వాసా శేఖర్ రెడ్డి గారి ప్రకటన గ్రంథ రహస్యములు ఇప్పుడు మీ చేతిలో(Part1)
గ్రంథకర్త : శేఖర్‌రెడ్డి వాసా
రచనా సహకారము : ఇమ్మానుయేల్ రెడ్డి వాసా
దీనిని అందుకోలేక పోతే, నీవు చాలా పోగొట్టుకొంటావు.
మూలము
రెడ్డిపాళెం గ్రామములోని నా ప్రభువు తల్లి ఉపదేశములు మరియు ఆమెను ఆవరించిన పరిశుద్ధాత్మయొక్క జ్ఞాన సహాయమే ఈ పుస్తక రచనకు మూలాధారము.
అంకితము
ఈ అవకాశాన్ని నాకు అనుగ్రహించి నన్ను ప్రేమించిన క్రీస్తు ప్రభువుకు అంకితమిస్తున్నాను. - వాసా శేఖర్‌రెడ్డి
Contents
(6) ఆయన సింహాసనము ఎదుటనున్న యేడు ఆత్మలు
(9) యోహాను చెర - పత్మాసు ద్వీపము
(11) ఏడు సువర్ణ దీపస్తంభముల మధ్య కుడిచేత ఏడు నక్షత్రములు పట్టుకొనియున్న మనుష్యకుమారుని పోలినవాడు
(14) మరణము మరియు పాతాళ లోకపు తాళపుచెవులు
(15) ఎఫెసులో ఉన్న సంఘపు దూతకు వ్రాసిన లేఖ
(16) ఈ దూతకు లేఖ వ్రాసినవారు ఎవరు?
(17) క్రీస్తు వ్రాయించిన ఈ లేఖలోని సారాంశము
(21) స్ముర్నలో ఉన్న సంఘపు దూతకు వ్రాసిన లేఖ
(22) ఈ దూతకు లేఖ వ్రాసినవారు ఎవరు?
(23) క్రీస్తు వ్రాయించిన ఈ లేఖలోని సారాంశము
(27) పెర్గములో ఉన్న సంఘపు దూతకు వ్రాసిన లేఖ
(28) దూతకు లేఖ వ్రాసినవారు ఎవరు?
(29) క్రీస్తు వ్రాయించిన ఈ లేఖలోని సారాంశము
(30) సాతాను సింహాసనమున్న స్థలము
(32) బిలాము బోధ - బాలాకువలె అనుసరణ
(36) తుయతైరలో ఉన్న సంఘపు దూతకు వ్రాసిన లేఖ
(37) ఈ దూతకు లేఖ వ్రాసినవారు ఎవరు?
(38) క్రీస్తు వ్రాయించిన ఈ లేఖలోని సారాంశము
(43) సార్దీస్‌లో ఉన్న సంఘపు దూతకు వ్రాసిన లేఖ
(44) ఈ దూతకు లేఖ వ్రాసినవారు ఎవరు?
(45) క్రీస్తు వ్రాయించిన ఈ లేఖలోని సారాంశము
(46) క్రియలు - మృతులు - చావనైయున్నవి
(51) ఫిలదెల్ఫియాలో ఉన్న సంఘపు దూతకు వ్రాసిన లేఖ
(52) ఈ దూతకు లేఖ వ్రాసినవారు ఎవరు?
(53) క్రీస్తు వ్రాయించిన ఈ లేఖలోని సారాంశము
(56) నా దేవుని పేరు - నా దేవుని పట్టణపు పేరు - నా క్రొత్త పేరు
(57) లవొదికయలో ఉన్న సంఘపు దూతకు వ్రాసిన లేఖ
(58) ఈ దూతకు లేఖ వ్రాసినవారు ఎవరు?
(59) క్రీస్తు వ్రాయించిన ఈ లేఖలోని సారాంశము
(60) ఆమేన్ అనువాడు - నమ్మకమైన సత్యసాక్షి - దేవుని సృష్టికి ఆదియునైనవాడు
(61) బంగారము - తెల్లని వస్త్రములు - కాటుక
(62) క్రీస్తు తలుపుయొద్ద నిలుచుండి తట్టుట
(63) ఆయన సింహాసనము - నా సింహాసనము - కూర్చుండువారు
ప్రియపాఠకులారా! దేవుడు ఆదామును సృజించి వానిని ఏదెను వనమునకు కాపలాగా ఉంచి, వాని ప్రక్కటెముక నుండి స్త్రీని సృజించాడు. మానవ పతనమునకు సంబంధించిన వృక్షఫలము ఒకటి ఆ వనములో ఉన్నదని ఆదామునకు తెలియకపోయినను, ఆ వృక్షఫలము తినుట ద్వారా మానవుని పతనము ఖచ్చితముగా జరుగునని దేవుడే స్వయముగా ఆదాముకు తెలియజేశాడు. కాని ఆదాము హవ్వలు ఇద్దరును సర్పముయొక్క బోధలకు లోనై దేవుడు తినవద్దన్న పండును తిని మరణము మరియు దేవుని శాపములు పొందారు.
అటుతరువాత నోవహు కాలములో దేవుడు నోవహు అతని కుటుంబాన్ని ఎన్నుకొని నూట ఇరువది సంవత్సరములు ఒక ఓడను నిర్మించేశాడు. ఈ కాలములో దేవుడు నోవహు ద్వారా జలప్రళయము వలన జరుగు లోకనాశనాన్నిగూర్చి తెలియజేశాడు. కాని భూజనులు మారలేదు. దానికి ఫలితము మహాజలప్రళయము. అటుతరువాత మోషే కాలములో దేవుడు ఇశ్రాయేలీయులను దాస్యము నుండి విడిపింపదలచి వారికి నాయకుడిని ఎన్నుకొన్నాడు. మోషే ద్వారా ఐగుప్తులో జరుగు వినాశనమునుగూర్చి ఫరో రాజునకు అతని సంస్థానమునకు తెలియజేశాడు. కాని ఫలితము మాత్రము నాశనమే. అయినా దేవుడు వారికి ముందుగానే వారియొక్క నాశనమును తెలియజేసారు.
ఇలా దేవుడు ముందుగానే వారి వారి నాశనమును గూర్చి ప్రవక్తల ద్వారా తెలియజేస్తూ వచ్చారు. ఎందుకంటే, వారు మారుమనస్సు పొంది రక్షణలోకి వస్తారని దేవునియొక్క ఆశ. ఈ విధముగా మారుమనస్సు పొంది తమ తప్పులను వీడినవారు నీనెవె పట్టణస్థులు. వారు యోనా యొక్క బోధ ద్వారా తమ తప్పును తెలుసుకొని మారుమనస్సు పొంది దేవుని రక్షణను పొందిరి.
ఈ విధముగా దేవుడు జరిగించు వినాశనమునుగూర్చి ముందుగానే తానెన్నుకొన్న వారి ద్వారా తెలియజేసి, వారు మారుమనస్సు పాపపశ్చాత్తాపము పొందనట్లయితే వారిని నాశనము చేస్తూ వచ్చారు.
కాని అంత్యకాలములో అనగా క్రీస్తు రెండవ రాకడలో జరగబోవు విషయాలను క్రీస్తు ప్రభువు మరణపునరుత్థానము తరువాత యోహానునకు దర్శనమిచ్చి వాని ద్వారా సమస్త లోకానికి జరుగబోవు సంగతులను తెలియజేసారు. ఇది జరిగి రెండువేల సంవత్సరాలై ఉండవచ్చును. ఆ కాలమునుండి యుగాంతములో జరుగబోవు విషయములు తెలుసుకొని మారుమనస్సు పొందినవారు రక్షింపబడుచు వచ్చారు. అయితే పొందనివారికి శిక్ష ఇంకా రాలేదు. అయితే ప్రకటన గ్రంథము మర్మములతో కూడినది. ఇది సాధారణమైనవారికి అర్థము కాదు అన్నది చాలామంది అభిప్రాయము.
అయితే ఈ అంత్య దినములో అనగా లోకనాశనము దగ్గర పడుచున్న దినములో అందరికి అర్థమగు రీతిలో లోకాంత్యము జరుగుటకు కారణములు, ఎలా జరుగుతుంది? అన్న విషయములనుగూర్చి ఈ పుస్తకము ద్వారా అందరికి తెలియజేయుటకు మమ్ములను ఎన్నుకొని మా ద్వారా ఈ పుస్తక కార్యక్రమము జరిగించి, దీనిని ప్రతి ఒక్కరు చదువుకొని మారుమనస్సు పొందమని దేవుని హెచ్చరికయైయున్నది. లేనియెడల నాశనము తప్పదని దేవుని హెచ్చరిక. తన రాకడ యొక్క మర్మములు ప్రతి ఒక్కరు తెలుసుకొనవలెనని దేవుని కోరిక, ఎందుకంటే దేవుడు రహస్యముగా జరిగించువాడు కాదు. తన ప్రవక్తల చేత ముందుగానే తెలియజేసి, కొంత సమయము ఇచ్చి, అప్పటికి మారుమనస్సు పొందనివారిని నాశనము చేయును. అందులో భాగముగా మమ్ములను ఎన్నుకొని మాకు దైవజ్ఞానమును దయజేసి లోకనాశనము జరుగు విధానమును, దాని ఫలితమును ప్రతి ఒక్కరు సులభముగా అర్థము చేసుకొనునట్లు వ్రాయుటకు ప్రేరేపించి, ఈ పుస్తకము ద్వారా సమస్త భూజనులకు ఒక హెచ్చరికను దయజేయుచున్నాడు.
ప్రియపాఠకులారా! ఈ హెచ్చరిక సాధారణమైనది కాదు. ఇది దేవునియొక్క నిర్ణయము. ఇప్పుడు ఇంకా కొంత సమయము ఈ పుస్తకము ద్వారా భూజనులకు ఇచ్చియున్నారు. ఈ పుస్తకమును చదివి మారుమనస్సు పొందమని కొంత సమయమును గూర్చి కూడ ఈ పుస్తకములో తెలియజేసియున్నారు. కనుక మారుమనస్సు పొంది దేవునికి యోగ్యమైన రీతిలో జీవించమని తండ్రి - కుమార - పరిశుద్ధాత్మల యొక్క దూతగా మిమ్ములను ఆదేశించుచున్నాను. లేనియెడల నాశనము తప్పదు, తప్పదు, తప్పదు.
ప్రభువు యొక్క కృప ఆయన దాసులకు తోడైయుండును గాక! ఆమేన్.
గ్రంథకర్త.
ఈ అధ్యాయమునందు క్రీస్తు ప్రభువు యోహానుకు పత్మాసు ద్వీపమున ప్రత్యక్షమై తనయొక్క ఆధిక్యత మరియు ఏడు ఆత్మీయ సంఘములనుగూర్చి పరిచయము చేయు చున్నారు.
ప్రకటన 1:1-2, ''యేసుక్రీస్తు తన దాసులకు కనుపరచుటకు దేవుడాయనకు అనుగ్రహించిన ప్రత్యక్షత. ఈ సంగతులు త్వరలో సంభవింపనైయున్నవి;''
ప్రకటన గ్రంథమునుగూర్చిన పవిత్రతనుగూర్చి వివరిస్తూ ప్రకటన 1:1-2లో యేసుక్రీస్తు తన దాసులకు కనబరచుటకు దేవుడు ఆయనకు అనుగ్రహించిన ప్రత్యక్షత అని వ్రాయబడియున్నది. ప్రకటన గ్రంథము అను ఈ గ్రంథములోని సంగతులు కల్పనలు గాక యదార్థములై దేవునియొక్క సత్యమును బయల్పరచుచు, ఇందులో వ్రాయబడిన సంఘటనలన్నియు త్వరలో సంభవింపనున్నాయని మనుష్యుల చేతగాక ప్రత్యక్షముగా తన దూత చేత వర్తమానము పంపి, తన దాసుడైన యోహానుకు చూపించగా - అతడు దేవుని వాక్యమును గూర్చియు యేసుక్రీస్తు సాక్ష్యమునుగూర్చి తాను చూచినంతమట్టుకు సాక్ష్యమిచ్చినట్లు పై వాక్యాలలో వివరణ.
మత్తయి 13:11, ''-పరలోక రాజ్యమర్మములు ఎరుగుట మీకు అనుగ్రహింప బడియున్నది గాని వారికి అనుగ్రహింపబడలేదు.'' మత్తయి19:11, ''అందుకాయన-అనుగ్రహము నొందినవారు తప్ప మరి ఎవరును ఈ మాటను అంగీకరింపనేరరు.'' దేవుని నుండి అనుగ్రహింపబడనిదే ఏదియు మనము పొందలేము. అదే విధముగా యోహాను కూడ దేవుని దూత ద్వారా ప్రకటన గ్రంథ ప్రత్యక్షతలు పొందగలిగెను.
నేటి ఆధునిక యుగములో ప్రకటన గ్రంథమును గూర్చి ప్రకటించే సువార్తీకుల ప్రసంగాలను ఆత్మీయ దృష్టితో దృష్టించి గ్రహించేటటువంటి క్రైస్తవ విశ్వాసి అరుదని చెప్పవచ్చును. ఎందుకంటే సువార్త - దైవవాక్యము ప్రార్థనాసహవాసము పట్ల సరియైన అవగాహన లేని వ్యక్తికి ప్రకటన గ్రంథ వివరమన్నది నమ్మశక్యము గానిదియు, కేవలము వెర్రితనముగాను ఉన్నది. అందుకే నేటి క్రైస్తవ విశ్వాసికి ప్రకటన గ్రంథములోని అంశములనుగూర్చి బోధించినప్పుడు అతడు ఇచ్చు సమాధానము అలక్ష్యమైనదియు, అమాయకతతో కూడియున్నట్లుగా మనకు తెలియుచున్నది. ఆనాడు యోహానుకొక్కడికే దేవుడు తన దూత ద్వారా దర్శనమిచ్చి ప్రకటన గ్రంథరచన జరిగించాడు. అలాగే భూమియొక్క పూర్వస్థితిని అనగా భూమి పుట్టింది లగాయతు జరిగిన సంఘటనలనుగూర్చి లోకసృష్టి ఉద్భవించిన రీతి, ఏదెను వనచరిత్ర, ఆదినరుల పాపప్రవేశము, జనాభా విస్తరణ, వారితోబాటు పాపము ప్రబలుట, అందునుబట్టి దైవోగ్రత, ఆనాటి జనకోటిలో నోవహు అను నీతిమంతుని ఎన్నిక, ఓడ నిర్మాణము, జలప్రళయ వినాశము, యావద్ సృష్టి నిర్మూలన, నోవహు అతని కుటుంబముతో నూతన సృష్టి నిర్మాణము. అటుతరువాత అబ్రాహాము లోతు కాలములో విస్తరించిన పాపము, సొదొమ గొమొఱ్ఱా పట్టణ నాశనము, అబ్రాహాము చరిత్ర, ఇస్సాకు చరిత్ర, యాకోబు చరిత్ర, ఇశ్రాయేలు అనిన దైవజనాంగము యొక్క నిర్వాహకత్వమునుగూర్చిన దేవుని ప్రణాళిక మొదలైనవి అన్ని కూడ పాతనిబంధన కాలములో దైవ ప్రత్యక్షత ద్వారా మోషే చేత వ్రాయిస్తూనే, తానెన్నుకున్న మోషేను తన జనాంగముమీద నాయకుడుగా నిర్వాహకునిగా జేసి, నాలుకమాంద్యం కలిగి నిరక్ష్యరాస్యుడు మోటువాడైన మోషేయొక్క నాలుకను సడలింపజేసి అతనికి వాక్శక్తి, దైవశక్తి, దైవప్రసన్నత, దైవాత్మ ఆవేశము దైవజ్ఞానము అనుగ్రహించి, పాతనిబంధనలోని ఐదు కాండములకు మోషేను గ్రంథకర్తగా దేవుడు మార్చినాడు.
అయితే నేటి నవనాగరికతతో కూడిన క్రైస్తవులమైన మనము పై రెండు అనగా పాతనిబంధనలోని మోషేకు దేవుడు అనుగ్రహించిన ప్రత్యక్షతను, ప్రకటన గ్రంథములో దేవుడు యోహానుకు అనుగ్రహించిన ప్రత్యక్షతను కూడ నమ్మలేకున్నాము. అందుకే దేవుడు మాదిరికరముగా మనకు అనుగ్రహించిన ప్రత్యక్షత టెలివిజన్. (టి.వి.) టెలివిజన్ అను యంత్ర సాధనములో టెలివిజన్ కేంద్రము నుండి ప్రసారమయ్యే ప్రతి కార్యక్రమమును మనము మన ఇంటిలోనే కూర్చుండి యంత్ర సహాయము ద్వారా యావత్ ప్రపంచములో జరుగుచున్న క్రియాకర్మలనుగూర్చి చూస్తున్నాము. తద్వారా మనము గ్రహించవలసినటువంటి ఎన్నో తెలియని విషయాలు తెలిసికోగలుగుచున్నాము. ఆనాడు నరునికి ఇట్టి అవకాశాలు లేవు. ఇట్టి సాధనాలు లేవు. ఇంత సుదీర్ఘమైన జ్ఞానము లేదు. అందుకే దేవుడు తన దూత ద్వారా ప్రతి విషయాన్ని ప్రత్యక్షముగా నరులకు బోధింపజేసేవాడు. ఇది ఒక వ్యక్తికి మాత్రమే పరిమితమైయుండే సంఘటన. మరి ఈనాడైతే అందరును అంతటను అన్ని సమయములందును అన్ని దినములయందును దేవుని ఎరిగి ఆయనను మహిమపరచి ఘనపరచాలని తలంచి దేవుడు జ్ఞానాన్ని ప్రత్యక్షముగా అందరిలోను అనుగ్రహించుటనుబట్టి, నరుడు దైవజ్ఞానముచేతనే టెలివిజన్ తయారు చేసుకొని దూరములోని సంఘటనలను ప్రదర్శింపజేస్తున్నాడు.
ఇక దేవుని దూత యోహానుతో మాట్లాడిన సంఘటనన్నది ఆత్మదర్శన్ నుండి ప్రసారమైనటువంటి క్రియయని మనము గ్రహించాలి. దేవుని దూత నరునికి దర్శనమియ్యా లంటే పరమాత్మకు కేంద్రమైన ఆయన నివాసము నుండి అనుమతి పొంది, దైవత్వముయొక్క కేంద్రము నుండియే దేవదూతయొక్క ఆగమనము జరుగుతుంది. కనుక ఈ టెలివిజన్ లేని ఆ కాలములో దేవుడే తన ఆత్మ దర్శనము ద్వారా దేవదూతను పంపి తన కార్యక్రమాలను గురించి తన ప్రణాళికను గూర్చి వివరించినట్లు తెలియుచున్నది. టెలివిజన్‌లో మనము ఏ విధముగా చూడగలుగుచున్నామో, అదే విధముగా దేవుడు తన దూత ద్వారా అన్ని విషయాలు ప్రత్యక్షముగా చూపించాడు.
ప్రకటన 1:1, ''ఆయన తన దూత ద్వారా వర్తమానము పంపి తన దాసుడైన యోహానుకు వాటిని సూచించెను.''
పాతనిబంధన కాలములో కూడ దేవుడు తన దూతలను పంపి తన వర్తమానమును వారికి తెలియజేసేవాడు. వారు దేవుని దూతలు. 1 రాజులు 22:19-23, ''మీకాయా యిట్లనెను-యెహోవా సెలవిచ్చినమాట ఆలకించుము; యెహోవా సింహాసనాసీనుడై యుండగా పరలోకసైన్యమంతయు ఆయన కుడి పార్శ్వమునను ఎడమపార్శ్వమునను నిలిచి యుండుట నేను చూచితిని -ఆహాబు రామోత్గిలాదుమీదికి పోయి అక్కడ ఓడి పోవునట్లుగా ఎవడు అతనిని ప్రేరేపించునని యెహోవా సెలవియ్యగా, ఒకడు ఈ విధముగాను మరియొకడు ఆ విధముగాను యోచన చెప్పుచుండిరి. అంతలో ఒక ఆత్మ యెదుటికి వచ్చి యెహోవా సన్నిధిని నిలువబడి-నేను అతనిని ప్రేరేపించెదననగా యెహోవా-ఏ ప్రకారము నీవతని ప్రేరేపించుదువని అతని నడిగెను. అందుతడు-నేను బయలుదేరి అతని ప్రవక్తల నోట అబద్ధమాడు ఆత్మగా ఉందునని చెప్పగా ఆయన-నీవు అతని ప్రేరేపించి జయము నొందుదువు; పోయి ఆ ప్రకారము చేయుమని అతనికి సెలవిచ్చెను. యెహోవా నిన్నుగూర్చి కీడు యోచించి నీ ప్రవక్తలనోట అబద్ధమాడు ఆత్మను ఉంచియున్నాడు.'' ఈ విధముగా దేవుని కార్యమును నెరవేర్చుటలో ఆయన దూతలు దేవుని వర్తమానమును మీకాయా ప్రవక్తకు తెలుపుటయేగాక మిగిలిన ప్రవక్తలను తప్పుడు సమాచారమును పలికించుట చేస్తున్నారు. అలాగే గబ్రియేలు దూత వర్తమానమును దేవుని నుండి పొంది దానియేలుకు తెలియజేయుటకు భూమిపైకి వచ్చాడు.
దానియేలు 9:21-23, ''నేను ఈలాగున మాటలాడుచు ప్రార్థన చేయుచునుండగా, మొదట నేను దర్శనమందు చూచిన అతి ప్రకాశమానుడైన గబ్రియేలను ఆ మనుష్యుడు సాయంత్రపు బలి అర్పించు సమయమున నాకు కనబడి నన్ను ముట్టెను. అతడు నాతో మాటలాడి ఆ సంగతి నాకు తెలియజేసి ఇట్లనెను-దానియేలూ, నీకు గ్రహింప శక్తి ఇచ్చుటకు నేను వచ్చితిని. నీవు బహు ప్రియుడవు గనుక నీవు విజ్ఞాపనముచేయ నారంభించి నప్పుడు, ఈ సంగతిని నీకు చెప్పుటకు వెళ్లవలెనని ఆజ్ఞ బయలుదేరెను; కావున ఈ సంగతిని తెలిసికొని నీకు కలిగిన దర్శనభావమును గ్రహించుము.'' అలాగే జెకర్యాకు యోహాను పుట్టుకను తెలుపుట అను దేవుని వర్తమానమును గబ్రియేలు దూత భూమిపైకి వచ్చి జెకర్యాకు కనబడి దేవుడు తనకిచ్చిన వర్తమానమును తెలియజేసెను. లూకా 1:11-13, ''ప్రభువు దూత ధూపవేదిక కుడివైపున నిలిచి అతనికి కనబడగా జెకర్యా అతని చూచి, తొందరపడి భయపడిన వాడాయెను. అప్పుడాదూత అతనితో - జెకర్యా భయ పడకుము; నీ ప్రార్థన వినబడినది, నీ భార్యయైన ఎలీసబెతు నీకు కుమారుని కనును, అతనికి యోహాను అను పేరు పెట్టుదువు.'' అలాగే క్రీస్తు ప్రభువు పుట్టుక విషయములో జరిగింది. లూకా 1:26-31, ''ఆరవ నెలలో గబ్రియేలను దేవదూత గలిలైయలోని నజరేతను ఊరిలో దావీదు వంశస్థుడైన యోసేపను ఒక పురుషునికి ప్రధానము చేయబడిన కన్యక యొద్దకు దేవునిచేత పంపబడెను. ఆ కన్యక పేరు మరియ ఆ దూత లోపలికివచ్చి ఆమెను చూచి-దయా ప్రాప్తురాలా నీకు శుభము; ప్రభువు నీకు తోడైయున్నాడని చెప్పెను. ఆమె ఆ మాటకు బహుగా తొందరపడి-ఈ శుభవచనమేమిటో అని ఆలోచించుకొను చుండగా దూత-మరియా, భయపడకుము; దేవునివలన నీవు కృపపొందితివి. ఇదిగో నీవు గర్భము ధరించి కుమారుని కని ఆయనకు యేసు అను పేరు పెట్టుదువు;'' ఈ విధముగా దేవుని దూతలు దేవుని వద్ద నుండి వర్తమానమును పొంది దానిని తెలియ జేయుటకు వారి వద్దకు వచ్చుట జరిగేది. ఇది చరిత్ర.
అలాగే యోహాను విషయములో జరిగింది. ఆయన దూత దేవుని వద్ద నుండి వర్తమానము తెలుసుకొని జరగబోవు సంగతులను తెలియజేయుటకు యోహాను ఉన్న ప్రాంతమునకు వచ్చుట జరిగింది. ఇంతకి ఈ దూత ఎవరు? దేవుని దూతలలో ఒకడా? గబ్రియేలా? లేక మరి ఎవరైన ఉంటారా? ఈ వర్తమానమును దేవుడు అనగా దేవుడైన యెహోవా అనుగ్రహించిన ప్రత్యక్షత. ఇది ఎవరికి అనుగ్రహింపబడింది? యేసుక్రీస్తుకు. కాని యేసుక్రీస్తు ప్రభువుయొక్క దాసులకు ఇది చూపుటకు దానిని తండ్రియైన దేవుడు యేసుక్రీస్తు ప్రభువుకు అనుగ్రహించాడు. అయితే ఈ అనుగ్రహము ద్వారా వర్తమానమును పొందిన క్రీస్తు ప్రభువు ఆయన దూతగా అనగా దూతలలో అగ్రగణ్యునిగా తనను తాను సిద్ధపడి ఆ వర్తమానమును యోహానుకు ఒక దూతవలె వచ్చి వాటిని చూపుట జరిగింది. ఇందులో, ''ఆయన దూత,'' అనుటలో ఆయన అనగా తండ్రియైన దేవుడు. తన దూత క్రీస్తు ప్రభువు. ఎలా? ఒకటవ అధ్యాయము తొమ్మిదవ విభాగములో దర్శనమిచ్చినది మనుష్యకుమారుడైన క్రీస్తు ప్రభువు అని తెలుసుకొన్నాము. అలాగే వర్తమానము ప్రకటన గ్రంథ రూపములో మనముందు ఉన్నది. కనుక దేవుని దూతగా క్రీస్తు ప్రభువు యోహానుకు తెలిపినదానిని తరువాత అధ్యాయాలలో ఒకటొకటిగా చదువుకొందము.
ప్రకటన 1:2, ''అతడు దేవుని వాక్యమును గూర్చియు యేసుక్రీస్తు సాక్ష్యమును గూర్చియు తాను చూచినంత మట్టుకు సాక్ష్యమిచ్చెను.''
క్రైస్తవ జీవితములో సాక్ష్యమిచ్చుట అనునది చాలా విలువైనది. ఒక్క మాటలో చెప్పాలంటే క్రైస్తవ జీవితమే ఒక సాక్ష్య జీవితము. మన జీవితములో క్రీస్తు ప్రభువు జరిగించిన అద్భుత కార్యములనుగూర్చి సాక్ష్యమిస్తుంటాము. నిరంతరము మనలో కలిగిన మారుమనస్సు అది జరిగిన విధానమునుగూర్చి సాక్ష్యమిస్తుంటాము. ఈ సాక్ష్యము మనము ఎందుకు ఇయ్యాలి? ఈ సాక్ష్యమును ఎందు నిమిత్తము ఇస్తున్నారు? అని మనము ఆలోచిస్తే మనము ఏ విధముగా నిజదైవమును గుర్తించినది తెలియజేయుటయే సాక్ష్యము. ఈ సాక్ష్యము ద్వారా మనము మన ఎదుటివారికి మీరు కూడ నావలె నిజదైవమును గుర్తించమని సాక్ష్యమిస్తాము. అలాగే యోహాను యేసుక్రీస్తు ప్రభువుకు అతి సన్నిహితుడుగా ఉండి సిలువ బలియాగ సందర్భములోకూడ విడువక ఉన్న శిష్యుడు. కనుక క్రీస్తు ప్రభువు దేవుని వాక్యమును వర్తమానముగా కొనిరాగా అది చూచి దేవుని వాక్యమునుగూర్చి సాక్ష్యమిస్తున్నాడు. అలాగే తాను శిష్యునిగా యేసుక్రీస్తునుగూర్చి కూడ సాక్ష్యమిస్తూ వ్రాసిన గ్రంథము ఇది. ఇందులో తన కళ్లతో స్వయముగా చూచి క్రీస్తు ప్రభువునుగూర్చి సాక్ష్యమిస్తే, దర్శనములో చూచి దేవుని వర్తమానము అనగా దేవుని సందేశము అను వాక్యమునుగూర్చి సాక్ష్యమిస్తున్నాడు. ఈ సాక్ష్యము సత్యమైనది. ఈ సాక్ష్యమును యోహాను ఎందునిమిత్తము ఇస్తున్నాడు. కేవలము తాను క్రీస్తు ప్రభువును గూర్చి సాక్ష్యమును ఇచ్చుటయేగాక యుగాంతమున జరుగు సంఘటనలను ముందుగా తెలియజేసి అవి ఒకటొకటిగా జరుగుచున్నప్పుడైనా కనీసము మారుమనస్సు పొంది రక్షణ పొందుదురన్న ఆశ. ఈ కారణము చేత ఈ సాక్ష్యమును మన ముందుకు వ్రాత పూర్వకముగా క్రీస్తు ప్రభువు దేవుని దూతగా వర్తమానమును తెలియజేయగా దానిని ఉన్నది ఉన్నట్లుగా చూచినది చూచినట్లుగా సాక్ష్యము ఇచ్చుట జరిగింది. కాబట్టి ఇది యదార్థమైన సాక్ష్యము. కనుక ఈ సాక్ష్యమునుగూర్చి అపనమ్మకము పొందక దీనిని ఆమూలాగ్రంగా ఆద్యంతాలు చదివి దేవుడు క్రీస్తు ప్రభువు ద్వారా మనకు తెలియజేయబోవు సంగతిని తెలుసుకొని బహు జాగరూకులుగ జీవిస్తూ పై రెండింటి సాక్ష్యములను మీరును అన్యుల మధ్య ప్రకటించి సాక్షులుగ జీవించండి.
ప్రకటన1:3, ''సమయము సమీపించినది గనుక ఈ ప్రవచనవాక్యములు చదువు వాడును, వాటిని విని యిందులో వ్రాయబడిన సంగతులను గైకొనువారును ధన్యులు.''
ఈ వచనములో ధన్యత అను ఒక పదమును ఉపయోగించాడు. ఇదే గ్రంథములో ప్రకటన 22:7లో మరల, ''ఈ గ్రంథములోని ప్రవచనవాక్యములను గైకొనువాడు ధన్యుడు,'' అని రెండవసారి ప్రవచించియున్నాడు. ధన్యత అను వచనము గురించి మనము ఒకసారి ఆత్మీయముగా ఆలోచన చేస్తే, అనేక విధములుగా బైబిలు గ్రంథమునందు చెప్పబడి యున్నట్లుగా తెలియును.
ఉదా :- ప్రకటన 19:9, ''పెండ్లివిందుకు పిలువబడిన వారు ధన్యులు.'' కీర్తన 1:2, ''యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు.'' కీర్తన 34:8, ''ఆయనను ఆశ్రయించు నరుడు ధన్యుడు.'' కీర్తన 40:4, ''యెహోవాను నమ్ముకొనువాడు ధన్యుడు.'' యాకోబు 1:12, ''శోధన సహించువాడు ధన్యుడు;'' అని వ్రాయబడియున్నది. ఈ విధముగా అనేక విధములుగా వ్రాయబడియున్నవి. ఇవి అన్ని ఒక ఎత్తు అయితే ప్రకటన 1:3లో వ్రాయబడినది మరి యొక ఎత్తు అని చెప్పవచ్చును. ఎందుకంటే పైన చెప్పబడిన అన్ని సంఘటనలలో ఏదో విధముగా మానవునియొక్క ప్రయత్నమే కలిసియున్నది.
అంటే మానవునికి కొంత యోగ్యత ఉంటేనే ధన్యత అనుగ్రహించబడియున్నది. అయితే ఈ వాక్యము చదువువాడును ధన్యుడు మరియు విని గైకొనువాడును ధన్యుడు అని వ్రాయబడియున్నది. బైబిలునందు ఏ పుస్తకమునకు లేని ఘనత ఈ పుస్తకము కలిగి యున్నది. ఎందుకంటే ఇది చదువువారు మరియు విని గైకొనువారు ఇద్దరును ధన్యులే అని చెప్పుచున్నది. కాబట్టి దీనిని చదువుటకు, మరియు కనీసము చదవలేని పక్షములో విని గ్రహించి గైకొని ధన్యులమగుదుము గాక! ఆమేన్.
ప్రకటన 1:4, ''యోహాను ఆసియలో ఉన్న యేడు సంఘములకు శుభమనిచెప్పి వ్రాయునది.''
ప్రకటన 1:20, ''అ యేడు నక్షత్రములు ఏడు సంఘములకు దూతలు. అ యేడు దీపస్తంభములు ఏడు సంఘములు.''
ఈ సంఘములు విడవబడు సంఘములా? లేక ఎత్తబడే సంఘములా? మొట్ట మొదటగా ఇవి భూలోక సంబంధమైన సంఘములైయుండి, సువార్త కార్యము ద్వారా దేవునిలో ఎన్నిక చేయబడి ఆత్మీయసంఘములుగా మారాయి. ఈ సంఘములు ప్రాంతమును బట్టి వారి వారి అలవాట్లనుబట్టి రకరకాల పేర్లుతో పిలువబడుచున్నవి. ఉదాహరణకు సంఘములకు ప్రవచన పత్రికలు వ్రాసి ఆత్మీయ మార్గములో ఆత్మ రాజ్యమునకు లోకస్థులను వారసులుగ చేయుటకు పౌలు ప్రభువు చేత నియమించబడిన అపొస్తలుడుగా అనగా పంపబడిన దూతగాను ఉన్నారు. ఈ సంఘములు 1. రోమా 2. కొరింథీ 3. గలతీ 4. ఎఫెసీ 5. ఫిలిప్పీ 6. కొలస్సీ 7. థెెస్సలొనీక. ఇలా సువార్త ప్రచారకుల ద్వారా అనేక సంఘములు ప్రాంతాన్నిబట్టి ఏర్పరచబడినవి. అయితే మన రక్షకుడైన క్రీస్తు ప్రభువు వీటి అన్నిటిని కలిపి ఒక సంఘముగా ఏర్పరచారు. అదియే వధువు సంఘము - పెండ్లికుమార్తె. ప్రకటన 21:2, ''మరియు నేను నూతనమైన యెరూషలేము అను ఆ పరిశుద్ధపట్టణము తన భర్తకొరకు అలంకరింపబడిన పెండ్లి కుమార్తెవలె సిద్ధపడి పరలోకమందున్న దేవునియొద్దనుండి దిగి వచ్చుట చూచితిని.'' ఈ సంఘము ఏడు విధములైన కార్యములతో ఏడు సంఘములుగా విభజించబడినవి. అవి ఆత్మ రాజ్య సంబంధమైన ఆత్మీయ సంఘములు. 1. ఎఫెసు 2. స్ముర్న 3. పెర్గము 4. తుయతైర 5. సార్దీస్ 6. ఫిిలదెల్ఫియ 7. లవొదికయ.
ఈ సంఘములు ఆత్మరాజ్య సంబంధమైనవని మనము ఎలా చెప్పగలము? ఈ ఒక్కొక్క సంఘమునకు ఒక దూతను దేవుడు కాపలాగా ఇచ్చినట్లుగా ప్రకటన 1:20లో వ్రాయబడియున్నది. అలాగే ప్రకటన 2:5, ''నీవు ఏ స్థితిలోనుండి పడితివో అది జ్ఞాపకము చేసికొని మారు మనస్సుపొంది ఆ మొదటి క్రియలను చేయుము. అట్లుచేసి నీవు మారు మనస్సు పొందితేనే సరి; లేనియెడల నేను నీయొద్దకు వచ్చి నీ దీపస్తంభమును దాని చోటనుండి తీసివేతును.'' ఇందులో చెప్పబడిన సంఘటన ఎఫెసు సంఘమునకు చెందినది. మారుమనస్సు పొందక, మొదటి క్రియలు చేయకపోతే ఆ ఆత్మీయ సంఘమును ఆ ప్రాంతమునుండి తొలగిస్తానని చెప్పుట జరిగింది. ఇలా తొలగించి ఇంకొక ప్రాంతములో ఏర్పరచుట జరుగును, ఎందుకంటే యుగాంతమువరకు ఏడు సంఘముల కార్యములు భూమిపై జరగాలి. యుగాంతము తరువాత ఏడు సంఘములవారు ఏక సంఘముగా వధువు సంఘముగా పరమయెరూషలేముగా మారుదురు. ఈ సంఘములు దాని చోట నుండి తీసివేస్తే ఇంకొక చోటుకు మార్చినట్లే కదా! లేకపోతే ఈ సంఘము యుగాంతము వరకు ఎలా కొనసాగాలి? కనుక పలాన ప్రాంతములోని సంఘము ఇది అని చెప్పుట తప్పు.
అలాగే ''ఆసియలో ఉన్న,'' అనుటనుబట్టి ఈ దర్శనము వచ్చిన కాలమునకు సంఘము కేవలము ఆసియలో ఉన్నట్లుగా గుర్తించాలి. అంటే అప్పటి ఆత్మీయ సంఘము లన్ని ఆసియ ఖండములో ఉన్నవి. క్రైస్తవ్యము అప్పటికి ప్రపంచ నలుమూలల వ్యాపించి యుండలేదు కనుక ఆసియలో ఉన్న సంఘములకు వ్రాయుట జరిగింది. అంటే మొదటి ఏడు ఆత్మీయ సంఘములు వాటి కార్యక్రమములు ఆసియ ఖండము అనగా మన ఖండములో ఏర్పరచుట జరిగింది. అంతమాత్రాన అవి ఇప్పటికి ఆ ప్రాంతములో ఉన్నవి అనుకొనుట పొరపాటే. వీటిని ఆత్మరీత్యా వాటి ప్రాంతములలో మార్పులు జరిగి యుండవచ్చును. ఇప్పుడు ప్రపంచ నలుమూలల క్రైస్తవ్యము విస్తరించినది కదా! ఎక్కడైతే నిజదైవభక్తులు ఉంటారో అక్కడ ఆత్మీయ సంఘము ఉంటుంది కనుక ఈ సంఘముయొక్క పేర్లు లోకరీత్యా భూసంబంధమైనవిగా మనము అనుకొనినను, ఇవి పరలోక సంబంధ మైనవిగానే భావించవచ్చును. ఎందుకంటే పరలోకమునకు సాదృశ్యముగా ఈ భూమి సృజించబడింది. ఏ విధముగానైతే పరలోకములో పరమయెరూషలేము ఉన్నట్లుగానే, అదే విధముగా భూలోకములో కూడ యెరూషలేము ఉన్నది. అనగా ఈ ఏడు సంఘములు భూలోకములో వాటి పేరు మీద ఏర్పాటు చేయబడినను, అవి ఆత్మీయ రాజ్యమునకు సంబంధించినవై ఎత్తబడే సంఘమునకు ఏడు సంపూర్ణ అవయములైయున్నవి. ఈ సంఘములలో మంచివారు చెడ్డవారు కలసి ఉన్నట్లుగా మనము ప్రకటన 2:1 నుండి 3:22 వరకు చదువగలము. ఇందులో దేవుని హెచ్చరికలు, బహుమానాలు కూడ వ్రాయబడియున్నవి. యెరూషలేము పరమయెరూష లేముగాను వధువుగాను మారినప్పుడు, సంఘములలోని ఆత్మలన్నియు ఈ ఏడుగురు దూతల చేత వారి వారి ఆధిక్యతలతో బహుమానాలతో ఆ వధువు సంఘములో చేర్చబడుతారు. అదియే మన తల్లి సంఘము. గలతీ 4:26లో పైనున్న యెరూషలేము స్వతంత్రముగా ఉన్నది, అది మనకు తల్లి. ఇందులో ఎటువంటి సందేహము లేదు.
ప్రకటన 21:24-26, ''జనములు దాని వెలుగునందు సంచరింతురు; భూ రాజులు తమ మహిమను దానిలోనికి తీసికొనివత్తురు. అక్కడ రాత్రి లేనందున దాని గుమ్మములు పగటివేళ ఏమాత్రమును వేయబడవు. జనములు తమ మహిమను ఘనతను దానిలోనికి తీసికొని వచ్చెదరు.'' అయితే, ఈ సంఘములలో జరుగబోవు కార్యములను గూర్చి ముందుగానే దేవుడు యోహాను ద్వారా మనకు జాగ్రత్తపడమని తెలియజేస్తున్నాడు. ఈనాడు భూమిమీద ఎన్నో పేర్లు గల సంఘములను మనము చూస్తున్నాము. కాని అవి ఈ ఏడు సంఘములకు ఏ సంఘమునకు మాదిరిగా ఉన్నవో మనము గ్రహించవలసి యున్నది. మనము చేయు కార్యములను మనము బేరీజు వేయవలసిన సమయము ఆసన్నమైనది. కాబట్టి, ఇప్పుడే, ఇది చదువుచున్న ప్రియసహోదరీ సహోదరులారా! మనము ఉన్న సంఘము ఈ ఏడు సంఘములలో ఏ సంఘమునకు పోలియున్నదో గ్రహించి, దానిలో మనకున్న దేవుని హెచ్చరిక చొప్పున మన జీవితాన్ని సవరించుకొని, ఎత్తబడు వధువు సంఘములో ప్రవేశించుటకు, దేవునినుండి ఈ సంఘమునకు ఇయ్యబడిన బహుమానాన్ని పొందగలుగుటకు, మన ఆత్మీయ జీవితాన్ని క్రమబద్ధము చేయుదుముగాక!
ప్రకటన 1:4,''యోహాను ఆసియాలో ఉన్న యేడు సంఘములకు శుభమనిచెప్పి వ్రాయునది. వర్తమాన భూతభవిష్యత్కాలములలో ఉన్నవానినుండియు, ఆయన సింహాసనము ఎదుటనున్న యేడు ఆత్మలనుండియు.''
ఎఫెసీ 4:4, ''శరీరమొక్కటే, ఆత్మయు ఒక్కడే;'' అదే దేవుని ఆత్మ. ఆదికాండము
1:2-3, ''భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను; చీకటి అగాధ జలముపైన కమ్మియుండెను; దేవుని ఆత్మ జలములపైన అల్లాడుచుండెను.'' ఈ ఆత్మ ఏడు విధములుగా విభజింపబడినది. ఇవి దేవుని సింహాసనము ఎదుట ఉన్నట్లుగా వ్రాయబడియున్నది.
1. జీవాత్మ :- ఆదికాండము 2:7. ఇది మానవునికి అనుగ్రహించబడినది. ఈ ఆత్మ ద్వారా మానవుడు జీవములో ప్రవేశించి జీవాత్మగా మారాడు.
2. దురాత్మ :- 1 సమూయేలు 18:10. ఈ ఆత్మ యెహోవా సన్నిధినుండి పంపబడినట్లుగా వ్రాయబడియున్నది. దీనివల్ల మనిషి ఆత్మీయ బలహీనతను పొంది దేవునినుండి దూరస్థుని చేస్తుంది. ఉదా :- సౌలుమీద దురాత్మ రావటము. దీనిని దేవుడు లోకనాశనానికిని, మానవునియొక్క ఆత్మీయ జీవితమునకు ఒక పరీక్షగా ఉంచాడు.
3. పవిత్రాత్మ :- అపొస్తలుల కార్యములు 2:3-4, ''మరియు అగ్నిజ్వాలల వంటి నాలుకలు విభాగింపబడినట్టుగా వారికి కనబడి, వారిలో ఒక్కొక్కని మీద వ్రాలగ అందరు పరిశుద్ధాత్మతో నిండినవారై ఆ ఆత్మ వారికి వాక్‌శక్తి అనుగ్రహించినకొలది అన్యభాషలతో మాటలాడసాగిరి.'' లూకా 1:41, ''ఎలీసబెతు మరియయొక్క వందన వచనము వినగానే, ఆమె గర్భములో శిశువు గంతులు వేసెను. అంతట ఎలీసబెతు పరిశుద్ధాత్మతో నిండుకొనినదై బిగ్గరగా ఇట్లనెను.''
4. క్రీస్తు ఆత్మ :- 1 పేతురు 1:10-11, ''మీకు కలుగు ఆ కృపనుగూర్చి ప్రవచించిన ప్రవక్తలు ఈ రక్షణనుగూర్చి పరిశీలించుచు, తమయందున్న క్రీస్తు ఆత్మ క్రీస్తు విషయమైన శ్రమలనుగూర్చియు, వాటి తరువాత కలుగబోవు మహిమలనుగూర్చియు ముందుగా సాక్ష్యమిచ్చునపుడు, ఆ ఆత్మ, యే కాలమును ఎట్టి కాలమును సూచించుచు వచ్చెనో దానిని విచారించి పరిశోధించిరి.'' రోమా 8:9, ''దేవుని ఆత్మ మీలో నివసించి యున్న యెడల మీరు ఆత్మస్వభావము గలవారే గాని శరీర స్వభావము గలవారు కారు.''
5. కుమారుని ఆత్మ :- గలతీ 4:6-7, ''మరియు మీరు కుమారులై యున్నందున -నాయనా తండ్రీ, అని మొఱ్ఱపెట్టు తన కుమారుని ఆత్మను దేవుడు మన హృదయములలోనికి పంపెను. కాబట్టి నీవిక దాసుడవు కావు కుమారుడవే. కుమారుడ వైతే దేవునిద్వారా వారసుడవు.'' యోహాను 1:12, ''తన్ను ఎందరంగీకరించిరో వారి కందరికి, అనగా తన నామమునందు విశ్వాసముంచినవారికి, దేవుని పిల్లలగుటకు ఆయన అధికారము అనుగ్రహించెను.''
6. జీవింపజేయు ఆత్మ :- రోమా 8:11, ''మృతులలో నుండి యేసును లేపినవాని ఆత్మ మీలో నివసించినయెడల, మృతులలోనుండి క్రీస్తుయేసును లేపినవాడు చావునకులోనైన మీ శరీరములను కూడ మీలో నివసించుచున్న తన ఆత్మద్వారా జీవింప జేయును.''
7. సత్యస్వరూపి ఆత్మ :- యోహాను 14:16, ''నేను తండ్రిని వేడుకొందును, మీయొద్ద ఎల్లప్పుడు నుండుటకై ఆయన వేరొక ఆదరణకర్తను, అనగా సత్యస్వరూపియగు ఆత్మను మీకనుగ్రహించును.'' ఈ విధముగా దేవుని ఏడు ఆత్మలు సింహాసనము ఎదుట ఉండి క్రియ జరిగించుచున్నవి.
ప్రకటన 1:4-7, ''యోహాను ఆసియలో ఉన్న యేడు సంఘములకు శుభమని చెప్పి వ్రాయునది. వర్తమాన భూతభవిష్యత్కాలములలో ఉన్నవానినుండియు, ఆయన సింహాసనము ఎదుటనున్న యేడు ఆత్మలనుండియు, నమ్మకమైన సాక్షియు, మృతులలో నుండి ఆదిసంభూతుడుగా లేచిన వాడును, భూపతులకు అధిపతియునైన యేసుక్రీస్తు నుండియు, కృపాసమాధానములు మీకు కలుగునుగాక. మనలను ప్రేమించుచు తన రక్తమువలన మన పాపముల నుండి మనలను విడిపించినవానికి మహిమయు ప్రభావమును యుగయుగములు కలుగునుగాక, ఆమేన్. ఆయన మనలను తన తండ్రియగు దేవునికి ఒక రాజ్యముగాను యాజకులనుగాను జేసెను. ఇదిగో ఆయన మేఘారూఢుడై వచ్చు చున్నాడు; ప్రతి నేత్రము ఆయనను చూచును, ఆయనను పొడిచినవారును చూచెదరు; భూజనులందరు ఆయనను చూచి రొమ్ము కొట్టుకొందురు; అవును ఆమేన్.''
వర్తమాన భూతభవిష్యత్కాలములలో ఉన్నవాడెవరు? ఆయన సింహాసనమేది? నమ్మకమైన సాక్షియు, మృతులలోనుండి ఆదిసంభూతుడుగా లేచినవాడును, భూపతులకు అధిపతియునైన యేసుక్రీస్తు నుండియు, కృపాసమాధానములు మీకు కలుగునుగాక! అని యోహాను చెప్పుచున్నాడు. ఈయన క్రీస్తునుగూర్చి పరిచయము చేస్తున్నాడని మరల నేను ప్రత్యేకముగా చెప్పనవసరము లేదు.
జలములమీద అల్లాడిన ఆత్మయు ఈయనే, ఆ ఆత్మ మాట్లాడిన మాటయు ఆయనే, ఆయననుండి ఏర్పడిన వెలుగు యేసుక్రీస్తే, మృతులలోనుండి ఆదిసంభూతుడుగా లేచినవాడు ఈయనే, భూపతులకు అధిపతియు ఈయనే, నమ్మకమైన సాక్షియు ఈయనయే, మన రక్తాపరాధములనుండి పాపములనుండి విడిపించినవాడు ఈయనయే, మనలను రాజులుగాను చేయువాడు ఆయనే, ప్రకటన 20:6లో మహిమాప్రభావములు కలిగినవాడు ఈయనయే, భవిష్యత్కాలములలో మేఘారూఢుడై వచ్చువాడు ఈయనయే, సర్వమును యేసయ్యేనని ఇందునుబట్టి మనకు తెలుస్తున్నది. ఇంకను విస్తరించి చెప్పాలంటే, యోహాను 1:3, ''కలిగియున్నదేదియు ఆయన లేకుండ కలుగలేదు.'' కనుక సృష్టించేది ఈయనయే, ఈయన లేకుండ కలుగలేదని రూఢిగా తెలుస్తున్నది. సమస్తము ఆయన మూలముగా కలిగినట్లు వ్రాయబడియున్నది. ''ఆయనలో జీవముండెను,'' అని వ్రాయబడుటనుబట్టి ఈయన జీవము భూమికి జలాలకు ఆకాశానికి జీవమిచ్చినట్లుగా ఈయన పలికిన ప్రతి మాటనుబట్టి తెలుస్తున్నది. మరి ఇంత అత్యధికమైన మహిమాప్రభావములు కలిగిన దేవుడు రూపము లేనివాడు. మొదటగా ఆత్మయైయుండి తరువాత వాక్కుగా యుండినాడు. యోహాను 1:14, ''ఆ వాక్యము శరీరధారియై, కృపాసత్యసంపూర్ణుడుగా మనమధ్య నివసించెను;'' అని వ్రాయబడుటలో ఏ వాక్కయితే సృష్టికి జీవము ఇచ్చిందో ఏ వాక్కయితే సమస్తము రూపించిందో - ఏ వాక్కయితే సృష్టికి వెలుగైయుండిందో, ఆ ''వాక్కు - వెలుగు,'' జీవముతో ఏకమై కన్య గర్భములో కృప - సత్య - సంపూర్ణతను పొంది శరీరధారియై లోకములో మనమధ్య నివసించెను.
దేవుడు క్రీస్తు రూపమున పాపులమైన మనకు కృపను దయచేసాడు. కాబట్టి క్రీస్తు అనుగ్రహించిన ఉచిత కృపనుబట్టి మనము రక్షణను పొందితిమి. ఇక్కడ మనము సమాధానము ఏ విధముగా పొందితిమో మనము తెలుసుకోవలసియున్నది. యేసుక్రీస్తు ఈ లోకములో జీవించిన కాలములో తన శిష్యులకు, పవిత్రాత్మను అనుగ్రహించెదనని ప్రమాణము చేసెను. యోహాను 14:26, ''ఆదరణకర్త, అనగా తండ్రి నా నామమున పంపబోవు పరిశుద్ధాత్మ సమస్తమును మీకు బోధించి నేను మీతో చెప్పిన సంగతులన్నిటిని మీకు జ్ఞాపకము చేయును.'' అపొస్తలుల కాలములో రెండవ అధ్యాయములో పెంతెకొస్తు దినమున దేవుడు సమాధానమును - అగ్ని నాలుకల రూపములో అనుగ్రహించాడు. ఈ సమాధానమును అక్కడ ఉన్న శిష్యులు పొందగలిగిరి. ఈ వచనములో కృపా సమాధానములను మనలను కూడ యేసుక్రీస్తునందు పొందమని దీవిస్తున్నాడు.
మనలను ప్రేమించుచు తన రక్తము వలన మన పాపములనుండి మనలను విడిపించినవాడు క్రీస్తే. కాబట్టి ఈయన మహిమాప్రభావము యుగయుగములు పొందుటకు యోగ్యుడు. ఇతను తన పుట్టుక ద్వారా ఈ లోకములో క్రైస్తవ ఆత్మీయ సామ్రాజ్యమును స్థాపించి, సువార్త కార్యము ద్వారా అనేకులను ఈ రాజ్యములో చేర్చి, వారిని ఒక రాజ్యముగాను, యాజకులుగాను చేసాడు. ప్రకటన 20:6, ''ఈ మొదటి పునరుత్థానములో పాలుగలవారు ధన్యులును పరిశుద్ధులునై యుందురు. ఇట్టివారిమీద రెండవ మరణమునకు అధికారములేదు; వీరు దేవునికిని క్రీస్తుకును యాజకులై క్రీస్తుతోకూడ వెయ్యి సంవత్సరములు రాజ్యము చేయుదురు.'' ఈయనయే మేఘారూఢుడై వచ్చువాడు. ఈయన మేఘారూఢుడై వచ్చునప్పుడు ప్రతి నేత్రము ఆయనను చూచును. ఇక్కడ నీతిమంతుడని దుష్టుడని లేదు. ఇక్కడ ఇంకొక ప్రత్యేకత ఏమిటంటే, ఆయనను ఎవరైతే సిలువ పైన ఆయన ప్రక్కన పొడిచినారో వారు కూడ ఆయన మేఘారూఢుడై వచ్చుట చూస్తారు.
ఇంత మహిమాప్రభావములతో వస్తున్న క్రీస్తును చూచి చివరి వచనములో భూజనులందరు రొమ్ము కొట్టుకొనవలసిన అవసరత ఏమి? రోమా 3:11, ''నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు'' ఈ వచనము ప్రకారము ప్రతి ఒక్కరు త్రోవ తప్పి యేకముగా పనికిమాలినవారే! అందులోను ఒకప్పుడైతే యేసుక్రీస్తు కన్య మరియ ద్వారా ఈ భూమిమీదకు రక్షించుటకు వచ్చాడు. మరి ఇప్పుడైతే క్రీస్తు భూజనులందరిని శిక్షించుటకు ఆయన రెండవసారి వస్తున్నారు. ఇక్కడ మనము గ్రహించవలసినదేమిటంటే భూజను లందరును అంటున్నాడు. ఈ భూజనులు అనగా వీరులోకము దాని క్రియలకు బానిసలైన వారు. కాబట్టి వీరు క్రీస్తు రెండవ రాకడలో - క్రీస్తు ప్రభువు మహిమా ప్రభావములతో మధ్యాకాశమునకు వచ్చినప్పుడు, ఆయనను చూచి వారికి జరుగబోవు శిక్షనుబట్టి రొమ్ము కొట్టుకొందురు.
శరీరము విడిచిన ఆత్మలలో క్రీస్తును ఎరుగనివారు మరియు ఆయనకు వ్యతిరేకముగా జీవించినవారు - యేసుక్రీస్తు ప్రభువుయొక్క రెండవ రాకడలో మాత్రమే ఆయనను దర్శింతురు. ఆయనయే సృష్టికర్త మరియు దేవునియొక్క దివ్య అవతారమనియు గ్రహించి భూమిమీద శరీరముతో జీవించిన కాలములో ఆయనను చేర్చుకొనక, ఆయన బోధను వినక, ఆయన మార్గములో నడవక, దైవమహిమను విగ్రహాలకు ఇచ్చి సృష్టిని - సృష్టములను పూజించి మరియు సేవించితిమేయని రొమ్ము కొట్టుకొని విలపించెదరు. అంటే శరీరము విడిచిన ఆత్మలు సహితము నిజదేవుడెవరో యేసుక్రీస్తు రెండవ రాకడ వరకు గ్రహించలేరు.
అయితే కొన్ని వివేకముగల జ్ఞానాత్మలు మాత్రము ప్రభువును విశ్వసించక చనిపోయినవారివలె కాక, ప్రభువును విశ్వసించి ఆయన మార్గములో నడిచిన ఆత్మలకున్న ప్రత్యేక విశ్రాంతి స్థలములను కేటాయించి యుండుటయును, వారు అందులో ప్రవేశించి నిశ్చింత జీవితము పొందుదురు అని గ్రహించగలుగును. అయితే ఏమి లాభము? భూమిమీద శరీరముతో జీవించిన కాలములో ప్రభువును అంగీకరించినవారు కారు. ప్రభువుయొక్క ప్రేమ మార్గములో నడిచినవారు కారు. కనుక వారికి భూమిమీద ప్రభువు ప్రేమను చవి చూచినవారికి ఇవ్వబడు రక్షణాయుతమైన విశ్రాంతి స్థలములలో ప్రవేశించుటకు యోగ్యత లేదు. అలాగే అన్యులైనవారికి అందులో ప్రవేశము ఉండదు. ప్రభువును అంగీకరించి బాప్తిస్మము పొందియు వేషధారణ జీవితము జీవించినవారికి అనగా లంచగొండిగానో లేక లోకవ్యామోహముతో జీవించిన వ్యక్తులకు కూడ ప్రభువు ప్రేమ మార్గములో నడిచినవారి గుంపులో వారికివ్వబడిన ప్రత్యేక శాంతికర పరదైసులలో ప్రవేశించు యోగ్యత ఉండదు.
