శేఖర్ రెడ్డి వాసా (ఆటోబయోగ్రఫీ)
యోహాను 1:9 సత్యవెలుగునకు సాక్షి
గ్రంథకర్త : శేఖర్‌రెడ్డి వాసా
అంకితము
ఈ అవకాశాన్ని నాకు అనుగ్రహించి నన్ను ప్రేమించిన క్రీస్తు ప్రభువుకు అంకితమిస్తున్నాను. - వాసా శేఖర్‌రెడ్డి
1. జన్మ స్థలము :- రెడ్డిపాళెం గ్రామము. ఇది నెల్లూరు జిల్లాలో కోవూరు తాలుకాలోని మానేగుంటపాడు వెళ్ళే మార్గములో ఉంది. 24.03.1935వ సంవత్సరము ఆదివారము సూర్యోస్తమయ కాలములో మసక మసక చీకట్లు క్రమ్ముచుండగా పక్షుల కిలాకిలారావములతో దేవుని స్తుతిస్తూ తమ గూడ్లకు చేరుతుండగా నా తల్లి నన్ను ప్రసవించింది. మార్చి నెల 24వ తేదీ రాత్రి సమయముననే యేసు ప్రభువు తల్లి గర్భములో ప్రవేశించి యుండవలెను. ఎందుకంటే మార్చి నెల 24వ తేదీ నుండి డిసెంబరు నెల 24వ తేదీ రాత్రికి మరియ తల్లికి తొమ్మిది నెలలు నిండి యేసు ప్రభువు జన్మించాడు. అనగా ప్రభువు - తల్లి గర్భములో ప్రవేశించిన సమయమే, నా తల్లి నన్ను భూమి మీద ప్రసవించిన కాలమని తెలుస్తున్నది. అయితే అదే ఆదివారము తెల్లవారుచుండగా అనగా లోకమును ఆవరించిన చీకట్లు తొలగిపోతుండగా నీతి సూర్యుడైన క్రీస్తు యొక్క పునరుత్థానము జరిగింది. అయితే ఆదివారము లోక వెలుగు తొలగి, చీకటి ప్రవేశిస్తుండగా నా తల్లి నన్ను ప్రసవించిన సమయము. ఇందుకు సమతుల్యముగానే నా జీవితము అజ్ఞానముతోను, అంధకారమయమై పాతిక సంవత్సరాల వరకు నిజదేవుని అవతారమైన క్రీస్తు నెరగని జీవితములో సప్త వ్యసనములతో లోకములో అసహ్య జీవితము జీవించాను.
........
2. శిశువు అప్పగించబడిన స్థలము :- మోషేను ఆయన తల్లి మూడు నెలల వరకు దాచిపెట్టి పోషించింది. ఆ తర్వాత సాధ్యము కాక ఏటి ఒడ్డున చేర్చి కనిపెట్టి ఫరో కుమార్తె కుమారుడుగా అప్పగింపబడునట్లుగా జేసింది. అదే రీతిగా అధిక బరువుతో ఆరోగ్యముగా జన్మించిన నన్ను పిల్లల భారముతోను కుటుంబ భారముతో మరి మిక్కిలిగా నాతో వేగలేక విసుగుతో కావలి తాలూకా సర్వాయపాళెం గ్రామము తన అక్కగారైన వనమ్మకు పెంపకము నిమిత్తము ఇచ్చి వేసింది. ఆమెకు ఒక్కడే కుమారుడు. నా కంటే పది ఏండ్లు పెద్దవాడు. ఆమె విధవరాలు.
.......
3. రోడ్డు ప్రమాదములో ఆశ్చర్యకరమైన రక్షణ :- నా తల్లి నన్ను రెడ్డిపాళెం గ్రామము నుండి కావలి తాలూకా సర్వాయపాళెముకు తీసుకొని వెళ్ళుటకు కావలిలో ఒంటెద్దు బండి నెక్కి ప్రయాణమై గూడుబండి వెనుక తట్టు చేతులలో శిశువును ఎత్తుకొని కూర్చుండి యుండగా కొంత దూరము వెళ్ళిన బండి రోడ్డు రిపేరు చేసు పెద్ద పెద్ద గులకరాళ్ళతో కూడిన పదునైన రాతి పలులు పరచి పెట్టి వాటిని సమముగా చదును చేయుటకు సమయము చాలక మరునాటికి విడిచి వెళ్ళినారు. ఎద్దు ఎందుకో బెదిరి ఆ గులక రాళ్ళు పరిచిన రోడ్డు మీదకు పరుగెత్తింది. ఆ కుడుపులకు నా తల్లి చేతిలోని బిడ్డ జారి అంత ఎత్తు నుండి క్రింద పడిపోయింది. ఏడుపు లేదు. ఆ బండి కొంచెము దూరము పోగా ఆపి, బిడ్డ అంత ఎత్తు నుండి పడి ఏడవలేదని, చచ్చినాడని రోదనలతో ఏడ్పులతో నా తల్లి - ఆమె తల్లి ఇద్దరు రొమ్ము బాదుకొంటూ ఈ రోజుతో నీ ఆయుస్సు ఈ రోడ్డు మీద చెల్లిందా? అని ఏడుస్తూ బిడ్డను చేతిలోకి తీసుకొన్నారు. బిడ్డ నవ్వుతూ కేరింతలతో యధా ప్రకారముగా ఉంది. వాళ్ళు ఏమైనా గాయాలైనాయా అని పరామర్శించి చూచారు. ఏ విధమైన గాయాలు కనపడలేదు. ఈ బిడ్డ ఎటువంటివాడవుతాడో ఇదేమి విచిత్రము. తలకు దెబ్బ తగిలి చచ్చినాడని అనుకొన్నాము గాని ఇది కనీ వినీ ఎరుగని ఆశ్చర్యముతో వారు ఆచరించు దేవుళ్లకు దండాలు పెట్టుకొని ఇంటికి వచ్చారు. దీనిని బట్టి యిర్మీయా 1:5లో ఈలాగు వ్రాయబడి ఉంది. తల్లి గర్భములోనే నన్ను దేవుడు ఎరిగియుండి నా తల్లి నన్ను ప్రసవించక మునుపే నన్ను పుట్టించాడు. జనములకు తండ్రిగా ప్రవక్తగా తాను రాయిస్తున్న గ్రంథముల ద్వారా ఆయన ఏర్పరచియున్నాడని నేను ఈనాడు ఈ గ్రంథ రచనల ద్వారా గ్రహిస్తున్నాను.
.......
4. సాధువు సలహా - పేరు మార్పు :- అక్కడ వారు నాకు రామచంద్రారెడ్డి అని పేరు పెట్టి పెంచుకొంటుండగా ప్రతి చిన్న విషయానికి ఏడవడము, రోషము, మూర్ఖత్వము, అల్లరితనముతో ఇంచుమించు అయిదారు ఏండ్లు నాతో విసిగి వేసారి యున్నప్పుడు ఒక సాధువు ఆ ఊరికి వచ్చినప్పుడు ఆయనతో నా పరిస్థితి వివరించినప్పుడు ఆయన ఈ బిడ్డకు ఏ దేవుని పేరు గల్గిన నామధేయము పనికిరాదని, ఏ దేవుడు ఏ దేవత పేరు కలియని ఏదైన ఒక పేరు మార్చి పెట్టమని, ఆ తర్వాత ఈ బిడ్డ చేత తొమ్మిది శుక్రవారాలు చెరువులో స్నానము చేయించి ఆ గట్టున ఉన్న తాటి చెట్టుకు ఉదయముననే పూజలు చేయించితే పిల్లవానికున్న మంకుపట్టు, విసుగు, రోషము వగైరాలు తొలగిపోయి ప్రశాంత వాతావరణము ఏర్పడుతుందని సెలవిచ్చాడు. ఆదికాండము 32:28లో చెప్పబడినట్లు లోక సంబంధమైన దేవుళ్ళు, దేవతలనబడెడివారు ఎందరున్నను వారిని అనుసరించక భవిష్యత్తులో నిజదేవునితో పోరాడి అనగా ఆయనను పరిశోధించి పరీక్షించి శేఖర్ అనగా ఉత్తమమైన వ్యక్తిగా అనగా దేవుని బిడ్డగా మారగలడనుటకు సూచనగా ఇదంతయు జరిగినట్లు గ్రహించాలి. ఆ తర్వాత ఆ స్వామి చెప్పినట్లుగా వారు నాతో చేయించగా ఉదయమున చన్నీటి స్నానము ఆరోగ్యవంతమే గాక కొంతవరకు నాలోని బలహీనతలు తగ్గినట్లయింది.
..........
4.లో 1. పిచ్చి కుక్క కాట్లు - చప్పిడి పత్యము :- ఇంటి వాకిట ముందు ఎండలో పోసిన వాటిని కావలి కాయుమని నా పినతల్లి నన్ను బయట ఉంచి లోపలికి వెళ్ళి ఏదో పనిలో నిమగ్నమైంది. అంతలో ఒక పిచ్చి కుక్క నా యొద్దకు వచ్చినప్పుడు అమ్మా! కుక్క కుక్క అని ఏడ్వడం మొదలుపెట్టినాను. కుక్క ఏమి చేయదులేమని ఆమె ఏదో పని చేసుకొంటూ కొంత తడవు ఆలస్యము చేసింది. ఆ కుక్క నన్ను బోర్ల పడవైచి నా ఆసనమందున్న పిర్రలను పదునైన కోరలతో కొరుకుతుండగా అంతలో ఆమె వచ్చి పెద్దగా దానిని అదలాయించి దానిని తరిమి చుట్టు ప్రక్కల వారిని కేకలు వేసి పిలువగా అందరు ఆ కుక్కను వెంటాడి తరిమి తరిమి రాళ్ళు తీసుకొని కొట్టి చంపివేశారు. పిచ్చి కుక్క కరచినప్పుడు దానిని చంపితేనే గాని కరచిన మనిషి బ్రదుకడని వారి విశ్వాసము. అందువల్ల దానిని వెంటాడి చంపి వేయటం జరిగింది. ఆ ఊరిలోని నాటు వైద్యుని పిలువగా అతడు కుక్క చేసిన గాయములను శుద్ధి జేసి దానిమీద ఏవేవో ఆకు పసరులు పోసి ఆకులను పరచి కట్టు కట్టినాడు. అటుతర్వాత మూడు నెలల కాలము ఉప్పు తగలని, పులుపు చేరని సప్పిడి పత్యము నా భోజనమునకు ఏర్పరచాడు. ఉప్పు పులుపు తగులని చప్పిడి ఆహారము నాకు సహించనప్పుడు నా పినతల్లి నన్ను ఓదార్చుచు బ్రతిమిలాడి కొంత ఆహారమును తినిపించేది. అయినను నా శరీరము క్రమేణా బలహీనమై పోవుటయేగాక చర్మ వ్యాధులు చోటు చేసుకొన్నాయి. కొన్ని రోజులు సమాప్తమై నాటు వైద్యము పూర్తియైన తర్వాత నా తాతగారు, మా అమ్మ, పినతండ్రి నన్ను ఎత్తుకొనిపోయి అధిక వర్షము కురిసిన ఎర్ర నీటితో నిండియున్న ప్రదేశములో నన్ను దింపి ఆ నీటిని చూపించాడు - అందులో దింపినాడు. కుక్క విషము ఏదైన శేషము ఉంటే ప్రకోల్పించి బయటపడుతుందని ఆయన విశ్వాసము. అదేది జరుగకపోయినను కావలి పట్టణములోని ప్రభుత్వాసుపత్రికి తీసుకొని వెళ్ళి ఎందుకైనను మంచిదని పిచ్చి కుక్క విషమునకు వేయబడు ఇంజక్షను కూడా కొన్ని వేయించారు. రెండు విధములుగా నాటు వైద్యము - ఇంజక్షన్ల వైద్యముతో ముందుగా చప్పిడి పత్యముతో చిక్కి శల్యమైయున్న నా శరీరము కాలక్రమేణా బలము పోగొట్టుకొని హుషారు కోల్పోయి రోగగ్రస్థుడనయ్యాను.
విగ్రహ దేవుని పేరు తొలగించి పేరు మార్చి దైవసంబంధమైన శ్రేష్ఠమైన పేరు పెట్టినందుకేమో విగ్రహ దేవుళ్ళకు మూలమైన అంధకార శక్తియైన సాతాను తన ఉగ్రతతో ఆనాడు సర్పములో ప్రవేశించి హవ్వను మోసము చేసి శాపగ్రస్థురాలిగా చేసినట్లుగా - కుక్కలో ప్రవేశించి దాని విషమును నాలో ఎక్కించి, చప్పిడి పత్యముతో నన్ను బలహీనపరచి నా శరీరములోని చర్మ వ్యాధులతోను, బలహీనతలలోను భ్రష్ఠునిగా చేశాడు. రాత్రి కాలములో నేను గోక్కుంటున్న దురదలను బట్టి నేను కప్పుకున్న దుప్పటి కూడా రక్తపు మరకలతో కనపడుతుండేది. వేడినీటితో స్నానము చేయించేవారేగాని సరియైన వైద్యము ఆ దురదలకు తెలియక వైద్యము చేయించేవారు కారు. ఆ దురదలు నా శరీరములో ఆనాడు పునాది వేసుకొని వ్రేళ్ళూని మహాభయంకరమై వయోవృద్ధ దశ వరకు అవి నన్ను వెంటాడుచుండగా నేను వాటితో ఆయుర్వేదము, హోమియో వైద్యాలు మాత్రమేగాక పైపూత మందులతో అప్పుడప్పుడు వాటిని అదుపు చేసుకొంటూ వచ్చానేగాని పూర్తిగా నిర్మూలించలేకపోయాను.
......
5. ప్రాథమిక విద్య :- ఒకటవ తరగతిలో నన్ను చేర్చినారు. వెంకటప్పయ్య అను పేరు గల బ్రాహ్మణుడు నా తరగతికి ఉపాధ్యాయుడు. బి.పి. ఉందేమో బహు కోపిష్ఠి. ఆ దినములలో అక్షరమాల అంతయు నేర్చుకొని, అన్ని రకాల గుణింతాలు వరుసగా రాసి చూపిస్తూ చదివితేనేగాని మొదటి తరగతి పుస్తకము చదువుటకు వీలుండదు. ఈ దినములలో అల వల తల అని బొమ్మలు, పదాలు నేర్పిస్తూ వ్రాయిస్తూ సులభ పద్ధతులలో గుణింతాలు కూడా నేర్పిస్తారు. ఆ దినములలో అట్లు గాదు. అక్షరమాలలోని అక్షరాలన్నియు క్రమము తప్పక రాయాల్సిందే. గుణింతాలు, ఒత్తుల గుణింతాలతో సహా వరుసగా రాసి చూపిస్తూ అప్పగించాల్సిందే. నా బలహీనతల వల్ల ఉత్సాహము కోల్పోయిన నా శరీరమునకు ఈ అక్షరమాలలు, గుణింతాలు సావకాశముగా పూర్తిగా రాసి చూపించే జ్ఞాపకశక్తి లేకుండా పోయింది. పైగా బహు కోపిష్ఠి ఆయనను చూస్తేనే భయము - ఆ భయముతో నాకున్న జ్ఞానము స్థంభించిపోయేది. ప్రతిరోజు నా తొడలు పట్టుకొని మెలిపెట్టి నలిపేవాడు. నేను గిజగిజ తన్నుకొని ఏడ్చి గీ పెట్టినను రాయందే వదిలేవాడు కాదు. నేను ఇంటికి వచ్చినప్పుడు నా పినతల్లికి నేను టీచరు కొట్టిన విషయము చెప్పేవాడను కాను. నాకు స్నానము చేయించేటప్పుడు నా నిక్కరు తీసి వేసినప్పుడు తొడలో ఎర్రగా ఉబ్బియున్న ఆ గాయములను చూచి ఆమె బాధపడుతు నన్ను ఈ విధముగా ఓదార్చింది. నీవు బాగా చదువుకోవాలని, పెద్ద పెద్ద ఉద్యోగాలు చేయాలని నీ అయ్యవారు నిన్ను కొట్టినాడేగాని నీవు బాధపడబోకు ఓర్చుకో! ఈ విషయము నీ తాతగార్కి ఏ మాత్రము చెప్పబోకు. ఆయన ముక్కోపి. నీవు చెప్పినావంటే వెళ్ళి అయ్యవారి తల పగులగొట్టి నీ చదువు మాన్పిస్తాడు. నీ బాగు కోసమే గదా! బాబూ ఓర్చుకో జాగ్రత్తగా చదువుకోమని చెప్పేది. ఏది ఏమైనను బడికి పోవాలంటే ఒక నరకములో ప్రవేశించినట్లే. ఒకసారి ఆయన నా చేత పదాలు పల్కిస్తూ పంతులుగారూ! అన్న స్వరము నా నోట పొరబడి వచ్చి ఆయనకు విన్పించేదేమో ఆయన నన్ను పట్టుకొని బాదుతూ నన్ను పందులుగారూ అంటావా? నేను పందినా అని కసురుకొని హింసించినాడు. ఆ రోజులలో హోంవర్కు ఇచ్చేవారు కాదు. హోంవర్కు ఇచ్చి ఉంటే నాకు ఆ కష్టాలుండేవి కావు - ఇంటి దగ్గర నా పిన్నమ్మ దగ్గర నేర్చుకొని రాసి చూపించేవాడను. ఇప్పటికి నాకు అర్థముగాని దొక్కటే - నేను స్కూలులో ఉపాధ్యాయుని దగ్గర దెబ్బలు తింటుంటే ఓదార్చేదేగాని ఒక సెలవు దినమైనను నన్ను కూర్చోబెట్టి అక్షరాలు వ్రాయించి నేర్పించేదే కాదు. పెద్ద చదువులు ఆమెకు రాకపోయినను చిన్న చిన్న పుస్తకాలు, మాటలు చదువగలదు. ఎందుకో ఆ మనస్సు ఆమెకు కలుగలేదు. నాకు అక్షరాలు, గుణింతాలు పేర్లు నెమ్మదిగా నేర్పించి వ్రాయించమని ఆమెను అడగాలనేంత ఊహ, జ్ఞానము నాలో లేనే లేవు. ఒకనాడు స్కూలుకు వెళ్ళేటప్పుడు నిక్కరు వేసుకోవడం మరచిపోయాను. ఎందుకంటే సాధారణముగా నేను వేసుకొనే చొక్కా పొడుగ్గా ఉంటుంది. నిక్కరు వేసుకున్నానా లేదా అన్న ఆలోచన లేకుండ వేసుకొన్నట్లుగానే అనుకొని స్కూలుకు వెళ్ళినాను. నా ఉపాధ్యాయుడు నన్ను నిక్కరు వేసుకొని రాపో అని ఇంటికి పంపక భయంకరముగా శిక్షించాడు. నా తరగతిలో నిత్యము దెబ్బలు తింటున్నవారిలో నేనే మొదటి స్థానము. ఇంకెవరు తరచుగా దెబ్బలు తింటున్నట్లు నేను చూడలేదు. ఆటలలో ఉత్సాహము పోయింది. స్కూలు కెళ్ళాలంటే చచ్చేంత భయము. శరీరము బలహీనము. ఈ పరిస్థితులలో నాకేమియు పాలుపోక ప్రతిరోజు నేను ఖాళీ ప్రదేశములో వేయబడియున్న ఒక గడ్డివామి ప్రక్కగా కూర్చుని ఆకాశము వైపు చూచి, దేవుడా! ఈ కనపడేవి అన్నీ నీవు సృష్టించినవే, సమస్తము నీవు కలుగజేసినవే, కాని నేను నీ కంటికి కనిపిస్తున్నాను. నేను నీకు కనపడకున్నానా? అలా కాదు. నీకు కనబడకున్నదేదియు లేదు. నేను నీకు కనబడుచున్నాను. నా స్థితి చూడు ఒళ్ళు బలహీనము. జ్ఞానము లేదు. స్కూలులోని పిల్లలందరి కంటే తెలివితక్కువవాడను. రోజూ నేను తినని దెబ్బలు లేవు. నా తొడ నలిపి నలిపి కరుడుగట్టి పోయింది. నా వైపు చూడవా! నా స్థితి చూడవా! అని అప్పుడప్పుడు నేను ఆ గడ్డివాములో మెత్తగా ఉన్న చోట కూర్చుని ఆకాశములోకి చూచి కనపడని దేవుని గూర్చి సమస్తాన్ని చేసిన సృష్టికర్తయైన దేవుడా! అని ఆయనకు మొర పెట్టుకొని నా స్థితిని, నా బాధలను చెప్పుకొంటుండేవాడను. నేను ఉంటున్న సర్వాయపాళెం గ్రామములో రాములవారు, కృష్ణుడు - ఆంజనేయులు, కలుగోళమ్మ వగైరా ఎందరో దేవుళ్ళు, దేవతా విగ్రహాలు ఆలయాలున్నవి. నేను రోజు అక్కడ పెట్టే నైవేద్యాలు తిని వచ్చేవాడినేగాని అవి దేవుళ్ళని మ్రొక్కేవాడను కాను. ఎందుకంటే ఈ దేవుళ్ళందరిలో గొప్ప దేవుడెవరో అందరికంటే మహోన్నతమైన దేవుడెవరో సమస్తము సృష్టించిన దేవుడెవరో తెలియనందున వాటిని పూజించేది లేదు - ప్రార్థించేవాడను కాను. అందుకే అప్పుడప్పుడు నా దీన స్థితిని గూర్చి సాయం సమయములో గడ్డివాము ప్రక్కన కూర్చుని సమస్తాన్ని సృష్టించిన దేవుడు ఆకాశములో ఆసీనుడై యుంటాడని అప్పుడప్పుడు ప్రార్థిస్తూ ఉండేవాడను. ప్రార్థించే విధానము కూడా నాకు తెలియదు. చిన్నపిల్లలు అమ్మా నాన్నలతో మాట్లాడినట్లే ఉంటుంది. నాకు తెలివి లేదు. అయ్యవారు ప్రతిరోజు కొడుతున్నాడు. ఒల్లు హుషారుగా ఉండటం లేదు. ఆటలు ఆడే స్థితి కూడా సరిగా లేదు. అన్నింటిని సృష్టించిన దేవుడవు. నా పరిస్థితి నీకు కనపడుతుంది గదా! నీవు నాకు ఏమి చేయాలో చేయి అది నీ ఇష్టము - నా పరిస్థితి నీకు తెలిసిందే అని అప్పుడప్పుడు చెప్పుకొనేవాడినేగాని ఏ దేవతకు దేవుని దగ్గరకు వెళ్ళి ప్రార్థించేవాడను కాను.
.......
6. నేను తరచుగా చేస్తున్న ప్రార్థనలను ఆలకించిన దేవుడు :- వర్షాకాలములో నీటితో నిండియుండి పల్లపు ప్రదేశము పొడుగాటి కాలువ వలె ఆ ఊరికి అతి దగ్గరలో ఉంటుంది. దాని ముందు ప్రదేశము ఇసుకతో నిండియున్న ఖాళీ ప్రదేశము. తోటలు, చెట్లు ఏమియు లేవు. ఏ పైరు అక్కడ వేయరు. ఆ ప్రదేశములో మా తాత కొంత ప్రదేశమునకు చుట్టు కంచె వేసి దోస, కిరిణీ, పుచ్చ వగైరా త్వరగా ఫలములిచ్చు తీగె చెట్లే గాక సపోట - మామిడి, బొప్పాయి వగైరా చెట్లు వేసి, లోపల వాటికి నీళ్ళు పోయుటకు ఒక గుంట కూడా త్రవించాడు. నేలలోనే విస్తారముగా దోస, పుచ్చ, కిరిణీ వగైరా ఫలములు విశేషముగా ఫలించినాయి. పుచ్చ పండ్లు చాలా పెద్దవిగా ఉండి ఎప్పుడు ఒకే రంగుగా ఉంటుంది. అది పండిందా లేదా, అని తెలియటం పిల్లలకు వీలు కాదు. పెద్దగా ఉన్న కాయను కత్తితో పొడిచి పండిందా లేదాయని చూచి పండితే తినేవాడను. లేదంటే అట్లనే ఉండి కోయకుండ వదిలి పెట్టేవాడిని. మా తాత చూచి ఏమిరా ఈ కాయలు రంధ్రాలు పడి యున్నాయనేవాడు. అందుకు జవాబుగా ఎలుకలు చేసే పని ఇది అని నా మీద తప్పు పెట్టుకోకుండ జవాబు ఇచ్చేవాన్ని. ఆ తర్వాత అంటు త్రొక్కిన ఫలవృక్షాలు వేసియుండుట చేత చిన్న చిన్న మొక్కల కాలములోనే మామిడి సపోటా వగైరా చెట్లు విస్తారముగా కాయసాగినవి. నేను కోరిన పండ్లు కోరుకున్నట్లు తినేవాడను. నన్నెవరు అడ్డగించేవారు కారు. ఆ గ్రామములో ప్రతి యొక్క తోట ఫలవృక్షాలు విశేషముగా కాయసాగినవి. తాటి కలకండ, తీపి కల్లు వగైరాలు వాడేవారము. ఆయా కాలమునుబట్టి తేగలు, బుర్రగుంజు విస్తారముగా ఉండేవి. పాలు అమ్మనించేవాడు కాదు మా తాత. అందువల్ల విస్తారమైన పాలు, వెన్న, నెయ్యి, మీగడలతో నేను తృప్తిగా భోంచేసేవాడను. మా తాత రాగి సంగటి వగైరాలు తింటూ నాకు ముద్దలు తినిపించేవాడు. నేను ఉంటున్న విశాలమైన ఆవరణలో రెండు జామ చెట్లు చాలా పెద్దవి. ఒక నిమ్మ చెట్టు ఉండేది. జామ చెట్లకు కాలము సమయము లేదు. సంవత్సరము పొడుగున పిందె పుల్లటి కాయలు మొదలు పండు కాయల వరకు వివిధ రకాలుగా ఎప్పుడు ఉండేవి. నేను స్కూలు నుండి వచ్చి చెట్టు ఎక్కితే నేను తినగల్గినన్ని శ్రేష్ఠమైన రుచికరమైన జామపండ్లు దోర కాయలతో సహా ఉండేవి. సంతృప్తికరమైన ఎన్నో రకాలైన కాయలు పండ్లతోబాటు సముద్రము దగ్గర కనుక చేపలు, రొయ్యలు వగైరాలు దొరికేవి. మరియు కోడి మాంసము, కోడి గుడ్లు, పొట్టేలు మాంసము అప్పుడప్పుడు వంట జేసేవారు. చిన్నతనాన్నుంచి నాకు ఆకలైతే నేనే కావలసిన వాటితో వేసుకొని భోంచేసేవాడిని. నన్నెవరు కసిరి అడ్డగించేవారు లేరు. ఇంకను తినమని ప్రోత్సాహించేవారే. నేను కావలి సర్వాయపాళెంలో ఉన్నంతకాలము అనగా దాదాపు 15 లేక 16 సంవత్సరాల కాలము వర్షాలు పడక ఎండిపోయిన రోజులు లేవు. విస్తారమైన ధాన్యము ఇంటికి చేరేది. ఏ విధమైన పైర్ల చీడ వగైరాలుండేవి కావు. నా బలహీనమైన దేహము మా తాతగారు వేసిన ఫలాలతో కూడిన చెట్ల మధ్య సంచరిస్తూ కావలసినన్ని ఫలములను, మామయ్య తోటల నుండి తెచ్చిన తీయ మామిడి పండ్లను భుజిస్తూ అనేకమార్లు అన్నము మానివేసి ఆ పండ్లతోనే సరిపెట్టుకొనేవాడిని. నేను రెండవ తరగతి ప్రవేశము జరిగినప్పుడు ఆ తరగతికి క్రిష్ణమూర్తి అను పేరు గల బ్రాహ్మణ అయ్యవారు టీచరుగా క్రొత్తగా ఆ స్కూలుకు వచ్చి నా రెండవ తరగతి ఉపాధ్యాయుడుగ ఆయన నియమించబడినాడు. ఏ పరిస్థితులలోను ఆయనకు పిల్లల మీద కోపము రాదు. ఎంతో ముద్దుగా పిల్లలను పలకరిస్తూ ఎన్నో కథలు చెప్పుతూ ఆటలు ఆడిస్తూ ఉంటూ మేము చదువలేనప్పుడు, తప్పులు చేసినప్పుడు కసిరేవాడు కాదు. ఓర్పుగా ప్రేమతో బోధించేవాడు. నాకు ఆయన దగ్గర చనువు పెరిగింది. భయము పోయింది. సబ్జక్టులన్నిటిలో కొంత జ్ఞానము పెరిగి మార్కులు బాగా రాసాగినవి. విస్తారమైన అనేక రుచులతో కూడిన భోజనము, ఫలహారాలు, ఆ గ్రామ పిల్లలతో పొద్దు పోయిందాకా ఆటలు పాటలుతో కాలక్షేపము వగైరాలతో ఆ రెండవ తరగతి పూర్తయ్యేటప్పటికి వేసవి సెలవులిచ్చారు. కాని ఇంత ఆనందాన్ని సుఖ సంతోషాన్ని అనుభవిస్తున్న నేను ఒకరోజు ఆకాశములో ఆసీనుడైయున్న కనపడని దేవుని గుర్తు చేసుకొంటూ ఆయనకు నా ఆనందాన్ని తెల్పుకుంటూ ఉండేవాడిని. కాని నాకు ఆకాశము వైపు చూచి దేవునితో మాట్లాడునప్పుడు నాకేమియు కన్పించేది కాదు. అయినను అక్కడ దేవుడున్నాడు - నన్ను పరిశీలిస్తూ నా స్థితిని గమనిస్తున్నాడని తలంచేవాడిని. కాని ఎవరితోను ఆకాశ దేవుని విషయమును గూర్చి తర్కించేవాడను కాను. వేసవి సెలవులు పోయి స్కూళ్ళు తెరచినారు. నన్న ప్రేమతో చేరదీసి విద్యాబుద్ధులు నేర్పిన కృష్ణమూర్తిగారు జాండీస్ అనే వ్యాధితో అకస్మాత్తుగా మరణించినట్లు అక్కడివారు చెప్పుకొనుచుండగా విని నా హృదయములో చెప్పరాని బాధను అనుభవించాను. ఆయన ప్రేమను మరువను అసాధ్యమైంది. మరణమేమిటో - మరణించి ఎక్కడకు పోతారో వారి అతిగతి లేదంటూ వారు లోకములో జీవించిన ప్రేమానురాగాలెట్టివో అకస్మాత్తుగా కనుమరుగు అగుటలోని మర్మమేమిటోనని నాలో నేను తర్కించుకొని బాధపడేవాడనేగాని ఎవరితోను ఈ మాటలు చెప్పుకోను. ఎందుకంటే ఎవరికి మాత్రము ఏమి తెలుసును? కనుక మరణాన్ని గూర్చి ఎవరినడిగిన ప్రయోజనము లేదని సరిపెట్టుకొన్నను, ఎప్పుడు నా జీవితములో మరణాన్ని గూర్చిన మర్మమును తెలుసుకోవాలన్న ఆతృత నాలో స్థిరపడి పెరిగి పెద్దదగుతూ వచ్చింది. కాని సందేహాలు తీర్చేవారు లేరు. కాబట్టి అవి అట్లే నిలిచిపోయేవి. సర్వాయపాళెములో ఐదవ తరగతి వరకే ఉంది. కనుక కావలి హైస్కూలులో నన్ను, నాతోబాటు రెడ్డిపాళెము మానేగుంటపాడు నుంచి వచ్చిన మా చిన్నాయన చిన్నమ్మ కుమారులను, వారితోబాటు నన్ను కావలి హైస్కూలులో ఆరవ తరగతిలో కావలిలో ఉంటున్న మా అమ్మ తమ్ముడు తన ఇంటిలో మా ముగ్గురును ఉంచుకొని తంబళ్ళగుంట హైస్కూలులో చేర్చాడు. చదువులో నేను అత్యధికముగా వెనుకబడి యున్నందున - సర్వాయపాళెము గ్రామములోని ఐదవ తరగతి వరకు పూర్తి చేయడానికి ఏడు సంవత్సరాలు కాలం పట్టింది. ఈ విధముగా రెండేసి సంవత్సరాలు ఒక్కొక్క క్లాసు చదివితే వయస్సు మీరిపోతుందని తలచిన మామయ్య నాకు మాత్రమే నాలుగేండ్లు వయస్సు తగ్గించి పుట్టిన తేదీని వ్రాయించాడు. ఆ రోజులలో పుట్టిన తేదీలను అంత పరిశీలించేది లేదు కాబట్టి 01.07.1939 అనే పుట్టిన తేదీతో చేర్చబడినాను.
.......
7. కావలి హైస్కూలులో నా విద్యా విధానము :- మమ్మల్ని చేర్చిన స్కూలు ఇంచుమించు రెండు కిలోమీటర్లు ఉండవచ్చును. మా ముగ్గురిని ఒక బ్రాహ్మణ పంతులు దగ్గర ట్యూషన్‌కు చేర్చాడు. అతడు ముక్పోపి. ఊదు శరీరము - కాళ్ళ నొప్పులతో బాధపడుచు విద్యార్థుల చేత కాళ్ళు వత్తించుకొంటూ ఉపశమనము పొందుతుంటాడు. అతడు చెప్పిన పాఠాలు సక్రమముగా చదవలేనందున కఠినముగా శిక్షించేవాడు. ఆతని దెబ్బలకు తట్టుకోలేక నేను సందు చేసుకొని వెళ్ళి అతని కాళ్ళు వత్తుచు సేవ చేస్తుండేవాడను. అతని కాళ్ళు వత్తుచుండే పిల్లలను సరిగా చదువులో కంఠస్థము చేయలేకపోయినను శిక్షించేవాడు కాదు. అందువల్ల నా చదువులో నాకు వచ్చుచుండిన శిక్షను తగ్గించుకొనుటకు ఆయన కాళ్ళు వత్తుతుండడం వాడుకయైంది. మా మామయ్య ట్యూషన్ ఫీజు, స్కూలు ఫీజు చెల్లిస్తూ బాగా చదువుకోండని స్కూలుకు పంపిస్తే నేను చదువును కొంతవరకు పక్కన పెట్టి గురువుగారి పాద సేవ చేస్తూ కాలము గడిపేవాడను. ఇట్లా రెండేళ్ళు గడిచిపోయినవి. మూడవ సంవత్సరములో బుచ్చిరెడ్డిపాళెములో ఉంటున్న నా అక్కగారు కావలికి వచ్చి నాతో కూడా ఉండి బుచ్చి హైస్కూలులో చదువుకోమని నన్ను ప్రేరేపించింది. నేను సరేనని ఆమెతో కూడు బుచ్చిరెడ్డిపాళెం స్కూలులో మూడవ ఫారములో జాయినయ్యాను.
........
8. బుచ్చిరెడ్డిపాళెములో నా విద్యావిధానము :- మా అక్కగారి ఇల్లు పక్కా మిద్దె ఇల్లు పాతది. అది నేల రిపేరుకు వచ్చింది. నేల మీద లేచిపోయిన సిమెంటు త్రవ్వించి మరల దానికి సిమెంటు పూత జేయించుటకు చదును చేసి దిమ్మెతో గట్టిగా నేలంతా కొట్టమన్నాడు. నేను సర్వాయపాళెములోగాని, కావలిలోగాని పని చేసి ఎరుగను కనుక నాకు అలవాటు లేనందున దిమ్మెసతో కొట్టుచుండగా నా చేయి బొబ్బలెక్కి వాచేవి. మన పని మనము చేసుకోవడములో తప్పేమి లేదంటూ నాకు పని తగ్గించేవాడు కాదు. హైస్కూలు చదువులో నాకు ట్యూషన్ చెప్పించలేదు. ఇంటికి ఎప్పుడు తినే వస్తువులు ఏవియు తెచ్చిపెట్టడు. ముందే నా శరీరము బలహీనమైనది గనుక ఒకనాడు నేను కూర్చుని చదువుకొంటూ ఏదో ఆలోచన చేసి, పుస్తకము క్రింద పెట్టి లేచి నిలబడ్డాను. నా కళ్ళు బైర్లు కమ్మినవి. నాకు స్మారకం లేదు. ఏమైందో నాకు తెలియదు. అక్కగారు ఏడుస్తూ నన్ను భుజాన వేసుకొని డాక్టరు గారి దగ్గరకు తీసుకొని వెళ్ళింది. అక్కడ ముఖాన నీళ్ళు చల్లి సేద దీర్చి ఏమిటని అడిగితే చదువుకొంటూ ఉన్నట్లే ఉండి లేచి నిలబడి దబ్బున నేలమీద పడిపోయాడు. స్మారకము లేదని చెప్పింది. రక్తము మెదడుకు అందక అట్లు జరిగి ఉంటుంది. బలహీనము కదా బలమైన ఆహారము పెడితే క్రమేణా సర్దుకుంటుంది అని చెప్పి పంపాడు. మా మామయ్య పిసినారి. ఆయన తెచ్చి పెట్టేవాడు కాదు. మా అక్కగార్కి స్తోమత లేదు. నేను అక్కగారి దగ్గర ఉండలేను. తిండి తక్కువ పని ఎక్కువ. నా చదువు సాగదు, మామయ్య ఇంట్లోనే హైస్కూలు టీచరు బలిజవాళ్ళు ఉంటున్నారు. వారికి చిన్నమ్మాయి ఒకటే ఉంది. వాళ్ళ బంధువుల అబ్బాయి ఉంటున్నాడు. ఆయనతో మాట్లాడి నన్ను వాళ్ళ ఇంటిలో చేర్చు భోజనమన్నా తృప్తికరముగా ఉంటుంది అన్నాను. ఆ పంతులుగారితో మాట్లాడి ప్రతి నెల బియ్యము, కొంత పైకము ఇచ్చే ఒప్పందము చేసుకొని వారి ఇంటిలో భోజనము చేస్తూ స్కూలుకు వెళుతుండేవాడను. ఆ స్కూలులో నాకు ట్యూషను లేనందున మార్కులు తగ్గి ఒక్కొక్క క్లాసు రెండేసి సంవత్సరాలు ఉండేవాణ్ణి - ఆ రెండవ సంవత్సరములోనైన నా విధేయత చూచి దయాభిక్షగా మార్కులు వేసి పాస్ చేసేవారు.
......
9. బుచ్చిరెడ్డిపాళెములో యోగవిద్యా విధానము :- నేను బుచ్చిరెడ్డిపాళెములో చదువుకొనే రోజులలో ఆకాశము వైపు చూచి నా దీన స్థితిని గూర్చి దేవునికి చెప్పుకొనే అలవాటు పోలేదు. నాకు దైవభక్తి ఎక్కువ - కాని నిజమైన దేవుడెవరు? ఈ కనబడే సమస్తము సృష్టించిన జగత్ కారణ కర్తయైన దేవుడెవరో తెలుసుకొని ఆయనకు మాత్రమే ధ్యానించాలనే కోరిక బలముగా ఉండేది. ఎవరికి మాత్రము ఏమి తెలుసులే అని నాలో నేనే ఎవరిని అడగక స్థబ్దతగా ఉండేవాడిని. నాలో ఉన్న దైవభక్తిని బట్టి ఆ గ్రామములో ఉంటున్న పెద్దల సుబ్బమ్మ అనే ఆమె ఒక సన్యాసిని. ఆమె కాషాయ వస్త్రాలు ధరిస్తూ యోగాశ్రమాలలో ఉంటూ అక్కడక్కడ సంచరిస్తుండేది. ఆమె బుచ్చిలో ఉంటున్న కాలములో నేను ఆమెకు పరిచయమయ్యాను. నాకున్న దైవభక్తిని గమనించి నాకు యోగవిద్యను నేర్పించి, ఒక సన్యాస ఆశ్రమములో పీఠాసనాధిపతిగా చేయాలని ఆమె నిశ్చయించి, నన్ను తన ఇంట జేర్చుకొని, ఒక ఋషి ఆచరించాల్సిన ఆచారాలతో అనగా ఉదయముననే చన్నీటి స్నానము, మధ్యాహ్నము ఒంటిపూట మాత్రమే భోజనము, రాత్రి ఏదైన ఒక పండో పాలు త్రాగాలి గాని భుజించకూడదు. శాకాహారములోనే జీవితము గడపాలి. బుచ్చిరెడ్డిపాళెములో నివాసముంటున్న బెజవాడ శివకోటారెడ్డిగారు గొప్ప యోగీశ్వరుడని రమణ మహర్షి దగ్గర తర్ఫీదు పొందిన యోగియని ఆయన దగ్గర యోగవిద్యను నేర్చుకొనుటకు నా కన్న తల్లి సహాయముతో ఆమె నన్ను ఆయన దగ్గర జేర్చింది. పగలు హైస్కూలులో చదువుకొంటూ ఉదయ సాయంత్రాలు రెడ్డిగారి దగ్గర తారక యోగము నేర్చుకొంటూ వచ్చాను. యోగవిద్యను నేర్చుకొన్నానేగాని అందులో సంపూర్ణ సిద్ధిని పొందలేక గురువుగారు పెట్టే యోగ పరీక్షకు నిలువలేక సతమతమగుతుంటే ఆమె ఈ విధముగా ఓదార్చేది. రెడ్డిగారు బాల బ్రహ్మచారి. కన్నతల్లి మూడు నాలుగు నెలలు మంచము మీద మరణ పడకలో ఉంటే పనివారికి అప్పజెప్పక తానే అన్నీ చక్కబెట్టేవాడు. ప్రతి మధ్యాహ్నము అండాలు డేగిసాల ద్వారా పుష్కలముగా అన్నము, కూరలు వండించి తిన్నంత భోజనము భిక్షగాళ్ళకు పెట్టిస్తున్నాడు. గ్రామములో బీదవాడైనను ఆయన పేరు మీద డాక్టరు దగ్గర ఉచిత వైద్యము చేయించుకోవచ్చును. చదువుటకు శక్తి లేనివారు ఆయనను ఆశ్రయించి ఆర్థిక సహాయము పొందేవారు. ఇన్ని విధములైన సద్గుణశీలి సాధువర్తనుడు మనసా వాచా కల్మషము లేని ప్రజ్ఞావంతుడైన యోగిని నీవు జయించాలంటే సాధ్యమా? కనీసము యోగవిద్యలో నిలబడుటకైనను శక్తి పొందాలంటే ఎంత సాధన చేయాలి అని తపో యోగ ధ్యాన రీతిలో సాధన చేయమని ప్రోత్సాహించేది.
......
10. అటు యోగవిద్యలోను ఇటు హైస్కూలు విద్యలోను భంగపాటు :- పదహారేండ్ల వయస్సు నడుస్తున్న నాకు దైవశక్తిని సాధించాలన్న దృఢమైన ఆసక్తి కల్గిందేగాని, యవ్వన దశలో ప్రవేశిస్తున్న నాకు శరీరేచ్ఛలు, స్త్రీ వ్యామోహములు వగైరాలతో సతమతమగుతూ ఉంటే ఆమె నాకు పెట్టే ఒంటిపూట మధ్యాహ్న భోజనము చాలక రాత్రి కాలాలలో ఆమె ఇంటిలో ఉన్న పప్పు ధాన్యాలు తిని నీళ్ళు త్రాగేవాణ్ణి. సెలవులలో నా తండ్రి గారి ఇంటికి వెళ్ళినను అక్కడ కూడా నాకు ఎంతో ఇష్టమైన చేపలు, మాంసము, రొయ్యలు వగైరాలు తినటం మానేశాను. కొట్టములో ఒక మూల చాటు చేసుకొని రాత్రింబగళ్ళు పద్మాసనము మీద యోగ సాధన, తపస్సు చేసేవాడను. దైవిక మంత్రార్థములతో దైవధ్యానము కూడా చేసేవాడను. నా యోగ దర్శనములో భూమండలము, నదీనదములు కనిపించేవి. కొన్నిసార్లు ఆకాశములోని సూర్యచంద్ర నక్షత్రాదులు వంటి వెలుగులతో శోభాయమానముగా యోగ దర్శనానందము పొందుచుండేవాడను. ఆశ్చర్యకరమైన సూర్యుని వంటి వెలుగు ప్రసరించినప్పుడు నిలువలేక శరీరము అత్యుష్ణమై ఒక్కొక్కసారి జ్వర పీడితుడుగా ఉండేవాడను. అప్పుడు ఆ యోగిని నాకు చల్లదనము కోసం వెన్న తినిపించి శరీరమును మర్ధన చేయించేది. ఎంతో కష్టపడి సాధన చేస్తూ ఉన్నను గురువుగారి యోగ పరీక్షలో నిలువటానికి కూడా శక్తి చాలక వ్యసనపడేవాడిని. దానికి తోడు యవ్వనేచ్ఛలు, కామోద్రిక్తత, స్త్రీ వ్యామోహము వగైరాలతో యోగవిద్యలో ముందంజ వేయలేకపోయాను. యోగవిద్యలో సంపూర్ణత పొందలేక పోయాను. అంటే యోగిగా మారలేదు. లోకము ఎదుట కపట యోగిగాను, దొంగ యోగిగాను ఉండుట నాకిష్టము లేదు. నూటికి 90 మంది పైగానే దొంగ సాధువులతో భారతదేశము నిండియున్నది. ఎందుకంటే ఈ సాధువులు మా గురువుగారి దర్శనార్థము వచ్చినప్పుడు ఏ ఒక్కడు కూడా ఆయన ప్రయోగించే యోగ పరీక్షలో నిలువలేక పారిపోయేవారు. ఆ విధముగా దొంగ యోగిగా ఉండుట నా కిష్టము లేనందున యోగిగా మారలేదు. హైస్కూలు స్టడీస్ కూడా పూర్తి చేయలేకపోయాను. ఏడవ తరగతి కూడా మొదటి సంవత్సరములో పాసయ్యేవాడను కాను. నా విధేయతను బట్టి ఉపాధ్యాయుల దయాభిక్షతో రెండవ సంవత్సరములో ఏవో మార్కులు సర్దుబాటు జేసి పాసు చేసేవారు. కనీసము యస్.యస్.ఎల్.సి. వరకన్నా చదవమని నా తల్లిదండ్రులు పట్టు పట్టినారు. మామూలు తరగతి పరీక్షలలోనే పాసు గాలేకపోతే పబ్లిక్ పరీక్షలో నేనేమి పాసవుతాను అని చెప్పి వారి చేత వృధాగా డబ్బు ఖర్చు పెట్టించడం ఇష్టము లేక 5వ ఫారము పాసయిన వెంటనే స్కూలు మానేశాను.
.........
11. లోకము ఎదుట బ్రతకడానికి ఏ పని చేత కాలేదు :- నేను ఏదైన పని చేసుకొని బ్రతుకదామంటే ఏ పని చేత కాలేదు. తండ్రి ఎప్పుడు అప్పుల్లో ఉంటూ పాలేరు తల మనిషి పని చేస్తూ ఆరుగురు ఆడపిల్లల పెళ్ళిళ్ళు అతి కష్టము మీద చేస్తూ బాధపడుతుండేవాడు. నా అన్నలు ఇద్దరు వ్యవసాయము, నా తమ్ముడు ఏదో ఫ్యాక్టరీలో పని చేసుకొంటూ ఏదో బ్రతుకుతున్నారు. ఒకసారి మా నాన్నగారి పశువులను తోలుకొని మోపుకొని వచ్చుటకు పొలమునకు వెళ్ళినాను. ఉదయము పది గంటల ప్రాంతానికే లేత ఎండకే నా శరీరము ఏదైన ఒక చెట్టు క్రింద పడుకోవాలనిపిస్తుంది. మధ్యాహ్నానికి నా ఒళ్ళంత చమటలు కమ్మి ఆయాసము, తల తిరగడము ప్రారంభించింది. పశువుల వెంట తిరగలేను, గొంతు పెదాల తడి ఆరిపోతుంది. ఎట్లనో పెందలకడకనే యాతనను భరించి ఇంటికి వెళ్ళినాను. నేను పశువుల వెంట తిరగలేను. వాటిని మేపే శక్తి నాకు లేదు. ఇది నాకు సాధ్యమయ్యే పని కాదని ఆ రోజు నుండి పశువులు మేపే పని మానివేసాను. పలసరకుల అంగళ్ళ వద్ద చిల్లర కొట్టు దగ్గర ఏదైన పని దొరకుతుందేమోనని నిలబడి వారు చేస్తున్న పని చూశాను. నా వయస్సు కంటే చిన్న పిల్లలు న్యూస్ పేపర్లతో పొట్లాలు చుట్టి పప్పులు వగైరా ధాన్యాలు పోసి తూచి కస్టమర్లకు ఇచ్చుచున్నారు. ఈ రోజుల వలె ప్లాస్టిక్ సంచులు వివిధ రకాలు ఆ రోజులలో వాడుకలో లేవు. న్యూస్ పేపర్ల పొట్లాలు కట్టి దారము చుట్టి ఇచ్చేవారు. అవి గట్టిగా నిలబడేవి. కాని నేను ప్రయత్నించాను. కాని నా నరాల వణకు బలహీనత వల్ల ఆ పని సజావుగా చేయలేక ఆ పని జోలికి పోలేదు.
.......
12. అయితే నేను చేయగల పని యొకటి ఉంది :- నేను 5వ ఫారము వరకు చదివేను గనుక ఒకటి రెండు తరగతుల పిల్లలకు విద్యాబోధన చేసే శక్తి మాత్రము ఉంది. ఎందుకంటే నీడ పాటున కూర్చుని పిల్లలకు చెప్పే విద్యయే గనుక ఈ పని నాకు సరిపోతుంది. ఆ దినములలో ప్రభుత్వ పాఠశాలలో ఒకటి రెండు తరగతులకు విద్యాబోధన చేసేవారిని హైయ్యర్ గ్రేడ్ టీచర్సు అంటారు. వీరి క్వాలిఫికేషన్ 8వ స్టాండర్డ్ వరకే. సెకండరీ గ్రేడ్ టీచర్స్ ట్రయినింగ్ అని మరొకటి ఉంది. దానికి యస్.యస్.ఎల్.సి. పాసైన సర్టిఫికేట్ తప్పకుండా ఉండాలి. నాది యస్.యస్.ఎల్.సి. కంటే ఒక్క క్లాసు తక్కువైనను హైయ్యర్ గ్రేడ్ టీచర్స్ క్రిందనే ఉండాలి. పల్లెపాడు గ్రామములో హైయ్యర్ గ్రేడ్ సెకండరీ గ్రేడ్ టీచర్ల ట్రైనింగ్ ఒకే చోట ఒకే హాస్టలులో కలిపి ట్రైనింగ్ ఇచ్చేవారు. అక్కడ చదివేవారికి స్టయిఫండ్ కూడా ఇస్తారు. కనుక ఆ రెండేళ్ళ ట్రయినింగ్ పూర్తియైనంత వరకు ఆ ఖర్చు తల్లిదండ్రులు భరించనక్కరలేదు. తల్లిదండ్రులను కష్టపెట్టడం ఇష్టము లేక ఆ ట్రయినింగ్‌లో చేరాలని నిశ్చయించుకొన్నాను. ఇంటర్వ్యూలో సెలక్ట్ చేసుకొనే అధికారులను కలసి ఆ రోజుల విలువ ప్రకారముగా 25 రూపాయలు లంచము కూడా ఇచ్చి వచ్చాను. నా పేరు గుర్తుగా వ్రాసుకొని తప్పనిసరిగా నీకు సీటు ఇస్తామని హామీ ఇచ్చారు. ఆ రోజులలో ఎలిమెంటరీ స్కూలు టీచరు పోస్టుకు విలువ లేదు. నామకార్థమైన అతి తక్కువ జీతాలే. అందువల్ల ఆ పోస్టుల్లో ఎవరు చేరేవాళ్ళు కారు. ఈ రోజులలో ఒకటవ తరగతి టీచరుకైనను గవర్నమెంటు జీతము వేలల్లో ఉంటుంది. కనుక పోటీ ఎక్కువై టీచరు పోస్టు దొరకుట ఈ దినములలో చాలా కష్టము.
........
13. భూమిపై నివసిస్తున్న ప్రతి ఒక్కరు ఏదో ఒక పని చేసి తన జీవనాధారమును పొందవలసి యున్నది. నాకు పని చేయవలసిన ఖర్మ నాకెందుకు? నా తాతముత్తాతల ఆస్థి కావలసినంత ఉన్నది అని అనవచ్చును. ఆదికాండము 3:19లో ''నీవు నీ ముఖపు చెమట కార్చి ఆహారము తిందువు'' అంటున్నాడు. ఈ రోజులలో అనేక రకములైన పనులున్నాయి. ముఖము చెమట కార్చునంత పని చేయవలసినంత పని లేదు. వ్యవసాయము కూడా యంత్రాలతో చేయబడుచున్నది. శరీరము నందలి ఉత్పన్న మలినములు చెమట ద్వారా కూడా చాలా వెలుపలికి వెళ్లుతాయి. కష్టించి పని చేసినవారికి సరియైన జీతము ముట్టనందు వలన ఆహార లోపము వల్ల కొంతవరకు బలహీనత పొందుచున్నారు. చెమట ద్వారా పోవలసిన లవణములు లోపలే నిలిచియుండుట ఆరోగ్యానికి భంగకరము. కాన పని చేయకపోయినను ఆటలు, ఆసనాలు, ఎక్స్‌ర్‌సైజులు, మార్నింగ్ వాక్ వగైరాలు చేసియైన ఆరోగ్యము పొందవచ్చును. తండ్రియైన దేవుడే సృష్టి నిర్మాణములో తన పని యంతటిని ముగించి ఏడవ రోజున విశ్రాంతి పొందినట్లు వ్రాయబడి యున్నది. అలాగే ఆయన కుమారుడైన యేసు ప్రభువు కూడా లూకా 2:49 నేను తండ్రి పనుల మీద ఉంటున్నానని చెప్పుచున్నాడు. కనుక సువార్త పని చేయువారు బోధకులు, విశ్వాసులు గ్రంథ రచన సాగించే వేదాంతులు, పండితులు ఎన్ని గ్రంథాలు రాసినను ఎన్నో విధముల సోషల్ సర్వీస్ సంస్థలు నడుపుచు కార్యక్రమాలు చేసినను ఎంతటి ఉద్ధండుడైనను లూకా 17:7-10లో ప్రభువు చెప్పినట్లు వారు అజ్ఞానులే, అమాయకులేయని చెప్పవచ్చును. దేవుని వాక్య మర్మములు దైవాత్మకే తప్ప మానవునికి అవి అవగాహన కావు - కాలేవు. మానవునికి ఆయన బయల్పరచినదే అవి అందుబాటులో ఉండవు. కనుక లోకములో నివసించే నరుడు ఎంత బోధకుడైనను ఎంతటి ఉదార బుద్ధితో తన కార్యక్రమములు బహు దృక్పధములో కొనసాగించువారికైనను ప్రభువు సంస్థలో పని చేస్తున్న పీఠాసనాధిపతి పోపంతటి ఉద్ధండులకైనను ప్రభువు తన కృతజ్ఞతను తెలుపడుగాని - దేవునికే తన కృతజ్ఞతాస్తుతులు చెల్లించవలసి యుంటుందని, తన్నుతాను ప్రభువు సన్నిధిలో తగ్గించుకోవాల్సి ఉందని, ఆ విధముగా తగ్గించుకొన్నవారిలో క్రీస్తునకు బాప్తిస్మమిచ్చిన యోహాను మనకు మార్గదర్శియై యున్నాడు. కనుక మనము జీవించుటకు ప్రతి యొక్కరు ఇతరుల మీద ఆధారపడక ఏదో యొక పని చేసుకొంటూ ప్రభువు దృక్పధములో మనము ఎంతటివారమైనను ఆజ్ఞానులమని అమాయకులమని గ్రహించవలసి యున్నది.
......
14. టీచర్సు ఇంటర్వ్యూ పల్లెపాడు :- అయితే టీచరు పోస్టులకు సెలక్టు చేసేది అధికారులు కాదు. ఆనాటి మున్సిపల్ ఛైర్మన్ ఏ.సి. సుబ్బారెడ్డిగారని తెలిసింది. అయితే నేను లంచము ఇచ్చిన అధికారులు ఆయన సెలక్టు చేసుకొన్నవారిని నమోదు చేసుకొనేవారే గాని స్వతంత్రించి విద్యార్థులను చేర్చుకొనే అధికారము లేదు. ఆ రోజు పల్లెపాడుకు దరఖాస్తు చేసుకొన్న విద్యార్థులందరు పల్లెపాడు ఇంటర్వ్యూకు వచ్చారు. ప్రారంభములోనే మైనరు తీరని 18 ఏండ్లు దాటని విద్యార్థులందరు వెళ్ళిపోవచ్చునని ప్రకటించారు. నాకు ఇంచుమించు నిజమైన వయస్సు 20 సంవత్సరాలున్నాయిగాని కావలి హైస్కూలులో నన్ను చేర్చేటప్పుడు నా మామయ్య రామిరెడ్డిగారు నాలుగు సంవత్సరాల వయస్సు తక్కువగా నమోదు చేయించాడు. ఆ రోజులలో ఆ వయస్సును గూర్చి పట్టింపు లేదు గనుక ప్రతి తరగతిలో మొదటి సంవత్సరమే పాసు కాలేక పోతున్నాడని, రెండేళ్ళు చదువుచున్నాడని ఉద్యోగానికి వచ్చినప్పుడు వయస్సు ఎక్కువైతే ఉద్యోగము దొరకదని ముందుచూపుతో నాలుగేళ్ళు తగ్గించి వ్రాయించాడు. నా అసలు పుట్టిన తేదీ 24.03.1935 అందుకు మారుగా 01.07.1939 గా నమోదైంది. రెండు సంవత్సరాలు తక్కువైనందున ఇంటర్వ్యూలో నిలబడకూడదు. కాని నా దగ్గర లంచము పుచ్చుకొన్న అధికారులు నన్ను సముదాయించి, మైనరు తీరిన పిల్లలతో కలిపి ఛైర్మన్‌గారి ఎదుటకు పంపినారు. చూడటానికి నాకు వయస్సు ఉంది గనుక ఛైర్మన్‌గార్కి అనుమానము రాలేదు.
.......
15. లంచము ప్రభావము :- నేను అధికారులకు ఇచ్చిన లంచము నన్ను గట్టెక్కించింది. నేను విద్యార్థులందరితో కలసి ఛైర్మన్‌గారి ఎదుటకు వెళ్ళినప్పుడు ఎత్తుగా ఉన్న నాలుగు తలల వైపు తన చేయి చూపించి తన దగ్గరకు రమ్మని వీరి పేర్లు వ్రాసుకొమ్మని అధికారులను ఆదేశించాడు. వారి నలుగురిలో నేనున్నాను కనుక నేను టీచర్స్ ట్రయినింగ్‌కు సెలక్టయ్యాను. వారు ఇచ్చు 16 రూపాయల స్టయిఫండుతో భోజన వసతులకు పై ఖర్చులకు కూడా సరిపోయేవి. ఎందుకంటే అది బేసిక్ ట్రయినింగ్ స్కూలు. నూతన విద్యా విధానము - పనిజేస్తూ చదువుకోవడమన్న మాట. మా విద్యార్థులందరు జట్లు జట్లుగా ఏర్పడి ఒక జట్టు కూరగాయలు పండించాలి. ఒక జట్టు భోజన పదార్థాలు వండాలి. మరొక జట్టు పాత్రల క్లీనింగ్, వడ్డన. ఈ విధముగా మా పని మేము చేసుకొంటూ అక్కడ పండించిన కూరగాయలే ఎక్కువగా తింటుండటము వలన మాకు ఇంకను కొంచెము చిల్లర డబ్బులు మిగిలేవి. అందువల్ల ఆ రెండు సంవత్సరాల కాలము తల్లిదండ్రులకు భారము లేకుండా పోయింది. ప్రతిరోజు ఉదయ సాయంత్రము ప్రార్థనా కూడికలలో హిందూ ముస్లిమ్ క్రైస్తవ మతాలలోని ప్రార్థనా గేయములు ఆలపించేవారు. ఎప్పుడు రండి ఉత్సాహించి పరిశుద్ధ పరిశుద్ధ వగైరా పాటలు ఎక్కువగా ఆలపించేవారు.
......
16. మరణ పిశాచి హాస్టలు రూములలో ప్రవేశించింది :- హాస్టలు గదులలో ఒక్కొక్క గదిలో ముగ్గురు నలుగురము ఉండేవాళ్ళము. నేను ఉంటున్నది మూడవ గది. మేము చేరిన మొదటి నెలలోనే ఒక విద్యార్థి జబ్బుతోనో దేనితోనో మరణించాడు. ఆ తర్వాత రెండు మూడు నెలల్లో రెండవ గదిలోని ఒక విద్యార్థి మరణించాడు. ఇక తర్వాత గది నేనుండే రూము - నా పరిస్థితి పొడుగ్గా ఎత్తుగా కనబడి సెలక్టు అయ్యానేగాని ఫిజికల్‌గా చాల బలహీనముగా ఉన్నాను. హాస్టలులో వంట చేసే బ్యాచీ వేకువన మూడు గంటలకే లేచి వంట చేసి టిఫిన్ కూడా తయారు చేయాలి. ఆ రాత్రి కాలములో నిద్ర లేపి వంట దగ్గరకు తీసుకొనిపోయిన నా బ్యాచివారు నా బలహీనత చూచి అయ్యో అని సానుభూతి చూపించి పొయ్యి దగ్గర పని గాకుండ సులభముగా ఉండే పనులు చిన్న చిన్న కూరగాయలు తరుగుట వగైరా పనులు అప్పగించేవారు. ఇక ఈసారి మూడవ గదిలో ఎవరు చనిపోతారోనని భయపడుచుండగా ప్రస్తుతానికి నా బలహీనతను బట్టి నేనే యుండవచ్చుననుకున్నాను. ఒకనాటి రాత్రి కలలో ఒక భయంకరమైన పిశాచి మొదటి రూము, రెండవ రూము దాటుకొని నేనున్న గదిలో ప్రవేశించటానికి ప్రయత్నిస్తుంది. విజయనగరం సాయిబాబా అను ఒక భక్తుడున్నాడు. అతను విజయనగరములో చాలా ప్రసిద్ధి. విజయనగర సాయిబాబా అని కలలోనే ఈ పిశాచిని అడ్డగించమని ప్రార్థించాను. నా ప్రార్థనకు జవాబు వచ్చినట్లుగా నా రూములో ప్రవేశించనున్న తరుణములో ఆ పిశాచిని దూరముగా తరిమివేయుట జరిగింది. అప్పుడు నాకు మెలకువ వచ్చింది. ఇంక అక్కడ నుండి ఏ రూములో ఎవరు కూడా మరణించలేదు. ఆ ఏటి గట్టున ఆ స్కూలు నిర్మించిన రోజులలో ఎంతోమందిని ఆ ప్రదేశములో హత్య జేసేవారట. ఈ హత్యలు నిరోధించుటకై ఆ స్కూలు నిర్మాణము చేశారని చెప్పుకొనేవారు. ఆ హత్య చేయబడిన వ్యక్తులలో ఒకడై యుంటాడని ఆ రోజులలో చెప్పుకొనేవారు.
........
17. నాచే వ్రాయబడిన సున్నతి - బాప్తిస్మము అను గ్రంథమును చదువగలరు. :- మార్కు 10:38-39 ప్రభువు పొందిన బాప్తిస్మము పొందగలరు. ప్రభువు ఆచరించతీన బల్లను ఆచరించగలరు. కాని ప్రభువు యొక్క పరిశుద్ధతకు మూలమైన ఆయన కుడివైపున పరిశుద్ధుల స్థానములో ప్రవేశించు యోగ్యత బాప్తిస్మమునకును ఆయన బల్లను ఆచరించుట వలనను కలుగుతుందా? అని ప్రభువు అడుగుచున్నాడు. బాప్తిస్మము అంటే చేసిన పాపాలకు పరితాపము పొంది, ఇక మీదట ఆ పాపముల జోలికి పోక సంఘము ఎదుట పరిశుద్ధ దేవుని సన్నిధిలో నీటిలో మునిగి ప్రమాణము చేస్తున్నాడు. ఏమని? ఇక మీదట ప్రభువు మార్గములో ఆయన ఉపదేశానుసారముగా పరిశుద్ధుల సావాసములో నిలిచి యాకోబు 2:13-20లో చెప్పబడినట్లు సత్క్రియలు లేని విశ్వాసము వల్ల ఈ బాప్తిస్మములు ప్రభువు బల్లను ఆచరించుట వ్యర్థములని తెలుస్తున్నది. కాబట్టి సత్క్రియలతో కూడిన విశ్వాసము. మరియు యాకోబు 4:17 మేలైన కార్యాలు ఏమిటో తెలిసియు వాటిని చేయకుండుట పాపమని స్పష్టముగా వివరించి యుండగా నీటి బాప్తిస్మము, బల్ల, ప్రతి ఆదివారము మందిర ఆరాధన, దశమ భాగము అనుకొని వాటితో సరిపెట్టుకొంటే ఎలా? మన ఇరుగుపొరుగు సహోదరుల మధ్య మనము చేయవలసిన మేలైన పనులు ఎన్నో ఉన్నాయి కనుక వాటిని చేయక సోమరులై పాపము సంపాయించుకొనే సోదరులు ఇప్పుడు లెక్కకు మించి యున్నారు. ఒకడు నీటి మూలముగాను అన్నాడు - ఇశ్రాయేలుకు చిలకరింపు బాప్తిస్మము పొందినారు - మేఘముల ద్వారా వర్షించిన నీటి తుంపరల ద్వారాను, సముద్ర మధ్యములో ప్రయాణించునప్పుడు సముద్ర కెరటాల అలల తాకిడికి రేగిన నీటి తుంపరల వల్లను ఇశ్రాయేలు బాప్తిస్మము పొందిరి. ఇది చిలకరింపు బాప్తిస్మము. ఐగుప్తు సైన్య సమూహాలన్నియు నీటిలో మునిగి నాశనమయ్యారు. ఆదికాండము 1: లో అగాధ జలముల మీద దేవుని ఆత్మ సంచరించి సముద్ర జలములోని నీటి తుంపరలతో దేవుని ఆత్మ బాప్తిస్మము పొంది ఆ అగాధ జలరాశులలో అణగారియున్న భూగృహమును తన వెలుగుతోను, ఉష్ణముతోను ఆరబెట్టి సకల సృష్టములను సృష్టించాడు. లూకా 3:6లో చెప్పబడినట్లు మారుమనస్సు విషయమైన బాప్తిస్మము - ఇది ప్రభువు సన్నిధిలోకి ప్రవేశించుటకు ప్రథమ సోపానము. ఆయన ద్వారా పరలోక రాజ్యములో ప్రవేశించాలంటే యేసు ప్రభువు చెప్పినట్లు మార్కు 10:21 నీ ఆస్తి అమ్మి బీదలకిచ్చి నన్ను వెంబడించమంటాడు. ఆస్తి అమ్ముట అటుంచి ఎంతమంది బీదలను కనికరిస్తున్నారు. కనుక దేవుని రాజ్యము మాటలలో వచ్చేది కాదు. నీటిలో మునిగి - నేను బాప్తిస్మము పొందినానని సంబరపడితే సరిపోదు. యోహాను చేత బాప్తిస్మము పొందిన యేసే నేను పొందవలసిన బాప్తిస్మము ఉన్నది. అది నెరవేరువరకు నేను ఇబ్బంది పడుచున్నానని చెప్పుచున్నాడు.
