యజ్ఞ సామరస్యము
గ్రంథకర్త : శేఖర్‌రెడ్డి వాసా
నీ మరణానంతరము నీ ఆత్మ ఎక్కడ వుండబోవుచున్నదో నీకు తెలుసునా?
మూలము
రెడ్డిపాళెం గ్రామములోని నా ప్రభువు తల్లి ఉపదేశములు మరియు ఆమెను ఆవరించిన పరిశుద్ధాత్మయొక్క జ్ఞాన సహాయమే ఈ పుస్తక రచనకు మూలాధారము.
అంకితము
ఈ అవకాశాన్ని నాకు అనుగ్రహించి నన్ను ప్రేమించిన క్రీస్తు ప్రభువుకు అంకితమిస్తున్నాను. - వాసా శేఖర్‌రెడ్డి
ప్రభువునందు ప్రియపాఠక మహాశయులారా! ఆదికాండములో ఆది దేవుడు ఆది నరజంట నేర్పరచి, తానేర్పరచిన తోటను కావలి కాచి తనకు యోగ్యకరముగా జీవించమని శాసిస్తూ తన బిడ్డలుగా వారిని పోషించాడు. నిర్గమకాండము 4:14 తన పేరు పెట్టబడిన తన జనాంగమునకు నిర్వాహకులుగా మోషే అహరోనులను దేవుడేర్పరచుకున్నాడు. నూతన నిబంధన కాలమొచ్చుసరికి దేవుడు తన జనాంగమునకు పాప విమోచన రక్షణార్థము యేసు, యోహానులను ప్రవక్తలుగా ఈ లోకమునకు పంపి క్రియ జరిగించాడు. యేసుప్రభువు తన జీవితయాత్రను చాలించిన పిదప, ఈ లోకములో దైవసువార్త మీదను స్వస్థత చేయు వరము పొందు యోగ్యతను మొట్టమొదటగా పేతురు, యోహానులకనుగ్రహించినట్లు అపొస్త 3:10 శృంగారమను ఆలయ ద్వారము నొద్ద జరిగిన సంఘటన ఋజువు పరచుచున్నది.
అదే విధముగా నేటి విశ్వాస యుగములో ప్రభువు తన ఆత్మోజ్జీవముతో సుమారు 12 సంవత్సరముల నుండి ఈ గ్రంధకర్తనైన శేఖర్ రెడ్డి అను మా ఇరువురి కలయికలో తానును కలిసి గురూపదేశము జేసి, తన ఆత్మ జ్ఞానముతో మా శరీర జ్ఞానమును మరుగుపరచి, యేసుప్రభువు పునరుత్థానుడైన తర్వాత తన శిష్యకోటితో సంబోధిస్తు - ''మీరు వెళ్ళి సర్వ లోకమునకును, సర్వ ప్రజకును సువార్త ప్రకటించుడి; నమ్మి బాప్తిస్మము పొందినవాడు రక్షింపబడును. నమ్మనివానికి శిక్ష విధింపబడును. అనిన ప్రవచనానుసారముగా దైవికమైన విద్యార్హతలు అనగా సి.టి.హెచ్, బి.టి.హెచ్; జి,టి.హెచ్; బిడి; యమ్.టి.హెచ్; డి.డి; వగైరా వేదాంత శాస్త్రజ్ఞానమునకు దూరులమై యుండి, కేవలము ఉపాధ్యాయ వృత్తిలో ఉన్న మమ్ములను తన సాధనములుగా జేసికొని స్వయంకృషితో; స్వార్జితముతో ఈ సేవాభారమునకు మమ్ములను ప్రేరేపించి, తన జ్ఞానముతో రచింపజేసిన గ్రంధములేగాని ఇవి మా స్వజ్ఞానము గాదు. మేము వేదాంతులము కాము.
ప్రియమహాశయులారా! చిత్రమేమిటంటే ఆదిలో దేవుడేర్పరచుకున్న ఆది ఆదాము నరజంట వేదాంతులు కారు. తమ జనాంగమునకు నాయకులుగా నియమించిన మోషే అహరోనులు వేదాంతులు కారు. తన ప్రవక్తలైన యేసు, యోహానులు వేదాంత విద్యాకోవిదులు కారు. పేతురు యోహానులు కూడా వేదాంత విద్యాకోవిదులు కారు. ఏ విద్య వారు పఠించలేదు. నేటి విశ్వాస జీవితములో ఉన్న నేను కూడా వేదాంతిని కాను. ఒకటవ కొరింథీ 1:29 జ్ఞానులను సిగ్గుపరచుటకు వెర్రివారిని, బలవంతులను సిగ్గుపరచుటకు బలహీనులైనవారిని, ఎన్నికైనవారిని వ్యర్థము చేయుటకు, నీచులైన తృణీకరింపబడిన వారిని, ఎన్నికలేని వారిని దేవుడేర్పరచుకొని యున్నాడనిన విధముగ ప్రభువుయొక్క ఉద్దేశ్యమైయున్నట్లు మనము గ్రహించవలెనని ఈ గ్రంధకర్తనగు నేను విన్నవించుకొంటున్నాను. కనుక ఇందులో వివరించబడిన వేద సత్యాలనుగూర్చి ఒకవేళ ఏదైన వ్రాత దోషముగాని, ఉచ్ఛారణ దోషముగాని, అంశమున కూర్పులుగాని, వివరణములోగాని, వర్ణనలోని ఏదేని లోపమున్నట్లయితే సహోదరులు క్షమించగలరని మనవి జేసుకొంటున్నాను.
ఇట్లు గ్రంథకర్త.
యజ్ఞమనగా నేమి? బలి అనగా నేమి? హోమమనగా నేమి? హోమములో అణగారియున్న త్రిత్వము, (హోమము - హోమత్రిత్వము) తీర్ధయాత్ర : తీర్థము.
యజ్ఞమనగానేమి? ప్రభువునందు ప్రియమైన సోదరీ! సోదరా! క్రైస్తవ్యములో యజ్ఞము, యాగము అనిన దానిని గూర్చి క్రైస్తవులమైన మనకు అనేక అనుమానాలు కలుగవచ్చు. యజ్ఞమన్నది అన్ని మతములవారు ఆచరించునదిగ మన పూర్వీకులు, మనము అనుకుంటున్న విషయము. అందులో మనము గుర్తించవలసినదేమిటంటే, అన్ని మతములను, అన్య మత సిద్ధాంతములను, వారి నిబంధనలను అన్ని మతములకంటే ఉన్నతమైన పరమార్థము బైబిలులో ఉన్నదనుటకు ఈ యజ్ఞమను క్రియ కూడా ఒక భాగమైయున్నది. క్రైస్తవులలో యజ్ఞమున్నదా? అనిన సందేహము మనకు కలుగక మానదు. క్రైస్తవులలో కూడ యజ్ఞము, బలి హోమమను క్రియలు ఉన్నవనునది ఋజువుపరచుటకే మేమిరువురమును ఈ గ్రంథమును వ్రాయుటకు హేతువైనది. అగ్ని దహించు దానిని యజ్ఞమంటారు. హోమమనగా దహింపబడిన వస్తువు దైవ అంగీకారమగుట బలియనగా సమర్పింపబడు పదార్థము ఇది కొబ్బరికాయ మొదలుకొని పశుపక్ష్యాదులు నరుని వరకును పరిమితమైయున్నది. యజ్ఞమనగా దహించుట. యజ్ఞముయొక్క రూపాంతరము హోమము. హోమముయొక్క సువాసన యజ్ఞాధిపతికి ప్రియమము. యజ్ఞాధిపతి దేవుడే, కాలము సమయము సందర్భము వీటన్నిటికిని అధిపతి దేవుడు ఇది ఋజువగుటకు వేదములో కొన్ని వేదభాగముల ద్వారా మనము తెలిసికొనగలము.
మొట్టమొదట దేవుడు సృష్టికి పూర్వము తన మహిమాన్విత క్రియ ద్వారా యజ్ఞమను దహనక్రియతో లోకసృష్టిని గల్గించినట్లు బైబిలులోని ఈ క్రింది వాక్య భాగము మనకు వివరించగలదు. యజ్ఞమనగా దహించుట అనగా పుటము వేయుట ఆది 1:3 ఈ వెలుగు చీకటిని దహించుటకు యజ్ఞ క్రియ ఆది 1:9లో నేలను దహించి దానిలోని మలినమును కల్మషమును బురదను దహించి, ఆరిన నేలగా మార్చుటకు రెండవ యజ్ఞ క్రియ. ఈ రెండు క్రియలకు దేవుడు ఆది 1:16 పగలు సృష్టిని దహన క్రియ ద్వారా మరియు వెలుగు ద్వారా సృష్టి మనుగడకు ఉపయోగకారియగుటకు పెద్ద జ్యోతి. ఇది దేవునియొక్క దావాగ్ని గోళము. పగటిపూట భూమిని దహించుటకే ఇది నిర్ణయింపబడెను. సృష్టి మనుగడలో భూలోకము అంతము వరకును నిత్యము భూమియందలి జీవరాసులు వాటితోబాటు నరునియొక్క జీవమునకును, దేవుడు నిత్యము ఈ అగ్నిగోళము ద్వారా యజ్ఞ క్రియ జరిగిస్తున్నట్లును ఇట్టి యజ్ఞములో భాగస్వామియైయున్న సూర్యుడు తన వెలుగు ద్వారా పట్టపగలు జరుగుచున్నట్టి నీతిమంతుల సత్కార్యములు దానధర్మములు వారియొక్క నిత్య ప్రార్థనాది కార్యములు దేవునికి చేయు స్తుతి అర్పణలు వేదపారాయణలు, ప్రార్థనలో దైవిక సావాసకూటములు వగైరా ప్రేమాతిశయ గుణములు ఈ యజ్ఞము ద్వారా దేవుడు గ్రహించుటకు సూర్యుడను ఈ పగటి జ్యోతి దోహదకారియైయున్నది. అదే విధముగా అనీతిమంతులు జేయు అక్రమములు చీకటి వ్యాపారములు, విగ్రహారాధన, వ్యభిచారము, త్రాగుబోతుతనము వగైరా దైవ వ్యతిరేకయుతమైన కల్మష మలిన హృదయములను దేవుని కెరింగించుటకు కూడా ఈ సూర్యగోళము కారణమైయున్నదని మనము గ్రహించవలసియున్నది.
అదే విధముగా రాత్రి యజ్ఞకార్యము జరుపుటకు దేవుడు సంకల్పించి అదే వెలుగును చల్లని వెలుగుగా మార్చి వేడికి బదులు చల్లదనము నిచ్చు వెలుగుగా మలచి (ఆది 1:17-18) నియమించినట్లు వేదములో మనము చదువగలము. ప్రభువునందు ప్రియసోదరీ! సోదరా! రాత్రిపూట ఆకాశములో వెలుగుచున్న నక్షత్రాలు, అగ్నిగోళములే. వీటి మధ్య సంచరించు చంద్రగోళము కూడా వెలుగే, ఇట్టి యజ్ఞక్రియ ద్వారా దేవుడు తాను సృష్టించిన సృష్టియొక్క గమనము నరులయొక్క గుణాతిశయములను పరీక్షించుచు, తాను సృష్టించిన నరుడు తన యజ్ఞక్రియ ద్వారా అతని హృదయములోని కల్మషాన్ని ఎంతవరకు శుద్ధి జేసుకొన్నాడు? ఎంతవరకు పవిత్రుడాయెను. అనిన దాన్నిగూర్చి దేవుడు ఇప్పటివరకును తన సృష్టియైన సూర్యచంద్ర నక్షత్రాదుల యజ్ఞ క్రియ ద్వారా ప్రతిదినము నరకోటిని పరిశోధించుచున్నాడు. ఇట్లు నరకోటియొక్క మనుగడ కోసము (రెండవ పేతురు 3: 9-12) దీర్ఘశాంతుడై తన నిత్య యజ్ఞక్రియను కొనసాగించుచున్నాడు.
అయితే నరులమైన మన యజ్ఞము ఎట్లున్నది? మన శరీరేచ్ఛలనుబట్టి మన జిహ్వచాపల్యము అనగా నాలుక రుచినిబట్టి మనకు కావలసిన రీతులలో రుచికర వంటకములను తయారుజేసుకొనుటకు నిత్యము మన గృహములో వంటింట్లో కోళ్ళను, చేపలను, పోట్టేళ్ళ, మేకల మాంసమును, కోడిగుడ్లను, శాఖాహారములను కొన్నిటిని నిప్పులమీదను, కొన్నిటిని నూనెతోను మరికొన్నిటిని మసాలతోను కాల్చి మన స్వప్రయోజనాలకు మన ఉదర శాంతికి ఆహారముగా ఉపయోగిస్తున్నాము. ఇది ప్రతి మానవుడు ప్రతి కుటుంబము ప్రతి చోటను నిత్యము జరిగిస్తున్న యజ్ఞమిది. ఆకలి యజ్ఞము జఠరాగ్ని. ఈ యజ్ఞము ద్వారా దేవుని కూడా ప్రసన్నము చేసుకోవాలని నరుడు అజ్ఞానియై తాను కట్టుకున్న నూతన గృహ ప్రారంభోత్సవములోను, పెండ్లి పందిట్లోను, గృహములో చీకాకు గల్గినప్పుడును, ఏడు రకాల చెట్టు పుల్లలు గంధపు చెక్కలతో జేర్చి, రాళ్ళతో యజ్ఞగుండమును తయారుజేసి అందులో పుల్లలను, కలపను పేర్చి వాటిని నూనెలతోను, కర్పూరముతోను దహించి అగ్నిహోత్రమను పేరున యజ్ఞక్రియను జరిగించి, నిర్జీవులైన ఱాతిదేవుళ్ళ ఎదుట నరుల చేత పూజారి, పౌరోహితుడనియు, అర్చకుడనియు, స్వామియనియు, టైటిల్స్ పొంది, ఒంటి మీద గుడ్డ లేకుండ జంద్యపు పోగులు వేసికొని భుజానికి అంగవస్త్రము ధరించి నెత్తిన నామాలు పెట్టుకొని, గంధ సింధూరము నలంకరించుకొని విభూది రేఖలతో నిజదైవత్వమునకు దూరమై అజ్ఞాన నరకోటికి సన్నిహితుడై, సమీపస్తుడై స్వామీ! స్వామీ! అని పిలువబడుచు జనబాహుళ్యములో ప్రధానాధిపత్యమును, దేవాలయములో అగ్రస్థానము నలంకరించి ఘనమైనవాడుగ ఎంచబడుచున్నాడు. ప్రభువునందు ప్రియసోదరీ! సోదరా! ఈ లోకములో ఘనముగా ఎంచబడునది దేవుని దృష్టికి అసహ్యము మరియు ఈ లోకములో అధికారియైనవాడు దేవుని దృష్టికి హీనుడనియు, ఈ లోకములో బలమైనదిగాఎంచబడునది దేవుని దృష్టికి బలహీనమైనదనియు వేదగ్రంధములో మొదటి కొరింథీ 1:26 నుండి చదివితే మనకు తెలియగలదు. మరియు యీ లోకములో చేయు యజ్ఞయాగాదులు దైవత్వమునకు యోగ్యకరములు కాదని మనము గ్రహించవలసియున్నది. ఎందుకనగా యీ లోకములో చేయు యజ్ఞ యాగములు విగ్రహ సంబంధమైనవిగాను, నవగ్రహాల సంబంధమైనవిగాను, నరుని స్వార్థమునకు సంబంధించినవిగాను, సంతానహీనుడుగా ఉన్నవాడు సంతానవంతుడగుటకు సంబంధించినదిగాను, వాతావరణమును గూర్చి అనగా అతివృష్టి, అనావృష్టి, అరాచకము, దేశములో అల్లకల్లోలములుగాను, ఈ యజ్ఞయాగాదులు పరిమితములైయున్నట్లు పై వాటి నిమిత్తముగా చేయబడుచున్నట్లు భూజ్ఞానము, మానవ జ్ఞానము వెల్లడిపరచుచున్నది. కాని దైవత్వము ఇందుకు భిన్నముగా ఉన్నది. యీ సందర్భములో యీ పుస్తకమును చదువుచున్న చదువరులకు బైబిలులో కూడా పాతనిబంధనలో యజ్ఞయాగ బలి హోమములున్నవి గదా! ఇవి కూడా లోకసంబంధమైనవి గదా! అనిన సందేహము కలుగకమానదు.
అయితే ఆ దినములలో దేవుడు ప్రత్యక్షముగా బలిని కోరి అందుకు కావలసిన నైవేద్యములను వాడవలసిన పశుపక్ష్యాదుల వివరములు భక్ష్యములు యజ్ఞగుండమును, బలిపీఠముగా మార్చి దానికి ఏర్పరచి కట్టవలసిన విధానము పద్ధతి, నియమములు, బలిని జరిగించు క్రమము, బల్యర్పణలను చేయవలసిన పద్ధతి వగైరాలను గూర్చి తన విశ్వాసులకు దేవుడే నిష్ట నియమాలను గూర్చి దేవుడు పాత నిబంధనలో ఆదికాండ నిర్గమ లేవీయకాండములలో మనము చదువగలము. ఇది దైవార్పితమును, దేవునికి ప్రీతికరమైన యజ్ఞ బలియాగము.
ఈ విధముగా దేవుడు తన భక్తులతో బల్యర్పణల మూలముగ యజ్ఞయాగాదుల ద్వారా తానేర్పరచుకొన్న ఇశ్రాయేలు అనిన జనాంగము చేత యెహోవాయను నామధేయముతో ఉచ్ఛరింపబడి, ఇశ్రాయేలను జనాంగముతో నివసించి వారిని తన ప్రజగా ఏర్పరచుకొని వారిని తన దుడ్డుకర్ర తన దండముతో ఆదరించి, వారి ఆపద్దినములలోను ప్రమాదకాలములలోను ఆదుకొంటూ, వారికి కావలసిన ఆహారపానీయాలు, శత్రు సైన్యముల నుండి విడుదల, సర్పకాటు బాధ నుండి రక్షణ, వగైరా మహిమ క్రియలతో వారిని ఆదరించి నడిపిస్తు - తన దైవత్వాన్ని బల్యర్పణ హోమము ద్వారా ప్రత్యక్షపరచుకొంటు వచ్చాడు. ఇట్టు యజ్ఞయాగాదులు బల్యర్పణలు చేసిన వ్యక్తులనుగూర్చి బైబిలులో కొందరిని మనము యీ సందర్భములో తెలిసికోవలసియున్నది.
ఇందులో మొట్టమొదటగా నరకోటిలో యజ్ఞమునకు పునాది వేసినవాడు హేబెలు. ఇతడు దైవప్రీతి కొరకు యీ బలియజ్ఞమును ఆచరించాడు. ఇందులో స్వార్థములేదు. ఉద్దేశ్యము లేదు. ఇంక రెండవవాడు నోవహు. ఇతడు జలప్రళయ వినాశనము నుండి తనను తన కుటుంబమును రక్షించిన సృష్టికర్తకు కృతజ్ఞతగ బలియాగమును జరిపించెను. ఈ విధముగా జరిగించిన పై రెండు యజ్ఞయాగాదులు దేవునికి ప్రీతికరమైనవిగ యెంచబడినవి. ఇందులో మొదటిదైన హేబెలు బలిని దేవుడు తన కంగీకారమైనట్లుగ తన అగ్ని చేత దహించాడు. లోకసంబంధమైన అగ్ని లేకయే దేవుడు హేబెలు బలిని దహించుటనునది దేవునికి యొప్పిదమైన బలియైనట్లు మనము గ్రహించవలసియున్నది. అదే విధముగా దేవుడు తన మహిమార్థముగా నోవహు అర్పించిన బలిని కూడా ఆఘ్రాణించుటన్నది - నోవహుయొక్క బలి దేవునికి ప్రీతికరమైనట్లుగ మనము గ్రహించవలసియున్నది. ఇందులో హేబెలు తన బల్యర్పణము ద్వారా దేవుని మహిమపరచగా సాతానుడు హేబెలు అన్నయైన కయీనులో ప్రవేశించి, హేబెలును తన బలిపశువుగా అన్న చేత వధింప జేసెను. ఇది సాతానుకు ప్రీతికరమైన బలి.
ఇంక నాలుగవ బలి అబ్రహాము దేవునికి అర్పించిన పుత్రకామేష్టి యాగ సంబంధమైయున్నది. ఆది 18:1 దేవుడు జీవముతో ప్రత్యక్షముగా మానవ రూపములో జీవము గల్గిన రీతిలో ప్రత్యక్షము కాగా అబ్రహాము వారి నిమిత్తము ఒక మంచి బలిసిన పెయ్యను, రొట్టెలను, పాలను, వెన్నను, నెయ్యిని, బల్యర్పణలుగా జేసి వారి ముందు నైవేద్యము చేయగా - ఆ జీవముగల దేవుడు త్రిత్వమైయుండి ముగ్గురు వ్యక్తులుగా ఆదాముయొక్క బల్యర్పణలను కడుపార భుజించి, అబ్రాహాము జరిగించిన బలియాగమునకు ముగ్దుడై ఆనంద భరితుడై, అబ్రాహామును దీవించి ముసలిదైన 90 ఏండ్ల సారాకు గర్భఫలమిచ్చుటన్నది - ఈ సందర్భములో గమనార్హమైయున్నది. ఇది నిజమైన పుత్రకామేష్టి యాగము - యజ్నఫలము.
ఇక దేవుడు నరబలి కోరువాడు కాదు గాని అబ్రహామును పరిశోధించు నిమిత్తము నరబలి కోరినప్పుడు వెనుకాడక అబ్రహాము దేవునికి తన కుమారుని బలియిచ్చుటన్నది, దైవ పరిశోధనై యున్నది. ఈ పరిశోధనలో అబ్రాహాము విజయుడాయెను. తద్వారా దేవుడు మోరియాలో అబ్రహాముకు దేవుడనుగ్రహించిన పొట్టేలు నేటి క్రీస్తునకది సాదృశ్యమైయున్నది.
ఈ విధముగా దైవ విశ్వాసి తన కర్పించు బలులపట్ల తృప్తిని పొందినవాడై ఆదిదేవుడు ఆనాటి తన జనాంగము తన కర్పించిన మిక్కుటమైన బలులకు కృతజ్ఞతగా - ఇక మీదట తనకే బలి వద్దనియు తానే బలిపశువుగాను తానే యజ్ఞాధిపతిగాను, తానే యాగపురుషుడుగాను, తానే యాజకుడుగాను, తానే ప్రీతికరమైన హోమముగాను, బల్యర్పణమైన పులియని కాల్చబడిన రొట్టెగాను, జంతు రక్తమునకు ప్రతిగా తన రక్తమును, సకల నరకోటి పాపపరిహారార్థమై సమర్పించుటకు సన్నిద్ధుడై, యేసుక్రీస్తను నామధేయముతో నరరూపములో నరుల మధ్య ''అలనాడు దైవవిశ్వాసియైన అబ్రహాముకు దేవుడు చూపిన పొట్టేలేవిధముగా పొదలోని తీగలకు తగుల్కొని బంధకములో ఉన్నట్లుగ,'' యూదులనబడు దైవ జనాంగమను పొదలో ఉండి వారియొక్క విమర్శలు, వారి హేళనలు క్రౌర్యము, అజ్ఞానము, నిర్లక్ష్యము, ఈర్ష్యలనబడు ముండ్లచే బంధితుడై, తుదకు దేవుని ప్రణాళిక ప్రకారము కాలము సంపూర్ణమయినప్పుడు దైవోద్దేశ్యక్రమము చొప్పున మోరియాలో అబ్రహామునకు కనపడిన పొట్టేలు వలె బలిపీఠమునెక్కి బలిపశువుగాను, మరియు యాజకునిగాను, హోమగుండమను గొల్గొతా అను ఆ ఉన్నత స్థలములో అనగా బలిపీఠమునకు సాదృశ్యమయిన ఆ ప్రదేశములో - ఇది బలిపీఠమునకు సాదృశ్యము. ముండ్ల కిరీటము చేత అలంకరించబడి నరులయొక్క దోష శిక్షను తన దేహముపై విధించుకొని అందుకు పరిహారముగా తన రక్తమును కార్చి భూమ్యాకాశములకు మధ్య వ్రేలాడబడి దేవునియొక్క సృష్టియైన సూర్యగ్రహముయొక్క తీక్షణ వేడితో కాల్చబడి, బలియాగమును, మారణహోమమను మహాయజ్ఞమును జరిగించి కృతార్దుడయ్యెను.
దేవుడు జరిపించిన ఈ బలియాగములో ఉన్న అతి విలువైన మరియు అతి ప్రీతికరమయిన దైవోద్దేశ్యమేమిటో మనము గ్రహించవలసియున్నది. ఈ సందర్భములో యోహాను 3:16 దేవుడు లోకమనే మనలను ప్రేమించినట్లు తెలియగలదు. దేవునియొక్క ప్రేమ నరులపట్ల ఎట్టిదంటే దేవదూతల పట్ల కూడా నరుల మీద కంటె ఎక్కువ ప్రేమ వారి మీద లేదు, ఎందుకనగా యూదా పత్రిక 1:6 రెండవ పేతురు 2:4 దేవదూతలు పాపము చేసినప్పుడు దేవుడు వారిని విడిచిపెట్టక పాతాళ బిలములలో వారిని బంధించి భద్రము జేసెను. నేను భూమిమీద క్రియ జేయుచున్న విగ్రహ దేవతలు అనగా ముక్కోటి దేవతలనబడు దేవదూతలలో మూడవ భాగము ఈ కోవకు చెందినవారే. యీ దేవదూతలకు మూలస్థానము గర్భగుడి. ఈ దేవతలు చీకటిలో ఉండువారు, శపించబడిన దేవదూతలు భూమిపై వెలసినట్లు ముక్కోటి దేవతలనబడు - ఆ శాపగ్రస్థు దేవదూతలు తాము దేవదూతలనబడినట్లు చెప్పుకొనుట, దేవుడుగాను, దేవతలుగా ప్రకటించుకొనునట్లు, నరులను వేధిస్తు, దేవునికి చెందవలసిన హోమము, యజ్ఞయాగాదులు, బల్యర్పణలు, నైవేద్యములు, ప్రసాదములు తమకే చెందాలంటు నరులను ఆవేశించి, కల్లబొల్లి క్రియలతో మభ్యపెట్టి దేవునికి చెందవలసిన స్తుతిని మహిమను - ఈ శాపగ్రస్థ అంధకారశక్తులు పొందాలని దైవసన్నిధిలో వలె మానవ సమక్షములో కూడా ఈ అరాచక శక్తులు ప్రధాన స్థానము నలంకరించియుండుట మనకు ఋజువుకాగలదు.
ఈ విధముగా నిజమైన దైవత్వానికిని మానవత్వానికి మధ్యలో అడ్డుబండగా ఈ అంధకార శక్తులేర్పడి యున్నవి. ఎట్లంటే పోలేరమ్మ జాతర, గంగ జాతర, కోటప్ప తిరునాళ్ళు, సత్యనారాయణ వైభవం, లక్ష్మి వైభవము, వగైరాలు, వీటికి అర్పించు బలులు, అర్పణలు, నైవేద్యాలు, కానుకలు వగైరాలు వీటికి కట్టుబడి చేయబడిన మందిరాలు, ఆలయాలు, అరుగులు, ధ్వజస్థంభాలు ఇవన్నియు శాపగ్రస్థ దేవదూత సంబంధములే.
ప్రభువునందు ప్రియమయిన సోదరీ! సోదరా! ఇందునుబట్టి చెట్లు అనేకములున్నవిగాని అన్నియు మానవ జీవితమునకు యోగ్యకరములుకావు. ఏదెను వనములో దేవుడేర్పరచిన వృక్షసందోహములో మానవ పతనమునకు కారకమైన చెట్టు ఉండినది. దీనితోబాటు జీవవృక్షము కూడా దేవుడు తోట మధ్యమున వేసినట్లు వేదములో మనము చదువగలము. అదే విధముగా లోకమనే ఈయొక్క భూలోకములో దేవతలుగా దేవుళ్ళుగా అనేకులు పిలువబడుచున్నారు. కాని నిజమయిన దేవుడొక్కడే, ఆయన త్రినామధారి, జీవాధిపతి, సర్వమునకు జీవమిచ్చు దాత; ఇంక దయ్యములు భూతములనబడునవి అనేకములున్నవిగాని, వీటన్నిటికి నాయకుడొక్కడే, అతడే ఆదిఘటసర్పము, క్రూరమృగము, అంత్యక్రీస్తు త్రినామధారియైన సాతానుడు.
ఆదిలో ఏదెను వనములో ఏ విధముగా జీవవృక్షము దైవ నిషేధవృక్షమును రెండును నరుల పట్ల ఏ విధముగా క్రియ జరిగించినవో, అదే విధముగా నేటి నరసమాజములో దైవత్వము పైశాచికము రెండును నరులలో క్రియ జరిగిస్తున్నవి. క్రీస్తు బలియాగముతో బలినిషేధించిన దేవుడు క్రీస్తును బలిపశువుగా మారణహోమములో యజ్ఞములో దహించిన దేవుడు బలులపట్ల విముఖుడై, నేటి నరులనుండి స్తుతులను, స్తోత్రములను కోరుచు విరిగి నలిగిన హృదయముతో దైవసన్నిధిని మొరపెట్టు నరులయొక్క విజ్ఞాపనలను ప్రేమతో ఆసక్తితో ఆలకిస్తున్నాడు.
అయితే దైవవ్యతిరేకియైన అపవాది తన అంధకారశక్తులకు నరులచేత గుళ్ళు, గాలిగోపురాలు కట్టించి చిత్రవిచిత్రమయిన నామధేయములను వాటికి పెట్టించి కాయ, కర్పూరము, గుమ్మడికాయ మొదలుకొని పాలు, పొంగలి, ధూపదీప నైవేద్యములు, పండ్లు, ఫలహారములు వగైరా నైవేద్యంబులను పెట్టించి శుద్ధ పూజయనియు, కోళ్ళు, పొట్టేళ్ళు, మేకలు, దున్నలు, నిమ్మకాయలు, నల్లగాజులు, నల్లపూసలు, విభూది పిండి దీపాలు వగైరాలతో వీటికి సంబంధించిన నీచ పూజలనియు పేర్లుపెట్టి నరులను తన అదుపాజ్ఞలలో ఉంచుకొనుటకు అనగా నరుని తన బంధిఖానాలో ఉంచుటకు యంత్రబంధమనియు, మెడకు తాయెత్తు కట్టుట, గృహ బంధమని ఇంటివాకిటకు రేకులు కొట్టుట, అష్ట దిగ్భంధనమని ఇంటికి ఎనిమిది మూలలో రాగిరేకులు తగిలించుట, వీటికి బలులని, గావులని, పశు పక్ష్యాదులను చంపి రక్తమును ప్రోక్షించుట, ఇవిగాక దిగదుడుపులు, దాటింపులని దండలని వివిధ రీతుల నరునియొక్క నవనాడులను తన క్రమములో ఉంచుకొని సాతానుడు బహుకుయుక్తిగా, నిజదేవునెరింగి బాప్తిస్మము పొందిన క్రైస్తవులను సైతము ఇట్టి అజ్ఞానవలయములో ఇరికించి క్రియ జరిగిస్తున్నట్లు ఈ క్రింది ఉదాహరణల ద్వారా మనము తెలిసికోగలము.
ప్రభువునందు ప్రియసోదరీ! సోదరా! నేటి క్రైస్తవులమైన మనము లగ్నాలు, తిధి, వార నక్షత్రాలు, రాహుకాల, యమగండాలు, ప్రయాణ వారశూలలు, వర్జ్యములు పాటించకున్నామా? ఈనాటికి కూడా క్రైస్తవ లోకములో నిజక్రైస్తవ కుటుంబాల్లో అక్షింతలు జల్లుట, నలుగులు, పసుపు నీరు దిగదీయడము. ప్రధాన సాంగ్యములో అన్యులను పోలి ప్రవర్తించుట. అన్యులవలె వరకట్నాలు, కానుకలు కోరుట వగైరాలు ఆచరించెడి క్రైస్తవులు లేరా? ఒకవేళ ఈ పుస్తకమును చదువుచున్న నీవు అట్టివారి జాబితాలో ఉన్నట్లయితే వెంటనే నీవు వాటినుండి విడుదల పొందుము.
అలనాడు పాతకాలములో దేవుడు తన దశాజ్ఞల మందసమునకు యజ్ఞయాగాదులను జరిపిస్తే ఈనాడు అపవాది కలిశ పూజలని, ఆయుధ పూజలని, నవగ్రహ పూజలని, నవవర్ణ పూజలని, మహాయజ్ఞమని వగైరా స్వజ్ఞానంతో కూడిన పిశాచి ప్రేరేపణపూరిత కార్యములతో నరుడు తన జ్ఞానమును కాలమును తన ఆయుర్ధాయమును వ్యర్థము చేయుచున్నట్లు ఇందునుబట్టి మనము గ్రహించవలసియున్నది. కనుక ప్రియసోదరీ! సోదరా! మన యజ్ఞములో బలులు, స్తుతులు, స్తోత్రాలు, జీవాధిపతియైన దేవునికి చెందాల్సినవియేగాని, అంధకార శక్తులకు మానవత్వమును ధార పోయుట యుక్తముగాదు. ఆమేన్.
నైవేద్య - తీర్థ - ప్రసాదములు
ప్రభువునందు ప్రియమైన సోదరీ! సోదరా! ఈ నైవేద్యము తీర్ధము, ప్రసాదము అను ఈ మూడును నేడు క్రైస్తవేతరులయిన అన్యదేవాలయములలో బహుముఖ రీతులుగా చలామణియగుచున్నది. నైవేద్యమంటే జంతు సంబంధము, వృక్ష సంబంధము, ధూపదీప సంబంధము, లోహ సంబంధము.
జంతుసంబంధమనగా కోడి, మేక వగైరా జీవరాసులు వృక్షసంబంధమనగా కొబ్బరికాయ, నిమ్మకాయ, గుమ్మడికాయ, అరటిపండ్లు, ఖర్జూరపుకాయలు, పంచదార వగైరా ధూపదీప సంబంధమనగా సాంబ్రాణి, అగరువత్తులు, వగైరా దీపసంబంధమనగా ప్రమిదలు, దీపస్థంబాలు, ఆముదపు వత్తులు, కర్పూరహారతి, వగైరాలు లోహసంబంధమనగా రాగిరేకులు, వెండిరేకులతో మలిచిన బీజాక్షరయుత పటాలు, ఇవిగాక నవధాన్యాలు, మధుమాంసములు, తీపి వంట పదార్థములు అనగా లడ్డు, కేసరి, పొంగలి, పంచకజ్జాయము, పాలపొంగలి, వగైరాలు ఇవిగాక కుంభమని విగ్రహము ముందు బోర్లించిన అన్నపురాశి వగైరాలు.
ప్రభువునందు ప్రియసోదరీ! సోదరా! ఆదిలో యెహోవా దేవుడు తాను మట్టితో నిర్మించిన నరునికి చెట్టుఫలాలను, సముద్ర మత్స్యములను, జంతుకోటిని, పక్షిసముదాయములను వగైరాలతోబాటు రొట్టెలు, అన్నము, వగైరా ధాన్యరూపములతో చేయబడిన రకరకాల పిండి వంటకములను తాను నేల మంటితో నిర్మించి, అందులో తన ఆత్మను ప్రతిష్టించి నైవేద్యములుగా ఈ నరాధమునికి సమర్పించినట్లు మన ఆత్మ జ్ఞానముతో ఆలోచిస్తే మనకు తెలియగలదు. నరులైన మనకు మన పాదముల క్రింద ఉంచి మనము తింటూ ఉంటే ఆయన ఆనందించినట్లు వేదములో ఈ క్రింది భాగములలో చదువగలము. ఆది 7: జలప్రళయ కాలములో దేవుడు భూమిని జలములలో ముంచెత్తినప్పుడు జలప్రళయము అంతమగువరకును నోవహు ఓడలో అతనికే లోటు లేకుండ ఆహారపు కొరతను దీర్చి అనేక రకములైన వస్తు సముదాయములను, వాటితోబాటు అగ్నిని అన్ని సంబారములతో నింపినట్లు మనము గ్రహించవలసి యున్నది. అదే విధముగా దేవుడు తన జనాంగమైన ఇశ్రాయేలీయులకు మోషే ప్రార్థన ద్వారా మాంసాహారమును, శాకాహారములను కూడా ఆకాశము నుండి కురిపించి నైవేద్యములుగా వారి ముందుంచినాడు. బండలో నుండి తీర్ధాన్ని వారికనుగ్రహించెను. తన వాక్యమను జ్యోతిలో నరుని సమక్షమున నరుని జీవితమును వెలుగుమయము జేశాడు. జ్యోతిని వెల్గించేడు. నరునియొక్క నిత్యజీవ మనుగడ కోసము దేవుడు బహుదీక్ష గలవాడై, నిత్యము నరుడు దేవుడనుగ్రహించుచున్న పశుపక్ష్యాదులు వృక్షఫలాదులు, పుష్కలమైన భోజన పదార్థంబులచేతను ద్రాక్షారసోపేతమైన మద్యముల చేతను మత్తుడై, వెగటుగల జీవితములో ఉండగా నరుని మీద నున్న ప్రేమ కొలది నరునికి గల్గిన పతనావస్థనుండి అతని కాపాడుటకై, దేవుడు తన వాక్యమును నరునికి కర్పూరహారతిగాను తన దేహమును నైవేద్యంబుగాను, తన రక్తమును తీర్థముగాను, నరపాప పరిహారార్థము బలిజేసి సమర్పించి, నరుని పాప విమోచనార్థము దేవుడు చేసిన ఈ త్యాగమును, ఈ బలియాగమును, నరకోటి లోకాంతము వరకు మరియు (యేసు) తన రాకడ వరకు తన జ్ఞాపకార్థము జేయమని దేవుడు నరుల కాజ్ఞాపించెను.
అయితే నరులు కృతజ్ఞతలేనివారై ఇందుకు భిన్నముగా ప్రవర్తిస్తు దేవుడు నరులకు నైవేద్యముగా అనుగ్రహించిన వస్తు సముదాయములను బలవర్థకములైన మరియు పవిత్రములైన ఆహార పదార్థములను విగ్రహాలకును, గోరీలకును, చెట్లకును, పాములకును, నైవేద్యంబులుగా ఉంచి వాటికి సాగిలపడి మ్రొక్కి వాటిని తీర్థ ప్రసాదములని ఆరగిస్తు వ్యర్థమయిన జీవితముతోను దేవునికి ఉగ్రత గల్గించు స్వభావముతోను నరకాగ్నికి యోగ్యకరమగు శిక్ష పొందునంతగా దైవోగ్రతకు పాత్రులగుచున్నారు.
కాబట్టి ప్రభువునందు ప్రియసోదరీ! సోదరా! ఈ పుస్తకమును చదువుచున్న నీవు ఆత్మీయ జ్ఞానముతో ఆలోచించుము. యోహాను సువార్త 4:13 యేసుప్రభువు సమరయ స్త్రీతో ఈ నీరు త్రాగువాడు మరల దప్పిక పొందుదురు. అయితే నేనిచ్చు నీరు త్రాగువాడు మరి ఎన్నటికిని దప్పిక పొందడు. యోహాను 6: 48-51 ఇది నిజమైన తీర్థప్రసాదము ఎట్లనగా యోహాను 6:53 ఆయన శరీరము తిని ఆయన రక్తమును త్రాగితేనేగాని మీలో మీరు జీవము గలవారు కారు. కనుక ప్రియసోదరీ! సోదరా! యోహాను 6:54 యేసు శరీరమును తిని ఆయన రక్తమును త్రాగినవాడే జీవముగల దేవుని సంతానమై యున్నట్లు ఇందుమూలముగ మనము గ్రహించవలసియున్నది. అంతేగాని విగ్రహాల ముందు అలౌకిక శక్తులకును, సర్పాలకును, గోరీలకును నైవేద్యాలుగా పెట్టిన వాటిని తినినవాడు శాపగ్రస్థుడును వాటి వలె మృతజీవుడని మనము గ్రహించవలసియున్నది.
పాపాన్ని దహించే యజ్ఞము
పాపయజ్ఞములోని పాపాన్ని దహించెడి అగ్ని ఏది? ఆయన నీతి సూర్యుడయిన క్రీస్తే యీయన దహించబడుచు దహించాడు అనగా కాలుచు కాల్చాడు. ఈ కాల్పు అనునది శరీరాలనే కాదుగాని ఆత్మలకే పరిమితమై ముఖ్యమైయున్నట్లు గొల్గొతా శిఖరములో యేసు కుడివైపు సిలువ వేయబడిన దొంగ తన ఎదుట దేవునిచే దహించబడుచున్న అగ్నియైన యేసు ద్వారా తన పాపములను దహింపజేసుకొని ధన్యుడాయెను. మత్తయి 3:11 నేను నీటితో బాప్తిస్మమిచ్చుచున్నాను. ఆయన పరిశుద్ధాత్మలోను, అగ్నితోను మీకు బాప్తిస్మమిచ్చును అనిన యోహాను మాటయు, ''నేను భూమి మీద అగ్ని వేయ వచ్చితినిగాని సమాధానము కోరి రాలేదని యేసుప్రభువు మాటలు యీ సందర్భములో మనము గ్రహించవలసియున్నది. ఇందునుబట్టి మనమాలోచిస్తే దేవునియొక్క అగ్ని క్రీస్తే. తొలుత హేబెలు బలిని దహించాడు, ఈయన దహించింది గొర్రెపిల్లను. అటుతర్వాత రాజుల గ్రంథములో ఏలీయా బలిని దహించాడు, ఈయన దహించింది ఎద్దును.
ఇక మూడవదిగ దేవుని యజ్ఞపశువుగ తానే నరరూపములో నరపాపము కొరకు నరబలిగ దహించబడుచు ప్రతి నరునియొక్క హృదయాన్ని దహించాడు. వాని పాపజీవితాన్ని దహించాడు. వాని అహంభావాన్ని, అంతస్థును, మూఢత్వాన్ని దహించాడు. వాని అవిశ్వాసాన్ని దహించాడు. వాని అయోగ్యతను దహించి యోగ్యునిగా జేశాడు. పాపి యొక్క పాపములను దహించి నీతిమంతునిగ తీర్చాడు.
ఇటువంటి అగ్ని భూసంబంధమయినదిగాక దృశ్యమయినదిగాక పరలోకసంబంధమై అదృశ్య రూపములో ఉండి, నరునికి కానరానట్టి స్థితిలో ప్రతి నిత్యము ఈ దహన యజ్ఞ కార్యమును జరుపుచున్నట్లు మన నిత్య జీవితములో అనేకచోట్ల యీ క్రింది విధముగా వార్తాపత్రికల ద్వారా నైతేనేమి, రేడియోల ద్వారా నైతేనేమి ప్రత్యక్షముగానేమి పరోక్షముగానేమి ఈ క్రింది విధముగా వింటున్నాము. పాపులు మారుట, క్రూరులు తమ క్రూరత్వము నుండి విడుదల పొందుట ఉదా|| సౌలుగా ఉన్న పౌలు, వ్యభిచారి సంసారియగుట, సమరయస్త్రీ జీవితము అక్రమస్థుడు న్యాయవంతుడగుట - జక్కయ్య జీవితము, గొప్ప రాచరికమును అనుభవిస్తు రాజలాంఛనాలతో భోగలోలుడైన కొర్నేలియొక్క జీవితములోను జరిగిన సంఘటన, మగ్దలేనే మరియయొక్క పాప జీవిత దహనము. రక్తస్రావరోగియైన స్త్రీ 12 ఏండ్ల రోగము నీతిసూర్యునియొక్క కిరణము తాకగానే దహించబడి ఆమె స్వస్థురాలగుట; అంతియేగాక ఈ అగ్ని ధాటికి కుష్టురోగము దహించబడి మాయమై స్వస్థత పొందుట, క్రీస్తు అను యీ అగ్నియొక్క కిరణ ప్రభావము చేత పక్షవాత రోగి నడచుట, గుడ్డివానికి ఈ వెలుగు చూపు ననుగ్రహించుట, గెరాసీనులను సమాధుల తోట, ఈ అగ్ని యొక్క దర్శనము ద్వారా ఆరువేలాత్మలు ఆవరించియున్న అపవిత్రాత్మల కూటమి కలవరపడి యీ అగ్నియొక్క ధాటికి ఆగలేక పందులలో జొరబడి సముద్రమునకు పలాయనము చిత్తగించుట, చనిపోయినవారిని పునరుజ్జీవితునిగా జేయుట.
ఇట్లు పరిశుద్ధ గ్రంథములో నూతన నిబంధన వేదభాగములో దేవుని నీతి సూర్యుడయిన క్రీస్తను అగ్ని తన దహన కార్యమును జరిగించగా - ఈ అగ్నిని దీని ప్రభావమును ఆర్పుటకు అపవాది లోక సంబంధమైన నరులను తన సహచరులుగా జేసుకొని, యీ సూర్యుని చీకటితో బంధించాలని వాక్య జ్యోతియైయున్న ఈయనను నరుల చేత ఱాతి సమాధిలో కాంతి విహీనునిగా అవగా నిర్జీవునిగా జేసి, భూస్థాపన జేసినట్లు అటు పిమ్మట యీ సూర్యుడు భూమిని బ్రద్దలు జేసి సమాధి నుండి పునరుత్థానుడై, బహుతీక్షణకరమైన కాంతిని తన పరిసరములో ప్రకాశింపజేసి, నాటి సామ్రాజ్య రాజభటులను సహితము చూడరానటువంటి వెలుగులో మొత్తి వారిని పడవైచి పునరుత్థానమై సంచరించాడంటే యీ నీతి సూర్యుడు సజీవుడును మరియు నిత్య జీవుడునైయున్నవాడేగాని కాంతిహీనుడును, మబ్బు తెరల చేత కప్పబడువాడు కాడు.
ఇట్లు సృష్టికర్తయొక్క ఆత్మీయాగ్ని మర్మములు నరజ్ఞానమునకు గుప్తమైయుండగా నరుని అజ్ఞానమును అపవాది లీజుకు తీసికొని దహనకాండ ఆత్మ సంబంధమయినదిగా ఉండగా దానిని శరీర సంబంధముగా మార్చి భార్యాభర్తలలోను, అత్తాకోడళ్ళలోను, తల్లీ కూతుళ్ళలోను, తోడికోడళ్ళయొక్క ఐక్యతలోను, ఆడబిడ్డల వ్యవహారాలలోను ఐక్యతతో జీవించాల్సిన సంసారములలో కలహాలు రేపి భూసంబంధ ఇంధనమైన కిరోసిన్, అగ్గిపుల్లతోను వారి శరీరాలను కాల్చుకొని ఆత్మహత్య చేయించు కొనుటకును, వరకట్నము లేదని, భర్త మరియొక దాన్ని ఉంచుకొన్నాడని, అత్త పోరు, ఆడబిడ్డల పోరు, వగైరా కారణాలతో యౌవ్వనస్థులనే - పండువంటి వారి జీవితాలను కిరసనాయిలు, అగ్గిపుల్లతో భస్మీపటలము చేయుచున్నాడు.
ఇదిగాక యజ్ఞము, హోమములంటు వివాహ సందర్భాలలో అన్యసాంగ్యాలలో వధూవరుల ఎదుట అగ్నిగుండ మేర్పరచి, ఆ అగ్ని చుట్టు తన ఏజెంటయిన పౌరోహితుని చేత ప్రదక్షిణలు చేయించి, వియ్యంకులలోగాని, వధూవరులలోను వ్యవహారాలు బెడిసి కట్నకానుకలు విషయములో నెపము మోపి సంసార జీవితములో నిండు యౌవ్వనస్థులు పుత్రపౌత్రాదులతో ఆనందమయ జీవితము గడుపుచు చిరకాలము వర్థిల్ల వలసియుండగా - అట్టివారిని ఏ అగ్ని ముందైతే పెళ్ళి చేసుకొన్నారో ఆ అగ్ని చేతనే వారి సంసార జీవితములో చిచ్చుపెట్టి దహిస్తున్నాడంటే సాతానుయొక్క కఠిన వైఖరి బహులోతుగా మనమాలోచించవలసియున్నది.
ప్రభువునందు ప్రియసోదరీ! సోదరా! లోకసంబంధమైన వెలుగు సాతాను; ఎట్లంటే నీతి సూర్యుడయిన క్రీస్తునకు నమస్కరించవలసిన వ్యక్తిని - అస్తమానకాలములో దీపాలు పెట్టు వేళలో దుకాణాదారులను స్విచ్ వేసి లైటు వెల్గించి, వెల్గిన బల్బులకు దండాలు పెట్టిస్తున్నాడు. అదే విధముగా సాంసారిక గృహాలలో కిరసనాయిలు లైటు లగాయతు కరెంటుబల్పు వరకు ఉన్న వెలుతురులకు ఇంటిలో వారి చేత దండాలు పెట్టిస్తున్నాడు. ఎవడైనను చిల్లర దొరకక నానా అవస్థలుపడి చిల్లర కోసము దుకాణానికి వస్తే అప్పుడే లైటు పెట్టినాను. దీపాలు పెట్టిన వేళలో చిల్లర ఏమిటయ్యా! అని పలికిస్తున్నాడు. గంజిలోకి ఉప్పో, తాళింపుకు కరివేపాకో కావలసి ఇంటికి వెళ్ళితే దీపాలు పెట్టిన వేళలలో ఉప్పు, కరివేపాకు ఏమిటయ్యా! మా ఇల్లు తుడిచికొని పోవలెనా? మధ్యాహ్నము నుండి ఏమి జేయుచున్నావు? అని నిష్ఠూర వచనాలు పల్కిస్తున్నాడు. ఇంటికి వచ్చిన అతిధిని సాయంకాలము దీపాలు పెట్టబోవు సమయము వరకు ఆయనను ఇంటిలో ఉండమని దీపాలు పెట్టిన తదుపరి ఆయన ప్రయాణానికి సన్నాహాలు చేయిస్తున్నాడు. ఇంకను విగ్రహాలకు, పటాలకు హారతి అను పేరుతో కర్పూరము వెలిగించి దిగదుడుపు జేసి కుటుంబసమేతముగా ఇంటిల్లిపాదిని కన్నులకు అద్దిస్తున్నాడు. ఇంకను తిరునాళ్ళు, ఉత్సవాల సందర్భాలలోను అగ్నిగుండ ప్రదక్షిణ అను వేడుక నేర్పరచి తన భక్తులచేత నిప్పులు త్రొక్కించే సాంగ్యాన్ని కూడా లోకములో సృష్టించి యున్నాడు.
