శారీర ఫల ప్రదర్శిని
గ్రంథకర్త : శేఖర్‌రెడ్డి వాసా
నీ మరణానంతరము నీ ఆత్మ ఎక్కడ వుండబోవుచున్నదో నీకు తెలుసునా?
మూలము
రెడ్డిపాళెం గ్రామములోని నా ప్రభువు తల్లి ఉపదేశములు మరియు ఆమెను ఆవరించిన పరిశుద్ధాత్మయొక్క జ్ఞాన సహాయమే ఈ పుస్తక రచనకు మూలాధారము.
అంకితము
ఈ అవకాశాన్ని నాకు అనుగ్రహించి నన్ను ప్రేమించిన క్రీస్తు ప్రభువుకు అంకితమిస్తున్నాను. - వాసా శేఖర్‌రెడ్డి
శారీర ఫలదర్శిని (ప్రదర్శిని) దీనికి ముందుగా ఆత్మఫల ప్రదర్శినికి నేను తొలిపలుకులు ప్రకటించియున్నాను. ఇప్పుడు శారీర ఫలప్రదర్శిని'' అను ఈ గ్రంథమును గూర్చి ఇందులోని సంగతులను గూర్చి బయల్పరచిన ప్రతి అంశమునుగూర్చి నరునియొక్క జీవితములో శారీర సంబంధముగా అనగా శరీరమునకు ఉన్నటువంటి వాటి ఫలింపు - పాత్ర ఎలాంటిదో? ఆ విధముగా శారీర సంబంధ పాత్రలు, నరుడు అవలంభించవలసిన విధానాన్ని గూర్చి అనగా శారీర సంబంధమైన క్రియాకర్మలను గూర్చి తెలిపే ఫలాఫలితాలనుగూర్చి వ్రాయబడిన ఈ గ్రంథమును గూర్చిన పరిచయ వాక్కులు.
ప్రియపాఠకులారా! శారీర ఫల ప్రదర్శిని అను ఈ గ్రంథము - అసలు శారీర ఫలాలు అంటే ఏమిటి? గలతీ 5:19-21 చదువుకొందము. ''శరీర కార్యములు స్పష్టమైయున్నవి. అవేవనగా జారత్వము అపవిత్రత, కాముకత్వము, విగ్రహారాధన, అభిచారము, ద్వేషములు, కలహము మత్సరములు క్రోధములు కక్ష్యలు, భేధములు, వి మతములు అసూయలు, మత్తతలు అల్లరితో కూడిన ఆటపాటలు.' ఇవి ''శారీర ఫలదర్శిని,'' అనే ఈ పుస్తకములో వీటిని గూర్చి వ్రాయబడింది. ఇందునుగూర్చి మనము గ్రహించాల్సినదేమనగా జీవ వృక్షఫలములను తిన్నవాడు నిరంతరము జీవిస్తాడు. ఇందునుగూర్చి యేసుక్రీస్తు ప్రత్యక్షముగ యోహాను 6:54 ''నా శరీరము తిని నా రక్తము త్రాగువాడే నిత్యజీవము గలవాడు. అంత్య దినమున నేను వానిని లేపుదును. నా శరీరము నిజమైన ఆహారమును నా రక్తము నిజమైన పానమునై యున్నది. నా శరీరము తిని నా రక్తము త్రాగువాడు నా యందును, నేను వాని యందును నిలిచి యుందుము.'' ఇందునుబట్టి ఆదిలో ఏదెను వన మధ్యలో సృష్టికర్త నాటిన రెండు వృక్షములలో ఒకటి క్రీస్తునకు ముంగుర్తయి ఉన్నట్లును మనము గ్రహించాలి. రెండవది మంచి చెడు తెలివినిచ్చు మరణ వృక్షము'', మరణము - జీవము అను రెండు వృక్ష రూపములు నాటినట్లును,'' ఇది తెలియక వాటిని శరీరము భూసంబంధమైనవి గనుక భూమి వైపు ఆకర్షించబడి, భూసంబంధమైన దైవనిషేధ ఫలములు తిని మరణాన్ని తెచ్చుకొన్నారు. ఆవిధంగా మరణశాపము నుండి మనలను కాపాడుటకు దేవుడు తన కుమారుని సజీవమైన వృక్షముగా - చలనాత్మకమైన వృక్షముగా, ఆత్మ శుద్ధిని కల్గించు వృక్షముగా మన మధ్యకు పంపి, మనకున్నటువంటి సమస్త దోషాపరాధముల నుండి విమోచించి తన బిడ్డలుగ సజీవమైయున్న క్రీస్తు తన రక్తముతో మనలను కొన్నారు. ఆయన ప్రణాళిక రూపించినట్లును కనుక శరీర ఫల ప్రదర్శిని అను ఈ గ్రంథము కేవలము లోకసంబంధమైనవి, శారీర సంబంధమైనవి, నరకాగ్ని గుండానికి మార్గము తెలిపేవిగా ఉన్నవి. కనుక ఇందులోనివి చదివి ఆత్మీయ అనుభవముతోను నిగ్రహముతోను చదువరులు తమ జీవితమును ధన్యవంతము చేసికొనుటకు ఈ చిన్న పుస్తకము మార్గదర్శిని యగును గాక! ఆమేన్.
శారీర ఫలదర్శిని (ప్రదర్శిని)
ప్రభువునందు ప్రియమైన పాఠకమహాశయులారా! దీనికి ముందు భాగమైన ఆత్మఫలవికాసిని అను గ్రంథములోని ఆత్మసంబంధ వివరాలను మనము తెలిసికొనియున్నాము. ఇపుడు ఇందులో రెండవ భాగమైన శారీర ఫలదర్శిని అనే ఈ గ్రంథమునుగూర్చి ఇప్పుడు మనము వేదరీత్యా తెలిసికొందము. ''శారీర ఫలదర్శిని,'' అను ఈ గ్రంథము కేవలము శారీర సంబంధమైన వాటిని గూర్చియు, శారీరమునకు జన్మనిచ్చిన భూసంబంధమైన వాటినిగూర్చియు, అంతేగాక భూలోకములో ఉన్నవాటిని గూర్చియు, నరునియొక్క స్వజ్ఞానమును గూర్చియు వేదరీత్యా కొన్ని అంశములు ఇందులో పొందుపరచబడియున్నవి.
ప్రియపాఠకులారా! ఆదిలో ఏదెనులో దేవుడు ప్రత్యక్షముగా ఆదాముతో మాట్లాడిన విధముగా తండ్రి తన బిడ్డతో మాట్లాడిన విధముగా ప్రతి విషయములోను ఆదాముతో ముచ్చటించుచు సందర్భాలను బట్టి దేవుడు ముఖాముఖిగా ఆదామును మాట్లాడిస్తూ ఆదికాండము 2:లోని చరిత్ర మనము చదువగలము. చిత్రమేమంటే ఆదాము పరిశుద్ధుడు గదా! ఆదాము దేవునియొక్క హస్తకృత్యము దేవుని ఆత్మలో భాగస్వామి గదా! అలాంటప్పుడు ఆదామునకు సాటి సహాయముగా ఏర్పరచిన స్త్రీ దేవుని హస్తకృత్యము ఆదాము శరీరములో ఒక అంగముగాను - ఎముకలలో ఒక ఎముకగాను మాంసములో మాంసముగాను ఉండి, ఒకే నరుని నుండి తీయబడింది. ఆదాము పరిశుద్ధుడైనప్పుడు స్త్రీ కూడా పరిశుద్ధురాలే గదా! మరి దేవుడు ఆమెతో ముఖాముఖిగ మాట్లాడినట్లు దాఖలాలున్నాయా? దేవుడు పురుషుని నుండి ఆదాము నుండి తీసిన స్త్రీని గాఢనిద్ర నుండి మేల్కొన్న అతనికి చూపినాడేగాని - ఇదిగో నీ భార్య నీవు ఈమెను ఏలుకో! అని అక్కడ ఉందా? అయితే గాఢనిద్ర నుండి మేల్కొన్న నరుడు ''నా ఎముకలలో ఒక ఎముక - నా మాంసములో మాంసము ఇది నరునిలోనుండి తీయబడెను గనుక నారి అని అన్నాడే గాని, ఆ నారి ఎక్కడనుండి వచ్చిందో ఆదామునకు తెలుసును. స్త్రీ తాను ఏ విధముగా ఈ లోకములో పుట్టింది ఆమెకు తెలియదు. తెలిసి ఉంటే, ఆదాముతో ప్రత్యక్షముగా తెలిపేది '' నీ ఎముకలలో ఒక ఎముకను నేను నీ మాంసములో మాంసము - నీలో నుండి తీయబడినాను, కనుక నేను నీ అర్దాంగిని అను మాట స్త్రీ అనగల్గిందా? ఎందుకు అనలేదు? అంటే పురుషుడు ప్రత్యేకరీతిలో ఆత్మ సంబంధముగా జీవించిన జీవితములో - తనకు ప్రత్యక్షముగా మాట్లాడే విలువను మర్యాదను అవకాశమును పాడు జేసుకొని, తనలో నుండి తీయబడిన ఎముకయైన స్త్రీ మాటలకును - స్త్రీ తనకిచ్చిన భూఫలములకు లోబడి దైవాజ్ఞను అతిక్రమము చేసేవాడేనా?
ప్రియపాఠకులారా! ఇందులో ఆదాము ఒంటరిగా ఉండి దేవునితో సన్నిహితముగా వుండి ముఖాముఖిగా మాట్లాడు సందర్భములో ఆదాము పరిశుద్ధుడును, ఆత్మీయ స్థితిలో ఆదాముయొక్క ప్రవర్తన అతని ఒంటరి స్థితి చాలా ఉన్నత స్థాయిలో ఉండింది. ఎప్పుడైతే ఆదామునకు దేవునికి మధ్య స్త్రీ రూపమన్నది ప్రత్యక్షమైందో - ఆ స్త్రీ రూపమన్నది సాతానుగా రూపాంతరము చెంది సాతాను చేసిన సర్ప ప్రవేశము ద్వారా ఏకీభవించి, అనగా దైవము నిషేధించిన ఫలభక్షణ క్రియను జరిగించుటలో - సర్పముతో ఏకీభవించి స్త్రీ చేసినటువంటి క్షమించరాని అపరాధము అన్నది తన జీవితాన్ని పాడు జేసుకొనుటయేగాక, తనకు జన్మనిచ్చిన పురుషుని తనను రూపించిన పరమాత్మను కూడా అగౌరవపరచింది. ఆ నిషేధఫల భక్షణము ద్వారా లోకానికిని ఆ ఫలభక్షణమును గూర్చి ప్రబోధించి పాపప్రవేశానికి నాంది పల్కిన సర్పానికి కూడా దాసులై సతీసమేతముగా స్త్రీ జేసిన దోషాపరాధమునకు ఇద్దరిని దైవిక సావాసము దైవిక పరిశుద్ధ వన జీవితానికి, ఆ వనములో అనుభవించిన స్వేచ్ఛా జీవితాన్ని సమస్తాన్ని కోల్పోయి, పాపమునకును దాని జీతమైన మరణమునకును వాటి ఫలమైన నరకాగ్నిగుండ శిక్షకును, యోగ్యులై దైవోగ్రతకు గురియై తీరనటువంటి శిక్షను యావద్ సృష్టికిని సంక్రమింపజేయుటకేగాక, తరతరములు నరులకు తరగనటువంటి స్థిరమైనట్టి, దైవత్వముతో విరోధము అంట గట్టుటకు నరజంట నాంది పల్కినట్లుగా ఇందునుబట్టి మనము గ్రహించవలసియున్నది.
ప్రియపాఠకులారా! శారీరఫలాలు లోక ఫలమునుగూర్చి ఇప్పటి వరకు సూచాయగ తెలిసికొని యున్నాము. ఇప్పుడు భూఫలము యొక్క పూర్వార్థమును గూర్చి కొంత తెలిసికొందము. భూఫలము పాడగుటకు కారణము నరులే! ఎలాగంటే దేవుడు ఆదామును శపిస్తూ - '' నీ నిమిత్తము నేల శపించబడి యున్నది. ప్రయాసతోనే నీవు బ్రతుకుదినములన్నియు దాని పంట తిందువు, అది ముండ్లతుప్పలను గచ్చ పొదలను నీకు మొలిపించును, పొలములోని పంట తిందువు. నీవు నేలకు తిరిగి చేరువరకు నీ ముఖపు చెమట కార్చి ఆహారము తిందువు.'' ఇది దేవుడు జీవితాంతము నరునికి ఇచ్చినటువంటి సుదీర్ఘమైన శిక్ష.
కనుక ప్రియపాఠకులారా! మనము ఇప్పుడు లోకము - పరలోకము, ఆత్మశరీరము శవీటి యొక్క ఉచ్ఛ నీచ ఫలితాలను గూర్చి సూచాయగ తెలిసికొన్నాము. చిత్రమేమిటంటే ఆదినరుడైన ఆదాము ద్వారా ప్రవేశించిన పాపమన్నది మరణమన్నది అతని తరమైనటువంటి నేటి వారమైన మన వరకు ఈ శిక్ష అమలు జరుగుచున్నది. ఈ మరణము అను శిక్ష ఒక క్రమము, ఒక పద్ధతి, ఒక సిద్ధాంతము, ఒక నిర్ణీత కాలము, ఒక నిర్ణీత స్థలము, ఏదో యొక సందర్భమును బట్టి సంభవించేది కాదు. ఎప్పుడు పడితే అప్పుడు, ఏ వయస్సులో పడితే ఆ వయస్సులో - ఏ సందర్భమైనను ఏకాలమైనను ఏ పద్ధతిలోనైనను సంభవించవచ్చును. అనగా ఇందునుబట్టి మరణానికి మర్యాద లేదు, మరణానికి కనికరము లేదు, మరణానికి సానుభూతి లేదు, మరణానికి సమయమంటూ లేదు, మరణానికి వయస్సుతో ప్రమేయము లేదు. మరణానికి ఒక పద్ధతంటూ లేదు, ఏ సమయములోనైనను ఏ స్థితిలోనైనను ఏ సందర్భములోనైనను ఎక్కడైనను ఇది సంభవించవచ్చును. మరణాన్ని గూర్చిన మర్మము సృష్టికర్తయైన దేవుడు నరులకు మరుగుపరచియున్నాడు. ఎలాగంటే ఆదిలో ఆది నరుని దేవుడు ఏదెనులో శాసిస్తూ నిషేధఫలమును గూర్చి మాట్లాడే సందర్భములో - ఈ తోటలోనున్న ప్రతి వృక్షఫలములను నీవు నిరభ్యంతరముగా తినవచ్చును. అయితే మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్ష ఫలములను తినకూడదు, నీవు వాటిని తిను దినమున నిశ్చయముగా చచ్చెదవు,'' అన్నాడేగాని, ఈ చావు పలానప్పుడు వస్తుందని గాని, ఈ చావు శరీర సంబంధ చావు అని గాని, ఫలానిది అని గాని, పలానప్పుడు చచ్చెదవని దేవుడు ఆదామునకు వివరించలేదు. దేవుడు ఆదాముతో నీవు నిశ్చయముగా చస్తావు,'' అన్నాడు. ఆదాము ఎందుకు చావలేదు? అనిన అనుమానము పాఠకులైన మనకు కలుగవచ్చును. వాస్తవానికి శారీరరీత్యా ఆ సందర్భములో మాత్రము ఆదాము చావలేదు, కాని ఆత్మీయంగా చచ్చాడు. ఆత్మ విలువను కోల్పోయాడు, ఆత్మ దేవుని యొక్క ఆశీర్వాదాన్ని పోగొట్టుకొన్నాడు, ఆత్మ దేవునికి సంతాపము పుట్టించుటకు కారకుడయ్యాడు. ఆత్మ దేవునికి ఉగ్రత పుట్టించుటకు మూలపురుషుడయ్యాడు. దైవ నరుల సంభాషణలో దైవత్వమునకు సంతాపము పుట్టించిన వారిలో ఆదాము ప్రధముడయ్యాడు. ఆదామునకు పూర్వము నరుడు లేడు, నారి లేదు, ఆదామునకు పూర్వము ఏదెను వనము, ఆ వనమునకు పూర్వము సృష్టి ఉంది, ఎలాగంటే మొట్టమొదట సృష్టి నిర్మాణ క్రియను ఆరు రోజులు జరిగించినప్పుడు మొట్టమొదట భూమ్యాకాశములు, వాటిలో జీవించగల్గిన జీవరాసుల జాబితాలో మృగపక్షి జంతుసముదాయము, వాటి మనుగడకు కావలసిన వాతావరణము, ఆహార విలువను సమకూర్చినాడు. భూమికి తన ఆజ్ఞనిచ్చి దైవత్వము సమస్తమును సమకూర్చింది. దైవవాక్కునకు విధేయించి భూమి సమస్తమును కన్నది. ఈ విధముగా ఈ పుస్తకములో విశదముగా వ్రాయబడి ఉంది.
కనుక ప్రియపాఠకులారా! ఇందులోని అంశములను ప్రారంభమునుండి అంతము వరకు పాఠకులు చదివి క్షుణ్ణముగా మననము చేసికొని, మనోనేత్ర దృష్టితో ఈ గ్రంథములోని అమూల్య సత్యాలను దైవోద్ధేశ్యాలను పఠించి ఆత్మీయ వెలుగును పొంది, ఆత్మ జ్ఞానాన్ని అలవరచుకొని నా చేత విరచితమై ప్రచురం కానున్న మూడవభాగమైన దైవ ప్రణాళిక ప్రకాశిని'' అను గ్రంథమును కూడా పఠించి, ఆత్మీయ మేలులు పొందగలరని పాఠక మహాశయులకు విన్నవించుకుంటున్నాను. సర్వశక్తిమంతుడైన ప్రభువు త్రియైక దేవుడు మనలను ఆశీర్వదించి కాపాడును గాక!
.......
ప్రసంగము :- మూలము ఆది 4:7 నీవు సత్క్రియ చేసిన యెడల తల ఎత్తుకొనవా? సత్క్రియ చేయని యెడల వాకిట పాపము పొంచియుండును నీ యెడల దానికి వాంఛ కల్గును. నీవు దానిని ఏలుదువు.''
ప్రియపాఠకులారా! సత్క్రియ అంటే ఏమిటి? సత్క్రియ అని దేనిని అంటారు? సత్క్రియ ద్వారా నరుడు సాధించేది ఏమిటి? సత్క్రియ అన్నది నరుని జీవితములో ఎంతవరకు ఉపయోగపడుతుంది? సత్క్రియ ద్వారా నరుడు మోక్షము చేరగల్గుతాడా? సత్క్రియ అన్నది దేహ సంబంధమా? ఆత్మ సంబంధమా? వగైరా విషయాలను గూర్చి తెలిసికొందము.
ప్రియపాఠకులారా! పాతనిబంధన కాలములో యోబు కంటే సత్క్రియ నిరతుడు - సద్దర్మాత్ముడు, పరిశుద్ధాత్ముడు ఎవరును లేరు. ఇందునుగూర్చి సాతానుతో దేవుడే సవాలు చేస్తూ యోబు యదార్ధవంతుడును, న్యాయవంతుడునై దేవునియందు భయభక్తులు కలిగి చెడుతనము విసర్జించినవాడు భూమి మీద అతని వంటి వాడెవడును లేడని సవాలు చేసియున్నాడు. యోబుయొక్క దానధర్మాలు దైవత్వము పట్ల భయభక్తులతో, జరిగించిన అర్పణలు బలులు, దేవుని పట్ల యోబు వ్యవహరించిన విధానము ఏ నరుడు యోబు కాలములో లేనట్లే యోబు గ్రంథములో మనము చదువగలము. అబ్రాహాము అన్ని విషయాలలో దేవునికి విధేయుడు అయ్యాడుగాని కొన్ని విషయాలలో భార్య మాటలనుబట్టి విని దారి తప్పి దాసికి గర్భమిచ్చాడు. అయితే యోబు విషయములో ఎలాంటి దోషము దైవత్వానికి కనబడనందున దేవుడు స్వయముగా సాక్ష్యమిస్తూ సాతానుతో సవాలు చేశాడు.
అలాగే నూతన నిబంధనలో అపొస్తలుల కార్యములు 10:లో కొర్నేలి చేసిన ధర్మ కార్యాలు, ప్రార్థనలు అన్నియు సత్క్రియలే. ఇట్టి ప్రభావమునుబట్టి దేవదూత పగలు మూడు గంటల వేళ దర్శించే భాగ్యాన్ని కొర్నేలి తన జీవితములో పొందగల్గినాడు ఇది సత్క్రియ; యోబుయొక్క ఇట్టి సత్క్రియా ప్రభావము - సాతాను - దేవుడు ఇద్దరిని ఏకము చేసి ఇద్దరిలో కలతను రేపింది. కొర్నేలి చేసిన ప్రార్థన దేవునియొక్క సన్నిధానమును కలవరపరచింది. దాని ఫలితమే దేవదూత దర్శనము. యోబు చరిత్రలో అయితే సాతాను శోధన, దేవుని పరిశోధన రెండును యోబు మీద క్రియ జరిగించింది. అయినను ఈ ఇరువురి విషయములో లోకములో తలదించుకొని జీవించక తల ఎత్తుకొని జీవించారు. వీరిపట్ల పాపానికి ఎలాంటి అవకాశము కలుగలేదు. అయితే సత్క్రియ చేయక దైవత్వమునకు సంతాపము పుట్టించే క్రియను జరిగించి, తలదించుకొని అనగా సిగ్గు భయము ఆవరించి, తమ జీవితాన్ని దుఃఖమయము చేసికొన్న వారిని గూర్చి తెలిసికొందము.
దావీదు కీర్తనాకారుడును, దేవునిచే పరలోక రాజ్య తాళపు చెవులు పొందియున్న దావీదు అంతటివాడినే, దావీదు యొక్క అంతఃపుర వాకిటనే పాపము పొంచి యుండి, దావీదుచే పాపప్రవేశము జరిగించింది. దావీదు చేత పాపపు పని జరిగించుటకు కాచుకొని యుండింది. తన సైన్యముతో యుద్ధానికి వెళ్ళవలసిన దావీదు తన అజ్ఞానము వల్ల పాపానికి అవకాశమిచ్చాడు. పాపానికి అవకాశ మిచ్చుటకు కారణము దావీదు అనియు, దైవ పక్షముగా జరిగించవలసిన యుద్ధానికి బదులుగా పాపానికి అవకాశమిచ్చి, ఆ పాపపు అవకాశాన్ని పురస్కరించుకొని పాపమన్నది దావీదునకు కామోద్రేకముతో కూడిన ఆకర్షణను కల్గించి, పాప క్రియకు అవకాశమిచ్చే స్వభావానికి పురిగొల్పింది. దైవ పక్షముగా దావీదు జరిగించవలసిన ధర్మాన్ని దావీదులో ఉన్న ఆత్మీయతను, దావీదుకు దేవునితో ఉన్న భక్తి విశ్వాసాలను, దేవుడు దావీదుకు కల్గించిన అనేక మేళ్ళను గూర్చిన తలంపు సమస్తమును దావీదు ఆ క్షణములో మరచిపోవునట్లుగా ఈ పాపమన్నది చేసింది. పాపమునకు నాటి సమయములో దావీదు ఇచ్చిన అవకాశాన్ని బట్టి, దావీదు యొక్క దైవ బలము కంటె ఈ పాపబలము అతి బలీయమైనదిగ మరిపించి, పాపము దావీదు కళ్ళకు కట్టినట్లుగ ప్రత్యక్షత చూపినందున తనకు తానే లోకాన్ని దైవత్వాన్ని మరచి తను చూచిన ఆ యొక్క స్త్రీ రూపము యొక్క ఆకర్షణ బలముగా క్రియ జరిగించుటనుబట్టి దావీదు పిచ్చివాడై తన్మయుడై కామోన్మాదియై చేసిన క్రియ మానవత్వాన్ని దైవత్వాన్ని దైవచట్టానికి దేవుని ధర్మశాస్త్రానికిని సమస్తమునకును వ్యతిరేకమైన స్వభావము కలిగి, పశువు కంటె నీచముగా ప్రవర్తించి, తాను చూచిన స్త్రీయొక్క వివరాలను తన అనుచరుల ద్వారా తెలిసికొని, ఆమెను చెరచి ఆమె భర్తను ప్రత్యక్షముగా కాక పరోక్షముగా అతి దారుణముగా అక్రమముగా చంపించే నీచ స్థితికి, దావీదు రాచనగరి ఎదుట పొంచియున్న పాపము జరిగించిన క్రియ - ఈ లోకములోని విశ్వములో ఎప్పుడు ఎక్కడ ఏ నరుని పట్ల జరిగించినట్లుగ చరిత్రలో విని యుండలేదు. అయితే దావీదు చరిత్రలో ఇది జరిగింది. ఈ విధముగా దావీదు రాచనగరి వాకిలి ఎదుట పొంచియున్న పాపము దావీదు మీద వాంఛ గలిగి అది జరిగించిన క్రియ - దావీదు దానిని ఏలిన విధానము - నాటి వేదచరిత్రలోనే ప్రాముఖ్యమైనదిగా పేర్కొనవచ్చును. ఈ పాపపు ఉరులలో కొన్ని తరముల వరకు దైవోగ్రత మూలంగా దీని ఫలితాన్ని పొందినాడు. ఎలాగంటే నాతాను ప్రవక్త ద్వారా తాను జరిగించిన పాప ఫలితాన్ని గూర్చి ప్రకటించుకున్న దావీదు 2వ సమూయేలు 12:7-15 వ్రాయబడిన లేఖన భాగములో నాతాను దావీదు చేసిన తప్పులను గూర్చి దావీదుకు వివరించి హెచ్చరించాడు.
ప్రియపాఠకులారా! దావీదు చేసిన ఈ పాపము ఒక్కటిగానే మనకు కనబడుతుంది గాని ఇందులో మూడు విభాగాలున్నవి. 1. ఊరియాను చంపించుట 2. ఆతని భార్యను చెరచుట 3. ఈ కార్యము వలన యెహోవాను దూషించుటకు దావీదు కారకుడుగా భావించబడుట. ఈ మూడు కార్యాల మూలముగా దావీదుయొక్క జీవితములో జరిగిన అనేకమైన దుస్సంఘటనలు వేదనలు సమస్యలు బాధలు భయాలు, తన పదవి విచ్ఛిన్నమై పిచ్చివానివలె తరుమబడినాడు. ఇవన్నియు జరుగుటకు ఈ క్రింది సందర్భాలనుగూర్చి తెలిసికొందము. రాజులు యుద్ధము చేయు కాలములో రాజు రాచనగరులో సుఖ భోగాలనుభవించుట 2. వివస్త్రయైన స్త్రీని చూచి ఆమెను మోహించుట. 3. ఆమెను చెరచుట - అంతియేగాక నిర్ధోషి, నిష్కపటి అమాయికుడైన ఆమె భర్తను యుద్ధరంగములో చంపించుట - ఈ మూడు తప్పులను గూర్చి దావీదు జీవితములో జరిగిన ఘోర విషాద సంఘటనలు - మొదట ఆ స్త్రీకి పుట్టిన బిడ్డ చచ్చుట ఇచ్చట నుండి పుత్రశోకమన్నది ప్రారంభము. 2. దావీదు కుమారుడైన అమ్నోను విషయములో జరిగిన పాపము - స్వంత చెల్లెలినే చెరచెను. 2వ సమూయేలు 13:8-18 కాబట్టి తామారు పిండి తీసికొని అప్పములు చేసి అమ్మోనుకు వడ్డించుటకు తీసికొని వెళ్ళగా ఆమెను చెరచుటన్నది మొట్టమొదటగా దావీదు చేసిన పాపము జరిగించిన క్రియ. మరియు అబ్షాలోము దావీదు పట్ల చేసిన దురాగతాలు. ఆమ్నోనును వెంటాడిన దావీదు పాపము, అబ్షాలోము విజృంభించగా దావీదు మానసికము గాను, శారీరకముగాను, ఆత్మీయముగాను క్రుంగదీసి పిచ్చివాని జేసింది. ఈ విధముగా ఒక్కసారి పాపమును ఏలిన దావీదు పాపము యొక్క దుష్ఫలితాన్ని కొన్ని తరాలుగ ఆ పాపము యొక్క దుష్ఫలితాలు మూలముగా తీరని వేదన దుఃఖము సంతాపము అనుభవించి, రాజ్య భ్రష్టుడై పిచ్చివాడుగ తిరిగిన సంఘటనలు కారణము - దావీదుకు ఇంటి వాకిట పొంచియున్న పాపము - దాని వల్ల ఉభయులకు కల్గిన వాంఛ, దావీదును పాపము ఏలిన విధము. ఆ తర్వాత పాపమన్నది దావీదు కుటుంబమును ఏలిన విధము అన్నది - అలనాడు కయీనుతో దేవుడు మాట్లాడిన మాట మన మూలవాక్యములో ఆది 4:7 నీవు సత్క్రియ చేసిన యెడల తలనెత్తుకొనవా? సత్క్రియ చేయని యెడల వాకిట పాపము పొంచియుండును,'' నీ యెడల దానికి వాంఛకల్గును - నీవు దానిని ఏలుదువు,'' అన్న ప్రవచన నెరవేర్పు ఈ విధముగా దావీదు జీవితంలో జరిగినట్లు గ్రహించవలసియున్నది. ఇంత గొప్ప శ్రమ అనుభవించిన దావీదును దేవుడు చేయి విడువలేదు. తిరిగి దావీదు సింహాసనము దావీదుకు ఇచ్చాడు. ఇశ్రాయేలు పోగొట్టుకొన్న సింహాసనము దావీదుకు అనుగ్రహించాడు - ఇశ్రాయేలుకు రాజుగా మరల దావీదును నియమించాడు.
.......
సృష్టి - సృష్టిలోని పశుపక్ష్యాదులు వృక్షజాలము జంతుజాలము - ప్రకృతి వాతావరణము ఇవన్నియు దేవుని ఆజ్ఞానుసారముగ మరియు నిర్ణయానుసారముగ తూచా తప్పక పాటిస్తూ - జంతువులు కాలమునుబట్టి చూలు కట్టడము, వృక్షజాలము ఋతువునుబట్టి ఫలించడము, సూర్యచంద్రాదులు నిర్ణీతకాలమును బట్టి దైవ నిర్ణయమునుబట్టి సూర్యుడుదయించుట హస్తమించుట క్రియను చంద్రుడు వెన్నెల నెల పొడుపు అను క్రియను, ఆకాశ మండలమందున్న నక్షత్రముల విద్యుత్ కాంతులను విరజిమ్ముచు ప్రకాశించడము మనము చూస్తున్నాము. వీటినన్నిటిని నరునియొక్క స్వాధీనములో ఉంచిన దేవునికి నరుడు విధేయుడు కాలేకయున్నాడు. కృతజ్ఞుడు కాకుండుటకు కారణమేమి?
ఆది 1:28 నరులను సంబోధించి దేవుడు నరులు భూమి మీద విస్తరించి ఫలించి భూమిని నిండించి దానిని ఏలుదురు అని ఉన్నది. ఇట్లు జరగాలంటే స్త్రీ పురుషుల కలయిక అవసరమైయున్నది. ఎందుకంటే ప్రతి జాతిలోను పోతు పెంటి సంభోగ క్రియ జరుపుచున్నప్పుడు నరకోటిలో కూడా ఇది జరుగవలెనని అందుకే పైవిధముగా పలికినాడు. స్త్రీ పురుష సంభోగము జరుగాలంటే మోహము కామము వీర్యోత్పత్తి ముఖ్యమైయున్నది. వీర్యోత్పత్తి కానిదే సంభోగ క్రియ జరుగనేరదు. అన్ని జీవరాసులతోబాటు నరునిలో కూడా ఇది అవసరమైయున్నది. దేవుడు కామాంధుడు కాడు. ఆయనకు వీర్య స్కలనము లేదు. సందర్భోచితముగా తన వాక్కు చేతనే వీర్యోత్పత్తి కావించి, ఆ క్రియకు శిశు జన్మ క్రియ జరుపగలడు. ఇందుకు నిదర్శనముకై యోహాను 1:14 ఆ వాక్యము శరీరధారియై కృపాసత్య సంపూర్ణుడుగా మనమధ్య వాసము చేసెను. అది దేవుని మహిమ క్రియయైయున్నది. నరుడు మహిమాన్వితుడు కాడు. కాకూడదు. కనుక దేవుడు మహిమ అను శక్తిని తనలో ఉంచుకొని, అనగా మహిమ పొందిన నరుడు కామ మోహ మద మత్సరాలకు బానిస కాడు. ఇది దైవ సన్నిధానమునకు ముఖ్యమైన యోగ్యత. ఇట్టి యోగ్యత పొందిన ఒక్క క్రీస్తే అనగా దేవుడని మనము గ్రహించవలసి యున్నది. మహిమ అనునది పరమాత్మకును - పరమాత్మ నరరూపమైన క్రీస్తునకు చెల్లును మరియు యేసుప్రభువు చెప్పినట్లుగా నాయందు విశ్వాసముంచువాడు నేను చేయు క్రియలు చేయునన్నట్లుగా ఆయన విశ్వాసులకు కూడా ఈ మహిమలో కొంత భాగము కల్గియున్నట్లు అపొస్త 3:1 శృంగారమను దేవళము దగ్గర పేతురు యోహానులు ఊచకాళ్ళ వానిని స్వస్థపరచుట ఇది నిదర్శనమైయున్నది. దేవుని మహిమపరచి వీరు మహిమ పొందినారు.
ఇట్లుండగా సృష్టిలో ఉన్న ఒక్క నరజంట లోనే నరసంతు దైవ వాక్యానుసారముగ ఫలించి అభివృద్ధి పొంది, భూమిని నింపాలంటే, కామక్రీడ తన్మూలముగా పిండోత్పత్తి జరుగవలసియున్నది. లోకరీత్యా ప్రతి కుటుంబమునకు ఇద్దరు తండ్రులున్నారు. మొదటి తండ్రి గృహ యజమాని, రెండవ తండ్రి గురువు అనగా బోధకుడు. మొదటి తండ్రి శిశు జన్మకును, వాని పోషణకును, కుటుంబ నిర్వహణకును ముఖ్యుడైయున్నాడు. రెండవ తండ్రియైన గురువు నరశిశువునకు జ్ఞానవికాసమునకు, నాగరికతకును సభ్యతకును, మంచి చెడు అను గుణ లక్షణములను అవగాహన చేసికొనుటకును, లోకములో జీవించుటకు కావలసిన వివేచనా జ్ఞానమునకు కారకుడైయున్నాడు. ఏదెను వనములోని సంఘటన ఈ పై విధముగా నరులైన మనకు తెలుపుచున్నది. ఇందులో గృహ యజమాని సృష్టికర్తయైన దేవుడు అనగా నరజన్మకు కారకుడు తండ్రి.
పశుపక్ష్యాదులలో యైతే జీవమున్నదిగాని ఆత్మ లేదు. తండ్రి ఏ విధముగా ఒక ఉద్యానవనము ఆవరణలో వేసుకొనునో అదే విధముగా దేవుడైన యెహోవా కూడా ఒక ఉద్యానవనమును వేసినాడు. అందులో తోట పనికి తన సృష్టియైన నరుని తన జీవాత్మతో నింపి అందులో ఉంచాడు. నేటి తండ్రి తన బిడ్డలను ఒరే! అబ్బాయిలు రోడ్డు మీదకు పోవద్దు. కారు క్రింద పడుతారు, అన్నట్లుగా తన బిడ్డలైన తొలి నరులను ఒరే! అబ్బాయిలు తోటలో అన్ని పండ్లు తినండి ఆ పండ్లు తినవద్దు. తింటే చస్తారని భయము పెట్టినాడు. కాని వాస్తవముగ ఆ చెట్టు ఫలములు మరణ తుల్యమైనది గాదు. ఎందుకంటే ఆ చెట్టు యొక్క ఫలగుణాతిశయములను గ్రంథములో దేవుని నోటనుండియే పల్కించినది. ఆది 3:6 మంచి చెడ్డలు తెలివినిచ్చు ఈ వృక్షఫలములను నీవు తినకూడదని దేవుని నోట నుండియే పల్కినట్లు మనకు తెలియుచున్నది. దేవుడు ఈ చెట్టును ఆ వనములో వేసి దానిని ఫలింపజేయుటలో ఆయనలో కూడా ఒక ఉద్దేశ్యము ఉన్నట్లు తెలియుచున్నది. అదేమిటంటే నేటి భూలోకపు తండ్రులు తమ బిడ్డలకు యుక్తవయస్సు వచ్చిన తర్వాత కన్యాన్వేషణ జరిపి వివాహము జరిపించుట, ఆ తర్వాత సంతానము కోసరము ఎదురు చూడడము అనేది ఒక్క ఆచారమైయున్నది. దేవుడు కూడా తన తొలి నరునికి యుక్తవయస్సు రాగానే అప్పటిలో కన్యలు లేరు గనుక కన్యాన్వేషణ జరపాల్సిన ఖర్మ ఆయనకు లేదు గనుక నరునిలోనే శల్యమును అన్వేషించి, ఆ ఎముకలలోనే ప్రక్కటెముకను తీసి చక్కని స్త్రీ రూపమును దోషరహితమైన కన్యను ఎలాంటి ఆడంబరములు లేక దిగంబరత్వముతో పెండ్లి చేశాడు. పెండ్లి అయితే జరిగింది కాని ఇది దేవుడు చేసిన మొట్టమొదటి పెండ్లి. ఇంతవరకు నరజంట దేవునికి ప్రియులుగాను విధేయులుగాను దైవసన్నిధానములో దైవాజ్ఞానుసారముగ బిడ్డలు ఏ విధముగా తండ్రికి లోబడి ఉంటారో అదే విధముగా ఆదాము హవ్వలు దేవునికి లోబడి జీవించిరి.
ఇట్లున్నట్టి నరజంటకు సంతానోత్పత్తికి కావలసిన రతి క్రియ ఏమిటో ఎరుగక సంభోగేచ్ఛలు ఎరుగక తమ యౌవ్వనాన్ని దేవుని ముందు ప్రదర్శిస్తూ - దిగంబర జీవితములో ఉన్న సందర్భములో వీరికి కొక్కోక మను శాస్త్రమును - ఆ శాస్త్రమునకు కారకమైన వన మూలికయైన ఫలము, దాని గుణ గణములు వివరించుటకు ఒక ఉపాధ్యాయుడు కావలసి వచ్చినది. వన మూలికయైతే ఫలించియున్నదిగాని దాన్ని తినుటకు ఉపదేశించు వ్యక్తి లేనందున నరజంట ఒకవైపు, మంచి చెడ్డలు అను కామశాస్త్రమునకు మూలమైన ఆ వృక్షము ఒక వైపు వేటికవి విడదీయబడి ఉండగా - దేవుని గృహమైన ఆ వనములో బాటసారిగా వచ్చి సర్పమున జొచ్చి నరజంటకు ఉపాధ్యాయ భంగిమలో కామేచ్ఛలకు గురియగుటకు దేవుడు నిషేధించిన ఫలములను భక్షింపజేయుటకు దైవత్వమును మరుగుపరచి, నిషేధ ఫలములను తినిపించి, తన గురుతర బాధ్యతను నెరవేర్చి బాటసారిగా వచ్చినట్టి నాశనకర ఆత్మ ఉపాధ్యాయ అవతారమును దాల్చి కామశాస్త్రంబునకు ఉపదేశములు జేసి, తాను వచ్చిన విధంబుగానే సర్పమును వీడి వెళ్ళిపోయినట్లు వెళ్ళిపోయెననుట; దైవ సన్నిధానములో దేవుడు సర్పమును శపించినప్పుడు అది మౌనియై యుండుటయే యిందుకు నిదర్శనమై యున్నది. దేవుని గృహమైన ఏదెను వనములో దేవుని హస్త నిర్మితములైన నరజంటకు దేవుని అనుమతి లేకుండనే నాశనకర ఆత్మను సృష్టించింది నేనే యెషయా 54:16 సర్పమున ప్రవేశించి, తాను కన్న బిడ్డలకు ఉపదేశించినట్లుగా దేవుని పరాయివానిగా జేసి, దేవుని మభ్యపెట్టి ఘాటైన బోధను జేసి తన ఉపాధ్యాయ ధర్మమును నెరవేర్చి కృతార్ధుడై నందువల్ల, నేటి వరకును నరకోటి కన్న తండ్రియైన దేవుని మరచి, నడిమంత్రమున పాపమునకును, దాని ఫలితమైన మరణమునకును గురువు మరియు తండ్రిగాయైన భుజంగుని, వాని రూపములను వాని నామధేయములను వాని పూజలను వాని వ్రతములను వాని పుట్టలను, నరసంతుకు సర్ప నామధేయములను మరియు సర్పమును దేవునిగా భావించి వాటికి ఆలయములను ఏర్పరచి, నిజదేవుని విస్మరించి సర్పదేవుని విశ్వాసులై జీవించినందువల్ల నిజదేవుడు ఉగ్రుడై అలనాడు దైవజనాంగమైన ఇశ్రాయేలీయులు సైతము ఏ సర్పము మూలమున లోకమునకు కీడు గల్గినదో - ఆ సర్పముల చేతనే కరపించి వారు వేదనపడుచుండగా - ఆ సర్పము ద్వారానే వారికి బుద్ధి జెప్పి మీ దోషము ఆదిలోనే మీరు విశ్వసించిన మీ తండ్రి వల్లనే గల్గినదని ఇత్తడి సర్పమును ఎత్తించి, అది చాలదన్నట్లు మత్తయి 23:33లో వలె సర్పములారా! సర్పసంతానమా! అనగా నరకోటి యావత్తు కూడా సర్పముయొక్క సంతానమన్నట్లుగా విసిగి పల్కినట్లు తెలియుచున్నది.
నరుడు కామాంధుడు అగుటకు దైవసృష్టిలో ఒక మర్మము మనకు బైల్పడుచున్నది. 1వ యోహాను 2:15-17 లోకమనగా దేవుని సృష్టి లోకములో ఉన్నవనగా దేవునిచే సృష్టించబడిన సమస్తమును వాటిలో భాగస్వామియైన జిత్తులమారి సర్పముయొక్క వాక్కులు ప్రియముగా ఆచరించుట. ఇందువల్లనే ఆది నరుడు లోకమైనట్టి సృష్టి ఫలమైనట్టి ఆ పండును దేవుని సృష్టియైన జంతుకోటిలో జిత్తులమారియగు సర్పవాక్కులకు దాసుడగుట వలన ఆ దాసత్వమనునది అనాది నుండి అనగా నరజంట దైవ ఆజ్ఞాతిక్రమము చేసిన లగాయతు నేటి తరమువారైన మనవరకును దాని ప్రభావము వ్యాపించియున్నది. అందునుబట్టియే దేవుడు నరకోటి జీవమునకు రెండు నిబంధనలను ఏర్పరచి, సృష్టి లగాయతు క్రీస్తను తన నరరూప జన్మ వరకును పాతనిబంధన కాలముగాను, క్రీస్తు జన్మ లగాయతు ఆయన మరణ పునరుత్థానము వరకు నూతన నిబంధనయను కాలముగాను, క్రీస్తు పునరుత్థానుడైన లగాయతు నేటి వరకును కడవరి కాలముగాను మూడు కాలములను నియమించి, నరునియొక్క బుద్ధిని మార్చాలని బహు ఓర్పుతో నిరీక్షిస్తున్నాడు. ఈ నిరీక్షణ కేవలము తన ఒక్కని ద్వారానే గాక త్రిరూపములో తానును అనగా తండ్రి కుమార పరిశుద్ధాత్ములుగా దేవుడును ప్రవక్తలును న్యాయాధిపతులు రాజులు దీర్ఘదర్శులు జ్ఞానులు అపొస్తలులు, వేదసాక్షులు హతసాక్షులు విశ్వాసులు అను వర్గములుగా నరులను తన వేద జ్ఞానముతో తర్ఫీదునిచ్చి, తన వాక్కును భూమి మీద విస్తరింపజేసి అనేకాత్మలను తనలో విలీనము చేసికొనుటకు క్రియ జేసి - నేడు సువార్తీకులను, బోధకులను, సంఘపెద్దలను, సంఘ కాపరులను బైబిలు స్త్రీలను ఒక వర్గమును, సంఘమను దైవ విశ్వాస కూటమిని ఏర్పరచి క్రియ జేయుచున్నాడు.
ఇట్టి సందర్భములో మన కొక సందేహము కలుగక మానదు. క్రైస్తవ కూటమిలో ఉన్నవారందరు సత్యవంతులా? పరిశుద్ధులా? దేవుని బిడ్డలా? అను సంశయము కలుగవచ్చును. యేసుప్రభువు చెప్పినట్లు నేనే క్రీస్తునని, అలౌకిక శక్తులను వెంటబెట్టుకొని క్రియజేయునట్టి బోధకులును, సత్యమును మరుగుపరచి అసత్యముతో కూడిన బోధలను జేయువారు కూడా క్రైస్తవ కూటమిలో లేకపోలేదు. పాప కార్యములు జరిగించువారు కూడా ఉన్నారు. ఇందునుబట్టియే యేసుప్రభువు మత్తయి 25:32 లోపల్కిన విధముగా గొర్రెలు మేకలు కలసి మేస్తుంటాయి. గొర్రెల స్వభావము గొర్రెలదే. మేకల స్వభావము మేకలదే. కనుక క్రైస్తవ కూటమిలో మేక స్వభావము, గొఱ్ఱె గుణములు కల్గినవారున్నారని తెలియుచున్నది. వాటి స్వభావము నెరిగినవాడు క్రీస్తే. ఆయనే తీర్పు తీర్చవలసినదిగాని తీర్పు తీర్చుటకు నరుని వంతు గాదు గనుక పాతనిబంధన నాటి కాలము కంటె నేటి తరములోనే ఎక్కువమంది విశ్వాసులున్నట్లుగా మనము గుర్తింపవలసియున్నది. అన్యుల కూటమిలో కొర్నేలివంటి విశ్వాసి ఉన్నట్లే; క్రైస్తవ కూటమిలో కూడా ప్రతి శాఖలోను కొందరు విశ్వాసులు లేకపోలేదు. ఇట్టి విశ్వాసులలో పేతురు వంటియు, పౌలు వంటియు, యోహాను వంటియు ఆదర్శకరమైన జీవితము జీవించాలని అభిలషించువారు కూడా క్రైస్తవ్యములో కొందరున్నారు. మరియొక వైపున గొర్రె చర్మమును కప్పుకొని గొర్రె మందలో చేరి, రోజుకొక గొర్రెను కాజేయు తోడేలు స్వభావము గల క్రైస్తవ సహోదరులు కూడా లేకపోలేదు. ఎవరెన్ని జేసినను దైవ వాక్యమునందును ప్రార్ధనందును నిలకడగల్గి నిబ్బరమైన మనస్సుతో లోకమును దానిలో ఉన్న వాటిని, దాని ఏలువాని, ఎదిరించు వీరుడు కావాలని దేవునియొక్క అభీష్టము సంకల్పమునైయున్నది.
దేవుని ఈ సంకల్పమును చెడగొట్టుటకు ఈ లోకనాధుడైన అపవాది అహోరాత్రులు నిర్విరామ కృషిని జరిగిస్తూ నరులను రాజకీయములలో చొప్పించి పార్టీ బేధములు కక్ష్యలు కలహాలు జాతిమత భేదములు పదవీ వ్యామోహము - దాని వలన మారణ హోమములు జరిగిస్తూ క్రైస్తవ కూటమిలో జేరి సంఘ బేధములను (కాపరికి సంఘమునకు పార్టీలు జాతి బేధములు) అంతస్థులు బేధములు ధనాశకు పురిగొల్పుట, క్రైస్తవ సంఘ ధనమును స్వార్థమునకు దుర్వినియోగము చేయుటకు పురిగొల్పి భ్రష్టు పట్టించుట; సంఘములలో కలహాలు రేపుట, మహమ్మదీయ కూటమిలో జేరి పఠాన్‌లు షేక్‌లు సయ్యద్‌లు మహమ్మదులు అవి విబేధములు కల్పించి ఐక్యతను చెడగొట్టుట. ఇది చాలదన్నట్లు దేశము మొత్తము మీద ప్రజలలో ద్వేషమును రేకెత్తించి, మాకు ప్రత్యేక రాష్ట్రము కావాలని ప్రభుత్వమును గోల పెట్టించి విప్లవముతో కూడిన మారణ హోమమును జరిగించుట. చదువరియైన సోదరా! దేవుడేర్పరచుకొన్న నరునియొక్క శరీర జీవాత్మలు భూమి మీద ఉన్నంత కాలము చేయుచున్న నిర్విరామ యుద్ధము ఎఫెసీ 6:12-17లో చదువగలము.
ఇందునుబట్టి చూడగా సర్పము మాటలను విని నరుడు చెడెనే గాని నరుని మాటలను విని సర్పము చెడలేదు. కాని నరుడు చేసిన క్రియనుబట్టి సర్పము చెడింది. అనగా పొట్టతో ప్రాకి మట్టి తినవలసిన ఖర్మ ఏర్పడింది. ఆ దినములలో పాము మాట్లాడిన మాటలను పాములు వినలేదు. వాటితోబాటు నరుడు కూడా ఏదోలే! పాము మాట్లాడుచున్నది. ఇది ఈలాగు మాట్లాడుట అలవాటే నేమోయని విరమించుకుంటే పరిస్థితి విషమించేది కాదు. నేటి నరుడు పాముల రాజా! నాగరాజా! అని సర్పమును ప్రబోధించుచున్నాడు. మన ఆత్మీయ జ్ఞానముతో ఆలోచిస్తే పాములకు రాజు అనవసరము. ఎందుకంటే వాటికి రాణి వాసము లేదు. కోట లేదు. ఆయుధాలు లేవు. యుద్ధము చేయాల్సిన ఖర్మ వాటికి లేదు. రాజ్యాన్ని ఏర్పరచుకోవాల్సిన అవసరము వాటికి లేదు గాని, నరుడు అంధుడై నరుని పతనానికి కారు చిచ్చుపెట్టిన సర్పమును శ్లాఘిస్తూ - అంత ఘనముగా దానిని పొగడుచున్నాడంటే వీడి అజ్ఞానమే పామును రాజుగా అధికారిగా జేసినట్లు కొన్ని సందర్భముల ద్వారా తెలియగలదు. నాగభూషణం, హెడ్మాష్టరు యస్.పి. భుజంగరావు, సర్కిల్ ఇన్‌స్పెక్టర్ నాగరాజరావు, కలెక్టర్ నాగరత్నం, గవర్నర్ ఫణీంద్రుడు, హెడ్ అకౌంటెడ్ నాగమణి, యమ్.ఎల్.ఏ సుబ్బరాయుడు వగైరా నామధేయములు సర్పముయొక్క లోక పరిపాలనను సూచిస్తున్నాయి. సర్పములో ఉన్న విషము, ద్వేషము, క్రూరత్వము యేసన్నలో లేకపోబట్టే ఆయన పేరు పెట్టుకొని జీవించుటకు నరుడు విముఖతను చూపిస్తున్నాడు. క్రైస్తవుడైన క్రీస్తను పేరునకు యోగ్యుడు కాలేకున్నాడు. కొందరైతే ఆ పేరుకు తగిన గుణాతిశయముల కొరకు నిత్యము ప్రయత్నిస్తున్నారు. నరుడు దైవవిశ్వాసిగా ఉండకపోవుటకు కారణమేమిటో రెండవ కొరింథీ 5:10లో వివరించినట్లు ప్రభువే - విశ్వాసులెవరో అవిశ్వాసులెవరో తీర్పు దీర్చు దినము వరకు మనము వివేచింపవలసియున్నది. అయితే దేవుడు విశ్వాసిగా నిర్ణయించు వానికిచ్చు ఆధిక్యత ఎట్టిది? దేవుడు తాను నిర్ణయించిన విశ్వాస బృందమునకు ప్రత్యేకముగా ఒక నామధేయమును ప్రకటన 21:2-4 ఇందునుబట్టి చూడగా అపవాది కూటమికి సర్ప నామధేయములు, సర్ప పూజలు, దాని తాలూకూ ఆచారములు ఆరాధనలు ఉండగా - దేవునియొక్క కూటమికి యెరూషలేము అని పరిశుద్ధ కూటమిగా ఏర్పరచి, దానిలో తానును తనతో తన విశ్వాసులును చిరంజీవులుగా జీవించునట్లు గ్రంథములో వివరించబడినది.
.......
భూమ్యాకర్షణ శక్తి :- ప్రభువునందు ప్రియమైనవారలారా! భూమికి ఆకర్షణ శక్తి ఉన్నదని నేటి మన భూలోక శాస్త్రజ్ఞానము ఖరారు చేసియున్నది. ఇందుకు నిదర్శనములు, ఒక వస్తువు పైకి ఎగుర వేయబడునప్పుడు అది మరల నేల మీద పడుట. చెట్టు పండు నేల రాలుట. మనిషి రెండు కాళ్ళతో నడవగల్గుట. సైకిలు రెండు చక్రములు ఉన్నను, ముందు వెనుకల బ్యాలెన్సునుబట్టి పడకుండ వెళ్ళుట, కోడి రెండు కాళ్ళు మీద నడుచుట. చెట్టు నిటారుగ నిలబడియుండుట. ఇట్టి శక్తి గల భూమిపై నరుని దేహము కూడా ఈ శక్తికి ఆకర్షింపబడి ఆత్మ జ్ఞానమును కోల్పోయి దేహజ్ఞానముతో ఈ మట్టి భూమిని భూమాత, భరతమాత, పుణ్యభూమి, మాతృభూమి అనియు వగైరా నామధేయములతో వర్ణించుచూ దీన్ని ఘనపరచుచు కొలువులు చేస్తూ రోమా 3:11-12లో ఇట్టివారిని గూర్చి పౌలు ప్రవచించుచున్నాడు. అయితే మానవుడు కొలుచుచున్న భూమి పవిత్రమైనదా? ఆది 3:17-19లో దేవుడు వక్కాణించియున్నాడు. ఈ విధముగా నరుడు పనికిమాలినవాడై భూమి మీద ఆశలు పెంచుకొని అసత్యమునకు అలవాటుపడి ఆశకు దాసుడై యాకోబు 1:14-15లో వలె భూమ్యాకర్షణకు లోనై లోకదాసుడై, జీవితమును వ్యర్థము చేసికొని భూమాతను కొలిచి ఆరాధిస్తే, ఈ భూమాత తన భక్తుడు ఎప్పుడు ఛస్తాడా? వానిని ఎప్పుడు మ్రింగెదమా? అని ఆరడుగుల గొయ్యి రూపములో నోరు తెరచుకొని గోరీల తోటలో ఉంటుంది. ఇది దేవునియొక్క శాపము. ఆదికాండము 3:17-19. ఈ భూమ్యాకర్షణ శక్తి ఆదిలో దేవుని సృష్టిపై మాత్రమే ఉండినది. అనగా జీవరాసులు, చెట్లు, క్రిమికీటకాదులు వీటిపై మాత్రమే దీని ప్రభావము ఉండినది. భూమికి ఈ ఆకర్షణ శక్తి అనుగ్రహించినవాడు దేవుడే. అందువల్లనే దేవుడు చేసిన ఆదాము హవ్వలు రెండు కాళ్ళతో నిలువబడి నడువకల్గినారు. అప్పటిలో అనగా వారు దైవాజ్ఞను మీరి పాపములో పడక మునుపు భూమియొక్క ఆకర్షణ వారిని ఏమియు చేయలేకపోయినది. ఏల? భూమ్యాకర్షణశక్తి కన్నను దానికి కారణభూతుడై దాన్ని సృష్టియైన పరమాత్ముని శక్తి గొప్పది. అందువల్ల దాని ప్రభావము దైవసృష్టియైన ఆ నరజంట మీద బలహీనమై ఉండినది. ఈ భూమ్యాకర్షణ శక్తికి నరుని అప్పగించడము దేవుడే. ఏలాగనగా మొట్టమొదట ఆది 3:17-19 లో వలె ఆదాము హవ్వలను భూమికి అప్పగించాడు. ఆ తర్వాత వారి ప్రధమ సంతానమైన కయీనును ఆది 4:11-12లో వలె ఈ ఆకర్షణశక్తి మానవునిపై ప్రభావమును చూప ప్రారంభించినది. నరులను భూలోకము ఆకర్షించు విధానము బహు విచిత్రముగా ఉంటుంది. ఇంటి మీద భార్యాబిడ్డల మీద, పొలాల, పైరుల మీద, భూఫలముల మీద అనగా బంగారు వెండి మొదలైన లోహములు, ధనాశ అలంకరణలు భోగవిలాసములు మొదలగునవి. అయితే నరసంతతి వారి తరతరములు ఈ భూమి మీద ఆశలు పెట్టుకొని మరణించవలసినదేనా?
సర్వసాధారణముగ ఒక గొప్ప వ్యక్తి చనిపోయిన తర్వాత అతని శవము వద్ద నిలబడి ఆతని విషయాన్ని గొప్పగ చెప్పి చూడండి సార్! ఈయన ఏ రకముగా బ్రతికాడో, ఎంత సంపాదించాడో, ఎంత చదువుకున్నాడో, ఎంత ఆస్థి ఉన్నది. దర్జాగా బ్రతికాడు గదా! ఆఖరుకు ఆయన ఏదియు తీసికొని పోకుండ, తుదకు తాను అత్యధిక సుఖమును అనుభవించిన శరీరాన్ని కూడా వదలిపోయాడు కదా! ఇంతేనండీ! నరజన్మ. రేపు మనము కూడా ఇంతే అని దైవత్వాన్ని ఒలకపోసి లెక్చర్లు దంచి, ఆ శవానికి అంత్యక్రియలు అయిపోయిన తర్వాత ఈ లెక్చర్లు దంచిన వ్యక్తి - ఆ చనిపోయిన వ్యక్తిని గూర్చి విమర్శించుచూ ఈయన ఏమీ భూమి మీద పెద్ద వైరాగ్యము కల్గిన వ్యక్తి వలె నటించుచూ ''ఆ చచ్చినవాడు వట్టి పిసినిగొట్టండి. కాకికి కూడా భిక్షము పెట్టేవాడు కాదు. దానధర్మములు కలలో కూడా ఎరుగడు. డబ్బు కోసము గడ్డియైన తింటాడు. పెద్ద గర్విష్టుడు. చాలా అక్రమముగా ఆస్థిని సంపాదించినాడు. దేవుడు ఎక్కడ చూస్తాడు. వాడిని పొట్ట ఉబ్బించి చావకొట్టినాడు,'' అని ఏకరువు పెట్టి ఎదుటి వ్యక్తులకు చెపుతుంటాడు. కాని చనిపోయిన వ్యక్తిలో ఉన్నట్టి ఆత్మ - ఎవరి ద్వారా ఆ చనిపోయిన వ్యక్తి దేహములోనికి పంపబడినదో ఆ స్థలమునకే ఆ ఆత్మ చేరును. తన ఫలములనిచ్చి తన జలములను త్రాగించి, తన సారముతో ఎదిగించిన మన నరశరీరమును భూమి కనికరము లేకుండ, ''నీవు నా సొత్తు అని ఉచితముగా కాకుండ నరుల చేత గౌరవ లాంఛనములతోను ఆరాధన కార్యక్రమములను జరిపించి, అందరు చూస్తుండగానే మ్రింగేసి, ''ఇతను నా సొత్తు అని నిశ్శబ్దముగా ఉంటుంది. కాని చనిపోయిన వ్యక్తి తాలూకూ వారిని అనగా స్నేహితులు, బంధువులు, ఇరుగుపొరుగు వారి ద్వారా భూమి - ''ఈ మృత శరీరము నా సొత్తు'' అన్నట్లుగా సాక్ష్యార్థముగా - ''ఈ చనిపోయినవాడు నా వాడు కాదు :- ఆదిసంభూతుడైన నరునియొక్క శరీరము భూమియొక్క సొత్తు అనుటకు సాక్షులు :- 1. సమాధుల తోటలో ఆరాధన జరిపే పాస్టరుగాని, స్వాములవారుగాని, మరి ఏ ఇతర అర్చ్యకుడుగాని వాని చేతి మట్టి. 2. చనిపోయిన వ్యక్తియొక్క పెద్ద కుమారుడో (ప్రధమ సంతానము) వారి చేతి మట్టి లేక కొరివి. ఆ తర్వాత వరుసబెట్టి బంధువులు స్నేహితులు అప్పచెల్లెళ్ళు వీరి చేతి మట్టి అంతయు దేవుడు చెప్పిన మాటకు సాక్ష్యము. ''అవును నిజమే ఈ సొత్తు నీ సొత్తే నాది కాదు అని మట్టి వేయుట.'' ఈ కుమారుడు నా కుమారుడు కాదు. ఈ స్నేహితుడు ఇక నా స్నేహితుడు కాదు. ఈ భార్య ఇక నా భార్య కాదు అని చేతి మట్టిని వేయుట.
ఇందునుబట్టి ప్రభువునందు ప్రియమైనవారలారా! భూమికి ఆకర్షణశక్తి ఉన్నదని, భూమియే ప్రత్యక్షముగా నిరూపించుచున్నది. కాని మనము అది గ్రహించలేక అంధకార శక్తులకు దాసులమై రెండవ కొరింథీ 5:1 మరియు 5-4లో వలె ఉన్నాము.
ఆత్మ ఆకర్షణ శక్తి :- ప్రభువునందు ప్రియమైన వారలారా! భూమ్యాకర్షణ శక్తినిగూర్చి మనము లోగడ తెలిసికొన్నాము. ఇప్పుడు ఆత్మ ఆకర్షణశక్తి ఎట్టిదో తెలిసికొందము. భూమియొక్క ఆకర్షణ శక్తి కంటె ఆత్మ యొక్క ఆకర్షణ వెయ్యిరెట్లు అధికము. ఆత్మయొక్క శక్తి భూమి కంటెను దానికున్న జ్ఞానమునకును అంతుపట్టనిది. ఆదికాండము 5:24లో ''హానోకు'' ఆత్మశక్తితో (సశరీరముగా) శరీరాత్మలతో పరలోకమునకు ఆరోహణుడై ఎక్కి వెళ్ళెను. ఆత్మయొక్క ఆకర్షణ భూమియొక్క బలహీనత రెండు తెలుస్తున్నవి. అదే విధముగా ఏలీయా - క్రొత్త నిబంధన కాలములో క్రీస్తుయొక్క మరణ పునరుత్థానము. యోహాను 20:17-18 ఇవి జరిగిపోయినవి. ఇక ఆత్మ ఆకర్షణ శక్తి అను ప్రభావములో జరుగవలసిన క్రియ ఏమిటి? ప్రకటన 20:4-6 మరియు 21:3-8 ఇవియే.
హృదయము :- హృదయమును బట్టి దేవుడు పొందిన పరితాపము. ఆది 8:21 యిర్మీయా 18-1 దేవుడు మానవుని సృష్టించినప్పుడు అతని హృదయము నిష్కల్మషముగను, పవిత్రముగను దేవుని దృష్టికి ఏ మచ్చడాగు, లేనిదిగ ఉండి ఏదెను అను దైవవనమును పోల్చి అనేక విధములైన సువాసనలు వెదజల్లు ఆలయముగా ఉండెను.
నేటి మానవ హృదయములో లోక దాసత్వము, ఓర్వలేనితనము, ధనాశ, గర్వము, అహంభావము, లోభము, దేవధూషణ కామవికారము, పగ, ద్వేషములతో కూడుకున్నదై యిర్మీయా 17-9లో వలె మోసకరమైన గుణములు ఘోరమైన వ్యాధి కల్గియున్నది. ఇందునుబట్టి యేసు ప్రభువు మత్తయి
15-7లో ఈ ప్రజలు తమ పెదవులతో నన్ను ఘనపరచుదురు. కాని వారి హృదయము నాకు దూరముగ ఉన్నది. యేసుక్రీస్తును వ్యర్థముగా ఆరాధించుట హృదయ కల్మషాల్లో ఒకటి; వాస్తవముగా మన హృదయము ఎవరికి నిజమైన ఆలయముగ ఉండవలెననునది మానవుడు గుర్తించలేకపోతున్నాడు. నేటి మానవ హృదయము భ్రష్టత్వములో అప్పుడప్పుడు పడుతున్నందువలన ప్రకటన 3-15 నీ క్రియలు నేను ఎరుగుదును. నా నోట నుండి ఉమ్మి వేయుచున్నాను అనగా హృదయశుద్ధి లేదని భావము. కీర్తనలు 34-18 హృదయము బహు ఘోరమైన వ్యాధి కలది, అది బహుమోసకరమైనది. అయిన ఈ హృదయమునకు మందు ఎచ్చట ఉన్నది? అందుకనే క్రీస్తు పాపభారము మోయుచున్న సమస్తమైనవారలారా! నా యొద్దకు రండి.
యెహెజ్కేలు 36:25-27 కాబట్టి ఏదెను వనము వలె ఉన్న మానవ హృదయములో ఇటువంటి బాధాకరమైన అపవిత్రమైన వాతావరణము ఏర్పడుతుంది. అంటే దేవుడు పెట్టే పరీక్ష కాదు, సైతాను పెట్టే ప్రేరేపణ కాదు. కేవలము మనయొక్క జ్ఞానేంద్రియముయొక్క పోకడనుబట్టియే. ఈ హృదయము యొక్క నడుపుదల నిర్ణయము కూడా ఉంటుంది. ఎవరైనను నాలోపాపము లేదనియు, నేను పాపము చేయుట లేదనియు, నీతిమంతుడనని చెప్పికొన్న యెడల వాడు యోహాను మొదటి పత్రిక 1-10లో వలె దేవుని వాక్యమును కోల్పోవును.
హృదయశుద్ధి అనునది ఏలాగు జరుగును? హెబ్రీయులకు 2:14-18 దీనినిబట్టి క్రీస్తు ద్వారానే జరుగవలెనని భావము.
మీ హృదయము కలవరపడనియ్యకుడి కలవరమేమిటి? యెహోవా, యేసు, పరిశుద్ధాత్మ ఈ ముగ్గురు ఎవరు? ఇది కలవరము కాదా? ఈ ముగ్గురు ఒకే దేవుడు అను సత్యము మనకు ఉన్నదా? నేనే మార్గము, పరిశుద్ధాత్మయైయున్నాడు. ''జీవము'' ఇది ఇచ్చువాడు దేవుడు. సత్యము - సత్యమునకు స్వరూపముగా దాల్చినవాడు ఎవరు? క్రీస్తే గదా! క్రీస్తునందు విశ్వాసము లేకపోతే హృదయశుద్ధి రాదు. యోహాను 1:4-5 చీకటి హృదయమునకు వెలుగు క్రీస్తే. వాక్యమునకు లోబడనొల్లని వారికి అనగా వాక్యమునకు హృదయమును చెవులను అప్పగించని అజ్ఞానులకు దేవుడు ఇచ్చు హెచ్చరిక.
అపొ 7-53 దేవుని దూతల ద్వారానే కదా? ఱాతిపలకలు మోషేకు చేరినవి. దేవుడు మోయవలసిన అగత్యమేమి?
.......
సూర్యుని క్రింద ఒక నరుడు జరిగించు క్రియలంతయు కూడా వ్యర్థమేయని ప్రసంగి చెప్పుచున్నాడు. ఏమిటి? ఆ వ్యర్థమో మనము గ్రహించాల్సి ఉంది. నరజన్మకు భూమి మీద సుఖమున్నది అనునది ఋజువైతే ప్రసంగి తన లేఖనములో చెప్పినది వ్యర్థమే. అదే విధముగా నరునిలో రోగాలు లేవనుట కూడా ఋజువైతే యేసు చెప్పిన మాట అనగా నేను రోగులకేగాని ఆరోగ్యవంతులకు వైద్యుడక్కర లేదన్నట్లుగా రోగము లేనివాడెవడైనా ఉన్న యెడల యేసు చెప్పిన మాట వ్యర్థమే. ఎంత ఆరోగ్యవంతునిలోనైనను పడిశము, జ్వరము, ఒళ్ళునొప్పులు, అజీర్ణము, మలబద్దకము, కండ్లకలక, కనీసము తినినది జీర్ణము చేసుకోలేని అనారోగ్యము గల్గినవాడు లోకములో లేకపోలేదు. ప్రతివాడు ఏదోయొక్క రోగము కల్గియున్నట్లు ఇందునుబట్టి తెలియుచున్నది.
