ఆత్మ జ్ఞాన సందేశము
గ్రంథకర్త : శేఖర్‌రెడ్డి వాసా
నీ మరణానంతరము నీ ఆత్మ ఎక్కడ వుండబోవుచున్నదో నీకు తెలుసునా?
మూలము
రెడ్డిపాళెం గ్రామములోని నా ప్రభువు తల్లి ఉపదేశములు మరియు ఆమెను ఆవరించిన పరిశుద్ధాత్మయొక్క జ్ఞాన సహాయమే ఈ పుస్తక రచనకు మూలాధారము.
అంకితము
ఈ అవకాశాన్ని నాకు అనుగ్రహించి నన్ను ప్రేమించిన క్రీస్తు ప్రభువుకు అంకితమిస్తున్నాను. - వాసా శేఖర్‌రెడ్డి
1. సర్వసంఘ సమ్మేళన సమైక్యతా ఉజ్జీవ ప్రసంగ నిఘంటువు
ఆత్మ అనగా నేమి? ఇది ముడిపదార్ధమా? జడపదార్థమా?
దేవుడైన యెహోవా నరుని నిర్మించి వాని నాసికారంధ్రములలో జీవవాయువు ఊదగా నరుడు జీవాత్మ ఆయెను 1 కొరింథీ 316 పౌలు ఈ మర్మమును వివరించియున్నాడు. కాబట్టి ఆత్మ అనువాడు నరునిలో ఉన్నాడనియు అతనే దేవుడైయున్నాడనియు మనమెరుంగక ఎదుటి సోదరుని ఉద్దేశించి దేవుడెక్కడున్నాడో చూపిస్తావా? అని అడుగుట ఎంత అవివేకములో మనమున్నామో ఒక్కసారి ఆలోచించ వలసియున్నది. ఇందునుబట్టి మనము ఆలోచిస్తే మనలోని ఆత్మ అంధత్వము పొంది అహంభావముతో కూడినదై, లోకసంబంధమైన భోగభాగ్యములకు దాసోహమై అహంభావము పొంది శరీర జ్ఞానముతో ఏకమై, తాను ఆరిపోవుటయేగాక శరీరమును కూడా అప్రయోజనముగా అనగా మరణపాత్రముగాను, దైవత్వమునకు దూరముగాను నిలకడలేని జీవితములో జీవిస్తూ నిరర్థకమగుచున్నది.
ఇట్టి అహంభావ జీవితములో అలుముకున్న ఆత్మలనుబట్టి ఆత్మ సంబంధమైన యేసుప్రభువు ఈలాగు అంటాడు ఆత్మ విషయమై దీనులైనవారు ధన్యులు అనగా ఆత్మ విషయమైన గుడ్డితనమును పోగొట్టుకొన్నవారు ఆత్మీయముగా శారీరేచ్ఛలు చంపుకొని, శారీరజ్ఞానముతో ఆత్మను ఆర్పక శారీరచ్ఛేలతో దానిని బాధింపక జీవించువారు ధన్యులని అర్థము. ఇందునుబట్టి సమరయస్త్రీతో యేసుప్రభువు చెప్పిన మాటలలో దేవుడు ఆత్మ గనుక ఆయనను ఆరాధించువారు ఆత్మతోను సత్యముతోను ఆరాధించాలి,'' అనుటలో ఈ ఆత్మయైన దేవుడు నరునికి శరీరమును ఎందుకిచ్చినట్లు?
ఉదా|| ఒక రైతు భూమిని దున్ని ఎరువు వేసి విత్తనములు చల్లి నీరుబోసి నారు నాటి పంటను ఆశిస్తూ గట్టి గింజ కావాలని, మంచి ఫలితముచూడాలని ఆశిస్తే అవితరకలు సచ్చు గురుగులు వగైరా రూపములో రైతుకును వాడకమునకును పనికిరాని గింజలుగా ఉన్నప్పుడు వాటిని మట్టిలో పారబోసిన విధముగా దేవుడు భూమిపై నరుడు అనగా శరీరిగా ఏర్పడుచున్న ప్రతి నరునిలోను తన జీవాత్మను పోసి మంచి ఫలితమును కోరుచున్నాడు. నరునిలోనికి తన జీవవాయువును పంపి వానిలో తన ఆత్మను వుంచి వ్యక్తిగా జీవించే యోగ్యతను ఆత్మకు కల్గించిన భాగ్యమునుబట్టి దేవుడు తనను స్తుతించి ఘనపరచి మహిమపర్చమని, శరీరాత్మలను హెచ్చరిస్తే అందుకు భిన్నముగా ఆత్మ తనలో అణగారియున్న దైవమర్మములను విస్మరించి శారీర జ్ఞానముతో ఏకమై లోకసంబంధముగా తయారై లోకము మీద ఉన్న ఆశావ్యామోహములతో ముడిపెట్టుకొని నాశనకర మరణమునకు దైవోగ్రతకును శరీరాత్మలు రెండును మూలకారణమగుచున్నవి. ఆత్మ దేహములో జీవించుచున్నంత కాలము ఒకదానికొకటి ఋణపడి యున్నట్లుగా మనము గ్రహించనగును.
ఆత్మయైన దేవుడు తొలుత చీకటి జలములలో అల్లలాడుచుండెను. అనగా అధోగతిలో ఉన్న చీకటిలో ఎందుకు పనికిరాకుండి దుర్గంధపూరితముగా ఉన్న భూమిని తాను ప్రేమించి తన ఆత్మతో దానిని జతపరచినట్లుగా దేవుడు చేసిన నరనిర్మాణము విశదీకరించుచున్నది. ఇందునుబట్టి యోహాను 3ః16లో దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. తన జీవమును పోసెను. తన రూపాన్ని సృష్టించెను. భూమిపై సృష్టి క్రియను జరిపినాడు. తన సృష్టి నైపుణ్యముతో దానిని చిత్రవిచిత్రమైన రీతులుగా అలంకరించినాడు. ఇది దేవుడు లోకాన్ని ప్రేమించినందులకు ఋజువైయున్నది. మరియు భూమి యందంతట తనయొక్క ఆత్మను కుమ్మరించినట్లుగా ఈ క్రింది వేద వాక్యముల ద్వారా ఋజువగుచున్నది.
వెలుగు కమ్మనగా వెలుగాయెను. పగలు వెలుగిచ్చుటకు ఒక జ్యోతి రాత్రి వెలుగుకు ఒక జ్యోతిని ఏర్పాటు చేసినట్లు గ్రంథములో ఉన్నది. ఇందునుబట్టి సృష్టి యావత్తుకు వెలుగునిచ్చే జ్యోతి ఉండగా లోకములో ఉన్న నరకోటి యావత్తుకు ఆత్మననుగ్రహించిన ఆత్మ ఒకటున్నదని మనము గుర్తించాలి. యోహాను 8ః12 దేవుడు తాను సృష్టి మీద ప్రసరింపజేయు వెలుగును ఆర్పుట లేదు. అయితే నరుడు తనస్వజ్ఞానము చేతను లోభము చేతను దోష క్రియల చేతను, దేవుని చేత తనకు అనుగ్రహించబడిన ఆత్మను ఆర్పి తాను చీకటి సంబంధియని వ్యక్తిగతముగా దేవునియొక్క జాబితాలో ఉన్నాడు. ఇట్టివానిని వెలుగు సంబంధిగా చేయుటకే ఆత్మననుగ్రహించిన దేవుడు భూమితో గాని నరులయొక్క కలయికతోగాని పొందిక లేక ఏ విధముగా నరుని నేలమంటితో నిర్మించాడో - అట్టి నరునికి సాటి సహాయముగా ఆ నరుని నుండి ఎముకను తీసి స్త్రీని నిర్మించాడో అదే విధముగా స్త్రీలో నుండి కూడా పురుషుని నిర్మించి, ఆయనను ఆత్మ సంబంధిగా లోకమునకు బంపి శారీర మాలిన్యము ఆయనకు అంటకుండ (యోహాను 8ః23) అనగా లోకసంబంధ మాలిన్యము ఆయనకు తగులనీయక ఆత్మసంబంధిగా జేసి, ఆయనను విశ్వసించినవారు కూడా ఆత్మసంబంధులుగా ఉండవలెనని తనను ఆరాధించువారు కూడా అట్టివారే కావాలని అభిలషించుచున్నారు. ఆయనను ఆరాధించువారు ఆత్మతోను, సత్యముతోను ఆరాధించవలెనని క్రీస్తు ద్వారా బైలుపరచినాడు. కాని నరునియొక్క శరీరాత్మలు దానికి అనుగుణ్యముగా ఉన్నాయా? అనెడిది ఆలోచించవలసియున్నది. గలతీ 5ః17 శరీరము ఆత్మకును, ఆత్మ శరీరమునకును పొందిక లేదు. ఎప్పటినుండి ఈ విధముగా జరిగినదో ఆలోచించవలసియున్నది.
ఆదిలో దేవుడు నరునిలో జీవవాయువును ఊదినప్పుడు శరీరాత్మలు ఐక్యత కల్గి ఏదెను వనము దేవుని పరిశుద్ధ సన్నిధిలో ఏ భేధము లేకుండ సృష్టికర్త సన్నిధిలోను, ఆయన ఏర్పరచిన వనములోను, జీవాత్మ నరశరీరములో ప్రవేశించి తన ఇష్టము చొప్పున శరీరమును నడుపుచు వంటావార్పు లేకుండగనే పలురకముల ఫలభక్షణములు, వనములో స్వేచ్ఛా విహారములు సలుపుచు శరీరము ద్వారా ఆత్మఫలములను ఫలింపజేసెను. అప్పటివరకు ఆదాము పవిత్రుడు.
శరీరాత్మలకు విరోధమనునది శరీరము దైవాజ్ఞాతిక్రమణము జేసి ఫలభక్షణము చేయుట ద్వారా దేవునికి లోకమునకును ఆత్మకును శారీరమునకును, సృష్టికిని సృష్టికర్తకును నరునికిని దేవునికిని, ప్రకృతికిని నరునియొక్క జీవితమునకు పరస్పర విరోధములు ఏర్పడినట్లుగా మనము గుర్తింపవలసియున్నది.
ఆది 3ః1-12 ఇచ్చట జరిగించిన సంఘటనలో ఆదాము ఆత్మ సంబంధి. హవ్వ శారీర సంబంధిగా మనము గ్రహించవలసియున్నది. ఎందుచేతనంటే దేవుడు ఆదామును తన హస్తముతోను, తన ఆత్మతోను, తన పరిశుద్ధతతోను సృష్టించినట్లుగా ఆది 1ః26లో వలె ఆదాము ప్రధమ శ్రేణికి చెందినవాడు. ఇక హవ్వ అను స్త్రీయొక్క నిర్మాణము ఆత్మ సంబంధము, ఆత్మ సంపూర్ణతతో చేయబడినదిగాక ఆదాము శరీరము నుండి తీయబడినది గనుక ఈమె శారీర సంబంధిగా మనము గుర్తింపవలయును. అందువల్ల దేవుడు తినవద్దని నిషేధించిన ఫలములు భూసంబంధమైయుండినందువల్ల హవ్వ శరీర సంబంధి గనుక, శారీర అవయవమైన నేత్రాశకు బానిసయై, కన్నులకు అందమైనదియు ఆహారమునకు మంచిదియు వివేకమిచ్చునదియు,'' అనుటలో ఈమూడును శారీర సంబంధమైయున్నట్లుగా మనము గుర్తింపవలసి యున్నది. ఎందుకనగా క్షుద్బాధకు ఆహారము, కన్నులకు ఆకర్షణ, శారీర జ్ఞానము ఎదుగుదలకు కారకమై యుండుట అను ఈ మూడు గుణములు - శారీర సంబంధములై యున్నవి గనుక దేహము భూసంబంధమై యున్నందున దేవుడు నిషేధించిన వృక్షము భూసంబంధమైయుండి భూఫలములుగ అవి ఏర్పడియున్నందు వల్ల భూఫలమైన దేహము తన జాతిలక్షణమునుబట్టి, భూసంబంధమైన వృక్షఫలముచే ఆకర్షింపబడి ఆత్మ జ్ఞానమును కోల్పోయి, ఆత్మదేవుని ఆజ్ఞకు వ్యతిరేకియై నేత్రాశ, జిహ్వచాపల్యము చేత ఫలభక్షణము జేసి ఆత్మయొక్క విలువను పోగొట్టుకొని, ఆత్మకును శరీరమునకును విరోధము లోకారంభమునుండి తీరనిదై, లోకాంత్యము వరకును ఉన్నట్లుగ నేటి లోకజ్ఞానమునుబట్టి మనము గుర్తింపవలసియున్నది. నాడు హవ్వ జేసిన ఫలభక్షణముయొక్క ప్రభావము దేవుడు లేదని, ఆత్మ లేదని, సృష్టి దేవుడని - దేవుడుంటే చూపించమని సవాలుజేయుచు, తిరుగునట్టి హేతువాద నాస్తిక సంఘముల జ్ఞానమునకు దారితీసినది.
ఇందులో మనము గ్రహించాల్సిన ముఖ్యాంశములు ః- ఆదాము శరీరము భూసంబంధమైన జిగురు గల పదార్థము. అనగా మట్టి. మట్టితో చేయబడినది. అందువల్ల ఆ స్త్రీ ఆదాముకు తినమని పండ్లనిచ్చినప్పుడు ఈ పండ్లు ఎక్కడ నుండి వచ్చినవి? అని అడుగక శారీరజ్ఞానముతో ఆమెను ఆకర్షించి ఆ ఫలములను భక్షించెను. అయితే ఆదాము భార్యయైన హవ్వ పూర్తిగా దేహసంబంధి అనగా ఆదాము ప్రక్కటెముక నుండి తీయబడినది గనుక పూర్తిగా శారీర సంబంధి జాబితాలో చేరుతుంది. ఆది 3ః1లో వలె దేవుడు జేసిన భూజంతువు అనగా సర్పము భూజంతువు గనుక శారీర బాంధవ్యమునుబట్టి ఆత్మీయ నిబంధనలు దాని హెచ్చరికను గుర్తించక, పరస్పరము అనగా సర్పము స్త్రీ ఇరువురు సమ్మతించి ఏకమై దైవాజ్ఞాతి క్రమణ క్రియను జరిగించుటకు కారకములైనట్లు మనము గ్రహించగలము.
అయితే దేవుడు వ్యర్థుడు కాడు. అశక్తుడు కాడు. అసమర్థుడు కాడు. అజ్ఞాని కాడు. నరునియొక్క పతనము, నరశరీరముయొక్క పతనము ఈ విధముగా జరుగబోవుచున్నదని తెలిసియే తోటలోని జీవవృక్ష మర్మమును నరుని జ్ఞానమునకు అంతుపట్టనీయక చేసినాడు. ఎందుకంటే నరజంట తొలుత జీవవృక్షఫలమును భక్షించి ఉంటే దేవుడు నిషేధించిన వృక్ష ఫలమును తిన్నప్పుడు లేత వయస్సు నడిప్రాయములో ఉండునుగాని అంగవైకల్యము, రోగములు మరణము ఇత్యాది అరిష్టములు లేక చిరంజీవిగా భూలోకములో జీవించువాడు. నరునిపట్ల దేవునికి అనుమానముండబట్టే నరునిలో దేవుడు తన ఆత్మను ఉంచినను, ఆ ఆత్మయొక్క జ్ఞానమును శరీర జ్ఞానముతో క్రమబద్ధము చేశాడేగాని, శరీరములను ఆత్మ జ్ఞానముతో ఉంచినట్లయితే నరజంట నిషేధించిన ఫలములను తినేవారు కాదు. సర్పములో ప్రవేశించిన అపవిత్రాత్మకు కూడా ఆ మర్మము తెలిసినట్లయితే ముందు జీవవృక్ష ఫలములను తినమని, ఆ తర్వాత మంచిచెడ్డల తెలివినిచ్చు వృక్షఫలములను తినుమనువాడు. ఈ మర్మము సర్పమునకు దాన్ని ఆవరించిన అపవిత్రాత్మకు దేవుని ఆత్మలో భాగస్వాములైన నరజంటకు దేవుడు మరుగు చేయుటనుబట్టి, అందుబాటులో ఉన్న జీవవృక్ష ఫలములను భక్షింపలేకపోయెను. ఈ మర్మమును మరుగుపరచియున్నాడు. అయితే ఆ ఫలములను తినునప్పుడు వీరు చచ్చారా? చచ్చారు. ఎఫెసీ
2ః1-2 తినవద్దన్న పండు తినుట పాపము. సర్పబోధ వినుట అపరాధము. చర్మపు దుస్తులు తొడిగించుట అనునది రక్షణ. మీరు వాటిని చేయుచు అనగా దైవవ్యతిరేకమైన ఫలభక్షణము చేసి వాయుమండల సంబంధమైన అధిపతిని అనగా అవిధేయులైనవారిని ఇప్పుడు ప్రేరేపించు శక్తికి అనుసరించి అనగా దేవుని యందు గురి లేనివారిని, దేవునిపట్ల అవిధేయులైన వారిని సర్పము ద్వారా ప్రేరేపించిన శక్తియొక్క అధిపతిని అనుసరించి నిషేధఫలభక్షణము జేసి, ప్రపంచ ధర్మము చొప్పున మునుపు నడుచుకొంటిరి. మంచి చెడ్డలకు దాసులై భూసంబంధులుగ తీర్చబడి ఆత్మసంబంధమైన దేవునికి విరోధులై, శారీరాశల ననుసరించి భ్రష్టులముగ దేవుని ఉగ్రతకు పాత్రులై, ఏదెను అను పరిశుద్ధ స్థలము నుండి త్రోయబడిన విధముగా దైవోగ్రతకు పాత్రులైయున్నట్లు, చర్మపు దుస్తులను క్రీస్తుతో కూడా అనగా ఆదిలో వధించబడిన గొఱ్ఱె పిల్లకు మూలమైన ముంగుర్తైయిన క్రీస్తు ద్వారా మనలను రక్షించినట్లు ఈ వాక్యము ద్వారా తెలియుచున్నది.
అందువల్ల దేవుడు ఆది 3ః22 విధముగా ''ఇదిగో మంచి చెడ్డలు ఎరుగునట్లు ఆదాము మనలో ఒకనివంటివాడాయెను.'' ఇచ్చట దేవుడు మానవ భవిష్యత్తును ఎరిగి ఆది 3ః24లో వలె కెరూబులను జీవవృక్షమునకు పోవు మార్గమును కాచుటకు ఖడ్గజ్వాలలను కావలి ఉంచినట్లును, ఆ మర్మమును ఎరుగక మునుపే ఆదామును తోట నుండి వెళ్ళగొట్టినట్లును దేవుని క్రియయైయున్నది. అందుచేతనే నాటి ఆదాము సంతతియైన నేటి శాస్త్రజ్ఞాని - రాష్ట్రములకును, దేశములకును, ఖండములకును, ఖండాంతరములకును, జలముల మీదను, జలాంతర భాగములోను, ఆకాశము మీదను ఆకాశములో వెలుగిచ్చు చంద్రుడు ఇత్యాది గ్రహములలో ప్రవేశించుటకు ప్రయత్నిస్తున్నప్పటికిని, ఈ జీవవృక్ష జ్ఞానము నరునికి అంతుపట్టకున్నదిగాని - ఈ జీవవృక్షము నరునికి అతి సమీపములోని వాని వాని ఇంటను వాని సన్నిధిలోను నిత్యము కనపడుచున్నప్పటికిని, ''నేనే మార్గము సత్యము జీవము అనిన వాక్కులను కూడా పెడచెవినిపెట్టి ఆకాశమండలములకు భూమండలము వదిలి తప్పించుకొను మార్గాలను నరుడు వెదకుచున్నాడు. ఇంతకు ఆ జీవవృక్షము క్రీస్తే. ఈ సందర్భములో యోహాను 6ః50-59 ఇందులో మనము గ్రహించునదేమిటంటే దేవుడు తినవద్దన్న చెట్ల ఫలములను నరజంట తిని మరణమును సంపాదించుకున్నారని అనుకుంటున్నాము. వీరు ఆ రకముగా తిని మరణమును సంపాయించుకున్నప్పటికిని తొలుత జీవవృక్షఫలములను భుజించి ఉండి, ఆ తర్వాత సర్పబోధను విశ్వసించి మంచిచెడ్డల తెలివినిచ్చు ఫలములను తిని ఉంటే దైవవాక్కులను బట్టి చచ్చినను జీవవృక్షఫలభక్షణ ప్రభావమును బట్టి పునరుజ్జీవితులయ్యేవారు. అనగా దేవుడు చెప్పిన వాక్కునుబట్టి ఈ పండు తినుదినమున మీరు చచ్చెదరు. అన్న మాట ప్రకారముగా మరణము వచ్చెడిది. వెంటనే జీవవృక్షముయొక్క ఫలభక్షణ ప్రభావము వల్ల మరల బ్రతికేవారు. ఆ జ్ఞానమును నరజంటకును వారిని మోసగించిన సర్పమునకు దేవుడు మరుగు పరచినట్లుగా ఈ సంఘటన ద్వారా మనము గుర్తింపనగును. నాడు తినిన పండు ప్రభావము వలన మరణము నరులయొక్క తరతరముల వెంటాడుచునే ఉన్నది. అదే విధముగా జీవవృక్ష ఫలములను తిని ఉంటే మరణముతోబాటు పునరుజ్జీవము కూడా నేడు భూమి మీద ఉండి చచ్చినవానికి పెట్టి ఖర్చు పాడె ఖర్చు, ఆదరణ కూటము కర్మంత్రాలు వగైరా మరణ సాంగ్యము లేకుండ ఉండెడివి. అందుచేతనే ఈ మర్మమును దేవుడు మరణములో మర్మమును భద్రపరచినట్లుగా తెలియుచున్నది. ఇందునుబట్టి ప్రవచనములలో దేవుడు నరుని హెచ్చరిస్తూ - ప్రకటన 3ః1, ''నీవు జీవించుచున్నావన్న మాటేగాని మృతుడవే,'' అని పల్కినట్లు తెలియుచున్నది. దేవుడు నరునిలో ఊదిన జీవాత్మ అనగా తోటలో నివసించుచున్న జీవాత్మకు బుద్ధి ఉన్నను - దేవుడు నాటిన జీవవృక్ష ఫలప్రభావము ఈ ఆత్మ గుర్తించక ఉండినదంటే - దేవుడు శరీర జ్ఞానముతో జతపరచినట్లుగా తెలియుచున్నది. శరీర జ్ఞానముతో ఆ ఆత్మ జీవించినదనుటకు సర్పబోధను వినుట, శారీర సంబంధమైన నేత్రాశ. జిహ్వచాపల్యము కారణములని గ్రహించాలి.
........
క్రీస్తును గూర్చిన వ్యాఖ్యానము - మానవ దృక్పధములో దేవుడెక్కడున్నాడు? ఆయన రూపము క్రీస్తు ఎక్కడ ఉన్నాడు? వారిరువురి మధ్య అదృశ్యశక్తియైన పరిశుద్ధాత్ముడెక్కడ ఉన్నాడు? మానవుడెక్కడ ఉన్నాడు? మనము తెలిసికోవలసియున్నది.
దేవుడు ః- లోకసృష్టికి పూర్వము దేవునియొక్క ఆత్మ చీకటి జలముల మీద అల్లలాడినట్లుగా భూమి శూన్యములోను, నిరాకారములోను ఉండినట్లు ఆది 1ః2లో వివరించబడియున్నది. అయితే ఇక్కడ చదువరులకు క్రీస్తుకంటె ముందు నరుడా? నరునికంటె ముందు క్రీస్తా? ఎవరు ముందు దేవుని సంకల్పములో ఉన్నారో అనే సందేహము కలుగక మానదు.
ఆది 1ః26లో దైవవాక్కులోని మర్మమును గుర్తిస్తే మన పోలిక మనస్వరూపము అన్నప్పుడు దేవుడు తనను గూర్చి మన అని అనుటలోను, నరులను చేయుదము అనుటలోను, అక్కడ పరిస్థితి స్థల ప్రభావము అచ్చటి వాతావరణము మనము అవగాహన చేసికొంటే ఆది 2ః9లో తన ప్రతిరూపమైన యేసు అను ఆకారమును వృక్షముగా మొలిపించి జీవవృక్షమను పేరుతో తన సృష్టికి మధ్యలో సాక్షాధారముగా ఉంచి, తాను సృష్టించిన నరజంటయొక్క ప్రవర్తన జీవిత మనుగడ దినచర్యలు గుర్తించుటకు యేసు అను జీవవృక్ష ప్రభావములు నరుని దృష్టికి కనుమరుగు చేసినట్లును, అయితే నరుల జీవిత పరిమాణము యావత్తు కూడా జీవవృక్ష రూపమైయున్న క్రీస్తు పరిశోధిస్తూ దేవునికి ప్రతినిధిగా ఉండి నరుల ప్రవర్తనా విధానాలను వారి పోకడలను పర్యవేక్షిస్తూ - దేవుని సృష్టియైన వనములో నరునికి కనుమరుగైయుండెను.
యోహాను 1ః1 ఆదియందు వాక్యముండెను. వాక్యము దేవుని యొద్ద ఉండెను. వాక్యము దేవుడైయుండెను. ఆయన ఆదియందు దేవుని యొద్ద యుండెను. క్రీస్తు దేహము సంఘమైనప్పుడు ఏదెను వనమను సంఘము యెహోవా దేవుని దేహమైయున్నది. 1ః4 ఆయనలో జీవముండెను. అనగా ఏదెను అను ఆయనయొక్క యేసు అను జీవవృక్షము తోట మధ్యలో ఉండెను.
ఇట్లుండగా నరులుచేసిన దైవాజ్ఞాతిక్రమమునుబట్టి ఏదెను అను దైవసన్నిధి మధ్యనున్న క్రీస్తు అను జీవవృక్షము యోహాను 1ః14లో వలె ఆ దినమందు ఆదిలో ఏ విధముగా ఏదెను వన మధ్యమున జీవవృక్షముగా నివసించాడో - క్రొత్త నిబంధన కాలములోను శరీరధారియై నరుల మధ్య నివసింపగా ఆనాడు ఏ విధముగా చీకటిలో ప్రకాశించెనో - ప్రకాశింపగా చీకటి ఏ విధముగా దానిని గ్రహింపకుండినదో అదే రకముగా నేను లోకమునకు వెలుగును, నన్ను వెంబడించువాడు చీకటిలో నడువక జీవపు వెలుగు కల్గి యుండును అని పల్కినను నాటి జనసందోహము రాజులు, చక్రవర్తులు, అధికారులు, ప్రధానులు, యాజకులు, మతాధిపతులు, వేద విద్వాంసులు సైతము గుడ్డివారై క్రీస్తుయొక్క వెలుగు ప్రభావము గుర్తింపకపోవుటయే దీనికి సాదృశ్యమైయున్నది.
అయితే ఆదిలో దేవుడు - మధ్యలో ఆయన రూపమైన యేసుప్రభువు; అంత్య కాలమునకు చేరువుగాయున్న ఈ యుగములో పరిశుద్ధాత్ముడు క్రియ జేయుచున్నాడు. చిత్రమేమిటంటే మానవకోటి యావత్తును ఆదిలోని పాత సిద్ధాంతములోనే యున్నది. అనగా అపొస్త 2ః1-4లో వలె క్రియజేయగా నేటి నరసందోహము విశ్వాసులు దైవత్వముతో కూడునప్పుడు అపొస్త 2ః13లో వలె పరిశుద్ధాత్ముని కూడా హేళన చేయుచున్నట్లు తృణీకరించుచున్నట్లు తెలియుచున్నది. ఇందునుబట్టి చూడగా ఆదిలో యెహోవా దేవుడు నరుని జేసి తాను గాఢముగ నరుని ప్రేమించినందులకుగాను నరుడిచ్చిన ప్రతిఫలమేమనగా దైవాజ్ఞ వ్యతిరేకత. ఆ తర్వాత అదే దేవుడు సానుభూతిపరుడై నరుని పట్ల జాలి తలచి నరరూపమును ధరించి నరశరీరమును దాల్చి, తనను ప్రేమింపమనగా నరుడు కృతజ్ఞత లేనివాడై తన దోషాలను కప్పి పెట్టుకొని, దైవసంభూతుడైన యేసునే దోషిగా చేసి మరణశిక్షకు పాత్రునిగా జేసి భూస్థాపన జేసినట్లు తెలియుచున్నది. అప్పటికి నరుడు శాంతించినట్లును, దేవునియొక్క ఆత్మ ఆందోళన చెందినట్లును లేఖనముల మూలముగా తెలియుచున్నది. అప్పటికిని నరుని పట్ల తన ప్రేమను చంపుకోలేక యదావిధిగ అదృశ్యరూపియై పరిశుద్ధాత్మ అను పేరుతో అపొస్త 2ః1-4లోవలె క్రియజేయుచున్నాడు.
దేవుని ఆత్మకు ఆందోళన ఏమిటో అను ప్రశ్న చదువరులకే కలుగక మానదు. అపొస్త 1ః2 అధ్యాయములు ఆత్మ అపొస్తలుల మీద వ్రాలి క్రియ జేసినప్పుడు వివిధ భాషలను వారు ప్రవచించినట్లుగా గ్రంథములో ఉన్నది.
మన పొరుగింటివాడు చేయరాని నేరము మన పట్ల చేసినప్పుడు మనము, మన ఇంటివారు ఏకమై అతనిని, అతని ఇంటివారిని నానాభూతులు ఉపయోగించి తిడుతుంటాము కదా! ఆ తిట్టడము కూడా మాతృ భాషే గాక అన్య భాషలతో (నానా భాషలతో) భూతులు ఉపయోగిస్తుంటాము. ఉదా|| రాస్కేల్ ఫూల్ ముర్దార్ మొదలైనవి. అదే రకముగా దైవశక్తి సృష్టికిని ప్రకృతికిని నరజన్మకును, వాని జ్ఞానమునకును కారణ సంభూతుడైన దేవుని ఆత్మ నరులను ఆవరించినప్పుడు అనేక భాషలతో తనను మహిమపరచుకొని, అనేక భాషలతో స్తుతించి తనను మహిమపరచుకొనుటకు, తానేర్పరచుకొన్న జనాంగము మీద వ్రాలి వివిధ భాషలతో మాట్లాడించగా ఇక్కడ కూడా నరుడు దేవుని పట్ల నిరుత్తరుడైయున్నట్లును, నిజదైవత్వమును కనుగొనలేక ఎటుబడితే అటు వ్రాలే - తోక లేని గాలి పడగ వలే జీవితములో దైవత్వములో మెరుగుపడలేకున్నాడు.
నరుల వల్ల దేవునికి కల్గిన త్రివిధ విచారములు 1. యెహోవా ః- నరుని ఆజ్ఞాతిక్రమము
2. ఏసు ః- దైవకుమారునికి మరణశిక్ష 3. పరిశుద్ధాత్మ దేవుడు నరుల చేత హేళన చేయించుకోవడము.
అయితే ఆదినుండి నేటి వరకు దేవుడు తన ప్రణాళికలను తను పేరుబెట్టిన జనాంగములను తన చిత్తానుసారముగ నడిపిస్తూ కృతార్ధుడాయెను, అదే విధంబుగ యేసు అను రూపముతో తన జనాంగమును ఒక సంఘముగ మార్చి తన నిబంధనలతో కూడిన కూటమిగా మార్చగల్గినాడు. పరిశుద్ధాత్ముడైతే ఇట్లు మార్చబడిన సంఘములను తన ఆత్మతో నింపి మొదటి కొరింథీ 12ః28లో వలె క్రియ జేయుచున్నాడు. ఇది దైవసత్యము.
ఇకపోతే ఆది నుండి నేటి వరకు మానవ సత్యము ఏలాగున్నదో మనలను మనమే పరిశోధించు కోవలసియున్నది. కనుక దైవత్వము ఈలాగు ఉండగా దేవుడు సృష్టించిన భూమి దాని సృష్టి లోకమను జనసందోహము వాని భవిష్యత్తు త్రివిధ కార్యసిద్ధియైన దేవుని గూర్చి ఆయన రాకడను గూర్చి - భర్తయొక్క రాకకు భార్య నిరీక్షించు విధంబుగ త్రివిధ దేవుళ్ళు ఏకమై ఏక దేవుడై ప్రకటన 3ః3లో వలె లోకముయొక్క నరునియొక్క అంతము ఉన్నదని ఇందుమూలముగ గ్రహింపవలసియున్నది. ఇది మానవకోటికి హెచ్చరిక. ఆ తదుపరి లోక సమాప్తి.
మార్కు 8ః34 ఆయనను వెంబడించువాడు తన్నుతాను ఉపేక్షించుకొని అనగా తన్ను తాను తగ్గించుకొని లోకము తన కుటుంబము తన శారీరక వ్యామోహములను సిలువను మోసి, దానిని విసర్జించుటకు క్రీస్తును వెంబడించాలి. ఇట్లు మోసినవారిలో లూకా 19ః1లో జక్కయ్య ఒకడుగను మార్కు 5ః25లో వలె ఆయనను వెంబడించి ఆయన అంగీ అంచును తాకి స్వస్థురాలైన స్త్రీ సాదృశ్యములై యున్నారు. పండ్రెండేళ్ళ రక్తస్రావమనే రోగపు స్త్రీ తన సిలువను ఎత్తుకొని మోసి యేసును తాకి స్వస్థురాలైనది.
లోకము, వ్యామోహము, ధనాశ వగైరా శరీర కార్యములలో మిళితమైయున్న జక్కయ్య యేసును చూచుటకు ఆయనను వెంబడించి, ఆయనకు ఆతిథ్యమిచ్చి తన పాపజీవితమను సిలువ భారము నుండి విమోచింపబడినాడు.
సిలువ అనగా శరీరేచ్ఛలు, లోకవ్యామోహము వీటికి రూపమైన పాపము. తన సిలువ నెత్తుకొని అనగా నేమి? మనము చేసిన కర్మను పాపాన్ని ఎత్తికొని ఆయనను వెంబడిస్తే తప్పకుండ రక్షణ ఉంటుంది. రోమా 10ః9-11 క్రీస్తు మోసినది లోకపాపమనే సిలువను. ఇందులో పాపమేగాని ఈ లోకపు శ్రమలు, ఇచ్ఛలు వేదనలు నిండియున్నవి. సిలువ అనగా శ్రమలతో ఆయనను వెంటాడమని అర్థము. ఈ లోకపు శ్రమలు - పాపము మరణము, దుఃఖము ఆవేదన మొదలైనవి సిలువ. శ్రమలకు రూపము సిలువ ఇరుకులు, ఇబ్బందులు, కష్టములు, నష్టములు వీటన్నిటి రూపము సిలువ, సిలువ కొయ్యతో చేయబడిన సిలువ రూపమునకు సాదృశ్యమైయున్నది.
దైవత్వమునకు రూపము క్రీస్తు. శ్రమలకు రూపము సిలువ. సాతానుకు రూపము సర్పము. పవిత్రాత్మకు రూపము పావురము, క్రీస్తుకు రూపము గొర్రెపిల్ల. వీటిలో నరుడే ఏ రూపమునకు చెందినవాడో తెలియక నిలకడలేని జీవితములో జీవించుచున్నట్లు తెలియుచున్నది.
దేవుడు తన పోలికలో తన రూపములో నరుని చేస్తే సర్పదాసుడై దైవ వ్యతిరేకియైన నరుడు హంతకుడుగాను, అవిశ్వాసిగాను, కొండెగాడుగాను, విగ్రహారాధికుడుగాను, నీతిలేనివాడుగను, పశువాంఛ లోలుడుగను, వ్యభిచారిగాను, దొంగగాను, నపుంసకుడుగను, కామాంధుడుగను, త్రాగుబోతుగాను జూదగాడుగాను, ద్వేషిగాను, కలహ ప్రియుడుగాను, మత్సరపరుడు, క్రోధపూరితుడును వగైరా రూపములతో విలయతాండవమాడుచు శరీర పటుత్వము ఉడిగి లింగనరములు బలహీనత పొంది, వల్లకాటి ఎన్నికలకు ఓటరుగా తయారైనప్పుడు బైబిలును పట్టుకొని, క్రైస్తవ విశ్వాసిననియు బోధకుడననియు మేళాలు వాయిస్తున్నాడు. కాని సృష్టికర్తయైన దేవుడు ఏకాత్మ, ఏక శరీరము, ఏక జ్ఞాని, ఏక శక్తి గనుక నాటికి నేటికి ఆయన ఒకే రూపములో ఉన్నాడు.
పరమాత్మకు జీవాత్మకున్నట్టి అవినాభావ సంబంధములు ః-
రెండు అదృశ్యమైనవి, రెంటియొక్క నిజస్వరూపము నరాకృతి. రెండు ఒకే అంశములో ఐక్యత కల్గియుండినవి. కాని కాలదోషము కర్మదోషమును బట్టి వక్రించి, పరస్పర విరోధములై క్రోధాదిగుణంబులచే జీవాత్మపూరితమైన శరీరము సృష్టినిర్మాణమునకు కారణభూతంబైన పరమాత్మతో ఉన్న సఖ్యంబను బంధమును త్రెంచుకొని తన ఇచ్ఛము వచ్చినట్లు నరశరీరంబను వాహనంబు ద్వారా లోకసంచారము చేసి, చివరకు మరణమను కర్టను త్రెంచుకొని పరమాత్మలో ఐక్యము కావలసిన దినమున్నది. నదులు ఏ విధముగా పుట్టి అనేక సెలయేరులు నదులు మహానదులు ఏ విధముగా జన్మించి, అనేక పేర్లతో వ్యవహరింపబడి వరదలతోను, ఉరవళ్ళతోను, నురగలను గ్రక్కుకొంటూ ప్రవహించి, తుదకు తన జన్మకు మూలకారణంబైన సముద్రునిలో కలియుచున్నవో - అదే విధంబుగ పరమాత్మునిలో నుండి పుట్టిన పరమాత్ముని క్రియాసంకల్పము ద్వారా పుట్టిన నరశరీరము అనేక పేర్లను దాల్చి అనేక బిరుదులు పొంది, అనేక గుణములతో ప్రవర్తించి ఎంతో కీర్తిని ఆర్జించి, నదివలె ప్రయాణించి కాలక్రమేణా శరీర పటుత్వము సన్నగిల్లి ముదిమి ఏర్పడి, ఎండిన నదివలె క్షీణించి మరణమను క్రియ ద్వారా పరమాత్మునిలో లీనమయ్యే దినమొక్కటియున్నదని రెండవ కొరింథీ 5ః10 క్రీస్తు న్యాయ పీఠము ఎదుట నర జీవాత్మ పరమాత్ముల యొక్క కలయిక ఈలాగున్నది.
మరి ప్రకృతి (సృష్టి) మాటేమిటి? సృష్టికర్త లేక సృష్టి లేదు. నరుడు లేక సృష్టికి మెరుగు లేదు. నరుడు దేవుడు ఇరువురు లేకపోతే సృష్టికి నాధుడు లేడు. నరుడు దేవుడును ఏదెను వనములో ఏకము కాబట్టే సృష్టికి నాధుడు లేనందున సర్పమును తనకు నాధునిగా చేసికొని, నరజంటను వారికి సంతానముగా చేసికొన్నట్లు లూకా 3ః7 మత్తయి 23ః33 సర్పములారా! సర్పసంతానమా! అని యేసుప్రభువు పల్కిన మాటలు ఇందుకు సమతుల్యముగా ఉన్నవి.
మొట్టమొదట సృష్టికి (భూమికి) నాధుడు పరమాత్ముడు - దీనికి ఋజువు ఆదికాండము ఆ తర్వాత అదే సృష్టిని ఆది 2ః15లో వలె దానిని సేద్యపరచుటకు అనగా దానిని మెరుగుపరచుటకును దానిని సంరక్షించుటకును దాని ఫలములను అనుభవించుటకును తన ఇష్టానుసారముగా దానిని ఏలుటకును నరునికి అప్పగించినాడు. అప్పగించినను దేవుడిచ్చిన ఆజ్ఞనుబట్టి నిషేధఫలభక్షణము అనునది భూమికి నరుని మీదనున్న ప్రేమకు అంతరాయముగా ఉన్నందువల్ల - భార్య ఏ విధముగా అయితే తన భర్తను తనకు దాసుడుగా ఉండి తన మాట వినునట్లుగా ప్రయత్నించునో - అదే విధంబుగ భూమి కూడా నరుని తన దాస్యమునకు లోబడుటకు ప్రయత్నించినట్లును, తన కార్యసాధనకు మధ్యవర్తిగా యుక్తిపరుడైన భుజంగుని డలారిగా తన జ్ఞానముతో ప్రేరేపించి, తను స్త్రీ కాబట్టి తన వలె అబలయైన, అనాధయైన స్త్రీని పై డలారి చేత మృదుమధుర సంభాషణముతో దైవవ్యతిరేక పలుకులను పల్కి, నిషేధఫలభక్షణము చేయించి నరుని దైవవ్యతిరేకునిగా చేసి, తనకు నాధునిగా ఏర్పరచుకొని నాటి నుండి భూమి - రాజులు, చక్రవర్తులు, అధిపతులు, మంత్రులు ముఖ్యమంత్రులు, రాష్ట్రపతులు అను వివిధ భంగిమలతో నరకోటిని సుస్థిరముగా తన ఆశలతో బంధించి తన వ్యామోహములోనే కొట్టుమిట్టాడి మరణకాలములో బికారులునుగా జేసి, మదాంధకారముతో జనసందోహ కోలాహలముతో జేజేలు నినాదములతో డాంబికముతో - నేటి భూలోకము శతవిధ పాపదోషంబులతో గంతులేస్తున్నది. దీని అంతమును ప్రకటన గ్రంథము చివరి అధ్యాయములలో చూడగలము.
.......
త్రిత్వము ః- కుటుంబములో గృహయజమానునికి ఏ విధముగా అయితే సాటి సహాయముగా ''స్త్రీ'' గృహనిర్వాహకుడుగ ఇంటికి పెద్దకొడుకు ఏ విధముగా ఉంటారో దేవుడు ఒక్కడైనప్పటికిని ప్రపంచము అను ఈ కుటుంబమును క్రమబద్ధము చేయుటకు దేవుడు ఆత్మ గనుక ఆత్మకు సాటిసహాయముగా ఆత్మయే కావలెను. శరీరమునకు సాటి సహాయము శరీరమే. కనుక ఆత్మయైన దేవుడు పరిశుద్ధాత్ముని సాటిసహాయముగ ఎంచుకొని, నరులైన మనకు చూపుల ద్వారా విశ్వాసము గనుక యేసు అను దృశ్యరూపుని నిర్మింప జేసి, పరిశుద్ధాత్మయొక్క మహిమాప్రభావము చేత (త్రిత్వమును నిర్మించి) భూలోకముయొక్క మాలిన్యమును తొలగించి పవిత్రులుగ చేయుటకు త్రిత్వమును పొంది త్రివిధములుగ తన ప్రణాళికను అమలుపరచినట్లు గ్రంథము ద్వారా తెలియుచున్నది. యోహాను ఒకటవ అధ్యాయము చూస్తే ఈ మర్మము మనకు తెలియును.
యేసు మహిమపర్చబడుట ః- యోహాను 9ః1-8 & 2ః
ఆత్మ బాప్తిస్మము పొంది గలతీ 5ః22లో ఆత్మఫలములు పొందవచ్చును. మారుమనస్సు ఫలములు లూకా 3ః8లో యోహాను చెప్పినవి. ఆత్మ ఫలములు తొమ్మిది. పరిశుద్ధాత్ముని ప్రభావమున మూడింటిని పొందగలము. 2వ కొరింథీ 3ః18లో ప్రభువు మహిమను అదామువలె చూపించు ఆత్మరూపుడైన యేసు మహిమను స్ఫురింపజేయును. అనగా క్రీస్తు స్వరూపమును పొందుదుము. అంటే దేవుని సంపూర్ణత పొంది నరులు. ఎఫెసీ 4ః13లో పరిశుద్ధులు. క్రీస్తు శరీరము అను సంఘములో క్షేమాభివృద్ధి జెందుటకు ఈ ఐదుగురిని నియమించినట్లు తెలియుచున్నది. 1వ కొరింథీ 12ః1-11లో ఆత్మ కృపావరములలో తొమ్మిది. ఇందులో వరములు, ఫలములు, పరిచర్యలు - ఇందులో మొదటిది 1వ కొరింథీ 13లో ప్రేమను గూర్చి తెలియుచున్నది. ఇందు అన్ని వరములలోను ప్రకాశవంతమైనట్లు తెలియుచున్నది. 1 వ కొరింథీ 14లో ప్రవచనము భాషలతో మాట్లాడుట.
ఎఫెసీ 4ః30లో పరిశుద్ధాత్మగా దేవుని ఆత్మ అని రోమా 8ః9లో క్రీస్తు ఆత్మ అనియు యోహాను 16ః13లో సత్యస్వరూపియైన ఆత్మ అని పేరు. యోహాను 14ః26లో ఆదరణకర్త అని కూడా పేరు. రోమా 8ః26లో సహాయకుడు అనగా ప్రార్థన, విజ్ఞాపన వగైరా దైవ కార్యలలో 1వ కొరింథీ 2ః10లో ఆత్మ వలన బయల్పరచుట 2వ కొరింథీ 3ః18లో పరిశుద్ధాత్మ మన పోలికను మార్చును. క్రొత్త నిబంధనలో పరిశుద్ధాత్మను గూర్చి 87 సార్లు వ్రాయబడియున్నది. లూకా 11ః3 ఎఫెసీ 1ః13, ఎఫెసీ 4ః20, 1 ధెస్సలొనీక 4ః8లో చూడుము. అగ్ని - నీరు - గాలి ఈ మూడును ఆత్మకు సూచనగా యున్నది. నీళ్ళు శుభ్రపరుస్తుంది. అగ్ని దహిస్తుంది. అదే విధముగా పరిశుద్ధాత్ముడు మొదట శుభ్రపరచును. అగ్నివలె నరుల మలినాన్ని దహించును. మలాకీ 3ః2-3లో ఆయన కంసాలి అగ్ని - చాకలివాని సబ్బు.
యెషయా 6ః6-7లో పాపమును దోషములను పెదవులను పవిత్రపరచినట్లు తెలియుచున్నది. అనగా యెషయా పాపప్రాయశ్చిత్తము ఎందుకంటే యెషయా 6ః5 చూచిన అపవిత్రమైన పెదవులు కలిగి యున్నట్లు ఆయన ఒప్పుకొన్నారు. యోహాను 5ః35లో అతను ప్రకాశించుచున్న దీపము - యోహానును గూర్చి యేసు సాక్ష్యమిచ్చియున్నారు. యోహాను 14ః15-16, అధ్యాయాలలో ఆయన అని ఆత్మ పిలువబడు చున్నాడు. రోమా 8ః16-26లోను యోహాను 4ః26లో నేనే ఆయనను.
........
ఆత్మను గూర్చిన వివరణ
మొదటి కొరింథీ 12ః4-11 ఆత్మ ఒక్కడే అదే విధముగా సేవా పరిస్థితులు ఆరాధనలు నానా విధములు ఉండవచ్చును, కాని ప్రభువు ఒక్కడే, అందరిలోను అన్నింటిని జరిగించు దేవుడు ఒక్కడే. అయినను వారివారి ప్రయోజనము కొరకు ప్రతివానికి ఆత్మ ప్రత్యక్షత అనుగ్రహించబడుచున్నది. మొదటి కొరింథీ 12ః8-11 పలురీతుల ఆత్మ అనువాడు తన చిత్తము చొప్పున ప్రతివానికి ప్రత్యేకముగా పంచి ఇచ్చి కార్యసిద్ధి కలుగజేసియున్నాడు. ఇందునుబట్టి క్రైస్తవులమైన మనమందరము ఒక్క శరీరములోనికి ఒక్క ఆత్మయందే బాప్తిస్మము పొందితిమి.
భూమికి జీవము కలుగవలెను. కాబట్టి పరములో ఉన్న పరమాత్మ ఒక నరరూపమును భూమినుండి తయారుచేసి ఆ నరరూపమునకు తన ఆత్మను జీవాత్మగా అందులో ప్రవేశింపజేసినందున నరుడు జీవాత్మ ఆయెను. అయితే ఆదాములోని ఆత్మ ఆదామునిది కాదు. దేవునిదే అనగా పరమాత్మదే యగును. భూలోకమునకు పరలోకమునకు సంబంధ బాంధవ్యములు ఏర్పఱచుటకే పరమాత్మ భూమిలో నుండి శరీరమును రూపొందించి పరమందున్న తన ఆత్మను ఈ శరీరమునకు జోడించి ఒక కలయికను ఏర్పరచియున్నట్లు తెలియుచున్నది. ఇందునుబట్టి నరుల కుమార్తెలు అందముగా నుండుట చూచి దేవుని కుమారులు వారితో కలయికలను ఏర్పరచుకొన్నట్లుగా గ్రంథములో ఉన్నది. ఇందులోని మర్మము ఏమిటి? దేవుని కుమారులు పరలోక సంబంధులు, నరుల కుమార్తెలు భూలోక సంబంధులు. దేవుని కుమారులు ఆదామునకు పుట్టిన షేతు వంశీకులు. కయీను సంతతియే నరులు. శరీర మాలిన్యము వలన ఆత్మ విలువను కోల్పోయి, సృష్టికి ప్రాబల్యము పెరిగి ఈ సృష్టి పరమాత్మునికి విరోధియైనది.
ఇందుమూలముగా పరమాత్ముడైన యెహోవా దైవాత్మ అనురాగమును పొంది, దైవవిధేయుడై యున్న నోవహు అను ఒక జీవాత్మ తప్ప ఇంకెవరును నీతిమంతులుగా పరమాత్ముని సన్నిధిలో ఎన్నిక లేనందున పరమాత్ముడు కోపించి, సృష్టిని తన ప్రకృతి శక్తుల ద్వారా తుడిచివేయుటకు సంకల్పించినట్లుగా ఆనాటి జలప్రళయము మనకు విశదీకరించుచున్నది. ఇట్టి క్రియను జీవాత్మ లోపము వలన దానియొక్క మాలిన్యము వలన పరమాత్మ ఉగ్రత తనయొక్క ప్రభావమును నిరూపించినట్లు కూడా ఈ జలప్రళయము మనకు తెలుపుచున్నది.
జీవాత్మ దానిని భూమికి అనుగ్రహించిన పరమాత్మునియొక్క శక్తిని ఈ లోకాశలకు లోబడి తృణీకరించి వ్యతిరేకియైనందువలన, జీవాత్మకును దానిని ఆవరించియున్న సృష్టికిని ఈ దుర్గతి ఏర్పడినట్లుగ గ్రహించవలెను.
అయితే స్త్రీలో ఉన్న ఆత్మ ఎవరిది? దేవుడైన యెహోవా నరునికి గాఢనిద్ర కలుగజేసి అతని ప్రక్కటెముకతో స్త్రీని చేసినట్లుగ గ్రంథములో ఉన్నది. కాని ఆమెను మట్టితో చేసి మరల తన జీవాత్మను ఊదినట్లు గ్రంథములో లేదు. ఆ ఎముకతో ఒక దేహమును చేసెను. వాక్కుతో సృష్టించినాడా? అనునది లేదు. అయితే ఈ నిర్మాణము ఎట్లు జరిగినది? ఈ సందర్భములో మనకు ఒక దైవరహస్యము తెలియుచున్నది.
గాఢనిద్ర నుండి లేచిన ఆదాము స్త్రీని చూచి - ''నా ఎముకలలో ఎముక నా మాంసములో మాంసము నరుని నుండి తీయబడితివి, కనుక నీవు నారివి.'' ఇందులో దాగియున్న సత్యమేమి? ఎముక మాంసముతో పాలుపంపులు ఉన్నప్పుడు - జీవాత్మలో మాత్రము భాగస్వామి ఎందుకు కాకూడదు? ఇందునుబట్టియే మన తెలుగు సాహిత్యము ''అర్ధాంగి'' అంటున్నది. అన్నింటిలో సగభాగము ఉన్నదన్నట్లుగ ఈ సత్యములోని మర్మముగా దేవుడు మనకు అనుగ్రహించియున్నాడు. అనగా ప్రతి అంగములోను సగభాగము జీవాత్మలో కూడా సగభాగమైయున్నది.
సర్వసాధారణముగా జంతుకోటిలోను, పశుపక్ష్యాదులలోను జరుగు జననము ఎలాగంటే - ఆడ మగ రెండును ఆత్మ లేనివి. అయితే జీవము ఉన్నవి. నరజన్మకు అలాగ కాదు. ఇచ్చట కలయిక పొందునట్టి రెండు శరీరములలోను జీవాత్మ కల్గియున్నది. అందుచేత పశుపక్ష్యాదుల జననమునుండి పరమాత్మ నరజన్మను ప్రత్యేకించి (స్పెషల్‌గా) యున్నాడు. ప్రసవ సమయములో జంతువు పద్ధతిలోనే మానవుడు ప్రసవించుచున్నాడు. కొన్ని నెలల వరకు జంతువు ఈనిన పిల్లలకును, నరునినుండి జన్మించిన బిడ్డకును ఒకే జ్ఞానముతో మెలగుచుండును. (ఇంచుమించు ఒక్కసంవత్సము వరకు) కాని పరమాత్మ మనకు ఇచ్చిన జీవాత్మ చాలా మర్మముతో నిర్ణయించబడియున్నది. అందువలన నరుని భూమికి అప్పగించి పోవునప్పుడు (అనగా చనిపోయినప్పుడు) శరీరముతో జీవాత్మ చెప్పదు. కాని ఎప్పుడు, ఏ వయస్సులో ఏ జబ్బుతో మరణించునది (అనగా శరీరమును ఆత్మ విడుచునది) చెప్పదు. ఎందుచేతనంటే పరమాత్మ పిలుపు జీవాత్మకే తెలియదు. పరమాత్మ - జీవాత్మ సంకల్పము లేనిదే శరీరమును జీవాత్మ విడువదు. పరమాత్మ సంకల్పించుకొని జీవాత్మను తన సన్నిధికి చేర్చుకొనుటయే మరణము. దైవాత్మ పూర్ణుడై జీవాత్మ విరోధియై ప్రకృతికి దూరుడై ఉన్నవాడే ఈయొక్క పరమాత్మ పిలుచు మరణ పిలుపును గుర్తింపగలడు. అనగా చనిపోవు సమయమును ముందుగా గుర్తింపగలడు.
దేవుని చేత రూపొందించబడిన వారు ఆదాము, ఆదాములో నుండి (నరుని నుండి) వచ్చినది స్త్రీ. నరుని దైవాజ్ఞ వ్యతిరేకిగా చేసినది స్త్రీ, ఆదాములో ఉన్న ఆత్మ దేవుని పూర్ణాత్మ. ఆ ఆత్మ నుండి అనగా నరుని నుండి సగపాలుగా హవ్వలోనికి పంచబడినది.
అపవిత్రాత్మ ః- సర్పమును నిలయముగా చేసికొని దేవుని పూర్ణాత్మపూర్ణుండైన ఆదామును శోధించలేక హవ్వను లోబఱచుకున్నది. ఆత్మశక్తి చేతనే సర్పము మాట్లాడగల్గినది.
పరమాత్మ - జలములు - సృష్టి - జీవాత్మ - అపవిత్రాత్మ. ఇవి అన్నియు ఆది అంత్యములు లేనివి. రూపములేనివి. పరమాత్మ తన క్రియాశక్తితో సృష్టికి నాధుడాయెను. జీవాత్మ మట్టి శరీరములో ప్రవేశింపబడి భూనాధుడాయెను. అపవిత్రాత్మ తన కుయుక్తితో పరమాత్మ సృష్టియైన భుజంగములో ప్రవేశించి భుజంగనాధుడాయెను. ఈ మూడు ఆత్మలు ఆదిలో అగాధజలముల మీద పరమాత్మలో లీనమైయున్నవి. ఆదిలో జీవాత్మ పరమాత్మలో ఉన్నది. కాని అపవిత్రాత్మ అగాధజలముల మీద ఉండినది. దాని మీద ఉన్నది పవిత్రాత్మ,
అయితే ఈ జీవాత్మ - పరమాత్మ - అపవిత్రాత్మ సృష్టి మీద ఏమేమి చేయుచున్నారు?
పరమాత్మ ః- సృష్టికి ముందు ఈయన అగాధ జలముల మీద అల్లలాడినట్లును, క్రియా సంకల్పము లేనివాడుగను వివరించబడి యున్నది. అటు పిమ్మట పరమాత్మ క్రియానిరూపణకు సంకల్పించినవాడై జలములను వేరు చేసి, భూమిని అందులో ఒక ఉద్యానవనమును, అందుకనువగు ప్రకృతిని, వాతావరణమును, వెలుగునిచ్చుటకు గ్రహములను, పశుపక్ష్యాదులను, జంతుకోటిని తన ఉజ్వల మహత్తర శక్తితో - వాక్ పూర్వకముగా సృష్టించినట్లు తెలియుచున్నది. అటుతర్వాత తాను ఏ భూమిని అయితే సృష్టించినాడో ఆ భూమియొక్క (మేను పిండి) మట్టితో ఒక నరాకృతిని రూపొందించి తనలో ఉన్న జీవాత్మను తన సృష్టికి జీవము ఇచ్చుటకుగాను, ఆ నరరూపములో ప్రకాశింపజేసెను. ఇందువలన నరుడు జీవాత్మ అనబడెను.
జీవాత్మ ః- ఈ జీవాత్మ అనువాడు పరమాత్మకును, భూమికిని ఉన్న సంబంధ బాంధవ్యముగ పరమాత్మ సృష్టికి జీవము ఇచ్చుటకును, అనగా దానిని మెరుగుపరచుటకును జీవాత్మ నిర్ణయించబడినాడు. ఇతడు పరమాత్మకు విధేయుడై తాను ఈ లోకమునుండి శరీరమును విడిచి పరమాత్మలో ఐక్యమగుటకు యోగ్యతను అనగా పరమాత్మయొక్క ఆజ్ఞానుసారముగా ఆయనకు విధేయుడై ప్రవర్తించవలెను. ఇది పరమాత్మ జీవాత్మకు ఇచ్చిన నిబంధన.
అపవిత్రాత్మ ః- జీవాత్మ ఒంటిగానో, జంటగానో పరమాత్మ నిబంధనకు నుడివడి నడుచుచున్న సృష్టి జరుగదు. అందుమూలమున ప్రకృతి ధర్మమును పరమాత్మ ఒప్పుకొనడు. పరమాత్మ పాపి కాదు, సంభోగము ఆయనకు చాలా హేయ్యమైనది. కాని సృష్టి సంభోగేచ్ఛల మీద అభివృద్ధి చెందవలసియున్నది. ఈ కార్యము జరుగవలెనంటే అపవిత్రాత్మ కావలెను. నరులు భూమి మీద విస్తరించవలెనంటే పాపము జరుగవలెను. ఈ క్రియను అపవిత్రాత్మ బహుచాకచక్యముగాను, సుళువుగను, సంకోచము లేకుండ చేయగలదు - అందుకుగాను పరమాత్మ దీనిని నియమించి యున్నట్లు తెలియుచున్నది. ఆ దినములలో ఈ ఆత్మకు రూపము ఇచ్చినది భుజంగము (సర్పము) కాని ఇతనికి రూపము లేదు. కనుక పరమాత్మయే నరునికి వృక్షఫలము మఱియు ప్రత్యేకించి ఈయొక్క సర్పమును సృష్టించినట్లుగా తెలియుచున్నది. ఆ చెట్టులోనే మాట్లాడాలి అందుబాటుగ ఉంటుంది. ఫలములు ఆరగించుటకు.
సృష్టి మర్మమును ఎరిగియున్నవాడు పరమాత్మ. ఆయన యొక్క మర్మములను అంతయుగాక పోయినను కొంతయైన ఎరిగియున్నవాడు అపవిత్రాత్మ. పూర్తిగ ఎరుగలేకున్నవాడు దైవాశీర్వాదమును కోల్పోయిన జీవాత్మ.
పరమాత్మ చెట్టు ఫలమును తినవద్దని శాసించినప్పుడు సర్పమును ఎందుకు పెట్టినాడు? ఒకవేళ సర్పము ఆ చెట్టు మీద కాక వేరే చెట్టు మీద నుండి మాట్లాడకూడదా? సర్పము అదే చెట్టు మీద నుండి మాట్లాడుటలో దైవసంకల్పమును అపవాదికి అవకాశమిచ్చు క్రియయైయున్నది.
అపవిత్రాత్మ ఆవహించిన సర్పము ఈ పండు మీరు తినుదినమున మీ కన్నులు తెరువబడి మీరు మంచి చెడు ఎరిగినవారై దేవతలవలె ఉందురు, అని పలుకుటలో పరమాత్మ ఆ పండును తినవద్దన్న సంగతి సర్పమునందున్న అపవిత్రాత్మకు ఎట్లు తెలియును? ''దేవతలవలె ఉందురు,'' అనుటలో సర్పమునకు దేవతల రూపము ఎట్లు తెలియును? ఈ రెండు విషయములలో ఎరిగియున్నవాడు పరమాత్మ - పరమాత్మ వల్ల ఉపదేశము పొంది సర్పములో ప్రవేశించుట అపవిత్రాత్మ ఒక్కడికే ఇది సాధ్యము.