ఇందుకు నిదర్శనము లూకా 16:22-23, ''ఆ దరిద్రుడు చనిపోయి దేవదూతల చేత అబ్రాహాము రొమ్మున (ఆను కొనుటకు) కొనిపోబడెను. ధనవంతుడు కూడా చనిపోయి పాతిపెట్టబడెను. అప్పుడతడు పాతాళములో బాధపడుచు, కన్నులెత్తి దూరమునుండి అబ్రాహామును అతని రొమ్మున (ఆనుకొనియున్న) లాజరును చూచి.''
ప్రకటన 1:8, ''అల్ఫాయు ఓమెగయు నేనే. వర్తమాన భూతభవిష్యత్కాలములలో ఉండువాడను నేనే అని సర్వాధికారియు దేవుడునగు ప్రభువు సెలవిచ్చుచున్నాడు.''
ఈ వచనము తరువాత యేసుక్రీస్తు యోహానుతో ప్రకటన 1:17-18లో కూడ ఈ విధముగా అంటున్నాడు. ''భయపడకుము; నేను మొదటివాడను కడపటివాడను జీవించువాడను; మృతుడనైతిని గాని ఇదిగో యుగయుగములు సజీవుడనైయున్నాను.''
''అల్ఫాయు ఓమెగయు నేేనే,'' అనగా, ''వర్తమాన భూతభవిష్యత్కాలములలో ఉండువాడను నేను,'' అని అర్థము, అనగా, ''నేను మొదటివాడను కడపటివాడను జీవించువాడను,'' అని అర్థము.
మొదటివాడు :- అల్ఫాయు :- భూతకాలములో దేవుడు ఏ విధముగా ఉన్నాడు? చెట్టు ముందా? విత్తనము ముందా? జీవము ముందా? జీవుడు ముందా? సృష్టికర్త ముందా? సృష్టి ముందా? ఈ సత్యాలను మనము ముందుగ తెలిసికోవలసి యున్నది. ఇందుకు జవాబు - చెట్టు లేకపోతే బీజము రాదు, లేక జీవము లేకపోతే జీవునికి చలనము లేదు, లేక సృష్టికర్త లేనిదే సృష్టి ఏర్పడదు.
''మొదటివాడు,'' అనుటలో పరలోకమునకు భూలోకమునకు గ్రహ మండలాల కును, నక్షత్ర మండలాలకును, ఆకాశ జ్యోతులకును, జలరాశులకును, అగ్నికిని, వాయువునకును, మొదలైన సృష్టికి మొదటివాడు. అనగా ఆదియైనవాడు సృష్టికర్తయైన దేవుడు. ఈయనే ఆదిదేవుడు - ఈ మొదటివాడే ఆదిదేవుడు. ఈయన ఆదిదేవుడు అయినందుననే భూమిమీద సమస్తమును నరునితో సహా సృష్టించాడు. ఇందునుబట్టి దేవుడు ఆదియైయున్నాడు. సృష్టికర్తయైన దేవుడు మొదటివాడు. మరి క్రీస్తు ఏ విధముగా మొదటివాడో మనము ఇప్పుడు తెలుసుకొందము.
పరిశుద్ధ గ్రంథములో మొట్టమొదట, ఆదికాండము 1:1, ''ఆదియందు దేవుడు భూమ్యాకాశములను సృజించెను,'' అని వ్రాయబడియున్నది. ఇందునుబట్టి సృష్టికి ముందు దేవుడున్నాడని, ఆ దేవుడే భూమ్యాకాశములను సృష్టించి సృష్టికి రూపాన్ని ఇచ్చి నట్లుగా తెలియుచున్నది. ఆదికాండము1:2, ''భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను;'' అని వ్రాయబడియున్నది. ఇందునుబట్టి సృష్టి కంటే సృష్టికర్తయే ముందు అని మనకు అర్థమగుచున్నది. ఇంకను, ''చీకటి అగాధ జలము పైన కమ్మియుండెను;'' ఇది సృష్టియొక్క సహజ స్థితిని మరియు సృష్టియొక్క పూర్విక స్థితిని వివరిస్తున్నది. ఆదిలో సృష్టి నిరాకారమై విడువబడినదిగా యున్నట్లు ఇందునుబట్టి మనకు తెలుస్తున్నది. ''దేవుని ఆత్మ జలములపైన అల్లాడుచుండెను.'' అనగా సృష్టికి ముందు సృష్టికర్తయైన దేవునియొక్క ఆత్మ జలములపై అల్లాడుచుండెను, అనగా సృష్టికి ముందు సృష్టికర్తయైన దేవునియొక్క ఆత్మ కూడ సృష్టి వలె నిరాకారము లోక నేత్రములకు శూన్యముగా కనబడినట్లు తెలియుచున్నది. ఇందులో ఈ సృష్టిని అందులోని సృష్టములను రూపించాలన్న బలమైన సంకల్పము సృష్టికర్తకున్నట్లుగ చీకటి జలములపై అల్లాడిన దేవునియొక్క చలనము బయల్పరచుచున్నది. సృష్టిని అందులోని నరసంతతిని సృష్టములను రూపించాలన్న బలమైన సంకల్పము సృష్టికర్తకు కలుగుటకు గల బలమైన మూడు కారణములను గూర్చి తెలిసికోవలసిన అవసరత ప్రతి విశ్వాసికున్నది.
అందులో 1. లూసిఫర్ అను తన జ్యేష్ఠకుమారుడైన దేవదూత తన అహంకార గర్వముచేత తండ్రి మీద తిరుగుబాటు చేయగా శాపగ్రస్థుడై తన సహచరులతోటి పరలోకము నుండి త్రోయబడి ఆదికాండము 1:2లోని చీకటి అంధకార జలములతో నిరాకారముగా అల్లాడుచుండగా వారి మీద దేవుడు కనికరించి, ఆ అగాధ జలములమీద అల్లాడుచున్న దూతగణములతో బాటు తానును అల్లాడుచు జలములలో గుప్తమైయున్న భూమిని పైకి తీసి తండ్రి తన కుమారునియొక్క దివ్యవెలుగులను ప్రసరింపజేసి ఆరబెట్టి, ఈ భూ మండలమును సకల వృక్ష జంతు పక్షి సముదాయములతోను, నదీనదములతోను, పర్వతములు లోయలతోను, గ్రహ నక్షత్ర కూటమితోను అలంకరించారు. చివరిగా తండ్రియైన దేవుడు ఈ దూత గణ సముదాయములు సంచరించుటకు స్వాస్థ్యముగా ఇచ్చెను. లూకా 4:6, ''-ఈ అధికారమంతయు, ఈ రాజ్యముల మహిమయు నీకిత్తును; అది నాకప్పగింపబడియున్నది.'' నేరస్థులైన ఖైదీలకు ప్రభుత్వమువారు పడక భోజన వసతి వైద్య సదుపాయములు, సంచరించుటకు కావలసిన ప్రదేశములను కేటాయించి ఖైదీల సంక్షేమమును గూర్చి పరామర్శిస్తున్నారు. అలాగే లూసిఫర్ అతని దూత గణములు విహరించుటకు జగత్తు సృష్టించడం జరిగింది.
2. పరమాత్మలో ఒక భాగమై ఆయనలో నివసిస్తూ ఆనందిస్తున్న జీవాత్మ దేవుడు సృష్టించిన ఈ భూమండలముపై తానుకూడ దృశ్యరూపములో భూమండలముపై నిండి సంచరిస్తూ ఆనందించాలన్న తలంపుగల్గి - పరవాసమైన పరలోకమునుండి యాత్ర రూపములో భూమిపై దృశ్యరూపములో సంచరింపజేయమని పరమాత్మని ప్రాధేయపడింది. 1 పేతురు 2:11, హెబ్రీ 11:13-16 జీవాత్మయొక్క అభ్యర్థన మేరకే నరశరీరమును సృష్టించి జీవాత్మను అందులో ప్రవేశపెట్టడం జరిగింది. మొదటిది అపవాదికి వానిదూతలకు కావలసిన కనీస సౌకర్యములు కొరకును, రెండవది జీవాత్మ శరీరధారియై భూమండలములో విహరించాలన్న తలంపును బట్టియే గాక మూడవదిగా పరమాత్మునిలోనే ఒక తలంపు ఉద్భవించింది. అదేమిటంటే దేవదూతల పరిచర్యతోను, వారి స్తుతిస్తోత్రాలతో సంతృప్తిపడక అదృశ్యములో ఉన్న పరలోకమునకు ధీటుగా సమస్త సదుపాయములతో దృశ్యరూపములో మరొక లోకమును సృష్టించి తన ఆత్మలో భాగస్వామి యొక్క స్తుతి స్తోత్రాలతో ఆనందించా లన్న తలంపు ఆయనలోనే బలముగా ఏర్పడింది. ఈ మూడింటి కారణాల వలన తండ్రి యైన దేవుడు ఈ లోకాన్ని సృష్టించడం జరిగింది. కనుక ఆదియైన దేవుడు ఆది సృష్టిని రూపించునప్పుడు ఈయన మొట్టమొదట జరిగించిన క్రియ ఆదికాండము 1:3లో చదువగలము. ''దేవుడు-వెలుగు కమ్మని పలుకగా వెలుగు కలిగెను.'' ఆత్మయైన దేవుడు మొట్టమొదటగా ఒక వాక్యమును పలికెను. ''వెలుగు కమ్మని పలుకగా వెలుగు కలిగెను.'' ఈ వాక్యము క్రీస్తునకు ముంగుర్తుగా ఉన్నది. ఈ వాక్యము దేవునియొద్ద ఉన్నట్లును, దానిని ఆత్మయైన దేవుడు పలికినట్లును మనకు తెలియుచున్నది. ఈ వాక్యము ప్రకారము, సమస్తమును ఈ వాక్యము సృజించిన తరువాత అవి మంచివైనట్లు దేవుడు చూచెనని అని వ్రాయబడియున్నది. చేసేటప్పుడు చూస్తూనే కదా చేస్తారు, మరల ప్రత్యేకముగా చూచుట ఏమిటి? ఇక్కడ ఆత్మ దేవుడు ఒక వాక్యమును పలికెను. ఈ వాక్యము అనెడు క్రీస్తు సమస్తమును సృజించి సర్వసుందరముగా చేసెను. అటు తరువాత ఆత్మయైన దేవుడు చూచి, ''అది మంచిది,'' అని చెప్పుచున్నాడు.
ఈ వాక్యము మొట్టమొదటగా దేవునినుండి వచ్చునప్పటికి ఈ సృష్టిలో ఏదియు సృజింపబడలేదు. అందుకే యోహాను 1:1-5, ''ఆదియందు వాక్యముండెను, వాక్యము దేవునియొద్ద ఉండెను, వాక్యము దేవుడై యుండెను. ఆయన ఆదియందు దేవునియొద్ద ఉండెను. సమస్తమును ఆయన మూలముగా కలిగెను, కలిగియున్నదేదియు ఆయన లేకుండ కలుగలేదు. ఆయనలో జీవముండెను; ఆ జీవము మనుష్యులకు వెలుగై యుండెను. ఆ వెలుగు చీకటిలో ప్రకాశించుచున్నది గాని చీకటి దాని గ్రహింపకుండెను,'' అని వ్రాసియున్నాడు. ఈ వాక్యము మొదటివాడుగా దేవునియొద్ద ఉండి వెలుగుగా చీకటిలో ప్రకాశించి, సమస్తమును కలిగించినది. ఈ విధముగా యేసుక్రీస్తు ఈ సమస్త సృష్టికి మొదటివాడై సమస్తమును సృజించెను. కాబట్టి ఈయన అల్ఫాయు లేక మొదటివాడు అని అనుటకు అర్హుడు. ఆత్మయైన దేవుడు భూతభవిష్యత్ వర్తమానకాలములలో ఉండువాడని మరల చెప్పనక్కరలేదు. ఎందుకంటే ఆయనకు కాలపరిమితులు లేవు. కాని క్రీస్తు ప్రభువు ఈ సృష్టికే మొదటివాడు అని అంటే క్రీస్తు 2000 సంవత్సరముల క్రితమే కదా పుట్టింది. ఈ సృష్టి కన్న మొదటివాడు ఎలాగయ్యెను? అని అడిగేవారు ఉన్నారు. కనుకనే క్రీస్తు ప్రభువు తనను మొదటివాడుగా పరిచయము చేసుకొనుచున్నాడు. ఈ విధముగా క్రీస్తు మొదటివాడుగ ఈ సృష్టికి ముందే ఈ లోకములో క్రియ జరిగించాడు. అందుకే యోహాను 8:58, ''యేసు-అబ్రాహాము పుట్టకమునుపే నేను ఉన్నానని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాననెను.'' ఈ విధముగా సృష్టికి ముందే వాక్యముగా క్రియ జరిగించిన క్రీస్తు, ఏ విధముగా కడపటివాడయ్యెనో సవివరముగా తెలుసుకొందము.
కడపటివాడు :- ఓమెగయు :- ఈ కడపటివాడు అనగా అందరికన్న చివరివరకు జీవించువాడు అని అర్థము. ఈ లోకమునకు తీర్పు జరిగిన తరువాత పరిశుద్ధులు ఒక వధువు సంఘముగా మార్పు చెందుతారు. వీరినిగూర్చి ప్రకటన 21వ అధ్యాయములో వ్రాయబడియున్నది. ఎన్నో విధములుగా మనము దేవుని చేరాలని ఈ భూమిమీద ప్రయత్నము చేస్తున్నాము. కాని చివరకు కడపటివాడైన జీవాధిపతియైన క్రీస్తుయొద్దకు మనము చేరుతాము అని ఈ అధ్యాయములో సవివరముగా చెప్పబడియున్నది. ఈ భూమి సృష్టింపక ముందు వాక్య రూపములో వచ్చిన క్రీస్తు చివరగా దేవుని ముందు నిలిచినవారికందరికిని కడపటివాడై వారిని పరలోకమునకు చేర్చుచున్నాడు. అందుకే క్రీస్తు - ''అల్ఫాయు ఓమెగయు నేనే,'' అని చెప్పుచున్నాడు. ఈ కడపటివాడు మేఘారూఢుడై వచ్చుట ప్రతి ఒక్కరు చూచెదరు అని బైబిలు గ్రంథము బోధించుచున్నది. అప్పుడు జీవ గ్రంథములో పేర్లు గలవారు మాత్రమే ఆయనతోబాటు పరలోకము చేరుదురు. అయితే మిగిలినవారు జీవము లేని అగాధజలములలో అంధకారములో కొట్టుమిట్టాడుచు అగ్నిగుండము అను రెండవ మరణము పొందుదురు. ఇది భయంకరమైన వేదన. అయితే భూమిమీద ఉన్న ప్రతి ఒక్కరికిని కడపటి గమ్యస్థానము నేనే అని క్రీస్తు ఈ వాక్యము ద్వారా చెప్పుచున్నాడు.
ఇటువంటి దేవుడు యోహాను ద్వారా సెలవిచ్చుచు ఈ పుస్తకములోని సంగతులు మనకు తెలియజేయుచున్నాడు. ఒక్కొక్క సంఘటనగూర్చి మనము సవివరముగా ఈ పుస్తకమునందు తెలుసుకొందము. ఇవి దేవుడు స్వయముగా తన దూతగా క్రీస్తు ప్రభువును ఏర్పరచుకొని ఆయనద్వారా తెలియజేసినవి. కాబట్టి వాటిని చదువువాడును, విని ఇందులో వ్రాయబడిన సంగతులను గైకొనువారును ధన్యులు.
ప్రకటన 1:9, ''మీ సహోదరుడను, యేసునుబట్టి కలుగు శ్రమలోను రాజ్యము లోను సహనములోను పాలివాడనునైన యోహానను నేను దేవుని వాక్యము నిమిత్తమును యేసును గూర్చిన సాక్ష్యము నిమిత్తమును పత్మాసు ద్వీపమున పరవాసినైతిని.''
ఇందులో మొట్టమొదటగా, ''మీ సహోదరుడను,'' అని అనుటలో యోహాను తన్నుతాను మనకు సహోదరుడుగా పరిచయము చేసుకొంటున్నాడు. దీనినిబట్టి యోహాను క్రైస్తవులకందరికిని సహోదరుడు. ఈ సహోదరుడు ఏ విధముగా సహోదరుడయ్యెనో మనము ఇప్పుడు తెలుసుకొందము.
దేవుడు ఆదాములో జీవాత్మను ఉంచెను. ఈ ఆత్మ అణువులుగా మారుచు, ప్రతి ఒక్కరి జననమునకు కారణమగుచున్నది. ఈ ఆత్మ నుండి వచ్చిన ఒక అణువు యోహానులో ఉంటే మరియొక అణువు ఇంకొకరిలో ఉంటుంది. ఈ విధముగా ఈ ఆత్మయొక్క అణువులు ప్రతి ఒక్కరిలో ఉన్నాయి. ఈ అణువులకు బాల్యము, వృద్ధాప్యములు లేవు. ఇవి శరీరమునకు మాత్రమే సంబంధించినవి. కాబట్టి యోహాను - ''మీ సహోదరుడను,'' అని అనుచున్నాడు. అందుకే యేసుక్రీస్తు కూడ ఈ విషయమునే చెప్పుచున్నాడు. మత్తయి 25:40, ''అందుకు రాజు-మిక్కిలి అల్పులైన యీ నా సహోదరులలో ఒకనికి మీరు చేసితిరి గనుక నాకు చేసితిరని నిశ్చయముగా మీతో చెప్పుచున్నానని వారితో అనును.'' కాబట్టి జీవాత్మ దేవునిది - ఈ ఆత్మ అణువులు మనలో నివసించుచున్నవి. కాబట్టి ఈ లోకములో జీవించుచున్న మనమందరము సహోదరులమై యున్నాము. కాబట్టి మన సహోదరులలో ఒక సహోదరుడైన యోహాను పత్మాసు ద్వీపమున పరవాసి అయ్యెను. ఈ సహోదరుడు ఎందుకు పరవాసి కావలసి వచ్చినది? ఈ ప్రశ్నకు కూడ సమాధానము ఈ వచనములోనే యోహాను వ్రాసాడు. దీనినే సాక్ష్యము చెప్పుట అని కూడ అనవచ్చును. ఈయన దేవుని వాక్యము నిమిత్తమును, యేసునుగూర్చిన సాక్ష్యము నిమిత్తమును, పత్మాసు ద్వీపమున చెర అనుభవించుచున్నాడు. ఈయన యేసునుబట్టి కలుగు శ్రమలోను, రాజ్యములోను, సహనములోను పాలివాడు. కాబట్టి ఈయన పేరు పరలోకములో ఒక పునాదిగా అర్హత పొందినది. ప్రకటన 21:14, ''ఆ పట్టణపు ప్రాకారము పండ్రెండు పునాదులుగలది, ఆ పునాదులపైనగొఱ్ఱె పిల్లయొక్క పన్నిద్దరు అపొస్తలుల పండ్రెండు పేళ్ల్లు కనబడుచున్నవి.''
ప్రకటన గ్రంథమును దైవప్రత్యక్షీకరణ మరియు దర్శనముద్వారా బహు తేట తెల్లముగా పరలోక రాజ్య మర్మములను బయల్పరచిన యోహానుయొక్క ఈ లోక జీవితము ఏలాగుందో మూలవాక్యము మనకు తెలియజేయుచున్నది. ఈ విధముగా లోకముచేతను, లోక ప్రభుత్వాలు, మరియు లోకనాధులచేతను తృణీకరింపబడి ఏకాంతములో పత్మాసు దీవిలో ఒంటరియైయున్న యోహాను జీవితము శరీరరీత్యా దుర్భరమైన వాతావరణములో ఉన్నను, యోహానుయొక్క ఆత్మీయ వికసింపు అన్నది మహా గొప్పగా ఉన్నత స్థితిలో ఉన్నది. కనుకనే లోకము వైపు చూడక, తనకు కేంద్ర బిందువైన పరమాత్ముని చిత్తము కొరకును, ఆయన సంబంధమైన రాజ్య మహిమల కొరకును, ఆయన కుమారుడును లోకరక్షకుడైన ప్రభువుయొక్క రాకడ కొరకును, నిరీక్షిస్తున్న వాతావరణములో ఉండుటను బట్టి, యోహాను ఈ ప్రకటన గ్రంథమును వ్రాయగలిగెను. యోహానుయొక్క శరీరము బలహీన స్థితిలో ఉన్నను, ఆయనయొక్క ఆత్మీయ స్థితి చాలా మెలకువ కలిగి ప్రభువు కొరకు కనిపెట్టియున్నట్లుగా యోహానుయొక్క ప్రకటన దర్శన జీవితము మనకు తెలుపు చున్నది. దైవిక తోడ్పాటు మరియు ఆయన ఆత్మ ఆవరింపు ఉన్న విశ్వాసి రాజాంతఃపురములో ఉన్నత స్థితిలో జీవించక పోయినను, అగ్నిలో, చెరలో, ఆపదలో, జలములలో, జలగర్భములో, అడవిలో, ద్వీపములో ఉన్నను, మరి ఎక్కడ ఉన్నను సరే, ఏ విధమైన కీడు అతనిని ఆశించదు, అని యోహానుయొక్క ద్వీపములోని నివాసము వివరిస్తున్నది. ఇట్టి స్థితిలో ఉన్న యోహానుకు లోకసంబంధమైన అన్నపానములు, అలంకారాలు, భోగభాగ్యాలు ఏవియు లేకపోయినను ప్రభువుయొక్క ఆత్మను దర్శించి, ఆయన స్వరమును విని, ఆ స్వరమునకు విధేయుడై ఆత్మీయ దృక్పధములో వీక్షించుచున్నప్పుడు కలిగిన దర్శనములే ఈ ప్రకటన గ్రంథములోని వేదభాగములు.
ప్రకటన 1:10-11, ''ప్రభువు దినమందు ఆత్మవశుడనైయుండగా బూరధ్వని వంటి గొప్పస్వరము-నీవు చూచుచున్నది పుస్తకములో వ్రాసి, ఎఫెసు, స్ముర్న, పెర్గము, తుయతైర, సార్దీస్, ఫిలదెల్ఫియ, లవొదికయ అను ఏడు సంఘములకు పంపుమని చెప్పుట నావెనుక వింటిని.''
ప్రభువు దినము అనగా ఇది ఒక ముఖ్యమైన సంఘటన జరిగిన దినముగా మనము భావించాలి. ఎందుకంటే ఈ దినము యోహాను ఆత్మవశుడైయున్నాడు. అంటే ఈ దినము యోహాను జీవితములో ప్రాముఖ్యమైన దినము. బహుశా ఈ దినము ఆదివారమై యుండవచ్చును. ఎందుకంటే యేసుక్రీస్తు బలియాగానంతరము ఆదివారమున పునరుత్థాను డయ్యెను. కనుక ఈ దినము చాలా ప్రాముఖ్యమైన దినము. ఒకవేళ యేసుక్రీస్తు పునరుత్ధానుడై తిరిగి లేవకుంటే క్రీస్తు రాజ్యమేయుండేది కాదు. కాబట్టి క్రైస్తవులకు ఆదివారము అను ఈ దినము చాలా శుభ దినముగా భావించాలి. ఆదివారమున అందరు కూడి ప్రార్థించి రొట్టె విరచుటకు కూడినప్పుడు అని అపొస్తలుల కార్యములు 20:7లో వ్రాయబడియున్నది. కనుక సమస్త జనులు కూడి ప్రార్థన జరుపు ఆదివారము ప్రభువు దినముగా మనము భావించాలి. యోహానుకు ప్రభువు దర్శనమిచ్చినాడు కనుక ఈ దినమును ప్రభువు దినము అని ఒకవేళ వ్రాసియుండవచ్చును. మన మానవ జీవితములో కూడ మంచి జరిగిన దినమును దేవుని దినముగా వర్ణిస్తూ చెప్పుచుందుము. అదే విధముగా యోహానుకూడ తనకు కనపడిన ప్రభువునుబట్టి ఆ దినమును ప్రభువు దినముగా అని వర్ణించియుండవచ్చును. ప్రభువు దినమున ఏదో ఒక కార్యము జరుగ వలసినది. ఆదికాండము ఒకటవ అధ్యాయములో ఏడు దినములనుగూర్చి వ్రాయబడి యున్నది. ఈ ఏడు దినములలో ప్రభువు ఏడు విధములైన కార్యములు చేసాడు.
అదే విధముగా యెషయా 13:6-11లో ''యెహోవా దినము వచ్చుచున్నది,'' అని చెప్పుచూనే ఆరోజు జరుగు కార్యములనుగూర్చి సంపూర్ణముగా వివరించాడు. అదే విధముగా యెషయా 27:1, ''ఆ దినమున,'' అని అంటున్నాడు. ''ఆ దినమున యెహోవా గట్టిదై గొప్పదై బలమైన తన ఖడ్గము పట్టుకొనును తీవ్రసర్పమైన మకరమును వంకర సర్పమైన మకరమును ఆయన దండించును సముద్రముమీదనున్న మకరమును సంహరించును.'' ఈ తీవ్ర సర్ప మకరము- వంకర సర్ప మకరములన్నవేమిటో యెషయా ప్రవచన సాహిత్య గ్రంథమందు చదువగలరు. ఈ విధముగా దేవుని దినములు వాటి కార్యములనుగూర్చి బైబిలు గ్రంథమునందు వివరిస్తూ వచ్చారు. ఎందుకంటే కాలము, క్యాలెండరు వంటివి ఆ రోజులలో లేవు. కనుక దేవుని కార్యములు జరుగు దినమును - దేవుని దినముగా వర్ణించిరి. అదే విధముగా యోహానుకూడ ప్రభువుదినము అని వర్ణించుచున్నాడు. ఎందుకంటే ఈ దినమున ప్రభువు యోహానుకు కనబడి, బూరధ్వనివంటి గొప్పస్వరముతో-నీవు చూచుచున్నది పుస్తకములో వ్రాసి, ఎఫెసు, స్ముర్న, పెర్గము, తుయతైర, సార్దీస్, ఫిలదెల్ఫియ, లవొదికయ అను ఏడు సంఘములకు పంపుమని చెప్పుట నా వెనుక వింటిని. ''ఈయన చూచుచున్నది,'' అనుటలో సంఘములయొక్క పరిస్థితి, నాలుగు జీవులు, క్రూరమృగము, స్త్రీ, బబులోను, ఈ లోక నాశనము, క్రీస్తు రాకడ, సాతాను చెర, వధువు సంఘము, పరలోకము మొదలగు వాటినన్నింటిని ఈయన చూచాడు. వీటినిగూర్చి ఈ ఏడు సంఘములకు వ్రాయమని చెప్పాడు. ఈ సంఘటన జరిగిన దినమును ప్రభువు దినముగా వర్ణించాడు. ఈ దినము యోహాను చరిత్రలోని ఒక గొప్ప దినముగా భావించాలి.
ప్రకటన 1:12-17, ''ఇది వినగా నాతో మాటలాడుచున్న స్వరమేమిటో అని చూడ తిరిగితిని. తిరుగగా ఏడు సువర్ణ దీపస్తంభములను, ఆ దీపస్తంభములమధ్యను మనుష్యకుమారునిపోలిన యొకనిని చూచితిని. ఆయన తన పాదములమట్టునకు దిగు చున్న వస్త్రము ధరించుకొని రొమ్మునకు బంగారుదట్టి కట్టుకొనియుండెను. ఆయన తలయు తలవెండ్రుకలును తెల్లని ఉన్నిని పోలినవై హిమమంత ధవళముగా ఉండెను. ఆయన నేత్రములు అగ్ని జ్వాలవలె ఉండెను; ఆయన పాదములు కొలిమిలో పుటము వేయబడి మెరయుచున్న అపరంజితో సమానమై యుండెను; ఆయన కంఠ స్వరము విస్తార జలప్రవాహముల ధ్వనివలె ఉండెను. ఆయన తన కుడిచేత ఏడు నక్షత్రములు పట్టుకొని యుండెను; ఆయన నోటినుండి రెండంచులుగల వాడియైన ఖడ్గమొకటి బయలు వెడలుచుండెను; ఆయన ముఖము మహా తేజస్సుతో ప్రకాశించుచున్న సూర్యునివలె ఉండెను. నేనాయనను చూడగానే చచ్చినవానివలె ఆయన పాదములయొద్ద పడితిని. ఆయన తన కుడిచేతిని నా మీద ఉంచి నాతో ఇట్లనెను-భయపడకుము;''
ఈ మనుష్య కుమారుని పోలినవాడు ఎవరు? మనుష్యకుమారుడు క్రీస్తు. మత్తయి 9:6, ''అయినను పాపములు క్షమించుటకు భూమిమీద మనుష్యకుమారునికి అధికారము కలదని మీరు తెలిసికొనవలెను అని చెప్పి,'' ఈ విధముగా క్రీస్తు తనకు తానే మనుష్యకుమారుడనని చెప్పెను. ఇంకను మత్తయి 8:20, 10:23, 11:19, 12:8, 32:40, 13:37, 41 ఇలా చాలా చోట్ల చెప్పబడియున్నది. అయితే మన మూల వాక్యములో మనుష్యకుమారుడు అని చెప్పక మనుష్య కుమారుని పోలినవాడు అని చెప్పబడియున్నది. మరి ఈ మనుష్యకుమారుని పోలినవాడు ఎవరు? ఈ మనుష్య కుమారుని పోలినవాడు కూడ క్రీస్తే. ఎలా? యోహాను 20:14, ''ఆమె (మగ్దలేనే మరియ) యీ మాట చెప్పి వెనుకతట్టు తిరిగి, యేసు నిలిచియుండుట చూచెనుగాని ఆయన యేసు అని గుర్తుపట్టలేదు.'' ఆమె గుర్తుపట్టకపోవుటకు కారణమేమి? యేసుక్రీస్తు అప్పటికే మరణించి మహిమ పునరుత్థానుడై ఆమెకు కనిపించాడు. కాబట్టి మహిమ శరీరముతో ఉన్న క్రీస్తు అను మనుష్యకుమారుని యేసుగా పోల్చుకొనక యోహాను 20:15, ''తోటమాలి,'' అని అనుకున్నది. ఇందునుబట్టి మహిమ శరీరము ఒక మనుష్యుని ఆకారముగానే కనబడునని మనకు అర్థమగుచున్నది. ఇక్కడ మగ్దలేని మరియ ఆయనను మనుష్యకుమారునిగా గుర్తించలేకపోవుటలో ప్రబలమైన కారణమున్నది. ముళ్ళ కిరీటము పెట్టి కొట్టినప్పుడు మేకులతో కాళ్ళు చేతులను సిలువకు దిగగొట్టినప్పుడు రక్తహీనుడై కళావిహీనముగా కనబడిన యేసుయొక్క దీన హృదయవిదారక రూపమే ఆమె మనస్సులో ముద్రపడి యుండినది. యోహాను 10:18లో చెప్పినట్లు తాను భూమిపై చిందించిన ప్రతి రక్తపు బొట్టును ప్రాణముతో బాటు తిరిగి తీసుకొన్నందున ఆయనయొక్క మహిమతో కూడిన ఆ దివ్య శరీరాన్ని గుర్తుపట్టలేకపోయింది. యేసు ఆమెను చూచి మరియా అని పిలిచిన పిలుపునుబట్టి ఆమె యోహాను 10:3లో ప్రభువు చెప్పినట్లు ఆయన స్వరమును విని ఆయనను మనుష్యకుమారునిగా గుర్తించి తరువాత, యోహాను 20:16, ''ఆయనను హెబ్రీ భాషతో రబ్బూనీ అని పిలిచెను. ఆ మాటకు బోధకుడని అర్థము.''
మన మూలవాక్యములో క్రీస్తు ఏడు సువర్ణ దీపస్తంభములమధ్య ఏడు నక్షత్రములు పట్టుకొని నిలుచున్నాడు. ఆయన నోటినుండి రెండంచులుగల వాడియైన ఖడ్గమొకటి బయలు వెడలుచుండును గనుక యోహాను మనుష్యకుమారుని పోలినవాడుగా గుర్తించాడు. ఇప్పుడుకూడ క్రీస్తు మహిమా ప్రభావములతో కనపడినాడు. కాబట్టి యోహాను మనుష్య కుమారుడు అని కాకుండ మనుష్యకుమారుని పోలినవాడు అని క్రీస్తు ప్రభువునుగూర్చి వ్రాసాడు. మనుష్యకుమారుడని చెప్పక మనుష్యకుమారుని పోలినవాడని చెప్పుటకు కారణాలు - ఆయన నోటి వెంట వెలువడు ఖడ్గము ఆయన చుట్టు ఉన్న దీపస్థంభములుచేత ఉన్న నక్షత్రాలు దర్శనమిచ్చిన ప్రభువుయొక్క దివ్య మహిమ స్వరూపమును దర్శించిన యోహాను ఈయన సర్వశక్తిగల మహిమ స్వరూపియైన సృష్టికర్తగా గ్రహించాడు. మనుష్య కుమారునిగా యేసయ్య కనబడుచున్నాడు గాని ఈయన మనిషి కాదు. ఆదికాండము 1:26-27లో వలె దేవుని పోలికెలో ఆదాము చేయబడినాడు. కాని ఆదాము దేవుడు కాదు. అట్లే యేసు మనుష్యుని పోలికెలో కనబడినంత మాత్రాన ఆయన మనిషి కాదు. సర్వశక్తిగల త్రియైక దేవుడు. కనుక యోహానుకు దర్శనమిచ్చిన యేసయ్య తన రూపాంతరములో మనుష్యుని పోలికెగా కనబడినాడు. కాని యేసయ్య మనిషి కాదు - జగత్‌ద్రక్షకుడని గుర్తించాడు.
ఈ మనుష్యకుమారుని పోలిన క్రీస్తు ప్రభువు యోహానుకు ఏ విధముగా కనబడినాడో తెలుసుకొందము. ఇందులో మొట్టమొదటగా ఏడు సువర్ణ దీపస్తంభములు, ఏడు సువర్ణ దీపస్తంభముల మధ్య యేసుక్రీస్తు మనుష్యకుమారునిగా సంచరిస్తున్నాడు. ఆయన కుడిచేతిలో ఏడు నక్షత్రాలు ఉన్నాయి. వీటిని గూర్చి, ప్రకటన 1:20, ''కాగా నీవు చూచినవాటిని, ఉన్నవాటిని, వీటివెంట కలుగబోవువాటిని, అనగా నా కుడిచేతిలో నీవు చూచిన యేడు నక్షత్రములను గూర్చిన మర్మమును, ఆ యేడు సువర్ణ దీపస్తంభముల సంగతియు వ్రాయుము. ఆ యేడు నక్షత్రములు ఏడు సంఘములకు దూతలు. ఆ యేడు దీపస్తంభములు ఏడు సంఘములు.'' సువర్ణ దీప స్తంభములు ఏడు సంఘములు అవి ఆత్మీయ సంఘములుగా మనకు అర్థమగుచున్నవి. వీటి మధ్య యేసుక్రీస్తు సంచరి స్తున్నాడు. సంఘము అంటే ప్రార్థనతో కూడిన సహోదరుల కలయిక. వీటి మధ్య యేసు నేను ఉంటానని ప్రమాణము చేసియున్నారు. మత్తయి 18:20, ''ఏలయనగా ఇద్దరు ముగ్గురు నా నామమున ఎక్కడ కూడి యుందురో అక్కడ నేను వారి మధ్యన ఉందునని చెప్పెను.''
ఈ విధముగా ప్రభువు మనుష్యకుమారుని రూపములో ఈ ఏడు ఆత్మీయ సంఘముల మధ్య సంచరిస్తున్నాడు. ఈ విషయమును ఈ గ్రంథమును చదువు చున్న నీవు గ్రహించావా! ఈ సంచరించుచున్న క్రీస్తును కనుగొనినావా? ఈయన అదృశ్య దేవుడని స్వరూపియని గ్రహించావా?
''ఆయన తన కుడిచేత ఏడు నక్షత్రములు పట్టుకొని యుండెను;'' ఈ యేడు నక్షత్రములు ఏడు సంఘములకు దూతలు అని ప్రకటన 1:20లో చెప్పబడియున్నది. అనగా ఆయన కుడిచేత ఏడుగురు దూతలను పట్టుకొని యుండుటలో ఉన్న అర్థమేమిటో మనము తెలుసుకోవలసియున్నది. ఇక్కడ ఈ ఏడుగురు దూతలు ఏడు సంఘములకు కాపుదలగా ప్రభువు అనుగ్రహించియున్నారు. వీరికి స్వతంత్రత లేదు. ఎందుకంటే వీరు క్రీస్తు యొక్క కుడిచేతిలో ఉన్నారు అనగా క్రీస్తు యొక్క ఆజ్ఞానుసారముగానే వీరి యొక్క కదలికలు ఉంటాయి. వీరు క్రీస్తు ప్రభువు యొక్క అధీనములో ఉంటూ సంఘ కార్యకలాపములు జరిగిస్తున్నారు. అయితే ఈ దూతలను నక్షత్రాలుగా మరియు ఏడు సంఘములు ఏడు సువర్ణ దీపస్తంభములు అని ఎందుకు వర్ణించాడో తెలుసుకొందము.
ముందుగా ఈ సంఘములు ఆత్మీయ సంఘములు. ఇవి సువర్ణ దీపములైనను అనేక ఆత్మలకు ఆధారములవంటివి. కాబట్టి అనేకులైన పరిశుద్ధులకు పట్టుకొమ్మలైన ఈ సంఘాలను సువర్ణ దీపస్తంభములుగా వర్ణించుట జరిగింది. మరి దూతలను నక్షత్రాలుగా ఎందుకు వర్ణించాడు? ఈ దూతలు ఈ సంఘములోని పరిశుద్ధుల ద్వారా క్రీస్తు యొక్క అధీనములో సువార్త కార్యమును జరిగిస్తున్నారు. కాబట్టి వీటిని నక్షత్రములుగా వర్ణించాడు. దానియేలు 12:3, ''నీతి మార్గము ననుసరించి నడుచుకొనునట్లు ఎవరు అనేకులను త్రిప్పుదురో వారు నక్షత్రమువలె నిరంతరమును ప్రకాశించెదరు.'' దీనినిబట్టి అనేకులు నీతిలో ప్రవేశించుటకు కారకులైన ఈ ఏడుగురు దూతలను నక్షత్రాలుగా వర్ణించటము జరిగింది.
''ఆయన తన పాదములమట్టునకు దిగుచున్న వస్త్రము ధరించుకొని రొమ్మునకు బంగారుదట్టి కట్టుకొనియుండెను,'' అనుటలో ఎఫెసీ 6:11-17, ''మీరు అపవాది తంత్రములను ఎదిరించుటకు శక్తిమంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొనుడి. ఏలయనగా మనము పోరాడునది శరీరులతోకాదు, గాని ప్రధానులతోను, అధికారులతోను, ప్రస్తుత అంధకారసంబంధులగు లోక నాధులతోను, ఆకాశమండల మందున్న దురాత్మల సమూహములతోను పోరాడుచున్నాము. అందుచేతను మీరు ఆపద్దినమందు వారిని ఎదిరించుటకును, సమస్తము నెరవేర్చినవారై నిలువబడుటకును శక్తిమంతులగునట్లు, దేవుడిచ్చు సర్వాంగకవచమును ధరించుకొనుడి. ఏలాగనగా మీ నడుమునకు సత్యమను దట్టి కట్టుకొని నీతియను మైమరువు తొడుగుకొని పాదములకు సమాధాన సువార్తవలననైన సిద్ధమనస్సను జోడుతొడుగుకొని నిలువబడుడి. ఇవన్నియు గాక విశ్వాసమను డాలు పట్టుకొనుడి; దానితో మీరు దుష్టుని అగ్నిబాణములన్నిటిని ఆర్పుటకు శక్తిమంతులవుదురు.'' ఈ వాక్యమునుబట్టి క్రీస్తు సంపూర్ణమైన వస్త్రమును ధరించుకొని (అర్థనగ్న వస్త్రములు కావు) రొమ్మునకు బంగారు దట్టి కట్టుకొని యుండెను. ఇక్కడ, ''బంగారు దట్టి,'' అనగా సత్యముతో సాతానును జయించి మరణవిజయుడైనందుకు ఇది గుర్తు. బంగారము, రాజరికమునకు జయమునకు గుర్తుగా సూచిస్తారు. క్రీస్తు ఈ లోకమును, సాతానును, లోకనాధులపైనను విజయము సాధించినట్లుగా ఈ బంగారు దట్టి మనకు తెలుపుచున్నది.
''ఆయన తలయు తల వెండ్రుకలును తెల్లని ఉన్నిని పోలినవై హిమమంత ధవళముగా ఉండెను,'' అనగా క్రీస్తు ప్రభువు శరీరము మహిమ శరీరము. కాబట్టి ఆయనలో ఎటువంటి మచ్చా-డాగు లేదు. కాబట్టి ఆయనయొక్క జ్ఞానము తెల్లని ఉన్నితో తలవెంట్రుకలతో హిమమంత ధవళముగా పోల్చబడినది. తలవెండ్రుకలు నెరయుట అనుభవము మరియు ప్రజ్ఞకు గుర్తు. సామెతలు 16:31. ఇది లోకసంబంధమైన సొగసు కాదు. ''ఆయన నేత్రములు అగ్ని జ్వాలవలె ఉండెను;'' అనుటలో క్రీస్తు ప్రభువు వెలుగు స్వరూపి. ఈయన వెలుగు సాధారణమైన కన్నులతో చూడలేము, ఎందుకంటే సూర్యుని వెలుగుకన్న వెయ్యి రెట్లు ఎక్కువ వెలుగు కలిగియున్నాడు. కనుకనే తలవెండ్రుకలు తెల్లవిగాను, కన్నులు అగ్ని జ్వాలలుగాను, పాదములు అపరంజి రంగులో కనబడుచున్నవి. అటుతరువాత సువార్తను బోధించిన ఆయన పాదములు ఎంత మనోహరమైనవో ఈ వచనములో రోమా 10:15లో వలె యోహాను తెలియజేయుచున్నాడు. ''ఆయన పాదములు కొలిమిలో పుటము వేయబడి మెరయు చున్న అపరంజితో సమానమైయుండెను;''
''ఆయన కంఠ స్వరము విస్తార జలప్రవాహముల ధ్వనివలె ఉండెను,'' అనగా క్రీస్తుయొక్క కంఠస్వరము నుండి వచ్చు ప్రతి వాక్యము జీవజలమే. ఈ వాక్యములోని మాటలను మన జీవితములో సంపూర్తిగా పాటించిన అది జీవజలమే. అందుకే యోహానుకు ఆయన కంఠస్వరము విస్తార జల ప్రవాహములవలె వినిపించింది. ఎందుకంటే జీవజలమైన క్రీస్తు వాక్యముల ద్వారా అనేకులు సంతృప్తి పొందుచు, వారి జీవితములు ధన్యము చేసు కొనుచున్నారు.
''ఆయన నోటినుండి రెండంచులుగల వాడియైన ఖడ్గమొకటి బయలు వెడలు చుండెను;'' అనగా హెబ్రీ 4:12, ''ఎందుకనగా దేవుని వాక్యము సజీవమై బలముగలదై రెండంచులుగల యెటువంటి ఖడ్గము కంటెను వాడిగా ఉండి, ప్రాణాత్మలను కీళ్లను మూలుగను విభజించునంతమట్టుకు దూరుచు, హృదయముయొక్క తలంపులను ఆలోచనలను శోధించుచున్నది.'' దేవుని వాక్యము క్రీస్తే! యోహాను 1:1-2, ''ఆది యందు వాక్యముండెను, వాక్యము దేవునియొద్ద ఉండెను, వాక్యము దేవుడై యుండెను. ఆయన ఆదియందు దేవునియొద్ద ఉండెను. సమస్తమును ఆయన మూలముగా కలిగెను.'' ఈ క్రీస్తు నోటినుండి వచ్చు ప్రతి వాక్యము రెండంచులుగల సజీవమైన బలముగల ఖడ్గము. ''ఇది బయలు వెడలుచుండెను;'' అనుటలో ఇది తీర్పు తీర్చుటకు సిద్ధమగు చున్నదని అర్థము. ఈ సంఘటన యుగాంతములో జరుగబోవువాటిని తెలియ జేస్తున్నది. ఇన్ని ఆధిక్యతలు కలిగిన మనుష్యకుమారుని పోలిన ఈ క్రీస్తుయొక్క ముఖము సూర్యునివలె మహాతేజస్సుతో ప్రకాశించుచున్నది.
ఇంత ప్రకాశమానమైన ఈ మనుష్యకుమారుని పోలిన క్రీస్తును చూచిన యోహాను పరిస్థితి మరీ ఆశ్చర్యకరమైయున్నది. అదేమిటంటే ప్రకటన 1:17, ''నేనా యనను చూడగానే చచ్చినవానివలె ఆయన పాదములయొద్ద పడితిని.''
ప్రకటన 1:17, ''నేనాయనను చూడగానే చచ్చినవానివలె ఆయన పాదముల యొద్ద పడితిని. ఆయన తన కుడిచేతిని నామీద ఉంచి నాతో ఇట్లనెను-భయపడకుము;''
ఇందులో యోహానునకు దర్శనమిచ్చిన ప్రభువు ఆత్మయొక్క రూపము. ఆయన తన కుడిచేతిని పైన ఉంచి పలికిన మాట - ''భయపడకుము;'' కుడిచేతిని ఉంచుటలో ఆశీర్వాదమునకును - కుడిపార్శ్వమన్నది పరిశుద్ధులకు ఇవ్వబడిన స్వాస్థ్యము. ఎడమ పార్శ్వమన్నది అపవాది సంబంధుల స్థానము.
ఈ భయము అన్నది ఆదిలో ఏదెను వనము నుండి నేటి వరకు ప్రతి వ్యక్తిని ప్రతి ప్రాణిని వెంటాడుచునే ఉన్నది. అయితే భయమన్నది నరునికి జన్మతః ఏర్పడిన గుణము కాదు. దేవుడు నరుని సృష్టించినప్పుడు వానిని భయస్థునిగ సృష్టించలేదు. అనగా పిరికివానిగా సృష్టించలేదు. ప్రకటన 21:8, ''పిరికివారును,'' అని వ్రాయబడి ఉన్నది. వీరు దేవుని రాజ్యానికి వారసులు కారు. పిరికితనానికి మూలము భయము. ఈ భయమన్నది ఒక జీవి నుండి మరియొక జీవికి, నరులలో ఒకరి నుండి మరొకరికి నానావిధాలుగా క్రియ జరిగిస్తున్నది. దేవుడు నరుడిని భయానక వాతావరణములో సృష్టించలేదు. మొదటి నరునికి దేవుడు అమూల్యమైనటువంటి ఏడు విధములైన ఉన్నత విలువలు ఇచ్చాడు. అవి 1. స్వాతంత్య్రము 2. నిశ్చింత 3. నిర్భయము 4. ఆరోగ్యము 5. దైవత్వముతో సావాసము 6. దైవాత్మలో భాగస్వామ్యము 7. దైవవనములో జీవించే యోగ్యత. ఈ యోగ్యతలు నరునికి దేవుడు ఇస్తూ నరుని తన జీవముతోను తన ఆత్మతోను తన రూపముతోను కట్టుటయేగాక, దేవుడు తాను రూపించిన అనంత విశ్వములోని సృష్టములన్నిటికిని పేర్లు పెట్టే యోగ్యత ఇచ్చాడు. అయితే భయముఅన్నది ఏమిటో దాని నీడనుకూడ నరునికి కనబరచలేదు. అయితే ఈ భయమును నరుడు కొని తెచ్చుకున్నాడు. ఈ భయమునకు పునాది దేవుడు నిషేధించిన ఏదెను మధ్యలోని చెట్టు ఫలమే. చెట్టు ఫలాన్ని సతీసమేతముగా తినిన నరుడు దైవత్వము ముందు నిలబడి మాట్లాడేందుకు సాహసించలేకపోయాడు. దేవుడు నిషేధించిన ఫలమును తిన్న వెంటనే నరనారులిద్దరిలో భయమనే గుణము ప్రవేశించుటకు బాట ఏర్పడింది. దేవునియొక్క హస్తముతోను దైవ జీవాత్మతోను రూపితుడైన నరుడు దేవునితో ముఖాముఖిగ ధైర్యముగా సాహసోపేతముగా మాట్లాడుచు నిర్భయముగా ఒంటరిగా కొంతకాలము, జంటగా కొంతకాలము ఏదెనులో జీవించాడు. భయమన్నది ఎరుగని స్థితిలో నరజంటను సృష్టించి పోషించాడు. ఈ విధముగా దేవునియొక్క సంరక్షణలో ఎదిగిన నరజంట నిర్భయముగా స్వాతంత్య్రముగాను సుఖశాంతులతో, దేవునియొక్క పరిశుద్ధ వనములో జీవించగలిగినారు.
ఏనాడైతే సర్పబోధతో దైవనిషేధఫలము తినుటలో పాలిపంపులు పంచుకొన్నారో ఆనాటి నుండి భయమన్నట్టి గుణము నరులకు సర్పమునకు ఆవరించింది. ఈ విధముగా దైవఆజ్ఞాతిక్రమము చేసిన నరజంట మూలముగా జంతుజాలము, పశుపక్ష్యాదులు, జల మత్స్యములు, ఆకాశ పక్షులు, ఒకటేమిటి, సృష్టిలోని సకల జీవులలో ఈ భయము అన్నది చోటుచేసుకున్నది. ఈ విధముగా భయానక వాతావరణమునుబట్టి నరుడు ఈ అనంత విశ్వములో స్వేచ్ఛను కోల్పోయాడు మరియు పిరికివాడయ్యాడు. దైవసన్నిధిలో నిలబడే యోగ్యతను పోగొట్టుకున్నాడు. బహిరంగముగా నీతిక్రియలకు బదులు రహస్య ముగా పాపకార్యాలు చేయు ఆత్మీయ బలహీనతకు దిగజారినాడు. ఇందువలన దేవుడు కూడ నరులను చేసినందుకు సంతాపపడినట్లుగ ఆదికాండము 6:6లో చదువగలము. అయితే ఈ భయమన్న గుణమును లోకము వైపు గాకుండ తన వైపు మరల్చుకొనుటకు తన ప్రవచనాలలో కీర్తన 128:1, ''యెహోవాయందు భయభక్తులు కలిగి ఆయన త్రోవలయందు నడుచువారందరు ధన్యులు.'' భయము అనిన గుణాన్ని భక్తికి జోడించి నట్లుగా చదువగలము. అనగా భయపడవలసినది దైవత్వమునకేగాని లోకనరులకు కాదు.
అయితే నరుడు అజ్ఞానియై దైవత్వమునకు భయపడుటకు బదులు సృష్టములకును లోకమునకును పంచభూతాలకు గ్రహాలకును, వర్షానికిని, మంచుకు, తుఫానుకు, భూకంపమునకు, లోకరాజ్య పరిపాలనకును, వ్యాధికి, మరణమునకు మొదలైనవాటికి భయపడుచు హీనాతిహీనమైన స్థితికి దిగజారినాడు. నేటి నరకోటియైన మనము పిరికి వాడైన ఆదాము సంతతికాక, దేవునియందు భయభక్తులు కలిగిన అబ్రాహాము సంతానముగా వేదరీత్యా నిర్ధారించబడియున్నాము. దేవునియందు భయభక్తులు కలిగి జీవించినవారిలో అబ్రాహాము మొదటివాడు. విశ్వాసమునుబట్టి అబ్రాహాము దేవునియందు భయభక్తులు గలవారిలో మొదటివాడాయెను. అందుకే దేవుడు అబ్రాహాముకున్న దైవభీతి, విశ్వాసమును బట్టి ఇశ్రాయేలును అబ్రాహాము సంతానముగా లోకములో ప్రతిష్టించాడు. లూకా 19:9, ''అందుకు యేసు-ఇతడును అబ్రాహాము కుమారుడే; ఎందుకనగా నేడు ఈ యింటికి రక్షణ వచ్చియున్నది.'' ఇందును బట్టి ఇశ్రాయేలీయులు నోవహు సంతానమైనప్పటికిని వారు యాకోబు సంతానముగా ఎన్నిక కాబడి విశ్వాసులకు తండ్రియైన అబ్రాహామును తమకు పితామహుడుగ పొందుటన్నది దేవుని కృప. ఇశ్రాయేలుకు తండ్రియైన యాకోబు కూడ ఈ భయానక స్థితిని అనుభవించాడు. తండ్రిదగ్గర కుయుక్తితో తాను సంపాదించుకొన్న జ్యేష్టత్వ ఆశీర్వాద విషయములో తాను అమలు చేసిన మోసపూరిత విధానమునకు ఒక వైపు భీతిల్లినను, మరొక వైపు తన అన్నయైన ఏశావు తనను చంపుతాడన్న భయముతో యాకోబు దాగినాడు. దైవజనుడైన యాకోబు భయము లేక రాత్రివేళ నరరూపములోని దైవశక్తితో పోరాడే పోరాటములో దేవుడు మెచ్చి యాకోబును ఆశీర్వదించి బిరుదును ఇచ్చాడు. ఆదికాండము 32:28, ''అప్పుడు ఆయన-నీవు దేవునితోను మనుష్యులతోను పోరాడి గెలిచితివి గనుక ఇకమీదట నీ పేరు ఇశ్రాయేలే.'' ఈ విధముగా పాతనిబంధనలో ఈ భయమన్నది నానా విధాలుగా క్రియ జరిగించియున్నది. ఈ భయమన్న గుణము నుండి తప్పించుకొన్న వారు లేరనే చెప్పవచ్చును.
నూతన నిబంధనలో యేసుక్రీస్తుకు విధించబడిన మరణశిక్ష అమలు జరుగు సందర్భములో ఆయన ప్రేమించిన శిష్యులలో ఒక్క యోహాను తప్ప ఎవరును ఆయనయొద్ద లేరు. ఆయనకు సిలువ వేయబడినప్పుడు యోహాను ఒక్కడే యేసుప్రభువుతో కూడ అంటిపెట్టుకొనియున్నాడు. ఆ యోహాను కూడ యేసు ప్రభువు శిష్యుడని ఆనాటి జనాంగానికి తెలియని స్థితిలో యోహాను సిలువ దగ్గర ఉండగలిగినాడు. యేసు ప్రభువు పేతురును అతిగా ప్రేమించి అతనిని బండగా వర్ణించి ఆ బండమీద నా సంఘమును కట్టుదును అని చెప్పాడు. పాతాళలోక ద్వారములు దానియెదుట నిలువ నేరవని నేను నీతో చెప్పుచున్నాను. పరలోక రాజ్యముయొక్క తాళపుచెవులు నీకిచ్చెదను అని చెప్పాడు. మత్తయి 16:18, ''మరియు నీవు పేతురువు; ఈ బండమీద నా సంఘమును కట్టుదును,'' అని వాగ్దానము చేయబడిన పేతురే చలిమంట దగ్గర మరణ భయముచేతను క్రీస్తు ప్రభువు తనకు ఇచ్చిన ఆజ్ఞ వలనను క్రీస్తును నేనెరుగనని ముమ్మారు అబద్ధమాడినాడు. లూకా 9:20-21, ''అందుకాయన-మీరైతే నేనెవడనని చెప్పుకొనుచున్నారని వారినడుగగా పేతురు-నీవు దేవుని క్రీస్తువనెను. ఆయన-ఇది ఎవనితోను చెప్పవద్దని వారికి ఖండితముగా ఆజ్ఞాపించి.'' ఇందునుబట్టి ఈ భయమన్నది సకలజనులలో క్రియ జరిగించుటకు కారణము దైవఆజ్ఞాతిక్రమము వలన వచ్చిన దైవశాపము వలన కలిగినదే. వాస్తవమునకు నరులను భయము అనే గుణముతో పుట్టించలేదు. నేడు ఈ భయమన్నది లేనట్టి స్థలమే లేదు. యావద్ సృష్టికి ఈ భయమన్నది ఆవరించియున్నది. ఒక్క భూమి మీదనే కాదు, జలములలో ప్రయాణించేటప్పుడు, ఆకాశములో విమానయానము చేయు నప్పుడు, సముద్ర మార్గములో ఓడ ప్రయాణములోను మరియు అడవిలో ఒంటరిగా ప్రయాణము చేసిన ఈ భయమన్నది వెంటాడుచున్నది. ఇందునుబట్టి ఈ భయమన్నది నీడవలె నరుని వెంటాడుచున్నదన్న సత్యాన్ని మనము గ్రహించాలి. అయితే భయమన్నది క్రియ జరిగించేది శరీరము మీదనే గాని ఆత్మ మీద కాదు. నరునినుండి ఆత్మ మరలి పోవునప్పుడు దీనికి ఎలాంటి భయముండదు. ప్రాణముమీద శరీరికి భయమేగాని ప్రాణానికి ఆత్మకు కూడ భయమన్నది లేదు. అందుకే దైవవాక్యము, ప్రకటన 21:8, ''పిరికివారును,'' అని వ్రాయబడుటయేగాక ''మండు గుండములో పాలుపొందుదురు;'' అని అనుటలో శారీర సంబంధమైన పిరికితనము గూర్చిన హెచ్చరికయైయున్నది. అందుకే మన మూలవాక్యములో ప్రకటన 1:18లో ప్రభువు దర్శనములో మాట్లాడిన మాట - ''భయపడకుము;'' కాబట్టి భయపడే పిరికితనము గలవారు పరలోక రాజ్యానికి వారసులు కాలేరు. కాబట్టి ప్రభువు తన కుడి హస్తమును యోహానుపై ఉంచి - ''భయపడకుము;'' అని చెప్పుచున్నాడు.
ప్రకటన 1:18, ''నేను మొదటివాడను కడపటివాడను జీవించువాడను; మృతుడ నైతిని గాని ఇదిగో యుగయుగములు సజీవుడనైయున్నాను.''
