మరణము తరువాత (Part 1)

గ్రంథకర్త : శేఖర్‌రెడ్డి వాసా

రచనా సహకారము :  ఇమ్మానుయేల్‌ రెడ్డి  వాసా

www.FaithScope.com

నీ మరణానంతరము నీ ఆత్మ ఎక్కడ వుండబోవుచున్నదో నీకు తెలుసునా?

మూలము

రెడ్డిపాళెం గ్రామములోని నా ప్రభువు తల్లి ఉపదేశములు మరియు ఆమెను ఆవరించిన పరిశుద్ధాత్మయొక్క జ్ఞాన సహాయమే ఈ పుస్తక రచనకు మూలాధారము.

అంకితము

ఈ అవకాశాన్ని నాకు అనుగ్రహించి నన్ను ప్రేమించిన క్రీస్తు ప్రభువుకు అంకితమిస్తున్నాను. -  వాసా శేఖర్‌రెడ్డి

Contents

ముందుమాట        

మొదటి భాగము        

దేవుడు జీవాత్మను ఎన్నుకొని జీవగ్రంథములో అతని పేరును నమోదు చేసి భూమి మీదకు పంపినది మొదలు ఆత్మ భౌతిక శరీరమును విడిచిన తరువాత  భౌతిక శరీరమును పూడ్చు వరకు ఉన్న కాలము        

1.   సృష్టికి ముందు -  సృష్టి అంతము తరువాత (ఈ యుగము ముందు - ఈ యుగము అంతము తరువాత)        

2.  జీవాత్మను భూమి పైకి పంపుటకు ముందు దేవుడు జీవాత్మను సిద్ధపరచుట        

3.  భూమిపైకి వెళ్ళవలసిన జీవాత్మయొక్క స్థితిని నిర్ణయించి వాని పేరును జీవగ్రంథమందు నమోదు చేయుట        

4.  మన ఆత్మలోని లోపాలు - మన పుట్టుకలోని లోపాలు        

5.  పుట్టుటకు మరణమునకు మధ్య        

6.  మరణమునకు మూలకారణము        

7.   సృష్టిలో మొదటి మరణమునకు ముందు        

8.  మరణవేదన        

9.  ప్రతి ఒక్కరికి తప్పని మరణము        

10.  చిన్నపిల్లల మరణము        

11.  ఒకేసారి అనేకమంది చనిపోవుటకు కారణము        

12.  మరణమును తెచ్చు వ్యాధులు - వైద్యము        

13.  అయోగ్యముగా ప్రభువు శరీరమును - రక్తము పుచ్చుకొని మనలో కొందరు బలహీనులై రోగులై మరణించుట!        

14.  దురాశ గర్భము ధరించగా పాపము మరణమును కనుట        

15.  కొందరికి వారు మరణించబోవుచున్నారని ముందుగానే సూచనలు వారికి తెలియజేయబడుట        

16.  దేవునికి ఎవరు హత్య గావింపబడి మరణించుట ఇష్టము        

17.  చనిపోకముందే కొందరు తమను పవిత్ర భూమిలో పాతిపెట్టమని తెలుపుట        

18.  శరీరరీత్యా మరణమును చూడక బ్రతుకు నరుడెవడు?        

19.  ఇంటి ముందు మంట వేసి మరణించినవారిని గూర్చి తెలుపుట        

20.  మరణదినము జన్మదినము కన్నా మేలైనది        

21.  మరణించినవారి కొరకు దు:ఖించుట / అంగలార్చుట        

22.  అంగలార్పు చేయునప్పుడు శరీరములను గాయపరచుట లేక తలలు గొరిగించుకొనుట నిషిద్ధము        

23.  అంగలార్పు ఆహారము - పానీయములు        

24.  రాత్రిపూట శవములు వ్రేలాడుట నిషిద్ధము        

25.  శవములను పూడ్చుటకు ముందు చేయవలసిన విధులు (శవమును పూడ్చుటకు సిద్ధపరచుట)        

26.  మరణించిన వారి కన్నులు మూయుట        

27.  శ్మశానపు ఏర్పాట్లు        

28.  మరణించినవారు తమ మరణించినవారిని పాతిపెట్టుట        

29.  మరణించినవారిని గూర్చిన భయము        

30.   మట్టి శరీరముతో రెండుసార్లు మొదటి మరణమును చూచినవారు        

31.  మరణించినవారియొక్క జ్ఞాపకార్థ విందు        

32.  చనిపోయిన పరిశుద్ధుల శవములు అద్భుతములు చేయుట        

33.  ఎప్పుడో వధింపబడిన ప్రవక్తల, పరిశుద్ధులయొక్క రక్తము యుగాంతములో కనబడుట        

రెండవ భాగము        

ఆత్మ భౌతిక శరీరమును విడిచినది మొదలు క్రీస్తు రెండవ రాకడకు ముందురోజు (పునరుత్థాన దినమునకు ముందు) వరకు వున్న కాలము        

34.  శరీరరీత్యా మరణించి భౌతిక శరీరమును వీడిన వెంటనే ఆత్మ పరిస్థితి        

35.  మరణించి భౌతిక శరీరమును విడిచిన వారి ఆత్మలను ఎవరు ఎక్కడికి తీసుకొని పోవుదురు?        

36.  మృతుల లోకము - పాతాళ లోకము        

37.   మృతుల లోకములోని ప్రాంతాల మధ్య మహా అగాధములు        

38.  మరణించి శరీరమును వదిలిన ఆత్మలు కొనిపోయేవి ఏవి?        

39.  మరణించిన భౌతిక శరీరమును విడిచిన ఆత్మలు మృతుల లోకములో ఎంత కాలము ఉండాలి?        

40.   మరణించిన ఆత్మలలో రకాలు - వారు ఉండు ప్రాంతములు - వారిపై రాజు        

41.   మరణించినవారి ఆత్మలయొక్క లింగము        

42.   మరణించినవారి ఆత్మలు   రూపములో ఉంటాయి?        

43.   మృతుల లోకములోని ఆత్మయొక్క శరీరము        

44.   మృతుల లోకములో ఆత్మ సంచారము        

45.  144000 మంది పరిశుద్ధులు లేక అనింద్యులయొక్క సంచారములు        

46.  ఆత్మలయొక్క వాహనములు        

47.  మృతుల లోకములోని ఆత్మల జీవన విధానము        

48.  మన మరణానంతరము మన ఆత్మ చూడగలిగి తెలివితోనే ఉండునా?        

49.  వధింపబడి మరణించిన కొన్ని ఆత్మలలో ప్రతీకార ఆలోచన        

50.  ఆత్మలయొక్క భాష        

51.   మృతుల లోకములోని ఆత్మలు చేయు ప్రార్థనలు        

52.   మృతుల లోకములోని ఆత్మ చేయు ప్రయత్నములు        

53.  మృతుల లోకములోని ఆత్మలకు క్రీస్తును గూర్చిన బోధ        

54.  మృతుల లోకములోని ఆత్మలకు సువార్తను జరిగించువారు ఎవరు?        

55.   మృతుల లోకములోని ఆత్మలకు ఆహార పానీయములు        

56.   మృతుల లోకములోని ఆత్మలు క్రీస్తు వాగ్దానము చేసిన ఫలములు        

57. పాతాళ లోకములోని వారి కిరీటములు        

58.  ఆత్మ శరీరమును విడిచి శరీరమును మరణమునకు అప్పగించిన తరువాత భూమిపై దాని కార్యములు        

59.  మృతుల ఆత్మతో జరిగించు మాంత్రిక సంబంధమైన క్రియలు        

60.   లోక వివాహ బంధములకు మరణానంతర స్థితి        

61.  నరుని కోరిక మేరే, జీవము లేక మరణము        

62.  పాతాళముయొక్క వశము కాకుండ తన్నుతాను తప్పించుకొనగలవాడెవడు?        

63.  క్రీస్తు కాలములో అక్కడ నిలిచియున్నవారిలో మరణమును రుచి చూడనివారు        

64.  మృతుల లోకములో లేని ఆత్మలు ఇంకా ఎవరెవరు?        

65.  మరణించినను మరల బ్రదికి ఇక ఎన్నటికి చనిపోనివాడు        

66.  భూమిమీద జరుగుచున్న దైవోగ్రత కార్యములు పరిశుద్ధుల ఆత్మలకు తెలియుచుండునా?        

67.  సువర్ణ కిరీటములు ధరించి సింహాసనమునందు ఆసీనులైన ఆత్మలు        

68.  మరణించినవారి ఆత్మలకు సాతాను శోధన        

69.  అకాల మరణము పొందినవారు (హత్య, ఆత్మహత్య, ప్రమాదవశాత్తు చనిపోయినవారు)        

70.  జంతువులు, పక్షులు, జలచరములు, పురుగులు మొదలైనవాటి మరణము, వానిలోని జీవము  శరీరమును వదిలిన తరువాత ఎక్కడ వుండును?        

71.  ఆత్మ భౌతిక శరీరమును విడిచిన తరువాత  లోకములోని వాహనము, ఎలక్ట్రానిక్వస్తువులు, కంపూటర్స్‌, రోబోట్స్‌, ఇండ్లు మొదలైనవాటి పరిస్థితి        

72.  సాతానుకు క్రీస్తుకు - అపరిశుద్ధులకు పరిశుద్ధుల ఆత్మలకు చివరి యుద్ధము        

ముందుమాట

ప్రియపాఠకులారా!  ఏదైన ఒక గ్రంథము వ్రాయునప్పుడు అనేక వర్ణనలతో గ్రంథకర్త తనయొక్క ప్రతిభను చూపించుట జరుగును.  కాని మరణము తరువాత అను అంశము వర్ణనలతో వ్రాయటానికి ఇది చరిత్ర కాదు, కథ కూడా కాదు.  భాషా ప్రావీణ్యము తెల్పుటకు ఇది గేయములు వంటిది కాదు.  మరణమనేది ఒక నిద్ర.  ఈ నిద్రగా వర్ణించబడిన మరణమును, ఆ తరువాత ఆత్మయొక్క చరిత్ర ఎవరైనా మనకు చెప్పిన అది అర్థమగుట బహు ప్రయాసతో కూడినది, ఎందుకంటే మరణానంతర ఆత్మల చరిత్ర బహు రహస్యములతో కూడియున్నది.  అందులోను అది ఒక అదృశ్య చరిత్ర.  ఈనాడు మనకు కనిపించేదే నమ్మే స్థితిలో మనము లేము.

        అయినను బైబిలు గ్రంథము నందు మరణానంతర చరిత్రను బహు స్పష్టముగా మనకు తెలియజేయుచున్నది.  ఇందులో వ్రాయబడిన ప్రతి అంశము బైబిలు ఆధారముగా చెప్పుటకు బహు ప్రయాస పడవలసి వచ్చింది, ఎందుకంటే మరణించిన వారి ఆత్మలు ఇలా వుండును లేక అలా వుండును అంటే నమ్మేవారు ఎవరూ వుండరు.  కనుక ప్రతి విభాగమునకు బైబిలు గ్రంథములోని వాక్యములను జతపరచి చెప్పుట చేత ఈ పుస్తకము కొంతవరకు సంపూర్ణత్వము పొందినది అని చెప్పుటకు నేను సంతోషిస్తున్నాను.

        మన ఇండ్లలో మనతో ఉండి మన పితరులుగా మరణించినవారి ఆత్మలు ఎక్కడ వున్నారు?  అన్న ప్రశ్న మనలో ఆతృతను లేపుతుంది.  మన మరణానంతరము మనము ఎక్కడ వుంటాము అన్న ఆలోచన మనలో భయముతో కూడిన భీతి మనకు కలుగుతుంది.  కాని మన మరణానంతరము ఒక గొప్ప చరిత్ర జరగబోవునని గ్రహించేవారు కొందరే.  అలా దాని గూర్చి తెలుసుకోవాలనుకొనే వారికి ఈ పుస్తకము ఒక గొప్ప వరము.  . . .

నెల్లూరు                                                                              ఇట్లు

21.05.2007.                                                 వి. శేఖర్‌రెడ్డి

మొదటి భాగము

దేవుడు జీవాత్మను ఎన్నుకొని జీవగ్రంథములో అతని పేరును నమోదు చేసి భూమి మీదకు పంపినది మొదలు ఆత్మ భౌతిక శరీరమును విడిచిన తరువాత  భౌతిక శరీరమును పూడ్చు వరకు ఉన్న కాలము

1.   సృష్టికి ముందు -  సృష్టి అంతము తరువాత (ఈ యుగము ముందు - ఈ యుగము అంతము తరువాత)

        ప్రియపాఠకులారా!  ఈనాడు మన శాస్త్రజ్ఞులు ఈ భూమి కొన్ని కోటానుకోట్ల సంవత్సరములకు పూర్వమే ఏర్పడినదని చెప్పుచున్నారు.  బైబిలు గ్రంథము ప్రకారము ఆదాము నుండి వారి జీవిత కాలమును బట్టి లెక్కించితే ఈ యుగము ఆరంభమై కేవలము సుమారుగా 8 వేల సంవత్సరములు అయ్యి ఉంటుంది.  మరి ఈ ఆదాము పుట్టక ముందు ఈ భూమి ఆకాశములు లేవా?  మానవ సృష్టి ఇదేనా?  దీనికి ముందు కూడా ఉన్నవా?  ఈ యుగ అంతము తరువాత కూడా ఇలాంటి మానవ సృష్టి జరుగునా?  బైబిలు గ్రంథము ఏమని చెప్పుచున్నదో ఇప్పుడు తెలుసుకొనవలసిన అవసరత ఉన్నది.

        ఆదికాండము 1:1, ''ఆదియందు దేవుడు భూమ్యాకాశములను సృజించెను.''  ఇందులో ఆదిలో భూమి ఆకాశమును సృజించెను అని చెప్పబడింది.  ఆదియందు అనుటనుబట్టి మొదటగా అన్న అర్థము ఇందులో ఉంది.  ఈ యుగమునకు ముందు అన్న అర్థము ఇందులో లేదు.  ఈవిధముగా ఆదియందు ఎప్పుడో అనగా కొన్ని కోటాను కోట్ల సంవత్సరములకు పూర్వమే ఈ భూమి ఆకాశము సృజింపబడింది.  ఇలా ఎప్పుడో సృజింపక బడక పోతే ఆ భూమి ఆకాశము అగాధ జలములలో ముంచబడి యుండవలసిన అవసరత లేదు.  ఆదికాండము 1:2, ''భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను; చీకటి అగాధ జలము పైన కమ్మియుండెను; దేవుని ఆత్మ జలములపైన అల్లాడుచుండెను.''  అలాగే ఆదికాండము 1:3-4, ''దేవుడు-వెలుగు కమ్మని పలుకగా వెలుగు కలిగెను.  వెలుగు మంచిదైనట్టు దేవుడు చూచెను; దేవుడు వెలుగును చీకటిని వేరుపరచెను.''  ఇలా వచ్చిన వెలుగు సూర్యచంద్రుల వెలుగు కాదు.  యోహాను 1:1-4, ''ఆదియందు వాక్యముండెను.  వాక్యము దేవునియొద్ద ఉండెను, వాక్యము దేవుడై యుండెను.  ఆయన ఆదియందు దేవునియొద్ద ఉండెను.  సమస్తమును ఆయన మూలముగా కలిగెను.  కలిగియున్నదేదియు ఆయన లేకుండ కలుగలేదు.  ఆయనలో జీవముండెను; ఆ జీవము మనుష్యులకు వెలుగైయుండెను.''  ఇలా దేవుని వాక్కు ద్వారా వచ్చిన మాట భూమి అగాధ జలములలో ముంచబడి యుండగా  ఆ అగాధ జలములలోని చీకటిని త్రోలిన వెలుగు ఆ చీకటిలో ప్రకాశించిన వెలుగు క్రీస్తు ప్రభువు అను వెలుగు అని అర్థమగుచున్నది.  ఇలా దేవుడు మొదటి దినమున క్రీస్తు ప్రభువును తన వాక్కుగా ఈ లోక సృష్టి కొరకు తనలోని 7 ఆత్మలలో ఒక ఆత్మగా బయటికి రప్పించుట జరిగింది.  ఈ విధముగా క్రీస్తు ప్రభువు మొదటగా వచ్చుట జరిగింది.  

        ఇలా మొదటగా వచ్చినప్పుడు క్రీస్తు ప్రభువు ద్వారా సమస్త సృష్టిని సృజింపజేసెనని ఆయన లేకుండా ఏదియు సృజింపబడలేదని చెప్పబడింది.  ఇలా సృజింపబడిన ఈ భూమి ఒక్కసారేసృజింపబడింది గాని అనేకమార్లు సృజించినది కాదు.  దేవుడు యుగాంతములో ఈ సృష్టిని అనగా ఈ భూమిని ఈ ఆకాశమును సమస్తమును అగ్నిచే దహించునని వ్రాయబడింది.  2 పేతురు 3:10-12.  ఇలా దహించబడిన ఈ భూమి ఈ ఆకాశమును మరల అగాధ జలములలో ముంచబడగా ఆ నీళ్లలో అవి పూర్తిగా చల్లబడి తన స్థితిలో మార్పు పొందువరకు అలాగే ఉంచబడుతుంది.  అలా ఒకసారి ముంచిన భూమి ఆకాశము అగాధ జలములలో ఉండి నిరాకారమై పోవును, ఎందుకంటే సమస్తము అగ్నిచే దహించబడి, ఆ దహించబడిన భూమిని నీళ్లలో ముంచుట జరుగును.  ఇలా ముంచబడిన భూమిని ఆకాశమును తిరిగి వెలికి తీయుట ద్వారా ఆరిన నేలను ఏర్పరుస్తున్నట్లుగా ఆదికాండము 1:6-10లో చెప్పబడింది.  ఇందులో ''ఆరిన నేల కనబడును గాక,'' అని చెప్పబడిందేగాని ఈ ఆరిన నేలను సృజించినట్లుగా చెప్పబడలేదు.  సృజించినది ఆదియందు ఈ సృష్టి ప్రారంభములో జరిగింది.  అందుకే హెబ్రీ 1:6, ''మరియు ఆయన భూలోకమునకు ఆదిసంభూతుని మరల రప్పించినప్పుడు దేవుని దూతలందరు ఆయనకు నమస్కారము చేయవలెనని చెప్పుచున్నాడు.''  ఈ మరల రప్పించుట సరి క్రొత్త యుగ ప్రారంభములో జరుగునని గ్రహించాలి.  ఇలా రప్పించినప్పుడు ప్రతి ఒక్కరు క్రీస్తు ప్రభువునకు నమస్కరించాలి.  ఒకవేళ ఇది యుగాంతములోనో లేక పరలోక రాజ్యములోనో జరుగునని అనుకొంటే సాతాను అతని దూతలు రెండవ మరణమనే శిక్షను పొందుట గురించి చదవగలము.  ఈ పుస్తకములో చివరికి వచ్చుసరికి సాతాను అతని దూతలు ఎవ్వరు పరలోక రాజ్యములోనికి రారు.  వారు రెండవ మరణమను అగ్ని గంధకములతో బాధింపబడినట్లుగా శిక్షను పొందుచున్నారు.  కనుక మొట్టమొదటి యుగ ఆరంభములో క్రీస్తు ప్రభువు వెలుగుగా వచ్చాడు.  అటుతరువాత యుగాంతము జరిగి ఆత్మలకు పరలోకము లేదా అపరిశుద్ధులకు శిక్ష జరిగిపోయాయి.  ఆ తరువాత మరల కొంత కాలానికి (దేవుని కాలమానం ప్రకారము) తిరిగి క్రీస్తు ప్రభువును ఆదిసంభూతినిగా రప్పించుట అందరిని నమస్కరించమని చెప్పుట ఈ స్థితిలో సాతాను ఈ క్రీస్తు ప్రభువు స్థానమును తాను కోరుకొని యెషయా 14వ అధ్యాయములో వలె మహోన్నతుడైన క్రీస్తు ప్రభువు స్థానమును ఆయన సింహాసనమును కోరుకొనుట వలన వాడు నమస్కరించక త్రోసి వేయబడుట చదవగలము.

        బైబిలు గ్రంథము ప్రకారము ఈ యుగము ఆదాముతో మొదలైంది.  ఈ యుగ అంతము యుగ సమాప్తితో అంతిమ యుద్ధముతో పూర్తి అగును.  దీనినే మత్తయి 13:49, ''ఆలాగే యుగసమాప్తి యందు జరుగును.  దేవ దూతలు వచ్చి నీతిమంతులలోనుండి దుష్టులను వేరుపరచి,''  ఇందులో క్రీస్తు ప్రభువు ఇప్పుడు జరుగు యుగమును దాని సమాప్తిని గూర్చి చెప్పుచున్నాడు.  మత్తయి 13:39, ''వాటిని విత్తిన శత్రువు అపవాది; కోత యుగసమాప్తి; కోతకోయువారు దేవదూతలు.''  ఇలాంటి ఈ యుగము ఆదాముతో మొదలై యుగాంతములో అంతిమ యుద్ధముతో సమాప్తి అగును.  ఈ కాలములో అపవాది అను సాతాను తన లక్షణములను పరిశుద్ధుల మధ్య నరులలో నాటి అనేకులను నాశనమునకు నడిపించుట జరిగింది.  ఈ యుగము అంతము తరువాత అందరుతీర్పుకు గురియై కొందరు పరలోక ఆనందమును పొందితే కొందరు రెండవ మరణములో బాధను పొందారు.  ఇందులో పరలోక ఆనందమును పొందినవారు ఈ యుగములో పేరు పొందిన నామమును గుర్తించి ఆ నామములో రక్షణ పొందినవారు.  ఆ నామమే క్రీస్తు ప్రభువు నామము.  ఎఫెసీ 1:20-21, ''ఆయన ఆ బలాతిశయముచేత క్రీస్తును మృతులలోనుండి లేపి, సమస్తమైన ఆదిపత్యముకంటెను అధికారముకంటెను శక్తికంటెను ప్రభుత్వముకంటెను, ఈ యుగమునందుమాత్రమే గాక రాబోవు యుగమునందును పేరుపొందిన ప్రతి నామముకంటెను, ఎంతోహెచ్చుగా పరలోకమునందు ఆయనను తన కుడిపార్శ్వమున కూర్చుండబెట్టుకొనియున్నాడు.''  ఇందులో ఈ యుగమందే కాదు రాబోవు యుగమందు కూడా ఈ నామము ఘనత పొంది యున్నది.  కనుక ఈ వచనములో రెండు యుగాలు కనిపిస్తున్నాయి.  1.  ఇప్పుడు జరిగేది  2.  రాబోవునది.  అలాగే - హెబ్రీ 6:4-6, ''ఒకసారి వెలిగింపబడి, పరలోకసంబంధమైన వరమును రుచిచూచి, పరిశుద్ధాత్మలో పాలివారై దేవుని దివ్యవాక్యమును రాబోవు యుగ సంబంధమైన శక్తుల ప్రభావమును అనుభవించిన తరువాత తప్పిపోయినవారు, తమ విషయములో దేవుని కుమారుని మరల సిలువవేయుచు, బాహాటముగా ఆయనను అవమాన పరచుచున్నారు గనుక మారుమనస్సు పొందునట్లు అట్టి వారిని మరల నూతనపరచుట అసాధ్యము.''  ఇందులో కొన్ని అంధకార సంబంధమైన శక్తులు రక్షణలో ఉన్న వారిని తప్పిపోయినవారుగా చేసుకొని, మరో యుగమునకు నాంది చేయుచున్నారు.  దీనికి కారణము క్రీస్తు ప్రభువుకు ఎవరును నశించుట ఆయనకు ఇష్టము లేదు.  

        అలాగే క్రీస్తు ప్రభువు తన బోధలో నశించిన గొఱ్ఱెల వద్దకు వచ్చానని చెప్పుచున్నారు.  ఇంకొక దగ్గర గొఱ్ఱె పిల్లల ఆహారము కుక్క పిల్లలకు వేయ తగునా అంటున్నారు.  అంటే కొందరు గొఱ్ఱె పిల్లలుగా ఎప్పుడయ్యారు?  ఈ గొఱ్ఱె పిల్లలు ఎప్పుడు నశింపులోకి వచ్చాయి?  అలాగే కొందరు కుక్క పిల్లలుగా ఎప్పుడు మారారు?  ఈ యుగములో ఇన్ని తేడాలు ఎలా ఏర్పడినవి?  అందరు మనుష్యులే కదా!  వీరిలో ఈ తేడా ఎలా వచ్చింది?  పరలోక ప్రవేశము కేవలము ప్రభువును నమ్మితేనే అనుగ్రహింపబడును.  తీర్పు దినమున వీరిని గొఱ్ఱెలుగా ఎన్నిక చేయబడ్డారు.  మత్తయి 25:31-32, ''తన మహిమతో మనుష్యకుమారుడును ఆయనతో కూడ సమస్త దూతలును వచ్చునప్పుడు ఆయన తన మహిమగల సింహాసనముమీద ఆసీనుడై యుండును.  అప్పుడు సమస్త జనములు ఆయనయెదుట పోగు చేయబడుదురు; గొల్లవాడు మేకలలోనుండి గొఱ్ఱెలను వేరుపరచునట్లు ఆయన వారిని వేరుపరచి''  ఇందులో పరిశుద్ధులు గొఱ్ఱెలుగా ఎన్నిక చేయబడి పరలోకమును స్వతంత్రించుకొన్నారు.  అలాగే అపరిశుద్ధులు మేకలుగా ఉండి నరక పాత్రులైయ్యారు.

        ఈ అపరిశుద్ధులు అనగా ఈ మేకలలో కుక్కలుగా పిలువబడినవారు కొందరున్నారు.  ప్రకటన 22:15, ''కుక్కలును మాంత్రికులును వ్యభిచారులును నరహంతకులును విగ్రహారాధకులును అబద్ధమును ప్రేమించి జరిగించు ప్రతివాడును వెలుపటనుందురు.''  వీరు యెరూషలేము బయటఉన్నవారు.  ఈ యుగ అంతమునకు వీరు ఈ స్థితులలో గొఱ్ఱెలుగా కొందరు పరలోక రాజ్యము చేరితే, అపరిశుద్ధులు అనగా మేకలలో కొందరు కుక్కలుగా రెండవ మరణమును పొంది యెరూషలేము బయట ఉంటారు.  రాబోవు యుగములో వారు జన్మించినప్పుడు వీరిలో పరలోకము చేరిన గొఱ్ఱెలు గొఱ్ఱెలుగానే ఈ లోకములో జన్మిస్తారు.  వీరు గొఱ్ఱెలుగా జన్మించినను ఈ లోక ఆశలలో పడి నశించుట వలన వీరిని క్రీస్తు ప్రభువు నశించిన గొఱ్ఱెలుగా పలుకుట జరిగింది.  అలాగే ఈ యుగములో కుక్కలుగా రెండవ మరణము పొందిన అపరిశుద్ధులు రాబోవు యుగములో మరల కుక్కలుగానే జన్మిస్తారు.  అనగా దేవుని రాజ్యములో అర్హత లేనివారుగానే జన్మిస్తారు.  ఇదే క్రీస్తు ప్రభువు సంబోధనలోని రహస్యము.   అందుకే ఆ నామము ఘనమైన నామముగా చెప్పబడింది.  అలా ఆ నామమును గుర్తించక చనిపోయినవారు తిరిగి నరక శిక్షను పొందుచున్నారే గాని క్రీస్తు ప్రభువు 1000 సంవత్సరముల పరిపాలనలో ప్రవేశించుట లేదు.  అటుతరువాత కూడ క్రీస్తు ప్రభువు నందు విశ్వాసముంచనివారు తిరిగి రెండవ మరణమను అగ్నిగంధకములతో కూడిన శిక్షను పొందుచున్నారేగాని పరలోక ప్రవేశము లేదు.  మరల క్రీస్తు ప్రభువు ఆదిసంభూతునిగా రప్పించుట ఈ సృష్టిని మరల అలంకరించుట ఈ నశించిన వారి కొరకు జరుగును.  ఎందుకంటే - యెషయా 66:24, ''వాటి పురుగు చావదు  వాటి ఆగ్ని ఆరిపోదు.''  ఇది ఒక కారణమైతే ఇంకొక కారణము మనలోని ఆత్మ కూడా దేవునిదే కనుక ఆ ఆత్మ నశించుట ఆయనకు ఇష్టము లేదు కనుక కొంతకాలము తరువాత ఆ ఆత్మలకు రక్షణ ఒసగుటకు మరల నూతన యుగమును ఏర్పరచి ఆ యుగములో నైనా సాతానును జయించి రమ్మని మరల ఆవకాశము ఇస్తున్నారు.  అప్పుడు ఇప్పటిలాగే నరుల మధ్య సువార్త కొనసాగింపబడునని రాబోవు యుగ సంబంధ శక్తులు తిరిగి క్రీస్తు ప్రభువును అవమానపరుస్తూ సిలువ వేయుట జరుగునని హెబ్రీ పత్రికలో వ్రాయబడింది.  అంతేగాని ఇప్పుడు చనిపోయినవారు కొద్ది రోజుల తరువాత ఈ యుగము నందే మరల మనుష్యులుగానో లేక జంతువులుగానో పుట్టుదురన్నది అసత్యము.  బైబిలు గ్రంథము ప్రకారము ఈ యుగములో జన్మించిన వారి క్రియల చొప్పున యుగాంతము తరువాత వారందరు శిక్షను పొందాలి.  ఆ శిక్షాకాలము తరువాత మరల యుగము ప్రారంభించబడి సాతానును జయించి క్రీస్తు ప్రభువును నమ్మి తిరిగి పరలోకమును చేరమని దేవుని కోరిక.  ఈ యుగములో ఎవరైతే పరలోక రాజ్యమును చేరారో వారందరు రాబోవు యుగములో గొఱ్ఱెలుగా పిలువబడుట జరుగును.  అలాగే గత యుగములో పరలోక రాజ్యములో ప్రభువును నమ్మి ప్రవేశించినవారు గొఱ్ఱెలుగా ఈ లోకములో జన్మించి తిరిగి లోక ఆశలతో నశించుట క్రీస్తు ప్రభువుకు ఇష్టము లేక వారి కోసము ఈ లోకములో జన్మించి రక్షణ మార్గమును ఒసగుట జరుగుచున్నది.  అలాగే గత యుగములో ఎవరైతే  క్రీస్తు ప్రభువును నమ్మక రెండవ మరణము అను శిక్షను పొందారో వారందరు గొఱ్ఱెలుగా కాక కుక్కలుగా సంబోధింపబడిన వారి వలె జన్మించుట జరుగుచున్నట్లుగా గుర్తించాలి.

ఈ విధముగా క్రీస్తు ప్రభువు యుగయుగాలకు రక్షకుడని, అలాగే తండ్రియైన దేవుడు యుగయుగాలకు దేవుడని అనేక సందర్భాలలో వీరిని గూర్చి సంబోధించుట జరిగింది.  ఒక్కసారి ఆలోచించండి.  ఈనాడు క్రీస్తు ప్రభువును అంగీకరించక నరక శిక్షకు గురియగుటకు యోగ్యులైనవారు మన మధ్య లేరా?  వీరి మరణానంతరము వీరు ఎప్పటికి శిక్షలోనే ఆరని అగ్నితోనే బాధింపబడాలా?  అందుకే క్రీస్తు ప్రభువు వారిపై తనకున్న ప్రేమ కొద్ది వారి కోసము తిరిగి బలియాగమునకు సిద్ధమై తిరిగి మరో యుగమును దైవసన్నిధిలో ప్రారంభించి తిరిగి పునరుద్ధరించుట జరుగును.  అప్పుడు క్రొత్తగా సృజించుట గాక అగాధ జలాలలో బురదగా ఉన్నదానిని వెలికి తీసి తిరిగి ఆరిన నేల కనబడునట్లుగా పలికి దానిని భూమిగా ఏర్పరచి దానిపై సమస్త సృష్టి తన చేతులతో సృజించుట చేయును.  అలా జరుగు అనేక యుగాలలో ఇప్పుడు జరుగుచున్న యుగము ఒకటి.  అలాంటిది మరొక రాబోవు యుగము ఉన్నది అనునది ఖచ్చితము ఎందుకంటే మన చుట్టూ జీవించు నరులలో అనేకులు ప్రభువునందు విశ్వాసము కోల్పోయినవారు.  అసలుకే విశ్వాసము లేనివారు ఉన్నారు.  కనుక వీరందరిని ఇలా చేయుట వలన వీరు పరలోక రాజ్య వారసులు కావాలంటే - రాబోవు యుగమునకు పునాది ఈ యుగములో సాతాను అతని దూతలు ఏర్పరచుకొనుట జరుగుచున్నది.  లేకపోతే వీరి ఆత్మలు నశించిపోతాయి.  యోహాను 17:12, ''నేను వారియొద్ద ఉండగా నీవు నాకు అనుగ్రహించినవారిని నీ నామమందు కాపాడితిని; నేను వారిని భద్రపరచితిని గనుక లేఖనము నెరవేరునట్లు నాశన పుత్రుడు తప్ప వారిలో మరి ఎవడును నశింపలేదు.''  కనుక అందరు పరిశుద్ధులుగా మారిపోతే ఈ నాశనకర పుత్రుడైన సాతాను నశించుట జరుగును గనుక ప్రభువు నశించుట ఇష్టము లేని నరుల ఆత్మలను తప్పించి రక్షణకు దూరముగా జీవించునట్లుగా చేసి తనకు ఇంకొక యుగమునకు రాబోవు యుగముగా పునాది వేసుకొనుచున్నట్లుగా గుర్తించాలి.

        ఇందునుబట్టి ఈ యుగమునకు ముందు ఇలా అనేక యుగములు జరిగాయి.  వాటి లెక్క ఇన్ని అని మనము చెప్పలేము.  అలాగే ఈ యుగ అంతము తరువాత రాబోవు మరో యుగము కూడ ఉన్నదని గ్రహించాలి.  అలా జరుగుతున్న యుగాలలో ఇప్పుడు ఈ యుగములో మన మరణానంతరము మన జీవితమును గూర్చి ఈ పుస్తకములో సంపూర్తిగా తెలుసుకొందము.  ఇక చదవండి  . . .

2.  జీవాత్మను భూమి పైకి పంపుటకు ముందు దేవుడు జీవాత్మను సిద్ధపరచుట

        మరల ఒక యుగమును దేవుడు ప్రారంభించినప్పుడు, భూమి పైకి వెళ్ళవలసిన జీవాత్మను దేవుడు సిద్ధపరచును.  యిర్మీయా 1:4-5, ''యెహోవావాక్కు నాకు ప్రత్యక్షమై యీలాగు సెలవిచ్చెను-గర్భములో నేను నిన్ను రూపింపక మునుపే నిన్నెరిగితిని, నీవు గర్భమునుండి బయలుపడక మునుపే నేను నిన్ను ప్రతిష్ఠించితిని, జనములకు ప్రవక్తగా నిన్ను నియమించితిని.'' కనుక ప్రవకఆత్మను దేవుడు సిద్ధపరచి, ప్రతిష్టించి, వానిని తన జనులకు ప్రవక్తగా నిర్ణయించి తల్లి గర్భములో ప్రవేశింప చేయుచున్నాడు.  యోహాను 1:6.  భూమి మీద పుట్టిన వారిలో దేవుని నిర్ణయము చొప్పున వారు ప్రవక్తలుగాను, రాజులుగాను, యాజకులుగాను, అపొస్తలులుగాను, విశ్వాసులుగాను వున్నారు.  వీరందిరి నిర్ణయము ముందుగానే అనగా భూమి పైకి పంపుటకు ముందే వారు భూమిపై వుండవలసిన స్థితి నిర్ణయించబడుచున్నది.  కనుకనే నరులలో ధనవంతులు వున్నారు, పేదవారు వున్నారు, రాజులు వున్నారు, రకరకాల వృత్తులు చేసుకొంటూ బాధలు అనుభవించువారు వున్నారు.  ఇలా అన్ని రకాల జనులు వారి వారి పుట్టుకతోనే వారి స్థితిలో అసమానతలు కలిగి యున్నారు.  వారు ఏ స్థితిలో ఉన్న ఇంటిలో పుట్టాలి అనేది దేవుని నిర్ణయమే.  క్రీస్తు ప్రభువు కాలములో క్రీస్తు ప్రభువుతో బాటుగా జీవించుటకు ఆయనతో సువార్తలో పాలి భాగస్థులగుటకు అనేకులు కోరుకొన్నారుగాని అది తన శిష్యులకు మాత్రమే అనుగ్రహింపబడెనని క్రీస్తు ప్రభువే స్వయంగా చెప్పుచున్నారు.  అంటే మనలోని ఆత్మ కోరుకొన్నను, దేవుని నిర్ణయము ప్రకారము ఎప్పుడు ఎక్కడ ఎలా జన్మించాలి అన్నది నిర్ణయింపబడును.

మన పుట్టుకకు ముందే మనమేస్ధితిలో పుట్టాలి అన్న నిర్ణయము జరుగును.

        ఇక్కడ ఇంకొక విషయమును మనము గుర్తించాలి.   దేవుడు ఆదామును సృజించునాటికి ఈ ప్రపంచములో ఎవరును లేరు.  ఏదెను వనమను దైవసన్నిధికి కాపలాదారుడుగా దేవుడు ఆదామును ఏర్పరచాడు.  ఆదికాండము 2:15, ''మరియు దేవుడైన యెహోవా నరుని తీసికొని ఏదెను తోటను సేద్యపరచుటకును దాని కాచుటకును దానిలో ఉంచెను.''  కనుక ఆదాము దేవుని నిర్ణయములో ఏదెను వనము కాచుట మరియు సేద్యపరచుట అను కార్యమును విధించి భూమి పైకి పంపాడు.  అతనిలో నుండి నారిని సృజించి అతనికి సహాయిగా వుంచాడు.  ఆదికాండము 2:18, ''మరియు దేవుడైన యెహోవా-నరుడు ఒంటరిగా నుండుట మంచిది కాదు; వానికి సాటియైన సహాయమును వానికొరకు చేయుదుననుకొనెను.''  కనుక హవ్వయొక్క కర్తవ్యము ఆదాముకు సాటి సహాయముగా వుండడమే.  కనుక ఆదాము ఏదెను వనము కాచుట, మరియు సేద్యపరచిన అది అతనికి నీతి.  అలాగే హవ్వ ఆదామునకు సాటి సహాయిగా నరునికి సహాయము చేయుచూ వుంటే అది ఆమెకు నీతి.  నీతితో జీవించిన ప్రతి ఒక్కరు పరలోక రాజ్యమునకు వారసులే.  అటు తరువాత దైవాజ్ఞను మొదటి నరజంట మీరి, పాపము శాపమును పొందెను.  కనుక వారు తమయొక్క ఉన్నత స్థితి నుండి భూమిపైకి వేదనకరమైన పరదైసులోనికి త్రోసి వేయబడ్డారు.  ఇటువంటి స్థితిలో వారికి కయీను, హేబెలు పుట్టుట జరిగింది.

        కయీను, హేబెలుకు ఏ పని చేయాలి అనేది దేవుడు చెప్పలేదు.  పైపెచ్చు వారు కూడా దేవుని అడగలేదు.  ఆదాము హవ్వలు దైవాజ్ఞను మీరుట ద్వారా వారిలో పరిశుద్ధత కోల్పోయారు. కనుకనే భూమిని దున్ని, చమటోడ్చి సాగు చేయమని దేవుడు వారిని శపించి ఏదెను వనము నుండి త్రోసివేసాడు.  కనుక ఆదికాండము 3:17, ''ఆయన ఆదాముతో-నీవు నీ భార్యమాట విని-తినవద్దని నేను నీ కాజ్ఞాపించిన వృక్షఫలములు తింటివి గనుక నీ నిమిత్తము నేల శపింపబడియున్నది; ప్రయాసముతోనే నీవు బ్రదుకు దినములన్నియు దాని పంట తిందువు;''  కనుక, ఆదాము శాపమును అనుభవించుచు కష్టించి భూమిని దున్ని దాని ఫలసాయాన్ని అనుభవించాడు.  ఇది దేవుని ఆజ్ఞ కాదు.  శాపము మాత్రమే.  ఆదామునకు దేవుని ఆజ్ఞ ఏదెను వనము సేద్యపరచుట మరియు కాచుట.  దీనిని కోల్పోయిన ఆదాము భూమిని దున్ని దైవ శాపాన్ని నెరవేర్చాడు.  ఇప్పుడు భూమిని దున్ని దాని ఫలసాయాన్ని తీయు ప్రతివాడు ఆదాము కియ్యబడిన దైవశాపాన్ని నెరవేర్చుచున్నట్లుగా మనము భావించాలి.

        ఆదాము, హవ్వలకు పుట్టిన సంతానము రెండు రకములైన పనులను ఈ భూమి మీద ఎన్నుకొన్నారు.  అందులో కయీను భూమిని సేద్యపరచువాడు.  హేబెలు గొఱ్ఱెల మందను కాచువాడు.  ఆదికాండము 4:2, ''తరువాత ఆమె అతని తమ్ముడగు హేబెలును కనెను.  హేబెలు గొఱ్ఱెల కాపరి;  కయీను భూమిని సేద్యపరచువాడు.''  ఇది నరుని ఎన్నిక దేవుడు చెప్పినది కాదు.  ఈ నరుల ఎన్నికలలో హేబెలు దేవుని శాపమును నెరవేర్చలేదు కాని తన కొరకు గొఱ్ఱెలమందను కాచుట మరియు సత్క్రియలు చేసినట్లుగా మనము గ్రహించాలి.  ఇక్కడ ఉన్నవారు నలుగురు.  ఈ నలుగురు విషయములో ఏవిధముగా సత్క్రియలు చేయగలరు?  హేబెలు కుమారుడు కనుక తన తల్లిదండ్రికి కుమారుడుగా సహాయకారిగా అన్ని పనులలో ఉండవచ్చును.  తన అన్నకు కావలసిన సహాయము చేయవచ్చును.  ఇలా తనతోటివారికి సహాయకారిగా వుండుట పరిశుద్ధ స్థితిని తెలుపును.  ఇక తను చేయుచున్న పని అనగా గొఱ్ఱెలు కాచుట నీతికి సూచన.

        ఇక కయీను సత్క్రియలు చేయలేదని అందుకే నీ అర్పణను నేను గుర్తించలేదని దేవుడు చెప్పుచున్నాడు.  ఆదికాండము 4:7, ''నీవు సత్క్రియ చేసినయెడల తలనెత్తుకొనవా?  సత్క్రియ చేయనియెడల వాకిట పాపము పొంచియుండును;  నీ యెడల దానికి వాంఛ కలుగును నీవు దానిని ఏలుదువనెను.''  కనుక పాపము కయీనును పొంచియుండి హేబెలు హత్యకు కారణమైంది.  ఇది మొదటి మరణము.  ఈ మరణము సాధారణమైన మరణము కాదు.  నరహత్య ద్వారా వచ్చిన అకస్మిక మరణము.

        ఇప్పుడు నలుగురు స్థానములో ముగ్గురు అయ్యారు.  వారే ఆదాము, హవ్వ, కయీను.  ఈ ముగ్గురు శాపగ్రస్థులే.  ఆదాము శాపగ్రస్థుడైనను మరల తప్పుచేయక దేవుని కుమారునిగా మారాడు.  కయీను తమ్ముని హత్యజేసి దైవశాపమునుబట్టి దైవ సన్నిధిని నిలువలేక తన భార్యతో కూడా నోదు దేశమునకు వెళ్ళి అక్కడ హనోకును కన్నాడు.  కయీనుకు భార్య ఎట్లా వచ్చింది? ఆదాముకు భార్య ఆదాము నుండి ఎట్లు వచ్చిందో అట్లే కయీనుకు భార్య కయీను తర్వాత జన్మించిన చెల్లెలే కయీనుకు భార్యయైనది.  జనాభా విస్తరించిన సమయములో మోషే చేత ఆదికాండము వ్రాయబడింది.  కనుక చెల్లెల్ని వివాహము చేసికొనుట నేరము కనుక గ్రంథములో వ్రాయబడలేదు.  ఆ దినములలో జనాభా విస్తరించలేదు గనుక అదే నేరముగా ఎంచబడలేదు.  ఆదాము కూడా తనలోనుండి తీయబడిన హవ్వను చూచి నా కుమార్తె అని చెప్పవలెను.  కాని నారివి అన్నాడు.  కనుకనే ఆదామునకు భార్య కాగల్గింది.

        ఆ విధముగానే కయీను వెళ్ళిపోయిన తర్వాత ఆదాము భార్య షేతును కనింది.  వాడే పెరిగి పెద్దవాడై తన చెల్లెల్నే భార్యగా చేసికొని ఎనోషను వానిని కన్నాడు.  అక్కడ నుండి యెహోవా నామమున వారు ప్రార్థన చేసికొంటూ దేవుని కుమారులుగా తీర్చబడినారు.  ఆది 4:26.

        కయీను తన చెల్లెల్ని కూడి దూర ప్రాంతములో జన సంతతులు విస్తరింపజేస్తూ దైవ నామమును మరచి లోకసంబంధులయ్యారు.  ఆదాము ద్వారా దైవశాపమును వారసత్వముగా పొందిన కయీను భరించలేనంత దైవశాపమును రెండంతలుగా పొంది, అతని ద్వారా విస్తరించిన జనాభా యెహోవాను మరచి శారీరేచ్ఛలతో విజృంభించి నరుల కుమార్తెలుగా వక్కాణించబడినారు.  వారు చెడుటయేగాక ప్రార్థనా జీవితములో యెహోవాను మరువక ఉంటున్న ఆదాము కుమారులైన దైవ సంతతులను ఆకర్షించి వారిని వివాహము చేసికొని దైవ కుమారులను పాడు చేసినందున లోకము జలప్రళయముతో నాశనమైంది.  కయీను హేబెలుల తరువాత ఆదామునకు పుట్టిన సంతానమును దేవుని కుమారులుగాను, కయీనుకు పుట్టిన వారిని నరుల కుమార్తెలుగాను చెప్పబడ్డారు.  ఆది 6:2, ''దేవుని కుమారులు నరుల కుమార్తెలు చక్కనివారని చూచి వారందరిలో తమకు మనస్సువచ్చిన స్త్రీలను వివాహము చేసికొనిరి.''  ఇలా దేవుని కుమారులు అనగా నీతి పరిశుద్ధతలతో జీవించినవారు అనగా తమ పనిని సవ్యముగా చేసి మరియు సత్క్రియలు చేసి పవిత్రతను కాపాడుకొనినవారు.  నరుల కుమార్తెలు తమ పనిని సవ్యముగా చేయక సత్క్రియలు చేయక దేవుని ఆజ్ఞలను మీరి కామవాంఛతో జీవించువారు.  ఇలా రెండు రకముల జనాభా ఏర్పడ్డారు.  ఈ రెండు రకముల జనాభాలో పుట్టినవారు దేవుని నిర్ణయము ప్రకారమే పుట్టినవారు.  

పూర్వ సృష్టిలో నరులు చేసిన పుణ్య కార్యములలోని తేడా రకరకాల స్థితులలో నరులు పుట్టుటకు కారణమైంది.

        దేవుని దూతలలో బలిష్టులైన దూతలు, మహాబలిష్టులైన దూతలు, సాధారణ దూతలు మొదలైనవారు ఉన్నట్లే, గత సృష్టిలో అనగా కొన్ని లక్షల సంవత్సరములకు ముందు జరిగిన సృష్టిలో ఇప్పటి సృష్టిలోలాగే పాపము చేసి తప్పిపోయినవారు రెండవ మరణమునకు పాత్రులై అగ్ని గంధకములో శిక్షింపబడుచుందురు.  వీరి ఆత్మకు చావు లేదు.  యెషయా 66:24,  ''వాటి పురుగు చావదు వాటి అగ్ని ఆరిపోదు.''  కనుక ఈ ఆత్మలకు వారి శిక్షాకాలము పూర్తియైన తర్వాత మరల ఒక అవకాశము దేవుడు ఇచ్చుచూ ఈ సృష్టిలో పంపించు చున్నాడు.  ఈ పాపములో మ్రగ్గిన ఆత్మలను అశుద్ధులుగా గత జీవితములో లేక సృష్టిలో జీవించి అగ్నిగంధకములలో శిక్ష అనుభవించిన ఆత్మలు వాటికి సత్క్రియలు లేవు గనుక భూమిపై నాశనమునకు మూర్ఖులుగాను, క్రూరులుగాను జన్మించుచున్నారు.  వారికి కూడా దేవుడు సువార్త రూపములో బోధింపచేసి మారుమనస్సుకు అవకాశము దయచేయుచున్నాడు.

        ఇదే మన స్థితికి కారణము.  అనగా గతసృష్టిలో ప్రవక్తగా వున్న వ్యక్తిని దేవుడు ప్రతిష్టించి పంపుచున్నాడు కనుకనే వారు దేవునిలో మహత్కార్యాలు చేయగలిగారు.  యోహాను 1:6, ''దేవునియొద్దనుండి పంపబడిన యొక మనుష్యుడు ఉండెను; అతని పేరు యోహాను.''  గత సృష్టిలో సాధారణ జీవితము జీవించి దేవునిలో ఎదగనివారికి మరల అదే జీవితము జీవించునట్లుగా దేవుడు వానిని అదే జీవితములో సృజించుచున్నాడు.  వానిని ఆ జీవితము నుండి దేవునిలో ఎదిగి గొప్ప స్థితికి రమ్మని పిలుస్తున్నాడు.  అనగా ఆస్థి అంతస్తులలో కాదుగాని దేవునిలో దేవునియొక్క జ్ఞానములో ఎదగమని చెప్పుచున్నాడు.  ఇలా ఎదగలేక పడిపోయినవారు మరల రెండవ మరణమునకు పాత్రులగుచున్నారు.  ఎదిగినవారు గొప్పస్థితిని పొందబోవుచున్నారు.  అలాగే దేవుడు గత సృష్టిలో పొందిన జీవితమును వాని కార్యములలో సత్క్రియలనుబట్టి ఈ సృష్టిలో వాని స్థితి వుంటుంది.  అనగా వాడు చేసిన పాపములకు శిక్ష పూర్తి చేయుచున్నాడు.  అటుతరువాత వాడు చేసిన కొద్దిపాటి సత్క్రియలనుబట్టి వాని స్థితి నిర్ణయించబడును.

        సొలొమోను రాజుగా ఎన్నికయైనను అతను దైవ వ్యతిరేకముగా విగ్రహ దేవుళ్ళను ఏర్పరచి తన స్థితిని పోగొట్టుకొన్నాడు.  ఇలా తన ఉన్నత స్థితిని పోగొట్టుకొన్నవారు వారి కార్యములకు శిక్షను అనుభవించి తిరిగి శిక్షాకాలము తరువాత మరల పరలోకములో ఒక స్థానమును పొందుదురు.  ఈ స్థానమునుబట్టి వారు తిరిగి భూమిపై అదే స్థితిలో జన్మించుదురు.  ఇక్కడనుండి దేవుడు వారికి ఇచ్చిన తలాంతును బట్టి ఎదిగి అనగా తను చేయవలసిన కార్యములు చేయుచూ దేవునిలో సత్క్రియలు చేసినవాడు మంచి స్థితి పొందుచున్నాడు.  కనుకనే క్రీస్తు ప్రభువు ఈ స్వల్ప జీవితములో జాగ్రత్త వహించమని బోధించారు.  మత్తయి 5:16.  ఇప్పుడు జరుగు యుగములో మన జీవితము స్వల్ప కాలమేనని మనందరికి తెలిసిన విషయమే.  మహా అంటే 100 లేక 120 సంవత్సరములు బ్రతుకుతాము.  ఇలాంటి అనేక యుగములు జరుగునని, ఆ జరుగు యుగములలో కూడా దేవుడు ఆయనేనని కీర్తన 103:18లో చదువుకొన్నాము.  తరువాత యుగములో మన జీవన విధానము మనము శరీరముతో చేసిన కార్యములని గుర్తించాలి.

        ఇది స్వల్ప జీవితమేకాని కొన్నివేల సంవత్సరముల కాలము మనలను బాధించునని గుర్తించాలి.  అటుతరువాత మరల, సృష్టి దేవుడు చేసినప్పుడు అప్పుడు నీవు వుండు స్థితి నిర్ణయింపబడును.  ఉదా :- వ్యభిచారమున కొందరు పుట్టుచున్నారు.  దీనికి పుట్టినవాడు చేసిన తప్పేమి?  దీనికి కారణము వాడు గతసృష్టిలో చేసిన తప్పే,  ఈ తప్పుకు వాడు శిక్ష అనుభవించినను, తిరిగి ఉన్నత స్థానమును పొందుట కొరకు వానికి మరల ఈ సృష్టిలో ఒక అవకాశమును దేవుడు వానికి ఇచ్చి వానిని తను ఏ తప్పైతే చేసాడో అదే స్థితిలో '' అనగా వాని తప్పుడు క్రియలు, నీతిక్రియలు  ఏమిలేని స్థితిలో వాని స్థితిని నిర్ణయించి పుట్టించును.  వాడు ఆ స్థితినుండి అనగా '' నుండి ఎక్కువగా ఎదగవచ్చును.

        ఇంకొకడు నీతిక్రియలు ఎక్కువగా వుండి పాపపు క్రియలు తక్కువగా వుంటే వాడు తన పాపపు క్రియలకు శిక్ష అనుభవించి పరలోకములో నీతి క్రియలను బట్టి వాని స్థానము వుండును.  ఈ నీతిక్రియలు వానిని విడచిపెట్టవు.  కనుక వాడు వాని నీతిక్రియల చొప్పున కొంత ఉన్నత స్థితిలో జన్మించును.  వాని పరిస్థితి మెరుగుగా వుంటుంది.

        ఇంకొకడు యాజకుడుగా వుండి తన అవినీతి క్రియలకు శిక్ష అనుభవించి నీతిక్రియల చొప్పున పరలోకములో ఒక స్థానమును పొందినవాడు మరల భూమిపై పుట్టుటకు, సృష్టిని దేవుడు చేసినప్పుడు వాడు యాజకులలో ఒకడుగాను లేక వాని గత నీతికార్యములనుబట్టి వాడు యాజకవృత్తి గలవారికి సన్నిహితుడుగా పుట్టును.  వానికి ఇంకా ఎక్కువ స్థితికి ఎదుగుటకు దేవుడు ఈవిధముగా బహు గొప్ప అవకాశమును దయచేయుచున్నాడు.

        కనుక ఎవరు ఏ స్థితిలో పుట్టినను వాడు గత సృష్టిలో తను చేసి సంపాదించుకున్న స్థితిని తిరిగి దానికన్నా కొంచెము ఉన్నత స్థితిని ఒక తలాంతుగా దేవుడు వానికి అనుగ్రహించును.  కనుకనే ఒక్కొక్కరు ఒక్కొక్క స్థితిలో జీవించగలుగుచున్నారు.  వారు ఆ స్థితిని ఆసరా చేసుకొని సత్క్రియల యందు మనస్సు పెట్టి అప్పగించిన పనిని పూర్తిచేసి దేవునిలో అంచెలంచెలుగా ఎదిగి తిరిగి మొదటి స్థితిని పొందవచ్చును.  

        అయితే ఒక గృహిణి ఉన్నదనుకొందము.  ఈమె ఎటువంటి తప్పుచేయక సత్క్రియలు కొంతవరకు చేయుచూ అనగా అందరికి అనుకూలమైన సహాయము చేయుచూ దేవుని చర్చికి తరచుగ హాజరగుచూ వారు చెప్పినది విని జీవించుచున్నది.  ఇలాంటి స్త్రీ చనిపోయిన తరువాత తప్పులు లేవు గనుక ఈ స్త్రీ పరలోకమునకు వెళ్ళినప్పుడు అక్కడ ఆమె ఒక స్థానమును, ఆమె క్రియల చొప్పున నిర్ణయించబడును.  అటుతరువాత మరల దేవుడు సృష్టించినప్పుడు ఆమె జీవాత్మగా భూమిపై పుట్టినప్పుడు ఆమె అదే స్థితిలో పుట్టించబడును.

        ఈవిధముగా ప్రతి ఒక్కరు భూమిపై పుట్టుటకు ముందే దేవుడు వాని స్థితిని నిర్ణయించి పంపును.  ఇక్కడ నరులు తమ కర్మగా భావించే అవకాశము వున్నది.  కాని దేవుడు మనలను మన స్థితి నిర్ణయించి పంపిన తరువాత మనము భూమిపై మరల చేయు కార్యములను బట్టి తరువాత జీవితముయొక్క నిర్ణయము జరుగును.అయితే యుగయుగాలకు పూర్వము అనగా లక్షలాది సంవత్సరాలకు పూర్వము అనగా దేవుడు నరులను భూమి మీద పుట్టించిన మొట్టమొదటి సృష్టిలో అనగా అంతకు మునుపు మానవ సృష్టి ఏదియు జరుగనందున ఇదే ప్రథమ సృష్టియైనప్పుడు - దుష్క్రియలు సత్క్రియలు లేనందున దేవుడు ఏ విధముగాను హెచ్చుతగ్గులు లేకుండ పుట్టించియున్నాడు?  జనులందరిలో గత జన్మ లేనందున ఎవరిలో ఏ క్రియలు లేవు గదా!

మొట్టమొదటి యుగములో అందరు సమానులే.  మనము చేసిన కియ్రలే మనలో ఇన్ని రకాల వ్యత్యాసాలకు కారణమైంది.

        అటువంటి స్థితిలో మొదటి సృష్టి జరిగింది.  ఈ సృష్టిలో నరులలో ఏర్పడి సాతాను కార్యముల మూలముగా వీరిలో అసమానతలు ఏర్పడి ఒకరు ఉన్నతి స్థానమును, ఇంకొకరు తక్కువ స్థానమును పొందగలిగారు.  మొదటి సృష్టి తరువాత శిక్షాకాలములో వారి పాపములకు శిక్ష జరిగిందిగాని వారి సత్క్రియలలో తేడా లేదు.  ఎక్కువ సత్క్రియలు చేసి దేవునిలో ఉన్నవారు గొఱ్ఱెలుగా తరువాత సృష్టిలో మంచి స్థితిలో జన్మించుట జరిగింది.  అలాగే చెడు జీవితములో కాలము వెచ్చించి మంచి క్రియలు చేయనివారు శిక్షాకాలమున చెడు కార్యములకు శిక్ష జరిగినను, వారిలో మంచి కార్యములు లేవు గనుక వారు తరువాత సృష్టిలో అదే స్థితిలో అనగా తక్కువ స్థితిలో మేకలుగాను కుక్కలుగా పుట్టుట జరుగుచున్నది.  అందుకే యుగయుగములకు దేవుడని చెప్పబడినది.  యెషయా 26:4, ''యెహోవా యెహోవాయే నిత్యాశ్రయదుర్గము యుగయుగములు యెహోవాను నమ్ముకొనుడి.''  కీర్తన 103:18, ''ఆయన కృప యుగయుగములు నిలుచును  ఆయన నీతి వారికి పిల్లపిల్ల తరమున నిలుచును.''  ఇప్పటి యుగములు లాంటివి ఎన్నియున్నను అన్నింటికి ఆయనే దేవుడు.  నిర్గమ కాండము 20:5-6.        

యుగయుగములు ఆదాము మొదలుకొని యుగాంతము వరకు ఒక యుగము.  ఇలా అనేక యుగములు

        ఒకసారి సాతానుతో చెయ్యి కలిపి నాశన కార్యములో నడచి రెండవ మరణమునకు పాత్రులైనవారు దేవుని ప్రవక్తలుగా ఎలా పుట్టగలరు?  వారికి దేవుని కనికరము వలన సాధారణ జీవితమే లభించును.  అలాగే నరునియొక్క దురాశలచేత కొందరి జీవితములో పేదరికమును అనుభవించవచ్చును.  వారిని వారి దురాశలచేత సాతాను వారిని నాశనమార్గములో పయనింప చేయుటకు తన సర్వశక్తులు ప్రయోగించుచున్నాడు.  కనుక మోసములు, కుయుక్తులతో కొందరి స్థితి భూమిపై సాతానుయొక్క నిర్ణయములో వుంటుంది.  అందుకే సోమరిపోతుగా వుండక సాతానును దాని ఆశలను లోకమును జయించమని చెప్పుచున్నాడు.  కనుక మనస్థితి దేవుడు ఇచ్చిన తలాంతుగా భావించి దానిలో మనకు ఒసగబడిన వృత్తిని నెరవేర్చి నీతిని సంపాదించండి.  తరువాత మన వృత్తితోబాటుగా దేవుని ఆజ్ఞను గౌరవించి పాటించి, క్రీస్తుయొక్క సువార్తను మనకు సాధ్యమైనంతగా చాటి మరల ఉన్నత స్థితి పొందుటకు ప్రయత్నము చేయండి.  కనుక దేవుడు జీవాత్మను భూమిపైకి పంపుటకు ముందే వారియొక్క స్థితిని నిర్ణయించి పంపును.  తలాంతుల ఉపమానములో క్రీస్తు ప్రభువు ప్రతి ఒక్కరికి తలాంతులు ఇస్తున్నారు.  కాని వాటిలో కొందరికి ఎక్కువగా కనబడుచున్నవి.  మరికొందరికి తక్కువగా కనబడుచున్నవి.  అంటే ఇందులో ఎక్కువ కలిగినవారు ముందుగానే కొన్ని తలాంతులు కలిగియుండి మరికొన్ని వారి కృషితో సంపాదించారు.  కొద్దిగా కలిగినవారు వారి కృషితో మరికొన్ని సంపాదించుకోవచ్చును లేక దానిని పోగొట్టుకోవచ్చును.  కనుక దేవుడు భూమిపై ధనవంతుడుగా పుట్టించాడని ఆనందపడవద్దు.  నీకు ఈ లోకములో వారసత్వముగా వచ్చినది ఎంత?  నీవు సంపాదించింది ఎంత?  ధర్మకార్యాలకు పరోపకారార్థము బీదరికములో బాధపడువారికి ఖర్చు పెట్టినది ఎంత?  అని ప్రభువు లెక్క అడుగుతున్నాడు.  యోబు 31:7.  నిన్ను తక్కెడలో పెట్టి నీవు చేసిన పుణ్య క్రియలకు తూస్తున్నాడు.  పాప క్రియల కంటె పుణ్య క్రియలు అధికముగా ఉన్న యెడల నీవు ధన్యుడవే, లేని యెడల ధనికుడు లాజరు ఉపమానములో వలె పాతాళములో వేదనపడుట ఖాయము.  మార్కు 12:41-44.  తనకు కల్గినదంతయు వేసిన బీద విధవరాలు అందరికంటే ఎంతో శ్రేష్ఠమైనది.  ఇందుకు నిదర్శనము మదర్‌ థెరిసా.  నీకు దగ్గ కార్యములు నీకు భుజ భారముగా అనుగ్రహించి యున్నారు దానిని నెరవేర్చాలి.  లేకపోతే నీవు కేవలము ధనవంతుడుగానే ఈ లోకరీత్యా మిగిలిపోయి ఎందుకు పనికిరానివాడివిగా మిగిలిపోతావు.  అలాగే పేదరికములో పుట్టితినని లేక నీ పుట్టుక పరిశుద్ధమైనది కాదని బాధపడక గత యుగ కాలములో నీ క్రియలు సరిగా లేవని గుర్తించి దేవునిలో ఎదుగుటకు ప్రయత్నించు.  రోమా 14:12.  

        ఇండియాకు మదర్‌ థెరీసా వచ్చినప్పుడు ఆమె దగ్గర ఎంత డబ్బు వున్నది?  ఇప్పుడు ఆమె పేరు మీద వున్న సంస్థల ఉన్నతి ఎంత?  సర్వమును దయచేయగల దేవుడు ఏమైనా చేయగలడని గుర్తించి దేవునిలో ఎదిగినట్లైతే, మనము తరువాత స్థితిలో ఉన్నత స్థానమును పొందగలము.  ఈ ఉన్నత స్థానముయొక్క నిర్ణయము మన జీవిత కాలములో మనము చేసే మంచి క్రియలను బట్టి వుంటుందని గ్రహించాలి.  జీవితాంతము పాపపు క్రియలు చేస్తూ, క్రీస్తు ప్రభువును అంగీకరించక మన మరణానంతరము క్రీస్తు ప్రభువు 1000 సంవత్సరముల పరిపాలనలో కూడ ప్రభువును అంగీకరించక మొదట పాతాళ లోకము తరువాత రెండవ మరణము అను శిక్షలను పొందిన ఆత్మ తిరిగి యుగ ప్రారంభమై సృష్టి జరిగినప్పుడు ఏ విధముగా జన్మించును?  దైవకుమారులుగానా లేక అన్యులుగానా?  ఇలా నిర్ణయింపబడిన ఆత్మ దేవుని నిర్ణయము ప్రకారము వారి ఉన్నతి స్థితిని లేక గత సృష్టిలో వారు చేసిన మంచి కార్యములను బట్టి ఎన్నిక చేసిన కుటుంబములో ప్రవేశించుట జరుగును.  ఈ విధముగా దేవుడు జీవాత్మను భూమి పైకి పంపుట జరుగుచున్నది.

3.  భూమిపైకి వెళ్ళవలసిన జీవాత్మయొక్క స్థితిని నిర్ణయించి వాని పేరును జీవగ్రంథమందు నమోదు చేయుట

        ప్రకటన  3:5, ''జయించు వాడు ఆలాగున తెల్లని వస్త్రములు ధరించుకొనును;  జీవ గ్రంథములోనుండి అతని పేరెంతమాత్రమును తుడుపు పెట్టక, నాతండ్రి యెదుటను ఆయన దూతల యెదుటను అతని పేరు ఒప్పుకొందును.''  పేరును తుడుపు పెట్టాలి అంటే వ్రాసియుండాలి కదా!  తుడుపు పెట్టుట వారివారి క్రియలపై నిర్ణయించబడుతున్నది.  ''జీవ గ్రంథములోనుండి అతని పేరెంత మాత్రమును తుడుపు పెట్టక,'' అని అనుటలో గొప్పవాడు కాదు, పేదవాడు కాదు, ప్రతి ఒక్కరి పేరు వ్రాయబడియున్నది.  కాని వారు జీవించిన కాలములో వారు చేసిన క్రియలనుబట్టి జీవ గ్రంథములో వుంచుట లేక తీసివేయుట అను నిర్ణయము తీసుకొనబడును.  మనము ఏ స్థితిలో భూమిపై పుట్టినను మన పేరు పుట్టుకతో జీవ గ్రంథములో వ్రాయబడియుండును.  అలా వ్రాసిన తరువాత జీవాత్మను భూమిపైకి పంపబడును.  ఇలా భూమి పైకి నమోదు చేయబడి జీవాత్మ పంపబడునాటికి, గత యుగములో చేసిన చెడ్డ కార్యములకు శిక్ష పూర్తి చేసుకొని యుండునని గ్రహించాలి.  కనుకనే వారి పేరు జీవగ్రంథములో నమోదు చేయబడుచున్నది.  పాపపు జీవితములో జీవించిన వారి పేరు జీవగ్రంథములో వుండదు.  నీతి కార్యములు కలవారి పేరు మాత్రమే అందులో వుండును.  ఇలా నమోదు చేయబడినది అంటే ప్రతి ఒక్కరి జీవితములో కొంచెమో లేక ఎక్కువో మంచి కార్యములు వుండాలి.  

దేవుడు పక్షపాతి కాడు.  ప్రతి ఒక్కరి పేరు జీవగంథములో నమోదు చేయును

వుంటాయి కూడా, ఎందుకంటే ఎంత దుష్టుడైనను ఏదో ఒక సందర్భములో నీతి కార్యము చేయును.  తన మరణానంతరము తన దుష్ట క్రియలకు శిక్ష అనుభవించి మంచి స్థితికి వచ్చును.  అప్పుడు అనగా తన శిక్షాకాలము పూర్తి అయిన తరువాత అతనిలో చెడు కార్యములు లేవు.  ఉన్నవి కొంచెము నీతి కార్యములే కనుక కొద్ది స్థితిలో అతని పేరు జీవగ్రంథములో లిఖించబడుచున్నది.  దేవుడు పక్షపాతి కాడు.  ప్రతి ఒక్కరికి అవకాశమును ఇచ్చుచున్నాడు.  ధనికుడు అని లేదు, పేదవాడని లేదు, బానిసని లేదు.  మన పుట్టుక మన పూర్వస్థితినిబట్టి నిర్ణయింపబడితే, మన పేరు మాత్రము నూతన రీతిగా జీవగ్రంథమందు లిఖించబడి నూతన జీవితమునకు సిద్ధపరచబడి యున్నదని గుర్తించి, సత్క్రియలతో దేవుని ఆజ్ఞలను తూచ తప్పకుండా పాటించి తరువాత జీవితమును ఆనందకరమైన స్థితిలో వుంచుకొనుటకు ప్రయత్నము చేయవలెను.  ఇప్పుడు చేయు చిన్న ప్రయత్నమే, తరువాతి రోజులలో ఒక పెద్ద ఉద్దేశ్యముగా మారి నిన్ను గొప్పవానిగా చేసి నీ పేరును జీవగ్రంథములో తుడుపు పెట్టనియ్యక పరలోక వారసునిగా చేయునని గుర్తించాలి.  

4.  మన ఆత్మలోని లోపాలు - మన పుట్టుకలోని లోపాలు

        లేవీయకాండము 26:27, ''నేను ఈలాగు చేసినతరువాత మీరు నా మాట వినక నాకు విరోధముగా నడిచినయెడల'' మరియు నిర్గమ కాండము 20:5-6, ''ఏలయనగా నీ దేవుడనైన యెహోవానగు నేను రోషముగల దేవుడను; నన్ను ద్వేషించువారి విషయములో మూడు నాలుగు తరముల వరకు, తండ్రుల దోషమును కుమారులమీదికి రప్పించుచు నన్ను ప్రేమించి నా ఆజ్ఞలు గైకొనువారిని వెయ్యితరములవరకు కరుణించువాడనై యున్నాను.''  మన ఆత్మలోని లోపాలు - మన పుట్టుకలోని లోపాలు గల వారి పేరు కూడా పరలోకములో నమోదు చేయబడియే పుట్టుదురు.  కాని వారి ఆత్మలోని లోపమును బట్టి వారియొక్క ముందు తరములవారు చేసిన పాపము వల్ల వీరి శరీరములో లోపము ఏర్పడును.  ఈ లోపము ఏర్పడిన ప్రాంతమును బట్టి వీరియొక్క శరీర ఎదుగుదల ఉండును.  ప్రకటన 3:17-18, ''నీవు దౌర్భాగ్యుడవును దిక్కుమాలినవాడవును దరిద్రుడవును గ్రుడ్డివాడవును దిగంబరుడవునై యున్నావని యెరుగక-నేను ధనవంతుడను, ధనవృద్ధి చేసియున్నాను, నాకేమియు కొదువలేదని చెప్పుకొనుచున్నావు.  నీవు ధనవృద్ధి చేసి కొనునట్లు అగ్నిలో పుటమువేయబడిన బంగారమును, నీ దిసమొల సిగ్గు కనబడకుండునట్లు ధరించుకొనుటకు తెల్లని వస్త్రములను, నీకు దృష్టికలుగునట్లు నీ కన్నులకు కాటుకను నాయొద్ద కొనుమని నీకు బుద్ధి చెప్పుచున్నాను.''  వీరిలో ఉన్న అంధకారము అనగా గ్రుడ్డితనము, చెవిటితనము మొదలైనవి ఆత్మకు సంబంధించినవి.  వీరిని గూర్చి క్రీస్తు ప్రభువు శరీర రీత్యా వీరు ఇవి కలిగి లేకున్నను వారు ఆత్మ రీత్యా ఉన్నట్లుగా చెప్పుచూ దాని నుండి విడుదల పొంది రమ్మని చెప్పుచున్నారు.  దీని వలననే వీరు క్రీస్తు ప్రభువును గుర్తించలేక పోతున్నారు.  సువార్తను వినలేక పోవుచున్నారు.  వీరు చూచుటకు బహు అందముగానే యుండవచ్చును కాని వీరిలోని ఆత్మీయ అంధత్వమనునది చెవిటితనమన్నది క్రియ జరిగించుచున్నది.  అందుకే పౌలు తన లేఖలో ఈ యుగ సంబంధమైన దేవత ఆత్మీయ అంధత్వమును కల్గించుచున్నట్లుగా చెప్పబడింది.  అంటే వీరు ఇలా ఉండటానికి కారణము ఈ యుగ సంబంధమైన దేవత అనగా సాతాను యొక్క బంధకాలని గ్రహించాలి.  వీరి ఆత్మ బంధకాలలో ఉన్నది కనుక వీరు సాతాను ఆధీనములో బందీలుగా ఉండి ఈ ఆత్మ రీత్యా అంధత్వమును చెవిటితనమును కల్గియున్నారు.  ఈ ఆత్మీయ అంధత్వము కారణముగా వీరు నరక పాత్రులుగా మారుచున్నారు.  అలాగే నరులు ఈ లోకములో దైవాజ్ఞలను మీరి జీవించుట వలన దేవుని నుండి శిక్షను పొందుట ఇహ లోకములోనే జరుగును.  ఈ శిక్ష మూలముగా ఇహ లోకములో వారి వల్ల వారి తరువాత వారి తరములలో శిక్ష కొనసాగును.  ఇది 3 లేక 4 తరములు కొనసాగుతాయి.  తండ్రి చేసిన శిక్షకు కుమారునికి ఏమి సంబంధము?  తండ్రి జూదములో పాపము చేసి ఆస్తిని పోగొట్టుకొనిన కుమారుడు కడు పేదవాడుగా మారును కదా!  అలాగే పాపము వలన ఆత్మ శరీరము రెండును బలహీనమగును.  పాపము చేసినవాని ఆత్మ శరీరము బలహీనమైనప్పుడు వానికి జన్మించువారు బలహీన స్థితిని పొందుట జరుగును.  అందుకే దేవుని 10 ఆజ్ఞలలో విశ్రాంతి దినమున ఆత్మను వాక్య పరిచర్యలో బలపరచుకొమ్మని ప్రభువు చెప్పుట జరిగింది.

        ఇంతకి తల్లిదండ్రుల పాపము వల్ల ఇలా బలహీన శరీరముతో జన్మించినవారు చేసిన పాపము ఏమి?  అన్న సంశయము మనకు కలుగవచ్చును.  ఇందులో వీరు గత సృష్టిలో చేసిన కార్యములు వారు అలా పుట్టుటకు కారణమని గ్రహించాలి.  వారి పాపములు వారి మరణానంతరము శిక్ష అనుభవించినను - మార్కు 9:48, ''నరకమున వారి పురుగు చావదు; అగ్ని ఆరదు.''  అనగా వారి ఆత్మకు నశింపు లేదు.  వారు ఆత్మరీత్యా శిక్షను అనుభవించినను ఆత్మకు నశింపు లేదు.  కాని వీరు గత సృష్టిలో పాప కార్యములు, పుణ్య కార్యములు చేసియుందురు.  ఇది సహజము.  మనము కూడా పాపము, పుణ్యము రెండు చేస్తూనే వుంటాము.  పుణ్యము మన శరీర ఆత్మలకు ఉన్నతి దయచేస్తే, పాపము శరీర ఆత్మల నాశనమును కలిగించును.  ఈ కారణము చేత పాపము వలన ఆత్మ బలహీనమై మన శరీరమునకు అనేక ఋగ్మతలను కలిగించి ఈ లోకరీత్యా వారి మరణమునకు కారణమై, వారి జీవిత కాలమునకు ముందే శరీరములోని కొన్ని భాగాలను చెడగొట్టి వారు మరణము పొందునట్లుగా చేయును.  ఇక అదే పాపము ఆత్మను వెంబడించును అని మనము వేదమునందు చదువగలము.  ప్రకటన 14:13, ''అంతట-ఇప్పటినుండి ప్రభువునందు మృతి నొందు మృతులు ధన్యులని వ్రాయుమని పరలోకమునుండి యొక స్వరము చెప్పగా వింటిని.  నిజమే;  వారు తమ ప్రయాసములు మాని విశ్రాంతి పొందుదురు;  వారి క్రియలు వారి వెంట పోవునని ఆత్మ చెప్పుచున్నాడు.''  ఈ పాపము ఆత్మను వెంబడించి వారి ఆత్మకు రకరకములైన జాడ్యములు అనగా జబ్బులకు కారణమగుచున్నది.  అదే కొద్దిపాటి పాపము చేయనివారికి ఈ ఋగ్మతలు జబ్బులు వుండవు.  కొద్దిపాటి పాపములు చేసినవారు వారి పాపములకు శిక్షను అనుభవించి పరలోకమునకు వెళ్ళినప్పుడు వారు జీవవృక్షములో పాలిపంపులు కలిగి వారి ఆత్మకు ఉన్న బలహీనత లేక జబ్బులను తొలగించుటకు జీవవృక్షపు ఆకులను ఉపయోగించుట జరుగును.  ప్రకటన 22:2, ''ఆ పట్టణపు రాజవీధిమధ్యను ప్రవహించుట ఆ దూత నాకు చూపెను.  ఆ నదియొక్క ఈవలను ఆవలను జీవవృక్షముండెను; అది నెలనెలకు ఫలించుచు పండ్రెండు కాపులు కాయును.  ఆ వృక్షముయొక్క ఆకులు జనములను స్వస్థపరచుటకై వినియోగించును.''  పరలోక రాజ్యములో జబ్బులు వుండవు.  అయితే స్వస్థపరచుటకై జీవవృక్షపు ఆకులతో సంబంధమేమున్నది?  కనుక పాపానికి శిక్ష అనుభవించినను వారిలో బలహీనతలు పోవు.  అవి పోవుటకు పరలోకములోని జీవవృక్షపు ఆకులను ఉపయోగించుకోవాలి.  అలా ఉపయోగించుకొన్నవారికి ఆత్మ స్వస్థత పొంది బలహీనతను పోగొట్టుకొని బలమైన స్థితిలో జీవించును.

