యోహాను సువార్త వ్యాఖ్యానము  (అమూల్య ముఖ్యాంశ ప్రసంగ తరంగిణి)

గ్రంథకర్త : శేఖర్‌రెడ్డి వాసా

www.FaithScope.com

నీ మరణానంతరము నీ ఆత్మ ఎక్కడ వుండబోవుచున్నదో నీకు తెలుసునా?

మూలము

రెడ్డిపాళెం గ్రామములోని నా ప్రభువు తల్లి ఉపదేశములు మరియు ఆమెను ఆవరించిన పరిశుద్ధాత్మయొక్క జ్ఞాన సహాయమే ఈ పుస్తక రచనకు మూలాధారము.

అంకితము

ఈ అవకాశాన్ని నాకు అనుగ్రహించి నన్ను ప్రేమించిన క్రీస్తు ప్రభువుకు అంకితమిస్తున్నాను. -  వాసా శేఖర్‌రెడ్డి

యోహాను శుభసందేశమునకు తొలిపలుకులు :-

        ప్రియపాఠకులారా!  పాత నిబంధన గ్రంథము ఐదు కాండములతో విరచితమై యున్నదన్న సత్యము మనకందరకును తెలిసిందే!  నేటి ఆధునిక యుగములో క్రైస్తవ్యము విస్తరించియున్న ఈ దినములలో - బైబిలులోని సంపూర్ణ దైవచిత్తమును ఎరుగనటువంటి ప్రబుద్ధులు కల్లబొల్లి దర్శనములు మాయమాటలు, వేషధారణ, కపట సన్యాసము, వగైరా దేహసంబంధమైన గుణాతిశయములతో 2 తిమోతి 3:2-5 వ్రాయబడిన వేదభాగములో వలె వాత వేయబడిన మనస్సాక్షి గలవారైన బోధకులు అనేకులు ఈ దినములలో విస్తరించి ప్రభుత్వ పరముగా క్రైస్తవునికి ఏ ఉద్యోగ అవకాశము లేని ఈ దినములలో అనగా సాతానుడు క్రైస్తవుని శారీర యుతముగా, ఆత్మీయముగా, ఆర్థికముగా శోధిస్తూ - జల్లెడ పట్టుచున్నటువంటి నేటి భూలోక ప్రభుత్వ విధానాలలో - ప్రత్యేకించి సాతాను అంత్యక్రీస్తుగా రూపాంతరము పొంది క్రైస్తవులలో చేరి, క్రైస్తవ మత గ్రంథమైన బైబిలును చంకన బెట్టి, అన్యులు చేసేటటువంటి క్రియాకర్మల కంటే అతి ఘోరమైన, మోసకరమైన, కఠినమైన, పాశవికమైన, కామక్రోధ మద మాత్సర్యములతో కూడిన స్వార్ధచింతనతో కూడిన చేయరాని హేయ కార్యాలను, క్రైస్తవ వాతావరణములో క్రైస్తవుల మధ్య అన్యుల ఎదుట జరిగిస్తున్న క్రియాకర్మలను గూర్చి మనము వార్తాపత్రికల ద్వారాను, టి.వి ల ద్వారాను, రేడియోల ద్వారాను, ప్రత్యక్షముగా మన నిత్య ఆత్మీయ జీవితము ద్వారాను చూస్తున్నాము చదువుచున్నాము -  తెలిసి కొంటున్నాము. అందుకే నానామము మీ నిమిత్తము అన్యుల మధ్య దూషింపబడుచున్నదన్న ప్రభువుయొక్క మనోవేదనను గూర్చి మనము ఈ సందర్భములో ఆలోచించాలి.  రోమా 2:24.

        ప్రియపాఠకులారా!  క్రైస్తవ్యాన్ని క్రైస్తవ మందిరాన్ని క్రీస్తు బలిపీఠాన్ని క్రైస్తవ సంఘాన్ని, సమస్తాన్ని తమ ఏలుబడిలో వుంచుకొని, క్రీస్తునే దోచి భాగలు వేసుకొనే ప్రబుద్ధులైన సంఘ పెద్దలు విస్తరించి సంఘాలను పాడు జేస్తున్న ఈ దినాలలో - క్రీస్తు పేరుతో కఠిక దరిద్రులైనటువంటి సోదరులను ఎరగా చూపి ధనార్జన చేసే ప్రబుద్ధులు విస్తరించియున్న ఈ దినములలో - క్రైస్తవ్యము ఎదగాలంటే ఏ రీతిని ఎదుగుతుందో, ఏ విధముగా నూతన ఆత్మలు ప్రభువులోనికి రాగలవో పాఠకులే యోచించండి.  అట్టి పూర్తి వివరాలు ఆత్మీయ మర్మాలు, సత్య మార్గాన్వేషణ, సత్యమార్గమును అవలంభించుటకు కావలసిన యోగ్యత ప్రభువులో అంటుగట్టబటి జీవించుటకు కావలసిన యోగ్యతలు, నిష్టనియమాలు, ఒక విశ్వాసి సంపూర్ణ మానవత్వమును పొందుటకుగల అర్హతలు - ''యోహాను శుభసందేశము'' అను ఈ గ్రంధములో పొందుపరచబడి యున్నవి.

        కనుక పాఠకమహాశయులు ఇందులోని ఆత్మీయ సందేశాలను, పరమార్థాలను, ఆత్మ జ్ఞానముతో పరిశోధించి గ్రహించి, మీయొక్క ఆత్మీయ ప్రోత్సాహములతో ఈ ప్రతులను విశేషముగా లోకమునకు ప్రకటించుటకు ఇతోధికముగా ఉజ్జీవముగా సహకరించి, నా రచనలకు తోడ్పడగలరని ప్రభువు నామమున మీకు విన్నవిస్తున్నాను.                                                  ఇట్లు  గ్రంధకర్త.

                        యోహాను ప్రవచన వ్యాఖ్యానము  ''యోహాను ప్రవచన ప్రసంగ ద్రాక్షావళి''

        యోహాను ప్రవచన (శుభ) సందేశములు, యోహాను శుభ సందేశ వివరణ :-

యోహాను సువార్తను గూర్చిన పీఠిక :-

        ప్రభువు నందు ప్రియపాఠక మహాశయులారా!  ఇంతవరకును నాచే విరచితమైన మత్తయి సువిశేష ప్రసంగ మంజరి, లూకా ప్రవచన సాహిత్యము, మార్కు సుబోధ సుమాంజలి, అను మూడు గ్రంథములుగాను - ప్రవచన సందేశములను గూర్చిన ఉపన్యాసములను గూర్చి విని యున్నాము.  ఆ మూడు పుస్తకములలోని ప్రవచన నిగూఢ సత్యములు, ప్రవచన విధానములు గ్రంధకర్తయొక్క జీవిత విశేషాలు అన్నియు ఒక రీతియైతే యోహాను రచించిన యోహాను సువార్త - యోహాను జీవితము - యోహానుయొక్క వచనములోని పరమార్థములు ఇవన్నియు కూడా యేసులో వుండి, యేసు ద్వారా లోకమునకు ప్రకటించబడి, యేసుయొక్క జన్మరహస్యమును యేసు పుట్టుకలో వున్న దైవసంకల్పము - భూలోకములో యేసుయొక్క జన్మము ద్వారా జరిగేటటువంటి ప్రణాళికయుతమైన కార్యక్రమములు, ఆయనలోని దైవత్వమును మహత్తరశక్తులను గూర్చి పూర్తిగా ఈ గ్రంథములో వివరించబడి యున్నవి.

        ప్రియపాఠకులారా!   నూతన నిబంధనలో యోహానులు ఇద్దరున్నారు.  ఇందులో యేసునకు బాప్తిస్మము ఇచ్చి హత్య గావించబడిన యోహాను వేరు.  యేసుక్రీస్తు శిష్యుడుగా యేసు చేత అత్యధికముగా ప్రేమించబడిన యోహాను వేరు.  యేసుకు భాప్తిస్మమిచ్చిన యోహాను దేవుని యొద్దనుండి పంపబడినట్లును వ్రాయబడి యున్నది.  యోహాను 1:6 అయితే దేవునియొద్ద నుండి పంపబడిన ఈ యోహాను ప్రభువును గూర్చి సాక్ష్యమిచ్చుటకును, ఆయనను అందరు విశ్వసించునట్లు ఆయనను గూర్చి లోకానికి  ప్రకటించునట్లు బాప్తిస్మమిచ్చు యోహాను ఈ లోకానికి వచ్చినట్లుగ ఇందులో వివరమై యున్నది.  ఈ యోహాను గొడ్రాలైన ఎలీసబెతుకు పరిశుద్ధాత్మ వలన జన్మించినట్లుగ లూకా 1:5-25 చదివితే దేవునియొద్ద నుండి పంపబడిన యేసునకు బాప్తిస్మము ఇచ్చిన యోహానుయొక్క జనన మర్మములు వివరములు తేటగా తెలియగలదు.  కనుక ఈ యోహాను దేవుని యొద్ద నుండి పంపబడినట్లుగ మనకు నిర్ధారణయై యున్నది.

        అయితే దైవ రూపమైన యేసుక్రీస్తుయొక్క తర్ఫీదులో ఆయన అధ్యయనములో ఆయన సమస్త కార్యాలలో పాలివాడై యుండి, ప్రభువు చేత అత్యధికముగా ప్రేమించబడిన ఈ యోహాను యేసుక్రీస్తు సిలువ మరణము పొందినంతవరకు అనగా సిలువలో మరణ వేదన అనుభవిస్తున్నంత వరకు ప్రభువు సిలువ వద్ద సాక్షిగా నిలబడుటయేగాక ఆయన మరణమునకును, ఆయన పునరుత్థానములో కూడా పాలివాడై యున్నట్లుగా యోహాను 21:16లో పునరుత్థానుడైన ప్రభువుయొక్క దర్శనమును చూచుటయే గాక యోహాను ప్రకటన గ్రంథమునకు గ్రంథకర్తగా ఉంటూ - కేవలము గ్రంథ రచనయేగాక ప్రభువుయొక్క రెండవ రాకడలో జరుగబోవు సంఘటనలను ప్రత్యక్షముగా దర్శనముల ద్వారా చూచి రాసిన గ్రంథమే ప్రకటన గ్రంథము.  ఈ గ్రంథము యేసు శిష్యులందరిలో కెల్ల యోహానులో ఒక ప్రత్యేకమైన ఆధిక్యత ఉన్నది.  ఈయన ప్రభువు చేత ఎక్కువగా ప్రేమింపబడుటయే గాక, ప్రభువు రెండవ రాకడలో జీవించు సజీవుల లెక్కలో ఈయన ఉన్నాడు.

        ప్రియపాఠకులారా!  యోహానును గూర్చి వ్రాయాలంటే చాలా వుంది.  ఇందునుగూర్చి ఈ గ్రంథములో వివరించబడిన లేఖన భాగాల ద్వారా ద్వారా తెలిసికొందము.  ఇంతవరకు నాచే విరచితమైన గ్రంథాలను పాఠకులు ఆదరించిన విధముగానే ఈ గ్రంథమును కూడా సోదర సోదరీమణులు ఆదరించి ఇందులోని ఆత్మీయ సత్యాలను గూర్చి ఆత్మీయ అనుమానాలు ఏవైన వున్నట్లయితే నాకు తెలియ జేయగలరు.

        యోహాను 1:1లో ఆదియందు వాక్యముండెను అన్నట్లుగా లోకము చివరి యుగములో ఉన్నను మరల మొదటికే వచ్చినట్లుగా దైవక్రియ నిరూపిస్తున్నది ఎట్లు?  ఆదియందు వాక్యము బోధించువారు లేక వినువారు లేక చలనము లేనిదై ఉండెను.  ఆ వాక్కే దేవుడైయుండెను.  అది ఒక దేవునికే పరిమితమై యుండెను.  యోహాను సువార్త 1:4లో విధముగా వాక్యము అనే దేవునిలో జీవమున్నట్లును, ఆ జీవము ద్వారా సృష్టికిని, నరకోటికిని వెలుగు ప్రసారమైనట్లు ఐదవ వచనము వివరించుచున్నది.  అటుతర్వాత సృష్టి - నరకోటి విజృంభించి, గర్వమదాంధులై దైవత్వమును విసర్జించి, అజ్ఞానాంధకారములో జీవిస్తుండగా జీవవాక్కయిన దేవుడు తన కాంతికిరణముల ద్వారా 14 వ వచనము ''ఆ వాక్యము శరీరధారియై నరకోటి మధ్య నివసించినట్లును, అప్పటికిని నరులు అజ్ఞానులై నిర్దోషియైన - ఆ వాక్య శరీరుని దోషిగా నిర్ణయించి, మరణశిక్షను విధించి చంపగా - ఆయన జీవవాక్య శరీరి గనుక మరణమన్నది లేనివాడు గనుక మరణించినట్లును, కనపడి సమాధికి అలవిగానివాడైనను, సమాధి చేయబడినవాడుగా ఉండి నిర్ణీతకాలములో అనగా మూడవ దినమున ఆయనను మ్రింగిన సమాధి భయాక్రాంతురాలై నోరు తెరచుకొనగా - మహిమాన్విత వాక్య శరీరియైన ఆశరీరి పునరుత్థానుడైనట్లు, అనగాఆయన కేంద్రమెక్కడనున్నదో అక్కడకు చేరుకున్నట్లు గ్రంథ వివరణ.  అట్టి శరీరియైన వాక్యము నేడు జీవవాక్యమై, దృశ్యములో వేదభాగముగ కనపడుచు ఆదిలో ఏ విధముగా చీకటి అగాధ జలముల మీద ఈ ఆత్మ అల్లలాడినదో అదే విధంబుగ లోకములో ప్రస్తుతము ఆవరించియున్న అజ్ఞానము, హేతువాదము, నాస్తికత్వము, ఉగ్రవాదత్వము, (టెర్రరిజమ్‌) నక్సలిజమ్‌, వగైరా చీకటి జనసందోహముల యొద్ద అలనాడు అల్లాడినట్లు ఈనాడు కూడా సువార్తీకులు బోధకులు ఉజ్జీవ సభలని రేడియోల ద్వారా టెలివిజన్‌ ద్వారా విమానాల రూపమున అల్లాడుచు, సృష్టికి పూర్వమున్న స్థితిని బైల్పరచుచు, నాడున్న చీకటియే నేడు జనముల మీదనున్నట్లుగా ఈ వాక్యమును దేవుడు ఋజువు పరచుచున్నాడు.        

        ఇట్టి సందర్భములో ప్రకటన 21:1 వచనములో వలె అంతట నేను క్రొత్త ఆకాశము క్రొత్త భూమిని చూచితిని - ఈ భూమి మరల యధావిధిగ దైవోగ్రతకు పాలై, లయమై, మొదటి స్థితికి వచ్చునట్లును, దీనికి మరల పునరుజ్జీవనము వున్నట్లును పాత నరులు పాతభూమియు నశించిపోగా - వాక్కైన దేవుడు మరియు నూతన భూమిని, నూతన నరసృష్టిని కల్పించునని తెలియుచున్నది.  కనుక దేవుడున్నాడు.  సోదరీ!  సోదరుడా!  ఇంకను నీవు నమ్మవా?  అట్టి నమ్మకము నీకున్నట్లయితే ఆయనను విశ్వసించు ఇదే నీకు రక్షణ దినము.  ఆదిలో భూమిని సృష్టించినప్పుడు సముద్రము వుండినది.  ఈసారి భూమికి సముద్రము పాలయ్యే గతి లేదుగాని అగ్నితో దహించబడి, ఆర్పుటకు నీళ్ళు కూడా లేని దరిద్రస్థితి ఏర్పడనున్నట్లు ప్రకటన 21:2లో సముద్రమును ఇకను లేదు.  అట్టి ఉగ్రతను నీవు చూడక మునుపే ప్రభువులో నీవు, మీరు, నేను కూడా మన ఆత్మలను ఆయనలో విలీనము చేసికొనుటకు ప్రయత్నించుదుము గాక!  ఆమేన్‌.

        అంశము - గొర్రెపిల్ల

        మూలము యోహాను 1:29 ఇదిగో లోకపాపములను మోసికొనిపోవు దేవుని గొర్రెపిల్ల.

        ప్రియపాఠక మహాశయులారా!  పిల్లలు అనేటటువంటిది మానవత్వానికిని, దైవత్వానికిని, ప్రీతికర నామము.  అనేక జీవరాసుల సంతానానికి వున్నవి.  ఉదా|| సింహపు పిల్లలు, పులి పిల్లలు, పిల్లి పిల్లలు, కుక్క పిల్లలు, ఏనుగు పిల్లలు, గుర్రపు పిల్లలు, ఒంటె పిల్లలు, పంది పిల్లలు, తోడేలు పిల్లలు, నక్క పిల్లలు, వగైరా పిల్లలు అనే నామధేయముతో తెలుపబడు జంతుజాలమున్నది.  దూడలు అనే నామధేయముతో తెలుపబడు దూడలు అని పిలువడు జంతుజాలమున్నది.  ఆవు దూడ,  బర్రె దూడ, వగైరా జంతువుల సంతానానికి దూడలు; ఆ విధముగా పిల్లలు అనే నామధేయముతో జంతుజాలములో రెండు విధాలుగా విభజింపబడియున్నవి.  అలాగే గొర్రెపిల్లలు అనియు, మేకపిల్లలు అనియు, కొన్ని జంతుజాలములో సంతానాన్ని పిలుస్తున్నాము.  అయితే వీటినన్నిటికిని సృష్టికర్తయు, జీవాధిపతియు, సర్వాంతర్యామి, సర్వశక్తిమంతుడైన దేవుని సంతానాన్ని గొర్రెపిల్లలుగా పిలుచుటలో గొర్రెపిల్లకున్న ప్రత్యేకత ఏమిటి?  గొర్రెపిల్ల అన్నది రాచరికానికి సూచన కాదు.  లేక దీనత్వానికి సూచన కాదు.  లేదు ఒక దేశ ఘనతకు సూచనా?  దేనినిబట్టి గొర్రెపిల్లను దైవత్వమన్నది ఒక ప్రత్యేకతగా ఉన్నదో మనము దానిని గూర్చి దీర్ఘముగా ఏనాడైనను ఆత్మీయ జ్ఞానముతో పరిశోధించామా?  ఎందునుబట్టి దైవత్వమన్నది గొర్రె పిల్లకు ప్రాధాన్యతనిచ్చి యున్నదన్న సత్యాన్ని వేదరీత్యా మనము ఇప్పుడు తెలిసికొందము.  

        ఆదిలో దేవుడు లోకసృష్టిని జరిగించి నర నిర్మాణము గావించి, నరునియొక్క జీవితానికి, లోకముయొక్క మనుగడకు, సంబంధ బాంధవ్యాలను ముడిపెట్టి అనగా నరుడు శరీరరీత్యా లోకసంబంధియే, అనగా భూసంబంధి, ఇంకా చెప్పాలంటే భూగర్భములోని మట్టితో శారీర సంబంధము కల్గినవాడు.  ఈయొక్క సత్యాన్ని నరులమైన మనము ఆత్మీయ జ్ఞానముతో ఆలోచించినట్లయితే, ఈనాడు మనము - మన శారీర విలువలనుబట్టి అతిశయించేవారము కాదు.  ఇంకా దేవుడు లోకముతో నరజీవితాన్ని ఎలా ముడిపెట్టినాడంటే, భూఫలాలు భుజించుట ద్వారా, ఆహారరీత్యా పోషణ - నరుని పోషించు విధానములో భూమి తల్లిగాను, నీళ్ళను పానీయముగా నరునికి అనుగ్రహించుటనుబట్టి వీటితో సంబంధ బాంధవ్యాలు. అన్నిటికంటే ముఖ్యముగా నరునికి కావలసిన వాతావరణము, గాలి, చల్లదనము, సమశీతోష్ణ వాతావరణము, వీటిని కల్గించుచు, నరుని తన కౌగిటిలో ఉంచుకొని, భూమి దైవశాపానికి గురిగాక పూర్వము నరునితో భూమి - భూమితో నరుడు; సృష్టితో ప్రకృతి - ప్రకృతితో సృష్టి - వీటన్నిటితోను, సృష్టికర్తయైన దేవునితో ఆత్మీయ జీవయుత క్రియాకర్మల ద్వారా అవినాభావ సంబంధ బాంధవ్యాలు కల్గించుచు, భూమితో నరుడు - నరునితో భూమి;  పంచభూతాలతో సృష్టి - సృష్టితో దేవుడు.  అలాగే నరులతో కలిసిమెలిసి ఒక కుటుంబ యజమానివలె సుఖజీవనము సాగిస్తుండినట్లుగ ఆదికాండము ఒకటి, రెండు అధ్యాయాల చరిత్ర మనకు వివరిస్తున్నది.  

        ఆ విధముగా ఆదిసృష్టిలో పిల్లలు, దూడలు, కూనలు, అనెడి విచక్షణ లేకుండ అన్నియును ఏకముగా, సమిష్టిగా జీవించినట్లుగ కొన్ని సందర్భాలు మనకు వివరిస్తున్నవి.  దైవహస్తముతో  ఆనాటి నరుడు చేయబడబట్టి పిల్ల అని లేదు - పెద్దవాడుగానే రూపించబడినాడు.  తల్లి చనుబాలు తాగినవాడు కాదు.  తల్లి చేత స్నానపానాదులు జరిపించుకొన్నవాడు కాదు.  తల్లి చేత ఆహారాన్ని తినినవాడు కాదు.  తల్లి అంటే ఏమిటో?  ఎరుగడు.  అయితే నరునికి తల్లి అని భూమికి తెలుసును.  అయితే నరుడు భూమినుండి పుట్టినాడన్న సత్యాన్ని భూమి ఎరుగును.  ఎందుకంటే దేవుడు భూగర్భము నుండి మట్టిని తీసినప్పుడు ప్రత్యక్షముగా నర నిర్మాణ క్రియను భూలోకమన్నది ఎరిగియున్నది.  కాని వానికి మంచి చెడు అను జ్ఞానాన్ని ఉపదేశించుటకు ఉపాధ్యాయుడు లేడు.  ప్రత్యక్షముగా పోషించే తల్లి లేదు, ఎందుకంటే భూమి - భూసృష్టిలోని సృష్టములతో నిండియుండి అలంకరించియున్నదేగాని దానికి మానవ రూపము లేదు గనుక ప్రత్యక్షముగా నరునితో నేను నిన్ను కన్నాను, నీవు నా బిడ్డవు, అని చెప్పగల వాక్శక్తి - వాక్శబ్దము, ఉపదేశ జ్ఞానమును బయల్పరచుటకు భూమికి నాలుక లేదు.  అంతేగాక దేవుని చేత రూపించబడిన ఈ అనంత విశ్వము అన్నది భాషలకు దూరమై, తాను మాట్లాడే మాటలకు అనువైన జీవి లేనందుకు సృష్టి కూడా మూగదైయున్నట్లుగ ఆనాటి భూలోకసృష్టిని గూర్చి ఆలోచిస్తే విషయాలన్నియును తెలియగలదు.  అనగా భూమికి వాక్కు లేదు.  భూమి నరుని బుజ్జగించుటకు దానికి అవకాశాలు లేవు.  

        ఇలాంటి వాతావరణములో ఒకానొక దినమున భూమి మాట్లాడకపోయినను, భూమికిని, నరునికిని మధ్యవర్తియు, దేవుని ఆత్మకు ప్రత్యర్థియైన సాతాను ఆత్మ - తాను అదృశ్యములో వున్న తనకు ఒక రూపము కావలసి భూమితో సంబంధ బాంధవ్యాలు ఏర్పరచుకొన్నాడు.  ఈ సంబంధ బాంధవ్యాలన్నది దేవుడు తూర్పుదిక్కు వేసిన పరిశుద్ధ వనమైన ఏదెనులో చక్కటి అవకాశమును భూమి సాతానాత్మకు ఇచ్చింది.  ఈ అవకాశము ఆసరాగా చేసుకొని, నిరాకార అలౌకిక ఆత్మ, దైవాత్మ పూర్ణుడైన భూగర్భము నుండి తీయబడిన నరుని మోసగించాలంటే భూసంబంధమైన వాటి ద్వారానే సంబంధము కల్పించుకొని, భూసంబంధమైన నరుని మోసగించుటన్నది సాధ్యము, అనిన తలంపుతో దేవుడైన యెహోవా సృష్టించిన భూజంతువన్నది భూసంబంధమైనదేగాని, పరలోకసంబంధమైనది కాదు.  భూలోకములోనే సర్పానికి ప్రాబల్యము ఉందిగాని ప్రియపాఠకులారా!  పరలోకములో మాట మాత్రమైనను, సర్పము అన్న మాటను అనుకొన్నటువంటివారు లేరు.  ఆ విధముగా సర్పములో ప్రవేశించిన సాతాను - స్త్రీతో - సంభాషిస్తూ దైవనిషేధమైన భూసంబంధ ఫలమును, మంచి చెడ్డలను, వివేకమును తెలుపు ఫలమును, పాపకార్యమునకు సాహసింపజేసే ఫలము, భూలోకముయొక్క పూర్వార్థమును గ్రహించేయొక్క ఫలము, అంటే ఇందునుగూర్చి నరుని నుండి తీయబడిన నారికి సర్పము ద్వారా సాతాను చేసిన ప్రసంగములోని భావాలు ఈలాగున్నవి.  అంటే భూమిని ఘనపరచి, దైవత్వము నుండి నరులను విడగొట్టి, వారందరు భూమి బిడ్డలన్న సత్యాన్ని తెలుపుచు, తమకు జన్మనిచ్చిన దేవుని పూర్తిగా మరచి, ఈయన పట్ల వ్యతిరేకులై, వారియొక్క భవిష్యత్తు మట్టిలో కలిసిపోవుచున్నదన్న సత్యాన్ని మరుగుపరచి, ఈ ఉపన్యాసము సర్పము చేసినట్లు గ్రహించాలి.

        ప్రియపాఠకులారా!  సృష్టికర్తయైన దేవుడు నరులను శాసిస్తూ తాను నిషేధభూఫలమును గూర్చి మాట్లాడుచు, 2:16, ''ఈ తోటలో నున్న ప్రతి వృక్షఫలములను నీవు నిరభ్యంతరముగా తినవచ్చును.  అయితే మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్షఫలములను తినకూడదు - నీవు వాటిని తినుదినమున నిశ్చయముగా చచ్చెదవు,'' అనుటలో దేవుడు అబద్ధమాడడు, సత్యాన్ని మాట్లాడి యున్నాడు,'' ఎందుకనగా సృష్టించబడిన ఆ చెట్టు దైవసృష్టియే;  అయితే నరునియొక్క ఆత్మీయ పరిశోధన చేయుటకు దేవుడు మాట్లాడిన మాటలేగాని, వాస్తవానికి ఆ పండులో ఏ దోషము లేదు.  వేదములోనే ఆ వృక్షము ఆహారానికి మంచిదియు, కన్నులకు అందమైనదియు, వివేకమిచ్చు రమ్యమైనది, వగైరా మంచి గుణాతిశయములను గూర్చి ఆది

3:6లో వివరించబడి యున్నది.  అలాంటప్పుడు నిషేధింపదగిన కారణము నరుని బుద్ధిని పరిశోధించుటకు నరునికి నిషేధము విధించాడు.  సర్పము దైవసృష్టియైన్పటికిని, అది భూమిలో నుండి అవతరించింది గనుక, భూమికి సంబంధమైనది గనుక, అందులో దైవత్వము ఏ మాత్రము లేదు గనుక అది అపవాది ఆవేశమునకు మరియు అపవాది చేయబోవు తోట ప్రవేశానికిని అది దారి ఇచ్చింది కనుక, భూజంతువు - భూఫలము రెండును చేరి దేవుడు సృష్టించినను, సాతానును ఏమియు చేయలేక, ఎదుర్కొనలేక, స్త్రీయొక్క ఒంటరితనాన్ని కోరుకోవడము - అలాంటి ఒంటరితరనముయొక్క అవకాశము కొరకు నిరీక్షిస్తున్న ఆ సమయము ఆసన్నమైనప్పుడు సాతాను సర్పము ఏకమై, ఈ రెండింటితోబాటు మూడవదియైన భూసంబంధ నిషేధఫలవృక్షము మూడును నరులు దైవవ్యతిరేక క్రియజరిగించుటకు త్రిత్వముగా క్రియ జరిగించాయి.  1.  అపవాది.  2.  అపవాదికి అవకాశము ఇచ్చిన సర్పము.  3.  ఈ రెండింటికి ఆలవాలమైన దేవుడు నిషేధించిన ఫలవృక్షము.  ఈ విధముగా త్రిత్వముగా పాపక్రియ జరిగించినందున దైవకుమారుడైన యేసుక్రీస్తు కూడా - ఏ చెట్టు దైవకృపనుండి, దైవత్వమునుండి వేరుపరచిందో - ఆ చెట్టు శాపమునకు, మరణమునకు, నిషేధఫలముగా సిలువ మ్రానును దైవకుమారుడు వ్రేలాడేడంటే ప్రియపాఠకులారా!    ఈయన గొర్రెపిల్లయైనాడు.  ఎందుకంటే అపవాదియొక్క పోరాటమునకు సహకరించిన పాపమునకు ప్రతిరూపమైన సర్పము, నరుడు తినిన నిషేధఫలవృక్షము ఈ మూడును త్రివిధమైన శక్తులుగా నరజీవితము పట్ల క్రియ జరిగించినవి.  అయితే పరిశుద్ధ గ్రంథములో నానా సమయాలలో, నానా సందర్భాలలో, పాతనిబంధనలో, మోషే చరిత్రలలో, ఆ తర్వాత భూమిలో విస్తరించిన నానావిధ అన్యజాతులలో, విభజింపబడిన నరసందోహములో సర్పానికి చాలా ప్రాముఖ్యత పొందింది.  

        మొట్టమొదటి ప్రవక్తయైన మోషేను దేవుడు శాసిస్తూ నీచేతిలోనిది ఏమిటి?  అన్నప్పుడు ఇది కర్ర అని చెప్పుటయు నేలపడవేసినప్పుడు సర్పమైనట్లు నిర్గమ 4:2లో చదువగలము.  ఆ కర్ర సర్పముగా ఎందుకు మారాలి?  సర్పానికంటె క్రూరమైన జంతువులు పశుపక్ష్యాదులున్నాయి కదా? ఆ రూపాలుగ మారవచ్చును గదా? అది సర్పముగా ఎందుకు మారింది?  అనిన ప్రశ్న ఈనాటికిని క్రైస్తవ లోకములో వుంది.  దేవుడు పాతనిబంధనలో మూడు చోట్ల సర్పాన్ని గూర్చి ప్రస్తావించిన సంఘటనలున్నవి.  మోషే చేతి లోని కర్ర క్రింద పడవేయగా సర్పమగుటయు,  ఆ సర్పముయొక్క తోక పట్టుకోగానే తిరిగి కర్రగా మారుట.  ఇందునుబట్టి ప్రియపాఠకులారా!   నాడు మోషే చేసిన సర్పము మోషే చేతి కర్రగా వున్నట్లున్నది గాని, ఈనాడు కర్రతోను, మట్టితోను, లోహములతోను, శిలలతో చేయబడిన సర్పరూపాలు కోకొల్లలుగా ఉన్నాయి.  పై పెచ్చు వాటికి గుళ్ళు కట్టి ఆరాధిస్తున్నారు.  వాటికి నివాసమైన పుట్టలను పూజిస్తున్నారు.  అలాగే ఫరో ఎదుట మోషే అహరోనులు వెళ్ళినపుడు దైవశక్తిని మోషే అహరోనులు దేవుని మహిమను చాటుచున్న సందర్భములో - ఫరో తన మంత్రగాళ్ళ మంత్రములకును, శకునగాండ్లను, పిలిపించినప్పుడు నానావిధ పరిమాణము గల సర్పాలను మంత్రశక్తితో సృష్టించినప్పుడు, ఫరోలో ఎలాంటి చలనము కలుగక ఇది సామాన్యమే అని అనుకున్నాడు.  అహరోను తన చేతి కర్రను నేలపడవేసినప్పుడు, బ్రహ్మాండమైన సర్ప రూపము ఎత్తి, శకునగాండ్ల సర్పాలను మ్రింగివేసినట్లును వేదములో చదువగలము.        

        ఇక సంఖ్యా 21:6-9లోని వేదభాగములలో మోషే మీద తిరుగుబాటు చేసిన జనాంగము పట్ల దేవుడు ఆగ్రహించి ఉగ్రుడై, వారి మీదకు సర్ప ప్రయోగము చేయగా మహా మరణకరమైన విషతుల్యమైన సర్పములు ఇశ్రాయేలు మీదపడి వారిలో అనేకులను సంహరించినట్లును అలాంటప్పుడు మోషే దేవునికి మొరపెట్టి తన జనాంగాన్ని క్షమించమని వారిని కనికరించమని, ఈ సర్పవిషము నుండి కాపాడమని ప్రార్థించినప్పుడు ఆయన శాంతించి ఇచ్చిన సలహా - ఇత్తడితో సర్పమును చేయించి దానిని ఎత్తయిన స్థలములో ఉంచమని, ఈ మాటను దేవుడే స్వయముగా మోషేతో - ఆ ఎత్తబడిన సర్పమును నిదానించి చూచినవారు సర్పకాటు నుండి విమోచింపబడుదురని సలహా ఇచ్చాడు.  ఇది ఎందుకు జరిగింది?  దేవుడేమైనట్లు?  మోషే చేతితో చేయబడిన ఇత్తడి సర్పము దేవుడా?  తన జనాంగమైన ఇశ్రాయేలుకు సర్పవిషము నుండి కాపాడుటకు దేవుడు అసమర్థుడా?  ఎందుకు ఈ విధముగా మోషేకు సెలవిచ్చాడు? ఆ విధముగా మోషే దేవుని మాటను శిరసావహించి, చేసిన ఆకారము సర్పకాటుకు గురియయ్యే వారందరు నిదానించి చూచి, సర్పవిషము నుండి తొలిగి సజీవులయ్యారు, స్వస్థత పొందినారు.  మరి ఈ మూడు సందర్భాలలో దేవుడు సర్పాన్ని ఎత్తి చూపుటలో అర్థమేమిటి?  అలాగే యోహాను 3:14లో దైవకుమారుడైన యేసుక్రీస్తు తన దేహాన్ని ఆ ఇత్తడి సర్పానికి ముంగుర్తు చేసికొని ''అరణ్యములో మోషే సర్పమును ఏలాగు ఎత్తెనో, ఆలాగే విశ్వసించు ప్రతివాడును నశింపక, ఆయన ద్వారా నిత్యజీవము పొందునట్లు మనుష్యకుమారుడు ఎత్తబడవలెను,'' ఆయనే తనను గూర్చి సర్పానికి పోల్చుకొన్నాడు.

         ఇంతకు ప్రియపాఠుకలారా!  పై వాక్యమును బట్టి యేసుప్రభువు ఎత్తబడిన మోషే ఎత్తిన సర్పానికి మాదిరిగా ఉన్నాడా?  లేక లోకపాపములు మోసే దేవుని గొర్రెపిల్లగా వున్నాడా? గొర్రెపిల్లకు బరువులు మోసే శక్తి బలము ఉన్నదా?  బరువులు మోసే జాతికి చెందిందా?  గొర్రెపిల్ల సన్న జీవాలలో అనగా బలహీన పశువు గణానికి చెందింది.  యేసుక్రీస్తును గొర్రెపిల్లకు పోల్చుటలో - దేవునియొద్ద నుండి పంపబడిన యోహాను అను భక్తుడు ప్రకటించుటలో ఇందులోని పరమార్ధమును గూర్చి తెలిసికొందము.  గొర్రెపిల్లలో అమాయకత, తనను పోషించి, పెంచే యజమాని పట్ల ప్రేమ, అనురాగము, విధేయత, తనను పెంచి పెద్దజేసే యజమానిని గుర్తించే స్వభావము కూడా ఉంది.

        ఆది 49:11లో యాకోబు తన కుమారులను సమావేశపరచి మాట్లాడిన మాటలలో ''ద్రాక్షావళ్ళికి తన గాడిదను, ఉత్తమ ద్రాక్షావళ్ళికి తన గాడిద పిల్లను కట్టి, ద్రాక్షారసములో తన బట్టలను - ద్రాక్షల రక్తములో తన వస్త్రమును ఉదుకును,'' అనిన పై మాటలను బట్టి ''ద్రాక్షావళ్ళికి తనగాడిదను,'' అనుటలో ఇశ్రాయేలు అను దైవజనాంగములో కన్యక నుండి పరిశుద్ధాత్మ ద్వారా జతపరచబడిన గాడిద అనగా కన్యకయైన మరియమ్మ,'' ఉత్తమ ద్రాక్షావళ్ళికి తన గాడిద పిల్లను - ''ఉత్తమ ద్రాక్షావళ్ళి క్రీస్తే!  యోహాను 15:1లో యేసుప్రభువు పల్కిన మాట, ''నేను నిజమైన ద్రాక్షావళ్ళిని,'' అనుటలో ఉత్తమ ద్రాక్షావళ్ళి ఈయనయే.

