ఆశ్రయపురము

గ్రంథకర్త : శేఖర్‌రెడ్డి వాసా

www.FaithScope.com

నీ మరణానంతరము నీ ఆత్మ ఎక్కడ వుండబోవుచున్నదో నీకు తెలుసునా?

మూలము

రెడ్డిపాళెం గ్రామములోని నా ప్రభువు తల్లి ఉపదేశములు మరియు ఆమెను ఆవరించిన పరిశుద్ధాత్మయొక్క జ్ఞాన సహాయమే ఈ పుస్తక రచనకు మూలాధారము.

అంకితము

ఈ అవకాశాన్ని నాకు అనుగ్రహించి నన్ను ప్రేమించిన క్రీస్తు ప్రభువుకు అంకితమిస్తున్నాను. -  వాసా శేఖర్‌రెడ్డి

గ్రంథపరిచయవాక్కు

        ప్రియక్రైస్తవ పాఠక మహాశయులారా!  ఆశ్రయపురము అనేటటువంటి ఈ గ్రంథములో పాతనిబంధనలో మోషే ఐగుప్తీయుని చంపి హంతకుడైయుండగా - ఫరో ఈ సంగతి విని మోషేను చంప చూడగా - మోషే ఫరో ఎదుట నుండి ప్రాణమునకు వెరచి, ఆనాడు కొన్ని ఆశ్రయపురాలలో వుంటూ కాలము గడిపినట్లుగ మనము చదువగలము.  ఇది పాతనిబంధన కాలపు మాట.  అయితే నూతన నిబంధనలో ఆశ్రయపురములు వున్నాయా?  అనిన అనుమానము మీకు కలుగవచ్చును, ఉన్నాయనుటకు బ్రహ్మాండమైన ఋజువులున్నవి.  ఈ సమయములో ఎఫెసీ 1:6 తన ప్రియుని యందు తన కృపామహిమకు కీర్తి గల్గునట్లు తన చిత్త ప్రకారమైన దయాసంకల్పము చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులనుగా స్వీకరించుటకై మనలను ముందుగా తన కోసము నిర్ణయించుకొని, జగత్తు పునాది వేయబడక మునుపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకొనెను, పాపికి ఆశ్రయము క్రీస్తే, నశించిన నరుని రక్షించుటకు మనుష్యకుమారుడు ఈ లోకానికి వచ్చెను.  సిలువ మీద కుడివైపు దొంగ ఇందుకు ఋజువై యున్నాడు.  సకల నరకోటికి ఖరారైన ఆశ్రయపురము క్రీస్తే.  ఇందులో ఏ భేధము లేదు ఎవరైనను ఏ దేశస్థుడైనను, ఏ భాష మాట్లాడు వాడైనను, స్త్రీయనిగాని, పురుషుడనిగాని భేధము లేదు.  ఎవరైనను క్రీస్తు అను ఆశ్రయపురములో ప్రవేశించవచ్చును.  ఇందునుగూర్చి ఈ చిన్న పుస్తకములో వ్రాయబడిన అంశాలు పాఠక మహాశయులు చదివి గ్రహించి, సమస్తమైనవారికి ఆధారము, పాపికి రక్షకుడు, విమోచకుడు, సమస్తమైనవారిని దైవపథము చేర్చుటకు సమర్థుడైన ఆధిపత్యము గల్గిన యేసుక్రీస్తు అను ఆశ్రయపురములో చేరుటకు ప్రయత్నించుదము గాక!  ఆమేన్‌.

         ప్రసంగాంశము :-  ఆశ్రయము - ఆశ్రయపురములు కనాను దేశము నందివి ఆరు కలవు.  (1)  యోర్దాను నదికి పడమట, యూదా గోత్రమందలి హెబ్రోను  (2) ఎప్రాయీమునందలి షెకెము  (3)  నప్తాలీ గోత్రమందలి కెదెషు  (4)  తూర్పున రూబేను గోత్రమునందలి బేసరును  (5)  గాదులోని రామోతి లాదు  (6)  మనష్షే గోత్రమందలి గోలాను అనునవియై యుండినవి.  యెహోషువ 20:7-9, సంఖ్యా 35:6-11 ఒక వ్యక్తి మరియొక వ్యక్తిని చంపిన పక్షములో చంపబడిన వాని తాలూకు వ్యక్తి హంతకుని తరిమి వెదకి చంపువాడు ఆ కాలమందు ఆ దేశములో వుండినది నిర్గమ

21:23

        మోషే యూదులకు చట్టముల నియమించినప్పుడు కనికరము కనపరచెడు ఒక క్రొత్త విధానము ఏర్పరచాడు.  ఒకడు విరోధబుద్ధి చేత కాక, పొరబాటున ఒకనిని చంపుట తటస్థించు పక్షమున చంపినవాడు అట్టి ఆశ్రయపురమునకు పారిపోయి, ఆ సంగతి విచారణ జరుగు వరకు అచ్చట నిర్భయముగా నివసించవచ్చును.  యెహోషువ 20:1-3 ఆ పురములకు పారిపోయిన వాని సంగతి అక్కడి పెద్దలు క్షుణ్ణముగా విచారించాలి.  అతని హత్య ఉద్ధేశ్య పూర్వకమైనదిగా ఋజువైన పక్షములో వారు ఆతనిని విరోధులకు అప్పగించాలి.  ద్వితీయోపదేశకాండము 19:12 అట్లుగాక పొరబాటున చంపెనని ఋజువైతే అతడు ఆ ఆశ్రయపురమునందును, దానికి వెయ్యి గజముల దూరములోను సురక్షితముగా బ్రతకవచ్చును.  సంఖ్యా 35:26-27 చంపబడిన వాని బంధువు అతనికి ఏ కీడు చేయకూడదు.  ఆశ్రయ పురములకు పోవు త్రోవలను బాగుజేసి ద్వితీయోపదేశకాండము 19:3 రెండు బాటలు చీలు తావులలో ఆశ్రయపురమును కనపరచు స్థంభములను కట్టువారు.  ఇది పాతనిబంధనలోని ఆశ్రయపురము వివరము.

        ఆశ్రయపురములను గూర్చిన నియమములను గూర్చి సంఖ్యా 35, ద్వితీయోపదేశకాండము  19:1-3, యెహోషువ 20:2-9 నందు తెలుసుకోవచ్చును.  ఆశ్రయపురాలు ఆరు  1.  హెబ్రోను  2.  షెకెను  3.  కెదెషు  4.  బేసరు  5. రామోతిలాదు  6. గోలాను, దైవోగ్రతకు పాత్రుడగు పాపికి నియమించబడిన ఆశ్రయము యేసుక్రీస్తే.  పాపమునకు రావలసిన శిక్ష కలుగక ముందే విశ్వాసము వలన యేసు శరణుజొచ్చినవాడు ధన్యుడు.  హెబ్రీ 6:18 ఈ విధముగా దేవుడు తన సంకల్పము నిశ్చలమైనదని, ఆవాగ్దానమునకు వారసులైన వారికి మరి నిశ్చయముగా కనుపరచవలెనని ఉద్ధేశించినవాడై తాను అబద్ధమాడజాలని నిశ్చలమైన రెండు సంగతులను బట్టి మన యెదుట వుంచబడిన నిరీక్షణను చేపట్టుటకు శరణాగతులమైన మనకు బలమైన ధైర్యము కలుగునట్లు ప్రమాణము జేసి, వాగ్దానమును దృఢపరిచెను.  ఇది ఏడవది, నూతన నిబంధన కాలములోనిది, దైవత్వముచే ఏర్పరచబడినది.

        పాపియొక్క లోకసంబంధమైన ఆరు ఆశ్రయముల కంటెను అనగా ధనము, జనులు కలిమి, గృహము, పదవి, ప్రభుత్వము మొదలైన వాటిని ఆశ్రయింపక ఏడవదైన యేసు సన్నిధిని జీవించుటన్నది ఎంతో ధన్యతరమైనది.  ఈ సందర్భములో ఇట్టి ధన్యత పొందినవారిని గూర్చి యోహాను 4:లో సమరయస్త్రీ ఈమె ఆరుగురిని ఆశ్రయించి వ్యర్థురాలై, ఏడవ ఆశ్రయపురమైన యేసుచే ధన్యురాలైంది.  లూకా

19:1లో జక్కయ్య తన జీవితములో ధనాన్ని, పదవిని, ప్రభుత్వాన్ని, ఐశ్వర్యాన్ని, కుటుంబాన్ని, చివరిగా మేడి చెట్టును తన ఆశ్రయములుగా జేసి వ్యర్థుడై, ఏడవ ఆశ్రయమైన క్రీస్తు దర్శనము ద్వారా

ధన్యుడైనాడు.  క్రీస్తుతో సిలువ వేయబడిన దొంగ తన చోర వృత్తిలో ఆరు విధములైన అనుభవాలు పొంది, ఏడవ స్థలమైన క్రీస్తు సన్నిధిలో పరదైసు ప్రవేశమునకు అర్హుడైనాడు.  ఇక మీ మాట మా మాట ఏమిటి?  ఏ స్థితిలో వున్నాము?

..............

        అపొ 17:27 ఆయన నొకని నుండి ప్రతి జాతి మనుష్యులను సృష్టించి వారు ఒకవేళ దేవునిని తడవులాడి కనుగొందురేమోయని, తనను వెదకు నిమిత్తము నిర్ణయకాలమును వారి నివాస స్థలములయొక్క పొలిమేర్లను ఏర్పరచెను.

         ప్రియపాఠకులారా!  గడిచిన అంశములలో ఎన్నో దేవునియొక్క మర్మాలను గూర్చి మనము తెలిసికొని యున్నాము.  ఇపుడు మరియొక మర్మాన్ని తెలిసికోపోతున్నాము.  పై వాక్యములో దేవుడు ఒకని నుండి ప్రతిజాతి మనుష్యులను సృష్టించినట్లు వ్రాయబడి యున్నది.  ఈయన ఏర్పరచిన ఒకని నుండి ఏయే జాతులు వచ్చాయో ముందుగ మనము తెలిసికొందము.

        మొట్టమొదటగ ఆదామును దేవుడు ఏదెను తోటను సేద్యపరచు సేద్యగానిగా నియమించాడు.  నరుడు దైవచిత్తానుసారముగా సేద్యగాడుగ జీవించినన్ని దినములు పవిత్రుడుగను, పరిశుద్ధుడుగను, దైవవనము అను ఏదెనులో స్వతంత్రునిగాను, చింతా చీకు - బరువు బాధ్యతలు లేని జీవితాన్ని జీవిస్తూ నిత్యసంతోషాన్ని అనుభవించాడు.  కాని కాల దోషమును బట్టి తన బుద్ధి - భూఫలములను బట్టి లోకఫలాన్ని ఆశించుటను బట్టి నరుడు శాపగ్రస్తుడై, దేవునియొక్క పరిశుద్ధ సన్నిధి నుండి వెళ్ళగొట్టబడినప్పుడు ఆతని పాపము దేవుడు నిషేధించిన ఫలముయొక్క ప్రభావము, రెండును ఏకమై, ఆదాముయొక్క శ్రీమతియైన స్త్రీ గర్భములో రెండు జాతులను రూపించాయి.  అంటే ఆది నరుని మొదటి కుమారుడైన కయీను రైతు.   రెండవవాడు గొల్లవాడు,  గొఱ్ఱెలను మేపువాడు.

         ప్రియపాఠకులారా!  ఇచ్చట రెండు జాతులు ఉద్భవించినవి.  చిత్రమేమంటే ఆది నరజంటకు తొలి గర్భఫలమైన ఈ ఇద్దరు బిడ్డలకు దైవత్వాన్ని  గూర్చి దైవ ప్రసన్నతను గూర్చి ప్రయత్నించి, అందులో చిన్నవాడైన హేబెలు దైవ ప్రేమకు పాత్రుడైనందున హేబెలు అన్నయైన కయీను ఈర్ష్య, అసూయ గుణాతిశయములతో నిండుకొన్నవాడై, తగు సమయము కొరకు కనిపెట్టి, పొలములో ఒంటరిగా వున్న హేబెలును హతమార్చినాడు.  అందునుబట్టి ఒకడు హంతకుడుగాను, మరియొకడు మరణపాత్రుడుగాను తెలియుచున్నది.  ఈ విధముగా దినదిన ప్రవర్థమానమై విస్తరించిన జనాంగములో ఈ రైతు - గొల్ల, ఈ రెండు జాతులు గాక అనగా ఈ రెండు జాతులును దైవత్వమునకు ప్రీతికరము యోగ్యకరము కానందువలన ఆది 6:లో దేవుడు తాను జరిగించబోవు లోక వినాశన మారణహోమములో - నోవహు అనునట్టి వ్యక్తిని నీతిమంతునిగ ఎన్నికజేసి, అతనినిగాక అతని కుటుంబాన్ని కూడా - ఆ నీతిమంతుల జాబితాలో జేర్చి, ఆ కుటుంబము ద్వారా సృష్టి వినాశనానంతరము  అదే నోవహు కుటుంబము ద్వారా పునః నరసృష్టి గావించినట్లు చదువగలము.  ఇంతకును ఆ నోవహు వడ్రంగి - వడ్రంగి కాబట్టి దేవుని చిత్తానుసారముగా దేవునియొక్క నమూనాతో ఓడను తయారు చేయగల్గినాడు.  నోవహు విశ్వాసి మాత్రమేగాక గొప్ప హస్త నైపుణ్యత కలిగినట్లుగా అతడు చేసిన ఓడ నైపుణ్యమును గూర్చిన పరిజ్ఞానము లోకానికి చాటుచున్నది.   లోకములో కట్టబడిన గృహములు వాహనములు వగైరాలు వంద సంవత్సరములుగాని ఇక అంతకు పైన రెండువందల సంవత్సరములలోపు స్థిరత్వము కలిగి ఉన్నాయి.  అయితే నేటి నోవహు చేసిన ఓడ నేటికిని  అరారాతు పర్వతాల మీద ఉందంటే, నోవహుయొక్క పనితనము, అతనియొక్క హస్త నైపుణ్యత ఆ అజ్ఞాన కాలములో అతనికున్న జ్ఞానము చాటుచున్నది.

         ప్రియపాఠకులారా!  నోవహు కాలములో మరలు చీలలు పట్టాలు మేకులు యంత్రాలు లేవు.  కేవలము కొయ్యతోనే విశాలమైన గొప్ప మూడు అంతస్థులతో ఓడను నోవహు చేయగల్గినాడంటే ఎంత జ్ఞానము కావలెను.  కనుక ఈ జ్ఞానమును బట్టి నోవహు యెహోవాను వెదకినాడు - ఆయనను కనుగొన్నాడు.  దేవుణ్ణి కనుగొన్నవారిలో మొట్టమొదటివాడు హానోకు, రెండవవాడు నోవహు.  నోవహు తన జీవిత కాలమంతయు దేవుణ్ణి కనుక్కొని వెదకుచు, దేవుని ఆజ్ఞానుసారముగా దేవుని మార్గములో నడిచాడు.  ఈయన వడ్రంగి భక్తుడు.  ఇప్పటికి నాలుగు జాతులైనవి.

        ఈ విధముగా దేవుడు ఆయా మనుష్యులను వారి వారి వృత్తులను బట్టి ఆయా జాతులుగా విభాగిస్తూ కాలము జరుపుచుండగా - ఉన్నపళముగా నరులలో అజ్ఞానము పడగవిప్పి అజ్ఞాన దశలో మూర్ఖంగా ఆలోచించి, భూమిమీద నుండి పరలోక రాజ్యానికి, ఆకాశానికి అంటే గొప్ప పట్టణాన్ని కట్టాలన్న తలంపు కల్గింది.  కేవలము తలంపుతోనే ఈ కార్యక్రమానికి కొన్ని లక్షల జనాభా తలపెట్టి గోపుర నిర్మాణాన్ని ప్రారంభించారు.  వీరియొక్క విచిత్ర అహంభావ జ్ఞానమునకు దేవుడు ఆశ్చర్యపడి, నరులు కట్టే ఈ యొక్క గోపురమును ఉన్నతమైన పట్టణమును చూడాలని పై నుండి దిగివచ్చుట - భూమిమీద నుండి ఆ నరులు కట్టే ఆ మహా గోపుర నిర్మాణ కార్యక్రమము త్వరితగతిని జరుగుచుండగా దేవుడు ఆలోచించి, నరులయొక్క జ్ఞానము బహు గొప్పగా వికసించి జరిగించుచున్న ఈ క్రియకు దేవుడు ఆగ్రహించి, ఆవరకు ఇటువంటి జాతులు వేరైనను, భాష ఒక్కటే!  కాబట్టి దేవుడు వారి భాషను తారుమారు చేసి, ఒకరి మాట ఒకరికి అర్థముగాని స్థితిలో అయోమయ స్థితిలో క్రియ జరిగించాడు.

         ప్రియపాఠకులారా!  దైవసృష్టియైన నరుడు దేవునియొక్క జీవాత్మలోను, ఆయన కార్యములోను పాలిభాగస్థుడైన నరుడు - దేవుని కనుసన్నలలో మెలగుచు, ఆయనను ప్రార్థన ద్వారా - స్తుతుల మూలముగా గాన ప్రతిగానాలతో ఆరాధిస్తూ ఆయనను వెదకవలెను.  అయితే ఇందుకు విరుద్ధముగా నరులు చేసిన క్రియ దేవునికి ఆగ్రహాన్ని పుట్టించింది.  కనుక అక్కడనుండి జాతులకు బదులుగా భాషలు గల వారినిగ దేవుడు చేశాడు.  కాని జాతిలో మానవుడు దేవుని చూడలేని స్థితి ఏర్పడినందున, ఇప్పుడు దేవుడు వారి భాషను తారుమారు చేయుటను బట్టి తారుమారైన ఈ భాషలలో నరులు నానావిధములుగా తలమునకలై, ఆయా భాషల ద్వారా దేవుణ్ణి వెదకుటకు ప్రయత్నించి జరిగించిన కృషియే.  నేడు నానాభాషలలో విరచితమైనట్టి పరిశుద్ధగ్రంథము.  కనుక ఇప్పటి నరుడు జాతిని బట్టి గాక, భాషను బట్టి బహుముఖముగా దేవుని వెదకుచు, ఆయన ఆశీస్సుల కొరకు ప్రయత్నిస్తున్నాడు.

        ఈ విధముగా నానాభాషలతో మాట్లాడు నరులను దేవుడు విడిచిపెట్టక అపొ 2:లో ఒక అపొస్తలుల మీదనే గాక, ఆ సమయములో అక్కడ వున్న సమస్త జనాంగము మీద కూడా వ్రాలి, వారిని నానాభాషలతో మాట్లాడించినట్లుగ చదువగలము.  ఆ విధముగా నానాభాషలతో మాట్లాడించిన మాటలే నేటి పరిశుద్ధ గ్రంథమని మనము తెలిసికోవలెను.  ఈ విధముగా ప్రార్థనా సావాసములో ఈ నానాభాషలు మాట్లాడు నానా జనాంగముల నానాభాషలతో కూడిన ప్రార్థనలు చేయుచు నానా భాషలతో కూడిన ప్రదేశాలలోని ఆయా భాషకు అనుగుణముగా క్రీస్తు మందిరాలను కట్టుకొని ప్రార్థనలు, ఆరాధనలు, ఉపవాస ప్రార్థనల ద్వారా దైవత్వముయొక్క ఆత్మీయతను పొందాలని, దేవునియొక్క నిజత్వాన్ని కనుగొనాలని ప్రార్థనాయుతమైన పోట్లాటలతో (ఇదే తడవులాడుట) తడవులాడుచు, నేటి క్రైస్తవ విశ్వాస జనాంగమున్నది.  ఈ విధముగా దేవుడు వారి నివాస స్థలములకు పొలిమేరల నేర్పరచినట్లుగా మూలవాక్యములో వ్రాయబడి యున్నది.

        ఈ నివాస స్థలములు, ఈ పొలిమేరలు ఏవి?  పొలిమేరలు అనగా హద్దులు.  ప్రియపాఠకులారా! క్రైస్తవ సంఘమునకు కొన్ని నిబంధనలు, కట్టుబాట్లు, హద్దులున్నాయి.  వాటిని బట్టి క్రైస్తవ విశ్వాసులైన మనము జీవిస్తున్నాము.  ఈ పొలిమేరలు అనేటటువంటి ఈ కట్టుబాట్లలోని ప్రధాన వివరాలు ఏమిటంటే, క్రీస్తును తప్ప మరెవ్వరిని ఆరాధించకూడదు;  విగ్రహారాధన పనికిరాదు;  క్రీస్తు ఆరాధన ఆత్మతోను, సత్యముతోను కూడుకొన్నది గనుక ఆయనను ఆరాధించువారు ఆత్మతోను, సత్యముతోను, ఆరాధించవలెను.  క్రైస్తవ సావాసము ప్రేమతో కూడుకున్నది గనుక ప్రతి వ్యక్తియు ప్రేమ కలిగి యుండవలెను.  ప్రియపాఠకులారా!  విశ్వాసము లేనిదే దేవునికి ఇష్టుడై యుండుట అసాధ్యము.  మెలకువ, ఇది విశ్వాస జీవితములో చాలా ముఖ్యము.  ఈ మెలకువ లేకపోతే క్రైస్తవ విశ్వాసి సులభముగా పతనావస్థకు దిగజారే ప్రమాదమున్నది.

        దేవుని వెదకి తడవులాడి కనుగొన్నవారు కలరా?  అనిన అంశాన్ని వేదరీత్యా మనము తెలిసికొందము.  మొట్టమొదటగా దేవుణ్ణి తెలిసికొని తగవులాడి, ఆయనను కనుగొని, ఆయనతో చేతులు కలిపి ఆయనతో నడిచి ఆయన ద్వారా కొనిపోబడి, లోకానికి కనుమరుగైన వ్యక్తి హానోకు.  అటుతరువాత దేవుని వాక్కును బట్టిగాక ఆయన ప్రత్యక్షత కొరకు ప్రాకులాడి, ఆయన చిత్తానుసారము, ఆయన నిర్ణయించిన స్థలములకు నడిచి, నిజదేవుని తెలిసికొన్న ఆత్మీయానందములో తన కుమారుని సహితము దహనబలిగా నిచ్చుటకు వెనుకాడని అబ్రాహాము.  అటుతరువాత అతని మనుమడైన యాకోబు విషయములో - యాకోబు దేవుని కనుగొని ఆయనతో పెనుగులాడి, ఆయనను తన దేవునిగా చేసికొని, ఇశ్రాయేలు అను బిరుదును పొందినట్లు చదువగలము.  ఈ విధముగా దేవుణ్ణి తడవులాడి కనుగొన్న వారిలో మోషే - యెహోషువ - ఎలీషా - యెషయా వంటి ప్రవక్తలు;  దానియేలు వంటి దీర్ఘదర్శులు : వీరు దేవుని తడవులాడి కనుగొన్నటువంటి దైవసంబంధులు :

        ఇక నూతన నిబంధనలో తూర్పుదిక్కున పుట్టిన నక్షత్రమును చూచి - ఆ నక్షత్రముయొక్క ప్రభావము - విలువ వగైరాలను గణించి అంత మాత్రమే గాక ఎడారి భూమిలో పయనించి, ఆ నక్షత్రానికి మూలకారకుడు మూలపురుషునియొక్క జనన విధానమును గూర్చి తడవులాడి, కనుగొన్న ముగ్గురు జ్ఞానులు.  అలాగే నూతన నిబంధనలో దైవకుమారుడైన యేసును కూడా వెదకుచు, ఆయనను కనుగొని ఆయన దర్శన భాగ్యము పొందిన వ్యక్తులలో మొదటివాడు జక్కయ్య, రక్తస్రావపు స్త్రీ; మగ్దలేనే మరియ వగైరాలు.

        అయితే ఈనాడు ఆ విధముగా తడవులాడి దేవుని వెదకువారున్నారా ? అంటే దీనికి జవాబు రోమా 3:11  దైవవాక్యమే జవాబిస్తున్నది.  ఇందులోని సారాంశ వివరము :  నీతిమంతుడు లేడు ఒక్కడును లేడు.  దేవుని వెదకువాడును లేడు.  అనుటయే!  ప్రియపాఠకులారా!  మన ఆత్మీయ స్థితిని గూర్చి వాతావరణాన్ని గూర్చి, దైవవాక్యమే పై విధముగా వివరిస్తున్నది.  ఇక ఈ విధముగా కాకుండ మరియొక విధముగా అనగా తనను వెదకుటకుగాను, తగు కాలములో నరులయొక్క నివాస స్థలములయొక్క పొలిమేరలలో మందిరాలు;  బహిరంగ ప్రార్థన కూడికలు;  సువార్త కూటములు, స్వస్థత కూటములు; కృతజ్ఞతా కూటములు, ధ్యాన కూటములు; ఆదరణ కూటములు; స్తుతి కూటములు వగైరా పేర్లతో క్రైస్తవ జీవితమునకు పై కూటములను పొలిమేరలుగా పై వాటిని ఏర్పరచి యున్నాడు.  ఎందుకంటే దేవుడు మనలో ఎవనికిని దూరముగా వుండేవాడు కాదని వ్రాయబడ యున్నది.  అంటే మనమందరము ఆయన సన్నిధిలో వుండాలని, మన దృక్ఫథములో ఆయన - ఆయన దృష్టిలో మనము సన్నిహితులుగా వుండాలని, ఆయన సర్వస్వమునకు వారసులుగ మనము వుండాలని, ఆయన మనలో - మనము ఆయనలో కలిసి జీవించాలని దేవుని సంకల్పమై యున్నది.  అందుచేతనే పొలిమేరలు అనబడు ప్రార్థన సావాసములే గాక, ప్రార్థనా మందిరాలు ఏర్పాటు జేసి యున్నాడు.  ఇవి లోకరీత్యా మిద్దెలు, మేడలు, ఏ విధముగా పక్కా గృహాలుగా పిలువబడుచున్నాయో, అలాగే క్రైస్తవ మందిరమన్నది పక్కా గృహము అనగా స్థిరమైన గృహము.  ఎందుకంటే లోకము నరులు అశాశ్వితులు : సృష్టికర్త - ఆయనేర్పరచుకొన్న స్థానములు స్థిరమైనవి.  అందుకే ఇవి పక్కా గృహములు.  అట్టి గృహమనే ఇశ్రాయేలు అను గృహము పక్కా గృహము - ఎందుకంటే పాత నిబంధన కాలము నుండి అనగా మోషే కాలము నుండి అనేక ఒడిదుడుకులను తట్టుకొని శోధనలు, బాధలు, వేదనలు, ప్రమాదములు, దైవోగ్రతలు;  అన్యులయొక్క చెరలను తట్టుకొని నిలబడి - నాడు దేవుడు కట్టిన ఇశ్రాయేలు జనాంగము మేమే!  అనుటకు సాక్ష్యార్థముగా ఈనాటికిని ఇశ్రాయేలు జనాభా నాటి చరిత్రకు సాక్షిగా నిలబడి యున్నది.  ఇట్టి ఇశ్రాయేలు అను గృహమునకు నమ్మకమైన నిర్వాహకుడు మోషే.  ఆనాడు దేవుడు ఇశ్రాయేలుకు వేసిన పొలిమేరలు అలాగే వున్నాయి.  ఆ పొలిమేరలు ఏమిటంటే పాలస్తీను, యెరూషలేము, దావీదు పట్టణము, గాజా, బేత్లెహేము, నజరేతు ఇవన్నియు  బైబిలులో వ్రాయబడిన ప్రకారముగా ఇశ్రాయేలుయొక్క పొలిమేరలు.

        అయితే నేటి క్రైస్తవులమైన మన పొలిమేరలు ఎట్లున్నవి?  ఒక్కసారి మనము పరిశోధించుకుంటే పరిశుద్ధ గ్రంథమే మనకున్నట్టి ఈ సమస్యను అనుమానాన్ని తీరుస్తుంది.  ఎట్లంటే దేవునియొక్క పొలిమేరలలో ఇశ్రాయేలున్నారు.  క్రీస్తుయొక్క పొలిమేరలలో అపొస్తలులు జీవించారు.  నేటి క్రైస్తవులమైన మనము అపొ 2:42-47 లో వీరు అపొస్తలుల బోధయందును, సహవాసమందును, రొట్టె విరచుట యందును,   ప్రార్థన చేయుట యందును ఎడతెగక వుండిరి.  మరియు 46వ వచనములో వారేకమనస్కుతో ప్రతి దినము దేవాలయములో తప్పక కూడుకొనుచు, ఇంటింట రొట్టె విరచుచు, దేవుని స్తుతించుచు, ప్రజలందరి వలన దయ పొందినవారై, ఆనందముతో నిష్కపటమైన హృదయముతోను ,ఆహారము పుచ్చుకొనుచుండిరి.  మరియు ప్రభువు రక్షణ పొందుచున్న వారిని అనుదినము వారితో చేర్చుచుండెను.  ఇది నేటి క్రైస్తవ జీవితానికి ప్రభువు అనుగ్రహించిన పొలిమేరలై యున్నవి.

        కనుక  ప్రియపాఠకులారా!  ఇట్టి పొలిమేరలలో మనమున్నామా? ఈ పొలిమేరలను క్రీస్తే స్వయముగా తానేర్పరచినట్లుగా ఋజువులున్నవి.  ఈ సందర్భములో లూకా 22:17-20, ఆయన గిన్నె ఎత్తికొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి - మీరు దీనిని తీసుకొని మీలో పంచుకొనుడి - ఇక మీదట దేవుని రాజ్యము వచ్చువరకు నేను ద్రాక్షారసము త్రాగనని మీతో చెప్పుచున్నాననెను.  పిమ్మట ఆయన యొక రొట్టెను పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి, దాని విరిచి, వారికిచ్చి ఇది మీ కొరకు ఈయబడుచున్న నాశరీరము - నన్ను జ్ఞాపకము చేసికొనుటకు దీనిని చేయుడని చెప్పెను.  ఆ ప్రకారమే భోజనము అయిన తర్వాత ఆయన గిన్నెయు పట్టుకొని, ఈ గిన్నె మీ కొరకు చిందింపబడుచున్న నా  రక్తము వల్లనైన క్రొత్తనిబంధన : దీనిని ఆచరించునప్పుడెల్ల నన్ను జ్ఞాపకము చేసుకొనుడి.

        ఇక పరిశుద్ధాత్మ దేవునియొక్క పొలిమేరలు :  నేటి యుగములో బహుముఖముగా వ్యాపించి క్రియ జరిగిస్తున్నాయి.  నేటి సంఘ నిర్మాణమునకు దానియొక్క ఫలాభివృద్ధికి పరిశుద్ధాత్మయొక్క ఏర్పాటు - పరిశుద్ధాత్మయొక్క ప్రత్యక్షీకరణ - పరిశుద్ధాత్మయొక్క ఎన్నిక - పరిశుద్ధాత్మయొక్క క్రియామూలమై యున్నది.  నేడు త్వరితగతిని గట్టపడుచున్న మరియు విస్తరిస్తున్న క్రైస్తవ సంఘములనబడు పొలిమేరలకు నిర్మాణకుడు పరిశుద్ధాత్ముడే!  ఇట్టి క్రియ ద్వారా ఈ పొలిమేరలలో తన విశ్వాసులతో కూడా ప్రభువు ఏకమై యుంటాడేగాని వారికి దూరముగా వుండడు అని మనము గ్రహించాలి.

..........

        ప్రసంగాంశము :-  ఆశ్రయపురము యెహోషువ 20:7-9 సంఖ్యా 35:6-11 (1) హెబ్రోను  (2)  షేకెము  (3)  కేలేషు  (4)  బేసరు (5) రామతిల్లాదు  (6)  గోలాను.

        నరహత్య చేసిన వ్యక్తిని చంపబడిన వ్యక్తి తాలూకూ వ్యక్తి హంతకుని తరిమి వెదికి చంపు వాడుక ఆ కాలమందు ఆయా దేశములలో వుండెడిది.  నిర్గమ 2:3లో మోషే యూదులకు చట్టములు నియమించినప్పుడు కనికరము కనబరచు ఒకక్రొత్త విధానాన్ని (చట్టాన్ని) ఏర్పరచాడు.  ఒకడు విరోధ బుద్ధి చేత గాక, పొరబాటున ఒకనిని చంపినట్లయితే చంపినవాడు అట్టి ఆశ్రయపురములోకి పారిపోయి, ఆ సంగతి విచారణ జరుగువరకు అచ్చట నిర్భయముగా జీవించవచ్చును.  యెహోషువ 20:1-3లో ఈ సందర్భములో చదువగలము.  ఆ పురములకు పారిపోయిన వాని సంగతి అక్కడి పెద్దలు క్షుణ్ణముగా విచారించాలి.  అతని హత్య ఉద్ధేశ్య పూర్వకమైనదిగా ఋజువైతే వారు విరోధుల కాతనిని అప్పగించాలి.  ద్వితియోపదేశకాండము 19:12లో అట్లు గాకుండ పొరబాటున చంపినట్లు ఋజువైతే, అతడు ఆ ఆశ్రయపురమందును, దానికి వెయ్యి గజాల దూరములోను సురక్షితముగా బ్రతుకవచ్చును.  సంఖ్యా 25:26-31, చంపబడిన వాని బంధువులతనికి ఏ కీడు చేయరాదు.  ఆ ఆశ్రయపురమునకు పోవు మార్గములను బాగుజేసి ద్వితీయోపదేశకాండము 19:3లో వలె రెండు బాటలు చీలు తావులలో ఆశ్రయపురమునకు పోవు మార్గమును కనబరచు స్థంభములను కట్టువారు.  ఇది పాత నిబంధనలోని ఆశ్రయపుర వివరము.

        అయితే నేటి నూతన నిబంధన కాలములో దైవోగ్రతకు పాత్రుడైన పాపికి నియమించబడిన ఆశ్రయపురము యేసుక్రీస్తు - పాపమునకు రావలసిన శిక్షకు మారుగా యేసు శరణు జొచ్చినవాడు ధన్యుడు.  హెబ్రీ 6:18 పాపియొక్క లోకసంబంధమైన ఆరు ఆశ్రయపురముల కంటెను అనగా ధనము, జనులు, కలిమి, గృహము, పదవి, ప్రభుత్వము - ఇవి లోక సంబంధమైనవి.  వగైరా ఇట్టి వాటిని ఆశ్రయింపక, ఏడవదియైన యేసు సన్నిధిని జీవించుటన్నది ఎంతో ధన్యకరమైనది. ఈ సందర్భములో ఇట్టి ధన్యతను పొందిన వారిని గూర్చి యోహాను 4లో సమరయస్త్రీ ఈమె ఆర్గురిని ఆశ్రయించి, వ్యర్థురాలై, ఏడవ ఆశ్రయపురమైన యేసును చేరి ధన్యురాలైంది.  లూకా 19:1లో జక్కయ్య తన జీవితములో ధనాన్ని, పదవిని, ప్రభుత్వాన్ని, ఐశ్వర్యాన్ని, కుటుంబాన్ని, చివరిగా మేడి చెట్టును తన ఆశ్రయములుగా చేసికొని, వ్యర్థుడై, ఏడవ ఆశ్రయమైన క్రీస్తు దర్శనము ద్వారా ధన్యుడయ్యెను.  క్రీస్తుతో సిలువ వేయబడిన దొంగతన చోర వృత్తిలో ఆరు విధములైన అనుభవాలు పొంది, ఏడవ స్థలమైన యేసు సన్నిధిలో పరదైసు ప్రవేశానికి అర్హుడాయెను.  ఇక నీ మాట మన మాటేమిటి?  ఏ స్థితిలో ఉన్నాము?

        యెహోషువ 20:7-8 ఆశ్రయపురములు :-  1.  కెదెషు  2. షెకెము 3.  కిర్యతర్బాను  

4. బేసెరు  5.  రామోతు  6.  గోలాము;  అపవాదియొక్క ఆశ్రయపురములు  (1)  జలములు  (2) భూమి  (3)  ఆకాశము  (4)  వాయుమండలము  (5)  పాతాళము  (6)  నరులు.

............

        అంశము :-  శ్రమ - కష్టము - ఆపద - ప్రమాదము - చర ఇట్టి వాతావరణములో కూడుకొన్న నరజీవితమునకు శారీరయుతముగాను, ఆత్మయుతముగాను కలుగు ఆధిక్యత ఆనందముతో కూడిన ఫలభరిత జీవితము, ఇందులో అణగారి యున్న దైవనిగూఢ సత్యమును గూర్చి వివరణ :  మూలము ఆది 37:18-28 వ్రాయబడిన లేఖన భాగములోని వివరణ.  మరియు ఆది 39:1-23 వ్రాయబడిన లేఖన భాగము, మరియు ఆది 41:1-46 వ్రాయబడిన వేదభాగము పై మూడు వేదభాగాలను గూర్చిన వివరణ.

        ప్రభువునందు ప్రియమైనవారలారా!   ఇంతకు ముందు యెషయాను గూర్చి, యెషయాయొక్క ఇహలోక జీవితాన్ని గూర్చి ఆ విధముగా ఇహలోక సంబంధియై యున్న యెషయాకు ప్రత్యక్షముగా తన దర్శనమునిచ్చి, దర్శనరీత్యా తన దూత ద్వారా ఆశ్చర్యకరమైన క్రియతో ప్రత్యక్షముగా తన సేవకు పిలుచుకొని మాట్లాడిన విధము - ఆ విధముగా దైవిక పిలుపు అందుకున్న యెషయాయొక్క దైనందిన జీవితము దేవుడు యెషయాకు అనుగ్రహించినటువంటి ఆత్మ నింపుదల, తద్వారా యెషయా వ్రాసిన గ్రంథాలలోని మర్మములు మరియు భూత వర్తమాన భవిష్యత్‌ కాలములలో జరుగు విషయములను గూర్చి లేఖన భాగాలలో రచింపజేసిన విధము గూర్చి క్షుణ్ణముగా మనము తెలిసికొని యున్నాము.

        ఇప్పుడు ఇశ్రాయేలు గోత్రములో ఒక గోత్రమునకు మూలపురుషుడును, యాకోబుయొక్క 12 మంది కుమారులలో ఒకడును అయిన యోసేపుయొక్క సుఖ దుఃఖ సంతోష  చేదు అనుభవాలను గూర్చియు, యెషయాను పిలిచిన దేవుడు - యోసేపును కూడా తన బిడ్డగా చేసికొని దేవుడు తన హస్తముతో యోసేపును కాపాడిన విధానమును గూర్చి మనము వివరముగా తెలిసికొన్నాము.  యోసేపును గురించి పై వివరించిన మూడు వేదభాగాలలోని వివరములను గూర్చి పరిశీలించెదము.