ఇంక విచారము :- ఈ విచారమనునది రాజు మొదలుకొని అడవులలోని మారుమూల ప్రదేశములలోని గుడిసెలో కాపురమున్న గిరిజనుని వరకు కూడా - ఈ విచారమనునది దీని మూలముగ కలుగు అశాంతి, భయము, వేదన ప్రబలి నరజన్మను క్రుంగదీస్తున్నట్లు మన నిత్యజీవితములో మనము అనేక వ్యక్తుల జీవితాన్నిబట్టి తెలుసుకుంటున్నాము. నరునియొక్క జీవాత్మ నరశరీరమును వదలి వానిని మరణ పాత్రునిగా జేసినంత వరకును నరజన్మకు విశ్రాంతి లేదన్నట్లు ఈ దిగువ ఉదహరించబడు వేదసత్యములో ఆ తర్వాత మానవ శాస్త్రములు నిరూపించగలవు.
కనుక లోకములో దైవవిశ్వాసిగా జీవించు నరునియొక్క జీవితమునకు ఉదా|| దైవసృష్టియైన మడుగులోని తామర తీగ జీవితముతో సరి పోల్చవచ్చును. ఎట్లనగా మడుగులోని తామర మొక్క నిర్మలమైన ప్రశాంత జలముల మీద తేలియాడుచు జలములోని మలినములకుగాని అందులోని నీటి బిందువులకు కూడా తామరాకుకు అంటక, ఒకవేళ ఆ బిందువులు తామరాకుపై పడినను మరల అవి ఆకు మీద నుండి జారి మడుగులోనే పడును. అదే విధముగా లోకసంబంధమైన ఆశలు వ్యామోహములు భక్తునియొక్క శరీరమును తాకినప్పుడు, ఆ భక్తుని ప్రభావము వాటిని లోకమునకే ప్రయోగిస్తుందిగాని తామరాకు వంటి జీవితమునకే వానిని ఆ మలినములుగాని ఆ జలబిందువులుగాని అంటనేరవు.
అదే విధముగా మడుగులోని కప్పలు సైతము ఆ ఆకుల మీద కూర్చునుట మనము తరచు చూస్తున్నాము. కప్పకు కావలసిన మలినపూరితమైన ఆహారము దొరకనందున అది మరల నీళ్ళలోకి దుముకుటను కూడా మనము చూస్తున్నాము. లోకములో ఉన్న అనేక రకములైనట్టి వివిధ పరిమళములు వెదజల్లు పుష్పజాతులు ఉన్నను అవి కేవలము నరులయొక్క ఆడంబరములకును, వారి ఘనతలకును దండలుగా హారములుగా అల్లబడి ఉపయోగకారులై కేవలము నశించిపోవు నరులయొక్క స్త్రీ సమాజ శిరస్సుల కొప్పులలోను, లోకరాజ్యముల పదవీ అలంకృతులైన మంత్రులు, ప్రధానులు, నాయకులు, దేవుళ్లుగా ఎంచబడు విగ్రహాలకు, తుదకు చనిపోయిన శవముల పైన కూడా ఇవి వేయబడి నరుని జీవితము వలెనే ఇవి కూడా నిర్జీవములై వాడబారి నశించిపోవుచున్నవి.
అయితే మడుగులోని తామరపువ్వు బహు ఆకర్షణీయమైయుండి దేవునియొక్క వెలుగైన సూర్యుని యొక్క కిరణ ప్రసార ప్రభావమూలమున వికసించబడి, గండు తుమ్మెదలను దైవసృష్టియైన కీటకాదులకు తనలోని మకర మాధుర్యమును చవి చూపించి, దైవ వెలుగునకు దాసోహమై అనగా విధేయత చూపి తానున్న మడుగులోనే తనయొక్క జీవితమును సార్థకము చేసికొని, దైవ ప్రీతికర జీవితములో ఉన్నట్లు నేటి మన నరజ్ఞానమునకు గోచరము కాగలదు. చిత్రమేమంటే నరులైన మనము గులాబి, మల్లె, జాజి, సంపంగె, బంతి, చేమంతి వగైరా పుష్పములను ఎంతో ప్రీతితో ఎన్నో విధంబులుగ వాటిని దండలుగా మడచి, మన చిత్త ప్రకారము మన ఇంటిలోని స్త్రీల శిఖలోను, మన గౌరవార్థముగా మన మెడలోను, ఇతరులను సన్మానించుటకు వారి మెడలోను వేయుచున్నాముగాని, ఎప్పుడైనను ఎక్కడైనను ఏ సమయమందైనను తామర పూవులను దండకట్టి ఎవరి మెడలోనైన వేశామా! ఒక్కసారి ఆలోచించండి మన ఇంటిలో స్త్రీలు శిఖలోనైనను పెట్టుచున్నారా?
మడుగులోని కప్ప కూడా తామరాకు మీద కూర్చుంటుందే గాని, అయితే వికసించిన తామర పువ్వులోని మకరందమును చవి చూడనేరదు. అయితే వికసించిన తామరపువ్వులోని మకరందమును దైవ ప్రేరేపణ మూలమున, దైవసృష్టియైన గండు తుమ్మెదను వాడు - కడుపార త్రాగి దైవానుభూతిని పొంది, వెళ్ళుచుండుట మనము చూచు దినచర్యలో ఒక్కటి. మడుగులోని కప్ప ఆ విషయాన్ని ఏమియు పట్టించుకోదు. ఆ తామరాకు మీద కూర్చుని మడుగులోని చేపపిల్లలనుగూర్చియు, ఇతరత్ర కీటకముల వేటాడుటనుగూర్చియు ఆలోచిస్తుంటుంది.
అయితే తన నిర్ణయము ప్రకారము తామర మొక్క ఉదయముననే సూర్యకిరణ ప్రభావమున తనలోని ఫలమైన పుష్పములను నీతి సూర్యుడైన క్రీస్తునకు సంపూర్ణముగా సమర్పించుకొని, దైవత్వానుభూతిని పొంది దైవత్వము పొందడం ఇందులోని గొప్ప నిగూఢ సత్యమైయున్నది. నరులమైన మనము అట్టి పరిశుద్ధ తామర తీగయొక్క అడుగులోని వ్రేళ్ళయందున్న గడ్డలను తినుటకు, మాధుర్యముగా ఉండబట్టి అప్పుడప్పుడు మనము, మన పిల్లలు కూడా తినుట రివాజు.
తామర పుష్పమునకు దైవత్వము ఉన్నదనుటకు ఆధారములు :- ఇందులకు ఈ ఉదాహరణకై ఇతరుల నామమును ఉచ్ఛరించుట కంటె హిందూ జీవితము నుండి, నిజ క్రైస్తవ జీవితములో ప్రవేశించిన నేనే సాక్షిని. ఎందుకనగా నా పూర్వీక జీవితములో మడుగులోని తామర పుష్పము మీద కూర్చున్న దేవతకు సాష్టాంగ నమస్కారము చేసి ఫలపుష్ప నైవేద్యంబులలో ఆరాధించినాను. నేను నా జీవితములో ఆ తామర పుష్పాన్నే ఆరాధించినాను. ఎందుకంటే ఆ పటములోని దేవత ఎవరో నాకు తెలియదుగాని ఆ పుష్పము మీద కూర్చున్న దేవత మానవ కల్పితమని, ఈ దినములలో ఇది నరుల చేత కల్పనాచిత్రము. అయితే యదార్థమైనది సహజమైనది ప్రకృతిలో ఉంటున్నది. తెలుపు ఎరుపు మొదలైన పలురంగుల పుష్పములతో మనస్సునకు ఆహ్లాదమును కల్గించునది తామర పుష్పమే. కనుక తామర పుష్పమునకు ఇట్టి యోగ్యత ఉండబట్టి నరులచేత పటానికి ప్రేము కట్టించుకొని నట్టింట్లో నరులచే ఆరాధింపబడుచున్నది. నా పూర్వీక జీవితములో తెలియని దశలో నారాయణుని నేను ఆరాధించునప్పుడు బొడ్డులో నుండి తామర వచ్చినట్లు - ఆ తామరలో ఒక దేవత ఆసీనురాలైయున్నట్లును ఆమె లక్ష్మియని మా పాత హైందవ జీవితములో అజ్ఞానములో నేను ఆరాధించుచుండెడివాడను. అయితే నాలో క్రియ జరిగించుచున్న పరిశుద్ధాత్మ దేవుడు - ఆ నగ్న సత్యములను బైల్పరచి, నాచే యిట్టి విరచితమును విరచింపజేయుట కూడా సర్వదా కృతజ్ఞుడను. ఇంతకు ఈ అంశమును గూర్చి ఎందుకుగా వ్రాయవలసి ఉన్నదంటే ఇందులో ఒక గొప్ప దైవిక మర్మము ఆత్మ జ్ఞానము చేత ఈ క్రింది విధముగా నేను వెలువరించుచున్నాను. దీనిని సకల క్రైస్తవ కోటి కాదనుట, విమర్శించుట జరిగినట్లయితే అందులకు నేను శిక్షార్హుడను. పై ఉపమానములో మొట్టమొదటిది మడుగు :- ఇది భూలోకమునకు సాదృశ్యమైయున్నది. మడుగులో ఏ విధముగా సమస్త విధములైన అనగా చేపలు, కప్పలు, నీటి పాములు, ఇంకను చిత్రవిచిత్రములైన క్రిమికీటకాదులు, నరుని ఆరోగ్యాన్ని భంగము గల్గించు సూక్ష్మజీవులు, పశువుల మూత్రాదులు, ఊరివారు గుంజే మురికి బట్టల మలినములు వగైరాలు మిళితమై ఉండి, ప్రశాంతకరమైన జలములుగ పైకి కనపడుచు ఎల్లప్పుడు పైకి నిమ్మళముగా ఉండునట్టి లోకమునకు ఇది సాదృశ్యమైయున్నది. ఇట్టి లోకములో పరమాత్ముడైన యెహోవా చేతను - ఆయన కుమారుడైన యేసుక్రీస్తు చేత ఏర్పరచబడిన ద్రాక్షతీగయే క్రైస్తవుడు. ఎందుకనగా క్రీస్తు ద్రాక్ష తీగ అన్నప్పుడు ఆయన ఏర్పరచుకున్న భక్తుడు కనీసము ద్రాక్షతీగ లేక తామర తీగగానైన ఉండాలి.
జలబాప్తిస్మము అను క్రియ ద్వారా ఆయన ప్రార్థన అను జీవజలముతో క్రైస్తవ జీవితమును పొందిన దైవదాసుడు - ఇతనిలో లోకమాలిన్యముగాని, లోకేచ్ఛలుగాని అంటకుండుటకు ప్రత్యేకమైన ఆత్మస్థైర్యముండుటయు, తామరాకు మీద ఉన్న నూగు యిందుకు సాదృశ్యము. అది పరిశుద్ధత క్రింద లెక్క. ఇందునుబట్టి ఈతనిని ఆతని శోధనలుగాని, లోకమాలిన్యముగాని అంటదు గనుక ఈ నీళ్ళు సాదృశ్యమై యున్నవి.
ఇంక మడుగను లోకములో తామర తీగయను క్రైస్తవ బోధకుడు స్థాపించినట్టి వానిని ఆవరించి నట్టి సంఘముల సంగతి మనము తెలుసుకోవలసియున్నది. ఈ సంఘమను మడుగులో చేపలు, చేప పిల్లలు వీరు. శారీరేచ్ఛలతో అనగా సంసారమను నీళ్ళను ఈదుచు, క్రీస్తును సంకలో పెట్టుకోవాలని ప్రయాసపడువాడు. అంతేగాని వారి హృదయాల్లో క్రీస్తు ఉండడు. చేపలేవిధముగా అహర్నిశలు ఆ నీళ్ళలో ఈదుచుండునో అదే విధముగా వీరు భూలోక ఆశతో వాటి ఫలాపేక్షలనుబట్టి అడ్డమైన తిరుగుళ్ళు తిరుగుచు, చేపలేవిధముగా బెస్తవాని వలలో పడి అగ్నికి ఆహుతియై పోతున్నవో - ఆ విధముగానే మరణానికి మరణ ద్వారాన్ని కాచుకొను సమాజము.
ఈ చేపలలో ఒకదానికొక దానికి ఐకమత్యము ఉండదు. తెల్ల చేపకు నల్లచేపకు పొత్తు కుదరదు. మట్టి గిడసల పార్టీ ఒకటి. కొఱ్ఱమేను పార్టీ ఒకటి, మలుగు పార్టీ ఒకటి, బొమ్మడాయ పార్టీ వేరొకటి, తేలుమేను చేప పార్టీ మరియొకటి - ఈ రకముగా ఇవి మడుగులోని చేపల పార్టీలు ఇవి. ఇంక నీళ్ళ చేపల పార్టీలు. అరుజుగండి, జల్లపక్కె వగైరా నామధేయములతో చిన్న పెద్ద తారతమ్యములతో తళుకు తళుకుమంటూ మెరుస్తూ ఒకదానికొకటి పొత్తు కుదరక సందర్భానుసారముగా ఒకదానినొకటి భక్షిస్తు తళ్ళుక్కు తళుక్కుమని తమ పొలుసులతో జిగేలుమని మెరయుచు, మడుగులోని చప్పుళ్ళకు ఉలిక్కిపడుచు భయాందోళన జీవితమును సాగిస్తూ ఉన్న అభాగ్య జీవితములో నరులే ఈ చేపలు. అనగా నరులలో కూడా ఈ విధముగానే అంతస్థులనుబట్టి పదవులనుబట్టి జాతులను కులములనుబట్టి, ఆస్థులనుబట్టి రకాలవారీగా పై చెప్పిన చేపల వలె ఆడంబరముగా కనపడుచు క్షణం క్షణం భయాందోళన జీవితముతో దైవసన్నిధిలో మరణపాత్రమును పొందు అభాగ్య సోదరులు.
ఇంక బురద చేపలంటే - కటిక చీకటిలో ఉండి దేవుడే లేదను నాస్తిక జీవితములో జీవిస్తూ ప్రాణాలతోనే దైవోగ్రతకు పల్చబడి (పట్టబడి) అకాల మరణము పొంది విలవిల తన్నుకొని చచ్చునట్టి అభాగ్యులే ఈ బురద జాతికి చెందినవారు. అనగా మడుగులోని కప్పవంటి జీవితము. నామక్రైస్తవులే వీరు - తామర మీద అనే బోధకుని అంటిపెట్టుకొని, తామరాకు అనునట్టి ఆతని జీవితమును అనుసరించాలని ఆతనితో ఉంటూ ఆతని ప్రవర్తనను మెచ్చుకుంటూ ఆతని వెంటబెట్టుకొని లోక సంబంధమైన ఐహిక విచారములతో సతమతమగుచు, తమయొక్క ఐహిక విచారములను ఫాస్టర్ల ప్రార్థనతో ముడిబెట్టి ఉదా|| సార్! ఫాస్టరుగారూ! మా అమ్మాయి ఈ ఏడు బి.ఇడి. ప్యాసవ్వాలి. ప్యాసయేట్లు ప్రార్థన చేయండని అంటారు. వీరేమి చేయరు. ఆ తర్వాత నా భర్త అలిగి వారి తల్లిగారి ఇంటికెళ్ళినాడు. ఆయన మరల మారుమనస్సు పొంది మా ఇంటికి వచ్చునట్లు ప్రార్థన చేయండి. ఇంకొకాయన సార్! మా ఆడవాళ్ళకి దెయ్యము బట్టినది. దయ్యము వదలునట్లు ప్రార్థన చేయండి. ఇంకొకరు వచ్చి సార్! మా అబ్బాయి రేపు ఇంటర్యూకి వెళ్ళుచున్నాడు. ఆతను ఇంటర్య్వూలో సెలక్టగునట్లుగా ప్రార్థన చేయండి. మరియొక్కరు సార్! నాకు గవర్నమెంటు నుండి డబ్బు రావాలి. అది తొందర్లో వచ్చేటట్లు మా కొరకు ప్రార్థన చేయండి. మరియొక్కరు వచ్చి సార్! నాకు మనశ్శాంతి లేదు. నాకు మా కుటుంబానికి మనశ్శాంతి కల్గునట్లు ప్రార్థించండి.
ఇవ్విధంబుగ తామరాకు మీద కప్పలు ఏ విధముగా వరుసగా కూర్చుని దుముకుచు ఎక్కు చందంబుగ సంఘస్థులు ఏకరువు పెట్టి పీడిస్తుందురు. అయితే ఈ సంఘమునకు తెలియని రీతిగా ఆ దైవదాసునియొక్క జీవితము పట్ల దేవుడు సానుభూతిపరుడై, ఆ దైవదాసుడు చేయు ప్రార్థన ఆతని ఆత్మవిశ్వాసమును గుర్తించిన ఆ దేవుడాతనిని ఆతని కుటుంబాన్ని మాత్రమే ఆశీర్వదిస్తున్నట్లుగా - ఆ దైవదాసునిలోని ఆత్మీయ పుష్పమును వికసింపజేసి, అందులోని మాధుర్యమును ప్రతినిత్యము చవిచూచి అనుభవించుచుండును. ఆ విషయము ఆత్మీయముగా దైవదాసునికి, ఆతని ప్రతిష్టించిన ప్రభువుకు మాత్రమే తెలియును. దైవదాసునిలో వికసించిన హృదయ పుష్ప మకరందపు రుచి దూరప్రాంతములకున్న తమ్మెదల వంటి దైవదాసులకే తెలియును గనుక ఇతనితో సఖ్యత ఏర్పరచుకొని, అప్పుడప్పుడు ఆయొక్క రుచి అనుభవించి, పుష్పములోని మకరందమును త్రాగు తుమ్మెదలవలె ఉంటూ వచ్చి పోవుచుందురు. ఈ విధముగా ఆ దైవదాసుని జీవితములో మడుగువంటి ఈ లోకములో జరుగుచున్నది గనుక ఈ ఉపమానమునుబట్టి మనము నేర్చుకోవలసినదేమిటంటే ఒక దైవదాసుని కప్పల వలె సంఘము ఘోష పెట్టినను, ఆతనిని అంటుకొని జీవించినను, ఆతనిలోని వాక్య జ్ఞానమును, ప్రార్థనాశక్తిని గుర్తించి, ఆతని సువాసనకర జీవితమును చవి చూచి, ఆతనిని వెంబడించిననాడే కప్ప జీవితము నుండి తామర జీవితములోనికి మార్చబడగలడు. తామర తీగ లోకరీత్యా బలపడవలెనంటే మడుగులోని సారమే ఆహారమై యున్నది. అదే విధముగా ఒక దైవదాసుడు దైవత్వములో బలపడి, లోక మనుగడను గురించి పాపమను ప్రళయము నుండి రక్షణ కొరకు పోరాడాలంటే సంఘ సహకారాలు ముఖ్యమైయున్నవి. అది గుర్తించక చీటికిమాటికి బోధకుని పట్టుకొని మన అక్కరకు ఆయనను వాడుకుంటూ, ఆయన అక్కరలో ఆయన అవసరాలకు మనము దూరమైతే సంఘాభివృద్ధి, సంఘ మనుగడ, ద్రాక్షావళ్ళియొక్క ఫలింపు శూన్యమని పై ఉదాహరణ ద్వారా క్రైస్తవ భక్తకోటియైన మనము ఆయన పరిశుద్ధ సంఘముగా తీర్చబడిన మనము గ్రహించవలసియున్నది. ఇది గ్రహించిననాడే నిజమైన ద్రాక్షావళ్ళియైన క్రీస్తుయొక్క ఆత్మీయతలో ఆయనను అంటుకొని జీవిస్తూ - ద్రాక్షావళ్ళి తీగలమని చెప్పుకుంటూ జీవిస్తున్న మన జీవితాలు ఫలింపు గలవై, మంచి ద్రాక్షలను ఫలించి అనగా ఆత్మీయ ఫలములు ఫలించి - ఆత్మ దేవుని మహిమ పరచగలవు. లేనట్లయితే కారు ద్రాక్షావళ్ళిగా మారి ఫలశూన్యములైన మరియు అయోగ్యమైన కారుద్రాక్షలను పంటకు కారణములు కాగలవని యిందు మూలముగా మనము గ్రహించవలసియున్నది గనుక లోకమనే మడుగులో ఉన్న మనము దైవ ప్రతిష్టితుడైన బోధకుని పట్ల బహు జాగరూకతతో ప్రవర్తింపవలసియున్నది.
పై ఉపమానము నుండి మనము నేర్చుకోవలసిన దైవనీతి :- మడుగు అన్నది ఈ లోకము. ఈ మడుగు అను లోకములో తామర తీగనునది ఒక దైవదాసుని జీవితముగా మనము గ్రహించవలసి యున్నది. ఎందుకనగా యోహాను 15:1లో యేసుప్రభువు ఈ లోకములో జీవించినప్పుడు తనను ద్రాక్షావళ్ళికి పోల్చుకున్నట్లును, తానే విధముగా ద్రాక్షావళ్ళియై యున్నాడో అదే విధముగా మనలను కూడా యోహాను 15:5లో విధముగా ద్రాక్షావళ్ళిని నేను తీగలు మీరని అన్నాడు గనుక ద్రాక్షావళ్ళియైనట్టి యేసుప్రభువుతో ఈ లోకసంబంధముగా తామర తీగ వంటి నిర్మల దైవాకర్షణీయ జీవితమును జీవించాలంటే, పరమ రక్షకుడైన యేసుప్రభువు వంటి ద్రాక్షావళ్ళి వంటి పవిత్ర జీవితములో జీవించాలంటే, మొదట జలములలో లోకసంబంధముగా ఏ వృక్ష సముదాయమునకుగాని, ఏ ఇతర పుష్పజాతి తీగలతోగాని వృక్షశాఖములతోగాని, ఇతర రకములైన భక్ష్య యోగ్యములైన సొర కాకర బీర గుమ్మడి చిక్కుడు పొట్ల వగైరా తీగల వలె నిష్ప్రయోజనకరమైన జీవితము జీవించుట వ్యర్థమని, ఎందుకనగా ఈ తీగలు ఋతుక్రమము ప్రకారము మొలిచి, కాలానుగుణ్యముగా నరులకు ఫలము లిచ్చి తర్వాత ఎండిపోవుచున్నవి. అనగా కాపు కాసిన అనంతరము వాటి జీవితము నిష్ప్రయోజనమగుచున్నది.
అయితే మడుగులోని తామర తీగ ఏ ఇతర వృక్షశాఖములతో సంబంధము లేక కీర్తన 23:2వ వాక్యములో వలె శాంతికర జలముల యొద్ద నన్ను నడిపించుచున్నాడు,'' అనిన వాక్యానుసారముగా ప్రశాంతమైన జలమైన మడుగులో ఈ తీగ ఏకాంతముగా జీవిస్తూ మడుగునకు అందము నిచ్చుచు, తన జీవితమును నిర్మల పరచుకొనుచు ఇతర రకములైన పుష్పములతోగాక ప్రత్యేకమైన తనలో నుండి వికసించిన పుష్పముల చేత సూర్యకిరణములను ఆకర్షించి పుష్పించి, మడుగునకు నూతన శోభను కల్పించుటయేగాక చూపరులకు అందమును తుమ్మెద జాతులకు జిహ్వచాపల్యము అనగా తనలోని మకరందమను మాధుర్యమును చవి చూడాలని అభిలషించునదియై జీవించుచున్నది.
ఇందుకు సాదృశ్యముగా మడుగు అను లోకములో వున్న దైవభోధకుని పోల్చవచ్చును, ఎందుకనగా సువార్త బోధకుడు లోకములో ప్రత్యేకించబడి సువార్త కొరకు దేవుని చేత పిలువబడి జనములలో నుండి ప్రత్యేకముగా దేవునిచే ప్రతిష్టింపబడుచున్నాడు. ఇట్టివాడు తామర తీగగా జీవిస్తూ - లోక మడుగు నుండి ఇతను ప్రత్యేక జీవితము జీవిస్తూ మడుగులోని నీటిబిందువులు తామరాకు మీద పడినను తామరాకును అవి అంటక మరల జలములలోనే అవి రాలిపడుచున్నవి. ఇందుకు కారణము సృష్టికర్త దానికి అనుగ్రహించిన జల నిరోధక ప్రభావమే. అట్టి దైవ ప్రభావము పొందియుండబట్టి తామరాకు నీట మునుగకయు నీటిలో కుళ్ళి పోకయు ఎల్లప్పుడు నూతనత్వముతో ఎదుగుచు, ఆ మడుగులోని జీవరాసులకు ఆశ్రయమిచ్చుచు నిలకడగా ప్రశాంతముగా జీవిస్తున్నది.
అదే రకముగా సువార్త బోధకుడు కూడా లోకవ్యామోహములు అంటనివాడై ఒకవేళ లోకము దాని క్రియలు ఆతనిని తాకినను, దేవుడు తనకిచ్చియున్న శోధన నిరోధక అను ప్రార్థనాశక్తి చేత వాటిని తొలగ తోసుకుంటూ నిలకడగా జీవిస్తున్నాడు. ఇట్టి తామర తీగ వంటి జీవితములో ఉన్న బోధకుని ఆవరించియున్న సంఘమునుగూర్చి మనము తెలుసుకోవలసియున్నది. మడుగు అనే ఈయొక్క లోకములో బోధకుని - బోధకుడు ఏర్పరచుకున్న సంఘము మడుగులోని జీవరాసులకు పోల్చదగును.
ఎలాగంటే చేపలు :- ఇవి తామర తీగలను రాచుకొంటూ తామరాకుల నీడన ఉంటూ - తామరతీగ యొక్క విలువను గుర్తించలేక తామరాకు మీద కూర్చుని దొంగ ప్రార్థన చేసే కొంగలకు బలియగుచున్నవి. ఇవి బోధకుని నిర్లక్ష్యము చేసి ఆతని బోధకు చెవినీయక చర్చీలో కూర్చున్నను, ధ్యానమును లోకము వైపు మరల్చుకున్న క్రైస్తవ సోదరులకు సాదృశ్యములైయున్నవి. తామరాకు మీద నిలుచున్న కొంగ దీర్ఘ ప్రార్థన చేయుదానివలె ఒంటి కాలి మీద నిలువబడి తామర తూండ్ల దగ్గరకును, దాని ఆకు మరుగున తిరుగుచున్న చేపలను బహు సునాయాసముగా భక్షించుచున్నది. ఈ కొంగయనునది దైవదాసుని వెన్నంటి ఉన్న అపవాదియొక్క దూతయైయున్నది. అనగా అబద్ధ బోధకునికి ఇది సాదృశ్యము. ఇట్టివాని ప్రార్థనకు చెవినిచ్చి, వానిచే నాశనకరమైన జీవితములో పడు సోదరులకు ఇది సాదృశ్యమైయున్నది.
ఇందులో విశేషమేమంటే క్రైస్తవ మతమనునది మతము కాదు, కులము కాదు, లేక గోత్రము కాదు. క్రైస్తవ మతమనునది ఒక రాజ్యము. దీనిని క్రీస్తు సామ్రాజ్యమనదగును. దానియేలు 7:14, మత్తయి 16:28, 2 పేతురు 2:11. ఇట్టి సామ్రాజ్యములో జీవించుచున్న మనమందరము క్రీస్తు బిడ్డలుగ నిజదేవుని సన్నిధిలో ఎన్నిక చేయబడియున్నాము. అదేవిధముగా మడుగులో ఉన్న చేపలన్నియు చేపలుగా పిలువబడుచున్నను, వీటిలో ఐక్యత లేక చిన్న చేప పెద్ద చేప అను బేధాభిప్రాయములు, బురద చేప, నీళ్ళ చేపయను వర్ణ బేధములు మడుగులోని నీటి ప్రభావమున అందులో తిండిని బట్టి బలిసి, కండబలముతో దేహమును పెంచి నేను వాలగను అని అంటూ నేను గెండినంటూ నేను కొర్రమేనునంటూ తమ పొడుగు లావులను ప్రదర్శించుచు కేరింతలు కొట్టుచు నీళ్ళ మీద బస్కీలు కొట్టుచున్న పెద్ద చేపలయొక్క డాంబికమునుబట్టి ఎగురుచుండగా - గట్టు మీద ఉన్న జాలరి కంటిలో ఇవి చేయు క్రియలను బట్టి వీటి సైజులు ఆకర్షించి, ఆతడు చేయు వలకు గురియై వాని వలలోనికి మరణాన్ని సంపాదించుకొని నాశనమై పోవుచున్నవి. అయితే ఇవి తమయొక్క ఔన్నత్యాన్ని దేవుడు తనకు అనుగ్రహించిన శరీరాన్ని ఐశ్వర్యాన్ని అణచుకొని తామరాకు నీడనే విశ్రమించి ఉన్నట్లయితే వీటికి ఆ గతి పట్టదు.
అదే విధముగా నేటి లోక క్రైస్తవ జీవితములో క్రైస్తవ సంఘము బోధకునియందు లక్ష్యముంచి, ఆతని వేదవాక్కులకును విధేయులై యెహోవా నాకు ఆశ్రయమును దుర్గమును కేడెమైయున్నాడను ధ్యేయముతో దేవుని హస్తమను చల్లని తామర నీడ వంటి సన్నిధిలో - వినయ మనస్కుగలవారై జీవించవలసి యుండగా బోధకునిపై తిరుగుబాటు జేసి, అతని వేదవాక్కులపై లక్ష్యముంచక తృణీకరించి, కొంగలవంటి అబద్ధ బోధకులకు చెవినిచ్చి - సమిష్టిగా జీవించాల్సిన క్రైస్తవ సంఘములు ఆ మడుగులోని చేపల వలె జాతి బేధములు అనగా నేను రెడ్డినని, నేను బ్రాహ్మణుడనని, కోమటి క్రైస్తవులని, మాల క్రైస్తవులని, మాదిగ యానాది క్రైస్తవులని, ఎరుకల క్రైస్తవులని, ఇవిగాక మేము గొప్పింటి వారమని తమ ఆస్థిని బట్టి తమ తాహతును బట్టి ఆలయాల్లో - దైవసన్నిధిలో ప్రధానత్వమును కోరుచు, సంఘకాపరిని ఎడము చేసుకొని జీవించునట్టి మరణపాత్రమైన క్రైస్తవ సంఘమును, అపవాది తనయొక్క మరణ వలను చేతబట్టి దానిలో వీరిని ఇరికించుకొని సంఘములను పాడు చేస్తున్నట్లుగా నేటి క్రైస్తవ సంఘ జీవితము మనకు నిరూపిస్తున్నది. సర్వసాధారణముగా ఈ విధముగా ఎన్నో క్రైస్తవ సంఘములు ఐక్యత లేకుండ పాడైపోవుట మన నిత్య జీవితములో చూస్తున్నాము.
అయినను బోధకుడు మాత్రము కొలనులోని తామర తీగ వలె నిలకడగా తన జీవితాన్ని సాగిస్తున్నాడు. సంఘము బోధకుని తృణీకరించినను బోధకుని ఏర్పరచుకున్న ప్రభువు బోధకునికి కావలసిన రక్షణ ఏర్పాటులను చేయుచునే యున్నాడు.
కొలనులోని జలగల సంగతి :- ఇంక లోకమనే కొలనిలో ఈ జలగ వంటి జీవితములో ఉన్న క్రైస్తవ సోదరులు కూడా మనకప్పుడప్పుడు తారసపడుచున్నారు. వీరికి ఎంత ధనము సంపాదించినను తృప్తి ఉండదు. ఎక్కడ ఉచితముగా ఇండ్ల స్థలాలు దొరకునో అక్కడ హరిజనులమని చెలామణియగుచు వాటికి ప్రాకులాడుదురు. సంఘానికి వచ్చిన కానుకలను అర్పణలను దిగమ్రింగుట. పాస్టరుగారి ప్రక్కన జేరి సంఘస్థులనుద్దేశించి సంఘమునకు మీరు ఇంకా ఇతోధికముగా మన సంఘ కార్యక్రమములకు ఆర్ధికముగా తోడ్పడండి అని అప్పుడప్పుడు పాడి మాటను కూడా వాడుచుండుట మనము వింటుంటాము. వీరి ధ్యేయమంతయు ధనము మీదనే. వీరి దాహమెట్లుండునంటే యోహాను 7:37-38 ఎవడైనను దప్పిగొన్న యెడల నా యొద్దకు వచ్చి దప్పిక తీర్చుకోవలెను. అన్నట్లుగా క్రీస్తు వాక్యముంటే ఇట్టి సోదరులకెల్లప్పుడు ధన దాహమును కడుపులో నుండియే ధన సంపాదనకు కావలసిన ఆలోచనలు ఎల్లప్పుడును ఊరుచుండును. కఠిన మనస్కులై పైకి భక్తి గలవారి వలె ఉండి, దాని శక్తిని ఎరుగనివారై తనకును తన ఇంటివారి కొరకును తన తరము వారి కొరకును ఆస్థిని సంపాదించు ఆలోచనపరులైయుందురు.
కప్పలు :- ఇది నామ క్రైస్తవ జీవితములో జీవించు వ్యక్తులకు సాదృశ్యమైయున్నది. కప్పలు తామరాకు మీద కూర్చుని తామర తీగను తామర ఆకులను ఆశ్రయించినట్లే దానినంటుకొని జీవిస్తుండును. కాని తామరాకు మీద కూర్చున్నప్పుడు కప్ప కండ్లు మూసుకొని తన జీవనోపాధిని గూర్చి ఆలోచించు విధముగా - ఈ నామ క్రైస్తవులు కూడా చర్చీకి వచ్చి బోధలో కూర్చుని కాపరి బోధను వింటూనే ఉంటారు. దైవవాక్యాన్ని విన్నట్లే నటిస్తారు. చర్చీ నుండి బైటికొచ్చి వార్తాపత్రికల్లో ప్రకటితమైన ప్రకటనలను అనగా హారిజనులకు ఇండ్ల స్థలాలు, స్వయం ఉపాధి కల్పనలకుగాను బ్యాంకి లోన్లు వగైరా ప్రకటనలను ప్రభుత్వము పురోభివృద్ధికిగాను, క్రైస్తవేతరులైన బలహీనవర్గములకు కేటాయించిన ప్రత్యేక వనరులనుగూర్చి చదివి ముందు వెనుక ఆలోచన లేకుండ తామున్న జీవితమునుగూర్చి తలంపు లేకుండ, క్రీస్తుయొక్క విలువను - క్రైస్తవత్వముయొక్క పవిత్రతను మంట గల్పి, తాను బలహీన వర్గమని హరిజనుడనని ప్రకటించుకొని లోకసంబంధమైన ఈవుల కొరకు దేవులాడుచున్నారు.
కప్ప కూడా అంతియే. తామరాకు మీద కూర్చుని ఎంతో విధేయతతో ఉన్నను, నీళ్ళలో తనకు ప్రియమైన పుష్కలమైన ఆహారము కనపడినప్పుడు వెంటనే తామరాకు మీద నుండి చెంగున నీళ్ళలో దూకి ఆహారము కొరకు దేవులాడుచున్నది. ఆహారము దొరకిన తర్వాత దానిని భక్షించి, మరల తామరాకు మీద కూర్చుంటుంది.
అదే విధముగా నామ క్రైస్తవుడు కూడా ప్రజాబాహుళ్యములో హరిజనుడుగాను, ఐశ్వర్యము నొంది చర్చీయను తామరాకు మీద కూర్చుని, క్రైస్తవ భజన చేయుచు క్రైస్తవుడనని చెప్పుకొంటూ - క్రైస్తవ ఈవులను పొందగోరుచు ఇటు క్రైస్తవ్యాన్ని అటు లోకాన్ని కనుగప్పి, ఉభయ భ్రష్టత్వము పొంది, కప్పవంటి నిష్ప్రయోజన జీవితములో జీవిస్తున్నారు. ఇది లోకసత్యము.
అయితే కప్ప తామరాకు మీద కూర్చుంటుందేగాని తామరతీగ నుండి వెలువడిన తామర పుష్పములోని మకరంద మాధుర్యమును చవి చూడనట్లే ఉభయ భ్రష్టత్వము పొందిన ఈ నామక్రైస్తవులు క్రైస్తవాలయములో కూర్చుంటారేగాని, కాపరి నోట నుండి వెలువడే క్రీస్తు వాక్యాలయొక్క మాధుర్యమును గుర్తించలేకున్నారు. అయితే అట్టి మాధుర్యమును గుర్తించి, తనవితీర ఆత్మ దప్పికను, ఆత్మాకలిని తీర్చుకొని దాని ద్వారా ధన్య జీవితమును పొందినవారు ఎవ్వరో మనము తెలుసుకొందము. అట్టివారే గండు తుమ్మెద వంటి కీటక జాతులకు సాదృశ్యమైయున్నారు వీరెవరు? తుమ్మెద జాతికి చెందినవారుగా నిర్ధారించబడినవారు అన్యులు. ఆత్మ ఫలములను అపేక్షించు నిజక్రైస్తవులు - విశ్వాసియే తేనెటీగ.
తుమ్మెదలు - గండు తుమ్మెదలు - తేనెటీగలు వగైరా మకరంద భుక్కులైన కీటక జాతులకు చెందిన వారినిగా ఈ క్రింద వివరించబడు సోదరులను చేర్చవచ్చును. మడుగులోని తామరకాండముల మీద వ్రాలిన కొంగ ఒంటి కాలి తపస్సులో పొంచి మడుగులోని చేపజాలములను మ్రింగును. తామరాకుల మీద కూర్చుండి దీర్ఘాలోచన చేయు కప్ప అకస్మాత్తుగా మడుగులో దూకి, తన కిష్టమైన జలచరము బట్టి మ్రింగుచున్నది. తామరాకు తూండ్లను ఆశ్రయించిన కొంగ, కప్ప రెండును దాని మీద నుండి అక్రమార్జనకు పాల్పడుచున్నారేగాని, ఆ తామర తూండ్ల నుండి వికసించు తామరపూవులోని మకరందపు రుచిని మాధుర్యమును గ్రహించు జ్ఞానము లేక అగాధ జలములోని ఫలములను ఆశిస్తూ నశిస్తున్నాయి.
కాని తామర తీగ నుండి వికసించిన పుష్పము యొక్క మకరంద మాధుర్యమును గ్రోలుటకు పుష్ప సువాసనకు మత్తెక్కి, పుష్ప మధ్యమున గుప్తమైయున్న మకరందమును త్రాగిన గండు తుమ్మెదలు, తేనెటీగలు మధురానుభూతిని పొంది, క్షుద్భాధను తీర్చుకొని, పరపరాగ సంపర్కము చేత బీజ వ్యాప్తికి తోడ్పడుచున్నవి. అదే విధముగా మడుగువంటి సంఘములోని కాపరియొక్క ఉజ్జీవకరమైన ప్రసంగ మాధుర్యంబునకు దైవోక్తులకు సంఘములోని వారు కాక దూర స్థలము నుండి చుట్టు ప్రక్కల నుండి వచ్చిన తేనెటీగల వలె వాక్యములోని మాధుర్యమును గ్రోలి, ఆత్మీయానందమును పొందవలెనని వచ్చిన సోదర సోదరీమణులు తేనెటీగకు చెందిన కోవలోనివారుగా ఉన్నారు. ఇంక గండు తుమ్మెద లెవరనగా అన్య సోదరులు. ఆత్మీయాకర్షణయైన వాక్య ప్రసంగమునకు చెవినిచ్చి, ప్రభువును స్వంత రక్షకునిగా అంగీకరించగల్గిన భక్తాగ్రేసరులు.
ప్రభువునందు ప్రియమైన వారలారా! ఈ ఉపమానమునుబట్టి ఆత్మ దేవుడు వివరించిన ఈయొక్క వివరములను గుర్తెరింగి, సంఘములోని కప్పల వంటి నామక్రైస్తవులకును, కులమత జాతి సంఘ అంతస్తులను పాటించుచు, క్రైస్తవ జీవితములో ఉన్న సోదరులకును, దూరముగా ఉండి ఆ తామర తూడులో మొలచునట్టి గడ్డలనెడి ఆయొక్క ఆత్మ ఫలమైన బోధకుని యొక్క జీవాహారమును - ఆతడు చేయు తేనె వంటి ప్రార్థనలకును చెవినిచ్చి, మన హృదయ పుష్పమును వికసింపజేసి, గండు తుమ్మెద వంటి ప్రభువుయొక్క ఆకర్షణకు లోనై, ఆత్మ బీజములను ఏర్పరచుకొని వాటిని వెదజల్లి ఆత్మఫలములను
ఫలించుదురు గాక! ఆమేన్.
ప్రసంగము - మూలము కాబట్టి మేలైనది చేయనెరిగియు ఆలాగు చేయని వానికి పాపము కలుగును యాకోబు 4:17
ప్రియసంఘమా! విశ్వాసులైన మన విషయములో లోకరీత్యా ఎన్నో క్రియలు జరిగిస్తున్నాము. ఇందులో మంచి వుంది చెడు వుంది. ప్రియసహోదరీ! సహోదరా! నరులైన మన విషయాలలో లోకరీత్యా దేవుడు చేసిన మేళ్ళు లెక్కలేనన్ని ఉన్నట్లు వేదరీత్యాను మరియును నిత్యజీవితము లోను మనము ఆత్మీయముగా ఆలోచిస్తే గోచరము కాగలవు. అందుకే దైవవాక్యము మేలైనది చేయమనుటలో ఆ మేలైనవి ఏమిటో వేదరీత్యా తెలుసుకొందము. కీర్తన 116:12లో దావీదు మహారాజు తన కీర్తనలలో యెహోవా నాకు చేసిన ఉపకారములకు నేను ఆయనకేమి చెల్లింతును? రక్షణ పాత్రను చేత పుచ్చుకొని యెహోవా నామమున ప్రార్థన చేసెదనన్నాడు. అయితే మేలైనవి ఏవి?
ప్రియసంఘమా! మొదట మేలైనది చేసిన ధన్యత పొందినవారిలో మొదటివాడు హానోకు. ఇతను దేవునితో నడచి లోకానికి కనుమరుగైనాడు. 2. నోవహు ఇతడు దేవుడు చేయమన్న ఓడను చేసి జల ప్రళయ వినాశమునకు తర్వాత పునఃసృష్టికి మూలపురుషుడైనాడు. 3. మోషే ఇతడు దేవుని ఇల్లంతటిలో నమ్మకస్థుడాయెను హెబ్రీ 3:2లో చదువగలము. ఇతడు దేవుడు చెప్పిన ప్రతి పనిని నమ్మకముగా చేసినాడు. అనగా చేయతగిన పనిని నమ్మకముగా చేయడము.
ఇక మేలైనది చేయని వారి విషయమును గూర్చి :- 1. యోనాను దేవుడు నీనెవె పట్టణమునకు జరుగబోవు వినాశనమును గూర్చి ప్రకటించమన్నాడు. ఇది మేలైన కార్యము. అయితే యోనా ఆ ప్రకారము చేయక వక్రమార్గములో వెళ్ళాలనుకొని, ఆ పనిని అలక్ష్యము చేశాడు - ఫలితము సముద్రము పాలైనాడు. 2. 2వ సమూయేలు 11:లో రాజులు యుద్ధములు చేయు కాలములో మహారాజైన దావీదు దైవజనాంగము పక్షముగా దేవునితో కలిసి పోరాడవలసియుండగా అందుకు విరుద్ధముగా రాజ భోగాన్ని కోరి, రాచనగరి మిద్దెపై తిరుగుతూ శోధనలో పడిన వైనము.
కనుక ప్రియసంఘమా! ఇందులో మనము గ్రహించవలసింది ఏమిటంటే తప్పు పని జేస్తేనే పాపము అన్నదియేగాక దైవకార్యములను జరిగించవలసియుండగా - ఆ కార్యములను జరిపించుటలో అలక్ష్యము చేయుట పాపమని గ్రహించాలి. సువార్త ప్రకటించవలసిన మనము ప్రకటించకపోవుటన్నది పాపమే. దైవారాధనలో పాల్గొనవలసిన మనము ఆ విధముగా పాల్గొనక పోవుట పాపమని తెలుసుకోవాలి.
ప్రియపాఠకులారా! ''మేలైనది చేయుట.'' దానిని చేయకుండుటన్నది ఏమిటి? మేలైనది ఏది? అన్న విషయాన్ని ముందుగ తెలిసికోవలసియున్నది. మానవ జీవితములో మానవునికి మేలు కల్గించేవి ఉన్నవి - చెడు కల్గించేవి ఉన్నవి. శారీర విషయములో మేలులున్నవి. ఆత్మ విషయములో మేలులున్నవి. అయితే దేవుని సన్నిధిలో శరీరానికి ఆత్మకు కూడా మేలైనటువంటి బాధ్యతలున్నవి. లోకరీత్యా మేలైనవి - ఆహారము తీసుకోకుంటే శరీరానికి బలహీనత, లోకరీత్యా మేలైన వస్తువులు వాడకుంటే మనుగడ తక్కువ, మేలైన ఔషధాలు తీసుకోకుంటే జబ్బు కుదరదు. మేలైన వస్త్రాలు ధరించితే శారీరానికి ఘనత, మేలైన ఉద్యోగము నరుడు చేస్తే వానికి ఘనత, మేలైన పదవి అలంకరించిన నరునికి సత్కారము - ప్రతి విషయములో శరీర సంబంధికి లోకరీత్యా మేలైనదియే అనగా ప్రశస్తమైనవి ఉన్నతమైనవి, మంచివి కోరుతాడు - ఇది శారీర సంబంధము. అయితే ఆత్మ సంబంధమైన మేలులు కొన్ని ఉన్నవి. ఈ ఆత్మ సంబంధమైన మేలులు ఆత్మకు విలువనిస్తూ శరీరానికి కూడా అత్యంత ప్రాధాన్యత - నిచ్చేటటువంటివై యున్నట్లుగ కొన్ని సందర్భాలనుబట్టి లోకములో జీవించిన వ్యక్తుల యొక్క తీపి చేదు అనుభవాలను బట్టి వివరముగా వేదరీత్యా తెలిసికొందము. మొట్టమొదటగా మేలైన వాటిని చేసిందెవరు? మేలైనవి చేయని వారెవరు? దావీదు మహారాజు కీర్తన 116:12-13లో ''యెహోవా నాకు చేసిన ఉపకారములన్నిటికి నేను ఆయనకేమి చెల్లింతును? రక్షణ పాత్రను చేతపుచ్చుకొని యెహోవా నామమున ప్రార్థన చేసెదను,'' అన్నాడు. ఇంత గొప్ప దైవానుభవము గల్గిన మహారాజు దేవుడు తనకు అప్పగించిన మేలైనది ఏమిటో ఎంతవరకు చేయగల్గినాడు? అనే ప్రశ్న మనకు కలుగవచ్చును. ఇందులో మేలైనది చేసినవారిని గూర్చి ముందుగా తెలిసికోవలసి యున్నది. మేలైనది మొదటజేసి ఘనత పొందినవారిలో మొట్టమొదటివాడు హానోకు. శరీరరీత్యా ఆత్మీయముగాను దేవుని కార్యాలు నెరవేర్చాడు. తాను లోకములో శారీరరీత్యా సంసార బంధకాలలో ఉన్నను తనను జన్మనిచ్చిన దేవునియొక్క నియమాన్ని తప్పక పాటించాడు - పాటించుటయేగాక అనుదినము దేవుని మార్గాన్ని అభిలషిస్తూ దైవత్వముతో నడచుచు దైవసన్నిధికి కొనిపోబడి నరులకు లోకానికి కనుమరుగయ్యాడు. హానోకు జీవించిన కాలములో మేలైన క్రియలే జరిగించాడు. ఆ విధముగా మేలైన జీవితము జీవించగల్గిన హానోకు దేవుడు అనుగ్రహించిన మేలైన స్వాస్థ్యాన్ని పొందగల్గినాడు. ఈ స్వాస్థ్యము అతనికి స్థిరమైనది, ఎవడును ఆక్రమించుటకు వీలుకానిది. ఈ స్వాస్థ్యము ద్వారా హానోకు దైవత్వమునకు మరీ చేరువయై దైవత్వములో లీనమయ్యాడని కూడా చెప్పవచ్చును.
అటుతర్వాత రెండవ వ్యక్తి నోవహు. ఇతడు దేవుడు తనకు ఆజ్ఞాపించిన ప్రశస్తమైన పనిని అనగా ఆయన చెప్పిన మాని కొయ్యలతోను ఆయన ఇచ్చిన కొలతలలో - ఆయన వాక్కునుబట్టి ఆయన ఇచ్చిన నమూనానుబట్టి ఆయన విధి నిర్వహణనుబట్టి ఆయన చేయమన్న విధముగా ఓడను చేసి, తన యావద్ పనిని సంపూర్ణము చేసిన తర్వాత లోక నాశన కాలములో తను - తన కుటుంబము దేవుడు ఆయనకు ఆజ్ఞాపించి చేర్చనున్న ఓడలోని జీవరాసులును అగాధ జలముల ఉపద్రవము నుండి కాపాడ బడుటయేగాక, పునఃసృష్టికి ఆ ఓడలోని జంతుజాలము దేవుడు ఎన్నుకొన్న ఆ నరకుటుంబము దేవుని మరుసృష్టికి మూలములై కారణమైనట్లుగా మనకు తెలిసిందే. మూడవవాడు మోషే - ఇతడు దేవుడు తనకు జరిగించిన ప్రతి కార్యమును తడవు చేయక దైవచిత్తాన్ని నెరవేర్చినాడు. దేవునికి ప్రతి విషయములోను ప్రతినిధిగా ఉండి దైవజనాంగమును పరిపాలించినవాడు. ఇందునుబట్టి దేవుని ఇల్లంతటిలో మోషే నమ్మకస్థుడని హెబ్రీ 3:5లో వ్రాయబడుట మనము చదువగలము. నలుబది సంవత్సరాలు ఇశ్రాయేలు జనాంగమును నిర్వాహకుడుగా ఉండి ప్రతి విషయములోను దేవునికి నమ్మకస్థుడై ప్రతి పని చేస్తూ - దేవుడు వెళ్లమన్న ప్రతి చోటకు వెళ్ళుతూ దేవుడు ఆచరించమన్నట్టి ప్రతి పనిని ఆచరింపజేసినట్లు వేదరీత్యా మన మెరిగిన విషయమే.
ఈ విధముగా మోషే దేవునికి నమ్మకస్థుడై యుండినట్లును, మోషే ప్రవక్తగా దైవత్వము చేత ఎన్నిక చేయబడినాడు. మోషే ప్రవక్త - అంతేగాకుండ దైవసన్నిధిలో అత్యంత పెద్ద పరిచర్య సాగించుటయే గాకుండ దేవునియొక్క దశాజ్ఞల రాతి శాసనాలను దైవజనాంగము చేత ఆచరింపజేయుటకు శ్రమించినవాడు. ఇందునుబట్టి మోషే ఇశ్రాయేలు జనాంగానికి చట్ట నిర్మాతగా కూడా వేదములో లిఖించబడినాడు. దేవుడు ఇశ్రాయేలుకు ఇచ్చిన ధర్మశాస్త్రము - మోషే ధర్మశాస్త్రముగా ప్రకటించబడినట్లును, ఇంత గొప్ప ప్రగతిని సాధించుటయేగాక ఆదికాండము లగాయతు ఐదు కాండలకు మోషే గ్రంథకర్త అయ్యాడు. మోషే విద్వాంసుడు కాడు, నాలుక మాంద్యము కలవాడు. ఆ కాలములో సరియైన లిపి లేదు. సరియైన భాషాజ్ఞానము లేదు. సరియైన వేదాంతి కాడు. అయినను అతనిని దేవుడే వేదాంతిగాను, ప్రవక్తగాను, రచయితగాను, ధర్మశాస్త్ర ఆచరణీయునిగాను, తన జనాంగమైన ఇశ్రాయేలుకు నిర్వాహకునిగాను, పంచకాండములకు గ్రంథకర్తగాను, మొట్టమొదటి పాతనిబంధన ప్రధమ ప్రవక్తగాను ప్రతిష్టించి, నేటికిని అతని చరిత్రను మనమధ్య జ్ఞాపికగా ఉంచినాడంటే, మోషే దేవునియొక్క మేలైన కార్యాలు ఏమేమి చేశాడో - ఎంత శ్రమ, ఎంత బాధలు, ఎన్ని హేళనలు, ఎన్ని విమర్శలు, ఎన్ని సణుగుళ్ళు భరించాడో - సరియైన సాధనాలు లేని దినాలలో కాలినడకలో ఆయా సమయాలలో తానేగాక తన జనాంగాన్ని దైవత్వము వైపు నడిపించి, కృతకృత్యుడయ్యాడంటే మోషేయొక్క శారీర ఆత్మీయ విలువలు దైవసన్నిధిలో ఎంత గొప్పగా ఉపకరించాయో ఇందునుబట్టి తెలుస్తున్నది. ఈ ముగ్గురేగాక మేలైంది చేయనెరిగి ఆలాగున చేసి దైవసన్నిధిలో వేదయుతముగా గొప్ప చరిత్రను పొందినవారు ఇంకను ఉన్నారు. ఇది మేలైనది చేయనెరిగి ఆ విధముగా చేసి ధన్యత పొందినవారి చరిత్ర. ఇక మేలైనది చేయని వారి విషయాన్ని ఈ సందర్భములో ఒకరిద్దరిని గూర్చి కూడా తెలిసికొందము.
నేటి తరమువారమైన మనకు సువార్త ప్రకటించకపోవుట కూడా అది మనకు పాపము. సువార్త ప్రకటించుట ప్రతి క్రైస్తవునికి మేలైన కార్యమే. ఆ విధముగా ప్రకటింపక పోవుట నేరము పాపము. అలాగే సువార్తను విని దాని ప్రకారము నడుచుకోక పోవుట కూడా పాపమే. ఇంకను క్రీస్తును ధరించుకొని క్రెస్తవులమని చెప్పుకొంటూ ఆచరణలో క్రీస్తుయొక్క సిద్ధాంతాలను పాటించకపోవుట కూడా పాపమే. భక్తి గలవారి వలె వేషధారణ పూరితమైన జీవితము జీవిస్తూ భక్తికి తగిన ఫలాలను కనబరచకపోవడము - అట్టి వారికి పాపము. ఈ సందర్భములో పాతనిబంధనలో ఇద్దరి వ్యక్తులను ఉదాహరణగా తెలిసికొందము. వీరు మేలైనది చేయనెరిగియు చేయలేకపోయారు, అన్న విషయాన్ని తెలిసికొందము. ఇందులో మొదటివాడు యోనా - దేవుడు నీనెవె పట్టణముయొక్క పాపానికి సంతాపపడి వారు దేవుని నెరుగక, మేలైనది ఏమిటో ఎరుగక, చేయవలసిన పని ఏమిటో తెలియక పశుప్రాయులై, దైవభీతి లేక దైవత్వానికి దూరమై, దైవరాజ్య సువార్త ఎరుగని స్థితిలో ఆ పట్టణముయొక్క 120 వేల జనాభా కల్గిన మహా గొప్ప పట్టణమైన నీనెవె పట్టణమునకు దేవుడు యోనాను ఏర్పరచుకొని, నీవు వెళ్ళి - ఇక నలుబది దినములకు నీనెవె పట్టణము నాశనమగునని ప్రకటన చేయమన్నాడు. ఇది యోనా దైవసన్నిధిలో చేయవలసిన మేలైన కార్యము - ఇది దైవకార్యము. ఇది దేవుడు ప్రత్యక్షముగా ఒక ప్రవక్తకు బోధించిన చట్టము. అయితే యోనా దేవునియొక్క మేలైన కార్యానికి విధేయించాడా? ఆ కార్యమును జరిగించేందుకు సమ్మతించాడా? లేదు. దేవుడు వెళ్ళమన్న నీనెవె పట్టణానికి బదులుగా సకలైశ్వర్యాలు, సకలవిధ భోగభాగ్యాలు, వెండి బంగారములతో తులదూగే తూరు రాజుల పరిపాలనలో ఉన్న తర్షీషు పట్టణమునకు వెళ్ళుటకు కేవు చెల్లించి ఓడనెక్కినాడు. దేవుడు వెళ్ళమన్నది నీనెవె పట్టణము - యోనా వెళ్ళుచున్న పట్టణము తర్షీషు. యోనా ప్రయాణించాల్సిన ఓడ నీనెవె పట్టణ ఓడ. అయితే యోనా అందుకు విరుద్ధముగా ప్రయాణించాలని తీర్మానించుకొన్న ఓడ తర్షీషు. నీనెవె ఓడ దైవ సంబంధమైంది. తర్షీషు ఓడ లోక సంబంధమైంది. దేవునియొక్క మాట, హెచ్చరిక చట్టాన్ని బట్టి నీనెవె పట్టణ ఓడనెక్కినట్లయితే, దైవ సువార్త వలన ఆ పట్టణ ప్రజలకు మేలు కల్గించేది. దైవ శుభవర్తమానమును మోసుకొని పోవాల్సిన ఓడ నీనెవె ఓడగా ఉండేది. అయితే యోనా దేవునియొక్క శుభవర్తమానాన్ని కడగా పెట్టి లోకముయొక్క ధనాశ, నేత్రాశ, డంబము - ఈ మూడింటిని తనలో ఉంచుకొని, తర్షీషు ఓడను ఎక్కుటనుబట్టి తర్షీషు పట్టణ ఓడను దేవుడు మొత్తినాడు.
ప్రియపాఠకులారా! ఒకవేళ యోనా నీనెవె పట్టణ ఓడ ఎక్కినట్లయితే అది ప్రశాంతముగాను, ఎలాంటి వికృత వాతావరణముగాని అనగా సముద్రపు అలలు, గాలులు, తుఫాను అలలు, వగైరా అరిష్టాలు కలుగక నెమ్మదిగా ప్రయాణించి, నీనెవె పట్టణానికి చేర్చి ఉండేది. అయితే దైవాజ్ఞను కడగా పెట్టి లోకాశలను మనసులో ఉంచుకొని సిద్ధపడిన యోనా తర్షీషు ఓడకు చాలా భారమయ్యాడు. ఆ ఓడలో ఉన్న సామగ్రి కంటె యోనా అరువది రెట్లు అధిక బరువున్నట్లును దేవుడు యోనానుబట్టి తర్షీషు ఓడను శిక్షించిన సందర్భములో ఓడలోని వారు అలల ధాటికి ఓడ మునిగి పోతుందేమోనని అనుకొని ఓడలో బరువైన సామానును సముద్రములో పారవేసినట్లును, అయినను ఓడ చులకనకాక పోవుటలో ఓడ అడుగు భాగములో గాఢ నిద్రావస్థలో ఉన్న ఓడకు చాలా బరువుగ, ఓడ మోయలేనంత మహా భారము యోనా అయ్యాడు - ఆ ఓడలో నావికులున్నారు, ప్రయాణీకులున్నారు, సామగ్రి వారి యొక్క ఆహార నిల్వలున్నాయి. అవి అన్నియును చేరినను వాటినన్నిటిని మించిన బరువు యోనాయొక్క దైవ వ్యతిరేకత, యోనాయొక్క ఆజ్ఞాతిక్రమము అన్నది ఓడ సామగ్రి కంటె, ప్రయాణీకుల కంటె, ఆహారము సామగ్రి బరువుల కంటె అనేక రెట్లు బరువైయున్నట్లు తెలుస్తున్నది.
ఇట్టి భారభరితమైన యోనాయొక్క ఆ స్థితి ఓడలో ఉన్న ఓడ నావికులకు అయోమయమైంది. అందుకే వారు చీట్లు వేశారు. ఆ విధముగా చీట్లు వేసినప్పుడు దేవునియొక్క ఆత్మ ఓడకు వచ్చిన దుర్గతికి కారకుడెవరో చీట్లు ద్వారా ఓడ నావికులకు ఋజువు పరచింది. అప్పుడు వారు యోనాను ప్రశ్నించుటయు, యోనా తన తప్పు తెలిసికొని తననుబట్టియే దేవుడు ఓడకు ఈ ఉపద్రవాన్ని పట్టించాడని, ప్రయాణీకుల ఆందోళనకు, ఓడలో సామాను సముద్రము పాలయ్యేందుకు, తీవ్ర తుఫాను వీచేందుకు తానే కారకుడనని ఒప్పుకొని, తాను చేయవలసిన మేలైన కార్యము చేయక అందుకు విరుద్ధముగా తాను చేసిన కార్యమునకు పశ్చాత్తాప్తుడై, తననెత్తి సముద్రములో వేయమన్నప్పుడు, ఆ విధముగా యోనాను సముద్రములో పడవేసినప్పుడు తుఫాను నిమ్మళించింది. ఓడ తేలికయైంది, అంటే యోనాయొక్క బరువు ఓడలో ఎంత గొప్ప మోతాదులో ఉండిందో మనము ఆత్మీయముగా ఆలోచించవలసియున్నది. దీని ఫలితముగా దేవుడు యోనాను చంపక తాను నిర్ధేశించిన పనిని యోనా తానే సంపూర్ణముగా నెరవేర్చవలసి యున్నందున సముద్రపు ఓడ నుండి పడవేయబడిన యోనాను పెద్ద మత్స్యము చేత మ్రింగించి, మూడు దివారాత్రులు నిరాహారముగా దానిని వేగముగా నడిపించి, తాను ఏ పట్టణము వెళ్ళమన్నాడో ఆ నీనెవె పట్టణ ఒడ్డున క్రక్కింది. నీనెవె పట్టణములో తాను జరిపించవలసిన కార్యాన్ని యోనా చేత జరిగించినట్లును, ఈ విధమైన కార్యాన్ని బట్టి దేవుడు తనయొక్క ప్రణాళికలో కృతార్ధుడైనట్లును, అలాగే యోనా కూడా సంపూర్ణుడైనట్లును మనము గ్రహించవలసియున్నది. అనగా పాపము నుండి రక్షణలోకి ప్రవేశించే యోగ్యతను యోనా పొందినాడు. ఇందునుబట్టి యోనా దేవుని చేత క్షమించబడిన పాపి. తర్షీషు ఓడలో ఉన్న ఓడవారు దైవత్వాన్ని ఎరుగని పాపులు. అంటే దైవత్వములో స్థిరత్వములో లేక నానావిధ ఆరాధనలకు అలవడి నిజమైన దేవుడు ఎవరో ఆయన శక్తి ఆయన మహిమ కార్యాలు ఎలాంటివో ఎరుగని స్థితిలో ఉన్న పాపులు. వాస్తవానికి దేవుని ఎరుగనివారు.
అయితే దేవుని ఎరిగినవాడును, దైవత్వముతో ముఖాముఖిగా మాట్లాడేవాడును, దేవుని చేత ఒక గొప్ప ప్రవక్తగా ప్రతిష్టించబడి, మరి ముఖ్యముగా నీనెవె పట్టణానికి దేవుని చేత పిలుపు అందుకొని దైవకార్యాన్ని నెరవేర్చుటకు బోధకుడైయున్నాడు. ఇతడు దేవునికి అత్యంత ప్రేమపాత్రుడు. మంచి దైవవాక్శక్తి గల ప్రవక్త. ఇట్టి ప్రవక్త పాతనిబంధనలో ఎవరును లేరు. ఇట్టి సామర్థ్యము పాతనిబంధన ప్రవక్త లెవరును కనబరచలేదు. మరణగోతి నుండి బయటపడ్డ ఇతడే ప్రధముడు. మరియు దైవ విషయములో త్యాగధనుడనియు కూడా చెప్పవచ్చును. దేవునికి అత్యంత ప్రియపాత్రుడు కాబట్టి - దేవుడు యోనాను చంపక శిక్షించక, యోనా చేసినటువంటి పాపాన్ని క్షమించి, అతనికి కూడా కొన్ని అవకాశాలు ఇచ్చినట్లుగ వేదరీత్యా తెలుస్తున్నది.
తర్షీషు ఓడ నావికులు చీట్లు వేసి చీటి యోనా మీదికి రాగా యోనా తాను చేసిన తప్పును గూర్చి ఓడ నావికులకు ఎరిగించి, తాను జీవముగల దేవునియొక్క ప్రవక్తననియు, ఆయన యావద్ సృష్టికిని, యావద్ సృష్టములకు, పంచభూతాలకును, సముద్రములు, భూమి, గాలి, వగైరాలన్నింటికి సృష్టికర్తయని, అట్టి దేవునియొక్క ప్రవక్తయై యుండుటనుబట్టి దేవుడు తనకు ఆజ్ఞాపించిన మార్గాన్ని విడిచినందున తన్నుబట్టియే దేవునియొక్క ఉగ్రత తర్షీషు ఓడను గలిబిలి చేసినట్లు ఓడ నావికులకు ఎరుకపరచి అట్టి ఉపద్రవము నుండి బయటపడాలంటే తనన్నెత్తి సముద్రములో పడవేయమన్నాడు. అట్టి శక్తి గల దేవుని ప్రవక్తయైన యోనాను ఎత్తి సముద్రములో పడవేయుటకు జంకినారు. ఎందుకంటే యోనాయొక్క దేవుడు ఏ కార్యము చేయుటకైనను సమర్ధుడని వారు జంకినారు. అయినను యోనా ఓడలోని జనము కొరకు తన్నెత్తి సముద్రములో పడవేయు వరకు ఈ తుఫాను ఉగ్రత ఆగదని, విధి లేని పరిస్థితులలో చేయరాని కార్యము చేస్తున్నామని ప్రాణభీతితో ఉండగా యోనా మరెక్కువగా హెచ్చరించి, వారిని తన్నెత్తి సముద్రములో పడవేయమనగా - వారు ఆ విధముగా చేసినప్పుడు దేవుడు యోనాను మరణానికి అప్పగించక మరణములో నుండి రక్షించి కాపాడుటకు ఒక మహా మత్స్యాన్ని యోనా కొరకు నియమించి, దానికి ఆజ్ఞ నిచ్చినప్పుడు, అది మ్రింగి మూడు దివారాత్రులు జలగర్భములో ప్రయాణించి, దేవుడు యోనాను వెళ్లమన్న చోటకు చేర్చిన తర్వాత ఆ మహా మత్స్యమునకు ఆజ్ఞనిచ్చినప్పుడు నీనెవె తీరములో క్రక్కివేసింది. ఇంత గొప్ప ఏర్పాటు దేవుడు యోనా కొరకు చేసి యోనా విషయములో శ్రద్ధ వహించినాడంటే, యోనా మీద దేవునికెంత ప్రేమ ఉందో గ్రహించాలి. ఇది యోనాయొక్క అనుభవములో ''మేలైనది చేయనెరిగియు దానిని చేయనందున సంభవించిన పాపముతో కూడిన శ్రమానుభవముతో కూడిన వివరణ.
ఇక రెండవదిగ 2వ సమూయేలు 11:1 చదివితే రాజులు యుద్ధము చేయవలసిన కాలములో దావీదు చేసిన పని :- ఇశ్రాయేలుతో యుద్ధాలు, ఇశ్రాయేలీయేతర ప్రతి పక్షమువారితో తరచుగ వసంత కాలములో జరుగుట ఆనవాయితీ. అలాగే రాజులు యుద్ధము చేయు సమయములో యుద్ధరంగానికి వెళ్ళకుండ సుఖానుభవమును విలాసము కోరి, దైవజనాంగాన్ని మరణానికి యుద్ధములోకి అప్పగించి, తాను రాచనగరులో విహరిస్తూ దైవత్వానికి బదులు పిశాచత్వమును అనగా సాతానుకు అవకాశాన్ని ఇచ్చి తిరుగుచున్న సమయములో - వివస్త్రముగా స్నానమాచరించు సౌందర్యవతియైన స్త్రీని చూచి, ఆమెను మోహించి ఆమెను గూర్చి వర్తమానము తెలిసికొన్నాడు. అయితే ప్రియపాఠకులారా! నమ్మకస్థుడైన ఊరియా భార్యయని తెలిసికొనియు, ఆమె మీదనున్న వ్యామోహమునుబట్టి ఆమె భర్తను అక్రమముగా యుద్ధములో నిలువబెట్టి చంపుటన్నది - దాని ఫలితమే పొరుగువాని భార్యను ఆశించి మానభంగము, నరహత్య అను మూడు విధములైన పాపాలను సంపాదించుకొని క్షోభను అనుభవించిన విధానము మనమెరిగినదే. దావీదుకు కల్గిన ఈ త్రివిధ దైవ వ్యతిరేక క్రియలను బట్టి దావీదు కుటుంబ సమేతముగా వేదనను, పాపఫలితాన్ని, శిక్షను అనుభవించాడు. ఇది క్షమించరాని నేరముగా దేవుడు భావించి, దావీదును నానావిధాలుగ శిక్షకు గురి చేశాడు. అయినను దావీదుపై దేవునికున్న ప్రేమను బట్టి మరణానికి అప్పగించలేదు.