        ఇందునుబట్టి ప్రియపాఠకులారా!  మొదటి ద్రాక్షావళ్ళి కన్యకయైన మరియమ్మ ఆమె చూలాలి అయినప్పుడు మోసింది గాడిద - ద్రాక్షావళ్ళికి తన గాడిద,'' అనుటకు ఇదియే ఆ పరమార్థము.  పరిశుద్ధాత్మతో కట్టబడిన కన్యకయైన నిండు చూలాలైన మరియమ్మను గాడిద మోసింది,'' ఇందునుబట్టి ద్రాక్షావళ్ళిని గాడిద మోసింది.  ఆ తర్వాత యేసుక్రీస్తు యెరూషలేములో జయోత్సాహముతో ప్రవేశించునప్పుడు, కట్టబడిన గాడిద పిల్ల ఇది ప్రభువును మోయబట్టి, దానికి ఘన సన్మానము జరిగింది,  యోహాను 12:12-15 మత్తయి 21:1-11 ఇందులోని ఈ వాక్యము ప్రకారము గాడిదపిల్ల జీవితము ఘనత వహించి యుండగా - యేసుక్రీస్తును గొర్రెపిల్లగా ప్రకటించుటలోని మర్మము ఏమిటి?  యేసుక్రీస్తును గొర్రెపిల్లకు పోల్చి, గొర్రెగా అభివర్ణించకపోతే, మోరియా పర్వతము మీద అబ్రాహాము దర్శనములో కనబడిన పొట్టేలు దర్శనముయొక్క దైవసంకల్పము నిరాధారమై యుండెడిది.  ఎందుకంటే యేసుక్రీస్తు పుట్టక మునుపే మరియమ్మ పుట్టుకను గూర్చి ఇశ్రాయేలు ఏర్పడక పూర్వమే అబ్రాహాముయొక్క విశ్వాస పరీక్షను జరిగించిన దేవుడే, భవిష్యత్తులో యేసుక్రీస్తు జననము ఆయన బలియాగము - గొర్రెపిల్ల బలికి సాదృశ్యము అన్నది, ఆ పూర్వార్థము బాప్తిస్మమిచ్చు యోహాను నోట వచ్చిన ప్రవచనము ద్వారా నెరవేర్చబడినట్లు మనము గ్రహించవలసియున్నది.  యోహాను 1:29.

        ప్రియపాఠకులారా!  యోహాను ఈ లోకానికి వచ్చిన తర్వాత ఆయన యుక్తవయస్కుడై, తన కంటే చిన్నయైన యేసుక్రీస్తు తన వద్దకు రాగా - లోకపాపము మోయు దేవుని గొర్రెపిల్లగా ఆయనను ప్రకటించుటలోని పూర్వార్థమిదియే.  అయితే లోకసంబంధులైన మనము మన ఆది తండ్రియైన ఆది నరులు దైవాత్మను వ్యతిరేకించి, దైవాజ్ఞ వ్యతిరేకమైన దైవనిషేధ కార్యమును జరిగించి, తద్వారా దైవత్వానికి సర్పబోధ మూలముగా దైవనిషేధ ఫలమును బట్టి, మన ఆదితండ్రి పాపదోషమన్నది మనలను సర్పసంతానముగా మార్చింది.  అనగా మనము పాము పిల్లలము.  అందుకే మత్తయి 23:33, సర్పములారా! సర్పసంతానమా!  నరకశిక్షను మీరు ఎలాగు తప్పించుకొందురు? అలాగే యోహాను కూడా దైవరాజ్యవ్యాప్తి, దైవరాజ్యస్థాపన నిమిత్తము, బాప్తిస్మకార్యము జరిగిస్తుండగా - నాటి శాస్థ్రులు, పరిసయ్యులు, మత బోధకులు, అనేకులు బాప్తిస్మము పొందుట మనకు లాభసాటియని తన వద్దకు వస్తున్నప్పుడు వారిని చూచి సర్పసంతానమా?  అని చెప్పుటయును; మరియు మనము క్రీస్తును ఎరుగక పూర్వము అనగా గొర్రెపిల్ల యొక్క వెలుగు శక్తి ఆయనయొక్క సావాసములో ఆయన ఆత్మీయతలో భాగస్వాములు కాకపూర్వము , మన పూర్వీక స్థితి సర్పసంతానముగ జీవించిన వారమే! అలాంటి సర్పపు పిల్లలైన మనలను గొర్రెపిల్లవంటి స్వభావ సిద్ధులుగ మార్చుటకు దేవుడు తన కుమారుని ఈ లోకానికి గొర్రెపిల్లగాను, గొర్రెల కాపరిగాను, ద్రాక్షావళ్ళిగాను, దేవుడు తానేర్పరచుకొన్న మార్గముగాను, ఆయన జీవముగాను, వెలుగుగాను, స్వరముగాను, ఈ లోకానికి పంపబడిన ప్రభువు తండ్రి చిత్తము, తండ్రి ప్రణాళికను నెరవేర్చుటకు సంసిద్ధుడై , ఆది నురడి అంతము వరకు తన తండ్రి తనను లోకానికి పంపిన ప్రణాళికను గూర్చి క్రియామూలకముగా జరిగించుటకు, అనేకమైన ఒడిదుడుకులను, అనేకమైన అభియోగాలను, తిరస్కారాలను, శ్రమలను నాటి ప్రభుత్వములో నింపబడి, నిరపరాధియు, దైవసంభూతుడును, ప్రభావితుడును, శక్తిమంతుడును, దైవత్వములో ఒక అంశమైన ప్రభువు తన సర్వశక్తులను వదలుకొని 2 కొరింధీ 8:9, మీరు మన ప్రభువైన యేసుక్రీస్తు కృపను ఎరుగుదురు కదా?  ఆయన ధనవంతుడై యుండియు మీరు తన దారిద్య్రము వలన ధనవంతులు కావలెనని మీ నిమిత్తము దరిద్రుడాయెను,'' అని ప్రవచించబడిన ప్రకారము పరలోక ఐశ్వర్యము వదలుకొని, పరలోక అధిపతియైన దైవకుమారుడు ఈ విధముగా ప్రకటన 5:5లో వలె యూదా గోత్రపు సింహము, దైవకుమారుడైన క్రీస్తు - సింహము వంటి తన రాచరికాన్ని వదలి గొర్రె పిల్లగ ఈ లోకములో అవతరించినాడని వేదవివరణ.  దాన్ని వివరించినవాడు బాప్తిస్మమిచ్చిన యోహాను; సింహము అనగా రాజులకు రాజైన ప్రభువు మన నిమిత్తముగ, తన రాచరికాన్ని, తన ఉగ్రతను, తన రాచ వైభోగములను, ఐశ్వర్యాలను, సమస్తమును వదలుకొని గొర్రెపిల్లగ మన పాపముల కొరకు ఈ లోకములో అవతరించాడు,'' అన్నదియే ఇందులోని పరమార్థము.

        ప్రియపాఠకులారా!  ఆదిలో ఆది తండ్రియైన ఆదాము అతని భార్య ఇరువురు సర్పబోధ, సర్పమాటలు విని, సర్ప ఆకర్షణకు లోనై, సర్పమునకు చెవినిచ్చి, సర్ప మాటలకు విధేయించి, దైవనిషేధఫలమును తిని, దైవాజ్ఞ అతిక్రమణచేసే సాహసానికి ఒడిగట్టినందున, ఏదెనులో గొర్రెల జంటగా జీవించిన ఆది నరజంట జీవితము అనగా దేవుని గొర్రెపిల్లలుగా జీవించిన ఆది నరజంట జీవిత విధానము భ్రష్టుపట్టి, తమయొక్క ఆత్మీయ జీవితమును, దేవుడు తమను రూపించినట్టి విధానాన్ని, ఆయన మహిమను, ఆయన తేజస్సును, ఆయన ఘనతను వ్యర్థపరచి, దైవ వ్యతిరేకులైనందున నాటి నుండి నరజాతికంతను, నరజంట యావత్తును సర్పసంతానముగా, పాము పిల్లలుగా, దైవసంతు ముద్రించబడినవి.  మన కండ్ల ముందే సర్ప ఆరాధన, పాము పుట్టలకు బలులు, సర్పసంబంధ ఆయుధాలు, సాహిత్యాలు, మందిరాలు, నానావిధ రీతులలో నానారూపాలు అనగా కర్ర, మట్టి, రాయి, లోహము, వీటితో సర్ప రూపాలను చేసి, వాటిని దైవములని పూజించే ప్రబుద్ధులు ఈనాటికిని ఉన్నారు కారా?  అయితే బైబిలు అబద్ధమా?  దేవుని వాక్కు వ్యర్థమా?  తన దగ్గరకు బాప్తిస్మము పొందుటకు వచ్చిన నరులనుద్ధేశించి యోహాను పల్కిన మాట లూకా 3:7 సర్పసంతానమా?  రాబోవు ఉగ్రతను తప్పించుకొనుటకు మీకు బుద్ధి చెప్పిన వాడెవడు?  మత్తయి 23:33లో యేసుప్రభువు - ''సర్పములారా! సర్పసంతానమా! నరక శిక్షను మీరేలాగు తప్పించుకొందురు,'' అని ప్రవచించుట ఇందుకు తార్కాణమై యున్నది.

        కనుక ప్రియపాఠకులారా!  సర్ప  స్వభావమును సంతరించుకొని సర్పమును ఆరాధించిన మన పూర్వీకుల జీవితాలు వారు మిగిల్చి పోయిన అనుభవాలు ఏమిటంటే, సర్పమునకు ఇచ్చిన ప్రాధాన్యతను మనము ఇంకను తెలిసికోవలసి యున్నది.  ఈనాటికిని ప్రియపాఠకులారా!  అన్యుల గృహాలలో నానారీతులుగ, నానా రూపాలలో నానా నామధేయాలతో - నానావిధ సాంగ్యములు, ఆచారాలతో చెట్లకు, పుట్టలకు, అన్యదేవతలయొక్క పరుపునకు, సర్పములకు ప్రాధాన్యత నిచ్చి, నానావిధ పేర్లతో ఉదా|| ఆదిశేషుడు, నాగేంద్రుడు, ఫణిరాజు, నాగమణి, నాగరత్నము, నాగదేవత, నాగమణి, నాగేశ్వరుడు, కాళీయుడు, వగైరా చిత్రవిచిత్రమైన పేర్లతో సర్పాలకు ప్రాధాన్యత నిచ్చి ఘనముగా ఆరాధిస్తూ, మరొక వైపు జీవించి యున్న సర్పము కనబడినప్పుడు దానిని చంపుచున్నారు.  ఈ విధముగా అటు ఆరాధన, ఇటు సంహారము రెండు విధములైన క్రియలు సర్పమన్న భూజంతువుకు జరుగుచున్నది.  బ్రతికి ఉన్న సర్పానికి శిక్ష - దాని రూపము నిర్జీవమైయుంటే దానికి ఆరాధన - ఆ విధముగా సర్పముయొక్క జీవితము భూమి మీద సాగుచున్నది.

        గొర్రెపిల్లగా యేసుక్రీస్తు ఎందుకు పిలువబడినాడు?  ఈ గొర్రెపిల్లన్నది ఆత్మసంబంధమైన నామధేయమా?  లేక దృశ్యరూపమైన నామధేయమా?  అంటే ఇది రెంటికిని అనువర్తిస్తుంది.  ప్రకటన

14:1 మరియు నేను చూడగా, ఇదిగో ఆ గొర్రెపిల్ల సీయోను పర్వతము మీద నిలువబడి యుండెను, ఆయన నామమును ఆయన తండ్రి నామమును నొసళ్ళయందు లిఖించబడియున్న 144 వేలమంది ఆయనతో కూడా వుండిరి, అనుటలో పరలోక సంబంధముగా గొర్రెపిల్లన్నది దైవసంబంధముగా ఉన్నట్లుగ తెలుస్తున్నది.  ఎందుకనగా గొర్రెపిల్ల సీయోను పర్వతము మీద నిలువబడి యున్నప్పుడు - ఆయన నామము ఆయన తండ్రి నామము నొసళ్ళమీద లిఖింపబడి యుండుట, అంటే గొర్రెపిల్ల తండ్రి దేవుడు - ఆయన ఎవరు;  సీయోను పర్వతము మీద నిల్చున్న గొర్రెపిల్లలో ఉన్న పరిశుద్ధత, గుణాతిశయములను గూర్చి ముందుగా మనము తెలిసికోవలసి యున్నది.  మన దేవుడు పక్షపాతి కాడు, ఆయన మనలను గొర్రెపిల్లలుగా జేసి, ఏదెను వనములో మొట్టమొదటగా దేవుడు తన చేతితో సృష్టించిన నరజంటను జంతువులలో ఒక జంతువుగ చేసి పోషించాడు.  ఆయొక్క నరజంట జీవితము గొర్రెపిల్లవలె దైవసన్నిధిలో తమ యజమానియైన దేవుని దగ్గర ఆయన ఉచితముగా అనుగ్రహించిన ఆహారములో వలె గాక, నాటి గొర్రెపిల్ల ఏ విధముగా శాకాహారియై, వృక్షసంబంధ ఆహారాలు భుజించుతుందో అలాగే ఆదినరుడు కూడా చెట్లను ఆదరువుగా చేసికొని, ఫలవృక్షాల నీడన చెట్లఫలాలతో తన జీవనాన్ని కల్గించుకొనినందువల్ల ఆది నరుడు నానావిధ చెట్ల ఫలాలను భుజించుటను బట్టి, గొప్పబలాన్ని, శక్తిని పొంది, ఆరోగ్యవంతుడై, 930 సం||లు బ్రతికినాడంటే ఈనాడు అంతటివాడెవడైనను ఉన్నాడా?  కనుక దైవవనములో పోషించబడిన ఈయొక్క నరజీవితము కూడా గొర్రెయే.  ఇందునుబట్టి, నేటి దైవమందిరాలలో, గొర్రెల దొడ్డిలో దైవారాధన చేసే విశ్వాసులు గొర్రెలు - గొర్రెల కాపరి క్రీస్తుగాను, గొర్రెల దొడ్డికి యజమాని తండ్రియైన దేవుడుగాను, ఈ నాటికిని మనయొక్క నిత్య ఆరాధనలో సంఘ మందిరాలలో ప్రకటించుకొంటూ నేను గొర్రెలకు మంచి కాపరిని అని యోహాను 10:1-18, అంతటిలోను యేసుక్రీస్తు తాను గొర్రెలకాపరిగాను, తన విశ్వాసులందరిని గొర్రెల మందగాను, మందిరమన్నది గొర్రెలదొడ్డి - గొర్రెల దొడ్డిలో సంఘస్థులమైన మనము - మనము మేసే పచ్చిక దేవునియొక్క వాక్యము, మనము త్రాగే శాంతికరమైన జలము మన ప్రార్థనా సావాసము.  అందుకే యేసుప్రభువు ''నా శరీరము తిని నా రక్తము త్రాగువాడే నిత్యజీవముగలవాడు. అంత్యదినమున నేను వానిని లేపుదును.'' నా శరీరము తిని నా రక్తము త్రాగువాడు నాయందును నేను వానియందును నిలిచియుందును.  యోహాను 6:55 ఇది పరలోకము నుండి దిగివచ్చిన ఆహారము  పితరులు మన్నాను తినియు చనిపోయినట్టు కాదు.  ఈ ఆహారము తినువాడు ఎల్లప్పుడు జీవించును

6:50 పరలోకమునుండి దిగి వచ్చిన ఆహారమిదియే.

        కనుక ప్రియపాఠకులారా!  శరీరము తినుటయు రక్తము త్రాగుటయు విచిత్రముగా కనబడుచున్నది.  శరీరమన్నది దేవుని వాక్యమే, రూపాంతరమునకు మాదిరియై యున్నది.  అనగా యోహాను 1:14, ఆవాక్యము శరీరధారియై, కృపాసత్యసంపూర్ణుడుగా మనమధ్య నివసించెను, అను మాట నెరవేర్పు నేటి మన విశ్వాస జీవితములో అను దినము నెరవేర్పబడుచున్నదన్న సత్యాన్ని మనము గ్రహించాలి.

        కనుక ప్రియపాఠకులారా!  శారీర రక్తమన్నది జంతుసంబంధమునకు చెందినదై యున్నది.  జంతుశరీరమునకు దృశ్యముగా ప్రత్యక్షముగా ఉండేది మాంసాహారమే, అదృశ్యములో ఆత్మసంబంధమైన మాంసాహారము కూడా ఉందని గ్రహించవలసి యున్నది.

        కనుక ప్రియపాఠకులారా!  దైవసన్నిధిలో ఆదిలో నరుని దేవుడు శాకాహారముతోనే పోషించినట్లుగ ఏదెను వనమును బట్టి ఋజువగుచున్నది.  దైవ ఆజ్ఞాతిక్రమము  చేసిన నరుని దేవుడు రక్తమాంసాదులు తినేటటువంటి స్థితికి మార్చినాడంటే ప్రియపాఠకులారా!  ఇది దైవత్వములో ఉన్నటువంటి అతి నిగూఢమైన మర్మమై యున్నది.  స్వతహా నరుడు మాంసాహారుడు కాడు, శాకాహారియే.  దైవ ఆజ్ఞాతిక్రమము చేసిన తర్వాత కూడా నరుడు మాంసాహారిగా జీవించిన దాఖలాలు లేవు.  దేవుడు శపించిన విధానములో పురుషునితో మాట్లాడుచు, 3:17 తినవద్దని నేను నీకు ఆజ్ఞాపించిన వృక్షఫలములు తింటివి గనుక నీ నిమిత్తము నేల శపించబడియున్నది.  4:12, నీవును నేలను సేద్యపరచునప్పుడు అది తన సారమును ఇక మీదట నీకీయదు, ప్రయాసముతోనే పొలము పంట తిందువని అన్నాడేగాని జంతుమాంసము తింటావని అనలేదు.  ఇందునుబట్టి చూడగా నరునియొక్క మాంసాపేక్ష రక్తదాహము అన్నది ఎంత కఠినముగా క్రియ జరిగిస్తున్నదో మన నిత్య జీవితములో చూడగలము.  ఈనాడు శాకాహారుల కంటె మాంసాహారులే విస్తరించి యున్నారు.  మాంసాహారానికి ఉన్న గిరాకీ శాకాహారానికి లేదు.  ఆవిధముగా రక్తమాంసములకు క్రూరజంతువుల కంటె అత్యధికమైన ఆసక్తి కనబరచిన జనాంగమని తండ్రియైన దేవుడు, ఆయన కుమారుని శరీరమును గొర్రెపిల్ల మాంసమున తినే జనముగా - ఆయన రక్తము ఆత్మీయమైన పానముగా నరులకు ఇచ్చాడంటే నరుల యొక్క ఆత్మీయ దాహము ఎంత నికృష్టమైన స్థితిలో ఉందో ఒక్కసారి మనము ఆలోచించవలసి యున్నది.  ఈ రక్త దాహమన్నది కయీను ద్వారా లోకములో శంకుస్థాపన జరిగించుకొన్నది, అనగా నర రక్తమును బలికోనే వారియొక్క కఠినమైన హృదయస్థితికి పునాది వేసినవాడు కయీను అనగా ఆదాముయొక్క జ్యేష్టపుత్రుని ద్వారా దీనికి ప్రారంభోత్సవము జరిగింది.  ఇక్కడ నుండి పునాది వేయబడిన ఈ రక్తమాంస వ్యామోహమన్నది దినదిన ప్రవర్థమానమై నానారీతులుగ క్రియజరిగించినట్లు చదువగలము.

        ఈ విధముగా రక్తమాంసములకు అలవాటు పడిన నరుని ఒక క్రమబద్ధీకరణ చేయుటకు జలప్రళయ కాలములో తానేర్పరచుకొన్న నోవహును శాసిస్తూ అతడు ఓడలో చేర్చుకొన్న జంతుజాలమునకు తినవలసిన ఆహార పదార్థములను చేర్చుకోమన్నాడు.  కాని మాంసాహారము అందులో వివరించబడలేదు.  ఆది 6:21 నరుడు ఆచరించాల్సిన, పాటించాల్సిన ఆహార నియమావళిని గూర్చి మోషేకు బోధించాడు.  కాని నాటి పాతనిబంధన కాలములో ఇశ్రాయేలు జనాభాను కట్టడిచేస్తూ నిషిద్ధములని, పరిశుద్ధములైన జంతుజాలమును గూర్చి వివరించినట్లు చదువగలము.

        కనుక ప్రియపాఠకులారా!   ఏది ఏమైనప్పటికిని నేటి అనంత విశ్వములో ఎక్కువగా నరుడు అభిలషించేది మాంసాహారమే అనిన సత్యాన్ని ఇప్పుడుమనము తెలిసికొని యున్నాము.  అందుకే నూతన నిబంధనలో ప్రభువు తనను గొర్రెపిల్లగా పోల్చుకొని, ప్రవచించిన సందర్భాలు తెలిసికొని యున్నాము.  యేసుప్రభువు ఈ లోకానికి రాకపూర్వము - దేవుడు తాను లోకము మీదకు పంపబోవు తనకుమారుని బలియాగమును గూర్చి ఇశ్రాయేలుకు మాదిరిగా చూపుచు పస్కా గొర్రెపిల్ల ఇది, రక్షించబడిన ప్రతి పాపి గృహమునకు దీని రక్తమును గుర్తుగా పూసినప్పుడు సంహారక దూత ఆ రక్తపు గుర్తు ఉన్న గృహమును వదలిపోవుటయు తద్వారా ఆ గృహమునకు రక్షణ.

        కనుక ప్రియపాఠకులారా!  ఇంత గొప్ప మర్మము దైవవాక్యములో ఉందన్న సత్యము వివరిస్తున్నది.  ఇది గొర్రెపిల్లయొక్క చరిత్రను గూర్చిన పూర్తి వివరణ.  నేటి ఆధునిక ప్రపంచములో మనలను ఎవరైనను గొర్రెలు అంటే తప్పక కోపము వస్తుంది.  గొర్రె అంటే అమాయక జంతువు, అయోమయ జంతువు.  గడ్డిమేసేది, జంతువులలో అల్పజంతువు.  అందుకే గొర్రెల గుంపును సన్నజీవాలు అని కూడా పిలువబడుచున్నవి.  ఇందునుబట్టి, మనలను ఎవరైనను గొర్రెలు అంటే మనకు కోపము వస్తుంది.  ఎదుటి వ్యక్తులు విమర్శించేటప్పుడు ఏమయ్యా!  గొర్రెలాగా చూస్తున్నావు?  అని అంటాడు.  గొర్రెయొక్క అమాయకత్వము, గొర్రెపిల్లయొక్క పరిశుద్ధత, గొర్రెపిల్లలో ఉన్నటువంటి ఈయొక్క మర్మము, వేదరీత్యా ఎరిగిన వ్యక్తి గొర్రెలను గూర్చి చులకనగా మాట్లాడడు.  ఆ విధముగా మాట్లాడుటకు కూడా అతని అంతరాత్మ అంగీకరించదు.  గొర్రెపిల్ల అన్నది దైవత్వములో శ్రేష్టమైన నామము.

        మత్తయి 25:31-34 ఈలాగున దైవవాక్యము ప్రవచిస్తున్నది, తన మహిమలో మనుష్య కుమారుడును ఆయనతో కూడా సమస్త దూతలును వచ్చునప్పుడు, ఆయన తన మహిమగల సింహాసనము మీద ఆసీనుడై యుండును - ఇది దైవత్వమును గూర్చిన నిజత్వము.  అప్పుడు సమస్త జనములు ఆయన ఎదుట పోగుచేయబడుదురు. గొల్లవాడు మేకలలో నుండి గొర్రెలను వేరుపరచునట్లు ఆయన వారిని వేరుపరచి, తన కుడివైపున గొర్రెలను, ఎడమవైపున మేకలను నిలువబట్టును.  అప్పుడు రాజు తన కుడివైపున ఉన్న వారిని చూచి - ''నా తండ్రి చేత ఆశీర్వదింపబడినవారలారా! రండి లోకము పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడిన రాజ్యమును స్వతంత్రించుకొనుడి.''

        ప్రియపాఠకులారా!  ఈ ప్రవచనాలలోని పరమార్థము దైవత్వము గొర్రెకు ఇచ్చిన ప్రాధాన్యత అద్దము పట్టినట్లు మనకు వివరిస్తున్నది.  కుడివైపు గొర్రెలు అనగా దైవజనాంగము - ఈ లోకములో గొర్రెలుగా జీవించితే దేవుని జనాంగముగా ఎంచబడుచున్నది.  అంతేగాక దేవుని చేత ఆశీర్వదింపబడి యున్నట్లును, అంతేగాక లోకము పుట్టినది మొదలు సిద్ధపరచబడియున్న దేవుని రాజ్యపు హక్కును, యోగ్యతయును కల్గించును.  ముఖాముఖిగ దేవుని చూచే మహా భాగ్యము పొందగలము.

        ప్రియపాఠకులారా!  నీవు ఏ జీవితము కోరుచున్నావు?  ఏ స్థానము కోరుకుంటున్నావు? కుడివైపుననా?  లేక ప్రభువుకు ఎడమవైపుననా?  కుడివైపు త్యాగపూరితమైన జీవితమునకును, మేకలలో అంటే లోకవ్యామోహముతో కన్నుమిన్నుగానక జీవిస్తున్నావా?  అట్టివారికి దైవవాక్యము చేయుచున్న హెచ్చరిక మత్తయి 25:41, అప్పుడు ఆయన ఎడమవైపు ఉండువారిని చూచి - శపించబడినవారలారా!  నన్ను విడిచి అపవాదికిని, వాని దూతలకును సిద్ధపరచబడిన నిత్యాగ్నిలోనికి పోవుడి,'' అనిన విధముగా ఈ స్థానాన్ని నీవు కోరుకుంటున్నావా?  నీకు ఏది కావాలో కోరుకో!  ప్రభువు నిన్ను ఆశీర్వదించుటకు గొర్రెగా జీవిస్తున్నావా?  తప్పక దైవాశీర్వాదము ఉంది;  మేకలాగ జీవిస్తున్నావా?  తప్పక ఆ ఆశీర్వాదాన్ని పోగొట్టుకొని శ్రమలపాలగుచున్నావు.  ప్రభువు నిన్ను ఆశీర్వదించి కాపాడును గాక! ఆమేన్‌.

        అంశము :-   అమూల్యవాక్కులు  :-

        మూలవాక్యము :-   యోహాను సువార్త 2:5, ఆయన తల్లి పరిచారకులను చూచి ఆయన మీతో చెప్పునది చేయుడని చెప్పెను.

        ప్రభువునందు ప్రియక్రైస్తవ మహాశయులారా!  ప్రపంచములో క్రైస్తవ్యమన్నది బహుముఖ వ్యాపితమై అనగా సువార్త ద్వారా నైతేనేమి, వేదాంత కళాశాలల ద్వారానైతేనేమి, ఆయా పలు నామధేయాలతో కూడిన సంఘముల పరిచర్యతో నైతేనేమి!  సంఘ పరిచర్యకు మూలమైన సంస్థలయొక్క ప్రోద్భలము ద్వారా నైతేనేమి, నేటి ఆధునిక ప్రపంచములో ఆయా భాషల ద్వారా, ఆయా దేశాలలో, ఆయా రాష్ట్రాలలో, ఆయా జనముల మధ్య క్రైస్తవ్యము విస్తరించి యున్నది.  క్రైస్తవ్యమునకు మూలమైన యేసుక్రీస్తు ప్రభువు యొక్క వాక్కులు ప్రపంచమందంతట విస్తరించిందంటే ఇందుకు కారణము పై మూలవాక్యములోని విధముగా - ''ఆయన మీతో చెప్పునది చేయుడీ!  అనుటలో - యోహాను 2:లో కానాలోని పెండ్లి ఇంటిలో యేసు చెప్పినట్లుగా పరిచారకులు చేశారు.  యేసు చెప్పినట్లు పరిచారకులు నింపిన ఱాతిబానలు క్రియ జరిగించాయి.  యేసు చెప్పినట్లుగా ఱాతిబానలలోని నీళ్ళు కూడా విధేయించబట్టే - విందు ప్రధానికి మత్తెక్కించింది.  ఆ మత్తులో విందు ప్రధాని చెప్పిన మాటలు యోహాను 2:10లో మనము చదివినట్లయితే అనగా ''ప్రతివాడును మొదట మంచి ద్రాక్షరసమును పోసి జనులు మత్తుగా ఉన్నప్పుడు జబ్బురసము పోయును.  నీవైతే ఇదివరకును మంచి ద్రాక్షరసము ఉంచుకొని యున్నావని ఆయనతో చెప్పెను.''  ఇట్లు చెప్పుటలో విందు ప్రధానికి మనోల్లాసమును, తన్మయత్వమును, ద్రాక్షారస మాధుర్యానుభూతిని పొందుటకు మూలమేదనగా ''ఆయన మీతో చెప్పునది చేయుడని'' మరియమ్మ అన్న మాటయేనని మనము గ్రహించవలసి యున్నది.

        ప్రభువునందు ప్రియులారా!  ఆయన చెప్పునట్లు అనగా ఆయన మాటలకు విధేయించి క్రియజరిగించిన సంఘటనలను కొన్నిటిని మనము జ్ఞాపకము చేసికొందము.  మార్కు 4:39, అప్పుడాయన గాలిని గద్దించి నిశ్శబ్దమై యూరకుండుమని సముద్రముతో చెప్పగా గాలి అణగి మిక్కిలి నిమ్మళమాయెను.  ఇక్కడ సముద్రమును, గాలియు, ఆయన చెప్పినట్లు విన్నాయి.  మార్కు 2:11లో పక్షవాయువుగల వానిని చూచి నీవు లేచి నీ పరుపెత్తుకొని ఇంటికి నడువుమని నీతో చెప్పుచున్నానన్నప్పుడు పక్షవాయువు ఆ రోగిని వదలి వేసింది.  తక్షణమే వాడు క్రీస్తు వాక్కానుసారము తన పరుపు నెత్తుకొని నడిచాడు.  ఐదు రొట్టెలు, రెండు చేపలు ఆయన మాట విని ఐదువేలమంది ఆకలి దీర్చి 12 గంపలు మిగిల్చినవి.  

        ఇక యేసుప్రభువు తండ్రియైన దేవుడు ఆదిలో ఆదికాండ మొదటి అధ్యాయములో ఒకటినుండి చివరివరకు చదివితే దేవుడు దేనితోనైతే ఏయే సృష్టిని గూర్చి ప్రకృతిని శాసించాడో - దైవవాక్కానుసారం ఆయన చెప్పిన విధముగా సృష్టి ఆయన వేటివేటిని గూర్చి ఆజ్ఞాపించాడో అనగా మృగపక్షి జంతుజాలములు ఖనిజములు భూగర్భములోని ఇంధనములు మరియు సూర్యచంద్ర నక్షత్రాదులు, గ్రహాలు, వగైరాలన్నియు ఆయన చెప్పినట్లుగానే సృష్టించబడినాయి, ''ఇది కల్గును గాక!  అన్నట్లుగానే కల్గినవి.  ఈ సందర్భములో ఆదికాండము మొదటి అధ్యాయము చదివితే ఇవన్నియు కూడా సృష్టించబడినట్లు మనకు తెలియగలదు.

        చిత్రమేమంటే యెహోవా దేవుడు చెప్పినట్లు సృష్టి వినింది.  యెహోవా దేవుని మాట చొప్పున యోనాను మ్రింగుటకు తిమింగలము విధేయించింది.  యోనాను మ్రింగిన తర్వాత మూడవ దినమున నినెవే పట్టణములో యెహోవా దేవుడు మత్స్యమున కాజ్ఞ ఈయగా అది వానిని కక్కి వేసింది.  ఇది తండ్రియైన దేవుడు సృష్టికి ఆజ్ఞ ఇచ్చినప్పుడు సృష్టి విధేయించి జరిగించిన క్రియ.

        ఇక పరిశుద్ధాత్మ దేవుడు శాసించినప్పుడు విధేయతతో పరిశుద్ధాత్మ చెప్పినట్లుగా జరిగిన అద్భుత క్రియలను గూర్చి మనము తెలిసికోగలము.  ఈ సందర్భములో అపో 2:16-21 యోవేలు ప్రవక్త ద్వారా చెప్పబడిన సంగతి చదివితే మనకు తెలియగలదు.  మరియు పరిశుద్ధాత్మ దేవుని ఆజ్ఞానుసారము ఆయనను విశ్వసించిన వారు వారి జీవితాలను గూర్చి అపొ 2:43-47 చదువగలము.  ఇట్లు పరిశుద్ధాత్మయొక్క చిత్తానుసారంగా విధేయించిన అపొస్తలులు వాక్శక్తిని పొందినవారై, అపొ 3:3-8 చదివితే వీరు చెప్పినట్లు చీలమండల రోగియొక్క చీలమండల రోగము విని ఆరోగిని వదిలింది, వాడు స్వస్థత పొంది దేవాలయములోకి వెళ్ళి దేవుని మహిమ పరిచాడు.

        ఈ విధముగా త్రినామధారియైన సర్వశక్తిమంతుడైన దేవుడు ఆదికాండములో వాక్కుగాను; నూతన నిబంధనలో ''యేసుప్రభువు'' అను శారీరిగాను, అనగా మనుష్యకుమారునిగాను, అపొస్తలుల యుగములో ఆత్మగాను క్రియ జరిగించి, ఆయన చెప్పునట్లు చేయమన్నాడు.  ప్రియక్రైస్తవ పాఠకులారా! ఈ అమూల్య సత్యములు బైల్పరచబడియున్న ఈ యుగములో యేసుప్రభువు చెప్పినట్లుగా ఎవరైన వింటున్నామా?  ఆయన చెప్పినట్లుగా మనము చేస్తున్నామా?  ఆయన విశ్వాసులుగా మనము జీవిస్తున్నామా? ఆయన మార్గాన్ని మనము అవలంభిస్తున్నామా?  నేటి మన జీవితమెట్లున్నది?  ప్రభువు చెప్పినట్లుగా కాపరి వినాలి, కాపరి చెప్పినట్లుగా సంఘము వినాలి.  సంఘము చెప్పినట్లుగా సంఘ సభ్యులు వినాలి.  నేటి యుగములో ఇవి ఒక దానికొకటి పరస్పర విరోధములై సంఘమునకు కాపరిని - సంఘానికి సంఘసభ్యులకును పరస్పర వైరుధ్యము గల్గి అర్థము లేని జీవితములో వుండగా - క్రీస్తు చెప్పినట్లుగా మనము వినగల్గే స్థితిలోను చేయగల్గే స్థితిలో వున్నామా?  ఒక్కసారి ఆలోచించండి.

        కానాలో పెండ్లి ఇంటి పరిచారకులు యేసు తల్లియైన మరియమ్మయొక్క మాటలను ఆమోదించారు.  ప్రభువైన యేసు వారితో చెప్పినట్లుగా చేశారు.  అనగా అంచులు మట్టుకు బానలలో నీళ్ళు నింపినారు.  అదే విధముగా బానలు కూడా తమలో నింపబడిన నీటిని పదిలముగా నిలకడగా తమలో నిలుపుకొన్నాయి.  అట్లు క్రియ జరుగబట్టే మంచి ద్రాక్షారసమైనది.  మన జీవితము కూడా మధురమైన జుంటి తేనె ధారలవంటి ఆహ్లదకరమైన, దైవత్వమునకు ప్రీతిగల యోగ్యమైన తేనె, ద్రాక్షారసము వంటి జీవితము అనగా మన జీవితమునకు ఇహలోక యాత్రకు ప్రధానియైన యేసుప్రభువునకు ప్రీతికరమైన ద్రాక్షారసానుభూతిని కల్గించు నమ్రత, విధేయతతో కూడిన జీవితమవసరమై యున్నది.  అట్లు మనము దైవావసరతలకుపయోగపడాలంటే ఆయన చెప్పినట్లు మనము చేయాలి.  అప్పుడే మనము ధన్యులము కాగలము.

..........

        యోహాను 3:1-2 వాక్యమును గూర్చిన వివరణ :-  యూదుల అధికారియైన నీకోదేమను పరిసయ్యుడొకడుండెను.  అతడు రాత్రి యందు ఆయన యొద్దకు వచ్చి - బోధకుడా!  నీవు దేవుని యొద్ద నుండి వచ్చిన బోధకుడవని మేమెరుగుదుము.  దేవుడతనికి తోడైయుంటేనేగాని, నీవు చేయుచున్న సూచక క్రియలను ఎవడును చేయలేడని ఆయనతో చెప్పెను.