        ఆది 37లో యోసేపు జీవితములో మొట్టమొదట యోసేపుకు అనుగ్రహించబడిన ప్రేమ :-   యోసేపు తండ్రి ప్రేమను సంపాదించుకొని, గొర్రెల కాపరిగా తన అన్నదమ్ములతో జీవిస్తున్నట్లును, తన అన్నదమ్ముల చెడు ప్రవర్తనను గూర్చి తండ్రికి అప్పుడప్పుడు చెప్పుచు, తన అన్నలయొక్క చెడు నడతను అసహ్యించుకొన్నట్లుగా వివరించబడి యున్నది.  యోసేపు - తండ్రికి వృద్ధాప్యములో పుట్టినవాడు.  కనుక యాకోబు తన అందరి కుమారుల కంటె కూడా యోసేపును ఎక్కువగా ప్రేమించాడు.  ఈ విధముగా తండ్రి యొక్క ప్రేమ - యోసేపు మీద మిక్కుటముగా వుండుటను బట్టి, యోసేపు అన్నదమ్ములు ఏకమై అతని మీద పగబట్టినట్లు వివరించబడి యున్నది.  అంతేగాకుండ వారి పగకు మరెక్కువగా ఆజ్యము పోసినది యోసేపు కనిన కల ఈ ఆధ్యాయములో మనము చదువగలము.

        అదేమనగా యోసేపు అన్నలు కట్టిన పనలు సాష్టాంగపడి - యోసేపు కట్టిన పన లేచి నిలుచుచుండగా దానికి సాష్టాంగపడి నమస్కరించినట్లుగ యోసేపు చెప్పుటను బట్టి అతని అన్నలు మరింతగా పగబట్టినట్లుగా కూడా వ్రాయబడి యున్నది.  అతడు మరియొక కలగని ఆ కలలో సూర్యచంద్ర నక్షత్రాదులు తనకు సాష్టాంగపడి నమస్కరించెనని చెప్పుట.  ఈ మాటలతో మరెక్కువగా యోసేపు అన్నలు రెచ్చిపోయినట్లుగా కూడా గ్రంథ వివరణయైయున్నది

        ఇట్టి క్రోధ గుణమునకు దాసులైన తన అన్నలు అతనిని చంపుటకు ఆలోచన జేసి, ఒంటరిగా అతను దొరికిన సమయములో ఒక పాడుపడిన గుంటలో అతనిని పడవేసి చంపుటకు ప్రయత్నించగా దేవుని ఆత్మ - యోసేపు అన్నదమ్ముడైన రూబేనును ఆవరించి, యోసేపును చంపనీయకుండ విడిపించినట్లు, రక్తము చిందింపకుండ - యోసేపుకు ఎలాంటి హాని చేయకుండ గుంటలో అతనిని వుంచమని చెప్పుట - యోసేపుకు తండ్రి తొడిగిన అంగీని తీసి, అతనిని వట్టి గుంటలో త్రోసి, సోదరుని చంపే ఆలోచనను దేవుని ఆత్మ తప్పించి, వారిలో ధనాశను రేకెత్తించి, వెండి మీది ఆశను వారికి కల్గించి, ఆ మార్గమున వెళ్ళే ఇష్మాయేలులకు ఇరవై తులముల వెండికి యోసేపును అమ్మినట్లుగా చేసినందువలన మరణ బంధకాల నుండి యోసేపు తప్పించబడిన వాడాయెను.  ఇట్టి మరణ గోతిలో నుండి తప్పించబడిన యోసేపునకు దేవుని బలమైన హస్తముతోడై యుండుటను బట్టి, ఇష్మాయేలీయులు యోసేపును ఐగుప్తునకు తీసుకు వెళ్ళి, ఐగుప్తు రాజైన ఫరో ఉద్యోగస్థుడును, సామ్రాజ్య సంరక్షక సేనాధిపతియైన పోతిఫరో అనునతడు ఇష్మాయేలు వద్ద నుండి కొన్నట్లు వివరించబడి యున్నది.

         ప్రియపాఠకులారా!  ఇక్కడనుండి యోసేపునకు యెహోవా తోడై యుండెను గనుక యోసేపును బట్టి, ఐగుప్తు దినదినము వర్థిల్లుచు, యోసేపును బట్టి ఐగుప్తీయుని గృహము కూడా దేవుని ఆశీర్వాదకరముగా శాంతి, సమాధానము, ఐశ్వర్యముతో తులదూగినట్లుగా వ్రాయబడి యున్నది.  అంతేగాకుండ ఐగుప్తీయుడు ఆత్మీయముగా యోసేపుయొక్క జీవితమును గూర్చి అర్థము జేసికొని - యోసేపునకు యెహోవా అన్ని వేళలు తోడై యున్నాడు, కనుక యోసేపు చేయు ప్రతీదియు సాఫల్యతను పొందుచున్నదని గ్రహించి, యోసేపు మీద అతనికి కటాక్షము కలిగి, యోసేపునకే ఐగుప్తీయుడు పరిచారకుడైనట్లు వ్రాయబడి యున్నది.  అంతేగాదు, ఆ ఐగుప్తీయుడు తన ఇంటి యావత్తుకును విచారణకర్తగా నియమిస్తూ తన యావదాస్థిని అతని చేతికి అప్పగించాడు.

        ఈ విధముగా ఆ ఐగుప్తీయుడు తన ఇంటి మీదను, తనకు గల్గిన అంతటిమీదను, అతనిని విచారణకర్తగా నియమించిన కాలము మొదలుకొని యోసేపును బట్టి యెహోవా ఐగుప్తీయుని ఇంటిని ఆశీర్వదించెను.  ఈ విధముగా ఐగుప్తీయుని ఇంటి మీద నున్న యెహోవా ఆశీర్వాదము అతని ఇంటిలోనేమి, అతని పొలములో నేమి, అతనికి కలిగిన సమస్తము మీదను బహుగా విస్తరింపజేసినట్లు మనకు తెలియగలదు.  ఈ విధముగా ఆ ఐగుప్తీయుడు తనకు కలిగిన దంతయు యోసేపు చేతికి అప్పగించిన విధమెట్లనగా ఆ ఐగుప్తీయుడు తాను భోజనము చేయుట తప్ప తనకేమి వున్నదో ఏది లేదో అనిన విషయాన్ని ఆలోచించిన వాడు కాదు.

        ఈ విధముగా క్షేమకరముగా వున్న యోసేపు జీవితములో సాతాను కన్నెర్ర జేసి - యోసేపుయొక్క ఆత్మీయ జీవితమును బాధించుటకు ఆ ఐగుప్తీయుని రాజ్యములో అనగా అతని గృహ బాహ్యములో కాక, ఆ ఐగుప్తీయుని గృహములోనే అతని భార్యనే ఆవరించి, యోసేపును వరింపజేసి యోసేపుయొక్క ఆత్మీయ జీవితాన్ని భంగపరచుటకు - అపవిత్రపరచుటకు ప్రయత్నించి, ఆమె చేత క్రియ జరిగించి, యోసేపును అపవిత్రునిగా జేయుటకు క్రియ జరిగించగా యోసేపుయొక్క ఆత్మీయానంద జీవితమునకు అడ్డతెర పడింది.  అనగా ఆ ఐగుప్తీయుడు తన భార్య తనతో చెప్పిన మాటలను బట్టి నమ్మి యోసేపును చెరసాలలో వేయించుట, ఇది చెరలోని అనుభవము.

         ప్రియపాఠకులారా!  ఇప్పుడు మనము యోసేపు జీవితములో మూడు అనుభవాలు తెలిసికొని యున్నాము.  అందులో మొదటిది తండ్రి చేత ఎక్కువగా ప్రేమించబడుట - అందునుబట్టి అన్నలకు ద్వేషియగుట, 2.  అందును బట్టి యోసేపు ప్రమాదమును తెచ్చుకొనుట - మరణ గోతిలో పడుట - ఆ గోతి నుండి తప్పించబడుట  3.  అన్యుడైన ఫరోకు బానిసగా అమ్మబడుట.  దైవకృపను బట్టి -  ఆ ఐగుప్తీయుని ప్రేమను పొంది, అతని సర్వస్వానికి అధిపతియై, క్షేమకరముగా వున్నను, దురదృష్టవశాత్తు ఐగుప్తీయుని భార్యనుబట్టి, ఆమె జరిగించిన క్రియను బట్టి నిర్దోషియైన యోసేపు - దోషిగా ఎంచబడి చెరసాల పాలగుట.  ఈ మూడు అనుభవాలు ఇపుడు తెలిసికొని యున్నాము.  ఈ మూడింటిలోను దేవునియొక్క హస్తము బలముగా తోడై యుండుటను బట్టి, యోసేపు తన శ్రమల జీవితములో సంతోషాన్ని పొందగల్గినాడు;  సుఖాన్ని చవి చూచాడు.

        ఇటువంటి సందర్భములో ఆదికాండము 41: లో ఐగుప్తు రాజైన ఫరో కనిన కలను యోసేపు వివరించుట అన్న దాన్ని మనము ధ్యానిస్తాము.  యోసేపునకు ఫరో తాను కన్నటువంటి రెండు కలలను వివరించినప్పుడు యోసేపు వాటి భావములను గూర్చి ఫరోకు కలాభావము సవివరముగ వివరించిన విధానము వేదములో చదువగలము.  యోసేపు వివరించిన కలాభావము దేవుని వలన నిర్ణయింపబడి, దైవచిత్తానుసారముగా జరుగునట్లు ఫరోకు యోసేపు వివరించి యున్నాడు.  ఈ విధముగా ఫరో కలలో జరిగిన సంఘటనలు దేశములో భవిష్యత్తులో రాబోయే ఆహార సంబంధమైన సమస్యయై యుండి, అంతేగాకుండ అనావృష్టి ఏర్పడి - భూమి బీటలు పారేటటువంటి భయంకరస్థితి ఏర్పడు సంఘటనను యోసేపు ద్వారా ఫరో తెలిసికొన్న తర్వాత రాబోవు ఏడు సంవత్సరముల కరువు గూర్చి ఐగుప్తు నందంతట, ఫరో యోసేపు ద్వారా జరిగించిన ముందు జాగ్రత్త కార్యక్రమాలు గూర్చిన ప్రణాళికను సిద్ధము జేసిన పిమ్మట,  ప్రియపాఠకులారా!  ఫరో తన సేవకులను పిలిపించి యోసేపును గూర్చి మాట్లాడిన మాట :-   ఇతనివంటి దేవుని ఆత్మగల వానిని కనుగొనగలమా?  అనుటయు, అంతేగాకుండ దేవుడు ఇదంతయు నీకు తెలియబరచెను.  కనుక నీవలె వివేక జ్ఞానములు కల్గిన వాడెవరును లేరు.  కనుక నీవు నా ఇంటికి అధికారివై యుండవలెను.  నా ప్రజలందరు నీకు విధేయులై యుందురు.  సింహాసనము విషయములో మాత్రమే నేను నీ కంటె పై వాడనై యుందునని, యోసేపుతో చెప్పి - ఐగుప్తు దేశము నంతటి మీద నిన్ను నియమించి యున్నాను, అని చెప్పుచు ఫరో తన చేతనున్న తన ఉంగరము యోసేపు చేతికి పెట్టి, ఖరీదైన సన్నపునార వస్త్రములు తొడిగించి - అతని మెడకు బంగారు గొలుసు వేసి తన రెండవ రథము మీద అతనిని ఎక్కించి, జన సమ్మర్థముతో యోసేపును ఊరేగిస్తూ వందనము చేయవలెనని అతని ముందర జనుల చేత కేకలు వేయించుట.

         ప్రియపాఠకులారా!  ఇక ఇక్కడనుండి ఫరో సంస్థానములో యోసేపుకు కలిగిన భోగభాగ్యాలు హెచ్చింపును గూర్చి వివరించాలంటే బహు గొప్పగా ఉన్నది.  ఆది 41:44 ఫరో యోసేపుతో - ఫరోను నేనే, అయినను నీ సెలవు లేక ఐగుప్తు దేశమందంతటను ఏ మనుష్యుడును తన చేతినైనను కాలినైనను ఎత్తకూడదని చెప్పెను, మరియు ఫరో యోసేపునకు జన్నత్పనేహు అను పేరు పెట్టి అతనికి ఓనుయొక్క యాజకుడైన పోతిఫరో కుమార్తెనిచ్చి పెండ్లిచేయుట;  యోసేపు బయలుదేరి ఐగుప్తు దేశమందంతట సంచరించుట.  ఈ విధముగా యోసేపు ఐగుప్తులో హెచ్చింపబడుటకు కారణము యెహోవా హస్తము అతనికి తోడుగా ఉండుట.

         ప్రియపాఠకులారా!  ఇక్కడనుండి యోసేపు చరిత్ర బహుసుఖాంతముగా సమాప్తమైంది.  ఎందుకంటే సాతాను భయముగాని, శతృ భయముగాని, తననుబట్టి ఐగుప్తుకు కరువు సమస్యగాని, తెగులు సమస్యగాని, శతృరాజులతో యుద్దసమస్యగాని, ఏవియులేక, యోసేపునుబట్టి ఫరోయొక్క సామ్రాజ్యాన్ని, ఐగుప్తు ప్రజలను, బహుగా దేవుడు ఆశీర్వదించినట్లుగా ఈ వేదభాగములో చదువగలము.

         ప్రియపాఠకులారా!  అన్యుడైన ఐగుప్తురాజు తన నోటితో ఇతనివలె దేవుని ఆత్మగల నరుని కనుగొనగలమా?  అని అన్నాడంటే ఈనాడు క్రైస్తవ లోకము దేవుని ఆత్మగల మనుష్యుని వెక్కిరిస్తున్నది.  దేవుని ఆత్మగల సేవకుని దూషిస్తుంది;  శ్రమల పాలు జేయుచున్నది.  చిత్రమేమంటే ఐగుప్తురాజైన ఫరో యెహోవాను ఆరాధించువాడు కాదు;  ఇశ్రాయేలుకు విరోధి, దేవునియొక్క శక్తి ఏమిటో ఎరుగనివాడు. ఆనాటి ఐగుప్తు సామ్రాజ్యములో రాజు సంస్థానములో విగ్రహారాధికులకు, జ్యోతిష్యులకు, మంత్రగాళ్ళకు శకునగాండ్రకు, సొదెగాండ్రకు, బహు ప్రాధాన్యత వుండేది.  జ్యోతిషశాస్త్రులు , శకున గాండ్రు, మంత్రగాళ్ళు మాటలు దైవవాక్కులు వేదవాక్కులుగా భావించి, ఐగుప్తు జనాంగము రాజు మొదలుకొని బీద వరకు, తూచా తప్పకుండ పాటించువారు.  అందులో ఆనాటి సామ్రాజ్యములో ఐగుప్తు సామ్రాజ్యమంత విస్తారమైన రాజ్యమేదియు లేదు. బైబిలు గ్రంథములో ఐగుప్తును గూర్చి ప్రత్యేకముగా వ్రాయబడియున్నది.  ఫరో పేరునకు కూడా ప్రత్యేకమైన స్థానమున్నది.  ఫరో పేరు ఐగుప్తులో గణనీయముగా సామాన్య నామధేయము గాక, బహు ప్రాముఖ్యత గల పేరుగా అది వివరించబడియున్నది.  ఐగుప్తు చరిత్ర చాలా గొప్పది.  ఐగుప్తులోని రత్నములు, మణులు, మాణిక్యాలు, వజ్రములు, బంగారము, ఐగుప్తు రాజ్యప్రసాదములు, ఐగుప్తు కోట, ఐగుప్తు రథాలు, ఐగుప్తులోని అశ్వములు, నేర్పరులైన యుద్ధవీరులు, సైన్యాధిపతులు, ఐగుప్తు స్త్రీల యొక్క రాణివాసములు, వారియొక్క విలాసవంతమైన జీవితము ఒకటేమిటి?  నేటి ప్రపంచములోని అగ్రరాజ్యాలు కూడా అనుభవించని మహా రాచరిక వైభవాన్ని ఈ ఐగుప్తు అనుభవించియున్నది.

        యోసేపునుబట్టి దేవుడు ఐగుప్తును ఆశీర్వదించిన విధమెట్లనగా - యోసేపు చెప్పిన దైవవాక్కులను బట్టి, ఏడు సంవత్సరములు ఫరో పరిపాలన, యోసేపు యొక్క ఉపపరిపాలన, యాజమాన్యము ఏకమై యుండగా - మూడవదిగ సృష్టికర్తయైన దేవునియొక్క హస్త ప్రభావము, వారిని ఆవరించినందున, ఐగుప్తులో గోధుమ యవలవంటి ధాన్యాదులు; ద్రాక్ష అంజూరము, ఒలీవ ఖర్జూరము వగైరా ఫలవృక్షాదులు ఇవిగాక నానారకములైన దుంపలు, పప్పు ధాన్యాదులు, తైలములు, ఖనిజములు ఒకటేమిటి?  అన్ని విధములైన ఫలభరితమైన ఐశ్వర్యములతో ఐగుప్తును దేవుడు ఆశీర్వదించాడు.

         ప్రియపాఠకులారా!  ఈ సందర్భములో మనము పరమ గీతములలో 1:9లో నా ప్రియులారా! ఫరోయొక్క రధాశ్వములతో నిన్ను పోల్చెదను అనుటలో ఫరో యొక్క రథాలు - ఆ రథమునకు అలంకరించబడిన అశ్వాలు ఎంత విలువైనవో ఒక్కసారి మనము ఆలోచించవలెను.  మొదటి రాజులు 10:లోను రెండవ దినవృత్తాంతములు 9లోను షేబా దేశపు రాణి మరియు సొలొమోను ఒకరినొకరు ఇచ్చి పుచ్చుకున్న బహుమానాలలో కూడా ఈ ఐగుప్తునకు సంబంధించిన వస్తు సముదాయములున్నవి.  ఈ విధముగా పరిశుద్ధ గ్రంథములో ఇట్టి అగ్రస్థానము పొందిన ఐగుప్తు సంస్థానములో నేడు పెట్రోలు, డీసెలు, కిరోసిన్‌, వగైరా యంత్ర సంబంధమైన తైలాదులకు ప్రసిద్ధి చెంది, విస్తారమైన ధనమును సంపాదిస్తూ నేటికిని ప్రపంచరాజ్యాల చరిత్రలో ఒక స్థానాన్ని సంపాదించుకొన్నది.  నాటి పాత నిబంధనలోని ఐగుప్తు సామ్రాజ్యమే నేడు ఈజిప్టు అను పేరు సంతరించుకొని యున్నది.  చిత్రమేమిటంటే యెహోవా యోసేపును బట్టి ఐగుప్తును ఆశీర్వదించిన ఆశీర్వాదము నేడు కూడా ఈజిప్టునకు కొద్దో గొప్పో ఉన్నందువలన, శత్రు రాజుల ధాటికి తట్టుకోవడము, ప్రపంచ దేశాలలోని అన్ని దేశాలలో గుర్తింపు పొందుట జరుగుచున్నది.  ఈ విధముగా యోసేపునుబట్టి ఐగుప్తునకు ఒక చరిత్ర ఏర్పడింది అనుట గమనార్హమైన విషయము.

........

        పరిశుద్ధ గ్రంథములో ఆయా కాలములలో భూమి మీద నివసించి నానావిధమైన ఆరాధనలు ఆచారములు చట్టాలతో జీవించి, ఈ భూలోకమును ఏలిన జనాంగములను గూర్చియు - ఆది కాలము నుండి నేటి వరకును అనగా నేటి ఆధునిక యుగము మరియు ప్రభువు రాకడ సమయము వరకు నిలిచియుండు జనాంగమును గూర్చిన వివరము.

         ప్రియపాఠకులారా!  పరిశుద్ధ గ్రంథములో మనము చదివినప్పుడు చాలా విషయాలు అనగా పాతవి - నూతనమైనవి నేర్చుకొనదగినవి మన ఊహకు అందనివియు - మన కన్నులకు మరుగై యున్నవి - వగైరా విషయాలు - నేటి నవీన యుగములో భూమి మీద లేనటువంటి జాతులు వంశాలు జనాంగములు వగైరాలను గూర్చి ఎన్నో వ్రాయబడి యున్నవి.  ఆదికాండము నుండి పాతనిబంధనలో మనము చదివినట్లయితే ఆదికాండము 6:లో రెండు జనాంగములు, రెండు జాతులనుగూర్చి చదువగలము.  అందులో 1.  నరుల కుమార్తెలు  2.  దేవుని కుమారులు : ఈ రెండు జనాంగముల ద్వారా భూమి మీద విస్తరించింది.  అధిక జనాభా విస్తారమైన పాపము అనగా ఈ పాపము మానవుల కంటె దేవునికే ఓర్వలేని స్థాయిలో ఎదిగింది.  అంటే దేవుడు లోకసృష్టిని యావత్తును తుడిచివేసేటటువంటి ఉగ్రతాపూరితమైన క్రియకు కారణమైంది.  అంటే దైవసంబంధమైనది - లోకసంబంధమైన, అలౌకికమైన, అక్రమ సంబంధమును కల్గించుకోవడము, తద్వారా అటు ఆత్మీయతను, ఇటు శారీరతను విస్మరించి, సంకర స్వభావమును ధరించిన జనాంగమును భూమిమీద వ్యాపింపజేసినట్లు - ఈ సంకర జాతి జనాంగముల పాపమన్నది విచ్చలవిడిగ వ్యాపించినట్లు ఇందును బట్టి దేవుడు ఉగ్రుడైనట్లును, తన హస్తముతో తాను జేసిన సృష్టినే తుడిచి వేయుటకు దేవుడు సంకల్పించినట్లు వ్రాయబడి యున్నది.

         ఈ విధముగా దైవకుమారులు నరుల కుమార్తెల ద్వారా పుట్టిన మూడవ జనమైన సంకర జనము - ఈ మూడు జాతులును జలప్రళయముతో తుడిచిపెట్టుకు పోయిన తర్వాత నోవహు ఓడలోని ఒకే కుటుంబము మిగిలి, ఒకే జనముగా జల ప్రళయానంతరము అరారాతు కొండల మీద నిలిచిన ఓడ నుండి బయటకు వచ్చిన జనము - ఈ నోవహు కుటుంబము.  ఇక్కడ నుండి నోవహు కుమారులగు షేము;  హాము, యాపేతు, అను వారి నుండి వంశావళులు ఏర్పడినట్లును - ఇందులో యాపేతు కుమారులు గోమేరు, మాగోగు, మాదయి, యానాను, తుబాలు, మెషెకు, తీరసు అనువారు.  గోమేరు కుమారులు అష్కనజు, రీపతు, తోగర్మా అనువారు, యానాను కుమారులు ఎలీషా, తర్పీషు, కిత్తీము, దాదోనీము, అనువారనియు, వీరి నుండి సముద్రతీర మందుండిన జనములు వ్యాపించినట్లును, వారి వారి జాతుల ప్రకారము, వారివారి భాషల ప్రకారము, వారి వారి వంశముల ప్రకారము ఆయా దేశములలో వారు వెళ్ళి పోయినట్లుగా ఆదికాండము 10వ అధ్యాయములో చదువగలము.        

        ఇక హాము కుమారులు కూషు, మిస్రాయిము పూతు కనాను అనువారు.  కూషు కుమారులు సెబాహవీల సబ్తా రాయమా, సబ్తకా అనువారు.  రాయను కుమారులు షేబ దదాను అనువారు.  కూషు నిమ్రోదును కనెను.  అతడు యెహోవా ఎదుట పరాక్రమము గల వేటగాడు.  అందును బట్టి యెహోవా ఎదుట పరాక్రమముగల వేటగాడైన నిమ్రోదు వలె అని ఆ కాలములో ఆ సామెత పుట్టినది.  సీనారు దేశములోని బాబెలు, ఎరెకు, హక్కదు, కల్నే అను పట్టణములు అతని రాజ్యమునకు మొదలు.  అంతేగాకుండ నిమ్రోదు ఆ దేశము నుండి అష్షూరునకు బయలుదేరి వెళ్ళి నీనెవెను రహోబోతీరును కాలహును -నీనెవెకును కాలహుకును మధ్యనున్న రెసెనను కట్టించెను.  ఇదే ఆ మహా పట్టణము.  మిస్రాయిము లూధీయులను, అనామీయులను, లేహాబీయులను, నప్తుహీయులను, కస్లూహీయులను, కస్తోరీయులను కనెను.  పిలిష్తీయులు కస్లూహీయులలో నుండి వచ్చినవారు.

         ప్రియపాఠకులారా!  ఇక్కడ నుండి విస్తరించిన జనాభా జాతులు, వంశములను గూర్చి,

10వ అధ్యాయములో వివరించబడి యున్నది.  ఇక ఆదికాండము 11వ అధ్యాయములో మనము చదివినట్లయితే, ఇంతమంది జనాభాకు ఒకే భాష, ఒకే పలుకు ఉన్నట్లు వ్రాయబడినట్లు యున్నది.  ఈ 11వ అధ్యాయములో కూడా వంశాబివృద్ధిని, జనాభావృద్ధిని గూర్చి వ్రాయబడి యున్నది.

         ప్రియపాఠకులారా!   ఇప్పుడు ఈ జాతులు ఉన్నాయా?  అనిన ప్రశ్న మనకు కలుగవచ్చును.  ప్రభువు చెప్పిన మాటను బట్టి మొదటివారు, కడపటివారును - కడపటివారు మొదటి వారగుదురు, అనిన ప్రవచనాన్ని బట్టి యాకోబు నుండి జనించిన 12 మంది కుమారులు, వారి ద్వారా ఏర్పరచబడిన 12 గోత్రాలు - యాకోబు అతని కుమారుల మొత్తానికి ఒకే పేర్లు ఇశ్రాయేలు అను పేరు.  వారి గోత్రాలు వారి పేర్లు ఎలాగున్నను, ఒకే జనాభా ఇశ్రాయేలు అను పేరుతో ఆది 32:27-28 చదివితే ఆయన నీ పేరు ఏమని అడుగగా అతడు యాకోబు అని చెప్పెను.  అప్పుడు ఆయన - నీవు దేవునిలోను, మనుష్యులతోను పోరాడి గెలిచితివి గనుక ఇక మీదట నీ పేరు ఇశ్రాయేలేగాని, యాకోబు అనబడదని చెప్పెను.  కనుక ప్రియపాఠకులారా!  ఇక్కడ నుండి ఇశ్రాయేలు అను నామముతో దేవునిచే పునాది వేయించుకొన్న జనాభా విస్తరించి, పాత నిబంధన కాలములో -  దైవనడుపుదలను బట్టి, అనేక యుద్ధాలు, అనేక విధములైన పోరాటాలు జరిగించినప్పటికిని, వారు అనగా ఆ జనము తరిగిపోకుండ, అంతరించి పోకుండ చిరస్థాయిగా నేటికిని తాము దేవునియొక్క జనాంగమన్న పేరును నిలుపుకొని, తాము ఒక రాజ్యాన్ని ఏర్పరచుకొని, ఈనాటికిని మనమధ్య వున్నారంటే, పాత నిబంధనలోని తక్కిన జనాభాలేమైనట్లు?  అనిన ప్రశ్న మనకు కలుగవచ్చును.  పాత జనాంగమంతయు పిలిష్తీయులతో కూడా అంతరించి

పోయినట్లే!        

        అయితే పరిశుద్ధ గ్రంథములోని రాజుల చరిత్రను జ్ఞాపకము చేయుటకు నేటికిని ఐగుప్తు సామ్రాజ్యము నిలిచి వుంది.  ఇది కూడా దేవుని కృపయే!  ఎందుకంటే ఇశ్రాయేలుయొక్క చరిత్రను నేటి తరము వారమైన మనకు వివరించుటకు ఐగుప్తులో వున్న దేవుడు మన ఎదుట నుంచి యున్నాడు.  అలాగే దైవకుమారుడైన ప్రభువు సిలువ వేయబడినాడనుటకు అందుకు కారణభూతులైన రోమా పట్టణాన్ని, అందలి నివాసులను, మనమధ్య నుంచియున్నాడు.  ఆనాటి యూదులున్నారు,  హెబ్రీయులున్నారు.

        యేసుక్రీస్తు ప్రభువు లోకములో పుట్టాడు అనుటకు; దైవకుమారుడగు యేసు ప్రభువు తన రక్త బలి ద్వారా సంపాయించుకొన్న నేటి క్రైస్తవులమైన మనము క్రీస్తు జనాంగముగా ప్రత్యేకించబడి యున్నాము.  మనము ఇశ్రాయేలీయులకు సమకాలికులము కాకపోయినప్పటికిని, క్రీస్తునుబట్టి దేవుని బిడ్డలుగా ఉన్నాము.  ఈ సందర్భములో యోహాను 1:12 మనము ధ్యానిస్తే - తన్ను ఎందరంగీకరించెరో  వారికందరికి అనగా తన నామమందు విశ్వాసముంచిన వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారము అనుగ్రహించెను.  కాబట్టి నేటి తరములో అనగా నేటి ఆధునిక యుగములో క్రీస్తు పక్షముగా దేవునికి మనము కుమారులముగా నిర్ధారించబడియున్నట్లు మొదటి పేతురు 2:9-10లో వివరముగా వ్రాయబడి యున్నది.  ఏమనగా చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మును పిలిచినవాని గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తము, ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును దేవుని సొత్తయిన ప్రజలునైయున్నారు.  ఒకప్పుడు ప్రజగా వుండక యిప్పుడు దేవుని ప్రజయైతిరి.  ఒకప్పుడు కనికరింపబడక, యిప్పుడు కనికరింపబడిన వారైతిరి.

         ప్రియపాఠకులారా!  పాత నిబంధన కాలములో అంతరించిపోయి, విగ్రహారాధికులైన వంశముల నుండి అవతరించిన జనాభాయే నేటి హైందవులు, పారశీకులు, బౌద్ధులు, జైనులు, వగైరా జాతులు.  ప్రభువు చెప్పినట్లుగా నిన్న, నేడు, రేపు, యుగయుగములు, ఆయన సజీవుడై యున్నట్లుగానే - నేటి క్రైస్తవులమైన మనము కూడా జాబితాలో చేర్చబడి - సజీవుడైన దైవకుమారుని బిడ్డలుగా తీర్చబడి - పరలోక రాజ్య వారసత్వపు హక్కునకు యోగ్యులగుటకు మనలను దేవుడు ఏర్పరచుకున్నాడు.  ఇది మన వలన జరిగినది కాదు, దేవుని వలన జరిగిన క్రియయే.  

         మరియొక ముఖ్య విషయమేమిటంటే - పాతనిబంధనలో మొదలైన ఇశ్రాయేలు అను నామము - ఆ నామము పెట్టబడిన జనాంగము - పాత నిబంధనలోను;  నూతన నిబంధన కాలములోను, క్రీస్తుతో కూడాను, ఆ తర్వాత అపొస్తలుల పరిచర్యలోను;  నేటి నవనాగరికత యుగములోను, ప్రభువు రాకడలోను; యుగసమాప్తి - లోకము అంతమైపోయిన తర్వాత పరలోకములో కూడా ఇశ్రాయేలుకు ఒక ప్రత్యేక స్థలమున్నట్లుగా ప్రకటన గ్రంథము 7:లో వ్రాయబడినట్లుగా ప్రత్యేక స్థానమున్నట్లుగా చదువగలము.  ఇశ్రాయేలీయుల గోత్రములన్నింటిలో ముద్రింపబడినవారు లక్షా నలుబది నాలుగువేలమంది.

         ప్రియపాఠకులారా!  ఇప్పటివరకు చదివిన సాహిత్యములో - ఇది చదువుచున్నట్టి - నీవు నీయొక్క ఆచారము, నీ ప్రవర్తన, నీ నియమము, నీ భక్తి, ఏ జనమునకు మాదిరికరముగా వున్నది?  

నీవు దేవుని సొత్తుగా జీవిస్తున్నావా?  లేక లోకసంబంధిగా జీవిస్తున్నావా?  అంటే లోకసంబంధమైన జాతులను, మతాలను, గోత్రాలను గూర్చి, గొప్పలు చెప్పుకుంటూ, కాలయాపన చేస్తూ, వ్యర్థముగా

నీ జీవితాన్ని గడపుకొంటున్నావా?  లేక సత్యదేవుని అంగీకరించి, సత్యాచారాములో సత్య సువార్తకు విధేయుడవై, ఆత్మ సంబంధమైన సత్యారాధనను ఆచరిస్తూ, నీ జీవితాన్ని కళంకము లేకుండా జేసుకొనుటకు ప్రయత్నిస్తున్నావా?  ఏ స్థితిలో వున్నావో నిన్ను నీవే పరిశోధించుకో!

............

        2 తిమోతి 2:1,  నా కుమారుడా!  క్రీస్తుయేసు నందున్న కృప చేత బలవంతుడవు కమ్ముః

        ప్రియులారా!  పై వాక్యానుసారముగ క్రీస్తుయేసుయొక్క కృపలో బలవంతులెట్టివారో యేసుక్రీస్తు యొక్క సావాసములో వారికున్న బలమెట్టిదో వేదరీత్యా మనము తెలిసికోవలసి యున్నది.  

          ప్రియపాఠకులారా!  ''యేసుక్రీసు ్త- క్రీసుయేసు'' వీటిలో ఉన్న పరమార్థములు, బలాధిక్యతలు శక్తిప్రభావములను గూర్చి వేదరీత్యా క్షుణ్ణముగా తెలిసికొందము.  మొట్టమొదటిగా మార్కు 4:36-41 జరిగిన సంఘటనలో యేసుక్రీస్తు శిష్యులు గొప్ప తుఫానులో వారు చిక్కుకొని, వారున్నదోనె నీటితో నిండిపోవుచున్న సందర్భములో - ప్రభువును వారు తట్టి లేపుచు అనిన మాట : బోధకుడా!  మేము నశించిపోవుచున్నాము?  నీకు చింతలేదా?  అని ఆయనతో అనుట - 41లో ఈయన ఎవరో?  గాలియు సముద్రము ఈయనకు లోబడుచున్నవని ఒకనితో నొకడు చెప్పుకొనుట, ప్రియపాఠకులారా!  ఈ సంఘటనను బట్టి ప్రభువు శిష్యులయొక్క ఆత్మీయ స్థితిని బట్టి యేసుక్రీస్తుతో వున్నారేగాని, క్రీస్తుయేసులో లేరని మనకు రూఢిగా తెలియుచున్నది.  అంటే యేసుక్రీస్తు ఎన్నుకొన్న శిష్యులే!  ఆయనతోనే ఉన్నారు.  ఆయనచేసిన అద్భుత క్రియలన్నియు చూస్తున్నారు - చూచినారు.  ఆయనతో తమయొక్క కాలాన్ని గడుపుచున్నారు, అంటే ఆయనను యేసుగానే అనగా రక్షకుడుగా వాడుకుంటున్నారేగాని, క్రీస్తుగా ఆయనను అర్థము చేసుకోలేకపోయారు.

        అలాగే లూకా 10:38-42 చదివితే ఈ సంఘటనలో యేసు ప్రభువు ప్రవేశించిన గ్రామములో మార్త అను స్త్రీ ఆయనను యింట చేర్చుకొనుట - ఆమెకు మరియ అను ఒక సోదరీ వున్నట్లును - ఈమె యేసు పాదముల యొద్ద కూర్చుండి, ఆయన బోధ వినుచున్నట్లు - మార్త విస్తారమైన పని పెట్టుకొన్నందు వలన తొందరపడి ఆయన యొద్దకు వచ్చి - నేను ఒంటరిగా పనిచేయుటకు నా సహోదరి నన్ను విడిచిపెట్టి నందున - నీకు  చింతలేదా?  నాకు సహాయము చేయుమని ఆమెతో చెప్పుమని ప్రభువుతో అనుట : అందుకు ప్రభువు;  మార్తా!  మార్తా!  నీవు అనేకమైన పనులను గూర్చి విచారించి తొందరపడుచున్నావు. కాని అవసరమైన దొక్కటే!  మరియ ఉత్తమమైనదానిని ఏర్పరచుకొనెను.  అది ఆమె యొద్ద నుండి తీసివేయబడదని మార్తతో చెప్పుట : ఇది ఈ వేదభాగములోని వివరణ.

        ఇందులో మార్త ప్రభువును యేసుగా అనగా రక్షకునిగా లేక లోకములో నరాకృతిలో అవతరించిన సామాన్య నరునిగ అంటే శరీరునిగ భావించి, యేసు అను భావముతో ఆమె దేహ సంబంధమైన పరిచర్యకు పూనుకొన్నది.  యేసు అనే భావముతోనే ఆయనను దృష్టించింది.  కాని ఆయన క్రీస్తు అని ఎరుగలేక పోయింది.  క్రీస్తును యేసుగానే చూచిందిగాని, యేసును క్రీస్తుగా గ్రహించలేక పోయింది.  అయితే ఆయనను క్రీస్తుగా భావించి, ఉత్తమమైన ప్రభువుగా మహిమ గల దైవసంభూతునిగ, దైవకుమారునిగ, దైవశక్తిగ, అభిషిక్తుడైన క్రీస్తుగా ఆయనకు పాదపూజ చేసింది.  ఆయన బోధను వింటూ యేసు రూపములో వున్నటువంటి ప్రభువులో క్రీస్తును చూడగల్గి ధన్యవంతురాలైంది.

        అయితే ఆమె సహోదరియైన మార్త క్రీస్తును యేసుగానే భావిస్తూ, యేసు సిద్ధాంతముతో, యేసు రూపముతో - యేసులో ఉన్న క్రీస్తు రూపమును చూడలేక, సామాన్య రక్షకునిగ భావించి, ఆయనను శారీరరీత్యా తృప్తి పరచాలని అనుకొనింది.  అంటే క్రీస్తుయేసులోని బలమును, మహిమను, శక్తిని, ప్రభావమును, ఆమె చూడలేక పోయింది, మరియు గ్రహించలేక పోయింది.  ఆ విధముగా యేసును క్రీస్తుగా భావించి, యేసు అను నామమునకు బదులుగా క్రీస్తు అను భావముతో - క్రీస్తు అనుభూతిని, క్రీస్తు మహిమను, క్రీస్తు ఆనందమును, ఆత్మీయానుభూతిని, ఆయన మహిమలో తన్మయురాలై, లోకాన్ని మరచింది మరియ.        

        ఇక మూడవదిగ లూకా 23:39-42, వ్రేలాడబడిన ఆ నేరస్థులలో ఒకడు ఆయనను దూషిస్తూ : నీవు క్రీస్తువు గదా?  నిన్ను నీవు రక్షించుకొనుము - మమ్మును కూడా రక్షించుమని చెప్పెను, అయితే ఆయన కుడివైపు సిలువ వేయబడిన రెండవ దొంగ పశ్చాత్తాప్తుడై, మనకైతే ఇది న్యాయమే, మనము చేసిన వాటికి తగిన ఫలము పొందుచున్నాము.  కాని ఈయన ఏ తప్పిదము చేయలేదని చెప్పి ఆయనను - యేసూ!  నీవు నీ రాజ్యములోనికి వచ్చునప్పుడు నన్ను జ్ఞాపకము చేసికొమ్ము, అనుటలో సిలువ మీది దొంగ, సిలువలో వున్న ప్రభువును లోకరక్షకునిగా భావించి - అయితే ఆయనకు ఒక రాజ్యమున్నదని, ఆయన రాజ్యములో ఆయన పేరు క్రీస్తు అని అంటే - క్రీస్తు దేవునియొక్క రాజ్యమని గ్రహించినవాడై, క్రీస్తు అను రాజ్యములో తనను చేర్చుకోమని అభ్యర్థించుటన్నది ఈ సంఘటనలో జరిగిన కార్యము. దొంగ ఆ విధముగా మాట్లాడిన తర్వాత, లూకా 23:43, నేడే నీవు నాతో కూడా పరదైసులో వుందువని నిశ్చయముగా నీతో చెప్పుచున్నాను, సిలువలో దొంగ యేసులో క్రీస్తును చూచినాడు.