శరీరాత్మల బలహీనతలకు కారణము పాపము.  శరీరమునకు వచ్చిన బలహీనత వాని జీవితకాలము కియ్ర జరిగించి వాని మరణముతో అంతమగును.  ఆత్మకు వచ్చిన బలహీనత పరలోకములోని జీవవృక్షపు ఆకులతోనే అంతమగును

        అయితే జీవితాంతము నరహత్యలు, వ్యభిచారము, దొంగతనము మొదలైనవి చేయుచూ పరిశుద్ధులకు వ్యతిరేకముగా పోరాడి వారిని హత్య చేసినవారికి శిక్ష బహుకాలము వుండును.  వీరు రెండవ మరణము ద్వారా అగ్నిగుండములో బాధపడుచుందురు.  ప్రకటన 21:8, ''పిరికివారును, అవిశ్వాసులును, అసహ్యులును, నరహంతకులును, వ్యభిచారులును, మాంత్రికులును, విగ్రహారాధకులును, అబద్ధికులందరు అగ్ని గంధకములతో మండు గుండములో పాలుపొందుదురు;  ఇది రెండవ మరణము.''  అలా పరిశుద్ధాత్మను దూషించిన వారికి ఈ యుగమునందును తరువాత యుగమునందును పాపక్షమాపణ లేదు.  మత్తయి 12:31-32, ''కాబట్టి నేను మీతో చెప్పునదేమనగా-మనుష్యులుచేయు ప్రతి పాపమును దూషణయు వారికి క్షమింపబడును గాని ఆత్మ విషయమైన దూషణకు పాప క్షమాపణ లేదు.  మనుష్యకుమారునికి విరోధముగా మాటలాడువానికి పాపక్షమాపణ కలదుగాని పరిశుద్ధాత్మకు విరోధముగా మాటలాడువానికి ఈ యుగమందైనను రాబోవు యుగమందైనను పాపక్షమాపణ లేదు.''  వారిలో కొంచెము పుణ్యము కూడా ఉండనివారు.  వీరి శిక్షాకాలము పూర్తి అగు సరికిని మరియొక సృష్టికి మరొక యుగమునకు భూమి సిద్ధపరచబడును.  కనుక వారు పరలోకములో ప్రవేశించుట, వారి ఆత్మకు జీవవృక్షపు ఆకులను ఉపయోగించుకొని స్వస్థత పొందు సమయము వారికి దొరకదు.  శిక్షాకాలము పూర్తి అయిన వెంటనే వీరు అగ్నిగుండము నుండి పరలోకమునకు చేర్చబడుట, అటుతరువాత జీవగ్రంథములో వ్రాయబడి భూమి మీదకు పంపుట జరుగును.  వారి ఆత్మకు ఏర్పడిన బలహీనతలను స్వస్థపరచుకొను సమయము వారికి దొరకదు.  కను వీరియొక్క ఆత్మ బలహీన స్థితిలోనే వుండి, మరల జన్మను పొందుచున్నది.  కనుక వీరి ఆత్మ వైకల్యము కల్గియున్నది కనుక ఆ వైకల్యమును బట్టి వారి పుట్టుకలో లోపములు సంభవించునని గ్రహించాలి.  ఉదా :-  1. గొఱ్ఱెలుగా చెప్పబడిన ఇశ్రాయేలీయులు.  2.  మేకలుగాను కుక్కలుగాను చెప్పబడిన అన్యులు.  కొందరు క్రైస్తవులుగా పుట్టుచున్నారు.  కొందరు అన్యులుగా పుట్టుచున్నారు.  అందరు సమాన రీతిలో జన్మించక పోవుట వారు పొందిన ఆత్మ బలహీనతలని గ్రహించాలి.  పరిశుద్ధాత్మను దూషించి మరల ఏర్పాటు చేసిన మరో యుగములో మంచి క్రైస్తవునిగా ఎలా జన్మించగలరు?  అలాగే జీవితాంతము నరహత్యలు, వ్యభిచారము వంటివి చేస్తూ మరో యుగములో దేవుని బిడ్డగాను సరియైన పుట్టుకలో లోపము లేని ఆత్మను శరీరమును ఎలా పొందగలము?  ఆత్మలలోని లోపము శరీర రీత్యా అనేక లోపాలకు కారణమగును కదా!  దేవుడు జీవాత్మను లోపములు కలదిగా చేయలేదు.  అలాగే జీవాత్మ శరీరమును కుంటి, గ్రుడ్డిగా చేయలేదు.  తన పోలిక తన స్వరూపము చొప్పున నరుని చేయాలని చేశారు.  ఆదికాండము 1:26, ''దేవుడు-మన స్వరూపమందు మన పోలికె చొప్పున నరులను చేయుదము; వారుసముద్రపు చేపలను ఆకాశ పక్షులను పశువులను సమస్త భూమిని భూమి మీద ప్రాకు ప్రతి జంతువును ఏలుదురుగాకనియు పలికెను.''  కనుక ఈ ఆత్మలోని లోపాలు మనము చేసిన పాపముల వలన సంభవించి దేవుని క్రియలుగా చెప్పబడు జీవవృక్షపు ఆకులతో స్వస్థత లభించక మరో సృష్టిలో మరో యుగములో జన్మించుటలో ఆ ఆత్మలోని లోపము మనము గతములో పొందిన స్థితి మన శరీరముపై ప్రభావము చూపి మన శరీరములో అనేక లోపాలకు కారణమగుచున్నది.  క్రీస్తు ప్రభువును అంగీకరించక పోవుట ఇన్ని అనర్థాలకు కారణము.  అంగీకరించినవారు జీవవృక్షపు ఆకులతో స్వస్థత కల్గి మరో సృష్టిలో పవిత్ర స్థితిలో జన్మించుట జరుగును.  కాబట్టి నరుని శరీరములో కన్పించు అసమానతలు మన ఆత్మలో పాపము వలన కల్గినవని గుర్తించి క్రీస్తు ప్రభువుని అంగీకరించుట ద్వారా అన్ని అనర్థాల నుంచి మన ఆత్మను రక్షించుకొనగలము.  ఇందులో మనము గుర్తించవలసినవి మూడు  . . .                            1.  పరిశుద్ధాత్మను దూషించి నందున పాప క్షమాపణ లభించక పోవుట        

        2.  తల్లిదండ్రులు చేసిన పాపము.  

        3.  గత సృష్టిలో వారు చేసిన పాపమునకు శిక్ష అనుభవించిన  ఆ శిక్షాకాలము పూర్తియైన తరువాత వారు పరలోకములో జీవవృక్షపు ఆకులు ద్వారా వచ్చు స్వస్థతకు సమయము లేకపోవుట.  

        ఈ మూడు కారణముల చేత వీరి ఆత్మ లోపముతో భూమిపై ఇలా జన్మించి అలాగే వారి శరీరములో పుట్టుకతో లోపములు కల్గి ఉంటున్నది.

5.  పుట్టుటకు మరణమునకు మధ్య

        పుట్టుక మన చేతులలో లేదు.  మన మరణము మన చేతులలో లేదు.  పుట్టినవారు పుట్టుచూనే వున్నారు.  మరణించేవారు మరణిస్తూనే వున్నారు.  మన జీవితములో ఈ పుట్టుక మరణములకు మధ్య మాత్రమే ఈ శరీర జీవితము వుంటుంది.  పుట్టుకకు ముందు ఆత్మ రూపములో జీవితము.  మరణము తరువాత ఆత్మ రూపములోనే జీవితము.  కాని ఈ రెంటి మధ్య అనగా పుట్టుక మరియు మరణముల మధ్య జీవితము భౌతిక శరీరముతో వుంటుంది.  ఈ కాలములో మనిషి శిశువుగా పుట్టుట, మంచిచెడ్డల జ్ఞానమును పొందుట, పరిణతి చెందినవాడుగా ఇంకొకరిని వివాహమాడి మరియొక శిశువుకు లేక మరికొందరి శిశువులకు జన్మనిచ్చుట జరుగుతుంది.  అటుతరువాత వృద్ధాప్యము తరువాత మరణము.  ఇవి నరుని జీవితములో ముఖ్యమైన సంఘటనలు.  ఏ కాలము వారైన, ఏ ప్రాంతము వారైనా పై విధముగానే వారి జీవితము వుంటుంది.  సంసార జీవితము వద్దు అనుకొని జీవించేవారు మరి కొందరు వున్నారు.  వారికి వివాహము, నూతన శిశు జన్మ వారి జీవితములో వుండదు.

        అయితే నరుడు పుట్టిన తరువాత శిశు దశలో ఏ విధమైన కార్యములు చేసుకోలేని స్థితిలో మరియొక నరునిచే మోయబడుచు కాలమును గడుపును.  అటుతరువాత మంచిచెడు తెలుసుకొనుచూ ఒక జ్ఞానిగా ఎదుగును.  ఇందులో మనము ఒక విషయమును తెలుసుకొనవలసి యున్నది.  అదేమిటంటే ప్రతి ఒక్కరి జీవితము బహు రహస్యమైనదే.  ఎవరికి వారే వారి జీవితములో రాజు లేక రాణియైనను ఎవరిని తక్కువగా అంచనా వేయకూడదు.  ఎవరి జీవితమును మనము పరికించి చూచిన ఎన్నో రహస్యములు అందులో కనిపిస్తాయి.  దీనికి అనేక రకములైన కారణాలు కూడా మనము చెప్పవచ్చును.  ఏది ఏమైనప్పటికి ఈ పుట్టుకకు మరణమునకు మధ్య ఈ జీవితము దానిలోని స్థితి తరువాత వుండే ఆత్మ జీవితమునకు పునాది.  ఈ శరీర జీవితములో పుట్టిన ప్రతి నరుడు వాని మరణము వరకు చేయు కార్యములు వ్రాస్తూ పోతే ప్రపంచమంతయు ఇలాంటి చరిత్ర పుస్తకాలతోనే నిండిపోవును.  అందుకే నేను ప్రతి ఒక్కరిని  ఒక రాజు లేక రాణి అని చెప్పాను.  వీటి గురించి ఈ పుస్తకములో వ్రాయుట లేదు గాని ఇలాంటి నరునియొక్క మరణమును గూర్చి ఇక ఒకదాని తరువాత ఒకటిగా తెలుసుకొందము.

6.  మరణమునకు మూలకారణము

        ఆదామును దేవుడు నేల మంటితో సృజించి ఏదెను వనములో ఆయనను వుంచినప్పుడు మరణము అనేది లేదు.  ఎన్ని సంవత్సరములు ఆదాము హవ్వలు ఏదెనులో జీవించారో వ్రాయబడలేదు.  అయితే దేవుడు ఆదామునకు మరణమును గూర్చి తెలియజేసాడు.  ఆదికాండము 2:17, ''అయితే మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్ష ఫలములను తినకూడదు;  నీవు వాటిని తినుదినమున నిశ్చయముగా చచ్చెదవని నరుని కాజ్ఞాపించెను.''  కాని ఆదికాండము 3వ అధ్యాయములో సాతాను సర్పము ద్వారా బోధించిన బోధకు హవ్వలోనై దేవుడు తినవద్దన్న పండును తిని పాపము చేసింది.  అంతేకాకుండా ఆదాముకు ఆ పండ్లను ఇచ్చి తినిపించి ఆదాముతో పాపము చేయించింది.  ఈ విధముగా దైవాజ్ఞను మీరి మొదట ఆత్మరీత్యా మరణమును పొందారు.  కాని ఆదికాండము 3:19, ''నీవు నేలకు తిరిగి చేరువరకు నీ ముఖపు చెమట కార్చి ఆహారము తిందువు;  ఏలయనగా నేలనుండి నీవు తీయబడితివి;  నీవు మన్నే గనుక తిరిగి మన్నైపోదువని చెప్పెను.''  ఈ విధముగా ఆదాము చేసిన తప్పుకు నరులకు శిక్ష వచ్చినది.  ఆదాము శాపగ్రస్తుడుగా మారి మరణమును తెచ్చుకొన్నాడు.  ఇంతకి మరణమునకు మూలకారణము  దైవశాపము.  ''నీవు మన్నే గనుక తిరిగి మన్నై పోదువని చెప్పెను.''  

నిషేధఫలమా - దైవాజ్ఞ మీరుటయా- దైవశాపమా - పాపమా ఏది మరణమునకు మూల కారణం?

        ఈ క్రియ మరణము ద్వారా మాత్రమే సంభవించునని గ్రహించాలి.  మన శరీరము మట్టి నుండి తియ్యబడినది కనుక తిరిగి మట్టిలోనికి వెళ్ళవలసియున్నది.  ఇది దైవశాపము.  ఇలా వెళ్ళుట ఒక్క మరణము ద్వారా మాత్రమే సాధ్యము.  ఇటువంటి శాపమునకు కారణము నరుడు దైవాజ్ఞను మీరుట - దేవుని ఆజ్ఞను మీరుట పాపము అని బైబిలు గ్రంథము చెప్పుచున్నది.  కనుక దైవాజ్ఞ మీరుట పాపము, తద్వారా దైవశాపమును పొందుట మరణము ఈ లోకములో ప్రవేశించుటకు ముఖ్య కారణమైనది.  కనుక నరుని పాపము - మరణమునకు మూలకారణమైనది.  అయితే ఏ పాపము చేయని క్రీస్తు ప్రభువు ఎందుకు మరణించెనని మనము అనుకోవచ్చును.  క్రీస్తు ప్రభువు మరణము మన కొరకేగాని ఆయన పాపము చేసి కాదు.  క్రీస్తు ప్రభువు తన ప్రాణమును మన కొరకు మచ్చలేని బలిపశువుగా అర్పించి తిరిగి తీసుకొని, తన అర్పణతో మనలను  పాప విముక్తులుగా చేసాడు.  తన రక్తముతో మనకు విడుదల కల్గించాడు.  అందుకే - ప్రకటన 5:9, ''ఆ పెద్దలు-నీవు ఆ గ్రంథమును తీసికొని దాని ముద్రలను విప్పుటకు యోగ్యుడవు, నీవు వధింపబడినవాడవై నీ రక్తమిచ్చి, ప్రతి వంశములోను, ఆయా భాషలు మాటలాడువారిలోను, ప్రతి ప్రజలోను, ప్రతి జనములోను, దేవునికొరకు మనుష్యులను కొని, మా దేవునికి వారిని ఒక రాజ్యముగాను యాజకులనుగాను చేసితివి;  గనుక వారు భూలోకమందు ఏలుదురని క్రొత్తపాట పాడుదురు.''  కనుక క్రీస్తు మరణము వలన మనము దేవుని ప్రజలుగా వుండుటకు కొనబడ్డాము.  ప్రకటన 7:13-14, ''పెద్దలలో ఒకడు-తెల్లని వస్త్రములు ధరించుకొనియున్న వీరెవరు?  ఎక్కడనుండి వచ్చిరని నన్ను అడిగెను.  అందుకు నేను-అయ్యా, నీకే తెలియుననగా అతడు ఈలాగు నాతో చెప్పెను-వీరు మహా శ్రమలనుండి వచ్చిన వారు; గొఱ్ఱెపిల్ల రక్తములో తమ వస్త్రములను ఉదుకుకొని వాటిని తెలుపుచేసికొనిరి.''  కనుక వీరు గొఱ్ఱెపిల్లయైన క్రీస్తు రక్తములో తమ పాపపు వస్త్రమును ఉదికి ప్రక్షాళన చేసికొని దేవునిలో ఎన్నికయై, పరలోక రాజ్య వారసులుగా మారిరని గ్రహించాలి. కనుక పాపము వలన మరణము సంభవించినది.  రోమా 6:23, ''ఏలయనగా పాపము వలన వచ్చు జీతము మరణము, అయితే దేవుని కృపావరము మన ప్రభువైన క్రీస్తుయేసునందు నిత్యజీవము.'' కనుక పాపము చేయు ప్రతివాడు మరణమును పొందును.  ఈ మరణము దేవుడు ఇచ్చిన శిక్ష.  అయితే పాపము చేయక పవిత్ర జీవితమును జీవించువాడు మొదటి మరణమును పొందినను నీతి విషయమై క్రీస్తు ప్రభువు తిరిగి లేపునని గుర్తించాలి.

        ఇక్కడ - మనకు ఒక సంశయము ఏర్పడవచ్చును.  అదేమిటంటే, పాపము చేసినవారు - పాపము చేయనివారు ఇద్దరు మరణిస్తున్నారు కదా!  అయితే మరణమునకు మూల కారణము పాపమేనా?  అన్న సంశయము మనకు కలుగవచ్చును.  క్రీస్తు ప్రభువు చెప్పిన లాజరు ధనవంతుని ఉపమానములో ధనవంతుడు పాపము చేసినవాడు.  లాజరు పాపము చేయనివాడు.  కనుక లాజరు అబ్రాహాము రొమ్మున ఆనుకొని సేద తీరుతూ స్వేచ్ఛా జీవితము పొందుచున్నాడు.  ప్రకటన 6:9, ''ఆయన అయిదవ ముద్రను విప్పినప్పుడు, దేవుని వాక్యము నిమిత్తమును, తాము ఇచ్చిన సాక్ష్యము నిమిత్తమును వధింపబడినవారి ఆత్మలను బలిపీఠము క్రింద చూచితిని.''  వీరు క్రీస్తు కొరకు మరణమును పొందినవారు.  వీరు బలిపీఠము క్రింద విశ్రాంతిలో వున్నారు.  కనుక వీరికి వేదనలేని జీవితము ఆత్మకు అందించబడును.   అయితే పాపములో మరణించినవానికి ధనికునివలె వేదనలో జీవించాలి.  దీనినే మరణము అని అంటారు.   యోహాను 11:25-26, ''అందుకు యేసు-పునరుత్థానమును జీవమును నేనే;  నాయందు విశ్వాసముంచువాడు చనిపోయినను బ్రదుకును;  బ్రదికి నాయందు విశ్వాసముంచు ప్రతివాడును ఎన్నటికిని చనిపోడు.  ఈ మాట నమ్ముచున్నావా?  అని ఆమెను నడిగెను.''  కనుక పాపము చేయక క్రీస్తు ప్రభువులో మరణించిన ఆత్మ జీవముతోనే తిరుగునని గ్రహించాలి.  పాపము చేసి క్రీస్తులో జీవించని ఆత్మ మరణ బంధకములలో పాతాళలోకములో బంధింపబడి యుండును.  కనుక మరణమునకు మూలకారణము పాపమని గ్రహించి పశ్చాత్తాపము క్రీస్తునందు మారుమనస్సు పొంది క్రీస్తు రక్తములో మన పాపపు జీవితమును ఉతికినట్లైతే, మనము పరిశుద్ధులుగా మారి పాపము వలన వచ్చు నిత్యబంధకమైన మరణమును దాటగలమని గ్రహించాలి.

7.   సృష్టిలో మొదటి మరణమునకు ముందు

        ఆదికాండము 1వ అధ్యాయములో దేవుడైన యెహోవా సమస్తమును సృజించెను అనగా భూమిని, ఆకాశమును, గ్రహమును, నక్షత్రములను, సూర్యుడు, చంద్రుడు, పక్షులు, జలచరములు, జంతువులు, మొదలైనవన్నింటిని సృజించారు.  ఈ సమస్తము సృజించిన తరువాత ఏదెను వనమును దేవుడు భూమి మీద వేసాడు.  అటు తరువాత ఏదెను వనమునకు వెలుపల మట్టితో నర శరీరమును చేసి దానిలో జీవాత్మను ఊదగా నరుడు జీవాత్మగా మారాడు.  ఇది మొదటి నరునియొక్క నిర్మాణము.  ఆది 2:7, ''దేవుడైన యెహోవా నేలమంటితో నరుని నిర్మించి వాని నాసికారంధ్రములలో జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మ ఆయెను.''  ఈ మొదటి నరుడు - దేవుని పోలిక, స్వరూపము చొప్పున సృజించబడినాడు.  

ఆది 1:26, ''దేవుడు-మన స్వరూపమందు మన పోలికె చొప్పున నరులను చేయుదము;  వారుసముద్రపు చేపలను ఆకాశ పక్షులను పశువులను సమస్త భూమిని భూమి మీద ప్రాకు ప్రతి జంతువును ఏలుదురుగాకనియు పలికెను.''  ఇది మొదటి నరునియొక్క నిర్మాణము.  ఇతని పేరు ఆదాము అనగా ఎఱ్ఱమన్ను అని అర్థము.  అటు తరువాత దేవుడు ఎఱ్ఱమన్నైన ఆదాము చేత సమస్త సృష్టికి పేర్లు పెట్టించాడు.  సమస్త సృష్టిలో అతనికి సాటి సహాయము లేకపోయెనని దేవుడైన యెహోవా అనుకొని వానికి గాఢనిద్రను కలిగించి వాని ప్రక్కటెముకనుంచి నారిని సృజించాడు.  ఆది 2:21-23, ''అప్పుడు దేవుడైన యెహోవా ఆదామునకు గాఢనిద్ర కలుగజేసి అతడు నిద్రించినప్పుడు అతని ప్రక్కటెముకలలో ఒక దానిని తీసి ఆ చోటును మాంసముతో పూడ్చి వేసెను.  తరువాత దేవుడైన యెహోవా తాను ఆదాము నుండి తీసిన ప్రక్కటెముకను స్త్రీనిగా నిర్మించి ఆమెను ఆదాము నొద్దకు తీసికొనివచ్చెను.  అప్పుడు ఆదాము ఇట్లనెను - నా యెముకలలో ఒక యెముక  నా మాంసములో మాంసము  ఇది నరునిలోనుండి తీయబడెను గనుక నారి అనబడను.''  ఇప్పటికి మరణము లేదు.  అటుతరువాత దేవుడైన యెహోవా తినవద్దన్న పండు తిని పాపము శాపమును పొందాడు.  తరువాత ఆదాము హవ్వతో శయనించి కయీనును, తరువాత హేబెలును కన్నారు.  ఇప్పటిదాక నరుడు అనగా శరీరముతో వున్న నరుడు చనిపోలేదు. అటుతరువాత అర్పణను ఇద్దరు తెచ్చారు.  దేవుడైన యెహోవా హేబెలు అర్పణను లక్ష్యముంచుట చేత కయీనుకు హేబెలుపై కోపము వచ్చింది.  ఆది 4:8, ''కయీను తన తమ్ముడైన హెబెలుతో మాటలాడెను.  వారు పొలములో ఉన్నప్పుడు కయీను తన తమ్ముడైన హేబెలు మీద పడి అతనిని చంపెను.'' మనమనుకొన్న మొదటి మరణముయొక్క సంఘటన రానే వచ్చింది.  ఈ మరణము సహజ మరణము కాదు.  హేబెలు యేండ్లు మీరి మరణించినవాడు కాడు.  పసి వయస్సులో తన అన్నయైన కయీనుచే కొట్టబడి మరణమును రుచి చూచాడు.  ఈ మరణము శరీర మరణములలో మొదటి మరణము.  ఈ సంఘటనలో వున్న మనుష్యులు నలుగురు.  ఆ నలుగురులో ఆదాము, హవ్వ, కయీను, మరియు హేబెలు.  వీరిలోనే పాపము కార్యము జరిగించి హేబెలు హత్యకు కారణమైంది. ఆదాము హవ్వ వీరికి మొదటి సంతానము కయీను.  రెండవ సంతానము హేబెలు.  వీరి తరువాత షేతు అను కుమారుడు ఆదామునకు హవ్వకు పుట్టుట జరిగింది.  ఆదాము షేతును కను నాటికి ఆదామునకు 130 సంవత్సరములవాడు.  ఆదాము పుట్టినప్పటి నుండి సుమారు 130 సంవత్సరముల లోపలే హేబెలు హత్య జరిగి మరణించుట జరిగింది.  ఇందులో తల్లిదండ్రి అన్నలకన్నా ముందే హేబెలు మరణించుట జరిగింది.  ఈ మరణము క్రీస్తు ప్రభువునకు సాదృశ్యముగా చెప్పబడినది.  హెబ్రీ 12:24.

        అటు తరువాత అనేకులు సహజ మరణమును రుచి చూచారు.  అనేకులు చంపబడ్డారు.  ఆత్మహత్యలు జరిగించుకొన్నారు.  వీటన్నిటి గురించి వివరముగా తెలుసుకొందము.

8.  మరణవేదన

        మనుష్యులు పుట్టుచున్నారు.  కాలాలు గతించి పోవుచున్నవి.  ఈ మరణవేదన పొందువారు తమకు తెలియకనే భీతిని పొందుచున్నారు.  ఈ మరణవేదన ఒక్కొక్కరికి ఒక్కో విధముగా వుంటుంది.  కాని అది ఏవిధముగా వారు అనుభవము పొందినప్పటికిని అది మరణవేదనే.

క్రీస్తు ప్రభువు తన చెమట రక్తముగా వచ్చునంతగా మరణవేదన పొందెను

        ముఖ్యముగా యేసుక్రీస్తు విషయములో - ఆయన తన సిలువ బలియాగమునకు ముందు గెత్సేమనె తోటలో మరణవేదన పొందాడు.  ఆయన రక్తము చెమటగా కారునంతగా వేదన అనుభవించుట జరిగింది.  ఇది ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే.  లూకా 22:44, ''ఆయన వేదనపడి మరింత ఆతురముగా ప్రార్థన చేయగా ఆయన చెమట, నేల పడుచున్న గొప్ప రక్త బిందువులవలె ఆయెను.''  ఇందులో ఆయన వేదన పడినట్లుగా వ్రాయబడింది.  ఇలా ప్రతి ఒక్కరికి తమ మరణము పలాని విధముగా జరుగును అని తెలిసిన వారి వేదన మనము వర్ణించలేము.  సాక్షాత్తు దేవుని కుమారుడైన క్రీస్తు ప్రభువు మరణవేదన పడి తనలోని చెమట రక్త బిందువులవలె వచ్చెనని చెప్పబడింది. మనము మరణించుదుమన్న సంగతి తెలిసిన మనలో మరణవేదన కలుగును.  నా 70 సంవత్సరముల జీవితములో అనేకులు మరణవేదన పడుట చూచాను.  కాని వారి వేదన ఒక్కొక్కరిలో ఒక్కొక్క విధముగా వున్నది.  ఇలానే వుండునని ఎవరి విషయములోను చెప్పలేము.  కాని క్రీస్తు ప్రభువుయొక్క మరణవేదన నరులందరికన్నా తీవ్రమైనదని మనము గ్రహించాలి, ఎందుకంటే నా జీవిత కాలములో మరణవేదన పడు నరులను అనేకులను చూచానుగాని వారి రక్తము చెమట రూపములో వచ్చునంతగా వేదనపడిన వారు ఎవ్వరూ లేరు.  

        చెమట పట్టుట క్రీస్తు ప్రభువులోని తీవ్రమైన ఆలోచనా పట్టుదలను మనకు చూపుచున్నది.  రక్తబిందువులవలె పడుట ఆవేదనలో ఆయన పడిన మానసిక సంఘర్షణయొక్క తీవ్రతను సూచిస్తున్నది.  కనుక క్రీస్తు ప్రభువు ఈ మరణవేదనను పొందినను దానినుండి పారిపోవుటకు ప్రయత్నించలేదు.  అంటే ఈ మరణమును గూర్చి వేదనపడి దానిని తప్పించుకొనుటకు ప్రయత్నింపక ధైర్యముతో ఎదుర్కొని సిలువ బలియాగము ద్వారా మరణించినట్లుగా గ్రహించాలి.  క్రీస్తు ప్రభువు పొందిన మరణము చాలా దారుణమైనది.  నరులు ఆయనను అనేక విధములుగా అవమానించారు.  ఆయన మీద ఉమ్మి వేయుట కూడా చేసారు.  అంటే ఒక దైవకుమారుడు, ఉన్నత స్థానములో ఉన్నవాడు, ఇంత ఘోరాతిఘోరమైన మరణమును పొందవలసి యున్నది అన్న 'సత్యము' వేదనకు గురి చేస్తున్నది.  ఇలా వారి మరణము కొందరికి ముందుగానే దేవుని చేత తెలియజేయబడునని గుర్తించాలి.  అలాగే మరణకరమైన వ్యాధితో బాధపడువారు తాము కొన్ని దినములలో మరణించుదుమని తెలిసి వేదనపడుట మనము చూస్తున్నాము.  వారు డాంబికముగా కనబడినను లోలోన ఏమగునో అన్న వేదన వారిలో మరికొంత కృంగదీసి వారిని త్వరగా మరణమునకు అప్పగించును.  ఈ వేదన కలిగినవారికి ఆకలి నశించి వారిని బలహీనులుగా చేయును.  కనుక వారు త్వరగా మరణించుట జరుగును.  వీరికి కలుగు వేదన తెలియనిది లేక ఏమగునో అన్న వేదన.  కాని క్రీస్తు ప్రభువుకు కలిగిన వేదన తెలిసినది.  తరువాత తాను ఎక్కడికి వెళ్ళబోవుచున్నాడో ఆయనకు తెలియును.  అయినను తాను పొందబోవు మరణము చాలా హింసతో కూడినది కనుక ఆయన వేదన పడినాడు.  అంతేగాని, ఆయన పిరికివాడుగా తప్పించుకొనాలని ప్రయత్నము చేయలేదు.  అయితే మరణకరమైన జబ్బులతో బాధపడువారు, వారు మరణించుదురని ముందుగా తెలిసి వారు వేదన పడుదురు.  ఈ వేదనకు కారణము తప్పించుకోవాలన్న ప్రయత్నమే అని గుర్తించాలి.  అనగా తాను మరణించకూడదని సకల విధములుగా ప్రయత్నించుట మనము చూస్తున్నాము.  తన జీవిత కాలములో లేని మరచితనము ఆ కొద్దిరోజులలో చూపించుదురు.  దీనికి కారణము ఎలాగైన బ్రతకాలని ఆశ.  దైవ ప్రార్థనలలో కాలము గడుపుటకు ఎక్కువగా ప్రయత్నము చేయును.  కాని ఫలితము మాత్రము చాలావరకు మరణమే.  ఎందుకంటే ముందు కాలములోని వారి జీవితము చాలావరకు వారి శరీరమును దెబ్బ తీయుట వలన దాని స్థితి మరణమునకు దారి తీసి యుండును.  కనుక తిరిగి దానిని నిలబెట్టవలెనన్న ప్రయత్నము చాలావరకు విఫలము అగుట మనకు కనబడుచున్నవి.  

        ఇలా ప్రతి ఒక్కరిలో మరణవేదన అనేది కనబడుచున్నది.  దీనికి కారణము వీరికి వీరి శరీరము మీద వున్న ఆశ.  ఈనాడు ఎవ్వరినైనా మనము వాని మరణము గురించి మాట్లాడిన వారు దు:ఖితులగుట చూస్తున్నాము.  దీనికి కారణము తెలియని స్థితి అని మనము గుర్తించాలి.

9.  ప్రతి ఒక్కరికి తప్పని మరణము

         ఏదెను వన చరిత్రలో ఆదాము దైవాజ్ఞ మీరి దైవశాపమును పొంది మరణము సంపాదించాడు.  అయితే అప్పుడు దైవాజ్ఞను మీరినది ఆదాము కదా!  మనకెందుకు మరణము సంభవించుచున్నది అని మనము అనుకొనవచ్చును.  దేవుడు శపించినది ఆదామునే, అయితే దైవశాపము మూలముగా ఆదాము శరీరము అతనిలోని ఆత్మ సమస్తము శాపగ్రస్థముగా మారుట జరిగింది.  అటుతరువాత ఆదాము హవ్వను కలసి కయీనుకు జన్మనిచ్చారు.  అంటే కయీనును దేవుడు వేరుగా సృష్టించలేదు.  

శాపగ్రస్థ శరీరము నుండి శాపగ్రస్థ శరీరము గాక పవిత్ర శరీరము ఏలాగు వచ్చును?

కయీను ఆదాము హవ్వల శారీరక కలయికలో వారి ఇరువురు బీజముల ద్వారా పిండముగా ఏర్పడి, భూమి మీద ప్రసవింపబడినాడు.  కనుక, ఈ బీజములు శాపగ్రస్థమైన ఆదాము హవ్వలలోనివే గదా!  కనుక ప్రతి ఒక్క నరుని శరీరము శాపగ్రస్థమై యున్నది.  కనుక భూమి మీద పుట్టిన ప్రతి నరుని శరీరము శాపగ్రస్థమైనదే కాని ఆత్మ దైవ సన్నిధి నుండి ప్రతి నరుని శాపగ్రస్థ శరీరములోనికి పంపుట చేత ఆత్మ శరీరముతో పోరాటము చేసి పవిత్ర జీవితము జీవించాలని ప్రయత్నిస్తున్నది.  కాని ఈ శరీర వాంఛలు ఆత్మయొక్క కోరికను నెరవేరనియ్యక ఒకదానికొకటి వ్యతిరేకముగా కార్యములు చేయుచూ చివరకు ఆత్మను నాశనకర మార్గమునకు నడిపించుచున్నది.  గలతీ 5:17, ''శరీరము ఆత్మకును ఆత్మ శరీరమునకును విరోధముగా అపేక్షించును.  ఇవి యొకదానికొకటి వ్యతిరేకముగా ఉన్నవి గనుక మీరేవిచేయ నిచ్ఛయింతురో వాటిని చేయకుందురు.''  మత్తయి 26:41, ''మీరు శోధనలో ప్రవేశించకుండునట్లు మెలకువగా ఉండి ప్రార్థనచేయుడి; ఆత్మ సిద్ధమే గాని శరీరము బలహీనమని పేతురుతో చెప్పి''   కనుక శాపగ్రస్థమైన ఈ శరీరము ఏనాటికైనను మరణము రుచి చూడక తప్పదని గ్రహించాలి.  1 రాజులు 2:2, ''లోకులందరు పోవలసిన మార్గమున నేను పోవుచున్నాను;  

మనము విశ్వాసముంచిన క్రీస్తు ప్రభువు కూడా మన పాపముల కొరకు మరణించాడు

కాబట్టి నీవు ధైర్యము తెచ్చుకొని నిబ్బరము గలిగి,'' ఇందులో ఏలీయాను దేవుడు బేతేలునకు పొమ్మని చెప్పుచున్నాడు.  ఎందుకు?  ఈ లోకమును విడిచి వెళ్ళుట కొరకు.  అయితే ఏలీయా ఆత్మను పొందినవాడు కనుక తాను ఎక్కడికి వెళ్ళుచున్నాడో తనకు తెలియును.  అది ఎలీషా చూచి దు:ఖపడకూడదని ఏలీయా ఎలీషాను ఇక్కడే వుండమని నేను బేతేలుకు వెళ్ళుదునని  చెప్పుట జరిగింది.  కాని ఎలీషా ఇందుకు విరుద్ధముగా నేను నీతో కూడా వస్తానని చెప్పి ఏలీయాతో కూడా బేతేలునకు వెళ్ళాడు.  ఈ బేతేలునందు ఏలీయా సుడిగాలిలో ఆరోహణమై పోవుట జరిగింది.  ఇది దైవ నిర్ణయము.

        కీర్తన 89:48, ''మరణమును చూడక బ్రదుకు నరుడెవడు?  పాతాళముయొక్క వశము కాకుండ తన్నుతాను తప్పించుకొనగలవాడెవడు?''  ఇలా మరణమును ప్రతి ఒక్కరు పొందవలసినదేగాని దాని నుండి తప్పించుకొనుట అసాధ్యము.  అలాగే లూకా 2:26, ''అతడు ప్రభువుయొక్క క్రీస్తును చూడక మునుపు మరణము పొందడని అతనికి పరిశుద్ధాత్మచేత బయలుపరచబడి యుండెను;  ఆత్మవశుడై అతడు దేవాలయములోనికి వచ్చెను.''  సుమెయోనుకు క్రీస్తును చూడక మరణము పొందడని పరిశుద్ధాత్మ చేత బయల్పరచుట, దేవుడు మరణమును ప్రతి ఒక్కరికి వచ్చుటకు సమ్మతించినట్లుగా గుర్తించాలి.

        అయితే క్రీస్తు ప్రభువు తనయందు నమ్మకముంచినవాడు మరణమును పొందడని చెప్పుచున్నాడు.  యోహాను 8:51, ''ఒకడు నా మాట గైకొనినయెడల వాడెన్నడును మరణము పొందడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని ఉత్తరమిచ్చెను.''  ఈ మరణము శరీర మరణమును గూర్చి కాదు.  ఇందులో చెప్పబడిన మరణము ఆత్మకు సంబంధించినది.  దీనినే రెండవ మరణమని చెప్పవచ్చును.  క్రీస్తునందు నమ్మిక వుంచినవారు మరణిస్తారు.  ఎలా?  శరీరరీత్యా కాని వారు సమాధానకరమైన పరదైసులలో నిత్యానందమును పొందుదురేగాని వేదన పొందుట వారికి యుండదు.  కాని అపరిశుద్ధులు వారు మరణించినప్పటి నుండి సాతాను చేత వారి ఆత్మ కొనిపోబడి పాతాళములో వారు బంధింపబడి వేదనను అనుభవించుదురు.  వారికి రెండవ మరణమును పొందుటకు యోగ్యులైనవారు.  కాని క్రీస్తు నందు విశ్వాసముతో ఆయన మాట చొప్పున జరిగించువారు ఈ రెండవ మరణము అనగా శాశ్వతమైన నిత్యమైన మరణము నుండి తప్పించబడుదురని క్రీస్తు ప్రభువు చెప్పుచున్నాడు.  క్రీస్తు ప్రభువు చెప్పిన మరణము ఆత్మ సంబంధమైనది.  ఇది తెలియని యూదులు - యోహాను 8:52, ''అందుకు యూదులు - నీవు దయ్యము పట్టినవాడవని యిప్పుడెరుగుదుము;  అబ్రాహామును ప్రవక్తలును చనిపోయిరి;  అయినను-ఒకడు నా మాట గైకొనినయెడల వాడు ఎన్నడును మరణము రుచిచూడడని నీవు చెప్పుచున్నావు.''  అని అనుచున్నారు.  కనుక శరీర మరణము ప్రతి ఒక్కరు పొందవలసినదే.

దూతలకన్నా కొంచెము తక్కువవానిగా క్రీస్తు ప్రభువు కూడా పుట్టుట

        క్రీస్తు ప్రభువు శరీరరీత్యా పుట్టినవాడు కాదు.  అయినను మరణించుట జరిగినది.  హెబ్రీ 2:9, ''దేవుని కృపవలన ఆయన ప్రతి మనుష్యుని కొరకు మరణము అనుభవించునట్లు, దూతలకంటె కొంచెము తక్కువవాడుగా చేయబడిన యేసు మరణము పొందినందున, మహిమాప్రభావములతో కిరీటము ధరించిన వానిగా ఆయనను చూచుచున్నాము.''  దూతల కంటే కొంచెము తక్కువవాడు ఎవడు?  నరులమైన మనమే కదా!  కీర్తన 8:4-5, ''నీవు మనుష్యుని జ్ఞాపకము చేసికొనుటకు వాడేపాటివాడు?  నీవు నరపుత్రుని దర్శించుటకు వాడేపాటివాడు?  దేవునికంటె వానిని కొంచెము తక్కువవానిగా చేసి యున్నావు.  మహిమా ప్రభావములతో వానికి కిరీటము ధరింపజేసి యున్నావు.''  ఇందులో నరులు దేవుని కంటె కొంచెము తక్కువవారుగా చేయబడినట్లుగా చెప్పబడినది.  దేవుడు సంపూర్ణమైనవాడు.  ఆయనకన్నా ప్రతి ఒక్కరు తక్కువవారే.  నరులుగాని దేవుని దూతలుగాని దేవునితో సమానులు కాలేరు.  ఆయనకన్నా తక్కువవారే!  హెబ్రీ 2:9లో చెప్పిన విధముగా దేవుని దూతలకు దేవునికి మరణము లేదు.  దేవుని దూతలకన్నా లేక దేవునికన్నా తక్కువవారుగా చేయబడిన నరులు మరణమును పొందుటకు భౌతిక శరీరమును కలిగియున్నారు.  అనగా వీరిపై మొదటి మరణము క్రియ జరిగించును.  కనుక నరులు దేవునికన్నా ఆయన దూతలకన్నా కొంచెము తక్కువవారుగా వున్నారు.  ఇటువంటి నరులలో ఒకరుగా క్రీస్తు ప్రభువు - ఆత్మ ద్వారా ఏర్పడినను కన్య మరియమ్మయొక్క గర్భములో పిండముగా రూపొందినవాడు.  కనుక నరుల శరీరము నుండి వచ్చిన కన్య మరియమ్మ శరీరము నుండి క్రీస్తు శరీరము ప్రసవించబడినది.  కనుక మనుష్యుల శరీరము వంటి శరీరమును క్రీస్తు ప్రభువు మనుష్య సంబంధముగా పొందియున్నాడు.  కనుకనే దూతలకన్నా కొంచెము తక్కువవానిగా క్రీస్తు పుట్టెనని చెప్పుట జరిగింది.  ఈ విధముగా దేవుడు క్రీస్తు ప్రభువును దేవదూతలకన్నా తక్కువవానిగా చేయుట ద్వారా ఆయన మనందరి కొరకు బలియాగము చేసి మరణించుట జరిగింది.  లేని పక్షములో ఈ సిలువ బలియాగము జరుగుట అసంభవమని గుర్తించాలి.  మనందరి కొరకు అనగా మనలను పాపము నుండి విమోచించుట కొరకు, క్రీస్తు ప్రభువు తననుతాను తగ్గించుకొని ఈ లోకములో నివసించి, ధర్మశాస్త్ర ప్రియుల ద్వారా ద్వేషింపబడి చివరకు సిలువపై మరణమును అనుభవించారు.  కనుక మొదటి మరణము శరీరరీత్యా వచ్చునది కనుక అది ప్రతి ఒక్కరు అనుభవింపక తప్పదు.

10.  చిన్నపిల్లల మరణము

        అభముశుభము తెలియనివారు చిన్నపిల్లలు.  అనగా తల్లి గర్భములో వేయబడినది మొదలు 5 సంవత్సరముల లోపల పిల్లలు మంచి చెడు తెలియనివారు.  వీరు మరణించుట మనము చూస్తున్నాము.  గర్భపాతముద్వారా అనేకమంది ఆడశిశువులను చంపుచున్నారు.  చట్టబద్ధమైన గర్భస్రావాలంటూ మరికొందరిని చంపుచున్నారు.  పుట్టిన బిడ్డ జబ్బులతో చనిపోవుచున్నారు.  హత్య కావింపబడుచున్నారు.  ఇలా ఎందుకు జరుగుచున్నది?

        ఈనాడు గర్భస్త్రావము చేయించుకొనుట సర్వసాధారణమై యున్నది.  దీనికి కారణాలు చాలా విచిత్రముగా చెప్పుదురు.  కొందరు ఆడపిల్ల కాబట్టి మాకు వద్దనుకొన్నాము.  మరికొందరు ఇప్పుడు బిడ్డ వద్దని అనుకొన్నాము, ఇలా అనేక రకములైన కారణాలు చెప్పుదురు.  కాని వారు ఒక బిడ్డను చంపుచున్నారని నరహత్య చేయుచున్నారని అనుకోరు.  తమ కామవాంఛ కోసము చేసిన ప్రయత్నములో గర్భము ఏర్పడినప్పుడు, వారు ఆ బిడ్డను వద్దని గర్భస్రావము చేయుచున్నారు.  ఇది నరహత్యతో సమానమే.  సమాజము ఎంత ఉన్నత స్థితిలో వున్నను శిశు హత్యను సమర్థించదు.  పెళ్ళి కాకుండా గర్భము వచ్చుట కామదాహము కాదంటారా!

        యుగాంతమున స్త్రీలు దయారహితులు, వాత్సల్యరహితులగుదురురని దైవవాక్యము చెప్పుచున్నది.  మత్తయి 24:12.  కనుక మన స్వార్థము ఒక కారణమైతే,  

        రెండవ కారణము, చాలా ప్రత్యేకత పొందియున్నది.  చిన్న బిడ్డగా పుట్టువాడు జీవగ్రంథమందు నమోదు చేయబడి దేవుడు భూలోకమునకు పంపును.  ప్రకటన  3:5, ''జయించు వాడు ఆలాగున తెల్లని వస్త్రములు ధరించుకొనును;  జీవ గ్రంథములోనుండి అతని పేరెంతమాత్రమును తుడుపు పెట్టక, నా తండ్రి యెదుటను ఆయన దూతల యెదుటను అతని పేరు ఒప్పుకొందును.''  

        ఇలా జీవగ్రంథములో వ్రాయబడినవారు కొద్దివారైన గొప్పవారైన వారిలో తప్పులేదు క్రియలు లేవు కనుక అవి మంచివి లేక చెడు రెండును లేవు కనుక వారు పరలోక రాజ్యములో అతి అల్పమైన స్థితిలోనైనా వుందురు.  ఇందులో ఏ తేడా లేదు.  ఎందుకంటే తీర్పు వారి క్రియలనుబట్టి వుండును.  వీరు, పసిబిడ్డలు కనుక వీరికి చెడు కార్యములు లేవు కనుక వారు శిక్షార్హులు కారు.  కనుక దైవరాజ్యములో వారికి ప్రవేశము కలుగునని గ్రహించాలి.  మత్తయి 18:4, ''కాగా ఈ బిడ్డవలె తన్నుతాను తగ్గించుకొనువాడెవడో వాడే పరలోకరాజ్యములో గొప్పవాడు.''

దావీదు చేసిన వ్యభిచారము, నరహత్య తనకు అక్రమముగా పుట్టిన బిడ్డ మరణమునకు కారణమైనది

        2 సమూయేలు 11:2-5, ''ఒకానొక దినమున ప్రొద్దు గ్రుంకువేళ దావీదు పడకమీదనుండి లేచి రాజనగరి మిద్దెమీద నడుచుచు పైనుండి చూచుచుండగా స్నానముచేయు ఒక స్త్రీ కనబడెను.  ఆమె బహు సౌందర్యవతియై యుండుట చూచి దావీదు దాని సమాచారము తెలిసికొనుటకై యొక దూతను పంపెను, అతడు వచ్చి-ఆమె ఏలీయాము కుమార్తెయు హిత్తీయుడగు ఊరియాకు భార్యయునైన బత్షెబ అని తెలియజేయగా దావీదు దూతలచేత ఆమెను పిలువనంపెను.  ఆమె అతనియొద్దకు రాగా అతడు ఆమెతో శయనించెను; కలిగిన అపవిత్రత పోగొట్టుకొని ఆమె తన యింటికి మరల వచ్చెను.  ఆ స్త్రీ గర్భవతియై-నేను గర్భవతినైతినని దావీదునకు వర్తమానము పంపగా''  ఇది దావీదు కామదాహమునకు ఒక నిదర్శనము.  

మనము చేసిన పాపము మూడు నాలుగు తరముల వరకు ఏడింతల శిక్షను మన సంతానము పొందును.

2 సమూయేలు  11:14-17, ''ఉదయమున దావీదు - యుద్ధము మోపుగా జరుగుచున్నచోట ఊరియాను ముందుపెట్టి అతడు కొట్టబడి హతమగునట్లు నీవు అతని యొద్దనుండి వెళ్లిపొమ్మని యోవాబునకు ఉత్తరము వ్రాయించి ఊరియాచేత పంపించెను.  యోవాబు పట్టణమును ముట్టడివేయుచుండగా, ధైర్యవంతులుండు స్థలమును గుర్తించి ఆ స్థలమునకు ఊరియాను పంపెను.  ఆ పట్టణపువారు బయలుదేరి యోవాబుతో యుద్ధమునకు రాగా దావీదు సేవకులలో కొందరు కూలిరి, హిత్తీయుడగు ఊరియాయును హతమాయెను.''  ఇది నరహత్యతో సమానము.  చేయించినవాడు దావీదు.  కాని దావీదు చేసిన పాపమునకు పశ్చాత్తాపము పడకపోవుట అతనికి అది పాపముగా ఎంచబడినది.  అటుతరువాత 2 సమూయేలు 12:1-12లో నాతాను ప్రవక్త దావీదు చేసిన తప్పును గుర్తుచేసి పశ్చాత్తాపపడునట్లుగా చేయుచున్నాడు.  పశ్చాత్తాపము ద్వారా తన ఆత్మను రక్షించుకొనగలిగినను శిక్ష మాత్రము తప్పలేదు.  2 సమూయేలు 12:13-15, ''నేను పాపముచేసితినని దావీదు నాతానుతో అనగా నాతాను-నీవు చావకుండునట్లు యెహోవా నీ పాపమును పరిహరించెను.  అయితే ఈ కార్యము వలన యెహోవాను దూషించుటకు ఆయన శత్రువులకు నీవు గొప్ప హేతువు కలుగజేసితివి గనుక నీకు పుట్టిన బిడ్డ నిశ్చయముగా చచ్చునని దావీదుతో చెప్పి తన యింటికి వెళ్ళెను.''  తరువాత శిశువు మరణించుట జరుగును.

        ఇచ్చట శిశువు మరణించుటకు కారణము తల్లిదండ్రులే.  వారు వ్యభిచరించి అక్రమ సంతానముగా బిడ్డను పొందారు.  అంతేకాదు తండ్రి నరహత్య చేయించాడు.  ఇలా ధర్మశాస్త్ర విరుద్ధముగా పాపము చేసినవాడు మూడు నాలుగు తరములవరకు ఏడింతలుగా శిక్షింపబడునని బైబిలు గ్రంథము చెప్పుచున్నది.  నిర్గమ కాండము 20:5-6, ''ఏలయనగా నీ దేవుడనైన యెహోవానగు నేను రోషముగల దేవుడను; నన్ను ద్వేషించువారి విషయములో మూడు నాలుగు తరముల వరకు, తండ్రుల దోషమును కుమారులమీదికి రప్పించుచు నన్ను ప్రేమించి నా ఆజ్ఞలు గైకొనువారిని వెయ్యితరములవరకు కరుణించువాడనై యున్నాను.''  లేవీయకాండము 26:28, ''నేను కోపపడి మీకు విరోధముగా నడిచెదను.  నేనే మీ పాపములను బట్టి యేడంతలుగా మిమ్మును దండించెదను.''

        కనుక ఈ తప్పుకు మూడు నాలుగు తరముల వరకు శిక్ష అనుభవించవలసిందే.  కాని పాపపశ్చాత్తాపము వల్ల కొంత ఊరట కల్గి వారు పవిత్రులు అగుదురు.  అప్పుడు వారికి పుట్టిన బిడ్డకు ఆ పాపముతో సంబంధము వుండదు.  కనుక నిజమైన పశ్చాత్తాపము పాపమునుండి విముక్తి కలిగి మన బిడ్డలపైకి రాకుండా ఆపును.  పాపములోని తల్లిదండ్రులకు పుట్టిన బిడ్డ దేవుని కోపమును వారసత్వముగా పొందవలసినదే అని గ్రహించాలి.

        పరలోకము నుండి వచ్చు జీవాత్మకు పాపము వుండదు, ఎందుకంటే ప్రకటన 3:5 ప్రకారము వారి పేరు జీవ గ్రంథమందు వ్రాయబడి వారిని భూమిపైకి పంపబడినవారు.  ఇటువంటివారు వారి గత సృష్టిలో మంచి కార్యములు లేకపోవుట చేత చెడు కార్యముల కొరకు శిక్షింపబడి, ఏమిలేని స్థితిలో శిక్షను పూర్తి చేసి పరలోకమునకు వెళ్ళుదురు.  ఇటువంటివారిని పరమున సాధారణ స్థితి లభించునుగాని ఉన్నత స్థితి లభించదు.  వీరు మరల సృష్టిలో సాధారణమైన వాని గర్భముననే జన్మింతురు.  వారి ఆత్మ ఇటువంటి స్థితిని ఒప్పుకొనక - నా తల్లిదండ్రుల పాపముతో నాకు పాలిపంపులు అవసరములేదు.  నాకు వద్దు అని దేవునిని వేడుకొనును.  అలా దేవుని ప్రార్థనలో సంధించుట చేత దేవుని కోపము వారి తల్లిదండ్రులపై రగులుకొని ఏదో ఒక రూపములో అనగా జబ్బు, ఆకస్మిక మరణము, మొదలైన విధానములో పసిబిడ్డ మరణించుట జరుగును.  అనగా పసిబిడ్డ మరణమునకు కారణము తల్లిదండ్రులని పసిబిడ్డ కాదని గుర్తించాలి.

        పసిబిడ్డ దేవునితో ఎలా ప్రార్థించును?  వారిలో భాష రానివారు వుంటారు, మాటలు రానివారు వుంటారు, సరిగా మాట్లాడలేని వారుంటారు,  ఎలా చెప్పాలో తెలియనివారు వుంటారు.  ఇక్కడ మనము ఒక ప్రత్యేకమైన సంగతి తెలుసుకోవాలి.  పసిబిడ్డలోని ఆత్మ దేవుని ప్రార్థించునని గుర్తించాలి.  ఎలా?  రోమా 8:26-27, ''అటువలె ఆత్మయు మన బలహీనతను చూచి సహాయము చేయుచున్నాడు.  ఏలయనగా మనము యుక్తముగా ఏలాగు ప్రార్థన చేయవలెనో మనకు తెలియదు గాని, ఉచ్చరింప శక్యముకాని మూలుగులతో ఆ ఆత్మ తానే మన పక్షముగా విజ్ఞాపనము చేయుచున్నాడు.  మరియు హృదయములను పరిశోధించువాడు ఆత్మయొక్క మనస్సు ఏదో యెరుగును; ఏలయనగా ఆయన దేవుని చిత్తప్రకారము పరిశుద్ధులకొరకు విజ్ఞాపనము చేయుచున్నాడు.''  పసిబిడ్డకు శరీరరీత్యా ఇంకా ఎదుగుదల లేక ప్రార్థించలేక పోవచ్చును.  కాని వారి ఆత్మ బలమైన స్థితిలోనే వుండి మాటలకు సాధ్యపడని మూలుగులద్వారా దేవుని ప్రార్థించి, తనకు తన తల్లిదండ్రులద్వారా రాబోవు శిక్ష నుండి తప్పింపమని దానికొరకు మరణించుటకైనను సిద్ధమని దేవుని వేడుకొనును.  కనుక తల్లిదండ్రులు పాపము చేయక పరిశుద్ధ స్థితిలో వుంటే మంచిదని గుర్తించాలి.

పసిబిడ్డలోని ఆత్మ ఉచ్ఛరింప శక్యము కాని మూలుగులతో దేవునికి విజ్ఞాపన చేయును

        ఇక్కడ ఇంకొక విషయము గుర్తించాలి.  తల్లి దండ్రులు పాపము చేసినను కొంతమంది శిశువులు వారి ఇంట చనిపోకుండా వుంటారు.  ఈ ఆత్మలు ప్రార్థనా జీవితములోనివి కావు.  ఇవి గత సృష్టిలో దైవ వ్యతిరేకమైనవే.  శిక్షను అనుభవించినను ఆత్మ పుట్టుకతోనే అదే పాపపు ఆలోచనతోనే వుండెను కనుక ఈ ఆత్మలు తమ ప్రార్థనలో దేవునిని అడగవు.  కనుక వారిని దేవుడు శిక్షించి మరణించునట్లుగా చేయడని గుర్తించాలి.  

ఇందునుబట్టి దైవభక్తిలో యోగ్యమైన ఒక ఆత్మ మన ఇంటిలో పుట్టి ఈ ఇల్లు పాప భూయిష్టమై యుండుట చేత వారి తల్లిదండ్రులు పాపులై దేవుని కోపమనే తరతరాల శిక్షను పొందియుండి యుండుటచేత దానిలో భాగస్వామ్యము నాకు వద్దని ప్రార్థించుటచేత, దైవభక్తి ఉన్నతస్థితి గల్గిన ఆత్మ ఏదో ఒక కారణముచేత చనిపోవుట జరుగును.  అనగా మన కుటుంబములో దేవునిలో ఉన్నతస్థితిలో జన్మించిన ఆత్మ చనిపోవుట జరుగుచున్నదని గ్రహించి బాధపడవలసి యున్నదని ఈ పుస్తకము ద్వారా భూజనులను హెచ్చరించుచున్నాను.

        దావీదు సంఘటనలో దావీదు పాపములో వుండగా పుట్టిన బిడ్డ మరణించుట జరిగింది.  కాని దావీదు మారుమనస్సు పొంది దేవుని పశ్చాత్తాపము పొందిన తరువాత శిక్షను అనుభవించిన తరువాత వారికి సొలొమోను పుట్టుట జరిగింది, కాని ఈ బిడ్డ మరణించలేదు.  దీనికి కారణము, సొలొమోను ఆత్మ ఉన్నతమైనదే.  అలాగే సొలొమోను పుట్టునప్పటికి దావీదు తిరిగి పాపము నుండి విమోచింపబడి ఉన్నత స్థితిని పొందియున్నాడు.  కనుక సొలొమోను వంటి దైవజనుడు పుట్టుట జరిగి శిశువుగా మరణించలేదు.  కాని దావీదు గొప్పవాడు కనుక తాను పాపము చేసినను, ఆయన ద్వారా జన్మించిన మొదటి బిడ్డ పరలోకములో గొప్ప స్థితిని కలిగియుండునని గ్రహించాలి.  ఇలాంటి బిడ్డ దావీదు ఉన్నతమైన స్థితిలో కాకుండా పాపపు స్థితిలో పుట్టుట జరిగింది.  కనుకనే ఈ ఆత్మ తన తల్లిదండ్రుల పాపముతో నాకు పాలిపంపులు వద్దని దేవుని ప్రార్థనతో సంధించి, దేవుని కోపము వారి తల్లిదండ్రులపైకి వచ్చునట్లు చేసి తాను శరీరరీత్యా మరణించి తిరిగి దేవుని సన్నిధి అనగా పరదైసునందు చేరుతున్నట్లుగా గ్రహించాలి.

11.  ఒకేసారి అనేకమంది చనిపోవుటకు కారణము

        ఈమధ్య 2004వ సంవత్సరములో డిసెంబరు 24వ తేదీన సునామి అను పేరుతో వచ్చిన ఉప్పెన వల్ల సుమారు 3 లక్షలమంది చనిపోయారు.  2005వ సంవత్సరములో పాకిస్తాన్‌లో వచ్చిన భూకంపము వల్ల సుమారు 75,000 మంది చనిపోయారు.  ఇలా మనము చెప్పుకుంటూ పోతే అనేక సంఘటనలు వస్తాయి.  ఇంతకి రెండవ ప్రపంచ యుద్ధములో ఎంతమంది చనిపోయారు?  ఈ భూమి పుట్టినప్పటినుండి ఎన్ని యుద్ధములు జరిగాయి?  ఎంతమంది చనిపోవుట జరిగింది?  దీనికి కారణమేమై యుండును.

        హెబ్రీ 3:16-17, ''విని కోపము పుట్టించినవారెవరు?  మోషేచేత నడిపింపబడి ఐగుప్తులోనుండి బయలుదేరి వచ్చిన వారందరే గదా!  ఎవరి మీద నలువది ఏండ్లు ఆయన కోపగించెను?  పాపము చేసినవారి మీదనే గదా?  వారి శవములు అరణ్యములో రాలి పోయెను.''  6 లక్షల ఇశ్రాయేలీయుల మగ యోధులతో ఐగుప్తు నుండి దైవజనము రాగ వారందరు దేవునికి విరోధముగా సణిగి అరణ్యములో శవములుగా రాలి పోయెనని బైబిలు గ్రంథములోని మోషే చరిత్రలో చదవగలము.  ఇలా వీరు అర్థాంతరముగా మరణించుటకు కానాను చేరక పోవుటకు కారణము - దేవునిపై వారు సణుగుట మరియు దేవుని కోపము వారిపై రగులుట.

అరణ్యములో 6 లక్షల ఇశాయ్రేలీయుల శవములుగా రాలిపోవుటకు కారణము వారు చేసిన పాపమే కదా!

        ఆది 6:13, ''దేవుడు నోవహుతో - సమస్త శరీరుల మూలముగా భూమి బలాత్కారముతో నిండియున్నది గనుక నా సన్నిధిని వారి అంతము వచ్చియున్నది;  ఇదిగో వారిని భూమితోకూడ నాశనము చేయుదును.''  ఇందులో నోవహు కాలములో జీవిస్తున్న సమస్త శరీరుల మూలముగా భూమి బలాత్కారముతో నిండియున్నది.  బలాత్కారము చేయుట అనగా ఇష్టము లేకపోయినను బలవంతముగా తీసుకొనుటను బలాత్కారము అందురు.  అనగా మనకు ఇష్టము వుండదుగాని లంచము ఇవ్వాలి.  అలా చేయకపోతే పని జరుగదు.  మనకు ఇష్టము లేకపోయినను అందరిలాగానే మనము పాపపు కార్యములు చేయాలి.  బలవంతముగా మానభంగము చేయుట, మొదలైనవన్ని బలాత్కారము క్రింద లెక్కించబడును.  ఇలాంటి నీచ పాపపు కార్యములు కొద్దిమందిలో కాదుగాని, నోవహు కాలములో సమస్త శరీరులలో వున్నట్లుగా దేవుడు నోవహుతో చెప్పుచున్నాడు.  కనుకనే దేవుని సన్నిధిలో వారికి అంతము వచ్చిందని చెప్పబడినది.  ఈ కారణము వలన నోవహు కాలములో వున్న సమస్త జనాభా జలప్రళయము ద్వారా నశించారు.  దీనికి కారణము బలాత్కారమని గ్రహించాలి.

        అలాగే ఆదికాండములో సొదొమ, గొమొఱ్ఱా పట్టణములను అగ్నిగంధకములతో నాశనము జరిగించుటకు కారణమేమి?  ఆది 18:20, ''మరియు యెహోవా-సొదొమ గొమొఱ్ఱాలను గూర్చిన మొర గొప్పది గనుకను వాటి పాపము బహుభారమైనది గనుకను'',  ఇందునుబట్టి పాపపు మొర ఎక్కువై భరింపరానిదిగా మారుట ద్వారా ఆ పట్టణములను నాశనము చేయుటకు దేవుని నిర్ణయము అబ్రాహామునకు తెలియజేసాడు.  అలాగే యుద్ధాలు దేవుడు పాపపు నరులను తొలగించుట కొరకు సాతానుకు దేవుడు అప్పగించునని గ్రహించాలి.  కనుకనే యుద్ధాలలో జరుగు మారణహోమమును లెక్కించలేము.  ఇలా చెప్పుతూ వెళితే ఇశ్రాయేలీయుల చరిత్రలో అనేక సంఘటనలు వున్నవి.  వారి నాశనమునుగాని, వారు జరిగించిన యుద్ధాలకుగాని కారణములు పాపమే.  వారి నాశనము  వారు దేవునికి దూరమై అన్య దేవతలను పూజించుట ద్వారా పొందారు.  ఈ నాశన కాలములో వారిలో అనేకులు మరణించుట జరిగింది.  శేషించిన కొద్దిమంది తిరిగి దేవునిలోకి తిరిగి మారుమనస్సు పొందినప్పుడు అన్యులకు నాశనము జరుగుచూ వచ్చింది.

        ప్రకటన 8:4-5, ''అప్పుడా ధూపద్రవ్యముల పొగ పరిశుద్ధుల ప్రార్థనలతో కలిసి దూత చేతిలోనుండి పైకి లేచి దేవుని సన్నిధిని చేరెను.  ఆ దూత ధూపార్తిని తీసికొని, బలి పీఠము పైనున్న నిప్పులతో దానిని నింపి, భూమిమీద పడవేయగా ఉరుములు ధ్వనులు మెరుపులు భూకంపమును కలిగెను.'' యుగాంతములో ఈ భూమి పాపముతో నిండియుండుట చేత భూమి మీద జరుగు భూకంపమునకు పరిశుద్ధుల ప్రార్థనలే కారణమయ్యాయి.  అనగా వారు వారి రక్తమునకు ప్రతిగా దండనను ఇయ్యమని వారు చేసిన ప్రార్థనల ఫలితము భూకంపముగా మొదట క్రియ జరిపించింది.  

సంఘటనలు                                                       కారణములు             

1.  6 లక్షల మంది అరణ్యములో శవములుగా రాలిపోవుట . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . .  పాపము   (దైవ వ్యతిరేకముగా సణుగుట)   (హెబీ 3:16-17)

2.  నోవహు కాలములో జల పళ్రయములో అప్పటి జనము మరణించుట . . . . . . . . . . . . . .  బలత్కారము (అనగా పాపము బలవంతముగా జరిగించబడుచున్నది)   (ఆదికాండము 6-7 అధ్యాయములు)

3.  సొదొమ గొమొఱ్ఱా అగ్నిగంధకములో నాశనమగుట . . . . . . . . . . . . . . . . . . . పాపము బహు భారముగా మారినది ( పట్టణములో కనీసము 10 మంది నీతిమంతులు లేకపోవుట)   (ఆది 18, 19 అధ్యాయములు)

4.   యుగాంతములో  భూమి అందులోని సమస్తము నాశనమునకు కారణము . . . . . . . . . . . . .  పాపమే (పక్రటన గంథము.)

5.  పాకిస్తాన్లో 2005 సం  భూకంపము వల్ల 75,000 మంది చనిపోవుటకు . . . . . . . . . . .  ?  

6.  2004 సం  డిసెంబరు 4 తేదీన వచ్చిన సునామిలో 3 లక్షలమంది మరణమునకు . . . . . ?

పాఠకులారా!  చదివి గహ్రించండి!

        అలాగే, ప్రకటన 11:19, ''మరియు పరలోకమందు దేవుని ఆలయము తెరవబడగా దేవుని నిబంధనమందసము ఆయన ఆలయములో కనబడెను.  అప్పుడు మెరుపులును ధ్వనులును ఉరుములును భూకంపమును గొప్ప వడగండ్లును పుట్టెను.''  ఇందులో దేవుని నిబంధనమందసము దేవుని పది ఆజ్ఞలకు  మూలము.  ఈ ఆజ్ఞలు మందసము రూపములో మోషే కాలములో క్రియ జరిగించాయి.  అనగా పది ఆజ్ఞలు మీరిన వారికి దేవుని నిబంధన మందసముగా వున్న ఈ ఆజ్ఞలు తన ఉగ్రతను వారిపై కనపరిచినాయి.  దాని ఫలితము అనేకులు నాశనము పొందినట్లుగా యిశ్రాయేలీయుల చరిత్రలో చదువగలము.  ఇప్పుడు అదే నిబంధనమందసము పరలోకములో వున్నట్లుగా ఈ వాక్యములో చెప్పబడినది.  అయితే మోషే కాలము నుండి యుగాంతము వరకు ఈ నిబంధనమందసములోని ఆజ్ఞలను మీరిన వారిపై తన ఉగ్రతను చూపుచూనే వున్నది.  అనేక భూకంపములకు కారణము అనేకుల అకస్మిక మరణమునకు కారణముగా యున్నది.

        అలాగే ప్రకటన గ్రంథములో జరగవలసిన యుగాంతమునకు కారణము కూడా పాపమే!  ఈ పాపము ఎక్కువై తన మొరను దేవుని సన్నిధిలో వినిపించినప్పుడు దేవుడు తన ఉగ్రతను పంపి అనేకుల అకస్మిక మరణమునకు కారణమగుచున్నాడు.  అయితే ఇక్కడ మనము ఒక సంగతి గమనించవలసియున్నది.  అదేమిటంటే - ఈనాడు అనేక ప్రాంతాలలో జనాభా విస్తరించియున్నది.  అందులో ఒక ప్రాంతములోని జనాభా యుద్ధముల ద్వారా, బాంబులద్వారా, జల ప్రళయము ద్వారా నశించినవారి పాపము మితిమీరినదిగా చెప్పవచ్చును.  అంతమాత్రాన మిగిలిన ప్రారతముల వారు పరిశుద్ధులని కాదు లేక పాపము చేయనివారు అని మనము అనుకోకూడదు.  మిగిలిన ప్రాంతాలవారు కూడా పాపములో మ్రగ్గుచున్న వారే.  కాని వారిలో కొందరు పరిశుద్ధులు వున్నారు.  వారి కోసము, ఆ ప్రాంతమును దేవుడు విడిచిపెట్టి, ఆ ప్రాంతములో అపరిశుద్ధులు చేయు పాపపు క్రియలను ఓర్పుతో సహించుచున్నట్లుగా మనము గ్రహించాలి.

ఎంత ఘోరమైన పాపులు వున్నను వారి మధ్య 10 మంది పరిశుద్ధులు వున్న  ప్రాంతమును దేవుడు నాశనము చేయడు

        ఆదికాండము 18:20-33లో వలె అబ్రాహాము సొదొమ, గొమొఱ్ఱా పట్టణములకు జరగబోవు సంగతి వినినప్పుడు, అబ్రాహాము సాహసించి దేవునితో 50 మంది - 45 మంది         - 40 మంది - 30 మంది - 20 మంది - 10 మంది నీతిమంతులు వున్న నాశనము చేయుదువా అని అడిగాడు.  అందుకు దేవుడు చివరకు 10 మంది నీతిమంతులు వున్నా ఆ సొదొమ గొమొఱ్ఱా పట్టణములను నాశనము చేయనని చెప్పుట జరిగింది.  అయితే మనము లోతు చరిత్ర చదివినట్లైతే - ఆ సొదొమ గొమొఱ్ఱా పట్టణములలో కేవలము లోతు, లోతు భార్య, అతని ఇద్దరు కుమార్తెలు మాత్రమే నీతిమంతులుగా వున్నట్లుగా మనము గ్రహించాలి.  అయితే దేవుడు నాశనము చేయునప్పుడు వారిని తప్పించి నాశనము చేసాడు.

        ఇందునుబట్టి ఒకేసారి అనేకమంది చనిపోవుటకు కారణము పాపమే!  వారు చేసిన పాపమే వారి మరణమునకు కారణమైనది.  ఒక్కొక్క ప్రాంతములో కనీసము అబ్రాహాము అడిగినంతమంది నీతిమంతులు జీవిస్తున్నా వారి కోసముగా ఆ ప్రాంతములోని అపరిశుద్ధులను వదిలి వేస్తున్నట్లుగా గుర్తించాలి.  అంతమాత్రాన వారికి శిక్ష రాదని కాదు.  పరిశుద్ధుల జీవన విధానము కోసము ఆ ప్రాంతములో వారిని దేవుడు శిక్షించక కనికరమును చూపుచున్నాడు.  ఒక్కసారే ఎక్కువమంది చనిపోయిన వారి పాపము గొప్పదే.  కాని మనము బ్రతికియున్నంత మాత్రాన మనము, మన ప్రాంతమంతా మంచివారని కాదు.  మన ప్రాంతములో కూడా అనేక పాపపు బలాత్కార క్రియలు జరుగుచున్నవి.  కాని దేవుడు నీతిమంతుల కోసరము ఆ ప్రాంతము వారిని కనికరముతో ఉపేక్షిస్తున్నట్లుగా మనము గ్రహించాలి.  2 పేతురు 3:9.

12.  మరణమును తెచ్చు వ్యాధులు - వైద్యము

        ఈనాడు ప్రతి సంవత్సరము గుండె జబ్బుల వల్ల మరణించుచున్నవారు ఎందరు?  ప్రతి సంవత్సరము హెచ్‌.ఐ.వి. వల్ల చనిపోవువారు ఎందరు?  

        ఇలా చెప్పుకొంటూపోతే  అనేక రకముల జబ్బులు ప్రతి ఏటా వాటివాటి క్రియలను పూర్తి చేస్తున్నాయి. ఈనాడు అన్నింటికన్నా రోగముల చేత చనిపోయేవారే ఎక్కువమంది వున్నారు.  అనగా మరణ దూత ఈ రోగముల ద్వారా కూడా నరులను మంటికి పంపుచున్నది.

        ఇటువంటి రోగములకు మందులున్నవంటే మనలోని భయము తొలగి ఆనందమును రేపుతుంది.  కాని ఈ మందు ఎంతవరకు బ్రతికించగలుగుచున్నది.  వాని జీవితకాలము వరకే కదా!  అయితే మందులలో వున్న ప్రత్యేకత ఏమిటి?  ఇందునుగూర్చి ఇప్పుడు తెలుసుకొందము.  2 రాజులు 20:1, ''ఆ దినములలో హిజ్కియాకు మరణకరమైన రోగము కలుగగా, ఆమోజు కుమారుడును ప్రవక్తయునైన యెషయా అతనియొద్దకు వచ్చి-నీవు మరణమవుచున్నావు, బ్రదుకవు గనుక నీవు నీ యిల్లు చక్కబెట్టుకొనుమని యెహోవా సెలవిచ్చుచున్నాడని చెప్పగా'',  ఈ విధముగా హిజ్కియా రాజు మరణకరమైన వ్యాధితో బాధపడుచున్నాడు.  అనగా ఈ వ్యాధికి అంతము మరణమే.  

ఈనాడు రకరకాల జబ్బులతో మరణించువారు ఎందరు?

        ఈ విషయమును యెషయా ప్రవక్త తెలియజేయగా హిజ్కియా రాజు ఏమి చేసాడో తెలుసుకోవలసిన అవసరత మనకు వున్నది.  ఇది చాలా ముఖ్యమైన విషయము.

        2 రాజులు 20:2-3, ''అతడు తన ముఖము గోడతట్టు త్రిప్పుకొని - యెహోవా, యథార్థహృదయుడనై, సత్యముతో నీ సన్నిధిని నేనెట్లు నడుచు కొంటినో, నీ దృష్టికి అనుకూలముగా సమస్తమును నేనెట్లు జరిగించితినో కృపతో జ్ఞాపకము చేసికొనుమని హిజ్కియా కన్నీళ్లు విడుచుచు యెహోవాను ప్రార్థించెను.''  ఎప్పుడైతే తనకు మరణకరమైన వ్యాధి వున్నదని తెలుసుకొన్నాడో వెంటనే తన ముఖమును గోడ తట్టుకు త్రిప్పుకొని కన్నీళ్ళు విడుచుచూ యెహోవాను ప్రార్థించాడు.  అలా మనకు రోగములు పట్టినప్పుడు మొదట మనము దేవుని ప్రార్థించాలి.  అందుకు 2 రాజులు 20:4-5, ''యెషయా నడిమిశాలలో నుండి అవతలకు వెళ్లకమునుపే యెహోవా వాక్కు అతనికి ప్రత్యక్షమై ఈలాగు సెలవిచ్చెను.  -నీవు తిరిగి నా ప్రజలకు అధిపతియైన హిజ్కియా యొద్దకు పోయి అతనితో ఇట్లనుము-నీ పితరుడైన దావీదునకు దేవుడగు యెహోవా నీకు సెలవిచ్చునదేమనగా- నీవు కన్నీళ్లు విడుచుట చూచితిని;  నీ ప్రార్థన నేనంగీకరించి యున్నాను;  నేను నిన్ను బాగుచేసెదను;  మూడవ దినమున నీవు యెహోవా మందిరమునకు ఎక్కి పోవుదువు.''  ఇందులో మరణకరమైన వ్యాధితో బాధపడు హిజ్కియా ప్రార్థనకు ఫలితము వచ్చింది.  స్వస్థత జరుగునని చెప్పబడినది.  అంతేకాదు - 2 రాజులు 20:6, ''ఇంక పదునయిదు సంవత్సరముల ఆయుష్యము నీకిచ్చెదను;  మరియు నా నిమిత్తమును నా సేవకుడైన దావీదు నిమిత్తమును ఈ పట్టణమును నేను కాపాడుచు, నిన్నును ఈ పట్టణమును అష్షూరు రాజు చేతిలో పడకుండ నేను విడిపించెదను.''  

మరణకరమైన వ్యాధి అతనిలో వున్నను నరుని ఆయుస్సు వున్నంతవరకు అది ఏమియు చేయలేదు

        ఇలా దేవుని యొద్దనుండి 15 సంవత్సరముల ఆయుస్సు పొందుట జరిగింది.  ఎప్పుడైతే మారుమనస్సు కల్గి ప్రార్థన జరిగిస్తామో ఆ ప్రార్థనను దేవుడు గుర్తించినట్లైతే మనకు మరణకరమైన వ్యాధి వున్నను దేవుడు మనకు ఆయుస్సు పెంచును.  దేవుడు ఎప్పుడైతే మన ఆయుస్సు పెంచాడో - మరణకరమైన రోగములు కలిగియుండి మరణించకుండా వుండు వారిని అనేకులను మనము మన నిజ జీవితములో చూడవచ్చును.  ఇలా ఎప్పుడైతే హిజ్కియా తన ప్రార్థన వల్ల ఆయుస్సును పొందాడో - ఈ లోక సంబంధమైన వైద్యము అతనియందు పని చేసింది.  2 రాజులు 20:7, ''పిమ్మట యెషయా-అంజూరపుపండ్ల ముద్ద తెప్పించుడని చెప్పగా వారు దాని తెచ్చి కురుపుమీద వేసినతరువాత అతడు బాగుపడెను.''  

        ఇందులో అంజూరపు పండ్లను ముద్దగా చేసి కురుపుకు పెట్టినప్పుడు ఆ కురుపు మానుట జరిగింది.  అనగా ఈ లోక సంబంధమైన ఈ మందులు అన్ని నరుని ఆయుస్సు వరకు మాత్రమే పని చేయునని గ్రహించాలి.  ఈ ఆయుస్సు పెరగాలి అంటే వైద్యునిలో లేదుగాని పరమ వైద్యుడైన క్రీస్తు ప్రభువు చేతిలో వున్నదని గ్రహించాలి.  ఇందునుబట్టి, మనకు రోగములు వచ్చినప్పుడు మొదట ప్రార్థించి అటుతరువాత వైద్యమును పొందవచ్చునని గ్రహించాలి.  ఈ లోకము వైద్యశాస్త్రము దేవుడు ఇచ్చిన జ్ఞానమేకాని నరుల స్వంత జ్ఞానము కాదు, ఎందుకంటే పైనుండి అనుగ్రహింప బడనిదే మనము ఏమి చేయజాలమని గ్రహించాలి.  

        యాకోబు 3:17, ''అయితే పైనుండివచ్చు జ్ఞానము మొట్టమొదట పవిత్రమైనది, తరువాత సమాధానకర మైనది, మృదువైనది, సులభముగా లోబడునది, కనికరముతోను మంచి ఫలములతోను నిండుకొనినది, పక్షపాతమైనను వేషధారణయైనను లేనిదియునై యున్నది.''  కనుక మరణకరమైన రోగములు నరుని మంటిగా మార్చుటకు అతనిలోని జీవమును చంపును.  అందుకుగాను అతని శరీరములో అవయవములను పని చేయనీయక ఆపును.  అయితే మరణకరమైన వ్యాధి వచ్చినను దేవుడు వానికి ఆయువు పెంచినట్లైతే వానికి ఆ వ్యాధి ప్రభావము వల్ల మరణము సంభవించదని గ్రహించాలి.

13.  అయోగ్యముగా ప్రభువు శరీరమును - రక్తము పుచ్చుకొని మనలో కొందరు బలహీనులై రోగులై మరణించుట!

        1 కొరింథీ 11:23-30, ''నేను మీకు అప్పగించిన దానిని ప్రభువు వలన పొందితిని.  ప్రభువైన యేసు తాను అప్పగింపబడిన రాత్రి యొక రొట్టెను ఎత్తికొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దానిని విరిచి-యిది మీకొరకైన నా శరీరము;  నన్ను జ్ఞాపకము చేసికొనుటకై దీనిని చేయుడని చెప్పెను.  ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్రను ఎత్తికొని- యీ పాత్ర నా రక్తమువలననైన క్రొత్తనిబంధన;  మీరు దీనిలోనిది త్రాగునప్పుడెల్లనన్ను జ్ఞాపకము చేసికొనుటకై దీనిని చేయుడని చెప్పెను.  మీరు ఈ రొట్టెను తిని, యీ పాత్రలోనిది త్రాగునప్పుడెల్ల నన్ను జ్ఞాపకము చేసికొనుటకై దీనిని చేయుడని చెప్పెను.  మీరు ఈ రొట్టెను తిని, యీ పాత్రలోనిది త్రాగునప్పుడెల్ల ప్రభువు వచ్చువరకు ఆయన మరణమును  ప్రచురించుదురు.  కాబట్టి యెవడు అయోగ్యముగా ప్రభువుయొక్క రొట్టెను తినునో, లేక ఆయన పాత్రలోనిది త్రాగునో, వాడు ప్రభువుయొక్క శరీరమును గూర్చియు రక్తమును గూర్చియు అపరాధియగును.  కాబట్టి ప్రతి మనుష్యుడు తన్ను తాను పరీక్షించుకొనవలెను;  ఆలాగుచేసి ఆ రొట్టెను తిని, ఆ పాత్రలోనిది త్రాగవలెను.  

పభ్రువు బల్ల భోజనములో అయోగ్యముగా తీసుకొను రొట్టె ద్రాక్షారసము మన శరీరమును బలహీనపరచి రోగులుగా మార్చి మన మరణమునకు ఒక కారణమగునా!

        ప్రభువు శరీరమని వివేచింపక తిని త్రాగువాడు తనకు శిక్షావిధి కలుగుటకే తిని త్రాగుచున్నాడు.  ఇందువలననే   మీలో అనేకులు బలహీనులును రోగులునై యున్నారు;  చాలమంది నిద్రించుచున్నారు.''  మనము ప్రభువు శరీరమును రొట్టెతో - రక్తమును పులియని ద్రాక్షారసముతో మాదిరిగా చూపుచూ సంఘములో పుచ్చుకొనుచున్నాము.  మనలో ఎంతమంది అది పుచ్చుకొనుటకు సిద్ధపాటు కలిగియున్నారు?  ఇది మనలను మనము విమర్శించుకోవాలి.  మనలో పాపము చేసి పశ్చాత్తాపము పొందక ప్రభువు బల్లలో పాల్గొనువారు ఎందరు?  ఇవన్ని ఒక ప్రక్కన పెట్టితే, అసలు ప్రభువు బల్లలో పంచువాటిని రొట్టె, ద్రాక్షారసముగానే పుచ్చుకొనువారు ఎందరు?  వీరు దానిని ప్రభువు శరీరముగాను - రక్తముగాను భావించక పోవుట చేత ఆ ప్రభువు, శరీరము - రక్తము వానిని బలహీనపరచి, రోగిగా మార్చునని గ్రహించాలి.  చివరకు వానిని మరణమునకు అప్పగించును.

