సాటి సహాయిని

(దైవసన్నిధిలో స్త్రీకి ఉన్న ప్రాధాన్యత)

గ్రంథకర్త : శేఖర్‌రెడ్డి వాసా

www.FaithScope.com

నీ మరణానంతరము నీ ఆత్మ ఎక్కడ వుండబోవుచున్నదో నీకు తెలుసునా?

మూలము

రెడ్డిపాళెం గ్రామములోని నా ప్రభువు తల్లి ఉపదేశములు మరియు ఆమెను ఆవరించిన పరిశుద్ధాత్మయొక్క జ్ఞాన సహాయమే ఈ పుస్తక రచనకు మూలాధారము.

అంకితము

ఈ అవకాశాన్ని నాకు అనుగ్రహించి నన్ను ప్రేమించిన క్రీస్తు ప్రభువుకు అంకితమిస్తున్నాను. -  వాసా శేఖర్‌రెడ్డి

Contents

పరిచయ వాక్కులు        

1.  క్రీస్తు పుట్టుక, పునరుత్థానము - స్త్రీల గొప్పతనము        

2.  అమ్మ లేక తల్లి స్థానము        

3.  ప్రవక్త్రినిగా అత్యున్నత స్థానములో స్త్రీ        

4.  న్యాయాధిపతులుగా స్త్రీలు        

5.  స్త్రీకి గుర్తింపు  . . .  (భూమిపై)        

6.  స్త్రీలు - ప్రార్థించుట - ఉపవాసములు ఉండుట        

7.  సంఘములో స్త్రీల సంగీత నాట్యములు        

8.  ఆలయము - పనివారుగా స్త్రీలు        

9.  స్త్రీలు బోధించుట        

10.  కుమారులు కుమార్తెలు దేవుని సందేశమును చెప్పుట        

11.  స్త్రీ - పవిత్రాత్మ ప్రభావము        

12.  ప్రార్థనా కూడికలు - స్త్రీల ప్రాధాన్యత        

13.  స్త్రీ - ముసుగు ఆచారము        

14.  సంఘ సమావేశము - స్త్రీలు మాట్లాడుట        

15.  దేవదాసి చట్టము        

16.  నాజీరు వ్రతము - స్త్రీలు ఉండవలసిన తీరు        

17.  మాంత్రికురాలుతో సంబంధములు        

18.  వేశ్యా వృత్తిలో . . . . . స్త్రీ        

19.  సాటి సహాయిగా స్త్రీ యొక్క పుట్టుక        

20.  ఒక స్త్రీ ఏ విధముగా సాటి సహాయి?        

21.  సాటి సహాయి - దైవజనుడు        

22.  దేవుని పది ఆజ్ఞలు - సాటి సహాయిగా స్త్రీ        

23.  సాటి సహాయిగాని పురుషుడుగాని ఊరికి దూరముగా ఉండవలసిన రోజులు  . . .        

24.  వీరు సాటి సహాయిగా తగరు        

25.  వివాహమునకు వధూవరుల ఎన్నిక        

26.  వివాహములో జాతులు గోత్రాల లెక్కలు        

27.  నిశ్చితార్థము        

28.  తల్లిని విడనాడు తనయుడు        

29.  వివాహము        

30.  జాతి గోత్రములు మార్చి వివాహమాడువారు        

31.  వ్యభిచారిణితో వివాహము        

32.  వివాహము - యుగాంతము        

33.  వివాహ మహోత్సవము - జరగవలసిన స్థలము        

34.  క్రొత్తగా వివాహము చేసుకొన్న జంట విధి        

35.  స్త్రీ పురుషుల కలయిక        

36.  స్త్రీ పురుషుల కలయిక అనంతరము కొన్ని నియమములు  . . .        

37.  ఇప్పటికే వివాహ స్థితిలో పై వలె కాక జీవించువారి ధర్మము        

38.  భార్యాభర్తలు ఉండవలసిన తీరు        

39.  వైవాహిక జీవితములో ఏకశరీరముగా జీవించువారికి కలుగు లైంగిక శోధన        

40.  స్త్రీ - తన భర్తపై వాంఛ        

41.  స్త్రీ - జన్మనిచ్చుట        

42.  ప్రసిద్ధులైన పురాతన వీరులకు జన్మనిచ్చిన నరుల కుమార్తెలు        

43.  ప్రసవ వేదన - శుద్ధీకరణ ఆచారము        

44.  తల్లి పాలు        

45.  పసిపిల్లలు        

46.  తల్లిదండ్రులు - పిల్లలు        

47.  పిల్లలు - ఒలీవ పిలకలు        

49.  సాతాను పిల్లలు        

50.  ముట్టు        

51.  గొడ్రాలు        

52.  గొడ్రాలు సంతోషించు దినములు        

53.  భార్యాభర్తల బంధము - కాలపరిమితి        

54.  ఫలించు ద్రాక్షావల్లిగ భార్య జీవితము        

55.  బలహీనమైన ఘటము భార్య        

56.  వితంతువులు        

57.  భర్తపై అధికారము సలుపు స్త్రీ        

58.  భార్యాభర్తలు కీచులాడుకొంటూ ఇలా ఎంత కాలము ఉండాలి?        

59.  విడాకులు (భార్యాభర్తలను విడదీయు పత్రము)        

60.  ఉపపత్నులు (మారు వివాహములు)        

61.  ఎదుటివాని భార్య        

62.  మానభంగము        

63.  వ్యభిచారము, విగ్రహారాధన, త్రాగుడు, దొంగతనము వంటి మహా దారుణమైన పాపములు - శిక్ష        

64.  పాపములలో వ్యభిచారము ప్రత్యేకమైనది        

65.  పర స్త్రీని పరకించుట        

66.  స్త్రీ స్త్రీతో  . . .  పురుషుడు పురుషునితో  . . .        

67.  స్త్రీ వస్త్రములు - పురుష వస్త్రములు        

68.  స్త్రీలు - వడ్డి వ్యాపారము        

69.  స్త్రీలు - ఆచారాలు        

70.  ఈ లోక దైవరాజ్యము - స్త్రీల బాధ్యత        

71.  నిజదైవమును ఎరుగని ప్రజలలోని స్త్రీలు        

72.  నిజదైవమును ఎరుగని స్త్రీలు - దైవజనుల పతనమునకు కారణము కూడ  . . . . .        

73.  నా కుటుంబములోని దోషము        

74.  కుటుంబము దరిద్ర స్థితికి కారణము        

75.  యోగ్యమైన గృహము        

76.  క్రీస్తు ప్రభువుతో బంధుత్వము        

77.  ఆస్తిని కూర్చు బాధ్యత        

78.  భార్య / కూతురు దేవునికి మ్రొక్కుకొనుట        

79.  దైవజనులను మరణము నుండి తప్పించుటకు అబద్ధమాడి నీతిని పొందిన . . . స్త్రీ        

80.  ధన్యురాలైన స్త్రీ తన జీవితమును వెళ్ళబుచ్చు తీరు  . . . . .        

81.  స్త్రీ తెలివిని పొందు విధానము        

82.  మన జీవితములో ఉత్తమమైనది        

83.  స్త్రీ - మారుమనస్సు        

84.  ప్రేమకు హద్దులు        

85.  మూర్ఖపు స్త్రీ లక్షణములు (సామెతల గ్రంథము నుండి)        

87.  స్త్రీలారా! / పురుషులారా!  మీ శరీరములో ఇవి యెహోవాకు అసహ్యమైనవి        

89.  జారస్త్రీని గూర్చి సొలొమోను సామెతలు        

90.  భార్య పోరు లేక సాటి సహాయి పోరుపై సొలొమోను సామెతలు        

91.  ప్రసంగి ఆలోచనలో స్త్రీ        

92.  వృద్ధులైన తల్లిదండ్రులు        

93.  వృద్ధులైన స్త్రీలు ఉండవలసిన తీరు        

గ్రంథ సారాంశము        

చివరిగా ఒక మాట        

పరిచయ వాక్కులు

        దేవునికి సాటి సహాయమున్నదా?  

        ఆదికాండము 1:26 దేవుని పోలికె ఆయన స్వరూపములో సృష్టించబడిన ఆదినరునికి సాటి సహాయినిని అనుగ్రహించినప్పుడు దేవునికి కూడ సాటి సహాయమున్నదని గ్రహించాలి.  దేవునికి సాటి సహాయము పరలోక భూలోకాలు అనగా అనంత విశ్వము, ఇందులో ఏడు ఆకాశాలు అంతేగాక మహాకాశాలు దేవుని నక్షత్రాలు సభా పర్వతము వగైరా సమస్తము దేవుని సాటి సహాయమని గ్రహించాలి.

        యేసుక్రీస్తు యొక్క సాటి సహాయము తన రక్తముతో కడగబడి శుద్ధీకరించబడిన పరిశుద్ధ సంఘము, ఇదియే వధువు సంఘము గొఱ్ఱెపిల్ల భార్య.

        పవిత్రాత్ముని భార్య ఎవరు?  యేసుక్రీస్తు తల్లియైన కన్య మరియమ్మగారు.  యేసుక్రీస్తు యొక్క దివ్యరూపము పరిశుద్ధాత్మ వలన మరియ గర్భములో రూపించబడింది.  ఆ మరియ శిశువును తన గర్భమున భరించుటకు ఏ విధమైన శరీర బలహీనతలకు లోను గాకుండుటకు సర్వోన్నతుని దివ్యశక్తి ఆమెను ఆవరించి ఆమె యొక్క శారీర ఆత్మీయ జీవితాలను మరెక్కువగా బలపరచినట్లు లూకా 1:35 వివరిస్తుంది.

        పరమాత్మ ఆదాము యొక్క ఎముక దానిని అంటియున్న రక్తమాంసాదులతోను ఆదాము జీవములోను భాగము తీసుకొని స్త్రీని ఏర్పరచినట్లే పరమాత్మ కూడ తన ఆత్మలోని కొంత భాగమును విడదీసి, ఈనాడు మనకు కనబడుచున్న ఈ సమస్తమును అంతేగాక అదృశ్యములో ఆత్మలు నివసించు పరలోకమును పరమాత్మకు నివాస యోగ్యముగా భూలోకములో వలెనే కొండలు లోయలు నదీనదములు బంగారు వజ్ర వైఢూర్యములు వృక్షజాలము రాజ వీధులు సింహాసనాలు వగైరా సమస్త వైభవముతో పరలోకమును సృష్టించి దానిని తనకు ఇష్టమైన అనగా ప్రకటన 12:1లో వలె లోక నక్షత్రాలతో గాక దేవుని నక్షత్రాలతోను చంద్ర కళాకాంతులతోను, అత్యంత విశాలమైన తేజో ప్రాభవములతో నిండిన సభాపర్వతమును సృష్టించుటయేగాక, మానవ విజ్ఞానానికి వాని ఊహలకు అందనట్టి ఆకాశ మహాకాశాలను సృష్టించి పరలోక సామ్రాజ్యమంతటిని ప్రకటన 2:17లో వలె పాలవంటి నిగనిగలాడుచు ప్రకాశించు తెల్లని రాళ్లతో అలంకరించి ఆ పరలోకమును తనకు సాటి సహాయినిగా చేసుకొని, ఆ పరలోకములో తన సింహాసనాన్ని ప్రతిష్టించుకొని, భూమిని తన పాదపీఠముగా చేసుకొని ప్రస్తుతము భూలోకాన్ని నిరాకారముగాను అనగా ఏ అలంకారాలు లేకుండ వదలివేసినట్లు ఆదికాండము 1:2 వివరిస్తున్నది.  ఇది దేవుడు ఎప్పుడు తాను ఆదియై యున్నాడో అప్పటి భూమియొక్క ఈ లోక స్థితియని చెప్పవచ్చును.

        అయితే ఆదాము ద్వారా లోకములో జనసంతతులను నింపుటకు పరమాత్మ ప్రయత్నించినప్పుడు యెషయా 6:3లో చెప్పబడినట్లు సర్వలోకమును పరమాత్మ తన మహిమతో నింపియున్నాడు.  ఇందునుబట్టి ఈ విశాల ప్రకృతియే పరమాత్మ యొక్క సాటి సహాయమని తెలుస్తున్నది.

        పరమాత్మ తన ఆత్మను క్రీస్తు యొక్క జీవముతో ఐక్యపరచి నరుని నాసికా రంధ్రములలో ప్రవేశ పెట్టినందున నరుడు జీవాత్మ కలిగినవాడాయెను.  సమస్త జీవరాసులను భూగర్భమునుండియు జలగర్భమునుండియు సృష్టించాడు.  ఒక్క నరుని మాత్రమే క్రీస్తు యొక్క జీవమును పరమాత్మ యొక్క ఆత్మ అణువును జతపరచి ఏకము చేసి నరుని సృష్టించినట్లు ఆదికాండము 2:7 వివరిస్తున్నది.  అంటే యేసుక్రీస్తు యొక్క దివ్య జీవమును నరునియొక్క నాసికారంధ్రములలో ప్రసరింపజేయగా ఆ జీవము పరమాత్మ యొక్క ఆత్మ అణువును ఆకర్షించి జీవాత్మగా మారింది.  కనుక యేసుక్రీస్తు యొక్క సాటి సహాయమే నరులని తెలుస్తున్నది.  ఎందుకంటే యేసు యొక్క జీవవాయువులోను జీవవృక్షములోను జీవాహారమైన ఆయన దివ్య శరీరమే పరలోకపు మన్నాగాను మరియు జీవజలములోను భాగస్వామిలగుటయేగాక యోహాను 1:4 యేసయ్యలోని జీవము మనుష్యులకు వెలుగై యున్నందున ఆయనే మనకు నిత్యజీవము దయ చేయుచుండుట వలన యేసు యొక్క సాటి సహాయము ఆయన రక్తములో శుద్ధి చేయబడిన పరిశుద్ధుల సంఘమని, అదియే వధువు సంఘమనియు ఈ లోకములో ఎంత మగధీరుడుగా జీవించినను హవ్వ చేతిలోని దైవ నిషేధఫలములు తిని స్త్రీకి వశుడైనందున వధువు సంఘములో చేర్చబడియున్నాడు.

        అయితే పరిశుద్ధాత్మ కార్యాలేమిటో తెలుసుకొందము.  ఈయన సాటి సహాయము ప్రభువు తల్లి మరియమ్మయే.  అయితే ఈయన కార్యాలేమిటంటే - పరమ తండ్రియైన యెహోవా యొక్కయు, ఆయన కుమారుడు మన రక్షకుడైన యేసయ్య యొక్కయు కార్యాలలో సహకరించి మంచితనముగాను పరమాత్మకు ప్రసిద్ధముగాను మార్చుచున్న శక్తిమంతుడని తెలుస్తున్నది.  ఆదికాండము మొదటి అధ్యాయములో తండ్రి - కుమారులు కలిసి సృష్టించిన ప్రతిదానిని మంచిదిగాను యోగ్యముగాను చేసినట్లును ఇందునుగూర్చి అది మంచిదని దేవుడు చూచినట్లుగా ఏడుమార్లు వ్రాయబడియున్నది.  మరియు క్రీస్తు జన్మకు మరియమ్మను సిద్ధపరచి శిశు రూపమును ఆమె గర్భములో నిర్మించింది పరిశుద్ధాత్మయే.

        ఇంకను పరిశుద్ధాత్మ చేయు పనులేమిటంటే మనము చేయు ప్రార్థనలకు సహాయముగా విజ్ఞాపన చేయుదురని రోమా 8:26-27 వివరిస్తున్నది. అంతేగాక క్రీస్తును నమ్మినవారి ఆత్మలను నూతనపరచుచున్నారనియు, క్రైస్తవులలో నివసించి సర్వసత్యములోనికి నడిపించుదురనియు యోహాను 20:22 మోక్షమునకు సంచకరువుగాను పరిశుద్ధాత్మ ఎల్లప్పుడు మనతో నుండురనియు యోహాను 16:13 సత్య స్వరూపియైన ఆత్మ వచ్చి మనలను సర్వసత్యములోనికి నడిపించుననియు - అంతేగాక సంభవించబోవు భవిష్యత్తును తెలియజేయ శక్తిమంతుడైయున్నాడు.  ఈ విధముగా యేసయ్య నామమును విశ్వసించిన ప్రతివాని ఆత్మను పవిత్రపరచి - మోక్షమునకు మార్గము సత్యము జీవమైయున్న క్రీస్తు యొక్క పరలోక రాజ్యమునకు విశ్వాసులను వారసులుగ చేయుటయే పరిశుద్ధాత్ముని క్రియయని గ్రహించాలి.        

నెల్లూరు                                                            ఇట్లు

26.04.2010.                                                 వి. శేఖర్‌ రెడ్డి

1.  క్రీస్తు పుట్టుక, పునరుత్థానము - స్త్రీల గొప్పతనము

        ప్రియపాఠకులారా!  దేవుని దూత కన్య మరియమ్మకు ఈ లోకములో దర్శనమిచ్చి పరిశుద్ధాత్మ ప్రభావమున గర్భము ధరించబోవుచున్నావని చెప్పుట జరిగింది.  లూకా 1:26-38 ప్రకారము క్రీస్తు ప్రభువు అను లోకరక్షకుడు ఈ లోకమునకు వచ్చెనన్న సంగతి కన్య మరియమ్మకు మాత్రమే తెలుసు.  అప్పటికి ఈ లోకములో ఎవరికి తెలియదు.  క్రీస్తు ప్రభువును గర్భము ధరించిన విషయమును గుర్తించిన రెండవ స్త్రీ ఎలీసబెతు.  లూకా 1:39-45 ప్రకారము ఎలీసబెతు అను స్త్రీ ప్రభువును గూర్చి తెలుసుకొన్నది.  అప్పటికి లోకరక్షకుని గూర్చిన జ్ఞానము పురుషులకు తెలియదు.  యోసేపుకు కూడ తెలియదు.  మరియమ్మ విషయములో యోసేపు అనుమానమును పొందినప్పుడు మాత్రమే క్రీస్తును గూర్చిన జ్ఞానము ఈ లోకములో యోసేపుకు తెలియజేయ బడింది.  ఈ విధముగా క్రీస్తు ప్రభువు ఈ లోకములో జన్మించుటను గూర్చిన జ్ఞానమును మొదటగా స్త్రీలకు మాత్రమే తెలియజేశాడు.  అంటే స్త్రీల గొప్పతనము కాదా!

        అలాగే పునరుత్థానము తరువాత క్రీస్తు ప్రభువు మొదటగా మగ్దలేనే మరియమ్మకు కనిపించాడు.  యోహాను 20:1, 6-10, 11-16, ''ఆదివారమున ఇంకను చీకటిగా ఉన్నప్పుడు మగ్దలేనే మరియ పెందలకడ సమాధియొద్దకు వచ్చి, సమాధి మీద ఉండిన రాయి తీయబడియుండుట చూచెను.  . . .  అంతట సీమోను పేతురు అతని వెంబడి వచ్చి, సమాధిలో ప్రవేశించి, నారబట్టలు పడియుండుటయు, ఆయన తల రుమాలు నారబట్టలయొద్ద ఉండక వేరుగా ఒకచోట చుట్టిపెట్టియుండుటయు చూచెను.  అప్పుడు మొదట సమాధియొద్దకు వచ్చిన ఆ శిష్యుడు లోపలికి పోయి చూచి నమ్మెను.  ఆయన మృతులలోనుండి లేచుట అగత్యమను లేఖనము వారింకను గ్రహింపలైరి.  అంతట ఆ శిష్యులు తిరిగి తమ వారియొద్దకు వెళ్లిపోయిరి.  . . .  అయితే మరియ సమాధి బయట నిలిచి యేడ్చుచుండెను.  ఆమె ఏడ్చుచు సమాధిలో వంగి చూడగా, తెల్లని వస్త్రములు ధరించిన యిద్దరు దేవదూతలు యేసు దేహము ఉంచబడిన స్థలములో తలవైపున ఒకడును కాళ్ల వైపున ఒకడును కూర్చుండుట కనబడెను.  వారు-అమ్మా, యెందుకు ఏడ్చుచున్నావని ఆమెను అడుగగా ఆమె-నా ప్రభువును ఎవరో యెత్తికొని పోయిరి; ఆయనను ఎక్కడ ఉంచిరో నాకు తెలియలేదని చెప్పెను.  ఆమె యీ మాట చెప్పి వెనుకతట్టు తిరిగి, యేసు నిలిచియుండుట చూచెనుగాని ఆయన యేసు అని గుర్తుపట్టలేదు.  యేసు-అమ్మా యెందుకు ఏడ్చుచున్నావు, ఎవనిని వెదకుచున్నావు?  అని ఆమెను అడుగగా ఆమె ఆయన తోటమాలి అనుకొని-అయ్యా, నీవు ఆయనను మోసికొని పోయినయెడల ఆయనను ఎక్కడ ఉంచితివో నాతో చెప్పుము, నేను ఆయనను ఎత్తికొని పోదునని చెప్పెను.  యేసు ఆమెను చూచి-మరియా అని పిలిచెను.  ఆమె ఆయనవైపు తిరిగి ఆయనను హెబ్రీ భాషతో రబ్బూనీ అని పిలిచెను.  ఆ మాటకు బోధకుడని అర్థము.''  ఈ విధముగా క్రీస్తు ప్రభువు జీవితములో ముఖ్యమైనవి పుట్టుక, పునరుత్థానము.  ఈ లోకములో పుట్టిన ప్రభువు సిలువ బలియాగము ద్వారా సకల మానవాళికి రక్షణ ఇచ్చి తిరిగి లేచి తాను సజీవుడనని నిరూపించుకొని ఈ లోకములో క్రైస్తవ్యమునకు పునాది వేయుట జరిగింది.  ఈ రెండు సంఘటనలలో కన్య మరియమ్మ, ఎలీసబెతు మరియు మగ్దలేనే మరియమ్మ వంటి స్త్రీలకే ప్రాధాన్యత ఇచ్చాడు.  మొదటగా స్త్రీలే తెలుసుకొన్నారు.  పునరుత్థానము తరువాత శిష్యులకు మొదట ఎందుకు దర్శనమియ్యలేదు?  ఒక్కసారి ఆలోచించాలి.  ఇలా దర్శనము మగ్దలేనే మరియమ్మకు ఇచ్చిన ప్రభువు తాను పునరుత్థానమును పొందానని ఒక స్త్రీ ద్వారా శిష్యులకు చెప్పుట మనము గమనించాలి.  యోహాను 20:17-18, ''యేసు ఆమెతో నేను ఇంను తండ్రియొద్దకు ఎక్కిపోలేదు గనుక నన్ను ముట్టుకొనవద్దు; అయితే నా సహోదరులయొద్దకు వెళ్లి-నా తండ్రియు మీ తండ్రియు, నా దేవుడును మీ దేవుడునైన వానియొద్దకు ఎక్కిపోవుచున్నానని వారితో చెప్పుమనెను.  మగ్దలేనే మరియ వచ్చి-నేను ప్రభువును చూచితిని, ఆయన నాతో ఈ మాటలు చెప్పెనని శిష్యులకు తెలియజేసెను.''  ఆ తరువాత క్రీస్తు ప్రభువు శిష్యులకు దర్శనమిచ్చుట జరిగింది.  కనుక క్రీస్తు ప్రభువు ఎంత గొప్ప భాగ్యమును స్త్రీలకు అనుగ్రహించెనో గ్రహించాలి.  అలాగే క్రీస్తు పునరుత్థానుడైనాడన్న సువార్తను ఒక స్త్రీ  ప్రభువు శిష్యులకు తెలియజేయునంతగా వారిని ఆశీర్వదించాడు.

        ఇక్కడ మనమొక విషయము గమనించాలి.  ప్రభువు పునరుత్థానుడై మగ్దలేనే మరియతో నా సహోదరులకు ఈ విషయము ప్రకటించమన్నాడు.  ఆమె వెళ్లి ప్రభువు సహోదరులకు గాక ప్రభువు శిష్యులకు తెలియజేసినట్లు యోహాను 20:18 వివరిస్తున్నది.  మత్తయి 13:55లో ప్రభువు సహోదరులుగా ప్రకటించబడిన వారి పేర్లు ఏవనగా యాకోబు యోసేపు సీమోను యూదా అనువారు.  వీరు ప్రభువు శిష్యులేగాని మరియమ్మ గర్భవాసమున యోసేపు వలన పుట్టినవారు కాదు.  వీరు ప్రభువు శిష్యులు ప్రభువును ఎడబాయక ఆయనతో ఉంటూ ఆయన ప్రార్థనా కార్యములలో పాల్గొంటూ ఆయనను అంటిపెట్టుకొని యున్నందున ప్రభువు సహోదరులుగా పిలువబడినారు.  కాని వీరు ప్రభువు శిష్యులని వారి పేర్లను బట్టి తెలుస్తున్నది.  ప్రభువు పుట్టిన తరువాత మరియ మరల గర్భము ధరించినట్లు ఏ సువార్తీకుడు వివరించలేదు.

2.  అమ్మ లేక తల్లి స్థానము

        ప్రియపాఠకులారా!  మత్తయి 23:9, ''మరియు భూమిమీద ఎవనికైనను తండ్రి అని పేరు పెట్టవద్దు; ఒక్కడే మీ తండ్రి; ఆయన పరలోకమందున్నాడు.''  ఇందులో క్రీస్తు ప్రభువు తన శిష్యులకు బోధిస్తూ తండ్రీ!  అని పిలువవద్దని చెప్పుట జరిగింది.  అంటే ఒక మగవాడు వివాహానంతరము ఒక బిడ్డకు జన్మనిచ్చి తండ్రిగా మారుచున్నాడు.  ఇది శరీర రీత్యా ఆ బిడ్డకు తండ్రి. కాని ఆత్మరీత్యా ఎవరైతే క్రీస్తు ప్రభువునందు విశ్వాసముంచుదురో వారందరు దేవునికి పిల్లలుగా ఉండు అధికారమును అనుగ్రహించి యున్నారు.  యోహాను 1:12-13, ''తన్ను ఎందరంగీకరించిరో వారికందరికి, అనగా తన నామమునందు విశ్వాసముంచినవారికి, దేవుని పిల్లలగుటకు ఆయన అధికారము అనుగ్రహించెను.  వారు దేవునివలన పుట్టినవారే గాని, రక్తమువలననైనను శరీరేచ్ఛవలననైనను మానుషేచ్ఛవలననైనను పుట్టినవారు కారు.''  కనుక క్రీస్తు ప్రభువునందు విశ్వాసమును కలిగిన మనమందరము శరీర రీత్యా ఒకరికి బిడ్డలమైనను ఇది గుర్తింపు పొందదు, ఎందుకంటే మనలోని ఆత్మ శరీర రీత్యా వచ్చిన తండ్రి నుండి వచ్చినది కాదు.  అది దేవుని వద్ద నుండి వచ్చినదే!  కనుక మనకు తండ్రి దేవుడు మాత్రమే!  మనము ఆయన రాజ్యమునకు వారసులము.  ఇక ఈ జన్మనిచ్చిన తండ్రి కూడ దేవుని నుండి ఆత్మను పొందుట ద్వారా ఒకే ఆత్మ నుండి శరీర రీత్యా తండ్రి ఆత్మ - కుమారుని ఆత్మ కూడ వచ్చుట జరిగింది కనుక తండ్రి అని పిలుచుట కంటే సహోదరులుగా పిలుచుకొనుట శ్రేయస్కరము.  ఇదే సంగతిని మన మూలవచనములో తన శిష్యులకు క్రీస్తు ప్రభువు తెలియజేయుట జరిగింది.  అలాగే బోధకుడుగాని గురువు అనిగాని పిలిపించుకొనవద్దని చెప్పుట జరిగింది.