ఎట్లంటే ఆదియందు దేవుని యాత్మ అగాధజలములమీద అనగా చీకటి జలముల మీద అల్లలాడుచున్నట్లుగ ఉన్నది. అగాధ జలములు అనగా అంధకార జలములు, చీకటి అనునది అపవిత్రాత్మ సొత్తు (నిలయము) వెలుగు అనునది దేవునియొక్క ప్రకాశము (కాంతి). చీకటి, వెలుగు రెండును ఒకదానికొకటి వ్యతిరేకములైయున్నవి. దీనిని బైబిలు వివరించియున్నది. మరియు ఈ నిర్ణయము పరమాత్మ నరుని శరీరము మీద కూడ నిరూపించియున్నాడు. ఏవిధమనగా పరమాత్మ తన రూపము క్రీస్తుగ చేసి తాను క్రీస్తు రూపముగ జీవించి సంచరించినప్పుడు - ''నేను లోకమునకు వెలుగైయున్నానని ప్రవచించియున్నారు. వెలుగు అంతర్థానమైనప్పుడు ఆ ప్రదేశమును ఆవరించునది చీకటియే. ఇది పరమాత్మ నరశరీరము మీద నిరూపించియున్నాడు. ఎట్లంటే నరశరీరములోని ఆత్మ దేవునిది. ఇది కాల నిర్ణయముబట్టి పరమాత్మలో ఐక్యమగు సమయము ఆసన్నమైనప్పుడు పరమాత్మునిలో లీనమైనప్పుడు - శరీరమును ఆవరించునది చీకటియే. ఇందులో బహిర్గతమగు ప్రధానాంశములు ః- 1. దేహము కన్నులు మూతలు పడుట 2. నిర్జీవము (చలనము లేనిది) 3. అగాధమైన గోతిలో పాతి పెట్టబడుట లేక కట్టెలను పేర్చి మృత శరీరమును ఇతరులకు కన్పించకుండ మూసి, దహన సంస్కారమను బిరుదును ఇచ్చి మన కండ్ల ఎదుటనే ఆ మృత శరీరమును అగ్నితో కాల్చుట.
ఇందుకు తార్కాణముగా యేసుప్రభువు తన బోధలో చీకటిని ప్రేమించువాడు అపవాది సంబంధులుగను, వెలుగును ప్రేమించువారు దైవసంబంధులుగను విభజించియున్నారు దీనినిబట్టి పరమాత్మతో దేవుని యొద్దనుండి ఈయొక్క భావములను మానవ శరీరము మీద ఆయన నిరూపించి యున్నాడు. ఏ విధముగా అంటే నరునికి రెండు హస్తములు, రెండు కన్నులు, రెండు స్తనములు ఉన్నవి. మొదటిదానిని కుడి, రెండవదానిని ఎడమ అంటున్నాము. ఈ లోకము పరమాత్మ నిర్ణయము ప్రకారము ఎడమ చేతిని, ఎడమ కాలును హీనముగా (నీచముగా) ఆచరించుచున్నది. ఎందుకంటే ఎడమ చేయి చేయు పని దేహమునకున్న ఎడమ భాగమున కంతటికిని అనువర్తిస్తున్నది. అనగా ఇది అపవిత్ర క్రియలను చేయుచున్నది. ఇందుకు ఉదా|| పాశ్చాత్య దేశస్థులు గుడ్ మార్నింగ్ సార్ అనునది కుడిచేతితోగాని ఎడమ చేతితో కాదు. సాహెబులు (ముస్లిమ్‌లు) సలామ్ చేసేది కుడ ిచేతితోనే - షేక్‌యాండ్ ఆచరించేది కుడి చేతితోనే, ఎవరికైన డబ్బు ఇవ్వవలెనంటే ధర్మము చేయవలెనంటే కుడి చేతితోనే, ప్రభుత్వ సిబ్బంది కవాతు చేయుచు అధికారికి సెల్యూట్ చేయునది కుడిచేతితోనే, క్రొత్త పెళ్ళి కుమార్తె అత్తవారింటిలో గడపలో కాలు పెట్టునది కుడి కాలే, కార్యార్థము బైలుదేరే వ్యక్తి గడప దాటునప్పుడు మొదట కుడిపాదము పెట్టును. యేసుప్రభువు తండ్రి యొద్ద కుడి పార్శములో ఉంటాను, అన్నట్లు చెప్పబడియున్నది ః కుడివైపు గొఱ్ఱెలు, ఎడమవైపు మేకలు, నరుని కుడి భాగము గొఱ్ఱె, ఎడమ భాగము మేకగను దేవుని నిర్ణయమైనట్లుగ మానవ శరీరము మీద నిర్ణయము చేసియున్నాడు.
మఱి నమస్కారము మాటేమిటి? స్తోత్రము, వందనములు అని చేతులు జోడించి కృతజ్ఞతలు తెలుపువారి సంగతులు అంటారా? ఇందులోని పరమార్థము - నర శరీరమైనట్టి మన దేహమును రెండు ఆత్మల నిర్ణయముతో ఈ లోకములో జీవించుచున్నట్లుగ దీనివలన తెలియుచున్నది. కుడి ఎడమ అను హస్తములు క్రియానిర్ణయముల ప్రకారము క్రియనుబట్టి వేరువేరుగ ఉన్నను - శరీరాత్మ ప్రత్యక్షతలను కనపఱచునప్పుడు ఇవి రెండును సమానములుగ ఉన్నట్లు ఈ రకములైన జోడింపులు ప్రత్యక్షపరచబడుచున్నవి. ఎందుకంటే ''యోబు'' అను శరీరమును శోధించునప్పుడు పరమాత్మ, అపవిత్రాత్మ ఇద్దరును ఏకమై - యోబును శోధించినట్లుగా గ్రంథములో ఉన్నది. ఎలాగనగా యోబుయొక్క జనాంగమును అపవిత్రాత్మ సంహరించగా యోబుయొక్క పశుజాలమును దైవాగ్ని దహించినట్లుగ గ్రంథములో ఉన్నది. మఱియు యోబు శోధన కాలమునకు పూర్వము పరమాత్మ అపవిత్రాత్మ రెండు ఏకముగా నిర్ణయము చేసికొనినట్లున్నది. అదే విధముగా నేడు నరులైన మనపట్ల కూడా దైవాత్మ, అపవిత్రాత్మ తమ ప్రయోగములను చేయుచున్నవి. ఎట్లంటే మనలో భక్తిని కల్గించేది పరమాత్మ. దానిని పెడదారిలొ పెట్టించేది అపవిత్రాత్మ. నరుల సొత్తును దొంగిలించవద్దు అనెడిది పరమాత్మ. మోసము చేయనిదే మహారాజు కాలేవు అనునది అపవిత్రాత్మ. అబద్ధము పలుకవద్దు అనెడిది పరమాత్మ, పలికించెడిది అపవిత్రాత్మ. పదవిని కోరవద్దనెడిది పరమాత్మ. పదవిని ఆశింపచేయునది అపవిత్రాత్మ. కాని మన జీవితములో ఈ రెండును కనబడుచున్నను ఇవి రెండు మనలను ఆవరించియున్నవని నిరూపించుటకు మన దేహము ఈ వందన సాంగ్యమును ఆచరించుచున్నది. ఈ ఆచరించు విధానము అన్నిచోట్ల జరుగదు. దైవసన్నిధానములోను, దైవనామస్మరణము చేయునప్పుడు, జపతపము ఆచరించునప్పుడును, దైవదాసులైన స్వాములవార్లును, మతాధిపతులకును, దైవసన్నిధిలోను ఎదుటను ఇది ఆచరింపబడుచున్నది. అనగా అపవిత్రాత్మ పవిత్రాత్మ ఇవి రెండును నరుని ఆవరించియున్నవని (నేను పాపిని అని ఒప్పుకొనుటయే) ఇందలి భావము.
అయితే మానవుని ఎడమ భాగమున మానవుని హృదయమును అమర్చుటలో దైవనిర్ణయమును మనము గుర్తింపవలెను, ఎందుచేతనంటే కుడిచేతికి మానవ జీవితములో పని ఎక్కువ. ఆఫీసరుకు వ్రాత పని; బరువులు మోయువానికి కుడిచేయియే ప్రాధాన్యత, హృదయము రక్తప్రసార కేంద్రము గమకను పైగా అనేకమైన ఆలోచనల వలయమగుట వలనను కుడి చేయి చేయవలసిన పని హృదయము యొక్క భారము ఆలోచనలు ఇవి అన్నియు కూడా ఒక్క కుడివైపునకే ఉంటే నరుడు జీవింపలేడు. పైగా త్వరగా అలసట పొందును. కాబట్టి ఎడమ భాగము పని తక్కువ.
అయితే ఈ అపవిత్రాత్మ ఎవరు? అపవిత్రాత్మకును, పరమాత్మకును రూపము ఇచ్చినది ఎవరు? ఆత్మలలో ఆడమగ ఉన్నదా?
అపవాదికి రూపము ఇచ్చినది దేవుడే. వీరిద్దరు చేసిన క్రియలనుబట్టి అనగా పాము మాట్లాడిన మాటలనుబట్టి మఱియు ఆదాము చేసిన దోషమునుబట్టి అనగా జీవాత్మ - అపవిత్రాత్మలు చెట్టు వద్ద ఆదిలో మాట్లాడుకొనిన మాటలనుబట్టి దేవునికి రూపము ఇచ్చినారు. ఆయనయే పరిశుద్ధాత్మ నరరూపము పొందిన క్రీస్తయి ఉన్నాడు.
దీనినిబట్టి సృష్టియొక్క పరిభ్రమణము ఈ మూడు ఆత్మల వలన నడిపింపబడి పవిత్రాత్మయను వానికి క్రియనిచ్చుచున్నది. (యోహాను - యేసు) పరిశుద్ధాత్మయొక్క క్రియల వలన జన్మించినట్టివారే కదా.
అయితే దేవతలు (దేవదూతలు) అనువారు ఎవరు? పరమాత్మునియొక్క శక్తులు. కానిచో యేసును దేవాలయ శిఖరమున నిలబెట్టలేడు.
అయితే యేసు ఎవరు?
పరమాత్మ - పవిత్రాత్మ కలయికగా రూపొందించబడిన మహాశక్తి. యేసుప్రభువు యోసేపుకు జన్మించి ఉన్నచో జీవాత్మ అయ్యేవాడు. అందుకనియే పరిశుద్ధాత్మయొక్క రూపము పొందినాడు.
పరమాత్మ అలనాడు గాఢనిద్రలో జీవాత్ముడు ఉన్న శరీరమునకు సాటిసహాయము కల్గించుటకు చేసిన క్రియయందు నిద్రనుండి మేల్కొన్న జీవాత్మయైన నరుడు నిద్రలో చేసిన పరమాత్మ క్రియను తన ఆత్మజ్ఞానములో కనుగొన్నవాడై, ''నా ఎముకలలో ఎముక నా మాంసములో మాంసము నరుని నుండి తీయబడితివి, కనుక నారి అనబడెదవు. అనిన ఆదాము అపవిత్రాత్మ ప్రబోధము చేత పరమాత్మకు విరోధియై, ఆత్మ జ్ఞానమును, పూర్వ జ్ఞానమును కోల్పోయి, నేడు చిలుక ప్రశ్నలు అడుగుకొనే కర్మ ఏర్పడినది.
హృదయమునకు దైవసన్నిధానములో ఉన్న విలువ ః-
హృదయము మోసకరమైనది అది ఘోరమైన వ్యాధి కలది. దానిని గ్రహింప కల్గినవాడెవరు? (పరమాత్మ ఒక్కడే) ఇక మీదట నరులనుబట్టి నేను శపించను. ఎందుకంటే నరునియొక్క హృదయాలోచన వాని బాల్యము నుండి చెడ్డది. యేసుప్రభువు రక్షకుడనియు నీ పూర్ణ హృదయముతోను, నీ పూర్ణాత్మతోను, నీ పూర్ణ మనస్సుతోను నీవు నమ్మిన యెడల, ఆయన నమ్మదగినవాడును, విమోచకుడు అయినందున నీ పాపములను క్షమించి తన పక్షమున మనలను చేర్చుకొనును.
ఈ హృదయమనునది శరీరమునకు - ఆత్మకును - జ్ఞానమునకును మధ్యవర్తియై యున్నది. సమస్త పాపాలకు కేంద్రమును పాన్పునైయున్నది ః ఇందులో వివిధ జంతు స్వభావములతో కూడిన గుణములు సాదృశ్యముగా మనకు తెలుస్తుంటుంది. ఇందులో మొదటిది దురాలోచన, ఎదుటివాని భార్యను, సంపదను ఆశించుట, వారిని నాశనమునకు దారి తీయుట, హత్యలు, దొంగతనము, లోభము, కామము, అవివేకము మొదలగునవి అన్నియు ఇందులోనుండి బయల్వెడలి మనుష్యుల్ని అపవిత్ర పఱచుచున్నవి.
ఇందులో ప్రధానమైనది దురాలోచన ః- దీనిని క్రమబద్ధము చేయనిచో హత్య వరకు దారి తీయును.
లోభము ః- దీని మూలముగ దైవత్వమును, శరీర ఆరోగ్యమును గుర్తించక ఇది కల్గియున్న హృదయము ధన సమృద్ధి కొఱకు పాటుపడును. తాను తినదు, ఒకరికి పెట్టదు.
ఈర్ష్య ః- ఇది కూడా పై వాటితోబాటు హృదయములో నుండి వచ్చునదియే ః- ఇతరుల సంపదను గూర్చి ఓర్చుకోలేక పోవుట, ఎదుటివారి వినాశమును కోరుట, ఎదుటివారితో విరోధ స్వభావము, సమాధానమను గుణమును కోల్పోవుట, ఎల్లప్పుడు తీరని వేదన పొందుట, అహంభావము, ఇందుమూలమున తన కలిమిని బట్టియు, తన అంగసౌష్టవమును బట్టియు, తన సంపదను బట్టియు, తన వంశముయొక్క ఔన్నత్యమును బట్టియు, తనకున్న ( బంగారు వెండి ఆభరణములను బట్టియు, తన జ్ఞానమును బట్టియు, తన ఐశ్వర్యమును బట్టియు, గర్వముగ సంచరించుట.
అజ్ఞానము ః- ఇవన్నియు హృదయ గుణములు ః- తనకున్న ఐశ్వర్యమునుబట్టి దేవుని మఱచి తనకు కల్గినదంతయు తన జ్ఞానము చేతనే కల్గినదని తలపోయుచు లోకముతో సంబంధము లేకుండ తనను స్తుతించువారిని, ఘనపఱచువారిని అభినందించుచు, వారిని స్నేహించి, వారిని తన ప్రధానులుగా - వారే దేవుళ్ళుగ భావించినట్లు చేయు గుణము.
ఇందునుబట్టియే యేసుప్రభువు పటములలో ఎక్కువ భాగము ఆయన హృదయమును చూపుచున్నట్లుగ మనకు తెలియుచున్నది, అనగా హృదయ పరిశోధకుడుగాని, హృదయముయొక్క అడ్డు తెరలను తెఱచువాడుగాని, హృదయాలోచనలు ఎరిగినవాడుగాని, హృదయాలోచనలు కట్టు భధ్రము చేయువాడుగాని, హృదయ వ్యాధికి వైద్యుడుగాని ఆయనే అన్నట్లుగా ఆయన దివ్య హృదయపటములు సూచించుచున్నవి. దైవ విశ్వాసమునకు నిలయము కూడా ఆయన హృదయమే. కనుక నరులమైన మనము ఈ హృదయమనెడు విషయములో బహుజాగ్రత్తగా వ్యవహరింపవలసి యున్నాము. ఏలయనగా యేసుప్రభువు రక్షకుడని నీ నోటితో ఒప్పుకొని నీ హృదయములో విశ్వసించిన యెడల నీవు రక్షింపబడుదువు.
సిలువ మీద పరమాత్మ రూపుడైన యేసుక్రీస్తు సాధించిన విజయములో దాగియున్న దైవ సత్యములు ః-
1. మానవ శ్రమలకు పాపవిమోచనమునకు తన రక్తము నిచ్చినాడు.
2. బలిపశువుగ తన దేహమును సిలువ మీద సమర్పించినాడు.
3. తాను పొందిన హృదయ వేదనలను తల్లికి అప్పగించినాడు.
అందువల్లనే ఆమె వ్యాకులమాతగా నేడు పిలువబడుచున్నది. ఈ వ్యాకులము ఆయన హృదయములో కల్గిన దానిని తల్లికిని, ఆత్మను మాత్రము ఆయన తండ్రికిని అప్పగించినట్లు తెలియుచున్నది.
అయితే ఆయన సమాధానమును ఎవరికిచ్చియున్నాడు? ''దొంగకు'' నేడు నీవు నాతో కూడా ''పరదైసు'' లో ఉందువు. ఇదియే సమాధాన పరదైసు, దొంగ క్రీస్తుతో సమాధానపడినాడు.
ఆయన ప్రవచనములను వేద ప్రచారములను మనకు ఇచ్చియున్నాడు. ఆయన మహిమ చరిత్రను మనకు ఇచ్చియున్నాడు, ఇన్ని ఇచ్చినప్పుడు ఆయనకు మనమేమి ఇచ్చినాము? మన నుండి ఆయన ఏమి కోరుచున్నాడు? హృదయ విశ్వాసమును ''నాయందు విశ్వాసముంచువాడు చనిపోయినను బ్రతుకును.'' విశ్వాసము ఎచ్చట పుట్టవలెను? హృదయమునందే.
మనస్సు ః-
దీనిలో నుండే కలిగే ప్రధమ గుణము మమకారము. ఈ మమకారము మూడు విధములుగా ఉంటుంది. 1. దైవికము 2. లౌకికము 3. అలౌకికము ( అలౌకిక శక్తుల వశీకరణ )
1. దైవికము ః- దైవిక క్రియల మీద అపేక్ష; తీర్థయాత్రలు, పుణ్యక్షేత్రములు దర్శించుట, పూజా పునస్కార కార్యంబులు మీద అపేక్ష, లోక వైరాగ్యము.
2. లౌకికము ః- ధనార్జన మీద ఆశ, సాటి నరులపై మమకారము, స్త్రీ వ్యామోహము, పదవీ వ్యామోహము, ఆచార వ్యామోహము, వెండి, కనకము, లోహములపై భూఫలంబులపై వ్యామోహము.
3. అలౌకికము ః- నిర్జీవ క్రియలపై వ్యామోహము, అదృశ్యమైన అంధకార శక్తుల వశీకరణముపై ప్రయాస, శ్రమ, వ్యర్థమైన తిరుగుళ్ళు, సాటి నరులను దేవుళ్ళుగ పూజించి ఆరాధించుట, పశుపక్ష్యాదులను దేవతలుగ భావించి ఆరాధించుట మొదలగునవి.
ఈ మనస్సు అనునది చంచలమైనది. మనస్సు, హృదయము అనునవి ఒకదానికొకటి సమన్వయించి యున్నవి. కోరికను పుట్టించునది మనస్సు. దానిని నిర్ణయించునది హృదయము దానిని అమలుపఱచుటకు ప్రయత్నించునది జ్ఞానము.
ఏకాభిప్రాయము ః- హృదయము - మనస్సు - జ్ఞానేంద్రియము - ఆత్మ ప్రేరేపణ ఇవన్నియు సంకల్పించి చేయు నిర్ణయించిన క్రియయే ఏకాభిప్రాయము.
ఇందులో మనస్సు ః- ఇది నిర్ణయమునకు నేత్రముతో సమానము ఎలాగంటే మనము కూర్చున్న స్థలము నుండియే క్షణాల మీదుగ ఎక్కడెక్కడ ఏమేమి జరుగుచున్నవో ఆ దృశ్యములను దృశ్య రూపముగ చూపించగల శక్తి ఈ మనస్సుకు ఉన్నది. అందుకే దీనిని మనోనేత్రమందురు. ఇట్లు మనోనేత్రము చూపించు బింబములను మానసిక బింబములు అందురు. దీని ద్వారా ప్రయాణ సాధనములు లేకనే శబ్ద గమనము కంటే వేగముగ పేటలు, కోటలు, బస్తీలు, పట్నములు, రాష్ట్రములు, దేశములు ఒకటేమిటి? కడకు పరలోక దృశ్యములను కూడా ఈ మనస్సు ఊహించి చూపించగలదు. అట్టివానిని విశ్వసించుటకుగాని, తృణికరించుటకుగాని, వీలైనచో దానిని అభివృద్ధి పఱచుటకుగాని ఆలోచనలు పుట్టించునది హృదయము. అట్టివానికి కావలసిన యంత్ర పరిజ్ఞానముగాని, సుళువైన మార్గములు గురించిగాని నడిపించగల శక్తి జ్ఞానమునకు ఉన్నది. అనగా శాస్త్ర పరిజ్ఞానములో శాస్త్ర మర్మములను ఈ జ్ఞానేంద్రియము అంచెల మీద నిర్ణయించగలదు.
అయితే శరీరము ఎవరు? ఈ శరీరమనువాడు ఒక యంత్రము. పై మూడిటి చేత నడువబడెడిది. జీవములోనే ఆత్మను ఇమిడ్చియున్నాడు. పై మూడును ఎంతో ప్రభావవంతమునై యున్నప్పటికిని, శరీరమును జీవాత్మ వదలి పోయినప్పుడు వీటి ప్రభావము అదృశ్యమైపోవుచున్నది. అనగా ఈ శరీరము మృతము.
అయితే ఆత్మను కలుషితము చేయుటకుగాని, దానిని సక్రమమైన క్రమశిక్షణలో ఉంచుటకుగాని ఈ మూడింటికి శక్తి కల్గియున్నది. ఆత్మను బంధించగలవు, విడుదల చేయగలవు, కలుషితము చేయగలవు. పవిత్ర పరచగలవు, ఏ విధముగ? సుబ్బయ్యను జైలులో వేసినారు. అంటే ఆత్మ వేయబడినట్లే కదా! ఆత్మకే గదా ప్రాధాన్యత. ఆత్మ లేని శరీరము శవము. మృత శరీరమును జైలులో పెట్టరు గదా! సుబ్బయ్యను విడుదల చేయాలన్నను ఈ మూడింటి సహకారము వలన (జడ్జిమెంటు)విడుదల పొందును.
హృదయము, మనస్సు, జ్ఞానము ఈ మూడును ఆత్మతో ఏకీభవించి దైవసంకల్పములో కేంద్రీకృతమైనప్పుడు ఆ శరీరాత్మలు భూలోక వైరాగ్యమును పొంది పరమాత్ముని సన్నిధి కొరకు పరితపించును. హృదయము - మనస్సు - జ్ఞానము ఏకీభవించి తమ ఇష్టానుసారముగా ఈ లోకేచ్ఛలలో ఆత్మను ప్రకోల్భము చేస్తే - అట్టి ఆత్మ భూలోక సంబంధియై శరీరేచ్ఛల కలవడి కలుషితమై దైవవిరోధి యగును.
జీవుడు + ఆత్మ = జీవాత్మ ః- ఇది సృష్టికి మూలమైయున్నది. పరమాత్మ = ఇది సృష్టికిని జీవాత్మకును కర్తయై యున్నది. (సృష్టిని సరిదిద్ది జీవాత్మను అందులో ప్రవేశింపజేసినవాడు)
అపవిత్రాత్మ ః- ఇది పరమాత్ముని మర్మములను, జీవాత్మునియొక్క క్రియ అను సృష్టియొక్క ఉత్పత్తికి క్రియయై యున్నది.
అపవిత్రాత్మ గుణములు ః- కామము, క్రోధము, పగ, జుగుప్స, ద్వేషము, అసూయ మొదలగునవి. అయితే అపవిత్రాత్మ చంచలమైనది. స్థిరత్వము లేనిది.
జీవాత్మ ః- ఇది శరీరములో చేరి స్కలితమైనది.
సృష్టి ః- వీర్య ఉత్పత్తికి నిలయమై ఉన్నది. ఇది శరీరమునకు కావలసిన జీవాణువులను ఇచ్చి - వీర్యము ద్వారా స్కలింపజేయుచున్నది. ఇందుమూలముగ మానవ సృష్టి ఏర్పడుచున్నది.
మానవునిలో తేజస్సు నిచ్చెడిది ఆత్మా? జ్ఞానమా? మనస్సా? హృదయమా? ఈ నాలుగింటిలో ఏది? ఈ నాలుగు ఉన్నాయా? ఉదా|| జ్ఞానజ్యోతి, జ్ఞానప్రకాశమ్, హృదయ ప్రకాశ్, మనోజ్యోతి, పరంజ్యోతి మొదలైన పేర్లు కలవారు ఉన్నారు. ఉదా|| శరీరమునకు ఎక్కడైన గాయమైనప్పుడు ఏయే అవయవములు, ఏయే నిర్ణయములతో విధానములతోను పనిచేయుచున్నవి. వీనిలో ''జీవము ఆత్మ - జ్ఞానము - హృదయము'' ఈ మూడింటి యొక్క పాత్రను వివరించుము?
అనగా ప్రయోగాత్మక క్రియ ః- శరీరమునకు గాయమైనప్పుడు గాయముయొక్క విలువను త్వగేంద్రియము బయల్పఱచును - విషపూరిత మౌతుందేమో! అని మనస్సు ఆలోచన పుట్టించును. ఫలాని డాక్టరు దగ్గరకు పోతే బాగుంటుంది కదా! యని హృదయము ఘోషిస్తుంది. ఆత్మ మాత్రము దేవుడు ఉన్నాడు ఆయనను విశ్వసించుము, అది ఏమి చేయదులే అనును. దేవుడు ఉన్నాడు అని నిప్పులో చేయి పెట్టమంటారా? అని జ్ఞానము అనును. ఇన్ని విధములుగా శరీరము మీద ఇవి పని చేయును.
ఆత్మయొక్క తేజస్సును శరీరము ద్వారా నిరూపించినవారు యేసుప్రభువు ఒక్కడే. ఆత్మ యొక్క బలమును నిరూపించినవాడు సంసోను. ఆత్మయొక్క శక్తిని నిరూపించినవాడు మోషే; ఆత్మయొక్క గుణములను వివరించినవాడు పౌలు, ఆత్మయొక్క ప్రభావమును అనగా మహిమను కనపఱచినవారు పునరుత్థానుడైన క్రీస్తు; ఆత్మయొక్క నిర్ణయములను విశదీకరించినవారు ప్రవక్తలు.
జ్ఞానము ః- ఇది శరీరము మీద చూపు ప్రభావము. ఈ జ్ఞానము ద్వారా యోసేపు కలల భావములను చెప్పగల్గెను. దానియేలు - భవిష్యత్తులో లోక గతిని గ్రహించగల్గెను. జ్ఞానముతోనే నోవహు ఓడను చేయగల్గెను. జ్నానముతో సొలొమోను మహాజ్ఞానిగా గ్రంథములో ప్రకటించబడినాడు. అదే విధముగా పరమాత్మ రూపుడైన క్రీస్తు కూడా రాబోవు లోక పతనమును తనను పరమాత్మ పంపిన కారణమును, లోకమునకు పట్టిన దుర్దశ, తన రెండవ రాకడ మర్మములను విశదీకరించినట్లు తెలియుచున్నది.
మనస్సు ః- శరీరముపై దీని ప్రభావము ః- ఆత్మానుసారముగా మనస్సును మనోభీష్టమును బట్టి శరీరమును ఈ మూడింటి నిర్ణయమునుబట్టి జ్ఞానము చెలామణి అగుచున్నాయి. శరీరానుసారమైన మనస్సు పాపానికి గోయి త్రవ్వును. ఆత్మానుసారమైన మనస్సు ఆత్మయొక్క జన్మస్థానమునకే చేరును. ( మీరు మహిమ శరీరములతో లేచెదరు ) అనగా పరమాత్మ దర్శన భాగ్యము పొందుదురు.
హృదయము ః- దేహములో ఇది కేంద్రస్థానమై అధిష్టించి అన్ని ఆలోచనలకును కేంద్రమై యున్నది. దీన్ని గురించి పరమాత్మ నరుని హృదయాలోచన వాని బాల్యము నుండి చెడ్డదని వక్కాణించి యున్నాడు. దీనిని క్రమశిక్షణలో పెట్టాలంటే పరమాత్మ యొక్క నడుపుదల ముఖ్యము. ఇది గాయపడినప్పుడు ఇందులో ఏడు వ్యాకులములు కనబడుచున్నవి. దీనిని గాయపరచు ఏడు వ్యాకులములు (సప్త వ్యసనములు) దీనిని వెంటాడుచుండును. యేసు ప్రభువును యూదులకు అప్పగించుటకు అపవాది అనువాడు యూదా ఇస్కరియోతు హృదయములో వెండిపై ఆశ చూపి హృదయాలోచన పుట్టించినట్లుగ ఉన్నది.
ప్రతిక్షణము హృదయము మరణ పర్యంతము ఏదో యొక్క బరువును మోయుచుండును. అందుకనే పరమాత్మ అయిన క్రీస్తు భారమును మోయుచున్న సమస్త ప్రజలారా! నా యొద్దకు రండి మీకు విశ్రాంతి కలుగజేయుదును అని పిలుచుచున్నారు. ఇందునుబట్టి ఏదైన ఒక విషయమునుగూర్చి ఒప్పుకోవాలంటే మొట్టమొదట హృదయమే ప్రాధాన్యత వహించును. హృదయ విశ్వాసము లేనిదే ఏదియు సాధించలేము.
మాతృభూమి ః-
ప్రభువునందు ప్రియమైన సోదర సోదరీమణులారా! సర్వసాధారణముగా మనము క్రొత్త వ్యక్తులను పరిచయము చేసుకున్నప్పుడు వారితో ముచ్చటించుచూ మీ జన్మ స్థలము ఏది? మీ తల్లి భాష ఏది? మీ తల్లి సంఘము ఏది? అనుట సహజము. ఈ ప్రశ్నలకు ఎదుటి వ్యక్తి జవాబుగ - తన మాతృభూమిని గూర్చి, తన తల్లి భాషను గూర్చి, తన తల్లి సంఘమును గూర్చి, ఆచారములు, ప్రజల జీవన భోజన పద్ధతులు, వాతావరణము, అచ్చటి జనాంగముయొక్క ఆచార వ్యవహారములు, పాండిత్య ఇతిహాసములను గూర్చి గొప్పగను తన గౌరవార్థముగా చెప్పుకొనును. అయితే ఇట్టివానిని గూర్చి దేవుడును ఆయన సన్నిధియు ఒప్పుకొనుట లేదు. దైవ గ్రంథము కూడా ఇందుకు వ్యతిరేకముగా ఉన్నది. ఒక్క మాటలో చెప్పవలెనంటే మాతృభూమి, మాతృభాష, మాతృ సంఘము, వీటన్నిటికి మూలము హవ్వ. ఎందుకంటే మొదట పాపములో పడినది ఆమెయే, మోసపోయినది కూడా ఆమెయే. మొదట మరణమను స్థిరాస్థిని సంపాదించినది హవ్వయే. కాబట్టి మదర్‌ల్యాండ్ అనగా హవ్వ మనకు స్వాస్థ్యముగా ఇచ్చిన భూమియే సమాధుల తోట. ఇదియే మదర్‌లాండ్.
భాష ః- ఆది 4ః1 యెహోవా దయ వలన నేను ఒక మనుష్యుని సంపాదించుకొంటిని, అను జ్ఞానముతో హవ్వ మాట్లాడినట్లు తెలియుచున్నది. కాబట్టి భాష కూడా కయీను, హేబెలులతో మొదట భాషా జ్ఞానముతో మాట్లాడినట్లు తెలియుచున్నది. మనము కయీను సంతతివారము. అనగా నరుల సంతతి, ఆదాము సంతతి దేవునిది, ఆదాము అంటే హెబ్రీ భాషలో ఎర్ర మట్టి. ఇందునుబట్టి చూడగా మొట్టమొదటి భాష హెబ్రీ భాషలో అని తెలియుచున్నది, ఈ భాషను కుండ పెంకువలె పగులకొట్టి ఆది 11ః8-9 యెహోవా వారిని చెదరగొట్టెను. పలు విధములైన భాషలును, భాషలుతో కూడిన జనాంగమును ఏర్పరచబడి వారి వారి వసతులనుబట్టి భూమిని ఆక్రమించుకొని, వారి వారి తల్లి భూమి, తల్లి భాష, తల్లి సంఘము అనుకుంటూ వీణె వాయించుకుంటున్నారు. ఇందునుబట్టి చదువరులు తల్లి తన బిడ్డను ఒడిలో పరుండ బెట్టుకొని నిద్ర పుచ్చును. అదే విధముగా మట్టిలో పుట్టిన మనలను మట్టి తనలోకి ఆలింగనము చేసుకొంటుంది. అనగా తన ఒడి అను గుంటలో చేర్చుకొని మనలను కప్పి తనలోకి జీర్ణము చేసుకుంటున్నది. ఎందుకంటే మనము మట్టివారము, మట్టి మనలను ఆలింగనము చేసుకుంటున్నది.
ఆత్మను గూర్చిన ప్రసంగము
ప్రభువునందు ప్రియమైనవారలారా!
మనము లోకములో జీవించుచున్నామని మాటేగాని ఒక నాటికి మనము మృతులమే. అనగా మరణించువారమే - ఇది దైవశాసనము. అయితే మరణము అనునది మనలో ఉన్నటువంటి జీవాత్మ అది ఎవరి చేత మనకు అనుగ్రహించబడెనో ఆయన వద్దకు మరలిపోవుటయే మరణము. ఆ జీవాత్మ మనలో ఉన్నంత కాలము పురుష శరీరమైతే తన బాహుబలమునుబట్టి తన సంపదనుబట్టి, తన భోగభాగ్యములనుబట్టి తన మీసములను దువ్వుచు నాకేమి? ఒకరిని యాచించాల్సిన దుర్దశ నాకు లేదు. నా పితరులు సంపాదించినది, నేను సంపాదించినది కావలసినంత ఉన్నది నన్ను ఒకరు పోషించాల్సిన పని లేదు. ఇంకను కావాలంటే పదిమందికి పెట్టగల శక్తి నాకు ఉన్నది. ఇది పురుషుని గూర్చిన విషయము. ఇందునుబట్టి మనము ఆలోచన చేస్తే మన పితరుల వద్ద నుండి అనగా ఆది ఆదాము నుండి నేటి వరకు మనము సంపాదించుకున్న కావలసినంత ఆస్థి అనునది ఏమంటే - ఈ లోక సంబంధముగా పాపము అది మనము పదిమంది వద్ద గర్వముగా ఒప్పుకుంటున్నాము. ఎదుటి వ్యక్తికి ఈ నిగూఢ సత్యము అర్థము గాక అబ్బో! ఇతను ఎంత గొప్పవాడు? ఎంత కోటీశ్వరుడో అని ఆశ్చర్యపరుచుంటారు. ఈ రకముగా డాంబికముగా మాట్లాడిన వ్యక్తి మరణించిన పిదప అతని తర్వాత వచ్చు వారసుడు కూడ ఈ విధముగనే మాట్లాడుచుండును. ఇది పురుషుని గూర్చిన వాఖ్యానము.
ఇక స్త్రీని గూర్చి ః- చిత్రవిచిత్ర ఆభరణములు ధరించి, షోకైన ముస్తాబులు, ఖరీదైన వస్త్రములు ధరించుకొని - పౌడరు, స్నోలు ముఖాన పులుముకొని, ఎత్తు మడిమల చెప్పులు, చేరడేసి కన్నులను కనుపఱచుకున్నట్లుగ కాటుకను పెట్టుకొని ''హ్యాండ్‌బ్యాగ్'' చేత పట్టుకున్న స్త్రీ, తన సాటి చెలికత్తెలతో ముచ్చటించుచూ తన ముస్తాబు, అలంకరణలు వారికి చూపించుచూ పొడుగాటి తన జడను ముందుకు విసిరి నాకేమి? మా వాళ్ళు సంపాదించినది కావలసినంత ఉన్నది. నేను ఇతరులను యాచించవలసి ఖర్మ నాకు లేదు. ఇంకా పదిమందిని పోషించదగిన శక్తి నాకు ఉన్నది, అని తన బిడ్డలనుబట్టి తన ఐశ్వర్యమును బట్టి, భోగభాగ్యములనుబట్టి ఆయమ్మ మాట్లాడుచు ఉంటుంది. ఇది సహజముగా భూలోకములో జరుగుతున్న విషయము. స్త్రీ పురుషులలో ఇంత ఆధిక్యత, ఘనతయు కనపడుచుంటే - వీరిద్దరి బ్రతుకులను బజారున పెట్టుచు దేవుడు ప్రకటన 3ః17-19 హెచ్చరించుచూ ప్రకటన 3ః1-3 ఇట్టివారిని గూర్చి దేవుడు ఇచ్చు భయంకరమైన హెచ్చరిక గమనింపవలసియున్నది. ఆ తీర్పులో చూచుకున్నచో మానవుడు తాను జీవించి యున్నంత కాలము వరకే దేవుడు ఆది 2ః6లో అనుగ్రహించిన జీవాత్మనుబట్టి భూలోకములో లక్షాధికారి, కోటీశ్వరుడు అతిరథ, మహారధుడు, బహాదూర్, డాక్టరు, రావుసాహెబ్, పండిట్ అని పలువిధములైన బిరుదులతో చెలామణియై, అతనిలో ఉన్న జీవాత్మ తన కాలపరిమితి చాలించుకొని దేవుని సన్నిధానమునకు వెళ్ళినప్పుడు ఆ ఆత్మ నివసించిన శరీరమునకు ఉన్న టైటిల్సు ఏమంటే
1. మృత దేహము 2. శవము 3,. కళేబరము 4. గొప్పగ చెప్పవలెనంటే పీనుగ. జీవించి ఉన్నప్పుడు అదే శరీరము మెత్తటి పరుపులు, ఏర్ కండిషన్ గదులు, బల్ల భోజనాలు, ఖరీదైన వస్త్రాలంకరణలు, అతిధి సత్కారాలు, విందులు, వినోదములు, యాత్రలు, విహారములు, ఉన్నత స్థానాలు, హోదాలు, ఇవి అనుభవించి జీవించితే - జీవాత్మను కోల్పోయిన అదే శరీరము నిర్జీవమై, మృతమై, నులక త్రాళ్ళతో పాడి కొయ్యకు కట్టబడి, ఆ వరకు కారులలో ఊరేగిన ఆ శరీరము నర వాహనములను అధిరోహించి స్మశానమునకు చేర్చబడి, కాల్చబడడమా లేక పూడ్చబడడమో జరిగించుకొని ఇక ఎన్నటికిని దాని రూపమును కనపఱచక లయమై పోవును. అది క్రైస్తవ శవమైతే చెక్క పెట్టెలో భద్రపరచబడి దైవకీర్తనలతోను, ప్రార్థనలతోను సమాధి తోటలో సమాధి చేయబడి లయమైపోవును. ఇంతకు మనము గుర్తింపవలసిన దేమిటంటే పువ్వులతో కట్టబడి యున్నంతవరకే అరటి నార భోగము. అనగా మాలలు కట్టి మెడలో వేసుకోవడము, దండలు కట్టి కొప్పులకు చుట్టుకోవడము, గౌరవ వ్యక్తులకు మెడలో వేయడము. పెండ్లిలో పెండ్లి కుమారుడు పెండ్లి కుమార్తెకు అలంకరణలోను ఉపయోగింపబడుచు బహు గౌరవస్థానాలను పొందుచు, వాసనలను ఈ నార వెదజల్లుచు ఉంటుంది. పువ్వు నారతో కూడి యున్నంత వరకే నారకు ఆ భోగము. అదే విధముగా మన శరీరములో మనకు దేవుడు అనుగ్రహించిన జీవాత్మ ఉన్నంతవరకే మన భోగము.
..........
దేవుని వైరాగ్యము శారీరము మీదనా? ఆత్మ మీదనా? మానవునియొక్క వైరాగ్యము లోకము మీదనా? దేవుని మీదనా? అన్న అంశములను గూర్చిన వ్యాఖ్యానము.
ప్రియచదువరీ! మానవునియొక్క శరీరాన్ని దేవుడు చేశాడు, ఆ శరీరములో తన జీవాత్మను ప్రవేశింపజేశాడు. ఇవి రెండును దేవునికి యొప్పిదములైనందుననే నరుడు జీవాత్మయై భూమి మీద సంచరించగల్గినాడు. మరి ఇట్లున్న నరునితో దేవుడు చాలాకాలము సఖ్యత గల్గి తన ఆత్మలోను తన హస్తకృత్యములోను పాలిపంపులు అనుగ్రహించినట్లు కీర్తన 8ః లో చదువగలము. మరియు యోహాను 3ః16 ఇందునుగూర్చి ప్రత్యక్షముగా వివరించబడినది. దేవుడు లోకమునెంతయో ప్రేమించెను.
దేవునియొక్క ప్రేమ నరుని మీద ఎంత ఉన్నదయ్యా అంటే దేవుడు ఒక్కడైయుండగా నరుని యిద్దరినిగా చేశాడు. అనగా స్త్రీ పురుషులుగా జేశాడు. దేవుడు స్త్రీ పురుషుడుగా లేడు. పురుషునిగానే ఉన్నాడు. అయితే నరునికి స్త్రీని ఎందుకు జంటగా ఏర్పరచాడంటే ఇందులో ఒక గొప్ప పరమార్థము బైల్పడుచున్నది. దేవునికి తన సృష్టిని గూర్చియు తన పరలోక రాజ్యమును గూర్చియు ఎన్నో భవిష్యత్కార్యములను గూర్చి ఆకళింపు ఉన్నది. తాను సృష్టించిన నరుడు స్థిరుడు కాడని, మగధీరుడుగా తన ఎదుట నిలువలేడని, స్త్రీ స్వభావముతో కూడినవాడై స్త్రీ గుణాతిశయముల చేత భవిష్యత్తులో పిరికివానిగాను, ఆడంగితనము గలవానిగాను, స్త్రీ వేషములు వేయు పాత్రధారిగాను, స్త్రీని అనుకరించి మాట్లాడు లయగాడుగాను, స్త్రీకి దాసుడై స్త్రీయొక్క చిత్తానుసారిగా స్త్రీలోలుడుగా జీవించువాడు కాగలడని గ్రహించినవాడై, ఆదామునకు అండగా మరియొక్క రూపమును స్త్రీని ఆకృతిలో జేసి స్త్రీ పురుషులయొక్క ప్రవర్తనను తాను సృష్టించిన ఏదెనను పరిశుద్ధ వనములో నిత్యము పరిశోధిస్తు వచ్చాడు. దేవుని పరిశోధనలో నరుడు దీర్ఘకాలికముగా నిలువలేకపోయాడు.
అయితే స్త్రీ బహుసాధ్విగా ఉండి తనవలె తన భర్తను కూడా తన అడుగుజాడలలో నడవాలని తానెక్కడ ఉంటే తన భర్త కూడా అక్కడ ఉండాలని, తామిద్దరు ఏకశరీరమై జీవించాలని ఆశించి సర్ప వాక్కులకు చెవినిచ్చి నిషేధఫలాన్ని తినింది. చిత్రమేమంటే దేవుడు ఊహించినట్లే నరుడు తాను జేసిన తప్పును ఒప్పుకొనక ఆ నేరమును స్త్రీ మీద మోపి తాను నిర్దోషిగ నిరూపించుకొనుటకు ప్రయత్నించాడు. అయితే దేవుడు వానిని తోటలో నుండి వెళ్ళగొట్టినప్పుడు దేవుని క్షమాపణ అడిగి తనకు రక్షణ ననుగ్రహించుమని విజ్ఞాపన చేయకుండ, దేవునినైన వదలుకున్నాడుగాని స్త్రీతో ఏకమై దేవుని సన్నిధి నుండి వీడిపోయినట్లు ఏదెను చరిత్ర మనకు నిరూపిస్తున్నది.
ఇట్లు దినదిన ప్రవర్థమానమైన స్త్రీ పురుషుల సావాసము ఒక అలౌకిక శక్తిగా భూమి మీద క్రియ జరిగిస్తు కాముకత్వమను పేరుతో వావివరుసలు లేక విజృంభించి, పురుషులు సైతము లోకధర్మమును పాటింపక సృష్టికి వ్యతిరేకమైన అవాంఛనీయమైన కార్యములు జరిగించినట్లు రోమా 1ః23-32 చదువగలము.
ఆది 6ః1 ఈ విధముగా విస్తరించినట్టి పాపము దైవసంభూతులైనవారిని కూడా పనికిమాలిన వారినిగా జేసి విజృంభించినదంటే, దేవునియొక్క ప్రణాళిక పురుషుని పట్ల తాను ఊహించిన స్త్రీ గుణాతిశయ మూలమున కల్గిన ఉపద్రవమునకు శిక్ష జలప్రళయము. దాని శిక్షగా అప్పటికి విధించబడినట్లు తెలియు చున్నది. నరుల కుమార్తెలు అందముగా ఉండుట జూచి దేవుని కుమారులు వారిని వివాహము జేసికొనగా పాపము విజృంభించింది. దీని జీతము జలప్రళయము అటుతర్వాత అగ్నితో నాశనము, సొదొమ గొమొఱ్ఱా పట్టణముల కాముకత్వముతో కూడిన పైశాచిక జీవితమే యిందుకు ప్రబల కారణము.
ఇట్లు దేహ వాంఛలను తీర్చుకొనుటకు నరుడు సంకల్పితుడై తనలో జీవాత్మ ననుగ్రహించిన సృష్టికర్తను విస్మరించి సృష్టియే దైవమని, సృష్టి లేనిదే జీవికి మనుగడ పోషణ ఆధారము జీవము లేదను ఆటవిక జ్ఞానముతో నరుడు నేటికిని జీవిస్తున్నాడంటే ఇందునుబట్టి మనమేమనుకోవాలో చదువరులే ఊహించాలి. జీవాత్మ అనునది పరమాత్మలో ఐక్యము కావాలన్నా లేక లీనమవ్వాలన్న సూత్రమొక్కటే. జీవాత్మ కనుగ్రహించబడిన పంజరమైన లేక గూడైన ఈయొక్క శరీరము - శుచి శుభ్రతయను రెండు యోగ్యతలను కల్గియుండవలసినదిగా ఈ క్రింది విధానములను బట్టి మనము తెలిసికోవలసియున్నది.
జీవాత్మకు శరీరమన్నది గూడు మాత్రమేగాని మేడ గాదు. అనగా స్థిరము గాదని అర్థము అయితే సృష్టికర్తయైన పరమాత్మకును దేహములో గుప్తమైయున్న జీవాత్మకును అడ్డుబండగా ఉన్నది ఈ శరీరమే; అందుచేతనే దీనిని శారీర వైరాగ్యులైన ఋషులగు అపొస్తలులు మరియు అపొస్తలులలో అగ్రగణ్యుడైన పౌలు ఈ విషయమై లేఖను వ్రాస్తూ రెండవ కొరింథీ 5ః1-2 ''శరీరముయొక్క అతి హీన స్థితిని గూర్చి వివరించియున్నాడు. భూమిమీద మన గుడారమైన ఈ నివాసము,'' అనుటలో శరీరాన్ని ఒక చర్మపు గుడారముగా అభివర్ణించినట్లు మనము గ్రహించవలసియున్నది.
ప్రసంగి . . . . . . . . . శరీరముయొక్క అవసాన కాలమునుగూర్చి అనగా వృద్ధాప్యములో కల్గు అవయవముల బలహీనతను అభివర్ణిస్తూ కన్నులు వానికి కల్గు మసకలు, అంధత్వము, చెవులు, అవి కోల్పోవు వినికిడి. చర్మము అది పొందు ముడతలుతో కూడిన స్వభావము. వెంట్రుకలు వాటికి దాపురించు నెరసిన గుణము. లేక రాలిపోయి బట్టతలగా మారుట. కాళ్ళు చేతులు శక్తిహీనమై, వణకుట అనగా నరాల పటుత్వము కోల్పోవుట, పండ్లు వాటి పని చాలించుకొని రాలిపోవుట అనగా బోసి నోరు. వీటన్నిటికి తోడు వెన్నెముక వంగుట. ఇత్యాది శారీర బలహీనతలను గూర్చి ప్రసంగి వర్ణిస్తు ... ప్రసంగి 12ః5 . . . బుడ్డ పుసరకాయ పగులును, అనుటలో హృదయము తనయొక్క పనిని చాలించి హృద్రోగము అను రోగము మూలమున బ్రద్దలగుట, ఇక్కడికి దేహ జీవితము సమాప్తము. ఇందునుబట్టి మన్నయినది వెనుకటి వలె మన్నగును, అని ప్రసంగి చెప్పుచున్నాడు. అనగా మట్టితో కట్టిన ఈ గూడు లేక గుడారము తిరిగి మంటిలో కలిసిపోవును మరి దేవుడనుగ్రహించిన జీవాత్మ దైవదర్శనము కొరకు ఉవ్విళ్ళూరు భక్తుని వలె తనను పిలిచినట్టి సృష్టికర్త యొద్దకు పయనించును.
ప్రభువునందు ప్రియచదువరీ! ఇందునుబట్టి చూడగా జీవాత్మకును పరమాత్మునికిని వున్న అడ్డుతెర శరీరమని ఋజువగుచున్నది. ఈ శరీరములోని జీవాత్మ పరమాత్ముని సన్నిధికి వెళ్ళాలంటే దేహము క్షీణించాలి, లేక శిధిలమవ్వాలి లేక బ్రద్దలు కావాలి. ఈ మర్మాన్ని యేసుప్రభువు మరణ కాలములో మత్తయి 27ః51 దేవాలయ తెర పై నుండి రెండుగా చినిగెను. భూమి వణకెను. నరునియొక్క దేహము భూసంబంధమైనదియు, దేవుడు కప్పిన చర్మపు తెరగా రూపొందించబడినట్లు ఇందునుబట్టి అర్థము కాగలదు. కనుక మొదటి కొరింథీ 15ః50 రక్తమాంసములు దేవుని రాజ్యమును స్వతంత్రించు కొననేరవని ప్రవచించినట్లు మనకు తెలియగలదు. అనగా ఈ శరీరముతో దైవత్వాన్ని దైవరాజ్యాన్ని కనుగొనలేమని అర్థము. కనుక దేవునికి మనకు అడ్డుబండ ఈ మట్టి దేహమేయని మనము గ్రహించవలసియున్నది. శరీరానుసారముగా మనము నడిచినవారమైతే చచ్చిన వారమును దైవత్వమునెన్నటికిని చూడలేని వారమును గలతీ 5ః16 ఆత్మానుసారముగా నడుచుకొనువారు శరీరేచ్ఛను నెరవేర్చరు. శరీరము ఆత్మకును, ఆత్మ శరీరమునకు విరోధముగా ఉన్నవి. కనుక గలతీ 5ః25 మనము ఆత్మననుసరించి జీవించువారమైతిమా - ఆత్మననుసరించి క్రమముగా నడుచు కొందుమని ప్రవచించియున్నాడు.
ఇందునుబట్టి ప్రభువునందు ప్రియచదువరీ! దైవ వాక్యము నరకోటిని సంబోధిస్తు జీవమును మరణమును మనముందుంచియున్నట్లుగా - ఆదిలో ఏదెను తోటలో వృక్షరూపముగా ఈ రెంటిని నాటి ఒకటి జీవవృక్షము రెండవది మరణవృక్షముగా దేవుడు రూపించియున్నాడు. ద్వితీయోపదేశకాండము 30ః19. ఇప్పుడు మరణమును, జీవమును మీ ఎదుట ఉంచియున్నాను. ఏది కావాలో అది కోరుకొమ్మని ప్రతి యొక్కరిని వేదగ్రంథము హెచ్చరిస్తున్నది.
ఆనాటి జీవవృక్షము చలనము లేనిదై నరుని జ్ఞానమునకు మరుగుపరచబడి నరునికి ఆత్మ వివేచన కల్గు స్థితిలో లేని వాతావరణములో ఉండినట్లుగా తెలియుచున్నది. అయితే నేటి యుగములో అదే జీవవృక్షము చలనాత్మకమైన జీవితమును పొంది, క్రీస్తు అను నామధేయముతో లోకములో నరాకృతిలో జన్మించి, క్రియ జరిగించి, నరపాపపరిహారార్థము నరకబడి పడద్రోయబడి మరల పునరుజ్జీవియై చిగిరించి, నేటి జనసందోహమెదుట దైవాక్షరయుతముగా దైవవాక్కయి తన సాక్ష్యార్థము పరిశుద్ధ గ్రంథమను వేద వాక్యము ద్వారా ప్రతి యొక్కరిని పరిశుద్ధ పట్టణమైన దైవసన్నిధానమునకు జీవాత్ముడు చేరవలెనంటే యోహాను 14ః6 నేనే మార్గము సత్యము జీవము నా ద్వారానే తప్ప మరెవ్వడు పరమాత్ముని సన్నిధిలో చేరలేడంటు ఖచ్చితమైన యదార్థమైన సత్యమును బైల్పరచుచున్నది. చదువరివైన నీవు రచయితనైన నేను ఏ స్థితిలో ఉన్నాను? ఈ పిలుపుకు సిద్ధముగా ఉన్నామా? ఉంటే ధన్యులమే.
ప్రభువునందు ప్రియచదువరులారా! ఇంతవరకును మనము దైవసన్నిధానమునకు మానవ జీవితము యోగ్యము కావాలంటే, మానవ శరీరము నరజీవితమునకు అడ్డుబండగా అడ్డు తెరగా ఉన్నట్లు (గలతీ 5ః16-17) గ్రహించగల్గియున్నాము. ఇప్పుడు దైవ జీవితమునకు మానవ జీవితమునకు అనగా శారీరేచ్ఛలకు ఆత్మ సిద్ధాంతములు గుణాలు బహుకఠినముగా ఉన్నట్లు ఈ క్రింది వేద భాగముల ద్వారా మనము తెలిసికోగలము. యోహాను 6ః51 యేసుప్రభువు తన్నావరించియున్న జనసందోహము నుద్దేశించి, పరలోకము నుండి దిగి వచ్చిన జీవాహారము నేనే, ఇది పరలోక సంబంధమైన పరమాత్ముని వాక్కు. ఇందుకు యోహాను 6ః52 శారీరమును ప్రేమించువారు. అనగా శారీరసంబంధులైనవారగు యూదులు ఈయన తన శరీరమునెట్లు తిననీయగలడని ఒకరితో ఒకరు వాదించిరి. అందుకు యేసుప్రభువు - ''మీరు మనుష్యకుమారుని శరీరము తిని ఆయన రక్తమును త్రాగితేనేగాని - మీలో మీరు జీవము గలవారు కారు. నా శరీరము తిని నా రక్తము త్రాగువాడే నిత్యజీవముగలవాడు. అంత్యదినమున నేను వానిని లేపుదును. వాడు నాయందును - నేను వానియందును నిలిచియుందుము. జీవము గల తండ్రి నన్ను పంపెను గనుక నేను తండ్రి మూలముగా జీవించుచున్నట్లే నన్ను తినువాడును నామూలముగా జీవించును. ఆయన శిష్యులు ఈ మాట విని ఇది కఠినమైన మాట. ఇది ఎవడు వినగలడని చెప్పుకొన్నట్లు వేదములో చదువగలము. ఇందులోని పరమార్థమేమనగా లోకములో జీవించుచున్న ప్రతి శరీరము మానవాకృతిలో జన్మించి జీవించుచున్నను వానికి జన్మపాపము కర్మపాపము ఉన్నదని, ఇవి తల్లి గర్భము ఒక భాగముగను ఎదిగిన పిమ్మట మనిషిగా జీవించు కాలములో చేయు క్రియలనుబట్టి రెండవ భాగమును మానవునియొక్క పాప విలువలు ఏర్పడియున్నట్లు తెలియుచున్నది.
జన్మపాపము శరీర కలయిక ద్వారా కర్మపాపము శరీరము చేయు క్రియల ద్వారాను సంక్రమించు చున్నట్లు మనము తెలిసికొనవలసియున్నది. ఈ జన్మకర్మ పాపములన్నవి రెండును శరీరేచ్ఛలనుబట్టి జరిగేవే గాని ఆత్మానుసారముగా జరిగేవి కావు. ప్రతి దోష క్రియను గూర్చి ఏదో యొక్క రీతిగా ఆత్మ శరీరాన్ని గద్దిస్తూనే ఉంటుంది. అయితే శరీరమునకున్న బలము అజ్ఞానము, అహంభావము అన్న అరిష్ట గుణములు ఆత్మనడ్డగించి ఎదిరించి, శారీర క్రియలకే ప్రాధాన్యతనిచ్చి పాపక్రియలు జరుగుటకు అవకాశమేర్పడుచున్నది. ఉదా|| దావీదు మహారాజు ఊరియా భార్యను మోహించుటలో నిజమునకు దావీదు వంటి ప్రవక్త ఆ కార్యము చేయదగినది కాదు. దావీదు మహారాజు ఆత్మ సంబంధి అయితే అందమైన స్త్రీయొక్క శారీర రూపమునకు ముగ్ధుడై, తన ఆత్మీయతను వదులుకొని శారీరమునకు దాసుడైనట్లు తన్మూలముగా హంతకునిగ దైవసన్నిధిలో ఎన్నికైనట్లు మనకు తెలియగలదు. దావీదువంటి ప్రవక్త దైవసన్నిధిని దైవాజ్ఞ నెదుర్కొని, తుచ్ఛమైన దేహవాంఛ కోసము పశువాంఛతో ప్రవర్తించాడంటే, ఆత్మకును శరీరమునకున్నటువంటి వైరాగ్యమెట్టిదో మనకు తెలియగలదు.
ఇందునుగూర్చి పౌలు తన లేఖనములో ప్రవచిస్తు గలతీ 5ః18 మీరు ఏమి చేయ యత్నింతురో వాటిని చేయకుందురు, అనుటలో ఒక మానవుడు జరిగించు క్రియ ఆత్మ సంబంధమైనదైతే అది బహు ఖచ్చితమైనదిగాను, ఒప్పిదమైనదిగాను, నిరాటంకమైనదిగాను, నిరాపేక్షపూరితమైనదిగాను ఉంటుంది. అది ఆత్మ సంబంధముగాక తన స్వజ్ఞానముతో కుత్సితముతో చేయు క్రియయైతే ప్రమాదపూరితమై నదియు నిందారోపణ కలదియును భరింపరాని నేరముతో కూడినదియును, చట్టవ్యతిరేకమైనదియు, స్వార్థముతో కూడినదియునైయుండి, అట్టి క్రియకు భూలోకము పరలోకము రెండును ఏకమై అతనిని దోషిగాను, ద్రోహిగాను నేరారోపణ చేయగలదు. ఉదా|| పౌలు సౌలుగా ఉన్నప్పుడు ఇతడు క్రైస్తవులను అనగా ఆత్మ సంబంధులైనవారిని బంధించుటకును, వారిని హింసించుటకును, హత్య చేయుటకును, అధికారమును కోరినాడు. ఇది శారీర జ్ఞానముతో కూడిన అజ్ఞాన క్రియ. పరమాత్ముడైన దేవుని చేత మొత్తబడి శరీరనేత్ర దృష్టిని కోల్పోయి అంధుడాయెను. ఇవ్విధంబుగ సౌలును అంధునిగా జేసిన పరమాత్మ అంతటితో విడిచిపెట్టక అతని ఆత్మీయ నేత్రమును తెరపించుటకు అననీయ అను తన భక్తుని ఎన్నుకొని తద్వారా ఆత్మీయ మర్మములను, ఆత్మీయ దృష్టిని గూర్చిన పరిజ్ఞానమును పొందుటకు సౌలు అను శరీరిని ఒక సాధనముగాను, ఒక వాహనముగాను వాడి, అతని ద్వారా ఆత్మ సంబంధమైన అనేక లేఖన భాగములను నేటి తరమువారమైన శరీర సంబంధులమైన మనకు ఎరింగిస్తున్నాడంటే, శరీరముయొక్క మనుగడకు ఆత్మ ఎంత ఉపయోగకారియో మనకు తేటతెల్లముగా బైల్పడుచున్నది. కనుక ఆత్మ కార్యములకును, శరీర కార్యములకును ఒకదానికొకటి ప్రతికూలమైయున్నట్లు యిందునుబట్టి మనము తెలిసికొనుచున్నాము.
........
మొదటి యోహాను 3ః4-5 పాపము చేయు ప్రతివాడును ఆజ్ఞను అతిక్రమించును, ఆజ్ఞాతిక్రమమే పాపము. పాపములను తీసివేయుటకై ఆయన ప్రత్యక్షమాయెనని మీకు తెలియును. మేలైనది చేయ నెరిగియు దానిని చేయకుండుటయే పాపము.