        పవిత్రమైనది అపవిత్రమైన దానిలో వుంచిన అక్కడి వారిని బలహీనపరచి రోగములు కలిగించునని గ్రహించాలి.  పాతనిబంధన కాలములో మందసములో నుండి ప్రభువైన దేవుడు ప్రత్యక్షపరుచుకొనేవాడు.  ఇది పవిత్రమైనది.  దీనిని ఫిలిష్తీయులను, అన్య దేవతా విగ్రహములను ఆరాధించువారు కొనిపోయి వారి దేశములో అనగా అపవిత్ర ప్రాంతములో వుంచినప్పుడు ఏమి జరిగిందో మనము ఇప్పుడు తెలుసుకొందము.   1 సమూయేలు 5:1, ''ఫిలిష్తీయులు దేవుని మందసమును పట్టుకొని ఎబెనెజరునుండి అష్డోదునకు తీసికొనివచ్చి''  1 సమూయేలు 5:6, ''యెహోవా హస్తము అష్డోదువారిమీద భారముగా ఉండెను.  అష్డోదువారిని దాని సరిహద్దులలో నున్నవారిని ఆయన గడ్డల రోగముతో మొత్తి వారిని హతము చేయగా''  అప్పుడు అష్డోదు ప్రాంతము వారలు ఆ మందసమును అపవిత్రమైన గాతు ప్రాంతమునకు పంపినారు.  1 సమూయేలు 5:9, ''అయితే వారు అష్డోదు నుండి గాతునకు దానిని మోసికొనిపోయిన తరువాత యెహోవా హస్తము ఆ పట్టణపు పెద్దలకు పిన్నలకును రహస్య స్థానములలో గడ్డలు లేపి వారిని మొత్తి, గొప్ప నాశనము చేసెను.''  ఇలా అపవిత్రమైన ప్రాంతములో దైవ ప్రత్యక్షత తనయందు చూపు మందసము పవిత్రమైనది గనుక ఆ ప్రదేశాలలో అనేక బలహీనతలను కలిగించి, రోగములను కలిగించి, చివరగా వారిలో అనేకులు పీడ చేత చచ్చిరని వ్రాయబడినది.

పవిత్రమ్రైనది అపవిత్ర స్థానములో వుంచినప్పుడు అక్కడ జరుగు ప్రతి అనర్థాలు పవిత్రమ్రైన దాని వలన కలిగినదే!

        అలాగే మనము ప్రభువు బల్లలో ప్రభువు శరీరమును రొట్టెగాను - ప్రభువు రక్తమును ద్రాక్షారసము రూపములో తీసుకొనుచున్నాము.  మన శరీరమును అపవిత్ర స్థితిలో వుంచుకొని, పవిత్రమైన ప్రభువు శరీర రక్తములను యాజకునిచే ప్రతిష్టించబడి పవిత్ర స్థితిలో మార్చబడిన రొట్టెను ద్రాక్షారసమును పుచ్చుకొనుట ద్వారా అది మన శరీరమను అపవిత్ర స్థలములో ప్రవేశించును.  అలా ప్రవేశించిన పవిత్రమైన ప్రభువు శరీరము రక్తము అను రొట్టె ద్రాక్షారసము మనలో బలహీనత కలిగించి రోగిగా మార్చును.  ఇలా అనేకులు మరణమును చివరగా పొందుచున్నారు.  ఇక్కడ మనము మరియొక విషయమును గుర్తుంచుకోవాలి.  అదే ప్రభువు శరీరము - రక్తమును  రొట్టెగాను ద్రాక్షారసముగా, ఏ పాపము చేయక, వాటియందు భక్తిశ్రద్ధలతో పుచ్చుకొనుట బహు శ్రేష్ఠమైనదని గ్రహించాలి.  అలా పుచ్చుకొనువారికి ఏ విధమైన కీడు వారికి కలుగదు.  పైపెచ్చు వారిలోని బలహీనతలను తీసివేసి రోగములను స్వస్థపరచునని గ్రహించాలి.  అయితే ఇందులో మరణించినవారిని - ''నిద్రించుచున్నారు,'' అని చెప్పుట మనము గమనించాలి.  1 కొరింథీ 11:30, ''చాలామంది నిద్రించుచున్నారు.''  అయోగ్యముగా ప్రభువు భోజనము భుజించి - పానమును త్రాగినను వారు ప్రభువునందు నిద్రించుచున్నవారిగానే చెప్పబడినది.  అంటే ప్రభువు నందు నిద్రించువారు ధన్యులే.  ప్రకటన 14:13, ''అంతట-ఇప్పటినుండి ప్రభువునందు మృతి నొందు మృతులు ధన్యులని వ్రాయుమని పరలోకమునుండి యొక స్వరము చెప్పగా వింటిని.  నిజమే;   వారు తమ ప్రయాసములు మాని విశ్రాంతి పొందుదురు;  వారి క్రియలు వారి వెంట పోవునని ఆత్మ చెప్పుచున్నాడు.''  కనుక వారి మరణానంతరము విశ్రాంతిలో వుందురు, ఎందుకంటే వారు ప్రభువు బల్లలో అయోగ్యముగా పొల్గొన్నను వారు ఆ శిక్షను అప్పుడే అనుభవించి, ఆ పీడ చేత వేదనను పొంది మరణిస్తున్నారు.  ఆ పీడనలో కూడా వారు క్రీస్తును వదలలేదు.  అంతేకాకుండా వారు బాధను అనుభవిస్తూ కూడా వారు అయోగ్యరీతిగా ప్రభువు బల్లలో పాల్గొన్నా కూడా వారు క్రీస్తు నందు విశ్వాసమును వీడనందున వారికి శరీరరీత్యా బలహీనతలు, రోగములు ఏర్పడి మరణించినను వారు నిద్రించినవారితో సమానమైనవారుగానే  చెప్పుట వారికి ఒక రకమైన ఓదార్పు.  కనుక మన బలహీనతలలో, రోగములలో ప్రభువును దూషించక, మన అయోగ్యతే మనకు అలా జరిగిందని గ్రహించి పశ్చాత్తాపముతో మనలను ప్రభువు రాజ్యమునకు యోగ్యులుగా చేసుకొందముగాక!

14.  దురాశ గర్భము ధరించగా పాపము మరణమును కనుట

        యాకోబు 1:15, ''దురాశ గర్భము ధరించి పాపమును కనగా, పాపము పరిపక్వమై మరణమునుకనును.''  ఇందులో దురాశను మన గర్భము నందు లేక మన మనస్సు నందు ఉంచుకొని యున్నప్పుడు పాపము ఏదో ఒక సమయములో జరుగును కదా!  అనగా ఒకడు పరస్త్రీ మీద వ్యామోహితుడై తన మనస్సు నందు లేక తన గర్భము నందు ఆ స్త్రీ పై దురాశ చేత వ్యామోహితుడై యుండగా, ఏదో ఒక సమయమున పాపపుక్రియ అనగా ఆ స్త్రీ పై బలాత్కారము చేయడా?  అలా కార్యరూపము దాల్చిన దురాశను పాపము అని చెప్పబడినది.  

ఆశ కలిగి యుండుట తప్పు కాదుగాని దురాశ కలిగి యుండకూడదు. ఆశ కలిగిన నరుడు తన ఉన్నతికి పాటుపడును  దురాశ  కలిగిన నరుడు తన నాశనమునకు పాత్రుడగును

దురాశ మన మనస్సు నందు వున్నంతవరకు పాపమును మన మనస్సులో గర్భములో పిండమును పెంచిన విధముగా వుంచుకొని యుందుము.  అనగా పిండము నవమాసములు పెరుగుచున్నట్లుగా మన మనస్సునందున్న దురాశ కూడా రోజురోజుకు పెరుగును.  ఆ దురాశ నెరవేరకపోవుట నరులలో కోపమును రగిలించును.  ఈ దురాశ లేపిన కోపము నరులలో ఏ క్రియకైనను ఒడిగట్టించును.  కనుక దురాశ అనగా మనది కాని దానిపై ఆశను వదులుకోవాలి.  ఒకడికి డబ్బుపై ఆశ వున్నది.  వాడు ఒక వ్యాపారము పెట్టి డబ్బు సంపాదించాలి అనుకొన్నాడు.  హోల్‌సేల్‌ మార్కెటునందు దొరుకు వస్తువును విడివిడిగా కొంత లాభమునకు అమ్మును.  ఇది అతనికి డబ్బుపై ఆశను కలిగియున్నట్లుగా చెప్పవచ్చును.  ఇతనికే ఆ డబ్బుపై దురాశను కలిగినప్పుడు తన వ్యాపారములో కల్తీ చేసి ఇంకా ఎక్కువగా సంపాదించుకోవాలని అనుకొనును.  దీనిని దురాశ అందురు.  ప్రకటన 6:6, ''మరియు-దేనారమునకు ఒక సేరు గోధుమలనియు, దేనారమునకు మూడు సేర్ల యవలనియు, నూనెను ద్రాక్షారసమును పాడుచేయ వద్దనియు, ఆ నాలుగు జీవులమధ్య ఒక  స్వరము పలికినట్టు నాకు వినబడెను.''  ఇందునుబట్టి ధరలు పెంచుట, కల్తీ చేసి వ్యాపారము చేయుట వగైరా నరులలో వచ్చిన దురాశ ఫలితము.  ఇందులో అతని మనస్సులోని దురాశ గర్భము ధరించి కల్తీ వ్యాపార రూపములో పాపమును కనెను.  ఇలా ప్రతి విషయములోను చెప్పవచ్చునని గ్రహించాలి.

        ఇక - ''పాపము పరిపక్వమై మరణమును కనును,'' అనుటలో పైన చెప్పిన విధముగా తన దురాశ చేత పాపము చేయుచూ వున్నవాడు తన మరణానంతరము తన వెంట పాపపు క్రియలు వచ్చును కనుక ఇతను పాతాళ లోకములో వేదన పొందును.  అలాగే తన క్రియల చొప్పున క్రీస్తు ప్రభువుచే తీర్పు  తీర్చబడి రెండవ మరణమును పొందునని చెప్పుచున్నాడు.  

        ఆదిలో ఆదాము చేసిన దైవవ్యతిరేక ఆజ్ఞ నరులకు ఈ భౌతిక శరీరరీత్యా మరణమును కలిగించినది.  దీనిని మొదటి మరణమని చెప్పబడినది.  ఈ మొదటి మరణమును పొందియున్న మనము దురాశ చేత ఈడ్వబడినప్పుడు మనము శోధనలోకి వస్తాము.  యాకోబు 1:14, ''ప్రతివాడును తన స్వకీయమైన దురాశచేత ఈడ్వబడి మరులు కొల్పబడిన వాడై శోధింపబడును.''  అని చెప్పుటనుబట్టి మనము స్వంతముగా కలిగించుకొన్న దురాశ మనలను పాపము చేయువరకు ఈడ్చుకొని పోవును.  ఈ శోధనలో పాపము చేయునంతవరకు జరుగుచూనే వుండును.  ఇలా పాపము చేసినవారు దానినుండి తిరిగిరానివారై తమ దురాశ అంతకంతకు పెంపు జరుగుచూ - చివరకు అందరివలె మరణమును పొందుదురు.  ఇది వానిలోని దురాశ వలన చేసినది పాపపు క్రియలే కనుక అది వానిని రెండవ మరణమునకు అప్పగించునని ఇందులోని పరమార్థము.

15.  కొందరికి వారు మరణించబోవుచున్నారని ముందుగానే సూచనలు వారికి తెలియజేయబడుట

        కొందరు తమ వ్యాధులలో తాము మరణించబోవుచున్నామని చెప్పుదురు.  అయితే వీరు మరణిస్తారా లేదా అన్నది కాలమే వారికి తెలియజేస్తుంది.  అనగా ఇలా వీరు చెప్పిన తరువాత కొన్ని సంవత్సరములు బ్రతికినవారిని కూడా మనము మన నిజ జీవితములో చూస్తున్నాము.  ఇది ఒక ఊహ మాత్రమే.

        అయితే మరికొందరికి ఇతరులు ఫలానా సంఘటన జరిగే అంతవరకు నీవు మరణించవని తెలియజేయబడుతుంది.  ఇలా చెప్పువారు చాలా కొద్దిమంది మాత్రమే.  నా నిజ జీవితములో - నాకు పెండ్లి జరిగిన 6 సంవత్సరముల కాలము పిల్లలు లేకుండా వుండుట జరిగింది.  ఈ సమయములో నా భార్య అమ్మమ్మ, నా భార్యయైన భారతితో నీకు ఒక కుమారుడు పుట్టుట చూడగలనా?  నా వయస్సు మీరుచున్నదని అడిగెను.  నా భార్య అమ్మమ్మ నాకు కూతురు పుట్టిన తరువాత గాని ఆమె మరణము రుచి చూడదని తెలియజేయబడినది.  

పరిశుద్ధాత్మ ముందుగా బహిర్గతము చేసినవారికి మాత్రమే తాము  సంఘటన తరువాత మరణించబోవుచున్నామో తెలుసుకొనగలుగుదురు

ఇంతకి ఈ విషయమును ఎవరు తెలియజేసారు?  అంటే పరిశుద్ధాత్మ.  పరిశుద్ధాత్మ మనలో క్రియ జరిగించి మన మనస్సును పురికొల్పుట చేయును.  అప్పుడు పై విధమైన ఆలోచన బహిర్గతము అగును.  అయితే నా భార్య అమ్మమ్మ నాకు ఐదవ సంతానముగా కూతురు జన్మించిన తరువాత ఆమె బహు వృద్ధాప్యములో మరణించుట జరిగింది.  కనుక దేవుడు ఎవరు ఎప్పుడు మరణించబోవుచున్నారో  తెలియజేయును.   కాని అది సూచనగా మాత్రమే చెప్పును.  అలాగే సుమెయోను విషయములో జరిగింది.  దేవుడు పంపించు రక్షణను కన్నులారా చూడనిదే మరణము చెందవని, ఆయనకు తెలియజేయబడింది.  లూకా 2:25-26, ''యెరూషలేము నందు సుమెయోనను ఒక మనుష్యుడుండెను.  అతడు నీతిమంతుడును భక్తిపరుడునైయుండి, ఇశ్రాయేలుయొక్క ఆదరణకొరకు కనిపెట్టువాడు;  పరిశుద్ధాత్మ అతనిమీద ఉండెను.  అతడు ప్రభువుయొక్క క్రీస్తును చూడక మునుపు మరణము పొందడని అతనికి పరిశుద్ధాత్మచేత బయలుపరచబడి యుండెను;  ఆత్మవశుడై అతడు దేవాలయములోనికి వచ్చెను.''  ఇందులో సుమెయోనుయొక్క మరణము ఎప్పుడు జరుగునని చెప్పబడినది?  క్రీస్తు ప్రభువును చూచిన తరువాత జరుగునని చెప్పబడినది.  ఇది తెలియజేసినది పరిశుద్ధాత్మ అని కూడా చెప్పబడినది.

        ఈ విధముగా పరిశుద్ధాత్మ ద్వారా వారి మరణమునకు సూచనయైన సంఘటన జరిగిన తరువాత ఆ దైవజనునిలో ప్రవర్తన ఎలా వున్నదో మనము తెలుసుకొనవలసియున్నది.  లూకా 2:27-32, ''అంతట ధర్మశాస్త్రపద్ధతి చొప్పున ఆయన విషయమై జరిగించుటకు తలిదండ్రులు శిశువైన యేసును దేవాలయములోనికి తీసికొనివచ్చినప్పుడు అతడు తన చేతులలో ఆయనను ఎత్తికొని దేవుని స్తుతించుచు ఇట్లనెను -  -నాథా, యిప్పుడు నీ మాటచొప్పున సమాధానముతో నీ దాసుని పోనిచ్చుచున్నావు;  అన్యజనులకు నిన్ను బయలుపరచుటకు వెలుగుగాను  నీ ప్రజలైన ఇశ్రాయేలుకు మహిమగాను  నీవు సకల ప్రజలయెదుట సిద్ధపరచిన నీ రక్షణ నేను కన్నులార చూచితిని.''  ఈ పరిశుద్ధాత్మ వలన తన మరణమునకు సంబంధించిన సంఘటన తెలుసుకొన్న సుమెయోను కలత చెందినట్లుగా మనము గ్రహించాలి, ఎందుకంటే - సుమెయోను దేవుని స్తుతించుచు   ''సమాధానముతో నీ దాసుని పోనిచ్చుచున్నావు,'' అని చెప్పుచున్నాడు.  తన ఆత్మకు సమాధానము తన మరణమునకు సూచనగా చెప్పబడిన క్రీస్తును చూచిన తరువాత అతనిలో కలిగినట్లుగా మనము గ్రహించాలి.  ఇందునుబట్టి నిజమైన దైవసేవకుడు తాను పొందబోవు రక్షణను తన భౌతిక శరీరముతో వుండగానే చూడాలన్న తాపత్రయము వుంటుంది.  ఈ తాపత్రయము నుండి సుమెయోనుకు నెమ్మది కలిగి రక్షణను పొందానన్న సంతృప్తి అతనిలో కలిగింది గాని తాను శరీరరీత్యా మరణించ బోవుచున్నానన్న బాధ అతనిలో లేదు.  ఇలా పరిశుద్ధాత్మ తన దాసులకు వారియొక్క పరిచర్యను, వారి ఉద్ధేశ్యమునుబట్టి వానికి సంభవించబోవు మరణము ఎప్పుడు జరుగునని తెలియజేయును.  అలాగే నా జీవితములో నా మరణమును గూర్చి కూడా పరిశుద్ధాత్మ దేవుడు దర్శనములో మాట్లాడుట జరిగింది.  ఇందులో నేను దైవ అత్యంత కృపచే రచించుచున్న ఈ సమస్త రచనలు పూర్తి అగువరకు     నాకు మరణము రాదని పరిశుద్ధాత్మ దేవుడు బయలుపరచుట జరిగింది.        

16.  దేవునికి ఎవరు హత్య గావింపబడి మరణించుట ఇష్టము

        దేవునికి మొదట తన ప్రియమైన కుమారుడు హింసించబడుట, సిలువమీద హత్య గావింపబడుట ఇష్టమైన చర్యగా యెషయా గ్రంథమందు చెప్పబడింది.  యెషయా   53:3-10, ''అతడు తృణీకరింపబడినవాడును ఆయెను   మనుష్యులవలన విసర్జింపబడినవాడును వ్యసనాక్రాంతుడుగాను, వ్యాధి ననుభవించినవాడుగాను మనుష్యులు చూడనొల్లనివాడుగాను ఉండెను.  అతడు తృణీకరింపబడినవాడు గనుక మనము అతనిని ఎన్నికచేయకపోతిమి.  నిశ్చయముగా అతడు మన రోగములను భరించెను  మన వ్యసనములను వహించెను  అయినను మొత్తబడినస వానిగాను  దేవునివలన బాధింపబడినవానిగాను  శ్రమనొందినవానిగాను మనమతనిని ఎంచితిమి.  మన యతిక్రమక్రియలనుబట్టి అతడు గాయపరచబడెను   మన దోషములనుబట్టి నలుగగొట్టబడెను   మన సమాధానార్థమైన శిక్ష అతనిమీద పడెను   అతడు పొందిన దెబ్బలచేత మనకు స్వస్థత కలుగుచున్నది.  మనమందరము గొఱ్ఱెలవలె త్రోవ తప్పిపోతిమి   మనలో ప్రతివాడును తనకిష్టమైన త్రోవకు తొలిగెను  యెహోవా మన యందరి దోషమును అతనిమీద మోపెను.  అతడు దౌర్జన్యము నొందెను  బాధింపబడినను అతడు నోరు తెరవలేదు   వధకు తేబడు గొఱ్ఱెపిల్లయు   బొచ్చు కత్తిరించువానియెదుట గొఱ్ఱెయు  మౌనముగా నుండునట్లు  అతడు నోరు తెరువలేదు.  అన్యాయపు తీర్పునొందినవాడై అతడు కొనిపోబడెను   అతడు నా జనుల యతిక్రమమునుబట్టి మొత్తబడెను గదా.  సజీవుల భూమిలోనుండి అతడు కొట్టివేయబడెను   అయినను అతని తరమువారిలో ఈ సంగతి ఆలోచించినవారెవరు?  అతడు మరణమైనప్పుడు భక్తిహీనులతో అతనికి సమాధి నియమింపబడెను   ధనవంతునియొద్ద అతడు ఉంచబడెను   నిశ్చయముగా అతడు అన్యాయమేమియు చేయలేదు   అతని నోట ఏ కపటమును లేదు.  అతని నలుగగొట్టుటకు యెహోవాకు ఇష్టమాయెను ఆయన అతనికి వ్యాధి కలుగజేసెను.  అతడు తన్నుతానే అపరాధపరిహారార్థబలిచేయగా అతని సంతానము చూచును.  అతడు దీర్ఘాయుష్మంతుడగును, యెహోవా ఉద్దేశము అతనివలన సఫలమగును.''  కనుక క్రీస్తు నలుగగొట్టబడుట యెహోవా దేవునికి ఇష్టమైన కార్యము.

హత్యగావింపబడి మరణించిన తన సేవకులను దేవుడు ఇష్టపడునుగాని చంపినవారిని కాదు

        అలాగే క్రీస్తు ప్రభువు తనకు సాక్షియై తనయందు విశ్వాసియై చంపబడి మరణించిన వానిని గూర్చి గొప్పగా చెప్పుట మనము వేదములో చదువగలము.  ప్రకటన  2:13, ''నా యందు విశ్వాసియై యుండి నన్ను గూర్చి సాక్షియైన అంతిపయనువాడు మీ మధ్యను చంపబడిన దినములలో,'' అని చెప్పుచున్నాడు.  కనుక ఇతడు హతసాక్షి.  ఇలా చంపబడాలన్నది క్రీస్తు ప్రభువుయొక్క నిర్ణయము.  ఇది క్రీస్తు ప్రభువుకు ఇష్టమైన చర్య, ఎందుకంటే తనకోసము తనకు సాక్షిగా విశ్వాసిగా వుండి, సాతాను సింహాసనము వున్న స్థలములో పోరాడి చంపబడుట దేవునిలో ఉన్నతమైన స్థానమును పొందుటయే. ఇటువంటివారిని  హత: సాక్షులుగా చెప్పబడింది.  వీరిలో కొంతమంది హత్య గావింపబడి చంపబడ వలెనని దేవుని కోరిక.  ప్రకటన 6:9-11, ''ఆయన అయిదవ ముద్రను విప్పినప్పుడు, దేవుని వాక్యము నిమిత్తమును, తాము ఇచ్చిన సాక్ష్యము నిమిత్తమును వధింప బడినవారి ఆత్మలను బలిపీఠము క్రింద చూచితిని.  వారు-నాథా, సత్యస్వరూపీ, పరిశుద్ధుడా, యెందాక తీర్పు తీర్చకయు, మా రక్తము నిమిత్తము భూనివాసులకు ప్రతిదండన చేయకయు ఉందువని బిగ్గరగా కేకలువేసిరి.  తెల్లని వస్త్రము వారిలో ప్రతివాని కియ్యబడెను; మరియు వారివలెనే చంపబడబోవువారి సహదాసులయొక్కయు సహోదరులయొక్కయు లెక్క పూర్తియగువరకు ఇంక కొంచెము కాలము విశ్రమింపవలెనని వారితో చెప్పబడెను.''  కనుక, ఈ యుగాంతము సంభవించాలంటే హతసాక్షులుగా మారవలసిన వారి సంఖ్య పూర్తి కావాలి అని తెలపబడింది.

        ఇందుచేత హతసాక్షిగా మారునట్లుగా సమస్తమును త్యజించి, దేవునికి క్రీస్తుకు సాక్షులుగా జీవిస్తూ భూమి అను సాతాను స్థానములలో సువార్త ప్రచారము కొనసాగించాలి.  అలా సాతాను స్థానములో జరిగించు సువార్త కార్యము బహు ప్రయాసకలదైనప్పటికిని సాతానుకు అది బహు కంటకముగా వుండి, దానిని నిలుపుటకు సాధ్యమైనంత విధముగా ప్రయత్నము చేయును.  ఆశ, వ్యామోహములతో వాని ఆత్మీయ జీవితమును నాశనము చేయుటకు ప్రయత్నించును.  ఇలా అనేకవిధములుగా ప్రయత్నించి, చివరిగా తన అనుచరులతో వానిని హత్య గావించును.  ఇటువంటివాడు దేవునిలో ఉన్నతమైన స్థానమును పొందినవాడు.  తన మరణము వరకు దేవుని కోసము పోరాడి క్రీస్తువలె తన ప్రాణమును పెట్టినవాడు కనుక ఇతను దేవునికి ఇష్టమైనవాడు.  ఇలా హత్యగావింపబడి మరణించినవారు తనకు ఇష్టమైనవారు కనుక వారిని పాతాళముయొక్క వశము చేయక, వారిని సమాధానకరమైన పరదైసులో బలిపీఠము క్రింద విశ్రాంతిలో వారిని వుంచి, వారికి ఎటువంటి బాధ కలుగకుండా దేవుడు చూచుకొనుచున్నాడు.  కనుక మనము కూడా సువార్త విషయములో ఆలోచింపక, భయపడక, ప్రాణమును పెట్టుటకు సిద్ధపడవలెనని ఈ పుస్తకము ద్వారా సువార్తీకులను కోరుకొనుచున్నాను, ఎందుకంటే ఈ చర్య దేవునికి ఇష్టమైన చర్య.  దీనిలో చెడు అర్థము తియ్యలేరు.  అనగా సువార్తీకులను చంపుట ఇష్టమైన చర్య కనుక దానిని నెరవేర్చుదామని చంపుటకు సిద్ధపడేవారు కొందరు ఉన్నారు.  కాని ఇందులో దేవుడు ఇష్టపడినది హత్యగావింపబడి చంపబడినవాడుగాని, చంపినవారు కాదు.  నరహత్య చేసినవానికి పాతాళములో సావాసము కల్పించియున్నాడు.  వానికి నిత్య వేదనేగాని వాని ఆత్మకు శాంతి లేదు.  ప్రకటన 21:8, '' పిరికివారును, అవిశ్వాసులును, అసహ్యులును, నరహంతకులును, వ్యభిచారులును, మాంత్రికులును, విగ్రహారాధకులును, అబద్ధికులందరును అగ్ని గంధకములతో మండు గుండములో పాలుపొందుదురు;   ఇది రెండవ మరణము.''  కనుక ఈ చర్యలో చంపేవారిని దేవుడు ఇష్టపడుట లేదని గుర్తించాలి.  అయితే చంపబడినవారు తన చివరి వరకు దేవునిలో సాక్షిగా వుండి, తన ఆత్మను ఉన్నతస్థితిలో వుంచి చనిపోయారు కనుక వారు దేవునికి ఇష్టులు అని గ్రహించాలి.  మత్తయి 5:10-12, ''నీతినిమిత్తము హింసింపబడువారు ధన్యులు; పరలోక రాజ్యము వారిది.  నా నిమిత్తము జనులు మిమ్మును నిందించి హింసించి మీమీద అబద్ధముగా చెడ్డమాటలెల్ల పలుకునప్పుడు మీరు ధన్యులు.  సంతోషించి ఆనందించుడి, పరలోకమందు మీ ఫలము అధికమగును.  ఈలాగున వారు మీకు పూర్వమందుండిన ప్రవక్తలను హింసించిరి.''

17.  చనిపోకముందే కొందరు తమను పవిత్ర భూమిలో పాతిపెట్టమని తెలుపుట

        ఇలా కొంతమంది చెప్పుట మనము చూస్తుంటాము.  అలాగే ఇంకొంతమంది తమ దగ్గర వున్న ఆస్తిని పంచుకొనుట కన్నా తమ ఇష్ట ప్రకారము ముందుగానే వీలునామా వ్రాస్తారు.  ఇలా వారివారి అభీష్టాన్ని ముందుగా తెలియజేస్తారు.  తమ దగ్గర వున్న నగలను, తమ మనమరాలైన పలానా పలానా అమ్మాయికి ఇయ్యమని, భూమిని తమ కుమారులను సమముగా పంచుకోమని చెప్పేవారు వున్నారు.  అయితే అవన్నీ వారు మరణించిన తర్వాతనే జరగాలి.  వారి మరణానికి ముందు కాదు.  ఎందుకంటే వారిపై వారికి నమ్మకము లేదు.  తమ దగ్గర వున్నది ఇచ్చేస్తే తమ వారు తమని సరిగా చూచుకోరేమోనన్న బెంగతో వారు అలా వీలునామా వ్రాయిస్తారు.  వీలునామాను వారి జీవిత కాలములో అనేకమార్లు మార్చవచ్చును.

 మట్టి శరీరమును ఎక్కడ సమాధి చేసినను ఆత్మకు కలుగు మేలు ఏమి లేదు

        ఇవన్నీ ఒక ఎత్తు అయితే చనిపోయిన తరువాత వారు ఎక్కడ పూడ్చిపెట్టవలెననునది ఒక ఎత్తు.  సాధారణముగా చనిపోక ముందు కొద్దిమంది మాత్రమే ఈ కోరికను చెప్పుట జరుగును.  మిగిలినవారు చనిపోయిన తరువాత వారు ఎక్కడ ఇష్టపడితే అక్కడ పూడ్చుట చేయుదురు లేక కాల్చుట జరుగును.  హిందువులలో కాల్చిన శరీరములోని కొంత బూడిదను ఎముకలను నిమజ్జనము అను పేరుతో నదులలో కలుపుతారు.  ఇది ఒక సాంగ్యము.  అయితే ఏ నదిలో కలపాలో వీరిలో కొందరు వారి మరణమునకు ముందే వారి వారికి తెలియజేస్తుంటారు.  దీనికి కారణము నదులు పవిత్రమైనవని వాటిలో నిమజ్జనము చేయుట ద్వారా పాపాలు తొలగి పరలోకమునకు చేరుతామని అనుకొంటారు.

        ఏది ఏమైనప్పటికి బైబిలు గ్రంథములో కూడా తన మరణానంతరము కనీసము తన ఎముకలనైనా కనాను అను పవిత్ర భూమిలో సమాధి చేయమని కోరుకొన్నవారు వున్నారు.  హెబ్రీ 11:22, ''యోసేపు తనకు అవసానకాలము సమీపించినప్పుడు విశ్వాసమునుబట్టి ఇశ్రాయేలు కుమారుల నిర్గమమునుగూర్చి ప్రశంసించి తన శల్యములను గూర్చి వారికి ఆజ్ఞాపించెను.''  ఆది 50:22-26, ''యోసేపు అతని తండ్రి కుటుంబపువారును ఐగుప్తులోనివసించిరి, యోసేపు నూటపది సంవత్సరములు బ్రదికెను.  యోసేపు ఎఫ్రాయిముయొక్క మూడవ తరము పిల్లలను చూచెను;  మరియు మనష్షే కుమారుడైన మాకీరునకు కుమారులు పుట్టి యోసేపు ఒడిలో ఉంచబడిరి.  యోసేపు తన సహోదరులను చూచి-నేను చనిపోవుచున్నాను;  దేవుడు నిశ్చయముగా మిమ్మును చూడవచ్చి, యీ దేశములోనుండి తాను అబ్రాహాము ఇస్సాకు యాకోబులతో ప్రమాణము చేసియిచ్చిన దేశమునకు మిమ్మును తీసికొని పోవునని చెప్పెను.  మరియు యోసేపు - దేవుడు నిశ్చయముగా మిమ్మును చూడవచ్చును;  అప్పుడు మీరు నా యెముకలను ఇక్కడనుండి తీసికొని పోవలెనని చెప్పి ఇశ్రాయేలు కుమారులచేత ప్రమాణము చేయించుకొనెను.  యోసేపు నూటపది సంవత్సరములవాడై మృతి పొందెను.  వారు సుగంధ ద్రవ్యములతో అతని శవమును సిద్ధపరచి ఐగుప్తు దేశమందు ఒక పెట్టెలో ఉంచిరి.''  ఈ విధముగా యోసేపు తన శరీరమును కాదుగాని తన ఎముకలను దేవుడు వాగ్దానముగా అబ్రాహాము ఇస్సాకు, యాకోబులతో చెప్పిన స్థలములో సమాధి చేయమని ప్రమాణము చేయించుకొన్నాడు.  ఇలా ఆది కాలము నుండియే పవిత్ర భూమి అను పేరు వచ్చింది.  అందులో తమను సమాధి చేయమని ముందుగానే చెప్పి చనిపోవువారు ఆదికాలమునుండి వున్నారు.

        ఈ విషయమును మోషే గుర్తించుకొని ఆ ఎముకలను ఐగుప్తు నుంచి కానానుకు వెళ్ళు సందర్భములో తనతోబాటుగా తీసుకొని పోయెను.  నిర్గమ 13:19, ''మరియు మోషే యోసేపు ఎముకలను తీసికొని వచ్చెను.  అతడు-దేవుడు నిశ్చయముగా దర్శనమిచ్చును;  అప్పుడు మీరు నా ఎముకలను ఇక్కడనుండి తీసికొని పోవలెనని ఇశ్రాయేలీయుల చేత రూఢిగా ప్రమాణము చేయించుకొని యుండెను.''   యెహోషువ 24:32, ''ఇశ్రాయేలీయులు ఐగుప్తులోనుండి తెచ్చిన యోసేపు ఎముకలను షెకెములో, అనగా యాకోబు నూరు వరహాలకు షెకెము తండ్రియైన హమోరు కుమారుల యొద్ద కొనిన చేని భాగములో వారు పాతిపెట్టిరి.  అవి యోసేపు పుత్రులకు ఒక స్వాస్థ్యముగా ఉండెను.''  ఇలా అనేకమంది అనేక రీతులుగా చెప్పుచుందురు.  మనము సాధారణముగా కథోలిక్‌ చర్చీలలో చూచినట్లైతే, చర్చీలోను, చర్చి ప్రాంగణములలో కొందరి సమాధులను చూడవచ్చును.  వారు చర్చిని పవిత్ర స్థలముగా భావించుట, ఆ చర్చీలో జరిగిన అద్భుతములు ఇవన్నీ లెక్కించుకొని తమను ఆ చర్చిలోనే పూడ్చుమని యోసేపు వలె కోరుకున్నవారు.  అలాగే ప్రభువు నందు నిద్రించిన కొందరి శరీరములు చెడిపోక జీవించినవారివలె వున్నవారిని కూడా చర్చీలలో భద్రపరచుట మనము చూడవచ్చును.  ఉదా :-  గోవాలోని ఒక చర్చీలో సెయింట్‌ జేవియర్‌ భౌతికకాయమును ఒక ప్రక్కన గాజు పెట్టెలో అందరు చూచుటకు వుంచి యున్నారు.  ఇది సుమారు 500 సంవత్సరములనుండి యున్నది.

గంథకర్తనైన నేను నా మరణానంతరము నా శరీరమును రెడ్డిపాళెం గ్రామములోని చర్చి స్థలములో పూడ్చమని నా కుమారులకు చెప్పియున్నాను

        అలాగే గ్రంథకర్తనైన నేను నా కుమారులకు, కుమార్తెకు నా మరణానంతరము నా భౌతిక కాయమును రెడ్డిపాళెములోని నా ప్రభువు తల్లి చర్చి ప్రాంగణము నందు సమాధి చేయమని చెప్పియున్నాను.  ఎందుకంటే నేను క్రైస్తవునిగా మారుట, ఈ రచన ఇంత ఉన్నతమైన స్థితికి రావటానికి కారణము అక్కడ నాకు కలిగిన దర్శనములు.  కనుక నా దృష్టిలో ఆ రెడ్డిపాళెము చర్చి స్థలము ఒక పవిత్రమైనది.  దేవుడు నన్ను ఎన్నుకొన్న స్థలము.  అందుచేత నా మరణానంతరము నా  శరీరము అందు సమాధి చేయమని చెప్పుట జరిగింది.

        ఏది ఏమైనప్పటికి ఇవన్నీ మన కోరికలే కాని మనము ఎక్కడ పూడ్చినను అనగా పవిత్ర స్థలములో పూడ్చినను లేక పూడ్చకపోయినను ఆత్మీయ దృష్టిలో దీనికి ప్రాధాన్యత లేదు, ఎందుకంటే ఈ శరీరము మన మరణానంతరము ఈ భూమిపాలు కావలసినదే.  కాని పరలోకమునకు చేర్చబడదు.  ఏనాటికైనను ఈ శరీరము మట్టిపాలు కావలసినదే.  అయితే దేవుని మహిమను పొందినవి ఈ చెడిపోని పరిశుద్ధుల శరీరములు వారి మరణానంతరము కూడా చాటుచున్నట్లుగా మనము గుర్తించాలి.  అయితే మరణానంతరము మన ఆత్మ శరీరమును వదిలివేయును.  కనుక శరీరము ఏనాటికైనను మట్టిపాలు అగును.  అయితే ఆత్మ వెంట వెళ్ళునవి కేవలము క్రియలు మాత్రమే.  అవి చెడ్డవైనను, లేక మంచివైనను ఆత్మ వెంట వెళ్ళునని గుర్తించాలి.  ప్రకటన 14:13, ''అంతట-ఇప్పటినుండి ప్రభువునందు మృతినొందు మృతులు ధన్యులని వ్రాయుమని పరలోకమునుండి యొక స్వరము చెప్పగా వింటిని.  నిజమే;  వారు తమ ప్రయాసములు మాని విశ్రాంతి పొందుదురు;  వారి క్రియలు వారి వెంట పోవునని ఆత్మ చెప్పుచున్నాడు.''  కనుక ఈ మట్టి శరీరమును ఎక్కడ సమాధి చేసినను ఆత్మకు కలుగు యోగ్యత ఏమి లేదని గ్రహించాలి.

18.  శరీరరీత్యా మరణమును చూడక బ్రతుకు నరుడెవడు?

        కీర్తనలు 89:48, ''మరణమును చూడక బ్రదుకు నరుడెవడు?  పాతాళముయొక్క వశము కాకుండ తన్నుతాను తప్పించుకొనగలవాడెవడు?''

హేబెలు హత్యతో మొదలైన మరణమను క్రియ యుగాంతము వరకు కొనసాగును

        ఎవరైనా వున్నారా?  ఎవరు లేరనే చెప్పాలి.  హేబెలు హత్యతో మొదలైన మరణక్రియ యుగాంతము వరకు కొనసాగును.  ఈ మరణమును చూడక బ్రతుకు నరుడెవడు లేడని చెప్పవచ్చును.  చివరకు క్రీస్తు ప్రభువుకు కూడా సిలువ మీద మరణించెనని గ్రహించాలి.  లూకా  23:46, ''అప్పుడు యేసు గొప్ప శబ్దముతో కేకవేసి - తండ్రీ, నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నాననెను.  ఆయన యీలాగు చెప్పి ప్రాణము విడిచెను.''  ఇలా క్రీస్తు ప్రభువు కూడా మరణించాడు.  దేవుని కుమారుడు తన ప్రాణమును నరుల కొరకు పెట్టుటకు ఈ లోకానికి వచ్చాడు.  అలాగే సిలువ బలియాగము ద్వారా మరణించి నరులను రక్షించాడు.  ఏది ఏమైనప్పటికి క్రీస్తు ప్రభువు కూడా శరీరరీత్యా మరణించినట్లుగా గ్రహించాలి.  కీర్తన 82:6-7, ''మీరు దైవములనియు   మీరందరు సర్వోన్నతుని కుమారులనియు నేనే సెలవిచ్చియున్నాను.   అయినను ఇతర మనుష్యులు చనిపోవునట్లు మీరును చనిపోవుదురు   అధికారులలో ఒకడు కూలునట్లు మీరును కూలుదురు.''

        బైబిలు చరిత్రలో ఇంకొక ఇద్దరు ఉన్నారు.  వారు మరణమును రుచి చూడకుండా పరదైసుకు కొనిపోబడిరి.  వీరిలో మొదటివాడు హనోకు.  రెండవవాడు ఏలియా.  హనోకు దేవునితో నడచి పరదైసులో చేర్చబడితే ఏలీయా సుడిగాలిలో ఆరోహణమై పరదైసులో చేర్చబడెను.  ఇలా వీరిద్దరు మరణము నుండి తప్పింపబడినవారు.  కాని వీరు కూడా యుగాంతములో ఇద్దరు ప్రవక్తలుగా భూమిపైకి దిగి వచ్చి సాతాను ప్రతిరూపమైన క్రూరమృగము చేతిలో చంపబడవలసి యున్నది.  ప్రకటన 11:3, ''నేను నా యిద్దరు సాక్షులకు అధికారము ఇచ్చెదను; వారు గోనెపట్ట ధరించుకొని వెయ్యిన్ని రెండువందల అరువది దినములు ప్రవచింతురు.''  ప్రభువు సువార్త పరిచర్య చేసిన దినములు కూడా 42 నెలలు.  అనగా ఇంచుమించు మూడున్నర సంవత్సరాలు.  ప్రకటన 11:7-8, ''వారు సాక్ష్యము చెప్పుట ముగింపగానే అగాధములోనుండి వచ్చు క్రూరమృగము వారితో యుద్ధముచేసి జయించి వారిని చంపును.  వారి శవములు ఆ మహాపట్టణపు సంతవీధిలో పడియుండును; వానికి ఉపమానరూపముగా సొదొమ అనియు ఐగుప్తు అనియు పేరు; అచ్చట వారి ప్రభువుకూడ సిలువవేయబడెను.''  కనుక వీరు కూడా మరణమును తప్పించుకోలేక పోతున్నారు.  కనుక ప్రతి ఒక్కరు మరణమును రుచి చూడవలసినదేనని గ్రహించాలి.  దీనినే మొదటి మరణము అని అందురు.  మొదటి మరణము భూమిమీద పుట్టిన ప్రతి ఒక్కరు రుచి చూడవలసినదేనని గ్రహించాలి.  1 కొరింథీ 15:50.

19.  ఇంటి ముందు మంట వేసి మరణించినవారిని గూర్చి తెలుపుట

        ఇది ఒక సూచనగా ఆ రోజులలో ఇశ్రాయేలీయులు చేసేవారు.  ఈ మంటను బట్టి ఆ ఇంటిలో మరణించిరని తెలుసుకొనుట జరిగేది.  ఇలా ప్రతి ఒక్కరి విషయములో చేసేవారు.  అలాగే యెహోరాము రాజు చనిపోయినప్పుడు అతనిని దావీదు నగరమున పాతిపెట్టిరిగాని రాజ సమాధులలో అతనిని పాతిపెట్టలేదు.  

యూదుల ఆచారాలలో ఇంటి ముందు మంట వేసి  ఇంటిలో మరణించిరని తెలుపుట కూడా ఒకటి

*2 దినవృత్తాంతములు 21:19, ''రెండు సంవత్సరములు వ్యాధి బలమగుచు వచ్చి ఆ వ్యాధిచేత అతని పేగులు పడిపోయి బహు వేదన నొందుచు అతడు మరణమాయెను.  (ఇంగ్లీషు హోలి బైబిల్‌ ద కింగ్‌ జేమ్స్‌ వర్షన్‌ నందు తమ పితరులకు వేసిన మంట వలె జనులు ఇతని కొరకు వేయలేదని వ్రాయబడి యున్నది.) అతని జనులు అతని పితరులకు చేసిన ఉత్తరక్రియలు అతనికి చేయలేదు.''  కనుక  యెహోరాము పితరులకు జరిగినట్లు సంతాప సూచకముగా మంట వేయుట యెహోరాము విషయములో జరగలేదు.  ఇది ఒక సూచన మాత్రమే.  ఎందుకంటే ఇంటి ముందు మంట వేసిన ఆ యింటిలో ఎవరో చనిపోయారని అందరికి తెలుస్తుంది.  అంటే ఇంటిలో ఒక వ్యక్తి చనిపోయిన వారి కుటుంబమువారు వెళ్ళి, మా ఇంటిలో చనిపోయారని వేరే ఇంటివారికి చెప్పరు.  వారు అంగలార్పు వేదన పొందుచుందురు కనుక వారి ఇంటి ముందు మంట వేసిన అది చూచిన ప్రతి ఒక్కరికి తమ ఇంటిలోని మరణమును గూర్చి తెలియజేసినట్లు అగును.  అయితే చలి కాచుకొను మంటకు, ఈ మంటకు తేడా ఉన్నదని గ్రహించాలి.  చలి కాచుకొను మంట చుట్టూ జనులు ప్రోగు అగుదురు.  కాని ఈ మంట చుట్టూ జనులు ప్రోగుకారు అని గ్రహించాలి.

        కనుక ఇంటి ముందు మంట వేయుట అనునది తమ ఇంటిలో మరణించినవారిని గూర్చి అందరికి తెలుపు ఒక ఆచారముగా భావించాలి.

20.  మరణదినము జన్మదినము కన్నా మేలైనది

         ప్రసంగి 7:1-2, ''సుగంధతైలముకంటె మంచి పేరు మేలు;  ఒకని జన్మదినముకంటె మరణదినమే మేలు.  విందు జరుగుచున్నయింటికి పోవుటకంటె ప్రలాపించుచున్నవారి యింటికి పోవుట మేలు;  ఏలయనగా మరణము అందరికినివచ్చునుగనుక బ్రదుకువారు దానిని మనస్సున పెట్టుదురు.''

        జన్మదినము :-  ఒక బిడ్డను మన సమాజములోనికి మనము ఆహ్వానిస్తూ, సంతోషముగా గడుపుట, విందు వినోదాలతో ఆనందించుట చేస్తాము.  ఈ ఆనందము మితిలేని విధముగా జరిగించుట మనము చూస్తున్నాము.  ప్రతి ఒక్కరి జీవితములో జన్మదినము వున్నది.  ప్రతి ఏటా ఈ దినమును క్రొత్త బట్టలతో చాక్లెట్‌, కేకులు మొదలైనవాటిని పంచుతూ మన చుట్టు ప్రక్కల వారితో ఆనందాన్ని పంచుకొనుట జరుగును.  నరుని జన్మదినము డాక్టర్లు నిర్ణయించి చెప్పుదురు.  ఒకరోజు అటోఇటో మొత్తానికి పుట్టుట జరుగును.

నరుని పుట్టుకతోనే వాని మరణదినము ఒకటున్నదని మనస్సున కలిగియుండాలి

        మరణదినము :-  జన్మదినము వున్నట్లే ప్రతి ఒక్కరికి మరణ దినము కూడా వున్నది.  ఇది అందరికి తెలిసిన విషయమే.  అయితే ఈ మరణదినము ఎలాగుండునో ఎవ్వరికి తెలియదు.  అయితే తన మరణదినమును గుర్తు చేసుకొనువారు అరుదని మనము చెప్పవచ్చును.  జన్మదినమునకు ప్రతియేట గుర్తించుకొని దానిని బహు జాగ్రత్తగా ఉన్నతముగా ఆనందించుట జరుగును.  కాని నరుడు తన మరణదినమును తను జరుపుకొనలేడు.  ఈ మరణదినము తన శరీరమును ఆత్మ వదిలి వెళ్ళు దినమని చెప్పవచ్చును.  ఈ దినము తరువాత, ఈ శరీరము క్రుళ్ళి మన్నుగా మారిపోయి ఈ జీవి ఇక కనబడడు.  వీనిలోని ఆత్మ కొనిపోబడును.  ఇక అది ఎన్నటికి రాదు.  తిరిగిరాని లోకానికి అది వెడలిపోవును.  కనుక మరణించిన నరునికి సంబంధించినవారు దు:ఖములో మునిగి ఏడ్పులతోను, రోదనలతోను చూచు వారికి భయాందోళన కలిగించుచూ వుందురు.  ప్రతి ఒక్కరి మదిలో ఏదో తెలియని స్తబ్ధత నెలకొని ఆలోచనాశక్తి నశించి ఆ దినమున బాధగా తన దైనందిన జీవితాన్ని వీడి జీవించుదురు.  కాని మరణించిన ఆత్మ వారిని వదిలి తెలియని లోకానికి వెళ్ళునుగాని దానికి దు:ఖము, వేదన వంటి ఇహలోక సంబంధమైనవి వుండవు.  ఆత్మకు వేదన, దు:ఖము మొదలైనవి వారు శరీరరీత్యా జరిగించిన దుష్ట కార్యములను బట్టి కలుగునుగాని అందరికి కాదు.  నీతిగా జీవించినవారి ఆత్మలకు మరణానంతరము విశ్రాంతిలో వుందురు.

        అయితే మరణించిన వానికి లేని దు:ఖము ఆత్మను వదిలిన శరీరమును చూచువారు అనుభవించుదురు.  వారి ఇంటివారు పరిమితి లేని బాధను అనుభవించుట చూస్తున్నాము.  కొందరిలో అయితే వారి జీవితాంతము వారికి సంబంధించిన వారి మరణదినమును అప్పుడప్పుడు గుర్తు చేసుకొంటూ బాధపడుట చూస్తున్నాము.  వీటన్నింటికి కారణము ఒక్కటే జన్మదినమున మన మధ్య నూతన జీవి చేరుట ఆనందమును ఇచ్చుచున్నది.  అయితే మరణ దినమున ఒక జీవి తిరిగిరాని స్థితికి వెళ్ళుట దు:ఖమునకు కారణమై యున్నది.  అయితే బైబిలు గ్రంథములో ప్రసంగి 7:1, ''సుగంధతైలముకంటె మంచి పేరు మేలు;  ఒకని జన్మదినముకంటె మరణదినమే మేలు.'' అని చెప్పుచున్నాడు.  మరణదినము జన్మదినము కన్నా మేలు ఎలాగైనదో ఇప్పుడు తెలుసుకొందము.

ప్రసంగి చెప్పినట్లుగా -వ్యర్థము అంతయును వ్యర్థమే.  గంథకర్తనైన నేను చెప్పునదేమనగా - మనము భౌతిక శరీరముతో చేసిన మంచి చెడు కియ్రలు తప్ప అంతయు వ్యర్థమే

        జన్మదినము ఆనందముతో కూడినది.  ఒక ఆత్మ శరీర రూపములో భూమిపై ప్రసవించబడి అందరికి ఆనందమును కలుగజేయునుగాని, ఈ భూమిపై ఆత్మకు ఆనందమనేది శూన్యమైనదని చెప్పవచ్చును.  ఈ భూమిపై ప్రతిదీ పోరాటమే.  నరుని జీవితమే ఒక పోరాటము.  దీనినిగూర్చి ప్రత్యేకముగా చెప్పనక్కరలేదు.  ప్రతి విషయము శ్రమతో కూడినది, 100 రోజుల శ్రమ ఒక దినము ఆనందమన్న సామెతగా నరుని జీవితము వుండును.  ఇట్టి స్థితిలో నీతిగా పరిశుద్ధతగా జీవించాలి.  లేని పక్షములో ఈ ఆత్మ మరణానంతరము దు:ఖమును ఆనుభవించును.  ఈ దు:ఖము వర్ణింపశక్యము కానిదని గుర్తించాలి.  యెషయా 66:24, ''పురుగు చావదు వాటి అగ్ని ఆరిపోదు,''  అనగా ఆత్మకు నశింపు లేదు.  బాధించు అగ్ని ఆరిపోదు.  ఇది మరణించిన ఆత్మలలో శరీరముతో జీవించునప్పుడు నీతి పరిశుద్ధతగా జీవించనివారి స్థితి.

        అయితే మరణించిన దినము మేలు అని చెప్పుటకు ఒక మర్మము వున్నది.  ఇందులో - మరణించిన  దినము మరణించిన వాని బంధువులు దు:ఖముతో వుందురుగాని ఆత్మ శరీర బంధముల నుండి విముక్తి జరుగును.  

ఉదా :-  1.  ఒక నీతిమంతుడు మరణించిన వాని ఆత్మతో బాటుగా వాడు చేసిన నీతి కార్యములు వెంబడించును.  కనుక వాడు పరిశుద్ధుడుగా తీర్చబడి విశ్రాంతిలో ఆనందమును అనుభవించును.  కనుక నీతిమంతునికి మరణదినము మేలైనది.  

        2.  ఒక అపరిశుద్ధుడు మరణించిన వాని ఆత్మతోబాటుగా వాడు చేసిన అవినీతి లేక దుష్ట కార్యములు వానిని వెంబడించును.  వానిని అపరిశుద్ధుడుగా లేక కడమవాడుగా తీర్చబడి పాతాళములో వేదన అటు తరువాత అగ్నిగుండములో పాలిపంపులు పొందును.  అయినను వీని మరణదినమే మేలు.  ఎందుకంటే వాడు చేయు దుష్ట కార్యములకు కూడా అంతటితో ఆగిపోవును.  లేకుంటే ఇంకా ఎక్కువ కార్యములు చేసి తన ఆత్మను అధోగతికి తీసుకొని పోవునని గుర్తించాలి.

మరణదినమున నీతిమంతుడు       

 1.  ఆత్మ శరీరమును వదులును.

2.  వీని నీతి కార్యములు ఆగిపోవును.        

3.  పరిశుద్ధుడుగా తీర్పు తీర్చబడును.        

4.  పరదైసులో చేర్చబడును.                

5.  విశాంతిలో వుండును.                

6.  ఆకలిదప్పిక లేక నెమ్మది పొందును.

7.  వీని మరణదినము మేలు, ఎందుకంటే నీతిమంతునిగా విశ్రాoతిలో ప్రవేశించాడు.

మరణదినమున అపరిశుద్ధుడు:

   1.  ఆత్మ శరీరమును వదులును

2.  వీని అవినీతి కార్యములు ఆగిపోవును.

3.  అపరిశుద్ధుడుగా తీర్పు తీర్చబడును.

4.  పాతాళములో చేర్చబడును.

5.  వేదనలో వుండును.

6.  ఆకలిదప్పికతో నోరు ఎండి ఆత్మీయ వేదన పొందుదురు.

7.  మరణదినమే మేలు, ఎందుకంటే  దినముతో వాని చెడు కార్యములు ఆగిపోవును.

        అందుకనే ప్రసంగి తన బోధలో జన్మదినము కన్నా మరణ దినము మేలైనదని తెలియ జేస్తున్నాడు.  అంతేకాదు జన్మదినమున నరులు ఆనందమును అనుభవించినను తమలో పశ్చాత్తాపము వుండదు.  ఉపదేశము వినినను వారిలో డాంబికము కనిపించును.  అలాగే మరణ దినమున ఈ స్థితి మనకు కనిపించదు.  ప్రతి ఒక్కరిలో తెలియని వేదన వారు అనుభవించుట జరుగును.  ఈ స్థితిలో కనీసము వారు చేయు దుష్ట కార్యములను కొంతకాలము చేయకుండా ఉండుట జరుగును.  కనుక జన్మదినము కన్నను మరణదినమే మేలు.

21.  మరణించినవారి కొరకు దు:ఖించుట / అంగలార్చుట

        మరణించిన వారి కొరకు దు:ఖించుట ఆదికాలము నుండి యుగాంతము వరకు వున్నది.  తనవాడు ఇక లేడు అను బాధ వానిలో దు:ఖమునకు కారణము. ఈ దు:ఖము ఒక్కొక్కరికి ఒక్కొక్క రీతిగా యుండుట చూస్తున్నాము.  ఒక వ్యక్తి మరణము, వాని రక్తసంబంధులు అనగా తల్లి, దండ్రి, కుమారులు, సహోదరులు, సహోదరీలకు బహు దు:ఖము కలిగిస్తే, వాని స్నేహితులకు మాత్రము కొంత తక్కువ దు:ఖము వుండును.  ఇంకొంత దూరపు బంధువులకు ఇంకా తక్కువ దు:ఖము కలుగును.  అయితే అసలు ఆయన ఎవరో తెలియని వారికి దు:ఖము ఉండదు గాని మరణ భీతి మాత్రము వానికి కలుగును.  ఇంకా వాని శత్రువులకు వీని మరణము ఆనందమును కలిగించును.    

మరణము తమ వారిలో సంభవించిన దు:ఖము కలుగుట సహజము.   దు:ఖము శృతి మించిన  దైవశాపమునకు కారణమగును

        ఇలా ప్రతి ఒక్కరి విషయములో మరణించిన వారికి కలుగు దు:ఖములో తేడా వుండుట మనము చూడవచ్చును.  తిండితిప్పలు మాని శవము దగ్గర బాధపడుచు, కన్నీరు కార్చుచూ, రొమ్ము కొట్టుకొనుచు కూర్చున్నవారిని చూడవచ్చును.  అలాగే వారిని మించి దు:ఖించువారివలె నటించువారిని అదే స్థలములో చూడ వచ్చును.  కన్నీరు కార్చుచూ నిశ్శబ్దముగా వుండువారిని చూడవచ్చును.  దు:ఖమును దిగమ్రింగి డాంబికముగా కనబడువారిని అదే స్థలములో చూడవచ్చు.  ఇలా అన్ని రకాల వారు వున్నట్లుగా మనము చూస్తున్నాము.  దీని కంతటికి కారణము ఇక ఆ వ్యక్తి ఇక వుండడను బాధయే.  ఆ దినము తరువాత జ్ఞాపకాలు మాత్రమేగాని ఆ వ్యక్తిని చూచుటకు అవకాశము వుండదు.  అలాగే ఆది 50:1, ''యోసేపు తన తండ్రి ముఖముమీద పడి అతనిగూర్చి యేడ్చి అతని ముద్దు పెట్టుకొనెను.''  ఇది యోసేపు ఇశ్రాయేలను తన తండ్రి మరణించినప్పటి సంఘటన.  ఆది 50:10, ''యెర్దానునకు అవతలనున్న ఆఠదు కళ్లమునొద్దకు చేరి అక్కడ బహు ఘోరముగా అంగలార్చిరి.  అతడు తన తండ్రినిగూర్చి యేడు దినములు దు:ఖము సలిపెను.''  అలాగే దావీదు, అబ్షాలోము మరణించినప్పుడు కూడా ఆ దు:ఖమును చూపుట జరిగింది.  

        2 సమూయేలు 19:1, ''రాజు తన కుమారునిగూర్చి దు:ఖించుచు ఏడ్చుచున్నాడను సంగతి ఆ దినమున జనులందరు విని,''  అలాగే దావీదు మహారాజు, అబ్నేరు చనిపోయినప్పుడు కూడా తన వారినందరిని దు:ఖించమని చెప్పుట గురించి మనము 2వ సమూయేలు 3:31లో చదువగలము.  అలాగే యేసుక్రీస్తును సిలువ బలియాగమునకు యూదులు తీసుకొని వెళ్ళునప్పుడు యెరూషలేము స్త్రీలు రొమ్ము కొట్టుకొనుచూ దు:ఖించుట చదువగలము.  హేరోదు మహారాజు జ్ఞానులు తనను మోసగించిరని తెలుసుకొని క్రీస్తును చంపదలచి 2 సంవత్సరములలోపు మగపిల్లలనందరిని చంపించుట చేత ఆ ప్రాంతమంతయు దు:ఖసాగరములో మునిగిపోయెనని వ్రాయబడి యున్నది.  మత్తయి 2:17-18, ''అందువలన -రామాలో అంగలార్పు వినబడెను   ఏడ్పును మహా రోదనధ్వనియు కలిగెను   రాహేలు తన పిల్లలవిషయమై యేడ్చుచు వారు లేనందున ఓదార్పు పొందనొల్లక యుండెను  అని ప్రవక్తయైన యిర్మీయా ద్వారా చెప్పబడిన వాక్యము నెరవేరెను.''  ఇలా మరణించిన వారి విషయములో శరీరరీత్యా దు:ఖము కలుగుట సహజమే అని మనము గ్రహించాలి.  ఈ దు:ఖములో దేవుని నిందించువారిని అనేకులను మనము చూస్తున్నాము.  ఇది చాలా తప్పు.  శరీరరీత్యా మరణము తప్పదు.  కనుక ఒకరు ముందు - ఇంకొకరు వెనుక.  ఇలా ప్రతి ఒక్కరు చనిపోవుట జరగవలసినదే.  దీనిని గూర్చి దు:ఖించ వచ్చునుగాని దేవుని నిందించుట తప్పుగా గ్రహించాలి.  దేవుని అవతారము, దేవుని కుమారుడు, మన రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువు మనకొరకు సిలువ బలియాగము చేసి మరణించెనని గుర్తించుకొని దు:ఖితులై పాపము చేయక క్రీస్తు చెప్పిన వాక్యమును అనుసరించవలసినవారమై యున్నాము.  ఆయన మరణమును నిత్యము జ్ఞాపకపరచుకొని ఆయన రాజ్య స్థాపన కొరకు జీవించాలి.

        అలాగే దైవవ్యతిరేకి, తండ్రిని చంప జూచినవాడు, ఇశ్రాయేలీయులందరికి తెలిసినట్లుగా తల్లితో సమానమైన తన తండ్రి ఉపపత్నులను కూడినవాడు మరణించినప్పుడు దేవుడు ఆ మరణమును హర్షించలేదు.  అనగా అబ్షాలోము మరణించినప్పుడు దు:ఖించుచున్న దావీదు మహారాజును మందలించినట్లుగా గుర్తించాలి.  2 సమూయేలు 19:1-7, ''రాజు తన కుమారునిగూర్చి దు:ఖించుచు ఏడ్చుచున్నాడను సంగతి ఆ దినమున జనులందరు విని, యుద్ధమందు సిగ్గుతో పారిపోయిన జనులవలె వారు నాడు దొంగనడకలతో వచ్చి పట్టణములో ప్రవేశించిరి;  నాటి విజయము జనులకందరికి దు:ఖమునకు కారణమాయెను.  రాజు ముఖము కప్పుకొని-అబ్షాలోమా నా కుమారుడా అబ్షాలోమా నా కుమారుడా నా కుమారుడా, అని కేకలు వేయుచు ఏడ్చుచుండగా, రాజు అబ్షాలోమునుగూర్చి దు:ఖించుచు ఏడ్చుచున్నాడను సంగతి యోవాబు విని నగరియందున్న రాజునొద్దకు వచ్చి-నీ ప్రాణమును నీ కుమారుల ప్రాణములను నీ కుమార్తెల ప్రాణములను నీ భార్యల ప్రాణములను నీ ఉపపత్నుల ప్రాణములను ఈ దినమున రక్షించిన నీ సేవకులనందరిని నేడు సిగ్గుపరచి నీ స్నేహితులయెడల ప్రేమ చూపక నీ శత్రువులయెడల ప్రేమ చూపుచు, ఈ దినమున అధిపతులును సేవకులును నీకు ఇష్టజనులు కారని నీవు కనుపరచితివి.  మేమందరము చనిపోయి అబ్షాలోము బ్రదికియుండినయెడల అది నీకు ఇష్టమగునన్న మాట యీ దినమున నేను తెలిసికొనుచున్నాను.  ఇప్పుడు లేచి బయటికివచ్చి నీ సేవకులను ధైర్యపరచుము.  నీవు బయటికిరాకయుండిన యెడల ఈ రాత్రి యొకడును నీయొద్ద నిలువడని యెహోవా నామమునుబట్టి ప్రమాణముచేసి చెప్పుచున్నాను;  నీ బాల్యమునుండి నేటివరకు నీకు ప్రాప్తించిన అపాయము లన్నిటికంటె అది నీకు కష్టతరముగా ఉండునని రాజుతో మనవిచేయగా రాజు లేచి వచ్చి గుమ్మములో కూర్చుండెను.''  ఇందునుబట్టి, దైవసంబంధులు మరణించినప్పుడు దు:ఖించుటలో తప్పులేదుగాని, దైవ సంబంధులు కాని వారి కొరకు దు:ఖించుట వ్యర్థమని గ్రహించాలి.  ఏది ఏమైనప్పటికిని దు:ఖము కొన్ని దినములు మాత్రమే ఉండును.  అటు తరువాత ఈ దు:ఖమును వీడి మరల తమ స్వకార్యములు జరిగించుట జరుగును.  ఈ విషయములు ప్రతి ఒక్కరికి తెలిసినదే.  ద్వితీయోపదేశ కాండము 34:7-8, ''మోషే చనిపోయినప్పుడు నూటఇరువది సంవత్సరముల యీడుగలవాడు.  అతనికి దృష్టి మాంద్యములేదు, అతని సత్తువు తగ్గలేదు.  ఇశ్రాయేలీయులు మోయాబు మైదానములలో మోషేనుబట్టి ముప్పది దినములు దు:ఖము సలుపగా మోషేనుగూర్చిన దు:ఖము సలిపిన దినములు సమాప్తమాయెను.''  ఈ విధముగా మోషే నిమిత్తముగా ఇశ్రాయేలీయులు మోయాబు మైదానములలో 30 దినములు దు:ఖమును సలుపుట జరిగింది.  అలాగే యోసేపు యాకోబు నిమిత్తము దు:ఖమును 7 దినములు జరిపాడు.  ఇలా తమ వారి కోసము దు:ఖము సలుపుట అనునది సహజము.  కనుక తమ వారు మరణము పొందినప్పుడు దు:ఖమును పొందువారిని విమర్శించుట మంచిది కాదని గ్రహించాలి.  అయితే చెడు నడత కల్గినవారు మరణించినప్పుడు వారు దైవసంబంధులు కారు కనుక వారికోసము దు:ఖము సలుపకూడదని, ఒకవేళ దు:ఖము పొందినను ఆ శరీరమును పాతి పెట్టువరకు మాత్రమే పొంది తరువాత దు:ఖము నుండి విడుదల పొందవలెను.  అలా కాకుండా, దైవసంబంధము కాని వాని విషయము దినముల తరబడి దు:ఖమును పొందిన చనిపోయినవాని వలె అతని కోసము దు:ఖము పొందినవారు కూడా దైవశాపమునకు యోగ్యులని 2 సమూయేలు 19:1-5లో చెప్పుట జరిగింది.  

మరణించినవారి కొరకు దు:ఖించుట వలన చచ్చినవారికి గాని బ్రతికియున్న వారికిగాని ఎవరికిని  మేలు వుండదు.

        అయితే మరణించినవారి కొరకు దు:ఖించుట వలన ఎవరికి మేలు జరుగును?  ఈ దు:ఖము వలన ఎవరికి మేలు లేదు.  ఎందుకంటే తమ సంబంధులు తిరిగిరాని లోకానికి వెళ్ళిరి అని మనకు కలుగు దు:ఖమేగాని, ఈ దు:ఖము పశ్చాత్తాపమునకు సంబంధించినది కాదు.  ఈ దు:ఖము తను చేసిన తప్పునుబట్టి కలిగినది అయితే ఏమన్నా ప్రయోజనము కలుగును.  కాని ఇందులో దు:ఖించువారు వారి తప్పులను గుర్తు చేసుకొని దు:ఖించరు.  అంతేకాకుండా దు:ఖించువారు తమ సంబంధులు రాని లోకానికి వెళ్ళారని వచ్చు దు:ఖమే ఎక్కువగా వుండును.  కనుక దీనివలన ప్రయోజనము ఏమి వుండదు.  అయితే ఈ దు:ఖ దినములు జరుపుట ద్వారా కామక్రోధ, లోభ మొదలైన గుణములను క్రమబద్ధము ఆ దినములలో జరుగును.  తప్పుపని చేయువారలు వారి క్రియలను మాని దు:ఖించుట జరుగును కనుక అది వానికి మేలు అని ప్రసంగి చెప్పుచున్నాడు.  ఎందుకంటే ఎవరైనను మరణించిన తమ సంబంధుల శరీరమును ఇంటిలో వుంచుకొని దైనందిక కార్యములు జరుపరు కదా!  అందుచేత మరణదినము జన్మదినము కన్నా మేలైనదిగా గుర్తించాలి.  అయితే మనము మరణించినవారి కొరకు దు:ఖించుట వలన చనిపోయినవారికి కూడా ఏ మేలు జరుగదని గుర్తించాలి.  ప్రకటన 14:13, ''అంతట-ఇప్పటినుండి ప్రభువునందు మృతినొందు మృతులు ధన్యులని వ్రాయుమని పరలోకమునుండి యొక స్వరము చెప్పగా వింటిని.  నిజమే;  వారు తమ ప్రయాసములు మాని విశ్రాంతి పొందుదురు;  వారి క్రియలు వారి వెంట పోవునని ఆత్మ చెప్పుచున్నాడు.''  

        ప్రకటన 22:12, ''ఇదిగో త్వరగా వచ్చుచున్నాను.  వానివాని క్రియచొప్పున ప్రతివాని కిచ్చుటకు నేను సిద్ధపరచిన జీతము నాయొద్ద ఉన్నది.''  కనుక శరీరముతో చేసిన కార్యములకు క్రీస్తు ప్రభువు జీతము ఇచ్చునుగాని మరణించిన తరువాత వారిని గూర్చి దు:ఖించిన దానినిబట్టి కాదని గ్రహించి, దు:ఖముతో కాలమును వ్యర్థము చేసుకొనక, బహు జాగరూకులై సత్క్రియలయందును, సువార్త కార్యముల యందును మనస్సును లగ్నము చేసి దేవునికి యోగ్యరీతిగా జీవించుదుముగాక.

22.  అంగలార్పు చేయునప్పుడు శరీరములను గాయపరచుట లేక తలలు గొరిగించుకొనుట నిషిద్ధము

        బైబిలు గ్రంథము ఒక ప్రత్యేకమైన గ్రంథము.  ప్రతి విషయమును ఒక ప్రత్యేకమైన శ్రద్ధతో చెప్పుట జరిగింది. అలాగే కొన్ని మతములవారు చనిపోయినవారి కొరకు అంగలార్చి అనగా విలపించి వారితోబాటుగా తమని చితిపై సజీవ దహనము చేసుకొంటారు.  దీనినే సతీసహగమనము అను పేరుతో జరిగిస్తారు.  ఇంకొన్ని మతములవారు మీసాలు, గడ్డము, తల వెంట్రుకలు గొరిగించుట చూస్తున్నాము.  ఇలా చేయుట శరీరమును గాయపరచుట లేక వెంట్రుకలను గొరిగించుకొనుటతో సమానమే.  

        దీనినిగూర్చి బైబిలు గ్రంథము - ద్వితీయోపదేశ కాండము 14:1-2, ''మీరు మీ దేవుడైన యెహోవాకు బిడ్డలు గనుక చనిపోయిన వాడెవనినిబట్టి మిమ్మును మీరు కోసికొనకూడదు, మీ కనుబొమ్మల మధ్య బోడిచేసుకొనకూడదు.  ఏలయనగా నీ దేవుడైన యెహోవాకు నీవు ప్రతిష్టత జనము.  మరియు యెహోవా భూమి మీదనున్న సమస్త జనములలో విశేషముగా తనకు స్వకీయజనమగునట్లు నిన్ను ఏర్పరచుకొనెను.''

        కనుక క్రైస్తవులకు చనిపోయిన వారి కోసరము తన శరీరము బాధించుకొనుట, వెంట్రుకలు గొరిగించుకొనుట వంటివి చేయుట నిషిద్ధము.  ఇలా చేయుటవలన మనలను మనము దేవుని జనాంగముగా వుండక వేరుపడినవారము అగుదుము.  కనుక మరణించిన వారి కోసము అంగలార్చినప్పుడు శరీరమును గాయపరచుకొనక, తలవెంట్రుకలు తీయించుకొనక వుండుట శ్రేయస్కరమని క్రైస్తవ మత గ్రంథము తెలుపుచున్నది.  గ్రంథమును పాటించినవారు దేవునియొక్క సొంత ప్రజలుగా చెప్పుట చదవగలము.  

        లేవీయకాండము 19:28, ''చచ్చినవారికొరకు మీ దేహమును చీరుకొనకూడదు, పచ్చబొట్లు మీ దేహమునకు పొడుచుకొనకూడదు;  నేను మీ దేవుడనైన యెహోవాను.''

23.  అంగలార్పు ఆహారము - పానీయములు

        మనలో ఒకరు చనిపోయినవారి శరీరమును ఇంట వుండినప్పటినుండి ఉపవాస దినములు గడచువరకు ఆ ఇంటివారికి వేరే ఇంటివారు ఆహారమును పంపించాలి.  ఎందుకంటే చనిపోయినవారి ఇంటివారు దు:ఖాక్రాంతులై వేదన పొందుచున్నందున వారి ఆహారము పానీయములు చేసుకొని తినవలెనన్న తలంపు వారికి వుండదు.  వారి వేదన అంతులేనిదిగా వుండునని గుర్తించాలి.  

సజీవుడై క్రీస్తు మరణించాడని దు:ఖించుట అవసరమా!

        ఆది 23:1-2, ''శారా జీవించిన కాలము, అనగా శారా బ్రదికిన యేండ్లు నూట ఇరువది యేడు.  శారా కనాను దేశమందలి హెబ్రోనను కిర్యతర్బాలో మృతిబొందెను;  అప్పుడు అబ్రాహాము శారా నిమిత్తము అంగలార్చుటకును ఆమెను గూర్చి యేడ్చుటకును వచ్చెను.''  ఇలా అబ్రాహాము తన భార్యయైన శారా చనిపోయినప్పుడు ఆమెయొద్దకు అంగలార్చుకొరకును యేడ్చుట కొరకును వెళ్ళుట జరిగింది.  ఆది 50:10, ''యెర్దానునకు అవతలనున్న ఆఠదు కళ్లమునొద్దకు చేరి అక్కడ బహు ఘోరముగా అంగలార్చిరి.  అతడు తన తండ్రినిగూర్చి యేడు దినములు దు:ఖము సలిపెను.''  

        అలాగే దావీదు తన అక్రమ సంతానమైన బేర్షబా బిడ్డ కొరకు అంగలార్చాడు.  కాని చనిపోక ముందు బాధపడుట జరిగింది.  ఎందుకంటే తన దు:ఖమును వేదనను చూచియైనను తండ్రియైనప్పుడు కుమారుని రోగము నయము చేసి చావనీయక బ్రతికించగలడని ఉపవాస ప్రార్థనలు చేశాడు.  చనిపోయిన తరువాత లేచి అన్నపానములు పుచ్చుకొని బిడ్డ కొరకు ఏడవలేదు.  కాని దావీదు దైవద్రోహియైన అబ్షాలోము గురించి అంగలార్చినప్పుడు దైవశాపము రాకుండా అంగలార్చుట మానమని చెప్పుట జరిగింది.  అలాగే ప్రతి ఒక్కరి కొరకు అంగలార్పు దు:ఖము సలుపుట జరుగును.  మోషే విషయములో 40 దినములు జరిపారు.  కాని యేసుక్రీస్తు విషయములో అంగలార్చు యెరూషలేమువారు ఒకరికి తెలియకుండా ఒకరు జరిపినట్లు గ్రహించాలి, ఎందుకంటే యేసుక్రీస్తు యూదా మతద్రోహిగా సిలువ శిక్షను అనుభవించుట జరిగింది.  కాని ఆయన సిలువను మోసుకొని వెళ్ళుచున్నప్పుడు యెరూషలేము స్త్రీలందరు రొమ్ములను బాదుకొంటూ ఏడ్చినట్లుగా చెప్పబడి యున్నది.  

తమలో ఒకరు చనిపోయి బాధపడుచున్నవారికి ఆహారము పానీయము పెట్టుట నీతి

        లూకా 23:27, ''గొప్ప జన సమూహమును, ఆయనను గూర్చి రొమ్ముకొట్టు కొనుచు దు:ఖించుచున్న చాలమంది స్త్రీలును ఆయనను వెంబడించిరి.''  అందుకు యేసు వారిని ఓదార్చుచూ - లూకా 23:28, ''యేసు వారివైపు తిరిగి-యెరూషలేము కుమార్తెలారా, నా నిమిత్తము ఏడ్వకుడి;  మీ నిమిత్తమును మీ పిల్లల నిమిత్తమును ఏడ్వుడి.'' అని చెప్పెను.  ఎందుకంటే క్రీస్తు బలియాగము ద్వారా సమస్త జనులకు రక్షణ వచ్చునని క్రీస్తు ప్రభువుకు తెలియును కనుక నా కొరకు దు:ఖించవద్దని నేను లోకరీత్యా మరణించినట్లు కనబడినను, నేను సజీవుడనే అని చెప్పుట జరిగింది.  కాని, అంగలార్చు దినములలో ఉన్నవారికి ఆహారము - పానీయములు ఇచ్చుట మన విధియై యున్నది.  యిర్మీయా 16:7, ''చచ్చినవారినిగూర్చి జనులను ఓదార్చుటకు అంగలార్పు ఆహారము ఎవరును పంచిపెట్టరు;  ఒకని తండ్రియైనను తల్లియైనను చనిపోయెనని యెవరును వారికి ఓదార్పు పాత్రను త్రాగనియ్యకుందురు.''  

        ఈ యిర్మీయాలో జరిగిన సంఘటనలో యెహోవా వాక్కు ప్రత్యక్షమై దైవజనాంగానికి శిక్ష వచ్చినప్పుడు జరిగిన సంఘటన.  ఇందులో చనిపోయినవారి కొరకు అంగలార్చు చున్నప్పుడు వారికి ఆహారమును పంచుట పానీయము త్రాగనిచ్చుట రెండును చేయకూడదని చెప్పుచున్నాడు, ఎందుకంటే వారు దైవోగ్రతలో వారు శిక్షను అనుభవించుచున్నారు.  వారి నిజ దైవమైన యెహోవాను వీడి అన్య దేవతా విగ్రహాలను పూజించుచున్నారు.  కనుక దేవుడు వారికి అంగలార్పు కాలములో ఆహారము, పానీయములు ఇయ్యవద్దని ప్రవక్తకు తెలియజేస్తున్నాడు.  

        ఇందునుబట్టి, నిజ దైవ విశ్వాసములో వున్నవారికి వారిలో ఒకడు చనిపోయి అంగలార్పుతోను, దు:ఖముతో వున్నప్పుడు, వారికి మనము అంగలార్పు ఆహారము, పానీయములు ఇయ్యవలసినవారమై యున్నామని గుర్తించాలి.  ఇలా ఇచ్చుట నీతిక్రియగా అది ఎంచబడునని గుర్తించాలి.  ఇలా ఇచ్చుటకు మనము వెనుకంజ వేయకూడదు.  ఇలా అంగలార్పుతో వున్నవారిని ఓదార్చుచూ, వారికి కావలసిన ఆహారమును పానీయములను పంచుట ఉత్తమమైన క్రియగా మనము గుర్తించాలి.

24.  రాత్రిపూట శవములు వ్రేలాడుట నిషిద్ధము

        యోహాను 19:31, ''ఆ దినము సిద్ధపరచుదినము; మరుసటి విశ్రాంతి దినము మహాదినము గనుక ఆ దేహములు విశ్రాంతి దినమున సిలువ మీద ఉండకుండునట్లు, వారి కాళ్లు విరుగగొట్టించి వారిని తీసివేయుంచుమని యూదులు పిలాతును అడిగిరి.''  ఇందునుబట్టి రేపటి దినము విశ్రాంతి దినము.  ఆ దినము శవములు సిలువపై అసలు వుండకూడదు.  అలావుంటే ఆ దినము విశ్రాంతి దినముగా లెక్కించబడదు.  

శవము రాత్రి వేలాడుచుండుట చనిపోయినవానికే కాదు  దేశములో వుండు పత్రి ఒక్కరికి అనర్థము.