        ప్రియ శ్రోతలారా!  నీకోదేము దైవజనాంగమైన ఇశ్రాయేలునకు యోహాను 3:10లో వలె బోదకుడైయున్నట్లు - యేసు మాట్లాడుటన్నది మనము చదువగలము.  నీకోదేమునకు తెలిసినదంతయు ఒక్కటే!  మోషే ధర్మశాస్త్రానుసారముగా దైవజనాంగమైన ఇశ్రాయేలీయులకు బోధకుడుగా వుండి, ధర్మశాస్త్ర సిద్ధాంతములను ఆచరింపజేయుటకు ఆనాటి మతాధిపతుల చేత నియమించబడినట్లుగా ఇందునుబట్టి మనకు తెలియుచున్నది.  ఈ నీకోదేము మామూలు బోధకుడుగాక యూదులకు అధికారిగ, బోధకుడు అనగా ప్రధాన బోధకుడు.  అటు దైవత్వము చేతను, ఇటు లోకము చేతను ఎన్నిక చేయబడిన వాడును అయినట్లు ఈ మొదటి వాక్యములోని మొదటి వచనములోని భావము.  ఇతను యూదులకు అధికారియని వివరిస్తున్నది.  అయితే ఇతను పరిసయ్యుడు.        

        ఇతను రాత్రివేళ యేసునొద్దకు వచ్చి యేసుతో తర్కవాదము చేయుటలో వున్న నిజాన్ని మనము గ్రహించవలసి యున్నది.  ఎందుకంటే పగటిపూట యేసు దగ్గరకు వచ్చినట్లయితే, తాను గొప్ప బోధకుడు కాదని తన ప్రధానత్వమునకు దెబ్బ తగులుతుందని, యేసును పగటిపూట నీకోదేము కలిసి మాట్లాడి యున్నచో ఇశ్రాయేలీయులు నీకోదేమును చేతగాని చవటగాను, దేవుని ధర్మశాస్త్రానికి విరోధిగాను తలచి యుండెడివారు.  మరియు తన పదవికిని తానున్న గౌరవానికి అవమానకరమని తలచి, బాగుగా ఆలోచించి, పగలు లోకానికిని, రాత్రిపూట దైవత్వానికిని భయపడి, సందిగ్ధములో పడి, రాత్రి కాలములో యేసుతో మాట్లాడవలెనని సంకల్పించినట్లు నీకోదేములోని లోకసంబంధమైన బలహీనత వివరిస్తున్నది.  

        నీకోదేము విషయములో రెండు గొప్ప యదార్థతలను మనము గుర్తించవలెను.  నీకోదేము ధర్మశాస్త్రమును గూర్చిన బోధనలు తెలిసినవాడేగాని, యేసుక్రీస్తు జన్మ ద్వారా దేవునియొక్క ప్రణాళిక, సంకల్పమును గూర్చి జ్ఞానమును ఎరుగని వాడైయుండినట్లుగా - నీకోదేము యేసును అడిగిన ప్రశ్న మరియు యేసుతో చేసిన తర్కవాదము బైలుపరచుచున్నది.  ఇందులో మూడవ వచనములో ఒకడు క్రొత్తగా జన్మించితేనేగాని అతడు దేవుని రాజ్యమును చూడలేడు,'' అని చెప్పినప్పుడు క్రొత్త జన్మయొక్క పరమార్థమేమిటో నీకోదేముకు అంతుపట్టక 4వ వచనములో వలె ముసలివాడైన మనుష్యుడేలాగు జన్మింపగలడు?  అని ఆయనను అడుగుటన్నది నీకోదేములోని నులివెచ్చని జ్ఞానము బైల్పడుచున్నది.

        మరియు యేసును గూర్చి నీకోదేము పూర్తిగా అజ్ఞానియు అంటే కానే కాదు.  ఇదే యోహాను 3:2లో యేసుతో మాట్లాడుచు -''నీవు దేవుని యొద్దనుండి వచ్చిన బోధకుడవని, దేవుడు నీకు తోడైయున్నాడని నీవు చేయుచున్న సూచనక్రియలు ఎవడు చేయలేడని,'' చెప్పుటలో నికోదేము క్రీస్తును ఎరిగినవాడును, క్రీస్తును గూర్చిన పరిజ్ఞానము కల్గిన వాడనుటకు ఋజువై యున్నది.  అయినను యేసును తర్కించిన విధానము, అమాయకత్వము, జ్ఞానహీనతను బైల్పరచుచున్నది.  ఎట్లంటే యేసు ప్రభువు నీకోదేముతో - నీవు ఇశ్రాయేలు బోధకుడవై యుండియు నరుడు రెండు జన్మలు ఎత్తవలెనని ఎరుగకున్నావనిన ప్రశ్నతో నీకోదేమును తారుమారుజేశాడు.  ఈ ప్రశ్నకు నీకోదేము అయోమయములో పడినాడు.  యేసుక్రీస్తును నీకోదేము కలుసుకున్న కాలములో - మనిషి నీటి మూలముగాను, ఆత్మమూలముగాను, జన్మించవలెనన్న కట్టుబాట్లున్న సంగతే - నీకోదేముయొక్క వేదాంతములోని వేద పరిచర్యలోనికి అతని బోధలోగాని లేనట్లే వున్నది.  ఇందునుబట్టి చూడగా నీకోదేము చేసిన బోధ యెహోవాది మాత్రమేగాని, రక్షణాయుతమును, పాపికి పునరుజ్జీవము నిచ్చుటకును, పాపికి ఆశ్రయము కల్గించుటకును పనికి రాని బోధ వున్నట్లు యేసు చెప్పిన మాటలలోని భావము స్ఫురింప జేయుచున్నది.

        ధర్మశాస్త్ర సిద్ధాంత ప్రకారముగా దోషికి రక్షణలేదు.  అతనికి మరణశిక్ష విధించడమే!  అయితే యేసుప్రభువు దేవుని యొద్ద నుండి వచ్చిన బోధకుడని, దేవుని కుమారుడని, దేవుని ప్రవక్తయని, నీకోదేమునకు బాగుగా తెలియును.  తెలియబట్టే నికోదేము ఏసుతో నీవు దేవుని దగ్గర నుండి వచ్చిన బోధకుడవని మేము ఎరుగుదుము,'' అని అంటున్నాడు.  అయిననేమి దేవుని యొద్దనుండి వచ్చిన దేవుని బోధకుని యొక్క బోధను అంగీకరించక, లోకానికి భయపడి, బాహాటముగా దైవబోధకునియొక్క సిద్ధాంతమును అంగీకరించలేక, అర్థరాత్రిలోనే తనయొక్క ఆత్మీయ జీవితాన్ని సరిపెట్టుకున్నాడు.  ఎందుకనగా క్రీస్తును అంగీకరించినట్లుగాని, క్రీస్తుయొక్క సిద్ధాంతమును పాటించినట్లుగాని, క్రీస్తు మార్గములో నడిచినట్లుగాని, నీకోదేము చరిత్ర వెల్లడించలేదు.  అర్థరాత్రిలో చీకటి సిద్ధాంతాన్ని విని, దాన్ని అంగీకరించక, చీకటిలో కలిసిపోయే జీవితాన్ని నీకోదేము అనుసరించినట్లు తెలియుచున్నది.

        ప్రియ శ్రోతలారా!  ఈనాడు కూడా నీకోదేము వంటి బోధకులు కోట్ల సంఖ్యలో వున్నారు.  నీకోదేము వలె ఎవరు చూడని, ఎవరు తిరుగని, ఎవరు గుర్తించని రీతిలో క్రైస్తవులుగా వుంటూ బాహ్యముగా లోకసంబంధులుగా ఉండి, క్రీస్తును బహిరంగముగా అంగీకరించలేక, క్రైస్తవ కూటమిలో క్రైస్తవులుగాను, లోకస్థుల మధ్య వెనుకబడిన జాబితాలో, ప్రభుత్వ లావాదేవీల పొందుచు, జీవించేటటువంటి క్రైస్తవ్యము మన కన్నుల ఎదుటనే ఉన్నది.  చిత్రమేమంటే ఒకానొక రాత్రి యేసును నీకోదేము సంధించి, తన మనోభావాన్ని వెల్లడించి, ఆ ఒక్క రాత్రితో తనయొక్క రహస్య కలయికను ముగించుకున్నాడు.  అయితే ఈ యుగములో వున్నటువంటి నీకోదేములు ప్రతిరాత్రి యేసును పరిశోధిస్తూ పగలంతయు లోకసంబంధితమైన పదవులు, ధనసంబంధమైన వస్తు సంబంధమైన వ్యాపార సరళిలో తిరుగుచు, అనేక ప్రయాసలు పడుచున్న నీకోదేములను గూర్చి మనము ఏమనుకోవలెనో శ్రోతలే గ్రహించండి, ఆలోచించండి.  ఆనాటి నీకోదేము యేసుతో సందేహ వాక్కులతో మాట్లాడి సరిపెట్టుకున్నాడు.  ఈనాటి నీకోదేము యేసును గూర్చి ఎరిగినవారమని, యేసును ఒప్పుకొన్నవారివలె నటిస్తూ - యేసు మార్గమును ఆచరించుచున్న వారివలెనే ప్రకటించుకొంటూ యేసు బోధలను చేయుచు, యేసు చెప్పినట్లుగా నీటి మూలముగాను, ఆత్మమూలముగాను జీవించాలని అనేకులకు బోధిస్తూ - యేసు ద్వారా అనేక ఈవులు, ఆశీర్వాదాలు పొందియు, నికోదేము జీవితములో జీవిస్తూ - నీకోదేము ఏ విధముగా యూదులకు అధికారియో, వీరు కూడా సందర్భానుసారముగా లోక ప్రభుత్వాధికారాలను సంపాదించి, లోకము మీద పెత్తనము చెలాయించి, రెండు చేతుల సంపాదనకు ప్రాకులాడుచున్నారు.  ఇందునుగూర్చి మొదటి తిమోతి 6:10లో పౌలు హెచ్చరికను మనము జ్ఞాపకముంచుకోవాలని జాగ్రత్తపడవలెనని నా మనవి.  ''ధనాపేక్ష సమస్త కీడులకు మూలము.  కొందరు దానిని ఆశించి, విశ్వాసము నుండి తొలగిపోయి, నానాబాధలతో తమ్మును తామే పొడుచుకొనిరి.

...........

        నిద్ర :-  ఎఫెసీ 5:14, ''అందుచేత నిద్రించుచున్న నీవు మేల్కొని మృతులలో నుండి లెమ్ము'', క్రీస్తు నీ మీద ప్రకాశించును.''

        ప్రియ శ్రోతలారా!  పై వాక్యమును గూర్చిన పరమార్థమును మనము తెలిసికొనుటకు ముందుగా నిద్ర అను క్రియను గూర్చి కూడా మనము ఆలోచించవలసి యున్నది.  కీర్తన 121లో ''నిన్ను కాపాడువాడు కునుకడు నిద్రపోడు'' అని వ్రాయబడి యున్నది.  అట్లయితే సృష్టికి నిద్ర ఎందుకు అవసరము?  దేవునియొక్క చేతిపనియైన మనుష్యునికి నిద్ర ఎందుకు అవసరము?  అన్నది మనమాలోచించవలెను. ఆదిలో దేవుడు లోకాన్ని సృష్టించి, సృష్టిక్రియను సంపూర్ణము చేసిన తర్వాత ఏడవదినమున విశ్రమించినట్లే ఉన్నదిగాని ఆయన నిద్రించినట్లు లేదు.  ఇందునుబట్టి చూడగా దేవునికి నిద్రన్నది లేదు.  ఆయన నిద్రాసక్తుడు కాడు.  అయితే దేవుని చేతి పనియైన సృష్టములకును, నరునికి నిద్ర ఎందుకు?  దేవుడు నరులను సృష్టిస్తూ ఆదికాండము 1:26లో మన పోలిక మన స్వరూపము చొప్పున నరులను చేయుద మన్నాడేగాని వారు నిద్రాసక్తులైయుంటారని దేవుడు చెప్పి యుండలేదు.

        ప్రియ శ్రోతలారా!  ఈ విషయాన్ని మీరు ఏనాడైన ఎప్పుడైన ఆలోచించారా?  సృష్టికర్తకు లేని నిద్ర సృష్టములకు ఎందుకు?  దేవుడు సృష్టించిన ఈ భూమి కూడా నిద్రపోవుట లేదు, భూమి కూడా నిద్ర ఎరుగదు.  ఇది తనచుట్టు తాను తిరుగుచు, సూర్యుని చుట్టు తిరుగుచున్నది.  ఈ క్రియ విరామము లేకుండ రేయింబగళ్ళు జరుగుచున్నదిగాని నిలుపుదల లేదు.  అదే విధముగా గ్రహాలు - నక్షత్రాలు కూడా నిద్రించుట లేదు.  గాలి నిద్ర ఎరుగదు.  గాలి నిద్రపోతే సృష్టికి జీవము లేదు.  అది మృతమే!  చీమ మొదలు ఏనుగు వరకును సృష్టిలో నిలబడియైన నిద్రపోయేటటువంటి స్థితి ఏర్పడియున్నట్లుగా మనకు తెలియును, మానవుడు నిద్రబోవుచున్నాడు.  జీవముగల ప్రతి దానికి నిద్ర ఉన్నది.  అయితే జీవాత్మకున్నదా?  పరమాత్మకున్నదా?  ఇద్దరికినిలేదు.  జీవాత్మ, పరమాత్మ ఇరువురును శరీరులు కాదు గాబట్టి వారికి నిద్ర లేదు.  నరుడు దృశ్యుడును, శరీరుడును కాబట్టి ఇతనికి నిద్ర అవసరము, ఎందుకంటే నర శరీరమన్నది భూమి మీద క్రియ జరిగించిన తర్వాత, దాని శరీర భాగములు అనగా దేహాంగములు పనిచేసి, అలసి అరిగి ఉండును కాబట్టి - ఈ అరుగుదల పూర్తి కావాలంటే నిద్రన్నది దేహానికవసరమే! అయినను నరశరీరములోని హృదయము, నాడులు, శ్వాసకోశము, వీటికి నిద్ర లేదు.  నరశరీరము నిద్రలో కూడా ఇవి పని జేయుచునే యుండును.  తతిమా అంగములు తమ క్రియను మరచి, నిద్రలో విలీనమై యుండును.  ఇందుకు తార్కాణము ఎవరైనను మనలను తట్టి లేపితేనే తప్ప, మనకు త్వరగా మెలకువ రాదు.  ఇది నిద్రయొక్క గుణాతిశయము.

        ఏదెనులో ఆదాము నిద్రపోయినట్లుగా దాఖలాలు లేవు.  ఎందుకంటే ఒక్క స్త్రీ నిర్మాణ సమయములోనే దేవుడు గాఢనిద్ర కల్గించినట్లున్నదేగాని, ఆదాము జీవితములో నిద్రకు ప్రాధాన్యత వున్నట్లు ఏదెను చరిత్రలో కనబడదు.  అయితే నిద్ర నరునికి ఎక్కడనుండి ఏర్పడినది?  అంటే స్త్రీ నిర్మాణము నుండి నిద్రకు పునాది ఏర్పడి, దినదిన ప్రవర్థమానమై, ఈ నిద్ర అను క్రియ వలన ఆయా సందర్భాలలో దైవత్వము చేత హెచ్చరికలు, రాజ్యపరిపాలన పతనావస్థలు, అనగా కరువులు, కాటకాలు, శుభము, అశుభములను గూర్చి ఆయా సందర్భాలలో - దేవుడు తన బిడ్డలకు లేక తన శతృవులకు స్వప్నముల ద్వారా హెచ్చరికలు హెచ్చరించినట్లు బైబిలు వేదములో మనము ఈ క్రింది సందర్భాలను బట్టి తెలిసికోగలము.

        యాకోబు నిద్రపోయాడు, కల కన్నాడు.  ఆ కలలో ఆకాశము నుండి భూమికి నిచ్చెన వేయబడి యుండుట.  ఆ నిచ్చెన నుండి క్రింద నుండి పైకి - పై నుండి క్రిందకు ఎక్కుట, దిగుట అన్న దానిని చూచెను.  అట్లే ఐగుప్తులో ఫరో కలలుగాని, దేవుని బిడ్డయైన యోసేపును ఆ స్వప్న దర్శన భాగములను గూర్చి అడుగుటయు, తదనుగుణ్యముగా కలా ఫలితములు లోకములో నెరవేరుటన్నది కూడా జరిగినది.  ఏడు బలిసిన ఎద్దులను ఏడు బక్కటెద్దులు మ్రింగివేయుట, ఏడు పీల వెన్నులు ఏడు బలిసిన వెన్నులను మ్రింగివేసినట్లు వచ్చిన కలలు.  ఫరో సంస్థానములో పానదాయకునికి వచ్చిన కల భక్షాకార్ల అధిపతికి వచ్చిన కలలు గూర్చిన భావములు, అనగా పానదాయకుని అధిపతి పోగొట్టుకొనిన ఉద్యోగము తిరిగి అతను సంపాదించుటకు అతనికి వచ్చిన కల మూలకారణమైనది.  భక్షాకారుల అధిపతికి మరణదండన విధించుటన్నది అతనికి  వచ్చిన కల ఆధారమైనది.  అదే విధముగా దానియేలు కాలములో నెబుకద్నెజరు కన్న గలలు నెరవేరినవి.  వీటినన్నిటికి మూలము నిద్ర.

        నిద్రపోవుటలో కూడా సమయము, సందర్భము, యోగ్యత, వాతావరణము ముఖ్యమని కూడా మనము గ్రహించవలెను.  1.  అయోగ్యమైన స్థలములో నిద్రించుట,  2.  దైవత్వమునకు ప్రీతిలేని నిద్ర 3.  దేవుడు అంగీకరించని నిద్ర  4.  దేవుని ఆశీస్సులు పొందే నిద్ర కూడా వున్నదని మనము తెలుసుకోవాలి.  ఇందులో మొదటిది.  అయోగ్యమైన స్థలములో అనగా దైవత్వానికి ప్రతికూలమైన దేవుడు ఒప్పుకోనటువంటి స్థితిలో నిద్ర న్యాయాధిపతులు 16:లో సంసోను డెలైల తొడమీద నిద్రపోవుటన్నది, దైవచట్టానికి, అతనిప్రతిష్టకు భంగకరమైనది, అయోగ్యకరమైనదియు అంధత్వముతో కూడినదియు, మరణకరమైనట్లు మనము గ్రహించవలెను.  ఇందువల్ల సంసోను కన్నులు పోగొట్టుకొని అంధుడై, అన్యదేవతా మందిరములో మరణపాత్రుడయ్యాడు.

        2.  దైవత్వమునకు ప్రీతిలేని నిద్ర :-  యోనా విషయములో యోనా జేసిన దైవవ్యతిరేక కార్యము మనకు తెలిసినదే!  దేవునికి నీనెవె పట్టణమునకు యోనాను వెళ్ళమంటే అందుకు వ్యతిరేకముగా తర్షీషు ఓడ నెక్కుటయేగాకుండ, ఆ ఓడ అడుగు భాగములో నిద్రపోవుటన్నది దైవోగ్రతకు కారణమైంది.  దీనివల్ల ఓడకు చేటు బలమైన తుఫాను వాతావరణ మేర్పడుటకు కూడా కారణమైనది.  అనవసరముగ తర్షీషు ఓడ సముద్ర అలలచే కొట్టబడి, ఓడ నావికులకును, ఓడలోని సరకునకును ముప్పు ఏర్పడింది.  ఈ క్రియ వలన అనగా దైవమార్గమును విడిచి, దైవిక ప్రణాళిక సంబంధమగు ఓడనెక్కకుండ అన్య జనాంగముల సంబంధితమైన తర్షీషు ఓడనెక్కి, దేవుని ప్రజలు కాని వారి మధ్య దైవవ్యతిరేక ప్రయాణము జేయుచు, ఓడ అడుగున యోనా పొందిన నిద్ర దైవోగ్రతకు కారణమే గాకుండ దైవప్రణాళికకును, నీనెవె ప్రజల యొక్క ఆత్మీయ జీవితమునకును ప్రతికూలమైనందున తర్షీషు ఓడ గర్భములో యోనా పొందిన నిద్రకు ప్రతిగా దేవుడు యోనాను చంపకుండ తర్షీషు ఓడ నుండి బైటకు పారవేయించి, తాను నియమించిన తిమింగలముయొక్క గర్భములోనికి యోనాను చేర్చి, మూడు దివారాత్రులు నిద్రాహారాలు లేని స్థితిని  కల్పించి, అటు తిమింగలమునకు జీర్ణము గాకుండ - ఇటు ఉచ్ఛ్వాసనిశ్వాసలు గాని లేక ఆ తిమింగల గర్భములోని కలుషితమైన వాతావరణమునకుగాని, యోనా మృతుడు గాకుండ సజీవునిగానే వుంచి, చేప గర్భములోని యోనాను ప్రార్థనా వాతావరణములో మలచి, యోనా నిద్రించిన మూడు దివారాత్రులు శిక్షను అనంతరము తిమింగలము ద్వారా దేవుడు తాననుకున్న నీనెవె పట్టణమునకు యోనాను జేర్చి కక్కించుటలో - యోనాకు నిద్ర వలన వచ్చినట్టి ఉపద్రవమెట్టిదో క్రియానుభవము ద్వారా నేర్చుకొన్నట్లు మనకు తెలియుచున్నది.

        ఇక ఆదాముయొక్క నిద్రలో ఇది దేవుడు స్వయముగా నరునికి సహాయకారిగ వుండుటకు రెండవ శరీర నిర్మాణమునకు అవసరమైన అనగా మొదటి శరీరము ఏకాకియు ఆదరణ లేనిదియు నిస్సహాయి అయినట్లును, అట్లు నిస్సహాయి అయిన జీవాత్మునికి సాటి సహాయముగా మరియొక జీవిని నిర్మించుటకు ఈ నిద్ర మూలకారణమైనది.  దీని ద్వారా  నిర్మించిన నరజీవికి కావలసిన జంట లభించింది.  ఇది దైవిక ఏర్పాటుతో కూడిన నిద్ర.  ఇక యాకోబు నిద్ర :-  సృష్టికర్తయైన దేవుడు సకల నరకోటిని ఉద్ధరించుటకు నరునిగా లోకమునకు అవతరించుటకు భవిష్యత్తుగా స్వప్నమును నిరూపించిన నిద్ర.  ఈ నిద్రలోని స్వప్నమును దేవుడు లీలగా వదలివేయక, యదార్థ చరిత్రగా క్రీస్తు అను తన ప్రతిరూపమును లోకమునకు బైల్పరచినట్లు లోకములోని యేసుక్రీస్తు చరిత్ర మనకు ఋజువుపరచుచున్నది.

        యాకోబు కుమారుడైన యోసేపు నిద్ర తన అన్నదమ్ములయొక్కబలహీనతలను ఋజువుపరచుచు వారున్న లోకసంబంధమైన జీవితములో పరాభవము పొందినవారై, తనకు దాసోహమగునట్లుగా నిరూపించిన నిద్రలోని స్వప్నము.  ఈ నిద్రలోని  కల కూడా యాకోబుయొక్క 12 కుమారులలో యోసేపును మినహాయించి, 11 మంది కుమారులు పొందిన కలవరపాటు, క్షామబాధ, దారిద్య్రము నందు రక్షణ కల్పించింది.  ఇక ఫరో నిద్ర ఫరో కల కూడా దేశారిష్టమును సూచించినప్పుడు నిద్ర దానికి కారణము.  అదే విధముగా ఫరో సంస్థానములో పానదాయకునికిని, భక్షాకార్ల అధిపతికిని, నిద్రరాగా వారియొక్క ఇహలోక జీవితము తీర్పు దీర్చబడింది.

        ప్రియ శ్రోతలారా!  యెజిబేలుకు భయపడిన ఏలీయా చెట్టుక్రింద నిద్రావస్థలో వున్నప్పుడు దేవుని దూత పిలుపు ఆతిధ్యము ద్వారా బలపరచబడినాడు.  ఇక మార్కు 4:31-39 చదివితే ఈ వేదభాగములో యేసుప్రభవు పొందిన నిద్ర తన శిష్యకోటియొక్క ఆత్మీయ జీవితముయొక్క పరీక్షార్థమేగాని, వాస్తవానికి ఆయన నిద్రపోలేదు.  ఇక లూకా 23:45, యేసు శిష్యులు పొందిన నిద్ర రక్షకుని కోల్పోవుటకు కారణమైనది.

        ప్రియశ్రోతలారా!  చూచినారా?  నిద్ర వలన అనర్థము.  ఇందునుబట్టి హానికరము,'' అని మనము అనుకోకూడదు.  కాని నిద్రలో ఆరోగ్యమున్నది, విశ్రాంతి వున్నది, దేహముయొక్క ఎదుగుదలకు, శారీర అవసరతలకు, నిద్ర ఎంతో ముఖ్యమై యున్నది.  అయితే నిద్రలో కూడా అనర్ధాలున్నట్లుగా మనము గ్రహించవలెను.  నిద్ర వలన మనము ప్రయాణించవలసిన రైలు కూడా తప్పిపోతుంది.  బస్సు వెళ్ళి పోతుంది.  నిద్రవల్ల మనము హాజరు కావలసిన సమయము కూడా దాటిపోతుంది  నిద్రవల్ల ప్రమాద స్థితిలో వున్న మన బంధువుయొక్క అవసాన స్థితిలో వున్న ఆందోళన సమయాన్ని దాటించి, వారి మృతికి మనము నిద్ర వలన కారకులగుచున్నాము.  నిద్రవల్ల ఆత్మకార్యాలను అలక్ష్యము జేస్తున్నాము.  నిద్రవలన ఇంట ప్రవేశించిన దొంగయొక్క ఉనికిని కనిపెట్టలేక దోపిడీకి గురియగుచున్నాము.  బస్సులు, లారీలుగాని, కార్లుగాని, రైళ్ళను గాని తోలెడి డ్రైవర్లు కునికి నిద్రించినారంటే ఎట్టి ప్రమాదము సంభవించునో మనకు తెలియును.  కాబట్టి మానవ జీవితములో ప్రతిదానికి సమయము కలదనిన దైవవాక్యానుసారము నిద్రకు కూడా సమయమున్నదని మనము గ్రహించవలెను.  ఏ సమయములో నిద్రించవలెనో ఆ సమయములోనే నిద్రించవలెను.  సమయము కాని సమయములోను, ప్రమాదకరమైన స్థలములలోను, మన స్వంతముగాని ఇళ్ళలోను లేక అనేక జనుల మధ్య రక్షణ లేని స్థలములలో నిద్రించుటన్నది దేహానికి, ఆస్థికి కూడా ప్రమాదకరమని ఇందునుగూర్చి దైవవాక్యము - అందుచేత నిద్రించుచున్న నీవు మేల్కొని మృతులలో నుండి లెమ్ము.  అప్పుడు క్రీస్తు నీ మీద ప్రకాశించును.

        కనుక శరీరము తన నిత్యక్రియల నుండి తన ఇహలోక సంచారము నుండి విశ్రమించి, అలసి నిద్రించినప్పుడు ఆత్మ శరీరములో నుండి బహిర్గతమై అదృశ్య సంచారము చేయుటలోనే స్వప్నములు దర్శనములు వచ్చును.  శరీరముతో వుండి అదృశ్యములో ఉన్న కార్యములు శారీర దృష్టి మానవునకు చాలదు.  ఆత్మసంచారము వేరు, శారీర సంచారము వేరు.  శారీర సంచారమునకు లోకసంబంధమైన వాహనాలు కావలెను.  ఆత్మ సంచారమునకు వాహనము అక్కరలేదు.  వాయువే దానికి సాధనము.  ఆత్మన్నది వాయువులో లీనమై, ప్రపంచములో ఏ దేశమైన, ఏ మూలనైన, ఏ సముద్రజలములనైనా చుట్టి రాగల శక్తి సామర్థ్యములు దానికున్నవి.  ప్రభువు మనలను ఆశీర్వదించి కాపాడును గాక!

.........

        ప్రసంగాంశము :-  యోహాను 3:15 యేసు ప్రభువు మోషే ఎత్తిన సర్పముతో తనను పోల్చుకొనుటలో ఉన్న నగ్న సత్యమును తెలిసికొందము.  సంఖ్యాకాండము 21:6లో యెహోవా ప్రజల మీదకు సర్పములను పంపెను.  ఆదికాండము 3:1లో దేవుడు సృష్టిలో సర్పము యుక్తి గలది.  నిర్గమకాండము 4:2-4 మోషే మరియు 7:10లో అహరోను విసిరిన కర్ర పామగుట.  మంత్రవేత్తలగు శకునగాళ్ళు కూడా పాములను  చేయుట ప్రకటన 12:3లో ఏడు తలల ఘటసర్పము మత్తయి 23:33లో యేసు సంభోధించి పల్కిన మాటలలో యోహాను బాప్తిస్మము పొందు పరిసయ్యులను సంబోధించిన తీరును మనము గుర్తించితే, సర్పాన్ని సృష్టించింది దేవుడే, దానిని శపించింది దేవుడే, అయితే ఆ శాపములో నీ సంతానమునకు, స్త్రీ సంతానమునకును విరోధము కల్గించినట్లున్నదిగాని పురుష సంతానమని లేదు.  స్త్రీ సంతానమనగా యేసుప్రభువు - దీనినిబట్టి యేసు ఆదాము సంతతి కాదనియు. ప్రకటనలో చూడు హవ్వ దోషమును బట్టి స్త్రీ నుండి శరీరేచ్ఛలు లేక జన్మించినట్లును, అయితే ఆది తండ్రియైన ఆదాముయొక్క దోషము చేత అతని సంతతియైన మనము సర్పదోషము అంటియుండుట చేత మత్తయి 23:33లో యేసుప్రభువు మనలను సర్పములుగా ఉచ్ఛరించి యున్నారు.

        మోషేచే అలనాడు నడుపబడిన ఇశ్రాయేలు జనాంగములు కూడా సర్పదోషులైనట్లు సంఖ్యాకాండము 21:6లో యెహోవా పంపిన తాపకర సర్పములు ఇందుకు నిదర్శనముగ ఉన్నది.  ఫరో ఎదుట అహరోను పడవేసిన కర్ర కూడ సర్పసంతానమునకు ఆదర్శము.  ఎట్లనగా దైవభక్తులు వెలుగు సంబంధులు, దుష్క్రియలు చేయువారు చీకటి అనగా అపవాదియను సర్పసంబంధులు.  ఇచ్చట నిర్గమ 4:2-5లో మోషే పడవేసిన కర్ర ఫలనిషేధ వృక్షమునకు గుర్తు.  అది సర్పముగా మారుటలో ఆ వృక్ష శాఖ నధిరోహించిన సర్పమునకు గుర్తు.  ఆదిలోని చెట్టున వ్రేలాడిన సర్పవిధానమును దేవుడు తన మహిమాన్విత క్రియ ద్వారా బయలుపరచినట్లు తెలియుచున్నది.  మరి ఫరో శకునగాళ్ళు మంత్రవేత్తల విషయములో గమనిస్తే వారు సృష్టించిన పాములను దేవుని కర్రయైన పాము మ్రింగివేయుటలో - నరుల చేత సృష్టించబడిన సర్పము శక్తిహీనమనియు, అవి నరులచే సృష్టించబడినందున దైవసృస్టికి లోకువైనట్లు తెలియుచున్నది.  దీనిని బట్టి ఆలోచిస్తే ఆదికాండము 3:1లో దేవుడు సృష్టించిన సర్పము యుక్తిగలదై నరునిలోని దైవాత్మను సైతము పనికిమాలినవానిగా చేసి, మరణపాత్రునిగా చేసిందంటే నరులు సృష్టించిన సర్పములో ఎంత ప్రభావము ఉంటుందో మనము గుర్తించితే అది ఫలశూన్యమని తెలియుచున్నది.  అయితే ప్రకటన 12:3-4లోని ఘటసర్పపు మాట ఏమి?  ఈ వాక్యములలో గొప్ప దైవసత్యము తెలియుచున్నది.

1.  ఎఱ్ఱని మహా ఘటసర్పము :-  మన పాపక్రియల శక్తి ద్వారా యెషయా 50:1-3 వచనములలో వలె మన దోషములను బట్టి అమ్మబడి, తద్వారా ఆ సర్పము ఎఱ్ఱని రంగుతో విజృంభించు శక్తినిచ్చినట్టును.

2.  దానికి ఏడు తలలు :-  గలతీ 5:19-21లో వలె నరుల శరీర కార్యములను, సప్త వ్యసనములను దుష్‌క్రియలను ఏడు తలలుగా దానికి ఇమిడ్చినట్లు.

3.  పదికొమ్ములనగా :-   దేవుని పది ఆజ్ఞలు వ్యతిరేకించి నరుల దైవవ్యతిరేక గుణములు.

...........

ప్రేమను గూర్చిన వ్యాఖ్యానము :-  సర్వేశ్వరుడు ఆదిలో నరుల పట్ల చూపిన ప్రేమానురాగాలు ఎట్టివి?

        యోహాను 3:16 దేవుడు లోకమును ఎంతోప్రేమించెను.  కష్టము లేకుండ తోటను వేసినాడు.  ఒక మనిషిని అందులో పెట్టినాడు.  అన్ని తిను, ఆ తోట మధ్యలో ఉన్న పండును మాత్రం తినవద్దన్నాడు.

దేవుని ప్రేమ నిరూపణ :-  ఒక తండ్రి ఒక బిడ్డను కనినప్పుడు ఆ బిడ్డ కొరకు ఒక ఇల్లు, ఆ బిడ్డ ఆడుకొనుటకు ఆటవస్తువులు, అతను విలాసముగా ఆడుకొనుటకు తోట - ఆ పసివానికి ఆహారముగా ఉపయోగపడు తోట ఫలములు, ఆడుకొనుటకు పచ్చటి ఆట స్థలము, పరిశుభ్రమైన పారుదలతో కూడిన నీరు, పరిశుభ్రమైన గాలి, నీరు, కల్గిన వాతావరణమును కల్గిన పరిస్థితి బిడ్డకు తండ్రి ఏర్పరచుట సహజము - ఇది ప్రేమ రహస్యము.  ఈ ప్రేమ రహస్యము దేవుడు మన యెడల ఏ రీతిగా కనపఱచియున్నాడనగా - నరులైన మనము పుట్టక మునుపే మనకు కావలసిన వాతావరణమును ఆయన ఏర్పాటు చేసి యున్నట్లుగా తెలియుచున్నది.  మొట్టమొదట ఆయన కుమారుడు ఆదాము ఇతని పట్ల దేవుడు కనపరచిన ప్రేమ :- ఆదామును గూర్చి దేవుడు ఒక బ్రహ్మాండమైన వనమును సృష్టించి, అందులో సకల సౌఖ్యంబుల కల్గించి, తన బిడ్డగా ప్రేమించి, ఆది నరుని పెంచినాడు.  అతనికి కాలక్షేపముగా వినోదించుటకు ఆ వనములో ఆటవస్తువులుగా జంతువులను పక్షులను ఆదినరునికి అందుబాటులో ఉన్నట్లుగాను, అతనితో సఖ్యత కల్గి యుండుటకు నిర్ణయించినాడు.  ఇట్లు కొంతకాలమైన తర్వాత తండ్రి ఏ విధముగా తన బిడ్డకు యుక్తవయస్సు రాగానే పెండ్లి చేయునో అదే విధముగా ఆదామునకు కూడా యుక్తవయస్సు రాగానే దేవుడు సాటి సహాయమని ఒక స్త్రీని చేసి ఆతనికి జతపరచియున్నాడు.  కాని మానవుడు కృతజ్ఞత లేనివాడు కాబట్టి, దేవుని ప్రేమయొక్క ఆంతర్యమును ఎరుగనివాడై, ఆజ్ఞాతిక్రమమును చేసి మరణమును సంపాదించుకున్నాడు.  అయినను దేవుడు నరుని విడువక, తానే యేసు అను రూపముతో ఈ భూలోకమునకు ఏతెంచి, నరుని మీద ఉన్న ప్రేమను చంపుకొనలేక వాని పాపపరిహారార్థము బలియై, తన చెంతకు రమ్మని పాపమును వదలిపెట్టమని,  నీతిగా జీవించమని ప్రవచించుచున్నాడు.  కనుక ఇంత ప్రేమ కల్గిన దేవుని మనము ఆత్మతోను, సత్యముతోను ఆరాధించి ప్రేమింపవలెనని ఈ సందర్భములో మనము గ్రహించవలసిన దైవసత్యము.

.........