        ఇక శిష్యకోటిలో ప్రధముడైన పేతురు మత్తయి 16:13-17 చదివితే - యేసు కైసరయ ప్రాంతములకు వచ్చి - మనుష్య కుమారుడెవడని జనులు చెప్పుకొనుచున్నారని తన శిష్యులను అడుగగా వారు - కొందరు బాప్తిస్మమిచ్చు యోహాననియు, కొందరు ఏలీయా అనియు, కొందరు యిర్మీయా అనియు, ప్రవక్తలలో ఒకడనియు, చెప్పుకొనుచున్నారనుట : అందుకాయన మీరైతే నేను ఎవడనని చెప్పుకొనుచున్నారని వారిని అడుగుట :  ఆ సందర్భములో సీమోను పేతురు, యేసులో ఆత్మీయముగా చూస్తూ :- నీవు సజీవుడగు దేవుని కుమారుడవైన క్రీస్తువు; అని చెప్పుట : అందుకు యేసు - సీమోను బర్‌ యోనా, నీవు ధన్యుడవు పరలోకమందున్న నా తండ్రి ఈ సంగతి నీకు బయలు పరచెనేగాని, నరులు నీకు బయలు పరచలేదనుట.

        మత్తయి 16:20లో తాను క్రీస్తునని ఎవనితోను చెప్పవద్దని ఖండితముగా ఆజ్ఞాపించుట : ఇందులో కూడా పరమార్థమున్నది.  అదేమిటంటే దేవుడు ప్రభువును లోకానికి పంపించింది యేసు అను పేరుతో - దీనికి ఋజువు యోసేపు మరియమ్మలకు దేవదూత చెప్పిన మాటలను మనము మత్తయి

1:21లోను లూకా 1:31లో యేసు అను పేరు. ఈ పేరుతోనే అనగా రక్షకుడు అను పేరుతోనే ప్రభువు తన మరణకాలము వరకు జీవించాడు.  క్రీస్తుగా ఆయన తనను గూర్చి చెప్పుకోలేదు.  దేవదూతలు కూడాప్రకటించలేదు.  యేసు జన్మ విధానమును గూర్చి గొల్లలకు దేవదూత : దావీదు పురములో నేడు మీ కొరకు రక్షకుడు పుట్టినాడని పలికినాడు గాని, క్రీస్తు పుట్టినాడని మాత్రము చెప్పలేదు.

        కనుక ప్రియులారా!  యేసును యేసుగానే లోకము చాలావరకు ఆచరించింది. అనగా యేసు కాలములో క్రీస్తు నెరుగని దినములలో దైవకుమారుని ఆనాటి జనసందోహము సంభోధించుచు యేసూ! దావీదు కుమారుడా!  మమ్ము కరుణించుము మార్కు 5:7లో సేన అను దయ్యములు ఆవరించినటువంటి అభాగ్యుడు ప్రభువును సంబోధిస్తూ, యేసూ! సర్వోన్నతుడైన దేవుని కుమారుడా!  నాతో నీకేమి?  అని అంటున్నాడు.  ఇందునుబట్టి చూడగా దయ్యములకు కూడా యేసును క్రీస్తుగా గ్రహించే శక్తి లేనట్లే, అని తెలియుచున్నది.  అయితే యేసును క్రీస్తుగా గ్రహించిన స్త్రీలలో మరియ ఒకటి మరియు యోహాను

4:29లో సమరయస్త్రీయొక్క మాట : మీరు వచ్చి నేను చేసినవన్నియు నాతో చెప్పిన మనుష్యుని చూడుడి : ఈయన క్రీస్తు కాడా?  అని చెప్పగా వారు ఊరిలో నుండి బైలుదేరి వచ్చుచుండిరి;  ఈమె క్రీస్తుయేసులో బలవంతురాలైన రెండవ స్త్రీ;  మొదటి స్త్రీ మార్త సహోదరియైన మరియ, క్రీస్తు యేసులో బలవంతురాలైన  రెండవ స్త్రీ సమరయస్త్రీ.

        పురుషులలో ఆయన 12 మంది శిష్యులలో పేతురు క్రీస్తు ఏసులో బలవంతుడైనట్లుగా ఋజువులున్నవి.  ఆ ఋజువులేమిటి అపొ 12:5 పేతురు చెరసాలలో బంధింపబడి ఇద్దరు సైనికుల మధ్య నిద్రించుచుండెను : ఇదిగో ప్రభువు దూత అతని దగ్గర నిలిచెను, దూత పేతురును తట్టి త్వరగా లెమ్మని చెప్పగా అతని సంకెళ్ళు ఊడెను : పేతురు క్రీస్తుయేసులో బలము పొంది, సాధించిన అమోఘమైన శక్తి.  మరి ఆశ్చర్యమైన మహిమకరమైన క్రియ ఏమిటంటే అపొ 12:10లో మొదటి కావలిని రెండవ కావలిని దాటి పట్టణమునకు పోవు ఇనుపగవిని యొద్దకు వచ్చినప్పుడు దానంతట అదే వారికి తెరచుకొనుట : అక్కడ నుండి దూత పేతురును విడిచి పెట్టుట : క్రీసుయేసు కృపలో బలవంతుడై పేతురు సాధించిన ఘన విజయము - శక్తి.

        ఇక  లూకా 1:30 దేవుని వలన క్రీసుయేసును గర్భము ధరించు భాగ్యము కన్యకయైన మరియకు పురుష ప్రమేయము లేకుండ కల్గుటన్నది దైవకృపయొక్క బలము ఋజువు పరచుచున్నది.  లూకా

1:41లో మరియమ్మయొక్క వందన వచనము వినగానే ఏలీసబేతు గర్భములోని శిశువు గంతులు వేయుటకు శక్తి - మరియమ్మ గర్భములోని క్రీసుయేసుయొక్క బల ప్రభావమే! ఈ బలము చేత ఎలీసబేతు పరిశుద్ధాత్మతో నింపబడినదై ధన్యురాలైంది.

        అపొ 3:6-8 లో చదివితే చీలమండల రోగి అనగా కుంటి భిక్షకుడు క్రీస్తుయేసు కృపలో బలవంతుడై, చీలమండలు సడలి నడచుచు గంతులు వేయుచు దైవ మందిరములో ప్రవేశించుటన్నది క్రీస్తుయేసులోని బలమును ఋజువు పరచుచున్నది.  ఇక అపొ 19:17-18లో ఈ విధముగా బలపడుటకు కారణము క్రీస్తుయేసులోని కృప : అపొ 16:26-27లో పౌలుయొక్క విముక్తి : ఇది క్రీస్తుయేసులోని కృపలోని బలాధిక్యతలను గూర్చిన వివరము.  అనగా చేతులు కాళ్ళకు బిగించిన బంధకములు ఊడిపోవుట, చెరసాల పునాదులు అదురుట, భూమి వణకుట, చెరసాల తలుపులు తెరచుకొనుట : ఇవన్నియు క్రీస్తుయేసు కృపలోని బలప్రభావములు ఋజువు పరచుచున్నవి.

        ప్రియసోదరా!  సోదరీ!  నీవు క్రీస్తుయేసులో బలము పొంది, ఆ బలము ద్వారా లోకాన్ని, శరీరాన్ని, దాని ఇచ్ఛలను, అపవాది, అతని సమూహాలను, అతని సంబంధమైన పోరాటమును జయించ గల్గే స్థితిలో వున్నావా?  క్రైస్తవుడుగా ఉండి క్రీస్తుయేసు కృపలో నీవు పొందిన బలముయొక్క శక్తి ఏది? లోకరీత్యా క్రైస్తవుడుగా వున్నావా?  లేక క్రీస్తుయేసు కృపలో బలవంతుడవైన క్రైస్తవుడుగా వున్నావా? ఎట్లున్నావు?

...........

        అంశము :-  యేసే క్రీస్తయి యున్నాడని నమ్ము ప్రతివాడును దేవుని మూలముగా పుట్టి యున్నాడుః మొదటి యోహాను 5:1

        ప్రియసోదరీ!  సోదరుడా!  నేటి క్రైస్తవుల మైన మము మన ఆత్మీయ జీవితములో యేసును గూర్చిగాని, క్రీస్తును గూర్చిగాని, ఎంతవరకు ఎరిగియున్నామో తెలిసికొంటే ఆయన ఎదుట పాపము, ఆయన మందిరములో అక్రమము, పొరుగువాని మీద ద్రోహమునకు పాల్పడము.  యేసును క్రీస్తుగా గుర్తించినవాడే క్రైస్తవుడు.  ఈ విధముగా గ్రహించి యేసులో ఉన్న క్రీస్తును మనము తెలిసికొనుటయేగాక, ఇతరులకు కూడా యేసును చూపి ధన్యులము కావాలని ప్రభువు ఆశయము : ఆవిధముగా యేసులో క్రీస్తును చూచినవారున్నారా?  అనిన విషయాన్ని వేదరీత్యా మనము తెలిసికోవలసియున్నది.

        మొదటగా మత్తయి 16:13-17, ఈ వేద భాగములో క్రీస్తు తన శిష్యకోటిని ప్రశ్నిస్తూ - మనుష్య కుమారుడెవరు?  అనగా యేసైయున్న తాను ఎవరు?  అనిన విషయాన్ని తన శిష్యులను ప్రశ్నిస్తూ అడిగినప్పుడు కొందరు బాప్తిస్మమిచ్చు యోహాననియు, కొందరు ఏలీయా అని, కొందరు యిర్మీయా అని, కొందరు ప్రవక్తలలో ఒకడనియు, చెప్పుచున్నారనుట అందుకాయన - మీరైతే నేను ఎవడనని చెప్పుకొనుచున్నారని ఆయన తన శిష్యులను అడిగినప్పుడు - అందుకు సీమోను, పేతురు - నీవు సజీవుడవగు దేవుని కుమారుడవైన క్రీస్తువని అన్నప్పుడు యేసు ప్రభువు చెప్పిన మాట చాలా ప్రాముఖ్యమై యున్నది.  ''సీమోను, బర్‌యోనా, నీవు ధన్యుడవు - పరలోకమందున్న నా తండ్రి ఈ సంగతి నీకు బయలు పరచెనే కాని నరులు నీకు బయలు పరచలేదు,'' అనుట అంటే పేతురు తన ఎదుటనున్న యేసులో ప్రత్యక్షముగా క్రీస్తును చూడగల్గినాడని తెలియుచున్నది.

        ఇక యేసు పాదములకు సేవ చేసిన పాపాత్మురాలైన స్త్రీ :-  లూకా 7:37-39లో ఆయనను క్రీస్తుగా ఎరిగి యుండబట్టే పాదపూజ చేసి, ఆరాధించి మహిమపరచింది.  అలాగే యోహాను 11:27 చదివితే, మార్త యేసులో క్రీస్తును చూచి లోకమునకు రావలసిన క్రీస్తుగా ప్రవచించి యున్నది.  ఇక యోహాను 12:3లో అత్తరు పూసి, యేసును క్రీస్తుగా మహిమపరచుట ఈ విధముగా యేసులో క్రీస్తును చూచినటువంటి స్త్రీలు ముగ్గురు - పురుషులలో పేతురు ఒకడు చివరిగా సిలువ మీది దొంగ కూడా సిలువలో వ్రేలాడుచున్న యేసును చూచి క్రీస్తుగా భావించి, యేసు వెళ్ళిన పరదైసులో తాను కూడా వెళ్ళుటకు యోగ్యత సంపాదించుకొని వేదములో లిఖించబడి ధన్యుడాయెను.  అందుకే పౌలు అంటున్నాడు.  ఎవడు క్రీస్తునందుండునో వాడు నూతన సృష్టి;  క్రీస్తును పోలి నేను నడిచిన ప్రకారము - మీరు నన్ను పోలి నడువుడి, రోమా 8:1-2, క్రీస్తుయేసు నందున్న వానికి ఏ శిక్షావిధి లేదు.  క్రీస్తుయేసు నందు జీవమునిచ్చు ఆత్మయొక్క నియమము, పాపమరణముల నియమము నుండి నన్ను విడిపించెను.  రోమా 6:3, క్రీస్తు యేసులోనికి బాప్తిస్మము పొందిన మనమందరము ఆయన మరణములోనికి బాప్తిస్మము పొందితిమని మీరెరుగరా?

        కనుక  ప్రియపాఠకులారా!  యేసును క్రీస్తుగా గ్రహించనిదే అనగా యేసులో క్రీస్తును చూడనిదే క్రైస్తవుడు - క్రైస్తవుడుగా జీవించలేడు.  యేసు ఈ లోకమునకు రక్షకుడుగా వచ్చాడు.  క్రీస్తు దేవుని కుమారుడుగ ఈ లోకములో జీవించాడు.  ఇందునుబట్టి, రోమా 1:7లో యేసుక్రీస్తు శరీరమును బట్టి దావీదు సంతానముగాను, మృతులలో నుండి పునరుత్థానుడైనందున పరిశుద్ధమైన ఆత్మను బట్టి దేవునికుమారుడుగాను, ప్రభావముతో నిరూపింపబడెను, కాబట్టి మీరును అనగా మనమును వారిలో వున్నవారమై అనగా విశ్వాసులయొక్క గుంపులో వున్నవారమై, యేసుక్రీస్తు వారుగా వుండుటకు పిలువబడి యున్నాము.

        కనుక నేటి మన ఆత్మీయజీవితములో చాలా జాగ్రత్తగా వుండి, మెలకువ గల్గి, ప్రార్థనాశక్తి గల్గి, సహనము గల్గి, ప్రేమ సావాసము కలిగి వుండవలెను, శాంతము కలిగి వుండవలెను.  ప్రభువు రాకడకు నిరీక్షణ కల్గి వుండవలెను.  రానున్న ప్రభువు నెదుర్కొనుటకు సిద్ధ మనస్సు గలవారమై యుండవలెను.  రానున్న ప్రభువును దర్శించుటకు ఆత్మీయత గలవారమై యుండవలెను.  ప్రభువును శరీరముతో కాదుగాని ఆత్మతో దర్శించగల్గి వుండవలెను.  అప్పుడే మనము యేసులో క్రీస్తును చూడగలము.  అట్లుగాకుంటే యేసును చూస్తూ క్రీస్తును చూడాలని నామ క్రైస్తవ జీవితము జీవిస్తూ బలహీనులుగా వుంటాము.

...........

        ఆదామునకును క్రీస్తుకున్న పోలికలు, మరియు ఆదాములోను, క్రీస్తులోను అణగారియున్న దైవ సత్యములు - మర్మములు.  ఆదాము దేవుని పోలికలోను దేవుని స్వరూపమందును అనగా రెండవ ఆదామైన క్రీస్తుయొక్క స్వరూపమును కల్గినవాడై నరసంతతికి తల్లిగా ఏర్పరచబడు స్త్రీ జన్మకు మూలకారకుడాయెను.  మరియు ఏదెను అను దేవునియొక్క పరిశుద్ధవన నివాసమునకు యోగ్యముగా దేవుని చేత ఎన్నుకొనబడినట్లు ఆదికాండము 2:15లో చదువగలము.  దేవుని స్వరూపిగా ఆదాము సృష్టించబడినట్లును, స్త్రీ జన్మకు మూలకారకుడైనట్లును చదువుచున్నాము.  దైవసృష్టిలోని జీవరాసులకు నామధేయమొనర్చు జ్ఞానసంపన్నునిగా దేవుడు అనుగ్రహించి యున్నాడు.  ఇట్టి ఆదాములో పై నాలుగు శక్తులుగాక, నాటి నుండి నేటి వరకు అనగా ఆదాము దైవవ్యతిరేకియైనది లగాయతు, నేటి వరకు ఆతని దోష ప్రభావమెలాంటిదో ఆత్మీయ జ్ఞానముతో ఆలోచిస్తే, ఆ దోష ప్రభావమును ఎదుర్కొనుటకు, ఆదాము సృష్టికి మూల కారకుడైన పరమాత్ముడే రెండవ ఆదాము అవతారము దాల్చవలసి వచ్చెను.  ఈయనే మనుష్య కుమారుడు.  ఈయనే రెండవ ఆదాముగా యేసు అను నరునిగా భూమిపై అవతరించవలసి వచ్చెను.  సృష్టికర్త తన హస్తక్రియా దోషమునకు తానే బలి గావలసి వచ్చెను.  ఇందునుబట్టియే కయీను నా దోష శిక్ష నేను భరించరానంత గొప్పదై యున్నది.  ఇది నరుడు భరించుటకు అశక్తమైయున్నందువల్లనే, నరజన్మకు మూలకారకుడైన సృష్టికర్తయే దానిని మోయవలసి వచ్చినట్లు యేసు జన్మలోని దైవసత్యము మనకెరింగించుచున్నది.  ఈ సత్యము గ్రహించనీయక 2 కొరింథీ 4:4 ఈ యుగ సంబంధమైన దేవతయను సాతాను క్రీస్తుయొక్క మహిమను నరకోటి మనోనేత్రమునకు మరుగుపరచి యున్నాడు.

        ఆదాము మంటి కుమారుడు.  అనగా భూగర్భములో మట్టి ద్వారా దైవాత్మచే సృష్టించబడినాడు.  ఇందులో కొంత లోకసంబంధము.  మరికొంత పరలోకసంబంధమై యున్నది.

        రెండవ ఆదామైన క్రీస్తును కూడా మట్టితో సృష్టించకూడదా?  అను ప్రశ్న మనకు కలుగవచ్చును.  అట్లు దేవుడు చేయలేని అశక్తుడుగాడు.  అట్లు రెండవ ఆదామైన క్రీస్తును భూమి నుండి తీసి వుంటే ఆదాములో నుండి తీసిన స్త్రీ జాతికి దేవుడిచ్చిన శాపము మాటేమిటి?  ఆమె గర్భము మొయ్యాలి.  ప్రసవవేదన పడవలెను గదా! ఈ వాక్యము నెరవేరాలి.  అందువల్ల దేవుడు నిష్కళంకమైన స్త్రీయొక్క గర్భాన్ని ఎన్నుకొని, అందులో తన క్రియాశక్తితో గూఢముగా నరాకృతితో నరుని సృష్టించెను.  మొదట నరుని దేవుడు భూగర్భము నుండి చేసినప్పుడు ఈ క్రింద వివరించబడు సాక్షుల యెదుట ఆ క్రియ జరిగించినట్లు తెలియుచున్నది.  ఆయన వేసిన తోట అందులో జంతుజాలము పక్షిజాలము, సూర్యచంద్ర నక్షత్రాదులు, భూమ్యాకాశములు మరియు ఆత్మ.  అదే విధముగా యేసు అను అవతారముతో  ఆయన స్త్రీ నుండి బైల్పడినప్పుడు కూడా ఈ క్రింది సాక్షులున్నారు.  ఆయనేర్పరచుకున్న ప్రవక్తల లేఖనములు. ఆయన విశ్వాసులకు ఆయన దహనబలి నిమిత్తమై చూపిన దృశ్యములు, అనగా ఇస్సాకు బలి సందర్భములో అబ్రాహాముకు చూపిన పొట్టేలు, దేవదూత చేత మరియమ్మకు చూపిన శుభవర్తమానము.  యేసు జన్మ మర్మమును తెల్పుటకు ఆకాశములో ఆయన నిల్పిన నక్షత్రము.  దానిని చూసిన ముగ్గురు జ్ఞానులు, గొల్లలు, ఆయన తిరిగిన భూమి.  ఆయన మహిమ స్వస్థతలు పొందిన రోగులు, వికలాంగులు కానాలోని రాతిబానలు.  ఆయన మోసిన సిలువ - మరణ కాలములో ఆయన కుడి వైపున కొరత వేయబడిన దొంగ, ఆయన మరణ విజయుడై లేచి పునరుత్థానుడైన పిమ్మట ఆయనను చూచిన 12 మంది శిష్యులు.  అపొస్తలులు, హతసాక్షులు.

        ఆదాము దోషమును బట్టి యెషయా 1:1-2, ఆకాశమా! ఆలకించుము.  భూమీ!  చెవి యొగ్గుము. భూమ్యాకాశములను సాక్షులుగా పెట్టుచున్నాడు.  అదే విధముగా యేసు నిర్దోషియనుటకు ఆయన సిలువ మరణము పొందిన పిమ్మట భూమి వణకుట, సమాధులు బ్రద్దలగుట, ఆకాశము చీకటియగుట, దేవాలయపు తెర చినుగుట.  ఇంకను నేటి ఆయన ఏర్పరచుకున్న క్రైస్తవ లోకమైన మనము సాక్షులముగా వున్నాము, కనుక ఆదాము దోషమును సాతాను మోస్తూ ఆదాము సంతతియైన మనకు స్వాస్థ్యముగా దానిని ప్రతి నరునకు ఏదోయొక రూపముగా అంటగట్టుచున్నాడు.  అయితే యేసు చేయుచున్న క్రియ దానికి భిన్నమై యున్నది.  ఇందునుబట్టియే భారము మోయుచున్న సమస్తమైనవారలారా!  నా యొద్దకు రండి,  నేను విశ్రాంతి గలుగ చేతును, అని అంటున్నాడు.  ఈ భారము - అపవాది నరులమైన మనకు అంటగట్టిన ఆదాము దోషమే.

..............

        అంశము :-   ఫలాభివృద్ధి  :

        మూలము నిర్గమకాండము - లేవీకాండము, సంఖ్యాకాండము, ద్వితీయోపదేశకాండముల వ్యాఖ్యానము :

         ప్రియపాఠకులారా!   లోగా పరిశుద్ధ గ్రంథములో ఎన్నో సంఘటనలను గూర్చి తెలిసికొని యున్నాము.  ఇపుడు పాతనిబంధనలోని నాలుగు కాండములలో తన జనాంగమునకు దేవుడు అనుగ్రహించిన కృప, రక్షణ, నడుపుదలను గూర్చి వివరముగా తెలిసికొందము.  ఇందులో మొట్టమొదటగ ఆదికాండము చివరి భాగములో దేవుడు తనకంటూ ప్రత్యేకించి ఏర్పరచుకొన్న ఒక జనమును గూర్చి మనకు తెలియును.  ఇశ్రాయేలు అను పేరు ఒక వ్యక్తికి సంబంధించింది.  కాని అనేకులకు చెందినది  కాదు.  ఇశ్రాయేలునకు లోక సంబంధముగా వున్న పేరు యాకోబు అనగా ఈ లోకము పెట్టిన పేరు.  అయితే ఆత్మీయ పోరాటములో దైవత్వముతో పోరాడి విజయము సాధించి, సంపాదించుకొన్న పేరే ఇశ్రాయేలు.  ఇందును గూర్చి మనము ఆది 35:9-10 లో యాకోబు పద్దన రామునుండి వచ్చుచుండగా దేవుడు తిరిగి అతనికి ప్రత్యక్షమై అతనిని ఆశీర్వదించెను.  అప్పుడు దేవుడు అతనితో - నీ పేరు యాకోబు, ఇక మీదట నీ పేరు యాకోబు అనబడదు.  నీ పేరు ఇశ్రాయేలు అని చెప్పి అతనికి ఇశ్రాయేలు అను పేరు పెట్టెను.

        కనుక  ప్రియపాఠకులారా!  యాకోబునకు ఇశ్రాయేలు అని ఇచ్చిన ఈ బిరుదు మనుష్యులు కారు.  సర్వశక్తుడైన దేవుని యొద్ద నుండి అతనికి అనుగ్రహించబడింది.  ఇది మనుష్యులు పెట్టిన పేరు కాదు.  కనుక ఒక వ్యక్తికి దేవుని చేత అనుగ్రహించబడిన ఈ పేరు ఆ వ్యక్తికి మాత్రమే పరిమితమై యుండక అతని సంతానమైన 12 మంది కుమారులకును వారిసంతానమునకును - ఆ విధముగా తరతరములు విస్తరించిన ఇశ్రాయేలుయొక్క సంతానము మొత్తమునకు దేవుడు అనుగ్రహించిన పేరు నాటి నుండి నేటి వరకు కూడా చిరస్థాయిగా నిలిచి యున్నది.

         ప్రియపాఠకులారా!  మనుష్యులు చేసే నామకరణము ఏ మనుష్యునికైతే నామకరణము చేస్తారో ఆ ఒక్క వ్యక్తికే పరిమితమైయున్నది.  అయితే దేవుడు పెట్టిన ఈ పేరు ఆ వ్యక్తికే గాక తరతములకు నిలబడి యున్నదంటే, దేవుని చేత పెట్టబడిన పేర్లయొక్క విలువ, ఆ పేరు వలన కలుగు ఫలాభివృద్ధి ఎంత గొప్పదో మనము సుదీర్ఘముగా ఆలోచించవలసి యున్నది.  ఈ విధముగా లక్షలు - కోట్లు జనాభాగా విస్తరించిన ఇశ్రాయేలుయొక్క జనవిస్తరణను గూర్చి నిర్గమ 1:1 చదివితే క్షుణ్ణముగా తెలియగలదు.  ఇందులోని వివరణమేమిటంటే - ఐగుప్తులోనికి యాకోబుతో వచ్చిన ఇశ్రాయేలీయుల పేర్లు ఏవనగా రూబేను, షిమ్యోను, యూదా, లేవి, ఇశ్మాఖారు, జెబూలోను, బెన్యామీను, దాను, నప్తాలి, గాదు, ఆషేరు.  వీరిలో ప్రతివాడు తన కుటుంబముతో వచ్చినట్లును, యాకోబు గర్భమున పుట్టిన వారందరు డెబ్భదిమంది, అప్పటికి యోసేపు ఐగుప్తులో వుండెను.  యోసేపును అతని అన్నదమ్ములందరును ఆ తరము వారందరును చనిపోయినట్లును; వారి సంతానమైన ఇశ్రాయేలీయులు బహు సంతానముగలవారై అభివృద్ధి పొంది,

విస్తరించి, అత్యధికముగా ప్రబలియున్నట్లుగ వారున్న ప్రదేశము వారితో నిండియున్నట్లును వివరించబడి యున్నది.

         ప్రియపాఠకులారా!  ఈయొక్క ఇశ్రాయేలుయొక్క జనవిస్తరణ గూర్చి ఆనాటి ఐగుప్తు రాజు కంగారుపడి ఇశ్రాయేలు సంతతియైన జనము ఐగుప్తు జనము కంటె ఎక్కువ విస్తారముగాను, బలాఢ్యులుగాను వున్నట్లును - ఏనాటికైన వీరి ద్వారా యుద్ధ ప్రమాదము వుండవచ్చునన్న భయము చేత రాజు తన సంస్థాన అధిపతులతో సమాలోచన చేసి వారి జనాభా విస్తరింపకుండునట్లు - ఇశ్రాయేలు పట్ల కుటుంబ నియంత్రణ చట్టమును అమలు పరచియున్నట్లుగా ఈ వేదభాగములో మనము చదువగలము.  ఈ చట్టము బహు కుయుక్తితోను, ఐగుప్తు జనాంగమునకు సమ్మతముగాను ఆమోదకరముగా వుండునట్లు, ఐగుప్తు రాజు సృష్టించిన చట్టము జన ఆమోదమును పొందినది.  అంతేగాకుండ ఐగుప్తు పరిపాలకులు ఇశ్రాయేలు యెడల బహు కఠినముగా ప్రవర్తించుచు, వారి చేత చాకిరి, దాస్యము, వెట్టి పనులు, ఱాయికోత వగైరా కఠినమైనటువంటి కార్యాలను చేయిస్తూ - కఠినముగా వారిని శిక్షిస్తూ వారిపై బహుదురుసుగాను కఠినముగా వ్యవహరిస్తూ అధికారము చలాయిస్తున్నట్లు ఈ అధ్యాయములో ఇశ్రాయేలు చేత చేయించిన పనులు వివరించబడి యున్నవి.  అవేవనగా ఇశ్రాయేలు చేత ఐగుప్తులో చేయించు ప్రతి పని కఠినముగాను, శ్రమతో కూడినదిగాను, వుండినట్లు వ్రాయబడి యున్నది.  ఉదా|| జిగటమన్ను పని, ఇటుకల పని, పొలములో పని , ఒల్లు పట్టించుకోవడము,  వంట పనులు, ఇంటిపనులు, బరువులు మోయుట, మొదలైన పనులు - ప్రతి పనిలోఐగుప్తులో కఠినముగా చూడడమునుబట్టి ఇశ్రాయేలు ప్రాణము విసిగింది.  ఇట్లుండగా ఐగుప్తురాజు తన కుటుంబ నియంత్రణ అమలుపరచుచు మంత్రసానులతో మాట్లాడిన మాట - మగవాడైనచో వానిని చంపుడి.  ఆడదియైన యెడల దానిని బ్రతుకనీయుడని చెప్పుట. అయితే ఇశ్రాయేలు అను జనాంగమునకు దేవుని హస్తము తోడైయున్నందువలన ఆ మంత్రసానులు దేవునికి భయపడి ఐగుప్తు రాజుయొక్క ఆజ్ఞకు విరుద్ధముగా మగపిల్లలను బ్రతుక నిచ్చినట్లును, ఆ సంగతి తెలిసిన రాజు -మంత్రసానులను మగపిల్లలనెందుకు బ్రతుక నిచ్చితిరి, అని అడుగుటయు, అందుకు ఆ మంత్రసానులు - హెబ్రీ స్త్రీలు ఐగుప్తు స్త్రీలవంటి వారు కారు, మంత్రసాని వారి యొద్దకు వెళ్ళక మునుపే, వారు ప్రసవించి యుందురని ఫరోతో చెప్పిరి.  దేవుడు ఆ మంత్రసానులకు మేలుచేసి, వంశాభివృద్ధి కలుగజేసినట్లు వివరించబడి యున్నది.  అయితే ఫరో అనే ఐగుప్తురాజు హెబ్రీయులలో పుట్టిన ప్రతి కుమారుని నదిలో పారవేయమని, ప్రతి కుమార్తెను బ్రతుక నీయమని తన జనాంగమునకు ఆజ్ఞాపించి యున్నాడు.

         ప్రియపాఠకులారా!  దేవుడు సృష్టించిన మరియు ఎన్నిక చేసిన అంతేగాకుండ ఇశ్రాయేలు అని పేరు పెట్టిన ఆ పరిశుద్ధ జనమునకు కీడు తలపెట్టిన రాజు తలంపులకును - ఐగుప్తులో అతను జారీచేసిన శాసనాలకును దేవుడు తన కార్యాన్ని మానుకోలేదు.  ఐగుప్తు ప్రజలు ఇశ్రాయేలు పట్ల ఎంత కఠినముగా, దురుసుగా వ్యవహరించారో, అంత గొప్పగా ఇశ్రాయేలుయొక్క సంతానాలు ఆ దినములలో వృద్ధి జెందినవి.   ఈ విధముగా దేవునియొక్క జనాంగము ఐగుప్తు దాస్యములో వుంటూ - దాస్యము చర భీతి, నిరాదరణ వాతావరణములో దేవునికి వారు మొర పెట్టినప్పుడు - దేవుడు వారి మొర విని ఐగుప్తు రాజైన ఫరోయొక్క రాజమందిరము నుండియే - దేవుడు తన జనాంగమునకు నాయకుని ఎన్నిక జేసినట్లు, మోషే చరిత్ర ద్వారా మనకు తెలియును.

        ఐగుప్తు రాజు ఏ చట్టము ద్వారా దైవజనాంగాన్ని నిర్మూలించాలనుకున్నాడో ఆ చట్టమే తనకు ప్రతికూలమైంది.  ఎట్లంటే హెబ్రీయులు కనిన ప్రతి మగబిడ్డను నదిలో పారవేయాలి.  ఇది రాజాజ్ఞ : అయితే నదిలో పారవేయడానికి మనసు రాని తల్లి తన బిడ్డను జమ్ముపెట్టెలో పెట్టి కీలుపూసి, దానిని నదిలో వదలుటయు, ఆ సమయములో విహారార్థము ఫరో కుమార్తె ఆ నది ఒడ్డుకు రావడము - ఆ బాలుని చూచుటయు - దేవుని హస్తము ఆ చంటి బిడ్డకు తోడైయున్నందువలన రాజకుమార్తె రహస్యముగా ఆ బిడ్డను తన కొరకు పెంచమని బిడ్డ తల్లిని నియమించుట.  ఆ కార్యములో దైవప్రణాళిక సాఫల్యము వహించడమన్నది ఇచ్చట మనము గుర్తింపవలసిన విషయము.

         ప్రియపాఠకులారా!  ఈ విధముగా దేవుడు తన జనాంగమునకు సరియైన నాయకుని ఎంపిక చేయుటకు - ఇశ్రాయేలును శ్రమపెట్టిన ఐగుప్తు రాజుయొక్క సంస్థానమునుండియే - ఐగుప్తీయుని గాక దేవుడు తన జనాంగములోని సంతతిలోనే నాయకుని ఎంచుకోవడమన్నది ప్రాముఖ్యమైన విషయము.  ఈవిధముగా ఐగుప్తు వాతావరణములో పెంచబడి, ఐగుప్తు సంస్థానములో ఎదిగి, ఐగుప్తు రాజపుత్రికయొక్క రాజభోజనమును ఆరగించిన మోషేను దేవుడు ఐగుప్తు ప్రజలయొక్క భోగభాగ్యాలవైపు మోషేను చూడనివ్వక, తన జనాంగమైన ఇశ్రాయేలుయొక్క శ్రమలను మోషేకు చూపించి - మోషేకు దేవుడు ఇశ్రాయేలు అను తన ఇంటిమీద నమ్మకమైన అధికారిగా నియమించాలని సంకల్పించి, మోషేను ఐగుప్తు పరిపాలకుని చేత పోషించేటట్లుగా చేశాడు.  వాస్తవానికి మోషే ఐగుప్తీయుడు కాదు - ఐగుప్తుకు విరోధి.  ఎట్లనగా మోషే పెద్దవాడైన తర్వాత ఒకానొక దినమున ఒక హెబ్రీయుని ఒక ఐగుప్తీయుడు తీవ్రముగా కొట్టి బాధిస్తున్న దృశ్యాన్ని మోషే చూచినప్పుడు, తన జనాంగమైన తన స్వకీయుడైన వ్యక్తిని తన కన్నుల ఎదుట అన్యుడు కొట్టి బాధించుట చూడలేక ఆ ఐగుప్తీయుని చంపి ఇసుకలో పాతిపెట్టినట్లు కూడా చదువగలము.

         ప్రియపాఠకులారా!  ఇదే విధముగా క్రీస్తుయొక్క చరిత్ర మత్తయి 2:13లో మనము చదివినట్లయితే, ప్రభువు దూత స్వప్నమందు యోసేపునకు ప్రత్యక్షమై - హేరోదు ఆ శిశువును సంహరింపవలెనని ఆయనను వెదకబోవుచున్నాడు.  కనుక నీవు లేచి ఆ శిశువును, ఆయన తల్లిని వెంటబెట్టుకొని ఐగుప్తునకు పారిపోయి, నేను నీతో తెలియజెప్పువరకు అక్కడనే యుండుమని అతనితో చెప్పుట.  అప్పుడు అతడు లేచి రాత్రివేళ తల్లిని శిశువును తోడ్కొని ఐగుప్తుకు వెళ్ళి హేరోదు మరణము వరకు ఐగుప్తులో వున్నట్లుగ వ్రాయబడియున్నది.  కనుక మోషే బాలుడుగా వున్నప్పుడు ఐగుప్తులో ఏ విధముగా శిశుహత్య జరిగిందో ఆ విధముగానే మత్తయి 2:16లో హేరోదు కూడా బహు ఆగ్రహాన్ని తెచ్చుకొని బేత్లెహేములోను, దాని సకల ప్రాంతాలలోను, రెండు సంవత్సరములు మొదలుకొని తక్కువ వయస్సు గల మగపిల్లలనందరిని వధించినట్లుగా వ్రాయబడి యున్నది.  చిత్రమేమిటంటే ప్రతి                    మగచూలు సంహారము అన్య రాజ్యమైన ఐగుప్తులో జరిగితే, నూతన నిబంధనలో ప్రతి మగ శిశువు సంహారము బేత్లెహేములో జరిగినట్లుగా మనము చదువగలము.

        రెండు రాజ్యములలోను పాతనిబంధనలోని ఐగుప్తు సామ్రాజ్యములోను, నూతన నిబంధనలోని హేరోదు సామ్రాజ్యములోను, ఒకే విధమైన శాసనాలు శాసించబడి యున్నవి.  రెండు ప్రభుత్వాలలోను ఇశ్రాయేలు సంతతిని గూర్చిన మారణహోమమే!  ఈ విధముగా హేరోదు జరిగించిన మారణహోమములో స్వప్నములో దూత ద్వారా ప్రబోధించబడిన యోసేపు రాత్రికి రాత్రే తల్లిని, శిశువును వెంటబెట్టుకొని గార్దబాన్ని ఎక్కి, ఐగుప్తు చేరుకొన్నట్లుగ వేదవాక్యము వివరిస్తున్నది.

        చిత్రమేమిటంటే దేవుని సంకల్పములో ఆనాటి రాజ్యపరిపాలనలో ఏ రాజ్య పరిపాలకులును, ఏ ప్రభుత్వమును, దేవుని ఎన్నికలో ఎన్నిక కాలేదుగాని, ఐగుప్తు, దాని సామ్రాజ్యాన్నే దేవుడు తన జనాంగమునకు పోషకులుగ నియమించినట్లుగ ఈ క్రింది దేవుని బిడ్డల చరిత్రలు మనకు వివరిస్తున్నవి.  మొట్టమొదటగా ఐగుప్తు పోషించింది.  దేవుని సంకల్పములో యోసేపు చేరవలెను. ఆ విధముగా చేర్చబడిన యోసేపు ఐగుప్తు ప్రభుత్వము దేవుని కొరకును, దైవజనాంగముయొక్క విస్తరణకును సాధనముగా యోసేపును బట్టి దేవుడు ఐగుప్తును ఆశీర్వదించి ఫలభరితమైనదిగ జేసినట్లును, ఎక్కువగా హెచ్చించినట్లును, వేదములో చదువగలము.