కనుక సహోదరుడా! నీటి ద్వారాను లేదా చిలకరింపు ద్వారాను లేదా జెండా క్రింద ప్రభువు మార్గములో నడచుకొంటానని ప్రమాణము చేసిన నీవు - నీ క్రియలు ప్రభువుకు యోగ్యకరముగా ఉన్నాయా లేదా పరిశీలించుకో! క్రీస్తుకు బాప్తిస్మము ఇచ్చిన యోహానుకు బాప్తిస్మమున్నదా! తనకు బాప్తిస్మము లేకుండ ఎదుటివానికి బాప్తిస్మమిచ్చే అధికారము ఎక్కడ నుండి వచ్చింది! క్రీస్తు ప్రభువు తల్లికి ఆయనను పెంచి పెద్ద చేసిన యోసేపుకు క్రీస్తు కుడి వైపున సిలువ వేయబడిన దొంగకు బాప్తిస్మములున్నాయా! ఈ విషయాలను గూర్చి సమగ్రముగా తెలిసికోవాలంటే నాచే విరచితమైన ''సున్నతి - బాప్తిస్మము'' అనే పుస్తకాన్ని చదివి గ్రహించగలరు.
.......
18. స్నానమునకు వెళ్లి లోతైన గుంటలో పడి విలవిల్లాడుట :- పల్లెపాడు బేసిక్ ట్రైనింగ్ 1955-56 సంవత్సరాలలో చదువుచున్న నేను సహ విద్యార్థులతో కూడా దగ్గరలో ఉన్న పెన్నా నది ఏటి గట్టులో స్నానములాచరించుట వాడుకయైంది. సహ విద్యార్థులలో కొందరు ఈత వచ్చిన వారు ఈత కొట్టుచుండగా ఈత రాని నేను, మరికొందరు నా దగ్గరనే స్నానము చేస్తున్నారు. వర్షాకాలములో పెన్నానది ఉధృతముగా ప్రవహించేటప్పుడు అక్కడక్కడ కొన్ని లోతైన గుంటలు సుడుల ద్వారా ఏర్పడి ఉన్నది. నేను స్నానము చేస్తున్న గట్టు ప్రక్కననే లోతైన గుంట ఒకటి ఉండింది. దానిని నేను గుర్తించక స్నానము చేస్తూ దానిలో జారి పడిపోయాను. అందులో మునిగిపోయి ఊపిరి తిరుగక చేతులు కాళ్లు కొట్టుకుంటూ ఊపిరి అరవడానికి నోరు రాక మునుగుతూ తేలుతూ ఎట్లానో చేతులు కాళ్లు బలముగా విదిలించుకొంటూ అటు ఇటు కొట్టుకుంటూ ప్రక్కనున్న గట్టు మీదకు రాగల్గి నా స్నేహితులతో ఇట్లన్నాను. నేను ఈత రాక గుంటలో జారిపడి ఊపిరి తిరుగక అరవటానికి నోరు రాక కొట్టుమిట్టాడుతుంటే ప్రక్కనే ఉండి నన్నెందుకు లాగలేకపోయారని అడిగినాను. నీవు ఏదో స్నానము చేస్తూ మునుగుతూ తేలుచూ ఉన్నావనుకున్నామేగాని నీ ప్రక్కనే గుంటలో పడి కొట్టుమిట్టాడుతున్నావని మేము గమనించక మా ధోరణిలో కబుర్లాడుకొంటూ స్నానము చేస్తున్నాము. మేము గమనిస్తే ఊరకుంటామా? అని అంటూ నీళ్లలో మునిగి లేస్తూ క్రిందికి పైకి దుముకుకొంటూ ఆట్లాడుతున్నావేమోయని మేము గుర్తించలేదన్నారు. ఆకాశము నుండి నా దేవుడు ఈ నీళ్ల గండము నుండి తప్పించి బయట పడవేసినాడనుకున్నాను. ఇక ప్రతి రోజు లోతైన నీళ్లలోనుండి ఏలాగు బయటపడగల్గినానో అలాగుననే లోతు లేని నీళ్లలో చేతులు కాళ్లతో ఈత గొట్టుట నాకు సులభముగా అలవాటైంది. మరి కొన్ని రోజులలో గొంతు లోతు నీళ్లలో ఈత గొట్టుట ప్రారంభించాను. ఆ తర్వాత ఎంత లోతైన నీళ్లలోను ఈత గొట్టుట నాకు సులభముగా నాకై నాకే ఈత వచ్చేసింది. దీనినిబట్టి నేను అర్థము చేసికొన్నదేమిటంటే ఈత నేర్చుకొనదలచిన పిల్లలనుగాని, పెద్దవారినిగాని నడుముకు త్రాడు గట్టి లోతైన నీళ్లలో శిరస్సు మునిగేంతవరకు వదలివేయాలి. వారు చేతులు కాళ్లు విలవిలాడిస్తూ పైకి రావడానికి నీళ్లను కాళ్లు చేతులతో తటతట కొట్టుకుంటూ వస్తారు. వారికి ఈత కొట్టుట అలవాటు లేదు గనుక ఒక నిమిషములోనే బైటకు లాగి శ్వాస పీల్చుకొని అలసట తీర్చుకొన్న తరువాత మరల నీళ్ల లోపలికి వదలివేయాలి. ఇక వారు మునిగిపోరు. నీటి మీద చేతులు కాళ్లతో ఈత గొట్టుచు నేర్చుకొని బయటపడగలరు. అంతేగాని రబ్బరు బెలూన్లతో ఇతర సదుపాయాలతో ఈత నేర్చుకోవాలంటే కొన్ని రోజులు కాలము గడుస్తుంది.
......
19. ఒకరి నిమిత్తము మూడు ప్రాణాలు బలి తీసుకొనే సమయమది :- పెన్నానది పల్లెపాడు గ్రామము దగ్గర ప్రవహించే మార్గాన్ని వేరొక మార్గానికి త్రిప్పుకొని ప్రవహిస్తుంది. ఆ నది త్రిప్పుకొన్న చోట ఎంతో లోతైన గుంటలు ఏర్పడి భయంకరముగా ఉంటుంది. అక్కడే మేమంతా స్నానము చేసే ఏటి గట్టు ఎంత లోతులో నీళ్లుంటే నాకేమి నాకు ఈత బాగా వచ్చేసింది. ఎంత దూరమైనను ఈత కొట్టవచ్చన్న భావముతో స్నానానికని ఏటి దగ్గరకు వెళ్లినప్పుడు అంతకుముందే కొందరు ఈదుకొంటూ వెళ్లి అవతలి గట్టుకు చేరుకున్నారు. మరికొందరు ఈదుకొంటూ వెళ్లుచున్నారు. నేను కూడా ఈదుతూ అవతలి గట్టుకు చేరాలని వెళ్లుచున్నాను. ఏటిలోని వాతావరణము ఎట్లుంటాదంటే చూడటానికి ఈ కనబడేదే గట్టు ఎంతో దూరము లేదనిపిస్తుంది. ఎందుకంటే ఏది ఆ ప్రాంతములో అడ్డుగా ఉండదు. కాని పోతూ ఉంటే దారి జరిగినట్లుండదు. దగ్గరలోనే గట్టున్నదనుటకు ఎంత దూరము ఈదుతూ వెళ్లినను అవతలి గట్టు రాలేదు. ఈలోగా నా కండరాలు అవయవాలు వాడుక లేని ఈత వలనను కొత్తగా నేర్చుకొని ప్రయత్నించుట వలనను సహజముగా శరీరము బలహీన స్థితిలో ఉండడం వల్లనో ఆయాసముతో ఈత కొట్టలేక స్పీడు తగ్గిపోయింది. సరే వెనుకకు తిరిగిపోయి ప్రాణము కాపాడుకొందామని వెనుక వైపు చూస్తే ముందటి గట్టు ఎంత దూరములో ఉందో అంతే దూరముగా ఈదుతూ వచ్చిన గట్టు ఉంది. ఈత జరగడం లేదు. నీటిపై తేలుతూ అక్కడనే నా శరీరము నీళ్ల మీద నిలిచిపోయింది. నాకేమి చేయాలో అర్థము కాలేదు. ఇంతలో అదే ఏటి గట్టు తీసుకొని తిరిగి ఈదుతూ నేనున్న వైపుగా ఇద్దరు విద్యార్థులు వస్తూ నా వైపు చూచి ఏమిట్రా అట్లానే నీళ్ల మీద నిలిచిపోయాడు ఏమిటా సంగతని శేఖరయ్యా, వచ్చేదా నీ దగ్గరకు అని ఒకడన్నాడు. నేను ఆలోచించి మీ ముఖాలు మీరు వచ్చి నన్నేమి చేస్తారు? నన్నెత్తి గట్టు మీద ఎలా చేరుస్తారు. మీ వల్ల కాదులే అన్నట్లుగ నేను మనసులో అనుకొని వారికి సమాధానమీయలేదు. నా దగ్గర నుండి సమాధానము రానందున ఏదో ప్రమాదములో చిక్కుకున్నాడని ఊహించి ఇద్దరు మాట్లాడుకొని నా వద్దకు వచ్చారు. నేను ఒక చేతితో ఒకనిని, మరొక చేతితో ఇంకొకడిని పట్టుకొని ఈత గొట్టుట మానివేశాను. అంతే ముగ్గురము ఎంతో లోతుగ గుంటలు ఏర్పడిన ఆ నీటి గోతులలోకి ముగ్గురము దిగిపోతున్నాము. నేను వారిని గట్టిగా పట్టుకొన్నందున వారు కూడా నాతో కూడా లోతులోకి వెళ్లుచున్నాము. ఆ సమయములో నేను ఇలా ఆలోచించాను. నా ఒక్క ప్రాణము నిమిత్తము మరి ఇద్దరిని చంపటం దేనికని ఆలోచించి వారిని గట్టిగా పట్టుకొనియున్న నా చేతులను వదలివేశాను. వదలిన వెంటనే ముగ్గురము నీటి పైకి వచ్చేశాము. వారికి ఏమియు చేయాలన్నది ఆలోచన రాక నన్ను వదిలి వెళ్ళలేక ప్రక్కనే ఉండగా నాకు దైవికముగా ఒక ఆలోచన గలిగి మీరు మీ పద్ధతి ప్రకారముగా ఈత గొట్టుచు బయలుదేరండి నేను మీ వీపుల మీద ఒకరి మీద ఒక చేయి మరొకరి మీద ఇంకొక చేయి వేసుకొని కాళ్లను ఆడించుకొంటూ వస్తానని చెప్పినాను. సరేనని వారిద్దరు నా ఇరువైపుల ఈత గొట్టుచుండగా నేను వారిద్దరి మధ్యలో ఉండి చెరొక చేతిని వారి వీపు మీద నా భారము మోపి సునాయాసముగా సురక్షితముగా గట్టునకు వెళ్ళగల్గినాము. వారు హాస్టలులోకి వెళ్ళి తోటి విద్యార్థులతో చెప్పిన మాట - ఈ రోజు పెన్నానదికి ఈతకు వెళ్ళి ముగ్గురు విద్యార్థులు మృతి అన్న ప్రకటన అంతేగాక ఏటి గట్టున మూడు శవాలు వరుసగా పెట్టబడియుండు భయంకరమైన సంఘటన శేఖర్‌రెడ్డి జ్ఞానము పని చేసినందున మా ముగ్గురు ప్రాణాలు సురక్షితముగా బయటపడినవి. అందుకనే ఎంత ఈతగాడైనను నీటిలో మునిగిపోయే వాని యొద్దకు నేరుగా వెళ్ళకూడదు. నీటిలో మునిగి పోయేవాడు ప్రాణ భయముతో నిన్ను గట్టిగా కౌగిలించుకుంటాడు - నీవు ఈదలేవు - ఇద్దరు ప్రాణాలు పోగొట్టుకుంటారు. కనుక కొంచెం దూరములో ఉండి వాని చేతినో లేక ఏదైన వంటి మీదనున్న వస్త్రానో పట్టుకొని బాక్కొంటూ రావచ్చును. ఏదైన త్రాటిని విసరి వేయవచ్చును. అది పట్టుకొన్నప్పుడు గట్టుకు లాగుకొని రావచ్చును. అంతేగాని మనతో సమానమైన వయస్సు, బలము గల్గిన వారి యొద్దకు నేరుగా వెళ్ళకూడదు. అదే చిన్నపిల్లలనైతే సులభముగా తీసుకొని రాగలము. అట్లే కరెంటు షాకు ఒక వ్యక్తిలో ప్రసరించి బాధపడుతుంటే ప్రక్కనున్న వ్యక్తి అతన్ని పట్టుకొన్నప్పుడు ఇతనికి కూడ ఆ షాకులో భాగస్వామియై ఇద్దరు ప్రాణాలు కోల్పోతారు. అందువల్ల కర్రనో ఏదైన రబ్బరు తొడుగునో ఉపయోగిస్తూ దగ్గరకు వెళ్ళవలసి ఉంటుంది. అట్లే నీటిలో మునిగిపోయేవారి విషయములో కర్రనో త్రాడునో ఏదైన వస్త్రపు చెంగునో పట్టుకోమని లాక్కొని రావలసి ఉంటుంది. లూకా 17:33లో చెప్పబడినట్లు నా ప్రాణమును రక్షించుకోవాలని నాకు సహాయము చేస్తున్నవారిని గట్టిగా వాటేసి బిగించి పట్టుకొని ఆలాగే ఉంటే వారితో కూడా నా ప్రాణము గాలిలో కలసిపోయేది. అట్లాగాక నా ప్రాణాన్ని కూడా రక్షించుకోమని ఆకాశమందు ఆసీనుడైయున్న దేవుడు ప్రసంగి 2:26లో చెప్పబడినట్లుగా జ్ఞానమును తెలివిని ఆనందమును అనుగ్రహించి ప్రాణభిక్ష పెట్టినాడు.
.......
20. నిజమైన దేవుడెవరో నా పరిశీలన కొనసాగుతూనే ఉంది :- యేసుక్రీస్తు ప్రభువు మరియు ఏడుకొండల వెంకటేశ్వర స్వామిని తప్ప మన దేశములోని దేవుళ్ళు దేవతలనబడెడివారిని నేను ఎరిగియున్నంతవరకు వారిని ధ్యానిస్తూ నా ప్రత్యక్షతలో వారి దర్శనాలను చూస్తూ కలల్లో వారితో సంభాషిస్తూ - వారితోబాటు దర్గాలలోని అల్లా దేవుని భక్తులను కూడా ధ్యానిస్తూ వారితో కూడా మాట్లాడుచు ఉండేవాడను. వీరి అందరికంటే గొప్ప దేవుడును ఆకాశ విశాలములో ఆసీనుడైయున్న సమస్త సృష్టిని సృష్టించిన సృష్టికర్తతో నేను ఎప్పుడు ముఖాముఖి మాట్లాడలేదు. కాని ఆకాశము వైపు చూచి ఆయన పైన ఉన్నాడన్న నమ్మకముతో నా బాధలు చెప్పుకొంటూ ఉండే అలవాటు కలవాడను. యేసు ప్రభువును తిరుపతి వెంకటేశ్వరస్వామిని నా ధ్యానములో ఎందుకు తప్పించినానంటే యేసుక్రీస్తు సర్వము సృష్టించిన సృష్టికర్తయైతే భయంకరమైన శిక్ష విధింపజేసుకొని మరణించవలసిన అవసరత జగత్ సృష్టికర్తకు లేదని, అట్లే తిరుపతి వెంకటేశ్వరునిపై కూడా తలలు బోడి చేయించే దేవుడు కూడా ఒక దేవుడేనా? అని అసహ్యత కల్గింది. ఏ దేవుని దగ్గర తలలు బోడి చేయరు. ప్రత్యేకించి దేవుడిచ్చిన వెంట్రుకలను బోడి చేయించుటన్నది నా దృష్టిలో అది అసహ్యమైన క్రియ కనుక ఆయనను నా దృష్టిలో దేవుడుగా అంగీకరించలేదు.
........
21. దృష్టిని కోల్పోయిన అమ్మాయికి బాబా ఇచ్చిన జవాబు :- దృష్టిని కోల్పోయిన అమ్మాయిని నీ దర్శనార్థము తీసుకవచ్చారు కదా! మరి నీవు ఆ అమ్మాయికి కళ్ళు ఎందుకు ఈయలేకపోయావని విజయనగర సాయిబాబాను ధ్యానిస్తూ ఆ ప్రశ్న వేశాను. ఆ అమ్మాయి పేరు రాజమ్మ - మా చిన్నాయన కూతురు. ఆమెకు ఒక విధమైన తలనొప్పి వచ్చి అస్వస్థతకు గురియైతే రామచంద్రారెడ్డి హాస్పిటలుకు తీసుకొని వెళ్ళినారు. ఆ రామచంద్రారెడ్డి డాక్టరు వైద్యములో అగ్రగణ్యుడు. ఆయనకు ఒక్కొక్కసారి ఏడాదికొకసారో ఎప్పుడో మెంటల్ వీక్‌నెస్ వచ్చేది. అప్పుడు అతడు ఏమి చేస్తున్నాడో ఆయనకే తెలియదు. అప్పుడు ఆయన అనుచరులైన డాక్టర్లు ఆయనను క్రమబద్ధీకరణ చేసి రోగులకు వైద్యము చేసేవారు. ఆయన జ్ఞానమునకు రష్యాలోని పెద్ద పెద్ద డాక్టర్లే ఆశ్చర్యపడినట్లు ప్రతీతి - అటువంటి స్థితిలో ఈ రాజమ్మ అనే పన్నెండేళ్ళ పాపకు చికిత్స సమయములో మెంటల్ వీక్‌నెస్ వచ్చి ఏదో ఇంజక్షన్ ఇచ్చి చూపు తమాణం కోల్పోవునట్లు చేశాడు. తర్వాత జ్ఞానము తెలిసి పాప చూపును నాశనము చేసినవాడను నేనేయని పరితాపమును వెల్లబుచ్చినాడు. - బీదలకందరికి ఉచిత వైద్యము అందించేవాడు. ఎంత కష్టతరమైన ఆపరేషన్ అయినను చిటికెలో సక్సెక్స్ చేసేవాడు. కాని ఏది ఏమైనను పాప చూపు కోల్పోయింది. అప్పుడు నేను ఆ అమ్మాయిని గూర్చి విజయనగర బాబాను ధ్యానిస్తూ అడిగిన ప్రశ్నకు ముఖాముఖిగా నాకు యోగములో కనపడి జవాబు ఈయలేదు. ఆ నాటి రాత్రి కలలో మా చిన్నాయన ఇంటిలో ఆయన ఒక ఆసనము మీద కూర్చుని ఉన్నాడు. నేను ప్రక్కనే ఉన్నాను. ఆయన ఈ మాటలు చెబుతున్నాడు. నేను ఆ అమ్మాయికి ఒక్క క్షణములోనే చూపునీయగల శక్తి నాలో ఉంది. నాకు అసాధ్యము లేదు. కాని ఆమె తల్లిదండ్రుల యొక్క హృదయాలోచనలు, వారి క్రియలు స్వార్థపూరితమైనవి, అసహ్యకరమైనవి. ఇందునుబట్టి వారి పాపము వెంటాడుచు ఆ బిడ్డకు స్వస్థత నీయలేకున్నవి అంటూ నాతో మాట్లాడుచుండగా నిద్ర మేల్కొన్నాను. నిజమే మా తండ్రిగారు ఆ అమ్మాయి తండ్రి అన్నాతమ్ముళ్ళు. ఆస్థి భాగాలలో మా నాయనతో తగాదా పెట్టుకొని చిన్న చిన్న విషయాలలో పేచీ పెట్టుకొనేవారు. ఎంత రోతగా వ్యవహరించేవాడు ఆయన - ఆయన భార్య కూడా అంతే - దీనికి ఉదాహరణ కావలిలో ఉన్న మా అమ్మ తమ్ముళ్ళు క్రిష్ణారెడ్డి, రామిరెడ్డి వచ్చి తగాదాలు తీర్చినను అవి సమసిపోలేదు. కొంచెం కొంచెంగా అన్న భాగాలను కబళించే స్థితిలో భార్యాభర్తలిద్దరు ఏకమై పోయేవారు. ఇంటిలో ఇల్లు అయింది. ఇంట్లో దొంగను ఎవరు పట్టగలరు. అన్ని విధాలుగ ఇబ్బందులు పడుతున్న మా అమ్మానాన్నలను శాంతింపజేసి మా మామయ్యలు ఇద్దరు వీరిని సమాధానపరచలేక వెళ్ళినప్పుడు - నేను వెళ్ళి దేవుడే మనకు తోడు - వారు కోరిన జాగా వారికి ఇచ్చి వేయమని మా తల్లిదండ్రులకు నచ్చ చెప్పి ఆ తగాదాల నుండి వాగ్వివాదాలనుండి నేను విరమింపజేశాను. ఇందునుబట్టియే దైవశక్తిని దోషము వెంటాడినందున ఆమె స్వస్థురాలు కాలేక శీఘ్రముగానే మరణించడం జరిగింది. ఈ విధముగా ప్రతి దైవముతోను, దైవ భక్తులతోను మాట్లాడటం జరుగుతుండేది. అయినను ఆకాశమందు ఆసీనుడైన దేవుని నేను మరచిపోక ఎప్పుడు జ్ఞాపకపరచుకొనేవాడను.
......
22. భూమి మీద విస్తరించియున్న దేవుళ్ళు దేవతలలో గొప్ప దేవుడెవరు? :- ప్రతి పండుగ రోజు ఆ పండుగ సందర్భముగా కొలువబడుచున్న దేవుని దేవతను ధ్యానిస్తూ - ఆ పండుగ కార్యక్రమాలను పద్ధతి ప్రకారముగా ఆచరించేవాడను. శివరాత్రి వచ్చిందంటే ఉపవాస వ్రతముతోబాటు రాత్రి జాగరణతో ప్రొద్దు పుచ్చేవాడను. వినాయకచవితి వచ్చిందంటే వినాయక పూజను భక్తి ప్రపత్తులతో ఆచరించేవాడను. ఈ విధముగా ప్రతి దేవతను, దేవుళ్ళను వారితోబాటు అల్లా భక్తులైన దర్గాలో పూజింపబడుచున్న పైగంలరులను ఏ బేధము లేకుండ ప్రతి యొక్కరిని ధ్యానిస్తూ వారితో మాట్లాడుచు దర్శనము కంటూ వారితో కలలలో మాట్లాడుచు ఉండేవాడను. నేను స్కూలుకు నాలుగు రోజులు సెలవులు వచ్చినప్పుడు శ్రీరాముని దివ్య రూపమును దర్శించాలని పట్టుదలగా మూడు రోజులు రాత్రింబగళ్ళు ధ్యానములో కూర్చుని నిష్ఠానియమాలతో ఉండగా చంద్రుని వెన్నెలను తలపిస్తూ ఆయన తన దివ్యరూపమును నాకు దర్శనమిచ్చి నన్ను తృప్తిపరచి అదృశ్యమైపోయాడు. ఒకసారి సెలవులిచ్చినప్పుడు రెడ్డిపాళెములో నడి మంచము మీద పరుపు మీద ఆనుకొని మా ఇంటి కుల దేవుడైన రాజమునీశ్వరుని ధ్యానిస్తూ ఆయన ప్రత్యక్షతను, ఆయన దర్శనాన్ని కోరినప్పుడు - ఆయన వికార పిశాచ రూపమున అస్థిపంజరాలతో మహా భయంకరముగా నా దర్శనములో కనబడినప్పుడు నేను భయపడి లేచి కూర్చుండి మా అమ్మ దగ్గర ఈ విషయము చెప్పగా ఆమె ఇట్లన్నది. రాజమునీశ్వరుడు మన ఇంటి కులదైవము. ఆయనను వినయవిధేయతలతో స్నానపానాది ఉపవాస ప్రార్థనలతో పద్మాసనాసీనుడై శుద్ధిగా ధ్యానించాలి. అంతేగాని నడి మంచము మీద కూర్చుని ధ్యానిస్తే ఆయన ఉగ్రత అలవి కాదు - కనుక ఆయన విషయములో జాగ్రత్తగా ఉండాలి అన్నది. మా తండ్రిగారైతే మునీశ్వరుని సదాచారముతో భక్తి ప్రపత్తులతో ఆరాధిస్తే ఆయన వరాలు అత్యున్నతమై యుంటాయి. లేదా తృణీకరిస్తే శనైశ్వర రూపముతో మహా భయంకరమైన స్థితిలో పీడిస్తాడు కనుక జాగ్రత్తగా ఉండండని హెచ్చరించాడు. అంటే భక్తితో కొలిస్తే దేవుడు భక్తి తప్పితే శనైశ్వరుడుగా పీడిస్తాడని చెప్పినాడు. ఏ దేవుని మనము ఆరాధించకూడదు. అట్లు కాదని వేరే దేవుని ఆరాధిస్తే ఆయన ఉగ్రత మన మీద తరతరములు ఉంటుందని చెప్పినాడు. మా నాయన తండ్రిగారి హయాములో ఆయన మీద రాజమునీశ్వరుడు పూని మాట్లాడుతుండేవాడట - గ్రామ గ్రామాలనుంచి బండ్లు కట్టుకొని వచ్చి రాజ మునీశ్వరునికి వారి సమస్య విన్నవించినప్పుడు ఆయన నా ముత్తాత ద్వారా వారి సమస్యలను పరిష్కరించి పంపేవాడట - ఇంత పెద్ద చరిత్ర మా కులదేవుడైన రాజమునీశ్వరునకున్నది.
......
23. నా రెండేళ్ళ ట్రైనింగు తర్వాత టీచరు సర్టిఫికేటుతో ఉద్యోగ ప్రయత్నము :- టీచరు ట్రయినింగు పాసై ఉద్యోగ ప్రయత్నములో - మరి గవర్నమెంటు పాఠశాలల్లో టీచరు పోస్టు కావాలంటే ఎవరినైన పంచాయతీ ప్రెసిడెంటునో మున్సిపల్ ఛైర్మన్‌నో ఎవరో ఒకరిని సంప్రదించాలి. రెకమెండేషన్ కోసము నేను నాన్న రెడ్డిపాళెము నుండి రామన్నపాళెము గ్రామమునకు వెళ్ళినాము. ఈ రెండు గ్రామాలకు పంచాయతీ ప్రెసిడెంటయిన పెళ్ళకూరు రామచంద్రారెడ్డిగారిని కలిశాము. ఆయనకు నన్ను పరిచయము చేసి ఏదైన సహాయము చేయమన్నాడు. ఆయన దగ్గరకు ప్రతి వారము వెళ్ళుచు నెలల తరబడి నడిచే వెళ్ళేవాడిని. ఆయన ఇదిగో ప్రయత్నిస్తున్నాననిగాని చేస్తాననిగాని చేయననిగాని చెప్పేవాడు కాదు. నేను అడిగేవాడను కాను, కనబడి వస్తుండేవాడను. నేను తరచుగా ఆయన దగ్గరకు వెళ్ళుచుండగా ఆ ఊరి రైతు చూచి ఆ ఊరికి ఎందుకు వెళ్ళుచున్నానో అడిగి తెలుసుకొని, ఇన్ని నెలల నుండి వెళ్ళుచున్నావే ఆయనకు నీ మీద కనికరము కలుగలేదా? అని జాలిపడి ఆయన ఇట్లన్నాడు. నీ వల్ల ఆయనకు ఏదైన చిన్న సహాయము ఉందని తోస్తేనే తప్ప ఎవరికి ఏ విధమైన సహాయమీయని కఠినుడు. ఎందుకు వృధాగా ప్రయాసపడతావు. వేరే ఏదైన ప్రయత్నము చేసుకోమన్నాడు. ఏ ప్రయత్నము చేయాలో ఎవరిని కలుసుకోవాలో నాకు తెలియదు. నాన్న చదువుకున్నవాడు కాదు. మా అన్నలు కూడా అంతే. ఎవరిని కలవాలో ఎక్కడ అర్జీ ఇవ్వాలో తెలియని అధ్వాన స్థితిలో ఉంటున్నాము. ఇట్టి పరిస్థితులలో ఏ దారి లేనప్పుడు నా దారి ఆకాశము వైపు చూచి అత్యున్నతమైన దేవుడు సమస్తాన్ని సృష్టించిన సృష్టికర్తకు నా దీన స్థితిని చూపించుకొని ఆ రైతుతో ఇట్లన్నాను. నాకెవరు తెలియదు. వేరే ప్రయత్నము ఎట్లా చెయ్యాలో తెలియదు. ఊరికే ఇంటిలో ఉండి చేసేదేముంది? వాడుకగా ఆయన దగ్గరకే వెళ్ళుతానని వెళ్ళేవాడిని.
......
24. ఆకాశము నుండి నా దీన స్థితిని చూచిన దేవుడు నా మార్గము తెరిచాడు :- ఆకాశములో సింహాసనాసీనుడైన దేవుడు భవిష్యత్ జ్ఞానము తెలిసినవాడు గనుక ఆ రెడ్డిగారి కఠిన హృదయమును బట్టి ఆయన ఇద్దరు పిల్లలకు బొత్తిగా అక్షర జ్ఞానము అంటనందున ఆ రెడ్డిగారి మనస్సును నా వైపు త్రిప్పించాడు. ఆ రెడ్డిగారి పిల్లల భవిష్యత్తును గూర్చి విచారపడి అక్షర జ్ఞానము నేర్పుటకు ఆయన దర్శనార్థము వెళ్ళుచున్న నన్ను చూచి దైవ ప్రేరేపణ ద్వారా రెడ్డిగారు ఇతనైతే నెమ్మదిగా మంచి ఓపికతో పిల్లలకు అక్షరాలు నేర్పగలడని తలంచి, వెనువెంటనే ఆయనే అర్జీ తయారు చేయించి దానిని టైపు చేయించి నా దగ్గర సంతకము తీసుకొని, తానే మున్సిపల్ వైస్ ఛైర్మన్ బలరామిరెడ్డి ద్వారా పోస్టింగ్ వేయించుకొని, నెల్లూరు స్టోన్‌హౌస్‌పేటలో పప్పులవీధి ఎలిమెంటరీ స్కూలులో తన ఇంటికి దగ్గరకు ఉన్నందున నాకు పోస్టింగ్ ఇప్పించి తన ఇంటిలోనే నేను ఉండుటకు ఒక గది ఇచ్చి భోజన వసతులు కల్పించి పిల్లలకు గుణింతాలు, పేర్లుతో చదువు నేర్పించమన్నాడు. అయితే చదువు నేర్పేటప్పుడు పిల్లలను ఏ మాత్రము కొట్టగూడదని కండిషన్ పెట్టినాడు.
పిల్లలిద్దరిని నాతోబాటు నేను పని చేసే స్కూలుకు తీసుకొని పోయి నాతోబాటే సైకిలు మీద కూర్చోబెట్టుకొని ఇంటికి తీసుక వచ్చేవాడను. ఇంటి దగ్గర పుస్తకము తీసుకోమంటే తీసుకోరు. చదువుకోమంటే చదువుకోరు. ఇంటి దగ్గర ఏ మాత్రము నా మాట వినటం లేదు. కొట్టకూడదన్నాడు. ఆయన భార్య ఆయన తల్లిదండ్రులు అతి గారాబముగా చూసుకొనే పిల్లలు. ఏమి చేయాలో నాకు పాలుపోలేదు. ఉద్యోగము ఇప్పించాడు. భోజన వసతులు ఏర్పరచాడు. ఇంత సహాయము చేసిన రెడ్డిగారి పిల్లలకు చదువు నేర్పి ఋణము తీర్చుకోవాలంటే నా వల్ల అయ్యే పనిగా కనబడలేదు. వాళ్ళ నాన్నగారి ఎదుటనైన పుస్తకాలు తీసుకొని రండని పిల్లలను బ్రతిమిలాడిన వాళ్ళు వచ్చేవాళ్ళు కారు. వాళ్ళ నాన్న కూడా పోయి చదువుకోండర్రా అని గదమాయించడు. ఏమి చేయాలో తోచనప్పుడు ఆకాశములో ఆసీనుడైన దేవుడు నా మొర నాలకించాడు. వారము రోజులు క్యాంపు వల్ల పిల్లల తల్లిదండ్రులు మద్రాసు వెళ్ళిపోయారు. ఆరోజు సాయంత్రము భోజనాల దగ్గర పిల్లలు నేను కలసి భోజనానికి కూర్చున్నాము. భోజనము పళ్ళెము పెట్టబడింది. చిన్న పిల్లవాడు బహు మొండిఘటము. అనవసరముగా వంటవానితో తగాదా పెట్టుకొని అలిగి భోజనము చేయకుండా లేచి వెళ్ళిపోయి పడుకొని నిద్రపోయాడు. ఆ పరిస్థితులలో అబ్బాయి తల్లిదండ్రులైతే బ్రతిమిలాడి ఏదోయొకటి తినబెట్టి సముదాయించేవారే. కాని వంటవానికి నేను సైగ చేసి వాడి జోలికి పోకు - ఉదయము చూసుకొందాము అన్నాను. ఉదయాన భోజనము బల్ల దగ్గర వాడుకగానే పిల్లలు నేను టిఫిన్ తినటానికి కూర్చున్నాము. రాత్రి అన్నము తినని చిన్న పిల్లవానికి అలుగు తీరలేదేమో బుజ్జగించేవారు లేరనియే ఏమో తన టిఫిన్ ప్లేటును అలిగి దూరముగా నెట్టినాడు. అప్పుడు నేను వాడితో రాత్రి నీవు అన్నము తినలేదు. టిఫిన్ ప్లేటు తినక నెట్టి వేస్తున్నావు - ఇష్టము లేకపోతే లేచి వెళ్ళిపో అని నేను ఆ టిఫిన్ ప్లేటును ఇంకా దూరముగా జరిపినాను. చిన్న పిల్లవాడు అన్నము తినలేదు, చిరుతిండి లేదు, పాలు త్రాగలేదాయే కడుపులో నకనకలాడుతుందేమో తలవంచి దూరముగా లాగిన టిఫిన్ ప్లేటును దగ్గరకు లాక్కొని తృప్తిగా భోంజేశాడు. ఆ మీదట వారికి జ్ఞానోదయము దేవుడు కల్గించాడేమో చెప్పినట్లు చదువుకోకపోతే భోజనము పెట్టనివ్వడేమోయనుకున్నారో ఏమోగాని ఆ వారము రోజులలో క్రమశిక్షణ పాటిస్తూ పిలవగానే వచ్చి అతి వినయముగా పాఠాలు నేర్చుకోవడం మొదలు పెట్టినారు. తల్లిదండ్రులు వచ్చి ఈ క్రమశిక్షణను చూచి అవాక్కయ్యారు.
నా పక్షమందున్న దేవుడు వారి జ్ఞానమును తెరచినందున ఒక్క సంవత్సర కాలములోనే ఇంగ్లీషు ప్రైమరీ పుస్తకము తెలుగులో గుణింతాలు, పెద్ద పెద్ద పాఠాలు, పద్యాలు చదవటం, చాలావరకు కూడికలు, భాగాహారాలు, ఎక్కాలు వగైరాలతో కంఠస్థము చేస్తూ రాసుకుంటూ తల్లిదండ్రులకు ఆనందము కల్గించారు. పైగా నేను స్కూలులో నాతో కూడా ఉంచుకొని ఇంటి దగ్గర ఉదయ సాయంత్రాలు ప్రత్యేక శ్రద్ధ వహించాను కదా! ఈ సంవత్సర కాలములో వారికి నేను బోధించిన పై చదువులతో ముచ్చటపడిన ఆ పిల్లల తల్లి హైస్కూలులో చేర్చింది. నాతో ఒక్క మాట కూడా చెప్పలేదు. ఇంకొక్క సంవత్సరము ఇంకా చదువులో మంచి పునాది వేసి వచ్చే సంవత్సరము హైస్కూలులో చేర్పిస్తాము అనుకున్నాను. అందుకు వ్యతిరేకముగా హైస్కూలులో చేర్పించారు. నాతో మాట మాత్రము చెప్పి ఉంటే బి.ఇడి. టీచరు దగ్గరనైన ఇంకొక్క సంవత్సరము ట్యూషన్ చెప్పించండని సలహా ఇచ్చేవాడను. కాని హైస్కూలులో చేర్చిన విషయము నాకు తెలియనీయకుండా దాచి వేరే రూము తీసుకొని నన్ను వెళ్ళిపొమ్మన్నారు. నన్ను బయటికి పంపించినందుకు నాకు బాధ లేదుగాని ఒక్క సంవత్సరము పాటి చదువుకు ముచ్చట పడి పునాది లేని గట్టితనము లేని చదువుతో హైస్కూలులో చేర్పించడము అన్నది నా ప్రాణము విలవిల్లాడింది. పాపం పిల్లలు ఒక్క సంవత్సరము చదివిన చదువులో ఐదు తరగతుల సిలబస్ ఎలా ఒంట పడుతుంది. పిల్లల భవిష్యత్తు దెబ్బ తింటుందని బాధపడి ఏమి చేయలేని స్థితిలో ఉండిపోయాను. పిల్లలు జ్ఞాపకము వచ్చినప్పుడు వాళ్ళు హైస్కూలులో ఎట్లా చదువగలరా? అని ఆ పిల్లలను బట్టి వేదన అనుభవించాను.
......
25. బాడుగ ఇంటిలో నా కాపురము :- నేను పని చేస్తున్న వీధిలోనే మిద్దె మీద ఒక చిన్న గదిని ఐదు రూపాయలకు అద్దెకు తీసుకొని అందులో ఉంటూ స్వయముగా వంట చేసుకొని తినటం మొదలుపెట్టినాను. నేను బ్రహ్మచారినైనను ఆ వీధిలో వారికి టీచరుగా వారి పిల్లలకు బడి పంతులుగా ఉంటున్నవాడినే గనుక సంశయించక నాకు గది ఇచ్చారు. పెళ్ళిళ్ళ పేరయ్య ఒకడు తరచుగా వచ్చి నన్ను యల్లాయపాళెము ఏకుల్ల కృష్ణారెడ్డికి పరిచయము చేశాడు. ఆయన మా స్కూలుకు వచ్చి నన్ను చూచి ఇష్టపడి ఒకసారి మా ఇంటికి రండి అమ్మాయిని చూపిస్తాను అన్నాడు. మా చిన్నాయన కొడుకు చిన్న గోపాలరెడ్డిని తోడు చేసుకొని యల్లాయపాళెము వారి గృహములో ప్రవేశించాము. అక్కడ ఒక లావుపాటి అమ్మాయి కొంచెము రంగు తక్కువగా ఉండి, ఆ ఇంటిలో మాకు కనబడింది. మా ఇరువురికి ఆ అమ్మాయి నచ్చలేదు. ముఖాముఖిగా నచ్చలేదని చెప్పటానికి సంకోచించాము. పెళ్ళిచూపులు ఏర్పాటు చేశారు. ఆ అమ్మాయి పక్కింటి అమ్మాయి. మాకు ఆ విషయము తెలియదు. ఆయన కుమార్తెను మా ఎదుటికి తీసుకొని వచ్చినప్పుడు ఇద్దరికి నచ్చింది. ఆ అమ్మాయిని చూచి వచ్చింది మొదలుకొని నా మనస్సు ఆమె ధ్యాసలోనే ఉండింది. నా తల్లిదండ్రులకు నా పెళ్ళి జరిగించడం ఇష్టము లేదు. ఎందుకంటే నాకు చిన్నతనము నుండి కోపమెక్కువ. అదుపు చేసుకొనలేని కోపము - చేతికి ఏది అందితే దానిని విసురు కొట్టడం ఇటువంటి అవలక్షణాలుండేవి. అందువల్ల ఈ పెళ్ళి చేయటం వారికి ఇష్టము లేదు.
......
26. వివాహము జరిపిస్తానని వాగ్దానము చేసిన దేవుడు :- ఆ నాటి రాత్రి కలలో ఒక తెల్ల అంగీ వేసుకొన్న వ్యక్తి వచ్చి శేఖరయ్యా! నీవు ఇష్టపడిన కన్యతోనే ఈ వివాహము జరుగుతుంది. ఎన్ని అడ్డంకులొచ్చిన ఈ వివాహము జరిపిస్తానని నాకు వాగ్దానము చేశాడు. ఆయన అంగీ ఆ మూర్తిమత్వము గల ఆ వ్యక్తిని చూచి యేసు ప్రభువుతో నాకు పరిచయము లేదు గనుక విజయనగరం సాయిబాబాయని అనుకొన్నాను. కాని నేను ధ్యానిస్తున్న ఆకాశమందున్న దేవుడేయని ఈ రోజులలో గ్రహించగల్గినాను. అనుకొన్నట్లుగానే ఆటంకాలు బయలుదేరినవి. రెడ్డిపాళెములో మా తండ్రిగారి ఇంటి ప్రక్కన ఉన్న ఏకొల్లు కమలమ్మ అనే పెద్దావిడ అమ్మాయిని ఇష్టపడి వచ్చిన ఇంటికి వెళ్ళి ఆ అబ్బాయికి సెంటు పొలము లేదు. అంకణము ఇల్లు లేదు - జీతభత్యాలు కూటి నీళ్ళకు కూడా చాలవు అని అమ్మాయిని పోషించలేడని ఖరాఖండిగ చెప్పి వచ్చింది. ఆ మాటలకు అమ్మాయి తండ్రి మనస్సు మార్చుకొన్నను తల్లి మాత్రము అబ్బాయి నెమ్మదస్తుడు. ఆస్తిపాస్తులదేమున్నది ఇచ్చి పెళ్ళి చేస్తామని పట్టు పట్టి 1959 ఫిబ్రవరి 27 శుక్రవారమున వివాహము జరిపించారు. ఆ వివాహానికి నా గురువుగారైన బెజవాడ శివకోటారెడ్డి గారు శేఖరయ్యకు కళ్యాణ యోగమున్నది అని ఆయన పెద్దల సుబ్బమ్మగారితో చెప్పిన మాట ఈ విధముగా నెరవేరింది. ఆయన వచ్చి అమ్మాయికి ఒక పట్టుచీర కానుకగా ఇచ్చి వెళ్ళినారు.
.......
27. ఆరు సంవత్సరాలు మాకు పిల్లలు పుట్టలేదు :- పిల్లలు లేని కారణముగా నా భార్య ఆమె తల్లి ఎందరో దేవుళ్ళకు దేవతలకు మ్రొక్కులు మ్రొక్కుకొని ఎన్నెన్నో ప్రయత్నాలు చేశారు. డాక్టరు పరీక్షల్లో ఏ లోపము లేదన్నారు. నా భార్య పెద్దమ్మ ధనరాజు అను పేరు గల ఒక మాంత్రి సిద్ధాంతిని తీసుక వచ్చింది. అతడు భూతవైద్యుడు. ప్రశ్నలు చెబుతాడు అంజన్లు ద్వారా కొన్ని సంఘటనలు చూపిస్తాడు. ఆయన చేత ఎన్నో విధాలైన తాయెత్తులు, దండలు, పూజలు, కొలువులు చేయించింది. ఫలితము శూన్యమేయైంది. మాంత్రికుడైన ధనరాజుగారి తల్లిదండ్రులు నాగ పట్టణ సముద్ర తీరములో వెలసియున్న వేళాంగణి మేరీమాత భక్తులు. ప్రతి సంవత్సరము ఆ తల్లి దర్శనమునకు వారు వాడుకగా వెళ్ళి వస్తుండేవారు. ఆ తల్లి తన భక్తుల కోర్కెలను తీర్చుచు ప్రఖ్యాతి పొందింది. ఈ సంగతి తల్లిదండ్రుల ద్వారా తెలిసికున్న ధనరాజుగారు మా చేత ఎంతో డబ్బు ఎన్నో విధములుగ ఖర్చు పెట్టించి కూడా ఫలితము లేకపోయినందున చింతించి, ఆయన తల్లిదండ్రుల వద్ద నుండి వేళాంగణి మేరీమాత స్వరూపమును తెచ్చి నా భార్యకు ఇచ్చి, సాయంత్రము సమయాలలో సాంబ్రాణీ ధూపము వేసి ఏదో నీకు తెలిసినంతవరకు ప్రార్థన చేసికొని మెడలో ధరించుకోమన్నాడు. ఎందరో దేవుళ్ళు దేవతల పూజలలోను తాయెత్తులతోను మ్రొక్కులతోను కలుగని సంతానము భయంకరమైన అతి ఘోరమైన చావు చచ్చిన ప్రభువును కన్న తల్లి మేరీమాత స్వరూపము ధరించినంత మాత్రాన సంతానము కల్గుతుందా? అని నేను అనుకొని అతని మాటను కాదనలేక సరే అన్నాను. ఆమె ఆరోజు సాయంత్రము ధూపము వేసికొని ప్రార్థన చేసి మెడలో ధరించింది.
.....
28. నా భార్య ముఖ దర్శనములో దైవమహిమ వెల్లివిరిసింది :- మాకు వివాహమైనది మొదలుకొని మా ఇంటి కులదైవము రాజమునీశ్వరుని ఆమె ఎరుగనందున ఆయన కొలువు చేయక మానింది. భార్యభర్తలు ఇరువురు ఏక దేవుని ఆరాధించాలేగాని భర్త ఒక దైవాన్ని, భార్య మరొక దైవాన్ని ఆరాధించకూడదన్నది నా సిద్ధాంతము. ఆ విధముగా ఆమె మనస్సును తిరుపతి వెంకటేశ్వరుని మీద నుండి మనస్సు మార్చి రాజమునీశ్వరుని వైపు మరల్చుటకు నేను ఆమె అనుసరిస్తున్న వెంకటేశ్వరస్వామిని అప్పుడప్పుడు అందరి ఎదుట దూషించేవాడను. నెత్తి గొరిగించి తలలు బోడి చేయించే దేవుడు ఒక దేవుడా? ఏ దేవుడు కూడా ఈ అసహ్యమైన కార్యము చేయించడు. నీవు మన కుల దైవమైన రాజమునీశ్వరుని వేడుకొమ్మన్నాను. ఆమె భక్తి వెంకటేశ్వరుని మీద నుండి మరలలేదు. ఈ విధముగా పదే పదే వెంకటేశ్వరుని కించపరస్తూ ఎద్దేవా చేస్తూ ఎగతాళి చేస్తుండగా సహించలేని వెంకటేశ్వరుడు నాకు బుద్ధి నేర్పుటకు సమయము కనిపెట్టినాడు.
ఒక మిట్ట మధ్యాహ్న సమయాన మా టెంకాయ తోటకు వెళ్ళి ఒక టెంకాయ చెట్టు ఎక్కి టెంకాయలు కోయాలన్న ప్రయత్నములో చెట్టు ఎక్కినాను. గెలలు వ్రేలాడుచున్న చెట్టు వరకు వెళ్ళగానే నా కండరాలు పట్టు సడలి నరాల వీక్‌నెస్, మూర్ఛ వచ్చినట్లుగా ఒళ్ళు తిరగడం వంటి వికారాలు నాలో చోటు చేసుకొన్నాయి. చెట్టు మట్టలు పట్టుకొని పూర్తిగా పైకి పోయి కాసేపు విశ్రాంతి తీసుకొందాము అని ప్రయత్నించాను. ఆ కొంచెము పైకి వెళ్ళుటకు కూడా నాకు సాధ్యము కాలేదు. క్రింద ఆ తోటలో ఎవరు లేరు. పెద్దగా అరిచాను నా స్వరము నా వరకే ఉందిగాని వెలుపలికి వెళ్ళటం లేదు. అక్కడ నుండి క్రిందికి దిగే శక్తి నాకు అసలే లేదు. నా కుల దైవమైన రాజమునీశ్వరుని ప్రార్థించాను. ఫలితము లేదు. అప్పుడు వెంకటేశ్వరస్వామిని మనస్సున ధ్యానిస్తూ - ఇట్లు చెప్పుకొన్నాను. నెత్తి గొరిగి తలలు బోడి చేసే దేవుడవని పలుమార్లు నిన్ను గేలిజేసి నా ప్రాణము మీదకు తెచ్చుకున్నాను. దేవతలందరిలో నీవే గొప్ప దేవుడవు. నెత్తి గొరిగేవాడవని నిన్ను గేలి చేసినందుకు ప్రతిగా నీ దర్శనార్థము నీ కొండకు వచ్చి నా నెత్తి గొరిగించికుంటాను. ఒకటికి మూడు పర్యాయములు నా తల బోడి చేయించుకొంటాను. ఈ గండము తప్పించమని మనస్సులోనే ధ్యానించాను. అంతే అద్భుతము ఆశ్చర్యము. నేను చెట్టు ఎక్కక ముందు నా బలము ఎట్లున్నదో అంతకు రెట్టింపుగా నాకు బలము నా శరీరములో ప్రవేశించింది. ఆశ్చర్యముతో ఉక్కిరిబిక్కిరియై ఏ భయము లేకుండ అనుకున్న ప్రకారముగా చెకా చెకా కాయలు కోసి నిదానముగా దిగి వచ్చినాను.
.........
29. అందరికంటే గొప్ప దేవుడెవరో తెలిసికొనగల్గిన అనుభవము ప్రారంభమైంది :- నాకు తోటలో టెంకాయ చెట్టు ఎక్కి ప్రమాదమునకు లోనైనప్పుడు వెంకటేశ్వరుని తప్ప ఎందరో దేవుళ్ళు దేవతలు దర్గాలను ఆశ్రయించియున్న ముస్లిమ్ భక్తులను ఎందరినో సహాయపడమని అభ్యర్థించాను. కాని ఎవరు ముందుకు రాలేనందున నేను అనవసరముగా ద్వేషిస్తున్న వెంకటేశ్వరస్వామినే నా తప్పు మన్నించమని శరణు వేడి ప్రాణాపాయము నుండి బయటపడగల్గినాను. లోగడ నేను వెంకటేశ్వరుని దూషించి అవమానపరచునప్పుడెల్ల దర్గా వాసులైన ముస్లిమ్ మత ఆరాధకులైన పెద్దలు నన్ను హెచ్చరించుచు వెంకటేశ్వరునితో వైరములు పెట్టుకోవద్దు. ఆయన కోపగించి నీ మీద చర్య తీసుకొన్నప్పుడు మేము నీకేమియు సహాయపడలేమని మస్తానయ్య హజరత్తయ్య విజయనగర సాయిబాబా వగైరాలందరు ఖరాఖండితముగా నన్ను హెచ్చరించారు. మీరందరు అంత అసమర్థులైతే మీతో నాకేమియు సహాయ సహకారాలక్కర లేదని చెప్పటం జరిగింది. అప్పుడు వారు మౌనులయ్యారు. నేను చెట్టెక్కి ప్రమాదములో ఉన్నప్పుడు సహాయము చేయలేని తరతరాల నా కుటుంబ ఆరాధ్య దైవమైన రాజమునీశ్వరుని వదలి నా భార్య ఇష్ట దైవమైన వెంకటేశ్వరునే ఆరాధిస్తూ ధ్యానిస్తూ తిరుపతి కొండకు నా తల నీలాల మ్రొక్కుబడి తీర్చుకొనుటకు వెళ్ళినాను. నేను వెళ్ళి నా మ్రొక్కుబడి ప్రకారముగా తల బోడి చేయించుకొని, వెనువెంటనే ఇంటికి తిరిగి వచ్చి భయంకరమైన జ్వరముతో పీడింపబడుతున్నాను. ఆ రోజు కలలో చాలా లావుగా ఉన్న ఒక కండ పుష్టి గల నల్లటి స్త్రీ వేపమండల లాంటివి చేత పట్టుకొని తిరుపతి నుండి నన్ను తరుముకొంటూ నన్ను వెంబడించింది. ఆ కలలో నేను భయపడి మేల్కొని జరిగిన కలను మా అమ్మకు వివరించగా ఆమె ఇట్లని చెప్పింది. తిరుపతికి వెళ్ళి వెంకటేశ్వరుని ప్రియ పత్నియైన అలివేలు మంగమ్మను దర్శించకుండా ఎవరును రారు. అదియే నీవు చేసిన తప్పిదము. తల్లికి అపరాధముగా ఏదైన మ్రొక్కుకొని ఈసారి కొండకు వెంకటేశ్వరుని దర్శనార్థము వచ్చినప్పుడు నీ దర్శనము చేసుకొని మ్రొక్కులు చెల్లిస్తానని ప్రార్థనలో మ్రొక్కుకున్నాను. అప్పటికప్పుడే తీక్షణమైన నా జ్వరము బలహీనతలు నా నుండి తొలగి ఆరోగ్యము చేకూరింది. ఇప్పటివరకు భారతదేశములో వెలసియున్న నాగూరు మీరా సాహేబు, విజయనగర సాయిబాబా వగైరా ముస్లిమ్ భక్త వర్గము నుండి మా కుల దేవుడైన రాజమునీశ్వరుని వరకును సకల విధములైన దేవుళ్ళు, దేవతలనబడెడి నామధేయములు, విగ్రహాలు గల దేవతా సమూహాలలో నేను గ్రహించిన గొప్ప దేవుడు శ్రీ వెంకటేశ్వరుడు, ఆయన భార్యయైన అలివేలు మంగమ్మ అని గ్రహించగల్గినాను.
.......
30. తరతరాలుగ కొలుస్తున్న దేవుడు నా మీద నా భార్య మీద పగ పట్టినాడు :- మా కుల దైవమైన రాజ మునీశ్వరుని నా కుటుంబములో ఆరాధ్య దైవముగ ఉంటున్న ఆ శక్తిని నేను నా నుండి నా కుటుంబము నుండి తొలగించుకొని వెంకటేశ్వర భక్తిలో చిన్నతనము నుండి కొలుస్తున్న నా భార్యయు, నూతనముగా ఆయన ఆరాధనలో ప్రవేశించిన నేనును భక్తి ప్రపత్తులతో ఆ స్వామిని సతీసమేతముగా ఆరాధిస్తూ వస్తున్నాము. ఆరాధన జరిగిస్తున్న మా కుటుంబములో నాకు మానసిక శాంతి సమాధానము లేదు. నా భార్య కూడా చిక్కిపోయినట్లుగా ముఖకవళికలు మారిపోయింది. చూచినవాళ్ళంతా పెళ్ళయిన తర్వాత నుండి సరిగా భోం చేయడము లేదా ముఖాలు కళ తప్పిపోయియున్నాయి అనేవారు. ఆరు సంవత్సరాలుగా సంతానము లేని స్థితిలో మాంత్రికుడుగా ప్రవేశించిన ధనరాజుగారి ద్వారా కొన్ని విషయములు బయల్పడినవి. ఆయన తన మాంత్రిక యోగములో చూచి నీ కుల దేవుడు రాజమునీశ్వరుడు. భయంకరమైన కాటేరు రూపము ధరించి నీ ఇంట నీ భార్య మీద ప్రభావము చూపెట్టుచూ తిష్టవేసియున్నాడు. నీవు నూతనముగా ఆరాధిస్తున్న వెంకటేశ్వరుడు - మునీశ్వరుని కాటేరు రూపమునకు అశక్తుడై నీ ఇల్లు వదలి నీ నిమిత్తము వీధుల వెంట ఎదురు చూస్తూ తిరుగుతున్నాడు. ఇప్పుడు నీకు తరతరాల దేవుని సహాయము, నూతనముగా నీవు ఆరాధించే వెంకటేశ్వరుని సహాయము నిలిచిపోయి కాటేరు రూపము ధరించి నిన్ను నీ భార్యను హింసపాల్జేస్తున్న మునీశ్వరుడు నీ ఇంటిలో నీకు మనశ్శాంతి లేకుండ ఆమె శరీర ఆరోగ్యము సరిగా లేకుండ బిడ్డలు లేకుండ చేస్తున్నాడు అని తన పిశాచ యోగదర్శనము ద్వారా వివరించాడు. ఇప్పుడు నీవు రెంటికి చెడ్డ రేవడివే గాక భయంకర స్థితి నిన్ను నీ కుటుంబాన్ని ఆవరించిందని పల్కినాడు.
......
మునీశ్వరుడు నా కుల దేవుడు నేను చెట్టు మీద ప్రమాద పరిస్థితులలో ఉన్నప్పుడు నన్నెందుకు ఆదుకోలేదు అని అడిగినాను. అందుకు జవాబుగా నిరంతరము వెంకటేశ్వరుని పదిమంది ఎదుట దూషిస్తున్న నీకు బుద్ధి నేర్పుటకు మునీశ్వరుడు తపో సమాధిలో ఉన్న సమయమును ఎన్నుకొని నీ ప్రార్థనా విన్నపమును మునీశ్వరుని చెవులకు సోకనీయక జాగ్రత్త పడి నన్ను తన దారికి తెచ్చుకొన్నాడు. మరి విష్ణుమూర్తి అవతారమైన వెంకటేశ్వరుడు జిత్తులమారి కదా! మునీశ్వరుని ఎదుర్కొనుటకు వెంకటేశ్వరునికి శక్తి సామర్థ్యాలు లేవు - అందుకని యుక్తిగా నీకు బుద్ధి నేర్పుటకు నీ ప్రార్థనను స్థంభింపజేసి అనగా స్థంభన యోగము ద్వారా తపో నిమగ్నుడైన మునీశ్వరుని చెవులకు శోకనీయక జాగ్రత్త పడి నిన్ను తన దారికి తెచ్చుకొన్నాడు. అటు తర్వాత నీ ఇంటిలో తిష్ఠ వేసి ఆరాధనలు అందుకుంటున్న వెంకటేశ్వరుని మునీశ్వరుడు కాటేరు రూపము వచ్చి ఇంట ప్రవేశించగా ఆ మునీశ్వర శక్తిని ఎదుర్కోలేక కాటేరు నివసిస్తున్న ఇంటిలో తాను ఉండలేక వెలుపల నీ కొరకు సంచరిస్తు తిరుగుతున్నాడని ధనరాజుగారు తన యోగదృష్టిలో వివరించాడు.
......
కాటేరు రూపములో ఇంటిలో ప్రవేశించిన మునీశ్వర శక్తిని బంధించి సాగనంపి వెంకటేశ్వరుని ప్రతిష్టించుటకు పూనుకున్న ధనరాజుగారు అనేక ప్రయత్నాలు మంత్రాలు తంత్రాలు, తాయెత్తులు, దండలతో నా ఇల్లు ఒళ్ళు సమస్తము గుల్ల జేసి ఎంతో డబ్బు ఖర్చు పెట్టించి, దైవిక శక్తులను క్రమబద్ధీకరణ చేయలేక సంతానము కల్గించుటకు తన మంత్ర తంత్ర తాయెత్తు ప్రయోగాలు పని చేయక విసిగి వేసారి, తన తల్లిదండ్రుల ద్వారా నా భార్యకు మెడలో ధరించుటకు నాగ పట్టణ మేరీమాత స్వరూపము ఇచ్చినప్పుడు - ఆమె ఆ రోజు సాయంత్రము ఆ స్వరూపమునకు ధూపము వేసి ప్రార్థన చేసుకొని కళ్ళకద్దుకొని మెడలో ధరించింది. ఆ తెల్లవారి నిద్ర లేచినప్పుడు ఆమె ముఖమును నేను చూచినప్పుడు ఆమె ముఖములో ఒక ప్రశాంతకరమైన ప్రత్యేకమైన దైవిక కళను ఆనందకరమైన స్థితిలో దర్శించగల్గినాను. మేరీమాత స్వరూపము ధరించని ముందరి రోజులలో ఆమె ముఖము కాటేరు ప్రభావమున పాలిపోయి ఎంత తిరిగినను ఎంత పని చేసినను ఒళ్ళు చెమట పట్టదు. ఎప్పుడు ఒక రకమైన వేడితో ఆమె శరీరము ఉంటుంది. ఎంత వేసవి కాలమైనను ఆమె చెమట పోయక ముఖము కళ తప్పి ఉంటుంది. సరిగా తిండి తినడం లేదాయని బంధుమిత్రులు హెచ్చరిస్తూ ఉండేవారు. ఒక్క రాత్రిలో జరిగిన ఈ మార్పును బట్టి ఆమె ముఖ కాంతిని దర్శిస్తూ ఇట్లని ఆలోచించాను.
........
31. క్రైస్తవ మత ప్రాభవమును గూర్చిన నా ఆలోచన :- ప్రపంచ వ్యాప్తముగా విశేషముగా విస్తరించి మొదటి స్థానమును ఆక్రమించిన క్రైస్తవత్వములో ఏదో యొక దైవసత్యము ఆవరించి యుండకపోతే ఈ క్రీస్తు రాజ్యము ఇంతటి విశేష ప్రగతి సాధించలేదు. కుట్టుమిషన్ సైకిలు వగైరాలు మొదలుకొని రాకెట్ వరకు కనిపెట్టిన జ్ఞానము క్రైస్తవత్వములో ఇమిడి యుండకపోతే టీ.వి.లు, టేప్‌రికార్డర్లు, కంప్యూటర్ చిత్ర విచిత్రమైన ఆపరేషన్స్ వగైరా జ్ఞానమంతటికి క్రైస్తవులే క్రీస్తు ద్వారా జ్ఞానాన్ని పొంది నాగరికతకుగాని సమస్తమైన ప్రయాణ సాధనాలకుగాని మూలకారకులు క్రైస్తవులే అనుటకు సందేహము లేదు. ఇంతకు భారతీయులు కనిపెట్టిందేమిటంటే ఎవరికి తెలియదు. కాని భారతీయులకు తెలిసింది తక్కువ తూకాలు, నాణ్యత లోపమైన కాంట్రాక్ట్స్, రాజకీయాల ద్వారా లబ్ధి పొందటం ఎక్కడ చూచినను ఏ డిపార్టుమెంటు చూచినను లంచగొండితనము, కల్తీ సరకులు - సరకులు దాచి ఎక్కువ రేట్లకు అమ్మటం వగైరాలు మాత్రమే.
యేసుక్రీస్తు నాధుని తల్లి మేరీమాతలో ఏదో యొక దైవశక్తి దాగియున్నదని తలంచి మరియ మాతను నా హృదయములో మనస్ఫూర్తిగా ధ్యానించగా ఆ క్షణమే ఆ తల్లి యొక్క దివ్యరూప ప్రత్యక్షత స్పష్టముగా నాకు యోగ దర్శనమిచ్చింది. ఆ సాక్షాత్కారములో నా హృదయములో కొంతవరకు ఆత్మ తృప్తి కల్గి ఆమె మీద ప్రేమానురాగాలు కల్గి మానసిక ప్రశాంతత కల్గింది. అందువల్ల ఆమె స్వరూపము గల ఒక చిన్న పటమును తెచ్చి లక్ష్మీ వెంకటేశ్వర్లు వగైరా దేవతల పటముల మధ్య పెట్టి ప్రతి రోజు ఆ తల్లి యొక్క ధ్యానముతో ఆమెను యోగ దర్శనములో పవిత్రాత్మ యొక్క దివ్య మహిమను తిలకిస్తూ శాంతిని తృప్తిని పొందుచుండేవాడను.
.......