ప్రియపాఠకులారా! పాపము చేయు ప్రతివాడు ఆజ్ఞను అతిక్రమించును,'' అను ఈ మాట ఆదిలో ఆది నరజంట; అటుతర్వాత దేవుడు లోకములో తనకంటూ ప్రత్యేకముగా ఏర్పరచుకున్న ఇశ్రాయేలు జనము పట్ల అనేకమార్లు జరిగింది. దేవుడు ఇశ్రాయేలీయుల కిచ్చిన ధర్మశాస్త్రము అనగా దశాజ్ఞలు బహు కఠినముగ అమలు చేయించినట్లు నిర్గమ కాండములో చదువగలము. ఇందునుబట్టి చూడగా దేవుని ఆజ్ఞ బహుకఠినమైనదియు ఖచ్చితమైనదియు తిరుగులేనిదియు, ఒక ప్రత్యేక రీతిలో క్రమబద్ధముగా ఆచరణీయమైన చట్టముగ విధించబడియున్నట్లు మనకు తెలియుచున్నది.
భూలోకములో లోక ప్రభుత్వపరముగా కొన్ని ఆజ్ఞలు జనబాహుళ్యానికి విధించబడియున్నవి. ఆజ్ఞలను గూర్చి తెలిసికొనుటకు పూర్వము ఆజ్ఞ అనగా అర్థమేమిటో కూడా మనము తెలిసికోవలసియున్నది. ప్రియపాఠకులారా! చట్టము నిబంధన, నియమము, శాసనము, వగైరా అర్థమిచ్చు ప్రతి నామములో ఈ ఆజ్ఞ అను మాటలో ఇమిడి ఉన్నవి. ఆజ్ఞ అన్నది రాజు శాసించే శాసనము. అందుకే ఆదామునుండి యేసుక్రీస్తు జననము వరకు పాత నిబంధన అన్నారు. అనగా పాతనిబంధన అనగా ఒప్పందము చట్టము. నూతన నిబంధన నూతన ఆజ్ఞ నూతన చట్టము నూతన ఒప్పందము అని అర్థము. ఇది కేవలము మనిషికే పరిమితమైయున్నది. మరి ఏ జీవికి ఇట్టి ఆజ్ఞ లేదు. రాజులుగాని, పరిపాలకులుగాని, ప్రభుత్వాలు గాని, సమాజములుగాని, లోక సంబంధముగాను, దైవత్వమన్నది పరలోక సంబంధముగాను, నరజీవిని కొన్ని సిద్ధాంతములు, నిబంధనలు విధించి, నరుని ఆత్మీయముగాను శారీరకముగాను అనగా శారీర జీవితములో లోకసంబంధముగాను ఆత్మీయ జీవితములో - పరలోక సంబంధముగాను జీవింపజేయుటకు క్రియ జరిగిస్తున్నాయి. ఇట్టి సందర్భములో నరునిలో ఆత్మ శక్తి బలహీనపడి శారీర శక్తి, శారీర జ్ఞానము రెండు ఏకమై లోకము దాని సంపదను, దాని వైభోగములను ఆశించినప్పుడు ఆత్మీయ చట్టాలను పాటించుట అసాధ్యము. ఎందుకనగా యేసుప్రభువు తన బోధలో లోకము, దాని క్రియలు చెడ్డవి. నేను లోకమునెంతో ప్రేమిస్తున్నానుగాని అది నాకు దూరముగ ఉన్నది. నేను పైనుండు వాడను మీరు క్రిందివారు. మీరు లోకసంబంధులైనట్లు నేను లోకసంబంధిని కాను. ఇట్టి మాటలు ఆయన వాడియున్నాడు. మరియు పౌలు కూడా తన ఆత్మీయ దైవిక జీవితములో కొలస్స 3ః1లో మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటినే వెదకుడి, పైనున్న వాటి మీదనేగాని భూసంబంధమైన వాటి మీద మనస్సు పెట్టకుడి ః మొదటి యోహాను 2ః15-17 ఈ లోకమునైనను, లోకములో ఉన్నవాటినైనను ప్రేమింపకుడి.
ప్రియపాఠకులారా! ఈ మాటలు ఒక వ్యక్తి యొక్క ఆత్మీయ జీవితానికి కట్టడలు మరియు హెచ్చరికలుగా నున్నవి. పౌలు తన రక్షణానుభవములో ఆత్మీయ జీవితములోకి రాక పూర్వము ఆనాటి రాజులు పరిపాలకుల మద్ధతుతో వారిపై ఆధారపడి దైవజ్ఞాన శూన్యుడై, ఆత్మ జ్ఞానమును పూర్తిగ కోల్పోయినవాడై శారీరులతో జత కలిపి, వారితో కూడి, దృశ్యమైన లోక కలిమి, లోక సిద్ధాంతాలకును దాని చట్టాలకును నాటి పరిపాలకుల ఆజ్ఞలను శిరసావహించి, తానున్న స్థితియే తనకు ఆధారమని రక్షణాయుతమైనదని తలచి గుఱ్ఱము, డాలు, కత్తి, భటులు, రాజవస్త్రములు, యుద్ధ కవచములు, అన్నిటి కన్నను డమస్కుయొక్క చట్టములకు ప్రాధాన్యతనిచ్చి దైవచట్టమేదో గుర్తించలేకపోయాడు. అయితే ఒకానొక దినమున దైవత్వము చేత మొత్తబడి దైవచిత్తమేమిటో దైవరాజ్య పరిపాలన చట్టమేమిటో దైవరాజ్యమునకు కావలసిన వస్తువాహనాలేమిటో - దైవరాజ్య ప్రవేశమునకు చేయవలసిన పోరాటమేమిటో - ఆ పోరాటములో కలుగు విజయమేపాటిదో, అట్టి పోరాటము జరుపుటకు కావలసిన నిబంధనలు నియమములను గూర్చి తెలిసికొన్నవాడై, తానున్న శారీర సౌలు జీవితము నుండి అనగా సౌలుగా ఉండి యోధునిగ, లోకసంబంధముగ ఆత్మ సంబంధులను చెరపెట్టుటయు, హింసించుటయు, చంపుటయు, తన ప్రాణాధారమని ఎంచుకొనిన శారీర నామమును మార్చుకొని, సౌలుగా ఉన్న తన జీవితమును ఆత్మీయ జీవితములోకి ప్రవేశింపజేసి ఆత్మ సంబంధమైన రాజ్య మర్మములను, దాన్ని గూర్చిన నియమములు, నిబంధనలు దాన్ని సాధించుటకు చేయవలసిన పోరాటము, ఆ పోరాటములో కలుగు విజయోత్సాహము, తత్సంబంధమైన ఆత్మీయమైన శాంతి సమాధాన మహాభాగ్యములను పొందుటకు ఆత్మీయ పోరాటమును సాగించి ఆత్మ దేవుని యొక్క స్వాస్థ్యమును పొందుటకు ఆత్మీయ పోరాటము సాగించుటకు సమాయత్తమై సౌలు అను పేరును మార్చుకొని భూలోక చట్టములకు నిబంధనలకు తిలోదకాలిచ్చి, కేవలము పరలోక సంబంధముగ, పరలోక పౌరునిగ, పరలోక వారసునిగ లోకమునకు దూరస్థునిగ, ఆత్మ దేవునికి సన్నిహితునిగ, అనగా క్రీస్తును పోలి క్రీస్తు మార్గములో నడచుచు, తన ఇహలోక యాత్రను జయప్రదముగ ఒక ప్రత్యేకమైన తన ఆత్మీయ స్థితిని గూర్చిన చరిత్రను - నూతన నిబంధనలో లిఖించబడునంతటి భాగ్యము పొంది, నేడు ప్రతి విశ్వాసికి క్రీస్తు మార్గములో నడుచుటకు మార్గదర్శియైనట్లు మొదటి యోహాను 3ః3లోని మాట ఇందునుబట్టి పౌలు విషయములో నెరవేర్పుగా ఉన్నది. అదేమిటంటే - ఆయనయందు నిరీక్షణ పెట్టుకొను ప్రతివాడును ఆయన పవిత్రుడుగా ఉండునట్లు పవిత్రునిగా జేసికొనుచు అను మాటయే!
ఇక దేవుని ఆజ్ఞను నిబంధనను అతిక్రమించువాడు పాపము చేసినవాడు అని ఇందులో వ్రాయబడి యున్నది. ఇట్లు అతిక్రమించినవారిలో ఉదా|| వేదములో కొందరిని మనము తెలిసికొందము. మొదటిది ఆది నరజంట 2. మోషే విషయములో దేవుడు బండను తాకమనగా అతడు కఱ్ఱతో బండను కొట్టినాడు. సౌలు విషయములో సౌలు ఫిలిష్తీయులతో యుద్ధము సంభవించినప్పుడు దైవజనాంగమునకు రాజుగా దేవుని చేత నియమించబడిన సౌలునకు అన్యులైన ఫిలిష్తీయులతో యుద్ధము సంభవించిప్పుడు దైవచట్ట ప్రకారము అతడు దేవునితో విచారించవలెను, దేవుని వెదకవలెను, దైవ సలహాను పొందవలెను. అందుకు విరుద్ధముగ సౌలు సోదెను చెప్పించుకోవడమన్నది దైవాజ్ఞకు వ్యతిరేకము. అలాగే దావీదు మహారాజు దైవజనాంగమైన ఇశ్రాయేలీయులకు యుద్ధము సంభవించినప్పుడు దైవ ప్రజలలో ఉండి రాజుగా ఉన్నవాడు - యుద్ధరంగములో నిలువవలెను. అందుకు విరుద్ధముగ దావీదు తన రాజమందిరములో చేరి సైన్యాన్ని యుద్ధభూమికి అప్పగించి, తాను రాజాంతఃపురములో చేరి మేడ మీద సుఖిస్తూ లోకానికి అవకాశమిచ్చి లోకము చేత శోధింపబడి పరస్త్రీ వ్యామోహితుడై, దైవాజ్ఞకు విరుద్ధముగ అనగా దైవాజ్ఞను వ్యతిరేకించి స్త్రీ పాపానికి ఒడిగట్టినాడు. ఈ విధముగా పాపము జరిగించిన వాడు ఆజ్ఞను అతిక్రమించినట్లు మూలవాక్యములోని వివరణ. ఈ విధముగ దైవాజ్ఞను వ్యతిరేకించినవారు నూతన నిబంధనలో కూడా ఉన్నారు. ఇందులో ప్రథములు యూదా ఇస్కరియోతు, దైవకుమారునే లోకానికి అమ్మి స్వామిద్రోహి, గురుద్రోహి అయినట్లు తెలియుచున్నది. అట్లే అననీయ సప్పీరాలు అబద్ధము మాట్లాడి మృత్యువాత పడినారు. ప్రియపాఠకులారా! ఈ విధమైన ఆజ్ఞాతిక్రమమే పాపము.
ఇక మొదటి యోహాను 3ః5లో పాపములు తీసివేయుటకు ఆయన ప్రత్యక్షమాయెనని మీకు తెలియును. ఆయనయందు పాపమేమియు లేదు,'' అనుటలో ప్రియపాఠకులారా! దైవత్వమన్నది ప్రత్యక్షము కావాలంటే పాతనిబంధన కాలములో మేఘములోను, అగ్నిలోను, సుడిగాలిలోను; దశాజ్ఞల శాసనముల ద్వారా, దూతల రూపముగ పాతనిబంధన కాలములో దైవత్వమన్నది ప్రత్యక్షమైనట్లు వేదములో చదువగలము. అదృశ్య రూపమంటే నరుని హస్తస్పర్శకు వీలుగాని రూపము. అయితే నూతన నిబంధన కాలములో లోకములో విస్తరించి బహుముఖ వ్యాప్తముగ ప్రబలియున్న ఘోరాతి ఘోరపాపమును దైవత్వమన్నది కన్నులారా చూచి, తాను అదృశ్యములో ఉండి లోకపాపమును తీసివేయుట అసాధ్యము అని ఎంచి అదృశ్యమైన తన రూపమును దృశ్యముగ - ఏ నరకోటిలో పాపము అక్రమము విస్తరించి ఉన్నదో - ఆ నరకోటి సంబంధముగా - ఆ నరకోటిలోని కన్నెకయైన నారి గర్భమునుండి ఒకానొకదినమున పాపమునకు వాడబడు సాధనమైన నరదేహములో విస్తరించియున్న పాప అతిక్రమములను తీసివేయుటకు బాల నర రూపములో - సమస్త నరకోటికి ప్రత్యక్షముగా కనపడు రీతిలో తన దైవ ప్రభావమును అదృశ్య లక్షణములను వదలుకొని, ప్రత్యక్షముగా నరునికి చేతితో తాకి స్పర్శించి కనుగొను విధముగ నరులకు అందుబాటులో నరరూపములో నరుల మధ్య జీవిస్తూ - తనయొక్క జనన మర్మములను పరలోక రాజ్యము అను వేరొక లోకమున్నదని ఎరిగించి, నరుడెంతటివాడైనను, ఎంత గొప్పవాడైన ఎంతకాలము జీవించినను, ఒకానొక దినమున ఈ లోకమును వదలి వెళ్ళవలసిన గడియ ఉన్నదని నిరూపించుచు, లోకములో నరుడు తాను సంపాదించిన యావద్ సంపదను, తన కుటుంబాన్ని, తుదకు దేహాన్ని కూడా వదలుకొని వేరొక స్థలమునకు అనగా పరలోకమునకు వెళ్ళవలసిన ఒక దినము ప్రతి నరునికి ఉన్నదని - అట్లు వెళ్ళిన నరుని ఆత్మకు కూడా తీర్పు ఉన్నదని, ఆ తీర్పులో నిర్దోషిగ నిర్మలముగా విశ్వాసిగ జీవించిన నరుని జీవాత్మకున్న విలువలను ఆధిక్యతలను వివరించి, అట్టి లోకమునకు వెళ్ళుటకు నరునికి కావలసిన యోగ్యతలను బోధించి, మెళకువ, విశ్వాసము, నిరీక్షణ గలిగి దైవత్వము మీద లక్ష్యముంచి, అశాశ్వతమైన ఈ లోకము మీద వ్యామోహాన్ని చంపుకొని జీవించాలని బోధించి, తద్వారా తన నామమును ధరించిన ప్రతి విశ్వాసిని యోహాను 14ః6లో వలె నేనే మార్గము - సత్యము - జీవము'' నా ద్వారానే తప్ప ఎవడును తండ్రి యొద్దకు వెళ్ళలేడు అనిన ప్రవచనాన్ని ప్రవచించినట్లు, ఈనాడు యావద్ క్రైస్తవ విశ్వాసికిని ఆయన మార్గమైయున్నాడు, అనగా లోకములోని పాపమును తీసివేసి ప్రతి యొక్కరికి ఆయన ప్రత్యక్షత యొక్క నిగూఢ సత్యమును యావద్ నరకోటికి నిరూపిస్తున్నాడు.
ఇక రెండవదిగ ''ఆయనయందు పాపమేమియు లేదు,'' అనుటలో దేవుని యందు పాపములేదన్న భావాన్ని ఈ వాక్యము నిరూపిస్తున్నది. ఎట్లంటే పాపము చేయువాడు దేవుడు కాడు. పాపక్రియను జరిగించువాడు దేవుని కుమారుడు కాడు. అంటే దేవుడు - దేవుని కుమారులు ఇద్దరును పవిత్రులే! మరి ఆయనయందు పాపము లేదనుటకు ఆయనకు తీర్పు యిచ్చిన పిలాతు కూడా ఈయన యందు నాకెట్టి దోషము కనబడలేదని చేయి కడుగుకొన్నాడు. ప్రియపాఠకులారా! యేసు ప్రభువునకు నూతన నిబంధన కాలములో తీర్పు దీర్చింది లోకనాధులు కాదు, లోకమే! ఆయనను సిలువ వేయమని అరిచింది లోకమే! ఆయనలో ఏ దోషము కనబడలేదన్నది లోకపరిపాలకుడు, ఆయనను సిలువ వేయమని అరిచింది ఆయన గోత్రీకులే! అనగా యూదులు. ఆయనయందు పాపము లేదని తీర్పు దీర్చినవాడు యేసు ప్రభువునకు కుడివైపున సిలువ వేయబడిన దొంగ అలాగే మత్తయి 27ః54లో శతాధిపతియు, అతనితో కూడా యేసునకు కావలిగా ఉన్నవారును మిక్కిలి భయపడి నిజముగా ఈయన దేవుని కుమారుడే! అని సాక్ష్యమిచ్చినట్లు చదువగలము. కనుక పాపము లేనివాడు క్రీస్తు. పాపములో ఉన్నవారము మనము.
కనుక మన పాపములను తీసివేయుటకు ఆయన నరునిగ భూలోకములో మన పూర్వీకుల మధ్యను తన మరణ పునరుత్థానము ద్వారా నేటి తరమువారమైన మన మధ్యను ఆయన ప్రత్యక్షముగా ఉండి, మనకు కలుగు ప్రతి వేదన, బాధ, శోధన అవసరతలలో మనకు తోడై ఎన్నియో సందర్భాలలో ఎన్నో విధములైన మేళ్ళు జరిగిస్తునట్లు, నేటి విశ్వాసులమైన మన రక్షణానుభవములో మనము గ్రహించవలసి యున్నది. కనుక మొదటి యోహాను 3ః6లో వలె ఆయనయందు నివసించు అనగా ఆయనను తమ రక్షకుడుగా అంగీకరించిన ప్రతివాడును పాపము చేయడు అనగా అతడు పాపమునకు దూరస్థుడు అని అర్థము.
ఇక ''పాపము చేయువాడెవడును ఆయనను చూడనులేదు - ఎరుగను లేదు. ఈ సందర్భములో ప్రియపాఠకులారా! పౌలు సౌలుగా ఉన్నప్పుడు అపొ 9ః3-5 సౌలు ప్రయాణము చేయుచు డమస్కు దగ్గరకు వచ్చినప్పుడు అకస్మాత్తుగా ఆకాశమునుండి ఒక వెలుగు అతని చుట్టు ప్రకాశించుట, అప్పుడతడు నేలమీద పడి - సౌలా! సౌలా! నీవేల నన్ను హింసించుచున్నావని తనతో ఒక స్వరము పలుకుట వినడము - అంతట సౌలు - ప్రభువా! నీవెవడవని అతడు అడుగగా ఆయన - ''నేను నీవు హింసించుచున్న యేసును,'' అనుటలో పాపము చేయువానికి దేవుడు ప్రసన్నుడు కాడనియు, అయితే శిక్షించి గద్దించునని ఇందునుబట్టి గ్రహించవలెను. ఎట్లంటే మొట్టమొదట గుఱ్ఱము మీద ప్రయాణిస్తున్న సౌలును వెలుగుతో మొత్తి పడవేసి దృశ్యముగాగాక అదృశ్యములో ఉండి, పడవేయబడిన సౌలును అంధునిగ జేసి తన మాటలతో హెచ్చరించుటన్నది - ఈ దైవవాక్కులోని యదార్థతను బైల్పరచుచున్నది. కనుక పాపము చేసిన సౌలు ప్రత్యక్షముగా క్రీస్తును చూడలేకపోయాడు.
ప్రియపాఠకులారా! ప్రతి నరునికి దేవుడు తనను చూచుటకు ఒక అవకాశాన్ని ఇచ్చినాడు. ఎట్లనగా తనను చూచినవాడు తండ్రిని చూచినట్లే; తండ్రి యందు నేనును నా యందు తండ్రియు ఏకమైయున్నామని చెప్పుట మరియొక సాక్ష్యము. కనుక పాపము చేసినవాడు దైవత్వమును చూడాలంటే పాతనిబంధన కాలములో శ్రమతో కూడిన పని. అయితే నేటి నూతన నిబంధన కాలములో దైవరూపమైన యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చిన ప్రణాళిక పాపులను రక్షించుటకు లూకా 19ః10లో నశించినదానిని వెదకి రక్షించుటకు మనుష్యకుమారుడు ఈ లోకానికి వచ్చెను,'' అని వ్రాయబడియున్నది.
ప్రియపాఠకులారా! నేడు లోకములో ప్రతి వ్యక్తి ప్రతివిధమైన పాపములో తగుల్కొని నాశనకరమైన స్థితికి దిగజారుచున్నట్లు తెలియుచున్నది. కనుక క్రైస్తవ విశ్వాసులమైన మనము - మన విశ్వాస స్థితిని కాపాడుకొంటూ - దేవునికిని ఆయన కుమారునికిని, కుమారత్వమునకు రూపమిచ్చిన పరిశుద్ధాత్మకును, ప్రీతికరమైన జీవితాన్ని జీవించుచు మనయొక్క జన్మను ధన్యవంతము చేసికొందము గాక!
......
ఎఫెసీ 2ః1 మూలము ః- మీ అపరాధములచేతను పాపములచేతను మీరు చచ్చినవారైయుండగా ఆయన మిమ్మును క్రీస్తుతో కూడా బ్రతికించెను.
ప్రియపాఠకులారా! ఇంతవరకు మనమెన్నో అంశములు నేర్చుకొనియున్నాము. పరిశుద్ధ గ్రంథములో ఎన్నో సత్యాలను గూర్చి ధ్యానించుకొందము. పై వాక్యము మూడు అంశాలుగా విభజింపబడి యున్నది. ఇందులో అపరాధములు పాపములు వాటి ఫలమైన మరణము. ఇందునుగూర్చి తెలిసికొందము. మొదటి అపరాధము ఇది భూసంబంధమైంది. రెండవది స్త్రీ సంబంధమైంది. మూడవది మరణము - ఇది దైవ సంబంధమైంది, నాలుగవది జీవము - ఇది క్రీస్తు సంబంధమైంది. ఇందునుగూర్చి తెలిసికొందము.
ప్రియపాఠకులారా! పాపమునకు అపరాధమునకు అతి సమీప సంబంధ బాంధవ్యాలున్నవి. ఎలాగంటే ఈ అపరాధమునకును, పాపమునకును మూలము ఆదిలో దేవుని వనములో జీవించిన నరజంట యొక్క దైవ ఆజ్ఞాతిక్రమమే కారణము. ఆనాటి ఆ నరజంట ఏ విధముగా జరిగించారంటే - దేవుడు తినవద్దని శాసించిన ఏదెను తోట మధ్యలోని వృక్షఫలాలు వారు భుజించుటన్నది అపరాధము అనగా ఆది సర్పపు మాటలకు లోబడి భూసంబంధ ఫలమునకు ఆకర్షితురాలై హవ్వ చేసిన పని తినుటన్నది అపరాధము. అయితే దేవునియొక్క చేతిపనియు, దేవునియొక్క రూపమును జీవమును పొంది, ఆత్మయైయున్న తొలి నరుడైన ఆదాము స్త్రీ ఆకర్షితుడై స్త్రీ హస్తములో ఉన్న ఫలములను తినుటన్నది పాపము. ఈ విధముగా ఈ అపరాధము పాపమన్నది ఏదెను వనములో భార్యాభర్తలుగ ఆవిర్భవించినట్లు తెలుస్తున్నది. అనగా అపరాధమునకు పాపమునకు మూలకేంద్రము ఏదెను వనము. ఈ రెంటి ద్వారా నరులకు ఇచ్చిన ఫలము మరణము. సర్పము మాట వినుట స్త్రీ చేసిన అపరాధము, ఆ తర్వాత సర్పము మాటలనుబట్టి నిషేధ ఫలమును తినుటన్నది పాపము. ఇందునుబట్టి మరణానికి కూడా కేంద్రము ఏదెను వనము. ఈ తీర్పు విధించబడిందిగాని అమలు జరిగింది ఏదెను వనములో కాదు. ఏదెను నుండి ఆదినరజంటను వెళ్ళగొట్టిన అనంతరము అనగా ఏదెను వనము నుండి నరులను తరిమి వేయబడగా ఈ మరణశిక్ష బాహ్యముగా అమలు జరిగింది. ఏ విధముగా అంటే ఏదెను వనములో అపరాధము, పాపము ఏకమై కామేచ్ఛలుతో కూడిన వాతావరణములో స్త్రీ గర్భము ధరించి కన్నటువంటి గర్భఫలాలు కూడా ఈ అపరాధ పాపములకు ప్రతీకలైయున్నవి. ఎలాగంటే కయీను తన పొలము పంటలో కొంత యెహోవాకు అర్పణగా తెచ్చెను. హేబెలు కూడా తన మందలో తొలిచూలును పుట్టిన వాటిలో కొన్నిటిని అర్పించుటన్నది అపరాధము, పాపము సమ్మేళనమైనట్లును, తద్వారా మరణము హేబెలుపై క్రియ జరిగించినట్లుగ ఈ క్రింది విధముగా మనము తెలిసికొందము. కయీను తెచ్చిన అర్పణలు దేవుడు శపించిన భూసంబంధమైన ఫలాలు ఇవి దైవసమ్మతమైంది కాదు. దైవసమ్మతమైనవైతే ఇరువురి బలులను దేవుడు అంగీకరించేవాడు హేబెలు అర్పించిన అర్పణలు జంతు సంబంధమైనవి.
ప్రియపాఠకులారా! సృష్టి ప్రారంభములో ఆదినరుడైన ఆదాము హవ్వలు - తద్వారా వారినుండి ఏర్పడిన తొలికయీను హేబెలులలో మొట్టమొదట సంతానమైయుండగా - వీరు దైవచిత్తము దైవపిలుపు దైవానుగ్రహము దేవుని ప్రణాళిక లేకయే ఎవరి ఇష్టము చొప్పున బలిపీఠములు కట్టి బలులర్పించుటన్నది అపరాధము. అయినను దేవుడు బలి అడిగినాడు కాని కయీను హేబెలులను దేవుడు బలి అడుగలేదు. కనుక ఇది అపరాధము. దేవుని చిత్తము లేకుండ అర్పించే ఈ అర్పణన్నది అపరాధమే. దేవుడు తన అర్పణను అంగీకరించలేదని కయీను చేసిన సోదర హత్య పాపము. అందుకే హేబెలుయొక్క రక్తము నేల నుండి దేవునికి మొరపెట్టినట్లుగ వేదములో చదువగలము. ఈ హత్యానేరమును బట్టి దేవుని చేత విధించబడిన శిక్ష - దేశ ద్రిమ్మరి. అనగా నిలుకడ లేని సంచార జీవితము, నెమ్మదిలేని జీవితము - కయీను ద్వారా విస్తరించిన జనాంగమే. ఆది 6ఃలో దైవోగ్రతకు గురియై జలప్రళయము ద్వారా యావద్ సృష్టి లయపరచు మారణహోమము - యావద్ సృష్టికి విధించబడినట్టి మరణశిక్ష సోదరులు ఇరువురు చేసిన అపరాధము, పాపమునుబట్టి విధించబడిన శిక్ష. ఈ విధముగా కయీను హేబెలులు అర్పించిన బలులు, అవి దైవచిత్తానుసారముగా గాక, వారి స్వంత ఉద్దేశముతో కూడుకొన్నవి. ఎట్లనగా కయీను శపితమైన పొలము పంటను మందలోని క్రొవ్విన వాటిని దేవునికి - దైవచిత్తమునకు వ్యతిరేకముగా ఉన్నందున - ఇది అపరాధముగా అర్పించిన అర్పణలు. ఈ విధముగా అపరాధములతో కూడిన - అర్పణ కార్యాలలో దేవుడు వీరిని పరిశోధించి, ఆదినరునికి ప్రధమ గర్భఫలమైన కయీనుయొక్క మనో వైఖరిని పరీక్షించుటకు హేబెలు అర్పణపై దేవుడు లక్ష్యముంచాడు. అందునుబట్టి కయీనుయొక్క అపరాధము తీవ్రరూపము దాల్చి హేబెలును హత్య చేసే పాపమునకు దారి తీసింది.
ప్రియపాఠకులారా! దేవుడు పక్షపాతి కాడు. ఈ కయీను హేబెలులను ఇరువురి సోదరుల తండ్రియైన ఆదాము హవ్వలు ఏ విధముగా అపరాధములు పాపముల చేత దైవోగ్రతకు గురియైనప్పుడు, వారి పట్ల ఏ విధముగా దేవుడు వ్యవహరించాడో అలాగే కయీను హేబెలుల పట్ల కూడా తన వైఖరిని కనబరచినట్లును అనగా ఆదినరజంట తోట చెట్ల చాటున దాగి ఆకులు కచ్చడములుగా చేసుకొని ధరించి యుండగా వారికి చర్మపు దుస్తులను ధరింపజేసినట్లును, అలాగే హేబెలును చంపి దేశద్రిమ్మరి శిక్ష పొందిన కయీనుకు, ఎవడును అతనిని చంపకుండునట్లు యెహోవా అతనికి ఒక గుర్తు వేసినట్లు వేదములో ఆది 4ః15లో చదువగలము. పై రెండు గుర్తులు అనగా ఆది నరజంటకు దేవుడు తొడిగిన చర్మపు దుస్తులు, కయీనుకు దేవుడు వేసిన గుర్తు దైవరక్షణార్థమైన గుర్తులైనట్లు మనము తెలిసికోవలసియున్నది.
అలాగే ప్రియపాఠకులారా! నేటి క్రైస్తవ విశ్వాసులుగ తీర్చబడిన మనకు క్రీస్తులో బాప్తిస్మము పొంది, క్రీస్తు జరిగించిన బలియాగములో ఆయన సిలువ బలియాగము ద్వారా నేటి మన అపరాధములు పాపములకు రక్షణ పొందిన మనకు ఆయన సిలువయే మనకు గుర్తుగా ఉన్నది. అందుకే గలతీ 3ః27లో పౌలు గలతీ సంఘానికి వ్రాసిన లేఖలో - ''క్రీస్తులోనికి బాప్తిస్మము పొందిన మీరందరు క్రీస్తును ధరించి కొనియున్నారు,'' అని వ్రాసిన ప్రవచనాన్ని ఈ సందర్భములో ధ్యానించవలసియున్నది.
అయితే ప్రియపాఠకులారా! ఈ విధముగా క్రీస్తును ధరించుకోక పూర్వము మన పూర్వీక స్థితి ఎలాగున్నది? అన్నదాన్ని గూర్చి మనము ఎఫెసీ 2ః2-5లో చదువుకొందము. ఇందులో వ్రాయబడి యున్నది ఏమనగా ''మీరు వాటిని చేయుచు, వాయుమండల సంబంధమైన అధిపతిని, అనగా అవిధేయులైన వారిని ఇప్పుడు ప్రేరేపించు శక్తికి అధిపతిని అనుసరించి, ఈ ప్రపంచ ధర్మము చొప్పున మునుపు నడుచుకొంటిరి. వారితో కలిసి మనమందరమును శరీరము యొక్కయు, మనస్సు యొక్కయు కోరికలను నెరవేర్చుకొనుచు, మన శరీరాశలను అనుసరించి మునుపు ప్రవర్తించుచు, కడమవారి వలెనే స్వభావ సిద్ధముగా దైవోగ్రతకు పాత్రులమై యుంటిమి. అయినను దేవుడు కరుణాసంపన్నుడైయుండి, మనము మన అపరాధముల చేత చచ్చినవారమైయుండినప్పుడు, సహితము మన యెడల చూపిన తన మహాప్రేమ చేత మనలను క్రీస్తుతో కూడాబ్రతికించెను.''
ప్రియపాఠకులారా! వాయుమండల సంబంధ అధిపతిని అనగా నిరాకారుడును, ఆత్మయై యుండి వాయుమండలము అనగా గాలిలో సంచరిస్తూ - దైవత్వమునకుగాని ఆయన చట్టమునకు అవిధేయులైన వారిని ప్రేరేపిస్తూ దైవ వ్యతిరేక క్రియలు జరిగించే శక్తులకు అధిపతిని అనుసరించుట. ఇంకను ఈ ప్రపంచ ధర్మము చొప్పున మునుపు నడుచుకొంటిరి అట్టివారితో కలిసి శరీరముయొక్క మనస్సుయొక్క కోరికలను నెరవేర్చుకొంటూ - మన శరీర ఆశలను అనుసరించి మునుపు ప్రవర్తించుట కడమవారివలెనే స్వభావ సిద్ధముగా దైవోగ్రతకు పాత్రులైయుండుట ఇందునుగూర్చి వివరముగా తెలిసికొందము.
ప్రియపాఠకులారా! ఈ వేదభాగములో మొట్టమొదటగా వ్రాయబడింది. ''మీరు వాటిని చేయుచు,'' అనుటలో క్రైస్తవులు గాక పూర్వము మన పూర్వీక స్థితిని ఈ వాక్యము జ్ఞాపకము చేస్తున్నది. అదేమనగా మన పూర్వీక క్రియలకు కారకులైనవారిని గూర్చి ఇందులో వివరించబడియున్నది. అందులో మొదటగా వాయుమండల సంబంధ అధిపతి - ఇతను అపరాధమునకును, పాపమునకును సంబంధించిన క్రియాకర్మలకు మూలకారకుడును అట్టి క్రియలను జరిగించువారికి ప్రధానాధికారియైయున్నట్లును అనగా మండలాధికారి స్థానమును అధిష్టించియున్నట్లును, ఇతని ఏలుబడిలో ఉన్నవారు దైవత్వమునకును ఆత్మీయతకును అవిధేయులును, అంతేగాకుండ ఈ పై వాయుమండల సంబంధ అధిపతి ననుసరించి అతని చిత్తానికి విధేయించి, అతని ఆజ్ఞను శిరసావహించి, అతని హేయకార్యాలకు పాలిభాగస్థులై వాటిని అనుసరిస్తూ - వాటితోబాటు ఈ ప్రపంచ ధర్మము చొప్పున మునుపు - ఈ లోకాచారము ఈ లోక ధర్మములు, ఈ లోకచట్టాలు చొప్పున నడుచుకొంటూ పూర్తిగా దైవత్వమునకు విరోధులై దైవత్వమును అనుసరింపనివారు, దైవత్వమును ఎదుర్కొనేవారును దైవవిరోధికి ప్రతికూలురునైనవారునైన మనమందరము శరీరముయొక్కయు, మనస్సుయొక్కయు కోరికలు,'' అనుటలో ప్రియపాఠకులారా! కోరికలు శరీర సంబంధమును మనస్సు సంబంధమని వివరించబడి యుండుటలో - శరీర కోరికలనుగూర్చి తినుట, త్రాగుట, సుఖించుట, అలంకారాలు, ముస్తాబులు కూడబెట్టుకొనుట, కామవాంఛలు, దుర్‌వ్యసనాలు ఇవి అన్నియు శరీర సంబంధమైన మనస్సుయొక్క కోర్కెలు. స్త్రీ వ్యామోహము, ధనవ్యామోహము, నేత్రాశ అనగా కంటికి కోరినవన్నియు అనుభవించాలన్న మనోచింతన, ఇది మహాభయంకరమైన మానసికస్థితి, దైవత్వము క్షమింపరానిది, దైవత్వము ఓర్వలేనిది, దైవశిక్షకు పాత్రమైనది. నరకాగ్నిలో నరజీవితమును బుగ్గిపాలు చేసేటటువంటి స్థితి అనగా ఈ విధముగా ప్రవర్తిస్తుంటనుబట్టి ''కడమవారు అనుటలో దైవత్వములో వెలివేయబడినవారు త్రోసివేయబడినవారు. ఈ త్రోసివేయబడిన జాబితాలో ఉన్నవారెవరు? అనగా మొట్టమొదటగా యూదా 1ః6లో ''తమ ప్రధానత్వమును నిలుపుకొనక, తమ నివాస స్థలమును విడిచిన దేవదూతలను, మహాదినమున జరుగు తీర్పు వరకు కటిక చీకటిలో నిత్య పాశములతో ఆయన బంధించి భద్రము చేసెను,'' అని వ్రాయబడిన విధముగా దేవదూతలకు సహితము పై విధమైన తీర్పు ఉన్నట్లు తెలుస్తున్నది. ఆ విధముగా బంధింపబడిన దేవదూతలయొక్క స్థితి 2వ పేతురు 2ః4లో దేవదూతలు పాపము చేసినప్పుడు దేవుడు వారిని విడిచి పెట్టక, పాతాళలోకమందలి కటిక చీకటి గల బిలములలోనికి త్రోసి, తీర్పుకు కావలిలో ఉంచబడుటకు వారిని అప్పగించెను,'' అని వ్రాయబడినట్లు ప్రియపాఠకులారా! ఈ విధముగా ఈ దూతలు ప్రధానత్వము నిలుపుకోలేక మొదటివారు కడపటివారు అగుదురన్నట్టి వచనాన్నిబట్టి - ఈ ప్రధానత్వము పొందిన దేవదూతలు తమ పాపక్రియల వలన త్రోయబడిన వారితో నీచమైనవారుగ అల్పులుగ దైవత్వము చేత తీర్చబడినవారై, తమ స్వభావ సిద్ద గుణాతిశయములనుబట్టి దైవోగ్రతకు గురియై వారు అనుభవిస్తున్న శిక్ష - వారితో ఏకీభవించి, వారి క్రియాకర్మలలో పాలివారమైయున్న మనము జీవిస్తున్నప్పుడే దేవుడు మనపట్ల కనికరించి, ఆయన కరుణాసంపన్నుడు గనుక మన అపరాధములతో పాపములతో మనము చచ్చినవారమైయున్నప్పుడు ఆయనకున్న మహా ప్రేమ చేత క్రీస్తు చేత రక్షింపబడినట్లు తెలుస్తున్నది. కాబట్టి మనము కృప ద్వారా రక్షింపబడియున్నాము.
కనుక ప్రియపాఠకులారా! క్రైస్తవులమైన మనము విశ్వాసము ద్వారా కృప చేత రక్షింపబడు చున్నామన్న సంగతి మనము తెలిసికోవాలి. ఇది మనవల్ల కల్గింది కాదు. దేవునియొక్క వరమే, అది మన క్రియల వలన కల్గింది కాదు. కనుక మనము అతిశయపడుటకు వీలులేదు. మనము అతిశయ పడవలసినదంతయు ప్రభువును గూర్చియే.
..........
ఆత్మహత్య అనగానేమి?
మరణ పిలుపు లేకుండ పొందునట్టి కాలనిర్ణయము లేని చావు
.......
పాఠక మహాశయులకు గ్రంథరచయిత మనవి ః-
ప్రభువునందు ప్రియమైన సోదరీ సోదరులారా! ఆత్మ దేవుని నిధి నుండి ఆత్మ జ్ఞానముతోను, ఆత్మ ప్రబోధము మూలముగాను, ఆత్మబోధ మూలముగాను శరీరేచ్ఛలను విసర్జించి, కేవలము ఆత్మదేవుని యొక్క సాంగత్యమునే అభిలషించుచు ఆణిముత్యములవంటి అమూల్యమైన, ఆత్మదేవునియొక్క దైవవాక్య మర్మములను అందు దాగియున్న నగ్నసత్యమును ఆత్మ అను ఈ రెండవ భాగము రచించుటకు నేను ఎంతయో కృషి చేయుచు, ప్రస్తుత ఈ పుస్తక ముద్రణలో కాగితమును ప్రింటింగునకును ఉన్నట్టి ఆర్ధిక బాధలలో నేను చిక్కుకొని బహు వ్యయప్రయాసలతో ఈ ఆత్మ రెండవ భాగము అను ప్రతిని వెలువరించుటకు నన్ను ఆవరించియున్న అదృశ్య అంధకార శక్తులను, ప్రస్తుతము ఎదురు తిరిగి నాతో పోరాడుచున్న ఆర్ధిక శక్తితోను ఎదుర్కొని, ఇంకను వ్రాయవలసిన పరిశుద్ధ గ్రంథ నిజ దైవసత్యములను బయల్పరచుటకు ఉద్దేశించినవాడినైయుండియు ఆర్ధిక ఇబ్బందుల మూలమున వెనుకబడియున్నాను. పరిశుద్ధ గ్రంథములో మనము చదువుచున్నప్పుడు వాక్యములే కనబడుచున్నవి. అనగా ఈ లోకధర్మము చొప్పున బైబిలు ప్రార్థన పఠనము చేయుచున్నాను. కాని వాక్య ఆత్మ అర్థములను గ్రహించడము మనకు పట్టింపు లేకయున్నది. ఇట్టి నిజ దైవసత్యమును ప్రతి ఆత్మకును వెల్లడించి ప్రతి ఆత్మయు నశింపక నిజదేవుని సన్నిధిలో నిత్యజీవము పొందునట్లుగా ఆయత్తము అగుటకు గాను ఈ గ్రంథము వెలువరించడమైనది. ఈ నా కృషికి ఇంకను వెలవరించబడనున్న ఆత్మ మూడవ భాగము శరీర జీవాత్మల అనుబంధము; భూలోకము దాని క్రియలు; పరలోకము దాని మహిమలు; దేవుడెవరు? నరుడెవరు? ప్రవక్తలెవరు? ఇంకను ఎన్నియో దైవసత్యములను గూర్చిన మర్మములను బయల్పరచుటకు, ముందడుగు వేయుచున్న నన్ను కులమత జాతి సంఘ విభేదము లేక చదువ సోదరుడు సోదరీ! నా ఈ కృషికి తోడ్పడి నన్ను ప్రోత్సహించి, ఈ నా కృషిలో కావలసిన ఆర్థిక సహాయమును తోచిన రీతిగా అందించగలరని ప్రభువు నామమున మీకు మనవి చేయుచున్నాను. తండ్రి - కుమార - పరిశుద్ధాత్మలయొక్క కృపాకటాక్ష మహిమాన్విత ఆత్మీయ నడుపుదలలు మీకు తోడైయుండును గాక ! ఆమేన్.
ఇట్లు ప్రభువునందు మీ ప్రియరచయిత.
........
మరణకరమైన పాపము ః- మరణకరము కాని పాపము ః- హెబ్రీ 12ః2 మొదటి యోహాను 5ః16-17. ప్రియపాఠకులారా! బైబిలు సిద్ధాంతము ప్రకారము పాపమన్నది ఏకత్వముగాక పంచాంగములు కల్గి ఐదు విధములుగ ఐదు రకములైన గుణాతిశయములతో కూడి ఐదు విధములైన శిక్షలకు పాత్రమై యున్నట్లు వేదములో మనము తెలిసికోగలము. ఇప్పటివరకు మనము తెలిసికొన్నదొక్కటే అదియే పాపము లేక దోషము. బైబిల్లో కూడా పాపమని దోషమని అనేకచోట్ల ప్రవచింపబడియున్నది. అయితే పాపమునకు సరియైన నిర్వచనములు అందులో అణగారియున్న ఐదు గుణముల నామధేయములు వాటియొక్క ఫలములు, వాటి గుణాతిశయములు, వాటి ద్వారా దైవసన్నిధిలోను, మానవలోకములోను కల్గు శిక్షలను గూర్చి తెలిసికోవలసియున్నది.
పాపమన్నది జన్మపాపమనియు కర్మపాపమనియు వివరించబడియున్నది. ఇదిగాక అపరాధము అపచారము తప్పిదము అని మూడు గుణములను కలిపితే మొత్తము ఐదు పాపగుణములు మనకు బైల్పడగలవు.
ప్రియచదువరీ! మానవ దృక్పధములో దేవుని సన్నిధిలో ఆది నరజంట జేసిన ఫలభక్షణమన్నది బుద్ధి పూర్వకముగా దేవుడు బహుతీవ్రముగా శాసించినను, దైవశాసనమును అతిక్రమించి చేసిన ఈ క్రియ కర్మపాపము. ఆది నరజంటలో స్వతహాగా జన్మపాపము లేదు. వీరి ద్వారా సంక్రమించిన ఈ దైవ వ్యతిరేక క్రియ లేశ మాత్రమైనను దైవత్వమునకు స్థానము లేక దైవదర్శనానికి కనుమరుగై సర్పదర్శనానికిని సర్పవాక్కులకును, సర్పగుణాలకును, సర్పస్వభావమునకు, సర్పవిశ్వాసమునకు అతిసన్నిహితులై సంసిద్ధులైనందున, వీరినుండి జనించి దినదిన ప్రవర్థమానమై విస్తరించి జనసందోహముగ తరతరములు జీవించిన నరకోటినుండి నేటి తరమువారమైన మనవరకును, మనకున్న - మన సంతానములవరకును ఆదినరకోటి మూలమున జన్మించిన పాపము జన్మపాపమైయున్నట్లు కీర్తన 51ః5 నేను పాపములో పుట్టినవాడను. పాపములోనే నా తల్లి గర్భము తాల్చెనని దావీదు ప్రవచించినట్లు తెలియుచున్నది.
ఇందునుబట్టి ప్రతి మానవునికిని జన్మపాపమున్నది. ఆదినరజంట కర్మపాపము ద్వారా దైవత్వాన్ని కోల్పోయారు. నేటి నరకోటియైన మనము జన్మపాపము ద్వారాను మనము చేయు కర్మపాపము ద్వారాను, మృతతుల్యమైన జీవితమును జీవిస్తూ దైవత్వానికి పూర్తిగా దూరమై అనగా దైవదర్శనమేమిటో దైవత్వమన్నదేమిటో దైవశక్తి ఏమిటో దైవత్వములోకి వెళ్ళుటకు మార్గమేమిటో ఎరుగని స్థితిలో ఉండి, నామక్రైస్తవ జీవితము జీవిస్తూ లేక జీవములేని నిర్జీవములైన ప్రతిమలకును, మృతతుల్యమైన జీవరాసులకును అజ్ఞానముతో దేవుళ్ళని పేరుపెట్టి వాటికి ఆలయమును మందిరాలను కట్టి ఆరాధించబడే విగ్రహాలయొక్క పేర్లను - తమకును, తమ సంతానములకును నామకరణము జేస్తు - తల్లిదండ్రులేగాక బిడ్డలను సైతము జన్మపాపమునకు జన్మహక్కుగా జేసి జీవము లేని దేవుళ్ళ ద్వారా జరుగని తమ ప్రయత్నాలకు విఫలురై, నాస్తికులుగాను హేతువాదులుగాను, కమ్యూనిష్టులుగాను నేటి జనసందోహము తయారైయున్నదంటే ఇందుకు కారణము జన్మపాప ప్రభావమును, కర్మపాప ప్రోత్సాహమును, లోకము యొక్క ప్రేరేపణయు, నరునియొక్క ఆత్మీయ జ్ఞానము శూన్యమగుటయు దైవత్వమన్నది మానవునకు కనుమరుగగుటయుయై ఉన్నది.
కనుక సోదరా! సోదరీ! ఇట్టివారికి కనువిప్పు గల్గించి ఇట్టి నరకోటిలో ప్రబలియున్న జన్మ కర్మ పాపములనుండి రక్షణ విమోచన కల్గించి నిజదైవత్వమన్నదేమిటో నిరూపించుటకు అదృశ్యుడైయున్న దేవుడు నరులకు శాశ్వతముగా కనుమరుగైయున్న దేవుడు జన్మపాపము లేనివాడుగ కర్మపాపము లేనివాడుగ, నిర్దోషిగ నిష్కల్మషునిగ పరిశుద్ధునిగ, స్త్రీ పురుష పాపము లేనివానిగ లోకములో నరాకృతిలో జన్మించి నరకోటికే ఆశ్చర్యము గల్గించు విధముగ నరజ్ఞానమునకు అర్థముగాని రీతిలో - తనలో ఉన్న దైవశక్తిని ప్రత్యక్షపరచుటకై లోక ధర్మము చొప్పున స్త్రీ పురుషుల కలయిక లేకనే, ఆత్మ కలయికతో శారీరమును నరాకృతిని దాల్చి జన్మ కర్త పాపములేనివాడుగ ఈ లోకములో జీవించి లూకా 1ః35 ఆయనయొక్క జన్మలోని మర్మము బైల్పడుచున్నది.
ఇట్టి ప్రభువు జన్మకర్మ పాపములున్న నరకోటియైన మనకు మన అపరాధములతోను పాపములతోను తప్పిదములు అపచారములు జన్మపాపము కర్మపాపములు అను ఈ ఐదు పాపముల నుండి మరియు ఈ ఐదు పాపములు నరకోటిలో విస్తరించి జరిగించుచున్న అక్రమాన్నిబట్టి యేసుప్రభువు సిలువలో ఐదు గాయములతో నరునికున్న ఈ పంచ దోషములను పరిహరించదలచినట్లు మనము గ్రహించవలసియున్నది.
ఇట్లు లోకరక్షకుడైన యేసుప్రభువు తన పంచగాయముల ద్వారా వాటినుండి స్రవించిన రక్తము ద్వారా సంపూర్ణ విడుదల అనుగ్రహించినట్లు క్రైస్తవ వేదము ఘోషిస్తున్నను, క్రైస్తవ జీవితమెట్లున్నది? అనిన దానినిగూర్చి మనము తెలిసికోవలసియున్నది. యేసుప్రభువు పంచగాయములు పొంది తన రక్తము ద్వారా నరులకు విడుదల గల్గించినను నరుడు పై దోషము చేయక ఉన్నాడా? అన్నది తెలిసికోవలసి యున్నది.
ఇందులో క్షమించదగిన పాపము, క్షమించుటకు అర్హత లేని పాపమని రెండు రకాలున్నవి. మరణమునకు యోగ్యకరమైన పాపము మరియు యోగ్యకరము కాని పాపమని రెండు విధములు. అనగా చరపెట్టి విడుదల చేయడము అని రెండు పాపములున్నవి. 1. మరణమునకు యోగ్యకరమైన పాపమనగా చావైన పాపము. ఇది లోకరీత్యా హంతకులకు విధించు ఉరిశిక్ష. 2. చెరసాల 3. కొరడాదెబ్బలు లేదా వార్నింగ్ హెచ్చరించి క్షమించి వదలుట. 4. తాత్కాలిక ఖైదు 5. జుల్మానా ఇవి బైబిలులో విధించబడకపోతే నేటి ప్రజాబాహుళ్యములోని ప్రభుత్వాలలో నేటికిని ఈ శిక్షలు భూలోక ప్రభుత్వాల చేత అమలు పరచబడుచున్నవి. ఈ సందర్భములో వేదరీత్యా వేదభాగముల ద్వారా ఈ శిక్షలు ఎక్కడెక్కడ ఏయే సందర్భాలలో అమలు పరచబడినవో వీటికి దైవత్వమిచ్చు జవాబేమిటో మనము తెలిసికోవలసియున్నది.
ప్రియచదువరీ! ఆదికాండములో ఆదాము విషయములో ఆదాము చేసినది మరణకరమైన పాపము. ఎందుకనగా దేవుడు తినవద్దని బహుకఠినముగా ఆజ్ఞాపించిన నిషేధ ఫలమును దైవత్వమునకు ప్రతిగా మరియొక రూపముయొక్క వాక్కులను నరజంట ఏకముగా విశ్వసించి బుద్ధిపూర్వకముగా జేసిన ఈ మహాపాపమునకు దేవుడు మరణశిక్షను విధించినట్లును, దీని ఫలితముగ నరజంటకు దిగంబరత్వము నుండి శారీర సంరక్షణార్థము అనగా వారి దిగంబరత్వమునుగూర్చిన సిగ్గునకు ప్రతిగా బలి క్రియ జరిగించినట్లు, దేవుడు వారికనుగ్రహించిన చర్మపు దుస్తుల చరిత్ర వివరిస్తున్నది.
ఇందుకు దేవుడు ఇచ్చిన తీర్పేమిటంటే నేటి లోకరీత్యా ఉన్న న్యాయ స్థానములు విధించు శిక్ష కంటె కఠినమైన శిక్ష దేవుడు తన తీర్పులో విధించినట్లు ఈ క్రింది అంశముల ద్వారా మనము తెలిసికోగలము. నరజంట చేసిన దోషమును నరులు ఒప్పుకోక స్త్రీ మీద పురుషుడు - సర్పము మీద స్త్రీ నేరారోపణ జేసికొంటు తమ దోషములను కప్పి పుచ్చుకొనుటకు ప్రయత్నించినట్లును, దేవుడు సర్ప విషయములో విచారించగా సర్పము అచేతనమై భాషాజ్ఞానమును కుత్సిత జ్ఞానమును కోల్పోయి, దైవసన్నిధిలో నిరాధారముగ నిలబడగా దేవుడు సర్పమునకు విధించిన మొట్టమొదటి శిక్ష జీవిత ఖైదు. అనగా నీవు బ్రతుకు దినములన్నియు పొట్టతో ప్రాకి మట్టిని తింటూ జన బాహుళ్యమునకును వెలుగు ప్రపంచానికిని కనుమరుగై యుండెదవనియు, నీ సంతానమునకును స్త్రీ సంతానమునకును వైరము కలుగునని మీరు ఒకరినొకరు పరస్పరము కాటువేసుకొంటూ మరణభీతితో - మరణముతోను నాశన మగుదురని సర్పమునకు తీర్పు తీర్చినట్లు గ్రంథములో మనము చదువగలము.
ఇక స్త్రీకి ప్రసవ వేదన. పురుషుని మీద వాంఛ పురుషునికి బానిసయు గర్భవేదనతో దాని సంబంధమైన జాడ్యములతో కూడిన శిక్షను దేవుడు తన తీర్పులో స్త్రీకి విధించినట్లు తెలియుచున్నది. ఇక పురుషునికి నీవు బ్రతుకు దినములన్నియు నీ చెమటోడ్చి భూమిని దున్ని ఆహారాన్ని సంపాదించుకోవాలి. నీ నిమిత్తము భూమి శపించబడియున్నది. అది ఇక మీదట నీకు తన సారము నీయదు. నీవు బ్రతుకు దినములన్నియు దాని పంటను తిందువు అని పురుషుని కిచ్చిన తీర్పు విధించిన శిక్ష. ఇక వారిని తన సన్నిధియైన ఏదెనునుండి వెళ్ళగొట్టుచు మంచి చెడ్డ తెలివినిచ్చు ఫలమును భుజించిన ఈ నరజంట నిషేధఫల ప్రభావముతో జీవవృక్షఫలమును తిని నిరంతరము జీవించుచు, నిత్యము తనకు బద్ధవిరోధులై యుందురేమోయనియు మరణము లేక సజీవులై సదాకాలము జీవించుదురనియు దేవుడు యోచించి, ఆ జీవవృక్షముయొక్క మర్మమును నరజంటకు అంతు చిక్కనీయక వారిని భయభ్రాంతులుగా జేసి, ఉరుములు మెరుపులు పెనుగాలులతో కూడిన ప్రకృతి భీభత్సమును సృష్టించి ఏదెను నుండి వారిని వెళ్ళగొట్టినట్లు, దేవుడు మరణకరమైన పాపమునకు ఉన్న శిక్షయొక్క ప్రభావము వెల్లడించినట్లు ఈ వేద భాగముల ద్వారా మనము తెలిసికోగలము.
ఇక ఆది నరజంటయొక్క తొలి సంతానమైన కయీను తన తమ్ముడైన హేబెలును చంపి నరహంతకుడైనప్పుడు అప్పటి కాలములో న్యాయ స్థానములో న్యాయాధిపతులు లేనందున దేవుడే ఆ మర్డరు కేసులు - ఆ హత్యానేరమునకు తీర్పు తీర్చుచు, కయీనును దేశద్రిమ్మరిగా శిక్ష విధించాడు. అంతేగాని కయీను చేసిన హత్యానేరమునుబట్టి దేవుడు మరణశిక్ష విధించకుండ మరియు ఎవడును కయీనును తాను చేసిన మహాపాపమునకు హాని గల్గించకుండ, ఆతని కాక గుర్తు వేసినట్లుగా కూడా వేదములో మనము చదువగలము.
ఈ విధముగా హంతకుడైనట్టి కయీనును దేవుడు క్షమించి విడిచిన పుణ్యానికి కయీను తన యొక్క కుత్సిత స్వభావము చేతను పాపక్రియల మూలముగాను భూమిలో పాపనరకోటిని విస్తరింపజేసి భూలోకములో దేవునియొక్క దృష్టికి న్యాయము, నీతి, సభ్యత, యోగ్యత అన్నవి లేనే లేదన్నంతగా పాపాన్ని అక్రమాన్ని కయీను విస్తరింపజేశాడు. ఈ విస్తరింపజేయుటన్నది దైవసంతానమైన ఆదాము కుమారులను సైతము ఘోరాతిఘోరమైన పాపులుగా ఎంచబడునంత తీవ్రముగా ప్రబలినది.
ఇందునుబట్టి దేవుడు ఆనాటి జనకోటిలో ఒక కుటుంబమును నీతిమంతునిగాను, దేవునియందు భయభక్తులు గలవానినిగాను నిర్ధారించి, లోకములో ఉన్న నరకోటి యావత్తునకును ఒకే తీర్పు అనగా నరకోటికిని, భూమికిని, భూసృష్టికిని మరియు భూమిపైనున్న సమస్తమునకును ఏక కాలములో ఏక రీతిలో ఒకే శిక్ష నమలు జరుపుటకు తీర్మానించుకొని, ఈ శిక్షను నరులచేగాక దేవదూతలచేగాక దురాత్మలచేగాక, తాను ఏ ప్రకృతినైతే సృష్టించెనో ఆ ప్రకృతినే శిక్ష నమలు జరుపు నారినిగా ఎన్నుకొని, ఇందుకుగాను ఆకాశమునకును, జలమునకును, మేఘాలకును, గాలికిని ఆజ్ఞనిచ్చి, తన శిక్షావిధి నమలు పరచుటకు 40 దివారాత్రులు వాటి చేత ఎడతెరిపి లేకుండ క్రియ జరిగించినట్లు బైబిల్లో మనము చదువగలము. ఇది మూడవ శిక్ష. ఇది పాతనిబంధనలో మరణకరమైన మూడవ పాపము.
ఇంక నాల్గవది సొదొమ గొమొఱ్ఱాల నాశనము ఇందుకు కారణము - సొదొమ నివాసులు కామాంధులై కన్నుమిన్ను గానక కన్నులకు మదమెక్కి జరిగించిన కామ కార్యకలాపములను మహాపాపములు. అయితే ఇశ్రాయేలను తన ప్రజలను కూడా దేవుడప్పుడప్పుడు వారు చేయు అపరాధములకును, దోషములకును దండనగా వారిని ఫిలిష్తీయులు, ఐగుప్తీయులు వగైరా అన్యజనాంగమునకు బానిసలుగా వారిని అప్పగించి కొన్ని సంవత్సరములు అట్టి శిక్షలు వారికి విధిస్తు తిరుగా వారు మారుమనస్సు పొంది తమ దోషములను ఒప్పుకొని దేవుని సన్నిధిలో విజ్ఞాపన చేసినప్పుడు, మరల వారిని క్షమించి వారికి యదావిధిగ వారి రాజ్యమును వారికి అనుగ్రహించుచు, వారిని తనయొక్క క్రమశిక్షణలో నడిపించినట్లు వేదములో మనము చదువగలము.
ప్రియచదువరీ! ఇట్టి సమయములో నేటి న్యాయస్థానములో విధించు రీతిగా దేవుడు తనయొక్క శాసనాలను దశాజ్ఞలుగా స్థిరపరచి వాటిని రెండు రాతి పలకల మీద లిఖించి, తన జనాంగమైన ఇశ్రాయేలీయులు ఆ చట్టములను విధిగా ఆచరించునట్లుగా శాసించాడు. ఈ శాసనములను వ్యతిరేకించిన వారికి కొరడాదెబ్బలు, మరణశిక్ష, ఱాళ్ళతో కొట్టి చంపుట, సమాజమునుండి వెలివేయుట లేక ఏ ప్రాణి ద్వారా నష్టము కల్గిందో ఆ ప్రాణికి ప్రతిగా అపరాధము చెల్లించుట, ఒక నష్టమునకు నాలుగంతలుగా జరిమానా విధించు చట్టము దేవుడు అమలు పరచినట్లు బైబిలులో మనము చదువగలము. దేవుడే దీనిని తీర్పు తీరుస్తు బలుల రూపముగా ఈ శిక్ష నమలు జరిపినట్లుగా నిర్గమ లేవీ సంఖ్యా కాండములలో మనము చదువగలము. (పాపపరిహారార్థబలి. సమాధాన బలి) ఈ విధముగా పాతనిబంధనలో అనేక వేదభాగములలో దేవుడక్కడక్కడ నరులకిచ్చిన తీర్పును మనము చదువగలము.
ఇంక క్రొత్తనిబంధనలో దేవుడు దేవునిగా ఉండి తీర్పు తీర్చుట మాని, దైవత్వమను అదృశ్య రూపమును, మహిమను, సంపదను, భోగభాగ్యమును, సర్వోన్నతమైన స్థలమును, నిర్విచార సామ్రాజ్యమును, సమాధానకరమైన పరలోకమును పరిశుద్ధ దూతగణములతో కూడిన సావాసమును, పరిచర్యను వదలి దిక్కులేనివానిగ, అనాధగ నిరాధారణ పూరితమగు వాతావరణములో మారుమూల ప్రదేశములో నిండుచలి ఎన్నికలేని స్థితిలో - దైవనరపుత్రునిగ దైవ నరాకృతిని దాల్చి నరరూపములో - ఈ లోకములో ఎదిగి దినదిన ప్రవర్థమానమై అనేక దైవమహత్తర క్రియలు జరిగించెను.