మరియు ముఖ్య విషయమేమిటంటే దేవుని నిజమైన వెలుగు క్రీస్తయియుండగా - అట్టి సత్యమైన వెలుగును అసత్యమునకు మార్చి మండే కట్టెలకు అగ్ని దేవుడని పేరుపెట్టి నరుల చేత ఒక దేవతగా దానిని పూజలు జేయిస్తున్నాడు. మరియు ముందు జాగ్రత్తగా కట్టెలతో కూడిన మంటలు దేవుళ్ళు ఎట్లగునో? అని విమర్శ నరులలో కలుగునేమోనని ముందుగా పధకము వేసికొని సృష్టికర్తయైన దేవుడు, సృష్టికంతటికిని పగటి వెలుగు కల్గించుటకు పెద్ద జ్యోతి అయిన సూర్యగోళమునే సాతానుడు సూర్య భగవానుడను పేరుతో సూర్య నమస్కారములు, సూర్య దర్శనము, సూర్యోదయమను వగైరా నామధేయములతో సూర్యునికి సంబంధించిన కాకమ్మ కథలల్లి, నిజదైవత్వము నుండి నరులను మళ్ళించి తప్పుడుదారులు పట్టిస్తున్నాడు. యీ సందర్భములో యోహాను సువార్త 1:9 నిజమైన వెలుగుండెను. ఆది లోకములోనికి వచ్చుచు ప్రతి మనుష్యుని వెల్గించుచున్నది. ఈ వెలుగే క్రీస్తు. ప్రతి స్థలములోను, ప్రతి చోటను, ప్రతి సమయమందును నరుని వెంటాడి వానికి కావలసిన అక్కరలు తీర్చుటకును, వానికున్న బరువులను తీర్చుటకును, వానికున్న దేహబాధలు,ఆర్థిక బాధలు, లౌకిక అలౌకిక బాధలు అశాంతి వేదన వగైరా అరిష్టాలనుండి తప్పించి, వెలుగులో కూడిన మార్గమును చూపించి నరునికున్న మనోనేత్రాంధకారము తొలగించుటకు ఈ అగ్ని మూలమైయున్నది. యీ అగ్నియే హేబెలు బలిని దహించింది. ఏలీయా బలిని దహించింది, లోకాంత్యములో యీ అగ్ని ప్రభావమున జరుగబోవు సూచనలు, సంఘటనలు, ప్రకటన గ్రంథములోను మరియు లూకా సువార్త 21:25-26, మత్తయి 24: 29-31లోను చదువగలము. భూమి మహావేండ్రముతో లయమైపోవుట, భూమి పతనము, సూర్యచంద్రులు కాంతి విహీనమగుట మొదలగునవి.
కనుక ప్రియసోదరీ! సోదరా! నీవు నీయొక్క పాపములను దహించుకొనుటకు నీతిసూర్యుడైన యేసుయొక్క ప్రభావ కిరణాన్ని అగ్నిగా వాడుకొని దహింపజేసుకొని శుద్ధీకరించుకొంటావా? లేక నీకున్న బాధలు ఆర్థిక సంబంధమైన ఇక్కట్లు తొలగించుకొనుటకును నీ లోక జీవితము సంసార జీవితము, బిడ్డల జీవితము నీ ఆత్మీయ శారీర జీవితములను పుటము వేసిన బంగారువలె నిత్యము పవిత్రముగా ఉంచుకొనుటకు దేవుని అగ్నియైన క్రీస్తుయొక్క నీతి అగ్నితో పరిశుద్ధ పరచుకొంటావా? లేక లోక సంబంధమైన అగ్నిహారతులు, సూర్య నమస్కారములు, దీపాలకు దండాలు పెట్టుకొంటు నిర్జీవ దశలో అనామకమైన ఆరిపోయే వెలుగులో జీవించి నీ జీవితాన్ని కిరసనాయిలు మంటకు ఆహుతి జేసుకొందువా? అట్లు నిర్భాగ్య జీవితము జీవిస్తే అనగా వెలుగులేని జీవితము జీవిస్తే పాపమునకు జీతము మరణము, మరణమునకు కేంద్రము అగ్నిగుండము. అట్లుగాకుండ నీతి సూర్యుని సహచరునిగా జేసుకొని జీవిస్తే ప్రకటన 21:23-26 ఉన్న నిత్య ప్రకాశమానమైన చీకటి శూన్యమైన దేవుని పట్టణమైన గొఱ్ఱె పిల్ల రాజ్యములో సుఖశాంతులతోను, దేవదూతల గాన ప్రతిగానములతోను, పాలిపంపులు గల్గి జీవించగలవు, ప్రభువు, మనలను దీవించుగాక! నీతి సూర్యుని ప్రకాశము నిత్యము మనపైనను మన మీదను మన కుటుంబీకుల మీదను మనము ప్రేమించు ప్రియుల మీదను, తుదకు శత్రువులుగా ఉన్న సోదరులను సైతము వారి దుర్నీతి నుండి వారిని పవిత్రులుగా జేయునుగాక!
కనుక ఈ వేదభాగమును చదివెడి సోదరీ! సోదరా! ఈ అంశములలోని పరమ రహస్యమేమిటంటే ఆదిలో దేవుడు సృష్టించిన పగటి జ్యోతియైన సూర్యుడు లోకసంబంధముగా దృశ్యములైన చెట్లకును, మొక్కలను, జీవరాసులను, జంతుజాలములను, మృగములను, పక్షులను, జలమత్స్యములకును, కీటకాదులకును, వీటితోబాటు నరులకును నిత్య జీవితములో కావలసిన అవసరతలు తీర్చుటకును, సంతానోత్పత్తి క్రియ జరిగించుటకు అనగా జీవరాసులు పెట్టిన గుడ్లు పిగిలి పిల్లలగుట, సృష్టిలోని వాతావరణ కలుషితమును నిర్మూలము జేయుటకు, మొగ్గలు వికసించుటకు, కాయలు పండుటకును, గింజలు మొలకెత్తుటకును ఒకటేమిటి? సమస్తమైనవాటికి దేవుడు సృష్టించిన ఈ సూర్యగోళము అతి ముఖ్యమై యున్నది.
తొలుత ఇట్టి సూర్యుని క్రింద జరిగిన పరిశుద్ధ క్రియయైన ఏదెను నిర్మాణము - అందులో దేవుడు జరిగించిన నరజంట నిర్మాణము, నరజంటలిరువురును దేవుని సన్నిధిలో ఎంతో సభ్యత కల్గి ఎంతో సన్నిహితులై జీవిస్తుండగా అట్టి సమైఖ్య జీవితమునకు ఈ సూర్యగోళము తనలో ఉన్నటువంటి అగ్నియొక్క తీక్షణతను తగ్గించుకొని, దైవానుజ్ఞానుసారము ఏదెను వనమునకును, దేవుని సృష్టికిని పరిమితమైన ఉష్ణోగ్రత క్రియ జరిగించినట్లు మనము తెలిసికోవలసియున్నది. ఆ కాలములో ఎండాకాలము వర్షాకాలమని, వసంతకాలమని, కాలాలు నిర్ణయమైయున్నట్లు బైబిలులో లేవు. ఆదికాండము 3:8లో చల్లని పూటయనియు సూర్యోదయముమధ్యాహ్న వేళయని ఉన్నదే గాని, వర్షాకాలములో ఎండాకాలములో చలిదినములలో అని ఆదికాండము తొలి అధ్యాయములో ఎక్కడను వ్రాయబడలేదు.
ఇందునుబట్టి చూస్తే నరులు దైవాతిక్రమణము చేసింది లగాయతు లోక సృష్టికిని వాతావరణమునకును జంతుజాలములను వృక్షజాలములను గ్రహాలను నక్షత్రాలను పంచభూతాలను విరోధియైనట్లు అవియన్నియు నరునికి ఒక వైపు మిత్రునిగ,'' సందర్భానుసారముగాను కాలానుగుణ్యముగా ఉగ్రరూపమును దాల్చి గాలి వర్షము మేఘములు భీకర గర్జనలతో తుఫాను రూపముగా నరకోటి మీద విరుచుకుపడి, జననష్టము అస్తినష్టము పైరు పంటల నష్టము నరులు తిరుగునట్టి బాటలు గండీలు కొట్టుట, రైలు, రోడ్డు వంతెనలు కూలుట, వగైరా నష్టాలకు నరులను గురిజేయుచున్నవి. ఇంక మృగ సందోహము, క్రూర వైఖరి ననుసరించి నరులపైబడి చీల్చుటకును, చంపుటకును సిద్ధమైనట్లు నేటి మృగ జీవిత విధానము మనకు వివరిస్తున్నది.
ఈ విధముగా యజ్ఞఫలము నరునియొక్క జీవితానుభవములో ఒక సమస్యగా యేర్పడి, వర్షాల కొరకై యజ్ఞము చేయుట, ఎండ వేడి తగ్గుటకు యజ్ఞయాగాదులాచరించుట, యజ్ఞయాగాదులయొక్క విలువను ఆత్మీయముగా కొల్పోయిన నరుడు దానిని మూగ విగ్రహాల ఎదుటను, దైవసృష్టియైన గ్రహాలతోను నక్షత్రాదులతోను పొందుపరచి యజ్ఞ కార్యక్రమమును జరుపుటన్నది మూఢ విశ్వాసమునకు మూలమైనట్లు మనము గ్రహించవలసియున్నది. ఇట్టి మూఢవిశ్వాసముతో కూడిన యజ్ఞమును యాగమును నిర్మూలించుటకు నిజమైన యజ్ఞ పశువుగాను, యాగాధిపతిగాను, యాగపశువుగాను, ప్రధాన యాజకుడు గాను, యజ్ఞానికి మూలమైన అగ్నిగాను, ఇట్లు వివిధ రీతుల పరమార్థమునిచ్చు బలి ఉపకరణములుగా దైవవాక్కు శారీరధారియై, అటు లోక నరకోటి పాపవిమోచకునిగాను, బలిపశువుగాను, యాజకునిగాను, తన యాజకత్వమును తన బల్యర్పణను తన దహన కాండను పరిసమాప్తి జేసుకొని, తండ్రియైన దేవుడు తనకిచ్చిన కర్తవ్యాన్ని నెరవేర్చి శుభ శుక్రవారమునాడు ఈ క్రియ యావత్తును సంపూర్ణముజేసి తండ్రి పంపిన తనయుడే అను నమ్మకమును ప్రతి వ్యక్తికిని కలుగునట్లుగా - ఆదిలో తండ్రి సృష్టి యావత్తునుండి ఏడవ దినమున ఎట్లు విశ్రమించెనో అదే విధముగా ఈయన కూడా శుక్రవారము సూర్యస్తమయము లగాయతు శనివారమంతయు విశ్రమించి, సూర్యవారమున (ఆదివారమున) సూర్యుడు ఉదయించక పూర్వమే - ఈ నీతి సూర్యుడు ఉదయించి అజ్ఞానాంధకారములో నిద్రలో కొట్టుమిట్టాడుచున్న చీకటి సంబంధులైన నరకోటికి వెలుగు ప్రసరింపజేసి, నేడు సూర్యుని కంటెను చంద్రుని కంటెను ప్రకాశమానుడై ఏడుఖండములలోను ప్రతి నరునియొక్క హృదయ చీకటిని తొలగించి, నిజమైన వెలుగైన దైవవెలుగులో నడిపించుటకు దోహదకారి అయినట్లు మనము గ్రహించవలసియున్నది.
ఇదియే సువార్త వెలుగు - సువార్తయే క్రీస్తు సువార్త అనగా దేవునియొక్క మాట, మాటయే మహిమ శరీరము దాల్చి మనలను తన మహిమ రాజ్యమునకు ఆహ్వానిస్తున్నది. కనుక ప్రతి విశ్వాసియు బల్యర్పణగ తన హృదయాన్ని ప్రభువు కర్పించవలసియున్నది. అదియే నిజమైన బలియాగము. అదియే దేవునికి ప్రియమైన హోమము, ప్రియసోదరీ! సోదరా! ఇట్టి హృదయ బల్యర్పణను దేవునికి అర్పించి, నీయొక్క అర్పణాఫలమును దేవునికి ప్రీతికరమైన హోమముగా చేయలేవా? అట్లు చేయుటకిదియే సమయము. ఇదియే అనుకూల సమయము, ఇదియే ఆ మహానుదినము, ప్రభువు నిన్ను ఆశీర్వదించి కాపాడుగాక! ఆమేన్.
.....
అంశము :- నిర్గమ 32:1-6 ప్రియపాఠకులారా! ఇంతవరకు మనమెన్నో సాహిత్యాలను గూర్చి నేర్చుకొన్నాము. అందులో బలులను గూర్చి ఆరాధననుగూర్చి నైవేద్యాలు, అర్పణలు కానుకలను గూర్చి దశమ భాగాలనుగూర్చి కృతజ్ఞత అర్పణ లనుగూర్చి అపరాధ బలులనుగూర్చి నానావిధ బలి కార్యాలు ద్వారా మనకు తెలియని అనేక విషయాలు నేర్చుకొనియున్నాము. నిజమైన దేవుడు బలిని కోరునా? దేవునికి రక్తప్రోక్షణ బలి అన్నది అవసరమా? ఒకప్పుడు భూమిమీద కాలు మోపే స్థలములేని దేవునికి నేడు ప్రపంచ వ్యాప్తముగా ప్రతి దేశములోను, ప్రతి పట్టణములోను, ప్రతి గ్రామములోను, ప్రతి వ్యక్తి యందును ప్రతి భాషలో తన్ను మహిమపరిచే విశ్వాసులను ఏర్పరచుకొన్నాడంటే, దైవత్వమునకున్న ఘనత శక్తి ప్రభావము తేజస్సు మహిమ ఎంత గొప్ప ఆధిక్యత కలిగి ఉందో? ఒక్కసారి మనము వేదరీత్యా పరిశోధించి తెలిసికొందము. వాస్తవమునకు దేవుడు బలిని కోరువాడు కాదు. దేవునికి కావలసింది నరునియొక్క హృదయము మరియు అతనిలోని సద్గుణసంపత్తి - అతని ఆత్మీయత - ఇవి దేవునికి కావలసిన అమూల్యమైన అర్పణలు, నరులు తెలియని రీతిగా దైవత్వమునకు నానావిధ బలులు, అర్పణలు, అర్పించి, నిర్జీవమైన ఆరాధనలు చరిత్ర లేని దేవత ప్రతిమలు, ప్రభావములేని మందిరాలు, సత్యమునకు విరుద్ధమైన బలిపీఠములు కట్టుకొని అజ్ఞాన దశలో దైవత్వానికి మానవత్వానికి దూరముగా ఆత్మయొక్క వెలుగు ఆర్పుకొని మనోనేత్రాంధకారముతో తామే గొప్పవారమని, తామే నిజమైన దేవుని బిడ్డలమని దైవరాజ్యమునకు తామే యోగ్యులమని, ఈ క్షణములో చనిపోతే దైవరాజ్యము ప్రవేశించగలమన్న ధీమాను వ్యక్తపరచుచు జీవించేవారున్నారు.
ప్రియపాఠకులారా! ఇందుకు నిర్దుష్టమైన భావాన్ని పౌలు 1 కొరింథీ 11:1లో నేను క్రీస్తును పోలి నడుచుకొనుచున్న ప్రకారము మీరును నన్ను పోలి నడుచుకొనుడి. మీరు అన్ని విషయాలలోను నన్ను జ్ఞాపకము చేసికొనుచు, నేను మీకు అప్పగించిన కట్టడలను గైకొనుచున్నారని మిమ్మును మెచ్చుకొనుచున్నాను,'' అని అంటున్నాడు.
ప్రియపాఠకులారా! పౌలు తనయొక్క రక్షణానుభవములో తాను క్రీస్తును బోలి నడుచుకొను చున్నాడంటే పౌలు ఊరకనే క్రీస్తును బోలి నడుచుకొన్న యోగ్యత పొందినాడా? పౌలు పూర్వీక స్థితి ఏమిటి? పౌలు దృష్టికి దేవుడున్నాడా? దైవకుమారుడైన క్రీస్తు ఉన్నాడా? పరిశుద్ధాత్ముడున్నాడా? అసలు పౌలు ఎవరు? ఈ విషయాలు ముందుగా జవాబు తెలిసికొందము. పౌలుయొక్క పూర్వీక స్థితినిగూర్చి తెలిసికొందము.
ప్రియపాఠకులారా! పౌలు హెబ్రీయుడే, యూదా జాతికి చెందినవాడే, అయితే ధర్మశాస్త్రము యొక్క ముసుగులో మూర్ఖత్వముతో పాశవికముగా కఠినముగా క్రూరముగా అజ్ఞానముగా ప్రవర్తించి, లోకసంబంధ ధర్మశాస్త్రమే తనకు ఆచరణ యుతమైనదనియు, లోకసంబంధమైన రాజ్యము తనకిచ్చిన పదవి తనకు ప్రాణాధారమై యున్నట్లును, దైవకుమారుని విశ్వాసులను చెరపెట్టుట హింసించుటన్నది అది ప్రాణప్రదము మరియు అత్యంత ప్రాముఖ్యమైన విషయముగా భావించినవాడై లోకపక్షముగా దైవకుమారుడైన క్రీస్తుతో పోరాడి, యేసు ఆత్మతో మొత్తబడి కన్నులు పోగొట్టుకొని అంధుడై అనగా దైవ శిక్షకు గురియై, నిజమైన దైవత్వముయొక్క మర్మమేమిటో, నిజమైన దైవత్వముయొక్క ప్రభావమేమిటి? అది ధర్మశాస్త్రములో బలుల అర్పణలు కానుకలు వగైరాలతో కూడినదేనా? లేక దృశ్యమైనదిగాక అదృశ్యమైన ఫలముల ద్వారా అర్పించి, సత్ఫలితాలు పొందుటకు మార్గము అన్న సత్యాన్ని పౌలు సౌలుగా ఉన్నప్పుడు తన యవ్వనకాలము వరకును, ధర్మశాస్త్ర సిద్ధాంతము ప్రకారము మూఢాచారముతో ప్రవర్తించి అనగా దెబ్బకు దెబ్బ, యుద్ధానికి యుద్ధము, పాపమునకు పాపము, నేరానికి నేరము అన్న సిద్ధాంతాలతో ప్రవర్తించి, ఆ సిద్ధాంతాలను అపొస్తలుల మీదను, వారి బోధలు వినువారి మీదను, వారి బోధలు విని క్రీస్తుకు సాక్షులైన వారి మీదను, బహు తీవ్రమైన రీతిలో క్రియ జరిగిస్తున్నది. తన స్వకీయ విషయములో విశ్రాంతి కోరి నిద్రించి ఉంటాడేమోగాని క్రైస్తవులను హింసించుటయు, చెర పెట్టుట, బాధించుటలోను, చంపుటలోను, తాను ఏ మాత్రమును, కునుకక నిద్రపోక అన్న ఆహారాదులు లేక శ్రమించి, డమస్కు పరిపాలకులకు అతి నమ్మకస్థుడుగను, డమస్కు నాయకులకు అతి ప్రాముఖ్యమైన వ్యక్తిగాను, గురిగాను, పౌలు సౌలుగా జీవించినప్పటి విషయము మనకు తెలుస్తున్నది.
అయితే ప్రియపాఠకులారా! పౌలు సౌలుగా ఉన్నప్పుడు బలులు అర్పించాడా? ఈ ప్రశ్న క్రైస్తవ లోకములో కలుగవచ్చును. అబ్రాహాము కాలము నుండి నూతన నిబంధన క్రీస్తు కాలము వరకు, ఆతర్వాత అపొస్తలుల కాలము వరకు బలిపీఠాలు బలులు అర్పణలు కానుకలు, బహుముఖ వ్యాప్తముగా క్రియ జరిగించినట్లు వేదచరిత్ర మనకు వివరిస్తున్నది.
ప్రియపాఠకులారా! బలులర్పించుటలో అపొస్తలుల కాలములో నాటి యూదా జనాంగము ఇశ్రాయేలీయులు, హెబ్రీయులు దైవజనాంగము - వారి శాస్త్రులు పరిసయ్యులు, యాజకులు, ప్రతిమలు రూపించే కంసాలులు, వేదవిద్వాంసులు, వగైరాలందరు ప్రజలలోనుండి దైవత్వము పేర బలులను ప్రాముఖ్యముగా అలరింపజేస్తూ నరులను అజ్ఞాన దశలో నడిపించారేగాని, దైవ పథములో నడిపించిన పుణ్యాన పోలేదు. దైవపథములో నడిపించుటకు దైవజనులను పరిశుద్ధాత్మ దేవుడు ప్రేరేపించి వారి ద్వారా క్రియ జరిగించినప్పుడు వారిని దయ్యము పట్టినవారని, లోకశాస్త్రమును ఆచరించువారని, గారడివారని పిచ్చివారని, దైవద్రోహులు రాజద్రోహులని నానావిధ విమర్శలతో వారిపై అభియోగములు చేస్తూ -నరహంతకుల కంటె కఠినమైన శిక్ష వారిపై విధింపజేసేవారు. ఇట్టి అజ్ఞాన కాలములో ఈ విధమైన పాశవిక స్వభావముతో ప్రవర్తించినవారిలో సౌలు ఒకడు. ఈ సౌలు ధర్మశాస్త్ర ఆచార పారంగతుడుగా యేసుక్రీస్తునకు పూర్తిగా విరోధి. అందునుబట్టి దైవరాజ్యానికి బద్ద శత్రువైనాడు. ఇట్టి శత్రువును జయించుటన్నది ఆ దినాలలో లోకనాధులకుగాని, దైవజనాంగమునకుగాని శక్తి చాలలేదని చెప్పవచ్చును. నాటి అపొస్తలుల కాలములో సౌలును ఎదుర్కొని పోరాడి విజయము సాధించినవాడు లేడు. ఇందునుగూర్చి ప్రత్యక్షముగా యేసుక్రీస్తు ప్రభువుగా అంగీకరించి పౌలుగా మారిన సౌలు ప్రభువును నమ్మని దినములలో,'' 1 తిమోతి 1:12 - నేను దూషకుడును, హింసకుడను, నరహంతకుడను, కఠినుడను, అజ్ఞానియు, దైవత్వమునుగూర్చిన సత్యమునకు దూరమైనవాడనని సాక్ష్యమిచ్చియున్నాడు. అనగా క్రీస్తును బొత్తిగా ఎరుగనట్టివాడు.
ప్రియపాఠకులారా! సౌలుయొక్క జీవితములో రెండు విధములైనటువంటి శారీర, ఆత్మీయ, భూలోక పరలోకము; ఇటు దైవత్వము అటు పైశాచికము ఒకటేమిటి? సకల విధాలుగ సౌలు జీవితము అనేక మలుపులు తిరిగినట్లు సౌలు చరిత్ర వివరిస్తున్నది.
ప్రియపాఠకులారా! పౌలు సౌలుగా ఉన్నప్పుడు ధర్మశాస్త్ర ముసుగులో సాతాను సౌలును తన సాధనముగాను తన పనిముట్టుగాను వాడినట్లు సౌలుయొక్క పూర్వీక జీవితము ద్వారా మనకు తెలుస్తున్నది. అయితే ఆ విధముగా లోకాధికారికిని, లోకమునకును సాధనముగా వాడబడిన సౌలును గూర్చి అపొ 9: 15-16లో అననీయ అను భక్తునికి దైవవాక్కు ప్రత్యక్షమై అననీయా! అని పిలువగా చిత్తము ప్రభువా! అనుటలో సౌలునుగూర్చిన వ్రపచనము అననీయను హెచ్చరించుచు - ''నీవు లేచి తిన్నదనబడిన వీధికి వెళ్ళి యూదా అను వాని ఇంట తార్సు వాడైన పౌలు అను వాని కొరకు విచారించుము. ఇదిగో అతడు ప్రార్థన చేయుచున్నాడు. అతడు అననీయ అనునొక మనుష్యుడు లోపలికి వచ్చి, తాను దృష్టి పొందునట్లు తలమీద చేతులుంచుట చూచియున్నానని చెప్పెను. అందుకు అననీయ ప్రభువా! ఈ మనుష్యుడు యెరూషలేములో నీ పరిశుద్ధులకు ఎంతో కీడు చేసియున్నాడని అతనిగూర్చి అనేకుల వలన వింటిని. ఇక్కడను నీ నామమునుబట్టి ప్రార్థన చేయువారినందరిని బంధించుటకు అతడు ప్రధాన యాజకుల వలన అధికారము పొందియున్నాడని ఉత్తరమిచ్చుటలో ప్రియపాఠకులారా! లోకము - లోకాధికారి ఇరువురును ఏకమై, దేవుని ధర్మశాస్త్ర ముసుగులో అరాచకమునకు పనిముట్టుగాను సాధనముగాను వాహనముగాను వాడబడుచున్నాడు. ప్రభువు అననీయను ఉద్దేశించి - నీవు వెళ్ళుము. అన్య జనుల ఎదుటను, రాజుల ఎదుటను, ఇశ్రాయేలీయుల ఎదుటను, నా నామము భరించుటకు ఇతడు నేను ఏర్పరచుకొనిన సాధనమైయున్నాడు. ఇతడు నా నామము కొరకు ఎన్ని శ్రమలను అనుభవింపవలెనో నేను ఇతనికి చూపుదునని చెప్పెను.'' ఈ రెండు విధములైన సందర్భాలనుబట్టి సౌలుయొక్క జీవితములో ఇద్ద్దరు - సౌలును శారీరముగాను, ఆత్మీయముగాను వాడినట్లును ఆ ఇద్దరిలోను మొదట లోకాధికారి, రెండవదిగ ప్రభువైన యేసుక్రీస్తు ఇరువురును ఇతన్ని వాడుకొనుటలో పేర్లు మార్చి సౌలును పౌలుగా మార్చి యేసుక్రీస్తు'' - ఇంత గొప్ప చరిత్ర సౌలు జీవితములో ఉంది.
కనుక ప్రియపాఠకులారా! ఇదే విధముగా పూర్వము అన్యులమైన మనలను ప్రభువు తన పిలుపు ద్వారా తన సావాసమునకు పిలుచుటలో - తన సావాసములో చేర్చుకొని నిర్జీవ ఆరాధనలకును మూగ విగ్రహాలను, నకిలీ ఆరాధనలకును, లోకసంబంధ కాకమ్మ కథలకును, లోక సంబంధమైన ఆశలకును, వ్యామోహములకును, అలౌకిక శక్తియొక్క బంధకాలలో ఉన్న మనలను తప్పించి, తన వారినిగా తన సావాసములో చేర్చుకొని, సత్యమైన ఆరాధన, సత్యవేదము, పరిశుద్ధుల సావాసము, ఆత్మీయతతోను సత్యముతోను, వివేకముతో కూడిన ఆరాధన, పరలోక ప్రవేశమునకు యోగ్యకరమైన సువార్త ప్రకటన -ఇన్ని హంగులలో మన జీవితాలను మలచి తన వారినిగా మనలను చేసికొన్నాడంటే ప్రియపాఠకులారా! మన జీవితాలు దైవత్వములో శరీరముగాను, ఆత్మీయముగాను అటు పరలోకానికి భూలోకానికి ఎన్ని విధములైన మలుపులలో మలచబడిందో ఒక్కసారి మనము పునరాలోచన చేసికోవలసిన వారమైయున్నాము. ఎందుకంటే నేడు క్రైస్తవులమని చెప్పుకొంటున్న మనము ఒకప్పుడు లోకము చేతను, లోకనాధులచేతను, లోకాచారములతోను లోకసిద్ధాంతాలు లోకాధికారియొక్క శోధన కార్యాలలోను పాలుపంచుకొన్నవారమే. అందుకే ''ఒకప్పుడు మీరు కనికరింపబడక ఇప్పుడు కనికరింపబడితిరి. ఒకప్పుడు మీరు దేవుని ప్రజగా నుండక ఇప్పుడు దేవుని ప్రజయైయున్నారు. 1 పేతురు 2:9-10లో మన శారీర ఆత్మీయ స్థితులనుగూర్చి ఈలాగు వ్రాయబడియున్నది.
కనుక ప్రియపాఠకులారా! ఈ విధముగా దేవునియొక్క ప్రజగా ఎన్నిక చేయబడిన నేటి ప్రజలైన మనము ఈ లోకసంబంధముగా కాక 1 పేతురు 2:11లో ప్రియులారా! మీరు పరదేశులును యాత్రికులునై యున్నామని వ్రాసిన ప్రకారము మనము లోకము వైపు కాకుండ మనకిచ్చిన సమయము, ఆయుష్కాలమునుబట్టి, లోతు భార్య వలె లోకము వైపు చూడక మన స్వదేశము కొరకు యాత్రికులముగా ఈ లోకములో జీవించిన కాలములో సత్యమును గ్రహించి, మన పౌర స్థితి పరలోకములో ఉన్నదని, మన పౌర స్థితి ఈ లోకసంబంధమై యున్నట్లయితే ఈ లోకానికి మనము పరిమితమై యుందుము. అయితే దేవుని ప్రజగా క్రీస్తుయొక్క రక్తము ద్వారా ఆయన బలియాగము ద్వారా దేవుని బిడ్డలుగా తీర్చబడిన మనము ఆయన రాజ్యసంబంధులుగా ఉన్నామన్న సత్యాన్ని గ్రహించి, ఆయన సిలువ వైపు చూస్తూ ఈ లోకయాత్రను సంపూర్ణముగా ముగించవలసిన వారమైయున్నామన్న సత్యాన్ని మరువకూడదు.
ప్రియపాఠకులారా! శారీరరీత్యా లోకములో మనము నానావిధ గృహాలలో నివసించి, నానా విధ భోగభాగ్యాలు అనుభవించినను, ఇవన్నియును మానవ హస్తకృత్యాలలో నరుని చేతి పనులైయున్నవి. నరుల చేతి పనికాక దేవుని చేత కట్టబడిన నిత్యమైన నివాసము పరలోకములో మనకున్నదన్న సత్యాన్ని ప్రభువు మనకు క్షుణ్ణముగా వివరించియుండగా - ఆ సత్యానికి చెవినీయక, లోకసంబంధ బోధలకును, లోకసంబంధ సంపదలకును, ఐశ్వర్యాలకు లోనై లోకములో మనము భూసంబంధముగా కట్టుకున్న నివాసాలే శాశ్వతమని, కేవలము ఇవి భ్రమయని ఎరిగియుండియు ఆ భావములో నుండి తేరుకోలేకపోతున్నాము. మనము కట్టుకొనే గృహాలు, తొడుగుకొనే వస్త్రాలు, వాడుకొనే పనిముట్లు, వ్రాసే కలము, తలుపుకు వేసే తాళము - చెవులు, గడియారాలు, మనము ఎక్కి ప్రయాణించే వాహనాల విషయాలనైతేనేమి గ్యారంటీని కోరుచున్నాము. ఈయొక్క వస్తువులతోబాటు గ్యారంటీని కోరుచున్న మనలో వీటికున్నటువంటి గ్యారంటీ అనగా మనుగడ లేనివారముగా మనము జీవిస్తున్నామన్న సత్యాన్ని అప్పుడప్పుడు మరచిపోతుంటాము. అందుకే దావీదు మహారాజు ప్రభువా! నా దినాలు లెక్కించుట నాకు తెల్పుము. నీ సన్నిధిలో నేను అల్పుడనేగాక ఎంత సంపాదించినను లోకరీత్యా ఎన్ని భవంతులు, మేడలున్నను మనము అస్థిరులమే, అన్న సత్యాన్ని దైవజనులైన మనము మరచిపోకూడదు. భూమిమీద స్థిరులైన నరులు లేరు. భూమి మీద స్థిరమైనది ఒక్కటే అది దేవుని వాక్యమే. భూమి మీద స్థిరమైనది ఒక్కటే అది యేసు నామము, భూమి మీద స్థిరమైనది ఒక్కటే అది దేవుడు నరులకు ఇచ్చిన పరిశుద్ధ గ్రంథము. ఇది ప్రవచన సముదాయములతో కూడినదై పరిశుద్ధుడైన దేవునియొక్క మహిమాన్విత క్రియ. ఆయనలోని దైవత్వము, ఆయన నిత్యత్వము, ఆయన మహిమను బయల్పరచుచున్నది గనుక ఇది స్థిరమైనది.
ఇంకను స్థిరమైనదేమిటంటే 1 కొరింథీ 3:11లో వలె ''వేయబడినది తప్ప, మరియొక పునాది ఎవడును వేయనేరడు. ఈ పునాది యేసుక్రీస్తే'' అను పునాది - ఇది స్థిరమైన పునాది. నరుల చేత గాక దేవుని చేత వేయబడిన పునాది. ఇది ఎవడును వేయనేరని పునాది. ఈ పునాది మీద కట్టబడిన విశ్వాసి యొక్క జీవితము, సంఘము, సమాజము, మందిరము దైవమహిమను లోకానికి కనబరచు దైవత్వము యొక్క ప్రతిష్టతను చాటుచున్నది.
కనుక ప్రియపాఠకులారా! లోకరీత్యా దేవుళ్ళు కాని విగ్రహాలు, దేవతలు కానట్టి రూపములు దైవసృష్టములు, దైవరూపాలతో ఏర్పరచబడిన మందిరాలు - ఇవన్నియు అశాశ్వతములైనవని ఇందునుబట్టి మనము గ్రహించాలి.
కనుక ప్రియపాఠకులారా! భూమిమీద దైవత్వానికి వేయబడిన పునాది యేసుక్రీస్తు తప్ప విగ్రహాలు కావు. ఆ విగ్రహాలకు సంబంధించిన నామములు కావు. దేవుడు తన కుమారుడైన యేసు అను సజీవమైన రాయి ద్వారా లోకములోని నరులను తన రాజ్యవారసులుగ వారిని ఒక సంఘముగా కట్టుటకు తన కుమారునియొక్క శారీర బలియాగము అను ఆయన భూమిలో స్థాపించుటనుబట్టి, దేవుని రాజ్యము భూమి మీద విస్తరించుటయేగాక దైవమందిరాలు కట్టబడుటలో క్రీస్తు దేహము పునాదిరాయిగా పాతబడినట్లును వ్రేయబడినట్లును) ఈ విధముగా పాతివేయబడిన క్రీస్తు దేహము సజీవమై, అనేక మందిరాలు కట్టుటకు అది మూలరాయియు, తెల్లరాయియుయైనట్లు గ్రహించాలి. కనుక ప్రియ పాఠకులారా! లోకములో ఈ నామమునుబట్టిగాక ఏ నామములో మనకు రక్షణ లేదన్న విషయాన్ని మరియు సత్యాన్ని మనము గ్రహించాలి.
.......
ఫిలిఫ్పీ 2:5-8 క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగియుండుడిః ఆయన దేవుని స్వరూపము కలిగినవాడైయుండి, దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు గాని మనుష్యుల పోలికగా పుట్టి, దాసుని స్వరూపమును ధరించుకొని, తన్ను తాను రిక్తునిగా చేసికొనెను. మరియు ఆయన ఆకారమందు మనుష్యుడుగా కనబడి, మరణము పొందునంతగా అనగా సిలువ మరణము పొందునంతగా విధేయత చూపినవాడై తన్ను తాను తగ్గించుకొనెను.'' ఇందునుగూర్చి దైవనిగూఢ మర్మయుతమైన ప్రత్యక్షీకరణ.
ప్రియపాఠకులారా! నేటి నూతన నిబంధన విశ్వాసులైన మనలో క్రీస్తు యేసుకు కలిగిన ఈ మనస్సు,'' అనుటలో అది ఏ మనస్సు? అది ఎలాంటి మనస్సు? ఆ మనస్సు స్వార్థపూరితమైన మనస్సా లేక నిస్వార్థమైన మనస్సా? అసలు క్రీస్తు యేసునకు కల్గిన ఈ మనస్సు'' అనుటలో ఈ లేఖన భాగరచయిత పౌలు ఫిలిప్పీయ సంఘాన్ని హెచ్చరిస్తూ ఫిలిప్పీయలో ఉన్న క్రీస్తు యేసునందు సకల అధ్యక్షులకును సంఘస్థులకును, పరిచారకులకును, క్రీస్తు యేసునుగూర్చిన వివరము - విశ్వాసులకు ఆది విశ్వాసులైన మొట్టమొదట విశ్వసించిన పిలిప్పీయ సంఘానికి సువార్త ప్రకటించుచు పల్కిన మాటలు ఇవి. క్రీస్తు యేసునకు కల్గిన ఈ మనస్సు,'' అనుటలో పౌలు పరిచర్య జరిగించిన కాలములో ఆయన లేఖన భాగము రచించి సంఘాలలో అనేకుల మనస్సులను అనేకులైన వారిని గూర్చి పౌలు ఎరిగియున్నాడు. ఏయే వ్యక్తులు ఎలాంటివారో ఏయే సంఘాల ఆత్మీయ స్థితి ఎలాగుందో వారి విశ్వాసము ఎలాగుందో - ఆ సంఘాలయొక్క ఆత్మీయ పరిశోధనను పరిశోధించినవాడై పౌలు వ్రాసిన ఎనిమిది సంఘాలయొక్క లేఖలు నేటి విశ్వాసులైన మనకు మన సంఘాలకు పౌలు ప్రకటించిన సువార్త ఉద్దేశాలు, ఆయన వారికిచ్చిన హెచ్చరికలు వారు పాటించవలసిన హెచ్చరికలనుగూర్చి నియమావళినిగూర్చి వ్రాసిన పత్రికలు మనము చదవమనియు, అయితే ఫిలిప్పీ సంఘానికి పౌలు వ్రాసిన ఆ పత్రికలో 2:5-8 ఆయన రచించిన లేఖన భాగములోని సత్యము. పై మూల వాక్యమునుబట్టి క్రీస్తు యేసునకు కల్గిన మనస్సును కల్గినవారున్నారా? ఇందుకు బాహ్యములో గాక వేదములోనే నూతన నిబంధనలోనేగాక, అపొస్తలుల చరిత్రలో అపొస్తలుల పరిచర్యలో కూడా క్రీస్తుయేసుకు కల్గిన మనస్సును ధరించుకొన్నవారున్నారా? అన్న ప్రశ్న నేటి విశ్వాసులమైన మనకు కలుగవచ్చును. దీనికి జవాబు నూతన నిబంధనలో కంటే అపొస్తలుల పరిచర్యలో కంటె, పాత నిబంధన చరిత్రలోనే ఈలాంటి మనస్సు కల్గినవాడున్నట్లు మనకు ప్రత్యక్షమైన ఋజువులున్నవి. ఈ సందర్భములో ఒక వ్యక్తినిగూర్చి మనము వివరముగా తెలిసికొందము. ఈ వ్యక్తిలో నూతన నిబంధనలో క్రీస్తు యేసునకు కల్గిన మనస్సు ఏ విధముగా క్రియ జరిగించింది అన్నది ప్రత్యక్షముగా క్రియ మూలకముగా బహు వివరముగా తెలిసికొందము.
1 సమూయేలు 18:1లో దావీదు సౌలుతో మాటలాడుట చాలించినప్పుడు యోనా తాను హృదయము దావీదు హృదయముతో కలిసిపోయెను,'' క్రీస్తు యేసునకు కల్గిన ఈ మనస్సు అనగా నేమి? అది ఏ మనస్సు? అది చేసిన పని ఏమి? యోనాతాను ఎవరు? ఇశ్రాయేలు రాజైన సౌలుయొక్క కుమారుడు - రాకుమారుడు. సమూయేలు గ్రంథముపై లేఖన భాగములో సౌలు రాజు దర్బారులో ఇద్దరు యువకులు నిలువబడియున్నారు. ఈ ఇద్దరిలో ఒకడు సౌలు రాజు కుమారుడు అందులో ఒకడు రాజకుమారుడు. సకల సంపదలు, యుద్ధ నైపుణ్యత కలిగి రాజవస్త్రాలు ధరించి యుద్ధ ఉపకరణాలు ధరించినవాడు. రెండవవాడు యెష్షయియొక్క చివరి కుమారుడు బాలుడు వస్త్రహీనుడు అనగా సరియైన వస్త్రాలంకరణ లేనివాడు పైపెచ్చు గొర్రెల కాపరి. యుద్ధనైపుణ్యతగాని, ఆయుధాలు వాడుటగాని సరియైన గుడ్డలుగాని లేని పేదవాడు. అయితే ఆనాటి రాజదర్బారులో రాజకుమారునితోబాటు గొర్రెల కాపరి మరియు పేదవాడును సరియైనటువంటి ఆయుధ శిక్షణ లేనివాడైన దావీదు కూడా నిలబడినాడు. యోనాతాను నిలబడిన పరిస్థితి వేరు. దావీదు నిలబడిన పరిస్థితి వేరు. యోనాతాను తన తండ్రియైనటు వంటి రాజైన సౌలు సరసన నిలువబడియున్నాడు. అలాగే సౌలునకును యోనా తానుకు ఎదురుగా బాలుడైన దావీదు ఒక చేతిలో ఒడిసెలు మరొక చేతిలో నరకబడిన గొలియాతు తలపట్టుకొని నిలిచి యున్నాడు. అయితే సౌలు రాజు ఇద్దరిని మెచ్చుకొన్నవానిగా సభకు కనబడినను దావీదు విజయానికి ఈర్ష్య కలిగినవాడై 1 సమూయేలు 18:9 దావీదు మీద విషపు చూపు నిలిపాడు.
ప్రియపాఠకులారా! చూపులలో నానావిధ చూపులున్నవి, ప్రేమ చూపు, దీనమైన చూపు,ఈర్ష్యతో కూడిన చూపు, కనికరము గల చూపు, ఆదరణనిచ్చే చూపు, ఆదరించే చూపు, అభ్యర్థించే చూపు, భిక్షమెత్తే చూపు. వీటన్నిటికంటె అతి ప్రమాదకరమైనది విషపు చూపు. ఇది ఎదుటివానిని హత్య చేయుటకు క్రియ జరిగించే చూపు. ఈ చూపుకు విరుగుడు లేదు. ఈ చూపు ద్వారా కలిగే క్రియ అతిదారుణమైనదియు ప్రమాదకరమైనదియు నరునిలోని మానవత్వమును సంపూర్ణముగా సమాధి చేయునదియునైయున్నది. ఇట్టి చూపుతో సౌలు దావీదును చూచాడు. అనగా ఇట్టి చూపును దావీదు మీద నిలిపినాడు. ఇట్టి చూపు వల్ల ఫలితము వెనువెంటనే సౌలులో క్రియ జరిగించింది. 1 సమూయేలు 18: 10-12 ఈ విషపు చూపు ద్వారా సౌలును ఆవరించి జరిగించిన దురాత్మనుగూర్చి చదువగలము. దురాత్మ ప్రభావము, ప్రేరేపణ మూలముగా దావీదును చంపుటకు ఎంత ప్రయత్నించాడో అదే సౌలు కుమారుడైన యోనాతాను మరి అరువది రెట్లు అధికమైన ప్రేమను దావీదుపట్ల చూపించాడు. యోనాతాను అంటే దేవుని వరము అని అర్ధము. దావీదు అంటే హెబ్రీభాషలో ప్రేమను పొందదగినవాడు అని అర్థము. ఈ విధముగా దేవుని వరమైన యోనాతానుయొక్క సకల సంపదలను, జ్ఞానాన్ని, త్యాగాన్ని, సమర్పణను దావీదుకు చెందినట్లు ఇందునుబట్టి తెలుస్తున్నది. అనగా యోనాతాను దావీదుకు తన సర్వస్వము ధారబోశాడు. మొట్టమొదటగా బంగారుతో పొదగబడిన తన శృంగార రాజ వస్త్రమును, తన భుజము నుండి తీసి దావీదుకు కప్పినాడు. ఇది మన పాపపరిహారార్థముగ మన పాప దిగంబరత్వము కప్పుటకు యేసుక్రీస్తు సిలువ రక్తముతో కడుగబడిన తన రక్షణ వస్త్రమునకు గుర్తు. ప్రకటన 7:14 వీరు మహాశ్రమలలో గొర్రెపిల్ల రక్తములో తమ వస్త్రములను ఉదుకుకొని వాటిని తెలుపు చేసికొన్నవారు. ఆ విధమైన భావాన్ని యోనాతాను కప్పిన వస్త్రము దైవనిగూఢసత్యమును బయల్పరుస్తున్నది.
అంతేగాదు యోనాతాను తన కత్తిని కూడా దావీదునకు ఇచ్చాడు. దావీదు చేతనున్న ఒడిసెలను పడవేసి, యోనాతాను తనకిచ్చిన పదునైన కత్తి మన ఇహలోక సంబంధ జీవితములో ఆత్మ సంబంధ ఎదుగుదలకై జయ జీవితమిచ్చిన వాక్య ఖడ్గము. ఇందునుగూర్చి ఎఫెసీ 6:17లో ఈ విధముగా చదువగలము. దేవుని వాక్యము అను ఆత్మ ఖడ్గమును ధరించుకొనుడి'', అనుటలో ఆ ఆత్మ ఖడ్గమన్నదే జీవవాక్యము. ఆ వాక్యమునకు ముంగుర్తు యోనాతాను దావీదుకు ఇచ్చిన ఖడ్గము. ఇక మూడవదిగ యోనాతాను దావీదు చేతిలోని గొలియాతు తలను తీసివేసి తన విల్లును దావీదు భుజముల మీద ఉంచాడు. ఇది దేవుడు మన భుజముల మీద ఉంచిన సువార్త భారమునకు గుర్తు. ఈ సందర్భములో ప్రకటన
6:2లో ఈ విధముగా చదువగలము. అతనికి ఒక కిరీటమియ్యబడెను, అతడు జయించుచు, జయించుటకు బయలు వెళ్ళెను,'' అనగా ఈ విల్లు ప్రతి ప్రభువు విశ్వాసియొక్క జీవితములో అతడు మోయవలసిన సువార్త భారమునకు సూచకమైయున్నది. ఇక యోనా తాను దావీదునకు తన నడికట్టును కట్టుకొనుటకు ఇచ్చాడు. ఈ నడికట్టు అన్నది దైవకార్యముచేయుటకు దేవుడు మనకిచ్చిన పరిశుద్ధాత్మ వరమునకు సాదృశ్యము. సాతానును లోకమును మన శరీరేచ్ఛలను జయించుటకు పరిశుద్ధాత్మ వలన మనకు ఇవ్వబడియున్నది. ఈ సందర్భములో లూకా 12:35లో మీనడుములు కట్టుకొని యుండుడి, మీ దీపములు వెలుగుచుండనియ్యుడి, మనము విశ్వాసమందు స్థిరముగా నిలబడి పోరాడుటకు శక్తి కావాలి. అందుకు ఈ నడికట్టు అవసరము.
ప్రియపాఠకులారా! ఇశ్రాయేలుకు ప్రధమ రాజుగ నియమించబడిన గాడిదల కాపరియైన సౌలును దేవుడు తన జనాంగమైన ఇశ్రాయేలుకు రాజుగా నియమించాడు. అయితే ఆ రాచరికాన్ని సౌలు నిలుపుకోలేకపోగా దైవాభిషక్తుడైన తన పరిపాలనా సింహాసనాన్ని నిలబెట్టి దైవజనాంగమైన ఇశ్రాయేలు విజయానికి కారకుడైన బాలుడైన దావీదు పట్ల కృతజ్ఞత చూపుటకు బదులు అతనిని అభినందించుటకు బదులు అతనిపై బల్లెము దూసినాడు. అయితే అదే రాజైన సౌలు కుమారుడు తన హృదయాన్ని దావీదునకు ఇచ్చుటయేగాక తన రాచరికాన్ని తన రాజవస్త్రాన్ని తనయొక్క కత్తిని విల్లును నడికట్టును అనగా తన రాచరిక వైభోగము యావత్తును - బీదవాడును యెష్షయి కుమారులలో ఎన్నికలేనివాడును, వస్త్రహీనుడును, ఎలాంటి ఆయుధ నైపుణ్యత లేనివాడును గొర్రెలకాపరియై తనకంటె చిన్నవాడైన బాలుడైన దావీదునకు ఇచ్చి రాజకుమారుడైన యోనాతాను దరిద్రుడయ్యాడు. దావీదు రాజయ్యాడు. గొర్రెల కుమారుడు రాజకుమారుడు. రాజకుమారుడు బికారి అయ్యాడు. అలాగే దైవకుమారుడు తన రక్షణ వస్త్రాన్ని మనకు ఇచ్చాడు, తన వాక్యమనే ఖడ్గాన్ని మనకు ఇచ్చాడు. తన సువార్త భారమును మన భుజముల మీద ఉంచాడు. తన నడికట్టును అనగా ఆత్మీయముగా నిలబడే శక్తిని మనకు అనుగ్రహించాడు. చివరిగా తన ప్రాణాన్నే ధారబోసాడు. అనగా తన సమస్తమును మనకొరకై ధారపోసి, రిక్తుడయ్యాడు. అందుకే పౌలు క్రీస్తుయేసునకు కల్గిన ఈ మనస్సును మీరు కలిగియుండుడి అంటున్నాడు. నేటి ఈ యుగములో నేటి విశ్వాసుల కాలములో నేడు ఈలాంటి మనస్సు కల్గినవారున్నారా? ఇందుకు జవాబు మనకు మనమే నిర్ణయించాలి.
........
రోమా 8:1-11 కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వానికి ఏ శిక్షావిధియులేదు. క్రీస్తుయేసు నందు జీవము ఇచ్చు ఆత్మయొక్క నియమము - పాపమరణముల నియమమునుండి నన్ను విడిపించెను. ఎట్లనగా ధర్మశాస్త్రము దేనిని చేయజాలకపోయెనో దానిని దేవుడు చేసెను. శరీరము ననుసరింపక ఆత్మననుసరించియే నడుచుకొను మనయందు ధర్మశాస్త్ర సంబంధమైన నీతి విధి నెరవేర్చబడవలెనని, పాపపరిహారము నిమిత్తము దేవుడు తన సొంత కుమారుని పాపశరీరాకారముతో పంపి, ఆయన శరీరమందు పాపమునకు శిక్ష విధించెను. శరీరానుసారులు శరీర విషయముల మీద మనస్సు నుంతురు. ఆత్మానుసారులు ఆత్మ విషయముల మీద మనస్సునుంతురు. శరీరానుసారమైన మనస్సు మరణము, ఆత్మానుసారమైన మనస్సు జీవమును సమాధానమునైయున్నది. ఏలయనగా శరీరానుసారమైన మనస్సు దేవునికి విరోధమైయున్నది. అది దేవుని ధర్మశాస్త్రమునకు లోబడదు, ఏ మాత్రమును లోబడనేరదు. కాగా శరీర స్వభావము గలవారు దేవుని సంతోషపరచనేరరు. దేవుని ఆత్మ మీలో నివసించియున్న యెడల మీరు ఆత్మ స్వభావము గలవారేగాని శరీర స్వభావము గలవారు కారు. ఎవడైనను క్రీస్తు ఆత్మ లేనివాడైతే వాడు ఆయన వాడు కాదు. క్రీస్తు మీలోనున్న యెడల మీ శరీరము పాపవిషయమై మృతమైనది గాని మీ ఆత్మ నీతి విషయమై జీవము కలిగియున్నది. మృతులలో నుండి యేసును లేపిన వాని ఆత్మ మీలో నివసించిన యెడల మృతులలో నుండి క్రీస్తుయేసును లేపినవాడు చావునకు లోనైన మీ శరీరములను కూడా మీలో నివసించుచున్న తన ఆత్మ ద్వారా జీవింపజేయును,'' ఇది ఈ లేఖన భాగములోని ముఖ్యాంశములు.