అంటే క్రీస్తు సిలువ బలియాగ సమయములో క్రీస్తుతోబాటుగా ఇద్దరు దొంగలను సిలువ వేసారు.  కాని క్రీస్తు - ఈ ఇద్దరు దొంగలు మరణించకుండా రాత్రి అంత వుండి విశ్రాంతి దినము అనగా పస్కా పండుగ దినమున చనిపోతే ఆ దినము అపవిత్ర దినముగా మారును.  అలాంటప్పుడు వారు పస్కా పండుగను తిరిగి నెల తరువాత ఆచరించాలి.  ఇది విధి.  సంఖ్యా కాండము 9:6-12, ''కొందరు నరశవమును ముట్టుట వలన అపవిత్రులై ఆ దినమున పస్కా పండుగను ఆచరింపలేకపోయిరి.  వారు ఆ దినమున మోషే అహరోనుల ఎదుటికి వచ్చి మోషేతో నియామక కాలమున ఇశ్రాయేలీయుల మధ్యను అర్పింపకుండునట్లు ఏల అడ్డగింపబడితిమని అడుగగా మోషే - నిలువుడి;  మీ విషయములో యెహోవా యేమి సెలవిచ్చునో నేను తెలిసి కొందునని వారితో అనెను.  అప్పుడు యెహోవా మోషేకు ఈలాగు సెలవిచ్చెను-నీవు ఇశ్రాయేలీయులతో ఇట్లనుము -మీలోగాని మీ వంశములలోగాని ఒకడు శవమును ముట్టుట వలన అపవిత్రుడైనను, దూరప్రయాణము చేయుచుండినను, అతడు యెహోవా పస్కాపండుగను ఆచరింపవలెను.  వారు రెండవనెల పదునాలుగవ దినమున సాయంకాలమున దానిని ఆచరించి పొంగనివాటితోను చేదు ఆకుకూరలతోను దానిని తినవలెను.  వారు మరునాటివరకు దానిలో కొంచెమైనను మిగలనీయవలదు;  దానిలోనిది ఒక్క యెముకనైనను విరువవలదు;  పస్కాపండుగ విషయమైన కట్టడలన్నిటిని బట్టి వారు దానిని ఆచరింపవలెను.''  కనుక విశ్రాంతి దినమున అనగా పస్కాపండుగ దినమను మహాదినమున శవములను తాకరాదు కనుక వారి కాళ్లను నరికి వారిని చంపివేయుమని యూదులు పిలాతును అడుగుచున్నారు.  యోహాను 19:32-34, ''కాబట్టి సైనికులు వచ్చి ఆయనతో కూడ సిలువవేయబడిన మొదటి వాని కాళ్లను రెండవవాని కాళ్లను విరుగగొట్టిరి.  వారు యేసునొద్దకు వచ్చి, అంతకుముందే ఆయన మృతిపొందియుండుట చూచి ఆయన కాళ్లు విరుగగొట్టలేదుగాని సైనికులలో ఒకడు ఈటెతో ఆయన ప్రక్కను పొడిచెను, వెంటనే రక్తమును నీళ్లును కారెను.''  ఈ విధముగా క్రీస్తు ప్రభువు ముందుగానే చనిపోవుట, ఇద్దరు దొంగల కాళ్ళను విరగగొట్టుట ద్వారా వారు చనిపోవుట జరిగింది.  ఇది పస్కా పండుగ దినమున మరియు చనిపోయినవారి దేహము వ్రేలాడుచూ రాత్రి కాలమున వుండకూడదని బైబిలు గ్రంథము చెప్పుచున్నది.  

శవములు ముట్టుట వలన అపవిత్రులు అగుదురు

ద్వితీయోపదేశకాండము 21:22-23, ''మరణశిక్షకు తగిన పాపము ఒకడు చేయగా అతని చంపి మ్రానుమీద వ్రేలాడదీసినయెడల అతని శవము రాత్రి వేళ ఆ మ్రానుమీద నిలువకూడదు.  వ్రేలాడదీయబడినవాడు దేవునికి శాపగ్రస్తుడు గనుక నీ దేవుడైన యెహోవా స్వాస్థ్యముగా నీకిచ్చుచున్న దేశమును నీవు అపవిత్రపరచకుండునట్లు అగత్యముగా ఆ దినమున వానిని పాతి పెట్టవలెను.''  కనుక యూదులు క్రీస్తును శాపగ్రస్తునిగా ఎంచిరి కనుక ఆయన భౌతిక దేహము సిలువకు వ్రేలాడకూడదని పిలాతుకు చెప్పుట జరిగింది.  కనుక అరిమతయియ యోసేపు పిలాతును క్రీస్తు శరీరమును అడగగానే ఇచ్చివేయుట జరిగింది.  యోహాను 19:38, ''అటుతరువాత, యూదుల భయమువలన రహస్యముగా యేసు శిష్యుడైన అరిమతయియ యోసేపు, తాను యేసు దేహమును తీసికొని పోవుటకు పిలాతు నొద్ద సెలవడిగెను.  పిలాతు సెలవిచ్చెను.  గనుక అతడు వచ్చి యేసు దేహమును తీసికొని పోయెను.''  ఎందుకంటే తరువాతి దినము మహాదినము విశ్రాంతి దినము.  ఆ దినమున శవములు వ్రేలాడకూడదు.  ఆ దినమున ఎవరును పని చేయరు.  అంతే కాకుండా శాపగ్రస్తుని శరీరము రాత్రి వ్రేలాడుట దేశానికి అరిష్టమని ధర్మశాస్త్రము చెప్పుచున్నది.  ఈ రెండు కారణములచేత పిలాతును యూదులు అడుగుట జరిగింది.

యూదా ఇస్కరియోతు ఉరి వేసుకొనినను శాపగ్రస్త స్థితి నుండి  దేవుడు రక్షించెను

        ఉరి వేసుకొని చనిపోవుట నేరమని ఈనాడు అందరు చెప్పుదురు.  దీనికి కారణము ధర్మశాస్త్రమే.  ఈ ధర్మశాస్త్రము మోషే కాలములో దేవుని ద్వారా ఇయ్యబడినది.  ఉరి వేసుకొని వ్రేలాడి చనిపోవువారు శాపగ్రస్తులుగా చెప్పబడియున్నది.  చాలావరకు ఉరి వేసుకొనుట అను కార్యము రాత్రిపూటలే జరుగును.  వారు ఎవరికి తెలియకుండా రహస్యముగా ఉరి వేసుకొనుట జరుగును.  రాత్రి శవము వ్రేలాడకూడదని ధర్మశాస్త్రము చెప్పుచుండగా సాతాను నరులను దానికి విరుద్ధముగా ప్రేరేపించి వారు ఉరి వేసుకొని రాత్రి వ్రేలాడునట్లుగా చేయును కనుక వీరు శాపగ్రస్తులు.  ఉరి వేసుకొనుట, ఉరి వేసుకొనుటకు ప్రయత్నించుట, అలా ఉరి వేసుకొంటానని బెదిరించుట, ఇవన్నీ కూడా సాతానుయొక్క లక్షణాలే.  కనుక వారు శాపగ్రస్తులని గ్రహించాలి.  ఉరి వేసుకొనుట గాని ఏదోయొక రీతిగా ఆత్మహత్య చేసుకొనుటగాని మహా పాపమని మనకెల్లరకు తెలిసిందే.  దేవుడు మనకు దయచేసిన ప్రాణమును త్యజించుటకు మనకు అధికారము లేదు.  ఆయన తీసివేయవలసినదే!  అట్టి వారికి దైవరాజ్యములో ప్రవేశము ఉండదని గ్రహించాలి.

        ఇక 12 మంది శిష్యులలో ఒకడైన యూదా ఇస్కరియోతు ఉరి వేసుకొనుట జరిగింది.  దీనిని గూర్చి క్రీస్తు ప్రభువు ఏమి చెప్పుచున్నాడో తెలుసుకొందము.  మత్తయి 26:20-24, ''సాయంకాలమైనప్పుడు ఆయన పండ్రెండుమంది శిష్యులతో కూడ భోజనమునకు కూర్చుండెను.  వారు భోజనము చేయుచుండగా ఆయన-మీలో ఒకడు నన్ను అప్పగించునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాననెను.  అందుకు వారు బహు దు:ఖపడి ప్రతివాడును-ప్రభువా నేనా?  అని ఆయన నడుగగా ఆయన-నాతో కూడ పాత్రలో చెయ్యి ముంచినవాడెవడో వాడే నన్ను అప్పగించువాడు.  మనుష్యకుమారునిగూర్చి వ్రాయబడిన ప్రకారము ఆయన పోవుచున్నాడు గాని యెవనిచేత మనుష్యకుమారుడు అప్పగింపబడుచున్నాడో ఆ మనుష్యునికి శ్రమ;  ఆ మనుష్యుడు పుట్టియుండని యెడల వానికి మేలని చెప్పెను.''  పుట్టియుండని యెడల యూదాకు మేలని ప్రభువు చెప్పుటలోని పరమార్థమేమి?  లోకములోని సజ్జనులనుగాని, దుర్జనులనుగాని దేవుడే కదా పుట్టిస్తున్నాడు.  యూదా తనంతట తానుగా ఈ లోకములో జన్మించాలని రాలేదు.

        యోహాను 3:5లో వలె యూదా నీటి మూలముగాను అనగా బాప్తిస్మము ద్వారాను ప్రభువు నామమున ఆత్మ మూలముగాను జన్మించి నూతన జన్మను పొందినాడు.  ప్రభువు చేసిన పాద ప్రక్షాళన ద్వారా పవిత్రత పొందినాడు.

        ఇట్టి పవిత్ర జన్మను నూతనముగా పొందిన యూదా ధనాశ చేత సాతానుకు అవకాశమిచ్చి భ్రష్టత్వము పొందినాడు.  కనుక యూదా క్రీస్తులో నూతనముగా జన్మించక ఆయన బల్లలో పాలుపంపులు పొందక అన్యుడుగానే ఉండి నన్ను శత్రువులకు పట్టిచ్చియుంటే కొంత శిక్ష తగ్గియుండేది.  కాని ప్రభువు నెరిగి నిజ దైవత్వము తెలిసికొని బాప్తిస్మము ద్వారా నూతన జన్మను పొందిన క్రైస్తవునికి ఏడింతల శిక్ష కలదని, ఆ శిక్ష మహా భయంకరమైనది కనుక యూదా క్రీస్తులో జన్మించక తనను పట్టించియుంటే కొంత శిక్ష తగ్గియుండేదన్న భావముతో - యూదా పుట్టి యుండని యెడల మేలని చెప్పుచున్నాడు.

        ఇలా 12 మంది శిష్యులలో ఒకడైన యూదా ఇస్కరియోతు యేసుక్రీస్తు ప్రభువును శత్రువులైన యూదులకు అప్పగించి తప్పు చేసినట్లుగా తెలియుచున్నది.  వాస్తవానికి ఇది లేఖనముల నెరవేర్పు మాత్రమే అని గుర్తించాలి.  అయితే ఈ పాపము చేసిన తరువాత యూదా ఏమి చేసాడో తెలుసుకొందము.  మత్తయి 27:3-5, ''అప్పుడాయనను అప్పగించిన యూదా, ఆయనకు శిక్ష విధింపబడగా చూచి పశ్చాత్తాపపడి, ఆ ముప్పది వెండి నాణెములు ప్రధానయాజకుల యొద్దకును పెద్దలయొద్దకును మరల తెచ్చి - నేను నిరపరాధరక్తమును అప్పగించి పాపము చేసితినని చెప్పెను.  వారు-దానితో మాకేమి?  నీవే చూచుకొనుమని చెప్పగా అతడు ఆ వెండి నాణెములు దేవాలయములో పారవేసి, పోయి ఉరి పెట్టుకొనెను.''  ఈ విధముగా యూదా ఉరి వేసుకొనుట జరిగింది.  కాని యూదా దైవ ప్రణాళికలో ఒక భాగముగా సాతానుచే ప్రేరేపింపబడి దైవాజ్ఞ మేర వాడబడినందును అతడు ఉరి వేసుకొనినను దైవాత్మ అతనిని వ్రేలాడువాడు శాపగ్రస్థుడు అను ధర్మశాస్త్ర చట్టము నుండి అతనికి విడుదల కలిగించాడు.  వాస్తవానికి యూదా ఉరి వేసుకొనుట నిజమే.  కాని ఈ ఉరి వేసుకొనుట క్రీస్తును సిలువ వేయుట ఒకేసారి జరిగినట్లుగా మనము తెలుసుకొనవలెను.  కనుక యూదా యేసునకు శిక్ష విధింపబడుట చూచాడు.  పశ్చాత్తాపపడి నేరుగా ప్రధానార్చకుల యొద్దకు వచ్చి వారితో మాట్లాడుట జరిగింది.  అదే సమయములో క్రీస్తు ప్రభువు సిలువను మోసుకుంటూ గొల్గత ప్రాంతమునకు వెళ్ళుట జరిగింది.  అటుతరువాత - ఆ విధముగా క్రీస్తు కొరకు తాను తీసుకొనిన వెండి నాణెములను దేవాలయములో విసిరికొట్టి ఉరి వేసుకొనుట జరిగింది.  ఈ ఉరి రాత్రిపూట జరిగింది కాదు.  రాత్రి శవములు వ్రేలాడకూడదు.  అలా వ్రేలాడినవారు శాపగ్రస్థులని ధర్మశాస్త్రమునందు చెప్పబడియున్నది.  కాని ఎవరైనా ఉరి వేసుకొన్న తరువాత సుమారుగా 3 గంటలసేపు బ్రతుకుటకు అవకాశమున్నది.  అందులో యూదా సైనికుడిగా వుండి యూదుల విడుదల కోసము బర్నబాతో వున్నవాడు కనుక ఉరి వేసుకొన్నను తక్షణమే ప్రాణము పోవుటకు అవకాశము లేదు.  ఈలోగా క్రీస్తు ప్రభువు సిలువపై దేవునికి తన ఆత్మను అప్పగించి ప్రాణము విడుచుట జరిగింది.  అప్పుడు - మత్తయి 27:51-52, ''అప్పుడు దేవాలయపు తెర పైనుండి క్రింది వరకు రెండుగా చినిగెను;  భూమి వణకెను;  బండలు బద్దలాయెను;  సమాధులు తెరవబడెను;  నిద్రించిన అనేక మంది పరిశుద్ధుల శరీరములు లేచెను.''  ఇందునుబట్టి యూదా ఉరి వేసుకొన్నను తాను చనిపోకతలికే, ఈ సంఘటన వల్ల తను ఉరి వేసుకొన్న కొండ శిఖరము బద్దలు అగుట జరిగింది.  క్రీస్తు ప్రభువును గొల్గత అను కొండ ప్రాంతమునకు తీసుకొని వెళ్ళి సిలువ వేసారు.  యూదా ఇస్కరియోతు ప్రధాన యాజకులతో వాగ్వివాదము చేసి వారిపై కోపగించుకొని వెండి నాణెములను దేవాలయములో విసిరికొట్టి వేరొక కొండ శిఖరమున వున్న చెట్టు కొనకు త్రాడు కట్టి ఉరి వేసుకొన్నాడు.  ఇలా యూదా ఇస్కరియోతు ప్రధాన యాజకుల వద్దకు వెళ్ళక ముందే యేసుక్రీస్తుకు శిక్ష పడిన సంగతి తెలుసుకొన్నాడు.  అటుతరువాత ప్రధాన యాజకుల వద్దకు వెళ్ళుట జరిగింది.  ఇంచుమించుగా ఇద్దరు అనగా యూదా ఇస్కరియోతు, క్రీస్తు ప్రభువు ఒకేసారి, ఒకే గడియలలో వారి సంఘటనలు జరిగాయి. 

ఉరి వేసుకొని లేక ఉరి వేయబడి మరణించిన వాని శవము మరుసటి దినమునకు ఉంచకూడదు

        ఎప్పుడైతే కొరడలు బద్దలైనవో యూదా ఇస్కరియోతు పై నుండి పడి ప్రేగులు బయటకు వచ్చి మరణించాడు.  ఈ సంఘటనను అపొస్తలుల కార్యములో వ్రాయబడి యున్నది.  అపొస్తలుల కార్యములు 1:18, ''ఈ యూదా ద్రోహమువలన సంపాదించిన రూకల నిచ్చి యొక పొలము కొనెను.  అతడు తలక్రిందుగాపడి నడిమికి బద్దలైనందున అతని పేగులన్నియు బయటికి వచ్చెను.'' అతడు పై నుండి తలక్రిందుగా పడగా పొట్ట పగిలి లోపల ఉన్న పేగులన్నియు బయటపడి మరణించాడు.  ఈ విధముగా యూదా ఇస్కరియోతు తన జీవితములో ఉరి అను శాపగ్రస్తమైన స్థితి నుండి తప్పించబడినట్లుగా మనము గ్రహించాలి.  ఎందుకంటే అతడు తను చేసిన పాపమునకు పశ్చాత్తాపపడి ఘోరముగా ఆవేదన పడి ప్రధాన యాజకుల యొద్దకు వెళ్ళి ఆయన నిరపరాధియని ప్రకటించి తాను తీసుకొన్న నాణెములు వారు విననందున వారిపై క్రోధావేశముతో దేవాలయములో వెదజల్లి, ప్రభువు శిక్షకు కారకుడు తనే గనుక తాను బ్రతికుండ తగదని తనకు తానుగా ఉరిశిక్ష విధించుకొన్నాడు.  పశ్చాత్తాపము పొంది ప్రభువు ప్రేమను, ఆయన రక్షణను పొందగల్గి క్రీస్తు కుడివైపున సిలువ వేయబడిన దొంగవలె ఇతడు కూడా హృదయ పరివర్తన చెంది క్రీస్తు ప్రేమకు పాత్రుడైనట్లు యోహాను 21:20-23లో ప్రభువు మాటలను బట్టి తెలుస్తున్నది.  

        దావీదు ఊరియాను నిష్కారణముగా చంపించి పశ్చాత్తాప హృదయముతో తిరిగి ప్రభువు ప్రేమను సంపాదించాడు.  సంసోను డెలీలా ప్రేమలో మునిగి దైవ మర్మమును బహిర్గతము చేసి అంధుడైనప్పుడు పాప పశ్చాత్తాప హృదయముతో ప్రభువు ప్రేమను సంపాదించి, తన జీవిత కాలములో చంపినవారి కంటే మరి ఎక్కువమందిని ప్రభువు ఆత్మను పొంది చంపగలిగిన శక్తి సామర్థ్యములను పొందెను. కనుక ఉరి వేసుకొనుట, లేక ఉరి వేయుట రెండును శాపగ్రస్తమైనవే అని మనము గ్రహించాలి.

25.  శవములను పూడ్చుటకు ముందు చేయవలసిన విధులు (శవమును పూడ్చుటకు సిద్ధపరచుట)

        నరులు చనిపోవుచున్నారు వారిని మనము పాతిపెట్టుచున్నాము.  అయితే చనిపోయిన నరుని పాతిపెట్టుటకు ముందు శవమును సిద్ధపరచవలసిన విధి మనకు ఉన్నది.  ఇందులో  భాగముగా ముస్లీములైతే శవమునకు స్నానము చేయించి మట్టి లేకుండా బాగా కడిగి, శరీరమునకు వస్త్రములు తొడిగి పెట్టెలో పెట్టి తీసుకొని వెళ్లి శవమును మాత్రమే పూడ్చి వేయుట చేయుదురు.  

        హిందూమతమునకు చెందినవారు శవమును కడగరుగాని శవముపై 2-3 బిందెల నీళ్ళు పోసి తుడిచి శవము నోటిలో తమలపాకులను, ముక్కులో దూదిని పెట్టి కాళ్ళు చేతులను దారముతో కట్టి పాడిపై సిద్ధపరచుదురు.  వీరికి పెట్టెలో పెట్టు ఆచారము లేదు.  వీరు శవమును బహిరంగముగా అందరికి కనబడునట్లుగా మోసుకొని పోవుదురు.  అదే ఆడవారు అయితే వారికి పసుపు కుంకుమలు పూసి పై విధముగా తీసుకొని పోవుదురు.  మరి తమిళులులలో వారు పై ఆచారమునే ఆచరించినను, మరికొన్ని విచిత్రమైన పద్ధతులను అవలంబించుచున్నారు.  అందులో ఎవరైనా కూర్చుని చనిపోయినవారిని శవపేటికపై కూర్చునబెట్టి అలాగే మోసుకొని పోతారు.  వారిలో పెళ్ళికాని పిల్లలు చనిపోతే మనము జంతువులను మోసుకొని వెళ్ళినట్టుగా వారి కాళ్ళు చేతులను కర్రకు కట్టి మోసుకొని పోవుదురు.  ఇలా వారివారి ఆచారములను బట్టి వారు శవములను సిద్ధపరచుట చూస్తున్నాము.  ఒక్క ఇండియాలోనే కొన్ని వందల లేక కొన్ని వేల పద్ధతులలో శవములను సిద్ధపరచుట చూస్తున్నాము.  ఫరోరాజు కుటుంబీకులను గుడ్డలతో చుట్టి సుగంధ ద్రవ్యములను చల్లి వారిని పూడ్చుట చేసేవారు.  దానితోబాటు వారు ఇష్టపడిన ప్రతి వస్తువును చనిపోయినవారు ఉపయోగించిన వస్తువులను వారితోబాటుగా పూడ్చేవారు.

        ఇక మనము బైబిలు గ్రంథమునకు వస్తే బైబిలు గ్రంథములో చనిపోయినవారిని పూడ్చుటకు ముందు శరీరమును అనగా శవమును సిద్ధపరచు ఆచారము కూడా వున్నట్లుగా వ్రాయబడియున్నది.  మొదట శరీరమునకు సుగంధ ద్రవ్యములు పూసి శవమును గుడ్డలతో చుట్టి ఒక పెట్టిలో ఉంచి పూడ్చేవారు.  ఆది 50:26, ''యోసేపు నూటపది సంవత్సరములవాడై మృతి పొందెను.  వారు సుగంధ ద్రవ్యములతో అతని శవమును సిద్ధపరచి ఐగుప్తు దేశమందు ఒక పెట్టెలో ఉంచిరి.''  

        ఈ సుగంధ ద్రవ్యము కొంతవరకు అనగా శవమును పూడ్చుటకే గుహలో వుంచువరకు శవము కుళ్ళిన వాసన వారికి రానీకుండా ఆ సుగంధ ద్రవ్యము ఆ ప్రదేశమును తన సుగంధముతో నింపును.  కనుక శరీరమును పూడ్చుటకు ముందు శరీరముయొక్క వాసన తెలియకుండుటకు ఈ సుగంధద్రవ్యమును ఉపయోగించేవారు.  అలాగే ఆ శరీరమును గుడ్డతో గట్టిగా చుట్టి యోసేపు శరీరమును పెట్టెలో పెట్టి పూడ్చినట్లుగా చెప్పబడింది.  ఇలా బైబిలు గ్రంథములో ఒక ఆచారముగా విధిగా దీనిని పాటిస్తూ వచ్చారు.

        అలాగే నూతన నిబంధన అనగా క్రీస్తు ప్రభువు కాలములో కూడా జరిగింది.  యోహాను 11:43-44, ''ఆయన ఆలాగు చెప్పి-లాజరూ, బయటికి రమ్మని బిగ్గరగా చెప్పగా చనిపోయినవాడు, కాళ్లు చేతులు ప్రేత వస్త్రములతో కట్టబడినవాడై వెలుపలికి వచ్చెను;  అతని ముఖమునకు రుమాలు కట్టియుండెను.  అంతట యేసు-మీరు అతని కట్లు విప్పిపోనియ్యుడని వారితో చెప్పెను.''  ఇందునుబట్టి ప్రేత వస్త్రముతో లాజరు శవమును బంధించి, శవమును గుహలో పెట్టుటకు సిద్ధపరచినట్లుగా మనము గుర్తించాలి.  ఇందులో ప్రేత వస్త్రములను ఎలా కట్టుదురో వివరముగా తెలుపబడి యున్నది.  కాళ్లు-చేతులు మొదలుకొని ముఖము వరకు ఏ ఒక్క రవ్వంత కూడా కనబడకుండా కట్టి శరీరమును బంధించినట్లుగా చేయాలి.  ఈ విధముగా వారు శవమును సిద్ధపరచినట్లుగా మనము గ్రహించాలి.  

క్రీస్తు ప్రభువు శరీరమునకు సుగంధ ద్రవ్యములు పూసి, నార వస్స్త్రముతో దేహమును చుట్టి, తలకు తుండుగుడ్డను కట్టిరి

        ఇంతకి క్రీస్తు ప్రభువు విషయములో క్రీస్తు ప్రభువుయొక్క శరీరమును ఏ విధముగా సిద్ధపరచారో తెలుసుకొందము.  క్రీస్తు ప్రభువు బలియాగమునకు ముందే బేతనియాలో ఆయన పాదములకు పరిమళద్రవ్యములు పూయుట జరిగింది.  ఇది క్రీస్తు ప్రభువు మరణమునకు సూచనగా చేసినట్లుగా చెప్పబడింది.  

        యోహాను 12:1-8, ''కాబట్టి యేసు తాను మృతులలోనుండి లేపిన లాజరు ఉన్న బేతనియకు పస్కా పండుగకు ఆరు దినములు ముందుగా వచ్చెను.  అక్కడ వారు ఆయనకు విందు చేసిరి.  మార్త ఉపచారము చేసెను;  లాజరు ఆయనతో కూడా భోజనమునకు కూర్చున్నవారిలో ఒకడు.  అప్పుడు మరియ మిక్కిలి విలువగల అచ్చజటామాంసి అత్తరు ఒకసేరున్నర యెత్తు తీసికొని, యేసు పాదములకు పూసి తన తలవెండ్రుకలతో ఆయన పాదములు తుడిచెను;  ఇల్లు ఆ అత్తరు వాసనతో నిండెను.  ఆయన శిష్యులలో ఒకడు అనగా ఆయనను అప్పగింపనైయున్న ఇస్కరియోతు యూదా -యీ అత్తరెందుకు మూడు వందల దేనారములకు అమ్మి బీదలకు ఇయ్యలేదనెను.  వాడీలాగు చెప్పినది బీదలమీద శ్రద్ధకలిగి కాదు గాని వాడు దొంగయైయుండి, తన దగ్గర డబ్బు సంచి యుండినందున అందులో వేయబడినది దొంగిలించుచు వచ్చెను గనుక ఆలాగు చెప్పెను.  కాబట్టి యేసు-నన్ను పాతిపెట్టు దినమునకు ఆమెను దీని నుంచుకొననియ్యుడి;''  కనుక యేసు ప్రభువు ప్రత్యేకించి ఈ పరిమళద్రవ్యమును భూస్థాపన చేయు దినమునకై ఉంచుకొననిండు అని చెప్పుచున్నాడు.  దానిని అమ్మి  పేదలకు పంచమని 12 మంది శిష్యులలో ఒకడైన యూదా చెప్పినను క్రీస్తు ప్రభువు వినలేదు.  పేదలు ఎల్లప్పుడు మనతోనే వుంటారు అని చెప్పుచున్నాడు.  కనుక ఈ పరిమళ ద్రవ్యమును శవము సిద్ధపరచునప్పుడు ఉపయోగించుట పేదలకు ఇచ్చిన దానికన్నా కూడా ఉన్నతమైన క్రియగా మనము గుర్తించాలి.  కనుకనే ఈ పరిమళ ద్రవ్యమును అమ్మి పేదలకు ఇయ్యక క్రీస్తు ప్రభువు తను చనిపోయి, తన శరీరమును భూస్థాపన చేయించుటకు సిద్ధముగా ఉంచుకొనుమని ఆ స్త్రీతోను, ఆ శిష్యులతోను చెప్పుట జరిగింది.  కనుక చనిపోయినవారి శరీరమును పరిమళద్రవ్యముతో పూసి ఆ వాసన తెలియకుండా చేయుట మనయొక్క విధిగా గుర్తించాలి.

        యోహాను 19:38-42, ''అటుతరువాత, యూదుల భయమువలన రహస్యముగా యేసు శిష్యుడైన అరిమతయియ యోసేపు, తాను యేసు దేహమును తీసికొనిపోవుటకు పిలాతునొద్ద సెలవడిగెను.  పిలాతు సెలవిచ్చెను.  గనుక అతడు వచ్చి యేసు దేహమును తీసికొనిపోయెను.  మొదట రాత్రివేళ ఆయన యొద్దకు వచ్చిన నీకొదేముకూడ బోళముతో కలిపిన అగరు రమారమి నూట ఏబది సేర్ల యెత్తు తెచ్చెను.  అంతట వారు యేసు దేహమును ఎత్తికొని వచ్చి, యూదులు పాతిపెట్టు మర్యాద చొప్పున ఆ సుగంధద్రవ్యములు దానికి పూసి నారబట్టలు చుట్టిరి.  ఆయనను సిలువ వేసిన స్థలములో ఒక తోట యుండెను;  ఆ తోటలో ఎవడును ఎప్పుడును ఉంచబడని క్రొత్తసమాధియొకటి యుండెను.  ఆ సమాధి సమీపములో ఉండెను గనుక ఆ దినము యూదులు సిద్ధ పరచు దినమైనందున వారు అందులో యేసును పెట్టిరి.''  

        ఇందులో యేసుక్రీస్తు ప్రభువుయొక్క భౌతిక దేహమును వారు తీసుకొని పోయి నీకొదేము తెచ్చిన 150 సేర్ల పరిమళద్రవ్యమును అత్తరు పూసి నార వస్త్రముతో ఆ దేహమును పాదములనుండి తల వరకు చుట్టి సాంప్రదాయ ప్రకారముగా ఆయనను క్రొత్త సమాధిలో వుంచారు.  కనుక ఈనాడు మనము శవములను సిద్ధపరచు విధానము ఎలాగున్నదో మనమొకసారి గ్రహించవలసి యున్నది.  సాంప్రదాయము అదియును క్రీస్తుకు జరిగిన విధానమును పాటించుటలో తప్పేమి లేదు.  వీటితోబాటుగా క్రీస్తు ప్రభువు విషయములో తలకు తుండుగుడ్డను కట్టినట్లుగా చెప్పబడినది.  యోహాను 20:7, ''నారబట్టలు పడియుండుటయు, ఆయన తల రుమాలు నారబట్టలయొద్ద ఉండక వేరుగా ఒకచోట చుట్టిపెట్టియుండుటయు చూచెను.''  లూకా 23:55-56,  ''అప్పుడు గలిలయనుండి ఆయనతో కూడ వచ్చిన స్త్రీలు వెంట వెళ్లి ఆ సమాధిని, ఆయన దేహము ఏలాగుంచబడెనో చూచి తిరిగి వెళ్లి, సుగంధ ద్రవ్యములను పరిమళ తైలములను సిద్ధపరచి, ఆజ్ఞచొప్పున విశ్రాంతిదినమున తీరికగా ఉండిరి.''  

        లూకా 24:1, ''ఆదివారమున తెల్లవారుచుండగా (ఆ స్త్రీలు) తాము సిద్ధపరచిన సుగంధ ద్రవ్యములను తీసికొని సమాధి యొద్దకు వచ్చి'' ఇది ఒక సాంప్రదాయ ఆచారము మాత్రమే అని గుర్తించాలి.  ఇది పాటించుటలో ఎటువంటి అభ్యంతరము లేదని గుర్తించాలి.

26.  మరణించిన వారి కన్నులు మూయుట

        మన కన్నుల ఎదుటే అనేకులు మరణించుట చూస్తున్నాము.  వారిలో కొందరు మన చేతులలో కూడా మరణించవచ్చును.  ఇలా మరణించినప్పుడు, వారు మరణ యాతనతో అర్థము కాని స్థితిలో ఎదుటివారి సహాయార్థము చూచుచూ చనిపోవుట అనేక సంఘటనలలో జరుగును.  ఇలా చనిపోయినవారి కన్నులు తెరవబడి యుండును.  వీటిని మనము మూయవలసియున్నది.  ఇదే సంగతిని దేవుడు యోసేపునకు తెలియజేశాడు.  ఆదికాండము 46:2-4, ''అప్పుడు రాత్రి దర్శనములయందు దేవుడు-యాకోబూ యాకోబూ అని ఇశ్రాయేలును పిలిచెను.  అందుకతడు-చిత్తము ప్రభువా అనెను.  ఆయన - నేనే దేవుడను, నీ తండ్రి దేవుడను, ఐగుప్తునకు వెళ్లుటకు భయపడకుము, అక్కడనిన్ను గొప్ప జనముగా చేసెదను.  నేను ఐగుప్తునకు నీతోగూడ వచ్చెదను.  అంతేకాదు నేను నిశ్చయముగా నిన్ను తిరిగి తీసికొని వచ్చెదను, యోసేపు నీ కన్నులమీద తన చెయ్యియుంచునని సెలవియ్యగా''  ఇందునుబట్టి మన ముందు మరణించువారికి మరణించిన వెంటనే కన్నులు మూయుట దేవుని ఆజ్ఞను పాటించుట అగునని మనము మరువకూడదు.  అలాగే ఈ విధముగా మన మధ్య మరణించి మన చేతుల మీదుగా కన్నులు మూయించుకొను మరణము కూడ మహా భాగ్యముగా గుర్తించాలి.  తన వారు తమ దగ్గర ఉంటేనే ఇది సాధ్యమగును.  అలాగే ఇశ్రాయేలు అను పేరుగల యాకోబు యోసేపు  అను తాను ప్రేమించిన రాహేలు కుమారుడు ఉండగా నీ మరణము జరుగునని చెప్పబడింది.  ఇది జరిగినప్పుడు యోసేపు నీ కన్నులు మూయునని చెప్పబడింది.  అలా మూయు అవకాశము లభించినవారు అదృష్టవంతులుగా భావించాలి, ఎందుకంటే దేవుడు చెప్పినట్లుగా మరణించినవారి కన్నులను మూయు భాగ్యము వారికి లభించగా, వారు ఆ కన్నులను మూసి దేవుని ఆజ్ఞను నెరవేర్చినవారు అగుచున్నారు.

27.  శ్మశానపు ఏర్పాట్లు

        ఈనాడు మనము చనిపోయిన వారిని చూస్తున్నాము.  క్రైస్తవులు వారిని ఒక చెక్క పెట్టెలో పెట్టి గోతి త్రవ్వి పూడ్చుట చేస్తున్నారు.  హిందూ మతమువారు చితిపై వుంచి కాల్చి బూడిద చేస్తున్నారు.  దానిలో మిగిలిన ఎముకలను ఏరి నదులలో నిమజ్జనము అను పేరుతో కలుపుట జరుగుతుంది.  ఇలా మరణించినవారికి చివరి వీడ్కోలు వారివారి జాతినిబట్టి అనేక రీతులుగా జరుగుట మనము చూస్తున్నాము.  ఈనాడు అమెరికా, బ్రిటన్‌, ఫ్రాన్స్‌ మొదలైన దేశాలలోని వారు తమ వారి శవములను కోల్ట్‌ హోమ్స్‌లో భద్రపరచుట చూస్తున్నాము, ఎందుకంటే ఏనాటికైనను శాస్త్రజ్ఞానము పెరిగి చనిపోయినవారిని తిరిగి లేపగలుగుదురని వారి నమ్మకము.  కనుక ఈ చనిపోయినవారి శరీరమును కోల్ట్‌ హోమ్స్‌ నందు వారు భద్రపరచుకొని నరుని తిరిగి బ్రతికించుటకు ప్రయోగములు జరుపుచున్నారు.  దీనిని కూడా మనము ఓ రకమైన సమాధి స్థానముగానే భావించాలి.  ఇంకొన్ని దేశాలలో మరణించినవారి శరీరములను పూడ్చే స్థలము లేక వారిని మండుచున్న ఎలక్ట్రికల్‌ గుండములో వేసి బూడిదగా మార్చుచున్నారు.  ఇది అభివృద్ధి చెందిన విధానమైతే, బైబిలు గ్రంథములోని పాత నిబంధన మరియు క్రొత్త నిబంధన కాలములలో మరణించినవారిని రాతి సమాధులలో వుంచి, దాని ద్వారమును మూసి వుంచేవారు.  ఆ శరీరము పురుగుపట్టి వాసనతో కుళ్ళి కృశించి చివరకు ఎముకలు మిగిలిపోయేవి.  కాలక్రమేణా ఆ యెముకలు కూడా పొడిగా మారిపోయేవి.

        దైవాజ్ఞను మీరి దైవ వనమైన ఏదెను నుండి త్రోసివేయబడిన ఆదాము తన మొదటి కుమారుడైన కయీను, తన రెండవ కుమారుడైన హేబెలును చంపినప్పుడు ఏమి చేసి వుండునో ఒక్కసారి మనము గమనించాలి.  ఆది 3:19, ''నీవు నేలకు తిరిగి చేరువరకు నీ ముఖపు చెమట కార్చి ఆహారము తిందువు;  ఏలయనగా నేలనుండి నీవు తీయబడితివి;  నీవు మన్నే గనుక తిరిగి మన్నైపోదువని చెప్పెను.''  ఈ మాట ప్రకారము ఆదాము చనిపోయిన తన రెండవ కుమారుని నేలను త్రవ్వి పూడ్చినట్లుగా మనము గ్రహించాలి.  అయితే అబ్రాహాము కాలములు - ఆది 23:19, ''ఆ తరువాత అబ్రాహాము కనాను దేశములో హెబ్రోనను మమ్రేయెదుట నున్న మక్పేలా పొలము గుహలో తన భార్యయైన శారాను పాతిపెట్టెను.''  ఇలా మరణించినవారి శరీరములను గుహలలో వుంచుట అనునది అబ్రాహాము చరిత్ర మొదలు నూతన నిబంధన కాలము తరువాత కూడా జరుగుచున్నది.  ఈ కాలములో కూడా కొన్ని జాతులవారిని గూర్చి నేషనల్‌ జియోగ్రఫీ టీ.వి. ఛానల్‌లో చూపిస్తూ - వారు వారిలో మరణించినవారిని ఒక పాత గృహములో వారు వదిలివేయుట చూపించారు.  ఇది అబ్రాహాము కాలములో కూడా జరిగింది.  తన భార్యయైన శారా చనిపోయినప్పుడు అబ్రాహాము కనాను దేశములో మక్సేలా పొలము అందులోని గుహను కొని తన సొంతము చేసుకొని, తన భార్యను అందులో వుంచినట్లుగా మనము గ్రహించాలి.  అంతేకాదు ఈ శ్మశానపు ఏర్పాటు చేయు కాలములో అబ్రాహాము తన భార్యయైన శారా నిమిత్తము దు:ఖమును అనుభవించినట్లుగా వ్రాయబడి యున్నది.  ఆది 23:2, ''శారా కనాను దేశమందలి హెబ్రోనను కిర్యతర్బాలో మృతిబొందెను;  అప్పుడు అబ్రాహాము శారా నిమిత్తము అంగలార్చుటకును ఆమెను గూర్చి యేడ్చుటకును వచ్చెను.''  అందరిలాగే అబ్రాహాము తన భార్యయైన శారా నిమిత్తము అంగలార్చుట, ఏడ్చుట చేసాడు కాని అదే సమయములో ఆమెను పాతిపెట్టుటకు స్వాస్థ్యముగా శ్మశానపు భూమిని కొనుగోలు చేయుట మనము చదువగలము.  ఆది 23:13-18, ''-సరేకాని నా మనవి ఆలకింపుము.  ఆ పొలమునకు వెల యిచ్చెదను;  అది నాయొద్ద పుచ్చుకొనినయెడల మృతిబొందిన నా భార్యను పాతి పెట్టెదనని ఆ దేశ ప్రజలకు వినబడునట్లు ఎఫ్రోనుతో చెప్పెను.  అందుకు ఎఫ్రోను-అయ్యా నా మాట వినుము;  ఆ భూమి నాలుగు వందల తులముల వెండి చేయును;  నాకు నీకు అది యెంత?  మృతిబొందిన నీ భార్యను పాతిపెట్టుమని అబ్రాహామున కుత్తరమిచ్చెను;   అబ్రాహాము ఎఫ్రోను మాట వినెను.  కాబట్టి హేతు కుమారులకు వినబడునట్లు ఎఫ్రోను చెప్పిన వెల అనగా వర్తకులలో చెల్లు నాలుగువందల తులముల వెండి అబ్రాహాము తూచి అతనికిచ్చెను.  ఆలాగున మమ్రే యెదుటనున్న మక్పేలాయందలి ఎఫ్రోను పొలము, అనగా ఆ పొలమును దానియందలి గుహయు దాని పొలిమేర అంతటిలోనున్న ఆ పొలము చెట్లన్నియు, అతని ఊరి గవిని ప్రవేశించువారందరిలో హేతు కుమారుల యెదుట అబ్రాహామునకు స్వాస్థ్యముగా స్థిరపరచబడెను.''  ఇలా అబ్రాహాము తన భార్యయైన శారాయొక్క శరీరమును పాతిపెట్టుటకు తన సొంత పొలముగా వుండునట్లుగా ఆ పొలమును కొని దాని గుహలో తన భార్యను వుంచుట జరిగింది.  

        అలాగే లాజరు, యేసుక్రీస్తు ప్రభువును కూడా గుహలలో వుంచారు.  అయితే ఎవరు పెట్టని గుహలో యేసుక్రీస్తు ప్రభువును వుంచుట జరిగింది.  ఇలా పాత మరియు క్రొత్త నిబంధన కాలములోని దైవజనాంగమైన ఇశ్రాయేలీయుల ప్రజలు గుహలలో శరీరములు వుంచుటయే పాతిపెట్టుటతో సమానముగా భావించేవారు.  ఆది 50:12-14, ''అతని కుమారులు తన విషయమై అతడు వారి కాజ్ఞాపించినట్లు చేసిరి.  అతని కుమారులు కనాను దేశమునకు అతని శవమును తీసికొనిపోయి మక్పేలా పొలమందున్న గుహలో పాతిపెట్టిరి.  దానిని ఆ పొలమును అబ్రాహాము తనకు శ్మశానముకొరకు స్వాస్థ్యముగానుండు నిమిత్తము మమ్రే యెదుట హిత్తీయుడైన ఎఫ్రోనుయొద్ద కొనెను.  యోసేపు తన తండ్రిని పాతిపెట్టిన తరువాత అతడును అతని సహోదరులును అతని తండ్రిని పాతిపెట్ట వెళ్లిన వారందరును తిరిగి ఐగుప్తునకు వచ్చిరి.''  కనుక శ్మశాన కార్యక్రమము ఆది కాలము నుండి ఏదో ఒక రూపములో జరుగుచూనే వున్నది.  వారివారి ఆచారములు వారివారి సిద్ధాంతములను బట్టి ఆ కార్యమును జరిగించేవారు.  అందులో భాగముగా పిరమిడ్‌లు, ఐగుప్తు రాజుల గొప్పతనమును, వారి ఆర్థిక స్థితిని చాటితే, సాధారణ స్థితిలో భూమిలో పాతిన వారి సాధారణ స్థితి మనకు తెలుస్తున్నది.  శ్మశాన కార్యక్రమములో హిందువులైతే కొందరిని గంధపు చెక్కలతో కాల్చుట, మరికొందరిని పనికిరాని కొయ్యలతో కాల్చుట చేస్తున్నారు.  దీనికి కారణము వారి కుటుంబముయొక్క ఆర్థిక స్థితినిగ్రహించాలి.  యుద్ధములలో చనిపోవువారిని అందరిని కలిపి ఒకే గోతిలో వేసి పూడ్చుట కూడా శ్మశాన కార్యక్రమమే.  కాని అది దేవుని ఉగ్రత వల్ల వచ్చినట్లుగా యిర్మీయా 16వ అధ్యాయములో చెప్పబడింది.  యిర్మీయా 16:4, ''-వారు ఘోరమైన మరణము నొందెదరు;  వారినిగూర్చి రోదనము చేయబడదు, వారు పాతి పెట్టబడక భూమిమీద పెంటవలె పడియుండెదరు, వారు ఖడ్గము చేతను క్షామముచేతను నశించెదరు;  వారి శవములు అకాశపక్షులకును భూజంతువులకును ఆహారముగా ఉండును.''  దేవుని ఉగ్రతలో చనిపోయినవారి శవములు కుప్పలు కుప్పలుగా పడి ఒకేచోట వందలకొలది తన మన భేధము లేక పూడ్చువారిని గూర్చి బాధపడువారే లేని స్థితిలో శ్మశాన కార్యక్రమము జరుగుతుంది.  కాని ఈ శ్మశాన కార్యక్రమము చేయువారి విషయములో చేయువారికి నీతిగా ఎంచబడుతుంది.  ఎందుకంటే చనిపోయినవారు వారి రక్త సంబంధులు కారు.  కాని వారి మీద వారికి జాలి కలిగి వారిని పూడ్చుట చేస్తున్నారు.  ఇది నీతి కార్యమే.  కార్యము చేయువారికి నీతిక్రియగా మారి వారి మరణానంతరము వారితో వెళ్ళుతుంది.  కాని చనిపోయి కుప్పలు కుప్పలుగా పూడ్చబడినవారికి అది నీతిగా ఎంచబడదు.  వారి చరిత్ర అంతటితో సమాప్తమై పోయినది.

దిక్కులేని శవములు పూడ్చుట కూడా నీతి క్రియయే

        కనుక శ్మశాన కార్యము చేయువారికి అది నీతిగా ఎంచబడును.  అందులోను దిక్కుమొక్కులేని శవములకు శ్మశాన కార్యక్రమము చేసిన అది చేయువారికి నీతిగా ఎంచబడును.  కాని చనిపోయి మరణించినవారికి మాత్రము ఈ కార్యక్రమము వలన వారికి నీతి రాదు.

28.  మరణించినవారు తమ మరణించినవారిని పాతిపెట్టుట

        మత్తయి 8:22, ''యేసు అతని చూచి-నన్ను వెంబడించుము;  మృతులు తమ మృతులను పాతిపెట్టుకొననిమ్మని చెప్పెను.''

        ఇది క్రీస్తు ప్రభువు చెప్పిన మాట.  దీనినిగూర్చి తెలుసుకొనే ముందు, ఇది ఏ సందర్భములో చెప్పబడినది అనేది ముఖ్యము.  మత్తయి 8:21, ''శిష్యులలో మరియొకడు-ప్రభువా, నేను మొదట వెళ్ళి, నా తండ్రిని పాతిపెట్టుటకు నాకు సెలవిమ్మని ఆయనను అడుగగా''  ఇందులో ఒక శిష్యుని తండ్రి మరణించినట్లుగా చెప్పబడినది.  అతనిని పూడ్చి వచ్చుటకు శిష్యుడు క్రీస్తు ప్రభువుని అనుమతిని అడుగుచున్నాడు.  అయితే క్రీస్తు ప్రభువు మన మూలవచనములో వలె తెలియచేస్తున్నారు.

        ఇందులో మొదట చెప్పబడిన మృతులు ఎవరు?  రెండవసారి చెప్పబడిన మృతులు ఎవరు?  ఇందులో మృతులుగా చెప్పబడినవారు - ఎఫెసీ 2:1, ''మీ అపరాధములచేతను పాపములచేతను మీరు చచ్చినవారై యుండగా, ఆయన మిమ్మును క్రీస్తుతో కూడ బ్రదికించెను.''  ఇందులో అపరాధములచేత పాపముల చేత చచ్చినవారే ఈ మృతులు.  అనగా ఆదాము దేవుడు తినవద్దన్న పండును తిని అపరాధములచేత పాపములచేత దైవవ్యతిరేకిగా మారి దైవశాపము మూలముగా మరణించినవాడు అయ్యాడు.  అనగా ఆత్మరీత్యా మరణించాడు.  అతని సంతతియైన మనము చచ్చినవారమై అనగా మన పుట్టుకతోటే మనయొక్క ఆత్మజ్ఞానము కోల్పోయినవారమై చచ్చినవారిగా అనగా మరణించిన వారిగా లెక్కకు వచ్చుచున్నాము.

అపరాధములు మరియు పాపముల చేత మరణించినను జీవము కలిగి తిరుగుతున్న మనుష్యులు

        ఇక రెండవ మృతులు వీరు శరీరరీత్యాను, ఆత్మరీత్యాను మరణించినవారు.  అనగా పుట్టుక నుండియే తమ దుష్క్రియల వలన ఆత్మను చంపుకొని ఆ తర్వాత దేహరీత్యా కూడా  మరణించి మృతులైనవారు, శరీరరీత్యా మొదటి మరణమును రుచి చూచుదురు.  ఇలా శరీరరీత్యా ప్రాణమును వదిలి మరణించినవారు ఈ రెండవ మృతులు.

        ఇందులో ఆత్మరీత్యా మరణించినవారు అనగా ప్రకటన 3:1లో వలె జీవించుచున్నామన్న పేరు మాత్రము ఉండి - మృతులైనవారు ఆత్మ శరీరరీత్యా మరణించినవారిని పాతిపెట్టు కొననిమ్మని క్రీస్తు ప్రభువు చెప్పుచూ - ''నన్ను వెంబడించుము,'' అని చెప్పుచున్నారు.  యోహాను 11:25, ''అందుకు యేసు-పునరుత్థానమును జీవమును నేనే;  నాయందు విశ్వాసముంచువాడు చనిపోయినను బ్రదుకును;''  కనుక క్రీస్తును వెంబడించినవాడు నిత్య జీవమును వెంబడించినవాడు మరియు జీవ పునరుత్థానమును వెంబడించినవాడు అగును.  అందుచేత ఆత్మరీత్యా మరణించినవాడుగా వున్న శిష్యుడిని క్రీస్తు ప్రభువు నన్ను వెంబడింపమని చెప్పుచున్నాడు.

        అందుచేత క్రీస్తు ప్రభువును వెంబడించుట, జీవమును వెంబడించుట అగును, ఎందుకంటే పునరుత్థానము మరియు జీవము క్రీస్తే.  కనుక మరణించియున్న మనము క్రీస్తును వెంబడించాలి.  అప్పుడు మనము మరణించినప్పుడు పునరుత్థానము జీవమునకు అధిపతియైన క్రీస్తు తన అధికారముతో ఆత్మరీత్యా శరీరరీత్యా మరణించియున్న మనలను తిరిగి జీవములోనికి పునరుత్థానము ద్వారా నడిపించును.

        అయితే క్రీస్తును వెంబడిస్తున్న శిష్యుడు జీవమును వెంబడించువాడు తన తండ్రి మరణించి యుండుటచేత తిరిగి అతన్ని పాతిపెట్టి వస్తానని చెప్పుచున్నాడు.  అయితే క్రీస్తు ప్రభువు శిష్యునికి అనుమతి ఇయ్యుట లేదు, ఎందుకంటే క్రీస్తు శిష్యులలో ఒక శిష్యుడు ఇతను.  ఇతను అప్పటికే క్రీస్తు ప్రభువు ద్వారా ఇతని ఆత్మ మరణమును జయించి జీవములో ప్రవేశించి యున్నాడు  కనుక వెనుతిరగవలసిన అవసరము లేదు, ఎందుకంటే జీవములో ప్రవేశించిన వారికి జీవములో ప్రవేశించినవారే బంధువులు, స్నేహితులు.  అంతేకాని మరణములో ప్రవేశించినవారు కారు.  ఈ శిష్యుడికి స్వంత తండ్రియైనను పాపములోనే మరణించుట చేత ఆయన చేసిన కార్యములు క్రీస్తు ప్రభువుకు తెలుసును కాబట్టి జీవములో ప్రవేశించిన నీవు వెళ్ళవద్దని తెలియజేస్తున్నాడు.

        కనుక పాపముల చేత, అపరాధముల చేత చచ్చినవారు మృతులుగా వున్నారు.  వీరు తోటి మృతులను అనగా అపరాధములచేత, పాపములచేత క్రీస్తును ఎరుగని శరీరరీత్యా మొదటి మరణమును చూచిన మృతులను పాతిపెట్టుకొననిమ్మని చెప్పుచున్నారు.  కనుక జీవములో వున్నవారికి, మరణములో వున్నవారికి ఎప్పటికి పొత్తు కూడదని చెప్పబడింది.  జీవములో వున్నవారు శాంతికర పరదైసులలో వుంటారు.  మరణించి మృతులుగా వున్నవారు పాతాళ లోకములో వుంటారు.  క్రీస్తు ప్రభువు తీర్పు తరువాత జీవములో వున్నవారు పరమయెరూషలేములో భాగస్థులు.  మృతులు మండుచున్న అగ్నిగుండములో భాగస్తులు.  వీరికి ఎక్కడ పొత్తు లేదని గ్రహించాలి.

        ఈ విషయము గ్రహించిన క్రీస్తు ప్రభువు మన మూలవచనములో వలె - మృతులు తమ మృతులను పాతిపెట్టుకొననిమ్మని చెప్పుచూ - జీవములో ప్రవేశించిన నీవు నన్ను వెంబడింపుముగాని వెనుతిరిగి చూడవద్దని చెప్పుచున్నాడు.  

        ఇదే మూల వాక్యములో లూకా 9:61-62లో ప్రభువు వెంట వెళ్ళుటకు ఇంటనున్న వారి యొద్ద అనుమతి పొంది వచ్చుటకు సెలవిమ్మని కోరినప్పుడు - నాగలియను జీవవృక్షము మీద చేయి పెట్టి వెనుకకు చూడనవసరము లేదని ప్రభువు పలుకుతున్నాడు.

29.  మరణించినవారిని గూర్చిన భయము

         ఇదొక విచిత్రమైన స్థితి.  చనిపోతామంటే భయపడేవారు ఒక రకము.  ఇది ఇంచుమించు అందరిలోను వుంటుంది.  కాని చనిపోయినవారి శవాలను చూచి భయపడువారిని అనేకులను మనము చూడ వచ్చు.  

చనిపోయిన వారంతా దయ్యాలుగా మారితే  ప్రపంచమంతా దయ్యాలతోనే నిండి వుండాలి

వీరు ఈ చనిపోయినవారు దయ్యాలుగా మారతారని అపోహలో జీవిస్తారు.  అందుకనే భయపడి రాత్రిళ్ళు బయటకు రాకుండా ప్రక్కన మనిషి లేనిదే వారు శరీర కార్యము లకు కూడా వెళ్ళరు. నిజానికి, వీరను కున్నట్లుగా చనిపోయినవారు దెయ్యాలైతే ఈ ప్రపంచమంతా దయ్యాలతోనే నిండి వుండేదని గ్రహించాలి.  కనుక ఇటువంటి అపోహలకు తావియ్యక భయము వీడి జీవించమని ఈ పుస్తకము ద్వారా తెలియజేస్తున్నాను.  అయితే చనిపోయినవారి శరీరమును మనము సమాధులలో పూడ్చుచున్నాము.  వారి ఆత్మను ఎవరు తీసుకొని వెళ్ళుదురు అను విషయము మనము 81వ పేజీలోని 33వ నెంబరు చాప్టరు నందు చదువగలము.

30.   మట్టి శరీరముతో రెండుసార్లు మొదటి మరణమును చూచినవారు

        పాతనిబంధన కాలములో సారెపతు అను ఊరిలోని విధవరాలి కుమారుడు రోగియై ప్రాణము విడిచి మరణించిన తరువాత, ఏలీయా దేవునికి ప్రార్థన చేసి తిరిగి బ్రతికించెను.  

క్రీస్తు నందు నమ్మిక ఉంచిన దైవజనులు మాత్రమే దేవుడు ఏమి చేయునో అవి అన్ని చేయగలరు అనుటకు ఇది మంచి ఉదాహరణ - ఇదే ఈనాటి క్రైస్తవ మత వ్యాప్తికి కారణము.

1 రాజులు 17:20-22, ''-యెహోవా నా దేవా, నన్ను చేర్చుకొనిన యీ విధవరాలి కుమారుని చంపునంతగా ఆమెమీదికి కీడు రాజేసితివా అని యెహోవాకు మొఱ్ఱపెట్టి ఆ చిన్నవానిమీద ముమ్మారు తాను పారచాచుకొని- యెహోవా నా దేవా, నా మొఱ్ఱ ఆలకించి యీ చిన్నవానికి ప్రాణము మరల రానిమ్మని యెహోవాకు ప్రార్థింపగా  యెహోవా ఏలీయా చేసిన ప్రార్థన ఆలకించి ఆ చిన్నవానికి ప్రాణము మరల రానిచ్చినప్పుడు వాడు బ్రదికెను.''

అలాగే ఎలీషా తాను చనిపోయినను, చనిపోయినవానికి అద్భుతరీతిగ జీవమును ఇచ్చెను.  2 రాజులు 13:20-21, ''తరువాత ఎలీషా మృతిపొందగా వారు అతనిని సమాధిలో ఉంచిరి.  ఒక సంవత్సరము గడచిన తరువాత మోయాబీయుల సైన్యము దేశముమీదికి వచ్చినప్పుడు కొందరు ఒక శవమును పాతిపెట్టుచు సైన్యమునకు భయపడి ఆ శవమును ఎలీషాయొక్క సమాధిలో ఉంచగా దింపిన ఆ శవము ఎలీషా శల్యములకు తగిలినప్పుడు అది తిరిగి బ్రతికి కాళ్లు మోపి నిలిచెను.''  ఇది ఒక విచిత్రమైన సంఘటన.  అయినను చనిపోయినవాడు అదే శరీరముతో ఎవరి ఉద్దేశ్యము అనగా బ్రతికించాలన్న ఉద్దేశ్యము ఎవరికి లేకపోయినను ఈ సంఘటనలో తిరిగి జీవము వానికి వచ్చింది.

        ఇక నూతన నిబంధన కాలములో యేసుక్రీస్తు ప్రభువు నాయీరులో వితంతువు కుమారుని  తిరిగి లేపాడు.  లూకా 7:13-15, ''ప్రభువు ఆమెను చూచి ఆమెయందు కనికరపడి ఏడువవద్దని ఆమెతో చెప్పి, దగ్గరకు వచ్చి పాడెను ముట్టగా మోయుచున్నవారు నిలిచిరి.  ఆయన-చిన్నవాడా, లెమ్మని నీతో చెప్పుచున్నాననగా ఆ చనిపోయిన వాడు లేచి కూర్చుండి మాటలాడసాగెను;  ఆయన అతనిని అతని తల్లికి అప్పగించెను.''  అలాగే లాజరు మరణించి నాలుగు దినములు అయిన తరువాత తిరిగి మరల బ్రతికింపబడెను.  యోహాను 11:43-44, ''ఆయన ఆలాగు చెప్పి-లాజరూ, బయటికి రమ్మని బిగ్గరగా చెప్పగా చనిపోయినవాడు, కాళ్లు చేతులు ప్రేత వస్త్రములతో కట్టబడినవాడై వెలుపలికి వచ్చెను;  అతని ముఖమునకు రుమాలు కట్టియుండెను.  అంతట యేసు-మీరు అతని కట్లు విప్పిపోనీయుడని వారితో చెప్పెను.''  ఇలా క్రీస్తు ప్రభువు అనేకులను తిరిగి లేపి వారికి మరల జీవము పోసెను.  అలాగే క్రీస్తునందు ప్రతిష్టించబడిన అపొస్తలులు చేయగలిగిరి.  అపొస్తలులుగా ఎంచబడినవారు పౌలు కూడా చనిపోయినవారిని లేపెను.  కనుకనే నేడు క్రైస్తవ మతము ప్రపంచమంతయు చుట్టుకొని యున్నది.  

        ఇలా ఒకసారి చనిపోయిన వారి ఆత్మ పరదైసులోనో లేక పాతాళములోనో బంధింపబడి యున్నప్పుడు ఆ ఆత్మ తిరిగివచ్చి దానిలో ప్రవేశించి జీవాన్ని ఇవ్వగలిగింది.  ఇలా బ్రతికినవారు మరి కొంత కాలము దైవ మహాత్యములకు సాక్ష్యముగా ఈ లోకములో జీవించి తిరిగి మరణించారు.  ఇలా వీరు రెండుసార్లు మొదటి మరణమును తమ జీవితములో రుచి చూడగలిగిరి.

31.  మరణించినవారియొక్క జ్ఞాపకార్థ విందు

        అంగలార్పు దినములు దు:ఖ దినములు జరిగిన తరువాత జ్ఞాపకార్థ విందు కార్యము జరుగును.  వారివారి పరిస్థితులను బట్టి వారి స్థితిని బట్టి ఈ కార్యక్రమము వుంటుంది.  సంఘ కాపరియొక్క వాక్యోపదేశముతో కూడిన ఈ కార్యక్రమమును కొందరు 3వ రోజు లగాయతు 40వ రోజు లోగా ఒక దినమున సాధారణముగా చేస్తుంటారు.  చనిపోయిన దినమువలె ఈరోజు అంగలార్పు ఉండదు.  మరణించిన వారి కుటుంబము వచ్చిన ప్రతి ఒక్కరిని విందు చేసి వెళ్ళమని బ్రతిమిలాడుట మనము చూస్తాము.  ఈ దినముతో చనిపోయిన వ్యక్తిని ప్రతి ఒక్కరు మరచిపోతారు.  ఎప్పుడో సమయ సందర్భాలనుబట్టి ఈ చనిపోయిన వ్యక్తిని గూర్చి మాట్లాడుటయే గాని మునుపటివలె ప్రాధాన్యత వుండదు.  ఈ విందులో చనిపోయినవారిని గూర్చిన బాధకన్నా వారి కుటుంబీకుల హోదా, అంతస్తులకు ప్రాధాన్యత వుంటుంది.  ఈ విందులో పంచభక్ష పరమాన్నాలు చేసేవారు కొందరైతే, సాంబారు అన్నముతో సరిపెట్టేవారు కొందరు.  ఈ విందులో కుటుంబానికి ఒక స్టీలు గ్లాసు ఇచ్చేవారు కొందరైతే, ఖరీదైన బహుమతిని ప్రతి ఒక్కరికి ఇచ్చేవారు కొందరు.  ఇలా వారివారి ఆర్థికస్థితిని బట్టి ఈ కార్యక్రమము చేస్తారు.  దీనినే మనము జ్ఞాపకార్థ విందుగా చెప్పుచున్నాము.

చనిపోయినవారిని గుర్తు చేసుకొంటూ ఆనందమును పంచుకొనే ఏకైక పద్ధతి

        అయితే, ఈ విందులో కూడా దేవునికి ఇష్టమైనవి ఇష్టము లేనివి అని రెండు రకములుగా ఉన్నాయి.  పరిశుద్ధుని మరణము తరువాత జరుగు విందు దేవునికి ఇష్టమైన చర్య.  అపరిశుద్ధునికి జరుగు విందు దేవునికి ఇష్టమైనది కాదు.  యిర్మీయా 16:8, ''వారియొద్ద కూర్చుండి అన్నపానములు పుచ్చుకొనుటకు నీవు విందుశాలలో ప్రవేశింపకూడదు.''  కనుక యిర్మీయాలో చెప్పబడిన వారు దైవ వ్యతిరేక చర్య వలన, అన్య దేవతలననుసరించి పూజించి దైవమార్గము నుండి మరలినవారు వారి విందు దైవత్వము నిరాకరించినట్లుగా మనము గుర్తించాలి.

32.  చనిపోయిన పరిశుద్ధుల శవములు అద్భుతములు చేయుట

        ఈనాడు ప్రపంచ చరిత్రలో క్రైస్తవులలో కథోలిక్‌ సంఘస్థులు పరిశుద్ధుల సమాధులను జాగ్రత్తపరచి వారిని గుర్తు చేసుకొనునట్లుగా ఏర్పాటు చేసి వున్నారు.  ఉదాహరణకు అపొస్తలుడైన తోమా చనిపోయిన స్థలమును - ఆయనను సమాధి చేసిన స్థలమును కథోలిక్‌ సంఘమువారు   వాటిని అలాగే వుంచి, అది పరిశుద్ధ స్థలముగా ఎన్నికచేసి దానిపై లేక ఆ సమాధిని అలాగే వుంచి దాని చుట్టూ చర్చీని నిర్మించియున్నారు.  ఇలా చేయుట అనేకము మనము చూడవచ్చును.  చెన్నై నగరములో మైలాపూర్‌ అను ప్రాంతములో చర్చీలోనే అపొస్తలుడైన తోమా పూడ్చిన సమాధిని మనము చూడవచ్చును.  అలాగే ఈమధ్య కాలములో మరణించిన మదర్‌ థెరిస్సా శరీరము పూడ్చిన స్థలమును  బాగా జాగ్రత్తగా దానిని భద్రపరచినట్లుగా మనము గుర్తించాలి.  కొందరు విశ్వాసులు మేము ఆ సమాధిని తాకి క్రీస్తు ప్రభువుని ప్రార్థించితిమి మాకు స్వస్థత లభించినదని చెప్పుట మనము అప్పుడప్పుడు వింటున్నాము.  

        ఇది నిజమా!  ఇది జరుగునా అని మరికొంతమంది క్రైస్తవ విశ్వాసులు ప్రశ్నించుట చూస్తున్నాము.  ఇందులో వున్న నిజమేమిటో తెలుసుకొందము.  మత్తయి 23:29-30, ''అయ్యో, వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు ప్రవక్తల సమాధులను కట్టించుచు, నీతిమంతుల గోరీలను శృంగారించుచు -మనము మన పితరుల దినములలో ఉండినయెడల ప్రవక్తల మరణ విషయములో వారితో పాలివారమై యుండకపోదుమని చెప్పుకొందురు.''  ఇందునుబట్టి, ప్రవక్తల మరణ విషయములో వారిని చంపినవారితో పాలివారము కాకుండా యుందుమని అనుకొని మరణించిన ప్రవక్తలకు సమాధులు కట్టించి, నీతిమంతుల గోరీలను శృంగారించుచు కాలము వెళ్ళబుచ్చుచున్నారు.  అనగా ఇందులో రెండు రకాల చర్యలు కనబడుచున్నవి.  

1.  ప్రవక్తల సమాధులు నిర్మించుట మరియు నీతిమంతుల గోరీలు శృంగారించుట.

2.  మనము మన పితరుల దినములలో ఉండినయెడల ప్రవక్తల మరణ విషయములో వారితో పాలివారమై యుండకపోదుమని చెప్పుట.

పరిశుద్ధుని శరీరము దేవుని నివాస స్థలము

        ఈ రెండు చర్యలు క్రీస్తు ప్రభువు వారికి గుర్తు చేస్తూనే మత్తయి 23:31, ''అందువలననే మీరు ప్రవక్తలను చంపినవారి కుమారులైయున్నారని మీ మీద మీరే సాక్ష్యము చెప్పుకొనుచున్నారు.'' అని చెప్పుచున్నారు.  అనగా ప్రవక్తను చంపినవారి కుమారులుగా వారికి క్రీస్తుప్రభువు పేరు పెట్టినారు.  యెహోవా దేవుని ప్రవక్తను చంపుట మహా నేరమైయున్నది.  దీనికి ఫలితముగా దేవుని కోపము, వీరిపైకి వచ్చునని గుర్తించాలి.  మత్తయి 23:35-36, ''నీతిమంతుడైన హేబెలు రక్తము మొదలుకొని బలిపీఠమునకును, దేవాలయమునకును మధ్య మీరు చంపిన బరకీయ కుమారుడగు జెకర్యా రక్తమువరకు భూమిమీద చిందింపబడిన నీతిమంతుల రక్తమంతయు మీ మీదికి వచ్చును.  ఇవన్నియు ఈ తరమువారిమీదికి వచ్చునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను.''  కనుక వీరు ప్రవక్తలకు సమాధులు నిర్మించినను నీతిమంతుల గోరీలు శృంగారించినను ఉపయోగము లేదు.  దానివల్ల వేషధారులైన శాస్త్రులు, పరిసయ్యులు తమకు వచ్చు శిక్ష నుండి తప్పించుకొనలేరు.

        ఒక మనిషి చనిపోయినప్పుడు, వానిని అలా వదిలివేయక సమాధిచేసి దానిపై నిర్మించుట నీతికి సూచనే.  మార్కు 6:29, ''యోహాను శిష్యులు ఈ సంగతి విని, వచ్చి శవమును ఎత్తికొనిపోయి సమాధిలో ఉంచిరి.''  అపొ 8:2, ''భక్తిగల మనుష్యులు స్తైఫనును సమాధిచేసి అతనిని గూర్చి బహుగా ప్రలాపించిరి.''  కనుక సమాధిని జాగ్రత్తపరచుట, కట్టించుట, సమాధి చేయుట, దానిని శుభ్రముగా వుంచుట, నీతికి సూచనయే.  కాని మత్తయి 23:29-30లో అది చేసినవారు శాస్త్రులు, పరిసయ్యులు.  వీరు ఎలాంటివారో ఈ వచనములోనే చెప్పబడింది.  వారు వేషధారులై యున్నారు.  కనుక వేషధారణ జీవితములో వుంటూ చనిపోయిన నీతిమంతులకు, ప్రవక్తలకు సమాధులు కట్టి వాటిని శృంగారించుచూ వున్నారు.  పైపెచ్చు వారు మా పూర్వీకులు వారిని చంపారు కాని మేమైతే వారిని చంపక యుందుమని చెప్పుచున్నారు.  కాని అక్కడ ప్రవక్తలకే మహా ప్రవక్తయైన క్రీస్తు ప్రభువును నిర్లక్ష్యము చేయుచున్నారు.  అందుకే క్రీస్తు ప్రభువు ఓ వేషధారణ జీవితములో ఉన్న శాస్త్రులూ, పరిసయ్యులారా,  మీరు ప్రవక్తల సమాధులను కట్టించుచూ వున్ననూ అది వ్యర్థమే, మీరు నీతిమంతుల గోరీలను శృంగారించుచూ వున్ననూ అది వ్యర్థమే అని చెప్పుచూనే ఈ తరము వారి మీదికి దేవుని కోపము వచ్చునని చెప్పుచున్నాడు.

దేవుని నివాస స్థలము (పరిశుద్ధుని శరీరము) అద్భుతములు చేయుననుటలో ఆశ్చర్యమేమన్నా వున్నదా!

        ఇందులో క్రీస్తు ప్రభువు ప్రవక్తల సమాధులు కట్టుట, నీతిమంతుల గోరీలను శృంగారించుట తప్పుగా చెప్పుటలేదు గాని వేషధారణ జీవితముతో చేయవద్దని చెప్పబడియున్నది.  ఈనాడు మన సమాజములో బోధకులుగా, యాజకులుగా అనేకులు వున్నారు.  వీరు ప్రవక్తల, అపొస్తలుల పరిశుద్ధుల సమాధులను భద్రపరచుచూ దేవునిలో ఎదిగిన అది గొప్పతనమేగాని నేరము కాదు.  కాని వీరు వ్యభిచారము, దొంగతనము వంటి రహస్య కార్యములు చేయుచూ పైకి పై సమాధులను శృంగారించి ప్రార్థనలు దేవునిపేర జరిగించినను అది వ్యర్థమని గుర్తించాలి.  దీనిని గురించి క్రీస్తు ప్రభువు మత్తయి 23:29-30లో చెప్పుచున్నారు.  అపొస్తలుల కార్యములు  19:12, ''అతని శరీరమునకు తగిలిన చేతిగుడ్డలైనను నడికట్లయినను రోగులయొద్దకు తెచ్చినప్పుడు రోగములు వారిని విడిచెను, దయ్యములు కూడ వదలిపోయెను.''  ఇందులో జీవములేని గుడ్డ అనేక అద్భుతములు చేయుచున్నది.  అదియును పౌలు శరీరము తగిలినవి మాత్రమే.  అయస్కాంతమును అంటిపెట్టియున్న ఇనుపముక్క కొంతకాలానికి అయస్కాంతముగా మారినట్లుగా పౌలు శరీరమునకు తగిలిన గుడ్డలు ఆయన శరీరమును వదిలిన తరువాత కూడా అవి మహత్యములు చేయుట గురించి చెప్పబడింది.  అలాగే ఎలీషా చనిపోయి సమాధి చేయబడిన తరువాత అతని శరీరము మహత్యము చేసిందని బైబిలు గ్రంథమందు చదువగలము.  2 రాజులు 13:20-21, ''తరువాత ఎలీషా మృతిపొందగా వారు అతనిని సమాధిలో ఉంచిరి.  ఒక సంవత్సరము గడచిన తరువాత మోయాబీయుల సైన్యము దేశముమీదికి వచ్చినప్పుడు కొందరు ఒక శవమును పాతిపెట్టుచు సైన్యమునకు భయపడి ఆ శవమును ఎలీషాయొక్క సమాధిలో ఉంచగా దింపిన ఆ శవము ఎలీషా శల్యములకు తగిలినప్పుడు అది తిరిగి బ్రతికి కాళ్లు మోపి నిలిచెను.''  ఇందునుబట్టి దైవాత్మ నివసించిన శరీరము ఆత్మను వీడి మరణించిన తరువాత కూడా దానిలో శక్తి కనుమరుగు కాదని గుర్తించాలి.  అది సంపూర్ణముగా భూమిలో కలసిపోవువరకు దానిలో దైవశక్తి క్రియ జరిగించును.  ఎలీషా చనిపోయి ఒక సంవత్సరము తరువాత చనిపోయిన శవాన్ని ఎలీషాని పాతిపెట్టిన దానిలో వేయగా ఒక అద్భుతము జరిగింది.  కనుక పరిశుద్ధులు దేవునికి వారసులుగా భూమి మీద క్రియ జరిగించిన వారు మరణించి తమ ఆత్మ శరీరమునుండి వేరు చేయబడిన తరువాత కూడా అద్భుతములు చేయగలరని గుర్తించాలి.  పరిశుద్ధుని శరీరము కుళ్ళదు అని చెప్పబడింది.  కీర్తన 16:10, ''ఎందుకనగా నీవు నా ఆత్మను పాతాళములో విడచి పెట్టవు   నీ పరిశుద్ధుని కుళ్లుపట్టనియ్యవు''  అపొ 2:27, ''నీవు నా ఆత్మను పాతాళములో విడిచిపెట్టవు  నీ పరిశుద్ధుని కుళ్లుపట్టనియ్యవు.''  అనగా పరిశుద్ధుని శరీరము మహిమ శరీరముగా మారి అనేక అద్భుతములు జరిగించునుగాని దానికి నాశనము లేదు.  రెండవ మరణము లేదని గుర్తించాలి.  కనుకనే ఒక సంవత్సరము తరువాత కూడా ఎలీషాయొక్క శరీరము అద్భుతము చేయుట బైబిలు గ్రంథమందు చదువుచున్నాము.  కనుక పరిశుద్ధునికి మరణము లేదని, ఒకవేళ వారు శరీరరీత్యా మరణించినను వారికి జీవమేగాని మరణము లేదని గుర్తించాలి.  1 కొరింథీ 3:16-17.

33.  ఎప్పుడో వధింపబడిన ప్రవక్తల, పరిశుద్ధులయొక్క రక్తము యుగాంతములో కనబడుట

        ప్రవక్తలు పాత నిబంధన కాలము నుండి అనగా క్రీస్తు పూర్వము నుండి యున్నారు.  పరిశుద్ధులు భూమి పుట్టినది మొదలు యుగాంతమునకు కొంచెము కాలము ముందు వరకు వుందురు.  యుగాంత కాలములో పరిశుద్ధులనేవారు వుండరు.  కనుకనే ఈ భూమిని దేవుడు అగ్ని గంధకములతో నాశనము చేయును.  ఈ నాశనము జరుగునప్పటికి ఈ పరిశుద్ధులనే వారు భూమిపై పుట్టుట, చంపబడి మరణించుట జరిగిపోవును.  అలాగే ప్రవక్తలు కూడా వధింపబడి మరణించుట జరుగును.  ఈ సమయములో అపరిశుద్ధులతో కూడిన సమాజమైన మహాబబులోనుయొక్క పతనము, దానికి శిక్ష సంభవించునని బైబిలు గ్రంథము బోధించుచున్నది.  బబులోను పట్టణముయొక్క పతనమును గూర్చి - ప్రకటన 18:21, ''తరువాత బలిష్ఠుడైన యొక దూత గొప్ప తిరుగటి రాతివంటి రాయి యెత్తి సముద్రములో పడవేసి- ఈలాగు మహాపట్టణమైన బబులోను వేగముగా పడద్రోయబడి ఇక ఎన్నటికిని కనబడకపోవును.''  ఇలా పడద్రోయబడినప్పుడు ఆ పట్టణములో ప్రవక్తల, పరిశుద్ధుల, భూమి మీద వధింపబడిన వారి రక్తము ఆ పట్టణములో కనబడెనని వ్రాయబడి యున్నది.  ప్రకటన 18:24, ''మరియు ప్రవక్తలయొక్కయు, పరిశుద్ధులయొక్కయు, భూమిమీద వధింప బడినవారందరియొక్కయు రక్తము ఆ పట్టణములో కనబడెననెను.''

పరిశుద్ధులకు  సందర్భములోను నాశనములో పాలిపంపులు లేదు

        ఈ బబులోను పట్టణము నాశనము చేయబడినప్పుడు, అది ఇక ఎన్నటికి కనబడకపోవునని చెప్పినప్పుడు ఆ నాశనములో రక్తము అగుపడుటలో వున్న ముఖ్య ఉద్ధేశ్యము ఏమై యుండును?  ప్రవక్తలు, పరిశుద్ధులు మొదలైనవారు పవిత్రులు.  వీరి రక్తము వీరిని వధించినప్పుడు ఈ భూమిపై పడి అందులో  కలిసిపోయింది.  అయితే బబులోను అను అపరిశుద్ధుల సమాజమును దేవుడు ఈ భూమితోబాటుగా దానిలోని అపరిశుద్ధులను నాశనము చేయునప్పుడు ఈ శిక్షలో పరిశుద్ధులకు పాలిపంపులు లేవు కనుక ఈ రక్తము అందులోంచి వెలుపలికి వచ్చి ఆ పట్టణములో కనబడుచున్నది.  పరిశుద్ధుని దేవుడు శిక్షించడని ప్రతి ఒక్కరికి తెలిసిన సంగతే.  అయితే బబులోను అను ఈ అపరిశుద్ధుల పట్టణములో పరిశుద్ధులు, ప్రవక్తలు ఒకప్పుడు చంపబడి, వారి రక్తము కలిసిపోయి యున్నది.  ఈ రక్తము దైవజనులది కనుక అపరిశుద్ధులతో పొందిక లేదు.  కనుకనే అపరిశుద్ధులకు జరుగు శిక్షలో నుండి అవి వేరుపరచబడినట్లుగా మనము గ్రహించాలి.

రెండవ భాగము

ఆత్మ భౌతిక శరీరమును విడిచినది మొదలు క్రీస్తు రెండవ రాకడకు ముందురోజు (పునరుత్థాన దినమునకు ముందు) వరకు వున్న కాలము

34.  శరీరరీత్యా మరణించి భౌతిక శరీరమును వీడిన వెంటనే ఆత్మ పరిస్థితి

        అది ఏ విధముగానైనను సరే మనిషి మరణిస్తున్నాడు.  ఈ మరణించిన వాని శరీరమును జీవముతో వున్న వారు సమాధి చేయుచున్నారు.  ఇవన్నీ మనము నిత్యము చూచుచున్నదే అయినను మనలను భయాందోళనను కలిగించే అంశము ఒకటున్నది.  అదేమిటంటే శరీరరీత్యా మరణించి భౌతిక శరీరమును వీడిన ఆత్మ పరిస్థితి ఏమిటి?  

        1 రాజులు 17:17-24, '' అటుతరువాత ఆ యింటి యజమానురాలైన ఆమె కుమారుడు రోగియై ప్రాణము నిలువజాలనంత వ్యాధిగలవాడాయెను.  ఆమె ఏలీయాతో - దైవ జనుడా, నాయొద్దకు నీవు రానిమిత్తమేమి?  నా పాపమును నాకు జ్ఞాపకముచేసి నా కుమారుని చంపుటకై నాయొద్దకు వచ్చితివా అని మనవి చేయగా అతడు-నీ బిడ్డను నా చేతికిమ్మని చెప్పి, ఆమె కౌగిటిలోనుండి వానిని తీసికొని తానున్న పై అంతస్తు గదిలోనికి పోయి తన మంచముమీద వాని పరుండబెట్టి -యెహోవా నా దేవా, నన్ను చేర్చుకొనిన యీ విధవరాలి కుమారుని చంపునంతగా ఆమెమీదికి కీడు రాజేసితివా అని యెహోవాకు మొఱ్ఱపెట్టి ఆ చిన్నవానిమీద ముమ్మారు తాను పారచాచుకొని- యెహోవా నా దేవా, నా మొఱ్ఱ ఆలకించి యీ చిన్నవానికి ప్రాణము మరల రానిమ్మని యెహోవాకు ప్రార్థింపగా యెహోవా ఏలీయా చేసిన ప్రార్థన ఆలకించి ఆ చిన్నవానికి ప్రాణము మరల రానిచ్చినప్పుడు వాడు బ్రదికెను.  ఏలీయా ఆ చిన్నవాని తీసికొని గదిలోనుండి దిగి యింట ప్రవేశించి వాని తల్లికి అప్పగించి ఇదిగో నీ కుమారుడు; వాడు బ్రదుకుచున్నాడని చెప్పగా ఆ స్త్రీ ఏలీయాతో-నీవు దైవజనుడవై యున్నావనియు నీవు పలుకుచున్న యెహోవామాట నిజమనియు ఇందుచేత నేనెరుగుదు ననెను.''

మనలోని ఆత్మ మన మరణానంతరము ఎటు వైపు దాని పయ్రాణము?