        ఇన్ని చెప్పిన క్రీస్తు ప్రభువు అమ్మ స్థానమును లేక తల్లి స్థానమును తండ్రియైన దేవుడుగాని, క్రీస్తు ప్రభువుగాని మరియు పరిశుద్ధాత్మ దేవుడుగాని పొందలేదు.  అమ్మ అని పిలువవద్దని చెప్పలేదు లేక తల్లి అని పిలువవద్దని చెప్పలేదు.  కనుక అమ్మ లేక తల్లి స్థానమును స్త్రీకి లేక సాటి సహాయముగా పిలువబడు స్త్రీకి వదిలివేయుట జరిగిందిగాని మగవారికి తండ్రి స్థానమును ఇయ్యక వారి స్థానమును కొద్దిగా తగ్గించి ఆ స్థానమును తానే తండ్రిగా పైనున్న దేవుడు పొందగా, తల్లి స్థానమును మాత్రము సాటి సహాయముగా పేరు పొందిన స్త్రీకి ఇచ్చుట జరిగింది.  అంటే ఈ లోకములో గాని పరలోకములో గాని మిగిలిన ఆకాశములలో గాని ఎవరు తల్లి లేక అమ్మ స్థానమును పొందినవారుగాని అందుకు అర్హులైనవారు ఎవరు లేరు.  ఈ స్థానమును దేవుడు మన మధ్య మనతో బాటుగా జీవించు స్త్రీకి అనుగ్రహించి వారిని గౌరవించినట్లుగా మనము గ్రహించాలి.  కనుక ప్రతి బిడ్డ తన తల్లిని గౌరవించవలసిన విధి వారికి ఉన్నది.  ఆమె పట్ల విధేయత కలిగి జీవించాలి.  నేను ఒక చర్చిలో ప్రార్థనలో పాల్గొనినప్పుడు ఒక పాటలో క్రీస్తు ప్రభువును ఉద్దేశించి తండ్రివి తల్లివి నీవే అని చెప్పుట జరిగింది.  కాని బైబిలు గ్రంథములో క్రీస్తు ప్రభువు ఎక్కడ కూడ తల్లి స్థానమును ఆయన పొందలేదు.  ఈ స్థానమును స్త్రీకి ఆయన ఇచ్చి ఆమెను గౌరవించినట్లుగా మనము గ్రహించాలి.  యోహాను 19:27.    దేవునిలో ఇంత ఉన్నత స్థానమును పొందిన స్త్రీని మన దైనందిత జీవితములో హింసకు గురి చేయుట, అగౌరవ పదజాలముతో పిలుచుట వంటివి సాతాను ప్రేరణతో జరుగు చర్యగా గుర్తించాలి.  క్రీస్తు ప్రభువు తనకు జన్మనిచ్చిన కన్య మరియమ్మని తల్లి, అమ్మా అని అనేక చోట్ల సంబోధించుట జరిగింది.  యోహాను 4:21, 8:10, 19:26 మరియు 20:13-15.  అలాగే మనము కూడ మన తల్లి పట్ల గౌరవ భావము కలిగి జీవించవలెనని గ్రహించాలి.

3.  ప్రవక్త్రినిగా అత్యున్నత స్థానములో స్త్రీ

        ప్రియపాఠకులారా!  యిర్మీయా 1:4-5, ''యెహోవావాక్కు నాకు ప్రత్యక్షమై యీలాగు సెలవిచ్చెను-గర్భములో నేను నిన్ను రూపించక మునుపే నిన్నెరిగితిని, నీవు గర్భమునుండి బయలుపడక మునుపే నేను నిన్ను ప్రతిష్ఠించితిని, జనములకు ప్రవక్తగా  నిన్ను నియమించితిని.''  ఇందులో ప్రవక్త యిర్మీయా మగవాడు.  ఈయన ఎన్నిక తల్లి గర్భములో రూపొందక ముందే జరిగినట్లుగా చెప్పబడింది.  ప్రవక్త అనగా ప్రవచించువాడు.  అంటే జరగబోవుదానిని ముందుగా తెలియజేయువాడు.  ఇందులో అనేకమంది ప్రవక్తలుగా పిలువబడినను దేవునిచే ఎన్నిక చేయబడినవారు కొద్దిమందే.  కనుక ప్రవక్త అంటేనే మన మనస్సులో ఒక గొప్ప స్థితిని వారు పొందియున్నారు.  ఈ స్థితిని స్త్రీలు కూడ పొందియున్నట్లుగా బైబిలు గ్రంథములో వ్రాయబడియున్నది.  క్రీస్తు ప్రభువు తన ముప్పది సంవత్సరాల వయస్సు తరువాత నూతన నిబంధనను బోధించుట జరిగింది.  దీనిని క్రీస్తు ప్రభువు పునరుత్థానము తరువాత పరలోకమునకు ఎక్కిపోయి తన వారసత్వముగా నరుల మధ్య దైవ సేవకులతో బాటుగా ఉండుటకు దేవుని శక్తియైన పరిశుద్ధాత్మను పంపుట జరిగింది.  ఈ పరిశుద్ధాత్మ క్రీస్తు ప్రభువు శిష్యులకు తలాంతుగా సువార్తను వ్రాయు యోగ్యతను దయచేసి రచియింపజేయుట జరిగింది.  ఇందులో ప్రవక్తగా మగవారిని గూర్చియేగాక ప్రవక్త్రినిగా స్త్రీని గూర్చి వ్రాయించుట జరిగింది.  అంటే చరిత్ర ప్రకారము ప్రవక్త్రినిగా వ్రాయబడిన స్త్రీ క్రీస్తు ప్రభువు పుట్టు నాటికే ఆమె అలా ఎన్నికై తన కార్యములు జరిగించుచున్నది.  లూకా 2:23, 36-37, ''మోషే ధర్మశాస్త్రముచొప్పున వారు తమ్మును శుద్ధి చేసికొను దినములు గడచినప్పుడు -ప్రతి తొలిచూలు మగపిల్ల ప్రభువుకు ప్రతిష్ఠ చేయబడవలెను అని ప్రభువు ధర్మశాస్త్రమందు వ్రాయబడినట్టు ఆయనను ప్రభువుకు ప్రతిష్ఠించుటకును, ప్రభువు ధర్మశాస్త్రమందు చెప్పబడినట్టు గువ్వల జతనైనను రెండు పావురపు పిల్లలనైనను బలిగా సమర్పించుటకును, వారు ఆయనను యెరూషలేమునకు తీసికొనిపోయిరి.  . . .  మరియు ఆషేరు గోత్రికురాలును పనూయేలు కుమార్తెయునైన అన్న అను ఒక ప్రవక్త్రి యుండెను.  ఆమె కన్యాత్వము మొదలు ఏడేండ్లు పెనిమిటితో సంసారము చేసి బహుకాలము గడిచినదై, యెనుబదినాలుగు సంవత్సరములు విధవరాలైయుండి, దేవాలయము విడువక ఉపవాస ప్రార్థనలతో రేయింబగళ్లు సేవచేయుచుండెను.''  యేసుక్రీస్తు ప్రభువును యెరూషలేమునకు తీసుకొని వచ్చునాటికి ఆయన పసిబిడ్డ అప్పటికిని ఈ ప్రవక్త్రిని వయస్సు 84 సంవత్సరములు.  కనుక ఈమె ప్రవక్త్రినిగా పాత నిబంధన కాలమునకు చెందినది.  అయితే క్రీస్తు ప్రభువు పుట్టుక సందర్భములో ఈమెను గూర్చి ప్రస్తావించుట జరిగింది.  అంటే పాత నిబంధన కాలములో అనేకమంది ప్రవక్త్రినిలు ఉన్నట్లుగా మనము గ్రహించాలి.

        ఇందునుబట్టి పాత నిబంధనలో ప్రవక్తలు అయిన మగవారితో సమానముగా స్త్రీలలో కూడ ప్రవక్త్రినిలుగా ఉన్నట్లుగా మనము గ్రహించాలి.  ప్రవక్త ఏమైతే చేస్తారో అవన్ని కూడ ప్రవక్త్రినిగా స్త్రీలు కూడ చేస్తున్నట్లుగా మనము గ్రహించాలి.  అలాగే వీరి ఎన్నిక కూడ యిర్మీయాలో చెప్పబడిన ప్రకారము వీరు వారి తల్లి గర్భములో పడక ముందే ఈ స్త్రీని ప్రవక్త్రినిగా ఎన్నుకొని దేవుడు పంపుచున్నట్లుగా మనము గ్రహించాలి.

        1 కొరింథీ 11:5, ''ఏ స్త్రీ తలమీద ముసుకు వేసికొనక ప్రార్థనచేయునో లేక ప్రవచించునో, ఆ స్త్రీ తన తలను అవమానపరచును; ఏల యనగా అది ఆమెకు క్షౌరము చేయబడినట్టుగానే యుండును.''  ఇందులో స్త్రీలలో ప్రవచించువారు ఉన్నట్లుగా పౌలు కూడ గుర్తించి చెప్పుట జరిగింది.  స్త్రీ ప్రవచించినను ప్రార్థించినను ఆమె ముసుగు అను ఆచారమును కలిగియుంటే మరి మంచిదని బోధించాడు.  ఏది ఏమైనప్పటికి మగ ప్రవక్తలవలె దైవసందేశమును ప్రవచించగలవారిలో ఆడవారు కూడ ఉండుట దేవుడు స్త్రీపై ఎంతగా ప్రేమను చూపెనో మనకు అర్థమగుచున్నది.  2 దినవృత్తాంతములు 34:22-33, ''అప్పుడు హిల్కీయాయును రాజు నియమించినవారును సంగతినిగూర్చి విచారణచేయుటకై హర్హషుకు పుట్టిన తిక్వా కుమారుడును వస్త్రశాలకు పైవిచారణకర్తయునగు షల్లూముయొక్క భార్యయైన హూల్దా అను ప్రవక్త్రియొద్దకు పోయిరి.  ఆమె అప్పుడు యెరూషలేమునకు చేరిన యుప భాగములో కాపురముండెను.''

        వారితో ఈ లాగు చెప్పెను.  ప్రభువు మీ మీదికి మీ స్థలము మీదికి దాని కాపురస్థులమీదికి గ్రంథమందు చెప్పబడిన శాపములనన్నింటిని రప్పించెదను.  తమ చేతులతో చేసుకొన్న దేవతలకు ధూపము వేసి ప్రభువు కోపమును రేపియున్నారు.  కనుక మిమ్మును మీరు తగ్గించుకొని వస్త్రమును చింపుకొని కన్నీళ్లు విడిచితిరి గనుక ఏ అపాయమును నీవు కన్నులారా చూడవు.  యోనా దైవశిక్షను పొంది నీనెవెవారికి ప్రకటన చేశాడు.  కాని ఈమె దైవమునకు ప్రీతిపాత్రురాలై ఆ జనాంగమునకు మారుమనస్సు కలిగించి రక్షణలోకి నడిపించింది.

        నిర్గమకాండము 15:20, ''మరియు అహరోను సహోదరియు ప్రవక్త్రియునగు మిర్యాము తంబురను చేత పట్టుకొనెను.  స్త్రీలందరు తంబురతోను నాట్యములతోను ఆమె వెంబడి వెళ్లగా''

        నెహెమ్యా 6:14, ''నా దేవా, వారి క్రియలనుబట్టి టోబీయాను సన్బల్లటును నన్ను భయపెట్టవలెనని కనిపెట్టియున్న ప్రవక్తలను, నోవద్యా అను ప్రవక్త్రిని జ్ఞాపకము చేసికొనుము.''

        న్యాయాధిపతులు 4: కనానును ఆబీసు పరిపాలించు కాలములో ఇశ్రాయేలు మరల దోషులైనప్పుడు కనాను రాజు ఆ దేశపు సైన్యాధిపతులకు అప్పగించగా వారు ఇశ్రాయేలును పీడించి పిప్పి జేసిరి.  ఆ రోజులలో దెబోరా ఇశ్రాయేలుకు తీర్పు తీర్చు ప్రవక్త్రిని.  ఈమె ఒకని భార్య.  ఆమె ఇశ్రాయేలులో ప్రముఖ వ్యక్తియైన బారాకును పిలిపించి సైన్యములను ప్రోగుజేసి నడిపించుకొని రమ్మనియు కనాను రాజును వారి సైన్యములను నీ చేతికి ప్రభువు అప్పగించుననియు చెప్పగా అప్పుడు బారాకు దెబోరాను తన సైన్యముల వెంట రమ్మని కోరినప్పుడు ఆమె సరేనని ఒప్పుకొనెను.  కనాను రాజు ఈ విషయము తెలుసుకొని తన మహా సైన్యమును రథములను రౌతులతో ముట్టడించగా దెబోరా బారాకును హెచ్చరించి నీవు పోయి శత్రు సైన్యము మీద పడుము.  ప్రభువు నీ సైన్యమునకు ముందు నడిచి శత్రువునకు భయమును కలవరమును కలిగించగా కట్టకడకు కనాను రాజును వారి సైన్యమును ఓడించి వారు పారిపోవుచుండగా ఒక్కడిని కూడ వదలక కత్తివాటుకు హతము చేశాడు.  ఇది దైవప్రవక్త్రిని దెబోరా ఇశ్రాయేలు సైన్యముతో కూడ నడచి కలిగించిన విజయోత్సవము.  ఈ విజయోత్సవము నందు దెబోరా బారాకు పాడిన గీతము న్యాయాధిపతులు 5: లో చదువగలము.  ఈ దెబోరా ప్రవక్త్రిని సైన్య సమూహముతో కలిసి నడిచి కలుగజేసిన దైవరక్షణను బట్టి ఇశ్రాయేలు నలుబది సంవత్సరములు చీకు చింతా లేకుండ జీవించారు.

        లూకా 2:36-39  అన్న అను ప్రవక్త్రిని ఏడు ఏండ్లు పెనిమిటితో కాపురము చేసి 84 సంవత్సరములు విధవయై యుండి దేవాలయమును విడువక ఉపవాస ప్రార్థనలతో రేయింబవళ్లు సేవ చేయుచుండెను.  ఆమె కూడ లోపలికి వచ్చి మరియ చేతిలోని శిశువైన ప్రభువును చూసి దేవుని కొనియాడుచూ ఆమె విమోచన కొరకు కనిపెట్టుచున్న వారందరికి ప్రభువును గూర్చి వర్తమానము అందించుట ఆశ్చర్యము.  

        2 రాజులు 22:14  హోషియా పరిపాలన కాలములో యెరూషలేము ఆలయ మరమ్మత్తులు చేయుచుండగా ధర్మశాస్త్ర గ్రంథము దొరికింది.  ఆ గ్రంథమును చదివించుకొన్న రాజు నలుగురు విశ్వాసులైన సహోదరులను హుల్దా ప్రవక్త్రిని యొద్దకు పంపగా ధర్మశాస్త్ర గ్రంథమందు వ్రాయబడిన శిక్ష నిన్ను కాచుకొని యున్నదనియు ప్రభువు కోపము రగుల్చబడుచున్నదనియు ఈ నగరము నామరూపాలు లేకుండ బీడుపడబోవుననియు ప్రభువు పలుకుచున్నాడు గనుక నీవు మారుమనస్సు పొంది నాకు విధేయుడవై కన్నీరు కార్చి ప్రవర్తనను సరిదిద్దుకొన్నచో చేయుదునన్న కీడు నుండి నీవు తప్పించబడి ప్రశాంతముగ కన్ను మూసెదవని సహోదరులకు ఉపదేశించింది.

        అపొస్తలుల కార్యములు 21:9  సువార్త పరిచారకుడైన ఫిలిప్పు యొక్క అవివాహితులైన నలుగురు కుమార్తెలు ప్రభువు వర్తమానమును ప్రవచించువారు.  

        ప్రకటన 2:20-22  పురుషులలో గాని స్త్రీలలో గాని అనేకమంది అబద్ధ ప్రవక్తలు, బోధకులు బయలుదేరి విశ్వాసి యొక్క విశ్వాస జీవితమును భ్రష్టు పట్టిస్తున్నారు.  ఇట్టివారిని గూర్చి జాగ్రత్తపడాలని ప్రభువు హెచ్చరిస్తున్నాడు.  అబద్ధ ప్రవక్తలు అనబడువారు పూర్వకాలములో ఉన్నారు.  నేటి కాలములోను ఉన్నారు.  యిర్మీయా 27:10  అబద్ధ ప్రవచనాలు ప్రవచిస్తారు.  మత్తయి 24:5  అనేకులైన అబద్ధ ప్రవక్తలు క్రీస్తు పేరట వచ్చి ఏర్పరచబడినవారిని సైతము మోసపరచెదరు.  ఏ విధముగానో తెలుసుకొందము.  అపొస్తలుల కార్యములు 10:28-29.  పాతనిబంధనలోని ధర్మశాస్త్రమును లోకసంబంధముగా సత్యమును అసత్యముగా మారుస్తారు.  యూదులకు మాత్రమే దేవుడు కాదు అన్యజనులకును దేవుడని రోమా 3:29 వివరిస్తుంది కనుక అన్యులతో సాంగత్యము చేయాలిగాని ముష్కరులతో గాని అన్యాయస్థులతో గాని కాదు.  అపొస్తలుల కార్యములు 10:35-36లో చెప్పబడినట్లు ప్రతి జనములోను దేవునికి భయపడి నీతిగా నడుచుకొనువారిని ఆయన అంగీకరించును గనుక అట్టివారితో చెలిమి చేసి వారితో కలిసిమెలిసి అట్టివారిని ప్రభువు యొక్క సువార్తతో ఆకర్షించి ప్రభువు సన్నిధికి నడిపించాలేగాని - ఇది జరగాలంటే అన్యులతో సహవాసము చేయక పోతే సువార్త పరిచర్య ఎలాగు జరుగగలదు?  రోమా 11:12  ఇశ్రాయేలు తొట్రుపాటు అన్యజనులకు రక్షణ.  అందువల్లనే అన్యజనుల మధ్య ప్రభువు సంచరించాడు.  అన్యజనుడైన జక్కయ్యను చేర్చుకొన్నాడు.  విశ్వాసి  క్రీస్తు యొక్క వెలుగును ఆయన ప్రేమను అన్యుల మధ్య ప్రకాశింపజేయాలి.  అంతేగాని  ఒక్క సంఘమైయున్న క్రీస్తు సంఘమును చీల్చి దానికి బైబిలులోని ఏదో యొక నామధేయమును తగిలించి క్రీస్తు రాకడలో ఎత్తబడే సంఘము నాదేయని మా సంఘములో ప్రకటించబడుచున్న సువార్త మాత్రమే వినాలని మరి ఏ దైవజనుని సువార్తకు అర్రులు చాచి పోకూడదనియు, మన తల్లి సంఘములోని పిల్లను వేరొక క్రైస్తవ శాఖలోని పిల్లవానికి ఇచ్చి పెళ్లి చేయకూడదనియు రోగము వస్తే మందులు మ్రింగకూడదనియు ప్రార్థనతోనే నయము చేసుకోవాలని వగైరా తప్పుడు బోధలు బోధించుటయేగాక, పరిశుద్ధాత్మ ఆవరించినట్లు గావుకేకలు ఒళ్లు అదరుగొట్టుకొనుట, ఎగురుట, గెంతుట మరియు అర్థము కాని భాషలతో అన్యుల మధ్య ప్రభువును దూషింపజేస్తున్నారు.  ఆ రోజులలో అర్థమయ్యే రీతిలో అపొస్తలులు భాషలు మాట్లాడినారు.  ఈ దినములలో దయ్యపు ఆత్మలను వాటి శక్తులను ఆవరింపజేసుకొని అర్థముగాని భాషలతో విశ్వాసులను మోసపుచ్చుతున్నారు.  ఇది అంత్య క్రీస్తు అబద్ధ బోధకుల క్రియాకర్మలని గ్రహించాలి.

4.  న్యాయాధిపతులుగా స్త్రీలు

        ప్రియపాఠకులారా!  న్యాయాధిపతులు 4:4-5, ''ఆ కాలమున లప్పీదోతునకు భార్యయైన దెబోరా అను ప్రవక్త్రి ఇశ్రాయేలీయులకు న్యాయాధిపతినిగా ఉండెను.  ఆమె ఎఫ్రాయిమీయుల మన్యమందలి రామాకును బేతేలుకును మధ్యనున్న దెబోరా సరళవృక్షము క్రింద తీర్పుకై కూర్చుండుటకద్దు, తీర్పు చేయుటకై ఇశ్రాయేలీయులు ఆమెయొద్దకు వచ్చుచుండిరి.''  ఈ విధముగా దెబోరా అనే స్త్రీ న్యాయాధిపతినిగా ఇశ్రాయేలులకు ఉంటూ ఆమె వారి తగవులను తీర్చుచున్నది.  అలాగే న్యాయాధిపతులు 4:6-7లో దెబోరా బారాకు చేయవలసిన యుద్ధమును గూర్చి తెలియజేస్తున్నది.  కనుక స్త్రీలు ఇదే చేయాలన్న పని లేదు.  వారు ఏవైన చేయవచ్చును.  వారు దేశ రాజకీయాలు నెరపవచ్చును, రక్షణ దళముగా ఉండవచ్చును, ఉన్నత అధికారులుగా ఉండవచ్చును, అన్ని రకములైన వృత్తి విద్యలు చేయవచ్చును.  కాని ఎంత ఉన్నత స్థానమును పొందినను దేవుడు ఇచ్చిన ఆజ్ఞలను కట్టడలను పాటించుచు పై కార్యములు నెరవేర్చుట మంచిది.

5.  స్త్రీకి గుర్తింపు  . . .  (భూమిపై)

        ప్రియపాఠకులారా!  మత్తయి 14:21, ''స్త్రీలును పిల్లలును గాక తినినవారు ఇంచుమించు అయిదు వేలమంది పురుషులు.''  ఇందులో స్త్రీలు పిల్లలను లెక్కించుట లేదుగాని పురుషుల సంఖ్యను లెక్కిస్తున్నారు.  నిర్గమకాండము 12:37, ''అప్పుడు ఇశ్రాయేలీయులు రామ సేసునుండి సుక్కోతుకు ప్రయాణమైపోయిరి వారు పిల్లలు గాక కాల్బలము ఆరులక్షల వీరులు.''  ఈ విధముగా పాత క్రొత్త నిబంధనలలో ఏ కార్యమైనను లెక్కించినప్పుడు వారు పురుషులను ప్రామాణికముగా తీసుకొనేవారు.  పురుష జాతిలో పిల్లలను లెక్కించేవారు కారు.  కేవలము యవ్వనస్థుల నుండి ముసలివారి వరకు లెక్క జరిగేది కాని స్త్రీలు పిల్లలను లెక్కించేవారు కారు.  జాతికి గుర్తింపు పురుషుల లెక్కను బట్టి వస్తుంది.  స్త్రీలు చిన్న పిల్లల లెక్కను బట్టి కాదు.

        అలాగే స్త్రీకి తన పురుషుని బట్టి గుర్తింపు ఉంటుంది.  దేవునిలో నీతిని పొందిన పురుషులు గొప్పవాని క్రింద లెక్కించబడుదురు.  వారి భార్యలు పిల్లలు కొడుకు భార్యలు ఎవరైన ఆ నీతిని పొందిన పురుషుని పేరు పైన పిలువబడుట జరుగుచున్నది.  ఆదికాండము 8:15-16, ''అప్పుడు దేవుడు-నీవును నీతో కూడ నీ  భార్యయు నీ కుమారులును నీ కోడండ్రును ఓడలోనుండి బయటికి రండి.''  దేవుడు నోవహుతోనే మాట్లాడేవాడు.  ఎందుకంటే ఆదికాండము 7:1, ''యెహోవా-ఈ తరమువారిలో నీవే నా యెదుట నీతిమంతుడవై యుండుట చూచితిని గనుక నీవును నీ యింటి వారును ఓడలో ప్రవేశించుడి.''  కనుక నోవహు దేవుని దృష్టిలో నీతిమంతుడు కనుక దేవుడు ఆయనతో మాట్లాడేవాడు.  ఆదికాండము 8:15-16లో స్త్రీలను గూర్చి చెప్పుచు నోవహుతో నీవు నీ భార్య నీ కోడండ్రు అని ఉచ్ఛరించుట జరిగింది.  వారికి పేర్లు లేవా?  ఉన్నవి కాని వారికి గుర్తింపు నోవహు  వలన కలిగినదిగా గుర్తించాలి.  ఆదికాండము 19:12, ''అప్పుడామనుష్యులు లోతుతో-ఇక్కడ నీకు మరియెవరున్నారు?  నీ అల్లుని నీ కుమారులను నీ కుమార్తెలను ఈ ఊరిలో నీకు కలిగినవారందరిని వెలుపలికి తీసికొనిరమ్ము;''  దేవుని దూతలుగా వెళ్లినవారు కూడ లోతును బట్టి మిగిలినవారికి గుర్తింపు నిచ్చుట జరిగింది.  ఈ విధముగా స్త్రీకి తన పురుషుని బట్టి లేక దైవజనుని బట్టి గుర్తింపు కలిగి యుండునని గ్రహించాలి.  ఈ వచనాలలో దేవుడు కూడ అదే విధముగా వారికి గుర్తింపును ఇస్తున్నారు.  లూకా 2:23లో అన్నకు ప్రవక్త్రినిగా గుర్తింపు వచ్చింది.  ఆమెకు భర్త లేడు.  అంటే ఒక స్త్రీ గుర్తింపు తన భర్త లేనప్పుడు కలుగునని గుర్తించాలి.  ఆమెను ఆమె పేరు మీద పిలుచుట అనునది కేవలము ఆమె ఒంటరిగా ఉన్నప్పుడే ఆ గుర్తింపు కలుగును.  అంటే స్త్రీ  వివాహానంతరము వారికి గుర్తింపు వారి పురుషుని బట్టి కలుగును.  అలాగే పిల్లలకు తండ్రిని బట్టి వారు పిలువబడుచున్నారు.  ఇది ఈ లోక చరిత్ర.