ప్రియపాఠకులారా! రోమీయులకు పౌలు వ్రాసిన పై వేదభాగములో మొట్టమొదటి మాట ''క్రీస్తు యేసునందున్న వానికి ఏ శిక్షావిధియులేదు,'' అనుటలో క్రీస్తు యేసునందు జీవించినవారికి లోకరీత్యా కలిగినటువంటి అవమానము దూషణ శ్రమ హింసశిక్ష మరణమునుగూర్చి వేదరీత్యా మనము తెలిసికొందము. ప్రియపాఠకులారా! భూమిమీద దైవరాజ్య స్థాపననుగూర్చి దేవుడు తన స్వంత కుమారుని ఈ లోకానికి పంపినప్పుడు ఆయన అనుభవించింది సంతోషము కాదుగాని విమర్శలు, దూషణలు, వేదన లోక ప్రభుత్వము ద్వారా అభియోగము - ఆ అభియోగమును బట్టి, లోక ప్రభుత్వ యంత్రాంగము విధించిన శిక్ష, తీర్చిన తీర్పు - తద్వారా మరణము వగైరాలన్నియు క్రీస్తుయొక్క ఆత్మ పొందినట్టి వేదనలు బాధలు శిక్షను గూర్చి నూతన నిబంధన నాలుగు సువార్తలలో మనము చదువగలము. అంతేగాకుండ ఆయనను తమ గురువుగ తమ అధ్యాపకుడుగ తమ రక్షకునిగ, ఒక ప్రవక్తగా ఆయనను గౌరవించి, ఆయనయందు విశ్వాసముంచి ఆయన చేత ప్రతిష్టించబడి అపొస్తలులుగ దైవత్వముచే నిర్ధారించబడి, ఈ లోకములో సంచరించిన యేసుక్రీస్తు శిష్యులు వారు కూడా యేసువలెనే అనేక సమస్యలకు లోనై లోకము చేత పట్టుబడి - చెరసాల కొరడా దెబ్బలు, అన్యాయపు అభియోగాలు తత్సబంధ విచారణలకు లోనై చెరసాలపాలై తుదకు మరణశిక్ష ద్వారా క్రీస్తు చరిత్రకు సాక్షులైనట్లు అపొస్తలుల చరిత్ర ద్వారా తెలిసిన విషయమే. ఇక అపొస్తలుల బోధయందు విశ్వాసముంచి దేవుని కూటమిగ ఏర్పరచబడిన సంఘము కూడా సమస్యలు అన్యాయపు తీర్పులు చెరసాల శ్రమలు సంభవించాయి. ఈ విధముగా శ్రమలు అనుభవించిన క్రీస్తుయొక్క సంఘాలలో మొట్టమొదటి హతసాక్షియైనవాడు స్తైఫను. ఈ విధముగా శ్రమలు సమస్యలు దండన చెరసాల వగైరా చేదు అనుభవాలతో ఏర్పడినట్టి సంఘము - క్రీస్తు సంఘముగా నేడు మన మధ్య విస్తరించియున్నది. రోమీయులకు వ్రాసిన పత్రికలో పౌలు కూడా ఇట్టి చేదు అనుభవాలు కఠిన శిక్షలు చెరసాల కొరడా దెబ్బలు - విశేషముగా చెప్పాలంటే ఖడ్గముతో నరకబడుట కూడా మనమెరిగిన విషయమే.
అయితే ఈ వేదభాగములో క్రీస్తుయేసునందున్న వానికి ఏ శిక్షావిధి లేదు. అంటున్నాడు. ప్రియపాఠకులారా! ఆది నుండి నేటి వరకు క్రైస్తవ జీవితములో జీవిస్తున్న వ్యక్తికిని అతని గృహానికి అతని కుటుంబ వ్యవస్థకును, లోకరీత్యా జరుగుచున్నట్టి నరుల ద్వారాగాని, లోక ప్రభుత్వ పరంగా ప్రత్యక్ష చట్టాలలోగాని, ఇరుగుపొరుగుగాని, సాటి క్రైస్తవ్యములోగాని ఎంతవరకు సంతోష సమాధానమును అనుభవిస్తున్నాడు?'' అనిన ఈ ప్రశ్నకు జవాబు చెప్పగల్గిన జ్ఞానము మనకున్నదా? పౌలు తన ప్రవచనాలలో క్రీస్తు యేసునందున్న వానికి ఏ శిక్షావిధి లేదు,'' అని సులభముగా అన్నాడు. కాని ఆయన అనుభవించింది శిక్షయే గదా?
ప్రియపాఠకులారా! శిక్ష అన్నది మరణమన్నది తృణీకరణన్నది ఈ మూడును ఆదిలో దైవత్వము నుండియే ప్రారంభమైంది. ఏదెను వనములో నరుడు దైవత్వముతో కలిసి మెలసి జీవించిన కాలములో ఏ విధమైన శిక్షలేదు, మరణభయము లేదు, ఎలాంటి సమస్య దేనిని గూర్చిన కొరతలేదు. అయితే ఈ కొరతలు సమస్యలు హేళనలు నరునికి ఏర్పడుటకు దైవత్వమునుండియే కల్గినట్లుగ ఏదెను చరిత్రలో మనము తెలిసికొందము. ఎలాగంటే ఆదిలో నరజంట దైవత్వములో ఐక్యమై నరునితో దేవుడు - దేవునితో నరులు ఉభయులు ఒకరిలోనొకరు (నరుని ఆత్మ దేవునితో ఉన్నది - దేవుని ఆత్మ నరునిలో ఉన్నది) ఏ సమస్య ఏ భయము ఏ శిక్ష నరునికి కలుగలేదు. ఎందుకంటే సృష్టికర్తయైన దేవుడు ఏ విధముగా పరలోక సామ్రాజ్యాన్ని ఏలుచున్నాడో ఆలాగే భూలోక పరిపాలన చేయుటకు నరుని తన ప్రతినిధిగ నేలమంటితో రూపించి తన ఆత్మను అతనిలో ఉంచి తన ప్రతినిధిగ తన సృష్టిని ఏలుటకు అధికారమిచ్చాడు అంటే దేవుడు తన రక్షణ వలయములో తన వెలుగులో తన వాక్కులో తన క్రమశిక్షణలో నరుని ఉంచుటనుబట్టి - ఆది నరుడు దేవుని యందుండబట్టి ఏ శిక్షా విధియు లోకముగాని, లోకములోని ఏ శక్తిగాని నరుని ఏమియు చేయలేకపోయినవి. ఇందుకు కారణము ఆది నరుడు దేవునిలో ఉండుటయే, ఆది దేవునిలో ఉండబట్టి అతనికి ఏ సమస్య ఏయొక్క అనారోగ్యము ప్రాణభయము ఏ విధమైన సమస్యలు లేవు. నిశ్చింతగ నిర్భయముగా పూర్ణ స్వాతంత్య్రముతో సృష్టికర్తయైన దేవునితో కలిసి జీవించాడు. ఇందుకు కారణము దేవునియందు జీవమిచ్చే ఆత్మయొక్క నియమము - ఆదామును పాపమరణమన్న నియమము నుండి దూరపరచింది. ఇందునుబట్టి ఆదినరుడు ఆత్మ ద్వారా జీవించాడేగాని శారీరరీత్యా జీవించిన వాడుకాదని నిర్ధారణ అగుచున్నది. అనగా ఆదినరుడు ఆదాము శారీరేచ్ఛలు శారీర స్వభావము శరీర జ్ఞానము శరీర నియమాలను పాటించక, తనకు ఆత్మననుగ్రహించిన పరిశుద్ధాత్మననుసరించి, ఆయన నీతిని నెరవేరుస్తూ ఎలాంటి అనారోగ్యమునకును వ్యాధికిని, అపరిశుద్ధ వాతావరణానికి లోనుగాకుండా దైవత్వములో జీవించాడు. ఇది సృష్టికర్తయైన ఆది దేవునిలో జీవించినవానికున్న ఐశ్వర్యము - మహాభాగ్యమై యున్నది.
అయితే ఈ ఐశ్వర్యమును అనగా దేవునితో ఉండి దేవునిలో జీవించి, దేవునితో కలిసి జీవించిన ఈ ప్రశస్తమైన విలువను, ఆయన అనుగ్రహించిన అధికారమును నరుడు కాపాడుకోలేకపోయాడు. ఎందుకనగా దైవాత్మకును దృశ్యమైన శరీరమును దాల్చిన జీవాత్మకును మధ్య వైషమ్యాన్ని పుట్టించింది సర్పము. ఆ విధముగా దైవత్వమునుండి నరుని వేరుపరచి లోకానికి ముడిపెట్టింది. భూఫలమును తినుటనుబట్టి నరునికిని మరణానికిని భూమియు ఒకదానికొకటి మధ్యవర్తులుగా వ్యవహరించి, నర జీవితమును పాపభూయిష్టముగాను దైవోగ్రతకు యోగ్యముగాను మరణపాత్రముగాను మార్చి వేసింది. ఇందుకు కారణము నరుడు భూమికి లోకానికి తన హృదయములో స్థానమిచ్చి తన జ్ఞానమును అజ్ఞానముగా మార్చుకొని జరిగించిన దైవ వ్యతిరేక క్రియయని మనము గ్రహించగలము. ఏదెను నుండి ప్రారంభమై నరునికి సంభవించిన దైవిక ఎడబాటు అన్నది నరునికి చలనాన్ని కల్గించక పోయినను, దేవుని ఆత్మమాత్రము బహు గొప్పగా చలించి ఆది 1:1-2లో విధముగా నూతన సృష్టి నిర్మాణ కార్యములో అగాధ జలములలో ఉన్న భూమిని సృష్టములతో అలంకరించాలని, దైవాత్మ ఎలాగ అల్లలాడిందో అలాగే తన జీవాత్మను అనుగ్రహించిన నరునిగూర్చి అంతకంటె రెండింతలుగ దైవాత్మ అల్లలాడింది. తనలో నుండి దూరమైన నరునిగూర్చి సంతాపపడి నరుడు తనలో జీవించాలని, నరుడు తన సొత్తని, తన ఆత్మలో భాగస్వామియని, కనుక నరుని విషయములో, ఒక ప్రత్యేక శ్రద్ధను వహించి వానిని తన పరిధి నుండి తొలిగిపోకుండ తన వానినిగా జేసికొని, తనలో ఐక్యపరచుటకు దేవుడు లోకానికి జరిగించిన క్రియ వేదరీత్యా అనేకములున్నవి. కాని వేదరీత్యా ఉదాహరణగా కొన్ని సంఘటనలు తెలిసికొందము.
ప్రియపాఠకులారా! ఆదాము దోషియై దైవవనము నుండి తరిమి వేయబడేటప్పుడు దేవుడు ఆదాముతో పూర్తిగ సంబంధ బాంధవ్యాలను త్రెంపుకోక, నరుడు తన సొత్తేనన్న సత్యాన్ని లోకానికి బయల్పరచుచు, చెట్టు ఆకులు చుట్టుకొన్న నరజంటకు చర్మపు దుస్తులు తొడిగినట్లు వేదరీత్యా చదువగలము. ఈ చర్మపు దుస్తులన్నవి దేవుడు నరునికి తనకు ఉన్నటువంటి సంబంధ బాంధవ్యాలను గూర్చి క్రియారూపముగా ప్రత్యక్షముగా బయల్పరచిన వాగ్ధాన పూర్వకమైన క్రియయైయున్నది. ఇట్టి చర్మపు చొక్కాయ ప్రభావమునుబట్టి ఆది నరజంట దేవుని కుమారులుగ పిలువబడినట్లును, వారు చేసిన దైవాతిక్రమణను బట్టి వారి జ్యేష్ఠ కుమారుడును ప్రథమ ఫలమైన కయీను మనుష్య కుమారునిగ పిలువబడినట్లు ఆది 6:లో చదువగలము.'' నరులు భూమి మీద విస్తరింప నారంభించిన తరువాత కుమార్తెలు వారికి పుట్టినప్పుడు దేవుని కుమారులు - నరుల కుమార్తెలు చక్కనివారని చూచి, వారందరిలో తమకు మనస్సు వచ్చిన స్త్రీలను వివాహము చేసికొన్నట్లు వ్రాయబడియుండుట మనకు తెలిసిన విషయమే, కనుక ఈ జనాభాలో రెండు వర్గాలు - దేవుని కుమారులు అనగా ఆదాము సంతతి, మనుష్యకుమారులు అనగా కయీనుకు పుట్టినవారు. దేవుని కుమారులు అనిన పేరు మాత్రమే ఉన్నదిగాని వారు నరులకు కుమార్తెలతో లౌకిక సంబంధము ఏర్పరచుకోబట్టి ఉభయ భ్రష్టులైనట్లే; అయితే దేవునియొక్క తీర్పు ద్వారా మనకు అర్థమగుచున్నది. ఎందుకనగా దేవుని కుమారులను నరుల కుమార్తెలను కూడా దేవుడు జలప్రళయ మారణహోమములో నాశనము చేసినట్లు వేదరీత్యా మనమెరిగిన సత్యము. ఇందుకు కారణము దేవునిలోనుండి తొలగిపోవుటయని తెలుస్తుంది.
కనుక ప్రియపాఠకులారా! దేవునిలో ఉన్నవానికి శిక్ష లేదని దైవత్వము నుండి తొలగినవానికి శిక్ష తప్పదని మనము గ్రహించవలసియున్నది. అటుతర్వాత జలప్రళయము నుండి విస్తరించిన జనాభా దేవుని సృష్టి కార్యక్రమములో నోవహుతో ఏర్పడిన జనాభా - దేవునితో కలిసి జీవించే జనాభాలో కూడా ధన్యతను కోల్పోయిన జనాభానుబట్టి తనకంటూ ఇశ్రాయేలు అను తన జనాభాగా ఒక కూటమిని ఏర్పరచినాడు. వీరు దేవునిలో దైవత్వముతో జీవించినవారు, దైవపోషణలో ఎదిగినవారు, దైవమార్గములో నడిచినవారు దేవుని బిడ్డలుగా పిలువబడినవారు. ఇట్టివారు దేవునితోను, దైవమార్గములోను, దైవ సిద్ధాంతములోను దైవనడుపుదలలోను దైవరక్షణ వలయములోను జీవించినంతకాలము, ఏ విధమైన సమస్యలకు భయాలకు శ్రమలకు వేదనలకు గురిగాక, దైవకాపుదల దైవపోషణలో దైవమార్గములో అభివృద్ధి చెందారు. అయితే వీరు దైవత్వము మీద తిరుగుబాటు జేసినందున దేవుడు వారిపట్ల ఆగ్రహించి, వారికి కల్గించిన శ్రమలు వేదనలు బాధలనుగూర్చి మనము వేదరీత్యా కూడా చదువగలము. అనగా వారిని అన్య రాజులకు అప్పగించుట, పాములతో మొత్తుట, నిరాహారులుగ జేయుట, ప్రత్యక్షముగా తన దండముతో వారిని శిక్షించుటన్నది మనమెరిగిన సత్యమే, అయినను దేవుడు నరుని ఆత్మ తనలో ఐక్యము కావాలని ఆశించి ఇశ్రాయేలుకు దేవుని ధర్మశాస్త్రమైయున్న రెండు రాతిపలకలను తన జనాంగానికి ఇచ్చాడు. ఈ శాసనాలను కూడా నరులపట్ల బహుకఠినముగా క్రియ జరిగించాయి. అనగా దేవునిచే లిఖించబడినటువంటి ఈ ధర్మశాస్త్రము అను రాతిపలకలు మోషే ధర్మశాస్త్రముగాను, దేవుని ధర్మశాస్త్రముగాను, దేవుని మందసముగాను, దేవుని కట్టడలుగాను, దేవుని ఆజ్ఞలుగాను నాటి కాలములో ఇవి రూపాంతరము పొంది క్రియ జరిగించినను, నాటి జనాంగము వీటిని ఆచరించినను దీని క్రమములో నిలువలేకపోయారు. అనగా ధర్మశాస్త్రాన్ని కూడా నాటి జనులు అతిక్రమించినట్లుగ నిర్గమ లేవీ ద్వితీయోపదేశ అను నాలుగు కాండాలలో చదువగలము.
ఈ విధముగా దేవుని ధర్మశాస్త్రానికి కూడా విధేయించని నరునియొక్క బలహీనతకు అనగా జీవాత్ముడైన నరుడు లోకఫలమునకు భూఫలమునకు దాసుడై, లోకాకర్షణకు లోనై అనగా భూమి చేత భూసంపద భూసంబంధ నిధి నిక్షేపాలు - భూసంబంధమైన ఫలములు భూసంబంధమైన చర స్థిర ఆస్థులు, భూసంబంధమైన నానా విధ ఆకర్షణలు అనగా ఫలముల చేతను పుష్పముల చేతను సిరిచేతను లోహసంబంధ ఐశ్వర్యముల చేతను, ఇవిగాక వ్యామోహము చేతను దైవత్వమునకు దూరమై పరలోకము అన్నదేమిటో ఎరుగని స్థితిలో - అసలు పరలోకమన్నది ఉన్నదా? అన్న బలహీనతకు దిగజారి, పరలోకమును - పరలోకాధిపతియైన దేవుని ఆయన ఆజ్ఞలను ఆయన క్రమమును అతిక్రమించి ఒళ్ళు మరచి లోక వ్యామోహములో జీవించిన సందర్భములో దేవుడు నరునిపై తనకున్న కోపాన్ని ఉగ్రతను, కఠినవైఖరిని తొలగించుకొని, శాంతహృదయుడై నరుని తన ప్రేమకు మరల్చుటకు దేవుడే ఈ లోకానికి నరుని ఆకృతిలో కన్యకయైన నారీగర్భములో జనించుట కూడా మనకు తెలియును.
ఈ విధముగా దేవుడు నరావతారములో ఈ లోకములో అవతరించుటకు మన మూలవాక్యమైన రోమా 8:1లో క్రీస్తుయేసునందున్న వారికి ఏ శిక్షా విధియు లేదు,'' అన్న వాక్యమునుబట్టి యోహాను
1:21లో తన్ను ఎందరంగీకరించెరో వారికందరికి, అనగా తన నామమందు విశ్వాసముంచినవారికి, దేవుని పిల్లలగుటకు ఆయన అధికారము అనుగ్రహించెను,'' అని వ్రాయబడిన ప్రకారము పాతనిబంధన అను పాతకాలమును విడిచి, నూతన నిబంధన అను దైవకుమారునియొక్క జనన కాలము ద్వారా ఆయనయొక్క ఆత్మీయతతో ఆయన వాక్కులనుబట్టి ఆయన వెలుగును, ఆయన ఆకర్షణకులోనై తమయొక్క అపరాధములను పాపములు అనేటటువంటి బలహీనతల నుండి విడుదల పొంది, ఆదిలో ఇశ్రాయేలు ఏమి చేయలేక పోయెనో, ఇశ్రాయేలుకు దేవుడు అనుగ్రహించిన ధర్మశాస్త్రము ఏది జరిగించలేకపోయెనో - దానిని జరిగించుటకును దైవరాజ్యము భూమిమీద స్థాపించబడి విస్తరించబడుటకును, యేసుక్రీస్తు అను పరిశుద్ధ నామమును పవిత్ర రూపము, దైవ నరావతారమన్నది దైవచిత్తమును, దైవవిధిని, దైవోద్దేశ్యము, దైవప్రణాళికను నెరవేర్చుటకు ఈ లోకములో యేసుక్రీస్తుగా దృశ్యములో సామాన్య నరుని వలె భూమి మీద పాదము మోపి సంచరించిన పవిత్ర దేవుని రూపమైన యేసుక్రీస్తుయొక్క ప్రత్యక్షతన్నది - నర జీవితానికి నూతనత్వమును ఆత్మ వికసింపును భూలోకములో దైవరాజ్య స్థాపనయు - అట్టి దైవరాజ్యానికి యోగ్యులైన బిడ్డలయొక్క ఎన్నికయు, అట్టి ఎన్నికకు కావలసిన తర్ఫీదునిచ్చు బోధకులను, అట్టి బోధకుల ద్వారా విశ్వాసులుగ కూడి దైవ సావాసము, దైవధ్యానము చేసేటటువంటి ఆరాధన మందిరాలను ఏర్పడుటకు దైవకుమారత్వమన్నది జరిగించిన సేవా పరిచర్య యాజకత్వము, సమర్పణ బలియాగము ద్వారా జరిగిన రక్తప్రోక్షణ నరులయొక్క విషయములో వారి ఆత్మీయ జీవితానికి నూతనత్వాన్ని గల్గించి, నూతన నిబంధనలో నూతన వికసింపులో - నూతన ఆరాధన నూతన విశ్వాసములో నూతన భక్తిలో జీవించే విధానమును - దైవకుమారత్వమన్నది బహుతీవ్రముగా క్రియజరిగించి, లోకముతోను అనగా నాటి ఏదెనులో భూఫలముల ద్వారా నాటి నరునియొక్క ఆత్మీయ జీవితాన్ని దైవత్వమునుండి చెడగొట్టి, నరుని దేవునికి వ్యతిరేకిగాను, విరోధిగాను మార్చి క్రియ జరిగించిన భూమియొక్క చెరనుండి, అలాగే భూమిని భూలోక సృష్టిని దైవశాపానికి గురిజేసిన ఆది సర్పముయొక్క పోరాటముతో - ఇప్పటి క్రీస్తులో జీవిస్తున్న క్రైస్తవ విశ్వాసిలో క్రీస్తు ఆత్మను ధరించుకొన్న క్రీస్తును స్వరక్షకునిగ అంగీకరించిన విశ్వాసి పై రెండింటితోనేగాక కొన్ని రకాలైన అదృశ్య శక్తులతో పోరాడుచున్నట్లుగ పౌలు ఎఫెసీ 6: 11-13లో వ్రాయబడిన వేదభాగములోని విధముగా ఇప్పుడు క్రీస్తుయేసులో ఉన్నటువంటి జయజీవితమునుగూర్చి ఈ విధముగా మనము తెలిసికోవలసియున్నది.
అదేమనగా ''మీరు అపవాది తంత్రములను ఎదిరించుటకు శక్తిమంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొనుడి. ఏలయనగా మనము పోరాడునది శరీరులతో కాదు, గాని ప్రధానులతోను అధికారులతోను, ప్రస్తుత అంధకార సంబంధులగు లోకనాధులతోను, ఆకాశమండల మందున్న దురాత్మల సమూహములతోను పోరాడుచున్నాము. అందుచేతను మీరు ఆపద్దినమందు వారిని ఎదిరించుటకును, సమస్తము నెరవేర్చినవారై నిలువబడుటకును శక్తిమంతులగునట్లు, దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొనుడి,'' అనుటలో ప్రియపాఠకులారా! ఈ సర్వాంగ కవచమన్నది యేసుక్రీస్తులో బాప్తిస్మము పొంది యేసును గలతీ 3:27లో వలె ధరించుకొన్నారన్న సత్యాన్ని గుర్తెరింగి, తాను క్రీస్తును ధరించుకొన్నానని క్రీస్తును అనుసరించుచు క్రీస్తు మార్గములో నడుచుచు, క్రీస్తు ఉపదేశములకు చెవినిచ్చి, క్రైస్తవ సావాసములోను అంతేగాకుండ విశ్వాసుల ప్రార్థన కూడికలలోను క్రైస్తవ ఆరాధన సమయాలలోను, క్రీస్తును ఆరాధించే ఆత్మీయ స్థితి గల్గి క్రీస్తును బోలి నడుచుకొన్నవారే క్రీస్తుయేసులో ఉన్నవాడు. ఇట్టి వానికి ఏ శిక్షావిధియు లేదు,'' అన్న సత్యాన్ని తెలిసికోవాలి. ఎందుకనగా క్రీస్తుయేసునందున్న జీవమునిచ్చు ఆత్మయొక్క నియమములో ఇట్టి వ్యక్తి జీవిస్తున్నాడు గనుక - ఇట్టి వానిపై పాపమునకుగాని మరణమునకుగాని దాని నియమములకుగాని దాని సిద్ధాంతాలకుగాని దాని వలయములోగాని దాని సంబంధమైన ఉపద్రవాలుగాని ఏవియును ఇట్టివానిని ఆవరించవు. ఎందుకనగా క్రీస్తుయేసులో ఉన్నవానిపై పాపమునకు మరణమునకు అధికారము లేదు. ఇందునుగూర్చి ప్రకటన
21:7లో జయించువాడు స్వతంత్రించుకొనును, నేనతనికి దేవుడునైయుందును - అతడు నాకు కుమారుడై యుండును,'' అని వ్రాయుటనుబట్టి ఇట్టివాడు - ఈ విధముగా క్రీస్తుయేసులో ఉన్నవాడు ప్రకటన
21:3లో వలె ''దేవుని నివాసము మనుష్యులతోకూడా ఉన్నది, ఆయన వారితో కాపురముండును, వారు ఆయన ప్రజలైయుందురు, దేవుడు తానే వారి దేవుడైయుండి వారికి తోడైయుండును,'' ఆయన వారి కన్నుల ప్రతి బాష్పబిందువును తుడిచివేయును, మరణము ఇక ఉండదు,'' కనుక ప్రియపాఠకులారా! క్రీస్తుయేసునందున్న వానికి ఇలాంటి గొప్ప యోగ్యతలున్నప్పుడు, ''పాపమునకు మరణమునకు శిక్షించుటకు, ఎట్టి అధికారము లేనట్లును ఈ మూడును క్రీస్తుయేసులో ఉన్నవానికి దూరమగునట్లుగా తెలుస్తున్నది. ప్రకటన 20:4-6 ఈ మొదటి పునరుత్థానములో పాలుగలవారు ధన్యులు పరిశుద్ధులునైయుందురు. ఇట్టివారి మీద రెండవ మరణమునకు అధికారము లేదు. వీరు దేవునికిని క్రీస్తునకును యాజకులై క్రీస్తుతో కూడా వెయ్యి సంవత్సరాలు రాజ్యము చేతురు.''
ప్రియపాఠక సోదరీ! సోదరా! ఈయొక్క వేదసారాంశమును చదువుచున్న నీవు క్రీస్తు యేసునందున్నావా? లేక లోకములో ఉన్నావా? క్రీస్తు యేసునందు ఆయనయొక్క కూటమిలో ఆయన యొక్క విశ్వాసుల సావాసములో ఉన్నావా? లేక లోకముతో ఏకీభవించి, లోకసంబంధ అధికారాలు ఆధిక్యతలు పదవులు వగైరాలనుగూర్చి నీ జీవితమును సమస్యలమయముగా చేసికొంటూ లోకానికి పరిమితమై లోకబంధకాలలో ఉన్నావా? లోకవ్యామోహములో కొట్టుమిట్టాడుచున్నావా? నీ స్థితి ఎలాగున్నది? ఒకవేళ క్రీస్తుయేసులో నీవు లేకుంటే నీలో జీవమున్నప్పుడే, మన రక్షకుడైన యేసుక్రీస్తును విశ్వాసముంచి, నిన్ను - మనలను పీడిస్తున్న లోకసంబంధమైన సమస్యలకు దూరమగునట్లుగా నీ ఆత్మీయతను మార్చుకో! ఇప్పుడే నీలో ఉన్న క్రీస్తును చూచిన ''పాపము - మరణము - అను ఈ లోకము మూడును నీకు దూరమై; దైవత్వమన్నది నీకు అతి సమీపమై నిన్ను తన వానినిగా జేసి ఆశీర్వదించును గాక!
........
యేసుక్రీస్తు ఈ లోకానికి రావలసిన ఆవశ్యకత ఏమి? ఈ లోకములో పుట్టుటకు కారణము, బోధించుటకును బాప్తిస్మము పొందుటకును, పరిశుద్ధాత్మతో నింపబడుటకును, తనకు అనుచరులుగా అనేకులను ఏర్పరచుకొనుటకును, తాను మరణించుటకు - పునరుత్థానుడగుటకును - మరల పరలోకానికి ఆరోహణుడగుటకును కారణమేమి? అసలు యేసుక్రీస్తు ఎవరు? ఈ వివరాలు తెలిసికొందము.
1.యేసుక్రీస్తు ఈ లోకానికి రావలసిన ఆవశ్యకత ఏమి? ప్రియపాఠకులారా! పై ప్రశ్నకు జవాబు ఎఫెసీ 1: 4-6 తన ప్రియుని యందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపా మహిమకు కీర్తికలుగునట్లు, తన చిత్తప్రకారమైన దయాసంకల్పము చొప్పున, యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులనుగా స్వీకరించుటకై, మనలను ముందుగా తన కోసము నిర్ణయించుకొని, మనము తన యెదుట పరిశుద్ధులమును నిర్దోషులమునైయుండవలెనని జగత్తు పునాది వేయబడక మునుపే, ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకొనెను,'' యావద్ సృష్టిని తండ్రియైన దేవుడు ఆయనలో ఉంచి, ఆయన ద్వారా రూపించబడింది. ఇందునుగూర్చి యోహాను సువార్త 1:3-5 సమస్తము ఆయన మూలముగా కలిగెను - కలిగియున్నదేదియు ఆయన లేకుండ కలుగలేదు. ఆయనలో జీవముండెను-ఆ జీవము మనుష్యులకు వెలుగైయుండెను. కాబట్టి యేసుక్రీస్తు ఈ సర్వసృష్టికి ఆది సంభూతుడైయున్నట్లును ఇందునుబట్టి మనకు తెలుస్తున్నది. అయితే దేవుడు నరునికి తనకు ఉభయులకంటూ ఆత్మీయముగా ఆది 2:8లో వేసిన ఏదెను తోటలో యేసు ఉన్నాడా? ఇందుకు జవాబు ఆది 2:9లో మనము చదువగలము. ఎట్లనగా దేవుడు తూర్పున ఏదెనను తోటను వేసి, అందులో నరుని ఆహార అవసర నిమిత్తము అతని యొక్క పోషణార్థం ఆ తోటలో ఆహార సంబంధమైన వృక్షఫలములను, సువాసన వెదజల్లు పుష్పములను పుష్పించుచెట్లను, నానావిధమైన ఆహ్లాదకరమైన వాతావరణాన్ని ఆ తోటలో కల్గించి ప్రత్యేకముగా తోటమధ్యలో జీవవృక్షము-మంచి చెడు తెలివినిచ్చు ఫలవృక్షము భూమినుండి మొలిపించినట్లు వేదములో చదువగలము. రెండును దైవ సృష్టములే, ఈ రెండు వృక్షములు తోట మధ్యలో ఒకదానికొకటి అభిముఖంగాను చేరువులో ఉన్నాయి. రెండింటిని పోషించువాడు దేవుడే. ఇందులో ఒకటి జీవవృక్షము 2వది మంచి చెడు తెలివినిచ్చు వృక్షము - రెండును మంచివే 1. జ్ఞానాన్ని ప్రసాదించేది. 2వది జీవము నిచ్చేది - నిత్యజీవమిచ్చేది. అయితే ఒక దానికొకటి వ్యతిరేకములైయున్నవి. ఈ వ్యతిరేకమన్నది దైవ వాక్కునుబట్టి కల్గిందేగాని ఒక దానికొకటి వ్యతిరేకములైనవి కావు. ఎందుకనగా మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్షము పరిశుద్ధ గ్రంథములో ఆది 3:6లో '' ఆ స్త్రీ ఆ వృక్షము ఆహారమునకు మంచిదియు కన్నులకు అందమైనదియు, వివేకమిచ్చు రమ్యమైనదియు తినుటకు యోగ్యమైనదనియు - నానా విధమైన మంచి వృక్షములతోబాటు ఈ రెండు వృక్షములు కూడా ఆ తోటలో ఉన్నవి.
అయితే ఆ తోటలో ఉన్నట్టి శతకోటి వృక్షాలలో వాటి పేర్లు ఈగ్రంథములో వ్రాయబడలేదు. ప్రత్యేకించి వ్రాయబడిన వృక్షాలపేర్లు ఇవియే 1. జీవవృక్షము 2. మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్షము,'' జీవవృక్షము అని అన్నాడేగాని జీవవృక్షఫలము అని నిర్ధారణ లేదు, మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్షము,'' అని అన్నాడేగాని ఆ చెట్టుకు ఫలాని పేరు లేదు. ఈ విధముగా దేవుని వనములోని చెట్ల పేర్లు, ఆయన చేసిన నరజంట పేర్లు కూడా అనామకముగానే ఉన్నట్లు ఈ రెండవ అధ్యాయము మనకు తెలుస్తున్నది. ఆదాము అను పేరుకు ఎర్రమట్టి అనియు, స్త్రీకి హవ్వ అను పేరు పెట్టినారు. ఇప్పుడు హవ్వ అను పేరు గలవారు లోకములో లేరు, ఆదాము అను పేరు గలవారు లోకములో లేరు. అయితే ఈ రెండు పేర్లు నరజంటకు దేవుడే పెట్టినాడు. ఆదాము తన భార్యకు హవ్వ అని పేరు పెట్టినాడు. ఇది ఆదాము పెట్టుకొన్న పేరు. 3:20 అయితే ఆదామునకు పేరు పెట్టుటకు నరుడెవరు లేదు గనుక ఈ విధముగా దైవవనములో మొలిచిన జీవవృక్షము క్రీస్తు అనగా నూతన నిబంధన,'' మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్షము - ఇది పాతనిబంధన, ఇందునుబట్టి రెండు వృక్షములుగ ఏదెను వనములో రూపించినట్లు క్రైస్తవ వేదమైన పరిశుద్ధ గ్రంథ పూర్వీక చరిత్ర మనకు వివరిస్తున్నది. ఇందునుబట్టి యేసుక్రీస్తుయొక్క చరిత్ర నూతన నిబంధనలోనేగాక పాతనిబంధనలో కూడా అదృశ్యములో చరిత్ర ఏర్పడియున్నట్లు తెలుస్తున్నది.
ప్రియపాఠకులారా! ఈ విధమైన ప్రభావితమైన సుస్థిరమైన నిత్య జీవయుతమైన చరిత్రను స్థాపించిన ప్రభువైన యేసుక్రీస్తుయొక్క పరలోక భూలోక చరిత్రనుగూర్చి వివరముగా తెలిసికొందము. ఈ సందర్భములో ఎఫెసీ 1:3-6 మన ప్రభువైన యేసుక్రీస్తుయొక్క తండ్రియగు దేవుడు స్తుతింపబడును గాక! ఆయన క్రీస్తునందు పరలోక విషయములలో ఆత్మసంబంధమైన ప్రతి ఆశీర్వాదమును మనకు అనుగ్రహించెను. ఎట్లనగా తన ప్రియునియందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపా మహిమకు కీర్తి కలుగునట్లు, తన చిత్త ప్రకారమైన దయాసంకల్పము చొప్పున, యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులనుగా స్వీకరించుటకై, మనలను ముందుగా తన కోసము నిర్ణయించుకొని, మనము తన యెదుట పరిశుద్ధులమును నిర్ధోషులమునై యుండవలెనని జగత్తు పునాది వేయబడక మునుపే; ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలనేర్పరచుకొనెను. ఎఫెసీ 1:3-13లో ఉన్నటువంటి లేఖన సారాంశమును ప్రవచనమునుబట్టి క్రీస్తు ఈ లోకములోకి రావలసి వచ్చింది, కొలస్సీ 1: 19-23 ఆయనయందు సర్వసంపూర్ణత నివసింపవలెననియు, ఆయన సిలువ రక్తము చేత సంధిచేసి, ఆయన ద్వారా సమస్తమును, అవి భూలోకమందున్న వైనను, పరలోకమందున్నవైనను, వాటినన్నిటిని ఆయన ద్వారా తనతో సమాధానపరచు కొనవలెననియు తండ్రి అభీష్టమాయెను. మరియు గత కాలమందు దేవునికి దూరస్థులును, మీ దుష్‌క్రియల వలన మీ మనస్సులో విరోధ భావము గలవారై యుండిన మిమ్మును కూడా తన సన్నిధిని పరిశుద్ధులుగాను నిర్ధోషులుగాను, నిరపరాధులుగాను నిలువబెట్టుటకు ఆయన మాంసయుక్తమైన దేహమందు మరణము వలన ఇప్పుడు మిమ్మును సమాధానపరచెను,'' ఇది దైవచిత్తములో యేసుక్రీస్తు లోకానికి వచ్చుటకు మరియొక ప్రణాళిక - పిలిప్పీ 2: 6-11 ఆయన దేవుని స్వరూపము కల్గినవాడైయుండి, దేవునితో సమానముగా ఉండుట విడిచి పెట్టకూడని భాగ్యమని ఎంచుకోలేదు, కాని మనుష్యుల పోలికగా పుట్టి, దాసుని స్వరూపమును ధరించుకొని, తన్నుతానే రిక్తునిగా చేసికొనెను. మరియు ఆయన ఆకారమందు మనుష్యుడుగా కనబడి, మరణము పొందునంతగా, అనగా సిలువ మరణము పొందునంతగా విధేయత చూపినవాడై, తన్ను తాను తగ్గించుకొనెను. అందుచేతను పరలోకమందున్న వారిలోగాని, భూమి మీద ఉన్నవారిలోగాని, భూమి క్రింద ఉన్నవారిలోగాని ప్రతివాని మోకాలును యేసు నామమున వంగునట్లును, ప్రతివాని నాలుకయు తండ్రియైన దేవుని మహిమార్థమై యేసుక్రీస్తు ప్రభువని ఒప్పుకొనునట్లును, దేవుడు ఆయనను అధికముగా హెచ్చించి, ప్రతి నామమునకు పై నామమును ఆయనకు అనుగ్రహించెను,'' ఇది దేవుడు తన ప్రణాళికలో లోకరక్షకుడైన యేసుక్రీస్తుకు ఇచ్చిన ఆధిక్యత.
రెండవది - ఈ లోకములో పుట్టుటకు కారణము :- ఆదిలో దేవుడు పరలోక సామ్రాజ్యము అందులోని దూతల సమూహాలను, ఆయొక్క పరిపాలన అధికారమును ఆ సింహాసనములో ఉంటూ తానున్న లోకమునకు అనుబంధముగా మరియొక లోకాన్ని సృష్టించు సంకల్పమునుబట్టి దేవుడు నిరాకార శూన్యంలో అగాధజలములలో గుప్తమైయుండి బురదమయము దుర్గంధ పూరిత స్థితిలో నిర్జీవమైయుండి, ఏ జీవియు అందులో జీవించలేనట్టి వాతావరణములో భూమియొక్క స్థితి ఉండగా అట్టి అంధకార నిరాధార నిరాకార స్థితిలో ఉన్న భూమిపై దేవుడు కనికరించి దానిని జలముల నుండి విభాగించి వేరుపరచి, మొట్టమొదటగా దానిని అలరించుటకు జిగట పదార్థముగా ఉన్న దానిని తన వెలుగు ద్వారా ఘనపదార్థముగా మార్చి దానికి రూపమిచ్చాడు. ఈ రూపమిచ్చుటలో ఆయన వెలుగును వాడినాడు. ఈ వెలుగు జీవపు వెలుగు, జీవమును కల్గించు వెలుగు, జీవము కల్గినదే గాక నిత్యజీవమైయున్న వెలుగు, ఆరిపోని సుస్థిరమైన వెలుగు, భూమిని దహించి, రూపించినట్లుగానే, పాపి హృదయాన్ని కదిలించి తన శక్తితో కరిగించి పవిత్రునిగా చేసే వెలుగు - ఈ వెలుగును అడ్డుకొనేందుకు మరియొక వెలుగు లేదనియే నిర్ధారణగా తెలుస్తున్నది. నరులమైన మనము పుట్టించే కృత్రిమ వెలుగులు మన ప్రాణానికే హాని - ఇది అస్థిరమైన వెలుగు - కన్ను మూసుకుంటే లోకసంబంధమైన వెలుగు కానరానిది. అదును తప్పితే నరజీవితాన్నే అంతము చేస్తుంది. అయితే దేవునియొక్క త్రిత్వములో రెండవదిగ రూపించబడిన ఈ వెలుగు నేలను ఎండించింది. అంతేగాక దానికి జీవమిచ్చి దాని నుండి నానావిధ సృష్టములను, వృక్షసముదాయములను, మృగపక్షి జంతుప్రాణులను చివరకు దాని మంటి నుండి దేవుని పోలికలో రూపించబడిన శరీరానికి ఈ వెలుగు ప్రాణప్రతిష్ట జేసి, వానిని జీవాత్మునిగ మార్చిందే - ఈ వెలుగు.
పౌలు సౌలుగా ఉన్నప్పుడు అనగా పౌలు భూలోక సంబంధంగా లోకానికి పరిమితమైయున్నప్పుడు లోకదాసుడై లోకాధికారము పొందియున్నాడు. లోకమునే తనకు ప్రాణాధారముగా ఎంచి జీవించిన కాలములో అనగా సౌలు లోకపు వెలుగుపై విశ్వాసముంచి, లోకపు వెలుగే తనకు ప్రాణాధారమైనట్లుగ భావించి, క్రీస్తు అను జీవపు వెలుగుతో పోరాడిన సమయ సందర్భములో సౌలు నేలపడి, తాను నమ్ముకున్న లోకపు వెలుగును శూన్యపరచి గుడ్డివానిగా జేసి క్రింద పడవైచి,'' సౌలా! సౌలా! నీవేల నన్ను హింసించుచున్నావని పల్కిన ఈ వెలుగు క్రీస్తే!
కనుక ప్రియపాఠకులారా! లోకమునకు జీవమిచ్చుటకును పాపిని మార్చుటకును, విశ్వాసికి జ్ఞానోదయము కల్గించుటకును, విశ్వాసిలో దైవత్వమునుప్రబలించుటకు, పాపియొక్క హృదయాంధకారంలో గూడు కట్టుకున్న చీకటిని తొలగించి పాపిని విమోచించుటకు క్రీస్తు వెలుగు ప్రాముఖ్యత సంతరించుకొన్నది. క్రీస్తు వెలుగునకు సాటి మరి ఏ వెలుగు లేదని మనకు నిర్ధారణ తెలుస్తున్నది.
కనుక ప్రియపాఠకులారా! క్రీస్తు ఈ లోకానికి వచ్చుటలో ఆయన వెలుగుగా వచ్చినట్లు తెలిసికొనుచున్నాము. క్రీస్తు ప్రవచిస్తు - యోహాను 8:12 నేను లోకమునకు వెలుగును నన్ను వెంబడించువాడు చీకటిలో నడువక జీవపు వెలుగు కలిగియుంటాడు,'' ఈ జీవపు వెలుగు క్రీస్తులో తప్ప మరెందులోను లేదన్న సత్యాన్ని మనము గ్రహించవలసియున్నది. క్రీస్తుయొక్క జీవపు వెలుగు మనలో కలగాలంటే క్రీస్తును అంగీకరించాలి, క్రీస్తును కలిగియుండాలి, క్రీస్తు మార్గములో మనము నడవాలి. క్రీస్తు అను ద్రాక్షవళ్ళితో మన జీవితాలు అంటుగట్టబడాలి. ఆ విధముగా అంటుగట్టబడిన జీవితాలలో జీవించిన మహనీయులు నూతన నిబంధనలో ప్రప్రధమముగా ఆయనేర్పరచుకొన్న శిష్యులు. అటుతర్వాత ఆయననుగూర్చి హతమైన హతసాక్షులు. వీరి ద్వారా దైవ కుమారుడు లోకరక్షకుడైన క్రీస్తుయొక్క రాజ్యము స్థాపించబడి లోకమందంతట విస్తరించియున్నది. ఈ విధమైన రీతిలో నరకోటి జీవించుటకు యేసుక్రీస్తు ఈ లోకానికి రావలసి వచ్చినట్లుగ మనకు తెలుస్తున్నది. మరియు ఇది దేవునియొక్క చిత్తమైయున్నది.
........
ప్రసంగము అంశము క్రొత్త బండి మూలము :- 1 సమూయేలు 6:7-8 పఠన ధ్యానము కీర్తన 78 అన్యుల చేత అన్య శాస్త్రయుతముగా చేయబడిన బండి, నూతన నిబంధన సంఘమునకు మాదిరి. దేవుని హస్త లిఖితమైన దశాజ్ఞల మందసమును మోయుట,'' అనుటలో ఇది యేసుప్రభువుకు మాదిరి. అనగా ఈ సంఘము అను బండి క్రీస్తును ధరించవలసియున్నది. ఈ బండిని లాగుటకు లేక మోయుటకు - కాడి మోయని,'' అంటే లోకదాస్యమునకు దాని ఇచ్ఛలకును బానిసలుగాని, లోక సంబంధ బంధకములు లేని పాపి.''
ఆవులు :- పురుషుని ఎరుగని పరిశుద్ధురాలైన కన్యకయైన మరియ, ఈమె గొడ్రాలు కాదు, క్రీస్తును మోసింది, లూకా 1:34 పురుషుని ఎరుగదు, నిష్కళంకురాలు - దైవమందసము అను క్రీస్తును మోసింది - దైవచిత్తమును నెరవేర్చింది. అన్ని తరముల వారిచే లూకా 1:49లో వలె ధన్యురాలుగా ఎంచబడుచున్నది.
ఇక రెండవ ఆవు ఈమె లూకా 1:5-6లో ఎలీసబెతు. ఈమె యాజకుడైన అహరోను కుమార్తె. జెకర్యా అను యాజకుని భార్య. ఆరవ వచనములో వలె ఈమె ప్రభువుయొక్క ఆజ్ఞలు విధులు చొప్పున నిరపరాధియై దైవదృష్టికి నీతిమంతురాలుగా జీవించిన స్త్రీ - ఇది రెండు ఆవుల పరమార్థము. ఈమె గొడ్రాలు కాదు.
ఇక దూడలు :- 1. కన్య మరియ గర్భములో జన్మించిన బాలయేసు. ఈయన లూకా 1:35 లో వలె దైవకుమారుడు. యోహాను 1:29లో వలె పాప పరిహారార్థ బలిపశువు. ఈయన ద్వారా పాపికి రక్షణ, దేవునికి మహిమ, దేవునికి నరులకు సమాధానము కల్గింది. రెండవ దూడ :- యోహాను 1:6-7లో విధముగా దేవునియొద్ద నుండి వచ్చాడు. ఈయన ఎలీసబేతు కుమారుడు. లూకా 1:14-16లో విధముగా లోకాన్ని దైవత్వము వైపు త్రిప్పినాడు.
ఇక ఈ దూడల నివాసము :- 1. దైవకుమారుడైన ఏసుక్రీస్తు నివాసము లూకా 22:39 ఒలీవల కొండ - ఇది మరియ కూమారుని నివాసము. రెండవ దూడ ఎలీసబెతు కుమారుడు - ఈయన నివాసము ఈ సందర్భములో మార్కు 1:4 మరియు లూకా 1:80 అరణ్య జీవితము. పై విధముగా ఆవులకు సాదృశ్యమైన ఎలీసబెతు మరియలు ఆనాటి పాడి ఆవులు దూడలకు సాదృశ్యమైన యేసు యోహానులు తమ తల్లులకు దూరమయ్యారు.
ఇప్పుడు దూడలను విడిచిన ఆవులు నడిచిన మార్గము బెత్షెయెషు అనగా సూర్యదేవత గృహము లేక పట్టణము. ఈ బండిని నడిపించినది పరిశుద్ధాత్ముడు, సారధి కూడా ఆయనే, ఈ బండిని వెంబడించిన వారు అన్యులైన పిలిష్తీయులు, ఈ సందర్భములో 1 సమూయేలు 6:12 చూడుము.
ఇక 1 సమూయేలు 6:14లో జరిగిన సంఘటనలో బండి కర్రలను చీల్చుటన్న క్రియ దేవునికి సమర్పించుకొన్న సంఘమునకు సూచన, ఆవుల దహన బలి అన్నది దేవునికి మహిమకరముగా తమ కుమారులైన దూడలను తమ శరీరాత్మలను సజీవ యాగముగా సమర్పించుకొన్న మరియ ఎలీసబెతుల జీవితములకు మాదిరి సూచన.
ప్రియసంఘమా! నాయొక్క మనయొక్క జీవిత విధానము, మన మార్గాలు - మన సంఘ జీవితములలో మందసాన్ని మోసిన బండి వలె ప్రభువు సిద్ధాంతాలను ఆచరించే స్థితిలో ఉన్నదా? కాడి మోయని అంటే లోక దాస్యము లేని గొప్ప జీవితములో ప్రభువు కాడిని మోసే స్థితిలో ఉన్నామా? కాడిని మోసిన ఆవులు తమ దూడలను దైవత్వానికి అప్పగించిన విధముగా మన పిల్లలను ప్రభువునకు ప్రతిష్టించు స్థితిలో ఉన్నామా? ఎట్లున్నాము? అపరాధార్ధమైన బలి సందర్భములో అన్యులైన ఫిలిష్తీయులు 5 బంగారు గడ్డలు, 5 బంగారు పందికొక్కులు చుంచులను అర్పించుటలో ప్రభువు పొందిన గాయములకు సూచన. ఈనాడు ప్రభువునకు నీవేమిస్తావు?
.....