లోకస్థులు ఆయన మీద నిందారోపణ చేసి దోషిగా చేయుటకు సంకల్పించి ఆయనను యోహానిచ్చే బాప్తిస్మము పరలోకము నుండి కల్గిందా? లేక భూలోకమునుండి కల్గిందా? గుడ్డివాని విషయములో ః- ఇతడు గుడ్డివాడగుటకు ఇతడు చేసికొన్న పాపకర్మా? లేక ఇతని తల్లిదండ్రులు చేసిన పాపమా? అని ఆయనను అడుగుట. వ్యభిచారములో పట్టుబడిన స్త్రీని గూర్చి ఆయనకు విన్నవిస్తూ - మోషే ధర్మశాస్త్ర ప్రకారముగా వ్యభిచారిని ఱాళ్ళతో కొట్టాలి. అయితే ఈమెకు నీవిచ్చు తీర్పేమిటి? అని ఆయనను అడుగుట, ఆయన చేయుచున్న స్వస్థత కార్యములను జనులు ఆయనను విమర్శించుట. ఏ అధికారముతో నీవు ఈ పనులు చేయుచున్నావని ఆయనను నిలదీసి అడుగుట. ఒకడు ఆత్మ మూలముగాగాని, నీటి మూలముగాగాని జన్మించాలని ఆయన అన్నప్పుడు ముసలివాడైన నరుడు మరల తల్లి గర్భములో ఎట్లు జన్మించగలడని ఆయనను నిలదీసి అడుగుట, 12 ఏండ్ల రక్తస్రావరోగి విషయములో ః- కుమారీ! నీ పాపములు క్షమించబడియున్నవని ఆయన అనుట. పక్షవాయువు గలవానితో నీ పాపములు క్షమించబడియున్నవి. లేచి నీ పరుపెత్తుకొని నడువుమని ఆయన తీర్పు ఇచ్చుట; లోకరీత్యా పాపియైన జక్కయ్యను అబ్రాహాము కుమారుడుగా తీర్పు యిచ్చుట. సిలువ మీది దొంగకు తీర్పు తీర్చుచు ఆయనతో కూడా పరదైసుకు కొనిపోవుట వగైరా సంఘటనలు దేవుని తీర్పునకు, తండ్రియొక్కయు కుమారుని యొక్కయు తీర్పులు.
మూడవ అంశమైన పరిశుద్ధాత్మునియొక్క తీర్పేమిటో మనము తెలిసికోవలసియున్నది. అననీయ సప్పీరాల విషయములో దైవత్వమునకు ఇవ్వ నిర్ణయించిన తమయొక్క అర్పణలలో వారు చేసిన తప్పిదము మరణకరమైన పాపముగానే భావించుదము. ఎట్లనగా ఆస్థివారిదే, పాలము వారిదే, అమ్మినది కూడా వారే, దానిని దేవునికి సమర్పించదలచుకొన్నది వారే. వారు ఇవ్వదలచుకున్న ఆ మొత్తము వారి స్వాధీనములో ఉన్నది. పరిశుద్ధాత్మ దేవుని సన్నిధిలో వారియొక్క ఆస్థి విక్రయ రుసుమును చెల్లించవలసియుండగా పరిశుద్ధాత్మ దేవుని అలక్ష్యము జేసి, భార్యాభర్తలిరువురు ఏకకాలములో ఏక నిర్ణయముతో సాతానుయొక్క ధనాశగుణముతో ఏకీభవించి, సమస్తమును సమర్పించుకోవలసియున్న తమ నిర్ణయమును మార్చుకొని, ధనవ్యామోహముతో దైవత్వాన్నే అంధత్వముగా భావించి, అంధుడైన నరునిగా పరిశుద్ధాత్మ దేవుని తలంచి, ఆయన చూడలేదన్నట్లుగా భావించి, అపొస్తలుల పాదముల చెంత కొంత ఉంచి అబద్ధము పలికి అకాల మృత్యువునకు పరిశుద్ధాత్మ దేవుని చేత తీర్పు పొందుట ఇందు గమనార్హము.
ఇంక అపొస్త 9ః లో క్రైస్తవ్యాన్ని క్రీస్తుయొక్క సువార్త ప్రకటనను, దాని వ్యాపకమును నిరోధింప నెంచి సౌలు బహుఖచ్చితమైన కఠినముతో కూడిన దృక్పధములో క్రైస్తవులను హింసించుటకును, చెర పెట్టుటకును, వధించుటకును, బహుపట్టుదలతో కూడిన కార్యక్రమానికి తలపడి, తనకున్న హక్కు చాలదని మరెక్కువ అధికారాలు సంపాదించి ఘోరాతిఘోరముగా క్రైస్తవ్యాన్నే మట్టుపెట్టాలని తలచినవాడై, అందుకు కావలసిన అధికారాలతో కూడిన పత్రములను, మంది మార్భలమును, ఆయుధములు, వాహనాలను పొందినవాడై సంచరిస్తున్న సమయములో - పరిశుద్ధాత్మ దేవుడు ఆయనను మొత్తి క్రైస్తవ్యమన్నదేమిటో క్రైస్తవ సిద్ధాంతమెటువంటిదో క్రైస్తవ రాజ్యముయొక్క ప్రభావమెట్టిదో - భూలోక సామ్రాజ్యము, దానియొక్క అశాశ్వత గుణాతిశయము లెట్టివో నిరూపించుటకు సౌలును మొత్తి అంధునిగ జేయుట.
అటుతర్వాత అననీయతో పరిశుద్ధాత్మ దేవుడు సంభాషించిన విధము. పౌలుతో పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడిన విధానము కొర్నేలి విషయము, పేతురుకు గల్గిన దుప్పటి దర్శనమునుగూర్చి మనమాత్మీయముగా ఆలోచిస్తే - యేసుక్రీస్తు అందరికి ప్రభువని, పరిశుద్ధాత్మ దేవుడు అందరిలో ఉన్నాడని, ఆయా సమయాలు, సందర్భాలు, సంఘటనలనుబట్టి పరిశుద్ధాత్మ దేవుడు వారి వారి క్రియల చొప్పున తీర్పు తీర్చుటకు సమర్ధుండని ఋజువు కాగలదు. చెరసాలలో బంధింపబడియున్న పేతురు విషయములో సంఘమంత ఒకచోట కూడి ప్రార్థించి, అదృశ్య దేవునియొక్క సహాయమును అభ్యర్థింపగా - పేతురు సంకెళ్ళు ఊడుటయు, ఆతని బంధవిముక్తునిగా జేసి, పేతురు చెరసాల నుండి విడుదలగునట్లు తీర్పు తీర్చుటన్నది పరిశుద్ధాత్మ దేవుని నిర్ణయముగా మనము భావించవలసియున్నది. పేతురుకు గల్గిన ఈ విడుదల సందర్భములో హేరోదు ఉగ్రుడై, పేతురు తప్పించుకొని పోకుండ ఏర్పాటుజేసిన కాపలాదారులగు రక్షకభటులను పేతురు నిమిత్తము మరణతీర్పు విధించి వారిని చంపినట్లు వేదములో మనము చదువగలము. ఇది సాతానుయొక్క తీర్పు.
ఇంక పేతురు విషయములో ఆయన నీడ సోకిన రోగులకు స్వస్థత, ఆయన వాక్కుల ద్వారా మృతులు సజీవులగుట వగైరా దైవమహత్తర క్రియలు పరిశుద్ధాత్మ దేవుడు జరిగించి యేసుక్రీస్తు శిష్యులుగా ప్రతిష్టించబడిన అపొస్తలులను దైవ పరిశుద్ధులుగా తీర్పుతీర్చినట్లు ఈ అపొస్తలుల చరిత్ర వివరిస్తున్నది. అదే విధముగా పౌలుయొక్క చరిత్రలో కూడా పౌలు చనిపోయినవారిని బ్రతికించుట, అజ్ఞానులను జ్ఞానవంతులుగా తీర్పు తీర్చుట వగైరా సంఘటనలు నూతన వేదములో చదువగలము.
ప్రభువునందు ప్రియచదువరీ! ఒక్కమాటలో చెప్పాలంటే ఎంతటి ఘోరపాపినైన దైవత్వము క్షమిస్తున్నదిగాని ఒకటి రెంటికేగాని, దినమును పాపక్రియలు జేయుచు, దినమును పాపక్షమాపణ కోరుటన్నది దేవుని వెక్కిరించుటయేగాని, అది యదార్థమైన ప్రార్థన కార్యము కాదు. తెలియక ఎన్నో తప్పులు చేసి ఉండవచ్చునుగాని తెలిసిన తర్వాత దానిని మానవలెను. ఇది బైబిలు వివరించే సత్యము. లోకరీత్యా మనము చేయుచున్న పాపాలు, అక్రమాలను కప్పిపుచ్చుకొనుటకు అబద్ధ సాక్ష్యాలతోను, వకీళ్ళ కుయుక్తులతో నిర్ధోషులమని భూలోక న్యాయస్థానములో తీర్పు పొందవచ్చునుగాని, సూర్యుని క్రింద విస్తరించియున్న విశాల ప్రపంచములో దేవునియొక్క కనుదృష్టిలో ఏ నరుడు ఎప్పుడు ఎక్కడ తప్పించుకొన్నట్లుగాని, తప్పించుకొనుటకు అవకాశమున్నట్లుగాని వేదములో పాత క్రొత్త నిబంధన గ్రంథములో ఎక్కడను లేదు. అయితే నేటి క్రైస్తవ రక్షణలో విశ్వాసులుగా తీర్చబడియున్న క్రైస్తవులమైన మనము - రానున్న ప్రభువు రాకడలో మధ్యాకాశములో జరుగబోవు ''యేసు యెరూషలేమను వధూవరుల వివాహ మహోత్సవములో మొదట గొర్రెపిల్ల విందు, ఆ తర్వాత రెండవ కొరింథీ 5ః10 తాను దేహముతో జరిగించిన వాటి నిమిత్తమై క్రీస్తు న్యాయపీఠము ఎదుట నిలువబడి తీర్పు తీర్చబడుటకు ఒక దినము రానైయున్నది.
కనుక ప్రియచదువరీ! మనము చేయుచున్న క్రియలు అవి మంచివో చెడ్డవో మనమే నిర్ణయించుకొని, రానున్న ప్రభువు రాకడకు నిరీక్షించాలని దైవగ్రంథము మనలను హెచ్చరిస్తున్నది. క్షమించదగినదిగాని, క్షమించ తగనిదిగాని, అది అపరాధముగాని, పొరబాటుగాని, అపకారముగాని మానవుడు క్రియాత్మకముగా చేయు ప్రతి పని దైవసన్నిధిలో పాపమే. ఆయన యావద్ సృష్టికి తండ్రి కాబట్టి క్షమించుటకు అధికారము పొందియున్నాడు. మనమాయన సృష్టించిన సృష్టము కాబట్టి క్షమించుటకు ఒప్పుకోలేక పోవుచున్నాము. ఇదియే మనకు దైవత్వమునకు ఉన్న తేడా - కనుక ఈ పుస్తకము చదువుచున్న నీవు ఓపికతో దైవతీర్పులో మంచి సాక్ష్యము పొందుటకు ప్రయత్నించుము. ఆమేన్.
.....
దేవుడంటే ఎవరు? ఆయన గుణలక్షణము లేవి? అను అంశము ఇందులో ముఖ్యము ః-
ఏక సత్యదేవుడు. స్వయంభవుడు, స్వయం ప్రత్యక్షత నిచ్చువాడును, సర్వాంతర్యామి, నేనేయని చెప్పువాడును, తండ్రి కుమార పరిశుద్ధాత్మ అను త్రియైక దేవుడుగా ప్రత్యక్షపరచబడియున్నారు. అయితే దేవుడు ఒక్కడే! ద్వితీయోపదేశకాండము 6ః4లో మార్కు 12ః29లో అద్వితీయుడు యెషయా 43ః10-11లో నేను నేనే! నేను తప్ప ఎవరు లేరు. మత్తయి 28ః19లో తండ్రి కుమార పరిశుద్ధాత్మ'' దేవునియొక్క శక్తిని ఉనికిని ఋజువుచేయు బైబిలును గూర్చి నాస్తికుల వాదన బుద్ధిహీనముగా ఎంచవలెను. కీర్తన 14ః1లో చూడుము. పదార్థ సిద్దాంతమును గూర్చిన విషయమును బైబిలు వ్యతిరేకించును. అనగా చచ్చినవాడు తక్కెడో బిక్కెడో అను మూర్ఖ సిద్ధాంతమునకు వ్యతిరేకము. ఎఫెసీ 4ః6లో అందరికి తండ్రి ఒకరున్నారు. యెషయా 40ః20 దేవుని గుణలక్షణములనుగూర్చి ఈ అధ్యాయమంతయు వ్రాయబడి యున్నది. అటుతర్వాత యోహాను 4ః24లో ఆయన ఆత్మ - ఆయనను ఆత్మతో సత్యముతో ఆరాధించాలి. అనేక దేవుళ్ళ సిద్ధాంతమును బైబిలు ఖండిస్తున్నది. పరమత దూషణ పనికి రాదు. గ్రామదేవతలు, కులదేవతలు వగైరా అనేక దేవతలున్నను దేవుడు ఒక్కడే! ఆయన యేసు అను నరరూపము. హెబ్రీ
1ః3లో దేవుని తేజస్సు, మూర్తిమత్వము పొంది దేవుని కుడిపార్శ్యములో ఉన్నాడనుటలో దేవుడు పూర్ణత్వముతోబాటు కొంత మానవత్వమును కలిగియుంటున్నట్లు కొన్ని వాక్యముల ద్వారా తెలియుచున్నది. కొలస్స 1ః15లో ఋజువగుచున్నది. దేవుడు నరుని సృష్టించి భూమిమీద మనతో సంబంధము లేకుండా ఉన్నాడను సిద్ధాంతమునకు బైబిలు వ్యతిరేకి. కీర్తన 34ః15లో దేవుడు నీతిమంతులను దృష్టించుచున్నట్లు తెలియుచున్నది. కీర్తన 46ః1లో ఆశ్రయ దుర్గము, ఆపత్కాలములలో మనలను విడిపించువాడు. మత్తయి 10ః29లో తండ్రి సెలవు లేక ఏదియు జరుగదు. మత్తయి 28ః20లో చూస్తే ఆయన ఆదిలో తండ్రి రూపముగా ఉండి చేసిన క్రియలు కుమారుని రూపములో నుండి చేసిన క్రియలు; పరిశుద్ధాత్మగా యుండి చేసిన క్రియలు బైబిలు బాహాటముగా వివరిస్తున్నది. దేవుడు సకల సృష్టికిని ఆధారసంభూతుడు. మరియు సమస్తమును ఎరిగినవాడు. అన్ని విషయాలలో పరిపూర్ణత కలిగినవాడు. ఆయనకు అవతారమంటూ లేక హీనమైన అవతారములను ధరింపక, హెబ్రీ 1ః2-3లో వలె ఆయన క్రీస్తు ద్వారా ప్రత్యక్షపరచబడి మాట్లాడినట్లు తెలియుచున్నది. యోహాను 1ః18లో ఎవడును ఎప్పుడును చూడలేదు. కనుక కుమారుని ద్వారా ప్రత్యక్షమయ్యెను. 1 తిమోతి 6ః15లో రాజులకు రాజు ప్రభువులకు ప్రభువునై తేజస్సులో అమరత్వమును కలిగియున్నాడు. ఫిలిప్పీ 2ః4లో క్రీస్తు దేవుని స్వరూపము కలిగియుండి మనష్యుని పోలికగా పుట్టి దాసుని స్వభావము కలిగి, తన్ను తాను రిక్తునిగా చేసుకొని ఈ లోకములో జీవించినట్లు తెలియుచున్నది.
........
యోహాను వ్రాసిన మొదటి పత్రిక 1ః5 దేవుడు వెలుగైయున్నాడు. ఆయనయందు చీకటి ఎంత మాత్రమును లేదు. అయితే భూమి నరులు వీరిరువురి విషయమేమిటో తెలిసికోవలసియున్నది. ఆది 1ః1-3 భూమి ఏ విధముగా జలగర్భములో చీకటిలో వుండినదో నరునియొక్క నిర్మాణము కూడా నిరాకారములో చీకటిలో గర్భజలములో తొమ్మిది మాసములు అశక్తముగాను, అంధత్వముతోను, దిగంబరత్వముతోను, సూక్ష్మరూపములో ఏర్పడి పరమాత్మ నిర్ణయము చొప్పున నిర్ణీత కాలములో - ఈ లోకములోనికి ప్రసవింపబడుచున్నాడు. అదే విధముగా భూమి కూడా పరమాత్మ నిర్ణయము ప్రకారముగానే జలములు అను స్త్రీలో భూమి, లూసీఫర్ అను అపవాది ఇరువురు కవలపిల్లలుగా పరమాత్మయొక్క నిర్ణయములో జన్మించబడినవి. ఒక తండ్రి క్రొత్తగా జన్మించిన బిడ్డను ఏ విధముగా వస్త్రములతోను, సుగంధ ద్రవ్యములతోను, పుష్టికరమైన ఆహారముతోను, అలంకారములతోను, పరిశుభ్రమైన వాతావరణములోను, దాసదాసీ జనులతో ప్రేమిస్తాడో అదేరకముగా దేవుడు శిశువును పోలి, నిరాకార శూన్య పరిస్థితిలో ఉన్న భూమిని జలములనుండి తీసి, దాని సహచరుడైన అపవాదిని కూడా ఇరువురిను తీసి భూమిని చిత్రవిచిత్రములైన ప్రకృతితతో అలంకరించి పలువిధములైన జంతుసందోహములతోను ఫలపుష్ప వృక్షాదులతోను, పర్వత పంక్తులలోను దానిని అలంకరింపజేసి దానికి రూపురేఖలు దిద్దుటకు ఆది 2ః15లో వలె నరుని కావలిగాను మెరుగుపరచు పనివానిగాను సృష్టించి, భూమియను ఆ శిశువులో ఏదెను అనునొక సుందరవనమును నిర్మించి, దానిలో ఫలవృక్ష నిషేధము అనునొక నిబంధనతో కూడిన శిఖవంటి నిబంధన అను వృక్షమును నిర్మించి, అందులో నరుని మరణపాత్రునిగ చేయు మణులు వజ్రములవంటి వృక్షఫలములను ఫలింపజేసి వాటికి చీకటి వర్తకుడనెడి అపవాది ద్వారా ఉచితముగ అమ్ముడై పోయినట్లుగా దేవుడు యెషయా 50ః1లో వలె బాధపడుచున్నాడు. ఇందునుబట్టి దేవుడు క్రీస్తు రూపములో తన రక్తమనెడి క్రయ ధనముతో మరల కొనవలసిన దుర్భర పరిస్థితి మన వలన కల్గినది.
అయితే క్రీస్తుముందా? భూమిముందా? బైబిలు సిద్ధాంతము ప్రకారముగా వెలుగు ముందు ఎఫెసీ 1ః6 అయితే క్రీస్తు ముందుగా నిర్ణయించబడినాడు. బైబిలు సిద్ధాంతము ప్రకారము నరుడు పంచముడు మొదట భూమి తర్వాత వెలుగు అటుతర్వాత సృష్టి, ఆ తర్వాత వాతావరణము ఆ తదుపరి నరుడు. భూలోకములో పంచముడు అంటే హరిజనుడుగా ఎంచబడుచున్నాడు. అయితే దైవసన్నిధి నరజన్మనే నరుడైన వానినే పంచముడుగా ఎంచుచున్నది. ఎట్లంటే పాపాన్ని మ్రింగి దానిని హరించుకొని గర్భమున దాల్చి, నాటినుండి నేటి వరకు పిత్రార్జితమైనట్టి ఆ పాపము అను ఫలమును తాను మ్రింగి జీర్ణము చేసికొని, పుట్టే ప్రతి బిడ్డకును దాన్ని పంచి హరింపజేయుచున్నాడు. కనుక వీడు హరిజనుడు అనగా సమస్తమును హరించినవాడు. యెయె 16ః1-14 లోని చీకటి దోషమును దాని సంబంధులైన సమస్త నరదోషమును హరింపనెంచి దేవుడే హరిజనుడై మానవులకు సాక్ష్యాత్కరిస్తే కొలస్స 1ః15 అదృశ్య దేవుని స్వరూపి - ''ఇతనిని వెనుకబడిన కులమునకు చెందినవాడనియు బలహీన వర్గమునకు చెందిన వాడనియు (నీవు దయ్యము పట్టినవాడవనియు) ద్వేషించి హీనునిగా చేసి సిలువ మరణము పాల్జేసింది ఈ లోకము. ఈయనను హీనునిగా చేసిన అత్యంత హీనులైన నరజాతి తనకున్నట్టి పంచదోషముల నుండి క్రీస్తు పొందిన పంచ గాయములను చూచి కూడా మారుమనస్సు పొందలేకున్నదంటే నరునియొక్క దోషము దేవుని సన్నిధిలో ఎంత భరింపరానిదిగా ఉన్నదో మనము గుర్తింపవలసినవారముగా ఉన్నాము.
అయితే పంచముడైన నరునిబట్టి యేసుక్రీస్తు ఏడు మాటలు సిలువ మీద మాట్లాడుటలో ఉన్న దైవ నగ్నసత్యమేమిటో మనము గుర్తింపవలసినవారముగా ఉన్నాము. ఇందులో 1. మొదటి మాట తండ్రీ! వీరేమి చేయుచున్నారో వీరెరుగరు ''నరశరీరమునకు ప్రాణాధారమైన సృష్టికి జీవాధిపతి నేనని వీరెరుగరు. కనుక వీరిని క్షమించుము. 2. నేడు నీవు నాతో కూడా పరదైసులో ఉందువు. పరదైసు అనగా నరుని కోసరము నిర్మించిన ఉద్యానవనము. ఆదాము దేవుని సన్నిధి దైవ ఉద్యానవనములో ఉన్నట్లుగ ఈ మాటలోని భావము మనకు తెల్పుచున్నది. 4. అమ్మా! ఇదిగో నీ కుమారుడు - ఇదిగో నీ తల్లి - ఆదామునకు హవ్వ కుమార్తె ఆమెతో పాప బీజమునకు పునాది వేయువాడుగ తయారైనాడు. మొదట సాటి సహాయముగా స్త్రీని సృష్టించుటలో ఆదాము నుండి తీయబడుటలో కుమార్తెయు, దైవ నిర్ణయమునుబట్టి భార్యగను ఆమె నిర్ణయించబడింది.
వ్యాఖ్యానము మొదటి కొరింథీ 3ః1-3
సహోదరులారా! ఆత్మ సంబంధులైన మనుష్యులతో మాటలాడినట్లు నేను మీతో మాటాలాడలేక పోతిని. శరీర సంబంధులైన మనుష్యులేయనియు క్రీస్తునందు పసిబిడ్డలేయనియు మీతో మాటలాడవలసి వచ్చెను.
ప్రియపాఠకులారా! పై వేదభాగములో మూడు విధములైన మనుష్యులను గూర్చి ప్రకటిస్తున్నది. ఇందులో ఆత్మసంబంధులు - వీరు ప్రధములు. 2. శారీర సంబంధులు - వీరు దృశ్యమైనవాటిని, లోక సంబంధమైన వాటిని లోకసంబంధమైన పరిజ్ఞానమునకు అలవడి శరీరానికి అంకితమైనవారు. ఇక మనుష్యులు,'' అనుటలో లోకమునకు అంకితమైన నరులు అనగా శరీరానుసారముగా శారీర లావణ్యమునకు అందచందాలకు ఐశ్వర్యాలకు బానిసలై లోకాన్ని ప్రేమించుచు - పరలోక సంబంధమైన ఐశ్వర్యములను అదృశ్యములో ఉన్న వాటిని గూర్చిన జ్ఞానమును ఎరుగనివారును, ఆత్మీయదృష్టి కోల్పోయి ఆత్మీయాంధులైనవారు.
''క్రీస్తునందు పసిబిడ్డలు'' అనుటలో క్రైస్తవులుగా ఉండి అన్ని శాస్త్రములను, అన్ని ఆరాధనలను, అన్ని సాంగ్యములను, అన్యాచారములను పాటిస్తూ క్రైస్తవులమని చెప్పుకొనుచు క్రీస్తులో తాము జీవిస్తున్నట్లే క్రైస్తవుల ఎదుట వేషధారణలో జీవించువారు. ఇట్టివారు పసిబిడ్డలు అనగా ఏమియు ఎరుగని జ్ఞాన శూన్యులని భావము. ఈ మూడు తరహా నరులతో పౌలు మాట్లాడుచున్న మాటలివి. ఇందులో రెండవ వచనము ః- ''అప్పటిలో మీకు బలము చాలనందున పాలతోనే మిమ్మును పెంచితినిగాని అన్నముతో మిమ్మును పెంచలేదు. మీరింకను శరీరసంబంధులై యుండుట వలన ఇప్పుడును మీరు బలహీనులైయున్నారు. కాదా! అనుటలో ఈ బలహీనుల కోవకు చెందినవారే పసిబిడ్డలు.
ప్రియపాఠకులారా! బలము చాలని బిడ్డలకు పాలే పౌష్టికాహారము, పాలు త్రాగువాడు పసిబిడ్డయే! మన పూర్వీకుల స్థితిని మనమాలోచిస్తే - మన పూర్వీకులు కూడా క్రీస్తునెరుగని స్థితిలో పసిబిడ్డ గుణలక్షణములతో జీవించినట్లు మనము గ్రహించాలి. పాలు త్రాగుటన్నది ఏమి ఎరుగని స్థితియు, ఆత్మజ్ఞానము లేని వయస్సనియు, మానవత్వము లేని కాలమని ఇందునుబట్టి మనము తెలిసి కోవలసియున్నది. వేదరీత్యా ఈ విధముగా శారీర సంబంధులై జీవించినవారిని - ఆత్మ సంబంధముగా జీవించినవారిని, పసిబిడ్డయొక్క గుణాతిశయములతో జీవించినవారినిగూర్చి తెలిసికొందము.
ధనవంతుడొకడుండెను. అతడు ఊదారంగు బట్టలును, సున్నపు నార వస్త్రములను ధరించుకొని ప్రతిదినము తినుచు త్రాగుచు బహుగా సుఖించినాడు. ఇతడు శారీర సంబంధి. అదే విధముగా యేసుప్రభువు జన్మ కాలములో యేసుయొక్క జన్మవార్తకు హేరోదు కలవరము జెంది, తన పరిపాలనకు విఘాతము ఏ విధముగానో ఏర్పడుతుందని ఆగ్రహించి, తన రాజరికాన్ని కాపాడుకోవాలని యూదుల రాజును అంతముజేసే ఉద్దేశ్యముతో రెండేళ్ళ లోపు మగశిశువులను తన స్వార్థము కోసము వధించినట్లుగా పై వేదభాగములో చదువగలము. అదే విధముగా ఏశావు శారీర సంబంధియై జిహ్వచాపల్యము చేత తన జ్యేష్టత్వాన్ని కూటికి ధారబోసుకున్నాడు. ఇది శారీర సంబంధముగా మానవత్వానికేర్పడిన అరిష్టము. అదే విధముగా అననీయ సప్పీరాలు తాము తమ స్వంత కయ్యను అమ్ముకొని అందులో పదియవవంతు దేవునికి అర్పించవలసియుండగా అందుకు ప్రతికూలముగ భార్యాభర్త లిరువురు కొంత ధనమును దాచుకొని శారీర సంబంధులై ధనాశ లోకాశల మూలముగా అబద్ధము మాట్లాడి మరణవాత పడినారు.
ఇక ఆత్మ సంబంధులు ః- స్తైఫనుయొక్క చరిత్ర; ఆత్మ ద్వారా సుడిగాలిలో ఆరోహణమై నటువంటి ఏలీయాయొక్క చరిత్ర; అడవి తేనె, మిడతలను తీసికొని నిరాడంబర జీవితము జీవించి, యేసు రాకకును, ఆయన మార్గమునకు సాక్షిగా ఉన్న బాప్తిస్మమిచ్చు యోహాను చరిత్ర. యేసుప్రభువు యొక్క 12 మంది శిష్యులైన వారి ఆత్మీయ జీవితమును గూర్చిన చరిత్రలు. ఆత్మవశులైనవారికి కల్గు దర్శనాలు ఇందుకు సాక్ష్యము. దర్శనాల రూపముగా ప్రకటన గ్రంథమును రచించిన యోహాను వగైరాలను యేసుప్రభువు తన రక్తము ద్వారా కొన్నటువంటి ఆయన విశ్వాసులైన మనము ఇందుకు సాక్ష్యము.
''పసిపిల్లలు'' - పౌలు సౌలుగా ఉన్నప్పుడు పసిపిల్లవానివలె క్రైస్తవులను చంపుటకును బంధించుటకును, హింసించుటకును డమస్కువారి అధికార పత్రము అడుగుటన్నది పసిపిల్లవాని గుణ లక్షణములు మొదటి కొరింథీ 13ః11 పిల్ల చేష్టలు మానితివి'' అని అంటున్నాడు. ప్రియపాఠకులారా! యేసు ప్రభువును సిలువ వేసినప్పుడు ప్రభువుయొక్క దృక్పధములో యూదులు చేసిన పని పిల్లవాని చేష్టలుగా ఉండినట్లు ఆయన పల్కిన మొట్టమొదటి మాటలోని భావము - ఆత్మీయముగా మనము గ్రహించవలసియున్నది. ''తండ్రీ! వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించుము,'' అన్నది - ఇవి పసిబిడ్డలయొక్క క్రియగా దైవత్వము భావిస్తున్నది. సౌలుగా జీవించిన పౌలు చరిత్ర క్రీస్తులో పసిబిడ్డలు.
నేడు క్రైస్తవ్యములో జీవిస్తు క్రైస్తవులమని చెప్పుకొనుచు, క్రైస్తవ ఇతిహాసములతో కూడిన విగ్రహారాధన, ఊరేగింపులు, ఉపవాసాలు, వ్రతాలు అన్యుల వలె బొట్టు కాటుక వగైరా అలంకరణలు, అన్యుల వలె అన్య సాంగ్యములను అనగా తిధి వార నక్షత్రాలు, జాతకాలు వాస్తు శాస్త్రములు వగైరాలను ఆచరించడము.'' ఇవన్నియు కూడా క్రైస్తవ్యములో జీవిస్తూ పసిపిల్లలవలె పిల్లవాని జ్ఞానములో జీవించుట.
......
హెచ్చు తగ్గుల అంతస్థులను గూర్చిన ప్రసంగము ః-
ప్రభువునందు ప్రియసోదరీ! సోదరులారా! దైవరాజ్యము తన పాలనలో ఎటువంటి యోగ్యత కలవారిని కోరుచున్నది? అను అంశమునుగూర్చి తెలిసికొందము. యోహాను 3ః30 యోహాను తన్ను తాను తగ్గించుకొని యేసుప్రభువునుగూర్చి మాట్లాడి ఆయనను హెచ్చించినట్లు తెలియుచున్నది. తనను తాను హీనపరచుకొని లూకా 3ః16-17 తనను తాను తగ్గించుకొన్న విధానము చూచిన మనకెంతో ఆశ్చర్యముగా ఉంటుంది. యోహాను ఎవరు? యోహాను 1ః21-23 ఆయన కేవలము పరమాత్మునియొక్క శబ్దమైనట్లుగా తెలియుచున్నది. అయితే యేసుప్రభువు పరిశుద్ధాత్మరూపుడై పరమాత్మ నిర్మితుడై యుండి, తన దైవత్వమును తగ్గించుకొంటూ లూకా 7ః28 స్త్రీలు కనినవారిలో యోహాను కంటే గొప్పవాడెవడును లేడని చెప్పుటలో యోహాను గొప్పా? యేసుప్రభువు గొప్పా?
......
అంశము ః- వ్యక్తి స్వాతంత్య్రము ః- మానవ స్వాతంత్య్ర హక్కు.
అన్నిటియందు నాకు స్వాతంత్య్రము కలదుగాని అన్నియు చేయదగినవి కావు. అన్నిటి యందు నాకు స్వాతంత్య్రము కలదుగాని నేను దేని చేతను లోబరచుకొనబడనొల్లను.'' 1 కొరింథీ 6ః12.
ఇంతవరకును మనమెన్నో పరిశుద్ధ గ్రంథ వేద సాహిత్య మర్మాలు, దైవనిగూఢ సత్యాలను గూర్చి తెలిసికొని యున్నాము. అలాగే ఇప్పుడు కూడా వేదములోని అమూల్యమైన వాక్య సారాంశమునుగూర్చి తెలిసికొందము. పై వాక్యములో పౌలు వివరించిన రీతిగా దేవుడు నరుని స్వాతంత్రునిగా చేశాడుగాని బానిసగా పిరికివానిగా చేయలేదు. ఇందుకు తార్కాణము పాతనిబంధన ఆది 2ఃలో దేవుడు మానవుని పట్లను తాను సృష్టించిన లోకమునుబట్టి మానవ ప్రేమను అందులోని మానవునియొక్క జీవిత అవసరతలను బట్టి ఏదెను అను ఒక తోటను వేసి, తోట నిర్మాణ కార్యానంతరము నరుని నిర్మాణ ప్రణాళికను రూపొందించి, నేలమంటితో నరుని నిర్మించి వానిలో తన జీవాత్మ నుంచి నరుని జీవాత్మునిగ సృష్టించి, తన సృష్టియైన ఏదెను వనమంతటి మీద అతనిని కాపరిగాను, అధికారిగాను, వారసునిగాను ప్రతిష్టించి నరునికి సంపూర్ణ స్వాతంత్య్రము ఇచ్చి ఒక హెచ్చరిక ఇచ్చాడు. ఆదామా! ఈ తోటలోనున్న ప్రతి వృక్ష ఫలములను నీవు నిరభ్యంతరముగా తినవచ్చును. అయితే మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్షఫలములను తినకూడదు,'' అని శాసించాడు. ఆది 2ః16-17.
ప్రియపాఠకులారా! ఇందునుబట్టి మొట్టమొదటగా నరుడు కడు స్వతంత్రుడు. అంటే ఏదెను వనములోని ప్రతి చెట్టు మీదను, ప్రతి జీవి మీదను ఇతనికి అధికారమున్నది. ఒక్కమాటలో చెప్పాలంటే ఏదేను తోట అంతటిమీద ఆదినరునికి దేవుడు స్వాతంత్య్రపు హక్కు ఇచ్చాడు. కాని అందులోనేచేయకూడనట్టి పనిని గూర్చి హెచ్చరించి యున్నాడు. ఇందునుబట్టి నరుడు దైవసృష్టిలో స్వతంత్రుడే! అయితే దైవచట్టమును ఆయన చిత్తమును పాటించక వక్రబుద్ధితో ప్రవర్తిస్తే పతనము తప్పదు,'' అని దేవుడు నరునిపట్ల జరిగించిన ఏదెను చరిత్ర మనకు వివరిస్తున్నది. ఇందునుబట్టి నరుడు ఏదెనులో అన్నియు చేయవచ్చును. కాని చేయకూడని పని కూడా ఒకటి ఉన్నట్లు అదియే దైవనిషేధ ఫలభక్షణము అను క్రియ ఒకటున్నది. ఇట్టి ఫలభక్షణ క్రియ ద్వారా నరుడు దేవుని సన్నిధిలో ఉన్న స్వాతంత్య్రపు హక్కును, ఆయన తోటలోని వారసత్వపు హక్కును, అలాగే ఆయన రాజ్య ప్రవేశానికి అర్హతను కోల్పోయి, లోకదాసుడుగా స్వాతంత్య్ర విహీనుడుగా జీవిస్తూ లోకసంబంధ సంసార వ్యామోహము, కనక వస్తు ధనవ్యామోహము, సంసార బాధలు వగైరా రుణానుబంధములో చిక్కుకొని దేవుడు ఇచ్చిన స్వాతంత్య్రమును పోగొట్టుకొని, అస్వతంత్రుడుగా ఈ లోకములో జీవించుటన్నది ఏర్పడింది. ఇది ఆదికాండము చరిత్ర నరునికి అన్నిటియందు ఉన్న స్వాతంత్య్రమును దేవుడు అనుగ్రహించినను నరుడు దానిని నిలబెట్టుకోలేని స్థితిని గూర్చిన వివరము. అలాగే దైవజనాంగమైన ఇశ్రాయేలునకు దేవుడు సంపూర్ణమైన స్వాతంత్య్రాన్ని అనుగ్రహించి వారిని ఎక్కువగా ప్రేమించాడు. ఇట్లు దైవ ప్రేమ అను వలయములో జీవించిన ఇశ్రాయేలునకు సంపూర్ణ స్వాతంత్య్రాన్ని అనుగ్రహించాడు. కాని వారి అవిధేయ స్థితినిబట్టి వారు చేసిన దైవవ్యతిరేకతను బట్టి దేవుడు వారి స్వాతంత్య్రమును తొలగించి, వారిని అన్యులైన ఐగుప్తీయులు, ఫిలిష్తీయులు వగైరా అన్య జాతులకు వారిని బానిసలుగా చేసి అష్టకష్టాల పాలు చేశాడు. ఇందుకు కారణము ఇశ్రాయేలుయొక్క అవిధేయతయే. అలాగే దేవుడు తన జనాంగ రక్షణార్థము సంసోను అను వీరుని సృష్టించి అతనిని ప్రతిష్టించి నాజరు చేసి, తన జనాంగమైన ఇశ్రాయేలునకు న్యాయాధిపతిగా అనగా తీర్పరిగా ఉండుటకు సర్వసాతంత్య్రపు హక్కులతో అతనిని ఇశ్రాయేలు జనాంగముపై న్యాయకర్తగా నియమించాడు. ఇందునుబట్టి సంసోను లోకసంబంధి కాడు. దైవజనాంగమైన ఇశ్రాయేలు సంబంధియు, దైవజనాంగముయొక్క స్వాతంత్య్ర పరిరక్షణకు న్యాయ తీర్పరిగా దేవునిచే నియమింపబడిన స్వాతంత్య్ర వీరుడు. ఇట్టి స్వాతంత్య్ర వీరుడైన సంసోనుకు శారీర బలము - దేవుని ఆత్మ బలము మరియు శక్తి - ఈ మూడును ఆవరించి ఒక సంసోనుతో పదివేలమంది పోరాడినను చిత్తుగా ఓడిపోవుటయేగాక మరణవాత పడేటటువంటి మహాశక్తిని దేవుడు సంసోనునకిచ్చి స్వతంత్రునిగా జీవించమన్నాడు. ఆ విధముగా దైవసన్నిధిలో స్వాతంత్య్రపు హక్కును పొందిన సంసోను బహుగా విజృంభించి ఆయుధము లేకనే చేతితో పోరాడి శత్రు నిర్మూలము చేయుచు, దైవసన్నిధిలో ఒక ప్రత్యేకమైన స్థానాన్ని సంపాయించుకొన్నాడు.
కనుక ప్రియపాఠకులారా! ఇప్పుడు సంసోను కడు స్వతంత్రుడు, అన్నియు చేయగలడు. ఎట్లంటే ఆయుధము లేకుండ అడవిలో సింహాన్ని హతమార్చినాడు. ఆయుధము లేకుండగనే ఎంతోమంది వీరులను మట్టి కరిపించాడు. అలాగే గాడిద దవడ ఎముకతో వెయ్యిమందిని చంపి కుప్ప కూల్చినాడు. ఇట్టి బలాఢ్యుడైన స్వతంత్రుడైన వీరుడు దేవుడు చేయవద్దని నిషేధించిన స్త్రీ సాంగత్యము అను క్రియకు బానిసయై, తన బలాధిక్యతను గూర్చిన మర్మమును దేవుని సంకల్పాన్ని వేశ్యయైన స్త్రీలకు ధారబోసి, హీనాతిహీనమైన అంధత్వముతో కూడిన మరణాన్ని చవిచూచాడు, అలాగే కీర్తనాకారుడు, ప్రవక్త, మహారాజు జ్ఞానియైన దావీదు గొప్ప ప్రార్థనాపరునిగాను, కీర్తనాకారునిగాను, దేవునియందు భయభక్తులు గలవానినిగాను, దేవునితో ముఖాముఖిగ సంభాషించే యోగ్యత, స్వాతంత్య్రమును దేవుడు దావీదుకు అనుగ్రహించిన స్వాతంత్య్రపు హక్కు విలువ ఎలాంటిదయ్యా? అంటే దావీదు జీవించినంత కాలము మరియు ఇశ్రాయేలు అను దైవ ప్రజలను తన సైన్యముగా ఉంచుకొని రాజ్య పరిపాలన చేసినంత కాలము దావీదు స్వాతంత్రుని గాను, నిర్భయునిగాను, అపజయమెరుంగని వానినిగా జీవించాడు. ఒక్కమాటలో చెప్పాలంటే దావీదుకు జీవితములో అపజయమన్నదే లేదు. ఈ విధముగా దేవుడు దావీదును హెచ్చించుటయేగాక తన తోడ్పాటును తన సన్నిధిని దావీదుకు అనుగ్రహించాడు. ఇట్టి స్థితిలో దావీదు చాలా గొప్పగా హెచ్చించబడి, ఆనాటి రాజులలో అగ్రగణ్యుడుగా కీర్తిని సంపాయించాడు. అయితే ఈ విధముగా స్వాతంత్య్రపు హక్కును సంపాయించుకొన్న దావీదు తన స్వాతంత్య్ర జీవితములో గర్వించి, తన హృదయములో సాతానుకు చోటు దొరికి యుద్ధములో దేవుని సైన్యముతో ముందుండి పోరాడవలసిన దావీదు మహారాజు రాచనగరు అంతఃపురములో అతనిని విశ్రమింపజేసి, దావీదు జీవితములో చేయకూడని కార్యక్రమమునకు దావీదును ప్రేరేపించి అతని చేత - ''తన సైనికులలో ఒకడును, తనయందు భయభక్తులు నమ్మకము కల్గినవాడైన ఊరియా భార్యను మోహించి, ఆమెను చెరచుటయేగాక తనకు, తన పాపజీవితానికి అడ్డముగా ఉన్న ఊరియాను నిష్కారణముగా అన్యాయముగా చంపించుటన్నది దావీదుయొక్క జీవితములో చేయవలసిన పని కాదు. అలాగే దావీదు కుమారుడైన సొలొమోనుకు దేవుడు తన జ్ఞానాన్ని ఇచ్చి సొలొమోనును గొప్ప ప్రసంగిగాను, జ్ఞానిగాను, మహారాజుగాను ''పరమగీతములు, విలాపవాక్యాలు, సామెతలు, ప్రసంగి వగైరా వేదసాహిత్యాలకు గ్రంథకర్తగాను, తన జ్ఞానముతో ప్రతిష్టించుటయేగాక దేవుడు తనకంటూ ఒక మందిరాన్ని సొలొమోను చేత కట్టించి సొలొమోనునకు దేవుడు తన సన్నిధిలో సర్వ స్వాతంత్య్రాన్ని ఇచ్చి, సొలొమోనుయొక్క రాజ్య పరిపాలనలో శత్రు భీతిగాని, యుద్ధ భయముగాని, కరువుకాటకాలుగాని ఏవియు లేకుండ సుభిక్షమైన పరిపాలన చేయించాడు. దీనికంతటికిని కారణము దేవుడు సొలొమోనుకు ఇచ్చిన స్వాతంత్య్రమే!
ప్రియపాఠకులారా! దేవుడు తన మందిర నిర్మాణమునకు దావీదును అయోగ్యునిగా జేసి దావీదు కుమారుడైన సొలొమోనునకు సకల విధములైన హక్కులను స్వాతంత్య్రమును ఇచ్చి గొప్పగా హెచ్చించాడు. అయితే సొలొమోను ఇట్టి దైవ స్వాతంత్య్రమును కాలరాచి స్త్రీ వ్యామోహితుడై మోయాబీయులు, అమ్మోరీయుల జనాంగములోని సుందర యవ్వనులను మోహించి కొన్ని వేలమంది అన్య స్త్రీలను తన పత్నులుగా జేసికొని, దేవునికిని దైవచట్టమునకును, దైవమందిరానికిని వ్యతిరేకమైన పాపము జేసి, తన జ్ఞానమును లోకానికి అంకితము జేసి దేవుడు తనకిచ్చిన స్వాతంత్య్రాన్ని తన భార్యలకు ధారబోసి దేవుని మాటను పెడచెవిని పెట్టి, తాను అనుభవిస్తున్న స్త్రీలయొక్క కోరికలను నెరవేరుస్తూ దైవచిత్తమునకు వ్యతిరేకముగా - తాను పెండ్లాడిన స్త్రీలయొక్క మనోస్థితికి అనుకూలముగా - ఆ అన్య స్త్రీలు ఆరాధించు బయలు మొలెకు అష్టారోతు అను సాతాను సంబంధమైన దేవతలను ఆరాధించుటయే గాక సొలొమోను ఏ దేవునికైతే ఆలయాన్ని కట్టి బలిపీఠాలు ఏర్పరచి, పరిశుద్ధమైన బలి కార్యాలు జరిగించాడో అందుకు వ్యతిరేకముగా దైవమందిరమునకు ఆయన బలిపీఠమునకు అభిముఖముగా అన్యదేవతా బలిపీఠములు కట్టి, అన్యదేవతా విగ్రహారాధన చేసి దైవసన్నిధిలో అజ్ఞానియై, అయోగ్యుడై దైవత్వము దగ్గర తనకున్న స్వాతంత్య్రాన్ని కోల్పోయాడు. ఇందుకు కారణము జ్ఞానియైన సొలొమోను తన స్వాతంత్య్రపు హక్కును సద్వినియోగపరచుకోలేక చేయకూడనట్టి, దైవ చిత్తమునకు అయోగ్యమైన వ్యతిరేకమైన క్రియలు జరిగించుటన్నది కూడని కార్యమని తెలియుచున్నది. 2వ రాజులు 11ః9-13.
ప్రియపాఠకులారా! పాత నిబంధనలో ఉదా|| నలుగురి జీవితాలనుగూర్చి తెలిసికొనియున్నాము. ఈ నలుగురును సామాన్యులు కారు. మరియొకసారి వీరియొక్క ఆత్మీయ బలాధిక్యతలనుగూర్చి దైవసన్నిధిలో వీరియొక్క ప్రాధాన్యతను గూర్చి తెలిసికొన్నాము. మొదట ఆదాము విషయములో ఆదాము దైవాత్మను ప్రత్యక్షముగా పొందినవాడు. అనగా దేవుని హస్తముతో నిర్మించబడి ఆయన జీవాత్మ చేత పూరించబడి భూమి మీద మొట్టమొదటి ఆత్మపూర్ణుడును, పరిశుద్ధుడునై నరునిగ దేవునిచేత ప్రకటించబడిన వ్యక్తి, మరియు దేవుని వనములో దేవుని చేత సకల విధములైన హక్కులను పొంది, సంపూర్ణ స్వాతంత్య్రాన్ని ఆ తోటలో పొందియున్నాడు. అట్టి స్వాతంత్య్రాన్ని దేవుని చేత ఆదాము పొందియుండగా భార్య మాటలు విని దేవుడు నిషేధించిన చెట్టు ఫలములను భుజించుటన్నది ఆదాము చేయవలసిన పని కాదు. అలాగే సంసోను విషయములో దేవునికి నాజరు చేయబడి దేవుని చేత ప్రతిష్టించబడి, దైవాత్మ బలమును పొంది దేవుని పరిశుద్ధ జనమైన ఇశ్రాయేలుకు న్యాయాధిపతిగా దేవుని చేత నియమించబడిన సంసోను కడు స్వతంత్రుడు. అతనికి సకల విధమైనటువంటి శక్తులను దేవుడు ఇచ్చి శత్రువులకు సింహస్వప్నముగా సంసోనును చేశాడు. అట్టి బలాధికుడైన సంసొను సంపూర్ణస్వాతంత్య్రపు హక్కు పొందిన సంసోనుకు అన్నిటిలో స్వాతంత్య్రమున్నది. కాని తన వ్రతాన్ని చెడుపుకొని స్త్రీ సాంగత్యము సంసోను చేయవలసిన పని కాదు. అలాగే దావీదు విషయములో కూడా అంతే దావీదు కూడా దేవుడు ఇచ్చినటువంటి జయ జీవితములో సంపూర్ణ స్వాతంత్య్రాన్ని దేవుని ద్వారా పొందియున్నాడు. దావీదు తన సైనిక దండులో ఒక సామాన్యుడైన సైనికుడైన వాని భార్యను ఆశించి ఆమెను చెరిచి, ఆమె భర్తను చంపించుటన్నది ప్రవక్త చేయదగిన పని కాదు. ఇక సొలొమోను విషయములో పై ముగ్గురు వ్యక్తులలో లేని ప్రత్యేకతను సొలొమోను దేవుని చేత కల్గియుండుటయేగాక, దేవుడు భూమిమీద తన ప్రజలతో విశ్రమించుటకు మందిరాన్ని కట్టినాడంటే సొలొమోనుయొక్క భక్తి విశ్వాసాలు దేవుడు అతనికి అనుగ్రహించిన స్వాతంత్య్రపు హక్కు సామాన్యమైనది కాదు. ఇది పాతనిబంధనలోని స్వాతంత్య్రపు హక్కును నిలుపుకోలేక పతనావస్థలోకి దిగజారినవారి చరిత్ర.
ఇక క్రొత్త నిబంధనలో యేసుక్రీస్తు 12 మంది శిష్యులలో ఆయన ప్రథమ శిష్యుడైన పేతురు ప్రభువు సన్నిధిలో కడు స్వతంత్రుడు. యేసుక్రీస్తుయొక్క శిష్యకోటిలో సంపూర్ణ స్వాతంత్య్రపు హక్కును పొందియున్నాడు. ప్రభువు సమక్షములో పేతురుకున్న స్వాతంత్య్రము చాలా గొప్పది. అటువంటి స్వాతంత్య్రపు హక్కును సంపాదించుకొన్న పేతురు యేసుప్రభువు లోక కిరాతకులకు పట్టుబడిన సందర్భములో చలి మంట దగ్గర కూర్చున్నప్పుడు తననుగూర్చి ఎదుటి వ్యక్తులు ప్రశ్నించినప్పుడు క్రీస్తును నేను ఎరగనే ఎరుగనని ఒట్టు పెట్టుకోవడమన్నది పేతురు చెప్పవలసినది కాదు. అలాగే యేసుక్రీస్తు 12 మంది శిష్యులలో ఇస్కరియోతు యూదా ప్రభువు శిష్యులలో ఒకడుగా ఉండి, ప్రభువుయొక్క మహత్కార్యాలను సూచక క్రియలను కన్నులారా చూచి ఆయనతో కూడా ఆయన వెంబడి తిరిగి, శిష్యులందరితోబాటు సంపూర్ణ స్వాతంత్య్రాన్ని పొందిన ఇస్కరియోతు యూదా. ముప్పది వెండి నాణెములకు ప్రభువును అమ్ముటన్నది అది విద్రోహ చర్యమయేగాని మంచి కార్యము కాదని మనము తెలిసికోవలసియున్నది. అలాగే తోమా ప్రభువుయొక్క మరణాన్ని గూర్చి తెలిసియు అనగా ఆయన చనిపోయి తిరిగి లేస్తాడని, తాను చనిపోవుట అవసరమని మూడవ దినమున తిరిగి లేచుట తధ్యమని ప్రవచించిన మాటలను, యేసుక్రీస్తు శిష్యులలో ఒక్కడైన తోమా ఎరిగియుండియు కూడా ప్రభువు పునరుత్థానుడైనప్పుడు ఆయన గాయాలలో వ్రేలుబెట్టి పరిశోధించుటన్నది తోమా వంటి శిష్యుడు చేయదగిన పని కాదు.
అలాగే అపొ 5ఃలో తమ స్వంత భూమిని అమ్ముకొని ప్రభువు సన్నిధిలో ఆ మొత్తాన్ని సమర్పిస్తామని మ్రొక్కుకొని ఆ భూమిని అమ్మిన తర్వాత ధనవ్యామోహితులై తాము దేవునికి ఇస్తామన్నటు వంటి ఆ మ్రొక్కుబడిలో భూమిని అమ్మిన డబ్బును కొంత దాచుకోవడమన్నదియు, అదే విధముగా అననీయ సప్పీరాలు ఇరువురు కూడా ఒకే పందాలో ఒకే స్వభావములో - ఒకే మాటలో ఒకే ఉద్దేశ్యముతో అపొస్తలుల సన్నిధిలో మాట్లాడి ఇద్దరును పరిశుద్ధాత్మను మోసగించుచు అబద్ధము మాట్లాడుటన్నది అది మంచి పని కాదు. అలాగే అపొ 9ఃలో సౌలు లోకప్రభుత్వాల చేత సకలవిధములైన అధికారాలు పొంది క్రీస్తు ఆత్మను, క్రైస్తవుల ఆత్మీయ జీవితాలతో చెలగాటమాడుచు, క్రైస్తవులను హింసించుటన్న పని సౌలు చేయవలసినది కాదు. అదే సౌలు పౌలుగా మారి తన మూల వాక్యములో మాట్లాడిన మాటనుబట్టి సౌలు తన ఇహలోక జీవితాన్ని అనగా తన పాప జీవితాన్ని సమాధి జేసుకొని పౌలుగా యేసు ఆత్మతో జీవిస్తూ - తాను చెప్పిన మాటయే మన మూలవాక్యము ''తనకు అన్నిటియందు స్వాతంత్రమున్నదిగాని అన్నియు చేయదగినవి కావు,'' అని అంటున్నాడు. 1 కొరింథీ 6ః12.
ప్రియపాఠకులారా! విన్నారు గదా! నేటి క్రైస్తవులమనబడు మనము క్రీస్తుయొక్క రక్తము చేత కడుగబడినవారమై మన పాప జీవితమునుబట్టి చనిపోయినవారమై, క్రీస్తులో లేపబడినవారముగా జీవిస్తున్న నేటి క్రైస్తవ విశ్వాసులమైన మనకు, ప్రభువు తన నామమునుబట్టి మనకు సంపూర్ణ స్వాతంత్య్రపు హక్కును ప్రతి క్రైస్తవునకును ఇచ్చియున్నాడు. క్రైస్తవులు చేయదగిన పనులు చాలా ఉన్నవి. క్రైస్తవులు తమ స్వాతంత్య్రపు హక్కును వినియోగించుకొను విధానము, సువార్త పరిచర్య అనగా సువార్తను ప్రకటించుట, దైవదాసులతో సావాసము, రొట్టె ద్రాక్షారస విందులో పాలిపంపులు, ప్రార్థనలో మెలకువ, పరిచర్యలో సిద్ధపాటు, ఆరాధనలో కానుకల సమర్పణ, రాబడిలో దశమ భాగము, బోధకులకు సహాయపడుట,'' వగైరాలు. యేసు నామములో సకల విధములైన స్వాతంత్య్రపు హక్కులు క్రీస్తు చేత ఇవ్వబడియున్నవి. ఇటువంటి దైవహక్కులను అనుభవములు పొందిన క్రైస్తవుడు నేటి యుగములో దేవుడు తనకు అనుగ్రహించిన పై వరమును క్రీస్తు ద్వారా అనుగ్రహించబడిన స్వాతంత్య్రమును కాపాడుకోవలసిన బాధ్యత ప్రతి క్రైస్తవ విశ్వాసికి ఉన్నది. అనగా ఆత్మసంబంధముగా క్రైస్తవుడు సంపూర్ణ స్వాతంత్య్రాన్ని పొందియున్నాడు. శారీర సంబంధముగా చేయకూడని పనులు క్రైస్తవునకు ఉన్నదన్న సత్యాన్ని మరువకూడదు. నేడు చాలామంది క్రైస్తవులు మాటలనుబట్టి ప్రామాణికమునుబట్టి క్రియలనుబట్టి, తలంపులనుబట్టి స్వార్థమునుబట్టి తమ ఆత్మీయ జీవితమునకు వ్యతిరేకముగా శారీరజీవితములకు అనుకూలముగా చేయకూడని క్రియలను చేస్తూ రోమా 3ః23లో వలె '' ఏ భేధమును లేదు, అందరును పాపము జేసి దేవుడనుగ్రహించు మహిమను పొందలేకపోవుచున్నారు,'' అనిన దైవవాక్కునుబట్టి నేటి క్రైస్తవ జీవితమన్నది దైవత్వమునకు యోగ్యకరముగా జీవించలేకున్నది. అనిన సత్యాన్ని మనము ఒప్పుకోక తప్పదు. ప్రతి యొక్కరిలో ఏదో యొక్క దైవవ్యతిరేకతన్నది క్రియ జరిగిస్తున్నట్లుగా నేటి మన రక్షణానుభవములో చూస్తున్నాము, వింటున్నాము. ఇట్టి వాతావరణములో మన ఆత్మీయ జీవితాలను గడుపుకొనక ప్రభువు రాకడకు సిద్ధ మనస్సు గలవారమై, ఆయన రాకకు నిరీక్షణ గల్గిన స్థితిలో జీవించగలందులకు ప్రభువు నామమునుబట్టి పాఠకులకు నా మనవి.
మొదటి కొరింథీ 6ః12లో 2వ వచన భాగము అన్నిటియందు నాకు స్వాతంత్య్రము కలదుగాని నేను దేనిచేతను లోబరచుకొనబడనొల్లను.'' ప్రియపాఠకులారా! మొదటి కొరింథీ 6ః12లో మొదటి వచన భాగాన్ని గూర్చిన వివరాలు మనము నేర్చుకొనియున్నాము. ఇప్పుడు ఆ వాక్యములోని రెండవ వచనభాగమును గూర్చి ధ్యానిస్తాము. మొదటి భాగములో దేవుడు నరునికి ఇచ్చిన స్వాతంత్య్రము - ఆ స్వాతంత్య్రపు హక్కుతో నరుడు చేయకూడని చేయ తగని కార్యములనుగూర్చి పరిశుద్ధ గ్రంథములో ఆయా వ్యక్తులయొక్క జీవిత విశేషాలను గూర్చి తెలిసికొనియున్నాము. ఇప్పుడు దేవుడు నరునికి ఇచ్చిన స్వాతంత్య్రపు హక్కును ఏ ఇతర శక్తియు లోబరచుకొనకుండునట్లు ఈ వాక్యములోని రెండవ వచన భాగము వివరిస్తున్నది. ఈ యొక్క సిద్ధాంతము ప్రకారము దైవ స్వాతంత్య్రమును పొందిన విశ్వాసిని ఏ విధముగా ప్రకృతి, లోకము, దానియొక్క సంపదలు వశము చేసుకోలేకపోయాయో ఆయా సందర్భాలనుబట్టి పరిశుద్ధ గ్రంథములోని కొన్ని సంఘటనల ద్వారా వివరముగా తెలిసికొందము. ఈ సందర్భములో మొట్టమొదటగ ఈ లోకము దాని సంబంధమైన సంపదలకు అమ్ముడైపోయిన కొందరు దైవ స్వాతంత్య్ర విశ్వాసులను గూర్చి వేదరీత్యా తెలిసికొందము.
ఈ విధమైన దైవస్వాతంత్య్ర జీవితాలను జరుపుకొన్న విశ్వాసులలో ఒకడైన యాకోబు కుమారుడైన యోసేపు ఐగుప్తులో ఫరో ఇంట దైవ కృపనుబట్టి ఫరోయొక్క సర్వసంపద, రాజ్యపరిపాలన విధానములో ఫరో చేత సర్వహక్కులు పొంది, నామమాత్రంగా ఫరో రాజుగాని, పరిపాలన యాజమాన్యము నిర్వాహకత్వము అధికారము యావత్తును దైవకృపలో సంపూర్ణ అధికారము ఫరో రాజు ద్వారా యోసేపు పొందియున్నాడు. అట్టి దైవాత్మ పూరితుడైన పవిత్రుని అతనియొక్క రూపమును, అందచందాలను, రంగు లావణ్యమును వగైరా శరీర సంబంధమైన ఆకర్షణనుబట్టి ఫరో భార్య మోహించి, యోసేపు మీద కన్నేసి అతడుఒంటరిగా వున్నప్పుడు తనతో శయనించమని బలవంతము చేసి పెనుగులాడినట్లు పరిశుద్ధ గ్రంథములో ఆదికాండము 39ః లోని యాకోబు కుమారుడైన యోసేపునకు జరిగిన సంఘటన. అయితే యోసేపును ఆ స్త్రీ లోబరచుకోలేకపోయింది. అలాగే యోసేపు ఆ స్త్రీకి లోబడక పోయాడు. ఇది బైబిలు గ్రంథములో విశ్వాస జీవితములో మొట్టమొదటగ జరిగిన సంఘటన.