ప్రియసంఘమా! తప్పు చేయుట పాపము. దైవకార్యము జరిగించుటకు అలక్ష్యము చేస్తే పాపము. సువార్త ప్రకటించవలసియుండగా ప్రకటింపకపోవుట పాపము. దైవ ఆరాధనలో పాల్గొనక పోవుట కూడా పాపమని గ్రహించాలి. కనుక దేవుడు మనకు తాను శాసించిన పనులను చేయకపోవుట పాపమని ఇందునుబట్టి గ్రహించవలసియున్నది. ఒకనికి అన్ని గుణాలు మంచివిగానే ఉంటాయి. అయితే ఎదుటి వ్యక్తిని తాను ప్రేమించకుండుట పాపమే. పొరుగువారిపై ప్రేమను కనుబరచకపోవుట పాపమే. ఇది మేలైనదని ఎరిగి దాని చేయకుండుట వలన సంక్రమించే పాపమును గూర్చిన వివరణ.
.......
యాకోబు 4:1-4 మీలో యుద్ధములును, పోరాటములును దేని నుండి కలుగుచున్నవి? మీ అవయములలో పోరాడు మీ భోగేచ్ఛల నుండియేగదా! మీరు ఆశించుచున్నారు. కాని మీకు దొరకుట లేదు. నరహత్య చేయుదురు, మత్సరపడుదురుగాని సంపాదించుకొనలేరు. పోట్లాడుదురు, యుద్ధము చేయుదురు గాని దేవుని అడుగనందున మీకేమియు దొరకదు. మీరు అడిగినను మీ భోగముల నిమిత్తము వినియోగించుటకై దురుద్దేశ్యముతో అడుగుదురు. వ్యభిచారిణులారా! ఈ లోక స్నేహము దేవునితో వైరమని మీరెరుగరా! కాబట్టి ఎవడు ఈ లోకముతో స్నేహము చేయగోరునో వాడు దేవునికి శత్రువగును.
ప్రియపాఠకులారా! పై వేదభాగములో మొట్టమొదటగ ''మీలో యుద్ధములును పోరాటములు దేనినుండి కల్గుచున్నవి? అన్న ప్రశ్నకు జవాబు కూడా ఈ విధముగా వ్రాయబడి యున్నది. మీ అవయవములలో పోరాడు మీ భోగేచ్ఛలనుండియేగదా! అనుటలో ఇది శరీర సంబంధమైన పోరాటమని తెలియుచున్నది. శరీర సంబంధమైన పోరాటము దైవత్వమునకు యోగ్యకరమైంది కాదని, దైవత్వము దాని ద్వారా మహిమ పరచబడనేరదని నరజీవితానికి అది ధన్యవంతమైంది కాదని తెలుస్తున్నది. యుద్ధములు - ఇది ఒక దేశముతో మరొక దేశము జరిగించే పోరాటము - ఇది రాజ్యకాంక్ష. ఒకరి మీద ఒకరికి శత్రుత్వము, దీని ద్వారా మారణహోమము, ఆస్థి నష్టము, ప్రాణ నష్టము, కరువులు, కాటకాలు, దీనియొక్క ఫలితమైయున్నది. ఈ పోరాటము దేశము ఏలే పరిపాలించే రాజులలో ఒకరినొకరు కరచుకొని భక్షించే ఈర్ష్యా ద్వేషాలతో కూడుకొన్నది. దైవత్వమునకు ఇందులో ఎలాంటి ప్రమేయము లేకపోగా కేవలము నరునియొక్క స్వార్థము అపేక్షతో కూడింది. అనగా ప్రత్యర్థులతో పోరాడునప్పుడు తన రాజ్యము విస్తరించాలని, తానే రాజ్య పరిపాలన చేయాలని, ఇతరులకు తన రాజ్యము ఎట్టి పరిస్థితులలోను స్వాధీనము కాకూడదని, తన రాజ్యములో తానే సుస్థిరమైన రాజుగా ఉండాలని, తన సింహాసనము మీద తాను తప్ప మరొకడు కూర్చునుటకు వీలులేదని, స్వార్థపూరితమైన స్వభావముతో నిండుకొన్నవాడై, తన స్వార్థతను తన సింహాసనముయొక్క పటిష్టతకు, తన రాజ్యములోని అనేకుల ప్రాణాలను, వారి కుటుంబాలను నాశనానికి మరణానికి అప్పగించి జరిగించే పోరాటం దీనిని యుద్ధమంటారు. పోరాటం అంటే హింస లేకుండ తన శరీరమును శుష్కింప జేసుకొని ప్రార్థనతోను, దీక్షతోను, విప్లవాత్మకమైన పద్ధతులతో అనేకులను కూడగట్టుకొని శాంతియుతముగా లేక నిరాహారదీక్ష, ధర్నాలు వగైరా క్రియాకర్మలతో జరిగించే పోరాటాలు కూడా ఉన్నాయి. మన పూర్వీక రాజులు ప్రత్యక్షముగా ఒకరితోనొకరు సైన్య సమేతముగా యుద్ధాలు జరిపి జయాపజయాలు చవి చూచారు. అయితే మన భారతదేశ చరిత్రలో మహాత్మాగాంధీ జరిగించిన అహింసా పోరాటమునకు దేశ స్వాతంత్య్రాన్ని తెచ్చి పెట్టింది. అంటే మన దేశము స్వతంత్య్రము అయింది.
ప్రియపాఠకులారా! శరీర సంబంధముగా ఒకరి నొకరు పొడుచుకొని చంపుకొనుటన్నది యుద్ధము. అనుకొన్నది ఆశించిన కార్యాన్ని సాధించుకొనుటకు శాంతియుతముగా అహింసతో కూడిన క్రియను పోరాటం అని తెలిసికొని యున్నారు. ఇవి రెండును లోకసంబంధమైనవియే. అయితే పరలోక సంబంధమైన పోరాటాలు రెండున్నవి. 1. విశ్వాసము 2. ప్రార్థన. విశ్వాసము లేని ప్రార్థన వ్యర్థమే - ప్రార్థన లేని విశ్వాసము వ్యర్థమే. ఇందునుగూర్చి పౌలు 2వ తిమోతి 4:7లో ఈ విధముగా ప్రవచింపబడింది. ''మంచి పోరాటము పోరాడితిని, నా పరుగు తుదముట్టించితిని, విశ్వాసము కాపాడుకొంటిని,'' అనుటలో పౌలు సాగించిన పోరాటము విశ్వాసముతోను, పట్టుదలతోను కూడినదియు, ఆత్మ రక్షణార్థమైనదియు, పరలోక మార్గమును అన్వేషించునదియు, దానిని సాధించునదియైయున్నది. పౌలు పోరాడిన పోరాటము ఆది నుంచి అంతము వరకు విశ్వాసముతో కూడినది, విశ్వాసమును కాపాడు కొన్నదియు, తన కొరకు ఉంచబడిన తద్వారా జీవకిరీటమును సంపాదించే యోగ్యతను కల్గినదియునై యున్నట్లు ఈ పై వేద భాగములోని పరమార్థము మనకు వివరిస్తున్నది.
ప్రియపాఠకులారా! పోరాటాలు 1. శరీర సంబంధమైనవి. 2. ఆత్మ సంబంధమైనవి. 3. విశ్వాస సంబంధమైనది. 4. శ్రమల పూరితమైనది. 5. వెలుగు సంబంధమైనది. 6. చీకటి సంబంధమైనది, ఆయుధాలతో కూడినది, ఆయుధాలు లేకుండ కేవలము శారీరబలముతో కూడినది. 7. వ్యయ ప్రయాసలతో కూడినది మరియు త్యాగముతో కూడినది. ఇన్ని విధాలైన పోరాటాలు నరజీవితములో క్రియ జరిగిస్తున్నాయి. వీటిని గూర్చి వివరముగా తెలిసికొందము. 1. శరీర సంబంధ పోరాటమన్నది యాకోబు విషయములో ఆది 32:24లో మనము చదువగలము. యాకోబు తెల్లవారు పర్యంతము ఒక వ్యక్తితో పోరాడినట్లు ఆ వేదభాగములో వ్రాయబడియున్నది. అయితే యాకోబు తాను పోరాడుచున్నది దేవునితో అని తెలియక కేవలము నరునితో పోరాడినట్లు భావించాడుగాని తన పోరాటము అంతిమ దశలో తాను పోరాడుచున్నది దైవత్వముతో అని గ్రహించాడు. ఆ స్థితిలో దేవుడు యాకోబుయొక్క పోరాటానికి మెచ్చి యాకోబుకు ఇచ్చినట్టి బిరుదు, యాకోబుకు ఇచ్చిన ధన్యత, యాకోబును హెచ్చించిన విధానము - ఈ వేదభాగములో ఈ పోరాటములో యాకోబు పేరు మార్చబడి, ఇశ్రాయేలుగ బిరుదును పొందుటన్నది మనమెరిగిన సత్యమే. యాకోబు సాధించిన ఈ విజయము ద్వారా తనకేగాక తనలోనుండి జన్మించిన 12 మంది కుమారులకు కూడా ఈ పేరు, ఈ ఆశీర్వాదము ధన్యయుతమైన ఐశ్వర్యాలుగూర్చి మనకు తెలిసిన విషయమే. యాకోబును దేవుడు ఇశ్రాయేలు అను పేరుతో వదలివేయక అతనిని వాడుకున్న విధానము - ఆయనను పేరుపెట్టి పిలిచిన విధానాన్ని గూర్చి యెషయా 42 & 43 అధ్యాయాలలో చదువగలము. ''యాకోబు నిన్ను సృజించినవాడగు యెహోవా, ఇశ్రాయేలూ! నిన్ను నిర్మించినవాడు.'' ఈ విధముగా యాకోబు పోరాటము, ఇశ్రాయేలు 12 గోత్రాలకు తండ్రియగుటయేగాక, దైవకుమారుడైన యేసుకు పితామహుడై ధన్యుడయ్యాడంటే యాకోబు విషయములోని దైవాశీస్సుల మర్మము వివరముగా మనకు తెలియగలదు.
అలాగే విశ్వాస సంబంధ పోరాటం ద్వారా అబ్రాహాము విశ్వాస జనాంగానికి తండ్రిగా దైవత్వము చేత బిరుదు పొందుట - ఇది విశ్వాస పోరాటము ద్వారా నరుడు సాధించే ఘనవిజయము. అలాగే దైవాత్మ వరము చేత సంసోను సాగించిన దైవవ్యతిరేక జనముతో పోరాటము, దైవవ్యతిరేక కూటమిని అంతమొందించినట్లు వేదములో చదువగలము. ఆలాగే దావీదు జరిగించిన పోరాటములో తన రాచరికాన్ని తన యుద్ధాన్ని తన శత్రు పోరును దైవత్వానికి అప్పగించి, దైవానుగ్రహము, దైవబలము, దైవిక తోడ్పాటుతో దైవ ప్రార్థనతో సాగించిన పోరులో - దావీదు పక్షముగా దేవుడే యుద్ధము చేసి దావీదుకు విజయము చేకూర్చిన విషయము మనమెరిగినదే. ఈ విధముగా మొట్టమొదట దైవజనాంగముతో నిలిచి - నిలబడి దైవాజ్ఞానుసారము దైవచిత్తము, దైవిక ఏర్పాటునుబట్టి మొట్టమొదటి ప్రవక్తగా దేవుని చేత నియమించబడిన మోషే జీవితములో - మోషే సాగించిన ప్రతి పోరాటము ప్రార్థనాయుతమైన పోరాటమే. సమస్యలలోను ప్రమాదాలలోను, అనివార్య పరిస్థితులలోను సమస్తమైన వాటిలోను దైవపరిధిలో దైవసహాయముతో మోషే సాగించిన పోరాటము మోషే జీవితానికి పరిశుద్ధ గ్రంథములో ఒక ప్రత్యేకమైన చరిత్రను సృష్టించింది. దేవుడే మోషేను గూర్చి సాక్ష్యమిస్తూ హెబ్రీ 3:2 దేవుని ఇల్లంతటిలో మోషే నమ్మకస్థుడని ప్రవచింపబడుటలో మోషేయొక్క నమ్మకమెంత ప్రభావితమైనది. దైవత్వానికి దైవపరిధిలో ఎంత విజయాన్ని సాధించిందో పరిశుద్ధ గ్రంథములో మనము చదువగలము. ఇందునుబట్టి ప్రవక్తలందరిలో మోషే ప్రధమ స్థానాన్ని సాధించాలంటే అతను సాగించిన పోరాటమే ఇందుకు కారణము. మోషే సాగించిన పోరాటము ఒకటి రెండు దినాలు కాదు, ఐదు పది సంవత్సరాలు కాదు. నలుబది సంవత్సరాలు లోకముతోను, లోకనాధులతోను, సమస్తమైన వారితోను, ఇవిగాక క్షుద్రశక్తులతోను, సాతాను సమాజములతోను, మోషే పోరాడి విజయాన్ని సాగించినట్లుగ వేదములో మనమెరిగిన విషయమే.
ఇక యదార్థముతో కూడిన పోరాటం యోబు; ఇతడు అసత్యానికి తావు లేకుండ ఎల్లప్పుడు దేవునియందు భయభక్తులతో అనుదినము బలులర్పిస్తూ - కుటుంబ సమేతముగా ప్రతి నిత్యము దైవసన్నిధిలో యోబు అర్పించిన బలులు అర్పణలు - యోబుకున్న భక్తి విశ్వాసమునుబట్టి దైవ పరిశోధనలో సాతానుయొక్క శోధనలోను, ఒక్క మాటలో చెప్పాలంటే సాతానుతోనే ఏ ఆయుధము లేకుండ యదార్థ స్థితిలో యోబు సాగించిన పోరాటము సాతానును ఓడించి జయించి, దైవపథములో విజయుడై ఐశ్వర్యవంతుడైనట్లుగ మనము చదువగలము. ఈ పోరాటములో ఎలాంటి సాధన సంపత్తిగాని, వాహనముగాని, ఏ ఆయుధముగాని వాడలేదు. యోబు వాడిన ఆయుధాలు సాధన సంపత్తి ఎఫెసీ
6:12లో విధముగా యోబు యొక్క పోరాటములో ప్రధానులు, అంధకార శక్తులు దురాత్మలయొక్క పోరాటములో ప్రధానులు అంధకారశక్తులు దురాత్మల సమూహాలు వీటితో పోరాడినట్లును, అంతేగాక వీటి సముదాయమునకు అధిపతియైన శోధకునితో ముఖాముఖిగ జరిగించిన పోరాటములో యోబు తన విశ్వాసము, తన విధేయతను, శాంతిని సహనమును ఓర్పును కలిగి, విశ్వాసము అనే డాలుతో దైవత్వమును ఆత్మీయ దృక్పధముతో వీక్షిస్తూ - శరీరాన్ని అలక్ష్యపెట్టి క్షణమాత్రమైనటువంటి లోక సుఖమునుగూర్చి చింతింపక, తన ఇహలోక సంబంధముగా తనకున్న సకలైశ్వర్యము తన శరీర సుఖమును అపేక్షించక జరిగించిన పోరాటములో - సాతానుకు అపజయము, యోబునకు విజయము కలిగి తనకు ఆవరకున్నటు వంటి ఐశ్వర్యము కంటె రెండింతలు ఐశ్వర్యాన్ని దైవకృపలో పొందగల్గి, తాను పోగొట్లుకొన్న సమస్తమునకంటె మరి ఎంతో అధికముగా సంపాదించుకొనడమే గాకుండ తన ఆయుష్కాలమును కూడా దైవాశీర్వాదముతో శోధన అనంతరము 140 సంవత్సరాలు అదనముగా జీవించగల్గినాడు. ఇది ఆత్మీయ పోరాటములో విశ్వాసి సాధించిన విజయాన్ని గూర్చిన వివరము.
అలాగే ఏలీయా యెహోషువా ఎలీషా యెషయా యిర్మీయా వగైరా ప్రవక్తలు - ఇట్టి పోరాటములో లోకసంబంధమైన సంపదలపై లక్ష్యముంచక వాటిని విడనాడి, దైవపథమునే తమకు ధ్యేయముగా ఉంచుకొని లోకముతో విజయాన్ని సాధించి, పాతనిబంధనలో సువర్ణాక్షరాలతో వీరి పేరు లిఖించబడినవి. ఇక నూతన నిబంధన చరిత్రలో అపొస్తలులుగ యేసుక్రీస్తు చేత ప్రతిష్టించబడిన ఆయన శిష్యులు తమ ఐశ్వర్యాలను తమ సంపదను తమ ఇహలోక జీవితాలను భోగభాగ్యాలను కడగా పెట్టి యేసుక్రీస్తు మార్గములో ఆయనను విశ్వసించి ఆయనను వెంటాడి ఆయనతో తిరిగి ఆయన చేత తర్ఫీదు పొంది, దైవరాజ్య సువార్తకు ప్రచారక సాధనాలుగ యేసుక్రీస్తు ఆత్మ చేత ముద్రించబడి పరిశుద్ధాత్మ పూర్ణులై - వారు సాగించిన సువార్త దండయాత్ర భూమి మీద దైవరాజ్య విస్తరణకు వారు సాగించిన పోరాటము, చేసిన ప్రయత్నాలు ప్రయాణాలు, వారు పొందిన చేదు అనుభవాలు, లోకరీత్యా వారికి కల్గిన శ్రమలు, వేదనలు, బంధకాలు, శిక్షలు అన్నిటిని కూడా వారు అలక్ష్యపెట్టి, దైవరాజ్యము కొరకు తమ శారీర ఆత్మలు సమర్పించుకొని చేసిన పోరాటము వలన, వారి జీవిత చరిత్రలు కేవలము వ్రాత మూలకముగానేగాక వారి పేరట ప్రార్థనా మందిరాలు కట్టబడియుండుట మనమెరిగిన సత్యమే. దైవరాజ్య ప్రకటనకు వారు చేసిన పరిచర్య - వారి త్యాగము వారి బలియాగము ద్వారా భూలోకములోనేగాక పరలోకములోను వారియొక్క పేర్లు 12 పునాదులుగ పరలోక పట్టణ పునాదులలో పరమ యెరూషలేము నందు వారి పేర్లు లిఖించబడియున్నాయంటే ఎంత ఆశీర్వాదకరమో మనము తెలిసికోవలసియున్నది. ఇది విశ్వాస సంబంధమైన దైవయుతమైన దైవరాజ్య సంబంధమైన పోరాటమును గూర్చిన వివరము.
ఇక భోగభాగ్యాలతోను శారీరేచ్ఛలలోను పదవీ వ్యామోహము రాజ్యకాంక్ష, పరిపాలనాదక్షతలోను దైవత్వమును పావుగా వాడుకొని పోరాడి నానావిధ దురాశలకు ఈడవబడి మరులు కొలుపబడిన వారై నాశన మార్గములో పయనించి, మరణ మార్గములో ప్రవేశించి కాలగతులలో కలసి పోయిన వారిని గూర్చి వేదరీత్యా తెలిసికొందము. ఇదే విధముగా అనగా మూలవాక్యములో యాకోబు 4:2 మీరు ఆశించుచున్నారు గాని మీకు దొరకుట లేదు, నరహత్య చేయుదురు మత్సరపడుదురుగాని సంపాదించుకోలేరు,'' అనుటలో పాతనిబంధనలో ఆదాము కుమారుడైన కయీను హేబెలు విషయంలో కయీను - హేబెలు బలిని దేవుడు లక్ష్యపెట్టినందున ఆగ్రహించి, ఈర్ష్యాద్వేషాలు కలవాడై దైవాశీర్వాదము తన సోదరుడైన హేబెలుకు చేరుటను గూర్చి ఆగ్రహించి, అతనిని భూమి మీద ఉంచకుండ చంపి తానొక్కడే దైవానుగ్రహము పొందగోరి జరిగించిన క్రియకు కయీను మత్సరపడి, నరహత్య జేసి సంపాదించుకొన్నదేమియు లేదు. ఈ హత్యా నేరానికి ప్రతిగా కయీను సంపాదించుకొన్నది శాపము, దేశద్రిమ్మరత్వము, విచారము, వేదనకర జీవితము పాపముతో కూడుకొన్న సంతానము. అతను సంపాదించుకొన్న జనాంగము కూడా దోషపూరితమైనవారై దైవోగ్రతకు గురియైన సంతానాన్ని భూమిని నిండించి, దైవోగ్రత మూలముగా యావద్ సృష్టి లయమయ్యే స్థితికి దిగజారినాడు. అనగా ముందున్న సృష్టిని సర్వనాశనము చేసేందుకు కారకులైన జనాంగము కయీను నుండి వ్యాపించారు.
ఇక ''పోట్లాడుదురు యుద్ధము చేయుదురుగాని దేవుని అడుగనందున మీకేమియు దొరకలేదు. ప్రియపాఠకులారా! ఇశ్రాయేలు పక్షముగా యుద్ధము జరిగించిన పాతనిబంధన రాజులందరును దైవచిత్తాన్ని దేవునియొక్క ఏర్పాటును దేవుడు చూపించిన మార్గమును, దైవనిబంధనను పాటించి, దైవాత్మ ప్రకారముగా తమ పోరాటాన్ని సాగించి ఎన్నో నియమాలు పాటించారు. ఇట్టివారిలో మోషే యెహోషువా దావీదు సొలొమోను వగైరాలు - ఈ పోరాటములో ఇశ్రాయేలు అను దైవజనాంగమునకు దేవుడు ప్రత్యక్షముగా వారి ముందు వెనుకల ఆవరించి నడిపించినట్లు అనగా దైవిక తోడ్పాటుతో ఇశ్రాయేలీ జనాంగము సాగించినట్లు అట్టి పోరాటము మూలముగా ఇశ్రాయేలీయులు విజృంభించి శత్రు రాజులను భీతావహులుగా జేసి దైవత్వాన్ని మహిమపరచారు.
ప్రియపాఠకులారా! ఇశ్రాయేలు సాగించిన పోరాటములో గిద్యోను మిద్యానీయులతో చేసిన పోరాట చరిత్ర చాలా ఆశ్చర్యకరమైనది, ఆయుధము లేదు, వాహనము లేదు, డాలు లేదు, యుద్ధ కవచాలు లేవు, సరియైన సాధన సంపత్తి లేదు, గిద్యోనుయొక్క సమూహము వాడినట్టి సాధనాలు ఏవియు కూడా ప్రాణహాని కల్గించేవి కావు, పోరాటానికి పనికి వచ్చేవి కావు, ప్రాణము తీసేవి కావు కుండ దివిటీ బూర - ఇవి గిద్యోనుయొక్క సాధనాలు. వీటితో ఇసుక రేణువుల వలె లెక్కకు మించిన సైన్యాన్ని వెంటాడి వారిని తరిమి, దైవశక్తి మూలముగా దైవాత్మ తోడ్పాటు ద్వారా గిద్యోను సాగించిన ఈ పోరాటము ఆశ్చర్యకరమైనది. దేవుని మహిమతో కూడినది ఈ పోరాట ఘట్టమును న్యాయాధిపతులు ఆరు ఏడు అధ్యాయాలలో చదువగలము. ఈ విధమైన పోరాటము ద్వారా గిద్యోను విజయాన్ని సాధించుటయే గాక దేవుని మహిమపరచాడు. ఇది దైవత్వాన్ని అడిగి దైవ ఆజ్ఞానుసారముగా దైవత్వమునకు విధేయించి, దేవునియందు భయభక్తులు గలిగి దేవుని అజమాయిషీలో నరుడు జరిగించిన ఈ పోరాటములో గిద్యోను విజయ వీరుడై తన చరిత్రను పరిశుద్ధ గ్రంథములో స్థిరపరచుకొన్నాడు. అలాగే దావీదు మహారాజు బాలుడై యుండి దేవునియొక్క అనుగ్రహము, దైవాశీస్సులు, దైవ ఎన్నిక, దైవ ప్రతిష్టతనుబట్టి దైవాత్మ తోడ్పాటు మూలముగా సింహాన్ని ఎలుగుబంటిని చంపుటయేగాక దైవజనాంగమైన ఇశ్రాయేలులతో నలుబది దివారాత్రులు ఏకధాటిగా సవాలు చేస్తూ పోరాటములో కాలు దువ్విన ఆరు మూరల జానెడు స్థూలకాయుడైన గొలియాతును, అతని సమూహమైన ఫిలిష్తీయులను జయించుటన్నది ఆశ్చర్యకర విషయము కాదా? ఏ ఆయుధం లేకుండ కేవలం వడెసెలలోని రాయితో పడవేసి, వాని కత్తితోనే వాని శిరస్సును నరకుటన్నది మానవత్వానికి అతీతమును, దైవత్వమునకు మహిమకరమును లోకానికి ఆశ్చర్య రీతిలో ఈ క్రియ జరిగినట్లుగా వేదములో 1 సమూయేలు 17:51లో చదువగలము. ఇది దేవుని అడిగి ఆయన చిత్తము ప్రకారముగా జరిగించబడింది. దైవజనాంగానికి దైవజనాంగ పరిపాలకులకు దైవవిశ్వాసులకు జరిగించిన విజయావకాశాలు - బబులోను సామ్రాజ్యములో దైవవిశ్వాస పోరాటము పోరాడిన దానియేలుగాని, మెషగు షద్రగు, అబిద్నగోయను వారు సాగించిన విశ్వాస సంబంధ, దైవభక్తి యుతమైన పోరాటములో మెషగు షద్రగు అబిద్నగో అను వారిని అగ్ని అంటలేదు, దానియేలును సింహాలు ముట్టలేదు. వారిని బాధించిన భూలోక పరిపాలక వర్గము అపజయము పాలైనట్లు దానియేలు గ్రంథములోని చరిత్ర ద్వారా మనకు తెలియగలదు. ఈ విధముగా పాతనిబంధనలో దైవత్వమును అడిగి పోరాటము సాగించిన వారలకు జయజీవితమును గూర్చిన వివరము మనము చదువగలము.
మూలవాక్యములో యాకోబు 4:3 మీరు అడిగినను మీ భోగముల నిమిత్తము వినియోగించుటకై దురుద్దేశ్యముతో అడుగుదురు గనుక మీకేమియు దొరుకుట లేదు,'' అనుటలో ప్రియాపాఠకులారా! మోషే యొక్కయు అహరోనుయొక్క ఆత్మీయ ఉన్నత స్థితినిగూర్చి కపటోపాయముతో దైవత్వమును అభ్యర్థించిన కోరహు కుమారులు వారు దైవత్వమును స్వార్థముతోను దురుద్ధేశ్యముతోను అడిగినందున అనగా మోషేకును అహరోనునకును వ్యతిరేకముగా నిలువబడి వారు దైవత్వమును అభ్యర్థించిన విధానమును బట్టి సణుగుళ్ళనుబట్టి దైవోగ్రతన్నది వారిని భూగర్భానికి అప్పగించినట్లుగ వేదరీత్యా మనకు తెలిసిందే. భూమి నెర్రి విడిచి వారిని, వారి కుటుంబాలను మ్రింగివేసినట్లు వేదచరిత్రలో మనము చదువగలము. ఆలాగే దేవుడు వెళ్ళమన్న నీనెవె పట్టణానికి వెళ్ళక దేవునియొక్క చిత్తమును గూర్చి నీనెవె పట్టణ నివాసులకు ప్రకటిస్తూ నలుబది దినాలలో నీనెవె పట్టణానికి సంభవించు దుర్ఘటననుగూర్చి ప్రకటించమనగా - లోకత్వమునకు దాసుడై లోకసంపదను లోక ఐశ్వర్యాన్ని ఆశించి, లోక ఐశ్వర్యాలకు ఆలవాలమైన తర్షీషు పట్టణమునకు పోవు ఓడను ఎక్కినప్పుడు, యోనా ప్రయాణించిన ఓడ, యోనా ఓడలోని నావికులు యావన్మంది దేవునియొక్క ఉగ్రతతో పోరాడవలసిన గతి ఏర్పడింది. ఇందుకు కారణము యోనాయే; ఈ విధముగా యోనా కారణమని తెలియుటకు చీట్లు వేయించగా నాటి ఉపద్రవమునకు కారకుడు యోనాయే,'' అనుటకు ఋజువుగ యోనా పేరట చీటీని నిర్ధారించుటలో యోనా చేసిన ప్రయాణము యోనా ఎక్కి పయనించిన మార్గము, యోనా వెళ్ళబోయిన ఆ ప్రదేశము ఎక్కిన ఓడ - ఇవి దేవుని అడిగి జరిగించిన ప్రయాణము కాదు. కనుక యోనా అవాంతరాలలోను సముద్ర కల్లోలాలలోను ఓడయొక్క పతనావస్థకును, ఓడ నావికుల భయాందోళనలకును సమస్తమునకును యోనా కారకుడై సముద్రము పాలయ్యాడు. ఆ పోరాటములో యోనా అపజయము పాలయ్యాడని ఇందునుబట్టి మనకు తెలుస్తున్నది. ఈ పని యోనా దేవుని అడిగి చేసింది కాదు. కనుక అతనికి ప్రమాదము చింత వేదన దుఃఖము, అంధకార జీవితము, చేప గర్భములో దుర్గంధపూరిత వాసము, ఇవన్నియు అతని జీవితములో ముఖ్య స్థానాన్ని ఆక్రమించినాయి. ఇందుకు కారణము దేవుని పట్ల యోనా ప్రదర్శించిన అలక్ష్య వైఖరియే.
ఆలాగే నూతన నిబంధన చరిత్రలో యేసుక్రీస్తు శిష్యులలో ఒకడైన ఇస్కరియోతు యూదా వెండిని ఆశించి, లోక పోరాటములో తగుల్కొని లోకాశలకు లోనై పరమగురువైన క్రీస్తుయొక్క సావాసమునకు దూరమై ఉరివేసుకొని మరణించే స్థితికి దిగజారినాడు. ఇస్కరియోతు యూదా సాధించింది మరణమేగాని అతనికి ఏమియు దొరకలేదు. సంపాయించుకోలేక పాతాళములో కలసిపోయాడు. అందుకే పౌలు 1 తిమోతి 6:12లో ''విశ్వాస సంబంధమైన మంచి పోరాటము పోరాడుము, నిత్యజీవమును చేపట్టుము, దాని పొందుటకు నీవు పిలువబడి అనేక సాక్షుల ఎదుట మంచి ఒప్పుకోలు ఒప్పుకొంటివి,'' అని తిమోతిని హెచ్చరిస్తూ 2వ తిమోతి 4:7లో తన్నుగూర్చి ''మంచి పోరాటము పోరాడితిని, నా పరుగు కడముట్టించితిని, విశ్వాసము కాపాడుకొంటిని, ఇక మీదట నా కొరకు నీతి కిరీటముంచబడియున్నది. ఆ దినమందు నీతి గల న్యాయాధిపతియైన ప్రభువు అది నాకును, నాకు మాత్రమే గాకుండ ఈ ప్రత్యక్షతను అపేక్షించు వారికందరికిని అనుగ్రహించును,'' అని ప్రవచించియున్నాడు. ఎఫెసీ 6:12లో మన పోరాటము ఎవరితో అన్నదానిని గూర్చి వివరించబడియున్నది. ''మనము పోరాడునది శరీరులతో కాదుగాని ప్రధానులతోను, అధికారులతోను, ప్రస్తుత అంధకార సంబంధులగు లోకనాధులతోను, ఆకాశమండల మందున్న దురాత్మల సమూహాలతోను పోరాడుచున్నాము.'' మన పోరాటముయొక్క వివరము వివరించబడియున్నది.
కనుక ప్రియపాఠకులారా! మన ఆత్మీయ స్థితిని కాపాడుకొంటూ మన ప్రభువు చిత్తమేమిటి? ఎరిగి ఆయన చిత్తానుసారము నడుచుకొనుటకు, మంచి మనస్సాక్షి కల్గి సిద్ధపాటు గల్గి దైవిక విశ్వాసములో స్థిరముగా జీవించెదము గాక!
.........
1. అపరాధము - పాపము
మూలము ఎఫెసీ 2:1 మీ అపరాధముల చేతను పాపములచేతను మీరు చచ్చినవారైయుండగా, ఆయన మిమ్మును క్రీస్తుతో కూడా బ్రతికించెను :- ప్రియసంఘమా! అపరాధమంటే ఏమిటి? పాపమంటే ఏమిటి? ఇవి రెండును నానా రీతులలో లోకమందంతట క్రియ జరిగిస్తూ విశ్వాసులతో సహా సమస్త జనాంగమును కలవరపరచి, దైవత్వానికి దూరులుగా చేస్తూ మాట తప్పిన వారినిగా అబద్ధీకులుగాను దుష్కార్యములు చేయువారుగాను, కపటము మోసముతో కూడిన ప్రవర్తన గలవారినిగాను దైవత్వములో జీవించే వ్యక్తిని సహాదేవునికి దూరంచేయుటకు ఇవి రెండును బహువిధాలుగ క్రియ జరిగిస్తున్నాయి. నాడు యేసుక్రీస్తు 12 మంది శిష్యులను, ఆ తర్వాత వారు అపొస్తలులు కాగా వారిని - వారియొక్క త్యాగపూరిత సువార్త బలియాగము ద్వారా పరిచర్య మూలముగా కట్టబడిన సంఘాలు నేడు నానావిధ పేర్లతో నానారకాలుగ నరుల ఇష్టానుసారముగా - అరిగురిలేని ఆచారాలు, దైవత్వానికి యోగ్యకరముగాని ప్రవర్తన సాంగ్యాలతో నానారీతులుగ క్రియజరిగిస్తున్న సంఘాలు కోకొల్లలు. మేము పరిశుద్ధాత్మ పూర్ణులము మా సంఘము పరిశుద్ధాత్మతో కూడిన సంఘము. పరిశుద్ధాత్మ కాపుదల మెండుగా ఉన్నది. అబద్ధాలు మాట్లాడడము, తప్పుడు పనులు, ఎలాంటి కపటాలు, కుత్సితముగాని లేదని చెప్పుకొనే సంఘాలే పప్పులో కాలువేసి, నానావిధమైనటువంటి శ్రమలు పడి కోర్టులపాలై అన్యుల చేత తీర్పు దీర్చుకొనే దుర్భర స్థితిలో కొన్ని సంఘాలుంటున్నవి. ఇందునుగూర్చి ఈ అపరాధము పాపమన్నది పాతనిబంధనలో కొంత పరిమితి ఉంది. ఈ యుగములో పరిమితి లేదు. వారు వీరు అను బేధము లేదు. క్రైస్తవ సంఘాలన్నిటిలో బాహాబాహీగా ఈ రెండును క్రియ జరిగిస్తున్నవి.
ఇంతకును అపరాధమంటే ఏమిటి? పాపమంటే ఏమిటి? వీటిని గూర్చి తెలిసికొందము. తెలియక చేసేది తప్పు - అపరాధము. ఈ అపరాధము రూపాంతరమే పాపము. మనిషిలో ఈ రెండును గూడు కట్టుకొని యున్నవి. బాల్యములో పాపమన్నది అపరాధ రూపముగా అనగా పాపము యొక్క బాల్యరూపమే అపరాధము. బాల్యమన్నది పెరిగి పెద్దదైనప్పుడు యవ్వనము. బాల్యములో చేసేటటువంటి తప్పులను అపరాధములంటారు. పెద్దయైనప్పుడు చేసే అకృత్యాలను పాపాలంటారు. ఒక్క మాటలో చెప్పాలంటే పాపముయొక్క చిగురు - అంకురము అపరాధము, అపరాధము ఎదిగి ప్రబలించినప్పుడు అది పాపముగా రూపము దాల్చుతుంది. ఈ పాపమన్నది ఏయేవిధాలుగ క్రియ జరిగించవచ్చును - హత్యారూపము, దోపిడీ రూపముగాని, మానభంగము, నరహత్య, వ్యభిచారము, జూదముగాగాని, ఏవిధముగానైనను పాపానికి దారులున్నవి. ఇందునుగూర్చి వేదరీత్యా తెలిసికొందము.
దైవ వనమైన ఏదెనులో పురుషుని వదలి స్త్రీ ఒంటరిగా ఉండుటన్నది అపరాధము. ఆలాగే ఒంటరితనములో ఉండి సర్పపు మాటలు వినుట అపరాధమే. ఈ రెండు అపరాధములు ఏకమై స్త్రీలో క్రియ జరిగించి, దేవుడు నిషేధించిన ఫలమును భక్షించిన నేరానికి, వ్యతిరేకతతో కూడిన పాపానికి వారిని సరాళము చేసింది, అంటే పురుషుని వదలి పెట్టుట మొదటి అపరాధము, రెండవది సర్పపు మాటలు వినుట. ఈ రెంటి ద్వారా పాపానికి దారి ఏర్పడింది. దైవ ఆజ్ఞాతిక్రమ క్రియకు రూపుదాల్చింది. ఇది పాపము. దీనియొక్క ఫలము మరణము. ఆ విధముగా ఆ స్త్రీ చేసిన పాపము అంతటితో ఆగక - ఈ పాపమన్నది పురుషునిపై కూడా ఈ పాపములో అవకాశమిచ్చినందున పాలిభాగస్థుడయ్యాడు. ఏ విధముగా అంటే స్త్రీ తన భర్తకు తెచ్చి ఇచ్చిన ఫలములనుగూర్చి - ఇవి ఎక్కడివి? ఎవరిచ్చారు? నీవెందుకు తిన్నావు? అని అడగాలి. ఆ విధముగా అడక్కపోవుట పురుషుని అపరాధము. ఆ విధముగా అడక్కుండ వెంటనే ఇచ్చిందే తడవుగ తినడము దైవాత్మ పూర్ణుడైన నరునియొక్క పాపము. ఈ విధముగా ఇరువురి ద్వారా ఈ పాపానికి పునాది ఏర్పడింది. అలాగే ఇరువురి ద్వారా అపరాధానికి పునాది ఏర్పడింది. ఇక వారి సంతానాల ద్వారా ఏర్పడిన అపరాధము, పాపమునుగూర్చి తెలిసికొందము. తొలి గర్భఫలములైన కయీను హేబెలు విషయములో అపరాధము పాపము జరిగించిన క్రియను ఆదికాండ 4:లో కయీను హేబెలులు అర్పించిన బల్యర్పణలు - నాకు బలులర్పించమని దేవుడు అడిగినట్లుగా వేదములో లేదు. ఆ విధముగా దైవత్వము అడగకుండానే, దైవత్వము కోరకనే నరులు తమ స్వార్థముతో చేసిన ప్రతి పనియు అపరాధమేయగుచున్నది. అలాగే కయీను హేబెలు బలి కూడా దైవత్వానికి ప్రీతికరముగాక అనుకూలముగా లేనందున దైవత్వము పట్ల అది అపరాధమైయున్నది. ఆ విధముగా దైవత్వము కోరకుండ ఇరువురు సోదరులు అర్పించిన అర్పణను పరిశోధనగా హేబెలు బలి మీద లక్ష్యముంచుట - ఇది దైవపరీక్ష. ఈ పరీక్షలో హేబెలు కంటే పెద్దవాడైన కయీను స్వార్థ చింతన కలవాడై అహంభావముతో కుట్ర, కుత్సిత ద్వేషము వైరాగ్యముతో విషపూరిత హృదయ స్థితిలో తమ్మునిపై ద్వేషాన్ని పెంచుకొన్నాడు.
ప్రియాపాఠకులారా! ఇందులో కయీను బలిని దేవుడు ఎందుకు లక్ష్యపెట్టలేదన్న సంశయము పాఠకులకు కలుగవచ్చును. కయీను అర్పించిన బల్యర్పణ శాపగ్రస్థమైనవి. ఆదాము నిమిత్తము భూమి శాపగ్రస్థమైనందున భూఫలములు దైవసన్నిధిని హ్యేయములు - అవి పనికిరావు. కనుక వాటిని పొలము పంట మీద లక్ష్యముంచలేదు. అందునుబట్టి కయీను ఈయొక్క అపరాధమునుబట్టి కయీనులో ద్వేషము విజృంభించి, పాపానికి లోకములో సోదరహంతకుడై మరణానికి బీజము వేసి, నరహత్యకు పునాది, సోదర హత్య క్రియకు ప్రారంభోత్సవము చేశాడు. తన తండ్రి ఆదాము కంటే మూడంతల దైవశాపానికి గురి అయ్యాడు. నికృష్ట జనాంగానికి తండ్రి అయ్యాడు. లోకాన్నే నాశనము చేయబడే జనాంగానికి మూల పురుషుడయ్యాడు. యావద్ సృష్టి నాశనానికి కారకుడయ్యాడు. దైవోగ్రతకు గురియయ్యే పాపానికి పితామహుడయ్యాడు. పాపానికి దాసుడయ్యాడు. అంతేగాక పాపానికి ప్రేమ పాత్రుడయ్యాడు. ఇన్ని అరిష్టాలతో కూడిన పాపబంధకాలలో తగుల్కొన్న కయీనుకు శిక్ష విధించక, వీపు మీద గుర్తువేసి రక్షణ కల్గించినట్లుగా చదువగలము. ఈ విధమైన క్రియ వల్ల సంక్రమించిన పాపము యావద్ సృష్టిని జల ప్రళయముతో తుడిచి వేసే ఘోరాతిఘోరమైన, విషాదకరమైన నిర్జీవమైన సృష్టిగా మార్చుటకు కారణమైంది.
అయితే ప్రియాపాఠకులారా! ఈయొక్క పాపము ఆగలేదు. మరు సృష్టిలో అనగా ఆదాము సృష్టి అంతమై నోవహు ద్వారా ఏర్పడిన నూతన సృష్టిలో - ఈ అపరాధము పాపమన్నది తన మామూలు క్రియాకర్మలు జరిగించుటకు మొదలుపెట్టినవి. ఎలాగంటే సంసోను విషయములో దేవుడు సృష్టించింది. తన జనాంగమైన ఇశ్రాయేలు రక్షణార్థమై అతడు దైవత్వము చేత ఒక గొడ్రాలి గర్భమును ఫలభరితముగా చేసి, తద్వారా ఒక ప్రత్యేకమైన స్థితిలో దేవునికి ప్రతిష్టించి, దైవత్వమునకు నాజరు చేయబడినవానిగ దైవజనాంగమున్న విషమ పరిస్థితులలో - వారున్న ఫిలిష్తీయ చెరలో వారికి సంక్రమించిన ఉపద్రవాలలో న్యాయాధిపతిగా నానావిధ బలాధిక్యతలలో నియమాలతో ప్రతిష్టించి, ఇశ్రాయేలుకు న్యాయాధిపతిగా నియమించాడు. ఇది దైవిక ఏర్పాటు. ఈ విధముగా జన్మించిన సంసోనులో దైవాత్మ ప్రత్యక్షముగా క్రియ జరిగించుచు సంసోనును ఆవరించి శత్రు సంహారము సింహాన్ని చంపుట, గొలుసులను త్రాళ్ళను త్రెంపుట, గాడిద దవడ ఎముకతో వెయ్యిమందిని చంపుట. ఇవన్నియు దేవునియొక్క బలాధిక్యతలు సంసోనులో గుప్తమైయున్న సందర్భాలు. ఇంత గొప్ప ఆధిక్యతలు ఒక నరునికి ఇచ్చిన దేవుని పట్ల నరుడు కృతజ్ఞతగ జీవించాలి. భక్తి విశ్వాసాలతో జీవించాలి. విధేయుడుగా జీవించాలి. కాని దైవ ప్రణాళికకు విరుద్ధముగా సంసోను దైవనియమానికి దైవచట్టానికి సంసోనులో జరిగించిన విధానమేమనగా మద్యాన్నిగాని, స్త్రీనిగాని నిషేధమై దేనిని వాడకూడదు. దేవుడు విధించిన చట్టానికి వ్యతిరేకముగా ప్రవర్తించుట అపరాధము. ఆ విధముగా ప్రవర్తించుటయేగాక వాటికి లోబడుట పాపము అనగా స్త్రీ వ్యామోహము, వ్యభిచారము, త్రాగుడు, దైవ ఆజ్ఞ నిర్లక్ష్యము. వీటి ద్వారా దైవత్వమునకు సంతాపము పుట్టించుటన్నది సంసోను చేసిన అపరాధము. అంతేగాక వాటిని అభ్యసించుట పాపము. దీనికి శిక్ష శత్రువులకు బందీయగుట, సాతాను ద్వారా చెర కండ్లు పోగొట్టుకొని అంధుడై చెరసాలలో తిరుగలి విసరుట, అన్యదేవతయైన దాగోను ఆలయములో ఆటవస్తువుగ శత్రువు చేత అవమానించబడుట. ఇది సంసోనులో తొలుత ఏర్పడిన అపరాధము దినదిన ప్రవర్థమానమై దైవోగ్రత పుట్టించే పాపముగా మారి, దైవోద్దేశ్యము దైవప్రణాళిక దైవచట్టమును వమ్ము చేసే హీనత్వానికి మరియు వానిని లోకానికి కూడా వమ్ము చేసిన అపరాధము, పాపమునుగూర్చి తెలిసికొనియున్నాము.
ఇక దావీదు విషయములో దావీదు కీర్తనాకారుడు ప్రవక్త మహారాజు, పరలోక తాళపు చెవులు కల్గినవాడు. యేసుక్రీస్తుకే తన వంశములో జన్మ నిచ్చినవాడు ఇట్టి మహాప్రవక్తయైన మహారాజు 2వ సమూయేలు 11:1లో వసంత కాలములో రాజులు యుద్ధమునకు బయలుదేరు సమయము ఆసన్నము కాగా ఇశ్రాయేలీయులు యుద్దసన్నద్ధులై అమ్మోనీయులను సంహరించి, రబ్బా పట్టణమును ముట్టడి చేసినట్లు వ్రాయబడియున్నది. అయితే ఆ సమయములో ఇశ్రాయేలుకు రాజుగా నియమింపబడిన దావీదు ఇశ్రాయేలు సైన్యము మధ్య నిలిచి దైవపక్షముగా పోరాడి శత్రువుతో యుద్ధము చేయవలసిన బరువు బాధ్యత యుండగా అందుకు విరుద్ధముగా దావీదు ప్రవర్తించిన విధానము ఈ విధముగా వ్రాయబడి యున్నది. యెరూషలేములో నిలిచిన దావీదు ప్రొద్దుక్రుంకు వేళ రాజ్యనగరి మిద్దె మీద నడుచుచు పైనుండి చూచినప్పుడు స్నానము చేయు ఒక స్త్రీ కనబడెను. ఆమె బహు సౌందర్యవతియై యుండుట చూచి, దావీదు దాని సమాచారము తెలిసికొనుటకై యొక దూతను పంపెను. ఆ చరిత్ర మనకు తెలిసిందే.
ప్రియపాఠకులారా! ఇందులో దావీదు చేసిన అపరాధము - దైవపక్షముగా తన జనాంగముతో వెళ్ళకుండుట అపరాధము. అలాగాకుండ ఇశ్రాయేలు పక్షముగా యుద్ధరంగానికి వెళ్ళియున్నట్లయితే అతను అపరాధి కాడు, దోషి కాడు. అయితే అతడు యుద్ధమునకు వెళ్ళక బద్ధకించుటనుబట్టి అపరాధి అయ్యాడు. రాచనగరిలో సుఖ భోగమును కోరి, ఆకాశము వైపు చూడవలసిన రాజు క్రింది భూమిని చూచి, భూమియొక్క ఆకర్షణకు భూసంబంధమైన స్త్రీ యొక్క ఆకర్షణకు లోనై పాపములో పడినాడు. ఈ చరిత్ర మనకు తెలిసిందే. ఈ పాపము దినదిన ప్రవర్థమానమై విజృంభించి, రాచరికాన్ని రాజ సింహాసనాన్ని సంబంధ బాంధవ్యాలు, దేవుడు అనుగ్రహించిన తలాంతులను వరాలను వమ్ముచేసింది. దావీదు చేసిన చిన్న అపరాధమును ఆసరాగా చేసుకొని, పాపమన్నది దావీదును ఆకర్షించి, అతని సంతానమును, రాచరికాన్ని, రాజ్యాన్ని, సంపదను, అతని ఆత్మీయతను, సమస్తమును భ్రష్టు పట్టించి అనగా దైవత్వము ఓర్వలేనంతటి విధముగా దావీదు పట్ల క్రియ జరిగించి దావీదును భ్రష్టునిగా చేసింది. దావీదు రాజ్యభ్రష్టుడై పిచ్చివాడై పుత్రశోకము, రాజ్య బహిష్కరణ, రాచరిక పతనము, దైవోగ్రత, శత్రువుల యొక్క అనుకరణ పాప ప్రభావము పాపముయొక్క విజృంభణ ఒకటేమిటి? సమస్త విధాలుగ ఈ పాపము క్రియ జరిగించుటయేగాక మనశ్శాంతి లేకుండ, నెమ్మది, ప్రశాంతత, విశ్రాంతి, నిద్ర, ఆహారాలు లేకుండ పిరికివానినిగ చేసి తరిమింది. ఇది దావీదు చేసిన అపరాధము తద్వారా రూపాంతరము చెందిన వివరమును గూర్చిన చరిత్ర. ఇలాంటివి పాతనిబంధనలో కోకొల్లలుగ వేదరీత్యా చదువగలము.
ఇక నూతన నిబంధనలో అపరాధము పాపము రెండును లోకములో జరిగిస్తున్న క్రియలు తద్వారా లోకానికి సంక్రమించిన పాపము దైవశాపము, మరణము అను మూడింటి నుండి రక్షణ కల్గించుటకు దేవుడు తన కుమారునే అపరాధార్ధము పాపపరిహారార్థము రెండింటి విషయములో తన కుమారుని బలిపశువుగ చేయుటకు ప్రణాళికను రూపించి, లోకములో దేవునికున్న ప్రేమనుబట్టి ఈ సందర్భములో యోహాను 3:16లో చదువగలము. లోకము మీద దేవునికున్న ప్రేమనుబట్టి పాపము దోషము ఎరుగని తన కుమారుని పంపి, పాపము అపరాధముల రెండింటిని ఆయన మీద మోపి, వీటి మూలముగా సంక్రమించిన దైవోగ్రతల నుండి లోకస్థులను విమోచించుటకు మరియు విడుదల కల్గించుటకు తన కుమారుని బలిపశువుగ సిలువ మీద, మన అపరాధ పాపముల కొరకు వ్రేలాడదీయించుటన్నది నరుని మీద దేవునికున్న ప్రేమకు ఋజువైయున్నది. ఈ విధముగా అపరాధము, పాపములన్నవి నిలువు అడ్డకొయ్యలుగ నరుల చేత రూపించబడి, దైవకుమారుని చేత మోయబడడము, అంతేగాకుండ ఆయనను అవి బలిగొనుటన్నది అపరాధము, పాపముయొక్క ప్రభావమెంత వికృతముగా లోకములో క్రియ జరిగించినవో మనము గ్రహించవలసియున్నది. అయితే ఈ అపరాధము, పాపమన్నది క్రీస్తు యుగములో ఆగలేదు. ఆయన మరణ పునరుత్థాన అనంతరము ఈ అపరాధము పాపమన్నది యేసుక్రీస్తుయొక్క అపొస్తలులపట్లను, ఆనాటి రోమా పట్టణ పరిపాలకులపట్లను బహు తీవ్రముగా క్రియ జరిగించినవి. ఆ క్రియ యేసుక్రీస్తు ప్రతిష్టించిన అపొస్తలులకు మరణశిక్ష విధించుటన్నది అపరాధ పాపములయొక్క ప్రధాన ఉద్దేశ్యము. అయితే యేసుక్రీస్తు ప్రతిష్టించిన 12 మంది అపొస్తలులు అపరాధులు కారు, పాపులు కారు నిర్ధోషులు. వారి మీద లోకము అపరాధము మోపుటకు కారణము - వారు క్రీస్తు రాజ్య సువార్తను ప్రకటించుటయే లోకములో అపరాధముగా ఎంచబడింది. ఆ అపరాధమన్నది నాటి యూదా జనాంగములో పాపముగా మారి, అపొస్తలులనే నానావిధ శిక్షలకు గురిజేసినట్లుగ అపొస్తలుల చరిత్ర తెలిసిందే.
ఈ విధముగా క్రియ జరిగించిన ఈ అపరాధ పాపములన్నవి రెండును ఏకమై సౌలును ఆవరించి సౌలు ద్వారా అపొ 9:1-2 చదివితే సౌలు చేసినటువంటి ఘోరకృత్యాలు ఇందులో వ్రాయబడిన విధముగా - ''ప్రభువు శిష్యులను బెదరించుటకును, హత్య చేయుటకును తనకు ప్రాణాధారమైనట్టు, అంతియేగాక ప్రధాన యాజకుని యొద్దకు వెళ్ళి క్రీస్తు మార్గమును అనుసరిస్తున్న స్త్రీలనైనను, పురుషులనైనను వారిని బంధించుటకును, చెరపెట్టుటకు, శిక్షించుటకును, హత్య చేయుటకు డమస్కులోని పరిపాలకుల యొద్ద అధికార పత్రిక లిమ్మని అడిగెను. అతడు ప్రయాణము చేయుచు ఈ మహా గొప్ప నరమేధ కార్యము జరిగించుటకు తలపడిన సౌలును దేవుని ఆత్మ ఉపేక్షింపక మొత్తి నేల పడవేసిన విధము; ఆ తర్వాత జరిగిన సంఘటన వగైరా విషయాలు మనకు తెలిసినవే. ఈ విధముగా దోషాపరాధముల చేత చచ్చిన సౌలును క్రీస్తు ఆత్మ మొత్తి, అతని హృదయస్థితిని అతని వైఖరిని, అతని ఆత్మీయతను, సమస్తమును మార్చి, అంధునిగ జేసి అంధత్వములో మూసుకున్న పొరలను తొలగించి, జలబాప్తిస్మము, ఆత్మాభిషేకము ద్వారా పౌలుగా మార్చినట్లు పౌలు చరిత్ర మనమెరిగినదే. అయితే సౌలును ప్రభువు చంపక, సౌలుగా ఉన్న అతనిని పౌలుగా మార్చి, ఎనిమిది సంఘాలకు దైవరాజ్య సంబంధితయుతమైన ప్రత్యేక పత్రాలను రచింపజేయుటన్నది క్రీస్తుయొక్క ప్రభావము. అందుకే ''అపరాధముల చేతను, పాపముల చేతను మీరు చచ్చినవారైయుండగా, ఆయన మిమ్మును క్రీస్తుతో కూడా బ్రతికించెనన్న మాట సౌలు పట్ల ముమ్మాటికి యధార్థమైయున్నదని గ్రహించాలి.
ఇక అననీయ సప్పీరాల విషయములో సొంత పొలము అమ్ముడైతే ఆ అమ్ముడైన పొలము పైకము దేవునికిస్తామని మ్రొక్కుకున్నారు. మీరు పొలమును అమ్మి నాకు డబ్బులిమ్మని దేవుడు అడుగలేదు. దేవుడు లంచగొండి కాదు, భిక్షకుడు కాదు, తాను అడుక్కునేవాడు కాదు. కాని అననీయ దంపతులు తమకు ఎంతకు అమ్ముడై పోనీ, పోరంబోకు పొలాన్ని దైవార్పితము చేయుటకు భార్యాభర్తలు ఇరువురు ఏకాభిప్రాయముతో ఆలోచించుకొని దేవునికి ఈయాలనుకొన్నారు. కాని వారిని పరిశోధించుటకు పరిశుద్ధాత్మ హెచ్చు ధరకే - అమ్ముడయ్యే స్థితికి మార్చినప్పుడు ఆశించిన దానికంటె ఎన్నో రెట్లు అధిక ధర పలుకగా - ఆ ధనములో కొంత దాచుకొని అబద్ధము మాట్లాడుటన్నది పాపము. దేవునికి ఇస్తానని దొంగ మ్రొక్కుబడి మొక్కుకోవడము, పనికిరాని నేల ఇది ఎవరు కొనరని దేవునికి ఇస్తామని అనుకోవడము అపరాధము. ఆ ఇస్తామన్నది సరిగా ఇవ్వకపోవడము పాపము. అపొస్తలుల పాదాల దగ్గర అబద్ధమాడిన ఈ విధమైన నేరానికి ఫలితము మరణము. ఇవి అపరాధము, పాపము జరిగించిన కొన్ని ఘట్టాలు.
అయితే ప్రస్తుత ఈ ఆధునిక కాలములో ప్రతి వ్యక్తిలో జాతి మత కుల శాఖ అంతస్థు పదవి అన్న విచక్షణ లేకుండ బాహాటముగా నేడు ఇది నాలుగు కాళ్ళతో నడచుచు ప్రతి వ్యక్తిని దైవత్వానికి దూరముగా చేస్తూ ఆత్మపరుని, ఆత్మ లేనివాని, వేదవిద్వాంసుని, వేదవిద్య ఎరుగని వానిని, ధనవంతుని, భిక్షగానిని ప్రభుత్వ ఉద్యోగిని దైవసేవకుని, లోకసంబంధ సంఘాలు నేడు ప్రపంచమందంతట వ్యాపించి, క్రైస్తవ సంఘాలు అవి ఏరకమైన సంఘమైనను ఈ అపరాధ పాపమన్నది సంఘములోను, సంఘ పెద్దలు, నిర్వాహకులు, సంఘ కాపరులలోను, సంఘస్థులలోను, సంఘ సంస్థలలోను, పాపమునకు మూలమైన అపరాధ కారణము బహిరంగముగా క్రియ జరిగిస్తున్నది. ఈనాడు నోటి మాటలతో విశ్వాసిగాని బోధకుడుగాని, ఒక సంఘపెద్దగాని, వేద విద్వాంసుడుగాని మాట మాత్రము ఆ సమయానికి ప్రమాణము చేసి తప్పిపోవటము జరుగుతున్నది. మాటలలో తలంపులలో క్రియలలో వ్యవహారికముగా దైవజనుడు బహుజాగ్రత్తగా వ్యవహరించవలసియున్నది. కపట వైఖరితోగాక నిర్మలబుద్ధి, నిష్కపట హృదయ స్థితి, యదార్థ జీవితములో సత్యాన్ని అనుసరిస్తూ - నోటి మాటలతోగాక క్రియారూపకముగా చేసిన వాగ్దానాలు నెరవేర్చుటన్నది క్రైస్తవ లక్షణము. క్రీస్తుయొక్క సిద్ధాంతము, క్రైస్తవ్యములో మూలమైనది - ప్రేమయే. క్రైస్తవ్యములో ప్రేమను కోల్పోవుటన్నది మొట్టమొదటి అపరాధము. ప్రేమన్నది లేకుండ క్రైస్తవ్యములో జీవించుట అసాధ్యము. ప్రేమ లేనివాడు క్రీస్తును చూడలేడు. అసలు యేసుక్రీస్తు నిజరూపము ప్రేమతో కూడింది. అతనిలో ద్వేషముగాని, కుత్సితముగాని, అసత్యముగాని వీషన్మాత్రము లేదు. అలాంటప్పుడు ఆయన బిడ్డలమైన మనలో ''విశ్వాసము, ప్రేమ, నిరీక్షణ'' ఈ మూడును లేనిదే దేవునికి ఇష్టుడై యుండుట అసాధ్యము. ఈ మూడును మాటలలో ఉన్నాయిగాని క్రియలలో లేవు. ఇందునుగూర్చి 1 కొరింథీ
13:1-7 చదివితే ప్రేమను గూర్చి పౌలు వ్రాసిన వివరము మనకు తెలియగలదు. మరియు 14:1 ప్రేమ కలిగియుండుటకు ప్రయాసపడుడి,'' అంటున్నాడు.
ఇందునుబట్టి ప్రియపాఠకులారా! ప్రేమను సంపాదించుటకు ప్రయాసపడాలి. నోటి మాటలతో సంపాదించేది కాదు. క్రియల ద్వారా బహిర్గతమయ్యేదేగాని, నోటి మాటలతో కూడినదిగాదు. నాలుకతో చేసే ప్రేమ సంపూర్ణము కావాలంటే అది క్రియలతో కూడిన గుణమని, ప్రేమ కలిగి ఉండాలంటే ఎన్నో అవాంతరాలు ఎదుర్కోవాలి. ఎన్నో అసందర్భాలు కలుగుతాయి. వాటినన్నిటిని ఎదుర్కొని పోరాడి ప్రేమ ద్వారా లోకాన్ని, లోక నరుల హృదయాలను, లోకాధికారులను, లోకోద్యోగస్థులను, లోకపరిపాలకులను, ఇరుగుపొరుగును, మన స్వకీయులను సంపాదించుకొని, వారి హృదయాలను ఆకర్షింపజేయగలగాలంటే - ఇట్టి క్రియలో ప్రేమకున్న ప్రాధాన్యత మరి దేనికిని లేదని, ప్రేమ ద్వారా లోకాన్ని జయించవచ్చని, అనేకులను ఆత్మీయ బంధువులుగా పొందవచ్చును. అసలు లోకమే ప్రేమ - లోకములో రెండు రకాల ప్రేమలున్నవి. ప్రేమ అనే నియమాన్ని పాటించకపోతే అది ద్వేషముగా మారి, ఎదుటివారిని అంతము చేయుట లేక వానిని అగౌరవపరచుట, బాధించుటయో ఏదోయొక దోషాపరాధము ప్రేమయొక్క రూపాంతరముగా ఉన్నదన్న సత్యాన్ని ఎరుగక, ఒక వ్యక్తిలోని ప్రేమ వక్రించితే అది ద్వేషముగా మారుతుంది. ఇది ఆదిలో ఏదెనులోనే నరజంటయొక్క జీవితము ఇందుకు మాదిరి; దేవుడు నరజంటను ప్రేమించి ప్రత్యేక వనము వేసి అన్ని హంగులు ఏర్పరచాడు. దిగులు లేదు, స్నానపానాదులు లేవు, వంటావార్పు లేదు, ఆరోగ్య వాతావరణములో చెట్లఫలాలతో పోషిస్తూ - ఆ నరజంట మీద ప్రేమకు పరిమితము లేదు. అనగా అంత ఎక్కువగా ప్రేమించాడు. దైవ ఆజ్ఞాతిక్రమము చేసి దైవత్వమును తిరస్కరించినందున దేవుని ప్రేమ ద్వేషముగా మారింది. దేవునియొక్క ద్వేషము నరుని మీద కొన్ని తరాలుగ క్రియ జరిగిస్తూ నానావిధమైన నానావిధ క్రియలలో - నానావిధ శిక్షలను విధించుచు నానారీతులుగ నరులను బాధించి, వారిని తన వారినిగా తనపై ప్రేమను కల్గించుటకు ఎంతో ప్రయాసపడినట్లుగ ఈ క్రింది అంశాలనుబట్టి తెలుస్తున్నది. ఆజ్ఞాతిక్రమము చేసిన నరుని కనికరించి చర్మపు దుస్తులను తొడిగించగా - వారికి పుట్టిన సంతానము కూడా దేవుని పట్ల ప్రేమ చూపకపోవుట విచారకరము. అయినను వారిని వదలలేక ఆత్మీయమైన ప్రేమతో నరుని సృష్టించినందుకు ఆదాము హవ్వల సంతానములో హానోకును తన ప్రేమలో చేర్చుకొని, తన ప్రేమలో భాగస్థుడు కాగా అతనిని లోకానికి కనుమరుగుచేసి తనతో తీసికొనిపోయాడు. అనగా హానోకు మరణము లేకుండ మరణాన్ని రుచి చూడకనే దైవ స్థానాన్ని పొందినాడు. ఇది దేవుని ప్రేమలోని ప్రధాన ఘట్టము. కనుక అపరాధము పాపము అన్నది ప్రేమ వికటిస్తేనే కలుగుతుందన్న సత్యాన్ని గ్రహించాలి.
అంశము :- ప్రేమ ప్రసంగము :- ప్రియాపాఠకులారా! అపరాధము పాపమునుగూర్చి తెలిసికొన్నాము. ఈ అపరాధము పాపముల చేత మనము చచ్చినవారమైయుండగా ఆయన క్రీస్తు ద్వారా మనము బ్రతికించబడుచున్నట్లు పై ప్రసంగము ద్వారా తెలుస్తున్నది. అపరాధముల చేతను పాపములచేతను చచ్చినవారమైయుండగా - క్రీస్తు జన్మ ద్వారా ఆయన బలియాగము, మరణ పునరుత్థానము ద్వారా మనము బ్రతికింపబడుచున్నాము. ఈ విధముగా అపరాధము పాపముల చేత చచ్చిన మన జీవితాలలో క్రీస్తు ద్వారా బ్రతికించబడుటకు ఆచరించవలసిన మొట్టమొదటి నియమము ప్రేమ. ఇందునుగూర్చి మొదటి యోహాను పత్రిక 3:13-17 ఈలాగు వ్రాయబడియున్నది. సహోదరులారా! లోకము మిమ్మును ద్వేషించిన యెడల ఆశ్చర్యపడకుడి. మనము సహోదరులను ప్రేమించుచున్నాము. గనుక మరణము నుండి జీవములోనికి దాటియున్నాము. ''ప్రేమలేనివాడు మరణమందు నిలిచియున్నాడు. తన సహోదరుని ద్వేషించువాడు నరహంతకుడు, ఏ నరహంతకుని యందును నిత్యజీవముండదని మీరెరుగుదురు. ఆయన మన నిమిత్తము తన ప్రాణము పెట్టెను గనుక దీనివలన ప్రేమ ఎట్టిదని తెలిసికొనుచున్నాము. మనము కూడా సహోదరుల నిమిత్తము మన ప్రాణములను పెట్ట బద్ధులమై యున్నాము. ఈ లోకపు జీవనోపాధి కలవాడైయుండి, తన సహోదరునికి లేమి కలుగుట చూచియు, అతని యెడల ఎంత మాత్రమును కనికరము చూపని వానియందు దేవుని ప్రేమ ఏలాగు నిలుచును? 23 ఆయన ఆజ్ఞ ఏదనగా ఆయనకుమారుడైన యేసుక్రీస్తు నామమును నమ్ముకొని, ఆయన మనకు ఆజ్ఞ ఇచ్చిన ప్రకారముగా ఒకనినొకడు ప్రేమింపవలెననియే, ఆయన ఆజ్ఞలను గైకొనువాడు ఆయనయందు నిలిచియుండును, ఆయన వానియందు నిలిచియుండును.'' ఇది ప్రేమయొక్క ఆధిక్యత.
ప్రియాపాఠకులారా! పరిశుద్ధాత్మను పొంది పూర్ణులై యున్నామని ప్రకటించుకొని మేము ఆత్మ గలవారమని, ఆత్మ పూర్ణులమని, విశ్వాసులమని, పరిశుద్ధాత్మకు ప్రతిరూపాలని, మాలో ఎలాంటి పాపము లేదని, లోకానికి దూరస్థులమని, మేము లోకసంబంధులము కామని, లోక అలంకారాలు విసర్జించుకొని, ఆత్మ ఆవేశితులమని ఊగిసలాడే విశ్వాసులకు అపొస్తలుడైన పౌలు ఇచ్చు హెచ్చరిక
1 కొరింథీ 13:1-2 మనుష్యుల భాషలతోను దేవదూతల భాషలతోను నేను మాటలాడినను, ప్రేమ లేని వాడనైతే - మ్రోగెడు కంచును గణగణలాడు తాళమునై యుండును,'' ప్రవచించు కృపావరము కలిగి మర్మములన్నియు జ్ఞానమంతయు ఎరిగినవాడనైనను, కొండలను పెకలించు విశ్వాసము గలవాడనైనను, ప్రేమ లేనివాడనైతే నేను వ్యర్థుడను,'' ఏ ప్రయోజనము ఉండదు.'' 13:13లో పౌలు ఇలాగు ప్రకటిస్తున్నాడు. విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ ఈ మూడును నిలుచును - వీటిలో శ్రేష్టమైనది ప్రేమయే.