6.  స్త్రీలు - ప్రార్థించుట - ఉపవాసములు ఉండుట

        ప్రియపాఠకులారా!  ప్రార్థన ప్రతి ఒక్కరు చేసుకొనదగినది.  మనము విశ్వసించే క్రీస్తు ప్రభువు కూడ తండ్రియైన దేవుని ప్రార్థించాడు.  ఇది అందరికి తెలిసిన విషయమే.  అలాగే క్రీస్తు ప్రభువు యొక్క తల్లియైన కన్య మరియమ్మ కూడ  (అపొస్తలుల కార్యములు 1:14) అపొస్తలులతో బాటు విశ్వాసులతో బాటుగా ప్రార్థనలో ఎడతెగక ఉన్నట్లుగా వ్రాయబడియున్నది.  అపొస్తలుల కార్యములు 2:42, ''వీరు అపొస్తలుల బోధయందును సహవాసమందును, రొట్టె విరుచుటయందును ప్రార్థన చేయుటయందును ఎడతెగక యుండిరి.''  ఇందులో మరియమ్మ పేరు వ్రాయబడలేదు.  కాని ఆమె ప్రార్థనా జీవితములో జీవిస్తున్నట్లుగానే లెక్కించాలి.  లేకపోతే ఆమె క్రీస్తు ప్రభువు పునరుత్థానము తరువాత ఏమి చేస్తున్నట్లు?  పరిశుద్ధురాలుగా ఆమె తన తరువాత జీవితమును అపొస్తలులతో ప్రార్థనా జీవితమును కొనసాగించింది.  అవసరతను బట్టి ఉపవాస ప్రార్థనలు చేసి యుండును.  అలాగే లూకా 2:36-37, ''అన్న  . . . . .  యెనుబదినాలుగు సంవత్సరములు విధవరాలైయుండి, దేవాలయము విడువక ఉపవాస ప్రార్థనలతో రేయింబగళ్లు సేవచేయుచుండెను.''  ఇందులో అన్న ఉపవాసములు చేయుచు ప్రార్థనా జీవితమును కొనసాగించుచూ ఉన్నది.  కనుక ఏ స్త్రీ అయినను అవసరతను బట్టి ఉపవాసముతోను సాధారణముగాను ప్రార్థించుట వంటివి చేయవచ్చును.  ప్రార్థించుటలో మగవారని ఆడవారన్న తేడా లేదు.

7.  సంఘములో స్త్రీల సంగీత నాట్యములు

        ప్రియపాఠకులారా!  స్త్రీలు సంఘములో మౌనముగ ఉండాలి అని చెప్పబడిన స్థానములోనే వారు పాటలు, సంగీత వాయిద్యములతో పాడి నాట్యము చేయవచ్చని బైబిలు గ్రంథము తెలియజేయుచున్నది.  సంఘ కార్యములలో మౌనముగ ఉండాలిగాని  దేవుని సంబంధమైన పాటలు పాడుట సంగీత వాయిద్యములు వాయించుట వాటికి అనుగుణముగా నాట్యము చేయుట వంటివి చేయవచ్చును.  నిర్గమకాండము 15:20-21, ''మరియు అహరోను సహోదరియు ప్రవక్త్రియునగు మిర్యాము తంబురను చేత పట్టుకొనెను.  స్త్రీలందరు తంబురతోను నాట్యములతోను ఆమె వెంబడి వెళ్లగా మిర్యాము వారితో కలిసి యిట్లు పల్లవి యెత్తి పాడెను- యెహోవాను గానము చేయుడి  ఆయన మిగుల అతిశయించి జయించెను  గుఱ్ఱమును దాని రౌతును  సముద్రములో ఆయన పడద్రోసెను.''  పాతనిబంధన కాలములో అహరోను సోదరియైన మిర్యాము పాట పాడుచు తంబుర అను సంగీత వాయిద్యమును వాయించుచుండగా ఇశ్రాయేలీయుల అనేకమంది స్త్రీలు ఆనందముతో నాట్యము చేయుట జరిగింది.  ఈ సందర్భమును దేవుడైన యెహోవా అంగీకరించెను కనుక ఈ విషయమును తప్పుగా అహరోనుకుగాని మోషేకుగాని తెలియజేయలేదు.  కనుక సంఘములో స్త్రీ సంఘము యొక్క కార్యములు జరగవలసిన తీరును గూర్చి మాట్లాడుట జరుగక దైవసంబంధమైన పాటలు వాయిద్యములు వాయించుట వంటివి చేస్తూ దేవుని కీర్తించాలి.  1 కొరింథీ 11:6-14 సంఘము యొక్క కార్యకలాపములను గూర్చి స్త్రీలు ప్రత్యేకముగా స్త్రీల కూడిక ద్వారా చర్చించి సంఘ పెద్దకు తమ భర్తల ద్వారా విన్నవించవచ్చును.  సంఘములో స్త్రీ ప్రవచించాలన్నను వాక్య ప్రసంగాలు చేయాలన్నను తప్పనిసరిగా ముసుకు వేసికోవడముగాని లేదా తల వెండ్రుకలు కత్తిరించుకొని తమ అలంకారమును తగ్గించుకోవాలి.  ఎందుకంటే స్త్రీల ముఖ ఆకర్షణకు పురుషుల మనస్సు అస్థిరత పొంది దైవ ధ్యానమునకు ఆటంకము కలిగించవచ్చును.  కనుక ముఖ సౌందర్యము కనపడక చేసుకోవడమో లేదా తల  వెండ్రుకలు కత్తిరించుకోవడమో చేసి తమ జీవితమును ధన్యకరముగా చేసుకొనవచ్చును.

8.  ఆలయము - పనివారుగా స్త్రీలు

        ప్రియపాఠకులారా!  ఆలయము పవిత్రమైనదిగా అందరం భావిస్తాము.  ఇంత పవిత్రముగా భావించుదానిని మరింత శుభ్రముగా ఉంచవలసిన బాధ్యత అందరి పైన ఉంటుంది.  చెత్త చెదారములను ఎక్కడ అంటే అక్కడ వేయక అందరు బాధ్యతగా జీవించాలి.  అయితే దేవుని ఆలయములో పరిచర్య చేసి శుభ్రముగా ఉంచుటకు కొందరు (కొంతమంది) స్త్రీలను ఏర్పాటు చేసి వారికి కావలసిన వస్తువులను సిద్ధపరచినట్లుగా చెప్పబడింది.  నిర్గమకాండము 38:8, ''అతడు ప్రత్యక్షపు గుడారముయొక్క ద్వారమున సేవింపవచ్చిన సేవకురాండ్ర అద్దములతో ఇత్తడి గంగాళమును దాని ఇత్తడి పీటను చేసెను.''  ఈ విధముగా సాటి సహాయిగా సృజింపబడినను వీరిలో కొంతమంది (కొందరు) స్త్రీలు ఆలయమును పరిశుభ్రత కొరకు పరిచర్య చేయు స్త్రీలుగా పిలువబడుదురు గాని పనివారుగ పిలువబడరు.  వీరు కేవలము దేవుని ఆలయములో పరిచర్య చేయువారు మాత్రమే.  కాని చర్చీలలో అనేకమార్లు గమనిస్తూ ఉంటాను చాలామంది స్త్రీలు వారు చదువుకొన్నవారైనను ఆర్థిక స్థితిలో గొప్పవారైనను తమని తాము తగ్గించుకొని ఆలయములో చీపురు పట్టి చిమ్ముచూ శుభ్రపరచువారిని చూచాను.  వీరు ఎవరు?  పనివారు కారు.  పనివాడు జీతము పుచ్చుకొని పని చేయును.  వీరు చేయు పనికి జీతము పుచ్చుకొనరు కనుక వీరు చేయు పనిని పరిచర్యగా లెక్కింపబడును.

9.  స్త్రీలు బోధించుట

        ప్రియపాఠకులారా!  1 తిమోతి 2:11-12, ''స్త్రీలు మౌనముగా ఉండి, సంపూర్ణ విధేయతతో నేర్చుకొనవలెను.  స్త్రీలు మౌనముగా ఉండవలసినదేగాని, ఉపదేశించుటకైనను, పురుషునిమీద అధికారము చేయుటకైనను ఆమెకు సెలవియ్యను.''    ఇందులో స్త్రీలు ఉపదేశించుటకు అవకాశము లేదని పౌలు తిమోతికి వ్రాయుట జరిగింది.  సంఘములో పురుషులు ఉండగా వారు ఉపదేశించక కూర్చుంటే స్త్రీ లేచి ఉపదేశించుట సబబా!  ఒక్కసారి ఆలోచించవలసియున్నది.  ఇందులో చెప్పబడిన స్త్రీలు సాధారణమైనవారు.  వీరు అణుకువగా యుండాలి.  ఇలాంటి స్త్రీలలో దైవసందేశమును ప్రవచించువారు ఉన్నారని అలా ప్రవచించునప్పుడు ముసుగు ధరించుకోవాలని అదే పౌలు కొరింథీయులకు వ్రాసిన లేఖలో వ్రాసారు.  ప్రవచించు వరముగల మీరు ఇలాగే జీవించాలని అధికారముగా 1 కొరింథీ 12:10-11 వివరిస్తున్నది.  ఇలాంటి అధికారయుతమైన బోధను క్రీస్తు ప్రభువు ఈ లోకములో బోధించి దానిని సువార్తల ద్వారా తెలియజేయబడింది.  ఇలాంటి బోధను తిరిగి లేఖలలో వివరించుట పౌలు ద్వారా జరిగింది.  ఇది పవిత్రాత్మ ప్రేరణతో వ్రాసిన వాఖ్యానాలు.  కనుక వీటిలో పవిత్రాత్మ ప్రేరణ కొలది ప్రతి విషయమును ఖరాఖండితముగా తెలియజేయుట జరిగింది.  ఇలా తెలియజేసిన ఉపదేశములను చదువుచు తిరిగి వాటినిగూర్చి తెలియజేయుట బోధగా లెక్కింపబడును.  కనుక సంఘములో స్త్రీలు బైబిలు గ్రంథములోని బోధను చెప్పుటలో తప్పు లేదుగాని నూతనముగా వారి ఇష్టానుసారము వారు ఉపదేశములు చేయుటకు అనుమతి లేదు.  ఎందుకంటే స్త్రీకి శిరస్సు పురుషుడు.  కాని పురుషునికి శిరస్సు క్రీస్తు ప్రభువు.  కనుక ఉపదేశములు జతపరచుట లేక మార్పులు చేయుట అనునవి కేవలము దేవుని ఆత్మను పొందిన పురుషులు మాత్రమే చేయాలి.  ఇలా నూత్నీకరించినవి స్త్రీలు వాటిలో మార్పు చేయక ఉన్నది ఉన్నట్లుగా బోధించుటలో తప్పు లేదు.  కనుక స్త్రీ బోధ బైబిలు గ్రంథములోని బోధవలె ఉండాలి.  తమ స్వకీయ ఆలోచనలను బట్టి గాక ఆత్మ బయలుపరిస్తే తప్ప నూతన ఉపదేశములు మార్పులు చేయుటకు వీలులేదు.  అలాగే పురుషులలో అందరు కూడ నూతన ఉపదేశము చేయుటకు అవకాశము లేదు.  వీరు కూడ బైబిలు గ్రంథములో ఉన్నదానినే బోధించాలి.  కాని కొందరు పురుషులు దేవుని ఆత్మ  ప్రేరణతో నూతన ఉపదేశములకు నాంది అవుతారు.  అలాంటి వాటిలో నాచే వ్రాయబడిన గ్రంథములు ప్రథమ స్థానమును పొందుచున్నవి, ఎందుకంటే ఈ బోధ చివరి బోధ.  ఇకపై నూతన బోధ రాదు అని పవిత్రాత్మ గ్రంథకర్తనైన నాకు తెలియజేయుట జరిగింది.  పురుష స్వరూపియైన దేవుడు క్రీస్తు ప్రభువు రూపములో నూతన నిబంధన గ్రంథము ఉపదేశించుట దీనినే ఉపమాన రీతిగా బోధించుట జరిగింది.  ఈ ఉపదేశములను నూతనమైన రీతిలో చివరి బోధగా ఈనాడు ఈ గ్రంథాలను మీరు చదువుచున్నారు.

        స్త్రీలు ఉపదేశించుటకుగాని సంఘములలో మాటలాడుటకుగాని వారికి సెలవు లేదని 1 కొరింథీ 14:34లో అపొస్తలుడైన పౌలు వివరించుటలోని పరమార్థమేమిటంటే స్త్రీ ఆకర్షణ చాలా గొప్పది.  స్త్రీ సంఘములో ప్రసంగిస్తుంటే పురుషులకున్న మానసిక దౌర్భల్య సహజ స్థితిని బట్టి ఆమె ఆకర్షణకు హావభావాలకు పరవశులై ఆమె అందచందాల యందు మనస్సు తగుల్కొని ప్రభువు యొక్క ఆధ్యాత్మిక స్థితినిగూర్చి వారి ఆలోచనలు పని జేయవు.  ఆదాము భార్య చేతిలోని అందమైన ఫలములు ఆమె రూపు రంగునకు మనస్సు తగుల్కొని భుజించుటనుబట్టి లోకములో మరణము ప్రవేశించింది.  దేవుని కుమారులైన ఆదాము సంతతిలోని షేతు ఎనోషు వగైరా దైవకుమారులు ఆదికాండము 4:26లో వలె ప్రార్థనా జీవితములో ఉంటున్న వారిని కయీను సంతతిలోని నరకుమార్తెలు తమ అందచందాలతో దైవకుమారులను మరిపించి దైవత్వము నుండి విడిపించి మహా ఉగ్రతపూరితమైన జలప్రళయమునకు కారకులయ్యారు.  దావీదు స్త్రీని ఆశించి నరహంతకుడయ్యాడు.  సొలొమోను స్త్రీ ఆకర్షణకు అంతులేదు.  యెజెబెలు ఆహాబు యొక్క భార్య నాబోతును చంపించి నాశనకరమైన మార్గానికి దారి తీసింది.  యేసు ప్రభువు యొక్క పండ్రెండుమంది స్త్రీలలో ఆరుమంది స్త్రీలను ఆరుమంది పురుషులను శిష్యులుగా శిష్యురాండ్రుగా ప్రభువు చేర్చుకొని ఉంటే ఒకే పడక ఒకే నివాసము వీటివల్ల శరీరేచ్ఛలు ప్రబలి క్రొత్త నిబంధనకు రూపురేఖలుండవు - ప్రభువు ఈ లోకానికి వచ్చి వెళ్లిన తరువాత సువార్త పరిచర్య కొనసాగించేవారుండరు.  పురుషులకు సహజముగా ఉన్న బలహీనతను బట్టియే పౌలు ఈ మాట చెప్పినాడు.  మరి పురుషులు ప్రసంగించునప్పుడు స్త్రీ తాను ప్రేమించిన పురుషుని తప్ప మరెవరిపై ఆసక్తి చూపదు.  అది స్త్రీయొక్క గుణ లక్షణము.  తాను పెండ్లాడిన పురుషుడు ఎట్టివాడైనను మరొక అందగాడు ఎదురుపడినను ఆమె మనస్సు పెట్టదు.  అది స్త్రీకి దేవుడు ఇచ్చిన బలమైన ఆత్మ బంధమని గ్రహించాలి.  ఒకవేళ స్త్రీ ప్రసంగించాలన్న తలంపు ఉంటే తల వెండ్రుకలు కత్తిరించుకొని తల బోడి చేయించుకోవడమో లేదా తల మీద ముసుకు వేసుకొని ప్రసంగించడమో మంచిదని అపొస్తలుడైనపౌలు మనకు హితోపదేశం చేస్తున్నాడు.

10.  కుమారులు కుమార్తెలు దేవుని సందేశమును చెప్పుట

        ప్రియపాఠకులారా!  దేవుని సందేశమును తెలియజేయుటనే ప్రవచించు వరము అని చెప్పవచ్చును.  ఈ వరమును దేవుడు తన సేవకులలో స్త్రీ పురుష భేదము లేకుండ అనుగ్రహించునని అది రాబోవు కాలములో ఇస్తానని పాతనిబంధన కాలములో తెలియజేయుట జరిగింది.  ఇలా ప్రవచించాలి అంటే దేవుని ఆత్మను వీరు పొందాలి.  వీరు పొందాలి అంటే వారిపై దేవుడే స్వయముగా ఆత్మను అనుగ్రహిస్తే తప్ప ఎవరికి వారు స్వతహాగా పొందలేరు.  యోవేలు 2:28, ''తరువాత నేను సర్వజనులమీద నా ఆత్మను కుమ్మరింతును; మీ కుమారులును మీ కుమార్తెలును ప్రవచనములు చెప్పుదురు; మీ ముసలివారు కలలు కందురు, మీ యౌవనులు దర్శనములు చూతురు.''  ఈ విధముగా దేవుడు స్వయముగా తన ఆత్మను కుమ్మరించుట ద్వారా అనేకులు కుమారులు కుమార్తెలు దేవుని వరమును పొందుట వలన ప్రవచించుట జరుగునని చెప్పబడింది.  ఈ ప్రవచించు వరమును కలిగినవారు బైబిలు గ్రంథములోని ప్రవక్తలవలె ప్రవచించుట జరుగునుగాని, ఈ ప్రవచించు వరమును వీరు పొందునాటికి వీరిని ప్రవక్తలు అని పిలువరు, ఎందుకంటే క్రీస్తు ప్రభువు రాజులకు రాజుగా ప్రవక్తలలో అగ్రగణ్యుడుగా సిలువపై బలియాగము చేయుట వలన ప్రవక్తల కాలము నిలిచిపోయి క్రీస్తు ప్రభువు తరువాత అపొస్తలులు, దైవసేవకులుగా పిలువబడుచున్నారు.  వీరు పరిశుద్ధాత్మ అను దేవుని ఆత్మను పొందుట ద్వారా దైవక్రియలు జరిగించాలని అపొస్తలుల కార్యములలో చదువగలము.  వీరు దైవసందేశమును ప్రవచించారు.  ఈ కాలములో అపొస్తలులతో బాటుగా స్త్రీ పురుషులు కూడ విరివిగా ఆత్మవరములో భాగస్వాములయ్యారు.  అపొస్తలుల కార్యములు 10:44-48, ''పేతురు ఈ మాటలు ఇంక చెప్పుచుండగా అతని బోధ విన్న వారందరిమీదికి పరిశుద్ధాత్మ దిగెను.  సున్నతి పొందినవారిలో పేతురుతోకూడ వచ్చిన విశ్వాసులందరు, పరిశుద్ధాత్మ వరము అన్యజనులమీద సయితము కుమ్మరింపబడుట చూచి విభ్రాంతినొందిరి.  ఏలయనగా వారు భాషలతో మాటలాడుచు దేవుని ఘనపరచుచుండగా వినిరి.  అందుకు పేతురు-మనవలె పరిశుద్ధాత్మను పొందిన వీరు బాప్తిస్మము పొందకుండ ఎవడైనను నీళ్ళకు ఆటంకము చేయగలడా అని చెప్పి యేసు క్రీస్తు నామమందు వారు బాప్తిస్మము పొందవలెనని ఆజ్ఞాపించెను.  తరువాత కొన్ని దినములు తమయొద్ద ఉండుమని వారతని వేడుకొనిరి.''  కైసరయ పట్టణములో ఉన్న అన్యులు వీరు.  వీరు కూడ ఆత్మను పొంది భాషలలో మాట్లాడుట జరుగుచున్నది.  అలాగే వీరు దేవుని సందేశమును ప్రవచించి కూడ ఉండవచ్చును.  ఈ కాలములో జరగబోవు ఈ సంఘటనలను పాతనిబంధన కాలములో యోవేలు చేత వ్రాయించుట జరిగింది.  ఇందులో పేతురు మాట్లాడుచుండగా అక్కడ ఉన్న అందరిపై అన్నాడుగాని స్త్రీ పురుషులని భేదము లేకుండ చెప్పుట జరిగింది.  ఈ కాలములో క్రైస్తవ విశ్వాసమును గూర్చిన ప్రచారము విపరీతముగ జరిగిందనుటకు ఇది ఒక నిదర్శనము.  

        ఈ విధముగా అపొస్తలుల కాలములోని కుమారులు / కుమార్తెలు అనగా క్రీస్తు ప్రభువునందు విశ్వాసము కలిగినవారు ఆత్మను పొంది క్రియ జరిగించుట ద్వారా క్రైస్తవ విశ్వాసము ప్రబలింది.  వీరినందరిని దైవసేవకులు అని విశ్వాసులు అని పిలువబడినవారేగాని ప్రవక్తలని పిలువబడలేదు.  ఈ విధముగా అపొస్తలుల కాలము, ప్రథమ విశ్వాసుల కాలము గడచిపోయింది.  ఆ తరువాత కాలము విశ్వాసుల కాలము కొనసాగుచున్నను దేవుని ఆత్మను పొందినవారిని అరుదుగా చూస్తున్నాము.  విశ్వాసుల కాలములో ప్రథమ భాగములో విరివిగా ఆత్మను పొందిన కుమారులు కుమార్తెలు విశ్వాసుల కాలములోని తరువాతి వేదభాగములు వచ్చుసరికి తగ్గిపోవుట గమనించాలి. ఒక ప్రాంతములోని వీరందరు ఆత్మను పొందితే ఈనాడు సంఘములో ఎందరు ఆత్మను పొందుచున్నారు.  ఎంతమంది దైవసందేశమును వినిపిస్తున్నారు.  కనీసము ఒక్కరు కూడ లేని సంఘాలు ఈనాడు మనకు కనిపిస్తున్నాయి. ఈ మధ్య ఒక సంఘములో ఓ  స్త్రీ దైవసందేశమును ఇచ్చుట చూచాను.  ఆమె వారిపై చేతులు ఉంచి ప్రార్థించి దేవుడు పలికిన మాటలు చెప్పుచున్నది.  నేను చాలా ఆనందముతో నిండిపోయాను.  బైబిలు గ్రంథములో చెప్పబడిన స్థితిలో ఇంకా కొందరు ఈ లోకములో ఉన్నారని ఆశ్చర్యమునకు లోనై పోయాను.  ఇదే సంఘటన కొంత సమయము గడచునప్పటికి నాలో తీవ్రమైన వేదనకు కారణమైంది.  అక్కడ జరుగునది దైవాత్మ వలన కాదని నాకు అర్థమైంది.  ఆమె కేవలము బైబిలు గ్రంథములోని వాక్యములను కొన్ని బట్టీ కొట్టి వాటినే ఒక్కొక్కటిగా చెప్పుచు దేవునికి స్తోత్రమని చెప్పుచు దేవుని ఆత్మను దూషించుచున్నట్లు గ్రహించాను.  చూచారా!  ఆలోచించారా!  1 కొరింథీ 14:1-5, 8-9, ''ప్రేమ కలిగియుండుటకు ప్రయాసపడుడి.  ఆత్మ సంబంధమైన వరములను ఆసక్తితో ఆపేక్షించుడి; విశేషముగా మీరు ప్రవచనవరము ఆపేక్షించుడి.  ఎందుకనగా భాషతో మాటలాడువాడు మనుష్యులతో కాదు దేవునితో మాటలాడుచున్నాడు; మనుష్యుడెవడును గ్రహింపడుగాని వాడు ఆత్మవలన మర్మములను పలుకుచున్నాడు.  క్షేమాభివృద్ధియు హెచ్చరికయు ఆదరణయు కలుగునట్లు, ప్రవచించువాడు మనుష్యులతో మాటలాడుచున్నాడు.  భాషతో మాటలాడువాడు తనకే క్షేమాభివృద్ధి కలుగజేసికొనును గాని ప్రవచించువాడు సంఘమునకు క్షేమాభివృద్ధి కలుగజేయును.  మీరందరు భాషలతో మాటలాడవలెనని కోరుచున్నానుగాని మీరు ప్రవచింపవలెనని మరి విశేషముగా కోరుచున్నాను.  సంఘము క్షేమాభివృద్ధి పొందునిమిత్తము భాషలతో మాట లాడువాడు అర్థము చెప్పితేనేగాని వానికంటె ప్రవచించువాడే శ్రేష్ఠుడు.  . . .  మరియు బూర స్పష్టముకాని ధ్వని ఇచ్చునప్పుడు యుద్ధమునకెవడు సిద్ధపడును?  ఆలాగే మీరు స్పష్టమైన మాటలు నాలుకతో పలికితేనేగాని పలికినది ఏలాగు తెలియును?  మీరు గాలితో మాటలాడు చున్నట్టుందురు.''  ఇందులో చెప్పిన విధముగా దేవుని ఆత్మను పొంది దైవసందేశమును వినిపించుట గొప్ప విషయమేగాని ఆత్మను పొందనివారు చెప్పితే!  అది తప్పు అవుతుంది.  మనము చేయబోవు జరుగబోవు వాటికి దేవుని సందేశము చెప్పుటనే ప్రవచించుట అగును.  దేవుని ఉద్దేశ్యమును ఎరిగించాలి.  ఇదిగో నీ కుమారుడు ఈ పాపము చేసినాడు కనుక దేవుడు ఈ సందేశమును వినిపించమని చెప్పెనని చెప్పాలి.  

        బైబిలు గ్రంథములో ఏ ప్రవచనమైన ఇదే విధముగా సాగింది.  2 సమూయేలు 12:1-13లో దావీదు ఊరియా భార్యతో చేసిన వ్యభిచారమును నాతాను తెలియజేసి ఆ పాపమునకు వచ్చు ఫలితమును దైవసందేశముగా తెలియజేసాడు.  అలాగే 2 సమూయేలు 24:1-17లో గాదు ప్రవక్త జనాభా లెక్కలు చేసి ధర్మశాస్త్రములో చెప్పబడిన పన్నును చెల్లించక చేసిన పాపమునకుగాను వచ్చు ఫలితము దైవసందేశముగా చెప్పుట జరిగింది.  1 రాజులు 5:1-6లో దేవుని మందిరమును నిర్మించుట గూర్చి దైవసందేశమును తెలియజేయుట జరిగింది.  1 రాజులు 17:1లో ఏలీయా ప్రవక్త రాబోవు కరువును దైవసందేశముగా తెలియజేయుట జరిగింది.  అలాగే 1 రాజులు 18:41-46లో ఆహాబుకు రాబోవు వర్షమును తెలియజేయుట జరిగింది.  అలాగే 1 రాజులు 21వ అధ్యాయములో నాబోతుకు జరిగిన అన్యాయమును ప్రస్తావిస్తూ ఏ విధమైన చావును రాజు రాణి పొందబోవుచున్నారో తెలియజేశాడు.  వారు ఆ దైవసందేశము ప్రకారము మరణించారు.  2 రాజులు 20వ అధ్యాయములో హిజ్కియాకు వచ్చిన మరణకరమైన వ్యాధిని గూర్చి  ప్రవచించుట దాని ఫలితమును దైవసందేశముగా యెషయా తెలియజేయుట జరిగింది.  అలాగే యెషయా, యెహెజ్కేలు, యిర్మీయా వంటి ప్రవక్తలు ఇశ్రాయేలీయులు, వారి రాజులు చేసిన తప్పులను తెలియజేస్తూ దానికి జరుగు పరిణామమును దైవసందేశముగా ప్రవచించుట జరిగింది.  ఇదిగో నీవు గొడ్రాలివి నీకు దేవుడు గర్భము తెరచి నీకు బిడ్డ అనుగ్రహించుచున్నాడని దైవసందేశముగా తెలియజేయబడినవారు ఉన్నారు.  ఈనాడు ఈ విధముగా దైవసందేశమును నిర్భయముగా తెలియజేసినవారు ఎవరైనా ఉన్నారా!  అంటే అరుదు అని మాత్రమే చెప్పగలను.  