ప్రసంగాంశము :- నరుడు, నరుని పతనము, నరుని విమోచనము
నరుడు :- ఇతను యదార్థవంతుడుగా సృష్టించబడినాడు. అయితే నరుడు వక్ర మార్గములో పడినాడు. ఆది 1:26లో దేవుని స్వరూపములో నరుని సృష్టి జరిగినట్లు ఆది 1:31లో అది మంచిదైనట్లు అనగా నరుడు మంచివాడే ఆది 3:1-7లో నరుని పతనము జరిగినది. రోమా 5:12-21లో లోకములో పాపము ప్రవేశించిన దినమొకటున్నట్లు తెలియుచున్నది. నరునికి తెలివి మనస్సాక్షి చిత్తము ఉన్నవి. నరుని స్వేచ్ఛాజీవిగా దేవుడు చేసినట్లు తెలియుచున్నది. మరియు దేవుడు నరునికి సంపూర్ణ స్వేచ్ఛను ఇచ్చినట్లును, దేవునికి స్వార్థము పక్షపాతము లేనట్లు గ్రంథములో వివరించబడియున్నది. కీర్తన 8:4లో దేవుడు నరునికిచ్చిన స్వేచ్ఛ తెలియుచున్నది. ఈ స్వేచ్ఛను నరుడు దుర్వినియోగపరచినట్లు తెలియుచున్నది. లూకా 12:47.
ఆదిలో అపవాది ఆదినరులకు జ్ఞానోదయమునకు పునాది వేసి 2వ కొరింథీ 4:లో క్రీస్తు సువార్త ప్రకాశమును నరులలో ప్రకాశింపకుండ వారి మనోనేత్రాలకు గుడ్డితనము కల్గించెను. ఇట్లు నరుడు నైతిక మానసిక ఆత్మీయముగా పాపముయొక్క ప్రభావమున నరుడు కలుషితుడైనాడు. కనుక ఇట్టి వ్యక్తి మరల నూతన సృష్టిగా మారాలి. 2వ కొరింథీ 5:17లో విధముగా నూతనముగా జన్మించాలి. అయితే పతనమైన హృదయము అంధకారమై దేవుని మహిమపరచలేదు. రోమా 1:21-22లో విధముగా జంతు వృక్షశిల పక్షి సముదాయముల విగ్రహ రూపములను దేవుళ్ళుగా ఆరాధింతురు. యెషయా
5:20లో విధముగా విచక్షణ జ్ఞానము కోల్పోయినట్లు తెలుస్తున్నది. జంతు సమానుడుగా మారినట్లు తెలియుచున్నది. రోమా 3:19లో నరుడు నీతిమంతుడుగా లేకపోయినట్లు తెలియుచున్నది. మత్తయి
4:1-11 హెబ్రీ 4:15లో మనలను యేసుప్రభువు నరుడు శోధనలను జయించగల్గుటకు (యేసు) శరీరము పై ప్రయోగము ద్వారా నిరూపించినట్లు తెలియుచున్నది.
యేసుప్రభువు సాతానును ఎదిరించి గెలిచినట్లు మనమును గెలవవలెనను సత్యమును యేసు ప్రభువు నిరూపించినట్లు తెలియుచున్నది. మత్తయి 20:28లో విధముగా ఆయన మన కొరకు పరిహారము చేయుటకు ఈ లోకమునకు వచ్చినట్లు తెలియుచున్నది. 1వ యోహాను 2:2లో 2వ కొరింథీ 5:21లో ఆయన మన పాపముల కొరకే ఈ లోకమునకు వచ్చెనుగాని ఆయనయందు ఏ దోషము లేదు. రోమా 5: 6-21 ఎఫెసీ 1:7లో ఆయన మానవుని పాపము సిగ్గు విమోచనతో కూడిన కృప ఉచితము అనునదియే బైబిలు సారాంశము. రోమా 5:21 పాపముతోబాటు కృప అమితముగా విస్తరించెను.
......
అంశము - విడుదల - మూలము ఆది 1:1-2 ఆదియందు దేవుడు భూమ్యాకాశములను సృజించెను. భూమినిరాకారముగాను శూన్యముగాను ఉండెను. దేవుని ఆత్మ జలముపైన అల్లలాడుచుండెను.''
ప్రియపాఠకులారా! బంధన అన్నదేమిటో మనము తెలిసికొనియున్నాము. ఈ బంధన అన్నది దేవుడు భూమిని జలములను ఆకాశమును రూపించక మునుపే యావద్ సృష్టి ఒక దానిలోనొకటి ఇమిడి అనగా ఒకదానిలోనొకటి బంధించబడి, ప్రకృతి నిరాకారముగాను శూన్యముగాను ఉన్నట్లు వేద వివరణ. అంటే జలములు నిర్జీవముగా ఉన్నట్లును, ఆకాశము నిరాకారముగా శూన్యముగా ఉన్నట్లును భూమి కూడా నిరాకారియై జిగట మంటితో అనగా బురదతో - దుర్గంధపూరిత వాతావరణంలో చీకటిలో ఉండినట్లును, సృష్టికి పూర్వము సృష్టములయొక్క బంధననుగూర్చి లైనుగా ఈ వేదభాగములో చదువగలము. అయితే ఈ త్రివిధ బంధన అనగా భూమి జలములు ఆకాశము ఈ మూడును ఒక దానిలోనొకటి ఇమిడి బంధీకృతములైయుండగా ఈ అనంత విశ్వమును రూపించిన దేవునియొక్క ఆత్మ అగాధ జలముల మీద అల్లలాడుచు జరిగించిన క్రియ వివరంగా తెలిసికొందము. ఇందులో మొట్టమొదటగా ఆత్మగా అల్లలాడుచున్న సృష్టికర్త మొట్టమొదట వెలుగు కమ్మని పలికినట్లును, ఆ విధముగా వెలుగు ఏర్పడినట్లును, మొట్టమొదటి బంధకములో చీకటిమయమైయున్న ఈ అనంత విశ్వమును తన వెలుగుతో వేరుపరచి దేవుడు వెలుగునకు పగలనియు, చీకటికి రాత్రియని పేరుపెట్టినట్లు చదువగలము. అనగా చీకటి నుండి తన వెలుగు ద్వారా సృష్టికి విడుదల ప్రసాదించినట్లు ఇందులోని భావము.
ఈ విధముగా క్రియజరిగిస్తున్న సృష్టికర్తయైన దేవుడు చీకటిమయము జలమయమైయున్న సృష్టికి విడుదల కల్గించిన విధానమును గూర్చి ఆది 1:6-10లో తెలిసికొందము. జలములను వేరుపరచి ఆకాశమునకు విడుదల కల్గించాడు. అనగా విశాలము క్రింది జలములను విశాలము మీది జలములను వేరుపరచగా ఆ ప్రకారమాయెను. దేవుడు ఆ విశాలమునకు ఆకాశమని పేరు పెట్టెను., ఇది జలములకు ఆకాశమునకు విడుదలను దేవుడు కల్గించిన విధానము. అలాగే 1:9లో ఆకాశము క్రిందనున్న జలములొక చోటనే కూర్చబడి ఆరిన నేల కనబడుగాక, ఇది జలములలో నుండి భూమికి విడుదల కల్గించిన విధానము ఈ వేదభాగములో చదువగలము. ఈ విధముగా దైవత్వము చేత విభజించబడి విడుదల పొందినటువంటి సృష్టిలో ఆరిన నేలకు భూమియని, జలరాశికి సముద్రములని దేవుడు పేరు పెట్టినట్లుగ వ్రాయబడియున్నది. ఇది ప్రకృతి సంబంధమైన బంధనలో సృష్టికర్త ప్రవేశించి విడుదల కల్గించిన విధానము.
ఇక భూమిలో గుప్తమైయున్న సృష్టములు వృక్షజాలము పక్షిజాలము జంతుజాలములు వగైరాలను గూర్చిన వివరము. 1:11 దేవుడు గడ్డిని విత్తనములిచ్చు చెట్లను, భూమి మీద తమతమ జాతి ప్రకారము తమలో విత్తనములుగల ఫలమిచ్చు ఫలవృక్షములను భూమి మొలిపించును గాక,'' అనుటలో ఇవియన్నియు భూమిలో బంధీకృతములైయున్నట్లును, ఈ బంధీకృతములైన వృక్ష జీవసముదాయములు దైవవాక్కుతో జీవము పుంజుకొని, వాటియొక్క వివిధ రూపములు పొంది వివిధ ఆకారాలతోను జాతులుగాను ఏర్పడి, భూమినుండి బహిర్గతమై విడుదల పొందినట్లును అనగా నిరాకారముగా శూన్యముగా ఉన్న ఈ జీవులు ఆకారమును ధరించుకొని, నేడు మనము చూస్తున్న రూపాలను సంతరించుకొనుట ఇందులోని విధానమై యున్నది. ఈ విధముగా యావద్ సృష్టిని దేవుడు భూమి నుండి, విడుదల చేయించిన తర్వాత ఆది 1:20లో జలములనుద్దేశించి దేవుడు పల్కిన మాటలు ''జీవము గలిగి చలించు వాటిని జలములు సమృద్ధిగా పుట్టించును గాకనియు, పక్షులు భూమిపైని ఆకాశ విశాలములో ఎగురును గాకని పలికెను. దేవుడు వాటి జాతి ప్రకారము జలములు సమృద్ధిగా పుట్టించిన మహామత్స్యములను, జీవముగలిగి చలించు వాటినన్నిటిని, వాని వాని జాతి ప్రకారము రెక్కలుగల ప్రతి పక్షిని సృజించెను. అది మంచిదని దేవుడు చూచినట్లును, సముద్ర జలములు నానా విధమైన జలజీవులను - ఇవన్నియు సృష్టించబడిన తర్వాత అనగా భూమిలోనుండి జలముల నుండి విడుదల పొంది చలించి సంచరిస్తుండగా - దేవుడు తాను జరిగించిన ఈ జీవోత్పత్తి మరియు వాటివాటి విడుదల క్రమము మంచిదైనట్లుగా నిర్ధారించుకొన్నట్లు వేదరీత్యా తెలుస్తున్నది.
ఈ విధముగా సృష్టిలోని నుండి సృష్టములను రూపించిన సృష్టికర్తయైన దేవుడు వాటిని ఏలుటకు తన రూపము తన పోలికలో నిర్మించిన నరునికి ఈ అనంత విశ్వములోని సమస్తము స్వాధీనపరచినట్లు ఆది 1:26-30 చదివితే తెలుస్తున్నది.
అలాగే ప్రియపాఠకులారా! భూగోళములో దేవుడు తాను చేయబోవు నరనిర్మాణమునకు కావలసిన మంటిని జడపదార్థముకూడా భూమిలోనే గుప్తమైయున్నట్లును, దైవహస్త స్పర్శ చేత ఆ మన్నే విభజింపబడి విడుదల పొంది, దేవుడు చేసిన నరరూపమునకు దోహదపడినట్లు తెలుస్తున్నది. ఈ విధముగా మట్టిలోనుండి దేహరీత్యా రూపించబడి విభాగించబడిన నరశరీరంలో దైవ ప్రమేయము కూడా లేకపోలేదు. దైవత్వముయొక్క విడుదల దశ - దేవుడు నరశరీరమును మట్టితో నిర్మించి వాని నాసికారంధ్రములలో తన జీవాత్మను ఊదగా నరదేహములో తన జీవాత్మను విడుదల చేసినందున నరుడు జీవాత్మయైనట్లు మనము గ్రహించవలసియున్నది. ఈవిధముగా తన సృష్టిని - సృష్టములను ప్రకృతిని, పంచభూతాలను, సమస్తమును తన వాక్కులతో విడుదల చేసిన తర్వాత తాను రూపించిన జీవాత్ముడైన నరశరీరములో తన జీవవాయువును విడుదల చేసి నరుని జీవాత్మునిగ జేసి, భూమి మీద నీతి పరిశుద్ధతతో జీవించమని తాను రూపించిన తోట మధ్యలో ఉంచాడు. ఇది దేవుడు నరునికి అనుగ్రహించినట్టి బంధన నుండి విడుదల - ఈ విడుదలలో - ఇట్టి విడుదల వాతావరణములో దేవుడు నరుని పరిశోధించుటకు, తాను వేసిన వనములో రెండు నియమాలను పెట్టినాడు. అనగా వృక్ష సముదాయములలో ప్రత్యేక స్థానము సంతరించుకొన్న 1. జీవవృక్షము రెండవది మంచి చెడు తెలియజేయు వృక్షము. అనగా ఒకటి లోకబంధనతో కూడిన ఫలవృక్షము. మరియొక ఫలవృక్షము - ఆ బంధన నుండి విడుదలను ప్రసాదించే వృక్షము - ఇది జీవవృక్షము, దేవుడు తాను సృష్టించిన నరుడు కూడా స్వతంత్రుడు - అతని ప్రాణానికి ముప్పు లేదు. అతన్ని ఎదుర్కొనే ఏ శక్తి లేదు. ఏ జీవి ద్వారా గాని ఏ ప్రాణి ద్వారా గాని ఏ చెట్టు ద్వారాగాని ఎలాంటి భయము బాధ లేదు. ఈ విధముగా నరుడు సంపూర్ణ స్వాతంత్య్రముతో ఎలాంటి బాదరబందీ లేకుండ, తోటలో ఉన్న ప్రతి వృక్షఫలమును తినునట్టి అధికారము దైవత్వము చేత పొంది స్వేచ్ఛాజీవిగా జీవిస్తుండగా - దేవునిలో నరుని గూర్చినట్టి ఒక సమస్య తలెత్తింది. అదేమనగా దేవుడు సృష్టించిన సకల ప్రాణులలో ఆడమగా జంటలున్నవి. కాని నరునికి జంట లేదు.
కనుక నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదని నరుని కొరకు సాటి సహాయిగా మరియొక రూపాన్ని సృష్టించాలని దేవుడు ఆలోచించినట్లుగ నరునికి కావలసిన జంటను - భూసంబంధ సృష్టములతో గాక, నరుని ద్వారానే ఏర్పాటు చేయాలని సంకల్పించినప్పుడు, నరునికి కావలసిన సాటిసహాయము నరునిలోనే బంధీకృతమై యున్నదన్న సత్యాన్ని దేవుడు గ్రహించి, సృష్టిలోని సకల జీవులకు భూమిమీద జన్మనిస్తే - నరునికి కావలసిన స్త్రీకి పురుషుడు జన్మనీయవలసినట్టి క్రమాన్ని దేవుడు ఏర్పరచి, పురుషునికి నిద్రావస్థ కల్పించి, వాని నుండి ప్రక్కటెముక తీసి స్త్రీ నిర్మాణము గావించినట్లు వేదములో చదువగలము. ఈ విధముగా పురుషునికి కావలసిన స్త్రీ పురుషునిలోనే బంధించియున్నట్లుగాను, నరుని గర్భములో బంధీయై వానికి సాటి సహాయిగా ఆ ఎముకను స్త్రీగా మార్చుటకు - స్త్రీ రూపమునకు దేవుడైన యెహోవా విడుదల కల్గించాడు. ఈ విధముగా పురుషునిలో బంధీకృతమైయున్న స్త్రీ రూపము పురుషునిలోను ఆత్మలోను జీవములోను శరీరములోను మానసిక విధానములోను రక్తమాంసాదులలో భాగస్వామ్యమై యున్నది. కనుక పురుషుని నుండి విడుదలైన ఈ స్త్రీ - పురుష సంబంధియేగాని వేరొకటి కాదు. ఈ మర్మమును బయల్పరచుచు నరునిలోనుండి స్త్రీ రూపముగా రూపించబడిన రూపము నరునిలో నుండి కల్గింది కనుక నారి. ఎందుకనగా నరుని ఆత్మలోను జీవములోను శరీరములోని ఎముకలో మాంసములోను సమస్తములోను భాగస్వామియైయున్నందున ఈమె నారి. ఇందునుబట్టి స్త్రీ పురుషులు వేరైనను ఆత్మ రీత్యా జీవరీత్యా శారీరరీత్యా ఏక శరీరమైయున్నట్లు భావించవలసియున్నది. ఆది 2:24 కాబట్టి పురుషుడు తన తండ్రిని తల్లిని విడిచి తన భార్యను హత్తుకొనును, వారు ఏక శరీరమైయున్నట్లు ఈ సత్యమును దేవుడు మర్మముగా ఉంచినను, స్త్రీ నిర్మాణ కార్యములో బయల్పరచినట్లుగా ఇందునుగూర్చి ఈ మర్మమును అపొస్తలుడైన పౌలు భర్త మరణించినప్పుడు ఆమె భర్తతో ఉన్న వైవాహిక బంధము నుండి విడుదల పొందింది. ఆమె వేరొకని వివాహము చేసికోవచ్చును,'' 1 కొరింథీ 7:39 మనకున్నటువంటి మన కొరకు నియమించబడిన బంధము - మరణబంధము - ఇది ప్రతి నరునికి ప్రతిక్షణము వెంటాడుతుంటుంది. సంసార బంధము, పుత్ర బంధము, పిశాచ బంధము ఋణ బంధము, లోకాధిపత్య చెర, ఆత్మకు శరీరానికున్న పరస్పర బంధాలు. ఇవన్నియు కూడా నరునియొక్క మరణానంతరము - నరుడు ఆత్మీయముగా శరీరము వేరు పడ్డప్పుడు తొలగిపోతాయి.
కనుక ప్రియపాఠకులారా! మనము ఆత్మననుసరించి ఫలించువారమై క్రమముగా నడుచుకొందము, అయితే శరీరానుసారముగా నడుచుకొనుటకు ప్రయత్నిస్తే శరీరసంబంధ బంధకాలలో చిక్కుకొనక తప్పదు. ఆత్మబంధము ఒక్కటే - అది శరీరములో ఉండి ప్రభువు శరీరమునకు ఆత్మకు నియమించిన ఆయుష్కాల పరిమితినిబట్టి అనగా శరీరము నుండి వేరుపరచుటకు విడుదల పొందుటకు నిరీక్షణతో దైవ చిత్తాన్ని గూర్చి శరీరము నుండి పోయే సమయము కొరకు ఎదురుచూస్తుంది. అయితే శరీరములో లోకరీత్యా తాను చిక్కుకొనే బంధకాలలో ఆత్మను కూడా ఇరికించే పరిస్థితినిబట్టి శరీరము యొక్క దుర్భర జీవితాన్నిబట్టి ప్రమాదము ద్వారానో లేక ఆత్మహత్య ద్వారానో లేక ఏదైన ఒక సంఘటననో కల్పించి, శరీరము నుండి విడుదల పొందుటకు ప్రయత్నిస్తుంది. దీనినే ఆత్మ వైరాగ్యము అంటారు. శరీర వైరాగ్యమన్నది తాను ప్రేమించిన వ్యక్తి దూరమైనప్పుడు, కనబడనప్పుడు, తనను వదలి వెళ్ళినప్పుడు శరీర వైరాగ్యము కలిగి, జీవితము మీద విరక్తి గలిగి వీడిపోయిన వ్యక్తి మీదనున్న మమకారమునుబట్టి, ప్రాణత్యాగము చేయుటన్నది శారీర సంబంధమైన కార్యము. ఆత్మ సంబంధమైంది అలాగాకుండ - ఇది ఆత్మ రాజ్యము కొరకు పరమాత్మ కొరకు అనగా సువార్త కొరకు దైవరాజ్య వ్యాప్తి కొరకు, దైవరాజ్య ప్రవేశము కొరకు దైవానుగ్రహం కొరకు లోకములో శారీరముతో జీవించియున్నప్పుడే సమర్పించుకొనుట ఇందునుగూర్చి రోమా 12:1లో పౌలు వ్రాసిన ప్రవచనాన్ని చదువగలము. కాబట్టి సహోదరులారా! పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరాలను ఆయనకు సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యమునుబట్టి మిమ్మును బ్రతిమాలుకొనుచున్నాను - ఇట్టి సేవ మీకు యుక్తమైనది.''
కనుక ప్రియపాఠకులారా! దైవత్వము కొరకు త్యాగము చేసే ఆత్మ సమర్పణన్నది దైవత్వమునకు యోగ్యకరము మహిమకరమును దైవరాజ్య ప్రవేశ అర్హత. ఇట్టివాడు శరీరమును తుచ్ఛంగా భావించి శరీర ఆశలను సిలువ వేసి, ఆత్మ సమర్పణ ద్వారా శరీరము నుండి విడుదల పొంది, పుణ్యపురుషులుగ ఆత్మపురుషులుగ దైవరాజ్య సంబంధులుగ నిర్ధారించబడి, అన్ని విషయాలలోను స్వేచ్ఛాజీవులుగ దైవత్వము చేత ప్రశంసింపబడిన వారుగ ఉన్నారు. ఇట్టి కోవలో అపొ 7:59 హతసాక్షియైన స్తైఫను తన శరీరమును రాళ్ళతో కొట్టబడి జీవం కోల్పోయినను అతని ఆత్మ మట్టి శరీరమును వదలినను దైవరాజ్యములో ఒక స్థానమును సంతరించుకొన్నది. ఇది ఆత్మీయ విడుదలకు మాదిరి. ఇక శరీర సంబంధమైన విడుదల ద్వారా మృతుల లోకమునకు చేర్చబడినవారు అననీయ సప్పీరాల చరిత్ర. వీరు పరిశుద్ధాత్మను మోసగించి అగౌరవపరచి, దైవత్వమునకు చెందవలసిన అర్పణలను దొంగిలించుటనుబట్టి, అంటే అసత్యపూరితమైన వైఖరిని అపొస్తలుల ఎదుట ప్రవర్తించుటనుబట్టి దైవోగ్రతకు గురియై, దైవత్వము చేతనే మొత్తబడి, ఆత్మను మృతుల లోకానికి శరీరాన్ని పాతాళమునకు విభాగించుకొనే హీనస్థితికి గురియయ్యారు. ఇది దైవతీర్పులో అపొస్తలుల చేత విధించబడిన శిక్ష. ఈ శిక్ష ద్వారా అననీయ దంపతులు ఏకీభవించి, ఒకే స్థలములో ఇరువురును మరణము ద్వారా మృతుల లోకాన్ని చవి చూచారు. అనగా మరణ బంధకాల నుండి పాతాళములోకి విడుదల చేయబడినారు.
కనుక ప్రియపాఠకులారా! ఇపుడు మనకు లూకా 4:18లో వలె నేటి లోకస్థుల మైన మనకు విడుదల ఏర్పడియున్నది. ''చెరలో నున్న వారికి విడుదల, గృడ్డివారికి చూపును, నలిగిన వారిని విడిపించుటకును, ప్రభువు హితవత్సరము ప్రకటించుటకును, ప్రభువైన యేసుక్రీస్తును దేవుడు ఈ లోకానికి పంపియున్నాడు. ఆయన మన పాపముల నుండి విడుదల కల్గించుటకు అనగా మన దోషములను తుడిచి ఆయన ద్వారా నీతిమంతులుగా తీర్చబడి, యోహాను 1:12లో వలె ప్రభువైన యేసును ఎందరంగీకరించెరో వారికందరికి, అనగా ఆయన నామమందు విశ్వాసముంచిన వారికి, దేవుని కుమారులుగ తీర్చబడుటకు - అనగా మన పాపముల నుండి మనలను విడిపించి, మనకు సంక్రమించిన మరణపాశముల నుండి రక్షించుటకు ప్రభువైన యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చెను. ఇందునుబట్టి యేసు క్రీస్తు ద్వారానే విడుదల విమోచన మనకున్నదన్న దైవప్రణాళిక ఏర్పడియున్నట్లు ఇందునుబట్టి మనకు తెలుస్తున్నది. ఇందునుగూర్చి మొదటి యోహాను 1:9లో ''మన పాపములను మనము ఒప్పుకొన్న యెడల ఆయన నమ్మదగినవాడును, నీతిమంతుడును గనుక ఆయన మన పాపములను క్షమించి, సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగ చేయును - ఇదియే విడుదల.
.....
హెబ్రీ 1:1-4 పూర్వకాలమున నానా సమయములలోను నానావిధములుగాను ప్రవక్తల ద్వారా మన పితరులతో మాట్లాడిన దేవుడు - ఈ దినముల అంతమందు కుమారుని ద్వారా మనతో మాటలాడెను, ఆయన ఆ కుమారుని సమస్తమునకు వారసునిగా నియమించెను. ఆయన ద్వారా ప్రపంచమును నిర్మించెను. ఆయన దేవునియొక్క తేజస్సును ఆయన తత్వముయొక్క మూర్తిమంతమునైయుండి, తన మహత్తుగల మాట చేత సమస్తమును నిర్వహించుచు, పాపముల విషయములో శుద్ధీకరణము తానే జేసి, దేవదూతలకంటె ఎంతశ్రేష్టమైన నామము పొందెనో వారి కంటె అంతశ్రేష్టుడై, ఉన్నత లోకమందు మహామహుడగు దేవుని కుడి పార్శ్వమున కూర్చుండెను. హెబ్రీ 3:1 ఇందువలన పరలోక సంబంధమైన పిలుపులో పాలుపొందిన పరిశుద్ధ సహోదరులారా! మనము ఒప్పుకొనిన దానికి అపొస్తలుడును ప్రధాన యాజకుడునైన యేసుమీద లక్ష్యముంచుడి.''
ప్రియపాఠకులారా! హెబ్రీ పత్రిక 1:1-4లో వ్రాయబడిన వేదవచనాలనుగూర్చి తెలిసికొందము. ఇందులో పాతనిబంధన కాలములో అనగా నిరక్షరాస్యత విద్య లేని చదువు సభ్యతలేని అమాయికమైన కాలమును, దైవత్వమును గూర్చి సత్యాన్ని ఎరుగని కాలము. మంచి ఏదో చెడు ఏదో తెలియని కాలము. దైవత్వము ఎరిగియు దానిని మహిమపరచక లోకమార్గములో లోకాధిక్యత నియమావళి లోకముతో చేతులు కలిపి పూర్తిగా పాపము - మూడు పువ్వులు ఆరు కాయలుగ వర్థిల్లిన ఆకాలములో - దేవుడు తనకంటూ ఒక ప్రత్యేక జనాభా ఇశ్రాయేలు అను పేరుతో ఎన్నుకొన్న ఆ కాలములో - ఆయా సందర్భాలలో మరియు దేవుడు తన జనాంగాన్ని క్రమబద్ధము చేయుటకు ధర్మశాస్త్రమను పది ఆజ్ఞలుగల శిలాపలకలను, దేవుని ధర్మశాస్త్రముగా తన జనాంగమైన ఇశ్రాయేలు విధిగా ఆచరించుచున్న ఆ కాలములో - ఆ విధముగా ఆ శాస్త్రము ఆ నియమావళిని దైవ మార్గమునకును, దైవ సంబంధమైన కట్టడలకు విధేయించక, దేవుని శక్తి సామర్ధ్యములు ఎరిగియు నాటి జనాంగము ఆయన మీద తిరుగుబాటు చేసిన కాలములో కూడా దేవుడు మాట్లాడిన విధానాలను గూర్చి సందర్భాలను గూర్చి వేదరీత్యా తెలిసికొందము.
ఇందులో మొదటిగ దేవుడు ఆది సృష్టిని రూపించి సంపూర్ణముగా సృష్టించిన తర్వాత తాను సృష్టించిన తొలి నరజంటతో ప్రత్యక్షముగా తానే మాట్లాడుచు, అహర్నిశలు వారి బాగోగులు వారి బరువు బాధ్యతలు తానే వహించి, తన పరలోక దేవదూతల సావాసమును వదలుకొని, తన చేతిపనియు తన జీవాత్మ భాగస్వామియైన నరునితో సావాసము చేస్తూ - వేడి వాతావరణము కాక చల్లని పూట. ఆనందించుటకు దర్శించినట్లుగ వేదములో ఆది 3:8 తాను సృష్టించిన నరులను ఆయన దర్శించిన వేళ చల్లని పూట అటు తర్వాత దైవాజ్ఞాతిక్రమమునుబట్టి దేవునియొక్క దర్శనాన్ని చల్లపూట దర్శించే యోగ్యతను నరుడు కోల్పోయిన వ్యక్తియొక్క సంతులో - తన యందు విశ్వాసముంచి భయభక్తులు గల్గిన అబ్రాహాము అను విశ్వాసిని పరిశోధించుటకు ఆది 18:1 తీక్షణమైన ఎండ వేడి వాతావరణాన్ని ఎన్నుకున్నాడు.
ప్రియపాఠకులారా! ఇందులోని పరమార్థమును ఏనాడైనను మనము గ్రహించామా? ఏనాడైనను ఆలోచించామా? చల్లని వేళ నరుని దర్శించే యోగ్యత కోల్పోయిన నరుని విషయములో - వేడి వాతావరణములో దైవదర్శనాన్ని పొందే దురదృష్టాన్ని పొందడమన్నది ఎంతో విచారకరము. మన మూల వాక్యములో పూర్వకాలమున నానా సమయములలో నానా విధాలుగా దేవుడు మాట్లాడిన విధానమునుగూర్చి తెలిసికొనియున్నాము. కాని అబ్రాహాము జీవితము ముగించిన తర్వాత దేవుడు తాను ప్రత్యక్షముగా మాట్లాడుట మాని దూతల ద్వారా ప్రవక్తల ద్వారా మాట్లాడిన సంఘటనలు కోకొల్లలుగా ఉన్నవి. మొట్టమొదటగా ఆదాముతో కలిసి జీవించిన దేవుడు - ఆదాము దైవసావాసము కోల్పోయిన తర్వాత రెండవసారిగా నాటి లోకములో విస్తరించిన జనాభా వారి ద్వారా లోకానికి కల్గినటువంటి అపవిత్రతను తుడిచివేయుటకు, జలప్రళయ వినాశ ప్రణాళిక రూపించుటకు దేవుడు మాట్లాడిన సమయ సందర్భము ఏదనగా నాటి కాలములో విస్తరించిన జనాభాలో దైవదృష్టికి దైవసన్నిధికి దైవ సమక్షములో నోవహు అను వ్యక్తిని నీతిమంతునితో ప్రత్యక్షముగా మాట్లాడి, జలప్రళయ వినాశమును వివరించి, కావలసిన సిద్ధపాటు గలిగి 371 దినములు నీటిలో నిలబడ శక్తి గల మన్నిక గల ఓడ నిర్మాణమునకు కావలసిన ఆయొక్క మ్రానితో చేయవలసిన నమూనా విధానము, ఓడ నిర్మాణములో పాటింపవలసిన పద్ధతులు, వగైరాలను గూర్చి వివరించి, అటు తర్వాత నోవహు తలపెట్టిన ఓడ నిర్మాణ కార్యము పూర్తియైన తర్వాత నలభై దినములు ప్రచండమైన వర్షము, ఆకాశములోని జలధారలు తెరిచి మహాపర్వతాలు మునిగి ప్రవాహ జలములు భూమి మీదకు రప్పించినప్పుడు నరులపట్ల దేవునికున్న అనుగ్రహము ఎంత గొప్పదో, ప్రేమ ఎంత బలమైనదో, ఎంత ఉన్నతమైన మోతాదులో వుందో ఒక్కసారి మనము ఆత్మీయ దృక్పధముతో వీక్షించి సుదీర్ఘముగా ఆలోచించవలసినవారమై యున్నాము. అయినను దేవుడు తాను సృష్టించిన నరుని పట్ల తనకున్న ప్రేమను చంపుకోలేదు, కోల్పోలేదు, తానెన్నుకున్న నీతిమంతుని ద్వారా మరొక సృష్టిని రూపించినట్లుగా వేదములో చదువగలము. ఆ విధముగా పునర్ నిర్మాణ సృష్టియే ఇప్పుడున్న ఈ అనంత విశ్వము.
నాటి నోవహు కాలములో పాపము విస్తరించిన రీతిగా నానా విధాలుగ నానా విధ పద్ధతులతో నానా విధ పోకడలతో విజృంబించి ప్రపంచమంతయు ప్రాకి విస్తరించి, నరునిలో దేవునిపట్ల విశ్వాసమన్నది దాదాపు లేనట్లుగానే క్రియజరిగిస్తున్నది. ఆధునిక విజ్ఞానము మూడుపువ్వులు ఆరు కాయలుగ నరునిలో విస్తరించి నరుని సహాయము లేకనే పనిచేసే యంత్రాలు, శ్రమపడి అచ్చు వేసి ప్రతులను ముద్రించే పద్ధతికి బదులు యంత్రము దానియంతట అదే శబ్దమునుబట్టి అక్షరాలు ముద్రించే ఆశ్చర్యకరమైన జ్ఞానము లోకములో క్రియ జరిగిస్తుంది. ఒక్క మాటలో చెప్పాలంటే ప్రతి విషయములో నరునికి యంత్రాలు త్వరితముగాను నిర్దుష్టముగాను నరునియొక్క ఉద్దేశానుసారము, వాని చిత్తానుసారము వాని జ్ఞానమునుబట్టి పనిచేసే యంత్రాలు, ఉపగ్రహాలు క్షిపణులు, భూగోళ ఖగోళ పరిశోధన సాధనములు; గంటలు నిమిషాలలో అతి వేగముగా సుదూర ప్రయాణము చేసే ప్రయాణ సాధనాలు, వ్యక్తుల సహకారము లేకుండగనే పంట కోత, కుప్ప నూర్పిడి, భూమి దున్నుట, కలుపు తీయుట, ధాన్యము నూర్చుట, నూర్చిన ధాన్యాన్ని గృహానికి చేర్చుట, నారు నాటుట, విత్తనాలు చల్లుట ఒకటేమిటి? అన్ని సాంకేతిక రంగాలలో సాధన సంపత్తి, ఇక నరుని దేహ విషయములో నరునిలో ఏదేని ఒక అంగము పనిచేయనప్పుడు కృత్రిమ అంగాన్ని అమర్చే జ్ఞానము. నరునియొక్క అంతర్భాగాలలోని అవయవాల క్రియను ఛాయాచిత్రము ద్వారా ఎక్స్‌రే ఒకటేమిటి? సకల విధమైనటువంటి శాస్త్రాలు నేడు ఆధునిక యుగములో విస్తరించి, నరునియొక్క జీవితములో లోకము - లోకసంబంధ శాస్త్రజ్ఞానమే ప్రాముఖ్యమన్నట్లు దైవత్వముయొక్క ప్రమేయము ఇందులో ఎంత మాత్రము ఏమియు లేనట్లుగ నరునియొక్క హృదయ స్థితిని పూర్తిగా మార్చివేసి ఈ లోకమన్నది నరుని దైవత్వము నుండి పూర్తిగా విడదీసి వారిని దైవత్వమునకు ఏ కోణములో కూడా భాగస్థునిగ చేయక, పూర్తిగ శాస్త్రజ్ఞానము అను పేరుతో ఈ లోకము వ్యక్తులను తమయొక్క గుప్పిట్లో ఉంచుకొని క్రియ జరిగిస్తున్నది. నేటి నాగరిక ప్రపంచములో జరుగుచున్న యదార్ధ చరిత్ర. ఇట్టి స్థితిలో నరుడు లోకరీత్యా లోకసంబంధమైన శాస్త్రజ్ఞానానికి తలవంచక తప్పటము లేదు. ఎందుకనగా నరునియొక్క జీవితములో దైవత్వము పట్ల ప్రేమ తప్పింది. అతడు పూర్తిగా లోకము మీద ఆధారపడే అవసరత ఉంది. ఆ విధముగా లోకాన్ని ఆశ్రయించకుంటే ఈ దేహము భూసంబంధమైనది గనుక దేహరీత్యా మరణము తప్పదు.
ప్రియపాఠకులారా! దైవత్వమన్నది నిజముగా నేడు విస్తరించి క్రియ జరిగించిన పక్షములో హస్పిటలుగాని లేక వైద్యసంబంధ పరిశోధనలుగాని, దానికి సంబంధించినటువంటి శాస్త్రాలుగాని ఉండవు. నేటి యుగములో జనాభా కంటే వ్యాధులు దీర్ఘ రోగాలు, మరణతుల్యమైన అవాంతరాలు సమస్యలు కలుగవు. ప్రియపాఠకులారా! మనము వేదరీత్యా ఆలోచిస్తే పాత నిబంధనలో హాస్పిటల్సు ఉన్నాయా? నూతన నిబంధనలో హాస్పిటల్సు ఉన్నాయా? అపొస్తలుల కాలంనాటి దినాలలో పేరుమోసిన వైద్యులున్నారా? నాటి కాలములో ప్రవక్తలే వైద్యులు, ప్రవక్తలు పల్కిన మాటలే స్వస్థతకు మూలము. నాటి కాలములో ఎక్స్‌రేలుగాని, వైద్యశాలలుగాని కళాక్షేత్రాలుగాని నాటకశాలలుగాని టి.వి.లుగాని, సినిమాలుగాని ఆ యుగాలలో లేవు. మరి నోవహు కాలములోయైతే నరజీవితమన్నది పూర్తిగా దైవత్వము మీద ఆధారపడి ప్రతి విషయములోను ప్రవక్తలు యాజకుల పరిచర్యనుబట్టి వారు దైవత్వముతో సంప్రదించి జరుపవలసిన కార్యములను గూర్చి వచ్చిన జబ్బుకు నివారణ, తలెత్తిన సమస్య నుండి విడుదల పొందుటకు కావలసిన సలహాలు వీటన్నిటిని గూర్చి కూడా నాటి కాలములో నరులు స్వయముగా కాకపోయినను దైవత్వమునకును లోకమునకును మధ్యవర్తులైన దైవజనుల ద్వారా వారికి సంభవించిన సమస్యకు పరిష్కారము, వారికి కల్గిన రోగాలకు విడుదల గూర్చి విచారించి తెలిసికొని, ఆ ప్రకారముగా దైవత్వముతో దైవ చిత్తానుసారము తమయొక్క లోకసంబంధ సమస్యల నుండి విడుదల పొందేవారు.
అయితే ప్రియపాఠకులారా! నేడది పూర్తిగా పోయింది, ఈనాడు దైవత్వాన్నిగూర్చి విచారించి దైవజనునికి తమయొక్క అవసరతలను విన్నవించుకొని తద్వారా తమకు వచ్చిన అనర్ధాలు పరిష్కరించుకొనే స్థితిలో నరులు లేరు. అపొస్తలుల కాలములో యాకోబు 5:14-17 మీలో ఎవడైనను రోగియైయున్నాడా? అతడు సంఘపు పెద్దలను పిలిపించవలెను. వారు ప్రభువు నామమున అతనికి నూనె రాసి అతని కొరకు ప్రార్థన చేయవలెను. విశ్వాస సహితమైన ప్రార్థన ఆ రోగిని స్వస్థపరచును, ప్రభువు అతనిని లేపును, అతడు పాపములు చేసినవాడైతే పాప క్షమాపణ నొందును, మీ పాపములను ఒకనితోనొకడు ఒప్పుకొనుడి, మీరు స్వస్థత పొందునట్లు ఒకని కొరకు ఒకడు ప్రార్థన చేయుడి, నీతిమంతుని విజ్ఞాపన మనః పూర్వకమైనదై బహు బలము గలదై యుండును, ఏలీయా మన వంటి స్వభావముగల మనుష్యుడైనను అతడు ఆసక్తితో ప్రార్థన చేయగా ఆకాశము వర్షమునిచ్చెను.
ప్రియపాఠకులారా! ఈ విధమైన క్రియలు నేడు క్రైస్తవ సంఘములలో జరుగుచున్నాయా? అయితే నేటి లోకము పోకడ రోమా 3:11-12లో పౌలు ఈలాగు ప్రవచించి యున్నాడు'', నీతిమంతుడులేడు, ఒక్కడును లేడు, దేవుని వెదకువాడు లేడు. అందరు త్రోవ దప్పి ఏకముగా పనికిమాలినవారైరి, మేలు చేయువాడు లేడు, ఒకడైనను లేడు. అంతేగాకుండ 23లో ఏ భేధమును లేదు, అందరును పాపము చేసి దేవుడనుగ్రహించు మహిమను పొందలేకపోవుచున్నారని వ్రాయబడిన ప్రకారము నేటి లోకముయొక్క స్థితి ఉంది. ఆత్మన్నది ఏమిటి? అసలు ఆత్మన్నది ఉన్నదా? ఇది మరీ అవివేకముతో కూడినట్టి మాటగా మనము గ్రహించాలి. ప్రియపాఠకులారా! నరుడు అవిశ్వాసి కాకపోతే నరునిలోని ఆత్మనే నరుడు శంకిస్తున్నాడంటే నరుని అజ్ఞానము ఎంత మోతాదులో క్రియ జరిగిస్తుందో ఇందునుబట్టి తెలుస్తున్నది.
కనుక ప్రియపాఠకులారా! ఇట్టి అజ్ఞానము పాపభూయిష్టమైన ఈ లోకములో నరుడు పవిత్రునిగా ఉండాలంటే భక్తి - విశ్వాసములకు ప్రతిగా వానిని కూడా ఈ లోకము ఆకర్షించి అపవాదితో ఏకమై సృష్టిలోని సృష్టములను నరుని దృష్టికి ఆకర్షింపజేసి తద్వారా నరజీవితమును పాపభూయిష్టముగా మార్చి మరణపాత్రునిగ చేసి దైవానుభూతికి దైవసావాసమునకు, దైవత్వముతో సమాధానపడుటకు ఈ లోకమన్నది అడ్డుబండగా ఉన్నట్లు తెలియుచున్నది. అంతేగాకుండ లోకమును ప్రేమించిన నరుని ఈ లోకమన్నది తనయొక్క బాహువులలో ఇరికించుకొని దైవపథమునకు నరుడు తొలగి పోకుండ కాలము సమీపించినప్పుడు నానావిధ రోగాలు భయాలు, ప్రమాదాలు, లోకసంబంధమైన రొష్టులతో నరులను ఇరికిస్తూ ఒకవైపు బాధించుచు మరొక వైపు వానికి సహకరించుచు, కలిమి లేములు కావడి కుండలు అనేటటువంటి కల్ల వేదాంతము నరుల దృష్టికి నరుల జ్ఞానానికి తెల్పుచు - ఎట్టి పరిస్థితులలోను నరుడు నిజదేవుని ఎరుగకుండ చేయుటయే ఈ లోకముయొక్క ప్రధానోద్దేశ్యమైయున్నది. అందుకే మొదటి తిమోతి 6:11లో పౌలు ఈలాగు సెలవిస్తున్నాడు. దైవజనుడా! నీవైతే వీటిని విసర్జించి, అనగా ఈయొక్క లోకసంబంధమైన ఈ మాయా క్రియలను, నీడవంటి ఐశ్వర్యాలను విసర్జించమనుటలో ఇవి దైవరాజ్యమునకు దైవ సావాసమునకు, దేవుడు మనలో ఉంచిన ఆత్మకు ఏ విధముగాను పనికిరావని, అయితే ఆత్మ సంబంధమైన ఐశ్వర్యాలు ''నీతి భక్తి విశ్వాసము ప్రేమ ఓర్పు సాత్వికము అనే ఈ అమూల్యమైన సంపదను ఈ అదృశ్యములోని మహదైశ్వర్యాలను పొందుటకు ప్రయాసపడమంటున్నాడు.
ప్రియపాఠకులారా! ఇవి పొందాలంటే లోకసంబంధమైనవేవియు ఉపకరించవు. అంటే లోకసంబంధమైన వాటితో పై వివరించిన గుణగణాలకు ధనాపేక్ష సమస్త కీడులకు మూలము, ధనాపేక్షను అపేక్షించు వారు శోధనలోను ఉరిలోను పడుటయేగాక, నష్టములోను నాశనములోను ముంచి వేయును. అట్టివారు విశ్వాసమునుండి తొలగిపోవుదురు. 1 తిమోతి 6: 9-10 లోకమునకు విరోధముగా పోరాడాలి, ఆ పోరాటమన్నది విశ్వాస సంబంధమైన మంచి పోరాటముగా వుండాలి. ఈ పోరాటము నీలోని జీవము కొరకు పోరాడాలి. ఆ నిత్యజీవమును పొందాలంటే లోకములో మంచి సాక్ష్యములను దేవుని ఎదుట కలిగి యుండాలి. అంటే లోకసంబంధ ఆశయాలను, దేహముతో జరిగించిన పాప క్రియలను, అక్రమ సంపాదన ధనాశ నేత్రాశ వగైరా దైవత్వమునకు వ్యతిరేకమైన గుణాలతో పోరాటము సాగించాలి. ఒక్క మాటలో చెప్పాలంటే లోకాన్ని విసర్జించి సమస్తమునకు ఆధారభూతుడైన దేవునియొక్క భక్తి విశ్వాసాలు కలిగి మారుమనస్సు పొంది, సత్యదేవునియొక్క నియమావళిని పాటిస్తూ మంచి సాక్ష్యాన్ని పొంది, దైవత్వమునకు యోగ్యునిగా భూమి మీద జీవించాలి. ప్రభువుయొక్క ఈ ఆజ్ఞను నీవు గైకొనాలంటే 1 తిమోతి 6:14లో పౌలు వివరించిన వివరణ. మన ప్రభువైన యేసుక్రీస్తు ప్రత్యక్షమగు వరకు నీవు నిష్కళంకముగాను, అనింద్యముగాను ఈ ఆజ్ఞను గైకొనవలెనని ఆజ్ఞాపించిన విధముగా - లోకము ఎదుటను, దేవుని ఎదుటను, రాజుల ఎదుటను, న్యాయాధిపతులు పరిపాలకుల ఎదుటను, దైవజనుల ఎదుటను, మంచి సాక్ష్యము పొందినప్పుడే దైవత్వము చేత స్థాపించబడి ఏర్పరచబడే నూతన సృష్టిలో - ఇట్టి విశ్వాసికి పాలుపంపులు వారసత్వము స్వాస్థ్యము కలుగగలదని ఇందునుబట్టి గ్రహించాలి.
ప్రియపాఠకులారా! ప్రకటన 21:లో ఈలాగు వ్రాయబడి యున్నది'', అంతట నేను క్రొత్తాకాశమును క్రొత్త భూమిని చూచితిని, మొదటి ఆకాశమును మొదటి భూమియు గతించిపోయెను, సముద్రమును ఇకనులేదు. అని వ్రాయబడుటలో ప్రియపాఠకులారా! క్రొత్తాకాశము క్రొత్త భూమి ఎన్నిసార్లు దైవత్వము చేత సృష్టించబడింది? అసలు క్రొత్తాకాశము, క్రొత్త భూమి పుట్టక మునుపు, మొదటి ఆకాశము మొదటి భూమిలో జీవించినవారున్నారా? ఈ సత్యమును గ్రహించినవారున్నారా? మొదటి భూమిలో నివసించిన ప్రాణికోటి ఆధారాలు లభించినను నరులు నివసించినట్లు దాఖలాలున్నాయా? మొదటి భూమి మొదటి ఆకాశములో నివసించినవారికి దేవునియందు భయభక్తులున్నాయా? ఉంటే ఆయా భూమ్యాకాశాలు నిరాకారమై శూన్యమగుటకు కారణమేమి? సృష్టికి పూర్వము దేవుడు దేవలోకములో ఉన్నాడా? ఆయనకంటూ ఒక రాజ్యము ఆ రాజ్యములో ఆయన పరిచారకులున్నారా? ఆయన ఆత్మ గనుక ఆయనకు పరిచర్య జరిగించే వారెవరు? ఆత్మచే తృప్తిచెందక మరియొక లోకాన్ని సృష్టించాలన్న తలంపు కలవాడై, ఆకాశములో ఉన్నత ఆధిపత్యాన్ని ఉన్నత స్థితిని ఉన్నత ఐశ్వర్యమును దేవదూతల చేత వారి స్తుతుల మూలముగా స్తుతింపబడుచు, ఆరాధింపబడుచు'' సైన్యములకు అధిపతియైన యెహోవా పరిశుద్ధుడు - పరిశుద్ధుడు - పరిశుద్ధుడు భూమ్యాకాశాలు ఆయన మహిమతో నిండియున్నవి,'' యెషయా 6:3 అనిన నినాదములతో స్తుతిగానములతో స్తోత్రాల మీద ఆసీనుడై, ఒకానొక సమయమున తాను మరియొక లోకమును అనగా అదృశ్యమైనదిగాక దృశ్యమైన లోకమును; అలాగే అదృశ్యమైన లోకములో కండ్లకు కనబడే రూపాలను దేవదూతలను పోలినటువంటి రూపాలను, దేవుని ఆత్మను ధరించిన రూపాలను, దేవుని పోలిక - దైవస్వరూపము, దాల్చిన రూపాలకు నరులని పేరు పెట్టి సృష్టించాలని సంకల్పించి ఆది 1:1 లో ఆదియందు దేవుడు భూమ్యాకాశాలను సృష్టించెను అని ఉన్నది. అప్పటి భూమి పరిస్థితి నిరాకారము శూన్యముగా ఉండెను. చీకటి అగాధ జలముపైన కమ్మియుండెను,'' అని వ్రాయబడియున్నది. ఆ విధముగా ఉన్న నిరాకారమైన గాడాంధకార చీకటిలో భధ్రపరచబడి నిర్జీవమైన స్థితిలో నిరాకారముతో - నిష్ప్రయోజనకరముగా ఉన్నటువంటి అనామకమైన సృష్టి జలముల మీద అనగా అప్పటి జలములు కూడా నిర్జీవములే! ఎందుకనగా నాటి జలరాసులలోగాని, నిరాకార భూమిలోగాని ఏలాటి జీవరాసులు జీవించలేదని ఇందునుబట్టి మనకు తెలియుచున్నది.
ఇట్టి తరుణములో పరలోకములో దేవదూతలచే పరిచర్య జరిగించుకొను దేవునికి ఈ లోకహీనత్వమును గూర్చి, దీనియొక్క దారిద్య్ర స్థితినిగూర్చి ఆయన ఆత్మతో దర్శించినప్పుడు ఈ నిరాకారమైయున్న అనంత విశ్వముపై జాలిపడి దీన్ని కూడా ఒక లోకముగా మార్చాలని, అంటే సృష్టికర్త ఉన్నది పరలోకము, చీకటి అగాధ జలములలో వున్న మరో సృష్టి - భూలోకముగా దాన్ని రూపొందించాలని ఆది 1:3లో దేవుడు ఆత్మగా జలముల మీద అల్లలాడినట్లు వ్రాయబడియున్నది. దేవునిలో ఎంత మాత్రము చీకటి లేదు - దేవునితో చీకటి అన్నది ఏమిటో మచ్చుకు కనబడదు. దైవత్వముయొక్క వెలుగు మొత్తము లోకాలకు అన్నిటికిని, ఆయనయొక్క కనుదృష్టి తీక్షణత ప్రకాశిస్తున్నది గనుక తాను దయదలచి జాలిపడిన భూమి మీద కూడా ఆయన ఆత్మ పల్కిన మొట్టమొదటి మాట ''వెలుగు కమ్మనగా, వెలుగాయెను,'' ఇందునుబట్టి మొట్టమొదట రూపించబడింది భూమి కాదు, సృష్టి కాదు, పంచభూతాలు కాదు, మొట్టమొదట సృష్టించబడింది జీవరాసులు కావు, వృక్ష సంతతులు కావు. దేవుడు తన వెలుగును పరిశోధించినట్లును ఆ వెలుగు మంచిదైనట్లును వ్రాయబడియున్నది. దేవుడు వెలుగును చీకటిని వేరుపరచెను, దేవుడు వెలుగునకు పగలనియు చీకటికి రాత్రి అనియు పేర్లు పెట్టినట్లును ఇవన్నియు ఏర్పడుటకు ఒక్క దిన కాలము పట్టినట్లు వ్రాయబడియున్నది. ఆది 1:1-4.