ఏ విధముగా ప్రేమ శ్రేష్టమైనది? ఎందుకు ప్రేమ పరిశుద్ధ గ్రంథమంతటిలో శ్రేష్టమైనది? క్రైస్తవ గుణములన్నిటిలో ప్రేమ ఎందుకు పరమోన్నతమైనది? ప్రేమ జరిగించిన కార్యము - ప్రేమ ద్వారా కల్గినటువంటి యోహాను 3:16 దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వానియందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్యజీవము పొందునట్లు ఆయనను అనుగ్రహించెను.'' అయితే లోకము దేవుని కుమారుని ప్రేమించలేదు. దైవోద్ధేశ్యము తన కుమారుని ద్వారా రక్షణ పొందుటకేగాని, లోకమునకు తీర్పు దీర్చుటకు దేవుడు తన కుమారుని పంపలేదు. 3:19 ఆ తీర్పు - ఇదే వెలుగు లోకములోనికి వచ్చెనుగాని తన క్రియలు చెడ్డవైనందున మనుష్యులు వెలుగును ప్రేమింపక చీకటినే ప్రేమించిరి. దుష్కార్యము చేయు ప్రతివాడు వెలుగును ద్వేషించును. తన క్రియలు దుష్క్రియలుగా కనబడకుండునట్టు వెలుగు నొద్దకు రాడు.
ఇందునుబట్టి ప్రియపాఠకులారా! యోహాను 3:35-36 వ్రాయబడిన దైవ ప్రవచన సారాంశము ఏమనగా తండ్రి కుమారుని ప్రేమించుచున్నాడు గనుక ఆయన చేతికి సమస్తము అప్పగించి యున్నాడు. అలాగే కుమారుని యందు విశ్వాసముంచువాడే నిత్యజీవము కలవాడు.'' కనుక ఆ విధముగా ప్రేమించువాడు తండ్రి ప్రేమలో భాగస్వామియగుటయేగాక కుమారుని ప్రేమకు యోగ్యుడుగా మలచబడినవాడై, తనవలె తన పొరుగువానిని ప్రేమించబద్ధుడైయున్నాడు. ఇది దైవత్వము లోకానికి విధించిన చట్టము. ఈ ప్రేమన్నది నేడు రెండు అక్షరాలలో ఉన్నది. కాని దీనిలోని పరమార్థము ఆకాశము, భూమి, జలములు. వీటి వైశాల్యము కంటె ప్రేమ వైశాల్యము అధికమన్న సత్యము గ్రహించవలసియున్నది. ఈ ప్రేమన్నది మన బంధువులు, మన సంతానము, మన స్వలాభము, మన ఉద్యోగము వరకే పరిమితి కాదు. దేవుడు రూపించిన యావద్ సృష్టి మీద నరునియొక్క ప్రేమ పరిమితము చేయబడి ఉంది. అందులో మరి ముఖ్యముగా దేవునియొక్క జీవము ఆత్మతో పూరించబడిన నరుల పట్ల ఈ ప్రేమ అన్న నియమము బహుఖచ్చితముగా పాటించవలసియున్నది. విశ్వాసము ప్రేమ లేకుండ దేవునికి ఇష్టుడుగా జీవించుట అసాధ్యము. విశ్వాసము ప్రేమ అనేది ఉండబట్టి అబ్రాహాము రెండు జనాంగాలకు తండ్రియై నేడు ప్రపంచములో వేరొక జనాంగానికి తావు లేకుండ ఫలింపు లేకుండ వేదములో తనలో నుండి విస్తరించిన, లోక జనాభాలో అత్యధికముగా ఆశీర్వదింపబడి ఉన్నత స్థితిని దేవుని ద్వారా సంపాదించు కొన్నాడు. ఇందుకు కారణము ప్రేమ.
అబ్రాహామునకు విశ్వాసమున్నది - విశ్వాసమునకు తగిన ప్రేమ కూడా ఉంది. అబ్రాహాము దేవుని మీదనేగాక తొంబయి సంవత్సరాల వృద్ధురాలైన తన భార్య పట్ల కూడా తన ప్రేమ తక్కువ కాలేదు. దేవుని పట్ల కూడా విశ్వాసముంచాడు - భార్య పట్ల కూడా ఉంచాడు. దేవుని పట్ల తన ప్రేమను వెల్లడిపరచాడు. తన భార్య శారా పట్ల కూడా ప్రేమ కలిగియున్నాడు. అబ్రాహాము ప్రేమ దైవత్వములో చాలా లోతుగ నడిపించింది - చాలా ఐశ్వర్యవంతునిగా చేసింది. అబ్రాహాములోని విశ్వాసము, ప్రేమ, నిరీక్షణ ఈ మూడును సమపాళ్ళలో క్రియ జరిగించాయి. విశ్వాసమునుబట్టి విశ్వాసులకు తండ్రి అయ్యాడు. ప్రేమపూరిత హృదయస్థితిని బట్టి తనలో రెండు జనాంగాలకు పితామహుడయ్యాడు. హెబ్రీ 11:8-12 ధ్యానిస్తే ''అబ్రాహాము పిలువబడినప్పుడు విశ్వాసమునుబట్టి ఆ పిలుపునకు లోబడి, తాను స్వాస్థ్యముగా పొందనైయున్న ప్రదేశమునకు బయలు వెళ్ళెను. విశ్వాసమునుబట్టి అతడును అతనితో ఆ వాగ్దానమునకు సమాన వారసులైన ఇస్సాకు యాకోబు అను వారును, గుడారములలో నివసించును. అన్యుల దేశములో ఉన్నట్లుగా వాగ్దత్త దేశములో పరవాసులైరి. ఏలయనగా దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడునై యున్నాడో, పునాదులు గల ఆ పట్టణము కొరకు అబ్రాహాము ఎదురు చూచుచుండెను.'' ఇది అతనిలో నిరీక్షణాయుతమైన గుణము. అందువల్ల మృతతుల్యుడైన అతని నుండి సంఖ్యకు ఆకాశ నక్షత్రాల వలెను, సముద్ర తీరమందలి లెక్కింప శక్యముగాని ఇసుక వలెను సంతానము కలిగెను.''
ఆ విధముగా సంతానము కల్గిన అబ్రాహాము నిరీక్షణ కలిగి, తాము భూమి మీద పరదేశులమును, యాత్రికులమునైయున్నామని ఒప్పుకొని విశ్వాసము గలవాడై మృతి పొందినట్లును, ఆ విధముగా దేవుని పరిశుద్ధ పట్టణానికి వారసుడగుటకు కారణము. హెబ్రీ 11:17 అబ్రాహాము శోధింపబడి విశ్వాసమునుబట్టి ఇస్సాకును బలిగా అర్పించెను. అంతేగాకుండ అబ్రాహాము - మృతులను సహితము లేపుటకు దేవుడు శక్తిమంతుడని ఎంచినవాడై, తన ఏక కుమారుని అర్పించి, ఉపమాన రూపముగా అతనిని మృతులలో నుండి మరల పొందెను. విశ్వాసమునుబట్టి ఇస్సాకు జరుగబోవు సంగతుల విషయమై యాకోబును, ఏశావును ఆశీర్వదించెను. విశ్వాసమునుబట్టి యాకోబు అవసాన కాలమందు యోసేపు కుమారులలో ఒక్కొక్కని ఆశీర్వదించి, తన చేతి కర్ర మొదలు మీద ఆనుకొని దేవునికి నమస్కారము చేసెను. ఈ విధముగా అబ్రాహాముయొక్క అనేక తరములను గూర్చి వ్రాయబడిన ప్రకారము విశ్వాసము ప్రేమ అన్నది జరిగించిన క్రియ ఎంత ఉన్నత స్థితిలో ఉందో వేదరీత్యా గ్రహించాలి.
ప్రియపాఠకులారా! దేవునికి మనుష్యుల మీద నున్న ప్రేమను తన కుమారుని బల్యర్పణ ద్వారా వెల్లడిపరస్తున్నాడు. ఆ విధముగా దేవుని ప్రేమ, ఆయనకుమారుడైన క్రీస్తు ప్రేమ, యేసుక్రీస్తు అపొస్తలులను కాచి కాపాడిన పరిశుద్ధాత్మ ప్రేమ. ఈ మూడు ప్రేమలలో ఏ ప్రేమ నీకున్నది? దేవుని ప్రేమ ఉన్నదా? క్రీస్తు ప్రేమ ఉందా? లేక పరిశుద్ధాత్మ ప్రేమ ఉందా? ఈ మూడింటిలో ఏ ఒక్క ప్రేమైనను నీకున్నదా? ఈ మూడు ప్రేమలు నీవు కలిగియున్నట్లయితే నీవు దేవుని స్వభావము కల్గి యున్నావు. నీవు పరలోక సంబంధివే, భూసంబంధివి కావు. నీవు ఆత్మ సంబంధివేగాని శరీర సంబంధివి కావు; నీది ఆత్మ సంఘమేగాని నీది శరీర సంఘము కాదు. ఈమూడును నీలో లేనట్లయితే నీవు మృతుడవే, అనగా బ్రతికినను చచ్చినవానితో సమానమే. నీ సంఘము జీవించినను చచ్చిన సంఘమే. దేవుడు తన ప్రేమను తండ్రి కుమారుల పరిశుద్ధాత్మ త్రివిధములైన ప్రేమలతో మనలను పోషిస్తున్నట్లుగాను, ఈ ప్రేమలలో కనీసము ఏ ఒక్క ప్రేమను కూడా అనుసరించకపోతే మన జీవితము ఎలాంటిదో చదువరివైన నీవు గ్రహించుము. మొట్టమొదటగ తండ్రియైన దేవుడు భూమి అందంతట తన ప్రేమను వెల్లడిపరచినను, ఆ ప్రేమను భూమి నిరాకరించింది. అయితే దేవుడు వదలక తనకంటూ ఒక జనాభాను ఏర్పరచుకొని వారి ద్వారా తన ప్రేమను కనబరచాడు. ఆ జనాభా కూడా దేవుని నుండి తొలగిపోయారు. ఆ స్థితిలో ధర్మశాస్త్ర చట్టము ద్వారా తన జనాంగమును క్రమబద్ధీకరణ చేయుటకు తన ప్రేమను చూపినను, వారు అన్యులకు బానిసలై భూసంబంధులై లోకవ్యామోహితులై దైవ ప్రేమకు దూరులయ్యారు. ఆ తర్వాత దేవుడు తాను ఏ జనాంగాన్ని రక్షించుటకై తన కుమారునికి జన్మనిచ్చి ఈ లోకానికి పంపి తన ప్రేమను వెల్లడిపరిచాడు. అయితే దేవుడు పంపిన కుమారుని హేళన చేసి, శ్రమల పాలుజేసి, నిర్దోష దైవకుమారుని దోషిగా చేసి, మరణ శిక్ష విధించుటన్నది వేదరీత్యా ఎరిగిందే. అనగా దేవునియొక్క కుమారుని హత్య చేసే స్థితికి నరుని హృదయ స్థితి తయారైంది.
అయితే దైవకుమారుడైన క్రీస్తు తాను విధించిన ధర్మచట్టంలో తన వలె తన పొరుగువానిని ప్రేమించుమన్న క్రొత్త ఆజ్ఞను విధించి ఒకరి యెడల ఒకరు ప్రేమ కలిగి, ప్రేమయే ధ్యేయమని, ప్రేమయే తన స్వరూపమని, తన ప్రేమను తన వాక్కుల ద్వారా క్రీస్తు బయల్పరచాడు. ఈ విధముగా కుమారుని ప్రేమను కూడా లోకము నిరాకరించింది. అనగా క్రీస్తు ప్రేమకు లోకము దూరమైంది. లోకము క్రీస్తు ప్రేమను వెంటాడి ఉంటే నేడు క్రైస్తవ్యమన్నది చాలా ఉన్నత స్థితికి ఎదిగి దైవత్వమును రంజింపజేసి, దైవత్వమునకు యోగ్యకరముగా ఎదుగగలిగేది. అయితే నేటి క్రైస్తవ సంఘాలలో దేవుని ప్రేమ లేదు. క్రీస్తు ప్రేమ లేదు. క్రీస్తు ప్రేమన్నది ఆపదలలో ఉన్నవారిని ఆదుకొనుట, నిరాహారికి ఆహారము, దాహానికి నీళ్ళు, రోగులకు స్వస్థత, వస్త్ర హీనునికి బట్టలు నిచ్చుట, ఆపదలలో ఉన్నవారిని పరామర్శించుట, అభాగ్యులను ఆదరించుట, చెరలో ఉన్నవారిని దర్శించుట, విధవరాళ్ళను చేరదీయుట, వారికి సహకరించుట, రోగులను దర్శించుట, వగైరా విధాలుగ క్రీస్తు ప్రత్యక్షముగా ప్రయోగాత్మకముగా వెల్లడి పరచినట్లు తెలిసికోవలసియున్నది. అలాగే తాను ప్రతిష్టించిన అపొస్తలులు కూడా క్రీస్తు మార్గములో ఆయన సావాసములో క్రీస్తు ప్రేమలో క్రీస్తు బోధలో నడిచారు. అందువల్ల వారి పేర్లు మందిరాలుగ కట్టబడి లోకములో విస్తరించి యున్నాయి. ఈనాడు క్రైస్తవులమని చెప్పుకొంటున్న మనము ఏ స్థితిలో ఉన్నాము? కనీసం మన పేరు మన వారు ప్రేమతో చెప్పుకొనే స్థితిలో ఉంటున్నామా? మన దాయాదులు, మన సంఘము మనలను గూర్చి మంచి సాక్ష్యమిచ్చే స్థితిలో ఉన్నమా? లేదా? గాలికి చెదరగొట్టు పొట్టు వలె ఉన్నామా? ఎలాగున్నాము?
ఇక పరిశుద్ధాత్మ ప్రేమనరులను ఆవరించి భాషలను మాట్లాడించేదే కాదు. ఈ పరిశుద్ధాత్మ ఆనాటి అపొస్తలులను ఆవరించి వారిలో క్రియ జరిగించింది. ఈనాడు ఈ పరిశుద్ధాత్మ క్రియ ఏమైంది? ఆనాటి అపొస్తలులు పరిశుద్ధాత్మ మీద విశ్వాసముంచారు. ఆయనను ప్రేమించి ఆయన ప్రేమకు పాత్రులయ్యారు. ఆయన కొరకు నిరీక్షించారు. ఆయన ఆవరింపుకు యోగ్యులయ్యారు. వారి హృదయస్థితి, పరిశుద్ధాత్మ ఆవరింపుకు తగిన ఔన్నత్యము కల్గియుండినారు. పరిశుద్ధ హృదయము, నిష్కళంక ప్రవర్తనతో నాటి అపొస్తలులు జీవించాలని వారిని పరిశుద్ధాత్మ తన రెక్కలలో దాచుకొని నడిపించాడు. ఇందుకు ఋజువు అననీయ సప్పీరాలు ఇరువురు ఏకముగా పొలము అమ్మి దాని వెలలో కొంత దాచుకొని, ఇంతకే అమ్మినామని అబద్ధమాడుచు అపొస్తలుల పాదాల యొద్ద పెట్టినారు. ఈ సందర్భమును పరిశుద్ధాత్మ పేతురుకు బయల్పరచగా భూమి వెలలో కొంత దాచుకోవాలని ఎందుకు ఈ సంగతి నీ హృదయములో ఉద్దేశించుకొన్నారు? అనుటలో వారి యొద్ద పరిశుద్ధాత్ముడున్నాడు. కాని సాతాను ఆవరించి సాతాను మార్గములో సాతాను ప్రేమలో - సాతాను ఆకర్షణలో ఉన్న అననీయ సప్పీరాలకు ఆ పరిశుద్ధాత్మ కనబడలేదు. వారిని ఆవరించిన సాతాను వీరిని మరణానికి గురిజేసింది.
కనుక ప్రియపాఠకులారా! ఇది అంత్య కాలము అనగా ప్రభువు రాకడ సమీపమైయున్న నిరీక్షణ కాలములో దైవకుమారుని రాకడ కొరకు నిరీక్షించవలసిన సమయమున్నది. ఇది ధనాన్ని ఖర్చుపెట్టే సమయము కూర్చుకొనేది కాదు, త్యాగము చేయవలసిన సమయమేగాని కక్కుర్తిపడే సమయము కాదు. సిద్ధపాటు కలిగి యుండవలసిన సమయమే గాని అశ్రద్ధ చేసే సమయము కాదు. మెలకువతో ఉండవలసినదే గాని నిద్రపోయే సమయము కాదు. ప్రేమ అనే విధానాన్ని పాటించవలసిన సమయమిది. ద్వేషము పెంచుకోవలసిన సమయము కాదు. కనుక నిరీక్షణ కలిగి జీవించుము. ప్రేమ కలిగి ప్రవర్తించుము. నీ విశ్వాసాన్ని కాపాడుకొమ్ము. నీవు విశ్వాసియైనంత మాత్రాన దైవరాజ్యము చేరలేవు. ఎంతగా నిరీక్షించినను ప్రభువును చేరలేవు. ఈ రెంటికి మధ్యవర్తియైన ప్రేమ నీలో ఉండాలని, అప్పుడే నీ జీవితము ధన్యవంతము - ఆమేన్.
నేడు భూమిపై చిత్రవిచిత్రములైన శాస్త్రజ్ఞానముతో విలయ తాండవమాడుచున్న మానవుని శక్తి దేవునిదా? అపవాదిదా?
ప్రభువునందు ప్రియసోదరీ! సోదరుడా! పాతనిబంధన కాలము నుండి నూతన నిబంధన కాలము వరకును ధర్మశాస్త్రమను క్రీస్తుయొక్క చరిత్రానంతరము దేవుని రాజ్యమైన క్రీస్తుయొక్క సిద్ధాంతములును నేటి క్రైస్తవ సమాజములో క్రియ జరిగిస్తున్నవి. చిత్రమేమిటంటే ప్రపంచ జనాభాలో దేవుడేర్పరచుకొన్న ఇశ్రాయేలను జనమును, క్రీస్తు ఏర్పరచుకున్న క్రైస్తవులమైన మనకును ప్రపంచములోని అన్ని తెగలు, అన్ని జాతులు, అన్ని మతముల కంటె విపరీత జ్ఞానము, విచిత్ర జ్ఞానము యూదులకును క్రైస్తవులకును ఉన్నట్లు నేటి ప్రపంచశాస్త్ర జ్ఞాన ప్రాబల్యము ఋజువుపరచుచున్నది. ఇందుకు ఉదా|| విమానము కనిపెట్టినవారు రైట్ సోదరులు. ఆవిరి ఇంజను కనిపెట్టినవాడు స్టీవెన్‌సన్. రేడియోను కనిపెట్టినవాడు ఫిలిఫ్స్, పెన్సిలిన్ అను ఔషధమును కనిపెట్టినవాడు యూదుడు.
ఇదే విధముగా బాంబులు, రాకెట్లు, అణు ధార్మిక శక్తితో కూడిన మారణాయుధాలు, ఔషధాలు. ఫ్యాక్టరీలు, వాతావరణ పరిశోధనా శాస్త్రము, జంతుశాస్త్రము, వృక్షశాస్త్రముః విద్యుశ్ఛక్తి, చలన చిత్రాలు, రేడియో, టెలివిజన్, వీడియో ఒకటేమిటి? సమస్త శాస్త్రములకును వాటితోబాటు ముస్తాబు ఉపకరణాలు పౌడరు, సెంటు వగైరాలు, సిగరెట్లు సకల విధములైన బ్రాందీః విస్కీ, మొదలైన మత్తుపదార్ధాలు, రోడ్డు మీద ప్రయాణించే జనోపకరణమైన సైకిలు మొదలుకొని రైలు వరకు ఉన్న వివిధ ప్రయాణ సాధనములు. ప్రభువునందు ప్రియమైన సోదరీ! సోదరుడా! పై వివరించిన వస్తు సముదాయములు, వాటి సాంకేతిక పరిజ్ఞానము, యూదులు క్రైస్తవులనబడునట్టి రెండు జనాంగముల నుండి ఇవి కనిపెట్టబడినట్లు విదేశ శాస్త్ర జ్ఞానము ఋజువుపరచుచున్నది. అమెరికా, బ్రిటన్, ప్రాంసు, జర్మనీ, స్విడ్జర్లెండు, రష్యా వగైరా దేశాల పరిజ్ఞానమే నేటి ఆధునిక శాస్త్రమునకు సోపానముగా ఉన్నది. మరి ఇట్టి జ్ఞానము అన్య కూటమికి గాక పై రెండు కూటములకే చెందుటకు కారణమేమిటో బైబిలు వేదరీత్యా మనము తెలిసికోవలసి యున్నది. ఇది అబద్ధమని అనుకుంటారా? నేటికిని జనబాహుళ్యములో ఒక వస్తువును కొనునప్పుడు దానిని తయారు చేసిన దేశానికి ప్రాధాన్యత నిచ్చి, అది ఎంత ధరయైనను కొనగల్గునట్టి పట్టుదలకు దారి తీయుచున్నది. ఉదా|| చేత కట్టుకొనే వాచీలు ఏది కావాలి? స్విడ్జర్లెండు వాచీకే ప్రాధాన్యత. అదే విధముగా జర్మనీ లైట్లకు, ఇంగ్లాండులో తయారైన పేనాలకు, విదేశాల్లో తయారైన రేడియోలకు, మోటారు సైకిళ్ళకు, కార్లకు నేటి జనసందోహము కొనుగోలుకు ఎగబడుచున్నది. ఇట్లు జరుగుటకు కారణమేమిటో బైబిలులో మనము తెలిసికోగలము.
ఆదిలో ఒంటరియైయున్న హవ్వతో సర్పము బోధిస్తూ దేవుడు తినవద్దన్న నిషేధ ఫలమును గూర్చి మీరీపండు తిను దినమున, మీ నేత్రములు తెరువబడి మంచి చెడ్డల నెరిగినవారై దేవతల వలె ఉందురు. ప్రభువునందు ప్రియసోదరీ! సోదరుడా! పై సర్ప వాక్కులోని గుడార్థమును మనము గుర్తింపవలసి యున్నది.
ఏదెను వనములో సర్పము తెలుగు భాషలో మాట్లాడియున్నట్లయితే ఈ జ్ఞానము ఆంధ్రునికే దక్కేది. లేక ఉర్దూ భాషలో మాట్లాడియున్నట్లయితే ఈ జ్ఞానము సాహెబులలో నుండి వెలువడెడిది. లేక తమిళ భాషలో మాట్లాడియున్నట్లయితే తమిళనాడులోనే ప్రభావము వికసించి, విలయతాండవమాడేది. కేరళ భాషలో మాట్లాడియున్నట్లయితే కేరళ నివాసుల ద్వారానే ఈ జ్ఞానము విస్తరించెడిది. అట్లుగాక సర్పము హవ్వతో మాట్లాడిన భాష హిబ్రూ భాష. ఎందుచేతనంటే తండ్రియైన దేవుడు తన రాజ్య విస్తరణ కోసము ప్రపంచమునకు నడిబొడ్డయిన పాలస్తీనా దేశము తన ప్రణాళికాచరణకు కేంద్రముగా యేర్పరచుకున్నట్లు బైబిలులోని వేద రహస్యము బైల్పరచుచున్నది. ఆదామనునది హిబ్రూ భాష. ఆదామంటే ఎఱ్ఱమట్టి అని తెలుగులో అర్ధము. ఈ హిబ్రూభాష అనునది నేటి జనకూటమి ఇశ్రాయేలులకే అంటే యూదులకే పరిమితమైయున్నది. దేవుడు ఆది నరజంటతో హిబ్రూ భాషలో మాట్లాడి క్రియ జరిగించి యుండుట చేత సాతానుడు కూడా ఆది నరజంటతో హిబ్రూ భాషలోనే మాట్లాడి క్రియ జరిగించినట్లు మనము గ్రహించవలసియున్నది. ఎందుచేతనంటే అప్పటికి ఏ ఇతర భాషలను నరునికి అలవడి యుండలేదు. భాష అనునది కేవలము వాక్కు రూపముగా ఉండినదేగాని వ్రాతరూపముగా ఉండినట్లు దాఖలాలు లేవు. అప్పుడు లిపి లేదు. ఇందునుబట్టి హిబ్రూ భాష అనునది దేవుని భాషయు, దేవదూతల భాషయునైయున్నట్లు మనకు తెలియుచున్నది. అందుచేతనే దేవుడు సర్పము మాట్లాడిన భాషను దైవాత్మ పూరితులైన నరులు కూడా అర్థము జేసికొని వారికి ప్రత్యుత్తరమిచ్చినట్లు గ్రహించగలము.
దేవుడు స్త్రీని సృష్టించిన విధానమును గూర్చి ఆదాము నిద్ర మేల్కొని ''నా ఎముకలలో ఎముక నా మాంసములో మాంసము నాలో నుండి తీయబడితివి గనుక నీవు నారివి,'' అనిన మాటలు కూడా హిబ్రూ భాషయేయని మనము తెలిసికోవలసియున్నది. ఇందునుబట్టి ఈ హిబ్రూ భాషయనునది యూదులకు పరిమితమైయున్నది గనుక, యూదుల నుండియే లోక శాస్త్రజ్ఞానము మరియు మారణ హోమమును జరిగించు ఆయుధ సంపత్తి, పరిజ్ఞానము, లోక కళ్యాణమునకు మానవ సుఖసౌఖ్యాలకు విలాసములకు ఉపయుక్తమగు శాస్త్రమును, మానవ మనుగడకు భోగభాగ్యాలుః యాత్ర జేయుటకు వాహన యాత్ర జ్ఞానమును, మానవులు గ్రహాంతరాళాల్లో ప్రయాణించుటకు తయారైన రాకెట్లు, ఉపగ్రహాలు వగైరాలుః సాంకేతిక శాస్త్రజ్ఞానము ఒకటేమిటి? మానవ మనుగడకును, లోక నాశనానికిని, జీవరాసుల మారణహోమమునకును ఈ జ్ఞానము దారి తీయుచున్నట్లు నేటి నరకోటియొక్క శాస్త్రజ్ఞానము మన కనుల ముందు దృశ్యముగా దృష్టాంతముగా క్రియ జరిగిస్తున్నట్లు మనము చూస్తున్నాము.
ప్రభువునందు ప్రియసోదరీ! సోదరుడా! ఆత్మీయ జ్ఞానముతో మనమాలోచిస్తే సృష్టిలోని ప్రతి జీవరాశికిని అనగా ప్రతి చెట్టు, ప్రతి పక్షి, ప్రతి జంతు మృగ కీటక జన్మకు ఆది బీజము ఒకటి లేనట్లయితే నేడు యివి సృష్టిలో జీవించలేవు. అదే విధముగా సృష్టికి కూడా మూలకర్త ఒకడు లేనట్లయితే సృష్టికి మనుగడ లేదు.
అదే విధముగా నేడున్న నరకోటిలో ఒక్క మానవ భాషలన్నిటికి అనగా ఆయా దేశములలో ఆయా రాష్ట్రములలో ఆయా ప్రాంతాలలో వారివారి జాతులు సాంప్రదాయముల ననుసరించి మాట్లాడుచున్న భాషలకు మూలభాష ఒకటుండవలెను. సృష్టికే విధముగా అయితే మూలము సృష్టికర్త. అదే విధముగా భాషకు కూడా ఒక బీజము ఉండాలి. నేడు మన భారతదేశములో సంస్కృతము మొదలుకొని, తెలుగు, తమిళము, కర్నాటకము, కొంకిణి, మళయాళము లగాయతు ఎరుకల భాష వరకును కొన్ని వందల భాషలు ఒక్క భారతదేశములోనే పరిమితమైయున్నవి. భారతీయులమైన మన విశ్వాసమేమంటే అన్ని భాషలకు మూలము సంస్కృతమని అనుకొంటున్నాము. కాని ప్రపంచ భాషగా ఇంగ్లీషని నరకోటి చప్పట్లు తట్టి వక్కాణించుచున్నది. ఈ సందర్భములో మొదటి కొరింథీ 1: ఈ లోకములో ఘనముగా ఎంచబడునది దేవుని దృష్టిలో అసహ్యమైనట్లు; ఈ లోకములో బహు ఉన్నత భాషగా చెలామణియగుచున్న ఇంగ్లీషు భాషను గూర్చి దైవత్వము ఈషణ్మాత్రము పరిశుద్ధ గ్రంథము ఎక్కడనైనను ఆంగ్ల భాషయని నామమాత్రముగా ఉచ్ఛరించకపోవుట గమనార్హము.
ఇందునుబట్టి చూడగా లోకములో ఏ నరుడును ఎప్పుడును మాట్లాడని భాషను దేవుడు ఎన్నుకొన్నట్లును, అది హిబ్రూ భాషయని బైబిలు ద్వారా మనకు ఋజువగుచున్నది. ''అల్లెలూయ,'' ''ఆమేన్'' అనునట్టి మాటలుగాని ఇవన్నియు హిబ్రూ భాషలోని సాంకేతికములై యున్నవి. మోషేకు దేవుడు ఱాతిపలకల మీదనున్న నిబంధనలతో కూడిన ధర్మశాస్త్రము అందులోని బీజాక్షరములు లిపి హిబ్రూ భాషయై యున్నట్లు మనము గ్రహించవలసియున్నది. కయీనుకు దేవునికి సంభవించిన సంభాషణ కూడా హిబ్రూ భాషయే. ఆది నరజంటను, సర్పమును, అటుతర్వాత సోదర హంతకుడైన కయీనును శపిస్తూ సంభాషించిన భాష కూడా హిబ్రూ భాషయే. ఆ దినములలో ఓడలు కట్టునట్టి శాస్త్రము లేకపోయినను హిబ్రూ భాషా పరిజ్ఞానముతో నోవహు దేవునితో ముఖాముఖిగ సంభాషించి ఓడను కట్టినట్లు మనకు తెలియుచున్నది. ఆదికాండము 11వ అధ్యాయము వరకును హిబ్రూ భాషా ప్రభావము - ఆ భాషలో ఉన్నట్టి మర్మము నరజ్ఞానమునకు అందక క్రియ జరిగించినట్లు ఆ వేదభాగములో మనము చదువగలము. నిర్గమ కాండము దగ్గరకు వచ్చుసరికి లిపి రూపముగా హిబ్రూ భాష రెండు ఱాతి పలకలుగా దృశ్యమిచ్చినట్లు మనకు తెలియగలదు.
ఈ హిబ్రూ భాష పరిజ్ఞాన మూలమున నరుడు అహంభావముతో కూడుకున్నవాడై, దైవత్వముతో పోటీపడి (ఆది 11:1-9) భాష మూలమున నరునికి కల్గిన గర్వము ద్వారా దేవునిపై తిరుగుబాటు జేసి పొందిన పతనము దేవునితో ముఖాముఖి మాట్లాడు ఏక భాష నుండి భిన్నత్వము నొంది తారుమారైన భాషలతో అర్థముగాని గొడవలతో తగుల్కొని, అటు దైవత్వానికి ఇటు మానవులతో కలసిమెలసియుండు సంఘ కట్టుబడికి దూరమై, అప్పటినుండి నేటి వరకు భాషా వైషమ్యములనుబట్టి నరకోటి ఎవరికి వారు వేరైపోయి వారి వారి భాషననుసరించి, దేశములను, రాష్ట్రములను, ప్రభుత్వాలను, విద్యాబోధనలు, వేదముల తర్జుమా, భాషాభిమానము వగైరా భిన్నత్వములు పొంది నరుడు - దైవత్వానికి మానవత్వానికి దూరమైనట్లు నేటి ప్రపంచములోని వివిధ భాషలతో కూడిన రాష్ట్రములు, దేశములు, వాటి భాషలు మనకు ఋజువు పరచుచున్నవి.
ఇట్టి పరిస్థితులలో ''ఇశ్రాయేలీయుల తొట్రుపాటు అన్యులకు రక్షణ'' అన్నట్లు దేవుడు తానేర్పరచుకున్న ఇశ్రాయేలు జనాంగము వారికనుగ్రహించిన హిబ్రూ భాష రెండును నేటి జన బాహుళ్యమునకు ప్రత్యేకముగాను, ఇతరులకు అసాధ్యముగాను ఉన్నట్లు నేటి ప్రపంచ దేశాలలో ఇశ్రాయేలీ దేశమునకున్న స్థానము ఋజువుపరచుచున్నది. ఎందుకనగా విస్తరించి ఫలించవలసినట్టి ఇశ్రాయేలీ దేశము దేవుని పట్ల అది చేసిన తిరుగుబాటు ఫలితమునుబట్టి క్రీస్తు ద్వారా అన్యులకు రక్షణ గల్పించి, ఒక చిన్న దేశముగా ముస్లిముల మధ్య ఇశ్రాయేలీయులను నియమించియున్నాడు.
ఇందునుబట్టియే దేవుని వాక్యము రక్షణ యూదులనుండియే వచ్చుచున్నట్లుగా ఘోషిస్తున్నది. నేటి మన క్రైస్తవ జీవితమునకు మూలము యూదులే. యూదుల శాస్త్రజ్ఞానమే ఇందునుబట్టి నేటి తరమువారమైన మనము రెండు విధములుగ విభజింపబడి యున్నాము. 1. దేవుని జనాంగమైన ఇశ్రాయేలు 2. క్రీస్తుయొక్క జనాంగముగ అనగా క్రైస్తవులుగా పిలువబడుచున్న అన్యులమైన మనము. అయితే మన జ్ఞానమెట్లున్నది? మన జ్ఞానము సక్రమముగా ఉన్నదని చెప్పగలమా? మన శాస్త్ర జ్ఞానము ద్వారా నీతిమంతులుగా మనము తీర్చబడిన జాబితాలో ఉన్నామా? మనము నిర్మించిన ఆలయాలలో దేవుడు ఉన్నాడా?
ఇశ్రాయేలు పక్షముగా దేవుడున్నాడనుటకు ఇప్పటికి కూడా ఋజువులు ఉన్నవి. ఎట్లంటే బ్రిటన్, అమెరికా, ప్రాంసు, జర్మనీ, రష్యా వగైరా దేశాలు యూదులను వారి బానిసలుగా వాడుకొంటూ - వారి విజ్ఞాన శాస్త్రముల ద్వారా అనేక సాంకేతిక శాస్త్ర పరిజ్ఞానాన్ని పొందగల్గినవి. దేవుని ప్రవచనానుసారముగా ఇశ్రాయేలు నేడు ఒక చిన్న రాజ్యము నేర్పరచుకొని ఉన్నది. అట్లేర్పరచుకొనుటయేగాక ఇశ్రాయేలు దేశమను పేరునకు నేటి ప్రపంచ దేశాలు హడలెత్తిపోవుచున్నవి. ఇశ్రాయేలీయులలో అణగారియున్నట్టి దైవశక్తి, శాస్త్రజ్ఞాన విస్తరింపు అనినదానికి మూలము యెహోవా దేవుని పట్ల వారికున్న చలించని విశ్వాసము మూలమై యున్నది.
అట్లు దేవునియొక్క జనాంగమైన సైన్యముల కధిపతియైన యెహోవా దేవుని కుమారుడైన యేసుప్రభువుయొక్క విశ్వాసులమైన మనము ఆయన బాప్తిస్మము పొందిన, ఆయన బల్లనాచరిస్తున్న మనము లోకము మాటకు అటుంచి మనమున్న రాష్ట్రములో మనమున్న పట్టణములో గ్రామములో మన ఇరుగుపొరుగుల మధ్య క్రైస్తవులమని చెప్పుకొనుటకు ధైర్యము చాలక, ధనాపేక్ష గల్గి దైవత్వమునకు దూరమై, క్రైస్తవ్యాన్ని దాచిపెట్టి హరిజనులమనుచు వెనుకబడిన వారిమి, షెడ్యూల్ కులాలవారమని ప్రకటించుకొంటూ - అన్యులను క్రైస్తవ సామ్రాజ్య సభ్యులుగా జేర్చవలసిన మనము - ఆ అన్యులను కూడా తప్పుడు దారి పట్టించుచు గ్రామ మున్సబుల యెదుట తహసీల్దార్ల యెదుట - క్రైస్తవులము కామని వ్రాత మూలముగ ప్రకటించుకొనుచు'' - ఆదివారము బైబిలును చంకనబెట్టి బహుభక్తిగా సంఘాలయములో జేరిః అలనాడు చలిమంట దగ్గర పేతురు క్రీస్తు విషయములో బొంకిన బొంకును వ్రేలుబెట్టి చూపుచు, అపొస్తలుడైన పేతురును యేసుయొక్క మరణమునకు హతసాక్షియైన ఆ పరమభక్తుని క్రియను తప్పుగా ఎంచి, మనమేదో గొప్ప నీతిమంతులమైనట్లు విమర్శించుచున్నాము.
ప్రభువునందు ప్రియసోదరీ! సోదరుడా! దేవుడాదిలో యేర్పరచుకొన్న ఇశ్రాయేలను జనాంగము నేటికిని వారు ఇశ్రాయేలులను నామధేయముతో ఏక సంఘముగా నేర్పడి ఏకత్వమును పొంది, యెహోవాయే దేవుడను సిద్ధాంతముతో మోషే వారికనుగ్రహించిన ధర్మశాస్త్ర సిద్ధాంతము చొప్పున ఆచరించుచు; అలనాడు యాకోబు దేవుడు జేసిన వాగ్దానము నెరవేర్పుకు యోగ్యకరముగా జీవించుచున్నారు. క్రైస్తవులమని చెప్పుకొనుచున్న మనము మన సంఘములు మన చరిత్ర మన సంఘచరిత్రను పై ఇశ్రాయేలీయులకు పోల్చినట్లయితే నక్కకు నాగలోకానికి ఉన్న తేడాఉన్నది. ఇశ్రాయేలీ జనాంగము తమ సంఘ ఐక్యతను చెడగొట్టు కొనక చిత్రవిచిత్రమైన స్వార్థపూరిత స్వభావములతో సంఘముల సృష్టించుకొనక కలసి కట్టుగా అందరును ఏకముగా ఉండి ఏక సిద్ధాంతములో ఏక దేవుని ఆరాధనలో జీవించు చున్నారు.
నేటి క్రైస్తవులమని చెప్పుకొను మనము క్రీస్తు యొక్క సిద్ధాంతములను, క్రీస్తుయొక్క మహిమను ఆయనయొక్క చరిత్రను, క్రీస్తుయొక్క ధ్యేయములను విడగొట్టి చిత్రవిచిత్ర నామధేయములతో ఎవరికి నచ్చిన రీతిగా వారు సమిష్టి జీవితములనుండి వేరై క్రీస్తు ప్రేమకు దూరమై, ధనాపేక్షతో కూడుకున్నవారమై బైబిలులో ఎన్ని పట్టణాలున్నవో అన్ని పట్టణాల పేర్లు, బైబిలులో ఎన్ని పవిత్రస్థలాలున్నవో అన్ని పవిత్ర స్థలాల పేర్లు. ఉదా|| కల్వరి బాప్తిస్టు బేతేలు బాప్టిస్టు బేతనియా బెతస్థా బాప్టిస్టు షాలేము కర్మేలు బాప్టిస్టు హెర్మోను హెబ్రోను బాప్టిస్టు బేత్యండ బెతెస్థా బాప్టిస్టు వగైరా ఊర్లపేర్లు యెరూషలేము బెత్లెహేము రోమా వగైరా పట్టణాల పేర్లు మరియు పండుగ సంబంధమైన పేరుతో పెంతెకొస్తు సంఘము. ఇవిగాక యేసుప్రభువు ఆయా ప్రదేశములలో జేసిన మహిమ ఆసరాగా తీసుకొని బెతెస్థా సంఘము, సిలోయమ్ సంఘము, ద్రాక్షవళ్ళి కల్వరి సంఘము వగైరా పేర్లతో క్రీస్తుయొక్క చరిత్రను దుయ్యబట్టుచు, క్రీస్తుయొక్క చరిత్రను అడ్డము పెట్టుకొని ఒక సంఘమున కొక సంఘము ఐక్యత, ప్రేమ, సావాసములను విస్మరించి, పోటీలుపడి కొట్లాడుకొంటు పవిత్రముగ క్రీస్తును ఆరాధించవలసిన ఆలయములో స్వార్థముతోను, దురహంకారముతో కూడిన ఆలోచనలతో సంఘ భిన్నమును గూర్చి కుతంత్రముల,ు ఆలోచనలు పన్ని సంఘ ఐక్యతను, సంఘవిశ్వాస్యతను చెడగొట్టి, కోర్టు కచ్చేరీల పాలై సంఘాలయములో ఆరాధననను జరుపుకొనుటకు కూడా అన్యులైన న్యాయాధిపతుల తీర్పునకు ఎదురు చూడవలసినట్టి అధోగతి, నేటి మన క్రైస్తవ సంఘ జీవితము దిగజారియున్నది. ఇందునుబట్టి యేసుప్రభువు తన మాటలలో ''మీ నిమిత్తము నా నామము అన్యుల యెదుట దూషింపబడుచున్నదని వాపోయినట్లు వేదములో మనము చదువగలము. మరియొకచోట మీకంటె ముందు వేశ్యలు అన్యులు పరలోక రాజ్యములో ఉందురని క్రైస్తవులను సంబోధించి పల్కినట్లు మత్తయి 21:31 సువార్తలో చదువగలము.
ప్రభువునందు ప్రియసోదరీ! సోదరుడా! దేవుడు పక్షపాతిగాడు. ఇశ్రాయేలీయులకు ఎలాంటి జ్ఞానము నిచ్చినాడో అదే విధమైన జ్ఞానము మనకు ఇచ్చినాడు. ఇప్పుడు నరజ్ఞానముయొక్క అభివృద్ధికి బీజమెక్కడున్నదో మనము తెలిసికొందము. ఆదిలో దేవుడు తోట మధ్యలో ఉన్న మంచి చెడు తెలుపునట్టి పండును తినవద్దనెను. చెట్టులో ఉన్న సర్పము ఆ పండునే తినమన్నాడు. ఇక్కడ మనము ఆత్మీయ జ్ఞానముతో ఆలోచిస్తే ఈ తోటలో దేవుని చేత సృష్టించబడిన నరజంటలో రెండు జ్ఞానాలు బైల్పడుచున్నవి. ఎట్లంటే ఆదాము ఆత్మ జ్ఞాన సంబంధి. హవ్వయైన స్త్రీ ఆదాముయొక్క శారీర జ్ఞాన సంబంధి.
ప్రభువునందు ప్రియసోదరీ! సోదరుడా! శారీర సంబంధియై స్త్రీకి రెండు జ్ఞానాలు ప్రవేశించి ఆదాము కంటెను స్త్రీ మూడింతల జ్ఞానవంతురాలుగా జేయుటకు దోహదకారకములైనట్లుగ ఈ క్రింది ప్రకరణము ద్వారా మనము తెలిసికోగలము. స్త్రీ స్వతహా శారీర జ్ఞానము కల్గియున్నది. ఈమె జ్ఞానమునకు తోడుగా దేవుడైన యెహోవా జేసిన సమస్త భూజంతువులలో సర్పము యుక్తిగలదై యుండెను. అనగా సర్పము యొక్క యుక్తి, సర్పమును ఆవరించియున్న సాతానుయొక్క శక్తివంతమైన జ్ఞానము - అవి రెండును స్త్రీయొక్క స్వజ్ఞానముతో చేరి త్రికరణశుద్ధిగా జేసిన నిషేధఫల భక్షణము ద్వారా సంభవించిన భూలోక ఫలమైన పండు తిన్నందువలన కల్గిన జ్ఞానము ఈ విధముగా నాలుగు అంతల జ్ఞానవంతురాలైన స్త్రీ ఆదామును ఓడించి, ఆతని జ్ఞానమును అజ్ఞానమునకు మార్చి పండుయొక్క వివరమునుగూర్చి ఆదామును ప్రస్తావించకుండ జేసి, ఆతని చేత పండును తినిపించి ఆతనిని దైవ వ్యతిరేకిగా జేయడమనునది మనము గ్రహించవలసియున్నది.
ఈ విధముగా ఆత్మ జ్ఞానమును కోల్పోయిన ఆదాము నుండి లోకనరకోటికి సంభవించిన ఫలితము మరణమే. ఈ విధముగా నాలుగంతల జ్ఞానమును పొందిన స్త్రీ సంతానమైన నేటి నరకోటియైన జనాంగము దినదిన ప్రవర్థమానమై జ్ఞానాతిశయముల చేత విజృంభించి, శాస్త్రజ్ఞానముతోను అనగా గణితము, యాంత్రికము, వైద్యము, విద్య వగైరా శాస్త్రములను అందుకనువైనట్టి సంస్థలను, విద్యాలయాలను నెలకొల్పి అనేక రీతులు నరుడు తన జ్ఞానమును సానబెట్టుకొనుటకు భూమియు, లోకాధికారియైన సాతానుడును, వాని దూతలును, నరజ్ఞానము దేవుడనుగ్రహించుచున్నట్టి అనుకూల వాతావరణము వగైరాలన్నియు ఏకీభవించి, నరునియొక్క జ్ఞాన వికాసమునకు తోడ్పడుచున్నవి.
వీటితోబాటు నరునిలో ఆదిలో దేవుడు సృష్టించిన సర్పముయొక్క గుణాతిశాయాదులు అనగా యుక్తి, మోసము, దగా, వంచన, వేషధారణ అను గుణాతిశయముల ద్వారా భూలోక రాజ్యములో ఆది ఘటసర్పమైన సాతానుడు - నరులను దైవత్వములోనికి నడువనీయక, తన ఈ లోక సామ్రాజ్య పరిపాలనకు యోగ్యులుగా ఎన్నికలను పేరు పెట్టి - ఆ ఎన్నికలలో ప్రజలెన్నుకొనునట్టి అభ్యర్థిని అతను ఎన్నిక జేసిన పదవిని, తన ఆధీనమందుంచుకొని, నాడు బాప్తిస్మము పొందిన యేసును లూకా 4:5లో అపవాది భూలోక రాజ్యములనన్నిటిని ఒక నిమిషములో వానికి చూపించి, ''నీవు నాకు మ్రొక్కితివా? ఇదంతయు నీకగునని యేసుతో పల్కిన రీతిగా - ఈనాడు తన సామ్రాజ్యమునకు ఎన్నిక జేయబడు వ్యక్తిని కూడా ప్రేరేపించి, దైవజ్ఞానానికి వానిని దూరునిగా జేసి, తన జ్ఞానముతో నరులను నడిపిస్తూ - నేత్రాశ, అహంభావము, పదవీవ్యామోహము, అహంకారము, లోకాశ ఎరగా జూపి, తద్ జ్ఞానముతో మారణహోమము గావించుటకు చిత్రవిచిత్రములైన అణు సంబంధ ఆయుధములు, క్షిపణులు వగైరాలు - గ్రహాంతరాళాల్లోకి పోవు రాకెట్లను తయారుజేయు శక్తివంతమైన పరిజ్ఞానముతో నరుని ప్రేరేపిస్తున్నాడు.
ప్రభువునందు సోదరీ! సోదరుడా! ఈ యుగములో మన మాత్మీయ జ్ఞానముతో పరిశోధించి నట్లయితే ఇప్పటి నర తరములో క్రియ జరిగించుచున్న జ్ఞానమునకు మూలము ఆదిలోని సర్పజ్ఞానము, నిషేధఫలముయొక్క జ్ఞానము, శరీరజ్ఞానము, సాతాను జ్ఞానము, ఇవన్నియు మేళవించిన భూలోక శాస్త్రజ్ఞానము, నేటి ప్రపంచ పతనమునకు దారితీయుచు, బహు తీవ్రముగా నరసందోహముతో విజృంభించి క్రియ జరిగించుచున్నట్లు తెలుసుకోగలము. దైవజ్ఞానమును అపేక్షించు నరుడు నేటి యుగములో అరుదైనాడు. ఇందునుబట్టి రోమా పత్రిక, ''నీతిమంతుడు ఒక్కడు లేడు. దేవుని వెదకువాడు లేడని ఘోషిస్తున్నది.
అయితే లోకజ్ఞానము దేవుని వెదకువానికి ఏమియు ఉండదని వాడు దొంగ సాధువని, సోమరియని, దేవుడసలు లేడని ఉన్నచో ఒకప్పుడు గాకపోతే మరొకప్పుడైన కనపడగలడని, సృష్టియే దేవుడని మనకు కనపడుచున్న సృష్టియే దైవసమానమని, నరుడై పుట్టితే సృష్టిని ఆరాధించి, సృష్టిని పరిశోధించి, సృష్టి మర్మాలను తెలిసికొని, సృష్టి జ్ఞానమును అలవరచుకొని, సృష్టిని గూర్చిన గొప్ప శాస్త్రవేత్తగా పేరు ప్రఖ్యాతులు గడించి చరిత్రను నెలకొల్పాలని, నిజముగా దేవుడన్నవాడున్నట్లయితేః సృష్టికి కనపడుచున్నది. పంచభూతాలు కన్నిస్తున్నవి. ప్రకృతి మనకు దృశ్యములో ఉన్నది. వీటిలో చలించునట్టి జీవరాసులు, నరులు ఒకరినొకరము చూసుకుంటున్నాము. ఇవన్నియు దైవకృత్యములైతే వీటిని సృష్టించిన దేవుడు ఒకప్పుడు కాకపోతే ఒకప్పుడైనను కనపడవలెగదా! అటువంటప్పుడు దేవుడున్నాడను దాఖలాలేవి?
దేవుడు లేడను సిద్ధాంతమునకు నేటి శాస్త్రజ్ఞానము నరుని దైవత్వము నుండి దూరపరచి, దేవునికి నరునికి ఉన్న సంబంధ బాంధవ్యములను త్రెంపి సాతాను భూమి ఒక్కటై, నరునియొక్క శారీర జ్ఞానమును తీసుకొని వానిని లోకాంత్యములో తనతోపాటు నాశనకర స్థలమునకు చేర్చుటకు నేడు క్రియ జరిగిస్తున్నాయి. ఈ సందర్భములో 20 అధ్యాయము చదివినట్లయితే ఇట్టి సామ్రాజ్యానాధులును, ఇట్టి సామ్రాజ్యవాదులను ప్రేరేపించు శక్తులకును, భూమికిని గల్గు శిక్షను తెలిసికొన్నాము. వినాశకాలే విపరీత బుద్ధియని లోకాంత్యము సమీపించుచున్న కొలది నరునికి విపరీత బుద్ధులు, విపరీతమైన శాస్త్రజ్ఞానము మారణహోమమునకు, దాని ఫలమైన పాతాళమునకు, దాని నివాసమైన అంధకారములోనికిని దారి తీయు, నాశనకరమైన జ్ఞానమునకు నరుడు దిగజారుచున్నట్లు తెలియుచున్నది.
ప్రభువునందు ప్రియసోదరీ! సోదరుడా! ఇట్టి జ్ఞానమునుగూర్చి వినిగాని, చూచిగాని చింతపడకుము. ఫిలిప్పీ 4:6-7లో విధముగా దేవునియొక్క జ్ఞానమును సంపాదించుకొనుటకు ప్రయాసపడుము. ఇందుకొరకే మనలను క్రీస్తు ముద్రతో క్రైస్తవులముగా దేవుడేర్పరచియున్నాడు. నాడు దేవుడేర్పరచుకున్న ఇశ్రాయేలను జనాంగము నేటికిని ఉన్నారు. వారు నిలకడగాను, ఎటువంటి శాఖా బేధములు లేక దేవుని ధర్మశాస్త్రము ప్రకారము కట్టుబడి, దేవునిచే ప్రత్యేకించబడిన జనాంగముగా సమస్త నరకోటి మధ్యన ఒక రాజ్యమును స్థాపించుకొని జీవించుచున్నారు. క్రైస్తవులమైన మనము వారిని చూచి వారిలోనుండి ఉద్భవించిన రక్షకుడైన యేసుప్రభువును మన దృక్పధములో ఉంచుకొని, ఆయన జ్ఞానముతో ఆయన మార్గములో నడువవలసిన వారమైయున్నాము. అంతేగాని మొదటి కొరింథీ 1:20 ఈ లోకజ్ఞానము దేవుడు వెర్రితనముగా జేసియున్నాడు. కాబట్టి ఈ లోకజ్ఞానము ననుసరింపక దైవజ్ఞానముతో అనుసరించిన యెడల గొర్రెపిల్ల రాజ్యములో ఆకలిదప్పికలు ఎటువంటి విచార దుఃఖములు లేక నిశ్చింతగా జీవించగల యోగ్యతలు పొందగలము. అట్లుగాక ఈ లోక జ్ఞానమును నమ్ముకొని, ఈ లోక వ్యామోహములోను గ్రహాంతరాళాల్లో నివసించాలనే దురాలోచన పూరితమైన జ్ఞానముతోను జీవించిన నాడు నరజాతికి పతనము తప్పదు.
ప్రభువునందు ప్రియసోదరీ! సోదరుడా! ఇప్పటివరకు నీవు చదివిన ఈ చిన్న పుస్తకములోని అంశములనుబట్టి నీ జ్ఞానమును, దైవరాజ్యమును వెదకుటకు ఉపయోగిస్తావా? లేక లోకసంబంధమైన కుయుక్తులకు నీ జ్ఞానమును ఉపయోగించుకొని నాశనకర పుత్రుడైన సాతానుకు బానిసవై నరకాగ్ని మరణములో ప్రవేశిస్తావా?
ప్రభువునందు ప్రియసోదరీ! సోదరుడా! ఇంతకును మనము గ్రహించవలసినదేమిటంటే వేద వాక్యానుసారముగా వేదములో వివరించబడిన రీతిగా ''ఇశ్రాయేలీయుల తొట్రుపాటు అన్యులకు రక్షణ'' అని వ్రాయబడియున్నది. ఆనాడు ఇశ్రాయేలీయులు యేసునందు లక్ష్యముంచక పోవుటయు ఆయనను విశ్వసింపక పోవుట, ఆయన దేవుని కుమారుడని అంగీకరించక పోవుట, ఆయనను మహిమ పరచక పోవుటననునది నేటి క్రైస్తవులమైన మనకు దేవుని రక్షణ వలయములో ప్రవేశించు నవకాశమేర్పడినది. ఆనాడు ఇశ్రాయేలీయులు యేసును ప్రభువుగా విశ్వసించిన యెడల నేటి క్రైస్తవులమైన మనము అన్యులముగా ఉండి, అన్య జీవితములో నిజదేవునెరుంగని స్థితిలో నిర్జీవమైన దేవతలను ఆరాధిస్తూ జీవములో ప్రవేశించుటకు బదులు మరణ పాత్రులమైయుండువారము.
కనుక ప్రియసోదరీ! సోదరుడా! క్రైస్తవ విశ్వాసులైన మనకు సాతాను కుతంత్ర జ్ఞానమున్నది. సర్పము వంటి గుణాతిశయములున్నవి. మంచి చెడ్డలను తెలియజేయు ఫలభక్షణము జేసిన మన ఆది తల్లియైన హవ్వ తినినట్టి ఫలజ్ఞానమున్నది. శారీరజ్ఞానము ఉన్నది. వీటన్నిటితోబాటు క్రీస్తునెరింగిన క్రైస్తవ జ్ఞానమున్నది. మరియు రానున్న క్రీస్తుయొక్క రాకడలోని మర్మములు జరుగు సంఘటనలు లోకాంత్యము గ్రహాల నక్షత్రాల పతనము నూతన సామ్రాజ్యము, దాని వైభోగమును గూర్చిన ఆత్మీయ జ్ఞానము కూడా నేటి క్రైస్తవుని కెరింగించబడియున్నది.
కనుక ప్రియసోదరీ! సోదరుడా! ఇంతవరకును నీవు చదివియున్న జ్ఞానమును గూర్చిన ప్రకరణములో మన పూర్వీకులున్న ఆ అజ్ఞాన కాలములో నరులర్పించు బలులను వారు అర్పించు అర్పణలను వారిచ్చు కానుకలను దశమభాగాలను అపొస్త 17:30లో వలె చూచిచూడనట్లుగా ఉండినట్లు దైవ వాక్యము వివరిస్తున్నది. ఎందుచేతనంటే అప్పుడు క్రీస్తు జ్ఞానము నరులలో లేదు. క్రీస్తునెరుంగని జీవితములో నరుడేమి జేసినను అజ్ఞానియనియే గ్రహించవలసియున్నది. అదే విధముగా అపొస్త 17:31 క్రీస్తుయొక్క చరిత్ర నెరింగిన ప్రతి స్థలము ప్రతి ప్రజ మారుమనస్సు పొంది దేవుని మహిమ పర్చాలని, క్రీస్తు ద్వారా దేవుడు కోరుచున్నాడు. మరియు యోహాను 1:12లో వలె తన్నెందరంగీకరించిరో యేసును అంగీకరించినవారికి అనగా ఆయన నామమందు విశ్వాసముంచినవారికి దైవజ్ఞానములో పాలింపంపులు గల పిల్లలుగ జీవించుటకు ఆయన అధికారమిచ్చినట్లుగా దైవవాక్యము వివరిస్తున్నది.
కనుక ప్రతివ్యక్తిలోను లోకజ్ఞానము, దేహజ్ఞానము, శాస్త్రజ్ఞానము వగైరా జ్ఞానములతోబాటు క్రీస్తు జ్ఞానము ఉన్నట్లయితే క్రీస్తుయొక్క వేదవాక్యముల నెరవేర్పును జరిగించిన వ్యక్తిగా దైవత్వములో గుర్తించబడి లోకసంబంధముగా దేవుని మహిమగా నరుడు జీవించగలడని, నేటి క్రైస్తవ సామ్రాజ్య జంతు వృక్ష మానవ ఆహార వైద్య వ్యవసాయిక, విద్యుద్ ఆయుధ వాతావరణ నాగరికత ప్రయాణ యాంత్రిక శాస్త్రజ్ఞానము ఋజువుపరచుచున్నది. ఇందునుబట్టియే క్రైస్తవ సామ్రాజ్యములైన అమెరికా, బ్రిటన్, ఫ్రాన్సు, జర్మనీ, స్విడ్జర్లెండు వగైరా దేశములు ప్రపంచములో అగ్రరాజ్యాలు జాబితాలో జేర్చబడి, మానవ ఊహకతీతమైన శాస్త్రజ్ఞానముతో ముందంజ వేయుచున్నట్లు మన నిత్యజీవితములో గ్రహించవలసి యున్నాము. ఇందునుబట్టి చూడగా అన్ని జ్ఞానములలోను క్రీస్తు జ్ఞానము గొప్పదని మనము ఫిలిప్పీ
4:6-7 ఈ సందర్భములో గ్రహించవలసియున్నది.
యాకోబు పత్రిక 4:1-3
మీలో యుద్ధములును పోరాటములును దేనినుండి కల్గుచున్నవి. మీ భోగోచ్ఛలనుండియే గదా! మీరు ఆశించుచున్నారు దొరకుట లేదు, పోట్లాడుదురు, యుద్ధము చేయుదురుగాని దేవుని అడుగనందున మీకేమియు దొరకదు. దురుద్దేశముతో అడుగుచున్నారు గనుక మీకేమియు దొరుకుట లేదు.
ప్రియపాఠకులారా! యాకోబు పత్రిక 4:1-3లోని విధముగ యుద్ధములు, పోరాటములు మొట్టమొదటగ లోకములో పుట్టినది నరుని శరీర అంగముల ద్వారానే అని మనము గ్రహించాలి. ఎందుకంటే ఒక వ్యక్తి లోకాన్ని సంపాదించి, లోకములో నున్నవాటిని ఏదేని ఒక రాజ్యము, ఒక పదవిని, ఒక స్త్రీని లేక ఒక ఐశ్వర్యాన్ని పొందాలంటే మొట్టమొదటగ తన శరీరముతో పోట్లాడందేగాని బహిరంగముగా రంగములోకి రాలేడు. మొట్టమొదటగా పోరాటమన్నది శారీర అవయవల్లోనే కల్గుచున్నది. దావీదును చంపాలని సౌలులోని ప్రతి అవయవము, వాటితోబాటు హృదయము ఎంతగా ఒకదానికొకటి పోట్లాడుకున్నాయో సమూయేలు గ్రంథములో మనము చదివినట్లయితే అర్థము కాగలదు. దావీదును చంపాలని మొట్టమొదటగ సౌలులో రేగిన పోరాటము సౌలుకే హానికరమైనట్లుగ సౌలుయొక్క చివరి జీవితముయొక్క అనుభవము వివరిస్తున్నది. మొట్టమొదటగ దావీదు పదివేలు, సౌలు వెయ్యి అని జనవాణి పలుకుటలో సౌలులోని సర్వాంగములు రక్తనాళాలు వెడెక్కి సౌలును ఉడికించి, సౌలు ఓర్వలేనంత కోపాన్ని రేకెత్తించినవి. మొట్టమొదటగ సౌలుయొక్క అవయవములలో దావీదును గూర్చిన పోరాటము బహుతీవ్రతరము కాగా ఈ పోరాట ప్రతిఫలమే ఈటె నెత్తుకొని దావీదును చంపాలని దావీదును వెంటాడునట్టి ఉగ్రతకు దారితీసింది. ఇందునుబట్టి సౌలుయొక్క అవయవాలలో ఒకదానినొకటి ద్వేషించుకొని అన్నియు ఏకమై, సౌలుయొక్క హృదయాన్ని కలవరపరచి, దావీదు తన అల్లుడని మరచి, ప్రేమ బదులు ద్వేషాన్ని పెంచుకొని దావీదును చంపాలని సిద్ధమైనట్లు వేదములో చదువగలము.
అదే విధముగా హేబెలుయొక్క బలిని దేవుడు లక్ష్యముంచుటలో కయీనులోని అవయవాలు ఒకదానితోనొకటి పోటీపడి, కయీనులో ద్వేషాన్ని, ఈర్ష్యను రెచ్చగొట్టి హేబెలును హత్య చేయుటకు దారి తీసింది. ఇందులో కయీను విషయములో హేబెలు చేసిన నేరమేమియు లేదు. సౌలు విషయములో దావీదు చేసిన నేరమేమియు లేదు. అదే విధముగా దావీదు రాజధర్మమును విడనాడి మేడ మీద విశ్రాంతి కోరి స్నానమాచరిస్తున్న వివస్త్రయైన స్త్రీని చూచినప్పుడు అతని నేత్రాల ఆకర్షణయన్నది దావీదులోని ప్రతి అవయవాన్ని ఉద్రేకపరచి, ఆ స్త్రీని అనుభవించాలన్నటువంటి ఉద్దేశ్యాన్ని రేకెత్తించి, తత్ఫలితముగ ఊరియాను హత్య జేయించుటకును, ఊరియా భార్యను చెరచుటకును దారి తీసింది. ప్రతి నరుడును ఏదోయొక విధమైన భోగేచ్ఛలు నాశించి తన అవయవ పోరాటముల ద్వారా ఒక నిర్ణయానికి రావడము జరుగుచున్నదని ఇందులోని భావము.
ప్రియపాఠకులారా! ఈ విధముగా నరుడు పోట్లాడుచున్నాడుగాని, ఆశించినదానిని సాధించ లేడు. అబ్షాలోము తండ్రిని చంపి తండ్రి సింహాసనాన్ని కైవసము జేసుకోవాలని ఎంతో ఉబలాటపడి తండ్రి మీద తిరుగుబాటు జేసి, శారీరయుతముతోబాటు లోకయుద్ధము కూడా జేశాడు. ఈ విధముగా అబ్షాలోము ఆశించాడేగాని దానిని పొందలేకపోయాడు. అదే విధముగా కయీను నరహత్య జేశాడు మత్సరపడినాడు. కాని దైవసన్నిధి నుండి శాపగ్రస్థుడై దేశద్రిమ్మరియై, తాను ఆశించినదానిని పొందలేక పోయాడు.
ఇక ''మీరు ఆశించుచున్నారుగాని మీకు దొరకుట లేదు'' అనుటలో నయమాను కుష్టురోగము నుండి విడుదల పొంది ఆరోగ్యవంతుడై ఎలీషా చేత నిషేధించబడిన వెండి బంగారు గేహాజీ ఆశించాడు. కాని ఆశించినదానికి బదులు కుష్టు రోగాన్ని పొందవలసి వచ్చింది. ఇక ''పోట్లాడుదురు యుద్ధము చేయుదురుగాని దేవుని అడుగనందున మీకేమియు దొరకదు'' అనుటలో ఫిలిష్తీయులతో సౌలునకు యుద్ధము సంభవించినప్పుడు సౌలు యెహోవాను విచారించుటకు మారుగా అనగా యెహోవాను ప్రార్థించి ఆయనయొక్క అనుగ్రహమును పొందుటకు బదులుగా సోదెగాండ్రను విచారించుట చేత అతనికి మరణము దొరికినది.
(3) ఇక ''మీరడిగినను మీ భోగముల నిమిత్తము వినియోగించుటకై దురుద్దేశముతో అడుగుదురు గనుక మీకేమియు దొరుకుట లేదు,'' అనుటలో ఎస్తేరు గ్రంథములో మెర్దెకై హామానులయొక్క చరిత్రను చదివినట్లయితే మెర్దెకై ప్రతి విషయములోను, ప్రతి సందర్భములోను దేవుని అడిగి ప్రార్థనాపూర్వకముగా తనయొక్క జీవితాన్ని రాజు దయను బట్టిగాక దేవుని దయలో జరుపుకొన్నాడు. హామాను అట్లుగాకుండ రాజునే అంతము జేసి రాజ్యాన్ని కబళించి తానే రాజై, దేవుని జనాంగమైన యూదులను అంతము జేయాలని తన సంకల్పాన్ని బట్టి తనకు తానే నిర్ణయించుకొని, దురుద్ధేశముతో రాజు సన్నిధిలో ప్రవర్తించి, సన్మానమునకు బదులు ఉరి శిక్షను, ఘనతకు బదులు మరణాన్ని పొందినాడు.
ప్రియపాఠకులారా! ఈ విధముగా శరీరేచ్ఛలనుబట్టి శరీర అవయవములు ఒకదానినొకటి పోరాటమునుబట్టి దైవచిత్తానుసారముగా కాక తన చిత్తానుసారముగా నరుడు ప్రవర్తిస్తే వానికి పతనము తప్పదని ఇందులోని భావము.
యాకోబు 4:4లో ఇట్టివారిని గూర్చి వ్యభిచారిణులారా! ఈ లోక స్నేహము దేవునితో వైరమని మీరెరుగరా? అనుటలో దేహమును రూపించి, అందులో జీవాత్మను ప్రతిష్టించి, తన మహిమార్థముగా నరుని జీవించమన్న పరమాత్మునియొక్క స్నేహమును విడిచి, లోకముతో స్నేహము జేయువాడు దేవునికి విరోధియని, లోకముతో స్నేహము దేవునికి వైరమని మనము తెలిసికోవలసియున్నది. ఎవడైతే లోకముతో స్నేహము చేయునో వాడు దేవునికి శత్రువు. ఇక ఏడవ వచనములో కాబట్టి దేవునికి లోబడియుండుడి,'' అంటున్నాడు. అప్పుడు మన శారీర అంగములలో శోధనపూరితమైన పోరాటమును సృష్టించు అపవాది పారిపోవుననియు, లోక వైరాగ్యముతో మంచి పోరాటాన్ని పోరాడవలసిన అవసరత ఎంతైన ఉన్నదనియు అట్లు పోరాడిన పక్షములో - అపవాది మన యొద్దనుండి పారిపోవునని మనము దేవుని యొద్ద ఉన్నప్పుడు ఆయన మన యొద్దకు వచ్చునని దైవవాక్యము హెచ్చరిస్తున్నది.
ప్రియపాఠకులారా! యాకోబు 4:8లో దేవుని యొద్దకు రండి అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చుననుటలో - దేవుని యొద్దకు మనము వెళ్ళాలంటే మన పాపాలను మనము ఒప్పుకోవలెను. మన పాపాలను మనము ఒప్పుకోవాలంటే పశ్చాత్తాప పడవలెను, అనగా మారుమనస్సు పొందవలెను. ఆ విధముగా ఉంటేనే దేవుని యొద్దకు వెళ్ళగలము. మోషే తన పాపాలను ఒప్పుకొన్నాడు. దేవుని పరిశుద్ధమైన యోరేబును ఆశ్రయించి యోరేబును ఎక్కినాడు. దేవుని చూడగల్గినాడు. దేవుని చేత దైవజనాంగమునకు నాయకునిగా హెచ్చించబడినాడు. మోషే దేవుని దగ్గరకు వచ్చినాడు. తననుగూర్చి, తన క్రియలను గూర్చి పశ్చాత్తాప్తుడాయెను. తనతో దేవుని, దేవునితోను తాను సహజీవనము చేశాడు.