        ఇందులో - విధవరాలి కుమారుడు మరణించినప్పుడు, ఏలీయా చేసిన ప్రార్థనలో - ''యీ చిన్నవానికి ప్రాణము మరల రానిమ్మని యెహోవాకు ప్రార్థింపగా,'' అని అనుటలో మరణించిన ఈ విధవరాలి కుమారుడులోని ప్రాణము అనగా ఆత్మ ఎక్కడికో వెళ్ళినట్లుగా మనకు అర్థమగుచున్నది.  ఈ ఆత్మ ఈ విధవరాలి కుమారుని విడుచుటయే మరణము అను క్రియ.  ఈ విడిచిన ఆత్మ ఎక్కడికో వెళ్ళినది.  ఈ వెళ్ళిన ఆత్మను ఏలీయా తన ప్రార్థనలో తిరిగి ఇయ్యమని యెహోవా దేవుని ప్రార్థించుచున్నాడు.  ఈ ప్రార్థన చేసినది గొప్ప దైవజనుడు కనుక అతని ప్రార్థన ఆలకించిన దేవుడు మరల వానిలోని ప్రాణమును లేక ఆత్మను ''రానిచ్చినప్పుడు'' వాడు బ్రతికెను.  ''రానిచ్చినప్పుడు,''  అనుటలోనే ఎక్కడికో వెళ్ళిన ఆత్మను తిరిగి మరల తీసుకొని వచ్చినట్లుగా అర్థమగుచున్నది.  ఇందునుబట్టి ఆ పసివానిలోని ప్రాణము లేక ఆత్మ అతనిని వీడిన తరువాత ఎక్కడికో వెళ్ళినది.  దానిని ప్రవక్త అడిగి ఆ వెళ్ళిన ఆత్మను మరల తిరిగి తీసుకొని వచ్చి ఆ చిన్నవానిలో ప్రవేశింపజేసినట్లుగా అర్థమగుచున్నది.

మరణించినవాని ఆత్మను తిరిగి భౌతిక శరీరములోనికి రమ్మని ప్రార్థించి రప్పించగల విశ్వాసము నీదా!

        ఇంతకి ఈ చిన్నవాడు ఎప్పుడు మరణించాడు?  1 రాజులు 17:17, ''  అటుతరువాత ఆ యింటి యజమానురాలైన ఆమె కుమారుడు రోగియై ప్రాణము నిలువజాలనంత వ్యాధిగలవాడాయెను.''  ఈ స్థితిలో ఉన్న ఆ బాలుని పై అంతస్తు గదిలోనికి పోయి మంచము మీద పరుండబెట్టిన వెంటనే ఆ పసివాడు మరణించి యుండాలి.  ఆ వెంటనే ప్రవక్తయైన ఏలీయా ప్రార్థించుట జరిగింది.  ఈ ప్రార్థనలో ప్రవక్త పసివానిలోని ప్రాణమును లేక ఆత్మను తిరిగి రానిమ్మని వేడుకొనుట జరిగింది.  ఇందునుబట్టి, శరీరరీత్యా మరణించిన వెంటనే ఆ శరీరములోని ఆత్మ వేరొక చోటికి వెళ్ళిపోతున్నట్లుగా మనకు అర్థమగుచున్నది.  చనిపోవుట జరిగిన తోడనే ఆత్మ ఇక అక్కడ ఉండదు.  ఎక్కడికో తీసుకొని పోవుట జరుగుచున్నది.

35.  మరణించి భౌతిక శరీరమును విడిచిన వారి ఆత్మలను ఎవరు ఎక్కడికి తీసుకొని పోవుదురు?

        

        ఆదికాండము 3:19, ''నీవు నేలకు తిరిగి చేరువరకు నీ ముఖపు చెమట కార్చి ఆహారము తిందువు;  ఏలయనగా నేలనుండి నీవు తీయబడితివి; నీవు మన్నే గనుక తిరిగి మన్నైపోదువని చెప్పెను.''   ప్రసంగి 12:7, ''మన్నయి నది వెనుకటివలెనే మరల భూమికి చేరును, ఆత్మ దాని దయచేసిన దేవునియొద్దకు మరల పోవును.''  ఇలా మరణించిన వారిని నరులు భూమిలో వారి శరీరములను పాతి మట్టిగా మార్చుచున్నాము.  

మన భౌతిక శరీరములో సమానమైన ఆకారములో ఆత్మ మహిమ శరీరముతో వుండును

అయితే ఆత్మ సంగతి ఏమిటి?  ప్రసంగి చెప్పినట్లుగా మన్నయిన మన శరీరము తిరిగి భూస్థాపిత శరీరము ద్వారా మట్టిగా మార్చబడుచున్నది.  అలాగే ఆత్మ తనను భూమిపైకి పంపిన దేవుని యొద్దకు మరల వెళ్ళవలసియున్నది.  ఇలా మరణించి భౌతిక శరీరమును విడిచినవారి ఆత్మ దైవసన్నిధికి వెంటనే వెళ్ళదు, ఎందుకంటే ఆత్మ శరీరముతో జీవించిన రోజులలో తాను చేసిన కార్యములకు తగిన జీతమును పొందవలసియున్నది.  ప్రకటన 22:12, ''ఇదిగో త్వరగా వచ్చుచున్నాను.  వానివాని క్రియచొప్పున ప్రతివాని కిచ్చుటకు నేను సిద్ధపరచిన జీతము నాయొద్ద ఉన్నది.''  కనుక తీర్పు దినము వరకు వారిని  కొందరు తీసుకొని వెళ్ళి కొన్ని ప్రాంతములలో భద్రపరచుచున్నారని యూదా వ్రాసిన పత్రికలో చదువగలము.  ఆత్మలను ఎవరు తీసుకొని వెళ్ళుదురు?  యూదా 1:9, ''అయితే ప్రధానదూతయైన మిఖాయేలు అపవాదితో వాదించుచు మోషేయొక్క శరీరమునుగూర్చి తర్కించినప్పుడు, దూషించి తీర్పుతీర్చ తెగింపక-ప్రభువు నిన్ను గద్దించును గాక అనెను.''  ఇందులో ''మోషేయొక్క శరీరమును గూర్చి,'' అనుటలో ఇది భౌతిక శరీరము కాదు, ఎందుకంటే మరణించినవారి శరీరమును వారి తరపువారు భూమిలో సమాధి చేయుచున్నారు.  ఇది కుళ్ళి క్రుశించి పోవుట మనము ఎరిగిన సత్యమే!  కొన్ని దినముల తరువాత మన అవసరతలనుబట్టి త్రవ్వినప్పుడు ఆ శరీరము చెడిపోవుచూ అందులోనే ఉంటున్నట్లుగా మనము మన నిజ జీవితములో చూస్తున్నాము.  అయితే ఇందులో చెప్పబడిన మోషేయొక్క శరీరము ఆత్మకు సంబంధించినది.  ఆత్మ కూడా శరీర ఆకారములోనే ఉండును.  యేసుక్రీస్తు ప్రభువు తాను సిలువ బలియాగము ద్వారా మరణించి, తిరిగి లేచినప్పుడు ఆయన మనుష్యుని ఆకారములోనే ఉన్నట్లుగా చెప్పబడినది.  యోహాను 20:14-16, ''ఆమె యీ మాట చెప్పి వెనుకతట్టు తిరిగి, యేసు నిలిచియుండుట చూచెనుగాని ఆయన యేసు అని గుర్తుపట్టలేదు.  యేసు- అమ్మా యెందుకు ఏడ్చుచున్నావు, ఎవనిని వెదకుచున్నావు?  అని ఆమెను అడుగగా ఆమె ఆయన తోటమాలి అనుకొని-అయ్యా, నీవు ఆయనను మోసికొని పోయినయెడల ఆయనను ఎక్కడ ఉంచితివో నాతో చెప్పుము, నేను ఆయనను ఎత్తికొని పోదునని చెప్పెను.  యేసు ఆమెను చూచి-మరియా అని పిలిచెను.  ఆమె ఆయనవైపు తిరిగి ఆయనను హెబ్రీ భాషతో రబ్బూనీ అని పిలిచెను.  ఆ మాటకు బోధకుడని అర్థము.''  కనుక ఆత్మయొక్క శరీరము కూడా మనుష్యుని శరీర ఆకారములో ఉండునుగాని మట్టి శరీరము మాత్రము కాదు.  అది చెడిపోని అనగా క్షయముగాని మహిమ శరీరము.  అలాగే మోషే మరణించిన తరువాత మోషేయొక్క ఆత్మ కూడా మనుష్యుని ఆకారములోనే శరీరమును కలిగియున్నది.  కనుకనే మోషేయొక్క శరీరముగానే చెప్పబడినది.  అయితే మోషే మరణించిన తరువాత అతని శరీరములో ఉన్న మరియొక శరీరము అనగా ఆత్మయొక్క శరీరమును తీసుకొని పోవుటకు దేవుని దూతయైన మిఖాయేలు అను ప్రధాన దూత, సాతాను ఇద్దరు వచ్చారు.  అనగా మన భౌతిక శరీరములో ఇంకొక శరీరము వున్నట్లుగా మనకు అర్థమగుచున్నది.  2 కొరింథీ 4:16-17లో  దీనినే ఆంతర్య పురుషుడని ఆత్మను గూర్చి చెప్పబడుచున్నది.  అదే ఆత్మ మహిమ శరీరమును కలిగి ఈ భౌతిక శరీరములో నివసిస్తున్నది.  దీని కొరకు వీరిద్దరు వచ్చారు.  కనుక చనిపోయినవారి  ఆత్మలను మిఖాయేలు అతని అనుచరులు, సాతాను అతని అనుచరులు ఈ రెండు వర్గములవారు తీసుకొనిపోయి పరదైసులలో వారి ఆత్మలను భద్రపరచుదురు.  వారిలో సాతాను కొనిపోవువారు భూమిపై పాపములు అనగా చెడు క్రియలు చేసి ఉండాలి.  మిఖాయేలు ప్రశాంతకర పరదైసులలో భద్రపరచును.  కాని సాతాను తన స్వాస్థ్యమైన బాధాకరమైన పాతాళలోకములో భద్రపరచును.  ఇలా మిఖాయేలు, సాతాను ఇద్దరు వారి వారి క్రియలనుబట్టి తర్కించుకొని, మరణించి భౌతిక శరీరము విడిచిన ఆత్మను మృతుల లోకము అను పరదైసులో చేర్చును.  ఈ మృతుల లోకము మృతులయొక్క ఆత్మలను వారి వారి కార్యములనుబట్టి భద్రపరచబడుట జరుగును.  లూకా 16:22-23, ''ఆ దరిద్రుడు చనిపోయి దేవదూతలచేత అబ్రాహాము రొమ్మున (ఆనుకొనుటకు) కొనిపోబడెను.  ధనవంతుడు కూడ చనిపోయి పాతిపెట్టబడెను.  అప్పుడతడు పాతాళములో బాధపడుచు, కన్నులెత్తి దూరమునుండి అబ్రాహామును అతని రొమ్మున (ఆనుకొనియున్న) లాజరును చూచి''  వీరిద్దరి మధ్యన ఒక మహా అగాధము ఉన్నట్లుగా లూకా 16:26 నందు వ్రాయబడి యున్నది.  కనుక మృతుల లోకములో రెండు రకముల ప్రాంతములు మనకు తెలియుచున్నవి.  అందులో 1.  లాజరు ఉన్న ప్రాంతము.  2.  ధనవంతుడున్న ప్రాంతము.  వీటి మధ్యలో అగాధము.  ఇటువంటి మృతుల లోకములో మరణించినవారి ఆత్మలను భద్రపరచుచున్నారు.

మరణించిన భౌతిక శరీరమును విడిచిన ఆత్మకు మార్గము చూపువారు ప్రదాన దూతయైన మిఖాయేలు మరియు సాతాను అను అపవాది

        ఇలా భద్రపరచబడిన పరదైసులలో ఆనందమును పాతాళములో బాధను అనుభవించు వారు క్రీస్తు ప్రభువు ఇయ్యవలసిన తీర్పు వరకు అలాగే ఉందురు.  వారిలో ఎవరును పరలోకమునకు వెళ్ళరు.  2 కొరింథీ 12:2, ''క్రీస్తునందున్నయొక మనుష్యుని నేనెరుగుదును.  అతడు పదునాలుగు సంవత్సరములక్రిందట మూడవ ఆకాశమునకు కొనిపోబడెను; అతడు శరీరముతో కొనిపోబడెనో నేనెరుగను, శరీరములేక కొనిపోబడెనో నేనెరుగను, అది దేవునికే తెలియును.''  కనుక మూడవ ఆకాశమునకు కొనిపోయెనేగాని ఒకసారిగా పరలోకమునకు వెళ్ళలేదు.  ప్రకటన 2:7, ''చెవిగలవాడు ఆత్మ సంఘములతో చెప్పుచున్నమాట వినునుగాక.  జయించు వానికి దేవుని పరదైసులో ఉన్న జీవవృక్షఫలములు భజింపనిత్తును.''  లూకా 23:43, ''అందుకాయన వానితో-నేడు నీవు నాతోకూడ పరదైసులో ఉందువని నిశ్చయముగా నీతో చెప్పుచున్నా ననెను.''  కనుక భూమిపై భౌతిక శరీరమును విడిచినవారి ఆత్మలు భూమి మీద కాక మృతుల లోకములోని పరదైసులలో లేక పాతాళ లోకములో వారిని ఉంచుట జరుగుచున్నది.  ఇలా శరీరము నుండి ఆత్మను వేరు చేసి మరియొక లోకమునకు చేర్చువారు మిఖాయేలను ప్రధాన దూత మరియు అపవాది అను సాతాను.  అయితే ఆత్మలు శరీర రూపము ధరించి ప్రభువు వారికేర్పరచిన నివాసాలలో ఉంటారని క్రీస్తు రూపాంతరములో మోషే ఏలీయాలు శిష్యులకు దర్శనమిచ్చుట, 2 కొరింథీ 12:2లోని మాటలు మరియు లాజరు ధనికుని ఉపమానమునుబట్టి మనకు అర్థమగుతున్నది.

36.  మృతుల లోకము - పాతాళ లోకము

        మృతుల లోకము భూమి కాక భూమి అంతర్గత పొరల నుండి సముద్రము, అగాధ జలములు, మధ్యాకాశము వరకు విస్తరించి యున్నది.  మృతుల లోకము అన్ని రకముల మరణించిన ఆత్మలతో నిండి యుంటుంది.  మరణమును దాటిన ఆత్మలు అనగా మరణ బంధకములు దాటిన ఆత్మలు కొద్ది మాత్రమే.  వీరు ప్రశాంతకరమైన పరదైసులలో నిండియున్నారు.  ప్రకటన 2:7, ''జయించు వానికి దేవుని పరదైసులో ఉన్న జీవవృక్షఫలములు భుజింపనిత్తును.''  ప్రకటన 6:9, ''ఆయన అయిదవ ముద్రను విప్పినప్పుడు, దేవుని వాక్యము నిమిత్తమును, తాము ఇచ్చిన సాక్ష్యము నిమిత్తమును వధింపబడినవారి ఆత్మలను బలిపీఠము క్రింద చూచితిని.''  ప్రకటన 14:1, ''మరియు నేను చూడగా, ఇదిగో, ఆ గొఱ్ఱెపిల్ల సీయోను పర్వతముమీద నిలువబడియుండెను.  ఆయన నామమును ఆయన తండ్రి నామమును నొసళ్లయందు లిఖింపబడియున్న నూట నలువది నాలుగు వేలమంది ఆయనతో కూడ ఉండిరి.''  

        ప్రకటన 14:4, ''వీరు స్త్రీ సాంగత్యమున అపవిత్రులు కానివారును, స్త్రీ సాంగత్యము ఎరుగని వారునైయుండి, గొఱ్ఱెపిల్ల ఎక్కడికి పోవునో అక్కడికెల్ల ఆయనను వెంబడింతురు;  వీరు దేవుని కొరకును గొఱ్ఱెపిల్లకొరకును ప్రథమఫలముగా ఉండుటకై మనుష్యులలోనుండి కొనబడినవారు.''  ప్రకటన 4:4, ''సింహాసనముచుట్టు ఇరువదినాలుగు సింహాసనములుండెను, ఈ సింహాసనములందు ఇరువదినలుగురు పెద్దలు తెల్లని వస్త్రములు ధరించుకొని, తమ తలలమీద సువర్ణ కిరీటములు పెట్టుకొన్నవారై కూర్చుండిరి.''

        ఇలా పరిశుద్ధులలో జయించినవారు, వధింపబడినవారు, వెయ్యిన్ని నలుబదినాలుగు వేలమంది, ఇరువదినలుగురు పెద్దలు శరీరరీత్యా మరణించినను, మృతులుగా మారినను, వీరు మృతుల లోకములో లేరు.  వీరిలో వారి వారి శరీర క్రియలనుబట్టి కొందరు క్రీస్తు ప్రభువుతో కూడా ఆయన ఎక్కడకు వెళ్ళితే అక్కడికల్లా సంచరించుచున్నారు.  ఆయన వాక్యము నిమిత్తము, వారిచ్చిన సాక్ష్యము నిమిత్తము వధింపబడినారు బలిపీఠము క్రింద విశ్రాంతి తీసుకొంటున్నారు.  మరికొందరు క్రీస్తు అనుగ్రహించిన పరదైసులలో ఉన్నారు.  మరికొందరు అనగా 12 మంది యాకోబు గోత్రముల మూల పురుషులు, 12 మంది అపొస్తలులు దేవుని సముఖములో ఉన్నారు.  ఇలా వీరంతా మృతుల లోకములో లేరు.  అందుకే క్రీస్తు ప్రభువు - యోహాను 11:25-26, ''అందుకు యేసు-పునరుత్థానమును  జీవమును నేనే;  నాయందు విశ్వాసముంచువాడు చనిపోయినను బ్రదుకును;  బ్రదికి నాయందు విశ్వాసముంచు ప్రతివాడును ఎన్నటికిని చనిపోడు.  ఈ మాట నమ్ముచున్నావా?  అని ఆమెను నడిగెను.''  కనుక పై వారందరు క్రీస్తు విశ్వాసములో చనిపోయినను బ్రతికినవారు. వారు జీవములోనే ఉన్నట్లుగా గుర్తించాలి.  వీరు దేవుని రాజ్యములో లేరుగాని దేవుని సన్నిధిలో ఉన్నట్లుగా గుర్తించాలి.  అనగా వీరు ఇప్పుడు పరలోకములో లేరుగాని మధ్యాకాశములోను దానిపై భాగాలలో పరదైసులలో ఉన్నారు.

మృతుల లోకములో అతి వేదనకర పాంతమును పాతాళ లోకము అందురు

        ఇక మిగిలినవారు ఎక్కడ ఉన్నారు?  వీరు కొద్ది పాపము నుండి ఎక్కువ పాపము చేసినవారు.  వీరు దేవుని క్షమాపణ పొందనివారు గనుక మృతుల లోకములో ఉన్నారు.  వీరిలో క్షమాపణ లేని పాపములు చేసినవారు ఉంటారు.  1 యోహాను 5:16-17లో వలె కొద్దిపాటి పాపములు చేసినవారు ఉంటారు.  దీనినే ఉత్తరించు స్థలము అని కూడా చెప్పవచ్చును.  వీరికి మృతుల లోకములో సువార్త కార్యక్రమము నిత్య సువార్తగా చెప్పబడుతుంది.  ప్రకటన 14:6.  

        ఇక పాతాళ లోకము అనగా నేమి?  ఇది కూడా ఇంచుమించు మృతుల లోకమే!  ఇందులో కూడా మృతులయొక్క ఆత్మలు వుండును.  ప్రకటన 20:13, ''సముద్రము తనలో ఉన్న మృతులను అప్పగించెను;  మరణమును పాతాళలోకమును వాటి వశముననున్న మృతుల నప్పగించెను;  వారిలో ప్రతివాడు తన క్రియల చొప్పున తీర్పుపొందెను.''  ఇందులో సముద్రము అనగా అగాధము.  మరియు మరణమును పాతాళ లోకమును తమ వశములో ఉన్న మృతులను అప్పగించినట్లుగా వ్రాయబడి యున్నది.  కనుక సముద్రము అనగా అగాధము అనగా ఆదికాండము 1:6-8, ''మరియు దేవుడు-జలముల మధ్య నొక విశాలము కలిగి ఆ జలములను ఈ జలములను వేరుపరచును గాకని  పలికెను.  దేవుడు ఆ విశాలము చేసి విశాలము క్రింది జలములను విశాలము మీది జలములను వేరుపరపగా ఆ ప్రకారమాయెను.  దేవుడు ఆ విశాలమునకు ఆకాశమని పేరు పెట్టెను.  అస్తమయమును ఉదయమును కలుగగా రెండవ దినమాయెను.''  ఆదికాండము 1:2, ''భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను; చీకటి అగాధ జలము పైన కమ్మియుండెను;''  ఇందులో చెప్పబడిన జలములు అగాధ జలములే.  కాని విభజింపబడినవి.

        కనుక అగాధముగా చెప్పబడిన సముద్రము పాతాళ లోకము రెండును మృతుల లోకములోని భాగాలుగా  గ్రహించాలి.  ఇందులో సముద్రములోనివారు మరణించినను మరణముయొక్క వశమున లేరు.  అనగా కొంత జీవమునకు సంబంధించిన కార్యములు జరిగించినవారుగా గుర్తించాలి.  వీరు మృతుల లోకములో సముద్రము అను అగాధములో ఉన్నారు.  

        అంతేకాకుండా మరికొందరు మరణమును పాతాళ లోకముయొక్క వశములో ఉన్నారు.  వీరు క్షమించరాని నేరము చేసినవారుగా గుర్తించాలి.  వారు దైవశాపము మూలముగా మరణమును పొందినట్లుగా గుర్తించాలి.  అనగా సొదొమ గొమొఱ్ఱా పట్టణ ప్రజలను అగ్ని గంధకములు దిగి వచ్చి వారిని నాశనము చేశాయి.  అలాగే యుగాంత కాలములో వధింపబడినట్లుండిన గొఱ్ఱెపిల్లగా ఉన్న క్రీస్తు ప్రభువు - ప్రకటన 6:7-8, ''ఆయన నాలుగవ ముద్రను విప్పినప్పుడు-రమ్ము అని నాలుగవ జీవి చెప్పుట వింటిని.  అప్పుడు నేను చూడగా, ఇదిగో పాండుర వర్ణముగల ఒక గుఱ్ఱము కనబడెను;  దాని మీద కూర్చున్నవాని పేరు మృత్యువు.  పాతాళ లోకము వానిని వెంబడించెను.  ఖడ్గమువలనను కరువువలనను మరణమువలనను భూమిలో నుండి క్రూర మృగములవలనను భూనివాసులను చంపుటకు భూమియొక్క నాలుగవ భాగము పైన అధికారము వారికియ్యబడెను.''  ఇలా దేవుని ఉగ్రత వల్ల చంపబడినవారు అందరు మృతుల లోకములో అతి వేదనకర ప్రాంతము పాతాళములో చేర్చబడినట్లుగా గుర్తించాలి.  లూకా 16:23-24, ''అప్పుడతడు పాతాళములో బాధపడుచు, కన్నులెత్తి దూరమునుండి అబ్రాహామును అతని రొమ్మున (ఆనుకొనియున్న) లాజరును చూచి -తండ్రివైన అబ్రాహామా, నాయందు కనికరపడి, తన వ్రేలికొసను నీళ్లలోముంచి నా నాలుకను చల్లార్చుటకు లాజరును పంపుము;  నేను ఈ అగ్నిజ్వాలలో యాతనపడుచున్నానని కేకలువేసి చెప్పెను.''  

        వీరు మరణముయొక్క ఆధీనములో ఉన్నారు.  కనుక మరణము పాతాళ లోకము రెండును తమలోని మృతులను, సముద్రము తనలోని మృతులతోబాటుగా అప్పగించుట ఇందులో జరుగుచున్నది.  కనుక మృతుల లోకములో సముద్రమను అగాధము మరియు పాతాళ లోకము ఉన్నట్లుగా మనము గ్రహించాలి. అయితే వీటిలోని మృతులు వీరు అప్పగింపబడిన తరువాత క్రీస్తు ప్రభువు తీర్పు తీర్చును.  

 మృతుల లోకము పరదైసుల వారీగా విభజింపబడి ఆత్మకు వారు భూమి మీద చేసిన కార్యములనుబట్టి నివాసముగా వున్నది

        అటుతరువాత - ప్రకటన 20:14, ''మరణమును మృతుల లోకమును అగ్నిగుండములో పడవేయబడెను;  ఈ అగ్నిగుండము రెండవ మరణము.''  ఈ రెండవ మరణమను అగ్నిగుండములో మరణము, మృతుల లోకము పడవేయబడుచున్నది.  దీని అర్థము పాతాళ లోకము కూడా అందులో పడవేయబడు చున్నట్లుగా గుర్తించాలి.  ఎందుకంటే మృతుల లోకములో పాతాళ లోకము ఒక భాగము మాత్రమే.

37.   మృతుల లోకములోని ప్రాంతాల మధ్య మహా అగాధములు

        లాజరు ధనవంతుని ఉపమానములో క్రీస్తు ప్రభువు ఈ విషయమును గూర్చి చెప్పెను.  లూకా 16:26, ''అంతేకాక ఇక్కడనుండి మీ యొద్దకు దాట గోరువారు దాటి పోజాలకుండునట్లును, అక్కడి వారు మాయొద్దకు దాటి రాజాలకుండునట్లును, మాకును మీకును మధ్య మహా అగాధముంచబడియున్నదని చెప్పెను.''  ఇందునుబట్టి ఇది వట్టి అగాధము కాదు మహా అగాధముగా చెప్పబడినది.  మృతుల లోకములోని ఆత్మలు వారి వారి క్రియలనుబట్టి విభజింపబడి వారు ప్రాంతాల వారీగా ఉంటారు.  

ఉదా :-         1.  లాజరు ఉన్న ప్రాంతము వేరు.  ఇది ఆత్మ నెమ్మది పొందు ప్రాంతము.  లూకా 16:19-31.  

        2.  ధనవంతుడు వుంటున్న ప్రాంతము వేరు.  ఇది ఆత్మ యాతన పొందు ప్రాంతము.  లూకా 16:19-31.  

        అలాగే మరణముయొక్క బంధకములలో లేనివారు కూడా వేరు వేరు ప్రాంతాలలో ఉన్నారు.  వారిలో వెయ్యిన్ని నలుబదినాలుగు వేలమంది క్రీస్తు ప్రభువుతో ఉండగా, ఇరువదినలుగురు పెద్దలు దేవుని సముఖములో, వధింపబడినవారి ఆత్మలు బలిపీఠము క్రింద మధ్యాకాశము పై భాగాలలో ఉన్నారు.  అలా మన క్రియలను బట్టి వేరు వేరు ప్రాంతాలలో ఉంటారు.

దాటజాలని మహా అగాధము కలిగిన మృతుల లోకము

        ఇలా అనేక రకములైన ప్రాంతములు ఉన్నవి.  ఈ ప్రాంతములు ఒకదాని నుండి మరియొక్క  ప్రాంతమును వేరు చేయుచు మహా అగాధము కలిగి యున్నవి కనుక వారు వారి ప్రాంతము నుండి మరొక ప్రాంతమునకు వెళ్ళు అవకాశము లేదు.  ఇవన్నీ ముందుగానే ఒక పద్ధతి లేక ప్రణాళిక ప్రకారముగా చేసినట్లుగా ఉన్నవి కదా!

38.  మరణించి శరీరమును వదిలిన ఆత్మలు కొనిపోయేవి ఏవి?

        మనము ఊరికి వెళ్ళు సందర్భములో మన అవసరత కొరకు కావలసిన వస్తువులు, డబ్బు తీసుకొనిపోవుట సహజము.  అలాగే ఆత్మ శరీరమును వదిలి వెళ్ళునప్పుడు తాను కొన్ని తీసుకొని వెళ్ళును.  కాదు, కాదు,  తీసుకొని వెళ్ళునని చెప్పితే అది తప్పు అవుతుంది.  ఆత్మ శరీరమును వదిలి శరీరమును మరణమునకు అప్పగించి వెళ్ళునప్పుడు అది ఏమి తీసుకొనకయే వెళ్ళును.  

        కనుక ఆత్మ శరీరమును వదలగానే వాని ఆత్మను చేర్చుటకు దేవదూతలు వాని యొద్దకు వచ్చి ఆ ఆత్మను చేర్చవలసిన చోటుకి చేర్చునేగాని ఇహలోక సంబంధముగాను, పరలోక సంబంధముగాను ఏమైన తెచ్చుకొనుటకు అవకాశము ఉండదని గ్రహించాలి.

        కాని, ప్రకటన 14:13, ''అంతట-ఇప్పటినుండి ప్రభువునందు మృతినొందు మృతులు ధన్యులని వ్రాయుమని పరలోకమునుండి యొక స్వరము చెప్పగా వింటిని.  నిజమే; వారు తమ ప్రయాసములు మాని విశ్రాంతి పొందుదురు;  వారి క్రియలు వారి వెంట పోవునని ఆత్మ చెప్పుచున్నాడు.''  కనుక ఆత్మ శరీరమును వదిలి వెళ్ళునప్పుడు తాను ఏమియు తీసుకొనకపోయినను దానిని అనుసరిస్తూ అది భూమిమీద చేసిన క్రియలు అవి చెడ్డవైనను, మంచివైనను ఈ ఆత్మ వెంట పోవునని గుర్తించాలి.  తాను చేసిన మంచి చెడు క్రియలను కూడా ఆత్మ అన్నింటితో అనగా సమస్త, ఇహలోక విషయములను వదిలి వెళ్ళినను, వానిని క్రియలు వెంబడించుచున్నవి.

మనలను మన నీడ వెంబడించినట్లుగా ఆత్మను తాను భూమి మీద చేసిన మంచి చెడు క్రియలు వెంబడించును

        కనుకనే ఆత్మ ఎక్కడ వుండవలసిన నిర్ణయము నిర్ణయించబడుతుంది.  అనగా మంచి క్రియలు వానిని వెంబడిస్తే, ఆ ఆత్మ మిఖాయేలు అతని దూతలచే శాంతికరమైన పరదైసులలో చేర్చబడును.  ఒకవేళ చెడుక్రియలు వానిని వెంబడిస్తే, ఆ ఆత్మను సైతాను, అతని దూతలచే పాతాళములో వేదనకరమైన పరదైసులలో చేర్చబడుదురు.

39.  మరణించిన భౌతిక శరీరమును విడిచిన ఆత్మలు మృతుల లోకములో ఎంత కాలము ఉండాలి?

        భౌతిక శరీరమును విడిచిన ఆత్మ మహిమ శరీరమును కలిగియున్నను తను భూమిపై చేసిన కార్యములను బట్టి పరదైసు లేక పాతాళ లోకములో చేర్చబడిన తరువాత వీరు ఇక్కడ ఎంతకాలము ఉండాలి?  అక్కడ వారు ప్రభువు తీర్పు కాలము వరకు వుండాలి.  అంతవరకు వీరు సజీవులుగా చెప్పబడరు.  వీరు మృతులే.  ప్రకటన 20:5, ''ఆ వెయ్యి సంవత్సరములు గడచువరకు కడమ మృతులు బ్రదుకలేదు;  ఇదియే మొదటి పునరుత్థానము.''  ఇందునుబట్టి వీరు పునరుత్థాన కాలము వరకు అనగా క్రీస్తు రెండవ రాకడ కాలము వరకు ఇక్కడ వుండుట జరుగును.  క్రీస్తు తన రెండవ రాకడ కాలములో మేఘారూఢుడై వచ్చుసరికి ఈ ప్రపంచములో ఒక్క నరమాత్రుడు ఉండరు.  అనగా క్రీస్తు ప్రభువు రాకడ ఈ యుగాంతము తరువాత వచ్చును.  ఈ యుగాంతము ఎప్పుడు జరుగునో ఎవరికి తెలియదు.  అది దొంగవలె వచ్చునని చెప్పబడినది.  ఇందునుబట్టి భౌతిక శరీరమును విడిచిన ఆత్మలు మొదట విడతగా మృతుల లోకములో ప్రవేశించి అక్కడ ఈ యుగాంతము వరకు  వుండవలసియున్నది.  అటుతరువాత వారి ప్రయాణము క్రీస్తు రాకడ కాలములో మాత్రమే జరుగును.  ఈ భూమి మీద మనము మన జీవిత కాలమునుబట్టి ఏ విధముగా వున్నామో, అలాగే ఆ ఆత్మలు మృతుల లోకములో వారు భౌతిక శరీరమును విడిచినప్పటి నుండి అక్కడ వుందురు.

40.   మరణించిన ఆత్మలలో రకాలు - వారు ఉండు ప్రాంతములు - వారిపై రాజు

         ఈ లోకరీత్యా అనేక రకముల ప్రజలను చూడవచ్చును.  ఇందులో ముఖ్యముగా మూడు రకములవారుగా మనకు కనబడుదురు.

1.  ధనవంతులు.  2.  మధ్యతరగతి కుటుంబములవారు.  3.  పేదవారు.  

 లోకములో మనము కొంతకాలము జీవిస్తూ నివసించిన తరువాత మనకు  జీవితముపై విరక్తి కలిగి చనిపోయి మృతుల లోకమునకు వెళ్ళవచ్చునేమోగాని,  మృతుల లోకములో వున్న ఆత్మ దేవుని నిర్ణయ కాలము వరకు ఎటు వెళ్ళలేదు

        వీరినే వారు చేయు వృత్తులనుబట్టి కులాలవారిగాను, జీవన విధానమునుబట్టి జాతులుగాను విభజించుకొని జీవిస్తున్నారు.  అలాగే తాను పొందిన ఉన్నత జీవితమునుబట్టి లేక అధికారమునుబట్టి అనేక వర్గాలుగా వున్నారు.

        అయితే మరణించిన ఆత్మకు ఇవన్నీ వున్నాయా?  అనేది మనము తెలుసుకొనవలసి యున్నది.  ఆత్మల విభజన ముఖ్యముగా వారు చేసిన క్రియలనుబట్టి యుండును.  

ఆత్మలు వారి  కియ్రలనుబట్టి  విభజింప బడుచున్నారు

        1.  అతి పరిశుద్ధులు          

        2.  అపరిశుద్ధులు  

        3.  ఈ రెంటి మధ్య కార్యములు కలవారు.  (అనగా మంచి చెడు చేసినవారు)  

        ఈ విభజన వారి వారి క్రియలనుబట్టి ఉంటుంది.  ఈ క్రియలు మంచి కావచ్చును లేక చెడు కావచ్చును.  

1.  అతిపరిశుద్ధులు :-  అంతా మంచి క్రియలు చేసి చెడు అసలు చేయనివారు అతిపరిశుద్ధులు.  వీరిలో జాతి, వర్గ, కుల భేదములు అసలు ఉండవు.  ఇక్కడ అందరు సమానులే.  వీరికి రాజు గొఱ్ఱె పిల్లయైన క్రీస్తే.  ప్రకటన 14:1, ''మరియు నేను చూడగా, ఇదిగో, ఆ గొఱ్ఱెపిల్ల సీయోను పర్వతముమీద నిలువబడియుండెను.  ఆయన నామమును ఆయన తండ్రి నామమును నొసళ్లయందు లిఖింపబడియున్న నూట నలువది నాలుగు వేలమంది ఆయనతో కూడ ఉండిరి.''  ప్రకటన 14:5, ''వీరినోట ఏఅబద్ధమును కనబడ లేదు; వీరు అనింద్యులు.''  ఇందునుబట్టి వీరు ఏ అబద్ధమును చెప్పనివారు, అనింద్యులు అనగా నింద లేనివారు.  వీరినే ప్రకటన 17:14, ''వీరు గొఱ్ఱెపిల్లతో యుద్ధము చేతురు గాని, గొఱ్ఱెపిల్ల ప్రభువులకు ప్రభువును రాజులకు రాజునై యున్నందునను, తనతోకూడ ఉండినవారు పిలువబడినవారై, యేర్పరచ బడినవారై, నమ్మకమైనవారై యున్నందునను, ఆయన ఆ రాజులను జయించును.''  ఈ అతిపరిశుద్ధులలో మూడు రకములవారు వున్నారు.  వీరు  . . .  

        1.  దేవునిచే పిలువబడినవారు.  అనగా పాత నిబంధన కాలములో తండ్రియైన దేవుడు, నూతన నిబంధన కాలములో క్రీస్తు ప్రభువు, విశ్వాసుల యుగములో పరిశుద్ధాత్మ  దేవునిచే  పిలువబడినవారు వీరు.  

        2.  దేవునిచే యేర్పరచబడినవారు అనగా మూడు రకముల కాలములలో త్రియేక దేవునిచే యేర్పరచబడినవారు.

        3.  నమ్మకమైనవారు :-  ఈ రెండు రకములవారు నమ్మకమైనవారుగా క్రీస్తు ప్రభువుతోబాటుగా ఉంటున్నారు.

2.  అపరిశుద్ధులు :-  వీరు చెడు క్రియలు చేసినవారు.  వీరు పాతాళ లోకములో వుంటారు.  లాజరు ధనవంతుని ఉపమానము ప్రకారము వీరు యాతన అనుభవిస్తూ వుంటారు.   వీరికి రాజు సాతాను, ఎందుకంటే పాతాళ లోకమునకు అధిపతి సాతాను.  ప్రకటన 9:11, ''పాతాళపు దూత వాటిపైన రాజుగా ఉన్నాడు;  హెబ్రీభాషలో వానికి అబద్దోనని పేరు, గ్రీసుదేశపు భాషలో వానిపేరు అపొల్లుయోను.''  ప్రస్తుతము మనకు కూడా రాజు సాతానే.  వీడు ఈ లోకము, లోక రాజ్యములపై అధికారిగా వున్నాడు.  లూకా 4:5-6, ''అప్పుడు అపవాది ఆయనను తీసికొనిపోయి, భూలోక రాజ్యములన్నిటిని ఒక నిమిషములో ఆయనకు చూపించి -ఈ అధికారమంతయు, ఈ రాజ్యముల మహిమయు నీకిత్తును; అది నాకప్పగింపబడియున్నది, అదెవనికి నేను ఇయ్యగోరుదునో వానికిత్తును;''  కనుక భూమిని దేవుడు చేసినది మొదలు యుగాంతము వరకు పాతాళ లోకము అనగా మృతుల లోకములో వేదనకర ప్రాంతము మరియు భూలోకముపై సాతాను రాజుగా నియమింపబడి యున్నాడు.  ఈ రాజ్యములోని వారందరు ఒకటిగా పరిశుద్ధులవలె యుండరు.  ఇందులో కూడా రకరకాల  జాతి భేదములు, కుల భేదములు కలిగియుందురు.  ఉదా :-  లాజరు ధనవంతుని ఉపమానములో ధనవంతుడు ధనవంతుని లాగానే కనబడునని  లూకా 16:22-23లో చెప్పబడి యున్నది.  భూమి మీద లాగానే అనేక రీతులుగా పాతాళ లోకములో విభజింపబడి యుంటారు, ఎందుకంటే సకల అవలక్షణములకు మూలము సాతానే కదా!

3.  ఈ రెంటి మధ్య కార్యములు కలవారు :-  వీరు నులివెచ్చని జీవితము కలవారు.  ప్రకటన 3:15-16, ''-నీ క్రియలను నేనెరుగుదును, నీవు చల్లగానైనను వెచ్చగానైనను లేవు; నీవు చల్లగానైనను వెచ్చగానైనను ఉండిన మేలు.  నీవు వెచ్చగానైనను చల్లగానైనను ఉండక, నులివెచ్చనగా ఉన్నావు గనుక నేను నిన్ను నా  నోటనుండి ఉమ్మివేయ నుద్దేశించుచున్నాను.''  ఇందులో వెచ్చగా యున్నవారు దేవుని పరిశుద్ధులు.  వీరు క్రీస్తు ప్రభువుతో కూడా సంచరిస్తున్నారు.  మరణించి కూడా జీవముతోనే ఉన్నారు.  చల్లగా వున్నవారు శరీరరీత్యా సాతాను కార్యములు చేసి మరణించి దేవునికి దూరముగానే పాతాళ లోకములో యాతనలో ఉన్నారు.  ఇక నులివెచ్చని జీవితములో వున్నవారు పోరాట జీవితమును జీవించినవారు.  వీరు దేవుని కోసము పోరాడుచూనే, లోకము మరియు సాతాను ఆశలకు లోనై జీవించినవారు.  వీరికి క్రీస్తు ప్రభువు జీవము దయచేయడు.  కనుక వీరు జీవము కలిగి క్రీస్తు ప్రభువువలె లేక 1,44,000 మంది వలె తిరుగుటకు అవకాశము లేదు.  అలాగే సాతాను అధికారము క్రింద లేక విశ్రాంతి జీవితములో వారి క్రియలనుబట్టి జీవిస్తారు.  అనగా వీరు మృతుల లోకములో వీరి కార్యములనుబట్టి విభజింపబడి పునరుత్థాన దినము వరకు జీవము లేక అనగా స్వతంత్య్రముగా తిరుగు యోగ్యత లేక వారికిచ్చిన స్థలములో నెమ్మది పొందుటకు ప్రయత్నము చేయుచుంటారు.  లూకా 16:23-24లో అబ్రాహాము వడిలో లాజరు నెమ్మది పొందుచున్నట్లుగా వీరు నెమ్మది పొందు అవకాశము కలిగి యుందురు.  కనుక వీరిలో కూడా అనేక వర్గములు, జాతులవారు ఉన్నను వారి వారి క్రియలనుబట్టి ఈ భేదము లేక ఒకటిగా జీవించుటకు ప్రయత్నిస్తుంటారు.  వీరు పరదైసులలో ఉందురు.  ఈ పరదైసులు కూడా మృతుల లోకములో ఒక భాగమే.  ఈ పరదైసులలో ఒక పరదైసులో జీవవృక్షము ఉన్నది.  అందులో ప్రవేశించినవారు క్రీస్తు ప్రభువుతోబాటు జీవము కలిగి అన్ని రకములుగా యోగ్యులుగా ఉందురని గ్రహించాలి.

ఆత్మలకు రాజులు  వారి కియ్రలనుబట్టి  ఉంటారు

        వీరికి రాజు సాతానే!  కాని వారు దేవుని కోసము పోరాడి కొంత మంచి కార్యములు చేస్తూనే కొన్ని సమయములలో లోకము సాతాను ఆశలచే పడిపోయినవారు.

        ఇలా మూడు రకముల జనాభా ఆత్మలలో ఉన్నారు.  మొదటి రకమువారు పరిశుద్ధులు.  వీరు జీవము కలిగి క్రీస్తు ప్రభువు చేయు ప్రతి క్రియలను చేయుచుందురు.  అపరిశుద్ధులు యాతన పొందుచుందురు.  ఇక నులివెచ్చని జీవితములోని వారు నెమ్మది పొందుటకు ప్రయత్నము చేస్తూ వుంటారు.

41.   మరణించినవారి ఆత్మలయొక్క లింగము

        ఈ భూమి మీద రెండు రకముల లింగములను నరులలో సర్వసాధారణముగా చూస్తున్నాము.  ఇందులో . . .

        1.  పురుష లింగము 2.  స్త్రీ లింగము.  

        వీరుకాక వీరిద్దరి మధ్యన ఇంకొక జాతి ఉన్నది.  వారిని నపుంసకులని పిలుస్తారు.  వీరు స్త్రీలైతే పురుషులవలె వ్యవహరిస్తారు.  వీరు పురుషులైతే స్త్రీలవలె వ్యవహరిస్తారు.  అయితే చిన్న పిల్లలలో కూడా స్త్రీ పురుష భేదములు మనము చూడవచ్చును.  అయితే స్త్రీ పురుష భేదము కలిగిన ఈ నరుల మరణానంతరము వారి ఆత్మలలో కూడా అదే తేడా ఉంటుందా?  అనిన సంగతి మనము తెలుసుకొందము.

స్తీ పురుష భేదము శరీరమునకేగాని ఆత్మకు కాదు

        మొట్టమొదటగా దేవుడు ఆదాములో తన ఆత్మను ఉంచాడు.  ఈ ఆత్మ పురుష సంబంధమైనది.  ఈ ఆత్మలో నుంచి రెండవ ఆత్మయైన హవ్వకు ఈ లోకములో ప్రవేశించు అవకాశమును ఇచ్చాడు.  ఇది స్త్రీ రూపము.  అయితే ఆత్మ మాత్రము దేవునిదే.  ఆదికాండము 1:26, ''దేవుడు-మన స్వరూపమందు మన పోలికె చొప్పున నరులను చేయుదము.''  దేవుడు తన స్వరూపమందు నరుని చేసాడు.  ఈ నరుని పేరు ఆదాము.  ఆదాము పురుష స్వరూపి.  కనుక దేవుడు పురుష స్వరూపియే,  ఎందుకంటే తన పోలిక, తన స్వరూపము చొప్పున సృజించిన మొదటి మానవుడు పురుషుడే.  అందుచేత దేవుడు పురుష స్వరూపియేగాని మానవులవలె మట్టి నిర్మితుడు కాడు.  దేవుడు ఆత్మ స్వరూపి.

        ఈయన తన ఆత్మను నరులకు అనుగ్రహించాడు.  అది స్త్రీలో ఉన్నను, పురుషునిలో ఉన్నను ఆత్మ పురుష స్వరూపమైనదే.  ఆత్మకు స్త్రీ పురుష భేదము లేదు.  ఆత్మ పురుష సంబంధమైనదే.  స్త్రీ రూపము కేవలము శరీరమునకు చెందినదిగా మనము గుర్తించాలి.  చిన్న పిల్లలలో వుండే ఆత్మ కూడా పురుష సంబంధమైనదే.  ఈ చిన్న పిల్లలలోని ఆత్మకు కూడా స్త్రీ పురుష బేధము ఉండదు.  ఇంకా దేవుడైన యెహోవా ఈ లోకములో జన్మించి క్రీస్తు రూపములో జీవించెనని వేద గ్రంథము మనకు తెలుపుచున్నది.  ఈ క్రీస్తు ప్రభువు కూడా పురుషుడేగాని స్త్రీ కాదు.  ఈ యేసుక్రీస్తు ప్రభువు దేవునియొక్క దృశ్యరూపము.  అంతేకాకుండా ఈయన ఆత్మ నిర్మితుడేగాని పురుష ప్రమేయముతో పుట్టినవాడు కాడు.  కనుక దేవుడు పురుష సంబంధమే!  కనుక మనలోని ఆత్మ కూడా పురుష సంబంధమైనదే.  అయితే స్త్రీ పురుష భేదములు దేవుడు నరనారులను ఏర్పరుచుటలో ఈ శరీరమునకు వచ్చినదేగాని ఆత్మకు వచ్చినది కాదని గుర్తించాలి.  కనుక మరణించినవారు ఆడవారైనా, మగవారైనా సరే వారి ఆత్మకు వారి మరణానంతరము ఆడ మగ తేడా ఉండదు.  కాని ఆత్మ పురుష స్వరూపమును కలిగి యుండునని గుర్తించాలి.  ఇక మూడవ రకమునకు చెందిన నపుంసకులలోని ఆత్మ కూడా పురుష సంబంధమైనదేనని గుర్తించాలి.  సాతాను వీరిని తన చెరలో బంధించి వారిని ఆ విధముగా నడిపించునని గుర్తించాలి.

ఆత్మ పురుష స్వరూపి

        ఇంతకి దేవుడు ఈ లింగ భేదమును ఈ శరీరములో ఎందుకు ఉంచినట్లు?  ఒకే ఆత్మయైన, తండ్రియైన దేవుని ఆత్మ నుండి వచ్చిన జీవాత్మలోని అణువులు అన్నీ భూమిపై విస్తరించి, వారి వారి కార్యములను పూర్తి చేసి దైవరాజ్యములో నూతన స్థితిని పొందవలసి యున్నది.  అనగా జీవాత్మ ఈ లోక సంచార జీవితములో సాతానును, ఈ లోక ఆశలను జయించి ఉన్నతమైన స్థితిని పరలోకములో పొందవలసియున్నదని గ్రహించాలి.  దీని కోసరముగా దేవుడు నరనారులను సృజించుట జరిగింది.  స్త్రీ పురుషుల అవయవాలలో తేడాను శరీరరీత్యా ఏర్పరచి ఒకరి నుండి ఒకరు వచ్చునట్లుగా అనగా శిశు జన్మ విధానమును సంపర్క క్రియ ద్వారా ఏర్పరచి, ఆత్మలను భూమి పైకి దేవుడు పంపుచున్నాడు.  అందుకే హెబ్రీ 13:4, ''వివాహము అన్ని విషయములలో ఘనమైనదిగాను, పానుపు నిష్కల్మషమైనదిగాను ఉండవలెను; వేశ్యాసంగులకును వ్యభిచారులకును దేవుడు తీర్పు తీర్చును.''  కనుక దేవుడు లింగ బేధమును నరుల జన్మ కొరకు శరీరరీత్యా ఏర్పరచి, ఆత్మను మాత్రము పురుష సంబంధమైనదిగా ఉంచాడు, ఎందుకంటే ఆత్మ దేవునిది.  దేవుడు పురుష స్వరూపి.  ఈ ఆత్మ నర శరీరమును ఆధీనములో ఉంచుకొని దేవునిలో నడిపించాలి.  అనగా పురుషుడు స్త్రీని ప్రేమించి ఆమెను తన మార్గములో నడిపించును.  ఎఫెసీ 5:25-28, ''పురుషులారా, మీరును మీ భార్యలను ప్రేమించుడి.  అటువలె క్రీస్తుకూడ సంఘమును ప్రేమించి, అది కళంకమైనను ముడతయైనను అట్టిది మరి ఏదైనను లేక, పరిశుద్ధమైనదిగాను, నిర్దోషమైనదిగాను మహిమగల సంఘముగాను ఆయన తనయెదుట దానిని నిలువబెట్టుకొనవలెనని, వాక్యముతో ఉదకస్నానముచేత దానిని పవిత్రపరచి, పరిశుద్ధపరచుటకై దానికొరకు తన్ను తాను అప్పగించుకొనెను.  అటువలెనే పురుషులుకూడ తమ సొంతశరీరములనువలె తమ భార్యలను ప్రేమింప బద్ధులైయున్నారు.  తన భార్యను ప్రేమించువాడు తన్ను ప్రేమించుకొనుచున్నాడు.''  అలాగే పురుష స్వరూపియైన మనలోని ఆత్మ ఈ శరీరమును నడిపించాలి.  ఎందులోనికి?  దేవునిలోనికి.  కనుక ఈ ఆత్మ నర శరీరమును తన ఆధీనములో వుంచుకొని దేవునిలోనికి నడిపించవలసిన అవసరత వున్నది.  కనుక యేసుక్రీస్తు ప్రభువు ఇచ్చు తీర్పు ఆత్మకు మాత్రమేగాని ఈ శరీరమునకు కాదని గుర్తించాలి.  కనుక దేవుని దృష్టిలో ఆత్మ మాత్రమే ప్రాముఖ్యత కలిగి యున్నది, ఎందుకంటే ఆత్మ దేవునిది.  శరీరము మట్టి సంబంధమైనది.  మట్టి సంబంధమైన ఈ లింగ భేదము కలిగిన ఈ శరీరము మరణ క్రియ ద్వారా దేహమును ఆత్మ వదిలిన తరువాత ఈ దేహము మట్టిలో కలిసిపోవును.  కాని ఈ లింగ భేదము కలిగిన ఈ మట్టి శరీరములోని ఆత్మ తిరిగి దైవసన్నిధికి వెళ్ళవలసియున్నది.  ప్రసంగి 12:7, ''మన్నయి నది వెనుకటివలెనే మరల భూమికి చేరును, ఆత్మ దాని దయచేసిన దేవునియొద్దకు మరల పోవును.''  దీనికి కారణము పురుష సంబంధమైన మనలోని ఆత్మ పరమపురుషుని చేరవలసియున్నది.  అనగా తండ్రియైన దేవుని దగ్గరకు తిరిగి వెళ్ళవలెనని గుర్తించాలి.  ఇలా వెళ్లి మరణించినవారి ఆత్మ రెండు రకముల లింగ భేదములు లేక పురుష సంబంధమైనదిగానే ఉండును.

        అయితే ప్రకటన గ్రంథములో ఎత్తబడే సంఘము అనగా పరమయెరూషలేమును వధువు సంఘముగా ఎందుకు చెప్పబడింది?  ఈ సంశయము మనలో కలుగవచ్చును, ఎందుకంటే వధువు ఒక కన్య.  వధువుగా చెప్పబడినవారు స్త్రీ సంబంధమైనవారే కదా!  ఇందులో పరమయెరూషలేమును స్త్రీగా వర్ణించుట జరిగింది.  ప్రకటన 21:2, ''మరియు నేను నూతనమైన యెరూషలేము అను పరిశుద్ధపట్టణము తన భర్తకొరకు అలంకరింపబడిన పెండ్లికుమార్తెవలె సిద్ధపడి పరలోకమందున్న దేవునియొద్దనుండి దిగి వచ్చుట చూచితిని.''  పరమ పురుషుడు దేవుడే.  ఆయన ముందు ఎవరైనను తక్కువే.  కనుక ఆయనను చేరవలసిన ఆత్మ కూడా పురుష సంబంధమైనదైనను  స్త్రీగా వర్ణించుట జరిగింది.  ఇది వర్ణన మాత్రమేగాని నిజానికి ఆత్మ స్త్రీ సంబంధమైనది కాదు.  ప్రకటన 21:2లో, ''తన భర్తకొరకు అలంకరింపబడిన పెండ్లికుమార్తెవలె,'' అని చెప్పుట జరిగింది.  ఇందులో చెప్పబడినది పోలిక మాత్రమే.  అనగా పరమ యెరూషలేములోనివారు పెండ్లి కుమార్తెవలె ఏక పురుషునికి చెందినవారు.  అనగా వీరు దైవ సంబంధులేగాని సాతాను సంబంధులు కారు.  వీరు సాతానును తమ నాధునిగా చేసుకొనినవారు కారు.  వీరు స్వచ్ఛమైన కన్యకలు తమ భర్తను చేరు విధముగా, వీరు ఏ కళంకము లేనివారుగా దేవుని చేరుటనుబట్టి పరమ యెరూషలేమను వధువు సంఘముగా చెప్పుట జరిగింది.  అంతేగాని, మనలోని ఆత్మ పురుష సంబంధమైనదిగానే గుర్తించాలి.  జీవాత్మ పరమాత్మలోని ఒక అణువు.  ఈ జీవాత్మ స్త్రీ పురుష భేదము లేకండ నర శరీరులందరిలో నివసిస్తున్నది.  

        నేను గొర్రెలకు మంచి కాపరిని అని ప్రభువు అన్నాడు.  అయితే ఆడవియైన గొర్రెలలో మగవియైన పొట్టేళ్ళు కూడా ఉంటాయి.  ఆయన తీర్పు దీర్చునప్పుడు కుడివైపున గొర్రెలు అన్నాడు.  ఇందులో ఆడా మగ అందరు ఉంటారు.  పరమాత్మలో నుండి నరశరీరములో జీవాత్మ ప్రవేశించి బలహీనమైంది గనుక స్త్రీ నామధేయములో పోలికగా ఉచ్ఛరింపబడింది.  పరమాత్మ యొక్కడే పురుషుడు ఎందుకంటే సర్వాన్ని పుట్టించినవాడు గనుక పురుషుడన్నాము.  ఆయన ద్వారా జీవాత్మ బలపడి తిరిగి పరమాత్మలో లీనము కావలసి ఉంది గనుక స్త్రీగా అనగా వధువు సంఘముగా పోల్చి చెప్పబడింది.  కనుక ఆత్మ ఒక్కటే.  అది పురుషుడు అయితే విభజింపబడి స్త్రీ నామము ధరించింది.  అపవాది కూడా పురుషుడే - శాపము వలన నపుంసక ఆత్మగా రూపాంతరము చెందినది.  లూకా 20:36, ''వారు పునరుత్థానములో పాలివారై యుండి, దేవదూత సమానులును దేవుని కుమారులునై యుందురు.'' అని ప్రభువు వాక్కు తెలియజేస్తున్నది.  కనుక మరణించినవారి ఆత్మలు కుమారులుగా పురుష సంబంధమైన ఆత్మగానే ఉండును.  కనుక దేవదూతలలో కూడా స్త్రీ దేవదూతలు లేరు.  వారి ఆత్మలు పురుష స్వరూపమే.  అయితే వారు కామ రూపధారులు.  ఏ రూపమునైనను ధరించి మనకు సహాయం చేయగలరు.

42.   మరణించినవారి ఆత్మలు   రూపములో ఉంటాయి?

        నర జ్ఞానముతో దీనిని చెప్పవలెనంటే ప్రయాసతో కూడినదిగా మనము గ్రహించాలి.  అయినను ఆత్మదేవుని ప్రేరణ కల్గినవారు దీనికి సమాధానము చాలా సులభముగా చెప్పుదురు.  ఇందులో అనేకులు అనేక స్థితులలో మరణించుట జరుగును.  ఇది మనకందరికి తెలిసిన విషయమే!  కొందరు పసి బిడ్డలుగా మరణిస్తారు.  కొందరు ముసలి ప్రాయములో మరణిస్తారు.  మరికొందరు ఆత్మహత్యల ద్వారాను, హత్యల ద్వారాను మధ్యాంతరముగా మరణిస్తారు.  వీరంతా వారి మరణానంతరము భౌతిక దేహ రీత్యా వారిని మట్టిలో పూడ్చి వేయుట జరుగును.  అయితే వారిలోని ఆత్మ ఏఏ రూపములలో ఉండును?  ఆత్మ పురుష సంబంధమైనదైనను ఆకారము ఏ రూపములలో ఉండునో తెలుసుకొనవలసి యున్నది.

        లూకా 16:23, ''అప్పుడతడు పాతాళములో బాధపడుచు, కన్నులెత్తి దూరమునుండి అబ్రాహామును అతని రొమ్మున (ఆనుకొనియున్న) లాజరును చూచి'',  ఇది క్రీస్తు ప్రభువు తన బోధలో చెప్పిన వాక్యము.  ఈ వాక్యములో ధనవంతుడు లాజరును చూచినట్లుగా వ్రాయబడి యున్నది.  అంతేకాదు ధనవంతుడు అబ్రాహామును కూడా గుర్తించాడు.  ఇంతకి ధనవంతుడు వుండేది పాతాళ లోకములో కనుక పాతాళ లోకములో వున్న ధనవంతుడు అబ్రాహాము రొమ్మున ఆనుకొనియున్న లాజరును చూచుట జరిగింది.  గుర్తించాడు అంటే శరీరమును ఆత్మ వదిలినను ఆత్మ శరీర రూపములో ఉండునని గుర్తించాలి.  ఆత్మ రూపములు మారిపోతే గుర్తించుట అసాధ్యము.  క్రీస్తు ప్రభువు చెప్పిన వచనములో ధనవంతుడు లాజరును, అబ్రాహామును గుర్తించినట్లుగా చెప్పబడినది.  కనుక మరణించినవారి ఆత్మ పాతాళ లోకములో వున్నను, అబ్రాహాము రొమ్మున ఆనుకొని పరదైసులో ఉన్నను ఒకరిని ఒకరు గుర్తించుకొన్నారు గనుక శరీరము విడిచిన ఆత్మ ఇంచుమించు అదే ఆకారమును కలిగియుండునని గుర్తించాలి.

        ఒక కాలేజీలో ఇద్దరు చిన్ననాటి స్నేహితులు చదువు పూర్తి చేసుకొని వారిలో ఒకడు విదేశాలకు వెళ్ళి స్థిరపడినాడు.  మరియొకడు స్వస్థలములోనే వుంటూ జీవించాడు.  వారు ముసలితనము వరకు ఒకరికొకరు చూచుకోలేదుగాని ఫోన్‌ ద్వారా మాట్లాడుకొనేవారు.  ముసలివారై కొన్ని ఏండ్లకు ఇద్దరు చనిపోయారు.  చనిపోయే ముందటి శరీర రూపములను వారు ఒకరినొకరు చూచుకోలేదు.  మరి ఆత్మల రాజ్యములో వారు ఒకరినొకరు గుర్తించుట ఎట్లు?  అందుకని ఆ ఆత్మలు ఒకరికొకరు గుర్తింపు పొందుట కొరకు కాలేజీలో చదివే యవ్వన రూపమును తాను ధరించి తన స్నేహితునికి గుర్తింపు కలుగజేయును.  ఆ దినములలోని  ఆ కాలేజీలోని ఇతర విద్యార్థుల ఆత్మలను కూడా ఆహ్వానించి హెబ్రీ 11:35లో వలె ఆ ఆత్మలు తమ వారిని తమ బంధుమిత్రులతో సమావేశమై ఆనందానుభూతిని పొందుదురు.

        ప్రకటన 4:4, ''సింహాసనముచుట్టు ఇరువదినాలుగు సింహాసనములుండెను, ఈ సింహాసనములందు ఇరువదినలుగురు పెద్దలు తెల్లని వస్త్రములు ధరించుకొని, తమ తలలమీద సువర్ణ కిరీటములు పెట్టుకొన్నవారై  కూర్చుండిరి.''  పరలోకములో ఈ ఇరువదినలుగురు పెద్దలు తలలు కలిగి వాటికి సువర్ణ కిరీటములు ధరించుకొని యున్నారు.  అంతేకాకుండా కూర్చుని యున్నట్లుగా వ్రాయబడి యున్నది.  అనగా మన ఆకారములోనే ఉన్నట్లుగా మనకు అర్థమగుచున్నది.

దేవుని వాక్యము నిమిత్తమును,  తాము ఇచ్చిన సాక్ష్యము నిమిత్తము వధింపబడిన వారి ఆత్మలు వధింపబడినట్లుగానే బలిపీఠము కింద కనిపిస్తున్నాయి

        యోహాను 20:11-16, ''అయితే మరియ సమాధి బయట నిలిచి యేడ్చుచుండెను.  ఆమె ఏడ్చుచు సమాధిలో వంగి చూడగా, తెల్లని వస్త్రములు ధరించిన యిద్దరు దేవదూతలు యేసు దేహము ఉంచబడిన స్థలములో తలవైపున ఒకడును కాళ్ల వైపున ఒకడును కూర్చుండుట కనబడెను.  వారు-అమ్మా, యెందుకు ఏడ్చుచున్నావని ఆమెను అడుగగా ఆమె-నా ప్రభువును ఎవరో యెత్తికొని పోయిరి;  ఆయనను ఎక్కడ ఉంచిరో నాకు తెలియలేదని చెప్పెను.  ఆమె యీ మాట చెప్పి వెనుకతట్టు తిరిగి, యేసు నిలిచియుండుట చూచెనుగాని ఆయన యేసు అని గుర్తుపట్టలేదు.  యేసు-అమ్మా యెందుకు ఏడ్చుచున్నావు, ఎవనిని వెదకుచున్నావు?  అని ఆమెను అడుగగా ఆమె ఆయన తోటమాలి అనుకొని-అయ్యా, నీవు ఆయనను మోసికొని పోయినయెడల ఆయనను ఎక్కడ ఉంచితివో నాతో చెప్పుము, నేను ఆయనను ఎత్తికొని పోదునని చెప్పెను.  యేసు ఆమెను చూచి-మరియా అని పిలిచెను.  ఆమె ఆయనవైపు తిరిగి ఆయనను హెబ్రీ భాషతో రబ్బూనీ అని పిలిచెను.  ఆ మాటకు బోధకుడని అర్థము.''  మరణించి పునరుత్థానము ద్వారా తిరిగి లేచిన క్రీస్తు ప్రభువు మానవ ఆకారమును కలిగియున్నట్లుగా చెప్పబడినది.  మగ్ధలేన మరియ మహిమ శరీరమును పొందియున్న క్రీస్తు ప్రభువును తోటమాలి అనుకొన్నట్లుగా వ్రాయబడియున్నది.  ఇందునుబట్టి మహిమ శరీరమును పొందిన ఆత్మ నరరూపమునే కలిగి యుండి నరులవలె అన్ని అవయవములు ఉండునని గుర్తించాలి.

        అయితే మరియ పునరుత్థానుడైన ప్రభువును ఎందుకు గుర్తుపట్టలేకపోయింది?  సిలువ మీద ఆయన పోగొట్టుకొన్న రక్తహీనత వల్ల ఆయన ముఖము కళావిహీనముగా రక్తసిక్తముగా ఉంటుంది.  ఆయొక్క  వాడబారిన ముఖమే ఆమె మనస్సులో నిలిచింది.  యోహాను 15:15-18లో వలె గొర్రెల కొరకు సిలువ మీద ప్రాణము పెట్టినాడు - తన ప్రాణమును తాను తిరిగి తీసుకొన్నప్పుడు ఆ ప్రాణముతో బాటు భూమి ఆయన రక్తమును జీర్ణించుకోలేక ఆయన తన ప్రాణముతోబాటు తన రక్తమును కూడా పూర్తిగా విడుచుటవలన ప్రకటన 10:1లో వలె బలిష్ఠుడుగా కనపడినందున తోటమాలి యనుకొని పొరపాటు పడింది.

మన మరణమునకు ముందు  స్థితిలో చనిపోవుట జరిగిందో అదే స్థితిలో ఆత్మలయొక్క రూపములుంటాయి

        యోహాను 20:24-27, ''యేసు వచ్చినప్పుడు, పండ్రెండుమందిలో ఒకడైన దిదుమ అనబడిన తోమా వారితో లేకపోయెను గనుక తక్కిన శిష్యులు-మేము ప్రభువును చూచితిమని అతనితో చెప్పగా అతడు-నేనాయన చేతులలో మేకుల గురుతును చూచి నా వ్రేలు ఆ మేకుల గరుతులో పెట్టి, నా చెయ్యి ఆయన ప్రక్కలో ఉంచితేనేగాని నమ్మనే నమ్మనని వారితో చెప్పెను.  ఎనిమిది దినములైన తరువాత ఆయన శిష్యులు మరల లోపల ఉన్నప్పుడు తోమా వారితో కూడ ఉండెను.  తలుపులు మూయబడియుండగా యేసు వచ్చి మధ్యను నిలిచి-మీకు సమాధానము కలుగునుగాక అనెను.  తరువాత తోమాను చూచి-నీ వ్రేలు ఇటు చాచి నా చేతులు చూడుము;  నీ చెయ్యి చాచి నా ప్రక్కలో ఉంచి, ఆవిశ్వాసివి కాక విశ్వాసివై యుండుమనెను.''  పునరుత్థానము తరువాత మహిమ శరీరమును ధరించిన క్రీస్తు ప్రభువు మానవ రూపమును కలిగియున్నను చేతులకు కలిగిన గాయములు తన ప్రక్కలో పొడవబడిన బల్లెముయొక్క గాయమును తోమాకు చూపిస్తున్నాడు.  అంటే మహిమ శరీరమును పొందినను భూమిపై వారికి జరిగిన క్రియ, వారి మహిమ శరీరములో కనబడునని గ్రహించాలి.  అనగా క్రీస్తు ప్రభువు తన చేతులలో కొట్టిన చీలల గాయమును చూపించాడు.  నడుము భాగములో బల్లెము ద్వారా జరిగిన గాయమును చూపించాడు.  అలాగే ప్రకటన 6:9, ''ఆయన అయిదవ ముద్రను విప్పినప్పుడు, దేవుని వాక్యము నిమిత్తమును, తాము ఇచ్చిన సాక్ష్యము నిమిత్తమును వధింపబడినవారి ఆత్మలను బలిపీఠము క్రింద చూచితిని.''  వీరంతా దేవుని కోసము వధింపబడినవారు.  వీరు కూడా ఆయొక్క యోగ్యతను కలిగి కనిపిస్తున్నారు.  ఇప్పటికి అనగా ఆరవ ముద్ర కాలమునకు పునరుత్థానము జరగలేదని గుర్తించాలి.

        ఇందునుబట్టి మనము ఏ స్థితిలో మరణిస్తామో ఆ స్థితి మన మహిమ శరీరములో స్పష్టముగా కనిపిస్తుందని గుర్తించాలి.  అనగా ఒక శిశువు మరణిస్తే వారి ఆత్మ అదే రూపములో ఉంటుంది.  ఆ ఆత్మ అదే స్థితిలో పునరుత్థాన దినమందు మహిమ శరీరమును పొందును.  ముసలితనములో చనిపోయినవారు పునరుత్థాన దినమందు వారి ఆత్మ ఆ ఆకారమునే పొందునని గుర్తించాలి.  అయితే ఈ మట్టి శరీరమువలె కాక మహిమ శరీరమునకు బలహీనత ఉండదుగాని బాధ, వేదన, దు:ఖము, ఆనందములను అనుభవించునని గుర్తించాలి.

        కనుక మరణానంతరము ఆత్మ అదే ఆకారమును కలిగి యుండి మృతుల లోకములో భద్రపరచబడి యుండును.  కనుక భూమిమీద వారు జీవించిన స్థితి వారి బాల్య యవ్వన వార్థక్య రూపాలు ఆత్మలో కనిపిస్తుంది.  అనగా క్రీస్తు ప్రభువు శరీరములో గాయములు, వధింపబడినవారు ఆ వధింపబడినట్లుగానే కనిపిస్తారు.  కాని వీరు మృతుల లోకములోని పరదైసుల వారీగా ఒకే స్థితి కలిగినవారు ఒకేచోట వుండుట జరుగును.  అయితే పాతాళ లోకములో కూడా ఇదే స్థితి ఉంటుంది.  లాజరు ధనవంతుని ఉపమానములో ధనవంతుని ఆత్మను ధనవంతుడుగానే గుర్తించుట జరిగింది.  కనుక పాతాళ లోకములోని ఆత్మలు కూడా వారు శరీరరీత్యా మరణించునప్పటి స్థితి వారి ఆత్మ రూపములో కనిపిస్తుంది.  కనుక అతి భయానకమైన రూపములు అందులో కనిపిస్తాయి.  ఈ స్థితి నుండి వారు బయటకు రాలేరు.  కాని పాతాళ లోకములో కాక మృతుల లోకములోని మిగిలిన భాగములోని ఆత్మలు వారి భౌతిక శరీరమును విడుచునప్పటి ఆకారములు కలిగియున్నను వారు ఆ స్థితి నుండి నెమ్మది పొందుచుందురు.  కనుక స్త్రీ పురుష ఆకారములలోనే కనబడుదురు.  కనుక  ఈ కాలము అనగా ఆత్మ శరీరరీత్యా మరణించినది మొదలు క్రీస్తు రాకడ వరకు వీరు అలాగే ఉండుట జరుగును.

43.   మృతుల లోకములోని ఆత్మయొక్క శరీరము

        భౌతిక శరీరమును విడిచిన ఆత్మలు మహిమ శరీరమును కలిగి మహిమలు కలిగియుండునా?  అన్న సంశయము నా మనస్సున కలిగింది.  దీని కొరకు బహుగా చాలా దినములు ఆలోచిస్తూ వున్నాను.  ఇది మన ఆలోచన జ్ఞానమునకు బహు దూరముగా వున్నదని గ్రహించి నా ప్రార్థనా జీవితములో ప్రభువుని అడిగి తెలుసుకోగలిగితిని.

        మొదట దేవుడు ఆత్మ స్వరూపి.  ఈయన నరుని తన రూపములో సృజించుట జరిగింది.  కాని నరునికి మట్టితో శరీరము రూపమును చేసాడు.  కాని దేవుడు నరునికి ఇచ్చినది జీవాత్మ.  ఈ ఆత్మ దేవుని రూపమును కలిగియున్నది.  ఈ ఆత్మ రూపము అదృశ్య రూపమేగాని కంటికి కనిపించునది కాదు.  అయితే యోహాను బలిపీఠము క్రింద వున్న ఆత్మలను తన దర్శనములో మాత్రమే చూడగలిగినాడుగాని తన కళ్ళతో కాదు.  కనుక ఆత్మయొక్క రూపము అదృశ్యమైనది.

        ఎప్పుడైతే ఆత్మ భౌతిక శరీరమును విడిచినదో, ఈ భౌతిక శరీరము రోజు రోజుకు పురుగులు పాలై మట్టిగా మారిపోవును.  ఆత్మ ఈ శరీర రూపమును కలిగియుండి అదృశ్యముగా వుండునేగాని కంటికి కనిపించదు.  ఈ ఆత్మ భౌతిక శరీరమును విడిచిన తరువాత మృతుల లోకములో భద్రపరచబడి యుండును.  ఆత్మ శరీర ఆకారమును కలిగి యుంటుంది.  కనుక వారు మరణించినప్పుడు ఏ స్థితిలో మరణించారో అదే స్థితిలో వారు వున్నట్లుగా మనము చదువుకొన్నాము.   కాని ఆత్మ ఆకారము వేరు, శరీరము వేరు.  అలాగే శరీరములలో మట్టి శరీరము వేరు, మహిమ శరీరము వేరు.  

మట్టి శరీరము వేరు ఆత్మయొక్క మహిమ శరీరము వేరు ఆత్మయొక్క రూపము వేరు

        మట్టి శరీరము ఆత్మ నర శరీరములో అనగా తల్లి గర్భములో ప్రవేశించినప్పుడు  మట్టి శరీరము తయారు చేసుకొని తొమ్మిది నెలల తరువాత ప్రసవించబడి, జ్ఞానమందు వికసించి అనేకులచే ప్రశంసించబడి లేక చీదరించబడి, చివరకు ఈ శరీరమును వదిలి వెళ్ళిపోవును.  కనుక ఈ మట్టి శరీరము అశాశ్వతమైనది.  కనుకనే మన్నుగా మారిపోతుంది.  ఇక ఈ భౌతిక శరీరమును విడిచిన ఆత్మ శరీర ఆకారమును కలిగి వుంటుందిగాని శరీరమును కలిగి యుండదు.  ఈ శరీరము ఇంతకు ముందులాగా మట్టి శరీరము కాదు.  ఈ శరీరము పునరుత్థాన శరీరము.  ఈ శరీరమును ఆత్మ పొందవలసి యున్నది.  ఇంతకి ఈ ఆత్మ ఈ శరీరమును ఎప్పుడు పొందును?  1 కొరింథీ 15:52, ''కడబూర మ్రోగగానే మనమందరము మార్పు పొందుదుము.''  అలాగే 1 కొరింథీ 15:42-45, ''మృతుల పునరుత్థానమును ఆలాగే శరీరము క్షయమైనదిగా విత్తబడి అక్షయమైనదిగా లేపబడును; ఘనహీనమైనదిగా విత్తబడి మహిమగలదిగా  లేపబడును; బలహీనమైనదిగా విత్తబడి, బలమైనదిగా లేపబడును; ప్రకృతిసంబంధమైన శరీరముగా విత్తబడి ఆత్మసంబంధ శరీరముగా లేపబడును.  ప్రకృతిసంబంధమైన శరీరమున్నది గనుక ఆత్మసంబంధమైన శరీరముకూడ ఉన్నది.  ఇందు విషయమై-ఆదామను మొదటి మనుష్యుడు జీవించు ప్రాణి ఆయెనని వ్రాయబడియున్నది.  కడపటి ఆదాము జీవింపచేయు ఆత్మ ఆయెను.''  కనుక ఈ మట్టి శరీరము పూడ్చబడి, ఆత్మ ఘనహీనముగా మృతుల లోకములో ప్రవేశిస్తుంది.  అయితే ఇది మరల లేపబడు దినము వున్నది.  అదే కడబూర దినము.  ఈ దినమే మృతుల పునరుత్థాన దినము.  1 కొరింథీ 15:23, ''తరువాత క్రీస్తు వచ్చినపుడు ఆయనవారు బ్రదికింపబడుదురు.''  దీనికి ముందు ఆత్మలు శరీరము లేక ఆత్మయొక్క ఆకారములోనే వుండునుగాని శరీరమును కలిగి యుండవు.

        ఇక్కడ మనమొక రహస్యమును తెలుసుకొనవలసి యున్నది.  అదేమిటంటే - ఆత్మయొక్క ఆకారము కూడా ఈ శరీర ఆకారమే.  కనుక మనలో ఈ అంశము అనేక సంశయములు కలిగించవచ్చును.  కాని కడబూర ఊదగానే మృతులు సమాధులలో నుండి శరీరమును మహిమలో పొందుట జరిగి తిరిగి బ్రతికింపబడుదురు.  కనుక మీ భౌతిక శరీరమును విడిచిన ఆత్మ కడబూర ఊదువరకు శరీర రూపమును కలిగి యుండదు.  ఆత్మగానే ఆత్మ రూపములో వుండునని గ్రహించాలి.

        మన శరీరములోని ఆత్మ మన శరీర ఆకారమునే కలిగియుండును.  అయితే ఆత్మ ఆకారము మన కంటికి కనిపించదు.  శరీరము కనిపించును.  ఈ మట్టి శరీరములోనే ఆత్మ అదే ఆకారములో వుంటుంది.  అలాగే మహిమ శరీరమును పునరుత్థాన కాలములో ఆత్మ తిరిగి మరియొకసారి పొందును.  దీనికి ముందు ఆత్మకు శరీరము వుండదు అని మనము గ్రహించాలి.

44.   మృతుల లోకములో ఆత్మ సంచారము

        సాధారణముగా ఆత్మ తిరుగుచూ వుంటుంది.  కాని మృతుల లోకములోని ఆత్మలు తిరుగుట యుండదు.  ఆత్మ భౌతిక శరీరమును విడిచిన తరువాత, ఆ ఆత్మ మృతుల లోకములో వుంచబడును.  లాజరు ధనవంతుని ఉపమానములో వారు వున్నచోటనే వున్నారుకాని కదలినట్లు, వేరొక చోటుకు వెళ్ళినట్లుగా లేదు.  అలా వెళ్ళుటకు అవకాశము లేనట్లుగా చెప్పబడినది.  అలాగే ప్రకటన 6:9-11, ''ఆయన అయిదవ ముద్రను విప్పినప్పుడు, దేవుని వాక్యము నిమిత్తమును, తాము ఇచ్చిన సాక్ష్యము నిమిత్తమును వధింపబడినవారి ఆత్మలను బలిపీఠము క్రింద చూచితిని.  వారు-నాథా, సత్యస్వరూపీ, పరిశుద్ధుడా, యెందాక తీర్పు తీర్చకయు, మా రక్తము నిమిత్తము భూనివాసులకు ప్రతిదండన చేయకయు ఉందువని బిగ్గరగా కేకలువేసిరి.  తెల్లని వస్త్రము వారిలో ప్రతివాని కియ్యబడెను; మరియు వారివలెనే చంపబడబోవువారి సహదాసులయొక్కయు సహోదరులయొక్కయు లెక్క పూర్తియగువరకు ఇంక కొంచెము కాలము విశ్రమింపవలెనని వారితో చెప్పబడెను.''  ఈ ఆత్మలు బలిపీఠము క్రింద వుండి ధర్నాను నిర్వహిస్తున్నాయిగాని అక్కడ నుండి కదలి వచ్చి క్రీస్తు ప్రభువును ఎదుర్కొన్నట్లుగా వ్రాయబడలేదు.  కాని ఆత్మ స్వతంత్ర మనస్సును కలిగి యున్నను వారు అందు నుండి వేరొక చోటుకు వెళ్ళు అవకాశము లేదు.  యెషయా 14:15-17, ''నీవు పాతాళమునకు నరకములో ఒక మూలకు త్రోయబడితివే.  నిన్ను చూచువారు నిన్ను నిదానించి చూచుచు ఇట్లు తలపోయుదురు  -భూమిని కంపింపజేసి రాజ్యములను వణకించినవాడు ఇతడేనా?  