అలాగే నయమాను కుష్టురోగము నుండి స్వస్థుడైనప్పుడు తనను స్వస్థపరచిన దైవజనుడైన ఎలీషాకు కానుకగా నయమాను పంపించిన ప్రశస్తమైన వస్త్రాలు - బంగారు వెండి రత్నాలు వగైరా సరంజామా అంతయును తన పరిచారకులు ద్వారా ఎలీషా వద్దకు పంపినప్పుడు నయమానుయొక్క కానుకలను వస్తుసముదాయమునకు ఎలీషా లోబడలేదు. అలాగే నయమాను ఇచ్చిన వస్తు సామగ్రి ఎలీషాను లోబరచుకోలేక పోయినవి. ఎందుకంటే దైవజనుడైన ఎలీషా దేవుని చేత అభిషేకించబడి ప్రతిష్టించబడినవాడైయుండి దేహము, లోకము, సంపదను విసర్జించి, కేవలము పరమాత్మునియొక్క ప్రసన్నతను, సన్నిధిని అభిలషించి, ఆత్మీయముగా ప్రార్థనాపూరితమైన ఆత్మీయ శక్తితో జీవించిన ప్రవక్త. ఇట్టి శక్తిమంతుడైన ప్రవక్తను నయమానుయొక్క లోకసంబంధమైన సృష్టములు లోబడరచుకోలేకపోయినవి.
అలాగే ప్రియపాఠకులారా! 1 రాజు 16ః29-34లో ఇశ్రాయేలు రాజైన ఆహాబు దేవుని చేత సర్వస్వాతంత్య్రము పొంది, దైవ జనాంగమును పాలించుటకు రాజుగా నియమించబడియున్నాడు. అయితే లోకసంబంధియు పైశాచిక స్వభావసిద్ధమైన స్త్రీయైన యెజిబేలుకు అతడు లోబడినాడు. ఇందునుబట్టి యెజిబేలు ఆహాబును సంపూర్ణముగా తన వశము చేసికొని నిరంకుశమైన పరిపాలన చేసి, నికృష్టమైన మరణాన్ని చవి చూచింది. అలాగే యెజిబేలుకు లోబడినట్టి ఆహాబు కూడా అదే మరణాన్ని పొంది తన చరిత్రయొక్క విలువను కోల్పోయాడు. అదే విధముగా దేవుని ప్రవక్తయైన బిలాము ఆనాటి దైవప్రవక్తలలో అగ్రగణ్యుడు మంచి ప్రవచన వరము కలవాడు. అట్టివాడు బాలాకుయొక్క మాటలకు లోబడి, బాలాకు ఇచ్చే బహుమానాలను ఆశించి ధనానికి అమ్ముడై దాని వశమైపోయాడు. ఈలాగు ప్రవక్తయైన బిలాము యొక్క జీవితాన్ని లోకధనము కాటేసింది. కనుక బిలాము లోకమునకు అంకితమైపోయాడు. సంఖ్యా 22 మరియు 23 అధ్యాయాలలో చదువగలము.
అలాగే దేవునియొక్క ప్రవక్తయైన యోనా విషయములో దేవుడు యోనాకు అప్పగించిన నీనెవె పట్టణమునకు కలుగు దుర్గతిని గూర్చిన ప్రకటనను ప్రకటించమనగా యోనా దేవునియొక్క చిత్తమునకు తలూపి, ఓడ రేవు దగ్గరకు వెళ్ళుసరికి తర్పీషు ఓడయొక్క వైభోగములపై దృష్టించగా ఆ ఓడ యోనాను కొనింది. అందుకు నిదర్శనము యోనా దైవవాక్కును పెడచెవిని బెట్టి యోనా తర్పీషు ఓడను ఎక్కడమే. ఈ విధముగా యోనా ప్రకృతికి లోకసంపదకు లోబడినాడు. ఇది యోనానుగూర్చిన చరిత్ర.
ఇక నూతన నిబంధనలో యేసుక్రీస్తు బాప్తిస్మము పొంది పరిశుద్ధాత్మ పూర్ణుడై 40 దినములు ఉపవాసము వుండి ఉపవాస దినములు ముగిసిన తర్వాత ఆయనను అపవాది శోధిస్తు లోకసంపదను ప్రభువునకు చూపడము - ప్రభువు వాటిని నిరాకరించి వాటిని ఆశింపక సాతానుయొక్క ప్రయత్నాన్ని వమ్ము చేయుటన్నది మనకు తెలిసిన సంగతియే! ఇక్కడనుండి క్రీస్తు ఆత్మ పూర్ణులైన అపొస్తలులు వేదసాక్షులు, హతసాక్షులు యావన్మందిని కూడా లోకము తన సంపదతో ఆకర్షించినప్పటికిని అది వారిని లోబరచుకోలేక పోయింది.
ప్రియపాఠకులారా! పాతనిబంధన కాలము నూతన నిబంధన కాలము అపొస్తలుల యుగము ఈ మూడిటి కాలములను గూర్చి తెలిసికొనియున్నాము. ఈ మూడు కాలములలో లోకానికి లోక సంపదకు వశముగాని పరిశుద్ధులను గూర్చి తెలిసికొనియున్నాము. నేటి క్రైస్తవులమైన మన జీవితము మాటేమిటి? మన ఆత్మీయ స్థితి ఎలాగున్నది? 1 యోహాను 2ః15లో ''ఈ లోకమునైనను లోకములో ఉన్నవాటినైనను ప్రేమింపకుడి,'' అని హెచ్చరించియున్నాడు. అయితే నేటి క్రైస్తవ్యము పై వివరించిన వాటికి విరుద్ధముగా పూర్తిగా లోకముతోను, లోకస్థులతోను, లోకసంపదతోను, చేతులు కలిపి ఆత్మీయ వెలుగును కోల్పోయి, అదృశ్యములో దేవుని మహిమపరచుటకు బదులుగా ఆయన పేరును వ్యర్థముగా ఉచ్ఛరిస్తూ ఆయన పేరే చెప్పుకొంటూ - సభలు, సమావేశాలు ఏర్పరచి, స్వదేశ విదేశ నిధులను సంపాదించుకొంటూ ప్రజాబాహుళ్యములో తనకున్న తాము సంపాదించిన దైవ వ్యతిరేకమైన ధనాన్ని సంపదను దాచిపెట్టి తాము ఆత్మ సంబంధులమని, దేవుని బిడ్డలమని, లోకానికి తెలుపుకొంటూ జనబాహుళ్యము ఎదుట బంగారు వెండి అలంకారాలు లేకుండ బొట్టు కాలిమెట్లు లేకుండ, తాళిబొట్టు కూడా లేకుండ తెల్లని వస్త్రధారణతో కూడిన గుప్తమైన లోకజీవితాన్ని అనుభవిస్తున్నారు. అందునుబట్టి పౌలు కొరింథు సంఘమునకు వ్రాసిన పై మాట లోకసంబంధులకు కఠినముగా కనబడవచ్చును.
ఆత్మ ప్రసంగము
యోహాను 3-16 దేవుడు లోకమును ఎంతో ప్రేమించితే ''జలప్రళయముతోను అగ్ని గంధక వర్షములతోను తన ప్రజలైన ఇశ్రాయేలీయులను బానిసత్వమునకును, సర్పవిషములకును, తెగుళ్ళకును అప్పగించి బాధించుటలో దేవుడు కనపరచిన ప్రేమ ఏమిటో మనము గ్రహించవలసియున్నది. దీనినిబట్టి నరునికి ఇట్టి శ్రమలు కల్గుటలో దేవుడు ప్రేమించిన లోకములో దైవ జ్ఞానముతో గుర్తించితే, దేవుడు చూపిన ఉగ్రతలోని నిగూఢ సత్యము బైల్పడుచున్నది.
నరునిలో ఆత్మ దేవునిది. ఇది వేదసత్యము. శరీరము భూమినుండి చేయబడినది. శరీరములోని దేవుని జీవాత్మ దైవ అజ్ఞాతిక్రమము చేసి శరీరముతో ఏకీభవించి''ఆత్మ'' దైవజ్ఞానమును కోల్పోయి భూఫలమైన శరీరాశలకు లోనై, అపవిత్రము పొందినందుననే దేవుని ప్రేమ ఉగ్రతగ మారినట్లు తెలియుచున్నది. ఇందునుబట్టి గలతీ 5ః17లో ఆత్మశరీరములు పరస్పర విరోధములైనట్లును గలతీ
5ః19-21 శరీర క్రియలను గలతీ 5-22 ఆత్మఫలములను గూర్చి తెలుపబడియున్నవి. కనుక శరీర ఇచ్చలను బట్టి అది జీవాత్మయైన నరునియొక్క ఆత్మ కలుషితమైనందున ఆత్మను అనుగ్రహించిన దేవుడు ఉగ్రుడై నరసంతతిని తన మహత్తర శక్తి నిర్మితమైన ఈ లోకశక్తిని తన ఉగ్రతకు గురి జేసి, శిక్షించినట్లు ఇందులో మనము గ్రహించవలసిన దైవసత్యము, దైవోగ్రతకు కారణము ఏమనగా ఆత్మ వైరాగ్యము తాను పంపిన ఆత్మ మీద కోపము.
......
శరీర పోరాటము - ఆత్మీయ పోరాటము
మూలము - ఎఫెసీ 6ః12 ఏలయనగా మనము పోరాడునది శరీరులతో కాదు, గాని ప్రధానులతోను, అధికారులతోను, ప్రస్తుత అంధకార సంబంధులగు లోకనాధుల తోను, ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహములతోను పోరాడుచున్నాము.''
ప్రియపాఠకులారా! పోరాటము అన్నది లోకరీత్యా ఒక దేశముతో మరియొక దేశము, ఒక రాజ్యముతో మరియొక రాజ్యము ఒక వ్యక్తితో మరియొక వ్యక్తి ఒక గ్రామముతో మరియొక గ్రామము, ముఠా తగాదాలు కక్షలు కలహాలు వగైరాలన్నియు, నరునియొక్క శరీర సంబంధమైన పోరాటములుగ లోకములో ఏర్పడియున్నవి. అయితే ఈ పోరాటాల వలన ఏదో యొక వర్గము విజయము సాధించుట, ఏదో యొక రాజ్యము, ఒక వర్గము విజయాన్ని సాధించటమో - ప్రాణాంతకమైన చేదు అనుభవాలు చవి చూడడము, అపజయము పాలవడము, ఏదో యొక విధమైన పతనావస్థను అనుభవిస్తున్నది.
ఆదిలో దేవుడు లోక సృష్టి నిర్మాణము జరిగించిన తర్వాత దేవుడు చేసిన ఏదెను వనములో ఈ పోరాటము లేదు. దేవుడు తన సృష్టిలో ఏ విధమైన పోరాటానికి స్థానమియ్యలేదు. పోరాడుకొనే స్థితిలో దేవుడు సృష్టిని రూపించలేదు. పంచభూతాలు ఒకదానితోనొకటి సమైక్యముగా తమ క్రియలను నిర్వర్తించుచు ఒకదానితోనొకటి వ్యతిరేకము కాక ఆహ్లాదకర వాతావరణము సృష్టించి ఐక్యత గల్గి తమ క్రియలను జరిగించాయి. అంటే వీటి వలన వరదలుగాని, సూర్యుని వలన వేడిగాడ్పులుగాని, గాలి ద్వారా పెనుగాలులు సుడిగాలులుగాని, అగ్ని అనిన తన తీక్షణతను కనబరచక నరునికి యోగ్యకరమైన స్థితిలో అనగా నరునికి ప్రయోజనకరమైన విధముగా క్రియ జరిగించింది. అలాగే వాతావరణము కూడా దైవచిత్తమునుబట్టి నరునికి అనుకూలముగా వ్యవహరించినట్లే ఏదెను వన చరిత్ర ప్రకటిస్తున్నది. అంతేగాకుండ సృష్టిగాని జంతుజాలములు, పక్షిజాలములు, కీటకాదులు వగైరాలు కూడా ఒకదానికొకటి కరచుకొని భక్షించే వికృతానుభవాలతో ప్రవర్తించనట్లు ఏదెనుయొక్క చరిత్ర మనకు వివరిస్తున్నది.
అంటే ప్రియపాఠకులారా! ఇందుకు కారణము పరమాత్ముడు జీవాత్ముడు ఇరువురు ఏకమై యున్నందున ఎలాంటి చేదు అనుభవాలు, వికృత పరిస్థితులు, వైరుధ్యముతో కూడిన వాతావరణము లేక పరమాత్ముడు జీవాత్ముడు సమైక్యముగా జీవిస్తూ - పరలోక స్వర్గాన్ని భూతల (భూలోక) స్వర్గముగా భూమిని చేసినట్లు ఆదిసృష్టియొక్క చరిత్ర మనకు వివరిస్తున్నది. అయితే పై మూలవాక్య రీత్యా పోరాటమన్నది ఎలాగొచ్చింది?
ప్రియపాఠకులారా! ఈ పోరాటమన్నది మొట్టమొదట భూమి మీద కాదుగాని పరలోకములోనే ఏర్పడి దేవదూత లలోను దేవునికిని ఏర్పడి, లూసీఫర్ అను దేవునియొక్క సంగీత విద్వాంసుడైన దూత తన అందచందాలతోను, తన గాన మాధుర్యముతోను, వాయిద్య నైపుణ్యముతోను నానావిధమైన ఆధిక్యతలను సంతరించుకొన్న తన జీవితములో గర్వము అహంభావము, ఈర్ష్యాద్వేషముననుసరించి దేవలోకములో మొట్టమొదటగా తిరుగుబాటుతో కూడిన విప్లవాన్ని ఈ లూసిఫర్ సృష్టించి, తనయొక్క కుయుక్తి మాయాశక్తులతో కొందరి దేవదూతలను కూడగట్టుకొని దైవత్వముతో పోరాడి, మిఖాయేలు అను దూత చేత దైవ ప్రభావముతో పడద్రోయబడి, ఈ లోకములో ఉన్నట్లుగ వేదచరిత్ర మనకు వివరిస్తున్నది. ఈ విధముగా పరలోకము నుండి ప్రారంభించబడిన ఈ పోరాటమును గూర్చి దేవుడు దేవదూతల కంటెను భూమిమీదనున్న నరులు శ్రేష్టులన్న భావముతో యోహాను 3ః16లో వలె దేవుడు ఈ లోకాన్ని ప్రేమించాడు. ఈ విదంగా దేవుడు తన ప్రేమను కేవలము వాక్కులతోగాక క్రియామూలకముగా నరుల మీద వెల్లడిపరచుచు, నరునియొక్క జీవితమునకు కావలసిన అవసరతలు అన్నియును తీర్చి తన ప్రేమను బయల్పరచినాడు. మరియొక ముఖ్య విషయము తాను రూపించిన నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదని సాటి సహాయముగా స్త్రీని కూడా చేశాడు. కాని స్త్రీ పురుషులు ఇరువురును ఏకమె,ౖ దైవనియమానికి వ్యతిరేకముగా క్రియ జరిగించి దైవాజ్ఞను అతిక్రమించి అపవాదికి అనుచరులయ్యారు. అనగా దైవత్వముతో ఏ లూసిఫర్ వ్యతిరేక పోరాటము చేసి, అపవాదియు - సాతాను ఘటసర్పము అను పేరుతో పడద్రోయ బడినాడు. వానికి ఈయొక్క జీవాత్మయైన నరజంట దాసులై పూర్తిగా దైవత్వాన్ని కోల్పోయారు. ఈ విధముగా భూలోకములో లూసిఫర్ అను అపవాది ప్రధానత్వమును సంపాదించుకొని భూలోకానికి ప్రధాని అయ్యాడు. ఇందునుబట్టి లూకా 4ః5-6లో యేసుప్రభువును అపవాది తీసుకొనిపోయి భూలోక రాజ్యములన్నిటిని ఒక నిమిషములో ఆయనకు చూపించి, ఈ అధికారమంతయు, ఈ రాజ్యముల మహిమయు నీకిత్తును అది నాకు అప్పగింపబడియున్నది. అదెవనికి నేను ఇయ్యగోరుదునో వానికిత్తును,'' అని అనుటయు, అలాగే 2వ కొరింథీ 4ః4 దేవుని స్వరూపియైయున్న క్రీస్తు మహిమను కనుబరచు సువార్త ప్రకాశము వారికి ప్రకాశింపకుండు నిమిత్తము, ఈ యుగసంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రములకు గుడ్డితనము కలుగజేసెనని వ్రాయబడినట్లును యోహాను 14ః30 ఈ లోకాధికారి వస్తున్నాడు - వానితో నాకేమి పని? అన్నట్లుగాను, కనుక ఆదినరులు చేసిన క్రియలనుబట్టి ఈ భూలోకమును దేవుడు శపించినందువలన ఈ లోకాధిపత్యాన్ని అపవాది కైవసము చేసికొన్నట్లుగ ఇందునుబట్టి తెలుస్తున్నది.
ప్రియపాఠకులారా! దేవుని చేత శపించబడిన ఈ భూలోకము అపవాదియొక్క వెలుగు చేతను, వాని క్రియలచేతను, వాని మాయ చేతను, వాని ఆకర్షణ చేతను విజృంభించి భూమిమీదనున్న నరులు వాని వేషధారణ చేతను, వాడు కల్పించు కృత్రిమమైన దృశ్యములచేతను, మహత్కార్యాలచేతను, విశ్వాసులు సహితము మోసపోయి ఆత్మీయముగా దిగజారే పరిస్థితి ఏర్పడింది. ఇందునుబట్టి అపవాదికి భూలోకమును, దాని ఐశ్వర్యమును, దాని రాజ్యమును, దాని రాజ్య పరిపాలన ఏలుబడి చట్టములు ఒకటేమిటి? సమస్తము నేడు లోకరీత్యా అపవాదికి అప్పగించబడియున్నది. అందువల్లనే దైవవిశ్వాసులకును అనగా ఆత్మసంబంధులైన నిజ క్రైస్తవులకు, లోకరాజ్య పరిపాలనలో ఎలాంటి రాయితీలు లేకుండ చేయుటయేగాక కేంద్ర పరిపాలన యంత్రాంగములోగాని, రాష్ట్ర పరిపాలన యంత్రాంగములోగాని, జిల్లా వారీగా పరిపాలన యంత్రాంగములోగాని నేడు నిజ క్రైస్తవునికి అవకాశము లేదు. అబద్ధ క్రైస్తవులు అనగా సాతాను కుయుక్తితోను, సాతానుయొక్క గుణగణాలతోను, అబద్ధములతోను, అబద్ధపు సర్టిఫికేట్లతోను అనగా లిఖితపూర్వకముగా లోకానికి బయల్పరచుచు తాను క్రైస్తవుడను కానని, పూర్తిగా తాను అన్యుడననియు, హరిజన క్రైస్తవుడననియు, ఆది ఆంధ్ర క్రైస్తవుడననియు, హిందూ క్రైస్తవుడననియు, భారత క్రైస్తవుడనని పేరు తగిలించుకొని అటు అన్యుడు గాక ఇటు క్రైస్తవుడు కాక, మిశ్రమ స్వభావముతో లోకములో చలామణి అయ్యే క్రైస్తవ్యమునకు లోకరీత్యా అనేక రాయితీలు కలిగియున్నప్పటికిని, ఒకవేళ సాతాను ప్రేరేపణ కుయుక్తి ద్వారా వంచకుడై విపరీతమైన ధనసంపత్తి ఏర్పరచుకొని తనకేమియు కొదువ లేదన్నట్లుగా కనబడినను, తాను క్రీస్తు విషయములో క్రీస్తును ఒప్పుకొని, తన పాపములకు పశ్చాత్తాప్తుడై మారుమనస్సు పొంది ఒక దైవజనుని ఎదుట, సంఘము ఎదుట, సంఘమునకు శిరస్సయిన ప్రభువు ఎదుట, బాప్తిస్మము అను ప్రమాణము చేసినవాడైనందున క్రీస్తుయొక్క ఆత్మకు అతడు సాక్షియై యున్నందున, అదే క్రైస్తవాత్మ అతనిని ఆత్మీయముగాను, శారీరముగాను, అటు అనారోగ్యము, అశాంతి, కుటుంబ సమస్యలు, క్రైస్తవ సంఘాలలో గుర్తింపు లేకుండ జేయుట మరియు నానవిధ రోగాలతో నిత్యము రోగిగా వ్యవహరించుట, ఆత్మీయముగా సేవాభారమును కోల్పోయి, తాను సేవకుడనన్న పేరు మాత్రము పెట్టుకొని, సేవను విడిచి, సేవయొక్క ధర్మాన్ని మరచి బహిరంగముగా క్రీస్తును గూర్చి ప్రకటించుటకు లోకానికి వెరచి రహస్యముగా ప్రభువును వెంబడించుటకు ప్రయత్నించుట.
ఇక సత్ క్రైస్తవ జీవితము - ఎల్లప్పుడును సత్యమును అనుసరించుట, లోకమును దాని ఐశ్వర్యమును దేహమును - దానియొక్క గుణలక్షణములు, దేహసంబంధ వాంఛలు అరిష్టగుణాలు వీటిని వదలి అనగా లోకమును పెంటగా ఎంచుకొని, లోకప్రభుత్వ చట్టానికి, దాని సిద్ధాంతానికి అతీతుడై, ఒక వ్యక్తి నుండి ప్రభువు కొరుకొనేటటువంటి యోగ్యతల కొరకు అహర్నిశలు ప్రయత్నిస్తూ కృషి చేస్తూ - ప్రభువు నామమున ప్రార్థన చేస్తూ ఆయన అనుగ్రహమును కోరుచు, ఆయన సన్నిధానమును అభిలషిస్తూ - లోకముయొక్క బురద అంటకుండ జీవించేటటువంటి నిష్కపటి నిష్కాముడే సత్ క్రైస్తవుడు - ఇట్టివాడు లోకపదవులను ఆశించడు. లోకసంబంధ వ్యసనాలలో తగుల్కొనడు. ఇట్టివానికి లోక సమస్యలు కలుగవు. నిందలు నిష్టూరాలు అన్నవి ఇతని దరిదాపులకు రావు. ఈ విధముగా జీవిస్తూ మొదటి కీర్తన మరియు 15వ కీర్తనలలో వ్రాయబడిన రీతిగా వివరించబడిన యోగ్యతలు కలవాడు, సాతాను సామ్రాజ్యమునకు మ్రింగుడు పడనివాడు. సాతాను ఉరులకు చిక్కుకొననివాడు. ఈ విధముగా జీవించాలంటే లోకములో సాధ్యము కాకపోవచ్చును అని అనుకోవచ్చును, కాని సాధ్యమే; లోకము - దాని ఆశలు ఈ క్రింది విధముగా ఉన్నవి. లాటరీలు, జూదము, గుర్రపు పందెములు, దొంగ వ్యాపారము, నల్లధన సంపాదన, అక్రమ ముద్రణ, దొంగనోట్లు, వ్యభిచారయుతమైన సంపాదన, మద్యము, వ్యాపారములు, సినిమాలు, బార్లు, కల్తీ వ్యాపారము వగైరాలు. ఇవన్నియును లోకసంబంధమైనవియే - సాతాను సంబంధమైనవి.
అయితే ప్రియపాఠకులారా! దేవుడు మనలను పరిశోధిస్తూ సాతాను సామ్రాజ్యమైన ఈ లోకములో మనలను ఉంచి, పాతనిబంధన కాలము నాటి అబ్రాహాము విషయములో ఏ విధముగా కుమారుని దహనబలిగా కోరినాడో - పాపభ్రష్టుడైన సాతాను సామ్రాజ్యములో ఉంచి జీవాత్మలైన మనలను పరిశోధిస్తున్నాడు. ఇట్టి దైవపరిశోధనలో ఎవరైతే నిలబడి, ప్రధానులతోను లోకసంబంధ నాధులతోను, ఆకాశమండలమందున్న దురాత్మల సమూహముతోను, అధికారులతోను, లోకమును పరిపాలించు వారితోను, అంధకార సంబంధమగు లోకనాధులు అనగా వీరు చీకటి సంబంధమైన కార్యక్రమాలకు అధికారులు, రాత్రి కాలములో జరుగు వ్యభిచారము, క్లబ్బులు, జూద గృహాలు, పగలు కూడా జరుగు అనేక నీచకార్యాలతో సాతాను రెండు విధములుగ విజృంభించి, భూమికి ఉపరితల భాగాన నరజీవితాలను శోధించి వారిని మరణానికి గొయ్యి త్రవ్వి పాతిపెట్టేటటువంటి దురాత్మల సమూహములు.
ప్రియపాఠకులారా! ఇవి ఎలాంటివి? ఆకాశ సంబంధమైన ఈ దురాత్మల సమూహములు ఎలాంటివి? అంటే ఆకాశములో ప్రయాణించే విమానాలను పడగొట్టుట, రాకెట్ల ప్రయోగము - దురాత్మ సంబంధముగ ఇవి జరుగును. ఇక దీనిని గూర్చి ఎఫెసీ 2ః2 వాయుమండల సంబంధమైన అధిపతిని అనగా అవిధేయులైన వారిని ఇప్పుడు ప్రేరేపించు శక్తికి అధిపతిని అనుసరించి, ఈ ప్రపంచ ధర్మము చొప్పున మునుపు నడుచుకొంటిరి. వీడు సోదెలోకి వస్తాడు, మనుష్యులను ఆవరించి నానావిధ కేకలు వేయిస్తాడు. వాయుమండలములో దురాత్మల సమూహాలకు అధిపతి అనగా త్రివిధములైన వారిని ఇప్పుడు ప్రేరేపించుశక్తి - అవిధేయులైన వారి చేత దహనకాండ దోపిడీలు చేయిస్తాడు. ఈ వాయుమండల అధిపతి - ఇతడు అదృశ్యుడు - ఆత్మ సంబంధి, ఇతడు అదృశ్యములో ఉండి, నరుని యొక్క ఆత్మను బలహీనపరచి వానిలో శారీర ద్వేషమును పెంచి, శారీర సంబంధమైన నానావిధములైనటువంటి క్రోధాది గుణములతో ప్రేరేపించి వానిని ఉగ్రునిగా చేసి, దైవత్వానికి విరోధమును దైవోగ్రతకు మూలమైన కార్యాలు జరిగిస్తాడు. అనగా ఆ వ్యక్తిని మరణానికి అప్పగిస్తాడు. ఆ వ్యక్తి చేత పాపము చేయిస్తున్నాడు. పాపమునకు జీతము మరణము. ఇది లోకసంబంధముగా నరునికి కలుగు దుర్గతి. అందుకే కొలస్స 3ః1-4 ''మీరు క్రీస్తుతో కూడా లేపబడినవారైతే పైనున్న వాటినే వెదకుడి, అక్కడక్రీస్తు దేవుని కుడి పార్శ్వమున కూర్చుండి యున్నాడు. పైనున్న వాటిమీదనేగాని భూసంబంధమైన వాటి మీద మనస్సు పెట్టుకొనకుడి. ఏలయనగా మీరు మృతి పొందితిరి. మీ జీవము క్రీస్తుతో కూడా దేవునియందు దాచబడియున్నది. మనకు జీవమైయున్న క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీరును ఆయనతో కూడా మహిమయందు ప్రత్యక్షపరచబడుదురు.'' ఇందునుబట్టి ప్రియపాఠకులారా! బాప్తిస్మము ద్వారా జలసమాధి చేయబడిన సమస్తమైన మన పూర్వీక పాపమునుండి మనము నూతన స్వభావము పొందినవారమై, ఈ లోకములో జీవించు సందర్భములో మనము లోక సంబంధమైన వాటినిగాక పరలోక సంబంధమైన వాటి మీదనే లక్ష్యముంచాలని, ఆ విధముగా లక్ష్యముంచి నప్పుడు భూలోక సంబంధమైన వాటిపై వైరాగ్యము ద్వేషము కలిగియుండాలని, దైవాత్మపూర్ణుడై లోకమును ప్రేమిస్తే అతడు ఆత్మ సంబంధి కాడని, భూసంబంధియైయుండి దైవత్వము మీద అభిమానమంటే అది కుదరదని ఇందునుబట్టి మనము గ్రహించాలి.
ప్రియపాఠకులారా! పోరాటమన్నది లోకరీత్యా నరజీవితములో ఈలాగున ఉంటే ప్రకటన 16ఃలో దేవుని కోపముతో నిండిన ఆ ఏడు పాత్రలను భూమి మీద కుమ్మరించుడనగా - ఇది లోకస్థులలో వారి జీవితాలలో ఎప్పుడు కలగనటువంటి పోరాటము - ఇది దైవోగ్రతతో చేయు పోరాటము. ఏడుగురు దూతలు ఏడు పాత్రలు చేతపట్టుకొని వరుసగా భూమి మీద కుమ్మరించినప్పుడు జరుగు పోరాటము. మొదటి దూత వెలుపలికి వచ్చి తన పాత్రను భూమి మీద కుమ్మరింపగా క్రూరమృగముయొక్క ముద్రగలవారికిని, దాని ప్రతిమకు నమస్కారము చేయువారికిని బాధాకరమైన చెడ్డ పుండు పుట్టెను.
ప్రియపాఠకులారా! మానవ లోకము - లోకదాస్యము లోక ఐశ్వర్యములోను లోక ఆశలలోను నేత్రాశలోను తగుల్కొన్న వారితో దైవత్వము చేయు పోరాటములో బాధాకరమైన చెడ్డపుండు అనగా అశాంతి, వేదన, అనారోగ్యము, శ్రమలు, నిందలు, అసమాధానము - ఇది బాధాకరమైన చెడ్డపుండుయొక్క లక్షణములు. అయితే ఇట్టి క్రియల వలన వెంటనే నరులు చావరు. కనుక ఇది మరణము లేని బాధ - నర పోరాటము. దేవుని ఉగ్రత జరిగించు పోరాటము. ఈ పోరాటములో నరుడు జీవించియున్నను చనిపోయినవానితో సమానునిగ ఉంటాడు. అనగా నిత్యరోగియైయుండి నిత్యశ్రమను బాధింపబడుచు, నిత్యము దైవత్వము చేత మొత్తబడినవాడై యుండి, యోబుకంటె భయంకరమైన విషాదము, అసమాధానము పొందుతాడు.
ఇక రెండవ దూత జరిగించు పోరాటము - ప్రియపాఠకులారా! మొదటి దూత తన పాత్రను భూమి మీద కుమ్మరించగా సముద్రము పీనుగ రక్తము వంటిదాయెను. అందువలన సముద్రములో ఉన్న జీవజంతువులన్నియును చచ్చెను,'' అని వ్రాయబడియున్నది అంటే నరునియొక్క జీవనోపాధికి, మనుగడకు, భూమికి కావలసిన వర్షపాతము అనుగ్రహించు శక్తిగల సముద్రము నరదోషమునుబట్టియు నరులయొక్క బలహీనతలనుబట్టియు, నరులయొక్క పాపమునుబట్టి సముద్రము కూడా దేవునియొక్క ఉగ్రతకు గురియగుట చేత సముద్రము కలుషితమై, సముద్రములో ప్రయాణించే ఓడలలోను - ఆ ఓడలోని జనాంగమును, సముద్ర గర్భములో పయనించే నరులను మత్స్యములు, మహామత్స్యములును ఒకటేమిటి? సకల విధములైన జీవరాసులన్నియు దైవోగ్రతకు గురియై నాశనమును చవి చూచుట.
ప్రియపాఠకులారా! ఇందునుబట్టి దేవుడు సముద్రము మీద కూడా దైవవ్యతిరేకులతో పోరాటము సాగిస్తున్నాడని తెలుస్తున్నది - ఇది జరుగవలసియున్నది. ఇది నరులయొక్క మహాదోషమునుబట్టి వారి కుత్సిత జ్ఞానమునుబట్టి సంభవిస్తున్నది.
ఇంక మూడవ దూత తన పాత్రను నదులలోను, జలధారలలోను కుమ్మరింపగా అవి రక్తమాయెను.'' ఇది అతి త్వరలో జరుగబోవునదియునైయున్నది. ప్రియపాఠకులారా! నేడు భూలోకమును పట్టి పీడిస్తున్న సమస్యలలో అతి ప్రధానమైన సమస్య త్రాగునీటిని గూర్చి వ్యవసాయమునకు నీటి వసతి, విద్యుశ్ఛక్తికి కావలసిన జలప్రవాహమును గూర్చి, ఆ జలప్రవాహమునకు కావలసిన ఆనకట్టలను గూర్చి, ఆ ఆనకట్టలను పెంచెడి ఎత్తులను గూర్చి - ఇది మొట్టమొదటగ నరులలో క్రియ జరిగించి అటుతర్వాత జలప్రవాహమునకు నరులు అడ్డుకొని ఒకరిపైనొకరు పొడుచుకొని రక్తపాతము జరిగించుట - ఇది భూలోక వ్యవసాయ సంబంధముగాను, నరులకు ప్రాణాధారమైన అతి ముఖ్యమైన నీటి సమస్య.
ప్రియపాఠకులారా! ఈ విధముగా దైవోగ్రత విజృంభించి జరిగించే రక్తపాతమును గూర్చి - ''16ః4, వర్తమాన భూతకాలములలోనుండు పవిత్రుడా? పరిశుద్ధుల రక్తమును, ప్రవక్తల రక్తమును వారు కార్చినందుకు తీర్పు దీర్చి, వారికి రక్తము త్రాగనిచ్చితివి, దీనికి వారు పాత్రులే. నీవు ఈలాగు తీర్పు దీర్చితివి గనుక నీవు న్యాయవంతుడవని జలముల దేవదూత చెప్పగా వింటిని. అందుకు అవును ప్రభువా? దేవా! సర్వాధికారీ! నీ తీర్పులు సత్యములును న్యాయములునై యున్నవని బలిపీఠము చెప్పుట వింటిని,'' అని వ్రాయబడియున్నది.
ప్రియపాఠకులారా! దేవుడు తన దూత ద్వారా భూమిమీద జరిగించబోవు రక్తధారల జలము నేటి క్రైస్తవులమైన మనము ఆరాధించు ఆలయ బలిపీఠము ఇందుకు సాక్ష్యమైయున్నది. జలసంబంధమైన పోరాటాలలో వినాశముతో కూడిన క్రియా ఫలితములు. నీటి పారుదల సంబంధమైన తగాదాలు, వ్యవసాయము, నదీజలాల పంపిణి, సముద్ర యుద్ధాలు వగైరాలు.
ఇక నాలుగవ దూత తన పాత్రను కుమ్మరించి జరిగించిన మారణహోమము. నాలుగవ దూత తన పాత్రను సూర్యుని మీద కుమ్మరింపగా మనుష్యులను అగ్నితో కాల్చుటకు సూర్యునికి అధికారము ఇయ్యబడెను.'' ప్రియపాఠకులారా! ఇందునుబట్టి మానవత్వముతో దైవత్వము పోరాడు సందర్భములో మొట్టమొదట భూమిమీదను, అటుతర్వాత జలరాశులలోను మరియు నదులు జలధారలలోను, దేవుడు తనయొక్క పోరాటాన్ని జరుపుటయేగాక అగ్నితో కాల్చుటకు సూర్యునికి అధికారమిచ్చాడు. ఈ అధికారమునుబట్టి మనుష్యులు తీవ్రమైన వేడితో కాలిపోయి ఎండలో పడవేసిన నల్లులు మంచములో మాడినట్లుగా మాడిపోవు సందర్భములో - నరులు దైవత్వమునకు లోబడక దేవునిపై తిరుగుబాటు చేస్తూ ఆయనను దూషిస్తున్నారుగాని, ఆయననను మహిపరచునట్లు వారు మారుమనస్సు పొందినవారుకారు. అనగా జనములో దేవుడు జరిగించిన ఈ క్రియలనుబట్టి నరులలో మారుమనస్సు లేకపోయెను.
ఇక ఐదవదిగా భూలోక పరిపాలనలో భూలోకములో క్రూరమృగము యొక్క సింహాసనము అనగా సాతాను పరిపాలన మీద, దాని సింహాసనము మీద ఐదవ దూత తన పాత్రను కుమ్మరించెను. దీని ఫలితము - దాని రాజ్యము చీకటి కమ్మెను. మనుష్యులు తమకు గల్గిన వేదనలనుబట్టి తమ నాలుకలు కరచుకొనుచుండిరి. తమకు కల్గిన వేదనలనుబట్టియు, పుండ్లనుబట్టియు పరలోకమందున్న దేవుని దూషించిరి గాని, తమ క్రియలను మాని మారుమనస్సు పొందినవారు కారు. 16ః11.
ప్రియపాఠకులారా! నేటి భూలోక రాజ్యాలలో వెలుగు కంటెను న్యాయమైన పరిపాలన కంటెను, సరియైన న్యాయవిధిని ఎరుగక లంచగొండితనము, హత్యలు, దోపిడీలు, రాజకీయ సంబంధముగా జరిగే హత్యలు ఇవన్నియును చీకటి సంబంధమైనవి. ఇంకను అక్రమాలు, మానభంగాలు, ఆత్మహత్యలు, నకిలీ నాణెములు, నకీలి నోట్లు, నకిలీ మద్యములు - మద్యపాన విస్తరణ, ప్రతి వ్యక్తియు మత్తుకు అలవాటుపడి నానావిధ భీభత్సము సృష్టించుట, బ్లాక్ మార్కెట్, కరువుకాటకాలు, ప్రేమన్నది చల్లారిపోవుట ద్వేషము పెరుగుట - ఇందునుబట్టి ఒకరిపైనొకరు నాలుక కరచుకొనుట, దైవత్వమును పూర్తిగా విస్మరించి దేవుని బదులుగా లోకాన్ని - లోక ఆధిపత్యాన్ని, లోకసంపదను, లోక ఐశ్వర్యాన్ని, లోక మెప్పుకోసము ప్రయాసపడుట', ''దేవుడు - వేదము - దేవాలయము,'' ఇవన్నియును ఒట్టిదేనని దేవుడు లేడని - సృష్టియే దేవుడని, నరుడే దేవుడని తమ హేయక్రియలను అధికము చేసి దైవత్వము ఎదుట అజ్ఞానముతో ప్రవర్తించుట, పరలోక దేవుని దూషించుట, ఆ విధముగా దూషించుటయే గాకుండ మారుమనస్సు పొందకుండుట - ఇది దేవుడు తన దూతలతో జరిగించిన ప్రకటన 6ః11లోని ఐదు పోరాటాల వివరము.
ఇంక ఆరవ దూత తన పాత్రను యూఫ్రటీసు అను మహానది మీద కుమ్మరింపగా తూర్పు నుండి వచ్చు రాజులకు మార్గము సిద్ధపరచునట్లు దాని నీళ్ళు ఎండిపోయెను.'' ఈ యూఫ్రటీసు అనిన నది ఆదిలో ఏదెను అను వనమునకు జీవమిచ్చిన నది, వర్షము లేకనే తన జలములతో భూమిని తడిపింది. ఈ యూఫ్రటీసు అన్నది పరలోక స్వర్గములోనేగాక భూలోక స్వర్గమైన ఏదెనులో ప్రవహించి ఏదెను వనముయొక్క పవిత్రతను, జీవాత్మయైన నరజంటయొక్క ఆత్మీయతను, నాటి సృష్టిలోని జంతుకోటిలో ప్రశాంతతను, మరణభయము, చింత, వ్యామోహము, ద్వేషము వగైరా కలుషిత గుణములకు అతీతముగా నాటి ఏదెను వన స్థితిని ఈ నది కాపాడింది. ఆది 2ః10-15 అనగా దేవునియొక్క మహిమలో ఈ నదికి ఒక ప్రత్యేక స్థానమున్నందువలన నాటినుండి ఈ నది ఒక ప్రత్యేక స్థానాన్ని సంతరించుకొని జీవనదియై అనగా ఈ నదికి వర్షపు నీరుగాని లేక ఏదైనను ఒక మహానదియొక్క కలయికగాని లేక కేవలము దైవానుగ్రహము, దైవశక్తి, దేవుని వరమునుబట్టి ఈ నది ఏదెనులో ప్రవహించి నేలను తడిపి, ఈ తోటను సస్యశ్యామలముగా మార్చివేసింది. అలాగే నాటి జంతుజాలానికి, నరకోటికిని వరద భీతి, కలుషిత వాతావరణము, అపవిత్రమైన దాహమునియ్యక, పవిత్రమైన జలముతో నాటి ఏదెనుయొక్క జీవకోటికిని, నరులకును తనయొక్క పరిచర్య జరిగించింది. ఈ విధముగా భూలోకములోను పరలోకమందును ఒక ప్రత్యేక నామమును సంతరించుకొన్న నదులలో ఈ యూఫ్రటీసు అనిన నది ఒక్కటే, అట్టి చరిత్రను సంపాదించుకొన్నది. ఇందునుబట్టి ఈ నది మహానదిగా ఒక ప్రత్యేక నామాన్ని పొందగల్గింది. మహానది యను పేరు భూలోకములో ఏ నదికిని లేదు. ఒక్క యూఫ్రటీసుకే ఈ పేరు ఈ ఖ్యాతి దక్కింది. ఎందుకంటే పరలోకములోను, భూలోకములోను స్థానమున్నట్లు తెలుస్తున్నది.
ఇట్టి గొప్ప గుణములు కలిగిన ఈ నది ఆరవ దూత తన పాత్రను కుమ్మరించినప్పుడు తూర్పు నుండి వచ్చు రాజులకు ఈ మహానది మార్గము సిద్ధపరచబడునట్లు దాని నీళ్ళు ఎండిపోయెనని వ్రాయబడుటలో పరమార్థమేమిటో? మనము ఆత్మీయముగా తెలిసికోవలసియున్నది. ఈ సందర్భములో ప్రియపాఠకులారా! మత్తయి 21ః18-19లో వ్రాయబడిన వేదభాగములో అంజూరపు చెట్టు ఎండిపోయింది. అంజూరపు చెట్టునకు వేదములో ఒక ప్రత్యేక స్థానమున్నది. అంజూరపు చెట్టు అన్నది నరునియొక్క ఆత్మీయ ఫలభరితమైన జీవితమునకు మాదిరి. అట్టి మాదిరియైన ఆ చెట్టు దేవునియొక్క సన్నిధిలో ఒక ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించికొనియున్నది. వేదములో అంజూరపు చెట్టునకును, ఒలీవ చెట్టునకును, ద్రాక్షాచెట్టునకును ఒక ప్రత్యేకమైన స్థానమున్నట్లుగాను మరియు ఈ చెట్లనుగూర్చి అక్కడక్కడ వ్రాయబడి నట్లుగా కూడా మనము చదువగలము. కీర్తనాకారుడు కీర్తన 128ః1-3, ''యెహోవాయందు భయభక్తులు కలిగి ఆయన త్రోవలయందు నడచువారందరు ధన్యులు, నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జితము ననుభవించెదవు. నీవు ధన్యుడవు - నీకు మేలు కల్గును. నీ లోగిట నీ భార్య ఫలించు ద్రాక్షావళ్లివలె నుండును, నీ భోజనపు బల్ల చుట్టు నీ పిల్లలు ఒలీవ మొక్కలవలె నుందురు,'' అని వ్రాయబడియున్నది. అలాగే యేసుక్రీస్తు నూతన నిబంధనలో దైవకుమారుడైన యేసుక్రీస్తుయొక్క ప్రార్థనాస్థలము కూడ ఒలీవల వనమే, అలాగే యేసుక్రీస్తు తన రక్తమును ద్రాక్షరసమునకు పోల్చి చెప్పుట మరియు యోహాను 15ః1లో యేసుక్రీస్తు తనను గూర్చి ప్రవచిస్తూ - ''నేను నిజమైన ద్రాక్షావళ్లిని, నా తండ్రి వ్యవసాయకుడు. 15ః5లో ద్రాక్షావళ్ళిని నేను, తీగెలు మీరు, ఎవడు నాయందు నిలిచియుండునో నేను ఎవనియందు నిలిచియుందునో వాడు బహుగా ఫలించును,'' అని మనలను సంబోధించుచున్నట్లు ఆ ప్రవచన భావమై యున్నది. యేసుప్రభువు గాడిద మీద వెళ్ళునప్పుడు ప్రజలు ఖర్జూరమట్టలు పట్టుకొన్నారు. అంజూరపు చెట్టు నరునియొక్క ఫలభరిత జీవితమునకు సాంకేతికమై యున్నది.
ప్రియపాఠకులారా! పురుషుడు అంజూరపువంటి జీవితమును, స్త్రీ ద్రాక్షావళ్ళివంటి జీవితమును, పిల్లలు - ఒలీవ మొక్కల వంటి జీవితాన్ని జీవించవలసిన విధానమైయున్నట్లు వేదములో వివరించబడిన ఈ ప్రవచనాలు యొక్క విధానమైయున్నది. కాని ఆ విధముగా జీవించుటకు లోకరీత్యా నరజీవితమునకు చాలా ఆటంకాలున్నవి. అనగా లోకసంబంధమైన ముండ్ల పొదలవంటి శోధనలు, శ్రమలు, విమర్శలు, హింసలు వగైరా వికృతమైన వాతావరణాలు ఇవన్నియు కూడా స్త్రీ పురుషుల జీవితాలలో ఎక్కువగా క్రియ జరిగిస్తున్నాయి. ఇందునుబట్టి పురుషునియొక్క జీవితము - ప్రభువు సన్నిధిలో నాటి అంజూరపు చెట్టు వలె నిష్ప్రయోజనకరమైన జీవితములో ఉంది. అలాగే స్త్రీ తన ధర్మాన్ని నిర్వర్తించలేకపోవుట వలన ఫలభరిత ద్రాక్షావళ్ళి జీవితానికి బదులుగా - లోకసంబంధ వ్యామోహములో తగుల్కొని, ప్రభువుయొక్క ఆత్మీయ సారమును కోల్పోయి శాపగ్రస్థమైన ఈ భూలోక సారములు - అభిలషించి తద్వారా కారు ద్రాక్షలు ఫలించి, చేదు అనుభవాలను చూపించే స్థితిలో స్త్రీ జీవితమున్నది. అలాగే ఇక రాజులను, ప్రవక్తలను అభిషేకించి దైవత్వమునకు యోగ్యకరముగా ప్రతిష్టించిన నాటి ఒలీవ తైలమునకు మూలమైన ఈ ఒలీవల చెట్టు బిడ్డలలో క్రియ జరిగించలేకపోవుటకు కారణము కూడా ఈ శాపగ్రస్థమైన భూమియే. ఇట్టి శాపగ్రస్థమైన ఈ భూమి మీద ఎండిపోయినట్టి నాటి ఏదెనులోని యూఫ్రటీసు నది ద్వారా భూలోకము యావత్తును కలుషితమైపోగా తూర్పు దిక్కున ఉదయించిన నక్షత్రమునకు మూలకారకుడైన క్రీస్తుయొక్క రాకడ ద్వారా - ఈ యూఫ్రటీసు అను నదియొక్క చరిత్ర గతించిపోయినను అనగా ఎండిపోయినను అనగా దీని ప్రభావము తుడిచిపెట్టుకపోయినను - తూర్పుదిక్కున నుండి వచ్చు రాజులు తూర్పు దిక్కున పుట్టిన నక్షత్రమునకు మూలకారకుడైన మొట్టమొదటి రాజు యూదుల రాజైన యేసుక్రీస్తు, ఆయన జనన కాలములో ఆయన నక్షత్రము ద్వారా ఆయనను చూడవచ్చిన ముగ్గురు జ్ఞానులు కూడా రాజులే. వారు రాజులు కాబట్టియే రాజుయొక్క పుట్టుకను గూర్చి అన్వేషించారు. వారు రాజులు కాబట్టియే బంగారు బోళము, ఖరీదైన వస్తుసముదాయములతో ఆరాధించారు. వారు రాజులు కాబట్టియే యూదుల రాజుయొక్క పుట్టుకను కనుగొనగల్గినారు. వారు రాజులు కాబట్టియే హేరోదుయొక్క జ్ఞానమును కలవరపరిచారు. వారు కలవరపరచినందున పడమటి రాజైన ఎదోమీయుడైన హేరోదు కలవరపడి భయాక్రాంతుడై జ్యోతిష్కులు - శాస్త్రులను పిలిచి నానా హంగామా చేశాడు.
ఇందునుబట్టి ఆదిలో ఏదెనులో యూఫ్రటీసు అను మహానది సృష్టి యావత్తునకు జీవమిచ్చింది. దప్పిక దీర్చి, దేవుని మహిమను బయల్పరచుచు, దేవుని శక్తి ప్రభావమును కనబరచుచు, నదియైయుండి వర్షము మీదగాని ఏదైన ఇతర నది మీదగాని ఆధారపడునదిగాక దైవచిత్తము ప్రకారము దేవుని మహిమార్థమై ఆనాటి సృష్టి యావత్తునకును ఆత్మీయముగాను, జీవయుతముగాను దప్పిక దీర్చుచు, ఏ విధముగా మహిమపరచిందో అలాగే దేవుడు ఎన్నుకొన్న ఇశ్రాయేలు అను జనాంగము ఈ యూఫ్రటీసు నదివలె లోకములోని నరకోటికి ఆత్మీయ దప్పికను తీర్చుటకు, దేవుని చేత దశాజ్ఞల ధర్మశాస్త్రముగా అవతరించాడు. యావద్ దేవుని జనాంగమునకును జీవనాధారమైయుండి దేవునియొక్క శక్తిని ప్రభావమును ప్రకటిస్తూ దృశ్యముగా జలధారతో ప్రవహించే నదిగా కాకుండ, అదృశ్యములో ఆత్మల దప్పిక తీర్చు ఆత్మీయ మహానదిగా ప్రవహించి క్రియ జరిగించి, దైవచట్టమును భూమి మీద బయల్పరచింది. అయినను ధర్మశాస్త్రము అను ఈ వినూత్నమైన ఈ యూఫ్రటీసు నది అను ఆత్మీయ జలధార తూర్పుదిక్కున ఉదయించిన యూదుల రాజైన క్రీస్తు, ఆయనయొక్క జన్మ నక్షత్రమును గుర్తించి తద్వారా యూదుల రాజును దర్శించుటకు వచ్చిన ముగ్గురు రాజులు - వారు తూర్పు దిక్కున నుండి వచ్చు సందర్భములో ఈ యూఫ్రటీసు మహానది అన్నట్టి ధర్మశాస్త్రము ఆ ముగ్గురు రాజులు జరిగించిన ఆరాధన, యూదుల రాజైన క్రీస్తుయొక్క రాజ్య సువార్త ప్రకటన - ఆయనయొక్క పరిచర్య ద్వారా ఆయన జరిగించిన బలియాగము ద్వారా ఈ ధర్మశాస్త్రము అను మహానదియొక్క ప్రభావము దినదినము బలహీనపడి నేడు అది ప్రపంచమంతట గాక దానిలోని ప్రవాహమైన ప్రభావము క్షీణించి, ఒక్క ఇశ్రాయేలుకు మాత్రమే పరిమితమై యుండగా - తూర్పు దిక్కున నుండి వచ్చు మహారాజైన యేసుక్రీస్తు ప్రభావము - యావద్ ప్రజకును, యావద్ ప్రదేశాలకును విస్తరించి, ఆయన యొక్క నామమే ఒక మహానదిగా యావద్ నరకోటికిని యావద్ సృష్టికిని పరిమితమైనందున యేసుప్రభువు పల్కిన మాట యోహాను 4ః13-14 ''ఈ నీళ్ళు త్రాగు ప్రతివాడును మరల దప్పిగొనును, నేనిచ్చు నీళ్ళు త్రాగు వాడెప్పుడును దప్పిగొనడు, నేను వానికి ఇచ్చు నీళ్ళు నిత్యజీవమునకై వానిలో ఊరెడి నీటి బుగ్గగా ఉండునని ఆమెతో చెప్పిన విధముగా ఇప్పుడు ప్రియపాఠకులారా! నాటి యూఫ్రటీసు నదికంటె కూడా నిత్య జీవజల ఊటయైన యేసుక్రీస్తుయొక్క ఆత్మీయ జీవజలమును ప్రతి జీవాత్ముడైన నరునికి, ఆత్మీయ దప్పిక తీర్చుటకు దైవత్వము చేత నియమించబడి యున్నది.
కనుక ప్రియపాఠకులారా! తూర్పునుండి రాజులయొక్క మార్గమును - వారి సత్యము, వారి జీవము, వారియొక్క పరలోకరాజ్య స్థాపన, వారి సిద్ధాంతాలు, వారి ప్రభావమునుబట్టి పాతనిబంధనకు మూలమైన జీవనదియు, దశాజ్ఞల మందసమైన జీవనదియొక్క రూపాంతరమైన ధర్మశాస్త్రము, ఈ రెండును తూర్పు నుండి వచ్చు యూదులరాజైన క్రీస్తుయొక్క ప్రభావమునకు ఎండినవై, దైవరాజ్యము యూదుల రాజైన క్రీస్తుయొక్క ప్రభావము యావద్ ప్రపంచములో ఆవరించి అనేకమైన విశ్వాసులను అనేక విశ్వాస మందిరాలను, సంఘాలను ఏర్పరచుటనుబట్టి యూఫ్రటీసు నది జలము కంటె యేసుక్రీస్తు అను ఈ జీవజలనదియొక్క ఆత్మీయ బలము ప్రభావితమై అనేక ఆత్మలను రంజింపజేసి, అనేకులైన విశ్వాసులను ఆత్మపరులను పరిశుద్ధులను జేసి, వారిని అపొస్తలులుగను, హతసాక్షులుగను, వేదసాక్షులుగాను, పరలోక రాజ్య నిమిత్తము త్యాగధనులుగాను మార్చి నేడు క్రియ జరిగిస్తుందంటే - ఇది యూఫ్రటీస్ నదియొక్క ప్రభావము తరిగిపోయినట్లు అనగా ఎండిపోయినట్లే గదా!
ప్రియపాఠకులారా! ఈ విధముగా భూమి మీద విస్తరించిన జీవజల బుగ్గయైన నిత్యజీవియైన క్రీస్తుతో యుద్ధము చేసి, క్రీస్తును అంగీకరించిన క్రైస్తవులను ఆత్మీయంగాను శారీరకముగాను పాడుజేసి వారిని నరకాగ్నికి గురిజేయుటకు నాటి ఏదెనులో స్త్రీతో మాట్లాడిన ఘటసర్పము, మరి పాతనిబంధన కాలములో ఇశ్రాయేలు జనము, వారియొక్క ఇహలోక జీవితములో క్రియ జరిగించిన ఘటసర్పము, క్రూరమృగములయొక్క ప్రవక్తయైన అబద్ధ ప్రవక్త అను ఈ మూడును దైవరాజ్యమునకు వ్యతిరేకముగా క్రైస్తవ విశ్వాసమునకు, క్రీస్తు ఆత్మీయ జీవితమునకును, క్రీస్తును ధరించుకొన్న విశ్వాసులను పాడుజేయుట - ఈ ముగ్గురు అనగా సర్పము, క్రూరమృగము, అబద్ధ ప్రవక్త అను ఈ మూడింటినుండి మూడు అపవిత్రాత్మలు అవతరించినట్లు ఈ వేదభాగములో వివరించబడియున్నది. అనగా లోకమును పాడు జేయుటకు ఆవిర్భవించిన సృష్టి ప్రారంభములో సర్పములో మాట్లాడిన ఆత్మయైన ఘటసర్పపు ఆత్మ, దైవత్వమునకు విరోధంగా క్రియజరిగించి దైవజనాంగము యెడల కఠినముగా ప్రవర్తించి, క్రియ జరిగించిన క్రూరమృగము అను సాతాను సామ్రాజ్య అంధకార ప్రభుత్వ అధికారియే ఈ మృగము. ఇక వీటిని గూర్చి వర్ణిస్తూ వీటి శక్తి ప్రభావములను గూర్చి దైవత్వమునకు అసత్యముగా దైవరాజ్యమునకు విరోధముగా ప్రకటనలు చేస్తూ క్రియ జరిగించే అబద్ధ ప్రవక్త.
ప్రియపాఠకులారా! దైవత్వములో ఎన్ని రకాల శక్తులున్నాయో అన్ని శక్తులు పైశాచికములో ఉన్నాయి. దైవత్వములో ఏయే విధమైనటువంటి అధిపతులున్నారో దురాత్మల సమూహాలలో కూడా అలాంటి అధిపతులున్నారు. వీరు మధ్యాకాశములో ఉంటూ వారి వారి విధి నిర్వహణనుబట్టి అపవాదియను దైవవిరోధి అను ప్రధానిచే నియమింపబడినవారై అనేకమైన ఆత్మలు వాటివాటి హోదాలనుబట్టి అనగా ఆదిసర్పమైన సాతానుయొక్క నియామకమునుబట్టి అపవిత్రాత్మలనియు, దురాత్మలనియు, ప్రేతాత్మలనియు, నాశకరమైన ఆత్మలనియు 2వ థెస్సలొనీక 2ః11-12 ఇందుచేత సత్యమును నమ్మక, దుర్నీతియందు అభిలాష గల శిక్షావిధి పొందుటకై, అబద్ధమును నమ్మునట్లు మోసము చేయు శక్తిని దేవుడు వారికి పంపుచున్నాడు.
అయితే ప్రియపాఠకులారా! అపవాదియను దైవవిరోధికి నానావిధమైన పేర్లున్నాయి. ఇప్పుడు మనము తెలిసికొన్న విధముగా ఆదిఘటసర్పము, క్రూరమృగము, అబద్ధ ప్రవక్త, అంత్యక్రీస్తు, నాశన పుత్రుడు, వాయుమండల అధిపతి, ఈ యుగసంబంధమైన దేవత అని పేర్లున్నవి. అయితే దేవదూత సముదాయములలో ఏ విధముగా ప్రధానులున్నారో అపవాది సంబంధమైన ఆత్మలలో కూడా ఆ విధముగా ఉన్నారు. ఈ విధముగా సర్పము నోటి నుండి, క్రూరమృగము నోట నుండి, అబద్ధ ప్రవక్త నోట నుండి కప్పల వంటి అపవిత్రాత్మలు బయలుదేరి, అవి సూచనలు చేయునట్లు దయ్యముల ఆత్మలనియు, సర్వాధికారియైన దేవుని మహాదినమున జరుగు యుద్ధమునకు లోకమందంతట ఉన్న రాజులను ప్రోగు చేయవలెనని రాజుల యొద్దకు బయలుదేరి వారిని ప్రేరేపించి, వారిలో రాజ్యకాంక్ష, అధికార కాంక్ష, సింహాసనము మీద వ్యామోహము, ఏకచ్ఛత్రాధిపత్యము వగైరా అహంభావములతో కూడిన గుణాలను భావములను హెచ్చించి, తద్వారా వారిని హార్‌మెగిద్దోను అను చోట ప్రోగు చేయుటన్నది - ఈ ఆరవ దూత తన పాత్రను కుమ్మరించినప్పుడు జరిగే సంఘటన.
ప్రియపాఠకులారా! ఇక ఏడవ దూత లోకములో జరిగించిన పోరాట వివరము. ఈ పోరాటములో సమాప్తమైనది అనగా సంపూర్ణమైనది అనగా పోరాటమన్నది అంతమైనది అన్నటువంటి భావము ఏడవ దూత క్రియలు బయల్పరచుచున్నది. ఈ ఏడవ దూతయొక్క పోరాటము మనుష్యులతో కాదు. కాని సమస్తమునకు ఆధారమైన వాయుమండలము - ఇది సాతానుయొక్క కేంద్రము. ఈ సందర్భములో ఎఫెసీ 2ః2-3లో ఈ విధముగా చదువగలము. ''మీరు వాటిని చేయుచు వాయుమండల సంబంధమైన అధిపతిని అనగా అవిధేయులైన వారిని ఇప్పుడు ప్రేరేపించు శక్తికి అధిపతిని అనుసరించి, ఈ ప్రపంచ ధర్మము చొప్పున మునుపు నడుచుకొంటిరి. వారితో కలిసి మనమందరమును శరీరము యొక్కయు, మనస్సు యొక్కయు కోరికలను నెరవేర్చుకొనుచు, మన శరీరాశలను అనుసరించి మునుపు ప్రవర్తించుచు, కడమ వారివలెనే స్వభావ సిద్దముగా దైవోగ్రతకు పాత్రులమైయుంటిమి,'' అనిన విధముగా ఈ వాయుమండలమన్నది అనేకమైన దురాత్మల సమూహములకును, దురాత్మలను ఏలేటటవంటి అపవాదియు సాతాను అను అధిపతికి కేంద్రమైయున్నది. వాయుమండలమును కేంద్రముగా జేసికొని అపవాది నానావిధ క్రియలను ఈ యుగములో జరిగిస్తున్నందువలన, ఇతనికి ఈ వాయుమండలములో ఆశ్రయమైయున్న ఇతనికి 2వ కొరింథీ 4ః4లో మరియొక పేరున్నది. అదియే ఈ యుగసంబంధమైన దేవత. ఇందునుబట్టి ఈ యుగములో ఈ వాయుసంబంధమైన వాని క్రియలు బహుముఖముగా వ్యాపించి రేడియో తరంగాల రూపముగాను, వయర్‌లెస్ చేస్తూ - దూరదర్శన్ వగైరా రూపములో వాయుమండలములో కేంద్రీకృతుడై తన ప్రభావ మూలముగా కృత్రిమ రూపములను భూమి మీద కనబరచుచు, కృత్రిమమైన సంభాషణలు భూనివాసులతో చేస్తూ నానావిధాలుగ క్రియ జరిగిస్తున్నాడు.