ఒకటవ అధ్యాయము ఏడవ విభాగమునందు మనము మొదటివాడు అనగా అల్ఫాయు మరియు కడపటివాడు అనగా ఓమెగయు గూర్చి స్పష్టముగా తెలుసుకొన్నాము.
ఇప్పుడు, ''జీవించువాడును,'' అనగా ఆదికాండములో ఈ సృష్టికి పూర్వము దేవుని నోటనుండి వచ్చిన వాక్యము, ఏదెను చరిత్రలో జీవవృక్షముగా మారి క్రియ జరిగించాడు. అటుతరువాత నూతననిబంధన కాలములో మానవులమధ్య క్రీస్తు రూపములో నివసించి, మరణించి, పునరుత్థానుడై, దేవుని కుడిపార్శములో కూర్చొని యున్నాడు. కాబట్టి ఈయన ఎప్పటికిని జీవించువాడు. ప్రకటన 20:6, ''వీరు దేవునికిని క్రీస్తుకును యాజకులై క్రీస్తుతోకూడ వెయ్యి సంవత్సరములు రాజ్యము చేయుదురు.'' ప్రకటన 21:3, ''అప్పుడు-ఇదిగో దేవుని నివాసము మనుష్యులతోకూడ ఉన్నది, ఆయన వారితో కాపుర ముండును, వారాయన ప్రజలైయుందురు, దేవుడు తానే వారి దేవుడైయుండి వారికి తోడైయుండును.'' ''మృతుడనైతినిగాని ఇదిగో యుగయుగములు సజీవుడనై యున్నాను,'' అనుటలో ఉన్న పరమార్థమునుగూర్చి తెలుసుకొందము. పాతనిబంధన కాలములో నరకోటికి సంభవించిన పాపము మరణము అను శిక్ష నుండి విమోచించుటకు ఏ దేవుడుగాని ఏ దేవతగాని శక్తి లేని స్థితిలో ఉండగా, నరకోటిని ఆవరించియున్న మరణమను ఉపద్రవము నుండి నిత్యజీవములోనికి ప్రవేశింప జేయుటకు కన్యకయైన మరియనుండి భూలోకములో అవతరించిన దైవరూపమే యేసు అను నరరూపము. ఈయన ద్వారా సకల నరకోటికి ఆత్మీయ రక్షణ మరియు మోక్షానికి మార్గము ఏర్పడింది. అనగా మరణాన్ని జయించి పునరుత్ధానుడై, మహిమరాజ్యములో ప్రవేశించే యోగ్యత సకలనరకోటికి అనుగ్రహించిన మొదటి రక్షకుడు మరియు విమోచకుడు ఈయనే అని ప్రవచనము ఘోషిస్తున్నది. ఈయనద్వారానే తప్ప మరెవరి ద్వారా రక్షణ లేదనే సత్యాన్ని కూడ వేదగ్రంథము ఘోషిస్తున్నది. ఇట్టి లోకరక్షకుడైన ప్రభువు నరావ తారములో నరులకు సంక్రమించియున్న పాపము మరణము అను శిక్షయొక్క చేదు అనుభవాన్ని తన శరీరము ద్వారా ప్రయో గాత్మకముగా బయల్పరచి, నరుడు పొందవలసిన శిక్షను తాను పొంది, ఆ శిక్షకు ఫలితమైన మరణాన్ని తాను అనుభవించి, తనయందు విశ్వాసముంచిన వ్యక్తికి తనవలె పాపమును మరణమును జయించేటటువంటి శక్తి పొందగలడని నిరూపించాడు. అంతేకాదు అట్టివాడు జీవమార్గములో ప్రవేశించి సుస్థిరమైన మోక్షరాజ్యమును పొందుచు, దైవత్వముతో సమకాలికముగా దేవునిరాజ్యములో నిత్యా నందము పొందగలడని వేదరీత్యా ఋజువుపరచినవాడే - ఈ మృతుడనైతినిగాని ఇదిగో యుగయుగములు సజీవుడనై యున్నాను అన్న క్రీస్తు. ఇట్టి మహిమాన్వితశక్తి ప్రభావితమైన క్రీస్తు నేటి యుగములో క్రైస్తవ విశ్వాసులైన మనతో నిత్యము మన ప్రార్థనాజీవితములో వేదధ్యానములో విశ్వాసుల సావాసములో ఆయన సన్నిధిలో ఆయన ఆత్మ తప్పక మనలను కాపాడుతుందన్న సత్యాన్ని ఈనాడు అనేక క్రైస్తవ జనాంగముల మధ్య ప్రభువు ఋజువుపరచుచున్నాడు. అందుకే, ''మృతుడనైతిని గాని ఇదిగో యుగయుగములు సజీవుడనైయున్నాను,'' అన్న మాటను ప్రవచిస్తున్నాడు. వాస్తవానికి ఆయన మృతుడు కాడు. ఆయన సజీవుడే.
దైవకుమారుడు దైవత్వములో ఒక అంశమైన యేసుక్రీస్తునకు మరణమన్నది లేదు గదా! అయితే ఆయన మరణించాడనుటలో అర్థమేమిటి? యేసుక్రీస్తు పొందిన మరణమన్నది కేవలము ఒక ముసుగు లేక తెర అని చెప్పవచ్చును. ఈ విధముగా మన పాపములకొరకు మృతి పొందిన క్రీస్తు తిరిగి పునరుత్థానుడై లేచి సజీవుడుగా యున్నాడు. భూమి పుట్టక మునుపు ఉన్నాడు. భూమిని సృజించునప్పుడు ఉన్నాడు. మోషే కాలములో బండగా ఉన్నాడు. నూతన నిబంధన కాలములో భూమిమీద కన్య ద్వారా అవతరించాడు. సిలువ బలియాగము ద్వారా మరణించి అనేకులకు విమోచన దయచేసి, తిరిగి ఆదివారము తెల్లవారుజామున పునరుత్థానుడై అనేకులకు అగుపడినాడు. అంతేకాదు ఇప్పటికిని సజీవుడుగా విశ్వసించినవారికి కనబడుచూనే యున్నాడు. తరువాత ప్రకటన 21:3లో వలె క్రీస్తు పరిశుద్ధులతో నివసించును.
క్రీస్తు ప్రభువు సజీవుడను అని చెప్పుకొనవలసిన అవసరత ఏముంది? తండ్రియైన దేవుడు లోకరీత్యా మరణించలేదు. కాని క్రీస్తు ప్రభువు మన పాపముల కొరకు సిలువ బలియాగము చేసి మరణించారు. పునరుత్థానము ద్వారా తిరిగి లేచినను కొందరి దృష్టి ఆయన ఒక మంచి మనిషి ఆయన సిలువలో మరణించాడు అని మాత్రమే చెప్పుకొందురు. కాని వీరు ఆయన తిరిగి లేచాడు అని అంటే ఒప్పుకోరు. అంతెందుకు ఆయన పండ్రెండు మంది శిష్యులలో తోమా ఆయన లేచిన సంగతి నమ్మలేదు. కనుకనే తననుగూర్చి సజీవుడుగా సాక్ష్యమిస్తున్నాడు. కనుక క్రీస్తు యుగయుగములకు సజీవుడు. ఆమేన్.
ప్రకటన 1:18, ''మరియు మరణముయొక్కయు పాతాళ లోకముయొక్కయు తాళపుచెవులు నా స్వాధీనములోఉన్నవి.''
మన గృహాలలో మనము మన ధనాన్ని భద్రపరచుటకు నానావిధమైన తాళపు బుర్రలు, తాళపు చెవులు ఉపయోగిస్తాము. ప్రతి గృహములోను ఉండే బీరువాకు చేతి సంచులకు సూట్ కేసులకు అనేక రకములైన తాళములు, తాళపు చెవులు వాడుచున్నాము. తుదకు మనము ఇంటి నుండి బయటకు వెళ్ళెటప్పుడు ఇంటికి వేసే తాళపు బుర్ర మరియు తాళపు చెవులు రక్షణార్థముగ వాడబడుచున్నవి. ఇవి ఇహలోక సంబంధమైనవి. దొంగకు ఇవి అసాధ్యమైనవి కావు. ఏ విధముగానైనను బుర్రను బద్దలు కొట్టి లేక మారు తాళాలు వేసి దొంగతనము జరిగించగలడు. ఇవి దృశ్యమైనవి. ఇక మరణము - పాతాళలోకము, ఇవి రెండును దృశ్యమైనవి కావు అనగా కంటికి కనబడేవి కావు. అయితే మన మూలవాక్యములో మరణమునకును పాతాళ లోకానికిని తాళపు చెవులున్నట్లుగా వ్రాయబడియున్నది. ఒక జీవియొక్క అంతము శాశ్వతముగా సమాప్తము కావాలంటే దానియొక్క తాళపుచెవి మరణము.
ఈ లోకములో చిన్న పెద్ద రకరకాల తాళపుచెవులు ఉన్నట్లుగానే మరణానికి కూడ నానా రకాలైన తాళాలున్నవి. కాని మరణము అను బుర్ర ఒక్కటే. ఈ మరణము అన్నది జబ్బు, తెగులు, ప్రమాదము, హత్య, ఆత్మహత్య ద్వారా ఆయుర్దాయము లేక అకాలముగా వచ్చును. మరణముయొక్క తాళపు బుర్ర ఒక జీవియొక్క జీవితములో ఏనాటికైనను వేయబడేది ఖాయము. మరణమన్నది ప్రతి యొక్కరికి వచ్చేది అనిన సత్యము మనకు తెలిసిందే. అయితే మరణదూత వేసే బుర్ర అది ఒక నరునియొక్క జీవితాన్ని అంతమొందించేవరకు దానికివ్వబడిన అధికారము. అనగా ప్రతి వ్యక్తికి మరణము ఒక్కసారే జరుగును. ప్రతి వ్యక్తిపై మరణమునకు అధికారమున్నది. మరణపు తాళపుచెవితో ఒక వ్యక్తియొక్క జీవితమును మరణము అను బుర్ర ద్వారా సమాప్తము చేసే దూతకు మృత్యుసంబంధ అధికారము తప్ప, మరల చనిపోయిన వ్యక్తిని బ్రతికించుటకు అధికారము లేదు. ఎందుకనగా మరణదూతకు భూమికి పునాదులు వేయబడినప్పుడే దేవుని చేత అధికారము ఇయ్యబడియున్నది. మృతులు మృతులేగాని వారిని సజీవులుగా లేపుటకు మరణదూతకు అధికారము లేదు. మరణదూత క్రియ వేరు. పునరుత్థాన క్రియలో మృతులను సజీవులుగా చేసే అధికారము పొందిన దూత వేరు. మరణమును జరిగించు కాలము వేరు. పునరుత్థాన క్రియను జరిగించే కాలము కూడ వేరు. ఇందునుగూర్చి 1 థెస్సలొనీక 4:16, ''ఆర్భాటముతోను, ప్రధానదూత శబ్దముతోను, దేవునిబూరతోను పరలోకమునుండి ప్రభువు దిగివచ్చును; క్రీస్తునందుండి మృతులైనవారు మొదట లేతురు.'' 1 కొరింథీ 15:51-52, ''మనమందరము నిద్రించముగాని నిమిషములో, ఒక రెప్ప పాటున, కడబూర మ్రోగగానే మనమందరము మార్పు పొందుదుము. బూర మ్రోగును; అప్పుడు మృతులు అక్షయులుగా లేపబడుదురు, మనము మార్పు పొందుదుము.''
ఇది పునరుత్థాన సమయ సంబంధిత అధికారము పొందిన దూతకు దేవుడు ఇచ్చిన అధికారము. ఇక్కడ ఈ తాళపుచెవి ఒక బూర నుంచి వచ్చు శబ్దముగా మనకు తెలియుచున్నది. ఈ దూత శబ్దమును బూర ద్వారా చేసినప్పుడు మరణపు తాళము తీయబడి ఒక్క క్షణములోనే అందరు మహిమశరీరమును పొంది తిరిగి లేపబడుదురు. ఈ తాళపుచెవి క్రీస్తు ప్రభువుయొక్క ఆధీనములోనే ఉన్నది. లోకములో నరులు వేసికొనే తాళపుచెవులలో ఒక బుర్రకు వేసిన తాళపుచెవి మరొక బుర్రకు వేయబడుటకు పనికిరాదు. అలాగే మరణదూత వేసిన తాళపుచెవి పునరుత్థాన క్రియకు ఆ తాళపుచెవి పనికిరాదు. పునరుత్థాన తాళపుచెవి మరణానికి పనికిరాదు అని ఇందునుబట్టి మనకు తెలియుచున్నది. మరణదూత వేరు. పునరుత్థాన దూత వేరు. మరణదూత ఎలాంటి హెచ్చరిక, సమయము, కాలము, వయోపరిమితి, సందర్భము వగైరాలను పాటించక, నరజీవితము పట్ల దయాదాక్షిణ్యము లేకుండ తన క్రియను జరిగిస్తున్నది. ఆదిలో సృష్టికర్తయైన దేవుడు ఈ మరణదూతకు ఇచ్చిన అధికారమునుబట్టి తల్లి గర్భమునుండి భూమిలో పుట్టిన ప్రతి నరునికిని వాని అంతము కొరకు నియమించబడియున్నది.
మరణమన్నది ఒక బుర్ర. మరణ క్రియకు మూలము ఒక దూత. ఆ దూతయొక్క హస్తములో ఈ మరణ తాళపుచెవి ఉన్నదనుటకు నిదర్శనముగా వేదరీత్యా కొన్ని నిరూపణలు మనకున్నవి. దైవకుమారుడు మన రక్షకుడు ప్రభువైన యేసుక్రీస్తు రెండు విధములైన తాళపుచెవులనుగూర్చి ప్రవచించిన వచనాలనుబట్టి తెలుసుకొందము. మత్తయి 24:31, ''మరియు ఆయన గొప్ప బూరతో తన దూతలను పంపును. వారు ఆకాశము యొక్క ఈ చివరనుండి ఆ చివరవరకు నలుదిక్కులనుండి ఆయన ఏర్పరచుకొనిన వారిని పోగు చేతురు.'' మత్తయి 25:31, ''తన మహిమతో మనుష్యకుమారుడును ఆయనతో కూడ సమస్త దూతలును వచ్చునప్పుడు ఆయన తన మహిమగల సింహాసనము మీద ఆసీనుడై యుండును,'' అనుటలో దైవకుమారునియొక్క రాకడలో ఆయన ఒక్కడే గాకుండ సమస్త దూతల సమేతుడై రాబోవుచున్నట్లుగా మనకు తెలియుచున్నది. ఆ సమయములో ఆయన మహిమగల సింహాసనముమీద ఆసీనుడైయున్నట్లును వ్రాయబడియున్నది. అప్పుడు మనుష్యకుమారుడుతో బాటుగా సమస్తమైన దూతలు, అందులో మరణ దూత, మరణము నుండి పునరుత్థానము కల్గించే బూర ఊదే దూతలు, చనిపోయిన సమస్త జనులను ప్రోగుచేయు దూతలు, ''గొల్లవాడు మేకలలో నుండి గొఱ్ఱెలను వేరుపరచునట్లు,'' ఆ పోగు చేయబడినవారిని తరగతులవారీగా విభజించే దూతలు, ప్రభువుయొక్క కుడిఎడమల వైపు ఈయొక్క జనాభాను చేర్చే దూతలు కొందరున్నట్లుగా మనకు తెలియుచున్నది.
మరణము, పాతాళ లోకము, మరియు పరలోకపు తాళపుచెవులు క్రీస్తు ప్రభువు కలిగియున్నట్లుగా మత్తయి 25వ అధ్యాయములో వివరముగా వివరించబడియున్నది. మత్తయి 25:34, ''అప్పుడు రాజు తన కుడివైపున ఉన్నవారిని చూచి-నా తండ్రిచేత ఆశీర్వదింపబడిన వారలారా, రండి; లోకము పుట్టినది మొదలుకొని మీకొరకు సిద్ధపరచ బడిన రాజ్యమును స్వతంత్రించుకొనుడి.'' ఈ వచనములో పరలోకపు తాళపుచెవి, క్రీస్తు ప్రభువు దగ్గర ఉన్నట్లుగా కనబడుచున్నది. ఈ తాళపుచెవితో తనయందు విశ్వాసిగా ఉండి మృతులలోకములో ఉన్నవానికి ప్రభువు ఇచ్చిన మహిమగల రాజ్యమే ఈ పరలోకము. ఈ రాజ్యప్రవేశమునకు కావలసిన తాళపుచెవి ప్రభువైన యేసుక్రీస్తుయొద్ద ఉన్నట్లుగా ఇందునుబట్టి తెలుస్తున్నది. మరియు దూత చేతి తాళపుచెవులలో రెండు విధానములున్నవి. యోహాను 5:24, ''నా మాటవిని నన్ను పంపినవానియందు విశ్వాసముంచువాడు నిత్య జీవము కలవాడు; వాడు తీర్పులోనికి రాక మరణములోనుండి జీవములోనికి దాటి యున్నాడు.'' ఈ వచనమునుబట్టి క్రీస్తు ప్రభువు మరణము నుండి జీవమునకు దాటించు తాళపుచెవులు కలిగియున్నట్లుగా తెలియుచున్నది. మత్తయి 25:41, ''అప్పుడాయన యెడమవైపున ఉండువారిని చూచి-శపింప బడినవారలారా, నన్ను విడిచి అపవాదికిని వాని దూతలకును సిద్ధపరచబడిన నిత్యాగ్నిలోనికి పోవుడి.'' ఇందునుబట్టి క్రీస్తు ప్రభువు దగ్గర నిత్య నరకాగ్నికి సంబంధించిన పాతాళలోకపు తాళపుచెవి కూడ ఉన్నట్లుగా ఈ వచనము ద్వారా తెలియుచున్నది.
అయితే మరణము రెండు విధములు. కీర్తన 116:15, ''యెహోవా భక్తుల మరణము ఆయన దృష్టికి విలువగలది.'' ప్రకటన 14:13, ''అంతట-ఇప్పటినుండి ప్రభువునందు మృతినొందు మృతులు ధన్యులని వ్రాయుమని పరలోకమునుండి యొక స్వరము చెప్పగా వింటిని. నిజమే; వారు తమ ప్రయాసములు మాని విశ్రాంతి పొందుదురు; వారి క్రియలు వారి వెంట పోవునని ఆత్మ చెప్పుచున్నాడు.'' ఇది ఆశీర్వాదకరముగా మరణించిన బిడ్డలకు దేవుడు అనుగ్రహించిన బహుమానము, స్వాస్థ్యము.
రెండవది శాపగ్రస్థమైన మరణము. మత్తయి 25:41, ''అప్పుడాయన యెడమ వైపున ఉండువారిని చూచి-శపింప బడినవారలారా, నన్ను విడిచి అపవాదికిని వాని దూతలకును సిద్ధపరచబడిన నిత్యాగ్నిలోనికి పోవుడి.'' ఈ మరణమునకు ఫలితము అపవాదికిని అతని దూతలతో సావాసము మరియు నిత్యనరకాగ్నితో కూడిన శిక్ష. ఇందులో మొదటి దానికి ఫలితము నిత్యజీవము, రెండవ దాని ఫలితము నిత్యనరకము. ఇటువంటి ఫలములతో కూడిన మరణము మరియు పాతాళముయొక్క తాళపుచెవులు ప్రభువు వశములో ఉన్నట్లును, వీటినుండి ఎవరును తప్పించుకొనలేడని తెలియుచున్నది. ఈ మరణము తరువాత ఆత్మలు ఉండుటకు రెండు విధములైన స్థలములు కలవు. ఇందులో మొదటిది సమాధానయుతమైనది, రెండవది వేదనకరమైనది. ఈ తాళపుచెవులకు యజమాని తండ్రియైన దేవుడు. ఈ తాళపుచెవులమీద అధికారము మాత్రము మన రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువుదే. వీటిని నరులలో క్రియ జరిగించువాడు పరిశుద్ధాత్మ దేవుడని ఈ క్రింది వేదభాగాల ద్వారా తెలిసికొందము. ఉదా :- ఈ తాళపుచెవులయొక్క అనుభవమును పొందినవారు అపొస్తలుల కార్యములు 5:1-11లోను అననీయ సప్పీరా అను నరజంట. వారు దైవత్వమునకు అర్పణగా తెచ్చుటకు ప్రమాణము చేసి తమ స్వంత ఆస్తిని అమ్ముకొని అపొస్తలుల పాదాలయొద్ద వారు అమ్మిన వెలలో కొంత దాచుకొని ఉంచినప్పుడు, అపొస్తలుల కార్యములు 5:3, ''అప్పుడు పేతురు-అననీయా, నీ భూమి వెలలో కొంత దాచుకొని పరిశుద్ధాత్మను మోసపుచ్చుటకు సాతాను ఎందుకు నీ హృదయమును ప్రేరేపించెను?'' అని అనుటలో అననీయ పరిశుద్ధాత్మనే మోసపుచ్చాడు అని ఇందునుబట్టి తెలియుచున్నది. మోసము, కపటము, ఈర్ష్యా, ద్వేషము వగైరా కుత్సిత గుణములుగల వ్యక్తి పట్ల పరిశుద్ధాత్ముడు వాడిన తాళపుచెవి మరణము. కనుక మరణముయొక్క తాళపుచెవి ద్వారా మరణించిన నరుని పాతాళ తాళపుచెవి భద్రపరచును. ఇది సృష్టికర్తయైన ప్రభువుయొక్క స్వాధీనములో ఉన్నట్లును, ఆయన వీటిని నరులమైన మనపట్ల ప్రయోగిస్తున్నట్లును, ఆదికాండము రెండు మూడు అధ్యాయాలలోనే ఈ మరణమునకు, పాతాళమునకు ప్రారంభోత్సవ క్రియ జరిగినట్లు వేదములో చదువగలము.
ఈ మరణముయొక్క తాళపుచెవులు ఏదెను వన మధ్య భాగములో నిషేధించిన చెట్టు ఫలములో ఇమిడియున్నది. అందుకు ఋజువు దేవుడు ఆదాముతో పలికిన మాటయే. ఆదికాండము 2:16-17, ''మరియు దేవుడైన యెహోవా-ఈ తోటలోనున్న ప్రతి వృక్ష ఫలములను నీవు నిరభ్యంతరముగా తినవచ్చును; అయితే మంచిచెడ్డల తెలివినిచ్చు వృక్ష ఫలములను తినకూడదు; నీవు వాటిని తినుదినమున నిశ్చయముగా చచ్చెదవని నరుని కాజ్ఞాపించెను.'' ఇందునుబట్టి అంతవరకు దేవునియొద్దనున్న మరణముయొక్కయు పాతాళముయొక్కయు తాళపుచెవులు ఆయనయొద్ద మూలనపడియున్నవి. కాని ఈ లోకములో సృష్టి పుట్టింది లగాయతు దేవుని వద్దయున్న ఈ తాళపుచెవులు వాడియుండలేదు. కాని దేవుడు హెచ్చరిక ఇచ్చాడు. అయితే మంచిచెడ్డల తెలివినిచ్చు వృక్షఫలములను నీవు తినకూడదు. అనగా మరణముయొక్కయు పాతాళముయొక్కయు తాళపుచెవికి - నీకును నీ తరమువారికిని పని పెట్టినవాడవగుదువు. కనుక నీవు జాగరూకుడవై యుండు మని హెచ్చరించాడు. అయితే దైవలోకమునుండి శపించబడి, పాతాళమునకు పడవేయ బడిన అపవాది తనకు జరిగిన పరాభవమునకు ఉగ్రుడై దేవునియొక్క జీవాత్మతో రూపించ బడిన నరజీవుడు నిత్యజీవుడుగా ఉండుటకు వీలులేదు. మరియు తనవలె నరుడు కూడ పాతాళలోకాన్ని అనుభవించాలన్న ఉద్దేశ్యముతో సంకల్పించినవాడై, సర్పమును ఆవేశించి, మానవ భాషలో స్త్రీతో మాట్లాడినాడు. మొట్టమొదట స్త్రీ, ఆ తరువాత పురుషుని దైవనిషేధఫలమును భక్షింపజేసి, నరులను దైవాజ్ఞాతిక్రమము ద్వారా దోషులుగా దేవుని ముందుంచాడు. ''నీవు వాటిని తినుదినమున నిశ్చయముగా చచ్చెదవు,'' అను మాట దేవుడు అమలు చేయునట్లుగా సాతాను జరిగించిన క్రియ. ఈ విధముగా దైవ వాక్కుతో అమలులోకి వచ్చిన మరణముయొక్క తాళపుచెవి మొట్టమొదట నరులమీద ఏ విధముగా ప్రయోగింపబడినది? ఆదాము దంపతులకు జన్మించిన సంతానమైన కయీను హేబెలులలో మొట్టమొదటిగా దేవునియొక్క రెండు తాళపుచెవులు క్రియ జరిగించాయి. ఒకడు చచ్చాడు, మరొకడు శాపగ్రస్థుడయ్యాడు. ఇంతటితో మరణము పాతాళముయొక్క ప్రభావము ఆగలేదు. అయితే ఇది ప్రారంభము మాత్రమే.
ఈ విధముగా కయీను జరిగించిన హత్యనుండి ఈ మరణముయొక్క తాళపుచెవికి పనిబడింది. కయీను హత్యానేరమునుబట్టి కయీను నరుడయ్యాడు. కయీనుకు పుట్టిన కుమార్తెలు నరుల కుమార్తెలుగా పిలువబడినారు. అలాగే ఆదాము కుమారులలో కయీను హేబెలు తరువాత పుట్టిన కుమారులు దేవునికుమారులుగా పిలవబడిరి. వేదములో ఆది కాండము ఆరవ అధ్యాయములో ప్రవచింపబడియున్న ప్రకారము దేవునియొక్క తాళపు చెవులలో మరణము పాతాళము అను తాళపుచెవులకు అప్పటిలో గొప్ప పనిబడింది. ఎలాగంటే భూమిమీద నరులు విస్తరింపనారంభించిన తరువాత నరులను దేవుడు పరిశోధించినప్పుడు, రోమా 1:19-20, ''ఎందుకనగా దేవునిగూర్చి తెలియ శక్యమైనదేదో అది వారి మధ్య విశదమైయున్నది; దేవుడు అది వారికి విశదపరచెను. ఆయన అదృశ్య లక్షణములు, అనగా ఆయన నిత్యశక్తియు దేవత్వమును, జగదుత్పత్తి మొదలుకొని సృష్టింపబడిన వస్తువులను ఆలోచించుటవలన తేటపడు చున్నవి గనుక వారు నిరుత్తరులై యున్నారు.'' మరియు రోమా 1:24-27, ''ఈ హేతువుచేత వారు తమ హృదయముల దురాశలను అనుసరించి, తమ శరీరములను పరస్పరము అవమాన పరచుకొనునట్లు దేవుడు వారిని అపవిత్రతకు అప్పగించెను. అట్టివారు దేవుని సత్యమును అసత్యమునకు మార్చి, సృష్టికర్తకు ప్రతిగా సృష్టమును పూజించి సేవించిరి. యుగముల వరకు ఆయన స్తోత్రార్హుడై యున్నాడు, ఆమేన్. అందువలన దేవుడు తుచ్ఛమైన అభిలాషలకు వారిని అప్పగించెను. వారి స్త్రీలు సయితము స్వాభావికమైన ధర్మమును విడిచి స్వాభావిక విరుద్ధమైన ధర్మమును అనుసరించిరి. అటువలె పురుషులు కూడ స్త్రీయొక్క స్వాభావికమైన ధర్మమును విడిచి, పురుషులతో పురుషులు అవాచ్యమైనదిచేయుచు, తమ తప్పిదమునకు తగిన ప్రతి ఫలమును పొందుచు ఒకరియెడల ఒకరు కామతప్తులైరి.'' రోమా 1:28, ''మరియు వారు తమ మనస్సులో దేవునికి చోటియ్య నొల్లకపోయిరి గనుక చేయరాని కార్యములు చేయుటకు దేవుడు భ్రష్ట మనస్సుకు వారినప్పగించెను.'' ఇదియొక తాళపుచెవి. ఈ తాళపుచెవియొక్క ప్రభావమునుగూర్చి రోమా 1:29-32 చదివితే ఇట్టివారిని మరణానికి అప్పగించినట్లు తెలియుచున్నది.
1 సమూయేలు 28వ అధ్యాయములో ఫిిలిష్తీయులు అధిక సైనికశక్తితో మహా బలశాలురై అత్యధికమైన సైన్యముతో సౌలును ముట్టడించినప్పుడు, సౌలు దేవునిగూర్చి విచారణ చేయలేదు. ఒకప్పుడు సౌలు తాను రాజుగా ఇశ్రాయేలును ఏలిన కాలములో చిల్లంగివారిని, సోదెవారిని, కర్ణ పిశాచి చెప్పు తాంత్రికులను మొదలైనవారిని తన దేశములోనే లేకుండ చేశాడో, అట్టి రాజైన సౌలు తన ఆపద సమయములో తనకు సంభవించిన భయంకరమైన విషాదకరమైన సంఘటనకు తను ఏ దేవుడైతే ఇశ్రాయేలుకు రాజుగా నియమించాడో - ఆ దేవునియొద్దకు వెళ్ళి మోకరించి, సాష్టాంగ నమస్కారము చేస్తూ - ప్రభువా, యెహోవా! గాడిదల కాపరియైన నన్ను, ఎన్నిక లేని నన్ను, రాచరికమంటే ఏమిటో ఎరుగని నన్ను, రాజుగా నీవు నియమించుటకు యోగ్యత లేని నన్ను నీ ప్రవక్త ద్వారా రాజుగా ప్రతిష్టించి నియమించి నీ జనాంగమునకు రాజుగా ఎన్నిక చేసావు; నా అవిధేయతను బట్టి నేను నిన్ను విసర్జించి చేసిన నేరాలనుబట్టి నన్ను విడవక క్షమించి, నీవే నా పక్షముగా యుద్ధము చేసి, నీ జనాంగమైన ఇశ్రాయేలుకును నీ దాసుడైన నాకును నీ రక్షణతో కూడిన నీ విజయాన్ని ప్రసాదించమని అడుగవలసియుండగా అందుకు బదులుగా తాను నిషేధించిన సోదెకత్తె దగ్గరకు భయానకమైన వాతావరణములో మారువేషములో తన రాచరికమును కనబడనీయక, ఒక పిరికివానివలె సామాన్య నరుని కంటెను హీనాతిహీన స్థితికి దిగజారి వెళ్ళాడు. సోదెకత్తె వద్దకు వెళ్ళుటకు బదులుగా దావీదును శరణు వేడినట్లయినను తన ప్రాణము కాపాడబడి యుండవచ్చును. అట్లుగాక పిరికితనముతో ఆ సోదెకత్తెకు కూడ జంకి, అంటే సోదె చెప్పేదానికి కూడ తన రాచరికాన్ని దాచి, సోదె అడుగు సందర్భములో సోదెకత్తెతో-నేను మహా ఉపద్రవములో ఉన్నాను. యుద్ధ మేఘాలు ఆవరించియున్నవి. మరణ బంధకాలు చుట్టుముట్టియున్నవి అని చెప్పెను.
1 సమూయేలు 28:10-14, ''అందుకు సౌలు-యెహోవా జీవముతోడు దీనిని బట్టి నీకు శిక్ష యెంత మాత్రమును రాదని యెహోవా నామమున ప్రమాణము చేయగా ఆ స్త్రీ-నీతో మాట లాడుటకై నేనెవని రప్పింపవలెనని యడుగగా అతడు-సమూయేలును రప్పింపవలెననెను. ఆ స్త్రీ సమూయేలును చూచినప్పుడు బిగ్గరగా కేకవేసి-నీవు సౌలువే; నీవు నన్నెందుకు మోసపుచ్చితివని సౌలుతో చెప్పగా రాజు-నీవు భయపడవద్దు, నీకు ఏమి కనబడినదని ఆమె నడుగగా ఆమె-దేవతలలో ఒకడు భూమిలోనుండి పైకి వచ్చుట నేను చూచుచున్నాననెను. అందుకతడు-ఏ రూపముగా ఉన్నాడని దాని నడిగినందుకు అది-దుప్పటి కప్పుకొనిన ముసలివాడొకడు పైకి వచ్చుచున్నాడనగా సౌలు-అతడు సమూయేలు అని తెలిసికొని సాగిలపడి నమస్కారము చేసెను.'' దేవుడు సౌలును రాజుగా అభిషేకించి ప్రతిష్టించి, వాని సాధారణ స్థితి నుండి ఉన్నత స్థితికి తీసుకువచ్చి, తన జనాంగమైన ఇశ్రాయేలుపై పరిపాలకునిగ చేసినందుకు, సౌలు కృతజ్ఞతాహీనుడై ప్రవర్తించుటయేగాక దైవచట్టమునకు వ్యతిరేకముగా సోదె అను దైవవ్యతిరేక క్రియకు పాల్పడినాడు. అయినను దేవుడు సౌలుపై ఆగ్రహింపక అతనికి కనువిప్పు కలిగించేందుకు సోదె చెప్పు స్త్రీ ఇంట భూమినుండి పాతాళపు చెవిని తెరచి తన ప్రవక్తయైన సమూయేలు రూపములో ఒక ఆత్మను రప్పించి సౌలునకు బుద్ధి నేర్పుట కొరకేగాని సొదెకత్తెయొక్క మాంత్రికము ద్వారా ఆ క్రియ జరుగలేదు. కాని సౌలునుబట్టి ఆయన పాతాళపు తాళపు చెవిని తెరచి, పాతాళములో ఉన్న ఒక శవాన్ని సమూయేలు రూపములో మలిచి అనగా భ్రమపరచు ఆత్మను చూపించాడు. అంతేగాని సోదెకత్తె దగ్గర పాతాళపు తాళపుచెవి లేదు. దైవనిర్ణయము ఆయన ప్రణాళిక ఆయన నిర్ణయము సౌలునకు కుటుంబసమేతముగా యుద్ధరంగములో జరుగబోయే దిక్కులేని మరణమునుగూర్చి ఆ ప్రేతాత్మ చేత పలికించాడు. ప్రకటన 6:9, ''ఆయన అయిదవ ముద్రను విప్పినప్పుడు, దేవుని వాక్యము నిమిత్తమును, తాము ఇచ్చిన సాక్ష్యము నిమిత్తమును వధింపబడినవారి ఆత్మలను బలిపీఠము క్రింద చూచితిని.'' మరియు ప్రకటన 6:11, ''తెల్లని వస్త్రము వారిలో ప్రతివాని కియ్యబడెను; మరియు వారివలెనే చంపబడబోవువారి సహదాసులయొక్కయు సహోదరులయొక్కయు లెక్క పూర్తియగువరకు ఇంక కొంచెము కాలము విశ్రమింపవలెనని వారితో చెప్పబడెను.'' ఇందులో బలిపీఠము పరలోకములో ఉండునుగాని పాతాళములో కాదు. దీని క్రింద హతసాక్షులు ఉన్నారు. వీరిని ఇంకొంత కాలము విశ్రాంతిలో ఉండమని చెప్పబడినది. అనగా పరిశుద్ధులు పాతాళములో ఉండరని తెలియుచున్నది. వీరికి సమాధానకరమైన ప్రాంతము అనగా పరదైసులో విశ్రమించియుంటారు. అయితే సౌలు విషయములో సమూయేలు పాతాళమునుండి వచ్చినట్టుగా కనబడినది. ఇవి సాతాను అతని దూతలే! ఎందుకంటే పాతనిబంధన కాలములో సమూయేలు మహాప్రవక్త. ఈయన మరణానంతరము పాపులవలె పాతాళములో బంధింపబడి బాధను అనుభవించవలసిన అవసరము లేదు. అయితే ఇక్కడ కనబడిన ఆత్మ ఎవరిది? సాతాను దూతదే! ఎందుకంటే సౌలు వెళ్లినది ప్రవక్తల దగ్గరకు కాదు, సోదెకత్తె దగ్గరకు వెళ్ళాడు. సోదెకత్తె దగ్గర సాతాను అతని దూతలు గాక దేవుని ప్రవక్తలు ఉంటారా?
ధనవంతుడు అనగా మహాభోగియైన వానిని దేవుడు పాతాళములో అప్పగించుట లూకా 16:19-23లోని ధనవంతుడు - లాజరు ఉపమానములో మనకు తెలిసిందే. ''ఆ దరిద్రుడు (లాజరు) చనిపోయి దేవదూతలచేత అబ్రాహాము రొమ్మున (ఆనుకొనుటకు) కొనిపోబడెను. ధనవంతుడు కూడ చనిపోయి పాతిపెట్టబడెను. అప్పుడతడు పాతాళములో బాధపడుచు, కన్నులెత్తి దూరమునుండి అబ్రాహామును అతని రొమ్మున (ఆనుకొనియున్న) లాజరును చూచి -తండ్రివైన అబ్రాహామా, నాయందు కనికరపడి, తన వ్రేలికొనను నీళ్ళలోముంచి నా నాలుకను చల్లార్చుటకు లాజరును పంపుము;'' ఇందునుబట్టి లోకరీత్యా ధనవంతునికి మేడలు - ధాన్యాన్ని నిలువజేసికొనే కొట్లు, పశుశాలలు, విలాసమందిరాలు మొదలైనవి ఎన్నో ఉండవచ్చును. వాటి సంబంధిత తాళాలు తన చేత ఉంచుకొని అతను లోకాన్ని అనుభవించాడు. అతడు చనిపోయిన తర్వాత దేవుడు అతనిని తనవద్దనున్న మరణపు తాళపుచెవి ద్వారా భూమిని తెరిపించి, పాతాళములో వేదనకరమైన వాతావరణములో ఉంచి అతనిని బంధించినట్లు చదువగలము. లూకా 16:26, ''అంతేకాక ఇక్కడనుండి మీ యొద్దకు దాట గోరువారు దాటి పోజాలకుండు నట్లును, అక్కడి వారు మాయొద్దకు దాటి రాజాలకుండునట్లును, మాకును మీకును మధ్య మహాఅగాధముంచబడియున్నదని చెప్పెను.''
ఈ విధముగా పాతాళమునుండి తప్పించుకొని దాటకుండ ఉండుటకు అదృశ్య మైన అభేద్యమైన తాళము ఉన్నదని చెప్పెను. ధనవంతుడు ఉన్నట్టి ఈ స్థలము ఎవరిది? ప్రకటన 20:1-3, ''మరియు పెద్దసంకెళ్ళను చేత పట్టుకొని అగాధముయొక్క తాళపుచెవిగల యొక దేవదూత పరలోకమునుండి దిగివచ్చుట చూచితిని. అతడు ఆదిసర్పమును, అనగా అపవాదియు సాతానును అను ఆ ఘటసర్పమును పట్టుకొని వెయ్యి సంవత్సరాలు వానిని బంధించి అగాధములో పడవేసి, ఆ వెయ్యి సంవత్సరములు గడుచువరకు ఇక జనములను మోసపరచకుండునట్లు అగాధమును మూసి దానికి ముద్రవేసెను;'' ఈ స్థలములో నరులనేగాక దేవదూతలనుకూడ దేవునియొక్క తాళపుచెవులు బంధించినట్లుగా చదువగలము. 2 పేతురు 2:4, ''దేవదూతలు పాపము చేసినప్పుడు దేవుడు వారిని విడిచిపెట్టక, పాతాళలోకమందలి కటికచీకటిగల బిలములలోనికి త్రోసి, తీర్పుకు కావలిలో ఉంచబడుటకు వారిని అప్పగించెను.'' మరియు యూదా 1:6, ''మరియు తమ ప్రధానత్వ మును నిలుపుకొనక, తమ నివాసస్థలములను విడిచిన దేవదూతలను, మహాదినమున జరుగు తీర్పువరకు కటికచీకటిలో నిత్యపాశములతో ఆయన బంధించి భద్రము చేసెను.''
ఈ మరణము ద్వారా పాతాళమునకు చేరినవారిని విడుదల చేయుటకు క్రీస్తు ప్రభువు నా స్వాధీనములో వాటి తాళపుచెవులు ఉన్నాయి. కాబట్టి భయపడకుము అని యోహానునకు తెలియజేయుచున్నాడు. క్రీస్తు ప్రభువు తాళపుచెవులు కలిగియున్నాడు అనుటలో ఒక ఋజువు. ప్రకటన 6:7-8, ''ఆయన నాలుగవ ముద్రను విప్పినప్పుడు-రమ్ము అని నాలుగవ జీవి చెప్పుట వింటిని. అప్పుడు నేను చూడగా, ఇదిగో పాండుర వర్ణముగల ఒక గుఱ్ఱము కనబడెను; దానిమీద కూర్చున్నవాని పేరు మృత్యువు. పాతాళ లోకము వానిని వెంబడించెను. ఖడ్గమువలనను కరవువలనను మరణమువలనను భూమిలోనుండు క్రూర మృగములవలనను భూనివాసులను చంపుటకు భూమియొక్క నాలుగవ భాగముపైన అధికారము వారికియ్యబడెను.'' ఈ నాలుగవ ముద్రను విప్పిన మృత్యువు అనువాడు బయలుదేరి భూనివాసులలో నాలుగవ భాగము చంపుటకు అనుమతి ఇవ్వబడినది. ఈ మరణముద్వారా చంపబడినవారిని పాతాళలోకము తనలో చేర్చుకొనుటకు ఈ మరణమును వెంబడిస్తున్నట్లుగా చదువగలము. పాతాళ లోకమును వెంబడించుచున్న మరణము, నాలుగవ వంతు భూనివాసులను చంపుటకు తాళపుచెవి ముద్ర రూపములో విప్పబడినది. ఇంతకి ఈ ముద్రను విప్పినవారు ఎవరు? ప్రకటన 5:5, ''ఆ పెద్దలలో ఒకడు-ఏడువకుము; ఇదిగో దావీదుకు చిగురైన యూదా గోత్రపు సింహము ఏడు ముద్రలను తీసి ఆ గ్రంథమును విప్పుటకై జయము పొందెనని నాతో చెప్పెను.'' ఈయన క్రీస్తు ప్రభువు. కనుక క్రీస్తు ప్రభువు మరణము పాతాళముయొక్క తాళపుచెవిని కలిగి యున్నట్లుగా మనము గ్రహించాలి.
ఈ అధ్యాయమునందు క్రీస్తు ప్రభువు మొదటి నాలుగు ఆత్మీయ సంఘములకు లేఖలు వ్రాయించారు. నాలుగు ఆత్మీయ సంఘముల లేఖలలోని వివరములు ఇందులో చూడగలము.
ప్రకటన 1:20 ప్రకారము ఎఫె¦సులో ఉన్న సంఘపు దూత క్రీస్తు చేతిలో ఉన్న ఒక నక్షత్రము.
ప్రకటన 2:1, ''ఏడు నక్షత్రములు తన కుడిచేత పట్టుకొని యేడు ద్వీపస్తంభముల మధ్య సంచరించువాడు,'' ఈ లేఖ వ్రాస్తున్నాడు. ఈయన క్రీస్తు అని ఈ గ్రంథములోని ఒకటవ అధ్యాయములో తొమ్మిదవ విభాగము ద్వారా తెలుసుకొన్నాము. యేసుక్రీస్తు తన సువార్తకు మూలమైన ఆత్మీయ సంఘములు అను ఏడు ద్వీపస్తంభముల మధ్య సంచరించుచు తన కుడిచేత ఏడు నక్షత్రములు అను ఏడుగురు దూతలను తన ఆధీనమునందు ఉంచుకొనినవాడు. ఈయన ఈ లేఖలో కొన్ని సంగతులు తెలుపుచున్నారు.
ఎఫె¦సులో ఉన్న సంఘము అన్ని విధాల దైవత్వమునకు యోగ్యకరమైనదిగా ఉన్నట్లు చదువగలము. ప్రకటన 2:2-3, ''-నీ క్రియలను నీ కష్టమును నీ సహనమును నేనెరుగుదును; నీవు దుష్టులను సహింపలేవనియు, అపొస్తలులు కాకయే తాము అపొ స్తలులమని చెప్పుకొను వారిని పరీక్షించి వారు అబద్ధికులని నీవు కనుగొంటివనియు, నీవు సహనము కలిగి నా నామము నిమిత్తము భారము భరించి అలయలేదనియు నేనెరు గుదును.'' ఇవన్నియు దైవత్వమునకు యోగ్యకరమైన లక్షణములు. ఇందులో క్రీస్తు ప్రభువు సంఘములోని వారి కష్టమును క్రియలను గుర్తించారు. కనుక వీరు ధన్యులే. అలాగే వీరు దుష్టులను సహింపలేదు. సంఘములోని అబద్ధికులను అనగా సాతాను ప్రేరణతో నటించువారిని గుర్తించారు.
దేవుని నామము కొరకు అనగా క్రీస్తు ప్రభువు కొరకు వారు ఎంత కృషి చేసినను అలసినవారుగ కనబడుట లేదు. ఈనాడు అనేక సంఘాలలో అలసినవారే కనబడుదురు. ఇప్పుడే ఈ పని చేసాను. ఇక నేను చెయ్యలేనని నేను రాలేనని చెప్పు వారు అనేకులు కలరు. వీరు ఎఫెసు అను ఆత్మీయ సంఘమునకు చెందినవారుకారు. అయితే ఈ సంఘము పాటించవలసిన లోటునుగూర్చి యోహాను ఈ లేఖలో వ్రాసియున్నారు. ప్రకటన 2:4, ''అయినను మొదట నీకుండిన ప్రేమను నీవు వదిలితివని నేను నీమీద తప్పు ఒకటి మోపవలసియున్నది.'' ఇది ప్రాముఖ్యమైనటు వంటి తప్పుగా ఈ లేఖలో వ్రాయబడి యున్నది. అదేమనగా ప్రేమను వదలిన జీవితము, ప్రేమలేని జీవితము, ప్రేమకు దూరమైన జీవితము. క్రైస్తవ జీవితములో ప్రేమ చాలా ముఖ్యము.
మార్కు 12:31, ''నిన్ను వలె నీ పొరుగువానిని ప్రేమింపవలెను.'' ఒక్కమాటలో చెప్పాలంటే దేవుడు ప్రేమయైయున్నాడు. ఇందునుగూర్చి 1 యోహాను 4:16, ''దేవుడు ప్రేమాస్వరూపియైయున్నాడు. ప్రేమయందు నిలిచి యుండువాడు దేవునియందు నిలిచి యున్నాడు.'' 1 యోహాను 4:7-8, ''ప్రేమ దేవునిమూలముగా కలుగుచున్నది; ప్రేమించు ప్రతివాడును దేవుని మూలముగా పుట్టినవాడై దేవుని ఎరుగును. దేవుడు ప్రేమాస్వరూపి; ప్రేమలేని వాడు దేవుని ఎరుగడు.''
1 కొరింథీ 13:13, ''కాగా విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ యీ మూడును నిలుచును; వీటిలో శ్రేష్ఠమైనది ప్రేమయే.'' ప్రేమకు ఇంత గొప్ప విలువలు దైవసన్నిధిలో ఉండగా ప్రకటనలో యోహాను ఎఫెసులో ఉన్న సంఘానికి ఈ ప్రేమ లేనట్లుగ లేఖలో వ్రాసియున్నాడు. ఎఫెసులో ఉన్న సంఘానికి అన్నియు ఉన్నవిగాని ప్రేమ లేదు. దైవత్వములో ప్రేమకే ప్రాధాన్యత, ప్రేమయే మూలము. అన్నియు ఉండి ప్రేమ లేకపోతే దైవసంబంధి కాడు అని ఋజువగు చున్నది. ఈ ప్రేమను సంపాదించుటకు మారు మనస్సు పొంది ఆ మొదటి క్రియలు చేయుమనియు ప్రకటన 2:5లో హెచ్చరించుచున్నాడు. అట్లు చేసి నీవు మారుమనస్సు పొందితే సరి లేని యెడల నేను నీ యొద్దకు వచ్చి నీ దీపస్తంభమును దాని చోటునుండి తీసివేతును, అనుటలో సంఘమును పాడు చేస్తానని, బొత్తిగా ఆ సంఘమును లేకుండ చేస్తానని దీని భావము. ఈ విధముగా ప్రేమ లేని సంఘాలు నేడు మన కండ్ల ఎదుట ఎన్నో అనర్థాలకు లోనై దైవానుగ్రహము కోల్పోయి, ధనాశ, స్వార్థము, పదవీవ్యామోహము వగైరా గుణాతిశయములలో సంఘాలు పాడై పోవుటన్నది మనమెరిగిందే.
ఈ లేఖ ఎఫెసులో ఉన్న సంఘాన్ని గూర్చియైనను, ఇది నేటి క్రైస్తవ సంఘాలలో ఉన్న మనకు కూడ ఈ నియమావళి అనుసరిస్తున్నది. ఆ విధముగా మనము దైవ నియమావళియైన ప్రేమను కలిగిన జీవితమును అలవరచుకొని, మనవలె ఇరుగు పొరుగును ప్రేమించు స్థితిలో జీవించి, దైవనియమావళిని ఆయన చిత్తాన్ని నెరవేర్చుచు జీవించితే, దేవుని పరదైసులో ఉన్న జీవవృక్ష ఫలములను ఆహారముగా భుజింపనిత్తునని క్రీస్తు ప్రభువు వాగ్దానము చేసియున్నారు. ఎఫెసులో ఉన్న సంఘానికే గాదు, ఇప్పుడుండే అన్ని సంఘాలకు ఈయొక్క నియమావళిని పాటించాలి. లోకమునందంతట విస్తరించియున్న ప్రతి క్రైస్తవ సంఘానికి ఇది కట్టడగా ఉన్నది. ఎందుకంటే ఇప్పుడున్న అన్ని సంఘాలు ఏడు ఆత్మీయ సంఘాల పరిధిలోని వాటి క్రియలచొప్పున చేర్చబడియున్నట్లుగా గుర్తించాలి.
మరి క్రీస్తుయేసు కుడిహస్తముయొక్క ఆధీనములో ఉన్న సంఘపు దూతయొక్క కార్యములలో ఎఫెసులో ఉన్న సంఘము దాని ప్రజలలో ఈ లోపము ఎందుకు జరిగింది? దీనికి కారణముకూడ సాతానే, ఎందుకంటే సాతానుయొక్క ప్రధానమైన లక్షణము దైవ కుమారులను శోధించుట. అందుకే బైబిలు గ్రంథము శోధనను జయించువాడు ధన్యుడు అని చెప్పుచున్నది. కాబట్టి ఎంత ఆత్మీయ సంఘమైనను సాతానుయొక్క కార్యములను జయించవలసియున్నది. అప్పుడే మనము సంపూర్ణులము కాగలము. అయితే ఈ సాతాను ప్రభావము వల్ల ఎఫెసు అను ఆత్మీయ సంఘములోని కొందరి క్రైస్తవులలో ప్రేమలో లోపమును కలిగించగలిగింది. ఈ లోపము సరిదిద్దుకోమని క్రీస్తు ప్రభువు స్వయముగా తన లేఖ ద్వారా తెలియజేయుచున్నాడు.
ఎటువంటి క్రైస్తవులు ఈ ఎఫెసు సంఘమునకు చెందినవారు? ఇప్పుడున్న అనేక క్రైస్తవ సంఘములలో ఏ సంఘమైతే ఈ లేఖలోని సారాంశమునకు సరిపోతారో వారు ఎఫెసు అను ఆత్మీయ సంఘము క్రిందకు వస్తారు. కాబట్టి మనమున్న సంఘ కార్యకలాపాలను బేరీజు వేసుకొని ఒకవేళ మనము ఎఫెసులో ఉన్న సంఘమునకు చెందితే ఈ సంఘములోని ప్రజలకు చెడు కన్న మంచే ఎక్కువగా యున్నది. కాబట్టి ప్రేమ విషయములో జాగ్రత్తపడవలసినదిగా ఈ క్రైస్తవులను లేఖ హెచ్చరిస్తున్నది.
ప్రకటన 2:6, ''అయితే ఈ యొకటి నీలో ఉన్నది, నీకొలాయితుల క్రియలు నీవు ద్వేషించుచున్నావు; నేనుకూడ వీటిని ద్వేషించుచున్నాను.''
నీకొలాయితులు అనగా ఎవరు?
అయితే ఈ లేఖలో నీకొలాయితులను నీవు ద్వేషించుచున్నావు అన్నది ఒక మంచి కార్యముగా చెప్పుచు, క్రీస్తుకూడ - నేనును వీటిని ద్వేషించుచున్నాను అని చెప్పు చున్నాడు. ఇందునుబట్టి నీకొలాయితులు అనగా ఒక చెడుకు సంబంధించినదిగా తెలియుచున్నది.
నీకొలాయితులు అనగా సత్యమును అసత్యమునకు మార్చి దైవవాక్యమును భూలోక వ్యవహారములకు పోల్చి లోక పారంపర్య ఆచారమునకు అనుకూలముగ ఉండు బోధలు. వాటి సంబంధమైన సాంగత్యముకూడ దేవునికి ద్వేషపూరితమైనవే. 1 తిమోతి 4:1-3, ''అయితే కడవరి దినములలో కొందరు అబద్ధ్దికుల వేషధారణవలన మోసపరచు ఆత్మలయందును దయ్యముల బోధయందును లక్ష్యముంచి, విశ్వాస భ్రష్టులగుదురని ఆత్మ తేటగా చెప్పుచున్నాడు. ఆ అబద్ధ్దికులు, వాత వేయబడిన మనస్సాక్షిగలవారై, వివాహమునిషేధించుచు, సత్యవిషయమై అనుభవజ్ఞానముగల విశ్వాసులు కృతజ్ఞతా స్తుతులు చెల్లించి పుచ్చుకొనునిమిత్తము దేవుడు సృజించిన ఆహారవస్తువులను కొన్నిటిని తినుట మానవలెనని చెప్పుచుందురు.''
ప్రకటన 2:7, ''జయించు వానికి దేవుని పరదైైసులో ఉన్న జీవవృక్షఫలములు భుజింపనిత్తును.''
పరదైసు అనగా నేమి? మొట్టమొదటగా తండ్రియైన దేవుడు, సకల దూతలు, సాతాను (లూసిఫర్‌గా), జీవాత్మ మొదలైనవారందరు పరలోకములో ఉన్నారు. ప్రతి ఆత్మకు నిలయము పరలోకమే. కాని జీవాత్మ కోరిక మీద దేవుడు భూమిని అగాధ జలముల నుండి వెలికితీసి దానిమీద సకల సృష్టిని సృజించాడు. దానిలో ఏదెను వనమును తూర్పుదిక్కున వేసి దానిని పరలోకమునకు సాదృశ్యముగా నిర్మించాడు. ఇందులో దేవుడు తిరిగినట్లు వ్రాయబడియున్నది. ఇందులో జీవవృక్షము, సకల జీవులు, మంచిచెడు తెలివినిచ్చు ఫలమును ఫలించు వృక్షము, మొదలైనవి అన్ని ఉన్నాయి. దేవుడైన యెహోవా నేలనుండి మంటిని తీసి నరుని తన పోలిక తన స్వరూపము చొప్పున నిర్మించి, వాని నాసికారంధ్రములలో జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మగా మారాడు. అనగా జీవాత్మ మంటితో చేయబడిన శరీరములో ఉన్నది. కనుక జీవాత్మకు నరశరీరము ఒక నివాసము.
ఈ విధముగా దేవుడు జీవాత్మను భూమిమీదకు పంపాడు. ఇందునుబట్టి ఈ భూలోకము జీవాత్మకు ఒక పరదైసు. ఈ పరదైసు రెండు రకములుగా ఉన్నది. 1. శాంతికరమైన పరదైసు 2. వేదనకరమైన పరదైసు. ఇక్కడ శాంతికరమైన పరదైసు భూమిపై ఏదెను వనరూపమున ఏర్పరచి అందులో ఆదామును దేవుడైన యెహోవా ఉంచాడు. కాని దైవవ్యతిరేక కార్యముల ద్వారా ఆదాము ఈ శాంతికరమైన పరదైసును పోగొట్టుకొని వేదనకరమైన పరదైసుకు త్రోసివేయబడ్డాడు. ఇందునుబట్టి దైవశాపము మూలముగా నరులకు భూలోకము వేదనకర పరదైసుగా మారింది. అయితే మన మూల వాక్యములో, ''జయించు వానికి దేవుని పరదైసులో ఉన్న జీవవృక్షఫలములు భుజింప నిత్తును.'' ఇందునుబట్టి పరదైసు అనేది ఒకటి ఉన్నదని దానిలో జీవవృక్షము ఉన్నదని తెలియుచున్నది. అంతేకాదు ఈ పరదైసు ఎక్కడో ఒకచోట ఉన్నట్లుగా తెలియుచున్నది. అంటే భూలోకము పరదైసు కాదా? పరలోకము నుండి వచ్చిన జీవాత్మకు భూలోకము ఒక పరదైసు. దీనిలో ఏ మార్పు లేదు. అయితే మన మూలవాక్యములో చెప్పబడిన పరదైసు జయించువానికి లభించేది. ''జయించువాడు,'' అనగా వీడు దేనిని జయించాలి?
జీవాత్మ దేవుని సన్నిధియైన పరలోకమునుండి భూలోకము అను పరదైసునకు వచ్చింది. అయితే దేవుడు ప్రేమాస్వరూపి కాబట్టి జీవాత్మపైయున్న ప్రేమకొద్ది ఏదెను వనము అను శాంతికరమైన పరదైసును నిర్మించి అందులో నరుని ఉంచాడు. కాని నరుడు దేవుడు తినవద్దని చెప్పిన పండును తినుట ద్వారా ఈ శాంతికరమైన పరదైసును పోగొట్టుకొని దైవశాపము మూలముగా వేదనకరమైన పరదైసునకు వెళ్ళగొట్టబడినాడు. దీనికి కారణము దేవుని పరీక్ష సాతాను రూపములో శోధనగా జరిగింది. ఈ పరీక్షలో ఆదాము సర్వము కోల్పోయాడు.