        దైవసందేశము ఇచ్చు స్త్రీని చూచానుగాని ఆమె చెప్పునది దేవుని ఆత్మ నుండి వచ్చునవి కావని గుర్తించాను, ఎందుకంటే సంఘములో ఉన్నవారందరిని పవిత్రులుగా చేసి దేవుని దీవెనలనే చిత్రవిచిత్రమైన వర్ణనలతో వారికి అందించి వారిని ఆ స్త్రీ మోసగించుట జరుగుచున్నది.  నీవు చేసిన తప్పును గూర్చియు దానివలన జరగబోవు పరిణామమును తెలియజేస్తేనే అది దైవసందేశము అవుతుంది.  నేను రాసిన గ్రంథములలో కొన్ని చోట్ల దైవసందేశమును వివరిస్తూ వారు చేయుచున్న తప్పును తెలియజేస్తూ అందువల్ల వారు పొందబోవు నాశనమును తెలియజేయుట ప్రభువు నాచే వ్రాయించిన గ్రంథములలో మీరు చదువగలరు.  ఇందులో ఆత్మ లేకనే ఆత్మ ఉన్నట్లుగా ప్రకటించు ప్రకటనలు దైవసంబంధము కాదు గనుక వీరు చేసిన ప్రతిజ్ఞలు నెరవేరవు.  కనుక కొన్ని యాదృచ్ఛికముగా జరిగినట్లుగా కనబడినను ఎక్కువ శాతము తప్పుగానే అగును.  పాపము చేసినవారికి నీవు ఈ పాపము చేసావని గద్దించాలి.  దాని ఫలితమును తెలియజేయాలిగాని దేవుని దీవెన నీపై యున్నదని తెలియజేయుట తప్పు.  ఇలాంటివారు వీరు అబద్ధ ప్రవక్తలుగా చెలామణి అగుచు నిజదైవ దూషణకు కారణమగుదురు.  కనుక వీరు మాత్రమేకాక వీరిని అనుసరించువారు కూడ నాశన మార్గములోనే ఉన్నారని గుర్తించాలి.  ఇలాంటివారికి దైవసందేశము ఒక్కటే.  వీరు చేయు ఆత్మయందు ప్రవచించు శుద్ధి వారికి లేకపోయినను ఆత్మను కలిగి ఉన్నట్లుగా నటించుట లేక సాతాను ఆత్మను వీరు కలిగియుండి దేవుని ఆత్మగా దానిని వర్ణించుట ఇవి రెండును నేరమే.  అలాగే వీరి ప్రవర్తన వలన అనేకులకు సాతాను సందేశమును లేదా తమ స్వంత సందేశమును దేవుని సందేశముగా విన్నవించుదురు కనుక ఇది పాపము.  కనుక అంత్య దినమున వీరు సాతాను రాజ్యములో పాలిపంపులు పొందవలసినదే కదా!  కనుక నటన మానమని నా మనవి.  లేని ఆత్మను ఉన్నట్లుగా ప్రదర్శించక నిజదేవుని ఆరాధించి ఆత్మను పొందమని వారిని వేడుకొనుచున్నాను.  యిర్మీయా 23:16-17.

        అపొస్తలుల కార్యములలో దేవుని కుమారులు కుమార్తెలపై విరివిగా ఆత్మను క్రుమ్మరించుట యోవేలు ప్రవక్త ప్రవచించుట జరిగింది.  అలాగే అపొస్తలుల కార్యములలో జరిగింది కూడ.  అయితే ఆ ఆత్మను పొందువారు నానాటికి తగ్గుచు ఈనాడు ఈ స్థితికి వచ్చింది.  ఇక యుగాంతానికి ఇక ఎవ్వరు ఉండక పోవచ్చును, ఎందుకంటే దేవుని ఆత్మను పొందగలిగిన దైవసేవకులు ఈ లోకములో ఉంటే ఈ లోకమును అంతము చేయవలసిన అవసరత లేదు.  ఇశ్రాయేలీయులలో ఆత్మ కార్యములు విరివిగా జరుగగా ఆ కాలములోని ఇశ్రాయేలీయులు క్రమేణా ఈ ఆత్మ కార్యములు కోల్పోయి దేవుని సందేశమును ప్రవచించు యోగ్యతను ఇంచుమించుగా అందరు కోల్పోవుట జరిగింది.  అందరు ఏకముగా విగ్రహారాధనలో అన్యదేవతలను పూజిస్తూ నిజదైవమునకు పూర్తిగా దూరమై జీవించారు.  ఈ కారణము వలన వారిలో లోపించిన దేవుని ఆత్మ కార్యములు మరల జరుగునని యోవేలు ప్రవక్త బోధించుట జరిగింది.  బాబిలోనియాకు బందీలుగా తీసికొను పోవునాటికి వారి మధ్య ప్రవక్తలు అనువారు ఒకరు లేక ఇద్దరు మాత్రమే ఉన్నారు.  యెషయా కొంత ముందు తరము వాడు కాగా యెహెజ్కేలు యిర్మీయా ఇద్దరు బాబిలోనియా చేతులలో ఇశ్రాయేలీయులు నాశనము పొందుట చూచినవారు.  అపొస్తలుల కాలములో అందరు స్త్రీలు పురుషులు నిజదైవమును గుర్తించిన వెంటనే ఆత్మను పొంది దేవుని జ్ఞానవరములను ప్రదర్శించారు.  అది ఇప్పటికే చాలావరకు కొరత ఏర్పడినట్లుగా గుర్తించాలి.  ఇలాగే జరిగితే ఒకప్పుడు ఇశ్రాయేలీయ దేశము బాబిలోనియన్ల చేతిలో నాశనము పొందినది కాని యుగాంతమున ఇప్పుడు ప్రపంచ వ్యాప్తముగా ఉన్న జనసందోహమునకు ఏమి జరుగనున్నదో ప్రకటనలో మనము చదువగలము.

        మత్తయి 24:5-11  అనేకులు క్రీస్తునని క్రీస్తు ఆత్మ నన్ను ఏర్పరచుకొన్నదని సాధ్యమైతే ఏర్పరచుకొన్నవారిని సహితము మోసపరచి గొప్ప సూచక క్రియలు మహత్కార్యాలు ప్రదర్శిస్తారని మార్కు 13:6-22 కూడ వివరిస్తున్నది.  ఎలాగంటే మా సంఘమే క్రీస్తు రాకడలో ఎత్తబడే సంఘమని తన్నుతాను హెచ్చించుకుంటాడు.  నా బోధ తప్ప మరెవరి బోధకు వెళ్లకూడదంటాడు.  ప్రార్థనతోనే రోగాలు నయము చేసికోవాలే గాని చనిపోయినను ఫరవాలేదు మందులు వాడకూడదని కండిషన్స్‌ (అంక్షలు) విధిస్తాడు.  అన్యులు నీ రక్త సంబంధులైనను మిత్రులైనను వారియొక్క వివాహాలకు, చనిపోతే వారి సమాధి కార్యక్రమాలకు వెళ్లకూడదని నిషేధిస్తాడు.  పరిశుద్ధాత్మ మా సంఘములో విరివిగా క్రియ జరిగిస్తున్నడని ఆత్మ కుమ్మరింపబడుతుందని దయ్యపు చిందులు ఆవేశాలతో అర్థముగాని భాషలతో వికారముగా అరుస్తారు.  మేము పరిశుద్ధాత్మ ఆవేశితులమని చెప్పుకుంటారుగాని వారి ఆలయ గేటు దగ్గర నున్న కుష్ఠురోగిని కూడ శుద్ధి చేయలేరు.  ఇదే విషయాన్ని గూర్చి 2 థెస్సలొనీక 2:4 సాతాను అపవాది అనువాడు దేవుని ఆలయములో కూర్చుంటాడని కనుక మీరు మోసపోకుండ చూచుకోండని హెచ్చరిస్తున్నాడు.  అపొస్తలుల కార్యములు 2:6-7 అపొస్తలులు పరిశుద్ధాత్మతో నిండుకొని భాషలతో మాట్లాడినప్పుడు అక్కడ చేరినవారికి వారి వారి స్వభాషలలో చక్కగా అర్థమైందని వ్రాయబడియున్నది.  అర్థముగాని భాషలు పరమాత్మ పలుకడని గ్రహించండి.  ఈ అర్థముగాని ఏ భాష ఎవడు ప్రవచించినను అది దయ్యపు ఆవేశమని గ్రహించాలి.  పాత నిబంధన కాలములో దేవుని వ్రేలితో వ్రాయబడిన లిపిని గాని వారి కలలకు అర్థము చెప్పగల శక్తినిగాని దైవజనులకు ఇచ్చినట్లు చదువగలము.  ఈనాడు పరిశుద్ధాత్మ యొక్క ఆవేశము ద్వారా ప్రవచిస్తున్నామని చెప్పుకొను భాషలకు ఏ విశ్వాసిగాని, దైవజనుడుగాని అర్థము చెప్పలేడు.  ఎందుకంటే అది మోసపరచు దయ్యపు ఆత్మల గోలయని తెలుస్తుంది.

        ఈ గ్రంథ రచయితగా నేను తరచుగ ప్రభువుతో మాట్లాడేవాడను.  ఇది గుర్తెరిగిన అపవాది ప్రభువు రూపములో నా యొద్దకు వచ్చి ఇప్పుడు ప్రయాణమై పోతే నీకు కావలసిన మనుష్యుడు దొరకునని చెప్పాడు.  నేను వెళ్లితే ఆ మనుష్యుడు లేడు.  ఇదేమిటని నేను ప్రభువు వైపు చూచినప్పుడు మత్తయి 11:27లోని వచనాలు నాకు వినిపించాడు.  అపవాది క్రీస్తు రూపములో వచ్చినప్పుడు నేను గుర్తుపట్టలేకపోయాను.  అప్పటినుండి నన్ను నేను జాగ్రత్తపడినాను.  ప్రభువు బయలుపరిస్తేనే తప్ప అపవాది యొక్క మోస కార్యాల నుండి బయటపడలేము.  ఈనాటి దైవజనులు క్రీస్తు రూపములో వచ్చిన అపవాదిని గుర్తించక అపవాది యొక్క ఉరులలో తగుల్కొని గిలగిలలాడుచున్నారు.

        ఈ అధ్యాయములో ఏమి తెలుసుకొన్నాము?  దేవుని ఆత్మను పొందుట దేవుని వరములను ప్రదర్శించుట అను విషయములో స్త్రీ పురుష భేదము లేదని గ్రహించాలి.

11.  స్త్రీ - పవిత్రాత్మ ప్రభావము

        ప్రియపాఠకులారా!  పాతనిబంధన కాలములో పవిత్రాత్మ అను పదమును ఉపయోగించక పోయినను దేవుని ఆత్మ ప్రవక్తలను ఆవేశించి వారిచే ప్రవచనములు చెప్పించినట్లుగా బైబిలు గ్రంథములో చదువగలము.  ఈ దేవుని ఆత్మ పాతనిబంధన కాలములో స్త్రీ, పురుషులు అను భేదము లేక ఎవరైతే దేవుని కోసము నిలబడతారో వారికి తన శక్తిని దయచేసి వారిచే భవిష్యత్తును దేవుని సందేశముగా చెప్పెడివారు.  పురుషులలో యెషయా, యిర్మీయా, యెహెజ్కేలు, నాతాను, ఏలీయా, ఎలీషా వంటివారు ఉండగా స్త్రీలలో అన్న, దెబోరా, హూల్దా వంటివారు ఉన్నారు.  వీరిలో దేవుని ఆత్మ ప్రభావమున ఎన్నో ప్రవచనాలు చెప్పుచు జరగబోవు సంగతులను వీరు తెలియజేయుట జరిగింది.  కాని ఇశ్రాయేలీయులు చరిత్ర చదివితే ఎంతోమంది ప్రవక్తలనుగూర్చి చెప్పబడినట్లుగా ఉన్నను, వీరు ఒకరి తరువాత ఒకరు ప్రవక్తలుగ క్రియ జరిగించినవారే.  ఏకకాలములో నిజమైన ప్రవక్తలు కొద్దిమంది మాత్రమే ఉండేవారు.  ఈ దేవుని ఆత్మను మనము పవిత్రాత్మగా నూతన నిబంధన గ్రంథము నుండి ఉచ్ఛరింపబడింది.  ఈ ఆత్మ ప్రభావము వలన, అనేకమంది స్త్రీలు పాతనిబంధన కాలములో ప్రవచించారుగాని గర్భమునందు ఆ ప్రభావమును ధరించినవారు లేరు.  కనుక వారు ప్రవక్త్రీనులుగానే మిగిలిపోయారు.

        నూతన నిబంధన కాలములో కన్య మరియమ్మ దేవుని ఆత్మ అనగా పవిత్రాత్మ ప్రభావమును పొందుట జరిగింది.  ఈ ఆత్మ ప్రభావమున ఆమె ప్రవచించలేదుగాని ఆమె గర్భము ధరించుట జరిగింది.  మత్తయి 1:18, ''యేసుక్రీస్తు జననవిధ మెట్లనగా, ఆయన తల్లియైన మరియ యోసేపునకు ప్రధానము చేయబడిన తరువాత వారేకము కాకమునుపు ఆమె పరిశుద్ధాత్మవలన గర్భవతిగా ఉండెను.''  ఇలా జరుగుట కేవలము కన్య మరియమ్మ విషయములోనే జరిగింది.  ఇలా జరిగిన పాతనిబంధన కాలములోని స్త్రీలు భవిష్యత్తును ప్రవచించారుగాని కన్య మరియమ్మ మాత్రము దీనికి మూలమైన ఆ పవిత్రాత్మలోని శక్తిని శిశువు రూపమున తన గర్భమునందు ధరించింది.  ఇదే మన రక్షకుడు ఈ లోకములో జన్మించుటకు మార్గముగా మారింది.  ఈ స్థితినిగూర్చి సంశయము పొందిన యోసేపుకు ప్రభువు దూత కలలో కన్పించి నివృత్తి చేయుట కూడ జరిగింది.  మత్తయి 1:19-20, ''ఆమె భర్తయైన యోసేపు నీతిమంతుడైయుండి ఆమెను అవమానపరచనొల్లక రహస్యముగా ఆమెను విడనాడ ఉద్దేశించెను.  అతడు ఈ సంగతులను గూర్చి ఆలోచించుకొనుచుంగా, ఇదిగో ప్రభువు దూత స్వప్నమందు అతనికి ప్రత్యక్షమై-దావీదు కుమారుడవైన యోసేపూ, నీ భార్యయైన మరియను చేర్చుకొనుటకు భయపడకుము, ఆమె గర్భము ధరించినది పరిశుద్ధాత్మవలన కలిగినది;'' ఈ విధముగా పవిత్రాత్మ ప్రభావముతో గర్భము ధరించిన కన్య మరియమ్మ ఒక కుమారునికి జన్మనిచ్చుట జరిగింది.  మత్తయి 1:21, 25, ''ఆమె యొక కుమారుని కనును; తన ప్రజలను వారి పాపములనుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అను పేరు పెట్టుదువనెను.  . . .  ఆమె కుమారుని కను వరకు ఆమెను ఎరుగకుండెను; అతడు ఆ కుమారునికి యేసు అను పేరు పెట్టెను.''  మరియ ప్రభువును కన్న తరువాత యాకోబు యోసేపు సీమోను యూదా అనువారికి  యోసేపుతో కూడి జన్మనిచ్చిందని బుద్ధి జ్ఞానము వివేచన లేని పాస్టర్లు కొందరు బోధించడం మనము వింటుంటాము.  ఇందునుగూర్చి నాచే విరచితమైన ''నా ప్రభువు తల్లి'' అను గ్రంథాన్ని చదివి యధార్థమేమిటో తెలిసికోగలరు.  ఈ విధముగా పవిత్రాత్మ ప్రభావము కన్య మరియమ్మ అను స్త్రీ విషయములో చూపుట జరిగింది.        

        అటుతరువాత దేవుని ఆత్మ అనగా పవిత్రాత్మ శక్తి క్రీస్తు ప్రభువులో ఉండుట వలన అనేక మహత్యములు ఈ లోకములో జరిగించి రాబోవు భవిష్యత్తును ప్రవచించుట చేసారు. ఈ శక్తిని తన మరణానంతరము తన శిష్యులకు క్రీస్తు ప్రభువు చేసిన వాగ్దానము ప్రకారము పెంతెకొస్తు దినమున పరిశుద్ధాత్మను ఇచ్చుట వలన వారు కూడ ప్రవచించుట అన్యభాషలలో మాట్లాడుట, స్వస్థపరచుట వంటి అనేక కార్యములు కొనసాగించుట జరిగింది.  అటుతరువాత ఈ పవిత్రాత్మ ప్రభావము శిష్యుల ద్వారా స్త్రీ పురుషులను భేదము లేక ఎవరైతే దేవుని కుమారులు కుమార్తెలుగా మారి నిజమైన మార్పుతో సంపూర్ణముగా తమను దేవుని కొరకు సమర్పించుకొన్నారో వారిపై కనబడుట వలన వారు కూడ అన్యభాషలలో మాట్లాడుచు, ప్రవచిస్తూ స్వస్థతవంటి కార్యములు జరుగుచున్నవి.  ఈ విధముగా ఈ యుగాంతమునకు ముందు వరకు స్త్రీ పురుషులను భేదము లేక ఈ కార్యక్రమము కొనసాగునని గ్రహించాలి.

12.  ప్రార్థనా కూడికలు - స్త్రీల ప్రాధాన్యత

        ప్రియపాఠకులారా!  క్రీస్తు ప్రభువు పునరుత్థానము తరువాత మొట్టమొదటగా  ప్రార్థనాకూడిక జరిగింది.  ఇందులో ప్రధాన పాత్రధారులుగా కన్య మరియమ్మ, క్రీస్తు ప్రభువు శిష్యులు, స్త్రీలు పొందారు.  అపొస్తలుల కార్యములు 1:14, ''వీరందరును, వీరితోకూడ కొందరు స్త్రీలును, యేసు తల్లియైన మరియయు ఆయన సహోదరులును ఏకమనస్సుతో ఎడతెగక ప్రార్థన చేయుచుండిరి.''  ఈ విధముగా ప్రార్థనలో ఎడతెగక  ఉన్నవారితో స్త్రీలు కూడ ఉన్నారని గుర్తించాలి.  ఈ కూడికలో ముఖ్యమైన దైవసేవకులతో బాటుగా స్త్రీలు పురుషులతో సమానముగా పాల్గొనుటను మనము గమనించాలి.  కనుక ప్రార్థనలో పాల్గొనుట ప్రార్థించుట వంటి విషయములలో స్త్రీ పురుష భేదములు లేవు.  ఎందుకంటే యదార్థవంతుల ప్రార్థన ఆయన అంగీకరించును.  యాకోబు 5:15 విశ్వాస సహితమైన ప్రార్థన రోగిని స్వస్థపరచును - కాబట్టి యదార్థత - విశ్వాసము అన్నది స్త్రీ పురుషుల ఇరువురిలో ఉంచుకొని ప్రార్థన చేయవలెను.

13.  స్త్రీ - ముసుగు ఆచారము

        ప్రియపాఠకులారా!  1 కొరింథీ 11:6-8, ''స్త్రీ ముసుకు వేసికొననియెడల ఆమె తల వెండ్రుకలు కత్తిరించుకొనవలెను.  కత్తిరించుకొనుటయైనను క్షౌరము చేయించుకొనుటయైనను స్త్రీ కవమానమైతే ఆమె ముసుకు వేసికొనవలెను.  పురుషుడైతే దేవుని పోలికయు మహిమయునై యున్నాడు గనుక తలమీద ముసుకు వేసికొనకూడదు గాని స్త్రీ పురుషుని మహిమయైయున్నది.  ఏలయనగా స్త్రీ పురుషునినుండి కలిగెనేగాని పురుషుడు స్త్రీనుండి కలుగలేదు.''  

        ఇందులో ముసుగును గూర్చి ప్రత్యేక వర్ణన ఉన్నది. స్త్రీ ముసుగు ధరించి సంఘములోను ప్రార్థనలోను పాల్గొనాలని చెప్పబడింది.  దానికి గల కారణము కూడ ఈ వచనములోనే చెప్పబడింది.  అదేమిటంటే స్త్రీయే పురుషుని కొరకు సృష్టింపబడింది.  ఆదిలో ఆదాము హవ్వను దేవుడే సృజించెనని చదువుకొన్నాము.  ఆదాము మొదట సృజింపబడినాడు.  ఈయనయొక్క ప్రక్కటెముక నుండి ఆయనకు సాటి సహాయిగా జీవించుట కొరకు హవ్వ అను స్త్రీని దేవుడు సృజించాడు.  ఈ విధముగా స్త్రీయే పురుషుని నుండి సృజించబడింది.  అంటే పురుషునియొక్క అవసరములకు స్త్రీ సృజించబడింది.  కనుక ఏ స్త్రీ అయినను పురుషుని కొరకే సృజింపబడినది కనుక పురుషుని కన్నులకు ఆమె సౌందర్యముగా కనిపించును.  ఈ విధముగా కనిపించుట వలన సంఘములో పురుషునియొక్క మనస్సు వికలమగుటకు ఎక్కువగా అవకాశము ఉన్నది.  పురుషుడు తనయొక్క శారీరక కోరికను అదుపు చేసుకొనుటకు బహుగా ప్రయత్నిస్తాడు కాని అనేకమార్లు దానిని అదుపు చేసుకొనుట కష్టముగా భావిస్తారు.  ఎవరైతే శారీరక కోరికను అదుపు చేసుకొందురో వారు పరిశుద్ధులుగా జీవించు అవకాశాలు ఎక్కువ.  అదే స్త్రీ విషయము శారీరక కోరిక ఉన్నను దానికి లోను కాదు.  ఎక్కువ శాతము తమ శారీరక కోరికను అదుపులో ఉంచుకొని జీవించువారు అనేకులు కలరు.  ఏది ఏమైనప్పటికి మగవారైనను ఆడవారైనను అదుపు తప్పి శారీరక కోరికలకు లోనై క్రమము తప్పి జీవిస్తే అది పాపమే.  పురుషుని మనస్సు అనేక పర్యాయములు స్త్రీని గమనిస్తూనే ఉంటుంది.  అలాగే స్త్రీలోని మనస్సు కొద్ది పర్యాయములే అలా చేయునుగాని వారు అదుపు తప్పి ప్రవర్తించరు.  అలా ప్రవర్తించువారు వ్యభిచారిణిగా ముద్రింపబడుచున్నారు.  వీరు సమాజములో కొద్దిమంది మాత్రమే యున్నారు.  

        అలాగే పురుషుడు తన మనస్సులో చపలచిత్తమును ప్రదర్శించుచు అనేకమార్లు స్త్రీని గమనించును.  చాలామంది పురుషులు స్త్రీ వెళ్లుచున్నప్పుడు ఆ దారిని దాటువరకు తొంగి చూచువారిని నేను అనేకసార్లు చూచాను.  దీనికి కారణము పురుషుని శారీరక అవసరాలకు సహాయిగా ఉండుటకు స్త్రీ సృజింపబడుటయే.  ఇలాంటి స్త్రీతో శయనించి తన శారీరక కోరికను తీర్చుకొనును.  ఇలా తన కోరిక తీరని పురుషుడు అనేకసార్లు సంచరిస్తున్న స్త్రీలను చూచుటకు ప్రయత్నిస్తాడు.  అంటే తన సాటి సహాయిగా ఉన్న స్త్రీ తనకు దూరముగా ఏ కారణము చేతనైన ఉన్నప్పుడు పురుషునిలోని శారీరక కోరిక తప్పని తెలిసినను మనస్సు కదిలించుట ద్వారా బలహీన మనస్సు కలిగినవారు దాని ప్రలోభమునకు లోనై తన చూపు పర స్త్రీపై మరలును.  ఈ స్థితి స్త్రీ యొక్క శరీర సౌష్టవము కనబడులాగున వస్త్రములు ధరించి సంఘములో ఉంటే ఈ పురుషుని మనస్సు ఆ స్త్రీపై పదే పదే లాగును.  ఇతడు తన మానసిక బలహీనతను బట్టి ఎలాగున ప్రార్థన చేయగలడు?  అదే స్త్రీ తలపై ముసుగు ధరించి ప్రార్థనలోను సంఘములో ఉన్నట్లయితే ఆ స్త్రీ వస్త్రము తప్ప మరే శరీర భాగము ప్రక్కవారికి కనిపించు అవకాశము ఉండదు కనుక పురుషుని చూపు వారిపై తిరిగినను  వారి మానసిక బలహీనతను ప్రేరేపించు స్థితి ఉండదు.  కనుక పౌలు తన లేఖలో - 1 కొరింథీ 11:13, ''మీలో మీరే యోచించుకొనుడి; స్త్రీ ముసుకు లేనిదై దేవుని ప్రార్థించుట తగునా?''  అని వ్రాసాడు.  ప్రార్థన చేయుటకు తలపై ముసుగుకు సంబంధమే లేదు.  కాని మన జీవితము ఎదుటివారి ప్రార్థనా జీవితమునకు భంగము కలుగకూడదు.  పురుషుని మనస్సును గ్రహించిన పౌలు పరిశుద్ధాత్మ ప్రేరణతో ఈ ఆచారమును స్త్రీకి సంఘములో పెట్టుట జరిగింది.  పురుషుడు ఉండేది సంఘములో.  ఆ పురుషుడు ప్రార్థించాలి అనుకొన్నప్పుడు సాతాను ఒక చిన్న ప్రేరణ కలిగించి అటు ఇటు చూచునట్లుగా చేసాడనుకొందము.  అప్పుడు అక్కడ ఉన్న స్త్రీలలో అంగాంగములు కనబడునట్లుగా ఉన్న స్త్రీపై తన చూపు మరలి అతనిలోని కామ కోరికలు కలుగును.  ఈ స్థితికి కారణము మీరు కాకూడదని పౌలు ఈ ముసుగు ఆచారమును పెట్టినట్లుగా మనము గ్రహించాలి.  మత్తయి 5:28, ''నేను మీతోచెప్పునదేమనగా-ఒక స్త్రీని మోహపుచూపుతో చూచు ప్రతివాడు అప్పుడే తన హృదయమందు ఆమెతో వ్యభిచారము చేసినవాడగును.''  ఈ విధముగా కామేచ్ఛలతో పరికించి ప్రార్థనా సమయమును వ్యర్థపరచుకొని శిక్షకు గురి అగుచున్నాడు.  ఈ స్థితికి కారణము కల్పించినది స్త్రీయే కదా!  ఇక్కడ కొందరు ఇలా ప్రశ్నించవచ్చును.  మనస్సును ఆధీనములో ఉంచుకొని ప్రార్థనలో ఉండాలి.  అది ఉంచుకోలేకపోవుట పురుషుని తప్పుగాని మాది కాదు అని చెప్పువారు ఉన్నారు.  వీరితో నేను కూడ ఏకీభవిస్తాను.  తప్పు చేస్తున్నది పురుషుడే.  ఈ పురుషుడు చూచినప్పుడు ముసుగులో ఉన్న స్త్రీ కనబడదు.  కాని ముసుగులో లేని స్త్రీ యొక్క శారీరక భాగములు కనిపించుట జరుగును.  ఇది వాని మానసిక చంచల జీవితమునకు కారణము కామేచ్ఛలను రగిలించు అవకాశము ఉన్నది.  ఇలా జరుగుటకు స్త్రీ ఆ విధముగా కనడుటయే అని పౌలు చెప్పుచున్నారు.  ఎదుటివారిని పాప స్థితిలోనికి లాగు విధముగా స్త్రీలు ప్రదర్శించినను ఆమె కూడ తప్పు చేయక పోయినను తప్పుగానే పరిగణింపబడును.  కనుకనే పౌలు పురుషుని కోసము సృజింపబడిన స్త్రీకి ఈ నిబంధన ఏర్పరచి పురుషుని మానసిక బలహీనతల నుండి కొంతవరకు కాపాడు ప్రయత్నము చేసినట్లుగా గుర్తించాలి.  అలాగే స్త్రీ ముసుగు వేసుకొని ప్రార్థించినంత మాత్రాన తను కోల్పోయేది ఏదియు లేదని గ్రహించాలి.