32. దద్దుర్ల రోగముతో తీవ్రమైన జ్వరముతో బాధపడుతుండగా స్వస్థపరచిన తల్లి :- ఆ రోజులలో నా శరీరము విపరీతమైన జ్వరముతో ఒళ్ళంతా దద్దుర్లతో అమ్మవారు పోసి, విపరీతమైన వేదన, జ్వర తీవ్రత ఆరాటముతో బాధపడుతుండగా నా ముఖ భాగాన తడి గుడ్డలు వేస్తూ జ్వర తీవ్రతను తగ్గిస్తుంది నా భార్య. నేను స్మారకము లేకుండ పడి యున్నాను. నా భార్య ఏదో పని మీద నా వద్ద నుంచి ప్రక్క గదిలోకి వెళ్ళింది. ఆ సమయములో పెద్దల సబ్బమ్మ అను యోగిని రూపములో మరియ తల్లి శేఖరయ్యా! అని పిలుస్తూ నా గదిలో ప్రవేశించింది. ఆమె పిలుపుకు నేను ఏ బాధ లేకుండ ఆమెను చూడగల్గినాను. ఆమె నా మంచము మీద పద్మాసనములో నన్ను ఆనుకొని కూర్చుండి నా ఛాతీ మీద చేయి వేసి, భయంకరమైన రక్త పిశాచి నిన్ను ఆవరించియున్నదని నన్ను తన హస్తముతో దిగదుడిచి లేచి నా భార్య పని చేసుకొంటున్న ప్రక్క గదిలోకి వెళ్ళింది. ఆ తదుపరి నా శరీరము నిత్య జీవితములో నేనెట్లు ఆరోగ్యవంతముగా ఉంటున్నానో అంతకంటే ఎక్కువ బలముతో లేచి తిరుగుచు, శరీరము మీదనున్న దద్దుర్లు తప్ప ఏ విధమైన బాధ, వేదన లేదు. ఇప్పుడు నా దగ్గరకు వచ్చిన ఆమె ఏది? అని నా భార్య దగ్గరకు వెళ్ళి అడిగినాను. ఎవరును నీ దగ్గరకు రాలేదు పోయి పడుకో జ్వర తీవ్రతలో కలవరించి ఉంటావన్నది. అర్థగంట క్రితము కూడా ఎవరు నా దగ్గరకు రాలేదా? అని మళ్ళీ అడిగినాను. అసలు ఉదయము నుండి ఎవరును రాలేదన్నది. కనుక ఆమె మరియ తల్లియని, ఆ రూపములో వచ్చి నన్ను మరణకరమైన రక్తపిశాచి చేతిలో నుండి నన్ను విడిపించి సంపూర్ణ స్వస్థత నిచ్చిందని అనుమానము ఉంటే నా శరీరమును పరీక్షించి చూడమన్నాను. ఆకలిగా ఉంది, ఏం కూర చేశావు? అన్నాను సాంబారు అన్నది. అమ్మవారు పోసినవారు పత్యము పాటించాలి, తినకూడదని ఆపింది. నేను ఆమె మాట వినకుండ, ఇంకేమి అమ్మవారు, మరియ తల్లి నాకు సంపూర్ణ స్వస్థత నిచ్చింది. నాకై నేనే సాంబారు చేసియున్న పచ్చళ్ళు వగైరాలతో భోజనమునకు కూర్చుండబోతుండగా విపరీతమైన జ్వరముతో ఇప్పటివరకు బాధపడుతున్న నీవు ఇవన్నియు తింటే జన్నీ ఎక్కి వెంటనే చనిపోతావని తినకూడదంటూనే ఆమె మాట వినడం లేదని చుట్టుప్రక్కల వారిని కేకలేసి పిలిచింది. నాకేమి కాదని నేను వారికి నచ్చ చెప్పుచు - నా తల్లి మరియమాత నన్ను నా ఛాతీ మీద చేయివేసి నా అస్వస్థతను తీసివేసి సంపూర్ణ స్వస్థత నిచ్చింది. నాకేమియు కాదు మీరు భయపడండని సంజాయిషీ ఇచ్చాను. ఆ దద్దుర్లు కూడా మచ్చలుతో కూడ మూడు రోజులలో మాయమైపోయాయి.
దైవకుమారుని తల్లి యొక్క ప్రేమాభిమానాలు, ఆమె యొక్క సహాయసహకారాలు తెలిసికొన్న నేను - జగత్ సృష్టికర్త యొక్క నరావతారము క్రీస్తని తెలిసికొన్న నేను ఆయన శక్తి సామర్థ్యములను సంఖ్యాకాండము 14:22లో వలె పరిశోధించి చూడాలని, ఆయన ముఖ దర్శనము పొందాలని ఆశించి శివకోటారెడ్డిగారు నాకు నేర్పించిన యోగము ప్రకారముగా దైవకుమారుని నా హృదయములో ధ్యానించాను. ధ్యానించడమే తరువాయి ఆయన వెనువెంటనే తన దివ్య ప్రకాశమైన ప్రత్యక్షతను నాకు అనుగ్రహించాడు. అంటే ఒక దివ్యమైన వెలుగు క్రీస్తు రూపము ధరించి నా ఎదుట ప్రత్యక్షమైంది. ఆ ప్రత్యక్షమైన తన దివ్య రూపాన్ని ఈనాటి వరకు ఆయన నా ఎదుట నుండి తీసివేయలేదు. నిరంతరము ఎక్కడ పడితే అక్కడ ఏ సమయమంటే ఆ సమయములో తన ప్రత్యక్షతను నా ముందు నుండి తీసివేయలేదు. నేను ప్రభువును నమ్మిన తర్వాత కూడా దుర్‌వ్యసనాలను మానుకోలేని స్థితిలో కూడా ఆయన తన ప్రత్యక్షతను ఉపసంహరించలేదు. అయితే పరీక్షార్థముగా ఒకానొక సంఘటనలో మూడు నాలుగు గంటలు మాత్రమే తన ప్రత్యక్షతను నా ఎదుట నుండి తొలగించాడు. నేను ఎంత ప్రయత్నించినను ఆయన దివ్య రూప దర్శనము నాకు కనిపించలేదు. ఆ సంఘటనను గూర్చి తదుపరి తెలిసికొందము.
ప్రభువు యొక్క దివ్యరూప ప్రత్యక్షతను నా నుండి తీసివేయనందున ఏ సమయములో నైనను ఎప్పుడు పడితే అప్పుడు ఆయనను సలహా అడిగేవాడను. ఏ ఊరికైనను పోవాలన్నను, ఎవరినైనను కలుసుకోవాలన్నను ఆయన అనుమతి తీసుకొనేవాడను. ఒకసారి రాత్రి కాలములో పరుపు మీద పండుకొని నిద్రకుపక్రమించే సమయములో ఆయనను చూచి ఒక ప్రశ్న వేశాను. ప్రభువా! నేను లోగడ చూచిన యోగదర్శనాలలో హిందూ దేవతలు, ముస్లిమ్ భక్తులు, సూర్యచంద్ర నక్షత్రాదుల వెలుగులు దర్శనమిస్తూ అందులో కూడా నేను వెలుగును దర్శిస్తూ ఆనందించేవాడను. మరి నేను లోకమునకు వెలుగును అని అన్నావు కదా! నీలోనున్న వెలుగును నాకు కనబరచుమని వెల్లకిలా పరుపు మీద పరుండే ఆయనను అడిగినాను. ఆయన ఎప్పుడు ఏ సంఘటనలోనైనా భూమికి పై భాగాన నా చూపుకు స్పష్టముగా కనబడేవాడు. ఆ విధముగానే నా ఇంటిలో నాకు ఎదురుగా పై భాగాన దర్శనమిచ్చిన ప్రభువు నేను అడిగిన ప్రశ్నకు జవాబుగా తన హస్తమును చాచి తన అరచేతిని నాకు చూపినాడు. అందుండి అద్వితీయమైన చంద్రుని కాంతి కంటే అతి ఆహ్లాదకరమైన ఆనందకరమైన శాంతిని సమాధానమును కల్గిస్తున్న ఆ వెలుగును దర్శిస్తూ ఇట్లనుకున్నాను. ఈ వెలుగును దర్శిస్తూ ఉంటే ఆకలిదప్పులు లేవు. నిద్ర లేదు శరీర బలహీనతలు లేవు. శరీరాత్మలకు విసుగు లేదు. చూస్తుంటే చూడాలనిపించే ఆ దివ్య వెలుగును చూస్తూ - ఈ వెలుగులో ఇలాగే ఈ విధముగానే నిశ్చలముగా హాయిగా ఉండిపోవచ్చును. ఏ విధమైన అభ్యంతరాలు అవాంతరాలు ఈ వెలుగు సన్నిధికి రావు. ఇంతకు పూర్వము నా గురువుగారి దగ్గర నేను సాధన చేసిన తపో యోగములోగాని ఇట్టి వెలుగును నేను దర్శించియుండలేదు. శివకోటారెడ్డిగారి యోగదర్శనములోని వెలుగు అవాంతరాలు, ఆటంకాలు కల్గించేవి. కంటిని చలింపజేస్తూ శరీరానికి వేడి పుట్టించేది. కొన్ని బలహీనతలకు దారి తీసేది. కాని ఈ వెలుగులో ఏ విధమైన చీకు చింత లోక సంబంధమైన ఆలోచనలు, శరీరేచ్ఛలు భయాలు పుట్టించేది కాదు. నేను ఆ వెలుగును దర్శిస్తుండగా క్షణక్షణమునకు ఆ వెలుగు నా శరీరాత్మలనే గాక నేనున్న గృహమును, భూమ్యాకాశాలను నింపి నిభిడీకృతమై అత్యంత దట్టముగా మారుతూ సూర్య కాంతి వలె నన్ను ఇబ్బంది పెట్టలేదుగాని చల్లని వెన్నెల కాంతి వలె ఉన్నదిగాని ఆ వెలుగులో విస్తరిస్తూ దట్టముగా ప్రసారమగుతున్న ఆ వెలుగులో నా శరీరాత్మలు నిలువలేక తేలిపోయినట్లున్నందున ఇట్లని ప్రభువుతో అన్నాను. ప్రభువా! ఇక చాలు ప్రభువా! అద్వితీయమైన నీలోని వెలుగు ప్రసారము క్షణక్షణానికి విస్తారమగుచుండగా మరి నా ఆత్మ శరీరాలు ఆ వెలుగులో తట్టుకొని నిలబడగల స్థైర్యము, తర్ఫీదు నాకు లేదు. నిజముగా లోకమునకు వెలుగు నీవే, లోగడ నేను చూచిన వెలుగులు స్థిరమైనవి కావు అస్థిరమైనవి. శరీరాత్మలకు అవి దోహదకారులు కావు. అవి ప్రకృతి సంబంధమైన వెలుగులవంటివే, నిజమైన వెలుగు నీవేయని నేను ఋజువు చేసుకొన్నాను. కనుక నా జీవితాంతము నిన్నును, నీ వెలుగును అనుసరిస్తాను. నీ వెలుగులో నిలబడగల తర్ఫీదు నాకు దయ చేయుము. అని వేడుకొనగా ఆయన తన వెలుగుతో కూడా అదృశ్యమయ్యాడు.
నేను ప్రతిరోజు పిల్లవాడు నాన్న పక్కలో పడుకొని ఆయనతో కబుర్లు చెప్పుకుంటూ నిద్రపోవుచున్నట్లే ప్రతి రాత్రి పడక మీద వెల్లకిలా పరుండి నా కెదురుగా నా పైగా ఉన్న ప్రభువుతో మాట్లాడుచు నిద్రపోయే అలవాటుంది. మరి నేటికి కూడా ఆ అలవాటు పోలేదు. ఏమి మాటలు లేకపోయినను ఆయనను నా పడక వైపుకు చేర్చుకొని ఆయన ఒడిలో నా తలను పెట్టుకొని నిద్ర పోవటం అలవాటుగా మారి ఈనాటికిని నా శరీర మానసిక స్థితులు సరిగా లేక ఏదైన నిద్ర పట్టని స్థితిలో నేను ఆయనను నా పడకకు చేర్చుకొని ఆయన ఒడిలో తలను పెట్టుకొని హాయిగా నిద్రపోతాను.
.........
33. భవిష్యత్తు తెలిపే దేవుడే నిజమైన దేవుడు :- మరియొక రోజు రాత్రి కాలములో నిద్రకు ఉపక్రమించి పడక మీద చేరి అలవాటు ప్రకారముగా ఆయనతో మాట్లాడుతూ ప్రభువా! నిజమైన దేవుడు భవిష్యత్తు తెల్పగలడు. నేను ఆరాధించిన నా పూర్వీక దేవతలందరు ఎప్పుడో జరిగిపోయినవి మరియు జరుగుచున్నవి కరెక్టుగా చెప్పుతున్నారు. మరి భవిష్యత్తు చెప్పగల దేవుడే నిజమైన దేవుడని అన్నాను. అందుకు ఆయన నాతో ఏమియు మాట్లాడక అదృశ్యమైపోయాడు. నేను సందిగ్ధముగా ఏమా! ప్రభువు మాట్లాడక అంతర్ధానమయ్యాడు. ఏమిటా! అని ఆలోచిస్తూ నిద్రపోసాగినాను. ఆ నిద్రలోని కలలో ఆకాశము నుండి వ్రేలాడుచున్న ఒక మైక్‌లాగా కనబడుచున్నది. అందులో నుండి గంభీర స్వరముతో రేడియోలో వార్తలులాగా వినబడుతున్నాయి. రాబోయే డిసెంబరు నెల మొదటి వారమంతా విస్తారమైన గాలులతో కూడిన తుఫాను, ఆగని వర్షాలు వారమంతయు ఉంటుంది. అట్లే అదే రీతిగా విడువని వర్షాలు గాలులు రెండవ వారము, మూడవ వారము, నాలుగవ వారము వరకు ఉంటుంది అని చెప్పబడిన వార్తలను విని మేల్కొని ఇట్లని ఆలోచించాను. మొదటి ఆదివారము మొదలుకొని నాలుగు ఆదివారాలు డిసెంబరు నెల అంతా ఆగని గాలులు, విడువని వర్షాలతో తుఫాను విజృంభిస్తుంది. ఆ చెప్పబడిన వార్తల ప్రకారముగా డిసెంబరు నెల ఇంకా ఏడు నెలలు ఉంది. ఆ దినములలో మొలగొలుకులు అనే ధాన్యము ఆరు నెలల పంట. డిసెంబరు నెలలో పంట ఫలింపుకు వచ్చి జనవరి సంక్రాంతి రోజులలో వరి కోతలు మొదలుపెడుతారు. డిసెంబరు నెలలో పంట బిర్రు మీదనున్న దినములలో తేలికపాటి వర్షానికి ఏమియు కాదు. జడివానలతో కూడిన తుఫాను వర్షమై విస్తారమైన ఆగని వర్షాలైతే పంట చేతికిరాక సర్వ నాశనమై పోతుంది. అయినను ఏ డిసెంబరు నెలలో కూడా ఆంధ్రప్రదేశ్‌లో విస్తారమైన వర్షాలు పడవు. పైగా తుఫానన్నది వారములో మొదటి రోజులు అల్ప పీడనముగా ప్రారంభమై వాయుగుండముగా విస్తరించి తుఫానుగా మారి చెట్లను గూల్చుచు విస్తారమైన వర్షాలతో సమస్తాన్ని తుడిచిపెట్టుక పోతుంది. అంటే మొదటి రెండు రోజులు మేఘావృతమై సన్నపాటి జల్లులతో ప్రారంభమై ఆ తర్వాత మూడు రోజులు ఉధృతమై తుఫానుగా మారి జలప్రవాహాలతో ముంచెత్తి ఆ తర్వాత రెండు రోజులు చిరుజల్లులతో చిరుగాలులతో తన ఉగ్రత తగ్గించుకొని మటుమాయమౌతుంది. అయితే ఇటువంటి తుఫాను ఆగకుండ సముద్ర మధ్యములో స్టడీగా నిలిచి నాలుగు వారాలపాటు ఏకధాటిగా తుఫాను క్రియ జరిగిస్తుందంటే ఇది నమ్మదగినది కాదు. అలా జరిగినట్లయితే రాష్ట్ర ప్రజలు అతి భయంకరమైన దారుణమైన దుస్థితి నెదుర్కొంటారు. కనుక ఇది జరుగదు గాక జరుగదని తీర్మానించుకొని ఆ యొక్క సమాచారాన్ని కొన్ని రోజులలోనే మరచిపోయాను.
భవిష్యత్తు తెలిపే దేవుడే దేవుడన్నందుకు ముఖాముఖిగా చెప్పక ఆకాశ మార్గము నుండి స్వప్న రూపములో వార్తలందించుటలో నేను ఆయన మాటలు నమ్మనని పై పెచ్చు తర్కిస్తానని, ఒకవేళ డిసెంబరు నెలలో తుఫాను ఉండవచ్చునేమోగాని నాలుగు వారాల పాటు ఎడతెగక తుఫాను రాష్ట్రము మీద దాడి చేయదని ప్రభువుతో తర్కవితర్కాలు పెట్టుకుంటానని తెలిసియే ఆయన స్వప్న రూపేణా నాకు తెలిపినాడనుకున్నాను. ఆకాశము నుండి విన్పించే ఆ స్వరము జలజల ప్రవహించు సెలయేరు వలె ప్రవాహ శబ్దమును పోలి వింతగా వినపడింది. కాని ఈ తుఫాను వాతావరణము ఎట్టి పరిస్థితులలోను జరగదని తీర్మానించుకొన్నాను.
నేను పని జేసే స్కూలు స్టోన్‌హవుస్‌పేటలోని పప్పుల వీధిలో ఉంది. ఆ వీధిలోనే ఒక శెట్టిగారి మిద్దె మీద చిన్న గదులు రెండు తీసుకొని నేను నా భార్య అద్దెకు ఉంటున్నాము. నేను పని జేసే స్కూలులో ఇద్దరు ఉపాధ్యాయినిలు మద్రాసు బస్టాండు దగ్గరనున్న వై.యమ్.సి.ఎ. గ్రౌండ్స్‌లోని లూథరన్ చర్చీకి వెళ్ళేవారు. వారితో నాకు పరిచయము ఉంది గనుక పైగా క్రైస్తవ సంఘాలలోని శాఖా బేధాలు నాకు తెలియవు గనుక వారు వెళ్ళే లూథరన్ చర్చీకి వెళ్ళేవాడను. వార్తలలో చెప్పినట్లే డిసెంబరు నెల మొదటి ఆదివారము వచ్చింది. ఆ రోజు ఇంచుమించు రెండు కిలోమీటర్ల దూరములో ఉన్న చర్చీకి వెళ్ళటానికి ముందుగా సిద్ధపడి ప్రయాణమైనప్పుడు ఆకాశము మంతా మేఘావృతమై యున్నది. కాని గాలిగాని, వాన తుంపరలుగాని లేదు. తిరిగి వచ్చేటప్పుడు వర్షము ప్రారంభమైతే రిక్షా ఎక్కవలసి వస్తుంది. వర్షములో రిక్షా వాళ్ళు ఎక్కువ చార్జీ అడుగుతారు. ఈ పరిస్థితులలో చాలీచాలని జీతము ఆర్థిక ఇబ్బందులలో ఉన్న నేను ఆ బాడుగను భరించలేనని గొడుగు ఒకటి చేత పట్టుకొని నడుస్తూ చర్చీకి వెళ్ళినాను. నా భార్య ఆ దినము వరకు ప్రభువును నమ్మలేదు గనుక చర్చీకి రావడం లేదు. చర్చీలో పాటలు పాడి ప్రార్థన కార్యక్రమాలతో ఆరాధన మొదలుపెట్టినారు. కాసేపటికి ఒక అతి భయంకరమైన గాలి ఉన్నట్లే ఉండి చర్చీని చుట్టుముట్టి తలుపులను కిటికీలను గడగడలాడించి కొట్టుతుండగా వర్షపు జల్లులు కూడా ప్రారంభమైనాయి. అక్కడ కూర్చున్న విశ్వాసులు గబా గబా లేచి తలుపులు, కిటికీలు, గొళ్ళెములు బిగించి అవి గాలికి కొట్టుకోకుండ ఆపుజేయగల్గినారు. బయట హోరుగాలి వర్షము. లోపల కాండిల్స్ వెలుగులో ఆరాధన జరుపుచు పాస్టరుగారు బోధిస్తున్నారు. ఆ సమయములో నాకు కలలో ఆకాశము నుండి విన్పించిన వాతావరణ వార్తలు నేను జ్ఞాపకము చేసుకొని ప్రభువు విన్పించినట్లే ఇది డిసెంబరు నెల మొదటి ఆదివారము కరెక్టుగా గాలితోను వర్షముతోను ప్రారంభమైంది. మిగతా మూడు వారాలు ఆగని స్థితిలో గాలివానలు విజృంభించవని ఎట్లా చెప్పగలము? ఆయన ఏడు నెలల క్రితము చెప్పిన రోజే కదా ఇది. ఆయన చెప్పినట్లే ప్రారంభమైన ఈ దినము మొదలు ఎట్లా ఉంటుందో పరీక్షిస్తామని అయినను వేచి దైవక్రియను చూస్తామని ఆలోచించాను. కాని ఈ విసరుచున్న గాలివానకు చేతిలో గొడుగు నిలువదు. ఆర్థిక ఇబ్బందులు, చాలీచాలని జీతాలు వల్ల జేబులో డబ్బులు పుష్కలముగా లేవు. ప్రస్తుతము నేను రెండు కిలోమీటర్లు నడిచి ఇంటికి వెళ్ళలేను. ఆ రోజులలో టౌన్ సర్వీసు బండ్లు సరిగా లేవు. చర్చీలోనే ఉండి గాలివాన ఆగినదాకా ఉండి నిదానముగా వెళ్ళవచ్చులే అనుకుంటే ఏడు నెలల క్రితము ఆయన చెప్పిన భవిష్యత్తు దినము ఇదే. వాతావరణము ఉధృతమగుతుందేగాని తగ్గలేదు. ప్రస్తుతము నేను ఇంటికి ఎట్లా వెళ్ళాలో అర్థము కాలేదు. ప్రభువు చెప్పిన వాతావరణాన్ని పరీక్షించాలంటే ప్రస్తుతము నేను ఈ గాలి వర్షములో ఇంటికి వెళ్ళాలి. ఆ రోజులలో ఆటోలు కంటే రిక్షాలే ఎక్కువగా తిరిగేవి. గాలివానలో వాళ్ళు రేటు ఎక్కువ అడుగుతారు. ఇంటికి ఎలా వెళ్ళాలో అర్థము కాలేదు. విశ్వాసులు వారి ప్రార్థనలలో ఆరాధనలో నిమగ్నమై ఆరాధనా కార్యక్రమాన్ని జరిగిస్తున్నారు. వారి ప్రసంగాలతో సంగీతము పాటలతో ప్రార్థనలలో నా మనస్సు ఏకము కాలేదు. కాని నా మనస్సులో ఈ తలంపులు నిండుకొనియున్నందున కనీసము అంత దూరము ఇంటికి వెళ్ళే మార్గము లేనందున ప్రభువును ఈలాగున మనస్సులోనే ఆయనతో మాట్లాడినాను. నేనెప్పుడు ప్రభువుతో మనస్సుతోనే మాట్లాడుతాను. కాని నోరు తెరచి ఇప్పుడు ఎప్పుడు కూడా మాట్లాడలేదు. అది యోగవిద్య ద్వారా నాకు వచ్చిన వాడుక. పైగా ఆయన దివ్య స్వరూపము ఎల్లప్పుడు నా ఎదుట నిలిచి ఉంటుంది. ఆయనతో ఈలాగు మనస్సుతో మాట్లాడినాను - ప్రభువా! నీవు చెప్పినట్లుగానే భవిష్యత్తులో జరుగబోవు వాతావరణము ఏడు నెలల క్రిందట ఉదయ కాలము నుండే మేఘావృతమై గాలితోబాటు వర్షము పడుట చూస్తున్నాను. ఈ చర్చీ వదలిన తర్వాత నేను ఇంటికి చేరే దారి లేదు. నా చేతిలోని గొడుగు ఈ ఉధృతమైన గాలిలో నిలువదు. ప్రభువా! నీవు లోకరక్షకుడవని లోకాన్ని రక్షించుటకేగాని శిక్షించుటకు రాలేదన్నావు. దేవుడు లోకమునెంతో ప్రేమించి యున్నాడని గ్రంథము ద్వారా విశ్వాసులు చెబుతుండగా వినియున్నాను. ఆ మాట ఈనాడు నా నిమిత్తము రాష్ట్ర ప్రజల మేలు నిమిత్తము ఆపు చేయగల సమర్థుండవు. నీవే గనుక ఈ చర్చీ వదలి నేను ఇంటికి బయలుదేరు సమయములో నా చేతిలోని గొడుగు వాన నిమిత్తముగా తెరచి పెట్టుకోకుండ, సుడిగాలి విసరనీయక గాలివానలను ఆపమని నేను మీకు విన్నవించు కుంటున్నాను. లోకరక్షకుడవన్న మాట నీ పక్షముగా నీవే ఆ మాటను నిలబెట్టుకో! అని నా ప్రార్థనలో ఆయనతో విన్నవించుకొన్నాను. నేను చర్చీలో ఉన్నంతసేపు ఆయన దివ్యమూర్తిని ఆత్మ ప్రత్యక్షత ద్వారా ఆనందిస్తూ నా హృదయమును ఆయన ఎదుట పరచి పెట్టుకొన్నాను. చర్చీలో పాడిన పాటలు వారి ఆరాధన, వారి ప్రసంగాలు వైపు నా మనస్సు చోటు చేసుకోలేదు గాని ప్రభువు యొక్క దివ్య సుందరమూర్తిని తిలకిస్తూ ఆయనను ఆవరించియున్న మహిమాన్వితమైన వెలుగును సందర్శిస్తూ ఆయనతో నేను నాలో నేను తర్కించుకొన్న విధానము. ఆరాధన సమయము ముగించబడింది. అందరు బయటకు వస్తున్నారు. వర్షము ఆగిపోయి ఉంది. నేను ఆకాశము వైపు చూశాను. కాని ఆకాశమంతయు భయంకరమైన కారుమేఘాలు అతి దట్టముగా ఆవరించియున్నాయి. ఎప్పుడెప్పుడు పెద్ద వర్షము పడుతుందేమోనని బిక్కు బిక్కుమంటూ ఆకాశము వైపు చూస్తూన్నాను. గాలి విసరనీయక వాన పడనీయక గొడుగు తెరచి పట్టకుండా నేను కోరుకున్నట్లుగానే ప్రేమామయుడు తండ్రియైన ప్రభువు నన్ను ఇంటికి నడిపినాడు. షుమారు సాయంత్రము లోపల ఆకాశమును ఆవరించియున్న ఆ దట్టమైన సూర్యకాంతిని చొరనీయని ఆ నల్లని మేఘాలు తొలగిపోయి ప్రశాంత వాతావరణము ఏర్పడింది.
ఇప్పటికి నాకు గుణపాఠము కలిగి ప్రభువును ప్రయోగాత్మకముగా పరీక్షించి శోధించి ఆయనే నిజ దైవమని సృష్టికర్తకు ప్రతిరూపమని, వేరే దేవుడు దేవత లోకములో లేరని, అవియన్నియును మానవ కల్పితములైన విగ్రహాలు, పుక్కిటి పురాణాలని అవి ఒకదానికొకటి పొత్తు కుదరవని, తమ నైపుణ్యము చేత శిల్పులు చెక్కిన విగ్రహాలేయని, అవి యదార్థము గావని దృఢపరచుకొని, ఆయన ఆత్మ దర్శనముతో నిరంతరము ఆనందించుతూ - ఒకనాడు ఇంటి దగ్గర భోంజేసి కుర్చీలో కూర్చుని విశ్రాంతి పొందుచు ఆయన దివ్యమూర్తి వైపు చూచి ప్రభువా! నీవే లోకరక్షకుడవని సృష్టికర్తకు ప్రతిరూపమైన నరావతారమని నేను తప్ప వేరే దేవుడు లేడని, నేను చిన్నతనము నుండి ఆకాశము వైపు చూస్తూ సమస్తాన్ని సృష్టించి ఏలుచున్న దేవుడు అని నన్ను జ్ఞాపకము చేసుకొంటున్న దేవుడను నేనేనని నా నామము ఎరుగనప్పుడు అదృశ్యములో ఉన్న దేవుని ఆకాశము వైపు చూచి నమ్మినానని, చూడక నమ్మినావు కనుక నీవు ధన్యుడవు - మరి ఈనాడు నా నామము నెరిగిన నీకు నా ప్రత్యక్షత నా దివ్యమైన మహిమను రూప సహితముగా నీ ఎదుట నుండి తొలగించనని నాకు వాగ్దానము చేసినట్లుగా నిరంతరము లోకము, లోకస్థులతోబాటు నీవు నా ఎదుటనే ఉంటున్నావు గనుక నిన్ను నిరతము ప్రతి సమయములోను నా ఎట్ట ఎదుట నిన్ను దర్శిస్తూనే ఉన్నాను. నీ దివ్య రూపాన్ని నా దృష్టి నుండి ఎన్నడును తొలగించలేదు. నేను అన్య జీవితములో అలవాటైన వ్యసనాలు త్రాగుడు, వ్యభిచారము, జూదము వగైరాలలో కూడా నీవు నన్ను అసహ్యించుకోక ఒక తండ్రి తన బిడ్డను ప్రేమించిన దాని కంటే నా ఎదుట కోపమన్నది ప్రదర్శించక నీ దివ్య రూపాన్ని నా ఎదుట నుండి తొలగించక పోవుటలో నీ దీర్ఘశాంతము, తరిగిపోని అద్వితీయమైన ప్రేమను బట్టి నీ దివ్యమూర్తియైన దేవుని మహిమ ఎదుట నేను నిలబడుటకు నాకు యోగ్యత లేదు. కాని నిన్ను నీవు పాపి కొరకు సమర్పించుకొన్నట్లుగా ఋజువు చేసుకొంటూ నిన్ను తెలుసుకొని కూడా నీ నామమును అంగీకరించి కూడా నా ఎదుట నుండి నీ ప్రత్యక్షతను తొలగించలేదు. అయితే ప్రభువా! ఈ దినమున నేను నిన్ను ఒక మాట అడుగుచున్నాను. అదేమిటంటే జగత్ సృష్టికర్తకు ప్రతిరూపము నేను - నేను తప్ప వేరే దేవుడు రక్షకుడు లేడని పరిశోధనా పూర్వకముగా నాకు నిరూపించావు. కాని నీ మాటలుగా చెప్పబడిన పరిశుద్ధ గ్రంథమును బైబిలును నేను ఆదికాండము ఒకటి రెండు అధ్యాయాలు చదివినప్పుడు, సర్పము మాట్లాడిందని, ఆదాము ఎముకతో స్త్రీ నిర్మించబడిందని వ్రాయబడి ఉంది. ఈ వచనాలను గూర్చి నేను ఆలోచించినప్పుడు నా పూర్వీక జీవితములో పుక్కిటి పురాణాలుగా ప్రసిద్ధి చెందిన మా దేవతల గ్రంథములో ఇటువంటి అంశాలు కోకొల్లలుగా ఉంటాయి. నాకు ఇటువంటి మాటలు చదవటం నాకు సహించదు. నీవరకు నీవు దేవుడవని నా ఎదుట నిరూపించావు కనుక నిన్ను మాత్రము నా హృదయము నుండి ఏ పరిస్థితులలోను తొలగించుకోను. నిన్ను విడిచి ఏ క్షణము కూడా నేనుండలేను. నా హృదయము అంతరాత్మలలో ముద్ర వేయబడిన దేవుడవు నీవే - కాని నీ పరిశుద్ధ గ్రంథమని చెప్పబడిన ఈ బైబిలు గ్రంథమును నేను చదవనే చదవను. నేను ఆ గ్రంథమును ఇక మీదట తాకనే తాకను. నేను ఆ గ్రంథాన్ని మనస్ఫూర్తిగా చదవాలంటే, నేను చదువుతున్నప్పుడు వాక్యములకు అర్థము చెప్పగల అందులోని అంతరార్థములను ఎరింగించగల్గిన ఆత్మను నా చెంత ఉంచినట్లయితే నేను చదువుతాను. కాని అట్లు లేనట్లయితే నీ నామముతో ప్రత్యక్షతలతోనే నేను సరిపెట్టుకొంటాను. నీ గ్రంథము అందులోని విషయాలతో నేను జోక్యము చేసుకోనని ప్రభువుతో ఖరాఖండీగా మాట్లాడినాను. ఆ మాటలతో ప్రభువు ఏమనుకున్నాడో ఏమో జవాబు చెప్పకనే అదృశ్యమయ్యాడు. నేను ఇన్ని గ్రంథాలు వ్రాయుటలో ఇది యొక కారణముగా చెప్పవచ్చును.
........
ప్రభువును మనస్ఫూర్తిగా పరిశోధించి పరీక్షించి హృదయములో చేర్చుకొన్న ప్రారంభ దినములలో ఒకసారి నేను బిషప్పు హౌస్ ఆవరణములో ఫ్రంటు గేటునకు ఎదురుగానున్న ప్రభువు యేసు సిలువ స్వరూపము నిలబెట్టబడి యుండుట చూచి, ఆ సిలువ స్వరూపములో వ్రేలాడుతు సిలువకు కొట్టబడిన ప్రభువు పాదములు పట్టుకొని తల ఆ పాదములకు ఆనించి ప్రభువును హృదయములో ధ్యానిస్తూ ఈ విధముగా నా గోడు వెళ్ళబుచ్చుకొన్నాను. ప్రభువుతో మాట్లాడుచు ప్రభువా! నేను బంధువర్గములో తృణీకరింపబడినాను. పైపెచ్చు దుర్వ్యాసనాలు నన్ను వదలలేదు. ఏ విధమైన ఆధిక్యతలు గాని, డిగ్రీలు హోదాలు గాని గౌరవనీయమైన విద్యా ఉద్యోగాలు గాని ఏవియు లేవు. ఇకమీదట నేను నా వ్యసనాల నుండి బయటపడి సంఘములో గుర్తింపబడగలనను ఆశ ఏ మాత్రము లేదు. నేను తల్లి గర్భము నుండి ఈ లోకములో జన్మించిన ఈ జీవితము నిష్ప్రయోజనము కాకుండ, ఈ లోక జనులు నా నామమును జ్ఞాపకపరచుకొనునట్లు నా పేరు మీద ఏదైనను ఒక మంచి కార్యము చేయమని, ఆయనను అభ్యర్థిస్తుండగా ఎట్ట ఎదురుగా చూచేవాళ్ళకు సిలువ వేయబడిన ప్రభువేగాని నేను ఆయనను స్మరిస్తూ విన్నవించుకొను మాటల సమయములో తన ఆత్మ ప్రత్యక్షతను ముఖాముఖిగ నాకు అనుగ్రహించి, తండ్రి తన బిడ్డను ఓదార్చి కోరిన కోర్కెలు తీర్చు విధముగా ఆయన పాదములు పట్టుకొని విడువక ప్రార్థిస్తున్న నన్ను ఆయన తన హస్తమును చాచి నా తల నిమురుచు, నా వీపు భాగాన వెన్నుపూస ప్రాంతమంతయు నా వీపునంతయు తన చేతులతో నిమురుతు, ఒక పసిబిడ్డను తండ్రి ఓదార్చుచు ఆప్యాయముగా దువ్వుచు బుజ్జగిస్తున్నట్లుగా ఆయన నన్ను తన హస్త స్వర్శను బట్టి నా తల నుండి వీపు దువ్విన విధానమును బట్టి నా విన్నపమును ఆయన అంగీకరించినట్లుగా తలంచాను.
.......
34. ఆయన హస్త స్పర్శ యొక్క అనుభూతి ఎటువంటిది? :- ఆ ఆనందానుభూతిని నేను ఈ గ్రంథములో చెప్పుటకు మన మాటలు చాలవు. నఖశిఖపర్యంతము ఉజ్జీవింపబడి ఒక క్రొత్త ఆనందాన్ని కల్గించింది. మానసికముగా శాంతి సమాధానమును కల్గించుటయేగాక తన హస్త స్పర్శతో పులకించిన నా శరీర ఆత్మలు మనస్సు పొందిన ఆనంద పారవశ్యము లోక సంబంధమైన వాటికి పోల్చి చెప్పజాలము. తల్లిదండ్రులు బిడ్డను కౌగిలించి ముద్దు మురిపములు తీర్చే సమయములో ఆ బిడ్డకు కలిగే ఆనందము వంటిది కాదు. పురుష స్పర్శ ఎరుగని కన్నెపిల్ల తాను మిక్కిలిగా ప్రేమించిన యువకుడు మొదటిసారిగా తన మీద చేయి వేసి గాఢముగా ఆలింగనము చేసుకొన్నప్పుడు, ఆ కన్నెపిల్లకు కలిగే నూతన ఆనందము అనుభూతి నరనరాలలో ఆమె పొందే ఉద్రిక్తత వంటిది కాదు. ఆయన హస్త స్పర్శ యొక్క అనుభూతి ఉజ్జీవము లోక సంబంధమైన వాటితో పోల్చి చెప్పడము కుదరదు. ఆ దివ్యానుభూతి ఆ మధుర స్మృతులు చెప్పుటకుగాని వ్రాయుటకుగాని మాటలు చాలవు. అది ఆత్మల ఆనందమని నేను గ్రహించాను. అందుకే పౌలు అంటున్నాడు 2వ కొరింథీ 12:4 వచింప శక్యము గాని మాటలు ప్రకటన 14:13 ఎవరు పాడలేని క్రొత్త కీర్తన, ఎవరు ఊహించలేరు. చెప్ప శక్యముగాని ఆయన హస్త స్పర్శలోని మధురానుభూతి అందలి ఉజ్జీవమును గూర్చి నేను సూచాయగానైనను చెప్పనశక్యము. ఆ అనుభూతిని పొందినవానికేగాని మరెవరికిని తెలియదు. ప్రభువు యొక్క హస్త స్పర్శలోని మాధుర్యమును ఆయన కౌగిలిలోని ఆత్మోజ్జీవమును పాఠకులైన మీరు పొందాలంటే మనమున్న తల్లి సంఘము నుండి రానున్న ప్రభువు రాకడలో ఎత్తబడే వధువు సంఘములో మనము చేర్చబడి ప్రకటన 21:2-4లో వలె ప్రభువును మనము కలుసుకున్నప్పుడు - ఆయన హస్తముతో మన న్నుల బాష్ప బిందువును తుడిచివేసి ఆయన మనలను ఆలింగనము చేసికొన్నప్పుడు ఆ దివ్యానుభూతిని చిరస్థాయిగా ఆత్మోజ్జీవము మనతోనే ఉంటుంది. ప్రభువు నా చేత ఈ దైవిక మర్మాలతో కూడిన పుస్తకాలు వ్రాయించుటకు ఇది కూడ యొక సరియైన కారణమని చెప్పవచ్చును.
......
35. ఈ గ్రంథాలు ప్రభువు నా చేత వ్రాయించుటలో మరో ముఖ్యమైన మూడవ కారణము కూడా ఉంది. :- ప్రభువును ప్రయోగాత్మకముగా పరీక్షించుటకు ఆయన అంగీకరించినందున ఆయనే నిజ దైవమని, సృష్టికర్తకు ప్రతిరూపమని దృఢపరచుకొని ఆయన ప్రత్యక్షతతోను ఆయనతో ముఖాముఖి సంభాషణలతోను ఆనందిస్తూ - ప్రతి విషయములో నా సందేహాన్ని తీర్చుకుంటూ ప్రభువునే సర్వస్వమని నమ్మిన తొలి రోజులలోనే నూతన సంవత్సరము జనవరి ఒకటవ తేదీ వచ్చింది. ఆ దినమున నేను ఇంటి దగ్గర ఉదయ కాలమున నా కార్యములు ముగించుకొని సమాధానముగా కూర్చుని ప్రభువు తట్టు చూచి ఈ విధముగా ఆయనతో చెప్పుకొన్నాను. నిన్ను మనస్ఫూర్తిగా విశ్వసించిన తర్వాత వచ్చినదే ఈ నూతన సంవత్సర ప్రారంభ దినము. ఈ నూతన సంవత్సరములో నేను నీ కొరకు ఏదైనను పని చేయాలని ఉంది. మీ నోటి ద్వారా ఆ పనిని నాకు వివరించమని కోరినాను. ఆయన వెంటనే ఈ మాటలు చెప్పాడు.
నేనే నిజ దైవమని గుర్తించావు. నా ద్వారా నీవు పొందిన ఉజ్జీవము శాంతి సమాధానమును గూర్చి నీ అనుభవ సాక్ష్యము కరపత్రము ద్వారా ప్రకటించమని ప్రభువు సెలవిచ్చాడు. ఆ మాటలు విన్న నేను - ఇట్లని ఆలోచించాను. ''నేను ప్రభువులో పొందిన శాంతిని తృప్తిని సమాధానమును గూర్చి కరపత్రముగా వ్రాసి పంచినంత మాత్రాన లోక జనాంగమునకు బుద్ధి రాదు. వారు క్రీస్తును అంగీకరించే స్థితి రాదు. కాబట్టి ప్రభువు యొక్క గొప్పతనమును వివరిస్తూనే అన్య మతాలలోని దుర్మార్గతను, కల్పితములను, దైవమను పేరుతో చేసే దురాచారాలను ఎత్తి చూపాలని లేకపోతే జనులకు క్రీస్తును గూర్చిన ఔన్నత్యము తెలిసి రాదని నేను ప్రభువు వివరించిన మార్గమును ప్రక్కన పెట్టి నా స్వంత ఆలోచన చేసి, మతాలలోని లోప భూయిష్టమైన నిరాధారమైన వాటిని ఎత్తి చూపుచు, ప్రభువు యొక్క గొప్పతనమును గూర్చి బైబిలులోని ప్రభువు మాటలను అందులో జోడిస్తూ సత్య మత నిరూపణ అను పేరుతో నాలుగు భాగములు గల చిన్న పుస్తకాలను ప్రింటు చేసి పంచటం జరిగింది. ప్రభువు యొక్క గొప్పతనమును గూర్చిన బైబిలు మాటలను అందులో జోడిస్తూ సత్య మత నిరూపణము అను పేరుతో ఒక చిన్న భాగముగా భగవద్గీతను గూర్చి ఆ గ్రంథమును ప్రబోధించిన శ్రీకృష్ణ అవతారము, ఆయన కార్యాలను గూర్చి మొదటి భాగముగా ఒక చిన్న పుస్తకముగా ప్రింటు చేసి అక్కడక్కడ పంచడం జరిగింది. రెండవ భాగ పుస్తకముగా ఖురాన్ షరీఫ్ లోని మత సిద్ధాంతాలను మహమ్మద్ ప్రవక్త యొక్క జీవితాన్ని గూర్చి ఎత్తి చూపుచు సత్య మత నిరూపణము అని రెండవ భాగము ప్రింటు చేశాను. నేను పని చేస్తున్న రంగనాయకుల పేట ఎలిమెంటరీ స్కూలు ముస్లిమ్ కుటుంబాల మధ్య ఉంది. ఎక్కువగా ఆ ముస్లిమ్ సోదరులు ఆ గ్రంథమును చదివి, మొదటి పేజీ ప్రారంభము నుండి లగాయతు ఆఖరు వరకు ఉత్కంఠభరితముగా ఉందనియు కడవరకు చదవందే మనస్సు నిలుపలేక పోయినామని కొందరు సాక్ష్యమిచ్చారు. ఇందులో తప్పు పట్టలేని విధముగా ఋజువు పరచినావన్నారు. మరికొందరు క్రైస్తవ ఫాస్టర్లు బోధకులకు ఇచ్చినప్పుడు ఖురాన్ గ్రంథమును గూర్చి మహమ్మద్ ప్రవక్తను గూర్చి నీవు రాసిన అంశాలు చదువుతుంటే మాకే హృదయ విదారకముగా ఉన్నాయి. వారి హృదయాలు ఎంత గాయపడతాయో క్రైస్తవులమైన మేమే ఓర్చుకోలేని స్థితిలో ఉన్నాయని గ్రంథము చదివినవారు సాక్ష్యమిచ్చారు. ఇవి తిన్నగా అనేకుల చేతుల నుండి మారుచు వారి మత పెద్దలు రాజకీయ నాయకులైన ముస్లిమ్‌ల దాక వెళ్ళినవి. ఈ పుస్తక రచయితను భూమి మీద లేకుండ తుద ముట్టించకపోతే మహమ్మద్ ప్రవక్తకు పవిత్రమైన ఖురాన్ గ్రంథానికి కళంకము ఏర్పడి సదాకాలము నిలబడిపోతుందని గ్రహించినవారై నెల్లూరు టౌనులోని అన్ని చోట్ల ఉన్న రౌడీలకు ఎక్కడ కనపడితే అక్కడ చంపి వేయమని హుకూం జారీ చేశారు. ఈ విషయము తెలియని నేను రంగనాయకుల పేట స్కూలు నుండి రైల్వే గేటు దాటి పప్పుల వీధిలో నేను కాపురముంటున్న గృహమునకు నడిచి వస్తుంటే, రైల్వే గేటు దాటగానే చిన్న టీ దుకాణము దానిని ఆనుకొని లోపలికి ఒక పూరి ఇల్లు ఉన్నది. ఒకతను నన్ను పిలిచి నీతో కొంచెము మాటలాడవలెనని టీ దుకాణము లోపలిగా ఉన్న పూరిల్లు లోపలికి నన్ను తీసుకొని వెళ్ళినాడు. ఏమిటా? అని లోపలికి పోయాను. అక్కడ ముగ్గురు రౌడీలు నన్ను పట్టుకొని ఇంకను లోపలికి ఈడ్చి వెల్లకిలా క్రింద పడవైచి నలుగురు నా మీదకు వంగి ఒకరి తర్వాత ఒకరు పిడిగుద్దులతో నా గుండె భాగము, ఛాతీ మీద గుద్దుచు కొన్ని గుద్దులు కొట్టి నా ముఖము మీద నోటి మీద గాయాలయ్యాయి. మ్కు నోట రక్తము స్రవించసాగింది. ఈ రోజుతో నా జీవితము సమాప్తమని నేను మనస్సులో తలంచినాను. వారు గుద్దిన పిడిగుద్దులకు మ్కు నోట రక్తము గ్రక్కుట ప్రారంభించాను. కొన్ని దెబ్బలు ముఖము మీద తగిలినాయి. వారు ఇతని జీవితము సమాప్తమని వీడిక బ్రతికే ఛాన్స్ లేదని వారి భాషలో చెప్పుకుంటూ విడిచి వెళ్ళినారు. అక్కడ నేను పడియున్న వసారా ఎదురుగా ఒక వ్యక్తి నాకు తెలిసిన క్రైస్తవుడుగా కనపడి నన్ను లేవదీసి రక్తము తుడిచి రిక్షా ఎక్కించి నన్ను ఇంటి దగ్గర దింపి వెళ్ళిపోయాడు. ఆ మరుసటిరోజు సెలవు. ఆ మూడవ రోజున తిరిగి స్కూలుకు వెళ్ళినాను. ఒళ్ళంతయు పుండయినట్లు చాలా బలహీనముగా ఉంది. స్కూలుకు వెళ్ళి మధ్యాహ్న సమయములో ఇంటికి వస్తున్నాను. నాతోపాటు పని చేసే పంతులమ్మలున్నారు. ఆ వీధి నిండా ముస్లిమ్‌లు ఆడ మగా పోగై నన్ను నిలదీసి నానా మాటలు తిడుతున్నారు. ఒకడు ఈడ్చి నా చెంప పగుల కొట్టినాడు. నాతో కూడా ఉన్న పంతులమ్మలు అడ్డుకొన్నందున ఇది సమయము కాదని వేరే సమయమున్నదని వారు చెప్పుకొని వెళ్ళిపోయారు. ఏదో పని మీద మానెగుంటపాడులో నివసిస్తున్న నా చిన్నమ్మ శంకరమ్మ గారి భర్త నా ప్రక్కన దూరముగా ఉండి నన్ను చూస్తూ ఏం జరిగిందో ఏమో నేను వెళ్ళి శేఖరయ్యను పలకరిస్తే ఏమవుతుందోనని నన్ను పలకరించకనే దూరముగా ఉండి కొంత సేపయిన తర్వాత వెళ్ళిపోయాడు. నేను ఇంటికి వెళ్ళి నా భార్యను తలుపు తాళము వేసుకొని నీ పుట్టింటికి వెళ్ళిపో - నేను నా స్వగ్రామము రెడ్డిపాళెము వెళతాను. జరిగినదంతయు చెప్పి ప్రస్తుతానికి ప్రాణాలు దక్కించుకొందము. నా మీద కోపముతో నిన్ను కూడా చంపుతారు,'' అని చెప్పి బలవంతముగా ఆమెను పంపివేసి నేను రెడ్డిపాళెము వెళ్ళినాను. నా తల్లి నన్ను చూచి ఏమిట్రా ఆ ముఖము మీది గాయాలని అడిగింది. ఈ జరిగిన యదార్థ సంఘటన చెపితే ఆమె కంగారు పడుతుందని సైకిలు మీద వెళ్ళేటప్పుడు యాక్సిడెంటు జరిగి చిన్న గాయాలయ్యాయే తప్ప ఏమి పరవాలేదని అబద్ధము చెప్పి ఆమెను నెమ్మది చేశాను. ఆమె ఇంటి ముందు వసారాలో మంచము వాల్చి మడిచి పెట్టిన పరుపును దాని మీద పెట్టి నన్ను ఆనుకొని కూర్చుని విశ్రాంతి తీసుకోమంది. నేను ఆ పరుపు మీద వెల్లకిలా ఆనుకొని వసారా పైకి చూస్తూ ప్రభువును ఈ విధముగా అడిగినాను. ప్రభువా! నీవు చెప్పినట్లు చేయలేదు. అతిగా వ్యవహరించాను. జరిగిందేదో జరిగిపోయింది. సాతాను నీ రూపములో వచ్చి నన్ను ఇంకను పెడదారి పట్టించనీయక వానిని అదుపు చేసి, నేను చేయవలసిన పని ఏమిటో ఒక మాట మాత్రముగా సెలవిమ్మని విన్నవించుకున్నాను. ఆ మాటలకు నాకు కనబడిన ప్రభువు యొక్క ముఖకవళికలు నాకే ఆశ్చర్యం కల్గించింది. నేను పడే బాధ ఆవేదన కంటే నన్ను గూర్చి ఆయన పడుతున్న ఆవేదనను ఆయన ముఖములో స్పష్టముగా కనపడినందున నన్ను హింసించిన ఆ భయంకరమైన హింస ఆయన పొందినాడా? అన్నట్లుగా నన్ను గూర్చి ఆయన కెందుకు అంత వేదన అంత బాధపడడము అని అనుకొంటుండగా ఆయన నోట నుండి నాకు వచ్చిన జవాబు ఏమిటంటే - నీవు ఎక్కడ నుండి వచ్చావో అక్కడకే వెళ్ళు! అని చెప్పి ఆయన అదృశ్యమయ్యాడు. కన్న తల్లి బిడ్డ దుస్థితిని చూచి ఏడ్పు ముఖము పెట్టుచున్నట్లుగా ఆయన ముఖ దర్శనము నాకు కనబడింది. ఆయన ముందు నేను చేసిన ప్రార్థనలో ఒక ప్రత్యేకమైన ముందు జాగ్రత్త మాట యొకటి ఆయనతో చెప్పినాను. అదేమిటంటే నీ రూపములో అపవాది వచ్చి నీవు లేనప్పుడు నన్ను మభ్యపరచి మోసపరచకుండునట్లు వానిని అడ్డగించి, నీవే ఒక మాట మాత్రము సెలవిమ్మని అడుగుటలో - ప్రభువును నమ్మిన ప్రారంభ దినాలలో ప్రభువు నాతో మాట్లాడి వెళ్ళిన పిమ్మట కొంతసేపటికి అపవాది వచ్చి తాను ప్రభువులాగానే కనపడి నాతో మాట్లాడి కొన్ని అవాంతరాలు కల్గించి యున్నాడు. వాటిని గూర్చి తదుపరి అధ్యాయాలలో విపులీకరిస్తాను. నీవు ఎక్కడ నుండి వచ్చావో అక్కడకే వెళ్ళు అన్న మాటను బట్టి దిగ్గున పైకి లేచాను. మా అమ్మ ఎక్కడికి రా బయలుదేరినావు? అన్నది. నెల్లూరుకని చెప్పితే వెళ్ళనీయదని, ఇక్కడికేనమ్మ ప్రక్క ఊరు నాగిరెడ్డిగారి దగ్గరకు వెళ్ళి ఒక ముఖ్య విషయము చెప్పి ఇప్పుడే వస్తాను అని చెప్పి ఆమె మాటకు ఎదురు చూడకుండ నెల్లూరులోని నా గృహానికి వచ్చాను. అప్పటికే నా భార్య తాళము వేసి వెళ్ళిపోయింది. మరి ప్రభువు ఎందుకు ఇక్కడకు రమ్మన్నట్లు అని ఆలోచిస్తూ ఏమియు తోచక బిషప్ హౌస్‌లోని చర్చీ దగ్గరకు వెళ్ళినాను. నా భార్య కథోలిక సంఘమును ఇష్టపడి ఆ సంఘములో ఆమె బాప్తిస్మము పొందింది. నేను వెళ్ళి ఆ చర్చీ ఆవరణలో తిరుగుచుండగా మార్గరేటమ్మ అని పేరు గల కన్య స్త్రీ నన్ను పిలిచి తన గదికి తీసుకొని వెళ్ళి నీ భార్య జరిగిన విషయమంతా నాకు చెప్పి యల్లాయపాళెము వెళ్ళింది. నీవు బయట తిరగకు చంపివేస్తారు. నీవు నా గదిలోనే ఉండమని కాఫీ టిఫిను ఇచ్చి నా ఆకలి దీర్చింది. బిషప్పుగారిని కూడా ముస్లిమ్ పెద్దలు ఫోన్లో ఆయనతో నీ విషయములో తగాదా పెట్టుకొన్నారు. ఆయనే నీ చేత ముస్లిమ్ వ్యతిరేక గ్రంథాలు రాయుస్తుండాడని, కనుక ఈ రచనలు కట్టిపెట్టు అన్నియును మాని వేయమని ఆమె నాకు బుద్ధి మాటలు చెప్పింది. నా భార్య ద్వారా వారు నాకు పరిచయమయ్యారు. ఎందుకంటే నా భార్య కథోలిక సంఘ బాప్తిస్మము కోరుకొని ఆమె అక్కడ సంఘ సంభ్యురాలిగా చేరింది. నాతో కూడా లూథరన్ సంఘమునకు ఆమె ఒక ఆదివారము వచ్చినప్పుడు నేను పని చేసే స్కూలులో పని చేసే పంతులమ్మలు ఆమె ముఖములోని బొట్టును చెరిపి తీసివేశారు. చిన్నతనము నుండి అలవాటుగా పెట్టుకొనే బొట్టును తీసివేయటం అంటే భర్త చనిపోయిన తర్వాత ఈ పని ఒక ఆచారముగా ఉంది. భర్త బ్రతికుండగానే బొట్టు చెరిపి వేయడం ఆమె మనస్సు చివుక్కుమని ఆమె స్వయముగా కొందరిని సంప్రదించి, బొట్టు పెట్టుకొంటే చర్చీలో ప్రవేశించడానికి అనుమతినిచ్చే సంఘము క్రైస్తవ్యములో లేదా! అని కొందరు క్రైస్తవులను ఆమె ప్రశ్నించి కథోలిక సంఘములో ప్రవేశమున్నదని తెలిసి, నేను ఆ సంఘములోనైతే బాప్తిస్మము పొందుతానని నాతో చెప్పింది. నాకు ఆ రోజులలోనే కాదు ఈ రోజులలో కూడా సంఘ బేధము లేదు. ప్రభువు ఎప్పుడు ప్రత్యేకించి ఏ సంఘమును గూర్చియు చెప్పలేదు. కనుక నాకు అన్ని సంఘాలు సమానమే - నీతిని పరిశద్ధతను జరిగించే ప్రతి సంఘము పరిశుద్ధమైనదే. అది ప్రభువు సంఘమే.
ఆ దినములలో ఇంగ్లీషు మీడియము స్కూళ్ళు బహు తక్కువ. బిషప్పు హౌస్‌లోని ఇంగ్లీషు మీడియం స్కూళ్ళు చాలా ప్రఖ్యాతి గల్గినందున ఎక్కువమందిని ఆ స్కూలులో చేర్చేవారు. ముస్లిమ్ మత పెద్దలు ముస్లిమ్ రాజకీయ నాయకులు హేమాహేమీల పిల్లలందరు చాలావరకు సిస్టర్స్ స్కూళ్ళల్లో చదివేవారు. అందువల్ల ఆ సిస్టరు తనకు తెలిసిన ముస్లిమ్ మత పెద్దలతో ఫోన్‌లో సంప్రదించి, వారినందరిని శాంతపరచినప్పుడు వారు వారి మత పెద్దలు నాతో కలిసి సమావేశమై మాట్లాడుకొనుటకు ఉదయ కాలమున సమావేశము ఏర్పాటు జేశారు. ఆ సమయములో మీరు మీ కారులో రావద్దనియు మేమే కారు పంపిస్తాము. మా కారులో అతనిని తీసుక రమ్మని సిస్టరుకు ఫోన్ చేసి చెప్పారు. ఎందుకంటే ఎక్కడ కనపడితే అక్కడ అతనిని పొడిచి చంపమని చెప్పినాము గనుక మా కారులోనే అయితే పైపెచ్చు సురక్షితమని వారు తెలియజేసి, నన్ను ఆ కారులో కూర్చుండబెట్టి నాకు సహాయముగా వయస్సు మళ్ళిన అనుభవము గల ఒక సిస్టరును నాతో కూడ పంపించారు. ఈ సంఘటన ఇంచుమించు 1964వ సంవత్సరములో జరిగియుండవచ్చును.
నేను సిస్టరుతో కూడా వాళ్ళు రమ్మన్న చోటుకు కారు దిగి వెళ్ళుతుండగా జనులు గుంపులు కూడి నిండియుండి, తప్పుడు కూతలతో నన్ను దూషిస్తున్నారు. నేను సరాసరి లోపలికి వెళ్లగా వారి పెద్దలు సిస్టరును ఆహ్వానించగా వారి ఎదురుగా కుర్చీల మీద కూర్చున్నాము. వారి మత పెద్ద ఇంకెవరో ఇద్దరున్నారు. వారేమన్నను తొందరపడి ఏమి మాట్లాడకుమని సిస్టరు నాకు హితోపదేశము చేసియున్నారు. వారు మమ్ములను కూర్చోబెట్టి ఇద్దరికి చెరొక టీ సప్లయి చేశారు. నా టీ కప్పులో ఏమైన విష ప్రయోగము చేసి ఉంటారేమోయని ముందు అనుమానము కల్గినా నిండా మునిగినవానికి చలి ఏమిటన్న లోకోక్తి విధముగా ఇంత దూరము వాళ్ళ మధ్యకు ప్రభువు నడిపించాడు గదా! ఏది జరిగినను ఆయన చిత్తమని టీ సేవించాను. వాళ్ళు చెప్పుకొను మాటలలో నన్నుగూర్చి ఈయనకు షుమారు 30 సంవత్సరాల వయస్సుండవచ్చును అని అన్నారు. వారు నన్ను ఒక ప్రశ్న వేశారు. నీవు ఈ పుస్తకము వ్రాసావంటే నీ ముఖము చూస్తే అట్టి జ్ఞానము నీకుండినట్లు మాకు కనబడలేదు. నీ వెనుక ఎవరైన ఉండి ఈ పుస్తకము వ్రాసి నీ పేరు పెట్టియుంటే వారి పేరు తెలుపమని, అటు తర్వాత నీ జోలికి రామని వారు ఖరాఖండిగా చెప్పినారు. లేదు నేను రాశానుగాని ఇంకెవరు పుస్తకాన్ని రాయలేదని విశదముగా చెప్పాను. తొందరపాటున ఏదో ఏవో రచనలు రాసే అలవాటుగ ఉండి ఇది వ్రాశాను. కాని ఇక మీదట ఎట్టి పరిస్థితులలోను మీ మతాన్ని గూర్చి వ్రాయనని చెప్పాను. ఇంతకు వ్రాసింది పొరబాటని అవివేకముగా రాశానని నా పొరబాటు మన్నించమని దినపత్రికలకు ఇవ్వాలని వారు కోరినారు. అందుకు నేను సరేనన్నాను. ఖురాన్‌లో కూడా చాలా మంచి విషయాలుండాయని తొందరపడి ఏదో రాశానని మీ మతములో ప్రవేశించి చక్కగా అవగాహన చేసికొని ఒక మంచి పుస్తకము రాస్తానని చెప్పాను. అంత పని అక్కరలేదులే - అని వారన్నారు. ఈ మాట నేను ఎందుకన్నానంటే వారి హృదయములో నా మీద నున్న పగ ద్వేషము పోగొట్టాలని కావాలని ఆ మాట పల్కినాను. సరే ఇంతవరకు నీ దగ్గర మిగిలియున్న పుస్తకాలన్నీ మాకు అప్పగించాలన్నారు. అందుకు నేను మీ దగ్గరకు రాక తలికే పర మత దూషణ తప్పని తెలిసి మిగిలిన గ్రంథాలన్నీ కూడా కట్టకట్టి సరెండర్ ఆఫ్ పోలీసు ఆఫీసులో పోలీస్ కమీషనరుగార్కి అప్పగించానని చెప్పాను. వారు సిస్టరుతో సమాధానముగా మేము మీతో సమాధానపడినాము గనుక ఇతనిని ఎవరు ఏమి చేయకూడదని ముట్టకూడదని అన్ని వీధులలో నివసిస్తున్న మా వారికి తెలియజేస్తున్నాము. నిర్భయముగా వెళ్ళండని వారు సాగనంపినారు. ఆ తర్వాత మేము ఇంటికి వచ్చిన తర్వాత వారి హృదయాలలో పగ పూర్తిగా పోలేదేమో. కనీసము ఇతని ఉద్యోగమునైనను పీకించి బుద్ధి చెప్పాలని నేను పని చేస్తున్న మున్సిపాలిటీలో మున్సిపల్ కమీషనరుగార్కి, సరెండర్ ఆఫ్ పోలీస్‌కు - హైద్రాబాదు అధిష్టాన వర్గము వారికి ప్రతి యొక్కరికి కాపీ టు ది - అని రిపోర్ట్సు పంపించారు. ఆ రిపోర్టు కాపీ అందుకొన్న మా మున్సిపల్ కమీషనరు, ముస్లీమ్ - ఆయన నాకు నీవు రాసిన పుస్తకాలు నాలుగు తీసుకొని ఆఫీసులో సబ్‌మిట్ చేయమన్నాడు. నా మీద చార్జెస్ ప్రైమ్ చేశారు. నేను విద్యా సంబంధముగా టీచరును గాన ఈ యొక్క నేరము ఋజువు చేయమని డి.ఇ.ఓ.గార్కి అప్ప చెప్పినారు. ఈ కేసు విచారణ పూర్తియైనంతవరకు జీతము నాకు అందుతుందిగాని ఏ విధమైన ఇంక్రిమెంట్లు డి.ఏ. వగైరాలు రావు. డి.ఇ.ఓ. గారు బ్రాహ్మణుడు - ఆయన చేతికి సత్య మత నిరూపణలో భగవద్గీత విమర్శ సంబంధమైన పుస్తకము కూడా అతని చేతికి వెళ్ళింది. ఖురాను గ్రంథమును, భగవద్గీతను విమర్శించిన విధానమును చదివి భగవద్గీత అంటే ప్రాణముతో సమానముగా విశ్వసించేవాడు గనుక కోపోద్రోక్తుడై ఏడు పేజీల మ్యాటరు నాకు విరోధముగా వ్రాసి ఎందుచేతనో పై ఆఫీసువారికి రిపోర్టు పంపించక తన ఫైలులోనే పెట్టుకొని కూర్చున్నాడు. నెలలు గడిచిపోయాయి. షుమారు రెండు సంవత్సరాలు గడిచి పోయినాయి. ఎదుగుబొదుగు లేని జీతము - చాలీచాలని జీతము రావాల్సిన అరియర్స్ ఆగిపోయి యున్నాయి. రెండు సంవత్సరాల తర్వాత నేను ఉండబట్టలేక డి.ఇ.ఓ. ఆఫీసుకు వెళ్ళే ముందు క్లర్క్‌ను కలిశాను. ఆయన చెప్పినదేమనగా నీ మీద ఏడు పేజీలు విరోధముగా వ్రాసి పెట్టి యున్నాడు. నీవు ఆయనను కదిలించి జ్ఞాపకము చేశావా? ఆ ఫైలు పై అధికారులకు పంపిస్తాడు. నీవు సస్పెండవుతావు. వచ్చే జీతము రాళ్ళు కూడా నీకు అందదు. జాగ్రత్త వెళ్ళిపొమ్మన్నాడు. నాకెందుకో ఆయనను కలవాలనిపించింది. వెళ్ళి ఆయనను పరిచయము చేసుకొన్నప్పుడు ఆయన నాపై గర్జించు సింహములాగ మండిపడుచు ఏందీ పుస్తకాలు రాయడము నీవు పెద్ద జ్ఞానవంతుడవనా? నా మీద భయంకరంగా విరుచుకపడినాడు. నా తప్పు నేను తెలుసుకొని నా పుస్తకాలన్నియు సరెండర్ ఆఫ్ పోలీసుకు అప్పజెప్పినాను కదా! ఎందుకు నా మీద మీరు మండిపడుతున్నారని నేను చెప్పే ఏ మాటను కూడా ఆయన పట్టించుకోకుండ అందులోని రచనలను గూర్చి ఎగిరి ఎగిరిపడుతూ మండిపడుతూనే ఉన్నారు. ఆయన నేను చెప్పే మాటలు విన్పించుకోకపోతుంటే అప్పుడు నేను ఆయన ముందు ఈలాగు గట్టిగా ధైర్యముగా మాట్లాడినాను. సార్! ఆ పుస్తకాలలో తప్పు ఎక్కడ ఉంది? నేను వాళ్ళ పుస్తకాలు చూచి రాశాను. ప్రతి పేజీలో రెఫరెన్సులున్నాయి అవి కూడా మీ కంటికి కనపడలేదా? నేను పుస్తకములో ఎక్కడనైనా ఏ పదమైనా అబద్ధముగా కల్పించి ఉంటే నాకు మీరు ఏ శిక్షయైనను విధించండి. నేను సంతోషముగా స్వీకరిస్తాను. ప్రతి వచనము వారి వారి గ్రంథాలలో ఉన్నది ఉన్నట్లుగానే రాశాను. ఆ గ్రంథాలలోని అధ్యాయాల నెంబర్లుతో కూడా వేశాను. ఏ విషయములో నేను రాసింది తప్పని నా మీద మండిపడుతున్నారు. మీరు మరల పుస్తకాన్ని పరిశీలించి మీకు ఏది న్యాయమైతే అదే చేయండి,'' అని నేను ఆయన దగ్గర నుండి వెళ్ళిపోయాను. నేను వెళ్ళిపోయిన తదుపరి జరిగిన సంఘటనను ఆఫీసు క్లర్కు ఈ విధముగా నాకు వివరించాడు. నీవు డి.ఇ.ఓ. గారి దగ్గర నుండి వెళ్ళిపోయిన తర్వాత ఆయన నీకు విరోధముగా వ్రాసిన ఆ ఏడు పేజీలు చించివేసి ఒక రెండు మాటలు ఆ పుస్తకాలలో ప్రత్యేకించి చెప్పవలసిందేమీ లేదని వ్రాసి హైయ్యర్ ఆఫీసర్స్‌కు సబ్‌మిట్ చేశారట. ఆ తర్వాత నెలలోనే నాకు రావలసిన అరియర్స్ అంతా వచ్చేసింది. ప్రభువు చెప్పిన ఆ ఒక్క గొప్ప మాట నీవు ఎక్కడ నుండి వచ్చావో అక్కడికే పో అన్న మాట నాకు తోడై నీడై నిలిచి, నా ప్రాణాన్ని నా ఉద్యోగాన్ని నిలిపి నాకు సమాధానము కల్గించింది. ఈ సంఘటన జరిగిన తర్వాత ప్రభువు నీకు పుస్తకాలు రాయాలని కోరిక ఉంది గనుక నీ హృదయాలోచన నీ జ్ఞానమును బట్టి వ్రాయవద్దు. నా ఆత్మను నీ సన్నిధికి పంపి నీకు ఉపాధ్యాయినిగా నా తల్లి మరియను లోకసంబంధముగా తోడుగా నీ ఇంటిలో మాంత్రక పని చేసి నీకు అనేక విధాలుగ నష్టాన్ని గల్గించిన ధనరాజును నీకు జత పనివానిగా ఏర్పరచి, నీవు జన్మించిన గ్రామములో తల్లికి మందిరమును ''నా ఆత్మ'' - తల్లి ద్వారా ఉపదేశించిన ఉపదేశాలను పుస్తక రూపముగా వ్రాసి ప్రకటించమని ఆయన ఆదేశించాడు. కాబట్టి ఈ పుస్తకాలు వ్రాయుటకు ఇది మూడవ ముఖ్య కారణమని పాఠకులు గ్రహించాలి.