        యోహాను 4-6.  యాకోబు బావిలో ఉన్నట్టి దైవిక మర్మములు ఏవి?  దాని ద్వారా జరిగిన మహత్తర క్రియలేవి?  యాకోబు బావి ఎవరిది?  ఆ బావి దగ్గరకు క్రీస్తు ఎందుకు వచ్చినాడు?  తాత సొత్తు యాకోబు వంశస్థులను యుగయుగముల నేలును.

        యాకోబు 4-6లో ఉదహరించిన బావి ఆదికాండము 26, లూకా 1-33.  దావీదు యాకోబు వంశస్థుడు.  కాబట్టి క్రీస్తుకు పిత్రార్జితము ఉన్నది.  యాకోబుకు దేవుడు ఇచ్చిన వాగ్దానము నెరవేర్చబడవలెను.  కనుక యాకోబు త్రవ్విన బావి నరునికి రక్షణార్థమై దేవుడు నిర్ణయించినట్లు ఈ యాకోబు బావి వద్ద జరిగిన సంఘటన మనకు ఋజువు పరచుచున్నది.  ఎట్లంటే ఐదుగురు భర్తలతో పాపములో జీవించిన స్త్రీకి ఈ బావి రక్షణ కల్గించినట్లును, ఆమె ద్వారా ఆ ప్రదేశములోని అన్యులును రక్షించబడినట్లు, వారి ఆత్మ దప్పిక తీర్చినట్లును మనకు తెలియుచున్నది.  క్రీస్తునకు కూడా తాను పొందిన దప్పికను ఆత్మీయముగా తీర్చుకున్నట్లు ఈ సంఘటన ఋజువగుచున్నది.  తాను ఆ బావి దగ్గరకు ఎందుకు వచ్చినట్లు?  పాపిని మార్చుటకు మాత్రమే.  ఈ కార్యము అచ్చట నెరవేరినది.  ఈ బావి ఇశ్రాయేలీయుల కొరకు ప్రత్యేకించి యున్నట్లు యాకోబు అను నామధేయముతో పిలువబడి యున్నది.  అయినను సమరీయులు ఈ బావి వద్ద (ద్వారా) రక్షణ పొందినట్లుగా మనము గ్రహించవలసి యున్నది.

        అయితే ఈ బావి ద్వారా ఒక గ్రామమును క్రీస్తు దైవత్వములోనికి మార్చినట్లును, వారిలో చాలామంది ఆయనను దర్శించి విశ్వసించినట్లును తెలియుచున్నది.  అయితే యేసు ఆ బావిని గూర్చి గొప్పగ చెప్పినట్లు లేదు.  ఎందుకంటే ఆ నూతి నీరు త్రాగువాడు మరల దప్పిగొనును.  అయితే యేసు ఇచ్చినట్టి నీరు త్రాగువాడు దప్పిగొనడు.  అనగా శరీర సంబంధముగా యాకోబు బావి.  ఆత్మీయ దాహమునకు అబ్రాహాము, దావీదు కుమారుడైన యేసు బావి.  ఈ రెండు బావులు ఈ సుఖారమ స్థలములో ఉన్నట్లు మనము గుర్తించవలెను.  ఎందుకంటే నేనిచ్చు జలముఅని అన్నాడు కదా!

        అనగా ఈయన బావి.  ఆ నీళ్ళు ఆమె చేదుకున్నట్లుగా అనగా చేదుకున్నంత అనుభూతి ఆమె పొందింది.  ఎందుకంటే ఆ బిందె అక్కడ పడవేసి ఊరిలోనికి వెళ్ళినది.  ఈ బావి యేసుకు పిత్రార్జితమై యున్నది.  అందుచేతనే యేసు తనయొక్క వారసత్వమును బట్టి ఈ లోకసంబంధముగా ఆమెను దాహమునకు అడిగినట్లుగా తెలియుచున్నది.  ఆమెను నీళ్ళు అడుగుటలో ఆయన హక్కుదారుడుగా ఇందులోని పరమార్థము మనము గుర్తించవలెను.  అయితే ఇచ్చట యాకోబు బావిలోని నీళ్ళకంటె, యేసు బావిలోని నీళ్ళు చాలా శక్తివంతములైనట్లు మనము గ్రహించవలసిన వారమైయున్నాము.  ఎందుకంటే ఆ సమరయ స్త్రీయొక్క ప్రవర్తనను మార్చి వేసినది.  ఆ ఊరిలోని జనముయొక్క మనసులను మార్చినది.  మనుష్యులను మార్చినది.  ఇంకను ఈ లోకసంబంధముగా శారీర దప్పికగా యాకోబు బావి.  ఆత్మీయ దప్పికకు ఆత్మ రక్షణార్థము - యాకోబు వంశస్థుడైన యేసు అను బావి.  యేసు బావి అనుటకు ఆధారములు యోహాను 2-8 ప్రకారముగా యేసు ద్రాక్షారసపు బావిగా ఎంచబడుచున్నాడు.  అరణ్యములో మోషే తట్టిన బండ యేసు జలాశయము అనగా జీవజలపు బుగ్గ అనుటకు ముంగుర్తుగా ఉన్నది.

............

దైవార్చన ధ్యాన ప్రసంగ మాలిక

        3వది మూలము యోహాను 5:2-16

        ప్రియపాఠకులారా!   యేసు చేసిన అద్భుతాలలోఅన్నియు కూడా నరునియొక్క బుద్ధికి అందని స్థితిలో ఆయన కార్యాలు ఉండుట - ఆయన దైవకుమారుడా?  మనుష్యకుమారుడా?  అని సందిగ్ధావస్థలో ఉంటున్నాము.  ఆయన చేసిన అనేక అద్భుతాలలో నాటి దైవజనాంగమైన యూదులకే ఆశ్చర్యముగాను,  వారియొక్క హోదాలకు భంగకరముగాను, వారి ఆచారాలకు విరుద్ధముగాను, వారి నియమాలకు అభ్యంతర పరచునదిగ ఉండినట్లును - యేసు చేసిన అద్బుత కార్యాలు ఆయన పట్ల తన స్వజనులు కనబరచిన వైఖరి ఎంతో విషాదకరము.  యేసుక్రీస్తు శరీరమును బట్టి అనగా తనకు తల్లి గర్భములో రూపమిచ్చి, జన్మనిచ్చిన తల్లిని బట్టి దావీదు సంతానముగాను ఈ లోకములో పిలువబడినాడు.  యూదులు కూడా ఆయనను మామూలు మనిషిగానే భావించారు.  దావీదు వంశము యూదా గోత్రములో పుట్టిన వాడైనప్పటికిని, ఆయనను నాటి ఇశ్రాయేలు అను దైవ జనాంగము తమ స్వజాతీయుడుగ భావించినను ఆయనను పోషించిన తల్లి దండ్రుల బీదరికాన్ని బట్టి అనగా యూదా జాతియొక్క ఆస్థులు, అంతస్థులు, పదవులు, ఆధిక్యతలు - యేసుక్రీస్తు పోషించిన తల్లిదండ్రుల స్థితిగతులకు చాలా తేడాలున్నవి.  ఎందుకనగా ఆయన చెప్పినట్లుగ మత్తయి 8:20 నక్కలకు బొరియలను, ఆకాశ పక్షులకు నివాసములును కలవుగాని మనుష్యకుమారునికి తలవాల్చుకొనుటకైనను స్థలము లేదని చెప్పిన మాటలను బట్టి, ఆయనను తమ స్వజనుడనిగాని, దైవ కుమారుడని, ఆయనను శారీరరీత్యా ప్రభువును - తమ జాతివాడని అనగా యూదుడని, దావీదు వంశపువాడని, మరియు ఆయన చేసిన అద్భుత కార్యాలను బట్టి ఆయన దైవకుమారుడే అనేటటువంటి నిర్ధారణ చేయక, రెండు విధములైన అనగా ద్వంద వైఖరితో యేసుక్రీస్తు పట్ల వ్యవహరించినట్లుగ ఈ బెతెస్థ కోనేటి దగ్గర జరిగిన సంఘటనను బట్టి మనము వేదరీత్యా తెలిసికొందము.

        యెరూషలేములో గొర్రెల ద్వారము దగ్గర హెబ్రీభాషలో బేతెస్థ అనబడిన యొక కోనేరు కలదు.  దానికి ఐదు మంటపాలున్నాయని, ఆయా సమయాలకు దేవదూత కొనేటిలో దిగి నీళ్ళు కదలించుట కలదు.  నీరు కదలింపబడిన పిమ్మట, మొదట ఎవడు దిగునో వాడు ఎట్టి వ్యాధికలవాడైనను బాగుపడును. కనుక ఆ మంటపములలో రోగులు, గ్రుడ్డివారు, కుంటివారు, ఊచకాలు చేతులు కలవారు గుంపులుగా పడి యుండిరి.  అక్కడ 38 ఏండ్ల నుండి వ్యాధి గల యొక మనుష్యుడుండెను.  యేసు -  వాడు పడి యుండుట చూచి, వాడు అప్పటికి బహుకాలము నుండి ఆ స్థితిలో నున్నాడని అనగా అతని వ్యాధియొక్క కాలపరిమితి 38 ఏండ్లు అంటే బేతెస్థా కోనేటి దగ్గరకు యేసు ప్రవేశించిన సమయమునకు యేసుప్రభువు వయస్సు 33 సంవత్సరముల లోపు.  ఈ రోగియొక్క కాలపరిమితి 38 ఏండ్లు.  రోగియొక్క రోగము 38 ఏండ్లు కలిగి ఉంటే, దైవకుమారుడైన యేసుక్రీస్తు వయస్సు కంటె ఈ కోనేటి దగ్గర పడి యున్న ఈ రోగియొక్క వయస్సు ఐదు సంవత్సరాలు, ఆరు లేక ఏడు సంవత్సరాలు అధికము.  అయితే ఈ రోగము అనుభవిస్తున్న రోగి వయస్సు ఎంత ఉండాలన్నట్టి విషయాన్ని మనము లెక్కిసే ్త- ఈ లెక్క మామూలు జ్ఞానానికి అందదు.

        ప్రియపాఠకులారా!   ఈ సందర్భములో యేసుక్రీస్తు పక్షరోగితో చెప్పిన మాట 5:14 ఇదిగో స్వస్థత నొందితివి, మరి ఎక్కువ కీడు కలుగకుండునట్లు ఇకను పాపము చేయకుము, అని చెప్పుటలో ఆ వరకు ఇతని రోగముతోబాటు ఆ రోగమునకు కారణమైన పాపము వయస్సు కంటె గొప్పది.  ఇతని పాపము యేసుక్రీస్తు కంటె ముందుగా జన్మించి, ఎక్కువ వయస్సు కల్గిందంటే ఇతడు రోగ పాపములోను, వ్యాధిలోను, లోకరీత్యా సీనియారిటీని పొంది యున్నాడు.  ఇది మామూలు సీనియారిటీకాదు.  ఏ నరునికి ఈ రకము సీనియారిటీ ఆనాడు ఈనాడు లేదు.  ఇతను పాపములో రిటైరైయ్యి రోగి అయ్యాడు.  ఇతడు రోగియైనందుకు పాపము - ఇతనికిచ్చిన రిటైర్‌మెంట్‌ పాప ఉద్యోగ విరమణ,  దీనికి 38 ఏండ్లు పండుకొని తినే యోగ్యతను, ఈ లోకము అతనికి అనుగ్రహించింది.  ఇది లోకసంబంధముగ పాపక్రియద్వారా, రిటైర్‌మెంట్‌ద్వారా, లోకము ఇచ్చే బహుమానము.  అయితే దైవసన్నిధిలో - ఇది సుదీర్ఘమైన శిక్ష - నిరాదరణ, నిస్సహాయతతో కూడిన శిక్ష.  అయితే భూమి దీనిని తన పాపక్రియల నుండి విరమించిన వానికి ఆ వ్యాధి అన్నది పారితోషికమైయున్నది.

        ప్రియపాఠకులారా!  బేతెస్థలో ఐదు మంటపాల కోనేరు.  38 ఏండ్ల నుండి పడియున్న ఈయొక్క రోగి పాపఫలితమునకు గుర్తుయై యున్నాడు.  ఈ విధముగా 38 ఏండ్ల నుండి రోగముఅనుభవిస్తున్న ఈ రోగి బేతెస్థ కోనేటిలో ప్రతి సంవత్సరము ఆయా సందర్భాలలో అనగా అది ఏ సందర్భములోగాని 9వ నెలలోగాని, ఏడవ నెలలోగాని, మూడవ నెల లేక ఏదైనను పండుగ దినములలోగాని, దైవదూత దర్శనమిచ్చుట.  ఆనాటి ఈ కోనేటి దగ్గర జరుగుచున్న పరిశుద్ధమైన దైవసంబంధమైన దేవదూత దర్శనముతో కూడిన పండుగ.  అట్లే ఆయా సమయాలలో పాతనిబంధన, నూతన నిబంధనలోగాని, ఏ సందర్భములోను, ఏ సమయములోను, ఏకాలములోను, ఏ సంవత్సరములోను, జరుగనట్టి ఆశ్చర్యకరమైన ఈ బేతెస్థ కోనేటిలో జరుగుచున్నది.  ఈ విధముగా నీళ్ళను దేవదూత కదిలించుటన్నది ఎక్కడను, ఏ కాలములోను లేదు.  మొట్టమొదట ఏ రోగి నీటిలో దిగునో ఆ రోగి స్వస్థత పొందుతాడన్న వివరము తెలుపుచున్నది.   ఇటువంటి స్థలము మరెక్కడ లేదు.  అయితే ఆ కోనేటికిని, ఆ మంటపాలకును, ఆ స్థలమునకు, ఆ గొర్రెల ద్వారమునకు వారసుడుగా యేసుప్రభువు వచ్చి, ఆ రోగిని - అధికార పూర్వకముగా స్వస్థపడగోరుచున్నావా? అని అడుగుట - అధికారయుతమైనదియు, ఆ రోగి పట్ల సానుభూతితో ప్రేమతో ఆదరణతో మాట్లాడిన మాటగా యేసు ప్రభువు పల్కిన మాటలలోని స్వరము మనకు బయల్పరచుచున్నది.  

        అయితే ఆ రోగి పాపములోను, రోగములోను, రెండింటిలో అత్యధికమైన మోస్ట్‌ సీనియారిటీని పొంది యున్నాడు.  ఎలాగంటే అతని పాప జీవిత కాల పరిమితి ఎంతో అతని రోగముయొక్క కాలపరిమితి కూడా అంతియే.  కనుక ఈ రెండు విధములైనటువంటి సీనియారిటీలను బట్టి, అతనికి కల్గిన దశ ఏమిటంటే - ఆ కోనేటి గట్టున పక్క వేసుకొని పరుండి తినడమే, ఇది లోకానికి, పరలోకానికిని, మానవత్వానికిని, దైవత్వానికిని, దేనికిని పనికిమాలినట్టిది.  ఏ విధముగా?  మానవత్వముగా తీసుకొంటే అతను ఆరోగ్యవంతుడు కాడు, దేహరీత్యా లోకానికి ఉపయోగపడేవాడు కాడు.  ఆత్మీయముగా చూస్తే క్రీస్తును ఎరిగియున్నవాడు కాదు.  ఎరిగియున్న పక్షములో తన ఎదుట నిలిచిన దైవకుమారుడైన క్రీస్తును తనకు స్వస్థత కల్గించమని ప్రాధేయపడి ఉండేవాడు.  తన ఎదుటనున్న ప్రభువును గుర్తించలేని స్థితిలో ఉన్న అతను ఎట్టి దుర్భరమైన జీవితాన్ని అనుభవిస్తున్నాడో - ఆ వివరాన్ని బేతెస్థ కోనేరు, దానికి ఆనుకొన్న ఐదు మంటపాలే సాక్ష్యములై యున్నవి.  అంటే దేవదూత వచ్చి నీళ్ళను కదిలించే సందర్భములో నీళ్ళను కదిలించే శబ్దమును ఆ రోగి ప్రకటిస్తూ - రమ్మని స్వస్థత పొందమని ఘోషించినను, ఆ రోగిని ఆ నీళ్ళు దగ్గర చేర్చే సహాయకులు లేరు.  ఆలాగే మంటపాలలో ఉన్న నానా రోగులలో ఒకడుగ అతను ముంచబడాలంటే ఆ మంటపాలలో అతని చేర్చి ఆదరించేవారు లేరన్నట్లుగానే అతనియొక్క దీనస్థితి వెల్లడిపరచుచున్నది. అనగా లోకములో ఏ వ్యక్తికి లేనట్టి నిస్సహాయకరమైన స్థితి ఆ వ్యక్తికి ఉన్నట్లు ఇందునుబట్టి మనకు తెలుస్తున్నది.  

        చిత్రమేమంటే 38 ఏండ్లుగా ఆ స్థలములో పడక వేసుకొన్న ఈ రోగి ఒక్క సందర్భములో కూడా తాను స్వస్థపడగోరుటకు ప్రయత్నించినట్లుగా దాఖలాలు లేవు.  కోనేటి నీళ్ళను కదిలించుటకు దేవదూత వచ్చినప్పుడు ఈ రోగి కేక లేచి తనను కాపాడమని, తనకు స్వస్థత కల్గించమని, అడిగియున్న పక్షములో అతని రోగముయొక్క సీనియారిటీ తొలగి ఉండేది.  అయితే అతడు దేవదూతను అభ్యర్థించిన వాడు కాదు.  రోగియై వేసికొన్న పడకయొక్క సీనియారిటీ కోనేటి మండపము దగ్గర రోగుల కంటె ఎక్కువ సీనియారిటీ - మూడు విధాలుగ అనగా రోగమును బట్టి, 2వది పడకను బట్టి, 3వది అతను ఉన్న కాలమును బట్టి.  ఈమూడు విధములైన సీినియారిటీలు అతనిని గూర్చి యేసునకు సాక్ష్యమిచ్చినట్లు తెలియుచున్నది.  యేసు ఎరిగిన విధానమునుబట్టి మనకు అర్థమగుచున్నది.  అంటే యోహాను 5-6లో యేసు - వాడు పడియుండుట చూచి, వాడు అప్పటికి బహుకాలము నుండి ఆస్థితిలో ఉన్నాడని ఎరుగుటకు పై ఉదహరించిన సాక్ష్యాలే;  ఇందునుబట్టి యేసుప్రభువు ఆ రోగి పట్ల కనికరపడి స్వస్థపడగోరుచున్నావా? అనగా అందుకు విరుద్ధమైన జవాబు - యేసుప్రభువు అతనిని అడిగినది స్వస్థతను గూర్చి, కాని అతడు చెప్పిన జవాబు - నీటిని గూర్చి దూతయొక్క రాకను గూర్చి, నీటి కదలికను గూర్చి - కదలింపబడే నీటిని గూర్చి, ఆ సందర్భములో కోనేటిలో దింపుటకు వ్యక్తులయొక్క సహాయము లేదనే కొరతను గూర్చి, తన నిస్సహాయతను బట్టి ప్రభువునకు ఎరిగించుటయు - అంతట యేసు - నీవు లేచి నీ పరుపెత్తుకొని నడువుమని వానితో చెప్పగా - వెంటనే వాడు తనకున్న మూడు విధములైన సీనియారిటీల నుండి విడుదల పొంది, అనగా పాపము, రోగము, ఆ కోనేటి దగ్గర పడియున్న కాలము - ఈ మూడింటి నుండి విడుదల పొంది, మరల లోకసంబంధముగా ప్రయోజకుడగుట, అనగా తిరుగా లోకానికి, దైవత్వానికి పనికి వచ్చేటటువంటి శక్తిని, బలాన్ని, ఆరోగ్యాన్ని పొంది, నాటి నుండి తన పడకను తనయొక్క విషతుల్య జీవితము నుండి విడుదల పొంది, ప్రభువును మహిమపరచినట్లు ఇందులోని వివరణ.        

        ప్రియపాఠకులారా!  ఇంత గొప్ప అద్భుత కార్యము జరిగించిన ప్రభువు పట్ల అతడు కృతజ్ఞత చూపకపోవుట అటుంచి నడిచి జనుల మధ్య నడచుచుండగా ఆ మహత్కార్యమును కన్నులారా చూచి గ్రహించక, దైవజనమని పేరు మాత్రమే ఉన్న నాటి ఇశ్రాయేలు అనగా దేవుని ధర్మశాస్త్రము తూచా తప్పకుండ ఆచరిస్తున్నామని, తామే ఆత్మపరులమని, తామే పండితులమని, తామే దేవుని బిడ్డలమని, తామే దైవనియమమును పాటించువారమని, లోకములో వారందరిలో తామే అగ్రకులస్థులమని, తామే జ్ఞానవంతులమని, చెప్పుకొను యూదులు - అయితే ఈ దినము విశ్రాంతి దినము గదా;  నీవు నీ పరుపెత్తుకొన తగదే అని స్వస్థత నొందిన వానితో చెప్పిరి.  అందుకు వాడు - నన్ను స్వస్థపరచినవాడు - నీ పరుపెత్తుకొని నడువమని నాతో చెప్పెననెను.  వారు నీ పరుపెత్తుకొని నడువుమని నీతో చెప్పిన వాడెవడని అడిగిరి.  ఆయన ఎవడో స్వస్థత నొందిన వానికి తెలియలేదు.  ఆ చోట గుంపు కూడి యుండెను గనుక యేసు తప్పించుకొని పోయెను.  అటు తర్వాత యేసు దేవాలయములో వానిని చూచి - ఇదిగో స్వస్థత నొందితివి.  మరి ఎక్కువ పాపము చేయకుమని చెప్పగా - వాడు వెళ్ళి నన్ను స్వస్థపరచినవాడు యేసు అని యూదులకు  తెలియజెప్పెను.  ఈ కార్యములను విశ్రాంతి దినమున చేసినందున యూదులు యేసును హింసించిరి.  ఇందులోని ప్రధానాంశములు 5:10-16.

        ప్రియపాఠకులారా!  ఇంతవరకు బేతెస్థ కోనేటి దగ్గర పడియున్న రోగియొక్క సీనియారిటీలను గూర్చి తెలిసికొని యున్నాము.  ఇప్పుడు దైవకుమారుడు, లోకరక్షకుడు, యేసుక్రీస్తు జరిగించిన ఈ అద్భుత కార్యమును గురించి వివేచింపక ప్రవర్తించిన మూఢవైఖరిని గూర్చి వివరముగా తెలిసికొందము.  నిజమునకు నాటి ఇశ్రాయేలు జనము దేవుని జనమైనను, వారు దైవత్వమునకు విరోధులై, దైవత్వములోని యదార్థతను గ్రహించనివారై, దేవునియొక్క నిజస్వరూపము క్రీస్తులో ఉన్నదన్న పూర్వార్థము బొత్తిగా కొల్పోయినవారై, అనగా ధర్మశాస్త్ర ముసుగులో దైవత్వముయొక్క నిజస్వరూపమును గూర్చిన ఆత్మీయ జ్ఞానమును కోల్పోయి, లోకసంబంధ ధర్మమును పాటించుచు, లోకములో న్యాయానికి శారీరకముగా విధించిన విధులను బట్టి, వాటిని గూర్చి అనగా వాటి మీదనే తమయొక్క మనస్సులను లగ్నము చేసి ప్రవర్తించుచు, తాము బుద్ధిమంతులు, జ్ఞానులమని, వేదాంతులమని, వేదశాస్త్ర పారంగతులమని, తామే దేవుని బిడ్డలమని, ప్రగల్భాలు పలుకుటనుబట్టి, వారి మధ్య యేసుప్రభువు చేసిన ఈ అద్భుత క్రియ రాణించలేకపోయింది.  అయినను 38 సంవత్సరములు  పడకనపడి బాధను అనుభవమును పొందిన ఆ రోగి యేసు ఎవరైనది ఈ ఐదు మంటపాల కోనేటి దగ్గర ప్రత్యక్షముగా చూచినను యేసును ఎరుగలేక పోయాడు.  కాని దేవాలయములో యేసును చూచినప్పుడు ఆ రోగితో యేసు - ఎక్కువ కీడు నీకు కలుగకుండునట్లు ఇకను పాపము చేయకుమని చెప్పెను.

        ప్రియపాఠకులారా!   ఆ రోగి అప్పటికే ఎంతో ఘోరాతి ఘోరమైనటువంటి ఆ పాపములో తగుల్కొని, పాపబంధకాల మూలముగా పడకనపడి జీవించినందున, అతను బేతెస్థ కోనేటి దగ్గర సంవత్సరాల తరబడి శిక్షను అనుభవించాడు.  అయితే ప్రభువు చెప్పిన మాట యోహాను 5:14, ''ఇదిగో స్వస్థత నొందితివి, మరి ఎక్కువ కీడు కలుగకుండునట్లు ఇకను పాపము చేయకుమని చెప్పెను,'' అంటే ఇప్పుడున్న కీడునుబట్టి తాను పొందిన 38 ఏండ్లు పడకనబడిన హీనస్థితి తొలగిపోగా, అనగా ఇప్పటివరకు అతని పాపముయొక్క మోతాదు అతడు అనుభవించిన 38 ఏండ్లు బేతెస్థ కోనేటి దగ్గర శిక్షకు పరిమితము కాగా, మరెక్కువ పాపము చేసినప్పుడు కీడు కలుగకుండునట్లు పాపము చేయకుము,'' అనుటలో బేతెస్థ కోనేటి దగ్గర యేసు ప్రభువు వాక్కులను బట్టి స్వస్థత నొందిన ఈ రోగి మరల పాపము చేసినట్లయితే, రెండు విధములైన నేరాలు, రెండువిధములైన శిక్షలు, 5వదిగా మరణశిక్ష, అటు తర్వాత అతని జీవితము సమాప్తమగునని ప్రభువు మాట్లాడిన మాటను బట్టి తెలిసికోవలసియున్నది.  ఇదే మాట యోహాను 8:11లో కూడా ప్రభువు పల్కిన మాట ''నీవు వెళ్ళి ఇక పాపము చేయకుమని ఆమెతో చెప్పెను'', అదే మాటను ఈ స్వస్థత నొందిన పడక రోగితో కూడా యేసుప్రభువు అంటున్నాడు. అయితే యేసుప్రభువు స్వజనమైన యూదులు యేసు ప్రభువు చేసిన ఇంత గొప్ప కార్యమును అలక్ష్యపరచి, ఆయనకు వ్యతిరేకముగా సణిగి, ఆయనను హింసించుటలో నరునియొక్క బలహీనత, నరుని జ్ఞానము, నరునియొక్క హృదయస్థితి ఎంత దుర్భరముగా ఉన్నదో - ఇట్టి సంఘాల మధ్య బోధకుడు అనుభవించే చేదు అనుభవాలెలాంటివో అన్న దానిని గూర్చి క్రైస్తవ సంఘస్థులమైన మనము సుదీర్ఘముగా ఆలోచించవలసి యున్నది.  అంటే బోధకునియొక్క జీవితము లోకరీత్యా ఎంత దుర్భరమో - దైవత్వములో బోధకునికున్న ఆధిక్యతలు ఎలా వున్నను, దైవత్వమునకు యోగ్యుడైన వ్యక్తిని లోకము అప్రయోజకుడుగా భావించవచ్చును - అనగా లోకమర్యాదలు, లోక చట్టాలకు వ్యతిరేక కార్యాలు చేయు వానినిగా లోకము భావిస్తున్నది.  అట్టి అలక్ష్య వైఖరిని ఈ సంఘటన మనకు వివరిస్తున్నది.  అనగా పరలోక సంబంధికి భూలోకమన్నది విరోధి.  పరలోక సంబంధమైన జ్ఞానము భూలోకమునకు వ్యతిరేకమును, భూలోక చట్టాలకు అతీతముగా భావించినట్లుగ మనకు బయల్పరచుచున్నది.

        ప్రియపాఠకులారా!  ఇట్టి స్థితిలో, ఈ విధమైన అలక్ష్యముతో కూడిన వాతావరణములో అలక్ష్యముతో కూడిన లోకము, అలక్ష్యవైఖరి కల్గిన జనాంగము, అక్రమము, పాపము, వైరాగ్యము, ద్వేషముతో కూడినటువంటి ఈ లోకముయొక్క వైఖరిని ఈ సంఘటన ప్రకటిస్తున్నది.  అయితే బేతెస్థ కోనేటి దగ్గర యేసు ద్వారా స్వస్థత పొందిన రోగి మరల పాపము చేయక ఉండినాడా?  అన్న ప్రశ్నకు జవాబు మనకు అనవసరము, ఎందుకంటే అతడు యేసు ద్వారా స్వస్థత పొందినాడన్నది నిజము.

.............

        ప్రియపాఠకులారా!   యోహాను 6:1-9లో వివరించబడిన వేదభాగములోని సారాంశమేమనగా యేసుప్రభువు  నరాకృతిగా వున్న దేవుడైయుండి లోకసంబంధులైన నరులలో విస్తరించియున్న పాపము, దాని సంబంధమైన అపవిత్రత, దానిని అనుసరించిన రోగములు, వాటి సంబంధితమైన కష్టనష్టములు, బాధలు, వగైరాలు నుండి లోకనరకోటిని విమోచించుటకు, ఈ లోకానికి వచ్చినట్లుగ యేసుప్రభువు చేసిన సూచకక్రియలు, జనసమూహాలలో ఆయన కనబరచిన మహత్కార్యములు ప్రభావితములై, అనేకులను ఆశ్చర్యపరచుచు, శారీర అవసరతలను మాని, ఆత్మీయాసక్తితో, ఆత్మీయాకలితో దినముల తరబడి కాలినడకతో కూడిన ప్రయాణముతో, ఆకలిదప్పిక, నిద్ర, దేహ సంబంధమైయున్న ఈ మూడింటిని విడిచిపెట్టి ఆత్మ సంబంధమైన ఆకలి, ఆత్మసంబంధమైన దప్పిక, వీటి తోడు ఆత్మప్రేరేపణ, యేసు ప్రభువును వెంబడించిన జనులలో క్రియ జరిగించినట్లుగాను, ఆయనను వెంబడించిన జనులయొక్క ఉద్ధేశ్యములను బైల్పరచుచున్నది.

        ఇక యేసు కొండ ఎక్కి తన శిష్యులతో కూడా కూర్చుండెను, అనుటలో దైవకుమారుడైన యేసుప్రభువు కొండ ఎక్కుటన్నదేమిటో - మనము ఆత్మీయముగ ఆలోచించవలసి యున్నది.  ప్రియపాఠకులారా!    ఆనాడు యేసు ప్రభువు కొండ ఎక్కినందువల్ల, ఈనాడు మందిరములలో బలిపీఠములో ఉన్నత స్థలములో ఆయనకు స్థానమేర్పడి వున్నది.  ఆయన ఎక్కిన కొండ ఈనాడు ''పుల్‌పీఠ'' అను పేరుతో క్రీస్తు బలి పీఠముగ చర్చీలలో నడుపబడుచున్నది.  మరియొక విశేషమేమిటంటే యేసును వెంబడించిన జనులు కొండ క్రింద వున్నారేగాని, యేసుతో కూడా కొండెక్కలేదు.  యేసు ఎక్కిన కొండమీద ప్రభువుతో సావాసము చేయుటకు యోగ్యులుగ శిష్యులున్నారనుటకు, ఈయనతోబాటు ఉన్నత స్థలములో ఆసీనులగుటకు ఆయన ప్రతిష్టించినవారే అర్హులు, అను మాట నెరవేర్పు కూడా ఈ కొండమీద యేసు ప్రభువు క్రియాత్మకముగ జరిగించినట్లు ఈ సంఘటన ఋజువు పరచుచున్నది.

        ప్రియపాఠకులారా!  నాడు యేసుతో కూడా కొండ మీద కూర్చున్న శిష్యులకు బదులు ఈనాడు యేసు బలిపీఠము దగ్గర యాజకులుగ ఉండుటకు నరులలోని అనేకులను దేవుడు ఏర్పరచుకొని యున్నాడు.  ఈనాటికి కూడా క్రైస్తవ చర్చీల ఫాదరీలు, స్వాములని, పాస్టర్లు అని, కాపర్లు అని, సువార్తీకులు, ఉపదేశకులని, పరిచారకులని పిలువబడుచున్నారు.  ఆనాడు యేసు కొండ ఎక్కినప్పుడు శిష్యులు కూర్చుండు యోగ్యతను - ఈనాడు వేదాంత విద్య నభ్యసించిన వేద విద్వాంసులకు, ఆ అవకాశము ఈయబడియున్నది.  కాబట్టి కొండమీదనున్న క్రీస్తు ఫస్కా అను యూదుల పండుగ సమీపించిన దినము గనుక యేసు కూడా ఆ ఫస్కా బలిని, పండుగను ఆచరించెడి సిద్ధాంతాలను, క్రియాత్మకముగా జరిగించాలని, ఫిలిప్పుతో రొట్టెలను గూర్చినట్టి చర్చను చర్చించాడు.  అయితే ప్రభువునకు తెలియును.  తనను సమీపించియున్న జనసందోహమునకు సరిపోవు రొట్టెలు తాను చేయగలడని - తెలిసి కూడా ఫిలిప్పును పరీక్షించుటకు రొట్టెల సమస్యను ఫిలిప్పుతో చర్చించినట్లు ఈ సంఘటన బైల్పరచుచున్నది.

        అలాగే ఆదిలోని దేవుడు అబ్రాహామును పరీక్షించుటకు కుమారుని అడిగినాడు.  యోబును పరిశోధించుటకు సాతానును ఉపయోగించాడు.  అలాగే ఇశ్రాయేలును కూడా దేవుడు వారియొక్క ఆత్మీయస్థితిని పరీక్షించి, వారికున్నటువంటి ఆత్మీయ బలహీనతలను గూర్చి బాధపడి, వారిని తన క్రమములో నడిపించాలని అప్పుడప్పుడు కొన్ని పరీక్షలు పెట్టియున్నాడు.

        నేటి మన విశ్వాస జీవితములో కూడా ప్రభువు కొన్ని పరీక్షలు పెట్టుచున్నాడుగాని, ఆ పరీక్షలు ఎవరు పెట్టుచున్నారు?  ఎందుకు పెట్టుచున్నారా?  ఈ పరీక్షలు వేనికోసము వచ్చినవా?  అన్నది నరులైన మన ఊహకందని సమస్యగానే వున్నది.  ప్రభువు పెట్టే పరీక్ష సాతానుయొక్క శోధన కంటె బలమైనది.  కాని అందులో రక్షణ కూడా ఉన్నది.  ప్రభువు పెట్టు పరీక్ష నర విశ్వాసముయొక్క స్థిరత్వాన్ని పటిష్టము చేయుటకేగాని, బలహీనపరచుటకు గాదు.  లోకసంబంధముగా కూడా లోకము మనుష్యులకు కొన్ని పరీక్షలు, ఇంటర్వ్యూలని, గవర్నమెంటు పరీక్షలని, నానారకములైన రీతులలో లోకము కూడా నరుని పరీక్షిస్తున్నది.  కాని ఆ పరీక్షలో నెగ్గిన వానికి ఉద్యోగ అవకాశము, బహుమతి ప్రదానము వగైరాలు ఇచ్చుచున్నవి.  మానవ జీవితములో పరీక్షన్నది లోకరీత్యా వాని ప్రజ్ఞ కొరకు, ఆత్మరీత్యా విశ్వాస పటిష్టత కొరకు.        

        ఈ విశ్వాస పటిష్టత కొరకు ఆదిలో దేవుడు ఏదెను వనములో అన్ని చెట్లతో బాటు మంచి చెడ్డలు తెలివినిచ్చు నిషేధ వృక్షాన్ని కూడా నాటి నరులయొక్క ఆత్మ విశ్వాసమును, జ్ఞానమును పరీక్షించాడు. కాని దైవపరీక్షలో ఆదినరులు పతనమయ్యారు.  అయితే అదే నరసంతతిలోవాడైన అబ్రాహాము తన విశ్వాస పరీక్షలో కుమారుని త్యాగము ద్వారా దైవత్వము చేత అనేక ఆశీర్వాదాలు పొందినాడు.  లోకపరీక్షలు లోకానికే పరిమితము.  పరలోకానికది నిష్ప్రయోజనము.  దానియేలు గ్రంథములో నెబుకద్నెజరు ఎత్తయిన విగ్రహాన్ని ప్రతిష్టించి, దానికి ప్రతి యొక్కరు సాగిలపడాలని ఆంక్షను విధించి, ఆయొక్క చట్టాన్ని దేవుని ప్రార్థన జీవితములో నిష్ఠాగరిష్ఠులైన మెషగు - షద్రగు - అబిద్నగోలును కూడా తన చట్టాన్ని వారికి కూడా వర్తింపజేశాడు.  అయితే నిర్జీవమైన, నిష్ప్రయోజనమైన, దైవవ్యతిరేకమైన ఈ లోక చట్టాన్ని సవాలు జేసి,  రాజు విధించు శిక్షకు వారు నిలబడగా, ఇట్టి విషమ పరీక్షలో రాజాజ్ఞను ధిక్కరించిన నేరానికి అగ్నిగుండములో పడవేయబడిన ఆ ముగ్గురు వ్యక్తులను, దేవుడు నాలుగవవాడుగ వుండి, వారిని కాపాడుటయేగాక, రాజును కూడా మార్చి, నిజమైన దేవుడు తానే అన్న నగ్న సత్యాన్ని బైల్పరచినాడు.  ఫలితము రాజు ప్రతిష్టించిన విగ్రహము పడగొట్టబడినది.