        అలాగే దేవుడు తన జనాంగమైన ఇశ్రాయేలుకు ఒక నాయకుని ఏర్పాటు జేయుటకు సంకల్పించి, ఐగుప్తు శాసించిన మరణశాసనమునుబట్టి, తాను ఎన్నుకొనబోయే నాయకుని బాల్యము నుండి యౌవ్వనము వరకు, ఐగుప్తు ప్రభుత్వము చనుబ్రాలు, అన్న ప్రాసన, బలవత్తరమైన ఆహారము అనగా రాజభోజనము తినిపించి మోషేను పెంచి పెద్దజేయుట.  ఈ విధముగా ఐగుప్తుయొక్క భోగభాగ్యాలను అనుభవించిన మోషే తన జనాంగమైన ఇశ్రాయేలు ఐగుప్తులో అనుభవిస్తున్న కటిక దాస్యము చెర నుండి విమోచన కల్గించుటకు తీర్మానించి, ఫరోయొక్క గృహములో రాజభోగమనుభవించుటకంటె, అనగా ఫరో కొడుకు అనిపించుకొనుటకంటె - ఇంకా జాస్తి చెప్పాలంటే ఐగుప్తీయుడు అను పౌరసత్వమును పొందుట కంటే, దేవుని జనాంగముతో కూడా వుండి వారు అనుభవిస్తున్న శ్రమలు, చరలో పాలివాడై యుండుటయే మహాభాగ్యమని మోషే తలంచి 40 సంవత్సరములు దేవుని జనాంగముతో నానావిధ శ్రమలు, బాధలు, సుదూర ప్రయాణాలు;  విరామము నెమ్మదిలేని జీవితముననుభవిస్తున్న దేవుని ఇల్లంతటిలో నమ్మకస్థుడుగ, మోషే వేదములో వ్రాయబడినాడంటే ఇందుకు కారణము మొట్టమొదటగ దేవుని సంకల్పము, ఆ తర్వాత ఐగుప్తు రాణివాసముయొక్క పోషణ కారణమని మనము గ్రహించాలి.

        అలాగే మూడవదిగ నూతన నిబంధనలో హేరోదుయొక్క మరణశాసనము నుండి తప్పించబడి, ప్రాణరక్షణ పొందుటకును, నిర్విచారమైన జీవితమును గడపుటకును, రాజశాసనమును వ్యర్థపరచుటకును, బేత్లెహేము పరిపాలకులయొక్క కన్నులకు మరుగు చేయబడుటకు, పరమరక్షకుడైన బాలయేసు ప్రభువునకు ఐగుప్తు ఆశ్రయమిచ్చింది అనుట సత్యమే గదా!  ఆ విధముగా తన జనాంగమైన ఇశ్రాయేలును బట్టి ఐగుప్తును దేవుడు ఆశీర్వదించినట్లుగా ఇందునుబట్టి మనకు తెలియుచున్నది.

         ప్రియపాఠకులారా!  ఈ విధముగా దేవుని ఆశీర్వాదము ఐగుప్తుపై ఉన్నట్లు మనకు తెలియుచున్నది.  అయితే ఇంత జేసినను ఐగుప్తుకు, ఇశ్రాయేలుకు మాత్రము విరోధమే!  నాటి నుండి నేటి వరకు కూడా ఈ రెండు దేశాలకు విరోధ భావమే!  ఇది ఐగుప్తుయొక్క చరిత్ర.  ఈ ఐగుప్తు చరిత్రకు మొట్టమొదట పునాది వేయబడింది ఇశ్రాయేలు ద్వారానే!  ఐగుప్తునకు గుర్తింపు ఏర్పడింది ఇశ్రాయేలుయొక్క చరిత్రను బట్టి - ఐగుప్తు అన్నది పరిశుద్ధ గ్రంథములో ఒక స్థానాన్ని సంపాయించుకొన్నది.  ఈ విధముగా మోషేయొక్క పరిచర్య ద్వారా నాలుగు కాండములలోని వివరణ క్షుణ్ణముగా మనకు వివరిస్తున్నది.

         ప్రియపాఠకులారా!  ఇందునుబట్టి ఆది, నిర్గమ, లేవీ, సంఖ్యా, ద్వితీయోపదేశ కాండాలు ఐదును మోషే తనయొక్క ఆత్మశుద్ధి, చిత్తశుద్ధి ద్వారా దైవ జ్ఞానమును సంపాయించుకొని దేవునితో నడిచి దైవజనాంగమునకు తన జీవితాన్ని అంకితము జేసి, తనశరీరాతల్మను దేవునికి సమర్పించి - సమర్పణా జీవితములో దేవునికి ఇష్టుడై, దేవుని ఇల్లంతటిలో మోషే నమ్మకస్థుడుగా హెబ్రీ 3:2లో ప్రవచింపబడి యున్నాడు.  మరియు ఐదు కాండములకు గ్రంథకర్త కూడా అయ్యాడు.  మోషే చేత వ్రాయబడిన ఐదు కాండములే ఆది, నిర్గమ, లేవి, సంఖ్యా, ద్వితీయోపదేశకాండము అను గ్రంథములు.  ఇంతకును మోషే విద్యావంతుడు కాడు.  నాలుక మాంద్యము కలవాడు, అనగా నత్తివాడు, నిరక్షరాస్యుడు, గొర్రెల కాపరి, మొరటువాడు.  ఇట్టి వ్యక్తిని నాలుకను సడలింపజేసి, భాషాజ్ఞానమిచ్చి అక్షరాస్యుడుగ జేసి, వీరునిగ మార్చి, తన జనాంగముతో కలిసి శత్రువులతో పోరాడే సేనానాయకునిగ జేసి, సృష్టికర్తయొక్క మహిమలోకానికి, లోకపరిపాలకులకు కనబరచు నిమిత్తము, దేవుని చేత వాడబడిన సాధనమై యున్నాడు.  మోషే దేవుని చేత వాడబడితే - మోషే చేతిలో కఱ్ఱ, మోషే చేత దేవుని మహిమార్థముగా వాడబడింది.

        కనుక  ప్రియపాఠక మహాశయులారా!   ఇట్టి సుదీర్ఘమైన వ్యాఖ్యానాలను గూర్చిన సత్యాలను తెలిసికొన్న నీవు - మీరు ఏ విధముగా దేవుని చేత వాడబడుచున్నారు.   మోషే దేవుని చేత వాడబడినట్లా?  లేక మోషే చేతిలోని కర్ర దేవుని మహిమార్థముగా వాడబడినట్లా?  ఇవి రెండును కాకపోతే మనయొక్క ఇహలోక జీవితము, లోకసంబంధముగా లోక మెప్పునకు వాడబడితే, దానివల్ల వచ్చే ఫలితము మరణమే!

        ఇందులో సారాంశమేమిటంటే!  యోసేపు క్రీస్తుకు సాదృశ్యమై యున్నాడు.  అలాగే మోషే కూడా క్రీస్తుకు ముందువాడై, దేవుని ఇల్లయిన ఇశ్రాయేలు జనాంగమునకు నమ్మకస్థుడుగా జీవించాడు.  అయితే యేసుక్రీస్తు దేవుని కుమారుడును, ఆయన రాజ్య వారసుడైయున్నట్లు దేవుని ఇంటికి వారసుడైయున్నాడు.  హెబ్రీ 3:2-6 చదివితే మనకు తెలియగలదు.

..........

        ప్రసంగము :-   మూలము 2:2లో జ్ఞానులు చూచిన నక్షత్రము వారిని ప్రభువు మార్గమునకు నడుపుచుండగా వారు తొట్రిల్లి హేరోదు పంచన చేరుటన్నది మార్గము తప్పినారు.  హేరోదు దుర్బోధ మత్తయి 2:9లో విన్నారు.  అయితే వారిని నడిపిన నక్షత్రము తన సత్యమార్గమును వారికి చూపుచు, క్రీస్తు జన్మించిన చోటికి వారిని జేర్చింది, వారు ఆరాధించారు కానుకలిచ్చారు.  ఆయనకు సాగిలపడినారు. మత్తయి  2:10-11.

        అలాగే లూకా 2:20లో గొల్లలు కూడా ప్రభువును గూర్చి దూత తెల్పిన మాటలను బట్టి దర్శించి స్తుతించి కేరల్స్‌ పాడినారు - ఇది జరిగిన సంఘటన.  అయితే ఆ దినములలో జరిగిన ఆ జ్ఞానులు మత్తయి 2:12లో వలె హేరోదు దగ్గరకు వెళ్ళవద్దని దేవుని చేత బోధింపబడి, వారు మరియొక మార్గములో తమదేశానికి సురక్షితముగా వెళ్ళినారు.  ఈ విధముగా వారు వెళ్ళిన తర్వాత యెరూషలేములో ఈ సమయములో జరిగిన సంఘటన మత్తయి 2:16లో చదువగలము.

        కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా!  ఈ నెల 15 నుండి 25వ తేదీ వరకు పండుగ జరుపుకొనే మన విషయములో మన పండుగ జరిగిపోగా ప్రస్తుతము మన లోక పరిస్థితి కూడా అలాగే ఉంది.  దేశములో హత్యలు, దోపిడీలు, కాల్పులు, దహనాలు, ప్రమాదాలు, వగైరా వాతావరణము మనలను అలుముకొని వున్నాయి.  మన సంఘముయొక్క స్థితి కూడా అలాగే ఉంది.  ఇట్టి స్థితిలో ఆ జ్ఞానులు దేవుని బోధ వలన తమ మార్గమును మార్చుకొన్నారు.  అలాగే ఈ పండుగ సమయములో రానున్న నూతన సంవత్సరములో మన మార్గమును మార్చుకొని, లోకమార్గమునకు స్వస్థి పల్కి నూతనమైన ప్రభువు మార్గమున స్వాగతము పలుకవలసియుండగా మన ఆత్మీయస్థితి ఎలాగుంది?  ఆనాటి నక్షత్రము మనకు రక్షకుని జననమును గూర్చి తెల్పుచున్న విధముగా మనము కూడా ఆ నక్షత్రమును ఇంటిపై కట్టుకొని ఆనందించకుండా ప్రభువు నక్షత్రముగా మనము వెలుగొంది, అనేకులకు ప్రభువుయొక్క సువార్త వెలుగును ప్రకాశింప జేయవలసినవారమై యున్నాము.  రానున్న నూతన సంవత్సరములో మనము దానియేలు 18:3లో వలె ఆకాశ నక్షత్రములుగా ప్రకాశిస్తూ, కీర్తన 148:3లో వలె ప్రభువును స్తుతించి, ఘనపరచుచు, క్రీస్తు మార్గములో జీవిస్తాము.

............

        ప్రసంగాంశము  :-   గాడిద

        మూలముః- గాడిద సొంతవాని దొడ్డి తెలుసుకొనును. యెషయా 1:3, ప్రియసంఘమా! లోకములో వున్న జంతుజాలాలలోకెల్ల గాడిద అతి నీచ జంతువుగా ఎంచబడుచున్నది.  ఈగాడిద అనిన పేరు మనుష్యులలో కూడా నానావిధాలుగ వాడబడుచున్నది.  తిండిపోతు గాడిద, బుద్ధిలేని గాడిద, పనికిమాలిన గాడిద, సోమరి గాడిద అని నానావిధాలుగ గాడిద పేరును నరులు చెడగొడుచున్నారు.  అయితే దైవకార్యాలలో గాడిద గొప్ప కార్యాలు చేసి ఒక ఉన్నత స్థానాన్ని పొందినట్లు వేదరీత్యా తెలుసుకొందము.  ఇందులో  (1)  ఆది 22:3లో అబ్రాహాము దహన బల్యర్పణకు బలి పీఠమునకు గాడిద కట్టెలు మోసింది.  (2)  సంఖ్యా 22-21లో బిలాము ప్రవక్తను మోసిన గాడిద - ద్రాక్ష తోటలో ప్రవేశించి దేవదూత దర్శనము పొంది, మానవ భాష మాట్లాడి దేవుని శక్తిని, జ్ఞానాన్ని, బిలామునకు బయల్పరచి దేవుని మహిమపరచి, బిలామునకు బుద్ధి నేర్పింది.  (3)  1 సమూయేలు 9:3లో గాడిదలను వెదకుచు వచ్చిన సౌలును, ఇశ్రాయేలు అను దైవజనాంగానికి రాజు లేని కొరత తీర్చింది.  (4)  2 సమూయేలు

16:1-2లో అబ్షాలోమునకు భయపడి దాగిన దావీదునకు గాడిద ఆహారము మోసింది.  (5)  2 సమూయేలు 18:9లో తండ్రి హంతకుడైన అబ్షాలోమును మరణానికి అప్పగించి, దావీదును, అతని రాజ్యాన్ని కాపాడింది.

        ఇక క్రొత్త నిబంధనలో (6)  మత్తయి 2:13-14లో ప్రభువును ఆయన తల్లిని ఐగుప్తుకు మోసుకుపోయి హేరోదు మారణహోమంనుండి కాపాడింది.  (7) మార్కు 11:4లో తలవాకిట కట్టబడిన గాడిద బంధకాలలో నుండి ప్రభువు ద్వారా విడుదల పొంది, యేసుప్రభువును మోసి యెరూషలేము ప్రవేశము చేసి, ఆయనను యెరూషలేము ద్వారమునకు చేర్చి మహిమపర్చింది.

         ప్రియసోదరీ!  సోదరా!  నీ స్థితి ఎలాగుంది?  యేసును మోసే స్థితిలో వున్నావా?  లేక లోకపాపాన్ని మోస్తున్నావా?  లేక ఇతరుల పాపాల్లో భాగము పంచుకొంటున్నావా?  ఏ విధముగా ఉన్నావు? గాడిద సొంతవాని దొడ్డి తెలుసుకొనునట్లు నీవు కూడా ప్రభువు నెరిగి, ఆయన ఉనికి తెలుసుకొనుటకు ప్రయాసపడుము.  ఆమేన్‌

..............

        అంశము :-  పరమాత్ముడు - పరిశుద్ధాత్ముడు - జీవాత్ముడు - లోకసృష్టియైన ఈ అనంత విశ్వము, పరలోక సామ్రాజ్యము వీటన్నిటికి ఉన్నటువంటి అవినాభావ సంబంధములు.  మరియు ఆయా సందర్భాలలో అవి పొందిన రూపములు, అవి జరిగించిన క్రియాకర్మలు, వాటి ఉద్దేశ్యములు, తత్సంబంధమైన క్రియాప్రణాళికను గూర్చిన వివరము.

         ప్రియపాఠకులారా!  నేటి ఆధునిక యుగములో నరులలో విస్తరించియున్న శాస్త్రజ్ఞానము అంచల వారీగా సాటి నరుని ఆశ్చర్యకరునిగా చేసే రీతిలో క్రియ జరిగిస్తున్న ఈ రోజులలో నరునికి దైవత్వము మీద పలురకాలైన అనుమానాలు రేకెత్తిస్తున్నవి.  మరి శాస్త్ర సాంకేతిక శాస్త్రజ్ఞులు అసలు దేవుడు లేడన్న సిద్ధాంతముతోనే తమ ఇహలోక జీవితాన్ని సాగిస్తున్నారు.   ఇట్టి యుగములో అజ్ఞానము వుంది, పాశవికమున్నది, దైవత్వము వుంది, హేతువాదముంది, నాస్తికత్వముంది.  అయితే దేవుడున్నాడనుటకు ప్రత్యేకమైన ఆధారాలున్నవి.  ఈ ఆధారాలు దేవుడే నరునికి ప్రయోగాత్మకముగా క్రియారూపముగా చూపిస్తున్నాడు.  ఉదా|| గాలి కంటికి కనబడకపోయినను, ఒక టైరులోను లేక ఒక బంతిలోను, స్టౌలోను లేక పిల్లలు ఊదే బెలూన్‌లోనో వగైరాలలో ఇది బంధింపబడి, ఏకారణము చేతనైనను ఈ గాలి బంధింపబడిన వస్తువు పేలిపోయినప్పుడు శబ్దముతో ఈ గాలి పీడనము ద్వారా బయటకు వస్తుంది.  ఇందునుబట్టి గాలి వున్నది, లేనిది మనము తెలిసికోవాలంటే ఆ వస్తువు గాలి చేత బంధింపబడి, ఎంతటి బరువునైనను మోసే స్థితిలో వుంటుంది.  ఇందుకు ఋజువులు మోటారు టైర్లు, సైకిళ్ళు, టైర్లు, స్కూటర్లు, ఆటో వగైరా టైర్లు మనయొక్క ప్రయాణాలలో మనలను ఒక చోట నుండి మరియొక చోటికి సులభముగా తీసుకొని పోతున్నాయంటే, ఆ చక్రాలలోని గాలియొక్క శక్తియని మనము తెలిసికొంటున్నాము.

        అలాగే జన బాహుళ్యములో విశేషముగా వాడబడే విద్యుశ్ఛక్తి కూడా కంటికి కనబడనిది, అదృశ్యములో వున్నది.  ఈవిద్యుశ్ఛక్తిని గూర్చి మనము తెలిసికోవాలంటే, ఈ విద్యుశ్ఛక్తి విద్యుత్కేంద్రము నుండి తీగెల ద్వారా ప్రసారమై, మన గృహాలకు ఆ తీగెల ద్వారా బంధింపబడి, మన గృహములోని ప్రతి అవసరతను తీర్చుటకు ఈ విద్యుశ్ఛక్తి వాడబడుచున్నది.  ఉదా|| లైట్లు, ఫ్యాన్లు, రేడియోలు, టీి.వీలు బట్టలు ఇస్త్రీ పట్టుట, నీటిని వేడి చేయుట, మిక్సీలు, పిండి మిల్లులు, వగైరా అవసరతలకును, ఇంతేగాక పరిసరాలలో వీధిలైట్లుగాను, సినిమాలు, నాటకశాలలు ఒకటేమిటి?  నరునియొక్క సకల అవసరతలలో ఈ విద్యుశ్ఛక్తి అన్నది విశేషముగా వాడబడుచున్నది.  నేటి ఆధునిక యుగములో విద్యుశ్ఛక్తి నర జీవితానికి ప్రాణాధారమై యున్నది.  హాస్పిటలులో జరిగే నేటి ఆధునిక చికిత్సలలో ఈ విద్యుశ్ఛక్తి ప్రమేయము అవసరత ముఖ్యమైయున్న విషయము మనకు తెలిసిందే.  ఇదిగాక పెద్దపెద్ద కర్మాగారాలలో యంత్రాలయాలు, రైళ్ళు, మోటారు వాహనాలు ఒకటేమిటి?  సమస్తము ఈ విద్యుశ్ఛక్తి చేత నడుపబడుచున్నవి.  అయితే ఈ విద్యుశ్ఛక్తియొక్క రూపము మనకు కనబడదు.  ఈ విధముగా గాలియొక్క రూపము విద్యుశ్ఛక్తియొక్క రూపము తెలిసికోలేనివారమైన మనము ఆ రెంటి వలననే మనము పోషింప బడుచున్నామన్న సత్యమును మనము తెలిసికొని యున్నాము.  ఇందులో గాలిలేనిదే నరునియొక్క శ్వాస, నరునియొక్క జీవితానికి మనుగడలేదు.  శ్వాస లేనివాడు శవమే!  ఆలాగే విద్యుశ్ఛక్తి సహకారము లేని వ్యక్తికి జీవితము అగచాట్ల పాలే, ఉన్నచోటే ఉండి కదలలేడు.

         ప్రియపాఠకులారా!  వాయుశక్తి - విద్యుశ్ఛక్తి ఉన్నట్లుగానే ఆత్మశక్తి కూడా ఉన్నదన్న సత్యాన్ని నేటి విశ్వాసులమైన మనము తెలిసికోవలసిన అవసరత ఎంతయినను వున్నది.  సృష్టిలో వాయుశక్తి, జలశక్తి, అగ్నిశక్తి వున్నట్లే ఈ యావద్‌ సృష్టికి ఆత్మశక్తి కూడా ఒకటున్నదన్న సత్యము మనము తెలిసికోవలసియున్నది.  చిత్రమేమంటే గాలి ఒక శక్తి అది అన్ని రూపాలలోను వాడబడుచున్నది.  ఇందునుగూర్చి మనము పై వ్యాఖ్యానములో తెలిసికొని యున్నాము.  అలాగే విద్యుశ్ఛక్తిని గూర్చి కూడా తెలిసికొని యున్నాము.  ఇక జలశక్తి అన్నది ప్రతి యొక్కరికి ఆధారమై నీరులేనిదే ఏ ప్రాణియు జీవించలేదు.  నీరు కూడా నానావిధాలుగ వాడబడుచున్నది.  నీటి ద్వారా పంట పొలములో ముఖ్యముగా ఆహారోత్పత్తి జరుగుచున్నది.  ప్రతి ప్రాణికిని, ప్రతి నరునికి దప్పికను నీళ్ళు తీర్చుచున్నవి.

         ప్రియపాఠకులారా!  ఇన్ని విధములైన వనరులు వసతులు పొందుచున్న మన నర జీవితములో  ఈ శక్తులన్నింటికి మించిన శక్తి ఏది?  అన్న సత్యాన్ని సరియైన ఆత్మజ్ఞానముతో ఆలోచించిన నరుడు లేడనియే రోమా 3:11లో నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు, గ్రహించువాడెవడును లేడు, దేవుని వెదకువాడెవడును లేడు, అంటే సమస్త శక్తులకు మించిన మహోన్నత శక్తియైన పరమాత్ముని వెదికే స్థితిలో నరునియొక్క ఆత్మీయస్థితి లేదు.

         ప్రియపాఠకులారా!  ఆత్మీయ దృక్ఫథముతో మనము పరిశోధిస్తే ఏదో యొక శక్తి లేనిదే భూగోళము ఇదిగాక, సూర్యచంద్ర నక్షత్రాదులు వగైరా నానాగ్రహములు తమ సంచారాన్ని సాగిస్తున్నాయంటే వీటన్నిటిని చలింపజేసే శక్తి మరియు వాటిని నిర్మించిన శక్తి కూడా ఒకటున్నదన్న సత్యాన్ని మనము గ్రహించవలసి యున్నది.  ఆ శక్తియే పరమాత్మయని, దైవాత్మయని పిలువబడుచున్నది.  అయితే సృష్టిలోని ప్రతి సృష్టము ఈ పరమాత్మునియొక్క వాక్శబ్దము నుండియే పుట్టినట్లుగ ఆదికాండము  1:లో చదువగలము. ఇట్టి సృష్టి నిర్మాణ కార్యక్రమమంతయు ఆరు దినములలో జరిగినట్లుగా వేదవివరణయై యున్నది.  ఇక ఏడవ దినమున సృష్టి నిర్మాణకర్తయైన దేవుడు విశ్రమించినట్లుగా ఆదికాండము 2:3లో చదువగలము.  వాస్తవమునకు ఆత్మకు విశ్రాంతి లేనట్లే పరమాత్మకి విశ్రాంతి లేదు.  అయితే 7వ దినమున విశ్రమించినట్లుగా వున్నది.  కేవలము పరమాత్ముడు తాను రూపించిన యావద్‌ సృష్టిని దానితోబాటు తాను సృష్టించిన జీవాత్మయైన నరుని స్థితిగతులను, సృష్టి క్రియ జరిగించే సృష్టములయొక్క క్రమమును వీక్షిస్తూ పరమాత్ముడు సంతృప్తుడైనట్లుగా ఏడవ దినముయొక్క ఆత్మీయ నిగూఢ సత్యము బయల్పరచుచున్నది.  ఆత్మకు నిద్ర లేదు, ఆకలి లేదు, దప్పిక లేదు, స్థిరత్వము లేదు, అనగా స్థిరముగా ఒకచోట ఉండదు. ఆత్మకు సంచారము ఉన్నట్లుగానే నరునిలోని జీవాత్మ కూడా శరీరములో గుప్తమై యున్నను, ఆత్మశరీరముతో ఏకీభవించక, ఆత్మ తన చిత్తానుసారముగా నానావిధములైనటువంటి రీతులలో చలిస్తుంటుంది.  ఎలాగంటే శరీరునికి విశ్రాంతి, నిద్ర, ఆకలిదప్పిక, దుఃఖము, ఆనందము, భయము, వగైరాలుంటాయి.  కాని శరీరములో ఉన్నఆత్మకు మాత్రము అలాంటివి ఉండవు.  శరీరము తాను చేసిన పని ద్వారా అలసి విశ్రమించి నిద్రించినప్పుడు - ఆత్మ నిద్రించునది కాదు.  అది మెలకువ గల్గి సంచరిస్తూ, శారీరముతో వుంటూనే నానారీతులుగా చలిస్తుంటుంది.  ఈ చలనము అనేది నిద్రించే నరునికి నానావిధములైన దృశ్యములను కనబరచుతుంటుంది.  ఇదియే స్వప్నము.

        అయితే పరమాత్ముని గూర్చి మనము తెలిసికొన్నప్పుడు కీర్తన 121:3లో నిన్ను కాపాడువాడు కునుకడు, ఇశ్రాయేలును కాపాడువాడు కునుకడు నిద్రపోడు-యెహోవాయే నిన్ను కాపాడువాడు, అని  వ్రాయబడిన ప్రకారము సృష్టి నిర్మాణకుడైన సృష్టికర్తయైన ప్రభువు, సృష్టియొక్క నిర్వహణ కార్యములలో నిమగ్నుడై రేయింబగలు ఏకరీతిగా, నిత్యజీవునిగా అనగా నిద్ర, ఆహారము, భయము, రోగము, వగైరా అసందర్భాలకు వ్యతిరేక జీవితమును నిర్భయముగా, తనకు ఎదురులేని వాతావరణములో - పరలోకము, భూలోకము, పాతాళ లోకములలో పరమాత్మయొక్క సంచారము సాగుచున్నట్లు కీర్తన 14:2లో వివేకము కలిగి దేవుని వెదకువాడు కలరేమో అని యెహోవా ఆకాశము నుండి చూచి నరులను పరిశీలించెను.  వారందరు దారి తొలగి బొత్తిగా చెడిపోయి యున్నారు, మేలు చేయువాడొకడును లేడు, ఒక్కడును లేడు.  అదే విధముగా కీర్తన 53:1-3లోను ఇదే మాట వ్రాయబడియున్నది.  కనుక నరులయొక్క ఆంతర్యాలను పరిశీలించువాడు పరమాత్మయని ఇందునుబట్టి మనకు తెలుస్తున్నది.

        ఇట్టి పరమాత్ముడైన పరలోక శక్తి సమస్త శక్తుల కంటె ప్రకాశమును తేజస్సును, ప్రభావమును కలిగి, సమస్తమును సృష్టించుటకును, పోషించుటకును, లయపరచుటకును, శక్తి సంపన్నుడైనట్లు ఆదికాండము ఒకటి రెండు అధ్యాయాలలో సృష్టినిర్మాణములో పరమాత్మ శక్తి సామర్థ్యాలను గూర్చి మనము పూర్తిగా తెలిసికోగలము.  అయితే పరమాత్మునియొక్క రూపములను గూర్చి ఆయా సందర్భాలనుబట్టి మనము తెలిసికోవలసి యున్నది.

        పరమాత్మునియొక్క పూర్వ రూపము ఏమిటి?  అంటే యోహాను 1:1 నుండి వివరముగా మనము తెలిసికొందము.  ఇందులో ''ఆదియందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్దనుండెను. వాక్యము దేవుడైయుండెను,'' అని మొదటి మాట వివరిస్తున్నది.  రూపము లేనిదే శబ్దము రాదు.  కనుక వాక్యము అన్నది అనగా వాక్కు అన్నది వున్నప్పుడు - వాక్కుకు మూలకారణమైన రూపము అన్నది తప్ప కుండా వుండాలి.  ఇందును గూర్చి ఆదికాండము 1:1-2లో ఈ విధముగా వ్రాయబడి యున్నది.  ''ఆదియందు దేవుడు భూమ్యాకాశములను సృజించెను.  భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను, చీకటి అగాధజలముపైన కమ్మియుండెను, దేవుని ఆత్మజలములపైన అల్లలాడుచుండెను.''

         ప్రియపాఠకులారా!   శారీరజ్ఞానము శారీర తత్త్వములతో కూడా జీవాత్మ నరులైన మనలో వున్న జీవాత్మునియొక్క జ్ఞానముతో ఈ ప్రవచనములలోని నిగూఢసత్యాలను ఆత్మీయ జ్ఞానంతో మనము పరిశోధించినట్లయితే, భూమి నిరాకారముగాను, శూన్యముగాను ఉన్నట్లే వాక్కయియున్న దేవునియొక్క స్థితి కూడా అదే విధముగా ఉంది.  అంటే సృష్టి అనాది పరమాత్ముడు అనాది అనగా ఆదిలేనివాడు, భూమికి కూడా ఆదిలేదు.  ఈ ఆదిని సృష్టిలో కల్గించినవాడు గనుకనే ఆయనకు ఆది దేవుడు అని పేరు గల్గింది.  ఈ విధముగా ఆది దేవుడైయుండి, సృష్టిలో మొదటగా క్రియాకర్మకు ఉపక్రమించిన పరమాత్మునియొక్క రూపము వాక్కు - దైవత్వముతోబాటు ఆత్మగా జలముల మీద సంచరించినట్లు వేదముయొక్క వివరణయై యున్నది.  ఇప్పటివరకు సృష్టికర్త కేవలము ఆత్మయై యున్నట్లు రెండవ వచనములోని రెండవ భాగము మనకు వివరిస్తున్నది.  దేవుని ఆత్మ జలముల మీద అల్లలాడుచుండెను.  అనగా సంచరించుచున్నట్లుగ తెలియుచున్నది.  ఇక వాక్కయియున్న వాక్శబ్దరూపమును ప్రయోగిస్తూ వెలుగు కమ్మని పలుకగా వెలుగు కలిగెను, అని మూడవ వచనము వ్రాయబడి యున్నది.  సృష్టి నిర్మాణకుడైన సృష్టికర్తయొక్క రూపము చీకటి కాదని వెలుగు అని మొదటి యోహాను 1:5లో విధముగా - దేవుడు వెలుగైయున్నాడు, ఆయన యందు చీకటి  ఎంతమాత్రమును లేదు, అన్నట్లుగా దైవాత్మన్నది మొట్టమొదటి భూలోక సృష్టికార్యములలో - తనను తాను ప్రత్యక్షపరచుకొంటూ - తన వెలుగును భూమిమీద ప్రసరింపజేసినట్లుగా  ఇందునుబట్టి మనకు తెలుస్తున్నది.  

        ఈ విధముగా వాక్కయియున్న దేవుడు సమస్తమును అనగా సమస్త సృష్టి కార్యక్రమాన్ని జరిగిస్తూ, ఈ అనంత విశ్వము యావద్‌ క్రియాకర్మలను సంపూర్తిగా సృష్టించాడు.  ఇందునుగూర్చి యోహాను 12:లో వివరిస్తూ - ఆయన ఆదియందు దేవుని యొద్ద వుండెను.  సమస్తమును ఆయన మూలముగా కలిగెను.  కలిగియున్నదేదియు ఆయన లేకుండ కలుగలేదు'', అనుటలో  ప్రియపాఠకులారా!   ఈలోక సృష్టియావత్తు కేవలము వాక్కుతోనే జరిగించుటకు మూలకర్తయైన ఒక వ్యక్తి ఉండాలి.  ఎందుకంటే ఆయన ఆదియందు దేవుని యొద్దనుండెను, సమస్తమును ఆయన మూలముగా కలిగెను, కలిగియున్న దేదియు ఆయన లేకుండ కలుగలేదని వ్రాయబడి యున్నది.  ఇంకను విచిత్రమేమిటంటే ఆయనలో జీవము ఉన్నట్లుగా వ్రాయబడి యున్నది.  దేవుని వాక్యము దేవుడు ఉన్నప్పుడు ఆయన ఆదియందు దేవునియొద్ద ఉన్నట్లును - ఆయన అని ప్రత్యేకముగా ఒక వ్యక్తిని గూర్చి పలుకుటలో అనుమానము మనకు కలుగవచ్చును.  ఇందుకు సమాధానముగా ఎఫెసీ 1:4, ఇందునుగూర్చి ప్రత్యక్షముగా దైవత్వమన్నది మనకు ఋజువు పరచుచున్నది.  ఆయన అనిన వాడు దేవుని యొద్ద ఉన్నాడన్న విషయాన్ని మనకు బయల్పరచుచున్నది.  అదేమనగా దేవుడు తన ప్రియుని యందు తాను అనగా పరమాత్మునికి ప్రియుడు - పరమాత్ముడైన పరమశక్తికి వాక్కయియున్న ప్రియుడు - తాను ఉచితముగా సమస్త నరకోటికి అనుగ్రహించిన తన కృపామహిమకు కీర్తి కలుగునట్లు - తన చిత్త ప్రకారమైన దయాసంకల్పము చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులనుగా స్వీకరించుటకై, మనలను ముందుగా తన కోసము నిర్ణయించుకొని, మనము తన యెదుట పరిశుద్ధులమును నిర్దోషులమునై యుండవలెనని జగత్తు పునాది వేయబడక మునుపే , ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకొనెను, అనివ్రాయబడిన ప్రకారము ప్రియులారా!  సృష్టి నిర్మాణకర్తయైన దైవాత్మ తన సన్నిధిలో క్రీస్తు అను రూపమును ఏర్పరచుకొని, సమస్తమును ఆయన మూలముగ సృష్టించినట్లును, ఆయన లేకుండ ఏదియు కలుగనట్లును, ఆయనలో జీవము ఉన్నట్లును, ఆ జీవము మనుష్యులకు వెలుగైయున్నట్లును, ఆ వెలుగు చీకటిలో ప్రకాశించు చున్నట్లును, చీకటి దానిని గుర్తింపనట్లుగా వివరించబడి యున్నది.  అంటే ఈ అనంత విశ్వమునకు పునాది వేయబడక మునుపే అనగా ఆదామును రూపించక మునుపే దైవసన్నిధిలో క్రీస్తుయొక్క రూపము ఉండినట్లును, ఆ రూపమే వెలుగైయున్నట్లును, ఆ రూపములో జీవమున్నట్లును - ఆ జీవము ద్వారా లోకములో వెలుగు ప్రసారమై, చీకటి అగాధజలములో ఉన్న భూగోళమును వేరుపరచి మట్టిముద్దగా నిరాకారశూన్యమైన భూగోళము - దైవరూపమైన క్రీస్తుయొక్క వెలుగు ద్వారా పుటము వేయబడి, ఘనీభవించి మంటి ముద్దగా, జిగటజిగటగా ఈ భూగోళము క్రీస్తుయొక్క వెలుగు ప్రభావమునకు ఘనీభవించి, పరమాత్మునియొక్క సృష్టిక్రియలకు యోగ్యకరముగా తయారైనట్లును, అంతేగాకుండ క్రీస్తుయొక్క వెలుగు ద్వారా భూగోళములో ప్రవేశించిన జీవమన్నది - సకలవిధములైన సృష్టములు పుట్టుటకును, వృక్షములు, గడ్డిబీళ్ళు మొలిపించుటకును, పర్వతములు, మైదానములు, జంతుజాలము, పక్షిజాలము, మృగ సముదాయము పుట్టుటకు కూడా అనగా జీవము కలిగి చలించు ప్రతిజీవిని, భూమిమీద ఏర్పడుటకు దైవసన్నిధిలో లోకమునకు కనుమరుగైయున్న క్రీస్తుయొక్క రూపము ద్వారా సమస్తమును - ఆయన జీవము భూమి మీద క్రియ జరిగించుటనుబట్టి ప్రతి జీవియు భూమి మీద ఏర్పడుటకు భూమికి జీవమిచ్చినవాడు క్రీస్తేయని తెలియుచున్నది.  

        ఇక ఆదికాండము 1:20-21, జీవము గల్గి చలించువాటిని జలములు సమృద్ధిగా పుట్టించును గాక!  అని పలికినప్పుడు, దేవుడు జలములలో వాటివాటి జాతిప్రకారము జలములు సమృద్ధిగా పుట్టించిన మహామత్స్యములను, జీవము గలిగి చలించు వాటినన్నిటిని, దాని దాని జాతి ప్రకారము రెక్కలుగల ప్రతి పక్షిని సృష్టించినట్లును, దేవుడు వీటిని పుట్టించుగాక అని పల్కినప్పుడు జలములలో కూడా క్రీస్తుయొక్క రూపము ప్రాణవాయువు రూపముగా క్రియ జరిగించి, అనేక జలచరాలను రూపించినట్లు ఇందునుబట్టి మనకు తెలుస్తున్నది.

         ప్రియపాఠకులారా!  సృష్టికి పూర్వము దేవుని సన్నిధిలో క్రీస్తు ఉన్నాడనుటకు ఋజువు.  ఆదికాండము 1:26-27లో ఈలాగు వ్రాయబడి యున్నది. ''దేవుడు - మన స్వరూపమందు మన పోలికె చొప్పున నరులను చేయుదము, దేవుడు తన స్వరూపమందు నరుని సృజించెను, దేవుని స్వరూపమందు వానిని సృజించెను.  స్త్రీనిగాను పురుషునిగాను వారిని సృజించెను, దేవుడు వారిని ఆశీర్వదించెను,'' అని వ్రాయబడి యుండుటలో మొట్టమొదటగా దేవుడు మన స్వరూపమందు మన పోలికె చొప్పున'' అనుటలో ఇక్కడ దైవత్వమున్నది.  1.  ఆత్మ  2.  రూపము; ఈ రెండు అంశములలో ఉన్నట్లుగా ఈ వాక్యములోని బహువచనముతో కూడిన ఈ మాట - ''మన పోలికె - మన స్వరూపము'' పరమాత్ముడు ఒక్కడుగా కాక అనగా వాక్కే గాకుండ మరియొక రూపములో ఉండినట్లు ఈ ప్రవచన భాగము వివరిస్తున్నది.  అందుకే మన స్వరూపము మన పోలికె చొప్పున నరులను చేయుదము, అనుటలో నరునియొక్క పోలికెయైన నమూనా దైవసన్నిధిలో క్రీస్తు రూపము దాల్చియున్నట్లు, ఆ రూపములో జీవమున్నట్లు - ఆ జీవము మనుష్యులకు వెలుగైయున్నట్లు - సర్వసృష్టి ఆయన మూలముగా కల్గినట్లు సృష్టిలో ఉన్నవేది ఆయన లేకుండ కలిగి యుండలేదనియు వ్రాయబడి యున్నది.

        ఇక ''ఆయనలో జీవమున్నట్లును, ఆ జీవము మనుష్యులకు వెలుగైయున్నట్లును - ఆ వెలుగు చీకటిలో ప్రకాశించుచున్నదిగాని, చీకటి ఆ వెలుగును గ్రహింపకుండెనని వ్రాయబడియున్నది.  ఇక యోహాను 1:9లో నిజమైన వెలుగు ఉండెను అది లోకములోనికి వచ్చుచు ప్రతి మనుష్యుని వెల్గించుచున్నది. ఆయన లోకములో ఉండెను.  లోకము ఆయన మూలముగా కలిగెను.  కాని లోకము ఆయనను తెలిసికోలేదు.  ఆయన తన స్వకీయుల యొద్దకు వచ్చెను.  ఆయన స్వకీయులు ఆయనను అంగీకరింపలేదు.  యోహాను 1:2-12 వరకు ఉన్నటువంటి ఈ వాక్యభాగములు దైవకుమారుడైన క్రీస్తును గూర్చి వివరిస్తున్నవి. ఇందునుబట్టి ఈ అనంత విశ్వము రూపించబడినప్పుడే అనగా భూమికి పునాది వేయబడక మునుపే క్రీస్తు రూపమున్నట్లు, ఆయన ద్వారా ఈ లోకములో లోకసృష్టములు ఏర్పడినట్లు ఇందునుబట్టి మనకు తెలుస్తున్నది.