.....
36. ప్రభువు నామములోని సంతోషము - ఆనందము :- ప్రభువు నామము నిమిత్తము హింసించి చెడ్డ మాటలు పల్కునప్పుడు మీరు ధన్యులు. సంతోషించి ఆనందించుడి, మత్తయి 5:11 సత్య మత నిరూపణము అను గ్రంథము వ్రాసినప్పుడు అతి భయంకరముగా నన్ను హింసించినప్పుడు నా శరీరము వెనుకటి ఉత్సాహము, శక్తి తగ్గి శరీరము ఆద్యంతము బలహీనమైంది. కాని నేను ప్రభువు నామము నిమిత్తము హింసలు పొందినప్పటి నుండి శరీరము రోగగ్రస్థమైనను నేను ఎప్పుడు ఏనాడు పొందని సంతోష ఆనందములు అదృశ్యములో నా ఆత్మను ఆవరించి విడిచిపోకుండుట, ఆ ఆనందము అనిర్వచనీయమైందిగా ఉండుటయు ఆ సంతోషమును అనుభవించే నాకే తప్ప మరెవరికి వివరించే విధానము నాకు తెలియక నాలో నేనే, అపొస్తలుడైన పౌలు 2వ కొరింథీ 11:23-25 పౌలు తిన్న దెబ్బలు, స్తైఫను మరణించునంతవరకు భయంకరమైన రాళ్ళ దెబ్బలు - ఈ విధముగా హతసాక్షులనబడువారు తమ దారుణమైన హింసలయందు ప్రభువు అనుగ్రహించిన నోటితో ఇది ఇట్లా ఉందని చెప్పలేని సంతోషానందములు నేను పొందుచున్నాను. నా కుడివైపు ఊపిరితిత్తులు దెబ్బలకు అదిరి అందులో నెమ్ము జేరి భయంకరమైన అతి దారుణమైన టి.బి. జబ్బుకు దారి తీస్తూ ఉన్నది. శరీరమంతా నరాలు, కండరాలు, ఎముకలు టి.బి. వ్యాధితో నిండుతున్నను రోగ నిర్థారణ డాక్టర్లు చేయలేకపోయారు. ఈ పరిస్థితులలో నా తల తిరగడము ఎక్కువగా తిరగలేక పోవడము, గుండె దడ వగైరాలు నన్ను చుట్టుకొన్నవి. శరీరానుసారముగా దు:ఖము, వేదన, బాధలు ఆత్మానుసారముగా ఆనంద సంతోషములతో పొందటము జరుగుచున్నది. తిరుగుతూ తిరుగుతూనే ఉంటాను. ఒక్కోసారి నిలబడలేను, తిరగలేను, నరాలు పని చేసేవి కావు. ఆ పరిస్థితులలో హాస్పిటలుకు వెళ్ళితే నరాల్లో సిలైన్ వాటర్ ఎక్కించి పంపించేవారు. ఇట్లు అప్పుడప్పుడు జరిపించుకొనుచూ - నిమ్మరసము, మజ్జిగ వగైరాలు ఎక్కువగా తీసుకోసాగినందున ఊపిరితిత్తుల్లో గల్ల ఏర్పడి టి.బి. అని ఎక్స్‌రేలో వైద్యులకు నిర్థారణ కల్గించింది. ఆ రోజులలో టి.బి.కి ఇంజక్షన్‌లో వేసేవారు. ఇంజక్షన్ నా చేతికి వేసినప్పుడు, వేయబడిన సూది నొప్పి వారము రోజులకు కూడా తగ్గేది కాదు. వేసిన చోట వేయకుండ సూదులు వేస్తున్నారేగాని తగ్గు ముఖము ఆవగింజైన కనబడడము లేదు. మా మిద్దె మీదనున్న బాడుగ ఇంటిలో నుండి వీవర్సు కాలనీలో ఒక ఇంటిలోని చిన్న పోర్షన్‌లో ఇల్లు బాడుగకు తీసుకొని అక్కడ ఉంటున్నాము - స్టోన్‌హవుస్ పేటలోకి ఒక ఇంటికి హోమియో డాక్టరు క్రొత్తగా వచ్చి దిగినాడు. ఆయనతో నాకు పరిచయము కల్గింది. ఆయనతో మాటల సందర్భముగా నా జబ్బును గూర్చి సూది మందుతో నేను పడే బాధలను గూర్చి వివరించినప్పుడు - ఆయన నాతో సూది మందు అక్కరలేదు. ఇంజక్షన్లు, వారు రాసిచ్చే మందులు ఆపివేసి, జర్మనీవారు తయారుజేసే హోమియో చాలా ఖచ్చితమైన రోగ నివారణ కలుగజేస్తుంది. ఆ మందులు నీవు తీసుకో - ప్రతి నెల వెళ్ళి రోగ నివారణను గూర్చిన పరీక్షలు వారి దగ్గరనే చేయించుకోమన్నాడు. దైవకృప - ఆయన ప్రేమ నన్ను వెంటాడిందేమో నా జబ్బు క్రమక్రమేణా తగ్గుచు మరల యాధావిధిగా నా ఆరోగ్యము చక్కబడింది. హోమియోనే ఒక మంచి వైద్యమని నా అనుభవము ద్వారా తెలుసుకొన్నందున నా కుమారులలో పిల్లలు ఇద్దరు హోమియో డాక్టర్లుగా తర్ఫీదు పొంది స్వంతముగా హాస్పిటల్సు పెట్టి, ఈ వైద్యమునే అందిస్తూ చాలా వాటికి ఇంజక్షన్లు ఆపరేషన్స్ లేకుండ నయము చేస్తు ప్రజా పథములో మంచి పేరు సంపాదించుకున్నారు. ఉదాహరణకు కొన్ని - షుగరు కురుపులకు ఆపరేషన్ అక్కరలేదు - సులభముగా షుగరు కురుపులు నయము చేస్తారు. కిడ్నీ చెడిపోయినా, రాళ్ళు చేరినా ఆపరేషన్ అక్కరలేదు. సులభముగా నయము చేస్తారు. టి.బి. కొన్ని విధాలైన గుండె జబ్బులు 24 గంటల కడుపు నొప్పులు వీటన్నింటిని వారు చాలా సులువుగా నయము చేయుట నేను గమనించి యున్నాను. హోమియో ద్వారా ప్రభువు నా పిల్లలకు అద్భుతముగా స్వస్థత చేసే వరము అనుగ్రహించినట్లు నాకు ఇందునుబట్టి తెలుస్తున్నది.
........
37. నా రోగమును గూర్చి ప్రభువు పల్కిన మాటలు :- ముస్లిమ్‌లు కొట్టిన దెబ్బలకు నా శరీరము బలహీనమైనను ఆత్మ - వినూత్నమైన పరలోక ఆనందాన్ని అనుభవిస్తూ ఉండినది. బలహీనమైన శరీరము లోగడే నాలో ఉన్న దుర్వ్యసనాల వల్ల వాటి ప్రభావము ద్విగుణీకృతమై ఆ బలహీనతలు నన్ను పట్టి పీడిస్తూనే ఉన్నాయి. వివాహమై యున్నను వ్యభిచార అలవాటును మానుకోలేక వెళ్ళుచున్నప్పుడు ఆ దారిలో ఒక ఆప్తుడు ఒక స్నేహితుడు వలె ప్రభువు నాకు ఎదురుపడినాడు. ప్రభువా! నన్ను క్షమించు నాయనా! నా మానసిక స్థితి అతి ఘోరముగా ఉంది. నా మనోస్థితి నా శరీరము నా అదుపులో లేదు. నన్ను ఈసారికి వెళ్ళనీయమని, నన్ను నేను నిగ్రహించుకొనలేని స్థితిలో నేనున్నానని, ఆయన జవాబుకు ఎదురు చూడకనే ఆతృతగా వెళ్ళినాను. ఈ సంఘటనలో ఆయన ముఖ దర్శనము నా మీద చూపిన దయ నాకు గుర్తుకొస్తుంటుంది.
వివాహమై యున్నను నా దుర్వ్యసనాలను నేను మానుకోలేక అవి విజృంభించి, నా శరీరము వారు కొట్టిన దెబ్బలకు ఊపిరితిత్తులు అదిరి శరీరము బలహీనమైయున్నందున ఒళ్ళు తిరగడము, ఒక్కొక్కసారి లేచి నిలబడలేక నడవలేక పోవడము జరిగినప్పుడు - డాక్టర్లు ఏ జబ్బు లేదనియు అని చెప్పి కాల్షియం, సిలైన్ వాటర్ నా నరాలకు ఎక్కించి తత్కాలికముగా నయము చేసి పంపించేవారు. అప్పుడు నాకు ఆరోగ్యముగా ఉండేది. ఇట్లు నెలలో ఒక్కొక్కసారి రెండేసిసార్లు ఈ నడవలేని స్థితి దాపురించేది. ఎంత తిన్నను ఒంటికి పట్టేది కాదు. తల తిరగడం ఎక్కువైంది. మంచము మీద పడుకొని కొంతసేపు విశ్రాంతి తీసుకొందామనుకుంటే నా గది నేను పడుకొన్న మంచము అవి అన్నియు గిర్రున తిరిగననట్లుండేది. ఇట్లు ఒకటి ఒకటిన్నర సంవత్సరము జరిగింది. ఈ వ్యధను ఈ అనారోగ్య పరిస్థితిని భరించలేక ప్రభువును అడిగినాను నా పరిస్థితి ఏమిటి ప్రభువా! అని ఆయన పలుకలేదు. ఆ తర్వాత ప్రభువు తల్లిని అడిగినాను ఆమెయు మౌనముగా ఉండిపోయింది. అప్పుడు నాకు అనుమానమొచ్చింది ఏమని? నా మరణము కొరకు ఈ జబ్బు వచ్చి ఉంటుంది. అందువల్లనేమో నేను బాధపడెదనని తల్లి మరియ; ప్రభువైన యేసు తమ నోటితో చెప్పలేకపోతున్నారని అప్పుడు మరల వారితో ఇట్లన్నాను. నా మరణము కొరకు ఈ జబ్బు వచ్చినను నేను బాధపడను. ఏ విషయము ఖచ్చితముగా చెప్పాలని వేడుకొన్నాను. అప్పటికి కూడా తల్లీ బడ్డలు నోరు మెదపలేదు. జవాబు ఈయలేదు. ఎట్లా చేయాలా? అని ఆలోచించి, పరిశుద్ధులైన భక్త వర్గాన్ని స్మరించి వారి నామములతో అంతోనివారిని ఇజ్ఞాసివారిని సకల అపొస్తలులను పరిశుద్ధులను హతసాక్షులైనవారిని జ్ఞాపకము చేసుకొంటూ వారికి విజ్ఞాపన చేశాను. వారి పేర్లను తెలిసినంతవరకు చెప్పుకొంటూ - అయ్యలారా! పరిశుద్ధులైన మీరు ప్రభువు నామము నిమిత్తము ప్రాణము పెట్టిన మీరు - ప్రభువు సన్నిధిలో సంచరిస్తున్నారని నాకు తెలియును. కనుక మీరు దయచేసి నా ఆరోగ్య విషయమును గూర్చి ప్రభువును అడిగి కనుక్కొని నాకు తెలియ జేయండని పేరుపేరున వారికి విన్నవించుకొంటూ ప్రార్థనలతో - భక్తి ప్రపత్తులతో జీవిస్తుండగా ఒకనాటి రాత్రి సుదూరమైన విశాల ఆకాశములో నేను నిలబడియున్నాను. నేను భూమి మీద నిలబడియున్నట్లుగానే ఏ భయము లేకుండ ఆకాశములో ఏ ఆధారము లేకుండ నిలబడియున్నాను. సూర్యచంద్ర నక్షత్రాదులుగాని, భుమి సముద్రాలు గాలి ఏవియు నా కంటికి కనబడలేదు. ఆ ఆకాశ విశాలములోనే ఎంతో దూరములో కొంతమంది పరిశుద్ధులు వారు ప్రభువు శిష్యులే ఎవరో నేను గుర్తించలేనుగాని, వారు ప్రభువును అడ్డగించి, ప్రభువా! అని సంబోధిస్తూ - శేఖర్‌రెడ్డి ఆరోగ్య విషయము ఏమిటి - ప్రభువా! అని ఒక పాతికమందిగా ఉన్న గుంపు ఆయనను చుట్టుకొని ఏకగ్రీవముగా ఒకే మాటగా ఆయనను చుట్టుకొని అడిగినారు. వారు ఆయనను అడగడము ఎంతో దూరములో ఉన్న నాకు స్పష్టముగా వినబడుతున్నది. ఆ మాటకు ఆయన వారికి జవాబియ్యక ఎంతో దూరముగా నేనున్నను ఒక క్షణములో నా యొద్దకు వచ్చి ఈ విధముగా ఆయన నాతో మాట్లాడినాడు. ఇది శోధన - పరలోకము నుండి నీ కొరకు ప్రత్యేకించబడింది. ఈ శోధన వదలిపోతుందని ఆయన చెబుతూనే ఈ శోధన ఎప్పటి వరకుఉంటుందో చెప్ప శక్యము కాదు. ఎందుకంటే ఇది పరలోకము నుండి దిగి వచ్చిన పరమ రహస్యము. అని ఆయన నాతో మాట్లాడుతూనే నన్ను ఓదార్చుతూ - ఒకనాటికి ఈ శోధన యావత్తు వదలిపోతుందని ఆ దినమును నీవు తప్పక చూస్తావని ఆయన అదృశ్యమయ్యాడు. నేను నిద్ర మేల్కొని ఆయన చెప్పిన మాటలు నెమరువేసుకొంటూ ఆయన ఆ మాటలు చెప్పినప్పుడు నన్ను ఓదార్చుతూనే పరలోకము నుండి ప్రత్యేకించబడిన ఈ శోధన దేవుని పరిశోధనగా పరీక్షగా తీవ్రముగా నా జీవిత కాలమంతా పీడిస్తూ - నన్ను నా జీవితాన్ని అన్ని విధాలుగ క్రుంగదీస్తూ - నా మీద అధికారము చెలాయిస్తూ ఇంచుమించు మరణము వరకు బాధించేదిగా నా మనస్సుకు అనిపించింది. అదేమి శోధనో అది ఏయే రీతులుగా నన్ను వెంబడిస్తుందో - అపొస్తలుడైన పౌలు యోహాను వగైరాలకే గాక పాత నిబంధనలో కూడా యోనా ఏలీయా వంటి ప్రవక్తలు కూడా మరణకరమైన బాధలు, వారు పడిన కష్టాలు చెప్ప శక్యముగాని అవమానాలు, చెరసాల దెబ్బల వంటివి కూడా నన్ను వెంబడించాయి. దానికి వ్యసనాలతో నిండియున్న నా బలహీన శరీరము మందిర నిర్మాణము, నిర్వహణ భారము, గ్రంథ రచనలు, వాటి ప్రచురణలు, వాటి ప్రింటింగ్ డిస్ట్రిబ్యూషన్‌లో కలిగిన చిత్ర విచిత్రమైన అవాంతరాలు, నోటితో చెప్పలేనన్ని క్రొత్త నిబంధన అంత పుస్తకము గల సంఘటనలు నన్ను చుట్టుకొని నన్ను బాధించాయి. ప్రతి విధమైన సంఘటనలు వివరించాలంటే ఈ గ్రంథము చాలదు. అయితే ఇది పరిశోధన. ఎప్పుడు తొలగిపోతుందో చెప్పటానికి వీలులేని పరలోక రహస్యమని, ప్రభువు ఈ మాటలు చెప్పుచూనే ఒకనాటికి ఈ శోధన తొలగిపోతుందని నాకు భరోసా ఇచ్చాడు. ఇంత భయంకరమైన శోధన వివిధ విధాలుగా వివిధ రంగాలలో అనేక సంఘటనలతో నన్ను ఎదుర్కొన్న ఈ శోధన నుండి బయటపడుతూ వచ్చిన కారణమేమిటంటే - ఇది ఆశ్చర్యకరమైన విషయము. ప్రభువు ప్రత్యక్షత, ఆయన దివ్య వెలుగు ఆయన కాపుదల - నేను నిద్ర లేచినను, తిరిగినను సంచరించినను ప్రయాణములో ఉన్నను, సమయ అసమయాలలోను నిద్రకు పడక మీద ఉపక్రమించేటప్పుడైనను నిరంతరము ఎప్పుడు చూస్తే అప్పుడు ఆయన నా యీ బలహీనమైన ఈ శరీరమునకు సకల వ్యసనాలతో నిండియున్నను, నన్ను ప్రేమిస్తు నా సన్నిధి నుండి నా కన్నుల ఎదుట నుండి ఆయన ప్రేమ పూరితమైన ఆశ్చర్యకరమైన ప్రశాంతమైన, శాంతి సమాధాన పూరితమైన ఆ దివ్య వెలుగును, ఆయన యొక్క దివ్య స్వరూపమును నా ఎదుట నుండి తీసివేయలేదు. ఎల్లప్పుడు ఏ కష్టమొచ్చినను ఏ శోధన నన్ను వెంబడించినను, ఏ అనారోగ్యముతో నేను పీడింపబడినను, ఆర్థిక ఇబ్బందులు, ఆరుమంది పిల్లలతో కూడిన కుటుంబ భారము - ఈ గ్రంథ రచనా భారము మందిర నిర్మాణము దాని నడిపింపుతో కల్గిన భారము, వీటన్నితోబాటు అంకణము స్థలముగాని నివసించుటకు ఒక ఇల్లుగాని లేని దారిద్య్ర స్థితి - ఈ రోజుల వలెగాక ఆ రోజులలో బ్రతకలేని బడిపంతులుగా చాలీచాలని జీతము. ఇటువంటివియేగాక ఎల్లప్పుడు నన్ను అంటిపెట్టుకొనియున్న రోగభారము, సకల విధ భారములు నన్ను చుట్టుకొని శాంతి సమాధానము లేకుండ, ఎల్లప్పుడు దురదృష్టకరమైన స్థితిలో ప్రతి యొక్కరి చేత తృణీకరింపబడుచు నా జీవితము ఆఖరు వరకు కూడా ఏడు పదుల ఆయుస్సు దాటినా కూడా ఆ శోధనలు తొలగి నాకు ప్రశాంతత ఏర్పడలేదు. అష్టకష్టాలు, నష్టాలు, ఆర్థిక ఇబ్బందులు, అనారోగ్యము, గంటల తరబడి విశ్రాంతి లేని రచనలు, పుస్తకాల కరెక్షన్లుతో ఏ విధమైన సహాయ సహకారాలు లేని నా జీవితము - ''ప్రభువు ప్రత్యక్షతను, ఆయన దివ్య వెలుగును, ఆయన ముఖ దర్శనము, రూపాంతర స్వరూపము, ఆయన ఊరడింపు - తట్టుకోలేని స్థితిగతులలో ఆందోళనపూరిత నా జీవితమునకు ఆయన అదృశ్య సహాయ సహకారాలతో నన్ను ఊరడిస్తున్నను ఒకటి రెండుసార్లు చనిపోతే ఆత్మకు విశ్రాంతి దొరకుతుందేమోనన్న ఆశ కూడా నాలో ప్రవేశించేది.
.......
38. నలుబది దినములు దయ్యముతో పోరాటము :- నేను ఏడు ఎనిమిది తరగతులు చదివేటప్పుడు వేసవి సెలవులలో నన్ను పెంచి పెద్ద జేసిన మా తాతగారి ఊరు సర్వాయపాళెము వెళ్ళినాను. తాతగారు వేసిన పండ్ల తోట పుష్కలముగా కాయలు కాస్తూ ఆహ్లాదకరముగా ఉంది. ఎండా కాలము గదా! హాయిగా తోటలో పడుకోవచ్చని తాతగారు నాతో చెప్పగా నేను ఆయనతో కూడా వెళ్ళి చెరొక మంచము మీద ప్రక్క ప్రక్కనే పండుకొన్నాము. ఆ మొదటి దినమున ఇద్దరము కబుర్లు చెప్పుకొంటూ నిద్రపోయినాము. నాకు నిద్ర పట్టిన కాసేపటికే వెంట్రుకలు విరబోసికొనియున్న ఒక స్త్రీ నా ముఖము మీద తన ముఖమును వాల్చగా ఆమె విరియబోసుకొనియున్న చిందరవందర వెంట్రుకలు నా ముఖమంతా కప్పగా నేను మెలకువ వచ్చి చూడగా నాకెవరు కనబడలేదు. నేను ఆ ఊరిలో ఎలిమెంటరీ స్కూల్లో చదివేటప్పుడు అప్పుడప్పుడు ఆ తోట వద్దకు వచ్చుచున్నప్పుడు ఎదురుగా ఉన్న గుడిసెలలో యానాది కుటుంబాలు నివసించేవారు. వారిలో పెద్ద వయస్సు గల్గిన ఒక ఆవిడ తల విరియబోసుకొని కూర్చుండి ఉండడము నేను తరచుగా చూస్తుండేవాడను. వాళ్ళు తల దువ్వుకొని చమురు పెట్టుకుని మంచి గుడ్డలు వేసుకొనే స్తోమత లేదు గాన వాళ్ళు చింపరి చింపిరి వస్త్రాలు, వెంట్రుకలు విరియబోసుకొని ఉంటారేమో అనుకొనేవాడను. నిద్రలో మెలకువ వచ్చిన నేను చుట్టు ప్రక్కల ఎక్కడ చూచినను ఎవరును లేరు. ఆ విధముగా లోగడ చూచిన యానాది మనిషి నా ముఖము మీద తల వాల్చి ఉంటుందేమో అనుకున్నానుగాని ఆ చుట్టు ప్రక్కల దూరముగానే యానాది గుడిసెలున్నవి గాని అక్కడ ఎవరు రాలేదు. మరల కాసేపాగి నిద్రకు పక్రమించాను మరల ఒక ప్రొద్దు గడిచిన తర్వాత అదే విధముగా చింపిరి చింపిరి వెంట్రుకలు ముఖమంతా కప్పినట్లు అనుభూతి గల్గి ఉలిక్కిపడి లేచాను. ఈ ప్రాంతములో లోగడ నేను చూస్తున్న యానాది మనిషి చచ్చి దయ్యమై తిరుగుతుందేమో నా మీద అపేక్షతో నన్ను ముట్టుకొను ఆపేక్షతో వచ్చి ఉంటుందని, ఇంక నాకు సుఖమైన నిద్ర దొరకదని ఈ యానాది దయ్యము నన్ను వదిలేటట్లు లేదని ఆలోచించి, ప్రక్కనే నిదురబోతున్న తాతగారిని లేపటానికి నేను ఇష్టపడలేదు. ఆకాశమందు ఆసీనుడైయున్న దేవదేవునికే నేను భయపడడము లేదు. ఎందుకంటే నన్ను సృష్టించినవాడు ఆయనే గనుక నా తండ్రి ఎదుట కుమారుడనైన నేను స్వతంత్రుడనేగాని ఆకాశములో ఆసీనుడైయున్న పరమతండ్రికి నేను భయపడలేదు. కాని తుచ్ఛమైన నీచమైన ఈ దయ్యపు శక్తికి నేను భయపడి తాతగార్కి ఫిర్యాదు చేయవలసిన పిరికివాణ్ణి కాదు నేను. ఆకాశమందున్న ఆ పరమ తండ్రి నా పక్షమందుండగా నేను భయపడను. దీన్ని ఎదుర్కొంటాను అని ఆకాశ దేవునికి విన్నవించుకొని మరల పడుకొన్నాను. ఇట్లా ప్రతి రాత్రి రెండు మూడు సార్లు జరుగుతుండగా విజయనగరము బాబా దయ్యాలను దూరపరుస్తాడేమోనని చూస్తామని ఇక ఈ రాత్రి కాలములో నా నిద్ర పాడు చేయకుండుటకై ఆకాశ దేవుడైన సృష్టికర్తకు, మంచి భక్తిపరుడైన విజయనగర సాయిబాబాను వేడుకొని నిద్రకు ప్రారంభించగా - ఆకాశము నుండి ఒక వెలుగు బ్యాటరీ లైటు వెలుతురు కంటే ప్రకాశముగా మా తోటలో మేము పండుకొన్న మంచాల వైపు ప్రకాశించి కాసేపటికి అదృశ్యమైపోయింది. తాతా! ఆ వెలుగు చూడు ఎవరు లేరే ఎంతో దూరములో ఉన్నారు. బ్యాటరీ లైటు కాంతి వంటి కాంతి ప్రసారమై వెళ్ళిపోయిందే అన్నాను. అందుకు ఆయనకు అర్థముగాక ఎవరైనా దూరము నుండి ఇళ్ళ మీద నుండి వేసి ఉంటారేమోలే అన్నాడు. కాదు ఆ వెలుగు పై నుండి క్రిందికి ప్రసరించింది అన్నాను. నేను ఆకాశ దేవుని తలంచుకొన్నప్పుడు నాకు ఇష్టము వచ్చిన ప్రార్థన చేసుకొంటున్నప్పుడు - కూర్చుని ఉంటే కూర్చునే ప్రార్థిస్తాను. పడుకొని ఉంటే పడుకొనే ఆకాశము చుట్టూ చూచి ప్రార్థిస్తాను. ఆ అలవాటు ఏడు పదులు దాటిన ఈ వయస్సులో కూడా ఆ అలవాటు అట్లే ఉంది. సంఘ కూడికలలో పదిమంది ఎదుట మాత్రము మోకరించుట ద్వారా సంఘ సభ్యుల వాడుక ప్రకారముగా నేను అట్లే ప్రార్థిస్తాను. కాని ఒంటరి ప్రార్థనలలో ఆ విధమైన పద్ధతులను ఆచరించే అలవాటు లేదు. ఆ విధముగా నేను సమ్మర్ హాలిడేస్ పూర్తియైనంతవరకు ఈ దయ్యపు వేధింపును గూర్చి తాతగార్కి చెప్పలేదు. అంటే దయ్యానికి నేను భయపడవలసిన పని లేదు. అది నన్నేమి చేస్తుంది - అనెడి ధీమాయే. ప్రతిరోజు రాత్రి వెల్లకిలా పండుకొని ఆకాశమందు దృష్టి సారించి అందు ఆసీనుడైయున్న దేవుని తలంచుకొని, ఆ తర్వాత విజయనగర సాయిబాబా అను దైవభక్తుని ధ్యానించి నిద్రపోయేవాడను. ఒక్కోరోజు ఆ దయ్యపు బాధ ఉండేది కాదు. ఒకరోజు ఉండకపోయినను మరొక రోజు తప్పక ఉండేది. కాని నేను ధైర్యముగ దానిని ఎదుర్కొని హాయిగా రాత్రి కాలములో నిద్రపోయేవాడను. ఎందుకంటే దైవబలము నా చుట్టూ ఉన్నది - దయ్యపు శక్తి నన్నేమి చేస్తుందని ధీమాతో ఎట్లో హలిడేస్ గడిపి నేను తాతగారి ఊరు నుండి వెళ్ళిపోయాను.
నేను వెళ్ళిపోయిన తర్వాత నా అక్కగారు నాతో ఆశ్చర్యపడుతూ చెప్పిన మాట నాకే వింతగా ఉండింది. నేను ఊరికి వెళ్ళిన తరువాత తాతగారు ఒక్కరే మామూలుగా కర్ర చేతబట్టుకొని ఆ రాత్రి పెందలకడనే వెళ్ళి మంచము వాల్చుకొని కర్ర ప్రక్కన పెట్టుకొని నడుము వాల్చి పండుకొన్నప్పుడు, నన్ను ప్రతి నిత్యము వేధిస్తున్న ఆ దయ్యము రౌద్రాకృతి దాల్చి తాత మీద పడి ఆయన పండుకొన్న మంచమును ఎత్తి పడవేసి ఆయనను క్రింద పడగా ఆ దయ్యము ఇట్లని చెప్పింది. వాడితోనే నేను ఇంత కాలముగా వేగులాడి వాన్ని పంపించి వేస్తే నీవు మరల ఇక్కడికే వచ్చావా? అని తాతగారిని గదమాయించి తరిమివేయగా మంచము త్రిప్పి వేసినప్పుడు క్రింద పడిన తాతగారు భయభ్రాంతుడై, ఉరుకు పరుగున ఇంటికి చేరి ఆ మూర్ఖుడు వాడెట్లా భరించాడో ఆ దయ్యముతో నన్ను చూడు మంచముతో కూడా ఎత్తి పడవైచి తరిమిందని, ఆతృతతోను భయాందోళనలతో ఆ మాటలు చెప్పి ఇంక ఆ రోజు నుండి ఆ తోటలో పడుకొనుటకు వెళ్ళినవాడు కాదు. కోపోద్రిక్తమైన ఆ దయ్యపు ప్రభావమో ఏమో కొంత కాలానికి ఆ తోట ఎదుగుబొదుగు లేక శిధిలమై నామరూపాలు లేకుండ పోయింది. నేను ఎప్పుడైనను పోయినప్పుడు నేను నా తాతగారు పండుకొనే స్థలములో ఒక బొంతరాయి ఉంటుంది. గుర్తుగ అక్కడ నిలబడి, ఆనాడు దయ్యముతో కల్గిన పోరాటమును గుర్తు చేసుకొంటూ నామరూపాలు లేకుండ నశించిపోయిన తోటను గూర్చి బాధపడేవాడను. తోట నాశనమవడానికి మరియొక్క కారణము కూడ ఉంది. అదేమిటంటే నేను సర్వాయపాళెములోను దగ్గరగ నున్న కావలిలో ఉన్న సంవత్సరాలు ఇంచుమించు 16 సంవత్సరాలుండవచ్చును. ఈ 16 సంవత్సరాల కాలములో వర్షాలు కురువక పంటలు పండని కాలము లేనే లేదు. నేను బుచ్చిరెడ్డిపాళెము వెళ్ళిన తర్వాత ఒక్కొక్క సంవత్సరము త్రాగుటకు కూడ నీరు లేక రాత్రిళ్ళు గుంట బావులలో నీళ్ళు ఊరేవి ఊరునట్లుగా నిద్ర మేల్కొని కొద్ది కొద్దిగా నీళ్ళుపట్టుకొనేవారు. నేను ఆ ఊర్లో ఉన్నంతకాలము ఆకాశమందు ఆసీనుడైయున్న దేవుడు నన్ను ఏ ఇబ్బందులకు గురి చేయక మంచి పాడిపంటలు, విస్తారమైన పండ్లు కూరగాయలు, విస్తారమైన వర్షాలతో ఆ గ్రామాన్ని సుభిక్షముగా అభివృద్ధి చేశాడు. నేను ఆ గ్రామమును విడిచి వచ్చిన తర్వాత తరచుగా త్రాగుటకే నీళ్ళు లేని దుస్థితిని గూర్చి వింటూ నా నిమిత్తముగా ఆకాశమందు ఆసీనుడైయున్న పేరు తెలియని సృష్టికర్తయైన దేవుడుకు నా మీద ఎంత ప్రేమ ఉన్నదో ఇందునుబట్టి తెలిసికోగల్గినాను.
.......
అయితే ఈ దినములలో ఆ సంఘటనను నేను గుర్తు చేసికొన్నప్పుడు ప్రభువు తన మహిమతో లాజరును లేపిన విషయము గుర్తు చేసుకొంటే యోహాను 11:44 చనిపోయిన లాజరు కాళ్లు చేతులు కట్టబడి యుండగా ముఖమునకు రుమాలు కట్టి యుండగా వెలుపలికి ప్రభువు సన్నిధికి ఎలా రాగల్గినాడు? - అట్లే సామానుతోను గడ్డితో ఎంతో ఎత్తులో పై భాగాన తూగుతూ కండ్లు మూతలు పడుతున్న నేను బండి ఒరిగి పడిపోయినప్పుడు నేనెలాగు క్రింద నిలబెట్టబడి యున్నానో నాకే తెలియదు. కన్నులకు రుమాలు చుట్టబడి కాళ్లు చేతులు ప్రేత వస్త్రాలతో కట్టబడిన లాజరు ప్రభువు సన్నిధికి ఎలా వచ్చాడు? తన సన్నిధికి వచ్చిన లాజరును చూచి ట్లు విప్పి పోనియ్యుడని వారితో చెప్పటం ఆశ్చర్యముగా లేదా!
.....
అప్పుడు ఆ దినములలో అంత చిన్న వయస్సులో సృష్టికర్తను గూర్చి ధ్యానిస్తూ ప్రార్థించడం నాకెట్లు అలవాటయిందో నాకే ఆశ్చర్యము కల్గిస్తుంది. ఇందునుగూర్చి బైబిలులో కీర్తనలు 19:2 పగటికి పగలును నేను చూస్తుండగా 16:9 చెప్పబడినట్లు నా అంతరేంద్రియమే నాకు ప్రభువు యొక్క ఏర్పాటును బట్టి నాకు బోధించియుండవచ్చును. 8:2 బాలుర చంటి పిల్లల స్తుతులు అన్నాడు - ప్రభువును గూర్చి స్తుతి స్తోత్రములు చేయుటకు నాది క్రైస్తవ కుటుంబము కాదు. సండే స్కూలు నుండి చిన్న పిల్లలకు వాక్యము పఠనము స్తుతి స్తోత్రములు చేయుటకేర్పడుచున్నది. నేను ఏమియు ఎరుగని అజ్ఞాన దశ. నేను పడే బాధలకు ఆకాశము వైపు చూచి ఇవన్నియు చేయగల్గిన దేవుడెవరో ఆయనకే నేను కనబడుచున్నాను. ఆయన నాకు కావలసిన తెలివిని అనుగ్రహిస్తూ నా త్రోవలలో నన్ను కాపాడగలడు, అని మాత్రము అప్పుడప్పుడు ఆకాశము వైపు చూచి మాట్లాడుకొనేవాడను. ఆ పద్ధతి నాకు క్రీస్తు నెరుగనంత వరకు అదే పద్ధతి ననుసరించేవాడను. క్రీస్తును ఎరిగిన తరువాత ఆయన దివ్య స్వరూప ప్రత్యక్షత నిరంతరము నా నుండి తొలగించలేదు గనుక ఆయన వైపు చూచి నాకు కలిగిన ఇబ్బందులు, అవసరతలను గూర్చి చెప్పుకొంటూ ఆయన నాకు అనుగ్రహించు సూచనలను పాటిస్తూ వస్తున్నాను. అది ఈ దినములలో పరిపాటైంది.
.......
39. ఎద్దుల బండి ప్రమాదములో రక్షించిన దేవుడు :- నేను బుచ్చిరెడ్డిపాళెములో చదువుకొనుచుండగా నా తల్లి గ్రామమైన రెడ్డిపాళెము సెలవులలో వెళ్ళినాను. మరల బుచ్చికి రావలసిన దినము సమీపించగా ఆ ఊరి నుండి ఏకొల్లు వారి రెండెద్దుల బండి కట్టి దాని మీద వాళ్ళ సామాను పశువులకు గడ్డి వేసుకొని రెడీ చేసుకొని వేకువ జాముననే బుచ్చిరెడ్డిపాళెం వెళ్ళుటకు సిద్ధపడి యున్నారు. మా ఊరికి ఆ రోజులలో బస్సు లేదు గనుక చీకటితో లేచి ఆ బండి మీద కూర్చుని బుచ్చికి పొమ్మని మా నాన్న సలహా ఇచ్చినాడు. వారు నన్ను బండి పై భాగాన ఉన్న గడ్డి మీద కూర్చుని దానికి కట్టియున్న బలమైన మోకులను పట్టుకొని కూర్చున్నాను. వారికి ఆ రోజు టైం తెలియలేదేమో వేకువ జామున గాక చాలా ప్రొద్దుండగానే బయలుదేరారు. రాజుపాళెం దాటి గ్రామనత్తం సమీపించినను కూడ తెల్లారలేదు. గ్రామనత్త గ్రామమునకు ముందు రోడ్డు వర్షాకాలపు వెల్లువలకు రోడ్డు కోసుకొని పోయి ఒక ప్రక్క గండి ఏర్పడింది. చీకటి రాత్రియైనందును బండిలో వారు దానిని గమనించక రోడ్డు దారే అనుకొని ఎద్దులను అదిలించగా బండి చక్రము ఒక ప్రక్క గుంటలో పడి బండి ఒరిగి పడిపోయింది. బండి ఓనరు బండి తోలువాడు ఇద్దరు గాభరాగా బండి వెనుకకు పరుగెత్తుచు వీడు రాళ్ళ మధ్యలో బండి పైన బడి చచ్చి ఉంటాడేమో ఏడుపులు అరుపులు లేవేయని శేఖరయ్యా! శేఖరయ్యా ఎక్కడ ఉన్నావు? అని గాభరాగా పరుగెత్తి నా వద్దకు వచ్చారు. నేను సురక్షితముగా నిలబడి ఉండడం చూచి ఏమియు దెబ్బలు తగలలేదా అని నన్ను తడిమి చూచారు. ఏమి తగలలేదని చెప్పినప్పుడు వారు బండిని లేవనెత్తుకొని ఎద్దులను సరి చేసుకొని ఎందుకైనను మంచిదని నన్ను బండి ముందువైపుననే వారి దగ్గర కూర్చుండబెట్టుకొని ఊరు చేర్చారు. అయితే బండికి కట్టబడిన సామాను వాటిపైన వేసిన చాలా ఎత్తుగా వేసియున్న గడ్డి మోపుల మీద కూర్చున్న నేను బండి ఒరిగి క్రిందకు ఒరిగిపోయినప్పుడు నేను ఎట్లా క్రిందకు వచ్చి నిలబడగల్గినాను? నన్ను అందుకొని క్రింద నిలబెట్టినవారెవరో? నాకు ఇప్పటికి అంతు చిక్కలేదు. కాని దైవ మహిమ ఆయన రక్షణ హస్తము అదృశ్య రూపములో నన్ను క్రింద నిలబెట్టి యుండాలి. ఆకాశమందు ఆసీనుడైయున్న దేవుడు నన్ను కంటికి రెప్ప వలె కాపాడుచు నన్నావరించి కాపరిగా - యున్నాడని ఇందునుబట్టి నేను గ్రహించగల్గినాను.
......
40. అష్టబంధనయను యోగ ప్రయోగమును పటాపంచలు చేసి నన్ను కాపాడిన మరియ తల్లి :- లోగడ నేను బుచ్చిలో |ఙశినీ ఓళిజీళీ, ఙశినీ ఓళిజీళీ చదివే రోజులలో నేను శివకోటారెడ్డిగారి దగ్గర యోగవిద్య ఆరు నెలలకు పైగా నేర్చుకొన్నప్పుడు ఆయన నా యోగవిద్యను ఎంతవరకు సాధన చేసి అభివృద్ధి పరచుకొన్నాడో తెలిసికొనుటకు ఆయన యోగ పరీక్ష ప్రయోగాల ద్వారా నన్ను పరీక్షించేవాడు. యోగ ప్రయోగాలలో గురువును మించిన శిష్యుడు కాలేక పోయినాను. గురువు దగ్గర నిలబడగల్గే దైవబలం సంపాదించుకోలేక నిరాశతో వెనుదిరిగి వచ్చేవాడను. ఎప్పటికైనను ఆయన ప్రయోగించు యోగ ప్రయోగములో నిలబడగలిగే దైవశక్తి సామర్థ్యాలు, దైవబలము సాధించాలనే దీక్షతో ఏటిలో అర్థరాత్రి వరకు యోగ ధ్యానమును కఠిన తపస్సుగా మార్చుకొని ధ్యానమును ఆచరించేవాడను. ఇంటిలో పరుండియున్నను తీరుబాటుగా కూర్చుని యున్నను యోగవిద్యను సాధనం చేసేవాడను. ఎంత సాధన చేసినను గొర్రెకు బెత్తెడే తోక అన్నట్లు నాలో అభివృద్ధి లవలేశమైన ఆయన ఎదుట కనబడలేదు. ఈ పరిస్థితులలో యోగాశ్రమాలలోనైతే నీ పాద దాసుడనేగాని నేను మీ విషయములో బలహీనుడనే నన్న విధముగా నోటితో చెప్పక గురువు పాదాల మీద మోకరిల్లి, తన ఓటమిని తన అసమర్థతను ఒప్పుకోవలసి ఉంది. అట్లా ఒప్పుకొని ఆయన పాదాల దగ్గర శిరము మోపి ప్రణమిల్లితే ఆయన మనమీద ప్రయోగించు యోగ ప్రయోగాల నుండి మనలను విముక్తి కల్గిస్తాడు. కాని ఎందుకనో కనీసము గురువును ఓడించలేక పోయినను గురువు దగ్గర నిలబడే యోగ బలము కావలెనని ఎన్నో విధాల ప్రయత్నించినను శృంగభంగమే కాని ఏ విధముగా చూచినను ముందంజ వెయలేకపోతున్నాను. కారణము ఆయన బాల బ్రహ్మచారి అబద్ధాలు చెప్పడు. నిత్య సత్యవంతుడు, నిరతాన్నప్రదాత ఎంతోమంది బీదలకు తన పేరు మీద విద్యావైద్యము చేయిస్తుంటాడు. చదువుకోవాలని ఆసక్తి గల్గినవారిని చదివిస్తాడు. తల్లి దీర్ఘకాలము మంచము మీద పడియున్నప్పుడు పనివారు సరిగా చూడనేరరని తానే ఆమెకు బ్రతికియున్నంతకాలము సపర్యలు చేసేవాడు. ఇట్టివానిని జయించుటకు నేను ఏపాటివాడను. అప్పుడప్పుడు నా భార్యతో అబద్ధాలు చెబుతాను. జీతభత్యాలు తక్కువగా జేసి చెబుతాను. భార్య ఉన్నను పర స్త్రీ సాంగత్యము ఈ విధమైన నీచ నికృష్ట స్థితిలో నున్న నేను ఆయనను జయించాలంటే అది అసాధ్యమనిపిస్తుంది. ఎందుకో నా మనస్సు ఆయన పాదాల మీద మోకరించి దాసాను దాసుడవగుమని ఒక ఆత్మ హెచ్చరిస్తున్నను, మరొక ఆత్మ ఎట్లయినను విజయాన్ని సాధించాలన్న ధీమాతో ఓటమిని అంగీకరిస్తూ ఆయన పాదముల ఎదుట మోకరిల్లుటకు నా మనస్సు అంగీకరించలేదు. ఏడు ఎనిమిది తరగతులలో ప్రారంభించిన యోగవిద్య 1955-56వ సంవత్సరాలలో టీచరు ట్రైనింగ్ పూర్తి చేసుకొని 1959 ఫిబ్రవరిలో వివాహము చేసుకొని 1962వ సంవత్సరములో మరియ తల్లి యొక్క ప్రభావమును తెలుసుకొన్నంతవరకు ఆయన చేత పరీక్షింపబడుచు వెనుదిరిగి వచ్చుచు పోవుచున్నానేగాని ప్రతిసారి ఓటమిని చవి చూస్తూనే ఉన్నానుగాని ఓటమిని అంగీకరించకపోవుటలో గురువుగారు విసిగివేసారినాడేమో ఇతనికి జీవితములో మరువలేని మరుపురాని గుణపాఠము చెప్పాలని, ఇంటిలో లేకుండ ఎక్కడకో వెళ్ళినాడు. రెడ్డిగారు ఇప్పుడప్పుడే రాడని చెప్పి ఆయన దగ్గరలో ఎక్కడో ఉండిపోతూ తన ఇంటిలో నా మీద భయంకరమైన యోగ ప్రయోగము సర్వాంగబంధము అను యోగ ప్రయోగము చేసి ఎక్కడో దగ్గర్లో దాగుకొన్నాడు. నేను గురువుగారు లేరు గదా! వచ్చినంతవరకు హాయిగా కాసేపు విశ్రమిస్తామని చాప పరచుకొని మిద్దె మీద కాళ్లు బార జాచుకొని వెళ్ళకిలా పడి నిదురపోయాను. కొంతసేపటికి నా కాళ్ళు కదలలేదు - మెడ తిరుగలేదు. కన్నులు రెప్పలు పడలేదు. శరీరములోని ప్రతి నరము ప్రతి కండరము బంధింపబడియున్నట్లు అట్లే అచేతనముగా ఉండిపోయాను. ఇట్టి పరిస్థితులలో జరిగిన ప్రమాద భరితమైన యోగ పరీక్షను కనుకొనిన దేవమాత మరియతల్లి నన్ను చేరదీసిన పెద్దల సుబ్బమ్మ రూపములో శేఖరయ్యా! అంటూ మిద్దె మీదకు నన్ను పలకరిస్తూ వచ్చింది. ఆమె పిలుపును విన్న నేను నా బంధనములన్నియు తొలగిపోయి యధాప్రకారముగా తిరుగుచుండుటలో నా గురువుగారైన రెడ్డిగారు ఆశ్చర్యపోయి ఉక్కిరిబిక్కిరయ్యాడు. అసాధ్యమైన ఈ బంధన నుండి ఎలా బయటపడ గల్గినాడా? ఆని అయోమయములో పడినాడు.
......
41. అమ్మ నిన్ను కాపాడింది :- మరి ఒకసారి వాడుక ప్రకారముగా మా గురువుగారి దగ్గరకు వెళ్ళినాను. నేను మామూలుగా ఒక బెంచీ మీద కూర్చున్నాను. ఎప్పుడేనాడు ప్రయోగించనట్టి తీవ్రమైన యోగ ప్రయోగాలు భయంకరమైనవి నా మీద అత్యంత దారుణముగా కఠినముగా ప్రయోగించసాగినాడు. ఎందుకంటే రెడ్డిగారిది తప్పు లేదు. దాదాపు పది పన్నెండు సంవత్సరాల వరకు ఓటమిని చవిచూస్తూ ఆయనకు ప్రణమిల్లి పాదదాసుడను కాక అహంకారములో ఉన్న నాకు ఫైనలుగా బుద్ధి చెప్పాలని, తన పాదదాసుడుగా చేసుకొని ఇక ఈ ప్రయోగాలనుండి విముక్తి కల్గించాలని ఎట్లయినను పాదదాసుని చేసుకోవాలన్న తాపత్రయముతో ప్రయోగించుచున్న అత్యంత దారుణమైన ఆ యోగ ప్రయోగమును తట్టుకోలేక నన్ను దద్దుర్ల జ్వరమును క్షణములో నయము చేసిన వేళాంగణి మాతను హృదయములో ధ్యానిస్తూ అమ్మా! అని మాత్రం అనుకొన్నాను. అంతే యోగ ప్రయోగాలు తీవ్ర స్థాయిలో ప్రయోగిస్తున్న రెడ్డిగారి ప్రయోగాలను ఆ తల్లి హస్తము ప్రత్యక్షమై నా మీద ప్రసరింపకుండ క్షణములో ఆపివేయగా రెడ్డిగారు తన ప్రయోగాలు కట్టయినందున ముందుకు తూలి సంతోష ఆనందాలతో నన్ను చూచి, అమ్మ నిన్ను కాపాడింది అమ్మ నిన్ను కాపాడింది అంటూ ఒక భగవద్గీతను తెచ్చి నాకు బహుమానముగా ఇచ్చాడు. అయితే రెడ్డిగార్కి మాత్రము ఏ అమ్మ కాపాడిందో తెలియక ఒక స్త్రీ రూపము ఆయనకు నాకు యోగములో దర్శనమిచ్చింది గనుక అమ్మ కాపాడిందని అన్నాడు. ఈయన అనుకున్నది ఆదిశక్తియో పార్వతియో ఏ స్త్రీ శక్తో కాపాడిందని అనుకున్నాడుగాని, ఆ కాపాడింది మరియ తల్లియని ఆయన తెలిసికోలేకపోయాడు. నేను వాడుక ప్రకారముగా వారమునకు ఒకసారి ఆట్లా వారి దగ్గరకు వెళ్ళేవాడను. నేను రెడ్డిగారి దగ్గరకి వెళ్లెదను అని ప్రభువును అడిగినప్పుడు ఆయన అనుమతినిచ్చేవాడు - అనుమతి ఇవ్వనప్పుడు నేను వెళ్ళేవాడను కాను. ఎందుకంటే నేను వెళ్ళే సమయానికి ఆయన ఉండడని ఆయన నాకు కొన్ని గుర్తులు అందిస్తుండేవాడు. నేను ఆయన దగ్గరకు వెళ్ళేటప్పుఢు నా యోగము ముందర భాగములో యేసునాధ స్వామిని నా వెనుక భాగములో నా తల్లిని ఉంచుకొని రెడ్డిగారి యోగ పరీక్షలో కూర్చునేవాడను. ఎన్ని గంటలైనను నాకేమి బాధ లేదు, ఏ విధమైనటువంటి ఇబ్బందులు లేవు - ఆయన ఆశ్చర్యపడుచు మహామహా యోగీశ్వరులు, పీఠాసనాధిపతులు నన్ను సందర్శించినప్పుడు నేను ప్రయోగించే ప్రయోగాలను ఎదుర్కోలేక నిలువలేక పలాయనము చిత్తగించేవారు. వీడు నా దగ్గర యోగవిద్య నేర్చుకొని కుటుంబ వ్యవస్థ నిర్వహిస్తూ బాలబ్రహ్మచారిని యోగవిద్యా పరిపూర్ణుడనైన నా యొద్ద నిక్షేపముగా ఆనందముగా ఎంతసేపయినను కూర్చుంటున్నాడేయని ఆశ్చర్యపడుతు నన్ను అడుగుటకు సంశయిస్తుండగా - నేనే ఈ దైవిక మర్మమును గూర్చి వారికి ఈ విధముగా విన్నవించినాను. యేసుక్రీస్తు నాధుని దివ్యశక్తి, ఆయన తల్లియైన మరియ ప్రేమాభిమానాలు నన్ను ఆవరించి నాకు యోగబలాన్ని శక్తిని దయ చేశారు. కాబట్టి అందరికంటే గొప్ప దేవుడు యేసునాధుస్వామి అందరికంటే గొప్ప తల్లి ఆయన తల్లియైన మరియమాతయని ఆయనతో చెప్పినాను. ఆ మాటలకు ఆయన అందరు దేవుళ్ళు ఒక్కటేయని అన్నాడు. ఆ మాటను అడ్డగిస్తూ ఆయనతో వాగ్వివాదము తర్కవితర్కాలు చేయకూడదు. యోగవిద్యలో ఏదైనను చెప్పాలంటే క్రియాత్మకముగా ఋజువు చేయాలి కాబట్టి నేను ఆ పద్ధతికి కట్టుబడి ఆయనతో వాదించలేదు. ఆయన దగ్గర సెలవు తీసుకొని నెల్లూరుకు బయలుదేరినాను. ఆయన చెప్పిన మాటను ఆలోచిస్తూ యేసునాధస్వామి దయ వల్ల నేను రెడ్డిగారి దగ్గర ఓడిపోవడము లేదు. ఆయన - ఆయన ఆరాధించే తారకయోగ దేవతలు లక్ష్మీ నారాయణులు వగైరా అన్య దేవతల యోగ శక్తుల వల్ల నేను ఆయనను ఓడించలేకపోతున్నాను. ఇప్పటి పరిస్థితులలో ఆయన చెప్పిన మాట సరియే ననిపిస్తుంది. ఆయనకు ఓటమి లేదు నాకు ఓటమి లేదు. ఇద్దరము సరిసమానులమే కనుక ఆయన ఆరాధించే దేవతలు నేను ఆరాధించే యేసు మరియలు సమానమే గదా అన్న సిద్ధాంతముతో గురువుగారు ఆ మాట అన్నారు. భారతదేశములోగాని ప్రపంచమందంతట ఆరాధించబడుతున్న సమస్త దేవతలందరికంటే, సమస్త సృష్టికి ఆది సంభూతుడైన సృష్టికర్త - నరావతారములో అవతరించిన యేసుక్రీస్తుస్వామి తప్ప మరి ఏ దేవుడు ఏ దేవత సమము కాదు. ఆయనే పరమోన్నతమైన దేవుడు అని ఆయన ఎదుట క్రియాత్మకముగా ఋజువుపరచాలి. ఏ విధముగా ఋజువుపరచాలో తెలియక నెల్లూరికి తిరిగి వస్తూ దారిలో ప్రభువుతో ఈ విధముగా మాట్లాడినాను. ప్రభువా! శివకోటారెడ్డిగారు మరణించకుండా ఒక్క మొత్తు మొత్తి నీవే నిజ రక్షకుడవని లోకములో మరి ఏ దైవము లేదని ఋజువుపరచమని ఆయనను అడిగినాను. అందులకు ఆయన బైబిలులో వ్రాయబడిన ఈ మాటను యోహాను 12:47, ''నేను లోకమును రక్షించుటకే వచ్చితినిగాని శిక్షించుటకు రాలేదని అన్నాడు.'' మరి నేను శివకోటారెడ్డిగారికి ఋజువుపరిచే మార్గమే లేదాయని కొన్ని దినముల పాటు ఆలోచిస్తూ ఉండిపోయాను. కాని ఆయనకు ప్రయోగాత్మకముగా ఎలా నిరూపించాలన్న ఆలోచనతోనే ఉంటూ నా అనుదిన కార్యక్రమములు జరుపుకొంటున్నాను.
.....
మోషే ఐగుప్తు రాజ భోగభాగ్యాలను వారి ఐశ్వర్యమును వదలి దేవుని బిడ్డలతో కష్టములనుభవించుటకును దేవుని వైపు తిరుగుటకు కారణము వాని తల్లియే - సమూయేలు అంత పెద్ద ప్రవక్త కావటానికి కారకురాలు సమూయేలు తల్లియే - సమూయేలును యెరూషలేము ఆలయమునకు పసిబిడ్డగా ఉన్నప్పుడే అప్పగించి, ఆ బాలుని ఆలనాపాలనా చూసుకొంటూ వానికి హితబోధ చేసి దైవమార్గమును చూపి పెంచి పెద్ద జేసింది. ఏలీ తన కుమారులకు తల్లి లేనందున దైవమార్గములో పెంచలేకపోయాడు. ఎస్తేరు యూదా జనాంగానికి విధించబడిన మరణశిక్ష నుండి ఆ జనాంగాన్ని ఒక స్త్రీ కాపాడగల్గింది. కాబట్టి తల్లికి పాత నిబంధనలోను నూతన నిబంధనలోను చాలా ప్రాధాన్యత ఉన్నది. దైవకుమారుడు కన్య గర్భము నుండి పుట్టింది మొదలు స్త్రీకి పురుషునితోబాటు గౌరవమర్యాదలు, ఏ పని చేయుటకైనను హక్కు అనుభవాలు ఏర్పడినవి. ఈనాడు లోక రాజ్యాలు ఏలెడి స్త్రీలున్నారు. యేసు తన తల్లిని యోహాను ద్వారా విశ్వాసులకు విశ్వాస సంఘాలకు తల్లిగా అనుగ్రహించాడు. కనుక ఇద్దరు ముగ్గురు ప్రభువు నామమున ఎక్కడ కూడి యుంటారో అక్కడ ప్రభువు వారిలో ఉంటాడు - ప్రభువు ఉన్న చోటనే ఆయన తల్లి కూడా ఉంటుందని గ్రహించి తల్లి యొక్క సహాయ సహకారాలు కూడా మనము పొందుకోవలసి ఉంది. కనుక మన ప్రార్థనలలో తల్లిని కూడా జ్ఞాపకము చేసుకొందము. ప్రభువు మనలను పరిశోధించినప్పుడు - సాతాను శోధించు సమయములో మనకు సహాయము చేయగల శక్తి సామర్థ్యము మరియ తల్లికి ఉన్నది.
........
42. నన్ను బట్టి నిన్ను కాపాడిన దేవుడు :- ప్రభువును ఆయన తల్లిని మనస్ఫూర్తిగా నమ్మిన దినాలలోని ఒక సంఘటన నాకు జ్ఞప్తికి వచ్చింది. పూర్వీక దినాలలో నా ఇంటనున్న సకల దేవతల పటములుండేవి. మరియమ్మ ద్వారా ప్రభువును నమ్మిన తర్వాత ఆ పటములన్నియును తీసివేసి ధనరాజుగారి కిచ్చి నీవు ఏమైన చేసుకో! ఎవరికైనను ఇచ్చుకోమని ఇచ్చివేసి యేసు ప్రభువు మరియ మాతల పటములు తెచ్చి ఆరాధన స్థలములో పెట్టి పూజించేవాడను. నా భార్య మాత్రము చిన్ననాటి నుండి వెంకటేశ్వరస్వామి మీదనున్న భక్తిని వదలలేక వెంకటేశ్వరుని ఒక చిన్న కాగిత పటమును యేసు మరియల పటముల చాటుగా బెట్టి నేను లేనప్పుడు భక్తిగా పూజించుకొనేది. ఒకనాడు ఎందుకనో ప్రేరేపణ కలిగి పటములను కదిలించి చూడగా వెంకటేశ్వరుని బొమ్మ ఉన్న ఒక చిన్న కాగితము ముక్క పటముల వెనుక నుండి, ఆ బొమ్మ మీద కుంకుమ పూలు వగైరాలతో పూజింపబడినట్లు నాకు కనపడింది. కాటేరు రూపమున మన ఇంట మనకు విరోధముగా ప్రవేశించిన మునీశ్వరుని వెళ్ళగొట్టలేని దేవుడు కూడా ఒక దేవుడేనా? ఎందుకు చాటుమడుగుగా పూజిస్తున్నావు? నేను నీ దేవుడుగా పూజిస్తున్న వెంకటేశ్వరునికి సవాల్‌గా మూడు రోజులు గడువు ఇస్తున్నాను. ఈ మూడు రోజులలో నాకు ఏదైన ప్రమాదముగాని, అస్వస్థతగాని ఏదైనను కీడు కలగాలి. అట్లు కలిగిందంటే నీవు పూజించే వెంకటేశ్వరుడే గొప్ప దేవుడు - కాబట్టి అతను నన్ను శిక్షించాలంటే ఆయనను నేను అవమానించాలి. కనుక వెంకటేశ్వరుని నేను నా భార్య ఎదుట దూషించి, కుంకుమ పూలతో పూజించి ఉన్న ఆ బొమ్మ మీద ఉమ్మి వేసి ముక్కలు ముక్కలుగ చించి కాలి క్రింద వేసి కాలితో రుద్దుచు త్రొక్కివేశాను. మూడు రాత్రింబగళ్ళు గడిచినవి. ఆమెతో సంభాషిస్తూ మరి నీవు పూజించే దేవుని నేను అంత ఘోరమైన అపచారము చేసినను ఏ విధమైన శిక్షకు ఆయన నన్ను పాత్రునిగా చేయలేకపోయాడు. మరి నన్ను కాపాడుచున్న యేసుక్రీస్తు స్వామి గొప్పవాడా? లేక నీవు పూజిస్తున్న వెంకటేశ్వరుడా? ఎవరు శక్తి గల మహిమగల గొప్ప దేవుడో గ్రహించావా? అని ఆమెను అడిగినాను. అందులకు ఆమె ఈ విధముగా జవాబు చెప్పింది. నేను పూజించే నా వెంకటేశ్వరస్వామి గొప్ప దేవుడే - మహిమగల స్వామియే, నీవు నా భర్తయైనందున నన్ను చూచి నన్ను బట్టి నిన్ను కాపాడినాడు. కనుక నా దేవుడు శాంతము, క్షమాగుణము కల్గిన గొప్ప దేవుడని చెప్పింది. నేను ఆ మాటలకు అవాక్కయ్యాను.
......
కట్టుకున్న భార్యకు యేసుక్రీస్తు ప్రభావాన్ని నిరూపించలేకపోయాను. యోగవిద్యా విధానాన్ని సాకల్యముగా నేర్పించిన గురువుగార్కి యేసుక్రీస్తు స్వామి యొక్క దివ్యయోగమే గొప్పదని ఆయన ఎదుట నిరూపించలేకపోయాను. ధనరాజుగారిని సంప్రదించాను. ఆయనకు కూడా మనసులో ఏ విధమైన ఆలోచన రాలేదు. దినములు గడిచిపోతున్నవి. అట్లే సులభముగా రెండేళ్ళు గడిచినవి.
......
43. దేహము విడిచిన ఆత్మలు ధనరాజుగారి యోగములో మాట్లాడుతారు :- రోజులు గడుచుచుండగా ఒక సంఘటన గుర్తుకు వచ్చింది. నేను అప్పుడప్పుడు ధనరాజుగారి ఇంటికి వెళ్ళుతుండేవాడను. ఎందుకంటే ఆయనతో యేసుక్రీస్తు స్వామి తప్ప - దేహము విడిచిన ఆత్మలు పరిశుద్ధులుగాని, అపరిశుద్ధులుగాని ఎవరైనను మనము కోరుకుంటే ఆయన యోగములో వచ్చి మాట్లాడుతారు. మనము ఏదైన ప్రశ్నిస్తే జవాబు చెప్తారు. మొదట నేను ముస్లిమ్‌ల చేత నేను దారుణముగా చావు దెబ్బలు తిని హింసించబడిన దినాలలో తరచుగా వేళాంగిణి యాత్రకు నేను వెళ్ళుతుండేవాడను. ఒకసారి నేను నా భార్య ఒక యాత్రా బస్సులో ఎక్కి వెళ్ళుచుండగా ధనరాజుగారు కూడ ఆ యాత్ర బస్సులోనే ఎక్కి బయలుదేరినాడు. అతను మాతోటి రావడము నా భార్యకి ఇష్టము లేదు. నేను ఆయనతో కలిసి సావాసము చేయుట కూడా ఇష్టము లేదు. ఎందుకంటే అతను మాంత్రికుడని, ఎంతో డబ్బు ఖర్చు పెట్టించి ఫలితము లేకుండ చేశాడని. ఎదుటివారిని పొగడుతు ఏవేవో మాటలు చెప్పి డబ్బులు వసూలు చేస్తుంటాడని అతని మీద ఆమెకు రోత గల్గింది. నేను అతనితో సావాసము చేయడం ఏ మాత్రము నా భార్యకు ఇష్టము లేదు. ఆయన యోగములో మరియమ్మగారి మాటలు - ఇంకా దేహము విడిచిన పరిశుద్ధులైనవారి ఆత్మలతో సంభాషించాలని నాకెంతో కోరికతో ఉండేవాడను. అందువల్ల నేను తరచుగా సాయంత్ర వేళల్లో సెలవు దినాలలో ఉదయ కాలమున ఆయన ఇంటికి వెళ్ళి దేహము విడిచిన ఆత్మల సంభాషణలు గూర్చి వింటూనే వారు చెప్పే మాటలను గ్రంథస్థం చేసేవాడను. ఇట్లు నేను వెళ్ళి దేహము విడిచిన ఆత్మలలో పరిశుద్ధులైనవారు సెయింట్ అంతోనివారు. విదేశాలలో ఒక సైనిక యవ్వనస్థుడైన జార్జి గారు - ఈయన మరియమ్మ ప్రభువునందు పరమ భక్తుడు - గొప్ప కీర్తి నార్జించినవాడు - తమిళనాడులో ఆయనను సందియప్పర్ అను పేరుతో పిలుస్తారు. ఈయన సైనిక దుస్తులు చేతిలో కరవాలము ధరించి గుర్రము మీద కూర్చున్నట్లుగా పటములు కలవు - ఈయన సహాయము ఎక్కువగా కోరుకుంటారు. వీరు ధనరాజుగారి యోగములో నేను అడిగిన ప్రతి ప్రశ్నకు చక్కటి జవాబులు చెప్పేవారు.
రెడ్డిపాళెములో నా స్వంత స్థలములో మరియమ్మగార్కి గుడి కట్టినప్పుడు అక్కడే ధనరాజుగార్కి కూడా ఒక ఇంటిని నివాసమునకు ఇచ్చి ఉపదేశిగ ఏర్పాటు చేశాము. రెడ్డిపాళెములో ఒక చిన్న పాక వేసినప్పుడు మరియమ్మగారు మద్రాసులో నా స్వరూపమునకు నేను ఆర్డరిచ్చాను. పోయి తెచ్చుకోండని సెలవిచ్చినప్పుడు - మరియమ్మ మాట్లాడింది. మీ దగ్గరకు వచ్చి ఆర్డరిచ్చింది అంటే నమ్మరు అని చెప్పగా స్వరూపముయొక్క రూపురేఖలు ఎత్తు అన్ని విశదముగా చెప్పి దానిని తయారు చేసిన వాని అడ్రస్సు ఇచ్చింది. ఆ స్వరూపమే రెడ్డిపాళెములో ప్రతి సంవత్సరము పల్లకీ ఊరేగింపులో ఉంచబడుతుంటుంది. మరియమ్మ స్వరూపమును గూర్చి రెడ్డిపాళెము ఆరోగ్యమాత గుడి చరిత్రలో చక్కగా వివరించబడియున్నది.