        అలాగే ఈనాడు సమాజము బాగుగా అభివృద్ధి చెంది స్త్రీ పురుషులు ఇద్దరు సమానులే అని వాదించుకొనువారు ఉన్నారు.  ఇలా వాదించుచు స్త్రీ ముసుగు ఎందుకు వేసుకోవాలి?  పురుషుడు ఎందుకు వేసుకొనకూడదు?  ఈ విధముగా బైబిలు గ్రంథము అసమానతను బోధించుచున్నది అని చెప్పువారు కలరు.  అందుకే 1 కొరింథీ 11:16, ''ఎవడైనను కలహప్రియుడుగా కనబడినయెడల మాలోనైనను దేవుని సంఘములోనైనను ఇట్టి ఆచారములేదని వాడు తెలిసికొనవలెను.''  కనుక ఈ ఆచారము మనకు లేదని చెప్పమంటున్నాడు.  కాని మన సంఘములో ఉన్న మన సహోదరుల మానసిక దుర్భలతను గ్రహించి వారిని పాపములోకి పడిపోక ఉండుట కొరకు స్త్రీలారా!  మీరు తగ్గించుకొని ముసుగు వేసుకోలేరా!  ఇలా మీరు తగ్గించుకొని పురుషులను పాపము నుండి రక్షించుట మీకు ఘనముగా అనిపించుట లేదా!  ఒక్కసారి ఆలోచించి ముసుగు అను ఆచార నిబంధనను పాటించి సంఘ అభివృద్ధికి పాటుపడాలని కోరుచున్నాను.  స్త్రీలారా!  ముసుగు ఆచారములో మీ కనికరము (దయ చూపుట) తగ్గింపు స్వభావము మరియు పురుషుని పాపము నుండి కాపాడాలన్న మీ తలంపు కనబడుచున్నవని గమనించాలి. పాపము జరగకుండ చేయు ప్రయత్నము చాలా గొప్పది.  అలాగే పురుషుల మానసిక దౌర్భల్యమునకు కనికరము చూపుట తన్నుతాను తగ్గించుకొని ముసుగు వేసుకొను స్త్రీలలోని గొప్ప గుణములని బైబిలు గ్రంథము తెలియజేయుచున్నది.  మత్తయి 5:7, ''కనికరముగలవారు ధన్యులు; వారు కనికరము పొందుదురు.''  ఈ విధముగా మీరు చూపు కనికరము వృధా కాక రెండవ రాకడలో క్రీస్తు ప్రభువు న్యాయపీఠము ముందు మీరును కనికరము ప్రభువు నుండి పొందుదురని గ్రహించాలి.  అలాగే తన్నుతాను తగ్గించుకొనువారు హెచ్చింపబడుదురు అని బైబిలు గ్రంథము చెప్పుచున్నది.  లూకా 18:14   ఓ స్త్రీలారా!  మీరు తగ్గింపు స్వభావమును కలిగి ముసుగు వేసుకొని మిమ్మల్ని మీరు తగ్గించుకొన్నందులకు క్రీస్తు ప్రభువు హెచ్చించునని గ్రహించాలి.  అష్ట భాగ్యములలో ఒక భాగ్యమును పొందిన మీరు ధన్యకరమైన జీవితమును ఈ ముసుగు ద్వారా పొందుచున్నట్లుగా గ్రహించాలి.

        అపొస్తలుల కార్యములు 18:18 సౌలును ప్రభువు తన వెలుగు ద్వారా పట్టుకొన్నప్పుడు మంచి అందగాడు యవ్వనుడు.  అతను ప్రభువును గూర్చిన పరిచర్య మొదలు పెట్టినప్పుడు అతనిని అపాదమస్తకము వైపే తమ చూపులు ప్రసరింపజేస్తూ ప్రభువు బోధపై మనస్సు నిలుపలేని యవ్వన స్త్రీల నిమిత్తము తల బోడి చేయించుకొని సన్యాసి వస్త్రాలు ధరించి తన అందాన్ని పూర్తిగా తగ్గించుకొన్నాడు.  అంతేగాని దైవసన్నిధిలో ఎన్నో మ్రొక్కుబళ్లు ఉన్నాయి.  కాని ఈ మ్రొక్కుబడి హేయ్యము దైవసన్నిధిలో నిషేధమని గ్రహించాలి.  ఇందునుబట్టియే తీతుకు వ్రాసిన లేఖ 2:6లో యవ్వన పురుషులను హెచ్చరించమని వ్రాసియున్నాడు.

14.  సంఘ సమావేశము - స్త్రీలు మాట్లాడుట

        ప్రియపాఠకులారా!  1 కొరింథీ 14:34-35, ''స్త్రీలు సంఘములలో మౌనముగా ఉండవలెను; వారు లోబడియుండవలసినదే గాని, మాటలాడుటకు వారికి సెలవు లేదు.  ఈలాగు ధర్మశాస్త్రమును చెప్పుచున్నది.  వారు ఏమైనను నేర్చుకొనగోరినయెడల, ఇంట తమ తమ భర్తల నడుగవలెను; సంఘములో స్త్రీ మాటలాడుట అవమానము.''  

        ఇందులో సంఘ సమావేశమున స్త్రీలు మాటలాడుట అవమానకరమని పౌలు చెప్పుచున్నారు.  ఇంతకి సంఘ సమావేశము ఎందుకు జరుగును?  ఏదైన కార్యములు తలపెట్టినప్పుడు దానిని ఎలా చేయాలి అని సంఘ సమావేశము జరుగును.  ఈ సమావేశములో చర్చించి ఆ పనిని ఎలా చేయాలన్న నిర్ణయము చేస్తారు.  అంటే పండుగలు, సువార్త కార్యములు, సంఘ పనులు ఇలాంటివి.  వీటిని చేయుటకు సంఘము సమావేశమై ఎలా చేయాలో నిర్ణయిస్తారు.  ఈ నిర్ణయము చేయు సమయములో స్త్రీలు మాటలాడవలసిన అవసరత ఉన్నదా?  అన్న ప్రశ్న మనము వేసుకోవాలి.  చర్చిలో జరగవలసిన పనులు గూర్చిన వాటిని సంఘ పెద్దలుగా కొందరు పురుషులు సమావేశమై తీసుకొను నిర్ణయము.  అందులో మాటలాడవలసిన అవసరత లేదు.  అందులోను ఈ వచనములో చెప్పబడిన స్త్రీలు వివాహము చేసుకొన్నవారు.  వీరు తమ భర్తల కార్యములలో సహాయిగా జీవించుటకు తమ జీవితమును ఎన్నిక చేసుకొన్నవారు కనుక వీరు సంఘ కార్యములలో వీరికి సంబంధము లేదు.  వీరు తమ భర్తలు చేయు కార్యములకు మాత్రమే సహాయిగా ఉండుటకు అనుమతి ఇయ్యబడింది.  మరి సంఘ కార్యములో చేయు పనులలో ముఖ్యముగా పండుగలు వస్తాయి.  ఇందులో ఆర్భాటముతో కూడినవి ఉంటాయి.  డెకరేషన్స్‌, వంటలు వంటి పనులను గూర్చి స్త్రీలు సంఘ సమావేశాలలో చేరి చర్చించవలసిన అవసరత లేదు.  పౌలు ఇదే సంగతిని వివాహ బంధముతో జీవించు స్త్రీలకు సంఘ కార్యములు చేయుట వంటి పనులు తగ్గించినట్లుగా గ్రహించాలి, ఎందుకంటే వీరు వీరి స్వంత పురుషుని సంబంధమైన పనులలో సహాయిగా జీవించాలి.  సంఘ సంబంధమైన పనులు చర్చించువారు సంఘ పెద్దలు.  వీరు నిర్ణయించిన పనులు చేయువారు పనివారుగా గుర్తించాలి.  ఇందులో సంఘములో స్త్రీలు కల్పించుకొనవలసిన అవసరత లేదు.  తాము చెప్పవలసిన వాటిని తమ భర్తలకు తెలియజేసి వారి ద్వారా సంఘములో తెలియజేయుట యుక్తము.  ఈ విధముగా వివాహ స్థితిలో జీవించు స్త్రీకి పౌలు కొంత పనిని తగ్గించినట్లుగా గ్రహించాలి.  అలాగే సంఘ కార్యములనుగూర్చి చర్చించునప్పుడు సాతాను కొందరిని పురికొల్పి అగౌరవ పదజాలముతో వాదులాడు కొనునట్లు చేయును.  చాలా సంఘములలో సంఘ కార్యములను గూర్చి సమావేశాలలో చర్చించుట జరుగును.  అందులో వాదోపవాదాలు జరుగును.  కనుక వివాహ స్థితిలో జీవించు స్త్రీ ఇలాంటి వాటిలో పాల్గొని అవమానపడుట ఇష్టపడని పౌలు వారికి జరగబోవు అవమానమును ముందుగా గ్రహించి పరిశుద్ధాత్మ ప్రేరణతో ఈ వచనములు వ్రాయుట జరిగింది.  కనుక స్త్రీలు సంఘ సమావేశములో పాల్గొనక అటువంటి కార్యములు సంఘ పెద్దలకు వదిలి వేయుట ద్వారా పొందబోవు అవమానము నుండి తప్పించు కొనవచ్చును.  పైపెచ్చు సమావేశాలు జరగబోవు కార్యములు జరిగిపోయిన వాటిని గూర్చి చర్చలే తప్ప జరుగుచున్న కార్యములు కావు.  జరుగుచున్న కార్యములకు చర్చలు ఉండవు.  ఈ కార్యమును గూర్చి ముందు తరువాత సంఘ సమావేశమై చర్చించుదురు.  కనుక వీటికి అంత ప్రాధాన్యత లేదు, ఎందుకంటే చర్చించుకొనుట కంటె జరిగించుట ముఖ్యము.  జరిగించువారికి సాటి సహాయముగా ఉన్న స్త్రీ కార్యములలో సహకరించునని గ్రహించాలి.  కనుక చర్చించుట వాదోపవాదాలకు ఎక్కువగా అవకాశము ఇచ్చును కనుక అవమానకరముగా చాలా సందర్భాలు ముగియును కనుక అందుకు దూరముగా ఉండమని హెచ్చరించుచున్నారు.  సహజముగా మాటలతో ఆడవారిని అవమానపరచుట వారి పురుషులను కించపరచినదాని క్రిందకు లెక్కకు వచ్చును.  అనేక ఆవేశాలకు దారి తీయునని గ్రహించాలి.

15.  దేవదాసి చట్టము

        ప్రియపాఠకులారా!  ఇలాంటి చట్టము విగ్రహారాధికులైన అన్యులలో ఉంది.  ఈనాడు భారతదేశములో కూడ ఉంది.  ఒక ఊరిలో దేవదాసిగా చేయబడిన స్త్రీ ఆ ఊరిలోని పురుషులందరు ఆమెను కూడవచ్చును.  ఇదే దేవదాసి చట్టము.  ఈమె ఆ ఊరిలోని పురుషుల ఆనందము కొరకు ఏర్పరచబడినదని చెప్పుదురు.  కాని ఇది వ్యభిచారమని ఇలాంటివి నిజదైవజనులు చేయరాదని ఆజ్ఞగా చెప్పబడింది.  లేవీయకాండము 19:29, ''మీ దేశము వ్యభిచరింపకయు దుష్కామ ప్రవర్తనతోనిండకయు ఉండునట్లు నీ కుమార్తె వ్యభిచారిణియగుటకై ఆమెను వేశ్యగా చేయకూడదు.''  కనుక మన ఇండ్లలోని స్త్రీలను దేవదాసీలుగా చేయుట తప్పు.  చేయుటకు ప్రేరేపించుట కూడ తప్పే కనుక ఇలాంటివి నిజదైవప్రజలు చేయరాదు.

16.  నాజీరు వ్రతము - స్త్రీలు ఉండవలసిన తీరు

        ప్రియపాఠకులారా!  బైబిలు గ్రంథములో దేవుడు చెప్పిన ఏకైక వ్రతము.  ఇది పాటించాలని అనుకొంటే ఎవరైన పాటించవచ్చును.  ఇది చాలా సులభమైనది.  సంఖ్యాకాండము 6:1-6, 8, ''మరియు యెహోవా మోషేకు ఈలాగు సెలవిచ్చెను-నీవు ఇశ్రాయేలీయులతో ఇట్లనుము.  పురుషుడేగాని స్త్రీయేగాని యెహోవాకు నాజీరగుటకు ఎవరైనను మ్రొక్కుకొని తన్నుతాను ప్రత్యేకించుకొనినయెడల వాడు ద్రాక్షారస మద్యములను మానవలెను.  ద్రాక్షారసపు చిరకనైనను మద్యపు చిరకనైనను త్రాగవలదు; ఏ ద్రాక్షారసమునైనను త్రాగవలదు; పచ్చివిగాని యెండినవిగాని ద్రాక్షపండ్లను తినవలదు.  అతడు ప్రత్యేకముగా నుండి దినములన్నియు పచ్చికాయలేగాని పైతోలేగాని ద్రాక్షావల్లిని పుట్టినదేదియు తినవలదు.  అతడు నాజీరగుటకు మ్రొక్కుకొనిన దినములన్నిటిలో మంగలకత్తి అతని తలమీద వేయవలదు, అతడు యెహోవాకు తన్ను తాను ప్రత్యేకించుకొనిన దినములు నెరవేరువరకు అతడు ప్రతిష్ఠితుడై తన తలవెండ్రుకలను ఎదుగనియ్యవలెను.  అతడు యెహోవాకు ప్రత్యేకముగానుండుదినములన్నిటిలో ఏ శవమును ముట్టవలదు.  . . .  అతడు ప్రత్యేకముగా ఉండు దినములన్నియు అతడు యెహోవాకు ప్రతిష్ఠితుడుగా ఉండును.''  ఈ విధముగా పాతనిబంధన కాలములో స్త్రీలుగాని పురుషులుగాని దైవజనాంగమైనప్పటికి ఈ వ్రతమును ఆచరించారు.  వీరు పై నిబంధనలకు లోబడి జీవించేవారు.  అలాగే సంసోను విషయములో - న్యాయాధిపతులు 13:3-5, ''యెహోవా దూత ఆ స్త్రీకి ప్రత్యక్షమై-ఇదిగో నీవు గొడ్రాలవు, నీకు కానుపులేకపోయెను; అయితే నీవు గర్భవతివై కుమారుని కందువు.  కాబట్టి నీవు జాగ్రత్తగా ఉండి, ద్రాక్షారసమునేగాని మద్యమునేగాని త్రాగకుండుము, అపవిత్రమైన దేనినైనను తినకుండుము.  నీవు గర్భవతివై కుమారుని కందువు.  అతని తలమీద మంగలకత్తి వేయకూడదు; ఆ బిడ్డ గర్భమున పుట్టినది మొదలుకొని దేవునికి నాజీరు చేయబడినవాడై ఫిలిష్తీయుల చేతిలోనుండి ఇశ్రాయేలీయులను రక్షింప మొదలుపెట్టునని ఆమెతో అనగా''  ఇందులో సంసోను పుట్టక ముందే దేవుడు అతనిని నాజీరు వ్రతమునకు అనగా దేవునికి సంబంధించినవానిగా ఎన్నుకొనెనని అందుకుగాను ఆ బిడ్డ నాజీరు వ్రతము ప్రకారము పెంచమని తెలియజేయుట జరిగింది.  ఇది జరిగించాలి అంటే సంసోను తల్లిదండ్రులు కూడ అదే నియమమును పాటించాలి.  ఇంకొంత ముందుకు వెళితే నాజీరు వ్రతము చేయుట పవిత్రతకు చిహ్నము కనుక వారి పరిసర ప్రాంతములలో ఉండు స్త్రీ పురుషులు పిల్లలు ఎవరైన పై నియమములు పాటించుట శ్రేయస్కరమని గ్రహించాలి.  అందరు పవిత్రముగా జీవిస్తే దేవుని ఆశీర్వాదము ఆ కుటుంబములపై మెండుగా వచ్చును కనుక ఆ వ్రతము ఆచరించువారు దేవుని శక్తిని పొంది ఒక ప్రత్యేక గుర్తింపు పొందు అవకాశము ఉన్నది.

        క్రీస్తు ప్రభువుగాని బాప్తీస్మమిచ్చు యోహానుగాని వారు పుట్టినది మొదలు నాజీరు వ్రతమును ఆచిరించినవారే.  వారికి తల వెండ్రుకలు కత్తిరించినట్లుగా వ్రాయబడలేదు.  వీరు మద్యము అశుచికరమైనవి సేవించినట్లుగా కూడ వ్రాయబడలేదు.  పైపెచ్చు క్రీస్తు ప్రభువు చనిపోయినవారి శవములను ముట్టి వారికి జీవమును ఇచ్చాడు.  ఆ విధముగా శవములను తాకుట నిషేధమైనప్పటికి ఆ శవముగా ఉన్నవారికి తిరిగి జీవమును ఇచ్చుట ద్వారా అది అశుద్ధమైన చర్యగా లెక్కింపబడలేదు.  ఈనాడు యేసుక్రీస్తు ప్రభువు లేక బాప్తిస్మమిచ్చు యోహాను చిత్రపటములు చూచినవారు నాజీరు వ్రతములో వలె వారి తలవెండ్రుకలు గడ్డము కలిగియుండుట గమనింపవచ్చును.

        యేసుక్రీస్తు ప్రభువు ఈ లోకమునకు వచ్చి వెళ్లిన తరువాత నాజీరు అన్నది హృదయములో ఉండాలి.  కాని గడ్డాలు మీసాలుతో పని లేదు.  సున్నతిని గూర్చి హృదయానికి గుర్తుగా మార్చబడింది.  కనుక శరీర సున్నతి అక్కరలేదు.  బోధకుడుగాని విశ్వాసిగాని ఎవరైతే నేను నిందారహితుడుగాను ఏకపత్నీ పురుషుడుగాను స్వస్థబుద్ధి గలవాడై మర్యాదస్థుడుగా బోధింపదగినవాడుగాను ధనాపేక్ష లేనివాడుగాను విశ్వాసము యొక్క మర్మమును ఎరిగినవారుగాను అనింద్యులుగాను ఉండవలెనని స్త్రీలు సహితము మాన్యులై కొండెములు చెప్పనివారుగాని అన్ని విషయాలలో నమ్మకమైనవారుగా ఉండాలని 1 తిమోతి 3:1-13లో వివరించియున్నాడు.  బోధకులన్నవారు సత్యమునకు భిన్నమైన బోధ చేయక కల్పనా కథలు కల్పించవద్దని 1 తిమోతి 1:3 దీర్ఘ ప్రసంగాలు కాకుండ ఇతరులకు అర్థమగునట్లు కొన్ని మాటలు మాత్రమే చాలుననియు 1 కొరింథీ 14:19 బోధకులు తమ క్రమమును తప్పితే మరి కఠినమైన తీర్పుకు లోనగురని యాకోబు 3:1లోను దేవుని సువార్త నిమిత్తము ప్రత్యేకించబడియుండాలని రోమా 1:2 విశ్వాసము నందు నిలకడ గలిగి ప్రతి సంఘములోను పెద్దలను ఏర్పరచి ఉపవాసముండి ప్రార్థన చేసి ప్రభువుకు వారిని అప్పగించువారునైయుండవలెను.  ఇందునుబట్టి మనకు తెలిసిందేమిటంటే శాస్త్రులు పరిసయ్యులవలె వేషధారణ జీవితము అక్కరలేదని తెలుస్తున్నది.

17.  మాంత్రికురాలుతో సంబంధములు

        ప్రియపాఠకులారా!  చచ్చినవారి ఆత్మను రప్పించుచున్నానని చెప్పుచూ సాతాను క్రియల ద్వారా భవిష్యత్తు చెప్పుచున్నట్లుగా నటించువారికి దూరముగా ఉండాలి, ఎందుకంటే ఈ చర్యలు ధర్మశాస్త్ర రీత్యా నిషేధించబడియున్నవి.  మాంత్రికులుగా చెప్పబడిన ఈ స్త్రీలు నిజ దైవద్రోహులు.  లేవీయకాండము 19:31, ''కర్ణపిశాచిగలవారి దగ్గరకుపోకూడదు, సోదెగాండ్రను వెదకి వారివలన అపవిత్రత కలుగజేసికొనకూడదు; నేను మీ దేవుడనైన యెహోవాను.''  ఇది దైవ ఆజ్ఞ అయితే సౌలు ఈ ఆజ్ఞను పాటించి మాంత్రిక సంబంధమైనవారిని తన రాజ్యములో నుండి వెడలగొట్టించినప్పుడు సౌలు బహుగా ఆశీర్వదింపబడి దైవజనానికి నాయకుడు రాజు అయ్యాడు.  అప్పటికే సౌలు 1 సమూయేలు 28:3, ''సమూయేలు మృతిబొందగా ఇశ్రాయేలీయులు అతని గురించి విలాపము చేసి రామా అను అతని పట్టణములో అతని పాతిపెట్టియుండిరి.  మరియు సౌలు కర్ణపిశాచము గలవారిని చిల్లంగివారిని దేశములో నుండి వెళ్లగొట్టియుండెను.''  ఇలాంటి సౌలు తిరిగి మాంత్రిక సంబంధురాలైన ఏన్దోరులో నివసించు స్త్రీని ఆశ్రయించి తన నాశనమును కొని తెచ్చుకొన్నాడు.  1 సమూయేలు 28:7-9, ''అప్పుడు సౌలు-నా కొరకు మీరు కర్ణపిశాచముగల యొక స్త్రీని కనుగొనుడి; నేను పోయి దానిచేత విచారణ చేతునని తన సేవకులకు ఆజ్ఞ ఇయ్యగా వారు-చిత్తము, ఏన్దోరులో కర్ణపిశాచముగల యొకతె యున్నదని అతనితో చెప్పిరి.  కాబట్టి సౌలు మారు వేషము ధరించి వేరు బట్టలు తొడుగుకొని యిద్దరు మనుష్యులను వెంటబెట్టుకొని పోయి రాత్రివేళ ఆ స్త్రీయొద్దకు వచ్చి-కర్ణపిశాచముద్వారా నాకు శకునము చెప్పి నాతో మాటలాడుటకై నేను నీతో చెప్పువాని రప్పించుమని కోరగా ఆ స్త్రీ-ఇదిగో, సౌలు చేయించినది నీకు తెలిసినది కాదా?  కర్ణపిశాచము గలవారిని చిల్లంగివారిని అతడు దేశములో ఉండకుండ నిర్మూలముచేసెను గదా.  నీవు నా ప్రాణముకొరకు ఉరియొగ్గి నాకు మరణమేల రప్పింతువు అని అతనితో అనెను.''  కనుక ఇవి ధర్మశాస్త్ర నియమములు.  కనుక దైవజనులుగా ఉండువారు ఎవ్వరు ఇలాంటి వారితో సంబంధాలు పెట్టుకొనకూడదు.  సోదె, జాతకాలు, ముహూర్తాలు, కొన్ని రోజులు మంచివి మరి కొన్ని రోజులు చెడ్డవి.  ఇందునుగూర్చి గలతీ 4:10 వివరిస్తుంది.  చేతబడి వంటివి చేయించకూడదు.  ఇవన్ని నిషిద్ధములు.  లేవీయకాండము 20:26-27, ''మీరు నాకు పరిశుద్ధులైయుండవలెను.  యెహోవా అనునేను పరిశుద్ధుడను.  మీరు నావారై యుండునట్లు అన్య జనులలోనుండి మిమ్మును వేరుపరచితిని.  పురుషునియందేమి స్త్రీయందేమి కర్ణపిశాచియైనను సోదెయైనను ఉండినయెడల వారికి మరణశిక్ష విధింపవలెను, వారిని రాళ్లతో కొట్టవలెను.  తమ శిక్షకు తామే కారకులు.''