జీవాత్మ భూలోకము అను వేదనకరమైన పరదైసులో ప్రవేశించి పరలోకములో తనకున్న స్థానమును నిలబెట్టుకోవలసియున్నది. అనగా ఎవరైతే భూలోకము అను తాత్కాలిక వేదనకరమైన పరదైసులో జీవిస్తూ దైవపరీక్షను, సాతాను శోధనను, మరియు లోకముయొక్క ఆశలను జయిస్తాడో అట్టివాడు జయించినవాడు. వీడికి క్రీస్తు ప్రభువు మరియొక పరదైసు ఇస్తానని చెప్పుచున్నాడు. అనగా పరలోకము నుండి వచ్చిన జీవాత్మ శరీరము ధరించి భూలోకము అను పరదైసులో నివసించి, జయించినట్లయితే, శరీరము వదలిన తరువాత ఈ ఆత్మకు జీవవృక్షఫలములు ఉన్న పరదైసులో ప్రవేశము ఉంది. జయించినవారికి శాంతికరమైన పరదైసులో ప్రవేశముంటే జయించనివారికి వేదనకరమైన పరదైసులో ప్రవేశముంటుంది.
లూకా 23:42-43, ''ఆయనను చూచి-యేసూ, నీవు నీ రాజ్యములోనికి వచ్చునప్పుడు నన్ను జ్ఞాపకము చేసికొనుమనెను. అందుకాయన వానితో-నేడు నీవు నాతోకూడ పరదైసులోఉందువని నిశ్చయముగా నీతో చెప్పుచున్నా ననెను.'' ఈ వచనములో కూడ భూలోక పరదైసులో ఉన్న దొంగ క్రీస్తు ప్రభువును-నీవు నీ రాజ్యములోనికి వచ్చునప్పుడు నన్ను జ్ఞాపకము చేసికొనుమనెను. ఇందుకు క్రీస్తు ప్రభువు-నేడు నీవు నాతోకూడ పరదైసులో ఉందువని చెప్పెను. ఈ వచనములనుబట్టి పరదైసు అనేది భూమిమీద జీవించి మరణించినవారికి ఉన్నట్లుగా గుర్తించాలి. ఎందుకంటే ఈ మాట క్రీస్తు ప్రభువు చెప్పిన కొంత సమయమునకు ముగ్గురు అనగా ఇద్దరు దొంగలు క్రీస్తు ప్రభువు మరణించారు. ఇందునుబట్టి ఈ లోకము అనే పరదైసులో జీవించిన జీవాత్మకు మరియొక పరదైసు ఉన్నట్లుగా గుర్తించాలి. ఈ పరదైసుకు మనము వెళ్ళాలి అంటే మనము మరణించవలసియున్నది. 2 కొరింథీ 12:2-4, ''క్రీస్తునందున్నయొక మనుష్యుని నేనెరుగుదును. అతడు పదునాలుగు సంవత్సరములక్రిందట మూడవ ఆకాశమునకు కొనిపోబడెను; అతడు శరీరముతో కొనిపోబడెనో నేనెరుగను, శరీరము లేక కొనిపోబడెనో నేనెరుగను, అది దేవునికే తెలియును. అట్టి మనుష్యుని నేనెరుగుదును.'' ఇక్కడ మూడవ ఆకాశములో ఈ మనుష్యుడు ఉన్నట్లుగా గుర్తించాలి. అక్కడ వాడు ఎలా ఉన్నాడు?
ప్రకటన 14:6, ''అప్పుడు మరియొక దూతను చూచితిని. అతడు భూనివాసులకు, అనగా ప్రతి జనమునకును ప్రతి వంశమునకును ఆ యా భాషలు మాటలాడువారికిని ప్రతి ప్రజకును ప్రకటించునట్లు నిత్యసువార్త తీసికొని ఆకాశ మధ్యమున ఎగురుచుండెను.'' సువార్త కార్యక్రమము భూలోకములో నిత్యము జరుగుచున్నప్పుడు ఆకాశమధ్యములో నిత్యసువార్త ప్రకటించునట్లు ఈ దూత ఎగురుటలో ఉన్న ఆంతర్యమేమి? ఇక్కడ పరదైసులు అనేవి ఆకాశమధ్యములో ఉన్నట్లుగా గుర్తించాలి. ఈ ఆకాశమధ్యములో ఉన్న పరదైసులలో ఈ సువార్త కార్యక్రమము జరుగుచున్నది. ఇక్కడ కూడ మరణించిన ఆత్మలకు క్రీస్తును గూర్చిన బోధ జరుగుచున్నది. ఈ పరదైసు శాంతికరమైనది కావచ్చును లేక వేదనకరమైనది కావచ్చు. పరదైసులో ఉన్నవారికి క్రీస్తును గురించి బోధ మనకు జరిగినట్లే జరుగును. కాని వారిలోకూడ ఈ లోకములో ఉన్న భూజనులు మాదిరిగానే సువార్తను లెక్క చేయువారు ఉంటారు మరియు లెక్క చేయనివారు ఉంటారు. దీనిని గూర్చి, ప్రకటన 1:7, ''ఇదిగో ఆయన మేఘా రూఢుడై వచ్చుచున్నాడు; ప్రతి నేత్రము ఆయనను చూచును, ఆయనను పొడిచినవారును చూచెదరు; భూజనులందరు ఆయనను చూచి రొమ్ము కొట్టుకొందురు; అవును ఆమేన్.'' ఇక్కడ వీరంతా రొమ్ము కొట్టుకొనవలసిన అవసరము ఏముంది? వీరికి భూమిమీద మరియు పరదైసులో జరిగిన క్రీస్తునుగూర్చిన బోధ వారు ఖాతరు చేయకపోవుట చేత వీరు క్రీస్తు మేఘారూఢుడై వచ్చుట చూచి రొమ్ము కొట్టుకొందురు. క్రీస్తు ప్రభువు మేఘారూఢుడై వచ్చినప్పుడు ఈ పరదైసులలో ఉన్న జనులందరు మధ్యా కాశములో పోగుచేయబడి తీర్పుకు ఆయన ముందు నిలబడుదురు.
ప్రకటన 20:4-6, ''అంతట సింహాసనములను చూచితిని; వాటిమీద ఆసీనులై యుండువారికి విమర్శచేయుటకు అధికారము ఇయ్యబడెను. మరియు క్రూరమృగము నకైనను దాని ప్రతిమకైనను నమస్కారము చేయక, తమ నొసళ్లయందు గాని చేతులయందు గాని దాని ముద్రవేయించుకొనని వారిని, యేసు విషయమై తామిచ్చిన సాక్ష్యము నిమిత్తమును దేవుని వాక్యము నిమిత్తమును శిరచ్ఛేదనము చేయబడిన వారి ఆత్మలను చూచితిని. వారు బ్రదికినవారై, వెయ్యి సంవత్సరములు క్రీస్తుతోకూడ రాజ్యము చేసిరి. ఆ వెయ్యి సంవత్సరములు గడచువరకు కడమ మృతులు బ్రదుకలేదు; ఇదియే మొదటి పునరుత్థానము. ఈ మొదటి పునరుత్థానములో పాలుగలవారు ధన్యులును పరిశుద్ధులునై యుందురు. ఇట్టివారిమీద రెండవ మరణమునకు అధికారములేదు; వీరు దేవునికిని క్రీస్తుకును యాజకులై క్రీస్తుతోకూడ వెయ్యి సంవత్సరములు రాజ్యము చేయుదురు.'' వీరు పరదైసులలో ఉన్నవారు. వీరికి తీర్పు తరువాతకూడ భూమిమీద పరిశుద్ధ పట్టణములు ఏర్పరచుకొని క్రీస్తుతోకూడ యాజకులై వెయ్యి సంవత్సరములు రాజ్యము చేయుదురు. ఈ కాలములో అపరిశుద్ధులు పరిశుద్ధ పట్టణమునకు దూరముగా అశాంతికరమైన పరదైసులో కడమవారుగా ఉంటారు. వీరికి తీర్పు వెయ్యి సంవత్సరముల తరువాత జరుగును. వెయ్యి సంవత్సరముల తరువాత అశాంతికరమైన పరదైసులో ఉన్న భూజనులు సాతానుతో ఏకమై, పరిశుద్ధ పట్టణముపై దాడి చేస్తారని వ్రాయబడి యున్నది.
ప్రకటన 20:7-9, ''వెయ్యి సంవత్సరములు గడిచిన తరువాత సాతాను తానున్న చెరలోనుండి విడిపింపబడును. భూమి నలుదిశలయందుండు జనములను, లెక్కకు సముద్రపు ఇసుకవలె ఉన్న గోగు మాగోగు అనువారిని మోసపరిచి వారిని యుద్ధమునకు పోగుచేయుటకై వాడు బయలుదేరును. వారు భూమియందంతట వ్యాపించి, పరిశుద్ధుల శిబిరమును ప్రియమైన పట్టణమును ముట్టడివేయగా పరలోకములో నుండి అగ్ని దిగివచ్చి వారిని దహించెను.'' అటుతరువాత కడమవారికి తీర్పు జరుగును. వారి వారి క్రియలు అనగా శరీరముతో జరిగించిన క్రియ చొప్పున వారు పాటించిన గ్రంథముల చొప్పున వారికి తీర్పు జరుగుతుంది. ఈ తీర్పు తరువాత అతి భయంకరమైన వేదనతో కూడిన పరదైసులోకి వేయబడుదురు. ప్రకటన 20:14-15, ''మరణమును మృతుల లోకమును అగ్నిగుండములో పడవేయబడెను; ఈ అగ్నిగుండము రెండవ మరణము. ఎవని పేరైనను జీవగ్రంథమందు వ్రాయబడినట్టు కనబడని యెడల వాడు అగ్నిగుండములో పడవేయ బడెను.'' ప్రకటన 20:10, ''వారిని మోసపరచిన అపవాది అగ్ని గంథకములుగల గుండములో పడవేయబడెను. అచ్చట ఆ క్రూరమృగమును అబద్ధ ప్రవక్తయు ఉన్నారు; వారు యుగయుగములు రాత్రిం బగళ్లు బాధింపబడుదురు.'' అయితే ఈ కాలములో పరిశుద్ధులు మాత్రము దేవునితో కూడ తిరిగి పరలోకము చేరుదురు. ప్రకటన
21: 3-4, ''అప్పుడు-ఇదిగో దేవుని నివాసము మనుష్యులతో కూడ ఉన్నది, ఆయన వారితో కాపురముండును, వారాయన ప్రజలైయుందురు, దేవుడు తానే వారి దేవుడైయుండి వారికి తోడైయుండును. ఆయన వారి కన్నుల ప్రతి బాష్పబిందువును తుడిచివేయును, మరణము ఇక ఉండదు, దుఃఖమైనను ఏడ్పైనను వేదన యైనను ఇక ఉండదు, మొదటి సంగతులు గతించి పోయెనని సింహాసనములోనుండి వచ్చిన గొప్ప స్వరము చెప్పుట వింటిని.''
ఇక్కడ మనము గ్రహించవలసినది ఒక్కటే. ఆత్మకు పరలోకమే నివాసస్థలము. ఈ పరలోకము గాక మిగిలిన ప్రాంతాలన్ని కూడ పరదైసులే! ఈ పరదైసులలో ఆత్మ నివసించి మరల దేవునికి యోగ్యమైన స్థితిని పొందవలసియున్నది. ఇందులో భాగముగా ఆత్మకు ఒక శరీరము ఏర్పరచి భూమి అను పరదైసులోకి పంపాడు. ఈ పరదైసులో శరీరముతో ఉన్న ఆత్మ దేవుని సన్నిధికి యోగ్యమైన స్థితిలో జీవించి పరలోకాన్ని తిరిగి పొందాలి. ఈ జీవాత్మలో అణువులమైన నరులు భూమిమీదకు అందరు వచ్చుటకు కొంత సమయము పడుతుంది. ఈ సమయములో మరణించి శరీరమును వదిలిన జీవాత్మను ఆకాశ మధ్యములో పరదైసులుగా చేసి వాటిలో వారిని ఉంచుతారు. ఈ పరదైసులు రెండు రకములుగా ఉన్నాయి. జయించిన వానికి జీవవృక్షఫలములు గల పరదైసు. అదే మన మూలవాక్యము తెలియజేస్తున్నది. ''జయించు వానికి దేవుని పరదైసులో ఉన్న జీవవృక్షఫలములు భుజింపనిత్తును.'' ఈ వాక్యములోనే జయించనివారు ఉన్నట్లుగా తెలియుచున్నది. వీరు కూడ మరణించిన తరువాత పరదైసులలోనే ఉంటారు. కాని వారి ఆత్మల ఆకలిదప్పిక తీర్చుటకు జీవవృక్షముగాని జీవజలముగాని ఉండవు. లూకా 16:23-26, ''అప్పుడతడు పాతాళములో బాధపడుచు, కన్నులెత్తి దూరమునుండి అబ్రాహామును అతని రొమ్మున (ఆనుకొనియున్న) లాజరునుచూచి-తండ్రివైన అబ్రాహామా, నాయందు కనికరపడి, తన వ్రేలికొనను - నీళ్లలోముంచి నా నాలుకను చల్లార్చుటకు లాజరును పంపుము; నేను ఈ అగ్నిజ్వాలలో యాతనపడుచున్నానని కేకలువేసి చెప్పెను. అందుకు అబ్రాహాము కుమారుడా, నీవు నీ జీవితకాలమందు నీకిష్టమైనట్టు సుఖము అనుభవించితివి, ఆలాగుననే లాజరు కష్టము అనుభవించెనని జ్ఞాపకము చేసికొనుము; ఇప్పుడైతే వాడు ఇక్కడ నెమ్మది పొందుచున్నాడు, నీవు యాతనపడుచున్నావు. అంతేకాక ఇక్కడనుండి మీ యొద్దకు దాట గోరువారు దాటి పోజాలకుండునట్లును, అక్కడి వారు మాయొద్దకు దాటి రాజాలకుండునట్లును, మాకును మీకును మధ్య మహాఅగాధముంచబడి యున్నదని చెప్పెను.'' ఇందులో చెప్పబడినవి రెండు రకముల పరదైసులు.
అయితే దేవుడు జీవాత్మను పరలోకమునుండి పరదైసు అను భూమి మీదకు పంపాడు. ఈ పరదైసు రెండు రకములుగా ఉన్నది. ఇందులో వేదన ఉన్నది. ఇందులో శాంతి ఉన్నది. మొట్టమొదటగా ఆదాము శాంతికరమైన భూమిలోని పరదైసు అనగా ఏదెను వనములో దేవుడు ఉంచాడు. కాని ఆదాము దీనిని కోల్పోయాడు. దీనికి కారణము దేవుని ఆజ్ఞ మీరుటయే. అయితే తరువాత జీవితము దేవునికి యోగ్యకరమైన జీవితము జీవించబట్టే ఇతని కుమారులను దైవకుమారులుగా ఆదికాండము ఆరవ అధ్యాయములో చెప్పబడినది. అనగా వేదనకర పరదైసులో చెమటోడ్చి కష్టపడుచు దేవునికి యోగ్యమైన జీవితమును జీవించారు.
ఇలా ప్రతి ఒక్కరి జీవితములోను భూలోకము అను ఈ పరదైసులో రెండు రకముల జీవితములు జీవించవచ్చును. ఉదాః- దానియేలు దేవుని కోసమై నిలబడినప్పుడు, సాతాను సమాజపు చక్రవర్తి ఆయనను సింహముల బోను అను వేదనకర మరణకరమగు పరదైసులో వేయించాడు. కాని దానియేలు దేవుని కోసము శాంతికరమైనస్థితిలో ఉండుట చేత, ఆ వేదనకర పరదైసును శాంతికర పరదైసుకు మాదిరిగా చేసి సింహముల నోరు మూయించాడు. అదే విధముగా మేషాకు, షద్రకు, అబెద్నెగొ విషయములో జరిగింది. ఇంకా నోవహు జలప్రళయ కాలములో కూడ నోవహు ఓడ శాంతికరమైన మార్గములో పయనించగా మిగిలినవన్ని నాశనమునకు అప్పగింపబడ్డాయి. ఈ విధముగా దేవుడు రానున్న పరదైసునకు సూచనగా ప్రతి ఒక్కరి జీవితములో చూపిస్తూనే వస్తున్నాడు. పరిశుద్ధులకు శాంతికరమైన పరదైసులు ఉన్నాయి. అవి నోవహు ఓడలుగాను, దానియేలు సింహాల బోనులో వలె, ఏదెను వనములుగా ఎటువంటి హాని లేని ప్రశాంతమైన జీవితము ఉంటుంది. అదే సందర్భములో జలప్రళయములో నాశనమగువారు, సింహములకు ఆహారమైనవారు, అగ్నిగుండములో నాశనమైన మొదలైనవి వేదనకర పరదైసుకు ఈ లోకములోనే మాదిరిగా దేవుడు చూపిస్తూ వచ్చారు. కాని మానవునిలో మార్పు లేదు. భూగోళమంతా కలిపి ఒక పరదైసు. ఈ ఉదాహరణలో చెప్పినవి పరదైసులు కావు. వాటి మాదిరి మాత్రమే. ప్రకటన 22:11, ''అన్యాయము చేయు వాడు ఇంకా అన్యాయమే చేయనిమ్ము, అపవిత్రుడైన వాడు ఇంకను అపవిత్రుడుగానే యుండనిమ్ము, నీతి మంతుడు ఇంకను నీతిమంతుడుగానే యుండనిమ్ము. పరిశుద్ధుడు ఇంకను పరిశుద్ధుడుగానే యుండ నిమ్ము,'' అని వ్రాయబడిన ప్రకారము పరిశుద్ధుడు పరిశుద్ధుడుగానే ఉన్నారు. అన్యాయము చేయువారు అన్యాయము చేస్తూనే ఉన్నారు.
ఒక్క ఈ భూలోకమను పరదైసులోనే రెండు రకములవారు కలిసి జీవిస్తారు. మత్తయి 13:24-30, ''ఆయన మరియొక ఉపమానము వారితో చెప్పెను, ఏమనగా-పరలోకరాజ్యము, తన పొలములో మంచి విత్తనము విత్తిన యొక మనుష్యుని పోలియున్నది. మనుష్యులు నిద్రించుచుండగా, అతని శత్రువు వచ్చి గోధుమల మధ్యను గురుగులు విత్తిపోయెను. మొలకలు పెరిగి గింజపట్టినప్పుడు గురుగులు కూడ అగపడెను. అప్పుడు ఇంటి యజమానుని దాసులు అతనియొద్దకు వచ్చి-అయ్యా, నీవు నీ పొలములో మంచి విత్తనము విత్తితివిగదా, అందులో గురుగులెక్కడనుండి వచ్చినవని అడిగిరి. -ఇది శత్రువు చేసిన పని అని అతడు వారితో చెప్పగా, ఆ దాసులు-మేమువెళ్లి వాటిని పెరికి కూర్చుట నీకిష్టమా? అని అతనిని అడిగిరి. అందుకతడు-వద్దు; గురుగులను పెరుకుచుండగా, వాటితోకూడ ఒకవేళ గోధుమలను పెల్లగింతురు. కోతకాలమువరకు రెంటినికలిసి యెదుగ నియ్యుడి; కోతకాలమందు గురుగులను ముందుగాకూర్చి వాటిని కాల్చివేయుటకు కట్టలు కట్టి, గోధుమలను నా కొట్టులో చేర్చి పెట్టుడని కోతగాండ్రతో చెప్పుదు ననెను.'' మేలు చేసినవారందరు పరలోకమునకు చేరుటకు ముందు శాంతికరమైన పరదైసులో ఉంటారు. కీడు చేసినవారు వేదనకర పరదైసులో ఉంటారు. కోతకాలము తరువాత పరిశుద్ధులు పరలోకము చేరుదురు. కడమ వారు వేదనకర పరదైసు అనబడు అగ్నిగుండము అను రెండవ మరణములో భాగస్వాములు అవుదురు.
ఈ పరదైసులలో జీవాత్మయొక్క కార్యములనుబట్టి తిరిగి పరలోకములో జీవాత్మ చేరినప్పుడు వారియొక్క ఉన్నత స్థితి ఉంటుంది. అనగా జీవాత్మ భూలోకములో చేసిన క్రియలనుబట్టి వారి స్థితి ఉంటుంది.
ఉదాహరణకు :- పండ్రెండుమంది శిష్యులు :- క్రీస్తు ప్రభువుతోబాటుగా తీర్పు తీర్చువారిగా ఉన్నారు. మత్తయి 19:28, ''యేసు వారితో ఇట్లనెను-(ప్రపంచ) పునర్జననమందు మనుష్యకుమారుడు తన మహిమగల సింహాసనముమీద ఆసీనుడై యుండునపుడు నన్ను వెంబడించిన మీరును పండ్రెండు సింహాసనములమీద ఆసీనులై ఇశ్రాయేలు పండ్రెండు గోత్రములవారికి తీర్పుతీర్చుదురు.''
వెయ్యిన్ని నలువది నాలుగువేలమంది పరిశుద్ధులు :- వీరు క్రీస్తుతోబాటు సంచరించువారు. ప్రకటన 14:1-4, మరియు నేను చూడగా, ఇదిగో, ఆ గొఱ్ఱెపిల్ల సీయోను పర్వతముమీద నిలువబడియుండెను. ఆయన నామమును ఆయన తండ్రి నామమును నొసళ్లయందు లిఖింపబడియున్న నూట నలువది నాలుగు వేలమంది ఆయనతో కూడ ఉండిరి. మరియు విస్తారమైన జలముల ధ్వనితోను గొప్ప ఉరుము ధ్వనితోను సమానమైన యొక శబ్దము పరలోకములోనుండి రాగా వింటిని. నేను వినిన ఆ శబ్దము వీణెలు వాయించుచున్న వైణికుల నాదమును పోలినది. వారు సింహాసనము ఎదుటను, ఆ నాలుగు జీవుల యెదుటను, పెద్దలయెదుటను ఒక క్రొత్త కీర్తన పాడు చున్నారు; భూలోకములోనుండి కొనబడిన ఆ నూట నలువది నాలుగువేలమంది తప్ప మరి ఎవరును ఆ కీర్తన నేర్చుకొనజాలరు. వీరు స్త్రీ సాంగత్యమున అపవిత్రులు కాని వారును, స్త్రీ సాంగత్యము ఎరుగని వారునైయుండి, గొఱ్ఱెపిల్ల ఎక్కడికి పోవునో అక్కడికెల్ల ఆయనను వెంబడింతురు; వీరు దేవుని కొరకును గొఱ్ఱెపిల్లకొరకును ప్రథమఫలముగా ఉండుటకై మనుష్యులలోనుండి కొనబడినవారు.''
తెల్లని వస్త్రములు ధరించిన గొప్ప సమూహము :- వీరు క్రీస్తు రక్తముతో తమ వస్త్రములను ఉదుకుకొనినవారు. ప్రకటన 7:9-12, ''అటుతరువాత నేను చూడగా, ఇదిగో, ప్రతి జనములోనుండియు ప్రతి వంశములోనుండియు ప్రజలలోనుండియు, ఆయా భాషలు మాటలాడువారిలోనుండియు వచ్చి, యెవడును లెక్కింపజాలని యొక గొప్ప సమూహము కనబడెను. వారు తెల్లని వస్త్రములు ధరించు కొన్నవారై, ఖర్జూరపుమట్టలు చేతపట్టుకొని సింహాసనము ఎదుటను గొఱ్ఱెపిల్లఎదుటను నిలువబడి.'' - ప్రకటన 7:13-17, ''పెద్దలలో ఒకడు-తెల్లని వస్త్రములు ధరించుకొనియున్న వీరెవరు? ఎక్కడనుండి వచ్చిరని నన్ను అడిగెను అందుకు నేను-అయ్యా, నీకే తెలియుననగా అతడు ఈలాగు నాతో చెప్పెను-వీరు మహాశ్రమలనుండి వచ్చిన వారు; గొఱ్ఱెపిల్ల రక్తములో తమ వస్త్రములను ఉదుకుకొని వాటిని తెలుపుచేసికొనిరి. అందువలన వారు దేవుని సింహాసనము ఎదుట ఉండి రాత్రింబగళ్ళు ఆయన ఆలయములో ఆయనను సేవించుచున్నారు. సింహాసనాసీనుడైన వాడు తానే తన గుడారము వారిమీద కప్పును; వారికి ఇకమీదట ఆకలియైనను దాహమైనను ఉండదు, సూర్యుని యెండయైనను ఏ వడగాలియైనను వారికి తగులదు, ఏలయనగా సింహాసన మధ్యమందుండు గొఱ్ఱెపిల్ల వారికి కాపరియై, జీవజలముల బుగ్గలయొద్దకు వారిని నడిపించును, దేవుడే వారి కన్నులనుండి ప్రతి బాష్పబిందువును తుడిచి వేయును.''
కడమవారు :- వీరు తీర్పునకు గురియై అగ్నిగుండము అను శిక్షను పొందు వారు. ప్రకటన 20:13-15, ''సముద్రము తనలో ఉన్న మృతులను అప్పగించెను; మరణమును పాతాళలోకమును వాటి వశముననున్న మృతుల నప్పగించెను; వారిలో ప్రతివాడు తన క్రియల చొప్పున తీర్పుపొందెను. మరణమును మృతుల లోకమును అగ్నిగుండములో పడవేయబడెను; ఈ అగ్నిగుండము రెండవ మరణము. ఎవని పేరైనను జీవగ్రంథమందు వ్రాయబడినట్టు కనబడని యెడల వాడు అగ్నిగుండములో పడవేయ బడెను.'' ప్రకటన 21:8, '' పిరికివారును, అవిశ్వాసులును, అసహ్యులును, నరహంతకు లును, వ్యభిచారులును, మాంత్రికులును, విగ్రహారాధకులును, అబద్ధికులందరును అగ్ని గంధకములతో మండు గుండములో పాలుపొందుదురు; ఇది రెండవ మరణము.''
ఈ విధముగా పరలోకములో వారి స్థితి, నరకములో వారు పొందు శిక్షకు గల కారణము - ఈ భూలోకము మరియు మధ్యాకాశములోని జీవాత్మ యొక్క కార్యములై యున్నవి. కనుక జీవాత్మ యొక్క ప్రయాణములో పరదైసుకు చాలా ప్రాధాన్యత ఉన్నట్లుగా అర్థమగుచున్నది.
ప్రకటన 2:7, ''జయించు వానికి దేవుని పరదైైసులో ఉన్న జీవవృక్షఫలములు భుజింపనిత్తును.''
ఆదికాండము 2:9లో దేవుడు ఈ జీవవృక్షాన్ని తాను తూర్పుదిక్కున వేసిన ఏదెనులో నాటినాడు. ఈ వృక్షముతోబాటు లోకసంబంధమైన మంచిచెడును తెలిపేటటు వంటి మరియొక వృక్షాన్ని కూడ దేవుడు నాటినట్లుగా చదువగలము. ఒకటి దైవికము మరొకటి లోకసంబంధము. ఆదినరుడు దైవాత్మ పూర్ణుడైనను వాని శరీరము భూ సంబంధము గనుక జీవవృక్షములో ఉన్నటువంటి నిగూఢ మర్మాలు తెలియని రీతిలో జీవించాడు. ఆ చెట్టు దరిదాపులకు కూడ నరుడు వెళ్ళినట్లు లేదు. అయితే లోకాధికారియైన సాతాను సర్పరూపములో నరునికి సాటి సహాయమైన నారితో లోకసంబంధ రీతిలో బోధ చేసి, దేవుడిని అబద్ధ్ధికుడుగా చేసి మంచి చెడు వృక్ష ఫలమును నరులచే తినిపించు కుయుక్తికరమైన క్రియను జరిగించి విజయుడయ్యాడు. ఈ సాతాను విజయమన్నది నరునికి మరణకరముగా పరిణమించింది. దీని ద్వారా నరుడు శాపపూరిత మరణాన్ని పొందాడు. అయితే ఏదెనులోని ఆ జీవవృక్షము ఏమైనది? పరదైౖసులోనికి ఈ జీవవృక్షము ఏలాగు వచ్చింది? అనిన ప్రశ్న మనకు కలుగవచ్చును. దేవుడు పక్షపాతి కాడు. ఆయన ఎవనికిని ఎట్టి పరిస్థితులలోను అపకారముగాని, అన్యాయముగాని చేసేవాడు కాదు. నరుడు జీవవృక్షఫలాన్ని భుజింపక నిషేధించిన ఫలాలను నరుడు తినుటనుబట్టి దేవుడు సుదీర్ఘముగా ఆలోచించి, మంచిచెడు ఫలాలను తినిన నరుడు - ఈ మంచిచెడు జ్ఞానముతో జీవవృక్ష ఫలాలను తినగలడని, సర్పముతో లోకముతో భూఫలముతో చేతులు కలిపిన నరుడు ఎట్టి కార్యానికైనను వెనుకాడడని, ఆ జీవవృక్షమునకు పోయే మార్గానికి ఖడ్గజ్వాలలను అడ్డుగా ఉంచాడు. అనగా నరుడు వెళ్ళలేనటువంటి వాతావరణాన్ని కలిగించాడు. నాడు దేవుడు కలిగించిన ఆ యొక్క నిర్ధిష్టమైన రక్షణనుబట్టి ఆ జీవవృక్ష మన్నది ఎక్కడున్నదో ఈనాటికిని నరునికి తెలియదు.
ఖండాంతరము వెళ్ళే రాకెట్లు, దేశ దేశాలను నాశనము చేసే క్షిపణులు, చిత్ర విచిత్రమైన బాంబులు, నానావిధ సాంకేతిక సాధనాలు, వాహనాలు, వాటితో బాటు విస్తారమైనట్టి భూగోళ ఖగోళ గ్రహ నక్షత్రాలయొక్క గమనాన్ని శాస్త్ర రూపముగా ఎరిగిన నరుడు జ్ఞానములో అత్యున్నత స్థానాన్ని పొందియున్నాడు. అయినను నరునికి ఈ జీవవృక్షము ఎక్కడున్నదని ప్రయత్నించిన దాఖలాలు లేవు, ఎందుచేతనంటే ఈ మర్మాన్ని దేవుడు ఎప్పుడో మరుగుపరచియున్నాడు. నేటి అరారాతు కొండలలో నోవహు ఓడను దర్శించినట్లు దాఖలాలున్నవి. అలాగే క్రీస్తు పునరుత్థానుడైన సమాధి, ఆయన సంచరించిన గ్రామాలు, ఆయన చరిత్రనుగూర్చి సాక్ష్యమిస్తూ నేటికిని ఉన్నవి. అలాగే పాతనిబంధన కాలములోని పూర్వీకులు కట్టిన కట్టడాలు చరిత్రలు సాక్ష్యాధారముగా నిలబడియున్నవి.
అయితే ఈ జీవవృక్షముయొక్క మాటేమిటి? ఇది గ్రహించినవాడెవడు? అన్నది ఈనాటికిని మరుగు చేయబడింది. అయితే జీవవృక్షము ఇప్పుడు ఎక్కడ ఉన్నట్లు? జీవ వృక్షము ఏదెను తోట నుండి తొలగించినట్లు చరిత్రలో దాఖలాలు లేవు. ఆదినరజంటను వెళ్ళగొట్టిన తరువాత వారు మరల ఆ జీవవృక్షఫలాన్ని తిని నిరంతరము జీవిస్తారని దేవుడు ముందు జాగ్రత్త కలిగినవాడె,ౖ జీవవృక్షమునకు పోవు దారిలో ఖడ్గజ్వాలల నుంచెను. ఈ విధముగా వానిని ఆ దరిదాపులకు వెళ్ళనీయకుండ చేయబడినది. మరియు అసలు జీవవృక్షమన్నదేమిటో దానిలో ఉన్నటువంటి మహిమ, దానియొక్క జనన విధానము, అది ఎందుకుగాను వేయబడిందో, ఏ దినము కూడ నరునికి తెలియనీయకుండ నరుని జ్ఞానానికి వాని తలంపులకు వాని ఆత్మీయ స్థితికి అంతుచిక్కనీయక బహుజాగ్రత్తగా గోప్యముగా ఉంచినట్లు తెలియుచున్నది. ఇందునుబట్టి నరుడు జీవవృక్షముయొక్క స్థితి గతులను, దాని ఫలాలను, దాన్ని గూర్చిన పరిజ్ఞానమును బొత్తిగా ఆలోచించక, కేవలము మంచిచెడు ఫలభక్షణముతో సరిపెట్టుకొని, ఆ పండుయొక్క మంచిచెడు వివేచన జ్ఞానముతో ఇహలోక జీవితాన్ని సాగించుచున్నాడు. ఆనాడు నిషేధఫలభక్షణము ఈ తరమువారికి కూడ మంచిచెడు వివేచన లోకసంబంధమైన జీవిత పరిజ్ఞానమును ఇచ్చినట్లుగా నేటి తరమువారమైన మనము తెలిసికోవలసియున్నది.
అయితే ఈ జీవవృక్షమన్నది క్రీస్తునకు నమూనాయైయున్నది. ఎందుకనగా యేసు ప్రభువు తన ప్రవచనాలలో, ''ఎండిన మ్రానుకే ఈలాగు చేసిన పచ్చి మ్రానుకు ఎలాగు చేయుదురో,'' అని మ్రానుకు తనను పోల్చుకొని ప్రవచించించాడు. ''నేను నిజమైన ద్రాక్షావళ్ళిని, నా తండ్రి వ్యవసాయకుడు.'' అలాగే తనను నమ్మిన విశ్వాసులను తీగెలుగా ప్రవచిస్తూ తనను అంటుకొని బహుగా ఫలించమంటున్నాడు. ''ఎవడు నా యందు నిలిచి యుండునో ఎవనియందు నేను నిలిచియుందునో వాడు బహుగా ఫలించును,'' అని ప్రవచించినాడు. క్రీస్తు ప్రభువు తననుగూర్చి లోకానికి ప్రకటిస్తూ, యోహాను 6:41, ''కాబట్టి నేను పరలోకమునుండి దిగి వచ్చిన ఆహారమని ఆయన చెప్పినందున, యూదులు ఆయనను గూర్చి సణుగుకొనుచు-ఈయన యోసేపు కుమారుడైన యేసు కాడా? ఈయన తల్లిదండ్రులను మనమెరుగుదుము గదా? నేను పరలోకమునుండి దిగి వచ్చియున్నానని ఈయన ఏలాగు చెప్పుచున్నాడనిరి.'' యోహాను 6:50-51, ''పరలోకమునుండి దిగి వచ్చిన జీవాహారమును నేనే, ఎవడైనను ఈ ఆహారము భుజించితే వాడెల్లప్పుడును జీవించును; మరియు నేనిచ్చు ఆహారము లోకమునకు జీవముకొరకైన నా శరీరమే అని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాననెను.'' ఈయన తనను ఒక వృక్షమునకు పోల్చుకున్నట్లుగ ఈ మాటలు మనకు వివరిస్తున్నవి. యెషయా 53:2, ''లేతమొక్కవలెను ఎండిన భూమిలో మొలిచిన మొక్కవలెను అతడు ఆయనయెదుట పెరిగెెను.'' పరమగీతాలలోను ఆదికాండము 49:11 లోను ఈయననుగూర్చి ద్రాక్షావళ్ళిగ వ్రాయబడియున్నది.
నిష్ప్రయోజనకరమైన చెట్టు వంటి మన జీవితాలకు నిత్యజీవమిచ్చుటకును పచ్చని వృక్షముగ మన జీవితాలను మరల చిగిరింపజేసి ఫలభరితమగుటకు కావలసిన సారము శక్తి ప్రభావము పునరుజ్జీవము క్రీస్తు ప్రభువునందు ఉండబట్టి ఈయనను జీవవృక్షముగా ప్రవచించుటన్నది సబబే. చెట్లు అనేకములుగా ఉండవచ్చునుగాని అన్నిటికిని ఆహారము నీరు అవసరము. అలాగే నరుని జీవితము కూడ చెట్టు వంటిదే. దైవత్వాన్ని వదిలి దైవాజ్ఞను మీరి తినవద్దని నిషేధించిన చెట్టు ఫలాన్ని తిన్నాడంటే ఇందునుబట్టి నరుడు చెట్టే. నరుని బుద్ధి కూడ చెట్టు సంబంధమే. నరుని జ్ఞానము చెట్టు జ్ఞానమే. కనుక దైవకుమారుడైన క్రీస్తు కూడ తనను ఒక చెట్టుగా పోల్చుకొన్నాడు. ద్రాక్ష చెట్టు అగు తనను అంటుగట్టబడి అంటుకొని జీవించమన్నాడు. తనలో జీవించమన్నాడు. తన ద్వారా ఫలించమన్నాడు. యోహాను 15:4, ''తీగె ద్రాక్షావల్లిలో నిలిచియుంటేనేగాని తనంతట తానే యేలాగు ఫలింపదో, ఆలాగే నాయందు నిలిచియుంటేనే కాని మీరును ఫలింపరు.'' కనుక యేసు అనే జీవవృక్షముతో విశ్వాసులమైన మనము అంటుగట్టబడి ఆయనతో ఐక్యత సంబంధము కలిగి ఉంటేనే మన కుటుంబములలో శాంతి సమాధానము కలిగి దైవత్వానికి యోగ్యకరమైన జీవితము లభిస్తుంది. ప్రతి నరుడు ఒక వృక్షముగానే ఉన్నట్లుగా ఆత్మీయముగా మనకు అర్థమగుచున్నది. ఇందునుగూర్చి లోతుగ మనము ఆలోచిస్తే, యేసుకు బాప్తిస్మము ఇచ్చిన యోహాను తన యొద్ద బాప్తిస్మము పొందవచ్చిన వారిని ఉద్దేశించి, మత్తయి 3:10, ''ఇప్పుడే గొడ్డలి చెట్లవేరున ఉంచబడియున్నది,'' అని చెప్పెను. కనుక మంచి ఫలము ఫలించని ప్రతి చెట్టును నరకబడి అగ్నిలో వేయబడును. అంటే అగ్నిగుండమను మరణములో పాలుపొందుదురు.
కనుక యేసుకు బాప్తిస్మమిచ్చిన యోహానుకూడ దైవత్వమునకు కావలసిన యోగ్యకరమైన ఆత్మీయ ఫలములను ఫలించని జీవితములో ఉన్న నరుని నరకబడే చెట్టుకు పోల్చెను. చిత్రమేమిటంటే నరునికున్నట్లు చెట్టుకు కూడ జీవమున్నది. దానికి కూడ అంగాలున్నవి అనగా మొదలు కొమ్మలు రెమ్మలు ఆకులు పూవులు పిందెలు కాయలు ఫలాలు, మొదలైనవి. నరుడు ఏ విధముగా చలించునో చెట్టు స్ధిరముగా ఉన్నా కూడ గాలికి వెలుతురికి చలించి పచ్చగ కళకళలాడుతుంది. అనేక జీవులకు ఆశ్రయ మిస్తుంది. ఎండ వేడిమికి తాపము పొందిన ప్రతి జీవికి అది నీడనిచ్చి సేద దీర్చుతుంది.
దేవుడు తన ఆత్మ ద్వారా మనకిచ్చిన ప్రకాశమానమైన ఆత్మీయ జ్ఞానవరములను బట్టి, ఆయన మన పట్ల చూపుతున్న మేళ్ళనుబట్టి, ఆయన మనకిచ్చిన గాలి, వెలుతురు, ఆహారము, ఆత్మీయ ప్రభు భోజనము, పానమునుబట్టి, తన ప్రార్థనాజలమునుబట్టి భూసం బంధముగా జీవిస్తున్న మనము ఆత్మ సంబంధులుగా ఎదిగి ఆత్మ ఫలాలను ఫలించాలి. అయితే భూసంబంధముగా మనము శరీర ఫలాలు ఫలిస్తున్నాము. దైవత్వమునకు ఉపయోగకరమైన ఫలాలున్నవి. అవియే ఆత్మఫలాలు. శారీర ఫలాలనుగూర్చి, గలతీ 5:19-22, ''శరీరకార్యములు స్పష్టమైయున్నవి; అవేవనగా, జారత్వము, అపవిత్రత, కాముకత్వము, విగ్రహారాధన, అభిచారము, ద్వేషములు, కలహము, మత్సరములు, క్రోధములు, కక్షలు, భేదములు, విమతములు, అసూయలు, మత్తతలు, అల్లరితో కూడిన ఆటపాటలు మొదలైనవి. వీటినిగూర్చి నేనుమునుపు చెప్పిన ప్రకారము ఇట్టి వాటిని చేయువారు దేవుని రాజ్యమును స్వతంత్రించుకొనరని మీతో స్పష్టముగా చెప్పుచున్నాను. అయితే ఆత్మ ఫలమేమనగా, ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళు త్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశానిగ్రహము.'' నరునిలో ఏ విధముగా శరీర ఫలాలు ఆత్మీయ ఫలాలున్నాయో అదే విధముగా చెట్టుకు లేవు. ఎందుకంటే చెట్టుకు ఆత్మలేదు గనుక దానికి ఆత్మ ఫలాలు లేవు. దానికున్నదంతయు శరీర ఫలములే. అయితే చెట్టుకు ఆత్మ లేకపోయినను, దేవుడు అనుగ్రహించిన ఆయా కాలములు ఆయా ఋతువుల ధర్మమును పాటిస్తూ మనకు కావలసిన ఫలాలు ఫలిస్తూనే ఉన్నది. అయితే నరుడు వీటికి భిన్నముగా ఉన్నాడు. నరుడు యీ సమయాలను నిష్టా నియమములను పాటింపక, దైవత్వమును లోకత్వాన్ని మానవత్వాన్ని పైశాచికాన్ని అన్నింటిని ఏకరీతిగా చేస్తూ జీవిస్తున్నాడు. ఇది వ్యర్థమైన జీవితము, అనగా నులివెచ్చని జీవితము. ఇట్టి జీవితము లోకానికి దైవత్వానికి అయోగ్యమైనది. కనుక నరుడు లోకానికి పనికిమాలిన వాడును, దైవత్వానికి శాపగ్రస్థుడుగా జీవించే స్థితికి దిగజారియున్నాడు.
జీవవృక్షముగాని, జీవవృక్షఫలముగాని ఇప్పుడు ప్రత్యక్షముగా మనమధ్య లేకపోయినను, అదృశ్యములో నేటికిని ఆ వృక్షము ఉన్నది. ఆ వృక్షముయొక్క ఫలాలు అనగా ప్రభావము మానవునిపట్ల నిత్యము క్రియ జరిగిస్తున్నది. దీనిని గ్రహించినవాడెవడు? ఏదెను తోటలో ప్రత్యక్షముగా దేవుని చేత నాటబడిన ఈ వృక్షము నరుని దైవఆజ్ఞాతి క్రమమునుబట్టి కనుమరుగై సజీవమైన వృక్షముగా నరులమధ్య చలించుచు క్రీస్తు రూపమున దర్శనమిచ్చింది. చలనము లేని భూఫలాన్ని తినిన నరుడు జీవవృక్షముయొక్క పూర్వార్థము గ్రహించలేక పోబట్టి, నరుల చేతనే అది నరకబడి పునరుజ్జీవము పొంది, మహిమ పునరుత్థానమై నేడు ప్రతి విశ్వాసి హృదయములో ఆ వృక్ష బీజము అన్నది మొలకెత్తియున్నది. దాని ప్రభావమే సువార్త వ్యాపకము. ఆ బీజమే దేవునియొక్క వాక్యము. అది నాటబడే స్థలము ప్రతి విశ్వాసి హృదయము. ఎఫెసీ 4:6, ''ఆయన అందరికిపైగా ఉన్నవాడై అందరిలోను వ్యాపించి అందరిలోఉన్నాడు,'' అనుటలో ఇప్పుడు ఈ జీవవృక్షము ఉన్నత శిఖరాలలో అందరికి పైగా ఉన్న పరదైసులోనే గాక, మనలో ఆ బీజము ఉండాలి గనుక ప్రతి విశ్వాసియొక్క హృదయములో సువార్త రూపముగా ఈ జీవవృక్ష బీజము నాటబడి యున్నది.
అయితే ప్రభువు జీవవృక్ష ఫలములను భుజింపనిత్తును, అని ఎఫెసులో జయించు వానికి వాగ్దానము చేసియున్నాడు. అయితే ప్రకటన 22:1-2, ''మరియు స్ఫటికమువలె మెరయునట్టి జీవజలముల నది దేవునియొక్కయు గొఱ్ఱెపిల్లయొక్కయు సింహాసనమునొద్ద నుండి ఆ పట్టణపు రాజవీధిమధ్యను ప్రవహించుట ఆ దూత నాకు చూపెను. ఆ నది యొక్క ఈవలను ఆవలను జీవవృక్షముండెను; అది నెలనెలకు ఫలించుచు పండ్రెండు కాపులు కాయును. ఆ వృక్షముయొక్క ఆకులు జనములను స్వస్థపరచుటకై వినియో గించును.'' ఈ వచనము ప్రకారము ఇది పరదైసునందు ఉన్నదనుటకు ఆధారమై యున్నది. ఇవి ఆత్మలకు ఆహార యోగ్యమైనవి.
ప్రకటన 1:20 ప్రకారము స్ముర్నలో ఉన్న సంఘపు దూత కూడ క్రీస్తు చేతిలో వెలుగుచున్న ఒక నక్షత్రము.
ప్రకటన 2:8, ''మొదటివాడును కడపటివాడునై యుండి, మృతుడై మరల బ్రదికినవాడు,'' ఈ లేఖ వ్రాయించుచున్నాడు. ఈయన క్రీస్తు అని ఈ గ్రంథములోని ఒకటవ అధ్యాయములో, ''అల్ఫాయు ఓమెగయు,'' అను ఎనిమిదవ విభాగములో సవివరముగా చెప్పబడియున్నది. పదమూడవ విభాగము ''చనిపోయెను గాని సజీవుడే,'' లో కూడ వివరించబడియున్నది. క్లుప్తముగా - క్రీస్తు మొదటివాడుగా యోహాను 1:1-4లో వలె వాక్యము దేవుని వద్ద ఉండి, దేవుని నోటి ద్వారా వెలుగుగా ఆదికాండము 1: 3లో బయలు వెడలి సమస్తము సృష్టించి ఈ సృష్టికి ఆది ఆయెను. మరల ఈయన సిలువ బలియాగము ద్వారా చనిపోయి తిరిగి లేచి కడపటివాడుగా మేఘారూఢుడై వచ్చుచున్నాడు.
ప్రకటన 2:9, ''నీ శ్రమను, దరిద్రతను నేనెరుగుదును, అయినను నీవు ధన వంతుడవే,'' అనుటలో శ్రమ ఏమిటి? దరిద్రత ఏమిటి? శ్రమ అనునది లోకరీత్యా లోక బంధకాలలో అనుభవించేటటువంటి వేదనకర జీవితము లేక తృణీకరించబడిన ఎన్నిక లేని జీవితము, లేక అనేక సమస్యలతో కూడిన జీవితము. ఇది ఎక్కువగా దైవత్వములో జీవించేవానికి సంభవిస్తుంది. ఈ శ్రమతోబాటు దరిద్రత అనగా లోక సంబంధ ఆర్ధిక ఇబ్బందులు, సరియైన గృహవసతి, సరియైన తిండి, వస్త్రాలను గూర్చిన సమస్య మొదలైనవి. ఇవన్నియు లోక దారిద్య్రానికి కారణములైయున్నవి. ఇట్టి స్థితిలో ఉన్న ఆత్మీయుని దైవవాక్యము - ''అయినను నీవు ధనవంతుడవే,'' అని అంటున్నాడు. మరి ఇలాంటివాడు ఎలాగున ధనవంతుడగును? ఈ సందర్భములో మత్తయి 5:3-6లో వ్రాయబడిన మాటలు దైవవిశ్వాసములో జీవించే విశ్వాసికి కలుగు అవాంతరాలు, వాటి నుండి దైవత్వము అనుగ్రహించే బహుమానాలను తెలుపుచున్నవి. ''ఆత్మవిషయమై దీనులైనవారు ధన్యులు; పరలోక రాజ్యము వారిది.'' ఇట్టివారే ఈ స్ముర్నలోని విశ్వాసులు. ఇట్టిదే విశ్వాసుల జీవితము. ''దుఃఖపడువారు ధన్యులు; వారు ఓదార్చబడుదురు.'' ఈ స్ముర్న సంఘమునకు వివరించినట్లు మనకు శ్రమలున్నవి. శోధన ఉన్నది. చెరను అనుభవించే పరిస్థితి ఉంది. లోక దూషణ ఉంది. యూదులు కాక యూదులమని చెప్పు కొనువారు అనగా క్రైస్తవులు కాకుండానే క్రైస్తవులుగా చెప్పుకొను అబద్ధ బోధకులు. ఆ సమాజపువారి వలన కలుగు దూషణలు దేవుడు చూస్తున్నాడు. లోక హేళన లోకసంబంధ శ్రమలు అన్నియును ఆవరించియుండగా దేవునియొక్క ఓదార్పు ఈ సంఘానికి ఉన్నట్లు ఇందునుబట్టి తెలుస్తున్నది. ప్రకటన 2:10, ''ఇదిగో మీరు శోధింపబడునట్లు అపవాది మీలో కొందరిని చెరలో వేయింప బోవుచున్నాడు; పది దినములు శ్రమ కలుగును; మరణము వరకు నమ్మకముగా ఉండుము. నేను నీకు జీవకిరీటమిచ్చెదను,'' అని అనుటలో ఈ జీవకిరీటమే ఆ ఓదార్పుగా అనుగ్రహించబడు బహుమానము. అంతేగాదు ఆ విధముగా జీవించినవారికి రెండవ మరణము వలన ఏ హానియు లేదు. రెండవ మరణానికి ఇతని మీద ఏ అధికారము లేదని తెలుస్తున్నది. ఒక్క మాటలో చెప్పాలంటే మత్తయి 5:3లో వలె పరలోక రాజ్యము వారిది.
ప్రకటన 2:10, ''ఇదిగో మీరు శోధింపబడునట్లు అపవాది మీలో కొందరిని చెరలో వేయింప బోవుచున్నాడు; పది దినములు శ్రమ కలుగును; మరణమువరకు నమ్మకముగా ఉండుము. నేను నీకు జీవకిరీటమిచ్చెదను.''
''పది దినములు శ్రమ కలుగును;'' అనగా నేమి? ఇక్కడ మనము గుర్తించ వలసినది ఏమిటి? అంటే ఈ వాక్యమును యేసుక్రీస్తు ప్రభువు చెప్పుచున్నాడు. అంటే ప్రతి మనిషి ఈ పది దినముల శ్రమను అనుభవించవలసిందే, ఎందుకంటే యేసుక్రీస్తు ఈ యొక్క వాక్యములో పదిదినముల శ్రమకు మనలను అప్పగిస్తున్నాడు. అంటే మనపై సాతాను గుప్తాధిపత్యము చేయబోవుచున్నాడు. యేసుక్రీస్తు ఈ పది దినముల శ్రమకు మనలను సాతానుకు అప్పగిస్తున్నాడు. మరి ఓ క్రైస్తవ విశ్వాసి! నీవు ఈ శ్రమను ఏ విధముగా పూర్తిచేయాలని అనుకొనుచున్నావు? ఏదెను వన చరిత్రలో ఆదామును ఈ పది దినముల శ్రమకు అప్పగించాడు. సాతాను పవిత్రమైన వనములో దేవుని ఆజ్ఞ ప్రకారము వెళ్లి శోధించాడు. అందువల్ల సాతాను శోధన మరియు దేవుని పరిశోధనను ఆదాము ఎదుర్కొనవలసి వచ్చింది అనగా దేవుని తోడ్పాటు ఆదామునకు లేకపోవుట వల్ల శోధనను జయించలేక పోయాడు. మరణమును పొందినాడు.
అటుతరువాత అబ్రాహాముయొక్క చరిత్ర మనము చదివితే సంతాన లేమి అనునది ఆయనకు ముదుసలి వయస్సు వరకు ఉంది. దేవుడు ఇదిగో నీ సంతానాన్ని ఆకాశ నక్షత్రాలవలెను, సముద్రపు వెంబడి యిసుక రేణువులవలెను పెంచుదునని చెప్పుచు వచ్చాడు. అయితే అబ్రాహాముయొక్క జీవితములో సంతానము ముదుసలి జీవితము వరకు లేదు. శారా కూడ ముట్టు ఉడిగి ముదుసలి అయిపోయింది. అబ్రాహాము ఈ పది దినముల శ్రమను అనుభవిస్తున్నను దేవుని మీద విశ్వాసాన్ని కోల్పోలేదు. అటుతరువాత ఇష్మాయేలు, ఇస్సాకు జన్మించారు. ఇష్మాయేలును ఎడారిలో వదలి వేయవలసి వచ్చింది. అటుతరువాత దేవుడు ఇస్సాకును బలిగా కోరాడు. అబ్రాహాము విశ్వాసముతో ఇస్సాకును బలి ఇయ్యబోయాడు. కాని దేవుడు నివారించి ఇస్సాకుకు బదులుగా గొఱ్ఱెను బలిగా తీసుకొన్నాడు. ఇక్కడ మనము బాగా గమనిస్తే అబ్రాహాము జీవితములో సుమారుగా తొంభై శాతము పది దినముల శ్రమను పొందవలసి వచ్చింది.
ఇంకా మనము యోబు చరిత్ర చదివితే యోబు బహుసంతానము కలవాడై అధిక ధనవంతుడుగాను దేవునిచే నీతిమంతుడుగా ఎన్నిక చేయబడ్డాడు. అయితే యోబు గ్రంథము ఒకటవ మరియు రెండవ అధ్యాయములలో దేవుడు యోబును సాతానుకు అప్పగించుట మనము చదువవచ్చును. ఈ పది దినముల శ్రమలలో తన సంతానాన్ని కోల్పోయాడు. పశువులు, గొఱ్ఱెలు మొదలగునవి అన్ని కోల్పోయినాడు. చివరగా తన ఆరోగ్యాన్ని కూడ కోల్పోయాడు. చిట్టచివరకు చిల్లపెంకులతో బూడిదలో కూర్చుని తనకు వచ్చిన బొబ్బలను గోక్కుంటూ కూడ దేవుని మీద విశ్వాసము కొంచెము కూడ సడలలేదు. ఈ విధముగా పది దినములను శ్రమను పూర్తి చేసాడు. ఆ తర్వాత దేవుని ఆశీర్వాదము వల్ల బహుగా ఆశీర్వదింపబడినాడు.
ఈ విధముగా బైబిలు గ్రంథములో ప్రతి ఒక్కరిని దేవుడు పది దినముల శ్రమలకు అప్పగించాడు. ఈ శ్రమలు కొందరికి మరణము వరకు కూడ ఉండవచ్చును, ఎందుకంటే మరణము వరకు నమ్మకముగా ఉండమని మన మూలవచనములో చెప్పు చున్నాడు. దీని అర్థము కొందరి జీవితములో ఈ పది దినముల శ్రమలు మరణము వరకు కూడ ఉండవచ్చును అని అర్థము.
ఈ పది దినముల శ్రమ అన్నది కొంతకాలము వరకేనని ప్రభువు మనలను ఓదార్చుటకు చెప్పిన మాటయే గాని మానవుడు వ్రేళ్ల మీద లెక్కించు దినములు కావు. 2 పేతురు 3:8లో చెప్పబడినట్లు ఇవి దేవుని నిర్ణయ దినములు. ఈ శ్రమలో సాతాను శోధన, దేవుని పరిశోధన- రెండు మిళితమైయుండును. దేవుని దృష్టిలో జీవాత్మ ఆయుస్సు పది దినములేయని గ్రహించాలి. కనుక ప్రకటన 2:10లో చెప్పబడినట్లు మానవుని జీవితములో ఎప్పుడో ఒకప్పుడు ఏదో ఒక విధముగా ఈ శ్రమలు ఒక్కొక్కరిలో ఒక్కొక్క విధముగా క్రియ జరిగిస్తాయి.
అయితే ఎవరైతే దేవునిలో నిలువబడి ఈ పది దినముల శ్రమను జయించ గలుగుతారో వారికి క్రీస్తు ప్రభువు ఇస్తున్న వాగ్దానము, జీవకిరీటము; దీని వలన వారికి రెండవ మరణము వలన ఏ హాని ఉండదు. అంటే నిత్య ఆనందకరమైన పరలోకమును వీరు ఆనందముగా అనుభవింతురు. ఇంతకి క్రీస్తు ప్రభువు మనలను పది దినముల శ్రమకు ఎందుకు సాతానుకు అప్పగించుచున్నాడు? ఈ విషయమునుగూర్చి ఎప్పుడైన తెలుసుకొన్నామా? క్రీస్తు ప్రభువు మనలను పది దినముల శ్రమకు అప్పగించి మనయొక్క సహనమును పరీక్షించును. ఈ సహనములో క్రీస్తునందున్న ఓర్పు, విశ్వాసము, నిరీక్షణ మొదలగునవి మనలో మరింత బహిర్గతము అగును. దీనినిబట్టి మనము ఈ లోకమును, సాతాను ద్వారా వచ్చు పది దినముల శ్రమను జయించుదుము. ఈ లోకములో మనము పొందిన విజయమునుబట్టి పరలోకములో ఒక ప్రత్యేకమైన స్థానమును క్రీస్తు ప్రభువు ఇచ్చును. అయితే మనలో చాలామంది ఈ పది దినముల శ్రమలో దేవుని దూషించి తప్పిపోవుచున్నారు. అనగా వీరు పొందవలసిన బహుమానమును, పరలోకములోఉన్న ఉన్నత స్థితిని కోల్పోవుచున్నారు. కాబట్టి పది దినముల శ్రమను అనుభవించుటకు సిద్ధముగా ఉందుముగాక!
ప్రకటన 2:10, ''నేను నీకు జీవకిరీటమిచ్చెదను.''