ప్రియపాఠకులారా! దేవుని చేత శపించబడి, దైవపోరాటములో పడద్రోయబడిన ఈ అపవాది అను లూసీఫర్ మధ్యాకాశములో వాయుమండలములో కేంద్రీకృతమైయున్నట్లు ఏడవ దూత తన పాత్రతో జరిగించిన దానినిబట్టి తెలుస్తున్నది. వాయుమండలమును కేంద్రముగా చేసికొన్న ఈ దూతయొక్క ప్రభావము దానియొక్క క్రియను గూర్చి ఇందులో వ్రాయబడియున్నది. అందులో మొట్టమొదటగ మెరుపులు, ధ్వనులు, ఉరుములు ఈ మూడింటి వలన కలుగు ఫలితము పిడుగుపడుట - దీని ద్వారా జననష్టము, గృహ నాశనములు, పట్టణములే కళను కోల్పోవును. భూమి మీద పడుట ద్వారాను చెట్ల మీదను వినాశనాలు. అటుతర్వాత పెద్ద భూకంపము అనుటలో - భూప్రకంపమన్నది మధ్యాకాశములోని భయానక వాతావరణమునుబట్టియే కలుగుటన్నది మనము తెలిసికోవలసిన విషయము. ఈ భూకంపము అనిన దానియొక్క భయంకర చేదు అనుభవాలను గూర్చి మనమున్న ప్రదేశములో మనము ఎరుగక పోయినను ప్రపంచ దేశాలలో చైనా, జపాను, ఫిలిప్పీన్ వగైరా ద్వీపాలు, సిసిలీ ద్వీపము, మన దేశములో కిలారి లాతూరు టిబెట్టు వగైరా ప్రదేశాలలో ఈ భూకంపముయొక్క అనుభవాన్ని అనుభవించి అనేకుల చావుకు కారణమైంది. లక్షలమంది చచ్చిన దాఖలాలున్నవి. ఇవి జరుగబోవు యావద్ సృష్టికి కలుగబోవు భూకంపమునకు మాదిరియైయున్నది.
కనుక ప్రియపాఠకులారా! ఏడవ దూతయొక్క పోరాటము లోకాంతమునకు మూలమైయుండి సర్వసృష్టిని అంతము చేయుటకు మూలకారకమైయుండి - యూదుల రాజైన యేసుక్రీస్తు ప్రభువుయొక్క ఆగమనమునకు మార్గమును విశాలపరచుటకు మూలకారకమైయున్నది. అనగా ప్రభువైన యేసుక్రీస్తు యొక్క రెండవ రాకడకు మార్గమును సరాళము చేయుటకు ఈ దూత క్రియ ప్రధానమైయున్నది. ఈ విధముగా వినాశనము సంభవించబోవు ఈ పరిస్థితులలో ఈ భూలోక పట్టణానికి బబులోను అను పేరు పెట్టి దీని మీద క్రియ జరిగించు సాతానుకు, దైవోగ్రతకు లోక వినాశన మూలకారకమైన ఈ అనంత విశ్వమునకు పెట్టబడిన పేరు బబులోను, ప్రసిద్ధమైన పట్టణము మూడు భాగములాయెను - ఆ మూడు భాగములేవి? ఈ ప్రసిద్ధమైన పట్టణములో మొట్టమొదటిది భూలోక యెరూషలేము. ఇది ఇశ్రాయేలు సంబంధమైనది. ప్రవక్తలను, క్రీస్తు విశ్వాసులను, ఆత్మ సంబంధులను, సత్యదేవుని ఆరాధికులను హింసించి అన్యాయపు తీర్పు దీర్చి రాళ్ళతో కొట్టి చంపుతారు. రెండవ భాగము - విగ్రహ సంబంధమైనది. ఈ విగ్రహ నిర్మాణమునకు ఒక నిర్ణయము లేదు. ఇది అజ్ఞానముతో కూడిన క్రియ. దైవత్వమును పూర్తిగా కోల్పోయిన భాగము. ఆత్మయైయున్న దేవుని సత్యమై జీవమైయున్న దేవుని విస్మరించి, నిర్జీవమైయున్న జ్ఞానము లేనివియు, దైవసృష్టములైనవియు, నరుని హస్తకృత్యములైన వాటిని ఆరాధించి దేవుళ్ళుగా భావించునది. ఇది ఈ పట్టణ క్రియ. మూడవ భాగమునకు - దేవుడు లేడు, వేదము లేదు సమస్తము సృష్టితో కూడుకొన్నదే! నరుడు దేవుడు - భూమియే దేవత అనిన సిద్ధాంతముతో ఉన్నది. ఈ విధముగా త్రివిధ భావములతో త్రివిధ స్వభావములతో గుణాతిశయములతో క్రియ జరిగిస్తున్న ఈ పట్టణము మూడును వినాశనమునకు కారకములైనట్లుగా తెలుస్తున్నది.
ప్రియపాఠకులారా! ఇందులో మరెక్కువగా ప్రాముఖ్యతను సంతరించుకొన్న పట్టణము బబులోను అనిన బిరుదును సంతరించుకొనియున్నది. ఈ బబులోను అన్నది పేరునకు మాత్రమేగాక క్రియలనుబట్టి కూడా మహా అపరాధములతోను, పాపములలోను, దైవదూషణకర సంభాషణలతోను, ప్రకటనలతో ఉన్న సాహిత్యములతోను, నినాదములతో కూడిన దైవత్వముతో ముఖాముఖిగ నిలబడుటకు లోకస్థుల చేత బలమును పుంజుకొని, దైవదూషణకర మాటలతో దైవత్వమును కవ్వించినదియే ఈ బబులోను. ఈ బబులోనులోని ప్రధానమైన పానము మద్యము. బబులోనులోని ఆకర్షణమైనది విలాసములతో కూడిన దైవవ్యతిరేక క్రియ వ్యభిచారము. బబులోను అతి ప్రాముఖ్యమైన సాహిత్యము దైవదూషణ - బబులోనులో నిత్యము జరిగే క్రియ. జగడములు, పోరాటములు, అక్రమ వ్యాపారము, హత్యలు, దోపిడీలు, దైవవ్యతిరేక సంబంధమైన నిర్జీవ నికృష్టమైన ఆరాధనలు, భూసంబంధమైన సాహిత్యాలు, భూసంబంధమైన ఆరాధనలు, భూసంబంధమైన విందులు వినోదాలు - ఇది బబులోనుయొక్క మహా వైభోగము. ఈవిధముగా బబులోనన్నది లోకములో మూడు పువ్వులు ఆరు కాయలుగా విస్తరించి, ప్రసిద్ధమైన మహాపట్టణము అన్యాయస్థులు, అక్రమస్థులతోను, మద్యముతోను, నీతిమంతుల రక్తముతోను దప్పికను తీర్చుకొంటూ - దేవుని ప్రవక్తలు క్రీస్తు, అపొస్తలులు, హతసాక్షుల రక్తముతోను చెలగాటమాడుచు, దేవుడు భూమి మీద అనుగ్రహించిన పరిశుద్ధ గ్రంథ వేదమును దూషింపజేస్తూ - అదంతయు మానవ కల్పితమని క్రీస్తు లేడని, ఆయన దేవుని కుమారుడు కాడని, మరియమ్మకు క్రీస్తు తర్వాత బిడ్డలున్నారని, సకలమునకు జీవమును ఆహారమును వాయువును ప్రసాదించే సృష్టియే దేవతయని, దేవుడని, మానవుని యొక్క నిత్యావసరతలకు ఉపయోగపడే జీవజంతువులే దేవతలని, నానావిధ వస్త్రాలంకరణలతో నరులను అజ్ఞాన దశలో త్రిప్పుచు, దైవత్వమును క్షోభింపజేస్తూ - నరులను దైవోగ్రతకు సమీపస్థులుగా జేస్తున్న ఈ బబులోను అన్నటువంటి ఈ లోకము ప్రస్తుతము భూమిలో ఉన్నటువంటి ఈ పట్టణాలు.
ప్రియపాఠకులారా! అందుకే ప్రసిద్ధమైన ఆ పట్టణము మూడు భాగాలుగ ఆయెను. ప్రత్యేకించి అన్యజనుల పట్టణము కాలిపోయినట్లుగా వ్రాయబడియున్నది. ఇది జరిగియున్నది - ఇంకను జరుగవలసి యున్నది. వరదలు చేతను, పిడుగుపాటు, విషవాయువు చేతను, భూకంపము చేతను, కరువు కాటకాల చేతను, హిమపాతము, వేడిగాడ్పులు ఒకటేమిటి? సకలమైనవాటికి ఈ అన్యజనుల పట్టణమును దేవుడు తన తీక్షణమైన పాత్రను, మద్యముగల పాత్రను, ఈ బబులోనువంటి అన్ని రాజ్యాలకు ఇవ్వాలని దేవుని సముఖములోని దేవదూతకు జ్ఞాపకము చేయడము జరిగింది.
కనుక ప్రియపాఠకులారా! ఇక జరుగబోవు పోరాటములో ప్రతి ద్వీపము కనబడకపోవును అనగా మునిగిపోతాయి - ఇది ప్రభవు రాకడలో జరుగును. మహాపర్వతములు భూకంపము వలన నేల మట్టమై కనబడకపోవును. అయిదేసి మణుగుల బరువుగల పెద్ద పెద్ద వడగండ్లు ఆకాశము నుండి మనుష్యుల మీద పడాలి. ఆ వడగండ్లు దెబ్బలకు గొప్పదైన జన జీవనము స్థంభించిపోతుంది. గృహ నాశనము, వృక్ష నాశనము, పంట నాశనము, నరుడు నడుచుటకు కూడా దారిలేనటువంటి దుస్థితి ఏర్పడబోతున్నది. అందునుబట్టి నరులు దేవుని దూషిస్తారు - అనగా నరునిలో మార్పు రాలేదు. ఎందుకంటే నరునియొక్క జన్మలో దాని పుట్టుకలో వాని ఆలోచనలు కేవలము చెడ్డవి. బాల్యములోనే నరునియొక్క స్వభావము సర్పవిషమన్నది ఏర్పడినందున వాడు కేవలము అతనియొక్క బుద్ధి చెడ్డది. ఆది 6ః6-7లో దేవుడు నరుని గూర్చి సంతాపపడినట్లు చదువగలము.
కనుక ప్రియపాఠకులారా! ఆరుగురు దూతలయొక్క అంత్య పోరాటము, లోకనాశనము, ప్రభువు రాకడ ఏమిటో? మనము తెలిసికొనియున్నాము. ఈ పోరాటము యొక్క ఛాయలు ఇప్పుడు ప్రారంభమై యున్నవి. ఈ పోరాటము నరునియొక్క భవిష్యత్తు - లోక భవిష్యత్తులో జరుగబోవు ఈ భవిష్యత్తును గూర్చి వివరించియున్నాడు. ఏమనగా మత్తయి 24ః1-27 ఇది లోకములో జరుగుచున్న, జరుగబోవు పోరాటములు చదివితే క్రైస్తవ విశ్వాసియొక్క పోరాటాలు వివరించబడియున్నది. అందుకే పౌలు అంటున్నాడు ''మంచి పోరాటము పోరాడితిని, నా పరుగు కడముట్టించితిని, విశ్వాసము కాపాడుకొంటిని. ఇక మీదట నా కొరకు నీతి కిరీటము ఉంచబడియున్నది. 2వ తిమోతి 4ః7 ఈ విధముగా మంచి పోరాటము పోరాడి క్రీస్తును ధరించుకొని క్రీస్తును పోలి నడుచుచు అపొస్తలుల ప్రధానత్వము పొందినవాడు పౌలు.
కనుక ప్రియపాఠకులారా! మనము సిద్ధపాటుగలవారమై ఆత్మపరులమై నిరీక్షణ గలవారమై, దీర్ఘశాంతము, ఆశానిగ్రహణ - విశ్వాసముతో జీవిస్తూ - ప్రభువు రాకడ కొరకు నిరీక్షణ గలవారమై మన జీవితాలను ఈ లోకములో మనము ప్రాణముతో ఉన్నప్పుడే చక్కబరచుకొని, దైవత్వమునకు దైవ పిలుపునకును యోగ్యులముగా జీవించెదము గాక!
.......
గలతీ 5ః16 ఆత్మానుసారముగ నడుచుకొనుడి ః అప్పుడు మీరు శరీరేచ్ఛను నెరవేర్చరు.
ప్రియపాఠకులారా! నరునియొక్క జీవితము రెండు భాగములుగ విభజించబడి యున్నది. సృష్టిలోని సృష్టముల కన్నిటికిని జీవయుత శరీరమున్నదిగాని ఆత్మను కలిగియుండలేదు. అయితే ఇది నరునికి ప్రత్యేకించి పరమాత్ముని చేత అనుగ్రహించబడిన శక్తి; నరుని జీవితము - ఆత్మ సంబంధముగాను, శారీర సంబంధముగాను రెండు విధములుగా విభజింపబడి ఒకవైపు లోక ధర్మాన్ని, మరొకవైపు పరమాత్మ సిద్ధాంతాన్ని నెరవేర్చవలసిన బాధ్యత ఉన్నట్లుగ తెలియుచున్నది. ఇందులో 1. ఆత్మానుసారముగా నడుచుటన్నది తెలిసికోవలసియున్నది.
ఆత్మశరీరములు ఏ విధముగ విభజింపబడియున్నవో వీటి సంబంధమైన గుణాతిశయములు కూడా అట్లే విభజింపబడియున్నవి. ఎట్లంటే ః- 1. ఆత్మబలము - శారీరబలము 2. ఆత్మజ్ఞానము - శారీర జ్ఞానము 3. ఆత్మనేత్రము - శారీర నేత్రము 4. ఆత్మదృష్టి - శారీర దృష్టి 5. ఆత్మీయ ఆకలి - శరీర ఆకలి 6. ఆత్మీయ దప్పిక - శరీర దప్పిక 7. ఆత్మీయ నిద్ర - శరీర నిద్ర 8. ఆత్మీయ విశ్రాంతి - శారీర విశ్రాంతి 9. ఆత్మ భాష - దేహ భాష 10. ఆత్మ సంబంధమైన సాధనాలు - శారీర సంబంధమైన సాధనాలు 11. ఆత్మాలంకరణలు - శారీరాలంకరణలు 12. ఆత్మరాజ్యము -లోకరాజ్యము 13. ఆత్మీయ మార్గము - శారీర మార్గము 14. ఆత్మీయ బలహీనత - శారీర బలహీనత 15. ఆత్మ వస్త్రము - శరీర వస్త్రము 16. ఆత్మీయ ఆయుధాలు - శారీర ఆయుధాలు 17. శారీరయుతమైన విందు - ఆత్మ సంబంధమైన విందు 18. ఆత్మ భోజనము - శరీర భోజనము.
కనుక ప్రియులారా! గలతీ 5ః17లో విధముగా - శరీరము ఆత్మకును - ఆత్మ శరీరమునకును విరోధముగా - అపేక్షించును. ఇది ఒకదానికొకటి విరోధముగా ఉన్నవి. ఇందులో శరీర కార్యాలు 5ః19 జారత్వము, అపవిత్రత, కాముకత్వము, విగ్రహారాధన, అభిచారము, ద్వేషములు, కలహములు, మత్సరము, క్రోధములు, కక్షలు, భేదములు, అల్లరితో కూడిన ఆటపాటలు. అయితే ఆత్మసంబంధమైన వాటిని గూర్చి గలతీ 5ః22లో 9 ఫలములను వివరించియున్నాడు. ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘ శాంతము, దయాళుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశానిగ్రహము. కనుక ఇప్పుడు వీటినిగూర్చి వేదరీత్యా క్షుణ్ణముగా తెలిసికొందము. ఇందులో మొట్టమొదటగ దేవునియొక్క ఆత్మ శరీర బలాధిక్యతలను గూర్చి తెలిసికొందము.
ప్రియపాఠకులారా! నరునిలో ఉన్న జీవాత్మ బలమైనది కాకపోతే నరజీవితములో నరునికి ఆలోచనా శక్తి మృగ్యము. అంటే ఆత్మజ్ఞానము కోల్పోయి ఆత్మ వైకల్యము పొందునని భావము. ఈ ఆత్మబలముతో పరమాత్ముని నిత్యత్వము ఏకమైనప్పుడు జరిగే క్రియ బహుశక్తివంతముగా ఉంటుంది. ఇందుకు ఋజువు సంసోను ఆయుధము లేకుండ మేకపిల్లవలె సింహాన్ని చీల్చినాడు. ఇది దేవునియొక్క ఆత్మ అతనిని ఆవరించుట వలన కలిగిన బలము శక్తి, ఇవి రెండును ఉన్నవి. అట్లే పచ్చి గాడిద దవడ ఎముకతో సంసోను వెయ్యిమంది ఫిలిష్తీయులను చంపుట కూడా ఆత్మబలము, శక్తి. అట్లే పటిష్టమైన దాగోను గుడి స్థంభాలను పడగొట్టి గుడిని నేల కూల్చుట కూడా దేవునియొక్క ఆత్మశక్తి! అట్లే దావీదు మహారాజు జీవితములో వడిసెలలోని రాయితో బలాఢ్యుడైన ఫిలిష్తీయ వీరుడైన గొలియాతును సంహరించుట కూడా దావీదును ఆవరించిన దైవాత్మయొక్క శక్తి. అట్లే దానియేలు జీవితములో సింహాల బోనులో నుండి దానియేలును కాపాడుటలో ఆత్మయొక్క బలము, శక్తి సింహాల నోళ్లు మూయించింది. అలాగే మెషగు, షద్రగు, అబిద్నగోలు అనువారు ప్రచండమైన అగ్నిగుండములో పడవేయబడినప్పుడు అగ్ని వాసన వారిని అంటకుండ నిప్పులలో చల్లటి వెన్నెలలో నడిచినట్లు నడిపించింది ఆత్మయే!
ఇక యేసు ప్రభువు తన శిష్యకోటిపై ఊది దైవరాజ్యమును గూర్చి ప్రకటించుటకు లోకము మీదకు వారిని పంపించుటకు వారికి ప్రత్యేకమైన ఒక ఆత్మశక్తిని అనుగ్రహించాడు. అందుచేత తద్వారా వారు రోగములను బాగుచేయు స్వస్థత వరము - మృతులను సజీవులుగ చేయుట, దైవరాజ్యమును గూర్చినటువంటి లేఖన భాగములను రచించుట, ప్రవచించుట వగైరా ఆత్మ సంబంధమైన క్రియాకర్మలను చేయగలిగినారంటే ఆత్మయొక్క బలము, శక్తి ప్రభావమేపాటిదో మనకు తెలియుచున్నది.
ఇక శరీర బలము - ఇది అశాశ్వతమైనది, ఇది దీర్ఘకాలము ఉండేది కాదు. ఇది శరీరములో బలము, శక్తి సన్నగిల్లినప్పుడు లేక ఏదేని ఒక జబ్బు - రోగము సంభవించినప్పుడు శరీరుని బలహీనునిగాను, శక్తిహీనునిగాను చేస్తుంది. ఈ శరీర బలమన్నది పంచేంద్రియములు చక్కగా పని చేసినంతవరకే దీనియొక్క బలాధిక్యతలుండును. కాని తర్వాత ఇది ఆదిలోని ఆదినరునికి దేవుడు ఇచ్చిన శాపాన్ని - ''నీవు మన్నే గనుక తిరిగి మన్నయి పోదువు,'' అనిన శాప వచనాన్ని నెరవేరుస్తున్నది. ఈ శరీర బలమన్నది లోక సంబంధమైన ఆహారము, ఓషధులు, వ్యాయామము, యోగాభ్యాసము మీద ఇది ఆధారపడియుంటుంది. వీటిలో ఏది క్రమము తప్పిన శారీర జీవితము లోప భూయిష్టమే!
ఇక ఆత్మజ్ఞానము ః- ప్రియపాఠకులారా! ఆత్మ జ్ఞానము మూలముననే ఈ అనంత సృష్టి అంతయు ఏర్పడింది ః అంటే ఒకప్పుడు ఈ సృష్టి యావత్తు జలమయమె,ౖ నిరాకారము శూన్యదశగా ఉన్నట్లు ఆది 1ఃలో మనము చదువగలము. ఈ విధముగా నిరాకార శూన్యదశలో ఉన్న భూమికి సృష్టి అలంకారము జరిగించుటకు మూలకారకుడు ఆత్మయే! అతని జ్ఞానమే! అందుకే వేదములో నర జీవితమును గూర్చి సంబోధిస్తూ బాహ్యపురుషుడు - ఆంతర్యపురుషుడు అని రెండుగా వివరించియున్నాడు. బాహ్యపురుషుడు - శరీరము, ఆంతర్యపురుషుడు - ఆత్మ. ఇందులో స్త్రీ అనిగాని, పురుషుడు అనిగాని భేధము లేదు. ఎందుకంటే ఆత్మకు లింగభేదము లేదు. శరీరానికి లింగము, యోని అనే భేధాలు తారతమ్యములున్నవి. ఇట్టి స్థితిలో ఆత్మజ్ఞానము శారీర జ్ఞానము కంటెను గొప్పది అన్నట్లుగా దేవుని చేత సృష్టింపబడిన సృష్టములు మనకు నిరూపిస్తున్నవి.
శరీర జ్ఞానముతో రూపించబడిన సాధనాలకు వాహనాలకు యంత్రాలకు వైర్లు, బ్యాటరీలు పండ్ల చక్రాలు, మరలు, భారీ యంత్ర సామగ్రి, లోహసంబంధముగా పోతబోయబడి బిగించబడిన యంత్ర సామగ్రి, సాధనముల చేతను, విద్యుశ్ఛక్తి చేతను పనిచేసే శక్తిసామర్థ్యములతో రూపించబడియున్నవి. అయితే ఆత్మజ్ఞానముతో రూపించబడిన సాధనములు, వాహనములకు మాంసయుతమైన దేహము, దానిపై రూపించబడిన చర్మము, అందులో పని చేసే రక్తనాళాలు, నరాలు, ఊపిరితిత్తులు, మెదడు, గుండె, పంచేంద్రియములు అనబడు కన్ను ముక్కు చెవి వగైరా అవయవాలు, మూత్రపిండాలు, చెమట గ్రంథులు, జీర్ణకోశము వగైరా నానారకములైన శరీరయుతుడైన నరునికి అసాధ్యమైన రీతిలో ఆత్మ చేత ఇవి రూపించబడి యున్నవి. చిత్తమేమంటే మానవుని చిత్తానుసారముగా యంత్ర సామగ్రి పనిజేస్తుంది. అయితే పరమాత్ముని చిత్తానుసారముగా సృష్టియు క్రియాధర్మమును నెరవేరుస్తున్నవి. ప్రియపాఠకులారా! ఇందులో ఎవరు గొప్ప? శరీరులు గొప్పా? ఆత్మ గొప్పా? ఆత్మ గొప్ప ఎందుకంటే - శరీరానికి మరణమున్నది. అంటే కనబడకుండ లయమైపోయే స్థితి ఉన్నది. ఆత్మకు మరణము లేదు అంటే ఆత్మ మరణము లేనిది, వయోపరిమితి లేనిది ః అలాగే ఆత్మ సంబంధ, శారీర సంబంధ పోరాటాలలో వాడబడే ఆయుధాలు కూడా శరీరయుతమైనవి. అయితే దృశ్యమైనవియు నరుని హస్తకృత్యములైయున్నవి. అయితే ఆత్మ సంబంధమైన ఆయుధములు ఎఫెసీ 6ః12-18 చదివితే ఆత్మ సంబంధమైన పోరాటములనుగూర్చి వాడబడే ఆయుధాలను గూర్చి వివరముగ వ్రాయబడియున్నది.
పాఠకులారా! శారీర సంబంధ పోరాటమునకు మరణమున్నది - ఆత్మ సంబంధ పోరాటములో జీవమున్నది. మరియొక గొప్ప విశేషము - ఆత్మ సంబంధ మరణము నరుడు జీవించియున్నను మృతునిగా జేస్తున్నది. అందుకే అంటున్నాడు. ప్రకటన 3ః1లో విధముగా ''శారీర యుతముగా జీవించుచున్న పేరు మాత్రమున్నను ఆత్మవికాసము ఆత్మీయశక్తి వెలుగు లేకున్నట్లయితే - ఆ శరీరుడు మృతుడే! శరీరముగా చచ్చినవానికి పునరుత్థానమున్నదిగాని ఆత్మీయముగా చచ్చినవానికి పునరుత్థానము లేదు. శారీరముగా చచ్చినవానికి దైవరాజ్యములో ప్రవేశమున్నదిగాని ఆత్మీయముగా చచ్చినవానికి దైవరాజ్యములో పాలుపంపులు లేవు. శారీరయుతమైన సంఘములో కలతలు, భేదములు, కక్షలు, కలహాలు ఉంటాయి. కాని ఆత్మ సంబంధమైన ఆత్మ ఉజ్జీవము ద్వారా కూడిన సంఘములో సమాధానము, ఐక్యత, శాంతము, దైవప్రసన్నత ఉంటుంది.
ప్రియపాఠకులారా! అందుకే పౌలు మొదటి కొరింథీ 3ః1లో కొరింథీ సంఘమును హెచ్చరిస్తూ - ''ఆత్మ సంబంధులైన మనుష్యులతో మాట్లాడినట్లు నేను మీతో మాటలాడలేకపోతిని ః శరీర సంబంధులైన మనుష్యులేయనియు; క్రీస్తునందు పసిబిడ్డలే అనియు మీతో మాట్లాడవలసి వచ్చింది ః అని అంటున్నాడు. ఇందునుబట్టి చూడగా కొరింథీ సంఘము శరీర కార్యాములను అపేక్షిస్తూ ఈ లోకసంబంధమైన సంపదను దీని ఇచ్ఛలను గూర్చి ఆలోచిస్తున్నట్లును - ఈ లోకము మీదనే తమ ప్రేమను కేంద్రీకరించి యున్నట్లును, ఇట్టి బలహీన స్థితిలో ఉండుటనుబట్టి పౌలు ఈ సంఘమును హెచ్చరిస్తున్నట్లుగా ఈ వేదభాగము మనలను హెచ్చరిస్తున్నది. అందుకే ఆత్మానుసారముగ నడుచుకోమని గలతీ సంఘమునుగూర్చి అదే పౌలు అవివేకులైన గలతీయులను హెచ్చరిస్తూ - గలతీయులకున్న అవివేకాన్ని అజ్ఞానాన్ని గూర్చి వ్యాకులపడి గలతీ 3ః1 చదివితే కొన్ని సత్యాలను మనము తెలిసికోగలము. ఇందులో మొదటిగ గలతీయులను హెచ్చరిస్తూ - గలతీయులకు ఇచ్చిన బిరుదు ఏమిటో ఇక్కడ మనము చదువగలము. ''అదేమిటంటే - ఓ! అవివేకులైన గలతీయులారా! మిమ్ము ఎవడు భ్రమపెట్టెను. సిలువ వేయబడినవాడైనట్టుగా యేసుక్రీస్తు మీ కన్నుల ఎదుట ప్రదర్శింపబడెను గదా! ఈ మొదటి వాక్యమును గూర్చి తెలిసికొందము. అంటే ఈ వాక్యరీతిగా గలతీ సంఘము అవివేకముతో కూడినదైయుండి భ్రమలో ఉన్నట్లును - సిలువ వేయబడిన క్రీస్తునే ఎల్లకాలము చూస్తున్నట్లును ఈ మూడు అజ్ఞాన దశలలో గలతీ సంఘము జీవిస్తున్నట్లు ఋజువగుచున్నది.
ఇక రెండవ వచనములో గలతీ సంఘము ధర్మశాస్త్ర సంబంధ క్రియలను ఆత్మీయముగ ప్రారంభించి విశ్వాసముతో వినుటనుబట్టి రెండు విధములైన ఆధిక్యతలున్న ఈ సంఘమునకు ఆత్మ - విశ్వాసము రెండును ఉన్నవిగాని అవివేకమన్నది వీరిలో విలయతాండవ మాడుచున్నట్లుగా ఈ వేదభాగములో పౌలు వివరిస్తున్నాడు. అంటే మొట్టమొదటగా ఆత్మీయముగా ఎంతో ఆత్మీయతను పొందిన గలతీ సంఘము ఆత్మీయతను వదలి లోకాన్ని వెంబడించి, శారీర సంబంధముగా స్వజ్ఞాన పూరిత అహంభావముతో వ్యర్థమైన కష్టాలను అనుభవిస్తూ ఉండుటనుబట్టి పౌలు పై మాటలతో గలతీ సంఘమును గద్దిస్తున్నాడు.
మరియొక మాట ః ఆత్మానుసారముగ లోకములో నడవాలంటే అట్టి వ్యక్తి పట్ల లోకము శరీరము రెండు వ్యతిరేక వైఖరితో వర్తిస్తాయి. ఆత్మపూర్ణుడైన వ్యక్తిని చెడగొట్టుటకు శరీరేచ్ఛలు ఒకవైపు లోకసంబంధమైన సంపద పదవి. స్త్రీ వగైరాల ద్వారా ఆత్మపూర్ణుని లోకము ఆకర్షిస్తున్నది. ఆత్మపూర్ణుడైన సంసోను భ్రష్టత్వము పొందుటకు కారణము శారీర బలహీనత - అంటే శారీర సంబంధ స్త్రీ వ్యామోహము. అలాగే ఆత్మదేవుని చేత తన జనాంగమునకు నియమించిన గాడిదలను మేపే సౌలును రాజుగా జేసి ఘనపరచగా ఆత్మీయముగా జీవించవలసిన సౌలు శారీర సంబంధ ద్వేషమునుబట్టి తన అల్లుడైన దావీదు మీదకు ఈటె ఎత్తి భ్రష్టుడాయెను. అలాగే దావీదు మహారాజుగా ఉండి మహా ఆత్మజ్ఞాన సంపన్నుడైయుండి తన సర్వస్వాన్ని దైవత్వానికి అంకితము జేసి జీవించిన దావీదు - వివస్త్రగా ఉండి స్నానము చేయుచున్న స్త్రీని మోహించి శారీర బలహీనతనుబట్టి ఆత్మీయ భ్రష్టత్వాన్ని పొందినాడు.
ఇంతకు ఈ సాహిత్యములో వివరించబడిన విషయమేమిటంటే శారీర గుణములకును ఆత్మీయ గుణములకు చాలా తారతమ్యములున్నవి శారీర భోజనము వేరు, ఆత్మ భోజనము వేరు. శారీర భోజనములో అనేక రకములైన సృష్టములతో కూడిన రుచికరమైన వంటకాలెన్నో ఉన్నవి. ఇవి తృప్తి లేని ఆహారము - ఏ పూట కాపూట తినవలసిందే! అయితే ఆత్మీయ ఆహారము అదృశ్యమైనదైయుండి ఆత్మకార్యములను నెరవేర్చి ఆత్మదేవునికి యోగ్యకరముగా మహిమకరముగా జీవించుట చేత - ఆత్మీయ ఆకలి ఉపశమనమగుతుంది. ఆత్మీయ ఆహారమునకు కావలసిన పదార్థము జీవవాక్యము - ఆత్మీయ దప్పికకు కావలసిన పానీయము కన్నీటితో చేయు ప్రార్థన. శారీర సంబంధ దప్పికకు పానము నీరు, అలాగే ఆత్మసంబంధమైన మద్యము; శారీర సంబంధమైన మద్యములు కల్లు, సారాయి, బ్రాంది, విస్కీ వగైరాలు; ఇవి నరుని పశుప్రాయునిగాను; సంఘములో అప్రయోజకునిగాను, సమాజములో వెర్రివానినిగాను, దైవసన్నిధిలో దరిద్రునిగాను, కుటుంబములో ఎన్నిక లేనివానిగాను; జన బాహుళ్యములో గుర్తింపు లేనివానిగాను ఒక్కమాటలో చెప్పాలంటే పిచ్చివానిగా జేస్తుంది.
అయితే ఆత్మీయ మద్యమన్నది అట్లు గాకుండ ఆత్మను ఉజ్జీవపరచి, లోకాన్ని మరపించి, దైవత్వాన్ని దైవసన్నిధానాన్ని చూపిస్తూ దేవునితో నడిపిస్తూ - దైవసంబంధమైన రసానుభూతిని, ఆనందానుభూతిని పరవశాన్ని కల్గించుటయేగాక లోకాన్ని మరిపిస్తుంది. అయితే ఈ మద్యమేది? ప్రియపాఠకులారా! ఈ మద్యము బైబిలులో ఉన్నది. యోహాను 2ః8-11 చదివితే కానాలో పెండ్లి ఇంట యేసుప్రభువు అనగా పరమాత్ముడు సృష్టించిన ద్రాక్షామద్యము ఆ వరకు పెండ్లియింటివారు లోకసంబంధముగా తయారుజేసి విందులో పంచిన ద్రాక్షారసము కంటెను, పారవశ్యాన్ని, కైపును ఆత్మానుభూతిని ద్రాక్షారస మాధుర్యాన్ని అనుభవించి పరవశులయ్యారంటే, యేసుప్రభువు నీటితో సిద్ధపరచిన ద్రాక్షారసము కాదది. అవి నీళ్లే -అంటే కానాలోని పెండ్లి ఇంటివారు యేసుప్రభువు చేత రూపించబడిన సిద్ధపరచబడిన ఆరు రాతిబానలలోని నీరే త్రాగినారు. కాని ద్రాక్షారసము త్రాగలేదు. అయితే నీరు ద్రాక్షారసమెట్లయింది? ఈ ద్రాక్షారసము ఆత్మ సంబంధమైన మద్యము ః అయితే అవి లోకానికి మాత్రము నీళ్ళు.
ప్రియపాఠకులారా! ఈ సందర్భములో ప్రభువు పల్కిన మాటలను మనము ఆలోచిస్తున్నాము. యోహాను 2ః7-9 ఆ బానలను యేసు నీటితో నింపమన్నాడేగాని ద్రాక్షారసముతో నింపమని ఆయన చెప్పలేదు. మీరు ఇప్పుడు ముంచి విందు యజమాని యొద్దకు తీసుకొని పొమ్మని చెప్పాడేగాని, ద్రాక్షరసము ముంచి తీసుకపొమ్మన్నట్లు లేదు. ఆ నీరు ముంచి తెచ్చిన పరిచారకులకే తెలిసినది,'' అనుటలో ఇక్కడ కానాలోని పరిచారకులు బానలలో నుండి ముంచి తీసుకొనిపోయింది. ఇందుకు మనమే ఋజువైయున్నాము. ప్రియపాఠకులారా! ఆ నీళ్ళు మనమే, అయితే మనము మన శరీరముతో పరమాత్ముని మహిమపరిచితే - మన జీవితము ఆ రాతిబానలలోని నీటివలె రూపాంతరము పొంది ద్రాక్షరసముగా మారి అనేకులకు ఆత్మీయ దప్పికను ఆత్మీయ తన్మయత్వమును అనగా మైమరపు కల్గిస్తుందని ఇందునుబట్టి మనము తెలిసికోవలసియున్నది.
ఆత్మనేత్రము - శారీర నేత్రము ః- ఇందునుగూర్చి మొదటి యోహాను 1ః1-3 చదివితే మొట్టమొదట ఆత్మీయ నేత్రము జీవవాక్యము నిరాకారమైన సృష్టికి రూపమేర్పరచి రూపించి దానికి జీవమిచ్చి దానిని యొక లోకముగా ఏర్పరచినది - ఈ జీవవాక్యమే! ఎందుకంటే సృష్టికర్త ఆత్మ మొట్టమొదట ఆది 1ఃలో ఈ ఆత్మ ఏడుదినములు చేసిన క్రియలను ఒక్కొక్కదినము తాను జేసిన పనిని చూచి అది మంచిదైనట్లు చూచి తెలుసుకున్నాడు,'' అని వ్రాయబడియున్నది. అంటే వాక్యమైయున్న దేవుడు అనగా వాక్కయియున్న దేవుడు ఆత్మయైయుండి సృష్టి కార్యమును జరిగించుటకు పూర్వము చీకటి జలములమీద ఆత్మగా అల్లలాడినట్లు ఆది 1ః1లో చదువగలము. ఆ తర్వాత సృష్టికి మూలమైయున్న నిరాకార భూమిని జలములలో నుండి వేరుపరచి వెలుగు కలుగును గాక! అనుటలో వాక్కయియున్న దేవుడు ఆత్మలో నుండి రూపాంతరము పొంది వెలుగుగా మారినట్లు ఇక్కడ మనము గ్రహించవలసియున్నది. ఇందునుబట్టి పరమాత్మునికి మూడు నేత్రాలున్నట్లు ఋజువగుచున్నది. 1. ఆత్మనేత్రము 2. వాక్ నేత్రము 3. వెలుగు నేత్రము. ఈ మూడు నేత్రాలతో సృష్టి యావత్తును పరమాత్ముడు రూపించినట్లు మనకు తెలియుచున్నది. ఈ మూడు నేత్రములతో పరమాత్మ మూడు లోకాలను దృష్టించుచున్నట్లు తెలియుచున్నది. 1. పరలోకము 2. భూమి 3. పాతాళము (ఆత్మలు నివసించు స్థలము)
నరుని హృదయాంతరాళము నాలుగవ నేత్రము నరుని మనోనేత్రము ఐదవ నేత్రము ః వీటిని గూర్చి మనము తెలిసికొందము. మొదటి నేత్రము ఆత్మగా ఉండి చీకటియైయున్న సృష్టిని వీక్షించింది. రెండవ నేత్రము ః చీకటియైన సృష్టి మీద వెలుగుగా ప్రకాశించి బహు లోతైన సుదీర్ఘప్రణాళికతో భూసృష్టి నేర్పరచి ఏడు దినములు పరిశోధించింది. మూడవ నేత్రము ః ఆది 7ః1లో ఈ తరమువారిలో నీవే నా ఎదుట నీతిమంతుడవైయున్నావు. అనగా నీతిని చూచి నీతిని పరిశోధించిన నేత్రము, (4) రెండవ కొరింథీ 4ః4లో నరునియొక్క మనోనేత్రము 5. పరమాత్ముడు నరుని హృదయాంతరాళమును పరిశోధించు నేత్రము. ఇందునుగూర్చి కీర్తన ః ''తనను వెదకువారు కలరేమోయని దేవుడు ఆకాశము నుండి నరులను పరిశోధించెను.'' ఐదవ నేత్రము ద్వారా నేడు దేవుడు నేటి నూతన నిబంధనలోని అపొస్తలుల యుగమంతరించి, ప్రభువు రాకకు నిరీక్షణతో కూడిన నేటి విశ్వాసుల కాలములో దేవుడు,'' ఎవరు నశించుట మంచిది కాదని ప్రతి యొక్కరు తన సన్నిధికి చేరాలని 2వ పేతురు 3ః9 ఎవడును నశింపవలెనని యిచ్ఛయింపక అందరు మారుమనస్సు పొందవలెనని మీ యెడల దీర్ఘశాంతముగలవాడైయుండి నేటి నరజీవితమును వీక్షించుచున్నాడు.
ప్రియపాఠకులారా! నరుని నేత్రాలు తానున్న స్థలము పరిసరముల వరకే అతని చూపు పరిమితమైయుంటుంది. మరియు అవి ఎల్లప్పుడు దృష్టి కల్గి యుండక వయసునుబట్టి కాలమునుబట్టి నేత్రములు చూపును కోల్పోయి, మసకలు, రేచీకటి, శుక్లాలు, పొరలు ఏర్పడి దృష్టిని కోల్పోవును. నరుడు చచ్చినాడంటే అవి అంతరించిపోయి లయమైపోవును. కాని సజీవమైన నేత్రము నిత్యము దృష్టి కల్గియున్న నేత్రము ఒక్క పరమాత్మునిదే అనగా ఆత్మదే! ఈ నేత్రమునకు గుడ్డితనము లేదు.
ఆకలిదప్పులు ః- ప్రియపాఠకులారా! ఆకలిదప్పులు అన్నవి శరీరమునకున్నవి - ఆత్మకున్నవి. ఆత్మీయ ఆకలి వేరు శరీర ఆకలి వేరు. శరీర ఆకలి దృశ్యమైన వాటిని కోరుతుంది. ఆత్మీయ ఆకలి అదృశ్యమైయున్న వాటిని కోరుతుంది. శరీర ఆకలికి లోకసంబంధమైన వాటి మీద మమకారము. ఆత్మీయ ఆకలికి లోకసంబంధ పదార్థములతో కూడిన వంటలు తత్సంబంధ భోజన పదార్థాలు అవసరము. నరుడు దీనిని చంపుకోలేడు. ఎందుకంటే శరీర సంబంధ ఆకలికి ఆహారము లేకపోతే శరీరసంబంధ బలహీనతలు కల్గును. శారీర సంబంధముగా నరుడు ఆహారము లేకపోతే ఏలాగు జీవించలేడో - అట్లే శరీరములో ఆంతర్య పురుషుడు అయిన నరునికి కూడా ఆత్మ భోజనము లేకపోతే బలహీనుడును పూర్తిగా ఆత్మీయ భోజనము కరువైనప్పుడు చచ్చినవాడై యుండును. ఆత్మీయ చావు అన్నది నరునికి ఎఫెసీ 2ః1లో వివరించబడి యున్నది. అపరాధముల చేతను, పాపముల చేతను చచ్చినవారైయుండగా,'' అంటే నిర్జీవమైన నిరాహారమైనట్లే - ఆత్మీయ ఆహారము లేకుండ శారీర ఆహార ఆత్మీయ జీవితము మృతమైనదే! అని దీని భావము.
ప్రియపాఠకులారా! శారీర ఆహారమైనను నాలుగు పూటలు లేకపోతే ఉండవచ్చునుగాని ఆత్మీయ ఆహారమన్నది లేకపోతే ఆత్మకు మూలకర్తయైన పరమాత్ముడు సహించలేడు. ఆది 2ః7లో నర నిర్మాణములో పరమాత్ముడు నరదేహములో జీవాత్మను; దేహము భూమిమీదను ఆత్మను నరునిలోను ప్రతిష్టించినప్పుడు లోక పరలోక రీత్యా రెండు సిద్ధాంతములను అనగా రెండు అవసరతలను నరుని దేహములో ఉంచియున్నాడు. శరీరమునకు కావలసిన ఆహారముతోబాటు జీవాత్మ ప్రతిష్టిత మూలముగ జీవాత్మకు కావలసిన ఆహారమును గూర్చి ప్రయత్నించక ఇందుకు భిన్నముగా నరుడు ప్రవర్తించుచు శారీర సంబంధ అవసరతలను గూర్చియే ప్రయత్నిస్తున్నాడేగాని - శారీర పోషణనుగూర్చి, దాని ముస్తాబులను గూర్చి, దానియొక్క ఆరోగ్యాన్ని గూర్చి, దాని ఘనతను గూర్చి, దాని అందమునకు మెరుగు పెట్టుటకును, దేహములో కలుగు ప్రతి లోకసంబంధ మెరుగులను దిద్ది శ్రద్ధ వహిస్తున్నాడేగాని ఆత్మను గూర్చి శ్రద్ధ వహించు స్థితిలో లేడు.
అలాగే శరీర పానము వేరు - ఆత్మ పానము వేరు. శరీర పానీయములు అనేకములున్నవి. ఉదా|| నీరు - మజ్జిగ - షరబత్తులు, కూల్‌డ్రింక్స్; మద్యముతో కూడిన మత్తుపానీయములు - కొబ్బరి నీరు వగైరాలు. ఇవి దేహ సంబంధమైనవి. అయితే ఆత్మీయ దప్పికకు ఒక్కటే పానీయము - అదే ఆత్మ జీవజలము; ఇది దొరకునది ఇది పొందాలంటే యేసు నామమొక్కటే! మరి దేనిలో లేదు. శారీర దప్పిక తాత్కాలికమే! నరుడు ప్రతినిత్యము తన దేహ అవసరతకు నీరు వాడాల్సిందే! అలాగే ఆత్మకు కూడా నిత్యముగా వాడవలసిన ఈ నీరున్నది ఇవియే ప్రార్థన. శారీర అవసరతలకు దినమునకెన్నోసార్లు నీరు త్రాగుచున్నాము. కాని ఆత్మీయ దప్పిక అవసరతలనుబట్టి ఎన్నిమార్లు మనము ప్రార్థన చేస్తున్నాము.
ప్రియపాఠకులారా! ఉదా|| లూకా 11ః19లో వివరించబడిన లాజరు ధనవంతుడు కథలో లోకసంబంధముగా ధనవంతుడు ఎన్నో పానీయములు వాడియున్నాడు. అయితే లాజరు ఒక్క గంజి తప్ప మరే పానీయము ఎరుగడు. ధనవంతుడైతే అనేకములైన పానీయములు వాడి అలవాటుపడి తాను చనిపోయిన తర్వాత తన ఆత్మ అగ్నిలో కాలుచుండగ ధనవంతుడు ఆహారాన్ని ఏ పదార్థాన్ని కోరలేదుగాని, అబ్రాహామునకు మనవిజేస్తూ లాజరును తన చిటికెన వ్రేలికొనను నీటిలో ముంచి తన దప్పికను తీర్చుమనుట - ధనవంతుడున్న స్థలముయొక్క స్థితి ఎట్లున్నది? నిత్యమైన దావాగ్నిలో కాలుచున్న నరదేహమునకు చిటికెన వ్రేలితో ముంచిన నీరు దప్పికను తీర్చునా? అన్నది మనము ఆలోచించవలెనుః భూలోకములో నీళ్ళున్నవి. కాని పరలోకములో నీరు లేదు. భూలోకమును ఆవరించి సముద్ర జలములున్నవి. పరలోకములో నదులు లేవు, చెరువులు, సముద్రాలు లేవు. ఏ విధమైన సరస్సులు లేవు. అయితే అక్కడ ఆత్మలు ఉన్నవి. ఆత్మలున్న దేశములో ఆత్మయుతమైన జలములుండునుగాని దృశ్యమైన జలములుండవని మనము గ్రహించవలెను.
ఇందులో గొప్ప నిగూఢ సత్యమున్నది. మనము ఆత్మీయ దృక్పధముతో ఈ సంఘటనను గూర్చి ఆలోచిస్తే నరకములో కాలుచున్న ధనవంతుని శరీరము లోకసంబంధ మాంసయుత శరీరము కాదు - ఆత్మయే! అలాగే అబ్రాహాము ఎదురురొమ్ము ఆత్మయే! దానిని ఆనుకున్న లాజరు కూడా ఆత్మయే! ధనవవంతుడు కాలుచు దప్పిక దీర్చమన్నది దృశ్యమైన నీటితో కాదు. లాజరుయొక్క ఆత్మీయ చిటికెన వ్రేలికొనతో ముంచి ఆత్మీయ జలముతో - ఆత్మీయ జీవజలము నొసంగమని భావము. అయితే పరలోకమందున్న రెండు స్థలములలోను, వాటి మధ్యలోను పెద్ద అగాధము అలుముకొనియుండగా - ఆ రెండు స్థలములు వేరుపడియున్న స్థలములో - ధనవంతుని ఆత్మీయ దప్పికను తీర్చుటకు వీలుండదు. యేసుప్రభువు కూడా సిలువ మీద శారీరయుతముగా దప్పిగొన్నట్లుగాను, ఆయన దప్పిక ఏ సంబంధమైనదో తెలియని ఆజ్ఞానులు, చిరకను ముంచి ఆయన నోటికందించి త్రాగమన్నారు. కాని ఆయన దప్పిక అది కాదు. ఆయన దప్పిక తనను ఈ లోకానికి పంపించిన తండ్రియొక్క ప్రణాళికయైయున్నది. దానిని నెరవేర్చుటకు ఆయన దప్పిక కొన్నట్లును, సిలువ మీద పలికిన ఆరవ మాట అనగా సమాప్తమైనది అనిన మాటతో ఆయన దప్పిక తీరినట్లుగా మనము గ్రహించవలసియున్నది. ప్రియపాఠకులారా! రెండు విధములైన దప్పికలను తెలుసుకొన్న మనము కేవలము శారీర దప్పికతోనే ఉన్నామా? లేక ఆత్మీయ దప్పికను గూర్చి ఏనాడైన ఆలోచిస్తున్నామా? దైవత్వమునకు కావలసింది శారీర దప్పిక కాదుగాని, ఆత్మీయ దప్పికను తీర్చుటయైయున్నది.
ప్రియపాఠకులారా! ఇందులో నిద్ర కూడా మానవ జీవితానికి చాలాప్రాముఖ్యమైన క్రియగా ఉన్నది. నిద్రన్నది ఒక్క శరీరమునకు మాత్రమే కాదుగాని ఆత్మకు కూడా కావలసియున్నది. చిత్రమేమంటే శరీర నిద్ర తాత్కాలికము, ఆత్మీయ నిద్ర శాశ్వతము. అంటే ప్రభువు రెండవ రాకడలో వచ్చునంత వరకు చనిపోయిన వారికి నిద్రావస్థవున్నది. శారీర నిద్రలో ఉన్నవానిని సాటి శరీరులు మేల్కొల్పగలరు. అయితే ఆత్మ నిద్రలో ఉన్నవానిని పరమాత్ముడే మేల్కొల్పాలి. శారీర నిద్రను గూర్చి వేదములో ప్రసంగి గ్రంథములో చనిపోయినవానికి లోకముతోగాని, లోకస్థులతోగాని, తనకు జన్మనిచ్చిన వారితో రక్త సంబంధులతోగాని ఎటువంటి సంబంధములుండవు. సూర్యుని క్రింద జరుగువాటిలో చనిపోయినవారికి ఎటువంటి పాలుపంపులు సంబంధాలుండవు. పగ, ఈర్ష్య ద్వేషము వారిలో ఉండవు. వారు లోకము చేత మరువబడినవారైయుందురు,'' అని వ్రాయబడియున్నది.
దేవుడు కూడా నిద్రావస్థను అనగా ఆత్మీయ నిద్రలో ఉండినట్లు మార్కు 4ః35-41 చదివితే ఆయన దోనె అమరమున తలగడమీద వాల్చుకొని నిద్రించుచుండగా అని వ్రాయబడియున్నది. దైవ వాక్యము 121వ కీర్తనలో ''నిన్ను కాపాడువాడు కునుకడు, ఇశ్రాయేలును కాపాడువాడు కునుకడు, నిద్రపోడు'' అని ఉన్నది. మరి దైవకుమారునికి నిద్ర ఏమిటి? అంటే ప్రభువు తానేర్పరచుకున్న శిష్యకోటికి పరీక్షార్థమైన నిద్రయైయున్నది. అంటే శిష్యకోటియొక్క విశ్వాసమును పరీక్షించుటకు తాను నిద్రావస్థను పాటించినట్లుగ మనము తెలిసికోవాలి. శారీర నిద్ర వలన నరుడు ఒకచోట మంచిని, అనేక చోట్ల అధోగతిని సంపాయించు కొన్నట్లు వేదరీత్యా మనము తెలిసికొందము.
ప్రియపాఠకులారా! ఆదిలో ఏదెనులో ఆదినరునికి దేవుడు గాఢనిద్ర పుట్టించాడు. ఇందువలన నరునిలోనుండి మరియొక శరీరము రూపించబడుటకు సహాయమైంది. అనగా నరునికి సాటి సహాయమైంది. యాకోబు నిద్రించినప్పుడు తాను కన్న కలనుబట్టి దైవప్రత్యక్షతను పొంది, దైవ ఆశీర్వాదానికి యోగ్యుడై బేతేలునకు పునాది రాయి వేశాడు. సంసోను వేశ్య తొడల మీద నిద్రాసక్తుడై గాఢనిద్రపోయి, దేవుడు తన కనుగ్రహించిన ఈ విని బలాధిక్యతను ఆత్మవరమును శక్తిని కోల్పోయి అంధుడాయెను. అలాగే యోనా దేవుడు వెళ్ళమన్నట్టి స్థలమునకు వెళ్ళకుండ వక్రమార్గమున మరియొక స్థలమునకు వెళ్ళుటకు ప్రయత్నించి దేవుడు వెళ్ళమన్న పట్నమునకు వెళ్ళుటకు వ్యతిరేకమైన మార్గమును అవలంభించుటయేగాక, తానెక్కిన ఓడ అడుగు భాగములో గాఢనిద్రకు ఉపక్రమించి అన్యులైన ఓడ నావికుల చేత విమర్శించబడి, ఒళ్ళు తెలియని నిద్రలో ఉండి ఓడకు చేటు తెచ్చినాడు. ఈవిధముగా తన నిద్ర మూలమున ఓడకు దాపురించిన ప్రమాదమునకు ఓడలో నుండి సముద్రములో పడవేయబడి తిమింగలము పాలయ్యాడు. చూశారా? శారీర నిద్ర తెచ్చిన చేటు ఎంత దౌర్భల్య స్థితియో;
ఆత్మీయ నిద్రన్నది మెలకువతో కూడినది. నరజ్ఞానమునకు అతీతమై శారీర దోషమూలముగ సంభవించు అనర్ధాల శిక్ష నుండి కాపాడుతుంది. ఆత్మీయ నిద్ర కల్గినవాడెప్పుడును మెలకువ కల్గినవాడై యుండును ః శారీర సంబంధ నిద్ర నరుని నిద్రపోతుగా చేస్తుంది. అందుకే మొదటి థెస్సలొనీక పత్రిక 4ః13లో ''నిరీక్షణ లేని ఇతరుల వలె మీరు దుఃఖపడకుండు నిమిత్తము నిద్రించుచున్నవారిని గూర్చి మీకు తెలియకుండుట నాకిష్టము లేదు,'' అనుటలో ఆత్మీయముగా నిద్రించిన వ్యక్తులను గూర్చి శరీరులు రోదించెదరు, ప్రలాపించెదరు. ఇట్టి క్రియ నిరీక్షణ లేని నరుల విధానమైయున్నది. అయితే నిరీక్షణ కలవారైతే ఆత్మీయముగా నిద్రించినవారిని గూర్చి దుఃఖించరు, ప్రలాపించరు.
నిద్రలో రెండు రకములున్నవి. 1. మరణ నిద్ర 2. విశ్రాంతి నిద్ర. ఆదిలో దేవుడు సృష్టించిన ఆత్మ సృష్టి చేసిన తర్వాత ఏడవ దినమున విశ్రమించినట్లు వేదములో ఉన్నది. దైవత్వము పొందిన ఈ విశ్రమము ఆయనయొక్క నిద్రావస్థను సూచిస్తున్నది. అట్లే లోకపాప నివారణార్థము ప్రతి నరజీవియొక్క పరిశుద్ధత కొరకు బలియాగము చేసిన యేసుక్రీస్తుయొక్క మరణము కూడా ఇటువంటి నిద్రావస్థ అనగా సమాధిలో ఆయన విశ్రమించాడు. ఈ విశ్రమించుటయే నిద్ర. ఈ నిద్రావస్థలో దైవకుమారునియొక్క శరీరము కుళ్ళిపోలేదు, దుర్గంధము కాలేదు. ఈయనను పరమాత్ముడే మరల తనయొక్క జీవముతో పునరుత్థానుని గావించాడు. ఇందునుబట్టి లోక నరకోటిలో మరణవిజయుడు ఒక్క క్రీస్తే! ప్రథముడని ఈయన ముందుగాని, తర్వాతగాని మరణాన్ని జయించిన వాడు లేడని ఋజువగుచున్నది.
ప్రియపాఠకులారా! ఆత్మ శరీరమును గూర్చి చాలా నేర్చుకొనియున్నాము. ఇప్పుడు ఆత్మకు శరీరమునకున్న భాషల విషయమునుగూర్చి కూడా తెలిసికోవలసియున్నది. ఆదిలో దేవుడు ఏదెనులోని నరునితో ఆత్మీయ భాష మాట్లాడినట్లుగా వేదములో చదువగలము. అంటే ఆత్మకు భాషవున్నదా? అనిన ప్రశ్న ఈనాడు సకల జనులతోబాటు క్రైస్తవులు కూడా అనుమానిస్తున్నారు, విమర్శిస్తున్నారు, ఉన్నది అనిన సత్యాన్ని బైబిలు వివరిస్తున్నది. ఆదిలో దేవుని తోటలో ఉన్న నరునికి ఆదాము అను పేరు పెట్టినది దేవుడే! ఆయన పెట్టిన పేరు ఆదాము. ఆదాము అంటే హెబ్రీ భాష - ''దేవుని భాష;'' ఈ హెబ్రీ భాషలో ఆదాము అంటే ఎర్రమన్ను అని అర్థము. హవ్వ అంటే హెబ్రీ భాషలో సృష్టికి తల్లి - అంటే జీవము గల్గి చలించు వాటికన్నిటికి హవ్వ తల్లి ః ఆత్మ భాషకు ఇది మొదటి ఋజువు.
రెండవది ః దేవుడు తన పేరును యెహోవాగా ప్రకటించినట్లు వేదములో చదువగలము. మీ దేవుడైన యెహోవా దోషము గల్గినవాడు ః యెహోవా అనగా ఉన్నవాడు ః ఇది హెబ్రీ భాషలోని మాట. నిర్గమ 3ః14 ఈ విధముగా ఆత్మకు భాష ఉన్నట్లుగాను, మరి మూడవ ఋజువు సీనాయి పర్వతము మీద దేవుడు మోషేకు అనుగ్రహించిన ఱాతిపలకలలోను పదిశాసనముల వివరమును గూర్చి మనము తెలిసికొంటే అది దేవుని చేత వ్రాయబడినట్లును, అది దేవుని భాషయైనట్లును, దేవుడే స్వయముగా వ్రాసినట్లుగా వ్రాయబడియున్నది. కనుక ఆత్మ భాషకు లిపి కూడా ఉన్నట్లుగా మూడవ సాక్ష్యము. ఇక నాలుగవది గోడమీది సాక్ష్యము ః దానియేలు 5ః24 రాజు విషయములో అతడు చేసిన అయోగ్యకరమైన పనికి దైవభాషలో దేవుడు గోడమీద వ్రాసిన - ''మెనే మెనే టెకేల్ ఉఫార్సిన్'' అని గోడ మీద వ్రాయబడిన ఆ భావమును శరీర సంబంధుడైన రాజు - ఆ రాజు సంస్థానములోని విద్వాంసులు, పండితులు గ్రహించకపోయినను దానియేలు ఆత్మసంబంధి కాబట్టి ఆ ఆత్మీయ భాషలో ఉన్న ఆత్మీయ సత్యాన్ని గ్రహించి, ఆ వ్రాతలో వివరించబడిన ప్రకారము ఆ రాజుకు కలిగిన పతనము, పరాభవము ఈ వేదభాగములో మనము చదువగలము. ఇందునుబట్టి చూడగా దేవుడు మన మీదనున్న ప్రేమకొద్దీ ఆయన భాషను కూడా నరునికి నేర్పినట్లు మనకు తెలుస్తున్నది. దేవుని భాష, దేవుని లిపి, దేవుని మాటలు ఇది పాతనిబంధన జనాంగమునకివ్వబడిన పరమ భాగ్యము.
అయితే నూతన నిబంధనలో దేవుని కుమారునియొక్క మాటలు ఆయన భాష, ఆయన ప్రత్యక్షత, ఆయన మహిమ, ఆయన ప్రభావము, వ్యభిచారములో పట్టుబడిన స్త్రీ యోహాను 8ః6-8 చదివితే యేసుప్రభువు తండ్రివలె ఱాతిపలకల మీదను, గోడల మీదను కాక వంగి నేల మీద ఏమో వ్రాయుచున్నట్లుగా - ఆ వ్రాయుచున్న మాటలు ఆయనను విమర్శించే జనాంగమునకు తెలియని రీతిలో ఉన్నట్లును, ఆయన ఒకటి రెండుమార్లుగా వంగి ఏమో వ్రాసినట్లుగా ఈ సువార్తలోని భాగము చదువు చున్నాము. పాతనిబంధన కాలములో ఆత్మ దేవుడు మోషే కిచ్చిన శాసనము గల రాతిపలకలు దేవుని లిపి దేవుని చేవ్రాతతో కూడినది. అయితే యేసుప్రభువు వ్రాసిన వ్రాత, ఆయన చేసిన బోధలోని మాటలు, ఆనాటి విద్యాకోవిదులైన యూదులకు, ప్రధానులకు గోచరము కాలేదు. అంటే వారికి అర్థము కాలేదు. ఆ భాషను నేర్చుకొనుటకు ఆనాటి జనాంగము ప్రయత్నించినట్లు లేదు.
యేసుప్రభువు వాగ్దానము చేసిన రీతిగా మరణవిజయుడై పునరుత్థానుడై, మోక్షారోహణుడైన పిదప అపొస్తలుల మీద వ్రాలిన ఆత్మ అపొస్తలుల చేత నానారీతులుగా భాషలతో మాట్లాడించి, నానా విధములుగా దైవ ప్రవచనాలను ఆయా భాషలలో వ్రాయుటకు క్రియ జరిగించినట్లుగా అపొస్తలుల వేదసాహిత్యము యొక్క లేఖన భాగములు ద్వారా ఋజువువగుచున్నది. ఈ విధముగా ఆత్మావేశముతోనే ఆత్మ భాషను అర్థము చేసికొన్న పౌలు 8 సంఘములకు 8 భాషలలో లేఖనములు వ్రాసినట్లు మనము చదువగలము. పౌలు వ్రాసిన 8 సంఘములు నానావిధమైన భాషలతో ఆనాడును ఈనాడును జీవిస్తున్నట్లును మనకు తెలియును. అన్ని భాషలు పోగా నేటి మనయొక్క భారతదేశములో తెలుగు భాషలో మనము ఆత్మీయ భాషను ఆత్మీయ జ్ఞానముతో తర్జుమా జేసి దైవవర్తమానము ప్రకటిస్తున్నాము. మరియు రేడియోలు టెలివిజన్ల ద్వారా కరపత్రముల ద్వారా తెలిసికొంటున్నాము. ఇది ఆత్మభాష యొక్క ప్రభావితమైన క్రియ.