అనగా మొట్టమొదట సృష్టించబడింది వెలుగు. కనుక ప్రియపాఠకులారా! సృష్టికి పూర్వము భూమ్యాకాశాలు లేవు. జలములు భూమి ఆకాశము ఏకత్వము పొందియున్నవి. శరీరము జీవము - ఆత్మ - నరుడయ్యాడు. అలాగే భూమి జలములు ఆకాశము మూడును ఒకదానితోనొకటి కలసిపోయి యున్నట్లుగా నిరాకార సృష్టిలో ఉన్న రహస్యము. ఇది ఏ విధముగా విభాగించబడిందో ఆది 1:6-8 వచనము ద్వారా గ్రహించగల్గుచున్నాము. మరియు దేవుడు - జలముల మధ్య నొక విశాలము కలిగి - ఆ జలములను ఈ జలములను వేరుపరచునుగాక! అని పల్కినట్లును, దేవుడు ఆ విశాలము చేసి విశాలము క్రింద జలములను విశాలము మీది జలములను వేరుపరచగా ఆ ప్రకారమాయెను. దేవుడు ఆ విశాలమునకు ఆకాశము అని పేరు పెట్టినట్లుగా రెండవ దినమున జరిగిన సృష్టి నిర్మాణ కార్యములోని వివరణ. ఇప్పుడు మనము ఈ అధ్యాయములో చదువుచున్న విధముగా రెండు దినములలో చేసినది 1. వెలుగు - ''చీకటి - వెలుగు, విభజన. ఈ విభజనలో ఆకాశము భూమి వేరుపరచుట తెలిసికొని యున్నాము. ఇక భూమియొక్క పూర్వీక స్థితినిగూర్చి కొన్ని మాటలు తెలిసికొందము. 1:9లో భూజల విభజనను గూర్చి వ్రాయబడియున్నది. అదేమనగా ''ఆకాశము క్రిందనున్న జలములు ఒకచోటనే కూర్చబడి జలములను భూమిని వేరుపరచుట - ఇది ఈ సందర్భములో మనము గ్రహించవలసిన విషయము. ప్రియపాఠకులారా! ఆరిన నేలకు భూమి అని పేరు పెట్టింది దేవుడే! భూమికి ఆకాశానికి పేరు పెట్టింది దేవుడేగాని నరులు కారు. ఆరిన నేలకు భూమియని జలరాశికి సముద్రమని పేరు పెట్టినట్లు వ్రాయబడి యున్నది. ఇది సృష్టికి పూర్వము సృష్టములకు నెలవులైన పంచభూతాలయొక్క పూర్వీక స్థితి. ఆ విధముగా దేవుడు తాను జేసిన ఈ త్రివిధ భూమ్యాకాశాలు సముద్రము సృష్టి క్రియనుబట్టి అది మంచిదైనట్లు తానే నిర్ధారణ చేసికొన్నట్లును, నరులు దానిని చూచి మంచిదనుటకును బాగోగులు నిర్ధారించు అధికారము ఆధిక్యత సృష్టికర్తకే ఉందిగాని నరులకు లేదు. ఈ సందర్భములో దావీదు వ్రాసిన కీర్తన భాగములో సృష్టికర్తయైన దేవుని గూర్చి స్తుతించిన విధానము ఇమిడియున్నది. ఇందులో 8:3-4లో ''నీ చేతిపనియైన నీ ఆకాశములను, నీవు కలుగజేసిన చంద్రనక్షత్రములను నేను చూడగా - నీవు మనుష్యుని జ్ఞాపకము చేసికొనుటకు వాడేపాటివాడు? నీవు నరపుత్రుని దర్శించుటకు వాడేపాటివాడు? అని వ్రాయబడియున్న ప్రకారము సృష్టికర్తయైన దేవునియొక్క నిర్మాణ క్రియను విమర్శించుటగాని వ్రేలుబెట్టి చూచుటకుగాని, ప్రశ్నించుటకుగాని నరులకు యోగ్యత లేదు.
........
యేసు లోకానికి ఎందుకు వచ్చినాడు? క్రొత్త నిబంధనయను వేదమునకు స్థాపకులెవరు? పాతనిబంధన, నూతన నిబంధన అనునవి జనబాహుళ్యములో జరిగించిన క్రియలేవి? పై అంశములను గూర్చి వివరణ.
సర్వసృష్టికిని ఆదిసంభూతుడైన దేవుడు తన ఆత్మ రూపమైన నరులు తన ఆజ్ఞను అతిక్రమించి నందువల్లను పాపమును దాని జీతమగు నాశనకరమైన శాపాన్ని మరణాన్ని సంపాదించుకొన్నందువల్లను దేవుడు ఆది 8:21 ఆది 6:5లో మనస్సులో నొచ్చుకొన్నట్లు యోహాను 3:16లో వలె దేవుడు లోకమునెంతో ప్రేమించినట్లు ఆయన ప్రేమ విస్తారమైనదిగను, నరులను అధికముగా ప్రేమించినందువల్ల నరరూపముతో ఈ లోకమునకు వచ్చు సందర్భమును నరునికి ఛాయగా దేవుడు చూపిన సూచనలను ఈ క్రింది రెఫరెన్సుల ద్వారా మనము చూడగలము.
ఏదెనులోని జీవవృక్షము :- ఆదాము హవ్వలకు తోట నుండి వెళ్ళగొట్టినప్పుడు తొడిగిన చర్మపు దుస్తులు. హేబెలు అర్పించిన బలి నోవహు కుటుంబమును జలప్రళయములో కాపాడిన ఓడ, మోషే తట్టిన బండ, మోషే ఎత్తిన సర్పము వగైరాలు. నూతన నిబంధనలో అవతరించిన క్రీస్తుకు సాదృశ్యములైయున్నవి. ఇదిగాక తానవతరించబోవు నరరూపముయొక్క ప్రభావమునకు సాదృశ్యముగను, తానెత్తనున్న యేసు అను నరావతారమునకు సత్యసాక్షి. మోషే అహరోను ప్రవక్తలు రాజులు యెషయా యిర్మీయా వంటి ఆత్మ పూర్ణుల చేత వారి లేఖనముల ద్వారా ఎరిగించాడు. అప్పటి భూలోకస్థితి అజ్ఞానముతోను అంధకారము తోను నిండి మూర్ఖత్వములో ఉండగా - దేవుడు తానను కొన్న ప్రణాళికను తానేర్పరచుకొన్న పన్నెండు గోత్రములలో యూదా గోత్రము నుండి తాను ప్రవక్తల ద్వారా ప్రవచించిన విధముగా అనగా దావీదు చిగురు యూదా గోత్రపు సింహము. ఈ విధముగా తన చిగురైనట్టి వాక్యబీజమును కన్నెక గర్భములో నుండి ప్రతిష్టించి, ఆ వర్తమానమును క్రీస్తు అను రూపము భూమిపై నెలగొనుటకు పూర్వము ఆకాశ మార్గములో నక్షత్రము ద్వారా - అప్పటి నరసందోహములో జ్ఞానవంతులైన ముగ్గురు జ్ఞానులు - ఆకాశములో తాను రూపొందించిన నక్షత్రమునకు - తాను ధరించిన నరరూపమునకు సాక్షులుగాను నియమించినట్లును అవి ఖరారనుటకు దూత ద్వారా అమాయికులైన గొల్లలకు ఎరిగించి వారి ద్వారా స్తుతులందుకొన్నట్లును పాతనిబంధన మర్మమును క్రొత్త నిబంధన ప్రారంభమునైయున్నది.
ఇంక క్రొత్త నిబంధనలో యేసుప్రభువు జక్కయ్య విషయములో - నశించినదానిని వెదకి రక్షించుటకు మనుష్యకుమారుడు ఈ లోకమునకు వచ్చెనని పల్కినట్లు లూకా 19:10లో తెలియుచున్నది. లూకా 4:18లో చూచినట్లయితే దేవుడు యేసుప్రభువు అవతారమెందుకు ఎత్తినాడా? అనునదియు యేసుప్రభువు ఈ లోకానికి ఎందుకు వచ్చాడా? అనునది సులభముగా అర్థమగును. ఇందునుబట్టి క్రొత్త నిబంధనయను వేదమునకు స్థాపకుడు క్రీస్తే. పాత నిబంధనలో స్వయముగా దేవుడు అబ్రాహాము వంటి విశ్వాసుని ద్వారాను, మోషే వంటి ప్రవక్తల ద్వారాను, అహరోను వంటి యాజకుల ద్వారాను తన క్రియలను జరిగించి మహిమ పరచబడెను. నూతన నిబంధన కాలములో తానే నరుడై నరస్వభామును దాల్చి అదృశ్యములో దాగియున్న దైవమహత్తర శక్తియొక్క మర్మములను నరుల కెరింగించి, సమస్త జనులను తన వారినిగా చేయుటకును తన రాజ్య వారసులుగ ఎన్నుకొనుటకును సంకల్పితుడై యేసు నామమున ఎన్నో బోధలు జేసి ఎన్నియో మహిమలు కూడా గనపరచినాడు. అయినను నరజ్ఞానము దైవత్వములో జీవించలేకున్నది. అయినను ప్రభువు విసుగుకొనక నరశాపాన్ని తనపై వేసికొని నరరూపములో తాను చేసిన బలియాగము ద్వారా నరులకున్న శాపమరణమను ఘోర శిక్షనుండి రక్షణ పొందమని, తన నామమందు విశ్వాసముంచి తన నివాసములో జేరి పరమాత్ముడైన దేవునిలో విలీనము గమ్మని, నేటికిని ప్రతిక్షణము ప్రతి స్థలములోను ప్రతి సమయము నరులను హెచ్చరించుచున్నారు.
ఈ విధముగా పాత నిబంధన క్రొత్త నిబంధన అనునవి రెండును జనబాహుళ్యములో క్రియజేసినవి. ఇంక నేను వెళ్ళి ఆదరణకర్తయైన దేవుడగు మరియొక్క ఆత్మను మీ యొద్దకు పంపెదను, అని చెప్పిన విధముగా ఆదరణకర్తయగు దేవుడు జరిగించు క్రియ ఇప్పుడు పాతనిబంధన, క్రొత్త నిబంధన యను వేదముయొక్క మర్మమును వాని ఉద్దేశ్యములను వాని ప్రభావములను, దేవుడేర్పరచుకున్న పరిశుద్ధులైన నరులను ఆవరించి అనగా బోధకులని యాజకులని సువార్తీకులని కాపరులని, బైబిలులో స్త్రీలని వగైరా విధములైన భక్తసందోహములను ఏర్పరచి వారి ద్వారా సత్యసువార్తను ప్రకటిస్తున్నది.
అయితే నరునియొక్క జీవితము దేవుడు జరిగించిన ఈ మూడు క్రియలలో మూడు కాలములుగా విభజింపబడియున్నది. మొదటిది అజ్ఞానకాలము పాతనిబంధన అనగా అజ్ఞానయుగము. రెండవది కృపాకాలము. అనగా రక్షణకాలము. ఇది క్రీస్తుతో కూడా జనుల మధ్య క్రియజరిగించినది. ఆ అజ్ఞానకాలమందైతే దేవుడే స్వయముగా జనుల మధ్య క్రియ జరిగించినాడు. అయితే ఇప్పటి కాలము నిరీక్షణ కాలము నిరీక్షణ యుగమైయున్నది. ఇప్పుడైతే దేవుడు ఆదిలో వలె మేఘములలోను వెలుగులలోను వాయుమండలములలోను మాట్లాడు కాలము కాదు. క్రీస్తు వలె శారీరధారియై నరుల మధ్య బోధలు జేసి మహిమపరచుకాలము కాదు. ఇప్పుడు నరుడే స్వయముగా అదృశ్యములో దైవాత్మ శక్తిని అభ్యర్థించి, వేదజ్ఞానమును అభ్యర్థించి శారీర జ్ఞానముచేగాక ఆత్మజ్ఞానముతో సాధనము జేసి ఆత్మస్వరూపియైన దేవునికి సన్నిహితుడై, ఆయనయొక్క ప్రేమకు పాత్రుడై తన జీవితమును జన్మను దైవత్వములో సార్థకము చేసికోవలసిన సమయమైయున్నది. ఇక మీదట మేఘములో నుండి దేవుడు మాట్లాడుట మనము ఎరుగము. శారీరముగా క్రీస్తు క్రియజేయుట అనునది చూడము. ఇట్టి నిరీక్షణ యుగములో మనము కేవలము యాత్రీకులమైయుండి మనయొక్క భక్తి విశ్వాసముల ద్వారా ఆయన కొరకు నిరీక్షింపవలసినవారమై యున్నాము. ఇది నిరీక్షణ యుగము. దీని తర్వాత లోకాంత్యము.
.......
యోహాను 1:19-24 నీవెవడని అడుగుటకు యూదులు యెరూషలేమునుండి యాజకులను లేవీయులను యోహాను నొద్దకు పంపినప్పుడు అతడిచ్చిన సాక్ష్యమిదే. అతడు ఎరుగననక ఒప్పుకొనెను. క్రీస్తును కానని ఒప్పుకొనెను. కాగా వారు - మరి నీవెవరవు? నీవు ఏలీయావా? అని అడుగగా అతడు కాననెను. నీవు ఆ ప్రవక్తవా? అని అడుగగా - కానని ఉత్తరమిచ్చెను. కాబట్టి వారు- నీవెవరవు? మమ్ము పంపిన వారికి మేము ఉత్తరమియ్యవలెను. గనుక నిన్ను గూర్చి నీవేమి చెప్పుకొనుచున్నావని అతనినడిగిరి. అందకతడు ప్రవక్తయైన యెషయా చెప్పినట్టు నేను - ''ప్రభువు త్రోవ సరాళము చేయుడి అని అరణ్యములో ఎలుగెత్తి చెప్పు ఒకని శబ్దము,'' అని చెప్పెను. పంపబడినవారు పరిసయ్యులకు చెందినవారు. వారు - నీవు క్రీస్తువైనను ఏలియావైనను ఆ ప్రవక్తవైనను కాని యెడల ఎందుకు బాప్తిస్మమిచ్చు చున్నావు? అని అతనిని అడిగిరి.
ప్రియపాఠకులారా! దైవత్వమన్నది సృష్టిలో నానావిధ విభజనలు చేసి ఒక సృష్టి అంతమైనప్పుడు పునఃసృష్టి చేయడము, ఆ సృష్టి అంతమైనప్పుడు వేరొక సృష్టి రూపించుట. అలాగే జంతుజాలాలలో కూడా ఒక సృష్టిలో నుండిన జంతువులలో వలె కాకుండ వేరొక సృష్టిలోని జంతువులలో కొన్ని మార్పులు కల్గియున్నవి. దైవ నిర్మాణములో జరుగుచున్న ఈ మార్పులను గూర్చి కొన్ని వేదభాగాల ద్వారా వివరముగా తెలిసికొందము. ఆదికాండము 1:లో మొట్టమొదటి సృష్టిని రూపించినప్పుడు ఇద్దరే స్త్రీ పురుషులున్నట్లు చదువగలము. మొట్టమొదట సృష్టిలో ''మన పోలిక మన స్వరూపము చొప్పున నరులను చేయుదము; అనుకొని నేలమంటితో నరుని రూపించి వానిని జీవాత్మునిగ చేసినట్లు వేదరీత్యా మనకు తెలిసిన విషయమే, ఇది ఆది నరజంటయొక్క వివరము. ఈ విధముగా దేవుడు వేసిన ప్రత్యేకమైన పరిశుద్ధ వనములో నరుడు నిరభ్యంతరముగా కడు స్వాతంత్య్రముతో ఆ వనములో జీవించి, ఆ స్వాతంత్య్రాన్ని ఆ నిర్భయత్వాన్ని కాపాడుకోలేక దైవ నిషేధఫలము ద్వారా దైవానుగ్రహమును దైవిక సావాసమును, దైవస్వాస్థ్యమైన ఏదెను వన జీవితమును సమస్తమును కోల్పోయి భయము, దిగులు ఆవరింపగా - ఆ తోటలోని అంజూరపు ఆకులను కచ్చడాలుగ చేసికొని మొలకు చుట్టుకొని జీవించినట్లు ఆది 3:లోని వివరము మనము చదివినవిషయమే, చిత్రమేమిటంటే ఆదినరుని దేవుడు మట్టితో రూపిస్తే సాటి సహాయియైన స్త్రీని అతని ప్రక్కటెముక నుండి తీసి, ఆ మాంసముతోనే స్త్రీ రూపమును చేసి నరునికి సాటి సహాయిగా ఇచ్చినట్లు వేదములో మనము చదువగలము.
ప్రియపాఠకులారా! దైవహస్తముతో పరిశుద్ధ స్థితిలో పవిత్రమైన జీవాత్మతో రూపించిన నరుని జీవితము దైవ ఆజ్ఞాతిక్రియ చేసి పతనమైపోగా - వాని సంతానము ద్వారా వ్యాపించిన పాపము బహుముఖ వ్యాప్తమై, మంచి చెడు అను విచక్షణ జ్ఞానము లేకుండ దైవత్వమును పూర్తిగా మరచి లోకదాసులై వారిరువురి ఇష్టప్రకారం నరులు విచ్చలవిడిగ ప్రవర్తించగా దైవాత్మ ఆగ్రహించి, ఉగ్రరూపము దాల్చి లోకము దానిలోని సృష్టములతో భూమిని దానిలోని సకల సంపదను పూర్తిగా తుడిచి వేయుటకు సంకల్పించి, నాటి భూలోకములో ఎవడైనను దైవత్వమునుగూర్చి వెదికి దైవానుగ్రహము కొరకు ప్రయాసపడు నీతిమంతుడున్నాడా? అని వెతికినప్పుడు దేవుని దృష్టికి నోవహు అతని కుటుంబము నీతిమంతులుగా అగపడినట్లును, వారి ద్వారా తాను ప్రస్తుతము ఉన్న యావద్ సృష్టిని లయపరచగ, పునఃసృష్టి నిర్మాణములో ఈ నోవహు కుటుంబాన్ని పునఃసృష్టిలో మరు జనాభాగా రూపించుటకు మరొక ప్రపంచ రూపకల్పనకు మార్గమును సరాళము చేయుటకు దేవుడు నోవహు అతని కుటుంబాన్ని నిర్ణయించుకొని నోవహు ద్వారా ఒక పెద్ద ఓడను నిర్మించి మరుజన్మకు కావలసిన పక్షి మృగ జంతుజాలము కీటకాదులను ఉంచి, యావద్ సృష్టిని ముంచివేసిన జలప్రవాహాల మీద వానిని నడిపించినట్లు చదువగలము. ఇందునుబట్టి మొదటి ఆదాము దోషియైనప్పుడు రెండవ నరుడైన నోవహు నీతిమంతుడైనందున - పునఃసృష్టియొక్క జనవిస్తరణకు మూలపురుషుడైనట్లు తెలుస్తున్నది. ఇందునుబట్టి ప్రియపాఠకులారా! ప్రస్తుతమున్నటువంటి మనయొక్క జన్మకు ఆది పురుషుడైన ఆదాము పాపక్రియకు జన్మకారకుడు కాగా రెండవ నరుడైన నోవహు ఆయన నీతి ద్వారా మనము జీవిస్తున్నామని గ్రహించాలి. ఎందుకంటే నోవహు నీతి ద్వారా విస్తరించిన జనాభా ఆయన నీతినిబట్టి పునఃసృష్టి నిర్మాణము జరిగింది. అనంతరము భూమి మీద జనాభా విస్తరించింది. నీతిమంతుని ద్వారా విస్తరించిన జనాభాలో మనము కూడా భాగస్వాములమే, ఆ దినములలో నోవహుతో మాట్లాడిన మాట ఆది 7:1 ఈ తరము వారిలో నీవే నా ఎదుట నీతిమంతుడవై యుండుట చూచితిని. కనుక నీవును నీ ఇంటివారును ఓడలో ప్రవేశించుడి.''
ప్రియపాఠకులారా! ఇది దేవుడు నీతిమంతుడైన తన భక్తునికి తాను నిర్మింపజేసిన ఓడ గృహములో ప్రవేశించే అర్హతను కల్గించడమైనది. ఆ విధముగా నోవహు కుటుంబము దైవగృహములో ప్రవేశించిన వెంటనే దేవుడు ఆది 7:16 చివరి వచనములో - ''అప్పుడు యెహోవా ఓడలో అతని మూసివేసెను,'' అని వ్రాయబడిన ప్రకారము దేవుని పరిశుద్ధ గృహమైన ఓడ గృహము తలుపును దేవుడే మూసివేయవలసిన క్రియయేగాని మనుష్యులకు అది అసాధ్యము. ఎందుకనగా దైవనమూనా కొలతల ప్రకారము దైవిక ఏర్పాటునుబట్టి దేవుడు నోవహు చేత ఓడను చేయించినప్పటికిని ఓడ నోవహుది కాదు. ఓడ నోవహుది అయితే ఓడ తలుపులను మూయుటకు అధికారము నోవహుకు ఉండేదే, అలాగాకుండ దేవుడు అతనిని మూసివేసినట్లును వ్రాయబడుటనుబట్టి ఇందులో మనము ఆత్మీయముగా రెండు విధాలైన సత్యాలు - మొదటిది ఏదెను తోట విషయములో తోట దేవునిది - ఏదెను తోటలోని సమస్తము దేవుని వశములో ఉంది. అయితే ఏదెను తోటను నరుడు ఆది 2:15లో వలె ఆ తోటను నరుని వశము జేసినట్లుగా వేదములో వ్రాయబడియున్నది,'' ఏదెను తోటను సేద్యపరచుటకును, దానిని కాచుటకును దానిలో కాపరిగా ఉంచాడు. ఇందునుబట్టి తోట దేవునిదే, అలాగే ఓడ పని ప్రకారము నోవహు చేసినప్పటికిని ఓడకు వాడిన కలప పరిజ్ఞానము, ఓడకు అవలంబించిన నియమము క్రమము పద్ధతి మరియు జ్ఞానము మొత్తము దేవునిదే, అయితే ఏదెనులో ఆదినరుడు తోటకు కాపరి - సేద్యపరచువాడైయున్నాడు. అలాగే దేవుని ఓడను చేయుటకు పనివాడును, కాపరియు నోవహుయైనట్లుగ ఇందునుబట్టి తెలుస్తున్నది.
అలాగే యోహాను యేసుక్రీస్తు విషయాలలో కూడా యోహాను ఆదాము వలె అరణ్యములో వన జీవితము జీవించాడు. ఆదాము వలెనే నిరాడంబరముగా ఆకులలములు పండ్లు కాయలు భుజిస్తూ తేనెను త్రాగినాడు. ఆహార విషయాలలో కూడా యోహాను భోజనప్రియుడు కాడు. ఆదాము ఏర్పరచిన పాపమార్గము నుండి నీతి మార్గములో నడిపించుటకు అనగా ఆ నీతి మార్గమును సరాళము చేయుటకు నోవహు దేవుని చేత ఎన్నుకోబడినట్లును, మరియు ఆదాము ఏ విధముగా పరిశుద్ధ వనములో సంచరించి దైవత్వంలో జీవించి పాపములో పడి ఏ విధముగా దోషియైనాడో ఆలాగే - ఆ దోషము ద్వారా విస్తరించిన జనాభా నీతి మార్గములో నడిపించుటకు అనగా నీతిమార్గమును సరాళము చేయుటకు నోవహు ఈ లోకములో ఎంపికయైనట్లును ఇందునుబట్టి మనకు తెలుస్తున్నది. చిత్రమేమిటంటే దేవుని హస్తనిర్మితుడు దేవుని ఆత్మలో భాగస్వామియైన ఆది నరుడు దైవవనములో దైవప్రత్యక్షతలో దైవిక సావాసములో - ముఖాముఖిగా కలిసి జీవించిన ఉన్నత విలువలు కల్గిన ఆదినరుడు దైవ ఆజ్ఞ అతిక్రమము చేసి పాపములో పడి దైవ శాపానికి గురియై దైవత్వముతో సావాసము దైవదర్శనమును కోల్పోయి, మరణమనే శాపమును పొంది, దైవవనము నుండి తరిమివేయబడి దైవత్వముతో ఉన్న సావాసము కోల్పోయాడు.
అలాగే అతని ద్వారా సంక్రమించిన పాపము మరణము అను రెండును నోవహు కాలములో బహుముఖముగా క్రియ జరిగించి, పాపమన్నది నాటి నోవహు కాలములో విస్తరించి బహుముఖవ్యాప్తమై విపరీతమైన జనాభాను భూమిమీద పెంచి జనాభాతోబాటు - సృష్టికర్తయైన దేవునికే ఉగ్రత గల్గించు అధిక మోతాదులో అనగా దైవత్వము ఓర్వలేనంతగా పాపమన్నది క్రియ జరిగించుటనుబట్టి దేవుడు నరులను సృష్టించినందుకు సంతాపము పొంది, నాటి జనకోటిలో దైవత్వమును వెదికే నీతిని కల్గిన నరుడున్నాడా? నీతిని వెదికే నీతిపరుడున్నాడా? అని లోకములో వెదికినప్పుడు దైవదృష్టికి నాటి జనాభాలో నోవహు అతని కుటుంబము ఒక్కటే దైవఎన్నికలో నిలిచియున్నట్లును, తద్వారా పాపమార్గమునుబట్టి మరణమార్గము ద్వారా లయమయ్యే సృష్టి - అనంతరము పునఃసృష్టి నిర్మాణములో నీతి మార్గమును సరాళము చేయుటకు తగిన నరుడున్నాడా? అని దైవ పరిశోధన జరిగినప్పుడు - ఉన్నాడన్న జవాబు దేవునికి నోవహుయొక్క ఆత్మీయత తేలినట్లు తద్వారా దేవుడు నోవహును - తాను భూమి మీద
జరిగించబోవు జలప్రళయ వినాశన క్రియ ద్వారా పునఃసృష్టి నిర్మాణమును గూర్చిన వివరణ నోవహునకు తెలిపి, ఓడకు కావలసినవి అతడు పాటించవలసిన నియమము అతడు చేయవలసిన పని వివరాలను గూర్చి నోవహుతో సవివరముగా వివరించిన విధానమునుబట్టి నోవహు దైవవాక్కులలో దేనిని కూడా విస్మరింపక, యావద్ దైవిక మాటలను తూచా తప్పకుండ నెరవేర్చి, దైవత్వము ఉపదేశించి శాసించిన ప్రకారము దైవోద్దేశ్యము, దైవిక ఏర్పాటునుబట్టి దైవిక నమూనా ప్రకారము దైవచిత్తానుసారముగా - ఓడ గృహ నిర్మాణమును కొనసాగిస్తూ తాను ఊరకే ఓడ పనిలో నిమగ్నమైయుండక మొదటి పేతురు 3:20 హెబ్రీ 11:7 దైవత్వము జరిగించబోవు మారణహోమమును గూర్చి నాటి జనాభాకు ప్రకటించినను, నోవహుయొక్క ప్రకటనను పెడచెవిని బెట్టి తినుచు త్రాగుచు కామేచ్ఛలతో కామాంధులై, లోకము తప్ప మరి దేనిని ఎరుగని స్థితిలో సుఖానుభవులైయుండగా 120 సం||లు నోవహు చేసిన లోకవినాశకరమును గూర్చిన ప్రకటన ఎవడును లక్ష్యపెట్టక పోగా - నాటిజనాంగము నోవహును ఒక పిచ్చివానిగా జేసి హేళన చేసినట్లును, అందునుబట్టి దేవుడు నిర్ణయించిన లోకసృష్టి నాశన కార్యాచరణ దినము సమీపించినప్పుడు నోవహు అతని కుటుంబము ఒక్కటే దైవదృష్టిలో నిలిచినట్లును అందునుబట్టి -''ప్రభువు - ఈ తరము వారిలో నీవే నా ఎదుట నీతిమంతుడవై యుండుట చూచితిని గనుక నీవును నీ ఇంటివారును ఓడలో ప్రవేశించుడి,'' అని చెప్పుటలో నోవహు కాలములో నోవహు కుటుంబము తప్ప ఎవడును నీతిమంతుడు లేనట్లును - నోవహు ఒక్కడే నీతికిని, దేవుడు సృష్టించబోవు పునఃసృష్టికి వారసుడైయున్నట్లును ఈ వారసత్వపు హక్కునుబట్టి సృష్టి యావత్తును పర్వతాలతో సహా మునిగినను, అగాధజలముల మీద నోవహు యొక్క ఓడ నోవహు నీతినిబట్టి దేవునియొక్క ఆత్మీయతనుబట్టి 150 దినాలు అగాధజలముల మీద ఓడ నడచునప్పుడు, లోకవినాశనాన్ని గూర్చి ఓడలోని నీతిమంతుడు చూడకుండునట్లు దేవుడు ఆ ఓడ తలుపులను మూసివేసినట్లు ఈ వేదభాగములో చదువగలము. ఇందునుబట్టి నోవహు అప్పటి లోకము యొక్క నాశనము, దైవోగ్రత మూలముగా ప్రబలిన అగాధజలములయొక్క లోతును గూర్చిగాని చూచినవాడు కాదు. ఎందుకంటే ఏ సృష్టికర్తయైతే ఓడను నిర్మింపజేశాడో ఆయనయొక్క వెలుగు ఆ ఓడలో ప్రవేశించుటనుబట్టి నోవహుకు దేవుని వెలుగును దేవుని మహిమను దేవుని ఆత్మీయతను, దైవిక తోడ్పాటును కల్గి నూతన సృష్టి నిర్మాణము కొరకు, ఆ చీకటి జలాల మీద దేవుడు జరిగించిన నూతన సృష్టి నిర్మాణమును జలముల మీద సరాళము చేస్తున్నట్లును తెలుస్తున్నది.
ప్రియపాఠకులారా! క్రీస్తు దేవుని కుమారుడని క్రీస్తు మార్గాన్ని సరాళము చేయుటకు యోహాను చేసిన ప్రయత్నములో యోహానుకు సహకరించిన వారెవరును లేరు. అయితే దేవుడు జరిగించిన నూతన సృష్టి నిర్మాణములో నోవహుతో సహకరించినవారు ఒక్క జీవి మాత్రమే - అది నల్ల పావురము. అలాగే నరులకు నూతన జన్మనిచ్చేందుకు నూతన నిబంధన కాలములో - నోవహు కాలములో వలె జనము అజ్ఞాన దశలో ధర్మశాస్త్రం అనే మూఢత్వములో - ధర్మశాస్త్రముతో పనిలేనటువంటి నూతన నిబంధన అనగా దేవుని కుమారునియొక్క జననము ద్వారా లోకానికి కలుగు అమూల్యమైన రక్షణ కాలములో - దైవకుమారుని జననమునకు ఈయన ఈ లోకములో జరిగించబోవు కార్యాలకును, ఆయన కంటె ముందుగా ఆయన పక్షముగా ఈ లోకములో యోహాను జరిగించవలసిన దైవప్రణాళికాయుతమైన కారణాలను గూర్చి యోహాను దేవుని యొద్దనుండి పంపబడినవాడై, అతని మూలముగా అందరు విశ్వసించునట్లు ఆ దైవ వెలుగును ప్రత్యక్షపరచినవాడు; దేవుని వెలుగైన దైవకుమారుని గూర్చి సాక్ష్యమిచ్చుటకు యోహాను సాక్షిగా అవతరించినట్లును, యోహాను 1:6-10 అయితే నిజమైన వెలుగుండెను అది లోకములోనికి వచ్చుచు ప్రతి మనుష్యుని వెల్గిస్తున్నట్లును, దేవుని వెలుగైన దైవకుమారుడు లోకములో ఉన్నట్లును లోకమాయన వలన కలిగెనుగాని, లోకమాయనను తెలిసికోలేక పోయినట్లు వ్రాయబడిన వేదవాక్య రీత్యా - నూతన నిబంధనలో అవతరించబోవు క్రీస్తుకు ముందుగా యోహాను నూతన నిబంధన అను గ్రంథమునకు సాక్షిగాను, ఆ విధముగా రూపింపబడు నూతన నిబంధన గ్రంథమునకు హతసాక్షిగాను, నూతన నిబంధన గ్రంథముయొక్క ప్రణాళికకు యోహాను యోర్దాను నదిలో జరిగించు బాప్తిస్మము అను క్రియకు నాంది పల్కినట్లును; అదే విధముగా నూతన నిబంధనలో అవతరించబోవు దైవకుమారునికి బాప్తిస్మము ఇచ్చుటకు యోగ్యునిగ దేవుని యొద్దనుండి పంపబడిన యోహాను దైవకుమారుడని సాక్ష్యమిచ్చుటకు, నోటితో క్రియామూలకముగా పదిమంది ఎదుట ప్రత్యక్షముగా యోహాను 1:29లో వలె క్రీస్తునుగూర్చి బయల్పరచుటకు యోహాను దేవుని చేత వాడబడుచున్నట్లు నూతన నిబంధన వేదముయొక్క నిగూఢ మర్మమును సత్యమునైయున్నది. అలాగే పాత నిబంధనలో నోవహుయొక్క ఓడలోని జీవిత చరిత్ర కూడా నూతన భూమి నూతన ఆకాశము - అవతరించబోవు నూతన సృష్టి - ఆ సృష్టి ద్వారా ఏర్పడే దేవుని మహిమకు నోవహుకు సాక్షిగా దేవుని చేత నియమించబడినట్లును, ఆ విధముగా ఏర్పడిన పునఃసృష్టికి మూలపురుషుడు నోవహుయే అనేటటువంటి నిర్ధారణ నేటి తరమువారమైన మనకేర్పడినట్లు నోవహుయొక్క జీవితము స్థిరపరచబడినట్లు ఇందునుబట్టి మనము తెలిసికొనుచున్నాము.
ప్రియపాఠకులారా! పాతనిబంధనలో నోవహుకు ఎంత గొప్ప చరిత్ర ఉందో - నూతన నిబంధనలో యేసుమార్గమును సరాళము చేయుటకు అవతరించిన యోహాను చరిత్ర కూడా దాని సమకాలికమైయున్నది. నోవహు వంటి నీతిమంతుడు అబ్రాహాము వంటి విశ్వాసి, దేవుని యందు భయభక్తులు గల్గిన ప్రవక్తలు రాజులు న్యాయాధిపతులు అవతరించారో - అలాగే యోహానుయొక్క జన్మ ద్వారా యోహాను జరిగించిన బాప్తిస్మం కార్యము ద్వారా దైవకుమారుడైన క్రీస్తు ప్రత్యక్షపరచబడుటయు, అనేకులైన శాస్త్రులు పరిసయ్యులు యోహాను మాటకు విధేయించి బాప్తిస్మం పొందుటకు యోర్దాను నదీతీరమునకు వచ్చినట్లును, అట్టివారి మనో స్థితిని గూర్చి యోహాను ఉగ్రుడై లూకా 3:7 సర్పసంతానమా! రాబోవు ఉగ్రతను తప్పించుకొనుటకు మీకు బుద్ధి చెప్పిన వాడెవడు? అని వారిని సంబోధించి మందలించిన మాటలు మనమెరిగిందే, అలాగే యేసుక్రీస్తును బహిరంగములో ప్రజాబాహుళ్యములో ప్రకటించినవారిలో మొట్టమొదటి వ్యక్తి యోహాను. ఈ విధముగా క్రీస్తుకు ముందు నడిచిన యోహాను తన్నుతాను తగ్గించుకొని, దైవకుమారుడైన క్రీస్తును హెచ్చిస్తూ పల్కిన మాటలు కూడా మనమెరిగిందే, యేసునుగూర్చి యోహాను ఇచ్చిన సాక్ష్యములో యోహాను 1:26-27 నేను నీళ్ళలో బాప్తిస్మము ఇచ్చుచున్నాను. నా వెనుక వచ్చుచున్న వాడు మీ మధ్యనున్నాడు. ఆయన చెప్పులవారు నిప్పుటకైనను నేను యోగ్యుడను కాను, 1:29-34 యోహాను - ''యేసు తన యొద్దకు రాగా చూచి,'' ఇదిగో లోక పాపమును మోసికొనిపోవు దేవుని గొర్రెపిల్లయని లోకమునకు పరిచయము చేస్తూ చెప్పిన మాటలు 1:30-34లో చదువగలము. ఈ విధముగా నూతన నిబంధన మూలకర్తయైన ప్రభువును పరిచయము చేయుటకే యోహాను సాధనముగా వాడబడినాడు. అలాగే పాతనిబంధనలో పునఃసృష్టి నిర్మాణములో - యావద్ నరకోటికి సంక్రమించిన జలప్రళయ మారణహోమములో పునఃసృష్టికి - పునఃసృష్టిలోని జనాంగమును వారి జీవితమును జరుపుటకు నోవహు దేవుని చేత సాధనముగా వాడబడినాడు. ఆనాడు నోవహును దేవుడు ఎన్నుకోకపోతే ఆదాము కాలములో రూపించిన సృష్టి ఆదాముతోనే అంతరించిపోయేది. అంటే మరుసృష్టి ఉండేది కాదు. అలాగే దేవునియొద్ద నుండి పంపబడిన యోహాను ఈ లోకములో దేవుని చేత నూతన నిబంధన మార్గమును సరాళము చేయుటకు ఏర్పరచబడకుంటే, నూతన నిబంధన గ్రంథానికి రూపముండేది కాదు. అంటే క్రీస్తునుగూర్చి లోకము గ్రహించేది కాదు - గ్రహించలేని స్థితిలో ఉండేది. బాప్తిస్మం అను క్రియ ఏమిటో జన బాహుళ్యానికి అర్థము గాకుండేది. ఒక్కమాటలో చెప్పాలంటే దైవకుమారుడైన యేసుక్రీస్తునకు బాప్తిస్మము పరిశుద్ధాత్మ యొక్క ప్రవేశ కార్యము ఆయనను గూర్చిన పరమార్థము నరులకు అర్థమయ్యేది కాదు. లోకమే యేసు విషయములో కంగారుపడి ఆయనను సామాన్య నరునిగా నాటి జనాంగములో ఒకనిగ ఆయన ఎవరో? దిక్కుమొక్కులేని స్థితిలో లోకము భావించియుండెడిది.
ప్రియపాఠకులారా! యేసు పుట్టిన సందర్భములో మరియమ్మకు దూత దర్శనములో ఆ దూత చేసిన ఆ సంభాషణనుబట్టి పరిశుద్ధాత్మయొక్క ఆవరింపు దేవుని శక్తి రెండును ఆమెను ఆవరించి క్రీస్తులో క్రియ జరిగించి ఆశ్చర్యకరమైన రీతిలో శిశు జననమును జరిగించినప్పటికిని, ఆ విధముగా జన్మించిన శిశువునుగూర్చి ఆకాశములో నక్షత్రము లోకానికి తన వెలుగు ద్వారా ప్రకటించినప్పుడు, ఆ వెలుగుయొక్క మర్మమును ఆ నక్షత్రముయొక్క పుట్టుదలను గ్రహించిన ముగ్గురు జ్ఞానులు - బెత్లెహేములో ప్రవేశించి, నాటి పరిపాలకుడైన హేరోదును విచారించినప్పుడు హేరోదునుగూర్చి బెత్లెహేములోని పేరు మోసిన జ్ఞానులకుగాని గణితశాస్త్ర పారంగతులకు అర్థముగాని ఆ వాతావరణములో - బాలయేసు ఎవరో ఎరుగని స్థితిలో దైవత్వము లోకానికి కనుమరుగు చేసింది. ఆ విధముగా దాచబడినట్టి యేసుక్రీస్తు యొక్క జనన చరిత్రను ఆయన జన్మించుటలోని పూర్వార్థ మర్మమును లోకానికి బయల్పరచబడింది యోహాను ద్వారానే; అలాగే దేవుడు రూపించిన నూతన సృష్టియొక్క చరిత్రకు సాక్షి నోవహు అతని కుటుంబము అతని ఓడ - ఈ ముగ్గురు సాక్ష్యాలు. అలాగే యేసుయొక్క జననములో మొట్టమొదటిగ సాక్షి నక్షత్రము, రెండవది జ్ఞానులు, మూడవది బాప్తిస్మమిచ్చు యోహాను.
ప్రియపాఠకులారా! ఈ విధముగా ఒకరియొక్క చరిత్రకు మరొకరు సాక్షులుగా రూపించబడిన పరిశుద్ధ గ్రంథములో మధ్యవర్తులు కూడా ఉన్నట్లు ఈ క్రింది సందర్భాలనుబట్టి తెలిసికొందము. మొట్టమొదటగా దైవాత్మకును అనగా దేవునియొక్క జీవాత్మకును భూలోకానికి మధ్యవర్తి దేవుని హస్తముతో నిర్మితమైన నరశరీరము. అలాగే దేవుడు వేసిన పరిశుద్ధ వనమైన ఏదెనులో సాతానునకు మానవునికి మధ్యవర్తి సర్పము. అలాగే సృష్టి వినాశన కాలములో దేవునికిని దైవోగ్రతతో కూడిన మారణ హోమమునకును మధ్యవర్తి నోవహు అతని కుటుంబము. దైవజనాంగమైన ఇశ్రాయేలునకును దేవునికిని మధ్యవర్తి మోషే - మోషేకును దేవునికిని మధ్యవర్తి శిలాశాసనాలతో కూడిన ధర్మశాస్త్రము. అలాగే ధర్మశాస్త్రము కూడా జరిగించలేని పాపవిమోచన కార్యమునకు దేవునికిని మానవులకును మధ్యవర్తి యేసుక్రీస్తు. యేసుక్రీస్తు జనన కాలములో మరియమ్మకును దేవునికిని మధ్యవర్తి పరిశుద్ధాత్ముడు. యేసుక్రీస్తు లోకానికి ప్రత్యక్షీకరణ గావించు సందర్భములో - యేసుక్రీస్తునకు దేవునికిని మధ్యవర్తి బాప్తిస్మమిచ్చు యోహాను. ఆ విధముగా ప్రభువు రాకడలో ఎత్తబడే గొర్రెపిల్ల పెళ్ళి మహోత్సవ కార్యములో మధ్యవర్తి అనగా దైవకుమారుడైన క్రీస్తునకు ఆయన వివాహమాడబోయే వధువు సంఘానికి మధ్యవర్తి పరిశుద్ధాత్ముడే, మరణానికి జీవమునకును మధ్యవర్తి యేసుక్రీస్తు.
ప్రియపాఠకులారా! పై అంశాలనుగూర్చి వ్రాయాలంటే చాలా వివరాలున్నాయి. ఈ విధముగా మధ్యవర్తులు దైవత్వముచేత వాడబడిన దైవిక కార్యాలలో కొన్నిటిని తెలిసికొనియున్నాము. ప్రియపాఠకులారా! చిత్రమేమిటంటే విశ్వాస జీవితము జీవించిన దైవజనులకు మధ్యవర్తులు లేరు, ఆదిలో ఆదాము దైవత్వముతో కలిసి జీవించే సందర్భములో దేవునికిని ఆదామునకును మధ్యవర్తులు లేరు. అలాగే హనోకు దేవునితో నడిచి దైవత్వముతో కలిసి జీవించిన దినాలలో హనోకునకును దేవునికిని మధ్యవర్తులు లేరు. మధ్యవర్తులు లేకనే దేవునితో నడిచి, ఆయనతో కలిసి జీవించి లోకానికి కనుమరుగయ్యాడు. అలాగే అబ్రాహామునకును దేవునికిని మధ్యవర్తులు లేరు. అంటే లోతునకును దేవునికిని మధ్యవర్తులున్నారు. అబ్రాహాముయొక్క విశ్వాస పరీక్షలో దేవుడు మధ్యవర్తులను వాడలేదు. ప్రతి విషయములో అబ్రాహాముతో దేవుడు ప్రత్యక్షముగా మాట్లాడి తన కార్యమునుగూర్చి తన కార్యాచరణ విధులను వివరించేవాడు. అలాగే దేవుడు మోషేతో ముఖాముఖి మాట్లాడినాడు. కాని మధ్యవర్తులు లేరు. అలాగే యెహోషువ జీవితములోగాని, ఏలీయా వంటి ప్రవక్తలకును దేవునికిని మధ్యవర్తులు లేనట్లే వారి చరిత్రలు మనకు వివరిస్తున్నాయి.
కనుక ప్రియపాఠకులారా! దైవత్వమునకును మానవత్వమునకును నేటి జీవితములో మధ్యవర్తులుగ క్రియ జరిగిస్తున్నది. నీతి - పరిశుద్ధతలే, ఈ రెంటితోబాటు విశ్వాసము-ప్రేమ అన్నవి నాలుగును దైవత్వమునకును మానవత్వానికిని నేటి నరులైన మనకు మధ్యవర్తులు. ఈనాలుగింటిలో ఏది లేకపోయినను దైవత్వముతో నరునికి సఖ్యత కల్గుటన్నది - అసంభవము.
కనుక ప్రియపాఠకులారా! దేవుని యొద్దనుండి పంపబడిన యోహాను అను మనుష్యుడు క్రీస్తును లోకానికి ప్రకటించుటకును క్రీస్తు మార్గాన్ని సరాళము చేయుటకును, దైవకుమారునికి బాప్తిస్మము అను పరిశుద్ద కార్యమును జరిగించుటకును, దైవకుమారుడైన క్రీస్తునకును తండ్రియైన దేవునికిని యోహాను మధ్యవర్తియైనట్లుగ గ్రహించవలసియున్నది. అయితే ఇప్పటి విశ్వాస జీవితములో దేవునికిని క్రీస్తునకును పరిశుద్ధాత్మకును అనగా త్రియైక దేవునికిని మనకును మధ్యవర్తి ఎవరు? పాతనిబంధనలోను నూతన నిబంధనలోను దైవత్వానికి మానవత్వానికి మధ్యవర్తులు ఒక్కరుగానే ఉన్నట్లు తెలిసికొన్నాము. అయితే అప్పటి నరులు వేరు, ఇప్పటి నరులు వేరు, వారి మానసిక స్థితివేరు, ఇప్పటి జనాంగము మానసిక స్థితి వేరు. ఆనాటి జ్ఞానము వేరు, ఈనాటి జ్ఞానము వేరు. ప్రతి విషయంలోను ఆనాటి నరులకంటె ఈనాటి నరకోటి జ్ఞానవంతులును, ఆధునిక పరిజ్ఞానము కలవారును అనగా యాంత్రికముగా నైతేనేమి, సాంకేతిక పరముగా నైతేనేమి? వేదయుతముగానైతేనేమి, లోకరీత్యాను ఆత్మీయముగాను ఎదిగి ఉండే కాలమిది. ఇట్టి కాలములో అనగా ఈ యుగము అంతరించి పోయి మరల నూతన సృష్టి ఏర్పడనున్న సమయము ఆసన్నమగుచుండగా - ఇప్పటి జనాంగానికి దేవునియొక్క హెచ్చరిక ఎఫెసీ 5:15-21లో వ్రాయబడిన వేదవాక్యాల రీతిగా దినములు చెడ్డవి గనుక నేటి నరులమైన మనము - మన జ్ఞానము లోకానికే పరిమితము చేయక పరలోకానికి యోగ్యకరముగా ఉండునట్లు నడుచుకుంటు - లోకసంబంధ జ్ఞానముతో గాక, పరలోక సంబంధమైన జ్ఞానము అనగా యాకోబు పత్రిక 3:17లో వలె పై నుండి దేవుడు అనుగ్రహించు జ్ఞానముతో ప్రవర్తించి ప్రభువు రాకడ కొరకు సిద్ధపాటును నిరీక్షణ గలవారమై జీవించెదముగాక!
ప్రియపాఠకులారా! ఇంతవరకును మనము మధ్యవర్తులను గూర్చియు, దైవకార్యాలను నెరవేర్చిన ఆత్మీయులను గూర్చియు ఎన్నో సత్యాలను తెలిసికొన్నాము. ఇందులోని వివరాలనుబట్టి దైవత్వమన్నది మానవులమైన మన యెడల నరులమైన మన పట్ల చూపిన ప్రేమ, మనకు అనుగ్రహించిన కృపయొక్క విలువ ఎట్టిదో గ్రహించి, ఆత్మసంబంధులుగ ఇతరులకు దైవరాజ్య సువార్తను ప్రకటించుటను బట్టి, దైవత్వానికి మానవత్వానికి దేవునియొక్క మధ్యవర్తులుగ జీవించి పరలోక రాజ్యములో పాలిపంపులు పొందే యోగ్యతను సంపాదించుదుము గాక! ఆమేన్.
.........