         ప్రియపాఠకులారా!  ఇందునుబట్టి మనము ఆలోచించినట్లయితే ఆదికాండము 2:7లో దేవుడైన ప్రభువు నేలమంటితో నరరూపమును నిర్మించుటలో క్రీస్తు రూపమునకు మాదిరియై యున్నట్లు తెలియుచున్నది.  దేవుడు నరుని రూపించు సందర్భములో నరరూపమును ఏదైన జంతురూపమునకు పోల్చి చేయవచ్చును గదా?  ఆలాగు చేయక ఆదికాండము 1:26లో తాను అనుకొన్నట్లుగ మన పోలికె మన స్వరూపము చొప్పున నరులను చేయుదము'', అనిన ప్రవచనమును బట్టి ఆయన రూపములో ఆయన పోలికెలో నరుని చేశాడు.  అంతేగాకుండ తన పోలికెయైన నరునికి తన జీవమును తన ఆత్మను ప్రవేశపెట్టినాడు.  ఇందును బట్టి నరుడు జీవిగాకుండ జీవాత్ముడైనట్లు వేదములో చదువగలము.

        దైవత్వముయొక్క రూపాంతరాలను గూర్చిన వివరాలను  ప్రియపాఠకులారా!  ఇప్పటివరకును మనము నేర్చుకొన్నటువంటి ఈ వేదభాగమును బట్టి దైవత్వమన్నది ఏయే రూపాంతరాలు పొంది నరసృష్టి వరకు క్రియ జరిగించిన విధానమును వివరముగా తెలిసికొందము.  మొట్టమొదట ఆత్మ ఆదికాండము 1:1-2 దేవుని ఆత్మ  2.  వాక్కు - వెలుగు కమ్మనగా వెలుగాయెను.  ఇందునుబట్టి రెండవది వాక్కు,

3వది వెలుగు 4. ఆ తర్వాత జీవము - ఆయనలో జీవముండెను కనుక జీవము, ఈ నాలుగింటికి కేంద్రమైన క్రీస్తు - ఎఫెసీ1:6 ఎట్లనగా తన ప్రియుని యందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపా మహిమకు కీర్తి కలుగునట్లు తన చిత్తప్రకారమైన దయాసంకల్పము చొప్పున, యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులనుగా స్వీకరించుటకై, మనలను ముందుగా తన కోసము నిర్ణయించుకొని, మనము తన యెదుట పరిశుద్ధులమును నిర్దోషులమునై యుండాలని జగత్తు పునాది వేయబడక మునుపే, ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకొనెను.

        అయితే ఈ సమస్తమునకు  - ''తూర్పుదిక్కున వేయబడిన ఏదెను వనములో ఉండినట్లు ఈ క్రింది వివరములనుబట్టి తెలిసికోగలము.  ప్రియపాఠకులారా!  ఏదెనులో తూర్పు దిక్కున వేయబడిన దేవుని వనములో దేవుడు ఐదు విధాలుగ జీవించినట్లుగ ఆత్మీయ విధానము వివరిస్తున్నది.  1.   మొట్టమొదటి దేహ నమూనా దేవునిది, రెండవది దేవుడు అందులో ప్రవేశింపజేసిన జీవము - ఆత్మ రెండును దేవునివి, తోట మధ్యలో నాటిన జీవవృక్షము దేవునిది అనగా క్రీస్తు - ''మంచిచెడులు తెలియజేయు వృక్షము - మరియు సర్పము'' ఈ రెండును దైవసృష్టియే.

        ఈ విధముగా ఐదు అనుసంఖ్యతో నరునియొక్క జీవితము దేవునిలో విభాగింపబడి యున్నది.  ఈ ఐదు అను సంఖ్యచే నరునియొక్క పంచేంద్రియములను దోషపూరితము చేసి, దైవానుగ్రహము నుండి నరుని తప్పించి వానిని దోషిగాను, శాపగ్రస్థునిగాను, మరణపాత్రునిగాను, మార్చివేసింది ఏది?

         ప్రియపాఠకులారా!  ఇందులో మనకు తేలిన సారాంశమేమనగా దైవత్వము మానవునకు అనుగ్రహించిన ఐదు అంశాలలో దైవత్వమునకు అనుకూలము గాకుండ, దైవత్వమునకు ప్రతికూలమైన దైవాజ్ఞాతిక్రమము చేసినప్పుడు ఈ పంచేంద్రియ దోష క్రియాకర్మలను బట్టి, సృష్టికర్తయైన దేవుడు ఈ మొదటి నరునియొక్క దుర్భర జీవితాన్ని అతనికి సంక్రమించిన పంచారిష్టములకుగాను, తానే ఈ లోకములో సామాన్య నరునిగ జన్మించి పంచ గాయాలు పొందినట్లు అనగా నరుడు పొందవలసిన దోష శిక్షను తాననుభవించినట్లు దైవనిగూఢసత్యము వివరిస్తున్నది.  ఎందుకంటే దేవుడు తాను రూపించిన వనము, తాను సృష్టించిన సర్పము, తాను చేసిన రూపించిన నరరూపము - వానిలో ప్రవేశింపజేసిన జీవము, ఆత్మ మొత్తము ఐదును వికటించుటనుబట్టి - సృష్టిదోషము నరదోషము - రెండు దోషములను బట్టి రెండు విధములైన శిక్షలు 1 . అన్యాయపు తీర్పు  2.  నిర్దోషమైన మరణశిక్ష - నరుల చేత దేవుడే విధింపజేసుకొని మరణశిక్షను అనుభవించినను ఆయన సృష్టికర్త కనుక సమస్త జీవులకు ఆయనయే ఆధారభూతుడు గనుక ఆయనలో జననము మరణము అన్నవి లేవు గనుక, మరణము ఆయనను ఏమియు చేయలేనందున, ఆయన తన పునరుత్థానము వలన తన మహిమను లోకమునకు బయల్పరచుచూ - మరణమన్నది మనుష్యునికేగాని దైవత్వమునకు లేదనియు అలాగే దైవత్వములో జీవించిన నరునికి మరణము ఒక ముల్లు మాత్రమేనన్న భావాన్ని యావద్‌ నరకోటికి ఆయన బయల్పరచియున్నాడు.

        ఈ విధముగా ఐదు అను సంఖ్యతో నరజీవితమునకు ముడిపెట్టిన పరమాత్ముడైన ప్రభువు ఈ ఐదు అన్న అంకెను కాగితాల మీద శిలల మీద తాళపత్రాల మీద లిఖించక, ఈ ఐదు సత్యాలను నరుడు తన జీవితాంతము మరువకుండునట్లు తన కళ్ళముందే ఎప్పుడు కనబడునట్లుగా అంతేగాకుండ ఏ కోణములో చూచినను అవి ప్రత్యక్షమగునట్లు కుడిచేతికి ఐదు వ్రేళ్ళు, ఎడమచేతికి ఐదు వేళ్ళు, కుడి కాలికి ఐదు వ్రేళ్ళు, ఎడమకాలికి ఐదు వ్రేళ్ళతో దేహ నిర్మాణము చేశాడు.

         ప్రియపాఠకులారా!  ఈ సత్యాన్ని ఎక్కడైనను, ఎప్పుడైనను, ఏనాడైనను మన జీవితములో మనము ఆత్మీయ దృక్పధముతో ఆలోచించి యున్నామా?  ఆ విధముగా ఆలోచించినట్లయితే ఏనాటికిని దైవమార్గము నుండి తప్పిపోము, అంతేగాకుండ, సృష్టిలో పంచభూతాలని నరునియొక్క అవసరతకు మనుగడకు ఏర్పరచి యున్నాడు.  ఈ పంచభూతాలే గాలి, నీరు, భూమి, అగ్ని, ఆకాశము.  దేహములో వ్రేళ్ళరూపముగా ఉంచిన దేవుడు జ్ఞాపకము చేసికొమ్మని సృష్టిలో పంచభూతాలుగా ఏర్పరచి యున్నాడు.  ఈ పంచభూతాలు - జీవాత్మ నరునికి ఆధారమునైయన్నవి.  ఆలాగే ఈ పంచభూతాలు వికటించినప్పుడు అనగా ఒకదానితోనొకటి విజృంభించి, స్వైర విహారము చేయునప్పుడు ఏర్పడే భీకర వాతావరణము, మారణహోమమును నాశనమును కల్గిస్తాయి.  ఎలాగంటే నీళ్ళు, గాలి వికటించినప్పుడు తుఫాను, అతివృష్టి, హిమపాతము, వడగండ్లు, వగైరాలు ఏర్పడుతాయి.  అలాగే ఎండ వేడిమి అధిగమించినప్పుడు వేడిగాడ్పులు, అనావృష్టి ఏర్పడుతాయి.  ఇక ఆకాశములో గ్రహ సంచారములుగాని, మేఘములయొక్క తీవ్ర సంచలనము ద్వారాగాని, ఏర్పడేటటువంటి విస్ఫోటము ద్వారా అనగా పిడుగుపాటు ఉరుములు - మెరుపులు, భూకంపము, వగైరాలు ఏర్పడే ప్రమాదాలున్నవి.  అలాగే నరశరీరములో దేవుడు అమర్చిన ఈ ఐదు వ్రేళ్ళు నిర్మాణములో కాళ్ళు, చేతులకు ఉన్న ఐదు వ్రేళ్ళు సక్రమముగా ఉంటేనే నరునియొక్క జీవితానికి మనుగడ, ఏదేని ఒక పనిచేయుటకు పట్టు, సాటి నరజీవితములో సఖ్యతగా జీవించుటకు యోగ్యత, ఇవన్నియును చేతి వ్రేళ్ళ సలక్షణమునుబట్టి ఉంటుంది.  ఏదేని ఒక కారణము చేత, ప్రమాదవశాత్తు చేత, చక్కర వ్యాధి చేతనో వ్రేళ్ళు కట్టయినప్పుడు లేక కాలిపోయినప్పుడు ప్రమాదములో ఒక వ్యక్తియొక్క జీవితము ఎట్లుంటుందోగాని,  ఆ వ్యక్తిని మొండి చెయ్యివాడు, కుంటివాడు, వికలాంగుడు అని చిన్న చూపు చూస్తూ అట్టివానికి కన్యాదానము చేయుటకు కూడా ఏ కన్యాదాతయు సాహసించుట అరుదు.

        కనుక  ప్రియపాఠకులారా!  ఐదు అనిన సంఖ్యకు ఆది నుండియే ఒక నిర్దిష్టమైనటువంటి గణనీయమైనటువంటి ప్రాధాన్యతనిచ్చి యున్నాడు.  ఇందునుబట్టి దేవుడు సృష్టికార్యములను యావత్తును ఏడు దినములలో సంపూర్ణము చేసి నరునిలో మాత్రము ఐదు అన్నటువంటి సంఖ్యను పరిమితము చేస్తూ నరజీవితానికి ప్రారంభోత్సవము చేశాడు.  ఈ ఐదు అన్నది నరజీవితములో చాలా ప్రాముఖ్యమైంది.  దేవుడు నరుని పట్ల ఏర్పరచిన ఈ ఐదు అను సంఖ్య భోజన పదార్థములలో కూడా గణనీయముగా ఎంచబడుచున్నది.  పంచభక్షపరమాన్నాలు, పంచసూత్రములు, పంచారిష్టములు, పంచభూతాలు, ఈ విధముగా ఐదు అను సంఖ్యతో దైవసన్నిధిలో జీవించిన నరునియొక్క జీవితములో కూడా దశలవారీగా ఐదు వున్నవి.  మొట్టమొదటిది పిండము, రెండవది బాల్యము, మూడవది యవ్వనము, నాలుగవది వార్థక్యము, ఐదవది వృద్ధాప్యము.  ఈ అయిదును మానవ దశలు.

         ప్రియపాఠకులారా!  ప్రపంచములో విభజింపబడియున్న ప్రాముఖ్యత ఖండాలు కూడా ఐదు.  అలాగే ప్రభువు సిలువలో పొందిన గాయములు ఐదు.  ఈ విధముగా ఐదు అన్నది నానావిధ రూపాంతరాలు పొంది, నూతన నిబంధనలో యోహాను 5:1-9 బేతెస్థ అను ఐదు మంటపముల కోనేరును యేసుప్రభువు దర్శించినప్పుడు - ఆ కోనేటి ప్రక్కన 38 ఏండ్ల నుండి వ్యాధి కలవాడు పడకనపడియుండి, యేసుప్రభువు ద్వారా స్వస్థత పడిన సంఘటనను గూర్చి చదువగలము.  అలాగే యోహాను 4:5-26లో సమరయస్త్రీ యొక్క భర్తలు కూడా ఐదుగురు.  సృష్టిలో దేవుడు ఏర్పరచిన వనములు కూడా ఐదు  1.  ఏదెను  2.  ఒలీవల వనము  3.  ద్రాక్ష తోట  4.  గెత్సెమేను  5.  సమాధుల తోట.  ఇందునుగూర్చి వివరముగా తెలిసికొందము.

        మొదటిది ఏదెను - ఇది పరిశుద్ధ వాతావరణములో పరిశుద్ధస్థితిలో దైవప్రత్యక్షతతో దేవుని పరామర్శతో నరునికి - దేవునికి సావాసము, సఖ్యత ఏర్పడుటయేగాక నరుడు పూర్తిగా స్వేచ్ఛాజీవిగా సంచరించినాడు.  రెండవది ఒలీవల వనము :-  ఈ వనమన్నది దైవజనాంగమైన ఇశ్రాయేలీయులకు పవిత్రమైనది.  మూడవది ద్రాక్ష తోట :-  ఇందువల్ల నిర్దోషియు, నిరపరాధియైన నాబోతు ఈ తోట ద్వారా నాటి ఇశ్రాయేలీ పరిపాలకుడైన ఆహాబు - యెజిబేలులకు ప్రతికూలుడై, వారి చేత దోషిగా ఎంచబడి, ఆ ద్రాక్ష తోటను ఆహాబు ఆశించుటను బట్టి, యెజిబేలుయొక్క కుయుక్తితో కూడిన క్రియ మూలముగా మరణాన్ని చవి చూచాడు.  మొదటి రాజు 21వ అధ్యాాయము.  4. గెత్సెమేను తోట :-  ఈ గెత్సెమేనన్నది లోకరక్షకుడైన యేసుక్రీస్తు విశేషముగా తన తండ్రితో ప్రశాంతముగా మరియు ప్రార్థన ద్వారాను, తండ్రితో సంభాషించిన పవిత్రమైన వనము - ఈ గెత్సెమేను ఈ స్థలములోనే యేసుక్రీస్తు అమూల్యమైన తన రక్త స్వేదమును లోకపాపనివారణార్థము కార్చినట్లు వేదములో లూకా 22:44లో చదువగలము.  ఇక ఐదవది సమాధుల తోట :-   నాటి ఏదెనులోని దైవశాపమునకు గురియైన నరునికి మరణ స్వాస్థ్యముగా ఉంచబడింది సమాధుల తోట.

        ఇక పాతనిబంధనలోని మొదటి సమూయేలు 17:40 ఫిలిష్తీయ వీరుడైన గొలియాతును సంహరించుటకు బాలుడైన దావీదు ఏరుకొనిన రాళ్ళు కూడా ఐదు.  ప్రియపాఠకులారా!  ఈ ఐదుకు ఇంత గొప్ప ఆధిక్యత దైవసన్నిధిలో వున్నది.  ఇందునుబట్టి నరుడు పంచమ పుత్రుడు.  యేసుక్రీస్తు దశమపుత్రుడు.  అనగా నరునికంటె దైవత్వము ఐదురెట్లు అధికుడని వేదరీత్యా మనము తెలిసికొందము.  ఎలాగంటే  (1)  ఆయన జన్మము మానుషేచ్ఛలతో కూడింది కాదు, ఆయనది ఆత్మజననము.  ఇందునుబట్టి ఆయన నిష్కళంకుడు, పవిత్రుడు - కనుకనే ఆయన జననకాలములో ఆకాశములో యేసుయొక్క వెలుగు నక్షత్ర రూపములో ప్రకాశించింది.  మత్తయి 2:2.  (2)  ఆయన జన్మ కాలములో ఆయనను గర్భములో మోసిన మరియమ్మ తన పొరుగున ఉన్న ఎలీసబేతమ్మను ఎదుర్కొన్నప్పుడు ప్రభావము వలన ఎలీశబేతమ్మ గర్భములోని శిశువు గంతులు వేయుట, లూకా 1:41.  (3)  ఇక ఆయన ఈ లోకములో సంచరించిన కార్యాలలో చేసిన మహత్కార్యాలు చనిపోయిన వారిని సజీవులుగా లేపుట, మరణమును జయించి మహిమ పునరుత్థానము పొందుట.  ఈ ఐదు గుణములు - అంతియేగాక సృష్టికర్తయొక్క కుడిపార్శ్యమున ఆయన సింహాసనము నందు ఆసీనుడగుట, ఆయన రూపాంతర లక్షణములు, భూమి మీద దైవరాజ్య స్థాపన, దైవసత్యమును గూర్చి యావద్‌ సృష్టికి బయలుపరచుట, ఆయన నామము ద్వారా అనేెకమైనటువంటి క్రియాకర్మలు జరుగుట, రానున్న లోకాంత్యము కాలములో ఆయన రాకడలో - ఆయన మహిమతో వచ్చు ఆగమనము.  ఇవన్నియు ఆయనయొక్క మహాదశను గూర్చి వివరిస్తున్నవి.

         ప్రియపాఠకులారా!   ఈ విధముగా ఐదు అను సంఖ్య నరుని గూర్చియేగాక, నరుని గూర్చియు లోకసృష్టిని గూర్చియు వివరించి యున్నవి.  ఈ విధముగా దైవత్వమన్నది ఈ అనంత విశ్వములో క్రియ జరిగిస్తూ నాటి నుండి నేటి వరకును బహుముఖరీతులుగా అభివృద్ధి చెంది, సృష్టిలోను, జన బాహుళ్యములోను నానారీతులుగా క్రియ జరిగిస్తున్నది.  యోహాను 3:16లో దేవుడు లోకమును ప్రేమించిన మోతాదు ఎంతంటే - ''ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టినవాని యందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక, నిత్యజీవము పొందునట్లు ఆయనను అనుగ్రహించెను,'' అని వ్రాయబడి యున్నది.  కనుక  ప్రియపాఠకులారా!  లోకము మీద దేవునియొక్క ప్రేమకున్నటువంటి షరతు యోహాను 1:12, యేసుప్రభువును రక్షకుడుగ అంగీకరించినవారికందరికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారము అనుగ్రహించి యున్నాడు.  ఇది షరతు అనగా ఈ దశపుత్రుడైన దైవకుమారుడైన యేసుప్రభువు నందు విశ్వాసముంచి, ఆయన అడుగుజాడలలో ఆయన ప్రార్థనలో ఆయన సావాసములో ఆయనను ఆరాధించుట ద్వారా విశ్వాసులైనటువంటి భక్తులకు, దేవుని పిల్లలగునట్లుగా క్రీస్తు ద్వారా ఆయన అధికారమిచ్చినట్లు తెలుస్తున్నది.  ఆయన నామములో ఆయన ప్రార్థనలో ఆయన సావాసములో ఆయన ఆరాధనలో ఆయన విశ్వాసములో ఎదిగిన మనమును దశపుత్రులమే!  అలాగే పాతనిబంధనలోని దైవజనాంగమైన ఇశ్రాయేలు కూడా దశపుత్రులే!  ఎందుకనగా దేవుని చేత ఎన్నుకొబడినవారై, ఆయన స్వహస్త లిఖితమైన దశాజ్ఞల ధర్మశాస్త్రము అను మందసమును నిధిగా పొందినారు.  కనుక వారు దశపుత్రులే!  యూదా ఇస్కరియోతు దశపుత్రుడుగా జీవించాల్సిన యోగ్యత కల్గియుండగా అట్టి యోగ్యతను కాలదన్నుకొని, ధనాశ, లోభము, వంచకము, వేషధారణ, చివరిగా గురుద్రోహము అను పంచారిష్టములకు దాసుడై, దశపుత్ర భాగ్యమును పోగొట్టుకొని, పాపమునకు జీతమైన మరణాన్ని పొందినాడు.  అయితే ఈ సందర్భములో మత్తయి

16:13-19 చదివితే ప్రప్రథమముగా దైవకుమారుడైన యేసుక్రీస్తుయొక్క శిష్యులలో దశపుత్ర యోగము పొందిన ప్రభువుయొక్క శిష్యులను గూర్చి ఈ క్రింది విధముగా తెలిసికొందము.  ''యేసు కైసరయ ప్రాంతమునకు వచ్చి - మనుష్యకుమారుడెవడని జనులు చెప్పుకొనుచున్నారని తన శిష్యులను అడుగగా వారు - కొందరు బాప్తిస్మమిచ్చు యోహాననియు, కొందరు ఏలీయా అనియు, కొందరు యిర్మీయా అనియు లేక ప్రజలలో ఒకడనియు చెప్పకొనుచున్నాడనిరి.  అందుకాయన మీరైతే నేను ఎవడని చెప్పుకొనుచున్నారని వారినడిగెను.  అందుకు సీమోను పేతురు - నీవు సజీవుడగు దేవుని కుమారుడవైన క్రీస్తువని చెప్పెను.  అందుకు యేసు - సీమోను బర్‌యోనా!  నీవు ధన్యుడవు, పరలోకమందున్న నా తండ్రి ఈ సంగతి నీకు బయలుపరచెనేకాని నరులు నీకు బయలుపరచలేదు.  మరియు నీవు పేతురువు, ఈ బండమీద నా సంఘమును కట్టుదును, పాతాళలోకద్వారములు దానిఎదుట నిలువనేరవని నేను నీతో చెప్పుచున్నాను, పరలోక రాజ్యముయొక్క తాళపు చెవులు నీకిచ్చెదను, నీవు భూలోకమందు దేని బంధించుదువో అది పరలోకమందును బంధింపబడును, భూలోకమందు దేని విప్పుదువో అది పరలోకమందును విప్పబడునని అతనితో చెప్పెను.''

         ప్రియపాఠకులారా!  యేసుక్రీస్తు శిష్యకోటిలో దశపుత్ర యోగము క్రీస్తు రాజ్యములోని వారసత్వము పొంది, దైవకుమారుని చేత అనగా దేవుని చేతనే ప్రత్యక్షముగా పరలోకపుతాళపు చెవులు పొందుటన్నది దశపుత్ర యోగమేకదా!  ఈ విధముగా దైవకుమారుడైన క్రీస్తులో జీవించినవాడు దశపుత్రుడే! ఇట్టి దశపుత్రులైన వారిని కొంతమందిని గూర్చి పాతనిబంధన, క్రొత్తనిబంధనలోని కొందరి చరిత్రను ఉదాహరణగా తీసుకొందము.  ఇందులో మొట్టమొదట దశపుత్రుడు హానోకు.  ప్రియపాఠకులారా!  ఆదాము అని పాఠకులు అనుకోవచ్చును.  దశపుత్రత్వమును ఆదాము పొందింది వాస్తవమే, ఎందుకనగా వంటావార్పు, లోకభయాలు, లోకారిష్టము, వ్యసనాలు, లోకేచ్ఛలు, మరణ భీతి లేకుండ స్వేచ్ఛగ దైవత్వమునకు అభిముఖముగా దైవత్వముతో కలిసి నిశ్చింత జీవితములో జీవించిన దేవునియొక్క ఏకైక దశపుత్రుడు ఆదాము.  అయితే ఇట్టి ఆధిక్యతను పొందిన ఆదాము దైవజ్ఞాతిక్రమము చేసి దైవశాపమునకు గురియై ఏదెను వనములో వున్నటువంటి స్వేచ్ఛను, స్వాస్థ్యమును, దైవసావాసమును కోల్పోయి, లోక సంబంధమైన పంచారిష్టములు అనగా కామక్రోధ మదమత్సరము, లోభము, అను పంచారిష్టములకు దాసుడై, లోక స్వాస్థ్యాన్ని గూర్చి ప్రాకులాడే హీనస్థితికి దిగజారినాడు, అంటే దైవ స్వాస్థ్యమును గూర్చిన వారసత్వపు హక్కును కోల్పోయాడు.  అందువలన ఇతని ద్వారా ప్రారంభమైన సృష్టి ఆదికాండము 7:లో సమూలముగా తుడిచి వేయబడింది.  ఎందుకంటే ఇతను దైవస్వాస్థ్యమును పోగొట్టుకొని పాపము మరణాన్ని స్వాస్థ్యంగా సంపాయించుకొని కాలగర్భములో కలిసిపోయాడు.  ఇతని చరిత్ర ఆదికాండము ఏడు నాటికి తుడిచి వేయబడింది.  ఇతని మూలముగా ఇతనివలన సంక్రమించిన దోషాపరాధములనుబట్టి శాపము మరణమునుబట్టి యావద్‌ సృష్టిలోని జీవరాసులు, వృక్షసముదాయములు దైవోగ్రతకు గురియై, ప్రచండమైన ఉధృతమైన, అగాధమైన జలప్రవాహముల చేత లయపరచబడింది.  

        ఇక దేవుడు తన పునఃసృష్టిగా ఈ కార్యక్రమములో తాను సృష్టించబోవు నూతన విశ్వమునకు వారసునిగ నోవహు అను నీతిమంతుని కుటుంబమును ఎంపిక చేసుకొన్నాడు.  అంతేగాకుండ నోవహుకు తాను ఇవ్వబోయే భూలోక స్వాస్థ్యమునకు ముంగుర్తుగా నోవహు చేత మూడు అంతస్థులుగల ఓడ గృహమును తన యొక్క ప్రణాళికలో తన చిత్త ప్రకారముగా తన ప్రణాళికను బట్టి, తన నమూనాలో ఓడ గృహమును నిర్మింపజేశాడు.  ఈ ఓడ గృహము అనే స్వాస్థ్యమునకు వారసుడు నోవహు, అతని కుటుంబీకులు మరియు అప్పటి సృష్టిలోని పవిత్ర, అపవిత్ర పశుపక్ష్యాదులు మాత్రమే.  ఈ విధముగా నోవహు విశ్వాసమును బట్టి నోవహు నీతిని బట్టి యెహోవా - ఈ తరము వారిలో నీవే నా యెదుట నీతిమంతుడవైయుండుట చూచితివి గనుక నీవును నీ ఇంటివారును ఓడలో ప్రవేశించుడి,'' ఆది 7:1 అనుటలో దైవత్వము చేత దైవచిత్త ప్రకారము దైవోద్ధేశ్యముతో దైవనమూనాలో నిర్మింపబడిన ఓడ గృహమునకు వారసుడు నోవహు, అతని కుటుంబము.  ఓడ గృహమును దేవుడు స్వాస్థ్యముగా ఇచ్చి, వారితోబాటు అప్పటి కాలములో ఉన్నట్టి జంతుజాలము, పక్షిజాలములు, లెక్కకు ఏడు చొప్పున ఓడలో ప్రవేశింపజేశాడు.  ఈ విధముగా దైవస్వాస్థ్యమగు ఓడకు అధికారియైన నోవహు దైవచిత్తప్రకారము, దైవాజ్ఞానుసారము యావద్‌ కార్యాన్ని నోవహు సంపూర్తి చేశాడు.

         ప్రియపాఠకులారా!  భూలోకములోని దైవస్వాస్థ్యము, దైవగృహము అను ఈ ఓడలో జీవించిన నోవహుయొక్క వయస్సు ఆరువందల సంవత్సరాలు.  అంటే దైవత్వములో దేవుని ప్రియులుగాను, ఆయనకు యోగ్యకరముగాను జీవించిన విశ్వాసియొక్క జీవితములో ఆయుఃపరిమాణము ఎంత గొప్పదో అనగా ఆయుస్సులో కూడా దశపుత్రుడే, ఆరువందల ఏండ్లు బ్రదికినాడు, ఈ ఆరువందల ఏండ్ల వయస్సులో కూడా నోవహు నాటి జలప్రళయకాలములో అనగా అతి వృష్టి భయంకర చలిగాలులు, మేఘావృతమైన ఆకాశము, విపరీత చలి వాతావరణమునకు అంధకార వాతావరణము, వెలుగన్నది  ఎరుగని స్థితిలో - కేవలము ఆ ఓడలోని గుడ్డి దీపపు కాంతిలో జీవించిన నోవహుకు ఎలాంటి వాతావరణ కలుషితముగాని, తత్సంబంధమైన అనారోగ్యముగాని, శారీర సంబంధ రుగ్మతలుగాని, అతనికిగాని, అతని కుటుంబమునకుగాని సంభవించినట్లు లేదు.  కనీసము పడిశముగాని, జ్వరముగాని, దగ్గుగాని సంభవించినట్లు లేదు.  కనుక దశపుత్రుడే, ఇటువంటి కలుషిత వాతావరణములో జీవించి తాను, తన కుటుంబము, వారితోబాటు జంతుజాలము, పక్షిజాలము, మృగాలు, ఇవన్నియును ఉన్నాయంటే నోవహుకు దేవుని ద్వారా కలిగిన దశయోగము ఆ ఓడలోని జంతుజాలమునకు కూడా సంభవించినట్లు మనకు తెలుస్తున్నది.  అవి ఏవియును చావలేదు, వాటికి రోగము రాలేదు.  ఈ విధముగా ఈయొక్క దశపుత్రుడైన నోవహు ద్వారా పునఃనిర్మితమైన ఈయొక్క అనంత విశ్వములో - నోవహు తర్వాత దశపుత్రులుగ దైవత్వము చేత తీర్పు చేయబడినవాడు హానోకు.  ఇతడు దైవత్వము చేత నడిచినందున దేవుడు అతనిని కొనిపోయినందున, దైవ స్వాస్థ్యమును పొందినాడు.  దైవస్వాస్థ్యములో సశరీరుడుగ చేరినందున, లోకానికి కనుమరుగయ్యాడు.  ఇతని తర్వాత లోతు, దేవునికి ఇష్టుడై సొదొమ, గొమొఱ్ఱా పట్టణ నాశన సందర్భములో దైవచిత్తప్రకారము వెనుదిరిగి చూడక, ముందుచూపుతో పయనించి, దేవుడు అనుగ్రహించిన స్వాస్థ్యానికి వారసుడయ్యాడు.  మూడవవాడు అబ్రాహాము.  దైవ పరిశోధనలో విజయుడై, తన కుమారుని దేవునికి బలియిచ్చే తెగింపునకు సిద్ధపడినప్పుడు దైవత్వమును మెప్పించి, భూలోకములో గొప్ప ఐశ్వర్యవంతుడై విశ్వాసులకు తండ్రిగా ఎంచబడినాడు.

        యాకోబు :-  దేవుడు యాకోబును ఇశ్రాయేలుగా మార్చి, అతని 12 మంది కుమారులను తన జనాంగముగా ఏర్పరచి, వారిని తన భూలోక స్వాస్థ్యముగా ఏర్పరచుకొని, వారిద్వారా దేవుడు మహిమ పరచబడాలని, వారిని తన జనాంగముగా భూలోకములో దేవుడు ఒక ప్రత్యేకమైన ధన్యకరమైన జీవితాన్ని వారికి అనుగ్రహించాడు.  కాని ఆ విలువను ఇశ్రాయేలు కాపాడుకోలేకపోయారు.  మోషే - దేవుని ఇల్లు అనేటటువంటి ఇశ్రాయేలు దైవిక కుటుంబములో నమ్మకస్థుడుగా ఉండినట్లు దేవుని చేత ప్రవచింపబడినాడు. హెబ్రీ 3:5 దైవ భూలోక స్వాస్థ్యమైన ఇశ్రాయేలుతో మోషే నలుబది సంవత్సరాలు వారిని పరిపాలించి దైవసన్నిధిలో ఒక గొప్ప ప్రత్యేకమైన స్థానాన్ని పొందినాడు.  మోషే తర్వాత యెహోషువా పాతనిబంధన యందలి ప్రవక్తలందరు ఈ విధముగా దైవత్వాన్ని మెప్పించి దశపుత్రులయ్యారు.  ఈ దశపుత్రులకు సృష్టికర్తయైన ప్రభువు ఏర్పరచిన ఆశ్రమాలు -  1.  మొట్టమొదట ఆదినరజంటయైన దశపుత్ర దంపతులకు దేవుడు అనుగ్రహించిన ఆశ్రమము ఏదెను వనము.  ఇక అటు తర్వాత ఈ ఆశ్రమము నుండి నరజీవితము దైవత్వము నుండి తొలగి దైవమార్గమును విడిచి, లోకమార్గములో అనగా శారీర సంబంధమైనటువంటి గుణములకు బానిసయైనప్పుడు దేవుడు అనగా దైవాజ్ఞాతిక్రమము చేసినప్పుడు, ఆ ఆశ్రమముయొక్క ఉన్నత స్థితిని కోల్పోయి, ఈ ఆశ్రమము నుండి పరమాత్ముని చేత తరమివేయబడినాడు.  

        ఈ విధముగా ఏదెను ఆశ్రమము నుండి వెలివేయబడిన నరజంట నుండి విస్తరించిన జనాంగము వికృతమైన దైవకుమారుల బాధకరమైన మానవత్వానికి యోగ్యముకాని క్రియాకర్మల ద్వారా పాపమును విస్తరింపజేసి, పాపముతోబాటు జనాభా - జనాభాతో బాటు పాపము పెరిగి దైవసృష్టియైన భూమి చెడినందున, పరమాత్ముడు తాను రూపించిన ఈ యావద్‌ సృష్టిని ప్రవాహజలములతో అగాధ జలములతో ప్రచండ జలములతో లయపరచ సంకల్పించి, ఆత్మీయ దృక్ఫథముతో ఈ అనంత విశ్వములో జనకోటిలో పరిశోధించినప్పుడు పరమాత్మ దృష్టికి నోవహు అను ఒక నీతిమంతుని కుటుంబము దైవత్వమునకు యోగ్యకరముగా వున్నట్లు కనుగొని అతనితో మాట్లాడిన మాటలు ఆదికాండ 7:లో చదువగలము.  ఆ విధముగా మాట్లాడిన మాటలు తన చిత్త ప్రకారము తన నమూనాతో ఆ కాలములో అప్పటి యుగములో ఎవరును నిర్మించలేని, చిత్రవిచిత్రమైన నమూనాతో ఆశ్చర్యరీతులతో తానేర్పరచుకొన్న నోవహు అను నీతిమంతుని ద్వారా ఓడ గృహాన్ని కట్టించాడు.  ఇది పరమాత్ముడు తానెన్నుకున్న పరిశుద్ధునికి ఏర్పరచిన రెండవ ఆశ్రమము.

        ప్రియపాఠకులారా!  మొదటి ఆశ్రయమైన ఏదెను వనములో నరుడు ఏ విధముగా పశుపక్ష్యాదులతోను, జంతుకోటితోను సమైక్యముగా జీవించాడో - ఆలాగే అదే వాతావరణములో  ఈ ఓడ గృహమైన దేవుని ఆశ్రయములో నరుడు జీవరాసులతో సమైక్యముగా జీవించాడు.  దేవుడు సంకల్పించి జరిగించిన సృష్టినాశన కాలములో - కాలానంతరము పునఃసృష్టి నిర్మాణక్రియను, నోవహు ద్వారా జనాభాను, ఓడలోని జీవకోటి ద్వారా సృష్టిలో జంతు మృగ పక్షి సముదాయములను విస్తరింపజేశాడు.  అటుతర్వాత దేవుడు తాను సృష్టించిన నరుల పట్ల తనకున్న ప్రేమను చంపుకోలేక నరులమధ్య నివసించాలని, తనకంటూ ఒక జనాంగాన్ని ఏర్పరచుకొన్నాడు.  ఈ జనాంగమే ఇశ్రాయేలు - ఇశ్రాయేలు అను ఈ జనాంగము దైవ పరిశుద్ధ ఆశ్రయముగా దేవుని చేత ఏర్పరచబడినారు.  అనగా దేవుని ఇల్లుగా గ్రంథములో అభివర్ణించబడింది.  ఇది మూడవ ఆశ్రమము.  ఈ ఆశ్రమములో దేవునియొక్క క్రమములో వున్న దైవజనాంగమును దేవుడు తన మార్గములో స్థిరపరచుటకు పది శాసనములు గల రెండు రాతిపలకలను తన గృహనిర్వాహకుడైన మోషేకు సీనాయి పర్వతము మీద ఇచ్చినట్లు చదవగలము.  కనుక ఇశ్రాయేలుకు ఆశ్రమము ఈ దశాజ్ఞల మందసమైన దేవుని ధర్మశాస్త్రము - ఈ ధర్మశాస్త్రము మోషే యొక్క దైవ విశ్వాస మునకు పవిత్ర జీవితమును బట్టి మోషే దర్మశాస్త్రము అని కూడా నామధేయమేర్పడింది.  ఆనాటి దైవజనాంగములో ఎవరియొక్క క్రియాకర్మలైనను, ఏ వ్యక్తియైనను, ఈ ధర్మశాస్త్రమునకు లోబడి జీవించాలేగాని వానిని వ్యతిరేకించుటకు వీలులేదు.  అలా వ్యతిరేకించిన వారికి మరణశిక్ష దేవుని చేత విధించబడినట్లు వేదములో చదువగలము.  కనుక ఇశ్రాయేలుకు ఆశ్రమము ధర్మశాస్త్రము.  ఈ ఆశ్రమమును కూడా నరుడు ధిక్కరించి, దేవుడైన ప్రభువు పట్ల అవిశ్వాసముతోను కృతజ్ఞత విహీనముగా ప్రవర్తించినట్లు తెలియుచున్నది.                  ఇప్పటివరకు మనము తెలుసుకొన్న ఆశ్రమాలు నాలుగు :-  1.  ఏదెను  2.  నోవహు ఓడ  3.  ఇశ్రాయేలు  4.  ధర్మశాస్త్రము.  ఈ నాలుగు ఆశ్రమాలు కూడా నరునియొక్క జీవితాన్ని గూర్చి ఎంతో శ్రమపడి క్రమములో ఉంచినను, నరునియొక్క జ్ఞానము ఈ ఆశ్రమాలయొక్క విలువను, ఆశ్రమాధిపతియైన దేవుని యందు గురి ఉంచక, ఆయన చిత్తమును, ఆయన నిష్టనియమాలను పాటింపక ఆయన మార్గము విడిచి, వక్రమార్గములో నడిచినందున అనగా ఆ వక్రమార్గము ఏదనగా - దేవుడు తినవద్దని ఆజ్ఞాపించిన మంచి చెడ్డల వివేకమిచ్చు వృక్షఫలమును భుజించి, దైవాజ్ఞాతిక్రమము చేసి ఆదాము దంపతులు చెడ్డారు.  ఈ మొదటి ఆశ్రమములో జీవించిన నరుడు పోగొట్టుకున్న దశపుత్రయోగము. ఇక రెండవది దైవఆశ్రమమైనటువంటి ఓడ గృహములో ప్రచండ జలప్రళయములో నోవహును అతని కుటుంబాన్ని కాపాడిన దేవునిపట్ల నోవహు కృతజ్ఞతా పూర్వకముగా బలులు అర్పించి ఆయనను మహిమపరచినప్పటికిని, నోవహు - సప్త వ్యసనాలలో ఒక వ్యసనమైన త్రాగుడుకు బానిసయై, మద్యపు మత్తులో అసభ్యముగా ప్రవర్తించి తన కుటుంబీకులకే అసహ్యుడయ్యాడు.  ఇక మూడవదిగా దేవుడు తనకంటూ ఏర్పరచుకొన్న ఇశ్రాయేలు అను ఈ ఆశ్రమము దేవునియొక్క మహిమను, ఆయన జరిగించిన అద్భుత కార్యాలను ఇశ్రాయేలు పక్షములో ఆయన జరిగించిన యుద్ధములు వారిపట్ల ఆయన చూపిన ప్రేమ అనురాగాలు ప్రత్యక్షముగా ప్రయోగాత్మకముగా ఇశ్రాయేలు అను ఆ జనాంగము అనుభవించినను వారు దేవుని మహిమపరచలేక పోయారు.  అందువలన దేవుడు వారిని క్రమబద్ధీకరణ చేయుటకు ధర్మశాస్త్రమును అనుగ్రహించాడు.  ఈ ధర్మశాస్త్రము ఇశ్రాయేలుకు ఆశ్రయపురమైంది.  అయినను ఈ ఆశ్రయపుర విలువను చట్టాన్ని, నియమమును దైవజనాంగము పాటించలేక పోయినందున పై నాలుగు ఆశ్రమాలకు కర్తయు, మూలకారకుడైన పరమాత్ముడే - మానుషేచ్ఛలతో కాక ఆత్మీయ కలయికతో అపవిత్రము కాని కన్య గర్భములో - మానవ రూపముతో మానుషగుణములతో అవతరించాడు.  ఇందునుబట్టి ప్రియపాఠకులారా!  ఐదవ ఆశ్రమము యేసు అను దైవ రక్షణాయుతమైన ఆశ్రమము మరియు క్రీస్తు అంటే పరమాత్ముని చేత ప్రతిష్టించబడింది.  అంటే యేసుక్రీస్తు.