ఇక పాపులారా! మీ చేతులు శుభ్రము జేసుకొనుడి'', అనుటలో పాపము చేయువాడు చేయదగిన క్రియ చేతితోనే! అంతరంగములో ఆలోచించును, మనస్సులో నిర్ణయించుకొనును, చేతులతో క్రియ జరిగించును. కావున పాపము చేయుటకు ఉపక్రమించేవి బాహ్యముగా చేతులే కాబట్టి చేతులు శుభ్రము చేసుకొనుట అనగా చేసిన పాపమునకు ప్రతిగా చేతులు జోడించి, చేతులు తట్టి ప్రార్థన విజ్ఞాపన పూర్వకముగా - గాన ప్రతిగానములతో దేవునియొక్క వాక్య ధ్యానముతో దేవుని స్తుతించి, పరిశుభ్రము చేసుకొనుట.
''ద్విమనస్కులారా! మీ హృదయములను పరిశుద్ధపరచుకొనుడి'' అనుటలో ఇట్టి దేవునిలో ఉంటూ అటు లోకసంబంధమైనటువంటి ఆలోచనలలో జీవించే వ్యక్తులు ద్విమనస్కులు. ఇట్టివారికి దేవుడు, లోకము రెండును కావలెను. కనుక ద్విమనస్కులు గాక రెండు విధములుగా కాక మనస్సును ఒకే విధముగా ఒకే దేవునికి ఒకే ఆరాధనకు ఒకే నిరీక్షణలో - ఏక దృష్టిలో ఏకాత్మతో దేవుని ఆరాధించి మహిమపరచువారు. ఇట్టివారికి హృదయశుద్ధి అవసరమైయున్నది. ఇట్టివారు పరిశుద్ధులు కావాలంటే వ్యాకులపడవలెను, దుఃఖపడవలెను, ఏడువవలెను. నవ్వును - దుఃఖమునకును ఆనందమును - చింతకును మార్చుకోవలెను. ప్రభువు దృష్టికి తమ్ము తాము తగ్గించుకోవలెను. అప్పుడు ఇట్టివారు హెచ్చించబడెదరు.
కనుక ప్రియపాఠకులారా! శారీరసంబంధమైన పంచేంద్రియముల ద్వారా జీవాత్ముడైన నరునిలో కలుగు పోరాటము లోకసంబంధమైనదిగాక పరలోక సంబంధమైనదియు శారీర సంబంధమైనదిగాక ఆత్మ సంబంధమైనదియు ఉండాలని, ఇట్టి పోరాటము వలన జీవాత్ముడు దైవసన్నిధిలో ఒక ప్రత్యేక స్థానమును పొందగలడని వేదరీత్యా కొందరి జీవితాలను మనము తెలిసికోగలము. ఇందులో మొట్టమొదటగ విశ్వాస పరీక్షలో లోకముతో గాక దేవునితో సహవసించి అబ్రాహాము విశ్వాసులకు తండ్రియైయ్యాడు. యాకోబు దేవునితో లోక సంబంధము గాక ఆత్మ సంబంధముగా పోరాడి ఇశ్రాయేలు అయ్యాడు. యోబు సాతానుతో పోట్లాడి విజయుడై వాని ద్వారా రెండంతల సంపదను పొందగల్గినాడు.
యాకోబు 4:4 వ్యభిచారిణులారా! ఈ లోక స్నేహము దేవునితో వైరము అని మీరెరుగరా?
ప్రియపాఠకులారా! లోకమును ప్రేమించి లోకాశలకు బానిసలై, లోకసంబంధమైన ఫలములను ఈవులను ఆశించి, అటు దైవత్వముయొక్క ఆత్మ సంబంధమైన ఆధిక్యతలను పొందాలని ప్రాకులాడి, లోకసంబంధులకు యాకోబు 4:4లోని వాక్యవివరణ వివరిస్తూ - లోక స్నేహము చేయుచు, దైవత్వాన్ని మభ్యపెట్టేటటువంటివారిని వ్యభిచారిణులుగా ప్రవచించుటలో లోకముతో స్నేహము దైవత్వమునకు విరోధము కనుక అది వ్యభిచారమే! ఎందుకనగా జీవమును ఆత్మను దయజేసి నీతిగ బ్రతుకమని దేవుడు నరునికి సెలవీయగా నరుడు అందుకు ప్రతికూలముగ అనగా విరుద్ధముగా లోకసంబంధమైన కృత్రిమములు, భూఫలములు, కాయాకర్పూరములకు దైవత్వాన్ని జోడించి ఆరాధించుటన్నది నిజమునకు వ్యభిచారమే! ఎట్లంటే దేవుళ్ళు అని చెప్పుకుంటూ భూసంబంధమైన ముడిపదార్థములతో మానవుడు తన స్వజ్ఞానముతో స్వహస్తాలతో తయారుజేసిన విగ్రహాలను, దేవునికి ప్రతిగా దేవుళ్ళు అని ఆ విగ్రహాలకు జంటలను ఏర్పరచి కళ్యాణ రధోత్సవములు జరుపుట, స్త్రీ పురుష విగ్రహాలను దేవుళ్ళుగా పేరుపెట్టి వాటిని ఊరేగించుట. వాటికి తాళిగట్టుట వగైరా క్రియాకర్మల ద్వారా నరుడు లోకసంబంధమైన దృశ్యములైన మూగ విగ్రహాలతో ఆరాధన కార్యక్రమముతో వాటితో లౌక్యమేర్పరచుకొని, అలౌకిక సంబంధము కల్పించుకొని వివిధములైన కవితలుతోను వర్ణనలతోను శ్లోకాలల్లి, ఆ విగ్రహాల ముందు తమ పాండిత్యాన్ని వెదజల్లుచు, లోకసంబంధమైన విగ్రహాలతోను సంబంధ బాంధవ్యాల నేర్పరచుకొని, వాటిని దైవత్వానికి జోడించి ఆరాధిస్తు లేనిపోని అనర్థాలకును దైవోగ్రతకు గురియగుచున్నారంటే, యిందుకు కారణము ఆత్మీయముగా మనము తెలిసికోవలసియున్నది. ఈ సందర్భములో మొదటి యోహాను పత్రిక 2:15లో ఈ లోకమునైనను ఈ లోకములో ఉన్నవాటినైనను ప్రేమింపకుడి. ఎవరైనను లోకమును ప్రేమించిన యెడల తండ్రి ప్రేమ వానిలో నుండదు,'' అన్నట్లు ఇట్టివారు జీవాధిపతియైన సృష్టికర్తయొక్క ప్రేమకు దూరమగుచున్నారనే జ్ఞానాన్ని ఎరుగరు. వీరి ప్రేమ యావత్తును విగ్రహాలు, సృష్టములు - సృష్టి సంబంధమైన జీవరాసులు, ఇందులోని భోగభాగ్యాల మీద పరిమితమైయున్నది. ఇందునుబట్టి ఇదే మొదటి యోహాను 2:16లో లోకములో ఉన్నదంతయు అనగా శరీరాశయు, నేత్రాశయు, జీవపు డంబమును తండ్రి వలన పుట్టినవి కావు, అవి లోకసంబంధమైనవియే! అని వివరించబడియున్నది.
కనుక దృశ్యమైన క్షయమైన అస్థిరమైన ఈ లోక స్నేహము వేశ్య ప్రేమవలె తాత్కాలికమైనదని దీనితో చెలిమి ఏర్పరచుకొన్నవారు వ్యభిచారిణులుగాను, దైవరాజ్యమునకు అయోగ్యులుగాను, అజ్ఞానులుగాను, నరక శిక్షకు పాత్రులుగాను అగుదురని ఇందులోని భావము. ఇందునుబట్టి యాకోబు పత్రిక చివరి వచనములో - ''ఎవడు ఈ లోకముతో స్నేహము చేసేవాడు దేవునికి శత్రువు,'' అని వ్రాయబడి యున్నది. ప్రియపాఠకులారా! ఇందులో గొప్ప పరమార్థమున్నది. అదేమిటంటే దృశ్యమైన వాటి మీద మమకారము ఉంచుకొనుటన్నది వ్యభిచారము. అదృశ్యములో ఆత్మ సంబంధములైయున్న వాటిపై ఉన్న మమకారము, అపేక్ష, చింతన, భక్తి విధేయతలు, పరిశుద్ధములును, పవిత్రములును, ఆత్మ దేవునికి యోగ్యకరములైయుండి, జీవాత్మకు స్థిర నివాసమైన పరలోక పట్టణము చేరుటకు సోపానములై యున్నవి. దైవత్వము కోరునటువంటి ముఖ్యమైన కోరిక ఏమిటంటే దైవత్వమన్నది ఆత్మ గనుక - ఆ ఆత్మను ఆత్మీయ దృక్పధముతో ఆత్మ సంబంధమైన ఆచారముతో మర్యాదలతో స్తుతించి, ఘనపరచి, ఆరాధించి, మహిమ పరచవలెను. అంతేగాని ఆత్మయైయున్న దేవుని దృశ్యమైయున్న వాటికి ముడిపెట్టి వాటికి జోడించి ఆరాధించుటన్నది ఆత్మ దేవుని అగౌరవపరచుటన్న సత్యాన్ని మనము ఇందుమూలముగ మనము తెలిసికోవలసియున్నది.
ఇందునుబట్టి చూడగా దృశ్యమైయున్న ఈ లోకముపైయున్న నరుని ప్రేమ లోక వ్యభిచారిగా మారుస్తున్నట్లు ఈ క్రింది బైబిలు వేదభాగము ద్వారా మనము తెలిసికోవలసియున్నది. ఆది 3:లో అదృశ్యమైయున్న దేవుని యొక్క శక్తి పభావములు ఆయన యొక్క అద్భుత లక్షణములను తెలిసి ప్రత్యక్షముగా చూసి, ఏదెను వనములో సృష్టికర్తయైన దేవునియొక్క కృప చేత నిశ్చింత జీవితము జీవిస్తున్న హవ్వ - ఆత్మ దేవుని మరచి, సృష్టి సంబంధమైన సర్పము మీదను, సర్పవాక్కులకు విధేయియై, సర్ప ప్రబోధము మూలముగా దృశ్యమైయున్న మంచి చెడు అను వృక్షఫలము యొక్క రంగు, లావణ్యము, దాని గుణాతిశయములకు చెవినిచ్చి పండును తినుట ద్వారా - పండుతో వ్యభిచారమును, సర్పమునకు చెవినిచ్చినందున సర్పముతో వ్యభిచారము చేసి ఉభయ భ్రష్టత్వము పొంది - ఈ ఉభయ భ్రష్టత్వమన్నది తనతో కూడా పరిమితము గాకుండ తన సంతానము యావత్తునకును - ఈ భ్రష్టత్వాన్ని అంటగట్టి, దైవపుత్రులను కనవలసిన ఈ స్త్రీ గర్భము దినదిన ప్రవర్థమానమై భూమ్మీద తాను తినిన దైవవ్యతిరేక ఫల ప్రభావమున, విస్తారమైన జన ప్రవాహము ప్రసవించి, ఈ విధముగా నాటి నుండి నేటి వరకు విస్తరించియున్న సంతానమును గూర్చి మత్తయి 23:33లో యేసుప్రభువు ఇట్టి సంతానమునకు ఇచ్చిన బిరుదు నామధేయములను గూర్చి వివరిస్తూ - సర్పములారా! సర్పసంతానమా! అనుటలో లోకముతో వ్యభిచరించిన నరజీవికి కల్గు బహుమానమేమిటో మనము ఇందుమూలముగా గ్రహించగలము.
ప్రియపాఠకులారా! సాతాను కూడా యేసుప్రభువును లోకసంబంధిగా చేయుటకు సంకల్పించి - యేసుప్రభువు బాప్తిస్మము పొంది, పరిశుద్ధాత్మ పూర్ణుడై యోర్దానునది నుండి వచ్చినప్పుడు 40 దినములు ఆయన దైవాత్మ చేత నడిపింపబడినను, ఒక వైపు అపవాది చేత శోధింపబడుచుండినట్లును ఈ శోధన కాలములో ఆయన ఏమియు తినక నిరాహారముగా ఉండినట్లును, ఆ ఉపవాస దినము తీరిన తర్వాత ఆయన ఆకలి గొన్నప్పుడు అపవాది అను ఆదికాండములో హవ్వను శోధించిన సాతానుడు ప్రత్యక్షముగా ప్రభువుతో దేవుని కుమారుడవైతే రొట్టెయగునట్లు ఈ ఱాతితో చెప్పుము'' అని ఆయనతో అనుటయు, అందుకు యేసు మనుష్యుడు రొట్టె వలన జీవించడని చెప్పినప్పుడు అపవాది ఆయనను వదలక రెండవదిగా భూలోకములోని రాజ్యములను, దాని వైభోగములను ఆయనకు చూపించుటయు - చూపించుటయే గాకుండ భూలోకాన్ని గూర్చి వివరిస్తూ - ''ఈ లోకరాజ్యము యొక్క అధికారము, దీన మహిమలు నీకిచ్చెదను, ఇవి నాకు అప్పగింపబడియున్నవి. అది ఇచ్చుటన్నది నా ఇష్టములో ఉన్నదని చెప్పుచు, నీవు నాకు మ్రొక్కినట్లయితే - ఇదంతయు నీది అవుతుందని చెప్పుట. అందుకు ప్రభువు - ''నీ దేవుడైన ప్రభువుకు మాత్రము మ్రొక్కు అని అనుటయు - ఆతర్వాత అపవాది ఆయనను యెరూషలేమునకు తీసుకొనిపోయి దేవాలయ శిఖరాన ఆయనను నిలువబెట్టి క్రిందకి దూకుము అని చెప్పుచు - నిన్ను గూర్చి ఆయన తన దూతలకు ఆజ్ఞాపించును. నీ పాదమెప్పుడైనను ఱాతికి తగులకుండ వారు నిన్ను చేతులతో ఎత్తికొందురు,'' అని యేసుప్రభువుకే బోధ చేసేటటువంటి స్థితికి అపవాది ఇచ్చట సిద్ధపడినట్లు ఈ వేదభాగములోని సారాంశము.
ప్రియపాఠకులారా! ఇందులో అపవాది ప్రభువును మూడు విధములుగా శోధించినట్లు మనకు అర్థమగుచున్నది. 1. తిండితో 2. లోకముతో 3. దైవత్వమును పరిశోధించుటకుగాను శోధన కార్యము జరిగించినట్లు తెలియుచున్నది. అయితే ప్రభువు ఆత్మీయ జ్ఞానముతో ఆత్మ సంబంధి గనుక నరులలో ఉన్న సాతానుయొక్క గుణాతిశయములను, దైవశాపమును తొలగించుటకు అవతరించిన ప్రత్యేకమైన దైవాత్మ గనుక ఈయన సునాయాసముగ లోకాన్ని జయించినాడు. మరణాన్ని జయించినాడు, సమాధిని జయించినాడు పరలోక రాజ్యమునకు ప్రత్యక్షముగా శరీరాత్మలతో ఆరోహణమయ్యాడు.
కనుక ప్రియపాఠకులారా! ఇది మొదలుకొని మన జీవితాలను లోకసంబంధమైన ఆశా వ్యామోహాలతో ముడిపెట్టుకొని లోకసంబంధమైన వ్యభిచార గుణాతిశయములతో లోనుగాకుండ మన దృక్పధాన్ని మార్చుకొని, ఆత్మ సంబంధులమై ఆత్మరాజ్య వారసులగుటకు లోక ప్రేమను చంపుకొని, ఆత్మ దేవుని యందు, ఆత్మ స్వరూపుడైన యేసుక్రీస్తు ప్రభువు నామములో ఆయన ఆత్మలో ఐక్యమై శాంతి సమాధానములతో జీవించుదుము గాక!
.........
దేవుడు వెళ్ళమన్న మార్గాన వెళ్ళక వేరొక మార్గాన వెళ్ళ సంకల్పించిన యోనా గతి ఏ స్థితికి వచ్చిందో యోనా చరిత్ర మూలాన కొన్ని అంశాలను మనము గ్రహించవలసియున్నది. ఇది ఆత్మీయ ఆలోచనాయుత సమస్యయై యున్నది. దేవుడు యోనాను నీనెవె పట్టణమునకు వెళ్ళమనగా దేవుని సమక్షములో వెళ్ళెదనని తల ఊపి సమ్మతిని తెల్పినట్లును, లోకము అను ఓడ ఆతని వెళ్ళవద్దని పోటీపడి వెళ్ళవలసిన ఓడకు ప్రతిగా వేరే ఓడ రూపమున తర్షీషు అను నామరూపమున యోనాను మ్రింగెను.
మ్రింగబడిన యోనా ఓడ గర్భములో మేను మరచి గాఢనిద్ర పోవుచుండి, బాహ్య వాతావరణ భీకర రోదనములను గ్రహింపలేనంత మైకములో ఉన్నట్లు తెలుస్తున్నది. అయితే దైవశక్తి గొప్పది గనుక ఓడ దైవోగ్రతకు తట్టుకోలేక యోనాను సముద్రములో క్రక్కెను. కాని దైవోద్దేశ్యము యోనా నిర్ణయమునకు ప్రతికూలమైనందున దైవశక్తి మహామత్స్య రూపమును దాల్చి తన గర్భములో వానిని ఇముడ్చుకొని, మూడు దివారాత్రాలు అతనిని గాఢ ప్రార్థనా శక్తి పరునిగా జేసి, మరియు నిరాహారునిగాను, వెలుగునకును భూమికిని దూరునిగా జేసి, తాను నిర్ణయించిన నీనెవె పట్టణమునకు తీసుకొని వెళ్ళి క్రక్కినట్లు వేద సారాంశము.
ప్రాణాయానము - ప్రాణత్యాగము
ప్రాణాయానము :- ఆదికాండము 4:10, ''నీవు చేసిన పని ఏమిటి? నీ తమ్ముని రక్తము యొక్క స్వరము నేలలో నుండి నాకు మొరపెట్టుచున్నది.''
ప్రియపాఠకులారా! దేవుడు సృష్టికి - సృష్టిలోని ప్రతి జీవికి అనుగ్రహించిన ప్రాణము మరియు నరునిలో ప్రత్యేకముగా ఉంచిన జీవాత్మ అను వాటిని గూర్చి తెలిసికొందము. మొట్టమొదటగా ప్రాణాయానము అనగా ప్రాణము చేసే ప్రయాణము, అనగా ప్రాణ సంచారము - ప్రాణ ప్రతిష్టత, రెండవది ప్రాణత్యాగము అనగా ప్రాణమును సమర్పించుకొనుట. ఇందులో ప్రాణప్రతిష్టతను గూర్చి తెలిసికొందము.
ఈ ప్రాణప్రతిష్టత అన్న క్రియను మొట్టమొదటగా దేవుడు భూమి మీద జరిగించాడు. దేవుడు భూమి మీద ప్రాణప్రతిష్ట గావించిన సమయములో ఎలాంటి ఆడంబరాలు లేవు. దేవుడు తన వాక్కుతో భూమికి జీవాన్ని పోశాడు. దైవవాక్కుతో జీవమును అందుకొన్న భూమి దైవచిత్తానుసారము దైవవాక్కును బట్టి దైవ నిర్ణయాన్ని బట్టి సృష్టములను రూపించి వాటిని చలింపజేసింది. అనగా చెట్లు చేమలు, మృగ పక్షి జాతులు జలములు వగైరా ఇవన్నియు భూమినుండి జనించాయి. అయితే నరునియొక్క జనన విధానములో భూమియొక్క ప్రమేయము ఎంతవరకంటే - దేవుడు రూపించిన నరరూపానికి కావలసిన జడపదార్ధాన్ని భూమి దేవునికి ఇచ్చింది. అందుకే దేవుడు నేలమంటితో నరునిజేసి, వాని నాసికారంధ్రములలో జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మ ఆయెను,'' అనుటలో ఇది భూమి మీద మొట్టమొదట దేవుడు జరిగించిన ప్రాణము - జీవము ఆత్మ ప్రతిష్టిత కార్యక్రమము. ఇది జీవాత్మ ప్రతిష్టితను గూర్చిన వివరము.
ఈ ప్రాణప్రతిష్ట అను క్రియాశక్తిని దేవుడు తన యందు విశ్వాసముంచి, ఆత్మ శుద్ధి గలిగి దైవాత్మను ధరించుకొన్నటువంటి పరిశుద్ధులకు అందరికిని ఇటువంటి యోగ్యతను దేవుడు అనుగ్రహించినట్లుగ పాతనిబంధనలో కొందరి వ్యక్తులను ఉదాహరణగా తీసికొందము. 1 రాజులు
17:21-22 ఏలీయా విధవరాలి కుమారుడు చనిపోగా వానిని బ్రతికించాడు. ఇది నిర్జీవమైన దేహమునకు నరుడు ప్రాణప్రతిష్ట చేసే యోగ్యతను పొందిన విధమైయున్నది. అలాగే ఇట్టి కార్యమును క్రొత్త నిబంధనలో యేసుక్రీస్తు కూడా కొన్ని సందర్భాలలో కొందరు చనిపోగా వారికి మరల పునః ప్రాణ ప్రతిష్ట చేసినట్లు ఉదాహరణగా నాయీరు కుమార్తె చనిపోగా అతడు పాడెను ముట్టి, జరిగించిన ప్రాణప్రతిష్ట విషయము మనము చదువగలము. అలాగే యేసుక్రీస్తు మొదటి అపొస్తలుడైన పేతురు కూడా చనిపోయినవానిని బ్రతికించినట్లును, అలాగే అపొస్తలుడైన పౌలు చనిపోయిన వానిని బ్రతికించినట్లును అపొస్తలుల గ్రంథములో మనము చదువగలము.
ప్రాణ ప్రతిష్టత అన్నది లోకములో జరిగే కార్యములన్నిటిలోను అతి గొప్పదియు ప్రధానమైనదియు, ఘనమైనదియునైయున్నది. దేవుడు ఈ విధముగా ప్రాణ ప్రతిష్ట క్రియ భూమి మీద జరిగించుచుండగా నరుడు దానిని తనకు అనుగుణ్య మార్గములో మలచి గృహ ప్రతిష్ట కార్యక్రమమని, చిన్న బిడ్డల పుట్టిన పండుగ, ప్రతిష్టత కార్యక్రమము, మందిర ప్రతిష్టత కార్యక్రమము అని వగైరా కార్యక్రమాలను లోకసంబంధముగా జరుపుచున్నాడు. అయితే దేవుడు ఈ ప్రాణ ప్రతిష్టతను లోకములో నరజీవితములో రెండు విధాలుగ వాడియున్నాడు. అందులో మొదటిది తల్లి గర్భము నుండి పుట్టిన బిడ్డను దైవత్వమునకు ప్రతిష్టించబడాలన్న చట్టమున్నది. ఈ చట్టమును ప్రతి యొక్కడును పాటించవలసి యుండగా దీనికి వ్యతిరేకముగా నరుడు పరిశ్రమ, కర్మాగారములు, నూతనముగా వెలిసే సంస్థలు, గృహాలు, ప్రాజెక్టులు, వంతెన నిర్మాణాలు ఒకటేమిటి? సకలమైన వాటికిని ఈ ప్రతిష్టిత కార్యక్రమానికి, దేవుని చేత ఏర్పరచబడిన ఈ క్రియను అయోగ్యముగా వాడుచున్నాడు. అయితే దేవుడు జరిగించే ప్రతిష్టిత కార్యాలు ఏవియును వ్యర్థము కాలేదు. మొట్టమొదట దేవుడు ఆది నరునికి జీవాత్మను ప్రతిష్టించి తన పరిశుద్ధ వనములో ఉంచినప్పుడు అతడు వ్యర్థముగా జీవించలేదు. దైవాత్మ యొక్క ప్రేరేపణ ద్వారా ఆ తోటలోని సకల జీవులను పరిపాలించాడు. దేవునితో ముఖాముఖిగా సంభాషిస్తూ లోకసంబంధమైన మాలిన్యము - అంటక పరిశుద్ధునిగ జీవించాడు.
ఈ విధముగా దైవ ప్రతిష్టిత నందుకున్న ఆదాము దేవుడు జరిగించిన జీవాత్మ ప్రతిష్టిత ప్రభావమును కోల్పోయినవాడై, దోషియై దైవసన్నిధి నుండి వెళ్ళగొట్టబడినాడు. ఈ విధముగా జరిగిన తర్వాత ఆదాము - అతని సాటి సహాయియైనటువంటి స్త్రీ - కర్మపాపము ద్వారా సంక్రమించిన సంతానములలో ఆది 4:1లో విధముగా మొట్టమొదట స్త్రీ గర్భమును తెరచి, నరసంతానముగా దేవుని అనుగ్రహము పొందిన బిడ్డలుగ కయీను హేబెలు అను రెండు సంతానాలను భూమ్మీద దేవుడు ప్రతిష్టించాడు. ఈయొక్క ప్రతిష్టితకు కృతజ్ఞతగా ఆదాము కుమారులు శాకాహార - మాంసాహార బలులర్పించినప్పుడు దేవుడు ఆ బలులను పరిశోధించి ఒక బలిని ఆశీర్వదించి, మరొక బలిని లక్ష్యపెట్టకపోగా - ఆదాము ప్రధమ కుమారుడైన కయీను సహోదర ద్వేషియై హేబెలు మీద పగబట్టి వానిని చంపగా - చంపబడిన హేబెలు రక్తములో ఉన్న జీవము దేవుని దగ్గరకు వెళ్ళి మొరపెట్టినట్లుగ వేదములో 4:10లో చదువగలము. ఇపుడు మనకు జీవాత్మ ప్రతిష్టిత జీవాత్మ సంచారము రెండును - ఇందులో జీవాత్మ సంచారమును గూర్చిన మర్మము మనకు బాహాటముగా తెలుస్తున్నది.
ఎలాగంటే రక్తములోని జీవము దేవుని దగ్గరకు వెళ్ళి దేవునికి మొరపెట్టినట్లుగ దేవుడే సాక్ష్యమిస్తున్నాడు. ''నీ తమ్ముని రక్తము యొక్క స్వరము నేలలో నుండి నాకు మొరపెట్టుచున్నది,'' ఇందునుబట్టి నరునిలోని జీవాత్మకు చలనాత్మకమైన స్వభావమున్నట్లు మనకు ఋజువగుచున్నది, అంటే జీవాత్మకు సంచారమున్నది. ఈ సంచారపు వాతావరణమే నరుడు జీవించియున్నను, ఈ జీవాత్మ చేయు సంచార మూలముగా అతడు నిద్రించియుండగా - ఈ నిద్రలో కూడా జీవాత్మయొక్క గమనము స్వప్న రూపముగా మనకు కొన్ని సందర్భాల ద్వారా విదితమగుచున్నది. ఉదాహరణ యాకోబు కన్న కల, యాకోబు కుమారుడైన యోసేపు కన్న కలలు, ఐగుప్తు పరిపాలకుడైన ఫరో కన్న కలలు, మహాజ్ఞానియైన దానియేలు కన్న కలలు. నూతన నిబంధనలో కన్యకయైన మరియను రహస్యముగా విడనాడాలనుకున్నప్పుడు దేవదూత ద్వారా యోసేపు కన్న కల, అటుతర్వాత హేరోదు జరిగిస్తున్న శిశుసంహారక మారణహోమములో యోసేపునకు స్వప్నములో దేవదూత ద్వారా కన్న కల, దేవదూత జ్ఞానులకు దర్శనమిచ్చి హేరోదు మార్గాన వెళ్ళవద్దని, వేరొక మార్గాన వెళ్ళమని చెప్పడము. ఇవన్నియు జీవాత్మ యొక్క సంచారము, ఆత్మ సంచారమును గూర్చిన వివరాలున్నవి. ఆది 3:8 చల్లపూటను ఆదామును అతని భార్యయు తోటలో సంచరించుచున్న దేవుడైన యెహోవా స్వరమును విని, దేవుడైన యెహోవా ఎదుటికి రాకుండ చెట్ల చాటున దాగుకొన్నారు.
ప్రియపాఠకులారా! యెహోవా అన్నది దైవనామము, దేవుడు శరీరుడు కాడు, ఆయన ఆత్మ - ఆత్మ యొక్క కేంద్రస్థానము పరలోకము - పరలోకములో ఈయన జీవించబట్టి - పరమాత్మ అని అంటున్నాము. ఇట్టి పరమాత్మ పరమును వదలి భూమి మీద సంచరించి, అనేకమైన ప్రతిష్టిత కార్యక్రమాలు యుద్ధాలు జరిగిస్తూ సంచారము చేసినట్లుగా కూడా వేదములో మనము చదువగలము. ఏదెనులో ఏ విధముగా పరమాత్ముడు సంచరించాడో అలాగే తాను భూమి మీద తనకు సాధనముగా ఎన్నుకొన్న ప్రతి యొక్క వ్యక్తి విషయములో కూడా తాను పరలోకము నుండి దిగివచ్చి తాను జరిగించబోవు కార్యార్థము నరులకు వివరించేవాడు. ఆదికాండము 1:1-2లో సృష్టి ఏర్పడక పూర్వము ఈ దేవునియొక్క ఆత్మ చీకటి జలాల మీద అల్లలాడుచున్నట్లు అనగా తిరుగులాడుచున్నట్లుగా వ్రాయబడియున్నది. అలాగే ఆదికాండము 6:12 దేవుడు భూలోకమును చూచినప్పుడు అది చెడిపోయియుండెను. భూమి మీద సమస్త శరీరులు తమ మార్గమును చెరిపివేసికొని యుండిరి.''
ప్రియపాఠకులారా! దేవుడు ప్రత్యక్షముగా పరము నుండి దిగి భూమిమీదికి వచ్చి ప్రత్యక్షంగా చూచిన సంఘటన ఇది. ఇందునుబట్టి ఆదికాండము 7:1 దేవుడు తానెన్నుకున్న విశ్వాసితో మాట్లాడిన మాటలు, యెహోవా - ఈ తరమువారిలో నీవే నా ఎదుట నీతిమంతుడవైయుండుట చూచితిని. కనుక నీవును నీ ఇంటివారును ఓడలో ప్రవేశించుడి,'' అనుటలో పరమాత్ముడు తాను సృష్టించిన ఈ భూసృష్టి యావత్తును తుడిచివేయు ప్రణాళికను సంకల్పించినప్పుడు, తానేర్పరచుకున్న భక్తునితో మాట్లాడిన మాటలు - ఇవి. ఈ విధముగా దేవుడు సృష్టి నిర్మూలన ప్రణాళికలో నరునితో దేవుడు మాట్లాడినట్లు మనకు తెలుస్తున్నది. అటుతర్వాత దేవుని ఆత్మ నరునితో సంచరించి ప్రత్యక్షముగా క్రియ జరిగించిన సంఘటనలు కొన్ని వేదరీత్యా తెలిసికొందము. మోషేకు అగ్నిజ్వాలల నడిమిలో యెహోవా దూత ప్రత్యక్షమై అతనిని దేవుని జనాంగమైన ఇశ్రాయేలుకు నాయకునిగ ప్రతిష్టించుట, ఈప్రతిష్టిత కార్యములో దేవుడు తన విశ్వాసియైన మోషేతో నీ చేతిలోనిది ఏమిటి? అని అడిగెను. అందుకతడు కర్ర అనెను. అప్పుడు ఆయన -నేలను దానిని పడవేయమనెను. అతడు దానిని నేల పడవేయగానే అది పామాయెను. అప్పుడు యెహోవా - నీ చెయ్యి చాచి దాని తోక పట్టుకొనుమనగా అది అతని చేతిలో కర్ర ఆయెను. ఇట్టి మహత్కార్యము ద్వారా అజ్ఞానియు, నోటి మాంద్యముగలవాడైన మోషేను దేవుడు తన జనాంగము మీద నాయకునిగాను, దైవపక్షముగా పోరాడు వీరునిగాను, దైవ గ్రంథములో ఐదుకాండలు వ్రాసే గ్రంథకర్తగాను, యాజకునిగాను, ప్రవక్తగాను, తన జనాంగమైన ఇశ్రాయేలుకు నియమించుటన్నది మోషేయొక్క ఉన్నత స్థితిని సూచిస్తున్నది. ఈ విధముగా దేవునియొక్క ఆత్మ ఐగుప్తు యొక్క దాస్యము నుండి వెలుపలికి రప్పించినప్పుడు పగలు మేఘస్థంభముగాను, రాత్రి వెలుగు ఇచ్చి చలి నుండి కాపాడుటకు అగ్ని స్థంభముగాను వారితో సంచారము చేసినట్లుగాను వేదములో మనము చదువగలము. అలాగే ఆది 11:5లో ''యెహోవా నరుల కుమారులు కట్టిన పట్టణమును చూడ దిగివచ్చెను,'' అనుటలో భూమి మీద నరులు అహంభావముతోను, స్వార్థముతోను దైవత్వమునకు ప్రతికూలమైన, దైవచిత్తమునకు వ్యతిరేకమైన కార్యము జరిగించుటకు పూనుకొన్నప్పుడు, దేవునియొక్క ఆత్మ భూమి మీదకు దిగి ఈ విధముగా దైవాత్మ సంచారమన్నది పాతనిబంధన అంతము వరకు ఎన్నో సందర్భాలలో ఎన్నో విధాలుగ భూమి మీద సంచరించి క్రియ జరిగించియున్నది. ఇది పాతనిబంధనలో పరమాత్ముడు భూమి మీద సంచారము చేసిన సందర్భాలను గూర్చినట్టి చరిత్ర.
ఇక నూతన నిబంధనలో పరమాత్ముడు నరజీవితములో రూపము లేకుండ సంచరించినట్లుగా గాక ప్రత్యేకముగా నరులకు అందుబాటులో ప్రతి నరుడు తాకి, ఆ యొక్క స్పర్శ, అనుభూతిని అనుభవించినట్లుగ అందుబాటులో ఉండి నరులమధ్య నివసిస్తే నరునిలోని ఆత్మీయ అంధత్వమన్నది పరమాత్ముని యొక్క మహిమాన్విత క్రియను నరుల పట్ల ఆయనకున్న ప్రేమానురాగాలను గూర్చి గ్రహించలేకపోయారంటే నరుడెంత అధముడో ఎంత పనికిమాలినవాడో - ఆత్మీయముగా ఎటువంటి దౌర్భాగ్యము కల్గినవాడో మనకు మనమే పరిశోధించుకున్నప్పుడే మనము పరమాత్మ యొక్క నిజత్వమును కనుగొనగలము. యేసుక్రీస్తు అను పేరుతో పరమాత్ముడు ఈ లోకములో అవతరించి, తన యొక్క సర్వస్వమును అనగా పరలోక వైభోగము, దూతల సావాసము, మహిమ రాజ్యాన్ని వదలుకొని, పనికిమాలిన నరులైన మనతో సాంగత్యమును ఆశించి, మనలను తన వారినిగా చేసికొనుటకు దేవుడు ఆశించినటువంటి ఆయన ఆశయాన్ని నరుడు వమ్ముచేసి, ఆత్మీయత లేక కేవలము లోకానికిని శరీరానికిని దేవుడు తనకు అనుగ్రహించిన ఆత్మ యొక్క విలువను పాడుచేసికొని సంపూర్ణముగా దైవత్వానికి దూరమగుచున్నాడంటే, నరుని ఆత్మీయ బలహీనతన్నది ఎంత గొప్పగా క్రియ జరిగించిందో ఇందునుబట్టి మనకు తెలుస్తున్నది. అటుతర్వాత అంటే యేసుక్రీస్తుయొక్క ''జననము - మరణము - పునరుత్థానము, ఈ మూడు క్రియలు జరిగిపోయిన తర్వాత కూడా దేవుడు వదలక పరిశుద్ధాత్మ అను వేరొక పేరుగల్గిన తన పరిశుద్ధాత్మ అను తన ఆత్మను మరియొక పేరుతో నరులపై తన ఆత్మను ఆవరింపజేసి, అనేకమైన అద్భుత కార్యాలు, స్వస్థత క్రియలు జరిగించినట్లు అపొస్తలుల కార్యాలలో మనము చదువగలము.
ప్రియపాఠకులారా! పాతనిబంధన నూతన నిబంధన అపొస్తలుల కాలములో - ఈ మూడు కాలాలలో మూడు విధాలుగ మూడు రూపాలలో - మూడు విధములైన జనాంగాలతో కలిసి సంచరించిన దేవుడు ఇప్పుడు విసిగివేసారి కేవలము తన ప్రవక్తల ద్వారా విరచితమైన వేదవాక్యాలనుబట్టి వాటియందు విశ్వసించి, వాని ద్వారా పాప పశ్చాత్తాపము, మారుమనస్సు పొంది, ఆత్మ ఫలించాలని అశించినట్లుగా అపొ 17:30 ఆ కాలమందైతే దేవుడు చూచి చూడనట్లున్నాడుగాని ఇప్పుడైతే, తాను నియమించిన మనుష్యుని ద్వారా అందరును అంతటను మారుమనస్సు పొందాలని మనుష్యులకు ఆజ్ఞాపించుచున్నాడు,'' అన్న ప్రవచనాన్ని బట్టి మరియు హెబ్రీ 1:1 పూర్వకాలమందు నానాసమయాలలోను నానావిధాలుగాను ప్రవక్తల ద్వారా మన పితరులతో మాట్లాడిన దేవుడు ఈ దినముల అంతమందు కుమారుని ద్వారా మనతో మాటలాడెను,'' అనుటలో ఇప్పుడు ఆ కుమారుడు ఏ విధముగా మనతో మాట్లాడుచున్నాడు? ఆ కుమారుడు ఎవరు? అన్నది వేదరీత్యా తెలిసికొందము. యోహాను 1:1 ఆది యందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద నుండెను, వాక్యము దేవుడైయుండెను.'' మరియు 1:14 ఆ వాక్యము శారీరధారియై, కృపాసత్యసంపూర్ణుడుగా మన మధ్య నివసించెను.''
కనుక ప్రియపాఠకులారా! ఆదియందు ఈ వాక్యము దేవుడైయున్నట్లును, దేవుడై అదృశ్యంగా ఉన్నట్టి ఈ వాక్యము సృష్టి ప్రారంభ నిర్మాణ కార్యము యావత్తును జరిగించి ఒక నిబంధన కాలమంతటిని పరిపాలించింది. ఈ విధముగా పరిపాలించే ఈయొక్క వాక్కు పరిపాలన అనగా దేవునియొక్క వాక్కు అనెడి దైవత్వము ఒక దూతగాను లేక ఆకాశములో మేఘవాణిగాను, మండుచున్న అగ్నిరూపముగానో - తన భక్తులకు దర్శనమిచ్చి తన ప్రవక్తలతో మాట్లాడి లేక ఒక దూతను పంపి - ఆ దూత ద్వారా మాట్లాడించి జరిగించినట్లు పాత నిబంధనలోని అనేక సంఘటనలు మనకు ఋజువు పరుస్తున్నవి. వ్రాయాలంటే చాలా విషయాలున్నాయి. ఈ విధముగా మేఘవాణి అనగా ఆకాశములో దేవుడు తాను ప్రత్యక్షముగా నరరూపములో తన దూతను పంపి, తన దూత ద్వారాను మాట్లాడినట్లును, ఈ విధముగా నూతన నిబంధనలో లూకా 1:26లో కన్యకయైన మరియతోను యోసేపుతో కూడా దేవదూత మాట్లాడినట్లును, బాలయేసును దర్శించిన జ్ఞానులతో స్వప్నములో దర్శనమిచ్చాడు. యోసేపుకు స్వప్నములో దర్శనమిచ్చి మాట్లాడినట్లును, నూతన నిబంధన ప్రారంభ వేదభాగాలలో వ్రాయబడిన సందర్భాలు మనకు ఋజువుపరస్తున్నవి. అటు తర్వాత ఇది హెబ్రీ 1:1లో మనము చదువుకొన్న వచనము యొక్క యదార్థ విషయమైయున్నది. ఇక ఆ వచన రెండవ వాక్య భాగము :- ''ఈ దినముల అంతమందు కుమారుని ద్వారా మనతో మాటలాడెనని వ్రాయబడిన ప్రకారము నూతన నిబంధన కాలము నుండి మరియు అపొస్తలుల కాలము నుండి విశ్వాసుల కాలము నుండి, నేటి అంత్య కాలమైయున్న నేటి దినాలలోను వాక్య రూపముగా మనతో మాట్లాడుచు, వ్యక్తి రూపముగా మనకు దర్శనాలిస్తూ - మన ప్రతి అవసరతలలో మనకు తోడై యుండి, మనకు శ్రమలు వేదనలు సమస్యలు ప్రమాదాలు వగైరాల నుండి కాపాడే దేవుడు ఆయనే అని మనము గ్రహించాలి.
ప్రియపాఠకులారా! చిత్రమేమంటే దేవునియందు భయభక్తులు గల్గి జీవించిన జనాంగము కొద్దిమందే, అలాగే నూతన నిబంధనలో ఆ దేవుడే శరీరధారియై నరరూపములో ప్రత్యక్షముగా దర్శనమిచ్చి నరులతో కలిసి జీవించి, ఎన్నో అద్భుత కార్యాలు ప్రత్యక్షముగా చూపినను యేసుయొక్క విశ్వాసులు ఆ దినాలలో బహు కొద్దిమందియే, కనీసము ఆయన శిష్యకోటిలో కూడా ఆయనను ప్రేమించినవాడు ఒక్కడే, అతనే ప్రకటన గ్రంథము వ్రాసిన యోహాను, ఈయన యేసు ప్రభువు సిలువ మరణము వరకు, ఆయన సిలువ దగ్గర నిలువబడి ప్రభువు మరణ సమయములో ఆయన చేత ఆయన తల్లి యైన మరియను తన ఇంట చేర్చుకొని ధన్యత పొందినవాడే ఈ యోహాను. ఇతనికి ముందు యేసుయొక్క ప్రేమ వలయములో జీవించినవారెవరంటే బేతనియలోని మార్తమరియలను ఇద్దరు సహోదరీలు, జక్కయ్య అను సుంకరి, మగ్దలేనె మరియ - వీరు ఆయన జీవించిన కాలములో ఆయన మీద విశ్వాసముంచినవారు. ఆఖరున సిలువ మీది దొంగ - ఆయనను ప్రేమించి ఆయనలో ఐక్యమయ్యాడు. ఇందునుబట్టి యెహోవా అను పేరుతో దేవుడు లోకాన్ని భరించిన కాలములో ఇశ్రాయేలు అను దైవజనాంగములో సహితము దేవునియందు విశ్వాసముంచి జీవించినవారు అరుదు. అనేకులు కూడా లోకాశలలో తగుల్కొనినట్లును ఆయన మీద సణిగి మోషేకు చాలా సంతాపాన్ని పుట్టించారు - ఈ ఇశ్రాయేలు. అలాగే నూతన నిబంధనలో తన జనాంగమైన ఇశ్రాయేలులో అవతరించి, వారితో కలిసి నరరూపములో జీవించిన దేవుని చూచి కూడా - ఇశ్రాయేలు అనే యూదా హెబ్రీయ నామధేయము కల్గిన ఆ దైవజనాంగము యేసును చూచి, ఆయన అద్భుతాలు చూచి కూడా ఆయనను నమ్మకపోగా - ఆయన మీద అసత్యకరమైన ఆరోపణలు పుట్టించి, నాటి రోమా పరిపాలకులయొక్క మరణశిక్షను విధింపజేసినవారు ఆ జనాంగమే. అయితే యేసుక్రీస్తు చనిపోయి మహిమ పునరుత్థానుడై తండ్రి రాజ్యానికి వెళ్ళిన అనంతరము, ఎవరైతే లోకానికి దడిచి, యేసుక్రీస్తునకు దూరమై దాగినారో వారే యేసుప్రభువు ఈ లోకము నుండి మహిమ పునరుత్థానుడైన అనంతరము ఆయన ఆత్మ చేత ఉజ్జీవింపబడినవారై, ఆయన శిష్యులు అపొస్తలులుగ మారి, వారియొక్క బోధల ద్వారా అనేకులను క్రీస్తుయొక్క చరిత్రకు సాక్షులుగా చేసి, వారిని బోధకులుగ అభిషేకించి, దైవరాజ్య సువార్తను బోధించుటకు లోకము మీదికి పంపి క్రియ జరిగింపగా తద్వారా దేవుని రాజ్యము క్రీస్తు రాజ్యముగా భూమి మీద విస్తరించి, నేడు ప్రపంచ జనాభాలో ప్రధమ స్థానాన్ని అలంకరించుకొని సంతరించుకొన్నదంటే యేసుప్రభువు తోమాతో చెప్పిన మాట, ''నీవు నన్ను చూచి నమ్మితివి, చూడక నమ్మినవారు ధన్యులు అని అతనితో చెప్పెను. యోహాను 20:29లోని మాటనుబట్టి ఈనాడు క్రైస్తవులమైన మనము ఇశ్రాయేలుము కాదు. అయినను ఇశ్రాయేలు కంటె ఘనమైనట్టి రక్షణ, ప్రత్యేక నామమును కల్గినవారమై, దైవకుమారుడైన యేసుక్రీస్తుయొక్క బిడ్డలుగ ఏర్పడియున్నామన్న సంగతి తెలిసిన విషయమే;
ప్రియపాఠకులారా! యెహోవా దేవుడు ఆత్మగ సంచరించిన కాలములో అన్యులైన జనాంగము దేవుని మహిమను చూచి ఆయనను విశ్వసించలేకపోయారు. మరియు ఆయన బిడ్డలైన ఇశ్రాయేలుకు ఆయన తోడైయుండి నడిపించిన విధానమెరింగియు, ఇశ్రాయేలుపట్ల కఠినముగా ప్రవర్తించి, ఇశ్రాయేలు దేవుడైన యెహోవాను ఆయన మహత్కార్యాలను గ్రహించియు కూడా దేవుని తిరస్కరించి, ఆయనకు చెందవలసిన మహిమను విగ్రహాలైన అన్య దేవతలను ఆరాధించి దైవోగ్రతకు గురి అయ్యారు. అయితే ఈనాడు అదే అన్యులైన మన పితరులు - మనము, కుమారుడైన దేవునిపై విశ్వాసముంచి, ఆయన పేరు పెట్టబడిన జనాంగముగా నేడు ఆయన పేర మందిరాలు కట్టి ఆత్మతో సత్యముతో వివేకముతో క్రైస్తవ చట్టముతో ఆరాధిస్తున్నాము. ఇందుకు కారణము యేసుక్రీస్తుయొక్క ఆత్మ ఆయన వాగ్దానము చేసిన పరిశుద్ధాత్మ దేవుడును ఏకమై సృష్టికర్త యొక్క నామమును ఘనపరచుచు, యావద్ ప్రపంచములో దైవరాజ్యమును విస్తరింపజేసి, క్రియ జరిగించుటనుబట్టి, ఈనాడు ప్రపంచమంతటను ప్రధమ స్థానమును క్రీస్తుయొక్క మార్గము పొందియున్నది.
ఈ విధముగా ప్రియపాఠకులారా! దైవత్వమన్నది త్రిత్వాన్ని ధరించి లోకసంచారము చేయుచున్న దనుటకు ఋజువు నూతనముగా బాప్తిస్మము పొందే విశ్వాసినుద్దేశించి, బాప్తిస్మము ఇచ్చే దైవజనుడు పలికే మూడు మాటలు - తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్ధాత్మ యొక్క నామములో మీకు బాప్తిస్మమిచ్చుచున్నాను,'' అనుటలో ఈ ముగ్గురును ఒక విశ్వాసియొక్క జీవితములో నిత్యమును సంచరిస్తూ వానిని దైవజనునిగ నిర్ధారిస్థున్నట్లుగా ఈ క్రియ బయల్పరచుచున్నది.
చిత్రమేమిటంటే ప్రియపాఠకులారా! పాతనిబంధన కాలములో యెహోవా అను పేరుతో ఆత్మ ఒక్కటే లోకములో సంచారము చేసినట్లు పాతనిబంధన చరిత్ర వివరిస్తున్నది. యోహాను 10:30 నేనును తండ్రియు ఏకమైయున్నాము.'' యోహాను 14:7-11 మీరు నన్ను ఎరిగియుంటే నా తండ్రిని ఎరిగియుందురు. ఫిలిప్పు! నేనింతకాలము మీ యొద్ద ఉండినను నీవు నన్ను ఎరుగవా? నన్ను చూచినవాడు తండ్రిని చూచియున్నాడు. తండ్రి నాయందు నివసించుచు తన క్రియలు చేయుచున్నాడు,'' అని వ్రాయబడిన ప్రకారము ప్రియపాఠకులారా! నూతన నిబంధన కాలములో తండ్రి కుమారులు లోకసంచారము చేసినట్లు తెలుస్తున్నది. అయితే అపొస్తలుల కాలములో మత్తయి 28:18-20 అపొస్తలులకు త్రిత్వములో ఉండి, దేవుడు అనుగ్రహించినట్లు ఆయన ఆజ్ఞను బట్టి ప్రతి క్రైస్తవ విశ్వాసియొక్క జీవితములో - ఆయన త్రిత్వముతో తోడైయున్నట్లు ప్రతి క్రైస్తవ మందిరమును ఆయన త్రిత్వముతో పరిశోధిస్తున్నట్లును, యావద్ ప్రపంచములోని జనుల మధ్య త్రిత్వములోనే ఆయన సంచరిస్తున్నాడు. ఈ సంచారము దృశ్యముగా కాక అదృశ్యములో ఆత్మ సంబంధముగా ఉండి, ఆత్మ రూపాంతరము పొంది, వాక్య రూపములో అనగా త్రిత్వము వాక్యరూపము ధరించింది. యోహాను 1:1 ఆదియందు వాక్యముండెను. వాక్యము దేవుని యొద్ద ఉండెను. వాక్యము దేవుడై యుండెను. పై వాక్య ప్రవచనాన్నిబట్టి ఈనాడు పరిశుద్ధ గ్రంథ రూపములో వేదవాక్యముగా దైవ త్రిత్వములో దేవుడైయున్న ఈ వాక్యము లోకమందంతట సంచారము చేస్తూ - అనేకులైన బోధకులను ఈ వాక్యము ఉజ్జీవపరచి, వారికి తర్ఫీదునిచ్చి, వారిని సిద్ధపరచి, వారిని తన మార్గములో త్రిప్పుచు, అనేకులకు దైవరాజ్యమును గూర్చిన మర్మాలను ప్రకటింపజేస్తున్నది. ఇది దేవునియొక్క ఆత్మ త్రిత్వము ధరించి సంచారము చేస్తున్నది. ఇది నరుని బుద్ధికి వాని ఊహకు అందనట్టి అతీతమైన విషయము.
ప్రియపాఠకులారా! ఆ దినాలలో ఈ దైవ త్రిత్వాన్ని గాడిద మోసింది. ఎలాగంటే కన్యకయైన మరియ గర్భవతియైనప్పుడు, కన్యకయైన మరియ దేవుని జనాంగమైన ఇశ్రాయేలు సంతతియైనందున ఆమెను ఆవరించిన పరిశుద్ధాత్మ శక్తిని ఆమె గర్భములో ఉన్న శిశువును అనగా దైవ రూపాన్ని ముగ్గురుని గాడిద మోసింది. ఈ సందర్భములో లూకా 2:1-5లో ఇందునుగూర్చి వ్రాయబడిన సంఘటనలో ''యోసేపు దావీదు గోత్రములోను, వంశములోను పుట్టినవాడు గనుక, తనకు భార్యగా ప్రధానము చేయబడిన మరియతో కూడా మొదటి ప్రజాసంఖ్యలో వ్రాయబడుటకు గలిలయలోని నజరేతు నుండి, యూదయాలోని బేత్లెహేము అనబడిన దావీదు ఊరికి వెళ్ళెను. ఈ విధముగా ప్రయాణించు ఆ సమయములో వారి ప్రయాణానికి సాధనం గాడిద. ఆ విధముగా త్రిత్వములో ఉన్నటువంటి త్రిత్వమును మోయుచున్న మరియను గాడిద మోసి, యోసేపు యొక్క పౌరసత్వాన్ని కన్యకయైన మరియమ్మ యొక్క గర్భము విషయములో ప్రజాసంఖ్యలో వ్రాయబడుటకు ఈ గాడిద ఒక వాహనముగా వాడబడింది.
ప్రియపాఠకులారా! ఈనాడు అదే దైవశక్తి త్రిత్వములో దేశదేశాలు పయనిస్తూ అనగా సంచార ప్రణాళికలో దైవరాజ్య సువార్తను సైకిళ్ళు స్కూటర్లు మోటార్ సైకిళ్లు ఆటోలు కార్లు వ్యాన్లు బస్సులు విమానాలు ఓడలు వగైరా సాధనాల ద్వారా మోయబడి, యావద్ లోకములో సంచరిస్తూ దైవరాజ్య వ్యాప్తి కొరకు సువార్త రూపముగాను, ఉజ్జీవ సభలు రూపముగాను, స్వస్థత సభల రూపముగాను, సువార్త సభల రూపముగాను క్రియ జరిగిస్తు అనేకులైన నరుల హృదయాలను ఆకర్షిస్తూ - లోకానికి అంకితమై దైవత్వానికి దూరమై, ఆత్మీయత శూన్యమై, సత్యము నెరుగని స్థితిలో జీవిస్తున్న అనేకులను, తన పేరు పెట్టబడిన జనాంగముగా తన రాజ్య నివాసులుగ చేస్తూ - ఈ దైవాత్మ త్రిత్వములో దైవాత్మ సంచారముయొక్క ప్రణాళికయైయున్నది.
కనుక ప్రియపాఠకులారా! ఇప్పుడు మనమున్నట్టి మనము జీవిస్తున్న దినములు దైవకుమారుడైన ప్రభువు మహిమతో తిరిగి వచ్చు దినములు. నేటి విశ్వాసులమైన మనము ఆయనతో కూడా వెయ్యేండ్ల పరిపాలనలో జీవించుటకు యోగ్యత కల్గిన విధముగా ఉండుటకు ఆయుత్తము పొందవలసినవారమైయుండి, ఆయన రాకడ కొరకు కనిపెట్టుచు మన ఆత్మీయ జీవితాన్ని కాపాడుకొంటూ - మన విశ్వాస జీవితాన్ని స్థిరపరచుకొంటూ నిరీక్షణ కల్గిన స్థితిలో జీవించాల్సిన దినములివి. ఇట్టి నిరీక్షణ స్థితిలో ఉన్న మనకు భద్రత, సహాయము, సిద్ధపాటు అనుగ్రహించువాడు ఈ త్రియైక ఆత్మయే; కనుక ఈ ఆత్మ ఎక్కడో లేడు. ఆయనను విశ్వసించిన మనలోను, ఆయననుగూర్చి ధ్యానించే మనయొక్క వేదములోను, మన కుటుంబములోను, మన విశ్వాస జీవితములోను, నిరంతరము దేవునియొక్క ఆత్మ సంచారము చేస్తూ నివసిస్తున్నాడన్న నగ్నసత్యాన్ని గ్రహించాలి. ఇది ఆత్మ సంచారము.
ప్రియపాఠకులారా! ఆత్మ సంచారమును గూర్చి తెలిసికొనియున్నాము. ఈ ఆత్మ సంచారమన్నది నరునిలోని జీవాత్మగాక, నరునికి నివాసమైన భూమికిని జీవమును, జీవాత్మను మనుగడను, ఇచ్చిన పరమాత్మయొక్క సంచార వివరాన్ని గూర్చి తెలిసికొనియున్నాము. ఇప్పుడు ప్రాణాయామమన్నది - ఇది దైవజ్ఞానముతోను, దైవశక్తితోను పరమాత్మునియందు జీవించే జీవాత్మయొక్క క్రియయైయున్నది. ఇందునుగూర్చి వేదరీత్యా మనము కొన్ని ఉదాహరణలు తీసికొందము. ఈ ప్రాణాయానములో మొట్టమొదటగా జీవమును - జీవాత్మ తనలోని జీవాత్మను తన స్వాధీనమందుంచుకొని, లోకసంబంధముగా కాక శారీర స్థితిలోగాక, ఆత్మీయ స్థితిలో పరమాత్మునికి యోగ్యకరమైన జీవితాన్ని జీవించి, తన పంచేంద్రియాలను తన స్వాధీనమందుంచుకొని, వాటిని పరమాత్మునియొక్క చిత్తానుసారముగా వాడి మూడు వందల ఏండ్లు పరమాత్మునితో నడచుచు అనగా పరమాత్మునియొక్క క్రమములో ఆయన మార్గములో జీవిస్తూ - శారీర సంబంధముగా దేహ వాంఛలలో తగుల్కొని అనగా సాంసారిక బంధాలలో ఉంటూ శారీరేచ్ఛలకు లోను గాకుండ సాంసారిక బంధాలలో తగుల్కొనక వాటిని జయించి, కుమారులను కుమార్తెలను కని 365 ఏండ్లు జీవించి, దేవునితో నడిచెను గనుక ఆదిలో హానోకునకు కలిగినట్లు ఆది
5:23-24లో చదువగలము. ఆ విధముగా నడుచుటనుబట్టి అతడు భూమి మీద లోకస్థులకు కనుమరుగైనట్లుగా వేదములో చదువగలము. అలాగే ప్రాణాయానములో అనగా తన జీవాత్మను తన క్రమములో ఉంచుకొంటూ తన శరీరానికేగాక తన కుటుంబాన్ని కూడా పరమాత్ముని యొక్క అడుగుజాడలలో నడిపి పరమాత్ముడు జరిగించిన భయంకరమైన జలప్రవాహ మారణహోమములో నాటి జనాంగములో నీతిమంతునిగ ఎంచబడి, పరమాత్ముని నీతి యొక్క ప్రతీకయై, చీకటి అగాధ జలముల మీద ఓడ గృహములో దైవకాపుదలతో పయనించి, దేవుని రక్షణకు యోగ్యుడై భూలోక పునఃసృష్టికి ఆదియై, దైవసన్నిధిలో ఒక గొప్ప స్థానాన్ని పొందే భాగ్యము నోవహునకు కల్గింది. ఇది ప్రాణాయానము ద్వారా నరుడు సాధించిన రెండవ సంఘటన. ఈ విధముగా ప్రాణమును స్వాధీనమందుంచుకొని, పరమాత్ముని చిత్తానుసారముగా ప్రవర్తించి వేదచరిత్రలో స్థానమును పొందినవారినిగూర్చి వ్రాయాలంటే, పాత నిబంధనలోని ప్రవక్తలు, యాజకులు, న్యాయాధిపతులు, వగైరాలందరును ఇట్టి ప్రాణాయాన జీవితములో జీవించినవారే; అనగా జీవమును క్రమములో ఉంచుకొని పరమాత్మ చిత్తానుసారముగా జీవించినవారే.
ఇక నూతన నిబంధనలో పరమాత్ముడు నరాకృతిలో అవతరించి, ఈ ప్రాణాయానమును గూర్చి తన శిష్యకోటికి ప్రత్యక్షముగా క్రియామూలముగా బయల్పరచియున్నాడు. ఉదాహరణగా చనిపోయినవారిని బ్రతికించుట, రోగులను స్వస్థపరచుట, పాపులను పరిశుద్ధులుగా చేయుట, అజ్ఞానులను జ్ఞానవంతులుగ చేయుట వగైరాలు. అలాగే పరమాత్ముడు యేసుక్రీస్తు అను పేర తన గురుత్వములో ఏర్పరచుకొన్న 12 మంది శిష్యులు కూడా ఈ ప్రాణాయాన జీవితమును జీవించారు. అలాగే లోకాంత్యము ప్రభువు రాకడ సమీపమైయున్న ఈ దినాలలో ఇటువంటివారు కొద్దిమందియని చెప్పవచ్చును. ప్రాణాయానమన్నది సామాన్య నరుని వలన జరిగే క్రియ కాదు. దీనికి ఒక ప్రత్యేకమైన శక్తి, తోడ్పాటు అవసరము. ఈ తోడ్పాటు కలగాలంటే దీనికి ఆత్మ సంబంధ ప్రక్రియ అవసరము. అట్టి ప్రాణాయానమన్న దాన్ని పాతనిబంధనలో ప్రత్యక్షముగా పరమాత్మునియొక్క శక్తితో జరిగించినవారు యోనా - యోనా విషయములో జరిగించిన ప్రాణాయానమన్నది నేటి ఆధునిక యుగములో ఉన్న మనకిది సాధ్యమేనా? అన్న సంశయము కల్గిస్తుంది. దివారాత్రాలు యోనా చేప గర్భములో నిరాహారుడై వాసన కూడా పీల్చే అవకాశము లేని స్థితిలో జీవించి, తాను ఏ మత్స్య గర్భములో ఉన్నాడో అదే మత్స్య గర్భములో పరమాత్ముని యొక్క శక్తితో కడలి తీరమున క్రక్కి వేయుటన్నది నిజానికి ఆశ్చర్యకరమైన విషయమే. నరుల ఊహకది అంతుపట్టని విషయము. సింహాల బోనులో దానియేలు ఆకలితో అలమటించే సింహాల మధ్య సహజీవనము సాగించాడంటే ఇది ప్రాణాయామ ప్రభావము. ప్రాణాయామమునకు పరమాత్ముని శక్తి అనుకూలించకపోతే అది అసాధ్యము.
ప్రాణత్యాగమనగా ఉదాహరణ - అనేకులైన విశ్వాసులయొక్క ప్రాణత్యాగము వలననే క్రైస్తవ సంఘము కట్టబడింది.
:- నశించిన ఇశ్రాయేలును గూర్చి :-
పఠనము యెషయా 43:1-6 మూలవాక్యము మత్తయి 10:5లో -
అన్య జనుల దారి, సమరయుల పట్టణములలో ప్రవేశము నిషేధము - ఇశ్రాయేలు వంశములో నశించిన గొర్రెల యొద్ద కూడుట'', అనుటలో
అన్యులెవరు? వారి దారి ఏది? సమరయులెవరు? వారి పట్టణములేవి? ఇశ్రాయేలు ఎవరు? వారి వంశములలో నశించిన గొర్రెలెవరో? మనము గుర్తింపవలసియున్నది.
మొదటిది అన్యుల దారి - యిర్మీయా 10:10-17
లూకా 12-29-30, రోమా 1:21-23, 5-9-10.
పరిత్యాగము :- యెషయ 50:1 మీ అతిక్రమములను బట్టి మీ తల్లి పరిత్యాగము చేయబడెను''.
ప్రియపాఠకులారా! ఆదిలో సృష్టికర్తయైన దేవుడు - నిరాకారముగా శూన్యముగా జలరాశులలో దుర్గంధపూరిత వాతావరణములో ఉన్నట్టి భూమిని వెలికి తీసి, దానిని తన యొక్క శక్తి, వెలుగు శక్తి, వాక్శక్తి ప్రభావముతో నానావిధ సృష్టములతో అలంకరించి తన దానినిగ అనగా దేవుడు లోకమునెంతో ప్రేమించెను యోహాను 3:16 అన్న ప్రవచనాన్నిబట్టి భూలోకము మీద దేవునియొక్క ప్రేమ మితిమీరి యుండి, దాని మీదనున్న ప్రేమనుబట్టి, తన పర్యవేక్షణ తన అజమాయిషీలోనేగాక, తనకు తర్వాత తనకు ప్రతినిధిగా ఈ భూలోకముయొక్క బాగోగులను పరామర్శించుటకు దేవుడు తన రూపము, తన పోలిక, తన జీవాత్మతో నరుని రూపించి వానిని తన ప్రతినిధిగ తోట మధ్యలో ఉంచి, నాటి ప్రకృతి సౌందర్యమునకు పరమాత్ముడు ముగ్దుడై తాను చేసిన సృష్టి సంపూర్ణముగా విజయవంతమగుటనుబట్టి దేవుడు ఎంతో సంతోషించాడు. దేవునియొక్క ''వాక్కు- భూమి, రెండును ఒకదానితోనొకటి కలయికనుబట్టి భూలోకము నుండి సకల జీవులు జన్మించాయి. ఇందునుబట్టి దేవునికిని భూమికిని పుట్టిన జీవులే యావద్ జీవకోటి. అయితే నరుడు భూమికిని దేవునికిని పుట్టినవాడు కాదు. దేవుడు ప్రత్యేకించి దేవుని యొక్క ఆత్మకును ఆయన వాక్కునకును జన్మించినవాడు. అనగా దేవునియొక్క రూపము వాక్కును ''ఆత్మయు వాయువునైయున్నది. ఆ రెంటియొక్క రూపమే దేవుడు నిర్మించిన మంటి రూపమే - నమూనాయైయున్నది. ఈ విధముగా ఆత్మ వాయువు భూమి సంగమము ద్వారా రూపించబడినవాడు గనుక నరునికి తండ్రులు ఇద్దరు. తల్లి ఒక్కటే, అనగా ప్రధాన శక్తులు రెండును తండ్రులు - జీవము వాయువు, మట్టి నుండి రూపము ఇచ్చిన భూమి తల్లియైయున్నది. ఈ విధముగా త్రివిధ సంగమముల ద్వారా సంభవించిన నరదేహము దేవుని యొక్క రూపకల్పనగా నిర్ధారించబడింది.
ప్రియపాఠకులారా! ఈ విధముగా దేవుడు భూమితో నరులతో కలసి నాటి పరిశుద్ధ వనమైన ఏదెనులో జీవించాడు. ఇందునుబట్టి భూలోకము తల్లి - సృష్టికర్త తండ్రిగా ఉండి నరుడు నారి ఇరువురును ఆయన బిడ్డలుగ తీర్చబడి సృష్టిలో ఒక కుటుంబముగ జీవించినట్లుగ నిరూపించబడుచున్నది. ఇది పాత నిబంధనలోని మొట్టమొదటి తిరుకుటుంబము - ఈ కుటుంబములోని బిడ్డల యొక్క దోషాపరాధములను బట్టి కుటుంబముయొక్క పరిస్థితి చిన్నాభిన్నమైంది. ఎందుకనగా ఈ మొదటి దైవ కుటుంబములోని దేవుని బిడ్డలకు దేవునియొక్క ప్రియపత్నిగా ఉన్న భూమియే తన ఫలము ద్వారా భక్షణము ద్వారా దేవుని బిడ్డలుగా ఉన్న ఆది నరజంటను తన బిడ్డలుగ ఈ భూమి మార్చేసింది - తన వైపుకు మరల్చుకున్నది. ఇందునుబట్టి కుటుంబ యజమానియైన దేవునికి భార్యాబిడ్డల మీద వైరాగ్యమేర్పడి ఇచ్చిన శాపనార్థాలను గూర్చి ఆదికాండము 3:లో చదువగలము. అనగా పురుషునికి స్త్రీకి భూమికి సర్పానికి ఇచ్చిన శాపము ఈ సందర్భములో మనము చదువగలము.
ఈ విధముగా సృష్టికర్త తన బిడ్డలను శపిస్తూ భూమిని కూడా శాపగ్రస్థముగా చేసినట్లు ఆది 3:17 నీ భార్యమాట విని తినవద్దని నేను నీకు ఆజ్ఞాపించిన వృక్షఫలములు తింటివి గనుక నీ నిమిత్తము నేల శపించబడియున్నది. ప్రయాసముతోనే నీవు బ్రతుకు దినములన్నియు దాని పంట తిందురు. 4:12 నీవు నేలను సేద్యపరచునప్పుడు అది తన సారమును నీకియ్యదు.'' ఈ విధముగా తల్లియైన భూమికిని బిడ్డలైన నరులకు శాపమిచ్చాడు. ఈ విధముగా శాపగ్రస్థులైన తర్వాత దేవుడు బిడ్డలను ఏదెను నుండి భూమి మీదకు తరిమివేశాడు. భూమియే నరులకు పోషణ భారము వహించింది. నరులు భూసంబంధులనియే యేసుప్రభువు యోహాను 8:23-24లోయూదులతో పల్కిన మాటలు ''మీరు క్రిందివారు ఈ లోకసంబంధులు - నేను పైనుండువాడను, ఈ లోకసంబంధుడను కాను, దేవుడు తన భార్యయైన ఈ లోకమును శపించి వదలివేశాడు. ఆయన తానున్న యధాస్థానములో ఉన్నాడు. ఏదెను అను దేవుని దివ్యవనము పరదైసుగా రూపాంతరము చెంది, నోవహు జలప్రళయ కాలములో మధ్యాకాశమునకు వెళ్ళింది. అందులో దేవుడు తనను నమ్మిన బిడ్డలకు దేహము విడిచిన తర్వాత అందులో తాత్కాలిక ఆశ్రయము కల్పించినట్లు లూకా 23:43లో చదువగలము. అలాగే విడువబడి పరిత్యాగము చేయబడిన ఈ భూమి - దేవుడు విడిచిన బిడ్డలలో శారీర లైంగిక క్రియలకు ప్రేరేపించి, తద్వారా విశేషమైన జనాభాను వావివరుసలు నిష్టానియమాలు లేనివారై, దైవత్వానికి ఎదురు తిరిగి విస్తరించిన జనాభాతో భూమి నింపింది. అనగా దైవభక్తి లేని జనాభా భూమి మీద విస్తరించారు.