1. అంశములు :- క్రీస్తు లోకములో అవతరించుటలో ఉన్న పరమార్థము. 2. క్రీస్తు లోకములో చేసిన అద్భుతాలు, ఆయన స్థాపించిన దైవరాజ్య పథకము, ఆయన క్రియజరిగించిన విధానము. 3. ఆయన లోకములో దైవరాజ్యము నిమిత్తము ఏర్పరచుకొన్న అపొస్తలులయొక్క చరిత్ర 4. వారు అపొస్తలులుగ పిలువబడుటలో ఉన్నటువంటి - దైవకుమారుడైన యేసుక్రీస్తుయొక్క ఆంతర్యము. 5. శుక్రవారమునాడే దైవకుమారుడైన క్రీస్తు సజీవయాగముగా తన్ను తాను లోకానికి అప్పగించుకొనుటలో ఉన్న పరమార్థము. 6, దైవకుమారుడు బలియాగము చేయు సందర్భములో శుక్రవారమే ఎన్నుకొని ఆ వారమునకు శుభ శుక్రవారమని, ఆ శుక్రవారమును ఎన్నుకొనుటలోని దైవసంకల్పము. 7. ఆ విధముగా శుక్రవారము బలియాగము దైవకుమారుడు అర్పించిన సిలువలో ఉన్న దైవరహస్యము - దైవప్రణాళిక - దైవోద్దేశ్యమేమి? 8. ఆ విధముగా దైవకుమారుడు బలియాగము చేసి ఉదయము 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు సిలువ మీద లోకముతోను మరణముతోను తనకు కల్గిన శ్రమలతోను పోరాడుచు, తన తండ్రికి తన ఆత్మను అప్పగించి అనగా సిలువ మీద మరణముతో జరిగిన సంఘటనలు క్రీస్తు సంబంధమైనదా? లేక పరలోక సంబంధమైనదా? పరలోక సంబంధమైనవి ఏవి? లోకసంబంధమైనవి ఏవి? 9. ఆ విధముగా సిలువమీది ప్రభువు ఆత్మను అప్పగించిన అనంతరము ఆయనను సిలువ నుంచి దింపి, నాటి కిరాతకులు రాతి సమాధిలో ఉంచి బండను మూసి రాజముద్రతో భద్రపరచగా - మరి రాతి సమాధిలో ఉంచబడిన క్రీస్తు శరీరము శనివారమే పునరుత్థానము పొందవచ్చును గదా? అలా ఎందుకు జరుగలేదు? ఆదివారము తెల్లవారు ఝామున ఆయన లేవవలసిన సమయమెందుకు ఏర్పడింది? ఇందులో ఉన్న పరమ రహస్యమేమిటి? 10. దైవకుమారుడైన క్రీస్తు శుక్రవారము ఎందుకు మరణశిక్ష అనుభవించాడు? శుక్రవారము మరణశిక్ష అనుభవించి సమాధిలో పెట్టబడినాడు. శనివారము ఎందుకు పునరుత్థానుడు కాలేదు? 11. ఆదివారము ప్రభువు పునరుత్థానుడై తాను ప్రేమించిన శిష్యకోటికి దర్శనమిచ్చి వారితో సంభాషించాడు. ఆదివారము పునరుత్థానుడైన ప్రభువు శిష్యులకు కనబడకపోతే ఊళ్ళోవాళ్ళకి కనబడ వచ్చును గదా! మరి ఆ ఊళ్ళో వారికి ఎందుకు కనబడలేదు? 12. ఆ విధముగా మరణ పునరుత్థానుడైన ప్రభువు 11 సార్లు తన్ను తాను లోకానికి ప్రత్యక్షమై కనబరచుకోవడములో ఉన్న పరమ రహస్యమేమి? 13. ఆయన ప్రతిష్టించిన అపొస్తలులు సాధించిన ఘన విజయాలు, వాటి ఫలితాలు ఏవి? 14. నేటి క్రైస్తవ విశ్వాస జీవితములో మనము అనుభవిస్తున్న దైవానుభూతి ఆది దేవునితో కూడిందా? ఆయన కుమారుడైన యేసుక్రీస్తుతో ముడిపడి ఉందా? లేక పరిశుద్ధాత్మ తోడ్పాటుతో ఆయన నడుపుదలలో కల్గిందా? 15. యేసు మరణపునరుత్థానమైన పండుగ - మనము పాప అపరాధముల చేత చనిపోయి క్రీస్తులో పొందిన పునరుత్థాన పండుగ.
అంశము :- క్రీస్తు ఈ లోకములో అవతరించుటలో ఉన్న పరమార్థము.
ప్రియపాఠకులారా! యేసుక్రీస్తు ఈ లోకములో జన్మించుటన్నది ఆయననుగూర్చి అన్యులని కాక క్రైస్తవులలో కూడా అనేకమైన సందేహాస్పదమైనట్టి సమస్యలు తల ఎత్తుచున్నవి. ఈ సందేహము అన్నది ఆత్మరీత్యా గాక పరలోక రీత్యా కాకుండ లోకరీత్యా తలెత్తి అనేకులను అనుమానాలతోను అవిశ్వాసముతోను, దైవత్వానికే కళంకాన్ని ప్రతిపాదించే విధముగా నరునియొక్క బలహీనత క్రియ జరిగిస్తున్నది. యేసుక్రీస్తు జననములో ఆనాటి ఇశ్రాయేలు గ్రహించలేక దేవుడు తన ప్రవక్తల ద్వారా ప్రవచనాల ద్వారా తన ప్రణాళిక ద్వారాను తన సాహిత్యాల ద్వారాను, లోకానికి తన కుమారుని జననము గూర్చిన వివరాలను బాహాభాహీగా ప్రకటించినను ఇశ్రాయేలు నమ్మక ఆయనను నానామాటలతో విమర్శించారు. భూలోకము ఆయనను మరియ కుమారుడని వడ్రంగి కుమారుడని దైవద్రోహియని రాజద్రోహియు, నిర్దోషియైన దైవకుమారునిపై నిందారోపణలు, నిర్ధోషియైన ప్రభువును దోషిగా నేరారోపణ జేసి, లోకపరిపాలకుల చేత మరణశిక్ష విధించి ఘోరాతి ఘోరశిక్షను ఏ నరునికిని ఎప్పుడు సంభవించని, కనివిని ఎరుగని రీతిలో ఆయనను దోషిగా చేయుటన్నది ఆనాటి ఇశ్రాయేలుయొక్క ఆత్మీయ బలహీనత, శారీర అజ్ఞానము పాశవిక జ్ఞానము మూర్ఖత్వము క్రోధాదిగుణములు దైవకుమారునిపట్ల జరిగించిన క్రియయై యున్నది. అందుకే దైవకుమారుడైన యేసుక్రీస్తు సిలువ మీద మాట్లాడిన మొట్టమొదటి మాటలో లూకా 23:34 తండ్రీ! వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించుము,'' ఆ కిరాతక మూక జరిగించిన ఘోరాతిఘోర దుష్క్రియలకు ప్రభువు తండ్రికి మొట్టమొదటగా మొరపెట్టినాడు. ఆనాడు ఆ విధంగా ఆ అజ్ఞానకాలములో ఆయన చేసిన విజ్ఞాపన అది ఈనాడు మనకు స్వరక్షకునిగ అంగీకరించి ఆ అంగీకరించుటలో నోటి మాటలతో గాక ఆత్మతోను నీటితోను దైవకుమారుని ఈ లోకానికి పంపినాడు. దేవుడు ఆయనను మృతులలో నుండి లేపినాడని ఆయనలో దైవత్వమును అంగీకరించి, ఆయనలో ముద్రింపబడి క్రైస్తవులమని చెప్పుకొను క్రైస్తవులలో కూడా దేవుడు క్రీస్తును పుట్టించుటలోని పరమార్థ వాస్తవాన్ని ఇంకను గుర్తింపలేని వెర్రితలలు వేస్తుంటే ఇట్టివారిని గూర్చి అపొస్తలుడైన పౌలు తన లేఖన భాగములో ప్రవచించిన మాట - రోమా 1:19-25 ఈలాగు వ్రాయబడియున్నది. అదేమనగా ''దేవునిగూర్చి తెలియ శక్యమైనదేదో అది వారి మధ్య విశదమైయున్నది,'' అనుటలో దైవత్వమును గూర్చిన పూర్తి వివరాలు దాచక తన ప్రవక్తల ద్వారా తానేర్పరచుకొన్న దైవజనుల ద్వారా ఆయా కాలములలో ఆయా సమయ సందర్భాలలో వెల్లడిపరచియున్నాడు.
దేవుడు బాహాబాహిగా దైవకుమారునిగూర్చి బయల్పరచినను తానేర్పరచుకొన్న ప్రవక్తల ద్వారా ప్రవచింపజేసినను నాటి జనాంగము అర్థము చేసికోకుండ బుద్ధిహీనతను లోకానికి విశదపరచియున్నాడు,'' ఆయన అదృశ్య లక్షణములు అనగా ఆయన నిత్యశక్తియు దైవత్వమును, జగదుత్పత్తి మొదలుకొని తాను సృష్టించిన సృష్టిలోని సృష్టములను జీవరాసులను పంచభూతాలనుగూర్చి ఆలోచించుట వలన, దేవుడు ఎలాంటివాడో నరులకు తెలుసును. తెలిసినను దేవున్ని దేవునిగా మహిమపరచక వారు దేవుని పట్ల నిరుత్తరులైయుండి, ఆయనను దేవునిగ మహిమపరచక తనకు నరజన్మనిచ్చి జీవాత్మనిచ్చి బుద్ధి జ్ఞానముతో జీవించమని, లోకములో సృష్టించిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించక ఆయనను మహిమ పరచక పోగా, అవివేక అంధకార జ్ఞానముతో తాము జ్ఞానులమని చెప్పుకొనుచు బుద్ధిహీనులైరి. అంతమాత్రమేగాక అక్షయుడును అనగా క్షయముగానివాడును, మృతులలోనుండి లేచినవాడును, మానవత్వమునకు అతీతుడును నీతికి భక్తికి సన్నిహితుడును దేవునియొక్క అక్షయతను ఆయన మహిమను క్షయమగు అనగా మరణశిక్షకు పాత్రులైన నరులకు, పక్షులయొక్కయు చతుష్పాద జంతువులయొక్కయు రూపములకు దేవునియొక్క రూపమును పోల్చి అనగా దైవ రూపమునకు వీటిని నమూనాగా చేసుకొని వాటిని పూజించి, వాటిని ఆరాధించి నైవేద్యయుతమైన బలులనర్పించి దేవునికి చెందవలసిన మహిమను ప్రభావమును ఆ నిర్జీవములకు చెల్లించుటెంత విచారము ఎంత భయంకరము. ఈ దైవసన్నిధిలో ఎంత ఘాతుకమో ప్రియపాఠకులారా! ఒక్కసారి ఆలోచించండి. ఇట్టి హేతువు చేత దేవుడు ఉగ్రుడై నరుల యొక్క బలహీనత దురాశల చేత బలహీనపరచి, పశువు కంటె హీనమైన ప్రవృత్తిలో నీచాతినీచమైన స్వభావమునకును, శారీరయుతముగా అవమానము, ఇట్టి నీచత్వమునుబట్టి పశుప్రాయులైన నరులు దైవసత్యమును విస్మరించి, ఆ సత్యమును అసత్యమునకు మార్చి సృష్టికర్తకు ప్రతిగా రూపించిన ప్రతిమలను దేవతలుగా ఆరాధించుటన్నది - ఇంతకంటె నీచాతినీచమైన స్థితి నరులకున్నదా? ఇట్టి ప్రవృత్తి లోకములో ఎక్కడైనను ఉందా?
ప్రియపాఠకులారా! దేవుడు సృష్టించిన మూగజీవులు కూడా విగ్రహారాధన చేయవు. అవి పంచభూతాలను దేవుడు - దేవతలుగా స్తుతించవు. పశుపక్ష్యాదులు దైవత్వమును ఆత్మగానే గౌరవిస్తాయి, మహిమపరస్తాయి. ఆయనను దేవునిగా నిరంతరము తమయొక్క కంఠారావముతో స్తుతించుచు ఇహలోక జీవితము గడుపుకొంటాయి. నరులెరుగని ఈ సత్యాన్ని జీవులెరిగియున్నాయి. కాని జీవాత్ముడైన నరుడు ఎరుగలేదు. యేసుక్రీస్తు జన్మ రహస్యము. నరశరీరుడుగా నరుడు పుట్టక మునుపే తల్లి గర్భములో నుండి రూపించబడక పూర్వమే దేవుడు ప్రతి నరునికి ఒక ముద్రవేసియున్నాడు. ఈ సత్యాన్ని ప్రభువు తానేర్పరచుకొన్న సౌలు ద్వారా ఎఫెసీ 1:4-6 తన ప్రియునియందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపామహిమకు కీర్తికలుగునట్లు, తన చిత్త ప్రకారమైన దయాసంకల్పము చొప్పున, యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులనుగా స్వీకరించుటకై, మనలను ముందుగ తన కోసము నిర్ణయించుకొని, మనము పరిశుద్ధులమును నిర్ధోషులమునై యుండవలెనని జగత్తు పునాదివేయబడక మునుపే, ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకొనెను'', భూమికి పునాది వేయబడక పూర్వమే క్రీస్తున్నాడని తెలియుచున్నది. ఏ విధముగా ఉన్నాడు? ఇది నరునికి మరుగుపరచియున్న క్రీస్తుయొక్క దైవ రహస్యము. ఈ రహస్యమును దేవుడు ఏలాగు తన జనాంగానికి బయల్పరచినాడన్న వివరాన్ని సంఘానికి వ్రాయబడిన లేఖలో పౌలు వివరించాడు. అయితే దేవుడెలాగు ఈయనను ఏర్పరచుకొన్నాడు. ఎందుకు ఏర్పరచుకొన్నాడు? ప్రియపాఠకులారా! ఇందునుగూర్చి ఆలోచిస్తే ఆదిలో మన పితరుడైన ఆదాము దైవాత్మలో భాగస్వామి, దైవత్వముతో ఉన్నటువంటి సావాసము, ఆయన వేసిన ఏదెను అను దైవవన నివాసము, పశుపక్ష్యాదులతో సహజీవనము - సృష్టిలో సకల విధమైన సుఖభోగాలు అనుభవిస్తు తనకు జీవాత్మను ప్రసాదించిన దేవునికి వ్యతిరేకియై దైవత్వము శాసించిన నిషేదఫలమును తిని, దైవత్వమునకు విరోధియై, దైవ వన స్వాస్థ్యము దైవ సావాసము, దైవకలయికలోని నిత్యానందము సమాధానకరమైన జీవితాన్ని కోల్పోయి ప్రకృతి వైరుధ్యము, లోకసృష్టిలో ఉన్నట్టి జంతుజాలములతో కూడా వైరుధ్యము పంచభూతాలతో శత్రువై లోకము చేత తృణీకరింపబడి, నానావిధ శరీర రుగ్మతలు వేదనలు బాధలు సమస్యలు వాటితోబాటు, దైవశాపముతో ఆవరించిన నరకాగ్ని గుండ మరణశిక్షకు గురియైయ్యాడు.
ప్రియపాఠకులారా! నరునియొక్క దైవ వ్యతిరేకత చిన్నదిగా కనబడినను, దైవసన్నిధిలో అది చాలా ద్రోహముగా ఎంచబడింది. తరతరాలు దైవత్వముతో సఖ్యతగల్గి జీవించాల్సిన నరుడు అందుకు యోగ్యత లేని స్థితిని నరుడు సంపాదించుకొన్నాడు. ఈ విధముగా నరుడు దైవత్వమునకు దూరుడై నానా విధముగా ఉపద్రవాలకును, రుగ్మతలకు, సమస్యలకు గురియై లోక జీవితము అనుభవిస్తున్నప్పుడు దేవుడు కనికరించి, తన హస్తముతో రూపించిన నరునిగూర్చి సంతాపపడి నరజీవితానికి, భూమికిని దైవసన్నిధిలో కలుగబోవు మహోగ్రతకు సంతాపపడి దేవుడు - భూత భవిష్యత్తు ఎరిగియున్న దేవుడు నరునికి భవిష్యత్తు లేనిదని అది మహా భయంకరమని, దాని భవిష్యత్తునుగూర్చి యోచించి, నరనారులు ఇద్దరును వారి క్రియాకర్మ దోషమున సాతాను సర్పము తోడై, లోకము మీదకు పంపించిన ఆదికాండము చరిత్రలో పాపమరణములనుగూర్చి మనకు విదితమే.
ప్రియపాఠకులారా! ఇక్కడ మనము దైవత్వములో ఉన్న గొప్ప మర్మమును చూడగలము. అదేమనగా మన జ్ఞానముతో మనము ఆలోచిస్తే భవిష్యత్తులో నరుడు దేవునికి విరోధి అగుతాడన్న విషయాన్ని ఎరుగకున్నాడా? సర్వము సృష్టించిన దేవుడు నరుని ఆంతర్యాన్ని గ్రహించే జ్ఞానము లేదా? అనిన ప్రశ్న కలుగవచ్చును. నరుని రూపించబడక పూర్వమే అతని భవిష్యత్తు అతను చేయబోయే పని అంతయు తెలుసును. ఇందులోని అంశాలు తీసికొంటే దేవునియందు భయభక్తులు గల్గిన, నిత్యము దేవునికి బలియాగము స్తుతియాగము చెల్లించే యదార్థవంతునిగ నీతిమంతునిగ జీవించే వారి స్థితి కూడా దేవునికి తెలిసిందే గదా! ఆ విధముగా నిత్యము నిష్కల్మషముగా యదార్థముగా జీవించే ఆ వన ప్రవేశమునకు సాతానుకు ఎందుకు అనుమతినిచ్చాడు? ఇందుకు పాఠకులు సమాధానము చెప్పుకోవాలి. ఆయన చేసిన శారీర నిర్మాణము ఆయన ఇచ్చిన జ్ఞానము ఆత్మయొక్క స్వభావము - అనగా దేవుని మూలముగా కల్గిన శరీరము, జీవాత్మ ఊపిరి కూడా అది పవిత్రమే గదా! ఏదెను వనము పరిశుద్ధతకు సమాధానమునకు ప్రకృతి ఆహ్లాద దృశ్యాలతో ఉండి కలుషిత వాతావరణము లేదు, లోక ప్రాణులద్వారా ప్రమాదముగాని ఏదియు లేదు గదా! అందులో దైవరక్షణ దైవిక తోడ్పాటు ఉన్నటువంటి ఆ వనములో అపవాది ప్రవేశించుటకు అవకాశం ఎలా గల్గింది? దీన్ని గూర్చి ఆలోచించారా?
ప్రియపాఠకులారా! యోబును శోధించుటకు అవకాశము ఇచ్చాడు. అలాగే నరజంటను పరిశోధించుటకు అపవాదికి అవకాశము ఇచ్చియున్నాడు. చిత్రమేమిటంటే యోబును శోధించుటకు అవకాశము సర్ప రూపముగా యోబుకు దర్శనమీయలేదు. కాని నరరూపములో దోపిడిగాళ్ళ రూపములో దర్శనమిచ్చి యోబుయొక్క ఆస్థిని కొల్లగొట్టినాడు. కాని దేవుడు దైవత్వము, పైశాచికము రెండును చేరి జరిగించిన క్రియను యోబు గ్రహించినవాడు కాదు. అపవాది కలిగించిన ప్రతి క్రియ దేవుని వలన కల్గిందని గొర్రెలను దైవాగ్ని కాల్చివేయడము, ఒంటెలు కొల్లగొట్టడము, కుమారులు, కుమార్తెలు ఇల్లు కూలి మరణించుట, ఆస్థి ఐశ్వర్యాలు క్షయమైపోగా యోబు లేచి తన పై వస్త్రమును చింపుకొని తల వెంట్రుకలు గొరిగించుకొని నేల మీద సాష్టాంగపడి నమస్కారము చేసి ఇట్లనెను నేను నా తల్లి గర్భము నుండి దిగంబరినై వచ్చితిని, దిగంబరినై అక్కడికి తిరిగి వెళ్ళెదను, యెహోవా ఇచ్చెను యెహోవా తీసికొని పోయెను. యెహోవా నామమునకు స్తుతికలుగును గాక! అన్నాడేగాని వీషన్మాత్రము దైవత్వాన్నిగూర్చి సంతాపపడి విసిగి దేవుని నిందించినట్లు వ్రాయబడలేదు. ఇది సాతాను వలన కల్గిన శోధన అని యోబు గ్రహించలేదు. అలాగే సర్పము మాట్లాడిందని భావించారుగాని సర్పములో అపవాది ఆవేశించి మాట్లాడినట్లు హవ్వ గ్రహించలేదు. అందువల్ల దేవుడనుగ్రహించిన వన స్వాస్త్యము శ్రేష్టమైన ఆహారాన్ని, వన స్వేచ్ఛను , తోటలోని ఆహ్లాద కరమైన మహాభాగ్యాన్ని పోగొట్టుకొని, ఏ దేవుడైతే జన్మనిచ్చాడో - ఆ దేవునికి విరోధులైనను దేవుడు కరుణాసంపన్నుడు గాన వారినిగూర్చి వారి మానసిక బలహీనతకు అవివేకమునకు సంతాపపడి చర్మపు దుస్తులను తొడిగించాడు. ఈ చర్మపు దుస్తులే నేడు క్రీస్తును స్వరక్షకునిగా అంగీకరించి, క్రీస్తులో బాప్తిస్మము పొందిన మనము కూడా ధరించుకొన్న రక్షణ వస్త్రము.
ఇందునుబట్టి ప్రియపాఠకులారా! యేసుయొక్క జన్మములోని దైవసంకల్పము, దైవప్రణాళిక దైవ నిర్ణయమును గూర్చి మనమిప్పుడు తెలిసికోవాలి.
ఆత్మగా ఉన్న దేవుడు సర్వసృష్టికి ఆది సంభూతుడును సర్వమునకు జీవిమిచ్చి లోకానికి వెలుగైయున్నదేవుడు సమస్తమును సృష్టించగల శక్తిగల దేవుడు - తన హస్తముతో నరుని రూపించి వాని నాసికారంధ్రములలో జీవాత్మను ఊది, తన ఆత్మతో తన జీవము తన హస్త క్రియ - ఈ త్రివిధమైన విధానమునుబట్టి నరుని రూపించిన దేవుడు నరుని తన హస్తముతో రూపించినను, వానిలో నుండి నరునిగా తాను జన్మించినను సంపూర్ణ నరుడుగా కాక, లోకరీత్యా మానుషేచ్ఛలతో పురుష బీజముతో పుట్టినవాడుగా కాక, నారీగర్భములో ఆత్మబిందువు ద్వారా ఆత్మ క్రియ ద్వారా ఆత్మయొక్క రూపము ద్వారా పరిశుద్ధమైన కన్య గర్భములో ఎలాంటి లోకసంబంధ ప్రమేయము లేకుండ జన్మించాడు. అలాగే దేవుడు నరుని తన హస్తముతో రూపించి, తన ఆత్మలో భాగస్వామియైన నరుడు దైవసృష్టమైన సర్ప రూపమునకు దానియొక్క బోధకును, అది అపవాది ఆవేశితమై జరిగించిన దైవ వ్యతిరేక క్రియకు లోనై నందున - కన్యక గర్భములో జన్మించిన నరరూపము - ఆదిలోని సర్పదోషమును నివృత్తి చేయుటకు యోహాను 3:14లో వలె ప్రభువు పల్కిన మాట ''అరణ్యములో మోషే పర్పమును ఏలాగు ఎత్తెనో ఆలాగే విశ్వసించు ప్రతివాడును నశింపక ఆయన ద్వారా నిత్యజీవము పొందునట్లు మనుష్యకుమారుడు ఎత్తబడవలెను,'' ఈ మాట చెప్పిన ప్రభువు జననమునకు - ఆదిలో మోషే దైవత్వంమీద సణిగి వ్యతిరేకించిన జనముపై సర్ప సమూహమును పంపించి, సర్పకాటుకు గురిజేసినప్పుడు, అనేకులు మరణవాత పడగా మోషే నశించి యున్న జనాంగమునుగూర్చి దైవత్వముతో మొరపెట్టగా - దేవుడు మోషేతో మాట్లాడిన మాట ఏదనగా సంఖ్యా 21:8 నీవు తాపకరమైన సర్పమువంటి ప్రతిమను ఇత్తడితో చేయించి ఎత్తయిన స్థంభము మీద పెట్టుము. అప్పుడు కరవబడిన ప్రతివాడును దాని వైపు చూచి రక్షణ పొందుతారన్న ప్రకారము - ఆదిసర్ప ఆకర్షణకు లోనైన జనముపై నరకాగ్ని సంబంధము మరణమునకు గురియగుట, తానే ఆనాడు మోషేతో సిద్ధపరచిన ఇత్తడి సర్ప ప్రతిరూపముగా ప్రవచించి - మనుష్యకుమారుడు ఎత్తబడవలెను,'' అనుటలో యేసుక్రీస్తు మనుష్యకుమారుడు,'' అనుటలో నారీ గర్భములో పుట్టినందుకు మనుష్యకుమారుడే, అయితే మరణించిన తర్వాత మహిమ పునరుత్థానము పొందుటకు యోగ్యుడయ్యాడు. ఎందుకంటే పురుష కలయిక లేకుండ ఆత్మ బీజము ద్వారా పరిశుద్ధాత్మ ఆవరింపు, సర్వోన్నతుని శక్తి ఇవి రెండును చేరి స్త్రీ గర్భములో ఒక శక్తి ఆత్మగాను, మరొక శక్తి శరీరముగాను రూపించిన రూపమే యేసు శరీరము. నవమాసములు కన్య గర్భములో నివసించి ప్రసవింపబడినాడు. ప్రభువు తననుగూర్చి మనుష్యకుమారునిగా ప్రవచించినను తండ్రి దైవకుమారుడుగ ఈయన నాకుమారుడని ప్రవచించాడు. నాయందు తండ్రియు - తండ్రియందు నేనును ఏకమైయున్నామనియు, నన్ను చూచినవాడు నా తండ్రిని చూచియున్నాడనియు, నాయందు విశ్వాసముంచినవాడు - నన్ను పంపిన వానియందును విశ్వాసముంచును. ఈ మాటలు విని, నాయందు విశ్వాసముంచువాడు మరణములో నుండి జీవములోనికి దాటియున్నాడు - వానికి తీర్పు ఉండదు. మీరు లోకసంబంధులైనట్లు నేను లోకసంబంధుడను కాను. ''నేను లోకానికి వెలుగును నన్ను వెంబడించువాడు చీకటిలో నడువక జీవపు వెలుగు కలిగియుండును.''
ప్రియపాఠకులారా! ఈ మాటలు లోకసంబంధమైనవి కావు - దైవసంబంధమైనవి. శారీర సంబంధమైనవి కావు - ఇవి ఆత్మసంబంధమైనవి. ఇవి సృష్టియొక్క మాటలు కావు - సృష్టికర్తయొక్క మాటలు. కనుక యేసుక్రీస్తు నరుడు చేసిన పాపమునుబట్టి తండ్రియైన దేవుడు ఏ నరుని నరరూపములో సృష్టించాడో అతడు సర్పబోధకులోనై జరిగించిన దైవాజ్ఞ వ్యతిరేక క్రియనుబట్టి ఎత్తబడిన సర్పమునకు సూచికగాను, రెండు విధమైన రూపాంతరాలలో దైవ ప్రణాళిక దైవచిత్తము, దైవసంకల్పముతో సశరీరునిగా సమర్పించుకొన్న నరునికున్న సర్పదోషము దైవవ్యతిరేకతనుబట్టి, సర్పములో మాట్లాడిన అలౌకిక ఆత్మ సాతాను ఆత్మయొక్క మాటలనుబట్టి నరుడు పాపియైనందున - ఆ పాప పరిహారార్థము - యేసుక్రీస్తు యొక్క శారీర రక్తములు సమర్పించుకొన్నట్లు ఇందులోని రహస్యము. ఇంత గొప్ప దైవరహస్యము క్రీస్తులో ఉండగా - నేటి యుగములో క్రైస్తవులే యేసుక్రీస్తు జరిగించిన ఆయొక్క మహోన్నతమైన సమర్పణాయుత బలియాగమును యేసుయొక్క రూపమును ఆయనయొక్క పవిత్రతను అలక్ష్యపరచుచు, ఆయనను తమయొక్క స్వార్థానికి ఆయన పేరు పెట్టుకొని, ఆయనలో ఉన్నామని చెప్పుకుంటూ ఆయనకు దూరముగా ఉంటూ - ఇటు ఈ లోకానికి అటు పరలోకానికి దూరమగుచున్నారు. ఇందుకు కారణము యేసుక్రీస్తు జనన రహస్యమును క్రైస్తవ లోకము మనోదృష్టితో వీక్షించక పోవుటయే, ఆత్మ జ్ఞానముతో రుచిచూడక పోవుటయే కారణము.
(4) ప్రియపాఠకులారా! ఇది యేసుక్రీస్తుయొక్క జననరహస్యము ఆయన స్థాపించిన దైవ రాజ్యమునుగూర్చిన సువార్త స్థాపననుగూర్చిన నిగూఢ సత్యాలు తెలిసికొందము. ఇందులో కూడా తండ్రికుమారుల ప్రణాళిక మిళితమైయున్నట్లును, ఎందుకంటే యేసుక్రీస్తును దేవుడు ఒక్కనిగా పంపి ఒక్కని ద్వారానే పరలోక రాజ్య సువార్తను వివరించుటయే కాదుగాని, ఆయన ఈ లోకములో నరునిగ అవతరించిన తర్వాత పరలోక సామ్రాజ్య మర్మాలను గూర్చి ప్రకటించుటకు మొట్టమొదట దేవుడు ప్రవక్తలను దీర్ఘదర్శులను జ్ఞానులను పంపినాడు. కాని ప్రవక్తల ప్రవచనాలు జ్ఞానులయొక్క జ్ఞానము దీర్ఘదర్శులయొక్క శాస్త్రజ్ఞానములన్నియు నాటి దైవజనాంగములో దైవ ప్రణాళికకు అనుగుణ్యముగా వారిలో క్రియ జరిగించ లేకపోయినవి. కారణము - ఆనాటి జనాంగములో విద్యాజ్ఞానముగాని, సాహిత్య జ్ఞానముగాని వేదజ్ఞానముగాని, క్రమముగాని, మంచి చెడు అన్న విచక్షణ జ్ఞానము లేకుండ మూర్ఖముగా ప్రవర్తించారు. కనుక ఆ జనాంగములను దేవుడే ఎన్నో విధాలుగ వారిని తన రాజ్య వారసులు చేసికోవాలని ప్రయత్నించి ఆ ప్రయత్నము విఫలమైంది, తానే నరావతారములో నరప్రమేయము లేకుండ మరొక జీవి గర్భములో కాక భూగర్భములో కాక, ఒక భర్తకు భార్యయైన ఇల్లాలి గర్భములో కాక కన్యకయై పురుషునికి ప్రధానము చేయబడిన స్త్రీ గర్భములో నుండి ఆయన అవతరించి, తానే ఈ లోకములో తన అద్భుత కార్యాలు తన ఆత్మీయ ప్రభావము ద్వారా అజ్ఞాన నరుల ఆత్మలను బలపరిచాయి, అయినను ఆయన ఆత్మీయ శక్తి ప్రత్యక్షీకరణను ఆనాటి జన సందోహము చూచి కూడా ఆయనను దైవకుమారుడుగ మహిమపరచే స్థితి లేనందువలన, ఆయన ఊరుకొనక ఆయన ప్రణాళిక వ్యర్థము కాకుండ, నరులందరికి దైవరాజ్యమునకు కావలసిన మార్గాన్ని సుగమము చేసేందుకు, నాటి వేదాంతులు వేదపండితులు విశ్వాసులు సంపన్నులు రాజులు చక్రవర్తులు గొప్ప వంశావళులకు చెందినవారుగాక, జాలరులు - అమాయికులు విద్యాజ్ఞానము లేనివారును, పామరులునైన చేపలు పట్టువారు, సుంకరులును, జీవాధారము లేనట్టివారును, దైవత్వము ఏమిటో తెలియని వారిని తన రాజ్యమునకు ఎన్నుకొని, తాను జరిగించే ప్రయోగాత్మక క్రియల ద్వారా అనగా సముద్రములో చేపలు పట్టు జాలరులతో కూడా దోనెలో ఉండి, సుడిగాలులు రేపి సముద్రాన్ని పొంగించి దోనె అలల చేత కప్పబడెను. అప్పుడు ఆయన నిద్రించుచుండగా వారు ఆయన యొద్దకు వచ్చి రక్షించుమని ఆయనను లేపిరి. అంతట ఆయన వారిని ఊరడిల్లచేసి, గాలిని సముద్రమును ఊరకుండుమని గద్దించుటన్నది వారిని తన రాజ్యవారసులుగా చేయుటకు ఆయన చేసిన ప్రణాళికలో మొదటి మెట్టు.
దీనికి ముందుగా కానాలోని పెండ్లి విందులో ఆయన చేసిన నీటిని ద్రాక్షారసముగా మార్చిన అద్భుత క్రియ. ఈ అద్భుత క్రియ ద్వారా ఆయన శిష్యులు ఆయనయందు విశ్వాసముంచిరి. మొట్టమొదట ప్రభువు తానేర్పరచుకొనే వ్యక్తులలో విశ్వాసమును స్థిరపరచుటకు బీజము వేసిన ఈయొక్క క్రియ నీటిని ద్రాక్షరసముగా మార్చాడు. దీనివలన ఆయన మహిమపరచబడుటయు, ఆయన శిష్యులు ఆయనపై తమ విశ్వాసమును బలపరచుకొని తమ సమస్తమును వదలుకొని ఆయనను వెంబడించారు. ఆ విధముగా వెంటాడిన ఆయన శిష్యులను ఊరక వదలక వారికి కాళ్ళు కడిగి తన శిష్యులుగ ప్రతిష్టించి అభిషేకించి, వారి మీద ఊది తన ఆత్మను నింపి వారిని తనకు ఈ లోకములో సాక్షులుగ ప్రతిష్టించుట, అంతేగాకుండ ఈ లోకముతో తండ్రి చిత్తప్రకారము మరణ పునరుత్థానుడై తండ్రి యొద్దకు వెళ్ళి తిరిగి రెండవ రాకడ వరకు కూడా వారిని సాక్షులుగా ఉంచాడు. వారి సాక్ష్యాలు నోటి మాటలతో గాకుండ లిఖిత పూర్వకముగాను, ఆ విధముగా లిఖించబడి భూమిమీద తానేర్పరచుకొన్న అపొస్తలులకు వీరికి తన ఆత్మనే గాకుండ యోహాను 16:7 లో వ్రాయబడిన వేద భాగ వివరణలో ఆయన పల్కిన మాటలు - ''నేను వెళ్ళిపోవుట వలన మీకు ప్రయోజనకరము, నేను వెళ్ళని యెడల ఆదరణకర్త మీ యొద్దకు రాడు. నేను వెళ్ళి ఆయనను మీ యొద్దకు పంపుదును. ఆయన వచ్చి, పాపమును గూర్చియు తీర్పును గూర్చియు లోకమును ఒప్పుకొనజేయును. 16:13 అయితే సత్యస్వరూపియైన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మును సర్వ సత్యము లోనికి నడిపించును,'' ఈ విధముగా ఆయన చెప్పిన మాటలు నెరవేరినవి. గొర్రెపిల్ల భార్యయైన యెరూషలేము ఆ మహా పట్టణపు పునాదులపైన గొర్రె పిల్ల యొక్క పన్నిద్దరు అపొస్తలుల 12 పేర్లు కనబడుచున్నవి. ప్రకటన 21:14.
(5) దైవకుమారుడైన క్రీస్తు సజీవ యాగముగా తన్నుతాను లోకానికి అప్పగించుకొనుటకు శుక్రవారమునే ఎన్నుకొనుటలో ఉన్న పరమార్థము - శుక్రవారమునాడే ఈ బలియాగము జరిగించినట్లు లోకానికి తెలుసు. క్రైస్తవులమైన మనము బాగా ఎరిగియున్నాము.
ప్రియపాఠకులారా! దైవత్వము ప్రతివిషయములో ఆది అంతము రెండును ఒకదాని తర్వాత అవి క్రియజరిగించుటన్నది మనమెరిగిన సత్యమే, పరిశుద్ధ గ్రంథములో కూడా మొట్టమొదటి వేదభాగాన్ని ఆదికాండము అని ఆది 1:లో భూమ్యాకాశాలు సృష్టించబడినవని వ్రాయబడియున్నది. లోకసృష్టిలో మొట్టమొదటి నరుడు కూడా ఆదాము అని ఆది నరుడు ఆది నారి అని అలాగే ఆదిసర్పము - మరియొక పేరు ఆదిఘటసర్పము, ఈ ఆదిసర్పమును గూర్చి వేదములో దేవుడు చేసిన సమస్త భూజంతువులలో సర్పము యుక్తి గలదైయుండెను'',అని వ్రాయబడుటనుబట్టి ఆది సర్పానికి యుక్తి ఉంది. అలాగే ఆది నరునికి శక్తి ఉన్నది - శక్తి లేకపోతే దైవత్వము ముందు నిలువగల్గి, దేవునితో ముఖాముఖి మాట్లాడగలిగే మనోస్థిరత్వము ఆత్మశుద్ధి నిష్కళంకత కలిగియుండబట్టియే నిలువగల్గినాడు. పైగా దేవుని ముఖాముఖి చూస్తూ దైవత్వంతో సావాసము చేశాడు. ఈనాడు ఈ విధముగా ముఖాముఖిగ దైవత్వముతో సావాసము చేసే వ్యక్తిగాని ఏ విశ్వాసిగాని ఉన్నాడా? ఏ వ్యవస్థగాని, ఏ సంస్థగాని ఉన్నదా?
ప్రియపాఠకులారా! ఆది దేవుడు ఆదినరుడు ఆది దంపతులతో ఆది వనములో ఆది సృష్టిలో - తాను సృష్టించిన నరజంటతో కూడా సహవాసము చేస్తూ సమాధానముగా శాంతియుతమైన స్నేహపూరిత జీవితాన్ని జీవించాడు. ఇది ఆదినరుడు సంపాదించుకొన్న మహాభాగ్యము. అయితే ప్రియపాఠకులారా! ఆది 1:1నుండి దేవుడు జరిగించిన సృష్టి నిర్మాణ క్రియలో ఐదు రోజులు దేవుడే తన వాక్శక్తితో - తన వెలుగుతో తన ధ్వనితో యావద్ ప్రపంచాలను జలనిధులను వాటివాటి క్రియలను నిర్మించి, అవి మంచి క్రియలుగా ఏర్పడి, ఆయన వాక్కుకు విధేయించి, అవి చలించి ఆయన వాక్కు ద్వారా జీవయుతములై ఫలించిన విధానమునుగూర్చి సంతృప్తి చెందినాడు. ఇది ఐదు దినముల సృష్టినిర్మాణక్రియలో దేవుడు అనుభవించిన మధురానుభూతి. అనగా వారమునకు మొదటి వారము ఆదివారము. మొట్టమొదట గాఢాంధకార చీకటి అగాధ జలములలో ఉన్న ఈ అనంత విశ్వము - భూమ్యాకాశములలో వెలుతురును ప్రసాదించిన దినము - మొట్టమొదటి దినము ఆదివారము. ఈ విధముగా వరుస క్రమముగా దేవుడు జరిగించిన సృష్టి నిర్మాణ క్రియలనుగూర్చి మొదటి ఆదివారము నుండి ఐదు దినాలలో దేవుడు జరిగించిన సృష్టి నిర్మాణ కార్యాలు పూర్తిగా వివరించబడియున్నవి. ఇంత గొప్ప విశాల ప్రపంచము ఐదు దినాలలో సులభముగా రూపించగల్గిన దేవునికి నరుని రూపించుట స్వల్పమే, కాని ఒకదినకాలము సంపూర్ణముగా నరుని నిర్మాణము కొరకు ఖర్చు పెట్టినట్లు వేదములో చదువగలము. ఆరవ దినమన్నది శుక్రవారము - ఇందునుబట్టి శుక్రవారమే నరుని నిర్మించినట్లు రూఢిగ తెలుస్తున్నది. ఇందునుగూర్చి చదువరులు లెక్క పెట్టుకోవలసి యున్నది. ఆరవ దినము శుక్రవారమే, ఆ ఒక్క దినాన సృష్టి జోలికి పోక నరుని నిర్మించి, నరనిర్మాణము జరిగించుచు అనగా భూగర్భము నుండి మట్టి తీసి, నరుని రూపముగా రూపించి అందులో తన జీవమును తన ఆత్మను నింపి వానిని జీవాత్మునిగ జేశాడు. ఆది 1:26-27లో ఏ విధముగా నర నిర్మాణమును గూర్చి ప్రవచించాడో - ఆ విధముగా ఆ దినముననే దేవుడే క్రియామూలకముగా నెరవేర్చినాడని దైవమర్మము, దైవచిత్తము, దైవప్రణాళిక దైవసంకల్పము తెలుస్తున్నది.
అయితే ప్రియపాఠకులారా! నరుని సరే ఆరవ దినాన చేశాడు. అయితే స్త్రీని ఎప్పుడు చేశాడో పాఠకులు తెలిసికోవాలి. ఇందును గూర్చి చదువరులైన పాఠకుల అభిప్రాయము ఎలాగున్నను ఆత్మ బయల్పరచిన మర్మాలను రచయితనైన నేను తెలిసికొన్న విధమెట్లనగా - దేవుడు ఆరవ దినాన నరుని చేశాడన్నది మనము తెలిసికొనియున్నాము. ఆ విధముగా నరునియొక్క జన్మకు మూలమైన శుక్రవారమున నరుని చేసినందుకు దేవుడు తృప్తి చెందినాడు. కాని దేవునియొక్క సంతృప్తిని నరుడు దేవుని పట్ల కృతజ్ఞత చూపక దైవాజ్ఞ వ్యతిరేకియై పాపము చేయుటనుబట్టి, నరుని నిర్మించిన దినమైన పరిశుద్ధ శుక్రవారము పవిత్రత ఉన్నత విలువల మంట గలిపి, ఆ శుక్రవారమునకు కళంకాన్ని కల్గించాడు. అందువలన దేవుడు రూపాంతరము చెంది నరపుత్రునిగ ఈ లోకములో అవతరించి తాను శుక్రవారము నరుని చేసినందుకు సంతాపము చెంది, వాని అపవిత్రతను పోగొట్టుటకు తన శారీర రక్తములను సమర్పించి, ఆ శుక్రవారమును పవిత్ర పరచుటకు యావద్ నరకోటికి సంక్రమించిన మరణము నరకాగ్ని శిక్ష నుండి తప్పించుటకు, తాను ఏ శుక్రవారము నాడు పరిశుద్ధ స్థితిలో తన పరిశుద్ధ హస్తముతో పవిత్ర రీతిలో - తన ఆత్మను తన జీవమును ఉంచి నరుని చేశాడో- ఆ నరునికి సాటిసహాయి యైన స్త్రీని కూడా శుక్రవారమే, నరునికి గాఢనిద్ర కలుగజేసి, వాని ప్రక్కటెముకతోను మాంసముతోను రూపించిన క్రియా విధానమునుబట్టి తాను నరుని ప్రక్కటెముకనుండి నారిని రూపించినట్లుగ ఆది 2:7 నరునికి గాఢనిద్ర కల్గించి, దేవుడు జరిగించిన స్త్రీ నిర్మాణక్రియయొక్క వివరము మనకు బాహాటముగా బయల్పరచుచున్నది. ఎట్లనగా ఆది నరదోషమునుబట్టి ఆ దినము మంచిది గాదని, సాటి సహాయము చేయుదుననుకున్న ఆది దేవుడు - పాతనిబంధనలో ఆది నరునికి సమకాలికుడైన రెండవ ఆదామును నూతన నిబంధనలో - ఆ ఆదాము అనబడే ఆది నరునికి సాటి సహాయము ఏ విధముగా అవసరమై ఆ ఆదాము ప్రక్కటెముక నుండి స్త్రీని చేశాడో - అలాగే యేసు అనబడే ఈ రెండవ ఆదాముయొక్క ప్రక్కటెముక బల్లెపు పోటు నుండి స్రవించిన రక్తము ద్వారా సంఘము అను స్త్రీని రూపించాడు.
ఇందునుబట్టి ప్రియపాఠకులారా! క్రైస్తవ సంఘమన్నది క్రీస్తుకు వేరుగా లేదు. ఇది క్రీస్తులో నుండి ఆయన కుడి ప్రక్క భాగము గాయము ద్వారా స్రవించిన రుధిరములో ఈ సంఘముయొక్క నిర్మాణము దైవచిత్తమే, దైవప్రణాళికయేనని ఇందునుబట్టి మనకు తెలుస్తున్నది. అందుకే అపొ 20:28 దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన తన సంఘమును కాయుటకు పరిశుద్ధాత్మ మిమ్మును దేనియందు అధ్యక్షులనుగా ఉంచెనో ఆ యావత్తు మందను గూర్చియు, మీ మట్టుకు మిమ్మును గూర్చియు జాగ్రత్తగా ఉండుడి, అనిన ప్రవచనము ననుసరించి, ఆ రక్తము వలన మొదటి స్త్రీ నరునికి దేవుడు సాటి సహాయిగ అనుగ్రహించిన స్త్రీ అతని ప్రక్కటెముక మాంసము నుండి రూపించబడింది. అయితే దేవునియొక్క స్వరక్తము - తన కుమారుడైన రెండవ ఆదామైన క్రీస్తుయొక్క యోహాను 19:34లో వలె ఈయన రక్తమును నీళ్ళను కోరెను. కనుక ఆయన ప్రక్కలోని గాయము నుండి స్రవించిన రక్తము ద్వారా సంఘము అను స్త్రీని రూపించాడు.
ప్రియపాఠకులారా! ఆదిలో దేవుడు నరుని రూపించినప్పుడు అతడు పరిశుద్ధుడు - అతడు పరిశుద్ధ స్థితిలో దైవత్వముతో కలసిమెలసి జీవించాడు. అతనికి సాటి సహాయియైన స్త్రీ నిర్మాణ క్రియను గూర్చి ఆదాము ఎరిగియున్నాడు. అలాగే ఇతనికి జన్మపాపముగాని, కర్మపాపముగాని ఏదియును లేదు, పాపము అన్నది-సర్పము స్త్రీ అను రెండు విధమైన సాధనాల ద్వారా నరునికి సంభవించింది. అయితే రెండవ ఆదాము కూడా పరిశుద్ధుడును పవిత్రుడును దేవుడును - దైవకుమారుడైన క్రీస్తుయొక్క జననము మనకు తెలిసిన విషయమే. ఈయన జన్మించిన కన్య గర్భము పరిశుద్ధము - పవిత్రమైనదే, అలాగే ఆదామును కన్న భూమి కూడా నాడు అది దేవుని సన్నిధిలో పరిశుద్ధమైనదియు, దైవత్వమునకు యోగ్యమై యున్నట్లు ఆది 1:లో చదువగలము. ఆ విధముగా పరిశుద్ధ స్థితిలో రూపించబడిన ఇద్దరు పురుషులలో పాత నిబంధనకు మూలపురుషుడైన ఆదాము తన దోషాపరాధముల ద్వారా పొందినటువంటి మరణము నరకాగ్ని గుండము అను రెండు విధములైన శిక్షలకు గురి అయ్యాడు. ఇది మొదటి ఆదాము ద్వారా లోకానికి సంక్రమించిన అరిష్టము. అంటే మొదటి ఆదాము ద్వారా సంక్రమించిన ఈయొక్క దోషాపరాధమును పరిహరించి లోకమును విమోచించుటకు స్త్రీ గర్భములో నరావతారునిగ జన్మించాడు. అయితే నరదోషమునకు సుదూరుడు అతీతుడై యుండి, తన పరిశుద్ధ స్థితినిబట్టి తన పవిత్రతనుబట్టి మొదటి ఆదాము ద్వారా పతనమైన మనలను - మన ఆది తండ్రి ఆదాము ద్వారా సంక్రమించిన అపరాధము పాపము రెండింటి వలన సంక్రమించి మరణవాతనబడి, ఆ విధముగా మరణవాతకు లోనైన మన శరీరాలను, దేవుని కృపయైన క్రీస్తు మనలను బ్రతికించినట్లుగ ఎఫెసీ :-2:1లో ఈలాగు చదువుదము. ''మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చినవారైయుండగా, ఆయన మిమ్మును క్రీస్తుతో కూడా బ్రతికించెను,'' అని వ్రాయబడియున్నది. ఇందునుబట్టి ఈ అపరాధ పాపముల వలన మరణమునకు పాత్రులైయున్నారని, ఈ దుర్గతి నుండి తప్పించుటకు యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చెనని మనము గ్రహించాలి.
ప్రియపాఠకులారా! ఇందులో గొప్ప పరమార్థము ఉంది. ఆదామునకు పుట్టుకతోనే భార్య లేదు. అలాగే యేసుక్రీస్తు లోకములో జన్మించగానే ఆయనకు వధువు సంఘమన్నది లేదు. ఆదాము ఏ విధముగా మొదటిగా దేవుని చేత రూపించబడినాడో అలాగే దేవుని కుమారుడు ఏ విధముగా నరుల సహకారము లేక ఈ లోకములో జీవించినట్లు ప్రభువే తనయొక్క ప్రవచనాలలో మత్తయి 8:20 నక్కలకు బొరియలు ఆకాశపక్షులకు నివాసాలు కలవుగాని మనుష్యకుమారునికి తల వాల్చుకొనుటకైనను స్థలము లేదని పల్కిన ప్రవచనము ఈ సందర్భములో మనకు ఋజువైయున్నది. అలాగే ఆదామునకు కూడా ఆశ్రమము లేదు. యేసుక్రీస్తు పుట్టినప్పుడు పశువుల తొట్టి స్థానమిచ్చిందిగాని, ఆదామునకు స్థానమిచ్చింది దైవ పరిశుద్ధ వనము! యేసుక్రీస్తుయొక్క నిత్య ప్రార్థన స్థలము. గెత్సెమనే ఒలీవల వనము - ఇది ఆయన ప్రార్థనా స్థలము. అలాగే మొదటి ఆది నరుడైన ఆదాము నిత్యప్రార్థనా స్థలము సువిశాల ఏదెను వనము. ఈ వనములో దైవత్వముతో కలసి సావాసము చేయుటన్నది ఆదాముయొక్క అదృష్టము, ఐశ్వర్యము, ఘనత. ఆలాగే ఒలీవల కొండలో తన విజ్ఞాపన తన ప్రార్థన ద్వారా రెండవ ఆదామైన క్రీస్తు తండ్రిని ప్రార్థించి, తండ్రితో మాట్లాడి, ఈ లోకములో జరిగించిన బలియాగము. ఈ లోకము నుండి వెళ్ళవలసిన చివరి దినము వరకు తండ్రితో కలిసి విజ్ఞాపన చేసిన ఈ ఒలీవల వనమన్నది లూకా 22:39 ఆయన తన వాడుక చొప్పున ఒలీవల కొండకు వెళ్ళగా శిష్యులును, ఆయన వెంట వెళ్ళిరి. ఆ చోటు చేరి ఆయన వారితో - మీరు శోధనలో ప్రవేశించకుండునట్లు ప్రార్థన చేయుడని చెప్పి, వారియొద్దనుండి రాతివేత దూరము వెళ్ళి ఆయన ప్రార్థన చేసినట్లు ఈ వేద భాగములో చదువగలము. ఆదినరుడైన ఆదాము దేవునితో ముఖాముఖిగ సంభాషించుచు ఏదెను వనములో జీవించాడో - అలాగే రెండవ ఆదామైన క్రీస్తు కూడా ఒలీవల వనములో తన తండ్రియైన దేవునితో నిత్యము జీవించినట్లు ఈ రెండు సంఘటనలు మనకు ఋజువుపరచుచున్నవి.