        ప్రియపాఠకులారా!  దైవపరీక్షన్నది పరిశోధనగాను, సాతాను కల్గించు క్రియాకర్మలు శోధనలుగ బైబిలులో వివరించబడి యున్నవి.  కనుక నరులమైన మనము మన శారీర ఆత్మీయ జీవితములో సాతాను శరీరమునకు శోధకుడుగాను, ఆత్మకు దేవుడు పరిశోధకుడుగాను, నియమితులైయున్నట్లు మనము గ్రహించవలెను.  ఇందునుబట్టి ఇక నరుడు రెండు విధములైన పోరాటములు పోరాడవలసి యున్నదని ప్రత్యక్షముగా మనకు తెలియుచున్నది.  ఈ ఆత్మా శారీర పరీక్షాయుత పోరాటములో - లోకరీత్యా శరీరము, ఆత్మరీత్యా ఆత్మయు బలహీనమగుట జరుగుచున్నది, అంటే లోకమన్నది దృశ్యమైన సంపదను చూపి మనిషితో పోరాడుచున్నది.  అదృశ్యమైయున్న వాటిని చూపుచు ఆత్మ పోరాటము సాగిస్తున్నది.  శారీరయుతముగ పోరాడి, జయించి, దృశ్యమైయున్న వాటిని సంపాయించుకొన్నను శరీరము అస్థిరమైనది.  కనుక ఒకనాటికి శారీరరీత్యా సంపాయించుకొన్న సంపదను, నరుడు శరీరముతో సహా వదలుకొని యాత్ర ముగించవలసిన దినమున్నది.  అయితే ఆత్మీయముగ సంపాయించుకొన్న సంపద, అదృశ్యములో వుండబట్టి అది స్థిరమైనదియు, నరశరీరమునకు అంతుపట్టనిదియునై యుండి, దైవత్వము చేత సృష్టించబడినదై యున్నది.

         ఆవిధముగ ఆత్మశక్తియొక్క ప్రభావమును నిరూపించుటకు ప్రభువు ఐదు యవల రొట్టెలు, రెండు చిన్న చేపలతో వున్న చిన్న వాని సంపదయైన ఆయొక్క భోజనము శారీరయుతముగ అయితే ఒక్కడికే అది.  అయితే ఐదువేలమందికి ఆ భోజనము వడ్డించబడింది.  అంతేగాక మిగిలిన భోజన పదార్థమును, 12 మంది శిష్యులు 12 గంపలకు నింపుటన్నది అది దైవత్వముతో కూడిన కార్యమా?  లేక మానవత్వముతో కూడిన కార్యమా?  మానవ స్థితిని బట్టి అనగా క్షుద్భాధను బట్టి నరునికి రొట్టె అవసరము. అలాగే సృష్టికర్తయైన దేవుడు రక్షకునిగ అవతరించి, రొట్టెలను తినిన ఐదువేలమంది మరియు ఆయన శిష్యులు 12 మంది మొత్తము జనాభా లోకరక్షకుడైన ప్రభువు ఎదుట కూడి యుండుటలో ప్రభువుయొక్క శక్తి వారి ఆకలి చంపినట్లా?  లేక ఐదురొట్టెలు రెండు చిన్న చేపల వలన వారు తృప్తి పడినట్లా?

        మరొక ముఖ్య గమనిక ఏమిటంటే - యేసు ఆ రొట్టెను పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి, కూర్చున్నవారికి వడ్డించినట్లును, ఆలాగున చేపలు కూడా వారికిష్టమైనంత మట్టుకు వడ్డించినట్లు వ్రాయబడియున్నది.  ఐదు రొట్టెలు ఐదువేలమంది తిని తృప్తి పొంది, మరల 12  గంపలు మిగిల్చినారంటే మాటలా?  అసలు 12 గంపల సంగతి అలా వుంచండి.  ఐదు రొట్టెలు, ఐదువేలమంది ఎలాగ తిని వుంటారు?  పోనీ అవి ఏమైన టన్నుల కొలదీ బరువున్న రొట్టెలా?  అంటే ఆ రొట్టెలు తెచ్చినటువంటివాడు బాలుడై యున్నాడు.  ఐదువేలమంది ఆహారాన్ని ఒక బాలుడు మోయగలడా?  అయితే యేసు ప్రభువు ఈ రొట్టెలను త్రుంచి ఎలాగు జనాభాకు వడ్డించినాడు?  అందరిని పచ్చిక మీద కూర్చోబెట్టుడని విస్తరిగాని, గిన్నెగాని, నీళ్లు త్రాగెడి గ్లాసుగాని అక్కడున్నట్లు లేదు.  రొట్టెలు తినినవారు నీళ్ళు త్రాగినట్లు కూడా వ్రాయబడలేదు.  దీన్ని గూర్చి మనము క్షుణ్ణముగా గ్రహించవలసియున్నది.

        ప్రియపాఠకులారా!  మానవ స్వభావముతో సీమోను పేతురు సహోదరుడైన అంద్రెయ ఒక చిన్నవాని యొద్ద ఐదు యవల రొట్టెలు, రెండు చిన్న చేపలున్నవి గాని ఇంతమందికి ఇవి ఏ మాత్రము? అనుటన్నది దైవసన్నిధిలో మానవునియొక్క బలహీనత తేటతెల్లముగ ఈ మాట ద్వారా తెలియుచున్నది.  దైవత్వమునకు అసాధ్యమన్నది లేదన్న సత్యాన్ని నాడు, నేడు కూడా నరజ్ఞానము నమ్మలేకున్నది.  దేవుడు మహనీయుడనియు నరునికి తెలిసినను దేవుడు కూడా మానవునివంటివాడే నన్నట్టి అజ్ఞానము, నేడున్న లోకజ్ఞాన అజ్ఞానులలో కూడా ఈ అవిశ్వాసమన్నది క్రియ జరిగిస్తున్నది.

        ఇంతకు ప్రియపాఠకులారా!  ఐదు రొట్టెలు, రెండు చిన్న చేపలు, ఐదువేలమందికి పంచబడుటలో వున్న కీలకాన్ని మనము ఈ సందర్భములో గ్రహించవలెను.  యేసు ఆ రొట్టెలు పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి కూర్చున్న వారికి వడ్డించెను, అని వ్రాయబడి యున్నది.  ఆలాగే చేపలు విషయము కూడా. ప్రియపాఠకులారా!  ఐదువేల మంది జనాభాకు ఈ ఐదు రొట్టెలు ఏ విధముగా మ్రింగుడు పడి వుంటాయి? అనుటలో ఈ ఐదు రొట్టెలు ప్రభువుయొక్క హస్తస్పర్శలోను, ఆయనయొక్క వాక్కుతోను, వారిలోని ఆకలిని చంపుట, విపరీతమైన ఎదుగుదల, ఈ రెండు యేసుయొక్క తాకిడిలో - రొట్టెలలో ప్రభావము ప్రవేశించినది.  ఎట్లంటే 12 ఏండ్ల రక్తస్రావము గల స్త్రీ యేసును గూర్చి విని, ఆమె అనుభవిస్తున్న 12 ఏండ్ల వ్యాధి బాధ నుండి స్వస్థత పొందుటకు, యేసుయొక్క అంగీ అంచును తాకింది.  వెంటనే యేసులోని ఒక శక్తి ఆమెలో ప్రవేశించి, ఆమె రోగ నిరోధము కల్గించుటయేగాక, ఆమె దేహస్థితిని మార్చి క్రీస్తును ముట్టక మునుపు తనకున్న వికార రూపము, శుష్కించిన దేహము, సహజ బలహీనతలు, లోకసంబంధమైన పీడ పిశాచులయొక్క ప్రభావము సమస్తమును తొలగి నూతన రూపము, నూతన వికాసము, నూతన శక్తి ఆమెలో కల్గినట్లుగ ఆమెకై ఆమె తెలుసుకొన్నది.  ఒక వైద్యుని దగ్గరకు పోయి ఆమె తన దేహాన్ని గూర్చి విచారించలేదు.  తన రోగ స్వస్థతను గూర్చిన మర్మాన్ని స్వయముగ ఆమె గ్రహించగల్గింది.  12 ఏండ్ల రోగ ప్రభావాన్ని యేసుయొక్క స్పర్శ నిరోధించగా, అనగా స్వస్థపరచగా చిన్నవాని దగ్గర తీసుకొన్న ఐదు రొట్టెలు, రెండు చిన్న చేపలు - ఆయన స్పర్శలో ప్రభావితములై బహు శక్తివంతములై, ఐదువేలమంది క్షుద్భాధను తీర్చుటయేగాక అలనాటి 12 ఏండ్ల రక్తస్రావ స్త్రీయొక్క 12 సంవత్సరముల రోగమును, ఆమె స్వస్థతను గూర్చిన విషయాన్ని జ్ఞాపకము చేయుచు, ఈ సంఘటనను, 12 గంపలు ఆత్మ సంబంధమై, మనకు ఆత్మీయముగా వివరిస్తున్నవి.  అంగీ అంచును తాకిన స్త్రీ యొక్క జీవితములో అంత ప్రభావము కనపడితే, ఇక ప్రభువుయొక్క హస్తములలో ఉంచబడిన ఆ రొట్టెలలో ఎంత ప్రభావమున్నదో మనకై మనమే ఆలోచించుకోవాలి.  కనుక ప్రభువు హస్తముల ద్వారా పంచబడిన ఈ రొట్టెలలో ఆ రెండు చేపలు నంజుడుగ ఉపయోగపడడములో ఆ చేపలు కిలోల బరువులో ఉన్న చేపలు కావు.  అక్కడే వ్రాసి యున్నాడు - రెండు చిన్న చేపలు అని, దీనినిబట్టి ఎంత అల్పునికైన దైవశక్తి అన్నది ఆవరించి, క్రియ జరిగించినప్పుడు ఆ అల్పుడే ఘనుడై భూలోక పరలోకాలలో కూడా యోగ్యునిగా ఎంచబడును.                                

        ప్రియపాఠకులారా!   మడుగులలో మారుమూలలో దొరికిన రెండు చిన్నచేపలు మరి అవి చంపబడి, కాల్చబడి, ఒక చిన్నవాని చేత మోయబడి, ప్రభువు హస్తాలలో వుంచబడి, ఆయన మహిమకు పాత్రములైనవి అంటే ఆ రెండు చేపలు జీవితము అవి చనిపోయినను ఐదువేలమంది ఆకలిని తీర్చుటయేగాక నేటికిని ప్రభువుయొక్క మహిమను ఎత్తి చూపుచున్నవి.  అలాగే రొట్టెలు అవి నూనెతో కాల్చబడినవో పులిసినవో పులియనివో అక్కడ వ్రాయబడలేదు.  అయితే ప్రభువు హస్తములో వుంచబడినవి.  వాటిని తాకిన ప్రభువుయొక్క హస్తముయొక్క ప్రభావము ఆ రొట్టెలో ప్రవేశించి, ఆ వరకు దానికున్న చప్పిడి గుణము కంటె అరవై రెట్ల రుచికరమైన శక్తి ఆ రొట్టెలలో ప్రవేశింపజేసి ఉండవలెను.  లేకపోతే తిన్నవారు ఊసేసేవారే!  వారు తృప్తిగ తిన్నట్లుగ వేదములో వ్రాయబడియున్నది.  జనాభా తిన్నారు.  రొట్టెలయొక్క శుచిని, రుచిని అనుభవించారు, కడుపు నింపుకున్నారు.  తినలేక మిగిల్చినారు.  ఐదు రొట్టెలు ఏమైనట్లు?  మిగిలిన 12 గంపలు ఏమిటి?  చిన్నవాడు ఆ జనములో తెచ్చిన రొట్టెలు ఐదు, చేపలు రెండు.  అయితే జనాభా తిని తృప్తిపొందగ 12 గంపలు మిగిలినవి.  12 గంపలు 12 మంది వ్యక్తులు మోసినారు.  ఏమిటీ వైపరీత్యము?  ఒక చిన్నవాని దగ్గర మూటలో వున్న ఐదు రొట్టెలు, రెండు చిన్న చేపలు ప్రభువు హస్తమునకును, ఆయన ఆశీర్వాదమునకును, ఆయన మహిమా ప్రభావములకును నోచుకొని, బహు తీవ్రముగాను, ఫలభరితముగాను, విస్తరించి జనాభా ఆకలిని, వారి దాహాన్ని తీర్చి, 12 గంపలలోకి ఎక్కి ఈ ఐదు రొట్టెలు, రెండు చిన్న చేపలు కూడా ఊరేగినాయి.

        ప్రియపాఠకులారా!  ఈ సందర్భములో యోహాను 15:5లో ద్రాక్షావళ్ళిని నేను తీగలు మీరు -  ఎవడు నా యందు నిలిచియుండునో నేనెవనియందు నిలిచియుందునో వాడు బహుగా ఫలించును. నాకు వేరుగ ఉండి మీరేమియు చేయలేరు, అన్నట్లుగ ఈ ఐదురొట్టెలు, రెండు చిన్న చేపలు ప్రభువుకు దూరముగా ఉండి, ఒక చిన్నవాని మూటలో లేక సంచిలో ఉన్నప్పుడు వాటికి ఫలింపు లేదు.  ఎప్పుడైతే ఆ జీవపు రొట్టెయైన క్రీస్తును తాకినప్పుడు - ఆ జీవపు రొట్టె యొక్క ప్రభావము వీటికి సోకి, బహుగా ఇవి విస్తరించి  ఐదువేలమంది ఆకలిని దీర్చి, 12 గంపలు మిగిల్చినవి ఇది ఇందులోని పరమార్థము.                        ఇంతవరకు రొట్టెలు తిన్న వారిని గూర్చి తెలుసుకున్నాము.  ఇక ఈ రొట్టెలు తిన్నవారు నీళ్ళు త్రాగినారా?  ప్రియపాఠకులారా!  ఈ ప్రశ్నకు జవాబు వేదమే!  ఈ సందర్భములో యోహాను 4:13లో ప్రభువు చెప్పిన మాటను మనము అర్థము చేసికొంటే మొదటగ సమరయ స్త్రీని ప్రభువు తనకు దాహానికి నీళ్ళిమ్మని అడిగినాడు.  వాస్తవానికి ఆయన దాహమేమిటి?  ఆయనకు నీళ్ళతో పని ఏముంది?  ఆయనలోనే నీళ్ళు - ఆయనలోనే ఆహారము, ఆయనలోనే జీవము, ఆయనలోనే బలము, ఆయనలోనే శక్తి ఉన్నదనుటకు వేదరీత్యా కొలస్సీ 1:15-19 చదివితే ఆయనలో వున్నవేమిటో క్షుణ్ణముగ వివరించబడి యున్నది.  ఆయన అదృశ్య దేవుని స్వరూపి - సమస్తమునకు ఆధారభూతుడు.  ఆయన ఆదియైయుండి మృతులలో నుండి లేచుటలో ఆయన ఆదిసంభూతుడాయెను.  ఆకాశములో వున్నవి, భూమియందున్నవి, సమస్తమును ఆయన ద్వారా ఆయనను బట్టి సృష్టించబడెను.        

        ఇట్టి ప్రభువునకు దప్పిక వుండదని దీన్ని బట్టి తెలియుచున్నది.  అయితే ఈయన దప్పిక ఏమిటి?  అంటే ఆరుగురు పురుషులతో అష్టకష్టములు పడి, నానావిధములైనటువంటి నీచపాప మోసకరమైన గుణములకు ఆలవాలమై, దైవత్వమునకు దూరమై, లోకానికి భయపడి, ఒంటరి జీవితములో అభాగ్యురాలిగా వున్న సమరయ స్త్రీయొక్క ఆత్మీయ జీవితమునకున్న ఆత్మీయ దప్పికయే ఈయనకున్న దప్పిక.  ఈయనయే ఆత్మీయముగా ఆత్మ తృష్ణను తీర్చుటకు ఆత్మ జలనిధి కూడా ప్రభువే!  పాతనిబంధన కాలములో ఇశ్రాయేలు జనాంగమునకున్న దప్పికను శిలారూపముగా వుండి, దైవాజ్ఞానుసారముగ మోషే చేత కఱ్ఱతో తాకబడి జలధారగ స్రవించి, దైవజనాంగముయొక్క దప్పికను దీర్చిన జలనిధి కూడా ఈయనయే!  అయితే ఇది శారీర సంబంధమైనది.  సమరయస్త్రీ దప్పిక దీర్చుటన్నది ఆత్మ సంబంధమై యున్నట్లు యోహాను 4:లో ప్రయోగాత్మకముగా అనగా క్రియారూపముగ వివరించబడి యున్నది.  ఎట్లంటే మధ్యాహ్నము 12 గంటల వేళ యేసు ప్రభువు సుఖారాలోని యాకోబు బావి దగ్గర కూర్చోవడము, సమరయ స్త్రీ నీళ్ళు చేదుటకు అక్కడకు రావడము, యేసు ఆ స్త్రీని చూచి దాహానికి నీళ్ళు అడుగుట.  కుల ధర్మముతో కూడిన అనగా కుల భేధమును గూర్చిన వివాదము ప్రభువునకును, ఆస్త్రీకిని జరుగుటయు అటుతరువాత యేసు ప్రభువు ఈ నీళ్ళు త్రాగు ప్రతివాడు మరల దప్పిగొనును.  నేనిచ్చు నీళ్ళు త్రాగువాడు దప్పిగొనడు అని మాట్లాడుట, ఆ స్త్రీ - చేదుకొనుటకు ఇంత దూరము రాకుండ ఆ నీళ్ళు దయ చేయుము, అని అడుగుటయు, ఇక అక్కడ నుండి ఆరుగురు భర్తలతో కాపురము చేసిన యదార్థ స్థితిని ప్రభువునకు విన్నవించుట.  అటుతరువాత తాను తెచ్చిన నీటికుండను బావి దగ్గర వదలి, తన నిజస్థితియొక్క మర్మమును బైల్పరచిన ప్రభువును మహిమపరచుచు, తన ఖాళీ కుండ వంటి జీవితాన్ని వదలుకొని,  నిండైన జీవితము కోసము శాశ్వతమైన ఆత్మీయ దప్పికను ప్రభువు ద్వారా తీర్చుకొని, ఆ జీవజలపానీయ మాధుర్యమునకు ఆత్మీయ పరవశురాలై తాను తీర్చుకున్న దప్పికను బట్టి, తాను త్రాగిన జీవజలనిధిలో పాలిపంపులు పొందుటకు, ఆ గ్రామములోని అనేకులను ప్రభువు సన్నిధికి చేర్చింది.  ఇది దప్పిక తీరిన విధము.  ఇందులో యాకోబు బావి నీళ్ళు వ్యర్థమైనవి.  సమరయ స్త్రీ కుండ అక్కర లేకుండ పోయింది. సమరయ స్త్రీయొక్క దప్పిక సంపూర్ణముగ తీరింది.  అలాగే జీవజల నిధియైయున్న క్రీస్తు తన జీవజలధారతో ఏ విధముగా సమరయ స్త్రీ దప్పికను తీర్చినాడో - ఆలాగే ఈ ఐదు రొట్టెలు, రెండు చేపల పంపకము విషయములో ప్రభువు తానే జీవపు రొట్టెయైయుండి, తానే జీవజలనిధియైయుండి ఇటు ఆహారము, అటు నీరుగా ఏకత్వములో వున్న ప్రభువు - ఆ రెండు రూపములకు భిన్నముగా నరాకృతిలో వుండి, తాను పంచిన ఐదు రొట్టెలను తన శరీరానికి సమతుల్యముగాను, అనగా మహిమగల తన ఆత్మీయ ఆహారముగాను, ఆలాగే జీవజలముగాను, రెండు విధములుగ ఆ రొట్టెలు పంపకము జరిగి వుండవలెను.  అంటే జీవపు రొట్టె క్రీస్తు - దీనికి సాక్ష్యాధారము ప్రభువు తాను ఈ లోకము నుండి వెళ్ళు సందర్భములో చివరి బల్లలో తానొక రొట్టెను పట్టుకొని దానిని విరిచి - ఇది మీ కొరకు అప్పగించబడు నా శరీరము, అనుటలో ఆయన శరీరము రొట్టె - ఆయన ఆత్మ జీవజలము.  ఇవి రెండును పరోక్షముగా క్రియ జరిగించి, ఐదువేలమంది ఆకలిదప్పులు తీర్చుటయేగాక, లోకసంబంధమైన కాల్చబడిన ఆ రొట్టెలతో ప్రమేయము లేకుండగనే ఐదువేలమందికి ఆకలిదప్పులు తీరినవంటే - ప్రియపాఠకులారా!  ఎంత ఆశ్చర్యకరమైన మహిమాన్వితమైన దేవుని క్రియయో మనము ఆలోచించవలెను.        

        రొట్టెల పంపకము సందర్భములో భోజన ప్రియులకు అరటిఆకుగాని విస్తరాకుగాని లేక పళ్ళెముగాని, నీళ్ళు త్రాగుటకు గ్లాసుగాని అచ్చట వుంచబడినట్లుగా లేదు.  పంక్తులు దీరి కూర్చున్నారేగాని ఆ రొట్టెలు ఏ విధముగా పంచబడినవో పంచువారు పళ్ళెములు చేతపట్టుకొని పంచినారో లేక గంపలులో రొట్టెలు వుంచుకొని పంచినారో  వ్రాయబడలేదు.  అక్కడ జరిగిన క్రియ ఒక్కటే!  చిన్నవాని దగ్గర నుండి  ఐదు రొట్టెలు, రెండు చిన్న చేపలను సేకరించుట, ప్రభువు తన హస్తములో వాటిని వుంచుకొని ఆశీర్వదించి, ప్రతిష్టించి పంపటము ఇది జరిగింది, ప్రభువు పంచినట్లుగా వ్రాయబడియున్నది.  అనగా ప్రియపాఠకులారా!    జీవపు రొట్టెయే రొట్టెను పంచింది.  రొట్టెతోబాటు జీవజలపు రొట్టెయే విస్తరి లేకుండ పాత్రలేకుండ జీవపు రొట్టె - రొట్టెను పంచింది.  అలాగే జీవజలధార గ్లాసు లేకుండ చెంబు లేకుండ మరి రొట్టెను భుజించిన వారికి గొంతు పట్టకుండ, నీళ్ళను త్రాగకుండగనే - నీళ్ళు త్రాగినంత తృప్తిని గల్గించింది.  రెండు క్రియలను జరిగించింది.  ఒకే రూపము అదియే క్రీస్తు రూపము.  అయితే ఈ రూపము ఆ రెండింటికి భిన్నముగ వున్నది. అదియే యేసుక్రీస్తు అను దైవరూపము.        

        ప్రియపాఠకులారా!  ఈ విధముగ యేసుక్రీస్తు ప్రభువు ఐదువేలమంది ఆకలిదప్పులను తీర్చినాడు.  ఇక 12 గంపలు మిగిల్చినట్లు ఈ లేఖన భాగములలో వ్రాయబడియున్నది.  అంటే  ఈ 12 గంపలు ఆ జన సమూహములోనే ఇతరులు లేక పనివారు మోయలేదుగాని, తన శిష్యుల చేతనే ఆ మిగిలిన రొట్టెలను 12 గంపలతో మిగిల్చినాడు.  ఇందులో ఉన్న పరమార్థము కూడా చాలా గోప్యమై యున్నది.  ఎట్లంటే ఈ 12 గంపలలోని రొట్టెముక్కలు ఇశ్రాయేలు 12 గోత్రములకును, ఈ జీవపు రొట్టెయొక్క చరిత్ర సాక్ష్యాధారమైయున్నట్లును, 12 గొత్రాలలో యూదా గోత్రములో ఈ జీవపు రొట్టె పరలోకము నుండి భూలోకములోకి దిగి నరాకృతిలో అవతరించినట్లును, ఈ రొట్టె యొక్క పరలోక భూలోక రాజ్య ప్రణాళికను గూర్చిన మర్మములు యావద్‌ నరకోటికి, వారియొక్క అపరాధ పాప నివారణార్థము జరుగబోవు సజీవ బలియాగముగ ఈ రొట్టె కాల్చబడి, అనేకులకు ఆత్మీయ ఆకలిదప్పికలను తీర్చుటకు అవతరించినట్లును, 12 గంపలలోని రొట్టె ముక్కల యొక్క మర్మము తెలియుచున్నది.  అలాగే 12 గంపలు, 12 మంది యేసుక్రీస్తు శిష్యులకు సాదృశ్యమై యుండి, పరలోకము నుండి దిగి వచ్చిన ఈ జీవపు రొట్టెయైన యేసు ప్రభువుయొక్క సువార్తను మోయుటకు, అనేకులకు ప్రకటించుటకును బాధ్యులై యున్నట్లు ఈ 12 గంపల చరిత్ర వివరిస్తున్నది.

        అయితే 12 మంది శిష్యులు మోసిన ఈ గంపలను బట్టి  శిష్యులయొక్క జీవితము వ్యర్థమా? అంటే అది ఎన్నటికిని కాదు.  మోసిన ఈ 12 మంది శిష్యుల చరిత్ర ప్రభువుయొక్క చరిత్రకు సాక్ష్యార్థమై భూమ్మీదను ప్రభువు రాకడ సమయములో - పరలోకము నుండి దిగివచ్చు పరమ యెరూషలేము అను ఆ పరిశుద్ధ పట్టణమునకు 12 పునాదులుగ ప్రకటన 21:14, వీరి చరిత్ర పరము నందు స్థిరపరచబడి యున్నట్లు మనము గ్రహించవలసి యున్నది.  ప్రభువు పల్కిన ఐదు రొట్టెలు, రెండు చేపలు ఐదువేలమంది భోజన ప్రియులు, 12 గంపలు 12 మంది శిష్యులను గూర్చిన వివరము.  ఇందునుబట్టి చూడగా ప్రభువు పంచిన ఐదు రొట్టెలు పంచినట్లుగా వున్నవిగాని వాటి వలన ఐదువేలమంది ఆకలి తీరలేదని - యోహాను 6:35 జీవాహారము నేనే - నా యొద్దకు వచ్చువాడు ఏ మాత్రము ఆకలిగొనడు - నా యందు విశ్వాసముంచువాడు ఎప్పుడును దప్పిగొనడు, కనుక దప్పిక కూడా లేదు.  కనుక ఇక్కడ రొట్టెలతో నీళ్ళతో పనిలేదని భావము.

........

''అబ్రాహాము పుట్టకమునుపే నేనున్నాను''

        యోహాను 8:57-59, ''అందుకు యూదులు - నీకింకను ఏబది సంవత్సరములైన లేవే, నీవు అబ్రాహామును  చూచితివా అని ఆయనతో చెప్పగా, యేసు - అబ్రాహాము పుట్టకమునుపే నేను ఉన్నానని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాననెను.  కాబట్టి వారు ఆయనమీద రువ్వుటకు రాళ్లు ఎత్తిరి గాని యేసు దాగి దేవాలయములో నుండి బయటికి వెళ్ళిపోయెను.''

        ప్రియపాఠకులారా!  యేసుక్రీస్తు ఎవరైనది ఆనాటి యూదులకు అర్థము కానట్లుగా ఉన్నది.  అయితే నేటి దినములలో కూడా క్రైస్తవులకే యేసుక్రీస్తులో వున్న మహిమాన్విత శక్తి ప్రభావములు అగమ్యముగా వున్నది.  ఆనాటి జనము మూర్ఖులు, పశుప్రాయులు, ఆత్మీయ దృక్ఫథము లేనివారును, దైవత్వాన్ని గూర్చిన పూర్తి సత్యాన్ని ఎరుగనివారై యున్నందువలన, యేసుక్రీస్తులోని దైవత్వాన్ని గూర్చి ఎరుగలేక పోయారు.  ఈనాడు క్రైస్తవులు క్రీస్తును దైవత్వములో రెండవ శక్తియని లేక యేసును క్రీస్తుగా గ్రహించక, ఆత్మీయముగా బలహీనులైయున్నట్లుగా - మనయొక్క నిత్యజీవితములో ఎందరినో చూడగలము.  అలాగే యూదులు కూడా యేసుక్రీస్తు ప్రభువును దేవునియొక్క ప్రతిరూపము అని ఎరుగక మోషే ధర్మశాస్త్రము అను ముసుగులో, అజ్ఞానకాలములో, దేవుడు మోషే ద్వారా తన జనాంగమున కిచ్చిన దశాజ్ఞలను దైవముగ ఎంచి - ఏ దశాజ్ఞలను దేవుడు తన కనుగ్రహించాడో - ఆ దేవుడే ప్రత్యక్షముగా నరరూపుడుగ దర్శన మిచ్చి, ఆనాటి జనసంఖ్యలో తాను కూడా ఒక్కడుగా సంచరిస్తూ అనేక దైవ మహత్తర క్రియలు జేస్తూ - తన దైవత్వాన్ని ప్రకటించుకొన్నప్పటికిని ప్రియపాఠకులారా!  ఈ సందర్భములో ఇదే యోహాను సువార్త కొన్ని వేదవాక్యాలలో యేసుక్రీస్తు తనను గూర్చి ప్రత్యక్షపరచుకొని - తాను దైవకుమారుడనని - లోకసంబంధికానని, పరలోకము నుండి దేవునియొద్ద నుండి పంపబడిన వానినని -తనంతట తాను రాలేదని తనను గూర్చి తాను ప్రత్యక్షపరచుకొంటూ - ఎన్నో అద్భుత క్రియలు ఆనాటి జనులమధ్య చేసినను, ఆ అజ్ఞాన జనాభాయొక్క యావద్‌ దృష్టి వారి పితరుడైన అబ్రాహాము మీదనే వున్నట్లుగ తన మూలవాక్యములో వివరించబడి యున్నది.

        ప్రియపాఠకులారా!  నరులయొక్క బలహీనతను ఎరిగిన దేవుడు తాను ఏ జనాంగమును ఇశ్రాయేలు అను పేరుతో ఏర్పరచుకున్నాడో ఆ జనాంగమునకు పితామహుడైన అబ్రాహాముయొక్క నామధేయాన్ని ఆ జనులకు ప్రకటిస్తూ వచ్చాడు.  ప్రియపాఠకులారా!  యేసుక్రీస్తు  ప్రత్యక్షముగా తన్నావరించి యున్న జనాంగముతో బహు నిబ్బరముగా ధైర్యముగా ప్రకటించిన మాట - ఈ సందర్భములో మూల వాక్యములోని వేదవాక్యములో చదువుచున్నాము.  అబ్రాహాము పుట్టక మునుపే నేనున్నాను, అనిన మాట - ఆ యూదా జనాంగమును కలవరపరిచింది.  అంతేగాకుండ అబ్రాహాముయొక్క కాలమును, యేసుయొక్క వయసును వారు గణించి, లోకసంబంధమైన జ్ఞానముతో అంచనా వేసినవారేగాని, అసలు యేసుక్రీస్తు ఏ వంశములో జన్మించాడు - యేసుక్రీస్తు ఎవరి తాలూకూ స్త్రీ నుండి జన్మించాడు, అనిన సత్యాన్ని యూదులు గ్రహించేందుకు ధర్మశాస్త్రమే  అడ్డు తగిలింది.  ఎందుకంటే అలనాటి యూదులు ఇశ్రాయేలీయులై యుండి అనగా  యాకోబుయొక్క సంతానమై యుండినను, దేవుడు తనకంటూ ప్రత్యేకించుకొన్న జనముగా వున్నందువలన నరకోటి రక్షణార్థము ఇశ్రాయేలును పోషించిన దేవుడే నరులమధ్య అవతరించి, నరుల కొరకు అంటే యావద్‌ నరకోటి ఈ ధర్మశాస్త్రము అను ముసుగును తొలగించుకొని, సత్యమార్గములో, జీవమార్గములో, మోక్షరాజ్యము చేరుటకు ఒక మార్గాన్ని సూచన ప్రాయముగా వారికి చూపించుటకు, దానిని స్థిరపరచుటకును, అనగా ఏ ఒక్కరు నశింపక లోకమందు ప్రతినరుడు, తన లోకసంబంధమైన పాపజీవితమును వదలుకొని, పవిత్ర స్థితిలో పరలోక రాజ్యాన్ని చేరాలన్న సంకల్పముతో - యూదుల మధ్య యేసు అను పేరుతో - క్రీస్తు అను దేవుడు తిరిగాడు.  ఈ సత్యాన్ని గ్రహించని యూదులు అనగా ధర్మశాస్త్ర ముసుగులో తలమునకలైయున్న యూదులు, దైవకుమారుడైన యేసుయొక్క జన్మ రహస్యము 2 కొరింథీ 4:4లో  ఈ యుగ సంబంధమైన దేవత ఆనాటి యూదా నరకోటియొక్క మనోనేత్రములకు అంధత్వము కల్గించినందు వలన యూదులు యేసుక్రీస్తుయొక్క మహిమలను గ్రహించలేక పోయారు. అంతేగాకుండ యేసుక్రీస్తు ప్రకటించిన సువార్తను పెడచెవిని పెట్టినారు.  ఆయన కోరిన ప్రార్థనా సావాసాన్ని నిరాకరించారు.  ఇంకను ఆయనతో కూడా సావాసముగా వుండవలసిన జనాభా ఆయనతో కూడా వుంటూ ఆయనను విమర్శిస్తూ మరియు అపహసిస్తూ పరుషముగా మాట్లాడి హింసిస్తూ ఒకచోట అని గాకుండ ఆయన వెంట వుండి, ఆయనతో నానచోట్ల, నానావిధమైన మాటలతో బాధించినట్లు వేదచరిత్ర మనకు తెల్పుచున్నది.  ఆ విధమైన విమర్శలలో ఒకటిగ నీవు అబ్రాహామును చూచితివా?  అని ఆయనతో చెప్పుట - అందుకు ఆయన వారితో అబ్రాహము పుట్టకమునుపే నేను వున్నానని వారితో నిశ్చయముగా చెప్పుట, ప్రియపాఠకులారా!  ఈ మాటకు యూదులు కలత చెంది, కొపోద్రేకులై ఆయనను కొట్టుటకు రాళ్ళు ఎత్తినట్లు వేదములో వ్రాయబడి యున్నది.

        ప్రియపాఠకులారా!  యేసుక్రీస్తు అబ్రాహామును చూచినాడా?  ఏ విధముగా చూచినాడు? అనిన ప్రశ్నను గూర్చి వివరాలు తెలిసికొందము.  మొదటిగ ఏసుప్రభువు అబ్రాహామును చూచాడా? అందుకు జవాబు చూచాడు.  ఏ విధముగా చూచాడు?  ఆది 18 ఈ సందర్భములో మనము చదివితే మమ్రే దగ్గర సింధూర వనములో అబ్రాహాము ఎండవేళ గుడారము వాకిట వుండినప్పుడు, దైవత్వము త్రిత్వములో అబ్రాహామునకు దర్శనమిచ్చినప్పుడు, అందులో ఒక వ్యక్తిగా ఒక శక్తిగా యేసుక్రీస్తు కూడా వున్నట్లే!  దైవ త్రిత్వమును చూచినవాడు బైబిలు  అంతటిలో అబ్రాహామేయని మనము ఒప్పుకోక తప్పదు.  ఏ వ్యక్తికి దేవుడు త్రిత్వముగా కనిపించినట్లుగా ఎక్కడను లేదు.  అందులో ఆత్మయై అదృశ్యరూపియైన దేవుడు అబ్రాహాము నందలి ప్రేమ చేత ముగ్గురు వ్యక్తులుగా కనబడినట్లు గ్రంథములో వ్రాయబడి యున్నది.  ముగ్గురు వ్యక్తులు మాట్లాడినారు.  అయినను అబ్రాహాము దైవత్రిత్వముతో సంభాషించిన విధానము ఆశ్చర్యము కల్గించింది.  ప్రభువా!  అని ఏక వచనముతో సంభోధించుట గమనార్హము.  అబ్రాహామునకు కనబడింది ముగ్గురు.  ఆయన పలికినది ఏకవచనము - ప్రభువా! అని పలుకుట.  అలాగే దైవత్రిత్వమునకు ఆతిధ్యము ఇచ్చుటకు మూడు మానికల పిండిని రొట్టెలుగా చేయించుట.  ఆ ముగ్గురి కొరకుగా ఒక లేత దూడను, వెన్నను, పాలను సిద్ధము చేయించిన దూడను, వారి ఎదుటపెట్టి వారు భోజనము చేయుచుండగా వారియొద్ద ఆ చెట్టు క్రింద నిలబడుట.  ప్రియపాఠకులారా!  ఈ సందర్భములో అబ్రాహాము పుట్టక మునుపు క్రీస్తు ఉన్నాడనుటకు ఋజువు.  ఆది 1:26లో దేవుడు తనను గూర్చి సృష్టికి బయల్పరచిన విధము, మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదము, ప్రియపాఠకులారా!  మన అన్నప్పుడు అది బహువచనమే గనుక సృష్టికర్తయైన దేవుడు సృష్టి కార్యమును చేయు సందర్భములో సృష్టికర్తయైన దేవునితో యేసుక్రీస్తు కూడా వున్నట్లే ఇందునుబట్టి మనకు ఋజువగుచున్నది.  దీనికి ఋజువు ఎఫెసీ 1:3-6, ఈ సందర్భములో చదివితే సృష్టి ఆరంభములోనే దేవునితో యేసుక్రీస్తు వున్నట్లుగ ఋజువగుచున్నది.  అటు తర్వాత అబ్రాహాము దేవునికిచ్చిన ఆతిధ్యములో కూడా క్రీస్తు వున్నట్లు తెలియుచున్నది.