ప్రియపాఠకులారా! ఇప్పుడు దేవుడు తాను ఏ భూమినైతే ఎక్కువగా ప్రేమించాడో యోహాను 3:16 ఏ నరులకైతే తాను జీవమును ఆత్మను ఉంచి, తన ఆత్మీయులుగాను, తన ప్రతిరూపములుగాను జేసి, తన మహిమార్థము వారిని నిలిపినాడో వారు కూడా పితృ ద్రోహులైన కారణాన దేవుడు లోకమును, నరులను, తన సన్నిధిలో తన సముఖములో నుండి సృష్టియు నరులు పరిత్యాగము చేయబడినారు. ఈ విధముగా వదలి వేయబడిన జనాంగమును గూర్చి దేవుడు విచారించి, ఈ అశేష జనాంగములో తనను వెదికేవాడెవడైనను కలడా? అని పరిశోధించి, అట్టి వాని కుటుంబమును తన పునఃసృష్టి నిర్మాణమునకు మూలకర్తగా ఉంచుకున్నాడు. ఇందునుబట్టి లోకమును, పరిత్యాగము చేయబడినను లోకము మీదను లోకస్థుల మీద ఉన్న ప్రేమ దేవుని విడనాడలేదు. అందువల్ల దేవుడు మరొక అవకాశము నరులకును భూమికిని ఇస్తూ - ఆదికాండము 7:లో జలప్రళయ మారణహోమము జరిగించక పూర్వము నోవహు అను వ్యక్తిని దైవవిశ్వాసిగా నీతిమంతునిగ తన ఎన్నికలో చేసి, అతనిని - అతని కుటుంబాన్ని నీతిమంతుల గృహముగా ఏర్పరచుకొని, వారి ద్వారా తన ప్రణాళిక, తన చిత్తము తన నమూనా తన సాంకేతిక జ్ఞానముతో ఓడ నిర్మాణము గావించాడు.
ప్రియపాఠకులారా! ఈ విధముగా దేవుడు తాను చేసిన లోకసృష్టిని పరిత్యాగము చేసి, ఆ సృష్టిలోని తొలి నరజంటను విడనాడి మరియొక సృష్టిని మరియొక జనాభాను సృష్టించుటకు ప్రణాళికను సిద్ధపరచుకొని, నలుబది దివారాత్రులు ప్రచండమైన వర్షపాతముతో లోకాన్ని ముంచెత్తి నిశ్శేషముగా యావద్ సృష్టిని లయపరచాడు. ఈ విధముగా సమస్త సృష్టి సంపూర్ణముగా పరిత్యాగము చేయబడి లయమైనను దేవుడు తన మొదటి సృష్టిలోని సృష్టములను, ప్రాణులను, నరులలో ఒక కుటుంబాన్ని విడనాడలేదు. అయితే మొదటి సృష్టిని విడనాడినాడు. అందుకు దాఖలాలు - ఆ జలప్రళయ మారణ హోమములో నశించిన ప్రాణులే. అయితే జలప్రళయానంతరము ఓడలో శేషించిన ప్రాణుల ద్వారాను, నరునియొక్క కుటుంబము ద్వారా పునఃసృష్టి అనగా నూతన భూమిని నిర్మించాడు. ఈ భూమియైనను తనను గుర్తిస్తుందా? స్తుతిస్తుందా? మహిమపరుస్తుందా? అని బహు ఆశతో నిరీక్షించాడు. అయితే ఈ సృష్టి కూడా దేవుని యొక్క మహిమకు నోచుకోలేక కలుషితమైన వాతావరణములో ప్రవేశించడమైనది.
ఈ విధముగా పునఃసృష్టి కార్యక్రమాన్ని బట్టి భూమికి ఒక తరుణాన్ని ఇచ్చి, తాను పరిత్యాగము చేసిన సృష్టిని పునఃనిర్మాణము గావించాడు. ఈ విధముగా సృష్టముల శేషముతో అలంకరించబడి ఫలించి అభివృద్ధి చెంది విస్తరించిన పునఃసృష్టియైన ఈ లోకము దైవత్వాన్ని మహిమపరచవలసిన ధర్మముండగా దీనిని విస్తరించిన భూమి - పూర్వము ఆదిలో నరజంటను భూమి తన ఫలము ద్వారా ద్రోహులుగా జేసి, దైవత్వము నుండి వారిని విడగొట్టిన విధముగానే, ఈ పునఃసృష్టి నిర్మాణ కార్యములో కూడా ఆదికాండము 19:లో వ్రాయబడిన లేఖన భాగములో సొదొమ గొమొఱ్ఱా పట్టణాలను ఈ భూమి కామాంధకారములో కనుమబ్బు గల్గించి, వావి వరుస సమయము, సందర్భము, నీతి, అవినీతి, మంచిచెడు, న్యాయాన్యాయాలు వగైరా గుణాతిశయ నియమములను విస్మరించి, కామాంధులై దేవదూతల పట్లను, లోతు పట్లను జరిగించిన అతి నీచకార్యాలను బట్టి దేవుడు లోతు కుటుంబమును తన దూతల చేత చెయ్యి పట్టించి, అతని కుటుంబమును మాత్రము తన రక్షణ వలయములోనికి చేర్చుకొని, లోతును అతని కుటుంబాన్ని, దేవుడు పంపిన దేవదూతలను అవమానించిన నేరమునకు మరొకసారి లోకాన్ని జలములతోగాక అగ్నిగంధకములతో కూడిన వర్షముతో వర్షింపజేసి, భూమికి తనయొక్క ప్రభావమును, తన శక్తిని నిరూపించాడు. తత్ఫలితము సొదొమ గొమొఱ్ఱా పట్టణాలు అగ్ని వర్షమునకు గురియై మాడి మసియైనవి. దీని ఫలితము భూమి మీద అగ్ని పొగ అలముకొనింది. అటుతర్వాత దేవుడు భూమితోగాక నరులతో సంబంధాలు కల్పించుకొని, తనకంటూ ఒక ప్రత్యేకమైన జనాభాను ఏర్పరచుకొని, ఆదికాండము ఒకటి రెండు అధ్యాయాలలో నరజంటతో నివసించిన దేవుడు అటుతర్వాత జలప్రళయ వినాశములో నీతిమంతుడైన నోవహు అను విశ్వాసియొక్క ఎనిమిదిమంది కుటుంబ సభ్యులతో జీవించిన దేవుడు, అటుతర్వాత లోతు - లోతు కుమార్తెలతోను, అబ్రాహాము - అబ్రాహాము భార్యతోను, వారి సంతానాలతో ప్రామాణికముగా తన సృష్టి కార్యక్రమములను గూర్చి దేవుడు తన భూలోక పరిపాలన ప్రణాళికలో నరులను నడుచుకొను విధానాలను గూర్చి వారికి బోధిస్తూ - వారి సంతానములలో నుండి 12 మంది సంతానాలను, 12 గోత్రాలుగ విభజించి, ఆ 12 గోత్రాల ద్వారా తాను మహిమ పరచబడాలని వారిని తనకంటూ ప్రత్యేకించబడిన ఇశ్రాయేలు అను దైవజనాంగముగా ఒక ప్రత్యేకమైన జనాభాను సృష్టించాడు.
ఈ జనాభా కూడా కొన్ని సందర్భాలలో దేవుని మీద తిరుగుబాటు జేసినప్పుడు, వారిని ఐగుప్తు చెరకు అప్పగించి విడనాడినట్లును, అటుతర్వాత వారు తమ తప్పిదాలను తెలిసికొని దేవునికి విజ్ఞాపన జేసి మొరపెట్టుకొనగా వారి మొర విన్న దేవుడు వారిపట్ల కనికరించి, వారికి దేవుడు నరహంతకుడును, నత్తివాడైన మోషేను నాయకునిగ దేవుడేర్పరచి, అతని ద్వారా మహిమ పరచబడాలనుకున్నాడు. అయినను ఆరు లక్షల జనాభాకు నాయకత్వము వహించిన దైవ ప్రతినిధి ప్రవక్తయైన మోషేపై ఆ జనాంగము సణుగుచు తిరుగుబాటు చేయగా దేవుడు వారిని శిక్షించుచు, తన క్రమములో ఉంచుకొని మోషేయొక్క ఆజ్ఞకు జవదాటక మోషే నడిచే మార్గాలను వ్యతిరేకించక, మోషే ఏ మార్గములో నడుచుచున్నాడో ఆ మార్గములో నడచుచు, దేవుడు తానే తండ్రిగాను, పోషకుడుగాను, దాతగాను, మార్గముగాను, వెలుగుగాను ఉంటూ మోషేను నమ్మకస్థుడైన నాయకునిగ నిర్వాహకునిగ ప్రధాన ప్రవక్తగ యాజక ధర్మ విషయములో మోషే అన్నయైన అహరోనును ప్రధాన యాజకునిగ వాడి తద్వారా ఇశ్రాయేలుయొక్క స్తుతి స్తోత్రాలు - వారు అర్పించే బలులు, అర్పణలు, వారు కట్టే బలిపీఠాలు మీద, వారియొక్క కార్యాల మీద ఆయన లక్ష్యముంచి, తనను మహిమపరచుకోవాలని ఆశపడినాడు. అయినను దేవుని మహిమలో ఇశ్రాయేలు నిలవలేకపోయారు. ఇశ్రాయేలునుబట్టి యెరూషలేమును కూడా విడనాడినాడు. గలతీ 4:25-26 అందుకే అంటున్నాడు. 50:1 నేను మీ తల్లిని విడనాడిన పరిత్యాగ పత్రిక ఎక్కడనున్నది? నా అప్పులవారిలో ఎవరికి మిమ్మును అమ్మివేసితిని,'' అని అంటున్నాడు. ఇందునుబట్టి దైవజనాంగమైన ఇశ్రాయేలు - ఆ ఇశ్రాయేలుయొక్క నివాస భూమియైన యెరూషలేము రెండును పరిత్యాగము చేయబడినట్లుగ మనకు తెలుస్తున్నది.
ఈ సందర్భములో యెషయా 1:2-8లో వ్రాయబడిన వ్యాఖ్యానము ప్రియపాఠకులారా! ఇందులో తన జనాంగమైన ఇశ్రాయేలునుగూర్చి వారి పట్టణమైన సీయోను కుమార్తెను దేవుడు సంతాపముతో మాట్లాడుచు - భూమ్యాకాశాలను సాక్షులుగా జేసి ఇశ్రాయేలును గూర్చి పల్కిన మాట ఆకాశమా! ఆలకించుము, భూమి చెవి యొగ్గుము - ఇవి దైవసన్నిధిలో సాక్ష్యార్ధముగా నిలబడిన విధానము. నేను పిల్లలను పెంచి గొప్పవారినిగా చేసితిని - వారు నా మీద తిరుగబడియున్నారు,'' అనుటలో వేదరీత్యా ఇశ్రాయేలుకున్న గొప్పదనము, వారికున్న తెలివితేటలు, వారికున్న దేహబలము, వారికున్న పరాక్రమ సాహసాలు, వారి ఎత్తు అందచందాలు, దేవుని దూతలను పోలిన వారి దేహవర్చస్సు, ఇశ్రాయేలుయొక్క ఘనతకు మూలమైయున్నాయి. ఇట్టి ఆధిక్యతలో సృష్టించిన దేవుని జనమైన ఇశ్రాయేలు వారి తండ్రియైన దేవుని మీదకే తిరుగుబాటు చేసినట్లుగా యెషయా 1:2లో వివరించబడియున్నది. ఇక 1:3లో ఇశ్రాయేలు యొక్క శారీర ఆత్మీయ బలహీనతలను గూర్చియు వారి జ్ఞానమును ఎద్దు గాడిదలకు పోల్చుచున్నాడు. ''ఎద్దు తన కామందు నెరుగును గాడిద తన సొంతవాని దొడ్డి తెలిసికొనును, తన జనాంగమైన ఇశ్రాయేలు వారికి తెలివిలేదని, వారు యోచింపరని, వారికి ఆలోచనాశక్తి జ్ఞానము లేదని, ఇంకను పాపిష్టి జనమని, దోషభరితమైన ప్రజలని, దుష్ట సంతానమని, చెరుపు చేయు జనాంగమని, ఇందువల్ల వారికి శ్రమయని -ఎందుకంటే వారు యెహోవాను విసర్జించియున్నారు. అంతేగాకుండ ఇశ్రాయేలుయొక్క పరిశుద్ధ దేవుని దూషింతురని, ఆయనను విడిచి తొలిగిపోయియున్నారని, దేవుడు పొందే సంతాపములోని ముఖ్యఘట్టములై యున్నవి. ఇక ఇట్టి విధమైన మానసిక స్థితిలోను, ఆత్మీయ స్థితిలోను ఉన్న జనాంగమునకు విధించబడిన శిక్షలు కూడా 1:5-6లో చదువుకొందము. వీరు నిత్యము తిరుగుబాటు చేయుచు దేవుని చేత కొట్టబడు చున్నారు. ప్రతివాడు నడినెత్తిన వ్యాధి కల్గియున్నాడు, ప్రతివాని గుండె బలహీనమయ్యెను. అరికాలు మొదలుకొని తల వరకు స్వస్థత కొంచెమైనను లేదు. ఎక్కడ చూచినను గాయములు, దెబ్బలు, పచ్చిపుండ్లు అవి పిండబడలేదు. తైలముతో మెత్తన చేయబడలేదు,'' అని వ్రాయబడియున్నది. అనగా ఇశ్రాయేలు యొక్క దోషపూరితమైన ప్రవర్తననుబట్టి దేవునిపై వారు చేసిన తిరుగుబాటునుబట్టి, మోషేపై దేవుని చేత తమకు యాజకునిగ చేయబడిన మోషేపై తిరుగుబాటు సణుగుకొనుట, ధిక్కరించుటనుబట్టి మోషే మాటను విననందువలన వారికి సంభవించిన అరిష్టములే 1:5-6 వేదభాగములోని వివరణ.
ప్రియపాఠకులారా! ఇశ్రాయేలుయొక్క గుణము తిరుగుబాటు చేయువారని ఇందునుబట్టి మనకు తెలుస్తున్నది. అంటే పాపభూయిష్ట జనమని, దోషభరిత సంతానమని, చెరుపు చేయువారని దీని భావము. ఈ విధముగా వారు దేవుని ప్రవక్తయైన మోషేను, యాజకుడైన అహరోను పట్లను ప్రవర్తించారు. అంతేగాక తమ దేవుడైన యెహోవాను దూషించి, ఆయననుండి తొలగిపోయి, అన్య దేవతలను తమకు దేవుళ్ళుగా చేసికొని అన్య మార్గమును అనుసరించారు. అందువల్ల వారికి దేహ సంబంధమైన అరిష్టాలు, ఆపదలు, చర్మ సంబంధమైన రోగాలు, గడ్డలు, పుండ్లు, వగైరా జాడ్యాలు సంభవించాయి. అంతేగాకుండ మోషే మీద తిరగబడిన జనాంగము మీదకు దేవుడు తాపకరమైన సర్పాలను పంపించినట్లుగ కూడా సంఖ్యా 21:6లో వాటి బారినపడి అనేకులు చచ్చినట్లు వేదములో చదువగలము. ఈ విధముగా తన జనాంగమైన ఇశ్రాయేలును దేవుడు విడనాడినాడు.
అలాగే యెషయా 1:7-8లో మీ దేశము పాడైపోయెను, మీ పట్టణములు అగ్ని చేత కాలిపోయెను. మీ ఎదుటనే అన్యులు మీ భూమిని తినివేయుచున్నారు. అన్యులకు తటస్థించు నాశనము వలె అది పాడై పోయెను. ద్రాక్ష తోటలోని గుడిసెవలెను, దోసపాదులలోని పాకవలెను, ముట్టడి వేయబడిన పట్టణమువలెను సీయోను కుమార్తె విడువబడియున్నది. ఇది పరిత్యాగము.
ప్రియపాఠకులారా! ఇందులో దైవజనాంగమును దేవుడు విడనాడబట్టి వారు ఐగుప్తు ఫరో కొలువులో నానా హింసలు పాలై చెర పెట్టబడి, కొరడాదెబ్బలు బానిస చాకిరి చేస్తూ నికృష్టమైన జీవితము జీవిస్తూ - ఐగుప్తు యొక్క దేవతలయందు లక్ష్యముంచి, ఐగుప్తు మార్గము, ఐగుప్తు చట్టములకును బద్ధులై జీవము గల తమ దేవునియొక్క ప్రభావమునుగూర్చి తెలిసియు కూడా - ఆయనను విసర్జించిన నేరానికి ఇశ్రాయేలీయులయొక్క జీవితము పై విధముగా తయారైంది.
ఈ విధముగా విడనాడబడిన ఇశ్రాయేలీయులను బట్టి దేవుడు ఇశ్రాయేలు పట్టణమైన సీయోనును కూడా పరిత్యాగము చేసినట్లుగా యెషయా 1:8లో వ్రాయబడియున్నది. అనగా ఇశ్రాయేలు యొక్క దైవత్వముపై తిరుగుబాటునకును, వారి అలక్ష్యమునకును, వారి అసమర్థతకును కారణము సీయోను అనగా యెరూషలేము. ఎలాగంటే సీయోను అన్నది దేవునియొక్క మహిమను పొంది, దేవునికి విధేయించక దేవుడు సీయోను కిచ్చిన ఆధిక్యతలనుబట్టి సీయోను గర్వించి, తన జనాంగములో కూడా ఈ గర్వమన్నదానికి కారణమైనది. ఎలాగంటే యెషయా 3:16లో ఈ విధముగా వ్రాయబడియున్నది. ''సీయోను కుమార్తెలు గర్విష్టురాండ్రయి మెడ చాచి నడుచుచు ఓరచూపులు చూచుచు, కులుకుతో నడచుచు, తమ కాళ్ళ గజ్జెలను మ్రోగించుచున్నారు.'' ఇది గర్వమునకును, అహంభావమునకును సూచనయై యున్నది. అనగా మెడ చాచి నడచుటన్నది అహంభావమునకు గుర్తు. ఓరచూపు చూచుటన్నది కామాతురతతో కూడిన క్రియ. కులుకుటన్నది పురుష ఆకర్షణ అనగా ఎదుటివారిని ఆకర్షించి, వారి ఆత్మీయ జీవితమును పాడు జేసే ప్రవర్తన మరియు తమయొక్క అహంభావము. తమ అందచందాలు, లావణ్యాలు ఇతరులకు కనబరచాలని తమ కాలిగజ్జెలను మ్రోగించుట, ఇది ఇతరులకు తమ ఘనతను ప్రకటించుకొను క్రియయైయున్నది. ఈ విధముగా గర్విష్టురాలైన సీయోను, దాని కుమార్తెలకు దేవుడు విధించే శిక్ష మొట్టమొదటగా ఏమిటంటే యెషయా 1:8లో సీయోను యొక్క స్థితి - ద్రాక్ష తోటలోని గుడిసెవలెను, దోసపాదులలోని పాకవలెను, ముట్టడి చేయబడిన పట్టణమువలెను సీయోను కుమార్తె విడువబడియున్నది. అనగా పరిత్యాగము చేయబడియున్నది. దీని గర్వము చేత సీయోనుయొక్క యవ్వనస్థురాండ్రకు దేవుడు ఇచ్చే శిక్ష యెషయా 3:17-26 కాబట్టి ప్రభువు సీయోను కుమార్తెల నడినెత్తి బోడి చేయును; తల క్షవరము అనగా వారిని ఆత్మీయ అంధకార జీవితములో ఆత్మ జ్ఞానమును పూర్తిగా కోల్పోయినవారగునట్లుగా వారిని చేయునని ఇందులోని భావము.
''మానమును బయలు పరచును,'' అనుటలో దైవత్వములో దైవసావాసములో గుట్టుగా బ్రతుకవలసిన వారి జీవితాలను పదిమంది ఎదుట అవమానకరముగా వారిని గూర్చి అసహ్యకరమైనటువంటి జీవితాన్ని బయలుపరచును. ఘల్లు ఘల్లుమను వారి పాద భూషణములు సూర్యబింబ చంద్రబింబ భూషణములు, చెవి భూషణములు, కడియములు, నాణెమైన ముసుకులను, కుల్లాయిలు, కాళ్ళగొలుసులు ఒడ్డాణములను, పరిమళ ద్రవ్వపు బరిణెలను, ఉత్సవ వస్త్రములను, ఉత్తరీయములను, పైటలను, వగైరా వారియొక్క అలంకారములనన్నిటిని తొలగించి, వారిని విడువబడిన సంతానముగా చేస్తూ 3:24-27 వేదభాగములో వారి పరిమళ ద్రవ్యమునకు ప్రతిగా మురుగుడును, అనగా కంపుగొట్టు దుర్గంధపూరిత జీవితాలను, నడికట్టుకు ప్రతిగా త్రాడును, అనుటలో వారి యొక్క నడుము ద్వారా వారు చేసిన లైంగిక నడకకు ఉరిత్రాడును, పొడవుగా అల్లిన జడకు ప్రతిగా బోడితలయు, ప్రశస్తమైన పై వస్త్రమునకు ప్రతిగా గోనెపట్టయు - అందమునకు ప్రతిగా వాతయును ఉండును,'' అనుటలో ఖడ్గము చేత మనుష్యులు కూలుదురు, యుద్ధమైన నీ బలాడ్యులు పడుదురు,'' అనుటలో ప్రియపాఠకులారా! సీయోను పట్టణము యొక్క వైభోగము, దానియొక్క అహంకార గర్వాంధకారమును గూర్చిన దాని పతనావస్థను గూర్చి ఈ వేదభాగములో మనము తెలిసికోగలము. నరుల చేత సీయోను కుమారి జరిగించిన క్రియలను బట్టి
3:26లో వలె సీయోను కుమార్తె పట్టణపు గుమ్మములు బాధపడి దుఃఖించును, ఆమె ఏమియు లేనిదై నేల కూర్చుండును,' అనగా విడువబడిన పట్టణముగా, విడువబడిన స్థలముగా మారుతుందని, ఇందులోని బలాఢ్యులుగాని, యుద్ధ వీరులుగాని, సైనికులుగాని, యవ్వనస్థులుగాని అనేకులు హతులై, సీయోను కుమార్తె పురుష సంతానము కోల్పోయి, స్త్రీ సంతానాలతో రోదిస్తుందని ఇందులోని భావము. అందుకే యేసుక్రీస్తు ప్రభువు సిలువను మోస్తున్న సందర్భములో సీయోనులోని స్త్రీలు చాలామంది ఆయనను చూచి ఏడుస్తుండగా ప్రభువు పల్కిన మాట - లూకా 23:28 యెరూషలేము కుమార్తెలారా! నా నిమిత్తము ఏడ్వకుడి, మీ నిమిత్తమును మీ పిల్లల నిమిత్తమును ఏడ్వుడి,'' అనుటలో సీయోను పట్టణ నివాసులైన ఇశ్రాయేలు ద్వారానే ప్రభువునకు ఆ యొక్క స్థితి ఏర్పడినదని ఇందులోని భావము. దేవుని జనాంగమైన ఇశ్రాయేలు యొక్క బలహీనతను గూర్చి ఆ జనాంగము నివసించిన పట్టణములను గూర్చి ఈ యొక్క చరిత్ర విషాదకరమైనది.
ప్రియపాఠకులారా! నరులు కాకుండ దేవుడే పెంచి పోషించిన జనాంగముయొక్క తిరుగుబాటును గూర్చి - ఆ తిరుగుబాటన్నది ఆ జనాంగమేగాక వారు నివసించిన పట్టణము కూడా చేసినట్లుగా మనము తెలిసికోవలసియున్నది. అయితే ఇంతటి బలహీనతలో అనగా దౌర్భల్య జీవితములో ఉన్న ఈ జనాంగమును గూర్చి దేవుడు సెలవిచ్చిన మరియొక మాట 1:11 విస్తారమైన మీ బలులు నాకేల? దహన బలులగు పొట్టేళ్ళను, బాగుగా మేసిన దూడల క్రొవ్వును నాకు వెక్కసమాయెను. కోడెల రక్తమునైనను, గొర్రెపిల్లల రక్తమందైనను, మేకపోతుల రక్తమందైనను నాకిష్టము లేదు. నా సన్నిధిని కనబడవలెనని మీరు వచ్చుచున్నారే, నా ఆవరణములను త్రొక్కుటకు మిమ్మును రమ్మన్న వాడెవడు? మీ నైవేద్యము వ్యర్థము - అది నాకు అసహ్యము పుట్టించు ధూపార్పణము దానినికను తేకుడి. అమావాస్యయు విశ్రాంతి దినమును సమాజ కూట ప్రకటనమును జరుగుచున్నవి. పాపుల గుంపు కూడిన ఉత్సవ సమాజమును నేనోర్చజాలను. మీ అమావాస్య ఉత్సవాలును, నియామక కాలములును నాకు హేయములు. అవి నాకు బాధకరములు, వాటిని సహింపలేక విసిగియున్నాను. మీరు మీ చేతులు చాచునప్పుడు మిమ్మును చూడక నా కన్నులు కప్పుకొందును. మీరు బహుగా ప్రార్థన చేసినను నేను వినను యెషయా 11:23 ఇశ్రాయేలుయొక్క అక్రమములు, అన్యాయాలనుగూర్చి దేవుడు పొందిన సంతాపము ఈ వేద భాగాలలో చదువగలము. ఇందునుబట్టి యెరూషలేముకు విధించబడే శిక్ష కూడా 3:17-26లో చదువుకొని యున్నాము. అయితే దేవుడు సీయోనుకు అన్యాయము చేయలేదు. సీయోనును వ్యర్థపరచలేదు. సీయోనును వదలివేయలేదు. భూలోక సీయోను బుద్ధిమాలినదై పాడైపోయినందున దేవుడు సంతాపపడి భూలోక సీయోనుకు ప్రతిగా దాని నామమును వృధా పోనీయక అనగా సీయోను యెరూషలేము వ్యర్థము గాకుండ అది పరిశుద్ధముగా పవిత్రముగా ఉండుటకు, దానిని తన రాజ్య సంబంధమైన పట్టణముగా జేసి పరమ సీయోను లేక పరమ యెరూషలేము అను పేరు దానికి పెట్టి, పరలోకము నుండి దిగి వచ్చే యోగ్యతను దానికి అనుగ్రహించియున్నాడు. ఈ సందర్భములో ప్రకటన 21:2, 9 వచనాలు చదవినట్లయితే, పరమ యెరూషలేము, సీయోను దాని వైభోగమును గూర్చి అది అలంకరింపబడిన విధానమును గూర్చి మనము తెలిసికోగలము.
ప్రియపాఠకులారా! ఈ విధముగా భూలోకములో దేవుడు ఏర్పరచుకొన్న ఇశ్రాయేలు పట్టణమైన యెరూషలేమును విడనాడి పరిత్యాగము చేసినను, ఇశ్రాయేలు తన పేరు పెట్టబడిన జనాంగము కనుక వారి పట్ల ఆయన దీర్ఘశాంతము వహించియున్నాడు. వారికి పరలోకములో ఒక ప్రత్యేకమైన ఆధిక్యత కూడా ఇచ్చియున్నట్లు ప్రకటన 14:1-5లో ఈ విధముగా వ్రాయబడియున్నది. మరియు నేను చూడగా ఇదిగో ఆ గొర్రెపిల్ల సీయోను పర్వతము మీద నిలువబడియుండెను. ఆయన నామమును, ఆయన తండ్రి నామమును నొసళ్ళయందు లిఖింపబడియున్న 144 వేలమంది ఆయనతో కూడా ఉండిరి. మరియు విస్తారమైన జలముల ధ్వనితోను, గొప్ప ఉరుము ధ్వనితోను, సమానమైన యొక శబ్దము పరలోకములోనుండి వినవచ్చినట్లును, ఆ వినబడిన శబ్దము వీణెలు వాయించుచున్న వైణికుల నాదమును పోలినది. వారు ఆ సింహాసనము ఎదుటను, ఆ నాలుగు జీవుల ఎదుటను, పెద్దల ఎదుటను ఒక క్రొత్త కీర్తన పాడుచున్నారు. భూలోకములోనుండి కొనబడిన ఆ 144 వేలమంది తప్ప మరెవరును ఆ కీర్తనను ఎరుగనివారైనట్లును మరియు వారెవరును ఆ కీర్తన నేర్చుకొనజాలనట్లును, వీరు స్త్రీ సాంగత్యము నెరుగనివారును, గొర్రెపిల్ల ఎక్కడికి పోవునో అక్కడికెల్ల ఆయనను వెంబడించినట్లును, వీరు దేవుని కొరకును, గొర్రెపిల్ల కొరకును, ప్రధమ ఫలముగా ఉండుటకై మనుష్యులలో నుండి కొనబడినవారును - వీరి నోట ఏ అబద్ధమును కనబడలేదు. వీరు అనింద్యులైనట్లును వ్రాయబడియున్నది,'' అనుటలో ప్రియులారా! ఈ 144 వేలమంది ఇశ్రాయేలీయులయొక్క 12 గోత్రాలలోనుండి దేవుని చేత గొర్రెపిల్ల రక్తము ద్వారా గొర్రెపిల్లకు ప్రధమ ఫలముగా ఉండుటకు కొనబడినవారు. ఇందునుబట్టి లోకానికి రక్షణ ఇశ్రాయేలునుండియే కలిగినట్లు మనకు అర్థమగుచున్నది. ఎలాగంటే దేవుడేర్పరచుకున్న తన జనము అనగా దేవునియొక్క జనము ఇశ్రాయేలు. ఇందునుగూర్చి మత్తయి 2:2-5 ఇశ్రాయేలు అను నా ప్రజలను పరిపాలించు అధిపతి నీలో నుండి వచ్చును,'' అనగా ఇశ్రాయేలును పరిపాలించువాడే గాక ఇశ్రాయేలునుండియే విమోచకుడును, రక్షకుడును పుట్టినట్లుగ ఇందునుబట్టి తెలుస్తున్నది.
కనుక ప్రియపాఠకులారా! దైవ ప్రజ, దైవరాజ్యము అయిన ఇశ్రాయేలు - వారి రాజ్యమైన యెరూషలేము లేక సీయోను అనే ఈ రెండు నామధేయాలు ప్రపంచములో ఒక ప్రత్యేకతను సంతరించుకొని యున్నను, నేడు లోకములో కోటానకోట్ల దేవుళ్ళు దేవతలను నరులు రూపించుకొన్నారుగాని దేవుడు ఒక్కడే, ఆయన భాష కూడా ఒక్కటే, అదే హెబ్రీ భాష - ఈ హెబ్రూ భాషన్నది దైవభాష - ప్రపంచ భాషలన్నియు దీనిలో నుండియే ఏర్పడినవి. ఇందునుగూర్చి వివరముగా తెలిసికొందము.
భాష ఒక్కటే అయినప్పుడు లోకములో నానావిధమైన అనేక భాషలున్నవి. కాని భాష ఒక్కటే. అదియే హెబ్రూ భాష. అలాగే దేవుళ్ళు అనేకులున్నారుగానిదేవుడు ఒక్కడే. ఆయన త్రిత్వములో ఏకత్వము పొందియున్నాడు. అనగా తండ్రి - కుమార - పరిశుద్ధాత్మలుగ విభజించబడియున్నను ఆయన ఒక్కడే, ఆయనే ఇశ్రాయేలు దేవుడే. యెషయా 54:5 ఇశ్రాయేలుయొక్క పరిశుద్ధ దేవుడు, నీకు విమోచకుడు. సర్వ లోకానికి దేవుడని ఆయనకు పేరు. ద్వితియోపదేశకాండము 4:35లో వలె దేవుడు ఒక్కడే, ఆయన సృష్టి అంతయు నిండియున్నాడు. అనగా భూమి, ఆకాశములోను, జలములోను నిండియున్నాడు. అయితే నరులైన మనము మన స్వార్థము మన జ్ఞానముతో మన స్వలాభమునకు నానావిధమైన దేవుళ్ళను నిర్మించుకొనియున్నాము. అందుకే దేవుళ్ళు అనబడువారు అనేకులున్నారు కాని దేవుడు ఒక్కడే ఎఫెసీ 4:5 ఆయన అందరికి పైగా ఉన్నవాడై అందరిలోను వ్యాపించి అందరిలో ఉన్నాడు. కనుక నరులమైన మనము మన స్వజ్ఞానముతో మనయొక్క కల్పనాచతురతతో నానావిధ రూపములను ఏర్పరచుకొని, ఆ రూపములను దేవుళ్ళుగా ఆరాధించుటన్నది దైవత్వమునకు యోగ్యకరము కాదు. ఇందునుగూర్చి దానియేలు గ్రంథములో 3:28-29లో ఈ విధముగా వ్రాయబడియున్నది. షద్రకు, మేషాకు, అబేద్నగో అను వారి దేవుడు పూజార్హుడు. ఆయన తన దూతను పంపి తనను ఆశ్రయించిన దాసులను రక్షించెను. వారు తమ దేవునికి గాక మరి ఏ దేవుని నమస్కరింపక రాజు యొక్క ఆజ్ఞను వ్యర్థపరచిరి. మరి ఈ విధముగా రక్షించుటకు సమర్ధుడగు దేవుడు గాక మరి ఏ దేవుడును లేడు. కాగా నేనొక శాసనమును నియమించుచున్నాను. షద్రకు, మేషాకు, అబేద్నగో అను వారి దేవుని ఎవడు దూషించునో వాడు తుత్తునియలుగా చేయబడును.'' ఇందుకు సత్యదేవుడున్నాడనుటకు ఋజువైయున్నది.
ప్రియపాఠకులారా! ఈ విధముగా దేవునిలోని ఏకత్వము మనకు తననుగూర్చి ప్రకటిస్తుండగా అట్టి దేవుని నరులైన మనము విడనాడి, లోకమును, దానిలోని సృష్టములను, పంచభూతాలను, గ్రహాలను, దేవుళ్ళుగ భావించి వాటిని విగ్రహాలుగ చేసుకొని ఆరాధించుటన్నది ఎంత శోచనీయమో మనలను మనమే ఆత్మీయ జ్ఞానముతో పరిశోధించుకుంటే బోధపడగలదు. ఇట్టి అజ్ఞాన ఆరాధననుబట్టి మూఢాచారముతో కూడినటువంటి లోకధర్మము, మానవ కుత్సితములైన పాటింపులు, ఆచారాలనుబట్టి దేవుడు లోకాన్ని, నరసమాజాన్ని - నరులు జీవించే ప్రదేశాలను సహితము పరిత్యాగము చేసినట్లుగా మూలవాక్యములోని పరమార్థమైయున్నది.
కనుక దేవుడు లోకమును విడనాడుట, లోకములోని నివాస స్థలమైన పట్టణాలను పరిత్యాగము చేయుటన్నది ఇంతవరకు మనము క్షుణ్ణముగా తెలిసికొన్నాము. పరిత్యాగ పత్రిక అన్నది చట్ట సమ్మతముగా వివాహము చేసికొన్న భార్యాభర్తలు దుర్భర పరిస్థితులలో - అనివార్య కారణములనుబట్టి మనస్తాపము కలిగి, వారిలో ద్వేష భావము పెరిగి ఒకరి యెడల ఒకరు వ్యతిరేకతను కలిగియున్నప్పుడు భర్తయైనవాడు, భార్యకు పరిత్యాగ పత్రిక అనగా విడాకులు ఇచ్చుటన్నదియు, ఒకవేళ భార్య సక్రమముగా లేనప్పుడు భార్యకు విడాకులిచ్చుట లోకరీత్యా మనమెరిగిన విషయమే. అయితే యెషయా గ్రంథములో పై వాక్యములో దేవుడు ''నీ తల్లిని విడనాడిన పరిత్యాగ పత్రిక ఎక్కడ ఉన్నది? నా అప్పులవారిలో ఎవరికి మిమ్మును అమ్మివేసితిని?'' 50:1 అనుటలో దేవుడు సంఘమును లేక పట్టణమును లేక లోకమును లేక సమాజమును విడనాడినట్టి పరిత్యాగ పత్రిక అనగా విడువబడిన వారి యొక్క ఆత్మీయ స్థితిని గూర్చి ఇందులో వ్రాయబడియున్నది.
ప్రియపాఠకులారా! పాతనిబంధన కాలములో దేవుని జనాంగము ఇశ్రాయేలేగాని, ఇశ్రాయేలులకు ప్రత్యర్థులైన జనాభా అనగా దేవుడు ఇశ్రాయేలును గాక విడిచి వేసిన జనాంగములు కొన్ని ఉన్నవి. అవి ఐగుప్తీయులు. ఇది హాగరు విషయములో జరిగిన కార్యము. ఆమె తనకు గర్భమునిచ్చి సంతానమును ప్రసాదించిన భర్తయే ఆమెను అరణ్యములో విడనాడినాడు. అయితే దేవుడు ఆమెను విడనాడలేదు, వదిలివేయలేదు. అరణ్యములో ఆమె చేసిన అరణ్య రోదనను విని హాగరును దర్శించి, హాగరూ నీవు దిగులు పడకుము - ఈ చిన్నవానిని ఒక గొప్ప జనముగా చేసెదనని అనుటయేగాక హాగరు కన్న చిన్నవానికి కావలసిన జలమును ఆ స్థలములో పుట్టించి, తద్వారా తల్లీ బిడ్డల యొక్క దప్పికను నివారించినట్లు వేదభాగములో ఆదికాండము 21:17-21లో చదువగలము.
ఆ విధముగా విడువబడిన హాగరుయొక్క సంతానమును దేవుడు హాగరుతో చేసిన వాగ్దానమును బట్టి విస్తరించి ప్రబలి, నేడు ప్రపంచ జనాభాలో రెండవ స్థానాన్ని అలంకరించుకొనియున్నది. ఇందునుబట్టి దేవుడు అబ్రాహాము మూలముగా శారా ద్వారా ఒక జనాంగము, హాగరు ద్వారా మరొక జనాంగమును ఈ భూలోకములో ఎదిగించియున్నాడు. ఈ రెండు జనాంగములకు తండ్రి సృష్టికర్తయైన దేవుడే; ఈ రెండు జనాంగములు కూడా దేవుని ఆత్మతోను, సత్యముతోను, వివేకముతో ఆరాధించవలసినట్టి బరువు బాధ్యతలు ఈ రెండు జనాంగములకున్నది. ఈ రెండు జనాంగములు గాక దైవత్వానికి విడువబడిన సంకర జనాభా వేరే ఒకటున్నది. అదేమనగా పౌలు వ్రాసినటువంటి ప్రవచనము 1 కొరింథీ 12:1 మీరు అన్యజనులైయున్నప్పుడు మూగవిగ్రహములను ఆరాధించుటకు ఎటుబడిన అటు నడిపింపబడితిరని మీకు తెలియును. సహోదరులారా! ఆత్మ సంబంధమైన వరములనుగూర్చి మీకు తెలియకుండుట నాకు ఇష్టము లేదు. కాబట్టి అన్యునికి దైవారాధనలో స్థిరత్వము లేదని, అరిగురి లేక స్థిరత్వము లేక ఏది దేవుడో ఏది దేవుడు కాదో - దేనిని ఆరాధించవచ్చునో దేనిని పూజించవచ్చునో దేనిని ఆరాధించకూడదో తారతమ్యాలు తెలియక బుద్ధి మాంద్యముతో జరిగించే ఆరాధనలు - ఇవి దైవత్వము చేత విడనాడ బడినవేగాని, దైవత్వమునకు యోగ్యకరము గాదని ఋజువగుచున్నది.
కనుక ప్రియపాఠకులారా! ఇట్టి అన్య జీవితము నుండి దైవకుమారుడైన క్రీస్తు జరిగించిన శారీరయుతమైన బలియాగము అనగా ఆయన రక్తప్రోక్షణ ద్వారా మన ఈ మూగవిగ్రహారాధన అనేక దేవత ఆరాధన నుండి విడుదల పొంది, దైవజనాంగమైన ఇశ్రాయేలు నుండి ప్రత్యేకించబడినవారమై అనగా యెహోవా జనాంగముగా కాకుండ యెహోవా ద్వారానే ఆయన కుమారుడు యోహాను 1:12లో వలె యేసుక్రీస్తును అంగీకరించుట ద్వారా దేవుని బిడ్డలైన క్రైస్తవ జనాంగమైన మనము దైవత్వములో దైవరక్షణలో దైవపరిధిలో దేవుని యొక్క ఆశ్రయములో చేర్చబడినవారమై యున్నాము. అనగా ఆయన యొక్క అతిధులుగా ఉన్నాము. ఆయన పేరు పెట్టబడిన జనాంగముగా ఉన్నాము. ఇశ్రాయేలు అనగా దేవుని జనాంగము. క్రైస్తవులైన మనము ఆయన కుమారుడైన యేసుక్రీస్తు యొక్క జనముగా ఏర్పరచబడు చున్నాము. కనుక ఒక్క దేవునికి ఈ రెండు జనములు కట్టుబడియున్నవి. అయితే ఇశ్రాయేలు అను దైవజనము తమ క్రియల ద్వారా సృష్టికర్తయైన దేవునికి సంతాపము పుట్టించు అన్యులకు అమ్మబడినారు. ఇందుకు కారణము వారి బుద్ధిహీనత, వారి ఆత్మ బలహీనత, నేటి క్రైస్తవులమైన మనము క్రీస్తు నెరిగి క్రైస్తవ సిద్ధాంతాలలో అనగా నీటి మూలముగాను, ఆత్మ మూలముగాను జన్మించి, క్రీస్తును ధరించుకొని, క్రైస్తవులమని చెప్పుకొంటున్న మనము కొన్ని సందర్భాలలో లోకానికి అమ్ముడైపోతున్నాము. అందునుబట్టి క్రైస్తవ సంఘాలను కూడా విడనాడినట్లు కొన్ని సందర్భాలున్నవి. అనగా ఆ సంఘాల యొక్క ఆత్మీయ ఎదుగుదల క్షీణించి మందిరాలే మూలపడిన సంఘటనలున్నవి. ఇందుకు కారణము క్రైస్తవ విశ్వాసులమైన మన ఆత్మీయ బలహీనత శారీర దౌర్భల్యమునుబట్టి లోకానికి, లోక ప్రభుత్వానికిని, సాతానునకు తెలియని రీతిగా అమ్మబడుచు హెచ్చించే జీవితాన్ని గడపుచున్నాము. ఇందుమూలముగా యేసుక్రీస్తు యొక్క కృపను, పరిశుద్ధాత్మ యొక్క వరమును కోల్పోయి, విడువబడినట్టి సంఘముగా క్రైస్తవ సమాజములో మనము సమాధులుగాను జీవిస్తున్న సందర్భాలున్నాయి.
కనుక ప్రియపాఠకులారా! మన విశ్వాసమును స్థిరపరచుకొని స్థిరమైన మనస్సాక్షి గల్గి సిద్ధపాటు గలవారమై, ఆత్మీయతను పొంది, శారీర దౌర్భల్యమునకు లోనుగాకుండ, స్వార్ధాన్ని ఈర్ష్యాన్ని ద్వేషములు అసూయలు వగైరా క్షుద్ర గుణములు మాని, దైవత్వములో ఒకవేళ మనము వెనుకబడిఉంటే అందునుబట్టి మన ఆత్మీయతను భద్రపరచుకొని స్థిరపరచుకొని, భూలోక యెరూషలేము అన్యాక్రాంతమై పాడుబడి పోయినను, నేటి మన క్రైస్తవ విశ్వాస జీవితములో మన పరిశుద్ధ కూటమియైన సంఘములో సభ్యులుగా ఉన్న మనము - పరలోకము నుండి దిగివచ్చే పరమ యెరూషలేము (పరమ సీయోనులో) సభ్యత్వము పొందుటకు ఆయత్తమై యుందుము గాక!
నరుని ప్రకరణము తర్వాత వివరించబడు అంశము నోటి మాట :- సర్వసాధారణముగా సందర్భానుసారముగ ఊరడింపుగా మొగమాటానికి నరులు జరిగించలేని క్రియకు కూడా జరుగని పనిని జరుగుతుందని నోటితో అనెదరు. చికాకు మీద కూడా అనవసరముగా పొరబడి లేక విరక్తి జెంది మాటలాడుదురు. ఇట్టి మాటల వల్ల ఎటువంటి ఘోరాతిఘోరములు జరిగాయో, వాటి పర్యవసానము ఏలాగు మారినదో బైబిలులో మనము తెలిసికోగలము.
నోటి మాట తెచ్చు చేటు :-
ప్రభువునందు ప్రియమైన సోదర సోదరీమణులకు విజ్ఞప్తి :- మనము తరచుగ సరదాకుగాని, మనుష్యులయొక్క మొగమాటానికిగాని, మన శక్తికి మన తాహతును మించిన మాటలు మాట్లాడడము. ఆ మాటలు ఎదుటి వ్యక్తులు నమ్మి అల్లరిపాలు కావడము లేదా ఆ మాటలు మాట్లాడిన మనము లేని కష్టనష్టాలను ప్రమాదాలను తెచ్చుకొని బాధలు పడడము, లోకములో సర్వసాధారణముగా జరుగుచున్నవి. ఇట్టి సందర్భ విషయములు అనేకములు మన జీవితములో అట్టి కుటుంబములు పడు బాధలు అనేకములు మన కండ్లారా చూస్తున్నాము. ఇట్టి అనర్ధాలకు వచ్చు కీడులు నోటి మాట వల్లనే. ఇట్టి మాటలను గూర్చి మనము బైబిలులో తెలిసికోగలము. మాటకు అనగా పలుకుట అనుటకు నాలుకయై యున్నది. ఈ నాలుకను గూర్చి యాకోబు 3:1-10 తెలిసికోగలము. ఆదియందు వాక్యముండెను. ఈ మాట అనునది ఓం ప్రధమములో దేవునిదైయుండి నోటి మాట యనునది దేవుని సొత్తు. యోహాను
1:1లో చూచినట్లయితే ఈ మాట వల్లనే దేవుడు లోకసృష్టిని సంపూర్తి చేశాడు. ఈ మాట లోకమునకు శుభమును చేకూర్చి ప్రకృతిని శోభాయమానముగా వెల్గించినది. ఈ మాట అతి పవిత్రమైనది. శుభకరమైనది. దేవుని నోటి వెంట వచ్చినది. దేవుని నోటి వెంట వచ్చిన మాట వల్లనే నరుడు చేయబడినాడు. వానికి జీవము వచ్చినది. దేవుడు తన మాటనే నరుని వినమన్నాడు. అట్లు దేవుని మాటలు వింటూ నరుడు ఆయన పరిశుద్ధ సన్నిధియైన ఏదెనులో వంటావార్పూ, ఆకలి దప్పిక, ఒంటికి మురికి లేకుండ స్నానము కూడా అక్కరలేని జీవితములో నిశ్చింతగ జీవించగల్గినాడు. అట్టి నిశ్చింత జీవియైన నరుని అనవసరమైన జిత్తులమారి సర్పము ఉండబట్టలేక దైవవ్యతిరేకమైన మాటలు మాట్లాడి, కాళ్ళు రెక్కలు గల్గి మంచి అవయవ సౌష్టవమైన తన రూపమును పోగొట్టుకొని, మంటి తింటూ పుట్ట పాలైనది. ఆనాడు అదినరునితో మాట్లాడిన మాట నేటి వరకును దాని దోషము నరులను వెంటాడుచునే ఉన్నది. అనగా సర్పము నోటి నుండి వచ్చిన మాట నరుని నామరూపము లేకుండ చేయునంతటి అరిష్టమును తెచ్చిపెట్టింది. ఎందుకనగా నరుడు దాని మాటలు విన్నాడు.
అయితే దేవుని నోటి మాట భూమి మీద నెరవేరుచున్నవి. దేవుడు నరునికిచ్చిన శాపములు మొట్టమొదటిది పాముకిచ్చిన శాపము. పొట్టతో ప్రాకాలి. పుట్టలో ఉండాలి. నరులచే చంపబడాలి. నరులకు తన జాతికి తీరని విరోధమేర్పడాలి. స్త్రీతో పల్కిన మాట ప్రయాసతో గర్భవేదనను భరించి పిల్లలను కనడము. పురుషుని మీద వాంఛ. పురుషునికి బానిసత్వము. ఇవి స్త్రీతో పల్కిన మాటలు. ఇంక పురుషునిలో పల్కిన మాటలు. చెమటోడ్చి భూమిని దున్నాలి, పని చేయాలి. భూమి తన ఫలితాన్ని నరునికీయదు. శ్రమపడి చెమటోడ్చి దాని ఫలితము తినాలి. భూఫలమును ఆశించినందున దైవమాటలను అలక్ష్యము చేసినందున, భూమి మీద దిగులుతో అనగా భూలోక వ్యామోహముతో జీవించాలి. ఇది ఆదిలో గల్గిన వాగ్దోష ఫలము.
రెండవది కయీను విషయములో దేవుడు కయీనును నీ తమ్ముడెక్కడ? అవి అడిగినప్పుడు, నా తమ్మునికి నేను కావలివాడనా? అని అలక్ష్యముగా పల్కిన మాటనుబట్టి కయీను దేశద్రిమ్మరిగాను, జ్యేష్టత్వ హక్కును కోల్పోయినవానిగాను జేసినది. లోతు దేవదూతల మాట వినినందున అగ్నిగంధకముల నాశనము నుండి రక్షించబడినాడు. ఆతని మాటలు విననందున సొదొమ గొమొఱ్ఱా ప్రజలు నాశనాన్ని తెచ్చుకున్నారు. నోవహు మాటను, ఆయనయొక్క ప్రకటనను విననందున జలప్రళయము చేత జననష్టము సంభవించి, తన మాటను వినిన తన కుటుంబమును దైవరక్షణకు యోగ్యమైనది. దేవుని మాటను విన్నందున మోషే దైవజనాంగమునకు నాయకుడుగాను, ప్రతినిధిగాను నియమితుడైనాడు. అట్లు నియమితుడైన మోషే యొక్క మాటలను వినినందున ఇశ్రాయేలీయులకు బానిసత్వ విమోచన గల్గినది. మోషే మాటను వినని సందర్భములో ఇశ్రాయేలీయులు అనేక ఇరుకు ఇబ్బందులు ఏర్పడినట్లు మనము గ్రంథములో చదువగలము. అహరోనుయొక్క నోటి మాట దూడ దేవుని సృష్టించి విగ్రహారాధనకు పునాదియైనది. ఆది 16:2లో విధముగా శారా అబ్రాహాముతో మాట్లాడిన మాట ఇష్మాయేలు సంతతిని దాసీదాని గర్భమును ఫలింపజేసి, ఒక్క తండ్రికి పుట్టిన ఇద్దరు బిడ్డలలో మాతృ ద్వేషమును కల్గించి, క్రైస్తవ ముస్లిమ్‌లను విబేధములను శారా మాట్లాడిన మాట తెచ్చి పెట్టింది.
క్రొత్త నిబంధన కాలములో యేసుయొక్క మాటలు : నరులకు జీవము పోసినవి. మృతులకు జీవము. నీళ్ళకు రూపము, (ద్రాక్షరసము) భూతములకు భయము, సముద్రమునకు విధేయత కల్గించినది. గాలిని సముద్రమును గద్దించినాడు.
సిలువలో దొంగ పల్కిన మాట పరదైసులో సమానత్వమును గల్గించినది.
శృంగారమను ద్వారము దగ్గర పేతురు యోహానులు పల్కిన మాటలు చచ్చువానికి నరబలము గల్గించి గంతులు వేయించినది. సౌలుగా ఉన్న పౌలుగా మారి క్రీస్తు మాటలను విశ్వసించుట, మన అపొస్తలుడుగను, క్రీస్తుకు సాక్షిగాను మారగల్గెను.
దానియేలు గ్రంథములో మెషగు - షద్రకు - అబిద్నగోలు ఆత్మవశుడై మాట్లాడిన మాటలు నెబుకద్నెజరు రాజును కనువిప్పు కల్గించింది. అననీయ సప్పీరాలు అపొస్తలుల ఎదుట మాట్లాడిన అబద్ధపు మాటలకు మరణాన్ని తెచ్చుకున్నారు. ప్రభువునందు ప్రియమైన సోదర సోదరీ! బైబిలు గ్రంథము అంతట దేవుని రాజ్యము మాటలు గాదుగాని శక్తితో కూడినట్లుగా వివరిస్తున్నది. మరి నీవు మాటలతోగాక దైవశక్తితో మనము జీవించగల్గుచున్నామా? అట్లున్న మనము ధన్యులమే. క్రైస్తవులమైన మనము క్రీస్తుయేసు మాటలతో కాలక్షేపమును ప్రమాణములను జేయుచు, వాటిని నెరవేర్చకపోయినట్లయితే పై వివరించబడిన విధముగా చేటును కొని తెచ్చుకొన్న వారమగుదుమని మనము గుర్తించాలి.
మన క్రైస్తవ సంఘములలో కూడా అనేక సార్లు అనేక సంఘటనలలో మాటలు జెప్పి తప్పిపోయి లేని చేటును తెచ్చుకొన్న సంఘటనలు కొన్ని ఈ క్రింది విధముగా చూస్తున్నాము. మంచి ఫాస్టరు కావాలని సంఘమంతా కూడి దేవుని ప్రార్థించి, వారి ప్రార్థనలు విన్న దేవుని దయ చేత మంచి ఫాస్టరుని పొంది, కొంత కాలమైన తర్వాత ఏ సంఘమైతే కూడి ఆ ఫాస్టర్ని గూర్చి ప్రార్థన జేసిందో - ఆ సంఘమే ఆ ఫాస్టరు పనికిమాలినవాడుగ నిర్ధారించుచున్నది. సంఘములలో నోటి మాటల వల్లనే అనేక కలతలు తెచ్చుకొని పోట్లాడుకోవడము కూడా మనము చూస్తున్నాము.
దేవుని పిలుపు లేకపోయినను బైబిలును చేతబట్టి దేవుడు తనను సేవకు పిలిచాడని సంఘములలో సాక్ష్యమిస్తూ సువార్త సేవకులమంటూ ప్రకటించుకొను సోదరులు - తమనోటి మాట వల్లనే పతనమైపోవుట చూస్తున్నాము. అభిషేకము లేకపోయినను నేను ఫాస్టరని చెప్పుకుంటూ అసత్యముతో సత్యమును మరుగుపరచి, విశ్వాసులమంటూ మాట్లాడుచు, విశ్వాసము గల వారి వలె విశ్వాసమునకు కావలసిన అన్ని హంగులను కనపరచుచు, మరుగున అవిశ్వాసముతో జీవిస్తూ అనేక ఇబ్బందులకు గురియగు సోదరులను మనము చూస్తున్నాము. సంఘాలయములలో బలిపీఠమనునది పాతనిబంధన కాలములో యెహోవా బలిపీఠము దగ్గర అహరోనుకున్న అగ్రస్థానము నేటి కాపరికి ఉన్నదని గుర్తిస్తే అనేకులు బోధకులగుటకు భయపడుదురు. అది గుర్తించకపోబట్టే క్రైస్తవ సంఘ రిటైర్డు అయిన ఉద్యోగులు, లోకములో అక్రమస్థులుగా ఎంచబడిన పెద్దమనుష్యులు, ఏ దారి లేక గోదారి అన్నట్లు బైబిలును చేతబట్టి సువార్త సేవకులమంటున్నారు. ఈ సందర్భములో మొదటి కొరింథీ 1:26 చదవినట్లయితే దేవునియొక్క ఎన్నిక మనకు బయల్పడును. యెహోవా ఏర్పరచిన రాజులుగాని, న్యాయాధిపతులుగాని, జ్ఞానులుగాని, దీర్ఘదర్శులుగాని, గవర్నమెంటులో రిటైర్ అయిన ఉద్యోగులు కారు. వీరు సమర్పించుకొనబడినవారు.
యేసుప్రభువు తన అపొస్తలులుగా నియమించబడిన 12 మంది అపొస్తలులు గవర్నమెంటు ఉద్యోగస్థులు కారు. అందుచేతనే వారి కాళ్ళు కడిగినాడు. వారు సమర్పించుకొనబడినవారు. అందుచేతనే తన రాజ్య సువార్తకు వారిని పిలిచాడు. అందుచేతనే తను వెళ్ళి తన పరిశుద్ధాత్మను వారికనుగ్రహించినాడు. అందుచేతనే తన మహిమలో పాలుపంపులుగలవారైనారు. అందుచేతనే తాను పొందిన వేదన, శ్రమలలో కూడా వారికి పాలు దయజేసినాడు. పరలోక సింహాసనములో కూడా అట్టివారికి ఆధిక్యత నిచ్చాడు. అదే విధముగా యేసుప్రభువు తన రాజ్య సువార్త ప్రకటనార్థము లోకసంబంధమైనట్టి అపేక్షలను, ఉద్యోగాలను, రాయితీలను, ధనసంపత్తి వ్యామోహమును విసర్జించి, కేవలము రక్షణ సువార్త కొరకే కంకణము కట్టి సేవజేయు పరిచారకులకున్నట్టి ప్రకటన 14:3-5 వచనము చదివితే బయల్పడును.
అటు తర్వాత నేటి యుగములో సువార్త వ్యాప్తికై దీక్షబూని లోకములోని ఉద్యోగము, పదవులను ఆశించక తమ జీవితమును క్రీస్తునకు అంకితము చేసికొని, సువార్తలోనే తమ సాంసారిక ఇహలోక జీవితమును జరుపదలచినవారిని ప్రభువు తన పనికి నియమించు విధానములో వారిని సంఘకాపరులుగాను, సంఘపెద్దలుగాను, బలిపీఠమునకు యాజకులుగాను నియమించియుండగా అట్టివారు శారీరముగాను, ఆత్మీయముగాను అభిషిక్తులై, దైవసన్నిధానములో సంఘపెద్దల ఎదుట అభిషిక్తులైయున్నందువల్ల వారు కేవలము దైవత్వమునకు అంకితము, నరులకును దేవునికిని మధ్యవర్తులై జీవిస్తున్నారనునది నగ్నసత్యము. ఇట్టివారి జీవితమును మంటగలిపి చిచ్చు పెట్టుటకు, దేవుని పిలుపు లేని, అభిషేకము లేని, సంఘనిర్ణయము లేని బైబిలు పట్టిన బోధకులు తయారై సత్యమును మరుగుపరచి, సమయోచితముగ బోధలు జేసి రెండవ తిమోతి 3:1-8 చదివినట్లయితే ఇట్టివారి విషయములు మనకు బైల్పడును. ఇందునుబట్టి బోధకుడుగా ఉన్నవానికి యాకోబు 3:1-2లో హెచ్చరిక చేయుచున్నాడు. ఈ దినాలలో ప్రభువు పిలుపునుబట్టి చేయు బోధలు వేరు (మానవుని స్వజ్ఞానముతో చేయు బోధలు వేరు) ఆదిలో దేవుడు తినమన్న పండు వేరు. తినవద్దన్న పండు వేరు. తినవద్దన్న పండును తిననందువల్లనే దేవునికి విధేయత అనగా తన హృదయమనే ఫలమును దేవునికి అర్పించినందున, ఆ ప్రీతికరమైన ఫలసారమునకు దేవుడు ముగ్దుడై, తన స్థానములోనికి సశరీరముగా చేర్చుకున్నాడు. తినవద్దన్న పండును తిన్నందువల్లనే నేటివరకు నరులు క్షోభననుభవించు చున్నారు. అదే విధముగా దైవముద్ర లేని బోధకుల మాటలు విన్నందువల్లనే సంఘములు పాడైపోవుచున్నవి. దైవపిలుపు నిలకడగా ఉన్న మాటలు విన్న సంఘములు చలనము లేక బండ మీద గట్టిన ఇంటిని బోలి ఉన్నవి. ఎన్నికలేని బోధకుల మాటలు విన్నందువలన కలతపడిన సంఘములు - ఇసుక మీద గట్టిన ఇండ్లను పోలియున్నవి.
సమర్పణా జీవితములో ఉన్న యెవ్వడు కూడా స్వంతముగా బోధకుడు కాలేడు. పై నుండి అనుగ్రహిస్తేనే తప్ప ఎవడు తనంతట తాను ఏదియు చేయనేరడని సువార్త సేవా విషయమై తర్ఫీదు నిచ్చు సెమినార్లలో చేరు అభ్యర్థులకు ఇట్టి సమర్పణా జీవితమున్నదని, దైవపిలుపు ఉన్నదని, సువార్త ఆసక్తి ఉన్నదని, వారికి అభిషేకము ఉన్నదని, వారు కేవలము దైవపరిచారకులుగా ఉన్నారని, భూలోక సంబంధముగా వారికే వృత్తి ఉద్యోగాలు లేవు గనుక ఆరాధన విషయములో ప్రతి పరిశుద్ధ కార్యమునకు వారు యోగ్యులుగా దైవసన్నిధానములో నిర్ణయించబడియున్నారు.
ఒకవేళ ఏ దారి లేక భుక్తిగా దీనిని ఆచరించు యోహాను 6:26లో విధముగా చెప్పినట్లుగా బ్రతుకుతెరువు నిమిత్తముగా కొందరు చేరుచున్నారు. కాని అది అట్టివారిని దేవుడు మనసు మార్చి వారి అంతరాత్మను గద్దింపజేసి, తన సేవలో బలముగా వాడుకొనుట కూడా మనము గుర్తింపవలసియున్నది.
ఆత్మ ఫలదర్శిని
రచయిత తొలిపలుకులు - అభిప్రాయము :- ప్రియపాఠకులారా! పై రెండు విధములైన స్వభావ సిద్ధమైన సంగతులను గూర్చి వివరముగా పాఠకులకు రచయిత చేయు విజ్ఞప్తి :-
ప్రియపాఠక మహాశయులారా! లోకములో అనేక విధములైనటువంటి మత సామరస్య సాహిత్యాలు కోకొల్లలుగా విరచితమైన సంగతి మనమెరిగిన విషయమే. అయితే అవియన్నియును కూడా నరునియొక్క జ్ఞానమునకు అంతుచిక్కనివియు, అంతేగాకుండ నరునియొక్క ఆత్మీయస్థితిని తారుమారు చేసే స్థితిలో నరుని అవిశ్వాసిగాను, అజ్ఞానిగాను చేయుటకు క్రియ జరిగిస్తున్నాయేగాని వాటిలో దైవత్వమును గూర్చిన పూర్తి జ్ఞానము లేదు. ఇంకను లోకరీత్యా వ్రాయబడిన అన్య గ్రంథాలలో దేవుడు ఒక్కడుగా అభివర్ణించినను, దైవనామమును నానారీతులుగ, నానా నామధేయాలతో నానవిధ మృగపక్షి జంతు రూపములతో - నిర్జీవమైన శిలాప్రతిమలతో నిర్జీవమైన పోతపోసిన లోహ విగ్రహాలు, తత్సంబంధమైన ఆచార నియమాలతో తామే పరిశుద్ధులమని, తాము రూపించుకొన్న ఆ దేవతా విగ్రహమే ప్రభావితమైనదని, శక్తివంతము అని భ్రమపడేటటువంటి జనాంగము మన భారతదేశములోఅనాది కాలము నుండి నేటి వరకును - ఈ మూఢత్వము మూడు పువ్వులు ఆరు కాయలుగ విస్తరించి క్రియ జరిగిస్తుండగా - ఇందులో ఒక వర్గము ఈ ఆచార వ్యవహారాలు, ఈ దేవతా రూపాలు, వీటికి జరిపే పండుగ ఉత్సవాలు, జాతరలు, వగైరాల మీద విసిగి జీవితములో విరక్తి జెంది, హేతువాదులుగాను నాస్తికులుగాను మారిన సంఘటనలు మనమెరిగిన విషయమే! మన భారతదేశములో దేవతలు - దేవుళ్ళు అనేవారు నరకోటి జనాభా ఎంత ఉందో అంత ఎత్తుకు ఎదిగి, ఈనాడు దేశవ్యాప్తముగా విస్తరించియున్నారన్న సంగతి కూడా మనకు తెలుసును. ఇందుకు పరిశుద్ధ గ్రంథమిచ్చు సమాధానమేమనగా యోహాను 1:4-5 ఆయనలో జీవముండెను, ఆ జీవము మనుష్యులకు వెలుగైయుండెను. ఆ వెలుగు చీకటిలో ప్రకాశించుచున్నదిగాని చీకటి దాన్ని గ్రహింపకుండెను. 1:9-10 నిజమైన వెలుగుండెను. అది లోకములోనికి వచ్చుచు ప్రతి మనుష్యుని వెలిగించుచున్నది. ఆయన లోకములో ఉండెను, లోకము ఆయన మూలముగ కలిగెను, కాని లోకము ఆయనను తెలిసికొనలేదు, అని ప్రవచించుటలో ఆ నిజమైన వెలుగు దైవత్వముయొక్క నిజరూపము. ఎందుకనగా 1యోహాను 1:5లో ఈలాగు వ్రాయబడియున్నది. ''దేవుడు వెలుగైయున్నాడు. ఆయనయందు చీకటి ఎంత మాత్రమును లేదు.'' ఆయనతో కూడా సావాసము కలవారమని చెప్పుకొనిన యెడల మనము అబద్ధమాడుచు సత్యమును జరిగింపకుందుము. అయితే ఆయన వెలుగులో నున్న ప్రకారము మనమును వెలుగులో నడిచిన యెడల, మనము అన్యోన్య సహవాసము గలవారమైయుందుము.''
ప్రియపాఠకులారా! ఇందునుబట్టి నిజమైన వెలుగు - ఆ వెలుగును గూర్చిన పూర్వార్థము, ఆ వెలుగు మార్గములో నడిచిన నావికున్న ధన్యత, ఆ వెలుగుయొక్క రక్షణానుభవము, ఆ వెలుగుతో నరునికి సావాసము, ఆ వెలుగుయొక్క ప్రభావము ఆ వెలుగులో ఉన్న ప్రకాశమానమైన పరిశుద్ధత ఇవన్నియు కూడా నరులు రూపించుకొన్న విగ్రహ సంబంధమైనది కావని, అవి కేవలము మనుష్యుల చేతి పనికి వాటిలో ఎంతమాత్రము జీవము లేదని, వాటితో ఉన్నదంతయు నిర్జీవమేగాని వాటిలో ఏమియు లేదని, వాటిలో చలనము లేదని, వాటిని రూపించిన మనుష్యుల చేతనే అవి మోయబడుచున్నాయన్న సత్యాన్ని గ్రహించలేకున్నారంటే నరునియొక్క అజ్ఞానమెంత ఉన్నత స్థితిలో ఎంత మనోనేత్ర గుడ్డితనముతో లోకము వ్యవహరిస్తున్నదో తెలియగలదు. ఈ విధమైన పాపమునకు భయపడి, లోకానికి జ్ఞానోదయము కలిగి నిజమైన వెలుగును, ఆ వెలుగు గుణాతిశయములు, ఆ వెలుగుయొక్క ఆత్మీయ జ్ఞానమునుగూర్చి ప్రకటించుటయే ఈగ్రంథ రచయిత ఉద్దేశ్యమైయున్నది. నేను ప్రకటించు ఈ సువార్త వ్యాపార సంబంధమైంది కాదు. ఇది వ్యాపార సంబంధమైతే నేను లక్షాధికారిగా లోకరీత్యా లేక కోటీశ్వరుల జాబితాలో చేర్చబడేవాడను. కాని లోకముయొక్క లక్షలు వగైరాలు ఆశించక పరలోక ప్రవేశము - సత్యదేవునితో నిత్య సమాధానము, నిత్య సావాసము, శాశ్వతమైనటువంటి పరలోక సంబంధమైన ఐశ్వర్యమునకు వారసుడను కావాలని, అట్టి వారసత్వమునుబట్టి దైవసన్నిధిని స్వాస్థ్యముగా అనుభవించాలన్న మనోవాంఛతో ఈ అధిక వ్యయ ప్రయాసలతో కూడినటువంటి దైవరాజ్య సువార్త - ప్రకటన అను ఈ మహత్తర దైనందిన కార్యక్రమ క్రియ అమలులో - దైవపక్షముగా నా శక్తి కొలది లోకములో సత్యదేవుని నిత్యదేవుని నిజమైన వెలుగైన ప్రభువునుగూర్చి ప్రకటించుటయే నా ఉద్దేశ్యము. దేవుడు నాకు అనుగ్రహించిన భూలోక సంబంధమైన మహాభాగ్యము ఐశ్వర్యమునైయున్నది.