.......
44. ఒక బలిష్టుడైన వ్యక్తి నా దేవుని పటములను ఎత్తుకెళ్ళినాడు :- సెయింట్ అంతోనివారి మీదను సందియప్పర్ అని మారు పేరు గల పునీత జార్జిగారి మీదను నాకు మంచి భక్తి భావము ఏర్పడింది. ఒకసారి జార్జిగారు మరియమ్మగారి ఆజ్ఞను శిరసావహించి నాకు ఆయన చేసిన సహాయము వివరిస్తాను. నేను ప్రభువును మరియమ్మను నా దేవునిగా అంగీకరించి మనస్ఫూర్తిగా విశ్వసించినప్పుడు నేను నా ఇంటిలోనికి నా భార్య తెచ్చి పెట్టుకొన్న వెంకటేశ్వర లక్ష్మిదేవి వగైరా పటములన్నిటిని తొలగించి, యేసు మరియల పటములతో నా పూజా గృహమును అలంకరించినప్పుడు ఆ రాత్రి కలలో ఒక బలిష్టుడైన వ్యక్తి ఎద్దు బండితో నేను ఉంటున్న ఇంటి ముందుకు వచ్చి, నా ఇంటిలో నేను ఏర్పాటు చేసికొన్న యేసు మరియల పటములన్నిటిని కట్టగట్టి దౌర్జన్యముగా తన ఎద్దు బండి మీద వేసుకొని పోవుచుండగా నేను ఆ బండి పోతున్న వైపు పరుగెత్తుచు ఏమి చేయలేని అశక్తుడనై యుండగా మరియ తల్లి తన భక్తుడైన సందియప్పర్‌కి ఆజ్ఞ ఇయ్యగా ఆయన తన సైనిక వేషధారణతో గుర్రము నధిరోహించి వెళ్ళి, ఆ బండిని వెంట తోలుకొని పోవుచున్న ఆ ఆజానుబాహువును కొరడాతో శిక్షించి, ఆ బండిని త్రిప్పి తిరుగా నా ఇంట యధాప్రకారముగా పటములను పెట్టించినాడు. పటములో ఏ విధముగా సందియప్పర్ ఉంటాడో అదే రీతిగా నాకు కలలో కన్పడి ఆ బండివానిని వెంబడించి తిరిగి నా ఇంటికి చేర్పించాడు.
......
45. యోగ పరీక్షలో పరిశుద్ధుల సహాయము :- శివకోటారెడ్డిగార్కి యోగ ప్రయోగములో బుద్ధి నేర్పుటకు ఈయన సరిపోతాడని నా మనస్సులో ఆలోచించి, ఆంతోనివారి చరిత్రనుబట్టి దయ్యాలకు బుద్ధి చెప్పిన విధానము, ఆయనను గూర్చి తెలిసికొన్న నేను ఈ ఇద్దరిని నా యోగము ద్వారా శివకోటారెడ్డిపై యోగ ప్రయోగము చేసి వారిని ఓడించే ఏర్పాటు చేసికోవచ్చని ఆలోచన చేసి ఒకనాడు నా అలవాటు ప్రకారముగా ఇప్పుడు బుచ్చిరెడ్డిపాళెము వెళితే రెడ్డిగారు ఉంటారా? అని ప్రభువును సలహా అడిగినప్పుడు ఆయన అనుమతినిచ్చాడు. ఆ సెలవు దినాన సెయింట్ అంతోనివారిని, సందియప్పర్‌ని నా యీ ప్రయత్నములో విజయాన్ని కల్గించమని అపవిత్ర శక్కులకు బుద్ధి చెప్పమని వారికి విన్నవించుకొని, బుచ్చిరెడ్డిపాళెము వెళ్ళి ఆయన చూపిన బెంచీ మీద ఆసీనుడనై నా ఎదుట ప్రభువును నా వెనుక భాగాన మరియ తల్లిని నాకు రక్షణగా ఉంచుకొని, నేను వెంటబెట్టుకొని వెళ్ళిన పరిశుద్ధుల నిద్దరిని ఆయనపై ప్రయోగించాను. రెడ్డిగారు కూడా ఎట్లయినను నన్ను ఓడించాలన్న ధ్యేయముతో కఠినముగా యోగ ప్రయోగము గావిస్తున్నాడు. ఎట్ట ఎదురుగా జరుగుతున్న ఆ పోరాటము నా ఎదుట ప్రత్యక్షముగా చూస్తున్నాను. ఆనందముగా ఆ పోరాటాన్ని తిలకిస్తున్నాను. జార్జిగారు గుర్రము మీద స్వారి చేస్తూ అపవిత్ర శక్తులను చావబాదుట - అంతోనివారు తన మొలకు చుట్టుకునియున్న బెల్టు తీసుకొని దయ్యపు శక్తులను చావబాదటం స్పష్టముగా నాకు కన్పించింది. ఇద్దరము ఒకరికొకరు తీసిపోకుండా కనీసము అరగంట గంట వరకు యోగములో కూర్చునే మేమిద్దరము ఆ రోజు రెండు మూడు నిమిషాలలోనే ఆ చావు దెబ్బలు తినలేక ఆలస్యము చేస్తే ప్రాణానికి ముప్పని అనుకొన్నారేమో రెడ్డిగారు గబగబా లేచి వచ్చి, బెంచీ మీద కూర్చున్న నా దగ్గరకు వచ్చి నా పాదాల దగ్గర పద్మాసనాసీనుడై నా పాదాల మీద తలవాల్చి కూర్చున్నాడు. నేను వెంటనే చివాలున లేచి ఆయనకు మర్యాద ఇచ్చి లేచి నిలబడి కాసేపు ఉండి, ఆయన దగ్గర సెలవు తీసుకొని నెల్లూరుకు వచ్చినాను. అయితే మేమిద్దరము యోగ విషయాలను గూర్చి ఏమియు మాట్లాడుకోలేదు. తాను ఓడిపోయినట్లుగా క్రియాత్మకముగా చేసి చూపించాడు గనుక ఇక మాటలతో పని లేకుండా పోయింది. మరొక వారము సెలవు రోజున ఆయన దర్శనార్థము ఆయన ఇంటికి వెళ్ళినప్పుడు నేను పొందిన ఆశ్చర్యము అంతా ఇంతా కాదు. ఆయన ఇంటిలో ఉన్న దేవతా విగ్రహాలు, పెద్ద పెద్ద వెంకటేశ్వర లక్ష్మి పటాలు అన్ని తీసివేసి బైబిలు చేత బట్టుకొని భక్తి భావముతో చదువుకొంటూ కనబడినాడు. ఆయన ఆ రోజు నుండి ఏ విధమైన యోగ ప్రయోగాలు గాని ఏవియు లేకుండ యేసుక్రీస్తు నాధుని భక్తి భావములో మునిగిపోయాడు.
......
46. యేసుక్రీస్తు నాధుని అంగీకరించిన శివకోటారెడ్డిగారి విషయమై అపవాది ఆందోళన :- శేఖర్‌రెడ్డిని బాల్యము నుండి ప్రేమించి అతని ద్వారా నిజదేవుని గుర్తించిన రెడ్డిగారు కృతజ్ఞతగా కోట్లాది రూపాయల విలువ గల తన ఆస్థిపాస్తులను శేఖర్‌రెడ్డి రచనల ద్వారా క్రైస్తవ సామ్రాజ్య ఔన్నత్యమునకు దాని విస్తరణకు ధారాళముగా ఖర్చు పెట్టడం ఖాయమని నమ్మిన అపవాది ఆయనకు గుండె జబ్బు అను పేరుతో హఠాన్మరణమునకు గురి జేశాడు. సాతాను యొక్క ఈ హత్య దేవునికి అది ఇష్టమైన కార్యమే గనుక సాతానును అడ్డగించలేదు. ఎందుకంటే రెడ్డిగారి యొక్క ఆస్థిపాస్తులు శేఖర్‌రెడ్డికి కైంకర్యము చేస్తే - ఆత్మ అనుగ్రహించు రచనలను ఏకాగ్రతతో రాసే శక్తి కోల్పోతాడని, దైవిక మర్మములతో కూడిన ఉజ్జీవ రచనలు పరలోక మర్మాలు, దైవ ప్రత్యక్షతలు వగైరాలన్ని కోల్పోయి, ఐశ్వర్యముతో తులదూగుచు వచ్చే పొయ్యే వారి సందర్శనలతో తన రచనలకు ఏకాగ్రత చాలదని, దరిద్ర స్థితిలో ఏకాంతముగా రాసే రచనలే పరిమళిస్తాయని గ్రహించిన దేవుడు రెడ్డిగారి మరణమును గూర్చి సాతానును అడ్డగించలేదు. పైగా తాను రాసే రచనలకు తానే గ్రంథస్థము చేస్తూ తన శ్రమనే ఖర్చుపెట్టి తన జీవితమును జీతమును ఖర్చు పెట్టాలని, తాను సంతానముగా అనుగ్రహించిన పిల్లలే ఆ రచనలకు సహకరించి ప్రపంచ వ్యాప్తము చేయాలన్న ధ్యేయము ప్రభువునందుండబట్టి - నా జీతము, నా పెన్షను పిల్లల సహకారముతోనే పుస్తక రచన పంపిణీ వగైరాలు జరుగుతుండగా - యెరూషలేము ప్రార్థనా మందిర పాస్టరు, డేవిడ్ నీలాకాంత్‌గారిని చేదోడువాదోడుగా నాకనుగ్రహించి కొంతవరకు ఆయన మీద ఈ సువార్త భారాన్ని ప్రభువు మోపినాడు.
......
47. నా భార్య భారతి ప్రభువును పరీక్షించిన విధానము :- నేను స్కూలుకు వెళ్ళి మధ్యాహ్న సమయాన ఇంటికి వచ్చి భోంచేసి కొంతసేపు విశ్రాంతిగా కూర్చున్నాను. నా ఎదుటనే నా భార్య దర్జీ పని చేసుకొంటూ ఉండింది. నేను ఆమెతో మాట్లాడుచూనే ఆమెతో ఇట్లన్నాను. నేను ప్రభువు నమ్మి ఇంచుమించు రెండేళ్ళయినది. నీవు ఇంతవరకు ప్రభువును నమ్మలేదు. నేను నీ భర్త నైనంత మాత్రాన ప్రభువు విషయములో బలవంతము చేయకూడదు. నీకై నీవే ప్రేమ పూర్వకముగా ఆయనను అంగీకరించాలి. సమస్త దేవతలను వదలి ఆయనే నిజ దైవమని నీవు నమ్ముటకు ప్రభువు నీ పక్షముగా ఏమి చేయాలి? అని శాంతముగా ప్రేమతో ఆమెతో అన్నాను. అప్పుడు ఆమె ఇట్లన్నది. నాకు ఇంచుమించు ఆరు సంవత్సరాలైనను పిల్లలు పుట్టలేదు. ఎందరో దేవుళ్ళకు మ్రొక్కులు మ్రొక్కినాను. ధనరాజుగారి తాయెత్తులు కూడా నిష్ప్రయోజనములయ్యాయి. ప్రభువు నాకొక బిడ్డను దయచేస్తే సమస్త దేవతలను, వారి ఆరాధనలను వదలి నేను ప్రభువునే నా హృదయములో చేర్చుకొని, ఆయననే ఆరాధ్య దైవముగా పూజిస్తానన్నది. అందుకు నేను వెనువెంటనే ఆయన గొడ్రాళ్ళకు బిడ్డలనిచ్చే దేవుడు. ఆయనకు అసాధ్యమంటూ ఏమియు లేదు. తప్పక నీకు సంతానము అనుగ్రహిస్తాడు. ఆయనను విశ్వసించి నీ హృదయములో చేర్చుకోమన్నాను. అందుకు ఆమె ఇట్లన్నది - తిరుపతి వెంకటేశ్వరుని దర్శించువారికి బిడ్డలు పుట్టడం లేదా? జొన్నవాడ దర్గా వగైరా స్థలములను దర్శించువారికి బిడ్డలు పుట్టడం లేదా? అసలు దేవుడు ఎక్కడున్నాడు? దేవుడే లేడని చెప్పువారికి పిల్లలు పుట్టడం లేదా? యేసుప్రభువే సంతానాలను అనుగ్రహిస్తాడని ఎట్లా చెప్పగలవు? అని నన్ను ప్రశ్నించింది. అందుకు నేను - అయితే ఇంతకును నీవేమి అంటావు అన్నాను. అందుకు ఆమె ''నేను ఎప్పుడు గర్భవతినయ్యెదనో ఆ దినమును గూర్చి నాకై నేనే తెలిసికొను దినమేదో నీ యేసుప్రభువు చెప్పగల్గితే ఆయనే నిజమైన దేవుడని నమ్మి ఆయనను మాత్రమే ఆరాధిస్తాను అని అన్నది. ఆ ప్రశ్న ఆమె వేసినప్పుడు - ఆమె ప్రభువును అడిగిన విధానము - పద్ధతి ప్రకారమే ఉందని, దేవుడు లేడని చెప్పేవారికి దేవుని తిట్టే వారికి కూడా పిల్లలు పుడుతున్నారు. యేసు తప్ప వేరే దేవుడు లేడన్న నీ మాట నేనెలా నమ్మగలను? అని అడగటం సబబే అనిపించింది. యేసే క్రీస్తయి యున్నాడు - అనగా సర్వ శక్తిమంతుడైన దేవుడే యైయున్నాడని ఆమె నమ్ముటకు సరియైన ప్రశ్నయే వేసిందని ఆమె వైపు చూస్తూ ఆమె అన్నట్లుగ - నేనెప్పుడు గర్భవతినగుదునో తెలిసికొను దినమును యేసు ప్రభువు చెప్పాలని కోరింది. ఈ ప్రశ్నకు జవాబు ఏమిటి? ఇంతకు ముందు ఈ ప్రశ్నకు జవాబు ఎవరైనను ఏ సందర్భములో నైనను చెప్పియున్నారా? లేక బైబిలులోనే ఎక్కడ నైన వ్రాసి యున్నారా? ఈ ప్రశ్నకు జవాబు ఏమిటి? అని నేను ఆమె వైపు చూస్తూ ఆలోచన చేస్తున్నప్పుడు - ఆకాశము తెరవబడి ఒక మహత్తరమైన వెలుగు క్రీస్తు రూపము ధరించుకొని, ఆ యొక్క దివ్య స్వరూపము నుండి చెప్పబడిన మాట ఏమిటంటే ''నా పుట్టినరోజు పండుగ దినమున ఆమె తనకు తానుగా నేను గర్భవతినైతినని తెలుసుకుంటుందని,'' ప్రభువు వాక్కు ఆయన దివ్య స్వరూప ప్రత్యక్షత ద్వారా పల్కినాడు. ప్రభువు చెప్పిన ఆ జవాబు విని నేను ఆమెతో - నీ ప్రశ్నకు జవాబు నేను ఊహించి చెప్పటం లేదు. ప్రభువు నీ మీది ప్రేమతో తన్నుతాను బయల్పరచుకొని, తన దివ్య స్వరూప దర్శనముతోబాటు నీవు గర్భవతి అయ్యే దినము క్రిస్మస్ పండుగ రోజని ప్రభువు పలికిన మాట ఆమెతో అన్నాను. అందులకు ఆమె ఆ దినము ఆయన చెప్పిన మాట జరుగకపోతేనో అని అన్నది. అందుకు నేను నీ ఇష్టమైన దైవము తట్టు వెళ్ళవచ్చును. యేసుక్రీస్తు వైపు రమ్మని నేనేమాత్రము నీకు చెప్పను, అని ఆమెతో నిష్కర్షగా చెప్పాను. ఆ దినమునకు క్రిస్మస్ పండుగ షుమారు ఏడు నెలల కాలమున్నది. ప్రభువు చెప్పిన దినము సమీపించినంతవరకు నీవు ప్రభువునే నమ్మాలి. ఆయననే విశ్వసించాలి. ఆయన మందిరమునకే వెళ్ళాలి. వేరే దేవుని స్మరించకూడదు, నమస్కరించకూడదు, అని నేను ఒక కండిషన్ ఆమెకు చెప్పాను. ఈ కండిషన్ ప్రభువు నాతో చెప్పలేదు. నేనే నా హృదయములో ఆలోచించి ఈ కండిషన్ నీకు చెబుతున్నాను, అని చెప్పినప్పుడు ఆమె సరేనని ఒప్పుకొన్నది. అయితే ఆదివారము నాతో కూడా నేను తరచుగ వెళ్ళే లూథరన్ చర్చీకి రమ్మన్నాను. అందులకామె నేను నాకు ఇష్టమైన చర్చీకి వెళతాను. కాని ఆ చర్చీకి రానన్నది. క్రైస్తవ సంఘాలలో ఉన్న శాఖలు, వాటిలో ఉన్న విబేధాలు నాకు తెలియవు. ప్రభువు కూడా పలాని సంఘానికి మాత్రమే వెళ్ళమని ప్రభువు నాతో చెప్పి యుండలేదు గనుక నేను ఆమెతో నీవు ఏ సంఘానికైనను వెళ్ళవచ్చును. నాకు అభ్యంతరము లేదన్నాను.
సరే ఆదివారము రానే వచ్చింది. ఉదయముననే కార్యక్రమాలు ముగించుకొని ఏ చర్చీకి పోదామని అన్నాను. క్యాథలిక్ చర్చీకి అని ఆమె చెప్పింది. ఏమి క్యాథలిక్ చర్చీలోని ప్రత్యేకత అన్నాను. నేను ఒకసారి నీతో కూడా లూధరన్ చర్చీకి వచ్చినప్పుడు నేను అలంకరించుకొన్న నా నుదుటి మీద బొట్టు నీతో ఉద్యోగము చేస్తున్న టీచరమ్మలు తుడిచివేశారు. నాకు చాలా దిగులు వేసింది. నేను వారిని ఏమియు అనలేకపోయాను. ఆ తదుపరి నేను కొందరిని విచారిస్తే క్యాథలిక్ సంఘములో చేరితే హిందూ ఆచారాలకు వాళ్ళు అభ్యంతరము చెప్పరు. కనుక ఆ సంఘమునకు వెళ్ళమన్నారు. క్యాథలిక్ సంఘానికి వెళ్తానన్నది. నీవు ఏ సంఘములో నైనను ప్రభువును ఆరాధించడమే నాకు కావాలి. నీ ఇష్ట ప్రకారముగా అక్కడకే పోదామని తీసుక వెళ్ళినాను. ఆ చర్చీలో పని చేస్తున్న మార్గరేటమ్మగారు ఈమెకు ప్రార్థనలు నేర్పించి, జ్ఞానస్నానము అను పేరు గల బాప్తిస్మము నా అనుమతి తీసుకొని ఆమెకు పాదరీగారి ద్వారా ఇప్పించింది. భర్తగాని లేదా తండ్రి అనుమతి లేనిదే ఏ స్త్రీకి వాళ్ళు బాప్తిస్మము ఇవ్వరు. ఎందుకంటే కుటుంబములో గొడవలు తగాదాలు వస్తాయేమోనని వారు ముందు జాగ్రత్తగ అనుమతి అడిగినప్పుడు నేను ఇవ్వమన్నాను. ఆమె నాతో నీవు కూడ బాప్తిస్మము తీసుకుంటే మంచిది గదా! అని ఆమె అన్నప్పుడు నేను ఇంకను నిర్ణయించుకోలేదు. ప్రస్తుతము ఆమె కివ్వమని ఆమెకు నచ్చ చెప్పాను. ఆమె నా భార్యకే ప్రార్థనలు, కథోలిక మత సిద్ధాంతాలు నేర్పించి ఫాదరుగారి ద్వారా బాప్తిస్మము ఇప్పించింది. దినములు గడచుచుండగా ప్రభువు చెప్పిన డిసెంబరు 25వ తేదీ గడువుకు ముందు రోజు అనగా డిసెంబరు 24వ తేదీన ఈ సంభాషణ జరిగింది. ఆమె నాతో నేను గర్భవతినయ్యానని నాకై నేను తెలుసుకొంటానని ప్రభువు చెప్పిన రోజు రేపే కదా! కాని ఈరోజు వరకు ఆ సూచనలుగాని గర్భము ధరించినట్టి చిహ్నాలు గాని ఏవియు నాలో లేవు - అని ఎగతాళి మాటలుగా చెప్పటం మొదలుపెట్టింది. అప్పుడు నేను ఆమెతో ఈ మాటలు రేపు చెప్పు నేను వింటాను. ఎందుకంటే ప్రభువు చెప్పిన దినము 25వ తేదీ పండుగ దినము. కను రేపు మాట్లాడు - ఈరోజు గర్భమును గూర్చిన ఏ మాటలు మనము మాట్లాడుకోవద్దన్నాను. ఆమె మౌనురాలైంది. ఆ రాత్రి గడిచి తెల్లవారింది. ఇద్దరము నిద్ర లేచాము. కాలకృత్యాలు తీర్చుకొని ముఖ ప్రక్షాళన దంతధావనము చేసుకొనుటకు ప్రారంభిస్తూ - ఆమె టూత్‌బ్రష్ తీసుకొని నోరు శుభ్రము చేసుకొనుటకు వెళ్ళినప్పుడు - అప్పటికప్పుడే ఆమె భరించలేనంత వేవిళ్ళు - వాంతులు వగైరాలతో ఆమె శరీరము నిలువలేని స్థితిలో బాధపడుచుండగా మా ఇరువురికి అర్థము కాక వెంటనే ఆమెను రిక్షా ఎక్కించి రైల్వే ఫీడర్సు రోడ్డులోని అమెరికా బాప్టిస్టు హాస్పిటల్‌కు తీసుక వెళ్ళి భేరిమ్మ అను అమెరికా డాక్టరమ్మకు చూపించాను. ఆమె పరీక్ష జేసి ఈమె గర్భవతి మూడవ నెల జరుగుతున్నది, అని కొన్ని మందులు వ్రాసిచ్చి ఇంటికి పంపింది. తాను అడిగిన ప్రశ్నకు ప్రభువు మాట ఋజువుపరిచింది గనుక దృఢముగా ప్రభువును ఆయన తల్లి మరియ మాత మీదను తన భక్తి ప్రపత్తులను అధికము చేసుకొని, అక్కడనుండి ప్రభువు ద్వారాను, ఆయన తల్లి ద్వారాను అనేక సహాయ సహకారాలు సూచనలు పొందటం జరుగుతూ వచ్చింది. అంటే ఏ బిడ్డ పుట్టేది - ఆ బిడ్డ ప్రసవమయ్యే కాలము చెప్పటం సూచాయగా ఆ పుట్టబోయే బిడ్డ భవిష్యత్తు చెప్పటం వగైరాలు జరుగుతూ వచ్చింది.
ప్రభువు నాతో ఏడుగురు సంతానాన్ని దయ చేస్తానని ఒక్కొక్క సంతానము ఇస్తూ వచ్చాడు. ప్రభువు మాటనుబట్టి ఆయన వాక్కును అనుసరించాలి గనుక మేము పిల్లలు పుట్టకుండ ఆపరేషన్ చేయించుకోలేదు. కాని ఇరుగుపొరుగువారు బంధుమిత్రులు నా భార్యతో మాట్లాడుచు ఆపరేషన్ చేయించుకోమని ఒత్తిడి తెచ్చేవారు. ఆ బాధ ఆమె జీవితములో భరింపరానిదైంది. ప్రభువు ఇచ్చే సంతానాన్ని భరించాలా? లేక ఆయన మాట కాదని ఆపరేషన్ చేయించుకోవాలా? ఏది ఏమైనను ప్రభువు మాటను మాత్రమే పాటించాలని తీర్మానించుకొన్నాము. కాని అపవాది ప్రభువు చెప్పిన మాటను నిర్వీర్యము చేయాలని ఇరుగు పొరుగువారిలోను, బంధుమిత్రులలో చేరి నా భార్యను భయపెట్టేవాళ్ళు - ఏ విధముగా - అంటే బ్రతకలేని బడిపంతులు జీతము - ఆ రోజులలో ఈ రోజులలో వలె ఎక్కువ జీతాలుండేవి కావు - అందువల్ల బడి పంతుళ్ళకు విద్యార్థుల తల్లిదండ్రులు అనేక విధాలుగా సహాయ సహకారాలు అందించేవాళ్ళు - నేను 1957లో నా జీతము అంతా కలిపితే 57 రూపాయలు మాత్రమే - కావలిలో నా మామయ్య రామిరెడ్డిగారు రోజుకు రెండు రూపాయలు కూడా రావటం లేదు. ఉద్యోగం వదలిపెట్టి నా ఆయిల్ కంపెనీలో కూర్చోమన్నాడు. నాకెందుకో మనస్సు రాక ఈ టీచరు ఉద్యోగములో నిలచిపోయాను. అదృష్టవశాత్తు ప్రభుత్వము బడి పంతుళ్ళ జీతాలు చాలా తక్కువయని భారతీయ పౌరులుగా చిన్న పిల్లల భవిష్యత్తు తీర్చిదిద్దే పంతుళ్ళ జీతాలు ఇట్లుండకూడదని విశేషముగా పెంచుతూ వచ్చారు. ఆ రోజులలో బతక లేనివాడు బడి పంతులు అనే సామెత - ఈ రోజులలో బతక నేర్చినవాడు బడిపంతులు అని మారింది. అందువల్లనే ఈ రోజులలో టీచరు పోస్టు సంపాదించాలన్న బహు కష్టతరముగా తయారైంది. ఇరుగుపొరుగు అమ్మలక్కలు నా భార్యను భయపెట్టుచు ఈ పిల్లలనందరిని స్కూలులో చేర్చి చదివించేటప్పుడు వాళ్ళు పెద్ద చదువులకు వెళ్ళినప్పుడు నీ బ్రతుకు బయట పడుతుంది. ఇప్పుడు కాదు నీకు తెలిసేది. సెంటు పొలము లేదు. స్వంత ఇల్లు లేదు. పెద్దలు సంపాయించిన ఆస్థి లేదు. చాలీచాలని జీతము. దర్జీ పని చేసి ఈ పిల్ల గుంపును ఎలాగు పైకి తీసుకరాగలవు? అని ప్రశ్నిస్తుండేవారు. ఎట్లో వారి మాటలు కాదనలేక ప్రభువు స్వయముగా ఇచ్చే సంతానమును కాదనలేక ఎట్లా ఒక అమ్మాయి, ఐదుగురు మగ పిల్లలను కనింది. ఇంకొక్క సంతానమే కొరవ అది పూర్తియైతే ఇక మాకు సంతానము ప్రభువు ఇవ్వడు. ఇట్టి పరిస్థితులలోనైనను ప్రభువు మాటను వ్యతిరేకింపజేయాలని బంధుమిత్రులలో అపవాది ప్రవేశిస్తూ - ఈ పిల్లలను నీవు చదివించలేవు - కూలికి బేలుదారి పనికి పంపిస్తావు - ఆ పనులు కూడా వారికి చేతకాక వారి భవిష్యత్తును నీ చేతులారా నాశనము చేస్తావా? ఇకనైనను ఆపరేషన్ చేయించుకోమని వత్తిడి తెస్తూ పంది పిల్లలను కన్నట్లు అనేకమంది పిల్లలను కంటే సరిపోదు. వారి భవిష్యత్తు తీర్చిదిద్దాలి. బుద్ధి జ్ఞానము ఉన్నదానివైతే ఇకనైనను ఆపరేషన్ చేయించుకొమ్మని ఒత్తిడి తెచ్చారు. నిండా మునిగిన వానికి చలి ఏమిటి? ఇంకొక్క బిడ్డయే కదా! ఓపిక పట్టమని నా భార్యను ఓదార్చినాను. ఆమె ఇక ఓర్చుకోలేక ప్రభువు తల్లి మరియ మాత స్వరూపము ఎదుట చేరి విలపిస్తూ నీవు సత్యమైన తల్లివైతే - ఇప్పుడు వచ్చిన నాకీ గర్భము నిలవకుండ చేయమని పంతము పట్టింది. ఇక్కడ సాతానుకు మంచి అవకాశము కల్గింది. మరియ తల్లి సత్యమైన ప్రభువు తల్లి అయితే గర్భము తీసివేయాలి. ప్రభువు మాటను బట్టి ఆ గర్భమును పోగొట్టకుండ ఉంచితే ఆమె సత్యమైన తల్లి కాదు. ఆమె పరిశుద్ధాత్మతో జతపరచబడిన పవిత్రమూర్తి - నీవు సత్యమైన తల్లివైతే అనే పదమును తన ప్రార్థనలో వాడింది కనుక - ఆ మాట ఆమెను ఆవరించియున్న పరిశుద్ధాత్మకు ఆ మాట దూషణకరముగా పరిణమించింది. పరిశుద్ధాత్మను దూషించువారికి పాప క్షమాపణ లేదు. అది భయంకరమైన నేరము. సాతాను బంధుమిత్రులలో ప్రవేశించి ఇంకొక్క సంతానము దగ్గర ఆమెను పరిశుద్ధాత్మకు వ్యతిరేకిగా జేసి భ్రష్టు పట్టించాడు. వెంటనే గర్భము విచ్ఛిన్నమై రక్త ధారలతో బట్టలన్నియు కూడ తడిసిపోయాయి. ఆమెను వెనువెంటనే హాస్పిటలులో చేర్పించి స్వస్థత పొందిన తర్వాత పిల్లలు లేకుండ ఆపరేషన్ చేయించటం జరిగింది. ప్రభువు ఇచ్చే ఏడవ తలాంతును పోగొట్టుకొని పరిశుద్ధాత్మకు విరోధముగా మాట్లాడిన మాట ఆమె శారీర ఆత్మీయ జీవితాలను భ్రష్టు పట్టించి వేదన పూరితము చేసింది. ''నీవు సత్యమైన తల్లివైతే -'' అను మాట ఉపయోగించక, భారభరితమైన ఈ సంసారాన్ని నేను మోయలేను ప్రభువుకు విన్నవించి ఆయన చిత్తమునకు ఒప్పిదముగా ఈ సంతానాన్ని నాకు లేకుండ చేయమని మోకరించి ప్రాధేయపడి ఉంటే, ప్రభువు ఆయన తల్లి ఇద్దరు ఆమెతో మాట్లాడియుండేవారు. నీకు భారము లేకుండ తల్లీబిడ్డలము ఇద్దరము మీ కుటుంబములో ప్రవేశించి నీకు ఏ విధమైన భారము లేకుండ నీకు సహాయ సహకారాలు అందిస్తామని ఓదార్చేవారు. ఇంకొక్క సంతానమే కదా! ఓపిక పట్టమ్మా అని ఓదార్చేవారు. కఠినమైన పదము నుపయోగించి ఆయన తల్లిని నిష్ఠూరముగా మాట్లాడినందుకు గర్భము విచ్ఛిన్నమై ఆగని రక్తధారలతో ఇంటిలో మంచము మీద పడుకొని ఏడుస్తూ ఈ బిడ్డలను నీవు ఎట్లా చేస్తావు - ఏ విధముగా నీవు వాళ్ళను చక్కబెట్టగలవు? నేను ఆగని రక్త స్రావముతో శరీరము చాలిస్తున్నానని ఏడుస్తుండగా నేను ఓదార్చి నీ ప్రాణము పోవాలంటే ప్రభువు నాకు ముందుగా తెలియజేస్తాడు. ఆయన నీ ప్రాణము పోతుందని తెలియజేయలేదు కనుక నీ ప్రాణము పోదు. ధైర్యముగా ఉండమని హాస్పిటలులో చేర్పించి పిల్లలు లేకుండ ఆపరేషన్ చేయించాను. అది మొదలుకొని ఆమె శరీర ఆరోగ్యము హై బి.పి. షుగరు జబ్బులు చోటు చేసుకొని భూమి మీదనే విడుదల పొందలేని నిత్య నరకాన్ని అనుభవిస్తూ వస్తున్నది. సృష్టికర్తకు ప్రతిరూపమైన మార్గము సత్యము జీవమునైన యేసుక్రీస్తు ప్రభువు జన్మించిన తల్లిని సత్యమైన తల్లివి అయితే అని సవాలు విసరుటన్నది క్షమించరాని నేరము. నేను ప్రభువును ఎరుగక మునుపు ఆయనతో నేను సవాలుగా మాట్లాడలేదుగాని, ''నీవు జగత్తుకు మూలపురుషుడవని సృష్టికర్తకు ప్రతిరూపమని లోకరక్షకుడవని లోకమునకు వెలుగని క్రైస్తవ లోకము బైబిలు ప్రకటిస్తున్నది. ఒక తండ్రిని తన బిడ్డ అడిగినట్లు అడిగేవాడను.
1. లోకమునకు వెలుగన్నావు - ఆ వెలుగు నేను దర్శించాలి గదా!
2. నా పూర్వీక దేవుళ్ళు దేవతలు జరిగినవి చెబుతారు. జరగబోయేవి చెప్పేవాడే నిజమైన దేవుడు. మరి నాకు అది రూఢిపరచమని అడిగినాను.
ఇట్లు దైవత్వము యొక్క శక్తిని కనుగొనాలని నాలో రూఢిపరచుకోవాలని అభ్యర్థిస్తూ ఆయనను ఒక తండ్రిని బిడ్డ అడిగినట్లు విధేయతతో అడిగేవాడను. ఆయన కూడా నన్ను తన కుమారునిగానే ప్రేమగానే ఎప్పుడు ఏ పరిస్థితులలోను దురలవాట్లలో కూడా విసుగుకొనక ముఖాముఖిగ మాట్లాడుచు, తన ప్రత్యక్షతను నా ఎదుట నుండి తీసివేయలేదు.
.......
48. బాప్తిస్మముతో అవసరమేమిటి? అని ఆ సాంగ్యమును నిరాకరించిన దాని ఫలితము :- నేను ప్రభువును పరిశోధించి ఆయన ద్వారా ప్రయోగాత్మకముగా సృష్టికర్తకు ప్రతిరూపమని, యెహోవా దేవుని నరావతారమని ఆయన తప్ప వేరొక దేవుడు లేడని హృదయ పూర్వకముగా గ్రహించి, ప్రభువు ధ్యానములోను ముఖాముఖిగ ఆయనతో మాట్లాడుటలోను ఆయన సలహాలు పొందుచున్న నేను ఆయన మహిమను కనుగొన్న నేను - ప్రభువు వెలుగును దర్శించుచు ఆయన తప్ప వేరొక దేవుడు లేడని తీర్మానించాను. ప్రతి ఆదివారము ఆరాధనకు వెళ్ళుతున్నాను. మరి ఇంత ప్రగతి బాటలో ఉంటున్న నేను ప్రభువులో ఆత్మీయముగా ఇంత ముందంజ వేసిన నేను బాప్తిస్మము పొందవలసిన అవసరమున్నదా? ప్రభువు తప్ప మరొక దేవుడు లేడన్న విశ్వాసాన్ని ప్రభువే నాలో ప్రయోగాత్మకముగా బలపరిచాడు - ఆయన సన్నిధి ప్రత్యక్షత నా ఎదుట నుండి తీసివేయలేదు. ఇంతగా ప్రభువులో ఎదిగిన నాకు ప్రభువు మహిమను రుచి చూచిన నాకు, బాప్తిస్మము అక్కరలేదని నాలో నేను తీర్మానించుకొని యుండగా రెండు సంవత్సరాలు జరిగియుండవచ్చునేమో ఒకనాటి రాత్రి నేను నా ఇంటిలోనే నా మంచము మీదనే పండుకొని నిద్రపోతున్నట్లుగానే కల వచ్చింది. నా మంచమే నేను ఉంటున్న బాడుగ ఇల్లే అది. నిద్రలో ఆకాశము నుండి నాకు ఎదురుగా ఒక నల్లటి షుమారైన కొండ వంటి బండరాయి వేగముగా దూసుకొని వస్తున్నది. ఆ రాయి నాలుగు ఏనుగుల లావు గలంత సైజులో నా మీద పడుటకు అత్యంత వేగముగా దూసుకొని వస్తున్నది. దాని ఎదురుగా నుండి తప్పుకోవడానికి నాకు శక్తి లేదు. అక్కడ ఎవరు రక్షించు నాధుడు లేడు - నా స్వరము, అందులోని భయానకమైన ఆత్రుతను గమనించువారు కూడా లేరు. ప్రభువును వేడుకొని ఆయనను ధ్యానిస్తూ మరణమగుట మంచిదన్న భావము కూడా నాలో కలుగలేదు. ఎందుకు పనికిరాని స్థితిలో ఉన్న నన్ను భవిష్యత్ ఎరిగిన ప్రభువు నాకు బాప్తిస్మము యొక్క అవసరతను గ్రహింప జేయుటకే అట్లు చేసి యున్నాడన్న తలంపు గావుకేకతో మేల్కొన్న నాకు జ్ఞానోదయము కల్గించాడు. యోహాను 3:5 నీటి ద్వారాను ఆత్మ ద్వారాను జన్మించాలి - ఇదియే క్రొత్త జన్మ - నాలో సాతాను ఆవరించుటకు కావలసిన పాత జన్మ మిగిలియుండబట్టే, సాతాను ఒక పెద్ద బండరాయి రూపములో నన్ను నశింపజేయుటకు వస్తున్నాడని నూతన జన్మకు మూలపురుషుడైన క్రీస్తు నాలో నిలిచి యుండుటకు, నీటి ద్వారా జన్మమును తిరస్కరించి నందున ఆత్మ నాలో స్థిరత్వము పొందక బాహ్యములో ఉండి నన్ను ఆదుకొంటూ నా అక్కరలను తీర్చుచున్నాడు. దేవుని ఆత్మయే అగాధ జలములలో భూసృష్టి నిర్మాణములో అల్లలాడి నిర్జీవ జలరాశులలో కొట్టుమిట్టాడుచున్న భూసృష్టికి నూతన జన్మ కల్గించింది. అట్లే ఆయన కుమారుడు మన రక్షకుడైన క్రీస్తు యోర్ధాను నదిలో నీటి ద్వారాను పావురము రూపములో దిగి వచ్చిన ఆత్మ ద్వారాను నూతనత్వము ఉజ్జీవము పొంది అనేకులకు స్వస్థత ననుగ్రహించి, రక్షణ మార్గము నుపదేశించి తనను నమ్మిన మనుష్యుల పాపములు తన మీద వేసుకొని, సిలువ మీద తల నుండి కాళ్ళ వరకు రక్త బాప్తిస్మము పొందుచు, తన ఆత్మను బలియాగము ద్వారా అల్లలాడించి ప్రాణ త్యాగము చేశాడు. మరి ప్రభువును విశ్వసించి ఆయన మార్గము ననుసరిస్తున్న నేను నీటి ద్వారా జీవజలమును అనుగ్రహిస్తూ ఆత్మ బంధము ద్వారా ఆయన యందు మనము - మనయందు ఆయన నివసిస్తుండగా యోహాను 13:10, ''స్నానము చేసినవాడు పాదములు కడుగుకోవాలి,'' అన్న ప్రభువు మాటను బట్టి నీటి ద్వారా చేయబడు బాప్తిస్మ స్నానము నేను చేయనందున ఆయన తన హస్తముతో నన్ను నా పాదములకు అంటియున్న పాప పంకిలమును ప్రక్షాళన చేయలేకపోయాడు. అందువల్ల నా ఆత్మ శరీరములయందు అపవాదికి చోటు దొరికి ఒక బండరాయిగా రూపాంతరము పొంది, అగాధ రూపమైన పాతాళమునకు నన్ను సమూలముగా అణచివేయు ప్రయత్నము చేయగలడని ప్రభువు నాకు జ్ఞానోదయము కల్గించాడు - బాప్తిస్మము ద్వారా సదాకాలము ప్రభువు మనలో మన అంతరంగములో నివసిస్తాడని యోహాను 14:20లో పలుకుచున్నాడు. ప్రభువు చెప్పినట్లుగా నేను నీటి ద్వారా ఆత్మ ద్వారా నూతన జన్మను పొంది ఆయన బల్లను ఆచరించి, ఆయన శరీరము తిని ఆయన రక్తమును పానము చేసియుంటే సాతాను నన్ను పాతాళమనబడు తన రాజ్యమునకు నెట్టివేయుటకు సమర్థుడు కానేరడు. నేను మేల్కొని జ్ఞానోదయము పొంది బాప్తిస్మము పొందాలని నేను తరచుగా వెళ్ళుచున్న మద్రాసు బస్టాండు దగ్గర నున్న లూథరన్ చర్చీలో బాప్తిస్మము పొందుటకు సిద్ధపడి, ఆ యొక్క విషయమును నాతో నేను పని చేస్తున్న స్కూలులోనే ఉపాధ్యాయినిగా పని చేస్తున్న ఆమెకు తెలియజేశాను. ఆమె ఒక ఆదివారము నాడు ఆరాధన దినమున నేను బాప్తిస్మము పొందుటకు ఏర్పాటు చేసింది. ఆ ఆదివారము ఒక వయోవృద్ధుడైన దైవపరిచారకుడు విదేశాల నుండి ఆ ఆదివారమున ఆ గుడికి వచ్చాడు. నాతో పని చేస్తున్న ఆయ్యవారమ్మ ఆశ్చర్యపడి శేఖర్‌రెడ్డి నీవు ధన్యుడవు - స్థానిక చర్చీ పాస్టరు ద్వారా నీవు బాప్తిస్మము పొందటం లేదు. విదేశాల నుండి వచ్చి ఎన్నో ప్రదేశాలలో సమర్పణా జీవితములో సువార్త పరిచర్య చేస్తున్న పుణ్య పురుషుడే నీకు బాప్తిస్మము ఈయబోతున్నాడు. నీవు అదృష్టవంతుడవు - ఆయన ఆత్మపరుడు ఆత్మీయుడు సమస్తము సమర్పించుకొన్నవాడు ఆయన హస్తము ద్వారా బాప్తిస్మము పొందుచున్న నీవు మరి ధన్యుడవని ప్రశంసించింది. బాప్తిస్మ కార్యక్రమము విదేశాల నుండి వచ్చిన వయోవృద్ధుడైన దైవజనునితో నా బాప్తిస్మ కార్యక్రమము జరిగిపోయింది. ప్రభువు బల్లలో ఆయన శరీర రక్తములలో పాలిపంపులు పొందు యోగ్యత కూడా నాకు లభించింది.
........
49. రెండవసారి బాప్తిస్మము పొందుకోవడం జరిగింది :- నేను నా భార్య ఇష్టానుసారముగా కథోలిక సంఘములో ఆమె సభ్యురాలిగా ఉండుటకు అనుమతినిచ్చినప్పుడు ఆ సంఘములో ఉన్న సిస్టర్లు పాదర్సు నన్నెక్కువగా ప్రేమించుచు, ముస్లిమ్ మతానికి వ్యతిరేకముగా వ్రాయబడిన సత్య మత నిరూపణము అను గ్రంథము ద్వారా నేను వారి చేత హింసింపబడినప్పుడు - వారిని నాతో సమాధానపరచి శాంతింపజేసి తమ ప్రేమానురాగాలు నా కుటుంబముతో పంచుకున్నప్పుడు వారు ఈ విధముగా చెప్పారు. భార్యాభర్తలిద్దరు ఒకే సంఘములో ఉండుట మంచిది. ఇది ప్రభువు అపొస్తలుల ద్వారా ఏర్పరచుకొన్న సంఘము - నిజమైన సంఘము కథోలిక సంఘము - ప్రభువు మాటను బట్టి ఆయన తల్లిని చేర్చుకొన్న సంఘమిది - మిగతా సంఘములన్నియు ప్రభువు తల్లికి దూరమైనవి, ప్రభువుతోబాటు ప్రభువు తల్లిని కూడా మనము చేర్చుకోవాలి. తల్లిని గౌరవించాలి. కుటుంబములోని పిల్లలను తల్లి ఎట్లా క్రమశిక్షణలో ఉంచుటకు తన సాయ శక్తులా కృషి చేస్తుందో ఆయన తల్లియైన మరియను మనతోను మన కుటుంబములోను చేర్చుకొంటే సాతాను శోధనలలోను దేవుని పరిశోధన పరీక్షలలో మనము నిలిచినప్పుడు మనకు ఓదార్పునిచ్చి సహాయసహకారాలు అందించేదే ప్రభువు తల్లి. కనుక ప్రభువుతోను ప్రభువు తల్లితోను ఆయన పరిశుద్ధ సందోహముతోను ఒకే కుటుంబముగా ఉన్న ఈ సంఘమే యదార్థమైనది. ఐక్యత గల్గిన సంఘమిది - దీనిలో నీవు బాప్తిస్మము పొందమని నాకు సలహా నిచ్చారు. పలాని సంఘము చెడ్డది - పలాని సంఘము మంచిదని ప్రభువు నాతో ఎప్పుడును చెప్పలేదు. నేను అన్ని సంఘాలను ప్రేమిస్తాను. అందరితోను సఖ్యతగా ఉంటాను. మరి కథోలిక సంఘములో చేరుటకు నాకేమి అభ్యంతరము లేదని, అయితే నేను లాథరన్ సంఘములో బాప్తిస్మము పొందితిని గనుక రెండవసారి బాప్తిస్మము పొందుట అపరాధమని నేను వారితో చెప్పినాను. అందుకు వారు ఒకసారి బాప్తిస్మము తమది గాని సంఘములో పొందినప్పుడు కండిషనల్ బాప్తిస్మము అను పేరు మీద బాప్తిస్మము ఇస్తారు. లోగడ నీవు తీసుకొన్న బాప్తిస్మము యదార్థమైనది దైవ సమ్మతమైన దైనచో ప్రభువా! ఇప్పుడు నీ పేరట ఇచ్చు బాప్తిస్మము చెల్లనీయక చేయుదవుగాక! అట్లుగాక లోగడే ఇచ్చిన బాప్తిస్మము సరియైనదియు దైవ ఒప్పిదము కానిదైతే ఇప్పుడు నీ పేరట నేనిచ్చు బాప్తిస్మము చెల్లుబాటై దైవ ప్రేమకు ఆయన రక్షణకు పాత్రుడనగునని ప్రభువును ప్రార్థించి ఆయన సన్నిధిలో విజ్ఞాపన చేసి రెండవసారి బాప్తిస్మము ఇస్తారు. మొదటిసారి ఇచ్చిన బాప్తిస్మము చెల్లితే ఇది వ్యర్థమై పోవును గాక, మొదటిసారి ఇచ్చిన బాప్తిస్మము సరియైనది గాకపోయిన రెండవసారి ఈయబడిన ఈ బాప్తిస్మము ద్వారా దైవరక్షణలో ప్రవేశించి దేవుని ప్రేమకు పాత్రుడగును గాకయని ప్రభువుకు విజ్ఞాపన చేస్తూ ఇచ్చెడి బాప్తిస్మము. నాకు ఆ సంఘములో బాప్తిస్మము ఇచ్చి నన్ను కథోలిక సంఘ సభ్యుడుగా నమోదు చేసుకొన్నారు.
.......
50. నేను రాస్తున్న గ్రంథాలను ఆమోదించని సంఘ పెద్దలు :- గ్రంథ రచనల ద్వారా శాఖా బేధము లేకుండ అన్నీ సంఘాలు దర్శిస్తూ సాక్ష్యము ద్వారాను వాక్యము ద్వారాను సంఘస్తులను పరిచయము చేసుకొంటూ నేను వ్రాస్తున్న పుస్తకాలను నెమ్మదిగా ప్రకటిస్తూ కొంతవరకు అమ్మకము చేయగల్గుచున్నాను. సంవత్సరమునకొకసారి ఆయా క్రైస్తవ శాఖలు పాస్టర్ల సదస్సు ఏర్పాటు చేసుకొంటారు. అది రాష్ట్రములో ఎక్కడనైనను ఉండవచ్చును. నేను ప్రింటు చేసిన పుస్తకాలు ఆ సదస్సులలో నన్ను అమ్ముకోనిచ్చేవారు కాదు. అందుకని ఆయా శాఖలలోని ప్రిన్స్‌పాళ్ళు, తియాలజీ ప్రొఫెసర్లు వగైరాలను కలసికొని నేను వ్రాసిన పుస్తకమును వారికిచ్చి వారి అభిప్రాయమును వ్రాయించుకొని వారి ఫోటోతో సహా ఫ్రంటు పేజీలలో పుస్తకాలలో ప్రింటు జేయించి, ఈ పుస్తకాలు నేను వారి వారి సదస్సులలో అమ్ముకొనేవాడను. ఈ విధముగా శాల్షేషన్ ఆర్మీ బాప్టిస్టు వగైరా సంఘాల సదస్సులలో అమ్ముకొంటూ ఉండేవాడను. ఈ నాటికి కూడా ప్రముఖుల అభిప్రాయాలతో ప్రచురించినను నేటి దినములలో కూడా మరి కొన్ని సంఘాలు వాళ్ళ బుక్స్ స్టాల్సులో అమ్మడానికి నిరాకరిస్తున్నారు. నిరాకరించే సంఘము క్రైస్తవ సంఘమే, ఆ సంఘ రచయితలు క్రీస్తు నామమును ప్రకటిస్తూ వ్రాసిన గ్రంథాలే. మరి నేను వ్రాసేది క్రీస్తు నామాన్ని మహిమపరచేవి గానే ఉన్నాయి. కనుక మీరు నా గ్రంథాన్ని చదివి - మీ సంఘ పెద్దలకు విన్నవించి ఈ పుస్తకాలు మీ సంఘము ద్వారా విక్రయించే ఆవకాశము కల్గించి నన్ను ప్రోత్సాహించండి,'' అని వారిని ప్రాధేయపడినను ససేమిరా అంటూ ఒప్పుకోవడం లేదు. ఇట్టి సంఘాలులో కొన్ని కాకినాడ క్రీస్తు సంఘము, మద్రాసులో వై.బి.సి. మరియు పెల్లోషిప్ వగైరాలేగాక ఎన్నో సంఘాలు మన మధ్యలో ఉంటున్నాయి. పుస్తకము ప్రింటు చేసి ఇస్తే వాళ్ళు చదవరు. ఎందుకని ఈ పుస్తకాన్ని మీ బుక్ స్టాల్సులో పెట్టుకోరో ఒక్క కారణము కూడా తెలుపరు. తిరిగి తిరిగి నా ప్రాణము వేసారింది. వాళ్ళు చదవరు - చదివేవారికి ఈ గ్రంథాలను అందించరు. గడ్డివామి దగ్గర కుక్క ఒకటి యజమాని దగ్గర సుష్టుగా తిని పడుకోనుంటుంది. గడ్డిని తినడానికి వచ్చిన పశువును తిననీయదు. సరి కదా తన యజమాని తిని పారవేసిన ఎంగిలి విస్తరిని కూడా దారిన పోతూ నకనకలాడుతున్న క్కులను కూడా తిననీయదు. అట్టి స్థితిలో ఈనాటి క్రైస్తవ సంఘాలలోని పాస్టర్లు, పాదర్లు వగైరాల సంగతి ఆలాగుంటున్నది. తాము చదివిన చదువుకు మంచి ఉద్యోగము దొరకనందున హాయిగా బ్రతికే మార్గము క్రైస్తవ సంఘమేనని, క్రైస్తవ శాఖలో ఏ పని చేసినను దిగులు విచారము ఉండదని, రేపటిని గూర్చి చింతింపనక్కర లేదని హాయిగా కాలము వెళ్ళబుచ్చవచ్చునని చేరేవారు ఎందరో ఉంటున్నారు. నిజముగా సమర్పించుకొని క్రీస్తు ప్రేమను ధరించుకొన్నవారు ఈ దినములలో వ్రేళ్ళ మీద లెక్కబెట్టడము కూడా కష్టమగుతున్నది.
.......
51. నేనే రాసే గ్రంథాలు నా జ్ఞానముతో రాసేవి కావు. మరెవరి జ్ఞానము? :- మోషే జన్మించక పూర్వము జరిగిన సృష్టి ఆవిర్భావ చరిత్ర, ఆదాము హవ్వల చరిత్ర, నోవహు జలప్రళయ కాలమున జరిగిన దైవోగ్రతలో నీతిమంతుని కుటుంబ రక్షణ వగైరాలు మోషేకు దేవుడు తెలియజేస్తూ ఏ విధముగా ఆదికాండము మొదలు పంచ కాండముల వరకే గాక అందులో తన మరణమును గూర్చి తానే వ్రాసుకొనుటన్నది ఎక్కడ ఎప్పుడు ఏ విధముగా జరుగదు. ద్వితీయోపదేశకాండము 34:5 యెహోవా మాట చొప్పున మోయాబు దేశములో ఉన్న లోయలో అతడు పాతిపెట్టబడెను; కాబట్టి ఈ పంచ కాండములలో ఉన్న మాటలన్నియు యెహోవా ఆత్మ చెబుతుండగా వ్రాసినవని తెలుస్తున్నది. ఎందుకంటే మోషే నిరక్షరాస్యుడు. మోషేకు ముందు రచనలు లేవు. వ్రాసే విధానము తెలియదు. అక్షర జ్ఞానము లేనివారు. మోషే నుండియే చదవటం రాయటం మొదలైంది. కనుక తండ్రియైన దేవుడు తన పరిశుద్ధాత్మ ద్వారా మోషేకు అక్షరం జ్ఞానం నేర్పి పంచకాండములు తన నోటితో చెప్పి వ్రాయించడం జరిగింది. యోహాను కూడా దేవుడు అనుగ్రహించిన ప్రత్యక్షత వలనను, దేవుని దూత సూచించిన విధానమును బట్టియు, తానే స్వయముగ చూచిన విషయములను గూర్చియు ప్రకటన గ్రంథము వ్రాశాడు. అలాగే హేతువాద నాస్తికుల విమర్శలు వారి ప్రశ్నలకు జవాబులు, అనేకమైన దైవిక మర్మాలు, అంతేగాకుండ ఎన్నియో ప్రసంగాంశములు వ్యాఖ్యానాలు పరిశుద్ధ గ్రంథములో దాగియున్న ఎన్నో లోతైన మర్మాలు, ఆయన తల్లియైన మరియ ద్వారా ప్రారంభించబడిన ఈ సాహిత్య రచనలు విస్తరించి, ప్రభువు తల్లిని ఆవరించిన పరిశుద్ధాత్మ ఆమె నుండి వేరై మా హృదయాంతరాళాలలో ప్రవేశించి వ్రాయిస్తున్నవేగాని ఇవి నా స్వంత రచనలు కావు - నాకు ఆయన చెప్పినవి అర్థము కానప్పుడు - అనగా మరణమును గూర్చి పరదైసు ప్రదేశాలను గూర్చి అక్కడ ఆత్మల సంచారమును గూర్చి వ్రాయబడినవి అర్థము కానప్పుడు - స్వప్నము ద్వారా సమగ్రముగా చూపించేవాడు - అంటే ఆయన నాకు చెప్పి వ్రాయించే మర్మాలు నాకు అర్థము కానప్పుడు స్వప్నము ద్వారా కండ్లారా చూపేవాడు. యేసుక్రీస్తు ప్రభువు సమక్షమున నా చేత వ్రాయించిన గ్రంథాలేగాని నా జ్ఞానము కాదని నేను అవివేకినని జ్ఞానశూన్యుడనని, పెద్దలు చదువుకోమంటే, కనీసము హైస్కూలు చదువు కూడా పూర్తి చేయలేని అసమర్థుడనని, ఏ పని చేతగాని పనికిమాలిన నన్ను ఆయన చేతిలోని కలముగా తీసుకొని వ్రాయించినవే ఈ గ్రంథాలన్నియు కూడా. అంతేగాని ఈ గ్రంథాల మీదనున్న నా పేరును బట్టి నన్ను పొగిడి నన్ను ఘనపరచి, అత్యధిక మర్యాద చూపటం వంటిది చేస్తే అది దైవత్వాన్ని అవమానపరచినట్లే గాన, ఈ గ్రంథాలు చదివి మీరు అందలి అంశాలను బట్టి ఆనందించినప్పుడు ఆయనను - ఆయన తల్లియైన మరియను ఆమెను ఆవరించిన పరిశుద్ధాత్మను సర్వోన్నతునియొక్క ప్రేమను బట్టి ఈ దైవిక కుటుంబ సహాయ సహకార ప్రత్యక్షతలను బట్టి వ్రాసినది గాన త్రియైక దేవుని దివ్య నామమునే ప్రశంసించాలేగాని నన్ను తలంచవలసిన అవసరత లేదు. ఎందుకంటే నాకే విధమైన డిగ్రీలు, హోదాలు, క్వాలిఫికేషన్స్ లేవు. కనీసము హైస్కూలు స్టడీ కూడా పూర్తి చేయలేదు. క్రైస్తవ కుటుంబములో పుట్టినవాడను కాను. ముప్పది సంవత్సరముల వరకు యేసును ఎరుగని జీవితము. ప్రభువును ఎరిగిన తర్వాత కూడా చాలాకాలము దుర్‌వ్యసనాలు నన్ను వదలలేదు. నేను సాధారణ మనుష్యుని కంటే ఎన్నో రెట్లు హీనుడనని మీరు గ్రహించి, సమస్తమైన మహిమ ఘనత ఆధిక్యతలు ప్రశంసలు ఆ ప్రభువుకే చెల్లించాలిగాని, నా పేరు పుస్తకాల మీద నున్నంతమాత్రాన నేను అజ్ఞానినే. ఏమియు తెలియని వాడనే, ప్రభువు తల్లి ఆయన ఆత్మ ఒక ఉపాధ్యాయుడుగాను ఉపాధ్యాయురాలిగాను ఉండి రాయించినవేగాని నాకేమియు ఈ రచనలతో సంబంధము లేదు. వారు చెప్పిన మాటలు నేను వ్రాశాను. మరి కొన్ని రచనలు నా హృదయములో నా ఆత్మలో ప్రవేశించిన పరిశుద్ధాత్మ ద్వారాను, ఆయన స్వప్నముల ద్వారా చూపిన ప్రత్యక్షతల ద్వారాను వ్రాసినవిగాని నేను అజ్ఞానినే ఏమియు ఎరుగనివాడనే. అన్య జీవితములో ఉన్న నన్ను తన ప్రత్యక్షత ద్వారా నాకు జ్ఞానోదయము కల్గించి అనేక పుస్తకాలు వ్రాయించిన ప్రభువునే ఘనపరస్తాము. ఆయననే మహిమ పరస్తాము. స్తుతి స్తోత్రములను సమర్పిస్తాము. సమస్త మహిమ ఘనతలు ఆయనే అర్హుడు.''
.......
52. రెెడ్డిపాళెములో ఆరోగ్య మాత గుడి - ప్రారంభ చరిత్ర :- నా జన్మ స్థలము రెడ్డిపాళెము. ఊరు పొలిమేరలలో ఒక 66 అంకణాల స్థలము రోడ్డు ప్రక్కగా ఉండి ఆ స్థలములో ఒక తాటి ఆకుల పాక వేసి ధనరాజుగారి సహాయముతో మద్రాసు వెళ్ళి మరియ మాత స్వరూపము తెచ్చి ఆ పాకలో ప్రతిష్ఠ చేశాము. ధనరాజుగారు ఆ మందిరమునకు ఉపదేశిగా తన బాధ్యతను స్వీకరిస్తూ అనేకులకు ప్రచారము చేస్తూ మందిరానికి నడిపిస్తూ వారికున్న సమస్యలను బాధలను కష్టనష్టాలను గూర్చి మరియ తల్లి ద్వారా చెప్పుచు, వారి కొరకు ప్రార్థించుచు మరియ తల్లి యేసు ప్రభువుల యొక్క ఆశీస్సులను అందించుచుండేవాడు. ఈ యొక్క స్వస్థతలను బట్టి మరియ తల్లి గుడికి ప్రతి వారము ఎంతోమంది వచ్చుచుండేవారు. ధనరాజుగారు లోగా మాంత్రికుడుగా ఉన్నప్పుడు పిశాచి యోగములో వారికి ప్రశ్నలు చెప్పుచు జరిగిపోయిన వాటిని గూర్చి ఖచ్చితముగా వివరించినప్పుడు వారు ఆశ్చర్యపడేవారు. అన్య దేవతలకు భవిష్యత్తు తెలియదు. సృష్టికర్తకు ప్రతిరూపమైన యేసు స్వామి పరిశుద్ధాత్ములకు తప్ప మరెవరికిని భవిష్యత్తు తెలియదు. కనుక జరిగిన వాటిని గూర్చి చెప్పినాడుగాన అందునుబట్టి తృప్తి పడి యుండేవారు. అయితే రెడ్డిపాళెము ఆరోగ్యమాత గుడిలో ధనరాజుగారు వారికున్న సమస్యలు వారు వివరించక ముందే తానే వారిని గూర్చి వారి సమస్యలను వివరిస్తున్నందున వారు ఆశ్చర్యపడేవారు. వారికి కొబ్బరి నూనె, తీర్థము తైలము వగైరాలు ఉపయోగిస్తూ స్వస్థత ప్రార్థనలు జరిగిస్తూ అనేకులకు మరియ తల్లి యొక్క సహాయ సహకారాలు అందించేవాడు.
మోషేకు తన అన్నయైన అహరోను సహాయకుడుగా యాజకుడుగా ఏ విధముగా సహాయ సహకారాలు అందించాడో అట్లే మాంత్రికుడుగా మా యింట పరిచయమైన ధనరాజు గారు నాకు స్నేహితుడుగా హితుడుగా సలహాదారుడుగా మారి రెడ్డిపాళెము గ్రామములో మరియ తల్లికి ఆరోగ్య మాత మందిరము కట్టినప్పుడు ఆయన ఉపదేశిగా అక్కడ ఆ మందిరములో పని చేయునప్పుడు అక్కడ ఒక వసారా ఏర్పాటు చేసి ఆయన తన భార్యతో కూడా అక్కడే నివాసము చేస్తుండేవాడు. నూతనముగా కట్టిన గుడిని గూర్చి ప్రచారము చేస్తూ అనేకులను నడిపిస్తూ మంచి ప్రార్థనలతోను మంచి పాటలను అనగా సినిమాలో కర్ణపేయముగా పాడిన పాటల బాణీలను సేకరించి, వాటిని బట్టి మరియ తల్లి మీద ప్రభువు మీద అనేక పాటలు స్వయముగా రచించి తానే పాడుచు అనేకులకు ఆ పాటలు నేర్పించేవాడు. ఆ పాటలను ఒక చిన్న పుస్తక రూపములో నేను జాగ్రత్త పరిచాను.
.......
53. స్వస్థత పొందిన అనేకులలో కొందరిని గూర్చి :- ధనరాజుగారి పరిచర్యనుబట్టి మొట్టమొదట కనుపర్తిపాడు పాలిచర్ల రుక్మిణమ్మగారు, పాలిచర్ల గోపాలరెడ్డిగారు వగైరాలెందరో జ్ఞానస్నానము పొంది, మంచి భక్తిపరులై మందిర కార్యక్రమాలలో ఎంతో కష్టపడి గుడి సందర్శన సందర్భముగా వచ్చేవారికి భోజన సదుపాయము సమకూర్చుట రివాజైనది. రుక్మిణమ్మగారి సంతానము అమెరికాలో డాక్టర్లుగా ఉంటూ ఉన్నారు. ఆమెకు వచ్చిన చర్మము మీది పొడ నయము చేయు శక్తి ఆ డాక్టర్లకు అలవి కాలేదు. అది రెడ్డిపాళెము గుడిలో అతి త్వరలో నయమైంది. ఆ తదుపరి ఆమె తమ్ముడు గోపాలరెడ్డి గార్కి సంతానము లేని తరుణములో ఇద్దరి బిడ్డలను ఆమె దయ చేసింది. నేను నా భార్య చేసిన ప్రార్థనల వల్ల నా తమ్ముడు శ్రీనివాసులు రెడ్డి భార్య సీతమ్మకు బిడ్డ పేగులో డాక్టర్లకు నయముగాని అల్సరును నయము చేసి ఆపరేషన్ లేకుండ చేసి ఇద్దరి బిడ్డలను అనుగ్రహించింది. ఆ గ్రామములో బద్వేలు అన్నమ్మగారు పొలములో బోరు బావి త్రవ్వించినప్పుడు నీళ్ళు పడకపోయి విచార పడుతున్నప్పుడు ఆమెను ప్రార్థించుట ద్వారా ఒక్క రాత్రిలోనే విశేషమైన జలము వారికి ప్రసాదించింది.
......
54. ఈ నా రచనలకు ప్రారంభ పునాది మరియ తల్లి :- ధనరాజుగారికి పిశాచి సంబంధమైన మాంత్రిక యోగములో మరియ తల్లి ప్రవేశించింది. నాకు హైస్కూలులో చదివేటప్పుడు శివకోటారెడ్డిగారు నేర్పించిన అన్య దేవతల యోగములో యేసు ప్రభువు ప్రవేశించాడు. అయితే ఎల్.కె.జి., యు.కె.జి. పిల్లలకు చెప్పబడే మాటల వలె ఆ తల్లి మా ఇరువురి మధ్యలో కూర్చుండి చిన్న చిన్న ఆత్మీయ వేద రచనలు ప్రారంభిస్తూ వాటిపై ప్రశ్న వేస్తూ జవాబు కొరకు మా వైపు చూచేది. మేము తెల్ల ముఖము వేసినప్పుడు ఆమె మమ్ము ఓదార్చుతూ జవాబు చెప్పేది. ప్రారంభములో ఆమె వేసే చిన్న చిన్న ప్రశ్నలు చిన్న చిన్న జవాబులే. కాని మాకు ఆ చిన్నవైన జవాబులు చెప్పటం కూడా కష్టతరమయ్యేది. ఈ ప్రశ్నలను గూర్చి మీరు తెలుసుకోవాలంటే మాచే విరచితమైన ''ఆత్మ జ్ఞాన యోగ సందేశములు'' అనే పుస్తకములో వివరించబడియున్నవి. ఇవి దాదాపు వెయ్యి ప్రశ్నలు ఉండవచ్చును. ఆ కాలములోనే ఎన్.వి. బ్రహ్మం చీరాలవారు బైబిలులో తప్పులున్నవని బైబిలు బండారము అనే పుస్తకము రచించినప్పుడు ఆ పుస్తకము మీద హైకోర్టుకు వెళ్ళి దానిని బ్యాండ్ చేయమని వెళ్ళినప్పుడు న్యాయాధిపతులు ఆ అంశములకు వివరణ కోరినప్పుడు జవాబు చెప్పలేని పరిస్థితులలో క్రైస్తవ సంఘ పెద్దలు తియాలజిష్టులు తలలు వ్రేలాడ వేసుకొని వచ్చినప్పుడు రెడ్డిపాళెము మరియ తల్లి అద్భుత రీతిలో ఆ జవాబులను మాకు అందించినప్పుడు బైబిలు బండారము నూరు ప్రశ్నలకు వాటి విమర్శలకు బైబిలు సత్యము - హేతువాదము నిరాధారమన్న పేరుతో జవాబులు ప్రకటించగా ఆ హేతువాద నాస్తికులే ఆ జవాబులు చదువుకొనినప్పుడు - బ్రహ్మం వ్రాసిన విమర్శలు తెలివితక్కువ విమర్శలు ప్రశ్నలు అని తెలుసుకొని వారంతట వారే ఆ గ్రంథమును మార్కెట్టు నుండి తొలగించుకున్నారు. ఇది రెడ్డిపాళెము ఆరోగ్య మాత తనను ఆవరించిన పరిశుద్ధాత్మ శక్తితో మాకు అనుగ్రహించిన తొలి విజయము. అప్పటి నుండి మా ఇరువురి పేర్లు ఆ రచనల మీద ప్రకటిస్తూ అనేక చిన్న చిన్న ఆధ్యాత్మిక గ్రంథాలు అనేకము ప్రకటించాము.