18.  వేశ్యా వృత్తిలో . . . . . స్త్రీ

        ప్రియపాఠకులారా!  ఈ సమాజములో మనము అనేకులు వేశ్యా వృత్తిలో జీవించుట చూస్తున్నాము.  అనేక సందర్భాలలో స్త్రీలు పట్టుబడి మాతో కూడ శయనించిన మగవాడిని ఎందుకు వదిలివేసారని ప్రశ్నించుట చూస్తూ ఉంటాము.  ఈ వేశ్యా వృత్తి అనునది బైబిలు గ్రంథము ప్రకారము నేరము.  ఈ వృత్తిని కొనసాగించువారుగాని అలా వేశ్యా సాంగత్యము చేయువారుగాని బైబిలు గ్రంథము ప్రకారము ఇద్దరు నేరస్థులే.  ధర్మశాస్త్రములోని పది ఆజ్ఞలలో ఈ ఆజ్ఞ కూడ ఉన్నది.  నిర్గమకాండము 20:14, ''వ్యభిచరింపకూడదు.''  ఇందులో వ్యభిచరించువారు మగవారా లేక ఆడవారా అన్నదానిని చెప్పక సకల మానవజాతికి సంబంధించి చెప్పుట జరిగింది.  కనుక ఎవరైన వ్యభిచరించిన అది నేరము క్రిందే లెక్కించబడును.  అయితే నీతిక్రియలు పలానావారే చేయాలి అన్న నిబంధన లేదు.  ఎలాంటి స్థితిలో ఉన్నవారైన చేయవచ్చును.  ఏ స్థితిలో ఉన్నవారు చేసినను అది వారికి నీతి క్రిందే లెక్కించబడును.  యెహోషువ 2:1-7, 10-12, 14, ''నూను కుమారుడైన యెహోషువ వేగులవారైన యిద్దరు మనుష్యులను పిలిపించి-మీరు పోయి ఆ దేశమును ముఖ్యముగా యెరికోను చూడుడని వారితో చెప్పి, షిత్తీమునొద్దనుండి వారిని రహస్యముగా పంపెను.  వారు వెళ్లి రాహాబను నొక వేశ్యయింట చేరి అక్కడ దిగగా దేశమును వేగుచూచుటకు ఇశ్రాయేలీయులయొద్దనుండి మనుష్యులు రాత్రివేళ ఇక్కడికి వచ్చిరని యెరికో రాజునకు వర్తమానము వచ్చెను.  అతడు-నీయొద్దకు వచ్చి నీ యింట చేరిన ఆ మనుష్యులను వెలుపలికి తీసికొనిరమ్ము; వారు ఈ దేశమంతటిని వేగు చూచుటకై వచ్చిరని చెప్పుటకు రాహాబు నొద్దకు మనుష్యులను పంపగా ఆ స్త్రీ ఆ యిద్దరు మనుష్యులను తోడుకొని వారిని దాచిపెట్టి-మనుష్యులు నా యొద్దకు వచ్చిన  మాట నిజమే, వారెక్కడనుండి వచ్చిరో నేనెరుగను; చీకటిపడుచుండగా గవిని వేయబడు వేళను ఆ మనుష్యులు వెలుపలికి వెళ్లిరి, వారెక్కడికిపోయిరో నేనెరుగను; మీరు వారిని శీఘ్రముగా తరిమితిరా పట్టుకొందురు అని చెప్పి తన మిద్దెమీదికి ఆ యిద్దరిని ఎక్కించి దానిమీద రాశివేసియున్న జనుపకట్టెలో వారిని దాచిపెట్టెను.  ఆ మనుష్యులు యొర్దాను దాటు రేవుల మార్గముగా వారిని తరిమిరి; తరుమపోయిన మనుష్యులు బయలు వెళ్లినతోడనే గవిని వేయబడెను.  . . .  మీరు ఐగుప్తు దేశములోనుండి వచ్చినప్పుడు మీ యెదుట యెహోవా యెఱ్ఱసముద్రపు నీరును ఏలాగు ఆరిపోచేసెనో, యొర్దాను తీరముననున్న అమోరీయుల యిద్దరు రాజులైన సీహోనుకును ఓగుకును మీరేమి చేసితిరో, అనగా మీరు వారినిఏలాగు నిర్మూలము చేసితిరో ఆ సంగతి మేము వింటిమి.  మేము వినినప్పుడు మా గుండెలు కరిగిపోయెను.  మీ దేవుడైన యెహోవా పైన ఆకాశమందును క్రింద భూమియందును దేవుడే.  మీ యెదుట ఎట్టి మనుష్యులకైనను ధైర్యమేమాత్రము ఉండదు.  నేను మీకు ఉపకారము చేసితిని గనుక మీరును నా తండ్రియింటికి ఉపకారము చేసి నాకు నిజమైన ఆనవాలును ఇచ్చి  . . .  అందుకు ఆ మనుష్యులు ఆమెతో-నీవు మా సంగతి వెల్లడి చేయనియెడల మీరు చావకుండునట్లు మీ ప్రాణములకు బదులుగా మా ప్రాణమిచ్చెదము, యెహోవా ఈ దేశమును మాకిచ్చునప్పుడు నిజముగా మేము నీకు ఉపకారము చేసెదమనిరి.''  యెహోషువ 6:22-25, ''అయితే యెహోషువ-ఆ వేశ్యయింటికి వెళ్లి మీరు ఆమెతో ప్రమాణము చేసినట్లు ఆమెను ఆమెకు కలిగినవారినందరిని అక్కడనుండి తోడుకొని రండని దేశమును వేగుచూచిన యిద్దరు మనుష్యులతో చెప్పగా వేగులవారైన ఆ మనుష్యులు పోయి రాహాబును ఆమె తండ్రిని ఆమె తల్లిని ఆమె సహోదరులను ఆమెకు కలిగినవారినందరిని వెలుపలికి తోడుకొని వచ్చిరి; ఆమె యింటివారి నందరిని వెలుపలికి తోడుకొని ఇశ్రాయేలీయుల పాళెమువెలుపట వారిని నివసింపజేసిరి.  అప్పుడు వారు ఆ పట్టణమును దానిలోని సమస్తమును అగ్నిచేత కాల్చివేసిరి; వెండిని బంగారును ఇత్తడి పాత్రలను ఇనుపపాత్రలను మాత్రమే యెహోవా మందిర ధనాగారములో నుంచిరి.  రాహాబను వేశ్య యెరికోను వేగుచూచుటకు యెహోషువ పంపిన దూతలను దాచిపెట్టి యుండెను గనుక అతడు ఆమెను ఆమె తండ్రిని యింటివారిని ఆమెకు కలిగినవారినందరిని బ్రదుకనిచ్చెను.  ఆమె నేటివరకు ఇశ్రాయేలీయుల మధ్యనివసించుచున్నది.''  ఈ వాక్యాలలో రాహాబు అను యువతి యెరికో పట్టణస్థురాలు.  ఈమె ఒక వేశ్య.  ఈ విభాగములో వేశ్యను వేశ్యగానే వర్ణించుట మనము గమనించాలి.  ఇలాంటి స్త్రీ ధర్మశాస్త్ర రీత్యా యోగ్యురాలు కాదు.  కాని ఈ స్త్రీ జ్ఞానము కలిగియున్నది గనుక దైవజనాంగమునకు చెందిన వేగులను రక్షించి నీతిని పొందుట జరిగింది.  ఇలా రక్షించినందుకు, దేవుడైన యెహోవా యందు తన నమ్మకమును కలిగి ఆయన గొప్పతనమును దైవజనులకే గుర్తు చేస్తూ ప్రకటించినందుకు ఆమె వేశ్యయైనను దేవుని యొద్ద కనికరము పొందినది.  కనుక వేశ్య దైవజనులను రక్షించినందులకు ఆమె గత జీవితములో చేసిన తప్పును క్షమింపబడినవి.  కనుక ఈ స్త్రీ రక్షణ పొంది ఇశ్రాయేలీయుల మధ్య నివసించు యోగ్యత పొందినట్లుగా మనము గుర్తించాలి.  ఇశ్రాయేలీయుల మీద రాహాబు ఆమె కుటుంబము నివసించుట ఆమె ఆమె కుటుంబము దైవజనాంగముగా గుర్తింపు పొందినది.  అంటే ఇశ్రాయేలీయుల క్రిందకు లెక్కింపబడుచున్నారు.  

        ధర్మశాస్త్రము ప్రకారము ఎవరైతే నిజదైవమును గుర్తించి మేము దేవుడైన యెహోవాను ఆశ్రయించి ఆయన జనాల మధ్యనే నివసించుదుమని చెప్పిన వారు ఇశ్రాయేలీయుల క్రిందకు లెక్కించబడుదురు.  ఈమె ఇశ్రాయేలీయుల వేగుల ముందు తన విశ్వాసమును ప్రకటించి తనే కాక తన ఇంటివారినందరిని రక్షించుకొనగలిగింది.  దైవజనాంగములో తన వంశస్థులను కూడ కలిసిపోవునట్లుగా చేసుకొనగలిగింది.  అందుకే - యాకోబు 2:25, ''అటువలెనే రాహాబను వేశ్యకూడ దూతలను చేర్చుకొని వేరొకమార్గమున వారిని వెలుపలికి పంపివేసినప్పుడు క్రియలమూలముగా నీతిమంతురాలని యెంచబడెను గదా?''  కనుక ఈ వేశ్యా వృత్తిలో ఉన్న స్త్రీ అయినను దైవసేవకులకు సహాయపడి వారిని మరణము నుండి కాపాడి రక్షించి నీతిని పొంది ఇశ్రాయేలీయులలో ఒకతెగా గుర్తింపు పొందినది.  యెప్తా వేశ్య కుమారుడైనను ఏ ఆస్తి అంతస్తు లేక సహోదరుల చేత వెళ్లగొట్టబడినను దైవకృప వానిని మహారాజుగాను దైవ గ్రంథములో పేరు పొందిన రాజుగా నిలిచినాడు.  అందుకే అపొస్తలుల కార్యములు 10:34-35 ప్రతి జనములోను దేవునికి భయపడి నీతిగా నడచుకొంటే ప్రభువు అంగీకరించునని వ్రాయబడి యున్నది.    కనుక ఎవరిని మనము చిన్నచూపు చూడకూడదు.  తెలియనితనము  సాతాను చెర వారిని ఆ తప్పులోనికి నడిపించునని గుర్తించాలి.  ఇలాంటివారు తమ తప్పును తెలుసుకొని మారుమనస్సు పొంది నిజదైవమును రాహాబువలె గుర్తించి నిజదైవజనులకు సహాయపడి నీతిక్రియలు జరిగించిన ఆమె నీతిమంతురాలుగానే గుర్తించబడును.

        యోహాను 8:1-11, ''యేసు ఒలీవలకొండకు వెళ్లెను.  తెల్లవారగానే యేసు తిరిగి దేవాలయములోనికి రాగా ప్రజలందరు ఆయన యొద్దకు వచ్చిరి గనుక ఆయన కూర్చుండి వారికి బోధించు చుండెను.  శాస్త్రులును పరిసయ్యులును, వ్యభిచారమందు పట్టబడిన యొక స్త్రీని తోడుకొనివచ్చి ఆమెను మధ్య నిలువబెట్టి -బోధకుడా, యీ స్త్రీ వ్యభిచారము చేయుచుండగా పట్టబడెను; అట్టివారిని రాళ్లు రువ్వి చంపవలెనని ధర్మశాస్త్రములో మోషే మన కాజ్ఞాపించెను గదా; అయినను నీవేమి చెప్పుచున్నావని ఆయన నడిగిరి.  ఆయనమీద నేరము మోపవలెనని ఆయనను శోధించుచు ఈలాగున అడిగిరి.  అయితే యేసు వంగి, నేలమీద వ్రేలితో ఏమో వ్రాయుచుండెను.  వారాయనను పట్టువదలక అడుగుచుండగా ఆయన తలయెత్తి చూచి-మీలో పాపము లేనివాడు మొట్టమొదట ఆమెమీద రాయి వేయ వచ్చునని వారితో చెప్పి మరల వంగి నేలమీద వ్రాయుచుండెను.  వారామాట విని, పెద్దవారు మొదలుకొని చిన్నవారివరకు ఒకని వెంట ఒకడు బయటికి వెళ్లిరి; యేసు ఒక్కడే మిగిలెను; ఆ స్త్రీ మధ్యను నిలువబడియుండెను.  యేసు తలయెత్తి చూచి-అమ్మా, వారెక్కడ ఉన్నారు?  ఎవరును నీకు శిక్ష విధింపలేదా?  అని అడిగినప్పుడు ఆమె-లేదు ప్రభువా అనెను.  అందుకు యేసు-నేనును నీకు శిక్ష విధింపను; నీవు వెళ్లి ఇక పాపము చేయకుమని ఆమెతో చెప్పెను.''  ఈ విభాగములో కూడ క్రీస్తు ప్రభువు వేశ్యా వృత్తిలో పట్టుపడి ధర్మశాస్త్రము ప్రకారము శిక్షింపబడవలసిన స్త్రీని వదిలివేయుట జరిగింది.  కాని చివరి వచనములో ఇక పాపము చేయకుము అని చెప్పుచున్నారు.  కనుక వేశ్యా వృత్తి అనగా వ్యభిచరించుట పాపమే.  కాని క్షమాగుణము కలిగిన క్రీస్తు ప్రభువు ఎంత పాపినైన క్షమించునుగాని వారు ఇక పాపము చేయక జీవించినట్లయితేనే పరలోక రాజ్య ప్రాప్తి అని గుర్తించాలి.

19.  సాటి సహాయిగా స్త్రీ యొక్క పుట్టుక

        ప్రియపాఠకులారా!  ఆదికాండము 2:7, 18-20, ''దేవుడైన యెహోవా నేలమంటితో నరుని నిర్మించి వాని నాసికారంధ్రములలో జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మ ఆయెను.  . . .  మరియు దేవుడైన యెహోవా-నరుడు ఒంటరిగా నుండుట మంచిది కాదు; వానికి సాటియైన సహాయమును వానికొరకు చేయుదుననుకొనెను.  దేవుడైన యెహోవా ప్రతి భూజంతువును ప్రతి ఆకాశపక్షిని నేలనుండి నిర్మించి, ఆదాము వాటికి ఏ పేరు పెట్టునో చూచుటకు అతని యొద్దకు వాటిని రప్పించెను.  జీవముగల ప్రతిదానికి ఆదాము ఏ పేరు పెట్టెనో ఆ పేరు దానికి కలిగెను.  అప్పుడు ఆదాము సమస్త పశువులకును ఆకాశ పక్షులకును సమస్త భూజంతువులకును పేరులు పెట్టెను.  అయినను ఆదామునకు సాటియైన సహాయము అతనికి లేక పోయెను.''  ఇందులో చెప్పబడిన విధముగా నరుడైన మగవాని పుట్టుక ముందుగా జరిగింది.  నేలమంటితో నరుని దేవుడు తన పోలిక రూపములో నిర్మించి తనలోని జీవవాయువును వాని నాసికారంధ్రములలో ఊదగా జీవాత్మగా సృష్టి జరిగింది.  ఇలాంటి నరునికి తోడుగా సాటి సహాయిగా ఉండుటకు ఒక స్త్రీ అవసరత ఉన్నదని దేవుడు పై వచనములో తెలియజేయుట జరిగింది.  ఇందులో స్త్రీని సృజించుటకు ప్రధాన ఉద్దేశ్యము మాత్రము నరునికి సహాయిగా ఉండుటయే అని మనకు అర్థమగుచున్నది.  అలాగే ఈ స్థానమును ఈ సృష్టి మరేది భర్తీ చేయలేదని గ్రహించాలి.  అంటే దేవుడు నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదని తలంచి నరుని ముందుకు సకల సృష్టిలో తాను సృజించిన వాటిని తీసుకొని వచ్చి వాటికి పేరు పెట్టునట్లుగా చేసాడు.  ఈ సందర్భములో దేవుడు అన్ని రకముల జాతులు ఉన్నను నరునికి సరిగా సరిపోయే సహాయి లేక తోడుగా ఉండువారు లేకపోయారన్న తలంపు ఇందులో చెప్పుట జరిగింది.  కనుక ఒక నరుడు స్త్రీకి బదులుగా తన ఇంట్లో మరి ఏ దానిని తనతో బాటుగా ఉంచుకొన్నను అవి సరిపోవు.  దేవుడు ఇచ్చిన సాటి సహాయి మాత్రమే ఈ లోటును తీర్చగలుగుతుంది.  అందుకే దేవుడు ఆదామును సృజించి ఆదాము నుండే హవ్వను సృజించుట చేసాడు.  ఆదికాండము 2:21-22, ''అప్పుడు దేవుడైన యెహోవా ఆదామునకు గాఢనిద్ర కలుగజేసి అతడు నిద్రించినప్పుడు అతని ప్రక్కటెముకలలో ఒక దానిని తీసి ఆ చోటును మాంసముతో పూడ్చివేసెను.  తరువాత దేవుడైన యెహోవా తాను ఆదామునుండి తీసిన ప్రక్కటెముకను స్త్రీనిగా నిర్మించి ఆమెను ఆదాము నొద్దకు తీసికొనివచ్చెను.''  ఈ విధముగా సాటి సహాయి అయిన స్త్రీ యొక్క సృష్టి జరిగింది.  ఇది దైవనిర్ణయము కనుకనే దేవుడే స్వయముగా నరుని చేసిన తరువాత సమస్త సృష్టిని పరిశీలించి చివరకు నరునికి సహాయిగా స్త్రీని సృజించుట జరిగింది.  ఈ స్త్రీని ఆదాము తనలో నుండి వచ్చినను ఆమెను నారిగా అనగా తనకు భార్యగా ఎంచుకొనినాడు.  ఈ విధముగా ఈనాడు ప్రతి స్త్రీ ఒక నరునికి సాటి సహాయిగా మనము గుర్తించాలి.  అలా గుర్తించి వారిలో దైవ ఎన్నిక చొప్పున ఎన్నికైన స్త్రీని మనము నారిగా లేక భార్యగా ఒక దినమున జతపరచ బడుచున్నారు.  ఆ స్త్రీ ఆ నరునికి సాటి సహాయిగా ఉండాలి.  అలాగే తన పుట్టుక లేక జన్మ ఆ నరునికి సాటి సహాయిగా ఉండుటకు తాను ఈ లోకములో జన్మించుట జరిగిందని గ్రహించి తదనుగుణముగా జీవించాలి.  అలాగే నరునిగా పిలువబడు మగవారు కూడ తనకు లభించిన స్త్రీని సాటి సహాయిగా దేవునిచే అనుగ్రహింపబడెనని గ్రహించి ఆమె విలువలకు భంగము కలుగకుండ ప్రవర్తించుచు ఆమె తన కోసము జన్మించుట జరిగెనని గ్రహించి ఏక మనస్కులుగా జీవించి ఈ లోక జీవితమును ఆనందమయము చేసుకోవాలి.

20.  ఒక స్త్రీ ఏ విధముగా సాటి సహాయి?

        ప్రియపాఠకులారా!  స్త్రీ దేవుని నిర్ణయము ప్రకారము సాటి సహాయిగా జన్మించింది.  అయితే ఈ స్త్రీ ఏ విధముగా సాటి సహాయిగా ఉండాలి?  అన్న ప్రశ్న ప్రతి ఒక్కరిలో కలుగుతుంది.  ఈ ప్రశ్నకు సమాధానము క్షుణ్ణముగా తెలిసినవారు ఆదర్శమైన జీవితమును జీవించగలుగుదురు.  కొన్ని ఉదాహరణలతో సాటి సహాయి విధానమును గూర్చి తెలుసుకొందము.

        ఆదామునకు సాటి సహాయి హవ్వ.  ఆదాము చేయు ప్రతి పనిలో హవ్వ సాటి సహాయిగా జీవించాలి.  ఆదికాండము 2:15, ''మరియు దేవుడైన యెహోవా నరుని తీసుకొని ఏదెను తోటను సేద్యపరచుటకును దాని కాచుటకును దానిలో ఉంచెను.''  అంటే ఆదాము చేయు పని ఏదెను వనము సాగు చేయుట మరియు కాపలాగా ఉండుట.  అతని సాటి సహాయి చేయవలసిన పని కూడ అదే!  కాకపోతే ఆదామునకు అనువుగా హవ్వ తన పనిని కొనసాగిస్తుంది.  మేకల మంద ఏదెను వనముపై పడి పాడు చేయుచున్నాయని అనుకొందము.  హవ్వ ఆదాము వాటిని బయటకు తరుముతున్నాడులే అని ఊరకే ఉండకూడదు.  ఆమె కూడ అతను చేయు పనికి తోడై వాటిని బయటకు తరుము వరకు సహాయిగా ఉండాలి.  అంటే ఆదాము మనస్సులో ఏదైతే కోరుకొంటాడో అందుకు అనుగుణముగా ఆమె ప్రవర్తించాలి.  అంటే ఆదాము చేయు ప్రతి పనిలో ఈమె సహాయిగా ఉండాలి.

        అలాగే ఒక వ్యాపారి తన భార్య సాటి సహాయిగా వ్యాపార లావాదేవీలలో సహాయిగా ఉండవచ్చును.  ఇంటిలో స్త్రీ పురుషునికి సమస్త విషయాలలో సహాయిగా ఉండవచ్చును.  చెట్లు నాటునప్పుడు పురుషుడు గుంట త్రవ్వగా స్త్రీ సహాయిగా ఉంటూ సరియైన సమయానికి పోషణ ఇయ్యవచ్చు.  అలాగే ఎంత సమయంలో పరుగు పందెములో చివరి గీతను దాటుచున్నాడో అన్నదాని చూచి చెప్పవచ్చు.  ఇలా ప్రతి విషయములో మనము చెప్పవచ్చును.  ఆర్థికముగా వెనకబడి ఇబ్బందిపడు పురుషునికి తన ప్రతిభతో సంపాదించి అతనికి సహాయిగా తోడ్పడవచ్చును.  ఇలా ప్రతి విషయంలో కూడ నరుని యొక్క ఆలోచనను, బాధను పంచుకొనే ఏకైక స్త్రీయే సాటి సహాయి.  సామెతలు 31:10-31 గుణవతియగు భార్య చీకటిలోనే లేచి తన చేతులారా పనిచేసి ఆహారము సిద్ధపరచును.  నారబట్టలు చేయించి వర్తకులకు అమ్మును.  తాను కూడబెట్టిన ధనముతో ద్రాక్షతోటను నాటించును.  దీనులకు దరిద్రులకు తన చెయ్యి చాపును.  జ్ఞానముగల తన నోరు తెరచి కృపగల ఉపదేశము చేయును.  భవిష్యత్తును గూర్చిన దిగులు ఆమె కుటుంబములో ఎవరికిని ఉండదు.  ఇలాంటి స్త్రీ దేవుడు ఇచ్చు దానమని బైబిలు గ్రంథము చెప్పుచున్నది.  సామెతలు 19:14.  దేవుడు అనుగ్రహించిన దానము అని సాటి సహాయిగా పొందిన నరుడు ప్రతి విషయములో తాను ఆమె సహాయమును పొందుచు అభివృద్ధి బాటలో పయనిస్తాడు.

        సాటి సాయమును గూర్చిన ఉదాహరణలు :-  మోషే తన భార్యతోను కుమారునితోను మార్గమున పోవుచుండగా యెహోవా మోషేను చంపచూడగా సిప్పోరా వాడిగల రాయి తీసుకొని తన కుమారునికి సున్నతి చేసి ఆమె దేవుని పాదముల చెంత వానిని పడవేసినప్పుడు యెహోవా కోపాగ్ని చల్లారినట్లు నిర్గమకాండము 4:24-26 వివరిస్తున్నది.  యెహోవా దూతను సంసోను తల్లిదండ్రులు దర్శించినప్పుడు సంసోను తండ్రి భయపడగా తల్లి ఈలాగు చెప్పింది.  యెహోవా దూత మనలను చంపగోరిన యెడల మన చేతి దహనబలిని ఆయన అంగీకరించరని తన భర్తను ధైర్యపరచింది.  న్యాయాధిపతులు 13:22 ఇశ్రాయేలు చిన్నది తాను పరిచారము చేయుచున్న ఇంటి యజమాని యొక్క కుష్ఠురోగమును నయము చేయగల ప్రవక్తను గూర్చి వివరించి నయమాను కుష్ఠురోగమును నయము చేయించెను.  2 రాజులు 5:2-3 యోగ్యురాలు తన పెనిమిటికి కిరీటమని సామెతలు 12:4 ఎంతటి మగాడైనను తన సాటి సహాయియైన స్త్రీతో కలిసి గొఱ్ఱెపిల్ల భార్యగా ఏకము కావలసిందే గదా!  యెషయా 54:5 వివరిస్తున్నది.

21.  సాటి సహాయి - దైవజనుడు

        ప్రియపాఠకులారా!  దైవజనులలో రకరకాల వారు ఉన్నారు.  ఇందులో ప్రవక్తలు, బోధకులు, సువార్తీకులు, సాధారణ దైవజనులు మొదలైన రీతులుగా జీవిస్తున్నారు.  మనలో ప్రతి దైవజనుడు ఒక స్త్రీని వివాహము చేసుకొనవచ్చును.  ఈ వివాహము ద్వారా జతపరచబడిన స్త్రీ అతనికి సాటి సహాయి.  అంటే జతపరచబడిన తరువాత ఆమె అతను చేయు పనిలో సహాయిగా జీవించాలి.  దైవజనులలో బోధకుడు బోధించును.  ఈమె అతనికి సహాయిగా బోధింపవచ్చును.  ప్రవక్తలు ప్రవచించి భవిష్యత్తును చెప్పుదురు.  అతనికి సాటి సహాయిగా అర్హత పొందిన స్త్రీ ఆ ఆత్మలో బాగస్థురాలై ప్రవచింపవచ్చును.  లేక ఆ ప్రవచనములను ప్రచారము చేయవచ్చును.  ఇలా దైవజనులు చేయు ప్రతి కార్యములో సహాయపడవచ్చును.  ఈనాడు కెథోలిక్‌ సంఘములో పాదర్స్‌గా పిలిపించుకొనుచున్న వారు వివాహ జీవితమును విడిచి జీవిస్తున్నారు.  వీరికి సాటి సహాయము లేదు.  కనుక వీరు స్వయముగా అన్ని పనులు చేసుకొంటూ జీవిస్తారు.  అలాగే అదే సంఘములో సిస్టర్స్‌గా పిలువబడుచు వివాహ జీవితమును విడిచి జీవించువారు కలరు.  వీరు సహాయముగా ఉండుటకు వీరికి భర్త లేడు.  కనుక వీరు స్వతంత్రులు.  వీరికి నిబంధనలు వర్తించవు.  ఎలా?  

        1 కొరింథీ 14:34-35, ''స్త్రీలు సంఘములలో మౌనముగా ఉండవలెను; వారు లోబడియుండవలసినదే గాని, మాటలాడుటకు వారికి సెలవు లేదు.  ఈలాగు ధర్మశాస్త్రమును చెప్పుచున్నది.  వారు ఏమైనను నేర్చుకొనగోరినయెడల, ఇంట తమ తమ భర్తల నడుగవలెను; సంఘములో స్త్రీ మాటలాడుట అవమానము.''  ఇందులో పౌలు స్త్రీలను గూర్చి చెప్పుచున్నాడు.  ఈ స్త్రీలు ఏదైన తెలిసికొనవలెనన్నచో వారు తమ ఇంటి వద్ద తమ తమ భర్తలను అడిగి తెలుసుకొనవలెనని చెప్పుచున్నాడు.  అంటే ఈ స్త్రీలకు భర్తలు ఉన్నారు.  ఈ భర్తలు సంఘస్థులు అనగా దైవప్రజలుగాను, లేక దైవజనాంగముగా పిలువబడువారు.  అంటే వీరు దేవునిలో కొంత ఉన్నతిని పొంది బాప్తిస్మము ద్వారా క్రీస్తు ప్రభువును తమ రక్షకునిగా అంగీకరించినవారు.  వీరి భార్యలు వీరికి సాటి సహాయిగా ఉండువారు.  సాటి సహాయి తన భర్త చేయు పనులలోనే సాటి సహాయిగా ఉండాలి.  అంతకు మించి చేయవలసిన అవసరత లేదు.  ఒకవేళ ఏదైన చేయాలని కోరిక కలిగితే ఆ విషయమును ఇంటి వద్ద తమ భర్తలతో చర్చించి వారి ద్వారా వారికి సహాయిగా ఉంటూ కొనసాగించవచ్చును.  తన భర్త దేవుని వరమును పొంది బోధకునిగా ఉంటే అతని బోధలో తాను సహాయముగా ఉంటూ మధ్య మధ్యలో అతనికి సహకారిగా ఉండాలి.  అంతేగాని తన భర్తను కూర్చోమని చెప్పి తానే అంతయు చేయకూడదు, ఎందుకంటే పురుషుడు దేవునికి ప్రతిరూపముగా సృజింపబడినవాడు.  ఇక్కడ చెప్పబడిన స్త్రీ జీవన విధానము వేరు.  ఈ తన జీవితములో వైవాహిక జీవితమును ఎన్నిక చేసుకొంది.  ఆమె తన భర్తతో జీవించుటకు నిర్ణయించుకొని వివాహము చేసుకొన్నది కనుక ఈ నిబంధన ఆమెకు వర్తిస్తుంది.  అలాగే పెండ్లి చేసుకొనని స్త్రీలకు భర్త ఉండడు కనుక ఈమె తన తండ్రికి విధేయురాలై జీవించాలి.  కాని తల్లిదండ్రుల నిర్ణయము చొప్పున పెరుగుచూ పెద్దల దయయందు వర్థిల్లుచూ జీవించాలి.  ఇక పెండ్లి గాని స్త్రీలలో కొందరు కన్యా స్త్రీలుగా మారుచూ వారి జీవితము దేవునికి అంకితము చేసుకొని జీవిస్తూ ఉంటారు.  వీరు తమ జీవితములో భర్త లేడు కనుక వీరు సాటి సహాయిగా ఉండ నవసరత లేదుగాని వీరు క్రీస్తు ప్రభువుకు దేవునికి తమ జీవితమును అంకితపరచుకొన్నారు గనుక వీరు ఆయనకు సహాయిగా ఉండు యోగ్యతను కలిగి యున్నారు.  వీరు ఏ విధముగా సహాయిగా క్రీస్తు ప్రభువుకు యుందురు?  ఆయన చేసిన బోధలు బోధించుట, సంఘములోని చిన్నారులకు ప్రార్థనలు నేర్పుట వంటి అనేక పనులు చేయుచూ సంఘ అభివృద్ధికి తోడ్పడవచ్చును.  ఈ విధముగా తమ జీవితములను సమర్పించుకొన్న స్త్రీలు వివాహ సంబంధమైన నిబంధనలు కొనసాగించరు కనుక వీరు ఒక పురుషునికి సాటి సహాయిగా ఉండక పరమపురుషుడైన క్రీస్తు ప్రభువుకు సాటి సహాయిగా జీవిస్తూ ఆయన నెలకొల్పిన సంఘము యొక్క బాధ్యతను మోస్తూ జీవించాలి.  ఇదే వారు చేయు సాటి సహాయము.