ప్రియపాఠకులారా! ఇప్పుడు శారీర ఆత్మీయ జీవితములలో వాడబడు సాధన సంపత్తినిగూర్చి మరియు వాహనములనుగూర్చి మనము తెలిసికోవలసియున్నది. ఏలీయా సజీవముగ దైవలోకమునకు వెళ్ళగలిగెనంటే ఈ కార్యమునకు ఆయనకు సాధనముగా వాడబడిన సుడిగాలి. ఈ సుడిగాలి సాధనముగా అతని ఆత్మీయ జీవితానికి వాడబడింది. అట్లే దైవవర్తమానమును నరకోటికి ప్రకటించు దేవదూతలకు కూడా ఱెక్కలున్నప్పటికిని, వాయువు వారికి వాహనముగాను, సాధనముగాను వాడబడియున్నది. దేవదూతలకును, లూసీఫర్ అతని దూతలకును సంభవించిన యుద్ధ పోరాటములో వాడబడిన ఆయుధాలు అన్ని ఆత్మ సంబంధమైనవే! పోరాటము కూడా ఆత్మసంబంధమైనవే! ఇట్టి పోరాటములో భూత దూత గణములకు సాధనములుగాను, వాహనములుగాను ఉపయోగపడినవి మేఘములు, పవనములు; ఉరుములు, మెరుపులు ఇవియే బాంబులు, ఇది ఆత్మసంబంధమైన పోరాటము ద్వారా జరిగిన యుద్ధ క్రియ. ఎఫెసీ 6ః12లో పౌలు ప్రవచిస్తూ నరుడు సాగించే ఆత్మీయ పోరాటములో వాడవలసిన సాధనాలు, ఆయుధాలను గూర్చి బహు వివరముగ వ్రాసియున్నాడు. పోరాడే శత్రువులయొక్క రూపములు, వారి ఆధిక్యతలు, వారి శక్తి సామర్ధ్యాలనుగూర్చి కూడా వివరిస్తున్నాడు. ఇది ఆత్మసంబంధమైన పోరాటమై యున్నది. ఈ పోరాటములో వాడబడు సాధనాలైన దట్టి, కవచము , శిరస్త్రాణము, జోడు, ఖడ్గము వగైరాలను గూర్చి బహువివరముగ వ్రాసియున్నాడు.
అయితే మొదటి థెస్సలొనీక 4ః14లో ప్రభువునందు మరణించిన ఆత్మలకున్న ఆధిక్యతలను గూర్చియు, భూమిమీద సజీవులై నిలిచియున్న నీతిమంతులను ప్రభువు పిలుచుకొను సందర్భములో వాడబడు వాహనము మేఘమండలము అని వివరించియున్నాడు. ప్రియపాఠకులారా! ఇది ఆత్మ సంబంధమైన సాధనములు, వాహనములను గూర్చిన వివరము. ఇక ముస్తాబులు - అలంకరణల మాటల కొస్తే శరీర సంబంధమైన అలంకరణలు, లోహసంబంధమైనవి పుష్పములతోను, రంగులతోను, కాటుక, పౌడర్లు, స్నో, తిలకము నానావిధములైన పక్కపిన్నులతో కూడినదైయున్నది. వీటితోబాటు వెండి బంగారములతో రూపించబడినవి. ఇవి స్త్రీయొక్క అలంకరణలు. ఇంచుమించు పురుషుడు కూడా వాచి, ఉంగరాలు, మెడకు గొలుసు, ఖరీదైన బట్టలు, వగైరాలు - ఇవిగాక కాలిజోళ్ళు, మేజోళ్ళు వగైరా అలంకరణలు. గలతీ 5ః22 ఇవి ఆత్మీయ అలంకరణలు ఇవి కంటికి కానరానివి, బజారులో దొరకనివి, అలవికానివి ః ఆత్మ ఫలమేమనగా ః- ప్రేమ, సంతోషము - సమాధాము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశానిగ్రహము.
లోకరాజ్యములు ః- తాత్కాలికమైనవి; అశాశ్వతమైనవి. నరుని భ్రమపెట్టేవి. నరునికి లేని ఆశలు కల్పించి, వానిని దైవత్వము నుండి దూరపరచేవి లోకరాజ్యములు ః అందుకే మొదటి యోహాను పత్రికలో ఈ లోకమునైనను లోకములో ఉన్నవాటినైనను ప్రేమింపకుడి ః అంటున్నాడు. అంటే లోకములో ఉన్నవి నేత్రాశ, జీవిత డంబము ఇవి ఆత్మరాజ్య సంబంధములు కావు. అయితే ఆత్మ రాజ్యమేది? ప్రకటన 21ః1 ఈ రాజ్యములో సముద్రముండదు, మరణము లేదు, భయము లేదు, పదవులు లేవు, వ్యామోహాలు లేవు, ఆకలి దప్పికలు లేవు, పొలాలు స్థలాలు మేడలు లేవు, వంటావార్పు లేదు. హాస్పిటల్స్ లేవు. సినిమాలు లేవు; మానవుని జీవితము పతనము చేసే ఏ సాధనము లేదు. అంటే మద్యపాన విక్రయము లేదు, అంగళ్ళు లేవు, పెండ్లిండ్లు లేవు, ఋణ బాధ లేదు, సృష్టికర్తతో సహవాసము - సృష్టికర్తతో జీవనము. సృష్టికర్త ఈ రాజ్యమునకు దీపము. ఇక్కడ లోకసంబంధమైన కరెంటు లేదు. జాతి కులమత శాఖ వగైరా ఏ భేధమును ఇక్కడ లేదు. స్త్రీ పురుష అనే తారతమ్యము లేదు, ఎందుకంటే ఆత్మకు లింగ భేధము లేదు. కనుక ఆత్మయుత జీవితము ఇచ్చట ఉండబట్టి స్త్రీ పురుష లైంగిక విలాసాలకు యిచ్చట స్థానము లేదు. లోకశరీరము లేనందువలన సంతానోత్పత్తి క్రియ లేదు; కుటుంబ నియంత్రణ లేదు, ఎలెక్షన్లు లేవు, కరువుకాటకాలు లేవు. ప్రియపాఠకులారా! తెలిసికొన్నారు గదా! తెలిసికొన్న పై రెండు రాజ్యాలలో నీవు ఏ రాజ్యాన్ని కోరుచున్నావు? ఏ రాజ్యములో జీవిస్తావు? నిరీక్షణలో జీవించుః
ప్రియపాఠకులారా! ఇప్పుడు మరియొక ఘట్టములోనికి మనము ప్రవేశిస్తాము. ఆత్మీయ పుష్పము - శారీర పుష్పము ఈ రెండు విధములైన పుష్పములనుగూర్చి తెలిసికొందము. పరమగీతము 1ః5లో శూలమతి తననుగూర్చి ప్రకటిస్తూ నేను షారోను పొలములో పూయు పుష్పము వంటిదానను అని అంటున్నది. అనగా వికసించిన ఆత్మయొక్క స్థితిని గూర్చి తెలియజేయు మాట ఇది. ఆత్మ పుష్పము వికసించాలంటే మొట్టమొదటగ శారీర హృదయ క్షేత్రమునుండి కండ్ల ద్వారా స్రవించు, పాప పశ్చాత్తాప పూరితమైన ప్రార్థనయే! ఈ ఆత్మ పుష్ప వికసింపునకు ఈ నీరు ఆహారమైయున్నది. శారీర నేత్రముల నుండి, హృదయ పరివర్తన ద్వారా స్రవించిన జలము ఆత్మను తాకకుంటే ఆత్మపుష్పము వికసించుటకు బదులు మొగ్గగానే ఉండి ఎండి నశించిపోతుంది. అనగా కఠినమైన మనస్సుగల ఆత్మగా తయారగును.
శారీర పుష్పము దీనిని యౌవ్వనమంటారు. ఈ శారీరమన్నది పురుషునిలో కంటే స్త్రీలో ఎక్కువగా కనబడుచు ఎక్కువగా క్రియ జరిగిస్తున్నది. ఒక స్త్రీ బాల్యము నుండి యౌవ్వనములో ప్రవేశించాలంటే పుష్పవతి కావాలి. పుష్పవతి కానిదే ఆమె యౌవ్వనస్థురాలు కానేరదు. అలాగే మనలో వున్న ఆత్మ కూడా వికసించి దైవత్వాన్ని ఆకర్షించలేకపోతే, మన ఆత్మీయ పుష్పముయొక్క పరిమళ జీవితము పరిసమాప్తి కాదు. ఇది అడవిలో కాచిన పువ్వు వంటి జీవితమునకు సమానము.
ప్రియపాఠకులారా! శరీరము బలహీనమైనది - లోకసంబంధ ఆహారము ఔషధులు, తైలాదులు, చూర్ణములు వగైరాలతో శక్తిమంతులుగా చేసికోగలము. ఆత్మీయ బలహీనతకు పైవేమియు పనికి రావు. ఆత్మీయ బలహీనతకు ఆత్మ సంబంధమైన ఆహారము కావలెను. ఈ ఆత్మ సంబంధమైన ఆహారము దృశ్యమైనది కాదు. ఆత్మ దృశ్యమైనది కానప్పుడు ఆత్మ భుజించే ఆహారము కూడా దృశ్యమైనదిగా ఉండదు. శరీర సంబంధ ఆహారము శరీరమునకు బలాన్ని శక్తిని ఇస్తుంది. ఆత్మ సంబంధ ఆహారము ఆత్మకు బలాన్ని, శక్తిని ఇస్తుంది. ఉధా|| అపొస్తలులందరి మీద పరిశుద్ధాత్మ వ్రాలినప్పుడు వారందరు నానాభాషలతో మాట్లాడి దేవున్ని మహిమపరిచారు.
శరీర సంబంధమైన బలములో నానావిధమైన శక్తులున్నవి. ఈ శక్తి అన్నది నానావిధాలుగ క్రియజరిగిస్తున్నది. ఉదా|| భూమిని సేద్యపరచుటఃఇది శారీర సంబంధమైన బలాధిక్యతతో కూడిన క్రియ బరువులు మోయుట, బస్కీలు చేయుట, కండలు పెంచి కండబలంతో వాహనాన్ని ఆపుట; ఏనుగును పైన ఎక్కించుకోవడము, చేతితో నువ్వులుపిండి నూనె తీయుట - మల్లయుద్ధాలు, కుస్తీలు, పరుగు పందెము, దూకుట, సంకెళ్ళు త్రెంచుట, త్రాళ్ళు త్రెంపుట వగైరా బలప్రదర్శనలు ఇందుకు ఋజువులు. అయితే ఆత్మసంబంధ బలము శక్తి అపొ 2ః17లో వలె ప్రవచనాశక్తి, రోగములను స్వస్థపరచుట, దయ్యములను వెళ్ళగొట్టుట, గుడ్డివారికి చూపు; కుంటివారికి నడక, రోగులకు స్వస్థత వగైరాలు.
ఇక ఆత్మీయ మార్గము - శారీర మార్గము ః ప్రియపాఠకులారా! ఇప్పుడు అన్ని విషయములలో వలె మార్గములనుగూర్చి తెలిసికొందము ః మార్గములు యేసుప్రభువు చెప్పిన విధముగ రెండున్నవి.
1. ఇరుకు మార్గము 2. విశాల మార్గము. ఇరుకు మార్గము ఆత్మ సంబంధమైనది. శ్రమలు, శోధనలు బాధలు కలిగినను మరణము, వేదన, యాతన లేక నిత్యజీవము, నిత్య విశ్రాంతిని ప్రసాదించు మార్గము ఇదియే యోహాను 14ః6లో వివరించబడిన యేసుక్రీస్తుయొక్క జీవయుతమైన మార్గము. ఇందునుగూర్చి వేరే ప్రత్యేకించి చెప్పక యేసుక్రీస్తు ప్రభువు తానే ఈ ఆత్మీయ మార్గమైనట్లుగా ప్రత్యక్షముగా ప్రవచించి యున్నాడు. నిత్య నాశనకరమైన నరకాగ్నికి నడిపించు మార్గము, యిది లోక సంబంధమైనది. ఇది ప్రాణాంతకమును, నాశనకరమును నిత్యనరక స్థలమునకు చేర్చెడి మార్గము. ఈ మార్గములో లోక సంబంధులును, శారీర సంబంధులును, లోక సుఖానుభవము ఎక్కువగా కోరువారు. ధనాపేక్ష కలవారును ఈ మార్గము ద్వారా ఆకర్షించబడుచున్నారు. కాని ఈ మార్గము చేర్చే గమ్యాన్ని వీరు గుర్తించరు.
ప్రియపాఠకులారా! ఆత్మ మార్గమును అవలంభించి, అనుసరించి ఆత్మీయ సన్నిధి చేరాలంటే దానికి కొన్ని యోగ్యతలున్నవి. ఆత్మీయ మార్గములో నడుచువానికి లోకజ్ఞానము, లోక సంబంధ ఐశ్వర్యాలు, భోగభాగ్యాలు రోతగా కనిపిస్తాయి. మరి ఆత్మీయ మార్గములో నడుచువానికి ఐశ్వర్యము వాని ఆత్మీయ జ్ఞానము మరియును పరమాత్ముడు ఇచ్చే ప్రశాంతత, నెమ్మది, ఆనందము, నిర్విచారము వగైరాలతో ఉండి, లోకసంబంధముగా సంభవించు ఏ విధమైన శ్రమకును, భయాందోళనకును, అరిష్టానికి, ప్రమాదమునకు సుదూరములో ఉంటాడు. అయితే శారీర మార్గములో పయనించువాడు మరణానికి అతి చేరువలోను, రోగానికి సన్నిహితునిగాను, ప్రశాంతతను ఎరుగనివాడును, నెమ్మది అసలు ఎలాంటిదో ఎరుగని స్థితిలో జీవిస్తూ అనుక్షణము ఏదో యొక భీతిని గలిగి అయోమయ స్థితిలో ఉంటాడు. కీడు మేలు ఎరుగడు. తానున్న గృహము, తన సంపద, తనకున్న స్తోమత, తన అంతస్థు తన మందిమార్భలము, తన పదవి వీటికి అంకితమై నెమ్మదిలేని జీవితములోను అనుభవిస్తుంటాడు.
ఆత్మ సంబంధియైతే విచారమన్నదేమిటో ఎరుగని స్థితిలో వుండి లోకమునకు దాని ప్రభుత్వానికి దాని సంపదకు, దానియొక్క చట్టాలకు దూరుడై నిర్భయముగ జీవిస్తుంటాడు. ''ఇందుకే ఆత్మశుద్ధిగలవారు ధన్యులు వారు దేవుని చూచెదరని వ్రాయబడియున్నది. మరియొక విశేషమేమిటంటే మరణమన్నది ఆత్మ మార్గములో పయనించేవానికి ఉన్నది. లోక మార్గములో పయనించేవానికి ఉన్నది. కాని ఈ విధముగా పయనించువానికి పునరుత్థానములు కూడా రెండు విధానాలున్నవి. 1. మహిమ పునరుత్థానము; 2. నిత్య నరకాగ్ని, మరణాన్ని అనుభవించే పునరుత్థానము; అందుకే యోహాను సువార్తలో మేలు చేసినవాడు జీవ పునరుత్థానమునకును - కీడు చేసినవాడు తీర్పు పునరుత్థానము పొందునని వ్రాయబడి యున్నది.
ప్రియపాఠకులారా! ఇక వస్త్రములు ః- ఆదిలో ఆదాము ఆత్మ సంబంధియైయున్నప్పుడు ఏదెను వనములో లోకరీత్యా దిగంబరియైయున్నప్పుడు పరమాత్ముని సన్నిధిలో ''నీతి - పరిశుద్ధత '' అను వస్త్రములు ధరించుకొని దేవునితో జీవించాడు. ఈ నీతి పరిశుద్ధతన్నది ఆదినరుని కివ్వబడిన వస్త్రములుః అయితే ఆత్మీయ విలువను కోల్పోయిన తర్వాత అదే నరజంట దృశ్యమైన, తుచ్ఛమైన లోకసంబంధమైన ఆకులతో కచ్చడములుగా మొలకు చుట్టుకొని, మాన సంరక్షణ పొందినట్లుగా వ్రాయబడి యున్నది. ఇక్కడనుండి దేహసంరక్షణకు కావలసిన వస్త్రాన్ని తయారు చేసుకొనే జ్ఞానము నరునికి లోకమే ఇచ్చింది. అంటే శారీర వస్త్రాలు చీలి పాతవియై చినిగిపోయి రంగు మాసి పాతగిలి పోవును.
అయితే ఆత్మవస్త్రము చినుగవు - మాయవు - శిధిలము కావుః వీటికి చాకలి - ఇస్త్రీ అవసరత లేదు. శారీర వస్త్రాలకు ఇవన్నియు కావలసియున్నది. లోక సంబంధ వస్త్రాలకున్న పేర్లు అనేకము. అయితే ఆత్మ వస్త్రములు మాత్రమే కొన్ని పేర్లు కలిగియున్నవి. ఇందులో 1. తెల్లని వస్త్రము 2. మహిమ వస్త్రము 3. ఆశీర్వాద వస్త్రములు 4. సుందర వస్త్రములు 5. సర్వాంగ కవచము - ఇవి ఆత్మ సంబంధులకు పరమాత్ముడు ఇచ్చునటువంటి మహిమ వస్త్రములుః ప్రియపాఠకులారా! ఇట్టి వస్త్రములు మనము కూడా పొందుటకు ప్రయత్నించెదము గాక!
........
మరణాలు రెండు ః- 1. ఆత్మీయ మరణము 2. శారీర మరణము. మొట్టమొదటగా ఆదాము దేవుడు తినవద్దన్న నిషేధ ఫలములు తిని ఆత్మీయముగా చచ్చాడు. ఆ తర్వాత దైవశాపము ద్వారా ఆదామునుబట్టి నరజాతి కంతటికిని సంభవించింది. అది ఇప్పుడు క్రియ జరిగిస్తున్నది. ఆత్మీయ మరణాన్ని గూర్చి ఎఫెసీ 2ః1లో మీరు మీ అపరాధముల చేతను పాపములచేతను చచ్చినవారైయుండగా ఆయన మిమ్మును క్రీస్తుతో కూడా బ్రతికించెనుః అని వ్రాశాడు. ఇందునుబట్టి చూడగా యావద్ లోకమునకు అపరాధములు, పాపముల ద్వారా ఆత్మీయ మరణము సంభవించినట్లును, దానినుండి పునరుత్థానము పొందుట, విమోచన యేసుక్రీస్తు ద్వారా కల్గించినట్లు వ్రాయబడియున్నది.
శారీర మరణము కంటె ఆత్మీయ మరణమునకు గొప్ప శక్తి ఉన్నది, ఎందుకంటే ప్రియపాఠకులారా! శారీరముగా చచ్చినవారు భూమిలో పాతిపెట్టబడి మట్టిలో అర్పితమైపోతున్నాడు. అంటే ఆత్మీయముగా చచ్చినవాడు తీర్పులోకి వచ్చి నిత్యశిక్షకు గురియయ్యే స్థితిలోకి వస్తాడు. అందువలన ఆత్మీయమైనటువంటి మరణాన్ని జీవాత్ముడు పొందుట మంచిది కాదు. శారీర సంబంధ మరణము ద్వారా భూమిలో పాతిపెట్టబడి పాతాళము చేరుచున్నది. అయితే ఆత్మకు సంభవించు మరణము దేవునియొక్క తీర్పులోకి ఆత్మను నడిపించి, క్రీస్తు న్యాయపీఠము ఎదుట తీర్పునకు నిలబెట్టేటటువంటి శక్తిని కల్గియున్నది.
కనుక ప్రియపాఠకులారా! ఇప్పుడు ఆత్మ శరీర సంబంధమైన బలాబలాలు - వాటియొక్క అంతర్గత చరిత్ర వాటియొక్క విలువలను గూర్చి తెలిసికొన్నారు గదా! ఈ సాహిత్యాన్ని చదువుచున్న నీలో మీలో ఏ స్థితిని కోరుకుంటున్నారో ఆలోచించండి - ప్రభువు మనలను తన ఆత్మీయ మార్గము ద్వారా ఆత్మీయ రాజ్యములో ఆత్మ సన్నిధిలో - ఆత్మ సంబంధ ఐశ్వర్యములు అనుగ్రహించి తన మహిమ, కాంతిని మన మీద ప్రసరింపజేయును గాక!
.......
గలతీ 5ః16 ఆత్మానుసారముగా నడుచుకొనుడిః అపుడు మీరుశరీరేచ్చను నెరవేర్చరు.
ప్రియపాఠకులారా! పై వేద వాక్యవివరణను బట్టి రెండు విధములైన విధులు నరజీవితములో నెరవేర్చవలసియున్నట్లుగా విశదమగుచున్నది. విధినిబట్టి నరుడు రెండుగా విభజింపబడియున్నాడు. దైవసంకల్పమునుబట్టి నరుడు మూడుగ విభజించబడియున్నాడు. అంటే ఆత్మ శరీరము రెండును చేరి ఒకటి. ఆత్మ, జీవము, శరీరము ఈ మూడును చేరి ఒకటి. ఇది దైవసంకల్పము. ఈ సందర్భములో ఆది 2ః7 చదివినట్లయితే ఇందులోని ఆత్మీయ సత్యము తెలియగలదు. ఎట్లంటే దేవుని హస్తము చేత రూపించబడిన శరీరము దేవుని జీవము ఆత్మ చేత పూరించబడిన నిర్మాణ క్రమము. దైవసంకల్పములో మానవుడు త్రిత్వమైయున్నను - విధి నిర్వహణలో ఆత్మ కార్యములు శరీర కార్యములను నెరవేర్చుటకు బద్ధుడై యున్నాడు. లోకధర్మమునుబట్టి శారీరయుతముగా నరుడు తినుట, త్రాగుట, మానవ సహజ విధులను నెరవేర్చుటలో - నీతి, భక్తి, పరిశుద్ధత, విశ్వాసము, ప్రేమ వగైరా సద్గుణ సంపత్తితో శారీర ధర్మములను నెరవేర్చవలసియున్నాడు. మరియు తన శరీరము వలె ఎదుటి శరీరమునుగూర్చి కూడా ప్రేమ, వాత్సల్యములను చూపుచు, వాటి నిమిత్తమై విచారించవలసినవాడునైయున్నాడు. ఇది శారీర విధినిబట్టి దైవమార్గమును అన్వేషించవలసిన కార్యము.
ఇక ఆత్మీయముగ ఆలోచిస్తే నరునిలో ఆత్మను ప్రసాదించిన పరమాత్ముడు ఏ విధముగా అదృశ్యుడైయున్నాడో - అలాగే పరమాత్మ నరునిలో వుంచిన జీవాత్మ అదృశ్యుడే! ఈ విధముగా ఆత్మ అదృశ్యుడు గనుక అట్టి దృశ్యుడైయున్న ఆత్మ సర్వసృష్టికిని, ఆదిసంభూతుడును, సర్వమునకు జీవప్రదాతయై యుండి సర్వసృష్టిని పోషించుటకు శక్తిమంతుడైయున్నాడు. అయినను ఆయన అదృశ్యుడు. ప్రతి జీవియొక్క జనన పోషణ మరణ త్రివిధ దశలకు మూలకారకుడు పరమాత్మయే! పరములో ఉన్న ఆత్మ పరమాత్మ. శారీరములో ఉన్న ఆత్మ జీవాత్మ. స్థాన భేదములున్నను రెండు ఆత్మలు ఒక్కటే! దీనిని గూర్చి పౌలు ఎఫెసీ 4ః4లో శరీరము ఒక్కటే! అందరికి తండ్రియైన దేవుడు ఒక్కడే ఆయన అందరిలో వ్యాపించి అందరిలోను ఉన్నాడు; అని ప్రవచిస్తున్నాడు. కనుక శరీరములో వున్న ఆత్మ పరములో ఉన్న ఆత్మ రెండును ఒక్కటేయైయున్నట్లు ఇందులోని భావము.
కనుక ప్రతి శరీరియు ఏకాత్మయైయున్న పరమాత్మను ఏకారాధనతో ఏకదేవునిగా మహిమపరచ వలసిన బాధ్యత ప్రతి ఆత్మకును ఉన్నట్లు తెలియుచున్నది. కనుక ప్రతి నరునిలో వున్న జీవాత్మ - నరశరీరములో జీవాత్మను ప్రవేశింపజేసిన పరమాత్మకు ఋణపడియున్నట్లుగా కూడా తెలియుచున్నది. ఈ ఋణాను బంధమునుబట్టి అనగా అలనాడు ఆదినరునిలో పరమాత్ముడు ప్రవేశింపజేసిన జీవాత్మ యొక్క ఆత్మీయ బంధమునుబట్టి ఆత్మయైయున్న దేవుడు జీవాత్మకున్న పొందిన కలుషితమును కడిగివేయుటకు కన్య గర్భములో పరమాత్మ నరునిగ జన్మించి, నర జీవాత్మకున్న నరదోషమును నిర్మూలించుటకు పరమాత్మ నరశరీరుడై,ఈ లోకములో అవతరించవలసిన పరిస్థితి ఏర్పడింది. అందుకే పౌలు అంటున్నాడు. ఏమని? ఆత్మానుసారముగ నడవాలంటే శరీరేచ్ఛలను చంపుకోవాలి. ఈ విధముగ ఆత్మానుసారముగా జీవించి, ఆత్మ కార్యములను గూర్చి ఆలోచించి, ఆత్మ కార్యముల నెరవేర్పునుగూర్చి శరీరముతో లోకములో వేదనలు బాధలు లోకసంబంధమైన ఇరుకు ఇబ్బందులు, శోధనలు, శ్రమలు భరించి, ఆత్మానుసారముగా నడిచి పరమాత్ముని చిత్తమును నెరవేర్చి శరీరేచ్ఛలను చంపుకొని, జీవించిన ఆత్మ సంబంధులను గూర్చి వేదరీత్యా వేదములోని కొందరిని గూర్చి మనము తెలిసికొనుటన్నది ముఖ్యము. ఇందులో మొట్టమొదటివారు హనోకు, హనోకు ఆత్మానుసారముగా ఆత్మ దేవునితో చేతులు కలిపి శారీరేచ్ఛలను చంపుకొని, పరమాత్మునితో ఐక్యమై శరీరముతో ఆరోహణమై పరమాత్మునిలో లీనమైనట్లుగా చదువగలము.
ఆలాగే ఆత్మానుసారముగా నడిచినట్టి వ్యక్తులలో రెండవవాడు మోషే, మూడవవాడు ఏలీయా. మోషే ఆత్మచిత్తానుసారముగా ఆత్మ సంకల్పమునుబట్టి, ఆత్మయొక్క నిబంధననుబట్టి అనగా దశాజ్ఞలు అను ధర్మశాస్త్రమును ఆచరించుటలోను దైవజనాంగమైన ఇశ్రాయేలును ఐగుప్తు చెరనుండి విమోచించి, నడిపించి ఆత్మ సంకల్పమును నెరవేర్చుటయందును, కాలినడకతో ఎన్నో అవాంతరాలను ఎదుర్కొంటూ కార్యదీక్ష పరాయణుడై దైవసంకల్పముయొక్క నెరవేర్పును గూర్చి తన శారీర జీవితాన్ని చంపుకొని, ఆత్మతో పరమాత్మునియొక్క సావాసములో సీనాయి కొండ మీద పరమాత్మ 40 దినములు సంభాషించినట్లు చదువగలము. పరమాత్మ కూడా తన జనాంగమును తన క్రమములో ఉంచుట, మోషే అను మధ్యవర్తిని మధ్యవర్తిగా ఉంచుకొని అతని వలన తన కార్య సాఫల్యమును జరిగించుకొన్నట్లు వేదములో చదువగలము. అలాగే మోషే తర్వాత ఏలీయా కూడా అనేకమంది శారీర సంబంధులను, విగ్రహారాధికులను, బయలు ప్రవక్తలను, విగ్రహారాధనకు ప్రతిరూపమైన యెజెబేలునకును కనువిప్పు గల్గించుటకు, పరమాత్మ ప్రత్యక్షీకరణ క్రియా కార్యక్రమముల ద్వారా వర్షమును నిరోధించుట, దేశము మీద క్షామమును రప్పించుట, అగ్ని లేకయే బలిని దహించుట వగైరా దైవమహత్తర అనగా పరమాత్ముని యొక్క మహిమాన్విత క్రియాకర్మల ద్వారా అజ్ఞాన నరకోటికి కనువిప్పు గల్గించెను. మరియు చనిపోయిన విధవరాలి కుమారుని బ్రతికించుట, ఆహాబు పరిపాలనలో సంభవించిన క్షామములో ఏలీయా తాను నివసించిన విధవరాలి యింట తొట్టిలోని పిండి తరిగిపోకుండ - బుడ్డిలోని తైలము తరగకుండ ఆత్మయొక్క మహిమా ప్రభావమును నిరూపిస్తూ - క్షామ భారము లేకుండ, ఆ విధవరాలి గృహాన్ని కాపాడినాడు. ఇది ఆత్మానుసారముగా ఆత్మ దేవునియొక్క మహిమాన్విత క్రియలను గూర్చిన వివరము. ఆత్మానుసారముగ నడుచు విశ్వాసియొక్క యదార్థ జీవితము.
అయితే శారీరేచ్ఛలను నెరవేరుస్తూ ఆత్మానుసారముగాకాక, శరీరానుసారముగా నడుచుకొను నరజీవియొక్క చరిత్ర ఏమిటో కూడా మనము తెలిసికోవలసియున్నది. ప్రియపాఠకులారా! ఇదే వాక్యములో ఆత్మ శరీరమునకును - శరీరమునకు ఆత్మ విరోధముగా ఉన్నవని - ఇవి ఒకదానికొకటి వ్యతిరేకముగా ఉన్నవని వివరించియున్నాడు. శరీరానుసారముగా నడిచిన వ్యక్తులు ఈ లోకానికే పరిమితమైపోయి, ఆత్మదేవునియొక్క సావాసమునకు దూరమై నాశన మార్గము లోనికి అనగా మరణపాత్రులై పాతాళ వశమైపోయి చరిత్ర లేని స్థితిలో ఉండి నాశనమైపోయారు.
ఆదాము విషయములో ఆలోచిస్తే ఆదాములో రెండు ఉన్నవి. అనగా శరీరము లోకసంబంధము. అతనిలోని ఆత్మ దైవసంబంధము. ఈ విధముగా రూపించబడిన ఆదాము తాను ఆత్మ సంబంధిగ ఆత్మదేవునితో సావాసమున్నన్నినాళ్ళు పరమాత్మునిలో జీవించి పరమాత్ముని సావాసములో నడచుచు, శారీరేచ్ఛలు అనగా శరీరమునకు కావలసినవేమిటో ఎరుగని స్థితిలో ఉన్నాడంటే, ఇప్పుడున్నట్టి ఆధునిక వస్త్రాలంకరణ, ముస్తాబులు, షడ్రసోపేత భోజనము, వంటావార్పులు, స్నానపానాదులు, వస్త్రాలంకరణను గూర్చిన ధ్యాస లేక అంటే శరీరేచ్ఛలకు దూరమై నిర్విచారముగా నిర్భయముగా ఆత్మ కార్యాలు నెరవేర్చుచు ఆత్మతో జీవించాడు. అయితే అలౌకిక శక్తి ఆకర్షణఅనగా ఆది 3ః1లో వలె పరమాత్మ సృష్టియైన భూజంతువైన సర్ప ప్రబోధ వలన సతీసమేతముగా పరమాత్మయొక్క సావాసమును కోల్పోయి అనగా ఆత్మయొక్క చిత్తానుసారముగా నడుచుచు పరమాత్మను మహిమపరచవలసిన బాధ్యతను విసర్జించి, శారీర సంబంధియు, లోకస్థునిగ మారి అటు పరమాత్మునియొక్క అనుగ్రహాన్ని, ఇటు నిస్సారమైన భూమి యొక్క శాపానికి గురియై, ఉభయభ్రష్టత్వము అంటే అటు పరమాత్ముడు ఇటు లోకము అనగా సృష్టి రెంటి చేతను విడువబడినవాడై కూడా భ్రష్టుడై, దైవత్వము చేత దైవసన్నిధానము నుండి తరుమబడి అనాధ అయ్యాడు. అనగా స్వయంకృషితో శారీర కష్టముతో చమటోడ్చి కష్టించి జీవించవలసిన స్థితికి దిగజారినాడు. ఇది ఆత్మానుసారముగా జీవించి ఆత్మ యొక్కఅనుగ్రహము పోగొట్టుకొని, శారీర సంబంధియై భ్రష్టుడైన విశ్వాసి జీవితము.
రెండవవదిగా సొలొమోను ః పరమాత్మునియొక్క జ్ఞానమును వరముగా పొంది, తన ఇహలోక రాజ్య పరిపాలనలో దేవునికి ఆలయమును నిర్మించి దేవుని మహిమపరచి, పరమాత్ముని యొక్క ఆశీస్సులను సంపదగా అనుభవించి జీవించిన సొలొమోను లోకసంబంధమైన శరీరులైన స్త్రీల సౌందర్యమునకు ముగ్ధుడై తద్వారా ఏ చేతులతో దేవునికి మందిరముకట్టి బలిపీఠాలు కట్టినాడో - అట్టి పరమాత్ముని మందిరానికి వ్యతిరేకముగా అనగా అదే బలిపీఠమునకు అభిముఖముగా అన్యదేవతల బలిపీఠములు కట్టి, తన జ్ఞానమును అజ్ఞానమునకు మార్చుకొని అవివేకియై, లోకసంబంధ శరీరులైన స్త్రీల యొక్క అంగసౌష్టవమునకు బానిసయై - ఆత్మచిత్తానుసారము నడువవలసిన మహాజ్ఞానియైన సొలొమోను - శరీర జ్ఞానముతో శరీరులయొక్క మెప్పునకు లోనై ఆత్మదేవునియొక్క ఆగ్రహానికి గురియైనాడు ః
అలాగే సంసోను జీవితములో సంసోను ఆత్మచే నాజరు చేయబడి ప్రతిష్టితుడై, ఆత్మదేవుని చిత్తమును నెరవేర్చవలసియుండగా - అందుకు వ్యతిరేకముగా తనయొక్క ఆత్మ ప్రత్యక్షతను అనగా సృష్టికర్త యొక్క ఆత్మ - సంసోనును ఆవరించి జరిగించు శక్తివంతమైన పరిజ్ఞానమును విస్మరించి, స్త్రీలోలుడై పరమాత్ముడు తనకనుగ్రహించిన బలాధిక్యతలు, ప్రతిష్టిత మర్మములను గూర్చిన వివరములను లోకసంబంధమైన వేశ్యకు వివరించి, దానికి తన బలాధిక్యతలను ధారపోసి వేశ్య ఒడిలో నిద్రించి, అంధుడై ఆత్మ వరాన్ని కొల్పోయి, శారీర సంబంధిగ మరణించుటలో ఎంత విచారకరమైన విషయమో మనము గ్రహించవలెనుః ఇది ఉభయ భ్రష్టత్వము.
ఇక శరీర సంబంధులుగా ఉండి ఆత్మానుసారముగా నడిచి శారీరేచ్ఛలను విస్మరించినవారిని గూర్చి కూడా ఈ సమయములో మనము తెలిసికోవలసియున్నది. ఇందులో ప్రధముడు మోషే. వేదరీత్యా శరీర సంబంధికి హెబ్రీ స్త్రీకి ప్రకృతి సిద్ధముగా జన్మించాడు. నత్తివాడుగాను, మొరటువాడుగాను జీవించి ఐగుప్తీయుని చంపి హంతకుడాయెనుః అయితే ఇట్టి మోషేకు దేవుని పిలుపు కలిగి దైవజనాంగమైన ఇశ్రాయేలీయులకు నాయకుడును, ప్రవక్తయు, ఆత్మదేవుని ఇల్లంతటిలో నమ్మకస్థుడుగను ఎంచబడినాడు. మరియు పరమాత్ముని చిత్తానుసారముగా తన ఆత్మీయ జీవితాన్ని నడుపుకున్నాడు. పరమాత్ముడు చెప్పినట్లే చేశాడు. కాని తనయొక్క స్వజ్ఞానమునుబట్టి తన చిత్తమునుబట్టి ప్రవర్తించలేదు.
ఇక రెండవవాడు ఆబ్రాహాము ః అబ్రాహాముయొక్క జీవితములో తాను శారీర సంబందియైనను, పరమాత్ముని యందుంచిన విశ్వాసము మూలముగా ఆత్మానుసారముగా ఆత్మీయ మార్గములో నడిచి, ఆత్మ దేవుని కోరిక మేరకు తనకు ఒక్కడుగా ఉన్నట్టి శరీరుడైన ఇస్సాకును బలిగా అర్పించుటకు సాహసించి, పరమాత్మునియొక్క భక్తి విశ్వాస నరకోటిలో విశ్వాస వీరునిగ ఎంచబడి లోకసంబంధమైన దైవవిశ్వాసులకు తండ్రిగా ఎంచబడినాడు.
సౌలు శరీర సంబంధిగా ఉండి దైవత్వమును విసర్జించి, ఆత్మసంబంధియైన యేసుక్రీస్తుయొక్క సువార్తకు అడ్డుబండగా ఉండి, క్రైస్తవ విశ్వాసులైన జనాంగమును చెర పెట్టుటకును, హింసించుటకు, చంపుటకును, లోకాధికారము పొంది విజృంభించగా ఆత్మ దేవుని ప్రసన్నత వెలుగు ద్వారా అంధుడై, తానున్న శారీర స్థితి నుండి ఆత్మదేవునియొక్క ఆంతర్య వివరములను గ్రహించినవాడై, తన అంధత్వమును గూర్చి ఆత్మదేవుని అభ్యర్థించి తన శరీరేచ్ఛలను చంపుకొని, ప్రభువు నామములో బాప్తిస్మము పొంది పేరు మార్పిడి, జీవిత మార్పిడి పొంది శారీర జీవితము నుండి ఆత్మీయ జీవితములో ప్రవేశించి ఎనిమిది సంఘములకు పత్రికలు వ్రాసి అపొస్తలులలో అగ్రగణ్యుడయ్యెను.
ప్రియపాఠకులారా! చదివితిరి గదా! ఆత్మానుసారముగా నడిచిన వారియొక్క అమూల్య జీవితమును గూర్చి శరీరానుసారముగా జీవించిన వారియొక్క అధోగతిని గూర్చి ఆత్మానుసారముగా నడిచి పతనమైపోయిన వారి అధోగతిని గూర్చి తెలిసికొనియున్నారు గదా! రానున్న ప్రభువు రాకడలో మనము మనయొక్క శేష జీవితములో శారీర జీవితమునకు దూరస్థులమై, ఆత్మ జీవితమును జీవిస్తూ ఆత్మదేవునియొక్క ఆగమనములో - ఆయనలో విలీనమగుటకు నిరీక్షణగల్గి సిద్ధపడియుందుముగాక! ఆమేన్.
అంశము ః- గొర్రెల దొడ్డి
ప్రియపాఠకులారా! లోగడ ఎన్నో అంశాలు తెలిసికొనియున్నాము. ఆ విధముగా వ్రాయబడిన ప్రతి అంశము కూడా దైవిక మర్మములతో కూడినవై ఆత్మీయతను బలపరిచేవిగా ఉన్నట్లు మనము గ్రహించిన విషయము. అయితే ఇప్పుడు మనము తెలిసికోబోయే అంశము మానవత్వములో అనగా జనబాహుళ్యములో ఏ వ్యక్తి ఎప్పుడు ఏ సంస్థ కూడా ఏ కళాశాలలో ఏ వేదాంతములో ఏ ప్రజలలోను ఎన్నిక లేనటువంటి విషయాన్ని గూర్చి తెలిసికొందము. అయితే దైవత్వములో ఈయొక్క నామధేయానికి ఒక ప్రత్యేకత ఉన్నట్లును, అంతేగాకుండ దైవత్వము మానవాళిని మలచుకొన్న విధానమునుగూర్చి కూడా ఇప్పుడు తెలిసికోబోతున్నాము.
ప్రియపాఠకులారా! ఆదిలో దేవుడు నేలమంటితో నిర్మించిన నరుడు వాని ఎముక నుండి తీయబడిన స్త్రీ ఇరువురు కూడా జీవాత్మయైన నరులు అనగా మనస్సాక్షి గల మానవులు, దైవాత్మను ధరించుకొన్న దైవ ప్రతిరూపాలు. ఇట్టి రూపాలు దైవసన్నిధిలో పరిశుద్ధతతోను, పవిత్రముగాను దైవత్వానికి యోగ్యకరముగాను, దైవమార్గమును తొలగనివారుగా జీవించాలి. సృష్టికర్తయైన దేవుడు కోరింది - అదే, అయితే ''దేవుని పోలికె దేవుని స్వరూపము,'' అనుటలో దైవ స్వరూపము గొర్రె కాదు, స్త్రీ పురుషులు ఇరువురు కూడా గొర్రె కాదు. అయితే దైవజనాంగము గొర్రెలనుటలోని మర్మమేమిటి? ఎందుకనగా దేవుడు తన జనాంగాన్ని గొర్రెలకు పోల్చినాడు. దావీదు 23వ కీర్తనలో యెహోవా కాపరి నాకు లేమి కలుగదు, పచ్చిక గల చోట్లను ఆయన నన్ను పరుండ జేయుచున్నాడు. శాంతికరమైన జలముల యొద్ద నన్ను నడిపించుచున్నాడు. నా ప్రాణమునకు ఆయన సేదదీర్చుచున్నాడు.'' ఈ మాటలు నర సంబంధమైనవి కావు. ఇవి జంతు సంబంధమైన మాటలు. పచ్చిక మేసేవి జంతువు - నరుడు కాదు. శాంతికరమైన జలముల దగ్గరకు నడిచేవి. కూడా జంతువులే, మేత మేసిన జంతువు నీళ్ళు త్రాగాలి, కనుక దావీదు వ్రాసిన ఈయొక్క కీర్తనలోని మొట్టమొదటి వచనాలలో నరుడైన తనను నరునిగా కాకుండ జీవిగా పోల్చుకొని వ్రాయుటలో మర్మమున్నది.
ప్రియపాఠకులారా! ఆదికాండము ఒకటి నుండి ఐదవ కాండము వరకు దేవుడు నరుని -నరుడుగనే చూచాడు. నరులపట్ల బహు సహనము వహించాడు. నరులు చేసే ప్రతి పాపాన్ని కూడా పట్టించుకోకుండ, ఆయా సందర్భాలనుబట్టి ఆయా విధాలుగ వారిని కాపాడుచు, వారికొక ప్రత్యేక బిరుదు ఇశ్రాయేలు దేవుని బిడ్డలు దేవుని ఇల్లుగా దేవుని కూటమిగా పిలిచి వారి మధ్య జీవించాడు. ఆయన ప్రేమకు నోచుకోకపోవుటతో సంతాపము కల్గి, ఆదినరజంట దోషులైనప్పుడు వారిని వెళ్ళగొట్టినను దేవుడు కనికరించి తన నోటితో పలుకక పోయినను క్రియామూలకముగా వారికి చర్మపు దుస్తులు రక్షణ వస్త్రాలుగా తొడిగించాడు. నేటి నవనాగరిక యుగములో గొప్ప వేదాంతులు, పండితులు, ఉద్యోగ విరమణ చేయువారు శాస్త్రవేత్తలను ఏ విధముగా శాలువలతో కప్పుతారో ఆ విధముగా దైవవనములో దైవసన్నిధిలో - దేవుని పరిశుద్ధ వనములోని ఫలసాయములను అనుభవిస్తూ దైవత్వమునకు ద్రోహులైన నరజంటకు దేవుడు కప్పిన శాలువ గొర్రెపిల్ల చర్మమని ఇందునుబట్టి తెలుస్తున్నది. ఆనాడు గొర్రెపిల్ల చర్మపు దుస్తులు కప్పకపోతే ఈనాడు దేవుని ప్రజగా చెప్పుకొన్న మనకు ఈనాడు గొర్రెమందగా పిలువబడవలసిన అవసరము లేదని దీని భావము. దైవ ఆజ్ఞను వ్యతిరేకించి లోకము వైపు మరలిన గొర్రెలేగాని మనుషులు కారు. అనగా గొర్రె జంతువులు సృష్టిలో బలహీనమైనది. కనుక వీరు బలహీనులే అనినట్లు నరునియొక్క హీనత్వాన్ని దేవుడు క్రియామూలకముగా నాటి తోటలో చర్మపు దుస్తుల ద్వారా కప్పి, తన పరిశుద్ధ సన్నిధి నుండి వెడలగొట్టి శాపగ్రస్థ భూప్రదేశమునకు నాంది పల్కినాడు. ఈ విధముగా దేవుడు తొడిగిన చర్మపు వస్త్రాలు పాతనిబంధనలో అక్కడక్కడ కూడా నరులకు తొడగబడినట్లు ప్రియపాఠకులారా! ఈ సందర్భములో యాకోబు తల్లియైన రిబ్కా తన రెండవ కుమారుడైన యాకోబునకు తండ్రియైన ఇస్సాకు ఆశీర్వాదము కావాలని అభిలషించి, ఇస్సాకుకు కనుదృష్టి కోల్పోయి, మందదృష్టి కల్గినప్పుడు జ్యేష్ట కుమారుడెవరో కనిష్టుడెవరో తెలిసికోలేని స్థితిలో - జ్యేష్ట కుమారుడైన ఏశావు కూడా రిబ్కా కుమారుడే. అయినను రిబ్కాయొక్క ప్రేమ యాకోబుపై ఉండుట వలన, తండ్రి దీవెనలు పొందాలని దైవాశీర్వాదాలకు యోగ్యుడు కావాలని, గొప్ప వంశాలకు మూలపురుషుడుగా జీవించాలని సంకల్పించినదై, ఏశావు దేహమునకు సమానముగా యాకోబు శరీరాన్ని మేక చర్మముతో కప్పినట్లు చదువగలము. దీని ద్వారా యాకోబు తండ్రి ఆశీర్వాదము - అందువలన కల్గిన బలాధిక్యతలనుబట్టి తాను ఒంటరిగా పోరాడి విజయుడగుటకు వానిని వధించక దేవుడు యాకోబు పోరాటానికి మెచ్చి, అతనిని ఇశ్రాయేలుగ బిరుదునిచ్చినట్లు చదువగలము. ఈ బిరుదు యాకోబుకు కల్గుటకు కారణము మేక చర్మమే. ఆలాగే నూతన నిబంధనలో బాప్తిస్మమిచ్చు యోహాను యూదా అరణ్యములో సంచరిస్తు తోలు దట్టి ఒంటె రోమముల వస్త్రము ధరించినట్లు చదువగలము.
కనుక ప్రియపాఠకులారా! చర్మపు ఉడుపుల ద్వారా దేవుడు నరులకు అనుగ్రహించిన ఈయొక్క ఆధిక్యతలు చాలా మర్మములతో కూడినవి. ఆనాడు ఏదెను వనములో ఆదామునకు దేవుడు కట్టిన వస్త్రాలు నానావిధ రూపాంతరాలు చెంది, మనలను ఏ చర్మముతో దేవుడు కప్పినాడో ఆ చర్మమునకు మూలమైన జీవియొక్క నామధేయముతో జీవింపజేస్తున్నది ఆ జీవియే. నరునియొక్క పాపపరిహారార్థము పాతనిబంధనలో బహుగా దేవునికి బల్యర్పణలుగ అర్పించబడి దాని రక్తము ద్వారా నాటి జనాంగ దోషాపరాధములు తొలగుటకు మూలమైనట్లు కూడా చదువగలము. పాతనిబంధన కాలములో మోషే అహరోనులు వగైరా యాజకులు దేవునికి అర్పించిన బలులు నరులయొక్క పాపపరిహారార్థము అర్పించబడినవే గాని, ఇవి దేవునియొక్క ఘనత కొరకు అర్పించబడినవి కావు. ఈ విధముగా దేవుడు మేకలు, గొర్రెలు, పొట్టేళ్ళు, పశువులు వగైరా రక్తబలులతో విసిగి వేసారినట్లు వేదములో చదువగలము. ఆ విధముగా వేసారిన దేవుడు యోహాను 1ః29 ''ఇదిగో లోక పాపమును మోసికొనిపోవు దేవుని గొర్రెపిల్ల'' అనుటనుబట్టి భూలోకములోని సమస్త మానవాళియొక్క దోషాపరాధము నిమిత్తము పాప పరిహార బలిగా వధింపబడిన గొర్రెపిల్లకు ప్రతిగా దైవకుమారుడు వధించబడినట్లును, ఆ విధముగా దైవసంకల్పమును బయల్పరచుటకు యోహాను యేసుక్రీస్తును గూర్చి ప్రవచించినట్లు తెలుస్తున్నది.
ప్రియపాఠకులారా! యోహాను 10ః14-16లో ఈలాగు వ్రాయబడియున్నది. ''నేను గొర్రెల మంచి కాపరిని, తండ్రి నన్ను ఏలాగున ఎరుగునో నేను తండ్రిని ఏలాగు ఎరుగుదునో - ఆలాగే నేను నా గొర్రెలను ఎరుగుదును, నా గొర్రెలు నన్ను ఎరుగును, మరియు గొర్రెల కొరకు ప్రాణము పెట్టుచున్నాను. ఈ దొడ్డివికాని వేరే గొర్రెలును నాకు కలవు. వాటిని కూడా నేను తోడుకొని రావలెను, అవి నా స్వరము వినును. అప్పుడు మంద ఒక్కటియు గొర్రెల కాపరి ఒక్కడును అగును.'' ఈ విధముగ దైవకుమారుడైన క్రీస్తు దైవ విశ్వాసులైన మనలను గొర్రెలనుగా పోల్చి మాట్లాడుటలో వాస్తవానికి మనము గొర్రెలమే. ఆయన మందిరమే మనకు దొడ్డి, ఆ మందిరములో ప్రకటించబడే ఆత్మీయ భోజనమే మనకు పచ్చిక, ఆలాగే ఆ మందిర ప్రార్థన సావాసమే జీవజలము అనగా మన దప్పిక దీర్చే నీళ్ళు.
కనుక ప్రియపాఠకులారా! ఈ విధముగా యేసుక్రీస్తుయొక్క ప్రవచనాలైన మాటలలో పరమార్థము ఉంది. అయితే తండ్రియైన దేవుడు యెషయా యిర్మీయాలను తన జనాంగమైన ఇశ్రాయేలును గూర్చి కూడా ఈలాగు ప్రవచించియున్నాడు. యెషయా 40ః11 గొర్రెల కాపరివలె ఆయన తన మందను మేపును, తన బాహువుతో గొర్రె పిల్లలను కూర్చి రొమ్మున ఆనించుకొని మోయును, పాలిచ్చువాటిని ఆయన మెల్లగా నడిపించును.'' యిర్మీయా 23ః1 నా మందలో చేరిన గొర్రెలను నశింపజేయుచు చెదరగొట్టు కాపరులకు శ్రమ.'' అందుకే ఇశ్రాయేలు కాపరియైన యెహోవా - ఇశ్రాయేలు ఆయన మేపెడి గొర్రెలు.
కనుక ప్రియపాఠకులారా! నరుని గొర్రెగా దేవుడు చేయుటలో - దేవునియొక్క శక్తిని ఆత్మను జ్ఞానమును పొందిన ఆదినరుడు త్రివిధమైన బలహీనతలు అనగా ఆత్మీయ బలహీనత, బుద్ధి బలహీనత దేహ బలహీనత పొందిన నరుని గొర్రెగా జేసినట్లు ఇందునుబట్టి మనము తెలుసుకోవలసియున్నది. ఈవిధముగా నరుని గొర్రెగా మార్చిన దేవుడు కూడా తన్నుగూర్చి దేవునియొక్క ప్రవచనమునుబట్టి, నరరూపమును గూర్చి ప్రవచనాలలో లోకపాపమును మోసికొనిపోవు దేవుని గొర్రెపిల్ల రాజని; గొర్రెపిల్ల వివాహమహోత్సవమని, గొర్రెపిల్ల విందని, గొర్రెపిల్ల రక్తములో తమ వస్త్రాలు ఉదుకుకొనువారు ధన్యులనియు, మరియు ప్రకటన 14ః1-4 ఇదిగో ఆ గొర్రెపిల్ల సీయోను పర్వతము మీద నిలువబడి యుండెను. ఆయన నామమును, ఆయన తండ్రి నామమును నొసళ్ళయందు లిఖింపబడియున్న 144 వేలమంది ఆయనతో కూడా ఉండిరి. మరియు విస్తారమైన జలముల ధ్వనితోను, గొప్ప ఉరుము ధ్వనితోను, సమానమైన యొక శబ్దము పరలోకమునుండి రాగా విన్నట్లును, ఆ శబ్దము వీణెలు వాయించు వైణికుల నాదమును పోలినది. వారు సింహాసనము ఎదుటను, ఆ నాలుగు జీవుల ఎదుటను పెద్దల ఎదుటను ఒక క్రొత్త కీర్తన పాడుచున్నారు. వీరు స్త్రీ సాంగత్యమున అపవిత్రులు కానివారును, స్త్రీ సాంగత్యము ఎరుగనివారై యుండి, గొర్రెపిల్ల ఎక్కడికి పోవునో అక్కడికెల్ల ఆయనను వెంబడింతురు. వీరు దేవుని కొరకును గొర్రెపిల్ల కొరకును ప్రధమ ఫలములుగా ఉండుటకై మనుష్యులలోనుండి కొనబడినవారు. వీరి నోట ఏ అబద్ధమును కనబడలేదు, వీరు అనింద్యులు,'' అని ఇందులో వ్రాయబడియున్నది.
ప్రియపాఠకులారా! దేవుని గొర్రెపిల్ల క్రీస్తే. అలాగే క్రైస్తవ జనాంగము అంటే గొర్రెల ఆలయ మందిరము - దొడ్డి. క్రైస్తవ సంఘానికి దొడ్డికి సంఘము అను గొర్రెలకు క్రీస్తు కాపరి. ఇశ్రాయేలు అను గొర్రెలకు యెహోవా కాపరి. కనుక ప్రియపాఠకులారా! లోకరీత్యా అనేకమైన దొడ్లు భూమి మీద ఉన్నవి. ఇందులో మనుష్యుల ఉపయోగార్ధం కొన్ని మనుష్యులకు ఉపయోగము లేనివి కొన్ని, అక్కరకు ఉపయోగపడేవి కొన్ని అక్కరకు రానివి మరికొన్ని ఉన్నట్లు ఉదాహరణగా కొన్నిటిని గూర్చి తెలిసికొందము. మొట్టమొదట గొర్రెల దొడ్డి 2వది పశువుల దొడ్డి, 3. కట్టెల దొడ్డి, 4. బండ్ల దొడ్డి 5. పాయి ఖానా దొడ్డి 6. సమాధుల దొడ్డి 7. గొర్రెల దొడ్డి ఈ ఏడు దొడ్లలో ఐదు దొడ్లను లోకరీత్యా అనుభవించిన మనము దొడ్డియైన సమాధుల దొడ్డికి ఏదోయొక రూపముగా నిర్జీవముగా చేరక తప్పదు. అయితే ఏడవదిగ మనుష్య కుమారుడైన గొర్రెపిల్ల ప్రభువు - ఆయనతో కూడా సమస్త దూతలును, తండ్రియైన దేవుడును వచ్చు సందర్భములో ఇశ్రాయేలు దేవుడైన యెహోవా ఇశ్రాయేలు అను గొర్రెలకు కాపరియైన దేవుడు - క్రైస్తవులమని చెప్పుచు క్రీస్తుయొక్క గొర్రెలుగా తీర్చబడిన మనకు మన భవిష్యత్తునుగూర్చి ఇద్దరు కాపరుల సన్నిధిలో మనకు తీర్పు అనగా ఎన్నిక జరుగబోతుందన్న సత్యాన్ని మనము మరువకూడదు.
ఎందుకంటే ప్రియపాఠకులారా! మత్తయి 25ః31 నుండి ఈలాగు వ్రాయబడియున్నది. ''తన మహిమతో మనుష్యకుమారుడును ఆయనతో కూడా సమస్త దూతలును వచ్చునపుడు ఆయన తన మహిమగల సింహాసనము మీద ఆసీనుడై యుండును, అప్పుడు సమస్త జనములు ఆయన ఎదుట పోగు చేయబడుదురు. గొల్లవాడు మేకలలో నుండి గొర్రెలను వేరుపరచునట్లు ఆయన వారిని వేరుపరచి, తన కుడివైపున గొర్రెలను ఎడమ వైపున మేకలను నిలువబెట్టును.'' ప్రియపాఠకులారా! ఈ గొర్రెల గుంపుగా పిలువబడు విశ్వాసుల భవిష్యత్తు ప్రభువు రాకడ లోకాంత్యములో గొర్రెలు మేకలు అను నామధేయము ఉంటుందిగాని వేరొక నామధేయముతో తీర్పు జరుగదు. ఆ తీర్పు వివరము ఇందులో క్రీస్తున్నాడు. ఈ తీర్పులో గొర్రెలు మేకలు కూడా ప్రోగు చేయబడుననియు, గొల్లవాడు మేకలలోనుండి గొర్రెలను వేరుపరచునట్లుగా - ''అనుటలో ప్రియపాఠకులారా! మేకలు గొర్రెలు రెండును పోలికలలో కొంత తేడా ఉన్నను శాఖాహారులే, రెండింటిని సన్నజీవులుగానే లోకము పిలుస్తున్నది. అయితే పెద్ద జీవులంటే ఎద్దులు, దున్నలు, వగైరా పశుగణాలు. నల్ల పసరము అంటే గేదె జాతి. ఇది లోకములో వాడుకలో ఉన్నటువంటి పశుగణాలకున్నట్టి పేర్లు. ఈ విధముగా పశు జాతుల గూర్చి వేదములో వివరించబడియున్నవి.
అయితే యోహాను 10ః వేద భాగములో దైవకుమారుడైన క్రీస్తు తన విశ్వాసులను తన వద్దనున్న జనాంగమునుద్ధేశించి మాట్లాడిన మాటలలో రెండు దైవనిగూఢ సత్యాలను గూర్చి వివరముగా తెలిసికొందము. అందులో మొదటిది ప్రభువు పల్కిన మాట 10ః7లో గొర్రెలు పోవు ద్వారమును నేనే,'' అనుటలో ఇశ్రాయేలు అను దైవజనాంగము పాతనిబంధనలో పేరుపెట్టబడి దేవుడు ప్రత్యేకించుకొన్న జనాంగము కాపరి లేని గొర్రెలుగా ఉన్నట్లును, వారియొక్క అజ్ఞానమునుగూర్చి యెషయా 1ః2-4లో దేవుడు ఈలాగు సెలవిచ్చియున్నాడు. ''ఆకాశమా! ఆలకించుము, భూమీ! చెవి యొగ్గుము, నేను పిల్లలను పెంచి గొప్పవారినిగా చేసితిని, వారు నామీద తిరుగబడియున్నారు. ఎద్దు తన కామందు నెరుగును, గాడిద తన సొంతవాని దొడ్డి తెలుసుకొనును. ఇశ్రాయేలుకు తెలివి లేదు. వారు యోచింపరు, పాపిష్టి జనమా! దోషభరితమైన ప్రజలారా! దుష్టసంతానమా? చెరుపు చేయు పిల్లలారా! మీకు శ్రమ, వారు యెహోవాను విసర్జించియున్నారు. ఇశ్రాయేలుయొక్క పరిశుద్ధ దేవుని దూషింతురు, ఆయనను విడిచి తొలగిపోయియున్నారు.'' ఇందునుగూర్చి మనము వివరముగా తెలిసికొందము.