        ప్రియపాఠకులారా!  పాపికి ఆశ్రయము యేసే అని పదజాలముతో ఆరాధన సమయాలలో పాపికి రక్షణ నీవేయని పాడుట సహజమే గదా!  క్రీస్తు కూడా యోహాను 15:1లో చదివితే తనను ద్రాక్షావళ్ళికి అనగా ద్రాక్ష తోటకు పోల్చుకొని, తనను ఎవరైతే అంటుకొని, అంటగట్టబడి ఎవరైతే జీవిస్తారో వారు బహుగా ఫలిస్తారని ప్రవచించియున్నాడు.  మరియు యోహాను14:6లో వలె ఈ ఆశ్రమమన్నది మోక్షరాజ్యమునకు నరకోటికి మార్గము, సత్యము, జీవమైయున్నట్లు వ్రాయబడియున్నది.

        ఆరవ ఆశ్రమము :-  దైవకుమారుడైన క్రీస్తు మనకు అనుగ్రహించిన నూతన నిబంధన అన్నది ఆశ్రమము.  అయితే ప్రియపాఠకులారా!  క్రీస్తు మరణ పునరుత్థానుడై వెళ్ళిన తర్వాత అనగా లోక నరకోటికి దేవుడు మనకనుగ్రహించిన క్రీస్తు అను పవిత్ర ఆశ్రమాన్ని కకావికలుగా జేసి పాడు చేయ సంకల్పించగా - దేవుడు తన జనాంగము ఎదుటనే యేసుక్రీస్తు అను ఈ ఆశ్రయపురమును సమాధి నుండి మహిమ పునరుత్థానము పొంది, ఆరోహణుడైనట్లు అనగా పరమునకు వెళ్ళినట్లు వేదములో మనము చదువగలము.  లూకా 24:50-51.

        అయితే భూమి మీద నరకోటికి చివరి ఆశ్రమము ఒక్కటే.  అదే నేటి క్రైస్తవ విశ్వాస జీవితము. తత్సంబంధమైన మందిరము మరియు వేదమైన పరిశుద్ధ గ్రంథము.  ప్రియపాఠకులారా!  ఇక్కడితో ఏడు ఆశ్రమాలు అయినవి.  ఈ ఏడు ఆశ్రమాలకు అధిపతులు ముగ్గురు -  పీఠాధిపతులు, పరమగురువులు అనగా పరలోక సామ్రాజ్య పరిపాలకులు - ఈ ఏడు ఆశ్రమాలలో  1.  ఏదెను  2.  నోవహు  3. ఇశ్రాయేలు  4.  ధర్మశాస్త్రము ఈ నాలుగింటికి యెహోవా దేవుడు పీఠాధిపతి అనగా మూలకారకుడు మరియు నిర్వాహకుడు  5.  క్రీస్తు జననమునకు మూలకారకుడును, అనగా కన్య గర్భములో మానవేచ్ఛలతో కాక ఆత్మక్రియ ద్వారా ఆత్మేచ్ఛల ద్వారా రూపితమైన నరరూపమునకును, ఆ రూపమును పరిశుద్ధ పవిత్ర స్థితిలో వుంచి నడిపించుటలో క్రియ జరిగించిన పరిశుద్దాత్ముడు యేసు అను ఆశ్రమమునకును, ఆయన జన్మకును, ఆయన ఈ లోకమునుండి వెళ్ళిన అనంతరము ఆయనేర్పరచుకొన్న జనాంగమును దైవరాజ్యమునకు యోగ్యకరమైన స్థితిలో విశ్వాసులను నడిపించుటకును, పాత నిబంధనలోని ప్రవక్తల జీవితాలను, వారి చరిత్రలను, లోకసృష్టి, దాని నిర్మాణ క్రియను గూర్చిన సత్యాలను, నాటి ప్రవక్తలను ఆవేశించి వేద రచన జరిగించినవాడును, అటుతర్వాత నూతననిబంధనలో యేసుక్రీస్తు వాగ్దానము చేసిన రీతిగా యోహాను 16:7-8 నేను వెళ్ళి ఆదరణకర్తయైన ఆత్మను మీ యొద్దకు పంపెదను, ఆయన వచ్చి పాపమును గూర్చియు, నీతిని గూర్చియు, తీర్పును గూర్చియు, లోకమును ఒప్పుకొనజేయును; నూతన నిబంధనలో అపొస్తలులను ఆవేశించి, రచింపజేసిన ఈ పరిశుద్ధ గ్రంథమే ఈ పరిశుద్ధాత్మయొక్క క్రియ అనగా పరిశుద్ధాత్మ ఆశ్రయములో పరిశుద్ధ జీవితములో పరిశుద్ధ స్థితిలో - పరిశుద్ధ వాతావరణములో పరిశుద్ధులుగ దేవుని చేత ఏర్పరచబడి, వారిచే రచింపబడిన పరిశుద్ధ గ్రంథమే - ఇది పరిశుద్ధాత్మ చేత లిఖించబడింది.

        యేసుక్రీస్తు ఈ లోకములో జీవించిన కాలములో తాను తండ్రితో జీవిస్తున్న ఆశ్రమము గెత్సెమనే ఒలీవల వనము.  యేసుప్రభువు ప్రతి నిత్యము తాను జరిగించబోవు క్రియాకర్మలను గూర్చి ఈ స్థలములో తండ్రితో విన్నవించుకుంటున్నాడు.  యేసుక్రీస్తు తన కొరకు ప్రత్యేకముగా ఏర్పరచుకొన్న ఆశ్రమము ఇదియే.

        కనుక దిక్కులేనివానికి దేవుడు ఆశ్రయమై యుండగా - పాపికి క్రీస్తు ఆశ్రయమైయున్నాడు.  అయితే పాపిని దేవుడు క్షమించాలంటే క్రీస్తు ద్వారానే ఎలాగంటే యోహాను 1:12లో తనను ఎందరంగీకరించిరో వారికందరికి, అనగా తన నామమందు విశ్వాసముంచిన వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారమనుగ్రహించెను.

        పరలోక సామ్రాజ్యము - భూలోక రాజ్యము ఈ రెండింటికి వున్న అవినాభావ సంబంధము.  ఈ రెండింటికి సంబంధము కల్గించినది పరమాత్మ.  ఈ రెంటికిని సృష్టికర్తయు అధిపతియు ఆయనే ప్రత్యేకించి, భూలోకములోని సృష్టములను రూపించిన దెవరు?  వాక్కు.  అయితే వాక్కుయొక్క నిజరూపము ఆత్మ - ఆత్మలో ప్రత్యేకత వున్న విలక్షణము దర్శనము వెలుగు, భూలోకముయొక్క నిర్మాణ కార్యక్రమములో క్రియ జరిగించిన వారు ముగ్గురు - ''ఆత్మ, వాక్కు, వెలుగు.   ఇందులో ఆత్మదేవుడు వాక్కు కుమార దేవుడు వెలుగు - పరిశుద్ధాత్మ'' ఈ మూడింటిలో మొట్టమొదట సృష్టి కార్యములో ఆత్మయొక్క ప్రమేయమేమిటి?  ఆదికాండము 1:2 లో దేవుని ఆత్మ జలముల మీద సంచరిస్తూ - తాను శరీరము దాల్చబోవు కుమార శక్తితో వెలుగు కమ్మని పలుకగా ఆ ప్రకారము వెలుగాయెను'', ఈ వెలుగన్నది - దైవత్రిత్వములోని పరిశుద్ధాత్మ.

        ప్రియపాఠకులారా!  ఈ మొట్టమొదటి క్రియలలో దేవునియొక్క త్రిత్వము వెలుగు - వెలుగు మంచిదైనట్లు అనగా పరిశుద్ధాత్మయొక్క వెలుగు మంచిదైనట్లును, ఈ విధముగా సృష్టి ఆరంభములో ఆత్మయొక్క త్రిత్వము ఆత్మ - వాక్కు - వెలుగు ఈ మూడును వరసగా ఆరు దినములు నానావిధములైన సృష్టికార్యములు జరిగించినట్లు ఆదికాండము మొదటి అధ్యాయములో మనము చదువగలము.        

        ప్రియపాఠకులారా!  దేవుడు సృష్టి నిర్మాణక్రియను జరిగించిన విధము వేరు.  ఆదికాండము

2:7లో నరజీవుని నిర్మించిన విధానము వేరు.  తొలుత నరుడు ఆత్మసంబంధియు, ఆత్మయొక్క క్రియయై యున్నను, ఆత్మరీత్యా పరలోకసంబంధియు, శారీరరీత్యా భూలోక సంబంధముగా రెండు విధములుగ విభజించబడి యున్నాడు.  నేలమంటితో నిర్మించినందువలన నరునియొక్క శారీరము భూసంబంధము.  ఆ విధముగా రూపించబడిన నర శరీరములో దేవుడు తన జీవాత్మను ప్రవేశపెట్టుట ద్వారా నరుడు జీవాత్మునిగ దైవవాక్యము ప్రవచిస్తున్నది.  ఇప్పుడు దైవత్వములో ఆత్మ - వాక్కు - వెలుగు అను మూడు విధాలుగ త్రిత్వమున్నట్లే దేవుడు రూపించిన నరశరీరములో కూడా త్రిత్వమున్నది.  అదేమనగా ఆత్మ, జీవము, శరీరము అంటే ముగ్గురు దేవుళ్ళు, మూడు దైవశక్తులు, నరుని దేహములో నివసిస్తున్నట్లు దైవనిగూఢ సత్యము మనకు వివరిస్తున్నది.  ఎలాగంటే ఆత్మ అనగా దేవుడు జీవమనగా పరిశుద్ధాత్మ; శరీరము దైవ కుమారుడైన క్రీస్తుయొక్క నమూనా - మాదిరి, ఈ విధముగా పరమాత్ముడు నిష్పక్షపాతిగా నరజీవితముపై క్రియ జరిగించి యున్నాడు. ఈ సత్యాన్ని నరుడు ఎప్పుడైనను ఎక్కడైనను, ఏరోజైనను, ఏ సమయములోనైనను నరుడు గ్రహిస్తున్నాడా?  అలా గ్రహించినట్లయితే వానికి మరణ భయముండదు.                 ప్రియపాఠకులారా!  ఇందును బట్టి చూడగా మనము మన సొత్తులము కాదు.  దేవునియొక్క ఆత్మయు, దేవుని సంకల్పము, దేవునియొక్క చేతిపనియైయున్నామని తెలిసికోవలసిన బాధ్యత ఎంతయినను ఉన్నది.  కాని నరుడు ఈ యుగములో ఇంత లోతుగ గ్రహించే స్థితిలో లేడు.  ప్రియపాఠకులారా!  మనము దేవుని సొత్తయిన ప్రజలమని ఇందునుబట్టి మనకు తెలుస్తున్నది.  ఈ విధముగా దైవత్రిత్వములో రూపించబడిన నరజీవుడు ఈ భూమి మీద సంచార జీవులుగా అనగా యాత్రికుడుగా ఉన్నారని, పరదేశులుగా ఉన్నారన్న సత్యాన్ని విశ్వాసులమైన మనము తెలుసుకోవలసిన అవసరత యెంతయినను ఉన్నది.

        కనుక ప్రియపాఠకులారా! ఆత్మ జీవము రెండును నరశరీరము అను గుడారములో నివసించుటను బట్టి జీవాత్ములైన నరులుగా మనము పిలువబడుచున్నాము.  అయితే భూమి మీద నున్న మన దేహమైన ఈ గుడారము స్థిరమైనదిగాక తాత్కాలిక నివాసమైయున్నది.  ఇందునుబట్టి నరుడు భూమి మీద ఎంతకాలము జీవించినను, వాడు యాత్రికుడనియు, పరదేశియని యన్నట్లు హెబ్రీ

11:13లో విశ్వాసులైనట్టి జనాంగము ఒప్పుకొని తమ ఇహలోక యాత్రను చాలించుకొన్నట్లు వేదములో వ్రాయబడి యున్నది.  నరునిలో త్రిత్వమున్నట్లుగానే దైవకుమారుడైన క్రీస్తులో కూడా త్రిత్వమున్నది.  నరకుమారుడైన యేసుక్రీస్తుయొక్క ఆత్మ ఒక ప్రత్యేకతను సంతరించుకొని యున్నది.  అనగా యేసుక్రీస్తు ఆత్మలో దేవుని ఆత్మ, పరిశుద్ధాత్మ, జీవాత్మ మూడును నివసించుటను బట్టి సామాన్య నరునివలె గాక యేసుక్రీస్తు ఒక ప్రత్యేక రీతిలో లోకస్థుల మధ్య జీవిస్తూ జరిగించిన అద్భుత కార్యాలు కోకొల్లలుగా వ్రాయబడి యున్నవి.  అవి ఇక్కడ వ్రాయాలంటే ఈ పుస్తకము చాలదు.  కాని ఉదాహరణగ కొన్ని :-   వాతావరణమును, గాలిని, సముద్రమును గద్దించుట, రోగులను బాగు చేయుట, దయ్యాలను వెళ్ళగొట్టుట, చనిపోయిన వారిని బ్రతికించుట, గుడ్డివారికి చూపు, కుష్ఠు రోగికి స్వస్థత, ఐదువేల అశేష జనానికి కలిగిన క్షుద్భాధను ఐదు రొట్టెలు, రెండు చేపలతో తీర్చుట, చనిపోయి, సమాధి చేయబడి మూడవ దినమున మహిమతో పునరుత్థానమై ఆరోహణమగుట - ఇది సామాన్య నరునికి సాధ్యమా?  కనుక యేసుక్రీస్తులోని ఆత్మ మూడు విధములైనటువంటి శక్తులను సంతరించుకొని క్రియ జరిగించినట్లుగ ఇందునుబట్టి మనకు తెలుస్తున్నది. అందుకే మొదటి కొరింధీ 11:1లో పౌలు తనలేఖలో నేను క్రీస్తును బోలి నడుచుకొనుచున్న ప్రకారము మీరు నన్ను పోలి నడుచుకొనుడి, అని అనుటలో క్రీస్తును పోలినడుచుటన్నది - క్రీస్తును ధరించుకొనుటయే అనిన సత్యము మనము గ్రహించాలి.

        ప్రియపాఠకులారా!  యేసుక్రీస్తు కేవలము లోక పాపవిమోచనార్థము అవతరించిన అవతారమూర్తియే గాక కొలస్సీ 1:20లో వలె ఆయన సిలువ రక్తము చేత సంధి చేసి, ఆయన ద్వారా అనగా క్రీస్తు ద్వారా సమాధాన పరచుకోవాలని పరమాత్మునియొక్క కోర్కెయైయున్నట్లు 1:21-22 వచనాలలో లోక నివాసులమైన మనము మన అవివేక క్రియాకర్మలను బట్టి, దైవత్వమునకు దూరస్థులమై వ్యతిరేకులముగా వుండగా మనలను తన తండ్రి సన్నిధికి పరిశుద్ధులుగాను, నిర్దోషులుగాను, నిరపరాధులుగాను నిలువబెట్టుటకు, ఆయన మాంసయుక్తమైన దేహమందు మరణము వలన మనలను సమాధానపరచెను;  ఇందునుబట్టి యేసుక్రీస్తు అను దైవకుమారుడు లోకమునకు రక్షకుడే గాక, పరలోకమునకు భూలోకమునకు సమాధానకర్తయు, మధ్యవర్తియై యున్నట్లు మనకు తెలుస్తున్నది.  అంతేగాక దైవత్వములో వున్న కుమారత్వమునకు ఏ వ్యక్తికిని ఏ శక్తికిలేని ప్రత్యేకత ఉన్నది. ఈ ప్రత్యేకతను గూర్చి ప్రకటన 3:1లో ఏడు నక్షత్రములును, దేవుని ఏడాత్మలును గలవాడు చెప్పు సంగతులేవనగా - అని అనుటలో ఏడు నక్షత్రాలేమిటి?  ఏడు ఆత్మలు ఏమిటి?  అనిన విషయాన్ని మనము తెలిసికొందము.  ఏడు నక్షత్రాలు ఏడు సంఘాలకు దూతలు.  వీరిని గూర్చి ప్రకటన 1:20లో ఆ ఏడు నక్షత్రాలు ఏడు సంఘములకు దూతలు ఆ ఏడు సంఘాల పేర్లు వరుసగ ప్రకటన 1:11లో వ్రాయబడి యున్నవి.  ఇందును గూర్చి ఏడు సంఘాలు - ఏడు సంఘాల దూతలను గూర్చి తెలిసికోగలము.

        ప్రియపాఠకులారా!  క్రీస్తులో ఉన్నటువంటి ప్రత్యేకత ఏ శక్తికి లేదు.  ఎలాగంటే క్రీస్తుయొక్క ఆత్మలో ఏడాత్మలు మిళితమై యున్నవి.  సప్తసోపాన వికాసినిలో వివరించి యున్నాము.  కనుక ఏడు నక్షత్రాలు దేవుని ఏడాత్మలు కల్గిన వాడనునదియే దాని అర్థము - ఈ ఏడాత్మలు ద్వారా యేసుక్రీస్తు లోకమునకు ప్రభువుగాను, రక్షకునిగాను, విమోచకునిగాను, జీవముగాను, రారాజుగాను, ప్రధాన యాజకునిగాను, ప్రవక్తగాను, దైవకుమారునిగాను, వెలుగుగాను, జీవింపజేయు ఆత్మగాను, రూపించబడి యున్నాడు.  అయితే లోకమునకు మాత్రము ఈయనను యోసేపు మరియమ్మల కుమారునిగానే ఎంచి కించపరచింది.  అయితే ఇప్పుడు అంగలార్చి ప్రలాపిస్తున్నది.  ఈ విధమైన శక్తి, ప్రభావముతో రూపించబడిన ప్రభువు - పరలోకమునకును, భూలోకమునకును ఆధిపత్యము వహించి, మహిమ ప్రభావముతో యుగాంతములో భూమికే తీర్పు దీర్చుటకు మధ్యాకాశమునకు రాబోవుచున్నాడు.  భూమికిని, గ్రహాలకును, లోకస్థులకును, తీర్పుదీర్చు గడియ రాబోవుచున్నదని, ఆ తీర్పులో దైవసృష్టములోని ప్రతి జీవియు, సృష్టిలోని గ్రహ నక్షత్రాదులు వగైరాలన్నియు 2 కొరింథీ 5:10లో వలె క్రీస్తు న్యాయపీఠము ఎదుట నిలువవలసిన దినమొకటున్నదని వేద వాక్యము ఘోషిస్తున్నది.

.........

        ప్రసంగాంశము :-  ఆశ్రయపురము యెహోషువ 20:7-9 సంఖ్యా 35:6-11  (1)  హెబ్రోను (2)  షెకెము  (3)  కేతేషు  (4)  బేసరు  (5)  రామతిల్గాదు  (6)  గోలాను.

        నరహత్య చేసిన వ్యక్తిని చంపబడిన వ్యక్తి తాలూకూ వ్యక్తి హంతకుని తరిమి వెదికి చంపువాడు ఆ కాలమందు ఆయా దేశములలో వుండెడిది.  నిర్గమ 21:3లో మోషే యూదులకు చట్టములు నియమించినప్పుడు కనికరము కనబరచు ఒక క్రొత్త విధానాన్ని (చట్టాన్ని) ఏర్పరచాడు.  ఒకడు విరోధ బుద్ధి చేతకాక పొరబాటున ఒకనిని చంపినట్లయితే - చంపినవాడు అట్టి ఆశ్రయపురములోకి పారిపోయి, ఆ సంగతి విచారణ జరుగు వరకు అచ్చట నిర్భయముగా జీవించవచ్చును.  యెహోషువ 20:1-3లో ఈ సందర్భములో చదువగలము.  ఆ పురములకు పారిపోయిన వాని సంగతి అక్కడి పెద్దలు క్షుణ్ణముగా విచారించాలి.  అతని హత్య ఉద్ధేశ్యపూర్వకమైనదిగా ఋజువైతే, వారు విరోధుల కాతనిని అప్పగించాలి.  ద్వితీయోపదేశకాండము 19:12లో అట్లుగాకుండ పొరబాటున చంపినట్లు  ఋజువైతే అతడు ఆ ఆశ్రయపురమందును, దానికి వెయ్యి గజాల దూరములోను సురక్షితముగా బ్రతుకవచ్చును.  సంఖ్యా 25:26-31 చంపబడినవాని బంధువులతనికి ఏ కీడు చేయరాదు.  ఆ ఆశ్రయపురమునకు పోవు మార్గములను బాగుజేసి ద్వితీయోపదేశకాండము 19:3లో వలె రెండు బాటలు చీలు తావులలో - ఆశ్రయపురమునకు పోవు మార్గమును కనబరచు స్థంభములను కట్టువారు.  ఇది పాతనిబంధనలోని ఆశ్రయపుర వివరము.

        అయితే నేటి నూతన నిబంధన కాలములో దైవోగ్రతకు పాత్రుడైన పాపికి నియమించబడిన ఆశ్రయపురము యేసుక్రీస్తు.  పాపమునకు రావలసిన శిక్షకు మారుగా యేసు శరణుజొచ్చినవాడు ధన్యుడు.  హెబ్రీ 6:18 పాపియొక్క లోకసంబంధమైన ఆరు ఆశ్రయపురములకంటెను అనగా ధనము, జనులు, కలిమి, గృహము, పదవి, ప్రభుత్వము, ఇవి లోకసంబంధమైనవి.  వగైరా ఇట్టివాటిని ఆశ్రయింపక, ఏడవదియైన యేసు సన్నిధిని జీవించుటన్నది ఎంతో ధన్యకరమైనది.  ఈ సందర్భములో ఇట్టి ధన్యతను పొందిన వారిని గూర్చి యోహాను 4లో సమరయస్త్రీ.  ఈమె ఆరుగురిని ఆశ్రయించి వ్యర్థురాలై, ఏడవ ఆశ్రయపురమైన యేసును చేరి ధన్యురాలైంది.  లూకా 19:1లో జక్కయ్య తన జీవితములో ధనాన్ని, పదవిని, ప్రభుత్వాన్ని, ఐశ్వర్యాన్ని, కుటుంబాన్ని, చివరిగా మేడిచెట్టును, తన ఆశ్రయములుగా జేసికొని వ్యర్థుడై, ఏడవ ఆశ్రయమైన క్రీస్తు దర్శనము ద్వారా ధన్యుడయ్యెను.  క్రీస్తుతో సిలువవేయబడిన దొంగ తన చోర వృత్తిలో ఆరు విధములైన అనుభవాలు పొంది ఏడవస్థలమైన యేసు సన్నిధిలో పరదైసు ప్రవేశానికి అర్హుడాయెను.  ఇక నీమాట మనమాటేమిటి?  ఏ స్థితిలో వున్నాము?

............

ప్రసంగము :-

అంశము :-  ఆయన నక్షత్రము.

        గొల్లలు - జ్ఞానులు కేరల్స్‌ పాడినారు.  మనము కూడా పాడుచున్నాము.

        మూలము :-  తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రమును చూచి ఆయనను పూజింప వచ్చితిమని చెప్పిరి.  మత్తయి 2:2.

        ప్రియమైన దేవుని బిడ్డలారా!  ఆయన నక్షత్రమును చూచిన జ్ఞానులు ఆయన మార్గములో నడుస్తూ దారి తప్పి హేరోదు మార్గములో హేరోదు రాజ్యాన్ని చేరారు.  అంటే నక్షత్ర మార్గాన్ని తప్పినారు.  అలా తప్పిపోవుటయేగాక ఆ నక్షత్రమునకు విరోధియైన హేరోదునే జ్ఞానులు యేసు జననమును గూర్చి విచారించారు.  అయితే హేరోదు కుయుక్తితో ఆ జ్ఞానులను మభ్యపరచి మత్తయి 2:8లో వారు హేరోదు మాట విని బయలుదేరుచుండగా తూర్పు దేశములో వారు చూచిన నక్షత్రము క్రీస్తు జన్మించిన చోటికి వారిని నడిపించినట్లు తెలుస్తున్నది.  ఆ విధముగా నక్షత్రమును చూచిన ఆ జ్ఞానులు సంతోష హృదయులై తల్లికి, శిశువుకు సాగిలపడి ఆయనను పూజించి, కానుకలు అర్పించినట్లు మత్తయి 2:10-11లో వివరించబడి వుంది.  ఇక మత్తయి 2:12లో హేరోదు వద్దకు వెళ్ళవద్దని దేవుని చేత బోధింపబడినవారై మరియొక మార్గములో తమ దేశాన్ని చేరినట్లు కూడా వ్రాయబడి వుంది.

        ప్రియమైనవారలారా!  ఆ తూర్పు దేశపు జ్ఞానుల వలె మనము కూడా ఈ సంవత్సరము ప్రభువు జన్మదినమును ఘనముగా ఆరాధించినాము.  ఆయన నక్షత్రమును గుర్తుగా మన ఇండ్ల మీద ఉంచినాము.  అంటే ఆయన నక్షత్ర మార్గములో ఉన్నాము.  పాపము, మరణము విలయతాండవము చేసే లోకములో ఉన్నాము.  అంటే హేరోదు రాజ్యములో ఉన్నాము.  ఆనాటి నక్షత్రము యేసు పుట్టుకను గూర్చి, ఆయన పుట్టిన స్థలము చూపింది.  ఆయన నక్షత్రములో జీవమున్నది.  ఆ నక్షత్రమునకు కదలిక ఉన్నది.  అందునుబట్టి ఆ నక్షత్ర మార్గములో సత్యము - జీవము ఉండుటయేగాక నేటి క్రైస్తవ విశ్వాసులైన మనకు దైవరాజ్యమునకు చేర్చు శక్తి యున్నట్లు తెలియుచున్నది.

        ప్రియులారా!  ఆ జ్ఞానులు బాలయేసును చూచారు, ఆయనను ఆరాధించారు, కానుక లర్పించారు.  మనము కూడా ఈ సంవత్సరము ఈ నెల 20 నుండి 25 కేరల్స్‌, పాటలు, ఆరాధనలు, కానుకలతో ప్రభువును ఆరాధించినాము.  ఆ విధముగానే ఆ జ్ఞానులు ఆరాధన పూర్తియైన తర్వాత హేరోదు యొద్దకు వెళ్ళవద్దని దేవుని చేత బోధింపబడి, మరియొక మార్గములో తమ దేశమునకు తిరిగి వెళ్ళినారు.  అంటే లోక మార్గము వదలి వెళ్ళి దైవమార్గమున నడిచారు.  క్షేమముగా గమ్యాన్ని చేరినారు.

        ప్రియులారా!  మనము కూడా క్రీస్తు జన్మదిన పండుగ దినమున దేవుని బోధలు విని యున్నాము.  ఆ బోధలలో మనమున్న భయంకర లోకమార్గము నుండి అసత్య, అరాచక, పాపమరణ మార్గమును చూపించే ఈ లోక దారులు వదలి, వేరొక అనగా క్రీస్తు మార్గములో నూతన ఆత్మీయ స్థితిలో నడువవలసిన వారమై యున్నాము.  క్రీస్తు జన్మకు గుర్తుగా మన ఇండ్లపై వుంచిన నక్షత్రము నేడు మన హృదయాలలో ప్రకాశించాలి.  అంతేగాదు మనమే ఆయన నక్షత్రముగా మారాలి.  ఈ సందర్భములో దానియేలు

12:3లో వలె అనేకులైన జ్ఞానులను, అజ్ఞానులను నీతి మార్గములోనడుపుటకు అనేకులకు మార్గదర్శకులుగా నుండు నక్షత్రములుగా ఉండాలి.  కీర్తన 148:3లో వలె ఆయనను స్తుతించు కాంతి గల నక్షత్రములుగా రాబోవు నూతన సంవత్సరములో జీవించాలి.  లోకమార్గము వదలి క్రీస్తు మార్గములో జీవించాలి.  అప్పుడే మనము నక్షత్రముల వలె ప్రకాశించగలము.  ఆమేన్‌.

........

        చీకటి - వెలుగు :-  మూలము ఆదికాండము 1:1-2 ఆదియందు దేవుడు భూమ్యాకాశములు సృజించెను.  భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను.  చీకటి అగాధ జలములపైన కమ్మి యుండెను.  2వ మాట యోహాను 1:5 ఆ వెలుగు చీకటిలో ప్రకాశించుచున్నది గాని చీకటి దాని గ్రహింపకుండెను.

        ప్రియపాఠకులారా!  ఇంతవరకు మనమెన్నో అంశాలను గూర్చి నేర్చుకొని యున్నాము.  అందులో విత్తనము ముందా?  చెట్టుముందా?  అనిన సమస్య లోకానికి ఏర్పడి యుండగా చెట్టు లేనిదే విత్తనము రాదు.  కనుక చెట్టుముందని, ఆ చెట్టు ఆది 1:లో దేవుడు తన వాక్‌బీజముతో భూమిమీద సృష్టించిన చెట్టే దీనికి ఆధారమని మనకు తెలుస్తున్నది.  అలాగే శరీరము ముందా?  జీవము ముందా?  అనిన మాటకు మనము సందిగ్ధములో పడవచ్చును.  శరీరము, జీవము రెండును ఆదిలో ఏకమై యున్నట్లుగానే ఇందులో జవాబు వున్నది.  ఈసందర్భములో ఎఫెసీ 1:6 తన చిత్త ప్రకారమైన దయాసంకల్పము చొప్పున, యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులనుగా స్వీకరించుటకై, మనలను ముందుగా తన కోసము నిర్ణయించుకొని, మనము తన ఎదుట పరిశుద్ధులము, నిర్దోషులమై యుండవలెనని, జగత్తు పునాది వేయబడక మునుపే, ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకొని యున్నట్లును మరియు ఆది 1:26-27 మన స్వరూపము మన పోలిక చొప్పున నరులను చేయుదము, అనుటలో దేవుడు తన పోలిక, తన స్వరూపములో నరులను చేసినట్లు వ్రాయబడిన ప్రకారము - నరశరీరము, రూపము అతనిలో ఉన్న జీవము - ఆత్మ, సమస్తము దేవునియందున్నట్లును - ఇది నేలమంటితో నరుని రూపించిన, ఆయన హస్త క్రియ ద్వారా లోకానికి బహిర్గతమైనట్లు మనకు తెలిసికోవలసి యున్నది.

        అలాగే భూమిముందా?  ఆకాశము ముందా?  అనే ప్రశ్న కూడా మనలో కలుగుట సహజము. ఇందుకు జవాబు - భూమి, ఆకాశము, జలములు, మూడును ఒక దానిలో ఒకటి విలీనమై ఏకత్వము పొందినట్లుగా ఆది 1:1-2లో మనము చదువగలము.  అది ఎలాగంటే దేవుడు భూమ్యాకాశములు సృష్టించక పూర్వము భూమి నిరాకారముగాను, శూన్యముగాను ఉండినట్లును, చీకటి అగాధజలముల చేత భూమి కప్పబడి యున్నట్లును చదువగలము.  ఇందునుబట్టి సృష్టి ఏ విధముగా త్రిత్వాన్ని పొంది యున్నదో దైవత్వము కూడా త్రిత్వాన్ని పొందవలసి వచ్చిందన్న సత్యాన్ని మనము గ్రహించాలి.  దేవునియొక్క త్రిత్వము - తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ.  ఈ విధముగానే సృష్టిలోని త్రిత్వము - ఆకాశము, భూమి, జలములు. త్రిత్వమన్నది ఇక్కడనుండి ప్రారంభమై, లోకసృష్టములలో ప్రధమముగా ఈ నరునిలో ఈ త్రిత్వమన్నది ఆత్మ, శరీరము, జీవము అనిన విధముగా ఏర్పడింది.  అనగా ప్రియపాఠకులారా!  ఈ త్రిత్వమన్నది ఏర్పడుటకు కారకుడు దేవుడే అయినప్పటికిని, ఆయన పక్షపాతికాడు గనుక, నిష్పక్షపాతి గనుక సృష్టిలోను, నరునిలోను ఈ త్రిత్వాన్ని ఉంచి యున్నాడు.  దేవుడు ఒక్కడే అనగా ఆయన ఆత్మ - ఆయన ఒక్కడై యుండి, లోకకార్య నిర్వహణార్థము ముగ్గురుగా విభజించబడినారు.  అలాగే దేవుడు నరునిలో ఉంచిన ఆత్మ ఒక్కటే!  కాని దైవకార్య నిర్వహణార్థము - నరునిలో ఉంచిన ఆత్మ త్రిత్వాన్ని పొంది, జీవము, శరీరము, ఆత్మగా ఏర్పడింది.  అలాగే సృష్టిలోని త్రిత్వము ఆదిలో అనగా జలములు, భూమి, ఆకాశము మూడును ఏకత్వము పొంది యుండి, దేవుడు సృష్టించబోవు ప్రణాళికకు అనుగుణ్యముగా ఈ సృష్టి అన్నది త్రిత్వాన్ని పొందింది.  ఈ త్రిత్వము ఏర్పడిన విధానము ఏదనగా దేవుడు జలములను విభజించి - ఆ విధముగా విభజించబడిన జలములకు పై భాగము ఆకాశము, క్రింది భాగము సముద్రము అనియు, ఆ తర్వాత ఆరిన నేల కనబడగా దానికి భూమి అని పేరు పెట్టినట్లుగాను, ఈ విధముగా లోక త్రిత్వమేర్పడింది.

        ప్రియపాఠకులారా!  ఈ విధముగా ఇవి అన్నియు ఏర్పడక మునుపు వెలుగు అన్నది ఏమిటో?  అది ఎలాగుంటుందో?  దాని ప్రభావమేమిటో ఎరిగే స్థితి నాడు లేదు, ఎందుకనగా జీవము సృష్టి లేనప్పుడు, సృష్టికర్త లేనప్పుడు నిరాకారము శూన్యము చీకటి, కలుషిత వాతావరణము ఏర్పడి వికార వాతావరణము ఉంటుంది.  కనుక నిరాకారము వికారము కలుషితము బురదమయమైన దుర్గంధ పూరిత చీకటి వాతావరణములో దేవునియొక్క ఆత్మ - వెలుగు కనుక, ఆయనలో చీకటి ఎంత మాత్రము లేదు గనుక ఆయన వెలుగు ద్వారా అగాధ జలముల మీద ప్రయాణించి, నాటి వాతావరణములో అనగా సృష్టి ఉన్నటువంటి నిరాధార స్థితిని గుర్తించినవాడై, ఆకాశము, జలములు, భూమిని వేరుపరచి ఒక నూతన లోకాన్ని సృష్టించాలని దేవుడు సంకల్పించి, మొట్టమొదటగ వెలుగును - కమ్మని శాసించినట్లు వేదములో ఆది 1:3లో చదువగలము.  దేవుడు తన వెలుగును మామూలుగ లోకసంబంధమైన వెలుగు వలె కాక - జీవపు వెలుగును, నాటి వికృతమైన వాతావరణములో ప్రసరింపజేశాడు.  ఎందుకనగా దేవునియొక్క వెలుగు జీవపు వెలుగు - కాకపోతే నిర్జీవమైయున్న త్రిత్వములో వున్న భూమి, ఆకాశము, జలములు జీవము కలిగియుండేవి కావు.  మొట్టమొదట దేవుడు భూమి మీద ప్రసరింపజేసింది.  వెలుగును, తర్వాత ఆ జీవపు వెలుగు ప్రభావమూలముగా మూడు లోకాలకు మూడు విధముల జీవము ఏర్పడి, మూడు విధములైన సృష్టములు ఏర్పడుటకు దోహదకారియైంది.  అనగా దేవుడు తన జీవపు వాక్కుతో భూమి, జలములను, ఆకాశమును వేరుపరచి, వానిలో నుండి సృష్టములను రూపించినట్లు వేద చరిత్రలో మనకు తెలిసిన విషయమే.