        ప్రియపాఠకులారా!  యోహాను 8:57-59, అబ్రాహాము పుట్టక మునుపే యేసు వున్నాడని చెప్పిన మాట సత్యమైనదియు, యదార్థమైనదియునైయున్నది.  ఈ విధముగా యేసు ప్రభువు సృష్టి ఆరంభములో వుండి, ఎందుకు లోకానికి  ఏ విధముగా ప్రత్యక్షత కనబరచుకొన్నాడన్న సత్యాన్ని మనము తెలిసికోవలసి యున్నది.  ఆది 1:2లో దేవునియొక్క ఆత్మ చీకటి జలముల మీద అల్లాడి క్రియ జరిగించిన సందర్భములో - దేవుడైతే ఆత్మగా జలములపై అల్లలాడినట్లున్నది గాని, క్రీస్తు వెలుగుగా ప్రకాశించినట్లు ఈ వేదభాగములో చదువగలము.  దేవుడు వెలుగు కమ్మనగా వెలుగాయెను, అను మాట సాక్ష్యము.  కనుక సృష్టి ఆరంభములో దేవునితోబాటు క్రీస్తు కూడా వున్నాడనుటకు మనకు కొన్ని ఆధారాలున్నవి.  మొట్టమొదట వెలుగుగా-అటుతర్వాత ఏదెను వనమును దేవుడు వేసినప్పుడు - ఆ తోట మధ్యన జీవవృక్షముగా, అటు తర్వాత ఇశ్రాయేలు జనాంగ దప్పికను దీర్చుటకు మోషే తట్టిన బండగాను, అబ్రాహాము దేవునియొక్క ఆతిధ్యము ఇచ్చు సందర్భములో అబ్రాహామునకు దర్శనమిచ్చిన ముగ్గురు వ్యక్తులలో ఒక్కరు యేసుక్రీస్తు కూడా అబ్రాహామునకు దర్శనమిచ్చి యున్నాడు.

        కనుక ప్రియపాఠకులారా!  ఇన్ని విధములుగ వ్యక్తిగతమైన అదృశ్య లక్షణములతో ఆయా సమయాలలో ఆయా విధములుగ దర్శనమిచ్చిన యేసుక్రీస్తు పాతనిబంధన కాలములో అనగా దేవునియొక్క ధర్మశాస్త్రము క్రియ జరిగించిన అనంతరము - ఆది దేవునియొక్క ప్రవక్తలయొక్క ప్రవచనములను బట్టి, అనగా యెషయా ప్రవచనాలలో ఇదిగో కన్యక కుమారుని కనును.  ఆయనకు ఇమ్మానుయేలు అని పేరు పెట్టుదురు.  అనియు ఏలయనగా మనకు శిశువు పుట్టెను - మనకు కుమారుడు అనుగ్రహించబడెను.  ఆయన భుజముల మీద రాజ్యభారముండును, అనిన వివరము మరియు క్రీస్తు జరిగించు బలియాగమును గూర్చి ప్రవచనములు వివరిస్తూ - క్రీస్తును వధకు తేబడు గొర్రెగాను, బొచ్చు కత్తిరించువాని ఎదుట మౌనిగాను వుండినట్లు వివరించి వ్రాయబడిన విధానము కూడా మనము చదువగలము.  ఈ విధముగా పాతనిబంధనలోని ప్రవచనాలలో అనేక సందర్భాలలో క్రీస్తును గూర్చి కూడా ప్రవచించబడి యున్నది.  అయితే క్రీస్తును ప్రత్యేకముగా ప్రత్యక్షముగా చూచినవారు లేరు.  అంటే ఇట్టి మహాభాగ్యమును నూతన నిబంధన గ్రంథములోని జనాంగము యావత్తును చూచుటయే గాక ఆయనతో సంచరించి, ఆయన చేసిన అద్భుత కార్యాలను కన్నులారా ప్రత్యక్షముగా చూచుటయేగాక ఆయన చేసిన  ఐదు రొట్టెలు, రెండు చేపల పంపకము - ఏడు రొట్టెలు, కొన్ని చిన్న చేపల పంపకము విందులో పాల్గొని ఆహార తృప్తిని అనుభవించారు.

        ప్రియపాఠకులారా!  అంతేగాకుండ ఆయన చేసిన అనేక అద్భుతాలు కూడా కన్నులారా చూచారు.  అట్టి శక్తిగల దైవకుమారునియొక్క మహిమను గూర్చి ఎరిగియు, ఆయనను మహిమ పరచుటకు బదులు దూషిస్తూ, విమర్శిస్తూ  వెక్కసమైన మాటలతో ఆయనను, ఆయన మనస్సును, వేదన పరచుచు అలక్ష్యపరచిన జనాంగము కూడా ఈ నూతన నిబంధన కాలములో వున్నారు.  ఆ జనాంగమే దైవకుమారుడు నరునిగా జన్మించుటకు దేవుడేర్పరచుకొన్న ఇశ్రాయేలు జనాంగములో యూదా గోత్రము, దావీదు వంశము - ఇట్టి రాజవంశములో దైవకుమారుడుగా అదృశ్యుడైయున్న దేవుడు - ఆత్మరూపియైయున్న దేవుడు - శారీరధారియై, కన్య గర్భములో అవతరించుటన్నది జరిగింది.  ఈ విధముగా పవిత్ర జన్మతో అవతరించిన ప్రభువును జ్ఞానశూన్యులైన పాశవిక జ్ఞానముతో కూడిన మూర్ఖ జనాంగము ఆయనను విమర్శిస్తూ మాట్లాడిన మాట ఎంత అవివేకమో - ''నీవు అబ్రాహామును చూచితివా?  అని అడుగట - వారియొక్క అజ్ఞాన దశను, వారియొక్క ఆత్మీయ అంధత్వమును గూర్చి వివరిస్తున్నది.        

        ప్రియపాఠకులారా!  ఆ అజ్ఞాన నరకోటికి యేసుక్రీస్తు ఇచ్చిన సమాధానము సత్యమైనదే! ఆయన చెప్పిన రీతిగా అబ్రాహాము పుట్టక మునుపు ఉన్నాడు; పుట్టిన తర్వాత ఉన్నాడు.  అలాగే నేటి యుగాంత కాలములో కూడా మనతో వున్నాడనుటకు ప్రత్యేక ఋజువు మత్తయి 28:16-20 అనిన వాగ్దానము ఇప్పుడు మనకు ఆయన అనుగ్రహించి యున్నాడు.  ''నేను యుగసమాప్తి వరకు సదాకాలము మీతో వున్నాను.''  ఇందునుబట్టి ప్రియపాఠకులారా!  సృష్టికి పూర్వము ఆదిలో క్రీస్తు ఉన్నాడు.  దేవుడు జరిగించిన సృష్టిక్రియలో క్రీస్తు ఉన్నాడు.  దేవుడు తూర్పుదిక్కున వేసిన ఏదెను వనములో క్రీస్తు ఉన్నాడు, నోవహు కాలములో వచ్చిన జలప్రళయములో దేవుడు నోవహుతో చేసిన నిబంధనలో ఆకాశములో ఏడు రంగుల ఇంద్రధనుస్సు యేసుక్రీస్తే.  అలాగే దైవవిశ్వాసియైన అబ్రాహాముయొక్క గుడారములో దేవునితో బాటు యేసుక్రీస్తు కూడా ఆతిధ్యము స్వీకరించినట్లు ఋజువైంది.  ఇశ్రాయేలు జనాంగము దప్పిక దీర్చుటకు - ఇశ్రాయేలుకు అవసరమైన దప్పిక దీర్చు బండయై యున్నట్లును, అటు తర్వాత నెబుకద్నెజరు కన్న కలలో కనిపించిన నానావిధమైన లోహ నిర్మితమైన విగ్రహమును నేలమట్టము గావించిన ఱాయి కూడా క్రీస్తే!  అలాగే దేవుని ప్రవక్తల నోటప్రవర్తించిన ప్రవచనాలలో కూడా క్రీస్తు వున్నాడు.  అలాగే యావద్‌ నరకోటియొక్క పాపమును పరిహరించుటకు దేవుని సంకల్పములో నరజన్మ ఎత్తుటను బట్టి, దైవనరునిగా పాపనరుల మధ్య జీవించాడు.  దైవరాజ్య వ్యాప్తికి 12 మంది శిష్యకోటిని ఎంపిక జేసి, వారిని దైవరాజ్యము కొరకు అపొస్తలులుగ ప్రతిష్టించాడు.  అంతేగాకుండ తాను ఈ లోకమునకు వచ్చిన దైవప్రణాళికను నెరవేర్చి తన క్రియలను ముగించి, మహిమ పునరుత్థానుడై అపొస్తలులతో వుండి అనేక అద్భుతాలను చేయించి, తన దైవత్వమును గూర్చిన మహిమను అపొస్తలుల కాలము నాటి జనాంగమునకు వెల్లడి పరిచాడు.  అటుతరువాత అపొస్తలుల కార్యాల ద్వారా వారి ఆత్మీయ పరిచర్య వల్ల, వారు జరిగించిన దైవ సువార్త సేవా పరిచర్యలో యేసుక్రీస్తు ఉన్నాడు.  అయితే యుగాంత కాలమైన ఈ చివరి దినాలలో కూడా ప్రభువు మనతో ఉన్నాడు.  ఎలాగున్నాడంటే యోహాను 1:14లో వలె నూతన నిబంధనలో వాక్య రూపముగా వుండి, కృపాసత్యసంపూర్ణుడుగా, శారీరధారియై నరుల మధ్య జీవించిన దేవుడు ఈనాడు శరీరముగా మనమధ్య కనబడకపోయినను పరిశుద్ధ గ్రంథ వేదములో వివరించిన విధముగా యదావిధిగ వాక్యమె,ౖ తన శరీరమును నరకోటికి కనుమరుగు చేసినను ప్రతినిత్యము వాక్యము ద్వారా మనతో మాటలాడుచున్నాడు.        

        కనుక ఇప్పుడు అదే యేసుక్రీస్తు ఒకప్పుడు దేవునితో ఆ తర్వాత ఆయన ప్రజలతో - నూతన నిబంధన కాలములో అజ్ఞాన అనారోగ్య అంగవైకల్య జనుల మధ్య నివసించి, ఆ తర్వాత అపొస్తలుల ద్వారా క్రియ జరిగించిన యేసుక్రీస్తు - ఈనాడు ప్రపంచ మందంతటను ఎఫెసీ 4:6లో వలె ఆయన అందరికి పైగా వున్నవాడై అందరిలోను వ్యాపించి అందరిలోను వున్నాడు.  కనుక ప్రియపాఠకులారా!    యేసుక్రీస్తు జరిగించిన బలియాగమును బట్టి ఆయన చరిత్ర, ఆయన చేసిన అద్భుతాలు, ఆయన మరణము, ఆయన కార్చిన రక్తము, ఆయన పొందిన శ్రమలు, ఆయన పునరుత్థానము, ఇవన్నియు యావద్‌ ప్రపంచములో విస్తరించుటను బట్టి యేసుక్రీస్తుయొక్క ప్రాబల్యము ప్రపంచమంతటను విస్తరించి యున్నదని మనము ఒప్పుకోక తప్పదు.  ఇంతగొప్ప మర్మము తండ్రియైన దేవుడు క్రీస్తులో దాచి యుంచినట్లును, అంతేగాకుండ తగిన కాలములో దానిని ఆయనను జన బాహుళ్యమునకు బయల్పరచినట్లును మనకు తెలియుచున్నది.

        కనుక ప్రియపాఠకులారా!   ఇంకను యేసుక్రీస్తుయొక్క ఋజువు కావాలంటే ప్రకటన 1:9లో వర్తమాన భూతభవిష్యత్కాలములలో ఉన్నవాడును - అల్పయు ఓమెగయు నేనే, 1:18లో నేను మొదటివాడను, కడపటివాడను, జీవించువాడను, మృతుడనైతినిగాని ఇదిగో యుగయుగములు సజీవుడనైయున్నాను.'' ఇది యేసుక్రీస్తును గూర్చినటువంటి యదార్థమైన దైవనిగూఢ సత్యము.         

శరీర గుడ్డితనమును గూర్చి : ప్రసంగ అంశములు

        యోహాను 9:1 మరియు 11-1 శరీర గుడ్డితనము ఇవి ఐదు రకములు 1.  నేత్రలోపము వలన కలుగు గుడ్డితనము సహజము యోహాను 9-13-17 కండ్లు ఉండియు గుడ్డివాళ్ళే.  2.  బాధ్యత లేకుండ ప్రవర్తించు గుడ్డితనము యోహాను 9:36-39 3. తెలియని దానిని తెలిసినట్లుగ కల్పించుకొని చెప్పు గుడ్డితనము లూకా 23:10-16  4. తాను జేయు క్రియలను తలుపులు వేసికొని చేయుచు ''నన్ను ఎవరు చూడరు,'' అనుకోవడము గుడ్డితనము;  మోషే ఐగుప్తీయుని చంపి నిర్గమ 2:11-13 ఇసుకలో పూడ్చిపెట్టుట 5.  లేని దానిని ఉన్నట్లు పుకార్లు పుట్టించు గుడ్డితనము (అప్రమాణము ఆడి తప్పుట గ్రుడ్డితనము, మత్తయి 24:11-13 ఇది అబద్ధ ప్రవక్తల సాక్ష్యము.

        ఆత్మ గుడ్డితనము :-  అపవిత్రాత్మలంటే ఒక్క సాతానుకే ఈ పేరు అనువర్తించదు.  పాపియైన ప్రతి ఒక్కడు అపవిత్రాత్మయే.  శరీర జ్ఞానమును బట్టి ఆత్మ అపవిత్రము అవుతుంది.  కాని ఆత్మను బట్టి కాదు.  ఎట్లంటే ఆదిలో మనలో దేవుడు ఊదిన జీవాత్మ పరిశుద్ధమైనది.  ఈ లోక నేత్రాశ అనగా శరీర ఆశలను బట్టి ఆత్మ జ్ఞానము బలహీనపడి, ఆది తల్లిదండ్రులను అపవిత్రులుగా చేసింది.  అపవిత్రమై కలుషితముగా ఉన్న ఆత్మను దాల్చినవాడై పౌలు ఆత్మ సౌలుగా ఉన్నప్పుడు బహు క్రూరముగను దేవుడు ఓర్వలేనంత పాపమును సంపాదించుకొన్నది.  ఆ ఆత్మ మరల దేవుని చేత మొత్తపడి శరీరమునకు జ్ఞానమునకు గుడ్డితనమును కల్గించి, ఆత్మ అతి పరిశుద్ధతతో వెలుగొంది, ఈ వెలుగుయొక్క కాంతికి శరీరనేత్రములకు గుడ్డితనము కలుగగా ''యేసు'' అను తేజోవంతమైన ఆత్మ - పౌలు కండ్లకున్న పొరలను తొలగించి, నూతన జ్ఞానమును, నూతన దృష్టిని, ఆత్మను నిర్మలమైనదిగ చేసి, నిజదైవసత్యమునకు హతసాక్షిగా ఏర్పరచుకొన్నది.

        అచ్చట హవ్వకు ఈయబడిన ఆత్మ పరిశుద్ధమైనదియే.  కాని ఈ హవ్వయొక్క ఆత్మ ఏ విధముగా నైనను ఆత్మలేనట్టి సర్పము మాటలకు లొంగదు.  కాన దేవుడు సర్పము నందు ఆత్మ ప్రవేశించి మాట్లాడుటను బట్టి అది లొంగినది.  హవ్వయొక్క ఆత్మ సర్పములో ఉన్న దైవాత్మకు లొంగి, పాపములో ప్రవేశించినది.  ఆది దంపతుల నుండి సంతతులు వృద్ధియై భూమిని నింపవలెనని, దేవుడు ఆది మానవ జంటను ఆశీర్వదించి యున్నందువల్లనే ఆదికాండము 1-28 పురుషులు స్త్రీలను ఆకర్షించుటకై బహు అందముగాను దయచేసి యున్నాడు.  స్త్రీలలో వారి మృదుమధుర మాటలను బట్టియు, వారు చదువుకున్న చదువులను బట్టియు, వారి అందమైన వెంట్రుకలను బట్టియు లేదా వారు ఇచ్చు బహు కట్న కానుకలను బట్టియు, ఆస్థిపాస్థులను బట్టియు ఏదో యొక విషయమును ఆధారముగా చేసికొని, పురుషుడు స్త్రీకి లొంగుచున్నాడు.  స్త్రీలో ఏదోయొక ఆకర్షణ పురుషునికి కల్గనిదే, ఆ స్త్రీతో జతపరచబడుటకు ఇష్టపడడు.

        మానవులను పరీక్షించుటకే ప్రకృతిని కూడా బహు ఆకర్షణీయముగ దేవుడు చేసి యున్నాడు.        ఆదినములలో ఆది దంపతులను తన మాటల చతురత వలన వారి ఆత్మలు గుడ్డితనము పొంది యుండుటను బట్టి;  ఆ గుడ్డితనమే దైవశాపము ద్వారా సర్పసంతానములకు పొర విడుచు సమయమున కొన్ని రోజులు శరీర గుడ్డితనము వివిధ రకములైన సర్పజాతులు ఈనాటికిని పొందుచున్నవి.

.............

        యోహాను 10:1 గొఱ్ఱెల దొడ్డిలో ద్వారమున ప్రవేశింపక వేరొక మార్గమున ఎక్కువాడు దొంగయు దోచుకొనువాడునైయున్నాడు. ద్వారమున ప్రవేశించువాడు గొఱ్ఱెలకాపరి.''        

        ప్రియపాఠకులారా!  పై వాక్యములో గొఱ్ఱెలు, దొడ్డి, ద్వారము, మార్గము, దొంగ, దోచుకొనుట వగైరా పదజాలము వ్రాయబడి యుండుట చూచుచున్నాము.  ఇందులో మొట్టమొదటగ గొఱ్ఱెలుఅనగా ఎవరు?  యోహాను 1:29లో యేసు తన యొద్దకు రాగా చూచి, ఇదిగో లోకపాపమును మోసికొని పోవు దేవుని గొఱ్ఱెపిల్ల అని యోహాను లోకనరకోటికి ప్రత్యక్షపరచిన దైవకుమారుడైన క్రీస్తు - ఈయన దేవుని గొఱ్ఱపిల్ల.  ఇట్టి గొఱ్ఱెపిల్ల ద్వారా మలచబడిన గొఱ్ఱెల వంటి మనము మన జీవితాలు కూడా గొర్రెలమే, అనగా అపరాధములు పాపముల చేత గాడిద స్వభావముతో - గాడిద గుణాతిశయములతో గాడిదలవలె పాపభారమును మోస్తూ గాడిదవలె లోకబంధకాలలో వుంటూ నలిగి విసిగి వేసారిన మన జీవితాలను బట్టి మన అపరాధములను బట్టి మనకు విమోచకునిగాను,         రక్షకునిగాను, దేవుని చేత రూపించబడి లోక పాపమును మోసిన గొర్రెపిల్లయే క్రీస్తు.  ఈ విధముగా గాడిదవంటి జీవితములో వున్న మన పూర్వీక స్థితికి ఈ గొర్రెపిల్ల జనన విధానము'', ఈ గొర్రెపిల్లను దేవుడు సృష్టించక పూర్వము ఆయన ప్రణాళికను గూర్చి తెలియక అనగా ఆ గొర్రెపిల్ల యొక్క ఆత్మీయతకు సుదూరమైన మన జీవితాలు గార్ధబ జీవితాలైయున్నందున గార్దబ దోషము బట్టిన నరునకు కలుగవలసిన శిక్షను - దేవుని గొర్రెపిల్లకు శిక్ష విధించాడు.  గాడిద దోషము పోవాలంటే తొలిచూలి గొర్రెపిల్ల వధింపబడవలెనుః  కనుక ఈ వధింపబడిన గొర్రెపిల్ల యొక్క రక్తము ద్వారా విమోచింపబడిన మనము దేవుని గొర్రెలము.  ఆయన మన కాపరి.  కనుక ప్రియపాఠకులారా!  క్రైస్తవులమైన మనము దేవుని గొఱ్ఱెపిల్లయైన క్రీస్తుయొక్క బలియాగమును బట్టి దేవుని గొఱ్ఱెలుగా మలచబడి యున్నాము.  ఇట్టి గొర్రెలకు కాపరి క్రీస్తు.  గొర్రెల దొడ్డి క్రైస్తవ ప్రార్థన మందిరము. గొర్రెల గుంపు అన్నది క్రైస్తవ సంఘము.        

        ఈ విధముగా గొర్రెల దొడ్డియైన క్రైస్తవ సంఘమునకు ద్వారము క్రీస్తే!  క్రీస్తులో జీవించిన వానికే గొర్రెల దొడ్డిలో ప్రవేశించుటకు అర్హత వున్నది.  అంతేగాదు రక్షణ వున్నది, అంతేగాదు నిత్య జీవమున్నది.  లోకసంబంధ బంధువుల నుండి విడుదల వున్నది.  మరణములో నుండి సంపూర్ణ విమోచన వున్నది.  కనుక క్రైస్తవ మందిరములో క్రీస్తు ద్వారములో ప్రవేశించు ప్రతి వ్యక్తియు గొర్రెల జాబితాలో చేర్చబడి యున్నారు.  అంటే గొర్రెవంటి అమాయకపు పరిశుద్ధ విధేయత వినయము గల్గిన గుణాతిశయములు కలిగిన వానికే ఇందులో ప్రవేశము.        

        ప్రియపాఠకులారా!  ఈ విధముగా గొర్రెల దొడ్డియను క్రైస్తవ మందిరములో ద్వారమునకు కావలి అనగా కాపరి చాలా ప్రాధాన్యతను సంతరించుకొని యున్నాడు.  దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన గొర్రెల మందయను సంఘమును కాచుటకు కాపరి చాలా బాధ్యతాయుతముగా ఆత్మ సంబంధమైన పరిశుద్ధతను పొంది, ద్వేషము, అసూయపరుడును, జగడమాడువాడును,ఈర్ష్యలేనివాడుగాను, ఎటువంటి వ్యసనాలు, దుర్వ్యసనాలు కలుగని వాడునైయుండి, వినయము విధేయత శాంతము ప్రేమ వాత్సల్యత కలిగి, తనను వలె తన ఎదుటివారిని ప్రేమించే స్వాభావికుడుగా వుండవలెను,  ఆ విధముగా వుంటే ప్రభువు చెప్పినట్లుగా మొదటి వచనము లో చివరిమాట '', ద్వారమున ప్రవేశించువాడు గొర్రెలకాపరి'' అనగా క్రీస్తును గురుత్వములోను తన యందుంచుకొని సంఘములోప్రవేశించే వాడే నిజమైన సంఘకాపరి.

        ఇట్టి కాపరియొక్క మాటను యోహాను 10:2లో గొఱ్ఱెలుఅతని స్వరము వినును, అనుటలో ఇట్టి ఆత్మావేశితుడైనటువంటి సద్ధర్మశీలునియొక్క ప్రార్థనను, బోధను, మరి సంఘము విని, గొర్రెలు అతని స్వరము వినును అన్నట్లును, ఇట్టి కాపరియొక్క బోధను సంఘము వింటూ అతని బోధను బట్టి తమయొక్క శారీర ఆత్మీయ జీవితాలను చక్కబరచుకొంటారు.  అనగా వారి మార్గమును సరి చేసుకొంటారు.  వారి సంఘ కార్యక్రమాలను ఇతరులకు మాదిరికరముగా కనబరచుదురు.  వారెల్లప్పుడు క్రీస్తు మార్గములోనే సంఘకాపరితో ఏకమై తమయొక్క ఆత్మీయ యాత్రను సాగిస్తారు.

        ప్రియపాఠకులారా! అంతేగాకుండ గొర్రెలకాపరి తన సొంత గొఱ్ఱెలను పేరుపెట్టి పిలిచి, వాటిని వెలుపలికి నడిపించును.  యోహాను 10:3లో  వ్రాయబడి యున్నది.  ఇందులోని భావము ఏమనగా ప్రియపాఠకులారా!  లోకములో గొర్రెలే గాకుండ మేకలు అడవి గొర్రెలు లేళ్ళు దుప్పులు జింకలు వగైరా సన్నజీవులున్నవి.  కాని దైవత్వము వీటన్నింటిలోను గొర్రెను తనకు ప్రధాన సాక్షిగా ఏర్పరచుకొన్నదంటే గొర్రెలోవున్న కొన్ని శ్రేష్టమైన గుణాలను మనము తెలుసుకోవలెను.  గొర్రె సాధు జంతువు - దానికి అహంభావము లేదు.  తానెక్కడకు వెళ్తుందో కాపరియొక్క క్రమశిక్షణలో వెళ్తుందేగాని తాను వెళ్ళేది మంచి స్థలమా?  ప్రమాదకర స్థలమా?  అన్నది కూడా దానికి తెలియదు.  కసాయివానికి మెడ, బొచ్చు కత్తిరించే వానికి శరీరము ఇచ్చే స్వభావము కలది.  భూజంతువులలోను మరి ముఖ్యముగా పశు గణములన్నిటిలోను గొర్రె ప్రధానమైనది.  గొర్రె మాంసమునకు సాటి ఏదియు లేదు.  అశుద్ధమైన దానిని తినదు, ఇది శాకాహారి.  ఇన్ని సత్‌ లక్షణములు వుండబట్టి బైబిలులో గొర్రెకు ఒక ప్రత్యేకమైన స్థానమేర్పడింది.

        ప్రియపాఠకులారా!  పరిశుద్ధ గ్రంథములో వ్రాయబడిన సకల జీవుల చరిత్రలలోను గొఱ్ఱెకే ప్రధాన స్థానమున్నది.  దేవుడు కోరిన బలులలో కూడా తొలిచూలి గొఱ్ఱె కోరి యున్నాడు.  అలాగే అబ్రాహాము తన కుమారుడైన ఇస్సాకును దహనబలిగా అర్పించుటకు కత్తి ఎత్తిన మోరియా అను దేవుని పర్వతము మీద అబ్రాహాము చేసిన ఆ సాహస కార్యమును దేవుడు ప్రశంసించి, అబ్రాహాము పైకెత్తిన కత్తిని ఆపమని అతనికి చూపించిన దర్శనములో కనబడిన జీవి గొఱ్ఱెపోతు (పొట్టేలు).

        కనుక ప్రియులారా!  ఇట్టి గుణాతిశయముండబట్టి దేవుడు గొఱ్ఱెను తన ప్రవచనాలలోను, తన బలి కార్యములలోను వాడినట్లుగా మనము తెలిసికోవలసి యున్నది.  ఇందునుబట్టి దావీదు ప్రవక్త కూడా తన ప్రవచనాలలో 23వ కీర్తన 1:లో యెహోవా నా కాపరి నాకు లేమి కలుగదు.  పచ్చిక గల చోట్ల ఆయన నన్ను పరుండజేయును : శాంతికర జలముల యొద్ద ఆయన నన్ను నడిపించుచున్నాడు.  ఈ రెండు వచనములను బట్టి దావీదు మహారాజై యుండి, కీర్తనాకారుడును ప్రవక్తయు దైవ విశ్వాసిగా వుండి తన్నుతాను తగ్గించుకొని, తన రాచరికాన్ని త్యజించి దైవసన్నిధిలో అతి వినయ విధేయతతో ఆలపించిన కీర్తన భాగాలే - పై రెండు వాక్కులు అంటే తన్ను తాను తగ్గించుకొన్నాడు.  యెహోవా నా కాపరి యైనప్పుడు దావీదు గొఱ్ఱె, అందుకే పచ్చిక గలచోట్ల, అని అనుటలో పచ్చిక మేసేది గొఱ్ఱె.  ప్రశాంతమైన నీటిని పానము చేసేది గొఱ్ఱె.

         ఆవిధముగా దేవుడు తనను ప్రశాంతమైన జలముల యొద్దకును పచ్చిక బైళ్ళలోను, అటుతర్వాత ప్రశాంతమైన అనగా పరిశుద్ధమైన జలముల యొద్దకు నడిపించుటన్నది.  ఇవి రెండును గొఱ్ఱెకు కాపరి జరిగించు కార్యములు.  అందుకే మొట్టమొదటగా యెహోవా కాపరత్వములో వున్న గొఱ్ఱెలు ఇశ్రాయేలు ఈ ఇశ్రాయేలు జనము ద్వారా దేవుడు బైల్పరచినటువంటి సత్య వాక్కే గొర్రెల పెంపకమును గూర్చిన వివరణ.  ఇశ్రాయేలు జనాభా నుండియే గొర్రెలను గూర్చి ప్రకటించబడింది.  ఇశ్రాయేలు జనాంగమునకు పూర్వము నరులకు గొఱ్ఱె అను పేరు లేదు.  ఇశ్రాయేలు అను గొర్రెలకు కాపరి యెహోవా!  నేటి క్రైస్తవ విశ్వాసులైన మనకు కాపరి క్రీస్తు.  అందుకే యోహాను సువార్త 10:7, దైవకుమారుడైన క్రీస్తు గొర్రెలు పోవు ద్వారమును నేనే 14లో నేను గొర్రెలకు మంచి కాపరిని అంటున్నాడు.  ఇందునుబట్టి, నేటి క్రైస్తవ విశ్వాసులైన మనకు ద్వారము క్రీస్తు; మార్గము క్రీస్తు; కాపరి క్రీస్తుయై యున్నాడు.  ఈ విధముగా మూడు విధములైన కాపుదలలు నేటి విశ్వాసులమైన మనకును మన సంఘమునకును - మన ఆత్మీయ జీవితమునకును ఉన్నదని మనము గ్రహించవలెను.

        మరియొక శ్రేష్టమైన మాటేమిటంటే యోహాను10:15లో నేను నా గొర్రెలను ఎరుగుదును, నా గొర్రెలు నన్నెరుగును మరియు గొర్రెల కొరకు నా ప్రాణము పెట్టుచున్నాను.  ప్రియపాఠకులారా!    మంచి కాపరియొక్క లక్షణాలు ప్రత్యక్షముగా క్రీస్తు బైల్పరచుచున్నాడు.  ఈయొక్క సాహిత్యాన్ని చదువుచున్న నీవు ఏ స్థితిలో వున్నావు?  ప్రభువు స్వరమును వినేటటువంటి గొఱ్ఱెగా ఉన్నావా?  ప్రభువు ద్వారములో ఆలయములో ప్రవేశించే గొర్రెగా ఉన్నావా? ప్రభువుయొక్క స్వరమును విని ఆయనను వెంబడించే గొర్రెగా ఉన్నావా?  ఏ విధమైన గొర్రెగా ఉన్నావు?  ఒక్కసారి మనలను మనము పరీక్షించుకొందము.                పరిశుద్ధ గ్రంథములో సకల జీవజంతుకోటిలో గొఱ్ఱెకున్న ప్రాధాన్యత మరి ఏ జీవికి లేక బహు ఉన్నతమైనదని మనము గ్రహించవలెను.  దేవుడు లోకరీత్యా గాకుండ పరలోక రాజ్యములో కూడా తన ఆత్మ సంబంధముగా గొఱ్ఱెకు ప్రాధాన్యత నిచ్చి యున్నట్లుగా ప్రకటన 14:1లో ఇదిగో ఆ గొఱ్ఱెపిల్ల సీయోను పర్వతము మీద నిలువబడి యుండెను, 21:9 పెండ్లి కుమార్తెను అనగా గొఱ్ఱెపిల్లయొక్క భార్యను నీకు చూపెదనని నాతో చెప్పెను, 14లో గొఱ్ఱెపిల్లయొక్క పన్నిద్దరు అపొస్తలుల పేర్లు కనబడుచున్నవి.  23లో గొర్రెపిల్లయే దానికి దీపముః జనములు దాని వెలుగు నందు సంచరింతురు.  ఈ విధముగా అనేక చోట్ల వేదములో దేవుని గొర్రెపిల్లను గూర్చి వాడిన పదములున్నవి.

        కనుక నేటి క్రైస్తవ చర్చీలు ఎన్ని ఉన్నను ఏ శాఖయైనను ఏజాతియైనను ఏ దేశములోనివైనను ఏ రాష్ట్రము ఏ పట్టణము ఏ గ్రామములో ఉన్న చర్చీలైనను వేదరీత్యా అవి గొర్రెల దొడ్లు.  ఇందులో సమావేశమగు సంఘము గొర్రెల మంద.  అందులో ప్రవేశించుటకు ద్వారము క్రీస్తు.  సంఘమునకు ప్రధాన కాపరి కూడా క్రీస్తే!  సంఘకాపరి, పరిచారకుడు మంద యజమానికి సేవకుడు.  ఈ క్రమములో ఏ సంఘమైతే లోకములో నడుస్తుందో - ఆ సంఘమునకున్నటువంటి ఆధిక్యత చాలా గొప్పది.  దైవసన్నిధిలో దానికొక ప్రత్యేక స్థానముంటుంది.  అట్టి మంద చదరదు, దైవసన్నిధిలో అట్టి మంద ఆశీర్వదించబడి, ఆత్మీయముగా అనేక గొర్రెలను కని తద్వారా సంఘము ఫలభరితము చేస్తుంది.

        ప్రియపాఠకులారా!  నేటి క్రైస్తవ విశ్వాస గొర్రెల మందలైన మనము మన సొత్తు కాము.  విలువ పెట్టబడి దేవుని గొర్రెపిల్లయైన క్రీస్తుయొక్క రక్తము ద్వారా  ఆయన శారీర బలియాగము ద్వారా దేవుని చేత కొనబడినవారమై బహు విలువైన జనాంగముగా రూపొందించబడి యున్నాము.  ఇందునుగూర్చి ప్రకటన 14:2-5 చదివితే వీరు ఏ విధముగా కొనబడినారు?  వీరియొక్క అలవాట్లు వీరి పవిత్రత;  వీరి ఎంపికను గూర్చి;  వీరికి వున్న దేవునియొక్క ఎన్నికను గూర్చి వివరముగా చదువగలము.        

        ప్రియపాఠకులారా!  ఆత్మదేవునియొక్క ఆత్మీయ సత్యములు ఈ విధముగా వుండగా శారీర నిర్మాణమునకు మూలమైన ఈ భూలోకము గొఱ్ఱె జాతిని కించపరచి దానిని అల్పజీవిగాను, పనికిమాలినదిగాను, వెర్రిజంతువుగాను, హేళన చేస్తూ కించపరచుచున్నది.  అమాయకుడైన వ్యక్తిని లోకమును గొఱ్ఱెగా హేళన చేస్తున్నది.  మనుష్యులను భక్షించే వన్యమృగాలైన పులి, సింహమునకు ప్రాధాన్యత నిచ్చి వాటిని ఘనమైన జంతువులుగాను, వానరికమైన అడవి జాతిగాను అభివర్ణిస్తూ - ప్రభుత్వ నాణెముల పైనను నోట్లు; ప్రభుత్వ స్టాంపులు ముద్రలు వగైరాలలో పులి, సింహము, జింక, వగైరా జంతువులయొక్క రూపాలను ముద్రించి, బహిరంగముగా ప్రభుత్వమే చలామణి జేస్తున్నది.