చిత్రమేమిటంటే సాటిసహాయముగా ఆదామునకు అనుగ్రహించిన స్త్రీ పాపములో పడింది. నూతన నిబంధనలో యేసుక్రీస్తుయొక్క రక్తము నుండి ఫలించిన నూతన నిబంధన స్త్రీ కూడా పాపములో పడి, దైవ మహిమకు దూరమైనట్లుగా భూలోక యెరూషలేముయొక్క చరిత్ర మనకు వివరిస్తున్నది. అందుకే దైవకుమారుడైన క్రీస్తు అంగలార్చుచు మత్తయి 23:37 యెరూషలేమా! యెరూషలేమా! ప్రవక్తలను చంపుచు నీ యొద్దకు పంపబడిన వారిని రాళ్ళతో కొట్టుచును ఉండుదానా, కోడి తన పిల్లలను రెక్కల క్రిందకు ఏలాగు చేర్చుకొనునో - ఆలాగే నేను నీ పిల్లలను ఎన్నోమారులు చేర్చుకోవాలని యుంటినిగాని మీరు ఒల్లకపోతిరి. ఇదిగో మీ ఇల్లు మీకు విడువబడియున్నది,'' అని వేదనతో పల్కిన మాటలను ఈ సందర్భములో జ్ఞాపకముంచుకోవాలి. భూలోక యెరూషలేము యేసు రక్తముతో అభిషేకము పొందిందిగాని దానియొక్క స్వభావము, దాని స్థితి మారలేదు. అది విగ్రహాలతోను, విలాసాలతోను, సుఖ భోగాలతోను, అలక్ష్యముతోను, సృష్టి సంబంధ ఆరాధనలతోను, ఆధిక్యతలతో క్రియ జరిగించిందేగాని, దైవకుమారుడైన యేసును క్రీస్తుగా మహిమపరచలేకపోయింది. అయితే ఈ పరలోక యెరూషలేము అన్నది దైవమహిమ క్రీస్తుయొక్క రక్షణ, పరిశుద్ధాత్మయొక్క నింపుదల మరియు పరిశుద్ధాత్మయొక్క మధ్యవర్తిత్వము ద్వారా దైవకుమారుడు గొర్రెపిల్లకును, ఆయన వధువైన పరిశుద్ధ సంఘానికి మధ్యవర్తిగా ఉండినట్లు వేదములో చదువగలము.
కనుక ప్రియపాఠకులారా! పరమ యెరూషలేమన్నది దేవుని మహిమగా పిలువబడుచున్నది. అలాగే ఆదినరుని ప్రక్కటెముక నుండి దేవుడు చేసిన ఎముక మాంసముతో స్త్రీగా రూపొందించబడింది. మరియు యేసు అధిష్టించిన సిలువలో బల్లెపు పోటు ద్వారా స్రవించిన రక్తములో వధువు సంఘము రూపించబడింది. ఇది ఎంత విచిత్రము. ఇవి రెండును దేవుని క్రియలే, ఎందుకనగా పురుషుని నుండి తీయబడిన ఎముక మాంసము స్త్రీ రూపము దాల్చింది. అలాగే రెండవ ఆదామైన యేసునుండి స్రవించిన రుధిర జలము పెండ్లి కుమారునికి వధువుగా కన్యగా అవతరించింది. అనగా రూపము వచ్చింది. ఇది ఆదాము జీవితములో రెండవ ఆదామైన యేసుయొక్క జీవితములో ఉన్న తారతమ్యము, ఇందులో ఒక మర్మమున్నది. ఆది నరుని రూపము భూగర్భము నుండి తీయబడిన మట్టితో దేవుని చేత రూపించబడింది. అలాగే కన్యకయైన స్త్రీ గర్భము నుండి వెలువడిన పురుష రూపము పరిశుద్ధమైనది, పవిత్రమైనది, నర సంబంధము కానిది, ఆత్మసంబంధమును దైవరూపము దాల్చినది, దైవత్వమును మహిమపరచేది, భూసంబంధమైన నరునియొక్క ఆత్మీయ బలహీనతను సరిచేసి వానిని లోకసంబంధముగా కాక దైవ సంబంధిగా మారే శక్తిని ప్రభావమును కలిగియున్నట్లు ఇందునుబట్టి మనకు తెలుస్తున్నది.
ప్రియపాఠకులారా! ఇప్పుడు తెలుసుకున్నారు గదా! పరిశుద్ధుడైన ఆదినరుడైన ఆదాము దేవుని కుమారుడు. కాని అతనికి తల్లి భూమి - భూగర్భము నుండి తీయబడిననాడు గనుక భూమియే నరుని తల్లి. ఇందునుబట్టి శరీర సంబంధముగా ప్రతి వ్యక్తియు ఎంత నాగరికతలో జీవించినను మనము ఈనాటికిని భూసంబంధులమే, నరసంబంధులమే, లోకసంబంధులమే, ఇది సృష్టికర్తయైన దైవకుమారుడు ప్రత్యక్షముగా దీనినిగూర్చి వేదములో నేను పై నున్నవాడను మీరు ఈ లోకసంబంధులు. మీరు మీ తండ్రియగు అపవాది సంబంధులు వాడు అబద్ధీకుడును, అబద్ధమునకు జనకుడునైయున్నాడు. ఈ మాటలు ప్రభువు ప్రవచించుటలో నరుడెంతగా ఆత్మీయముగా ఎంత గొప్పగా జీవించాలన్నను, అతని తల్లి భూమి అతనికి జన్మనిచ్చిన తండ్రి లోకములో ఉన్నాడు గనుక అతడు లోకసంబంధియే,'' యోహాను 8:41-47 శరీరముతో జీవిస్తున్నాడు గనుక అతడు శారీర సంబంధియే, శారీరయుతముగా లోకములో జీవిస్తున్నాడు. అనగా శరీరేచ్ఛలతో పాలిపంపులు గలవాడు ఇది భూగర్భము నుండి వెలికి తీసిన మనుష్యుని గుణగుణాల వివరము.
అయితే ఆత్మ సంబంధియు శరీర సంబంధముగాని, భూలోకముతో ఎలాంటి పొందికగాని లేనట్టిదియునైన రెండవ ఆదామైన దైవకుమారుడు తన జీవితములో చెప్పిన మాట,'' నేను లోకసంబంధి కాను, వాస్తవమే; ఆయన లోక సంబంధి కాడు. ఆయన లోకసంబంధియేయని పితరులు భావించారు. మత్తయి 13:55 ఇతడు వడ్లవాడైన యోసేపు కుమారుడు కాడా? ఇతని తల్లి పేరు మరియ కాదా? ఈయన బంధువర్గమంతయు మనతోనే ఉన్నారు గదా! ఈయన తాను దేవుడనని ఆత్మ సంబంధినని ఎలాగు ప్రకటిస్తున్నాడని ఆయన విషయమై అభ్యంతరపడుట - దేవుని కించపరచుట కాదా? ఆ విధముగా ఆయనను నిందించి ఆ నిందను కేవలము తమ వరకే గాకుండ లోకరీత్యా నరుల చేత ఆయనను నిందింపజేసి, అటుతర్వాత రాజులకు ప్రధాన యాజకులకు శాస్త్రులకు రాణువులు వగైరాలకు ఆయన మీద పిర్యాదులు జేసి, నిర్దోషియైన ఆయన మీద దైవద్రోహిగా అభియోగాన్ని ఆపాదించి ఆయనను దోషిగా జేసి, ఒక కిరాతకుని కంటే ఒక హంతకుని కంటే ద్రోహిగా కఠినమైన తీర్పు దీర్చి దోషిగా చేయుట - ఆత్మసంబంధులు చేయు పనియేనా? ఇది దైవసంబంధులు చేయదగిన పనియేనా? ఇట్టివారు దేవుని బిడ్డలేనా? పరిశుద్ధ జనాంగమని, దేవుని గృహమని, భూమిమీద దేవుడు ఏర్పరచుకొన్న ప్రత్యేక కూటమియని పాతనిబంధనలో వారిని ప్రేమించగా గర్వాంధులైన దైవజనాంగము తమకు దేవుడైన యెహోవా కుమారుడైన క్రీస్తు అనగా యెహోవా రూపాంతరమైన దైవ స్వరూపాన్ని పూర్తిగా అవమానపరచి, నిందారోపణలతో కూడిన అభియోగాన్ని మోపి హింసించిన విధానము దేవుని జనమైన ఇశ్రాయేలు చేయవలసిన పనియేనా?
కనుక భూలోక యెరూషలేముయొక్క పరిస్థితి ఆ విధముగా విషాదకరముగా మారింది. తమకు దేవుడుగా ఉన్న యెహోవాయొక్క ప్రతిరూపమైన యేసుక్రీస్తును ఆయనలో ఉన్న మహిమను, ఆయన ప్రేమను, ఆయన కృపను, ఆయన ప్రవచనాలను, ఆయన చేసిన అద్భుతాలను ఆయన లోని దైవత్వమును గ్రహించలేక మనోనేత్రాంధకారముతో ప్రవర్తించి, దైవకుమారునికి కఠోర శిక్ష విధించుటెంత విచారము కాదా? ప్రియపాఠకులారా! ఇది నూతన నిబంధనలో రెండవ ఆదామైన క్రీస్తుయొక్క చరిత్రలోని విషాదకర చరిత్ర. పోతే ఆదినరుడైన ఆదాము విషయములో అతడేమైనా దైవత్వమును గుర్తించ గల్గినాడా? ఈ సందర్భములో మనమొక విషయాన్ని దీర్ఘముగా ఆలోచించాలి. ఆనాడు లోకములో ఏ నరుడు ఏ నారి లేడు. ఒక్క నరుడు ఒక్క నారి దేవుని చేత సృష్టించబడినారు. వీరిని ఏ యొక్క శక్తి చేయలేదుగాని సృష్టికర్తయే రూపాన్ని ఇచ్చి ఆత్మ ప్రతిష్ట చేసి నీతి సమాధానము ప్రేమ నిరీక్షణ, విశ్వాసము వీటితో జీవించమని బోధించి, తాను ప్రత్యేకముగా వారి కొరకు సృష్టిలో ఏదెను అను వనమును వారికి స్వాస్థ్యముగా ఇచ్చి, ఆ వనమును సేద్యపరచుటకును కాచుటకును అందులో వారిని ఉంచాడు. ప్రియపాఠకులారా! ఈ తొలినరుని అలక్ష్య వైఖరి, లోక ఆకర్షణ భూఫలముయొక్క ఆధిక్యతలు ఇవన్నియును కూడా ఆదామును ఆత్మీయముగా ఎదుగనీయక క్రియ జరిగించాయి.
అలాగే నూతన నిబంధన క్రీస్తు విషయములో కూడా లోకము - ఆది సర్పమనే సాతాను ఇరువురు ఏకమై జరిగించిన దైవవ్యతిరేక క్రియను బట్టి అట్లే తొలి నరులైన ఆది నరజంట - వారు ఆత్మీయముగా పరిశుద్ధులు పవిత్రులు. అట్టి వారి దైవిక స్వభావములను పూర్తిగా వ్యర్థపరచి, లోకము తన వంతు ధర్మాన్ని అది సర్ప బోధ ద్వారా నెరవేర్చి తానేమియు నెరుగనన్నట్లు సృష్టికర్తయైన దేవుని యెదుట అది నిలబడింది. అయితే జగత్తును అందలి సమస్తమును సృష్టించిన దేవునికి కనుమరుగు కాలేదు. కనుమరుగయ్యే శక్తి దేనికి లేదు. ఏదెను వనములో జరిగిన న్యాయ తీర్పులో దేవుడు నరుని నిషేధ ఫలభక్షణను గూర్చి విమర్శింపగా ఆ కార్యమును తన సాటి సహాయమైన నారి మీద మోపాడు. ఆ విధముగా స్త్రీ పై నేరారోపణ జేసి, తాను ఉత్తముడనని దైవసన్నిధిలో కనబడాలన్నటువంటి నరుని హృదయ స్థితి కనబడింది. నరునియొక్క బలహీనతకు నరుని నుండి తీయబడిన స్త్రీ ప్రముఖ పాత్ర వహించి నందువల్ల ఆమె కూడా నరునిలో నుండి తీయబడింది, నరునిలో అర్థ శరీరి. కనుక ఒక్క మాటలో చెప్పాలంటే నారి కనుక నరునియొక్క వ్యతిరేకములో భాగస్వామియైనందువల్ల దేవుడు ఆమెను ప్రశ్నించినప్పుడు - ఆ నేరమును తనపై వేసికొనక తాను దోషినని ప్రకటించుకోక, తనకు బోధ చేసిన సర్పము మీద ఆ నేరమును మోపింది. ఇట్టి క్రియ ద్వారా ఆది నరదంపతులు, తాము దైవ తీర్పునుండి నిర్దోషులమని అనుకొని తప్పించుకొనుటకు ప్రయత్నించి ఉండవచ్చును. సృష్టికర్త అంతటితో ఊరుకోక నరనారులను ప్రశ్నించిన తీర్పులో భూసృష్టిలో సృష్టించబడిన పశుపక్ష్యాదులన్నిటిలో ఒక ప్రాముఖ్యమైన పాత్రను అనగా యుక్తిగల గుణమును దైవత్వము ద్వారా పొందిన ఆధిక్యతనుబట్టి సర్పము దైవ సమక్షములో మాట్లాడలేక మూగయై మౌనముతో ఉండుటకు కారణము - దానిని ఆవేశించి మాట్లాడించిన సాతాను దానిని వదలి తన మానాన తాను వదలిపోయి, దిక్కుతోచని స్థితిలో విడిచి వెళ్ళుటనుబట్టి ఆ సర్పము దేవుని ఎదుట మాట్లాడే శక్తిని, యుక్తిగల స్వభావమును, తనకున్న దేవుని చేత అనుగ్రహించబడిన అంగములను కోల్పోయింది. అంటే ఆదిలోని సర్పము నేడున్న సర్పము వలె కాక దేవుడు ప్రత్యేకమైన అవయవ నిర్మాణము కల్గించియున్నట్లు అనగా నాలుగు కాళ్ళు ఒక స్థలము నుండి మరొక స్థలానికి ఎగిరి వెళ్ళే రెక్కలు, ఆకర్షణీయమైనటువంటి దేహచ్ఛాయ - ఇది దేవునియొక్క వాక్కులో సర్పము పొందిన ప్రత్యేకతలు.
ఈ ప్రత్యేకతలనుబట్టి సర్పము అహంభావియై స్త్రీకి చేసిన బోధనుబట్టి దేవుడు సర్పాన్ని మారు మాట మాట్లాడనివ్వక, సర్పము మాట్లాడే మాటలను కూడా దేవుడే మాట్లాడినాడు. దేవుడైన యెహోవా సర్పముతో నీవు దీనిని చేసినందున,'' అని అంటున్నాడు. దేవుడు పురుషుని ప్రశ్నించాడు - ఆదామా! నీవు ఎక్కడ ఉన్నావు? నీవు దిగంబరివని నీకు తెలిపిన వాడెవడు? నేను తినవద్దని ఆజ్ఞాపించిన వృక్షఫలాలు తిన్నావా? ఈ మూడు ప్రశ్నల ద్వారా నరుని విచారించాడు. అలాగే స్త్రీతో - నీవు చేసినది ఏమిటి? అని అడుగుటలో నరనారులను దేవుడు ప్రశ్నించిన ప్రశ్నలలోని మాటలివి. అయితే సర్పమునకు దేవుడు ఏవిధమైన ప్రశ్నను వేయలేదు. స్త్రీ పురుషులు ఇచ్చిన వాగ్మూలమునుబట్టి సర్పముతో నీవు దీని చేసినందున పశువులన్నిటిలోను భూజంతువులన్నిటిలోను నీవు శపించబడినదానవై నీ కడుపుతో ప్రాకుచు నీవు బ్రతుకు దినములన్నియు మన్ను తిందువు,'' అనుటలో ప్రియపాఠకులారా! దేవుడు సర్పమును శపించిన శాపానికి ముందు సర్పజీవితము లోకములో వైభోగముతోను, ఉన్నత ఫలాలను ఆరగించే స్థితిలో ఉన్నట్లును అనగా ఏదెనులోని సర్పము నరునివలెనే ఫలాలను ఆరగిస్తూ - నరునివలె కేవలము శాకాహారిగాను, నరునికంటె మూడు రెట్లు అధికమైనటువంటి ఉన్నత విలువలను పొందియున్నట్లును, అందులో 1. సర్పానికి నాలుగు కాళ్ళు ఉండి, వీపున ఆకాశంలో విహరించుటకు కావలసిన రెక్కలును, వీటితోబాటు జంతువులలో వేటికిని లేనట్టి యుక్తిగల గుణము, నరునికి కూడా సాధ్యముగాని ఒక చెట్టు నుండి మరొక చెట్టుకు ఎగిరి స్వేచ్ఛగ ఆకర్షణీయముగా సంచరించే స్వభావము. ఇంకను ఆకర్షణీయమైన మధురమైన కంఠారావము. ఇవి సర్పమునకు ఆధిక్యతలు. ఈ ఆధిక్యతలతో అహంభావియై అపవాదికి స్థానమిచ్చిన సర్పమును విచారించునప్పుడు అది మౌనియై ఉండింది. అయితే దేవుడు సర్పమును క్షమించక ఘోరాతిఘోరమైన శిక్ష విధించాడు. ఆ శిక్షలోని ఫలితాలు - కాళ్ళు రెక్కలు పోగొట్టుకున్నది, నోటి మాట మాట్లాడే శక్తి పడిపోయింది - మూగగా జీవించింది. దైవత్వముతోను, మానవత్వముతోను దీర్ఘకాలిక విరోధము, దినదిన మరణగండము, క్షణక్షణము భయము భయము, మరియు లోకము కంట పడకుండ ఒంటరిగ పుట్టలో జీవించు దుర్గతి ఏర్పడుటన్నది సర్పానికి వచ్చిన లోకసంబంధ శిక్ష.
అయితే దైవసంబంధమైన శిక్షలు - ఎవరైతే దైవత్వమును అంగీకరించక, దైవనియమాన్ని పాటించక దైవ విరోధులుగా ఉంటారో వారిని సర్ప సంతానముగాను, దైవకుమారుడైన ప్రభువే మత్తయి 23:33 సర్పములారా! సర్పసంతానమా! నరక శిక్షను మీరేలాగు తప్పించుకొందురు? అనగా లోక సంబంధముగా దృశ్యమైన దైవ సృష్టములను పూజించేవారిని గూర్చి ప్రభువు పల్కిన మాట అనగా సర్పబోధ, సర్పాకర్షణ సర్ప కుయుక్తి, సర్ప విషతుల్య గుణగణాలు, సర్ప నామధేయాలతో సర్ప రూపాలను ఆరాధించేవారిని సర్ప సంతానముగాను, ఆది దేవుని ఆరాధించిన ఇశ్రాయేలు దైవసంతానముగాను, క్రైస్తవ విశ్వాసులు అనగా క్రీస్తు ప్రభువు సంతానముగాను, అలాగే ఆత్మసంబంధులు అనగా పరిశుద్ధాత్మను ధరించుకొని, పరిశుద్ధాత్మ వరాలను పొందినవారు. సర్పములని, సర్ప సంతానమని యేసుప్రభువు ప్రవచించుటలో నరుల బలహీనత ఎంత దిగజారియున్నదో మనకు తెలుస్తున్నది.
ప్రియపాఠకులారా! చిత్రమేమిటంటే నాటి దేవుని తీర్పులో సర్పము వికలాంగియై దైవశాపానికి గురియై నానావిధమైన భయానక జీవితములో జీవించినను, నాటి నరకోటిని మోసగించి నిషేధఫలమును భుజింపజేసి అది చేసిన బోధకు నేటి తరమైన మనము కూడా ఈ సర్పరూపమును దైవికమునకు మాదిరిగా దైవమునకు ముంగుర్తుగా దైవత్వములో ఒక భాగముగా ఆరాధిస్తున్నాము. సాతానును నెత్తికెక్కించుకొని సర్పము మాట్లాడిన మాటలలోని ఆకర్షణ మోసపూరితమైన స్వభావమెలాంటిదో క్షుణ్ణముగా మనకు తెలియగలదు. మరెక్కువ విచిత్రమేమిటంటే ప్రియపాఠకులారా! నేడు జ్ఞానులమని చెప్పుకొనుచు వేద విద్వాంసులమని, దైవ సంభూతులమని, దైవత్వమునకు అతి సన్నిహితులమని, దైవవరము ఉన్నవారిమని, ఈ విధముగా నానా విధమైనటువంటి నరులతో జీవిస్తున్న నేటి యుగములో ఆది తల్లి తండ్రికి సర్పము చేసిన బోధను - లోకము ఆచరిస్తున్న విధానములో లోకానికి సంభవించిన చేటు, శరీర సంబంధులైన వారికున్న నానా విధమైన కుయుక్తి, జ్ఞానము అవి అన్నియును సర్ప సంబంధమే.
ప్రియపాఠకులారా! ఒక శిష్యుడు విద్య నేర్పిన గురువును మరిచిపోడో - గురువు దగ్గర విద్య నేర్చుకున్న ఆయన గురుత్వాన్ని స్మరించుకొంటూ - ఆయన ద్వారా తాను నేర్చుకొన్నటువంటి విషయాలు ఆ గురువు తర్ఫీదులో తాను అలవరచుకొన్న అలవాట్లు ఆచారాలు వగైరాలను తలపోసుకొంటూ - తాను కొలిచే దేవుని కంటే విద్య నేర్పిన గురువుకే ప్రాధాన్యతనిస్తూ ఉదయాన్నే స్మరించుకొంటూ - ఏదైన పనిలో మొట్టమొదట తనకు విద్య నేర్పిన గురువును తలచుకొంటాడు. అలాగే ఈ యుగములో - పాత నిబంధన కాలములో నరకోటి ద్వారా పాపప్రవేశమునకు పునాది వేసిన సర్పరూపము నేడు యావద్ అవిశ్వాస అజ్ఞాన నరకోటికిని, యావద్ విగ్రహారాధన చేసే భక్తకోటికిని గురువైయున్నాడు. ఆ గురువును తాము కొలిచే దైవరూపమునకు పాన్పుగా కూడా చేసి నోటి మాటలతో గాక క్రియామూలముగా శేషపాన్పు అని నాగులచవితియని, సర్పయాగమని, తుదకు యుద్ధాలలో వాడే ఆయుధ సంపత్తిలో సర్ప అస్త్రమని, నాగాస్త్రమని ధరించే ఆభరణాలలో నాగమణియని నాగభూషణమని - నట్టింట ఉన్న దేవతా విగ్రహాల వద్ద సర్ప రూపాన్ని, ఊళ్ళో జరిగే తిరునాళ్ళలో దేవుళ్ళకు శేషపాన్పుగా ఊరేగిస్తూ బాణా సంచా, భాజా భజంత్రీలతో ఊరేగిస్తున్నారు.
ప్రియపాఠకులారా! విజ్ఞానము వెల్లివిరిసిన ఈ దినాలలో ఆది గురువైన ఆది సర్పము అనేకులకు నట్టింట పటాలు, పచ్చబొట్టు రూపములో ఒంటిమీద ముద్ర వేసి నరులను తన బిడ్డలుగ తన ముద్ర ద్వారా ప్రకటిస్తున్నట్లు నేడు సర్పారాధకులుయొక్క ఆరాధనలు, వారి సాంగ్యాలు, వారి క్రియలు, వారు జరిపే ఉత్సవాలు వారికి సర్ప రూపములో ఇచ్చిన బిరుదులు నాగేంద్రులు, నాగభైరవుడు, భుజంగుడు, సుబ్బరాయుడు, సుబ్రహ్మణ్యము, కాళీయుడు, ఆదిశేషుడు, వగైరా నామధేయాలతో ఒట్టి సర్ప రూపాన్నే గాక వాటిని దేవుళ్ళు అంటూ రాతితో కొయ్యతో మలచబడిన విగ్రహాలు - పల్లకిలో ఊరేగిస్తూ బాణాసంచాను మనము చూస్తున్న విషయమే. ఇందునుబట్టి చూడగా ప్రతి వ్యక్తికిని పాముతో చాలా సన్నిహిత సంబంధాలున్నట్లుగ తెలుస్తున్నది. అయితే పామును శిక్షించేవాళ్ళు లేకపోలేదు. పామును ఒకవైపు ఆరాధిస్తూ మరొక వైపు నీచాతినీచమైన స్థితిలో దానిపట్ల ప్రవర్తించుటన్నది కూడా ఇందునుబట్టి తెలిసికోవలసియున్నది.
ప్రియపాఠకులారా! నరుని అజ్ఞానములో ఉన్న మూడు విధములైన ఆశ్చర్యకరమైన నవ్వులాటతో కూడిన క్రియలు. మనుష్యుల చేత రూపించబడిన పాము రూపమునకు కొలువులు చేస్తూ దానిని ఆరాధిస్తూ - ఆ రూపానికి కాయా కర్పూర నైవేద్యాలను సమర్పించుట, ఆ తర్వాత ప్రత్యక్షముగా నివసించే పుట్ట దగ్గరకు వెళ్ళి, సర్పము బయటకు రాకుండ కట్టుదిట్టమైన ఏర్పాట్లతో ఆ పుట్టను ఆరాధించుట. నరునియొక్క అజ్ఞానమునకు నిజస్వరూపము ఏమిటంటే ఆ సర్పము ప్రత్యక్షముగా కనబడినప్పుడు దానిని కర్రతో కొట్టి చంపుదురు. ఇది నరునియొక్క అజ్ఞానమునకు పరాకాష్ట. ఇటువంటి మరణభీతితో చేదు అనుభవాలతో సర్ప జీవితముండగా నరుడు సర్పములోని ప్రమాదకరమైన గుణాలుండగా - దానిని దేవుడుగ దేవతగా ఆరాధించుటన్నది ఎంత అవివేకమో ఎంత నీచమో ఆలోచించాలి.
కనుక సర్పబోధకు చెవినిచ్చి సర్పముయొక్క బోధనను గురించి, సర్ప మార్గములో పయనించి, దైవత్వమునకు పూర్తిగా వ్యతిరేకులై దైవమార్గము నుండి తమయొక్క శారీర ఆత్మీయ జీవితాలను తొలగించుకొని లోకమార్గమును సర్పమార్గమును అవలంభించుకొని రోమా 3:13లో ఈలాగు వ్రాయబడి యున్నది. వారి గొంతుక తెరచిన సమాధి తమ నాలుకతో మోసము చేయుదురు, వారి పెదవులు క్రింద సర్పవిషమున్నది. వారి నోట నిండ శపించుటయు పగయు ఉన్నవి; అన్న ప్రవచనాన్నిబట్టి ఆది నరుని జీవితములో దైవత్వముతో ఏకీభవించి, దైవసన్నిధిలో దేవునికి ఇష్టునిగాను, దైవాత్మకు విధేయునిగాను నడిచిన ఆది నరజంట సర్ప బోధ విని, దైవనిషేధ ఫలమును తిని దైవమార్గము నుండి తొలగిపోయిన తర్వాత, నరులయొక్క నాలుకలోగాని, పెదవులలలోగాని, సర్ప సంబంధమైన గుణాలు, సర్పసంబంధమైన వాక్కు; దైవత్వమునకు అయోగ్యకరమైన వ్యతిరేకమైన, దైవోగ్రత పుట్టించునదియు, నరకాగ్నిలోకి నడిపించు స్థితికి నరజ్ఞానము దిగజారుటన్నది ఇందులో మనకు తెలుస్తున్న మర్మము.
కనుక ప్రియపాఠకులారా! యేసుక్రీస్తునకు బాప్తిస్మమిచ్చిన యోహాను నొద్దకు వచ్చిన శాస్త్రులు పరిసయ్యులు సద్దూకయ్యులనబడిన నారిలో లోకస్థులు - వారియొక్క పూర్వీక స్థితి సర్ప స్వభావముతోను సర్పగుణాల తోను ఉంటూ యోహాను చేత కపటోపాయముతో దైవరాజ్య ప్రవేశము పొందుటకు, వేషధారణతో ఉన్నవారిని గూర్చి పల్కిన మాట - సర్పసంతానమా! రాబోవు ఉగ్రతను తప్పించుకొనుటకు మీకు బుద్ధి చెప్పినవాడెవడు? అన్న మాటను ఈ సందర్భములో మనము గ్రహించాలి మత్తయి 3:7.
కనుక ప్రియపాఠకులారా! సర్పమును ఆవరించిన సాతాను వదలి పోయినను, సర్పమును ఆవరించి సాతాను సర్పము చేత మాట్లాడించిన మాటలు నేటికిని జనబాహుళ్యములో శిలాక్షరాలుగా నిలిచి క్రియ జరిగిస్తున్నవి. అందుకే రోమా 3:11 నీతిమంతుడు లేడు ఒక్కడును లేడు, గ్రహించువాడెవడును లేడు. దేవుని వెదకు వాడెవడును లేడు. అందరును త్రోవ దప్పి ఏకముగా పనికి మాలిన వారైరి'', అని పౌలు ప్రవచించినట్లును - ఈ విధముగా సర్పానికి పోల్చి ప్రవచించిన సంఘటనలు అనేకములున్నవి. ఆదికాండము మూడవ అధ్యాయము నుండి పరిశుద్ధ గ్రంథములోని చివరి వేదభాగమైన ప్రకటన గ్రంథము వరకును సర్పమును గూర్చి పూర్తి వివరాలు వ్రాయబడియున్నవి. నరులను సర్పమునకు పోల్చి కొన్ని సందర్భాలు సర్పమునకు పోల్చి కొన్ని వస్తు విశేషాలు. ఆ పోలికలో ఆ విధముగా పోల్చబడిన సందర్భాలలో మొట్టమొదట ఇశ్రాయేలు దైవోగ్రత పాలై తాపకర సర్ప విషము ద్వారా అనేకులు మరణవాత పడి చనిపోయిరి. కాబట్టి ప్రజలు సంతాపపడి మోషే వద్దకు రాగా మోషే ప్రజల కొరకు ప్రార్థన చేయగా యెహోవా - తాపకరమైన సర్పమువంటి ప్రతిమను ఇత్తడితో చేయించి ఎత్తయిన స్థలములో ఉంచమన్నది కూడా ఈ సందర్భములో మనము సంఖ్యా 21:7లో తెలుసుకోవచ్చును. అలాగే సామెత గ్రంథములో మద్యపానమును గూర్చి గ్రంథకర్త వర్ణిస్తూ ద్రాక్షారస మద్యమును నాగుపాములతోను, కట్లపాములతోను, మిడినాగని, నానావిధ వర్ణనలతో పోల్చి ద్రాక్షారస మద్యమనే త్రాగుడు వ్యసనమును సర్పముతో సమానముగా అభివర్ణించి యున్నాడు. అలాగే జారస్త్రీని గూర్చి వర్ణిస్తూ ఆమెయొక్క మాటలు, ఆమె ప్రవర్తన, దానియొక్క నిత్య జీవితములో సర్పమునకు ప్రతి రూపమని మరొక చోట వర్ణించియున్నాడు. ఈ విధముగా పరిశుద్ధ గ్రంథములో దైవత్వమును విడిచిన నరుల స్వభావములను గూర్చి సర్పముతో పోల్చి వ్రాసిన అనేక సందర్భాలున్నవి.
కనుక ప్రియపాఠకులారా! ఇంత గొప్ప మర్మము సర్పమును బట్టి నర జీవితములో ఉన్నటువంటి విషాదమును బయల్పరచుచుండగా వేదముప్రకటించుచుండగా నేటి నరకోటి వీటిని పెడచెవిని బెట్టి, ఈ ప్రవచన మర్మాలను ఖాతరు చేయక మాయ లోకమైన ఈ లోకములో మాయ సర్పపు వైఖరిలో నరుల వంచన, క్రోధాదిగుణములు ఈర్ష్య పగ ఒకటేమిటి? సకల దుర్గుణాలకు ఆలవాలమైన సర్పనామమన్నది అనేకులలో క్రియ జరిగిస్తూ - దైవత్వమునకు విధేయించక విశ్వాసులు సహితము ఈ సర్ప సంబంధుల పాలనలో నలిగిన చరిత్రలు కూడా మనమెరిగి యున్నాము.
ప్రియపాఠకులారా! పాతనిబంధన కాలములో ప్రవక్తలను దైవజనులను నీతి మార్గమున నడిపించే దేవుని బిడ్డలను నానా విధమైన శోధనలకును, బాధలకును, వేదనలకును, ఘోరాతిఘోర శిక్షలకును, అన్యాయపు తీర్పులకును గురిజేసి, వారి జీవితాలతో ఆటలాడుకొన్నటువంటి నాటి క్రూర జనాంగము సర్పసంబంధులును, సర్పసంతానమేః కనుక ప్రియపాఠకులారా! సర్పబోధ ద్వారా నరజంట మాత్రమేగాక యావద్ లోకము కలుషితమై సర్పము నరులతో చేసిన బోధ యావద్ సృష్టిని వ్యాపించి, సృష్టిలోని జడ పదార్థముచే సర్పముయొక్క రూపమును పుట్టించే హీనస్థితికి భూలోకము దిగజారింది. అయితే సర్పము యొక్క దోషము ఎంత ప్రమాదకరమైనదో ఎంత ప్రభావితమైనదో మనము ఊహించలేము. అందుకే యేసుప్రభువు మత్తయి 3:14లో అరణ్యములో మోషే సర్పమును ఏలాగు ఎత్తెనో విశ్వసించు ప్రతివాడును నశింపక నిత్యజీవము పొందునట్లు ఆయన తనను గూర్చి సర్పానికి పోల్చుకున్నాడు.
6. దైవకుమారుడు బలియాగము చేయు సందర్భములో శుక్రవారమునే ఎంచుకొనుటలోని దైవసంకల్పమేమి?
శుక్రవారమునాడు దేవుడు రూపించిన ఆది నరజంటను చెడుపుటనుబట్టి, ఆ విధముగా సర్పపు మాటలు విని అభాసుపాలైన నరజంటకు భవిష్యత్తులో రక్షణార్థమైన తన కాపుదల అనుగ్రహము ఆది నరజంటకు దేవుడు తొడిగించిన చర్మపు దుస్తులను బట్టి అనుగ్రహించబడాలని ఈ మూడు విధములైన దేవునియొక్క ప్రధాన ఉద్ధేశ్యములను నెరవేర్చబడుటకు, ఈ శుభ శుక్రవారము అనగా గుడ్‌ఫ్రైడే రోజున దైవకుమారత్వముతో దేవుడు జరిపించిన శారీర సమర్పణ క్రియతో కూడిన సజీవయాగముగా - శారీర రక్తములతో అర్పించబడిన ఆ బలియాగములో దైవరహస్యమున్నది.
కనుక ప్రియపాఠకులారా! శుక్రవారమునాడు యేసుప్రభువును కిరాతకులు జరిగించిన ఈ అమానుష క్రియను యావద్ నరలోకము గ్రహించనందుకు, నరుల హృదయ రహస్యాలను ఎరిగిన దైవ కుమారుడైన యేసుక్రీస్తు తాను సిలువ మీద మాట్లాడిన మొట్టమొదటి మాట లూకా 23:34 తండ్రీ! వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించుము,'' అనుటలో పై విధముగా ఇంత గొప్ప మర్మము ఇందులో ఇమిడియున్నదని పాఠకులు గ్రహించాలి. ప్రభువు పల్కిన మొట్టమొదటి మాటలో ఆయనను సిలువకు అప్పగించిన కిరాతకులు ఏమియు ఎరుగరు. పై వివరించిన పరమార్థము దైవచిత్తానుసారము దైవసంబంధముగా అందులో గుప్తమైయున్న మర్మము అందులోని పరమార్థము దైవచిత్తము కిరాతకులైన ఆ జనాంగము వాస్తవమును వారెరుగరు. ఎరిగియున్నది - సిలువమీది ప్రభువే. మోషే ఎత్తిన ఇత్తడి సర్పము వలె తానెత్తబడుటలో యేసుప్రభువు తన ఇహలోక జీవితములో తనను ఆవరించిన జనాంగముతో పల్కిన మాటలను బాహ్యముగా మనము చదువగలము. ఆ విధముగా ఎత్తబడవలసిన దైవత్వము నరకోటి పాపపరిహారార్థము - ఆ పాపమునకు మూలమైన సర్పముయొక్క పరిపాలన దానియొక్క ప్రభావము బయలు పరచబడాలన్నదే ప్రభువు జరిగించిన బలియాగములోని దైవోద్దేశ్యము. ఆ విధముగా ప్రభువు ఎత్తబడాలన్నదే ఆనాటి జనాంగము ఎరుగరు. ఎరిగియుంటే సిలువ వేసేవారు కారు. ఆయనకు ఆ శిక్షన్నది సంభవించదు.
ఆలాగే ఆదిలో శుక్రవారమునాడు తండ్రియైన దేవుడు చేసిన నరనిర్మాణ క్రియలో - ఆ శుక్రవారముయొక్క పవిత్రతను నరుడు అపవిత్ర పరచెనన్న సంగతి కూడా దైవజనాంగమునకు గాని సిలువ క్రింది జనాభాకు గాని తెలియదు. అందువలన కూడా తండ్రికి విజ్ఞాపన చేశాడు. లూకా 23:34 తండ్రీ! వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించుము. వారి హృదయ స్థితి వారెరుగరు. తండ్రి చిత్తమేమిటో వారెరుగరు. దేవుడు శుక్రవారము నాడు నరనిర్మాణము చేశాడు. ఆ శుక్రవార ప్రతిష్టతను అప్రతిష్ట పాలు చేశారన్న సత్యము కూడా వారెరుగరు. ఆదిలో దేవుడు తన హస్తముతో నరుని రూపించి వానిలో జీవవాయువును ఊది జీవాత్మను ఉంచి ప్రతిష్టించిన ప్రాముఖ్యమైన దినము ఇదేనని వారెరుగరు. ఎరిగియుంటే ఈ శుక్రవారములో వీరు చేసిన మహత్తర క్రియను ఆత్మీయముతో గ్రహించి ఈ దినాన్ని, కిరాతక దినముగా కాక పవిత్ర దినముగా ఆరాధించియుండేవారు. కనుక వారిని క్షమించుము. ఈ మర్మాన్ని గ్రహించినవారు లేనందున, ఆ విధముగా క్రూరముగా ప్రవర్తించిన వారి పట్ల ప్రభువు సిలువ మీద మాట్లాడిన ఏడు మాటలలోని మొట్టమొదటి మాటలోని దైవిక మర్మాలు గుప్తమై యున్నట్లుగ మనము గ్రహించవలసియున్నది.
కనుక ప్రియపాఠకులారా! ఇందునుబట్టి దేవుడు నరుని ఆరవదినమైన శుక్రవారం నాడు చేసినట్లు దైవవాక్యము మనకు వివరిస్తున్నది. కనుక ఇట్టి దైవిక మర్మముతో కూడిన దైవకుమారుని శ్రమల పూరితమైన దినము. ఈ విధముగా శుక్రవారము బలియాగము చేసిన శరీరముతో దైవకుమారుడు శుక్రవారము గడిచిపోగా శనివారము ఉదయము సమాధి నుండి లేచి పునరుత్థానము కావచ్చుగదా! అన్ని దినాలు ఆయనవియే గదా! శనివారము తానెందుకు పునరుత్థానము కాలేదు? అన్న విషయాన్ని ఇప్పుడు మనము వేదరీత్యా తెలిసికొందము.
ప్రియపాఠకులారా! ఇందునుగూర్చిన మర్మాన్ని దైవత్వము ప్రత్యక్షముగా ఇందుకు జవాబు ఆది 2:1-3 వ్రాయబడిన వేదభాగములో వివరించబడియున్నది. అదేమనగా ''ఆకాశమును భూమియు వాటిలో ఉన్న సమస్తమును సంపూర్తి చేయబడెను. దేవుడు తాను చేసిన తన పని ఏడవ దినము లోగా సంపూర్తి చేసి, తాను చేసిన తన పని అంతటినుండి ఏడవ దినమున విశ్రమించెను,'' అని వ్రాయబడిన ప్రకారము ప్రియపాఠకులారా! దేవుడు భూమ్యాకాశములు సృష్టించిన తొలిదినము మొట్టమొదట చీకటిని వేరుపరచునట్లు వెలుగును ప్రసరింపజేసినట్లు చదువగలము. దీనిని ఆదివారము - వారములలో మొదటి దినము అన్నప్పుడు ఆది - ఆదివారము. ఇందునుబట్టి ఆదిని గూర్చి లోగడ కొన్ని వివరాలు తెలిసికొందము. వేదములో ఆదికాండము ఆది సృష్టి ఆదినరుడు ఆదికాలము ఆది దినము ఆది నెల ఆది సంవత్సరము మొట్టమొదటి దినము ఇవన్నియు ఆదికి సంబంధించినవి. ఆదిలో ఆది దినము నుండి అనగా మొట్టమొదటి దినము నుండి, ఆదివారము నుండి శుక్రవారము వరకు ఈ ఆరు దినాలు సృష్టికర్తయే - వాక్కును శబ్దము జీవమునైయున్న దేవుడు తన వాక్శబ్దము చేత ఐదు దినాలు సృష్టిలోని ప్రతి దానిని సృష్టించాడు. కాని ఆరవ దినమున ఈయన చేసిన కార్యము ప్రత్యేకతను సంతరించుకున్నది. అదేమనగా దేవుడు తన హస్తముతో మట్టితో నరరూపమును చేసి, అందులో తన జీవాత్మను ప్రతిష్టించాడు - ఇది ఆరవ దినక్రియ. దీనితో దైవనిర్మాణ కార్యము సృష్టి నిర్మాణ కార్య క్రియ - యావత్తును సంపూర్తి చేసినట్లు తెలిసికొన్నాము. దేవుడు తాను చేసిన తనపని ఏడవ దినములోగా సంపూర్తి చేసి, తాను చేసిన తన పని అంతటి నుండి ఏడవ దినమున విశ్రమించినాడు. అనగా ఎలాంటి సృష్టి నిర్మాణ క్రియ లేక తన ఆత్మలో విశ్రాంతిని పొందినాడు.
ఆది 2:2లో దేవుడు తాను చేసిన తన పని ఏడవ దినము లోగా సంపూర్తి చేసి, తాను చేసిన తన పని అంతటి నుండి ఏడవ దినమున విశ్రమించెను,'' అని వ్రాయబడిన ప్రకారము - దేవుడు తాను చేసిన పని ఏమిటి? అంటే నిరాకారమును శూన్యమును చీకటి అగాధ జలములతో కప్పబడి అట్టడగున ఉన్న సృష్టిని పైకి లేవనెత్తి, దానిని తన వెలుగు ద్వారా విభజించి ఆ వెలుగునుబట్టి పై జలములను విశాలము క్రింది జలములను విభాగించి, పై నున్న జలములకు ఆకాశమనియు క్రింది జలములకు సముద్రమనియు - జలనిధి నుండి పైకి తీసిన భూమిని ఆరిన నేలగా జేసి భూమికి జీవమునిచ్చి, ఈ జీవము ద్వారా భూమికి స్వయంభవత్వమును అనుగ్రహించి సకల సృష్టములు సకల ఫలవృక్షములు పూల చెట్లు పచ్చిక బైళ్ళు, నానావిధమైన మృగపక్షి జంతుజాలమును నరులను తటాకములను ఒకటేమిటి? సమస్తమైన అలంకారాలతో దేవుడు సృష్టిని అలంకరించాడు. దేవుడు తన వాక్కుతో భూమికి శక్తిని సారమును జీవమును ఇచ్చి సమస్తమును భూమి పుట్టించగల స్థితికి భూమికి తన జీవాన్ని అనుగ్రహించినట్లును, ఈ విధముగా ఐదవదినమున సృష్టి నిర్మాణక్రియ ఆరవదినాన నరనిర్మాణక్రియ పూర్తి చేసిన దేవుడు ఏడవదినమును ఆశ్రయించి దానియందు విశ్రమించాడు. అంతేగాకుండ ఆ ఏడవ దినమును ప్రత్యేకముగా ఆశీర్వదించి పరిశుద్ధపరచినట్లు వేదములో వ్రాయబడియున్నది. ఇందునుబట్టి చూడగా ఏడు దినములలో దైవత్వము తన కొరకు ప్రత్యేకించుకొన్న దినాలు మూడు ఉన్నవి. ఈ మూడింటిలో నేలనుండి తన హస్తముతో రూపించి తన ఆత్మను ప్రతిష్టించుటన్నది పరిశుద్ధ దినము ఆది 1:26-27 ఆయన అనుకున్న రూపమును దేవునియొక్క స్వరూపముతో ప్రత్యక్షముగా రూపించబడినదియే ఈ ఆరవదినమైన శుక్రవారము. ఇందునుబట్టి దేవుడు తాననుకున్నట్లు చేయగలడుగాని నరుడు తాననుకున్నది చేయలేడు. చేసినను దైవచిత్తమునకు యోగ్యకరము కాదు. ఇది శుక్రవారము దేవుడు జరిగించిన పరిశుద్ధ క్రియ.
ఈ పరిశుద్ధ దేవుని హస్తక్రియ పరమాత్మ స్వరూపమును, ఆయన ఆత్మను ధరించుకొన్న నరుడు శుక్రవారము నరునిపట్ల దేవుడు జరిగించిన ఆయొక్క ధర్మాన్ని వమ్ము చేసి, దైవచిత్తమునకు విరుద్ధముగా దైవనిషేధ ఫలభక్షణ జరిగించి దోషి కాగా - వారు చేసిన దోషాపరాధమునకు దేవుడు సంతాపపడి వారి ఆత్మీయ బలహీనతకు చింతించి, తన స్వాస్థ్యము నుండి వెళ్ళగొట్టు సందర్భములో నరులపై తనకున్న ప్రేమను పోగొట్టుకోక, ఆ తోటనుండి వెళ్ళగొట్టిన ఆ దినముననే నరులకు చర్మపు దుస్తులను తొడిగించినట్లు వేదములో చదువగలము. ఇందుకు ఋజువు ఆధారము - శుక్రవారము నాడేనని బయల్పరచి, ఆ శుక్రవారము నాడే దైవకుమారుడు శరీర బలియాగము జరిగించిన శుక్రవారము - ఆది నరజంటకు దేవుడు తొడిగించిన చర్మపు దుస్తులలోని రహస్యము దైవకుమారుడు పొందిన మరణశిక్షను అనుభవించిన రోజు లోకానికి వెల్లడిపరచాడు. ఈ సత్యాన్ని లోకము గ్రహించలేకున్నది. అంటే నరజంట దోషులైనందున చర్మపు దుస్తులనుబట్టియు - ఈ శుక్రవారము నాడు నిర్దోష మరణశిక్షను అనుభవించినందుకు ముంగుర్తయియున్నది. ఆయన పొందిన దోషాపరాధము ద్వారా ఆయన చిందించిన రక్తము వేదననుబట్టి శిక్షించబడిన దైవకుమారుడు యావద్ పాపనరకోటికి దైవత్వము ద్వారా అనుగ్రహించిన రక్షణయై యున్నది. ఆనాడు ఏ చర్మపు దుస్తులతో రక్షణ కల్గించాడో ఆ చర్మపు దుస్తులయొక్క మర్మము దేవుని గొర్రెపిల్లయైన క్రీస్తుయొక్క శారీరయుతమైన సిలువ శిక్ష పాపపరిహారార్థ బలికి సాదృశ్యము, ఆనాడు దేవుడు ఆది నరజంటకు ఏ గొర్రెపిల్ల చర్మపు దుస్తులతో వారికి తొడిగించెనో - ఆ గొర్రెపిల్లయొక్క నామధేయము గొర్రెపిల్ల రూపము బలియాగము అను పేరుతో - దేవుని గొర్రెపిల్లయైన క్రీస్తు తన బలియాగము ద్వారా జన్మపాపము కర్మపాపమునకు రక్షణ వస్త్రము అనుగ్రహించినట్లుగ ఈ శుభ శుక్రవారముయొక్క పూర్వీక చరిత్ర ఋజువుపరచుచున్నది.
ప్రియపాఠకులారా! యేసుప్రభువు గొర్రెపిల్లగాను, గొర్రెపిల్ల రాజుగాను వధకు తేబడిన గొర్రెపిల్లగాను, బొచ్చు కత్తిరించువాని ఎదుట విధేయించిన గొర్రెపిల్లగాను మరియు ప్రకటన గ్రంథములో వివరించబడిన వేదభాగాలలో యేసుక్రీస్తును గొర్రెపిల్లగా ఆయనకు బిరుదునిచ్చి ప్రవచిస్తూ వ్రాయబడిన లేఖన భాగాలలోని మర్మము - ఆనాడు తండ్రియైన దేవుడు నరజంటకు తొడిగించిన చర్మపు దుస్తుల నిగూఢ మర్మమైయున్నది.
ప్రియపాఠకులారా! శుక్రవారము రోజు దేవుడు జరిగించిన క్రియాకర్మల పూర్వార్ధము తెలిసికొన్నాము. అయితే సిలువ మరణము ద్వారా సమాధిలో ఉంచబడిన క్రీస్తుయొక్క శరీరము శనివారము ఉదయము లేవవచ్చును పునరుత్థానము కావచ్చును గదా! ఎందుకు శనివారము పునరుత్థానము కాలేకపోయాడు? అన్న ప్రశ్న కలుగవచ్చును. ఈ ప్రశ్న లోకములోని క్రైస్తవ లోకములో ఎంతమందిలో తలెత్తిందోగాని ఈ గ్రంథకర్తనైన నాలో క్రియ జరిగించింది. అందుకు ఆత్మ దేవుడు అందించిన వివరమునుబట్టి వ్రాయుట ఏమనగా - యేసుక్రీస్తు శనివారము నాడే పునరుత్థానుడైతే ఆయన దైవకుమారుడు కాడు. ఈయన పరిశుద్ధాత్మ ద్వారా పుట్టినవాడు కాదు, ఆయన దైవ సంబంధి కాడు, ఆయన లోకసంబంధముగా ఎంచబడేవాడు.