కనుక పాఠక మహాశయులారా! ఈ గ్రంథమును పఠించి ఇందులోని అంశములనుగూర్చి ఏవైన సందేహాలు అనుమానాలుగాని, ఒకవేళ ఏవైన అర్థముగాని విషయాలున్నట్లయితే ఈ దిగువ అడ్రసులో నన్ను సంప్రదించగలరు. ప్రభువు మిమ్ము ఆశీర్వదించి కాపాడును గాక! ఆమేన్.
........
ఆత్మ శరీరముల వైరాగ్యముల గూర్చిన అంశము :- మూలవాక్యము :- ఒకటవ కొరింథీ
12:4-7లో విధముగా ప్రతి నరునిలోను జీవించు ఆత్మ ఒక్కడే. కాని ఆత్మ ప్రభావ మూలమున పరిచర్యలు అనేక రకములుగా ఉన్నవి. నానారకముల భాషలు, భాషా జ్ఞానములు, స్వప్న ఫలములు చెప్పుట, స్వస్థపరచు వరములు, ప్రవచించుట వగైరా. అయితే ప్రభువునందు ప్రియమైన సోదరీ! సోదరా! నేటి యుగములో నరశరీరమైన మనలో దేవుడు తన ఆత్మను ప్రతిష్టించి, నీతితోను పరిశుద్ధతతోను జీవింపనుద్దేశించితే రోమా 1:21-25 ఆత్మ ప్రత్యక్షతను, దాని విలువను, దానిని అనుగ్రహించిన కర్తను విస్మరించిన జనులయొక్క క్రియలు, వాని ఫలితములు తెలియుచున్నవి. హేతువాదస్థులును, నాస్తిక సోదరులు కూడ ఇట్టి కూటమిలో చేర్చబడియున్నారు. మనకు దేవుడు అనుగ్రహించిన ఆత్మ ప్రత్యేకించబడి యున్నట్లు మరణమను క్రియ ద్వారా బహుమర్మముగా తేటతెల్లముగా తెలియుచున్నది. ఈ సందర్భముగ గలతీ 5:17 ఆత్మ శరీరములకు ఉన్న ప్రత్యేకతలు గుర్తించగలము. మన్ను అనునది వెనుకటి వలె మన్నై పోవును. ఆత్మ దానిని అనుగ్రహించిన వాని వద్దకు వెళ్ళును; అను బైబిలు సత్యమును ఈ సందర్భములో మనము గుర్తించగలము. మత్తయి 5:3 శారీర క్రియలను, దాని గుణములను చంపుకుంటే అనగా కొఱత (సిలువ) వేసిన ఆత్మయొక్క ఫలములు దైవసన్నిధిలో గొప్ప ప్రగతిని సాధించును. శరీర జ్ఞానము దాని ఆశయములతో ఆత్మ యొక్క వెలుగును హీనపరచినప్పుడు దైవసన్నిధానములో దైవోగ్రత, భూలోకములో అపకీర్తి, శరీర కార్యములు ప్రతిదియు దేవునికి విరుద్ధములైయున్నవి. అదే విధముగా ఆత్మఫలములు ప్రతిది దేవునియొక్క సన్నిధానమునకును, ఆయన దాసుల సాంగత్యమునకును ఒప్పుదలయైయున్నది. ఈ లోక భోగభాగ్యములను, ముస్తాబులను, అలంకారములను శారీరము దాని జ్ఞానము కోరును. కాని ఆత్మకు అవి యోగ్యములు కావు. శరీరము చేయు ప్రతి క్రియను బట్టి ఆత్మకు ఘనత, ఆధిక్యత, దైవకలయిక, పరలోక స్వాస్థ్యము పొందు గణనీయమైన ప్రగతిని సాధించును. శారీర ఆశలకు, దాని జ్ఞానమునకును అలవాటైన ఆత్మ దైవోగ్రతకును, భూలోకములో శరీరము అనుభవించు శిక్షలకును, పరలోకమందు జరుగబోవు నాశనకరమైన రెండవ మరణమునకును గురియగునట్లుగా ఫలితములను పొందును. ఇందునుబట్టి శరీర ఆత్మలకు సారధ్యము వహించువాడు మనస్సు. అనగా శరీర జ్ఞానమునకును, ఆత్మ జ్ఞానమునకును కారణము మనస్సు. రోమా 8:12-13. ఇందునుబట్టి యేసుప్రభువు మన శరీరేచ్ఛలనుబట్టి ఒకటి పేతురు 2-24 ఈ విధముగా మన శరీర ఆత్మలను గూర్చిన జాగ్రత్తలు ఉంటే నరులమైన మనము దైవాత్మ మనలో ఉన్నాడను జ్ఞానము కోల్పోయి, శారీర సంబంధముగా అనగా ఆస్థిని పోగొట్టుకొనో లేక ఇంటి ఇల్లాలు పరునితో లేచి పోవుటచేతను లేదా అధికమైన విద్యాజ్ఞానము చేతను మరియు బంధువుల రక్తసంబంధుల చేతను, స్నేహితుల చేతను చిన్న చూపు చూడబడినప్పుడు - ఈ శరీరముయొక్క జీవితముపై విరక్తి చెంది, ఏ నుయ్యో గొయ్యో చూచుకోవడము, ఎండ్రిన్ త్రాగడము, రైలు క్రింద పడటము మొదలుగా గల ఆత్మహత్య క్రియల మూలమున ఆత్మ మనకు అనుగ్రహించిన దేవునకు విరోధస్తులమై, ఆయన మనపట్ల ఆశించిన ఆశయములను నెరవేర్చక, శరీర జ్ఞానమునకు దాసులమై మరణ మార్గమునకు దారిని వెతుకుచున్నాము.
ఒక పక్షి యొక్క గుడ్డు చూచుటకు బహు అందముగా కనపడును. ఆ గుడ్డును ఆలాగే ఉంచితే కొలది కాలమునకు కుళ్ళి కృశించి నాశనమైపోవును. అదే గుడ్డును పొదగ వేసినప్పుడు అది ఆ గుడ్డులో రక్తమాంసములతో రూపాందించబడి అతి సుందరమైన ముద్దులు కొలుపు పిల్ల నూతనత్వముతో వెలుపలికి వచ్చును. అదే విధముగా మన శరీరమను ఈ గుడ్డులో ఆత్మకు నూతనత్వమును, పరిశుద్ధతను కలుగవలెనంటే మన శరీరమను ఈ గుడ్డు - శరీర జ్ఞానమను పక్షి క్రింద కాకుండ, పరిశుద్ధాత్మ అను పావురమును పోలిన మనలోని ఆత్మ జ్ఞానముతో పొదగబడినప్పుడు మన ఆత్మ కూడా దేవుని సన్నిధిలో సుందరమైనదియు, కళంక రహితమైనదియునై పరమాత్మ సన్నిధిలో ఆడుకొను పరిశుద్ధ పిల్లగా తయారగును.
.......
పరలోక సంబంధమైన ఫలములు - నరునికి ఈయబడిన ఆశీర్వాద ఫలములు వివరణ. ఈ గ్రంథము రెండు భాగాలు. 1. పరలోక సంబంధ ఫలములు 2. శారీర ఫలములు. ఈ పుస్తకము రెండు భాగాలుగా విభజింపబడియున్నది. ఇందులో మొదటి భాగము అన్నది ఈ పుస్తకములోని తొలి రచన రెండవ భాగ ఫలములను గూర్చి తర్వాత తెలిసికొందము.
ప్రియపాఠకులారా! పరలోక సంబంధ ఫలములు అనగా ఇవి దృశ్యమైనవి కావు. అదృశ్యమైనవి. శారీర నేత్రాలకు గోచరము కానివి, మనో నేత్రానికి కనబడేవి. ఈ విధముగా ఆత్మీయ మనోదృష్టి నేత్రములో పాతనిబంధన కాలములో ఎందరో మహనీయులు అక్షరాస్యులు కాకపోయినను, జ్ఞానులు కాకపోయినను, విద్వాంసులు, వేదాంతులు కాకపోయినను, కేవలము దైవత్వము ద్వారా నడిపించబడి, దైవిక నడుపుదల, ఆత్మీయ సంబంధ ఉజ్జీవముతో దైవమార్గములో నడిచి, దైవచిత్తముతో తమ ఇహలోక జీవితమును గడిపి వారి జీవితాలను పరిసమాప్తి చేసుకొన్నట్లు - పాతనిబంధన చరిత్రలో అనేకులను గూర్చి మనమెరిగిన సత్యము. వారియొక్క చరిత్రలు ఈనాటికిని పరిశుద్ధ గ్రంథములో ముద్రించబడి, నేటి తరమైన మానవ జీవితానికి ఆమోదమైయుండి, నరునియొక్క ఆత్మీయ జీవితానికి మహిమకరముగా ఉండుటన్నది కూడా మనమెరిగిన సత్యమే!
ప్రియపాఠకులారా! ఈ విధముగా ఆత్మయొక్క సావాసములో దైవమార్గములో - దైవచిత్తము ప్రకారముగా నడిచిన వ్యక్తుల పూర్వీక స్థితి ఈలాగు ఉంటే, నేడు విశ్వాసులమని చెప్పుకొంటున్న మన ఆత్మీయత, మన మనో నేత్ర స్థితి ఎలాగుంది? కూడా మనము తెలిసికోవలసియున్నది.
.......
లూకా 2:14, సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయనకిష్టులైన మనుష్యులకు భూమి మీద సమాధానమును కలుగును గాక!
ప్రభువునందు ప్రియసోదరీ సోదరులారా! పై ప్రవచనము మనుష్యులు మాట్లాడింది కాదు. ఇది పరలోక సమూహము అనగా నానావిధములు నానా రకములైన దూతల సముదాయములు బాలయేసును గూర్చి అభివర్ణిస్తూ స్తుతిస్తూ పల్కిన మాటలివి. ''సర్వోన్నతమైన స్థలములేవి? దేవునికి మహిమ ఏమిటి? ఆయనకు ఇష్టులైన మనుష్యులెవరు? భూమి మీద వారికి కల్గిన సమాధానమేది? ఈ వివరాలనుగూర్చి వేదరీత్యా తెలిసికొందము. లోకరీత్యా భూమి మీద ఉన్నత స్థలాలున్నవి. ఉన్నత స్థలాలను పర్వతాలు కొండలు మీద నరులు నివసించే ప్రదేశముగా మనమెరిగిన విషయమే. ఇక భూమికి పైన ఆకాశములో నివాస యోగ్యమైన ఉన్నత స్థలాలు లేవు అని చెప్పవచ్చును. ఎందుకనగా అచ్చట భూమి లేదు. సర్వోన్నతమైన స్థలాల జాబితాలో నవగ్రహాలు, నక్షత్రాలుగాని లెక్కలోకి రావు. అందుకే కీర్తనాకారుడైన దావీదు 15:1 మొట్టమొదటగా యెహోవా నీ గుడారములో అతిధిగా ఉండదగినవాడెవడు? నీ పరిశుద్ధ పర్వతము మీద నివసింపదగిన వాడెవడు? అని కూడా ప్రవచించియున్నాడు. ఇంతకు సర్వోన్నతమైన స్థలములన్నవి ఎక్కడనో లేవు. ఇందునుగూర్చి పాఠకులు ఏనాడైనను ఆత్మ జ్ఞానముతో మనోనేత్ర దృక్పధముతో - దైవ ప్రార్థన, దైవాత్మ ఆవేశముతో - దైవ దృక్పధముతో దైవజ్ఞానముతో ఆలోచించారా? ఆ విధముగా ఆలోచించే జ్ఞానము నరునికి ఉంటే లోకానికి పాపానికిగాని, అక్రమానికిగాని, మరణానికినిగాని, సాతానుయొక్క క్రియలకుగాని అవకాశము ఉండేది కాదు. ఈ సర్వోన్నత స్థలములనుగూర్చి నరుడు పరిశోధించనందున అనేక అవాంతరాలు, ప్రమాదాలు, సమస్యలను ఎదుర్కోవలసి వచ్చింది.
ప్రియపాఠకులారా! సర్వోన్నతమైన స్థలముల జాబితాలో హిమాలయ శిఖరాలు, ఆండీస్ పర్వత శిఖరాలు ఫిలిప్పీన్స్‌లోను, జపాన్‌లోను ఉన్నతమైన పర్వత శిఖరాలనుగూర్చి మనము ఆలోచిస్తే అదినరునికి నివాస యోగ్యాలుగా లేవు. అక్కడ దేవుడు మహిమపరచుటకు ఏ విధమైన అవకాశాలు లేవు. దేవునియొక్క మహిమ అక్కడ కనబడినట్లు లేదుగాని అచ్చట వికృతమైన వాతావరణమును, సకల జీవులను నిర్జీవముగా చేసే అగ్ని కీలలతో గంధకాలతో కూడిన వాతావరణమును కలిగియున్నవి. అగ్నిపర్వత మూలముగా భూకంపాలు కలుగుట మనమెరిగిన విషయమే. అలాగే హిమాలయ శిఖరాలు విపరీతమైన చలి నరుని నివాసానికి అయోగ్యములై రక్తాన్ని గడ్డ కట్టించే వాతావరణము కల్గింది. అయితే సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమ కలగాలన్న దైవ ప్రవచనము ఒట్టిదా? దైవ ప్రవచనము ఎప్పుడు ఏనాడు ఏ స్థితిలోను ఒట్టిది కానేరదు. ఇంతకును సర్వోన్నతమైన స్థలములన్నవి ఏవి? అన్నదే మన చర్చనీయాంశము. నరుని సర్వోన్నత స్థలములన్నవి నరునియొక్క హృదయాలే. నరుని హృదయాలలో దేవుడు మహిమపరచబడాలని ఆశిస్తున్నాడు. అందుకే గాన ప్రతిగానాలతో దేవుని మహిమపరచుచు, నరుల హృదయాలలో దేవునికి మహిమ కలగాలని ఇందునుబట్టి నరులయొక్క హృదయాలలో తాను మహిమపరచబడి, వారి ద్వారా స్తుతించబడి, వారి హృదయాలలో మహిమపరచబడాలి. వారు అర్పించే అర్పణలు, వారు కట్టే మందిరాలు, వారు ఇచ్చే కానుకలు కావు. ఇందునుగూర్చి ఎఫెసీ 4:6లో ఈ విధముగా వ్రాయబడి యున్నది. ఆయన అందరికీ పైగా ఉన్నవాడై అందరిలోను వ్యాపించి అందరిలో ఉన్నాడు. ఎలాగున్నాడు? అంటే 1 కొరింథీ 3:16-17 మీరు దేవుని ఆలయమైయున్నారనియు, దేవుని ఆత్మ మీలో నివసిస్తున్నాడనియు మీరెరుగరా? ఎవడైనను దేవుని ఆలయము పాడు చేసిన యెడల దేవుడు వానిని పాడు చేయును. దేవుని ఆలయము పరిశుద్ధమైయున్నది. మీరు ఆ ఆలయమైయున్నారు.
కనుక ప్రియపాఠకులారా! ఇందునుబట్టి దేవుడు కోరుకున్న సర్వోన్నత స్థలములన్నవి నరుని హృదయ పీఠమేనని మనము గ్రహించవలసియున్నది. ఆ హృదయములోని విశ్వాసము, హృదయములోని నిశ్చలత, హృదయశుద్ధి, ఆత్మవివేచన, ఆత్మ జ్ఞానము, భక్తి ఇవన్నియు హృదయము ద్వారానే కల్గును. కాబట్టి దేవుని యొక్క నివాసము సర్వోన్నత స్థలమైన హృదయమేనని ఇందునుబట్టి మనకు తెలుస్తున్నది. కాబట్టి హృదయంతో దేవుని మహిమపరచినప్పుడు మూలవాక్యములో రెండవ భాగమైన ''ఆయన కిష్టులైన మనుష్యులకు భూమి మీద సమాధానమును; ఆయన కిష్టులైన మనుష్యులెవరో? ముందుగా మనము తెలిసికొంటే ఆ తర్వాత సమాధానమును గూర్చి తెలుసుకొందము. ఆయన కిష్టులైన మనుష్యులెవరు? మొట్టమొదటగా ఆయన జనన సందర్భములో ఆయనను గర్భము ధరించిన తల్లి. తనను పోషిించిన మరియ భర్తయైన యోసేపు. వీరేగాకుండ ఆయన ఈ లోకములో జన్మించిన తర్వాత ఆయనను గూర్చిన వర్తమానమును ఆయన నక్షత్రము ద్వారా గ్రహించిన జ్ఞానులు, వారు ఆయన కిష్టులైన మనుష్యుల జాబితాలో చేర్చబడినారంటే వారు బాలయేసును యూదుల రాజుగా గ్రహించి, ఆయనకు బంగారము, బోళము, సాంబ్రాణితో ఆరాధించి, దైవమహిమకు యోగ్యులయ్యారు. ఆలాగే రెండవ స్థానములో గొల్లలు - వీరు బాలయేసును దర్శించి కీర్తనలతోను, పాటలతోను, పరిశుద్ధమైన హృదయముతోను బాలయేసును స్తుతించి ఆరాధించారు. మొట్టమొదట దేవునికి ఇష్టులైన జనాంగముగా వీరు నూతన నిబంధనలో లిఖించబడినట్లు తెలుస్తున్నది.
మూడవ వ్యక్తి సుమెయోను - సుమెయోను పల్కిన మాట లూకా 2:28-32. ఆయన తల్లిదండ్రులు శిశువైన యేసును దేవాలయములోనికి తీసికొని వచ్చినప్పుడు అతడు తన చేతులతో ఆయనను ఎత్తికొని, దేవుని స్తుతించుచు - నాధా! ఇప్పుడు నీ మాట చొప్పున సమాధానముతో నీ దాసుని పోనిచ్చుచున్నావు. అన్య జనులకు నిన్ను బయలుపరచుటకు వెలుగుగాను, నీ ప్రజలైన ఇశ్రాయేలుకు మహిమగాను, నీవు సకల ప్రజల యెదుట సిద్ధపరచిన నీ రక్షణ నేను కన్నులారా చూచితిని,'' అనుటలో ప్రియపాఠకులారా! సుమెయోను పల్కిన ఈ మాటలలో దేవునియొక్క మహిమ, ఆయన అనుగ్రహించిన సమాధానము రెండును మనకు బయల్పరచబడుచున్నది. ఎట్లనగా దేవుని కిష్టులైన మనుష్యులకు భూమి మీద సమాధానము,'' అనుటలో దేవుడు తన బిడ్డలకు అనుగ్రహించు సమాధానము క్రీస్తే. ఎట్లనగా యెషయా 9:6 చదివినప్పుడు అందులో ఈ విధముగా వ్రాయబడియున్నది. సమాధానమునకు అధిపతి ఎవరు? క్రీస్తే. ఆయన కిష్టులైన మనుష్యులకు సమాధానమంటే క్రీస్తే! ఆయనను మనకు అప్పగించిన ఇది మూలవాక్యములోని - ఆయనను అనుగ్రహించిన క్రీస్తే ఆ సమాధానము - ఇది సరియైన నిర్వచనము. సర్వోన్నతమైన స్థలములన్నవి ఎక్కడనో లేవు, అవి మన హృదయమనెడి క్షేత్రాలే. దేవునియొక్క సమాధానమేది? దేవుడు మన రక్షణార్థముగా ఆయన మనకు అనుగ్రహించిన ఆయన కుమారుడైన క్రీస్తే ఈ సమాధానము. మన పట్ల దైవత్వానికి ఆది నుండి ఉన్న విరోధాన్ని, వైషమ్యాన్ని, ఉగ్రత, శిక్ష నుండి, యావద్ నరులైన మనలను విమోచించి, తండ్రితో సమాధానపరచి, పరలోక రాజ్య ప్రవేశానికి మనలను యోగ్యులుగా చేశాడు. ఇందునుబట్టి ఈయన సమాధానకర్త. కనుక మనము దేవునితో సమాధానము పడాలంటే మరియు దైవత్వమునకు యోగ్యులుగా జీవించాలంటే రోమా 10:9 యేసు ప్రభువుని నీ నోటితో ఒప్పుకొని, దేవుడు మృతులలోనుండి ఆయనను లేపెనని నీ హృదయమందు విశ్వసించిన యెడల - ఆయన మహిమ, తన సమాధానము, రక్షణ మనకు కలుగుతుందని ఇందునుబట్టి మనము గ్రహించవలసియున్నది.
పతనమును గూర్చిన ప్రసంగము
అపొ 9:1 సౌలు ఇంకను ప్రభువు యొక్క శిష్యులను బెదిరించుటయు, హత్యచేయుటయు తనకు ప్రాణాధారమైనట్టు :
ప్రభువునందు ప్రియ క్రైస్తవ సహోదరులారా! మానవ జీవితములో లోకరీత్యా ఎన్నో విధములైన సంఘటనలు జరుగుచుండును. అయితే అవి లోకసంబంధమైనవి. దేవుడు నరుని పుట్టించినప్పుడు వాడు శ్రమల పాలు కావాలని ఆయన అనుకోలేదు, ఆయన అనుకొనడు కూడా. ఆయన ప్రతివానికిని ఏదో విధమైన తలాంతులను అనుగ్రహించియున్నాడు. ఈ తలాంతు నరులకందరికి ఒకే విధముగా ఉండక నానారీతులుగ దేవుని చేత అనుగ్రహించబడియున్నది. కొందరిని రాజ్యాలేలు రాజులుగాను, కొందరిని మంత్రులుగాను, కొందరిని సైన్యాధిపతులుగాను, కొందరిని రౌతులుగాను, సైనికులుగాను, వేగులవారిగాను, హస్తకళానైపుణ్యముగల పనివారుగాను, నానావిధములైన తలాంతులతో జీవిత యాత్రను సాగించుకొను భాగ్యాన్ని దేవుడు ప్రసాదించియున్నాడు. ఇది లోకసంబంధమైనది.
ఇక ఆత్మ సంబంధమైన విషయములో పరమాత్మ యొక్క ఏర్పాట్లు ఆశ్చర్యకరముగా ఉన్నవి. ఇట్టి వివరాలను వేదరీత్యా తెలిసికొందము. మొట్టమొదటగా మనము గ్రహించవలసినది నరజీవితములో దేవుడు ఉన్నత స్థితిని - ఉన్నత విధానములో ప్రతి యొక్కరిని తన చిత్తానుసారముగా నానావిధములైన తలాంతులతో దేవుడు భూమి మీద జీవింపజేయుచున్నాడు. కాని ఈ తలాంతును నిలుపుకొని సద్వినియోగపరచుకొనువాడు ధన్యునిగాను, యోగ్యునిగాను, పుణ్యపురుషునిగాను వేదము వక్కాణిస్తున్నది. నరజీవితములో తలాంతన్నది రెండు విధములై యున్నది. 1. దేవుని చేత ఏర్పరచబడి, దేవుని చేత ఎన్నిక చేయబడినప్పుడు ఆయన అనుగ్రహించిన తలాంతు. 2. ఈ లోకము మూలముగ ప్రభుత్వాలు, ప్రధానులు, పరిపాలకులు చేత అనుగ్రహించబడిన హోదాలు, ఆధిక్యతలు, అధికారాలు, వగైరాలు. అలాగే ఈ తలాంతులను నరుడు సక్రమముగా వినియోగించుకోనప్పుడు కలిగే పతనావస్థ కూడా రెండు విధములు.
1. ఆత్మ సంబంధమైన పతనావస్థ 2. శారీర సంబంధ పతనావస్థ. ఇందులో మొదటిగా ఆత్మ సంబంధ పతనావస్థను గూర్చి ధ్యానించుకొందము. పరమాత్ముడు ఏదెను వనములో నరుని సృష్టించినప్పుడు వానికి ఐదు తలాంతులు ఇచ్చినాడు. అందులో ఆది 2:7లో వలె దేవుని చేత మట్టిచే రూపించబడిన నర శరీరములో జీవాత్మ ప్రతిష్టిత. ఇది మొదటి తలాంతు. అనగా తన ఆత్మతో దేవుడు ప్రతిష్టించుట. 2. తన సృష్టి మీద నరునికి అధికారము 8వ కీర్తన. 3. దేవుని పరిశుద్ధ స్థలమైన ఏదెను మీద తోట కాపరిగా ఆధిపత్యము. 4. తనకు జంటగా పరమాత్ముడు స్త్రీని నిర్మించిన కార్యక్రమములో గాఢనిద్రలో నుండి స్త్రీయొక్క సృష్టి మర్మమును తెలిసికోగల్గిన ఆత్మీయ జ్ఞానము : ఇది దేవుని చేత అనుగ్రహించిన గొప్ప తలాంతు. 5. దైవత్వముతో ముఖాముఖిగ మాట్లాడే యోగ్యత : ఇవి ఆత్మ సంబంధమైన ఆధిక్యతలుః ఇట్టి ఉన్నత స్థితి నుండి ఆదాము పంచారిష్ట దోషముల మూలాన్ని, పాపాన్ని, శాపాన్ని, మరణాన్ని సంపాదించుకున్నాడు. ఇది నరుడు ఆత్మీయ స్థితి నుండి ఉన్నత విలువలను పోగొట్టుకొని పతనావస్థలో దిగజారిన చరిత్ర.
ఇక శారీరముగా లోకసంబంధమైన అధికారాలు తలాంతులను పొంది, శారీర జీవితములో పతనావస్థను పొంది ఆత్మీయముగా ఆధిక్యతలను పొందిన వ్యక్తిని గూర్చి మనము తెలిసికోవలసియున్నది. ఈ సందర్భములో నూతన నిబంధనలో సౌలు జీవితము ఇందుకు పోల్చవచ్చును. సౌలునకు లోకము అనుగ్రహించిన తలాంతులు, ఆధిక్యతలు. 1. ప్రభువు శిష్యులను బెదరించుట, చెరపెట్టుట, హత్య చేయుట అన్నది. 2. డమస్కు చేత అధికార పత్రమును పొందుట. ఆనాటి డమస్కు పరిపాలకులు సౌలునకు రాజాశ్వమునిచ్చుట. 3. యుద్ధాయుధాలు. 4. అంగరక్షకులు. 5. సైనిక అధికార హోదా! ఈ ఐదు సౌలుయొక్క శారీర జీవిత పతనావస్థకు కారకములైనవి. ఇట్టి స్థితిలో సౌలు వీటిని పోగొట్టుకొని గుడ్డివాడయ్యెను. అయితే ఆత్మీయముగా ఆత్మీయ చూపుకలవాడై తనయొక్క అపరాధములు పాపముల మూలముగ పొందిన మరణావస్థ నుండి, పునరుద్దీపితుడై నిశితమైన ఆత్మీయ దృష్టికలవాడై, జలబాప్తిస్మము ఆత్మాభిషేకము పొంది శారీర మాలిన్యము నుండి దూరపరచబడి, పరిశుద్ధ జీవితములో అపొస్తలుడగు పౌలుగా బిరుదును సంపాయించాడు. అనగా శారీర జీవితములో సౌలు, ఆత్మీయ జీవితములో పౌలుగా వక్కాణించబడినాడు. అంతియేగాక అపొస్తలులలో అగ్రగామియై ఎనిమిది సంఘాలకు లేఖలు వ్రాశాడు. ప్రభువుయొక్క రాజ్య సువార్త నిమిత్తము హతసాక్షి అయ్యాడు. ఇవి శారీర తలాంతును పోగొట్టుకొని, ఆత్మీయమైన దైవిక తలాంతులను, ఆధిక్యతలను, ఆశీర్వాదాలను, నూతన నిబంధన వేదములో ఒక ప్రధాన పాత్రను సంపాదించుకొన్న పౌలు చరిత్ర.
ఇక మొదట వివరించిన రీతిగా ఆదాము తన ఆత్మీయ జీవితమును కోల్పోయినటువంటి తలాంతులేవి? శారీరయుతముగా తాను సంపాయించుకున్న లోకసంబంధమైన శపితమగు ఫలితాలేవి? అన్నది ముందు తెలిసికొందము. మొదటగా ఆదాము పోగొట్టుకున్న ఆత్మీయ తలాంతులు. 1. దేవునితో సావాసము. 2. సృష్టితో సావాసము. 3. ఏదెను వనములో వారసత్వము. 4. జీవాత్మ యొక్క విలువను, 5. సృష్టికర్త యొక్క మహిమను ఇవి ఆత్మీయముగ పోగొట్టుకున్నవి. ఇక సంపాయించుకున్నవి. 1. దైవోగ్రత 2. సృష్టి భయము అనగా పంచభూతాలు మృగ కీటకాదులు వగైరాలతో కూడిన భయానక స్థితి 4. శాపము 5. మరణము; పౌలు శారీర సంబంధముగా కోల్పోయినవి :- దమస్కు అధికారము 2. తానెక్కిన గుర్రము 3. తన ఆయుధాలు 4. తన అంగరక్షకులు 5. కనుచూపు. సౌలు పౌలై ఆత్మీయముగా సంపాయించుకున్న ఆధిక్యతలు :- 1. గుడ్డితనమును పోగొట్టుకున్నాడు. 2. ప్రభువులో పునర్జన్మ పొంది ఆత్మావేశుడాయెను. 3. అపొస్తలులలో అగ్రజుడయ్యాడు. 4. క్రీస్తును పోలి నడిచాడు. 5. క్రీస్తు నిమిత్తము హతసాక్షి అయ్యాడు. ఇవి సౌలు పౌలై సంపాయించుకున్న అమూల్య సంపద మరియు తలాంతులు.
పై ఇరువురి చరిత్ర ఇట్లుండగా నేటిక్రైస్తవులమైన మనము లోకరీత్యా మనకు గల్గు దుస్సంఘటనలు, ప్రతికూల పరిణామాలు నరుల చేత పరాభవము కలిగినప్పుడు మన విశ్వాసమును కాపాడుకుంటూ - ఆత్మీయముగా పోరాడవలసినవారమైయున్నామే గాని, దైవత్వముతో ఢీకొని ఆయనను దూషిస్తూ శాపనార్థాలు పెట్టుట - విమర్శించుటన్నది మన జీవితములో మనలో ఉన్నట్లయితే దాని ద్వారా ఉభయ భ్రష్టత్వము అనగా ఆత్మీయముగా శరీరముగా భ్రష్టత్వము పతానవస్థ తప్పదని ఇందునుబట్టి మనకు తెలియుచున్నది.
.......
నరునికి చేతి కర్ర ఎందుకు వచ్చింది? ఈ చేతి కర్ర అన్నది అబ్రాహాము మొదలుకొని పాతనిబంధన అంతము వరకు ఉన్న యాజకులు, ప్రవక్తలు, రాజులు, నాయకులు, దీర్ఘదర్శులు, వగైరా భక్తకోటి వరకు ఈ చేత కర్ర అవసరత ఉండినట్లు వేదరీత్యా కొందరి జీవిత విధానాలను తెలిసికొందము. ఆదికాండము ఆరవ అధ్యాయము వరకు జీవించిన నరకోటిలో ఎవనికిని చేతి కర్ర లేదు. అంటే చేతి కర్ర మీద ఆధారపడే అవసరత నరునికి లేదు.
మొదట అబ్రాహాము చేతికి ఇవ్వబడిన చేతి కర్ర దైవ విశ్వాసమునకు గుర్తు. ఈ కఱ్ఱ ద్వారా అబ్రాహాము తన విశ్వాసాన్ని పదిలపరచుకున్నాడు. అబ్రాహాము చేతిలో ఉన్న చేతి కర్ర దేవుని మహిమార్థముగా వాడబడలేదు. కాని అబ్రాహాము విశ్వాసాన్ని బలపరిచింది.
దేవుడు మోషే కిచ్చిన చేతి కర్ర దేవుని మహిమార్థముగాను, నరునికి రక్షణార్థముగాను ఇవ్వబడినట్లు మోషే చేతి కర్రతో చేసిన పాము - అదే చేతి కర్రతో మోషే రప్పించిన తెగుళ్ళు; అదే చేతి కర్రతో బండను తాకి రప్పించిన జలధార, అదే చేతి కర్రతో ఎఱ్ఱ సముద్రాన్ని కొట్టినప్పుడు అది కంపు కొట్టుట - అదే కర్రతో సముద్రాన్ని కొట్టగా రెండు పాయలైనది. ఇది దైవమహత్తర క్రియయైనటువంటి కర్ర మహాత్మ్యము.
సౌలు ఇశ్రాయేలు రాజు గాక మునుపు తాను గాడిదల కాపరిగా ఉన్నప్పుడు అతని చేత వాడబడిన కర్ర ఇశ్రాయేలు జనాంగముపై ఆధిపత్యము వహించుటకు నాంది పల్కింది. ఇట్టి కాపరత్వము ద్వారా సౌలు తాను పోగొట్టుకున్న గాడిదలను తన చేతి కర్ర ద్వారా వెదకుచు, తైలాభిషిక్తుడై దైవ అనుగ్రహమునకు నోచుకొని, దైవ జనాంగము మీద పరిపాలకుడగుటకు, కఱ్ఱ పోయి కత్తిని చేతబట్టే యోగ్యత సౌలు పొందినాడంటే దానికి కారణము అతని చేతి కర్రయే! చేతి కర్రయే దుడ్డు కర్ర. అందుకే కీర్తనాకారుడైన దావీదు తన పూర్వానుభవములో గొర్రెలను మేపిన దినములలో చేతి కర్రకున్న ప్రాధాన్యతను పూర్తిగా ఎరిగియున్నట్లు దావీదు జీవితములో జరిగిన సంఘటన మొదటి సమూయేలు 18:లో దావీదు బాలుడుగా ఉన్నప్పుడు ఫిలిష్తీయ దండులో ప్రవేశించి, గొలియాతుతో పోట్లాడుటకు వెళ్ళు సందర్భములో దావీదును ధైర్యపరచింది చేతి కర్రయే! అనగా దుడ్డుకర్ర. అంటే శత్రువు ఎంతటి బలవంతుడైనను, ఎంత ఆధిక్యత గలవాడైనను, ఎట్టి యోధుడైనను, వాని కుక్కతో సమానముగా ఎంపిక జేసింది దుడ్డుకర్రయే! అందుకే గొలియాతు దావీదుతో అంటున్నాడు. చేతి కర్ర పట్టుకొని వచ్చుచున్నావు. నేను కుక్కనా? అన్నట్లు చదువగలము.
అలాగే అహరోనుయొక్క చేతి కర్ర (దుడ్డు కర్ర) ఐగుప్తీయ శకునగాండ్ర సర్పాలను మ్రింగివేసింది. ఇంతెందుకు? మిద్యానీయులకు భయపడి న్యాయాధిపతులు 6:లో గానుగ చాటున దాగి గోధుమలను దుల్లగొట్టు గిద్యోనును ధైర్యపరచింది కర్రయే! ఏలీయాను నడిపించింది కర్రయే! బలి పీఠములకు వాడబడినది కర్రయే, మందసమును ఉంచిన పేటిక, బల్ల మందిరముయొక్క ద్వారబంధాలు, తలుపులు ఇవన్నియు కర్రలే!
అయితే పాతనిబంధన అంతము నూతన నిబంధన ప్రవేశములోను అనగా అపొస్తలుల కాలము వరకు కర్ర బహుముఖముగా చేతి కర్రగా దుడ్డు కర్రగా వాడబడింది. యేసుక్రీస్తు శిష్యులు కూడా కర్ర పట్టుకున్నట్లును, ఈ విధముగా క్రియ జరిగించిన కర్ర ఆదిలో ఆదాముకు లేదు. అయితే ఆదామును ఆదరించింది ఏది? దావీదు కీర్తన 23లో నీ దుడ్డుకర్రయు నీ దండమును నన్ను ఆదరించును,'' అన్నాడు. నిశ్శబ్ద వాతావరణము, నిర్మానుష్య ఒంటరి జీవితములో ఆది నరునికి చేతిలో కర్ర ఉన్నట్లుగ వేదములో లేదు. కారణము ఆత్మీయమైన కర్రగా దేవుడతనికి తోడైయున్నందువలన శత్రు భీతి లేదు. సకల ప్రాణులు ఆదాముతో సఖ్యత కల్గియున్నందున జంతుభయము, సర్ప భయము లేదు. ఒక్క మాటలో చెప్పాలంటే ఆదాము యొక్క దృక్పధములో దేవుడే రక్షగా ఉన్నందువలన కర్ర అక్కరలేదు. ఈ విధముగా ఆత్మీయమైన కఱ్ఱతో నిర్భయముగా జీవించిన జీవాత్ముడైన నరునికి - దృశ్యమైయున్న దైవ నిషేధ చెట్టు ఫలము దైవాజ్ఞను మీరి తినుటను బట్టి, నరుడు ఆత్మీయ దుడ్డు కర్రను కోల్పోయి, దృశ్యమును భూసంబంధమునైన చెట్టుకర్రను ఆశ్రయించు గతి ఏర్పడింది.
అయితే ఈనాటి మన జీవితములో ఈ కర్రలు కటారులు కత్తులు అవసరమా? లేదు, ఎందుకంటే ''నీ వాక్యము నా పాదములకు దీపము - నా త్రోవలకు వెలుగు,'' అన్నట్లుగ ఇప్పుడాదుడ్డు కర్ర మనకు వాక్యము. ఆయన ఇచ్చిన దండము మనకు వెలుగు అనగా నేటి క్రైస్తవులమైన మనకు దుడ్డుకర్ర వాక్యము - దండమనగా ప్రార్థన. ఈ ప్రార్థన అను దండము దైవ ప్రత్యక్షీకరణకు సాధనము. అనగా దైవత్వముతో మాట్లాడుటకు సాధనము.
......
దీవెన :- ప్రియపాఠకులారా! మన గృహాలలో సర్వ సాధారణముగా వివాహ కార్యాలు, పుట్టిన పండుగ కార్యాలు, ఆయా పండుగ సందర్భాలలోను, నూతన సంవత్సరము వగైరా సందర్భాలలో పెద్దలు - సంఘకాపరులు లేక తల్లిదండ్రులు మనలను దీవించెదరు. అనగా ఆశీర్వదిస్తుంటారు. విద్యా వివాహ సందర్భాలలోను గాక సంఘ ఆరాధన కార్యక్రమాలలో - సంఘకాపరి ఆరాధన అనంతరము ప్రభువు ప్రార్థన - ఆశీర్వాదము, దీవెనలు సంఘానికి తెలుపుచుండును.'' ఇది ఇహలోక సంబంధముగా జరుగుచున్న ఆనవాయితీ - అయితే ఈ ఆశీర్వాదము దీవెన అన్నది - ఎప్పటినుండి ప్రారంభమైందో ఇతర గ్రంథాలలో లేదుగాని బైబిలులో ఖచ్చితముగా వ్రాయబడియున్నది. ఈ సందర్భములో ఆది 1:28లో దేవుడే మొట్టమొదట ఈ దీవెన నరకోటికి అనుగ్రహించినట్లు ఈ వేదవాక్యములో చదువగలము.
ఈ దీవెన ఎటువంటిదంటే ఫలభరితమైన జీవితము విస్తరింపు గల జీవితము. భూమిని స్వతంత్రించుకొను జీవితము దానిని ఏలెడి అధికారము, సృష్టిలోని సృష్టములన్నియు నరునికి లోబడినట్లుగాను, భూలోకము మీద పరిపాలనాధికారము కలుగునట్లుగాను, ఈ ఆశీర్వాదపు దీవెనయొక్క పరమార్థమైయున్నది. ఈ విధముగా ప్రారంభమైన ఈ ఆశీర్వాదపు దీవెన ఆది 9:1లో దేవుడు నోవహును మరియు అతని కుమారులను ఆశీర్వదించి మీరు బహుగా ఫలించి అభివృద్ధి పొంది భూమిని నిండించి దానిని ఏలుడి? భూమి మీద నుండు జంతువులకును, సముద్ర చరములన్నిటికిని, పక్షులకును మీకు భయపడును. అవి మీ చేతికి అప్పగింపబడి యున్నవి. ప్రాణము గల సమస్త చరములు మీకు ఆహారమగును.''
మొదటి దీవెన సృష్టి ఆరంభములో - దేవుడు లోక సృష్టినంత సృష్టించిన తర్వాత దేవుని యొక్క సన్నిధిలో దైవ సృష్టములైన జంతుజాలముల మీద అధికారిగ దైవహస్త నిర్మితులైన నరజంటను రూపించి, ఆశీర్వదించి, సృష్టి మీద సర్వాధిపత్యము వహించుచున్నట్లు దీవించినాడు. ఈ ఆశీర్వాదము ఎంతో కాలము నిలువలేక నరుని యొక్క ఆత్మీయ బలహీనతనుబట్టి దైవవ్యతిరేక కార్యములనుబట్టి ఆశీర్వాదమునకు బదులు శాపమును మరణమును సంపాదించుకొని, దైవవిరోధియై, దైవ సన్నిధి నుండి తరుమబడి, దైవవనము నుండి వెలివేయబడినాడు. మొదటి నరునికి దేవుడిచ్చిన ఆశీర్వాదము, దీవెనలను కాపాడుకోలేని విధమునుబట్టి సంక్రమించిన అధోగతి.
అయితే దేవుడు తన ఆశీర్వాదపు దీవెనలు భూమి మీద వ్యర్థమైనందుకు ఆగ్రహించి, నొచ్చుకొని సంతాపపడి ఉగ్రుడై ఏ జలముల నుండి సృష్టికి పూర్వము భూమిని పైకి తీశాడో అదే జలములతో మరల భూనాశనమునకు సంకల్పించి, ప్రణాళికను రూపొందించి, నీతిమంతుడుగ ఉన్న ఒక కుటుంబాన్ని
పునఃసృష్టి కొరకు ఎంపిక చేసి, వాని కొరకును, వాని కుటుంబము కొరకును నాటి ఏదెనులో వలె తోట కాక, ఓడ గృహాన్ని నిర్మింపజేసి - ఏదెను వనములో జంతుజాలముతో ఆది నరుడు ఏ విధముగా నివసించాడో సంచరించాడో అదే విధముగా అగాధ జలముల మీద దైవ నిర్మితమైన ఓడ గృహములో నీతిమంతుడైన నోవహు - జంతుజాలములతోను, మృగపక్షి సముదాయములతోను 150 దినములు జలముల మీద నివసించినట్లుగా పునఃసృష్టి నిర్మాణ సందర్భములో ఆదికాండము 8:1-19 చదివితే వివరముగా మనకు తెలియగలదు. అటుతర్వాత మూడవ దీవెన కూడా నోవహు అతని కుటుంబానికి చెందింది. అంటే మొదటి దీవెన, ఆశీర్వాదము ఆదామునకు, అతని భార్యయైన హవ్వకును దేవుని ద్వారా కల్గింది. రెండవ దీవెన నోవహునకు, అతని కుటుంబానికి, కుమారులకును కల్గినట్లుగ ఇందునుబట్టి తెలియుచున్నది. ఈ దీవెన ప్రకారము సృష్టి లయమైపోగా పునఃసృష్టి కార్యక్రమములో జరిగిన తేడాలను ఈ సందర్భములో మనము తెలిసికోవలసి యున్నది. మొదటి దీవెన తోటలో - రెండవ దీవెన ఓడలో - మూడవ దీవెన ఓడ నుండి బైటికి వచ్చిన తర్వాత సృష్టిని ఫలభరితము గావించి, దాన్ని విస్తరింపజేయవలసిన కార్యక్రమాన్ని గూర్చిన దీవెన మూడవ దీవెన. దూడను తెచ్చి ఆది 18:8లో అతడు వెన్నను పాలను తాను సిద్ధపరచిన దూడను తెచ్చి వారి ఎదుట పెట్టి - వారు భోజనము చేయుచుండగా నీ భార్యయైన శారా ఎచ్చట ఉన్నది? అనగా గుడారములో ఉన్నదని చెప్పెను. అంతట వారు మీదటికి నీ భార్యయైన శారాకు ఒక కుమారుడు కలుగునని చెప్పెను. ఇది సంతాన సౌభాగ్యపు ఆశీర్వాదపు దీవెన.
ప్రియపాఠకులారా! ఇప్పుడు వివరించిన మూడు విధములైన దీవెనలు దేవుడు నరుల కనుగ్రహించినవి. ఇప్పటివరకు తండ్రి దీవెన అనేది లేదు. అయితే తండ్రి కుమారుని దీవించుటకు హక్కు ఎవరు ఇచ్చాడు. తండ్రి కుమారుని ఆశీర్వాదించుటకు యోగ్యత ఎక్కడ నుండి వచ్చింది? అన్నది మనమిప్పుడు తెలిసికోవలసియున్నది. అబ్రాహాముకు దేవుడు దీవెనలు ఇచ్చియున్నాడు. వాటిని గూర్చి మనము తెలిసికొందము. అబ్రాహాముకు దేవుడు ఇచ్చిన ప్రభావితమైనది మరియు తరతరములు తరగనట్టి ఆశీర్వాదము అబ్రాహామునకు ఉన్నది. ఎట్లనగా ఆది 22:16-18లో చదువగలము. ''నీవు ఒక్కగానొక్క కుమారుని వెనుదీయక బలి యిచ్చుటకు సిద్ధపడితివి గనుక ఆకాశ నక్షత్రములవలెను, భూమి మీద ఇసుక రేణువులవలెను నీ సంతతి విస్తరించును. వారు శత్రువుల గవినిని స్వాధీనపరచు కొందురు. నీ సంతానము ఆశీర్వదించబడును.'' నా తోడు అని ప్రమాణము చేస్తున్నానని యెహోవా సెలవిచ్చెను. ఇస్సాకునకు దేవుడు అనుగ్రహించిన ఆశీర్వాదము ఆది 26:1-5 మరియొక కరువు ఆ దేశములో వచ్చినప్పుడు అబీమెలెకు నొద్దకు వెళ్ళెను. దేవుడు ఆయనకు ప్రత్యక్షమై ఐగుప్తులో నివాసము చేయునప్పుడు నీకు తోడైయుండి నిన్ను ఆశీర్వదింతును. ఆకాశ నక్షత్రముల వలె నీ సంతానమును విస్తరింపజేసి, ఈ దేశములన్నియు నీ సంతానమునకు ఇచ్చెదను, నీ సంతానము వలన భూలోకములోని సమస్త ప్రజలు ఆశీర్వదింపబడెదరు. నేను విధించిన నా ఆజ్ఞలను నా కట్టడలను గైకొనమని చెప్పెను. మరియొక మాట ఆది 26:12 ఇస్సాకు ఆదేశమున విత్తనము వేసి నూరంతల ఫలము పొందెను. యెహోవా అతనిని ఆశీర్వదించెను గనుక ఆ మనుష్యుడు గొప్ప ఫలము పొందెను. అతనికి కలిగిన ఐశ్వర్యమునుబట్టి ఫిలిష్తీయులు అతనియందు అసూయపడిరి.
ఈ విధముగా ఇస్సాకు దేవుని వలన, తండ్రి వలనను, తల్లి వలనను ఆశీర్వదించబడినవాడై, ఇట్టి చతుర్ముఖ ఆశీర్వాద బలమునుబట్టి అనగా సృషికర్తయొక్క దీవెనను కన్నతండ్రియొక్క దీవెన, కన్నతల్లి యొక్క దీవెన తనయొక్క పవిత్రమైన ప్రవర్తననుబట్టి దేవుడు తనకిచ్చిన దీవెన - ఈ నాలుగు విధములైన దీవెన ప్రభావమూలమున నాలుగు దీవెనలు కలిగియున్నట్లు ఆది 27:1-4 చదివితే - ఇస్సాకు తాను కలిగియున్న దైవ - మాత - పిత ఆశీర్వాద బలములను, వాటి శక్తులను, జిహ్వ చాపల్యమును బట్టి తుచ్ఛమైన మాంసాహారమును ఆశించి, జ్యేష్టుడెవరో కనిష్టుడెవరో ఎరుగని స్థితిలో అయోగ్యముగా ఆ దీవెనలను ఖర్చు పెట్టినాడు,'' అని తెలియుచున్నది.
అలాగే ఇస్సాకుయొక్క జ్యేష్టకుమారుడైన ఏశావు ఈసాకుయొక్క సంపూర్ణమైన నాలుగు విధములైన దీవెనలు పొందవలసిన వారసత్వము కలిగియుండి, ఆ దీవెనలు పొంది, సర్వ హక్కు అనుభవాలతో భూలోకములో దైవత్వానికి మానవత్వానికి ప్రీతికరముగా జీవించవలసినవాడైయుండగా - ఆది 25:29-34 చదివితే ఏశావు తనకు కలుగబోవు దీవెనలను, వాటి వారసత్వపు విలువలతో సహా సర్వహక్కులతో యాకోబు వండుచున్న కలగూర వంటకము యొక్క వాసన, దాని రంగు, దాని ఆకర్షణ కడుపులోని క్షుద్భాధ, ఆత్మీయ బలహీనత వగైరా నాలుగు విధములైన బలహీనతలకు దాసుడై, తన జ్యేష్టత్వపు హక్కును ప్రమాణ పూర్వకముగా ఈ యాకోబునకు ధారాదత్తము చేసినట్లు చదువగలము. ఈ విధముగా ఏశావుకు రావలసిన సర్వ దీవెనలు, ఆశీర్వాదములను తండ్రియైన ఇస్సాకు ఇవ్వక పూర్వమే యాకోబు వాటిని కొనేశాడు. ఏశావు యాకోబుకు అమ్మేశాడు. ఈ విధముగా ఉభయుల మధ్య జరిగిన ఒడంబడికలను మాంసాహార భోజన ఆసక్తుడైన ఇస్సాకునకు దేహ సంబంధ గుడ్డితనము ఆత్మ సంబంధమైన గుడ్డితనము రెండును ఆవరించి, అతనిని సంపూర్ణముగ గుడ్డివానిగాను, జ్ఞానహీనునిగాను జేసినందువలన ఏ దీవెన కూడా ఇస్సాకు దగ్గర మిగిలియుండక పోవుటయేగాక అతనిని అ శక్తునిగా జేసేటటువంటి స్థితికి దిగజార్చినవి. అందునుబట్టి ఆదికాండము 27:38లో నా తండ్రీ! నీ యొద్ద ఒక్క దీవెనయే ఉన్నదా? నా తండ్రీ! నన్ను కూడా దీవించుమని ఎలుగెత్తి ఏడ్వగా ఇస్సాకు ఏశావుకు శాపనార్ధాలు పెట్టినట్లుగా ఆదికాండము 28:39-40 వచనాలు వివరిస్తున్నవి. అదేమిటంటే - నీ నివాసము భూసారము లేనిది, నీ కత్తి చేత నీవు బ్రతుకుదువు - నీ సహోదరునికి దాసుడవగుదువు, నీ మెడ మీద నుండి అతని కాడి విరిచి వేసెదవు అని అనుట,' ఇది దీవెనా? శాపమా? ఇది పాఠకులే తేల్చండి? అందువల్ల అతనికి ఇట్టి శాపనార్ధాల వలన ఏశావు దైవత్వములో ఎదుగుటకు అవకాశాలు లేకుండ పోయినవి. అయితే యాకోబు - తండ్రి దీవెన, దేవునితో పోట్లాడి దేవుని ఆశీర్వాద బలమును, దేవుని శక్తిని, బలాన్ని ప్రత్యేకముగా పొంది, ఇంతేగాకుండ తన పేరు కూడా దేవుని చేత మార్చబడి ఇశ్రాయేలై తన ద్వారా 12 గోత్రాలలో ఒక గోత్రములో దేవుడే స్వయముగా ఇతని గోత్రాలలో ఒకటైన యూదా గోత్రములో - దేవుడే లోకపాపనివారణార్థము నరకోటియొక్క నరక మరణ విమోచనార్థము నరావతారములో భూలోకములో జన్మించుటకు ఇతని నుండి రూపించబడిన యూదా గోత్రము మూలమైయున్నట్లు వేదములో మనము చదువగలము.
ప్రియపాఠకులారా! ఇప్పుడు గ్రహించితిరా? యాకోబు యొక్క జీవితములో దేవుడు అనుగ్రహించిన దీవెనలు, తండ్రి యొక్క దీవెనలు, తల్లి యొక్క దీవెనలు, వాటి ప్రభావము, వాటి నెరవేర్పు, వాటి ద్వారా యాకోబు సాధించిన ఘన విజయాలచరిత్రను ఎరిగియున్నారు గదా? ఆ విధముగా అట్టి దీవెన ప్రభావముతో మనము కూడా ఒక అంశములో యోగ్యత పొందుటకు యోగ్యులమగుదుము గాక!
.......
మొదటి కొరింథీ 5:6-8, మీరు అతిశయపడుట మంచిది కాదు. పులిసిన పిండి కొంచెమైనను ముద్దంతయు పులియజేయునని మీరెరుగరా? మీరు పులి పిండి లేనివారు గనుక ఆ పాతదైన పులిపిండిని తీసి పారవేయుడిః
ప్రియపాఠకులారా! పరిశుద్ధ పౌలు వివరించిన వాక్య సారాంశమును గూర్చి మనము ధ్యానించెదము. లోకరీత్యా మన ఇహలోక జీవిత ఆహార విధానములో పులిసిన పిండి, పులియని పిండి రెండు విధములైన పిండి పదార్థములు ఆహారములో వాడబడుచున్నవి. పులిసిన పిండితో చేసేటటువంటి పిండి వంటలు ఇడ్లీ దోసె పొంగళాలు బేకరీ రొట్టెలు బన్నులు వగైరాలు. ఇవి పులిసిన పిండితో చేయబడేవి. మానవ ఆహార సమస్యలో దోహదకారిగ ఈ పులిపిండి ఉన్నది. అలాగే పులియని పిండితో రొట్టెలు పూరీలు చపాతీలు బిస్కట్లు కేకులు వగైరాలు తయారగుచున్నవి. పులిసిన పిండి ప్రత్యేకముగా ఎక్కడనో తయారయ్యేది కాదు. పులియని పిండి నిలువరమైనప్పుడు నరుల కృత్రిమ పద్ధతిలోను, వారియొక్క స్వజ్ఞానమును బట్టి నిలవరమైన పులియని పిండి పులిసిన పిండిగా మారుచున్నది. పులియని పిండి పులిసిన పిండిగా మారాలంటే, పులియని పిండిలో పులిసిన పిండిని కలుపవలెను. అప్పుడు పులిసిన పిండితో కూడిన పులియని పిండి కూడా - పులిసిన పిండిగా మారుతుంది.
ప్రియపాఠకులారా! ఈ ఉపమానములో పులిసిన పిండి పాత జీవితము, పులియని పిండి నూతన జీవితము. పులిసిన పిండి పాపులైన నరసందోహమునకు సాంకేతికము. పులియని పిండి పరిశుద్ధులైన నీతిమంతులకు సాంకేతికము. అనగా పులిసిన పిండి మనము, పులియని పిండి క్రీస్తు అనగా ప్రాచీన స్వభావముతో కూడిన మన జీవితము. నూతన స్వభావము, నూతన విధానమైన జననము క్రీస్తుయొక్క దేహమైయున్నది. ఈ పులిసిన పిండి అన్నది 8వ వచనములో దుర్మార్గతయు, దుష్టత్వమును, అను పాపముతోను, అవినీతితోను కూడిన దైవ స్వభావము. దీనినే పులి పిండియని వేదవాక్యము ఘోషిస్తున్నది. కాని పులియని పిండి యేసుక్రీస్తు - పులియని రొట్టె యేసుక్రీస్తు. చిత్రమేమిటంటే పులిసిన పిండియు కాల్చబడుచున్నది. పులియని పిండియు కాల్చబడుచున్నది. పులిసిన పిండి రొట్టెగా మారుచున్నది. పులియని పిండి రొట్టెగా మారుచున్నది. రెండును కాల్చబడెడివి. పులియని పిండి రొట్టె పలచనిదిగ ఉండి పొంగనదియునైయుండి నరునికి ఆహారముగ ఉపయోగపడుచున్నది. అయితే పులిసిన పిండి రొట్టె పిండిని పొంగించుటయేగాక రొట్టెను బోలుగాను, పుల్లనిదిగాను ఉండుటయేగాక అనేక పదార్థములలో వాడుటకు ఉపయోగకారిగా ఉన్నది.'' అలాగే పులిసిన రొట్టె వంటి జీవితములో ఉన్న నరుడు కూడా తన దుష్టత్వము, తన అహంకారము కప్పిపుచ్చి హుందాగ డాబుసరిగా - ఆడంబరముగ పొంగిన పులిసిన రొట్టె వలె లోకాకర్షితుడుగ కనబడును. కాని ఇట్టివారు దైవత్వమునకు పనికిరారు.
ఇందునుగూర్చి నిర్గమ చదివితే దేవుడు తన బలిపీఠము మీద ఉంచెడి వస్తుసముదాయములలో ప్రధమ స్థానమును పొంగని రొట్టెలకే ఇచ్చియున్నాడు. దేవుని సన్నిధిలో పులిసిన వాటికి స్థానము లేదు. పరిశుద్ధతకును, నిరాడంబరత్వమునకును, పవిత్రతకును, దైవసన్నిధిలో స్థానమున్నదేగాని, పులిసిన స్వభావము గల కుత్సితమైన వాటికి స్థానము లేదు. అయితే పులిసిన వాటికి లోకములో ప్రధమ స్థానమున్నది.
ప్రియపాఠకులారా! ఆదిలో దేవుడు ఏదెనులో వేసిన తోట పులియని పిండి ముద్దతో సమానము. అందులో పాతని ఏమియు లేవు. అందులో సృష్టించబడిన ప్రతి జీవియు, వృక్షజాలము మరియు ఆ వనమును ఆవరించియున్న వాతావరణము నిష్కల్మషమైన పులియని పిండితో సమానము.
ప్రియపాఠకులారా! ఈ సందర్భములో మనము ఒక ఆత్మీయ సత్యాన్ని గ్రహించవలెను. పులియని పిండి పులిసిన పిండిగా మారాలంటే అందులో పులిసిన పిండినే కలపవలెను. ఈ పులిసిన పిండి పులియని పిండివలెనే ఉంటూ పులిసిన స్వభావముతో ఉండి, పులియని పిండిలో కలిసి పులియని పిండియొక్క పవిత్రతను చెడగొట్టుతుంది. అలాగే ఏదెను యొక్క చరిత్ర కూడా ఈ పులియని పిండి, పులిసిన పిండి సమ్మేళనముగా కలిగిన మర్మాన్ని ఆత్మీయముగా చదివితే ఈ క్రింది విధముగా తెలియగలదు.
ఏదెను వనము అన్నది దేవుని హస్తకృత్యమై పవిత్రమును పరిశుద్ధమును నిష్కల్మషమైన స్థితిలో ఉన్నట్లు ఆది 2:లో మనము చదువగలము. అయితే ఈ వనములోనే పులిసిన పిండి కూడా ఉన్నదిగాని అదినరునికి కనుమరుగై యున్నట్లుగాను, సృష్టికి అర్థముగాని రీతిలో దైవత్వము చేత గోప్యముగా ఉంచబడింది. అయితే ఇట్టి పరిశుద్ధ స్థితిలో పులిసిన పిండి గుణాతిశయములు గల్గిన మంచి చెడు తెలివినిచ్చు జీవవృక్ష ఫలములనుగూర్చి దేవుడు నరుని శాసించి, ఈ పండు నీవు తిను దినమున నిశ్చయముగ చచ్చెదవు,'' అనగా పులిపిండిగా మారెదవు. ఇంకను పులిపిండి మంచి చెడ్డలు, దైవత్వము అనిన పులియని పిండికి వ్యతిరేకమైన స్వభావములు మీలో కలిగి చచ్చెదవు అనగా భ్రష్టుడవు కాగలవు అని దీని భావము. నిజమే! పులిపిండి వంటి గుణాతిశయములు గల వ్యక్తి లోకములో చచ్చినవానితో సమానము. కనుక దేవుడు నరుని పులియని పిండిగా ఉన్న స్థితిలో హెచ్చరికను చేశాడు.
ఈ విధముగ పులియని పిండి వలెనున్న ఆదాముయొక్క దాంపత్య పవిత్ర జీవితాన్ని చెడగొట్టి పులిసిన రొట్టెగా చేయుటకు బేకరీవానిగా సర్పాన్ని సాతాను నియమించినట్లు - ఈ బేకరీవాడైన సర్పము క్రియా మూలముగ ఆదాముయొక్క జంట జీవితము పులిసిన రొట్టె కలుషితముగా మారుటయేగాక పొంగింది అనగా పొంగుట అనగా నరునియొక్క గర్వానికి, అహంకారానికి, ఆడంబరానికి, అలక్ష్యానికి, తిరస్కారానికి మూలమైయున్నది. చివరకు దాని ఫలితము అగ్నిలో దహింపబడుట - రొట్టె అగ్నిలో దహించబడుతుంది. ఈ విధముగ బేకరీవాడైన సర్పముయొక్క క్రియమూలముగ ఆదాముయొక్క జంట జీవితమే గాక ఏదెను పవిత్రవనము యొక్క పవిత్రత, జంతుకోటిలోని ఐక్యత, ఆ తోటను ఆవరించియున్న వాతావరణము, నరునికి దైవత్వానికి ఉన్న అనుబంధము చెడి పులిసిన పిండిగా నర జీవితము కలుషితమై, ఆనాటినుండి నేటి వరకును ఈ పులి పిండి దినదిన ప్రవర్థమానమై, ప్రతి వ్యక్తి యొక్క ఆత్మీయ జీవితములో ప్రవేశించి, అతనిని దైవసావాసము నుండి చెడగొట్టుటయేగాక భ్రష్టునిగా కూడా చేసినట్లు ఈ క్రింది వేదవాక్యానుసారముగా తెలిసికోగలము.
ప్రియపాఠకులారా! మొట్టమొదటగా ఈ పులి పిండి అన్నది ఆదాము కుమారులైన కయీను, హేబెలు జీవితాలలో ఈ పులి పిండి అన్నది కయీనులో చేరి ద్వేషాన్ని పొంగించి సోదర హత్యకు దారి తీయించి కయీనును భ్రష్టునిగ జేసింది. అలాగే లోతు జీవితములో లోతుయొక్క పవిత్ర విశ్వాస జీవితాన్ని చెడగొట్టుటకు లోతు కుమార్తెలలో జేరి అతనిని మద్యపానము అను పులిసిన ద్రాక్షారసముతో మత్తెక్కించి, అలౌకిక సంబంధానికి దారి తీయించింది. అలాగే అహరోను జీవితములో అహరోను యాజకునిగాను, దైవసన్నిధిలో దేవునికి ప్రజలకు మధ్యవర్తిగా పవిత్ర స్థలములో యాజకత్వములో జీవిస్తుండగా ఈ పులి పిండి అన్నది పవిత్రులును, పులిసిన స్వభావము లేనివారైన దేవుని జనాంగమైన ఇశ్రాయేలీయులలో ప్రవేశించి, అహరోను చేత దూడను చేయించి, అతని జీవితాన్ని పులి పిండిగా మార్చి అతని జ్యేష్టత్వానికి గొడ్డలి పెట్టయింది. అంటే ప్రధానత్వమును కోల్పోయాడు.
అలాగే ఇస్సాకు ఏశావు యాకోబు జీవితాలలో ఈ పులి పిండి అన్నది తిండి ఆశతో క్రియ జరిగించి, ఏశావును జ్యేష్టత్వపు హక్కును అమ్ముకొనునట్లుగాను, ఇస్సాకునకు ఏశావు ఎవరో? యాకోబు ఎవరో తెలియని అజ్ఞానాన్ని కల్గించి, క్రియ జరిగించినట్లు పులిసిన పిండియైన యాకోబు జీవితమును, తండ్రియైన ఇస్సాకు ఆశీర్వాదములతో యాకోబు జీవితాన్ని పులియని పిండిగ జేసి, ఇస్సాకుయొక్క జ్యేష్టుడైన ఏశావు జీవితాన్ని పులి పిండి జీవితముగా మార్చివేసింది. అలాగే మోషే, యెహోషువా, ఏలీయా, యిర్మీయా - జీవితాలలో వారు పులి పిండి లేనివారుగా జీవించి, దైవసన్నిధిలో ఎన్నిక చేయబడి, ప్రవక్తలుగా మారి ఇశ్రాయేలు రాజైన ఆహాబు జీవితములో యెజిబేలు అను పులి పిండి ప్రవేశించి, అతనియొక్క పవిత్ర జీవితాన్ని చెడగొట్టి, అతనిని పులిసిన పిండిగా మార్చి, పనికిమాలినవానిగ భ్రష్ఠునిగ జేసినట్లు చదువగలము.
ప్రియపాఠకులారా! ఈ సందర్భములో యాకోబు జీవితములోని మార్పులను గూర్చి మనము ముఖ్యముగా తెలిసికోవలసియున్నది. జన్మతః యాకోబు మోసగాడు గాదు. అనగా పులి పిండి వంటివాడు కాదు. యాకోబు యొక్క పులియని పిండి జీవితమును పులిసిన పిండిగా మార్చుటకు దోహదకారులైనవారు - మొట్టమొదటగ తల్లి యొక్క సలహా మేరకు తండ్రిని మోసగించుటలో ఈ పులి పిండిని యాకోబు యొక్క పవిత్ర జీవితములో కలిపినది అతని తల్లి. ఎట్లంటే తండ్రియైన ఇస్సాకు ఆశీర్వాదము పొందాలని తల్లి - మేక చర్మమును కప్పి ఇస్సాకును మోసము చేసింది. మోసము జేసి ఇస్సాకుయొక్క దీవెనలను యాకోబుకు వచ్చునట్లుగా చేసింది. అలాగే యాకోబుయొక్క జీవితములో మరొక పులి పిండి ఎవరయ్యా? అంటే లాబాను - అతని మామ; మోసపూరితమైన క్రియాకర్మలతో యాకోబును లాబాను అల్లుడుగా జేసికున్నాడు. ఈ విధముగా పులి పిండి మయమైన యాకోబు జీవితము పులియని పిండియైన యెహోవా దేవుని కలయికలో పులియని పిండి పులిసిన పిండి రెండు అనగా యాకోబు - దేవుడు ''ఇద్దరును పెనుగులాడినప్పుడు పులిసిన పిండి వంటి యాకోబు జీవితమును పులియని పిండియైన దేవుని వెలుగు పూర్తిగా మార్చివేసి - ఇక మీదట నీ పేరు పులి పిండి కాదు. అనగా యాకోబు కాదు - అనగా మోసగాడివి కాదు. నీ పేరు పులియని పిండి అనగా ఇశ్రాయేలు అని నామకరణము జేసినట్లు వేదములో చదువగలము. ఈ విధముగ పులిసిన పిండి వంటి జీవితము నుండి వేరుపరచబడిన యాకోబు జీవితము, పులియని పిండియైన ఇశ్రాయేలు అనగా దేవుని ప్రజలు అను బిరుదును పొంది 12 గోత్రాలకు తండ్రియైనట్లు వేదములో చదువగలము. దావీదు జీవితములో కూడా ఒకానొక దినమున కామాతురతతో కూడిన పులి పిండి స్వభావము ప్రవేశించి, పులియని తాజా పిండియైన దావీదు జీవితమును చెడగొట్టినట్లు చదువగలము. అలాగే సొలొమోను తన పులియని పిండి యొక్క అతి స్వచ్ఛమైన అనగా పవిత్రమైన జీవితములో దేవునికి ఆలయము కట్టునటువంటి ఆధిక్యత పొందినాడు. దేవుని జ్ఞానాన్ని పొందినాడు. దైవ ఆజ్ఞానుసారముగ తన రాజ్యపరిపాలన సాగించినాడు. దైవత్వముతో సంభాషించాడు. అయినను సొలొమోనులో స్త్రీ వ్యామోహము అను పులిసిన పిండి ప్రబలి, భ్రష్టునిగ జేసింది. అనగా పులిసిన పిండిగా మార్చివేసింది.