        కనుక స్త్రీ సాటి సహాయముగా జీవించాలి.  వారి జీవితమును సార్థకము చేసుకోవాలి.  వారి వారి పురుషుని (భర్త) యొక్క కోరికను ఎరిగి దానిని వారి జీవితములో పూర్తి చేయుచూ సహాయిగా తన భర్తను ఉన్నత స్థితిలో చూపించు స్త్రీ నిజమైన సాటి సహాయిగా గుర్తించాలి.

        రోమా 5:12-21  పాతనిబంధనలో స్త్రీ ద్వారా పాపము ప్రవేశించినను - పురుషుని ద్వారానే పాపము ప్రవేశించిందని వ్రాయబడియున్నది.  ఎందుకంటే నిషేధ ఫలములు తినకూడదని పురుషునితో చెప్పినాడేగాని స్త్రీతో చెప్పలేదు.  ఆ విధముగానే నూతన నిబంధనలో లోక రక్షణకు మరియ తల్లి జన్మనిచ్చినను ఆమె పేరు మరుగు చేయబడి ప్రభువే లోకరక్షకుడుగా తన క్రియను కొనసాగించాడు.  అయితే ఆదాము భార్య ద్వారా పురుషునిలో ప్రవేశించిన పాపము లోకమందంతట వ్యాపించుటనుబట్టి పాతనిబంధనలో స్త్రీకి ప్రాధాన్యత లేకుండ పోయింది.  అయితే నూతన నిబంధనలో స్త్రీయే లోకరక్షణకు జన్మనిచ్చినందున నేటి దినములలో పురుషులకంటే స్త్రీలకే ప్రతి విషయములోను ఆధిక్యత లభించింది.  ఈనాడు దేశ విదేశాలలో స్త్రీలు రాజ్యాలే ఏలుచున్నారు.  సంఘములోని స్త్రీలు - స్త్రీల కూడికలలో తగు నిర్ణయాలు తీసుకొని సంఘ పెద్దలకు తమ నివేదికలను అందించి సంఘాభివృద్ధికి దోహదకారులు స్త్రీలే.

22.  దేవుని పది ఆజ్ఞలు - సాటి సహాయిగా స్త్రీ

        ఒకటవ ఆజ్ఞ :-  నిర్గమకాండము 20:3, ''నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు.''

        రెండవ ఆజ్ఞ :-  నిర్గమకాండము 20:4-5, ''పైన ఆకాశమందేగాని క్రింది భూమియందేగాని భూమిక్రింద నీళ్లయందేగాని యుండు దేని రూపమునయినను విగ్రహమునయినను నీవు చేసికొనకూడదు; వాటికి సాగిలపడకూడదు వాటిని పూజింపకూడదు.  ఏలయనగా నీ దేవుడనైన యెహోవానగు నేను రోషముగల దేవుడను; నన్ను ద్వేషించువారి విషయములో మూడు నాలుగు తరముల వరకు, తండ్రుల దోషమును కుమారులమీదికి రప్పించుచు.''  

        నేను తప్ప అన్నాడు కాబట్టి యెహోవా యొక్క రూపము చేసికోవచ్చును.  తండ్రి యొక్క రూపము యేసుక్రీస్తు ప్రభువే - ఆ వాక్యము శరీరధారియై నరుల మధ్య నివసించాడు.  కనుక ప్రభువు యొక్క రూపమును మన మధ్య మన కుటుంబాలలో మన సంఘములో అన్యుల మధ్యను జ్ఞాపకార్థముగా నిలుపుకోవచ్చును.  కాని ఆ విగ్రహాలకు సాగిలపడకూడదు.  ప్రభువును మన హృదయములో ఆత్మతోను సత్యముతోను ధ్యానించాలి.  ఆయన గొప్ప కార్యాలను గూర్చి ఆయనను ప్రస్తుతించాలి.  యేసుక్రీస్తు ప్రభువు యొక్క రూపము చేసికొన్నందువల్ల విశ్వాసి ఆ విగ్రహాల ఎదుట త్రాగుడు, పొగ త్రాగుడు, వ్యభిచారము వగైరాలు చేయుటకు సాహసించడు.  పైగా ఎవరైన చేస్తుంటే గద్దిస్తాడు.  కనుక ప్రభువు రూపమును చేసికొనుట తప్పు కాదని అన్యులకు కూడ ఆ విగ్రహము గుర్తింపుగా ఉంటుందని గ్రహించాలి.

        మూడవ ఆజ్ఞ :-  నిర్గమకాండము 20:7, ''నీ దేవుడైన యెహోవా నామమును వ్యర్థముగా నుచ్ఛరింపకూడదు; యెహోవా తన నామమును వ్యర్థముగా నుచ్ఛరింపువానిని నిర్దోషిగా ఎంచడు.''

        మత్తయి 7:21  ప్రభువా!  ప్రభువా!  అన్న ప్రతి యొక్కడు పరలోక రాజ్యము చేరలేడు.  ప్రభువు చిత్తము ఏమిటి?  నిన్నువలె నీ పొరుగువానిని ప్రేమించు.  ఈనాడు క్రీస్తు పేరట అనేక నామధేయాలతో నడిచే సంఘాలు ఎన్నో ఉన్నాయి.  పెంతికోస్తు  - బాప్టిస్టు - శాల్వేషన్‌ ఆర్మీ - కథోలిక వగైరాలన్నియు ఒక్క ప్రభువునే ఆరాధిస్తారు - ఒకే బైబిలు చదువుతారు.  కాని మా శాఖయే గొప్పదని గొప్పలు చెప్పుకొంటూ తమ నాశనాన్ని తామే కొని తెచ్చుకుంటున్నారు.  ఈ శాఖలోని పిల్లను తమ పొరుగువారైన క్రైస్తవ శాఖలోని పిల్లవాని కిచ్చి వారితో వియ్యమందరు.  తమ శాఖలోనే తెలవారుతుందని బావిలోని కప్పలాగ ఉండవలసిందే - వేరే శాఖలోని ఉపదేశకుల ఉపదేశాలను వినకూడదు.  వాళ్ల ప్రార్థనా సావాసాలకు వెళ్లకూడదు.  ఈ సంఘాలు విశ్వాసుల జీవితాలతో ఆటలాడుకొంటూ తాము భ్రష్టుపడటమేగాక విశ్వాసులను అష్టకష్టాల పాలు జేస్తున్నారు.  మరీ హృదయవిదారకమైన స్థితి ఏమిటంటే ఎవరికైనను ఆరోగ్యము క్షీణించి ఏదైన వ్యాధి సంభవిస్తే ప్రార్థన మాత్రమే చేయించుకోవాలిగాని మందులు వాడకూడదు.  ఇక్కడ మందులు వాడడమంటే మానవ ప్రయత్నము ప్రార్థనన్నది దైవిక సహాయము అని గ్రహించాలి.  కనుక శరీరమునకు మందులు ఆత్మకు ప్రార్థన అత్యవసరము.  ఎందుకంటే యోహాను 3:6 శరీర మూలముగా పుట్టినది శరీరము - ఆత్మ మూలముగా పుట్టినది ఆత్మ.'' అని గ్రహించాలి.  మన ఎదుట వెలిగే లైటుగాని మనము ప్రయాణించే వాహనంగాని  చెవిలో పెట్టుకొన్న సెల్‌ ఫోన్‌గాని నేడు వాడుకలో ఉన్న ప్రతి ఔషధంగాని యూదులు ఇశ్రాయేలు వల్ల నేటి శాస్త్ర జ్ఞానము విజృంభించిందని ఈ మూర్ఖులకు తెలియదు.  యూదులు ఇశ్రాయేలు యొక్క జ్ఞానము పైనున్న  యేసుక్రీస్తు ప్రభువులోని జ్ఞానమే గదా!  కనుక దైవజ్ఞానముతో చేయబడుచున్న వాహనాలు, సెల్‌ఫోన్‌, కంప్యూటర్స్‌ నీవు వాడుకొనేటప్పుడు మందులు ఎందుకు వాడకూడదో - ఆలోచించండి.  ఆదాము హవ్వలను దేవుడు శపించినప్పుడు - భూమిమీద ముండ్ల తుప్పలు గచ్చపొదలు గన్నేరు  నేల ఉసిరిగ, కలబంద వగైరాలు ఉత్పత్తి అయ్యాయి.  దైవశాపానికి వచ్చిన బలహీనతలకు రోగాలకు భూమిమీద మన కంటి ముందున్న పిచ్చి మొక్కలు ఔషధాలుగా నేడు వాడబడుతున్నవి.  కనుక దేవుని శాపము కూడ మానవులకు సంక్రమించు రోగాలకు బలహీనతలకని తెలుస్తుంది.  కనుక శరీరానికి మందు ఆత్మకు ప్రార్థన రెండును ముఖ్యమని గ్రహించండి.

        నాలుగవ ఆజ్ఞ :-  నిర్గమకాండము 20:8, ''విశ్రాంతిదినమును పరిశుద్ధముగా ఆచరించుటకు జ్ఞాపక ముంచుకొనుము.''

        విశ్రాంతి దినాన్ని విశ్వాసి పాటించవచ్చునా?  యేసు ప్రభువు శనివారము సమాధిలో విశ్రాంతి పొందినాడు - సున్నతిని పాటించాడు.  సున్నతిని విశ్రాంతి దినాన్ని ప్రభువు మన పక్షముగ పాటించి ఫిలిప్పీ 3:9లో వివరించినట్లుగ ధర్మశాస్త్రము అనుసరించుట వలన వచ్చే నీతి కంటే క్రీస్తునందలి విశ్వాసమే గొప్పదని నిరూపించాడు.  గలతీ 2:21.  ధర్మశాస్త్రము వల్ల నీతిమంతుడైతే క్రీస్తు చనిపోవడం వ్యర్థమంటున్నాడు.  కనుక ప్రభువు పునరుత్థాన దినమైన ఆదివారమునే మనము ఆచరించవలసియున్నది.  

        రోమా 4:13-14  అబ్రాహాము సున్నతి పొందక ముందు నుండియే విశ్వాసము యొక్క అడుగుజాడలలో నడిచి దేవుని వాగ్దానము పొందియున్నాడు.  కాబట్టి గలతీ 3:10-11  ధర్మశాస్త్ర క్రియలను పాటిస్తే విశ్వాసి శాపగ్రస్తుడు గనుక శనివారమునకు బదులు పునరుత్థాన దినమైన ఆదివారమును మనము ప్రభువు మహిమార్థముగా పాటిస్తాము.  ఇందునుబట్టియే అపొస్తలులు కూడ (అపొస్తలుల కార్యములు 20:7) ఆదివారము రొట్టె విరుచుట యందును ప్రార్థన చేయుట యందును పాల్గొన్నట్లు మనకు తెలుస్తున్నది.

        ఐదవ ఆజ్ఞ :-  నిర్గమకాండము 20:12, ''నీ దేవుడైన యెహోవా నీకనుగ్రహించు దేశములో నీవు దీర్ఘాయుష్మంతుడవగునట్లు నీ తండ్రిని నీ తల్లిని సన్మానించుము.''

        నీ తండ్రిని నీ తల్లిని సన్మానించుటన్నది ధర్మశాస్త్రపరముగా శరీర సంబంధులను గూర్చి చెప్పబడింది.  ఎందుకంటే చిన్నతనము నుండి పెంచి పెద్ద చేసిన తల్లిదండ్రులను వారి ముసలితనములో వారిని నిరాదరణ చేయక పసిపిల్లలను పెద్దవారు ఎలాగు చూచుకొంటారో అలాగే వాళ్లు లేవలేని స్థితులలో వారిని అలాగే చూచుకోవాలి.  అంతేగాని సన్మానమన్నది దేవునికే చెల్లుతుంది.  కథోలిక బైబిలులో తల్లిదండ్రులను గౌరవించమని వ్రాసారు.  ఈ లోకములో తల్లిని తండ్రిని గురువులను పెద్దలను గౌరవించుట సబబే గదా!  ఎదురింటివాడితో తిరుగుచున్న తల్లిని, తప్ప త్రాగి దుర్భాషలాడుచున్న తండ్రిని కుమారుడు ఎలాగు సన్మానించగలడు?  గౌరవించగలడు?  కాబట్టి మత్తయి 23:9  నీ తండ్రి పరలోకపు తండ్రియనియు ఆ తండ్రియే యేసుక్రీస్తు ప్రభువునందు ఏకమై నివసిస్తున్నాడనియు యోహాను 14:10-12 వివరిస్తున్నది.  కనుక శరీరము నిచ్చిన తండ్రి తల్లి ఈ లోకము వరకే - ఆ తరువాత పరలోకమునకు నడిపించు తండ్రి, తల్లి యేసు, ఆయనను కనిన తల్లి మరియయే మనకు ఆత్మీయ తల్లియని తెలుస్తున్నది.  ప్రభువు సిలువ మీద నుండి పలికిన మాట ''యిదిగో నీ తల్లి'' - ఆ తల్లిని యోహాను తన ఇంటికి చేర్చుకొని గౌరవించినట్లే మనము కూడ మరియ తల్లిని మన ప్రార్థనలో జ్ఞాపకము చేసుకొని ప్రభువుతో మన ఇంట చేర్చుకొని వారిని సన్మానించవలసి యున్నది.  

        ఆరవ ఆజ్ఞ :-  నిర్గమకాండము 20:13, ''నరహత్య చేయకూడదు.''

        ఏడవ ఆజ్ఞ :-  నిర్గమకాండము 20:14, ''వ్యభిచరింపకూడదు.''

        ఎనిమిదవ ఆజ్ఞ :-  నిర్గమకాండము 20:15, ''దొంగిలకూడదు.''

        తొమ్మిదవ ఆజ్ఞ :-  నిర్గమకాండము 20:16, ''నీ పొరుగువానిమీద అబద్ధసాక్ష్యము పలుకకూడదు.''

        పదవ ఆజ్ఞ :-  నిర్గమకాండము 20:17, ''నీ పొరుగువాని యిల్లు ఆశింపకూడదు.  నీ పొరుగువాని భార్యనైనను అతని దాసునైనను అతని దాసినైనను అతని యెద్దునైనను అతని గాడిదనైనను నీ పొరుగువానిదగు దేనినైనను ఆశింపకూడదు అని చెప్పెను.''

        ఈ ఆజ్ఞలను దేవుడే స్వయముగా రెండు రాతిపలకలపై వ్రాసి ఇచ్చినవి.  వీటిని ప్రతి ఒక్కరు పాటించవలసినదే.  ఇందులో స్త్రీ అనిగాని పురుషుడనిగాని బేధము లేదు.  ఏ స్థితిలో జీవించువారైనను ఖచ్చితముగా ఈ ఆజ్ఞలను పాటించవలసినదే.  క్రీస్తు ప్రభువు కూడ తాను పాటించితినని తానే స్వయముగా చెప్పుచున్నారు.  మత్తయి 5:17-18, ''ధర్మశాస్త్రమునైనను ప్రవక్తల వచనములనైనను కొట్టి వేయవచ్చితినని తలంచవద్దు; నెరవేర్చుటకే గాని కొట్టి వేయుటకు నేను రాలేదు.  ఆకాశమును భూమియు గతించిపోయిననే గాని ధర్మశాస్త్రమంతయు నెరవేరువరకు దానినుండి యొక పొల్లయినను ఒక సున్నయైనను తప్పి పోదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను.''  కనుక మనము రాజులకే రాజుగా ఆరాధించే క్రీస్తు ప్రభువు వాటిని పరిపూర్తి చేయుటకు వచ్చెనని చెప్పెను కనుక మనము సంపూర్తిగా ఆజ్ఞలను పాటించాలి.  వీటిని పాటించువారు నీతిమంతుడు / నీతిమంతురాలుగా లెక్కింపబడుదురు.

23.  సాటి సహాయిగాని పురుషుడుగాని ఊరికి దూరముగా ఉండవలసిన రోజులు  . . .

        ప్రియపాఠకులారా!  జబ్బులకు స్త్రీ పురుషులనే తేడా లేదు.  అందరికి సోకుతాయి.  అయితే ఈ వ్యాధులు సోకినవారు కొన్ని నియమములు పాటించుట ద్వారా అందరికి వ్యాపించకుండ నివారింప వీలగును.  లేవీయకాండము 13:29, ''పురుషునికైనను స్త్రీకైనను తలయందేమి గడ్డమందేమి పొడ పుట్టినయెడల, యాజకుడు ఆ పొడను చూడగా''  లేవీయకాండము 13:38, ''మరియు పురుషుని దేహపుచర్మమందేమి స్త్రీ దేహపు చర్మమందేమి నిగనిగలాడు మచ్చలు, అనగా నిగనిగలాడు తెల్లని మచ్చలు పుట్టినయెడల''  ఇందులో కుష్ఠు రోగులనుగూర్చి చెప్పబడింది.  ఇది ఒక రకమైన అంటువ్యాధి.  అన్ని పరిస్థితులలో ఒకరి నుండి ఇంకొకరికి వ్యాపించదుగాని కొన్ని పరిస్థితులలోనే ఇది ఒకరి నుండి ఇంకొకరికి వ్యాపించును.  కనుక ఇలాంటి జబ్బును గూర్చి జాగ్రత్త వహింపమని తెలియజేయబడింది.  ఇలాంటి వ్యాధి కలిగినవారు వారు నివసించు ప్రాంతమునకు దూరముగా ఉండాలి.  లేవీయకాండము 13:46, ''ఆ పొడ వానికి కలిగిన దినములన్నియు వాడు అపవిత్రుడై యుండును; వాడు అపవిత్రుడు గనుక ప్రత్యేకముగానే నివసింపవలెను; వాని నివాసము పాళెమునకు వెలుపల ఉండవలెను.''  అలాగే మిర్యాము అను ప్రవక్త్రిని పాపము చేయగా కుష్ఠు సోకినట్లుగా మనము చదువగలము.  సంఖ్యాకాండము 12:9-15, ''యెహోవా కోపము వారిమీద రగులుకొనగా ఆయన వెళ్లిపోయెను.  మేఘమును ఆ ప్రత్యక్షపు గుడారముమీదనుండి ఎత్తబడెను; అప్పుడు మిర్యాము హిమమువంటి తెల్లని కుష్ఠు గలదాయెను; అహరోను మిర్యామువైపు చూచినప్పుడు ఆమె కుష్ఠుగలదిగా కనబడెను.  అహరోను-అయ్యో నా ప్రభువా, మేము అవివేకులము; పాపులమైన మేము చేసిన యీ పాపమును మామీద మోపవద్దు.  తన తల్లి గర్భములో నుండి పుట్టినప్పటికే సగముమాంసము క్షీణించిన శిశు శవమువలె ఆమెను ఉండనియ్యకుమని మోషేతో చెప్పగా మోషే యెలుగెత్తి-దేవా, దయచేసి యీమెను బాగుచేయుమని యెహోవాకు మొఱ పెట్టెను.  అప్పుడు యెహోవా మోషేతో ఆమె తండ్రి ఆమె ముఖము మీద ఉమ్మివేసినయెడల ఆమె యేడు దినములు సిగ్గు పడునుగదా; ఆమె పాళెము వెలుపల ఏడు దినములు ప్రత్యేకముగా ఉండవలెను.  తరువాత ఆమెను చేర్చుకొనవలెను.  కాబట్టి మిర్యాము ఏడు దినములు పాళెము వెలుపలనే గడిపెను.  మిర్యాము మరల చేర్చబడువరకు జనులు ముందుకు సాగరైరి.''  ఈ విధముగా సాటి సహాయిగా సృజింపబడిన స్త్రీ పురుషునితోనే ఉండి అతనికి అన్ని విధాలుగా సహకరించవలసియున్నను ఆమెకు కలిగిన అంటువ్యాధులను బట్టి ఊరి చివర ఆ వ్యాధి తగ్గువరకు ప్రత్యేకముగా జీవించవలసియున్నది.  ఇందులో నేను నా పురుషునికి సాటి సహాయిగా సృజింపబడినాను నేను నా యింటిలోనే ఉంటాను అని అంటే అక్కడ ఉన్నవారందరు వ్యాధికి గురి అగు అవకాశము ఉన్నది.  కనుకనే ఈ నియమము చేయుట జరిగింది.  ఈనాడు వైద్యశాస్త్రము బహుగా వృద్ధి చెందినది కనుక వైద్యశాలల పేరుతో ఏర్పరచి అందులో రోగానికి గురియైనవారిని ఉంచి ప్రత్యేక శ్రద్ధతో వ్యాధిని నయము చేస్తున్నారు.  ఇది కూడ ఒక రకముగా ప్రత్యేకముగా దూరముగా ఉంచుటయే.  టి.బి. హాస్పిటల్స్‌, కుష్ఠు సంబంధమైన హాస్పిటల్స్‌ను ఊరికి దూరముగా ఏర్పరచుట మనము ఇప్పటికి అనేక చోట్ల చూడవచ్చును.  ఇవన్ని కూడ అంటువ్యాధులు పూర్తిగా ప్రబలకుండ అదుపులో ఉంచుటకు చేస్తారు.  పాతనిబంధన కాలములో ఇంతటి వైద్య జ్ఞానము లేకపోవుట వలన దేవుడే స్వయముగా ఈ నియమము ఇచ్చుట జరిగింది.  కనుక స్త్రీ పురుషులు అను తేడా లేకుండ ఈ నియమమును పాటింపవలసి యున్నది.

24.  వీరు సాటి సహాయిగా తగరు

        ప్రియపాఠకులారా!  సామెతలు 18:22, ''భార్య దొరికినవానికి మేలు దొరికెను  అట్టివాడు యెహోవావలన అనుగ్రహము పొందినవాడు.''  వివాహము మనము చేసుకొని ఒక సాటి సహాయిగా స్త్రీని మన ఇంటికి తెచ్చుకొంటాము.  ఈ వివాహము చేసికొనుటకు కొందరు అయోగ్యులుగా చెప్పబడింది.  వీరిని వివాహము చేసుకొని వారితో శారీరక సంబంధము కలిగియుండుట దేవుని ఆజ్ఞను ధిక్కరించుటయే.  లేవీయకాండము 18:1-5, ''మరియు యెహోవా మోషేకు ఈలాగు సెలవిచ్చెను -నేను మీ దేవుడనైన యెహోవానని నీవు ఇశ్రాయేలీయులతో చెప్పుము.  మీరు నివసించిన ఐగుప్తు దేశాచారముల చొప్పున మీరు చేయకూడదు; నేను మిమ్మును రప్పించుచున్న కనాను దేశాచారములచొప్పున మీరు చేయకూడదు; వారి కట్టడలను బట్టి నడవకూడదు.  మీరు నా విధులను గైకొనవలెను; నా కట్టడలనుబట్టి నడుచుకొనుటకు వాటిని ఆచరింపవలెను; మీ దేవుడనగు నేను యెహోవాను.  మీరు నా కట్టడలను నా విధులను ఆచరింపవలెను.  వాటిని గైకొనువాడు వాటివలన బ్రదుకును; నేను యెహోవాను.''  ఇందులో చెప్పబడిన విధముగా సాటి సహాయిగా మనము ఎన్నుకొనువారిలో దేవుడు లేవీయకాండము 18:6-20లో చెప్పబడినవారు తగరని గ్రహించి ఈ జాబితాలో లేని వారిని ఎన్నిక చేసుకొని దేవుని ఆజ్ఞను పాటించుట మంచిది.  ఇందులో  . . . . .

        1.  రక్తసంబంధులుగా ఉన్న స్త్రీ  2.  నీ తల్లి.  3.  నీ తండ్రి ఉపపత్నులు (పాతనిబంధన కాలములో అయితే.  ఈ కాలములో ఉపపత్నులు ఉండకూడదు.)  4.  నీ సహోదరి, మారు సహోదరి  5.  నీ కుమారుని కుమార్తె  6.  నీ కూతురు కుమార్తె  7.  నీ తల్లి సహోదరి, పిన్నమ్మ  8.  నీ తండ్రి సహోదరి, మేనత్త  9.  నీ కోడలు  10.  నీ సహోదరుని భార్య  11.  నీ కూతురు  12.  నీ పొరుగువాని భార్య  13.  మనుమరాలు  14.  నీ తండ్రికి మరో భార్య వల్ల పుట్టిన కూతురు (భార్య చనిపోయినవారు మరో పెళ్లి చేసుకొనవచ్చును.  నూతన నిబంధన ప్రకారము కూడ అలా పుట్టినవారి పిల్లను చేసుకొనకూడదు.  15.  నీ పినతండ్రి భార్య  16.  నీ భార్య చెల్లెలు (భార్య బ్రతికి ఉండగా ఆమె చెల్లెలును వివాహమాడరాదు.  ఒకవేళ భార్య చనిపోతే భార్య చెల్లెలును పెండ్లి చేసుకొనవచ్చు.)  17.  జంతువులు  18.  పురుషునికి పురుషుడు / స్త్రీకి స్త్రీ.

        ఈ నియమములు చూచుకొని నీవు ఎన్నిక చేసుకొన్న సాటి సహాయి లేక నీవు ఎన్నిక చేసుకొన్న పురుషునికి నీవు ఈ వరుసలో లేకపోతే వివాహమాడుటకు యోగ్యత కలిగియున్నారు.  బైబిలు గ్రంథము ప్రకారము వ్యభిచారము క్రింద భర్తను భార్య లేక  భార్యను భర్త  విడిచిపెట్టుట జరుగును.  లేక భార్య చనిపోవుట / భర్త చనిపోయిన మరో వివాహము చేసుకొనవచ్చును.  ఉండగలిగితే మరో వివాహము లేక ఉండుట మంచిది.  ఉండలేని పక్షములో పాపము చేయుట కన్నా వివాహము చేసుకొనుట మంచిది.  ఇలా వివాహము చేసుకొనువారు అనగా కన్య / బ్రహ్మచారి / భర్తను వ్యభిచార నేరమున వదిలిన స్త్రీ / విధవరాలు / భార్యను వ్యభిచార నేరమున వదిలిన భర్త / భార్య చనిపోయిన భర్త.  పై నియమములలో ఉన్న స్త్రీని వివాహమాడి ఆమెతో శారీరక సంబంధమును కలిగియుండుట పాపముగా చెప్పబడింది.  దేవుని ఆజ్ఞను చేకొని అనుసరించుట పరలోక రాజ్యములో ప్రవేశించుటగా గమనించి ఆచరించుట యోగ్యమని గ్రహించాలి.  పై జాబితాలోని వారు నీకు సాటి సహాయిగా ఉండ తగరుగాని వారు అన్యజనాంగమునకు సాటి సహాయి.  సామెతలు 18:22, ''భార్య దొరికినవానికి మేలు దొరికెను  అట్టివాడు యెహోవావలన అనుగ్రహము పొందినవాడు.''