అయితే శనివారమునాడే ఎందుకు పునరుత్థానము కాలేదు? ఇందుకు జవాబు వేదజ్ఞానముగా వేదసంబంధముగా వేదములోనే ఉంది. అదేమనగా సృష్టి యావత్తు సృష్టి నిర్మాణక్రియ దినాల వారిగా ఒకటవ దినము నుండి ఐదవ దినము వరకు అంటే గురువారము వరకు దేవుడు జరిగించిన క్రియ ఆది 1:లో చదువగలము. మొదటి దినము వారములలో ఆదివారము - తండ్రియైన దేవుడు చేసిన క్రియయేమంటే అంధకార చీకటిని అగాధ జలాలను వేరుపరచుటకు తన వెలుగును ప్రసరింపజేశాడు. ఇది ఆదివారము నాడు దైవత్వము జరిగించిన ప్రథమ క్రియ. ఆది 1:3 దేవుడు వెలుగు కమ్మని పలుకగా వెలుగు కలిగెను. వెలుగు మంచిదైనట్లు దేవుడు చూచెను. దేవుడు వెలుగును చీకటిని వేరుపరచెను. వెలుగునకు పగలనియు, చీకటికి రాత్రియనియు పేరుపెట్టెను. అస్తమయమును ఉదయమును కలుగగా ఒక దినమాయెను. అనగా ప్రారంభ దినము. లేక మొదటివారము ఈ మొదటి వారమే ఆదివారము. ఆదివారము నాడే ఆది 1:5లో దేవుడు జరిగించిన క్రియలో బయలుపరచబడియున్నది. అనగా తన వాక్కు ద్వారా తన వెలుగు ద్వారా వెలుగును చీకటిని వేరుపరచినట్లు చదువగలము.
ఇక రెండవ దినము అనగా సోమవారము - నేడు మనము పిలుచుకొనే సోమవారము. ఈ దినమున దేవుడు ఆది 1:6-8 చదివితే జలముల మధ్య ఒక విశాలము కలిగి జల విభజన జరిగినట్లును, ఆ విధముగా జలవిభజన జరిగినప్పుడు - విశాలము క్రింది జలములను విశాలము మీది జలములను వేరుపరచినట్లుగాను, ఆ విధముగా వేరుపరచబడిన పై జలములకు ఆకాశమని పేరు పెట్టినాడు. ఇది రెండవ దినమున జరిగిన క్రియయొక్క వివరము బయలుపరచబడుచున్నది.
ఇక మూడవ దినము - ఇది మంగళవారము ఆది 1:9లో దేవుడు ఆకాశము క్రిందనున్న జలములొక చోటనే రాశిగా ఏర్పరచి ఆరిన నేలను సృష్టించినట్లును, ఆరిన నేలకు భూమి అని పేరు పెట్టెను. జలరాశికి సముద్రములని పేరు పెట్టెను, అది మంచిదని దేవుడు చూచినట్లును, అంతటితోనే గాక భూమిని ఆరిన నేలగానే ఉంచక దానికి తన జీవమును ఇచ్చి దాని చేత జరిగించిన క్రియ - గడ్డి విత్తనములిచ్చు చెట్లను భూమి మీద తమ తమ జాతి ప్రకారము తమలో విత్తనములు గల ఫలమిచ్చు ఫలవృక్షములను, భూమి మొలిపించును గాకని పలుకగా ఆ ప్రకారమాయెను. భూమి మొలిపించిన సమస్తమును అది మంచిదని దేవుడు చూచెను. ఈ క్రియ మూడవ దినమున జరిగినట్లు వేదములో వ్రాయబడియున్నది.
ఇక 1:14-19లో వ్రాయబడిన వేదభాగములో దేవుడు నాలుగవ దినమున జరిగించిన క్రియ చాలా ఉన్నతమైనది. నరునియొక్క జ్ఞానమునకు అంతుచిక్కనిది, నరుని ఊహకు అందనట్టిదై, ఎవరును ఏ శక్తి చేయలేనట్టి క్రియను ఈ నాలుగవ దినమున చేయుటన్నది చదువరులైన మనకు ఆశ్చర్యము కలుగవచ్చును. ఇందులో దేవుడు చేసింది చాలా గొప్ప క్రియ. ఆకాశ విశాలములో జ్యోతులను ఏర్పరచుట అనగా కాలములను సంవత్సరాలను సూచించుటకై సూచనలుగా ఉండుటకును భూమి మీద వెలుగిచ్చుటకును ఆకాశములో జ్యోతులను - పగటి నేలుటకు పెద్ద జ్యోతిని రాత్రి నేలుటకు చిన్న జ్యోతిని నక్షత్రాలను, పగటిని రాత్రిని ఏలుటకు ఆకాశ విశాలములో వాటిని ఉంచెను. అది మంచిదైనట్లు నాలుగవ దినమున దైవసృష్టి నిర్మాణ క్రియలోని వివరమైయున్నది.
ఇక ఐదవ దినమున దేవుడు చేసిన క్రియ ద్వారా ఆయన ప్రణాళిక జలములను గూర్చి ఉద్దేశించినట్లుగ మనకు తెలియగలదు. జీవము గలిగి చలించువాటిని జలములు సమృద్ధిగా పుట్టించును గాక; అనుటలో జలాలకు స్వయంభవత్వాన్ని దేవుడు ఇచ్చియున్నాడు. మొట్టమొదటగ భూమికి ఆ తర్వాత ఆకాశానికి ఆ తర్వాత జలాలకు స్వయంభవత్వము అనుగ్రహించాడు. పక్షులు భూమి పైన ఆకాశ విశాలములో ఎగురును గాక! అని అనుటలో భూమ్యాకాశాలకు కూడా స్వయంభవత్వాన్ని అనుగ్రహించినట్లుగా వ్రాయబడియున్నది - ఇది ఐదవ దినమున జరిగిన క్రియ.
ఇక ఆరవది - దేవుడు ఆలోచించి చేయదలచుకొన్న ప్రణాళిక ఆది 1: 26-27 దేవుడు-మన స్వరూపమందు మన పోలికె చొప్పున నరులను చేయుదము. దేవుడు తన స్వరూపమందు నరుని సృజించెను స్త్రీనిగాను పురుషునిగాను వారిని సృజించి ఆశీర్వదించిన విధానము ఇవన్నియు ఆరవ దినమున జరిగిన క్రియ.
కనుక ప్రియపాఠకులారా! ఆరవ దినమున దేవుడు నర నిర్మాణ క్రియను సంపూర్ణముగా జరిగించినట్లును ఈ ఆరవ దినమే శుక్రవారము. ఈ ఆరు దినాలలో ఈ అనంత విశ్వమును శ్రమించి సంపూర్ణముగా రూపించిన దేవునికి ఏడవ దినమన్నది విశ్రాంతి దినముగా తాను విశ్రమించి దానిని ఆశీర్వదించి పరిశుద్ధపరచినట్లును, తాను చేసిన పని అంతటి నుండి తాను విశ్రాంతిని పొందినట్లు అదే విధముగా ప్రియపాఠకులారా! యేసుక్రీస్తు దైవకుమారుడైనప్పుడు తండ్రివలెనే తండ్రి నియమాన్ని తండ్రి చిత్తాన్ని ఆయన పనిని, ఆయన చేసిన పనిలోని ఒడిదుడుకులలో కూడా జోక్యము చేసుకొని కుమారుడు చక్కదిద్దాలి. ఈ అనంత విశ్వమును చేసి విశ్రమించాడు. అందులో కల్గిన దోషమును అపవిత్రతను కళంకమును, దైవశాపమును దాని మూలమున సంక్రమించిన దైవోగ్రత పాపికి శిక్ష వీటన్నిటినుంచి విడుదల కల్గించి, పరలోక భాగ్యముననుగ్రహించుటకు దైవకుమారుడు నియమించబడినాడు. తండ్రి ప్రతిష్ట చేసి ఈ లోకానికి పంపిన కుమారుడైన క్రీస్తు కూడా తాను తండ్రి ఏ విధముగా ఆరు దినాలు సృష్టి నిర్మాణము గావించి ఏడవ దినాన విశ్రమించాడో అలాగే తండ్రిని అనుసరించిన కుమారడు కూడా ఆది సృష్టి కలుషితము కాగా ఆ అపవిత్రత నుండి సృష్టికి కల్గిన దైవశిక్షను తప్పించుటకు కుమారుడు కూడా సిలువ మీద ఆరు మాటలు మాట్లాడి ఏడవ మాట ద్వారా విశ్రమించాడు.
చిత్రమేమిటంటే ఆదిలో సృష్టికర్తయైన దేవుడు తన విశ్రాంతిలోకి నరుని పిలువలేదు. అయితే కుమారుడైన దేవుడు తన విశ్రాంతిలోకి హంతకుడును కిరాతకుడైన దొంగ పశ్చాత్తాప్తుడై మారుమనస్సు పొంది, ప్రార్థనాయుతముగా విజ్ఞాపన చేసిన తన కుడివైపు దొంగను తనతోబాటు తన విశ్రాంతి లోనికి తీసుకొని వెళ్ళిన సందర్భాలలో ప్రభువు పొందిన విశ్రాంతి సమాధిలో కాదుగాని పరదైసులో అని రూఢిగా తెలుస్తున్నది. లూకా 23:43.
ప్రియపాఠకులారా! ఆయన సమాధిలో విశ్రాంతి పొందినట్లు చాలామంది అపోహపడుచున్నారు గాని ఆయన సమాధిలో ఉంటే సజీవునిగా ఉండి ఉండవచ్చును గదా! అలాగాక సమాధిలో ఆయన దేహము రాజముద్ర వేసి భద్రపరచి భటుల కాపలా ఉంచియుండగా సమాధి నుండి శనివారము లేవవచ్చును గదా! అలాఎందుకు జరుగలేదు? తండ్రి ఏడవ దినమైన శనివారమును పాటించాడు. ఆయన పాటించి విశ్రాంతి పొందిన శనివారాన్ని పరిశుద్ధపరచిన ఏడవ దినాన్ని తన బలియాగ అనంతరము కుమారుడు ఆచరించినట్లుగ ఇందులోని పరమార్థము వివరిస్తున్నది.
కనుక ప్రియపాఠకులారా! ఈ విశ్రాంతి దినాన్ని దేవుడు తన జనాంగానికి కట్టడగా విధించినట్లున్నది గాని, అన్యులమైన మనకు అనువర్తించదు. ఎందుకనగా మనము ఇశ్రాయేలు కాము. మనము ధర్మశాస్త్రమును అనుసరించము. కంటికి కన్ను పంటికి పన్ను అను సిద్దాంతము గల్గిన ధర్మశాస్త్రము మనకు అక్కరలేదు. అయితే ధర్మశాస్త్రాన్ని పాటిస్తున్న ఇశ్రాయేలుకు క్రీస్తులో జీవించే యోగ్యత లేదు. వారిలో క్రైస్తవ విశ్వాసము లేదు. ఇంకా చెప్పాలంటే వారు ధర్మశాస్త్ర సంబంధులు, మనము ధర్మశాస్త్రానికి పునాదియైన దైవకుమారుడైన యేసుక్రీస్తు సంబంధులము. ఇశ్రాయేలు దేవుని ప్రజలైతే క్రైస్తవులమైన మనము క్రీస్తు బిడ్డలము. ఇశ్రాయేలు మార్గము యెహోవా అయితే మన మార్గము యేసుక్రీస్తు - ఇశ్రాయేలు సత్యమార్గము యెహోవా అయితే మనకు యోహాను 14:6 నేనే మార్గము సత్యమును జీవమును, నా ద్వారానే తప్ప ఎవడును తండ్రి యొద్దకు రాడు. ఇది ప్రభువు పల్కిన మాట - అది ధర్మశాస్త్రము - ఇది క్రీస్తుయొక్క మాటలు కనుక ధర్మశాస్త్రమునకు రూపాంతరమైన ఈయన మార్గము ఈయన జీవములో మనము నేడు చూస్తున్న మార్గము ఈయన మార్గము - ఈయన సత్యము ఈయన పొందిన విశ్రాంతి సమాధిలో కాక భూమికి ఉపరితల భాగములో నిత్య విశ్రాంతిలో ఆయన ఉన్నట్లు ఇందునుబట్టి మనకు రూఢిగా తెలుస్తున్నది.
ప్రభువైన యేసుక్రీస్తు విశ్రాంతిలో ఉన్నను తాను పాలుమాలినవాడు కాదు. ఆయన విశ్రాంతిలో ఉండికూడ, తాను పొందిన విశ్రాంతి అనంతరము, తన పునరుత్థానములో ఉన్నటువంటి ప్రాముఖ్యమైన దైవప్రణాళికను గూర్చి సజీవుడై అనేకులకు దర్శనమిచ్చి అనేకులతో మాట్లాడిన మాటలు కూడా ఈ సందర్భములో మనము చదువగలము.
ప్రియపాఠకులారా! నూతన నిబంధనలో వ్రాయబడిన నాలుగు సువార్తలలో మూడు సువార్తలలో మాత్రమే ఈ విధంగా వుంది. విశ్రాంతి దినము గడిచిపోయి ఆదివారమున తెల్లవారు చుండగా మగ్దలేనే మరియయు వేరొక మరియము సమాధిని చూడవచ్చిరని మత్తయి పత్రిక 28:1 లోని వివరము. అలాగే మార్కు 16:1 ఈలాగు వ్రాయబడియున్నది. విశ్రాంతి దినము గడిచిపోగానే మగ్దలేనే మరియయు యాకోబు తల్లియైన మరియయు, సలోమేయు వచ్చి, ఆయనకు పూయవలెనని సుగంధ ద్రవ్యములు కొని, పెందలకడనే లేచి బయలుదేరి సూర్యోదయమైనప్పుడు సమాధి యొద్దకు వచ్చుచుండిరి,'' అని వ్రాయబడియున్నది. ఇక లూకా వ్రాసిన 24:1 ఆదివారమున తెల్లవారుచుండగా ఆ స్త్రీలు తాము సిద్ధపరచిన సుగంధ ద్రవ్యములు తీసికొని సమాధి యొద్దకు వచ్చిరి.'' ఈ విధముగా మూడు సువార్తలలో లేఖకులు వ్రాసిన విధానము మూడు విధాలుగ కనబడినను అందులోని భావము ఒక్కటే! అయినను ఆయన శనివారము పునరుత్థానము అయినట్లుగా ఈ లేఖన భాగాలలో వ్రాయబడలేదు. అయినను విశ్రాంతి దినము గడిచిపోయిన తర్వాత అనగా శనివారము రాత్రి అనగా 12 గంటల మీదట ఆదివారము తెల్లవారుఝాము అనుటలో మూడు నుండి ఐదు గంటలలో తెల్లవారు సమయము తెలిపే ఈ సమయములో ఆయన తండ్రి నియమాన్ని పాటించి, తాను తండ్రి బిడ్డనని నిరూపించుచు, ఆయన జరిగించిన దైవప్రణాళికానుసారమైన క్రియయే ఈ విశ్రాంతిని ఆచరించుట. అయితే ఆదివారము తెల్లవారు ఝామున ఎందుకు లేచినట్లు?
ప్రియపాఠకులారా! ఈ సందర్భములో యోహాను 5:19-21లోని అక్కడక్కడ కొన్ని లేఖన భాగాలను పరిశీలిస్తాము. ఇందులో యేసు పల్కిన మాట ''తండ్రి ఏది చేయుట కుమారుడు చూచునో, అదేకాని తనంతట తాను ఏదియు చేయనేరడు. ఆయన వేటిని చేయునో వాటినే కుమారుడును అలాగే చేయును. తండ్రి కుమారుని ప్రేమించును, తాను చేయు వాటి నెల్లను ఆయనకు అగపరచుచున్నాడని మీతో నిశ్చయంగా చెప్పచున్నాను. తండ్రి మృతులను ఏలాగు లేపి బ్రతికించునో అలాగే కుమారుడును తనకు ఇష్టము వచ్చిన వారిని బ్రతికించును. 5:26 తండ్రి ఏలాగు తనంతటతానే జీవము గలవాడైయున్నాడో అలాగే కుమారుడును తనంతట తానే జీవముగలవాడై యుండుటకు కుమారునికి అధికారము అనుగ్రహించెను, పై ప్రవచనాలనుబట్టి ఆదికాండములో ఆది దేవుడు ఆది సృష్టిని, ఆది నరులను, ఆది వనమును ఆది ప్రత్యక్షీకరణను - ఆ ప్రత్యక్షీకరణలో ఆది దేవుడు జరిగించిన అద్భుత క్రియలు ఇవన్నియు కుమారుని ఎదుటనే చేసినందున కుమారుడు ప్రత్యక్షముగా చూచినట్లును, ఆ విధముగా తండ్రి చేసిన ప్రతి పనిలో కుమారునియొక్క పాలిపంపులున్నట్లును, తండ్రి ఏయే క్రియలు చేశాడో వాటి అన్నిటిమీద కుమారునికి అధికారము అనుగ్రహించినట్లును, నోటి మాటలతోగాక స్థిరమైనది బలమైనది శక్తివంతమైనది మహిమగలదియైయున్నట్లు తెలుస్తున్నది. ఇందులో ఆది దేవుడు చేసిన సృష్టి క్రియలలో కుమారునికి పాలున్నది. ఆది దేవుడు ఆది సృష్టి జరిగించునప్పుడు కుమారుడు కూడా తండ్రితో ఉన్నట్లు ప్రవచనాలు ఋజువుపరచుచున్నవి. తండ్రి అజమాయిషీలో ఉన్న జనాంగము వేరు, తండ్రి నడుపుదలలో ఉన్న జనాంగము వేరు, తండ్రి ప్రత్యేకించిన జనము వేరు, అనేకులైన జనాంగముగా ఉండవచ్చును విశేష జనాభా ఉండవచ్చును. కాని విస్తరించిన జనాభా అంతయు దైవత్వమును ఎరిగినవారు కారు. దైవచట్టము నెరిగియు దానిని అనుసరించనివారు దైవచట్టాన్ని వ్యతిరేకించినవారు. వారియొక్క అవిశ్వాస్యత దైవచట్టము అతిక్రమణ దైవత్వమునకు విరోధమైన కార్యాల చేత సంతాపపరచినవారు, దైవచట్ట వ్యతిరేకులు దైవత్వము నందు విశ్వాసముంచిన వారున్నారు. ఆది దేవుడు అందరికి దేవుడై యున్నను, ఆయన జనాంగముగా ఇశ్రాయేలు దేవుని ప్రజలుగ ఏర్పరచుకున్నాడు. వారు దేవుని ఇల్లుగాను దేవుని సైన్యముగాను, దేవుని చేత పేరుపెట్టబడిన కూటమి. వీరిలోనుండి తనకు కావలసిన ప్రవక్తలను రాజులను దీర్ఘదర్శులను జ్ఞానులను ఏర్పరచుకున్నాడు. మోషే లగాయతు పాత నిబంధనలో జీవించిన, దైవత్వము చేత ఎన్నిక చేయబడి ప్రతిష్టించబడి దైవజనాంగానికి నిర్వాహకులుగాను పరిచారకులుగాను దేవుని చేత నియమించ బడినారు. అలాగే దేవుడు ఈ విధముగా పరిపాలన సాగించిన కాలంలో ఆయన అసమర్ధుడు కాడు గనుక అవినీతిని జరిగించిన వారిని కఠినముగా శిక్షించాడు. ఆ శిక్షకు గురియైన వారు అనేకులున్నారు. అయితే దేవుడు నరులను శిక్షించుటకు నిశ్చయింపక వారిని తన క్రమములో ఉంచుకొని పాపమునకు సుదూరంగా ఉంచుటకు బలులను అర్పణలను కోరి వాటి ద్వారా నరులను తన క్రమములో ఉంచి పవిత్ర జీవితము జీవించాలని ప్రయత్నించాడు. ఆ తర్వాత ధర్మశాస్త్ర శాసనాలతో వారిని క్రమబద్ధీకరణ చేయాలని కూడా దేవుడు విశ్వ ప్రయత్నము చేసినట్లును, అయినను దేవుని పేరు పెట్టబడిన దైవజనాంగము ధర్మశాస్త్రమునకు లోబడలేదు, ప్రవక్తలకు లోబడలేదు, రాజులకు లోబడలేదు, తుదకు ఆయనేర్పరచుకొన్న ప్రవక్తలు రాజులు విశ్వాసులు కూడా త్రోవదప్పినారు. ఉదా|| బిలాము యోనా సౌలు దావీదు ఆహాబు వగైరాలు. ఇవన్నియును తండ్రియైన దేవుని సన్నిధిలో జరుగుచున్నప్పుడు యేసుక్రీస్తు యోహాను 5:19 లో విధముగా ''తండ్రి ఏది చేయుటకుమారుడు చూచునో, అదే కాని తనంతట తానేదియు చేయనేరడు. ఆయన వేటిని చేయునో, వాటినే కుమారుడును ఆలాగే చేయును,'' అని అన్న ప్రకారము ఆది దేవుడు చేయు ప్రతిక్రియలో అదృశ్యుడైయుండి, తండ్రి చేయు పరిపాలన విధానము ఆయన చేయు కార్యాలన్నియు కూడా మనకు ఋజువుపరచుచున్నవి. ఇవి అన్నియు తండ్రి తాను చేయు పనులనన్నిటిని తాను ప్రేమించిన కుమారునికి తాను చేయువాటినెల్లను అగుపరచినట్లు 5:20లో సాక్ష్యమున్నది, ''తండ్రి కుమారుని ప్రేమించుచు, తాను చేయు వాటినెల్లను ఆయనకు అగపరచును. కుమారునియొక్క సమక్షములోనే ఈ కార్యములన్నియు జరిగినట్లుగ ప్రభువు మాటలు 5:22లో సాక్ష్యమిస్తున్నది. అలాగే 5:26లో తండ్రి ఏలాగు తనంతట తానే జీవముగలవాడై యున్నాడో అలాగే కుమారుడును తనంతట తానే జీవము గలవాడైయున్నట్లు ప్రభువు పల్కిన మాటలు మనకు ఋజువుపరచుచున్నవి.
ఇందునుబట్టి ఆది దేవుడు ఆది సృష్టి ఆది నరుడు ఆది గ్రంథము ఆది నరుల చరిత్ర ఏ విధముగా భూమి మీద క్రియ జరిగించిందో - దేవుడు ఈ పాతనిబంధన అనేటటువంటి తన ప్రణాళికను సమస్తము జేసి, మరొక నిబంధనకు రెండవ ఆదాముగ రెండవ సృష్టిగా నూతన నిబంధన అని మరొక చరిత్రకు ఆయన భూమి మీద పునాది వేసినప్పుడు తండ్రి దగ్గరనున్న ఆ కుమారుడే ఆది తండ్రి - ఈనాడు ఆది దేవుడయ్యాడు. పాతనిబంధనలో ఆదిదేవుడు రూపాంతరమై దైవత్వంలో ఒక భాగమై కుమారత్వము ధరించి యోహాను 1:14లో వలె ఆదియందు వాక్యము శరీరధారియై కృపాసత్యసంపూర్ణుడుగా నూతన నిబంధనలో అవతరించి నరుల మధ్య నివసించినట్లును, నరులలో ఒక నరుడుగా జీవించినను ఆయన నరుడుగానే దిక్కుమాలిన నరుడుగా మరణపాత్రునిగా కాక సృష్టికర్తయొక్క ఆత్మ, ఆయన శక్తి ఆయన తోడ్పాటు ఆయన సహకారము ఆయన ఆత్మలో పాలిపంపులు పొంది, మరొక నిబంధనకు పునాది వేశాడు. 1 కొరింథీ 3:11లో వలె ''వేయబడినది తప్ప మరియొక పునాది ఎవడును వేయనేరడు. ఈ పునాది యేసుక్రీస్తే. అన్న ప్రవచనాన్ని బట్టి నూతన నిబంధనకు పునాది, నూతన నిబంధనకు ఆది క్రీస్తయియున్నట్లు ఋజువగుచున్నది. తన తండ్రి ఆది దేవుడు ఏ విధముగా సృష్టించి ఏ విధముగా ఏ పద్ధతిని ఆచరించాడో ఆయన కుమారుడు కూడా తండ్రి పద్ధతిని తండ్రి చట్టాన్ని, తండ్రి విధులను తండ్రి మార్గాన్ని అనుసరించి, ఈ లోకానికి దైవకుమారుడుగ ఋజువు కావలసి యున్నందున ఏయే రోజులలో ఏ దినాన్ని ఏ పద్ధతిలో కార్యాలను తండ్రి జరిగించాడో - అదే విధముగా కుమారుడు కూడా తండ్రి ఆచరించిన ఏడు దినముల క్రమాన్ని పాటించాడు. నరజంటను శుక్రవారము చేసినందున ఆ శుక్రవారం నాడే నరకోటి పాపపరిహారార్థము తండ్రి చిత్తము తండ్రి ప్రణాళిక ప్రకారము బలియాగము చేశాడు. ఆ తర్వాత తండ్రి ఆరు దినములలోగా సమస్త సృష్టిని, ఆరవ దినమున నరుని చేసి ఏడవ దినాన విశ్రమించాడో ఆలాగే ఈయన కూడా ఏడవ దినాన్ని పాటిస్తూ ఏడవ దినాన విశ్రమించినట్లును, తండ్రి ఆదివారమున నిరాకార శూన్యమైనకటిక చీకటితో కప్పబడి, శూన్యమైన ఈ అనంత విశ్వము మీద వెలుగును ప్రసరింపజేస్తూ క్రియ జరిగించాడో ఈయన కూడా పాతాళములోని చీకటి నుండి సమాధిని బద్దలు చేసికొని, చీకటిమయమైన అంధకార లోకములో తన వెలుగును అనగా జీవపు వెలుగును ప్రకాశింపజేయుటకు మృత్యుంజయుడై ఆదివారమునాడు నీతి సూర్యునిగ ఈ లోకపాపపు చీకటి తెర నుండి విమోచించుటకు నీతిసూర్యునిగ ఉదయించినట్లును, ఈ ఉదయించిన ఈయన ఇమ్మానుయేలు - దైవనరులకు దేవుడు తోడుగా ఉన్న యేసు రక్షకుడు, తన సమస్త లోకనరుల హృదయ చీకటిని ఛేదించి వారిలో దైవ వెలుగును ప్రసరింపజేయుటకు ఆదివారము పునరుత్థానుడగుటన్నది దైవచిత్తమైయున్నది. ఆదిలో దేవుడు తన సృష్టి నిర్మాణములో చీకటి అంధకార జలముల మీద వెలుగును, ఆదివారమునాడే ప్రసరింపజేశాడు. ఆ విధముగానే తండ్రి చిత్తమును కుమారుడు నెరవేర్చి లోకములో నరులు దైవపథములో నడువవలసిన త్రోవలో ఈయనయే సమస్త జనులకు సత్యము జీవము మార్గమైయున్నట్లు మనము గ్రహించవలసియున్నది.
.......
అంశము :- నేటి మన క్రైస్తవ విశ్వాస జీవితములో మనము అనుభవిస్తున్న దైవానుభూతి - ఆది దేవునితో కూడిందా? ఆయన కుమారుడైన యేసుక్రీస్తుతో ముడిపడి ఉందా? లేక పరిశుద్ధాత్మ తోడ్పాటుతో ఆయన నడుపుదలతో కల్గిందా?
ప్రియపాఠకులారా! పై ప్రశ్నకు సమాధానము మానవత్వములో ఆలోచిస్తే జవాబు దొరకదు. ఇందుకు కావలసిన సరియైన సమాధానము వేదములోనే వేదరీత్యా మనము తెలిసికోవలసియున్నది. తండ్రియైన దేవుడు ఆయన కుమారుడైన దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు ముగ్గురును, ఆది సృష్టిలోని నిర్మాణములో పాత నిబంధన చరిత్రలో త్రిత్వముతో దైవత్వము ఏకమై క్రియ జరిగించిన విధానము నరునియొక్క మానవదృష్టికి వాని జ్ఞానమునకు అంతుపట్టని రీతిగా ఏకత్వము పొంది, తనలో ఉన్న త్రిత్వాన్ని రహస్యముగా బయల్పరచుచు తానేర్పరచుకొన్న ప్రవక్తలతో ఏకత్వముతో మాట్లాడుచు క్రియ జరిగించినట్లు ఆదికాండములోను, నిర్గమకాండములోను, ప్రవక్తల చరిత్రలు ఇందునుగూర్చి దేవుడు బయల్పరచినాడు. దేవుని పర్వతమైన హోరేబులో మోషే దేవునిగూర్చి మాట్లాడుచు తన జనాంగమైన ఇశ్రాయేలు ఐగుప్తులో ఫరో పరిపాలన నుండి విడిపించుటకు మోషేతో పల్కిన మాట,'' నేను ఐగుప్తులోనున్న నా ప్రజల బాధను నిశ్చయముగా చూచితిని. వారు అనేక శ్రమలు సమస్యలతో నిరాహారముతోను, దిక్కులేని బాధాకరమైన హృదయ స్థితిలో వారు చేయు మొర ఆలకించితిని. వారిని ఫరో చేతిలో నుండి విడిపించుటకు నా జనుల యొద్దకు నిన్ను పంపుచున్నాను'' అనెను. అందుకు మోషే చెప్పిన మాట ప్రభువా! నేను ఇశ్రాయేలీయుల యొద్దకు వెళ్ళి మీ పితరుల దేవుడు నన్ను మీ యొద్దకు పంపెనని వారితో చెప్పగా వారు - ఆయన పేరేమి? అని అడిగిన యెడల వారితో నేనేమి చెప్పవలెనని దేవుని అడిగెను. అందుకు దేవుడు నిర్గమ 3:14లో చెప్పిన మాట,'' నేను ఉన్నవాడను, అనువాడనైయున్నాను,'' అనుటలో ప్రియపాఠకులారా! ఇక్కడ త్రిత్వము ఉంది. దైవత్వము వ్యక్తిగతముగా బయల్పరచినట్లుగ అర్థము. ఉన్నవాడను అనగా యావద్ సృష్టిని కలిగియున్నవాడు స్వయంభవుడు తేజోమయుడుగా వెలుగుగా శక్తియు జీవము ఆత్మ శరీరము రూపము సమస్తము ఆయలోనే ఉన్నట్లుగ ఈ మాట భావము వివరిస్తున్నది.
మోషేతో మాట్లాడిన దేవుడు తన్ను గూర్చి చెప్పుచు నిర్గమ 3:14-15లో ఈ విధముగా వ్రాయబడి యున్నది. ''నేను ఉన్నవాడను అనువాడనైయున్నానని మోషేతో చెప్పెను. మరియు ఆయన - ఉండునను వాడు మీ యొద్దకు నన్ను పంపెనని నీవు ఇశ్రాయేలీయులతో చెప్పవలెనన్నప్పుడు మోషే ఆ మాటకు అయోమయములో పడినాడు. మరల దేవుడు మోషేతో - ''మీ పితరుల దేవుడైన యెహోవా అనగా అబ్రాహాము దేవుడు ఇస్సాకు దేవుడు యాకోబు దేవుడైన యెహోవా! అని చెప్పవలెను,'' నిరంతరము నా నామము ఇదే, తరతరములకు ఇది నా జ్ఞాపకార్థక నామము. నీవు వెళ్ళి ఇశ్రాయేలీయుల పెద్దలను పోగు జేసి - మీ పితరుల దేవుడైన యెహోవా, అనగా అబ్రాహాము ఇస్సాకు యాకోబుల దేవుడగు యెహోవా నాకు ప్రత్యక్షమై ఇట్లనెను,'' అని అన్నప్పుడు నిర్గమ 4:1లో అందుకు మోషే చిత్తగించుము వారు నన్ను నమ్మరు, నా మాట వినరు యెహోవా నీకు ప్రత్యక్షము కాలేదందురు.'' అని ఉత్తరమీయగా యెహోవా -నీ చేతిలోనిది ఏమిటి? అని అతనినడిగెను. అందుకతడు కర్ర అనెను. అప్పుడు ఆయన - నేలను దాని పడవేయుమనెను. అతడు దాని నేల పడవేయగా అది పామైనట్లును, అప్పుడు యెహోవా - నీ చేయి చాపి దాని తోక పట్టుకొనమనగా అతడు తన చెయ్యి చాపి దాని పట్టుకొనగానే అది అతని చేతిలో కర్రయైనట్లుగా వ్రాయబడియున్నది. దానిని ఆనవాలుగా మోషేను అనుగ్రహించి, ఆ విధమైన క్రియను మోషే ఇశ్రాయేలు సమక్షములో చేసినప్పుడు వారు మోషేకు దైవప్రత్యక్షత గల్గినట్లుగ నమ్ముతారని దేవుడు మోషేకు సూచించినట్లును, అంతేగాక మోషేచేత దేవుడు చేయించిన మరికొన్ని పరిశోధనలు నిర్గమ 4:6 నీ చెయ్యి నీ రొమ్మున ఉంచుకొనుమనగా, అతడు తన చెయ్యి రొమ్మున ఉంచుకొని దాని వెలుపలికి తీసినప్పుడు ఆ చెయ్యి కుష్టము గలదై హిమమువలె తెల్లగా ఆయెను. తరువాత ఆయన - నీ చెయ్యి మరల నీ రొమ్మున ఉంచుకొనుమనగా, అతడు తన చెయ్యి మరల తన రొమ్మున ఉంచుకొని తన రొమ్మునుండి వెలుపలికి తీసినప్పుడు అది అతని మిగిలిన శరీరమువలెనే ఆయెను.'' అప్పుడు మొదటి సూచక క్రియ రెండవ సూచక క్రియనుబట్టి వారు నీ మాట నమ్మని యెడల నీవు కొంచెము ఏటి నీళ్ళు తీసి ఎండిన నేలమీద పోయవలెను. అప్పుడవి రక్తమగుననెను, అప్పుడు మోషే - ప్రభువా! ఇంతకు మునుపైనను, నీవు నా దాసునితో మాటలాడి నప్పటినుండియైనను నేను మాట నేర్పరిని కాను. నేను నోటిమాంద్యము నాలుక మాంద్యము గలవాడనని యెహోవాతో చెప్పగా యెహోవా - మానవునకు నోరిచ్చినవాడు ఎవడు? మూగవానినేగాని చెవిటివానినేగాని దృష్టిగలవానినేగాని పుట్టించినవాడెవడు? యెహోవానైన నేనే గదా! కాబట్టి వెళ్ళుము నేను నీ నోటికి తోడైయుండి, నీవు ఏమి పలుకవలసినది నీకు బోధించెదను. ఇదిగో నీ అన్నయైన అహరోను నిన్ను ఎదుర్కొన వచ్చుచున్నాడు. నీవు అతనితో మాట్లాడి అతని నోటికి మాటలు అందించవలెను, నేను నీ నోటికి అతని నోటికి తోడైయుండి మీరు చేయవలసిన దానిని మీకు బోధించెదను. అతడే నీకు బదులు జనులతో మాట్లాడును, అతడే నీకు నోరుగా నుండును. నీవు అతనికి దేవుడవు గానుందువు. ఈ కర్రను చేతబట్టుకొని దానితో సూచక క్రియలను చేయవలయునని చెప్పెను.
ప్రియపాఠకులారా! నూతన నిబంధనలో తండ్రి కుమారులయొక్క అనుబంధమన్నది బాహాటముగా మనకు మనోదృష్టితో పరిశీలిస్తే బోధపడగలదు. మోషేతో దేవుడు మాట్లాడుచు నేను మొదటివాడను ఉన్నవాడను అంటున్నాడు. ఉన్నవాడు అనగానేమిటి? ఈ అనంత విశ్వము ఆకాశములను సృష్టిలోని సమస్తమును పంచభూతాలతో సహా కలిగియున్న సమస్తములో ఆవరించి యున్నవాడు ఇమ్మానుయేలు - దేవుడు తోడు. అనగా పుట్టబోవు శిశువు క్రీస్తుగా దేవుడు ఈయనలో ఉన్నాడు. క్రీస్తును గూర్చిన పూర్వార్థము ఈయనలో ఉన్నది. అనువాడునైయున్న వాడు - ఇమ్మానుయేలు అనువాడు - ఇశ్రాయేలు అనగా దేవుడే. ఇశ్రాయేలు జనము అంటే దైవజనము - ఇశ్రాయేలు దేవుడు. ఏటి నీళ్ళు తీసికొని భూమి మీద పోసినప్పుడు అవి రక్తమాయెను. రక్తము చిందించి పాపిని విమోచించుటకు - ఇవన్నియును క్రీస్తుకు సంబంధించినవి. ఈ రక్తము యేసుక్రీస్తు చిందించిన రక్త బలియాగమునకు సంబంధించింది. మోషే చేతిలోని కర్ర అది సిలువకు సూచన. పాము దేవునికి సూచన సిలువ-ఎత్తబడిన యేసునకు సూచన. మోషే చేతిలోని కర్ర - ఇశ్రాయేలు పాపము అందుచేత కల్గిన దైవవోగ్రతను మోషే చేతులు అడ్డు పెట్టి అడ్డుకున్నాడు. నిలువు కర్రగా ఉన్న దేవుని దుడ్డు కర్రను అడ్డుకొని, క్రీస్తు నిలువు కర్రగాను దైవోగ్రతను అడ్డుకున్నందున అడ్డు కర్రగాను అనగా సిలువలో ఎత్తబడిన యేసునకు సూచన, మొట్టమొదటి ప్రవక్త మోషే ప్రవక్తగా క్రీస్తుకు సూచన. దేవుడు మోషేకు కర్ర పెత్తనము అనుగ్రహించాడు. మొదటి కర్ర ద్వారా వచ్చిన పాపము దైవశాపము తద్వారా నరకాగ్నిగుండ మరణము. ఇశ్రాయేలుయొక్క చరిత్ర హీనత అవిశ్వాసము అజ్ఞానము వారిలో ఐగుప్తు మీదనున్న ఆశలు వారి సణుగుళ్ళవల్ల దైవోగ్రత, తాపకరమైన సర్పరూపములో ప్రవేశించి వారి జీవితాలను ఛిన్నాభిన్నము చేయుచుండగా వారిని విమోచించుటకు మోషే ద్వారా దేవుడు సెలవిచ్చి చేయించిన ఇత్తడి సర్పము ఎత్తయిన స్థలములో ఉంచి, సర్ప ఉపద్రవము నుండి విమోచించి; ఆ సర్పమును నిదానించి చూచిన వారికి సర్పకాటు వలనను మృత్యువు వలనను ప్రమాదము లేకుండా దైవశాపమును మోషే చేతులు చాచి అడ్డుకున్నాడు. అక్కడక్కడ ఇశ్రాయేలు ప్రదర్శించిన విసుగుదలనుబట్టి అజ్ఞానము అవిశ్వాసమునుబట్టి వారిని సమూలముగా మరణ శిక్షతో అణిచి వేయాలని సంకల్పించిన దైవోగ్రతను తన చేతులను అడ్డుపెట్టి మోషే ఎదుర్కొన్నాడు. అలాగే నూతన నిబంధన అజ్ఞానులమైన మన నిమిత్తము, ఇశ్రాయేలు నిమిత్తము తానే బలియై తన దేహమును తన రక్తమును తన ప్రాణమును అర్పించి, దైవశిక్ష మరణశిక్ష నుండి తప్పించుటకు అన్యులమైన మనకు రక్షణమార్గమును సత్యమార్గమును, జీవమార్గమును మోక్షమార్గమును ప్రసాదించుటకు ఆయన ఈ లోకములో మనతో జీవించి పాడైపోయిన జనాంగానికి అధికారమును అనుగ్రహించుటకు తాను పునరుత్థానము పొందినట్లును, పునరుత్థాన అనంతరము భూలోకమందంతట దైవరాజ్య సువార్త నలుమూలల ప్రకటితమై అనేకులు దైవరాజ్య వారసులుగా చేయుటకు కూడా యేసుప్రభువు నలుబది దినములు తన్ను తాను సజీవునిగ అగుపరచుకొని, తానీలోకానికి వచ్చి తండ్రి చిత్తము ఆయన ప్రణాళిక ఆయన ఉద్ధేశ్యముతో తాను ఈ లోకములో అవతరించుటకు కారణము - సమస్తమును తానేర్పరచుకొన్న శిష్యకోటికి వివరించి పల్కిన మాట మత్తయి 28:18-21 ప్రవచించిన మాటలు ''పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారము ఇయ్యబడియున్నది. కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులనుగా చేయుడి; తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మయొక్కయు నామములోనికి వారికి బాప్తిస్మమిచ్చుచు, నేను మీకు ఏయే సంగతులను ఆజ్ఞాపించితినో వాటినన్నిటిని గైకొనవలెనని వారికి బోధించుడి. ఇదిగో నేను యుగసమాప్తి వరకు సదాకాలము మీతో కూడా ఉన్నానని వారితో చెప్పుటలోని పరమార్థమిదే.
ప్రియపాఠకులారా! తండ్రి చిత్తము ప్రకారము తండ్రి ప్రణాళికనుబట్టి, తండ్రి తనకు విధించిన విధి కృతమును నెరవేర్చి ఆదివారమునాడు తెల్లవారుఝామున మహిమ పునరుత్థానుడై ఆదివారంనాడు జరుగవలసిన క్రియాకర్మలనుగూర్చి తన శిష్యకోటికి వివరించాడు. తండ్రియైన దేవుడు కలుషితము నిరాకారము దుర్గంధపు, పాపభూయిష్టమైన మురికి కూపముతో చీకటి అగాధ జలముల మీద తన వాక్కుతో తన వెలుగుతో వెలికితీసి శుద్ధీకరించి, సృష్టములను ఏలాగు రూపించాడో ఆలాగే కుమారుడైన దేవుడు భూమి మీద మొట్టమొదటిసారిగ నీట ిమూలముగాను ఆత్మ మూలముగాను నరుడు జన్మించుటకు కావలసిన శక్తిని ప్రభావాన్ని ఆత్మీయతను, వీటితోబాటు దైవమహిమను లోకానికి ప్రచురణ చేయుటకు తన మహిమను తాను ప్రేమించిన శిష్యకోటికి అనుగ్రహించి, తద్వారా లోకమాలిన్యముతో కటిక పాపములో మ్రగ్గి నానా విధబాధలు వ్యాధులతో వున్న అభాగ్యులకు తండ్రి కుమార పరిశుద్ధాత్మల ద్వారా బాప్తిస్మమిచ్చే అధికారం తాను పొందియుండి, ఆ అధికారమును తానేర్పరచుకొన్న శిష్యకోటికి ఇచ్చి, తాను పొందిన పునరుత్థాన బలాధిక్యతలను, తాను ప్రేమించిన శిష్యకోటికి అనుగ్రహించి వారి ద్వారా పరలోకరాజ్య సువార్తను దైవరాజ్యము విస్తరింపజేయుటకు యేసుప్రభువు తన అధికారాలను ఈ పదకొండుమంది శిష్యులకు వాటాను అనుగ్రహించి, తద్వారా అనేక అద్భుత కార్యాలను పరిశుద్ధాత్మ శక్తి ద్వారా జరిగించుటకు అనుమతించినట్లును అంతేగాకుండ ''నేను యుగసమాప్తి వరకు సదాకాలము శిష్యుల వెంట ఉంటూ అనేక అద్భుత కార్యాలు చేయుచు సిలువకు వారిని సాక్షులుగాను, తన చరిత్రకును తాను కట్టబోయే యెరూషలేము పట్టణానికి పునాదులుగాను వేదములో చదువగలము. అటు తర్వాత యేసుక్రీస్తు ఏర్పరచుకొన్న అపొస్తలులు వారినేగాకుండ, తాను వాగ్దానము చేసిన యోహాను 14:16-17 నేను తండ్రిని వేడుకొందును, మీ యొద్దఎల్లప్పుడు నుండుటకై ఆయన వేరొక ఆదరణకర్తను అనగా సత్యస్వరూపియగు ఆత్మను మీకనుగ్రహించును. లోకము ఆయనను చూడదు, ఆయనను ఎరుగదు కనుక ఆయనను పొందనేరదు. మీరు ఆయనను ఎరుగుదురు, ఆయన మీతో కూడా నివసించును మీలో ఉండును. మిమ్మును అనాధులనుగా విడువను, మీ యొద్దకు వత్తును,'' పరిశుద్ధాత్మ ఆయన శిష్యులను ఆవరించి జరిగించిన క్రియలను గూర్చి అపొస్తలుల కార్యాలలోను కొన్ని వేదభాగాలలోను, వారు జరిగించిన మహిమాన్విత క్రియలను గూర్చి చదువగలము.
ప్రియపాఠకులారా! ఆదివారమన్నది ఆరాధన దినముగా పాటించుటకు మూడు ముఖ్య విషయాలు. 1. ఆదివారమన్నది దేవుని సృష్టికి పూర్వము దేవుడు వెలుగును ప్రసాదించిన దినము ఆది 1:1-2. 2. ఆదివారమన్నది యేసుక్రీస్తు మరణవిజయుడై పునరుత్థానము పొంది, 40 దినములు శిష్యకోటికి తన ప్రత్యక్షతను అనుగ్రహించి తన్ను తాను కనబరచుకొని జరిగించిన అద్భుత కార్యాలను బట్టి అపొ
2:38లో వ్రాయబడి ఉంది. ప్రభువైన యేసుక్రీస్తు పేతురు ద్వారా బాప్తిస్మ కార్యమునకు వేసిన పునాదిని గూర్చిన వివరము. మీరు మారుమనస్సు పొంది, పాప క్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మము పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మ అను వరము పొందుదురు. ఈ వాగ్దానము మీకును మీ పిల్లలకును దూరస్థులందరికిని అనగా ప్రభువైన దేవుడు తన యొద్దకు పిలిచిన వారికందరికిని చెందునని వారితో చెప్పెను. ఇంకను అనేకమైన విషయాలనుగూర్చి సాక్ష్యమిస్తూ - మీరు మూర్ఖులగు ఈ తరమువారికి వేరై రక్షణ పొందుడని వారిని హెచ్చరించినందున అతని వాక్యమును అంగీకరించినవారు బాప్తిస్మము పొందిరి. ఆ దినమందు ఇంచుమించు మూడు వేలమంది చేర్చబడిరి. వీరు అపొస్తలుల బోధ యందును, సహవాసమందును, రొట్టె విరుచుటయందును ప్రార్థన చేయుటయందును ఎడతెగక యుండిరి. ఇది ఆదివారమున ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా నియమించబడిన ఆరాధన. ఆయన ఆచరించిన బల్ల ఆరాధనను గూర్చిన పరమార్థమైయున్నది.
కనుక ప్రియపాఠకులారా! సబ్బాతు దినమనగా శనివారము అన్నది ఇశ్రాయేలీయులకు విశ్రాంతిదినము. అనగా ఆది దేవునియొక్క విశ్రాంతి. యేసుక్రీస్తు కూడా ఇశ్రాయేలీయులలో యూదా గోత్రము దావీదు వంశములో దైవజనకూటమికి చెందినవాడై దేవుని పట్టణమైన యెరూషలేములో జన్మించి, ఆ పౌరసత్వము పొందినవాడుగాను, ఆ తర్వాత బలియాగము జరిగించి సిలువ మరణము పొంది విశ్రమించాడు, అయితే తన విశ్వాసులమైన మనకు క్రైస్తవులమని చెప్పుకొనుచున్న మనకు, క్రైస్తవ బిడ్డలమని ప్రకటించుకొంటున్న మనకు, క్రైస్తవ మందిరాలను కట్టుకొని ఆరాధించు మనకు - యేసుప్రభువు విమోచకుడును రక్షకుడునై సంఘానికి శిరస్సయియున్నాడు. ఈ శిరస్సయియున్న దైవకుమారుడు యేసు ఎప్పుడు లేచాడో - ఆదినమే మనకు ఆచరణీయమైన దినము. మనమెంత విర్రవీగినను మనము ఇశ్రాయేలుము కాము. ఇశ్రాయేలుకు అన్యులమే. మనకు ఇశ్రాయేలుకు ఎలాంటి సంబంధ బాంధవ్యాలు లేవు. ఇశ్రాయేలు దేవునితో మనము నివసించినను ఇశ్రాయేలుగ పిలువబడము - ఇశ్రాయేలుగ జీవించలేము. ఇశ్రాయేలు స్వాస్థ్యము మీద మనకు అధికారాలు లేవు. దేవుడు అబ్రాహామునకు చేసిన వాగ్దానమునుబట్టి అన్యులయొక్క స్వాస్థ్యములను ఇశ్రాయేలుకు అనుగ్రహించియున్నాడు. ఈ వాగ్దానము అబ్రాహామునకు అతని సంతానమునకు దేవుడు వాగ్దానము చేసినట్లు వేదములో చదువగలము.
కనుక ప్రియపాఠకులారా! ఇంత గొప్ప మర్మము ఆదివారములో దేవుడు బయల్పరచి యున్నాడు. ఆయన తన కుమారుని ద్వారా బయల్పరచియున్నాడు. ఇందునుబట్టి ఆయన లేచిన తర్వాత అపొస్తలుల కార్యము 2:లో ఆయన లేచి మోక్షరాజ్యము ప్రవేశించిన తర్వాత యేసుప్రభువు వాగ్దానం చేసిన సత్యస్వరూపియగు పరిశుద్ధాత్ముడు అపొస్తలుల మీద ఆవహించి క్రియ జరిగించినట్లుగా కూడా వేదములో చదువగలము. కనుక శుక్రవారము అన్నది శ్రమల ధ్యాన దినము, శనివారమన్నది విశ్రాంతి దినము ఆదివారము పునరుత్థాన దినము ఆరాధన దినము - రొట్టె విరచు దినము.
........
యోబు
దానియేలు
యేసుక్రీస్తు
పై ముగ్గురి విషయములలో మామూలు మనుష్యులను చేసి వారిపై అపవాదు వేసిరి. క్రీస్తు కూడ అపవాదు వేయబడినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు తొలగిపోయి మామూలు మనిషిగా నిలబడెను. అందువలననే అతని మీద అపవాదు వేయుటకుగాని, పట్టుకొనుటకుగాని సాధ్యమయ్యెను.
పై మూడు విషయములలో నరుడు నిర్దోషిగాను, దైవ నిర్ణయము నెరవేర్చువాడుగాను, నిష్కల్మషుడుగాను, దేవుని బిడ్డగాను, పరిశుద్ధాత్మ ప్రభావము కలిగినవాడుగాను, సైతానుడు చేయు సవాలును ఎదుర్కొను ధీరుడై యుండెను.
ప్రభువునందు సహోదరీ సహోదరులారా!
దీని వలన, మేము మీ యొక్క సహాయ సహకారాల వల్ల తరువాత ముద్రణలో ఈ పుస్తకము అన్ని కోణాలలో అందముగా తీర్చిదిద్ది అందించగలము. ఆమేన్.
శేఖర్ రెడ్డి గారు వ్రాసిన పుస్తకములు:
వీటిని మీరు www.FaithScope.com ద్వారా ఉచితముగా పొంద వచ్చును.