ఇక నూతన నిబంధన కాలములో పులిసిన పిండి ఎవరో పులియని పిండి ఎవరో? అన్నది తెలిసికొందము. పులియని పిండి కన్యకయైన మరియ యొక్క ఆత్మీయ జీవితము. పులియని పిండి మరియ యొక్క నిష్కళంకమైన గర్భము. పులియని పిండి మరియ భర్తయైన యోసేపు జీవితము పులియని పిండి - యేసుక్రీస్తునకు బాప్తిస్మమిచ్చిన యోహాను పులియని పిండి. బాలుడైన యేసును దర్శించుటకు వచ్చిన ముగ్గురు జ్ఞానులు పులియని పిండి. యేసుక్రీస్తు యొక్క ఇహలోక జీవితము పులియని పిండి. యేసుక్రీస్తు ఎన్నుకున్న 12 మంది అపొస్తలులు పులియని పిండి. స్తైఫను మొదలుగా గల హతసాక్షులు పులియని పిండి, కొర్నేలి జీవితము పులియని పిండి. యేసుప్రభువు కడరా భోజనములో ఆయన విరిచిన రొట్టె పులియని రొట్టె - యేసుక్రీస్తు యొక్క పవిత్ర జీవితము పులియని రొట్టె. ముప్పయి వెండి నాణెములు ఆశించి, ధనదాహముతో పొందిన ఇస్కరియోతు యూదా జీవితము పులిసిన రొట్టె. అననీయ సప్పీరాలు పులిసిన పిండి. తప్పిపోయిన కుమారునియొక్క ఆత్మీయ స్థితి పులిసినది. పులియని రొట్టె యేసుప్రభువు పంచిన ఐదు రొట్టెలు మరియు ఏడు రొట్టెలు. పులియని రొట్టె - అంటే దేవునియొక్క వాక్యము. పులియని పిండి అనగా యేసుక్రీస్తు యొక్క శారీర ఆత్మీయ జీవితము. లాజరు ధనవంతుని ఉపమానములో ధనవంతుని ఇహలోక జీవితము పులిసిన రొట్టె.
ప్రియపాఠకులారా! పులి పిండి, పులియని పిండికి ఉన్న తారతమ్యమునుగూర్చి పులియని రొట్టె, పులిసిన రొట్టెకి ఉన్న ప్రాధాన్యతను గూర్చి తెలిసికొనియున్నాము. పులిసిన రొట్టె లోకసంబంధము, పులియని రొట్టె దైవసంబంధము. దైవసన్నిధిలో అర్పించబడు రొట్టెలుగాని, పిండిగాని తైలముతో మిళితమైనవై కాల్చబడి, పొంగనివియు రూపము లేనివియునైయున్నవి. అయితే పులిసిన రొట్టెలు చిత్ర విచిత్రమైనటువంటి ఆకారములు, పలువిధమైన సువాసన ద్రవ్యములు, రుచికరమైన పదార్థములతో సమ్మేళనమై లోక నరులను ఆకర్షించును. అయితే దైవత్వమునకు ఆకర్షణలుగాని, రంగుగాని, సైజులుగాని పనికిరావు. దైవసన్నిధిలో ఉంచబడు రొట్టెకు ఆడంబరముండదు, అలంకారముండదు, సువాసనలుండవు. అందుకే యేసుప్రభువు పంచిన రొట్టెలు యవల రొట్టెలు చప్పిడివి. వాటిలోకి నంజుడు కావాలి. ఆ నంజుడు ఆయన పంచిన రెండు చేపలు.
ప్రియపాఠకులారా! ఇప్పుడు తెలిసికొనియున్నాము గదా? దైవత్వములో మనము ఆయన సన్నిధిలో ఎన్నిక గలవారమై యుండాలంటే పొంగని రొట్టెలుగా ఉండవలెను. అంటే పులియని పిండి స్వభావము గల్గి ఉండవలెను. పులియని పిండి వలె మృదువైన జీవితము జీవించవలెను. అంటే సున్నితమైన మనస్సు, కఠినత్వము, ప్రేమ, దయ, సానుభూతి, సహనము వగైరా గుణాతిశయములు గల్గి, ఆయనకు విధేయత కలిగి జీవించవలెను. అప్పుడే ఆయన సన్నిధిలో మనము సన్నిధి రొట్టెలు గల్గిన జీవితము జీవించవలెను. అనగా దైవత్వములో నైవేద్యముగా ఉంచబడిన పొంగని రొట్టెల వలె అనగా సన్నిధి రొట్టెగా మన జీవితము ఎల్లవేళల దైవసన్నిధానమును పొందగలము. అట్లుగాని పక్షములో పులియని రొట్టె వలె అచ్చులలో ఉంచి అగ్నిలో కాల్చేటటువంటి ఘోరాతిఘోరమైన మరణవేదనను పొంది, లోకమునకు అంకితమై, లోకమునకే పరిమితమై పోవలసిన స్థితి ఏర్పడుతుంది.
కనుక ప్రియపాఠకులారా! ఈ యొక్క నగ్నసత్యమును గ్రహించిన మీరు మనము పులి పిండి వలె అనగా పులిసిన రొట్టె వలె లోకస్థులుగా ఉంటామా? లేక క్రీస్తులో బాప్తిస్మము పొంది, పులి పిండి స్వభావమును కోల్పోయి, అనగా కలుషితము పోగొట్టుకొన్నవారమై నిజ క్రైస్తవ్యములో జీవించి, పులియని పిండి వంటి స్వభావము కల్గి పులియని రొట్టె వలె అనగా ఫస్కారొట్టె వలె జీవించుచు, ప్రభువునకు యోగ్యకరమైన జీవితమును జీవించెదము గాక!
అంశము :- కుండ మూలము :- ఆది 24:15
1. ప్రభువునందు ప్రియపాఠకులారా! ఆది 24:15లో రిబ్కా యొక్క కన్యత్వమును, శీలమును, సద్గుణ సంపత్తిని యెలియాజరునకు తెలియజేయుటకు తోడ్పడిన అమూల్య సాధనము కుండ. కనుక రిబ్కా సాంసారిక జీవితము ఆశీర్వాదకరముగాను, యోగ్యకరముగాను నిండుకుండవలె జరిగింది. ఇది నీటి కుండ మహాత్మ్యము.
2. నూనె కుండ మహాత్మ్యము :- రెండు రాజు 4:2లో ఋణానుబంధములో చిక్కుకున్న విధవరాలియొక్క ఇద్దరు కుమారులకు ఋణ విమోచనము కల్గించుటయేగాక, విధవరాలి గృహమునకు జీవనోపాధి కల్గించింది.
3. నిష్ప్రయోజనమైన కుండ కీర్తన 2:9లో పగలిన కుండ :- ఇనుప దండముతో నీవు వారిని నలుగ కొట్టెదవు. ''కుండను పగులగొట్టినట్లు వారిని ముక్కచెక్కలుగా పగులగొట్టెదవు.''
4. ఓటి కుండ కీర్తన 31:12 మరణ యోగ్యమైన లేక చావునకు పతనమునకు దిగజారిన జీవితము.
5. సామెతలు 5:15లో సొంత కుండ అనగా కట్టుకున్న భార్య లేక భర్త లేక తల్లి తండ్రి. వారి సంబంధమైన ఆస్థి వగైరాలు అనగా దప్పిక లేని జీవితము. ఇది స్వంత కుండ మహాత్మ్యము.
6. యేసుప్రభువు ఫస్కాను ఆచరించుటకు కావలసిన విడిది గది చూపుటకు తోడ్పడినది నీటికుండ ఇది నీటి కుండ మహాత్మ్యము. మార్కు 14:13-16 లూకా 22:10 :- మీరు పట్టణములోనికి వెళ్ళుడి. అక్కడ నీళ్ళ కుండ మోయుచున్న యొక మనుష్యుడు మీ కెదురుపడును. వాని వెంటబోయి వాడెక్కడ ప్రవేశించునో ఆ ఇంటి యజమానుని చూచి - నేను నా శిష్యులతో కూడా ఫస్కాను భుజించుటకు నా విడిది గది ఎక్కడనని బోధకుడడుగుచున్నాడని చెప్పుడి. అతడు సామగ్రితో సిద్ధపరచబడిన గొప్ప మేడ గది మీకు చూపించును.''
7. సమరయ స్త్రీయొక్క పాపభూయిష్టమైన కుండ యోహాను 4:28లో ఖాళీ కుండ. ఫలశూన్య జీవితము. ఖాళీ కుండను ఆమె విడిచి ప్రభువు కృపలో ఆమె నిండుకొని, ప్రయోజనకరమైన నూతన జీవితములో ఆమె ప్రవేశించింది. ఇది ఖాళీ కుండ మహాత్మ్యము.
8. ప్రకటన 2:27లో దైవోగ్రతలో పగులకొట్టబడిన సాతాను కుండలు. ''వారు కుమ్మరవాని పాత్రల వలె పగులగొట్టబడుదురు.
9. న్యాయాధిపతులు 7:16-20 అశేష జనమైన మిద్యానీయులను తరిమి హతము జేసి, గిద్యోను యెహోవా దేవునికి జయము చేకూర్చిన కుండ. మరియు దివిటీతో వెల్గించిన కుండ మహాత్మ్యము.
10. పరమ కుమ్మరి యెహోవా దేవుడు. జిగట మన్ను ఇశ్రాయేలు. ఈ ఇశ్రాయేలు దేవునిచే చేయబడిన కుండలు.
11. యెహెజ్కేలు 24:3-14లో మాంసము ఉడుకబెట్టు కుండ. మడ్డి కుండ :- ఎల్లప్పుడు మడ్డి కల్గి యుండు కుండ అనగా పాపభూయిష్టమైన కుండ.
12. రోమా 9:21లో ఘనమైన కుండ ఘనహీనమైన కుండగా చేయుటకు మంటి మీద పరమ కుమ్మరికి అధికారము కలదు. కనుక ప్రియచదువరీ! ఈ అంశమును చదువుచున్న నీవు ఏరకమైన కుండగా ఉన్నావు? రిబ్కా కుండ వలె పరిచర్య జీవితములో ఉన్నావా? విధవరాలి కుండ వలె బంధకాలలోను, విధవరాలి జీవితము వంటి జీవితములో బంధకాలలో ఉన్న మన ఇరుగుపొరుగువారిని విడిపించు స్థితిలో ఉన్నామా? దేవుని స్వంత కుండ జీవితములో జీవిస్తూ అనేకుల ఆత్మీయ దప్పికను దీర్చు స్థితి. ప్రభువు విడిది గృహమైన సంఘాలయమును కట్టుటకు నీటికుండ వలె అనేకులకు మార్గదర్శకులుగాను, సమరయ స్త్రీ వదలివేసిన ఖాళీ కుండ వలె, పనికిమాలిన కుండ వలె, ఓటి కుండ వలె దైవోగ్రతకు పగులగొట్టబడిన సాతాను కుండ, మిద్యానీయులను హతమార్చుటకు యెహోవాకు జయము చేకూర్చిన దివిటీ కుండ. జిగటమన్నుతో దేవుడు చేసిన కుండలలో మడ్డి గల కుండగా పాపభూయిష్టమైన జీవితములో ఉన్నామా? ఈ వేదాంతమును చదువుచున్న నీ జీవితమే విధముగా ఉన్నదో నిన్ను నీవే పరిక్షించుకో!
........
మొదటి కొరింథీ 12:4-6 కృపావరములు నానావిధములుగ ఉన్నవిగాని ఆత్మ యొక్కడే! పరిచర్యలు నానవిధములుగ ఉన్నవిగాని ప్రభువు ఒక్కడే! నానావిధములై కార్యములు కలవుగాని అందరిలోను అన్నిటిని జరిగించు దేవుడు ఒక్కడే! అనుటలో కృపావరములు నానావిధములుగ ఉన్నప్పుడు సమయము, సందర్భము అవకాశమునుబట్టి నానావిధములుగా ఉన్న కృపావరములను, నానావిధములుగా ఉన్న పరిచర్యలను, నానావిధములైన కార్యములను నరులందరిలోను అన్నిటిని జరిగించు దేవుడు ఒక్కడేయని వాక్యముయొక్క వివరణ.
అయితే కృపావరములు, పరిచర్యలు, కార్యములు ఈ మూడును ఒక్కటేయైయున్నట్లును, ఇవి జరిగించు శక్తి కూడా ఒక్కటే! చిత్రమేమిటంటే కృపావరములనినను, పరిచర్యలనినను, కార్యములన్నను ఇంచుమించు ఒక్కటే అర్థాన్ని ఇచ్చుచున్నవి. అలాగే కృపావరములు అనుగ్రహించు ఆత్మ పరిచర్యలు జరిగించుకొను ప్రభువు నానావిధములైన కార్యములను జరిగించు దేవుడు ఈ ముగ్గురు కూడా ఇంచుమించు ఒక్కరుగానే యున్నట్లుగా కూడా మనము తెలిసికోవలసియున్నది.
ఆత్మ ఒక్కడైయున్నను - ఏడాత్మలున్నట్లుగ ప్రకటన 3:1 ఏడు నక్షత్రాలు - దేవుని ఏడాత్మలు గలవాడు చెప్పు సంగతులని వివరించబడియున్నది. ఆత్మ ఒక్కడేయై యున్నప్పుడు ఆత్మ ఏడుగ విభజించబడుట కూడా మనము వేదములో చదువగలము.
ప్రియపాఠకులారా! ఆత్మ ఒక్కడైయుండి నరునిలో జీవాత్మగాను, సృష్టికి దేవుని ఆత్మగాను, సృష్టి యావత్తు నిర్మించుటలో దేవుని ఆత్మగాను, దైవభక్తులయొక్క హృదయశుద్ధి స్థితిలో పరిశుద్ధాత్మగాను, లోకరక్షకుని నిర్మాణములో క్రీస్తు ఆత్మగాను, మరణాన్ని జయించి పునరుత్థానుడైన ప్రభువు మరణ విజయుడైన ఆత్మగాను, వగైరా ఆత్మలుగ విభాగింపబడి, ఆయా సందర్భాలు, ఆయా స్థలములలో ఆయా వాతావరణములనుబట్టి ఒక్కడైయున్న ఆత్మ విభజించబడి యున్నట్లు ఈ సందర్భాలు వివరిస్తున్నవి.
అదే విధముగ మనయొక్క పరిచర్యలందుకొను ప్రభువు కూడా విభాగింపబడినట్లు వేదరీత్యా మనము తెలిసికొందము. యావద్‌సృష్టికి సృష్టికర్త ప్రభువు ప్రకటన 1:4-5 వర్తమాన భూత భవిష్యత్కాలములలో ఉన్నవాడు. ఆయన సింహాసనము ఎదుటనున్న ఏడాత్మల నుండియు, నమ్మకమైన సాక్షి, మృతులలో నుండి ఆది సంభూతుడుగ లేచినవాడు, భూపతులకు అధిపతియై యేసుక్రీస్తు,'' అనుటలో పై మూలవాక్యము వివరించిన ప్రభువు ఒక్కడై యుండక ఏడు సంఘములకు వర్తమాన భూత భవిష్యత్కాలములకు, ఆయన సింహాసనము ఎదుటనున్న ఏడాత్మలకును నమ్మకమైన సాక్షియు, మృతులలో నుండి ఆదిసంభూతుడుగ లేచినవాడు అనగా మరణవిజయుడై మహిమ పునరుత్థానము పొందినవాడు, భూపతులకు అధిపతి అనగా రాజులకు రాజు, రారాజైనవాడు.
ఇందునుబట్టి మనము తెలిసికోవలసినదేమిటంటే పై వివరించినవన్నియు ఇవిగాకుండ కృపావరములు, పరిచర్యలు, దైవకార్యములు ఒకటేమిటి? సమస్తమును యేసుక్రీస్తులో నుండి కృపా సమాధానములు అను రూపాంతరములు కలిగి, పాపికి రక్షణ, విశ్వాసికి నిత్యజీవము అనుగ్రహించు స్థితికి నరులలో క్రియ జరిగిస్తున్నట్లు తెలియుచున్నది. ఈ కృపావరములన్నవి లోకసంబంధముగాక ఇదే మొదటి కొరింథీ 12:8లో ఆత్మ మూలముగ అనుగ్రహించబడిన కృపావరములునుబట్టి బుద్ధి వాక్యము, జ్ఞాన వాక్యము, విశ్వాసమును, స్వస్థపరచు వరము, అద్భుత కార్యాలను చేయు శక్తి, ప్రవచన వరము, ఆత్మల వివేచన, నానావిధ భాషలు - ఆ భాషలకు అర్థము చెప్పు శక్తి అనుగ్రహించబడుచున్నది. ఇది ఒక్క ఆత్మ ద్వారానే ఆయన చిత్తము ప్రకారము ప్రతివానికి ప్రత్యేకముగా పంచి ఇచ్చుచు కార్యసిద్ధి కలుగజేయుచున్నట్లు మొదటి కొరింథీ 12:8-11 వివరించబడిన వేదభాగములో చదువగలము.
ఇక, పరిచర్యలు నానావిధములుగ ఉన్నవి,'' అనుటలో పరిచర్య, ఇది మూడు విధములుగ ఉన్నది. ఇందులో 1. మన ఇరుగుపొరుగువారుగాని లేదా ఎవరైనను ఒక అపరిచిత వ్యక్తి ప్రమాదములో అసహాయ స్థితిలో ఉన్నప్పుడు వానిని ఆదుకొని, వానికి ఆ సమయములో చేయదగు సేవ, చికిత్స, సహాయము. ఇది నరసంబంధమైన పరిచర్య. 2. ఇక రాజ్యము నేలే రాజులు ప్రజలను పాలిస్తు వారి కొరకు రాజ్యాంగ చట్టమును విధించి, ఆ చట్ట ప్రకారము పరిపాలన చేయుట - లోకరాజ్య చట్టసంబంధమైన పరిచర్య. 3. దైవిక సంబంధ పరిచర్య :- ఇందులో దైవసేవకులకు చేయు పరిచర్య - సువార్త పరిచర్య ప్రార్థనా సహవాసము, ధర్మకార్యాలు, దైవమందిరములో దేవుని బలపీఠము దగ్గర జరిగించు పరిచర్య, వగైరాలు. ఈ మూడు విధములైన పరిచర్యలకు కూడా దైవశక్తి అవసరమైయున్నది. దీనిని మనము వేదరీత్యా తెలిసికొందము.
ప్రియపాఠకులారా! దేవుడు ఇశ్రాయేలు అను తన జనాంగమునకు అనగా తాను పరిపాలిస్తున్న ప్రజలకు మొట్టమొదట నిర్వాహకునిగ పరిపాలకునిగ మోషేను ఎన్నుకున్నాడు. అటుతర్వాత రాజులనెన్నుకున్నాడు. ఆ రాజులు తమ చిత్త ప్రకారముగా కాక సింహాసనము దేవునిది - పరిపాలన చట్టములు దేవునివి. అనగా ధర్మశాస్త్రము వీటిని అమలు జేయుచు రాజులుగాని, ప్రవక్తలుగాని, యాజకులుగాని నామమాత్రముగ వారు ఆయా బిరుదులు పొందియున్నను పరిపాలన పరిచర్య యావత్తును, ప్రభువైన దేవునియొక్క విధినిబట్టి పరిపాలన చేయవలసినదేగాని, వారి స్వశక్తి, స్వజ్ఞానమునుబట్టి గాదు. ఇది పరిచర్యలోని రెండవ ఘట్టము.
ఇక మూడవది :- క్రైస్తవ సంఘ విషయములో సంఘపరిచర్య విధానములెట్లంటే సంఘమునకు శిరస్సు క్రీస్తు. సంఘమునకు క్రీస్తు నియమించిన కాపరి సంఘ కార్యములను దైవమందిరములోని పరిచర్య జరిగించుటకు యాజకుడైయున్నట్లు కూడా మనము తెలిసికోవలసియున్నది. ప్రియపాఠకులారా! ఇంతియేగాకుండ దైవరాజ్య సువార్తను ప్రకటించుటకు క్రీస్తు ద్వారా నియమితులైన కాపరులు పరిచారకులుగా కూడా నియమించబడియున్నారు. సర్వసాధారణముగ మన క్రైస్తవ జీవితములో అనేకులైనటువంటి సువార్త సేవకులను దైవసేవకులనియు, దైవదాసులనియు, బోధకులనియు పిలుచుచుందుము. మన ఇరుగుపొరుగులకును పరిచయము చేయుచుందుము. ఇది ఆత్మ ప్రభువు చేయించు కృపావరములు పరిచర్యలు.
ఇక మూడవది కార్యములు :- ప్రియపాఠకులారా! ఇక కార్యములు జరిగించేటటువంటి దేవుని శక్తి ఏదో కూడా ఈ సందర్భములో తెలిసికోవలెను. హెబ్రీ 1:1-2 పూర్వకాలమందు నానా సమయములలోను, నానావిధములుగాను ప్రవక్తల ద్వారా మన పితరులతో మాట్లాడిన దేవుడు,'' అని అనుటలో యావద్ సృష్టికి సృష్టికర్తయైన దేవునియొక్క కార్యాలు కూడా నరుల జీవితాలపై ప్రభావము చూపినట్లు ఆదాము నుండి మలాకీ గ్రంథము వరకు చదువగలము. ఆదాముతో అబ్రాహాముతో మోషేతో ఇక ప్రవక్తలతో మాట్లాడిన దేవుడు - వారి ద్వారా ఆయా సందర్భాలనుబట్టి, ఆయా సంఘటనలననుసరించి క్రియ జరిగించి తన ప్రణాళికలను దేవుడు నెరవేర్చుకొన్నట్లు చరిత్రలో అనేకులైన రాజులు, చక్రవర్తులు, న్యాయాధిపతులు, కీర్తనాకారులు, యాజకులు, బోధకులు, ప్రవక్తల చరిత్రలలో మనము చదువగలము. ఇట్టి కోవకు చెందినవారు మోషే - విశ్వాసులకు తండ్రియైన అబ్రాహాము, మోసగాడైన యాకోబు, సమూయేలు, వగైరా ఎందరో ప్రవక్తలు ఈ కోవకు చెందినవారు. ఇది దైవకార్యములు జరిగించిన దేవునియొక్క యదార్ధ చరిత్ర.
ప్రియపాఠకులారా! ఆత్మ - ప్రభువు - దేవుడు జరిగించిన క్రియలను గూర్చి వేదరీత్యా తెలిసికున్నాము. ఇది తెలిసికొన్నటువంటి చదువరులు అయిన మీలో ఈ ముగ్గురు దేవుళ్ళ యొక్క ప్రతిభ, వెలుగు, జ్ఞానము, శక్తి, వరము ఎంత వరకు క్రియ జరిగిస్తున్నదో మనలను మనమే పరీక్షించుకొని ఆ విధంగా జరిగించుటకు మన ప్రార్థనా విజ్ఞాపనలతో ఆయనను మనము ధ్యానించుకొందము.
.......
యుద్ధములు :- వాటి బలాతిశయములు తన్మూలముగా సంభవించు ఫలితము.
ప్రభువునందు ప్రియసోదరీ! సోదరా! దేవుడు సృష్టిని సృష్టించినప్పుడు కలహములతో గాని, యుద్ధోన్మాదము గాని, ఈర్ష్యాద్వేషాలతో గాని సృష్టించలేదు. యుద్ధమన్నది నరకోటికి తద్వారా, నర సృష్టిలోనికి ఏ విధముగా విజృంభించిందో వేదయుతముగా మనము తెలిసికోవలసియున్నది. యుద్ధానికి పునాది ఎక్కడేర్పడినది? అన్నదానిని గూర్చి తెలిసికోవలసియున్నది.
మొట్టమొదటగా ఈ యుద్ధము పరలోక రాజ్యములో లూసీఫర్ అను అపవాదికిని, దేవునికిని జరిగి దైవ ప్రభావముతో అతిసుందరుడు, గాయకుడు, వైణికుడు, సంగీత విద్వాంసునిగా సృష్టికర్తను ఉల్లసింపజేసిన ఈ లూసీఫర్ అను దేవదూత - అందము, నైపుణ్యము, సంగీత కళనుబట్టి గర్వోన్మాదుడై దైవత్వమునకంటె ఉన్నతమైన స్థానము నభిలషించి, దైవత్వము కంటె, తానధికునిగ ప్రకటిస్తు - దైవత్వముతో విరోధము పెంచుకొని తిరుగుబాటు చేశాడు. ఇట్టి తిరుగుబాటు మూలమున దేవుని పక్షముగ దేవదూతల సైన్యములు, అపవాది అనగా లూసీఫర్ పక్షముగా కొంతమంది దేవదూతల సమూహములు చీలిపోవుట జరిగినది.
ఇట్లు వీడిపోయిన దేవదూతలు దేవుని చేత శపించబడుటయు, ఇట్టి దూతలకు నాయకుడైన లూసీఫర్ అను అపవాది కూడా తన దూతల సైనిక బలము చేత దేవుని సైన్యము నెదుర్కొని యుద్ధముజేసి దైవత్వముయొక్క తీక్షణతకు ఆగలేక పతనమైపోయి, అందమైన ముఖమునకు ప్రతిగా వికృతమైన రూపమును మేలిమి బంగారువంటి దేహ వర్ణమునకు బదులుగా నల్లని శరీరమును, వికృత రూపముతో పడద్రోయబడి సాతానను పేరుతో భూలోకములో చలామణి యగుచున్నట్లు వేదరీత్యా మనము చదువగలము.
ఇందునుబట్టి చూడగా యుద్ధమన్నది మొట్టమొదట పరలోకము నుండి భూలోకమునకు దిగుమతి చేయబడినది. ఇట్లు దిగుమతి చేయబడిన యుద్ధమను పోరాటమునకు ఏదెనులో మొట్టమొదటగా పునాది వేయబడినది. ఎట్లనగా దేవుడు తన హస్తముతో చేసిన నరుడు తనపై తిరుగుబాటు చేయగా వానికి శత్రువులుగ దేవుడు తుఫాను, సుడిగాలులు, తీక్షణ, ఎండ, మంచు, భూకంపము, ఉరుములు, మెరుపులు, వగైరా భీభత్సములతో ప్రకృతిని విరోధులుగా జేసినట్లును, అప్పటివరకు సాధువులుగా ఉన్న సింహము, ఏనుగు, ఎలుగుబంటి, పులి, చిరుత, వగైరా వన్య మృగములు క్రూరమృగములుగా మారి, నరునితో నేటికిని బద్ధ వైరము గల్గియుండుట, సందర్భానుసారముగా వాటితో పోరాటము, నరుడు వాటిని వేట అను క్రియతో పోరాడుట నేడు మనము వింటున్న సంఘటనలు ఋజువుపరచుచున్నవి.
ఇట్టి యుద్ధమన్నది ఆదిలో పరలోకములో ఏ అపవాది చేత ప్రారంభమైనదో అదే విధముగా భూమిపై కూడ ఈ అపవాది మూలముగానే నరునికిని, దేవునికిని; ప్రకృతికిని, నరునికిని; జంతుకోటికిని, నరునికిని; వాతావరణానికిని, నరునికిని; రోగానికిని, నరునికిని; తుదకు నరుడేర్పరచుకున్న రాజ్యములలో ఒక రాజ్యముతో మరియొక రాజ్యమునకును; ఒక దేశమునకు మరియొక దేశమునకు; ఒక రాష్ట్రమునకును మరియొక రాష్ట్రమునకు; ఒక గ్రామమునకును మరియొక గ్రామమునకును; ఒక కుటుంబానికిని మరియొక కుటుంబమునకు; ఒక ప్రభుత్వమునకును మరియొక ప్రభుత్వానికిని; ఈ యుద్ధము విస్తరించి, నేటి తరమువారమైన మనకు సమాధానము, నెమ్మది, ఐక్యత, ప్రేమ, సహనాన్ని లేకుండ చేసింది. ఇందునుబట్టి ఎఫెసీ 6:12-18 చదివినట్లయితే, నేటి మానవుడు పోరాడుతున్న సమూహములు, వాటినుండి రక్షణ విధానము ఏమిటో మనకు తెలియగలదు. ఇది నేటి ప్రపంచ పరిస్థితి మానవునియొక్క పరిస్థితి.
అయితే వేదములో ఈ యుద్ధాలన్నవి దేవుడు తనకుగా తన పేరు పెట్టబడిన అనగా ఇశ్రాయేలను ఒక జనాంగము నేర్పరచుకొని, వారికి ప్రభువు దేవుడుగా ఉండి - వారి పక్షముగా మోషే యెహోషువ ఏలీయా వగైరా అధిపతులనేర్పరచి వారి ద్వారా ఎన్నో యుద్ధాలు జరిగించి ''జయము యెహోవాదే'' అన్నట్లు దేవుడు పరలోకములో ఏ విధముగా అపవాదిని, వాని సమూహములను ఓడించెనో పతనము చేశాడో - అదే విధముగా భూలోకములోను ఇశ్రాయేలను తనయొక్క జనాంగము ద్వారా నేటికిని విజయాన్ని సాధిస్తున్నాడు.
నాడు జయము యెహోవాదైతే నేటి విజయము క్రీస్తుది. నాటి యుద్ధముల ద్వారా దేవుడు ఇశ్రాయేలీయులు అను తన జనాభా యొక్క విజయ పతాకమును, వారి చరిత్రను గూర్చిన మర్మములు - వారిని తానేర్పాటుజేసికొన్న ఉద్దేశ్యములు, వారు తనకు విధేయులై జీవించిన కాలములో వారనుభవించిన సుఖశాంతులు, వారు తన్ను మరచి దోషులైనప్పుడు వారనుభవించిన శ్రమలు, ఇరుకులు, ఎదుర్కొన్న సమస్యలు, వారి ద్వారా దేవుడు తనయొక్క రాజ్యముయొక్క సిద్ధాంతములను బైల్పరచిన విధానములు - వారు తన ప్రజలేయన్నట్లుగా నేటికిని వారికంటు ఇశ్రాయేలీ అను సామ్రాజ్యమును తన వేదమునకు సాక్షులుగా - ఆసియా ఖండ మధ్య భాగములో వారిని ప్రపంచ జనాభాకు సాక్ష్యాధారముగా ఉంచి ఉన్నట్లుగ - నేటికిని వారు దేవుని ప్రజలే అన్నట్లుగా ఇశ్రాయేలీయులను పేరును తుడుపు పెట్టక స్థిరపరచియున్నట్లు - నేటి ఇశ్రాయేలీయుల సామ్రాజ్యము - దానియొక్క జ్ఞానాతిశయములు, దానికున్న ప్రాధాన్యత నేటి ప్రపంచ చరిత్రలో ప్రకటితమగుచున్నది.
ఇట్లు దేవుని చేత ఎన్నిక చేయబడిన యూదయా జనాంగము నుండి లోకములో జరుగుచున్న అన్యాయపు అపవాది సామ్రాజ్యము నుండి విడుదలకు మత్తయి 2:5 యూదయా దేశపు బెత్లెహేమా! నీవు యూదా ప్రధానులలో నెంత మాత్రమును అల్పమైనదానవు కావు. ఇశ్రాయేలను నా ప్రజలను పరిపాలించు నధిపతి నీలో నుండి వచ్చు'' నన్న ప్రవచన నెరవేర్పును బట్టి ఇశ్రాయేలు సామ్రాజ్యమైన పాలస్తీనా దేశములోనే, బెత్లెహేమను పురములో దేవుని ప్రజలనుండియే - సర్వ నరకోటి కావరించియున్న సాతాను పోరాటము నుండి విడుదల గల్గించుటకు, లోకరక్షకునిగ, విమోచకునిగ, యేసుక్రీస్తను నామధేయముతో - ఈ లోకములో దైవనరునిగ అవతరించి, మొట్టమొదటగ సాతానుతో ప్రత్యక్షముగా పోరాడినట్లు యేసుప్రభువు బాప్తిస్మము పొంది, ఆయన 40 రోజులు ఉపవాసముండి ఆకలిగొన్నప్పుడు - సాతానుతో పోరాట విధానములో - సాతానును ఓడించినట్లుగా మనము వేదములో చదువగలము.
చిత్రమేమంటే నాడు యెహోవా సైన్యముతో పోరాడిన సైతానుడు నేడు క్రైస్తవులమను మనతో పోరాడుచున్నాడు. మనము వానితో తెలియని రీతిగా పోరాడుచున్నాముగాని వానిని జయించలేకున్నాము. వాని పోరాటము కుయుక్తులతో కూడినది. మన పోరాటము విశ్వాసముతో కూడినది. విశ్వాసమునకును, కుయుక్తికిని పొందిక ఏమిటి?
ప్రియచదువరీ! అపవాదికిని, మనకున్న పోరాటములో అపవాది మనకు తన ప్రత్యక్ష రూపమును చూపించక లోకాన్ని లోకములోని ధనాన్ని, పదవులను, బంగారాన్ని, ఈవులను, భోగభాగ్యాలను, ధనధాన్యాలను ఎరగా జూపి మనతో పోరాడుచున్నాడు. వీటి ద్వారా మనలను తన వారినిగా జేసుకొని దైవత్వానికి మనలను విరోధులుగా జేయాలని దైవశాపాన్ని అంటగట్టి, నాశనకరమైన మరణానికి మనలను పాత్రులుగా జేయాలని వాని సంకల్పమైయున్నది.
వేదరీత్యా మనము జరుపవలసిన పోరాటమేమిటో మన వారసత్వమెక్కడున్నదో మన స్వాస్థ్యమేదో - మన రాజ్యమేదో మనమేవిధముగా పోరాడవలెనో తెలిసికోవలసియున్నది. వేదరీత్యా మన పోరాటము ఎఫెసీ 6:12 ప్రధానులతోను, అధికారులతోను, ఆకాశమండల మందున్న దురాత్మల సమూహములతోను మన పోరాటమున్నది. ఈ పోరాటమునకు కావలసిన శస్త్రములు, ఆయుధములు, క్షిపణులు, కవచములు దృశ్యమైనవి కావు. నరునిచే నిర్మించబడినవి కావు. కనుక అదృశ్యములో ఉన్న శత్రుసమూహము నెదిరించుటకు అదృశ్యములో ఉన్నవి. అనగా కంటికి గోచరముగాని శక్తివంతములైన ఆయుధసంపత్తి అవసరమైనట్లు ఎఫెసీ 6:13-18 వేదములో చదివినట్లయితే మనకు కావలసిన ఆయుధసంపత్తి, వాటియొక్క ప్రభావములు గోచరము కాగలదు. ఇట్లు పోరాడిన మనకు రెండవ కొరింథీ 5:1 చదివినట్లయితే లోకమును జయించుట ద్వారా మనకు కల్గు మన కేర్పరచబడిన నివాసములు యోహాను 14:2 నా తండ్రి ఇంటికి అనేక నివాసములు కలవు. అనిన విధముగా యేసు సిద్ధపరచిన స్థలము ఈ లోకమును జయించిన విశ్వాసి కేర్పరచబడిన స్వాస్థ్యముగా మనము గ్రహించవలసియున్నది.
ప్రభువునందు ప్రియచదువరీ! ఇంకను మనము లోతుగ ఆలోచిస్తే లోకమును జయించిన వానికున్న బహుమానములను (ప్రకటన 2:7 & 2:17 & 2:26 & 3:5 & 3:12 & 3:21) మరియు ఆధిక్యతలను గూర్చి తెలిసికోగలము. నేటి తరమువారమైన మనము ఇందుకు ప్రతికూలముగా క్రైస్తవ విశ్వాసులమంటు ప్రకటించుకొంటూ, ఒకరియెడల ఒకరు సహోదర ప్రేమ గల్గియుండి ఐక్యతగా జీవించుట మాని, సంఘముయొక్క సేవను, సంఘ నిబంధనలను, సంఘముయొక్క శిరస్సైయున్న క్రీస్తుయొక్క ఆశయాలను మంటగల్పి, సంఘముపై కాపరి; కాపరిపై సంఘము ద్వేషాన్ని రగుల్చుకొని, ఒకరితోనొకరు పోరాడుటలో సంఘము విచ్ఛిన్నమై, ఛిన్నాభిన్నమై, పార్టీలై క్రైస్తవ్యానికి గొడ్డలిపెట్టుగా తయారై, అన్యులకు సహితము వెక్కిరింతగా తయారైయున్నదంటే ఇందుకు కారణము ఎవరంటారు? దేవుడు కాదు. యెషయా 1: దేవుడు ఈ విధముగా మాట్లాడుచున్నాడు. పిల్లలను పెంచి పెద్దవారిని చేసితిని. వారు నా మీద తిరుగబడియున్నారు.
కనుక ప్రియచదువరీ! ''గొఱ్ఱెలు, కాపరి కలసి ఉంటేనే మందకు జీవము, రక్షణ ఉంటుంది. ఫలింపు గల జీవితము కూడా ఉంటుంది. మరద లేకుండ కాపరి జీవించలేడు. కాపరి లేకుండ మందకు రక్షణ లేదు. ఇందునుబట్టియే ప్రభువు క్రైస్తవ సంఘాన్ని గొఱ్ఱెల మందకు సాదృశ్యముగా పోల్చినాడు. ఎందుకంటే గొఱ్ఱెలు పోట్లాడుకోవు, కలసికట్టుగా ఉండును. పశువులు పోట్లాడుకొనును. కనుక తండ్రియైన దేవుడు తన విశ్వాసులను గొఱ్ఱెలుగా పోల్చి, తన కుమారుని గొఱ్ఱెల కాపరిగా ప్రతిష్టించి, ఐక్యతతోను సమాధానముతోను, సభ్యత్వముతోను, ''నీతి - పరిశుద్ధత'' తోను, శాంతియుతమైన లోక పోరాటముతో బ్రతుకమని, క్రైస్తవ సంఘాన్ని ప్రతిష్టించాడు. అయితే సాతానుడు అన్యకూటములను వదలి ప్రత్యేకముగా క్రైస్తవ సంఘాల మీద పడి, క్రైస్తవులలోని పదవీవ్యామోహము, ధనాపేక్ష, స్వార్థ్యము, ఈర్ష్య, క్రోధము, మత్సరము, అహంభావమను అరిష్ట గుణములతో - సంఘముల నావరించి, విశ్వాసపూరితమైన సంఘమును సైతము తన కుయుక్తులతో ఓడించుటకు నిత్యము క్రియ జరిగిస్తున్నట్లుగా - నేటి సంఘచరిత్రలు మన కనుల ఎదుటనే ప్రత్యక్షముగా ఋజువుపరచుచున్నవి.
ఇందునుబట్టి శక్తివంతుడైయున్న దేవుడు బలిపీఠము నావరించి క్రియ జరిగించవలసిన దేవుడు గుడి పై కప్పు మీద కూర్చుండి ప్రతి విశ్వాసి చర్యలను కనిపెట్టుచు, నరులను - నరుల పాపవిమోచనార్థము తన కుమారుని ఈ లోకమునకు పంపి జరిగించిన విధానమును బట్టియు దేవుడు విచారిస్తున్నట్లు ఈ సందర్భములో మనము కీర్తన 7:11-17 యెషయా :- అయ్యో! నమ్మకమైన నా పట్టణము వేశ్య ఆయెనే అనియు విచారిస్తున్నట్లు ఈ సందర్భములో గ్రహించినవారమై, మన సంఘ విషయములోను, మన సావాస విషయములోను, మన ప్రవర్తనలోను, జాగ్రత్త గల్గినవారై ప్రార్థనతో మెలకువ గల్గిన జీవితముతో జీవించాలని, అట్లు జీవిస్తే తప్పకుండ దైవరాజ్యములో ప్రవేశించగలమని, అందుకొరకు శరీరముతో లోకముతోను ఆత్మీయముగా అదృశ్యమైన శక్తులతోను ప్రతినిత్యము మన ఆత్మ దేవుని శక్తితో మనము పోరాడి, తుదిమట్టుకు మన కర్తవ్యాన్ని నెరవేర్చాలని అంతిమ విజయము ద్వారా దైవస్వాస్థ్యమైయున్న మన పరలోక రాజ్యములో ప్రవేశించగలమని, అట్లు జీవించుటకే, అట్టి యోగ్యత పొందుటకే, దేవుడు మనలను ఈ లోకములో సృష్టించి మనలో తన జీవాత్మ నుంచి, అట్టి జీవాత్మకు ఆలయముగా మనకు శరీరము నేర్పరచి, మనస్సాక్షి ప్రకారము ఆత్మ దేవుని పట్ల కృతజ్ఞత గల్గినవారమై జీవించాలని, మనలను దేవుడు ఈ లోకములో సృష్టించినట్లు ఇందునుబట్టి మనము గ్రహించాల్సి ఉన్నది. ఆమేన్.
శరీరము - ఆత్మ
ప్రియపాఠకులారా! ఇంతవరకును మనము అనేక విధములైన దృష్టాంతములు, వ్యక్తుల జీవితాల ద్వారా దైవత్వమును గూర్చి మానవత్వాన్ని గూర్చి - దైవత్వాన్ని ఆశ్రయించిన విశ్వాసులయొక్క ఆత్మీయ జీవితాలలో వారు సాధించిన విజయావకాశాలు, దైవత్వాన్నిగాక కేవలము లోకాన్ని అంటిపెట్టుకొని, కేవలము జీవించిన వారియొక్క అనుభవాలు, అటు దైవత్వము, ఇటు మానవత్వము రెండింటిని అవలంబించి, ఉభయభ్రష్టత్వము పొందిన అభాగ్యుల చరిత్రలు ఇంతవరకు తెలిసికొనియున్నాము. అంటే దైవత్వముతో ఎన్నిక చేయబడి, అభిషేకించబడి, ప్రతిష్టించబడి, దేవుని మహిమపరచుటకు బదులుగా తన్నుతాను హెచ్చించుకొని, దైవత్వముపై తిరుగుబాటు జేసి, దైవ జనాంగమును తృణీకరించిన వ్యక్తుల జీవితాలు - దైవత్వమును ద్వేషించి, దైవసంఘాలను పాడుజేస్తూ - ఆ విధముగా సంఘాలను పాడుచేయుటకు లోక ప్రభుత్వ అధికారాలు కోరుచు, బహుముఖ విధముగా ప్రభువు మార్గాన్ని ఆటంకము కల్గించుటకు, క్రియ జరిగించుటకు ప్రయత్నించిన దైవదూషకులను, మత ద్వేషులను సైతము వారి జీవితాలలో వారు అనుభవించిన శ్రమలు, వేదనతో కూడిన అనుభవాలనుగూర్చి తెలిసికొనియున్నాము. ఇప్పుడు సకల విధములైన క్రియాకర్మలకు శరీరము మూలము గనుక, శరీరాన్ని గూర్చి శరీరములో దేవుడు ప్రతిష్టించిన ఆత్మను గూర్చి, వాటి విలువలను గూర్చి, జీవాత్మలైన మనము కేవలము మానవత్వముతోనేగాక దైవత్వముతో జీవించుటకు కావలసిన యోగ్యతలనుగూర్చి దైవత్వమును మహిమపరచవలసిన విధానమును గూర్చి సవివరముగా తెలిసికొందము.
ప్రియపాఠకులారా! నరజీవితములో దేవుడు నరుడు తనను మహిమపరచుటకు సాధనముగా దేహాన్ని అనుగ్రహించియున్నాడు. అందునుబట్టి నరుడు దేవునికి ఋణస్థుడై యున్నాడుగాని దేవుడు నరునికి ఋణస్థుడు కాడు. ఎందుకనగా దేవునిచే సృష్టించబడి రూపించబడిన నరుడు దేవుని రూపమును పోలియున్నట్లు ఆదికాండము 1:26లో మనము చదువగలము. అనగా దేవుని స్వరూపము, దేవుని పోలికలో నరుడు దేవుని చేత రూపించబడినాడు. అంతియేగాక ఆదికాండము 2:7లో వలె నరుడు దేవుని ఆత్మ చేత పూరించబడి ప్రతిష్టించబడి యున్నాడు. కేవలము నేలమంటితో నరుడు రూపించబడినంత మాత్రాన నరుడు భూసంబంధి కానేరడు. ఎందుకంటే భూసంబంధమైన మట్టిని నర నిర్మాణములో వాడబడినప్పుడు నరునికి జీవాత్మ ప్రతిష్టిత కూడా భూమి చేయవచ్చును. అయితే భూమి సకల ప్రాణులకు జీవాధారమై యున్నట్లుగ వేదములో ఆదికాండము 1:20-25లో జలములు పుట్టించునని - భూమి పుట్టించుగాకని
1:12లో సమస్త జాతి వృక్షములను, గడ్డిని, తమ తమ జాతి ప్రకారము భూమి మొలిపించునుగాక! భూమి మొలిపించింది. శక్తి దేవునిది - క్రియ భూమిది. ఇది సృష్టి నిర్మాణ విషయములో మాత్రము భూమిలోని మట్టి మాత్రమే వాడబడిందిగాని, భూమిలోని జీవముగాని, భూసంబంధమైన ఏ విధమైన కార్యములు నరుని నిర్మాణ విషయములో జరుగలేదు. నరదేహానికి కావలసిన జడపదార్థమును, దైవోద్దేశ్యమునుబట్టి భూమి వాడబడింది. అంతేగాని నరనిర్మాణ క్రియలో భూమికి ఎలాంటి సంబంధము లేదు.
ప్రియపాఠకులారా! ఇట్టి మర్మము దేవుడు నరుని రూపించిన క్రియలో ఉన్నది. అయితే ఆత్మ - జీవము రెండును దేవుని నుండి ప్రత్యక్షముగా ప్రయోగాత్మకముగా నరశరీరములో ప్రవేశించాయి, అందునుబట్టి సృష్టిలోని ఏ జీవికి లేని పేరు నరునికి దేవుడు అనుగ్రహించియున్నాడు. అదియే జీవాత్ముడు. ఈ జీవాత్మకు కేంద్ర బిందువు - పరమాత్ముడే! ఆ విధముగా పరమాత్మునియొక్క ప్రత్యేక క్రియాకర్మ ద్వారా రూపించబడిన నరశరీరమునకు దేవుని మహిమపరచవలసిన విధి, ధర్మము ఎంతైనను ఉన్నది. ఎందుకంటే దేవుడు నరుని రూపించిన సందర్భములో ఒకవేళ నరశరీరమునకు కావలసిన మట్టిని భూమి సరఫరా జేసి యుండవచ్చును. అంతమాత్రములో నరునియొక్క శరీరము భూమియొక్క శక్తి కాదు. ఎలాగంటే ఉదా|| మనకు సంక్రమించియున్న మన ఆర్జితమైన స్థలములో అనగా మన పితరుల ద్వారా మనకు పట్టా రూపముగా ఏర్పడిన మన స్వంత స్థలములో - ఇల్లు కట్టుకొనుటకు అది మట్టి ఇల్లుగాని, రాతి ఇల్లుగాని, ఏ ఇల్లయినను కట్టుకొనే సందర్భములో - ఇంటి నిర్మాణమునకు కావలసిన మట్టి, రాళ్ళు మరే విధమైన సామగ్రి కావలసియున్నప్పుడు, వాటిని మనకు సరఫరా జేసినటువంటి వ్యక్తులకు డబ్బిచ్చి, మనకు కావలసిన వస్తువులను తోలించుకొని ఇల్లు కట్టుకుంటాము. ఇట్టి సందర్భములో పట్టాదారుడు -ఇల్లు కట్టుకొనే స్వంతదారుడు ఆ సామాను తోలిన బండి యజమాని కాలేడు. సరఫరా చేసినవాడు సహాయకుడుగా మాత్రమే! కాని సహాయకుడుగా కూడా ఎంచబడడు. ఎందుకంటే అతడు ఉచితముగా సరఫరా చేసినవాడు కూడా కాదు. కనుక కట్టబడిన గృహములో వస్తుసముదాయమును చేర్చినవాడు పనివాడేగాని యజమాని కాదు. సర్వహక్కులు ఇల్లుగలవానిదే! అలాగే శరీరమునకు కావలసిన మట్టిని, దేవునియొక్క కార్యానికి సరఫరా జేసిన భూమికి - నరదేహము మీద ఎలాంటి హక్కు, అనుభవాలు లేవు. ఎందుకంటే దేవుని స్వరూపము, దేవుని పోలిక, దేవుని జీవము, దేవుని ఆత్మ, దేవునియొక్క హక్కు అనుభవాలతో నరుడు నిర్మించబడియున్నాడు.
కనుక ప్రియపాఠకులారా! ఇందునుబట్టి నరజీవితము మీద, నరుని దేహము మీదగాని పూర్తి హక్కు అనుభవాలు ఒక్క దేవునికే ఉన్నవి. ఎందుకంటే నరుడు దేవుని చేత కట్టబడిన జీవయుతమును మరియు చలనాత్మకమైన గృహము. ఈ గృహమును దేవుడే తన హస్తముతో నిర్మించి, అందులో తన జీవపు వెలుగైన జీవాత్మను ప్రతిష్టించాడు. జీవమును, ఆత్మను ప్రతిష్టించగా నరుడు జీవాత్ముడైనట్లు వేద వివరణ. ఈ విధముగా నరదేహమైన గృహములో నర జీవాత్మ - దేవుడు ప్రతిష్టించిన జీవాత్మలు దేవుడు పెట్టిన దీపమే! గృహములో దీపము ఆరిపోయినప్పుడు చీకటి ఏర్పడి కాంతి విహీనమైనట్లుగ ఆత్మ - శరీరమును విడచిపోయిన తర్వాత శరీరము కూడా జీవకళను పోగొట్టుకొని కళావిహీనమగుటయేగాక, శరీరము నిర్జీవమై, నిష్ప్రయోజనకరమై, అది ఏ మట్టి నుండి రూపించబడిందో - ఆ మట్టిలోనే కలిసిపోతుంది. ఇది శరీరము యొక్క చివరి స్థితి. అయితే దేవునియొక్క సంకల్పములో శరీరము యొక్క పూర్వ స్థితి చాలా ఆధిక్యతలో జీవిస్తూ శారీరమును రూపించిన దేవునికి శరీరమన్నది కృతజ్ఞత కల్గినదై, దేవుని మహిమపరచవలసిన బాధ్యత ఉన్నది. అయితే ఈ శారీరమన్నది భూమితో సంబంధము కల్గించుకొని, భూసంబంధమైన వ్యామోహములో తగుల్కొని, తనకు రూపమిచ్చి జీవాత్మననుగ్రహించిన దేవునియొక్క ఆశయము, ఆయన చేసిన పనిని పూర్తిగా మరచిపోయి, లోకముతో చెయ్యి కలిపిన ఈ దేహము - తన స్వజ్ఞానముతో ప్రవర్తిస్తూ - దైవత్వము పట్ల చూపవలసిన వినయము, విధేయతకు బదులు భూలోకమునకును దీని చట్టమునకును, దీని ఆచారములకును, దీని సంపదకును, దీనిలోని పదవులకును దాసోహమై సృష్టికర్తను మహిమపరచలేక పోతున్నదంటే, లోకరీత్యా దేహము సంపాయించుకొన్న జ్ఞానము ఎంత అజ్ఞానమో, ఎంతటి బలహీనమైనదో ఒక్కసారి మన మానసిక స్థితినిబట్టి మనకై మనమే పరిశోధించుకోవలసియున్నది.
శరీరము దైవత్వమునకు పతనావస్థ పొందుటకు కారణము. సర్పము మాత్రమే కాకుండ భూమి కూడా ప్రబల కారణమైయున్నట్లు ఆది 3:లో భూజంతువైన సర్పము మానవ భాషతో మాట్లాడి దేవుడు నిషేధించిన భూఫలమును తినమని బోధించింది. సర్పబోధను విన్న నారి - దేవుని చేత పురుషునికి సాటి సహాయముగా రూపించబడి, పురుషునికి మహిమగా జీవించవలసియుండగా - ఇట్టి పురుషునికి మహిమయైయున్న స్త్రీయే, పురుషునియొక్క ఆత్మీయ జీవితాన్ని పాడుచేయుటకు కారణభూతమైంది. స్త్రీలోని మొట్టమొదటి అపరాధమేమిటంటే సర్పము మాటలకు చెవినిచ్చుట. ఆ విధముగా విన్నటువంటి స్త్రీ సర్పబోధను లక్ష్యపెట్టక, దైవత్వము మీద లక్ష్యముంచి, దైవచిత్తమునకు కనిపెట్టాలి. కాని ఈ స్త్రీ ఆలాగే చేయలేదు. సర్పము మాటలు విని దేవుడు నిషేధించిన ఫలము వైపు చూచినప్పుడు ఆ ఫలములలో స్త్రీకి నిషేధింపదగిన గుణములు ఏవియు కనబడలేదు. అన్నియు మంచివిగానే ఉన్నాయి. చూపుకు రమ్యమైనవి, తినుటకు యోగ్యమైనవి, మంచి చెడు తెలివినిచ్చేవి. ఇన్ని విధములైన యోగ్యతలు కలిగిన ఆ పండు స్త్రీని ఆకర్షించింది. అయితే పండులోని ఈ యొక్క లక్షణాలకు ఆ పండు యొక్క రూపమునకు కారణభూతమైంది భూమియే!
ప్రియపాఠకులారా! దేవుడు సృష్టించిన నరులు ఇద్దరు భూసంబంధులే! కనుక దేవుడు తాను సృష్టించిన నరజంట, వారిని భూసంబంధముగానే పరిశోధించాలని సంకల్పించి, భూజంతువు చేత బోధను, భూఫలముల చేత ఆకర్షణను కల్పించి, నరులలో తానుంచిన జీవాత్మను దేవుడు పరిశోధించాడు. నరులలోని జీవాత్మయొక్క బలహీనతనుబట్టి, భూసంబంధమైన శరీరమునుబట్టి జీవాత్మ బలహీనమైనది. ఏకాత్మయైన జీవాత్మ బలహీనమగుటకు కారణము :- దేహము భూసంబంధమైనది, దేహమును శోధించిన సర్పము భూజంతువు - భూసంబంధము, దేవుడు నిషేధించిన ఫలము భూఫలమే! ఈ విధముగా మూడు విధములైన భూఫలములతో నరులలోని జీవాత్మ పోరాడవలసివచ్చింది. ఈ త్రివిధ పోరాటములో నరునిలోని జీవాత్మ బలహీనమై, శోధనకు లోబడి, పరమాత్మయొక్క ఆధిక్యతను, ఆయన ఆశీస్సులను, ఆయన స్వాస్థ్యమైన ఏదెను వనమును, ఆయన ప్రత్యక్షతను, ఆయన సావాసమును పోగొట్టుకొని, దైవస్వాస్థ్యము నుండి వెలివేయబడి తరిమివేయబడినట్లు ఆది 3:లోని చరిత్ర మనకు వివరిస్తున్నది.
ఈ విధముగా శరీరముతో కూడా ఆత్మ వెలివేయబడి లోకముతో సంబంధ బాంధవ్యా లేర్పరచుకొని, లోకసంబంధమైన వాటితో పొందిక ఏర్పరచుకొని, లోక సావాసములో చేరిపోయింది. ఈ విధముగా జీవాత్మ లోకముతో సంబంధాలేర్పరచుకొనుటనుబట్టి పరమాత్ముడు తన సంబంధమైన జీవాత్మ - తనతో ఉన్నటువంటి ప్రగాఢమైన బంధమును తెగత్రెంపులు చేసుకోకుండ, ఏనాటికైనను జీవాత్మ తన సొత్తే అనిన సిద్ధాంతముతో నరజంటను దేవుడు తోట నుండి తరిమివేయుటకు పూర్వము చర్మపు దుస్తులను తొడిగించి, జీవాత్మతో తనకున్న సంబంధ బాంధవ్యాన్ని స్థిరపరచుకొన్నట్లు వేదములో దేవుడు నరజంటకు తొడిగిన చర్మపు దుస్తుల క్రియయొక్క పరమార్థము మనకు బయల్పరచుచున్నది.
ప్రియపాఠకులారా! నరునిలోని జీవాత్మతో పరమాత్మకు సంబంధ బాంధవ్యాలుండబట్టియే, నరునిలో తాను ఊదిన జీవాత్మ నానావిధమైన అనుభవాలు పొంది, చివరి దశలో పరమాత్మునిలో ఐక్యమగు స్థితికి చేరుకొన్నది. ఎలాగంటే నరునిలో దేవుడు ఉంచిన జీవాత్మయొక్క విలువను కాపాడుటకు దేవుడే ప్రత్యక్షముగా రంగములో నిలిచి, నానావిధమైన క్రియలు జరిగించినట్లు వేదరీత్యా మనము తెలిసికొందము. చర్మపు దుస్తులు తొడిగి దేవుడు తరిమివేసిన నరజంటను అనాధులుగ విడువలేదు. వారిని వెంటాడి సంతాన సౌభాగ్యము కల్గించినట్లు స్త్రీ మాట్లాడిన మాటలు ఆదికాండము 4:1 యెహోవా దయ వలన నేనొక మనుష్యుని సంపాయించుకొంటిని.
ప్రియపాఠకులారా! కీర్తన 127:3 లోని మాట అదేమిటంటే కుమారులు యెహోవా అనుగ్రహించు స్వాస్థ్యము గర్భఫలము ఆయన ఇచ్చు బహుమానము. ఈ వాక్య నెరవేర్పు మొట్టమొదటగా ఆది నరజంటలో జరిగింది. ఈ విధముగా జీవాత్మన్నది దేహమునుబట్టి దైవత్వము పట్ల దోషపూరితమైనదియైనను, దైవాశీర్వాదము చేత ఈ జీవాత్మన్నది బహుగా ఫలించి, అనేక శరీరముల ద్వారా అభివృద్ధి పొంది, బహుగా విస్తరించి, భూమిని నింపినట్లుగా ఆది 6:లో మనము చదువగలము. ఈ విధముగా విస్తరించిన జీవాత్మ యొక్క ఫలాలు దైవసంబంధములుకాక భూసంబంధములుగా మారి, దైవత్వమునకు వ్యతిరేకములును, పాపమునకు ప్రతిరూపములునై భూమికి బరువు - పరమాత్మునికి ఉగ్రత, కల్గించే రీతిలో ఈయొక్క జీవాత్మ ఫలములు తయారైనవి. ఇట్టి వాతావరణమును గుర్తించిన పరమాత్ముడు ఉగ్రుడై జలప్రవాహముతో పాపభూయిష్టమైన జీవాత్మ ఫలాలను తుడిచివేసినట్లు మనము చదువగలము. అయినను పరమాత్ముడు తాను భూమి మీద ప్రతిష్టించిన జీవాత్మయొక్క స్థితిని మెరుగుపరచాలని, తన వైపు మరల్చుకోవాలని ప్రయత్నించి, నాటి విస్తరించిన జీవాత్మ ఫలాలలో తనకు యోగ్యకరముగా ఉండు ఒకే ఒక్క కుటుంబాన్ని పునఃనిర్మాణమునకు ఎంపిక చేసుకొని, తద్వారా పునఃసృష్టి కార్యక్రమాన్ని ప్రారంభించి, రెండవ ప్రపంచాన్ని నిర్మించాడు. అయినను పరమాత్మునికి యోగ్యకరమైన జీవాత్మ ఫలాలు ఫలించలేకపోయింది.
అట్టి వాతావరణములో ఇశ్రాయేలు అను పేరుతో ఒక జనాంగమును ఏర్పరచుకొని, వారి ద్వారా మహిమపరచబడాలని పరమాత్ముడు ఆకాంక్షించాడు. అది కూడా ఫలించలేకపోయేటప్పటికి దశాజ్ఞలు అనే శాసనాలను నోటితో గాకుండ శిలాశాసనాలుగా చెక్కి, తానేర్పరచుకొన్న జనాంగమునకు బహూకరించి (ఇచ్చి) వాటిని విధిగ ఆచరించమన్నాడు. అయినను నరులు పరమాత్మునియొక్క చట్టమునకు లోబడకపోయారు. అటుతర్వాత తన ఆత్మతో ఉజ్జీవింపజేసిన అనేక ప్రవక్తలు, న్యాయాధిపతులు, దీర్ఘదర్శులు, రాజులను నియమించి, తాను సృష్టించిన నరులను తన క్రమములో ఉంచుకోవాలని ప్రయత్నించాడు. ఈ ప్రయత్నము కూడా ఫలించలేదు. తుదకు తానే లోకమాలిన్యమునుబట్టి, లోకస్థులైన జీవాత్మ నరులయొక్క పాపపరిహారార్థము - ''ఆదిలో ఏ స్త్రీ ద్వారా దైవాజ్ఞ వ్యతిరేక పాపము ప్రవేశించిందో - అదే కన్యకయైన స్త్రీ ద్వారా తాను శిశువుగ నరాకృతిలో జన్మించి, జీవాత్మ నరులైన మన కొరకు సజీవ యాగముగా శరీరాత్మలను బలిగా సమర్పించుకొని, జీవాత్మకున్న కళంకాన్ని తొలగించే ప్రయత్నము కార్యక్రమాన్ని సంపూర్తి జేసి, తాను పరమాత్ముడు గనుక లోకమునకు మ్రింగుడుపడక మహిమ పునరుత్థానముతో తిరిగి తనయొక్క కేంద్ర స్థానమైన పరలోకమునకు ఆరోహణుడైనట్లు పరిశుద్ధ గ్రంథమైన నూతన నిబంధన గ్రంథములో చదువగలము. అయినను నేటి నవీన యుగములో ఈ సత్యాన్ని వేదరీత్యా తెలిసికొని కూడా పరమాత్ముని మహిమపరచక పోవడమే గాక, నేటి నరుడు తమ స్వజ్ఞానాన్నిబట్టి, తమ శరీర బలాధిక్యతలనుబట్టి, లోకసంబంధ సంపదలు, ఐశ్వర్యాలనుబట్టి, లోక పరిపాలనలోని పదవులనుబట్టి, ఉన్నత ఉద్యోగ విలువనుబట్టి పరమాత్ముని మరచుటయేగాక ఆయనను ద్వేషిస్తూ, అలక్ష్యపరచి, ధన మదాంధులై కన్నుమిన్ను గానని స్థితిలో జీవిస్తున్నారంటే నరునిలో దేవుడు పూరించిన జీవాత్మయొక్క స్థితి ఎంత దుర్భలమైనదో ఒక్కసారి మనము ఆలోచించాలి.
ఈ విధముగా లోకవ్యామోహములో పడి కొట్టుమిట్టాడుచున్న నరునిలోని జీవాత్మ, పరమాత్ముని దర్శించే యోగ్యతను పొందుటకు చివరి ప్రయత్నముగా దేవుడు వాక్యము - వాక్యధ్యానము, వాక్యోపదేశము విరివిగా పొందుట, ప్రార్థన - ప్రార్థనా సావాసము, ప్రార్థనా కార్యములు విధిగా ఆచరించుట ద్వారా నేటి విశ్వాసులమైన మనలను తన రక్షణ వలయములోకి వచ్చుటకు చివరిసారిగా అవకాశాన్ని కల్పించియున్నాడు. ప్రియపాఠకులారా! ఇది చివరి హెచ్చరిక. ఇది జీవాత్ముడైన నరునికి అనుగ్రహించిన చివరి అవకాశము. ఇది జారవిడుచుకుంటే నరజీవితములో నరునియొక్క ఆత్మీయ జీవితానికి పుట్టగతులు లేవు. ఈ చివరి అవకాశమునుబట్టి దేవుడు తనలో ఐక్యమగుటకు, ప్రతి నరునికి జాతిమత కుల వ్యవస్థ లేకుండ, అలాగే భాషాబేధము, వర్ణ బేధము, స్థలబేధము వగైరా వైషమ్యాలను విస్మరించి, అందరిని సమస్తమైనవారిని తాననుగ్రహించిన ప్రవచనాలతో ప్రవచిస్తూ - భారము మోయుచున్న సమస్తమైనవారలారా! నా యొద్దకు రండి - నేను విశ్రాంతి గలుగజేతును,'' అనియు నా జనులారా! నా బోధకు చెవినియ్యుడి,'' అనియు - దేవుని ఆత్మ క్రీస్తు ఆత్మ బోధకుల ద్వారా, సువార్తీకుల ద్వారా, రేడియోల ద్వారా, పత్రికల ద్వారా, విమానాల ద్వారా, ఓడల ద్వారా, వాహనాల ద్వారా - పరమాత్ముడైన దేవుడు తనయొక్క కార్యాన్ని బహు ఉజ్జీవముగా తీవ్రతరముగా నేటి తరములో జరిగిస్తున్నాడు. దేవుడు జరిగించే ఈ మహత్కార్యములో మహత్తరమైన కార్యాచరణతో కూడిన ఈ ప్రణాళికలో దైవత్వముతో సహకరించేటటువంటి ఆయన పనిలో పాల్గొని, ఆయన చిత్తము నెరవేర్చుచు, తమ ఇహలోక జీవితాన్ని ఫలభరితముగా జరిగించుకొన్న పరిశుద్ధులెందరు? అనిన ప్రశ్నకు నేటి యుగములో జవాబు దొరకుతుందా? ఈ విధముగా జవాబు కావాలంటే వెయ్యికొక్కడున్నాడా? లేక లక్షకొక్కడున్నాడా? అనిన సందేహము మనకే కలుగుతుంది.
అందుకే ఒలీవల కొండ దిగువన ఉన్న శిష్యులతో యేసుప్రభువు చెప్పిన మాట - ''ఆత్మ సిద్ధమేగాని శరీరము బలహీనము,'' అనిన ప్రవచనాన్నిబట్టి ప్రియపాఠకులారా! నరులమైన మన ఆత్మీయ స్థితి నేటికిని ఆలాగనే ఉన్నది. మనము ఏదయితే చేయాలనుకుంటామో అది చేయలేకపోతున్నాము. ఏదైతే చేయకూడదని అనుకుంటామో అది చేస్తాము. ఇది నరులలోని ఆత్మీయ బలహీనత. ఇందునుబట్టి మనము గ్రహించవలసినదేమిటంటే భూమి మీద మన నివాసమైన ఈ శరీరముతో మనము ఎన్ని కార్యాలు జేసినను, ఎన్నో విధములుగ లోకాన్ని అనుభవించినను, ఎన్నో పేరు ప్రఖ్యాతులు సంపాయించుకొన్నను, ఎంతో ఆధిక్యతలలో జీవించినను, ఒకానొకదినమున దేహాన్ని వదలి మనలో ఉన్న ఆత్మను దేవుని సన్నిధికి అప్పగించవలసిన దినమొకటున్నది. అయితే శరీరము మన్ను గాబట్టి, ఇంకను భూసంబంధమైన ఫలములచే పోషింపబడినదే కాబట్టి ఇది భూమికి అంకితమై, శిధిలమై, కుళ్ళి కృశించి, చీకి, భూగర్భములో కలిసిపోతుంది. మరియు దీని రూపము పలాని అని గుర్తు పట్టలేని స్థితికి మారిపోతుంది. అయితే ఆత్మన్నది రూపము లేకపోయినను, దైవసన్నిధిలో తానేవిధముగా నరశరీరములో ప్రవేశించిందో - అదే విధముగా దైవపీఠము ఎదుట తీర్పులో నిలువవలసియున్నది. ఇట్టి తీర్పు కాలములో జీవాత్మన్నది భూలోకములో తాను దేహముతో జరిగించిన క్రియలనుగూర్చి లెక్క చెప్పవలసిన దినమొకటున్నది గనుక ప్రియపాఠకులారా! భూలోక సంబంధమైన మన శరీరము, భూఫలముల చేత పోషించబడిన మన శరీరము - నానావిధములైన భోగభాగ్యాలు - కష్టనష్టాలు - శ్రమలు, వేదనలు లేక సుఖదుఃఖాలు వగైరా జీవితానుభవములను అనుభవించిన నరశరీరము ఏనాటికి అస్థిరమే; అయితే మనలోని జీవాత్మ నిత్యము నిలిచినదైయుండి, తనయొక్క పరిశుద్ధ స్థితినిబట్టి జీవాత్మకు దాతయైన దేవుని సన్నిధిలో నిత్యజీవములో ప్రవేశించాలంటే - జీవాత్మకు పరిశుద్ధత - దైవత్వములో విలీనము కావాలనేటటువంటి ఆతృత, అభిలాష - తత్సంబంధమైన పట్టుదలతో కూడిన దైవధ్యానము అవసరమైయున్నది. ఈ స్థితిలో జీవించిన నాడే ఆత్మీయ స్థితి ధన్యవంతము కాగలదు.
ప్రభువునందు సహోదరీ సహోదరులారా!
దీని వలన, మేము మీ యొక్క సహాయ సహకారాల వల్ల తరువాత ముద్రణలో ఈ పుస్తకము అన్ని కోణాలలో అందముగా తీర్చిదిద్ది అందించగలము. ఆమేన్.
శేఖర్ రెడ్డి గారు వ్రాసిన పుస్తకములు:
వీటిని మీరు www.FaithScope.com ద్వారా ఉచితముగా పొంద వచ్చును.