కీర్తన 8:5-9 వరకు మనము ధ్యానించినట్లయితే ఇందులో దేవునియొక్క సృష్టి మర్మములు ఆయన మహిమాప్రభావములు సృష్టిలో ఆయన జరిగించిన క్రియలనుగూర్చి మనకు తెలియును. కీర్తన 8:5-9, ''దేవునికంటె వానిని కొంచెము తక్కువవానిగా చేసి యున్నావు. మహిమా ప్రభావములతో వానికి కిరీటము ధరింపజేసియున్నావు. నీ చేతిపనుల మీద వానికి అధికారమిచ్చియున్నావు. గొఱ్ఱెలన్నిటిని, ఎడ్లనన్నిటిని అడవి మృగములను ఆకాశపక్షులను సముద్ర మత్స్యములను సముద్రమార్గములలో సంచరించువాటినన్నిటిని వాని పాదముల క్రింద నీవు ఉంచి యున్నావు. యెహోవా మా ప్రభువా భూమియందంతట నీ నామము ఎంత ప్రభావము గలది!'' ఇందులో మానవునికిని యావద్ సృష్టిపైన అధికారమిచ్చుచు ప్రపంచానికే ఆది మహారాజుగా నియమించినట్లుగా తెలియుచున్నది. ఆదికాండము 1:28, ''దేవుడు వారిని ఆశీర్వదించెను; ఎట్లనగా-మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోపరచుకొనుడి; సముద్రపు చేపలను ఆకాశ పక్షులను భూమిమీద ప్రాకు ప్రతి జీవిని ఏలుడని దేవుడు వారితో చెప్పెను,'' అనుటలో భూలోకమునకు తొలి రాజు ఆదాము. ఇతని శిరస్సు పైన జీవకిరీటమును దేవుడు తన మహిమాప్రభావముతో ధరింపజేసియున్నాడు. తన చేతిపనుల మీద తన సృష్టి యావత్తు మీద నరునికి అధికారమిచ్చి నట్లుగా కీర్తన 8:5 వివరిస్తున్నది.
ఇంత ఆధిక్యతలో జీవించిన ఆదిరాజైన ఆదాము ఆయన స్వాస్థ్యమంతటికిని వారసుడుగా జీవిస్తుండినప్పటికి, సర్ప శోధన ద్వారా తన సహకారిణియైన స్త్రీయొక్క బలహీనతకు దాసుడై శోధనకు లోనై దేవునియొక్క మహిమ కిరీటమును, దాని విలువను పోగొట్టుకొన్నట్లు మనము గ్రహించవలసియున్నది. ఇందునుబట్టి యాకోబు 1:12, ''శోధన సహించువాడు ధన్యుడు; అతడు శోధనకు నిలిచినవాడై ప్రభువు తన్ను ప్రేమించు వారికి వాగ్దానము చేసిన జీవకిరీటము పొందును.'' ఏదెనులోని శోధనను ఆదాము జయించియున్నట్లయితే అతనికి దేవుడు ధరింపజేసిన మహిమ కిరీటము జీవకిరీటముగా అనగా మరణము లేనివానినిగా సజీవునిగా జీవింపజేసియుండెడిది. అందుకు భిన్నముగా ఆదాము వ్యవహరించబట్టియే ఈ జీవకిరీటము ధరించే భాగ్యము పోగొట్టుకొని మరణించి మన్నైపోవు స్థితికి దిగజారవలసివచ్చింది.
ఇంతకును ఈ జీవకిరీటమన్నది ఆత్మ సంబంధమైనదా? లేక శరీర సంబంధ మైనదా? ఇహలోక సంబంధమా? లేక పరలోక సంబంధమైనదా? దృశ్యములో ఉన్నదా? అదృశ్యములో ఉన్నదా? అన్నది మనము తెలిసికోవలసియున్నది. తొలుత ఏదెను వనములో ఈ జీవకిరీటమన్నది దృశ్యములో ఉండి దేవుని చేత నరునికి అనుగ్రహించ బడినది. అయితే నరునికి దీని మీద అసలు ధ్యాస ఉన్నట్లుగా లేదు. ఎందుకంటే జీవకిరీటము తనకు దేవుడు ధరింపజేశాడనియు, జీవవృక్షమన్నది తోట మధ్యలో దృశ్యములో ఉన్నదని నరుడెరిగి ఉంటే దైవశాపమునకు గురియగువాడు గాదు. దైవత్వమునకు విరోధిగా మారువాడు గాదు.
అయితే ఈ జీవకిరీటము ఎవరు పొందిరి? ఎవరు దీనిని దేవుని చేత పొందగలిగిరి? అన్న దానినిగూర్చి మనము లోకరీత్యా తెలిసికోవలసియున్నది. ఈ జీవకిరీటాన్ని ఆది కాలములో దైవపుత్రుడైన ఆదాము పోగొట్టుకొన్నను, పోయినదానిని ఆయన కుమారుడైన హానోకు ధరించి దేవునితో సహవాసము జేసి, దేవునితో కూడ నడిచి భూమి మీద కనపడకుండ పోయాడు. మరణము రుచి చూడకుండపోయాడు. అదే విధముగా ఏలీయా కూడ ఈ జీవకిరీటాన్ని పొంది సుడిగాలిలో ఆరోహణమైౖ భూజనులకు కనుమరుగాయెను. ఇక మూడవదిగా దైవకుమారుడైనట్టి యేసు ప్రభువు శోధనను, శ్రమలను, బాధలను, లోకసంబంధమైన ప్రతి శ్రమను జయించి పాప నరశిక్షను తన దేహము మీద విధించుకొని, మూడవ దినమున మృత్యుంజయుడై దేవుడనుగ్రహించిన జీవకిరీటమును దాని ప్రభావమున గొర్రెపిల్ల రాజుగా ప్రతిష్టించబడినాడు. అయితే ఇట్టి జీవమైయున్న క్రీస్తును నిర్జీవునిగాను దోషినిగాను తీర్పుదీర్చి లోకసంబంధమైన రాజుగా హేళన జేస్తూ ఆయనకు ముండ్ల కిరీటమును ధరింపజేశారు.
అయితే మన దేవుడైన యేసుక్రీస్తు అపవాది శోధనలు జరుగునని చెప్పుచూనే మరణము వరకు ఎవరైతే నమ్మకముగా సువార్త సేవను జరిగిస్తారో - తాను జీవకిరీటము పొందిన విధముగా వారికి జీవకిరీటము మిచ్చెదనని వాగ్దానము చేయుచున్నాడు. క్రీస్తు ప్రభువు మన తండ్రియైన ఆదాము పోగొట్టిన జీవకిరీటమును మరల పొందుటకు ఈ లోకమును, సాతానును, సాతాను ఇచ్చు పది దినముల శ్రమను జయించమని చెప్పు చున్నారు. ఇందునుబట్టి సాతాను శోధనను జయించి మరణము వరకు నమ్మకముగాఉన్న ప్రతి ఒక్కరు ఈ జీవకిరీటమును పొందుదురు. ఇందులో ఎటువంటి అనుమానము లేదు.
ప్రకటన 2:11, ''జయించువాడు రెండవ మరణమువలన ఏ హానియుచెందడు.''
ఆదికాండము 2:17, ''అయితే మంచిచెడ్డల తెలివినిచ్చు వృక్ష ఫలములను తినకూడదు; నీవు వాటిని తినుదినమున నిశ్చయముగా చచ్చెదవని నరుని కాజ్ఞాపించెను.'' ఇది మరణమునుగూర్చిన ఆజ్ఞ. అయితే ఆదాము హవ్వలు సర్పబోధకు లోనై ఈ ఆజ్ఞను మీరి దైవశాపము వలన మరణమును కొని తెచ్చుకొన్నారు. దీనిని మొదటి మరణము అని అందురు. ఈ మరణము ద్వారా మానవుని శరీరము ఏ మట్టి నుంచి వచ్చిందో ఆ మట్టిలో కలిసిపోతుంది. అయితే ఈ మరణానంతరము ఆత్మ పరదైసులలో భద్రపరచబడి యుంటుంది.
క్రీస్తు రెండవ రాకడ సందర్భములో బూర ఊదగా ప్రతి ఒక్కరు అక్షయులుగా లేపబడుదురు. ప్రతి ఆత్మ మహిమ శరీరమును పొంది సమాధులనుండి వెలుపలికి వస్తారు. దీనిని రెండవ జన్మ అని కూడ అనవచ్చును. అయితే ఈసారి జీవితము క్రీస్తు ప్రభువుయొక్క తీర్పును అనుసరించి ఉంటుంది. ఈ తీర్పు మత్తయి 25వ అధ్యాయములో చెప్పబడిన రీతిగా ఉండి, మంచి చేసినవారికి అనగా జీవకిరీటము మరల పొందినవారికి రెండవ మరణము వలన హాని జరుగదని క్రీస్తు మనకు చెప్పుచున్నాడు. క్రీస్తు ఈ రెండవ మరణమును - పాపము చేయు ప్రతి ఒక్కరికి దీనిని బహుమానముగా ఇచ్చును. ఈ రెండవ మరణమును ఎవరు పొందుదురు? ప్రకటన 21:8, ''పిరికివారును, అవిశ్వాసులును, అసహ్యులును, నరహంతకులును, వ్యభిచారులును, మాంత్రికులును, విగ్రహారాధికులును, అబద్ధికులందరును అగ్ని గంధకములతో మండు గుండములో పాలుపొందుదురు; ఇది రెండవ మరణము.'' ఇప్పుడు మొదటి మరణము సుమారు పుట్టినది మొదలు 120 సంవత్సరముల కాలము లోపల జరుగుతుంటే రెండవ మరణము అనునది వీరిపై అనంత కాలము రాజ్యమేలును.
ప్రకటన 20:4-6, ''అంతట సింహా సనములను చూచితిని; వాటిమీద ఆసీనులై యుండువారికి విమర్శచేయుటకు అధికారము ఇయ్యబడెను. మరియు క్రూరమృగము నకైనను దాని ప్రతిమకైనను నమస్కారము చేయక, తమ నొసళ్ళయందు గాని చేతుల యందు గాని దాని ముద్రవేయించుకొనని వారిని, యేసు విషయమై తామిచ్చిన సాక్ష్యము నిమిత్తమును దేవుని వాక్యము నిమిత్తమును శిరచ్ఛేదనము చేయబడిన వారి ఆత్మలను చూచితిని. వారు బ్రదికినవారై, వెయ్యి సంవత్సరములు క్రీస్తుతోకూడ రాజ్యము చేసిరి. ఆ వెయ్యి సంవత్సరములు గడచువరకు కడమ మృతులు బ్రదుకలేదు; ఇదియే మొదటి పునరుత్థానము. ఈ మొదటి పునరుత్థానములో పాలుగలవారు ధన్యులును పరిశుద్ధులునై యుందురు.
ఇట్టివారిమీద రెండవ మరణమునకు అధికారములేదు; వీరు దేవునికిని క్రీస్తుకును యాజకులై క్రీస్తుతోకూడ వెయ్యి సంవత్సరములు రాజ్యము చేయుదురు.''
ప్రకటన 1:20 ప్రకారము పెర్గములో ఉన్న సంఘపు దూత క్రీస్తు చేతిలో ఒక నక్షత్రముగా వెలుగొందుచున్నదే.
ప్రకటన 2:13, ''వాడియైన రెండంచులుగల ఖడ్గముగలవాడు,'' ఈ లేఖ వ్రాయించుచున్నాడు. ఈయన క్రీస్తు అని ఈ గ్రంథములోని ఒకటవ అధ్యాయము పదకొండవ విభాగములో తెలుసుకొన్నాము.
హెబ్రీ 4:12, ''ఎందుకనగా దేవుని వాక్యము సజీవమై బలముగలదై రెండంచులు గల యెటువంటి ఖడ్గముకంటెను వాడిగా ఉండి, ప్రాణాత్మలను కీళ్లను మూలుగను విభజించునంతమట్టుకు దూరుచు, హృదయముయొక్క తలంపులను ఆలోచనలను శోధించు చున్నది.'' దేవుని వాక్యమనే ఈ ఖడ్గము దేవుని వద్ద ఉన్నట్లుగా యోహాను 1:1-4లో చదువగలము.
ఈ వాక్యము యోహాను 1:14లో వలె కృపాసత్యసంపూర్ణుడుగా శరీరధారియై ఈ లోకములో అవతరించింది. ఈయన నోటినుండి మరల తీర్పు తీర్చుటకు బయలు వెడలుచున్నట్లుగా యోహాను ప్రకటన 1:16లో సాక్ష్యమిస్తున్నాడు. ఇటువంటివాడైన క్రీస్తు ఈ లేఖలో కొన్ని సంగతులను మనకు తెలియజేస్తున్నాడు.
ప్రకటన 2:13-17, ''-సాతాను సింహాసనమున్న స్థలములో నీవు కాపురము న్నావని నేనెరుగుదును. మరియు సాతాను కాపురమున్న ఆ స్థలములో, నాయందు విశ్వాసియైయుండి నన్నుగూర్చి సాక్షియైన అంతిపయనువాడు మీ మధ్యను చంపబడిన దినములలో నీవు నా నామము గట్టిగా చేపట్టి నాయందలి విశ్వాసమును విసర్జింపలేదని నేనెరుగుదును. అయినను నేను నీమీద కొన్ని తప్పిదములు మోపవలసియున్నది. అవేవనగా, విగ్రహములకు బలియిచ్చిన వాటిని తినునట్లును, జారత్వము చేయునట్లును, ఇశ్రాయేలీయులకు ఉరి యొడ్డుమని బాలాకునకు నేర్పిన బిలాముబోధను అనుసరించు వారు నీలో ఉన్నారు. అటువలెనే నీకొలాయితుల బోధ ననుసరించు వారును నీలో ఉన్నారు. కావున మారుమనస్సు పొందుము; లేనియెడల నేను నీయొద్దకు త్వరగా వచ్చి నానోటనుండివచ్చు ఖడ్గముచేత వీరితో యుద్ధము చేసెదను. సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినును గాక. జయించువానికి మరుగైయున్న మన్నాను భుజింపనిత్తును. మరియు అతనికి తెల్లరాతినిత్తును; ఆ రాతిమీద చెక్కబడిన యొక క్రొత్తపేరుండును; పొందిన వానికేగాని అది మరి యెవనికిని తెలియదు.''
పెర్గములో ఉన్న సంఘానికి క్రీస్తు యోహాను ద్వారా వ్రాసిన లేఖ చాలా హెచ్చరికతోను వేదనతోను ఉగ్రతతోను ఎలాంటి రాజీపడని స్థితిలో వ్రాయబడినట్లుగా తెలుస్తున్నది. ఎందుకనగా పెర్గములోని సంఘస్థులు అన్యులతో సావాసము, విగ్రహారాధికు లతో పొందిక, విగ్రహాలకు అర్పించిన వాటిని ఆరగించుట, వ్యభిచారమును చేయునట్లు అనేకులను ప్రేరేపింపజేయుట, దైవజనాంగాన్ని పాడుజేయుటకు బిలాము చేసిన బోధను అనుసరించిన బోధకులు, దైవవిశ్వాసులను చెదరగొట్టుటకు చేయు బోధలను ఆదర్శముగా అనుసరించి నడిచెదరు. అటువంటి వారితో స్నేహము కలిగినవారు ఈ సంఘములో ఉన్నారు. ఇందునుబట్టి ఈ సంఘానికి మారుమనస్సు లేదు. ఇందునుబట్టి ఈ సంఘానికి దేవుని ద్వారా ఉన్న దోషశిక్ష మహా చెడ్డది. అయితే పై వాటిని జయించినవానికి ఉన్న ఉన్నత విలువలు చాలా గొప్పవి. మహా సన్మానముతో కూడినది.
ఇలాంటి గుణగణాలు కలిగిన వ్యక్తులు కూడ నేడు మన క్రైస్తవ సంఘాలలో అక్కడక్కడ ఉన్నారు. విగ్రహాల ప్రార్థనలు, జాతకాలు, నక్షత్రలగ్నాలు, ముహుర్తాలు పాటించుట, రాహుకాలము యమగండము పాటించుట, దినములను పాటించేవారు, దైవత్వమును విచారింపక మానవత్వాన్ని విచారించి జాతకాలను చెప్పువారిని ఆశ్రయించే వారు, తమలో ఉన్న క్రీస్తును చంపి మృతతుల్యముగా తమ జీవితాలను మార్చుకొనే వారున్నారు. వీరు లోక సంబంధ శాస్త్రాలు, లోక సంబంధ సిద్ధాంతాలు, నియమావళిని మనుష్యుల ద్వారా విచారించి, వారి సలహాలను పాటించి, తమ జీవితాలను దైవత్వము నుండి తొలగించుకొని శాపగ్రస్థులై ఎన్నో విధములైన రుగ్మతలకు బలహీనతలకు గురియై, చివరకు దైవశిక్షకు పాత్రులైనవారు అనేకులున్నారు.
పెర్గములో ఉన్న సంఘములో జనాభావలె ఈ లోకములో అన్ని క్రైస్తవ సంఘాలలోను ఈనాడు ఉన్నారు. ఇట్టివారికి స్థిరత్వము అన్నది లేదు. మనోనిశ్చలత లేదు, నిలుకడ లేదు. దైవత్వము అన్నదేమిటో తెలిసికూడ దానిని అనుసరించే పరిజ్ఞానము లేదు. క్రైస్తవులే, క్రైస్తవ విశ్వాసులే, ఆత్మపరులే, పుట్టుక క్రైస్తవులే ఈ పెర్గము సంఘములో ఉన్న గుణగణాలుంటే ఏ మాత్రము క్రైస్తవులో చదువరులే ఊహించాలి. ఇట్టి సంఘముతో నరులు కాదుగాని దేవుడే తానే దానిని నిర్వీర్యపరచుటకు తన వాక్కుతో ఆయన నోటినుండి వచ్చు ఖడ్గముచేత యుద్ధము చేయును. అనగా ఇలాంటి సంఘ విద్రోహులను ప్రభువు తన వాక్య ఖడ్గముతో పోరాడి వారిని నిర్వీర్యపరచుటకు ముందు వారి ద్వారా కలిగిన శ్రమలతో పోరాడి జయించినవానికి మరుగైయున్న మన్నా - ఆత్మీయ ఆకలి, ఆత్మీయ దాహమునకు - జీవజలముతో పోషించెదనని మరియు అతనికి తెల్లరాతిని పరిశుద్ధాత్మను అతనికి అనుగ్రహించును.
పరిశుద్ధాత్మయొక్క పోషణలో రక్షణ మనుగడను, ఆ రాతి ద్వారా పరలోక రాజ్య ప్రవేశము అనుగ్రహించుటయేగాక, ఆ రాతినే తనకు రక్షణ కవచముగాను మరియు క్రొత్త పేరును విశ్వాసికి దేవుడు అనుగ్రహించును.
ప్రకటన 2:13, ''-సాతాను సింహాసనమున్న స్థలములో నీవు కాపురమున్నావని నేనెరుగుదును.''
సాతాను సింహాసనము ఈ లోకములో ఉన్నది. లూకా 4:1, ''యేసు పరిశుద్ధాత్మ పూర్ణుడై యోర్దానునదినుండి తిరిగి వచ్చి, నలుబది దినములు ఆత్మచేత అరణ్యములో నడిపింపబడి అపవాది చేత శోధింపబడు చుండెను.''
శోధకుడు అనగా సాతాను ఆయనను శోధిస్తూ, లూకా 4:6, ''-ఈ అధికార మంతయు, ఈ రాజ్యముల మహిమయు నీకిత్తును; అది నాప్పగింపబడియున్నది.'' ఇందునుబట్టి లోకాధికారియైన అపవాది లోక సింహాసనాన్ని అధిష్టించి పరిపాలన చేస్తుంటే, లోకములోని విశ్వాసులు అతని పరిపాలనలో ఉన్నారు. సాతాను సింహాసనమున్న ఈ లోకములో విశ్వాసియైనవాడు కాపురముంటూ ప్రభువునుగూర్చి సాక్ష్యమిస్తూ జీవిస్త్తున్నాడు.
ఇది ఎంత ఆశ్చర్యము! మనము సాతాను సింహాసనమున్న స్థలములో కాపురమున్నామని గ్రహించామా?
ప్రకటన 2:13, ''నాయందు విశ్వాసియైయుండి నన్నుగూర్చి సాక్షియైన అంతిప యనువాడు మీ మధ్యను చంపబడిన దినములలో నీవు నా నామము గట్టిగా చేపట్టి నా యందలి విశ్వాసమును విసర్జింపలేదని నేనెరుగుదును.''
అంతిపయనువాడు ఎవరు? ఈ వచనములో ఈ అంతిపయనువాడు క్రీస్తునందు విశ్వాసి అని క్రీస్తు ప్రభువు స్వయముగా -''నాయందు విశ్వాసియైయుండి,'' అని సాక్ష్య మిస్తున్నాడు. క్రీస్తే స్వయముగా సాక్ష్యమిస్తున్నాడు అంటే ఈ అంతిపయనువాడు చాలా అదృష్టవంతుడై యుండాలి. ఎందుకంటే క్రీస్తు ప్రభువు స్వయముగా అంతిపయను వాని గురించి సాక్ష్యమిస్తున్నాడు. ఏమని? ''నాయందు విశ్వాసియైయుండి,'' ఇంకా, ''నన్ను గూర్చి సాక్షియైన అంతిపయనువాడు మీ మధ్యను చంపబడిన దినములలో,'' అనగా ఈ అంతిపయనువాడు క్రీస్తు ప్రభువు కొరకు సాక్షియైయుండి చంపబడి హతసాక్షి యైనవాడు. తమ సంఘములో చంపబడి హతసాక్షియైనాకూడ ఈ సంఘములోని విశ్వాసులు యేసు నామమును గట్టిగా చేపట్టి యేసునందు విశ్వాసమును విసర్జింపలేదని చెప్పుచున్నారు.
ఈ వచనములో అంతిపయనువాడు హతసాక్షికి సాదృశ్యముగా చెప్పబడింది. మన సంఘములో ఒకవేళ యేసుక్రీస్తునుగూర్చియు తాను ఇచ్చు సాక్ష్యముగూర్చియు ఎవరైన హతసాక్షియైన యెడల, మనము పెర్గము అను ఆత్మీయ సంఘమువారుగా మారుదుము. ఈ విధముగా ఈ సంఘములో క్రీస్తునుగూర్చియు, తాము ఇచ్చు సాక్ష్యము గూర్చియు, చంపబడినవారు ఇప్పుడు ఎక్కడ ఉన్నారు? ప్రకటన 6:9-10, ''ఆయన అయిదవ ముద్రను విప్పినప్పుడు, దేవుని వాక్యము నిమిత్తమును, తాము ఇచ్చిన సాక్ష్యము నిమిత్తమును వధింపబడినవారి ఆత్మలను బలిపీఠము క్రింద చూచితిని. వారు-నాథా, సత్యస్వరూపీి, పరిశుద్ధుడా, యెందాక తీర్పు తీర్చకయు, మా రక్తము నిమిత్తము భూ నివాసులకు ప్రతిదండన చేయకయు ఉందువని బిగ్గరగా కేకలు వేసిరి,'' అని వ్రాయబడిన ప్రకారము వారు వారి రక్తమునకు ప్రతిగా శిక్షను భూజనులకు ఇవ్వమని క్రీస్తు ప్రభువును కోరుచున్నారు. అయితే వీరు క్రీస్తు ప్రభువు నిమిత్తము తాము ఇచ్చిన సాక్ష్యము నిమిత్తము చంపబడినను, ఈ సంఘములోని విశ్వాసులు క్రీస్తు ప్రభువునందున్న తమ విశ్వాసమును విసర్జించలేదు అని చెప్పబడియున్నది. కాబట్టి ఇటువంటి సంఘము భూమిమీద ఏ పేరుతో నడుపబడుచున్నను వీరందరు పెర్గము అను ఆత్మీయ సంఘము క్రిందకు వస్తారు. వీరికి మరుగైయున్న మన్నా ఆహారముగా ఇయ్యబడుతుంది. వీరి పేరు తెల్లరాతిపై చెక్కబడి వీరికి అనుగ్రహించబడుతుందని మన ప్రభువైన యేసుక్రీస్తు చెప్పుచున్నారు.
ప్రకటన 2:14, ''ఇశ్రాయేలీయులకు ఉరి యొడ్డుమని బాలాకునకు నేర్పిన బిలాముబోధను అనుసరించువారు నీలోఉన్నారు.''
దైవ ప్రవక్తయైన బిలాముయొక్క బోధను యేసు ప్రభువు తృణీకరించుచున్నాడు. బిలాము బోధలో దాగియున్న యదార్థతలనుగూర్చి తెలుసుకొందము. బిలాము ఒక ప్రవక్త. అందులోను ప్రవచనవరము కలవాడు. అయితే దేవుడు అతనికిచ్చిన ప్రవచనవరము ఆత్మ సంబంధమైనదై యుండినప్పటికిని శరీరానుసారముగా అది పరిపక్వమైనట్లుగా ఈ క్రింది అంశముల ద్వారా తెలియుచున్నది.
సంఖ్యాకాండము 22:7లో వలె యెహోవా మాటలాడు సంగతులు సోదెగా ప్రజలలో వాడుకయైనది. దేవుని మాటలు వినిపించినప్పుడు బిలాము సొమ్ము వసూలు చేయువాడు. బిలాము విశ్వాసియైన బాలాకు అను చక్రవర్తి గొప్ప సామ్రాజ్యమును కలిగినవాడై, అనేకమైన దేవతలు తన రాజ్యములో ఉండగా అన్యజీవితములో తను ఉన్నప్పటికిని, ఇశ్రాయేలీయులు తమ రాజ్యములోని స్త్రీలతో శారీర సంబంధము కల్పించు కొని తన రాజ్యములోని విగ్రహ దేవతలకు దాసులై ఘోరపాపులై జీవిస్తున్న సందర్భములో - బిలామును ఎంతో వినయవిధేయతతో కబురుపెట్టి ఇశ్రాయేలీ జనాంగమునకు బుద్ధి నేర్పుటకు వారిని శపించుటకు పిలిపించాడు.
బిలాము వారికి సువార్త ప్రకటన చేయమన్నప్పుడు, బిలాముయొక్క బోధ శరీర సంబంధమైన క్రియలను పునరుజ్జీవపరచునట్లుగా ఉండినట్లు; బిలాము ప్రవక్తయొక్క ప్రవచనములు దైవోక్తియైనను, దానిని అపవాది దొంగిలించి దానిని నిర్జీవ బోధగా బిలాము చేతనే ప్రవచింపజేసినట్లు తెలియుచున్నది. అందుచేత ఇశ్రాయేలీయుల మనస్సు మారలేదుగాని బిలాముయొక్క మనస్సైనను మారనందువలనను పాపము విస్తరింప జేయుటకు కారణమైనది. అందుచేత బిలాముయొక్క బోధలు దైవత్వము నిషేధించినది.
బాలాకు అను మోయాబు రాజు బిలామును పిలిపించి ఇశ్రాయేలీయులను శపించుమని కోరాడు. ఇలా మూడుసార్లు కోరాడు. మూడుసార్లు దేవున్ని బిలాము ఇశ్రాయేలీయులు అను దైవజనాంగమును శపించమని కోరుతాడు. ఈనాడు అన్యులను విశ్వాసుల మీద పురికొల్పె బిలాము వంటి బోధకులు మన మధ్యన లేరా! మనము ఒకసారి గుర్తు చేసుకోవలసిన దినము ఆసన్నమైనది.
ప్రకటన 2:15, ''అటువలెనే నీకొలాయితుల బోధ ననుసరించు వారును నీలో ఉన్నారు.''
ఆత్మ సంబంధులుగా కనపడుచు రహస్యముగా శారీర క్రియలను నెరవేర్చువారు. వెలుగు సంబంధులుగా కనపడుచు చీకటిని ప్రేమించువారు. బాహ్యముగా క్రీస్తును ప్రేమించియు అంతర్యములో క్రీస్తును ఎరుగనివారు. ఆత్మీయముగా బలహీనులై శారీరముగా బలము కలిగినవారు. క్రీస్తును ఎరిగినవారమని చెప్పుకొనుచు క్రీస్తును మోసపరచువారు. మేము అన్నియు ఎరిగినవారమని చెప్పుకొనుచు ఏమియు ఎరుగనివారు. ఈ సందర్భములో 2 తిమోతి 3:1-9 చదివినట్లైతే నీకొలాయితుల బోధనా విధానము తెలియును.
ప్రకటన 2:17, ''జయించువానికి మరుగైయున్న మన్నాను భుజింపనిత్తును.''
దేవుని జనాంగమైన ఇశ్రాయేలీయులు ఆహారము కోసము మోషేను వేధింపగా, మోషే తన ప్రార్థనాద్వారా దేవునికి విన్నవించి ఆకాశము నుండి మన్నా అను ఆహారమును కురిపించెను. ఇది తినినను లోభత్వము చేత ఇశ్రాయేలీయులు చని పోయిరి. తమ అక్కర కొలది గాక అధికముగా ప్రోగుచేశారు. ఈ మన్నా ఆకాశము నుండి కురిసినట్లుగా సంఖ్యాకాండములో చెప్పబడింది. ఇది ఇశ్రాయేలీయులలో జిహ్వ కోరిక మీద రుచిలో మార్పులు కలిగియుండినట్లుగ చెప్పబడింది. ఇంతకి ఈ మన్నా ఎక్కడ ఉంది? ఆనాటి ఇశ్రాయేలీయులు కాక ఇక ఎవరైనా దీనిని చూచారా? అని ప్రశ్నించితే లేదని చెప్పవచ్చును. అందుకే యోహాను దీనిని మరుగైయున్న మన్నాగా వర్ణించాడు. ఈ సందర్భములో, యోహాను 6:47-51, ''జీవాహారము నేనే. మీ పితరులు అరణ్యములో మన్నానుతినినను చనిపోయిరి. దీనిని తినువాడు చావకుండునట్లు పరలోకము నుండి దిగివచ్చిన ఆహారమిదే. పరలోకమునుండి దిగి వచ్చిన జీవాహారమును నేనే. ఎవడైనను ఈ ఆహారము భుజించితే వాడెల్లప్పుడును జీవించును; మరియు నేనిచ్చు ఆహారము లోకమునకు జీవముకొరకైన నా శరీరమే అని మీతో నిశ్చయముగా చెప్పు చున్నాననెను.''
ఇందునుబట్టి మోషే తన ప్రార్థనా ప్రభావముతో ఆకాశము నుండి వర్షింపజేసిన మన్నా దృశ్యమైయుండి, శారీర క్షుద్బాధను తీర్చుటకు దైవజనాంగమైన ఇశ్రాయేలీయులకు లభ్యమైనది. దేవుని ప్రజలైన ఇశ్రాయేలీయులకు మాత్రమే ఈ ఆహారము పరిమితమై యున్నట్లు, దీనిని తినినను చావునుండి మాత్రము ఎవరును తప్పించుకోలేక పోయారు. అదే విధముగా యేసు ప్రభువు యోహాను 10:37లో వలె తండ్రి చేయుచున్న క్రియలు తనయుడు కూడ చేయును అని చెప్పి యోహాను 6:8లో వలె ఐదు రొట్టెలు, రెండు చిన్న చేపలు ఐదువేలమందికి తృప్తియైన ఆహారముగా మార్చెను. ఈ రొట్టెలలో చేపలలో ప్రభావమేమియు లేదు - ఇది లోకసంబంధమైన ఆహారము.
యోహాను 10:30, ''నేనును తండ్రియును ఏకమైయున్నామని వారితో చెప్పెను.'' కనుక తండ్రి చేసిన క్రియను కుమారుడు కూడ చేయగలడనుటకు ఋజువుగా దేవుని ప్రజలైన ఇశ్రాయేలీయులకు దేవుడు జరిగించిన క్షుద్బాధ నివారణ క్రియకు సమానముగా, కుమారుడు లోక సంబంధమైన రొట్టెలను చేపలను ఆహారముగా తీసుకొని, తండ్రియైన దేవునివైపు వాటిని ప్రతిష్టించి ఆకాశము వైపు కన్నులెత్తి చూడగా - యెహోవా ప్రభావము యేసుక్రీస్తు మహిమ రెండును ఏకమై పాతనిబంధనలోని మన్నాను బోలిన ఆహారము అనగా ఈ రొట్టెను బోలిన ఆహారమును ఆకాశమునుండి మన్నాకు మాదిరిగా కురిపించి నట్లు మనము గ్రహించవలసియున్నది. తండ్రియైన దేవుడు లోక రక్షణార్థము మరియు నరుల పాపవిమోచనార్థము తాను పంపిన కుమారుడే నరుల శాపవిమోచనార్థము జరిగించు బలియాగమునకు ముందు తనను రొట్టెగా, ద్రాక్షారసముగా ప్రతిష్టించుకొన్నారు. అనేకులకు పాపవిమోచన కలుగుటకు యేసు ప్రభువే ఈ మరుగైయున్న మన్నాగా తనను తాను నూతన నిబంధన వేదములో యోహాను 6:27-35లో బయల్పరచుకొన్నాడు. ప్రతి నరునియొక్క ఆత్మ ఆకలిదప్పిక తీర్చుటకై భూలోకములో ప్రత్యక్షముగా అవతరించి, ఈ ఆహారము పరలోకమునుండి దిగి వచ్చినను యేసు అను శరీర రూపము దాల్చినది. యేసు అను జీవపు మన్నా దైవప్రభావము గలదనుటకు సాదృశ్యముగా లోకానికి అతీతమైన రోగాలను బాగుజేయుట, పిశాచి పట్టినవారిని స్వస్థపరచుట, వికలాంగులకున్న అంగవైకల్యమును సరిజేయుట, మృతులను సజీవులుగా లేపుట, పంచభూతములైన గాలి, నీరు, నిప్పు, మేఘములు, వగైరాలను తన వాక్కు చేత స్థంభింపజేయుట వగైరా మహత్కార్యములను జరిగించెను. ప్రత్యక్షముగా అనేకుల శరీరాకలిని, దప్పికలను తీర్చినను, మరియు దేవుడు పంపిన ఆహారమని తన్నుతాను ప్రత్యక్షపరచుకొనినను, యేసు అను యీ పరలోక మన్నా పరలోకము ద్వారా బయలుపరచబడినను, 2 కొరింథీ 4:4లో వలె మనోనేత్ర గుడ్డితనము వలన భూజనులు గుర్తించలేకపోయారు.
అయితే ఈ మరుగైయున్న మన్నాను భుజించుటకు యోగ్యులెవరు? లోక సంబంధమైన గుణములగు మోసము, కపటము, క్షుద్బాధ, వ్యామోహము, జిహ్వచాపల్యము, నేత్రాశ, లోకాశ వగైరాలను చంపుకొని, చీకటి శక్తుల ప్రేరేపణలతోను అదృశ్య అంధకార శక్తుల యొక్క ఆలోచనలతో ఏకీభవించక, పైనున్న వాటిమీదనే లక్ష్యముంచి, పరలోక ఐశ్వర్యములను అభిలషించి, లోకముతో పోరాడి జయించినవానికి మరుగైయున్న మన్నాను భుజించుటకు ఇవ్వబడును. పరలోకమునుండి దిగివచ్చి లోకపాపవిమోచనార్థము సకల నరకోటియొక్క దోషపరిహారార్థము నరరూపమున అవతరించి, నరపాపముల కొరకు దోషిగా ఎంచబడి, తన శరీర రక్తములను నరునికి ఆత్మీయాహారముగా మారుటకు బలియాగము ద్వారా చనిపోయి, మూడవ దినమున తిరిగి లేచి తానెక్కడనుండి వచ్చెనో అక్కడకే వెళ్ళి మరల మన మధ్యకు రానైయున్న యేసు అను ఆ పరమ రక్షకుడే ఇప్పుడు మనకు మరుగైయున్న మన్నాగా ఉన్నాడు. క్రీస్తు ప్రభువు ప్రతి విశ్వాసికిని జీవాహారము అనగా జీవపు మన్నా, జీవజలము అనగా ఆత్మీయ దప్పికను తీర్చు మరుగైయున్న జలనిధిగా ప్రకటన 2:17లోని వేదమర్మము మనకు వివరిస్తున్నది.
ప్రకటన 2:17, ''మరియు అతనికి తెల్లరాతినిత్తును; ఆ రాతిమీద చెక్కబడిన యొక క్రొత్తపేరుండును; పొందిన వానికేగాని అది మరి యెవనికిని తెలియదు.''
ఈ తెల్లరాయి ఎవరు? పాతనిబంధన కాలములో దేవుని జనాంగమైన ఇశ్రాయేలీ యుల క్షుద్బాధను నివారించుటకు ఆకాశమునుండి కురిపించిన మన్నా అను ఆహారము తెల్లనిది. శిశు దశ మొదలుకొని వృద్ధాప్యము వరకు భోజన పదార్థముగ పదార్థములన్నిటిలో అతి ప్రాధాన్యమైనది పాలు. ఇది సంపూర్ణాహారమైయున్నది. పుట్టిన బిడ్డ లగాయతు రోగియు, వస్తాదులు, వృద్ధులు మొదలగువారికి యోగ్యకరమైన ఆహారము పాలు. అయితే పాలిచ్చు జంతువు ఏ రంగు అయినను ఉండవచ్చును. ఏ జాతియైనను ఏ రూపమైనను ఉండవచ్చును. ఏ విధమైన ఆహారమైనను అది భుజించవచ్చునుగాని, దాని పాలు మాత్రము తెలుపు. ఇందునుబట్టి సకలజాతి జీవులకును మరియు అన్ని కులముల నరులకును పాలు ఆహారమైయున్నది.
అదే విధముగా అపొస్తలుల కార్యములు 10:36, ''యేసుక్రీస్తు అందరికి ప్రభువు.'' పాలు రంగు తెలుపు. యేసుయొక్క జీవితము కూడ తెలుపే. అసలు యేసు ప్రభువే తెల్లని ప్రకాశమానమైన వెలుగు. కనుక తెల్లరాయి మచ్చలేని జీవితమునకు గుర్తు. కనుక ప్రకటన గ్రంథములో వివరించిన ఈ తెల్లరాయి పాతనిబంధనలో ఇశ్రాయేలీయుల దప్పిక తీర్చుటకు మోషే తట్టిన బండే ఈ రాయిగా మనము గ్రహించవలసియున్నది. ఎందుకనగా ఈ రాయి యేసుకు సాదృశ్యము. కనుక లోకాన్ని మరణాన్ని జయించినవాడు ఈ తెల్లరాయి సంబంధి అనగా క్రీస్తు సంబంధి. తెలుపు పవిత్రతకు గుర్తు. అయితే ఈ రాయి పైన ఒక పేరు చెక్కబడియుంటుంది.
''పొందిన వానికేగాని మరి యెవనికిని తెలియదు.'' అనగా ఈ పేరేమిటో మనము తెలిసికొందము. ఎఫెసీ 1:3-12 యేసుక్రీస్తు ద్వారా పరిశుద్ధులైనవారు దేవుని కుమారులుగా పిలువబడుదురు. ఈ తెల్లరాయి అనునది క్రొత్త నిబంధన వలె క్రొత్త పేరు, గొర్రెపిల్లయొక్క తెల్లరాయి అనగా గొర్రెపిల్లయొక్క జీవగ్రంథములో ఇది వ్రాయబడియుంటుంది. పొందినవానికేగాని అనుటలో రోమా 10:9లో వలె గొర్రెపిల్ల రక్తము చేత విమోచింపబడి దేవుడాయనను లేపెనని విశ్వసించి క్రీస్తు ముద్రను ధరించినవానికే ఆ మర్మము బయల్పరచబడును. కనుక క్రీస్తు సిలువలో పాలిపంపులు గలవానికే, ఇది తెలియునుగాని లోకసంబంధమైన నరుడు దీనిని గ్రహించలేడని భావము.
ఈ వచనము అంతిపయనువాడు హతసాక్షికి సాదృశ్యముగా చెప్పబడింది. మన సంఘములో ఒకవేళ యేసుక్రీస్తునుగూర్చి ఎవరైన హతసాక్షియైన యెడల ఈ సంఘము పెర్గము అను ఆత్మీయ సంఘముగా మారును. అయితే ఈ సంఘములో క్రీస్తు నిమిత్తముగా కొందరు చంపబడినను సంఘస్థులు క్రీస్తు నామము గట్టిగా చేపట్టి ఆయనయందు విశ్వాసమును విసర్జించలేదు అని చెప్పుచున్నారు. కాబట్టి ఇటువంటి సంఘము భూమిమీద ఏ పేరుతో నడపబడుచున్నను వీరందరు కూడ పెర్గము సంఘము క్రిందకు వస్తారు. వీరికి మరుగైయున్న మన్నా వారి ఆహారముగా ఇవ్వబడుతుంది. వీరి పేరు తెల్లరాతిపై చెక్కబడి వారికి అనుగ్రహించబడుతుందని మన ప్రభువైన యేసుక్రీస్తు చెప్పుచున్నారు. కనుక దాని పైన వారి పేరు వ్రాయబడి ఇచ్చుట అనునది చివరగా జరుగు సంఘటన కాబట్టి ఈ పేరు ఇప్పుడు ఊహించి చెప్పలేము. చివరగా క్రీస్తు ప్రభువు విశ్వాసులకు పరలోక ప్రవేశానికి ముందు ఈ పేరు వ్రాసిన రాయిని ఇచ్చును.
ప్రకటన 1:20 ప్రకారము తుయతైరలో ఉన్న సంఘపు దూత కూడ క్రీస్తు చేతిలో ఉన్న ఒక నక్షత్రమే.
ప్రకటన 2:18, ''అగ్నిజ్వాలవంటి కన్నులును అపరంజినిపోలిన పాదములునుగల దేవుని కుమారుడు,'' ఈ లేఖ వ్రాయించుచున్నాడు.
ఈ వాక్యములోనే ఈ వర్ణన కలిగినవాడు దేవుని కుమారుడని వివరముగా చెప్పబడియున్నది. యేసుక్రీస్తు వెలుగుకు ప్రతిరూపము కాబట్టి ఈ వెలుగును సాధారణ మానవులు చూడలేరు.
ఎందుకంటే దేవుడు మోషేకు సీనాయి కొండ మీద కనిపించినప్పుడు, మోషే బండ సందులో నుండి కూడ ఈ వెలుగును చూడలేకపోయాడు. యేసుక్రీస్తు కన్నులు కూడ అగ్నిజ్వాలవంటి కన్నులే. ఉదా :- పౌలు సౌలుగా ఉన్నప్పుడు, క్రీస్తు నుండి వచ్చిన వెలుగునకు తన కన్నులను పోగొట్టుకున్నాడు. అందుకే దేవుని కుమారుడైన యేసుక్రీస్తు కన్నులు కూడ అగ్నిజ్వాలవంటి కన్నులకు, సువార్తకు మూలమైన పాదములను - అపరంజిని పోలిన పాదములుగా వర్ణించాడు. ఈ లేఖలో కూడ కొన్ని సంగతులను మనకు క్రీస్తు ప్రభువు తెలియజేస్తున్నారు.
ప్రకటన 2:19, ''-నీ క్రియలను, నీ ప్రేమను, నీ విశ్వాసమును, నీ పరిచర్యను, నీ సహనమును నేనెరుగుదును; నీ మొదటి క్రియల కన్న నీ కడపటి క్రియలు మరి యెక్కువైనవని యెరుగుదును,'' అనుటలో ప్రభువు ఈ తుయతైర సంఘముయొక్క క్రియలు, దాని ప్రేమ, విశ్వాసుల పరిచర్య పట్ల సంతృప్తి పొందినట్లుగా తెలుస్తున్నది. అలాగే నేటి కొన్ని సంఘాలలో జరుగుచున్న క్రియలు, ఆ సంఘాలలోని ప్రేమ, పరిచర్య, సహనము, విశ్వాసము, మునుపటి కన్నా ఇప్పుడు ఎక్కువగా చేయుట చూస్తున్నాము. వారంతా కూడ తుయతైర సంఘజీవితమునకు సంబంధించినవారు. అయితే దైవత్వానికి యోగ్యకరముగాని క్రియలు కూడ ఉండబట్టియే ఈ లేఖ హెచ్చరించుచున్నది. ''ఏమనగా, తాను ప్రవక్త్రినని చెప్పుకొనుచున్న యెజెబెలను స్త్రీని నీవుండనిచ్చుచున్నావు. జారత్వము చేయుటకును, విగ్రహములకు బలియిచ్చిన వాటిని తినుటకును అది నా దాసులకు బోధించుచు వారిని మోసపరచుచున్నది,'' అనుటలో అయితే క్రీస్తు ఈ స్త్రీని మంచము పట్టించి దాని పిల్లలను నిశ్చయముగా చంపెదనని చెప్పుచున్నాడు.
అంతేకాదు, హృదయాంతరంగాలను పరిశోధించే దేవుడు ప్రతివాని, వాని క్రియల చొప్పున ప్రతిఫలము కూడ ఇచ్చెదనని చెప్పుచున్నాడు. అయితే క్రీస్తు ఈ సంఘములోని వారికి ఏ భారమును పెట్టనని వాగ్దానమిచ్చియున్నారు, జనులమీద అధికారమిస్తానని చెప్పుచున్నారు, మరియు వేకువచుక్కను ఇచ్చెదనని అంటున్నారు. కాబట్టి వీరు జారత్వము విగ్రహారాధన ఈ రెండును వీడిన వీరి జీవితము ధన్యవంతమే. కనుక, మన సంఘముయొక్క పరిస్థితిని ఒకసారి బేరీజు వేసుకొని, ఒకవేళ మన సంఘములో విగ్రహారాధన వ్యభిచారము ఉన్నట్లయితే దానిని మానుకొనుట ఉత్తమమైనదని గుర్తించాలి.
ప్రకటన 2:20-23, ''అయినను నీమీద తప్పు ఒకటి నేను మోపవలసి యున్నది; ఏమనగా, తాను ప్రవక్త్త్రినని చెప్పుకొనుచున్న యెజెబెలను స్త్రీని నీవుండనిచ్చుచున్నావు. జారత్వము చేయుటకును, విగ్రహములకు బలియిచ్చిన వాటిని తినుటకును అది నా దాసులకు బోధించుచు వారిని మోసపరచుచున్నది. మారుమనస్సు పొందుటకు నేను దానికి సమయమిచ్చితినిగాని అది తన జారత్వము విడిచిపెట్టి మారుమనస్సు పొందనొల్లదు. ఇదిగో నేను దానిని మంచము పట్టించి దానితోకూడ వ్యభిచరించువారు దాని క్రియల విషయమై మారుమనస్సు పొందితేనేగాని వారిని బహు శ్రమలపాలు చేతును, దాని పిల్లలను నిశ్చయముగా చంపెదను. అందువలన అంతరింద్రియములను హృదయములను పరీక్షించువాడను నేనే అని సంఘములన్నియు తెలిసికొనును. మరియు మీలో ప్రతివానికి వాని వాని క్రియల చొప్పున ప్రతిఫలము ఇచ్చెదను.''
నేడు అనేకులైనటువంటి స్త్రీలు తాము బోధకురాండ్రమని, పరిశుద్ధాత్మ ఆవేశితులమని, క్రీస్తు మార్గములో జీవించువారమని, క్రీస్తును ధరించుకొనియున్నామని, క్రీస్తును చూచామని, పరిశుద్ధాత్మ తమకు ప్రతి విషయములోను జరుగబోయే సంగతులు ప్రకటిస్తున్నాడనియు చెప్పుకొనేవారు బయలుదేరియున్నారు. అట్టివారు తమయొక్క ఇహలోక జీవితాన్ని దాచి తమలోని లోటుపాట్లను బైటకు రానీయక, తమయొక్క అక్రమాలను మరుగుపరచి, ఇతరుల లోటుపాట్లనుగూర్చి వ్రేలుబెట్టి విమర్శించుచు, ఆత్మ ద్వారా భవిష్యత్తును చూచుచున్నట్లుగా చెప్పుచున్నారు. వారు చేయు ఆరాధనలు మనము వింటున్నాము, చూస్తున్నాము. తాను ప్రవక్త్రినని చెప్పుకొనుచున్న యెజెబెలు అను ఈ స్త్రీ ఎవరు? సంఘమే. బబులోనను సంఘము. అటువంటి సంఘములో నీవున్నావు. ఆ సంఘము విగ్రహారాధన చేస్తున్నది. వ్యభిచారాన్ని అది ప్రోత్సహిస్తుంది. వ్యభిచారమన్నది శారీర సంబంధమైనదేగాక ఆత్మ సంబంధమైనది కూడ ఉన్నది. ధనముతోను, బంగారు, విగ్రహాలతోను, పదవితోను నానావిధమైన ఊహలు, తలంపులతో దైవత్వమును మరచి వాటి మీదనే ధ్యాస, వాటినిగూర్చి సమయమంతా గడుపుట, వాటినిగూర్చి దైవత్వమునకు భిన్నమైన బోధను బోధిస్తూ - తాను దేవునియొక్క దాసు రాలినని, దైవాత్మ ఆవేశితురాలినని సాక్షాత్తు దైవాత్మను ధరించుకొన్నానని, తనను గూర్చి తాను ప్రకటించుకొంటూ మహాగర్విగా విజృంభించిన సంఘము - సాతాను సంబంధమైనదై సాతానుకు వధువు సంఘముగా మారును. అది మాట్లాడే మాటలు మరియు ప్రకటించేవి దైవవాక్కులేగాని చేసేవి మాత్రము సాతాను క్రియలు. దైవత్వమును అనుకరించినట్లే ఉంటుందిగాని, ఆచరణకుగాని నియమానికిగాని విరుద్ధములైనవి, దైవవిశ్వాసులను పెడత్రోవన నడిపించు విధానమే ఈ సాతానుసంబంధ వధువు సంఘము యొక్క ప్రత్యేకత. దైవసంఘమునకు ప్రవక్తలు ఉన్నట్లే, సాతాను వధువు సంఘమైన బబులోనుకు కూడ ప్రవక్త్రినిలు ఉన్నారు. వీరికి గల పేరు యెజెబెలు. దైవసంఘములోని ప్రవక్తలు దేవునిలోకి ప్రజలను నడిపించితే, బబులోను ప్రవక్త్రినియైన యెజెబెలు విశ్వాసులను నాశనకర మార్గములో నడిపించుచున్నది.
ఈనాడు ఇట్టి సంఘాలు అనేకము ఉండి ఇప్పుడు క్రియ జరిగిస్తున్నవి. ఆభరణాలు అలంకారాలు ఆడంబరాలు విందువినోదాలు దైవరాజ్యమునకు పనికిరావు అంటూ ప్రకటన చేస్తూనే సంఘములో కలతలు పెట్టుట, దైవవాక్యమును స్వలాభమునకు వాడుకొంటూ తనయొక్క మోసకర జీవితాన్ని కప్పిపుచ్చుకొనుటకు అనుకూలమైన బోధలను సమకూర్చుకొని, దానిని బోధించుటకు అనుకూలమైన బోధకులను ఏర్పరచి, వారి ద్వారా తన కుటిల మనోస్థితిని కప్పిపుచ్చుకుంటూ, తాను మహాసాధ్వినని, భక్తిపరురాలి నని, ప్రభువు రెండవ రాకడలో ఎత్తబడే వధువు సంఘము తానేనని చెప్పించును. విగ్రహారాధన నిషేధమని చెప్పుకుంటూ మరొక వైపు వస్తువాహనాలు, భోగభాగ్యాలమీద ఆసక్తిని పెంచి, స్త్రీ పురుషులలో ఒకరితో ఒకరికి కామాతురత రేపుచు బహుగుప్తముగా రహస్యముగా పాపపు జీవితాన్ని గడుపు సంఘము ఈ యెజెబెలుయొక్క సమాజముతో కూడినది. ఇట్టి సంఘము మారుమనస్సు పొందుటకు సమయమిచ్చినను, ఇట్టి సంఘము దైవత్వమునకు యోగ్యకరముగా జీవించదు. మరియు మారుమనస్సు పొందదు. ఇట్టి సంఘము దైవకఠిన నియమములలో దైవసిద్ధాంతాలలో దైవత్వముతో కూడిన కఠిన క్రమశిక్షణలో జీవించుటన్నది అసాధ్యము, ఎందుకనగా ఇట్టి సంఘము విగ్రహారాధనకును, సుఖభోగాలకు, అక్రమ ఆర్జనలకు, ఆడంబరాలకు, సకల విధములైన దైవవ్యతిరేక ఆచారములకు అలవాటుపడినందున అట్టి వాటిని మానుకొనుట ఇట్టి సంఘాలకు అసాధ్యము. ''ఇదిగో నేను దానిని మంచము పట్టించి దానితోకూడ వ్యభిచరించువారు దాని క్రియలవిషయమై మారుమనస్సు పొందితేనేగాని వారిని బహు శ్రమలుపాలు చేతును, దాని పిల్లలను నిశ్చయముగా చంపెదను,'' అనుటలో మంచము పట్టించుట ఏమిటి? దానితో వ్యభిచరించే వారెవరు? దాని పిల్లలు నిశ్చయముగా చావడమేమిటి? అందువలన అంతరింద్రియములను హృదయములను పరీక్షించువాడను నేనే అని సంఘములన్నియు తెలిసికోవడమేమిటి? ఇందునుగూర్చి కూడ తెలిసికొందము.
రహస్యములో పాప క్రియలు జరిగిస్తూనే లోకానికి పరిశుద్ధముగా కనబడాలని తెల్లని వస్త్రధారణ, మాటి మాటికి ప్రభువును గూర్చిన పలుకులు, నినాదాలు చేస్తూ తామేదో పవిత్రులమన్నట్లుగా ఎదుటివారిని అవిశ్వాసులని, పాపులని, దైవరాజ్యమునకు అయోగ్యులని విమర్శించుచు, ప్రభువు రాకడలో ఎత్తబడేది తామేనని, జీవించేవారు ఈ సంఘాలు. ఇట్టివారిని మంచము పట్టించుట అంటే నిలుకడ ఉండక ఒకరినొకరు విమర్శించుకొని పార్టీలు కక్షలు విమర్శలు కోర్టులపాలై అన్యులమధ్య వెక్కిరింపు పాలగుటయే ఈ మంచము పట్టించుటన్నదానికి ఋజువు. ఈ విధముగా మంచము పట్టించబడిన సంఘాలు నేటి లోక సంబంధ న్యాయస్థానాలలో కొట్టుమిట్టాడుచున్న విషయము మనమెరిగిన విషయమే. ఈ విధముగా బహు శ్రమలపాలు చేతును, అనుటలో శాంతి సమాధానము ఉండదు, ఆదరణ సానుభూతి ఉండదు, ప్రభువుయొక్క ఆశీర్వాదము, సమాధనముండదు. ''దాని పిల్లలను శ్రమలు పాలుచేసి చంపెదను,'' అనుటలో ఇందువలన సంఘములోని విశ్వాసులు కూడ శారీరరీత్యా, ఆత్మీయముగా మృత్యువాత పడుట సహజము. అయితే దేవుడు తాను హృదయ పరిశోధకుడు అంటు న్నాడు. ''మరియు మీలో ప్రతివానికి వాని వాని క్రియల చొప్పున ప్రతిఫలము ఇచ్చెదను,'' అనుటలో ఇట్టి సంఘములోని సంఘ సభ్యునికి సరియైనట్టి సాక్ష్యముగాని, సరియైన జీవితముగాని, నిలుకడయైన మనస్సాక్షిగాని లేక ఎల్లప్పుడు అశాంతి బాధ వేదనతో ఉంటుందని, ఇటువంటి ప్రతిఫలాలు దైవత్వము చేత పొందుచుంటాడని తెలుస్తున్నది.
ప్రకటన 2:24, ''అయితే తుయతైరలో కడమవారైన మీతో, అనగా ఈ బోధను అంగీకరింపక సాతానుయొక్క గూఢమైన సంగతులను ఎరుగమని చెప్పుకొనువారందరితో నేను చెప్పుచున్న దేమనగా-మీపైని మరి ఏ భారమును పెట్టను.''
''కడమవారైన మీతో,'' అనుటలో ఈ తుయతైర సంఘములో కొన్ని వర్గాలున్నట్లు తెలుస్తున్నది. కడమవారంటున్నారు అంటే మొదటివారు కూడ ఉన్నట్లే కదా! అయితే ఈ మొదటివారు ఎవరు? కడమవారెవరు? ఇందునుగూర్చి తరగతులవారీగా తెలుసు కొందము. తుయతైరలో ఉన్న సంఘము అన్ని విషయాలలోను మంచి సాక్ష్యముంది, అనగా ఇది మొదటి తరగతి వారియొక్క స్థితి. ఇందులో క్రియల ద్వారా మంచి సాక్ష్యమున్న వారు, ప్రేమనుబట్టి మంచి సాక్ష్యము పొందినవారు, విశ్వాసమునుబట్టి పరిశుద్ధులైనవారు, పరిచర్యనుబట్టి దైవత్వమును మెప్పించినవారు, సహనాన్నిబట్టి లోకాన్ని జయించినవారు; అని ఐదు రకముల జనాభా ఈ తుయతైర సంఘములో ఉన్నారు. అయినను ఇంత గొప్ప ఆధిక్యత కలిగిన ఈ సంఘములో లోకసంబంధులు కూడ ఉన్నట్లును, లోకములో రూపించబడిన విగ్రహ సంబంధులు ఉన్నట్లును, లోకభోగాలు ఆశించిన లోక వ్యామోహితు లున్నట్లును, పైకి భక్తి గలవారివలె కనపడి దాని శక్తిని ఆశించనివారును, వ్యభిచార సంబంధులు కూడ ఉన్నట్లు ఈ సంఘ విశ్వాసులకున్న వైఖరిని ఈ లేఖన భాగములో వివరించుచున్నాడు అనగా తుయతైర సంఘములో ఎంత మంచి హృదయస్థితి గల వారున్నారో, అంత భయంకరమైన అయోగ్యకరమైన జనాభా వర్గాలవారీగా ఉన్నట్లుగ మనకు తెలుస్తున్నది.