మృతుల లోకము విడిచి ఆత్మ తిరుగుటకు అవకాశము లేదు, కనుక అవి వున్న చోటనే పునరుత్థాన దినము వరకు వుంటాయి

లోకమును అడవిగాచేసి దాని పట్టణములను పాడు చేసినవాడు ఇతడేనా?  తాను చెరపట్టినవారిని తమ నివాసస్థలమునకు పోనియ్యనివాడు ఇతడేనా?''  ఇది కొంతమంది సాతానును చూచుచున్నట్లుగా చెప్పబడినది.  వీరిలో కదలిక వున్నట్లుగా చెప్పబడినది.  ఇది జరిగేది పాతాళ లోకములోనే.  అనగా ఇది మృతుల లోకములో జరుగుచున్నది గాని ఈ కార్యము సాతాను బంధింపబడినప్పుడు జరుగుచున్నది.  సాతాను బంధింపబడి పాతాళ లోకము అను అగాధములో పడవేయబడును.  ప్రకటన 20:1-3, ''మరియు పెద్దసంకెళ్లను చేత పట్టుకొని అగాధముయొక్క తాళపుచెవిగల యొక దేవదూత పరలోకము నుండి దిగివచ్చుట చూచితిని.  అతడు ఆదిసర్పమును, అనగా అపవాదియు సాతానును అను ఆ ఘటసర్పమును పట్టుకొని వెయ్యి సంవత్సరములు వానిని బంధించి అగాధములో పడవేసి, ఆ వెయ్యి సంవత్సరములు గడచువరకు ఇక జనములను మోసపరచకుండునట్లు అగాధమును మూసి దానికి ముద్ర వేసెను; అటుపిమ్మట వాడు కొంచెము కాలము విడిచి పెట్టబడవలెను.''  అటుతరువాత క్రీస్తు వెయ్యి సంవత్సరములు పరిపాలన జరుగును.  దీనికి ముందు క్రీస్తు ప్రభువు తీర్పు తీర్చును.  దీనికి ముందు ఆత్మలు పునరుత్థానమును పొందును కనుక ఈ వచనములో పాతాళ లోకములో వున్న ఆత్మలు తిరుగుతూ సంచారము చేయుచున్నట్లుగా చెప్పబడినది.  అయితే పునరుత్థానమునకు ముందు అనగా ఆత్మ భౌతిక శరీరమును విడిచినది మొదలు పునరుత్థానమునకు ముందు వరకు మృతుల లోకములో వారి వారి కార్యములను బట్టి అవి వాటి ప్రాంతాలలో వుండును.  అక్కడ నుండి అవి తిరుగుటకు అవకాశము లేదు.  ఇది ఒక రకముగా బంధన అని చెప్పవచ్చును.  ప్రకటన 20:4-5, ''అంతట సింహాసనములను చూచితిని; వాటిమీద ఆసీనులై యుండువారికి విమర్శచేయుటకు అధికారము ఇయ్యబడెను.  మరియు క్రూరమృగమునకైనను దాని ప్రతిమకైనను నమస్కారముచేయక, తమ నొసళ్లయందు గాని చేతులయందు గాని దాని ముద్రవేయించుకొనని వారిని, యేసు విషయమై తామిచ్చిన సాక్ష్యము నిమిత్తమును దేవుని వాక్యము నిమిత్తమును శిరచ్ఛేదనము చేయబడిన వారి ఆత్మలను చూచితిని.  వారు బ్రదికినవారై, వెయ్యి సంవత్సరములు క్రీస్తుతోకూడ రాజ్యము చేసిరి.  ఆ వెయ్యి సంవత్సరములు గడచువరకు కడమ మృతులు బ్రదుకలేదు; ఇదియే మొదటి పునరుత్థానము.''  ఇందులో యోహాను చూచిన ఆత్మలు బ్రతుకుట ఏమిటి?  అంటే ఇంతవరకు బంధకములో వుండి నెమ్మది పొందుచున్న ఆత్మలకు ఇప్పుడు విడుదల కలిగింది.  కనుక అవి మన వలె శరీరమును మహిమలో పొంది సంచారము చేయు యోగ్యతను పొందుచున్నారు.  దీనినే పునరుత్థానముగా చెప్పబడినది.  కనుక పునరుత్థానమునకు ముందు మనము చెప్పుకొనుచున్న ఆత్మలు బ్రదికిన స్థితిలో స్వతంత్రముగా సంచారము చేయు యోగ్యత వుండదు.

        కనుక ఈ ఆత్మలను ఏ స్థితిలో మిఖాయేలు సాతానులు వుంచుదురో అదే స్థితిలో వారు పునరుత్థాన దినము వరకు ఉండాలి.

45.  144000 మంది పరిశుద్ధులు లేక అనింద్యులయొక్క సంచారములు

         పరిశుద్ధులుగా వుండినవారు భూమిపై మరణించిన తరువాత వారి ఆత్మను మిఖాయేలు దూత వారి వారి కార్యములనుబట్టి మృతుల లోకములోని పరదైసులలో వదిలిపెట్టును.  అక్కడ ఆ ఆత్మలు సంచార జీవితమును జీవించునని గుర్తించాలి.  అక్కడ వారికి అన్ని రకములైన వసతులతో కూడిన గృహములు కలిగి యుంటారు.  యోెహాను 14:2.  తినుటకు జీవవృక్ష ఫలములు పరదైసులో వున్నవని ప్రకటన 2:7లో చెప్పబడి యున్నది.  యోహాను 10:9, ''నేనే ద్వారమును;  నా ద్వారా ఎవడైన లోపల ప్రవేశించిన యెడల వాడు రక్షింపబడినవాడై, లోపలికి పోవుచు బయటికి వచ్చుచు మేత మేయుచుండును.'' ఇందునుబట్టి రక్షింపబడినవాడు పరదైసులో అటుఇటు తిరుగుటకు ఇంకా పరదైసులను దాటి తిరుగుటకు యోగ్యుడని గ్రహించాలి.

పరిశుద్ధులు పరిశుద్ధులే.  వీరిని దేవుడు తనతో సమానముగా చూచుకొనును.  కనుక వీరి ఆత్మలకు నిబంధనలు లేక స్వేచ్ఛగా వుందురు

        పాత నిబంధన కాలము నాటి ఏలీయా, మోషేలలో ఏలీయా సుడిగాలిలో ఆరోహణమై పోగా మోషే మరణించినవాడే.  కాని క్రీస్తు ప్రభువు కాలములో కొండపై క్రీస్తు ప్రభువు రూపాంతరము పొందినప్పుడు కనిపించారు.  లూకా 9:28-31, ''ఈ మాటలు చెప్పినది మొదలుకొని రమారమి యెనిమిది దినములైన తరువాత, ఆయన పేతురును యోహానును యాకోబును వెంటబెట్టుకొని, ప్రార్థన చేయుటకు ఒక కొండ యెక్కెను.  ఆయన ప్రార్థించుచుండగా ఆయన వస్త్రములు తెల్లనివై ధగధగ మెరిసెను.  మరియు ఇద్దరు పురుషులు ఆయనతో మాటలాడుచుండిరి, వారు మోషే ఏలీయా అనువారు.  వారు మహిమతో అగపడి, ఆయన యెరూషలేములో నెరవేర్చబోవు నిర్గమమునుగూర్చి మాటలాడుచుండిరి.''  అలాగే 1,44,000 మంది కూడా క్రీస్తుతోబాటుగా సంచారము చేయుచుందురని చెప్పబడినది.  ప్రకటన 14:1 మరియు ప్రకటన 14:4.  ఇలాంటి వీరు క్రీస్తు ప్రభువుతో కూడా వుండి, ఆయన శత్రువులను జయించుదురు.  ప్రకటన 17:14, ''వీరు గొఱ్ఱెపిల్లతో యుద్ధము చేతురు గాని, గొఱ్ఱెపిల్ల ప్రభువులకు ప్రభువును రాజులకు రాజునై యున్నందునను, తనతోకూడ ఉండినవారు పిలువబడినవారై, యేర్పరచ బడినవారై, నమ్మకమైనవారై యున్నందునను, ఆయన ఆ రాజులను జయించును.''

        ఇలా పరిశుద్ధులుగా చెప్పబడినవారు క్రీస్తుకు నమ్మకస్థులుగా వుండి ఆయనతోబాటుగా సంచరించు యోగ్యతను కలిగియున్నారు.  అందుకే వీరిని సజీవులని చెప్పబడినది.  ఈ 1,44,000 మంది ఆత్మలకుగాని వారు పునరుత్థానము ద్వారా పొందిన శరీరమునకుగాని ఎటువంటి నిబంధన లేక తిరుగుటకు అవకాశము ఇయ్యబడినది.

46.  ఆత్మలయొక్క వాహనములు

        ప్రకటన 19:14, ''పరలోకమందున్న సేనలు శుభ్రమైన తెల్లని నారబట్టలు ధరించుకొని తెల్లని గుఱ్ఱము లెక్కి ఆయనను వెంబడించుచుండిరి.''  ఈ సేనలు ప్రకటన 17:14, ''వీరు గొఱ్ఱెపిల్లతో యుద్ధము చేతురు గాని, గొఱ్ఱెపిల్ల ప్రభువులకు ప్రభువును రాజులకు రాజునై యున్నందునను, తనతోకూడ ఉండినవారు పిలువబడినవారై, యేర్పరచ బడినవారై, నమ్మకమైనవారై యున్నందునను, ఆయన ఆ రాజులను జయించును.''  వీరందరు పరిశుద్ధులుగా గుర్తించాలి.  వీరు గుఱ్ఱములను తమ వాహనములుగా ఉపయోగించుకొని సంచరించుచున్నారు.  ప్రకటన 19:11-21లో జరుగు యుద్ధము చివరి యుద్ధము.  ఈ యుద్ధములో సాతాను క్రూరమృగము రూపములో భూరాజులను తన ప్రవక్తయైన అబద్ధ ప్రవక్త ద్వారా పురికొల్పి రాజాధిరాజైన క్రీస్తు ప్రభువుతోను, అతని సైన్యముతోను యుద్ధము చేయ సంకల్పించును.  ఈ సమయమునకు ఈ భూమి మీద పరిశుద్ధులనేవారే యుండరు.  అందరు అపరిశుద్ధులు అనగా కడమవారుగా వుందురు.  పరిశుద్ధులు లేని ఆ కాలములో క్రూరమృగముతో యుద్ధము చేయుటకు, పరిశుద్ధుల ఆత్మలు క్రీస్తుతో కూడా సహకరించునని గుర్తించాలి.  వీరు తెల్లని గుఱ్ఱములను తమ వాహనములుగా చేసుకొని క్రూరమృగముతో యుద్ధము చేయుదురు.  ఇది చివరి యుద్ధము.  ఈ యుద్ధము తరువాత జనులు ఉండరు.  ఈ మట్టి శరీర జీవితమునకు సమాప్తము.

రాజులకు రాజు పభ్రువులకు పభ్రువు యొక్క సైన్యము, అగ్ని రథాలు, అగ్ని గురాల్రు మన ఊహకు అందని నిజాలు. వాటిని చూసిన వాటిలో పయ్రాణించిన వారు ధన్యులే!

        అయితే తెల్లని గుఱ్ఱములు పరిశుద్ధులు ఆత్మలకు వాహనములుగా వుండి వారిని ఆకాశములను దాటించి భూమి మీదకు తీసుకొని వస్తాయి.  అంటే ఈ ఆకాశము దాటి అవతల వుండు 2, 3, 4, 5, 6వ మరియు 7వ ఆకాశమైన పరలోకము మధ్యలలో పెద్ద పెద్ద అగాధములు వుండును.  అటువంటి అగాధములను సైతము దాటి రాగల శక్తివంతమైనవిగా గ్రహించాలి.  ఈనాడు విమానాలు, రాకెట్లలతో మన శాస్త్రజ్ఞులు ఒక గ్రహము నుండి ఇంకొక గ్రహానికి పోగలుగుచున్నాము గాని ఇంకొక నక్షత్ర మండలములోనికి పోలేకున్నాము.  అయితే ఈ తెల్లని గుఱ్ఱములు ఈ సూర్య, చంద్ర నక్షత్రాదులు వున్న ఆకాశమును దాటి మరియొక ఆకాశములలోకి వెళ్ళగలిగిన శక్తివంతమైనవిగా గ్రహించాలి.  ఈ వాహనమలుగా చెప్పబడిన గుఱ్ఱములు కూడా ఆత్మ రూపములే ఆత్మయొక్క అద్భుత శక్తులే అని గ్రహించాలి.

        ఇలాంటివి అపరిశుద్ధులు ఉండే ప్రాంతములో వుండవని గ్రహించాలి, ఎందుకంటే ఈ వాహనములు క్రీస్తుతో కూడా వుండువారికి మాత్రమే ఇయ్యబడునని గ్రహించాలి.  కనుక అపరిశుద్ధులు వాహనములు కలిగి యుండరు.

        2 రాజులు 2:11, ''వారు ఇంక వెళ్లుచు మాటలాడుచుండగా ఇదిగో అగ్ని రథమును అగ్ని గుఱ్ఱములును కనబడి వీరిద్దరిని వేరు చేసెను; అప్పుడు ఏలీయా సుడిగాలి చేత ఆకాశమునకు ఆరోహణమాయెను.''  ఈ విధమైన వాహనములు దేవునియొద్ద వున్నట్లుగా చెప్పబడినది.  ఈ వాహనములు ఏలీయాను పరదైసులోకి భూమినుండి తీసుకొని పోవుటకు వచ్చినట్లుగా చెప్పబడినది.  ఒక సుడిగాలి వచ్చి తీసుకొని పోవును అని అనుటలో వాటి వేగము చాలా చాలా ఎక్కువని గ్రహించాలి.  ఇలాంటి వాహనములనే దేవుడు పరిశుద్ధులకు ఇచ్చునని గ్రహించాలి.

47.  మృతుల లోకములోని ఆత్మల జీవన విధానము

        లాజరు ధనవంతుని ఉపమానములో క్రీస్తు ప్రభువు ధనవంతుడు పాతాళ లోకములో ఉంటున్నట్లుగా చెప్పబడినది.  లూకా 16:22-24, ''ఆ దరిద్రుడు చనిపోయి దేవదూతలచేత అబ్రాహాము రొమ్మున (ఆనుకొనుటకు) కొనిపోబడెను.  ధనవంతుడు కూడ చనిపోయి పాతిపెట్టబడెను.  అప్పుడతడు పాతాళములో బాధపడుచు, కన్నులెత్తి దూరమునుండి అబ్రాహామును అతని రొమ్మున (ఆనుకొనియున్న) లాజరును చూచి -తండ్రివైన అబ్రాహామా, నాయందు కనికరపడి, తన వ్రేలికొనను నీళ్లలోముంచి నా నాలుకను చల్లార్చుటకు లాజరును పంపుము; నేను ఈ అగ్నిజ్వాలలో యాతనపడుచున్నానని కేకలువేసి చెప్పెను.''  

        ఈ విధముగా మృతుల లోకములో ఒకరు సేద దీరుతూ ఇంకొకరు వేదన అనుభవిస్తూ ఉన్నారు.  అబ్రాహాము ధనవంతుడు ఇద్దరును కూడా మాట్లాడుకొనుచున్నారు.  ఇందులో ధనవంతుడు స్వతంత్రముగా అబ్రాహామును అడుగుచున్నాడు.  నీరు కావాలని, నీటిని పంపించమని, తన దాహమును తీర్చమని అడుగుచున్నాడు.  అంటే ధనవంతుడు మనవలె జీవమును కలిగి స్వతంత్ర మనస్సును కలిగి యున్నట్లుగా మనము గుర్తించాలి.  అనగా మనవలె ఆలోచనాశక్తి కలిగిన ధనవంతునిలోని ఆత్మ అబ్రాహామును అడుగుచున్నాడు.

 స్థితిలో ఆత్మ మృతుల లోకమునకు వెళ్ళునో  స్థితిలో పునరుత్థాన దినము

వరకు వుండవలయును

        అందుకు అబ్రాహాము స్వతంత్య్రముగా మనము వ్యవహరించుటకు అవకాశము లేదు అని చెప్పుచున్నాడు.  ఎలా?  లూకా 16:25-26, ''అందుకు అబ్రాహాము కుమారుడా, నీవు నీ జీవితకాలమందు నీకిష్టమైనట్టు సుఖము అనుభవించితివి, ఆలాగుననే లాజరు కష్టము అనుభవించెనని జ్ఞాపకము చేసికొనుము;  ఇప్పుడైతే వాడు ఇక్కడ నెమ్మది పొందుచున్నాడు, నీవు యాతన పడుచున్నావు.  అంతేకాక ఇక్కడనుండి మీయొద్దకు దాట గోరువారు దాటి పోజాలకుండునట్లును, అక్కడి వారు మాయొద్దకు దాటి రాజాలకుండునట్లును, మాకును మీకును మధ్య మహా అగాధముంచబడియున్నదని చెప్పెను.''  భూమి మీద నీవు చేసిన కార్యములనుబట్టి ఇక్కడ నీవు యాతన అనుభవిస్తున్నావు అయితే లాజరు నెమ్మది పొందుచున్నాడు అని చెప్పుచున్నాడు.  ఇందునుబట్టి, స్వతంత్రముగా మాట్లాడుటకు ఆత్మ మనస్సును కలిగియున్నదిగాని అనుకూలమైన స్థితి వారికి అక్కడ సమకూర్చబడవు.  అంతేకాదు కనీసము వారంతట వారు తమ మనస్సుకు వచ్చినట్లుగా చేసుకొను అవకాశము కూడా వారికి లేదు.  అనగా వారి ఆత్మ తెలివిని కలిగి ఆలోచనాశక్తిని పొందియున్నదిగాని తన కొరకు తను ఏమియు చేయలేని స్థితిలో వుంటుంది.  దీనినే అచేతన స్థితి అని చెప్పవచ్చును.  ఏ విధముగా కప్ప సుషుప్తావస్థను పొంది మట్టి పొరలలో జీవించునో, అదే విధముగా ఆత్మ మృతుల లోకములో జీవించును.  కప్పకు సుషుప్తావస్థ కాలములో అనగా నీరు లేని కాలములో మట్టి పొరలలోకి వెళ్ళి ప్రతికూల పరిస్థితిని తప్పించుకొనుటకు బాధాకరమైన స్థితిలో అది జీవించును.  అలాగే ఆత్మ యాతన అనుభవిస్తున్నను ఏమి చేయలేని స్థితిలో అక్కడ జీవిస్తుంది.  అందుకే వీరు బ్రతికి లేరు అని చెప్పుచున్నాడు.  అనగా వీరి స్థితిని మార్చుకొను అవకాశము వారికి లేదు.  ఎఫెసీ 2:1 మరియు ప్రకటన 3:1లో వలె వారే స్థితిలో అయితే అక్కడకు చేర్చబడిరో అదే స్థితిలో వేదన అనుభవించుదురుగాని వారికి విడుదల ఉండదు.  వారికి ఆ అవకాశమే లేదు.

        ఉదా :-  భూమి పైన కరువు వచ్చి నరులకు యాతన ఎక్కువైనప్పుడు మనము వేరొక ప్రాంతమునకు వెళ్ళి జీవించు అవకాశము మనకు ఉన్నది.  ఇది దేవుడు మనపై ఆయనకున్న ప్రేమ కొద్ది ఇచ్చిన అవకాశము.  అలా నరులు వారి వారి మనస్సుకు నచ్చిన చోట జీవించవచ్చును.  కాని ఆత్మకు ఈ అవకాశము లేదు.  అది ఎక్కడకైతే చేర్చబడునో అక్కడ దానికి ఇష్టము లేకపోయినను జీవించాలి.  అనగా యాతన ఎక్కువగా ఉన్నను ఖచ్చితముగా అక్కడ దేవుని రెండవ రాకడ వరకు ఉండవలసినదే.  అందుకే వీరు బ్రతికి లేరు అంటే ప్రకటన 3:1 ఆత్మకు మరణము లేదు.  ఆత్మ జీవించుచున్నదన్న మాటేగాని అది మృతమైనదే అని ప్రకటన 20:4-6లో చెప్పబడినది.  పునరుత్థాన కాలమువరకు వీరు అదే స్థితిలో ఉంటారు.  భూమిపై వారు ఏ స్థితిలో మరణించారో వారు అదే స్థితిలో వారి కార్యములను బట్టి నెమ్మది పొందుట లేక యాతన పొందుట జరుగును.

        కనుక జీవము కలిగినవారు స్వతంత్రత కలిగి వారు మనస్సుకు నచ్చిన దగ్గరకు మనవలె వెళ్ళవచ్చును.  అటువంటివారిని జీవము కలిగినవారుగా చెప్పబడినది.  ఇలా జీవించుటకు యోగ్యత లేనివారిని మృతులుగాను బ్రతికిలేరని చెప్పబడినది.  అయితే పరిశుద్ధులుగా జీవించి దేవుని కోసము ప్రాణ త్యాగము చేసినను వీరు విశ్రాంతికరమైన పరదైసులలో సంచరింతురుగాని క్రీస్తు ప్రభువుతో సంచరించుటకుగాని, పరలోక రాజ్యములో ప్రవేశించుటకు ప్రస్తుతము వారికి విశ్రాంతి కాలము గనుక బూర మ్రోగువరకు వారికి అవకాశము లేదు.  (అనగా బ్రతికి లేరు.)  కనుకనే మొదటి పునరుత్థాన కాలములో వీరు జీవమును అనగా వీరు మనస్సుకు నచ్చినట్లుగా జీవించుటకు తిరిగి లేపబడుచున్నారు.  ప్రకటన 20:4-6, ''అంతట సింహాసనములను చూచితిని; వాటిమీద ఆసీనులై యుండువారికి విమర్శచేయుటకు అధికారము ఇయ్యబడెను.  మరియు క్రూరమృగమునకైనను దాని ప్రతిమకైనను నమస్కారముచేయక, తమ నొసళ్లయందు గాని చేతులయందు గాని దాని ముద్రవేయించుకొనని వారిని, యేసు విషయమై తామిచ్చిన సాక్ష్యము నిమిత్తమును దేవుని వాక్యము నిమిత్తమును శిరచ్ఛేదనము చేయబడిన వారి ఆత్మలను చూచితిని.  వారు బ్రదికినవారై, వెయ్యి సంవత్సరములు క్రీస్తుతోకూడ రాజ్యము చేసిరి.  ఆ వెయ్యి సంవత్సరములు గడచువరకు కడమ మృతులు బ్రదుకలేదు;  ఇదియే మొదటి పునరుత్థానము.  ఈ మొదటి పునరుత్థానములో పాలుగలవారు ధన్యులును పరిశుద్ధులునై యుందురు.  ఇట్టివారిమీద రెండవ మరణమునకు అధికారము లేదు;  వీరు దేవునికిని క్రీస్తుకును యాజకులై క్రీస్తుతోకూడ వెయ్యి సంవత్సరములు రాజ్యము చేయుదురు.''  కనుక దీనిలో జీవము పునరుత్థానము ద్వారా పొందినవారు దానికి ముందు వారిలో జీవము లేదా?  వున్నదిగాని వారు స్వతంత్రముగా చేయుటకు అవకాశము వుండదు.  ప్రకటన 6:9-10, ''ఆయన అయిదవ ముద్రను విప్పినప్పుడు, దేవుని వాక్యము నిమిత్తమును, తాము ఇచ్చిన సాక్ష్యము నిమిత్తమును వధింపబడినవారి ఆత్మలను బలిపీఠము క్రింద చూచితిని.  వారు-నాథా, సత్యస్వరూపీ, పరిశుద్ధుడా, యెందాక తీర్పు తీర్చకయు, మా రక్తము నిమిత్తము భూనివాసులకు ప్రతిదండన చేయకయు ఉందువని బిగ్గరగా కేకలువేసిరి.''  వీరు బలిపీఠము క్రింద పరదైసులో వుండుటకు కారణమేమి?

మృతుల లోకములోని ఆత్మలు స్వతంత్రముగా వారి ఇష్టము ప్రకారము జీవించు అవకాశము లేదు అయినను వారు తెలివితోను ఆలోచనలతోను జీవిస్తారు

        ప్రకటన 6:11, ''తెల్లని వస్త్రము వారిలో ప్రతివాని కియ్యబడెను;  మరియు వారివలెనే చంపబడబోవువారి సహదాసులయొక్కయు సహోదరులయొక్కయు లెక్క పూర్తియగువరకు ఇంక కొంచెము కాలము విశ్రమింపవలెనని వారితో చెప్పబడెను.''   వారిని ఇంకొంత కాలము అక్కడే విశ్రాంతిలో వుండుమని చెప్పబడినదిగాని వారి మనస్సు వచ్చినట్లు చేయమని చెప్పబడలేదు.  కనుక మరణించిన ప్రతి ఒక్కరి ఆత్మ భూమి మీద వున్న స్థితి వారికి మృతుల లోకములో వుండదు.  భూమిపై మనము పుణ్యము చేయవచ్చును లేక పాపము చేయవచ్చును.  అలాగే భూమిపై మనము మన ఇష్టానుసారముగా జీవించవచ్చును. కాని మృతుల లోకములోని ఆత్మ భూమిపై జీవించిన దాని వలె జీవించుటకు అవకాశము లేదు.  అనగా ధనవంతునికి నెమ్మది రాదు.  లాజరుకు యాతన రాదు.  ఇలాంటి స్థితిలో వారు నివసించుట జరుగును.

48.  మన మరణానంతరము మన ఆత్మ చూడగలిగి తెలివితోనే ఉండునా?

        ప్రసంగి 12:7, ''మన్నయి నది వెనుకటివలెనే మరల భూమికి చేరును, ఆత్మ దాని దయచేసిన దేవుని యొద్దకు మరల పోవును,''  అని అనుటలో మన మరణానంతరము మన శరీరము మట్టి నుండి తీయబడినది కనుక మట్టిలోనే కలవవలసి యున్నది.  కనుక మట్టిలో కలసిపోవును.  

        ఇక కొన్ని రోజులు తరువాత ఈ శరీరము ఎవరికి కనిపించదు.  కాని ఆత్మ దేవునియొద్దకు వెళ్ళవలసి యున్నది.  కాని ప్రతి ఆత్మ దేవుని యొద్దకు వెళ్ళదు.  కొన్ని పాతాళములో బంధింపబడి అటుతరువాత తీర్పుకు లోనై రెండవ మరణమును పొందునని మనము తరువాతి విభాగాలలో సంపూర్ణముగా తెలుసుకొందము.  ఇందునుబట్టి, ఆత్మ దానిని దయచేసిన దేవుని యొద్దకు మరల పోవును అని చెప్పుట దేవునియొక్క ఉద్ధేశ్యమై యున్నది.  అంటే దేవునికి ఏ ఆత్మ నశించుట ఇష్టము లేదు.  యోహాను 17:12, ''నేను వారియొద్ద ఉండగా నీవు నాకు అనుగ్రహించినవారిని నీ నామమందు కాపాడితిని; నేను వారిని భద్రపరచితిని గనుక లేఖనము నెరవేరునట్లు నాశన పుత్రుడు తప్ప వారిలో మరి ఎవడును నశింపలేదు.''    

మనకన్నా ఎక్కువ గహ్రించగలిగే శక్తి ఆత్మకు వున్నది మనలాగే ఆత్మలు మాట్లాడును

        క్రీస్తు ప్రభువుకు కూడా ఏ ఆత్మ నశించుట ఇష్టము లేదని తెలుసుకొన్నాము.  కాని మనము చేయు పాపములు మనలను దేవుని నుండి దూరపరచును.

        కనుక మనలోని ఆత్మ ఈ లోకము నుండి తిరిగి అంచలంచెలుగా దేవుని సన్నిధిని చేరవలసి యున్నది.  అలా వెళ్ళవలెనంటే ఆత్మ తెలివితోనే ఉండవలెనని గ్రహించాలి.  అంతేకాకుండా సమస్తమును చూడగలుగును గ్రహించగలుగునని మాట్లాడునని మనము లూకా 16:22-31లో లాజరు ధనవంతుని ఉపమానములో చదువుకొనగలము.  ధనవంతుడు వేదన అనుభవిస్తూ అబ్రాహామును నీళ్ళ కొరకు అడుగుచున్నాడంటే వారు తెలివితోనే వుందురని మనకు అర్థమగుచున్నది.  ప్రకటన 6:9-11లో దేవుని వాక్యము నిమిత్తము తాము ఇచ్చిన సాక్ష్యము నిమిత్తము మరణించిన వారి ఆత్మలు క్రీస్తు ప్రభువును ప్రతిదండన అడుగుచున్నాయంటే ఆత్మలు విశ్రాంతిలో వున్న కూడా తెలివితోనే వున్నాయని అర్థమగుచున్నది.  కనుక పాతాళ లోకములోని ధనవంతుడేమి, సమాధానకర పరదైసులో బలిపీఠము క్రింద విశ్రాంతిలో వున్న ఆత్మలేమి ఏవైన తెలివిని కలిగి గ్రహించగలిగే స్థితిలో వున్నట్లుగా మనకు అర్థమగుచున్నది.  మనలాగనే ఆత్మలు మాట్లాడునని, మనకన్నా ఎక్కువ గ్రహించగలిగే శక్తి ఆత్మకు ఉన్నట్లుగా మనము గ్రహించాలి.  యెషయా 14:15-17, ''నీవు పాతాళమునకు నరకములో ఒక మూలకు త్రోయబడితివే.  నిన్ను చూచువారు నిన్ను నిదానించి చూచుచు ఇట్లు తలపోయుదురు  -భూమిని కంపింపజేసి రాజ్యములను వణకించిన వాడు ఇతడేనా?  లోకమును అడవిగాచేసి దాని పట్టణములను పాడు చేసినవాడు ఇతడేనా?  తాను చెరపట్టినవారిని తమ నివాసస్థలమునకు పోనియ్యనివాడు ఇతడేనా?''  సాతాను పాతాళములో ఒక మూలకు త్రోయబడిన తరువాత పాతాళ లోకములో వేదనను అనుభవిస్తున్న ఆత్మలు వానిని చూచి పై విధముగా తలపోయుచున్నారంటే ఆ ఆత్మలు తెలివితో వుండడమే కాకుండా ఆలోచనాశక్తిని కలిగియున్నట్లుగా మనము గ్రహించాలి.  కనుక, ఆత్మ చూడగలుగుట అన్ని విధాలుగా తెలివిని కలిగియుండి, ప్రతిది తెలుసుకొనగలిగి యుండునని మనము గ్రహించాలి.

49.  వధింపబడి మరణించిన కొన్ని ఆత్మలలో ప్రతీకార ఆలోచన

        ప్రకటన 6:9-11, ''ఆయన అయిదవ ముద్రను విప్పినప్పుడు, దేవుని వాక్యము నిమిత్తమును, తాము ఇచ్చిన సాక్ష్యము నిమిత్తమును వధింపబడినవారి ఆత్మలను బలిపీఠము క్రింద చూచితిని.  వారు-నాథా, సత్యస్వరూపీ, పరిశుద్ధుడా, యెందాక తీర్పు తీర్చకయు, మా రక్తము నిమిత్తము భూనివాసులకు ప్రతిదండన చేయకయు ఉందువని బిగ్గరగా కేకలువేసిరి.  తెల్లని వస్త్రము వారిలో ప్రతివాని కియ్యబడెను;  మరియు వారివలెనే చంపబడబోవువారి సహదాసులయొక్కయు సహోదరులయొక్కయు లెక్క పూర్తియగువరకు ఇంక కొంచెము కాలము విశ్రమింపవలెనని వారితో చెప్పబడెను.''

        దేవుని కోసము వధింపబడి మరణించుట దేవునికి ఇష్టమైన చర్య, ఎందుకంటే వారు వధింపబడేది దేవుని వాక్యము నిమిత్తము, తాము ఇచ్చిన సాక్ష్యము నిమిత్తము.  తన నిమిత్తము వారు ఈ లోకమునకు విరోధులై యున్నను దేవుని నిమిత్తము సాతానుకు విరోధులైయ్యారు.  కనుక సాతాను ఈ లోకమును  ప్రేరేపించి వారిని వధించుచున్నదని గ్రహించాలి.

        ఈ విధముగా దేవుని వాక్యము నిమిత్తము, తాము ఇచ్చిన సాక్ష్యము నిమిత్తము వధింపబడుట క్రీస్తు బలియాగములో తాము పాలి భాగస్థులై తమను జతపరచుకొనుటయే అగును.  కనుక వీరు భూజనులందరిలోకి ఆధిక్యతను కలిగియుండి బలిపీఠము క్రింద విశ్రాంతి తీసుకొనుచున్నారు.  వారు యుగాంతమునకు ముందు 5వ ముద్ర కాలములో క్రీస్తు ప్రభువును అడుగుచూ తీర్పు తీర్చమని మా రక్తానికి బదులు చెప్పమని బిగ్గరగా కేకలు వేస్తున్నారు.  అయితే క్రీస్తు ప్రభువు మరి కొంతకాలము విశ్రాంతిలో వుండమని వారివలె చంపబడబోవు వారి లెక్క పూర్తి కావాలని చెప్పుచున్నాడు.

        ఇందునుబట్టి ఈ యుగ ఆరంభమైనది మొదలు వధింపబడినవారు బలిపీఠము క్రింద విశ్రాంతిలో వున్నను వారు భూజనులపై కోపమును కలిగియున్నట్లుగా గ్రహించాలి.  ఎందుకంటే వారు నిర్దోషులమైన మమ్ములను చంపి వారు భార్యా బిడ్డలతో సుఖాలనుభవిస్తున్నారు.  ఇది సహించరాని విషయము.  అందుకే వారు వారికి తీర్పుతీర్చి మా రక్తానికి బదులు చెప్పమని క్రీస్తు ప్రభువునుఅడుగుచున్నారు.  వీరి కోపము దుర్మార్గులైన భూజనులపైనే కాని క్రీస్తు ప్రభువు పైన కాదు.  కనుకనే వీరు క్రీస్తు ప్రభువును - నాథా, సత్యస్వరూపీ, పరిశుద్ధుడా అని పిలుస్తున్నారు.

కొన్ని ఆత్మలు భూమిపై తాము శరీరరీత్యా చిందించిన రక్తమునకు బదులుగా ప్రతీకారము చేయమని క్రీస్తు పభ్రువును అడుగుట

        ఇలా పరిశుద్ధులను భూజనులు సాతాను ప్రేరణతో వధిస్తూ పోతే చివరకు వారి లెక్క పూర్తి అయిన వెంటనే - భూజనుల నాశనము మొదలగును.  యుగాంతము ద్వారా భూమిపై జనులు ప్రతి ఒక్కరు వధింపబడుటయేగాక, వీరు మృతుల లోకములో బాధను అనుభవిస్తారు.  అటుతర్వాత 1000 సంవత్సరముల క్రీస్తు పరిపాలన తరువాత వారికి తీర్పు తీర్చబడి వారు నిత్యనరకాగ్ని గుండములో పాలుపొందుదురు.  త్వరగా వీరికి శిక్షను విధింపమని వారి రక్తానికి ప్రతిగా వారు శిక్ష అనుభవించాలన్న తలంపుతో ఈ వధింపబడిన ఆత్మలు తమలోని ప్రతీకార ఆలోచనను తెలియజేయుచున్నారు.

50.  ఆత్మలయొక్క భాష

        ఆత్మలకు క్రీస్తు ప్రభువును గూర్చిన బోధ జరుగునని తెలుసుకొన్నాము.  అయితే ఈ బోధ అనగా ఈ నిత్య సువార్త కార్యక్రమము జరుగవలెనంటే భాషయొక్క అవసరత ఉన్నది, ఎందుకంటే భాష వల్ల చెప్పునది నరులకు అర్థమగునని గ్రహించాలి.  ఇందునుబట్టి ఆత్మలకు బోధించాలి అంటే ఒక భాష అవసరమై యున్నది.  ఇంతకి మరణించినవారి ఆత్మలయొక్క భాష ఏమిటి?

        బాబేలు గోపుర నిర్మాణమునకు ముందు భాష ఒక్కటే.  అదే హెబ్రీ భాషయని అందులోనే దేవుని 10 ఆజ్ఞలు వ్రాయబడినవి అని బైబిలు శాస్త్రజ్ఞులు చెప్పుచున్నారు.  బాబేలు గోపుర కాలములో నరులు చేయుచున్న అజ్ఞాన చర్యను ఆపు చేయుటకు దేవుడు భాషలను సృష్టించాడు.  అంటే ఈ హెబ్రీ భాష నుండి అనేక భాషలు ఉత్పన్నమైనవి.  ఆది 11:1-9.  ఈ భాషలన్నింటిని దేవుడు మాట్లాడగలడు.  అపొ 2:1-13.  కనుక ఆత్మను పొందినవారు అన్ని భాషలు మాట్లాడగలరని గ్రహించాలి.  ఇక్కడ వారు మాట్లాడినది వారి స్వంత భాష కాని వినేవారికి వారివారి స్వంత భాషలలో వినబడునని గ్రహించాలి.  ఇక మరణించినవారి భాషలను గూర్చి తెలుసుకొందము.

పరిశుద్ధుల భాష ఒక్కటే

1.  పరిశుద్ధుల ఆత్మలయొక్క భాష :-  వీరందరి భాష ఒక్కటే, ఎందుకంటే వీరు పరిశుద్ధులు.  వీరు దైవసన్నిధిలో వుండువారు.  కను వీరు దైవభాషనే మాట్లాడుదురని గ్రహించాలి.  అందుకే 1,44,000 వేలమంది ఒకే కీర్తనను క్రొత్త కీర్తనగా పాడుచున్నారు.  వారి మాటల ధ్వని ఒకే విధముగా వున్నదని చెప్పబడినది.  వీరు పాడు కీర్తనలోని మాటలు ఎవరికి అర్థము కావటము లేదని, దానిని ఎవరు నేర్వలేక పోతున్నట్లుగా చెప్పబడినది.  ప్రకటన 14:1-3, ''మరియు నేను చూడగా, ఇదిగో, ఆ గొఱ్ఱెపిల్ల సీయోను పర్వతముమీద నిలువబడి యుండెను.  ఆయన నామమును ఆయన తండ్రి నామమును నొసళ్లయందు లిఖింపబడియున్న నూట నలువది నాలుగు వేలమంది ఆయనతో కూడ ఉండిరి.  మరియు విస్తారమైన జలముల ధ్వనితోను గొప్ప ఉరుము ధ్వనితోను సమానమైన యొక శబ్దము పరలోకములోనుండి రాగా వింటిని.  నేను వినిన ఆ శబ్దము వీణెలు వాయించుచున్న వైణికుల నాదమును పోలినది.  వారు సింహాసనము ఎదుటను, ఆ నాలుగు జీవుల యెదుటను, పెద్దలయెదుటను ఒక క్రొత్త కీర్తన పాడుచున్నారు;  భూలోకములోనుండి కొనబడిన ఆ నూట నలువది నాలుగువేలమంది తప్ప మరి ఎవరును ఆ కీర్తన నేర్చుకొనజాలరు.''  కనుక వీరి భాష ఒక్కటే.  అదే దైవభాష.

అపరిశుద్ధుల భాషలు అనేకము

2.  అపరిశుద్ధుల ఆత్మలయొక్క భాష :-  ప్రకటన 14:6, ''అప్పుడు మరియొక దూతను చూచితిని.  అతడు భూనివాసులకు, అనగా ప్రతి జనమునకును ప్రతి వంశమునకును ఆ యా భాషలు మాటలాడువారికిని ప్రతి ప్రజకును ప్రకటించునట్లు నిత్యసువార్త తీసికొని ఆకాశ మధ్యమున ఎగురుచుండెను.''  ఈ నిత్య సువార్త కార్యక్రమము మధ్యాకాశములో జరుగుచున్నది.  ఈ కార్యక్రమము ఎవరెవరికి జరుగుచున్నది అని మనము ఆలోచిస్తే - ''ఆ యా భాషలు మాటలాడువారికిని,'' అనగా భూమి మీద ఎన్ని భాషలు ఉన్నాయో అపరిశుద్ధుల ఆత్మలకు కూడా అన్ని భాషలు కలిగి యుండునని అర్థమగుచున్నది.  భూమి మీద ఉన్నట్లే పాతాళలోకములో ఉండునని గ్రహించాలి.  ఇక్కడ జరిగినట్లే సువార్తా కార్యక్రమము అక్కడ కూడా జరుగును.  కాని పరిశుద్ధులు మాత్రము దైవభాషలోనే ఒకే భాషను మాట్లాడుదురు.  ఈ భాష ఇతరులు నేర్వలేరు.  భాషలు అనునవి దైవశాపము వలన నరుల మధ్య ఏర్పడినవి.  కనుక అపరిశుద్ధులు భూలోకములో వలె అనేక రకములైన భాషలు వారి మరణానంతరము కూడా మాట్లాడుదురని గ్రహించాలి.  వారివారి భాషలలోనే సువార్తా కార్యక్రమము ఆత్మ రూపములో జరుగునని గ్రహించాలి.

51.   మృతుల లోకములోని ఆత్మలు చేయు ప్రార్థనలు

        సహజముగా పరిశుద్ధులు ప్రార్థనా వీరులని అందరికి తెలిసిన విషయమే!  వీరు భూమిపై వారి మరణము వరకు విశ్వాసము కలిగియుండి ప్రార్థనలో వారి జీవితమును గడుపుతున్నట్లుగా మనము అనేకమందిని మన జీవితములో చూస్తున్నాము.  వీరు ప్రార్థన ద్వారా అనేక విజయములు దేవునిలో పొందినట్లుగా మన బైబిలు గ్రంథములో అనేక సంఘటనలు చదవగలము.  వీరు తమ ప్రార్థన ద్వారా చనిపోయినవారిని సైతము తిరిగి లేపినట్లుగా మనము వేదములో చదువగలము.  సాధారణముగా పరిశుద్ధులైతేనేమి, సాధారణ క్రైస్తవులైతేనేమి తమ ప్రార్థనలలో తమ కోసము, తమ వారి కోసము, తమని ప్రార్థించమని చెప్పిన వారి కోసము, అన్యులు క్రీస్తును తెలుసుకొనునట్లుగా, తమ దేశము కోసము, సాతాను చెరలో వున్నవారి కోసము, మరణించినవారి కోసము మొదలైన రీతులుగా ప్రార్థించుచుందురు.  వీరి మరణానంతరము వారి ఆత్మలు ప్రార్థిస్తాయా?

పరిశుద్ధులు తమ భూలోక చరితల్రో నిరంతరము దేవుని పార్థ్రనలో ఉన్నవారే.  వీరు ఆత్మ రూపములో ఉన్నప్పుడు వీరికి పార్థ్రన చేయుట  విధముగా నేర్పించవలసిన అవసరత ఉన్నదా!

        ఇందులో ఒక విషయము మాత్రము నేను చెప్పగలను.  భూమి మీద సాతాను అతని సమాజము ద్వారా పొందిన కష్టనష్టాల నుండి వారు విశ్రాంతిని పొందుదురు.  ఈ విశ్రాంతి సమయములో వారు ప్రార్థనలో వుంటారు.  ప్రార్థనా జీవితమును విశ్రాంతి జీవితముగా చెప్పవచ్చును, ఎందుకంటే తొలుత తమ ప్రార్థనలో భారము కలిగి ప్రార్థనను మొదలు పెట్టుదురు, తరువాత ప్రార్థనాపరులు ప్రార్థన పూర్తి అగునప్పటికి తమ భారమును క్రీస్తు ప్రభువుపై వేసి, వారి మనస్సుకు వారు విశ్రాంతిని కలిగించుకొందురు.  అవిశ్వాసులు తమ ప్రార్థన చేసినను వారు తమ భారమును క్రీస్తు ప్రభువుపై పెట్టినట్లుగా కనబడినను తమ అనుమానము లేక అవిశ్వాసము చేత ఆ భారమును తమ మనస్సులోనే వుంచుకొని విశ్రాంతిని పొందక ఇంకా బాధపడుచూనే వుందురు.

        పరిశుద్ధులు శరీర జీవితము ప్రార్థనా జీవితమే! అయితే పరిశుద్ధులు వారి మరణానంతరము ఆత్మ రూపములో పరదైసులో చేర్చబడిన తరువాత వారు ఇంకా ఎక్కువ ప్రార్థనా జీవితమును కలిగి యుందురనుటకు ఎటువంటి సందేహము లేదు, ఎందుకంటే ఈ లోకములో వారు జీవించేటప్పుడే వారు తమ కోసము కాక ప్రార్థనాపరులుగా దేవుని కోసము జీవించినవారు.  ఇలాంటివారు వారి మరణానంతరము తమ స్వార్థము కోసము జీవించరని గ్రహించాలి.  వారు దేవుని కోసముగా వారు జీవిస్తారు.  వీరు నమ్మకమైనవారు కనుకనే వీరు క్రీస్తు ప్రభువుతో వుండు యోగ్యత కలిగియున్నారు.  ప్రకటన 17:14, ''వీరు గొఱ్ఱెపిల్లతో యుద్ధము చేతురు గాని, గొఱ్ఱెపిల్ల ప్రభువులకు ప్రభువును రాజులకు రాజునై యున్నందునను, తనతోకూడ ఉండినవారు పిలువబడినవారై, యేర్పరచ బడినవారై, నమ్మకమైనవారై యున్నందునను, ఆయన ఆ రాజులను జయించును.''  ఆ శాంతికర పరదైసులలోని ఆత్మలకు విశ్రాంతి లభిస్తుంది.  ఈ విశ్రాంతి కాలములో వారు ప్రార్థనలో కాలము గడుపుదురు.  ప్రకటన 6:9-10, ''ఆయన అయిదవ ముద్రను విప్పినప్పుడు, దేవుని వాక్యము నిమిత్తమును, తాము ఇచ్చిన సాక్ష్యము నిమిత్తమును వధింపబడినవారి ఆత్మలను బలిపీఠము క్రింద చూచితిని.  వారు-నాథా, సత్యస్వరూపీ, పరిశుద్ధుడా, యెందాక తీర్పు తీర్చకయు, మా రక్తము నిమిత్తము భూనివాసులకు ప్రతిదండన చేయకయు ఉందువని బిగ్గరగా కేకలువేసిరి.''  భూనివాసులకు ప్రతిదండన చేయమని దేవుని వాక్యము కొరకు, తామిచ్చిన సాక్ష్యము కొరకు, వధింపబడిన వారి ఆత్మలు బలపీఠము క్రింద విశ్రాంతిలో ఉండి చేయు ప్రార్థన.  ఈ ప్రార్థనలో వారు భూనివాసులను రక్షించమని కోరుట లేదు.  శిక్షించమని కోరుచున్నారు.  అదియును గట్టిగా కేకలు వేసి అడుగుచున్నారు.  అందుకు క్రీస్తు ప్రభువు మరి కొంతకాలము విశ్రమించమని చెప్పుచున్నారు.  ప్రకటన 6:11, ''తెల్లని వస్త్రము వారిలో ప్రతివాని కియ్యబడెను;  మరియు వారివలెనే చంపబడబోవువారి సహదాసులయొక్కయు సహోదరులయొక్కయు లెక్క పూర్తియగువరకు ఇంక కొంచెము కాలము విశ్రమింపవలెనని వారితో చెప్పబడెను.''

        ప్రకటన 7:9-10, ''అటుతరువాత నేను చూడగా, ఇదిగో, ప్రతి జనములోనుండియు ప్రతి వంశములోనుండియు ప్రజలలోనుండియు, ఆయా భాషలు మాటలాడువారిలోనుండియు వచ్చి, యెవడును లెక్కింపజాలని యొక గొప్ప సమూహము కనబడెను.  వారు తెల్లని వస్త్రములు ధరించు కొన్నవారై, ఖర్జూరపుమట్టలు చేతపట్టుకొని సింహాసనము ఎదుటను గొఱ్ఱెపిల్లయెదుటను నిలువబడి -సింహాసనాసీనుడైన మా దేవునికిని గొఱ్ఱెపిల్లకును మా రక్షణకై స్తోత్రమని మహాశబ్దముతో ఎలుగెత్తి చెప్పిరి.''  ఇందునుబట్టి తెల్లని వస్త్రములు ధరించిన పరిశుద్ధులు గొఱ్ఱెపిల్లయైన యేసుక్రీస్తు ఎదుట నిలువబడి తాము పొందిన రక్షణకై స్తోత్రములు చెల్లించుచున్నారు.  ఇలాంటివారు భూమి పుట్టినది మొదలు యుగాంతము వరకు చేసిన ప్రార్థనలు అన్నింటికి క్రీస్తు ప్రభువు సమాధానము దయ చేయడు, ఎందుకంటే పరిశుద్ధులు శ్రమలను ఎదుర్కొని జయించాలని దేవుని వాక్యము చెప్పుచున్నది.  ఇలా తమకు జవాబు రాని ప్రార్థనలన్నీ పరిశుద్ధుల ప్రార్థనలుగా ఇరువదినలుగురు పెద్దల చేతిలో చేరును.  ప్రకటన 5:8, ''ఆయన దానిని తీసికొనినప్పుడు ఆ నాలుగుజీవులును, వీణెలను, ధూప ద్రవ్యములతో నిండిన సువర్ణపాత్రలను పట్టుకొనియున్న ఆ యిరువదినలుగురు పెద్దలును, ఆ గొఱ్ఱెపిల్ల యెదుట సాగిలపడిరి.  ఈ పాత్రలు పరిశుద్ధుల ప్రార్థనలు.''  ఈ ప్రార్థనలు యుగాంత కాలములో బలిపీఠముపై చేర్చబడును.  ప్రకటన 8:3-5, ''మరియు సువర్ణధూపార్తి చేత పట్టుకొనియున్న వేరొక దూతవచ్చి బలిపీఠము ఎదుట నిలువగా సింహాసనము ఎదుటఉన్న సువర్ణబలిపీఠము పైన పరిశుద్ధులందరి ప్రార్థనలతో కలుపుటకై అతనికి బహు ధూపద్రవ్యములు ఇయ్యబడెను.  అప్పుడా ధూపద్రవ్యముల పొగ పరిశుద్ధుల ప్రార్థనలతో కలిసి దూత చేతిలోనుండి పైకి లేచి దేవుని సన్నిధిని చేరెను.  ఆ దూత ధూపార్తిని తీసికొని, బలి పీఠముపైనున్న నిప్పులతో దానిని నింపి, భూమిమీద పడవేయగా ఉరుములు ధ్వనులు మెరుపులు భూకంపమును కలిగెను.''  ఈ విధముగా పరిశుద్ధుల ప్రార్థనలు అన్ని బలిపీఠముపై చేర్చబడి, ప్రకటన 6:9-11లో వలె వారు అడిగినట్లుగా ప్రతిదండన చేయుట జరుగుచున్నది.  పరిశుద్ధుని ప్రార్థన ఎప్పటికైనా ఫలితమును పొందునని ఇందునుబట్టి మనము గ్రహించవలసి యున్నది.  అందుకే క్రీస్తు ప్రభువు మీరు ప్రార్థించునప్పుడు మీరు పొందినట్లుగా విశ్వాసము కలిగి ప్రార్థించమని చెప్పుచున్నాడు.  మార్కు  11:24, ''అందుచేత ప్రార్థన చేయునప్పుడు మీరు అడుగుచున్న వాటినెల్లను పొందియున్నామని నమ్ముడి; అప్పుడు అవి మీకు కలుగునని మీతో చెప్పుచున్నాను.''

        ప్రకటన 15:2-4, ''మరియు అగ్నితో కలిసియున్న స్ఫటికపు సముద్రము వంటిది ఒకటి నేను చూచితిని.  ఆ క్రూరమృగమునకును దాని ప్రతిమకును దాని పేరుగల సంఖ్యకును లోబడక వాటిని జయించినవారు దేవుని వీణెలుగలవారై, ఆ స్ఫటికపు సముద్రమునొద్ద నిలిచియుండుట చూచితిని.  వారు- ప్రభువా, దేవా, సర్వాధికారీ, నీ క్రియలు ఘనమైనవి, ఆశ్చర్యమైనవి;  యుగములకు రాజా, నీ మార్గములు న్యాయములును సత్యములునై యున్నవి;  ప్రభువా, నీవు మాత్రము పవిత్రుడవు, నీకు భయపడని వాడెవడు?  నీ నామమును మహిమపరచనివాడెవడు?  నీ న్యాయవిధులు ప్రత్యక్షపరచబడినవి గనుక జనములందరు వచ్చి నీ సన్నిధిని నమస్కారముచేసెదరని చెప్పుచు, దేవునిదాసుడగు మోషే కీర్తనయు గొఱ్ఱెపిల్ల కీర్తనయు పాడుచున్నారు.''  ఇందునుబట్టి, ఇందులో చెప్పబడిన పరిశుద్ధులు దేవున్ని స్తుతిస్తూనే జనులందరు దేవునికి నమస్కారము చేయుదురని తమ ప్రార్థనలో చెప్పుచున్నట్లుగా గ్రహించాలి.  ఆ తదనంతరము వారు కీర్తనలు పాడుచున్నారు.  

        ప్రకటన 19:1-2, ''అటుతరువాత బహు జనులశబ్ధమువంటి గొప్ప స్వరము పరలోకమందు ఈలాగు చెప్పగా వింటిని-ప్రభువును స్తుతించుడి, రక్షణ మహిమ ప్రభావములు మన దేవునికే చెల్లును;  ఆయన తీర్పులు సత్యములును న్యాయములునై యున్నవి;  తన వ్యభిచారముతో భూలోకమును చెరిపిన గొప్ప వేశ్యకు ఆయన తీర్పుతీర్చి తన దాసుల రక్తమునుబట్టి దానికి ప్రతిదండన చేసెను;  మరి రెండవసారి వారు-ప్రభువును స్తుతించుడి అనిరి.''  ఈ విధముగా బహు జనులుగా చెప్పబడిన పరిశుద్ధులు బబులోను  అను మహావేశ్యకు జరిగిన తీర్పును చూచి స్తుతించుట ఇందులో జరిగింది.  ఈ విధముగా వీరి ప్రార్థనలు క్లుప్తముగా వున్నట్లుగా మనము గ్రహించాలి.  మత్తయి 6:5-8, ''మరియు మీరు ప్రార్థన చేయునప్పుడు వేష ధారులవలె ఉండవద్దు; మనుష్యులకు కనబడవలెనని సమాజ మందిరములలోను వీధుల మూలలలోను నిలిచి ప్రార్థన చేయుట వారికిష్టము; వారు తమ ఫలము పొందియున్నారని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను.  నీవు ప్రార్థన చేయునప్పుడు, నీ గదిలోనికి వెళ్లి తలుపువేసి, రహస్యమందున్న నీ తండ్రికి ప్రార్థన చేయుము; అప్పుడు రహస్యమందు చూచు నీ తండ్రి నీకు ప్రతి ఫలమిచ్చును.''

        క్రీస్తు ప్రభువు పరలోకములో వుండి మన కొరకు విజ్ఞాపనము చేస్తున్నట్లుగా చెప్పబడినది.  రోమా 8:34, ''శిక్ష విధించువాడెవడు?  చనిపోయిన క్రీస్తుయేసే;  అంతేకాదు, మృతులలోనుండి లేచినవాడును దేవుని కుడి పార్శ్వమున ఉన్నవాడును మనకొరకు విజ్ఞాపనము కూడ చేయువాడును ఆయనే''  క్రీస్తు ప్రభువు ఏమి చేయునో పరిశుద్ధులు కూడా అదే చేస్తారు.  యోహాను 14:12, ''నేను తండ్రియొద్దకు వెళ్లుచున్నాను గనుక నేను చేయు క్రియలు నాయందు  విశ్వాసముంచువాడును చేయును, వాటికంటె మరి గొప్పవియు అతడు చేయునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను.''  కనుక పరిశుద్ధులు కూడా భూమిపైనున్న మన కొరకు ప్రార్థనా విజ్ఞాపనలు దేవునికి చేస్తూ ఉందురని గ్రహించాలి.  కనుక పరిశుద్ధులు నిరంతరము మన కొరకు విజ్ఞాపనా ప్రార్థనలు చేస్తూనే ఉంటారు, ఎందుకంటే మన దేవుడైన క్రీస్తు ప్రభువు మరియు పరిశుద్ధాత్మ దేవుడు కూడా మన కొరకు తండ్రియైన దేవుని విజ్ఞాపనా ప్రార్థన చేస్తున్నారు.  రోమా 8:26, ''అటువలె ఆత్మయు మన బలహీనతను చూచి సహాయము చేయుచున్నాడు.  ఏలయనగా మనము యుక్తముగా ఏలాగు ప్రార్థన చేయవలెనో మనకు తెలియదు గాని, ఉచ్ఛరింప శక్యముకాని మూలుగులతో ఆ ఆత్మ తానే మన పక్షముగా విజ్ఞాపనము చేయుచున్నాడు.''  ఈ విధముగా క్రీస్తు ప్రభువు పరిశుద్ధాత్మ దేవుడు ఇద్దరు మనము చేయు ప్రార్థనకు తమ వంతు సహకారము చేయుచున్నారు.  అలాగే మరణించిన  పరిశుద్ధుల ఆత్మలు కూడా మనకు ప్రార్థన సహాయము చేయునని గ్రహించాలి.  ఈ సందర్భములో గ్రంథకర్తనైన నేను నా జీవితములో జరిగిన ఒక సాక్ష్యము మీ ముందు ఈ పుస్తకము ద్వారా ఉంచుచున్నాను  నాకు 1969-70 మధ్య కాలములో క్షయ వ్యాధి వచ్చింది.  ఆ కాలములో శరీరరీత్యా చాలా దెబ్బ తిన్నాను.  నోటి గుండా రక్తము విపరీతముగా పోతున్నది.  శరీరము వడలి సన్నబడిపోయినది.  ఈ స్థితిలో నేను మరణించెదనన్న తలంపు కలిగి ప్రభువును ప్రార్థించాను కాని నాకు సమాధానము రాలేదు.  అయినను నిరుత్సాహము పొందక, పరిశుద్ధులలో నాకు తెలిసిన వారిని మీరు అడిగి తెలుసుకొని నాకు తెలియజేయకూడదా అని నేను నా విజ్ఞాపన ద్వారా అడిగాను.  ఆరోజు రాత్రి ఒక కలలో దర్శనము వచ్చింది.  ఈ దర్శనములో కొందరు పరిశుద్ధులు క్రీస్తు ప్రభువు చుట్టూ చేరి శేఖర్‌రెడ్డియొక్క ఆరోగ్య విషయము ఏమిటి? ప్రభువా! అని అడుగుచుండిరి.  అప్పుడు క్రీస్తు ప్రభువు నాతో - ''ఇది శోధన మాత్రమే!  ఆరోగ్యము నీ చేతిలో వుంది,'' అని చెప్పెను.  అప్పుడు పరిశుద్ధులు ఈ శోధన ఎప్పుడు తీరునని క్రీస్తు ప్రభువును అడుగుట నేను విన్నాను.  అప్పుడు క్రీస్తు ప్రభువు నాతో - ''అది దైవ రహస్యము.  కాలము సంపూర్ణమైనప్పుడు అది నెరవేరునని,'' తెలియజేసెను.  కనుక పరిశుద్ధుల ఆత్మలు దైవకార్యములు చేయువారి కొరకు తమ ప్రార్థన సహాయమును దయ చేయునని గ్రహించాలి.  చర్చీలోని బోధకుడు మన కొరకు చేయు ప్రార్థనలవలె సమస్తమైన పరిశుద్ధుల ఆత్మలు నిరంతరము వారి విశ్రాంతి జీవితములో వారు మనము అడిగిన, వారు మన కొరకు ప్రార్థన చేయుదురని గ్రహించాలి.

         అయితే పాతాళ లోకము చేరిన అపరిశుద్ధుల ఆత్మలు మాత్రము ప్రార్థనను కలిగి యుండవు, ఎందుకంటే వారు కూడా సాతానుయొక్క రాజ్యములో బంధింపబడి యున్నారు.  పాతాళ లోకమునకు రాజు సాతాను.  ఈ లోకములో భూమి పుట్టినప్పటినుండి దేవుళ్ళుగా చెలామణి అయ్యి మరణించినవారి ఆత్మలు అందులోనే వున్నారు.  కనుక వీరి మోసపూరిత కార్యములు క్రీస్తు రాకడ వరకు కొనసాగించును కనుక వీరు వారి మధ్య తిరుగుతున్న మోసపూరిత సాతాను సంబంధ దేవుళ్ళనే నిజ దైవముగా భావించి నిజమైన ప్రార్థనా జీవితమునకు దూరముగా జీవించుట జరుగును.  అయితే పరిశుద్ధులు మరియు క్రీస్తునందుండి మృతులైనవారికి విశ్రాంతిలో వుందురు కనుక వీరు మరింత ఎక్కువ ప్రార్థనా జీవితమును కలిగియుందురని గ్రహించాలి.  అతి కొద్ది కాలమైన ఈ భూమిపై జీవితములోనే అన్ని ప్రయాసలు బాధలు పడుచూనే పరిశుద్ధులు తమ జీవితములో సాధ్యమైనంత భాగము ప్రార్థనా జీవితమునకు సమర్పించుకొన్నవారు.  వారికి కొంత విశ్రాంతి లభిస్తే వూరుకొంటారా?  ప్రార్థనలోనే వీరి ఆత్మ కూడా వుండునని గ్రహించాలి.

52.   మృతుల లోకములోని ఆత్మ చేయు ప్రయత్నములు

         మూడు రకముల ఆత్మలను గూర్చి తెలుసుకొన్నాము.  వీరు 1.  పరిశుద్ధులు  2.  అపరిశుద్ధులు  3.  మంచి చెడు కార్యములు కలిగినవారు.  వీరు మృతుల లోకములో ఏదైన ప్రయత్నము చేయుదురా?  లేక అలాగే యుండుట జరుగునా?

        ఇందులో అతిపరిశుద్ధులు క్రీస్తు ప్రభువుతోబాటుగా వుండి ఆయన చేయు కార్యములన్నీ చేయుదురు.  ఇది ప్రయత్నమే.  దీని ద్వారా వారు ఆత్మ రూపములో వున్నను సహాయపడుటకు దేవుని నుండి జీవమును కలిగి మరణించినను సజీవులవలె  తిరుగుచుందురు.  మోషే, ఏలీయాలు కొండపై క్రీస్తు ప్రభువు రూపాంతర సమయమున కనబడి క్రీస్తు నిర్గమమును గూర్చి మాట్లాడుట జరిగింది.  మార్కు 9:2-4, ''ఆరుదినములైన తరువాత, యేసు పేతురును యాకోబును యోహానును మాత్రము వెంటబెట్టుకొని, యెత్తయిన యొక కొండమీదికి ఏకాంతముగా వారిని తోడుకొనిపోయి, వారియెదుట రూపాంతరము పొందెను.  అంతలో ఆయన వస్త్రములు ప్రకాశమానమైనవియు మిగుల తెల్లనివియు ఆయెను; లోకమందు ఏ చాకలియును అంత తెల్లగా చలువచేయలేడు.  మరియు మోషేయు ఏలీయాయు వారికి కనబడి యేసుతో మాటలాడుచుండిరి.''  కనుక దేవుని ప్రణాళికను నెరవేర్చుటకు  దేవునితోబాటుగా ఈ పరిశుద్ధులు కూడా ప్రయత్నము చేయుచుందురు.  

        అపరిశుద్ధులు పాతాళ లోకములో వారు భూమిపై చేసిన దైవ వ్యతిరేక పనులకుగాను యాతన అనుభవిస్తుంటారు.  ఈ యాతన నుండి బయటపడుటకు ప్రయత్నము చేయుదురుగాని వారికి అక్కడ అవకాశము లేదు.  వారు ఆ బాధను అనుభవించవలసినదేగాని వారు దానినుండి విడుదల పొందు అవకాశము లేదు.

ఆత్మ నెమ్మది పొందుటకు పయ్రత్నించునుగాని నెమ్మది పొందదు, యాతనను తగ్గించుకోవాలని ప్రయత్నించునుగాని తగ్గించుకొనలేదు  . . .ఇదే మృతుల లోకములోని జీవితమునకు నిబంధన వారు తప్పించుకొనుటకు వారికి సహాయము చేయువారు ఎవరునూ ఉండరు

        ఇక మంచి చెడు కార్యములు చేయువారి ఆత్మలు దేవుని కొరకు జీవించుటకు ప్రయత్నము చేసినవారు.  కనుక ఈ లోకరీత్యా వీరు వేదనలు పొంది దేవుని కోసము సాక్షిగా నిలువబడినవారే.  కాని వీరిలో కూడా కొన్ని పాపములు వున్నాయి.  ఈ పాపములు మరణకరము కానివి అని గ్రహించాలి.  1 యోహాను 5:16, ''తన సహోదరుడు మరణకరము కాని పాపము చేయగా ఎవడైనను చూచినయెడల అతడు వేడుకొనును; అతనిబట్టి దేవుడు మరణకరముకాని పాపము చేసినవారికి జీవము దయచేయును.  మరణకరమైన పాపము కలదు.  అట్టిదానిగూర్చి వేడుకొనవలెనని నేను చెప్పుటలేదు.''  వారు చేసిన పాపము నుండి వారు అనుభవించిన యాతన నుండి ఆత్మరీత్యా నెమ్మది పొందుచున్నట్లుగా లూకా 16:25లో చెప్పబడినది.  ''ఇప్పుడైతే వాడు ఇక్కడ నెమ్మది పొందుచున్నాడు.''  ఇక్కడ నెమ్మది పొందుచున్నాడని చెప్పబడినదేగాని నెమ్మది పొందినట్లుగా చెప్పబడలేదు.  వారు నెమ్మది పొందుటకు ప్రయత్నము చేయుచున్నారు.  ఏకముగా లాజరైతే అబ్రాహాము ఒడిలో చేరి సేద తీరు ప్రయత్నము చేయుచున్నాడు.  కాని నెమ్మది పొందలేరు,   ఎందుకంటే వారు ఇంకా మృతుల లోకములో వున్నారుగాని స్వతంత్య్రులుగా లేరు.  పరలోక రాజ్యములో వారు లేరు.  వారు ఇంకా దేవుని వారసత్వమును పొందలేదు.

53.  మృతుల లోకములోని ఆత్మలకు క్రీస్తును గూర్చిన బోధ

        ప్రకటన 14:6-7, ''అప్పుడు మరియొక దూతను చూచితిని.  అతడు భూనివాసులకు, అనగా ప్రతి జనమునకును ప్రతి వంశమునకును ఆ యా భాషలు మాటలాడువారికిని ప్రతి ప్రజకును ప్రకటించునట్లు నిత్యసువార్త తీసికొని ఆకాశ మధ్యమున ఎగురుచుండెను.  అతడు - మీరు దేవునికి భయపడి ఆయనను మహిమపరచుడి;  ఆయన తీర్పుతీర్చు గడియ వచ్చెను గనుక ఆకాశమును భూమిని సముద్రమును జలధారలను కలుగజేసినవానికే నమస్కారము చేయుడి అని గొప్ప స్వరముతో చెప్పెను.''  ఇందునుబట్టి ఆకాశ మధ్యమున యున్న మరణించినవారి ఆత్మలకు కూడా సువార్త కార్యక్రమము భూమి మీదవలె జరుగుచున్నది.  1 పేతురు 3:19-20, ''దేవుడు దీర్ఘశాంతము ఇంక కనిపెట్టుచుండినప్పుడు పూర్వము నోవహు దినములలో ఓడ సిద్ధపరచబడుచుండగా, అవిధేయులైనవారియొద్దకు, అనగా చెరలో ఉన్న ఆత్మలయొద్దకు, ఆయన ఆత్మరూపిగానే వెళ్లి వారికి ప్రకటించెను.  ఆ ఓడలో కొందరు, అనగా ఎనిమిది మంది నీటిద్వారా రక్షణపొందిరి.''  అయితే నోవహు ఏవిధముగా రక్షణ పొందినాడు?  తాను దేవుని నీతిని పాటిస్తూ దేవుని ఆజ్ఞ చొప్పున ఓడ సిద్ధపరచుకొంటూ తగిన సమయములందు పాపమును వీడి పరిశుద్ధ జీవితమును జీవించమని నోవహు తన కాలమందలి ప్రజలకు నీతిని ప్రకటించినట్లు 2 పేతురు 2:5లో వ్రాయబడియున్నది.  

క్రీస్తు ప్రభువుకు  ఆత్మ నశించుట ఇష్టము లేదు కనుక మృతుల లోకములో కూడా సువార్తను జరిగిస్తున్నారు

        ఈ విధముగా క్రీస్తు ప్రభువు ఆత్మరూపిగానే నోవహు ముందు కాలమునాటి వారియొద్దకు వెళ్లి వారికి సువార్తను ప్రకటించాడు.  అలాగే అపరిశుద్ధులుయొక్క ఆత్మలకు పాతాళలోకములో నిత్యము ఈ భూమి మీద జరుగు సువార్తవలె కార్యక్రమములు జరుగునని గ్రహించాలి.  దీనినే ఉత్తరించు ఆత్మల కార్యక్రమముగా గుర్తించాలి.  1 పేతురు 4:6, ''మృతులు శరీరవిషయములో మానవరీత్యా తీర్పు పొందునట్లును ఆత్మవిషయములో దేవుని బట్టి జీవించునట్లును వారికికూడ సువార్త ప్రకటింపబడెను.''  శరీర విషయములో ఇప్పుడు సువార్తను చూస్తున్నాము.  ఆత్మ విషయములో సువార్తను ఉత్తరించు స్థలములలో మధ్యాకాశములో మరల చూడగలము.  ఇది కేవలము ఉత్తరించువారికి మాత్రమేనని గ్రహించాలి.  ఉత్తరించుట అనగా 1 కొరింథీ 5:16-17లో వలె మరణకరముగాని చిన్న చిన్న తప్పులు చేసినవారు అనగా క్షమించుటకు అర్హత పొందిన పాపములని చెప్పవచ్చును.  అనగా వీరికి యుగయుగములకు శిక్ష వుండదుగాని, భరింపరాని ఆత్మ వేదన పొంది త్వరితగతిన శిక్ష నుండి విడుదల పొంది ప్రభువు సన్నిధికి ప్రవేశించు ఆత్మలే ఉత్తరించు ఆత్మలు.

54.  మృతుల లోకములోని ఆత్మలకు సువార్తను జరిగించువారు ఎవరు?

        సువార్త బోధ సరే!  ఇంతకి ఈ సువార్తను జరిగించువారు ఎవరు?  ఈ ప్రశ్న నా మనస్సున మొదలవగానే నాకు నోవహు చరిత్ర గుర్తుకొచ్చింది.  క్రీస్తు ప్రభువు నోవహు కాలములో మృతి పొందినవారికి సువార్త బోధనను మృతుల లోకములో జరిగించినట్లుగా వ్రాయబడియున్నది.  1 పేతురు 3:19-20, ''దేవుని దీర్ఘశాంతము ఇంక కనిపెట్టుచుండినప్పుడు పూర్వము నోవహు దినములలో ఓడ సిద్ధపరచబడుచుండగా, అవిధేయులైనవారియొద్దకు, అనగా చెరలో ఉన్న ఆత్మలయొద్దకు, ఆయన ఆత్మరూపిగానే వెళ్లి వారికి ప్రకటించెను.  ఆ ఓడలో కొందరు, అనగా ఎనిమిది మంది నీటిద్వారా రక్షణపొందిరి.'' అని వ్రాయబడుటనుబట్టి నోవహు కాలములోని ఆత్మలు చెరలో వున్నవి.  చెర అనగా యాతన అనుభవించు ప్రాంతములో వున్నవి.  అనగా పాతాళ లోకము యాతనకు నిలయమని లాజరు ధనవంతుని ఉపమానములో తెలుసుకొని యున్నాము.  ధనవంతుడు పాతాళ లోకములో యాతన అనగా చెరను అనుభవిస్తున్నాడు.  ఇలా నోవహు కాలమునాటి ఆత్మలు ధనవంతుని వలె చెర అనుభవిస్తున్నట్లుగా మనము గ్రహించాలి.  ఇలాంటివారికి సువార్త కార్యము జరుగుచున్నది.  1 పేతురు 4:6, ''మృతులు శరీరవిషయములో మానవరీత్య తీర్పు పొందునట్లును ఆత్మవిషయములో దేవుని బట్టి జీవించునట్లును వారికికూడ సువార్త ప్రకటింపబడెను.''  ఇలా మృతుల విషయములో కూడా సువార్త ప్రకటించబడుచున్నది.  అలాగే క్రీస్తు ప్రభువు నోవహు కాలములో మరణించి చెరను అనుభవిస్తున్న ఆత్మలకు ఆత్మరూపిగానే వెళ్ళి అనగా వారు ఏ రూపములో వున్నారో అదే రూపములో వెళ్ళి వానికి సువార్తను ప్రకటించాడు.  అంటే మట్టి శరీరములో ఉన్న నరులమైన మనకు బోధించుటకు ఆయన మనుష్య కుమారునిగా ఈ లోకములో అవతరించుట జరిగింది.  అలాగే ఆత్మలుగా మృతుల లోకములో వున్న మరణించినవారి ఆత్మలకు క్రీస్తు ప్రభువు కూడా ఆత్మ రూపముగా బోధించుటకు సువార్తను ప్రకటించుటకు వెళ్ళినట్లుగా చెప్పుచున్నాడు.  ఇది జరిగి 2000 సంవత్సరములు అయ్యి వుండవచ్చు.  ఈ బోధలో మార్పు చెందినవారు పరిశుద్ధులు జాబితాలోనే లెక్కించుట జరుగును, ఎందుకంటే క్రీస్తు ప్రభువుకు ఎవ్వరును నశించుట ఇష్టము లేదు.  యోహాను 17:12, ''నేను వారియొద్ద ఉండగా నీవు నాకు అనుగ్రహించినవారిని నీ నామమందు కాపాడితిని; నేను వారిని భద్రపరచితిని గనుక లేఖనము నెరవేరునట్లు నాశన పుత్రుడు తప్ప వారిలో మరి ఎవడును నశింపలేదు.''  

క్రీస్తు ప్రభువు ఆత్మ రూపములో చెరలో వున్న వారి యొద్దకు వెళ్ళి సువార్త ప్రకటించారు

        ఈ విధముగా క్రీస్తు ప్రభువు చెరలో వున్న ఆత్మలయొద్దకు వెళ్ళి సువార్తను ప్రకటించుట మొదలుపెట్టాడు.  అయితే క్రీస్తు ప్రభువు ఏమైతే చేస్తాడో అవి అన్నీ కూడా ఆయనయందు విశ్వాసముంచినవారు కూడా అంతకన్నా ఎక్కువే జేయగలరని క్రీస్తు ప్రభువు చెప్పియున్నారు.  ఇందునుబట్టి క్రీస్తునందు విశ్వాసముంచినవారు కూడా వీరికి బోధించుట లేక సువార్తను ప్రకటించుట జరుగునని గ్రహించాలి.  యోహాను 10:9-10, ''నేనే ద్వారమును; నా ద్వారా ఎవడైన లోపల ప్రవేశించిన యెడల వాడు రక్షింపబడినవాడై, లోపలికి పోవుచు బయటికి వచ్చుచు మేత మేయుచునుండును.  దొంగ దొంగతనమును హత్యను నాశనమును చేయుటకు వచ్చునుగాని మరిదేనికిని రాడు; గొఱ్ఱెలకు జీవము లుగుటకును అది సమృద్ధిగా కలుగుటకును నేను వచ్చితినని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను.''  అని వ్రాయబడుటనుబట్టి, ఎవరైతే క్రీస్తు  ద్వారములో ప్రవేశించి ఆయనయందు విశ్వాసము కలిగి రక్షణ పొందునో అతడు లోపలికి పోవుచు  బయటికి వచ్చుచు మేత మేయుచు నుండును అని చెప్పబడినది.  కనుక లోపలికి పోవుచు అనుటలో క్రీస్తు ద్వారము అనగా రక్షణ ద్వారములో వెళ్ళుట.  అనగా క్రీస్తు సన్నిధికి వెళ్ళుట.  బయటికి వచ్చుచు అనగా ఈ లోకము లేక మృతుల లోకమునకు వెళ్ళుచు బయటి సంబంధులు అనగా అపరిశుద్ధుల వద్దకు వెళ్ళుట అర్థము.  ఇలా వెళ్ళుచూ, వస్తూ మేత మేయుచున్నారు.

పరిశుద్ధులు కూడా క్రీస్తు ప్రభువు ఏమి చేయునో అంతకన్నా ఎక్కువగా జరిగించువారు. ఇదే క్రీస్తు ప్రభువులో వారు పొందిన ఉన్నతి

        ఇందులో లోపలికి పోవుచు మేత మేయుచున్నారు మరల బయటికి వచ్చుచు మేత మేయుచున్నారు.  అనగా క్రీస్తు ద్వారములో ప్రవేశించిన కొలది వాక్యపు లోతులో ఎదుగుచూ ఆత్మకు వున్న ఆకలిని తీర్చుకొనుదురు.  అలాగే వీరు బయటకు వచ్చునప్పుడు దేవుని కార్యము పనిగా పొంది బయటివారికి బోధించుటకు వచ్చుదురు.  ఆ దేవుని కార్యమును నెరవేర్చి వీరు తమ ఆకలిని తీర్చుకొందురు.  అనగా లోపలికి పోవుచు తమ ఆకలిని దేవుని వాక్య రూపములో భుజించి తీర్చుకొందురు.  అలాగే బయటకు వెళ్ళుచు తమ ఆకలిని దేవుని కార్యములను తుదముట్టించి తీర్చుకొందురు.

        ఇందునుబట్టి, మృతుల లోకములో చెరలో ఉన్న ఆత్మలకు సువార్తను ప్రకటించువారు క్రీస్తు ప్రభువు మరియు పరిశుద్ధులని గ్రహించాలి.

55.   మృతుల లోకములోని ఆత్మలకు ఆహార పానీయములు

         లూకా 16:24లో ధనవంతుడు యాతన వల్ల దప్పిక గొనినట్లుగా చెప్పబడినది.  అయితే ఈ దప్పిగొనిన ఈ ధనవంతునికి దప్పిక తీర్చుకొనుటకు నీళ్ళు లేవు.  తినుటకు ఆహారము లేదు.  పాతాళ లోకములో జీవజలము, జీవవృక్షము వుండదు.  కనుక వారికి త్రాగుటకు నీళ్ళు, తినుటకు ఫలములు దొరకవు.  పైపెచ్చు దేవుని వాక్యమును వీరు అంగీకరించనివారు కనుక వారు సువార్త రూపములో తమ ఆకలి దప్పికను తీర్చుకొనుటకు ప్రయత్నము  చేయలేదు.  కనుక వీరు పాతాళ లోకములో ఆకలి దప్పిక బాధలతో యాతన పొందుచున్నారు.  కాని వీరికి విడుదల, నెమ్మది లేదు.  అలాగే పరిశుద్ధులు మరణించినను జీవము కలిగినవారు.  యోహాను 5:24, ''నా మాటవిని నన్ను పంపినవానియందు విశ్వాసముంచువాడు నిత్యజీవము గలవాడు; వాడు తీర్పులోనికి రాక మరణములోనుండి

మృతుల లోకములో జీవవృక్ష ఫలములు, జీవ జలము, దేవుని వాక్యములే ఆహారము పానీయము

జీవములోనికి దాటియున్నాడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను.''  కనుక వారు క్రీస్తు ప్రభువు  ఉన్న దగ్గర ఉందురు కనుక వారికి అకలి దప్పికలు ఉండవు.  వీరు క్రీస్తు ప్రభువు ఇచ్చిన జీవజలము అను దైవవాక్యమును ఈ భూమిపైనే సంపూర్ణముగా లోకొనినవారు.  వీరిని పరలోకములో సజీవులుగా వుండుట చేత వీరు జీవజలము, జీవవృక్షపు పండ్లు వారికి బహుమానములు కనుక వారికి ఆకలి దప్పికలు లేవు.  యోహాను 4:14, ''నేనిచ్చు నీళ్లు త్రాగు వాడెప్పుడును దప్పిగొనడు; నేను వానికిచ్చు నీళ్లు నిత్యజీవమునకై వానిలో ఊరెడి నీటి బుగ్గగా ఉండునని ఆమెతో చెప్పెను.''   ఇటువంటి వాక్యమును క్రీస్తు ప్రభువును జీవజలము జీవవృక్ష ఫలములుగా గైకొని వారి ఆత్మకు నెమ్మది ఈ లోకములోనే పొంది వారి మరణానంతరము క్రీస్తులో జీవమును పొందిరి కనుక వీరు ఆకలి దప్పికను క్రీస్తులో సంతృప్తి పొందియున్నారు.  అంతేకాదు, వీరు జీవవృక్షము, జీవజలము ఉండు చోటునకు వెళ్ళుటకు స్వతంత్ర జీవనము కలిగియున్నారు.  కనుక క్రీస్తు ప్రభువు వారిని ఎక్కడికి నడిపిస్తే అక్కడికల్లా వారు వెళ్ళుటకు యోగ్యతను పొందియున్నారు.