        ఈ విధముగా లోకసృష్టి నిర్మాణములో భూమిమీద వెలుగు కంటే చీకటియే ముందున్నట్లును - ఆ కటిక చీకటి అన్నది దైవత్వముయొక్క ప్రభావమును గ్రహించకుండినట్లును, ఆ చీకటిని దైవాత్మ వేరుపరచి, నానావిధ సృష్టికార్యములను - ఆకాశములో భూమిమీదను, జలములలోను జరిగించినట్లు వేదములో చదువగలము.  ఈ విధముగాఈ భూలోకము ఏర్పడినట్లుగ మనకు తెలుస్తున్నది.  ఒక వ్యక్తి జీవితానికి గాలి, నీరు, ఆహారమెంత అవసరమో వెలుగు, చీకటి కూడా అంత అవసరమైనట్లు - దైవసృష్టి నిర్మాణ విషయములో నరకోటికి ఆయన అనుగ్రహించిన వెలుగు, చీకటిని బట్టి మనకు తెలుస్తున్నది. ఆలాగే పరలోకములో దేవదూతలను దేవుడు రెండు వర్గాలుగా విభజించి యున్నాడు.  ఇందునుగూర్చి ఎఫెసీ 6:2 వ్రాసిన లేఖన భాగములో  - ''మనము పోరాడునది శరీరులతో కాదుగాని ప్రధానులతోను, అధికారులతోను, ప్రస్తుత అంధకార సంబంధులగు లోకనాధులతోను, ఆకాశమండలమందున్న దురాత్మల సమూహాలతోను పోరాడుచున్నాము,'' అనుటలో దేవదూతలలో కూడా వెలుగు - చీకటి అను రెండు విధములైన రెండు వర్గములుగ, దేవుడు తన దూతలను విభజించినట్లు ఇందునుబట్టి తెలుస్తున్నది.  ఈ చీకటి అన్నది నరజీవితములో మొట్టమొదట భూగర్భము నుండి ప్రారంభమైంది.  భూమి ఏ విధముగా జలములతో కప్పబడి, చీకటిమయముగా ఉండిందో అట్లే భూగర్భము నుండి తీయబడిన నరుడు భూమిలో ఒకమంటి ముద్దగా ఉండినట్లును, ఆ విధముగా మట్టి ముద్దగా రూపించబడిన నరుని గర్భములో శల్య రూపముగా స్త్రీ ఉండినట్లును, తదనంతరము నిషేధఫల భక్షణము దైవ ఆజ్ఞాతిక్రమము చేసిన నరుల గర్భము కూడా చీకటిమయమైనందున, ఆ చీకటిలో మంచి చెడ్డ ఎరిగిన నరులలో కామేచ్ఛన్నది ఏర్పడి, స్త్రీ పురుష కలయిక ద్వారా నరజన్మకు నాంది ఏర్పడింది.  

        ఈ విధముగా స్త్రీ గర్భములో నుండి చీకటిలో నుండి ఏర్పడిన తొలి సంతతి కయీను, హేబెలులు, అనగా నారీ గర్భములో మొట్టమొదటగ చీకటి వాతావరణాన్ని పొందినట్టి సంతానమే, కయీను హేబెలులు.  ఇక్కడ నుండి నరునియొక్క బాల్యమన్నది చీకటిమయమైనట్లును, అట్టి చీకటిమయమైన వాతావరణమును రెండు విధములుగ విభజించినట్లు వేదరీత్యా తెలిసికోవాలి.  తల్లి గర్భములో చీకటిలో నవమాసములు ఎదగాలి.  నవమాసములు పూర్తియైన తర్వాత నరుడు సర్వాంగ స్థితిని పొంది, సంపూర్ణ శిశువుగ ఏర్పడిన తర్వాత స్త్రీ గర్భము నుండి జనించుటన్నది నేడు లోకరీత్యా మనమెరిగిన విషయమే. అనగా తొమ్మిది నెలలు కటిక చీకటిలో శరీరరూపమును పొందిన శిశువు, కాలము సంపూర్ణమైనప్పుడు, లోకసంబంధ వెలుగును చూచే భాగ్యాన్ని పొందుట దైవకృపయే.  ఆదికాండము 1:28లో నరులను గూర్చి ప్రవచిస్తూ - ''మీరు ఫలించి - అభివృద్ధి పొంది, విస్తరించి, భూమిని నిండించి, బదానిని లోబరుచుకొని దానిని ఏలుడి,'' అనుటలో నరజీవితము ఫలభరితమయినదిగా దైవప్రణాళికలో ఉన్నట్లు తెలుస్తున్నది.  

        ఈ విధముగా దైవవాక్కానుసారము ఫలభరితమై విస్తరించిన జనాభా దేవుని ప్రణాళికను, ఆయన చిత్తమును నెరవేర్పక పోవుటయేగాక ఆయన చేసిన మేళ్ళను ఉపకారాలను మరచి, అవిధేయులై వావివరుసలు మాని, అక్రమ పద్ధతులలో కృతజ్ఞత లేని మనస్సాక్షితో ప్రవర్తించి, మానవత్వము, దైవత్వము ఏకమై - మానవత్వము, దైవత్వమును కోల్పోయి, లోకసంబంధముగా సృష్టిలో ఉన్న జీవులు పశుపక్ష్యాదులవలె  ప్రవర్తించి దైవోగ్రతకు గురియైనట్లు ఆది 6:లోని వేద భాగము చరిత్ర మనకు వివరిస్తున్నది.  ఇట్టి హృదయ విదారకమైన, కృతజ్ఞతాహీనులైన జనాంగమును ఏ చీకటి నుండి రూపించినాడో - ఆ చీకటికే అంకితము చేయునట్లు వీరిపట్ల ఉగ్రుడై, నాటి మానవ లోకములో తన పట్ల భయభక్తులు గల్గి, దేవునిగ మహిమపరచే వ్యక్తి ఉన్నాడా?  అని పరిశోధించి అప్పటి కాలములో అప్పటి స్థితిలో అప్పటి వాతావరణములో నోవహు అను వ్యక్తి నీతిమంతునిగ, దైవ ఎంపికలో నిలుచుటనుబట్టి అతనినిబట్టి - అతనిని,  అతని కుటుంబాన్ని నీతిమంతుల జాబితాలో చేర్చి, తద్వారా అప్పుడున్న యావద్‌ మానవలోకాన్ని తాను భూమి నుండి ఏ విధముగా తీశాడో అదే చీకటి అగాధ జలములకు వారిని జలసమాధి చేసి, నీతిమంతుడైన నోవహును, అతని కుటుంబాన్ని పునఃసృష్టి నిర్మాణములో మానవ జనాంగానికి  నాందిగ మూలపురుషునిగ జేసికొని, వారి ద్వారా నూతన సృష్టిని ఏర్పరచుట మన మెరిగిందే.  ఇందునుబట్టి దైవచిత్తములోనే చీకటి వెలుగులు క్రియజరిగిస్తున్నట్లు రూఢిగా మనము తెలిసికోగలము.  అనగా అంధకారములో వెలుగును కలుగజేయువాడు దేవుడేయని, వెలుగును అంధకారములోకి మార్చే శక్తి గలవాడు దేవుడే!  రెండింటిని క్రమబద్ధీకరణ చేస్తూ నరునియొక్క జీవనోపాధికి చేయశక్తిగలవాడు కూడా దేవుడేనని మనము తెలిసికోవలసి యున్నది.

        ప్రియపాఠకులారా!  దేవుడు చీకటిని మనకు అనుగ్రహించింది నిద్ర కోసము - మరియొక మాట చెప్పాలంటే మన జీవితాలలో మనము ఎదుగుటకు కావలసిన వాతావరణం కోసమే చీకటిని అనుగ్రహించి యున్నాడు . అంతేగాకుండ చీకటి అన్నది నర జీవితములో కొన్ని అవసరతలకు వాడబడుచున్నది.  చీకటి అన్నది దేవుని మహిమపరచుచున్నది.  ఎలాగంటే యేసుక్రీస్తు సిలువ మీద శ్రమలు పొందినప్పుడు ఆ సమయములో చీకటి ఆ రాజ్యాన్ని అలముకొన్నది.  లూకా 23:44 ఈ చీకటి దేవుని మహిమపరచింది.  అలాగే ఆదాము విషయములో దేవుడు అతనికి సాటిసహాయమును రూపించినప్పుడు గాఢనిద్ర కలుగజేసినట్లును - ఈ గాఢనిద్రన్నది వ్యక్తియొక్క జీవితములో చీకటి మయమైయున్నట్ల అనగా చీకటి వాతావరణము - నరునియొక్క శరీర అంగములలో ఉన్న ఎముకలు చీకటి వాతావరణములో ఉన్నట్లును, అట్టి చీకటి వాతావరణము నుండి దేవుడు స్త్రీని రూపించి, ఆది నరునికి జతపరచినట్లు వేదములో ఆది 2:21లో చదువగలము.  ఈవిధముగా జతపరబడిన స్త్రీ -పురుషునికి మహిమయై యున్నది.  ఇందునుగూర్చి పౌలు కొరింథీయులకు వ్రాసిన మొదటి పత్రిక

11:7-9లో ఈ విధముగా ప్రవచించి యున్నాడు, ''పురుషుడైతే దేవుని పోలికయు మహిమయునైయున్నాడు.  కనుక తలమీద ముసుకువేసి కొనకూడదుగాని, స్త్రీ పురుషుని మహిమయైయున్నది.  ఏలయనగా స్త్రీ పురుషుని నుండి కలిగెనేగాని పురుషుడు స్త్రీ కొరకు సృష్టింపబడలేదు,'' అని వ్రాయబడి యున్నది.

        కనుక ప్రియపాఠకులారా!  నరుని జీవితములో చీకటికి చాలా ప్రాధాన్యత ఉన్నట్లుగా

ఇందునుబట్టి మనకు తెలుస్తున్నది.  దేవునియొక్క దూత ఐగుప్తులో సంచారము చేసి ప్రతి తొలిచూలును వధించిన సమయము రాత్రికాలమే.  అలాగే యేసుక్రీస్తును యూదులకు పట్టించిన సమయము కూడా రాత్రికాలమే;  అపొ 12:6-10, హేరోదు అతనిని వెలుపలికి తీసికొని రావలెనని యుండగా, ఆ రాత్రియే పేతురు రెండు సంకెళ్ళతో బంధింపబడి, ఇద్దరు సైనికుల మధ్య నిద్రించుచుండెను.  మరియు కావలివారు తలుపుఎదుట చెరసాల కాచుకొనుచుండిరి.  ఇదిగో ప్రభువు దూత అతని దగ్గర నిలిచెను. అతడుండిన గదిలో వెలుగు ప్రకాశించెను.  దూత పేతురు ప్రక్కను తట్టి - త్వరగా లెమ్మని చెప్పి అతనిని లేపగా సంకెళ్ళు అతని చేతుల నుండి ఊడిపడెను.  అప్పుడు దూత అతనితో - నీవు నడుము కట్టుకొని చెప్పులు తొడుగుకొనుమనెను.  అతడు అలాగు చేసిన తర్వాత దూత - నీ వస్త్రము పైన వేసికొని నా వెంబడి రమ్మని అతనితో చెప్పెను. అతడు వెలుపలికి వచ్చి దూత వెంబడి వెళ్ళి, దూత వలన జరిగినది నిజముగా జరిగెనని గ్రహింపక తనకు దర్శనము కలిగెనని తలంచెను.  మొదటి కావలిని, రెండవ కావలిని దాటి పట్టణమునకు పోవు ఇనుప గవిని యొద్దకు వచ్చినప్పుడు దానంతట అదే వారికి తెరచుకొనును.  వారు బయలుదేరి యొక వీధి దాటిన వెంటనే దూత అతనిని విడిచి పోయెను.

        ప్రియపాఠకులారా!  ఇందులో చీకటి వెలుగుయొక్క పోరాటములో చీకటి ఓడిపోయి, వెలుగు విజయాన్ని సాధించి వెలుగు సంబంధియైన విశ్వాసిని చీకటి - సంకెళ్ళతో బంధింపగా అట్టి బంధకాల నుండి విమోచించుటకు పేతురు అను విశ్వాసికి మూలమైన జీవపు వెలుగు పేతురుయొక్క బంధకాలను విమోచించి, విడుదల అనుగ్రహించినట్లు ఈ వేదభాగములోని వివరణ.

        ఇందునుబట్టి ప్రియపాఠకులారా!  ప్రతి వ్యక్తియు ఈ లోకరీత్యా చీకటిచే బంధీకృతుడై యున్నట్లు ఈ సత్యాన్ని మనము ఈ క్రింది వివరాలను బట్టి తెలిసికొందము.  ఒక దినకాలములో మనము పగలంతయు వెలుగులో ఉండినను, ఆ వెలుగు అస్తమించిన పిదప ఈ లోకములో ఆవరించే చీకటిలో మనము అర్థ దినము జీవింపక తప్పదు. ఈ చీకటి అన్నది దేవుడు అనుగ్రహించిన వాతావరణము.  ఎలాగంటే చీకటి లేనిదే ఒక జీవియొక్క పుట్టుక సఫలీకృతము కాదు.  గుడ్డులోని పిల్ల చీకటిలో ఉంటుంది. గర్భములోని శిశువు చీకటిలో ఉంటుంది.  ఒక జంతువు గర్భములోని దూడ చీకటిలో ఉంటుంది.  అలాగాకుండ గర్భములోని శిశువు బహిరంగముగా వెలుగులో ఉన్నట్లయితే, గర్భమును మోసే తల్లికిని, గర్భములో ఉన్న శిశువు ఇద్దరును మృతమే, అందుకే చీకటిని దేవుడు జీవరాసులయొక్క పుట్టుకకు చీకటి వాతావరణానికి ప్రాధాన్యత నిచ్చాడు.

        అయితే ప్రియపాఠకులారా!  ఈ చీకటిని ఆసరాగా చేసుకొని సాతానుడు లోకరీత్యా అనేక విధములైన అక్రమాలు, అన్యాయాలు, హత్యలు, దోపీడీలు, దురాలోచనలు, వగైరాలకు చీకటిని వాడుకొంటున్నాడు.  ఈవిధముగా సాతాను తన స్వార్ధానికి చీకటిని వాడుకోవడమే గాకుండ, తన క్రియాకర్మలకు అనుకూలముగా నరులను ఆవేశించి, ప్రేరేపించి, నానాలోకసంబంధ వ్యామోహాలు, ధనాపేక్షతో కూడిన ఆశలు, మరియు నానావిధ వ్యసనాలకు బానిసలుగ జేసి, తానేవిధముగా చీకటిని ప్రేమించి, చీకటిలో ఉన్నాడో ఆలాగే తనతోబాటు నరులను కూడా చీకటి సంబంధులుగ చేయుటకును, తనవలె చీకటిలో వారియొక్క ఆత్మలు బంధించబడాలని ఆశిస్తూ - ప్రతి విశ్వాసి జీవితాన్ని పాడుచేయుటకు నిర్విరామముగా కృషిజేస్తున్నాడు.  ఇందునుబట్టి ప్రియపాఠకులారా!   మత్తయి 25:41లో యేసుప్రభువు పల్కిన మాట, ''అప్పుడాయన ఎడమ వైపున ఉండువారిని చూచి - శపించబడిన వారలారా!  నన్ను విడిచి అపవాదికిని వాని దూతలకును సిద్దపరచబడిన నిత్యాగ్నిలోనికి పోవుడి,'' అనుటలో అపవాదికిని అతని దూతలకును సిద్ధపరచబడిన స్థలము కటిక చీకటిలోని నరకశిక్ష అని ఇందునుబట్టి మనకు ఋజువు అగుచున్నది.  ఈ నిత్యాగ్నికి వెలుతురు ఉండదు.  అగ్ని మాత్రమే ఉంటుంది.  మన పూర్వీకులు నీళ్లు కాచుకొనే దాలిబాన గుంటవలెను, ఇటుకలు సున్నము కాల్చుకొనే బట్టీలవలెనో ఉంటుంది.  కాని వెలుతురు ఉండదు - అగ్ని ఉంటుంది.  యోహాను 8:12, ''నేను లోకమునకు వెలుగును, నన్ను వెంబడించువాడు చీకటిలో నడువక జీవపు వెలుగు కల్గియుండును,'' యేసు తననుగూర్చి జీవపు వెలుగు కలిగి యుండునని వారితో చెప్పెను.  కనుక దైవకుమారుడైన క్రీస్తు జీవపు వెలుగు సంబంధియై యుండగా ఆయన అడుగుజాడలలో ఆయన విశ్వాసములో ఆయన ఆత్మలో - ఆయనలో బాప్తిస్మము పొంది, నిజ క్రైస్తవ బిడ్డలుగ జీవిస్తున్న మనము ఆయనను పోలి నడచుకొనవలసినవారమై యున్నాము.  ఆ విధముగా నడుచుకొన్న పక్షములో ఆయన జీవపు వెలుగులో మనము భాగస్వాములై ఆయనలో స్వభావ సిద్ధముగా జీవించగలవారమై యుండగలము.

        ప్రియపాఠకులారా!  క్రీస్తువలెనే అంత్యక్రీస్తు కూడా వెలుగు దూత వేషముతో ప్రకాశిస్తూ నరులను మోసము చేసే స్థితి కూడా ఉంది.  ఇందునుబట్టి చూడగా భూలోకములో ఏ విధముగా నకిలీలున్నాయో అనగా శారీర సంబంధగా ఏ విధంగా నకిలీ జీవితమున్నదో ఆత్మసంబంధముగా కూడా జీవితములో నకిలీ జీవితము అనగా వేషధారణతో కూడిన జీవితమున్నదన్న సత్యాన్ని గ్రహించాలి.  అపవాది వెలుగు దూత వేషధారణతో వస్తాడని మత్తయి 24:24 సాధ్యమైతే ఏర్పరచబడిన వారిని సహితము మోసగిస్తారని వేదములో వ్రాయబడి యున్నది.

        ప్రియపాఠకులారా!   నరజీవితములో చీకటి వెలుగులు సమానము అనిన భావాన్ని లోకరీత్యా దేవుడు నరులకు విశదపరచినను, కాని ఆత్మసంబంధముగా వెలుగు కున్న ప్రాధాన్యత వేరు, వెలుగు - రహస్యాన్ని బట్టబయలు చేస్తుంది.  చీకటి రహస్యాన్ని దాస్తుంది.  ఇది చీకటి వెలుగుల కున్న తేడా. ఇటువంటి తారతమ్యములో ఈ లోకజీవితము జరుగుచున్నది.

        కనుక ప్రియపాఠకులారా!  ప్రభువు రాకడ సమయములో మత్తయి 25:31-33లో వివరించబడిన రీతిగా ''గొల్లవాడు - మేకలలో నుండి గొర్రెలను వేరుపరచునటు,్ల ఆయన వారిని వేరుపరచి, తన కుడి వైపున గొర్రెలను ఎడమవైపున మేకలను నిలువబెట్టును,'' అనగా కుడివైపున ఉన్నవారు వెలుగు సంబంధులు. వీరు గొర్రెలు, ఎడమవైపు నిలిచిన వారు మేకలు - వీరు చీకటి సంబంధులు.  కుడివైపున ఉన్నవారు తండ్రి చేత ఆశీర్వదింపబడినవారు.  అనగా వెలుగు చేత నింపబడినవారు, వెలుగు మార్గములో నడచినవారు.  జీవపు వెలుగు కల్గినవారు.  వెలుగుతో ప్రతిష్టింపబడినవారు.  ఈ విధముగా జనకోటిని విభాగించిన దేవుడు లోకాంత్యములో జరిగించబోవు లోకవినాశన క్రియాకర్మలను గూర్చి దైవకుమారుడైన క్రీస్తు మత్తయి 24:29లో ఈ విధముగా ప్రవచించినట్లు చదువగలము.  ''ఆ దినముల శ్రమ ముగిసిన వెంటనే చీకటి సూర్యుని కమ్మును, చంద్రుడు కాంతిని ఇయ్యడు.  ఆకాశమునందు నక్షత్రాలు రాలును, ఆకాశమందలి శక్తులు కదిలింపబడును, అప్పుడు మనుష్యకుమారుని సూచన ఆకాశమందు కనబడును.  అప్పుడు మనుష్య కుమారుడు ప్రభావముతోను మహిమతోను ఆకాశ మేఘారూడుడై వచ్చుట చూచి, భూమి మీదనున్న సకల గోత్రములవారు రొమ్ముకొట్టుకొందురు.  

        ప్రియపాఠకులారా!  ఆదికాండము 1:లో ఈ అనంత విశ్వము ఏ విధముగా గాఢాంధకార చీకటిమయములో ఉండిందో లోకాంత్యములో కూడా ఈ భూలోకమునకు చీకటి వాతావరణము సంక్రమించునట్లుగ ఇందునుబట్టి తెలుస్తున్నది.  ఆదిలో ఏ చీకటియైతే ఈ సృష్టిని ధరించుకొని యుండిందో అదే చీకటిని మరల ప్రభువుయొక్క రాకడలో ఈ లోకము ధరించుకొను గతి సంభవించునని తెలుస్తున్నది.  ఆలాగే నాటి చీకటి అగాధ జలములలో భూమి గుప్తమైయున్నప్పుడు దేవుని ఆత్మ ఏ విధముగా అల్లాడిందో అలాగే లోకాంత్యములో యావద్‌ సృష్టములను భూమిని చీకటి అలముకొనబోవు సందర్భములో మత్తయి 24:22-30లో సూర్యచంద్రులు, ప్రకాశింపనీయక చీకటి కమ్మి కాంతివిహీనము చేయును, ఆకాశమందున్న కోటానుకోట్ల నక్షత్ర సముదాయములు లయమైపోవునట్లును, ఆకాశమందలి శక్తులు కదిలింపబడి, మనుష్య కుమారుని సూచన కనబడుచు, ప్రభావముతోను ఆకాశమేఘారూడుడై వచ్చుట చూచి భూమిమీదనున్న సకల గోత్రముల వారు రొమ్ము కొట్టుకొందురు.  మరియు ఆయన గొప్ప బూరతో తన దూతలను పంపును.  వారు ఆకాశము యొక్క ఈ చివరి నుండి ఆ చివరి వరకు నలుదిక్కుల నుండి ఆయన ఏర్పరచుకొనిన వారిని పోగుచేయుచున్నట్లు వ్రాయబడియున్నది.  ఇది యావద్‌ సృష్టిని చీకటిలో అలముకొన్నప్పుడు సంభవించు క్రియ.  చిత్రమేమిటంటే లోకసృష్టికి పూర్వము దేవుని ఆత్మ అల్లాడినట్లును, లోకాంత్యములో అదే సృష్టి లయపరచబడగా దైవకుమారుని ఆగమనము జరిగి, తాను పంపిన బూరనాదము ద్వారా - ఆకాశముయొక్క నలుదిక్కుల నుండి ఆయనేర్పరచుకొన్న వారిని సంఘముగా ఏర్పరచినట్లు, ఆ సంఘమే ఎత్తబడే సంఘము.  ఈ సంఘము తీర్పులోనికి వచ్చి దేవుని మహిమను ధరించుకొని, తన భార్యకొరకు అలంకరింపబడిన పెండ్లికుమారుని వలె సిద్ధపాటు గల్గిన సంఘముగ - ఈ సంఘముయొక్క భవిష్యత్తు ఉన్నట్లు ఈ వేదభాగమును బట్టి మనము తెలిసికోగలము.

        ప్రియపాఠకులారా!  చీకటివెలుగులలో ఉన్నట్టి మంచిచెడును గూర్చి తెలిసికొనియున్నాము.  చీకటితో నింపబడిన లోకము వెలుగుతో పునాది వేయబడి, సృష్టములతో అలంకరించబడి నిరాకారము, శూన్యమైన ఈ భూమి నానావిధమైన సృష్టములతో నానా జాతుల జనసంఖ్యతో అలరించబడి భూమి అను పేరు గాక భూలోకము అను పేరు పొందింది.  అయితే లోకాంత్యములో పూర్వము వలె చీకటితో కప్పబడి, ప్రభువుయొక్క తీర్పులో ఈ లోకము దీనిలోని జనాంగము నిలబడినప్పుడు, ప్రభువు తాను ప్రేమించి ఏర్పరచుకొన్నవారిని తనలో చేర్చుకొను సందర్భములో భూలోకమునకు పెట్టబడు పేరు మృతుల లోకము.  ఈ భూలోకము మృతుల లోకముగా మారుతుంది.  అయితే ఇపుడున్నట్టి ఈ లోకము పేరేమి?  అంటే పాప లోకము.  ఎందుకంటే రోమా 3:11లో వలె ''నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు.  దేవుని వెదకువాడును లేడు.  అందరును త్రోవ దప్పి ఏకముగా పనికిమాలిన వారైరి.  ఇంకను 3:23 ఏ భేేధమును లేదు.  అందరును పాపము చేసి దేవుడనుగ్రహించు మహిమను పొందలేకపోవుచున్నారు,'' అని వ్రాయబడిన ప్రకారము ఇప్పుడున్న లోకము దైవదృష్టిలోను, నేటి మన విశ్వాస జీవితములోను మనము చూస్తున్న నగ్నసత్యమే!  ఈ విధముగా పాపభూయిష్టమైన ఈ భూలోకము ప్రభువు రాకడలో ఆయన తీర్పులో మృతుల లోకముగా మారి, ఇప్పుడు తన ప్రేమలో తనయొక్క అజమాయిషీలో తన ఏర్పాటులో తన జ్ఞానములో దైవత్వమును విస్మరింపజేసి, నరుని తన క్రమములో నడిపిస్తూ ప్రభువు రాకడలో ఈ భూలోకము సృష్టికర్త చేత నేరస్థాపన చేయబడి, ఇది జరిగించిన అన్యాయపు క్రియలు అక్రమాలు హేయకార్యాలు విపరీతమైన పాప క్రియలను బట్టి లోకసంబంధులుగ దైవకుమారుడైన యేసుక్రీస్తు భూవ్యామోహితులను గూర్చి ప్రవచించినట్లుగ మనకు తెలుసును.  ''మీరు లోకసంబంధులైనట్లు నేను లోకసంబంధిని కాను'', అని ప్రవచించియున్నాడు.  పాపమునకు దాసుడైన ప్రతివానికిని భూమితల్లి - అపవాది తండ్రియునైయున్నాడు.  నీతిని జరిగించు ప్రతి వానికిని పరమ యెరూషలేము తల్లియు పరమరక్షకుడైన ప్రభువు తండ్రియైయున్నాడు.  లోక వ్యామోహము - లోకమును ప్రేమించువాడు లోకసంబంధ ఆరాధనలు జరిగిస్తూ భూమిని తల్లిగాను, భూమిని అదృశ్యములో పరిపాలించు దేవుని తండ్రిగాను స్తుతిస్తూ కీర్తిస్తూ సుప్రభాతమని అర్చ్యన అని పూజ అని నానావిధమైన పేర్లతో భూసంపదను అనుభవించుటకు లోకరీత్యా శారీర రీత్యా నానావిధమైన కుయుక్తులతోను కుత్సితాలకు పాల్పడువానికి భూమి జనని - ఇట్టివారికి తండ్రి అపవాది, ఈ విధముగా ఈలోక వ్యామోహములో లోకదాసులై జీవించేటటువంటి వారికి దైవరాజ్యములో ప్రవేశము జరుగుటన్నది దుర్లభము.

        ప్రియపాఠకులారా!  లోకమే చీకటిమయము, పరలోకము వెలుగుమయము.  భూలోకములో రాత్రి, పగలు చీకటి రాజ్యము చేయుచుండగా పరలోకములో వెలుగన్నది ప్రకాశిస్తూ పరలోక రాజ్య మహిమను బయలుపరచుచున్నది.  ఇందునుబట్టి చీకటికి వెలుగుకు పొత్తు కుదరనందున ఇవి ఒకదానికొకటి ఆవరించి క్రియ జరిగిస్తున్నాయి.  కాని ఏనాటికైనను ఈ భూమండలమన్నది యదావిధిగ మరల చీకటిలో కాలగర్భములో కలిసి చీకటిమయమయ్యే దినము ఒకటున్నది.  ఇందునుగూర్చి 2 పేతురు 3:10లో ఈ విధముగా వ్రాయబడి యున్నది.  '' ఆ దినమున ఆకాశములు మహాధ్వనితో గతించి పోవును,  పంచభూతాలు మిక్కుటమైన వేండ్రముతో లయమైపోవును.  భూమియు దానిమీదనున్న కృత్యములు కాలిపోవును'' అనియు మొదటి థెస్సలొనీక 5:2-9లో ఈ విధముగా వ్రాయబడియున్నది. ''రాత్రి వేళ దొంగ ఏలాగు అలాగే ప్రభువు దినము వచ్చునని మీకు తెలియును.  లోకులు నెమ్మదిగా ఉన్నది భయమేమియు లేదని చెప్పుకొనుచుండగా గర్భిణీ స్త్రీకి ప్రసవవేదన వచ్చునట్లు వారికి ఆకస్మికముగా నాశనము తటస్థించును.  కనుక వారెంతమాత్రమును తప్పించుకొనలేరు.  సహోదరులారా!  ఆ దినము దొంగవలె మీమీదికి వచ్చుటకు మీరు చీకటిలో ఉన్నవారు కారు.  మీరందరు వెలుగు సంబంధులును పగటి సంబంధులునైయున్నారు.  మనము రాత్రివారము కాము, కావున ఇతరుల వలె నిద్రపోక మెలకువగా ఉండిమత్తులము కాకయుందము.  నిద్రపోవువారు రాత్రివేళ నిద్రపోవుదురు.  మత్తుగా ఉండువారు రాత్రివేళ మత్తుగా నుందురు.  మనము పగటివారమైయున్నాము గనుక మత్తులమైయుండక, విశ్వాసప్రేమలను కవచము, రక్షణ నిరీక్షణయను శిరస్త్రాణమును ధరించుకొందము.  ఎందుకనగా మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా రక్షణ నొందుటకే దేవుడు మనలను నియమించెనుగాని ఉగ్రత పాలగుటకు నియమించలేదు.

        కనుక ప్రియపాఠకులారా!   దేవుడు మనలను నిర్మించి తనయొక్క ఆశ్చర్యకరమైన మహిమకరమైన జీవింపజేయు తన వెలుగును నరుడు ధరించుకొనుటకే - దేవుడు నరుని సృష్టించినట్లు తెలుస్తున్నది.  అంతేగాకుండ 1 థెస్సలొనీక 5:10లో ''మనము మేలుకొనియున్నను, నిద్రపోవుచున్నను తనతో కూడా జీవించు నిమిత్తము ఆయన మన కొరకు మృతిపొందెనని వ్రాయబడిన ప్రకారము మనము ఏ విధముగా చీకటి వెలుగులను ఈ లోకములో అనుభవిస్తున్నామో - అలాగే దైవకుమారుడు కూడా తల్లి గర్భములో చీకటిని; తన తండ్రి ప్రణాళిక ప్రకారము సజీవ యాగముగా బలిగా తననుతాను సమర్పించుకొని మరణావస్థను ఆయన అనుభవించి, ఆయన కూడా చీకటి అనుభూతిని పొందినట్లు తెలుస్తున్నది.  కనుక క్రైస్తవ విశ్వాసులమైన మనము చీకటి సంబంధులము కాము అనియు, వెలుగు సంబంధులమే అని ఎందుకనగా మత్తయి 2:2లో ఆకాశములో ప్రకాశించిన దైవకుమారుని నక్షత్రమును గూర్చి జ్ఞానులు తెలుసుకొన్నప్పుడు - ''యూదుల రాజుగా పుట్టిన వాడెక్కడనున్నాడు?  తూర్పుదిక్కున మేము ఆయన నక్షత్రమును చూచి, ఆయనను పూజింపవచ్చితిమి, అని చెప్పుటలో ఆకాశములో తారగా ప్రకాశించిన ప్రభువు వెలుగు సంబంధియేగాని చీకటి సంబంధి కాడు.  అయితే మనము చీకటి సంబంధులము.  ఇందునుగూర్చి 1 పేతురు 2:9లో - ''అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మును పిలిచిన వాని గుణాతిశయములు ప్రచురము చేయు నిమిత్తము, ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తయిన ప్రజలునై యున్నారు'' అని క్రైస్తవ విశ్వాసులమైన మనలను గూర్చి ప్రవచించి యున్నాడు.  అందునుబట్టి వెలుగు సంబంధులమైన మనము చీకటి సంబంధులవలె గాక వెలుగుకు ఆదియు, మన ఆత్మీయతకు తండ్రియైన దేవుని మహిమపరచుచు - ఆయన రాజ్య సువార్త సత్యసువార్త, రక్షణ సువార్త, ఆయన నిత్య సువార్తను, ఆయన అంతిమ సువార్తను, లోకమునకు అంతము ప్రభువు రాకడను గూర్చిన మర్మము అనేకులకు ప్రకటించుటకు ఆత్మసంబంధులుగ సత్‌ క్రైస్తవులుగ జీవిస్తున్న మనమందరికిని, ఈ బాధ్యతను దేవుడు అప్పగించి యున్నాడన్న సంగతి మరువకూడదు.  ఎందుకనగా మనము చీకటి సంబంధులము కాము రాత్రి సంబంధులము కాము, మనము అపవాది సంబంధులము కాము, మన తల్లి భూమి కాదు.  అయితే మనము భూమిమీద ఉన్నాము.  భూమిమీద మన ఆత్మీయ స్థితి వెలుగుమయముగా ఉండాలిగాని, చీకటిమయముగా ఉండకూడదు.  కనుక ఆత్మపూర్ణులై సిద్ధపాటుగలవారమై పరమ తండ్రియైన దైవకుమారునియొక్క రాకడ కొరకు అనగా ఆయన తేజోమయమైన వెలుగును దర్శించుటకు సమాయత్తమై, నిరీక్షణ గలవారమై యుందుము గాక!

..............

        లోకసృష్టికర్త యేసు ప్రభువే :-  కొలస్సీ 1:13-23, యోహాను 1-1-5 ప్రభువు నందు ప్రియమైనవారలారా!  పై రెండు పత్రికలను యేసు ప్రభువుయొక్క దైవ మహత్తర మర్మములను బయల్పరచుచున్నవి.

        అపొస్తలుల కార్యములు 2:35-36 విధముగా ఇశ్రాయేలు వంశమైన మనము రూఢిగా తెలిసికోవలసి యున్నది.  ఇందునుబట్టి యేసు ప్రభువు తన ప్రవచనములో యోహాను 8:58 అబ్రాహామునకు ముందే ఉన్నట్లు తెలిపి యున్నారు.  ఇందునుబట్టి యేసు అందరికిని ప్రభువుగా రోమా 14:9లో వివరించి యున్నారు.  కనుక 1 కొరింథీ 1:9లో వలె దేవుని కుమారుని సహవాసములో పిలుచు దేవుడు నమ్మతగినవాడు.

        నీతిని గూర్చి :-  ప్రభువు నందు ప్రియమైనవారలారా!  యేసుప్రభువు మాటలాడుచున్నాడు? ఏమని?  మత్తయి 5-6లో విధముగ నీతి కొరకు ఆకలి దప్పులు కల్గియుండుమని అయితే నరులమగు మన ఆకలిదప్పులు దేని కొరకు కల్గియున్నదో తెలిసికొందము.  మనము ఈ లోకముతో జాతిని ప్రేమించుచున్నాము.  జాతి కొరకు ఆకలి దప్పులు కల్గియున్నామని గుర్తించవలసియున్నది.  మన ప్రయాసలన్నియు జాతి అభివృద్ధి కోసము ప్రయాసపడుచు, జాతి మమకారములో నీతిని విడిచి, నీతిమాలిన పనులు చేయుచు, నీతికి దూరస్థులమై, నీతిని అవినీతిగా మార్చి జాతిని ప్రేమించుచున్నాము.

        నరులలో జాతులను బట్టి గౌరవించడము.  బ్రాహ్మణ, వైశ్య, క్షత్రియ, రెడ్డి, కమ్మ వగైరాలుగా విలువ కట్టి క్రైస్తవులమైన మనలను ఈ లోకములో వెనుకబడిన జాతిగను, బలహీనవర్గముగను ఎంచుచున్నాము.  ఇట్టి బలహీనతలో ఉండియు రెడ్డి, భూమి, ద్రావిడ, పాకనాటి అరవ, తెలుగు, ఉత్తరాదివాళ్ళు, దక్షిణాదోళ్ళు అను జాతి మత భేధములతో నరులు దిగజారియున్నారు.  ఇట్లు మానవులు హీనులు అవుతారని దేవునికి తెలుసా? అంటే సర్వము తెలిపిన శక్తికి పూర్వపరజ్ఞానములు లేక యుండునా?

        ఇందునుబట్టి యాకోబును ఇశ్రాయేలుగా మార్చి అతని నుండి ఒకప్రత్యేక జాతిని సృష్టించి, వారిని దేవుని ప్రజలుగా చేసి, ఆ సైన్యమునకు దేవుడు అధిపతిగా యుండి లోకపాప పరిహారార్థము నరులమైన మనకున్న కులగోత్ర వ్యామోహమును ముందే ఎరిగినవాడై, దావీదు వంశమును ఇశ్రాయేలీయుల అధిపతిగా ఈ లోకములో జన్మించి, మనకున్న విభేధములను మాని, క్రైస్తవ జీవితములో క్రీస్తులో జీవించి, క్రైస్తవ జాతిగా జీవించమంటున్నారు.  ఇందునుబట్టి ఆదిలో దేవుడు కూడా నరునిలో నీతిని స్థాపించుటకుగాను సాతానుతో యోబు 1-9 మరియు 2-3లో సవాలు వేసినట్లు ఋజువగుచున్నది.

        నేటి నరులకు ఉన్న విభేధములనుబట్టి యేసు ప్రభువు మత్తయి 23:34లో మనలను ఒక జాతిగా ఉచ్ఛరించినట్లు తెలియుచున్నది.  ఇటువంటి వారి పట్ల దేవుని నిర్ణయము రోమా 1:20-25 మరియు 26-32 చూడుము.  ఇందునుబట్టి రోమా 14-17లో పౌలు దేవుని రాజ్యములో ప్రవేశించువాని నీతిని గూర్చి తెలిపియున్నాడు.  ఇందునుగూర్చి క్రీస్తు ప్రేమ రోమా 5-6లో వెల్లడియగుచున్నది.  అయినను రోమా 3-11లో విధముగా జీవించుచున్నాము.  ఈ విధముగా నరుడు జీవించుట దుర్లభము.  ఎందుకంటే అపొ 17-31 మనుష్యులకు తీర్పుదినము ఉన్నది.  కనుక ప్రభువు నందు ప్రియమైనవారలారా! మనకు జాతికావలయునా?  నీతిని కోరు దైవరాజ్యము కావలయునా?  జాతిని ప్రేమించితే మరణము.  నీతిని ప్రేమించితే నిత్యజీవము.  రోమా 8-5-10లో శరీరానుసారమైన మనస్సు.  ఆత్మానుసారమైన మనస్సు వివరించబడి యున్నది.

        ఇందుచేత దేవుడు రోమా 4-25లో విధముగా నీతిమంతులముగా చేయ క్రీస్తుచే నిరూపించినట్లు తెలియుచున్నది.  అయితే పౌలు చెప్పిన సిద్ధాంతము రోమా 3-23లో వలె నున్నది.  కనుక ప్రభువు యొక్క కన్నులు 1 పేతురు 3-12 వలె యున్నది.

.............