ప్రకటన 2:25-27, ''నేను వచ్చువరకు మీకు కలిగియున్నదానిని (అనగా విశ్వాసమును) గట్టిగా పట్టుకొనుడి. నేను నా తండ్రివలన అధికారము పొందినట్టు జయించుచు, అంతమువరకు నా క్రియలు జాగ్రత్తగా చేయువానికి జనులమీద అధికారము ఇచ్చెదను. అతడు ఇనుపదండముతో వారిని ఏలును; వారు కుమ్మరివాని పాత్రలవలె పగులగొట్టబడుదురు.''
ఈ అధికారము ఎటువంటిది? ఈ లోకములో భూమిమీద అధికారమును పొందాలంటే అది లోకనాధుల ద్వారానే సాధ్యమగుతుంది. ఎందుకంటే ఈ లోకము మీద అధికారము సాతానుకు ఇవ్వబడియున్నది. లూకా 4:6-7, ''-ఈ అధికారమంతయు, ఈ రాజ్యముల మహిమయు నీకిత్తును; అది నాకప్పగింపబడియున్నది, అదెవనికి నేను ఇయ్యగోరుదునో వానికిత్తును; కాబట్టి నీవు నాకు మ్రొక్కితివా యిదంతయు నీదగునని ఆయనతో చెప్పెను.'' ఈ వాక్యము ప్రకారము సాతాను తనను మ్రొక్కినవారికి ఈ లోకముమీద అధికారము ఇచ్చునని అర్థమగుచున్నది. దైవవిశ్వాసి సాతాను సంబంధి కాడు. పైపెచ్చు సాతానును తన విశ్వాసము ద్వారా జయించాలి అని అనుకొనువాడు. అయితే దైవవిశ్వాసి ఈ లోకాధికారమును ఏ విధముగా పొందగలడు? ''అతడు ఇనుప దండముతో వారిని ఏలును;'' అని కూడ వ్రాయబడియున్నది. ఇంకను, ''వారు కుమ్మరవాని పాత్రలవలె పగులగొట్టబడుదురు;'' అనుటలో జనుల మీద అధికారము ఎలాంటిది? ఆ అధికారము పొందినవానికి ఇవ్వబడు ఇనుపదండము ఏది? మొట్ట మొదటిగా జనముల మీద అధికారము ఇది లోకసంబంధమైనది కాదు.
విశ్వాసము కలిగి ఆత్మీయముగా ఎదిగిన దైవజనునికి లోకాధికారమన్నది రాజకీయ పరమైనది కాదని అది లోకసంబంధమైతే లోకము అట్టివానిని స్నేహించునని కూడ యేసు ప్రభువు తన ప్రవచనాలలో విశదపరచెను. యోహాను 15:19, ''మీరు లోక సంబంధులైన యెడల లోకము తన వారిని స్నేహించును;'' ఇది ప్రభువు చెప్పిన మాట. ఇందునుబట్టి లోక సంబంధియైనవాడు దైవరాజ్యమును స్వతంత్రించుకోలేడని మనకు తెలియుచున్నది. అయితే ఈ లోకాధికారము ఎలాంటిది? మత్తయి 28:18-20, ''అయితే యేసు వారియొద్దకు వచ్చి -పరలోకమందును భూమిమీదను నాకు సర్వాధి కారము ఇయ్యబడియున్నది. కాబట్టి మీరు వెళ్లి, సమస్త జనులను శిష్యులనుగా చేయుడి; తండ్రియొక్కయు కుమారునియొక్కయు పరిశుద్ధాత్మయొక్కయు నామములోనికి వారికి బాప్తిస్మమిచ్చుచు నేను మీకు ఏ యే సంగతులను ఆజ్ఞాపించితినో వాటినన్నిటిని గైకొన వలెనని వారికి బోధించుడి.'' ఇదియే ఆ అధికారము. అంతేగాని రాజ్యాలు ఏలమని కాదు, అక్రమమైన ప్రభుత్వము చేయమని కాదు; నిరపరాధికి మరణశిక్ష విధించుట, నిరపరాధుల పట్ల అన్యాయముగా ప్రవర్తించుట గాదు. లోక పరిపాలనలో ఇవన్నియును ఉన్నవి. కాని ప్రభువు చెప్పినట్లు దైవజనులకు ఇచ్చే అధికారము పగలు రాత్రి అనక సమయము సందర్భమన్నది పాటించకుండ, అవకాశము దొరికినప్పుడు ప్రతి విశ్వాసి కూడ దైవరాజ్య సువార్తను ప్రకటించుటయే. ఈ అధికారములో అట్టి విశ్వాసికి అనుగ్రహించ బడిన దండమే దేవునియొక్క వాక్య ఖడ్గము. ఈ ఖడ్గముతో లోకమును లోకస్థులను స్వాధీనపరచుకొని, లోక సంబంధులుగా ఉన్నవారిని దైవరాజ్య సంబంధులుగా చేయుట. ఇట్టి క్రియ ద్వారా లోకములో అపవాదితోను లోకముతోను పోరాడి, ఆ పోరాటములో విజయాన్ని సాధించాలి. అనగా అనేకమంది విశ్వాసులను దైవవాక్యము ద్వారా వారి పాప జీవితమునుండి మరల్చి దైవరాజ్య సంబంధమైనవారిగా మార్చుటకు ఈ పోరాటములో దైవపక్షముగా విజయాన్ని సాధించాలి. ఈ విధముగా విజయవీరులు వేదములో అనేకులున్నారు. పాత నిబంధనలో ప్రవక్తలుగాని యాజకులు గాని అనేకులు లోకముతో పోరాడి లోక పరిపాలనకు అతీతులై, లోకమునకు దాసులు కాక దైవపక్షముగ పోరాడి పాపానికి సమాధి, అక్రమానికి ఆనకట్ట కట్టి, దైవమహిమను అనేకులకు కనబరచి తద్వారా సాతాను సమాజమును వీరు హతమార్చినట్లు వేదము మనకు వివరిస్తున్నది.
ఇది లోకము జయించినవానియొక్క ఉన్నత స్థితి. లోకము జయించినవానికి బహుమానము. ఇట్టివారు సువార్తను ప్రకటించుటకు దైవత్వము చేత అధికారము పొందిన వారును, వారియొక్క జీవితాలు ధన్యకరముగాను, వారి పాదములు సుందరములు, వారి చేతులలో ఎల్లప్పుడు ఆశీర్వాదము నిలిచియున్నట్లును, దేవుడు ఇట్టి అధికారమును వారికి అనుగ్రహించినట్లుగా మనము తెలిసికోవలసియున్నది. వారు కుమ్మరవాని పాత్రలవలె పగులగొట్టబడుదురు.
లూకా 4:18-19 ప్రకారము యీ అధికారము తండ్రి వలన క్రీస్తు కలిగి యున్నాడు. అదే విధముగా నేటి విశ్వాసి లోకమును, దాని క్రియలను, దాని ఆచారములను, సాంగ్యములను, దాని ఆశలను జయించి, తన జీవితాంతము వరకు యేసు ప్రభువు వలె ఆయన చేసినట్లుగా ఆయన ననుసరించి, ఆయన మార్గములో నడిచి ఆయన చిత్తాను సారముగా ప్రవర్తిస్తూ ప్రభువు తనకనుగ్రహించిన కొలది దేవుని రాజ్య సువార్తను ప్రకటిస్తూ క్రీస్తును పోలి, ప్రార్థనాజీవితములో జీవించినవానికి దేవుడు, తన జనాంగమైన సంఘము మీద, సంస్థల మీదను బోధకుడనియు, సువార్తీకుడనియు, కాపరి అనియు వగైరా నామధేయములతో అధికారమిచ్చియున్నట్లును - అతడు వాక్యమను ఇనుప దండముతో క్రైస్తవ సంఘములను పాలించుటకు యోగ్యుడగును. ఇట్టివాడు తనకనుగ్రహించిన వాక్యమను ఇనుపదండముతో విగ్రహారాధికులు, కఠిన హృదయులు, పాపపుణ్యము ఎరుగనివారు, అజ్ఞానులైయుండి కుమ్మరవాని మట్టి పాత్రలవలె ఉన్న వారి హృదయములు నలగగొట్టి, క్రీస్తు అను వెలుగుతో వారి హృదయమును వెలిగించి వారిని సత్యసాక్షులుగా ప్రతిష్టించి వారిని ఏలునని ఈ వాక్యభాగములోని అర్థమైయున్నది.
ఇందులో చెప్పబడినది ఉదాహరణ మాత్రమే. ఇంతకంటే గొప్ప అధికారమును క్రీస్తు ప్రభువు వెయ్యి సంవత్సరముల పరిపాలన కాలములో పరిశుద్ధులు పొందబోవు చున్నారు. ప్రకటన 20:6, ''ఈ మొదటి పునరుత్థానములో పాలుగలవారు ధన్యులును పరిశుద్ధులునై యుందురు. ఇట్టివారిమీద రెండవ మరణమునకు అధికారములేదు; వీరు దేవునికిని క్రీస్తుకును యాజకులై క్రీస్తుతోకూడ వెయ్యి సంవత్సరములు రాజ్యము చేయుదురు.'' ఇలా వీరు రాజ్యము చేయునప్పుడు అపరిశుద్ధులు పాతాళలోకములో ధనవంతుని వలె బాధను పొందుచుందురు. ఈనాడు సువార్తీకులు దేవుని వాక్యములోని ఒక అంచును మనకు చూపిస్తున్నారు. సుతిమెత్తగా వారి బోధ ఉంటుంది. మారుమనస్సు పొందమని చెప్పుచూ సంఘస్థులలో ఉన్న బాధలకు ప్రార్థనలు చేస్తుంటారు. కాని క్రీస్తు ప్రభువు వెయ్యి సంవత్సరముల పరిపాలన కాలములో అపరిశుద్ధులు అనగా కడమవారు తమ బాధను అనుభవించాల్సి ఉంది. అప్పుడు పరిశుద్ధులు క్రీస్తు ప్రభువుతో రాజ్యము చేయుచు, కడమవారి పట్ల అనగా క్రీస్తు ప్రభువును విశ్వసింపని వారి పట్ల కఠినముగా ఉందురని దానిని ఇనుపదండమునకు పోల్చి చెప్పుట జరిగింది.
ప్రకటన 2:28, ''మరియు అతనికి వేకువచుక్కను ఇచ్చెదను.''
వేకువచుక్క అనగా జీవపు వెలుగు. ఉదయించు వెలుగు. క్రీస్తు సువార్తకు సూచన. అయితే నీతి సూర్యుడు క్రీస్తు. శాంతికరమైన వెలుగుకూడ క్రీస్తే; నీతిచంద్రుడు క్రీస్తే. వేకువచుక్క అనగా ప్రకటన 22:16, ''సంఘములకోసము ఈ సంగతులనుగూర్చి మీకు సాక్ష్యమిచ్చుటకు యేసు అను నేను నా దూతను పంపి యున్నాను. నేను దావీదు వేరు చిగురును సంతానమును, ప్రకాశమానమైన వేకువ చుక్కయునైయున్నాను.''
ఈ వేకువ చుక్కయైన క్రీస్తు తన్ను తాను ఈ సంఘములో జయించినవారికి ఇస్తానని చెప్పుచున్నారు. అనగా వాక్యరూపములో వారికి ఒసగబడును. కాబట్టి వారు దానియేలు 12:3లో వలె సువార్తకు ప్రతిరూపముగా ఉందురు అని భావము.
అంతేకాదు క్రీస్తు నీతికి ప్రతిరూపము. కాబట్టి వారిని నీతిమంతులుగా దేవుని ఎదుట క్రీస్తు ఒప్పుకొని, వారిని తనతో సమానముగా అర్హతను ఇస్తాడు అని అర్థము.
ఈ అధ్యాయమునందు క్రీస్తు ప్రభువు ఏడింటిలో చివరి మూడు ఆత్మీయ సంఘములకు లేఖలు వ్రాయించారు. ఈ మూడు ఆత్మీయ సంఘముల లేఖలలోని వివరములు ఇందులో చూడగలము.
ప్రకటన 1:20 ప్రకారము సార్దీస్‌లో ఉన్న సంఘపు దూత కూడ క్రీస్తు అధీనములో ఉన్న ఒక నక్షత్రము.
ప్రకటన 3:1, ''ఏడు నక్షత్రములును దేవుని యేడాత్మలును గలవాడు,'' ఈ లేఖ వ్రాయిస్తున్నాడు. మొదటి అధ్యాయము పదకొండవ విభాగము ప్రకారము ఏడు నక్షత్రములు కలిగినవాడు క్రీస్తే. ఈ యేడు ఆత్మలు క్రీస్తునందు గుప్తమైయున్నవి అని ఎలా చెప్పవచ్చును?
యోహాను 10:30, ''నేనును తండ్రియును ఏకమైయున్నామని వారితో చెప్పెను.'' ఈ వాక్యము ప్రకారముగా దేవుని యొద్దనున్న యేడు ఆత్మలు క్రీస్తునందును ఉండి క్రియ జరిగించుచున్నవి. యెషయా 11:1-2, ''యెష్షయి మొద్దునుండి చిగురు పుట్టును వాని వేరులనుండి అంకురము ఎదిగి ఫలించును యెహోవా ఆత్మ జ్ఞానవివేకములకు ఆధారమగు ఆత్మ ఆలోచన బలములకు ఆధారమగు ఆత్మ తెలివిని యెహోవాయెడల భయభక్తులను పుట్టించు ఆత్మ అతనిమీద నిలుచును.'' ఈ ప్రవచనము క్రీస్తుయేసును గురించి చెప్పబడియున్నది అని నాచే విరచితమైన ''ప్రవక్తల ప్రవచనములు - పర మార్థములు'' అను గ్రంథమునందు చదువగలము.
ఇందులో - మొదటి ఆత్మ :- జ్ఞానమునకు ఆధారము
రెండవ ఆత్మ :- వివేకమునకు ఆధారము
మూడవ ఆత్మ :- ఆలోచనకు ఆధారము
నాలుగవ ఆత్మ :- బలమునకు ఆధారము
ఐదవ ఆత్మ :- తెలివిని పుట్టించును
ఆరవ ఆత్మ :- యెహోవా యెడల భయమును పుట్టించును
ఏడవ ఆత్మ :- యెహోవా యెడల భక్తిని పుట్టించును
ఈ ఏడు ఆత్మలు క్రీస్తునందు ఉన్నప్పుడు వాటి కార్యములు క్రీస్తు ద్వారా జరిగించుచున్నవని తెలియుచున్నది. మరి ఏడు నక్షత్రములు ఏడాత్మలు గలవాడైన యేసుక్రీస్తు ఈ లేఖలో కొన్ని సంగతులను మనకు తెలియజేస్తున్నారు.
''నీ క్రియలను నేనెరుగుదును. ఏమనగా, జీవించుచున్నావన్న పేరుమాత్రమున్నది గాని నీవు మృతుడవే నీ క్రియలు నా దేవుని యెదుట సంపూర్ణమైనవిగా నాకు కనబడలేదు గనుక జాగరూకుడవై, చావనైయున్న మిగిలినవాటిని బలపరచుము. నీవేలాగు ఉపదేశము పొందితివో యేలాగు వింటివో జ్ఞాపకము చేసికొని దానిని గైకొనుచు మారుమనస్సు పొందుము. నీవు జాగరూకుడవైయుండనియెడల నేను దొంగవలె వచ్చెదను; ఏ గడియను నీ మీదికి వచ్చెదనో నీకు తెలియనే తెలియదు. అయితే తమ వస్త్రములను అపవిత్రపరచు కొనని కొందరు సార్దీస్‌లో నీయొద్దఉన్నారు. వారు అర్హులు గనుక తెల్లని వస్త్రములు ధరించుకొని నాతోకూడ సంచరించెదరు. జయించు వాడు ఆలాగున తెల్లని వస్త్రములు ధరించుకొనును; జీవగ్రంథములోనుండి అతని పేరెంతమాత్రమును తుడుపు పెట్టక, నా తండ్రి యెదుటను ఆయన దూతల యెదుటను అతని పేరు ఒప్పుకొందును.''
ఇది ఈ సంఘము యొక్క స్థితి. ఇప్పటి క్రైస్తవులు పరిశుద్ధాత్మ ఆవేశితులమని, పరిశుద్ధులమని, లోకసంబంధమైనవి ఆశించనివారమని లోకసంబంధమైన దృష్టి లేని వారమని, ఎలాంటి లోక సంబంధ ఆశలు లేనివారమని, ప్రభువు కొరకు నలుగగొట్టు కుంటున్నామని, తమను తామే ప్రకటించుకొంటూ అతిభక్తిని ప్రదర్శించుచు దైవత్వమునకు అయోగ్యకరమైన ఆచారాలు ఆచరిస్తూ వేషధారణ జీవితము జీవిస్తున్నారు.
ప్రకటన 3:1-2, ''-నీ క్రియలను నేనెరుగుదును. ఏమనగా, జీవించుచున్నావన్న పేరుమాత్రమున్నది గాని నీవు మృతుడవే నీ క్రియలు నా దేవునియెదుట సంపూర్ణమైనవిగా నాకు కనబడలేదు గనుక జాగరూకుడవై, చావనైయున్న మిగిలినవాటిని బలపరచుము. నీవేలాగు ఉపదేశము పొందితివో యేలాగు వింటివో జ్ఞాపకము చేసికొని దానిని గైకొనుచు మారుమనస్సు పొందుము. నీవు జాగరూకుడవైయుండనియెడల నేను దొంగవలె వచ్చెదను; ఏ గడియను నీ మీదికి వచ్చెదనో నీకు తెలియనే తెలియదు.''
''నీ క్రియలను నేనెరుగుదును. ఏమనగా, జీవించుచున్నావన్న పేరుమాత్రమున్నది గాని నీవు మృతుడవే.'' ఈ మృత్యువు అన్నది శరీర సంబంధమా? లేక ఆత్మ సంబంధమా? అన్నది ముందు మనము తెలిసికోవలసియున్నది. ఈ సందర్భములో ఎఫెసీ 2:1, ''మీ అపరాధములచేతను పాపములచేతను మీరు చచ్చినవారై యుండగా, ఆయన మిమ్మును క్రీస్తుతోకూడ బ్రతికించెను,'' అని వ్రాయబడుటలో ఇది ఆత్మీయ మరణముగా తెలిసికో వలసి యున్నది. ఎందుకంటే, ఎఫెసీ 2:2, ''మీరు వాటిని చేయుచు, వాయుమండల సంబంధమైన అధిపతిని, అనగా అవిధేయులైన వారిని ఇప్పుడు ప్రేరేపించు శక్తికి అధిపతిని అనుసరించి, యీ ప్రపంచ ధర్మముచొప్పున మునుపు నడుచుకొంటిరి.'' ఇట్టివారే మృతులు. జీవముతో ఉన్న మృతులు. ఈ స్థితిలో చాలామంది నేటి దినాలలో ఉన్నారు. కీడు జరిగినను మేలు జరిగినను నరుడు ఏది చేసినను ప్రభువు వలననే అని లోకాన్ని మభ్యపెట్టుచున్న క్రైస్తవ సోదరులు ఎక్కువగా ఉన్నారు. వారు చేసే మోస కార్యాలకు ప్రభువు నామాన్ని జోడించి జీవించే క్రైస్తవులు నేడు కోకొల్లలుగా ఉన్నారు.
''నీ క్రియలు నా దేవునియెదుట సంపూర్ణమైనవిగా నాకు కనబడలేదు గనుక జాగరూకుడవై, చావనైయున్న మిగిలినవాటిని బలపరచుము,'' అనుటలో చావనైయున్న మిగిలినవి ఏమిటి? 1 కొరింథీ 12:2, ''మీరు అన్యజనులై యున్నప్పుడు మూగ విగ్రహములను ఆరాధించుటకు ఎటుపడిన అటు నడిపింపబడితిరని మీకు తెలియును.'' మరియు ఎఫెసీ 2:3-4, ''వారితో కలిసి మనమందరమును శరీరముయొక్కయు మనస్సు యొక్కయు కోరికలను నెరవేర్చుకొనుచు, మన శరీరాశలను అనుసరించి మునుపు ప్రవర్తించుచు, కడమ వారివలెనే స్వభావసిద్ధముగా దైవోగ్రతకు పాత్రులమై యుంటిమి. అయినను దేవుడు కరుణాసంపన్నుడై యుండి, మనము మన అపరాధములచేత చచ్చిన వారమై యుండినప్పుడు సయితము మనయెడల చూపిన తన మహాప్రేమచేత మనలను క్రీస్తుతోకూడ బ్రదికించెను. కృపచేత మీరు రక్షింపబడియున్నారు.'' అని వ్రాయబడిన ప్రకారము ఇవియే చావనైయున్న మిగిలిన క్రియలు. ఇందులో నానావిధ గుణాతిశయములు మిళితములైయున్నవి. గలతీ 5:19-21, ''శరీరకార్యములు స్పష్టమైయున్నవి; అవేవనగా, జారత్వము, అపవిత్రత, కాముకత్వము, విగ్రహారాధన, అభిచారము, ద్వేషములు, కలహము, మత్సరములు, క్రోధములు, కక్షలు, భేదములు, విమతములు, అసూయలు, మత్తతలు, అల్లరితో కూడిన ఆటపాటలు మొదలైనవి. వీటినిగూర్చి నేనుమునుపు చెప్పిన ప్రకారము ఇట్టి వాటిని చేయువారు దేవుని రాజ్యమును స్వతంత్రించుకొనరని మీతో స్పష్టముగా చెప్పుచున్నాను.'' ఇవి ఆత్మీయముగా చచ్చినవాని క్రియలు.ఇట్టి వ్యక్తి వస్త్రాలను అపవిత్ర పరచుకొని మారుమనస్సు పొందకనే - మారుమనస్సు పొందినట్లుగ ప్రకటించుకొంటూ వేషధారణ జీవితము జీవిస్తూ మారుమనస్సు పొందకుండ ఉండేవారు!
ఈ సార్దీస్ సంఘములో వలె నేటి మన సంఘాలలో కూడ ఇట్టివారున్నారు. అలాగే గొప్ప గొప్ప ప్రసంగాలు చేస్తూ వేదాంతులమని దైవాత్మ పూర్ణులమని చెప్పుకొంటూ - సంఘాలలో స్వార్థమునకు ధనాపేక్షతో కూడిన బోధలు చేస్తూ సంఘముయొక్క ఆత్మీయస్థితిని మార్చే బోధకులున్నారు. వీరినిగూర్చి యేసుక్రీస్తు ప్రభువు తన వర్తమానములో చెప్పియున్నారు. మత్తయి 24:5, ''అనేకులు నా పేరట వచ్చి-నేనే క్రీస్తునని చెప్పి పలువురిని మోసపరచెదరు.'' మత్తయి 24:11, ''అనేకులైన అబద్ధ ప్రవక్తలు వచ్చి పలువురిని మోసపరచెదరు;'' అని వ్రాయబడిన ప్రకారము బోధకులలో కూడ విషమ పరిణామాలు కూడా తలెత్తి ఉన్నాయని, ప్రభువు రానైయున్న ఈ లోకాంత్య కాలములో ఇట్టి బోధకులు ఇట్టి సంఘాలు విస్తరించును. కనుక ఇటువంటి సంఘాలలో విశ్వాసులు సన్నగిల్లుదురు. ''అయితే తమ వస్త్రములను అపవిత్రపరచుకొనని కొందరు సార్దీస్‌లో నీయొద్ద ఉన్నారు.''
ఈ విధముగా ఈ సంఘము వారి క్రియలు సంపూర్ణముగా లేకపోవుటయేగాక ఆత్మీయజీవితము చావనైయున్నది. కాబట్టి నీవు మృతుడవే అని చెప్పబడుచున్నది. కాబట్టి ఇకనైన సాధ్యమైనంతవరకు ఆత్మీయతను బలపరచుకొని, ప్రకటన 3:3, ''నీవేలాగు ఉపదేశము పొందితివో యేలాగు వింటివో జ్ఞాపకము చేసికొని దానిని గైకొనుచు మారు మనస్సు పొందుము. నీవు జాగరూకుడవై యుండనియెడల నేను దొంగవలె వచ్చెదను; ఏ గడియను నీ మీదికి వచ్చెదనో నీకు తెలియనే తెలియదు,''అని వ్రాయబడిన ప్రకారము మారుమనస్సు పొందవలసియున్నది. లేకున్నట్లయితే నాశనము తప్పదని హెచ్చరిక.
ప్రకటన 3:3, ''నీవు జాగరూకుడవై యుండనియెడల నేను దొంగవలె వచ్చెదను; ఏ గడియను నీ మీదికి వచ్చెదనో నీకు తెలియనే తెలియదు.''
ప్రభువు రాకడ దొంగవలె ఏ గడియలో వచ్చునో తెలియదు గనుక జాగరూకుడవై యుండుమని హెచ్చరించుచున్నాడు. ప్రభువు ఈ లోకములో జీవించిన కాలములోకూడ ఈ సంగతినే అనేకమార్లు చెప్పియున్నారు. మత్తయి 24:36, ''అయితే ఆ దినమును గూర్చియు ఆ గడియనుగూర్చియు తండ్రి మాత్రమే (యెరుగును) గాని, యే మనుష్యుడై నను పరలోకమందలి దూతలైనను కుమారుడైనను ఎరుగరు.'' మరియు మార్కు 13:32, ''ఆ దినమును గూర్చియు ఆ గడియను గూర్చియు తండ్రి తప్ప ఏ మనుష్యుడైనను, పరలోకమందలి దూతలైనను, కుమారుడైనను ఎరుగరు.'' 1 థెస్సలొనీక 5:1-2, ''సహోదరులారా, ఆ కాలమునుగూర్చియు ఆ సమయములనుగూర్చియు మీకు వ్రాయ నక్కరలేదు. రాత్రివేళ దొంగ ఏలాగు వచ్చునో ఆలాగే ప్రభువు దినము వచ్చునని మీకు బాగుగా తెలియును.'' కాబట్టి క్రీస్తురాకడ ఎప్పుడు వచ్చునో మనకు తెలియదు. అందరిని జాగరూకుడవై యుండుడని చెప్పుచున్నాడు. ఈ రోజులలో చాలామంది ఫలానా రోజు యుగాంతము ఉండవచ్చునని చెప్పు చుందురు. కాని అది ఒక ఊహ మాత్రమేగాని నిజ మైనది కాదు. ఎందుకంటే ఈ సమయమును దేవుడు రహస్యముగా ఉంచి ఉన్నారు. ఇక్కడ ప్రభువు రాకడలో ఏమి జరుగుతుంది? అని వ్రాయాలని మొదలుపెట్టగా నామదిలో ప్రకటన అంతా ఒక్కసారిగా కదలాడింది. ఎందుకంటే ప్రకటనఅను ఈ పుస్తకము క్రీస్తు రెండవ రాకడ ఏ విధముగా ఉంటుంది? అని సంపూర్ణముగా తెలియజేయ బడింది. ఈ పుస్తకము అంతా రెండవ రాకడ గురించి కాబట్టి ఈ పుస్తకములోని విషయము అంతా క్లుప్తముగా ఇక్కడ వ్రాసే దానికన్న మిగతా అధ్యాయాలలో సంపూర్ణముగా చదువుకొందము.
ప్రకటన 3:4, ''అయితే తమ వస్త్రములను అపవిత్రపరచుకొనని కొందరు సార్దీస్‌లో నీయొద్ద ఉన్నారు. వారు అర్హులు గనుక తెల్లని వస్త్రములు ధరించుకొని నాతో కూడ సంచరించెదరు.''
''తమ వస్త్రములను అపవిత్రపరచుకొనని కొందరు నీయొద్దఉన్నారు,'' అనగా వారు ఆత్మీయముగా జీవించువారు, ప్రభువు యొక్క మహిమ వస్త్రము ధరించుకొన్నవారు; ఆత్మ వరమును పొందినవారు, దైవకృపకు పాత్రులైనవారు; తమ్ముతాము సమర్పించుకొన్న వారు. ఇటువంటివారు తెల్లని వస్త్రములు ధరించుకొని క్రీస్తుతో కూడ సంచరించెదరు. ప్రకటన 6:11, ''తెల్లని వస్త్రము వారిలో ప్రతివాని కియ్యబడెను; మరియు వారివలెనే చంపబడబోవువారి సహదాసులయొక్కయు సహోదరులయొక్కయు లెక్క పూర్తి యగు వరకు ఇంక కొంచెము కాలము విశ్రమింపవలెనని వారితో చెప్పబడెను.'' ఈ వచనములో,''తెల్లని వస్త్రము వారిలో ప్రతివాని కియ్యబడెను;'' అని చెప్పబడియున్నది. వీరంతా కూడ హతసాక్షులు అంటే దేవుని నిమిత్తము క్రీస్తు సువార్త నిమిత్తము చంపబడిన వారు. ఈ తెల్లని వస్త్రములకు యోగ్యులు.
ప్రకటన 7:9, ''అటుతరువాత నేను చూడగా, ఇదిగో, ప్రతి జనములోనుండియు, ప్రతి వంశములోనుండియు ప్రజలలోనుండియు, ఆయా భాషలు మాటలాడువారిలో నుండియు వచ్చి, యెవడును లెక్కింపజాలని యొక గొప్ప సమూహము కనబడెను. వారు తెల్లని వస్త్రములు ధరించు కొన్నవారై, ఖర్జూరపుమట్టలు చేతపట్టుకొని సింహాసనము ఎదుటను గొఱ్ఱెపిల్లయెదుటను నిలువబడి,'' ఇక్కడ తెల్లని వస్త్రములు ధరించుకొన్నవారు కూడ క్రీస్తు సువార్త కొరకు పాటుబడినవారు. వీరు అనేక సంతతుల నుండి ఎన్నిక చేయబడినవారు. వీరినిగూర్చి ప్రకటన 7:13-14, ''పెద్దలలో ఒకడు-తెల్లని వస్త్రములు ధరించు కొనియున్న వీరెవరు? ఎక్కడనుండి వచ్చిరని నన్ను అడిగెను. అందుకు నేను-అయ్యా, నీకే తెలియుననగా అతడు ఈలాగు నాతో చెప్పెను-వీరు మహాశ్రమలనుండి వచ్చిన వారు; గొఱ్ఱెపిల్ల రక్తములో తమ వస్త్రములను ఉదుకుకొని వాటిని తెలుపుచేసి కొనిరి,'' అని వ్రాయబడిన ప్రకారము వీరు పరలోక రాజ్యానికి అర్హులు. కాబట్టి తెల్లని వస్త్రములు సంపూర్ణతకును, నీతికిని మరియు పవిత్రతకు సూచనగా ఉన్నవి.
ప్రకటన 3:5, ''జయించు వాడు ఆలాగున తెల్లని వస్త్రములు ధరించుకొనును; జీవ గ్రంథములోనుండి అతని పేరెంతమాత్రమును తుడుపు పెట్టక, నా తండ్రి యెదుటను ఆయన దూతల యెదుటను అతని పేరు ఒప్పుకొందును.''
జీవగ్రంథము క్రీస్తుకు సంబంధించినది అని ప్రత్యేకముగా చెప్పనక్కరలేదు. ఈ జీవగ్రంథము యుగాంతకాలములో తెరవబడును అని ప్రకటన 20:12లో వ్రాయబడి యున్నది. దీనిలో పేర్లు గలవారు ధన్యులు కాబట్టి వీరు పరలోక రాజ్యానికి వారసులు. అయితే మన మూలవాక్యము మనకు మరికొన్ని ముఖ్య విషయములు తెలియజేయుచున్నది.
''జీవగ్రంథములోనుండి అతని పేరెంతమాత్రమును తుడుపు పెట్టక,'' అని అనుటలో జీవగ్రంథములో పేర్లు వ్రాయబడియున్నట్లుగా మనకు తెలియుచున్నది. పేర్లు కొందరివేనా లేక అందరి పేర్లు వ్రాయబడియున్నవా అన్న విషయము తెలుసుకోవలసి యున్నది. ఇక్కడ పేర్లు వ్రాస్తేనేగాని తుడుపుటకు వీలులేదు. అంటే అందరి పేర్లు వ్రాయబడియున్నవి. కాని మన క్రియల చొప్పున మన పేరు ఉంచుటమా లేక తుడుపుటమా జరుగుతుంది. యోహాను 17:12, ''నేను వారియొద్ద ఉండగా నీవు నాకు అనుగ్రహించిన వారిని నీ నామమందు కాపాడితిని; నేను వారిని భద్రపరచితిని గనుక లేఖనము నెరవేరునట్లు నాశన పుత్రుడు తప్ప వారిలో మరి ఎవడును నశింపలేదు.'' ఈ వాక్యము ప్రకారము మన ప్రభువైన యేసుక్రీస్తు ప్రతి ఒక్కరిని రక్షింపవలెనని కోరుకొనెను గనుక జీవగ్రంథములో మన పుట్టుకతోనే మన పేరు నమోదు చేయబడుతుంది. అనగా లోకరీత్యా మనము పుట్టినప్పుడు జనన పత్రము మంజూరు చేస్తూ జనన గ్రంథమందు నమోదు చేస్తారు. అదే విధముగా ఈ జీవగ్రంథమందు కూడ నమోదు చేయబడుతుంది. ఎవరి పేర్లు? ప్రతి ఒక్కరి పేరు నమోదు చేయబడుతుంది. ఎందుకంటే దేవుడు పక్షపాతి కాడు అని అపొస్తలుల కార్యములు 10:34లో చెప్పబడి ఉంది.
అయితే ఎవరైతే క్రీస్తు రాకడ కొరకు జాగరూకుడై ఉండి తెల్లని వస్త్రములకు యోగ్యుడు అవుతాడో వాని పేరెంత మాత్రమును తుడుపు పెట్టడు. అనగా జీవగ్రంథములో వాని పేరు అలాగే ఉంటుంది. ఎవరైతే క్రీస్తు రాకడ కొరకు జాగరూకుడై ఉండడో వాడు తెల్లని వస్త్రములకు యోగ్యుడు కాడు కనుక వాని పేరు జీవగ్రంథములో వాని పుట్టుకతో వ్రాయబడినప్పటికిని వాని పేరు తుడుపు పెట్టబడును. వాని పేరు తుడుపు పెట్టబడినది కనుక వాడు రెండవ మరణమునకు పాత్రుడు, అని ఈ వచనము తెలుపుచున్నది.
ప్రకటన 3:5, ''నా తండ్రి యెదుటను ఆయన దూతల యెదుటను అతని పేరు ఒప్పుకొందును.''
ఇది తెల్లని వస్త్రములు ధరించినవారి గురించి క్రీస్తు ప్రభువు ఇస్తున్న సాక్ష్యము. ఈ సాక్ష్యమునకు తిరుగులేదు. విచారణ అసలే లేదు. క్రీస్తు తండ్రియైన దేవుడు మేఘా రూఢుడై దూతల సమూహముతో ఆయన సింహాసనములో కూర్చుని ఉండినప్పుడు ఈ సంఘటన జరుగుతుంది. అనగా దీనికి ముందు క్రీస్తు మేఘారూఢుడై తన దూతలతో వచ్చి జీవించినవారికిని, చనిపోయిన వారికి వారి వారి కార్యముల చొప్పున తీర్పుతీర్చి, వారిలో తెల్లని వస్త్రములకు యోగ్యులైనవారిని తనతోబాటుగా తండ్రియైన దేవుని యొద్దకు తీసుకొని వెళ్ళును. ప్రకటన 3:4, ''తెల్లని వస్త్రములు ధరించుకొని నాతోకూడ సంచ రించెదరు,'' అని చెప్పుచున్నారు. వీరు క్రీస్తుతోబాటుగా సంచరిస్తూ పరలోకమునకు చేెర్చబడుదురు. అప్పుడు క్రీస్తు తన తండ్రి యెదుటను ఆయన దూతల యెదుటను అతని పేరు ఒప్పుకొని అతని పవిత్ర జీవితమునుగూర్చి సాక్ష్యమిచ్చును అని అర్థము.
ఇలా క్రీస్తు ప్రభువు సాక్ష్యమివ్వాలి అంటే మనము ఎలా ఈ భూమిపై జీవించి యుండాలి? మత్తయి 10:32-33, ''మనుష్యులయెదుట నన్ను ఒప్పుకొనువాడెవడో పరలోకమందున్న నా తండ్రి యెదుట నేనును వానిని ఒప్పుకొందును. మనుష్యుల యెదుట ఎవడు నన్ను ఎరుగననునో వానిని పరలోకమందున్న నా తండ్రి యెదుట నేనును ఎరుగనందును.'' ఇందులో ఒక నిబంధన మనకు కనబడుచున్నది. అదే ఈ భూమిపై నివసిస్తున్న మనము ప్రజల యెదుట క్రీస్తు ప్రభువును రక్షకునిగా అంగీకరిస్తే మన పేర్లను తండ్రి ఆయన దూతల సమక్షములో అంగీకరిస్తాడు. ఇదే క్రీస్తు ప్రభువు తన బోధలో తెలియజేసింది. కనుక మనలో ఎవరైన తన పేరును పరలోకపు తండ్రి ఆయన దూతల సమక్షములో ఒప్పుకోవాలి అనుకొంటే ముందుగా ఈ లోకములో మనము జీవించునప్పుడే ఆయననుగూర్చి సిగ్గుపడక బహిరంగముగా ప్రజల ముందు ఆయనను రక్షకునిగా అంగీకరించి ఆయన తండ్రి చిత్తము ప్రకారము సువార్తలోని బోధలను అనుసరించాలి. అప్పుడే మనము తెల్లని వస్త్రములు ధరించుటయేగాక తండ్రియైన దేవుని ముందు మన పేరును క్రీస్తు ప్రభువు అంగీకరించుట వలన పరలోక రాజ్యములో నిత్యానందమును పొందుదుము అని గ్రహించాలి.
ప్రకటన 1:20, ''ప్రకారము ఫిలదెల్ఫియాలో ఉన్న దూత కూడ క్రీస్తు చేతిలో అనగా ఆధీనములో ఉన్న ఒక నక్షత్రము.''
ప్రకటన 3:7, ''దావీదు తాళపుచెవి కలిగి, యెవడును వేయ లేకుండ తీయు వాడును, ఎవడును తీయలేకుండ వేయువాడునైన సత్యస్వరూపియగు పరిశుద్ధుడు,'' ఈ లేఖ వ్రాయిస్తున్నారు.
ఇందులో దావీదు తాళపుచెవి గురించి తరువాత (54) (|||) విభాగములో సంపూర్ణముగా తెలిసికొందము. ''సత్యస్వరూపియగు పరిశుద్ధుడు అయినవాడు క్రీస్తే.'' ఎందుకంటే క్రీస్తుయేసునందు ఎటువంటి లోపము లేదు అని బైబిలు గ్రంథముతో బాటుగా ఖురాన్-ఇ-షరీఫ్ గ్రంథము కూడ నొక్కి వక్కాణించుచున్నది.
ఖురాన్-ఇ-షరీఫ్ అను గ్రంథము యేసుక్రీస్తు ఒక ప్రవక్త, ఆయన దేవుని కుమారుడు కాడు అని చెప్పినప్పటికిని భూమి పుట్టినది మొదలు భూమి అంతమువరకు క్రీస్తు ప్రభువు ఒక్కడే నీతిమంతుడు ఆయన ఎటువంటి తప్పు చేయలేదు అని చెప్పుచున్నది. కాబట్టి భూజనులకు తీర్పు చేయు అధికారమును దేవుడు క్రీస్తుకు (ఈసా) అనుగ్రహించెనని మహమ్మద్ సాక్ష్యమిచ్చుచున్నాడు. కాబట్టి సత్యస్వరూపి మరియు పరిశుద్ధుడు ఒక్క క్రీస్తు మాత్రమే. ఈయన ఈ లేఖలో ఏమి చెప్పుచున్నాడో తెలుసుకొందము.
''-నీ క్రియలను నేనెరుగుదును; నీకున్న శక్తి కొంచెమై యుండినను నీవు నా వాక్యమును గైకొని నా నామము ఎరుగననలేదు. ఇదిగో తలుపు నీయెదుట తీసియుంచి యున్నాను; దానిని ఎవడును వేయనేరడు,'' అనుటలో ఈ తలుపు సువార్త అనే తలుపు, లోకములో ఈ తలుపును తీయుటకుగాని మూయుటకుగాని వారసుడు క్రీస్తు. సువార్త వారసత్వములో యోగ్యుడైనవాడు క్రీస్తును ధరించుకొన్నవాడే. లోకసంబంధి ఈ సువార్త అను తలుపును మూయను లేడు మరియు తెరవను లేడు. మూయుటకును మరియు తెరచుటకును అధికారము పొందినవాడు క్రీస్తు.
సువార్త అనే తాళపుచెవి నరుని హృదయ కవాటమును తెరచును. కనుక సువార్త అనే తాళపుచెవి పరలోకమందున్న దేవునికి, విశ్వాసియొక్క పరిశుద్ధతను కన బరచునది. ఈ విధముగా విశ్వాసికి దేవునికిని అవినాభావ సంబంధము కలిగించేది ఈ తాళపుచెవి. ''నీవు నా వాక్యమును గైకొని నా నామము ఎరుగననలేదు. ఇదిగో తలుపు నీయెదుట తీసియుంచి యున్నాను; దానిని ఎవడును వేయనేరడు,'' అనుటలో మోక్షరాజ్య ద్వారము క్రీస్తు. కనుక క్రీస్తు ద్వారము ప్రతి ఒక్కరికి తెరవబడియున్నది. కనుక దీనిని మూయజాలరు. ''యూదులు కాకయే తాము యూదులమని అబద్ధమాడు సాతాను సమాజపు వారిని రప్పించెదను;'' అనగా క్రైస్తవులుకాకయే దేవుని బిడ్డలు కాకయే ఉభయ జీవితము జీవించువారు అనగా అటు పరలోకమునకును, ఇటు భూలోకమునకును పనికిరాని జీవితము జీవించేవారు. సత్యమును అసత్యమునకు మార్చేవారు ఈ సాతాను సమాజము వారు. వారి నోట నిజమన్నది లేదు. వీరు ఎల్లప్పుడు అబద్ధమాడుదురు. ఎందుకంటే యోహాను 8:44, ''వాడు అబద్ధికుడును అబద్ధమునకు జనకుడునై యున్నాడు.'' కాబట్టి వీరి తండ్రియైన అపవాది అబద్ధమునకు జనకుడు. అట్టి అబద్ధికులు వచ్చునట్లుగ చేసి, వారు నీతిమంతులయొక్క పాదముల ఎదుట నమస్కారము చేసి, ఆత్మ సంబంధమైన విశ్వాసముతో తమ పాపములనుబట్టి పశ్చాత్తాపపడి, దైవరాజ్య ప్రభావమును దేవునియొక్క మహిమ ఎట్టిదో తెలిసికొనునట్లు చేయుదును.
ఆ విధముగా చేయుటయే గాకుండ; ''ఇదిగో, నేను నిన్ను ప్రేమించితినని తెలిసికొనునట్లు చేసెదను,'' అనుటలో దైవత్వమే విశ్వాసి యందుంటున్నది అనుటకు ఋజువుగా విశ్వాసి దేవునియొక్క ఆత్మ వెలుగుతో కూడిన గొప్ప కార్యాలు జరిగించును. కనుక భూనివాసులందరి మీదకు రాబోవు శోధన కాలములో తనను నమ్మిన విశ్వాసులను కాపాడుదును అని వాగ్దానము చేస్తున్నారు. అంతియేగాక, ''నేను త్వరగా వచ్చుచున్నాను; ఎవడును నీ కిరీటము నపహరింప కుండునట్లు నీకు కలిగినదానిని గట్టిగా పట్టుకొనుము,'' అనుటలో ప్రభువు యొక్క రాకడలో సంభవించబోవు సంఘటనయైయున్నది. కాబట్టి అందుకు యోగ్యకరమైన సిద్ధపాటునుగూర్చి ఈ వేదభాగములో వివరించబడియున్నది.
''ఎవడును నీ కిరీటము నపహరింపకుండునట్లు,'' అనుటలో విశ్వాసికి దేవుడిచ్చిన కిరీటము ఏమిటి? ఆయన పొందిన కిరీటము ఏమిటి? దీనినిగూర్చి 2వ అధ్యాయములోని జీవకిరీటము 25వ విభాగము నందు చదువుకొని యున్నాము. విశ్వాసిని బలపరచుటకు, వానిని కాపాడుటకును, తన సన్నిధిలో ఆధిక్యత నిచ్చుటకును, దైవ కుమారుడైన క్రీస్తు ముళ్ళ కిరీటము ధరించినట్లు గ్రహించాలి. పాపిరక్షణార్థము మరియు నీతిమంతునియొక్క నీతిని భద్రపరచుటకు విమోచకుడుగ క్రీస్తు ధరించిన ముళ్ళ కిరీటమే దేవుని ద్వారా మనకు అనుగ్రహించిన జీవకిరీటము. ఎవడును నీ కిరీటము నపహరింప కుండునట్లు నీకు కలిగినదానిని గట్టిగా పట్టుకొనుము అని చెప్పుచున్నాడు. కాబట్టి నిరంతరము ప్రభువుయొక్క సన్నిధిలో విజ్ఞాపన చేస్తూ, మొరపెట్టి, తన ఆత్మీయ జీవితమునుగూర్చి విన్నవించి, లోకములో రక్షణనుగూర్చి అభ్యర్థించి ఆయన వాక్యమును దివారాత్రులు ధ్యానించుచు, ఆయన మనకిచ్చిన రక్షణలో తన ఆత్మీయ జీవితమును కాపాడుకోవాలి. పరలోక సంబంధమైన నియమావళిని విశ్వాసి పాటించుటలో దృఢమైన మనస్సుతో స్థిరమైన బుద్ధి, ప్రగాఢమైన భక్తి, దైవత్వములో నిరీక్షణ, క్రీస్తు ప్రేమ గలిగి జీవించితేనేగాని ఈ కలిగియున్నదానిని పట్టుకోవడము అసాధ్యము. కలిగి యున్న దానిని గట్టిగా పట్టుకోవడము ఎంతో అవసరము. ఆ విధముగా పట్టుకొని దైవత్వములో దైవ ప్రార్థన దైవదాసుల సావాసములో జీవించినప్పుడు తప్పకుండ అట్టివాడు లోకాన్ని శోధన వలన కలిగిన కష్టాలను, సకల సమస్యలను ఎదుర్కొని, అజ్ఞాన నర సమాజమును జయించును. ఎఫెసీ 6:12లో వలె లోకముతో పోరాడి జయించినవానిని నా దేవుని ఆలయములో ఒక స్థంభమువలె స్థిరముగా ఉండునట్లు చేసెదను. అతనిని దైవసంబంధమైన ఒక ప్రధాన మూల స్థంభముగా అనగా దైవకార్యాలు భరించేవాడుగ చేస్తానని భావము. ఆ విధముగా చేయబడినప్పుడు అందులో నుండి ఇక మీదట ఎన్నటికిని వెలుపలికి పోడు. నా దేవుని పేరు,'' అని క్రీస్తు ప్రభువు చెప్పుచున్నారు.
ఆయన ఒక్కడే. ఆయన యెహోవా.
''నా దేవుని పేరును, పరలోకములో నా దేవుని యొద్దనుండి దిగి వచ్చుచున్న నూతనమైన యెరూషలేమను నా దేవుని పట్టణపు పేరును, నా క్రొత్త పేరును వానిమీద వ్రాసెదను.'' ఈ విధముగా జీవించేవాని మీద వ్రాయబడే పేరు మొట్టమొదట యెహోవా, ఆ తరువాత యెరూషలేము, అటుతరువాత యెరూషలేము అను వధువు సంఘానికి భర్త యైన యేసుక్రీస్తు అని వ్రాయబడెను. ఇందుకు ఋజువు దేవుడు యేసుక్రీస్తు ద్వారా దేవుని పిల్లలగుటకు అధికారము అనుగ్రహించెను. యోహాను 1:12-13, ''తన్ను ఎందరంగీ కరించిరో వారికందరికి, అనగా తన నామమునందు విశ్వాసముంచినవారికి, దేవుని పిల్లలగుటకు ఆయన అధికారము అనుగ్రహించెను. వారు దేవునివలన పుట్టినవారేగాని, రక్తమువలననైనను శరీరేచ్ఛవలన నైనను మానుషేచ్ఛలవలననైనను పుట్టినవారు కారు.''
ప్రకటన 3:7, ''దావీదు తాళపుచెవి కలిగి, యెవడును వేయ లేకుండ తీయు వాడును, ఎవడును తీయలేకుండ వేయువాడునైన సత్యస్వరూపియగు పరిశుద్ధుడు చెప్పుసంగతులేవనగా''
దావీదు తాళపు చెవి అంటే ఏమిటో? ముందు మనము తెలిసికోవలసియున్నది. ఇందులో దావీదునకు ఈ తాళము ఎట్లు వచ్చింది? మొట్టమొదటగా దావీదుకు ఇవ్వబడిన తాళపుచెవియొక్క విలువను ప్రభావమును మనము తెలిసికోవాలి.
మొట్టమొదటగా దేవునియొద్దనుండి దావీదు కియ్యబడిన తాళము చిక్కము, తాళపుచెవి లోయలో దావీదు ఏరుకున్న రాళ్ళు. ఇది దైవనిర్ణయము చేతను దైవప్రేరేపణ చేత ఉజ్జీవింపబడిన బాలుడైన దావీదునకు ప్రధమముగా ఇవ్వబడిన తాళపుచెవి. దీనితో ఎవడును ఎదుర్కోలేని పోరాడి గెలువలేని వీరుడైన గొలియాతు అను మహాబలుడు, సాతాను సంబంధి వీరుడు, ఫిలిష్తీయ యోధులను సైన్యములుగా పొంది, తన ఆయుధముల మీదను తన దేహబలము మీదను, తానారాధించే అలౌకిక శక్తియైన దాగోను మీద ఆధారపడి విజృంభించి దేహదారుఢ్యము బలము చేత బలాధిక్యతనుబట్టి నలభైదినములు ఇశ్రాయేలు మీద సవాలు చేసిన, ఎవని చేతను ఓటమిని చవిచూడని, ఎవడును ఎదిరించు టకు సాహసింపని వానిపై విజయమును సాధించాడు. అట్టివానిపై దేవుడు దావీదు కనుగ్రహించిన తాళపుచెవి రాళ్ళు. ఈ రాళ్ళు క్రీస్తు. ప్రకటన 5:5లో క్రీస్తు ప్రభువును దావీదు చిగురుగా వర్ణించబడియున్నది. దావీదుయొక్క సకల ఐశ్వర్యములకును, ఆయన మందసమునకును వారసులైనవారు లోకరీతిగా ఆయన కొడుకులు కారు. దావీదుయొక్క నిజమైన వారసుడు క్రీస్తే. కాబట్టి క్రీస్తుయొక్క జన్మకు మూలపురుషుడుగా దావీదు ఎన్నిక చేయబడినాడు.
''యెవడును వేయ లేకుండ తీయువాడును,'' అనుటలో ఎవడును సాధించలేని దానిని సాధించువాడు. ఎవడును జయింపలేని వానిని జయించువాడు. నేను లోకమును జయించునట్లు మీరును లోకమును జయించమంటున్నాడు. ''యెవడును వేయ లేకుండ తీయువాడును,'' అనుటలో యేసుక్రీస్తు సిలువ వేయబడి రాజముద్రతో ఆయన సమాధి ముద్రించబడి రోమా భటుల కాపుదలలో ఉండిన సమాధి నుండి తెరచుకొని బైటకు వచ్చినవాడు క్రీస్తే. తానే సమాధిని జయించి సజీవుడుగా లేచినవాడు. మరణములో ఉన్నవానిని సమాధి నుండి లేపినవాడు. దేవాలయ తెరను మనుష్యుల ప్రమేయము లేకుండ చినుగునట్లు చేసినవాడు. మృతులను సమాధి నుండి లేపినవాడు. ఇశ్రాయేలు పక్షములో దావీదు పోట్లాడగా దావీదు చేత దైవజనాంగమునకు విజయాన్ని చేకూర్చాలని లోయలో శిలారూపములో ఉండి దావీదుయొక్క చిక్కములో అమర్చబడి, దావీదు హస్తనైపుణ్యముతో త్రిప్పబడి, యెహోవా నామములో దావీదుయొక్క విశ్వాస పూరితమైన క్రియ ద్వారా నరరూప సాతానుడైన గొలియాతు నొసలును బలముగా తాకి వానిని పడ వేసిన వీరుడు క్రీస్తే.
దావీదునకు దేవుడిచ్చిన వరము కూడ తాళపుచెవిగా గ్రహించాలి. ఇది యొక వరము. దావీదు మందను కాయునప్పుడు మంద మీదకు దాడి చేసిన సింహాన్ని ఎలుగు బంటిని చంపిన శక్తి కూడ ఈ దావీదు తాళపుచెవిలో ఇమిడియున్నది. లూకా 1:32, ''ఆయన గొప్పవాడై సర్వోన్నతుని కుమారుడన బడును; ప్రభువైన దేవుడు ఆయన తండ్రియైన దావీదు సింహాసనమును ఆయన కిచ్చును,'' అనుటలో దావీదుయొక్క సింహాసనము కూడ క్రీస్తుదే. దావీదే క్రీస్తులో ఉన్నట్లుగ - క్రీస్తు దావీదులో ఉన్నట్లుగా ఇందునుబట్టి తెలియుచున్నది. యెషయా 22:22, ''నేను దావీదు ఇంటితాళపు అధికార భారమును అతని భుజముమీద ఉంచెదను అతడు తీయగా ఎవడును మూయజాలడు అతడు మూయగా ఎవడును తీయజాలడు'' ఈ విధముగా దావీదు అపజయమెరుగక సాతాను సమాజమునకు సింహస్వప్నమై భయంకరుడై, సర్వశక్తిగల దేవునికి విధేయుడై యుండెను. 1 సమూయేలు 18:21-30లో సౌలు ఫిలిష్తీయులచేత దావీదును పడగొట్ట వలెనని తలంపు గలిగినవాడై కపటయోచన జేసినట్లుగా, సౌలు మాట్లాడిన విధానాన్నిబట్టి గ్రహించగలము. ఇందులో సైనికులు ''దావీదుతో రహస్యముగా మాటలాడి-రాజు నీయందు ఇష్టము గలిగియున్నాడు, అతని సేవకులందరును నీయెడల స్నేహముగా నున్నారు, కాబట్టి నీవు రాజునకు అల్లుడవు కావలెనని చెప్పవలెనని ఆజ్ఞ ఇచ్చెను.'' ఈ విధముగా సౌలు తన కుమార్తెయైన మీకాలును మీకాలుయొక్క ప్రేమను ఆసరాగా జేసుకొని ఆమె దావీదుకు ఉరిగా ఉండునట్లు ఫిలిష్తీయుల చెయ్యి అతని మీద ఉండు నట్లును కుట్రపన్ని - యిందుకు ఓలిగా ఫిలిష్తీీయుల నూరు ముందోళ్లు కోరుచున్నాడని కబురంపి, దావీదునకు ఆశ చూపి ఒక గడువును నియమించెను. ఆ గడువు దాటక మునుపే సౌలు ఫిలిష్తీయుల నూరు ముందోళ్ళను కోరినట్లును, అందుకు దావీదు పరమానందభరితుడై తన ప్రాణమునుసైతము లెక్కచేయక మీకాలు మీదనున్న ప్రేమనుబట్టి గడువుదాటక మునుపే, తనవారితోపోయి ఫిలిష్తీయులలో రెండువందల మందిని హతముచేసి వారి ముందోళ్లు తీసుకొనివచ్చి రాజునకు అల్లుడగుటకై లెక్క పూర్తిచేసి అప్పగించగా సౌలు భయముతో తన కుమార్తెయైన మీకాలు పెళ్ళి దావీదుతో చేయుటన్నది ఈ వేదభాగములో చదువగలము. 1 సమూయేలు 18:28-29, ''యెహోవా దావీదునకు తోడుగా నుండుటయు, తన కుమార్తెయైన మీకాలు అతని ప్రేమించుటయు సౌలు చూచి దావీదునకు మరి యెక్కువగా భయపడి, యెల్లప్పుడును దావీదు మీద విరోధముగా ఉండెను.''
దావీదు దేవుని మందసముయొక్క ప్రభావము, మహత్యము ఆనాటి దేవుని ప్రజలకు చాటి, బలులు, ఉత్సవములు, ఆరాధనలు మొదలైన దైవిక క్రియల ద్వారా దశాజ్ఞలమందసమునకు గౌరవము ఇచ్చాడు. ఇక్కడ క్రీస్తుకు పూర్వము క్రీస్తుకు చిహ్నమైన దశాజ్ఞల మందసమును మోసి దానిని ఆరాధించి ఎన్నో దైవ ఆశీర్వాదములు తన రాజ్యమునకు దానిలో ప్రజలకు పొందగలిగాడు. శత్రువుల దగ్గర నుండి తన మహిమతో తిరిగి వస్తున్న మందసము పడిపోతుందని చిన్న తలంపుతో తాకిన ఉజ్జీయ అక్కడికక్కడే పడి చనిపోయాడు. ఇందులో దావీదుకు యెహోవా తోడుగా ఉండుటయే తాళపుచెవియై యున్నది. ఇక ఈ తాళపుచెవియొక్క మర్మము ఇది చేయు క్రియాకర్మలనుగూర్చి మనము తెలుసుకోవలసియున్నది. తాళపుచెవి దావీదుకు పూర్వము ఇశ్రాయేలు అను దైవ జనాంగమును నడిపించుటకు మోషేకు చేతికఱ్ఱగా ఇయ్యబడెను. దేవుని మహిమను బైల్పరచుటకు అది నేలపడవేసినప్పుడు సర్పముగాను నరదృష్టికి కనిపించినట్లు వేదములో చదువగలము. అదే విధముగా అహరోను చేతిలో కూడ ఈ తాళపుచెవి కఱ్ఱగా ఉండి, ఫరోయొక్క సంస్థానములోని మంత్రజ్ఞులు తమ మంత్ర ప్రభావముతో సృష్టించిన సర్పములను అహరోను చేతి కర్ర మ్రింగివేసి దేవుని మహిమపరచినట్లుగా చదువగలము. ఈ అహరోను కర్రయే చిగిరించినట్లుగా సంఖ్యాకాండము 17:8-10లో చదువగలము.