ప్రారంభములో రెడ్డిపాళెములో ఆమె తన ప్రత్యక్షతను మాకు అనుగ్రహించి ఆమె చెప్పే మాటలు సామెతలు చిన్న చిన్న ప్రశ్నలుగ ఆమె వేసినప్పుడు ముఖము తేల వేసినప్పుడు ఆ తల్లియే జవాబులు చెప్పుచు మమ్ములను ఆనందింపజేస్తుండేది. ఆమె చెప్పే ప్రతి మాట చిన్న చిన్న నీతి కథలు మాటల వాక్యాలు - అవి అన్నియు నన్ను ఆకర్షించి ఉజ్జీవపరచినందున ఆమె సన్నిధిలో వచ్చిన ప్రతి మాటను ఒక నోట్సులో వ్రాసి పెట్టుకొనేవాడను. కొన్ని సమయాలలో దేహము విడిచిన ఆత్మలు ధనరాజుగారి యోగములో వచ్చి మాట్లాడేవారు. కాని మరియ తల్లి వలె వేదాంతమును బోధించాలని అపొస్తలులలో కొందరు ప్రయత్నించినప్పుడు వారు చెప్పే బోధలోని మాటలను నేను అభ్యంతరపరచి తర్కిస్తుండగా గ్రంథ రచన సాగేది కాదు. అందు నిమిత్తమే మరియ మాత చెప్పే విషయాలు నాకు ఆమోద యోగ్యముగా ఉండేవి. అందువల్ల ఆ తల్లియే ఎక్కువ కాలము ధనరాజుగారి ద్వారా వేద బోధన చేసేది. నేను వ్రాసేవాడను.
......
55. ధనరాజుగారి యోగమునకు నా యోగమునకు తారతమ్యము :- నా యోగములో ప్రభువు మాత్రమే మాట్లాడేవాడు. కాని ధనరాజుగారి యోగములో ఒక్కసారి కూడా ప్రభువు మాట్లాడలేదని చెప్పేవాడు. దేహము విడిచిన ఏ ఆత్మ కూడా నాతో మాట్లాడడానికి ప్రభువు పర్మీషన్ ఈయలేదు. ఆయన తప్ప మరెవ్వరు నాతో మాట్లాడడానికి లేదు. ఎప్పుడైనను ఎక్కడైనను ఏ సమయములోనైనను ఆయన తల్లి నాతో మాట్లాడేది.
ప్రభువును నా స్వరక్షకునిగా అంగీకరించిన దినాలలో ప్రభువు మాట్లాడినట్లుగానే ఆయన లేని సమయములో అపవాది యేసుక్రీస్తు రూపమును ధరించుకొని నాతో మాట్లాడడము జరిగేది. అందువల్ల నేను మోసపోయి ప్రభువుతో విన్నవించుకొన్న నాటి నుండి సాతాను కూడా నాతో మాట్లాడడానికి అవకాశమియ్యలేదు. సాతాను క్రీస్తు రూపములో వచ్చి మోసపరచిన విధానమును గూర్చి తదుపరి విభాగములో వివరిస్తాను.
ధనరాజుగారి యోగమును ఆసరాగా తీసుకొని ఆయన యోగము ద్వారా భూమి మీద దేహము చాలించిన వారిని పిలిపించుకొని వారి ద్వారా మరణమును గూర్చిన అనేక సంగతులు నేను వ్రాసేవాడను. నాకు ఎక్కువ ఆసక్తి కల్గించేది దేహము విడిచిన ఆత్మల గతిని గూర్చి వాటి సంచారము నివాసము వగైరాలు నేను అడిగి తెలిసికొని వ్రాసేవాడను. వారిచ్చిన సాక్ష్యము ద్వారా ప్రత్యక్షముగా ఒక పుస్తకము వ్రాశాను. అయితే దేహము విడిచిన ఆత్మలు నా యోగములో వచ్చి మాట్లాడకపోయినను నా స్వప్నములో వచ్చి ఎన్నోసార్లు నాతో మాట్లాడుచు - అనేక విషయాలు నేను అడిగిన వాటిని గూర్చి కూడా చెప్పేవారు. నిద్ర లేచినప్పుడు నాకు జ్ఞాపకమున్నంతవరకు వాటిని రాసి పెట్టేవాడను. ప్రభువు చెప్పినవి యోహాను వ్రాసిన ప్రకటన గ్రంథ రచనలు నేను చదివి గ్రహించలేనప్పుడు స్వప్నము ద్వారా పరదైసు విభాగాలలోకి నా ఆత్మను నడిపించి సకల విషయాలు గ్రహింపజేసేవారు. ఆ విధముగా దేహము విడిచిన ఆత్మల యొక్క కొన్ని విషయాలు వ్రాయగల్గినాను.
..........
56. తండ్రి ఎవరో కుమారుడు గుర్తు పట్టాలి :- ప్రభువును నమ్మిన ప్రారంభ దినాలలో నెల్లూరు నుండి బుచ్చిరెడ్డిపాళెము శివకోటారెడ్డిగారి దగ్గరకు పోవటం మానలేదు. ప్రభువు తట్టు చూచి ఆయన సమ్మతమైన సూచన ఇస్తేనే నేను వెళ్ళేది. ఆయన వెళ్ళమని సంజ్ఞ చేయకపోతే నేను వెళ్ళినను ఆయన అక్కడ ఉండడు. ఏదో యొక పని మీద ఆరోగ్యము బాగులేకనో తరచుగ మద్రాసు వెళ్ళుతుండేవారు. నేను బుచ్చిరెడ్డిపాళెము వెళ్ళదలచినప్పుడు ఆయన తట్టు చూచేవాడను. ఆయన వెళ్ళమన్న సంజ్ఞ చేయకపోతే నేను వెళ్ళేవాడను కాను. ఆ తదుపరి ప్రభువు తనకై తానే నాకు సూచన ఇచ్చినప్పుడు ఆ సమయములో వెళ్ళేవాడను. శివకోటారెడ్డిగారు తన క్యాంపు ముగించుకొని ఇంటికి రావడం నేను ఆ సమయమునకు వెళ్ళటం జరిగేది. ఇట్లుండగా మరి కొన్ని దినముల తర్వాత మరల రెడ్డిగారి దగ్గరకు వెళ్ళాలని ప్రేరేపింపబడినప్పుడు ప్రభువు తట్టు చూచినాను. ఆయన నాకు అనుమతి ఈయలేదు. ఆ తదుపరి కొన్ని గంటల వ్యవధిలో ప్రభువు రూపము ఆయన స్వరము ధరించుకొన్న అపవాది నాకు ప్రత్యక్షమై ఇప్పుడు వెళ్ళమన్న సూచన నాకు ఇచ్చాడు. ప్రభువు రూపము ఆయన స్వరమును ధరించిన అపవాదిని నేను గుర్తుపట్టనందున ప్రభువే ననుకొని బుచ్చిరెడ్డిపాళెము వెళ్ళగా ఆయన లేడు మద్రాసు వెళ్ళినాడు అని అన్నారు. తిరిగి ప్రయాణమై సైకిలు మీద వస్తూ ప్రభువు నన్ను అనవసరముగా బయలుదేరవచ్చునని ఎందుకు సంజ్ఞ చేశాడు? అని ప్రభువు తట్టు చూచినాను. అప్పుడు ఆయన చెప్పిన మాట - ''తండ్రి ఎవరో కుమారుడు గుర్తు పట్టాలి'' అని అన్నాడు. అప్పుడు నేను ఆలోచించుకొని ఇది అపవాది క్రీస్తు రూపాన్ని ధరించుకొని వచ్చి మోసము చేశాడు - నేను అపవాదిని గుర్తుపట్టలేకపోయాను. కనుక నాదే పొరబాటని ఆలోచించాను. కాని ప్రభువు చెప్పిన ఆ మాటను జ్ఞానముతో ఆలోచిస్తే - ''ఈ విధముగా అందులోని అర్థమున్నది. ''తండ్రి ఎవరో కుమారుడైన క్రీస్తుకు తప్ప మరెవరికిని గుర్తుపట్ట సాధ్యపడదు.'' కాబట్టి ఆ నాటి నుండి సాతాను యొక్క వేషధారణను అరికట్టి అతనికి అవకాశము లేకుండ నా రచనలలోను ఆత్మల యోగము ద్వారా మాట్లాడుటలోను స్వప్న దర్శనములలోను లేకుండ హద్దు లేర్పరచి ప్రభువు ఈ సువార్త కార్యక్రమము జయప్రదము గావిస్తున్నాడు.
......
57. సాతానుతో మోసగింపబడిన మరియొక సంఘటన :- ప్రభువును అనుసరించిన రెండు సంవత్సరాల కాలములో ఒక దినమున నేను ప్రభువును గూర్చిన ధ్యాసలో ఉండగా అపవాది క్రీస్తు రూపము ధరించి లోకాన్ని సాంసారిక జీవితాన్ని ఉద్యోగాన్ని సమస్తము వదలి సెయింట్‌గా మారి ఏదైన యోగాశ్రమములో ప్రవేశించు. అక్కడి హిందూ యోగాశ్రమములోని వారికి కూడా క్రీస్తు మార్గమును బోధించుము. వైరాగ్య జీవితాన్ని కొనసాగించుము. వెళ్ళేటప్పుడు ఎవరితో ఏమియు చెప్పనవసరము లేదని హుకుం జారీ చేశాడు. నిజముగా ప్రభువే నాతో మాట్లాడుచున్నాడనుకొని, ఆయన చెప్పినట్లు చేయడమే ముఖ్య ధర్మమని వెనుక ముందు సంశయించి ఆలోచన చేయవలసిన అవసరత లేదని తలంచి, వెంటనే లేచి ఉద్యోగానికి రిజైన్ చేయక కనీసము సెలవు కూడా పెట్టక తరచుగ వేసుకొనే దుస్తులు తీసుకోకుండ పరుపుకు ముసుగు కుట్టమని ఒక ముతక గుడ్డ ఒకటి రామచంద్రారెడ్డిగారి తల్లి ఇచ్చిన కొన్ని గజాల ముతక గుడ్డ నా భార్య మిషన్ దగ్గర ఉంటే దాన్ని ముక్కలుగా కత్తిరించి ఒక పెద్ద ముక్క మొలకు చుట్టుకొని ఒక చిన్న ముక్క పై కండువా లాగా వేసుకొని విగ్రహాల దగ్గర పూజారుల వలె బయలుదేరుచు, మిగిలిన గుడ్డ ముక్కను ఒక చిన్న కవరులో ఉంచుకొని ఆశ్రమానికి వెళ్ళే ఛార్జీ మాత్రమే దగ్గర ఉంచుకొని తిరిగి ఇంటికి వచ్చే ప్రసక్తి లేదు గనుక అదనముగా డబ్బులు తీసుకోకుండా నా భార్యకు కూడా చెప్పకుండ నాకు తెలిసిన పెద్దల సుబ్బమ్మగారు ఉంటున్న యోగాశ్రమానికి వెళ్ళినాను. ఆమె స్వామికి పరిచయము చేసి ఆశ్రమములో భోజన వసతులు కల్పించింది. ఆరోజు మధ్యాహ్నము భోంచేసి సాయంత్రము ఏటి దగ్గరకు వచ్చి హృదయము కలవరపడుచుండగా నేను జీవితములో తప్పిపోకుండ సరియైన మార్గములో నడిపించమని హృదయవిదారకముగా ప్రభువును గూర్చి ధ్యానిస్తూ ప్రార్థన చేశాను. నేను ఎంత ఎక్కువగా ప్రార్థన ధ్యానము చేస్తున్నానో అంత ఎక్కువగా నా సంసారము, నా ఉద్యోగము, నా తల్లిదండ్రులు వారి వైపే నా హృదయ స్పందన, మానసిక స్థితి పరుగులెత్తుతుంది. ఈ రోజు నేను అనుసరించిన మార్గము ప్రభువు చిత్తమైతే ఈలాగు హృదయము కలవరముతో హృదయవిదారకముగా ఉండదని గ్రహించి, మరల మరుసటి రోజు నెల్లూరు రావటానికి ప్రయత్నము చేశాను. కాని టిక్కెట్టుకు డబ్బులు లేవు - రైల్వే స్టేషన్ దగ్గర ఉన్న కొందరు పల్లెటూరి వ్యక్తులను పరిచయము చేసుకొని, నా పర్సు ఎక్కడో జారవిడుచుకున్నానని ఛార్జీకి డబ్బులు లేవని ఈ పరుపు ముసుకు చాలా ఖరీదైనదని, ఈ ముక్కలు తీసుకొని మీకు తోచింది ఈయమని వారిని అభ్యర్థించాను. వారు ఆ ముక్కలు తీసుకొని ఏదో కొన్ని రూపాయలు ఇవ్వగా టిక్కెట్టు కొని నెల్లూరుకు వచ్చినాను. నా భార్య కత్తిరించబడిన పరుపు ముసుకు రెడ్డిగార్కి అప్పగించాలి కదా! నేనేమి చేసేది అన్నది. అదనముగా కొంత గుడ్డ కొని వారికి కుట్టి అప్పగించింది. మరుసటి రోజు స్కూలుకు వెళ్ళితే నేను ఒక నెల సెలవు పెట్టుచున్నాను అని రాసి లెటరు పంపించావు - కాని ఇందుకు డాక్టరు సర్టిఫికేటు జతపరచాలి కదా! అందుకే నేను ఆఫీసుకు పంపించలేదు. నీవు తిరిగి వచ్చావు అంతే చాలు నిన్నటికి వేరుగా సెలవు చీటి రాసివ్వు చాలని ఆమె అన్నది. ఆ విధముగా సాతాను యొక్క అతి భయంకరమైన వేషధారణ నడిపింపు అన్నది మరణానికి గొయ్యి త్రవ్వుకున్నట్లేనని గ్రహించి, ఈ విధముగా ఆలోచించాను, ''యోహాను 20:9 చూచి నమ్మిన వారి కంటే చూడక నమ్మిన వారు ధన్యులు.'' నేను నా జీవితములో ప్రభువును దర్శించి ఆయనతో ముఖాముఖిగా మాట్లాడసాగి నమ్మినాను. దీనివల్ల కల్గిన కష్టాలేమిటి? అపవాది ఆయన రూపముతో వచ్చి మాట్లాడి నాశనకరమైన మార్గములో నడిపిస్తున్నాడు. కనుక పెద్దలు చెప్పిన మాటను విని ప్రభువును నమ్మిన వారెంతో ధన్యులని తెలుస్తున్నది. నేను కరపత్రాల ద్వారా బోధకుల బోధల ద్వారా మారలేదుగాని ప్రభువు ప్రత్యక్షమై ముఖాముఖిగా మాట్లాడుచుండగా - అప్పటికి ఆయనను నమ్మక ఆయనలోని వెలుగును దర్శించి ఆయన యొక్క భవిష్యత్ జ్ఞానమును తెలిసికొని అన్ని విధాల ఆయనను పరిశోధించి, నిశ్చయముగా ఈయన సృష్టికర్తకు ప్రతిరూపమని తెలిసికొన్నాను. ఈలాగు తెలిసికొని ప్రభువుతో మాట్లాడుచు ఆనందిస్తుండగా అపవాది నన్ను నాశనకరమైన గొయ్యికి నడిపించుటకు ప్రభువు లేని సమయములో - ఆయన పోలికతో ఆయన మాటలతో నన్ను వెంబడించి దర్శనమిచ్చి మాట్లాడుచుండగా - ఎవ్వరు ఎప్పుడు కూడా ఎవరు క్రీస్తో ఎవడు అంత్య క్రీస్తో తెలుసుకోవడం కష్టము. అందుకే నేను అనుకుంటాను. చూడక నమ్మి ఆయన విశ్వాస మార్గములో నడచువాడు ధన్యుడని, నేను పడిన కష్టాలు వానికి ఉండవని తెలుసుకొన్నాను.
.......
అంత్య క్రీస్తు క్రీస్తు రూపములో బైబిలు వచనాలు ప్రకటిస్తూ దుర్బోధ చేస్తాడు. మత్తయి 19:27-29 వచనాలు ఎత్తి చూపుచు ఇహలోక సమస్తమును వదలాలని, ఈ లోక సంబంధమైనవి ప్రభువు నామము నిమిత్తము వదలమని ఎవరితో ఏమియు చెప్పకుండ బయలుదేరమని ప్రస్తుతము హిందూ యోగాశ్రమాలే త్యాగపూరిత జీవితమునకు నిదర్శనమని నన్ను కాళహస్తి యోగాశ్రమానికి నడిపించాడు. ఆదాము హవ్వలను మోసము చేశాడు. పరిశుద్ధాత్మను మోసగించుటకై అననీయ సప్పీరాలను ప్రేరేపించాడు. కాబట్టి ప్రభువు చెప్పుచున్నాడు. మార్కు 13:6, 22 వచనాలు చదివినట్లయితే నేనే ఆయనని చెప్పి ఏర్పరచబడిన వారిని సహితము మోసపరుస్తాడని ప్రభువు మాటలు మనకు తెలుపుచున్నవి. ఇందునుబట్టి అపవాదిని వాని క్రియలను వాని మాయలను మరియు శరీరేచ్ఛలను లోకాశలను ఆకాశమండల మందున్న దురాత్మల సమూహాలను జయించేవారికి ఇవ్వబడు ఐశ్వర్యము లేమిటో ప్రకటన 2:7, 17 వచనాలలో జీవవృక్ష ఫలాలు భుజించుట ఆత్మల భోజనమైనట్టి మరుగైనట్టి మన్నా - ఇవి ఆత్మలకు కావలసిన భోజనపానములు మరియు తెల్లరాయి పరిశుద్ధతలో నిలిచి యుండుటకు కావలసిన శక్తి సామర్థ్యములో క్రొత్త పేరు అనగా ఈ లోకములో తల్లిదండ్రులు ఏదో యొక పేరు పెట్టడం జరుగుతుంది. కాని ప్రభువు ఆశ్చర్యకరమైన అర్థవంతమైన నూతనమైన పేరుతో ఆత్మల రాజ్యములో వ్యవహరించబడుతాడు. ఇవి అన్నియు ప్రతి జీవాత్మ పొందాలంటే ప్రభువు ఈ లోకాన్ని శరీరాశలను అపవాదిని శోధనలను జయించి తండ్రియైన దేవుని ప్రణాళికను నెరవేర్చినట్లుగానే ఎన్ని కష్టాలు నష్టాలు జీవితములో ఎదుర్కొన్నను వెన్ను చూపకను - అనగా లూకా 9:62 నాగలి అను సువార్త పరిచర్యను ప్రారంభించి విగ్రహాలతోను దుర్‌వ్యసనాలతోను నిండియున్న అన్యుల హృదయాలను దున్ని చదును చేయుటకు పూనుకొని శ్రమయని కష్టమని వెనుక వైపు చూచువాడు దైవరాజ్యమునకు పాత్రుడు కాడు. ప్రభువుతో ముఖాముఖి మాట్లాడుచూ ఆయన దివ్య శక్తులను ఆకళింపు చేసుకొని త్యాగపూరితమైన మనస్సని సువార్త పరిచర్యయని యోగాశ్రమానికి నడిచి అన్యుల కొలువులో ప్రవేశించడమేమిటోనన్న ఆలోచనలు ఆ రోజు రాత్రి అంతయు నిద్ర పట్టనందున నా ఆత్మ ఘోష హృదయవిదారకముగా ప్రభువును ధ్యానిస్తుండగా ఆయన తప్పు మార్గమున ప్రవేశించిన నా మార్గము నుండి తప్పించి యదావిధిగా నెల్లూరుకు నడిపించాడు.
.......
58. ''ఆమె నీకు ఏమి అపకారము చేసింది.'' :- నేను నెల్లూరు స్టోన్‌హవుస్‌పేట పప్పుల వీధిలో టీచరుగా పని చేస్తున్న దినములలో నా తోటి ఉపాధ్యాయినులు ఇద్దరు అక్క చెల్లెళ్ళు లూథరన్ సంఘ సభ్యులు. వారు మరియమ్మ సహాయమును కోరరు. ఆ కోరే కోర్కె ఏదో ప్రభువునే కోరుకోవడం మంచిదంటారు. ఆమె సహాయము మనకెందుకు? అని వారి వాదన. జగత్తును అందలి సమస్తమును సృష్టించిన తండ్రి యేసులో ఉన్నాడు. కనుక యేసును తప్ప మరియొక నామమునుగాని మరియొకరి సహాయ సహకారాలుగాని ఆశించడం క్రైస్తవ సిద్ధాంతానికే అది కళంకమని వారు బోధించినందున, నేను నా ఇంటిలో నేను కొని పెట్టుకొని యున్న మరియమ్మ పటమును తీసుకొని క్రింద పెట్టుకొని నా భార్యతో ఇట్లన్నాను. సృష్టికర్తకు ప్రతిరూపము నేను తప్ప వేరే దేవుడు లేడని తనను తాను బయలుపరచుకొన్న యేసుక్రీస్తు ప్రభువు తప్ప ఇంకెవరి సహాయ సహకారాలు మనకు అక్కరలేదని, ఆయన ఒక్కనినే మనము ఆరాధించాలని దేని రూపమైనను మన ఇంట వంట ఉండకూడదని ఆమెతో చెప్పుచు. ఆమె ఎంత వారిస్తున్నను ఆమె మాట వినకుండ మరియ తల్లి పటము ఫ్రేమును ఊడదీసి లోపలి ఆ తల్లి పట రూపమును తీసి చించివేయ ప్రయత్నిస్తుండగా - ప్రభువు ఆకాశములో తన దర్శనమును అనుగ్రహించి ఈ విధముగా ఒక ప్రశ్న వేశాడు. ''ఆమె నీకు ఏమి అపకారము చేసింది?'' ఆ ప్రశ్న ఆయన వేసినప్పుడు ఆ తల్లి నాకు నా ఇంటి వారికి చేసిన ఉపకారాలు ఒక్కొక్కటిగా నా కంటి ఎదుట కనపడసాగినవి. ఆ తల్లి ద్వారా ప్రభువును నేను తెలిసికొన్నాను. ఆ తల్లి ద్వారా భయంకరమైన జ్వరముతో దద్దుర్ల వ్యాధితో బాధపడుచు స్మారకము లేనప్పుడు నా పడక మీద ఆసీనురాలై స్వస్థపరచింది. తిరుపతి వెంకటేశ్వరుడు, లక్ష్మి పటాలు తొలగించి యేసుక్రీస్తు మరియమ్మ పటాలు పెట్టుకొన్న రోజున కలలో వెంకటేశ్వరుడు ఒక బలాఢ్యుడుగా వచ్చి ప్రభువు మరియమ్మ పటాలను నందీశ్వరుని రూపాంతరమైన ఎద్దుల బండి మీద వేసుకొని వెళ్ళుచుండగా అతనిని ఎదిరించ శక్తి లేకుండుట వలన నిలబడి నేను బాధపడుచుండగా - ''ఆ తల్లి తన చేతిని తట్టి ప్రభువులో గొప్ప విశ్వాసిగా ఉండి మరణించి సైనిక వీరుడైన సందియప్పర్ అని పేరు గల సైనిక వీరుడు జార్జిగారిని పిలిచి, ఆ బండి తోలుకొనిపోవు వెంకటేశ్వరుని తన కొరడాతో శిక్షించి మర్యాదగా బండిని వెనుకకు త్రిప్పించి ఎక్కడ ఉన్న పటాలను అక్కడనే పెట్టించింది. ఈ విధముగా చెప్పుకొని పోతే ఎన్నో ఉపకారాలు చేసింది. శివకోటారెడ్డిగారు తన యోగ ప్రయోగములో నా నవనాడులను బంధించి కదలిక లేకుండ చేసినప్పుడు ఆ తల్లి నన్ను శేఖరయ్యా! అని పిలిచి ఆ సాతాను యోగబంధకాలను ఒక్క క్షణములో విడగొట్టి అదృశ్యమైంది. ఇన్ని ఉపకారాలు చేసిన నా ప్రభువు తల్లిపై పగ పట్టిన నా కఠిన హృదయమునకు నేను పరితాప చిత్తుడనై, అప్పటినుండి ప్రభువు తల్లిని నా కన్న తల్లి కంటే ఆధ్యాత్మిక తల్లిగా నిరంతరము నా ప్రార్థనలలో నా ధ్యానములో జ్ఞాపకము చేసుకొంటూ ఉంటాను. ప్రభువు తల్లిని ఆరాధించ వలసిన పని లేదు. ఆరాధన ప్రభువుకే చెల్లించాలి. ప్రభువు తల్లిని మన తల్లిగా సిలువ దగ్గర యోహాను ఇచ్చిన తల్లిగా కాక, యోహాను ద్వారా క్రైస్తవ విశ్వాసుల కందరికి తల్లిగా మనము ఆమె యెడల గౌరవమర్యాదలు చూపాలి. క్రైస్తవ విశ్వాసులు తల్లి యొక్క ప్రేమను ఆదరణను తల్లి యొక్క పరిచర్యను తల్లి యొక్క సహాయ సహకారాలు పొందవలసియున్నది. కనుక ప్రభువు తల్లిని మన ప్రార్థనలలో జ్ఞాపకము చేసుకొంటూ మన హృదయములో మన కుటుంబములో ఆమెకు ప్రభువుతోబాటు ఆమెకు కూడా స్థానమిచ్చి ఇరువురి ఆశీర్వాదాలుతో మన జీవితాలను శాంతి సమాధానముతో నింపుకొందము. ప్రభువును సిలువ వేయు కాలములో ప్రభువును కన్నందుకు ఆ ప్రభువును యూదా మత సిద్ధాంతము ప్రకారముగా పెంచనందుకు ఈమెను కూడా శిక్షించండి కనీసము ఊరి వెలుపలికి తీసుకొని వెళ్ళి రాళ్ళతో కొట్టి చంపండని ఆనాటి పరిపాలకులు అనవచ్చును. కాని ఆమెను హింసించుటకు సాతానుకు అధికారము లేదు. ఆమె ఎవరికైనను సహాయము చేయాలనుకుంటే ఆమెను అడ్డుకొనేవారు లేరు. కనుక మనము తల్లి యొక్క సహాయ సహకారాలు కూడా సమృద్ధిగా పొందుకొందము. ఎందుకంటే ప్రభువు మనలను శోధన పరిశోధనలతో పరీక్షించినప్పుడు ఓదార్చి బలపరచుటకు మరియ తల్లి మన పక్షమున ఉంటుంది.
.......
59. నీ దేహ స్థితికి అది సరిపడదు :- ఒకనాడు నేను ప్రభువును గూర్చి ఆలోచిస్తూ స్టోన్‌హవుస్‌పేట బజారు వెంబడి నడుస్తూ ఈలాగు ఆలోచించుచున్నాను. ''ప్రభువు శిష్యులు తమ వలలను తమకు కల్గిన సమస్తమును వదలి ప్రభువును వెంబడించారు మార్కు 10:29 ప్రభువు నిమిత్తము సువార్త నిమిత్తము ఇంటినైనను సమస్తమైన వారలను వదలివేయవలెను. 8:34 ప్రభువును వెంబడింపగోరువాడు తన్నుతాను ఉపేక్షించుకోవలెను. మత్తయి 19:21, ''నీ ఆస్థిని అమ్మి బీదలకిచ్చి ఆయనను వెంబడింపవలెను,'' అని ప్రభువు చెప్పిన ప్రకారమేగాక పాత నిబంధనలో మోషే ఐగుప్తు భోగభాగ్యాలను రాచరికాన్ని అష్టైశ్వర్యాలను వదలి దేవునితోను దైవ బిడ్డలైన ఇశ్రాయేలుతోను శ్రమలు అనుభవించడం మేలని తన్నుతాను దైవత్వమునకు సమర్పించుకున్నాడు,'' అని ఈ విధముగా ఆలోచిస్తూ ప్రభువుతో ఈలాగు అన్నాను. నేను నా ఉద్యోగాన్ని వదలి నీ సేవలో ప్రవేశిస్తాను; అని అనగా ఆయన చెప్పిన మాట అది నీ దేహ జీవిత భవిష్యత్ స్థితికి సరి కాదు,'' అని అన్నాడు. నేను ఆలోచించాను. ఆ దినములలో ఉపాధ్యాయుల జీతాలు అతి తక్కువ. నా ప్రారంభ జీతము అన్నియు కలిపి 57 రూపాయలు మాత్రమే, రోజు 1కి 2 రూపాయలు కూడా పడలేదు. ఇంతమాత్రానికి దీనితో ఉండవలసిన అవసరము లేదు,'' అని అనుకున్నాను. అయితే ప్రభువు నీ దేహ తత్వమునకు ఉద్యోగము చాలించుట మంచిది కాదని ఎందుకన్నాడు? అని తర్కించుకొంటూ మరునాడు అదే దారిలో వెళ్తూ ప్రభువా! నాకు ఆస్తిపాస్తులు లేవు. ఇల్లు వాకిలి లేదు. ఈ చిన్న ఉద్యోగము మాత్రము ఎందుకు? ఈ ఉద్యోగాన్ని వదలి నీ సేవ చేస్తానని రెండవ రోజు కూడా ఆయన తట్టు చూచి ఈ మాటను అడిగాను. కాని ఆయన నాకు జవాబు చెప్పలేదు, మాట్లాడనైనను మాట్లాడలేదు. యోబు 33:14 దేవుడు ఒక్క మారే పలుకును! రెండుమారులు పలునన్నాడు. నాతో ఎప్పుడు ఆయన ఒక్కసారే పలికియున్నాడు. కాని రెండవసారి ఎప్పుడు పలుకలేదు. నాకు ప్రభువు మీద రోషము పుట్టుక వచ్చింది. నాతో మరియొకసారి దీనిని గూర్చి మాట్లాడకపోతే పోనీ - నీ సన్నిధిలో నీ సావాసమునకు పరిచర్యకు పనికిరాని అష్ట దరిద్రుణ్ణి - పైగా నాకు అనేక వ్యసనాలున్నవి. కాబట్టి నా దేహ మానసిక స్థితి నీకు పనికి రాదు. అందుకే నీవు మౌనముగా ఉన్నావు. నేను నీ సన్నిధికి పనికిరానంత స్థితిలో ఉంటే పోనీలే. నీ మాట చొప్పున నీ కంత ఇష్టము లేకపోతే నేను ఈ ఉద్యోగాన్ని వదలనులే అని ఆయన మీద అణచుకోలేని రోషముతో నన్ను నేను సముదాయించుకొని, ఉద్యోగాన్నే అంటిపెట్టుకొని యున్నాను.
ఇట్లుండగా కొలది కాలములోనే రాజకీయ నాయకులలో అలజడి లేవదీసినాడు. అదేమిటంటే పిల్లల జీవితాలను తీర్చిదిద్ది వారిని మంచి పౌరులుగా రూపుదిద్దుతున్న టీచర్ల జీవన విధానము వారి జీతభత్యాలు చాలా తక్కువ ఉండి చాలీచాలని జీతాలతో దరిద్ర స్థితిలో బాధపడటం బాగులేదని, పిల్లల భవిష్యత్తును తీర్చిదిద్దే టీచర్ల ఆర్థిక స్థితిని చక్కబరచాలన్న ధ్యేయముతో విపరీతముగా పెంచడం జరిగింది. ఎంతవరకు టీచర్ల జీతాలు పెరిగినాయంటే ఒకటి రెండు తరగతుల టీచర్ల పోస్టులు కూడా అందుబాటులో లేకుండ ఉద్యోగాలలో పోటీ తత్వము పెరిగింది. ఇందువల్ల ప్రభువు ఆత్మ ద్వారా నేను రాస్తున్న సువార్త రచనలు చిన్న చిన్న పుస్తకాలుగా ప్రింటు చేసుకొంటూ నేనే బాప్టిస్టు శాల్వేషన్ ఆర్మీ వగైరా పాస్టర్ల సదస్సులలో క్రైస్తవ సభలలోను వాటిని అమర్చుకొని అమ్మకము చేసేవాడను. నా భార్య చుట్టు ప్రక్కల వారికి దుస్తులు కుట్టుకుంటూ వారికి కుట్లు, దుస్తులు కుట్టడం వగైరాలు నేర్పుతూ కుటుంబాన్ని పోషించేది. నా జీతము నా జీవితము ప్రభువు గ్రంథాలకే పరిమితమయ్యాయి. నా పేరు ప్రక్కన రెవరెండ్ అని గాని తియాలజిష్టు శ్రీశ్రీ వగైరా క్వాలిఫికేషన్స్ లేవు గాన సభలలో ఈ పుస్తకాలు అమ్మకాన్ని నిషేధించారు. అప్పుడు ప్రతి పుస్తకము మీద తియాలజీ కాలేజ్ ప్రిన్స్‌పాళ్ళ అభిప్రాయాలు వారి ఫోటోలతో సహా ఫ్రంట్ పేజీలలో ప్రచురించి వారు రాసిన పుస్తకము అన్నట్లుగ సభలలో అమ్మేవాడను. ఒకసారి ఒక ఫాస్టర్ల సదస్సులో పుస్తకాలు కొన్నవారు అదే పాస్టర్ల సదస్సు మరొక సంవత్సరము వచ్చినప్పుడు, మొదటిసారి కొన్న ఫాస్టర్లు రెండవసారి వచ్చినప్పుడు వారంతట వారే ఇంకేమైనను క్రొత్త పుస్తకాలున్నాయా? అంటూ ఆప్యాయతగా పలకరించి పుస్తకాలు కొనుక్కొనేవారు. ఈ విధముగా నేనే రాయటం నేనే ప్రింటు చేయించుకోవడం ఆంధ్ర రాష్ట్రములో ఏ జిల్లాలోనైతే ఫాస్టర్ల సదస్సులు జరుగుతున్నాయో అక్కడికెల్లా వాటిని మోసుకొని వెళ్ళి, మూడు నాలుగు రోజులు సరియైన తిండి నిద్ర లేకుండ పడిగాడ్పులు పడి రావటము నాకు అలవాటైంది. పుస్తకాలు ఏమిటో చూడ్డానికి వచ్చిన ఫాస్టర్లతో ఆ పుస్తకాలలోని అతి గూఢమైన దేవుని వాక్య మర్మములు ప్రశ్న రూపములో వారికి తెలియజేసినప్పుడు వారు ఆసక్తితో ఆ పుస్తకాన్ని కొనుక్కొనేవారు. ఇట్లా ప్రతి పుస్తకాన్ని పరిచయము చేస్తూ అమ్ముతుండేవాడను. సువార్త సభలలో నేను తిండికి ఇబ్బందిపడేవాడను. ఎందుకంటే భోజన విరామ సమయము 1 నుండి 3 గంటల దాకా ఉంటుంది. ఆ సమయములో పాస్టర్లతో కూడా వెళ్ళి భోజనము చేయవచ్చు. కాని నా దగ్గర నాకు సహాయముగా ఎవరు లేనందున వారు భోంజేస్తూ కొందరు కాలక్షేపముగా పుస్తకాలను సందర్శించే సమయమది - వారికి ఈ పుస్తకాలలోని మర్మాలను గూర్చి ప్రకటిస్తూ పుస్తకాలు అమ్మేవాడను. మూడు గంటలకు మరల సువార్త కూడికలు మొదలుపెట్టినప్పుడు - భోజనము పాత్రలు కూడా కడిగి పనివారు వెళ్ళేవారు. ఏదో మిగిలింది తిని సర్దుకొనేవాడను.
ఒకసారి నేను శాల్వేషన్ ఆర్మీ ఫాస్టర్ల సదస్సుకు బాపట్ల వెళ్ళినాను. సాయంత్రము భోజన సమయములో చాలామంది ఫాస్టర్లు నాకు తెలిసినవారే కాబట్టి వారితో కూడా వెళ్ళి భోం చేయవచ్చు. కాని కొందరు భోంజేస్తూ కొందరు పుస్తకాలు సందర్శిస్తూ అటు ఇటు తిరిగే సమయమది. ఇంత కష్టపడి ఇంత దూరము వచ్చి భోజనానికి ప్రాధాన్యత నిస్తే పుస్తకాలు ఖర్చు కావు. కనుక వారు భోజనము ముగించి ఎవరి రూములకు వారు వెళ్ళిన తర్వాత నేను వంట పాత్రలు సర్దుకుంటున్న వారి దగ్గరకు వెళ్ళి ఏదైన మిగిలి ఉంటే కొంచెము అన్నముగాని ఏదైన కొంచెము పెట్టమని పనివారిని అడిగినాను. వారు ఫాస్టర్లకు తప్ప మిగిలినవారికి పెట్టకూడదని నిక్కచ్చిగా చెప్పినారు. అయ్యా! ఇక్కడ నుండి భోజనానికి వెళ్ళాలంటే రైల్వే గేటు దాటి టౌన్‌లోకి చాలా దూరం వెళ్ళాలి రాత్రి కాలము. అందులో ఆరోగ్యము సరిగా లేదు - కొంచెము జ్వరము తగిలినట్లుగా ఉంది. దయచేసి అడుగున మిగిలిన అన్నము కొంచెమే దానితోబాటు రసమో మజ్జిగో ఏదో అంత భిక్షగానికి వేసినట్లు కొంచెము పెట్టండి లేదా డబ్బులైనను ఇస్తాను. అంత దూరము వెళ్ళలేక మిమ్ములను బ్రతిమాలుచున్నాను అన్నాను. వారు ససేమిరా వల్ల కాదన్నారు. చేసేది లేక కాంపౌండు గేటు దగ్గర చిన్న బంకు ఉంది. అక్కడ ఏదో బిస్కెట్టో లేక ఎండిపోయిన రస్కో ఏదో తిని నీళ్ళు త్రాగి ఆ రాత్రి కాళ్ళు ముడగ తీసుకొని నా బట్టల సంచి తల క్రింద పెట్టుకొని వరండాలో నిద్రపోయాను. యేసుప్రభువు సిలువ మోయునప్పుడు కొంచెము దూరము ఆయన సిలువను మోయుటకు కురేనియా సీమోననువాడు సహాయము చేశాడు. కాని నాకు ఆ రోజులలో ఆ కొంచెము సహాయము కూడా లేదు.
.......
60. నీతిని కొలిచి లోకాంత్యమును కలుగజేస్తాను :- ప్రభువును మనస్ఫూర్తిగా నిజ రక్షకుడుగా అంగీకరించినను నాలోని దుర్వ్యసనాలు నాలో నుండి తొలగిపోవటం లేదు. యేసుక్రీస్తు ప్రభువు తన దివ్య వెలుగులో దర్శనమిస్తూ నిరంతరము తన ప్రత్యక్షతను నా నుండి తొలగించలేదు. నేను తిరుగుచున్నను ఇంటిలో ఉన్నను ఎక్కడకు వెళ్ళినను ఆయన వెలుగు క్రీస్తు రూపము ధరించుకొని నా ఎదుట ఆవరించి యుండును. నేను జూదము, పానము, వ్యభిచారము వగైరా దుర్వ్యసనాలు నా నుండి తొలగిపోక వాటికి బానిసయైనను ఆయన నా ఎదుట నుండి తన ప్రత్యక్షతను తొలగించలేదు. ఒకసారి నేను స్టోన్‌హవుస్‌పేటలో కొత్తగా పెండ్లి జేసుకొని కాపురముంటున్నను నా వ్యభిచార అలవాటు నా నుండి దూరము కానందున నేను వాడుక ప్రకారము వ్యభిచార గృహానికి వెళ్ళుతుండగా ప్రభువు మానవ రూపముతో నా ఎదుటకు నిలిచి నన్ను అడ్డగించినాడు. ఆయనను దాటి వెళ్ళుటకు శక్తి లేనందున ప్రభువా నా మనస్సు శరీరము ప్రస్తుతము నా స్వాధీనములో లేదు. దయచేసి ఈ నాటికి నన్ను వదలి పెట్టమని ఆయనను బ్రతిమిలాడుచు వ్యభిచార గృహానికి వెళ్ళడం జరిగింది. లోకములో ఎందరో విశ్వాసులు ప్రభువును నమ్మిన నాటి నుండి వారి వ్యసనాలు చుట్ట బీడి త్రాగుడు వగైరాలు వెనువెంటనే మానేవారు. నేను కనీసము సినిమా కూడా మానలేని స్థితిలో నన్ను దూషించుకొనేవాడను. ప్రతి దుర్వ్యసనాన్ని మానవలెనని కఠినముగా తీర్మానించుకుంటాను. ఆ సమయము ఆసన్నమైనప్పుడు ఆ తీర్మానము నీరుగారిపోయేది. ఎప్పుడు నేను ఆ విషయములో ఆశ్చర్యచకితుడనగుచుండేవాడను.
ఒకసారి నేను నా ఎదుట నిరంతరము ప్రకాశిస్తున్న ప్రభువు యొక్క దివ్యరూప ప్రత్యక్షతను చూస్తూ ఆయనతో ఇట్లన్నాను. దారిన వెళ్ళే సర్వ సాధారణ మనిషి కంటె కూడా నేను ఎంతో నీచ ప్రవృత్తి గలవాడను. అన్యులు సరే సృష్టికర్తను మరచి సృష్టములను విగ్రహాలను పూజిస్తూ వారు తమ మార్గమును చెరుపుకున్నారు. ఎట్లంటే తైత్తీరియోపనిషత్తు ఏడవ శ్లోకములో ఈ విధముగా వ్రాయబడి యున్నది. సమస్తాన్ని సృష్టించిన సృష్తికర్తయైన బ్రహ్మ నెరిగినవాడే మోక్షాన్ని పొందుతాడని, తాను వేరు పరమాత్మ వేరు కాదన్న బేధ భావము పొందాలని, వాక్కుకు మనస్సుకు అతీతమైన సృష్టికర్తను జ్ఞానముతో తెలుసుకోవాలంటున్నాడు. ఆ విధముగానే కేనోపనిషత్తు ఐదు మరియు ఆరు శ్లోకాలలో సామాన్య జనులంతా పూజించేది బ్రహ్మము కాదంటాడు. ఇష్ట దైవాన్ని పూజించేవాడికి మోక్షము లేదంటాడు. సమస్త సృష్టికి ఈ దేవుడొక్కడేయైనప్పుడు - ఇక ఇష్ట దైవమనే భావము ఉండకూడదు. కనపడినదంతా దేవుడు అనేవాడికి మోక్షము లేదు. ఆ పరమాత్మను ఎనిమిదవ శ్లోకములో ధ్యానము ద్వారా ఉపదేశము ద్వారా పొందవచ్చునంటాడు. కనుక సృష్టిని, సృష్టములను, గ్రహాలను, పంచ భూతాలను సృష్టించిన సృష్టికర్తను వదలి భూమిని, ఆకాశమును, అందలి విగ్రహాలను, పంచ భూతాలను మరియు మాలక్ష్మమ్మ దేవత అని వేప చెట్టును, మునీశ్వరుడని, గంగ, రావిచెట్టును సమస్తమును మనకు అనుగ్రహిస్తుందని భూమిని ఒక దేవతగాను, లోకానికి వెలుగిస్తున్నాడని సూర్యుని ఒక దేవుడుగాను పూజించేవారికి మోక్షము లేదు. ఎందుకంటే సూర్యచంద్ర గ్రహ నక్షత్రాదులు, పంచభూతాలన్నియు సృష్టికర్తయైన యెహోవా సృష్టించినాడని గ్రంథము వివరిస్తున్నది - అట్టి సృష్టికర్తకు ప్రతిరూపమే యేసుక్రీస్తు ప్రభువు - కనుక సృష్టికర్తను వదలి సృష్టములను పూజించేవారికి మోక్షము లేదు. క్రైస్తవ విశ్వాసులమని చెప్పుచు ఒకే దేవుని ఆరాధిస్తున్నామని ప్రగల్భాలు పలుకుతు ఒకే క్రీస్తును ఆయన దివ్య గ్రంథాన్ని అనుసరించి నట్లుగానే నటిస్తూ ఒకరినొకరు ద్వేషిస్తూ ''సహోదరులు ఐక్యత కల్గి యుండుట ఎంతో మేలు ఎంత మనోహరమన్న దైవవాక్యమును తుంగలో త్రొక్కి, దేవునికి ఇవ్వబడిన దివ్య స్థలాలను అన్యులకు అమ్ముకొంటూ ఒకరినొకరు కాట్లాడుకొంటూ విడిపోయే క్రైస్తవ సంఘాలను ఇప్పుడు మనము చూస్తున్నాము. వివాహము నిషేధించుకున్నామని సంపూర్ణ సమర్పణ జీవితములో మేము ప్రభువు పరిచర్య జరిగిస్తున్నామని కథోలిక మరియు పెంతికొస్తు వగైరా సంఘాలులో పని జేస్తున్న పెద్దలు చెప్పుకుంటున్నను, వారిలో హృదయపూర్వకముగా పని చేయువారిని వ్రేళ్ళ మీద లెక్క పెట్టడం కష్టమేయగుతున్నది. వారు పని చేస్తున్న సంఘాలలో వారు పని చేస్తున్న పని నిమిత్తము భోజన వసతులు పొందుచున్నారు. సంస్థ మీద ఆధారపడి పని చేస్తున్నారు. అపొస్తలుడైన పౌలు ఎవరి మీద ఆధారపడక సువార్త ప్రకటించుచు రాత్రులు చేతుల కష్టముతో డేరాలు కుట్టి కూలి సంపాదించుకొని తన చేతుల కష్టార్జితముతో తాను జీవిస్తు సువార్త ప్రకటించినట్లు 1 థెస్సలొనీక 2:9, 1 కొరింథీ 9:15, అపొ 18:3 వివరించియున్నాడు. ఈ దినములలో సిస్టర్లు ఫాదర్లుగా చెప్పుకొనుచు సహోదరులు అను పదమునకు కళంకము తెస్తూ తాము చదివిన చదువుకు సరియైన ఉద్యోగము దొరకనందున సంస్థలలో చేరితే ప్రభువు చెప్పినట్లు రేపటిని గూర్చి చింతించనక్కర లేకుండ, వేళకు భోజనము వసతులు సంత వీధులలో వందనాలు అన్నట్లుగా అందరిచేత నమస్కారాలు, గౌరవమర్యాదలు, రాత్రులలో టి.వి. కాలక్షేపములు, ఏ.సి. గదులు, మంచి సుఖాసనమైన పడలు, నలగని ఇస్త్రీ, అంగీలు వగైరా వేషధారణ జీవితముతో తలమునకలైపోతూ - ఆరాధన చేస్తున్నాము సత్ప్రసాదమని ప్రభువు బల్ల అని ఎత్తి చూపిస్తున్నాము అంటే సరిపోతుందా? అన్యులకు బోధించాలి. తప్పిపోయిన క్రైస్తవ కుటుంబాల దర్శనము చేయాలి కదా! వాలంటరీ వర్కు చేయాలి కదా! ప్రభువు పరిచర్య కార్యములు చేసేవారిని ప్రోత్సహించి సహాయ సహకారాలు అందించాలి కదా! దాదాపు 40 సంవత్సరాలుగా సువార్త ప్రచురణ గ్రంథాలు వ్రాసి కష్టపడి పని చేస్తూ వాటిని ప్రింటు చేసి - నేను తిరగని స్థలము లేదు దర్శించని దైవజనుడు లేడు. నేను దర్శించని సంఘ పెద్దలు లేరు. నీవు మా సంఘ సభ్యుడవు కాదని కొందరు, మరికొందరు నీ పుస్తకాలు అచ్చు వేయుటకు సంస్థలో డబ్బులు లేవనియు, నీవు అచ్చు వేసి తెచ్చిన పుస్తకాలు పంపిణీ చేయుటకు అదనపు పనివారు ఇక్కడ లేరనియు, మా బుక్ షాపులలో నీ పుస్తకాలు కొనే నాధుడు లేడనియు ఏదోయొక వంక బెట్టి పంపించేవారేగాని చేయి పట్టి సలహాలిచ్చి నడిపించే నాధుడు నేడు క్రైస్తవ సంఘాలలో కనుమరుగయ్యాడు. అందునుబట్టి ప్రభువు తట్టు చూచి ఆయనతో మాట్లాడుచు నీతి ఎక్కడ ఉన్నది? అన్న ప్రశ్న వేశాను. ఎందుకంటే నేను గ్రంథాలు వ్రాసినప్పుడు నన్ను హింసించిన ముస్లిమ్‌లు నా గ్రంథాలను ఆదరించని క్రైస్తవులు విగ్రహారాధనను వెర్రితనముగా మార్చుకొని దానివైపు పరుగులెత్తుచున్న అన్యులు, ఏ విధముగా చూచినను ప్రపంచ జనాభాలో నీతి ఎక్కడ ఉన్నదో నాకు కనుబరచుమని ప్రభువుతో మాట్లాడుచు నాలో కూడా దుర్వ్యసనాలతో బలహీనుడైన సంగతి నీకు తెలుసు గదా! కనీసము నాలో కూడా నీతి లేదు. మరి నీతి ఎక్కడ ఉన్నదో నాకు కనబరచుమని ప్రభువును ముఖాముఖిగ నిలదీసాను.'' ఆయన నాతో ఏమియు మాట్లాడలేదు, ఆయన నీతిని అన్వేషించడానికి ప్రయత్నిస్తున్నాడేమోనని అనుకున్నాను. కాని ఆనాటి రాత్రి ఆకాశములో మహా ఉన్నతమైన స్థలములో ఒక అద్వితీయమైన ప్రకాశమానమైన కట్టడము నిలిచియున్నది. అందులో ప్రభువుతో నేను ప్రవేశించాను. ఆయన అందలి అత్యాశ్చర్యకరమైన పరికరాలతో నేను నీతిని కొలిచి లోకమును అంత్యము చేయబోవుచున్నానని నాతో చెప్పి ప్రజల నీతిని కొలుచుటకు ప్రయోగశాల వద్దకు వెళ్ళుచుండగానే నేను ఆయనను అడ్డగించి వద్దు ప్రభువా! ఒకవేళ నా అనుభవమునుబట్టి నీతి కొరవడి యున్న యెడల లోకరీత్యా మహా భయంకరమైన ఆ ప్రళయ దృశ్యమును నేను చూచి భరించలేను. దయచేసి ఈ కాలమున నీతి కొలుచు ప్రయత్నము ఆపమని ప్రభువును ప్రాధేయపడినాను. ఆ మాటకు ప్రభువు అయితే ఇంకను చాలా దీర్ఘకాలము నీతిని కొలిచి లోకమును అంత్యము చేయు సమయమును చాలా వరకు పొడిగిస్తున్నానని నాతో చెప్పగా నేను మేలుకొని స్వప్నములో ప్రభువుతో జరిగిన సంభాషణను బట్టి ఆశ్చర్యపడినాను. ఈ సంఘటన ఇరాన్ ఇరాక్ వగైరా ముస్లిమ్ కంట్రీలతో అమెరికా జరుపుచున్న పోరాట కాలమది. ప్రభువు లోకాంత్యమును పొడిగించిన సందర్భముగా యుద్ధ పోరాటములు సద్దుమణిగినవి.
......
61. నన్ను హింసించిన జనాంగముపై ప్రతీకార జ్వాల నా హృదయములో చల్లారలేదు :- మత్తయి 5:44, లూకా 6:27-29 ప్రభువు ప్రవచనాలలో హింసించువారి కొరకు ప్రార్థన చేయుడని, నిన్ను ఒక చెంప మీద నీ పగవాడు కొడితే ఎడమ చెంప చూపమన్న ప్రభువు మాటలనే గాక పరలోక ప్రార్థనలో కూడా మత్తయి 6:14 మనుష్యుల అపరాధములను మీరు క్షమింపని యెడల మీ పరలోకపు తండ్రియు మీ అపరాధములను క్షమింపబడవని యేసుక్రీస్తు ప్రవచనాలు ఘోషిస్తుండగా ప్రభువును పరిశోధనా పూర్వకముగా నిజ రక్షకుడని సృష్టికర్తకు ప్రతిరూపమని తెలిసికొన్న నాకు అది ఏమిటో హృదయములో మార్పు రాలేదు. దుర్వ్యసనాల నుండి బయటపడలేక పోతున్నాను. మత విమర్శ చేసినందుకు ముస్లిమ్‌లు నోట ముక్కున రక్తము వచ్చునంతవరకు ఛాతీ మీద ముఖము మీద చావ చితకబాది వీడు ఇక ఎందుకు పనికిరాడని చావే గతియని వెళ్ళిపోయింది మొదలుకొని భయంకరముగా కనికరము లేకుండ క్రింద పడద్రోసి రౌడీ మూక పిడిగుద్దులతో గుద్ది వెళ్ళిన నాట నుండి ఎన్ని రోజులు గడిచినను, వారితో సిస్టర్లు సమాధానపరిచి మధ్యస్థము చేసి, ఇక మీదట మీ మతమును గూర్చి వ్రాయడు - పొరబాటుగా ఏదో జరిగిపోయిందని మత నాయకుల పిల్లలు సిస్టర్లు దగ్గర చదువుచు వారికి అనుకూలురుగా ఉన్నందున సిస్టర్లను బట్టి నన్ను చంపు ప్రయత్నము మాని, కనీసము ఉద్యోగము నుండియైన తొలగించాలని మున్సిపల్ ఆఫీసు సరెండరు ఆఫ్ పోలీస్, డి.ఇ.ఓ. కు హైద్రాబాద్ అన్ని ఆఫీసులకు నా మీద మత విమర్శ చేసి మా హృదయాలను గాయపరిచినాడని రిపోర్టు పెట్టినారు. ప్రాణ భయము పోయినను నా మీద చార్జెెస్ ఫ్రేమ్ అయి రెండు సంవత్సరాలు ఇంక్రిమెంట్లుగాని డి.ఏ. గాని విడుదల కాకుండ బాధపడినాను. అటుతర్వాత ఆ బాధకరమైన స్థితి నుండి ప్రభువు కృప వలన బయటపడి ఉద్యోగాన్ని దక్కించుకున్నాను. ఇందునుగూర్చి తదుపరి వివరిస్తాను.
నన్ను క్రూరముగా హృదయవిదారకముగా హింసించి నా మీద చెడ్డ మాట పల్కి నా నిజ జీవితాన్ని అనారోగ్య పాలుజేసి భయంకర స్థితికి దిగజార్చిన సంఘటనుబట్టి నా శత్రువులపై నేను ప్రభువు మాటలను బట్టి వారిని హృదయపూర్వకముగా క్షమించలేని స్థితికి దిగజారినాను. వారి కొరకు ప్రార్థన చేయాలన్న తలంపు అసలే లేదు. వారు చేసిన భయంకరమైన అతి దారుణముగా హింసించి భరింపరాని వేదనకు మరణ భయమునకు అనారోగ్య కారణమునకు గురి చేసిన విధానమును బట్టి వారు చేసిన ఈ అకృత్యమును క్షమించమని ప్రభువును బట్టి ప్రార్థన చేయుటకు నాకు మనస్సు రాలేదు. వారిపై దినములు గడచు కొలది హృదయము పట్టరాని ద్వేషము, పగ, వృద్ధి అగుతుందేగాని సమాధానకరమైన స్థితి నేను కోల్పోయినాను. ఒకనాటి ప్రాత:కాలమున మా ఇంటికి దగ్గరగా ఉన్న టీ షాపు దగ్గర పేపరు చదువుచు పేపరు చదవటానికి కూడా మనసు రాక పేపరు మడిచి ప్రక్కవానికిచ్చి ప్రభువు వైపు చూచి ఆనాడు హాగరు సంతానాన్ని నీ చేయి ఎత్తి ఆశీర్వదించావు. అందువల్ల వారు అడ్డు అదుపు లేకుండ పేట్రేగిపోతున్నారు. కాశ్మీరు కల్లోలానికి వారే కారకులు. నీవెందుకు వారి భవిష్యత్తు తెలిసి కూడా నీ చేయి ఎత్తి వారిని ఆశీర్వదించావు. వారి మీద నున్న నీ ఆశీర్వాద హస్తము దించతావా లేదా! నా కంటి ఎదుట నా మనోనేత్రము ప్రత్యక్షముగా చూచునట్లు నీ హస్తము దించి నీ ఆశీర్వాదము వారి పట్ల తొలగించమని, అది నేను ఇప్పుడే చూడాలని పట్టు పట్టాను. ప్రభువు నాకు దర్శనాత్మకముగా తనయందే తండ్రియైన దేవుడు - పరిశుద్ధాత్మయు నా యందే ఏకమై యున్నారని పరిశోధన పూర్వకముగా ప్రత్యక్ష రూపముగా చూపించిన దర్శనాన్ని బట్టి, నేను యేసు ప్రభువు యొక్క దివ్య రూపాన్ని తిలకిస్తూ ఆయనలో ఉన్న తండ్రియైన దేవుని గద్దిస్తూ మాట్లాడుతున్నాను. దైవ త్రిత్వాన్ని క్రీస్తులో దర్శించుట నాకు ఎట్లు అలవాటైందో మరొకసారి ప్రస్తావిస్తాను. నేను ఆ జనాంగము పై నీవుంచిన ఆశీర్వాద హస్తమును తొలగించాలని. నా కంటితో నేను చూడాలని పట్టుబట్టినప్పుడు ఆయన వెలుగుమయమైన ఎంతో ప్రకాశమానమైన తన ఆశీర్వాద హస్తము వారి మీద నుండి తొలగించుట నా కంటితో సమగ్రముగా చూడగల్గినాను. ఆ నాటికి ఆ దర్శనము చూచి కొంత సంతృప్తిపడి ఇంటికి వెళ్ళినాను. మరునాడు అదే టీ స్టాలుకు వచ్చి పేపరు చూచినప్పుడు ఉగాండాలో భయంకరమైన భూకంపమనియు, వేల కొలది మృత్యువాత బడిరని క్షతగాత్రు లయినారని పేపరులో వ్రాశారు. నేను ఆశ్చర్యపడ్డాను. ఆ విధముగా ప్రతిరోజు ఉదయమున నిద్ర లేచి టీ షాపుకు వెళ్ళి పేపరు చూడడము, ముస్లిమ్‌లపైనే దారుణమైన సంఘటనలు జరగడం ప్రారంభించినవి. ఆ మరుసటి దినము నుండి పాకిస్తాన్ బంగ్లా దేశాలు రెండు వేరు వేరుగా విడిపోయి బద్ధ శత్రువులైనందున పాకిస్తాన్ సైనికులు బంగ్లా దేశముపై పడి వారి ఆస్తులను కొల్లగొట్టి - వారిని అతి భయంకరముగా హింసించుట, వారి మాన ప్రాణాలను బలిగొనుట, కాలేజీ హాస్టలు విద్యార్థినులపై పడి అతి కిరాతకమైన హింసాత్మకమైన మానభంగాలు, ప్రతిరోజు ఈ విధముగా ఈ సంఘటనలు చదవటం పరిపాటైంది. ఇంత జరుగుచున్న వారి మీద నాకు సానుభూతి కలుగలేదు. నేను పని చేయుచున్న ముస్లిమ్ లొకాలిటీ రంగనాయకుల పేటలో చుట్టలు చుట్టి పొట్ట పోసుకొనే కార్మికులకు, వారి పెద్దలకు జీతాలలో విబేధాలు వచ్చి స్ట్రయికు చేయడము వల్ల వారికి జరుగుబాటు లేక బాధపడటం జరుగుతుంది. అటు తర్వాత ఆత్మకూరు బస్టాండు దగ్గర లోన్‌స్టార్ చర్చీ గోడ కూలి దాని క్రింద ఒక ముస్లిమ్ కుటుంబమంతా కలిసి కట్టుగా మరణించడం జరిగింది. ప్రపంచమందంతట ముస్లిమ్‌ల మీదనే జరుగుచున్న ఈ దారణ హింసాత్మక స్థితిని అలవాటుగ ప్రతిరోజు ఉదయాన్నే టీ దుకాణమునకు వెళ్ళి పేపరు చదివి ఆనందిస్తున్న నాకు, దాదాపు ఒక నెల ఈ హింసలు ఆగక జరుగుచున్నను, ఒక దుస్సంఘటన నా హృదయాన్ని కలచివైచి ఆ దారుణ హింసలకు బ్రేకు పడింది. ఆ సంఘటన ఏమిటంటే బంగ్లా దేశములో పాకిస్తానీ సైనికులు చేసే కిరాతక హింసల నుండి తప్పించుకొనుటకు ఒక బంగ్లా దేశపు మహిళ తన బిడ్డను చంకన బెట్టుకొని వారి బారిన పడకుండ తప్పించుకొంటూ వారు దగ్గర పడడంతో - ఒక పొద చాటున దాగుకొని బిడ్డ ఏడ్చి శబ్దము చేయకుండ ఉండుటకు ప్రాణ భయముతో గజగజ వణకుచు ఆ బిడ్డ నోటి మీద తన చేయి వేసి అరవనీయక చేసింది. సైనికులు తరుముకొను వచ్చు సందర్భములో తాను నోటి మీద తన చేయి వేసి కప్పినాననుకుంటున్నదేగాని ఆ చేయి నోటి మీదనే గాక ఆ బిడ్డ ముక్కు మీద కూడా పడి ఊపిరి తిరుగక చనిపోయింది. ఈ విషయము తల్లికి తెలియదు. కొంతసేపటికి సైనికులు వెళ్ళిపోవటం గమనించిన తల్లి తన చేయి తీసి బిడ్డ వైపు చూడగా శిశువు మృతమై యుండుట చూచి హృదయవిదారకముగా విలపించింది. సైనికులు నన్ను చంపి లేదా నా మాన ప్రాణాలు హరించి ఈ బిడ్డను బ్రతకనిస్తే ఎంతో బాగుండునని విలపించడం నేను చదివి, ఈ విధముగా ప్రతి దినము ఈ హృదయవిదారక సంఘటనలలో ముఖ్యముగా హాస్టలు విద్యార్థినుల వస్త్రాలు తొలగించి చేసే కీచక కృత్యాలు, వృద్ధులు, మహిళలు, చిన్న బిడ్డలన్న తారతమ్యము లేకుండ చేస్తున్న క్రూరకృత్యము, ప్రతిరోజు వాడుకగా చదవలేక మహిళ చంకలోని పసిబిడ్డ మరణము నన్ను నా హృదయాన్ని కలచివైచి అక్కడే ఆ టీ బంకులోనే ప్రభువులో ఐక్యమైయున్న తండ్రియైన దేవుని చూచి ఈలాగు మాట్లాడినాను. నీ ఆలోచనలు మాకు శ్రేయోదాయకములు నీ క్రియలు సత్యమైనవి యదార్థమైనవి. లోక మనుగడకు యోగ్యమైనవి. ఆ రోజులలో హాగరు సంతానాన్ని దీవించుట సమంజసమైనదే - నేనే పొరబాటు పడ్డాను. ఈ దారుణ దుస్సంఘటనలు చదివి ఎంతకాలము నేను ఓర్చుకోగలను. ఎంత శత్రువులకైనను ఈలాటి దారణమైన స్థితి కలుగకూడదు. స్త్రీలు, పిల్లలు, వృద్ధులు అమాయికులు ఎందరో భయంకరమైన హింసలలో దిగజారిపోవటమన్నది భయంకరమైన స్థితి. దైవత్వమునకే గాదు కనీసము మానవత్వమునకు కూడా ఇది సహించరాని నేరము. ఇట్టి దానికి క్షమాపణ లేదు. ఇక మీదట ఈ దారుణ మారణ హృదయవిదారక స్థితి కలుగకుండ ఉండాలంటే యదావిధిగ మీ ఆశీర్వాద హస్తము ఇష్మాయేలు సంతతులపై ఉండాల్సిందే, మీ ఆలోచనలు సత్యమైనవి మీ ప్రణాళిక నిర్దోషమైనది. మీ తలంపులను తప్పు బట్టుట నరునికి అసాధ్యము. నేను నీ ఆశీర్వాద హస్తమును గూర్చి తప్పు బట్టినాను - అద్వితీయమైన ప్రేమా పూరితమైన మీ హృదయమును అర్థము చేసికొనే శక్తి నాకు చాలదు. మీ నిర్ణయము మీ భవిష్యత్ ప్రణాళిక ప్రకారమే మీ కుడి చేయి చాచి నేను చూస్తుండగా మీ ఆశీర్వాద హస్తాన్ని వారి మీద ఉంచండి. ఇంక నేను ఈ మారణకాండను గూర్చి వినలేను, చదవలేను. మీరు ఈ క్షణమే నేను చూస్తుండగానే మీ కుడి హస్తము చాచి తొలగించిన ఆ ఆశీర్వాదాన్ని మరల వారి కందించమని హృదయములో ఆత్మతో ఆయనతో మాట్లాడినప్పుడు, వారిపై తన ఆశీర్వాద హస్తము ఉంచుట నాకు కన్నులకు కట్టినట్లు దర్శించినాను. ఎప్పుడైతే ఆయన ఆశీర్వాద హస్తము వారిపై ఉంచబడిందో దినముల పర్యంతము కఠిన మనస్సుతోనున్న భారతదేశ ప్రధాని ఇందిరాగాంధీ తన సైనికులను బంగ్లా దేశము పంపి పాకిస్తానీయుల ఆగడాలను, వారి దుర్మార్గతను అడ్డగించి, వారిని బంగ్లా నుంచి తరిమివేసి బంగ్లా దేశీయులకు - స్వయంపరిపాలన శక్తి అందించింది. ఒక్కటిగా ఉన్న బంగ్లా పాకిస్తానులు వేర్వేరు ప్రభుత్వాలుగ మారిపోయినవి.