ప్రియపాఠకులారా! దేవునియొక్క గొర్రెల మందగా లోకములో ప్రత్యేకించబడిన ఇశ్రాయేలును దేవునియొక్క గొర్రెలుగాను, దేవుడు ఆ విధముగా గొర్రెలైనవారికి దేవుడు కాపరియైయున్నట్లుగా కూడా దావీదుయొక్క కీర్తన భాగాలలోను, యెషయా గ్రంథము కొన్ని వేదభాగాలలోను, యిర్మీయా గ్రంథములోను ఇందునుగూర్చి ప్రత్యక్షముగా వివరించబడియున్నది. ప్రియపాఠకులారా! ఈ విధముగా దేవుడు తన విశ్వాస జనాంగమును గొర్రెలకు పోల్చుటలో ఉన్నటువంటి పూర్వార్థమునుగూర్చి చర్మపు దుస్తుల ద్వారా తెలిసికొనియున్నాము. దేవుడు నరజంటకు తొడిగించిన చర్మపు దుస్తులు గొర్రెచర్మమేనని ఇందునుబట్టి రూఢిగా తెలుస్తున్నది. దేవునియొక్క ఎన్నిక దేవునియొక్క నడుపుదల దేవునియొక్క ఆత్మ ఆవరింపు దేవునియొక్క పోషణ, సంరక్షణ, ప్రత్యక్షీకరణ ఆయన మహిమలో పాలిపంపులు పొంది, ఆయనను తమ దేవునిగా మహిమపరచ వలసిన జనాంగము పాశవికులై అజ్ఞానులై, కృతజ్ఞత హీనులై అవిశ్వాసులగుటయేగాక, దైవత్వము మీద తిరుగుబాటు చేసి అనేకమార్లు దైవత్వము నుండి తొలగిపోయిన ఇశ్రాయేలునుగూర్చి సంతాపపడినట్లు యెషయా 1ః1-7 వ్రాయబడిన వేదభాగ వివరణ మనకు తెలుపుతున్నది.
కనుక ప్రియపాఠకులారా! ఈ విధముగా తొలిగిపోయిన జనాంగము గొర్రెలవలె గాక గొర్రెల కంటె హీనమైన జంతువుతో పోల్చి, తన జనాంగమునుగూర్చి సంతాపపడుచున్నాడు. ఎద్దు ః- ఇది మొద్దు జీవి. దీనికి జ్ఞానము లేదు దీనికి జంతుజాలములో ఎన్నిక లేదు, విలువ లేదు. ఇది మానవ నిర్వాహకమునకు దున్నుటకు బరువులు, గానుగ త్రిప్పుట, బరువు పనులు చేయుటకు బండ్లు లాగుటకు ఉపయోగపడే జీవి. రెండవది గాడిద - లోకరీత్యా జంతువులలో నీచ జంతువుగా ఎంచబడింది. దీనిని భారవాహకమంటారు. ఇది చాకలి బట్టలు, బరువులు మోయుట, హీనమైన చాకిరీ చేయుటకు ఉపయోగపడే జంతువు, కనుక దేవుడు అమాయికులు దేవుని పేరు పెట్టబడినవారు, దేవునిచే పవిత్రముగా జీవించాల్సినవారిని పై రెండు జీవులకంటె హీనముగా ప్రవచిస్తూ మాట్లాడిన మాటలు. ప్రియపాఠకులారా! ఇది ఎంత విచారకరమో అందుకే యేసుప్రభువు తన ప్రవచనాలలో ఈలాగు ప్రవచిస్తున్నాడు. యోహాను 10ః7లో గొర్రెలు పోవు ద్వారమును నేనే,'' అనగా దేవుని జనమైన ఇశ్రాయేలు కొరకు ఈ లోకమునకు వచ్చియున్నాడు. వారు దారి తొలిగి అనగా దైవమార్గము నుండి బొత్తుగా తొలిగినట్లును, వారిని దైవ మార్గములో నడిపించుటకు ప్రభువు మార్గముగా అనగా గొర్రెలు ప్రవేశించుటకు ద్వారముగా ఈయనే ద్వారమైనట్లు మనము గ్రహించాలి. 10ః9 నేనే ద్వారమును, నా ద్వారా ఎవడైనను లోపల ప్రవేశించిన యెడల వాడు రక్షింపబడినవాడై, లోపలికి పోవుచు బయటికి వచ్చుచు మేత మేయుచుండును,'' అనుటలో ఈ యేసు అనే మార్గములో రక్షణ ఆత్మీయ ఆహారము తద్వారా ఎదుగుదల ఆత్మీయ వికసింపు, ఈ లోకసంబంధముగా కాక వేరొక లోకములో ప్రవేశించుటకు కావలసిన యోగ్యత ఈ మార్గములో ఈ ద్వారములో ఉన్నట్లు తెలుస్తున్నది.
ప్రియపాఠకులారా! ఇంత గొప్ప ఆధిక్యత ఇశ్రాయేలు సంపాదించుకోకపోవుటన్నది నేటి మన విశ్వాస జీవితములో - యేసు ద్వారా దైవరాజ్యములో ప్రవేశించు యోగ్యత పొందుట మనకు ఇదియొక కారణము. వారి తొట్రుపాటు ఇశ్రాయేలు అవిధేయత వారి తిరుగుబాటు, వారియొక్క మూర్ఖత అని ఇందునుబట్టి మనము గ్రహించవలసియున్నది.
చివరిగా 10ః11లో నేను గొర్రెలకు మంచి కాపరిని, ఆలాగే 10ః14లో నేను గొర్రెలకు మంచి కాపరిని.'' ఈ విధముగా రెండుసార్లు ప్రభువు పల్కుటలో ఆయన తన్ను గూర్చి మంచి కాపరిగా ప్రకటించుకొనుటలో మంచి కాపరికున్న లక్షణములు 10ః15లో ఈలాగు వ్రాయబడియున్నది. ''నేను తండ్రిని ఏలాగు ఎరుగుదునో ఆలాగే నేను నా గొర్రెలను ఎరుగుదును. నా గొర్రెలు నన్నెరుగును, మరియు గొర్రెల కొరకు నా ప్రాణము పెట్టుచున్నాను - ఇది మంచి కాపరియొక్క లక్షణము. అయితే ఈయన ఉద్ధేశ్యము 16 ఈ దొడ్డివి కాని వేరే గొర్రెలును నాకు కలవు, వాటిని కూడా నేను తోడ్కొని రావలెను, అవి నా స్వరము వినును, అప్పుడు మంద ఒక్కటియు గొర్రెల కాపరి ఒక్కడును అగును, నేను దాని మరల తీసుకొనునట్లుగా నా ప్రాణము పెట్టుచున్నాను. ఇందువలననే నా తండ్రి నన్ను ప్రేమించు చున్నాడు. ఇందునుగూర్చి వివరముగా తెలిసికొందము.
గొర్రెలకు మంచి కాపరీ! అంటే యేసు తన్ను గూర్చి ఈ వేదభాగములో ప్రకటించుకొన్న ప్రకారము మంచి కాపరికున్న లక్షణాలు - 1. దొంగల నుండి రక్షించును 2. దుష్ట మృగాలనుండి కాపాడును 3. మేతగల చోట్లకు నడిపించును 4. మంచి నీళ్ళు గల స్థలానికి చేర్చి గొర్రెలకు విశ్రాంతి గల్గించును 5. చీకటి వాతావరణముగాని, ప్రకృతియొక్క వైపరీత్యములోగాని బహుజాగ్రత్తగా ఎలాంటి అవాంతరాలు తలెత్తకుండ వాటిని సంరక్షించును. ఇది లోకసంబంధముగా గొర్రెల కాపరికున్నట్టి లక్షణాలు. యోగ్యతలు. అయితే దేవుని యొద్దనుండి పంపబడిన యేసు అను మన కాపరి ఈయన రెండు విధాలైనట్టి జనాంగములకు కాపరియైయున్నాడు. తండ్రియైన దేవుని గొర్రెలు ఇశ్రాయేలు అయితే కుమారుడైన యేసుక్రీస్తు అను కాపరికి యేసుక్రీస్తు గొర్రెలు అన్యులమైన మనము. అయితే దైవ ప్రణాళికలో ఈయన ఇశ్రాయేలుకు కాపరిగా పంపినాడు - వారు నోచుకోలేదు, అవి ఆయనను తృణీకరించాయి. కాన మనలను నూతన ఆత్మీయతతో గొర్రెలుగా మార్చి మన కొరకు అనేక దొడ్లను ఏర్పరచియున్నాడు. ఈ దొడ్లే మందిరాలు అవియే ప్రార్థనా మందిరాలు. అయితే ప్రధాన కాపరి క్రీస్తే! 1 పేతురు 5ః4, ప్రధాన కాపరి ప్రత్యక్షమైనప్పుడు వాడబారని స్వాస్థ్యమును పొందుచున్నాము,'' అనుటలో అయితే మన స్వాస్థము మనకాపరి యైన క్రీస్తులో ఉన్నది. ఆయన ద్వారా మనకు అది అనుగ్రహించబడియున్నది. ఇందును గూర్చి యోహాను 1ః11-12లో మనము వివరముగా చదువగలము. ''ఆయన తన స్వకీయుల యొద్దకు వచ్చెను ఆయన స్వకీయులు ఆయనను అంగీకరింపలేదు. తన్ను ఎందరంగీకరించెరో వారికందరికి అనగా తన నామమందు విశ్వాసముంచినవారికి, దేవుని పిల్లలగుటకు ఆయన అధికారము అనుగ్రహించెను. అని వ్రాయబడుటలో ఆయన స్వకీయుల యొద్దకు వచ్చెను. ప్రధాన కాపరియైన తండ్రియైన ప్రభువు నరావతారుడై, తాను ఏ గొర్రెల కాపరియైయున్నాడో ఆ తండ్రియైన దేవుడే నరావతారియై యేసుక్రీస్తుగా ఈ లోకానికి వచ్చాడు. అందుకే ఆయనను ఇశ్రాయేలు అనుగొర్రెలు తమ కాపరిగా ఆయనను అంగీకరించలేదు. అందునుబట్టి ఆయన కాపరత్వము ఆయన తన జనాంగమునకు ఇచ్చిన బిరుదు అన్యులైన మనకు అనుగ్రహించబడి తద్వారా దైవకుమారుడైన యేసుక్రీస్తు మన కాపరిగా మనము ఆయన గొర్రెలుగా పిలువబడుట జరుగుచున్నది. ఇది ఇప్పుడు జరుగుచున్నట్టి దైవత్వములోని నిగూఢ సత్యము. ఆదిలో ఇశ్రాయేలు అనే గొర్రెలు నూతన నిబంధనలో అవతరించిన యేసుక్రీస్తును యెహోవా దేవుని ప్రతిరూపముగా విశ్వసించి ఆయన మాటలు వినియుంటే మనము మేకలమే, అంటే దైవత్వములో నిలుకడ లేక ఎటుబడితే అటు గురిలేని ఆత్మీయ జీవితాన్ని అనుభవిస్తూ సత్యదేవుని ఎరుగక, మనోనేత్ర అంధకారులమై నానావిధ లోక ఆరాధనలతో భ్రష్టుపట్టియుండేవారమే. మేకవంటి నిలుకడలేని మనస్సు గల్గి ఎటుబడితే అటు మూగవిగ్రహాలను ఆరాధించుటకు నడిపింపబడితిరని మీకు తెలియును 1 కొరింథీ 12ః2 అని వ్రాయబడిన ప్రకారము మేక వంటి చంచల స్వభావము కాదా? ఆ విధముగా జీవించే నరుని జీవితము మేకవంటి చంచల స్వభావముతో కూడుకొన్నది కాదా?
కనుక ప్రియపాఠకులారా! ఇందునుబట్టి మనకు తెలిసినదేమిటంటే యేసుప్రభువు రాకడలో ఆయన కుడి ప్రక్కన నిలబడేవారు గొర్రెలకును ఎడమ వైపు వారిని మేకలకును పోల్చి దైవవాక్యము ప్రవచించుటన్నది మనము బహుజాగ్రత్తగలవారమై ఆసక్తిగలవారమై, దైవత్వమునకు విధేయతను ఆయన కుడి ప్రక్కన నిలుచుటకు ఆధిక్యత యోగ్యతను పొందుటకు దైవత్వము చేత ఎంపిక చేయబడువారముగ మన ఆత్మీయ ఇహలోక జీవితాలు కూడా అందుకు యోగ్యకరముగా ఉండవలెనన్న సత్యాన్ని ఈ సందర్భములో గ్రహించవలసియున్నాము.
ప్రియపాఠకులారా! మేకలు గొర్రెలు కలసి జీవిస్తున్నట్లే అలాగే ఈ లోకములో నీతిమంతులు పాపులు కలిసి జీవిస్తున్నారు. ఆలాగే సంఘములో నీతిమంతులు, అవినీతిమంతులు, విశ్వాసులు, అవిశ్వాసులు కలిసియే ఉంటున్నారు. కాని విశ్వాసులెవరో, అవిశ్వాసులెవరో? లోకము నిర్ధారించలేదు. విశ్వాసులను అవిశ్వాసులను నిర్ధారించాలంటే దైవత్వమునకును ఆయనయొక్క ప్రత్యక్షతకును ఇది సాధ్యము. పై వివరించబడిన రెండు తరహా నరకోటి కలిసియే జీవిస్తున్నారు. ఇందునుబట్టి దైవ ప్రవచనము విశ్వాసులను, అవిశ్వాసులను, నీతిమంతులను, పాపులను, న్యాయస్థులను, అన్యాయస్థులను మోసగాళ్ళను అమాయికులు వగైరాలను గూర్చి లోకరీత్యా గొర్రెల మేకలయొక్క కలయికతో పోల్చి ప్రవచించుటన్నది గొప్ప ఆత్మీయ మర్మముతో కూడిన విషయము.
ప్రియపాఠకులారా! ఈ విధమైన నిర్ధారణలు దైవసన్నిధిలో దైవపక్షముగా దైవవ్యతిరేక కూటమి పక్షముగా - నిలువబడపోయే రెండు విధములైన నరసందోహాన్ని గూర్చి దైవవాక్యము వివరిస్తున్నది. అదేమనగా పై పెర్కొనబడిన గుణాతిశయములు కల్గిన వ్యక్తులను ప్రభువు రాకడలో ఎన్నుకొనే సందర్భంలో జరిగే దైవపరీక్షలోని వారికిచ్చిన ప్రత్యేక నామము కుడివైపువారికి గొర్రెలనియు, ఎడమవైపువారికి మేకలనియు ప్రవచించుటలో మేక నీచజంతువు కాదు, గొర్రె అపరిశుద్ధమైన జంతువు కాదు. లోకసంబంధ వైద్యరీత్యా మేక మాంసము కొన్ని జబ్బులకు పధ్యాకారి. డోలు మద్దెల మృదంగము డప్పులు తప్పెటలు వగైరా నానావిధ తోలు వాయిద్యాలకు మోత నిచ్చేది మేక చర్మమే; చర్మపు వాయిద్యాలలో వాడబడేది మేక చర్మము పలురకాలైన ఆకులు మేస్తున్నందున మేకలో వైద్య సంబంధ ఔషధ గుణాలున్నవి. మరి ఇంత గొప్ప ఆధిక్యతగల మేకలను అనీతిమంతులకును ఈ నామధేయముతో ప్రవచించుటలో దైవత్వమన్నది పక్షపాత దృష్టి అనుటకు వీలులేదు. ఎందుకంటే మేకలో ఎన్ని గుణ లక్షణాలున్నను దాని స్వభావము దైవత్వమునకు - విశ్వాసియొక్క ఆత్మీయ గుణాలకును విరుద్ధము. ఎలాగంటే మేక అహంభావము కలది, మందలో కలిసి జీవించే స్వభావము లేనిది. అనగా ఐక్యత అను గుణము మేకలో లేదు. ఇది ఎల్లప్పుడు ఒంటరితనము కోరుకుంటుంది. మందలో కలిసి జీవించినను మేత విషయములో స్వార్థము ఉంది, గర్వము కలది, నడకలో తన అహంభావాన్ని కనబరచుచు ఠీవిగా నడుచును, అందుకే మేకపోతు గాంభీర్యము అనుట లోకోక్తి - ఈనాటికిని జనబాహుళ్యములో నిలిచియుంది. మరియు మేక మాంసము, రాజభోజనాలలో వాడబడేది కాదు. ఈనాటికిని లోకరీత్యా ముఖ్యమంత్రులు. ప్రధాన మంత్రులు, రాజకీయనాయకులు, గొప్ప గొప్ప ఐశ్వర్యవంతులైన ఘనీబులు, వారియొక్క జన్మదిన పండుగలు, వారియొక్క కుటుంబ సమేతముగా ఆచరించే ఆచారయుత కార్యక్రమాలు, వివాహాలు, అతిథి సత్కారము క్రింద జరిగించే విందులలో పొట్టేళ్ళను తప్ప మేకలను వాడే దాఖలాలు లేవు. విందులోను పరిశుద్ధ కార్యక్రమాల్లోను దైవసన్నిధిలోను మేక రెండవ తరగతికి చెందిందిగా తెలుస్తుందిగాని వాస్తవానికి ప్రాముఖ్యమైన ఆహార వస్తువుగావాడబడదని ఇందునుబట్టి తెలిసికోవలసియున్నది.
యేసుక్రీస్తు కూడా తన ప్రవచనాలలో నిజమైన గొర్రెల కాపరిని అని అన్నాడేగాని నేను నిజమైన మేకల కాపరినని అనలేదు. అలాగే క్రైస్తవ విశ్వాసులను గొర్రెల మందగా వేదము ప్రవచిస్తున్నదిగాని మేకల మందగా కాదు. అలాగే క్రైస్తవ మందిరాలను గొర్రెల దొడ్డిగా ప్రవచింపబడింది. కాని గొర్రెలతో మేకలు కూడా కలిసి ఉంటాయి. అయితే గొర్రె రూపము వేరు, గొర్రె అలవాట్లు వేరు, నడక వేరు, జీవితము వేరు, గొర్రె రూపము వేరు గొర్రె యొక్క వ్యవస్థ వేరు. ఒక్కమాటలో చెప్పాలంటే గొర్రెలకు మేకకును జనబాహుళ్యములో గొర్రె వాడబడే విధానము వేరు. విందుశాలల్లోగాని, రాజగృహాలలోగాని, దైవ సన్నిధిలోగాని గొర్రెకు చాలా ప్రాముఖ్యత ఉన్నట్లు ఇందునుబట్టి మనకు తెలుస్తున్నది. అందుకే ఆయన అంటున్నాడు, ''నా గొర్రెలు నా స్వరము వినును, అనగా ఆత్మపరులైన క్రైస్తవ విశ్వాసులు ఆయన సువార్తను వినే ఆసక్తి కలిగియుంటారు. ఆయన ప్రకటించిన ప్రవచనాన్నిగూర్చి ఆయన చరిత్రను గూర్చి రాజ్య సువార్తను గూర్చి ప్రకటనాయుతమైన స్వరానికి ఎల్లప్పుడు వినగల్గిన చెవులు గలవారు యేసుక్రీస్తుయొక్క మందలోని గొర్రెలుగా ఉంటారని ఇందులోని భావము.
మేకలు కాపరి మాటలు వినవు. కాపరిని కాపరి మార్గాన్ని అనుసరించవు. మందలో కలిసి నడవవు. అడ్డుదారులలో నడుస్తుంటాయి. ఏదైనను ప్రమాదము సంభవించినప్పుడు గోలచేస్తాయి. అందుకే యేసుప్రభువు మత్తయి 25ఃలో వ్రాయబడిన సంఘటనలో కుడివైపున గొర్రెలును, ఎడమ వైపున మేకలను నిలువబెట్టును. ఈ మేకలన్నవి అవిశ్వాసులును, వేషధారులును, అహంభావము కలవారు. ఎల్లప్పుడును సుఖానుభవము కోరేవారు. దైవత్వానికి విధేయించని సావాసముతో కూడుకొన్నవి. విశ్వాసుల గుంపులో చేరనివారును, సరఘానికి చెందవలసిన కానుకలు చెల్లించి ఆరాధనకు రానివారు. గొర్రెల దొడ్డికి దూరముగా జీవించేవారు. ఇంకా చెప్పాలంటే క్రీస్తుయొక్క ప్రేమను ఎరుగరు, క్రీస్తు మార్గములో నడువరు, తాము క్రైస్తవులమని చెప్పరు, క్రీస్తు సంబంధులమని ప్రకటించరు, గొర్రె చర్మము కప్పుకొని మేక జీవితముతో జీవించువారు. ఇట్టివారిని ప్రభువు రాకడలో ప్రభువు ఎడమవైపున నిలువబెట్టి వారిని మేకలుగా ప్రవచించినట్లు తెలుస్తున్నది. అనగా వీరు గొర్రెల మందలలో కలిసి ఉంటారని గొర్రె స్వభావము, గొర్రెల అలవాట్లు, గొర్రెవలె వినయ విధేయతలు, సావాసము, వగైరా ఆత్మీయ గుణములకు దూరమై అనగా గొర్రెల అలవాట్లకు వ్యతిరేకులై, తమవరకు తామే నీతిమంతులమని చెప్పుకొంటూ - స్వార్థముతో అహంభావముతో జీవించే మేక స్వభావము గల్గిన వ్యక్తులు. నేటి క్రైస్తవ సంఘాలలో ఈ రెండు విధములైన వారు కలిసే ఉన్నారు. కాని ఎవరు గొర్రెలు ఎవరు మేకలన్నది మనకు తెలియకపోయినను దైవత్వమునకు తెలిసియే ఉండబట్టి మత్తయి 25ఃలో వ్రాయబడిన రీతిగా ప్రభువు తన మహిమలో వచ్చునప్పుడు ఆయనే గొర్రెలెవరో మేకలెవరో విడదీసి తీర్పు దీర్చి వారిని కుడిఎడమల నిలువబెట్టి లోకమునకు బహిరంగపరిచే దినమున్నదన్న సత్యాన్ని కనబరచునట్లుగా ఇందునుబట్టి మనము తెలిసికోవాలి.
కనుక ప్రియపాఠకులారా! దైవత్వములో గొర్రెకు గొర్రెల దొడ్డికి - గొర్రెపిల్లకు, గొర్రెయొక్క జీవితానికి, గొర్రె స్వభావమునకు ప్రత్యేక ఆధిక్యత ఉన్నట్లు మనకు ఋజువగుచున్నదంటే దైవసన్నిధిలో మనము ధన్యులమే. లోకరీత్యా నరకోటిలో ఒక వ్యక్తిని గొర్రె అంటే అతనిని చాలా అగౌరవపరచినట్లుగా భావించుతాడు. దేనికంటె లోకరీత్యా గొర్రె అల్ప జీవి అనగా బలహీన జంతువు. ఇది జంతువులన్నిటిలో కూడా బలహీనమైనది. పరిశుద్ధమైనది, అమాయికమైనది. జంతువులన్నిటిలో యజమానికి విధేయించి ప్రవర్తించును. కనుక దైవత్వము ఆదిలో ఏదెనునుండియే గొర్రె వంటి జీవితానికి పునాది వేసినట్లు తెలుస్తున్నది.
ప్రియసోదరీ! సోదరా! ఈ సాహిత్యము వినిన నీవు ఆదినుండి అంతము వరకు గొర్రెను గూర్చి, మేకనుగూర్చి తెలిసికొనియున్నావు. క్రీస్తు ఏ విధముగా తన జీవితాన్ని లోకములో గొర్రెపిల్ల నామధేయముతో తన జీవితం ప్రారంభించాడో ఆ విధముగా యేసుక్రీస్తు ఈ లోకములో అవతరించుటలోని నిగూఢ సత్యము గ్రహించుము. పాపపరిహారార్థము వధింపబడిన గొర్రెగాను, యాజకుడుగాను, ఆయన ప్రధాన అపొస్తలుడు, ఆయనే గొర్రెపిల్ల రాజుగాను, లోకములో తన చరిత్రను ఎరిగించుటకు ఉన్న పరమార్ధాన్ని గూర్చి గ్రహించితే మరికొన్ని అమూల్య మర్మాలు, సత్యాలు గొర్రెపిల్ల జీవితములో గుప్తమై యున్నవి. ఈ సందర్భములో వేదరీత్యా కొన్ని ముఖ్యాంశాలను గూర్చి ధ్యానించుకొందము. ప్రకటన
5ః6లో ఈలాగు వ్రాయబడియున్నది. ''మరియు సింహాసనమునకును, ఆ నాలుగు జీవులకును, పెద్దలకును మధ్యను వధింపబడిన గొర్రెపిల్ల నిలిచియుండుట చూచితిని. ఆ గొర్రెపిల్లకు ఏడు కొమ్ములును, ఏడు కన్నులుండెను. ఆ కన్నులు భూమి అంతటికి పంపబడిన దేవుని ఏడాత్మలు 8లో ఆ నాలుగు జీవులును వీణెలును ధూపద్రవ్యములతో నిండిన సువర్ణ పాత్రలును పట్టుకొనియున్న ఆ 24 పెద్దలును ఆ గొర్రెపిల్ల ఎదుట సాగిలపడి మ్రొక్కిరి. 5ః10లో వధింపబడిన ఆ గొర్రెపిల్ల తన స్వరక్తమిచ్చి ప్రతి వంశములోను, ఆయాభాషలు మాటలాడువారిలోను, ప్రతి జనములోను, దేవుని కొరకు మనుష్యులను కొని వారిని దేవునికి ఒక రాజ్యముగాను, యాజకులనుగాను జేసినట్లును, వారు భూలోకమందును ఏలుదురని క్రొత్త పాట పాడుదురు. ఇది ప్రకటన గ్రంథములో యోహాను కనిన దర్శనములోని ఆధిక్యత. ఇక
5ః12లో వధింపబడిన గొర్రెపిల్ల శక్తియు, ఐశ్వర్యమును, జ్ఞానమును, బలమును, ఘనతయు, మహిమయు, స్తోత్రమును పొందనర్హుడని గొప్ప స్వరముతో చెప్పుట వినెను.
ప్రియపాఠకులారా! గొర్రె పిల్ల వధింపబడుట ఏమి? ఆ విధముగా వధింపబడిన గొర్రెపిల్ల బలమేమిటి? శక్తి ఏమిటి? ఇది చదువునప్పుడు మనకు ఆశ్చర్యము కలుగుట లేదా? అటుతర్వాత
5ః13లో అంతట పరలోకమందును భూలోకమందును భూమి - క్రిందను సముద్రములోను ఉన్న ప్రతి సృష్టము, అనగా వాటిలోనున్న సర్వమును - సింహాసనాసీనుడైయున్నవానికిని, గొర్రెపిల్లకును - స్తోత్రమును, ఘనతయు, మహిమయు, ప్రభావమును, యుగయుగములు కలుగును గాక అని చెప్పుట వింటిని. ఆ నాలుగు జీవులు ఆమేన్ అని చెప్పగా ఆ పెద్దలు సాగిలపడి నమస్కారము చేసిరి.''
ఇవన్నియు ప్రియపాఠకులారా! నేటి క్రైస్తవులమైన మనకు కలవరపాటు, తత్తరపాటు కల్గించే అంశములుగా ఉండవచ్చును. అయితే ఇందులో మర్మమున్నది. గొర్రెపిల్ల వధింపబడింది ఒక్కసారేే, ఆ గొర్రెపిల్ల లోకసంబంధ గొర్రెపిల్ల కాక దైవసంబంధమైన, దైవత్వము చేత పంపబడినదియునైన దేవుని గొర్రెపిల్ల,'' అని అనుటలో భూమి మీద ఉన్న గొర్రెకును, దేవుని యొద్దనున్న గొర్రెకు వ్యత్యాసము - భూమిమీదనున్న గొర్రె పశుగణాలలో ఒక జీవి. నరునియొక్క అవసరతలకు, వాని ఆహారమునకు ఉపయోగపడే చతుష్పాద జీవి గొర్రె. అయితే దేవుని యొద్దనుండి పంపబడిన ఆ గొర్రెపిల్ల లోకసంబంధమైన జీవులైన గొర్రెయొక్క దేహాన్ని లోకస్థులైన మనము చంపి నానారీతులుగా వాడుకొనే విధానము, ఆహార విలువలో దానికున్న ప్రాధాన్యత. ఇవన్నియు లోకరీత్యా నరుని పోషణార్థము ఈ గొర్రె వాడబడింది. అయితే పరలోకము నుండి పంపబడిన ఆ గొర్రె నాలుగు కాళ్ళు కాక రెండు కాళ్ళతో మానవాకారములో ఈ లోకములో జీవించి, పాపపరిహారార్థము లోకరీత్యా వధింపబడు గొర్రెపిల్లకు ప్రతిగా నిలిచి, సృష్టిలోని నరకోటి యావత్తుకును ఒక్కసారే సంక్రమించిన దోషాపరాధమును ఒక్క బలితో పరిసమాప్తి అగుటకు, ఈ పరలోకము నుండి వచ్చిన గొర్రెపిల్ల, దైవకుమారుడు యేసుక్రీస్తు అను గొర్రెపిల్ల మన అపరాధములు, పాపములు అనగా కలుషితమైన మన రక్తము అపరిశుద్ధమైన మన దేహము పరిశుద్ధపరచబడునట్లును, అపవిత్రమైన జీవితము పవిత్రపరచబడునట్లు, కలుషితమైన మన ఆత్మకు పరిశుద్ధత కల్గించి, ఈ నిర్దోషమైన దేవుని గొర్రెపిల్ల మీద లోకనరకోటి పాపములు యావత్తు మోపబడి, పాపమునకు మరణమునకు నరుని మీద అధికారము లేకుండుటకు అనగా మరణమునకు అపజయము, పాపమునకు విమోచన, నిత్యాగ్ని పూరితమైన రెండవ మరణము నుండి విమోచన కల్గించే ఈ దేవుని గొర్రెపిల్ల - శారీర రక్త బలియాగము ద్వారా లోకము శుద్ధీకరించబడునట్లుగా దేవుని గొర్రెపిల్లగా పిలువబడినట్లు మనము వేదరీత్యా తెలిసికోవలసిన సత్యము. ఇదియే సత్య సువార్త. ఇదియే గొర్రెపిల్ల రాజ్య సువార్త. ఇదియే గొర్రెపిల్ల రాజు యొక్క పరిపాలనను గూర్చిన పరలోక మర్మము.
కనుక భూలోక గొర్రెపిల్ల వేరు పరలోక గొర్రెపిల్ల వేరు. భూలోకంలో గొర్రెలుగా ఉన్న మనము పరలోకంలో గొర్రెపిల్లయైన ప్రభువునకు సమీపస్తులుగా గొర్రెలుగా మార్చబడి ఎఫెసీ 5ః22లో ఈ విధముగా వ్రాయబడియున్నది. ''క్రీస్తు సంఘానికి శిరస్సయి యున్నలాగున పురుషుడు భార్యకు శిరస్సయియున్నాడు. క్రీస్తే శరీరమునకు రక్షకుడైయున్నాడు. సంఘము క్రీస్తునకు లోబడినట్టుగా భార్యలు కూడా ప్రతి విషయములోను తమ పురుషులకు లోబడవలెను. పురుషులారా! మీరును మీ భార్యలను ప్రేమించుడి అటువలె క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి, అది కళంకమైనను ముడతయైనను అట్టిది మరి ఏదైనను లేక, పరిశుద్ధమైనదిగాను, నిర్దోషమైనదిగాను, మహిమగల సంఘముగాను ఆయన తన ఎదుట దానిని నిలువబెట్టుకొనవలెనని, వాక్యముతో ఉదక స్నానము చేత దానిని పవిత్రపరచి, పరిశుద్ధపరచుటకై దాని కొరకు తన్ను తాను అప్పగించుకొనెను,'' అని వ్రాయబడిన ప్రకారము దేవుని గొర్రెపిల్ల క్రీస్తుయొక్క బలియాగమును గూర్చిన పూర్తి వివరణ తెలుస్తున్నది.
కనుక లోకములో మనయొక్క ఇహలోక స్థితిగతులు, ఐశ్వర్యము, పదవులు, హోదాలు, అధికారము, శక్తి సామర్ధ్యాలు గల్గి ఎంతగా మనము గర్వించినను, సంబరపడినను, చంకలు ఎగరేచినను దైవత్వమన్నది మనలను గొర్రెలుగా జేసి ప్రవచిస్తున్నదన్న సత్యాన్ని గ్రహించాలి. మనమున్నటువంటి సంఘము గొర్రెల మంద, మనము ఆరాధించే ఆరాధన గొర్రెల దొడ్డి - మన సంఘ ప్రధాన కాపరి, క్రీస్తు. మన సంఘానికి మనము ఏర్పరచుకొన్న బోధకుడు క్రీస్తుకు ప్రతినిధిగ ఏర్పరచుకొన్న కాపరి, గొర్రెలైన మనకు కాపరి. అయితే ఈ కాపరి ప్రధాన కాపరియైన క్రీస్తుయొక్క మాటలనే అతడు మనకు బోధించువాడై యున్నాడు. కనుక ఆయన యేసుక్రీస్తుయొక్క ఆయన దొడ్డియైన క్రైస్తవ సంఘమును, ఆయనేర్పరచుకొన్న కాపరి సంఘ నిర్వాహకుడుగా నున్నాడు - కాదంటారా? ఇశ్రాయేలు అను దేవుని జనాంగము ఆయన మేపు గొర్రెలు, ఆయన దొడ్డిలోని గొర్రెలు. వారికి ప్రధమ నిర్వాహకుడు మోషే. ఇశ్రాయేలు అన్న దేవుని గొర్రెలు ఆయన నియమావళిని అధిగమించి త్రోవ తప్పగా దారి దప్పిన గొర్రెలుగా గ్రంథము ప్రవచిస్తున్నది.
ఈ విధముగా దారి తప్పినవారిని మళ్ళించుటకు యేసుక్రీస్తు వచ్చినను ఆయననుగూర్చి గ్రహించక తృణీకరించారు. అంతేగాదు ఆయన మీద అనేకమైన నేరారోపణలు మోపి సిలువ మరణానికి గురిజేసి ఆయనను చంపింది. అయినను దేవుని యొద్ద నుండి దిగివచ్చిన ఆ గొర్రెపిల్ల జీవమైనది, నిత్యయుతమైనది దానికి మరణము లేదు, మరణము బంధించలేదు, మరణాన్ని జయించే శక్తి, ప్రభావము ఆ గొర్రెకున్నది. సమాధి చేసినను సమాధిని బద్దలు చేసుకొని మోక్షారోహణమై, భూలోకములో ఏ విధముగా అవతరించిందో ఆ గొర్రె రారాజు సింహాసనాసీనుడై గొర్రెపిల్ల పేరుతో వివాహ మహోత్సవము జరిపించుకొనే దినమున్నట్లును, అలాగే గొర్రెపిల్ల వివాహమహోత్సవమునకు పిలువబడువాడు ధన్యులని వ్రాయబడిన ప్రవచనము కూడా వేదరీత్యా ఎరిగిన సత్యము. ప్రకటన 17ః1- లో వ్రాయబడిన వేదభాగములో ''విస్తారమైన జలముల మీద కూర్చున్న మహావేశ్యకు చేయబడు తీర్పు - భూరాజులు ఆమెతో వ్యభిచరించిరి, భూనివాసులు ఆమె వ్యభిచార మద్యములో మత్తులైరి. దేవదూషణ నామములతో నిండుకొని ఏడు తలలును పది కొమ్ములును గల ఎర్రని మృగము ఆ స్త్రీయొక్క వాహనము. ధూమ్ర రక్తవర్ణముగల వస్త్రము ఆ స్త్రీ యొక్క వస్త్రధారణ. బంగారముతోను, రత్నములతోను, ముత్యములతోను వగైరా ఆభరణములను అలంకరించుకొన్న ఈ స్త్రీ యొక్క చేతులలో ఉన్న పాత్ర - హేహ్యమైన కార్యాలతోను, వ్యభిచార సంబంధమైన అపవిత్ర కార్యాలతోను నిండిన ఒక సువర్ణ పాత్రయుండెను. ఈ వేశ్య నొసట వ్రాయబడిన మాటలు - వేశ్యలకును భూమిలోని ఏహ్యమైన వాటికిని తల్లియైన మహాబబులోను, ఈ స్త్రీయొక్క పానీయము పరిశుద్ధుల రక్తము, యేసుయొక్క హతసాక్షుల రక్తము చేతను మత్తిల్లియుండుట, ఈ విధమైన బలాధిక్యతలు గల్గిన ఆస్త్రీ ఏలుచున్న ఏడుకొండలు - మరియు ఆమెతో ఏకీభవించిన ఏడుగురు రాజులు. ఇందులో క్రూరమృగము అను సాతాను ప్రధాన పాత్ర వహించియున్నట్లును, ఇట్టి బలాధిక్యతలు గల్గిన స్త్రీ 17ః14 గొర్రెపిల్లతో యుద్ధము చేతురుగాని, గొర్రెపిల్ల ప్రభువులకు ప్రభువును రాజులకు రాజునైయున్నందునను, తనతో కూడా ఉండినవారు పిలువబడినవారు ఏర్పరచబడినవారై, నమ్మకమైన వారైయున్నందున ఆ స్త్రీ పక్షముగా ఉన్న రాజులతో యుద్ధముచేసి వారిని జయించినట్లును, ఆ తర్వాత ఆ పది కొమ్ములుగల మృగమును, ఆ వేశ్యను ద్వేషించి, దానిని దిక్కులేని దానినిగాను, దిగంబరిగాను, దాని మాంసము భక్షించి, అగ్ని చేత దానిని బొత్తిగా కాల్చివేతురు. దేవుని మాటలు నెరవేరువరకు వారు ఏకాభిప్రాయము గలవారై, తమ రాజ్యమును ఆ మృగమునకు అప్పగించుట వలన తన సంకల్పము కొనసాగించినట్లు దేవుడు వారికి బుద్ధి పుట్టించును. ఇంతకును ఈ స్త్రీ భూరాజుల నేలు ఆ మహాపట్టణము. ఇదియే ఈ వేదభాగములోని చివరి సారాంశము.
కనుక ప్రియపాఠకులారా! దైవకార్యము దైవోద్దేశ్యము, దైవ ప్రణాళికలు అన్నియును జీవులకు పోల్చి రాయబడిన సాహిత్యము తెల్పుచున్నది. భూమి మీద గొర్రెపిల్ల చతుష్పాదజీవి, పరలోకమునకు అనుగ్రహించిన పాపపరిహారియేగాని చతుష్పాద జీవి కాదు. దేవుని మహిమార్థమైన నరస్వరూపము లేక ప్రత్యక్షపరచే నరశరీరము ఈ గొర్రెపిల్ల. ఈ గొర్రెపిల్లనే యేసని క్రీస్తని, లోకరక్షకుడని, ఇమ్మానుయేలు విమోచకుడని, ప్రవక్తయని, ప్రధాన అపొస్తలుడని, ప్రధాన యాజకుడని నానావిధ బిరుదులున్నవి. ఈ బిరుదులలో గొర్రెపిల్ల యని పిలువబడే ఈ బిరుదు ప్రత్యేకమైన బిరుదు. ఈ తొమ్మిది నామధేయాలు యేసుక్రీస్తు విషయములో 9 విధములైన క్రియలు జరిగించుటనుబట్టి ఆయా సందర్భాలనుబట్టి ఆ పేర్లు సార్థకమైయున్నవి. ఇందులో 1ః యేసు అను పేరు లోకము చేత పెట్టబడింది కాదు. ఇది దేవుడు తన దూత ద్వారా మత్తయి 1ః22 ఆయనకు 1. ఇమ్మానుయేలు 1.21 కన్యక గర్భవతియై కుమారుని కనును ఆయనకు 2. యేసు అను పేరు 3. యూదుల రాజు మత్తయి 2ః2 ఈలాగు వ్రాయబడియున్నది. యూదయా దేశపు బెత్లెహేములో యేసు పుట్టిన పిమ్మట ఇదిగో తూర్పుదేశపు జ్ఞానులు యెరూషలేమునకు వచ్చి - యూదుల రాజుగా పుట్టినవాడెక్కడ నున్నాడు? తూర్పుదిక్కున ఆయన నక్షత్రమును చూచి ఆయనకు పూజింపవచ్చితిమి,'' అనిన ప్రవచనము నెరవేర్పు. 4. ఇక లూకా 2ః11లో ''రక్షకుడు, దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టియున్నాడు - ఈయన ప్రభువైన క్రీస్తు,'' అని గొల్లలతో దేవుని దూత చెప్పిన మాట. 5. మత్తయి 20ః28 విమోచకుడు గలతీ 1ః3-4 విమోచించువాడు. 6. ప్రవక్త యోహాను 4ః19 అయ్యా నీవు ప్రవక్తవని గ్రహించుచున్నాను. 7. హెబ్రీ 3ః1లో ఈలాగు వ్రాయబడియున్నది. ''పరలోకసంబంధమైన పిలుపులో పాలుపొందిన పరిశుద్ధ సహోదరులారా! మనము ఒప్పుకొనిన దానికి అపొస్తలుడును ప్రధాన యాజకుడునైన యేసు మీద లక్ష్యముంచుడి,'' అపొస్తలుడు - ప్రధాన యాజకుడు 8. గొర్రెపిల్ల; యోహాను 1ః29 యోహాను చెప్పిన మాట ''ఇదిగో లోక పాపమును మోసికొనిపోవు దేవుని గొర్రెపిల్ల.
ఇక గొర్రెపిల్ల విందుకు పిలువబడినవారు ధన్యులు ఈ గొర్రెపిల్ల విందేమిటి? అన్న దానిన గూర్చి తెలిసికొందము. గొర్రెపిల్ల విందుకు కారణము - గొర్రెపిల్ల వివాహ మహోత్సవము, ఈ విందు గొర్రెపిల్ల సంబంధమైంది. ప్రకటన 19ః17-21 ఇది గొర్రెపిల్ల ప్రభువు చేయు యుద్ధమునుగూర్చి వివరించబడింది. 19ః7 గొప్ప జనసమూహపు శబ్దము, విస్తార జలముల శబ్దము, బలమైన ఉరుముల శబ్దమును పోలిన యొక స్వరము - సర్వాధికారియు ప్రభువునగు మన దేవుడు ఏలుచున్నాడు. ఆయనను స్తుతించుడి, గొర్రెపిల్ల వివాహమహోత్సవ సమయము వచ్చినది, ఆయన భార్య తన్ను తాను సిద్ధపరచుకొని యున్నది. కనుక మనము సంతోషపడి ఉత్సహించి ఆయనను మహిమపరచెదమని చెప్పగా వింటిని,'' అని వ్రాయబడిన ప్రకారము 19ః8-9 గొర్రెపిల్ల భార్యకు ధరింపజేసిన వస్త్రము ప్రకాశమానమైనదియు, నిర్మలములైన సన్నపు నారబట్టలు ఆమెకియ్యబడినవి. అవి పరిశుద్ధుల నీతి క్రియలని వ్రాయబడుట ఇందులో మనము చదువగలము.
ప్రియపాఠకులారా! ఈ విధంగా గొర్రెపిల్లను గూర్చి వ్రాయుటయేగాక, గొర్రెపిల్ల భార్యను గూర్చి వ్రాయబడింది. 21ః9 ఆ కడపట ఏడు తెగుళ్ళతో నిండిన ఏడు పాత్రలను పట్టుకొనియున్న ఏడుగురు దేవదూతలలో ఒకడు వచ్చి - ఇటు రమ్ము, పెండ్లి కుమార్తెను అనగా గొర్రెపిల్లయొక్క భార్యను నీకు చూపెదనని చెప్పెను. ఈ గొర్రెపిల్ల భార్య అన్నది క్రీస్తునందు విశ్వాసముంచి, క్రీస్తు నిమిత్తము హతసాక్షులైన వేదసాక్షులైనవారు - వారితో సమ్మేళనమైన సంఘమే ఈ గొర్రెపిల్ల వధువు సంఘము, అనగా గొర్రెపిల్ల భార్య. ఈ విధముగా సంఘము దైవమహిమను ధరించుకొని, గొర్రెపిల్లయొక్క స్వభావములను, గుణాతిశయములను అలంకారాలుగ అలంకరించుకొని పెండ్లి కుమారుడైన ప్రభువును వివాహమాడు స్థితి - వివాహమనగా సంఘము ప్రభువులో లీనమగుట, సంఘము ప్రభువులో ఐక్యమగుటన్నదియే ఈ వివాహ మహోత్సవము. ఈ వివాహ మహోత్సవములో లోకసంబంధమైనవి ఏవియు ఉండవు. లోకసంబంధమైనటువంటి వస్తువాహనాలు, భాజాబజంత్రీలు, ఆడంబరాలు, భోజన పదార్ధాలు, అలంకారాలు, కట్నకానుకలేవియు ఉండవు. ఇది ఆత్మీయమైన వివాహము - ఆత్మలతో సమ్మేళనమైన వివాహమైన ఇందులో దేవదూతల గానప్రతిగానాలు, నీతిమంతుల ప్రార్థనలు, పరిశుద్ధుల యొక్క నినాదములు వగైరాలన్నియు ఈ సందర్భములో ఉంటుందని వేదరీత్యా తెలిసిందే. అయితే గొర్రెపిల్ల ప్రభువు వివాహములో ఆమెకు అలంకరించబడిన ఆభరణ అలంకారాలు ప్రకటన 21ః11-23 వ్రాయబడిన వేదభాగములోని వర్ణనలే ఈ పట్టణానికి ఉన్నట్టి ఆభరణ అలంకారాలు.
కనుక ప్రియపాఠకులారా! దేవుడు ఆదిలో నరజంటకు కప్పిన గొర్రెపిల్ల చర్మముతో జరిగించిన ప్రారంభోత్సవము భూమి మీద నానావిధాల క్రియ జరిగించి, నానావిధ రూపాంతరాలతో నానావిధ నామధేయాలతో వేదరీత్యా దైవసన్నిధిలో స్థానాన్ని ధరించి అనగా నరులకు ఆహారమును, దైవత్వమునకు బలి నైవేద్యముగాను, ఈ గొర్రెపిల్లన్నది వాడబడి క్రియ జరిగించి అటుతర్వాత లోకసంబంధమైన గొర్రెతో నరుల పాప రక్తము - నరుల పాపము తీసివేయుటకు సాధ్యము కానందువలన పరలోకము నుండి దైవకుమారుడే పరమ గొర్రెపిల్ల అవతరించి యావద్ నరకోటి పాప శాప మరణ ఫలితమైన నరకాగ్ని శిక్ష నుండి విమోచనార్థము బలిపశువుగ అనగా దేవునియొక్క గొర్రెపిల్లగా దేవునియొక్క మనుష్యుడైన యోహాను ప్రవచించినట్లుగా దేవుని చేత పంపబడిన అనగా పరలోకము నుండి దిగి వచ్చిన గొర్రెపిల్ల దైవత్వమునకు సంబంధించిన నిష్కళంక గొర్రెపిల్ల, పరిశుద్ధ గొర్రెపిల్ల, మచ్చడాగు కళంకములేని గొర్రెపిల్ల, సకల నరకోటిని దైవపరిధిలో దైవమార్గములో దైవ క్రమములో - దైవరాజ్యానికి నడిపించే గొర్రెపిల్ల, మరణము నుండి జీవములోకి దాటించే గొర్రెపిల్ల. సకల విశ్వాసులకు దైవత్వమునుగూర్చి ప్రకటించిన నూతన నిబంధన చరిత్రకు ఆది అంతములు, దేవుని మహిమను దైవ రాజ్య సువార్తను ప్రకటించిన గొర్రెపిల్ల. ఆ తర్వాత అపొస్తలులను వేదచరిత్రకు రచయితలుగాను సాక్షులుగాను మలచిన గొర్రెపిల్ల, పరలోక పట్టణమునకు 12 మంది అపొస్తలులు పునాదులుగా ఏర్పడుటకు కారకుడైన గొర్రెపిల్ల. ఈ పునాదుల ద్వారా ఈ విధముగా దైవనిగూఢ మర్మములతో కూడిన గొర్రెపిల్ల నామము దేవుని మహిమార్థముగా క్రీస్తు ఈ లోకములో చరిత్రకు సాక్ష్యముగా ఈనాడు మన క్రైస్తవ మందిర ఆరాధనలో గొర్రెపిల్ల శరీరము రొట్టె ద్రాక్షారసముగాను, ఆత్మీయ ఆహార పానీయాలుగాను వాడబడుటలో మనము గ్రహించవలసిన దైవ నిగూఢ సత్యము.
కనుక ప్రియపాఠకులారా! యేసుక్రీస్తు ఈ లోకములో మన పాపపరిహారార్థము అవతరించి పాపవిమోచనకు వధింపబడిన గొర్రెపిల్ల. ఆయన జరిగించిన రక్తబలి ద్వారా మన పాపములకు విమోచన మనకు రక్షణ, అంతియేగాక తండ్రి రాజ్యానికి వెళ్ళుటకు ఈ గొర్రెపిల్ల చరిత్ర ఆదర్శము, మార్గము. తండ్రిని ఆరాధించుటకు కావలసిన యదార్థ స్థితికి ఈ గొర్రెపిల్ల సాక్ష్యము - ఈ గొర్రెపిల్ల చరిత్ర మనకు ఆదర్శము - ఆచరణీయము. గొర్రెపిల్ల నామము మనకు ఆరాధ్యనీయము. గొర్రెపిల్ల ప్రభువే రక్షకుడు, విమోచకుడు, దేవుడు ఆయనే మనకు సర్వస్వము. ఆయనే దేవునియొక్క వాక్యము అని ఇందునుబట్టి మనము గ్రహించవలసియున్నది. ఇందునుబట్టి గొర్రెపిల్లకు ఇంత గొప్ప చరిత్ర దైవసన్నిధిలో మానవ జీవితములో ఇంత గొప్ప ఆధిక్యత కల్గిన ఈ గొర్రెపిల్ల ప్రభువుకున్న బిరుదులే ఇప్పుడు మనము గ్రహించియున్నాము.
కనుక ప్రియపాఠకులారా! యోహాను 6ః54-58 నా శరీరము తిని నా రక్తము త్రాగువాడే నిత్యజీవముగలవాడు. అంత్యదినమున నేను వానిని లేపుదును, నా శరీరము నిజమైన ఆహారమును నా రక్తము నిజమైన పానమునైయున్నది, నా శరీరము తిని నా రక్తము త్రాగువాడు నా యందును నేను వానియందును నిలిచియుందుము. జీవముగల తండ్రి నన్ను పంపెను గనుక నేను తండ్రి మూలముగా జీవించుచున్నట్లే నన్ను తినువాడును నా మూలముగా జీవించును. ఇదే పరలోకమునుండి దిగివచ్చిన ఆహారము. పితరులు మన్నాను తినియు చనిపోయినట్లు కాదు. ఈ ఆహారము తినువాడు ఎల్లప్పుడును జీవించును,'' అని చెప్పెను.
కనుక ప్రియపాఠకులారా! లోకసంబంధమైన గొర్రెను తిను ప్రతివాడు చనిపోవునుగాని, ఆత్మ సంబంధమైన ఈ గొర్రెపిల్ల విందులో అనగా ఆరాధనలో పాల్గొని ఆయన నామమందు విశ్వాసముంచిన వానికి, తన పాపములకు పశ్చాత్తాపము పొంది బాప్తిస్మము పొంది, దైవకుమారుని రక్షకుడుగా అంగీకరించిన వానికి మరణము లేదు. లోకసంబంధమైన ఏ జాడ్యము అంటదు. ఏ సమస్యలు అతనిలో తలెత్తవు. ఏ విధమైనటువంటి దుష్టత్వము అతనిపై క్రియ జరిగించదు. ప్రతి ఆపదలోను గొర్రెపిల్ల ప్రభువుయొక్క హస్తము తోడై యుండును - గ్రహించారా? ఇది గొర్రెపిల్లను గూర్చిన పూర్తి చరిత్ర.
........
అంశము - సంపూర్ణత మూలము కొలస్సీ 1ః28-29 ప్రతి మనుష్యుని క్రీస్తునందు సంపూర్ణునిగా జేసి ఆయన ఎదుట నిలువబెట్టవలెనని, సమస్త విదములైన జ్ఞానముతో మేము ప్రతి మనుష్యునికి బోధించుచు, ఆయనను ప్రకటించుచున్నాము.
ప్రియ క్రైస్తవ సంఘమా! లోకములో క్రీస్తుకు తర్వాత ఏ నరుడు సంపూర్ణుడు కాడు. దైవత్వములో సంపూర్ణుడుగా జీవించాలంటే లోకరీత్యా అది అసాధ్యము. ఆదిలో ఆదాము దేవుని చేతిపనియై యుండి దేవునియొక్క ఆత్మను ధరించి ఉన్నను దైవసన్నిధిలో సంపూర్ణుడుగా కాక లోక సృష్టమైన పాము వలన తన ఎముకతో రూపించబడిన స్త్రీ శోధనకు లోనై ఆమె వలన తాను కూడా అసంపూర్ణుడై తోట నుండి తరుమబడినాడు. ఇందునుబట్టి ఆదిలోనే అసంపూర్ణతన్నది నరునికి పునాది వేయబడింది. దైవవిశ్వాసియైన అబ్రాహాము కూడా సంపూర్ణుడు కాడు. ఎందుకనగా తనకున్నటువంటి సంతాన సమస్యను సంతాన హీనత్వ సమస్యను గూర్చి దైవత్వమును విచారింపక, తన భార్యయైన శారా మాటను పాటించి, దాసీని - ఆమె కన్నబిడ్డను మరచి, భార్యయైన శారా మాటననుసరించి హాగరును - హాగరు బిడ్డను అడవుల పాల్జేయుటన్నది స్త్రీ వంచన, ఈ నేరానికి అబ్రాహాము సంపూర్ణుడు కాలేకపోయాడు. కాని అతని సంతానములో కూడా సంపూర్ణులుగా జీవించినవారు లేరు. ఇస్సాకు దైవాశీర్వాదము, దైవబలము, దైవిక తోడ్పాటు గల్గి జీవించినను తన వృద్ధాప్యములో జిహ్వ చాపల్యము చేత మాంసాపేక్ష గలవాడై తిండిని బట్టి తనకు దేవుడు అనుగ్రహించిన ఆశీర్వాద బలాన్ని, తనకున్న కంటి మాంద్యము ద్వారా విచక్షణారహితుడై జ్యేష్టకుమారుడు ఎవడో ద్వితీయ కుమారుడెవరో తెలియని స్థితిలో తాను తినవలసిన ఆహారముతో కూడా మోసపోయి తన వృద్ధాప్యములో పుత్ర శోకాన్ని పొందినాడు. ఇక యాకోబుకు అన్ని ఉన్నాయిగాని పుత్రశోకమన్నది ఏర్పడుటనుబట్టి అతను కూడా సంపూర్ణుడు కాలేకపోయాడు. దైవజనాంగమును నలుబది సంవత్సరాలు పరిపాలించిన అనగా దేవుని గృహము మీద నలుబది సంవత్సరాలు నిర్వాహకత్వము వహించిన మోషే కూడా సంపూర్ణుడు కాడు - కానాలో ప్రవేశించే యోగ్యత కోల్పోయాడు. ఈ అసంపూర్ణతను గూర్చి వ్రాయాలంటే ఈ పుస్తకము చాలదు.
ప్రియపాఠకులారా! పాతనిబంధనలో నరునియొక్క అసంపూర్ణతను గూర్చిన వివరము. ఇక నూతన నిబంధనలో సంపూర్ణులు ఎవరయ్యా? అంటే స్త్రీ జాతిలో కన్యకయైన మరియ, పురుష జాతిలో ఆమెకు ప్రధానము చేయబడిన యోసేపు. పాత నిబంధనలోని ప్రవక్తల నోట దేవుడు ప్రవచింపజేసిన ప్రవచనాలను సంపూర్ణము చేసినటువంటి నూతన నిబంధనలో కన్యకయైన మరియ యోసేపుల జీవితము సంపూర్ణత పొందింది. దైవచిత్తము, ఆయన ప్రణాళికను ఆయన పనిని నెరవేర్చారు. ఇది సంపూర్ణత. పురుష ప్రమేయము లేకుండ ఆమె గర్భము ద్వారా జనించిన కుమారుని కని పెంచి పోషించి, దైవచిత్త ప్రకారము లోకపాప మరణశాప నివారణార్థము అనగా ప్రతి మనుష్యుడు పాపము నుండి విడుదల పొంది దైవత్వముననుసరించి, దైవరాజ్య ప్రవేశము పొందు యోగ్యతను పొందుటకు నర ప్రమేయము లేకుండ కేవలం దైవాత్మ ద్వారా దైవ కుమారత్వమునకు జననమిచ్చి, ఆ పనిని తుది ముట్టించి దైవప్రణాళిక సంపూర్తి చేసిన ఈయొక్క దంపతులు సంపూర్ణులుగా తీర్చబడియున్నారు. అటుతర్వాత యేసుక్రీస్తు 12 మంది శిష్యులలో కొందరు అసంపూర్ణులు. అయితే అపొస్తలులలో సంపూర్ణత పొందినవాడు పౌలు.
ప్రియపాఠకులారా! ఎందుకు నరుడు సంపూర్ణుడు కాకున్నాడు? అన్న విషయాన్ని గూర్చి తెలిసికొందము. కీర్తన 8ః5 దేవుని కంటె వానిని కొంచెము తక్కువవానినిగా చేసియున్నావు. అలాగే స్త్రీ కూడా పురుషునిలో ఒక భాగమైయున్నదేగాని, పురుషునిలో సంపూర్ణత్వాన్ని స్త్రీ పొందలేదు. అలాగే నరుడు కూడా దైవ జీవాత్మలో ఒక భాగమేగాని సంపూర్ణుడు కాడు. దైవత్వములో నరుడు తక్కువవాడైతే నరునిలో స్త్రీ అర్ధాంగి సగ భాగమైయున్నది. ఇందునుగూర్చి వేదరీత్యా అనేక ప్రవచనాలు అపోస్తలుడైన పౌలు వివరించియున్నాడు. అయితే నరుడు సంపూర్ణుడు కాడు. ఎందుకంటే కీర్తన 90ః3, నీవు మనుష్యులను మంటికి మార్చుచున్నావు - నరులారా! తిరిగి రండని నీవు సెలవిచ్చుచున్నావు'', కనుక నరుడు సంపూర్ణుడా? అసంపూర్ణుడా? ఇందునుబట్టి సంపూర్ణుడు క్రీస్తే. ఈ సందర్భములో యోహాను 1ః14 ఆ వాక్యము శరీరధారియై, కృపా సత్య సంపూర్ణుడుగా మనమధ్య వాసము చేసెను'' కొలస్స
2ః9-10 దైవత్వముయొక్క సర్వపరిపూర్ణత శరీరముగా క్రీస్తునందు నివసిస్తున్నది. మరియు ఆయన యందు మీరును సంపూర్ణులైయున్నారు. ఇందునుబట్టి క్రీస్తు ఆత్మ లేనివాడు అసంపూర్ణుడే. క్రీస్తును ధరించుకొన్నవాడు ఆయనయందు సంపూర్ణుడైయున్నట్లుగ కొలస్స 2ః10 వివరిస్తున్నది.
సంపూర్ణత మూడు విధములు. 1. దేవునితో సంపూర్ణులైనవారు హనోకు - దేవునితో నడిచాడు - దేవునితో కలిశాడు, భూమికి కనుమరుగయ్యాడు. 2. నోవహు దేవుని ఆజ్ఞప్రకారము ఆయన నమూనాతో ఓడను నిర్మించి సంపూర్ణుడయ్యాడు. 3. మోషే దేవుని ధర్మశాస్త్ర విధులను నెరవేర్చి దేవుని గృహమైన ఇశ్రాయేలుకు నిర్వాహకుడుగాను, నమ్మకస్థుడుగాను ఎంచబడి సంపూర్ణుడుగా తీర్చబడినాడు. నూతన నిబంధనలో యేసుక్రీస్తు ఏర్పరచుకొన్న శిష్యులు ఆయన ద్వారా అపొస్తలులుగ ప్రతిష్టించబడి దైవరాజ్యము నిమిత్తము లోకాన్ని ద్వేషించి, లోకహింసను వేదనలను లోక చెరను, లోకము వారిపట్ల జరిగించిన అక్రమాలను సహించి, తమ ప్రభువైన యేసుక్రీస్తు తమకు విధించిన చట్టము పరలోక రాజ్యమునకు మత్తయి 28ః18-20 పరలోకమందును, భూమిమీదను నాకు సర్వాధికారము ఇయ్యబడి యున్నది. కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులనుగా చేయుడి, తండ్రియొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి వారికి బాప్తిస్మమిచ్చుచు, నేను మీకు ఏయే సంగతులను ఆజ్ఞాపించితినో వాటినన్నిటిని గైకొనవలెనని వారికి బోధించుడి, ఇదిగో నేను యుగసమాప్తి వరకు సదాకాలము మీతో కూడా ఉన్నానని వారితో చెప్పెను.'' ఇది శిష్యకోటి సంపూర్ణముగా నెరవేర్చి పరలోక పట్టణములో 12 పునాదులై దైవరాజ్యములో సంపూర్ణులుగా స్వతంత్రించుకొన్నారు. ఇది నరులు ఆత్మీయముగా సంపూర్ణత పొందిన వివరము.
ప్రభువునందు సహోదరీ సహోదరులారా!
దీని వలన, మేము మీ యొక్క సహాయ సహకారాల వల్ల తరువాత ముద్రణలో ఈ పుస్తకము అన్ని కోణాలలో అందముగా తీర్చిదిద్ది అందించగలము. ఆమేన్.
శేఖర్ రెడ్డి గారు వ్రాసిన పుస్తకములు:
వీటిని మీరు www.FaithScope.com ద్వారా ఉచితముగా పొంద వచ్చును.