        ప్రియపాఠకులారా!  నేటి మన ఇహలోక జీవితములో ధన రూపముగా మనము పొందే వేతనము, జీవన భృతి వగైరా సంపాద్యములో మనకు దొరికే ధనము, నోట్లుగాని, నాణ్యాలుగాని, వీటిమీద ఏనాడైనను గొఱ్ఱెముద్రను చూచినారా?  అయితే పరలోకము దీనిని పూర్తిగా నిషేధిస్తున్నది.  సహోదరుడా!  సహోదరీ! పరలోక రాజ్యములో నీవు ప్రవేశించాలంటే, ఈ లోకములో నీవు ఘనముగా ఎంచబడే ఏ జీవి ముద్ర పనికి రాదు.  గొర్రెపిల్ల ముద్ర లేనివారు పరలోక రాజ్య ప్రవేశమునకు అనర్హులు, దైవసన్నిధిలో చలామణి కాలేరు, దేవుని బిడ్డలుగ తీర్చబడరు.  ఆయన సేవకు పనికి రారు.  ఒకవేళ సంఘాలయములోకి రావచ్చును. సంఘసభ్యులతో కూర్చుని వాక్యము వినవచ్చును, ప్రార్థన చేయవచ్చును, క్రైస్తవులమని ప్రకటించుకోవచ్చును.  అయితే ఆత్మీయముగా వారిలో క్రీస్తు అను గొర్రెపిల్లయొక్క ముద్ర ఉన్నదా?  అనిన విషయాన్ని ఆత్మ దేవుడే నిర్ధారించునుగాని నరులమైన మనము నిర్ధారించలేము.        

        కనుక ప్రియ సోదరీ!  సోదరుడా!  నీవు ఏ స్థితిలో వున్నావు?  ఏ గొఱ్ఱెగా ఉన్నావు?  దిక్కులేని గొర్రెగా వున్నావా?  మందలో నుండి తప్పిపోయి అరణ్య మార్గములో చిక్కుకొన్న గొర్రెగా ఉన్నావా?  లేక మందలో దెబ్బలాడి మానసికముగా గాయము పొందినటువంటి జగడగాండు గొర్రెగా ఉన్నావా?  లేక యేసునకును, దైవత్వానికిని, మానవత్వానికిని, ఆత్మీయతకును అనువైనటువంటి సౌమ్యమైన, వినయవిధేయత గల్గి క్రీస్తు అను ద్వారములో ప్రవేశించి, క్రీస్తు మార్గములో సంచరిస్తూ ఆయన ఇచ్చు మేతను మేస్తూ - ఆయన ననుసరిస్తూ ఆయన మార్గమును వెంబడిస్తూ - ఆయన దొడ్డిలో ఆయన గొర్రెగా జీవించే స్థితిలో ఉన్నావా? నీకాపరి నిజమైన గొర్రెల కాపరియైన క్రీస్తా?  లేక గొర్రె చర్మము కప్పుకున్న తోడేళ్ళ కాపరియైన అపవాదియా?  ఎవరు నీ కాపరి?  నీకు మనకు అందరికి యేసే నిజమైన కాపరి. ఎందుకంటే ఆయన తన మందయైన మన కొరకు తన శరీరాన్ని, తన రక్తాన్ని, తన జీవమును, తన ఆత్మను అర్పించాడు.  అది నిజమైన కాపరియొక్క లక్షణాలు - మనము కూడా ప్రభువు ననుసరించి ప్రభువు ద్వారములో ప్రభువు మార్గములో - ప్రభువుయొక్క కాపుదలలో ప్రభువు దొడ్డిలో అనగా ప్రభువు గృహములో - వాక్యము ప్రార్థన అనేటటువంటి ఆహారము, జీవజలములతో మనకున్న ఆత్మీయ ఆకలి దప్పికను తీర్చుకొని, మన కాపరియైన క్రీస్తును మహిమపరచెదముగాక!  ఆమేన్‌.

..........

        యోహాను 11:1-3 ప్రియపాఠకులారా!  ఇప్పుడు మనము తెలిసికొనబోవు వేదభాగములో చివరి మాట :- ప్రభువా!  నీవు ప్రేమించువాడు రోగియై యున్నాడని వ్రాయబడుట నిజమే!  లోకములో ప్రతి నరుడు కూడా ఈ మాటనుబట్టి తప్పనిసరిగా రోగియై యున్నాడు.  రోమా 3:11లో నీతిమంతుడు ఒక్కడును లేడు, గ్రహించువాడు లేడు, దేవుని వెదకువాడు లేడు, అన్నట్లుగ - యేసు ప్రభువుయొక్క దీవెన ఆయన ఆత్మ కుమ్మరింపు, ఆయన సావాసము నరునికి కలగాలంటే తప్పకుండా వాడు రోగియై యుండవలెను.  ఈ రోగమన్నది దేహ సంబంధముగా ఉండినను లేక ఆత్మ సంబంధముగా వున్నను రోగము రోగమే!  లోకములో రోగము లేని నరుడు లేడు.  నరుడు పుట్టినది లగాయతు మరణించు వరకు ఏవో కొన్ని రకాలైన రోగములు వానికి సంభవిస్తుంటాయి.  అలాగే నరునిలో వున్న ఆంతర్యపురుషుడైన ఆత్మ నరునికి కూడా శరీరునికున్న వాని వలె ఆత్మ సంబంధమైన రోగాలు కూడా కొన్ని ఉన్నవని ఈ సందర్భములో  మనమెరుగవలెను.

        యేసు ప్రేమించువాడు రోగి - దేవుడు ప్రేమించువాడు బికారి.  ఇందునుగూర్చిన కొన్ని ఉదా|| వేదరీత్యా మనము తెలిసికొందము.  మొట్టమొదటగా ఏదెను వనములో దేవుడు సృష్టించి ప్రేమించిన నరజంట ఇద్దరు బికారులే!  వీరికి గూడు లేదు - కూడూ లేదు, బట్ట లేదు వంటికి స్నానము లేదు, ఇట్టివారిపై దేవుని ప్రేమ విస్తరించింది.  ఆలాగే దేవుడు ప్రేమించిన నోవహు ఇతను కూడా బికారే.  లోక సంబంధముగా ఇతని కెటువంటి స్థితిగతులు, సంపదలు, మణులు మాణిక్యాలు లేవు.  చేతివృత్తిని బట్టి వడ్రంగిగా వుండి దైవవాక్కును బట్టి ఓడను తయారు చేసి, దైవానుగ్రహము చేత మరియు దైవాత్మ ప్రేరేపణ చేత, ఆయన చిత్తాన్ని బట్టి ఎఱ్ఱటియేగాని లేకుండా ఓడను చేశాడు.  ఓడను తయారు చేయుటకు కావలసిన కలపను నోవహు కొన్నట్లుగా బైబిలులో లేదు.  దానికి వాడిన సీలమేకుల వివరము కూడా లేదు.  అంటే నోవహు చేసిన ఓడ కమ్మర కొలిమి ఇనుప సామగ్రి, శిల్పులయొక్క హస్త నైపుణ్యము వగైరాలేవియు లేనట్లును, ఆ ఓడకు వాడిన మొత్తపు సామగ్రి దేవునియొక్క వాక్కును, ఆయన చిత్తమును, ఆయన సన్నిధి - నోవహుయొక్క హృదయములో ఆయన ఆత్మ ఉజ్జీవింపజేసి, నోవహు చేత జరిగించిన హస్తక్రియయై యున్నది.  ఇట్టి స్థితిలో నోవహు ఓడను చేశాడు.  లోకరీత్యా నోవహు దరిద్రుడే!  అనగా బికారియే! అయిననేమి?  దేవునియొక్క సావాసము ద్వారా మూడంతస్థుల ఓడ గృహానికి యజమానియు, లోకసృష్టిలో వున్న ప్రతి జీవరాశికి తండ్రియు, పోషకుడు, ప్రాణదాతయైనట్లు మనము గ్రహించవలెను.

        మూడవ బికారి లోతు - దైవవాక్కును మనసులో నిల్పి దైవచిత్తానుసారముగా దైవవిధేయతతో ప్రవర్తించిన లోతు దేవుని యందు విధేయించి, కట్టుగుడ్డలతో దైవమార్గంలో నడిచిన లోతు తన యావదాస్థిని పోగొట్టుకొని బికారియైయ్యాడు.  అలాగే మోషే, ఫరో సంస్థానములో ఫరో కుమార్తెయొక్క కొడుకుగా అనిపించుకొని ఫరోయొక్క సమస్త అధికారములను, రాచరికాన్ని అన్నిటిని వదలిపెట్టి ఫరో కుమార్తె కుమారుడుగా అనిపించుకొనుట కంటె దేవుని ప్రజలైన ఇశ్రాయేలుతో చేరి, బికారిగా జీవించి, ఆ దైవజనాంగమును 40 సంవత్సరములు యూదా అరణ్యములో నడిపించాడు.  యోబు :-  దేవుడిచ్చిన సమస్త ఐశ్వర్యాన్ని దేవునికి అప్పగించి బికారియై - అంతియేగాకుండ రోగియై తన విశ్వాస జీవితములో సాతానుతో పోరాడి విజయుడాయెను, ఐశ్వర్యవంతుడాయెను, మోషే నాయకుడాయెను, నోవహు పునఃసృష్టికి తండ్రి అయ్యాడు.  అనగా సకలైశ్వర్యాలు కలవారయ్యారు.  అలాగే లోతు దేవునికి ప్రీతిపాత్రుడాయెను.  ఐదవ బికారి సౌలు :-  ఇశ్రాయేలుకు రాజుగా సమూయేలు చేత అభిషేకించబడిన సౌలు గాడిదలు కాపరియైన బికారి.  ఇట్టి బికారిని దైవత్వమన్నది దైవజనాంగానికి రాజుగా చేసింది.  అలాగే దావీదు గొఱ్ఱెలు మేపుకొంటు లోకము చేత ఎన్నికలేని బికారి.  కాని దైవత్వము చేత ఎన్నుకోబడి రాజుగా మహారాజుగ, ప్రవక్తగ, కీర్తనాకారుడుగ, దైవత్వములో హెచ్చించబడినాడు.  ఈలాగు ఇంకను అనేకమంది బికారీలు పాత నిబంధనలో వున్నారు.

        ప్రియపాఠకులారా!  ఈ విధముగా బికారీలను షావుకార్లుగా మార్చిన దేవుడు 2 కొరింధీ 8:9 మీరు మన ప్రభువైన యేసుక్రీస్తు కృపను ఎరుగుదురు గదా!  ఆయన ధనవంతుడై యుండియు మీరు తన దారిద్య్రము వలన ధనవంతులు కావలెనని, మీ నిమిత్తము దరిద్రుడాయెను.  ప్రియపాఠకులారా!    ఈ విధముగా దేవుడు బికారీలను బాగుజేసి, వారిని ఉన్నత స్థితికి తెచ్చి పోషిస్తే, వారు కృతజ్ఞత లేనివారై ఆయన మీద తిరుగబడి అవిధేయులై దైవత్వాన్ని అలక్ష్యము చేయగా - పై వాక్య రీతిగా ప్రభువే మన కొరకు దరిద్రుడై అనగా బికారియై ఈ లోకములో అవతరించినట్లు తెలియుచున్నది.  మొట్టమొదట ఆయన భూమి మీద నర రూపములో జన్మించిన జనన కాలములో ఆయన ఇండ్లలోగాని, సత్రములోగాని, స్థలము లేదు.  ప్రభువు తన బోధలో నక్కలకు బొరియలు, ఆకాశపక్షులకు గూండ్లు కలవుగాని, మనుష్య కుమారునికి తలవాల్చుకొనుటకు స్థలము లేదు అని ప్రవచించి యున్నాడు.  నిజమే!  ఆయన ఈ లోకములో జీవించిన దినములలో ఊరిలో బోధించుట, ఆలయాలను దర్శించుట, ఒలీవల కొండలో విశ్రమించుట.  ఇందునుబట్టి, చూస్తే ఆయనకు ఇల్లు లేదు.  ప్రియపాఠకులారా!  తండ్రియైన  దేవునికి వలె  యేసు ప్రభువు కూడా చేపలు పట్టే జాలరులను బికార్లుగా చేసి, సమస్తము వదలి తనను వెంబడించమన్నాడు.  ధనవంతుడు దేవుని రాజ్యము చేరుట కంటె సూది బెజ్జములో ఒంటె దూరుట సులభము అనుటలో యేసును వెంబడించువాడు బికారిగా వుండాలనే దీని భావము.  ఇందునుబట్టి చూడగా ప్రభువును వెంబడించిన శిష్యులు :-  వారి ప్రవచనాలను విశ్వసించి కూడిన సంఘము ఆత్మీయముగా ఐశ్వర్యవంతులను శారీరకముగా బికారులుగా అగునట్లు  మనము తెలిసికోవలసి యున్నది.  యోహాను కూడా బికారియే తినకయు, త్రాగకయు, ఒంటె రోమ వస్త్రాలు : అడవి మిడతలు, తేనె ఇతని ఆహారముః యోహాను కూడా బికారిగానే జీవించాడు.  కాని దైవరాజ్యములో అతను ఐశ్వర్యవంతుడు.

        ప్రియపాఠకులారా!  యేసును వెంబడించిన శిష్యులు సువార్త నిమిత్తము హతసాక్షులైనవారు వేదసాక్షులైన వారు మొత్తము బికారీలుగ వున్నట్లుగానే మనకు తెలియుచున్నది.  ఇందుకు సాక్ష్యాధారము మొదటి యోహాను పత్రికలో - లోకమునైనను లోకములో ఉన్నవాటినైనను ప్రేమింపకుడి - కొలస్స 3:1 మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్నవాటినే వెదకుడు.  పైనున్న వాటి మీదనేగాని భూసంబంధమైన వాటి మీద మనస్సు పెట్టకుడు.  పై మాటలన్నియు లోక వైరాగ్యమును గూర్చిన మాటలు కనుక ప్రియపాఠకులారా!    మరియొక మాటేమిటంటే ఎవడైనను లోకమును ప్రేమించిన యెడల తండ్రి ప్రేమ వానిలో ఉండదు.  కనుక మన ఆత్మీయ జీవితములో మనయొక్క ఆత్మీయ దృక్పధము లోకము పై ఉంచక, పరలోక సంబంధమైన దైవరాజ్య సంపదను, వారసత్వమును పొందుటకు, పైనున్న తండ్రి కొరకే మన చూపులు వుంచవలెను.  ఇందునుగూర్చి కీర్తనాకారుడు 123:1, ఆకాశమునందు ఆసీనుడైయున్నవాడా! నీతట్టు నా కన్నుల నెత్తుచున్నాను, అంటున్నాడు.  అలాగే మనము కూడా మన ఆత్మీయ కనుదృష్టి ఆయనపై నిలిపి ఆయన కృప, ఆయన ఆశీర్వాదము, ఆయన దీవెనలు పొంది, ఆత్మానంద భరితుల మగుదము గాక!  ఆమేన్‌.        

        షికారి :-  ఈ షికారి ఎవరు?  యోబు 1:7 యెహోవా ఎక్కడ నుండి నీవు వచ్చితివి?  అని వానిని అడుగగా అపవాది భూమి మీద అటు ఇటు తిరుగుచు అందులో సంచరించుచు వచ్చితినని యెహోవాకు ప్రత్యుత్తరమిచ్చెను.

        బికారీలను గూర్చి లోగా తెలిసికొన్నాము.  బికారీలుగ ఉన్నవారికున్న ఆత్మీయ ఆధిక్యతలు, పరలోక ఐశ్వర్యాలు తెలిసికొన్నాము.  ఇప్పుడు షికారి కున్నటువంటి మంచి చెడు ఫలితాలేమిటో వేదరీత్యా తెలిసికోగలము.  మొట్టమొదటగా ఆది నరజంట దైవత్వముతో సఖ్యతగా ఉండి ఆయనకు ప్రీతికరముగా నడిచిన కాలములో - వంటావార్పు, కూడూ గుడ్డా, బరువు బాధ్యతలు లేక తమ ఇష్టము వచ్చిన చెట్టు ఫలాలను భుజించి, నిర్విచారముగా ఏదెను తోటలో ఆది నరజంట షికార్లు జేశారు.  ఇది దేవునితో నడిచిన షికారీ విధానము.  దైవత్వములో షికారు చేసిన నరజంటకు దేవుడు తన స్వాస్థ్యమైన ఏదెనును వారికి అనుగ్రహించాడు.  అందులో వారి ఇష్టము ప్రకారము జీవించే స్వాతంత్య్రము కూడా అనుగ్రహించాడు.  ఈ విధముగ దైవచిత్తానుసారముగ నాటి నరజంట, వారియొక్క ఆత్మీయ జీవితములో షికారీతోనే మనోల్లాసముగా జరుపుకొన్నారు.  ఇట్టి షికారు వలన ఆది నరజంట ఆత్మీయ మేళ్ళను పొంది, ఆత్మానందములో జీవించారు.

        ఇట్లుండగా పురుషుడు లేని సమయములో ఒంటరిగా వున్న స్త్రీ యొద్దకు సాతాను సర్పరూపుడై అనగా సర్పాన్ని తనయొక్క వాహనముగా జేసుకొని, ఏదెనులో షికార్లు తిరుగుచు, స్త్రీతో యుక్తిగా మాట్లాడి దైవ నిషేధ ఫలమును తినిపించి, నరజంట దైవాజ్ఞను మీరునట్లుగా క్రియ జరిగించినట్లు మనము చదువగలము.  ఇట్టి క్రియల వలన నరులయొక్క తోట షికారుకు బంధకాలు పడినవి.  ఎట్లంటే నరజంట నిషేధ ఫలమును భుజించిన తర్వాత వారు మంచి చెడ్డలు ఎరిగినవారై, దైవసన్నిధిలో షికార్లు జేసే యోగ్యత కోల్పోయి, చెట్లచాటున దాగుకొనుటన్నది ఇక్కడ జరిగిన క్రియ.  కాని దేవుడు మాత్రము తన సంకల్పము మానుకొనక సంచరించుచున్న యెహోవా స్వరము విని ఆయన సన్నిధికి రాక దాగినారు.

        దేవుడు తోటలో షికార్లు జేస్తూ దోషియైన నరుని ఉద్ధేశించి ఆదామా!  నీవు ఎక్కడ నున్నావు అని అడుగుట; అందుకు నరుడు తన స్వేచ్ఛను కోల్పోయి, నేను దిగంబరిని కనుక నీ స్వరము విన్నప్పుడు దాగుకొంటిని.  ప్రియపాఠకులారా!  ఏదెను వనములో జరిగిన ఈ సంఘటనను బట్టి ఏదెను తోటలో శాపగ్రస్థులైన నరజంట సర్పము ముగ్గురును స్వేచ్ఛను కోల్పోయి, నరకోటికి భయపడి పాము; భార్యా బంధము, శారీర బలహీనత, ఆత్మీయ బలహీనతలను బట్టి పురుషుడు;  భర్తను బట్టి భార్య;  ఈ ముగ్గురును తమ స్వేచ్ఛను కోల్పోయి, ఒకరి యందు ఒకరు భయపడుచు, ఈ ముగ్గురు లోకానికి భయపడుచు మరియు నిజమైన దేవుని సన్నిధిలో కనబడుటకు స్వేచ్ఛను కోల్పోయి, ఒంటరితనముతో, వారి జీవితములో కృశిస్తూ, బాధపడుచు ఈ షికార్లను మానుకోవలసివచ్చింది.

        ప్రియపాఠకులారా!  పై సంఘటనను బట్టి శాపగ్రస్థమైన పాము తన షికారును రాత్రి కాలములో అనగా చీకటిలో చేయు స్థితికి దిగజారింది. అలాగే స్త్రీ తనయొక్క స్వేచ్ఛను కోల్పోయి, పురుషునికి లోబడి, వాని ఇష్టప్రకారముగా వాని చిత్తానుసారముగ నడిచే స్థితికి దిగజారింది.  అలాగే పురుషుడు స్వేచ్ఛను కోల్పోయి భూమ్మీద శ్రమించి పనిజేసేటటువంటి స్థితికి దిగజారి తన స్వేచ్ఛను కోల్పోయి - ఈవిధముగ సంపూర్ణ స్వేచ్ఛతో కూడినట్టి షికారును నరుడు కోల్పోయి, తన ఆత్మీయ బలహీనతను బట్టి, సాతానును షికారు చేయించే స్థితికి నరుడు దిగజారినాడు.  

        అందును బట్టి ఈ వ్యాఖ్యానము లోని మూలవాక్యము యోబు 1:7లో అపవాది దేవునికి ప్రత్యుత్తర మిచ్చుచు - భూమిమీద ఇటునటు తిరుగుచు, అందులో సంచరిస్తూ వచ్చితిని, అని అనుటలో లోకములో యధేచ్ఛగా సంచరించే అనగా షికారు జేసే శక్తి సాతానుకు మానవుడు ఇచ్చి యున్నాడు.  

        ఒకానొక దినమున ప్రొద్దు క్రుంకు వేళ దావీదు పడక మీద నుండి లేచి రాచనగరి మిద్దెమీద నడచుచు, పై నుండి చూచుచుండగా స్నానము చేయు ఒక స్త్రీ కనబడెను.  ప్రియపాఠకులారా!    దైవజనాంగముతో దేవుని పక్షముగా యుద్ధము జేసి దైవజనాంగమును రక్షించవలసిన రాజు - బలమైన యుద్ధ సమయములో తన సైన్యమైన దైవజనాంగమును అనామకముగా వదలి, రాచనగరిలో మిద్దె మీద షికారు చేయుచు పాపములో పడినాడు.  ఇక్కడ దావీదు చేసిన షికారు పాపప్రవేశమునకు మూలము.

        అలాగే మొదటి సమూయేలు గ్రంథము 9:14-15, వారు ఊరిలోనికి రాగా ఉన్నతమైన స్థలమునకు పోవుచున్న సమూయేలు వారికి ఎదురుపడెను.  సౌలు సమూయేలుకు కనబడగానే యెహోవా - ఇతనే నేను నీకు చెప్పిన మనిషి.  అప్పుడు సమూయేలు తైలపు బుడ్డి పట్టుకొని సౌలు తలమీద తైలము పోసి, అతనిని ముద్దుపెట్టుకొని, యెహోవా నిన్ను అభిషేకించి తన స్వాస్థ్యము మీద అధిపతిగా నియమించి యున్నాడని చెప్పి - యెహోవా ఆత్మ నీమీదికి బలముగా దిగి వచ్చును.  నీవు వారితో కలసి ప్రకటన చేయుచుండగా నీకు క్రొత్త మనస్సు వచ్చును.  దేవుడు నీకు తోడుగా వుండును.  కనుక ఈ సూచనలు నీకు సంభవించిన తర్వాత నీకు మంచిదని తోచిన వానిని చేయుము.  నా కంటె ముందు నీవు గిల్గాకు వెళ్ళగా దహన బలులను, సమాధాన బలులను అర్పించుటకై నేను నీ యొద్దకు దిగి వత్తును.  నేను నీ యొద్దకు వచ్చి నీవు చేయవలసిన దానిని నీకు తెలియజేయు వరకు ఏడు దినముల పాటు నీవు అచ్చట నిలువవలెను.  అతడు సమూయేలు యొద్ద నుండి వెళ్ళిపోవుటకై తిరుగగా దేవుడు అతనికి క్రొత్త మనస్సు అనుగ్రహించెను.  ఆ దినముననే ఆ సూచనలు కనబడెను.

        ప్రియపాఠకులారా!  పోగొట్టుకున్న తప్పిపోయిన గాడిదలను గూర్చి షికారుగా వెదికిన సౌలు దైవత్వము చేత ఎన్నిక చేయబడి, దైవజనాంగమైన ఇశ్రాయేలుకు రాజయ్యాడు.  అలాగే నూతన నిబంధన కాలములో యేసుప్రభువు కూడా సంచరిస్తూ, ఎరికో పట్టణములో ప్రవేశించినట్లు వ్రాయబడి యున్నది.  ఇందునుబట్టి చూడగా లూకా 19:10లో నశించిన దానిని వెదకి రక్షించుటకు మనుష్య కుమారుడు ఈ లోకములో షికార్లు చేసినట్లు ఋజువగుచున్నది.  ఆయన సంచరించిన ప్రతి స్థలములోను, ప్రతి పట్టణములోను, ఏదో యొక విధమైన మహిమాన్విత క్రియ జరిగించి యున్నాడు.

        ప్రియపాఠకులారా!  షికారు అను పదమును రచయితనైన నేను ఉపయోగించిన నన్ను గూర్చి పాఠకులు అపోహపడరని ఈ క్రింది విధమును బట్టి నేను నమ్ముచున్నాము.  ఆదిలో యెహోవా దేవుడు విశాలమైన ఏదెనులో విహరించినట్లు వేదములో చదువగలము.  ఈ విహారమన్నదే షికారు.  షికారులో               కొన్ని రకాలున్నవి.  వేట, చేపల వేట, హంతకుల వేట, సలక్షణమైన వధువును గూర్చి వేట, కావలసిన జంతువును గూర్చిన వేట, మంచి కార్యసాధనను గూర్చిన వేట, వగైరా అనేక రకములైన వేటలున్నవి.  ఈ వేటనే షికారు అంటారు.  పేతురు, యోహానులు వారి సంతతి వారందరును చేపల వేట, చేపల షికారీలో ఆరి తేరిన జాలరులు.  ఆలాగే యేసుప్రభువు కూడా పేతురు యోహానుల నుద్ధేశించి, మీరు చేపలు పట్టువారేగాని మిమ్ము మనుష్యులను పట్టు జాలరులుగా చేస్తానని అనుట వేదములో చదువగలము.                షికారు అనిన పదము బోటు షికారు అనగా పడవ షికారు అన్నది, సరస్సులలోను, నదులలోను, కాలువలలోను జరుగుచున్నది.  పాత నిబంధన కాలము నాటి రాజులు, వారియొక్క షికార్లు అన్నియు కూడా గుఱ్ఱముల మీదను, రథములలోను, పల్లకీలలోను, అడవులలోను, జరిపినట్లు తెలియుచున్నది.  అలాగే నరులలో వున్న జీవాత్మ కూడా శరీరములో చేరి, శరీరమైన యంత్రమును, భూలోకములో - శరీరమును తన సాధనముగ వాడుకుంటూ భూమిపై షికార్లు చేయుచున్నది.  ఈ షీకారునే యాత్ర అంటున్నాము.  షికారునకు పర్యాయ పదము యాత్ర, విహారము, సంచారము, వగైరా కార్యార్థమై ఉద్ధేశ్య పూర్వకముగ చేయు సంచారమును ప్రయాణమంటారు.  దైవికముగా పుణ్యక్షేత్రాలను దర్శించు సందర్భముగ చేసెడి ప్రయాణమును యాత్ర అంటారు.  ఏ ఉద్ధేశ్యము లేకుండ కేవలము మనోల్లాసము కొరకు చేసేటటువంటి ప్రయాణాన్ని షికారు అనగా విహారమంటారు.  ఏది ఏమైనప్పటికిని నరులు భూమి మీద చేసిన చేయు లోక సంబంధమైనవి మరియు శారీర యుతమైన షికార్లు వ్యర్థమే!  ఒకవేళ దేహమనారోగ్య స్థితిలో వుండి, బలహీనుడైనప్పుడు మరియు దేహములో నీరు పెరిగి శరీరము లావెక్కి నడవలేని స్థితిలో వున్నప్పుడు, వైద్యులిచ్చే సలహా షికారుగా నడవడమన్నది ప్రధానాంశమై యున్నది.  నూతనముగ వివాహమాడిన యువ దంపతులు కూడా వారియొక్క మనోల్లాసమము కొరకు హనీమూన్‌ అనగా కళ్యాణ విహారమను పేరుతో షికారు చేయుట మనము చూస్తున్నాము.  ఇది లోకరీత్యా జరుగుచున్న ఆనవాయితీ!

        ప్రియపాఠకులారా!  లోకరీత్యా మనయొక్క కార్యసాధనను బట్టి, మనోల్లాసమును బట్టి, ఎన్నియో రకముల షికారీలు, విహారాలు చేసినప్పటికిని మనయొక్క ఇహలోక జీవితములో - ఏ ఒక్క రోజైన సువార్తను గూర్చిన షికారీ చేసితిమా?  చేయుచున్నామా?  ప్రభువు మనకిచ్చిన సమయములో, ఆయుష్కాలములో మనము చేయవలసిన షికారీ సమయమందును, ఆ సమయమందును 2 తిమోతి

4:2, సువార్త ప్రకటించుట, సువార్త సేవకు వెళ్ళుటయు, ఆయనయొక్క వాక్యమును ప్రకటించుటయు, అనేక ఆత్మలను సంపాదించు క్రియలో చేర్చుటన్నది క్రైస్తవునియొక్క బాధ్యతాయుతమైన షికారియై యున్నది.

        ప్రియపాఠకులారా!  షికారన్నది కేవలము మనోల్లాసము కొరకు కాదు గాని, మనస్సాక్షికి మూలపురుషుడైన ఆత్మ దేవునియొక్క ఉద్ధేశ్యాన్ని సఫలము చేయుటన్నది, ప్రధానమై యున్నట్లు ఇందునుబట్టి మనము గ్రహించవలెను.  షికారీలలో దైవసంబంధమైన షీకారీలు, మోక్ష భాగ్యమునకు సోపానము.  అట్లుగాక లోకసంబంధమైన షికారి అనగా జంతు వేట, చేపల వేట, మద్యాన్ని గూర్చి వేట, వ్యభిచారమును గూర్చి షికారి.  ఈ షికార్లు అన్నియు ప్రాణాంతకములు.  చేపల షీకారి చేయువాడెంత నేర్పరియైనను ఏదో యొకనాడు లోతైన జలములలో మరణించక మానడు.  ఆయుధముతో షికారు చేయువాడు అనగా జంతు వేట - ఆయుధము ద్వారాగాని లేదా వేటాడబడు జంతువు ద్వారాగాని ప్రమాదాలలో చిక్కుకొనక మానడు.  వేశ్యలను గూర్చి షికారు చేయువాడు వేశ్య ద్వారానే నాశనమగును, ధన సంపాదను గూర్చి అనగా భూలోక సంపదను గూర్చి విహరించువాడు ఆ ధనము చేతనే సంహరించబడును.

        ప్రియపాఠకులారా!  మన ఇహలోక జీవితములో మన షికారీ లెట్లుండవలెను?  సువార్త సంబంధమా?  లేక దృశ్యమైన లోకసంబంధమైన వాటి కొరకా!  ఆత్మల సంపాదన కొరకా?  లేక వ్యామోహము కొరకా?  దేని కొరకు మన షికారీ ఉండవలెను.  లోకసంబంధమైన షికారీ లోకమునకు పరిమితమై, లోకములో విలీనమై పోవలసి వస్తుంది.  ఆత్మ సంబంధమైన షికారీ ఆత్మ సంబంధమైయుండి, అదృశ్యములో ఉన్న వాటిని కనుగొనుటకును మరియు అదృశ్యములో ఉన్న మానవ హస్తకృత్యములు, సృష్టి సంబంధ దృశ్యములు గాక అమూల్యమైనవి, చెరగనివియు, స్థిరమైనవియు, బలమైనవియు, మహిమ గలవియైయున్న వాటిని పొందగలము.  వాటియొక్క అనుభూతిని అనుభవించగలము.  అట్లు గాకుండ, ప్రసంగి 3:11లో వలె మనము చేసే పనులన్నియు, వాటి కొరకై మనము పడిన ప్రయాస అంతయు వ్యర్థమైనవిగాను, గాలికి ప్రయాసపడినట్లు ఉంటుందని గ్రహించవలెను.

............

        యోహాను 11:9-10, ఒకడు పగటి వేళ నడిచిన యెడల ఈ లోకపు వెలుగును చూచును గనుక తొట్రుపడడు.  అయితే రాత్రి వేళ నడిచిన యెడల వెలుగు లేదు గనుక తొట్రుపడును.

        ప్రియపాఠకులారా!  పై రెండు వాక్యములలోని పరమార్థమును మనము వేదరీత్యా తెలిసి కొందము.  ఇందులో మొట్టమొదటగా పగలు 12 గంటలు అన్నప్పుడు మధ్యాహ్న కాలమును సూచిస్తున్నది.  ఈ మధ్యాహ్న కాలములో అనగా వెలుగు సమయములో తన కార్యమును చక్కబెట్టుకొను వ్యక్తి వెలుగులోనే తనయొక్క కార్యములను చక్కబరచుకొన్నాడు.  కనుక వానికి కొరత లేదు, భయము లేదు, అని భావము.  అంటే ఈ పగలు 12 గంటల వేళ ప్రభువు యోహాను 4:6లో సుఖార అను ఊరికి వచ్చినప్పుడు అక్కడ యాకోబు బావి యొకటి ఉన్నట్లును, వేసవి ప్రయాణము వలన అలసియున్నందున ఆ బావి యొద్ద కూర్చుండినట్లును.  అప్పుడు ఇంచుమించు మధ్యాహ్నము 12 గంటల కాలమైనట్లు ఈ వాక్యములో వివరించబడి యున్నది.

        ప్రియపాఠకులారా!  ఈ మధ్యాహ్నము 12 గంటల కాలములో పరమ తండ్రియైన దేవుని కుమారుడగు పరమ రక్షకునియొక్క దర్శనాన్ని, అనగా దేవుని వెలుగైన క్రీస్తును దర్శించి, ఆ బావి యొద్దకు నీటి కొరకు వచ్చిన ఒక సమరయ స్త్రీ ధన్యురాలైనట్లుగా ఈ వేదభాగములో చదువగలము.  పగలు 12 గంటల వేళ ఆమె నీరు చేదుకొను అలవాటు ఆమెకు లేకున్నట్లయితే ఆమె జీవితములో ఆమె ప్రభువుయొక్క మహాభాగ్యము పొందే అనుభవము, ఆమె జీవితములో కలిగి యుండేది కాదు.  ఆమె ఆరుగురు పెండ్లి లేని పురుషులతో దౌర్భాగ్యము అనగా చీకటిమయమైన రహస్య అంధకార జీవితములో ఆమె జీవించి యున్నట్లును, ఆ జీవిత కాలములో ఆమె రాత్రివేళనే తన జీవితమును ఎక్కువగా మరియు అనుకూలముగ వాడుకొన్నట్లు ఆమె పాపపు జీవితము ఋజువు పరచుచున్నది.

        ఇక్కడ మనమొక అమూల్య మర్మాన్ని తెలిసికొందము.  సమరయస్త్రీ జీవితము  అంధకారమయమైనది, అనగా దైవ వెలుగును ఏనాడు చూడనటువంటి అయోమయ భయంకర జీవితము.  అందుకు సాక్ష్యముగా ఆమె చేదుకొను ఆ బావి కూడా లోతైనది, అంధకారమయమైనది.  కుండకు తాడుకు అందని చాలా లోతైనది.  సమరయస్త్రీయే యేసుప్రభువుతో అయ్యా!  ఈ బావి లోతైనది చేదుకొనుటకు నీకేమైనను లేదే!  ఆ జీవజలము నీకెట్లు దొరకునని అనుట గమనించదగిన విషయము.  ఇందునుబట్టి మనము ఆలోచిస్తే సమరయస్త్రీ జీవితము, ఆమె నీరు చేదుకొను బావి జీవితము రెండును చీకటిమయమైనట్లుగ తెలియుచున్నది.  ఇందునుబట్టి, ప్రభువు తన శిష్యకోటితో ప్రవచిస్తూ పగలు 12 గంటల వేళ, అనుటలో సూర్యుడు నడినెత్తిన నిలిచే సమయమిది.  అంటే నీతి సూర్యుడైన క్రీస్తు వారి మధ్యన, వారి మీద వున్నాడని దీని భావము.  ఆ విధముగా పగలు 12 గంటలకు నడినెత్తిన వున్న సూర్యుని కిరణ ప్రభావములు నరుల మీద ప్రకాశించినప్పుడు నరుని నీడ వాని చుట్టు కాకుండ పాదాల దిగువన ఉంటుంది.  కాని ప్రక్కలగాని, చుట్టుప్రక్కలగాని వుండదు.  అలాగే ప్రభువుయొక్క ఆత్మ, ఆయన శక్తి, ఆయన వెలుగు, మన మీద వుండిన యెడల, మనలను ఆవరించే సాతాను మన పాదముల క్రిందనుంటాడు.  అంటే పూర్తిగ మన మీద ప్రభువు ఉన్నాడని, మనపైన ఉండి మన చేత పిశాచిని అణగ ద్రొక్కించునని భావము.        

        కనుక ప్రియులారా!  మన జీవితములో మనము వెలుగు సంబంధులముగా జీవించాలంటే ప్రభువుయొక్క ఆత్మ వెలుగు ఎల్లవేళల ప్రకాశించాలి.  ఆ విధముగా ప్రభువుయొక్క వెలుగు మన మీద ప్రకాశించినప్పుడు ఆత్మ రాజ్యమును గూర్చిన, ఆత్మ సంబంధమైన ఆత్మ దేవునియొక్క సిద్ధాంతములను అనుసరించి, మన ఆత్మీయ జీవితాన్ని సరిదిద్దుకొని ఈ లోకములో జాగ్రత్తగా జీవించగలము.  ఈ విధముగా పగలు 12 గంటలు అనగా నడినెత్తిన సూర్యుడు ప్రకాశించిన విధముగా యేసును ధరించుకొని లోకములో చరిత్రను నెలకొల్పిన పరిశుద్ధులను కొందరిని గూర్చి ఉదాహరణముగ తెలిసికొందము. మొట్టమొదటగ నీతి సూర్యుడైన క్రీస్తును ధరించుకొన్న వ్యక్తి పేతురు.  పేతురు క్రీస్తును ధరించుకొని జీవించబట్టే పరలోకపు తాళపు చెవులు అతనికివ్వబడినవి.   క్రీస్తు అను బండ మీద సంఘమును కట్టే సామర్థ్యత కల్గినవాడు.  క్రీస్తు చేసిన అద్భుతాలు కూడా చేయగల్గినాడు.  అలాగే పౌలు కూడా చేయగల్గినాడు.  ప్రకటన 12:1లో సూర్యుని ధరించుకొన్న స్త్రీ సంఘము.        