.........
62. దేవుడొక్కడే అంటూనే తండ్రి కుమార పరిశుద్ధాత్మలు వీరెవరు? :- అందరికి తండ్రియైన దేవుడొక్కడేయని మార్కు 10:18, ఎఫెసీ 4:5 తెలియజేస్తుండగా మరి ఈ దైవ త్రిత్వమన్నదేంటో అర్థ సహితముగా వివరించమనగా స్వప్న రూపములో ఆయన చూపిన విధానము ఈ రీతిగా ఉన్నది. ఆకాశ మధ్యమున ఆయన సింహాసనాసీనుడై యున్నాడు. కాని సింహాసనము కనబడలేదుగాని సింహాసనము మీద కూర్చున్నవాని పోలికగా ఆయన ఆసీనుడైయున్నాడు. ఆయన ముఖము బంగారు వన్నెకు కూడా పోల్చలేము - అంత అందముగా దయాపూర్వకమైన ముఖకవళికలతో నన్ను చూస్తూ ఉన్నాడు. నేను భూమి మీద ఒక మహా సముద్రము దగ్గరలో ఉన్న ఒక షెడ్డులో నిలబడియున్నాను. నా కాళ్ళు పాదముల వరకు నీళ్ళలో మునిగియున్నాయి. మహా సముద్ర మధ్యము నుండి ఒక భయంకరమైన ఆకారము ఏనుగు రూపములో నా వైపుకు వస్తున్నది. అది నన్ను ఏమియు చేయలేదు - ఎందుకంటే ఆకాశమందు ఆసీనుడైయున్న ప్రభువు యొక్క దృష్టి నా మీద నిలచియుండుటను బట్టి వడివడిగా సముద్రము నుండి వచ్చింది కాని అది ఏమియు చేయలేక సముద్రపు అగాధములోనే నిలిచియున్నది. ఎందుకంటే సర్వశక్తుని చూపు నన్ను దృష్టించుచున్నాడు కనుక అది మహా సముద్రములో నుండి గబగబ వచ్చి నిలిచి ఉంది. ఆయన ముఖారవిందము ప్రేమ పూర్వకముగా దయారసము ఆప్యాయత ఉట్టిపడుచున్నట్లుగా ఉంది. ఆయన శిరస్సు ఇరువైపుల రెండు ముఖాలు అదే రూపము అదే సైజులో పైకి వచ్చి కనబడుచు ఆయనలోనే లీనమైపోతున్నాయి. ఆయన శిరస్సు కణతల భాగమున ఇరువైపుల కనబడిన రెండు ముఖములు ఆయన శిరస్సు పార్శ్వ భాగాల నుండి పైకి వచ్చి నాకు దర్శనమిచ్చుచు అటువైపు శిరస్సు ఇటువైపు - ఇటువైపు శిరస్సు అటువైపు ఆయన శిరస్సులో నుండి పైకి వచ్చుచు ఆయనలోనే ఐక్యమగుచు అదృశ్యమగుతున్నది. ఆయన శిరస్సు ఇరువైపుల నాకు కనబడుచున్న మరల రెండు శిరస్సులు సింహాసనాసీనుడైన వాని ముఖకవళికలు మాత్రమే ధరించుకొని ఆయన శిరస్సులో నుండి పైకి వచ్చుచు మరల లోపలికి వెళ్ళుచు అటు ఇటు రెండు శిరస్సులు ఆయన శిరస్సుకు అటు ఇటు మార్చుకుంటూ నాకు దర్శనమిచ్చినవి. అందునుబట్టి నిదుర లేచినప్పుడు నేను ఈ విధముగా ఆలోచించాను. సింహాసనాసీనుడైన తండ్రియైన దేవుని ఇరు పార్శ్వముల నుండియే మరి రెండు రూపాలు ఆయన శిరస్సు నుండి పైకి వచ్చుచు మరి ఆయనలోకి వెళ్ళుచుండుటలో ఆయన శిరస్సును పూర్తిగా విడిచిపెట్టి వెలుపలికి వచ్చిన శిరస్సులు కావు అవి. శిరో ముఖము వెలుపలికి వచ్చుచున్నవి గాని సింహాసనాసీనుడైన వాని ముఖమును పూర్తిగా వదలి వెలుపలికి వచ్చి తిరిగి ఆయన శిరస్సులోకి వెళ్ళుచుండుట లేదుగాని ఆయన ప్రధాన శిరస్సు నుండి విడివడకుండ మరి రెండు శిరస్సులు వెలుపలికి వచ్చుచు తిరిగి ఆయన శిరస్సులో లీనమై అదృశ్యమగుట చూస్తున్నాను. కనుక ఇందునుబట్టి నాకు అర్థమైందేమిటంటే - తండ్రియైన దేవునితో విడిచిపెట్టని ఆత్మ బంధము కల్గియున్నట్లు పరిశుద్ధాత్మ యొక్కయు ప్రభువు యొక్కయు స్వరూప దర్శనములున్నట్లు కనబడుచున్నవి. ఆయన శిరస్సు నుండి వెలుపలికి వచ్చి ప్రధాన శిరస్సును అంటిపెట్టుకొనియే తమ కార్యక్రమాలు ముగించుకొని ఆయనలోనే ఈ దైవ స్వరూపములు లీనమైనప్పుడు సింహాసనాసీనుడైన తండ్రియైన దేవుని ఏక స్వరూపము మాత్రమే నాకు కనబడుచున్నది. కనుక ఒకే దేవుని నుండి ఆదే శక్తి అదే రూపము గల మరల రెండు శక్తులు ఆయనలో నుండి పైకి వచ్చి మరల ఆయనలోనే లీనమై ఒకే దేవుని ఏక రూపముగా నాకు దర్శనమిచ్చి నప్పుడు దైవ త్రిత్వములో చెప్పబడిన తండ్రి నుండి వెలుపలికి వస్తున్న కుమారుడు - పరిశుద్ధాత్మ ఇరువురు దైవాత్మలో తెగతెంపులు చేయలేని స్థితిలో ఆయనలో నుండి విడివడి వేరుగా క్షణము సేపైనను వెలుపలికి రాని స్థితిలోనే విడరాని ఆత్మ బంధము కల్గియుండి సింహాసనాసీనుడైన తండ్రియైన దేవునిలోనే కుమారుడు - పరిశుద్ధాత్మ ఇరువురు విడరాని బంధము కల్గి దైవ త్రిత్వము ఏకమైయున్నదని నేను గ్రహించాను. ఈ విధముగా గ్రహించాలంటే ఆనాడు సింహాసనాసీనుడైన దేవుని రూపము నా కళ్ళకు కట్టినట్లు ఈనాటి వరకు నిలిచియున్నది. ఈ మూడు రూపాలు ఒకరితో ఒకరు కలిసియున్నందువలన యేసయ్య యొక్క దివ్య స్వరూపములోనే నేను తండ్రి యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు దివ్యరూప శక్తులను నేను ఆత్మరీత్యా గ్రహిస్తున్నాను. నేను యేసయ్య యొక్క అత్యంత ప్రాముఖ్యమైన రూపమును ధ్యానించుచు దర్శించుచు ప్రభువులోని తండ్రియైన దేవునితోను ఆయన దివ్యమైన పరిశుద్ధాత్మతోను మాట్లాడుట అలవాటైంది. ముస్లిమ్‌లు నన్ను హింసించిన సందర్భములో యేసు వైపు చూచి ఆనాడు హాగరు సంతానాన్ని ఆశీర్వదించబట్టి గదా! ఈనాడు వారు విజృంభించి ఈ ఆగడాలు సృష్టిస్తున్నారన్నప్పుడు తండ్రియైన దేవుని ముఖ దర్శనము స్పష్టముగా నాకు కనబడింది. ఇప్పటికైనను వారి మీదనున్న నీవు ఆనాడు ఇచ్చిన ఆశీర్వాద హస్తాన్ని తిరిగి తీసుకోమన్నప్పుడు స్పష్టముగా తండ్రియైన దేవుని హస్తము వారి మీద నుండి తొలగిపోవుట నా కంట పడింది. ఆ తర్వాత వారు పడే బాధలు, ఓదార్పు పొందనొల్లని ఆర్తనాదాలు, వారు పడే వేదనలు చూచి నా హృదయము ద్రవించినప్పుడు, నీవు వారి మీద ఉంచిన ఆశీర్వాద హస్తము న్యాయమైనది. నేను వెంటనే నేను చూస్తుండగా వారి మీద మరల నీ ఆశీర్వాద హస్తముంచి వారిని రక్షించమని వేడుకొనగా తండ్రియైన దేవుని హస్తము ఆ జనాంగముపై ఉంచుట నాకు తేటగా కనబడినందున, ఆ క్షణమే ఆ దినమే ఇందిరమ్మ భారతదేశ సైనికులను బంగ్లా దేశము పంపి వారి అరాచకాలను ఘాతుక క్రియలకు అడ్డు గట్ట వేసి ఆ సైనిక దుశ్చర్యలను ఆగడాలకు చరమగీతము పాడి బంగాళా దేశమునకు స్వాతంత్య్రాన్ని కల్గించింది.
.........
63. ప్రస్తుత దినములలో దేవుని ఆత్మ నా హృదయములో ప్రవేశించి నా జ్ఞానమును విస్తరింపజేసి సువార్త గ్రంథాలను రాయిస్తున్నాడు :- తొలుత రెడ్డిపాళెములో ఆరోగ్య మాత గుడి కట్టినప్పుడు ధనరాజుగారు ఉపదేశిగా ఉండగా ప్రభువు తల్లి అక్కడ క్రైస్తవులెవరు లేనందున మమ్ములను బుజ్జగించి మా ఇరువురి మధ్యన ఉండి చిన్న వేద రచనలను సామెతల రూపములోను చిన్న చిన్న ప్రశ్నల రూపములో మమ్ములను ప్రశ్నించుచు దైవవాక్యమును విన్పించుచుండగా వాటినన్నిటిని నేను రాసి పెట్టేవాడను. ధనరాజుగారు రెడ్డిపాళెములో తన భార్యతో కూడా కాపురముండి ఉపదేశిగా ఉన్నంతకాలము మరియమ్మగారు ధనరాజుగారి యోగము ద్వారా వేద రచనలు ఉపన్యసిస్తూ గుడికి వచ్చే వారి సమస్యలను కష్టనష్టాలను గూర్చి చెప్పుచు వారిని ఓదార్చి మరియ తల్లి యేసు స్వామి ప్రార్థనల ద్వారా వారికి స్వస్థత లందించేవాడు. ఆ దినములలో మరియ తల్లి బైబిలుకు వ్యతిరేకముగా వ్రాయబడిన బైబిలు బండారములోని వంద ప్రశ్నలకు కూడా ధనరాజుగారి యోగము ద్వారా జవాబులందించింది. రెడ్డిపాళెము గుడి వద్ద ఈ ధనరాజుగారు లోన్‌స్టార్ బాప్టిస్టు సంఘ విలేజీ ఫాస్టరుగా చేరిన సందర్భములో అలనాడు సొలొమోను యొక్క జ్ఞానమును వికసింపజేసినట్లుగానే ప్రభువు తన పరిశుద్ధాత్మ ద్వారా నా జ్ఞానమును తెరచినందున నేను స్వయముగా రాసే శక్తి కల్గింది. కాని దేహము విడిచిన ఆత్మలు యోగములో కనబడి ఆత్మల రాజ్యములో ఉన్న సంఘటనలను, సమాచారములను గూర్చి వినుట మొదటి నుండి నాకెంతో ఇష్టము. ఆ ఆత్మలు నాతో మాట్లాడుటకు ప్రభువు పర్మిషన్ ఈయనందున ధనరాజుగారిని నేను ఆశ్రయించి, ఆయన ఇంటికి తరచుగ వెళ్ళి వివిధ రకములైన ఆత్మల సంభాషణ వివరములను వ్రాసుకొనేవాడను. భూమి మీద నివసించి చనిపోయిన ఆత్మనైనను ధ్యానించి పిలిచినట్లయితే యోగములో ప్రవేశించి మనము అడిగిన ప్రతి విషయము పూస గ్రుచ్చినట్లు చెప్పేవారు. ఆత్మల పరిచర్య వారి సంచార విధానము, వారి అనుదిన చర్యలు ఆత్మల కూడికలు వగైరాలు వివరిస్తున్నారు. నాకు చిన్నతనములో యోగము నేర్పించిన శివకోటారెడ్డిగారిని బైబిలుకు విరుద్ధముగా వ్రాసిన సత్యార్థ ప్రకాశిక రచయిత దయానంద సరస్వతిని, నా స్నేహితుడు నీలాకాంత్‌గారి తల్లిదండ్రులను ఒకరేమిటి ప్రతిసారి ఒక్కొక్క ఆత్మను పిలిచి వారి యోగక్షేమములు వారికున్న కాపలా ఆత్మల రాజ్యము వారి సమావేశము వారి అనుభవాలు ధనరాజుగారికి వివరిస్తుంటే ఆయన వారి మాటలు విని నాకు చెబుతుండగా నేను వ్రాసి పెట్టేవాడను. అందునుబట్టి ధనరాజుగారి మరణము వరకు ఆయన సావాసము నేను వదలిపెట్టలేదు.
ధనరాజుగారు నా కంటే ఏడు సంవత్సరాలు పెద్ద. అయినను రెడ్డిపాళెములో మరియమ్మగారికి గుడి కట్టి ప్రతి వారము ఎంతోమందిని నడిపిస్తూ పరిచర్య సాగిస్తూ యూదా వలె ధనాశకును, బాప్టిస్టు సంఘస్థుల మాటలకు లోబడి మొదట ప్రభువు తల్లికి ఆమె నుండి దూరమై ప్రభువు యొక్క కార్యాలకు దూరమై, డాక్టర్లకు అలవిగాని రోగాలకు బానిసయై కాల గర్భములో కలిసిపోయాడు. రెడ్డిపాళెములో ఎంతోమందిని నడిపిస్తూ ప్రతి ఆదివారము తాను స్వంతముగా కవిత గట్టిన పాటలతోను, విశ్వాసుల సాక్ష్యముతోను ఎంతో సందడిగా ఉన్న రెడ్డిపాళెమునకు తాను రానందున గుడిని నడిపించే ఉపదేశి లేనందున క్రమముగా ఆ గుడికి రావడము మానేశారు. ఒక పల్లెటూరిలో క్రైస్తవ కుటుంబము ఒక్కటైనను లేనిచోట గుడి కట్టిన నేరానికి ఆ తల్లి ఆరాధన లేని తన స్వరూపమును నా ఇంటికి చేర్చమని నాతో చెప్పింది. అందుకు నేను మరియ తల్లితో గుడిలో ఉండవలసిన స్వరూపము సంసారము చేసే గృహములో భార్యా పిల్లలున్నచోట అశుద్ధత ఆవరించియుండగా నీ స్వరూపము ఇంటిలో ఎట్లా పెట్టేది? అన్నాను. బిడ్డల యొక్క మాలిన్య స్థితికి తల్లి ఎప్పుడు బాధపడదు. బిడ్డల యొక్క మాలిన్యము నుండి దుస్థితి నుండి శుభ్రపరచి వారిని పరిశుద్ధులుగ తీర్చవలసిన బ్యాధ్యత తల్లికి కూడ ఉంది గదా! కనుక సంశయము లేకుండ నా స్వరూపమును మీ ఇంటిలో పెట్టు అక్కడ నాకు నిత్యము దైవ ప్రార్థనలు జరుగుతాయి. బిడ్డల మాలిన్యము తల్లి కంటదు, అని చెప్పినప్పుడు సరేనని రెడ్డిపాళెము నుండి స్వరూపమును నా ఇంటిలో చేర్చినాను. ఆ తల్లి సహాయము కూడా నాకు అందినందువల్ల అనేక గ్రంథాలు వ్రాయసాగినాను. మరి కొంత కాలానికి నా నాలుగవ కుమారుడు ఇమ్మానుయేలు రెడ్డికి నేనున్న వీధిలోనే హాస్పిటలు పెట్టుకొనుటకు ఒక ఇల్లు కొని ఇచ్చారు. ఆ ఇంటిలో వాడు వాసము చేస్తుండగా మరియ తల్లి నాతో ఈ స్వరూపమును హాస్పిటలులో ఉంచమని చెప్పింది. ఆ మాట నా భార్యతో చెప్పగా వాడికి ఇంకో స్వరూపము కొని ఇయ్యి - ఇది మాత్రము తీయవద్దన్నది. మరియ తల్లి తాను ప్రత్యేకముగా ఏర్పరచుకొన్న స్వరూపము గనుక ఇదే హాస్పిటలులో పెట్టమన్నది కనుక నేను అక్కడ ఎత్తైన స్థలములో అల్మారు కట్టించగా అందులో అమర్చి రాత్రింబగళ్ళు ఆమె అల్మారులో ఒక లైటు ప్రకాశిస్తుంటుంది. ఆ తల్లి స్వరూపము అక్కడ చేరింది మొదలుకొని నా కుమారుడు ఇమ్మానుయేలు ప్రభువు తల్లిని ఆవరించిన పరిశుద్ధాత్మ ద్వారా బయల్పరచబడి నేను వ్రాసిన అనేక గ్రంథ రచనలను సరిచేసి సమకూర్చి అనగా ఎడిట్ చేసి వాటిని మంచి ప్రింటింగుతోను, ఆకర్షణీయమైన అట్టలతోను తీర్చిదిద్దుతూ - ప్రతి పుస్తకాన్ని ఆంగ్ల భాషలో కూడా స్వయముగా తర్జుమా చేసి అనేకులకు అందుబాటుకు తెచ్చినాడు. ఆయన భార్య కిరణ్మయి కూడా హిందీలో తర్జుమా జేసి ఉత్తరాది రాష్ట్రాలకు కూడా ఈ సాహిత్యమును అందుబాటులో తెస్తున్నది. ఈ గ్రంథ రచనలన్నియు కూడా యేసు ప్రభువుని యొక్క అనుమతితోను, ఉజ్జీవముతోను ఇన్ని రచనలు, ఇన్ని గ్రంథాలు వెలుగు చూచినవి - ఇంకను చూస్తున్నవి. ఆంగ్ల భాషలో తర్జుమా చేస్తున్న ఇమ్మానుయేలు ఇంటరు వరకు తెలుగు మీడియం చదివినవాడే - పైగా ఇంగ్లీషులో ధారాళముగా మాట్లాడలేడు. అయిననేమి పరిశుద్ధాత్మ యొక్క ఆవేశము, ఆయన ఉజ్జీవము రాగా అతి శీఘ్రముగా అనేక గ్రంథాలు తెలుగులో సవరించి తిరిగి రాసుకొని ఆంగ్ల భాషలో తర్జుమా చేయుటన్నది అసామాన్య విషయము - ఎంతో అసాధ్యమైన ఈ కార్యమును సాధ్యము చేసిన ప్రభువు తల్లికి - ఆమెను ఆవరించిన పరిశుద్ధాత్మ దేవునికిని తన ప్రత్యక్షతను నాకు అనుగ్రహించి నాతో ముఖాముఖి మాట్లాడుచు తన పరిశుద్ధతలోకి నడిపించిన యేసు ప్రభువునకు ఇప్పుడు ఎప్పుడు నిరంతరము స్తుతి స్తోత్రములతో కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను.
..........
64. దైవ నిర్ణయాన్ని అడ్డగిస్తావా? :- ప్రభువును అంగీకరించిన ప్రారంభ దినాలలో రెడ్డిపాళెములో మా నాన్న వయస్సు పైబడి యుండి జబ్బుతో కోమాలోకి వెళ్ళినట్లుండినాడు. ఇంక ఎక్కువ రోజులు బ్రతికేటట్లు లేదన్న మాటలు నేను విని నెల్లూరులో నేను నివసిస్తున్న బాడుగ ఇంటిలో ఉంటూ ఉన్న దినాలలో ప్రభువుతో మాట్లాడుచు ప్రభువా! నాతో రా. మా నాయనగారి మరణము నుండి తప్పిస్తాము.'' అని ఆయనతో మాట్లాడాక ఆయన వెనువెంటనే దైవ నిర్ణయాన్ని మారుస్తావా? అని నాతో అన్నాడు. ఆ మాటకు నేను ఆలోచిస్తూ సృష్టిలో ప్రతి జీవికి మరణమన్నది తప్పదు కదా! మరణాలు లేకపోతే ఈ జననాల వల్ల భూమి చాలినంత ఉండదు. ఆహారానికి ఇండ్ల స్థలాలన్నింటికి కరువు ఏర్పడి అతి దారుణమైన భయంకర స్థితులు ఏర్పడుతాయి. కాబట్టి దైవ నిర్ణయములో మరణమన్నది ఆయన ప్రణాళికలోనిదే కనుక మరణానికి సిద్ధపడి దానిని తప్పక ఆహ్వానించి మరణము ద్వారా దైవసన్నిధికి వెళ్ళుటకు ఇది అత్యంత ప్రాముఖ్యమైన మార్గము. కనుక ప్రతి యొక్కరు మరణాన్ని ఆహ్వానించాలేగాని మరణించినవారిని గూర్చి దు:ఖపడ నవసరము లేదు. ఎందుకంటే మరణము ద్వారా పరమాత్ముని సన్నిధి ఆయన ఆనందము మనకందరికి లభిస్తుంది. అప్పటినుండి నేను మరణించిన వారి కొరకు దు:ఖపడటం మానివేశాను. అయితే మరణమన్నది నా ఇంటిలో ప్రవేశించాలంటే నా పర్మిషన్ తీసుకోవాలి అని ప్రభువు వాగ్దానమిచ్చాడు. అందుకని నా ఇంటిలోని వారిని ఎవరినైనను మరణము ద్వారా వారి ఆత్మను కొనిపోవాలంటే మరణ దూత నా అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. లేదా ఎవరినైనను ప్రభువుకు చూపి మరణము ద్వారా ఆ శరీరిలోని ఆత్మను కొనిపొమ్మని నేను ప్రార్థించినప్పుడు వెనువెంటనే మరణము ప్రవేశించి ఆ వ్యక్తి చనిపోవుట జరుగుతుంది.
ఇందుకు సంబంధించిన కొన్ని ఉదాహరణలు. మా తల్లిగారు వృద్ధాప్య దశలో మా యొద్ద ఉండాలని ఎంతో ప్రాధేయపడినది. అందుకు నేను నా భార్య హౌసింగు బోర్డు ఇరుకు ఇళ్ళు - వసతులు సరిగా లేవు - తమ్ముడు పల్లెటూళ్ళో బాగా సంపాయించాడు. పొలాలు పశువులు పాడి పంట విశేషమైన ఐశ్వర్యాన్ని ఇచ్చి ప్రతి నిత్యము పనివారుతో ఉంటుండగా నీ జీవితము తమ్ముని దగ్గర సుఖముగా ఉంటుందని ఆమెకు హితబోధ చేసి ఒప్పించి తమ్ముని దగ్గరకు పంపించాము. నేను ఈ గ్రంథ రచనలలో తలమునకలై తీరుబాటు లేనందున ఆమెను ఒకసారి కూడా దర్శించలేదు - ఎందుకంటే తమ్ముని దగ్గర నా దగ్గర కంటే కూడా సుఖముగా ఉంటుందని తలంచాను. నేను ఈ విశేషమైన గ్రంథ రచనల వల్ల బంధు మిత్రాదుల దర్శనము, వివాహము, మరణించినవారి సందర్శనము - అన్ని మానివేసి నా భార్యను పిల్లలను పంపించేవాడనేగాని నేను ఎప్పుడు ఎక్కడకు వెళ్ళటం మానేశాను. ఎందుకో చాలా కాలమైంది ఆమెను చూచి వస్తామని ఎమ్మిగనూరుకు వెళ్ళినాను. అది చలి కాలము. తమ్ముడు, తమ్ముని భార్య ఇంటి లోపల పడుకున్నారు. నాకు ఇంటిలో మంచము పరుపు వేశారు. రాత్రి కాలములో నా తల్లి గొడ్ల చావిడిలో పశువుల మధ్యలో మంచము మీద పరుండి వెర్రి అరుపులు అరుస్తూ ఉండింది. అప్పటికే ఆమె స్థితి మంచములో దిగజారి పోయింది. ఆమెను వీడు ఇట్లా చేస్తాడనే ముందుచూపుతో నా దగ్గర ఉంటానని నా తల్లి అన్నది. నేను అది గ్రహించలేక పోయాను. దిగజారిపోయిన స్థితిలో ఆమెను తిరిగి నెల్లూరుకు తీసుకపోవటం కుదరదు. ప్రభువా! ఆమె దారుణ స్థితి పిచ్చిగా వికారమైన వెర్రి అరపులతో అనాధగా పశువుల పాకలో వదలిపెట్టిన స్థితి నన్ను కలిచి వేస్తుంది. దయచేసి ఆమె ప్రాణమును స్వాధీనము చేసుకొని ఆమె బాధ నివారణ కల్గించండని ప్రభువుకు విన్నవించి, ఆ తెల్లవారి అక్కడ నిలవకుండ ఆమెను కడసారి చూచి బయలుదేరి వచ్చినాను. నేను ఇంటికి వచ్చిన మరుసటి రోజున ఆమె ప్రాణము ఆమెను విడిచి వెళ్ళింది. అయితే మా తల్లి నా ద్వారా ప్రభువును విశ్వసించింది. కనుక ఆమె ధన్యురాలు. ప్రభువు యొక్క పరదైసులో ఉన్న ఆనందాన్ని స్వప్నము ద్వారా నాకు చూపించింది.
అలాగే మా అక్కగారు నా ద్వారా ప్రభువును నమ్మింది. ఆమెకు భర్త చనిపోయాడు. పిల్లలు లేరు. ఆస్థిపాస్తులు అసలు లేవు. మా చెల్లెలి ఇంటిలో ఉంటూ వచ్చింది. బబ్బు పడినప్పుడు నెల్లూరుకు నా దగ్గరకు వచ్చి స్వస్థపరచుకొని వెళ్ళేది. మరి మిక్కిలిగా వయస్సు మీరి బాధాకరమైన జబ్బుతో లేవలేని స్థితిలో ఒకసారి మా ఇంటికి మరల వచ్చినప్పుడు ఈమె మంచము మీదనే లేవలేని స్థితిలో ఉంటే ఎవరికైనను ఆమెకు పరిచర్య చేయాలంటే కష్టమే. ఈమె వల్ల ఎవరికి ఏ ఇబ్బంది కలుగకూడదు. తనదంటూ తనకు ఏమియు లేదు. ఇతరుల మీద ఆధారపడవలసిందే. తినుటకు తిండి పెట్టగలరు. వస్తువులియ్యగలరు. కాని మంచము మీద లేవలేని స్థితిలో ఉంటే 24 గంటలు ఆమె దగ్గర ఉండి పరిచర్య చేయాలంటే అది అసాధ్యము. ఎందుకంటే ఆమెకు పిల్లలు లేరు. ఆమె మిగుల్చుకున్న ఐశ్వర్యము లేదు. ఉదారముగా తమ సమయాన్ని ఆమెకు వినియోగించాలంటే ఎవరికైనను బాధాకరమే గదా! అందుకని ప్రభువుతో అంటున్నాను. ప్రభువా! ఈమె మంచము మీద లేవలేని స్థితిలో ఉంటే పరిచర్య చేసేవారు ఆమెను ఈసడించుకుంటారు. ఎవరికైనను కష్టమే - ఎవరికి భారము లేకుండ ఆమె ప్రాణమును తొలగించమని చెప్పుకున్నాను. ఆ మరుసటి రోజే నా భార్య చేతులలోనే ఆమె ప్రాణము పోయింది. ఆమె కోరుకున్నట్లుగానే క్రైస్తవ సమాధుల తోటలో ప్రార్థనలతో పాతిపెట్టమని ఆమె కడసారి కోరిక కోరింది. ఆ విధముగానే చేయించాను కాని ఆమెకు సమాధి కట్టించలేకపోయాను. అదే విధముగా మరొక సంఘటన - ప్రభువు నాతో మాట్లాడుచు నీ భార్య కాలము సమీపించింది. కనుక ఆమె ప్రాణము తీసి వేయబడునని సెలవిచ్చాడు. అందుకు నేను నీ సువార్త గ్రంథ రచనలు పుస్తకాలు రాస్తూ అవి ప్రచురిస్తూ కష్టపడి వాటిని అన్ని చోట్ల పంపిణీ చేస్తున్నాను కదా! ఆమె తరచుగా ఈ పుస్తకాలు రాసిన దాని వల్ల ప్రయోజనమేమిటి? ఎవరిని ఈ పుస్తకాలు ఆకర్షించడము లేదు. వృధాగా డబ్బు తగలెయ్యడం తప్పితే - అంతగా కావలసి ఉంటే చేయాలనుకుంటే సంవత్సరానికి ఒక చిన్న పుస్తకము వేసి ఉచితముగా పంచండి అని అనేది. నా జీవిత కాలమంతయు ఆమె నాతో పుస్తకాల విషయములో పోరాటం సాగించేది. పదిమందిని రంజింప చేయని ఉజ్జీవింపచేయని పుస్తకాలు రాసి డబ్బు తగలేయడం దేనికి అనేది. కనుక ప్రభువా! ఈ పుస్తకాలు రాయటం మంచిదే - పదిమందిలో గుర్తింపు వచ్చింది - ఈ పుస్తకాలకు ఆదరణ లభించింది. నా భర్త చేసిన ఈ సువార్త రచనలు జ్ఞాపకార్థముగా నిలబడగల్గినవి. మంచి పేరు గల్గిందని ఆమె తన్నుతాను తెలుసుకొని సంతృప్తి పడేంత వరకైన ఆమెను భూమి మీద ఉంచకూడదా! అన్నాను. ఆ మాటలకు ఆయన తన అభిప్రాయాన్ని మార్చుకొన్నాడు. జబ్బు పడి మరణానికి సిద్ధపడ్డ ఆమె తిరిగి కోలుకొన్నది. ఈ విధముగా నాలుగైదు సంవత్సరాలు ఆమె ప్రాణము నిలబడింది. కాని హై బి.పి., షుగరు, ఆయాసము, గ్యాస్ట్రిక్ పెయిన్, కాళ్ళు చేతులలో నీరు చేరుట - భయంకర స్థితిలో రాత్రిళ్ళు నిద్ర పట్టక పండుకోలేక కూర్చునే బాధపడుతుండేది. ఏది ఏమైనను, కొన్ని గంటలు బాధపడినను మరికొన్ని గంటలు తన పని తను చేసుకొంటూ చర్చీకి వెళ్ళగలగడం అటు ఇటు తిరగడం కొంత ప్రశాంతతను పొందటం, ఈలాగు తన ప్రాణము కాపాడుకుంటూ ప్రభువు ప్రార్థనలతో ప్రశాంతత ననుభవిస్తూ మంచము మీద పడి ఇతరులకు భారము లేకుండ తన కాలమును వెళ్ళబుచ్చుచుండింది.
ఈ పరిస్థితులలో ఈమె మూడవ కుమారుడు అమెరికాలో ఉండి తల్లిదండ్రులకు అమెరికా ఒకసారి చూపించాలన్న కోరిక గల్గి పాస్‌పోర్టు రెడీ చేసుకోమన్నాడు. నేను రానంటే రానని ఖరాఖండిగా చెప్పేశాను. ప్రభువు చూపిన భవిష్యత్ జ్ఞానమునుబట్టి విదేశీయులు నన్ను చూడడానికి రావలసిందేగాని నేను వారిని, వారి దేశాన్ని దర్శించుటకు వెళ్ళవలసిన అవసరత నాకు లేదు. వాళ్ళే నన్ను చూడటానికి వస్తారు అని నేను వెళ్ళే ఆలోచన మానివేశాను. కాని ఈమె పాస్‌పోర్టు రెడీ చేసుకొని అమెరికా వెళ్ళుటకు హై.బి.పి., షుగర్ జబ్బులతో బాధపడుచున్న ఈమెకు ఇక్కడి డాక్టర్లు చికిత్స చేసిన టెస్ట్ పేపర్లు అవసరమైంది. అవి లేనిదే అక్కడ డాక్టర్లు చికిత్స చేయరు. అందువల్ల హాస్పిటల్లో చేర్చాము. హాస్పిటల్లో చేర్చినప్పుడు హోమియో మందులు ఇచ్చి పంపటం సరి కాదని అవి ఆమెకు ఇవ్వలేదు. ఆమె జీవితములో షుగరు, బి.పి. జబ్బులకు అల్లోపతి - హోమియో కొన్నిసార్లు త్రిఫలాచూర్ణము వగైరాలు వాడేవారము. అందువల్ల ఆమె పరిస్థితి కొంత మెరుగుగా ఉండేది. ఎప్పుడైతే హోమియో వైద్యము ఆమెకు నిలిచిపోయిందో అప్పుడే ఆమె పరిస్థితి దిగజారింది. నేను ఆమెను హాస్పిటల్లో చేర్చి ఆనాటి రాత్రి హాస్పిటలులోనే ఆమెకు తోడుగా ఉండి నిదురలేదు. అంతకు ముందు విజయవాడకు వెళ్ళి బుక్ డిస్ట్రిబ్యూషన్ సందర్భములో వెళ్ళి రెండు రోజులు నిద్ర లేదు. వరుసగా మూడు నాలుగు రోజులు నిద్ర లేనందున నాకు చీకాకుతోబాటు బలహీనత ప్రవేశించింది. ఆమెను డాక్టర్లు మా వైద్యము చాలదు వేరేచోట తీసుక వెళ్ళమని చెప్పినప్పుడు ఆ రోజు రాత్రి పొద్దుబోయి ఇంటికి తీసుక వచ్చారు. ఆ రాత్రి అంతయు ఆమె పరిస్థితి సరిగా లేదు. ప్రక్కవారిని సరిగా నిద్ర పోనీయలేదు. నేను ఉదయమున లేచి అబ్బాయి ఉన్న హాస్పిటలుకు పోతూ నిద్ర లేని స్థితిని బట్టి ఆమె పరిస్థితిని బట్టి పైగా ఇంచుమించు మూడు నాలుగు వారముల నుండి సువార్త రచన కొనసాగక పోవుటయు - మద్రాసు పాస్‌పోర్టు ప్రయాణము, వగైరాల వల్ల నాకు శ్రమయేగాని సుఖము లేదు. సువార్త ప్రకటించకపోయిన నాకు శ్రమ అని పౌలు చెప్పినట్లు గ్రంథ రచన సాగకపోయినను శ్రమ, నిద్ర లేమి, అనారోగ్యము వగైరాలు ఆవరించి వేదన ననుభవిస్తూ హాస్పిటలులో ఉన్న మా అబ్బాయితో ఆమె విషయము మాట్లాడుటకు వెళ్ళుచు దారిలో నడుస్తూ ప్రభువుతో ఇట్లని మాట్లాడినాను. నీ మాట విననందుకు నాకు శాస్తి జరిగింది. నిద్ర లేదు, సువార్త గ్రంథ రచన ఆగిపోయింది. మానసిక స్థిమితము లేదు. ఆమె తన బాధలతో తల్లడిల్లిపోతుంది. నెమ్మదిగా ఉన్నది ఉన్నట్లుండక అమెరికా ప్రయాణము పెట్టుకొని మొదటికే మోసము తెచ్చుకొన్నది. ఏది ఏమైన నీ చిత్తము, నీ సంకల్పము ప్రకారమే ఆమె ఆయుస్సును తీసివేస్తే తీసివేయి లేదా ఉంచితే ఉంచు. నేనేదో మిమ్మల్ని బ్రతిమిలాడి ఆమె మరణమును ఆపి అన్ని విధాల ఇబ్బందుల పాలగుచున్నాము. ఆమెకు ఆనందము, ప్రశాంతత లేదు. కుటుంబములో శాంతి లేదు. ఏండ్లు మీరినాయని పేరేగాని మీ దృష్టిలో నేను పిల్ల గుంపు క్రింద లెక్కయే - పిల్లవాడు తండ్రిని ఎన్నో కోర్కెలు కోరుతాడు. తండ్రి వాడి కోర్కెలలో అవసరమైనవి మాత్రమే వాడి తాహతుకు సరిపోయే కోర్కెలు మాత్రమే తీరుస్తాడు. అట్లే నేను కూడా మీ దృష్టిలో నేను పిల్లవాడివంటివాడినే - నేను ఆమె ప్రాణమును నిలపమన్నాను. కాని నా చిత్తము నా తలంపును బట్టి గాక మీ తలంపు మీ ప్రణాళిక మీ నిర్ణయానుసారముగా ఆమె ప్రాణమును ఉంటే ఉండనీయుడి తీసివేస్తే తీసివేయుడి. సమస్తము మీ చిత్త ప్రకారమే జరుగనీయమని ప్రభువును ప్రార్థిస్తూ హోమియో డాక్టరుగా ఉన్న అబ్బాయి దగ్గరకు వెళ్ళి వచ్చాను. వాడు నాతో కూడా ఆమె దగ్గరగా ఎదురుగా కూర్చుని చెప్పమ్మా ఏదైన చెప్పమని అడిగినాడు. నేను ప్రక్కన నిలబడి యున్నాను. ఆమె నోరు తెరచి పిత అన్నది. ఇంకా చెప్పు అని అబ్బాయి అన్నాడు. మరల పిత అని, మూడవసారి కూడా పిత అన్నది. ఇంకా చెప్పుమంటూ అబ్బాయి ప్రోత్సహిస్తుండగా మరి మూడుసార్లు పుత్ర - పుత్ర - పుత్ర అని అన్నది. ఇంకా చెప్పమ్మా అని అన్నప్పుడు పవిత్రాత్మ అని అనడము ఒక్కసారే మాకు వినబడింది. తర్వాత రెండుసార్లు ఆమె లోలోన అనుకున్నదేమో మాకు తెలియలేదు. ఆమె మాత్రము మా మీద దృక్పధము ఉంచి ఆ ప్రార్థన చేయలేదు. చెప్పమ్మా అని అబ్బాయి అంటుంటే ఆమె శారీరక బాధలు చెప్పటం లోగడ ఆనవాయితీ - అది లేదు గాని ప్రార్థనలో వినియోగించే ప్రధానమైన ఏక త్రిత్వ సర్వేశ్వరుని గూర్చిన ప్రధాన సంస్మరణ మాటలివి. ఆ మూడవ మాట పవిత్రాత్మ అని ఒక్కసారి మాత్రమే అనడం మాకు వినబడింది. కాని లోలోన అనుకున్నదేమో నాకు తెలియదు. అ తదుపరి ఆమె పెద్ద కోడలు విజయ పాలు తెచ్చి తాగిస్తే ఒక గుటక పీల్చుకొని తల పైకెత్తి శ్వాసను బయటకు వదలుతూ ప్రాణాన్ని కూడా వదలి కుర్చీలో తలను ప్రక్కకు పెట్టింది. అబ్బాయి స్టెతస్కోపు తెప్పించి పరీక్షించి ప్రాణము పోయిందని నిర్థారించాడు. మూడు నాలుగు ఏండ్ల క్రిందట ఆమె ఆయుస్సు పరిసమాప్తి అని చెప్పినప్పుడు నేను ప్రభువును అడ్డగించి ఆమె ప్రాణమును నిలబెట్టినాను. ఇక నా వల్ల కాక నాకు, ఇంటిలోని వారికి శ్రమలు - ఆమెకు అలవిగాని శరీర బాధలు వగైరాలతోబాటు సువార్త గ్రంథ రచనలకు విఘాతము, వగైరాలు చుట్టుముట్టి నందువల్ల ఆనాడు ప్రభువు సంకల్పమునకు అడ్డగించిన నేను మరల ప్రాధేయపడి ఆయన సంకల్పము ప్రకారము చేయమని ప్రాధేయపడి, ఇంటిలోనికి వచ్చిన మరుక్షణమే ఆమె ప్రాణము ఏ విధమైన బాధలతో ఆయాసములతో కొట్టుమిట్టాడక ప్రశాంతముగా త్రియైక దేవుని దివ్య నామ త్రయమును మూడు మూడు సార్లు పలుకుచూ తన తుది శ్వాసను వదలివేసింది. ఇది ఒక రకముగా ఆమెకు ప్రభువు సన్నిధిలో ఘనతయని చెప్పవచ్చును. ఆమెను తీర్చిదిద్ది ఆమెకు ప్రభువు ప్రార్థనలు కథోలిక సిద్ధాంతములు నేర్పుతూ ఆమెను ఆ రోజులలో బహుగా ప్రేమించిన సిస్టరు మార్గరేటమ్మగారు ఆమె మరణ సమయములో ప్రభువు నామమును జపించుచు ప్రాణాలను వదలివేసిందని ఆ రోజులలో ఆశ్చర్యముగా చెప్పుకొనేవారు. ప్రాణము శరీరమును వదలు సమయములో ప్రశాంతముగా దైవ నామ స్మరణము చేయనెట్లు సాధ్యము! అని ఈనాటికి కూడా నాకు అనుమానము, ఆశ్చర్యము కల్గుతుంటుంది. దీర్ఘకాలముగా నివసించిన ఇంటిని, బంధు వర్గమును, ఇరుగుపొరుగును, మనవళ్ళు, మనవరాళ్ళను వదలి ప్రాణము పోయేటప్పుడు మానసిక పరిస్థితి, ఆందోళన అది ఎటువంటిదో నా ఊహాలకే అందదు. అట్టి పరిస్థితులలో నాకు తెలియకుండానే నా ప్రాణము శరీరమును వదలిపోయే మార్గము ఏదైనను ఉంటే చూడు ప్రభువా! అని చెప్పుకొన్నాను. మూడు రోజుల పాటు కోమాలోకి వెళ్ళి శ్వాస వదలుతావు అన్నట్లుగా నా భవిష్యత్తు నాకు తెల్పింది. రెండు మూడు రోజులలో చనిపోతావని కూడా నిన్ను పరీక్షించినవారు నిన్ను గూర్చి చెప్పుకుంటారని కూడా తెలియజేయబడింది. ఏది ఏ విధముగా నేను మరణించినను చనిపోయే సమయములో ప్రశాంతత, ఏ విధమైన లోక వ్యామోహము, బంధు ప్రీతి ఉండక పరమాత్ముని యందే మనస్సు నిల్పి ఉండాలని నా కోరిక అది సాధ్యమయ్యేదేనా? ఏది ఏమైనను నా మరణమును గూర్చి నా కెందుకు చింత ప్రభువే చూచుకుంటాడు. మరణ సమయములో నా ఆత్మ శరీరమును వదలునప్పుడు, ఆయన ఆత్మ నన్నావరించి ఏ విధమైన మనో వైకల్పము, మనో చింతన లేకుండ ఈ లోకయాత్రను ముగింపజేయును గాక!
.......
65. నన్ను ఉద్యోగము నుండి సస్పెండు చేశారు :- నేను టీచరు పోస్టులో చేరిన కొంత కాలమునకు వివాహమైంది. ఆ తర్వాత నా దగ్గరకు రాఘవయ్య అను ఉపాధ్యాయుడు నా దగ్గరకు వచ్చి డబ్బులు అప్పుగా కావాలని చాలా అవసరమని ప్రాణము మీదకు వచ్చిందని చెప్పి - ఈ నెల నా జీతము స్టాంపు మీద వ్రాసి నీ చేతికి ఇస్తాను. దానిని మేనేజర్ దగ్గరకు తీసుక వెళ్ళి నా జీతము నీవే డ్రా చేసి తీసుకోమన్నాడు. నిజమేనని ఎంత అవసరమోనని నేను అధికముగా ఇబ్బందులు పడుతున్నను డబ్బు ఇచ్చి పంపినాను. ఆ నెలలో అతని జీతము నేను డ్రా చేసుకోక ముందే తాను మున్సిపలు ఆఫీసుకు వెళ్ళి వాళ్ళను మంచి చేసుకొని అందరికంటే ముందుగా ఆ నెల జీతము తీసుకొని వెళ్ళినాడు. నేను అతని జీతము డ్రా చేసుకొనుటకు వెళ్ళినప్పుడు ముందుగానే తీసుకొన్నట్లుగా తెలిసి అతని మోసమునకు గురి అయ్యానని తెలిసింది. ఆ రోజులలో మున్సిపలు ఆఫీసులోనే సాయంత్రము అందరి టీచర్లకు వరుసవారీగా జీతాలు ఇచ్చేవారు. ఉదయకాలమే వెళ్ళి ఏదో అవసరమని జీతాలు చెల్లించు క్లర్క్‌కు మాయమాటలు చెప్పి తెచ్చుకున్నాడు. మరి నా కంటికి కనబడక అడిగితే డబ్బు ఈయలేదు. బాకీ చెల్లించలేదు. ఇట్లా రెండు మూడు నెలలు గడిచినవి. నేను పని చేసే స్కూలులో వరదయ్య అను ఉపాధ్యాయునితో ఈ విషయము ప్రస్తావించినప్పుడు అతను రాసిచ్చిన కాగితములో తేదీని మార్చి నీవు ముందుగా వెళ్ళి డబ్బు డ్రా చేసుకోమని సలహా ఇచ్చాడు. తేదీని మారిస్తే ఇబ్బంది కదా! అని అంటే అదేమో నాకు తెలియదు అతడే కొట్టివేసి మార్చినాడని చెప్పమన్నాడు. నేను ఆ రోజులలో లోక జ్ఞానము లేదు - హైస్కూలు స్టడీ కూడా పూర్తిగా పూర్తి చేసినవాడను కాను. అట్టి అమాయిక స్థితిలో నేను తేదీని మార్చి అతని జీతమును ఆ తదుపరి నెలల్లో డ్రా చేసి తీసుకొన్నాను. అతడు కమీషనరుగార్కి కంప్లయింట్ చేశాడు. తేదీని మార్చి తీసుకొన్న నేరానికి ఫోర్జరీ క్రింద నన్ను సస్పెండు చేశారు. చాలీచాలని జీతము - అది కూడా లేకుండ పోయింది. నీవు ఇంటిలో కూర్చుండి ఏదైన కుట్లు అల్లికలు మిషను కుట్టి ఏదైన కొంత సంపాయించుకోవడం మేలు కదా! అని ఒక లేడీ - మిషన్ సెంటర్ పెట్టి డ్రస్సులు కుట్టటం నేర్పిస్తుంటే, అక్కడ చేరి కొంత కాలములోనే జాకెట్లు, గౌనులు, లంగాలు, వగైరాలు కుట్టడం నేర్చుకొని ఇంటిలో ప్రత్యేకముగా ఒక మిషను కొని చుట్టు ప్రక్కల ఇరుగుపొరుగువారికి జాకెట్లు గౌనులు చిన్న పిల్లల చొక్కాలు కుట్టి డబ్బులు సంపాదించడం మొదలుపెట్టింది. తదుపరి ఎట్లో నన్ను ఉద్యోగములో చేర్చిన పెళ్ళకూరు రామచంద్ర రెడ్డిగారిని పట్టుకొని నా ఉద్యోగమును తిరిగి తెచ్చుకోగల్గినాను. ఉద్యోగములో సస్పెండ్ కావడం అనేది ఉద్యోగికి భరించరాని వేదన కల్గిస్తుంది. అది భవిష్యత్తులో భార్య కూడా సంపాదించుకొనే స్థితికి దారి తీసింది. ఆమె సంపాదన కుటుంబ పోషణార్థము, నా జీతము - జీవితము గ్రంథ రచన ప్రచురణ వగైరాలకు పరిమితమైంది. ఇది ప్రభువు సంకల్పములోని ఏర్పాటైయున్నది.
......
66. ఈ బిడ్డను కూడా తినేస్తాను :- బుచ్చిరెడ్డిపాళెములో ఉన్న నా రెండవ చెల్లెలికి అత్తమామలున్నారు. నా చెల్లెలికి ప్రతిసారి గర్భము నిలవడము ప్రసవ కాలములో ఆ బిడ్డ చనిపోవడం జరుగుతుండేది. ఎందువల్ల ఇట్లా జరుగుతుందో డాక్టర్లకు కూడ అంతు చిక్కలేదు. మరియొకసారి ఆమె గర్భవతియైనప్పుడు నెలలు నిండిన సమయములో ఒక నెల ముందుగానే మా ఇంటిలో ఆమెను పెట్టుకొన్నాను. అప్పటి దినములో నేను ప్రభువును ఎరుగను. హిందువుడుగానే ఉండి వెంకటేశ్వరుని భక్తిలోనే ఉంటూ వచ్చాను. ఆమె మా యింటికి వచ్చిన రాత్రి కాలములో నాకు ఒక కల వచ్చింది. తిరుపతి వెంకటేశ్వరుడు నాకు కలలో కనబడి ఈ బిడ్డను కూడా నేను తినేస్తాను అని ప్రగల్భాలు పలుకుతుంటే ఎందుకు తినేస్తావు? ఆ బిడ్డను ఎందుకు బ్రతుకనీయవని అడిగినాను. ఆమె అత్త నాకు ఎన్నో మ్రొక్కులు మ్రొక్కుకొని ఉన్నది. అన్నిటిని ఎగనామం పెట్టి ఏ ఒక్క మ్రొక్కు నాకు తీర్చలేదు. కాబట్టి ఈ బిడ్డను కూడా నేను బ్రతుకనీయను అని అన్నాడు. ఆ సంగతి ఏదో నేను కనుగొంటానని చెప్పినాను. తెల్లవారి లేచినప్పుడు అత్తమ్మను పిలిచి తిరుపతి వెంకటేశ్వరస్వామికి నీవు చెల్లించవలసిన మ్రొక్కులలో ఏ ఒక్కటి కూడా చెల్లించలేదంటున్నాడు నిజమేనా! అని అడిగినాను. అందుకు ఆమె నిజమేనన్నది. తిరుపతి వెంకటేశ్వర్లుకు ఆపద మ్రొక్కులు మ్రొక్కి ఎగ్గొట్టి తిరిగేవాడు ఎన్నటికి బాగుపడడు. తిరుపతి వెంకన్న ఈ విషయములో భయంకరుడు. కనుక దేవుడు దగ్గర దీపము వెల్గించు కర్పూరము వెల్గించి నేను చెప్పినట్లుగా చెప్పుచు, ఆ దేవుని దగ్గర ప్రమాణము చేయాలి. అట్లు చేయని యెడల నీ కోడలిని తీసుకొని నా ఇల్లు వదలి వెళ్ళిపోవలసి ఉంటుందని ఖరాఖండీగా చెప్పాను. అందుకు ఆమె నీవు చెప్పినట్లు చేస్తానన్నది. వెంకటేశ్వరుని పటము ముందు దీపము వెల్గించి ఆమె చేతికి వెల్గించిన కర్పూరము ఇచ్చి వెంకటేశ్వరా! తండ్రీ నా అపరాధములు మన్నించు. నీకు చాలా మ్రొక్కుబళ్ళు మ్రొక్కి అవి ఈ నాటి వరకు తీర్చలేదు. ఈ నిండు గర్భవతిగా ఉన్న గర్భమును రుణించుము. ఆమెకు సుభిక్షమైన ప్రసవము దయచేయుము. నీకు ఇవ్వవలసిన బాకీలన్నియు బిడ్డను సురక్షితముగా ప్రసవించిన వెంటనే మా ఊరికి వెళ్ళి నీ బాకీలన్నియు దీర్చుటయేగాక అపరాధ వడ్డీగా 50 రూపాయలు నీకు అదనముగా సమర్పించి నా తల నీలాలు తీయించుకొంటాను. ఈసారికి నన్ను మన్నించు. పుట్టబోవు శిశువు ప్రాణాలు తీయకుము అని ఆమె చేత ప్రార్థన ప్రమాణము చేయించాను. నా చెల్లెలికి నొప్పులు తగిలిన వెంటనే హాస్పిటలులో చేర్పించాము. ఆ రాత్రి కలలో వెంకటేశ్వర్లు అనే బాలుడు నా దగ్గర చంటివాడి రూపములో నేను ఉంటున్న ఇంటికి వచ్చాడు. అప్పుడు నేను వానిని చూచి వెంకటేశ్వరా! హాస్పిటలుకు పోలేదేమిరా? అన్నాను. ఆ మాటతో కూడా వాడు దిగ్గున నా ముందు అంతర్దానమై హాస్పిటలుకని వెళ్ళినాడు. ఆ రోజు సురు రాత్రి ఆమె బిడ్డను సరక్షితముగా ప్రసవించి తమ ఇంటికి తీసుకొని వెళ్ళింది. ఆ మగ శిశువే కట్ట కడపటి మగ శిశువుగా నా చెల్లెలికి దక్కింది. ఆ రోజుల వరకు నేను యేసు ప్రభువును ఎరిగియుండలేదు. నేను యేసు ప్రభువును ఎరిగియుంటే వెంకటేశ్వరుల మ్రొక్కులు ఎగ్గొట్టినను, వెంకటేశ్వర్లు నామమున ఏ అపరాధములు చేసి యున్నను వాటిని చెల్లించకయే యేసు ప్రభువు నామమున వెంకటేశ్వరుని వల్ల వచ్చు కీడును యావత్తును తొలగించియుందును.
.......
67. జూదములోను నెంబర్లాటలోను సంపాయించిన డబ్బుతో సువార్త సేవ చేస్తావా? :- నేను 1958వ సంవత్సరములో స్టోన్‌హవుస్ పేట పప్పుల వీధిలో టీచరుగా పని చేస్తున్న రోజులలో నెంబర్లాట ఒకటి విపరీతముగా ఆడేవారు. 00 నుండి 99 వరకున్న అంకెలలో ఏదో ఒక్కటి ఆ రాత్రి పది గంటలకు మొదటి అంకె దాని తర్వాత వేకువన నాలుగు గంటలకు రెండవ అంకె వెలువడేది. మొదటి అంకె మీదగాని రెండవ అంకె మీద గాని డబ్బులు కట్టితే కట్టిన డబ్బుకు ఎనిమిది రెట్లు ఇచ్చేవారు - రెండంకెల మీద ఒకేసారి డబ్బు కట్టితే ఆ కట్టిన డబ్బుకు 80 రెట్లు డబ్బులు ఇచ్చేవారు. డబ్బులు కట్టిన అంకె వెలువడక పోతే కట్టిన డబ్బులు పోయినట్లే - ఈ విధముగా ఈ అంకెల జూదానికి అలవాటు పడినవారు ఎక్కువ మంది నష్టపడిపోయేవారే. ఈ జూదము నన్నంటుకొనింది. దానికి బానిసయ్యాను. జీతము తక్కువ పుస్తక రచనలు ఎక్కువ. సంసారము పిల్లలు ఎక్కువ ఆర్థిక స్తోమత తక్కువ. అయినను చాలామంది పిల్లలను చేర్చుకొని ట్యూషన్లు కూడా చెప్పుచుండేవాడను. అప్పటి పిల్లల ట్యూషన్ రేట్లు ఈ విధముగా ఉండేవి. ఒకటవ తరగతికి ఒక్క రూపాయి, రెండవ తరగతికి రెండు రూపాయలు ఈ విధముగా ఐదవ తరగతి వరకున్న యెడల ఐదు రూపాయలు వరకు నెల జీతము ఉండేది. ప్రారంభ జీతము అంతయు కలసి57 రూపాయలు మాత్రమే - ఆ రోజులలో ఒక రూపాయకు రెండు శేర్ల బియ్యము ఇచ్చేవారు - నాకు వివాహము కాని రోజులలో ఐదు రూపాయలు బాడుగతో ఒక గది అద్దెకు తీసుకొన్నాను. వివాహమైన తర్వాత ఆ గది ప్రక్కనున్న కొంచెము పెద్ద గది కూడా తీసుకొని రెండింటికి కలిసి పది రూపాయలు ఇచ్చేవాళ్ళము. ఈ విధముగా జూదమునకు అలవాటుపడిన నా శరీరము మనస్సు ఆత్మ శ్రమల పూరితమై ఎందుకు పనికిరాని స్థితికి దారి తీసింది. హౌసింగ్ బోర్డు కాలనీలో చేరిన కొంత కాలము వరకు ఆ జూదము నన్ను వెంటాడింది. ప్రభువు మాటలు రచనలు రాయడము దీనితోబాటు సాతాను కార్యాలు వ్యభిచారము, జూదము, సినిమాలు అంటిపెట్టుకొని ప్రభువు యొక్క గ్రంథ రచన సక్రమముగా జరుపలేక కుంటుపడుచూ వచ్చింది. అందువల్ల ప్రభువు తన కార్యము కుంటుపడుతుండుట చూచి ప్రభుత్వమును ప్రేరేపించి ఆ జూదమును, వెంబర్లాటను నెల్లూరు పట్టణములో లేకుండ చేశాడు. అంతటితో నాకు జూదము నుండి విడుదల కల్గి సమయము కాలము కలిసి వచ్చింది. కాని నాకున్న మిగతా దుర్వ్యసనాలు నా నుండి దూరము కాలేదు, అవి చాలా కాలము నన్ను పీడించి నన్ను వెంబడించినవి. కొంతకాలానికి పుస్తకాలు ప్రచురిస్తూ సంఘాలలో సాక్ష్యము చెబుతూ పరిశుద్ధుల సావాసములో తిరుగ సాగినాక నా దుర్వ్యసనాలు నాకు తెలియకనే వాటంతట అవి తొలగి నా నుండి దూరమైనవి. చేసిన పాపముల నిమిత్తము పశ్చాత్తాపము పొంది పాప క్షమాపణ పొందు కార్యక్రమమున్నది. కథోలిక సంఘములో చేసిన పాపము వివరములు ఫాదరుగారికి చెప్పి వాటివల్ల వచ్చు పాపమునకు పరిహారము పొంది ప్రభువు బల్లయైన సత్ప్రసాదము స్వీకరించాలి. కాని నేను ఎన్నిసార్లు పాప పశ్చాత్తాపము పొందినను, ఎన్నిసార్లు ఫాదరీ దగ్గర పాప సంకీర్తనము చేసినను చేసిన పాపములు తిరిగి చేస్తూ నా జీవితమును నాకే వెగటు కల్గించేవి. ఇందునుబట్టి పాప పశ్చాత్తాపము వేస్టనియు అంటే పాపము చేసి పశ్చాత్తాపబడుట కంటే ఆ పాపమును చేయకనే ఉండాలి. అట్లే ఫాదరీ దగ్గరకు పోయి ప్రతి వారములో చేసిన పాపాలు చెప్పుకొని పరిహారము పొందడం కంటే పాపాలు చేయకూడదు. ఎన్నిసార్లు పశ్చాత్తాపము పొందినను ఎన్నిసార్లు పాప సంకీర్తనము చేసినను నేను చేయుచున్న పాపాల చిట్టా తగ్గు ముఖము పట్టలేదు. కొందరు సాక్ష్యము చెప్పునప్పుడు నేను విన్నప్పుడు ప్రభువును నమ్మి పొగ త్రాగుడు వ్యభిచారము సినిమాలు వగైరాలు వెంటనే వదలివేశామన్నప్పుడు నేను ఆశ్చర్యపడి వారు ఎంతటి ధన్యులో అనుకొనేవాడను. కాని నా సంగతి ఏమిటి? ప్రభువు ప్రత్యక్షత నిరంతరము నన్ను వెంటాడుచున్నది. నేను ఎంతటి దుర్వ్యసనాలలో పొర్లుచున్నను నా నుండి ఆయన ప్రత్యక్షత ముఖాముఖి సంభాషణ వదలలేదు. ఎంత దీర్ఘ శాంతము, పాపి పైన ఎంతటి ప్రేమ - ఒకసారి నేను ఆలోచించాను - ప్రపంచములోఉండే సాధారణ మనుష్యులందరిలోకల్లా నేను ఎందుకు పనికిరానివాడను. నా స్థితి హేయమైనది. నాలో ఒక ఆలోచన కల్గింది - సంఘాలలో తిరుగుచు పరిశుద్ధుల సావాసములో పాలు పొందుచు సంఘాలలో సాక్ష్యమిస్తూ - నేను ప్రభువు ఆత్మ ద్వారా వ్రాసిన గ్రంథాలను పరిచయము చేస్తూ - వారి ప్రార్థన కూడికలలో ప్రవేశిస్తుండగా నాకు తెలియకనే నా దుర్వ్యసనాలు వాటంతటవి సమసిపోయినవి. - సువార్త సేవకుల ప్రార్థనా కూడికలలోను, గ్రంథ పరిచర్యలోను, నేను వ్రాసిన గ్రంథాలు చదివినవారు నేనేదో ఆత్మపరుడనని అత్యున్నతమైన రచయితనైన నా చేత ప్రార్థనలు చేయించుకొనేవారు. తొలిమలి రోజులలో ప్రార్థన క్రమము ఎట్లా చేయాలో తెలిసేది కాదు. పరిశుద్ధుల సావాసములు, ఫాస్టర్ల సదస్సులో వారు చేయు ప్రార్థనల బాణీలో నేను కూడా ప్రార్థనలు చేయడం అలవాటు చేసుకున్నాను. నేను ఇప్పటివరకు కూడా నా ఎదురుగా ప్రభువు ప్రత్యక్ష రూపముతో ముఖాముఖి దర్శనమును నా ఎదుట నుండి తీసివేయనందున నేను ఒక తండ్రిని కుమారుడు ఏమి అడుగుతాడో అట్లే అడిగే అలవాటుండేది - అనగా నాయనా! స్కూలు ఫీజు కట్టాలి. క్రొత్త డ్రస్సు కొని పట్రా ఖర్చులకు డబ్బులు ఇయ్యి. ఈ విధముగా ఒకే ఒక మాటగా ఉంటుంది. ఆ విధముగానే నేను ఇప్పుడు ఎప్పుడు నిరంతరము నాకు కావలసిన సహాయమును ఒక మాటతోనే అడిగి ముగిస్తాను. ఆ మాటకు ఆయన ప్రతిగా ఒక మాటతోనే జవాబు ఇస్తాడు. ఉదాహరణకు కొన్ని 1. ప్రభువును చూచి - ఈ దినము నూతన సంవత్సరము గదా! నీ మహిమార్థముగా నేనేమి చేయాలి? అన్నప్పుడు ప్రభువు - నాలో తృప్తి పొందిన నీ జీవితమును గూర్చి సాక్ష్యము కరపత్ర రూపములో ప్రకటించుము అని అన్నాడు. 2. ముస్లిమ్‌లు నన్ను హింసించినప్పుడు భయపడి రెడ్డిపాళెము వెళ్ళినప్పుడు - ప్రభువా! సాతానును నీ రూపములో వచ్చి నన్ను మోసము చేయకుండ నీవే నేను చేయవలసిన దానిని గూర్చి ఒక మాట మాత్రము సెలవిమ్ము - అందుకు ఆయన నీవు లేచి ఎక్కడ నుండి వచ్చావో అక్కడికే వెళ్ళు.'' అని అన్నాడు. 3. ప్రభువా! మా నాయన మరణ పడకలో ఉన్నాడు - ఆయనను నీ నామము పేరట బ్రతికించు కొనుటకు రెడ్డిపాళెము పోదాము పద అన్నప్పుడు - ప్రభువు - దేవుని నిర్ణయమును అడ్డగిస్తావా? ఈ మాటను బట్టి మా తండ్రి ఆయుస్సు తీరిపోయినదని నిర్ణయించాను. అట్లే ఆయన చాలా పెద్ద వయస్సులో మరణించాడు. 4. నాకు యోగము నేర్పించిన శివకోటారెడ్డికి నిన్ను గూర్చి నీ గొప్పతనమును గూర్చి ఎంత చెప్పినను అతడు అందరు దేవుళ్ళు సమానమే అంటున్నాడు. కనుక అతను చంపకుండ బుద్ధి వచ్చునట్లు ఒక మొత్తు మొత్తమని ఆయనను ప్రాధేయపడగా - ''నేను రక్షించుటకేగాని శిక్షించుటకు ఆ లోకానికి రాలేదు,'' అని అన్నాడు. ఈ రీతిగా తండ్రి - కుమారులు మాట్లాడుకున్నట్లే ఉంటుందిగాని చర్చీలలోని ప్రార్థనా బాణీలు వలె ప్రభువుతో నా ప్రార్థనా విన్నపములుండవు - సంఘములో అందరు ఏలాగు ప్రార్థిస్తారో ఆలాగే నేను అనుకరించి ప్రార్థన చేయటానికి ప్రయత్నిస్తుంటాను. ఈ విధముగా పరిశుద్ధుల సావాసములో ప్రార్థన కూడికలతో సువార్త గ్రంథ రచనలతో నా జీవితము పాత వ్యసనాలు దూరమై నా జీవితము చాలావరకు ధన్యత పొందింది.
......