        తలపైన ని తలక్రిందులు  :-   అనుకూలము  ని  ప్రతికూలము

        ప్రియపాఠక మహాశయులారా!  ఇంతవరకును దేవుడు బయల్పరచిన ఎన్నో అంశాలనుగూర్చి వేదరీత్యా తెలిసికొని యున్నాము.  ఇప్పుడు దైవత్వములో గుప్తమైయున్న అమూల్యమైన అంశాలను గూర్చి మనము తెలిసికొందము.  దేవుడు తానున్న పరలోకమునకు ధీటుగా ఉండుటకు అనగా ఆ పరలోకమునకు సమతుల్యముగా ఉండుటకు, పరము నుండి దిగివచ్చిన దేవుడు నిరాకారముగాను, శూన్యముగాను, చీకటి అగాధములో ఉన్నట్టి భూలోకమునకు జలముల మీద అల్లాడి తన వెలుగు ద్వారా చీకటి జలాలను వేరుపరచి, తానెంతో శ్రమించి ఈ భూలోకమును - ఈ లోకములోని సృష్టములను దీనికి అనుబంధముగా గ్రహాలను, నక్షత్రాలను, వాతావరణమును, వగైరా సమస్తమును దేవుడు ఆహ్లాదకరముగా రూపించి;  పరలోక సామ్రాజ్యములో దేవునికి ఏ విధముగా దేవదూతలు ఆయనను స్తుతించుచు, కీర్తించుచు, ఘనపరచుచు, మహిమపరచుచు, ఆయన చిత్తానుసారముగా కార్యక్రమాలు నెరవేరుస్తున్నారో - అలాగే ఈ భూమి మీద కూడా ఆ పరలోక సామ్రాజ్యనికి వలె కాక నూతన విధముగా అనగా చెట్టుచేమలు, బచ్చికబయళ్ళు, పర్వతశ్రేణులు, నానావిధ మృగపక్షి జంతు సముదాయముతో పరిమళభరితమైన పుష్పములను పుష్పించే చెట్ల చేమలతో - నానావిధ ఫలములతో సమ్మిళితమైన ఫలవృక్షములు నదులు తటాకములు ఒకటేమిటి? సర్వాంగ సుందరముగా పరలోకపు ఆనందానుభూతిని, తాను తన జీవాత్మతో రూపించబోయే నరునికి తన్మయాన్ని కల్గించే రీతిగా ఈ లోకాన్ని అలంకరించాడు.  ఆ విధముగా అలంకరించిన దేవుడు సృష్టి యావత్తును తనయొక్క నోటి మాటతో అనగా తనయొక్క వాక్శబ్దముతో భూమికి జీవాన్ని గల్గించి, సమస్తమును పుట్టింపజేశాడు.

         మొట్టమొదటగా భూమి దైవవాక్శక్తిని బట్టి భూమిమీద ఉన్న సకల సృష్టములకు తానే భూమి జన్మనిచ్చినట్లుగ ఆదికాండము 1:లో చదువగలము.  ఎలాగంటే దేవుడు తన నోట పల్కిన మాటయొక్క శబ్దమునకు భూమి దైవచిత్తానుసారంగా ఆయన నిర్ణయాన్ని బట్టి ఆయన పల్కిన మాటను అనుసరించి, ఆయా రూపాలలో జంతువులను మృగాలను పక్షులను కీటకాదులు అలాగే వృక్షాలను నానారకమైనటువంటి ఆహారపు గింజలను పుట్టించింది.  అదే విధముగా దేవుడు తన వాక్కును జలముల మీద ప్రయోగించగా దైవవాక్కు జీవమును బట్టి నానావిధ జలచరాలను పుట్టించింది.  ఈ విధముగా రూపించబడిన ఈ అనంత విశ్వమును ఏలుటకు దేవుడు భూమిలోనుండియే భూలోకమునకు ఏలికగా నరుని తన స్వహస్తాలతో మట్టితో రూపించి, వానికి ప్రాణప్రతిష్ట తాను సృష్టించిన యావద్‌ సృష్టికి అధికారిగాను, కాపరిగాను, నియమించాడు.  ఇట్లు కొంత కాలము జరిగిన తర్వాత దేవునికి తాను సృష్టించిన నరునిపట్ల జాలి గలిగి లోకసృష్టములకు అన్నింటికిని జతలున్నవిగాని, తాను రూపించిన నరునికి జంట లేదని విచారము కలిగి, ఆ విధముగా విచారమును పొందిన దేవుడు - తాను సృష్టించిన ఆది నరునికి ఆదాము అను పేరుపెట్టుటయే గాక అతనికి గాఢనిద్ర కల్గించి, అతని ప్రక్కటెముకలో ఒక దానిని తీసి, అతని మాంసములో కొంత భాగమును జోడించి, ఆ ఎముకను నారిగా రూపించి, ఒంటరియైన నరునికి జంటను ఏర్పరచుటనుబట్టి దేవుడు సంతుష్టుడై ఆనందించాడు.  ఆ విధముగా రూపించబడిన నారిని, నరుని ఇద్దరిని నరనారులను ఐక్యపరచిన దినమున ప్రకృతి అంతయును కూడా పరవశించింది.  చెట్లుచేమలు చల్లనిగాలులు వీచాయి.  పక్షులు కిలకిలారావములతో పెళ్ళి పాటలు పాడినాయి.  పంచభూతములు దేవుని మహిమను చాటుచు నానావిధమైన నినాదాలు చేసాయి.  ఎందుకంటే ఆనాడు భూమి మీద నూతనముగా జతపరచబడిన ఆ  నరజంటకు సాటినరులు లేరు, దాయాదులు, బంధువర్గాలు లేరు.  ఆ నరనారులు ఇద్దరు ఒకరికొకరు సహాయకులేగాని, వారికి సహాయకులు, సాటి సహాయకులు ఎవరును లేరు.  వారిని ఆరాధించి, ప్రేమతో పెంచి, పోషించి, వారి మంచిచెడు విషయాలలో జాగ్రత్త వహించి పరిరక్షించేవాడు ఒక్క దేవుడే.  

        ఈ విధముగా దేవుడు ఒక్కడు, నరుడు ఒక్కడు, నారి ఒక్కటి.  ఈ ముగ్గురి ద్వారా ఈయొక్క భూలోక సామ్రాజ్యమునకు నాంది ఏర్పడింది.  ఈ విధముగా రూపించిన భూలోక సామ్రాజ్యములో దేవుడు ఆశించింది ఒక్కటే, అదేమనగా పరలోకములో ఏ విధముగా దూతలు తనను స్తుతించి, ఘనపరచి, మహిమపరచి, ఆరాధిస్తున్నారో - ఆలాగే ఈ అనంత విశ్వములోని సృష్టములు, నరులు కూడా తనను ఆ విధముగా మహిమపరచాలని దేవుడు ఆశించాడు.  కాని దేవునియొక్క ఈ ఆశయమును నెరవేర్చుటలో నరులు, వారి క్రియలు, సృష్టి - దానిలోని సృష్టములు, పంచభూతములు, సూర్యచంద్ర నక్షత్రాదులు, వాతావరణము, సమస్తమును ఒక నరునియొక్క వ్యతిరేకతనుబట్టి, దేవుడు సృష్టించిన ఈ అనంత విశ్వములోని కార్యములన్నియును తలక్రిందులైనవి.  ఎలాగంటే నరుడు దేవుడు కలిసి జీవించినంత కాలము నరునియొక్క ఇహలోక జీవితములో ఎలాంటి ఒడిదుడుకులు, సమస్యలు, ఉపద్రవాలు, ఆటంకాలు, రోగభయాలు కలుగలేదు.  అలాగే నరుడు దేవుడు ఉభయులు కలసి దైవవనములో నివసించినంత కాలము సృష్టిలోని సమస్తము ఒక దైవిక కుటుంబముగా దేవునితో కలిసి సుఖాంతమైన జీవితాన్ని గడిపినవి.  ఈ విధముగా జీవించిన కాలములో అపవిత్రతకుగాని, అపవాదికిగాని, అంధకారశక్తులకుగాని ఎటువంటి అవకాశాలు లేక నరునియొక్క ఆత్మీయ స్థితిలో పరిశుద్ధత, పవిత్రతన్నది చోటు చేసుకొని, అతనిని సర్వ స్వతంత్రునిగ చేసింది.  

        ఇట్లుండగా దైవవ్యతిరేకియైన అపవాది పరలోకరాజ్యములో దేవునియొక్క పరిపాలనను తలక్రిందులు చేయుటకు నాటి దినమున పోరాడి, దూత గణముల చేత పడద్రోయబడి, దైవత్వముతో తనకున్నట్టి సత్‌సంబంధాలను - దైవత్వములో అపవాదికున్నట్టి ప్రధమ స్థానమును కోల్పోయి, పరిశుద్ధముగా పవిత్రముగా దైవత్వమునకు అభిముఖముగా తన కంఠస్వర మాధుర్యముతో వాయిద్య నాదముతో రంజింపజేస్తున్న లూసిఫర్‌ అను దూత తనలో  మొలకెత్తినటువంటి అతిశయము, అహంభావము, స్వార్థము, తిరుగుబాటు, పోరాటము ఈ ఐదు హేయగుణములు అతనిలో మొలకెత్తి నందువలన దేవుని దూత గణములతో మాట్లాడి, తానేగాకుండ తనకంటూ ఒక సమూహాన్ని ఏర్పరచుకొని, దూత గణములతో పోరాడి, దేవునిపై తిరుగుబాటు చేసిన ఈ లూసిఫర్‌యొక్క ఆత్మీయ జీవితము తలక్రిందులై పరలోకము నుండి పడద్రోయబడినందున, ఈ విధముగా తన జీవితమును తలక్రిందులుగా చేసికొన్న ఈ దూత దైవత్వముతో సమతుల్యముతో ఉన్నట్టి మానవ జీవితమునకు, హెచ్చింపునకు ఓర్వలేనివాడై - నరజీవితమును తలక్రిందులుగా చేయ సంకల్పించి, అందుకు తగిన సమయాన్ని గూర్చి వేచి యుండగా అట్టి అవకాశమును మొట్టమొదట నరుడు, ఆ తర్వాత సర్పము, ఆ తర్వాత నారి - ముగ్గురును ఆ తర్వాత నాలుగవది దేవుడు నిషేధించిన ఫలము, ఐదవది దేవునియొక్క పరీక్ష - ఇవన్నియును నరలోక జీవితమును తలక్రిందులగుటకు కారణమైనది.  

        1.  దేవుని పరిశోధన.  2. స్త్రీని ఒంటరి చేయుట నరునియొక్క పొరబాటు.  3.  పాములోని యుక్తిగల గుణము.  4.  దేవుడు నిషేధించిన ఫలములోని గుణగణాలు.  5.  సాతాను ప్రవేశానికి సరాళమార్గము.  6.  నారి చేతిలోని ఫలములను నరుడు తినుట.  7.  దైవనిషేధ ఫలములను నరజంట తినుట ద్వారా నరజంట దేవుని ఎదుటికి రాకుండ చెట్లచాటున దాగుకొనుట.  ఈ క్రియ ద్వారా భూలోకములో దేవుడు ఆశించినటువంటి దైవపరిపాలన అనే ప్రణాళిక తలక్రిందులైంది.  జంతుజాలము యొక్క స్వభావములు, ఒకదానికొకటి ప్రతికూలమైనటువంటి గుణాలతో అంటే ఒకదానికొకటి కరచుకొని భక్షించే నీచత్వానికి దిగజారినవి.  ఒక్కమాటలో చెప్పాలంటే సమాధానమునకు బదులు నిస్సమాధానము, ఐక్యతకు బదులు అనైక్యతయు, అనగా వాటి ఆహార విలువలు, నియమాలు కూడా మారినవి.  ఈ విధముగా దైవాత్మతో రూపించబడిన ఈ పరిశుద్ధ ప్రకృతి - వికృతి దాల్చింది.  అంతేగాకుండ పంచభూతాలలోను, దైవసృష్టములలోను, వాతావరణములోను, వికార స్వభావము ఏర్పడి అల్లకల్లోల వాతావరణముగాను, తుఫానులు, వడగండ్లు, భూకంపాలు, పిడుగుపాటు, వేడిగాడ్పులు, అనావృష్టి, అతివృష్టి,  వగైరా వికార స్థితి ఏర్పడింది.  కనుక దైవసన్నిధిలో ఇటువంటి తలక్రిందులు అనగా వికృతమైన స్వభావములు ఏర్పడగా నరుని జీవితములో కూడా తలక్రిందులైంది.  ఆవరకు సుఖాసనముగా దైవవనములోని నిరాక్షేపణముగా కడు స్వాతంత్య్రముతో విచ్చలవిడిగా మరణము, ఉపద్రవము, భయము అన్నది ఎరుగక స్వేచ్ఛాపూరిత జీవితము జీవించిన నరునియొక్క జీవితము దైవఆజ్ఞాతిక్రమము వలన తలక్రిందులై ద్వేషము, అసూయ, కామము, ఈర్ష్య, క్రూరత్వము - వీటి మూలమున సంభవించు పాపము అన్నది మొట్టమొదటగా పాపమునకు పునాది ఏర్పడింది.  దీనికి పునాది వేసినవాడు నారీగర్భము నుండి జన్మించిన నరునియొక్క తొలి ఫలమైన కయీను.

        ప్రియపాఠకులారా!  దైవసృష్టిలో సమస్తమును దేవుడు ప్రకృతిగానే అనగా తన వాక్కుతో పవిత్ర రీతిలో సమస్తమును తన వాక్శక్తి చేత భూమి చేత పుట్టించాడు.  ఈ సందర్భములో మనము ఆదికాండము 1:1-31 చదివితే పూర్తి వివరాలు తెలియగలదు.  అయితే నరునియొక్క దైవవ్యతిరేక క్రియను బట్టి దేవుడు ప్రకృతినే వికృతిగా మార్చాడు.  ఎలాగంటే భూమి నుండిగాక నాటి భూసృష్టిలో జంతుజాలములు, వృక్షజాలములు, మృగపక్షి సముదాయములు వగైరాలన్నియు, వాటివాటి జాతులను బట్టి ఆడ మగ - మగ ఆడయై యున్నటువంటి జీవరాసులను ఒకదానికొకటి దేహరీత్యా సంపర్కము ద్వారా వాటి కలయిక ద్వారా పరపరాగ సంపర్కము వీర్యబీజము నుండి సంతానోత్పత్తి కల్గింది.  ఇది వికృతి క్రియ.  ప్రకృతి క్రియ అంటే భూమినుంచే పుట్టాయి.  అయితే ప్రకృతి వికటించి, వికృతి పొందింది, కాబట్టి సృష్టిలోని జీవరాసులలోనే వాటివాటి కలయికను బట్టి ఒకదానికొకటి శారరీయుతముగా సంపర్క క్రియ ద్వారా సంతానోత్పత్తి కలిగినట్లును, ఆ విధముగా నేటి తరము వారమైన మన వరకు కూడా తెలిసిన విషయమే.  అయితే దేవుడు నరుని నిర్మించిన విధానములో కూడా ఈ వికృతి అన్నది విచిత్రరీతిలో క్రియ జరిగిస్తున్నది.  ఎలాగంటే భూమిలో నుండి నరుడు రూపించబడినాడు.  నరునిలో నుండి స్త్రీ (జన్మించింది) తీయబడింది.  ఇది దేవునియొక్క ప్రకృతి క్రియ.  అయితే నరనారులు దైవవ్యతిరేకులై దోషులైనందువలన నరునియొక్క జనన విధానములో ప్రకృతి సంబంధముగాక వికృతి ఏర్పడింది.  అనగా పురుషుని నుండి నారి పుట్టవలసినందుకు బదులుగా స్త్రీలో నుండి పురుషుడును, స్త్రీలో నుండి స్త్రీయు పుట్టవలసిన గతి ఏర్పడింది.  ఈ సందర్భములో దైవ వ్యతిరేకులైన నరజంటను శపిస్తూ మాట్లాడిన మాటలలో మొట్టమొదటగా స్త్రీకి విధించిన శాపములో ఆదికాండము 3:16, ''నీ ప్రయాసమును నీ గర్భవేదనను నేను మిక్కిలి హెచ్చించెదను.  వేదనతో పిల్లలను కందువు - నీ భర్తయెడల నీకు వాంఛ కల్గును.  అతడు నిన్ను ఏలును.''

        ప్రియపాఠకులారా!  అంతకుముందు ఇట్టి బాధాకరమైనటువంటి జీవితము స్త్రీకి లేదు.  అనగా ప్రసవవేదన ఎరుగదు.  గర్భవేదనన్నది లేదు, భర్త యెడల కామేచ్ఛలతో కూడిన వాంఛ (కోరిక) కూడా లేదు. అంటే లోకధర్మసిద్ధమైన ఏ స్వభావము ఆమెలో లేదు.  అంటే దైవసృష్టమైన సర్పపు మాటలు విని దైవత్వమునకు ఇవ్వవలసిన మహిమను, దైవత్వము పట్ల చూపవలసిన కృతజ్ఞతను విస్మరించి, సర్ప మాటలకు చెవినిచ్చి, దానికి ఆకర్షితురాలైనందునను, అంతేగాక దాని మాటలకు విధేయించి అది చేయమన్న కార్యమును చేసినందువలన, స్త్రీయొక్క జీవితము వక్రించి, వికటితమై, కామేచ్ఛలతో పురుషుని కలయిక ద్వారా గర్భము ధరించి బిడ్డలు కనే బాధాయుతమైన స్థితికి స్త్రీ దిగజారింది.  ఒక పురుషుని విషయములో ఆదికాండము 3:17, నీవు నీ భార్యమాటవిని తినవద్దని నేను నీకు ఆజ్ఞాపించిన వృక్షఫలములను తింటివి గనుక నీ నిమిత్తము నేల శపించబడియున్నది.  అనగా నీ నిమిత్తము ప్రకృతి వికృతియైనది - సృష్టి వక్రించిందని దీని భావము.  అందునుబట్టి జరిగే క్రియ ఏమిటంటే, ఆ వరకు పరిశుద్ధమైనదిగాను, దేవునియొక్క కండ్లకు నేత్రపర్వము, ఆకర్షణీయమై దేవుని మహిమపరచేది, ఆహ్లాదకరమైన, పరిశుద్ధమైన ప్రకృతికి మూలకారకమైన భూలోకము నరునియొక్క దైవ ఆజ్ఞాతిక్రమణను బట్టి వికృతియై, తన సారమును కోల్పోయినదై శపించబడినది.  ఆ వరకు నరునికి నానావిధమైన, మధురమైన, సునాయాసమైన, మధురఫలాలను అనుగ్రహించిన భూమి ముండ్ల తుప్పలను, గచ్చపొదలను మొలిపించుటయు, నరుడు  ప్రయాసతో భూమిని దున్నితేనేగాని, పొలము పంట పండుటయును, నరునియొక్క జీవితము మరణావస్థకు దిగజారినప్పుడు, అనగా నరుని శరీరము నేలకు చేరువరకు నరుడు ముఖపు చెమట కార్చి, ఆహారము తినునట్లును, ఎందుకనగా నరుడు నేలనుండి తీయబడెను మన్నే గనుక తిరిగి మన్నయి పోదువు, అని నరునితో దేవుడు చెప్పెను.  కనుక నరజీవితములో సమస్తము వికృతరూపము దాల్చినట్లు తెలుస్తున్నది.  నరజంటను మోసగించిన సర్పమునకు ఏర్పడిన వికృత స్వభావమును గూర్చిన వివరము 3:14, దేవుడైన యెహోవా సర్పముతో నీవు దీని చేసినందున పశువులన్నిటిలోను భూజంతువులన్నిటిలోను నీవు శపించబడిన దానవై నీకడుపుతో ప్రాకుచు నీవు బ్రతుకు దినములన్నియు మన్నుతిందువు.  మరియు నీకును స్త్రీకిని, నీ సంతానమునకును ఆమె సంతానమునకును వైరము కలుగజేసెదను. అది నిన్ను తలమీద కొట్టుచు - నీవు దానిని మడిమె మీద కొట్టుదువని చెప్పెను.''

        కనుక ప్రియపాఠకులారా!  సర్పము యొక్క జీవితములో ''కడుపుతో ప్రాకుచు మన్నుతిందువు, అనుటలో సర్పముయొక్క రూపము, సర్ప స్వభావము, దాని గుణలక్షణములు, సమస్తమును వక్రించినందు వలననే దైవ సృష్టిలో సహజముగా దానికున్న కాళ్లు, రెక్కలు పోగొట్టుకొని నరునితో సమానముగా ఒక చెట్టు మీద నుండి మరియొక చెట్టుకు ఎగురుచు, కాళ్ళతో నడుచుచు, కొమ్మలను ఎక్కుచు, స్వేచ్ఛా విహారము చేయుచున్న సర్పము కూడా తాను ఆవరకు నరునితో సహజీవనము చేస్తూ - దైవవనములో విహరిస్తున్న సర్పము, పిశాచి ఆవేశితమై చేసిన దైవవ్యతిరేక క్రియలనుబట్టి అనగా దైవనిషేధ ఫలమును నరులచేత తినిపించుటనుబట్టి, నరులను దైవ ఆజ్ఞాతిక్రమణ చేసినవారినిగా అనగా దైవదోషులుగా చేసినందువలన, సర్పజీవితము కూడా ప్రకృతి సిద్ధము నుండి వికృతమునకు మార్చి, కాళ్ళు, రెక్కలు కోల్పోయి, ఆవరకు లేనట్టి విషపదార్థమును తన కోరల యందు చోటుచేసుకొనగానే ఆ సర్పము వికలాంగమై, వికృతమై, వికార స్వభావము పొంది, పొట్టతో ప్రాకుచు సృష్టిలో నిర్భయముగా సంచరించుచున్న ఆ సర్పము మట్టిని ఆశ్రయించి, పుట్టలలో దాక్కొంటూ పిరికితనము, భయము, నరునితోను, ప్రకృతితోను శతృత్వము ఏర్పడి, దినదినము మరణభీతితో ఒంటరి జీవితాన్ని జీవిస్తూ నిర్జన ప్రదేశములో తిరుగుచు, భయానక జీవితము జీవించే స్థితికి సర్పముయొక్క జీవితము దిగజారింది.  ఈ విధముగా సృష్టిలోను, సృష్టములలోను, ప్రకృతిలోను, వాతావరణములోను, పంచభూతాలలోను, దైవత్వములోను, నరునియొక్క జీవితము దుర్భరమైన స్థితిలో దిగజారుచు, తలక్రిందులైనట్టి జీవితములో నాటి నుండి నేటివరకు జీవిస్తున్న నరుని గూర్చి దైవవాక్కు ఇచ్చే హెచ్చరిక ఈ సందర్భములో ప్రకటన 3:14-19 ఆమేన్‌ అనువాడును నమ్మకమైన సత్యసాక్షియు, దేవుని సృష్టికి ఆదియునైనవాడు చెప్పు సంగతులేమనగా - ''నీ క్రియలను నేనెరుగుదును, నీవు చల్లగా నైనను వెచ్చగానైనను లేవు, నీవు చల్లగానైనను వెచ్చగానైనను ఉండిన మేలు.  నీవు వెచ్చగానైనను చల్లగానైనను ఉండక, నులివెచ్చగా నున్నావు గనుక నేను నిన్ను నా నోట నుండి ఉమ్మివేయ నుద్ధేశించుచున్నాను,'' నీవు దౌర్భాగ్యుడవును, దిక్కుమాలినవాడవును, దరిద్రుడవును, గుడ్డివాడవును, దిగంబరుడవునై యున్నావని యెరుగక - నేను ధనవంతుడను, ధనవృద్ధి చేసియున్నాను, నాకేమియు కొదువలేదని చెప్పుకొనుచున్నావు?  నీవు ధనవృద్ధి చేసికొనునట్లు అగ్నిలో పుటము వేయబడిన బంగారమును, నీ దిసమొల సిగ్గుకనబరచకుండునట్లు ధరించుకొనుటకు తెల్లని వస్త్రములను, నీకు దృష్టికలుగునట్లు నీ కన్నులకు కాటుకను, నా యొద్ద కొనుమని నీకు బుద్ధి చెప్పుచున్నాను.  నేను ప్రేమించువారిని గద్దించి శిక్షించుచున్నాను.  కనుక నీవు ఆసక్తి కలిగి మారు మనస్సు పొందుము.''  ఈయొక్క వేదవచనాలను బట్టి నరుని యొక్క దౌర్భల్యము దిక్కుమాలిన స్థితి, దారిద్య్రము, గుడ్డితనము, దిగంబరత్వము, అహంభావములను గూర్చి వివరించబడి యున్నది.

        కనుక ప్రియపాఠకులారా!  దేవుడు నిషేధించిన మంచి చెడు వివేకమిచ్చు ఆ వృక్షము ఆహారమునకు మంచిదియు, కన్నులకు అందమైనదియు, వివేకమిచ్చు రమ్యమైనదియునైన ఆ వృక్షఫలముల లక్షణాలన్నియును బాగున్నవి.  దానిని తిన్న నరజంట జీవితము తలక్రిందులైంది.  ఎలాగంటే ఆదినరులు ప్రత్యక్షముగా సృష్టికర్తయైన దేవుని కనులారా చూచి ఆయన స్వరమును వింటూ - ఆయనతో సఖ్యత గల్గి జీవించిన స్థితిని మరచి, దైవనిషేధ ఫలమును తిన్న వెంటనే వారికి, నిషేధఫలమును తినుము అని ప్రేరేపించిన సర్పము వారి దృష్టికి దేవునిగా కనబడినందువల్ల యావద్‌ సృష్టికిని మూలకారణమైన దేవుని విస్మరించి, యావద్‌ సృష్టికిని కారణము సర్పమేయని, నాటినుండి నేటివరకు సర్పమే దేవుడని, ఆదినుంచి ఆరాధించే జనాంగమున్నదంటే - ఇది తలక్రిందుల జీవితానికిని, ఆరాధనకును, ఆత్మీయ వికారమునకు ఋజువులు కావా?  అంటే దేవుడు తినవద్దన్న నిషేధఫలమును తిన్నందువలన నరుని జీవితములో ఆత్మీయ వికారమేర్పడి అదృశ్యమైయున్న శక్తుల్ని ఆరాధించుటకు బదులు, దృశ్యమైయున్న సృష్టములను ఆరాధించే దౌర్భల్యము హీనస్థితి ఏర్పడింది.  ఈ విధముగా నరుడు చేసిన దైవఆజ్ఞాతిక్రమణ మూలమున నరునియొక్క ఆరాధనలోనేగాక, నరునియొక్క ఆత్మీయ జీవితములో - తలక్రిందుల వాతావరణము, ప్రకృతి తలక్రిందులు, వాతావరణము తలక్రిందులు, పంచభూతాలు తలక్రిందులు, అనగా ఒక దానికొకటి ప్రతికూలములైనవి.  జంతుజాలములోను, మృగపక్షి సముదాయములలోను ఐక్యతకు బదులు ఒకదానికొకటి ద్వేషము, అసూయతను పెంచుకొని, సృష్టిలోని జీవరాసులు ఒకదానినొకటి చంపుకొని తింటూ - శాకాహార, మాంసాహార జంతువులుగ విభాగింపబడి తలక్రిందుల జీవితమైంది, ఇట్టి తలక్రిందుల జీవితమును దేవుడు భూమి మీద తాను ఆశించినటువంటి దైవ సామ్రాజ్యముయొక్క పరిపాలనా విధానము పై విధముగా తలక్రిందులైనందున నరులను చేసినందుకు దేవుడు సంతాపపడినట్లుగ వేదములో ఆదికాండము 6:6లో చదువగలము.

        ఆ విధముగా సంతాపపడుటయేగాక నరులను సృష్టించినందుకు దేవుడు ఉగ్రుడై యావద్‌ సృష్టిని భూమి మీద ఉండకుండ తుడిచివేసే ప్రణాళికను ఏర్పరచుకొని, ఈ ప్రణాళికను అమలు పరచుటకు ప్రణాళికను రూపాందించి, ఆనాటి జనసమూహములో నీతిమంతుడైన నోవహు అను విశ్వాసిమీద దృష్టి నిలిపి, అప్పుడున్న సృష్టి యావత్తును తుడిచి, రెండవ సృష్టికి నోవహును, అతని కుటుంబాన్ని ఆదినరులుగా ఏర్పరచుకొని, అతని రక్షణార్థము అతనికిని, అతని కుటుంబానికి, అప్పటి సృష్టిలోని జంతుజాలమునకును, సమస్త జీవులకును, రక్షణ గృహముగా నోవహు చేత సిద్ధము చేయించి, తద్వారా దేవుడు తాను జరిగించ తలచుకొన్న జలప్రళయ మారణహోమమును సంపూర్ణముగా నెరవేర్చి, భూమి మీద నోవహు ఓడలో ఉన్న నరులు, సృష్టములు తప్ప ఏదియు లేకుండ శూన్యమగునట్లు తుడిచివేయగా - అరారాతు కొండల మీద నిలిచిన ఓడ నుండి పునఃసృష్టిని చేయ సంకల్పించి, సృష్టి నిర్మాణ కార్యక్రమము ప్రారంభమైంది.  అయినను నరులలో సర్పబీజము, సర్పప్రభావము, సర్పఆరాధన, సృష్టములకు కొలువులు, సృష్టి ఆరాధన అన్నటువంటి బీజము మాత్రము చావలేదు.  అయినను దేవుడు తాను రూపించిన పునఃసృష్టిలో నీతిమంతుల గుంపును చూడాలని ఆశించాడు.  ఇది దేవుడు నరులపట్ల కోరినట్టి ఆత్మీయ ఫలములు.  అయితే నరులు ఆత్మీయ ఫలములకు బదులు శారీర ఫలములు ఫలించి, శారీర ధర్మాలు నెరవేర్పుచు, శారీరానుసారముగా ప్రవర్తిస్తూ - దృశ్యమైన వాటియందే మనస్సు నిలిపి, దృశ్యమైన వాటినే ఆరాధిస్తూ అదృశ్యమైన వాటిని ఖాతరు చేయక, అదృశ్యములోని మహత్తరశక్తిని, ఆత్మశక్తిని గూర్చిన పరిజ్ఞానమును విస్మరించి, సమస్త శక్తులు భూమికే ఉన్నాయని, అవి అన్నియు గుప్తమైయున్నాయని భూమికి మించిన శక్తిలేదని, భూమిని ఆరాధించే స్థితికి నరులు దిగజారినారు.  ఈ విధముగా నీతిమంతునిగా భూమి మీద దేవుడేర్పరచుకొన్న నోవహు అతని కుటుంబము, దైవత్వమునకు ప్రీతికరమైన కుటుంబముగా ఉన్నను, దేవుడు ఏ నోవహునైతే నీతిమంతునిగా భూమి మీద ఎన్నిక చేశాడో - అదే నోవహు ఆదాము వలెనే భూఫలముల ద్వారా అనగా భూఫలరసమైన ద్రాక్షరసముతో మత్తుడై, దైవత్వాన్ని వదలి, మొలమీద బట్టలేక దిగంబరియై, దైవత్వములోని పూర్వజ్ఞానమును మరచి, తన జీవితమును తలక్రిందులు చేసుకొన్నాడు.  అనగా తన కుమారులే తన దిసమొల మీద గుడ్డ కప్పవలసిన హీనత్వానికి దిగజారినాడు.  ఇది నీతిమంతుడైన నోవహుయొక్క తలక్రిందుల జీవితము.         

        ఈ విధముగా తలక్రిందుల స్థితిలో ప్రారంభమైన ఈ అనంత విశ్వముయొక్క జీవిత విధానములో అనేకమైన ఒడిదుడుకులు ప్రారంభమై, మరల నరులు తమ దైవత్వమును గుర్తించలేక లోకమును దేవతగాను, లోకసృష్టములను దేవుళ్ళుగాను ఆరాధించుచు, అజ్ఞాన దశలో తలక్రిందుల జీవితము జీవిస్తున్న సందర్భములో దేవుడు నరులకు మరొక అవకాశమిస్తూ - ఈసారి సృష్టిని నాశనము చేయు ప్రణాళిక కాక తనయొక్క నిజత్వాన్ని నరులకు బయల్పరచుటకు ఇశ్రాయేలు అను ఒక జనాంగాన్ని ప్రత్యేకించి, ఒక వ్యక్తి నుండి 12 మంది కుమారులను పుట్టించి 12 గోత్రాలుగ ఏర్పరచి వారి ద్వారా ఒక ప్రత్యేకజనాంగాన్ని పుట్టించాడు.  ఈ జనాంగము కూడా లోకవ్యసనాలకు లోకసంబంధమైన భుక్తికి దాసులై దైవత్వమును మరచి, లోకసంబంధులుగా జీవించగా దేవుడు వారిపట్ల ఆగ్రహించి అన్యులచేతికి అప్పగించి, చెరపెట్టగా ఆ బాధకరమైన వాతావరణములో మాత్రము వారు దేవునియొక్క అనుగ్రహాన్ని, ఆయన రక్షణ కోరి తమ స్వార్థము కొరకు ప్రార్థించి, దేవుని ద్వారా మేలు పొందిన తర్వాత ఆ మేలులను మరచి యదావిధిగ లోకముతో చేతులు కలిపి జీవించు తలక్రిందుల జీవితములో ఉన్న జనులను దేవుడు సహించలేక వారిని తన పరిధిలో ఉంచకూడదన్నట్లు దశాజ్ఞలు అనే పది శాసనములు గల రాతిపలకలను, దైవ శాసనములుగాను, దేవునియొక్క శక్తి ప్రతీకలుగాను, ఒక పెట్టెలో మందసము అను పేరుతో భద్రపరచి, ఈ మందసమునకు దేవుడు ప్రభావమిచ్చి, తద్వారా తనయొక్క క్రియ, తనయొక్క శక్తి తన మహిమను కనబరచుచు, నాటి ఇశ్రాయేలు జనాంగములో క్రియజరిగించిన విధానము మనకు తెలిసిందే!

        ఈ విధముగా దేవుడు క్రియజరిగించినను నరునిలో ఈ తలక్రిందుల జీవితము మారలేదు.  దేవునియొక్క ప్రణాళికలు ఎంత తీవ్రంగా అమలు జరిగించిందో అంతకు రెట్టింపుగా తలక్రిందులైనటువంటి అపవాదియొక్క వ్యతిరేక గుణాలు కూడా క్రియ జరిగిస్తున్నాయి.  ఇందునుగూర్చి రోమా 1:21-32 మనము ఇందులోని లేఖన భాగాలను మనము చదివితే జీవాత్ముడైన నరునియొక్క ఆత్మీయస్థితి ఎంత తల క్రిందులై క్రియజరిగిస్తున్నదో మనకు తెలియగలదు. ఈ తలక్రిందులన్నవి నేటికిని క్రియ జరిగిస్తూ - ఈ తలక్రిందులైనటువంటి స్వభావ సిద్ధమైన జీవితములో జీవిస్తున్న నరులయొక్క క్రియావిధానము కూడా వారి ఆత్మీయ బలహీనతలు కూడా - ఈ క్రింది నామధేయాలతో తలక్రిందులైన గుణాతిశయములతో క్రియ జరిగించుటకు గూర్చి తెలిసికొందము.  ఇందులో మొదటిది  1.  అజ్ఞానము - ఇది పాతనిబంధన కాలములోవలె వంశపారంపర్యముగా నరునిలో ఎంత జ్ఞాన వికసింపు గల్గి వృక్ష సంబంధము, జంతు సంబంధము, భౌగోళిక సంబంధము, వాతావరణ సంబంధము, గ్రహాల పరిశోధన, భూగర్భములో పరిశోధన - భూగర్భములో గుప్తమైయున్న నిధులను గూర్చి అన్వేషణ, యంత్ర పరిజ్ఞానము, నరుని ప్రమేయము లేకుండా సాటి నరులను పొరుగుదేశాలను నాశనము చేసేటటువంటి భీకరమైన ప్రాణాంతకమైన ఆయుధ ఉత్పత్తులు, నానావిధ యంత్ర సామగ్రి సాధనాలు వాహనాలు ఒకటేమిటి? నానారీతులుగ నరుని జ్ఞానము అభివృద్ధి చెంది, మూడు పువ్వులు, ఆరు కాయలుగ క్రియ జరిగిస్తున్న ఈ దినాలలో కూడా - ఈ విగ్రహారాధనన్నది క్రియ జరిగిస్తున్నది.  ఈనాడు యమ్‌.ఏలు, బి.ఏలు, వైద్యశాస్త్రము, న్యాయశాస్త్రము, సాంకేతిక శాస్త్రము, వగైరా నానావిధ శాస్త్రాలు అభ్యసించిన వేదవిద్వాంసులు సహితము - ఈ నిర్జీవమైనటువంటి విగ్రహాలను ఆరాధించు భక్తులైయున్నారంటే, వారి ఆత్మీయ బలహీనత స్థితి ఎంత దిగజారియున్నదో మనకు అర్థము కాగలదు.  

        అలాగే హేతువాదము నాస్తికత్వము - ఇవి అసలు దేవుడే లేడన్న సిద్ధాంతముతో జీవిస్తూ - ఈ హేతువాదులు, నాస్తికులు అనబడే జనాంగము కేవలము - ''లోకము, నరుడు, మరణము.  ఈ మూడింటి మీదనే వారి జీవిత విధానము పరిమితమై, చచ్చినవాని జీవితము సమాధితో అంతమనియు, వేరొక లోకము లేదనియు, నరుని జన్మ - కోతి జన్మ ఒక్కటేనన్న సిద్ధాంతములతో వెర్రితలలు వేస్తున్న జ్ఞానమునకు వత్తాసు పలికే ఇట్టి జనమున్నది.  ఇక మూడవతరగతి వారు - వీరు దైవత్వములో గురిలేనివారును, దైవత్వములోని సత్యమును ఎరుగని స్థితిలో ఉండి, ప్రతిదానిని దైవత్వముగా భావించి ఆరాధించు వారు.  ఇట్టివారికి ఒక్క దేవుడన్న సిద్ధాంతము లేదు.  జంతుజాలాన్ని, చెట్లను, పుట్టలను, పాములను, సూర్యుని, చంద్రుని, నక్షత్రాలను, అగ్నిని, గాలిని, నీళ్ళను, మేఘాన్ని, తుదకు వారి గృహములో ఉన్నట్టి ఇనుప పెట్టెను, వారి గాటిలో ఉన్న ఆవును, దేవుళ్ళుగా పూజిస్తూ - అవే తమను ఉద్ధరించి మోక్షాన్ని చేరుస్తాయన్న మూఢభక్తిలో జీవించే రకాలు.  ఇక నాలుగవ తరగతివారు దైవత్వాన్ని గోరీలతో పోల్చి ఆరాధిస్తూ, సమాధులకు దండము పెట్టే మూడభక్తులున్నారు.  నిన్న, నేడు, రేపు మూడు కాలాలలోను ఏకరీతిగా సజీవుడుగా ఉన్న దేవుని సమాధియైన వారి జాబితాలో చేర్చి ఆరాధించుటన్నది ఎంత బుద్ధిహీనతయో అనిన సత్యాన్ని ఎరుగ&