        ప్రియపాఠకులారా!  ప్రభువు తనయొక్క మాటలలో నేను లోకమునకు వెలుగును నన్ను వెంబడించువాడు చీకటిలో నడువక జీవపు వెలుగు కలిగియుండుననియు, ఈ జీవపు వెలుగే పగలు 12 గంటల వెలుగు.  ఈ జీవపు వెలుగును అనగా క్రీస్తును ధరించుకొన్నవాడు మరణమునకు దూరస్థుడు.  నిత్యజీవమునకు సమీపస్థుడు మరియు వారసుడు - ఇంకను ప్రకటన గ్రంథములో మనము చదివినట్లయితే పరలోక పట్టణమునకు గొర్రెపిల్లయే వెలుగు.  ప్రకటన 21:2, గొర్రెపిల్లయే దానికి దీపము.  ఆయనే వెలుగు, ఆయనే సూర్యుడు.  కనుక ఈ లోకసంబంధ సూర్యాస్తమయ కాలములకు మనము దాసులము కాకుండ, దేవునియొక్క వెలుగైన క్రీస్తును ధరించుకొని, మనము పగటివారమై, పగటిసంబంధులుగ, వెలుగు జీవితములో మన ఆత్మీయ జీవితాన్ని ధన్యవంతము చేసికొందుముగాక!

        అలాగే పగలు మూడుగంటల వేళ ఇటాలియా పటాలమునకు అధిపతియైన కొర్నేలి, తన భక్తి, నీతి ధర్మకార్యాలను బట్టి - ఈ లోకములో దేవదూత రూపములో దైవ వెలుగును దేవదూత ఆకారములో చూచి, ఆ దూతయొక్క మాటలు వినుటయేగాక, ఆదూత ద్వారా దైవిక సిద్ధాంతముతో హెచ్చరించబడి, తానున్న లోకసంబంధ మార్గము నుండి వెలుగు సంబంధ దైవమార్గములో నడుచుటకు తీర్మానించుకున్నాడు.  అలాగే పగలు 12 గంటల వేళ దైవకుమారుడైన యేసు సిలువ మీద సిలువ బలియాగము చేయు సందర్భములో ఆయనకు కుడిప్రక్కన సిలువ వేయబడిన దొంగ సిలువపై యున్న క్రీస్తు యొక్క వెలుగునకు ఆకర్షితుడై, తానున్న శిక్ష నుండి తొట్రుపడక, ప్రభువుతో కూడా పరదైసులోకి వెళ్ళగలిగినాడు.  అలాగే పరిశుద్ధ గ్రంథములో ఇంకను అక్కడక్కడ కొన్ని సంఘటనలు పగటివేళ జరిగినట్లు చదువగలము.  ఈ విధముగా  దేవునియొక్క పిలుపు పగటి వేళ సూర్యుని వెలుగులో క్రియ జరిగించినట్లుగా వేదములో చదువగలము.  ఇది పగలు నడిచిన విశ్వాసియొక్క ఆశీర్వాదకర ధన్యవంతమైన జీవితాలను గూర్చిన వివరము.                        

        అయితే యోహాను 11:10లో రాత్రివేళ ఒకడు నడిచిన యెడల వానియందు వెలుగు లేదు.  కనుక వాడు తొట్రుపడునని వ్రాయబడియున్నది.  ప్రియపాఠకులారా!  రాత్రివేళ నడుచుటన్నది ఏమిటో మనము తెలిసికొందము.  రాత్రి అన్నది చీకటి సమయము అనగా సాతాను అతనియొక్క దూతలు శక్తులు క్రియ జరిగించే సమయము.  రాత్రివేళ నడుచుటన్నది దైవత్వమును, దైవసత్యమును, దైవ నిబంధనను, దైవమహాత్మ్యమును ఎరుగని, అయోమయ మనో నేత్రాంధకార నడవడిని సూచిస్తున్నది.

        ప్రియపాఠకులారా!  దీనికి ముందుగా యోహాను 11:9 చివరి భాగములో ఈ లోకపు వెలుగును చూచును గనుక తొట్రుపడడు, అని వ్రాయబడి యున్నది.  ఈ లోకపు వెలుగు ఎవరో ఒకసారి మనము తెలిసికొందము.  ఈ సందర్భములో యోహాను 8:12 ఈ లోకపు వెలుగు క్రీస్తే.  నేను ఈ లోకమునకు వెలుగును నన్ను వెంబడించువాడు చీకటిలో నడువక జీవపు వెలుగు కల్గియుండును, అనుటలో ఈ లోకమునకు వెలుగు క్రీస్తే.  క్రీస్తు వెలుగులో మనము నడిచినట్లయితే, చీకటి రాత్రులలో మనము నడిచినను ఏ అపాయము మనకు కలుగదు.  తొట్రిల్లము.  యేసు ప్రభువు ఈ లోకమునకు వెలుగైనట్లుగా మనము తెలిసికొన్నాము గదా!  కనుక ప్రభువును చూస్తూ ఆయన యందు మనము లక్ష్యముంచి జీవిస్తే, మన జీవితములో ఎటువంటి ఒడిదుడుకు లేర్పడవని యిందులోని భావము.        

        ప్రియపాఠకులారా!  రాత్రివేళ నడిచినవారెవరో వారియొక్క స్థితిగతులేమిటో మనము తెలిసికొందము.  యోహాను 3:1 యూదుల అధికారియైన నీకోదేము అను పరిసయ్యుడు రాత్రియందు ఆయన యొద్దకు వచ్చినట్లుగా వ్రాయబడి యున్నది.  ఈ నీకోదేము ఇశ్రాయేలుకు బోధకుడు అనగా సంఘకాపరి, ఈయన సంఘకాపరి అన్నమాటేగాని ఈయనలో క్రీస్తు వెలుగు లేదు.  కనుక అవిశ్వాసపు మాటలతో ప్రభువును పరిశోధించి, ఆయనను అంగీకరించినను, యూదులకు భయపడి ప్రభువును అనుసరింపలేదు.  కాబట్టి తొట్రుపడినాడు, ప్రభువుకు దూరమయ్యాడు.  ఇది రాత్రివేళ నడిచిన వానియొక్క మొదటి జీవితము.  యేసుక్రీస్తును యూదుల చేతికి అప్పగించిన ఇస్కరియోతు యూదా దైవకుమారుడైన యేసును పట్టించుటకు రాత్రివేళ నడిచి క్రీస్తు వెలుగును కోల్పొయినవాడై ఉరివేసుకొని చచ్చాడు.

        అయితే అపొ 16:25-265లో మధ్య రాత్రివేళ పౌలును సీలయు దేవుని ప్రార్ధించుచు, కీర్తనలు పాడుచున్నట్లుగాను, ఖైదీలు వింటున్నట్లుగా చెరసాల పునాదులు అదిరినట్లును, తలుపులు తెరచుకొని, అందరి బంధకాలు వూడినట్లును వివరించబడి యున్నది.  ప్రియపాఠకులారా!  ఇక్కడ రాత్రివేళ ప్రభువుయొక్క వెలుగును ధరించిన బిడ్డలకు వారియొక్క కంటికి ఆ రాత్రి కాలమన్నది పగలుతో సమానమని ఋజువగుచున్నది.  ఎందుకనగా పౌలు సీలలుయొక్క స్తుతి కీర్తన, ప్రార్థనాయుత దైవధ్యాన ప్రభావమునకు, వారిలో జనించిన వెలుగు చెరసాలను, దాని పునాదులను, దాని తలుపులను, వారికి వేయబడిన బంధకాలను తొలగించినట్లుగా ఈ వేద వాక్యము మనకు తెలుపుచున్నది.  అనగా వెలుగుయొక్క ప్రభావమెంత గొప్పదో ఇందునుబట్టి మనము తెలిసికోవలసి యున్నది.

        ప్రియపాఠకులారా!  పాత నిబంధన కాలములో యాకోబు కుమారుడైన యోసేపు కనిన కలలు యోసేపులో వున్న దైవ వెలుగును గూర్చిన మర్మాలను తెలుపుచు, వివరించబడినట్లు చదువుచున్నాము.  అలాగే ఫరో కనిన కలలు ఐగుప్తులో రాబోవు ఉగ్రత, కరువు కాటకాలు, భయంకర క్షామమును గూర్చి, ఐగుప్తుకు రాబోవు కరువు నుండి కాపుదల, అందుకు కావలసిన జాగ్రత్తలు, దైవవెలుగు ఆవరించియున్న యాకోబు కుమారుడైన యోసేపుయొక్క ప్రవచనాల మూలముగా అంటే, ఐగుప్తు రాజైన ఫరో - యోసేపు దైవాత్మ లక్షణములను గూర్చి విశ్వసించినవాడై, అందునుబట్టి తన దేశమునకు వచ్చు కరువు కాటకాల నుండి దేశమును కాపాడుకోవడమే గాక, ఇరుగుపొరుగు దేశాలకు కూడా క్షామము వలన కలుగు ఆహార సమస్య తీర్చగలిగినాడంటే అతని ఇంటిలో దేవుని వెలుగు, యోసేపు రూపములో వెలుగుచున్నది.  ఆ విధముగా ఫరో చీకటి సంబంధియైనను, దైవ వెలుగైన యోసేపును తన సింహాసనములో చోటిచ్చాడు.  కనుక అతను వెలుగు సంబంధియై, తన పరిపాలనలో తొట్రుపడకుండ ప్రజలను సుభిక్షముగా ఏల గలిగినాడు.

        గాడిదలు కాచుకొనే సౌలును దేవుడు కనికరించి ఇశ్రాయేలుకు రాజుగా ప్రతిష్టించాడు.  అయితే ఈ ప్రతిష్టతను సౌలు ఎంతో కాలము నిలుపుకోలేకపోయాడు.  కారణమేమిటంటే అతను రాజైన లగాయతు కొంతకాలము వరకే వెలుగు సంబంధముగా ఉండి, ఆ తర్వాత సంపూర్ణముగా వెలుగును కోల్పోయి, అహంభావము, గర్వము, స్వార్ధము, ఈర్ష్య, ద్వేషములు, ఇతనిలో చోటు జేసుకొన్నందువలన దైవత్వాన్ని మరిచాడు.   ఇట్టి సందర్భములో అన్య జనాంగమైన ఫిలిష్తీయులు సౌలుతో యుద్ధమునకు తలపడగా ఇతడు వెలుగును కోల్పోయి, చీకటి శక్తులను ప్రేమించి, వాటి చేత ఆకర్షించబడి రాత్రివేళ యెరూషలేములో సొదె చెప్పించుకొని, తనకు సంభవించిన ఉపద్రవము నుండి తప్పించుకొనుటకు మార్గము వెదికినాడు.  ప్రియపాఠకులారా!  ఇట్టి స్థితిలో సౌలు ఎన్నుకొన్నది రాత్రి సమయము.  సౌలు నమ్ముకున్నది అంధకార శక్తులను, సౌలుకు కల్గిన పతనము కూడా చీకటి ప్రభావము అనగా ఇతనిలో దైవానుగ్రహము యెహోవా వెలుగును పూర్తిగా కోల్పోయాడు.  ఆ వెలుగు ఉన్నంత కాలము అతను పిలిష్తీీయులతో అనేక యుద్ధ విజయాలు సాధించాడు.  ఇది చీకటిలో నడిచిన వానియొక్క వెలుగు, హీనమైన పతనమునకు దారి తీసేటటువంటి ప్రయాణము.

        ప్రియపాఠకులారా!  ఇది చదువుచున్న నీవు మనము పగలు 12 గంటల వేళ అనగా ఈయొక్క సంపూర్ణ వెలుగైన క్రీస్తు మార్గములో నడిచే స్థితిలో వున్నామా?  లేక దైవవెలుగును ముప్పయి వెండి నాణెములకు అమ్ముకున్న ఇస్కరియోతు యూదాయొక్క అర్థరాత్రిలో నడిచిన మార్గములో వున్నామా?  ఏ మార్గములో వున్నాము?  మనలను మనమే పరీక్షించుకొందము.        

        ప్రియపాఠకులారా!  దేవుడు తన జనాంగమైన ఇశ్రాయేలును ఐగుప్తు చెర నుండి నడిపించు సందర్భములో పగలు మేఘస్థంభముగాను, అగ్నిస్థంభముగాను, తన జనాంగముతో నడిచినట్లు వేదములో చదువగలము.  ఇందునుబట్టి దైవాత్మతో సావాసము గల్గి ఆత్మ పూర్ణులుగా జీవించే బిడ్డలకు, పగలైన, చీకటైనను అతడు తొట్రిల్లడు.  అందుకే కీర్తన  121:2-7 ఆయన నీ పాదములను తొట్రిల్లనీయడు.

..........

        యోహాను 13:1-3 గూర్చిన వివరము :-   ఇందులో మొదటిది తాను అనగా యేసుక్రీస్తు ఈ లోకము నుండి తండ్రి యొద్దకు వెళ్ళవలసిన గడియ వచ్చెనని ఫస్కా పండుగకు ముందే ఎరిగినవాడై, అని వ్రాయబడి యున్నది.  అంతకు మునుపు ఈయన తాను లోకములో నుండి తండ్రి యొద్దకు వెళ్ళవలసి వచ్చు గడియ యున్నదని చెప్పలేదా?  ఎన్నో మార్లు ప్రభువు సువార్తలలో ప్రవచిస్తూ యోహాను 12:7-8లో నన్ను పాతిపెట్టు దినమునకు ఆమెను దీనిని ఉంచుకొననీయుడి.  బీదలు ఎల్లప్పుడు మీతో కూడా ఉందురు.  కాని నేనెల్లప్పుడు మీతో వుండనని చెప్పెను.  అలాగే యోహాను 14:3లో నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరచిన యెడల నేనుండు స్థలములో మీరును వుండులాగున మరల వచ్చి, నా యొద్ద నుండుటకు మిమ్మును తీసుకొనిపోదును, వగైరా ఆలాగు ప్రవచనాలు ఆయన అప్పుడప్పుడు తన బోధలో వాడినట్లుగా సువార్తలలో అక్కడక్కడ చదువగలము.        

        ప్రియపాఠకులారా!  యోహాను 13:3లో యేసు ప్రభువు దేవుని చేత ఈ లోకమునకు పంపబడిన దైవోద్ధేశ్యము, దైవప్రణాళిక, దైవిక ఏర్పాటు, ఈ మూడవ వచనములో వ్రాయబడి యున్నది.  అందులోని ముఖ్యాంశ మేమిటంటే యేసుక్రీస్తుకు సర్వాధికారము తండ్రియైన దేవుడు ఇచ్చినట్లుగా వ్రాయబడి యున్నది.  ఇందునుగూర్చి పౌలు ఎఫెసీ 1:3-12 చదివితే యోహాను 13:3వ మాటయొక్క పరమార్థ మర్మము, దైవోద్ధేశ్యము వివరముగా పూర్తిగా తెలియగలదు.  ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదము, క్రీస్తు ద్వారా  దేవుడు మనకు అనుగ్రహించెను.  యేసుక్రీస్తు ద్వారా మనలను కుమారులనుగా స్వీకరించెను, ఆయన రక్తము వలన మనకు విమోచనము, అపరాధములకు క్షమాపణ కలిగి యున్నది.  

        ప్రియపాఠకులారా!  ఇంత గొప్ప దైవిక మర్మమును గూర్చి ఇంకను ఎక్కువగా పౌలు కొలస్సీయులకు వ్రాసిన లేఖలో 1:13-22 ఇట్టి దైవ ప్రణాళిక నెరవేర్పును బట్టి యేసు ప్రభువు తండ్రి యొద్దకు వెళ్ళవలసి యున్నది.  అంతియేగాకుండ యేసుక్రీస్తు ప్రభువు తండ్రి యొక్క ప్రణాళికను పూర్తిగా నెరవేర్చుటకును అపరాధులను, పాపులను, వారియొక్క అపరాధము, పాపము అను బంధముల నుండి విముక్తులుగా జేసి, తండ్రి రాజ్యానికి వారసులుగా ఏర్పరచుటకు దేవుని చేత అధికారము పొంది యున్నట్లుగా ఈ మూడవ వాక్యములో మొట్టమొదటి మాట అనగా తండ్రి తన చేతికి సమస్తము అప్పగించెను, అని వ్రాయబడి యున్నట్లు మనము గ్రహించవలసి యున్నది.

        మరియొక ముఖ్యమైన విషయమేమిటంటే - యేసుక్రీస్తు దేవుని యొద్ద నుండి బయలుదేరి వచ్చెననియు - దేవుని యొద్దకు మరల వెళ్ళవలసి యున్నది.  ప్రియపాఠకులారా!  యేసుక్రీస్తు దేవుని యొద్ద నుండి ఏలాగు వచ్చినాడు?  విమానములో వచ్చినాడా?  ఓడలోనా?  లేక రాకెట్టులోనా?  మరి ఇంకేదైన వాహనాన్ని ఎక్కి వచ్చాడా?  అనిన విషయము మనలను సందేహపరచవచ్చును.  దీనికి జవాబు మత్తయి 2:2లో ఈలాగు వ్రాయబడి యున్నది.  యూదుల రాజుగా పుట్టినవాడెక్కడ నున్నాడు? తూర్పుదిక్కున మేము ఆయన నక్షత్రమును చూచి, ఆయనను పూజింప వచ్చితిమని తూర్పుదేశపు జ్ఞానులు చెప్పుటలోని పరమార్థము.  ప్రియపాఠకులారా!  యేసుక్రీస్తు తండ్రియైన దేవుని యొద్ద నుండి యూదులకు రాజుగా వచ్చినట్లును, అయితే ఆయన రాకడ ఆకాశములో తేజోమయమైన తారగా దర్శనమిచ్చినట్లును, అంతేగాకుండ దేవుని యొద్ద నుండి బయలుదేరి వచ్చిన యేసుక్రీస్తు ప్రభువు భక్తులు ఆరాధించి పూజించుటకు యోగ్యునిగా ఈ లోకానికి ఆయన వచ్చినట్లుగ దైవ వాక్యమును బట్టి మనము గ్రహించవలసి యున్నది.

        ప్రియపాఠకులారా!  ఇప్పుడు మీరు గ్రహించారా?  దేవుడు సర్వసృష్టిని తనకుమారుడైన క్రీస్తు చేతికి అప్పగించినట్లుగా - ఆ విధముగా సర్వాధికారము పొందిన యేసుక్రీస్తు ప్రభువు తాను దేవుని యొద్ద నుండి, మొదట ఆకాశములో ప్రకాశమైన వెలుగు నక్షత్రముగా జ్ఞానులు హేరోదుతో మాట్లాడిన ప్రకారము యూదులకు రాజుగాను, మత్తయి 2:5లో ఇశ్రాయేలు అను దైవ ప్రజలను పరిపాలించు అధిపతిగాను, ఈ లోకానికి వచ్చినట్లుగా మనకు తెలియుచున్నది.  అయితే ఇట్టి అత్యున్నత పదవిలో దైవిక ఏర్పాటులో - దైవప్రతిష్ట, దైవ ఎన్నికలో దైవకార్య సాఫల్యతలో తన జీవితాన్ని సార్థకము చేసి, త్యాగము చేసిన ప్రభువు తిరుగ ఏవిధముగా దేవుని యొద్దకు వెళ్ళినాడు.

        ప్రియపాఠకులారా!  యేసు ప్రభువు ఈ లోకమునకు వచ్చిన మార్గము - ఆయన వచ్చిన విధానము, ఆయన జరిగించిన కార్యాచరణ, ఆయనను గూర్చినట్టి మర్మాలు మనము తెలిసికొని యున్నాము.  కాని యేసుక్రీస్తు తండ్రి యొద్దకు వెళ్ళవలసిన సమయము ఆసన్నమైనప్పుడు ఆయన వెళ్ళిన మార్గము, విధానము, క్రమము;  ప్రయాణించిన వాతావరణము మహాకఠినమును, భయంకరమును, రక్తపాతమును, శ్రమలు, వేదనలు, దోషియని తీర్పు; లోకముయొక్క తృణీకరణ, లోక రాజులయొక్క కఠిన శిక్ష, వగైరాలు క్రియ జరిగించాయి.

        ప్రియపాఠకులారా!  యోహాను 14:6లో యేసు నేనే మార్గమును సత్యమును జీవమును; నా ద్వారానే తప్ప ఎవడును తండ్రి యొద్దకు రాడు : అని ప్రవచించి యున్నాడు.  అయితే ఈ విధముగా తన భక్తకోటిని, తన విశ్వాసులను, తన శిష్యకోటిని పిలిచిన దైవకుమారుడు తాను వెళ్ళిన మార్గము అన్యాయపు తీర్పుతోను, అక్రమమైనటువంటి లోకచట్టాలతోను, సిలువ మరణము అను శిక్షతోను, ఱాతితో  బిగించబడి, సీలు వేయబడి, రాజముద్రికను ముద్రించిన శిలాసంబంధమైన సమాధి నుండి, మహిమతో పునరుత్థానుడై 40 దినములు ఈ లోకములో తనను నమ్మిన భక్తకోటికి దర్శనమిచ్చి, తండ్రియొద్దకు వెళ్ళవలసి యున్నది, అనిన సత్యాన్ని యేసుక్రీస్తు దైవరూపుడు గనుక జరుగబోవు భవిష్యత్తును ఎరిగి, తాను ఆచరించు భోజన బల్లలో భోజన పంక్తి నుండి లేచి, తన పై వస్త్రమును కడగా పెట్టి ఒక తువ్వాలును  తీసుకొని నడుముకు కట్టుకొన్నట్లును, పళ్ళెములో నీళ్ళుపోసి శిష్యుల పాదములు కడుగుటకును, తాను కట్టుకున్న తువ్వాలుతో తుడుచుటకును, మొదలుపెట్టినట్లు వ్రాయబడుటయేగాక, యేసుప్రభువు చేసిన ఈ పాదాభిషేక కార్యక్రమాన్ని గూర్చి విశదముగా వ్రాయబడి యున్నది.  ఇందునుగూర్చి మనము ఆత్మీయముగా తెలిసికోవలసిన సత్యాలు అనేకములున్నవి.

        ప్రియపాఠకులారా!  లూకా 7:37-38 చదివితే యేసు తన శిష్యుల పాదములు కడిగి తువ్వాలుతో వారి పాదములు తుడిచుటకును మొదలు పెట్టెను.  ప్రియపాఠకులారా!  ఒక పాపాత్మురాలైన స్త్రీ - తన కన్నీటితో అనగా ఏడ్చుచు ఆయన పాదములను తన కన్నీటితో తడిపి, తన తల వెంట్రుకలతో తుడిచి, ఆయన పాదములను ముద్దుపెట్టుకొని, ఆయన పాదములకు అత్తరు పూసినట్లుగా వ్రాయబడి యున్నది.  ఒక పాపి పరిశుద్ధులకు చేసిన కార్యము బహు గొప్పగా నాలుగు సువార్తలలో వ్రాయబడి యున్నది.  యేసు ప్రభువు ఈ లోకమునకు వచ్చినది పాపియొక్క జీవితమును కడిగివేసి పవిత్ర పరచుటకు అన్నట్లుగ, యేసుక్రీస్తు ఈ లోకములో ఆయన మాట్లాడిన మాటలనుబట్టి ''నేను పాపులను పిలువవచ్చితినిగాని -నీతిమంతుల కొరకు రాలేదు.  తండ్రియైన దేవుడు యేసుక్రీస్తును లోకమునకు పంపుటలో వున్న కారణము, ప్రణాళిక ఇదియే!  అనగా లోకస్థులను ఆవరించియున్న శాపము, పాపము, మరణము, అను త్రివిధ క్రియానిర్మూలనకు లోకస్థునిగా గాక, లోకసంబంధిగా కాక, లోకస్థులలో ఒకడుగా కాక, లోక రాజ్యమును పరిపాలించువాడుగా కాక, లోకాధిపతిగాక, పరలోక సంబంధి, పరలోకాధిపతి, పరలోక రాజ్యవారసుడు, పరమ పవిత్రుడు దైవాత్మ చేత రూపించబడిన యేసుక్రీస్తును ఈ లోకమునకు పంపుటలోని ప్రణాళికలోని మర్మాన్ని మొట్టమొదటగా పాపాత్మురాలైన  స్త్రీ తెలిసికొని, లోకములో అతి విలువైన మరియు అతి పరిమళ భరితమైన, శ్రేష్టమైన, అత్తరుతో ప్రభువు పాదముల నభిషేకించాలని, తలపెట్టి, ప్రభువు కొరకు కాచుకొని యుండి, ఆయనను వెదకుచు ఆయనను గూర్చి వాకబు చేసి, ఆయన పరిసయ్యుని ఇంట భోజనమునకు కూర్చున్న విషయము తెలిసికొని, తాను అత్తరు బుడ్డిని తీసికొని ప్రభువు ముఖమును చూచుటకు ధైర్యము చాలక ఆయన వెనుక తట్టుగా ఆయన పాదముల యొద్ద నిలువబడి, ఆమె జరిగించిన ఐదు అమూల్యమైన క్రియలను గూర్చి తెలిసికొందము.        

        అదేమిటంటే  1.  యేసుప్రభువు గూర్చి వాకబు చేయుట  2.  ప్రభువు ముఖమును చూడలేక ఆయన వెనుకగా పాదముల యొద్ద నిలువబడుట.  3.  తాను చేసిన పాపములను బట్టియు తన అపవిత్ర జీవితమును గూర్చియు ఏడ్చి, ఆ కన్నీటితో ఆయన పాదములను తడిపి, తన తల వెంట్రుకలతో తుడుచుట.  4.  ఆయన పాదములను ముద్దు పెట్టుకొని  5.  తాను తెచ్చిన అత్తరును ఆయన పాదములకు పూయుట.

        అదే విధముగ యేసుప్రభువు తన శిష్యకోటికి జరిగించిన పాదాభిషేక కార్యక్రమములో ఐదు దైవసత్యాలున్నవి.  1.  తన తండ్రి తన చేతికి సమస్తాన్ని అప్పగించెనని - తాను దేవుని యొద్దనుండి వచ్చెనని ఎరుగుట.  2.  భోజన పంక్తి నుండి తనపై వస్త్రాన్ని అవతల పెట్టుట  3.  ఒక తువ్వాలు తీసుకొని నడుముకు కట్టుకొనుట  4.  అంతట పళ్ళెములో  నీళ్ళు పోసి శిష్యుల పాదములు కడుగుట.  

5.  తాను కట్టుకున్న తువ్వాలుతో తుడుచుట.

        ప్రియపాఠకులారా!  ఇందులో మనము ఎరుగవలసిన అమూల్యమైన దైవక్రియ ఏమిటంటే మొదట పాపాత్మురాలైన స్త్రీ - పవిత్రుడు పరిశుద్ధుడైన దైవకుమారునియొక్క పాదములను కన్నీటితో అభిషేకించి, శిరోజాలతో తుడిచి, అత్తరు పూసి ఆరాధించి ముద్దు పెట్టింది.  ఇది పాపియైన స్త్రీ చేసిన క్రియ.  ఇక పరిశుద్ధుడును, పవిత్రుడును, దైవకుమారుడైన యేసుక్రీస్తు చేసిన క్రియ - పాపుల పాదములు కడిగి, వారియొక్క పాదములను తుడిచి,  దైవరాజ్యమునకు వారిని ప్రతిష్టించుటన్నది ఉన్నతమైన క్రియ,  మొదట ప్రభువునకు స్త్రీ జేసిన పాదాభిషేక పూజ అర్చన ద్వారా  ఆస్త్రీయొక్క సమస్త పాపములు తుడిచి వేయబడి, ఆమె పవిత్రురాలైనట్లుగా అనగా ఆమెయొక్క సమస్త పాపములు దైవసన్నిధానములో తుడిచివేయబడి, క్షమింపబడి, తద్వారా ఆమె పవిత్రురాలైనట్లుగా తెలియుచున్నది.  ఇక రెండవదిగా యేసుప్రభువు చేసిన శిష్యకోటికి జరిగించిన, పాదాభిషేక క్రియ అన్నది ఈ పన్నెండుమంది పాపులను పవిత్రపరచి, పరలోక పట్టణానికి పన్నెండు పునాదులుగాను, భూలోకములో నూతన నిబంధన చరిత్రకు సాక్షులుగాను, లోకపాపనివారణార్థము యేసుక్రీస్తు బలియాగమునకు సాక్షులుగా వీరిని ప్రతిష్టించినట్లు మనము తెలిసికోవలసి యున్నది.  ఇది ప్రభువు తన శిష్యకోటికి చేసిన పాదాభిషేకములో గుప్తమై యున్న మర్మము.

........

        పరిశుద్దాత్ముని గూర్చి :-  యోహాను 14:15-17లో తండ్రి అనుగ్రహించు ఆదరణకర్తయైన ఆత్మ అనగా ఇంతవరకు శిష్యులతో వుండి నడిపిన క్రీస్తు వేరొక ఆత్మ అనుటలో దానిని అనుగ్రహించువాడు క్రీస్తే అని తెలియుచున్నది.  మరియు న్యాయవాది, (వకీలు) సత్యస్వరూపియగు ఆత్మ అంటే సత్యాత్మ.  ఆయన మీతో వుండును, మీలో వుండునని అర్థము.  యోహాను 14:26లో ఆయన సమస్తమును బోధించును, జ్ఞాపకము చేయును.  ఇది నరుల ఆత్మకు అసాధ్యము.  వాక్య మర్మములు, గ్రంధవివరణలు బోధించుటకు పరిశుద్ధాత్మ సాధ్యుడనియే తెలియుచున్నది.  కనుక ఈ వరమును అనుగ్రహించువాడు యేసుప్రభువు,

        ఆత్మ యొక్క ప్రాముఖ్యము :-  యోహాను 16:7లో ఆయన వెళ్ళకపోతే ఆత్మ రాదు.  క్రీస్తు వెళ్ళితేనే గాని ఆదరణ కర్తరాడని ప్రభువు వక్కాణించి యున్నారు.  అపొ 2:38-39లో పరిశుద్ధాత్మ ద్వారా పొందు వరము వాగ్దాన పూర్వకమైన అపొస్తలుల కార్యములు 2:11లో పేతురు - ఆత్మను పొంది తెల్పిన వివరమును అపొస్తలుల కార్యములు 2:38లో మీరు మారుమనస్సు పొంది, పాప  క్షమాపణ నిమిత్తము . . .  . .  పరిశుద్ధాత్మ అను వరమును పొందుదురు.  1.  మారుమనస్సు  2.  బాప్తిస్మము  3.  పరిశుద్ధాత్మ అను మూడు మెట్లు అపొస్తలుల కార్యములు 2:39లో అప్పుడు ఈ వాగ్దానము మీకును, మీ పిల్లలకును, దూరస్థులందరికిని అనగా ప్రభువైన దేవుడు తన యొద్దకు పిలిచిన వారికందరికిని చెందును.  అపొ 10 మరియు 11 అధ్యాయాలలో అన్యులకు కూడా ఈ వరము అనుగ్రహింపబడినట్లు తెలుస్తున్నది.  పేతురు ఈ వరాన్ని ముద్రగా చెపుతున్నారు. ఎఫెసీ 1:13లో ఈ ఆత్మను అనుగ్రహించి యున్నాడు.  వాగ్దానము చేయబడిన ఆత్మచే ముద్రింపబడుట ఎఫెసీ 1:14లో ఆత్మ సంచకరువుగా అనుగ్రహించి యున్నట్లు తెలియుచున్నది.

పరిశుద్ధాత్మ గుర్తులు :-

        1.  ఒక వ్యక్తి యొక్క ముఖవర్చస్సులో  2.  క్రియలలో  3.  సేవలో  4.  జీవితము

5.  స్వరములో  6.  ప్రవర్తనలోను ఈ శక్తి కనబడుతుంది.  ఈ ఆత్మ క్రీస్తు నందు మనము అంగీకరించబడుటకును రోమా 8:16-17లో విధముగా క్రీస్తు వారసులమని ఋజువునై యున్నది.  సువార్త ప్రకటనలో ప్రకటించు వారసులకిచ్చు వరములు పై నుండి యొసగు శక్తి,  లూకా 24:46-49లో సువార్తకు సాక్షులము.  మనము పై నుండి శక్తి పొంది సాక్షులుగా నిలువాలి.  అపొ 4:18 నుండి చదివితే సువార్త పక్షముగా సాక్షులుగా నిలిచితే ఆత్మయొక్క అద్భుతము తెలుస్తుంది.   వారు చేసిన ప్రార్థన ఫలితముగా జరిగిన అద్భుతము.  ఒకప్పుడు చిన్నపిల్ల దగ్గర బొంకిన పేతురు రాజుల ఎదుట నిలిచి సంకెళ్ళతో ఉన్నప్పుడు ఆత్మపూర్ణుడై దైవవాక్యములు ప్రవచించాడు.  హింసకుడైన సౌలు పౌలుగా మారి ఫిలేమోను

2:8-10 బంధకములలో కూడా ఆత్మీయ కుమారులను సంపాదించాడు.  యోహాను 16:8లో ఆయన వచ్చి పాపములను గూర్చి నీతిని గూర్చి మారుమనస్సు పొందించి ఒప్పింపజేయును. అపొ 2:37లో హృదయములో నొచ్చుకొనుట  జెకర్యా 4:6లో బలము, శక్తిచేతను గాక ఆత్మ ద్వారా జరుగుతుంది.  అపొ 2:5-11లో అపొ 19:1-7లో ఎఫెసీయులు బాప్తిస్మము ద్వారా ఆత్మపూర్ణులై భాషలు, ప్రవచనములు మాట్లాడినట్లు తెలియుచున్నది.  1 కొరింథీ 12:1-31లో పరిశుద్ధాత్మ ఇచ్చు తొమ్మిది వరములు,

1 కొరింథీ 13:లో ప్రేమయొక్క శ్రేష్ఠత్వము హెబ్రీ 2:3-4 సువార్త ప్రకటనలో ఈ తరములు ఎట్లు తోడ్పడినది వివరించబడి యున్నది.

        చివరిగా ఒక మాట

ప్రభువునందు సహోదరీ సహోదరులారా!  

  1. ఈ పుస్తకమును చదువుచున్న మీకు ఏమైన అనుమానాలు ఉన్నట్లయితే,
  2. ఈ పుస్తకములోని సారాంశములో లోపమును మీరు గ్రహించినట్లయితే,
  3. దీనిలో విభాగములు పూర్తిగా వివరించనట్లు మీరు గ్రహించినట్లయితే,
  4. పవిత్ర గ్రంథమునకు వ్యతిరేకమైన అంశములు మీరు ఇందులో చూచినట్లయితే,
  5. మీ హృదయము నుండి ఈ అంశమును కలిపిన మరింత బాగుండునని ఆలోచన వచ్చినట్లయితే, ''దయవుంచి నాకు వ్రాయండి.'' (email: FaithScope@thamu.com)

        దీని వలన, మేము మీ యొక్క సహాయ సహకారాల వల్ల తరువాత ముద్రణలో ఈ పుస్తకము అన్ని కోణాలలో అందముగా తీర్చిదిద్ది అందించగలము. ఆమేన్‌.

శేఖర్ రెడ్డి గారు వ్రాసిన పుస్తకములు: 

  1. ఏడు అను సంఖ్యలోని సర్వసంపూర్ణత  
  2. లోకానికి బైబిల్‌ సవాల్‌ - పార్ట్‌ 1-5
  3. మరణము తరువాత  
  4. నా ప్రభువు తల్లి
  5. ఏదెనులోని దైవప్రణాళిక  
  6. సున్నతి - బాప్తిస్మము  
  7. దేవుని దూతలు - వారి పరిచర్యలు
  8. జేసునాథుని దివ్య వాక్కులు  
  9. ప్రవక్తల ప్రవచనములు - పరమార్థములు  
  10. ప్రకటన గ్రంథ రహస్యములు ఇప్పుడు మీ చేతిలో
  11. పరమగీతము
  12. సాటి సహాయిని

వీటిని మీరు www.FaithScope.com ద్వారా ఉచితముగా పొంద వచ్చును.