68. బిడ్డ పేగులో అల్సరు నయమైంది :- నా తమ్ముడు - తమ్ముని భార్య ఇద్దరు హిందువులే. ప్రభువును ఎరుగనివారే - తమ్ముని భార్యకు బిడ్డ పేగులో అల్సరు ప్రారంభమైంది. అది క్యాన్సరుగా మారే అవకాశము ఉంది. కనుక ఆపరేషన్ చేయాలి. ఇక పిల్లలు పుట్టరు, అని డాక్టరమ్మ చెప్పింది. అయితే వారికి సంతానము లేనందున బ్రతికినంత కాలము పిల్లలు లేకుండ బ్రతుకలేనని చస్తే చస్తానని తమ్ముని భార్య సీతమ్మ మొండికేసింది. అప్పుడు మేము ప్రభువులోకి వచ్చిన ప్రారంభ రోజులైనను ప్రభువు నందలి విశ్వాసము వలన ఆమెను మా ఇంటిలో ఉంచి ప్రభువును విశ్వసించమని చెప్పి వారికి బాప్తిస్మము ఇప్పించాము. ప్రభువులో ప్రార్థనా జీవితములోను ఆపరేషన్ లేకుండ మందులు వాడుటలోను కొద్ది దినములలోనే అల్సరు నయమై ప్రభువు కృప వల్ల ఇద్దరు పిల్లలు జన్మించారు. రెడ్డిపాళెము గ్రామములో అప్పులతోను ఫ్యాక్టరీకి వెళ్ళి పని చేసుకొంటూ ఆర్థిక ఇబ్బందులలో ఉన్న తమ్ముడు తనకున్న దంతయు అమ్మి వేసి సమీపములో ఎమ్మిగనూరు వెళ్ళి పొలములు కొని సాగు చేసుకొంటూ లక్షలు సంపాయించాడు. కాని రెడ్డిపాళెములోని మరియ తల్లి దయ వలన ఐశ్వర్యము, సంతానము సంపాదించుకొన్న తమ్ముడు క్రైస్తవ్యములో సజావుగా ఎదుగలేక రెడ్డిపాళెము మరియ తల్లిని మరచి యేసు ప్రభువుతోబాటు ఇతరుల గుళ్ళు గోపురాలకు వెళ్ళి ప్రజల మెహర్బానీ కోసరము దండాలు పెట్టుచుండేవాడు. కుమార్తెను హిందువునకిచ్చి పెళ్ళి చేశాడు - కొడుకునకు హిందువురాలి నిచ్చి పెండ్లి చేశాడు. కాని వారిని యేసయ్య యొక్క ప్రేమ మార్గములో పెంచలేక పోయాడు. గుండె జబ్బుతో అకస్మాత్తు మరణాన్ని చవి చూచాడు. యోబు 8:13 దేవుని మరచువారందరి గతి ఇట్లేయగును. చెంబులు చెంబులు నీళ్ళు త్రాగుతు అపవిత్రత శక్తుల నుండి రోగముల నుండి గొడ్డుబోతుతనము నుండి విడుదల కల్గించి ఐశ్వర్యములు, పాడిపంటలు, అనేకమంది పనివారలను అనుగ్రహించిన దేవుని మరచువారుంటారా? కొలస్స 3:17 యేసు ద్వారా తండ్రియైన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించవలసిన తమ్ముడు ప్రతి సంవత్సరము రెడ్డిపాళెములో మరియ తల్లికి అర్పించవలసిన కానుకలు, అర్పణలు అర్పించమని జ్ఞాపకము చేసినను నిర్లక్ష్యము చేసిన తమ్మునివంటి వాడెవరైనను ఉంటారా? అపవిత్ర శక్తులతోను రోగాలతోను బాధపడేవారిని ఇంటికి తెచ్చి పెట్టుకొనేవారెవరైనను ఉంటారా? నేను తమ్ముని భార్యను ఇంటికి తెచ్చి పెట్టుకొని నేను నా భార్య ఆమె స్వస్థత కొరకు ప్రార్థనలు చేయించాము. ఆమె నావరించిన దయ్యాలు నా భార్య మీద ప్రతాపము చూపించి ఆ రాత్రి కాలములో క్రింద పడవైచి నోటిలోని దంతములకు దెబ్బ తగులగా పంటి బాధలతో కొంతకాలము బాధపడింది. ఏది ఏమైనను కృతజ్ఞత లేని జీవితము - లూకా 17:17 స్వస్థత పొందిన ఆ తొమ్మండుగురు ఎక్కడ? అని ప్రభువు అడుగుచున్నాడు. హోషేయ 2:8 ధనధాన్యములు భోగభాగ్యాలు ఇచ్చే దేవుడు సృష్టికర్తయు ఆయన కుమారుడైన యేసయ్యే తప్ప మనము మన చేతులతో చేసుకొన్న విగ్రహాలు ఇస్తాయా! గొడ్రాళ్ళకు బిడ్డలనిచ్చే దేవుడెవరు? రాతితోను కొయ్యతోను మానవులు తన హస్తముతో చేసుకొన్న విగ్రహాలు మనము పూజిస్తున్న చెట్టు చేమలు గోరీల కొలువులు ఇస్తాయా!
........
69. బిడ్డల నోటి కాడ కూడు ఈ విధముగా నాశనము చేస్తావా? :- మా కుటుంబము స్టోన్‌హవుస్‌పేట వీవర్సు కాలనీలో వింజమూరు వెంకటసుబ్బయ్య తానున్న ఇంటిలోనే ఒక భాగము అద్దెకు ఇచ్చాడు. ఇద్దరికి కలిపి ఒక వరండా లోపల ఒక గది - ఇరుకైన వంట గది ఉండేది. ఆ వంట గదిలో బొగ్గులతో వంట చేసుకొనేవాళ్ళము. మధ్య గదిలో మా పిల్లలనందరిని నేల మీద వరసగా పరుండబెట్టి మేము పిల్లలకు చెరియొక వైపు పండుకొనేవాళ్ళము. వరండాలో మిషను పెట్టుకొని డ్రస్సులు కూలికి కుట్టి ఇచ్చేది. నాకు వచ్చిన జీతము చాలా వరకు మరియమ్మగారు పరిశుద్ధాత్మ సావాసములో చెప్పిన కొన్ని మాటలు నన్ను ఉజ్జీవపరచగా వాటిని చిన్న చిన్న పుస్తకాలుగా ప్రింటు చేయించి విశ్వాసుల సంఘాలలో అక్కడక్కడ కూడికలలో కొంత రేటుకు అమ్మి మరికొన్ని ఉచితముగా ఇచ్చేవాడను. పుస్తకాలు ప్రింటు చేసినప్పుడు ఆ పుస్తకాలు పెట్టుకొనుటకు చోటు లేనందున ఆ ఇంటి అరమరలో అన్నియు వరుసగా పేర్చి పెట్టుకొన్నాము. నాకు స్కూలుకు సెలవులు లేక పుస్తకాలు కొనేవారు లేక రాష్ట్ర వ్యాప్తముగా ఆ పుస్తకాలు చెలామణిలో లేనందున ఆ పుస్తకాలు ఆ అరమరలో చాలా కాలము నిలిచి ఆ ఇల్లు గవర్నమెంటు బీదలకు కట్టినవిగాన నాసి రకముగా ఉన్నందున పుస్తకముల అరమరలో చెదలు బయలుదేరి లోలోపల అన్ని పుస్తకాలు పనికిరాకుండ తినేసినవి. అవి కదిల్చి బయట తీసినప్పుడు - నా భార్య హృదయ వేదనతో జీతము తెచ్చి ఇంటి ఖర్చులకు ఇవ్వక పిల్లల నోటికి అందించాల్సిన భోజనమును చెదలుకు ఇచ్చి నాశనము చేస్తావా? అని నన్ను ఈసడించుకొన్నది. నా హృదయములో కూడా చెదలుతో పుస్తకాలు నాశనమైనందున బాధతో కుమిలిపోయాను. మత్తయి 11:5 బీదలకు సువార్త ప్రకటించబడవలసి యుండగా చెదలుకు అంకితము చేయవలసి వచ్చింది.
.......
70. చిన్ననాటి నుండి నేను మోయలేని అత్యంత వేదనకరమైన భారములు :- యెషయా 1:4-6 ఇశ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుడైన యెహోవా యొక్క నరావతారమైన క్రీస్తును, క్రీస్తును విసర్జించి ఆయనను తిరస్కరించి నిజ దేవుని నుండి నేను తొలగిపోయాను. నిత్యము క్రైస్తవ్యులును విమర్శించుచు ఆయనను అవమానపరచుచు - దైవోగ్రత చేత కొట్టబడి యున్న ఫలితముగా అరకాలు మొదలుకొని తల వరకు స్వస్థత కొంచెమైనను లేదు. ఎక్కడ చూచినను గాయములు పచ్చి పుండ్లు. అవి మెత్తన చేయబడలేదు అన్నట్లుగా నా బాల్య కాలము నుండి కాళ్ళ పగుళ్ళు, అరికాళ్ళలో ఆనెలు, గుండె దడ, బలహీనము, ఒళ్ళు తిరుగుట - ప్రతి సంవత్సరము ఆయా కాలములను బట్టి నెత్తురు గడ్డలు - పార్శ్వపు తలనొప్పులతో విపరీతముగా బాధపడుచు నా చిన్నతనములోనే నా తల వెంట్రుకలు తెల్లగా నెరసిపోయినవి. నా వివాహమప్పుడు అమ్మలక్కలు చెప్పుకోవడము నెరసిన నా వెంట్రుకలు చూచి రెండవ పెళ్ళివాడు అని చెప్పుకున్నారు. పెదవుల పగుళ్ళు, శరీర మద్యంతము విస్తారమైన దురదలు - గోగుతే రక్తము వచ్చునంత పర్యంతము గోకుకుంటూ నేను కప్పుకున్న దుప్పటి రక్తపు మరకలతో నిండియుండేది. మా అవ్వగారు నా దురదల మీద వేడివేడిగా నీళ్ళు కాచి పోసి శుభ్రపరిచేది. నా భార్య అసహ్యించుకొనే రీతిలో నా చర్మము కూడా దురదల వలన పొక్కి రూపు మారిపోయింది. చిన్నతనము నుండి ఒళ్ళు తిరుగుట - గ్యాస్ట్రిక్ పెయిన్, వాటితో బాటు నోరు పూసిపోయి నోటి పుండ్లు, నాలుక దుర్వాసన వాటితో బాటు గోళ్ళు పుచ్చిపోవడము ముస్లిమ్‌లు కొట్టిన దెబ్బలకు నా హృదయము ఊపిరితిత్తులులో నెమ్ము జేరి భయంకరమైన టి.బి. జబ్బుతోను యోబు 7:20లో చెప్పినట్లు నాకు నేనే భారముగా మారినాను. చిన్నతనము నుండి విస్తరించియున్న ఈ అనారోగ్యము దృష్ట్యా ఏ పని చేత కానందున 1 థెస్సలొనీక 2:9లో వలె ఎవరికిని నేను భారముగా ఉండకూడదని ఆలోచించి ఒకటి రెండు తరగతులకు ఉపాధ్యాయుడుగా ప్రభుత్వ పాఠశాలలో ఉద్యోగము సంపాయించుకొన్నాను. ఆ ఉద్యోగము కూడా నాకు సులభముగా రాలేదు. 25 రూపాయలు లంచము చెల్లించుట వలన నా పేరు అందులో నమోదు చేశారు. ఎవరికి లేని ఇన్ని వ్యాధులు నన్ను చుట్టుముట్టినాయంటే యెషయా 53:10లో చెప్పబడినట్లు ప్రభువు నా పరీక్షార్థము ఇచ్చి ఈ వ్యాధి బాధలనన్నిటిని జయించమని ఇచ్చినవేయనవచ్చును. ప్రభువు వ్యాధిని జయించాడు. లోకాన్ని పిశాచిని మరణాన్ని జయించాడు - నేను జయించినట్లే మీరు లోకమును జయించియున్నారంటున్నాడు. కనుక జయించవలసిన కార్యములు బహు భారమైనవి. రెడ్డిపాళెములో క్రైస్తవులు లేని చోట కట్టబడిన ఆరోగ్య మాత గుడి భారము, ఆమెను అనుసరించిన పరిశుద్ధాత్మ అనుగ్రహించిన సువార్త గ్రంథ రచనల ముద్రణ భారము - గొడ్రాలైన నా భార్యకు ప్రభువు అనుగ్రహిస్తున్న ఏడుగురు పిల్లల భారము - నా అనారోగ్య భారము - సువార్త ప్రకటించవలసిన భారము 1 కొరింథీ 9:16 సువార్త ప్రకటించకపోయిన నాకు శ్రమ. మత్తయు 11:28-30 ఇన్ని భారములు కల్గిన నరుడు ఈ లోకములో జీవించుట కష్టము. ప్రభువు ప్రత్యక్షత ద్వారాను, ఆయనతో ముఖాముఖిగా మాట్లాడుట ద్వారాను ఆయన మీద నా భారములు మోపి, ఆయన కాడి ఎత్తుకొని ఆయన యొద్ద నేర్చుకొనుట బట్టి నా ప్రాణములకు విశ్రాంతి దొరికింది. మత్తయి 13:21 వాక్యము నిమిత్తము శ్రమలను హింసలను పొందుచు మార్కు 9:12 మనుష్య కుమారుడు అనేక శ్రమలు పడినట్లే ఆయనతో శ్రమ పడినందువలన రోమా 8:17 క్రీస్తు తోడి వారసుడనయ్యాను. బాల్య కాలము నుండి ఏడు పదులు 70 సంవత్సరమలు దాటినను ఈ శ్రమలు, ఈ దేహ బాధలు అత్యధికముగా నన్ను ఆవరించినను అంతకు మించిన అత్యధికమైన ఆనందము 2వ కొరింథీ 7:4లో వలె నేను పొందుకుంటున్నాను. ఈ వృద్ధాప్య దశలో కూడా నేను పొందుచున్న బాధలు :- 1. నీవు రాసిన పుస్తకాలు మేము మా షాపులో విక్రయించము - ఎందుకంటే నీకు తియాలజీ సంబంధమైన క్వాలిఫికేషన్స్ లేవు అని ఒకరు, నీ పుస్తకాలు మేము అమ్మము ఎందుకంటే మా సంఘ యాజమాన్యము వ్రాసిన పుస్తకాలే మేము అమ్మవలసినట్లు వేరే రచయితల పుస్తకాలు అని ఎంత బాగున్నను మేము వాటిని తీసుకొని విక్రయించకూడదు. కథోలికులు అందలి సంఘ ఫాదరీలు వ్రాసిన పుస్తకాలు చాలా చౌక - కొనుటకు అందుబాటులో ఉంటాయి. నీవు రాసిన పుస్తకాలు అత్యంత ప్రియమైనవి కనుక మా షాపులో అవి విక్రయించము. కథోలిక సంఘ పాదరీలు వ్రాసిన పుస్తకాల ప్రింటింగ్ సంస్థ ద్వారా ప్రింటు చేయబడుతున్నవి. నేను కథోలిక క్రైస్తవుడనైనను నేను అందలి పాదరీని కాను కనుక నేను వ్రాసే పుస్తకాలు ప్రింటు చేయరు - వాళ్ళ సంస్థ బుక్ స్టాల్సులో వాటిని విక్రయించరు. కనుక సువార్త సేవ గ్రంథ రచన వాటి ప్రింటింగ్ డిస్ట్రిబ్యూషన్ అన్నది - 2వ కొరింథీ 7:5లో పౌలు చెప్పినట్లు ఏ సంఘమునకు బోయి సహాయమడిగినను మాకు శ్రమయే కలిగెను, వెలుపట పోరాటము లోపల భయము. ఆయన దీనులను ఆదరించు దేవుడు కనుక తన ప్రత్యక్షతను ఎల్లవేళలా నా ఎదుట నుంచి తీసివేయక నన్ను ఓదార్చుచు బలపరచేవాడు. అందునుబట్టి ఆయన ప్రత్యక్షతను బట్టి ఆయన నాతో మాట్లాడు ముఖాముఖి సంభాషణను బట్టి 1 కొరింథీ 5:7 వలె ఆయన నన్ను గూర్చి చింతించుచున్నాడు గనుక నా చింత యావత్తు ఆయన మీద వేసి నేను విశ్రాంతి పొందుకోవడం అలవాటు చేసికొన్నాను.
.........
71. సువార్త సేవలో ప్రభువు నన్ను పరీక్షించాడు :- ప్రభువు నా చేత వ్రాయించే పుస్తకాలలో ప్రారంభములో బాగా విశ్వాసులను ఫాస్టర్లను ఆకర్షింపజేసి నా పుస్తకము ఏడు అను సంఖ్య మీద వ్రాసిన సప్త సోపాన వికాసిని అను పేరు గల గ్రంథము. నేను ఏ పుస్తకము వ్రాసినను అందుకు కొంత పైకమును గుంటూరులోని లోగోస్ ప్రింటర్స్ ఇశ్రాయేలు గారికి పంపిస్తే కొంత పైకమును ఆయన పెట్టుబడిగా పెట్టుకొని అచ్చు వేయించి పుస్తకాలు అమ్ముకొనేవాడు. అద్దంకి నీలాకాంత్‌గారి ఆధ్వర్యములో ఆ పుస్తకము ఇశ్రాయేలుగారు అచ్చు వేయించుటకు ఒప్పించారు. ఆ పుస్తకము అచ్చు వేయబడి నేను పంపిన పైకమునకు కొన్ని పుస్తకాలు నాకు పంపటం జరిగింది. ఆ సమయములో నాగార్జునసాగర్ కేంద్రముగా ఎంచుకొని - ఆ ఏరియాలో రాష్ట్ర బాప్టిస్టు ఫాస్టర్ల సదస్సు ఏర్పాటు చేశారు. ఆ సదస్సులో ఈ పుస్తకాలు అమ్ముకొనుటకు పుస్తకాలు ఒక ఫ్లాస్టిక్ సంచిలో మూట గట్టుకొని నేను పరచుకొనుటకు ఒక దుప్పటి ఒక జత బట్టలు తీసుకొని వేరొక చిన్న బ్యాగులో పెట్టుకొని బయలుదేరుటకు సన్నాహము చేశాను. నా కంటే ముందు తన ప్రత్యక్షతను తన స్వరూప దర్శనాన్ని నా ముందుండి ప్రభువు తొలగించాడు. ఏమిటో నాకు అర్థము కాలేదు. ఆయన తట్టు చూచి కనుక్కోవడానికి ఆయన దివ్య స్వరూపము నాకు కనబడటము లేదు. ఎల్లప్పుడు ఎక్కడ తిరిగినను ఏ సమయములోనైనను ఆయన దివ్య స్వరూప ప్రత్యక్షత నా ముందుండి నాకు అనుమానము వచ్చినప్పుడు సూచనలిస్తూ ధైర్యపరస్తుంటాడు. అట్టిది పూర్తిగా నా ముందునున్న ప్రత్యక్షత నేను ప్రయాణము కావలసిన సమయము నుండి తొలగించబడినది. ఆయనను నిజ రక్షకునిగా అనగా తీతుకు 2:13లో వలె ఆయనే మహాదేవుడు మన రక్షకుడైన యేసుక్రీస్తు అని తెలుసుకొన్నది మొదలుకొని ఆయన ప్రత్యక్షతను ఆయన సూచనలను నా ఎదుట నుండి తొలగించలేదు. నేను ప్రయాణమునకు సిద్ధమగుతూనే ఆ రోజుననే ప్రయాణము కావలసి యుండగా 1 కొరింథీ 1:7లో ఎదురు చూస్తున్నానేగాని ఆయన దర్శనము గాని సూచనలు గాని లేదు. ఇశ్రాయేలు గారు ప్రచురించిన మొట్టమొదటి పుస్తకము సప్తసోపాన వికాసిని ఈ పుస్తకాలు మీద ఉన్న రేటుతో కాకుండ ఆయన నాకిచ్చిన రేటుతోనే వాటినన్నింటిని అమ్మి ఆయనకే ఆ డబ్బు పంపితే ఆయనకు ఉత్సాహముగా ఉంటుందని, మరల ఏదైన పుస్తకాన్ని ప్రింటు వేయుటకు ముందుకు వస్తాడని ఆశపడి, ప్రభువు ప్రత్యక్షత కొరకు ఆయన అనుమతి కొరకు ఎంతగా ఎదురు చూచినను నేను ఆయన ప్రత్యక్షతను కనుగొనలేక నిరాశపడి ఇట్లనుకొన్నాను. నెల్లూరు ఎక్కడ? నాగార్జునసాగర్ ఎక్కడ? దారిలో ఏదైనను ప్రమాదము జరుగుతుందేమో. ఆయన నా ప్రయాణమునకు అనుమతి ఎందుకు ఇవ్వటం లేదు? ఏ సంగతి నాతో చెప్పాలి కదా! ఆయన ముఖ దర్శనము కూడా లేకుండా చేశాడే అనుకొని ఒక నిశ్చయానికి వచ్చాను. ఇవి సువార్త గ్రంథాలు. ఆ సభలు సంవత్సరానికి ఒక్కసారే జరుగుతాయి. ఈ సభలో ఈ గ్రంథాలు ఫాస్టర్ల చేతికి పోతే అన్ని జిల్లాలలో కొంత ప్రాపగండా జరుగుతుంది. ఈ అవకాశమును ఇప్పుడు పోగొట్టుకుంటే ఎట్లా? అని ఆలోచించి, ప్రభువుకు ఈ ప్రయాణము ఎందుకు ఇష్టము లేదోగాని, ఏది ఏమైనను ఏమి జరిగినను సువార్త గ్రంథముల నిమిత్తముగా నా ప్రాణము పెట్టుచున్నాను. కాని ఇంక ప్రభువు ప్రత్యక్షతతో నాకు అవసరము లేదు. నా కనీస ధర్మాన్ని నేను అనుసరిస్తానని నాగార్జునసాగర్ వెళ్ళే బస్సు ఎక్కినాను. దారిలో ప్రత్యక్షత కొరకు చూచాను. బస్సులో ప్రయాణిస్తూ ఆయనను వెదికాను. కాని ఆయన ప్రత్యక్షత జాడ లేదు. 2వ దినవృత్తాంతములు 15:15 పూర్ణ మనస్సుతోను 22:9 హృదయపూర్వకముగాను ఆయనను వెదకినను ఆయన దర్శన భాగ్యము లేనందున ప్రభువు చెప్పిన మాటలను గుర్తుకు తెచ్చుకొని మత్తయి 6:33 ఆయన రాజ్యము - ఆయన నీతిని వెదకుటకు ప్రయత్నించి మార్కు 16:15 సర్వ సృష్టికి సువార్త ప్రకటించుటయే ప్రస్తుతము నా ధర్మమని భావించి, ఒక్క సంఘములో చేరి ప్రకటించమన్నాడు గాన గ్రంథ రచనలే ఇందుకు మూలమైయున్నాయని వాటిని ఫాస్టర్లకు అందుబాటు చేసినందువలన వారి ద్వారా సమస్త ప్రజలకు సువార్త ప్రకటించబడుతుందని, ఏడు అను సంఖ్య దైవ దృష్టిలో అతి ప్రాముఖ్య స్థానము సంపాయించింది గనుక ప్రభువు ప్రత్యక్షత లేకపోయినను నాకు ఏ కీడు సంభవించినను నా ప్రాణమును పణముగా బెట్టి ఈ పుస్తక పంపిణీ కార్యమును వదలనని ప్రయాణము చేస్తున్నంతసేపు ప్రభువును వెదకుచు ఆలోచనలో మునిగిపోయాను. నాగార్జున సాగర్ ముందు బస్‌స్టాప్‌లో బస్సు ఆగింది. ప్రయాణీకులు డ్రైవరు కండక్టర్లు టీ త్రాగుటకే అన్నట్లుగా కొంతసేపు దిగారు. నేను ఏమియు తోచక బస్సు దిగి అటు ఇటు తిరుగుచున్నాను. మరల బస్సు బయలుదేరుటకు ప్రారంభమైంది. అందరు బస్సు ఎక్కు ప్రయత్నములో ఉన్నారు. ఆ సమయములో ప్రభువు యొక్క దివ్య స్వరూప దర్శనము ఆ మహా దివ్యమైన వెలుగు లోగడ నాకు ఇచ్చుచున్న ప్రభువు ప్రత్యక్షత కంటే ఎన్నో రెట్లు ఆనందకరముగా కీర్తన 70:4 మరియు 105:3లో చెప్పబడినట్లు ఆయనను గూర్చిన ఉత్సాహము నా హృదయములో సంతోషము ఆ మహోజ్వలమైన ఆత్మ వేరు దర్శన భాగ్యము నాకు లభించింది. ఎప్పుడు రానంత మహోన్నతమైన ఆత్మ యొక్క ఉజ్జీవమైన ఆ మహత్తర దర్శనము ఆ దివ్య వెలుగు ప్రకాశము నేను వెళ్ళుచున్న ప్రాంతమంతయు నిండియుండి స్థిరముగా నిలిచియుండుటను చూచి, ఈ ఫాస్టర్ల కూడికలో ఏదో అద్భుతము జరగబోతుందని నేను ఆలోచించాను. సామెతలు 8:17లో వలె నన్ను జాగ్రత్తగా వెదకువారు నన్ను కనుగొందురన్నట్లుగా ఎన్నో రెట్లు ఆత్మానందముతో ఆయనను కనుగొన్నాను. ఆరోజు రాత్రికి ఆ సదస్సు జరిగే చోట నిద్రించి ఉదయాన్నే అందరి కంటే ముందు స్నానపానము లాచరించినాను. ఉదయము టిఫిన్ తయారు చేసి పంపకమునకు సిద్ధపరచియున్నారు. ఫాస్టర్లు ముఖ ప్రక్షాళన వగైరా కార్యక్రమములు కొరకు అటు ఇటు తిరుగుచున్నప్పుడు వారికి ఈ పుస్తకములు కంటికి కనబడేటట్లు ఉంచాలని ఆ ఉదయకాలమందే ఒక బెంచీ మీద పెట్టినప్పుడు ఫాస్టర్లు ఆ పుస్తకాల వైపు చూచి, ఏడు ఆను సంఖ్య ప్రాముఖ్యత వారికి తెలుసు కనుక మంచి ప్రసంగాలు చేయాలనుకుంటే ఇది దోహదకారియని తెలిసి, అప్పటికప్పుడే పైసలు చెల్లిస్తూ పుస్తకాలు కొనుగోలు చేస్తున్నారు. టిఫిన్ పంపకము జరుగుతున్నది. తినేవాళ్ళు తింటున్నారు. తిని వచ్చి పుస్తకాలు కొనుక్కొనేవారు కొంటున్నారు. అమ్మకము ఒక క్షణము కూడా ఆగలేదు. టిఫిన్ పంపిణీ చేయు ఫాస్టరుగారు బుచ్చిరెడ్డిపాళెము వాస్తవ్యుడు. ఆయన నా కొరకు కొంచెము టిఫిన్ ఉంచి పెట్టినాడు. ఒకరిని చూచి మరొకరు వారిని చూచి ఇంక కొంతమంది వచ్చి మొత్తము మీద నేను తీసుకొని వెళ్ళిన ఫ్లాస్టిక్ సంచిలోని పుస్తకాలన్నియు పూర్తిగా అమ్ముడైనాయి. అప్పుడు ఆలోచించి ఈరోజు గాక ఇంకా రెండు రోజులు సువార్త కూడికలున్నాయి గదా! ఈ వసూలైన డబ్బులు ఇశ్రాయేలు గార్కి చెల్లించి మరి కొన్ని పుస్తకాలు తెచ్చి ఇక్కడ అమ్ముతాము. మిగిలితే నెల్లూరుకు తీసుకొని వెళ్ళతామని ఆలోచించి బస్సు ఎక్కినప్పుడు ఇశ్రాయేలుగారి దగ్గరకు ప్రభువు ఆత్మ వెళ్ళనీయలేదు గనుక సురక్షితముగా నెల్లూరు చేరినాను. ఏ సువార్త కూడికలలో వెళ్ళినను మూడు రోజులు పడిగాడ్పులు పడవలసిందే - కొన్ని పుస్తకాలు మిగిలిపోయేవి. కాని ఒకే ఒక ప్రాత:కాల సమయములో రెండు మూడు గంటలలో ఆ పుస్తకాలన్నియు అమ్ముడైనాయి. ఈ సప్తసోపాన వికాసిని అను పుస్తకము ఇశ్రాయేలు రెండు మూడు ప్రింట్లు చేసుకొని విస్తారముగా అమ్ముకొని లాభము పొందగల్గినాడు. ఐ.యస్.పి.సి.కె. అను ఢిల్లీ పబ్లికేషన్స్ సంస్థ ఈ పుస్తకాన్ని ప్రింటు చేశారు. ఆ విధముగా 1 థెస్సలొనీక 2:4లో వలె హృదయములను పరీక్షించు దేవునినే సంతోష పెట్టుచు ఈ సువార్తను గ్రంథ రచన చేసి వ్రాస్తున్నాను. రోమా 5:3-5లో వలె నా శ్రమను ఓర్పును - ఈ ఓర్పులో పరీక్షను - పరీక్షలో నిరీక్షణ వలన పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయాలలో కుమ్మరింప బడుచున్నది. ఆ విధముగా నేను ఆయన ప్రత్యక్షత యొక్క ఆనందాన్ని పొందగల్గినాను. 1 పేతురు 4:12-14. ఈ సువార్త గ్రంథ రచనలలోను సువార్త ప్రచురణలలోను - సంఘములు నన్ను దుయ్యబట్టిన విషయాలలోను కల్గిన మహా శ్రమలలోను, క్రీస్తు మహిమ నాకు నిరంతరము బయలుపరచబడి యుంటుంది గనుక మహానందముతో క్రీస్తు శ్రమలలో పాలి భాగస్తుడనై, క్రీస్తు నామము నిమిత్తము నిందల పాలైనను, మహిమా స్వరూపియగు ఆత్మ నా మీద నిలిచి యుండుటనుబట్టి ఈ నాటి వరకు అపజయమన్నది లేక ఎన్ని కష్టనష్టములు, శ్రమలు వచ్చినను విజయమునే పొందగల్గుచున్నాను.
.........
72. సువార్త సేవ పర్యటనలో ప్రభువు నన్ను పరీక్షించాడు :- ఒకసారి నేను కావలి పట్టణములో పర్యటిస్తూ కొందరు సహోదరుల మధ్య సంచరిస్తూ వారి గృహ దర్శనాలు చేస్తూ వారికి కొన్ని పుస్తకాలు పరిచయము చేస్తూ స్వస్థలము నెల్లూరు చేరుకున్నాను. చాలా రోజులు గడిచిన తర్వాత నాకు ఒళ్ళు సుస్తీ చేసి జ్వరము ఒళ్ళు నొప్పులు నడిచే స్థితిలో లేను. మంచము మీద వెళ్ళకిలా పరుండి అయ్యో వారికి పుస్తకాలు పరిచయము చేసి గృహ దర్శనము చేసి వచ్చాను. మరియొకసారి వెళ్ళవలసి ఉంది. అయినను ఇన్ని రోజులయ్యింది కదా! ఈ ఆదివారమన్నను పోకపోతే ఏమి బాగుంటుంది. ఎట్లా గంటన్నర ప్రయాణముంటుంది. అచ్చట గృహ పర్యటనలుంటాయి. లేచి నడవలేని స్థితిలో ఉన్నానని ఆలోచిస్తుండగా లేచి వెళ్ళి నీ సువార్త పర్యటన ముగించుకొని రమ్మని అదృశ్యములో వాక్కు స్పష్టముగా వినబడింది. ఆ మాటను విన్న నేను లేచి కూర్చుని పైకి లేచి నడిచే శక్తి కూడా లేదే అనుకుంటూ ఒళ్ళు నొప్పులు కళ్ళు తేలిపోతూ ఉంటే ప్యాంటు చొక్కా వేసుకొన్నాను. చిన్న బ్యాగు కొన్ని పుస్తకాలు చేత బట్టుకొని బస్సు కొరకు వీధి వెంట నడచిపోతుంటే కళ్ళు తేలిపోతూ తడబడుచు త్రాగినవాని విధముగా వెళ్ళుచు, ప్రభువు మీద కోపించి తండ్రి మీద బిడ్డ అలిగి వెళ్ళిపోతున్నట్లుగా రోషముతో హృదయ వేదనతో బయలుదేరి ఏమైతే అయిందని ధైర్యము చేసి బస్సు ఎక్కినాను - ఆశ్చర్యము బస్సు ఎక్కి సీటులో కూర్చునది మొదలుకొని ఒళ్ళు నొప్పులు స్వల్పముగా ఉండే జ్వర లక్షణాలు ఏమియు లేవు - కాని వెనుకటి కంటే ఎక్కువ బలము నా ఒంటిలో చేరి బలపరచింది. నేను హాయిని అనుభవిస్తూ ప్రభువు చేసిన ఈ అద్భుత కార్యాన్ని తలపోసుకుంటూ నా సువార్త ప్రయాణము ఆనందముగా సంతృప్తిగా జరిగించుకొని ఇంటికి తిరిగి వచ్చినను అస్వస్థత అన్న జాడ ఏ కోశాన లేదు. ఇది నా జీవితములో దేవుని మాట విన్నందుకు ఆయన నాకు ఇచ్చిన అధిక బలము ఆరోగ్యము నాకు సంతృప్తిని ఆనందాన్ని కల్గించింది. అయితే బస్సు ఎక్కే వరకు ఒళ్ళు నొప్పులు, తల త్రిప్పు వగైరా అస్వస్థతలతో బాధపడుచు నేను ప్రభువును సణుగుకొంటున్నాను. ఆయన మీద కోపపడినను ఆయన మాటను తృణీకరించక స్వీకరించి అమలు చేసినందున నాకు మునుపటి కంటె రెండింతల బలము ఆరోగ్యము వచ్చింది. యోహాను 9:6-7 కోనేటికి వెళ్ళి కడుకోమ్మనగా - పుట్టు గుడ్డివాడు కోనేటికి ఎలా వెళ్ళగలడు? ప్రభువు తలచుకొంటే ఆ క్షణములోనే చూపు రాదా? ఇది పరీక్ష - ఆయన సమక్షములో రాని చూపు కోనేటిలో కడుగుక్కుంటే మాత్రాన పుట్టు గుడ్డివానికి చూపు వస్తుందా? అని అతడు అనుమానించక వెళ్ళి కడుగుకొని చూపు పొందినాడు. అట్లే పదిమంది కుష్టు రోగులు లూకా 17:12-14 పోయి యాజకులకు తెలుపమని చెప్పగా వాళ్ళకేంది చూపించేది. మా కుష్టు రోగము మా దగ్గరే కన్నులకు కల్గినట్లు కనబడుచున్నది గదా! అని వారు ప్రతి విమర్శ చేయక అయనను విశ్వసించి ఆయన చెప్పినట్లు యాజకుల వద్దకు వెళ్ళుచుండగా కుష్టు రోగము నయమైంది. అట్లే 2 రాజులు 5:10లో నయమాను ఎలీషా మీద కోపపడినట్లేను ఇశ్రాయేలు నదులన్నిటి కంటే డమస్కు నదులు శ్రేష్ఠమైనవి కావా? యోర్ధాను నదికే వెళ్ళవలెనని ఏమి? మునిగేదానికి ఏ నది యైతే నేమి? ఒకసారి మునిగితే పోనిది ఏడుసార్లు మునిగితే పోతుందా! అని ప్రవక్త మీద నయమాను కోపగించుకొనగా అతని దాసులలోని ఒకడు అతని మనస్సును మార్చినందున ఎలీషా చెప్పినట్లు చేసి శుద్ధుడాయెను. అట్లే నేను కూడా నా బలహీనతను బట్టి ఇప్పుడు నేను వెళ్ళలేను ప్రభువు స్వస్థత పొందిన తర్వాత వచ్చే వారము చూచుకుంటానులే అని చెప్పలేదు. ఆయన బలము శక్తి మహిమను నేను ఎరిగియున్నందున ఆయన మాట జవదాట వీలు లేదు కనుక నేను నా అస్వస్థత, ఒళ్ళు నొప్పులు, తల త్రిప్పుటను బట్టి ఆయన మీద సణుగుకుంటూ కోపగించుకుంటూనే ఆయన మాట ప్రకారము నడచుకొన్నందున ఆయన స్వస్థత నాకు అనుగ్రహించబడింది. యిర్మీయా 23:36 జీవము గల యెహోవా దేవుని మాటలను నేను అపార్థము చేసికొన్నను వ్యసనపడినను యెహోవా త్రిత్వ రూపములో నాకు దర్శనమిచ్చిన అనుభవమున్నందున ఎంత శరీరము వేదనతో నున్న ఆయన మాటను నెరవేర్చగల్గినాను. మత్తయి 4:4 దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించునన్నమాట నా విషయములో ఋజువైంది. ఎట్లంటే ముస్లిమ్‌లు నన్ను బ్రతుకనివ్వరు. నా ఆయుస్సు ఇంతటితో సమాప్తమయ్యెనని ఆయన మాటకు ఎదురు చూచినప్పుడు - నిన్ను చంపువారి ఎదుటకు నిన్ను సురక్షితముగా నడిపిస్తాను. ఎక్కడ నుండి వచ్చావో అక్కడకే తిరిగి వెళ్ళుమన్న ఆయన మాటను బట్టి నేను భయపడక ఆ విధముగా వెళ్ళినాను. నాకు కథోలిక సంఘ బిషప్పు పాదర్ల సిస్టర్ల సహాయము నాకు లభించి వారి ద్వారా వారికి నాకు మధ్యస్తము కల్గించి, సమాధానకరమైన స్థితిలో ప్రభువు నాకు భూమి మీద ప్రాణ రక్షణ కల్గించాడు.
.....
73. నీ కుమారుడు చేసే రచనలను నీవు కరక్టు చేయాలి :- నా కుమారుడు ఇమ్మానుయేలు నేను రాసిన రచనలనన్నిటిని సమీకరించి ఒక వరుస క్రమములో క్రమబద్ధముగా వాటిని టైప్ చేసుకొంటూ తనకు ప్రభువు ఇచ్చిన జ్ఞానమును బట్టి, అందలి విషయాలనన్నిటిని ఒకే క్రమములో వాటిని మలచుకొంటూ ప్రజా సందోహము ఆసక్తిగా చదువుకొనే విధముగా అందరికి అర్థమయ్యే విధముగా తిరిగి వ్రాసుకొంటూ నూతన విషయాలను గూడా చేర్చుకొంటూ వ్రాసుకొంటున్నాడు. కనుక ఆ పుస్తకాల విషయములో నేను బాధ్యత వహించదలచుకోలేదు. ఎందుకంటే వందలాది పేజీలతో కూడిన ప్రతి పుస్తకము చదివి ఏదైన పొరబాట్లు దిద్దుబాటు ఉన్నట్లయితే నేను రాసిన రచనలు అందులో ఉన్నాయి కనుక అతను వాటిని తన ఇష్టానుసారముగా తిరిగి వ్రాసినాడు. కనుక తానే జాగ్రత్త పడతాడని సరిపెట్టుకొన్నాను. ప్రతి పుస్తకము నాలుగైదు వందల పేజీలతో కూడుకొన్నది. అవి కరెక్షన్ చేయాలంటే చాలా కష్టము - కంటి చూపు తగ్గింది. నడుముల నొప్పులు బయలుదేరినవి. ఇంకను నేను వ్రాయాల్సినవి ఎన్నో ఉన్నాయి. ఇప్పటికే నా ప్రాణము విసుక్కుంటున్నది - డెబ్బయి ఏండ్లు దాటినను బుక్ షాపులకు వెళ్ళటం వారిని పుస్తకాల విక్రయము కొరకు ఒప్పించడం - రవాణా చేయడం వగైరాలు చాలావరకు నేను నా దైవిక సహోదరుడు నీలాకాంత్‌గారు కూడా చూసుకొంటున్నాము. ఏ రోజు ఒక ఘడియ కూడా తీరుబాటు లేదు. వాడు కరెక్షన్ చేయమని ప్రాధేయపడినాడు. కాని నా వల్ల కాదని తీర్మానించుకొని సరి పెట్టుకొన్నాను. అదే రోజు రాత్రి నిద్ర పోయి తెల్లవారు ఝామున మెలకువ వచ్చి లేచి కూర్చున్నాను. ''నీవు లేచి వెళ్ళి రచనలను కరెక్టు చేయమన్న స్వరము నాకు వినబడింది. ఎందుకు చేయమన్నాడో యని వాడు తయారు చేసిన రచనను చదువుతున్నప్పుడు నేను కరెక్టు చేయకపోతే తప్పకుండ ఈ రచనలకు చెడ్డ పేరు వచ్చి ఉండేదని అర్థమైంది. కొన్ని చోట్ల గుణింతాలు తప్పులు - కొన్ని చోట్ల దైవ వాక్యానికి అర్థము ఆ వాక్య భాగములో వివరించకుండుటయు, చదివేవాళ్ళు ఇబ్బందిపడకుండ కొన్ని చోట్ల ప్రత్యేక వివరణలు జతపరచుచుండగా - ఇట్లనుకొన్నాను. ప్రభువు ఆశించిన మాట వాస్తవమే. నేను పరిశీలించడము మంచిదైంది. ఉదాహరణగా ఒక విషయము ఆలోచిస్తే - మత్తయి 27:52 సమాధులు తెరవబడి అందులో నుండి ఆత్మలు లేచి రావడమేమిటి? వాడు ఎక్కడో యాక్సిడెంట్‌లో నుగ్గునుగ్తై ఉంటాడు - హాస్పిటల్లో చనిపోయినవాడు - వగైరాల శరీరాలు మాత్రమే సమాధులలో ఉంటాయి. ఎక్కడో చనిపోయి దేహము విడిచిన ఆత్మ సమాధిలో ఎక్కడనైన ఉంటుందా? 1 కొరింథీ 15:23 ప్రతివాడును తన తన వరసలోనే బ్రతికింపబడును,'' బూర మ్రోగును మృతులు బ్రతుకుదురు అను వగైరా పదజాలము వచ్చినప్పుడు - ఆత్మకు చావు లేదు కనుక బ్రతికింపబడుదురు అన్న శబ్దమునకు అక్కడనే అర్థము తెలియజేస్తూ వ్రాస్తూ వచ్చాను. నేను రాసిన పుస్తకాలకు తాను మెరుగుపెట్టడము - తాను మెరుగుపెట్టి సరిదిద్ది వ్రాసిన రచనలను నేను ఫైనల్‌గా సరి చేసి ఓకే చేయడములో శాఖా బేధము లేకుండ ప్రతి యొక్కరి మన్ననలను ప్రశంసలను అందుకోవడం జరుగుతున్నది. ఇందుకు కారణము తెల్లవారు ఝామున నేను నిద్ర లేచినప్పుడు - లేచి కరెక్షన్స్ చేయమన్న ప్రభువు మాటయే గ్రంథ రచనలు ప్రతి యొక్కరికి ఆమోద యోగ్యమగుటకు కారణభూతమైందని తెలుసుకున్నాను.
......
74. సర్వశక్తి గల దేవుడు ఆయన కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువు గ్రంథ రచన చేయుటకు నన్నెందుకు ఎన్నుకొన్నట్లు? :- ప్రపంచ వ్యాప్తముగా ఎందరో తియాలిజిష్టులు, రెవరెండ్లు డిడిలు వేద పండితులుండగా ఇంను ఆత్మపరులు ఆత్మావేశితులుండగా ఎందుకు పనికిరాని నన్ను అనగా హైస్కూలు స్టడీ కూడా పూర్తి చేయలేదు, ఇంక మాట్లాడుటకైనను ఏ ఇతర భాష రాదు. ఏ పనియు చేతగాని నన్ను ఆయన ఎన్నుకొనుటలో కారణాన్ని తెలిసికోవలసి ఉన్నది. మోషే బాల్యములో ఆయన తల్లి హితబోధ ద్వారా దైవభక్తి అలవరచుకొని ఐగుప్తు రాజ భోగాలు కాదని దేవుని బిడ్డలతో శ్రమ అనుభవించుట మేలని తెలుసుకొని వచ్చాడు. ఇది తన తల్లి హితబోధ ద్వారా జరిగింది. సమూయేలు అంత పెద్ద ప్రవక్త కావటానికి కారణము చిన్న వయస్సులో తాను యెరూషలేము ఆలయమునకు అప్పగింపబడిన దినములలో సమూయేలుకు తల్లి యొక్క హితబోధలు చెవికెక్కి మంచి ప్రవక్తగా పేరు ప్రఖ్యాతులు తెచ్చుకున్నాడు. అలాగే దావీదు సొలొమోను వగైరా రాజులు బాల్యములోనే తండ్రియైన యెహోవాను తెలిసికొని భక్తి భావము పెంచుకున్నారు. కాని దేశములో ఎక్కడ చూచినను బలిసిపోయి క్రిక్కిరిసి యున్న విగ్రహాలు వైపు చూచి అవియే దేవుళ్ళు అని చెప్పినవారుగాని, సర్వ జగత్తును సృష్టించిన సృష్టికర్త పలాని అనిగాని ఎవ్వరు బాల్య కాలములో చెప్పినవారు లేరు. నా తల్లి తన నుండి దూరము చేసి పినతల్లి యొద్దకు సర్వాయపాళెము గ్రామానికి చేర్చింది. అక్కడే గుళ్ళు గోపురాలు విగ్రహాల మధ్య పెరిగి పెద్దవాడనయ్యాను. కాని బాల్యములో ఒంటరిగా ఆరు బయట ఎవరు లేని చోట కూర్చుని ఆకాశము వైపు చూచి ఆకాశము అందున్నవాటిని సృష్టిని సృష్టములను సమస్తాన్ని సృష్టించిన దేవుడు ఆకాశములో ఆసీనుడై యున్నాడు. ఆయన నా కంటికి కనబడక పోయినను ఆయన కనుదృష్టిలో నేను నిలిచియున్నాను. నేను ఎందుకు పనికిరాని స్థితిలో ఉన్నాను. కనుక నన్ను ఓదార్చి నడిపిస్తాడు. నాకు సహాయము అందిస్తాడు. ఆయనకు నేనెప్పుడు కనబడుతూనే ఉంటాను. అనే మాటలు నాకు ఆ పసి వయస్సులో నా నోటికి వచ్చునట్లుగా ఆ అర్థముతో ఆకాశము వైపు చూచి నాలో నేను మౌనముగా మాట్లాడుకొనేవాడను. క్రీస్తే సృష్టికర్తకు ప్రతిరూపమని తెలుసుకున్నంతవరకు ఆ అలవాటు నేను వదలుకోలేదు. ఏ విగ్రహము వైపు చూచి నమస్కరించేవాడను కాను. ఈ కారణమును బట్టి విగ్రహాలను ఆవరించియున్న ఆకాశమండల మందున్న దురాత్మల శక్తులన్నియును నా మీద పగ బట్టి భరింపరాని, ఓర్చుకో చాలనట్టి వేదనలకు బాధలకు నన్ను గురి చేస్తూ వచ్చాయి. ఇది సృష్టికర్తయైన యెహోవాకు ఇష్టమైన కార్యము. జెకర్యా 13:9 అగ్నిలో నుండి వెండిని తీసి శుద్ధి చేసినట్లును బంగారమును శోధించినట్లును నేను వారిని శోధింతును. వారు నా నామమున మొర్ర పెట్టగా వారి మొరను ఆలకింతును; ఈ యొక్క వేద వచనాన్ని బట్టి ఆయన నన్ను శోధించి బాధించి కాదు గాని, ఆయన సంకల్పమును విగ్రహాల నావరించియున్న దుష్ట శక్తులు నేను వాటి వైపు చూడలేదని ఆకాశములో ఆసీనుడైయున్న దేవుని వెదకులాడుచున్నాడని అవి క్రూర స్వభావమును పొంది నన్ను ఆవరించినవి. కాని నాకు ఆ వయస్సులో బాధలు అనుభవించటము తప్ప నాకేమియు తెలిసింది కాదు. పిచ్చి కుక్క కాటు వల్ల ఉప్పు పులుసు లేని చప్పిడి తిండి పథ్యము ద్వారా నలభై రోజులు తిని సహించక బలహీనముతో శరీరము రోగగ్రస్థమైంది. నేను ఒకటవ తరగతిలో చేర్చబడినప్పుడు - బలహీనత వల్ల జ్ఞాపకశక్తి తగ్గి ఉండుటయేగాక ఓనమాలు మొదలు కఖగఘ మొదలు గుణింతాలు పెద్ద గుణింతాలు వరకు ఏకధాటిగా చెప్పవలసి ఉంటుంది రాసి చూపించాలి. కాని నాకు కొంత దూరమే వచ్చాయిగాని ఆ తర్వాత జ్ఞాపకశక్తి లేక గుణింతాలు వచ్చేవి కావు - నాలుక బలహీనత ద్వారా సరిగా అక్షరాలు పలికే స్థితి కోల్పోయాను. పంతులుగారూ! అనమన్నప్పుడు - నేను పందులుగారు అని అంటుండేవాడను. తు అనే అక్షరము దు గా నా నోటి వెంట వచ్చేది. నన్ను పంది అంటావా! అని నా మేష్టరుగారు తొడబెల్లము పెట్టి కఠినముగా హింసించేవాడు - ఆ రోజులలో హోంవర్కు ఇచ్చేవారు కాదు. స్కూలులో నేర్చుకొన్నంతవరకే - మరల స్కూలుకు పోయి నేర్చుకోవలసిందే. స్కూలు అంటే ఒక నరకము అయ్యింది. నా బాల్య కాలములో ఐదవ తరగతి వరకు ఐదు సంవత్సరాలు చదువవలసిన నా చదువు ఏడు సంవత్సరముల కాలము పట్టింది. ఆ తదుపరి ఏడు మరియు ఎనిమిదవ తరగతులు ఒక్కొకటి రెండు సంవత్సరాలు చదువవలసి వచ్చింది. ఆ రెండు సంవత్సరాల కాలమైనను టీచర్ల దయాభిక్ష వలన పై క్లాసుకు పంపించేవారు. ఆఖరుకు యస్.యస్.యల్.సి. పబ్లిక్ పరీక్షయని తెలిసికొన్న నేను వృధా ప్రయాస దేనికని యస్.యస్.యల్.సి. చదవకనే స్కూలు మానివేశాను. పెద్దల ఎదుట తోటి విద్యార్థుల ఎదుట లోకము ఎదుట తృణీకరించబడుట దైవ సంకల్పమే. కీర్తన 8:2 బాలుర యొక్కయు చంటి పిల్లల యొక్కయు స్తుతుల మూలమున ఒక దుర్గము - కీర్తనాకారుడు 18:2లో చెప్పినట్లు క్రీస్తే నా శృంగము నా రక్షణ దుర్గముగా మారి ఆయన దివ్య స్వరూప దర్శన భాగ్యము నా ఎదుట నుండి తీసివేయక నిరంతరము నా ఎదుట నిల్పినాడు - ఇది ఎంతటి భాగ్యము - ఇట్లు క్రీస్తు యొక్క రక్షణ దుర్గము ద్వారా గ్రంథ రచనను కొనసాగించుచు ఆవిష్కరింపజేశాడు. ఇది ప్రపంచములో ఎవరు ఎప్పుడు ఎక్కడ చేయని చేయలేని ఘనకార్యము. ఇది జరుగవలెనంటే అపవాది యొక్కయు వాని దూతల యొక్కయు ఆగడాల వల్ల నా శరీరము నా మనస్సు ఆత్మా జీవము ఆత్మీయత పాడై పోవాల్సిందే. దైవ జ్ఞానములో నడిపేవాడు లేడు, లోక జ్ఞానము అసలే లేదు. జీవించుచున్నానన్న మాటేగాని నేను మృతుడనే, నాది పనికిరాని స్థితి. ఎందుకంటే అనేక దురలవాట్లు నన్ను ఆవరించి యుండేవి. ఈ స్థితియే ప్రభువుకు కావలసియున్నది. అందుకనే 1 కొరింథీ 1:26-29లో చెప్పబడినట్లు జ్ఞానులు ఘనులు గొప్ప వంశమువారు అక్కర లేదుగాని, దేవుని ఎదుట అతిశయించకుండునట్లు వెర్రివారిని బలహీనులైనవారిని నీచులైన తృణీకరింపబడి ఎన్నిక లేనివారిని దేవుడు ఏర్పరచుకొని యున్నాడు.'' ఇట్టి నీచ నికృష్ణ స్థితిలో ఉండేవారు ప్రపంచమందంతట ఎందరో ఉంటారు కదా! వారినందరిని దేవుడు పిలుస్తున్నాడా? అన్న ప్రశ్న పాఠకులకు కలుగవచ్చును. నిజమే యెషయా 66:2లో చెప్పబడినట్లు ఎవడు దీనుడై నలిగిన హృదయము కలవాడై నా మాట విని వణకుచుండునో అట్టి వానిని నేను దృష్టించుచున్నాను.'' ఆయన మాట నేను వినకపోయినను ఆయనను గూర్చిన జ్ఞానము నాకు లేకపోయినను, సర్వ జగత్తును చరాచరములను పుట్టించి పరిపాలించు జగత్కర్త ఒకడున్నాడన్న జ్ఞానముతో బాల్య కాలము నుండి సృష్టికర్తకు ప్రతిరూపమైన క్రీస్తును ఎరిగినంతవరకు, ఆకాశ మధ్యములో ఆయనను నేను వెదకుట మానలేదు - ఆయనను స్మరించని దినము లేదు. కనుక బాల్యము నుండి యవ్వనము వరకు కూడా నా మనస్సు సృష్టికర్త వైపు నిలిచి యుండినందువల్ల నాకు దైవిక ప్రయోజనము లభించింది. ఎన్ని శోధనలు, కష్టాలు వచ్చినను యోబు తండ్రియైన దేవుని నుండి మనస్సు మార్చుకోలేదు. యోసేపు ఎన్ని ఇరుకు ఇబ్బందులు కల్గినను ఆయనకు దూరము కాలేదు. వీరందరు సృష్టికర్తను ఎరిగి ఆయన నామము నెరిగి ఆయనయందు నిలిచియున్నవారు. నేను సృష్టికర్త ఎవరో ఎరుగక ఆయన స్వరూప దర్శనము లేక కేవలము నా నమ్మికను తప్పిపోకుండ దాదాపు 30 సంవత్సరాల వరకు ఆ నమ్మికను నిలుపుకొన్నందున క్రీస్తు ప్రభువు యొక్క దివ్య గుడారములో ప్రవేశించగల్గినాను. బాల్య కాలములో నా అజ్ఞాన దశలో గుళ్ళు గోపురాలకు ఉత్సవాలకు విగ్రహ దేవుళ్ళ యొద్దకు వెళ్ళేవాడనే ఎందుకు? వాటి ముందు పెట్టే పండ్లు ఫలహారాలు పొంగళ్ళు పంచకజ్జాయము గుగ్గిళ్ళు కొబ్బరి చిప్పలు వగైరాలు భుజించుటకు మాత్రమేగాని అవి దేవుళ్ళని భావించి కళ్ళకు అడ్డుకొని తినేవాడను కాను. విగ్రహ దేవుళ్ళు అనేక రూపములతో నాకు దర్శనమిస్తూ కలలో కూడా కనబడుతూ మాట్లాడేవారు. ఎందుకని ఎట్లయినను నన్ను తమ వైపు గల భక్తి భావమునకు త్రిప్పుకోవాలని, కాని నా మనస్సు ఎప్పుడు అందరి కంటే గొప్ప దేవుడెవరు? మహోన్నతుడెవరు? అన్న పరిశోధనలో నిలిచి వాటివైపు మనస్సు ఉంచేవాడను కాను. ప్రతి రోజూ నా అలవాటు ప్రకారముగా ఆకాశము వైపు చూస్తూ ఆయనను జ్ఞాపకము చేసుకొనేవాడను. తీరుబాటు సమయము లేనప్పుడు నేను నా హృదయములో ఆకాశ దేవుని జ్ఞాపకము చేసుకొని, ఆయన నన్ను నడిపిస్తాడన్న జ్ఞానముతో సంచరిస్తూ నా మనస్సుతోనే నా దీన స్థితిని చెప్పుకొనేవాడను. బాల్య కాలములో పిచ్చి కుక్క కాటు వలన నాటు వైద్యము ఉప్పు పులుసు నిషేధించిన భోజన పదార్థములు భుజించాలని చెప్పుట వలన అవి సహించక తిండి తగ్గిపోయి బలహీనము అనారోగ్యము దానితోబాటు విద్యాభ్యాస కాలములో విపరీతముగా శిక్షింపబడుట చుండుట వలన - నన్ను పెంచుచున్న నా పిన్నమ్మకు స్కూలు మాస్టరు తొడలు మెలిపెట్టి వాచిపోయి యుండుటను కూడా ఆమె చూచి నన్ను ఓదార్చేది. బాబూ నీ భవిష్యత్తుకే మాస్టారు నిన్ను కొట్టినాడు. ఆయనకు నీమీద ఏమి పగ - నీవు మాస్టారు కొట్టిన దెబ్బలు తాతగారికి చెప్పవద్దు - ఆయన ముక్కోపి. మీ మాస్టారు యొక్క తల పగులగొట్టి నీ చదువు మాన్పించి వేస్తాడు. వద్దు తాత దగ్గర ఈ ప్రస్తావన తీసుక రావద్దు అని నన్ను బుజ్జగించేది. ఈ నిరాధార నిస్సహాయ స్థితిలో ఒంటరిగా ఆరుబయట గడ్డివాముల దగ్గర కూర్చుని ఆకాశ దేవునికి నా బాధ వేదనను గూర్చి చెప్పుకొనేవాడను. నా బాధను నా కష్టాలను నా ఆవేదనను పరిశీలించిన దేవుడు ఏదెను తోటను మరపించినట్లుగా తీయటి ఫలవృక్షాలతోను ఫలములతోను పాలు పండ్లు ఫలరసాలు, చేపలు, రొయ్యలు మొదలగు బలమైన ఆహారముతోను తాటి కలకండ జున్ను వగైరాలతో విశేషమైన బలమైన పుచ్చ దోస దానిమ్మ సపోట వంటి పండ్లతో సర్వాయపాళెము గ్రామమును నింపి, నేను ఉంటున్న ఇంటి ఆవరణలో ఉన్న పెద్దవిగా పెరిగి యున్న రెండు జామ చెట్లును సంవత్సరము పొడుగునను పిందెలు - పుల్లటి కాయలు - పండ్లు ఏవి కావాలంటే అవి ఏవి తినాలనుకుంటే అవి ఎప్పుడు ఉండేటట్లు ఆ చెట్లకు ఆజ్ఞ నిచ్చాడు. ఈ యొక్క ప్రత్యేకముగా ప్రభువు ఇచ్చిన ఈయొక్క తిండి వలన నా దేహము భౌతికముగా ఉజ్జీవించింది. నేను సర్వాయపాళెములో ఉన్నంత కాలము వర్షా భావం లేదు. క్రమబద్ధమైన వర్షము, నీటికి కరువు లేదు - పంటలకు తెగుళ్ళు లేవు - అయినను నా శరీరములో అప్పుడప్పుడు నెత్తురు గడ్డలు పార్శపు నొప్పులు ఒళ్ళంతా దురదలు ఇటువంటివి కూడా తొంగి చూస్తూ ఉండేది. కాని మంచి పోషకాహారము వలన ఆ బాధలు నన్ను ఏమి చేయలేక పోయినవి. యెహోవా అను సృష్టికర్త నామమును ఎరుగక పోయినను ఆత్మీయముగా భక్తి భావముతో ఆయనను అనుసరించుచున్న నాకు ఈ అనేక ఇరుకులు ఇబ్బందులకు కారణమేమి? దైవ ప్రణాళిక ఆది 50:20 యోసేపు ఆ విధముగా హింసింపబడి తల్లిదండ్రులకు దూరమై పారద్రోలక పోతే తాను తన కుటుంబము తన దేశ ప్రజలకు క్షామ కాలములో అన్నము దొరకక నశించిపోయెదరు. ఆ విధముగానే నేను పుట్టింది మొదలుకొని నన్ను క్రమశిక్షణలో పెంచి పెద్ద జేసి పెద్ద పెద్ద చదువులు చదివించి ఏ పోలీస్ ఉద్యోగమో కలెక్టరో - లేదా ఏ క్లర్కు పోస్టో చేసుకొంటూ నా కాలము గడిపితే ఈ గ్రంథ రచన కొనసాగేది కాదు. గ్రంథ రచన రాసే స్థితి ఆ ఉద్యోగాలు కల్పించలేవు. సమయము ఏకాగ్రత ఉండదు. వచ్చే వాళ్ళు పోయే వాళ్ళు ఫోన్లు వగైరాలతో కాలము గడిచిపోయేది. ఆ దినములలో ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయుల పని తీరు చాలా తేలికయైనది. ఈ రోజులలో ప్రైవేటు ఇంగ్లీషు మీడియం స్కూలుల్లో ఎల్.కె.జి., యు.కె.జి. టీచర్లకు కూడా ఏ మాత్రము విశ్రాంతి లేని ఉద్యోగాలు చేస్తున్నారు. ఆ రోజులలో ప్రభుత్వ పాఠశాలలకు ఎప్పుడు సెలవులు ఉంటూనే ఉంటాయి. టీచర్లకు పని తక్కువ కనుక నేను ఉదయ సాయంకాలల్లోను సెలవులు పండుగ సెలవులు సంక్రాంతి దసరా వేసవి సెలవులు వగైరా సెలవులలోను గ్రంథ రచనకు నిస్తారమైన సమయము ఉండేది. ఎంత పనియైనను ఎన్ని రచనలైనను చేసుకోవచ్చును. అదే నేను ఈ దినములలో ఇంగ్లీషు మీడియం స్కూలుల్లో ఎల్.కె.జి. యు.కె.జి. పిల్లలకు కూడా విద్యాబోధన చేయుటకు పనికిరాను. ఎందుకంటే నాకు ఇంగ్లీషు రాదు కనుక. అక్షర జ్ఞానము లేని మోషేకు తాను దర్శనమిచ్చి ఆయనను ఎన్నిక చేసి, ఇశ్రాయేలు జనాంగ బానిసత్వము నుండి తప్పించుటకు ఏర్పరచి పంచకాండములను వ్రాయించాడు - మోషేకు ముందు జరిగినప్పటి చరిత్ర ఆదాము హవ్వల చరిత్ర మోషేకు తెలియదు కదా! తాను వివరిస్తుండగా మోషే దానిని పంచకాండములుగా విభజించి రచనను కొనసాగించాడు. అలాగే ముప్పయి సంవత్సరాల వరకు అజ్ఞానముతో పెరిగిన నాకు ఆయన వివరించిన జ్ఞాన సందేశాలను విని గ్రంథ రచన కొనసాగించానేగాని నా జ్ఞానము నా తెలివి అని ఎవరైనను చెప్ప సాహసించగలరా?
.......
ఈ గ్రంథ రచయితనైన నేను నా పుట్టినరోజే ప్రభువు, ''తల్లి గర్భములో ప్రవేశించిన రోజుగ తెలుస్తున్నది. అనగా 1935 మార్చి 24వ తేదీ సూర్యాస్తమయ కాలము. పక్షులు గూండ్లకు చేరే కాలమని నా తల్లి నాకు చెప్పగా విన్నాను. ఆదివారమున సూర్యాస్తమయమున నా జన్మ కాలము - సూర్యోదయమునకు ముందే ప్రభువు పునరుత్థాన సమయము. ప్రభువు 12 సంవత్సరాల వయస్సులో యెరూషలేము ఆలయములో బోధకుల మధ్య తన ప్రజ్ఞను చూపించి అందరిని ఆశ్చర్యపరిచాడు. అదే 12 సంవత్సరాల వయస్సులో బుచ్చిరెడ్డిపాళెములో ఎనిమిదవ తరగతి చదువుచున్నప్పుడు యోగి పుంగవుడు బాల బ్రహ్మచారి రమణ మహర్షి శిష్యుడైన బెజవాడ శివకోటారెడ్డిగారి దగ్గర యోగవిద్యను అభ్యసించుచున్న కాలమది. యెరూషలేము ఆలయమునకు ఆయన తల్లిదండ్రులు ఆయనను నడిపించారు. శివకోటారెడ్డి గారి యొద్ద యోగవిద్యను నేర్చుకొనుటకు, ఆయన దగ్గరకు యోగిని పెద్దల సుబ్బమ్మగారి సహాయమున నా తల్లి నన్ను చేర్పించింది. శుక్రవారము మధ్యాహ్నము మూడు గంటల సమయము నా పెండ్లి జరిగిన వివాహ ముహూర్తము. ఈ పెండ్లికి శివకోటారెడ్డిగారు హాజరయ్యారు. ఒక మంచి చీర జాకెట్టు పెండ్లి కుమార్తెకు ఇచ్చారు. అదే సమయములో ప్రభువు సిలువ మీద తన ప్రాణమును మన కొరకు అప్పగించాడు. 1959 ఫిబ్రవరి 27వ తేదీన వివాహము జరిగింది. ఆరు సంవత్సరాలు పిల్లలు పుట్టలేదు - ప్రభువు కృప వల్ల 01.07.1965వ తేదీన ప్రసాద్ జన్మించాడు. యేసు ప్రభువు శోధింపబడినట్లుగాక నేను ప్రభువు చెప్పినట్లు నడచుకోనందున నా స్వంత జ్ఞానముతో విమర్శనాత్మక గ్రంథాలు వ్రాసినందున, మరణకరమైన పిడిగుద్దులు తిని అనేక కష్టాలకు వేదనలకు గురియైన కాలములో ప్రభువు తన ప్రత్యక్షత ననుగ్రహించి ఆ భయంకర ఉపద్రవము నుండి తన రక్షణ వాక్కు ననుగ్రహించి కాపాడినాడు. యేసు సిలువలో ప్రాణము అప్పగించినది 33 1/2 సంవత్సరాల వయస్సులో ప్రభువు తల్లి ఆమెను ఆవరించిన పరిశుద్ధాత్మ దేవుడు యేసయ్య యొక్క అంగీకారముతో నాకు బోధిస్తూ నా చేత గ్రంథ రచనను చేయిస్తూ ప్రారంభించిన కాలము ఇంచుమించు 33 1/2 సంవత్సరాల వయస్సు నాకు ఉంటుంది.
ప్రభువునందు సహోదరీ సహోదరులారా!
దీని వలన, మేము మీ యొక్క సహాయ సహకారాల వల్ల తరువాత ముద్రణలో ఈ పుస్తకము అన్ని కోణాలలో అందముగా తీర్చిదిద్ది అందించగలము. ఆమేన్.
శేఖర్ రెడ్డి గారు వ్రాసిన పుస్తకములు:
వీటిని మీరు www.FaithScope.com ద్వారా ఉచితముగా పొంద వచ్చును.