        ఇక మంచి చెడు కార్యములు కలవారు.  వీరు ఈ లోకములో దేవుని కోసము పోరాట జీవితమును జరిగిస్తూనే లోకము సాతానుయొక్క ఆశల చేత కొన్ని తప్పులు జరిగించినవారు.  వీరు, తమ ప్రయాసలతో దైవవాక్యాన్ని మోయాలని ప్రయత్నించి, సాతాను శోధనలో, లోక ఆశలతో కొంత పతనమును పొందుచూ మరలా లేస్తూ జీవించినవారు.  వీరు మృతుల లోకములో వుండినను నెమ్మది పొందుచున్నారుగాని పూర్తిగా నెమ్మది పొందలేరు, ఎందుకంటే వీరు ఉండు చోట జీవజలము, జీవవృక్షము ఉండినను వారికి ఇప్పుడు పాలిపంపులు లేవు.  వారు భూలోకరీత్యా వారు పొందిన వేదన అంత గొప్పది.  వారి ప్రయాసలో వారి ఆత్మ నలగగొట్టబడి తిరిగి నిలుచుటకు ప్రయాసపడినవారు.  వారికి పరిపూర్ణత క్రీస్తు రాజ్యములోనే పొందుదురుగాని ముందు పొందలేరు.

        ఎందుకంటే జయించినవారికి జీవవృక్ష ఫలములు జీవజలము క్రీస్తు ప్రభువు బహుమానముగా తన తీర్పు దినమున అనుగ్రహిస్తాడు.  మృతులలోక కాలములో ఇవి అనుగ్రహింప బడవు.  ప్రకటన 2:7, ''చెవిగలవాడు ఆత్మ సంఘములతో చెప్పుచున్నమాట వినునుగాక.  జయించు వానికి దేవుని పరదైసులో ఉన్న జీవవృక్షఫలములు భుజింపనిత్తును.''  కనుక వీరు తమ క్రియల చొప్పున నెమ్మది పొందుటకు ప్రయత్నమేగాని పూర్తి నెమ్మది పొందలేరు.  పూర్తి నెమ్మది క్రీస్తు ప్రభువు తీర్పు తరువాత పరమ యెరూషలేములో వారు పొందుట జరుగును.  అక్కడ వారు జీవజలముతో తమ దప్పికను, జీవవృక్షఫలములతో తమ ఆకలిని, జీవవృక్షపు ఆకులతో తమ అస్వస్థతలను తీర్చుకొని పరిపూర్ణ సిద్ధిని పొందుదురు.  ప్రకటన 22:1-5.  అయితే లాజరు ధనవంతుని ఉపమానములో లాజరు నెమ్మది పొందుచున్నాడు.  అంతేకాని దప్పిక గొనుట లేదు అని చెప్పబడినది, ఎందుకంటే లాజరు విశ్వాసులకు తండ్రియైన అబ్రాహాము ఒడిలో వున్నాడు.  కనుక, అబ్రాహాము దగ్గర దైవవాక్యమునకు కొదువ వుండదు.  కనుక లాజరు దప్పికతో యాతన పొందుట లేదు.  ప్రకటన 22:17, ''ఆత్మయు పెండ్లి కుమార్తెయు రమ్ము అని చెప్పుచున్నారు; వినువాడును రమ్ము అని చెప్పవలెను; దప్పికగొనిన వానిని రానిమ్ము; ఇచ్ఛయించువానిని జీవజలమును ఉచితముగా పుచ్చుకొననిమ్ము.''  ఈ విధముగా ఆత్మ సంఘము రమ్మని చెప్పినప్పుడు వినిన విశ్వాసియైన అబ్రాహాము మరల లాజరును రమ్మని పిలిచి తన దగ్గర వున్న వాక్యమను క్రీస్తును ఉచితముగా లాజరుకు అనుగ్రహించాలి వానికి నెమ్మదిని కలిగిస్తున్నాడు. అంతేకాని వారు జీవవృక్షఫలములు, జీవజలమును పొందుట లేదు.

56.   మృతుల లోకములోని ఆత్మలు క్రీస్తు వాగ్దానము చేసిన ఫలములు

(జీవకిరీటము, జీవవృక్షఫలములు, క్రొత్త పేరు, ఇనుప దండము, జీవగ్రంథములో పేరు, తెల్లని వస్త్రములు, స్థంభములు, సింహాసనముపై కూర్చుండు యోగ్యత, మరియు ఆయనతో కూర్చుని భుజించు యోగ్యత)

         జీవ కిరీటము జయించువానికి ఇచ్చు బహుమానము.  అయితే ఈ బహుమానము క్రీస్తు ప్రభువు తీర్పు దినమున వారికి ఇచ్చును.  అలాగే జీవవృక్షఫలములు, ఇవి పరమ యెరూషలేములో ప్రవేశించిన తరువాత పొందునవి.  అలాగే, క్రీస్తు ప్రభువు జయించినవారికి క్రొత్త పేరు తెల్లని రాతిపై వ్రాసి ఇచ్చును.  అయితే, జీవగ్రంథములో పేరు మాత్రము మన పుట్టుకతోనే వ్రాయబడి యుండును కనుక ఇక్కడ వాగ్దానము దానిని తుడిచివేయునని చెప్పినట్లుగా గ్రహించాలి.  నీ పేరు ఇశ్రాయేలేగాని యాకోబు అనబడదని దేవుడు చెప్పెను.  కనుక పాత పేరు తొలగించబడి క్రొత్త పేరు చేర్చబడును.  కనుక తీర్పు తరువాత జీవగ్రంథములో వ్రాయబడినవారు పై యోగ్యతలు కలిగి యుండుట చేత వారు దేవుని రాజ్యమైన పరమ యెరూషలేములో స్థంభముగా చేయుదునని వాగ్దానము పొందియున్నారు.  వీరు ఇనుపదండము కలిగి క్రీస్తుతోబాటుగా వెయ్యి సంవత్సరముల పరిపాలన కాలములో రాజ్యము చేయుట జరుగును.  అలాగే క్రీస్తుతోబాటుగా తీర్పు తరువాత అనగా  పునరుత్థానము తరువాత వీరు క్రీస్తు ప్రభువుయొక్క సింహాసనములో సహ రాజులుగా కూర్చుని రాజ్యపాలన చేస్తారు.  వీరు క్రీస్తు ప్రభువుతోబాటుగా భోజన పంక్తిలో కూర్చుని భుజించుట జరుగును.

క్రీస్తు ప్రభువు ఇచ్చు బహుమానములను మృతుల లోకములోని ఆత్మలకు ఈయబడవు

        కనుక పైవన్నీ మృతుల లోకములో వున్న కాలములో అనుగ్రహించబడవని గ్రహించాలి.  ఈ కాలము నరుని మొదటి మరణము మొదలు చివరి మరణము (యుగాంతము) వరకు ఉండునని గ్రహించాలి.  కనుక ఇటు పరిశుద్ధులుగా అటు అపరిశుద్ధులుగా ఏ యోగ్యత ఈ కాలములో కలిగి యుండరు.  వీరు కేవలము వారి క్రియలనుబట్టి యాతన లేక నెమ్మది పొందుట మాత్రమే జరుగునని గ్రహించాలి.

57. పాతాళ లోకములోని వారి కిరీటములు

        మృతుల లోకములోని పరిశుద్ధులు జీవకిరీటమును ధరించుటకు ఇంకా తీర్పు పొందలేదు.  అపరిశుద్ధులకు జీవకిరీటము వుండదు.  వీరికి కూడా తీర్పు తీర్చబడలేదు.  తీర్పు తీర్చినా కూడా వీరు అపరిశుద్ధులు కనుక వారికి జీవకిరీటము అనుగ్రహించబడవు.  వీరు పాతాళలోకములో బంధింపబడి యుందురు.  అయితే పాతాళ లోకమునకు అధికారి సాతాను.  ఈ అధికారము దేవుని నుండి పొందియున్నాడు.  ప్రకటన 9:1, ''అయిదవ దూత బూర ఊదినప్పుడు ఆకాశము నుండి భూమిమీద రాలిన యొక నక్షత్రమును చూచితిని.  అగాధముయొక్క తాళపుచెవి అతనికి ఇయ్యబడెను.''  

        ఈ తాళపు చెవి రూపములో సాతానుకు అధికారము ఇయ్యబడింది నుక సాతాను పాతాళపు దూతలపై రాజుగా ఉన్నాడు.  ప్రకటన 9:11, ''పాతాళపు దూత వాటిపైన రాజుగా ఉన్నాడు;  హెబ్రీభాషలో వానికి అబద్దోనని పేరు, గ్రీసుదేశపు భాషలో వానిపేరు అపొల్లుయోను.''  అలాగే సాతాను ఈ లోకము మీద అధికారమును పొందియున్నాడు.  దీనినే సాతాను క్రీస్తు ప్రభువునకు చెప్పుచూ తనకు మ్రొక్కిన తన అధికారమంతయు నీకు ఇస్తానని చెప్పుచున్నాడు.  లూకా 4:5-6, ''అప్పుడు అపవాది ఆయనను తీసికొనిపోయి, భూలోక రాజ్యములన్నిటిని ఒక నిమిషములో ఆయనకు చూపించి -ఈ అధికారమంతయు, ఈ రాజ్యముల మహిమయు నీకిత్తును;  అది నాకప్పగింపబడియున్నది, అదెవనికి నేను ఇయ్యగోరుదునో వానికిత్తును;''  ఈ విధముగా సాతాను పాతాళ లోకము మరియు భూలోకము రాజ్యములపై అధికారమును దేవుని నుండి పొందియున్నాడు.  ఇవి సాతాను కిరీటములు.  వారు పొందిన అధికారము వారికి కిరీటములుగా వారి తలలపై కనిపించును.  అలాగే నరులను శోధించి జల్లెడ పట్టు అధికారమును కూడా సాతాను దేవుని నుండి పొందియున్నాడు.  లూకా 22:31, ''సీమోనూ, సీమోనూ, ఇదిగో సాతాను మిమ్మును పట్టి గోధుమలవలె జల్లించుటకు మిమ్మును కోరుకొనెను గాని'' ఇలా దేవుడే సాతానుకు కూడా అనేక కిరీటములు అనుగ్రహించి యున్నాడు.  తనకు అనుగ్రహించి తనను చేయమనిన ఆ అధికార బాధ్యతను సాతాను తన అనుచరులకు ఇచ్చి వారిచే చేయించును.  అందుచేత వారు కూడా కిరీటములు ధరించుకొని తమ అధికారమును కొనసాగిస్తారు.  వీరు సాతాను దూతలు అనగా శాపగ్రస్తమైన దేవుని దూతలే.  

        ప్రకటన 9:7, ''ఆ మిడతల రూపములు యుద్ధమునకు సిద్ధపరచబడిన గుఱ్ఱములను పోలి యున్నవి.  బంగారమువలె మెరయు కిరీటములవంటివి వాటి తలలమీద ఉండెను; వాటి ముఖములు మనుష్య ముఖములవంటివి,''  ఈ బంగారమువలె మెరయు కిరీటముల వంటివి తలలపై కలిగిన మిడతలు ఎక్కడ నుండి వచ్చుచున్నవి?  ప్రకటన 9:2-3, ''అతడు అగాధము   తెరవగా పెద్ద కొలిమిలోనుండి లేచు పొగవంటి పొగ ఆ అగాధములోనుండి లేచెను; ఆ అగాధములోని పొగచేత సూర్యునిని వాయుమండలమున చీకటి కమ్మెను.  ఆ పొగలోనుండి మిడతలు భూమి మీదికి వచ్చెను, భూమిలో ఉండు తేళ్లకు బలమున్నట్టు వాటికి బలము ఇయ్యబడెను.''  అలాగే ప్రకటన 12:3, ''అంతట పరలోకమందు ఇంకొక సూచన కనబడెను.  ఇదిగో యెఱ్ఱని మహాఘటసర్పము; దానికి ఏడు తలలును పది కొమ్ములును ఉండెను;  దాని తలలమీద ఏడు కిరీటము లుండెను.''  ప్రకటన 13:1, ''మరియు పది కొమ్ములును ఏడు తలలును గల యొక క్రూరమృగము సముద్రములోనుండి పైకి వచ్చుట చూచితిని.  దాని కొమ్ములమీద పది కిరీటములును దాని తలల మీద దేవదూషణకరమైన పేర్లును ఉండెను.''  వీరంతా సాతాను అనుచరులే.  వీరికి దేవుడు అధికారము ఇచ్చుట చేత వీరు ఆ అధికారము కలిగియున్నంతవరకు వాటిని ధరించి వారి కార్యములు నెరవేరుస్తారు.  అయితే ఈ లోకములో రాజులు, మంత్రులు, ప్రపంచ సుందరీలు, ఇలా అనేక రకములైన కిరీటములను సాతాను ఏర్పరచి వారిని ఈ లోక రాజులు, రాణులుగా చేసి, వారిని దైవ సంబంధులుగా ఉండనీయ్యక వారే స్వయముగా దేవుళ్ళుగా ప్రవర్తింప జేస్తున్నాడు.  వీరంతా వారి మరణానంతరము కిరీటములు వారి వెంట రాక సామాన్య ఆత్మలవలె పాతాళ లోకములో బాధింపబడుదురు.  కాని వారి ఆత్మ భూలోకములో వారు అనుభవించిన స్థితిని పాతాళలోకములో కనబరచుచూనే ఉండునని గ్రహించాలి.  క్రీస్తు ప్రభువు చెప్పిన విధముగా ధనవంతుడు పాతాళ లోకములో ధనవంతుని ఆకారములోనే కనబడుచున్నాడుగాని వేరే ఆకారములో కనబడుట లేదని గుర్తించాలి.  లూకా 16:22-25.  అబ్రాహాము ధనవంతుని చూచాడు.  వారి ఆత్మ అంత స్పష్టముగా కనబడునని గుర్తించాలి.  అనగా మనము భూమిపై ఎలా ఉంటామో అలాగే పాతాళ లోకములో మరణించినవారి ఆత్మలు కూడ అలాగే ఉంటాయి.  అయితే భూమి మీద స్థితికి, పాతాళ లోకములో స్థితికి మార్పు ఉండదుగాని, అక్కడ అగ్నిజ్వాలలో యాతన మాత్రము ఉండునని గ్రహించాలి.

సాతాను అతని పరిపాలనలో ఉన్నవారికి అనేక కిరీటములు ఇచ్చి వారిని అధికారులుగా చేయును.   అధికారము క్రీస్తు రాకడ వరకు మాత్రమే ఉండును

        ఇందునుబట్టి పాతాళ లోకములో కూడా మరణించినవారి ఆత్మలు భూమిపైన వారి హోదాను బట్టి అక్కడ కనిపించినను వారికి శిక్షలో మాత్రము తేడా ఉండదని గ్రహించాలి.  అయితే సాతాను బంధింపబడిన తరువాత పాతాళలోక సంబంధులకు కిరీటములు అనేవి ఏవి ఉండవు.  అనగా దేవుని నుండి వారు పొందిన అధికారము వారి ద్వారా నెరవేరబడును గనుక ఆ కిరీటములు వారి నుండి తొలగిపోవును.  కనుక పాతాళ లోకములో దేవుని నుండి వచ్చిన కిరీటములు యుగాంతము తరువాత ఏమి ఉండవని గుర్తించాలి.  ఆదాము మొదలు యుగాంతము వరకు వున్నవారిలో వారి మరణానంతరము వారు ధరించుటకు ఎటువంటి అధికార పూరితమైన కిరీటము లేదని గ్రహించాలి.  ఈ కిరీటములన్నియు కేవలము సాతాను తను దేవుని నుండి పొందిన అధికారములే అని గ్రహించాలి.  సాతాను ఈ అధికారము అను కిరీటములను తన అనుచరులకు ధరింపజేసి వారిని పాతాళలోక వశమునకు తనతోబాటుగా బాధింపబడుటకు ఉపయోగించు మోసపూరితమైన కిరీటములని గ్రహించాలి.

58.  ఆత్మ శరీరమును విడిచి శరీరమును మరణమునకు అప్పగించిన తరువాత భూమిపై దాని కార్యములు

        రాజు రాజ్యాన్ని ఏలి ఉండవచ్చు, తన పగ చేత కొన్ని వేలమందిని చంపి యుండవచ్చును.  500 మంది భార్యలు కలిగి 5000 మంది ఉపపత్నులను కలిగి యుండవచ్చును.  100-200 మంది కుమారులను కలిగియుండవచ్చును.  కాని తాను మరణించి తన ఆత్మ శరీరమును విడిచిన తరువాత అది ఏమి చేయలేదు.  కనీసము తను సంపాదించిన దానిలో ఒక పూస కూడా తీసుకొని పోలేదు.

        అలాగే ప్రతి ఒక్కరు నివసించే ఈ శరీర జీవితములో అనేకము కలిగి ఉంటారు.  లేనివారంటూ ఎవరు ఉండరు.  బిచ్చగాడైనను తను అడుగుకొను బొచ్చెగాని, జోలెగాని కలిగియుండును.  కాని ఎవరు ఏ దానిని తీసుకొని వెళ్ళలేరు.  వారి మరణానంతరము వారు ఏమి తీసుకొని వెళ్ళరు.  ఇక్కడ మనము ఒక విషయము గుర్తించాలి.  నరుని మరణము తరువాత ఆత్మ పరదైసులో లేక పాతాళమునకు తీసుకొని పోబడుతున్నది.  క్రీస్తు ప్రభువు కుడివైపు దొంగతో  లూకా 23:42-43, ''ఆయనను చూచి-యేసూ, నీవు నీ రాజ్యములోనికి వచ్చునప్పుడు నన్ను జ్ఞాపకము చేసికొనుమనెను.  అందుకాయన వానితో-నేడు నీవు నాతోకూడ పరదైసులో ఉందువని నిశ్చయముగా నీతో చెప్పుచున్నా ననెను.''  ఇందులో క్రీస్తు ప్రభువు నేడే నాతోకూడా పరదైసులో ఉందువని చెప్పాడు.  దొంగ కాలము తీరి మరణించిన వాడు కాదు.  నరులచేత చిక్కి మధ్యలోనే చనిపోయినవాడు.  అయినప్పటికి నేడు నీవు నాతోకూడా పరదైసులో ఉందువని క్రీస్తు దగ్గర వాగ్దానము పొందియున్నాడు.

సూర్యుని క్రింద జరుగు వేటితోను వారికి వంతు లేనివారు పాపులు మాత్రమే ప్రేమింపరు పగ పెట్టుకొనరు  అసూయపడరు

        ఈ సంఘటనలో క్రీస్తు ప్రభువు ఈ వాగ్దానమును సుమారు మధ్యాహ్నము 3.00 గంటల సమయములో చెప్పబడింది.  బైబిలు గ్రంథము ప్రకారము ఒక పగలు, ఒక రాత్రి దినము.  ఈ దినము లోపల కుడివైపు దొంగ పరదైసులో చేర్చబడ్డాడు.  కనుక ఈ ఆత్మ భూమిపై ఏ కార్యము ఇకపై జరిగించలేదు, ఎందుకంటే ఒకసారి భూమిని దాటిన ఆత్మ పరదైసులో లేక పాతాళమును చేరిన ఆత్మ భూమిపైకి తిరిగి వచ్చుట జరుగదు.  కనుక నరుడు ఎంత గొప్పవాడైనను, ఎంత పేదవాడైనను మరణించి యేసుక్రీస్తు ప్రభువు చెప్పిన విధముగా వెంటనే పరదైసులో లేక పాతాళములో చేర్చబడిన తరువాత వారు ఎటువంటి కార్యము భూమిపైన చేయలేరు, ఎందుకంటే ఈ ఆత్మ భూమిపైకి తిరిగివచ్చుటకు అనుమతి లేదు.  కనుకనే ధనవంతుడు అబ్రాహామును అనుమతి అడిగినను అతనికి అనుమతి ఇవ్వక అక్కడే బోధించుటకు ప్రవక్తలు ఉన్నట్లుగా చెప్పుచున్నాడు.  లూకా 16:27-31, ''అప్పుడతడు-తండ్రీ, అలాగైతే నా కయిదుగురు సహోదరులున్నారు.  వారును ఈ వేదనకరమైన స్థలమునకు రాకుండ వారికి సాక్ష్యమిచ్చుటకై నా తండ్రి యింటికి వాని పంపవలెనని నిన్ను వేడుకొనుచున్నాననెను.  అందుకు అబ్రాహాము వారియొద్ద మోషేయు ప్రవక్తలును ఉన్నారు;  వారి మాటలు వినవలెనని అతనితో చెప్పగా అతడు-తండ్రివైన అబ్రాహామా, ఆలాగు అనవద్దు; మృతులలోనుండి ఒకడు వారియొద్దకు వెళ్లిన యెడల వారు మారుమనస్సు పొందుదురని చెప్పెను.  అందుకతడు-మోషేయు ప్రవక్తలును (చెప్పిన మాటలు) వారు విననియెడల మృతులలో నుండి ఒకడు లేచినను వారు నమ్మరని అతనితో చెప్పెననెను.''  కనుక మరణించినవారి ఆత్మ పరదైసులో లేక పాతాళమునకు వెళ్ళిన తరువాత ఆత్మ మరల భూమి మీదకు వచ్చి కార్యములు జరిగించు అవకాశము లేదు.  అందుకే - ప్రసంగి 9:6, ''వారిక ప్రేమింపరు, పగపెట్టుకొనరు, అసూయపడరు, సూర్యునిక్రింద జరుగు వాటిలో దేనియందును వారికిక నెప్పటికిని వంతు లేదు.''

ప్రత్యక్షముగాగాని మరియు తాంత్రిక విద్య చేయువాని వద్దగాని చనిపోయిన వారు కనబడుట సాతాను, సాతాను దూతలయొక్క మోసపూరిత క్రియలు మాత్రమే

        ఇక్కడ మరొక విషయము మనము గుర్తించాలి.  కొంతమంది విషయములో మినహాయింపు వుంది.  వారే పరిశుద్ధులు.  వారు పరదైసులో ఉన్నను, వారికి క్రీస్తు ప్రభువు ఎక్కడికి వెళ్ళునో అక్కడికి వెళ్ళుటకు అనుమతి ఇయ్యబడింది.  ప్రకటన 14:1-5, ''గొఱ్ఱెపిల్ల ఎక్కడికి పోవునో అక్కడికెల్ల ఆయనను వెంబడింతురు.''  1,44,000 మంది గొఱ్ఱెపిల్ల ఎక్కడికి పోవునో అక్కడికెల్ల ఆయనను వెంబడించుదురు.  కనుక వీరు భూమిపైకి శరీర రీత్యా వచ్చి వారి కార్యములు నెరవేర్చి మరణించిన తరువాత, పరదైసులో వారు చేర్చబడినను, వారు అనింద్యులు కనుక వారు క్రీస్తు ప్రభువుతోపాటు ఉండి క్రీస్తు ప్రభువుతో కూడా సంచరించుచూ భూమి మీద క్రీస్తు ప్రభువు కార్యములను నెరవేర్చు యోగ్యతను పొందియున్నారు.  వీరుగాక ఇంకెవరు మరణించిన తరువాత భూమిపైకి శరీర రీత్యా వచ్చు యోగ్యత

1,44,000 మంది అనింద్యులు మరియు  ఇరువదినలుగురు పెద్దలు మాత్రమే దేవుని దూతలు లేక క్రీస్తు ప్రభువు వలె భూమి మీద తమ కార్యములు కొనసాగించుదురు

పొందలేదుగాని 24గురు పెద్దలు మాత్రమే ఈ యోగ్యత 1,44,000 మందితో బాటుగా పొందియున్నారు.  వీరు భూమి మీద అప్పుడప్పుడు కనబడినట్లుగా చెప్పబడుట మనము విని యున్నాము.

        కనుక వీరు క్రీస్తును వెంబడించుట అనగా క్రీస్తు ప్రభువు చేయు కార్యములను కొనసాగించుట అని అర్థము అనగా క్రీస్తు ప్రభువు ఏవైతే కార్యములు చేయాలని అనుకొంటాడో ఆ కార్యములు వీరు నెరవేర్చుదురని గ్రహించాలి.  నీతి విషయములో, సువార్త విషయములో భూమిపై నివసించు పరిశుద్ధులకు వారు సహాయపడి వారిచే నిరాటంకముగా సువార్త కార్యము జరిగించుదురు.   అందుకోసము ఆయనను నమ్మిన ఈ పరిశుద్ధులు క్రీస్తువలె ఆయన కన్నా ఎక్కువ అద్భుతములు చేస్తున్నారు.  వీరు భూమిపై బ్రతికియున్నప్పుడు చేయగలిగిరి.  మరణించిన తరువాత కూడా చేయుచున్నట్లుగా గ్రహించాలి.  ఉదా :-  ఏలీయాయొక్క దుప్పటి ఎలీషాకు దారి చూపించుట 2 రాజులు 2:13.  ఏలీయా క్రీస్తుకు బాప్తిస్మము ఇచ్చుట, మోషే ఏలీయాలు కొండపై రూపాంతరములో కనిపించుట లూకా 1:17, ప్రకటన 11:3 ఇద్దరు సాక్షులు దిగివచ్చి సువార్తను ప్రకటించి వారి నోట నుండి దైవాగ్ని దిగి వచ్చి వారి శత్రువులను దహించుట మొదలైనవి.

        వీరు తప్ప మిగిలినవారి ఆత్మలు మరణించిన దినమున పరదైసులో గాని లేక పాతాళమునకు  వారి కార్యములనుబట్టి కొనిపోబడి ఇక తిరిగి భూమిపైకి రారని గ్రహించాలి.  అలా కాకుండా చనిపోయినవారు (1,44,000 మంది + 24గురు పెద్దలు తప్ప) మరల కనబడ్డారని కొందరు చెప్పుదురు.  ఇది చనిపోయినవారి ఆత్మలు కావు.  సాతానుయొక్క దూతలు.  ఆ రూపములో జనులను మోసపరచుచున్నవని గ్రహించాలి.  ఈ దూతలు చనిపోయిన వారి రూపములో కనబడి పాతాళములో బంధింపబడి తిరిగిరానివాడు తిరిగివచ్చినట్లుగా తెలియజేయును.  తన కోరికలు ఏవేవో ఉన్నట్లుగా తెలియజేయును.  ఇలా చేసేవి సాతాను దూతలు కాని మరణించిన వారి ఆత్మలు కావు.  అకస్మికముగా ప్రమాదాలలో మరణించినను వారికి దేవుడు ఇచ్చినకాలము అంతే అని అనుకోవాలి.  ఎందుకంటే, సిలువపై క్రీస్తుతోబాటు కుడివైపు మరణించిన దొంగవానిది కూడా అకాలమరణమని గ్రహించాలి.  అదేరోజు వాడు పరదైసులో చేర్చబడ్డాడుగాని కొంతకాలము వాని ఆత్మ భూమిపై తిరగలేదని గ్రహించాలి.

59.  మృతుల ఆత్మతో జరిగించు మాంత్రిక సంబంధమైన క్రియలు

        1 సమూయేలు 28:3, ''సౌలు కర్ణపిశాచము గలవారిని చిల్లంగివారిని దేశములో నుండి వెళ్లగొట్టియుండెను.''  

        ఇది మాంత్రిక విద్య.  దీనికి అధిపతి సాతానే.  కనుక ఈ చర్యలు నిషేధించుట జరిగింది.  సౌలు కూడా 1 సమూయేలు 28:3లో వలె ఈ చర్యలను నిషేధించుట జరిగింది.  ఇది మృతుల ఆత్మల పేరుతో దెయ్యముల ఆత్మలతో జరుగు కార్యము.  ఇది నరులను నాశన మార్గములో నడిపించును అని గ్రహించాలి.  వారు సాతాను దూతల ఆత్మలచే ప్రేరేపితులై మన ఇంటిలో జరిగిన కార్యములు, మూలధనములను చెప్పగలుగుదురు, ఎందుకంటే నరులను నమ్మించుటకు ఇలా చెప్పుదురు.  అయితే వీరు భవిష్యత్తును చెప్పలేరు.  దేవుడు జరిగించబోవు కార్యములను గూర్చి చెప్పలేరు.  కాని జరిగిన వాటిని చెప్పగల సామర్థ్యము సాతానుకును అతని దూతలకు వున్నది.  ఇలా ఉన్నవి లేనివి కల్పించి చెప్పి, శకునములు,  జాతకాలన్న పేరుతోను ఆత్మలతో మాట్లాడి చెప్పుట చేస్తారు.  వీరు దెయ్యముల ఆత్మను రప్పించి వారి ద్వారా సమాచారమును తెలియజేయుదురు.  ఇటువంటి క్రియలు నిషిద్ధము, ఎందుకంటే సమస్తమును చేయగల సమర్థుడు దేవుడు.  ఆయనను మనము వదిలి దెయ్యములను ఆశ్రయించుట మన్నింపరాని దోషముగా పరిగణించాలి.  జరగబోవు విషయములను దేవుడు తన ప్రవక్తల ద్వారా తెలియజేస్తాడు.  అవి అన్ని కూడా తు.చ. తప్పకుండా జరుగును.  కాని మానవుడు దేవుని ఆశ్రయించి తన ప్రార్థన, నిరీక్షణ, విశ్వాసముతో జరగబోవువాటిని తెలుసుకోవాలన్న ఆశ అతనిలో వుండదు.  కాని త్వరపడి సాతాను దూతలను ఆశ్రయించి దేవునికి దూరమైపోతున్నాడు.  కనుకనే బైబిలు గ్రంథములో ఇటువంటి చర్యలను ఖరాఖండిగా నిషేధించుట జరిగింది.  

        1 సమూయేలు 28:3లో చెప్పిన విధముగా దెయ్యములు, చనిపోయిన వారి ఆత్మలు నిజముగా మాంత్రికులు పిలిచినప్పుడు వస్తాయా అన్న విషయములు మనము తెలుసుకోవలసి యున్నది.  పరిశుద్ధులు చనిపోయిన తరువాత పరదైసులలో ప్రశాంతకరమైన వాటిలో ఆనందముగా జీవిస్తారు.  కాని అపరిశుద్ధులు మృతులలోకములో బంధింపబడి యుంటారు.  వీరు తిరిగి వచ్చుట జరుగదు.  పరిశుద్ధులకు మాత్రమే వారి మరణానంతరము భూమిపై తిరుగుటకు అవకాశము ఉంటుంది.  ఎలా?  ప్రకటన 14:1-4లో వలె ఈ 1,44,000 మంది పరిశుద్ధులు క్రీస్తుతోబాటుగా క్రీస్తు ప్రభువు భూమిపై తన కార్యములు చేయుటకు వచ్చినప్పుడు వారు కూడా వచ్చుట జరుగును.  

        అలాగే లూకా 1:17, ''మరియు అతడు తండ్రుల హృదయములను పిల్లల తట్టునకును, అవిధేయులను నీతిమంతుల జ్ఞానము ననుసరించుటకును త్రిప్పి, ప్రభువు కొరకు ఆయత్తపడియున్న ప్రజలను సిద్ధపరచుటకై ఏలీయాయొక్క ఆత్మయు శక్తియు గలవాడై ఆయనకు ముందుగా వెళ్లును గనుక నీకు సంతోషమును మహా ఆనందమును కలుగును;  అతడు పుట్టినందున అనేకులు సంతోషింతురనెను.''  ఈ విధముగా బాప్తిస్మమిచ్చు యోహాను పాత నిబంధనలోని ఏలీయా ఆత్మను పొందినట్లుగా చెప్పబడినది.  కనుక పరిశుద్ధుడైన ఏలీయా బాప్తిస్మమిచ్చు యోహానుకు తన ఆత్మలోని శక్తిని ఇచ్చి బలపరచినట్లుగా మనము గ్రహించాలి.  అలాగే క్రీస్తు ప్రభువు కొండ మీద దివ్య రూపధారణ చేసినప్పుడు కూడా మోషే ఏలీయాలు క్రీస్తుతో దేవుని కార్యములను గూర్చి సంభాషించినట్లుగా చదువగలము.  లూకా 9:28-30,  ''ఈ మాటలు చెప్పినది మొదలుకొని రమారమి యెనిమిది దినములైన తరువాత, ఆయన పేతురును యోహానును యాకోబును వెంటబెట్టుకొని, ప్రార్థన చేయుటకు ఒక కొండ యెక్కెను.  ఆయన ప్రార్థించుచుండగా ఆయన ముఖరూపము మారెను;  ఆయన వస్త్రములు తెల్లనివై ధగధగ మెరిసెను.  మరియు ఇద్దరు పురుషులు ఆయనతో మాటలాడుచుండిరి, వారు మోషే ఏలీయా అను వారు.''  లూకా 9:31, ''వారు మహిమతో అగపడి, ఆయన యెరూషలేములో నెరవేర్చబోవు నిర్గమమును గూర్చి మాటలాడుచుండిరి.''  ఇలా పరిశుద్ధులైనవారు వారి మరణానంతరము కూడా దేవుని కార్యములను జరిగించువారికి వారి సహాయాన్ని అందించుటకు వారు వస్తారు.  దేవుని కార్యములను దేవుని దూతలవలె తెలియజేసి ఆ కార్యములను నెరవేరుస్తారు.  కనుక దేవుని రాజ్య వారసులుగాను, పరిశుద్ధులుగాను జీవించినవారు వారి మరణానంతరము కూడా దేవుని కార్యములను తెలియజేస్తారని గ్రహించాలి.  ఆ కార్య నెరవేర్పు ఎలా చెయ్యాలో మనకు తెలియజేస్తారు.  అందుకే అపొస్తలుడైన యాకోబు పరిశుద్ధులను జ్ఞాపకము చేసుకొనుట శ్రేయోదాయకమని చెప్పుచున్నాడు.  యాకోబు 5:10, ''నా సహోదరులారా, ప్రభువు నామమున బోధించిన ప్రవక్తలను, శ్రమానుభవమునకును ఓపికకును మాదిరిగా పెట్టుకొనుడి.''  

పరిశుద్ధుల ఆత్మలు సంచరించుటకు నిషేధము లేదు. పరిశుద్ధుని ఆత్మలు భూమిపైకి వచ్చుటకు, ఇంకొక పరిశుద్ధునికి దైవకార్యములో సహాయపడుటకు అదికారమున్నది.

        వీరందరు కూడా పాత కాలములో చనిపోయినవారే కాని వీరు జీవమును పొందినవారు, పరిశుద్ధులు కనుక వీరు తిరుగుటకు నిషిద్ధము లేదు.  కాని అపరిశుద్ధులు చనిపోయిన తరువాత వారు తిరిగి భూమి మీదకు రారు.  మరైతే మాంత్రికులు తమ మంత్ర విద్య చేత పిలిచినప్పుడు వచ్చువారు ఎవరు?  పరిశుద్ధులుగా ఉండి చనిపోయినవారు దేవుని కార్య నిమిత్తము మాత్రమే వచ్చెదరని గ్రహించాలి.  వీరు మంత్రవిద్యచే పిలిచిన రారు.  వారికి మాంత్రికులకు పొత్తు లేదు.  వీరు పరిశుద్ధులు.  వారు అపరిశుద్ధులు.  అయితే అపరిశుద్ధులైన ఈ మాంత్రికులు ఎవరిని రప్పించి విషయములను తెలియజేస్తారో మనము ఇప్పుడు తెలుసుకొందము.

        1 సమూయేలు 28:3, ''సమూయేలు మృతిబొందగా ఇశ్రాయేలీయులు అతని గురించి విలాపము చేసి రామా అను అతని పట్టణములో అతని పాతిపెట్టియుండిరి.  మరియు సౌలు కర్ణపిశాచము గలవారిని చిల్లంగివారిని దేశములో నుండి వెళ్లగొట్టియుండెను.''  ఇందులో దయ్యములు కొందరి దగ్గర ఉన్నట్లుగాను, ఇలాంటి మాంత్రికులు దెయ్యములను, చనిపోయినవారి ఆత్మలను రప్పించుచున్నట్లుగా చెప్పబడినది.  కాని ఇక్కడ చనిపోయినవారి ఆత్మలు రావు.  అక్కడ వచ్చేది దెయ్యముల ఆత్మలే.  అయితే ఈ వచనములో చనిపోయినవారి ఆత్మలు అని ఎందుకు వ్రాయబడి యున్నది?  అన్న సంశయము మనకు కలుగవచ్చును.  ఇందులో చెప్పబడిన దయ్యములు చనిపోయినవారి రూపములో కనిపిస్తాయి.  అంతేగాని అవి చనిపోయినవారు కాదు, ఎందుకంటే చనిపోయినవారు యుగాంతములో క్రీస్తు రాకడకు ముందు పునరుత్థానములో మాత్రమే వారి ఆత్మలు శరీర రూపములు పొందుదురు.  ఆ రూపములు పునరుత్థానానికి ముందు కనిపించరు.  ఇంకా ఆత్మకు రూపము వున్నది.  ఈ రూపము కూడా నరరూపము మాదిరిగానే ఉంటుంది.  కనుక చనిపోయినవారి ఆత్మ ఆ రూపములో కనిపించవచ్చును కదా అన్న సంశయము మనకు కలుగవచ్చును.  

        కాని ధనికుడు లాజరు ఉపమానములో క్రీస్తు ప్రభువు అలా వెళ్లుటకు విషయములను తెలియజేయు అవకాశము ధనికుని ఆత్మకు గాని లాజరు ఆత్మకు గాని ఇవ్వలేదు.  లూకా 16:27-31, ''అప్పుడతడు-తండ్రీ, ఆలాగైతే నా కయిదుగురు సహోదరులున్నారు.  వారును ఈ వేదనకరమైన స్థలమునకు రాకుండ వారికి సాక్ష్యమిచ్చుటకై నా తండ్రి యింటికి వాని పంపవలెనని నిన్ను వేడుకొనుచున్నాననెను.  అందుకు అబ్రాహాము వారియొద్ద మోషేయు ప్రవక్తలును ఉన్నారు;  వారి మాటలు వినవలెనని అతనితో చెప్పగా అతడు-తండ్రివైన అబ్రాహామా, ఆలాగు అనవద్దు;  మృతులలోనుండి ఒకడు వారియొద్దకు వెళ్లిన యెడల వారు మారుమనస్సు పొందుదురని చెప్పెను.  అందుకతడు-మోషేయు ప్రవక్తలును (చెప్పిన మాటలు) వారు విననియెడల మృతులలో నుండి ఒకడు లేచినను వారు నమ్మరని అతనితో చెప్పెననెను.''  పరిశుద్ధులు వెళ్ళి అనేక హెచ్చరికలు జరగవలసిన కార్యములను తెలియజేస్తారు.  వీరిలో చనిపోయిన మోషే వంటి ప్రవక్తలు కూడా వున్నారు.  వీరు క్రీస్తు జరిగించాల్సిన కార్యములను కూడా తెలియజేస్తారు.  అలాగే మనలో వున్న పరిశుద్ధులకు వారు చేయవలసిన కార్యములను గూర్చి మోషేవంటి పరిశుద్ధులు వారి  మరణానంతరము కూడా ఆత్మరూపములో వచ్చి వారికి తెలియజేయుదురు.  కాని వీరికి అపరిశుద్ధులతో  సంబంధము లేదు.  వీరు వారితో మాట్లాడరు.  ఎందుకంటే వారు దేవునియొక్క నీతిలో జీవించినవారు కారు.  1 సమూయేలు 26:23, ''యెహోవా ఈ దినము నిన్ను నాకు అప్పగించినను నేను యెహోవాచేత అభిషేకము నొందినవానిని చంపనొల్లక పోయినందున ఆయన నా నీతిని నా విశ్వాస్యతను చూచి నాకు ప్రతిఫలము దయచేయును.''  కనుక దేవుడుకాని, పరిశుద్ధుల ఆత్మలుకాని పరిశుద్ధులతోనే సంభాషించునని గ్రహించాలి.  అపరిశుద్ధులు పాతాళములో బాధింపబడుదురేగాని దీనిదాటి బయటకు వచ్చుటకు అవకాశము లేదు.  వారు వారి శిక్షను అనుభవిస్తుంటారు.  దానిని తప్పించుకొని వచ్చి మాంత్రిక విద్య జేయువారితో మాట్లాడుటకు అవకాశము లేదని అబ్రాహాము చెప్పినట్లుగా యేసుక్రీస్తు ప్రభువు మనకు లూకా 16:27-31లో చెప్పుచున్నారు.

        అయితే సమూయేలు గ్రంథములో మాంత్రిక విద్యను ప్రదర్శించు స్త్రీని గూర్చి చెప్పబడింది.  ఈ స్త్రీ సౌలు కోసము సమూయేలు ప్రవక్తను రప్పించినట్లుగా చెప్పబడింది.  1 సమూయేలు 28:7-11, ''అప్పుడు సౌలు-నా కొరకు మీరు కర్ణ పిశాచముగల యొక స్త్రీని కనుగొనుడి;  నేను పోయి దానిచేత విచారణ చేతునని తన సేవకులకు ఆజ్ఞ ఇయ్యగా వారు-చిత్తము, ఏన్దోరులో కర్ణపిశాచము గల యొకతె యున్నదని అతనితో చెప్పిరి.  కాబట్టి సౌలు మారు వేషము ధరించి వేరు బట్టలు తొడుగుకొని యిద్దరు మనుష్యులను వెంటబెట్టుకొని పోయి రాత్రివేళ ఆ స్త్రీయొద్దకు వచ్చి-కర్ణపిశాచముద్వారా నాకు శకునము చెప్పి నాతో మాటలాడుటకై నేను నీతో చెప్పువాని రప్పించుమని కోరగా ఆ స్త్రీ-ఇదిగో, సౌలు చేయించినది నీకు తెలిసినది కాదా?  కర్ణపిశాచము గలవారిని చిల్లంగివారిని అతడు దేశములో ఉండకుండ నిర్మూలము చేసెను గదా.  నీవు నా ప్రాణముకొరకు ఉరియొగ్గి నాకు మరణమేల రప్పింతువు అని అతనితో అనెను.  అందుకు సౌలు-యెహోవా జీవముతోడు దీనినిబట్టి నీకు శిక్ష యెంత మాత్రమును రాదని యెహోవా నామమున ప్రమాణము చేయగా ఆ స్త్రీ-నీతో మాట లాడుటకై నేనెవని రప్పింపవలెనని యడుగగా అతడు-సమూయేలును రప్పింపవలెననెను.''

        ఇందులో సౌలు ఎన్దోరు వద్ద వున్న మాంత్రికురాలి వద్దకు రహస్యముగా వెళ్ళాడు.  ఒకప్పుడు అదే సౌలు మాంత్రికులను, శకునములు చెప్పువారిని చంపించాడు అయినను అతడు మాంత్రికురాలి వద్దకు వెళ్ళి తను పేర్కొన్న వానిని రప్పింపుమని అడుగుచున్నాడు.  అంటే సౌలు దేవుని వదిలివేసినందున ఒక మాంత్రికురాలు చేత దేవుడు సౌలును హెచ్చరింప చేసినట్లుగా చదువగలము.  1 సమూయేలు 28:9లో ఆ స్త్రీ-ఇదిగో, సౌలు చేయించినది నీకు తెలిసినది కాదా?  కర్ణపిశాచము గలవారిని చిల్లంగివారిని అతడు దేశములో ఉండకుండ నిర్మూలము చేసెను గదా.  నీవు నా ప్రాణముకొరకు ఉరియొగ్గి నాకు మరణమేల రప్పింతువు అని అతనితో అనెను.  అందుకు సౌలు దేవుడైన యెహోవా తోడుగా ప్రమాణము చేస్తూ ఆ స్త్రీకి అభయమిచ్చి దేవుని హెచ్చరికను ఖాతరు చేయలేదు.  దేవుడు నాశన మార్గమునకు దగ్గరకు వెళ్ళిన సౌలును ఆ మంత్రగత్తె చేతనే హెచ్చరిక చేసినను సౌలు దానిని వినలేదు.  అంతే కాకుండా దైవ ప్రవక్తలలో గొప్ప ప్రవక్తయైన సమూయేలును రప్పింపమని తెలియజేసాడు.

మాంత్రిక సంబంధమైన క్రియలు నిషేధము. ఇది దైవ చట్టము

        1 సమూయేలు 28:12, ''ఆ స్త్రీ సమూయేలును చూచినప్పుడు బిగ్గరగా కేకవేసి-నీవు సౌలువే;  నీవు నన్నెందుకు మోసపుచ్చితివని సౌలుతో చెప్పగా'',  ఈవిధముగా మాంత్రికురాలు సమూయేలును పిలిచినప్పుడు సమూయేలును చూచి కేకవేసి సౌలు రాజును గుర్తించింది.  1 సమూయేలు 28:13, ''రాజు-నీవు భయపడవద్దు, నీకు ఏమి కనబడినదని ఆమె నడుగగా ఆమె-దేవతలలో ఒకడు భూమిలోనుండి పైకి వచ్చుట నేను చూచుచున్నాననెను.''  ఇందులో మాంత్రికురాలు సౌలు ఉన్నారు.  మాంత్రికురాలు పిలిచినప్పుడు ఆ వచ్చినది సౌలుకు కనబడలేదు.  కనుక సౌలు ఆమెను వచ్చినవాని గూర్చి అడిగి తెలుసుకున్నాడు.  1 సమూయేలు 28:14, ''అందుకతడు-ఏ రూపముగా ఉన్నాడని దాని నడిగినందుకు అది-దుప్పటి కప్పుకొనిన ముసలివాడొకడు పైకి వచ్చుచున్నాడనగా సౌలు-అతడు సమూయేలు అని తెలిసికొని సాగిలపడి నమస్కారము చేసెను.''  ఈ విధముగా ఆమె చెప్పిన వర్ణనను బట్టి సౌలు సమూయేలు ప్రవక్త అని గ్రహించాడు.  ఇది ఎంతవరకు నిజమైనదో మనము గ్రహించాలి.

        ఇందులో సమూయేలు ప్రవక్తగా గుర్తించింది సౌలురాజు.  కాని సౌలురాజు సమూయేలును చూడలేదు.  ఆమె చెప్పిన దానిని బట్టి సమూయేలు ప్రవక్తగా ఊహించాడు, ఎందుకంటే సౌలు మంత్రగత్తెను సమూయేలును రప్పింపమని అడిగాడు.  కనుక దుప్పటి కప్పుకొని వచ్చిన ఆ ముసలి రూపమును మంత్రగత్తె వర్ణించగా సౌలురాజు సమూయేలు ప్రవక్తగా గ్రహించాడు.  కాని వాస్తవానికి సమూయేలు ప్రవక్త కాదు.  ఎలా?

        సమూయేలు ప్రవక్తలలో అగ్రగణ్యుడని చెప్పవచ్చు.  అతనిలో ఏ దోషము లేదు.  ఇటువంటి దేవుని ప్రవక్త పాతాళములో ఎందుకు ఉంటాడు?  పాతాళములో వుండువారు అపరిశుద్ధులు అని అందరికి తెలుసును.  సమూయేలు ప్రవక్త పాతాళములో వుండుటకు అవకాశము లేదు.  పాతాళములో ఆత్మలు బాధను అనుభవించునని లూకా 16వ అధ్యాయములో ధనికుడు చెప్పుచున్నాడు.  ఇది అపవిత్రుల స్థలము.  సమూయేలు ప్రవక్త పవిత్రమైనవాడు.  అతను పాతాళలోకములో బాధను అనుభవించవలసిన అవసరము లేదు.  సమూయేలు ప్రవక్త పరదైసులో ఆనందకరమైన స్థితిలో ఉండునని మనము ప్రత్యేకముగా చెప్పనవసరత లేదు.

        ఇంతకి మంత్రగత్తె పిలిచినప్పుడు అక్కడ కనిపించింది ఎవరు?  ఈ సమూయేలు ప్రవక్త రూపములో సాతానుయొక్క దూత వచ్చినట్లుగా మనము గ్రహించాలి, ఎందుకంటే పాతాళలోకములో సాతాను దూతలు బంధింపబడి యున్నారు.  యూదా 1:6, ''మరియు తమ ప్రధానత్వమును నిలుపుకొనక, తమ నివాసస్థలమును విడిచిన దేవదూతలను, మహాదినమున జరుగు తీర్పువరకు కటికచీకటిలో నిత్యపాశములతో ఆయన బంధించి భద్రము చేసెను.''  2 పేతురు 2:4, ''దేవదూతలు పాపము చేసినప్పుడు దేవుడు వారిని విడిచిపెట్టక, పాతాళలోకమందలి కటిక చీకటిగల బిలములలోనికి త్రోసి, తీర్పుకు కావలిలో ఉంచబడుటకు వారిని అప్పగించెను.''  కనుక ఈ దూతలలో ఒక సాతాను దూత సమూయేలు ఆకారమును ధరించి ఆ దినమున ఆమెకు కనపడినాడు.  

        1 సమూయేలు 28:15-19, ''సమూయేలు-నన్ను పైకిరమ్మని నీ వెందుకు తొందర పెట్టితివని సౌలు నడుగగా సౌలు-నేను బహు శ్రమలో నున్నాను;  ఫిలిష్తీయులు నా మీదికి యుద్ధమునకు రాగా దేవుడు నన్ను ఎడబాసి ప్రవక్తల ద్వారానైనను స్వప్నములద్వారానైనను నా కేమియు సెలవియ్యక యున్నాడు.  కాబట్టి నేను చేయవలసిన దానిని నాతో తెలియజెప్పుటకై నిన్ను పిలిపించితి ననెను.  అందుకు సమూయేలు-యెహోవో నిన్ను ఎడ బాసి నీకు పగవాడు కాగా నన్ను అడుగుటవలన ప్రయోజనమేమి?  యెహోవా తన మాట తన పక్షముగానే నెరవేర్చుచున్నాడు.  నా ద్వారా ఆయన సెలవిచ్చియున్నట్టు నీ చేతినుండి రాజ్యమును తీసివేసి నీ పొరుగువాడైన దావీదునకు దాని నిచ్చి యున్నాడు.  యెహోవా ఆజ్ఞకు నీవు లోబడక, అమాలేకీయుల విషయములో ఆయన తీక్షణమైన కోపము నెరవేర్చక పోయిన దానినిబట్టి యెహోవా నీకు ఈవేళ ఈ ప్రకారముగా చేయుచున్నాడు.  యెహోవా నిన్నును ఇశ్రాయేలీయులను ఫిలిష్తీయుల చేతికి అప్పగించును;  యెహోవా ఇశ్రాయేలీయుల దండును ఫిలిష్తీయుల చేతికి అప్పగించును;  రేపు నీవును నీ కుమారులును నాతోకూడ ఉందురు అని సౌలుతో చెప్పగా'', ఇందులో సౌలుకు సాతాను దూత సమూయేలు రూపములో కనిపించి అతని భవిష్యత్తును ఎలా చెప్పగలిగింది?  అన్న సంశయము మనకు కలుగవచ్చును, ఎందుకంటే భవిష్యత్తు సాతానుకు తెలియదు.  ఏవి ఎప్పుడు ఎలా జరుగునన్నవి దేవుని ఆధీనములోనే జరుగును.  ఇవి ముందుగా దేవుడు తన ప్రవక్తలకు మాత్రమే తెలియజేయును.  ఇక ఎవ్వరు దీనిని తెలుసుకొనుటకు యోగ్యులు కారు.  అలాగే ప్రవక్త చెప్పిన విషయములు తప్ప ఇంకేది కూడా ఎవ్వరికి తెలియదు.  కాని సౌలు విషయము సాతాను సౌలుకు జరగబోవు విషయములను తెలియజేసింది.  ఎలా?

        ఇందులో సాతాను దూత ఇది శాపగ్రస్తమైనది.  ఇది అపవిత్రమైనది.  ఇది సమూయేలు రూపములో మంత్రగత్తె పిలిచినప్పుడు కనిపించుట జరిగింది.  అటు తరువాత సౌలురాజుకు జరగబోవు వినాశనమును గూర్చి తెలియజేయుట జరిగింది.  ఇందులో సాతాను దూత భవిష్యత్తు తెలియజేసినట్లుగా వున్నను అది భవిష్యత్తు కాదు.  ఇది ఎవ్వరైనా చెప్పవచ్చును.  అంటే ఒకడు మాంత్రికులను ఆశ్రయించి దేవునికి దూరమైపోయిన వాని పరిస్థితి  ఏమిటి?  అని మనము ఎవరిని అడిగినను వారు నాశనమునకు పోవునని చెప్పును.  కనుక ఇదే విషయమును ఈ సాతాను దూత సమూయేలు రూపములో వచ్చి తెలియజేస్తున్నది.  ఇందులో మనము ఆశ్చర్యపడవలసిన పని లేదు.  ఇక్కడ చనిపోయిన వాని ఆత్మ  రావటము లేదు.  అక్కడ వచ్చింది సాతాను దూత మాత్రమే.  జనులను నాశన మార్గములో నడిపించువారే కదా సాతాను అతని దూతలు.  కనుక తమను ఆశ్రయించిన సౌలురాజుకు తమ మార్గము నాశన మార్గమని అదే నీవు పొందబోవుచున్నావని తేలిగ్గా తెలియచేయగలిగినది.  ఇందులో తెలియజేసినవి జరిగే విషయములు మాత్రమే అని గ్రహించాలి.  జరగబోవునవి నాశనము.  అది తమను ఆశ్రయించిన ప్రతి ఒక్కరికి వచ్చునదే.  ఇందులో ఆ దూత చెప్పిన భవిష్యత్తు ఏమియు లేదు.

        ఒకవేళ నిజముగా సమూయేలు ఆత్మ అయితే సౌలుకు ఏమని చెప్పేవాడో ఊహిస్తాము.  దేవుడు ప్రేమించిన నీ అల్లుడైన దావీదును నీవు ద్వేషించి చంపజూచినందున నీకు ఈ గతి కల్గింది.  కనుక దావీదును శరణు వేడి అతనికి రాజ్యాన్ని అప్పగించి నీ ప్రాణములు కాపాడుకో గల్గుటకు అవకాశమున్నదని ప్రయత్నించమని చెప్పేవాడు.

మాంత్రికులను ఆశ్రయించువారు సాతానును ఆశ్రయించినట్లే! సాతానును ఆశ్రయించినవారికి వారికి నాశనమే గదా!  అందుకే సాతాను, వారు ఎలా నాశనమగుదురో సునాయాసముగా చెప్పగలుగును

        కనుక మృతుల ఆత్మలతో జరిగించు మాంత్రిక విద్యలు దేవుడు నిషేధించాడు.  వాటిని ఆశ్రయించినవారు నాశనమునకు వెళ్ళవలసినదేగాని వారికి మోక్షము లభించదు.  అయితే పరిశుద్ధులు దేవుని దూతగా వచ్చినప్పుడు దేవుడు వారికి చెప్పిన కార్యమునే తెలియజేతురుగాని వేరొకటి తెలుపరు.  కనుక మనము భవిష్యత్తు తెలుసుకోవాలంటే దేవుని అడిగి తెలుసుకోవాలేగాని మాంత్రికులను అడగకూడదు.  దేవుడు భవిష్యత్తు అవసరమును బట్టి తెలియజేయునని గ్రహించాలి.  ప్రవక్తలు రాసిన దర్శనములు దేవుడు తెలియజేసినవే.  అవి అన్నీ కూడా తు.చ. తప్పక వాటి కాలమందు జరుగునని  గ్రహించాలి.  కనుక మాంత్రిక సంబంధమైన చర్యలలో సాతాను అతని దూతల ప్రమేయముండునని గ్రహించి వాటికి దూరముగా జీవించుట మంచిదని గ్రహించాలి.

60.   లోక వివాహ బంధములకు మరణానంతర స్థితి

         ఈ లోకములో వివాహము అన్ని విషయములలో ఘనమైనదిగా ఎంచబడి యున్నది.  మత్తయి 5:31-32. ఈ వివాహ స్థితిలో జతపరచబడిన వారిని ఎవరును విడదీయరాదని బైబిలు గ్రంథము బోధించుచున్నది.  మరియైతే ఈ వివాహ స్థితి మరణించిన ఆత్మలకు వున్నదా?  లేక పునరుత్థానము పొందిన ఆత్మలకు వున్నదా?  అన్న విషయమును మనము తెలుసుకోవలసి యున్నది.

        బైబిలు గ్రంథములో భార్యభర్తలను విడదీయరాదని చెప్పబడినది.  1 కొరింథీ 7:10-12, ''మరియు పెండ్లియైన వారికి నేను కాదు ప్రభువే ఆజ్ఞాపించునదేమనగా, భార్య భర్తను ఎడబాయకూడదు.  ఎడబాసినయెడల పెండ్లిచేసికొనకుండవలెను; లేదా, తన భర్తతో సమాధాన పడవలెను.  మరియు భర్త తన భార్యను పరిత్యజింప కూడదు.  ప్రభువు కాదు నేనే తక్కినవారితో చెప్పున దేమనగా-ఏ సహోదరునికైనను అవిశ్వాసురాలైన భార్యయుండి, ఆమె అతనితో కాపురము చేయ నిష్టపడినయెడల, అతడు ఆమెను పరిత్యజింపకూడదు.''  కనుక వీరిని విడదీసినవారు శాపగ్రస్థులే.  భార్య భర్త ఇద్దరు ఈ లోకములో ఎంతకాలము జీవించినను, ఎంతో అన్యోన్యముగా వున్నను, ఒకానొక దినమున మరణము అను స్థితికి రావలసినవారే.  ఈ మరణము వీరిద్దరిని విడదీయునని మనకు తెలియును.  ఇలా ఒకరికొకరు దూరమై మరణించి సమాధి చేయబడుట జరుగును.  అటు తరువాత మిగిలినవారు కూడా మరణించుట జరుగును.  అటుతరువాత ఈ ఇరువురి స్థితి ఎలాగుండునో మనము తెలుసుకోవలసి యున్నది.  ఇందులో ప్రధానముగా మరణానంతరము వారు వారి ఆత్మలు భద్రపరచబడి వుంటారు.  వారు పునరుత్థానము వరకు అలాగే వుండుట జరుగును.

        అటుతరువాత ఈ భవబంధములు అనగా ఈ లోక వివాహబంధము మరణించిన తరువాత ఆత్మలలో కొనసాగదు.  మత్తయి 22:23-28, ''పునరుత్థానములేదని చెప్పెడి సద్దూకయ్యులు ఆ దినమున ఆయనయొద్దకు వచ్చి -బోధకుడా, ఒకడు పిల్లలు లేక చనిపోయిన యెడల అతని సహోదరుడు అతని భార్యని పెండ్లిచేసికొని తన సహోదరునికి సంతానము కలుగజేయ వలెనని మోషే చెప్పెను;  మాలో ఏడుగురు సహోదరులుండిరి;  మొదటివాడు పెండ్లిచేసికొని చనిపోయెను;  అతనికి సంతానము లేనందున అతని సహోదరుడు అతని భార్యను తీసికొనెను.  రెండవ వాడును మూడవ వాడును ఏడవ వానివరకు అందరును అలాగే జరిగించి చనిపోయిరి.  అందరివెనుక ఆ స్త్రీయు చనిపోయెను.  పునరుత్థానమందు  ఈ యేడుగురిలో ఆమె ఎవనికి భార్యగా ఉండును?  ఆమె వీరందరికిని భార్యగా ఉండెను గదా అని ఆయనను అడిగిరి.''  మత్తయి 22:29-30, ''అందుకు యేసు-లేఖనములనుగాని దేవుని శక్తినిగాని ఎరుగక మీరు పొరబడుచున్నారు.  పునరుత్థానమందు ఎవరును పెండ్లి చేసికొనరు, పెండ్లి కియ్యబడరు;    వారు పరలోకమందున్న దూతలవలె ఉందురు.''  ఇందునుబట్టి వివాహ బంధము అనేది ఈ శరీర సంబంధమైనది.  మరణించినవారికి శరీరము ఉండదు.  వారికి పునరుత్థానమందు మహిమ శరీరమును ధరించుకొనుట జరుగును.  కనుక ఈ లోకములో మనకున్న శరీరము వేరు మనము మరణించి పునరుత్థానము పొందిన తరువాత మనము పొందు శరీరము వేరు.  ఈ లోక శరీరము మట్టి నిర్మితము కనుక ఈ శరీరము మట్టిగా అనగా మన్నుగా మారును.  కాని మహిమ శరీరమునకు నాశనము వుండదు.  కనుక ఈ మహిమ శరీరమును ధరించినవారు అనగా పునరుత్థానము పొందినవారు దేవుని దూతల వలె వుండి ఈ లోక భవబంధములనుండి అనగా వివాహ ధర్మము నుండి విడుదల పొందినవారై ఎవరికి వారుగా దేవదూతలవలె కలిసిమెలసి వుందురు.

మరణించిన శరీరమును వదిలిన ఆత్మకు లోకబంధాలనుండి విముక్తి పొందును

        కనుక ఎవరితో జీవించాము అన్న స్థితి పునరుత్థాన దినమందు లెక్కించబడదు.  అనగా ఒక స్త్రీ ఒక పురుషుడు వివాహ ధర్మము చొప్పున ఈ లోకములో జతపరచబడి జీవించుటకు సమాజము మరియు సంఘ పెద్దల ద్వారా నిర్ణయించబడుదురు.  వీరు ఏక శరీరులై జీవించి ఫలించి నరసంతతిని పెంపొందించవలసి యున్నది.  ఆది 2:24, ''కాబట్టి పురుషుడు తన తండ్రిని తన తల్లిని విడిచి తన భార్యను హత్తుకొనును;  వారు ఏక శరీరమై యుందురు.''  ఈ జంట దైవ ప్రార్థన విషయములో తప్ప మరి ఏ విషయములో వేరుపడి యుండకూడదు.  1 కొరింథీ 7:5, ''ప్రార్థన చేయుటకు మీకు సావకాశము కలుగునట్లు కొంతకాలమువరకు ఉభయులసమ్మతి చొప్పుననే తప్ప, ఒకరినొకరు ఎడబాయకుడి; మీరు మనస్సు నిలుపలేకపోయినప్పుడు సాతాను మిమ్మును శోధింపకుండునట్లు తిరిగి కలిసికొనుడి.''  ప్రతి విషయములోను వారిది ఏక మనస్సు కలిగినవారై ఉండాలి.  క్రీస్తు సంఘమును ప్రేమించినట్లు భర్త భార్యని ప్రేమించాలి.

        ఎఫెసీ 5:22, ''స్త్రీలారా, ప్రభువునకువలె మీ సొంతపురుషులకు లోబడియుండుడి.''  అలాగే ఎఫెసీ 5:28, ''అటువలెనే పురుషులుకూడ తమ సొంతశరీరములనువలె తమ భార్యలను ప్రేమింప బద్ధులైయున్నారు.  తన భార్యను ప్రేమించువాడు తన్ను ప్రేమించుకొనుచున్నాడు.''  ఈ రెండు శరీరరీత్యా వివాహ స్థితికి మూలాధారము.  ఎఫెసీ 5:31, ''ఈ హేతువు చేత పురుషుడు తన తండ్రిని తల్లిని విడిచి తన భార్యను హత్తుకొనును;  వారిద్దరును ఏకశరీరమగుదురు.''  ఈ స్థితి వీరికి వారి మొదటి మరణము ఆనగా ఈ శరీరము గతించువరకే అని గుర్తించాలి.  అటు తరువాత వారి ఆత్మలకుగాని, వారి పునరుత్థానము  తరువాతగాని ఇటువంటి ఏ నిబంధన వారికి యుండదు.  వీరు ఇరువురు స్వతంత్రులే అని మనము గ్రహించాలి.  అయితే యేసు పునరుత్థానమై అపొస్తలులతోను, తనను ప్రేమించిన భక్త జనమునకును దర్శనమిచ్చి వారితో 40 దినములు గడిపినట్లుగానే - స్త్రీలు మృతులైన తమ వారిని పునరుత్థానము ద్వారా కలుసుకుండురని హెబ్రీ 11:35లోను, మత్తయి 27:52లోను వివరించబడి యున్నది.

61.  నరుని కోరిక మేరే, జీవము లేక మరణము

        ద్వితీయోపదేశకాండము 30:15, ''చూడుము; నేడు నేను జీవమును మేలును మరణమును కీడును నీ యెదుట ఉంచియున్నాను.''  మొట్టమొదట దేవుడు నరులను మరణానికి అప్పగించలేదు.  అనగా నరుని మరణ పాత్రునిగా చేయాలన్న ఉద్దేశ్యము దేవునికి లేదు.  అయితే ఏదెను వనములో దేవుడు జీవమును - జీవవృక్షరూపములో; మరణమును - మంచిచెడు తెలియజేయు వృక్షరూపములో వుంచాడు.  అంతేకాదు, ఈ రెండింటిని నరుని ముందు వుంచాడు.  నరుడు మంచిచెడు వృక్షఫలములను తిని మరణమును కోరుకొన్నట్లుగా గ్రహించాలి.  ఈవిధముగా నరుని కోరిక మేర దేవుడు ఆదాము హవ్వలను మరణమునకు అప్పగించాడు.  దీనిని మొదటి మరణము.  ఇది శరీరమునకు దాని ఆయుష్కాలము తరువాత వచ్చును.        

        ఈ శరీర మరణానంతరము మనము జీవములో వుంటామా లేక మరణములో వుంటామా అనేది నరుని కోరిక మీదే వుంటుంది.  జీవము పరమ యెరూషలేముగాను, మరణము అనగా రెండవ మరణము - అగ్నిగుండముగా వుంటుందని గ్రహించాలి.  దీనికి కారణము నరుని కోరికయే.

        ఈనాడు భూమిపై జీవించు ప్రతి ఒక్కరికి పవిత్ర బైబిలు గ్రంథము అందుబాటులో ఉన్నది.  దానిని అనుసరించినవారు పరమ యెరూషలేములో జీవములో ప్రవేశించుదురు.  అలాకాక దైవ వ్యతిరేక క్రియలతో బైబిలు గ్రంథములోనిది అనుసరించని ప్రతి ఒక్కరు రెండవ మరణమును చూడవలసినదే.  ఈనాడు క్రీస్తును గూర్చి, బైబిలు గ్రంథమును గూర్చి తెలియనివారు లేరని చెప్పవచ్చును.  కనుక దేవుడు బైబిలు గ్రంథము అను జీవములోనికి నడిపించు దానిని మన యందు ఉంచాడు.  అలాగే సాతాను తన గ్రంథములు అనగా పొంతన లేని కట్టుకథల పురాణాల గ్రంథాలను మన ముందు మరణ రూపములో ఉంచాడు.  ఇలా మన ఎదురుగానే మంచి చెడు అనగా జీవము, మరణము ఉన్నది.  నరుని కోరిక ఏ దాని మీద నిలుచునో వానికి అది అనుగ్రహింపబడును.  కనుక, మన కోరికను జీవముపై యుంచుకొని బైబిలు గ్రంథమును పాటించి మంచి కార్యములు చేయుచూ పరలోక రాజ్య వారసులుగా జీవించాలని ఈ పుస్తకము ద్వారా తెలియజేయుచున్నాను.

62.  పాతాళముయొక్క వశము కాకుండ తన్నుతాను తప్పించుకొనగలవాడెవడు?

         కీర్తన 89:48, ''మరణమును చూడక బ్రదుకు నరుడెవడు?  పాతాళముయొక్క వశము కాకుండ తన్నుతాను తప్పించుకొనగలవాడెవడు?''

        ఇక మరణమును చూడకుండా ఎవ్వరు లేరని చెప్పవచ్చును.  చివరకు ఆత్మరీత్యా పుట్టిన క్రీస్తు ప్రభువు కూడా మరణించుట మన పాపముల కొరకు జరిగింది.  హనోకు, ఏలీయాలు కూడ యుగాంతములో మరణించుదురని 42వ పేజీలోని 17వ విభాగములో చదువుకొన్నాము.  ప్రకటన 6:8, ''అప్పుడు నేను చూడగా, ఇదిగో పాండుర వర్ణముగల ఒక గుఱ్ఱము కనబడెను; దాని మీద కూర్చున్నవాని పేరు మృత్యువు.  పాతాళ లోకము వానిని వెంబడించెను.  ఖడ్గమువలనను కరవువలనను మరణమువలనను భూమిలో నుండు క్రూరమృగములవలనను భూనివాసులను చంపుటకు భూమియొక్క నాలుగవ భాగముపైన అధికారము వారికియ్యబడెను.''  మరణించి దేహము వదిలిన ప్రతి ఒక్కరి ఆత్మను యుగాంతములో పాతాళము తన వశము చేసుకొన్నట్లుగా వ్రాయబడియున్నది.  ప్రకటన 6:8లోని సంఘటన నాలుగవ ముద్రను వధింపబడుచున్న గొఱ్ఱెపిల్లగా కనబడుచున్న క్రీస్తు ప్రభువు విప్పినప్పుడు జరుగు సంఘటన.  ఇది ఉగ్రతా కాలము కనుక ఈ కాలములో దైవజనులు లేక ప్రతి ఒక్కరు పాపులే కనుక మరణించిన ప్రతి ఒక్కరిని పాతాళము తన వశము చేసుకొనుచున్నది.

పాతాళ లోకము యొక్క ఆధిక్యత పాపము చేసినవారి మీదనే!

        నరుడు భూమి మీద పుట్టినది మొదలు నీతిగా జీవించినవారు ఎవరు?  రోమా 3:11-12, ''నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు  గ్రహించువాడెవడును లేడు  దేవుని వెదకువాడెవడును లేడు  అందరును త్రోవ తప్పి యేకముగా పనికిమాలినవారైరి.  మేలుచేయువాడు లేడు, ఒక్కడైనను లేడు.''  కనుక అందరు పాపులే కనుక పాతాళమును తప్పించుకొనువారు లేరు అని చెప్పబడింది.

        లాజరు ధనవంతుని ఉపమానములో - లూకా 16:23లో ''అబ్రాహామును అతని రొమ్మున (ఆనుకొనియున్న) లాజరును చూచి,'' ధనవంతుడు పాతాళములో బాధపడుచున్నాడు.  లాజరు అబ్రాహాము రొమ్మున ఆనుకొని పరదైసులో ఆనందించుచున్నాడు.  అనగా లాజరు పాతాళమును తప్పించుకొన్నట్లే కదా!

        అలాగే ఆదాము మొదలుకొని నోవహు జలప్రళయ కాలము వరకు పాతాళమును తప్పించుకొన్నవారు ఎవరు?  హనోకు, హేబెలు లాంటివారు కదా!  మిగిలినవారందరు పాపములో జీవించి మరణించి పాతాళ వశము అయ్యారు.  ఇశ్రాయేలీయుల కాలములో ఐగుప్తు నుండి ఇశ్రాయేలీయులు బయలుదేరి వచ్చినప్పుడు దేవుని ఎన్నికలోనివారు మోషే అహరోనే కదా!  యూదా 1:9, ''అయితే ప్రధానదూతయైన మిఖాయేలు అపవాదితో వాదించుచు మోషేయొక్క శరీరమునుగూర్చి తర్కించినప్పుడు, దూషించి తీర్పు తీర్చ తెగింపక-ప్రభువు నిన్ను గద్దించును గాక అనెను.''  అని వ్రాయబడుటనుబట్టి మోషే మహిమ శరీరుడై పాతాళమును తప్పించుకొన్నట్లే కదా!

        క్రీస్తు ప్రభువు సిలువ బలియాగము ద్వారా మరణించి పాతాళములోని ఆత్మలకు సువార్త కార్యము జరిగించి కొద్దిపాటి తప్పులుగల పరిశుద్ధుల ఆత్మలకు విడుదల కలిగించి, తాను మరణమును పాతాళమును జయించి మూడవనాడు పునరుత్థానుడై తిరిగి లేచాడు.  మత్తయి 27:52-53, ''నిద్రించిన అనేక మంది పరిశుద్ధుల శరీరములు లేచెను.  వారు సమాధులలోనుండి బయటికి వచ్చి ఆయన లేచినతరువాత పరిశుద్ధ పట్టణములో ప్రవేశించి అనేకులకు అగపడిరి.''  ఇలా విడుదల కాబడినను వారు పాతనిబంధన కాలమునాటివారు కనుక వారు క్రీస్తు బలియాగము వరకు పాతాళ వశములో ఉన్నవారేనని గుర్తించాలి.  అటుతరువాత క్రీస్తు ద్వారా వారు విడుదలను పొందినట్లుగా గ్రహించాలి.

        క్రీస్తు కాలము తరువాత అనేకులైన పాపులు పాప పశ్చాత్తాపము తరువాత పరిశుద్ధులుగా మారి పాతాళ వశము తప్పించుకొన్నట్లుగా గ్రహించాలి.  ఇందునుబట్టి, భూమిపై పాపము చేసినవారు పాతాళము వశమున ఉన్నారు.  అయితే మనకు ఎటు చూచినను పాపము చేయనివారు కానరారు.  కనుకనే కీర్తనాకారుడు ఎజ్రాహీయుడైన ఏతాను మన మూలవాక్యములో పై విధముగా వ్రాశాడు.  యోహాను 5:40, ''అయితే మీకు జీవము కలుగునట్లు మీరు నాయొద్దకు రానొల్లరు.''  అని క్రీస్తు ప్రభువు చెప్పిన ప్రకారము, మనలో జీవము కలగాలంటే క్రీస్తు యొద్దకు రావాలి.  క్రీస్తు వద్దకు వచ్చినవాడు మరణమును దాటినట్లే!  యోహాను 5:24, ''నా మాటవిని నన్ను పంపినవానియందు విశ్వాసముంచువాడు నిత్యజీవము గలవాడు; వాడు తీర్పులోనికి రాక మరణములోనుండి జీవములోనికి దాటియున్నాడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను.''  కనుక క్రీస్తుయందు విశ్వాసముంచి ఆయన యొద్దకు వచ్చినవారు మరణించినను వారిపై పాతాళ లోక ఆధిక్యత లేక జీవము కలిగి లాజరువలె నెమ్మదిని కలిగియుందురు.  ఇలా క్రీస్తును నమ్మి ఆయన మాటల ప్రకారము జీవించిన ప్రతి ఒక్కరు మరణమును తప్పించుకొన లేకపోయినను పాతాళమును తప్పించుకొనుచున్నారు.  అంటే పాతాళ లోకములో ధనికునివలె యాతన పొందక మృతుల లోకములో పరదైసులవారిగా విభజింపబడిన వారిలో ఉండి నెమ్మది పొందుదురు.

        పాతాళపు వశము నుండి తప్పించుకొన్నవారు ప్రకటన 4:4లోని 24గురు పెద్దలు, ఇశ్రాయేలీయులలో 1,44,000మంది, (ప్రకటన 7:4-8)  వీరు కాక లెక్కకుమించిన పరిశుద్ధులు (ప్రకటన 7:9-17).  వీరందరు మొదటి పునరుత్థానములో పాలిపంపులు కలవారు కనుక వారిపై పాతాళపు ఆధిక్యత లేదు.  పాతాళపు ఆధిక్యత కేవలము పాపము చేయువారిపై మాత్రమే ఉండును.  అనగా నరుడు మరణించునాటి వాని కార్యములను బట్టి అది నిర్ణయింపబడునని గుర్తించాలి.

63.  క్రీస్తు కాలములో అక్కడ నిలిచియున్నవారిలో మరణమును రుచి చూడనివారు

         మత్తయి 16:28, ''ఇక్కడ నిలిచియున్న వారిలోకొందరు, మనుష్యకుమారుడు తన రాజ్యముతో వచ్చుట చూచువరకు మరణము రుచి చూడరని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాననెను.''  వీరు ఎవరు?  క్రీస్తు ప్రభువు చెప్పినట్లుగా వీరు ఇంకా బ్రతికియున్నారా?  ''ఇక్కడ నిలిచియున్న వారిలో కొందరు’’  అని అనుటలో అక్కడ నిలిచియున్నవారు ఎవరు?  వారు ఆయన శిష్యులు 12 మంది, అనేకమంది ఆయనను అనుసరించువారు, చూడాలని వచ్చువారు, స్వస్థత కొరకు వచ్చినవారు, మొదలైన అనేకమంది యున్నారు.  వీరిలో కొందరు అనగా వారు 11 మంది శిష్యులే.  మత్తయి 19:28, ''యేసు వారితో ఇట్లనెను-(ప్రపంచ) పునర్జననమందు మనుష్యకుమారుడు తన మహిమగల సింహాసనముమీద ఆసీనుడై యుండునపుడు నన్ను వెంబడించిన మీరును పండ్రెండు  సింహాసనములమీద ఆసీనులై ఇశ్రాయేలు పండ్రెండు గోత్రములవారికి తీర్పుతీర్చుదురు.''  కనుక అక్కడ నిలిచియున్న వారిలో కొందరు అనగా ఈ కొద్దిమంది అనగా 11 మంది శిష్యులు మరణమును రుచి చూడక వున్నారు.  11 మంది శిష్యులు మరణించిన సంగతి అందరికి తెలుసును.  వారిలో యోహాను ఒక్కడే సహజ మరణము పొందినవాడు.  మిగిలిన 10 మంది వేరేవాళ్ళ చేత చంపబడినవారు.

క్రీస్తు నందు విశ్వాసమున్నను శరీరరీత్యా మరణించవలసినదే! క్రీస్తు ఎన్నిక చేసిన శిష్యులు మరణించినను వారు మృతుల లోకములో లేరు.  తండ్రియైన దేవుని మహా సింహాసనము ముందు 12 యాకోబు గోత్రముల మూలపురుషులతో కలసి ఇరువదినలుగురు పెద్దలుగా కూర్చుని దైవ పణ్రాళికయొక్క నెరవేర్పును గూర్చి మంతనాలు జరుపుచున్నారు.

        సహజముగా మరణించినవారి ఆత్మను సాతాను లేక మిఖాయేలు దూత పాతాళములో లేక ప్రశాంతకరమైన పరదైసులలో భద్రపరచును.  వారు తీర్పు దినమున పునరుత్థానమై తిరిగి, లేచుట జరుగును.  దీనినే పునరుత్థానమని చెప్పబడినది.  అయితే క్రీస్తు ప్రభువు శిష్యులు అనగా అపొస్తలులు మరణించిన తరువాత వారి ఆత్మలు పాతాళములో లేక ప్రశాంతకర పరదైసులలో లేవు.  వారు దేవుని సన్నిధిలో ఇరువదినలుగురు పెద్దలలో 12 మందిగా వున్నారు.  వారు దేవుని ఎదుట కూర్చుని దేవునిచే యొసగబడిన సువర్ణ కిరీటములు ధరించియున్నారు.  ప్రకటన 4:4, ''సింహాసనముచుట్టు ఇరువదినాలుగు సింహాసనములుండెను, ఈ సింహాసనములందు ఇరువదినలుగురు పెద్దలు తెల్లని వస్త్రములు ధరించుకొని, తమ తలలమీద సువర్ణ కిరీటములు పెట్టుకొన్నవారై కూర్చుండిరి.''  కనుక ఈ ఇరువదినలుగురు పెద్దలలో ఈ 12 మంది క్రీస్తు ప్రభువు శిష్యులు 12మంది యాకోబు గోత్ర పెద్దలతో కలసి ఈ ఇరువదినాలుగు సింహాసనములపై కూర్చుని యున్నారు.  ప్రకటన 4:10-11, ''ఆ యిరువదినలుగురు పెద్దలు సింహాసనమునందు ఆసీనుడై యుండువాని యెదుట సాగిలపడి, యుగయుగములు జీవించుచున్న  వానికి నమస్కారము చేయుచు-ప్రభువా, మా దేవా, నీవు సమస్తమును సృష్టించితివి;  నీ చిత్తమునుబట్టి అవి యుండెను;  దానిని బట్టియే సృష్టింపబడెను గనుక నీవె మహిమ ఘనత ప్రభావములు పొంద నర్హుడవని చెప్పుచు, తమ కిరీటములను ఆ సింహాసనము ఎదుట వేసిరి.''  ఈ విధముగా వారు దైవసన్నిధిలో వుండి మత్తయి 19:28లో క్రీస్తు ప్రభువు వారికి ఇచ్చిన అధికారమును సువర్ణ కిరీటములుగా  కలిగియున్నారు.  వీటిని వారు సింహాసనము ముందు వేయుట జరిగింది.  అనగా వారు క్రీస్తు ప్రభువు చెప్పినట్లుగా పరిశుద్ధులకు తీర్పుతీర్చి తమకు ఒసగిన సువర్ణ కిరీట బాధ్యతను పూర్తి చేసుకొని ఆ కిరీటములు సింహాసనము ముందు పడవేయుట జరిగింది.  ప్రకటన 20:4, ''అంతట సింహాసనములను చూచితిని;  వాటిమీద ఆసీనులై యుండువారికి విమర్శచేయుటకు అధికారము ఇయ్యబడెను.''