ఈ అహరోను కఱ్ఱ యొక్క చిగురే యేసు ప్రభువు పుట్టుక యొక్క జన్మ రహస్యము. కాబట్టి యెషయా మొద్దు చిగిరించిందని, అటుతరువాత ఆ చిగురే ప్రకటన 5:5లో దావీదు చిగురుగా వర్ణించబడెను. ఈ విధముగా ఆయా సందర్భాలనుబట్టి పూర్వార్థముల ననుసరించి, అంచెలవారీగా చిగురించిన చిగురే దావీదుకు తాళపుచెవి అనగా యేసు నామము. ఈ యేసు నామము అను తాళపుచెవి ప్రభావ మూలమున అపొస్తలుల కార్యములు 3:లో పేతురు యోహానులు చీలమండలరోగిని పాదములోని చీలమండల బంధమునుండి విడిపించి నడిపించుటన్నది మనము చదువగలము. కనుక దావీదు తాళపుచెవి యేసుక్రీస్తు నామము. దావీదుకు ఆ తాళపుచెవి అనుగ్రహించింది సృష్టికర్తయైన యెహోవా దేవుడు. అయితే దావీదు మరణానంతరము ఆ తాళపుచెవి అనగా యేసుక్రీస్తు అను నామము దావీదు కుమారుడైన యేసు ప్రభువునకు స్వాస్థ్యమై నట్లును ఆ స్వాస్థ్యపు హక్కును యేసు ప్రభువు తన ప్రధమ అపొస్తలుడైన పేతురు కిచ్చినట్లును, ఆ తాళము ప్రభావ మూలమున అనగా యేసు నామమున ఆ తాళము అనేక రోగులను స్వస్థపరచి మరణించినవారిని సైతము లేపినట్లును వేదములో చదువ గలము. మత్తయి 16:19, ''పరలోకరాజ్యముయొక్క తాళపుచెవులు నీ కిచ్చెదను, నీవు భూలోకమందు దేని బంధించుదువో అది పరలోక మందును బంధింపబడును, భూలోక మందు దేని విప్పుదువో అది పరలోకమందును విప్పబడునని అతనితో చెప్పెను.''
ఈ తాళపుచెవి అను తన జీవవాక్కుల ప్రభావము వల్లనే యేసు ప్రభువు మరణించి మూడు దినములై దుర్గంధపు వాసనతో నున్న లాజరును సజీవముగా లేపినాడు. కొలొస్స 2:9, ''ఏలయనగా దేవత్వముయొక్క సర్వపరిపూర్ణత శరీరముగా క్రీస్తునందు నివసించుచున్నది;'' ఎంతోమందికి ఎన్నో విధాలైన మహాభాగ్యాలను ఆశ్చర్యకరముగా చేయగలిగినాడు. కనుక ఈ పుస్తకమును చదువుచున్న మీరు దావీదు తాళపుచెవిని సంపాదించాలంటే ఇది బజారులో దొరికేది కాదు. ఒక విధముగా దీనిని వారసత్వపు హక్కుగా కూడ మనము భావించవలసియున్నది. ఇట్టి వారసత్వపు హక్కును మనము పొందాలంటే క్రీస్తు నామాన్ని ధరించియుండాలి. యేసుయొక్క సన్నిధిలోనే ఈ తాళపుచెవి యొక్క సంపాదిత రహస్యమిమిడియున్నది. దావీదు పొందిన తాళపుచెవి యేసునకు సంక్రమించింది. అదే విధముగా యేసుయొక్క తాళపుచెవి పేతురునకు ఇవ్వబడింది. తుదిమట్టుకు విశ్వాసముతో మనము ప్రభువుయొక్క నామమును మహిమపరచువారముగా ఉండి, ద్రాక్షావళ్ళియైన యేసు ప్రభువులో అంటుగట్టబడి జీవిస్తే ఈ తాళపుచెవిని మనము కూడ పొందగలము. భూలోకములో మనము దేనినైతే బంధిస్తామో పరలోకములో కూడ అది బంధింపబడి ఉంటుంది. భూలోకములో దేనినైతే మనము తెరచెదమో అది పరలోకము లో కూడ తెరవబడుతుంది. దీనికి ఋజువు :- అపొస్తలుల కార్యములు 16:23-27, ''వారు చాల దెబ్బలు కొట్టి వారిని చెరసాలలోవేసి భద్రముగా కనిపెట్టవలెనని చెరసాల నాయకుని కాజ్ఞాపించిరి. అతడు అట్టి ఆజ్ఞనుపొంది, వారిని లోపలి చెరసాలలోనికి త్రోసి, వారి కాళ్లకు బొండవేసి బిగించెను. అయితే మధ్యరాత్రివేళ పౌలును సీలయు దేవునికి ప్రార్థించుచు కీర్తనలు పాడుచునుండిరి; ఖయిదీలు వినుచుండిరి. అప్పుడు అకస్మాత్తుగా మహాభూకంపము కలిగెను, చెరసాల పునాదులు అదరెను, వెంటనే తలుపు లన్నియు తెరచుకొనెను, అందరి బంధకములు ఊడెను. అంతలో చెరసాల నాయకుడు మేలుకొని, చెరసాల తలుపులన్నియు తెరచియుండుట చూచి, ఖయిదీలు పారిపోయి రనుకొని, కత్తిదూసి, తన్ను తాను చంపుకొనబోయెను.'' దావీదు తాళపుచెవియైన యేసునామముయొక్క ప్రభావము ఈ సంఘటనలో మనకు ఋజువగుచున్నది.
కనుక ఎవడు తీయలేని భూలోక సంబంధమైన రాజాజ్ఞ రాజముద్రికతో ముద్రించిన చెరసాల గదులనే ఈ తాళపుచెవి తెరచుచున్నది, బంధకాలను ఊడబెరుకుచున్నది, చెరసాలయొక్క పునాదులదిరించుచున్నది. ఇవన్నియు యేసు తన శిష్యకోటి కిచ్చిన రక్షణ. ఇవి మొట్టమొదటగా దేవుడు మోషేకు తరువాత దావీదు కనుగ్రహించినాడు. అటుతరువాత యేసు తన శిష్యకోటికి అనుగ్రహించినారు. వారికి పరిశుద్ధాత్మ దేవుడు అనుగ్రహించిన వరము ద్వారా వారు రచించిన సువార్తలు మూలముగా వారు జేసిన అద్భుత కార్యాలు పరిచర్య మరియు వారు పడిన శ్రమల ద్వారా నేడు ప్రపంచమంతయు ఏడు ఖండాలలో ఈ తాళపుచెవియొక్క ప్రభావము అనేకులను ఆకర్షించి అనేకుల మధ్య క్రియ జరిగిస్తున్నది. దావీదు తాళపుచెవి మన మధ్యలో సువార్త రూపమున క్రీస్తు ద్వారా అపొస్తలుల మూలముగా క్రియ జరిగిస్తున్నది. లోకములో అందరికిని కైవసమగునట్లుగా ఈ తాళపుచెవి అందరికి అందుబాటులో ఉన్నది. కాని దీనిని పొందగలిగిన వారెవరు? అన్నదే నేటి క్రైస్తవ్యములో ఏర్పడియున్న సమస్య.
దేవుడు తన తాళపుచెవిని మోషేకిచ్చి ఐగుప్తు దాస్యములో బందీలై ఐగుప్తు చెరలో పడరాని పాట్లు పడి శ్రమలనుభవించిన తన జనాంగమునకు విడుదల కలిగించి నాడు. అటుతరువాత సాతాను సమాజమైన ఫిలిష్తీయుల వల్ల కలిగిన శ్రమలు వారిద్వారా సంక్రమించిన యుద్ధాలలో దైవజనాంగమైన ఇశ్రాయేలు రక్షణ పొందుటకు దావీదునకు తన రక్షణాయుతమైన తాళపుచెవిని దేవుడనుగ్రహించి ఎన్నో విజయాలు కలిగించాడు. అటుతరువాత దైవకుమారుడైన యేసు ప్రభువునకు ఈ తాళపుచెవి అనుగ్రహించబడినట్లు ఎరికో ద్వారముదగ్గర గుడ్డివాడు, ''దావీదు కుమారుడా, నన్ను కరుణించుము,'' అనగా అంధత్వము అను చెరలోనున్న నాకు విడుదల కలిగించుమని అభ్యర్థించినాడు. అనగా గుడ్డివాడు యేసు దగ్గర దావీదు తాళపుచెవి యున్నదని గ్రహించాడు. తద్వారా ఆ అంధత్వము నుండి విడుదల పొందినాడని మత్తయి 9:27 మరియు మార్కు 10:47-48లో చదువగలము. అటుతరువాత ఈ దావీదు తాళపుచెవి ప్రభావమున యేసు ప్రభువు మరణాన్ని జయించి సమాధిని తెరచి సజీవుడుగా తన్నుతాను కనబరచుకున్నాడు. అదే తాళపుచెవి ప్రభావ మూలమున యేసు ప్రభువుయొక్క శిష్యులు అపొస్తలులుగా మారి తమ జీవితాలను ధన్యవంతము చేసుకున్నారు. దావీదు తాళపుచెవికి మూలపురుషుడైన ప్రభువుయొక్క చరిత్రకు సత్యసాక్షులుగా తీర్చబడినారు.
దావీదు తాళపుచెవి యేసు నామమే! ప్రకటన 1:18, ''నేను మొదటివాడను కడపటివాడను జీవించువాడను; మృతుడనైతిని గాని ఇదిగో యుగయుగములు సజీవుడనై యున్నాను. మరియు మరణముయొక్కయు పాతాళ లోకము యొక్కయు తాళపుచెవులు నా స్వాధీనములోఉన్నవి,'' అని ప్రభువు అంటున్నాడు.
ఈ మర్మాన్ని యేసు ప్రభువు ప్రత్యక్షముగా ప్రయోగాత్మకముగా తన శరీరముపౖౖె ఋజువుపరచినట్లు ఆయన మరణపునరుత్థాన క్రియలు బయల్పరచుచున్నవి. మరణ తాళపుచెవి ద్వారా తాను మరణించినట్లు కనబడి, మరణించినాడు కూడ. లోకముకూడ ఆయనను మరణించినట్లే భావించి బహు భద్రముగా గట్టి బందోబస్తు రాజముద్రికలతో కూడిన సీలువేసి, రాతి సమాధిలో ఆయన దేహమును బంధించారు. అయితే పాతాళము యొక్క తాళముచెవి ద్వారా ఆయన మృతుల లోకములో సంచరించి, మూడవనాడు సమాధిని తెరచుకొని పాతాళముయొక్క అగాధములను తెరచి, మరణానికి అపజయము సమాధికి ఓటమి గలిగించెను. కనుక యేసు ప్రభువుయొక్క మరణ పునరుత్థాన క్రియ - పరలోక తాళపుచెవి యేసే అనుటకు ఋజువైయున్నది.
దేవునికి ప్రీతికరమైన యోగ్యకరమైన నమ్మకమైన వినయవిధేయతతో కూడిన జీవితము జీవిస్తే ఆ తాళపుచెవులు మనము కూడ పొందగలము. ''నేను జేయుచున్న క్రియలు నా యందు విశ్వాసముంచువాడు జేయును.'' ''నా యందు విశ్వాసముంచు వాడెన్నటికిని చనిపోడు.'' ''మరియు నా యందు విశ్వాసముంచువాడు మరణములోనుండి జీవములోనికి దాటియున్నాడు.'' ''ఎవడు నా యందుండునో - ఎవనియందు నేనుందునో వాడు బహుగా ఫలించును.'' ''నేను లోకమును జయించియున్న ప్రకారము మీరును లోకమును జయించియున్నారు.'' పై వేదవాక్కులు యేసు ప్రభువు తన విశ్వాసులకు అనుగ్రహించిన తాళపుచెవులని మనము గ్రహించవలసియున్నది. 1. ప్రేమ 2. సంతోషము 3. సమాధానము 4. దీర్ఘశాంతము 5. దయాళుత్వము 6. మంచితనము 7. విశ్వాసము 8. సాత్వికము 9. ఆశానిగ్రహము,'' అనుటలో ఇవి అన్ని కూడ తాళపు చెవులే. గలతీ 5:22లో ప్రభువు చెప్పిన రీతిగా ప్రతి విశ్వాసికి ఈ తొమ్మిది తాళపుచెవులు కలిగి ఉంటేనే దేవుని ఇంటికి వారసుడుగాను సాతాను చెరకు అందనివాడును, సాతానుడు బంధించుటకు వీలులేనివాడును, విశ్వాసులకు ఆదర్శుడు గాను, అన్యుల ఆత్మలను తన తాళములతో తెరచి ప్రభువు రాజ్యమునకు సమీపస్థులుగా జేయుటకు శక్తిమంతుడు కాగలడని ఇందుమూలముగా మనము గ్రహించవలసియున్నది. ప్రకటన 11:3-4, ''నేను నా యిద్దరు సాక్షులకు అధికారము ఇచ్చెదను; వారు గోనెపట్ట ధరించుకొని వెయ్యిన్ని రెండువందల అరువది దినములు ప్రవచింతురు. వీరు భూలోకమునకు ప్రభువైన వాని యెదుట నిలుచుచున్న రెండు ఒలీవచెట్లును దీపస్తంభములునై యున్నారు.''
ప్రకటన 3:12, ''జయించు వానిని నా దేవుని ఆలయములో ఒక స్తంభముగా చేసెదను; అందులోనుండి వాడు ఇకమీదట ఎన్నటికిని వెలుపలికిపోడు.''
ఇందులో మొదటగా జయించువాడు అనుటలో జయించువాడు ఎవరు? ఎవరిని జయించుచున్నాడు? ఎఫెసీ 6:12, ''ఏలయనగా మనము పోరాడునది శరీరులతోకాదు, గాని ప్రధానులతోను, అధికారులతోను, ప్రస్తుత అంధకారసంబంధులగు లోక నాథుల తోను, ఆకాశమండల మందున్న దురాత్మల సమూహములతోను పోరాడుచున్నాము.'' ఇందునుబట్టి ప్రభువు కూడ తన బోధలో నేను లోకమును జయించియున్న ప్రకారము మీరును లోకమును జయించియున్నారు అని చెప్పుచున్నారు. ఈ విధముగా జయించిన వాడు తన విజయ పతాకాన్ని తన బిరుదును యేసు నామములో పొందియుండాలి. క్రీస్తును ధరించియున్నవానిగాను క్రీస్తులో ఉన్నవాడుగాను ఉంటేనే తప్ప, దృశ్యమైన వాటిని అదృశ్యములోని వాటిని జయించుట అసాధ్యము.
ఈ విధముగా, ''జయించు వానిని నా దేవుని ఆలయములో ఒక స్తంభముగా జేసెదను,'' అని అనుటలో దేవుని ఆలయమనగా క్రీస్తు దేహమైన సంఘము. ఎఫెసీ 5:22, ''క్రీస్తు సంఘమునకు శిరస్సు.'' అట్టి సంఘములో జయించు వానిని బరువు బాధ్యతలతో కూడిన నిర్వాహకునిగా నియమించబడును. ''అందులోనుండి వాడు ఇక మీదట ఎన్నటికిని వెలుపలికిపోడు,'' అనుటలో మరల అన్య మార్గములోను అన్యుల విగ్రహారాధనలతోను అన్యుల ఆచారములోను, లోకసంబంధమైన మర్యాదలలోను పాలి భాగస్థుడు కానేరడు. ప్రకటన 11:3-4, ''నేను నా ఇద్దరు సాక్షులకు అధికారము ఇచ్చెదను; వారు గోనెపట్ట ధరించుకొని వెయ్యిన్ని రెండు వందల అరువది దినములు ప్రవచింతురు. వీరు భూలోకమునకు ప్రభువైన వానియెదుట నిలుచుచున్న రెండు ఒలీవ చెట్లును దీపస్తంభములునై యున్నారు.'' ఇక్కడ ద్వీప స్తంభములు అని వ్రాయబడియున్నది. ఎవరినిగూర్చి వ్రాయబడియున్నది? ఇద్దరు సాక్షులుగూర్చి. వీరినిగూర్చి పదకొండవ అధ్యాయములో సంపూర్ణముగా తెలుసుకొందము. ఇక్కడ ఈ ఇద్దరు సాక్షులను దీప స్తంభములుగా చెప్పబడినది. అంతేకాదు రెండు ఒలీవచెట్లుతో పోల్చబడ్డారు. వీరు పాత నిబంధన కాలములోనివారు. వీరు దేవుని బిడ్డలు అని మరల చెప్ప నక్కరలేదు. వీరు జయించినవారు. వీరు ప్రభువు ఎదుట రెండు ఒలీవచెట్లుగాను దీప స్తంభములుగాను ఉన్నారు. ప్రకటన 1:20, ''ఆ యేడు దీపస్తంభములు ఏడు సంఘములు.'' ఇక్కడ సంఘములను దీపస్తంభములకు పోల్చి చెప్పుచున్నాడు. మరి మన మూలవాక్యములో జయించిన మనలను స్తంభములుగా చేస్తానని వాగ్దానమిచ్చి యున్నారు. దీపము అనగా వెలుగుకు సూచన. ఈ వెలుగు క్రీస్తుకు ప్రతిరూపము. దీనినే సువార్త అని కూడ అన వచ్చును. ఈ సువార్త అను దీపమును కలిగియున్న ఇద్దరుసాక్షులు 1260 దినములు ప్రవచిస్తున్నారు. అనగా సువార్త అను దీపపు వెలుగు ఇద్దరు సాక్షులద్వారా ఎత్తి చూపబడు చున్నది. కనుక వీరు స్తంభములతో పోల్చబడ్డారు. అదే విధముగా ఏడు సంఘములు ఏడు దీపస్తంభములుగా పోల్చారు. దీనికి కారణము కూడా ఒక్కటే. సంఘము సువార్తకు ప్రతిరూపము. ఈ ఆత్మీయ ఏడు సంఘముల ద్వారా సువార్త అను దీపము ప్రజ్వరిల్లి అనేక హృదయములను వెలిగించుచున్నవి. కనుక ఈ సంఘములు సువార్త అను దీపమునకు ఆధారమై యున్నవి. కనుక వీటిని దీపస్తంభములు అని చెప్పబడినది.
ప్రకటన 22:17, ''ఆత్మయు పెండ్లి కుమార్తెయు రమ్ము అని చెప్పుచున్నారు; వినువాడును రమ్ము అని చెప్పవలెను; దప్పిగొనిన వానిని రానిమ్ము; ఇచ్ఛయించువానిని జీవజలమును ఉచితముగా పుచ్చుకొననిమ్ము.'' ఇందులో చెప్పబడిన పెండ్లి కుమార్తె పరిశుద్ధ సంఘము. ఈమె పరమ యెరూషలేముగా ప్రకటన 21:2 మరియు 21:9 --10లో చెప్పబడియున్నది. ఇక్కడ ఈమె రమ్ము అని చెప్పుచున్నది. అనగా సువార్తను తన ద్వారా బోధించు చున్నదని అర్థమగుచున్నది. అందుకే ఎవరైతే ఆత్మీయ దప్పికను కలిగియుంటారో వారు వచ్చునప్పుడు జీవజలము అను వాక్యమును ఉచితముగా ఇవ్వవలసి యుంటుంది. ఈ విధముగా సువార్తను వెదజల్లు వారిని స్తంభముగా అభివర్ణించి లేఖలో క్రీస్తు ప్రభువు వ్రాయించారు. కనుక మన మూలవాక్యములో జయించువానిని ఒక స్తంభముగా చేస్తానని వాగ్దానమిచ్చియున్నారు. కనుక సువార్త అను దీపమునకు ఆధారమైనవారుగా మిమ్మల్ని అనగా జయించినవారిని గుర్తిస్తానని చెప్పబడియున్నది.
ప్రకటన 3:12, ''మరియు నా దేవుని పేరును, పరలోకములో నా దేవుని యొద్దనుండి దిగి వచ్చుచున్న నూతనమైన యెరూషలేమను నా దేవుని పట్టణపు పేరును, నా క్రొత్త పేరును వానిమీద వ్రాసెదను.''
''నా దేవుని పేరును,'' అనుటలో మన దేవుడెవరు? యెహోవా. అనగా ఉన్న వాడు. క్రీస్తు తన తండ్రిని తన దేవుడుగా ఇక్కడ చెప్పుచున్నాడు. అనగా తన్నుతాను తగ్గించుకొని తన తండ్రిని హెచ్చించుచున్నాడు. ''పరలోకములో నా దేవుని యొద్దనుండి దిగి వచ్చుచున్న నూతనమైన యెరూషలేమను నా దేవుని పట్టణపు పేరును,'' అనుటలో ప్రకటన 21:10, ''ఆత్మవశుడనైయున్న నన్ను యెత్తయిన గొప్ప పర్వతముమీదికి కొనిపోయి, యెరూషలేము అను పరిశుద్ధ పట్టణము దేవుని మహిమగలదై పరలోకమందున్న దేవుని యొద్దనుండి దిగివచ్చుట నాకు చూపెను.'' ఈ పట్టణమే ఒకప్పుడు భూలోక యెరూషలేము. ఈ పట్టణము దైవచిత్తానుసారముగా దైవనిర్ణయానుసారముగా, దైవిక నమూనానుబట్టి దైవిక ఏర్పాటునుబట్టి పాతనిబంధన వేదములో దావీదు కుమారుడైన సొలొమోను చేత కట్టబడి గొప్ప ఖ్యాతిని పొంది, ప్రపంచ చరిత్రలో అగ్రస్థానము వహించిన పట్టణముగాను, చరిత్రాత్మక స్థలముగా పేరుప్రఖ్యాతులు పొందినది. కాని దైవజనాంగముయొక్క అవిధేయత అజ్ఞానము వల్లను దైవత్వముపై జేసిన తిరుగుబాటు వల్లను ఈ పట్టణము శత్రువుల చేత ముట్టడింపబడి శిధిలమైనను నెహెమ్యాయొక్క ప్రార్థనా ప్రభావమున మరల కట్టబడినది. అటుతరువాత కూడ ఈ పట్టణము దైవవ్యతిరేకుల చేత శిధిలమైనట్లు బైబిలు చరిత్రలోనే కాకుండ ప్రపంచ చరిత్రలోకూడ విరచితమైయున్నది. అయితే యేసు ప్రభువు ఈ లోకములో యెరూషలేములో దావీదుపురములో జీవించినప్పుడు తన 12 యేండ్ల ప్రాయము నుండి ఈ ఆలయములో తరచుగ వస్తూ అనేకులకు దైవిక బోధలు జేసినట్లు బైబిలులో చదువ గలము. లూకా 2:47, ''ఆయన మాటలు వినినవారందరు ఆయన ప్రజ్ఞకును ప్రత్యుత్తరము లకును విస్మయమొందరి.''
ఈ భూలోక యెరూషలేములో విస్తరించియున్న పాపము దోషాపరాధము అవినీతిని బట్టి యేసు ప్రభువు దీన్నిగూర్చి అంగలార్చుచు, మత్తయి 23:37-38, ''యెరూషలేమా, యెరూషలేమా, ప్రవక్తలను చంపుచును నీయొద్దకు పంపబడినవారిని రాళ్లతో కొట్టుచును ఉండుదానా, కోడి తన పిల్లలను రెక్కల క్రింది కేేలాగు చేర్చుకొనునో ఆలాగే నేనును నీ పిల్లలను ఎన్నోమారులు చేర్చు కొనవలెనని యుంటినిగాని మీరు ఒల్లకపోతిరి. ఇదిగో మీ యిల్లు మీకు విడువబడియున్నది.'' అనంతరము యేసు ప్రభువు చెప్పిన రీతిగానే యెరూషలేము శత్రురాజుల వశమై అందులోని యూదా జనాంగమంతయు అన్యరాజులకు బందీలుగాను బానిసలుగా ఉండి, జర్మనీ నియంతయైన హిట్లర్ వంటి వారి చేత కఠినముగా శిక్షించబడి, యూదయా జాతి అన్నదే సమూలముగా నిర్మూలము కావాలనే నిర్ణయానికి దిగజారినట్లు యూదుల చరిత్ర తెలుపుచున్నది. ఇశ్రాయేలుకు పాదము మోపు స్థలము కూడ లేకుండ హీనస్థితి ఏర్పడింది. ఈ విధముగా రెండవ ప్రపంచ యుద్ధము వరకును ఇశ్రాయేలీయులు బానిసలుగా విదేశాలలో తలదాచుకొన్నారు. అంత్య దినాలు కాబట్టి మానవుని జ్ఞానము పెరిగింది కాబట్టి క్రీస్తు ప్రభువు యూదులకు మరియొక అవకాశము ఇస్తున్నాడు. అందులో భాగముగ యూదులు మరల స్వతంత్రముగా రాజ్యపాలన చేస్తున్నారు.
ఇంతకి ఈ అవకాశమును యూదులు ఉపయోగించుకొని దైవమార్గములో మారుతారా? ఇది చాలా క్లిష్టమైన సమస్యే, ఎందుకంటే ఈకాలమున కొందరు మారుటకు అవకాశము ఉన్నది. ప్రకటన 6:11, ''తెల్లని వస్త్రము వారిలో ప్రతివాని కియ్యబడెను; మరియు - వారివలెనే చంపబడబోవువారి సహదాసులయొక్కయు సహోదరుల యొక్కయు లెక్క పూర్తియగువరకు ఇంక కొంచెము కాలము విశ్రమింపవలెనని వారితో చెప్పబడెను,'' అని వ్రాయబడిన ప్రకారము వీరితో కూడ చంపబడవలెనని నిర్ణయింపబడిన వారి లెక్క పూర్తి అవ్వాలి. కనుక యూదులలో కొందరు దైవజనులు ఉన్నట్లుగా తెలియు చున్నది. అయితే యుగాంతానికి ముందు వీరి పరిస్థితి ఎలా ఉంటుందో తెలుసుకొందము. ప్రకటన 11:7-10, ''వారు సాక్ష్యము చెప్పుట ముగింపగానే అగాధములోనుండి వచ్చు క్రూరమృగము వారితో యుద్ధముచేసి జయించి వారిని చంపును. వారి శవములు ఆ మహాపట్టణపు సంతవీధిలో పడియుండును; వానికి ఉపమానరూపముగా సొదొమ అనియు ఐగుప్తు అనియు పేరు; అచ్చట వారి ప్రభువుకూడ సిలువవేయబడెను. మరియు ప్రజలకును, వంశములకును, ఆ యా భాషలు మాటలాడువారికిని, జనములకును సంబంధించినవారు మూడు దినములన్నర వారి శవములను చూచుచు వారి శవములను సమాధిలో పెట్టనియ్యరు. ఈ యిద్దరు ప్రవక్తలు భూనివాసులను బాధించినందున భూని వాసులు వారి గతి చూచి సంతోషించుచు, ఉత్సహించుచు, ఒకనికొకడు కట్నములు పంపుకొందురు.'' కనుక ఈ శవములు పడియున్న ప్రాంతము యెరూషలేమే! దానిలోని భూజనుల పరిస్థితి తెలుసుకొన్నాము కదా! ఇది భూలోక యెరూషలేము చరిత్ర. అయితే ఈ విధముగ పాడైన యెరూషలేము అను పట్టణముయొక్క నామము భూ సంబంధముగా కాక క్రీస్తు రక్తము ద్వారా కడుగబడి భక్తుల మూలముగా ఏర్పడిన సంఘమే ఈ పరమ యెరూషలేము. క్రీస్తుయొక్క మరణానికి సాక్షులుగాను క్రీస్తుతో కూడ పరిచర్యలో పాలి భాగస్థులై, ఆయనను గురువుగా ఉంచుకొని శిష్యరికము చేసిన శిష్యులు అపొస్తలులైనవారు - వారి లేఖనముల ద్వారా ఆయన నామమును ధరించి, ఆయనలో నిద్రించి ప్రకటన 14:13లో వలె ప్రభువునందు మృతులైన మృతులుగా ధన్యతను పొంది, వారు తమ ప్రయాసములు మాని దేవునియొద్దనుండి దిగి వచ్చు యెరూషలేము అను దేవుని పరిశుద్ధ పట్టణముగా వచ్చుచున్నారు. ''దేవుని పరిశుద్ధ పట్టణపు పేరును,'' అనుటలో పాత యెరూషలేము ఒకటున్నదని అది భూలోక సంబంధమైనదని, దైవనిర్ణయానుసారముగా భూలోకములో అది కట్టబడినను దేవునికి ఒప్పిదముగాను విధేయతగాను ఉండనందున, దైవస్వరూపియైన యేసు ప్రభువు యొక్క జనన మర్మము నెరుగని స్థితిలో ఉండి, అంధకార సంబంధ శక్తుల చేతను, లోక సంబంధుల చేతను ఈ పట్టణము ఈ లోకములో పరిపాలించబడింది. ఇది దేవునికిని, క్రీస్తునకును, పరిశుద్ధాత్మ దేవునికిని విరుద్ధముగా ప్రవర్తించుటయేగాక దైవకుమారుడైన క్రీస్తును ఘోరముగా శిక్షించి చంపించినది.
ఆయన శిష్యులైన అపొస్తలులను కూడ చిత్రహింసలు పాల్జేసి మరణశిక్ష విధింపజేయుటయు, అపొస్తలుల విరచితములైన లేఖనములకు సాక్షులుగ తమ్ముతాము సమర్పించుకొన్న విశ్వాసులను రాళ్ళతో కొట్టి చంపుటయు, కత్తితో నరకుటయు, జంతువుల చేత పొడిపించి చంపుటయు, పచ్చి ఎద్దు చర్మముతో చుట్టి ఎండలో పడవేసి ఆ చర్మము యొక్క బిగువుతో వారికి మరణశిక్షను అమలు జరుపుటయు, అగ్నిలో పడవేయుట, చెరసాలలో వేసి కొరడాలతో కొట్టుట, మొదలైన శిక్షలను అనుభవింపజేసింది. స్త్రీ పురుష అను వివక్షత లేక ప్రతి యొక్కరికిని పై వివరించిన మరణశిక్షలనమలుపరచి చంపించిరి. క్రైస్తవ సాహిత్యమును దేవునివాక్యము అను సువార్తను ప్రకటించుటకును, తుదకు ప్రార్థనలు జేసుకొనుటకు కూడ వీలులేని చట్టాలు అమలుపరచి, ప్రవక్తలు మొదలుకొని బోధకుల వరకును వారి పట్ల జరిగించిన దుష్కార్యములనుబట్టి, భూలోక యెరూషలేము శత్రురాజుల చేత ముట్టడించబడి శిధిలమై లోకము చేత విడువబడిన స్థితికి దిగజారింది. ఇది భూలోక యెరూషలేముయొక్క చరిత్ర.
దైవచిత్తములో యెరూషలేముకొక ప్రత్యేకమైన స్థానమున్నట్లు మన మూల వాక్యములో వివరించబడియున్నది. ఒకవేళ భూలోక యెరూషలేము పాడైపోయినను, ఇది జరిగించిన దైవవ్యతిరేక హేయక్రియలకు బలియైన ప్రవక్తలు, న్యాయాధిపతులు, అపొస్తలులు, ప్రధాన యాజకుడైన క్రీస్తు, హతసాక్షులు, వేదసాక్షులైన వగైరాల ఆత్మల జన్మ దీనిలో జరిగింది. ఈ కారణము చేత వీరి సేవల వలన లేక వీరు రచించిన సువార్తల మూలముగా మారుమనస్సు పొంది ప్రార్థనాపరులై, వాక్యములోని పరమార్థము తెలుసు కొనిన నేటి తరమువారైన మనము క్రీస్తునందు విశ్వాసము ద్వారా లోకమును జయించినట్లయితే, మన ఆత్మలు దైవమహిమను పొంది సమూహముగా మారి పరమ యెరూషలేముగా పరలోకము నుండి ప్రభువుతో కూడ దిగివచ్చును. 1 థెెస్సలొనీక 4:16, ''ఆర్భాటముతోను, ప్రధానదూతశబ్దముతోను, దేవుని బూరతోను పరలోకమునుండి ప్రభువు దిగివచ్చును;'' ఇట్లు దిగి వచ్చునప్పుడు, 1 థెెస్సలొనీక 4:14, ''యేసు మృతి పొంది తిరిగి లేచెనని మనము నమ్మినయెడల, అదే ప్రకారము యేసునందు నిద్రించిన వారిని దేవుడాయనతో కూడవెంటబెట్టుకొని వచ్చును.''
ఈ విధముగా దేవునితో కూడ వచ్చు సంఘమే - పరమయెరూషలేము అను పరిశుద్ధ పట్టణము. ''కాబట్టి మీరు ఈ మాటలచేత ఒకనినొకడు ఆదరించుకొనుడి,'' అని పౌలు 1థెెస్సలొనీక 4:18లో చెప్పుచున్నాడు. జ్ఞానమందును భక్తియందును జాగ్రత్త కలిగి ఓర్పు గలిగినవారమై, మధ్యాకాశమునకు దిగివచ్చు ఆ పరలోక పరిశుద్ధ పట్టణమైన యెరూషలేముయొక్క ఆగమనమునకు నిరీక్షించవలసినవారమైయున్నాము. 2 కొరింథీ 5:10, ''ఎందుకనగా తాను జరిగించిన క్రియలచొప్పున, అవి మంచివైనను సరే చెడ్డవైనను సరే, దేహముతో జరిగించిన వాటి ఫలమును ప్రతి వాడును పొందునట్లు మనమందరమును క్రీస్తు న్యాయపీఠము ఎదుట ప్రత్యక్షము కావలయును.'' కనుక క్రీస్తు న్యాయపీఠము ముందు ప్రత్యక్షమైనవారిలో నీతిక్రియలు కలిగినవారు పరమ యెరూషలేమునకు చెందినవారు. హెబ్రీ 11:16, ''అయితే వారు మరి శ్రేష్ఠమైన దేశమును, అనగా పరలోక సంబంధమైన దేశమును కోరుచున్నారు. అందుచేత తాను వారి దేవుడనని అనిపించు కొనుటకు దేవుడు వారినిగూర్చి సిగ్గుపడడు; ఏలయనగా ఆయన వారికొరకు ఒక పట్టణము సిద్ధపరచి యున్నాడు.'' ఇదియే ఆ పరమ యెరూషలేము. కయీను దోషియై తన దోషాపరాధమునుగూర్చి పశ్చాత్తాప్తుడైనప్పుడు వానిని కనికరించి వాని వీపున ఒక గుర్తు వేశాడు. అతనిని ఎవరైన కనుగొని చంపుటకు వీలు లేకుండ ఆ గుర్తు వేయబడింది. అదే విధముగా నా క్రొత్త పేరును అనగా గొర్రెపిల్లయైన క్రీస్తు నామము.
ప్రకటన 14:1, ''మరియు నేను చూడగా, ఇదిగో, ఆ గొఱ్ఱెపిల్ల సీయోను పర్వతముమీద నిలువబడి యుండెను. ఆయన నామమును ఆయన తండ్రి నామమును నొసళ్లయందు లిఖింపబడి యున్న నూట నలువది నాలుగు వేలమంది ఆయనతో కూడ ఉండిరి,'' అనుటలో వీరందరు ఆయన క్రొత్త పేరును వ్రాయించుకొనుటకు అర్హులైనట్లు తెలియుచున్నది. దేవుని పేరు, ఆయన యొద్దనుండి దిగివచ్చు యెరూషలేము అను పరిశుద్ధ పట్టణపు పేరు ప్రభువును విశ్వసించి గొఱ్ఱెపిల్ల రక్తముతో కడగబడి పరిశుద్ధ జీవితము జీవించి సీయోను రాజు మరియు యెరూషలేముకు భర్తయైన యేసు ప్రభువుయొక్క పేరు మనకు ఉన్నట్లయితే, నిజ క్రైస్తవులుగాను ఆయన సత్యమార్గములో నడుచువారముగ ఆయన రాజ్య వారసత్వమునకు వారసులుగాను ఉండగలమనుటకెట్టి సందేహము లేదు. రోగము, మరణము, ఆకలి, దప్పిక, లోకచింతనలు లేని నిశ్చింత నిర్భయ జీవితము ఇట్టివారికి లభించునని వేదవాక్య వివరణ.
ప్రకటన 1:20 ప్రకారము లవొదికయలో ఉన్న సంఘపు దూత కూడ క్రీస్తు చేతిలో ఉన్న ఒక నక్షత్రము.
ప్రకటన 3:14, ''ఆమేన్ అనువాడును నమ్మకమైన సత్యసాక్షియు దేవుని సృష్టికి ఆదియునైనవాడు,'' ఈ లేఖ వ్రాస్తున్నాడు. ఆమేన్ అనువాడు, నమ్మకమైన సత్యసాక్షి మరియు దేవుని సృష్టికి ఆదియునైనవాడు క్రీస్తే. దీనినిగూర్చి తరువాత (60) (|||) అను ప్రత్యేక విభాగములో తెలుసుకొందము. మరి ఈ లేఖలో క్రీస్తు ప్రభువు ఏమి చెప్పుచున్నాడో తెలుసుకొందము.
''నీ క్రియలను నేనెరుగుదును, నీవు చల్లగానైనను వెచ్చగానైనను లేవు; నీవు చల్లగానైనను వెచ్చగానైనను ఉండిన మేలు. నీవు వెచ్చగానైనను చల్లగానైనను ఉండక, నులివెచ్చనగా ఉన్నావు గనుక నేను నిన్ను నా నోటనుండి ఉమ్మివేయ నుద్దేశించు చున్నాను,'' అని వేదములో వ్రాయబడిన ప్రకారము పాపిగానైనను ఉండవచ్చును లేక నీతిమంతుడుగానైనను ఉండవచ్చును, అపరిశుద్ధుడుగ ఉండవచ్చును లేక పరిశుద్ధుడుగ ఉండవచ్చును. నీవు చల్లగానైనను ఉండుట మేలు అనగా పాపిగానైనను లేదా అపరిశుద్ధుడు గానైనను ఉండవచ్చును. వెచ్చగానైనను అనగా పరిశుద్ధుడుగా నీతిమంతుడుగాను ఉండాలి. ''నీవు వెచ్చగానైనను చల్లగానైనను ఉండక, నులివెచ్చనగా ఉన్నావు,'' అనుటలో ఇది నామ క్రైస్తవ జీవితము. పేరుకు క్రైస్తవులు కాని క్రైస్తవ్యము లేదు. క్రైస్తవుడను పేరు మాత్రమే ఉన్నదిగాని క్రీస్తులో లేడు. అతనిలో క్రీస్తు లేడు. క్రైస్తవుడను పేరు మాత్రమే ఉందిగాని క్రైస్తవుడుగా చెప్పుకొనే ధైర్యము అతనిలో లేదు.
అందుకే నీవు వెచ్చగానైనను ఉండు లేదా చల్లగానైనను ఉండుట మేలని దైవవాక్యము ప్రవచించుటలో - నరుని జీవితము వేషధారణతో కూడిన క్రైస్తవ జీవితము. అనగా అన్యుల ఆచారాలు, హోదాలు, పదవీవ్యామోహము, వగైరా చల్లని గుణాలున్నప్పటి కిని, ప్రజాబాహుళ్యములో తాను గొప్ప విశ్వాసియని పరిశుద్ధుడని వెచ్చని గుణాలుగా చెప్పుకొనే తరగతికి చెందినవాడు. అట్టివాని జీవితమే నులివెచ్చని జీవితము. ఈ జీవితము 2 తిమోతి 3:5 వలె ఉండును. కనుక నీవు చల్లగానైనను వెచ్చగానైనను ఉండక నులి వెచ్చనగా ఉన్నావు. కనుక నేను నిన్ను నా నోటనుండి ఉమ్మివేయ నుద్దేశించుచున్నాను. అయితే ఇట్టివాడు దైవసన్నిధిలో ఎలాగుంటాడు?
''నీవు దౌర్భాగ్యుడవును దిక్కుమాలినవాడవును దరిద్రుడవును, గ్రుడ్డివాడవును దిగంబరుడవునై యున్నావని యెరుగక-నేను ధనవంతుడను, ధనవృద్ధి చేసియున్నాను, నాకేమియు కొదువలేదని చెప్పుకొనుచున్నావు,'' అనుటలో దౌర్భాగ్యము, దిక్కుమాలిన తనము, దారిద్య్రము, గ్రుడ్డితనము, దిగంబరత్వము ఇవన్నియును దేవుడు రెండు రకాలుగ విభజించియున్నాడు. 1. లోక సంబంధము 2. పరలోక సంబంధము లేక 1. శారీర సంబంధము 2. ఆత్మ సంబంధము లేక 1. దృశ్యమైనది 2. అదృశ్యమైనది.
1. దౌర్భాగ్యుడు :- సత్యదేవుని ఎరిగి, ఆయనను అంగీకరించి, జలప్రమాణము ద్వారా ముద్రింపబడి, ఆ తర్వాత విశ్వాసము నుండి తొలిగి లోకము వైపు మరలి, దేవుని సంఘము ఎదుట నీతిమంతునిగ భక్తిపరునిగ ఆత్మ సంబంధిగ కనబరచుచు, లోలోపల అశాంతి వేదన, సమస్యలు, తీరనట్టి రోగాలతో సంతోషము ఎరుగని స్థితి. ఇవన్నియును కూడ దౌర్భాగ్యానికి మూలములై యున్నవి.
2. దిక్కుమాలినవాడు :- ఇట్టివానికి దైవసన్నిధిలో ఏ విధమైన తోడ్పాటు సహకారము రక్షణ కాపుదల ఉండదని ఖచ్చితముగా తెలుస్తున్నది. అనగా దిక్కులేని జీవితము. చల్లని గుణములతో జీవించి సాతానుకు వారసత్వము అను దిక్కులో జీవించుట, లేక వెచ్చగా జీవించి క్రీస్తు ప్రభువు ఒసగు పరలోక యెరూషలేముకు యోగ్యమైన దిశలో జీవించుట. కాని వీరు ఈ రెంటిలో ఏ దిక్కు లేనివారు.
3. దరిద్రుడు :- ఎంత సంపాదించినను ధనవ్యామోహములో తలమునకలై ధనార్జన కొరకు దివారాత్రులు పాటుబడుచు, కూడబెట్టిన ధనాన్ని ఖర్చుపెట్టక పిసినిగొట్టు తనముతో వ్యవహరించుచు, ప్రేమ కనికరము సానుభూతి అన్నదేమిటో ఎరుగని స్థితిలో ఉండువారు దరిద్రులే. వీరు తన ధనమే సర్వస్వము అన్న మనోవైఖరితో జీవించి, ఈ దారిద్య్రమన్నది అలముకొని వారిని సరియైన వస్త్రాలు తొడగనియ్యక, సరియైన ఆహారము తిననియ్యక దానధర్మాలుగాని విరాళాలు చేయనియ్యదు. పిసినారితనము నరునియొక్క దారిద్య్రస్థితికి ఋజువు. ఇది శారీర దారిద్య్రము. ఆత్మ సంబంధమైన దారిద్య్రము దైవానుగ్రహము కోల్పోవుట, దైవకృపలో నుండి దైవరక్షణ నుండి దూరమగుట, దైవకార్యాల నుండి తప్పించుకొని తిరుగుట - ఇవన్నియును ఆత్మీయ దారిద్య్రమునకు చిహ్నములు.
4. గ్రుడ్డివాడు :- 2 కొరింథీ 4:4, ''దేవుని స్వరూపియైయున్న క్రీస్తుమహిమను కనపరచు సువార్త ప్రకాశము వారికి ప్రకాశింపకుండు నిమిత్తము, ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైనవారి మనోనేత్రములకు గ్రుడ్డితనము కలుగజేసెను.'' మనో నేత్రాంధకారము ఈ తరహాకు చెందిన జీవితమే. గ్రుడ్డితనము అనగా క్రీస్తు మహిమను, ఆయన చరిత్రను, దేవుని ప్రణాళికను, ఆయన ప్రభావమును, శక్తిని ఎరిగియు ఆ ప్రకారము నడవని స్థితిలో ఉండుటయే ఈ మనోనేత్ర గ్రుడ్డితనము. 5. ఇక దిగంబరుడు :- నిజమునకు పై నాలుగు గుణములు ఉన్నవాడు దిగంబరుడే. లోకసంబంధి, లోకసంబంధ వ్యసనాలు, ఆశలు, సంపద, ఆధిపత్యము మరియు ఐశ్వర్యాలకు ప్రాకులాడే వ్యక్తి, మరియు తనయొక్క ఘనత ప్రకటించుటకు ఖరీదైన వస్త్రాలు అలంకరణలు వస్తువాహనాలు కలిగియున్న ఇహలోక ధనవంతుడు దిగంబరే. వీని జీవితము దైవత్వమునకు పూర్తిగా దూరమైన జీవితము. క్రీస్తును ధరించు కొననివాడు దిగంబరుడే. అయితే వస్త్రదారుడెవడు? గలతీ 3:27-29, ''క్రీస్తులోనికి బాప్తిస్మముపొందిన మీరందరు క్రీస్తును ధరించుకొనియున్నారు. ఇందులో యూదుడని గ్రీసుదేశస్థుడని లేదు, దాసుడని స్వతంత్రుడని లేదు, పురుషుడని స్త్రీయని లేదు; యేసు క్రీస్తునందు మీరందరును ఏకముగా ఉన్నారు. మీరు క్రీస్తు సంబంధులైతే ఆ పక్షమందు అబ్రాహాముయొక్క సంతానమైయుండి వాగ్దాన ప్రకారము వారసులైయున్నారు.'' కనుక ఇట్టి ఆధిక్యతను కోల్పోవుటయే దిగంబరత్వము. ఇట్టి జీవితములో ఉన్న నరుడు కేవలము ధనవంతుడు. అయితే నరుని నిజస్థితి ఈ ఆధునిక యుగములో ఎలాగుంది? నేను ధనవంతుడను, ధనవృద్ధి చేసియున్నాను, నాకేమియు కొదువలేదని చెప్పుకుంటూ - తన ఇష్ట ప్రకారము తనకున్నట్టి అధికారము అంగబలము ధనబలమునుబట్టి నరుడు చలామణియగుచున్నాడు.
ఈ లవొదికయ సంఘములో ఇలాంటి జనాంగములు ఉండబట్టి దైవత్వము ఇంత తీవ్రముగా హెచ్చరిస్తున్నాడు. ప్రకటన 3:18, ''నీవు ధనవృద్ధి చేసి కొనునట్లు అగ్నిలో పుటమువేయబడిన బంగారమును, నీ దిసమొల సిగ్గు కనబడకుండునట్లు ధరించుకొనుటకు తెల్లని వస్త్రములను, నీకు దృష్టికలుగునట్లు నీ కన్నులకు కాటుకను నాయొద్ద కొనుమని నీకు బుద్ధి చెప్పుచున్నాను.'' శరీర దృష్టికి లోకసంబంధమైన కాటుక అవసరము. అయితే ఆత్మీయ దృష్టికి నేత్ర సంబంధమైన ఈ లోక ఔషధాలు, నేత్ర చికిత్సలు ఏవియును పనికిరావు. లోక సంబంధమైన వస్త్రాలు పనికిరావు. అయితే పరలోక వస్త్రధారణ మహిమగలవి. విశ్వాసియొక్క జీవితానికి వికసింపునిస్తాయి. అయితే ఆయనయొద్ద కొనమనుటలో ఇట్టివి ఎక్కడ కొనవచ్చు? దీనికి రూకలు అక్కరలేదు. ఇది పరలోక సంబంధము మరియు ఆత్మ సంబంధమైనది. ఆత్మదేవునియొద్ద దొరికేవి కనుక సహవాసము, ప్రార్థన, ధ్యానము, విజ్ఞాపన వగైరా రీతులుగా పొందవచ్చును. ''నేను ప్రేమించువారినందరిని గద్దించి శిక్షించుచున్నాను గనుక నీవు ఆసక్తి కలిగి మారుమనస్సు పొందుము,'' అనుటలో దేవుని చేత ప్రేమించబడినవారికి శిక్ష ఏమిటి? అన్న సందేహము మనకు కలుగవచ్చును. తండ్రి ఎక్కువగా ప్రేమించు కుమారుని దండిస్తాడని ఈ సందర్భములో మనము తెలుసుకోవాలి. తండ్రి శిక్షణలో దండన ఉంటుంది. దండించకపోతే సక్రమ మార్గములో సరియైన నడవడికలో సాగరు. కనుక తండ్రి తాను ప్రేమించే కుమారుని అప్పుడప్పుడు దండించుచు పరిశోధిస్తాడు. తండ్రియొక్క పరిశోధనలో మలచబడిన వారినిగూర్చి వేదరీత్యా మనము తెలిసికొందము. ఇందులో మొట్టమొదట పరిశోధనలో అబ్రాహాము నిలబడగలిగినాడు. దైవపరిశోధనలో అతనికి కలిగిన శ్రమలు ప్రతి వ్యక్తికి దేవుని మీద కోపమును మానసిక ఆందోళన కలిగించే రీతిలో సాగింది. ఈ పరిశోధనలో దృఢముగా నిలువబడి, సృష్టికర్తయైన దేవుడు కోరిన విధముగా ఒక్కగానొక్క కుమారుని కఠినచిత్తుడై వధించుటకు కత్తినెత్తెను. అబ్రాహాము విశ్వాస పరీక్షలో విజయవీరుడైనందున దేవుడు అబ్రాహామునకు దైవత్వముపై గల విశ్వాసము, సమర్పణా జీవితమునకు మెచ్చి, దేవుడు తరగని సంపద, విస్తారముగా అతని సంతతిని ఆశీర్వదించెను. అలాగే దేవుడు యోబును పరిశోధించినప్పుడు దైవ పరిశోధనలో నిలువబడగలిగి సాతానుతో పోరాడినాడు. దేవుడు యోబును పరిశోధిం చుటలో ద్వంద్వ వైఖరి అవలంభించినట్లు చదువగలము.
1. సాతానుకు అవకాశము ఇచ్చి శోధింపజేయుట.
2. తానే అగ్నిగా దిగివచ్చి పరిశోధించుట. యోబుయొక్క సంపద వినాశనము చేసి పరిశోధన చేయుట.
ఆ తరువాత సాతాను చేత యోబు దేహాన్ని గాయపరచి శోధింపజేశాడు. అయినను యోబు తన విశ్వాసమును వదలక, పట్టుదలతో ఏ మాత్రము జంకక, వెనుకంజ వేయక స్థిరుడుగా నిలువబడి, దైవపరీక్షను సాతాను శోధనను జయించుటనుబట్టి పరిశుద్ధ గ్రంథములో ఒక ముఖ్యమైన స్థానాన్ని సంపాదించుకొన్నాడు. యేసుక్రీస్తును కూడ తండ్రియైన దేవుడు అపవాది చేత శోధింపజేసి, నరుల చేత శిక్షను ఆయనకు విధింపజేసెను. అందువల్ల ఈ నిర్దోష రక్తము నరులకు పాపవిమోచన కలిగించెను. ప్రభువు ఆచరించిన కడరా భోజనమును ఆచరించుట, వెనుకటి జీవితములోకి వెళ్లక మనస్సును స్థిరపరచు కొన్నప్పుడు, ఇదిగో నేను తలుపునొద్ద నిలుచుండి తట్టుచున్నాను. ఎవడైనను నా స్వరము విని తలుపుతీసిన యెడల, అనగా తమ హృదయమును తెరచి ప్రభువుకు స్వాగతము పల్కినప్పుడు యేసుక్రీస్తులో అతడు ఉంటాడని, ఒకరితోనొకరు ఆత్మీయ ఆహార విందును భుజిస్తారని ఇందులోని భావము. అంతేకాదు వీరికి ఆయన సింహాసనములో కూర్చునే యోగ్యతను ఇస్తాడు.
ప్రకటన 3:14, ''ఆమేన్ అనువాడును నమ్మకమైన సత్యసాక్షియు దేవుని సృష్టికి ఆదియునైనవాడు చెప్పు సంగతులేవనగా.''
ఈ వాక్యము మూడు విధములైన గుణములనుగూర్చి తెల్పుచున్నది. ఇందులో మొదటిది ఆమేన్ అనువాడు. రెండవది నమ్మకమైన సత్యసాక్షి. మూడవదిగ దేవుని సృష్టికి ఆదియైనవాడు. ఈ విధముగా ముగ్గురు వ్యక్తులుగా విభజింపబడియున్నప్పటికిని ఆత్మ ఒక్కటే! ఇందునుగూర్చి ఎఫెసీ 4:4-5, ''శరీర మొక్కటే, ఆత్మయు ఒక్కడే; అలాగే అందరికి తండ్రియైన దేవుడు ఒక్కడే,'' అని పౌలు ప్రవచించియున్నాడు.
ఇప్పుడు ఆమేన్ అను గుణము కలిగిన ఆత్మరూపునిగూర్చి ధ్యానించుకొందము. ఆదికాండము 1:1 నుండి చివరి వరకు చదివితే ఈ అనంత విశ్వమును ఇందులోని సృష్టములను ఈ ఆమేన్ అను దైవత్వము సృష్టించినట్లు, ఈ సృష్టిని ఆరు దినములు జరిగించి, తాను జరిగించిన సృష్టి నిర్మాణ కార్యక్రమములో ఏడవదినమున విశ్రమించినట్లు వివరించియున్నది. ఆమేన్ అంటే అలాగే అగునుగాక అని అర్థము. ఇది ఎవరు పలికినారు? దేవుడు తాను ఆరు దినములు జరిగించిన సృష్టి నిర్మాణ కార్యములో, ఆదికాండము 1:3లో మొట్టమొదటగా ''వెలుగు కమ్మని పలుకగా,'' అనగా వెలుగు కలుగును గాక, అనుటతో సృష్టి నిర్మాణము ప్రారంభమైంది. ''ఆ జలములు ఈ జలములు వేరుపరచబడును గాక.'' ''ఆరిన నేల కనబడును గాక.'' ''చెట్లను ఫలమిచ్చు వృక్షములను భూమి మొలిపించును గాక.'' ఇవన్నియును ఆదికాండము ఒకటవ అధ్యాయములో కొన్ని కార్యములు జరిగినట్లుగా, ''గాక,'' అను మాటను ఎక్కువగా చదువగలము.
మొదటగా వెలుగు కమ్మని ఆత్మగా ఉన్న దేవుడు చెప్పాడు. దానికి వెలుగు కలిగింది. అలాగుననే, ''ఆ జలములు ఈ జలములు వేరు పరచబడును గాక,'' అని ఆత్మగా ఉన్న దేవుడు చెప్పాడు. అప్పుడు జలములు వేరుపరచబడినవి. మొదట చెప్పుట, ఆ తరువాత ఆ విధముగా జరుగుట జరిగింది. సాధారణముగా మన సంఘములో బోధకులు దీవించేటప్పుడు, దేవుడు మనలను దీవించుగాక అని అంటారు. అప్పుడు మనము ఆమేన్ అని సమాధానము చెప్పుచు ఉంటాము. ఈ విధముగా తండ్రియైన దేవుడు ఆత్మగా ఉండి, ఆ జలములు ఈ జలములు వేరు అగు గాక, భూమి మొలిపించును గాక, అని పలికినప్పుడు ఇంకొకరు ఆమేన్ అని పలుకుట జరిగినట్లుగా మనము గ్రహించవలసియున్నది. ఈ ఆమేన్ అని పలికినవాడు క్రీస్తు ప్రభువే. అందుకే మన మూలవాక్యములో క్రీస్తు ప్రభువు ఆమేన్ అనువాడుగా తనను తాను పరిచయము చేసుకొంటున్నారు. యోహాను 1:1-4, ''ఆదియందు వాక్యముండెను, వాక్యము దేవునియొద్ద ఉండెను, వాక్యము దేవుడై యుండెను. ఆయన ఆదియందు దేవునియొద్ద ఉండెను. సమస్తమును ఆయన మూలముగా కలిగెను. కలిగియున్నదేదియు ఆయన లేకుండ కలుగలేదు. ఆయనలో జీవముండెను; ఆ జీవము మనుష్యులకు వెలుగైయుండెను,'' అని వ్రాయబడిన ప్రకారము క్రీస్తు ప్రభువు ఈ సృష్టికి ముందే ఉండి తండ్రియైనవాడు ఆత్మగా చెప్పు ప్రతి వచనమునకు ఆమేన్ అని పలుకుచు సమస్తమును సృష్టించెను.
ఇక తండ్రియైన దేవుడు లోకమునకు తనయొక్క మహిమ అను క్రీస్తు రూపము జనబాహుళ్యమునకు కనబరచుచు యోహాను 3:16లో వలె లోకము మీదనున్న తన మితిలేని ప్రేమను బయల్పరచియున్నాడు. మానవత్వము మీద దైవత్వానికి ఉన్న ప్రేమ వల్ల ఆమేన్ అనువాడుగా క్రీస్తు ప్రభువు ఒక కానుకగా పంపబడ్డాడు. చిత్రమేమిటంటే ఆమేన్ అనువానికి రూపము లేదు. అయితే దేవునియొక్క సత్యమును ప్రకటించుటకు భూమిమీద సాక్షిగా అవతరించిన వానికి రూపమున్నది. ఆ రూపమే యేసు రూపము. అయితే ఆమేన్ అను ఆత్మదేవునియొక్క సత్యమును బయల్పరచుటకు సాక్షిగా కన్యకయైన నారీగర్భము నుండి పురుష ప్రమేయము లేకుండ ఆత్మ ప్రమేయముతో ఈ లోకములో మానవమర్యాద చొప్పున ప్రసవింపబడినవాడై దైవసత్యమునకు సాక్షియైయుండినట్లుగా యేసుక్రీస్తు చరిత్ర విశదపరచుచున్నది.