        అంతేకాదు ఈ ఇరువదినలుగురు పెద్దలు పరిశుద్ధుల ప్రార్థనలు పట్టుకొని యున్నారు.  ప్రకటన 5:8, ''ఆయన దానిని తీసికొనినప్పుడు ఆ నాలుగుజీవులును, వీణెలను, ధూప ద్రవ్యములతో నిండిన సువర్ణపాత్రలను పట్టుకొనియున్న ఆ యిరువదినలుగురు పెద్దలును, ఆ గొఱ్ఱెపిల్ల యెదుట సాగిలపడిరి.  ఈ పాత్రలు పరిశుద్ధుల ప్రార్థనలు.''  అటు తరువాత వారు ప్రకటన 5:9-10లో కొత్త పాట పాడుట జరుగును.  కనుక ఈ క్రీస్తు ప్రభువు ముందువున్న వారిలో కొద్దిమందియైన ఈ అపొస్తలులు శరీరరీత్యా మరణించినను వారి ఆత్మ జీవములో వున్నది కనుక, వారు క్రీస్తు ప్రభువుయొక్క వాగ్దానము వలన వీరు మరణించినవారి మరణముయొక్క రుచిని చూడక దైవసన్నిధిలో దేవుని సింహాసనము ముందు ఆసీనులై యున్నారు.  వీరు మనుష్య కుమారుడు తన రాజ్యముతో వచ్చువరకు కూడా వారు మరణమును రుచి చూడలేదు అని క్రీస్తు ప్రభువు ఖచ్చితముగా చెప్పుచున్నారు.

        మరణమును రుచి చూచుట అనగా నేమి?  మరణించినవారి ఆత్మ వారి వారి క్రియలను బట్టి పరదైసులోనో లేక పాతాళములోనో చేర్చబడి యుండాలి.  అనగా పరిశుద్ధులుగా మరణించినవారు శాంతిరకర పరదైసులో విశ్రాంతిలో ఉందురు.  వీరి ఆత్మకు ఏ పని యుండదు.  వారు పునరుత్థాన దినము వరకు వీరు విశ్రాంతిలో ఉందురు.  అలాగే అపరిశుద్ధులు పాతాళ లోకములో బంధింపబడి వారు లూకా 16:23లోని ధనవంతుని వలె వేదన పొందుచూ ఉంటారు.  అనగా మరణించినవారి ఆత్మలకు స్వాతంత్య్రము లేదు.  ఈనాడు మనకు ఉన్న స్వతంత్రత మరణించినవారి ఆత్మలకు ఉండదు.  వీరు మరణము రుచి చూచుట - ఈ విధముగా ఉండునని గుర్తించాలి.  అయితే ఇరువదినలుగురు పెద్దలలో 12 మంది యాకోబు గోత్రముల మూలపురుషులు మరియు 12 మంది అపొస్తలులు మరణించి విశ్రాంతిలో లేరు.  వారు దేవుని సింహాసనము ముందు సువర్ణ కిరీటమును, తెల్లని వస్త్రములను ధరించి, రాజఠీవితో ఇరువదినలుగురు సింహాసనములపై కూర్చుని దైవకార్యములను నెరవేర్చుచున్నారు.  కనుక వీరు శరీరముతో ఉన్నప్పటివలె వారు దైవరాజ్య కార్యములనే జరిగించుచు జీవిస్తున్నారు.  కనుక వారు మరణముయొక్క విశ్రాంతినో లేక వేదననో వీరు అనుభవించుట లేదు అని మనము గ్రహించాలి.  కనుక తన ముందువున్న తన శిష్యులను గూర్చి క్రీస్తు ప్రభువు మరణమును రుచి చూడరని ఖచ్చితముగా చెప్పుట జరిగింది.

64.  మృతుల లోకములో లేని ఆత్మలు ఇంకా ఎవరెవరు?

         క్రీస్తు కాలములో అక్కడ నిలిచియున్న వారిలో అపొస్తలులు శరీరరీత్యా  మరణించినను వీరు జీవముతో క్రీస్తు ప్రభువునందు లేపబడి తండ్రియైన దేవుని ముందు కూర్చుని యున్నారు.  వీరితోబాటుగా ఇశ్రాయేలు 12 గోత్రముల మూలపురుషులు కూడా కూర్చుని యున్నారు.  వీరిని గూర్చి మనము 103వ విభాగములో 233వ పేజీలో తెలుసుకొని యున్నాము.

        ఇప్పుడు - వీరు కాక ఇంకా ఎవరు ఎవరు ఉన్నారు? అన్న సంగతి మనము తెలుసుకోవలసి యున్నది.  వారిని పరిశుద్ధులు అని అందురు.  మరణించిన ఆత్మలలో వీరు కూడా భాగస్వాములేగాని వీరు మృతుల లోకములో ఉండరు.  మృతుల లోకములోని నిబంధనలు వీరిపై వర్తించవు.  వీరు ఎక్కడికైన వెళ్ళగలరు.  ఎవరికైనా సహాయము చేయగలరు.  మిగిలిన ఆత్మలు మృతుల లోకములో ఉంటే, వీరు మాత్రము ఎక్కడికైనను వెళ్ళగలిగిన స్థితిలో ఉంటారు.  ప్రకటన 14:1-4, ''. . .  నూట నలువది నాలుగు వేలమంది  . . .  గొఱ్ఱెపిల్ల ఎక్కడికి పోవునో అక్కడికెల్ల ఆయనను వెంబడింతురు;''  వీరు ఇశ్రాయేలు 12 గోత్రములో నుండి వచ్చిన పరిశుద్ధులు.  వీరు గొఱ్ఱెపిల్లతోబాటు ఎక్కడికైనా వెళ్ళగలిగిన స్థితిలో ఉన్నారు.  వీరిపై మృతుల లోకపు లేక పాతాళ లోకపు లేక మరణముయొక్క నిబంధనలు వర్తించవు.  వీరు క్రీస్తుయేసునందు పరిశుద్ధులుగా తీర్పు పొందియున్నారు.

పరిశుద్ధులపై పాతాళ లోకముయొక్క ఆధిపత్యము లేదు

        ఉదా :-  1.  మత్తయి 17:1-3, ''ఆరు దినములైన తరువాత యేసు పేతురును యాకోబును అతని సహోదరుడైన యోహానును వెంటబెట్టుకొని  యెత్తయిన యొక కొండమీదికి ఏకాంతముగా పోయి వారి యెదుట రూపాంతరము పొందెను.  ఆయన ముఖము సూర్యునివలె ప్రకాశించెను; ఆయన వస్త్రములు వెలుగువలె తెల్లనివాయెను.  ఇదిగో మోషేయు ఏలీయాయు వారికి కనబడి ఆయనతో మాటలాడుచుండిరి.''  మోషే ఏలీయాలు దేవుని ప్రణాళికలో భాగముగా క్రీస్తు ప్రభువుకు కనబడి ప్రణాళికను తెలియజేస్తున్నారు.  వీరు మృతుల లోకములో లేరు.  మృతుల లోకముయొక్క నిబంధనలు వీరిపై పని చేయుట లేదు.

        2.  ప్రకటన 11:3-5, ''నేను యిద్దరు సాక్షులకు అధికారము ఇచ్చెదను; వారు గోనెపట్ట ధరించుకొని వెయ్యిన్ని రెండువందల అరువది దినములు ప్రవచింతురు.  వీరు భూలోకమునకు ప్రభువైన వాని యెదుట నిలుచుచున్న రెండు ఒలీవచెట్లును దీపస్తంభములునై యున్నారు.  ఎవడైనను వారికి హాని చేయనుద్దేశించినయెడల వారి నోటనుండి అగ్ని బయలు వెడలి వారి శత్రువులను దహించివేయును గనుక ఎవడైనను వారికి హానిచేయ నుద్దేశించినయెడల ఆలాగున వాడు చంపబడవలెను.''  ఈ ఇద్దరు సాక్షులు హనోకు, ఏలీయాలని మనము ప్రకటన గ్రంథ రహస్యములు ఇప్పుడు మీ చేతిలో అను నాచే విరచితమైన పుస్తకము నందు చదువుకొని యున్నాము.  వీరు ప్రభువు సన్నిధిలో ప్రభువు యెదుట నిలుచుచున్న రెండు ఒలీవచెట్లను దీపస్తంభములునై యున్నారుగాని మృతుల లోకములో లేరు.  ఇలా వీరందరు స్వతంత్ర జీవనమును క్రీస్తునందు పొంది, మృతుల లోకమునకు వెలుపల జీవిస్తున్నారు.  అనగా వీరు దేవుని సన్నిధిలోనే వుంటున్నట్లుగా గ్రహించాలి.

65.  మరణించినను మరల బ్రదికి ఇక ఎన్నటికి చనిపోనివాడు

        యోహాను 11:25-26, ''అందుకు యేసు-పునరుత్థానమును జీవమును నేనే;  నాయందు విశ్వాసముంచువాడు చనిపోయినను బ్రదుకును;  బ్రదికి నాయందు విశ్వాసముంచు ప్రతివాడును ఎన్నటికిని చనిపోడు.  ఈ మాట నమ్ముచున్నావా?  అని ఆమెను నడిగెను.''  ఇందులో క్రీస్తు ప్రభువు - ''పునరుత్థానమును జీవమును నేనే;'' అని చెప్పుచున్నారు.  అనగా క్రీస్తులోనే పునరుత్థానము వుంది ఆయనలోనే జీవము వుంది.  కనుక జీవానికి పునరుత్థానానికి అధిపతి క్రీస్తే అని తెలుసుకోవలసి యున్నది.

        ఇలా క్రీస్తు ప్రభువు చెప్పుచూనే - ''నాయందు విశ్వాసముంచువాడు చనిపోయినను బ్రదుకును;''  అని చెప్పాడు.  కనుక క్రీస్తు నందు విశ్వాసముంచువానిని విశ్వాసి అందురు.  ఈ విశ్వాసి - తనయొక్క ఆధిక్యతను బట్టి అపొస్తలుడుగా పిలువవచ్చును లేక హతసాక్షి కావచ్చును లేక ప్రవచన వరము కల ప్రవక్త కావచ్చును లేక వేరే ఏమైన దేవునిలో ఘనతను పొంది యుండవచ్చును.  ఇతను చనిపోవలసినదే, ఎందుకంటే రక్తమాంసములు పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకోనేరవు.  1 కొరింథీ 15:50.

        కనుక వాడు ఎంత గొప్ప విశ్వాసియైనను వాడు చనిపోవాలి.  అనగా మొదటి మరణమునకు లోను కావలసిందేనని క్రీస్తు ప్రభువు చెప్పుచున్నాడు.  ఈ మొదటి మరణమునకు లోనగు వారు విశ్వాసము ఉన్నా లేకపోయిన మొదటి మరణము సంభవించును.  అంతేకాదు క్రీస్తుయేసు నందు విశ్వాసముంచినను వారు కూడా మొదటి మరణమును పొందవలసిందేనని గుర్తించాలి.

        మన మూలవాక్యములో, ''పునరుత్థానమును జీవమును నేనే,'' అని క్రీస్తు ప్రభువు చెప్పుచున్నారు.  కాని మరణమును నేను అని చెప్పుట లేదు.  కనుక మరణము క్రీస్తు ప్రభువు కాదు.  క్రీసులో మరణము లేదు, ఎందుకంటే మరణము క్రీస్తు ప్రభువు వల్ల వచ్చింది కాదు.  నరుడు దైవాజ్ఞ మీరి దేవుడు తినవద్దన్న పండును తిని దైవశాపమునకు ప్రతిగా పొందినది.  కనుక శాపగ్రస్తమైన వాటికి క్రీస్తు ప్రభువుకు ఎటువంటి సంబంధము లేదు.  క్రీస్తు ప్రభువు ఈ శాపగ్రస్థమైన నరులను మరణము నుండి జీవములోనికి నడిపించుటకు వచ్చినవాడు.  మరణము క్రీస్తు ప్రభువు వల్ల ఈ లోకములోకి రాలేదుగాని, క్రీస్తు ప్రభువు వల్ల పునరుత్థానము జీవము వచ్చినట్లుగా గ్రహించాలి.  కనుక మరణము క్రీస్తు ప్రభువులో లేదు.  క్రీస్తు ప్రభువులో ఉన్నది మరణించినవారికి పునరుత్థానము, తదనంతరము నిత్యజీవము ఆయనలో ఉన్నది.  యోబు 19:26, ''ఈలాగు నా చర్మము చీకిపోయిన తరువాత శరీరముతో నేను దేవుని చూచెదను.''

రక్త మాంసములు పరలోక రాజ్యాన్ని స్వతంత్రి౦చుకొన నేరవు

        కనుక క్రీస్తు ప్రభువునందు విశ్వాసముంచినవాడు మరణమును చవి చూచినను బ్రదుకును అని చెప్పబడింది.  మరణము అందరికి వస్తుంది.  దీనిని తప్పించుకొనువారు ఎవరు లేరు.  హానోకు ఏలీయాలు కూడా యుగాంతములో యిద్దరు సాక్షులుగా వచ్చి మరణించవలసిన వారే!  దేవుని శాపము వల్ల వచ్చిన మరణమును క్రీస్తు ప్రభువునందు విశ్వాసములో ఉన్న నరుడైనను అనుభవించవలసిందేనని గ్రహించాలి.  కాని మరణించునది నరుడు.  మృతుల లోకములోనికి మరణము ద్వారా వెళ్ళవలసియున్నది నరుడు.

        అయితే క్రీస్తు ప్రభువు పునరుత్థానము జీవము ఆయనే కనుక మరణించినవారికి పునరుత్థానము జీవము క్రీస్తు నందు మాత్రమే కలుగునని చెప్పుచున్నాడు.  కనుక క్రీస్తు నందు విశ్వాసముంచినవాడు మరణించును గాని క్రీస్తు పునరుత్థానము జీవము ఆయనే కనుక ఆయన యందు విశ్వాసముంచిన వానిని జీవ పునరుత్థాన క్రియ ద్వారా బ్రతికించును.  ఇలా బ్రతికినవాడు ఇక ఎన్నటికి చనిపోడు అని చెప్పుచున్నాడు.  అనగా క్రీస్తు నందు విశ్వాసము కలిగి పునరుత్థానము ద్వారా బ్రతికినవాడు ఎన్నటికి ఇక చనిపోడు.  

        ఇలా చెప్పుటలో క్రీస్తు నందు విశ్వాసములేనివారు ఉన్నట్లుగా మనకు అర్థమగుచున్నది.    వీరు కూడా మరణిస్తారు.  కాని క్రీస్తు పునరుత్థానమును జీవమును కనుక వీరిలో పునరుత్థానము వుండదు.  వీరు మొదటి పునరుత్థానములో భాగస్వాములు కారు.  ప్రకటన 20:4, ''అంతట సింహాసనములను చూచితిని;  వాటిమీద ఆసీనులై యుండువారికి విమర్శచేయుటకు అధికారము ఇయ్యబడెను.  మరియు క్రూరమృగమునకైనను దాని ప్రతిమకైనను నమస్కారముచేయక, తమ నొసళ్లయందు గాని చేతులయందు గాని దాని ముద్రవేయించుకొనని వారిని, యేసు విషయమై తామిచ్చిన సాక్ష్యము నిమిత్తమును దేవుని వాక్యము నిమిత్తమును శిరచ్ఛేదనము చేయబడిన వారి ఆత్మలను చూచితిని.  వారు బ్రదికినవారై, వెయ్యి సంవత్సరములు క్రీస్తుతోకూడ రాజ్యము చేసిరి.''  వీరు పరిశుద్ధులు.  ఇక అపరిశుద్ధులు పరిశుద్ధులవలె జీవమును పొందరు.  కనుక ప్రకటన 20:5, ''ఆ వెయ్యి సంవత్సరములు గడచువరకు కడమ మృతులు బ్రదుకలేదు; ఇదియే మొదటి పునరుత్థానము.''  కనుక కడమవారైన అపరిశుద్ధులు అనగా క్రీస్తు నందు విశ్వాసము లేనివారు బ్రదుకరు అనగా మొదటి పునరుత్థానములో పాలిపంపులు లేక జీవమును పొందక మరణించినవారివలె పాతాళ లోకములో అనగా మృతుల లోకములో బంధింపబడి బాధను 1000 సంవత్సరములు క్రీస్తు పరిపాలన జరుగునంతవరకు అనుభవింతురు.  వీరు నిత్యజీవము లేక మొదటి జీవ పునరుత్థానములో పాలిపంపులు లేక విడువబడినవారుగా జీవిస్తారు.  వీరికి తీర్పు 1000 సంవత్సరముల క్రీస్తు పరిపాలన తరువాత ఉండును.  అప్పుడు వీరికి వారి వారి క్రియల చొప్పున శిక్షను అమలుపరచుదురని గ్రహించాలి.  వీరు రెండవ మరణమునకు అప్పగింపబడుదురు.  

        కాని క్రీస్తు నందు విశ్వాసము గలవారికి మొదటి మరణము వచ్చి శరీరరీత్యా మరణించినను - వీరు విశ్వాసముంచిన క్రీస్తు పునరుత్థానము జీవము ఆయనే కనుక వారిని తిరిగి మొదటి పునరుత్థానము ద్వారా బ్రతికించి వారిని జీవముతో నింపును.  ఇలా జీవమును క్రీస్తు ద్వారా పొందినవారు ఇక ఎన్నటికి మరణమును పొందరని క్రీస్తు ప్రభువు చెప్పుచున్నాడు.

66.  భూమిమీద జరుగుచున్న దైవోగ్రత కార్యములు పరిశుద్ధుల ఆత్మలకు తెలియుచుండునా?

        పరిశుద్ధుల మాట దేవుడు వినును.  పరిశుద్దులు కోరినట్లుగా దేవుడు చేయును.  పరిశుద్ధులకు చెప్పకుండా దేవుడు ఏదీ చేయడు.  భూమిపై ఏ కార్యములు జరిగినను, పరిశుద్ధులకు చెప్పి చేయునని మనము గ్రహించాలి.  ఉదాహరణకు సొదొమ గొమొఱ్ఱా పట్టణముల నాశనమును గూర్చి మనము ఒకసారి గుర్తు చేసుకోవాలి.  అబ్రాహాము పరిశుద్ధుడు.  ఆ కాలములో అబ్రాహామునకు జరగబోవు విషయములను దేవుడు స్వయముగా తెలియజేసాడు.  అబ్రాహాము సమ్మతి మీదనే లోతు ఉన్న నగరమైన సొదొమ, దానితోపాటుగా గొమొఱ్ఱా పట్టణములను నాశనము చేయుట జరిగింది.  ఆదికాండము 18:20-33, ''మరియు యెహోవా-సొదొమ గొమొఱ్ఱాలను గూర్చిన మొర గొప్పది గనుకను వాటి పాపము బహుభారమైనది గనుకను నేను దిగిపోయి నాయొద్దకు వచ్చిన ఆ మొర చొప్పుననే వారు సంపూర్ణముగా చేసిరో లేదో చూచెదను;  చేయనియెడల నేను తెలిసికొందుననెను.  ఆ మనుష్యులు అక్కడనుండి తిరిగి సొదొమ వైపుగా వెళ్లిరి.  అబ్రాహాము ఇంక యెహోవా సన్నిధిని నిలుచుండెను.  అప్పుడు అబ్రాహాము సమీపించి యిట్లనెను- దుష్టులతోకూడ నీతిమంతులను నాశనము చేయుదువా?  ఆ పట్టణములో ఒకవేళ ఏబదిమంది నీతిమంతులుండిన యెడల దానిలోనున్న యేబదిమంది నీతి మంతుల నిమిత్తము ఆ స్థలమును నాశనము చేయక కాయవా?  ఆ చొప్పున చేసి దుష్టులతో కూడ నీతి మంతులను చంపుట నీకు దూరమవునుగాక.  నీతిమంతుని దుష్టునితో సమముగా ఎంచుట నీకు దూరమవు గాక.  సర్వలోకమునకు తీర్పు తీర్చువాడు న్యాయము చేయడా అని చెప్పినప్పుడు యెహోవా-సొదొమ పట్టణములో ఏబదిమంది నీతిమంతులు నాకు కనబడినయెడల వారినిబట్టి ఆ స్థలమంతటిని కాయుదుననెను.  అందుకు అబ్రాహాము-ఇదిగో ధూళియు బూడిదెయునైన నేను ప్రభువుతో మాటలాడ తెగించుచున్నాను.  ఏబదిమంది నీతిమంతులలో ఒకవేళ ఐదుగురు తక్కువైతే ఐదుగురు తక్కువైనందున ఆ పట్టణమంతయు నాశనము చేయుదువా అని మరల అడిగెను.  అందుకాయన -అక్కడ నలుబదియైదుగురు నాకు కనబడినయెడల నాశనము చేయననెను;  అతడింక ఆయనతో మాటలాడుచు - ఒకవేళ అక్కడ నలుబదిమందియే కనబడుదురేమో అనినప్పుడు ఆయన- ఆ నలుబదిమందిని బట్టి నాశనముచేయక యుందునని చెప్పగా అతడు - ప్రభువు కోపపడనియెడల నేను మాటలాడెదను;  ఒకవేళ అక్కడ ముప్పదిమందియే కనబడుదురేమో అనినప్పుడు ఆయన-అక్కడ ముప్పదిమంది నాకు కనబడినయెడల నాశనము చేయననెను.  అందుకతడు-ఇదిగో ప్రభువుతో మాటలాడ తెగించితిని;  ఒకవేళ అక్కడ ఇరువదిమంది కనబడుదురేమో అనినప్పుడు ఆయన-ఆ యిరువదిమందినిబట్టి నాశనము చేయ కుందుననగా అతడు-ప్రభువు కోపపడనియెడల నేనింకొకమారే మాటలాడెదను;  ఒకవేళ అక్కడ పదిమందికనబడుదురేమో అనినప్పుడు ఆయన-ఆ పదిమందినిబట్టి నాశనముచేయకయుందుననెను.    యెహోవా అబ్రాహాముతో మాటలాడుట చాలించి వెళ్ళిపోయెను.  అబ్రాహాము తన యింటికి తిరిగి వెళ్లెను.''

దేవుడు పరిశుద్ధులందరికి తెలియజేసిన తరువాతే తన కార్యములు జరిగించును

        ఇందులో కనీసము 10 మంది కూడా లేరని తెలుసుకొన్న అబ్రాహాము తిరిగి దేవున్ని ''అడగలేదు,'' అంటే సొదొమ గొమొఱ్ఱాలను నాశనము చేయమని చెప్పుటయే కదా!  ఈ సొదొమ గొమొఱ్ఱా పట్టణముల నాశనమును గూర్చి దేవుని సన్నిధిలో వున్న పరిశుద్ధులతో చర్చించిన మీదట జరుగునని గుర్తించాలి.  అలాగే జలప్రళయ కాలములో నోవహు అను నీతిమంతునికి మాత్రమే దేవుడు ముందుగా తెలియజేసాడు.  లూకా 9:28-31లో కొండపై క్రీస్తు ప్రభువుయొక్క రూపాంతరములో కనిపించిన మోషే ఏలీయాలు పరిశుద్ధులు.  వీరు పాత నిబంధన కాలమునాటివారు.  వీరిలో మోషే మరణమును పొందెనని, ఏలీయా సుడిగాలిలో అగ్నిరథములపై శరీరముతో కొనిపోయెనని బైబిలు గ్రంథము చెప్పుచున్నది.  వీరిద్దరు కొండపైన క్రీస్తుకు కనబడి యెరూషలేములో క్రీస్తు చేయవలసిన బలియాగమును గూర్చి మాటలాడుకొనిరి.  అంటే భూమిపై జరుగవలసిన కార్యములు పరిశుద్ధులకు అనగా భూమిపైన ఉన్నవారికి మరణించి ఆత్మల రాజ్యములో ఉన్నవారికి కూడ తెలియునని అర్థము కదా!

        ప్రకటన 5:1-6, ''మరియు లోపటను వెలుపటను వ్రాతకలిగి, యేడు ముద్రలు గట్టిగా వేసియున్న యొక గ్రంథము సింహాసనమునందు ఆసీనుడైయుండువాని కుడిచేత చూచితిని.  మరియు దాని ముద్రలు  తీసి ఆ గ్రంథము విప్పుటకు యోగ్యుడైనవాడెవడని బలిష్ఠుడైన యొక దేవదూత బిగ్గరగా ప్రచురింపగా చూచితిని.  అయితే పరలోకమందు గాని భూమిమీదగాని భూమిక్రిందగాని ఆ గ్రంథము విప్పుటకైనను చూచుటకైనను ఎవనికిని శక్తి లేకపోయెను.  ఆ గ్రంథము విప్పుటకైనను చూచుటకైనను యోగ్యుడెవడును కనబడనందున నేను బహుగా ఏడ్చుచుండగా ఆ పెద్దలలో ఒకడు-ఏడువకుము;  ఇదిగో దావీదుకు చిగురైన యూదా గోత్రపు సింహము ఏడు ముద్రలను తీసి ఆ గ్రంథమును విప్పుటకై జయముపొందెనని నాతో చెప్పెను.  మరియు సింహాసనమునకును ఆ నాలుగు జీవులకును పెద్దలకును మధ్యను, వధింపబడినట్లుండిన గొఱ్ఱెపిల్ల నిలిచియుండుట చూచితిని.  ఆ గొఱ్ఱెపిల్లకు ఏడు కొమ్ములును ఏడు కన్నులు నుండెను.  ఆ కన్నులు భూమియందంతటికి పంపబడిన దేవుని యేడు ఆత్మలు.''  ఈ ముద్రలు విప్పుట ద్వారా ఈ ప్రపంచమే అంతమగును.  అలాంటి విషయము ఇరువదినలుగురు పెద్దల ముందు జరుగుచున్నట్లుగా చెప్పబడినది.  

        ప్రకటన 6:9-10లో వలె ప్రతిదండనగా భూనివాసులను శిక్షించమని అడుగుచున్న హతసాక్షులకు తెలుపకుండానే క్రీస్తు ప్రభువు ప్రతిదండన చేయునా?  ఎంతమాత్రము కాదు.  భూమిపై జరగవలసినది వారికి తెలియజేసిన తరువాత నాశనము జరిగించునని గ్రహించాలి.  యెషయా 21:8-10, ''సింహము గర్జించినట్టు కేకలు వేసి -నా యేలినవాడా, పగటివేళ నేను నిత్యమును కావలి బురుజుమీద నిలుచుచున్నాను  రాత్రి అంతయు కావలి కాయుచున్నాను  ఇదిగో జతజతలుగా రౌతుల దండు వచ్చుచున్నది అని చెప్పెను.  బబులోను కూలెను కూలెను  దాని దేవతల విగ్రహములన్నిటిని ఆయన నేలను పడవేసియున్నాడు   ముక్కముక్కలుగా విరుగగొట్టియున్నాడు అని చెప్పుచు వచ్చెను.  నేను నూర్చిన నా ధాన్యమా, నా కళ్లములో నూర్చబడినవాడా, ఇశ్రాయేలు దేవుడును సైన్యములకధిపతియునగు యెహోవావలన నేను వినిన సంగతి నీకు తెలియజెప్పియున్నాను.''  ఇందులో యుగాంతములో జరుగబోవు బబులోను పతనమును గూర్చి అనగా బబులోనుయొక్క నాశనమును గూర్చి తెలుపబడినది.  ఇందులో ఇశ్రాయేలు దేవుడైన యెహోవా వలన ఒక సంగతి విన్నట్లుగా చెప్పబడినది.  ఈ విన్నవాడు ధాన్యమును తన కళ్లములో నూర్చినట్లుగా చెప్పుచున్నాడు.  ధాన్యము నూర్చుట అనగా సాతానుయొక్క శోధనాశ్రమలు పొంది, ధాన్యము పొట్టు కోల్పోయి మేలిమి ధాన్యమొచ్చినట్లుగా పరిశుద్ధులు నూర్చబడిరి అని మనము గ్రహించాలి.  పరిశుద్ధులుగా తీర్చిన సాతాను యెహోవా నుండి బబులోను నాశనమును గూర్చి తెలుసుకొన్నాడు, ఎందుకంటే  బబులోనును నాశనము చేయవలసినది సాతానే, ఎందుకంటే సాతాను దేవుని ఉగ్రతను, ఆయన కార్యములు నెరవేర్చు ఒక దూత అని గ్రహించాలి.  ప్రకటన 17:16, ''నీవు ఆ పది కొమ్ములుగల ఆ మృగమును చూచితివే, వారు ఆ వేశ్యను ద్వేషించి, దానిని దిక్కు లేనిదానిగాను దిగంబరిగాను చేసి, దాని మాంసము భక్షించి అగ్నిచేత దానిని బొత్తిగా కాల్చివేతురు.''  క్రూరమృగము సాతానుయొక్క ప్రధాన దూత.  ఈ క్రూర మృగము బబులోను అని మహావేశ్యను నాశనము చేయును.

        ఈ విధముగా దేవుడైన యెహోవా నుండి బబులోను నాశనమునకు సంబంధమైన వార్తను తెలుసుకొన్న సాతాను మొదటగా తను నూర్చిన ధాన్యమైన పరిశుద్ధులకు తెలియజేస్తున్నాడు.  ఈ బబులోను నాశనము జరుగునప్పటికి పరిశుద్ధులందరు శరీరరీత్యా మరణించినవారు.  వీరు ఆత్మరీత్యా జీవము కలిగి యుండి బబులోను పతనమును గూర్చి తెలుసుకొనుచున్నారు.  ఇలా భూలోకములో జరుగు దేవుని ప్రతి కార్యము ముందుగానే పరిశుద్ధులకు తెలియజేయబడును.  వారు శరీరముతో వున్నను లేక శరీరము లేక ఆత్మరీతిగా వున్నను వారికి ముందుగా తెలియజేయబడును.  అటుతరువాత ఆ కార్యము జరుగునని గ్రహించాలి.  అయితే ఏ కార్యములు ఎప్పుడు జరుగునో అన్న విషయములు ముందుగా ఎవరికి తెలియవు.  కాని అవి జరుగబోవుటకు ముందు దేవుడు తన దూతలకు, పరిశుద్ధులకు తెలియజేసి, అటుతరువాత నాశన కార్యమైతే సాతానుకు, మంచి కార్యమైతే తన పరిశుద్ధులకు పని అప్పగించునని గ్రహించాలి.

67.  సువర్ణ కిరీటములు ధరించి సింహాసనమునందు ఆసీనులైన ఆత్మలు

        ప్రకటన 4:1-2 లోని యోహాను దర్శనములో ఒక తలుపు తెరువబడి దానిలోని రహస్యాలు  ఒకటి ఒకటిగా కనబడుచున్నవి.  మొదటగా అదిగో పరలోక మందు ఒక సింహాసనము వేయబడి యుండెను.  అటుతరువాత సింహాసనమునందు ఒకడు ఆసీనుడై యుండెను.  ఆసీనుడైనవాడు  యోహాను దృష్టికి సూర్యకాంతపద్మరాగములను పోలినవాడుగా కనబడుచున్నాడు.  ఈయన ఎవరు?  ఈయన ఆత్మ అయిన దేవుడు సృష్టికర్త.  ఈయన సృష్టికర్తయైన దేవుడని ఎలా చెప్పగలము?

        ప్రకటన 4:3, ''మరకతము వలె ప్రకాశించు మేఘధనస్సు సింహాసనమును ఆవరించి యుండెను.''  పాత నిబంధనలోని ఆదికాండములో జలప్రళయానంతరము ఈ మేఘ ధనుస్సును తండ్రియైన దేవుడు మానవులకు తనకు మధ్య ఒక మధ్యవర్తిగా వుంచాడు.  దీనిని ఉపయోగించినది తండ్రియైన దేవుడే.  ప్రకటన 45, ''మరియు ఆ సింహాసనము ఎదుట ఏడు దీపములు ప్రజ్వలించుచున్నవి.  అవి దేవుని యేడు ఆత్మలు.''  దేవుని యేడు ఆత్మలు సింహాసనము ఎదుట ప్రజ్వలించుచున్నట్లుగా వ్రాయబడియున్నది.  దేవుని యేడు ఆత్మలలో క్రీస్తు ఆత్మ కూడా  ఒకటి అని ప్రకటన గ్రంథ రహస్యములు ఇప్పుడు మీ చేతిలో . . . లోని ఒకటవ అధ్యాయములో సింహాసనము యెదుట నున్న యేడు ఆత్మలు అను నాలుగవ విభాగములో తెలుసుకొన్నాము.  దేవునియొక్క  యేడు ఆత్మలు క్రీస్తులో కలిసియున్నను సింహాసనముమీద ఆసీనుడైన  వాని యెదుట ఈ ఏడు  ఆత్మలు ప్రజ్వలించుచున్నట్లుగా వ్రాయబడియున్నది.  ఈ యేడు ఆత్మలలో క్రీస్తు ఆత్మ కూడా ఒకటి. కాబట్టి సింహాసనము మీద కూర్చున్నవాడు తండ్రియైన దేవుడు మాత్రమే.

ఇరువది నలుగురు పెద్దలు దేవుని నుండి తీర్పు తీర్చు అధికారమును పొంది యున్నారు

        ప్రకటన 4:4, ''సింహాసనముచుట్టు ఇరువదినాలుగు సింహాసనములుండెను, ఈ సింహాసనములందు ఇరువదినలుగురు పెద్దలు తెల్లని వస్త్రములు ధరించుకొని, తమ తలలమీద సువర్ణ కిరీటములు పెట్టుకొన్నవారై కూర్చుండిరి.''  ఇందులో ఇరువది నాలుగు పెద్దలు వున్నారు.  వీరు ఎవరు?  వీరు తెల్లని వస్త్రములు ధరించుకొని యున్నారు.  ప్రకటన 35, ''జయించు వాడు ఆలాగున తెల్లని వస్త్రములు  ధరించుకొనును;''  వీరు లోకమును సాతానును జయించినవారు. కాబట్టి వీరు తెల్లనివస్త్రములు  ధరించుకొని యున్నారు.   అంతే కాదు వీరు తమ తలల మీద సువర్ణ కిరీటములు పెట్టుకొన్నవారై కూర్చుండిరి.  సువర్ణ కిరీటము రాజరికమునకు సూచన.  వీరు ఈ లోకములో మూలస్థంభముల వంటి వారని కూడా చెప్పవచ్చును. వీరు ఎవరు?  లూకా 133, ''ఆయన యాకోబు వంశస్థులను యుగయుగములు ఏలుకొను ఆయన రాజ్యము అంతయు లేనిదై యుండును,'' అని చెప్పబడిన ప్రకారము దేవుని చేత  ఎన్నుకొనబడినవారు.  ఇరువదినలుగురు పెద్దలలో 12 మంది యాకోబు 12 గోత్రాలుకు చెందిన 12 మంది మూలపురుషులు.  వీరు తండ్రియైన దేవుని పేరు పెట్టబడినవారు.  మిగిలిన 12 మంది యేసుక్రీస్తుయొక్క 12 మంది అపొస్తలులు.

        ఇక్కడ పైన చెప్పబడినవారే 24 మంది పెద్దలని ఎలా చెప్పగలము అన్ని సంశయము మీలో రావచ్చును.  అందుకు జవాబు, లూకా 133 ఒక సమాధానమైతే,  రెండవది, యేసుప్రభువు ఎన్నికజేసిన 12 మంది అపొస్తలులు.  వీరు అందరు తీర్పు దినమున సింహాసనములపై కూర్చుండి తీర్పు తీర్చుదురు అని వ్రాయబడియున్నది.  మత్తయి 1928 యేసు వారితో ఇట్లనెను, ప్రపంచ పునర్జననమందు మనుష్యుల కుమారుడు తన మహిమగల సింహాసనము మీద ఆసీనుడై యుండునప్పుడు నన్ను వెంబడించిన మీరును పండ్రెండు సింహాసనము మీద ఆసీనులై ఇశ్రాయేలు పండ్రెండు గోత్రముల వారికి తీర్పు తీర్చుదురు.   ప్రకటన 45 ఆ సింహాసనములోనుండి మెరుపులు  ధ్వనులును ఉరుములును బయలుదేరుచున్నవి.  అనగా ఇరువది నలుగురు పెద్దలు  తీర్పుదినమునకు సిద్ధపడియున్నారని అర్థము.  వీరు జేయు తీర్పు మెరుపువలె  త్వరితగతిన వెలువడు ధ్వనులను ఉరుములును వలె తీర్పు తీర్చబడిన వారిని చేరుచున్నాయని అర్థము.  ఈ సువర్ణ కిరీటములు అధికారమునకు సూచన అని తెలుసుకొన్నాము.  ఈ అధికారమును వీరు తీర్పు దినము వరకు కొనసాగిస్తారు.  కనుక వీరు దేవునితోబాటుగా సింహాసనములను అధిష్టించి పరిపాలన కొనసాగిస్తున్నారు.  వీరు పరిశుద్ధుల విభాగమునకు తీర్పు తీర్చు యోగ్యతను తమ కిరీటములుగా పొందుటయేగాక వారు రాజ్య భారము మోస్తున్నందుకు సూచనగా సింహాసనములు కలిగియున్నారు.

68.  మరణించినవారి ఆత్మలకు సాతాను శోధన

        ఆదాము హవ్వలను సాతాను దేవుని ఆజ్ఞ ద్వారా శోధించాడు.  యోబును శోధించాడు.  క్రీస్తు ప్రభువును శోధించాడు.  లూకా 23:31.  అలాగే నరులమైన మనందరిని శోధించి మనలో నిజ దైవభక్తిని వెలికి తీస్తున్నాడు.  ఎందరు నిజముగా దేవునిలో వున్నారు, లేకున్నారని ఓర్పును కల్గి విశ్వాసములో వున్నారని పరిశోధించునది సాతానే.  ప్రకటన 2:10, ''ఇదిగో మీరు శోధింపబడునట్లు అపవాది మీలో కొందరిని చెరలో వేయింప బోవుచున్నాడు;  పది దినములు శ్రమ కలుగును;  మరణము వరకు నమ్మకముగా ఉండుము.  నేను నీకు జీవకిరీటమిచ్చెదను.''  ఈ కాలము సాతానుయొక్క శోధన కాలము.  దేవుని నుండి సాతాను నరులను శోధించుటకు పొందిన కాలము.  ఈ శోధనా కాలమును ఎవరును తప్పించుకొనలేరు.  ఈ కాలములో శోధనను సహించి ఎవరైతే దేవునిలో విశ్వాసము కలిగి వారి మరణము వరకు తప్పిపోకుండా వుండగలుగుదురో వారు పరిశుద్ధులును, జయించినవారుగా లెక్కించబడి దైవరాజ్యమునకు వారసులగుదురు.  ప్రకటన 13:6-7, ''గనుక దేవుని దూషించుటకును, ఆయన నామమును, ఆయన గుడారమును, పరలోకనివాసులను దూషించుటకును అది తన నోరు తెరచెను.  మరియు పరిశుద్ధులతో యుద్ధముచేయను వారిని జయింపను దానికి అధికారమియ్యబడెను.  ప్రతి వంశముమీదను ప్రతి ప్రజమీదను ఆ యా భాషలు మాటలాడువారిమీదను ప్రతి జనముమీదను అధికారము దానికియ్యబడెను.''  ఈ అధికారము క్రూరమృగమునకు దేవుని నుండి ఇయ్యబడినది.  దీనికి కారణము పరిశుద్ధులలోని విశ్వాసము, ఓర్పును దేవుడు పరీక్షించుచున్నట్లుగా మనము గ్రహించాలి.  ఇవి అన్నికూడా శరీరరీత్యా జరిగేవి.

        ఇక ఆత్మకు శోధన వుంటుందా?  ఈ విషయమును గూర్చి నేను చాలా దినములు పరిశోధించవలసి వచ్చింది.  నా యీ ఆత్మీయ పరిశోధనలో నేను ఒక విషయమును గుర్తించాను.

పరిశుద్ధులు  లోకములోనే సాతాను శోధనను జయించినవారు.  అపరిశుద్ధులు సాతాను శోధనను  లోకములో పాతాళ లోకములో కూడా పొందుదురు

        మృతులలోకములో అన్ని ఆత్మలు పరదైసుల వారీగా వారి వారి క్రియలను బట్టి వుంటాయి.  పరిశుద్ధులు కానివారు పాతాళలోకములో వుంటారు.  పరిశుద్ధుల ఆత్మలకు సాతాను శోధన వుండదు.  దేవుని కోసము ప్రాణ త్యాగము చేసిన వారి ఆత్మలకు శోధన వుండదు.  వీరు జయించినవారు.  కనుక సాతాను శోధన వారికి వుండదు.  వారు విశ్రాంతిలో వుందురు.  ప్రకటన 14:13, ''అంతట-ఇప్పటినుండి ప్రభువునందు మృతినొందు మృతులు ధన్యులని వ్రాయుమని పరలోకమునుండి యొక స్వరము చెప్పగా వింటిని.  నిజమే;  వారు తమ ప్రయాసములు మాని విశ్రాంతి పొందుదురు;  వారి క్రియలు వారి వెంట పోవునని ఆత్మ చెప్పుచున్నాడు.''  ఇందునుబట్టి ప్రభువు నందు నిద్రించినవారికి విశ్రాంతి లభించునుగాని  శోధన కాదు.  ప్రకటన 6:9-11లో దేవుని కోసము, తమ సాక్ష్యము కోసము ప్రాణత్యాగము చేసిన వారి ఆత్మలను ఇంక కొంచెము కాలము విశ్రమింపవలెనని వారితో చెప్పబడియున్నది.  అనగా దేవుని వాక్యము నిమిత్తము, తామిచ్చిన సాక్ష్యము నిమిత్తము వధింపబడినవారు బలిపీఠము క్రింద విశ్రాంతిలో వున్నారుగాని సాతాను శోధనలో లేరు.

        అయితే అపరిశుద్ధులు పాతాళలోకములో వుందురు.  వీరు అన్ని రకముల అవలక్షణములు కలిగిన సమ్మేళనము.  ఇందులో నేనే దేవున్ని అని చెప్పుకొని మనమధ్య పూజింపబడినవారి ఆత్మలు కూడా వుంటాయి.  ఇలాంటివారందరు పాతాళలోకములో వుంటూ వేదన పొందుచూనే తమ మోసపూరిత కార్యములు జరిగిస్తారు.  అందుకే పాతాళ లోకములో సువార్త కార్యక్రమము జరుగుచుండునని చెప్పబడినది.  1 పేతురు 4:6, ''మృతులు శరీరవిషయములో మానవరీత్యా తీర్పు పొందునట్లును ఆత్మ విషయములో దేవుని బట్టి జీవించునట్లును వారికికూడ సువార్త ప్రకటింపబడెను.''  అందులోను సాతాను పాతాళ లోకమునకు రాజు.  ప్రకటన 9:11, ''పాతాళపు దూత వాటిపైన రాజుగా ఉన్నాడు;  హెబ్రీభాషలో వానికి అబద్దోనని   పేరు, గ్రీసుదేశపు భాషలో వానిపేరు అపొల్లుయోను.''  కనుక సాతాను తన మోసపూరిత కార్యములను కొనసాగించునని గ్రహించాలి, ఎందుకంటే సాతాను తనతోబాటుగా తను పొందబోవు శిక్షలోనికి మనలను నడిపించాలని అనుకొనియున్నట్లుగా వ్రాయబడియున్నది. 2 కొరింథీ 11:13-15, ''ఏలయనగా అట్టి వారు క్రీస్తుయొక్క అపొస్తలుల వేషము ధరించు కొనువారైయుండి, దొంగ అపొస్తలులులును మోసగాండ్రగు పనివారునై యున్నారు.  ఇది ఆశ్చర్యము కాదు; సాతాను తానే వెలుగు దూత వేషము ధరించుకొనుచున్నాడు గనుక వాని పరిచారకులును నీతి పరిచారకుల వేషము ధరించుకొనుట గొప్ప సంగతికాదు.  వారి క్రియల  చొప్పున వారి కంతము కలుగును.''  ప్రకటన 16:13, ''మరియు ఆ ఘటసర్పము నోటనుండియు క్రూరమృగము నోటనుండియు అబద్ధ ప్రవక్త నోటనుండియు కప్పలవంటి మూడు అపవిత్రాత్మలు బయలువెడలగా చూచితిని.''  ఇందునుట్టి, సాతానుకు మన శరీరముతో ఏ పని లేదు.  సాతానుకు మన ఆత్మలతోనే పని.  కనుకనే శరీరముతో వున్న పరిశుద్ధులను వారి మరణము వరకు వేధించాడు.  వారి ఆత్మలను చెరలో వేయాలని ప్రయత్నించాడుగాని వారు విశ్వాసము, ఓర్పు ద్వారా తప్పించుకొనగలిగారు.  కనుకనే పరిశుద్ధుల ఆత్మలు సాతాను శోధననుండి విముక్తి కలిగి విశ్రాంతిలో వున్నారు.  ఇక అపరిశుద్ధుల ఆత్మలకు భూమి మీద లాగానే పాతాళలోకములో కూడా సువార్త కార్యక్రమము జరుగునని 1 పేతురు 4:6లో తెలుసుకొన్నాము.  వారిలో మారుమనస్సు వచ్చినట్లైతే క్రీస్తు వెయ్యి సంవత్సరముల పరిపాలన అనంతరము పరలోక రాజ్యమైన నూతన యెరూషలేమునకు వెళ్ళిపోదురు.  కనుక సాతాను వారి ఆత్మలను క్రీస్తు ప్రభువు వెయ్యి సంవత్సరాల పరిపాలన మొదలువరకు వారిని మోసపరుస్తూనే వుంటాడు.

పప్రంచము పుట్టినప్పటినుండి దేవుళ్ళుగా చెలామణి అయిన సాతాను దూతలు దేవుళ్ళుగా మారి మోసపూరిత కార్యములు జరిగించిన నరుని ఆత్మలు ఇవి అన్నీ పాతాళ లోకములోనే వున్నారు

        ప్రకటన 20:2-3, ''అతడు ఆదిసర్పమును, అనగా అపవాదియు సాతానును అను ఆ ఘటసర్పమును పట్టుకొని వెయ్యి సంవత్సరములు వానిని బంధించి అగాధములో పడవేసి, ఆ వెయ్యి సంవత్సరములు గడచువరకు ఇక జనములను మోసపరచకుండునట్లు అగాధమును మూసి దానికి ముద్ర వేసెను; అటుపిమ్మట వాడు కొంచెము కాలము విడిచి పెట్టబడవలెను.''  ఇలా సాతాను బంధింపబడుటకు  కారణము ఏమిటి?  జనులను మోసపరచకుండుట కొరకు కాని ఈ భూమి పుట్టినప్పటినుండి సాతాను భూమిని, పాతాళ లోకమునకు అధికారిగా వుండి తన పరిపాలన సాగిస్తున్నాడు.  సాతాను చేయు పరిపాలన అంతా మోసపూరితమైనదే.  కనుక తన నివాసమైన పాతాళ లోకములో మోసము చేయకుండా ఎలా వుంటాడు.  కనుక పాతాళ లోకములో సాతాను శోధన జరుగుచూనే వుంటుంది.  అక్కడ కూడా భూమి మీద లాగానే అనేకులైన దేవుళ్ళు వుంటారు.  వీరు భూమి మీద ఆత్మలను ఎలాగున మోసపూరిత మార్గములో పయనింపజేసారో అలాగే శరీరమును విడిచిన ఆత్మలలో మారుమనస్సు రానియ్యకుండా మోసమును కొనసాగిస్తారు.  సాతాను దూతలుగా వీరు పాతాళ లోకములో వారి కార్యములు కొనసాగించి శరీరమును విడిచిన ఆత్మలలో మారుమనస్సు రానియ్యకుండా చేయుదురు.  అలాగే 1 పేతురు 4:6లో వలె సువార్త కార్యక్రమము నిత్య సువార్తగా వారి మధ్య పరిశుద్ధులచే దేవుడు జరిగించును.  ఎందుకంటే ఏ ఆత్మ నశించుట క్రీస్తు ప్రభువుకు ఇష్టము లేదు.

69.  అకాల మరణము పొందినవారు (హత్య, ఆత్మహత్య, ప్రమాదవశాత్తు చనిపోయినవారు)

        ఈ లోకములో చాలామంది పై విధముగా చనిపోయినవారిని గూర్చి తెలుపుచూ - వారికి జీవిత కాలము పూర్తి కాలేదు కనుక వీరి ఆత్మ భూమిపైనే తిరుగుచుండునని చెప్పుచుందురు.  ఇది సహజ మరణము కాదు.  ఈ లోకములో జరిగిన మరణములలో మొట్టమొదటి మరణము హేబెలుది.  ఈ హేబెలు మరణము కూడ అకాల మరణము.  ఒకరు కక్ష్య చేతను లేక డబ్బు కోసమో ఎదుటివారిని చంపుట జరుగును.  దీనిని మనము హత్యగా పరిగణిస్తాము.  అలాగే తన జీవితముపై విరక్తితో ఆత్మహత్య చేసుకొనుట చూస్తున్నాము.  అలాగే ఈ లోకములో అనేకమంది ప్రమాదవశాత్తు మరణించుట చూస్తున్నాము.  ఇవన్నీ అకాలములో జరిగేవిగా మనము గుర్తించాలి.  ఇలా మరణించినవారి ఆత్మలు భూమిపై సంచరిస్తూ వుంటాయా?

అకస్మాత్తుగా అకాల మరణమును పొందినవారి ఆత్మలు అదే దినమున మృతుల లోకములో చేర్చబడుదురు. అంతేగాని దెయ్యాలు లెక్కన తిరుగరు.

        ఈ సందర్భములో మనము బైబిలు గ్రంథములోని ఒక సంఘటనను గూర్చి తెలుసుకొనవలసిన అవసరత వున్నది.  లూకా 23:33, ''వారు కపాలమనబడిన స్థలమునకు వచ్చినప్పుడు అక్కడ కుడివైపున ఒకనిని ఎడమవైపున ఒకనిని ఆ నేరస్థులను ఆయనతో కూడ సిలువవేసిరి.''  ఇందులో ముగ్గురు ఉన్నారు.  అందులో ఒకరు క్రీస్తు ప్రభువు.  మరి ఇద్దరు దొంగలు.  లూకా 23:32, ''మరి యిద్దరు ఆయనతో కూడ చంపబడుటకు తేబడిరి; వారు నేరము చేసినవారు.''

        లూకా 23:39-41, ''వ్రేలాడవేయబడిన ఆ నేరస్తులలో ఒకడు ఆయనను దూషించుచు-నీవు క్రీస్తువు గదా?  నిన్ను నీవు రక్షించు కొనుము, మమ్మునుకూడ రక్షించుమని చెప్పెను.  అయితే రెండవవాడు వానిని గద్దించి-నీవు అదే శిక్షా విధిలో ఉన్నావు గనుక దేవునికి భయపడవా?  మనకైతే యిది న్యాయమే;  మనము చేసిన వాటికి తగిన ఫలము పొందుచున్నాము గాని యీయన ఏ తప్పిదమును చేయలేదని చెప్పి''  ఇలా ఈ ఇద్దరు దొంగలు మాట్లాడుకొనుట జరిగింది.  ఈయొక్క మాటలలో ఒకరు నీతిమంతునిగాను, మరియొకరు పాపిగాను గుర్తింపు పొందారు.  అయితే - లూకా 23:42, ''ఆయనను చూచి-యేసూ, నీవు నీ రాజ్యములోనికి వచ్చునప్పుడు నన్ను జ్ఞాపకము చేసికొనుమనెను.''  అని కుడివైపు దొంగ క్రీస్తు ప్రభువును అడిగినప్పుడు - లూకా 23:43, ''అందుకాయన వానితో-నేడు నీవు నాతోకూడ పరదైసులో ఉందువని నిశ్చయముగా నీతో చెప్పుచున్నా ననెను.''

        ఇందునుబట్టి  ''నేడు,'' అనగా అదే దినమున వీరు పరదైసులో చేర్చబడినట్లుగా మనము గ్రహించాలి.  ఇందులో ఇద్దరు దొంగలు కాళ్ళు విరగగొట్టుట ద్వారా మరణించినవారే.  యోహాను 19:31-33, ''ఆ దినము సిద్ధపరచుదినము; మరుసటి విశ్రాంతి దినము మహాదినము గనుక ఆ దేహములు విశ్రాంతి దినమున సిలువ మీద ఉండకుండునట్లు, వారి కాళ్లు విరుగకగొట్టించి వారిని తీసివేయించుమని యూదులు పిలాతును అడిగిరి.  కాబట్టి సైనికులు వచ్చి ఆయనతో కూడ సిలువవేయబడిన మొదటి వాని కాళ్లను రెండవవాని కాళ్లను విరుగగొట్టిరి.  వారు యేసునొద్దకు వచ్చి, అంతకుముందే ఆయన మృతిపొందియుండుట చూచి ఆయన కాళ్లు విరుగగొట్టలేదు గాని'',  కనుక వీరు బలవంతపు మరణమును అనగా అకాల మరణమును పొందినవారుగా గుర్తించాలి.  అయినను వీరు అదే దినమున వారు మృతుల లోకములోని పరదైసులలో వారి కార్యములనుబట్టి చేర్చబడినట్లుగా మనము గుర్తించాలి.  ఇందునుబట్టి హత్య, ఆత్మహత్య మరియు ప్రమాదవశాత్తు మరణించిన తమ శరీరములను, వదిలిన ఆత్మలు భూమిమీద తిరుగవు అని గ్రహించాలి.  శరీరమును విడిచిన వెంటనే ఆ ఆత్మ మృతుల లోకములో చేర్చబడును.

        అలా కాకుండా, కొంతమందికి చనిపోయినవారు కనబడుట జరుగును.  ఇలా కనబడునవి సాతాను దూతలని గ్రహించాలి.  మనలోని భయాందోళనలనుబట్టి అవి ఆ రూపములో కనిపించి మనలను భయభ్రాంతులుగా చేయుట జరుగును.  దేవుని సందేశమును లేక నాశన కార్యములను పరిశుద్ధులందరికి సాతాను తెలుపుచున్నట్లుగా యెషయా ప్రవక్త ప్రవచించియున్నారు.  యెషయా 21:8-10, ''సింహము గర్జించినట్టు కేకలు వేసి -నా యేలినవాడా, పగటివేళ నేను నిత్యమును కావలి బురుజుమీద నిలుచుచున్నాను  రాత్రి అంతయు కావలి కాయుచున్నాను  ఇదిగో జతజతలుగా రౌతుల దండు వచ్చుచున్నది అని చెప్పెను.  బబులోను కూలెను కూలెను  దాని దేవతల విగ్రహములన్నిటిని ఆయన నేలను పడవేసియున్నాడు  ముక్కముక్కలుగా విరుగగొట్టియున్నాడు  అని చెప్పుచు వచ్చెను.  నేను నూర్చిన నా ధాన్యమా, నా కళ్లములో నూర్చబడినవాడా, ఇశ్రాయేలు దేవుడును సైన్యములకధిపతియునగు యెహోవావలన నేను వినిన సంగతి నీకు తెలియజెప్పి యున్నాను.''  మాచే విరచితమైన యెషయా ప్రవచన సాహిత్యమను గ్రంథమునందు వివరముగా చదివి తెలుసుకొనగలరు.  ఇందులో సాతాను దేవుని నుండి సమాచారము పొంది పరిశుద్ధులకు బబులోను పతనమును తెలుపుచున్నది.  కనుక పరిశుద్ధులకు దేవుడు, ఆయన దూతలు మరియు పరిశుద్ధుల ఆత్మలే కాకుండా, సాతాను కూడా సహాయపడునని గ్రహించాలి.

        ఇందులో సాతాను సహాయము దైవాజ్ఞ మేరకే చేయునుగాని, వానిలో మోసపు గుణము వున్నది కనుక బహు జాగ్రత్తగా మనము పరిశీలించవలసి యున్నది.  సాతాను యోబును శోధించాడు.  యోబు ఈ శోధనలో సమస్తమును పోగొట్టుకొనుట జరిగిందిగాని విశ్వాసమును పోగొట్టుకోలేదు.  అయితే ఈ శోధన అనంతరము సాతానే సమస్తమును యోబుకు దైవాజ్ఞ మేర ఇచ్చినట్లుగా మనము యోబు గ్రంథమునందు చదువగలము.  కనుక ఇటువంటి కార్యములన్నీ కూడా సాతాను అతని దూతల పని అని గ్రహించాలి.  అంతేకాని అకాలముగా హత్య ద్వారాగాని, ఆత్మహత్య ద్వారాగాని మరియు ప్రమాదవశాత్తు మరణించినవారి ఆత్మలు భూమిపై తిరుగవు.  వారు అదే దినమున మృతుల లోకములో చేర్చబడుదురు.

70.  జంతువులు, పక్షులు, జలచరములు, పురుగులు మొదలైనవాటి మరణము, వానిలోని జీవము  శరీరమును వదిలిన తరువాత ఎక్కడ వుండును?

        జంతువులు, పక్షులు, జలచరములు, పురుగులు మొదలైనవి అనేక రీతులుగా మరణిస్తున్నాయి.  కొన్ని ఆయుస్సు తీరి మరణిస్తే మరికొన్ని తమకన్నా బలమైన జంతువులచే వేటాడబడి వాటికి ఆహారముగా మారుచున్నవి.  మరికొన్ని జబ్బుల ద్వారా మరణిస్తున్నాయి.  మరికొన్ని ప్రకృతి వైపరీత్యముల కారణముగా మరణిస్తున్నాయి.

నరులే లేనప్పుడు జీవరాసులతో పని ఏమున్నది. జీవరాసులలోని జీవము పరలోకమునకు చేరునుగాని మృతుల లోకములో చేరవు. జీవరాసులలోని జీవము ప్రకృతిలో విలీనమై లోకాంత్యములో జీవాధిపతియైన క్రీస్తులో విలీనమగును.  యోహాను 14:6

        ఏదే ఏమైనప్పటికి జంతువులు, పక్షులు, జలచరముల పురుగుల మరణము జరుగుచున్నది.  దేవుడు ఈ జంతువులు, పక్షులు, జలచరములు మరియు పురుగులు వీటిని మనకు ఆహారముగా అనుగ్రహిస్తే, మరికొన్నింటిని ఈ ప్రకృతిని క్రమబద్ధములో వుంచుట కొరకు సృష్టించుట జరిగింది.  ఇవి అన్నీ నరుల పాపములు పెచ్చు పెరిగినప్పుడు, ఒకప్పుడు ప్రకృతి వైపరీత్యములు జరిగి మరణించుట చూస్తున్నాము.  దీనికి కారణము పాపమే.  జంతువులు, పక్షులు, జలచరములు, పురుగులు చేసిన పాపము గాదుగాని నరులు చేసిన పాపమే.  ఇలా వాటి నాశనము జరుగుట మనకు అన్యాయముగా అగుపించవచ్చును.  నోవహు కాలములో జలప్రళయము జరిగింది.  ఈ జలప్రళయములో సమస్త నరులతో బాటుగా ఈ సృష్టిలోని సమస్త జీవులు (కొన్ని మినహాయించి) మరణించుట జరిగింది.  ఆది 7:21-23, ''అప్పుడు పక్షులేమి పశువులేమి మృగములేమి భూమిమీద ప్రాకు పురుగులేమి భూమిమీద సంచరించు సమస్త శరీరులేమి సమస్త నరులేమి చచ్చిపోయిరి.  పొడి నేలమీదనున్న వాటన్నిటిలోను నాసికారంధ్రములలో జీవాత్మ సంబంధమైన ఊపిరిగలవన్నియు చనిపోయెను.  నరులతో కూడ పశువులును, పురుగులును అకాశపక్షులును నేలమీదనున్న జీవరాసులన్నియు తుడిచివేయబడెను.  అవి భూమిమీద నుండకుండ తుడిచివేయబడెను.  నోవహును అతనితో కూడ ఓడలో నున్నవియు మాత్రము మిగిలియుండెను.''  నోవహు కాలములోని పాపము నరుల అంతమునకు కారణమైనది.  అయితే, ఈ నరులతోబాటుగా ఈ జీవులును చంపుట అన్యాయము కాదా!  అని మనము అడుగవచ్చును.

        నరుని కోసము ఈ సమస్త జీవులు సృజించబడినవి.  నరులే లేనప్పుడు వీటితో అవసరత ఏమున్నది?  అందుచేత నరులకు కావలసిన మేర జీవరాసులు విడిపించబడి మిగిలినవి నాశనము అగును.  అంటే నరులకు ఆహారముగా ఈ ప్రకృతి క్రమబద్ధము చేయవలసిన జీవుల అవసరత ఇక లేకపోవుట చేత వాటి నాశనము జరుగును.  అలాగే ప్రకృతి వైపరీత్యాలలో కూడా అనేక జీవరాసులు నరులతోబాటుగా మరణిస్తాయి.  దీనికి కారణము నరుల కోసము సృష్టించబడిన జీవులు వారే లేనప్పుడు వాటి అవసరత ఏమున్నది?  అయితే ఈ జీవులు అనగా జంతువులు, పక్షులు, పురుగులు, జలచరములు, మొదలైన వాటిలో ఆత్మ లేదు.  కనుక వాటికి తీర్పు లేదు.  కనుక వీటిలోని జీవము తమ భౌతిక శరీమును విడిచిన తరువాత వాటి జీవము ప్రకృతిలో విలీనమగుచున్నది.  లాకాంత్యములో ఈ జీవమంతయు సమిష్టిగా దైవాత్మలో విలీనమగుచున్నది.  యోహాను 14:6.  కనుక మృతుల లోకములో వుండవలసిన అవసరత వాటికి లేదు.  ఆత్మకు ఆహారము వేరు.  వీటి అవసరత లేక ఇవి ఆహారముగా ఆత్మలకు ఉపయోగము లేదు.  కనుక ఇవి మృతుల లోకములో వుండవు.  ఇవి నేరుగా పరలోకమునకు చేర్చబడుచున్నవి.

71.  ఆత్మ భౌతిక శరీరమును విడిచిన తరువాత  లోకములోని వాహనము, ఎలక్ట్రానిక్వస్తువులు, కంపూటర్స్‌, రోబోట్స్‌, ఇండ్లు మొదలైనవాటి పరిస్థితి

        ఈ లోకములో నరుడు జీవించునప్పుడు పెద్ద పెద్ద మేడలు కట్టవచ్చును.  గొప్ప గొప్ప వాహనములు, ఖరీదైన రోబోట్స్‌, కంపూటర్స్‌, ఎలక్ట్రానిక్‌ వస్తువులు పొంది యుండవచ్చును.  కాని ఇవి ఏమియు ఆత్మ భౌతిక శరీరమును వదిలిపెట్టి తరువాత తీసుకొని పోవుట జరుగదు.  ఎంత సంపాదించినను, ఎన్ని వ్యాపారాలు చేసినను, ఎంత ఖరీదైన జీవితము జీవించినను, సమస్తము ఆత్మ శరీరములో వున్నంతవరకు మాత్రమే.  అటుతరువాత ఇవి సమస్తము ఆత్మకు పనికిరావు.  వాటిని వారసత్వముగా కొందరు నరులు అవి పనికిరాని స్థితికి వచ్చు వరకు అనుభవించిన తరువాత వాటిని కూల్చుట లేక చెత్త సామాను క్రింద పారవేయుట జరుగును.  ఇందులో ఒక తేడాను మనము గమనించవచ్చు.  ఒక ఆత్మ తన శరీరముతో వున్నప్పుడు కష్టపడి సంపాయించినది, ఆ ఆత్మ తదనంతరము ఆ ఆత్మయొక్క వారసులు కష్టపడక లేక సంపాయించ నవసరము లేకనే అనుభవించుట జరుగును.

        కాని, ఇవి ఏమియు ఆత్మకు పనికిరావు.  మత్తయి 6:19-21, ''భూమిమీద మీకొరకు ధనమును కూర్చుకొనవద్దు; ఇక్కడ చిమ్మెటయు, తుప్పును తినివేయును, దొంగలు కన్నమువేసి దొంగిలెదరు.  పరలోకమందు మీకొరకు ధనమును కూర్చుకొనుడి; అచ్చట చిమ్మెటయైనను, తుప్పైనను దాని తినివేయదు, దొంగలు కన్నమువేసి దొంగిలరు.  నీ ధనమెక్కడ నుండునో అక్కడనే నీ హృదయము ఉండును.''  ఇందునుబట్టి ఈ లోకములోని సమస్త ధనము, వస్తువులు, వాహనములు మొదలైనవి చివరకు పాడైపోవునని చెప్పుచున్నాడు.  పాడైనవి పరలోక రాజ్యమునకు పనికిరావు.  అయితే పరలోకములో వున్నవి నూతనమైనవి.  వీటికన్నా స్థిరమైనవిగా గుర్తించాలి.  అంటే పరలోకములో ఆత్మరీత్యా ఇవన్నీ వుంటాయిగాని భూమిమీదవి కావు.  అక్కడ వస్తువులు చెడిపోవు.  ఇవన్నీ పరలోకములో ఆత్మరీత్యా సృజించబడి యుండునని గ్రహించాలి.  అందుకే మత్తయి 6:19-21లో ధనమును పరలోకములో కూర్చుకొనుమని చెప్పుచున్నాడు.  పరలోకములోని వాహనములకు ఉదా :-  2 రాజులు 2:11-12, ''వారు ఇంక వెళ్లుచు మాటలాడుచుండగా ఇదిగో అగ్ని రథమును అగ్ని గుఱ్ఱములును కనబడి వీరిద్దరిని వేరు చేసెను; అప్పుడు ఏలీయా సుడిగాలి చేత ఆకాశమునకు ఆరోహణమాయెను.  ఎలీషా అది చూచి-నా తండ్రీ నా తండ్రీ, ఇశ్రాయేలువారికి రథమును రౌతులును నీవే అని కేకలు వేసెను; అంతలో ఏలీయా అతనికి మరల కన బడకపోయెను.  అప్పుడు ఎలీషా తన వస్త్రమును పట్టుకొని రెండు తునకలుగా చేసెను.''  

        మనము ఈ లోకములో ప్రయాణించు సాధనములు అనేకము చేసుకొని యున్నాము.  ఇందులో గ్రహాలను దాటి వెళ్ళు వాహనములు కూడా చేసుకొని యున్నాము.  కాని ఈ వాహనములు ఏవి ఈ ఆకాశ మండలమును దాటిపోవు జ్ఞానమును పొందిలేవు.  వాటి కాల పరిమితి యున్నది.  అటుతరువాత ఇవి తుప్పుపట్టి మట్టిగా మారిపోవును.  కాని దేవుని రాజ్యములోని వాహనాలు ఎంత శక్తివంతమైనవో మనకు 2 రాజులు 2:11-12లో అర్థమగుచున్నది.  ఇది మనము చూచుచున్న ఆకాశ మండలము అనగా సూర్య, చంద్ర మరియు నక్షత్రాదులను దాటి వెళ్ళినట్లు చదువుకొనియున్నాము.  ఇవి ఆత్మ నిర్మితమైనవి.  భూమిమీద ఈ ప్రకృతిలో కనబడు సమస్తము అనగా రాజ్యము, సింహాసనములు నదినదములు మెలించు వృక్షములు, పట్టణము, రాజవీధులు వివిధ రకముల కొలతలు, వజ్ర వైఢూర్యములు, జీవజలము - జీవాహారము;  వస్త్రములు, వస్త్రధారణ, గ్రంథములు సంగీత నినాదములు, వాయిద్యములు, గుర్రములు వగైరా వివిధ రకములైన జంతువులు ఇవియన్నియు ఆత్మ నిర్మితములు.

        అయితే మృతుల లోకములోని ఆత్మలకు ఇవి ఏమి వుండవు.  అక్కడ ఆత్మ ఎక్కడ వుండవలెనని నిర్ణయింపబడి వుంచబడినవో అవి అక్కడే వుండాలిగాని వాటికి వాహనములు, వస్తువులు వంటివి అనుగ్రహింపబడవు.

72.  సాతానుకు క్రీస్తుకు - అపరిశుద్ధులకు పరిశుద్ధుల ఆత్మలకు చివరి యుద్ధము

        ఈ భూమిపై జరిగిన యుద్ధములను ప్రపంచ యుద్ధములు అని అందురు.  అనగా మొదటి రెండవ ప్రపంచ యుద్ధములు జరిగిపోయాయి.  ఇలా అనేక యుద్ధములు జరుగునని బైబిలు గ్రంథము చెప్పుచున్నది.  అయితే ఈ యుద్ధములన్నీ కూడా శరీరముతో వున్న వారి మధ్య జరిగేది.  కాని చివరగా జరుగు యుద్ధము సాతానుకు క్రీస్తుకు మరియు అపరిశుద్ధులకు, పరిశుద్ధుల ఆత్మలకు జరుగు యుద్ధము.  ఇందునుగూర్చి వివరముగా తెలుసుకొందము.

        ప్రకటన 19:19-21, ''మరియు ఆ గుఱ్ఱముమీద కూర్చున్నవానితోను ఆయన సేనతోను యుద్ధము చేయుటకై ఆ క్రూరమృగమును భూరాజులును వారి సేనలును కూడియుండగా చూచితిని.  అప్పుడా మృగమును, దానియెదుట సూచక క్రియలు చేసి దాని ముద్రను వేయించుకొనినవారిని ఆ మృగపు ప్రతిమకు నమస్కరించినవారిని మోసపరచిన ఆ అబద్ధ ప్రవక్తయు, పట్టబడి వారిద్దరు గంధకముతో మండు అగ్నిగుండములో ప్రాణముతోనే వేయబడిరి.  కడమ వారు గుఱ్ఱముమీద కూర్చున్నవాని నోటనుండి వచ్చిన ఖడ్గముచేత వధింపబడిరి;  వారి మాంసమును పక్షులన్నియు కడుపార తినెను.''  ఇది చివరి యుద్ధము.  ఈ యుద్ధము తరువాత శరీరులు వుండరు.  శరీరముగా వున్న ప్రతి ఒక్కరు మరణమును రుచి చూస్తారు.  వీరిని కడమవారుగా చెప్పబడినది.  ఈ విషయములను గూర్చి తెలుసుకొనుటకు ముందు మనము యుగాంతములో వుండువారు ఎవరు అనే విషయము తెలుసుకోవాలి.  యుగాంతములో పరిశుద్ధులు వుండరు.  ఉండేవారంతా అపరిశుద్ధులు మాత్రమే.  ఇది అందరికి తెలిసిన విషయమే.  పరిశుద్ధులు లేని ఆ కాలములో అపరిశుద్ధులు దేవునిపై కోపగించి యుద్ధమునకు తలపడగా అందరు వధింపబడుదురు.  ఇది జరగవలసినది.

మట్టి శరీరముతో వున్న అపరిశుద్ధులకు మధ్య  ఆత్మలుగా ఉన్న పరిశుద్ధులకు చివరి మహా సంగామ్రము  ఏక పక్షముగా జరుగును

        ఇందులో - క్రీస్తు ప్రభువుతోబాటుగా వుండువారు ఎవరు?  సాతాను పక్షములో వుండువారు ఎవరు?

క్రీస్తు పక్షములో ఉండువారు :-  ప్రకటన 19:19లో ''మరియు ఆ గుఱ్ఱముమీద కూర్చున్నవానితోను ఆయన సేనతోను,'' అని అనుటలో గుఱ్ఱము మీద కూర్చున్నవాడు క్రీస్తు ప్రభువు.  క్రీస్తు ప్రభువు యొక్క సైన్యము, పరిశుద్ధులుగా మనము గ్రహించాలి.  ప్రకటన 17:14, ''వీరు గొఱ్ఱెపిల్లతో యుద్ధము చేతురు గాని, గొఱ్ఱెపిల్ల ప్రభువులకు ప్రభువును రాజులకు రాజునై యున్నందునను, తనతోకూడ ఉండినవారు పిలువబడినవారై, యేర్పరచ బడినవారై, నమ్మకమైనవారై యున్నందునను, ఆయన ఆ రాజులను జయించును.''  

        ఇందునుబట్టి గొఱ్ఱెపిల్లగా పిలువబడిన క్రీస్తు ప్రభువుతోబాటు వుండేవారు ఆయన ఏర్పరచుకొని ఆయన చేత పిలువబడినవారు.  వీరు వారి మరణము వరకు ఈ శరీర జీవితములో నమ్మకముగా వుండి, ఈ లోకమును సాతానును జయించినవారు.  ప్రకటన 19:14, ''పరలోకమందున్న సేనలు శుభ్రమైన తెల్లని నారబట్టలు ధరించుకొని తెల్లని గుఱ్ఱము లెక్కి ఆయనను వెంబడించుచుండిరి.''  అని అనుటలో ఈ పరిశుద్ధ జీవితము జీవించి మరణము వరకు నమ్మకముగా వున్నవారు తెల్లని నారబట్టలు ధరించుకొని సంచరించెదరని వ్రాయబడి యున్నది.  

        ప్రకటన 3:4, ''అయితే తమ వస్త్రములను అపవిత్రపరచుకొనని కొందరు సార్దీస్‌లో నీయొద్దఉన్నారు.  వారు అర్హులు గనుక తెల్లని వస్త్రములు ధరించుకొని నాతోకూడ సంచరించెదరు.''  కనుక ఈ సేనలు పరిశుద్ధుల ఆత్మలే.  వీరు జయించినవారు కనుక వీరు శరీరరీత్యా మరణించినను వారు ఆత్మరీత్యా క్రీస్తు ప్రభువుతోబాటుగా జీవముతో వుండువారు.  1 థెస్సలొనీక 4:17, ''ఆ మీదట సజీవులమై నిలిచియుండు మనము వారితోకూడ ఏకముగా ప్రభువును ఎదుర్కొనుటకు ఆకాశమండలమునకు మేఘములమీద కొనిపోబడుదుము.  కాగా మనము సదాకాలము ప్రభువుతో కూడ ఉందుము.''  ఇది రాసిన పాలు, పౌలు ఏ విధముగా ఇప్పుడు సజీవుడై నిలిచియున్నాడు.  ఇందునుబట్టి పరిశుద్ధుడు మరణించినను వారు సజీవులు క్రిందనే లెక్క.  వీరు క్రీస్తు ప్రభువుకు సేనగా యున్నారు.

సాతాను పక్షములో ఉన్నవారు :-  ప్రకటన 19:19లో - ''ఆ క్రూరమృగమును భూరాజులను వారి సేనలును కూడి,'' అని అనుటలో సాతాను పక్షములో క్రూరమృగము ఈ లోక రాజులు, వారి సేనలు.  అంతేకాదు, ప్రకటన 19:20లో వలె అబద్ధ ప్రవక్త.  వీరిలో సాతాను ముఖ్య అనుచరులు క్రూరమృగము మరియు అబద్ధ ప్రవక్త.  ఇక భూరాజులు మరియు వారి సేనలు శరీరముతో జీవించువారు.  

        క్రూరమృగము మరియు అబద్ధ ప్రవక్త దూతలుగాను మరియు భూరాజులు మరియు వారి సేనలు శరీరులుగా ఎలా మనకు అర్థమగును?  

        ప్రకటన 19:20, ''అప్పుడా మృగమును, దానియెదుట సూచక క్రియలు చేసి దాని ముద్రను వేయించుకొనినవారిని ఆ మృగపు ప్రతిమకు నమస్కరించినవారిని మోసపరచిన ఆ అబద్ధప్రవక్తయు, పట్టబడి వారిద్దరు గంధకముతో మండు అగ్నిగుండములో ప్రాణముతోనే వేయబడిరి.''  అని అనుటలో క్రూరమృగము, అబద్ధ ప్రవక్త ఇద్దరు ప్రత్యక్షముగా గంధకముతో మండు అగ్నిగుండములో ప్రాణముతోనే వేయబడ్డారు.  వీరిని చంపినట్లుగా వ్రాయబడలేదు.  కనుక వీరు శరీరులు కారు.  కనుకనే అగ్ని గుండములో ప్రాణముతోనే వేయబడ్డారు.  

        ప్రకటన 20:15, ''ఎవని పేరైనను జీవగ్రంథమందు వ్రాయబడినట్టు కనబడని యెడల వాడు అగ్నిగుండములో పడవేయబడెను.''  ఈ జీవగ్రంథమందు పేరు లేనివారు మొదటి మరణమును రుచి చూచినవారు.  వీరు ఆత్మలుగా అగ్నిగుండములో వేయబడుచున్నారుగాని శరీరముతో గాదని గ్రహించాలి.  కనుక అగ్నిగుండములతో మండు గుండము అను రెండవ మరణముతో పాలిపంపులు గలవారు శరీరము గలవారు కాదుగాని శరీర రూపము గలిగిన ఆత్మలని గ్రహించాలి.

        ఇక భూరాజులు మరియు వారి సేనలు విషయమునకు వస్తే వారిని బైబిలు గ్రంథము కడమ వారుగా చెప్పబడ్డారు.  ప్రకటన 19:21, ''కడమ వారు గుఱ్ఱముమీద కూర్చున్నవాని నోటనుండి వచ్చిన ఖడ్గముచేత వధింపబడిరి;  వారి మాంసమును పక్షులన్నియు కడుపార తినెను.''  వీరు వధింపబడి వారి మాంసము పక్షులన్నియు డుపార తినుటను బట్టి వీరు శరీరులుగా గుర్తించాలి.  మాంసము భౌతిక శరీరమునకు వుండునుగాని మాయ శరీరమునకు కాదు.  మాయ శరీరము నాశనము పొందదు.  అది అదృశ్య రూపము మాత్రమే -  అటుతరువాత ప్రకటన 20:1-3లో సాతాను వెయ్యి సంవత్సరములు బంధింపబడుటను గూర్చి చెప్పబడినది.  ఈ బంధించుట పాతాళ లోకములో,  కాని అగ్నిగుండములో కాదు.  అటుతరువాత, ప్రకటన 20:4-6లో మొదటి పునరుత్థానము గూర్చి చెప్పబడినది.  కనుక ఈ యుద్ధము చివరగా జరిగే మహాయుద్ధముగా  గుర్తించాలి.  ఈ యుద్ధము క్రీస్తు ప్రభువుకు సాతానుకు మధ్య జరిగే యుద్ధము.  ఈ యుద్ధము చివరగా యుగాంతములో జరిగే యుద్ధము.  దీనిలో క్రీస్తు ప్రభువు సేనలుగా పరిశుద్ధుల ఆత్మలు క్రియ జరిగిస్తే - సాతానుకు సేనలుగా భూరాజులు, వారి సేనలు శరీరముతో వుండువారు అపవిత్రాత్మలు, దురాత్మల సమూహాలు క్రియ జరిగిస్తారు.  వీరు దేవునికి దూరముగా జీవించేవారు గనుక వారిని కడమవారు అని చెప్పబడినది.

        అయితే ఈ యుద్ధముయొక్క ఫలితము మాత్రము ఏక పక్షముగా వుంటుందని గ్రహించాలి, ఎందుకంటే ఆత్మలు చాలా శక్తివంతమైనవి.  పైపెచ్చు వారు క్రీస్తు ప్రభువుకు సేనలుగా వున్నారు.  సాతానుకు భూరాజులు, వారి సేనలు సేనలుగా వున్నను, వీరు శరీరులు మరియు ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహాలు గనుక వీరు బలహీనులు అయినను సాతాను ప్రేరణతో క్రీస్తు ప్రభువు, వారి సేనలతో యుద్ధము జరిగించి వారి పతనమును వారే పొందుదురని గ్రహించాలి.  కనుక చివరి యుద్ధము పరిశుద్ధుల ఆత్మలు, శరీరముతో వుండే అపరిశుద్ధుల మధ్య క్రీస్తు ప్రభువు పరిశుద్ధుల ఆత్మలకు నాయకుడుగా, సాతాను అపరిశుద్ధులకు నాయకుడుగా వుండి యుద్ధము జరిగించునని గ్రహించాలి.