యేసుక్రీస్తు తన శిష్యకోటికి నేర్పిన పరలోక ప్రార్థనలో, మత్తయి 6:10, ''పరలోకమందున్న మా తండ్రీ, నీ నామము పరిశుద్ధ పరచబడుగాక; నీ రాజ్యము వచ్చుగాక; నీ చిత్తము పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమియందును నెరవేరునుగాక,'' ఈ విధముగా, ''గాక,'' అను మాట చాలా సందర్భాలలో చూడగలము.
ఈ ప్రార్థనను క్రీస్తు ప్రభువు స్వయముగా తన శిష్యులకు నేర్పించాడు. అయితే ఈ ప్రార్థనను క్రీస్తు ప్రభువు తన కోసము చెప్పుకొన్నది కాదు. ఎందుకంటే క్రీస్తు ప్రభువు ఆమేన్ అనువాడు. నీవు పరలోక ప్రార్థన చేసి ''గాక'' - అని చెప్పుచు ఉన్న ప్పుడు, నీ ప్రార్థన పరలోకములో హోమముగాను పరిశుద్ధుల ప్రార్థనగా గుర్తింపబడి నప్పుడు, ఎప్పుడైతే క్రీస్తు ప్రభువు ఆమేన్ అని చెప్పునో అప్పుడు నీ ప్రార్థన ఫలించినట్లే. ఎందుకంటే తండ్రియైన దేవుడు ఆత్మగా భూమి మొలిపించునుగాక అని సృష్టి కార్యములో అన్నప్పుడు క్రీస్తు ప్రభువు వెలుగుగా ఉండి సమస్తమును సృష్టించాడు. ''ఆమేన్,'' అని ఇక్కడ చెప్పినట్లుగా గుర్తించాలి. అదే విధముగా మనము ప్రార్థించినప్పుడు క్రీస్తు ప్రభువు, ''ఆమేన్,'' అని ఎవరి ప్రార్థనకైతే చెప్పుతారో ఆ ప్రార్థన ఫలింపు గలిగినదని గుర్తించాలి.
ఈ సత్యసాక్షి అనేక కార్యములు చేసినట్లు పాత నిబంధన మరియు నూతన నిబంధన అను రెండు గ్రంథాలలో వ్రాయబడియున్నది. అంతేగాకుండ ఈ సత్యసాక్షి లోకానికి సత్య సువార్తను ప్రకటించుటయే గాకుండ ఆ సువార్తకు పునాది వేసెను. ఈ సత్యసాక్షి సత్యమునకు సాక్ష్యముగా తాను మాత్రమే బలి కాకుండ ఇంకా అనేకులను అనగా అపొస్తలులను, హతసాక్షులు, ప్రవక్తలు, వగైరా నామధేయములతో అనేకులను సిద్ధపరచెను. నేడు యావద్ లోకానికి సత్యసువార్తను ప్రకటింపజేయుటకును, భూమిమీద సత్యసువార్తను స్థాపించుటకు కారకుడైనవాడే ఈ సత్యమునకు సాక్షి. అనగా ఆమేన్ అను మాటను శబ్దముగా భూమిమీద పలికినవాడు. అది ఆత్మకు రూపమిచ్చినవాడు కూడ ఈ సత్యసాక్షి.
యోహాను 14:6, ''నేనే మార్గమును, సత్యమును, జీవమును;'' అని పలుకుటలో ఈ సత్యసాక్షి నామమాత్రముగా కాక నరునిలోని జీవాత్మ నరుని విడిచి వెళ్లు సందర్భములో ఆ ఆత్మను సత్య మార్గములో నడిపించి, తన తండ్రియొక్క రాజ్యమునకు చేర్చుచున్నట్లుగా మనము గ్రహించాలి. క్రీస్తు యుగాంత కాలములో తన సాక్ష్యమును దేవునియెదుట ఆయన దూతలయెదుట వినిపించబోవుచున్నాడు. ప్రకటన 3:5, ''జయించు వాడు ఆలాగున తెల్లని వస్త్రములు ధరించుకొనును; జీవగ్రంథములోనుండి అతని పేరెంత మాత్రమును తుడుపు పెట్టక, నాతండ్రి యెదుటను ఆయన దూతల యెదుటను అతని పేరు ఒప్పుకొందును.'' ఈ ఒప్పుకొనుటయే సాక్ష్యమిచ్చుట అని కూడ అనవచ్చును. ఈయన సాక్ష్యము సత్యమైనది. కాబట్టి మన సాక్ష్య జీవితము క్రీస్తునందు భద్రపరచబడి నట్లయితే, ఈ నమ్మకమైన సత్యసాక్షి దానిని దేవునియెదుట ఆయన దూతలయెదుట చెప్పి మనలను పరలోక వారసులను చేస్తాడు. ఈయన చెప్పు సాక్ష్యములో తప్పు ఉండదు. కాబట్టి ఈయనను నమ్మకమైన సత్యసాక్షిగా చెప్పుకొనుచున్నారు.
''ఇక సృష్టికి ఆదియునైనవాడు,'' అనుటలో, మరల మనము మొదటికి వచ్చాము. ఆమేన్ అనువాడు సత్యసాక్షియైనవాడు వీరిద్దరితోబాటుగా ఇంకొక శక్తి ఉన్నాడనుటకు ఈ మాట ఋజువుపరచుచున్నట్లు మనము గ్రహించాలి. దేవుని సృష్టికి ఆదియైనవాడెవరు? సమస్త సృష్టికి ఆదియైనవాడు మాత్రము కాదని మనము తెలిసికోవలసియున్నది. ఈయన దేవుని సృష్టికి మాత్రమే ఆదియైనవాడు అనగా ఇప్పుడున్న సృష్టికి ఆదియైనవాడు.
మొట్టమొదటగా చీకటి అగాధ జలముల మీద ఆత్మగా అల్లలాడుచు, నిరాకారము శూన్యము దుర్గంధపూరితమైన జలాలలో మరుగుగా ఉన్న భూగ్రహమును పైకి తీయుటకు, దేవుని ఆత్మ క్రియ జరిగించిన సత్యాన్ని మనము ఒప్పుకొక తప్పదు. అయితే సృష్టికి ఆదిలో దేవుని ఆత్మ జలములమీద అల్లలాడినప్పటికిని దేవునితో కూడ దైవసృష్టి కార్యక్రమ ములో - దేవునికి తోడ్పడిన రెండవ శక్తి ఉన్నట్లుగా మనకు తెలియుచున్నది.
ఆ సృష్టికి ఆదియైనవాడు ఒకడున్నాడని ఈయన ఈ సృష్టి నిర్మాణములో సృష్టికర్తతో సహకరించినట్లుగా తెలియుచున్నది. ఆదికాండము 1:3-5 చదివితే ఈ శక్తి ఎవరు అన్నది మనకు తెలియగలదు. ''వెలుగు కమ్మని పలుకగా వెలుగు కలిగెను. వెలుగు మంచిదైనట్టు దేవుడు చూచెను.''
దైవశక్తితో సమానమైన ప్రకాశవంతమైన శక్తి మరియొకటి దేవుని సృష్టి నిర్మాణ కార్యక్రమములో సహకరించినట్లుగా ఈ వచనము వివరిస్తున్నది. దేవుడు వెలుగు కమ్మన్నప్పుడు వెలుగు కూడ ఒక శక్తియే అనగా ఆత్మ - వెలుగు. ఈ వెలుగు సూర్య చంద్రులు కారు. ఎందుకంటే ఇవి రెండు ఆ తర్వాత సృష్టించబడినవి. ఆదికాండము 1:14. 1. ఆత్మ 2. వెలుగు. ఆత్మ నుండి శబ్దము, శబ్దము అను వాక్యము ద్వారా వెలుగు. ఇట్లు రెండు శక్తులు మనకు కనబడుచున్నవి. అంతేగాకుండ ఆ వెలుగు లోకసంబంధమైన వెలుగుగా గాక నిత్యమైనట్టి వెలుగు. ఇది ఒక్క స్థలానికే పరిమితము కాకుండ యావద్ ప్రపంచమునకు వెలుగు. ఈ దేవుని సృష్టికి ఆదియైనవాని దగ్గర ఉన్నట్లుగా తెలియుచున్నది. అందునుబట్టి వెలుగు మంచిదైనట్లు చూచి నిర్ధారించి యున్నాడు. కనుక ఈ వెలుగు ద్వారా దేవుడు చీకటిని వేరుపరచినట్లు ఇందులో వ్రాయబడియున్నది. ఇప్పుడు ఈ వెలుగునుగూర్చి మనము క్షుణ్ణముగా తెలిసికొందము.
వెలుగు అన్నది ఐదు విధములైయున్నది.
1. ఆత్మీయమైన వెలుగు :- ఇది ఆత్మలను పరిశోధిస్తున్నది. ఆత్మలలోని కలుషితాన్ని దహించేది. మానవునియొక్క పాపభూయిష్టమైన జీవితాన్ని భస్మము చేసేది ఈ వెలుగు.
2. పెద్ద జ్యోతులు :- దేవుడు లోకమునకు వెలుగు ఇచ్చుటకు ఆకాశములో నిలిపిన సూర్యచంద్రాదులు.
3. కృత్రిమ వెలుగు :- మానవ స్వజ్ఞానముతో బ్యాటరీలు, యంత్రాలతో రూపొందించి బల్బులతో వెలిగించే వెలుగు. ఇది ఆ బల్బు వెలుగుచున్న స్థలము వరకే పరిమితము. ఇది మానవ స్వజ్ఞానముతో రూపించబడినది.
4. నాశనకరమైన వెలుగు :- ఇది ఆకాశములో దేవుడు కనబరచే ఉరుములు మెరుపులతో వర్షపాతమును సూచించే వెలుగు. దీని ద్వారా మానవ నేత్రాలకు అంధత్వము అంధకారము కలుగుతుంది.
5. జీవపు వెలుగు :- ఇది నరదేహములో ఉన్న జీవమునకు సంబంధించిన వెలుగు. ఈవెలుగు దేహసంబంధమైన నేత్రాలకు అగమ్యగోచరము. ఇది ఆత్మ సంబంధియు ఎల్లప్పుడు ఆమేన్ అనువానిని, సత్యసాక్షియైనవానిని, సృష్టికి ఆదియునైన వానిని అనగా క్రీస్తు ప్రభువును ఘనపరచి స్తుతించి మహిమపరచి, ప్రార్థనతోను గానములతో ఆరాధించే వానికే ఈ జీవపు వెలుగు అన్నది కలుగుతుంది. ఈ విధముగా లోకసృష్టికి ఆదియైన వానియొక్క వెలుగు అనాది కాలము నుండి నేటి వరకును క్రియ జరిగిస్తూనే ఉన్నది.
ఎఫెసీ 1:3-6, ''ఎట్లనగా తన ప్రియునియందు తాను ఉచితముగా మనకను గ్రహించిన తన కృపామహిమకుకీర్తి కలుగునట్లు, తన చిత్త ప్రకారమైన దయాసంకల్పము చొప్పున, యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులనుగా స్వీకరించుటకై, మనలను ముందుగా తన కోసము నిర్ణయించుకొని, మనము తన యెదుట పరిశుద్ధులమును నిర్దోషులమునై యుండవలెనని జగత్తు పునాది వేయబడకమునుపే, ప్రేమచేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకొనెను.'' పై వాక్యము దేవునియొక్క యదార్థతను ఆయన సత్యసంకల్పమును వివరిస్తున్నది. అయితే క్రీస్తు ద్వారా మనలను ఏర్పరచుకొన్న పక్షములో మనకు కలుగు లాభమేమిటి? ఆయన రక్తము వలన విమోచనము అనగా మన అపరాధములకు క్షమాపణ లభించును. కొలస్స 1:15-20, ''ఆయన (యేసుక్రీస్తు) అదృశ్యదేవుని స్వరూపియై (ఆమేన్ అను వానియొక్క స్వరూపము) సర్వసృష్టికి ఆదిసంభూతుడై యున్నాడు. ఏలయనగా ఆకాశమందున్నవియు భూమియందున్నవియు దృశ్యమైనవిగాని, అదృశ్య మైనవిగాని, అవి సింహాసనములైనను ప్రభుత్వములైనను ప్రధానులైనను అధికారములైనను, సర్వమును ఆయనయందు సృజింపబడెను, సర్వమును ఆయనద్వారాను ఆయననుబట్టియు సృజింపబడెను.'' కనుక ఆమేన్ అనువాడు, సత్యసాక్షియైనవాడు, దేవుని సృష్టికి ఆదియునైనవాడు అను ముగ్గురు కూడ క్రీస్తే.
ప్రకటన 3:18, ''నీవు ధనవృద్ద్ధి చేసి కొనునట్లు అగ్నిలో పుటమువేయబడిన బంగారమును, నీ దిసమొల సిగ్గు కనపడకుండునట్లు ధరించుకొనుటకు తెల్లని వస్త్రములను, నీకు దృష్టికలుగునట్లు నీ కన్నులకు కాటుకను నాయొద్ద కొనుమని నీకు బుద్ధి చెప్పు చున్నాను.''
దేవుని సంకల్పములో 1. బంగారము 2. తెల్లని వస్త్రములు 3. కన్నులకు కాటుక ఉన్నట్లుగా తెలియుచున్నది. లోకరీత్యా దృశ్యముగా బంగారమును తెల్లని వస్త్రములు నల్లని కాటుకను చూస్తున్నాము. లోకరీత్యా ఇవి నరులకు అందుబాటులో ఉన్నవి. వీటిని డబ్బుతో కొనవచ్చును. ప్రతి మనిషి ఏదో యొక రూపములో ఈ మూడింటిలో ఒకదానిని లేక రెండిటిని లేదా మూడింటిని ధరించుకొనుచున్నాడు. నేడు ఈ మూడు వస్తువులు క్రైస్తవులలోను క్రైస్తవేతరులలోను ప్రత్యక్షముగా కూడ కనబడుచున్నవి.
అపొస్తలుల కార్యములు 3:6, ''అంతట పేతురు-వెండి బంగారములు నాయొద్ద లేవు గాని నాకు కలిగినదే నీ కిచ్చు చున్నాను;'' అపొస్తలుల కార్యములు 3:4-5, ''పేతురును యోహానును వానిని తేరి చూచి-మాతట్టు (తమ) చూడమని ఆ రోగికి చెప్పగా-వాడు వారి వద్ద ఏమైన దొరకునని కనిపెట్టుచు వారి యందు లక్ష్యముంచెను.'' వారి తట్టు చూచుటలో ఆ భిక్షకునియొక్క కనుదృష్టి, పేతురు యోహానుల దగ్గర వెండి బంగారములున్నాయన్న ధ్యాసతో చూచినట్లే ఉన్నదిగాని, వేరే ఉద్ధేశ్యముతో చూచినట్లు లేదు. ఆ చీలమండలరోగి యొక్క ధ్యేయము పేతురు యోహానుల దగ్గర లోకసంబంధ వెండి బంగారములలో ఏదేని ఒకటి ఉంటుందని ఆశించాడేగాని, వెండి బంగారముల కంటె అమూల్యమైనవి అపొస్తలులైనవారి దగ్గర ఒకటున్నదన్న సంగతిని అతను గ్రహించలేదు. ఎందుకంటే ఆ చీలమండలరోగి శరీర సంబంధియైయుండి అందులో వికలాంగుడైయుండి, అటు ఆత్మీయముగా ఇటు శారీరముగా ఉభయ భ్రష్టత్వము పొందిన స్థితిలో ఉన్నాడు. అందునుబట్టి పేతురు యోహానుల దగ్గర ఉన్న వెండి బంగారముల రూపమేమిటో గ్రహించలేకున్నాడు.
పేతురు యోహానులు చీలమండలరోగి స్థితినిబట్టి అతని మనోస్థితిని గ్రహించిన వారై నాకు కలిగినదే నీకిచ్చుచున్నాను అని అన్నారు. పేతురుకు కలిగియున్నదేమిటి? నజరేయుడైన యేసు నామములో విశ్వాసము తద్వారా తాను సంపాదించుకొన్న నజరేయుడైన యేసు నామముయొక్క శక్తి - మహిమ - ప్రభావములు. ఇవియే ఆ వెండి బంగారములు. అపొస్తలులయొక్క విశ్వాసము వెండి బంగారముల కంటె విలువైనది. 1 పేతురు 1:18 వలె క్షయమగు వెండి బంగారము కంటె 1 పేతురు 3:3-4లో వలె సాధువైనట్టియు, మృదువైనట్టి గుణమను అక్షయాలంకారముగల మీ హృదయపు అంతరంగ స్వభావము మీకు అలంకారముగా ఉండవలెను; అది దేవుని దృష్టికి మిగుల విలువగలది.
లోకాంత్యము ప్రభువు రాకడ మధ్యకాలములో ఉన్న మనయొక్క అంత్య జీవితములో లోకరీత్యా చూస్తే బంగారమునకు విలువలేదు. అయినను బంగారముమీద నరునియొక్క వ్యామోహము తగ్గుట లేదు. బంగారము మీద వ్యామోహము ప్రతివారిలో ప్రత్యక్షముగా ప్రబలి సిసలైన బంగారము పొందలేకపోయినను, నకిలీ బంగారము అయినను ధరించుకొని తమయొక్క బంగారముమీద ఆశను తృప్తిపరచుకొంటున్నారు.
పాతనిబంధన కాలములో ఐగుప్తు రథములు, గుఱ్ఱములకున్న అలంకారములు వాటికి పొదిగిన రేకులు మొదలైనవి బంగారువే! సొలొమోను యెహోవాకు కట్టించిన మందిరములో దాదాపు పూర్తిగా బంగారమనే చెప్పవచ్చును. మందసము - మందసము నకు అలంకరించబడిన ఉంగరములు బంగారు తాపడము చేయబడిన రేకులు బంగారమువే! మందస పేటికకు అలంకరించబడిన కెరూబులు బంగారువే! బలిపీఠమునకు కూడ బంగారముతో అలంకరించబడి యున్నట్లు వేదములో చదువగలము.
ఐగుప్తీయుడైన ఫరో యోసేపు వ్రేలికి బంగారు ఉంగరమును అలంకరించినట్లును, తప్పిపోయి దొరికిన కుమారునికి తండ్రి ప్రశస్తమైన వస్త్రములు వ్రేలికి ఉంగరము, కాళ్ళకు క్రొత్త జోళ్ళను తొడిగినట్లు వేదములో చదువగలము. పాత నిబంధన గ్రంథములో బంగారమునకు చాలా ప్రాధాన్యత ఉన్నట్లు వేదము ద్వారా తెలియుచున్నది. బంగారమును గూర్చి అనేకులు అనేక విధములుగా చెప్పియున్నారు. అవి కేవలము మానవ జ్ఞానమును బట్టి చెప్పబడియున్నవి. అయితే ప్రవక్తల ద్వారా బయల్పరచబడిన సంగతులు మానవ జ్ఞానమునకు విరుద్ధముగా ఉన్నవి. ''ఈ లోకమునైనను లోకములో ఉన్నవాటినైనను ప్రేమింపకుడి,'' అని 1 యోహాను 2:15లో వ్రాయబడియున్నది. లోకములో ఉన్నవి లోకసంబంధమైనవియే! ఇందునుగూర్చి, 1పేతురు 1:7, ''నశించిపోవు సువర్ణము అగ్నిపరీక్షవలన శుద్ధపరచబడుచున్నది గదా? దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము ఈ శోధనలచేత పరీక్షకు నిలచినదై, యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పును మహిమయు ఘనతయు కలుగుటకు కారణమగును.'' కనుక ప్రభువైన యేసుక్రీస్తు తాను ఏర్పరచుకొనిన పండ్రెండుమంది అపొస్తలులకు పరిశుద్ధమైన సువర్ణము కంటె మరెక్కువైన విశ్వాసమును స్వాస్థ్యముగ యిచ్చియున్నాడు. అట్టి విశ్వాసము అను స్వాస్థ్యమును పొందిన అపొస్తలులు బంగారము కంటె విలువగల ఆ విశ్వాసమును జాగ్రత్తగా కాపాడుకున్నారు. అంతమట్టుకేగాక విశ్వాస సంబంధమైన మంచి పోరాటమును వారు కూడ పోరాడినారు. కనుక విశ్వాసమే ప్రభువు సంకల్పములోని బంగారము.
క్రైస్తవ సంఘ విశ్వాసులయొక్క అమూల్యమైన బంగారమను విశ్వాసమును చెడగొట్టుటకు అపవాది సంఘములలో క్రియ జరిగిస్తున్నాడు. విశ్వాసులకు సంఘము మీదనున్న విశ్వాసాన్ని ఒకవైపు, సంఘస్థులకు కాపరి మీదనున్న విశ్వాసమును ఒకవైపు; కాపరికి సంఘముమీదనున్న విశ్వాసమును మరియొకవైపు, వీటన్నిటికంటెను సంఘమున కును క్రీస్తుకు ఉన్న విశ్వాస బంధమును మరియొకవైపు తస్కరించుచు సాతాను విశ్వాస క్రైస్తవ జీవితమును అవిశ్వాస క్రైస్తవ జీవితముగాను, నామక్రైస్తవ జీవితముగాను, బోధకులను అబద్ధ బోధకులుగాను, లోకసంబంధ బోధకులుగాను, వాక్యమునకు విరుద్ధమైన బోధకులుగాను చేస్తూ ప్రత్యక్షముగా సంఘములను విశ్వాసము అను అమూల్యమైన బంగారము లేని నిర్జీవ సంఘముగా మారుస్తున్నాడు. అంటే అపవాది సంఘములోని విశ్వాసాన్ని దొంగిలించుచున్నాడన్నమాట.
విశ్వాసము కంటె మించిన వెండి బంగారములు, విశ్వాసము కంటే మించిన అమూల్యమైన రక్షణాయుత కవచమన్నది మరొకటి లేదు. అందుకే అంటున్నాడు, అపొస్తలుల కార్యములు16:31, ''అందుకు వారు-ప్రభువైన యేసునందు విశ్వాస ముంచుము, అప్పుడు నీవును నీ ఇంటివారును రక్షణ పొందుదురని చెప్పి.'' మనలో వెండి బంగారములు విశ్వాస రూపములో ప్రభువు నామములో ఉండవలెనేగాని, లోక సంబంధముగా దృశ్యములైన వెండి బంగారు రూపములో ఉండకూడదని దీని భావము. బంగారమునకంటె అమూల్యమైన విశ్వాసమునుబట్టియే మన పితరుడైన అబ్రాహాము విశ్వాసులకు తండ్రిి అయ్యెను. కనుక విశ్వాసమును కాపాడుకొనుటన్నది బంగారమును భద్రపరచుకొనుటతో సమానము. బంగారమును దొంగిలించుటకు దొంగ ఏ విధముగా వచ్చునో, విశ్వాసమును దొంగిలించి అవిశ్వాసమును పుట్టించుటకు అపవాది కాచుకొని కూర్చొని ఉన్నాడు, అనిన సత్యాన్ని మనము మరచిపోకూడదు. 1 తిమోతి 6:12, ''విశ్వాస సంబంధమైన మంచి పోరాటము పోరాడుము, నిత్యజీవమును చేపట్టుము. దాని పొందుటకు నీవు పిలువబడి అనేక సాక్షులయెదుట మంచి ఒప్పుకోలు ఒప్పు కొంటివి,'' అని పౌలు హెచ్చరిస్తున్నాడు.
''బంగారము అగ్నిలో పుటము వేయబడుట,'' అంటే ఏమిటి?
బంగారము అనగా విశ్వాసము అని తెలుసుకొనియున్నాము. ఈ విశ్వాసము అగ్నిలో పుటము వేయబడుట, అనుటలో ప్రకటన 2:10, ''ఇదిగో మీరు శోధింపబడునట్లు అపవాది మీలో కొందరిని చెరలో వేయింప బోవుచున్నాడు; పది దినములు శ్రమ కలుగును; మరణము వరకు నమ్మకముగా ఉండుము. నేను నీకు జీవకిరీటమిచ్చెదను.'' కనుక దేవుడు సాతాను అను అపవాది చేతికి పది దినములు మనలను అప్పగించుచున్నాడు. ఈ పది దినములు శ్రమను మనము అనుభవించి అనగా అగ్నిలో పుటము వేయబడినట్లు సాతాను శోధనలో పుటము వేయబడినప్పుడు మనలోని విశ్వాసము అను బంగారము తండ్రియైన దేవుడు మరియు ఆయన కుమారుని సన్నిధిలో చేరును. మన విశ్వాసాన్ని ఈ కాలమున ఓర్పుతో నిలదొక్కుకొన్నవాడు జీవకిరీటమును పొందును. ఈ వాక్యములో కొనుక్కోమని బుద్ధి చెప్పుచున్నాడు. ఇటువంటి విశ్వాసము మనము కలిగి సాతానును జయించాలి అంటే ప్రార్థన ద్వారా క్రీస్తు ప్రభువు దగ్గర కొనుక్కోవలసినదే. అట్లు కాని యెడల మనము విశ్వాసహీనులమై దరిద్రులము కాగలము. ఇక్కడ కొనుక్కొనుము అనగా సాతానును జయించుటయే! సాతానును ప్రార్థన ద్వారా జయించి, ఓర్పుతో శ్రమలను భరించినవానికి బంగారమను విశ్వాసము తనంతట తాను వీరిలో ఏర్పడుతుంది. కనుక మనము శోధన అను అగ్నిలో పుటము వేయబడి ఓర్పును కలిగి పది దినములు శ్రమను మన మరణమువరకు భరించి, నమ్మకముగా ఉండి, క్రీస్తునందు పుటము వేయబడిన మేలిమి బంగారమువంటి విశ్వాసమును మనము పొందవలసియున్నది. ప్రకటన 14:12, ''దేవుని ఆజ్ఞలను యేసునుగూర్చిన విశ్వాసమును గైకొనుచున్న పరిశుద్ధుల ఓర్పు ఇందులో కనబడును.'' కనుక ఓర్పు వలన పరిశుద్ధులలో విశ్వాసము పెంపొందును. శ్రమల వలన విశ్వాసము పటిష్టమై బంగారము వంటి పరిశుద్ధమైనదిగాను విలువైనదిగాను మారును.
ఇక మూలవాక్యములో రెండవది తెల్లని వస్త్రము. ఇది ఏమిటి? ఎఫెసీ
5:25-27, ''అటువలె క్రీస్తుకూడ సంఘమును ప్రేమించి, అది కళంకమైనను ముడతయైనను అట్టిది మరి ఏదైనను లేక, పరిశుద్ధమైనదిగాను, నిర్దోషమైనదిగాను మహిమగల సంఘముగాను ఆయన తనయెదుట దానిని నిలబెట్టుకొనవలెనని, వాక్యముతో ఉదకస్నానముచేత దానిని పవిత్రపరచి, పరిశుద్ధపరచుటకై దానికొరకు తన్ను తాను అప్పగించుకొనెను.'' అన్నదే ఈ తెల్లని వస్త్రమునకున్న ప్రశస్తత. ఈ ప్రశస్తతన్నది దేవుని వాక్యముతో ఉదకస్నానముచేత పవిత్రపరచబడి పరిశుద్ధపరచబడుటకై అనగా శ్వేతవర్ణములో ధగధగ మెరిసే ప్రకాశమానమైన స్థితిలో జీవించుటకు, యేసుయొక్క శరీర రక్తసమర్పణ బలియాగము ద్వారా పరిశుద్ధపరచబడిన విశ్వాసియొక్క ఆత్మీయ జీవితమే ఈ తెల్లని వస్త్రము. ప్రకటన 7:9-10, ''అటుతరువాత నేను చూడగా, ఇదిగో, ప్రతి జనములో నుండియు ప్రతి వంశములోనుండియు ప్రజలలోనుండియు, ఆయా భాషలు మాటలాడు వారిలోనుండియు వచ్చి, యెవడును లెక్కింపజాలని యొక గొప్ప సమూహము కనబడెను. వారు తెల్లని వస్త్రములు ధరించు కొన్నవారై, ఖర్జూరపుమట్టలు చేతపట్టుకొని సింహాసనము ఎదుటను గొఱ్ఱెపిల్లయెదుటను నిలువబడి -సింహాసనాసీనుడైన మా దేవునికిని గొఱ్ఱె పిల్లకును మా రక్షణకై స్తోత్రమని మహాశబ్దముతో ఎలుగెత్తి చెప్పిరి.''
కనుక, ప్రకటన 7:13-14, ''పెద్దలలో ఒకడు-తెల్లని వస్త్రములు ధరించుకొని యున్న వీరెవరు? ఎక్కడనుండి వచ్చిరని నన్ను అడిగెను. అందుకు నేను-అయ్యా, నీకే తెలియుననగా అతడు ఈలాగు నాతో చెప్పెను-వీరు మహాశ్రమలనుండి వచ్చిన వారు; గొఱ్ఱెపిల్ల రక్తములో తమ వస్త్రములను ఉదుకుకొని వాటిని తెలుపుచేసికొనిరి.'' వీరికి దేవుడనుగ్రహించిన మహా ఐశ్వర్యము రక్షణ పోషణ ఆదరణను గూర్చి తెలుసుకొందము. ప్రకటన 7:15-17, ''అందువలన వారు దేవుని సింహాసనము ఎదుట ఉండి రాత్రింబగళ్లు ఆయన ఆలయములో ఆయనను సేవించుచున్నారు. సింహాసనాసీనుడైన వాడు తానే తన గుడారము వారిమీద కప్పును; వారికి ఇకమీదట ఆకలియైనను దాహమైననుఉండదు, సూర్యుని యెండయైనను ఏ వడగాలియైనను వారికి తగులదు, ఏలయనగా సింహాసన మధ్యమందుండు గొఱ్ఱెపిల్ల వారికి కాపరియై, జీవజలముల బుగ్గలయొద్దకు వారిని నడిపించును, దేవుడే వారి కన్నులనుండి ప్రతి బాష్పబిందువును తుడిచి వేయును.''
ఇక మూడవది కాటుక అనుటలో ఇవి రంగులో నలుపు - ఈ నల్లదనమును దేవుడు జన్మతః ప్రతి జీవికి ఏదో యొక రూపములో ఏదోయొక అవయవ భాగములో రూపించియున్నాడు. నరునియొక్క దేహాంగములలో నల్లని వెంట్రుకలకు ప్రాధాన్యత ఉన్నది. లోకరీత్యా నెరసిన అనగా తెల్లని వెంట్రుకలు గలవానికి విలువలేదు. ఎందుకంటే అతడు ముదుసలి అని, తెల్లని వెంట్రుకలవాడు అందవిహీనుడని లోకము చిన్నచూపు చూస్తున్నది. అట్టివానికి కన్యక నిచ్చెడివారుండరు. నలుపు అన్నది స్త్రీలకైతే శిరోజాలు, కనుబొమ్మలు, కనురెప్పలు వగైరాలలో కనబడుచు స్త్రీ రూపానికి ఒక ప్రత్యేకమైన అందాన్ని చేకూర్చుతుంది. అందుకే పరమగీతము 1:5, ''(శూలమతి)-నేను నల్లని దాననైనను సౌందర్యవంతురాలను,'' అని అంటున్నది. నలుపులో సౌందర్యమున్నట్లు ఇందునుబట్టి మనకు తెలియుచున్నది. స్త్రీల దేహచ్ఛాయ కేవలము ఎఱ్ఱగా ఉన్నప్పటికిని వారియొక్క శిరోజాలు తెల్లగా ఉంటే, వారి దేహచ్ఛాయ నిరుపయోగమే! స్త్రీలు ప్రేమించే రంగులలో నల్లరంగుకు కూడ ప్రాధాన్యత ఉన్నది. నల్లరంగు మీద నున్న ప్రేమకొద్ది తమ కన్నులు కూడ నలుపు చేసుకొనుటకు కంటి అందమునకు సాధనముగా కాటుకన్నది వాడబడుచున్నది. లోకరీత్యా ఔషధముగా కాటుకకు ఒక ప్రత్యేకత ఉన్నది. చెట్టు ఆకుల మూలముగాను తైలాదులమూలముగాను రూపొందించబడి కంటి రక్షణకు అనగా కంటి సంబంధమైన కలక, మసక, వగైరా కంటి జబ్బుల నుండి రక్షణకు ఈ కాటుక వాడబడు చున్నది. అయితే లోకరీత్యా ముస్తాబులలో కూడ ఈ కాటుకకు ఒక స్థానమున్నది.
''నీకు దృష్టికలుగునట్లు నీ కన్నులకు కాటుకను నాయొద్ద కొనుమని నీకు బుద్ధి చెప్పుచున్నాను.'' నలుపులో అపరిశుద్ధత ఉన్నది, పరిశుద్ధత ఉన్నది. పాపమున్నది, పుణ్యమున్నది. నీతి ఉన్నది, అవినీతి ఉన్నది. ఎట్లంటే లోకస్థులైనట్టి యౌవ్వనులు తమ యొక్క శిరోజాల విషయములో నలుపునే కోరుకుంటారు. ఆ నలుపునే నిలుపుకొనుటకు అనగా నల్లని తమ శిరోజాలయొక్క విలువను కాపాడుకొనుటకు తమ శిరోజాల స్థితినిబట్టి తమ వయస్సును కుదించుకొనుటకును, నిత్య యవ్వనులుగా లోకానికి కనబడాలన్న తాపత్రయములో కృత్రిమమైన నల్లరంగును వాడే సోదరులను మనము చూస్తున్నాము. దేవుడు పక్షపాతి కాడు. కనుక జంతుజాలములో వెంట్రుకలు నెరయుట తెల్లబడుటన్నది ఏ జీవిలో కనబడదు. ఎలుగుబంటి బాల్యము నుండి నలుపే. దాని నలుపు అలాగే ఉంటుందిగాని ఎంత మాత్రమును అవి తెల్లబడవు. నల్లపిల్లి తన మరణ పర్యంతము నల్లగానే ఉంటుందిగాని ఎంత మాత్రమును అవి తెల్లబడవు. అలాగే పక్షి జాలములో నల్లకాకి యొక్క ఈకలు దానియొక్క ఆయుఃపరిణామమునుబట్టి తెలుపుగా మారవు. అలాగే నల్లని పావురపు ఈకలు నల్లగానే ఉన్నవి. మరి నరకోటిలో నలుపు అన్నది తెలుపుగా మారుటలో పరమార్థమున్నది. దీనికి కారణము నల్లని రంగు అన్నది దేవుని వశములో ఉన్నది. తెల్లని వెంట్రుకలకు నల్లరంగు వేసుకొనుట ఎలుగుబంటి, నల్లపిల్లి, నల్లపులి, నల్లకాకి, నల్ల పావురము, మరియు నల్ల కొంగలలో లేదు. వాటికి ఆ ఖర్మ లేదు. ఇది ఒక మనిషికే పరిమితమైయున్నది.
జీవజంతువులను దేవుడు ఏ విధముగా సృజించాడో అవి అదే విధముగా ఉన్నాయి. వీటిలో రంగులో మార్పు రాదు. ఎందుకంటే అవి దేవుడిచ్చిన కాలపరిమితిని బట్టి జీవించి మరణించును. కాని మానవుని దేవుడు నిరంతరము జీవించునట్లుగా సృజించాడు. ఆదాము హవ్వలను సృజించునప్పుడు వారికి మరణము అనునది కలిగించలేదు. అందుకే దేవుడైన యెహోవా తినవద్దన్న పండునుగూర్చి ఆదామునకు తెలిపి-నీవు దీనిని తినుదినమున మరణించెదవు. కనుక జాగ్రత్త వహించుమని చెప్పాడు. ఆదికాండము 2:17, ''అయితే మంచిచెడ్డల తెలివినిచ్చు వృక్ష ఫలములను తినకూడదు; నీవు వాటిని తినుదినమున నిశ్చయముగా చచ్చెదవని నరుని కాజ్ఞాపించెను.'' అనగా దేవుని ఉద్దేశ్యములో తన ఆజ్ఞను ఆదాము హవ్వ పాటించి నిరంతరము జీవించాలని ఉన్నది అని మనము గ్రహించాలి. అందుకే నిత్యజీవము వారికి పుట్టుకతోనే ఇచ్చాడు. కాని ఆదాము దేవుని ఆజ్ఞను మీరి మరణకరమైన పండును తిని మరణమును పొందాడు.
ఆదికాండము 3:2-3, ''అందుకు స్త్రీ-ఈ తోట చెట్ల ఫలములను మేము తినవచ్చును; అయితే తోట మధ్యవున్న చెట్టు ఫలములను గూర్చి దేవుడు-మీరు చావకుండునట్లు వాటిని తిన కూడదనియు, వాటిని ముట్టకూడదనియు (దేవుడు) చెప్పెనని సర్పముతో అనెను,'' అని వ్రాయబడిన ప్రకారము వారు నిత్యజీవమును కోల్పోయారు. ఇక్కడ మానవునికి చావు అన్నది ఏర్పడింది. ఇది సహజ మరణము. ప్రతి ఒక్కరము పొందవలసినవారమైయున్నాము. పుట్టినది మొదలు శరీరము చావునకు దగ్గర పడుచున్నప్పుడు ఈ శరీరము క్షీణదశను పొందుచున్నది. దీనికి కారణము ఆదాము నిత్యజీవము కోల్పోయి, పండు రూపములో ఉన్న మరణమును స్వీకరించుటయే. ఇక్కడ మనకు జంతువులలో కూడ చావు ఉన్నది కదా అన్న సందేహము రావచ్చును. జంతువులను దేవుడు నిరంతరము జీవించునట్లుగా సృజించెనని ఎక్కడ బైబిలు గ్రంథమునందు చెప్పబడలేదు. కాని ఆదామును హవ్వను మాత్రమే చావు లేకుండ సృజించినట్లు మనము గ్రహించవలసియున్నది.
''నీకు దృష్టి కలుగునట్లు,'' అనగా ఇది మనోనేత్ర దృష్టి అనగా ఆత్మ సంబంధ దృక్పధము. ఆత్మ సంబంధ దృక్పధమునకు దృశ్యమైన కాటుకలు పనికిరావు అని దీని భావము. ఆత్మకు రంగు లేదు. నలుపు రంగు శరీరానికి కావలసియున్నది. కాని శరీర దృష్టితో, శరీర నేత్రాలతో, శరీరముమీద మమకారముతో జీవించే వ్యక్తులకు దేవుని మాట-నీకు దృష్టి కలుగునట్లు అనగా నీవు శారీర దృష్టి నుండి మేల్కొని నీ శారీర దృక్పధమును మార్చుకొని, ఆత్మీయ దర్శనాలను నీవు అనుభవించుటకు నా సన్నిధిలో నా ప్రత్యక్షతను కోరి నాయొద్ద వాటిని నీ విశ్వాసమునుబట్టి కొనుక్కోమని హెచ్చరిక.
''నీకు దృష్టికలుగునట్లు నీ కన్నులకు కాటుకను నాయొద్ద కొనుమని నీకు బుద్ధి చెప్పుచున్నాను,'' అని అనుటలో మన అపరాధములచేత మన పాపముల ద్వారా మన ఆత్మీయ బలహీనతలనుబట్టి కొన్ని సమయాలలో మనము ప్రభువైన యేసును మన క్రియలనుబట్టి అమ్మేస్తున్నాము. యూదా ఇస్కరియోతు ముప్పది వెండి నాణెములకు క్రీస్తును అమ్మినాడు. నేటి క్రైస్తవ సంఘకాపరులు కూడ విదేశ ద్రవ్య సహాయము కొరకు ఎదురు చూస్తూ అనేక శ్రమల కోర్చి ఆత్మ సంబంధమైన బాధలు వేదనలు శ్రమలు నిందలు అనుభవించి తమయొక్క ఆత్మీయ విశ్వాసముతో కట్టిన సంఘములను ఇతరులకు అమ్ముకొనే స్థితికి దిగజారియున్నారు. మరికొందరైతే కేవలము తమ ప్రసం గాలను ధనసంపాదనకు వాడుకుంటున్నారు. గ్రుడ్డితనముతోనున్న మన మనోనేత్రాలకు ఆయన ఆత్మీయ సంపదను పొందుటకు మనము ఆయనను కొనుక్కోవలసిన పరిస్థితి ఏర్పడినది.
యేసు ప్రభువు తన ఐశ్వర్యముతో మనము ధనవంతులము కావాలని తన దైవత్వాన్ని, రాజ్యాన్ని, మహిమను, వెలుగును మరియు సర్వాధిపత్యమును వదలుకొని, చివరకు తన రక్తాన్ని తన దేహన్ని మనకొరకు ఫణముగా పెట్టి మనలను కొన్నాడు. అయితే ఆయన బలియాగమునుగూర్చి విన్న మనము, ఆయనను మరచి అవిశ్వాసులు, శారీర సంబంధులు మరియు నామ క్రైస్తవ జీవితాలలోను జీవిస్తున్నందున ఆయనను మనము పోగొట్టుకొన్నవారైనాము. అందువలన ఆయనను మనము కొనుక్కోవలసిన గతి ఏర్పడింది. యేసు ప్రభువును మనము కొనుక్కోవాలంటే ఆయన మనకొరకు చేసిన బలియాగమును సమర్పణను గ్రహించి మనము కూడ సమర్పించుకోవలసియున్నది. యేసు ప్రభువు మన కొరకు తన నిర్దోష పవిత్రమైన దేహమును ఆయన ఆత్మీయ జీవితాన్ని ఆయన జీవాన్ని మనకొరకు అర్పించాడు. అదే విధముగా మనము కూడ ఆయన వాక్య పరిచర్యను జరిగించువారమైయుండి ఆయన జరిగించిన బలియాగమును గూర్చిన నిగూఢ సత్యాలను గ్రహించినవారమై, మనయొక్క శారీర ఆత్మీయ జీవితాలను మార్చుకుంటూ ఆయనయందు మన ఆత్మీయ నేత్రాలకు కావలసిన కాటుకను, ఆతర్వాత ఆయన కృపను మనము కొనుక్కోవలసినవారమైయున్నాము.
ప్రభువుయొక్క ఆత్మీయ దృష్టియను కాటుకను మనము సంపాదించుకోగలిగితే, కళ్ళజోడుతో గాని కంటి సంబంధమైన ఔషధములతో పనిలేదు. కంటి జబ్బులు కూడ మనలనంటవు. అందుకే మత్తయి 7:3, ''నీ కంటిలోనున్న దూలము నెంచక నీ సహోదరుని కంటిలోనున్న నలుసును చూచుట యేల?'' ఇందునుబట్టి లోకములో ప్రతి నరునికి దృష్టి లోపమున్నట్లు అందులో ప్రధానమైన ఆత్మీయమైన దృష్టి లోపము మరెక్కువగా నున్నట్లు తెలియుచున్నది. అందుకే మన కనుదృష్టి కొరకు ప్రభువు తన వద్ద కాటుకను కొనమంటున్నాడు.
ప్రభువుయొద్ద కాటుకను కొనగలిగే స్థితిలో ఉన్నామా? లేక మనకున్న కొద్దిపాటి మనోనేత్ర దృష్టిని కోల్పోయి అంధులుగా జీవించే స్థితిలో ఉన్నామా?
ప్రకటన 3:20, ''ఇదిగో నేను తలుపునొద్ద నిలుచుండి తట్టుచున్నాను. ఎవడైనను నా స్వరము విని తలుపుతీసిన యెడల, నేను అతనియొద్దకు వచ్చి అతనితో నేనును, నాతో కూడ అతడును భోజనము చేయుదుము.''
దైవవాక్కు పలుకుచున్న పై వాక్యరీతిగా, పాత నిబంధన కాలములో దేవుడు తన జనాంగము నిమిత్తమేర్పరచిన ప్రవక్తలు, రాజులు, న్యాయాధిపతులు, మొదలైనవారిని దేవుడు తానే వారికి ప్రత్యక్షుడై పేరుపెట్టి పిలిచి, తన కార్యక్రమాలలో వారిని వాడినట్లుగా వేదములో మనము చదువగలము. అదే ప్రభువు నూతన నిబంధన కాలములో యేసుక్రీస్తు అను పేరుతో మనుష్యకుమారునిగ ఈ లోకములో జీవించి తాను ఎన్నుకొన్న వారియొక్క ఆత్మీయ జీవితముల నిమిత్తము, ఆయా సందర్భాలలో తానేర్పరచుకున్న గృహాలను దర్శించి, వారి హృదయ ద్వారాలను కదిలించినట్లు వేదములో చదువగలము.
యేసుక్రీస్తు ఈ లోకములో నరునిగ జీవించినప్పుడు ఆయనకు స్వాగతము పలికి, హృదయద్వారమును తెరచినవారిలో బేతనియలో మార్త, మరియలు, జక్కయ్య, బేతనియలో స్వస్థుడైన కుష్టురోగి, తన గృహములో ఆతిధ్యమునిచ్చి ప్రభువుయొక్క కాళ్ళను కన్నీటితో కడిగి తన శిరోజాలతో ఆయన పాదములు తుడిచి అత్తరు పూసి ఆరాధించి ముద్దుపెట్టిన మగ్దలేనెే మరియ, మొదలైనవారు. ఇంకా అపొస్తలుల కార్యములు 16:14లో వలె లూదియయను ఊదారంగు పొడి అమ్ము తుయతైర పట్టణస్థురాలియొక్క హృదయము తెరవబడి, పౌలుయొక్క జీవయుత మాటలు ఆమెలో ప్రవేశించుట ప్రభువు యొక్క మాటలలో తెరవబడిన తలుపులకు ఉదాహరణలైయున్నవి.
పేతురుతో యేసు ప్రభువు చెప్పిన మాట, మత్తయి 16:19, ''పరలోకరాజ్యము యొక్క తాళపుచెవులు నీ కిచ్చెదను, నీవు భూలోకమందు దేని బంధించుదువో అది పరలోక మందును బంధింపబడును, భూలోకమందు దేని విప్పుదువో అది పరలోక మందును విప్పబడునని అతనితో చెప్పెను,'' అని అనుటలో ప్రభువుయొక్క పిలుపు అందుకొని హృదయాన్ని తెరచి స్వాగతము పలికెడి విశ్వాసియొక్క జీవితానికి మాదిరియై యున్నట్లు మనము గ్రహించవలెను. అబ్రాహాము తన విశ్వాస జీవితములో తన హృదయ ద్వారమును, అన్ని సమయములందు దేవుని కొరకు తెరచియుంచినాడు. అయితే అబ్రాహాముయొక్క విశ్వాస పరిశోధన కొరకు, దేవుడు అబ్రాహాము భార్యయైన శారా గర్భమును మూసియుంచినాడు.
ఇందుకు కారణము దేవుడు అబ్రాహామును పరిశోధించు టయే! ఇందునుబట్టి దేవుడు లోకనరులయొక్క జీవితములోని లోకసంబంధమైన తలుపులు అను మానవ జీవితాన్ని విప్పి ఆ కుటుంబాలను ఫలవంతము చేయగలడు. అదేవిధముగా తనయొక్క విశ్వాసాన్ని కోల్పోయి అలక్ష్య వైఖరితో జీవించే నరజీవితాలను, వారియొక్క జీవన ద్వారములను దేవుడు మూసివేయగలడు. అలాగే నరునియొక్క ఆత్మీయ జీవితములో పరమాత్మునికొరకు ఎల్లవేళలు కనిపెట్టి, ఆయన కృప కొరకు తన హృదయద్వారమును తెరచిన పక్షములో, తెరచియున్న నరుని ఆత్మీయ జీవితములో పరమాత్ముడు ప్రవేశించి, జీవాత్మునిలో ఆత్మసంబంధమైన మంచి ఫలములను అనుగ్రహించి ఆశీర్వదించ గలడు.
ఆదికాండము 6:లో సృష్టి యావత్తును పాపములో మునిగియుండగా లోక నాశనము జరుపు సందర్భములో దేవుడు నోవహు అను నీతిమంతుని హృదయమును తెరచి పునఃసృష్టికి అతనిని జనకునిగ నియమించి అతని చేత ఓడను చేయించెను. జల ప్రళయమునకు పూర్వము కుటుంబసమేతముగా నోవహును ఆ ఓడలోనికి ప్రవేశింపజేసి, జలములు భూమిమీద ప్రవేశించునప్పుడు ఓడ తలుపులను దేవుడు స్వయముగా మూసివేసి ఓడలో నోవహును బంధించాడు. ఓడలో 150 దినములు నోవహు దేవునితోను, దైవ సృష్టితోను, ఆయన ఆత్మీయ సన్నిధిలో జీవించాడు. జలప్రళయ మారణహోమ అనంతరము భూమిమీద ప్రవాహ జలములన్ని ఎండిపోయిన తర్వాత ఓడ తలుపులను తెరచింది కూడ దేవుడే. అందుకు కృతజ్ఞతగా నోవహు దేవునికి ఇంపైన సువాసన గల బలిహోమము నర్పించి దేవుని సంతోషపరచినాడు. అంతేగాక నోవహునకును దేవునికిని నిబంధన గుర్తు ఏర్పడినట్లుగా కూడ ఈ వేదభాగములో చదువగలము. ఆ నిబంధన గుర్తు భూమిమీద గాక ఆకాశములో నేటికిని వర్షాకాలములో జ్ఞాపకార్థముగ దేవుడు నియమించియున్నట్లు మనము చూడగలము. ఇది దేవునికి హృదయ ద్వారమును తెరచి ఆతిధ్యాన్ని యిచ్చి దేవునితో నరుడు - నరునితో దేవుడు, కలిసి జీవించు భాగ్యము ఉన్నదనుటకు ఇటువంటి గుర్తులు దేవుడు అక్కడక్కడ మనకు ప్రత్యక్షముగా కనబరచిన సంఘటనలున్నవి.
ఆదికాండము 2:లో ఏదెనుయొక్క ద్వారము మరియు ఏదెనులోని ఆదాముయొక్క హృదయద్వారము దేవునికొరకు ఎల్లప్పుడు తెరచియుంచినదైయుండి, ప్రతినిత్యము దేవుడు ప్రవేశించినప్పుడెల్ల దేవునికి ప్రీతికరమైన విధానములలో మంచి ఫలితాలతో నిష్కల్మష నిర్దోష పరిశుద్ధ స్థితిలో ఉన్నది. ఆదాముయొక్క హృదయద్వారము తెరువబడియుండబట్టే ఆదాము లోటు లేని స్వాతంత్య్ర జీవితమును అనుభవించాడు. ఇందుకు కారణము ఏదెనులో నరుడు దేవుడు ఏకమై జీవించడమే! ఆదికాండము 19:11, ''అప్పుడు వారు పిన్నలు మొదలుకొని పెద్దలవరకు ఆ ఇంటి ద్వారము దగ్గరనున్న వారికి కనుమబ్బు కలుగజేయగా వారు ద్వారము కనుగొనలేక విసికిరి.'' ఇక్కడ లోతు ఇంటి ద్వారము కనుగొనకుండ కండ్లకు మబ్బు తెర కలిగించగా అంధులై సొదొమ నివాసులు లోతు ఇంటికి తలుపు ఏదో తెలియని స్థితిలో వెనుదిరిగారు. ఇది నరులకు దేవుడు అనుగ్రహించిన గుడ్డితనము. ఒక మనిషికి హృదయమనే ద్వారము తెరవబడవలెనంటే జక్కయ్య జీవితములో వలె క్రీస్తు ప్రభువు తట్టవలసిందే. క్రీస్తు ప్రభువు జక్కయ్య హృదయమును తట్టుట చేత జక్కయ్య హృదయ తలుపులు తెరబడినవి. మారుమనస్సు కలిగి దేవునితోబాటుగా ఆహారమును భుజించాడు. అదే విధముగా క్రీస్తు జీవించినంతకాలము హృదయము అను తలుపులు తట్టుచూనే ఉన్నాడు. క్రీస్తు మరణించి పునరుత్థానుడైన తర్వాత తన సువార్త రూపములో ప్రతి ఒక్కరి హృదయమును తట్టుచున్నారు.
అయితే ఎవరైతే జక్కయ్య లాగా హృదయమనే తలుపులను తెరుస్తారో, వారితో క్రీస్తు, క్రీస్తుతో వారు భుజించెదరు. అనగా. . . .
ప్రకటన 21:3-4, ''అప్పుడు-ఇదిగో దేవుని నివాసము మనుష్యులతో కూడ ఉన్నది, ఆయన వారితో కాపుర ముండును; వారాయన ప్రజలైయుందురు, దేవుడు తానే వారి దేవుడైయుండి వారికి తోడైయుండును. ఆయన వారి కన్నుల ప్రతి బాష్ప బిందువును తుడిచివేయును, మరణము ఇక ఉండదు, దుఃఖమైనను ఏడ్పైనను వేదన యైనను ఇక ఉండదు.''
ప్రకటన 3:21, ''నేను జయించి నా తండ్రితోకూడ ఆయన సింహాసనమునందు కూర్చుండియున్న ప్రకారము జయించువానిని నాతోకూడ నా సింహాసనమునందు కూర్చుండనిచ్చెదను.''
ఇందులో క్రీస్తు ప్రభువు జయించి ఆయన తండ్రి సింహాసనముపై కూర్చుండెనని వ్రాయబడింది. అపొస్తలుల కార్యములు 7:55-56, ''అయితే అతడు పరిశుద్ధాత్మతో నిండుకొనినవాడై ఆకాశమువైపు తేరిచూచి, దేవుని మహిమను యేసు దేవుని కుడిపార్శ్వ మందు నిలిచియుండుటను చూచి -ఆకాశము తెరవబడుటయు, మనుష్యకుమారుడు దేవుని కుడిపార్శ్వమందు నిలిచియుండుటయు చూచుచున్నానని చెప్పెను.''
ఈ విధముగా దేవుని కుడిపార్శ్వమున ఉండుట స్తెఫను తన దర్శనములో చూడగా, యోహానుకు తాను దేవుని మహాసింహాసనము పైన కూర్చున్నట్లుగా తెలియజేసి దానిని వ్రాయించుటకు ఈ వచనము జరిగింది. ఇంతకి తండ్రి సింహాసనము ఏది? యెహెజ్కేలు ఒకటవ అధ్యాయమంతా ఈ సింహాసనమునుగూర్చి వర్ణించబడియున్నది. దీనినిగూర్చి 66వ విభాగములో 4వ అధ్యాయములో చదువగలము. ఇంత మహిమా పూర్వితమైన సింహాసనములో క్రీస్తు ప్రభువు కూర్చుండుట జరిగింది అని చెప్పబడింది. ఈ సింహాసనముపై క్రీస్తు ప్రభువు కూర్చుండుట ద్వారా క్రీస్తు ప్రభువు సింహాసనముగా మారింది. ప్రకటన 22:1, ''మరియు స్ఫటికమువలె మెరయునట్టి జీవజలముల నది దేవునియొక్కయు గొఱ్ఱెపిల్లయొక్కయు సింహాసనము నొద్దనుండి.'' ఇలాంటి సింహాసనము పైన తనవలె జయించినవారికి కూర్చొను అవకాశమును ఇస్తానని చెప్పుచున్నారు. ఇలా అవకాశమును పొందాలి అంటే జయించాలి.
జయించాడు కాబట్టి క్రీస్తు ప్రభువు తండ్రియైన దేవుని సింహాసనముపై కూర్చొనుట జరిగింది కనుక ఆయన సింహాసనమే నా సింహాసనముగా క్రీస్తు ప్రభువుచే చెప్పబడింది. ఆ సింహాసనముపై మనము కూర్చున్న రోజు ఆయన సింహాసనము - నా సింహాసనముగా మారగా అదే సింహాసనము మనందరి సింహాసనముగా మారును.
ప్రకటన 20:4లో వలె వెయ్యి సంవత్సరములు క్రీస్తుతో కూడ రాజ్యము చేయబోవుచున్నాము. కనుక నీతి - పరిశుద్ధతతో క్రీస్తు ప్రభువు చెప్పిన ప్రకారము జీవిస్తే మనకు ఈ అరుదైన మహా ఆవకాశము లభించునని గ్రహించాలి.
ప్రకటన 3:22, ''సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినునుగాక.''
ఈ చెవిగలవాడు అని ప్రకటన 2:7, 2:11, 2:17, 2:29, 3:6, 3:13,
3:22లలో యేడుసార్లు చదువగలము. ఇంతకి ఈ చెవిగలవాడు ఎవరు?
అందరికి చెవులు లేవా? నీతిమంతునికి, అజ్ఞానికి, విద్యావంతునికి, విద్యా హీనునికి, పాపికి మొదలైన అందరికి చెవులున్నవి. ఇంతకి చెవులు లేనివాడెవడు? చెవులున్న వాడెవడు? దైవవాక్కులను పెడచెవిని పెట్టేవాడు, విధేయించనివాడు, అపార్థము చేసుకొనేవాడు, అలక్ష్యము చేసేవాడు, దేవుని వాక్యాన్ని హేళన చేయువాడు, చెవిలేనివాడు. సువార్త వినువాడు, దైవజనుని సలహా విని దేవుని వాక్యము ప్రకారముగా నడచువాడు, దైవప్రార్థనలో దైవజవాబుకు ఎదురు చూచువాడు కూడ చెవిగలవారే. ఇంకను సువార్త కొరకు ఆసక్తి గలవాడు, అభిలాష కలవాడు, సువార్త ప్రకటన వినాలని ఉద్దేశ్యము కలవాడు కూడ చెవిగలవాడు.