25.  వివాహమునకు వధూవరుల ఎన్నిక

        ప్రియపాఠకులారా!  ఈ ఎన్నిక చాలా విచిత్రముగా అనేక రీతులుగా జరుగుచున్నది.  ఈనాడు వధూవరులలో కొందరు తల్లిదండ్రుల ఇష్ట ప్రకారము పోవువారు ఉన్నారు.  వధువు తన వరునిని వరుడు తన వధువును తన ఇష్ట ప్రకారము ఎన్నిక చేసుకొనువారు ఉన్నారు.  ఈ సందర్భాలలో చాలా ముఖ్యమైన సంఘటనలు జరుగును.  ఈ సంఘటనలలో ఎంతో బాధ్యతాయుతమైన స్థితి కలిగియున్నవారు మనకు కనబడుదురు.  ఈ బాధ్యతలలో ముఖ్యము కుమారుని తల్లిదండ్రులు, వరుడు, వధువు, వధువు తల్లిదండ్రులు, వధువు వరుని తోబుట్టువులు, వారి స్నేహితులు, వారి బంధువులపై  ఉంటుంది.  వీరందరితో బాటుగా సమాజ పెద్దలు యాజకులు అనగా పెండ్లి తంతు జరిపించువారికి కూడ బాధ్యతను కలిగియుంటారు.  ఇందులో  . . . .

        వరుని తల్లిదండ్రులు :-  ఒకటవ బాధ్యత :-  తమ కుమారునికి / కుమార్తె పెద్దవారైనప్పుడు వారికి వివాహము చేయాలన్న తలంపు వీరికి కలుగుతుంది.  అప్పుడు వీరు వారి జాతివారిలో వెదకి వారి కుమార్తె / కుమారునికి సరియైన జోడి కుదుర్చుకొంటారు.  ఇది తల్లిదండ్రుల బాధ్యత.  అబ్రాహాము ఇస్సాకు విషయములో ఈ బాధ్యతను నెరవేర్చాడు.  ఆదికాండము 24:3-4, 7, 26-27, ''నేను ఎవరి మధ్య కాపురమున్నానో ఆ కనానీయుల కుమార్తెలలో ఒక దానిని నా కుమారునికి పెండ్లిచేయక నా స్వదేశమందున్న నా బంధువులయొద్దకు వెళ్లి ఇస్సాకను నా కుమారునికి భార్యను తెచ్చునట్లు ఆకాశముయొక్క దేవుడును భూమియొక్క దేవుడునైన యెహోవా తోడని నీ చేత ప్రమాణము చేయించెదననెను.  . . .  నా తండ్రి యింటనుండియు నేను పుట్టిన దేశమునుండియు నన్ను తెచ్చి నాతో మాటలాడి-నీ సంతానమునకు ఈ దేశము నిచ్చెదనని ప్రమాణము చేసి నాతో చెప్పిన పరలోకపు దేవుడగు యెహోవా తన దూతను నీకు ముందుగా పంపును; అక్కడనుండి నీవు నా కుమారునికి భార్యను తీసికొనివచ్చెదవు  . . .  ఆ మనుష్యుడు తన తలవంచి యెహోవాకు మ్రొక్కి - అబ్రాహామను నా యజమానుని దేవుడైన యెహోవా స్తుతింపబడునుగాక; ఆయన నా యజమానునికి తన కృపను తన సత్యమును చూపుట మానలేదు; నేను త్రోవలో నుండగానే యెహోవా నా యజమానుని బంధువుల యింటికి నన్ను నడిపించెననెను.''  ఈ విధముగా అబ్రాహాము తన బాధ్యతను ఎరిగి ఇస్సాకుకు భార్యను వెదుకుటకు పంపుచున్నాడు.  ఇందులో అన్యుల జాతికి చెందినవారిలో కాక తన జాతివారిలోనే వెదుకుటకు పంపుచున్నాడు.  ఈ కార్యమును దేవుడే సఫలము చేయునని అందుకు తోడుగా ఒక దేవుని దూతను ముందు పంపి తన కుమారునికి భార్యను తన కోడలిని సిద్ధపరచునని చెప్పుట జరిగింది.  అంటే దేవుడు అబ్రాహాముకు తన జాతివారినే వివాహమాడమని ప్రేరేపించుట వలన తన దాసుని తాను వదిలి వచ్చిన తన జాతి వారి వద్దకు పంపి తనకు కోడలిని పిలిపించుకొనుచున్నాడు.  అయితే అబ్రాహాము తన కోడలి విషయములో తాను నివసిస్తున్న కనానీయులు అనగా కయీను సంతతివారిని అనగా అన్యులతో పొత్తు కుదుర్చుకొనలేదు.  కేవలము తన జాతివారిలోనే ఈ సంబంధమును ఏర్పరచుట తన కుమారుని విషయములో బాధ్యతను నెరవేర్చాడు.  ఇలా చేయుట వరుని తల్లిదండ్రులుగా మన బాధ్యత కాదా!  ఫిలిష్తీయులు అను అన్యులతో సంబంధమేర్పరచుకొన్న సంసోనుకు ఏమి గతి పట్టినదో  ఒకసారి ఆలోచించవలసియున్నది.

        రెండవ బాధ్యత :-  ఆదికాండము 24:53, ''తరువాత ఆ సేవకుడు వెండి నగలను బంగారు నగలను, వస్త్రములను తీసి రిబ్కాకు ఇచ్చెను; మరియు అతడు ఆమె సహోదరునికి తల్లికిని విలువగల వస్తువులు ఇచ్చెను.''  ఇది వారి వారి తాహతుకు తగ్గ బాధ్యత.  అబ్రాహాము తన దాసుని ద్వారా ఈ కానుకలను పంపిస్తున్నాడు.  ఈ విధముగా వరుని తల్లిదండ్రులు అబ్రాహాము దంపతులవలె తాము ఎన్నిక చేసుకొన్న తమ జాతి వధువుకు కానుకలు తమకు సాధ్యమైనవి పంపించాలి, ఎందుకంటే అందులో వ్రాయబడిన కానుకలు విలువైనవని చెప్పబడింది.

        మూడవ బాధ్యత :-  ఈ సందర్భములో అబ్రాహాము దంపతులు తమ కుమారునికి రాబోవు వధువు విషయములో ఎంత కట్నం కానుకలు తెస్తుంది అని విచారించలేదు.  దేవుని చిత్తము ఏ వధువు ఎన్నికయైనదో ఆ వధువుకు తామే విలువైన వస్తువులను కానుకగా ఇస్తున్నాడు.  వారితో కనీసము ఎంత ఇస్తారు అన్న మాట కూడ వారు అడగలేదు.  ఇలా ఉండుట వారి జీవితములో దేవుని నిర్ణయమునకు ప్రాధాన్యత ఇచ్చినట్లు లెక్కించాలి.  ఇది కూడ బాధ్యతయే.  వారు ప్రేమతో ఉదారముగా కానుకగా ఇస్తే తీసుకోవచ్చునుగాని బలవంతముగా అడిగి తీసుకొనుట నేరము.  పాతనిబంధనలో స్త్రీ ద్వారా వచ్చిన పాపమునుబట్టి పురుషుడు ఓలి అను పేరుతో స్త్రీని కొంటున్నాడు.  నూతన నిబంధనలో స్త్రీ ద్వారా లోకములో రక్షణ ప్రవేశించింది.  కనుక స్త్రీయే కట్న రూపముగా పురుషుని కొనుక్కుంటున్నది.  ఇందునుబట్టి స్త్రీ తరపువారుగాని వరుని తరుపువారుగాని ఏదైనను ఇస్తే తీసుకొనవచ్చునుగాని బలవంతము చేసి బేరసారాలు చేసి కట్నకానుకలు వసూలు చేయుట నేరము.  ఈ బాధ్యతను మీరుట కొన్ని సందర్భాలలో పరుల సొమ్మును ఆశించుట క్రిందకు లెక్కింపబడును.

        వధువు తల్లిదండ్రులు :- ఒకటవ బాధ్యత :-  సంఖ్యా కాండము 36:6, ''యెహోవా సెలోపెహాదు కుమార్తెలను గూర్చి సెలవిచ్చిన మాట ఏదనగా-వారు తమకు ఇష్టులైనవారిని పెండ్లి చేసుకొనవచ్చును గాని వారు తండ్రి గోత్రవంశములోనే పెండ్లి చేసికొనవలెను.''  వీరు కూడ వరుని తల్లిదండ్రులవలె దైవనిర్ణయముతో తమ కూతురుకి వరుని అన్వేషణ చేయాలి.  ఇందులో తప్పు లేదు.  దైవనిర్ణయము ప్రకారము తమ జాతి వాళ్లలో మాత్రమే అన్వేషించుకోవాలి.  ఒక్కసారి ఈ అన్వేషణ వరుని నుండి జరగవచ్చు.  ఒక్కోసారి వధువు నుండి కూడ జరగవచ్చు.  ఇలా జరిగినప్పుడు వధువువారికి నచ్చిన వరుడని తమ కూతురికి ఎన్నిక చేసుకొనవచ్చును.  ఇలా ఎన్నిక చేసినప్పుడు వరుని తల్లిదండ్రుల ప్రవర్తన వధువు తల్లిదండ్రుల పట్ల పై మూడవ బాధ్యతను నెరవేర్చులాగా ఉండాలి.

        రెండవ బాధ్యత :-  వరుని లేక వధువు వారి తాహతుకు తగ్గట్లుగా ఇచ్చిన కానుకలకు వంకర మాటలను కలిపి మాట్లాడకూడదు.  ఆ కానుకలను బహు విలువైనవిగా లెక్కించి బహు ఆప్యాయముగా తీసుకోవాలి.  వాటిని గూర్చి తక్కువ చేసి మాట్లాడుట తమని తాము అవమానించుకున్నట్లుగా లెక్కించాలి.

        మూడవ బాధ్యత :-  ఒక్కసారి తమ కూతురుకి వివాహము నిర్ణయము చేసుకొన్న తరువాత వారికి కలిగియున్నదానిని ఆమెకు కొంత ఇచ్చి పంపించాలి.  అలాగే సంఖ్యా కాండము 36:8, ''మరియు ఇశ్రాయేలీయులకు వారి వారి పితరుల స్వాస్థ్యము కలుగునట్లు, ఇశ్రాయేలీయుల గోత్రములలో స్వాస్థ్యముగల ప్రతి కుమార్తెయు తన తండ్రి గోత్రవంశములోనే పెండ్లిచేసికొనవలెను.''  ఇందులో స్త్రీలకు తన పుట్టినింటి వారసత్వపు హక్కు ఉంది కనుక ఈ ఆస్థిని వారికి సమానముగా పంచి ఇయ్యవలసి యున్నది.  ఇలా ఇయ్యకుండ తప్పించుకొనుట తమ బాధ్యతను దేవుని ఆజ్ఞను మీరుటయే.  కనుక వివాహము నిర్ణయము చేసిన దినముననే ఎంత ఆస్థిని వారసత్వముగా వధువుకు ఇయ్యాలని ఆలోచించి న్యాయబద్ధముగా ఇయ్యాలి.  అలా వచ్చింది వధువువరులు ఇద్దరు దానిని అనుభవిస్తారుగాని దీనిపై తల్లిదండ్రులలో వధువు వారికిగాని, వరుని వారికిగాని హక్కు లేదు.  వీరు వారసత్వముగా ఇచ్చినది తప్ప ఎక్కువగ వరుని తల్లిదండ్రులు అడగకూడదు.

        వరుడు :-  ఒకటవ బాధ్యత :-  ఆదికాండము 24న అధ్యాయములో ఇస్సాకు తన తండ్రికి గౌరవము ఇచ్చి ఆయన నిర్ణయించిన వధువును స్వీకరించాడు.  ఎటువంటి అనుమానము వ్యక్తపరచలేదు.  ఆ యువతినే తనకు వధువుగా స్వీకరించాడు.  ఆదికాండము 24:67, ''ఇస్సాకు తల్లియైన శారా గుడారములోనికి ఆమెను తీసికొనిపోయెను.  అట్లు అతడు రిబ్కాను పరిగ్రహింపగా ఆమె అతనికి భార్య ఆయెను; అతడు ఆమెను ప్రేమించెను.''  ఇందులో తన తండ్రి బాధ్యతతో చేసిన పనిని తాను సమర్థిస్తూ తన బాధ్యతను గుర్తు చేసుకొని ఆ యువతిని స్వీకరించుట జరిగింది కాని నేను వేరొక అమ్మాయిని ప్రేమించాను.  ఆ యువతిని చేసుకొంటానని తల్లిదండ్రులకు తెలియజేసి వారి బాధ్యతకు అడ్డు రాకూడదు.  తాను ఎవరినైనను ప్రేమించి ఉంటే ముందుగానే తల్లిదండ్రులకు తన ప్రేమను తెలియజేయాలి.  ఎందుకంటే మనము సమాజములో ఉన్నాము.  అందరికి అన్ని రకములుగా బాధ్యతలు కలిగియున్నారు.  ఎవరి బాధ్యతను వారు సక్రమముగా నెరవేర్చు అవకాశమును కలిగించాలి.  ఆదికాండము 6:2-3, ''దేవుని కుమారులు నరుల కుమార్తెలు చక్కనివారని చూచి వారందరిలో తమకు మనస్సువచ్చిన స్త్రీలను వివాహము చేసికొనిరి.  అప్పుడు యెహోవా-నా ఆత్మ నరులతో ఎల్లప్పుడును వాదించదు; వారు తమ అక్రమ విషయములో నరమాత్రులై యున్నారు; అయినను వారి దినములు నూట ఇరువది యేండ్లగుననెను.''  ఒక్కసారి ఆలోచించండి.  భూమిపై మానవులు విస్తరించినప్పుడు దేవుని కుమారులు అయిన ఆదాము కుమారులు తమకు నచ్చినవారిని వారి సౌందర్యమునకు ముగ్ధులై ఎన్నిక చేసుకొని వివాహము చేసుకొన్నారు.  ఇందులో వివాహమే కదా చేసుకొన్నది.  ఇందులో తప్పు ఏమున్నది?  వారు వారి మనస్సుకు నచ్చినవారిని పెండ్లి చేసుకొనుట జరిగింది.  అలా జరిగినప్పుడు దేవుడైన యెహోవా ఆత్మ నరులతో ఎప్పటికి వాదించదు అని చెప్పుచున్నాడు.  ఇప్పుడు నా లెక్కనే ఇందులో తప్పు ఏమున్నది?  వారు వివాహమే కదా చేసుకున్నది అని వాదిస్తే దేవుని ఆత్మ ఆ విధముగా సమాధానము ఇస్తున్నారు.  అంతేకాదు ఈ స్థితి అక్రమమని చెప్పుట జరిగింది.  ఆ విషయములో దేవుని పిల్లలైనను వారికి నచ్చినవారిని ప్రేమించి పెళ్లి చేసుకొంటే వారు చేసినది అక్రమమని చెప్పబడింది.  కనుక వారు దేవుని కుమారులుగా కుమార్తెలుగా ఉండు యోగ్యతను పోగొట్టుకొని నరమాత్రులుగా మారుట ఇందులో మనము గమనించవలసిన విషయము.  అలా జతపడిన వారి పిల్లలు చాలా పేరు పొందినవారు అవుతారని ఆదికాండము 6:4లో వ్రాయబడినది.  కాని ఇది అక్రమమైనదని చెప్పబడింది. ఎందుకు?  లూకా 10:26-27, ''అందుకాయన-ధర్మశాస్త్రమందేమి వ్రాయబడియున్నది?  నీ వేమి చదువుచున్నావని అతని నడుగగా అతడు-నీ దేవుడైన ప్రభువును నీ పూర్ణ హృదయముతోను, నీ పూర్ణమనస్సుతోను, నీ పూర్ణశక్తితోను, నీ పూర్ణవివేకముతోను ప్రేమింపవలెననియు, వ్రాయబడియున్నదని చెప్పెను.''  ఇది దేవుని ఆజ్ఞ.  అయితే నేను పలానా అమ్మాయిని / అబ్బాయిని ప్రేమించాను కనుక ఆమె / అతనే నా సర్వస్వమని చెప్పుట ఆజ్ఞను మీరుట కాదా!  ఇలాంటి విషయములో వారు వారి ప్రాణమును సైతము తీసుకొనుటకు ప్రేరేపించబడుట అందరికంటే తాము ప్రేమించినవారే ఎక్కువ అని అనుకొనుట కాదా!  కనుక ఈ లోకములో కొద్ది కాలము ఉండు ప్రేమ అవసరత ఉందా?  లేక దేవుని ఆజ్ఞలోని ప్రేమ అవసరత ఉన్నదా?  నిన్నువలె నీ భార్యను సైతము ప్రేమించాలి.  ఈ ప్రేమ వేరు.

        వివాహమన్నది దైవసన్నిధిలో జరగాలి.  కయీను సంతతిలోని స్త్రీలు దేవుని మరచినవారు.  వారితో వియ్యమందిన దైవజనాంగము వారితో మమేకమై తమ ఇష్టానుసారముగా ప్రవర్తించుచు దేవుని మరచి ఆయన ప్రేమను కోల్పోయినందున నరమాత్రులుగా అనగా లోకసంబంధులయ్యారు.  లోకము తన వారిని ప్రేమిస్తుంది.  కనుక వీరు దైవసంబంధులు కారు.  కాబట్టి దైవ ప్రేమలో నిలిచిన పిల్లలు తమ తమ ఇష్టానుసారముగా ప్రేమించి పెండ్లి చేసుకోవచ్చును.  కాని ఆ వివాహము దేవుని మరచిపోవుటకు నాంది కాకూడదు.  మరి ఈ దినములలో ప్రభువు ఒక్కడే - విశ్వాసము పైనే - కాని వేలకువేల క్రైస్తవ శాఖలు విస్తరించియున్నవి.  ఈ క్రైస్తవ శాఖలలోని వారందరు సహోదరులే - దైవజనాంగమే - కాని ఐక్యత లేదు.  ఎవరికి వారు తమను తాము హెచ్చించుకొంటూ తమ పిల్లను సహోదర సంఘస్థునికి ఇవ్వటానికి కూడ ఇష్టపడరు.  అయినను ఏ శాఖలోని వారైనను క్రైస్తవులే.  ద్వేషముతోను అసూయతోను నిండిన జనముగా తయారైంది.  అందుకే క్రీస్తు ప్రభువు అంటున్నారు.  మత్తయి 7:21  ప్రభువా!  ప్రభువా!  అన్న ప్రతి యొక్కడు పరలోక రాజ్యములో ప్రవేశించడని మత్తయి 21:31  ప్రభువు చిత్తము నెరవేర్చువారు ప్రవేశిస్తారని విశదపరచాడు.

        ఈ విధముగా వధూవరుల ఎన్నికలో వివాహ సంబంధ బాధ్యతలు ఉన్నవి.  ఎవరి బాధ్యతలు వారు ఎరిగి దానిని పూర్తి చేసుకోవాలిగాని మీరవలసిన అవసరత లేదు.

26.  వివాహములో జాతులు గోత్రాల లెక్కలు

        ప్రియపాఠకులారా!  ఆదికాండములో ఆదామునకు జన్మించినవారు దైవజనాంగముగాను ఆదాము కుమారుడైన కయీనుకు జన్మించినవారు అనగా నిజదైవము నుండి దూరముగా జీవించినవారిని నరుల జనాంగముగా లెక్కింపబడ్డారు.  ఆదికాండము 4:26.  ఈ విధముగా దైవజనాంగము కయీను జనాంగము అను రెండు జనాంగములు ఏర్పడ్డాయి.  వీరిలో  దేవునిలో ఉంటూ నిజదైవమును ఆరాధించువారు.  రెండవ రకమువారు ఇహలోక ఆశలతోను సాతాను ఏర్పరచిన డబ్బర దేవుళ్లు దేవతలను పూజించువారు.  కనుక వీరి మధ్య పొత్తు వద్దన్న దేవుని ఆలోచన కనబడుచున్నది.  అందుకే వీరి మధ్య జరిగిన ప్రేమ వివాహమును అక్రమ వివాహములుగా చెప్పుట జరిగింది.  ఎంత ప్రసిద్ధి చెందిన సంతానము వీరి సంతానమైనప్పటికి దేవుని దృష్టిలో అక్రమ సంతానముగానే లెక్కింపబడుచున్నారు.  ఈ జనాంగము మధ్య పొత్తు వలన పాపము బహుగా విస్తరించి అందరు బలాత్కారమునకు లోనై నిజదైవమును వీడు పరిస్థితి నోవహు కాలమునకు వచ్చింది.  కనుక జలప్రళయము ద్వారా నోవహు అతని కుటుంబము తప్ప అందరు నశించారు.  అటుతరువాత నోవహు సంతానము ద్వారా అనేక జాతులు మరల ఉద్భవించాయి.  వీరిలో నుండి అబ్రాహాముకు మనుమడైన యాకోబుకు జన్మించిన పన్నెండుమంది పుత్రులను ఇశ్రాయేలీయులుగా దైవజనాంగముగా నామకరణము చేసి వారిని ఒక జాతిగా ఏర్పరచుట పాతనిబంధన కాలములో జరిగింది.  వీరు ఐగుప్తు దాస్యము నుండి విడిపింపబడి కానానును స్వతంత్రించుకొన్నప్పుడు వారు యాకోబు పన్నెండుమంది కుమారుల పేర్ల మీద ఏర్పడిన గోత్రములను బట్టి వారు అక్కడ భూభాగములను పంచుకొని స్థిర నివాసములను ఏర్పరచుట జరిగింది.  ఇక్కడ నుండి - సంఖ్యాకాండము 36:6-7, ''యెహోవా సెలోపెహాదు కుమార్తెలను గూర్చి సెలవిచ్చిన మాట ఏదనగా-వారు తమకు ఇష్టులైనవారిని పెండ్లి చేసికొనవచ్చును గాని వారు తమ తండ్రి గోత్రవంశములోనే పెండ్లి చేసికొనవలెను.  ఇశ్రాయేలీయుల స్వాస్థ్యము ఒక గోత్రములోనుండి వేరొక గోత్రములోనికి పోకూడదు.  ఇశ్రాయేలీయులలో ప్రతివాడును తన తన పితరుల గోత్రస్వాస్థ్యమును హత్తుకొని యుండవలెను.''  ఇది దేవుని ఆజ్ఞగా చెప్పబడింది.  అంటే దైవజనాంగము దైవజనాంగములోనే వివాహమాడాలి.  అన్యులతో పొత్తు వద్దు అని అది అక్రమమైనదని దీనివలన వినాశనము జరుగునని చెప్పబడింది.  అలాగే దైవజనాంగమైనంత మాత్రాన ఎవరినంటే వారిని వివాహము ఆడుటకు వీలులేదు.  తమ జాతిలోని వారి గోత్రములవారీగానే వివాహము చేసుకోవాలి.  ఈ విధముగా జాతులు గోత్రాలను సమతుల్యము చేయుచు అవి అంతరించకుండ చూడవలసిన బాధ్యత ఉన్నదని గ్రహించాలి.  కనుక దేవుడు దైవజనాంగములో కామము మీరి ఎవరితో బడితే వారితో వెళ్లకుండ ఒక ఆజ్ఞను ఇచ్చాడు.  ఈ ఆజ్ఞను పాటించాలి.  ఈనాడు ఆంధ్రప్రదేశ్‌లో అనేక జాతులవారు వారితో బాటుగా అనేక గోత్రాలు కులాలుగా పిలువబడుచూ నివసిస్తున్నారు.  వీరిలో క్రైస్తవులుగా పిలువబడువారు ఉన్నారు.  ఈ క్రైస్తవులలో అనేక జాతులు, గోత్రాలు కులాలు ఉన్నాయి.  వీరు పై కట్టడవలె పాటించిన తప్పేమి ఉన్నది?  ఒక్కసారి ఆలోచించండి.  అందరు ఆదాము నుండి వచ్చినవారేగాని వారి క్రియలను బట్టి విభజింపబడియున్నారు.  అందరు ఇశ్రాయేలీయులే 12 గోత్రాలుగా విభజింపబడియున్నారు.  కనుక తమ మనస్సుకు నచ్చినవారితో తమ గోత్రమువారిని వివాహము చేసుకొనవచ్చునుగాని వేరే జాతివారిని గోత్రములవారిని కులాలవారిని చేసుకొనక ఉండుట మేలు, ఎందుకంటే దేవుడే వారిని ఆయా జాతులుగాను గోత్రాలుగాను పుట్టించుట చేసాడు.  ఇవి అంతరించిపోవుట ఆయనకు ఇష్టము లేదు.

        లేవీయకాండము 21:13-15, ''అతడు కన్యకను పెండ్లిచేసి కొనవలెను.  విధవరాలినైనను విడనాడబడినదానినైనను భ్రష్టురాలినైనను, అనగా జారస్త్రీనైనను అట్టివారిని పెండ్లిచేసికొనక తన ప్రజలలోని కన్యకనే పెండ్లిచేసికొనవలెను.  యెహోవా అను నేను అతని పరిశుద్ధపరచు వాడను గనుక అతడు తన ప్రజలలో తన సంతానమును అపవిత్రపరచకూడదని వారితో చెప్పుము.''  ఇందులో యాజకునిగా అతనిని దేవుడు ఎన్నుకొన్నాడు కను అతడు తన యాజ కుటుంబములలో వారినే పెండ్లి చేసుకోవాలి అన్న నిబంధన లేక ఆజ్ఞ ఇయ్యబడింది, ఎందుకంటే వాని పిల్లలు తిరిగి వాని తదనంతరము యాజకులుగా కావాలి.  అంటే మనము ఏ స్థితిలో పుట్టుచున్నామన్నది దైవనిర్ణయము.  కనుక మనము జన్మించిన జాతి, గోత్రము, స్థితులలోనే వివాహము చేసుకొనుట మంచిది.  దేవుడు యిర్మీయాను ప్రవక్తగా ఎన్నుకొనుట తల్లి గర్భములో పడక ముందే జరిగింది.  అంటే నేను గ్రంథకర్తగా నా తల్లి గర్భములో పడక ముందే ఎన్నిక చేయుట జరిగి యుండాలి.  అందుకు నేను నాకు సహకారిగా ఎన్నిక చేసుకొను స్త్రీ కూడ అదే దైవభక్తురాలిగా కన్యగా దేవుని ఎన్నికలో నిలిచిన నా జాతి స్త్రీగా ఉండుట మంచిది.

27.  నిశ్చితార్థము

        ప్రియపాఠకులారా!  నిశ్చితార్థము అనగా ఒడంబడిక.  అనగా వాగ్దానము చేసుకొనుట.  ఇది పెద్దల సమక్షములో వధువు మరియు వరుని తల్లిదండ్రుల మధ్య అంగీకారమును కుదుర్చుట జరుగును.  ఇది సగము వివాహము అయినట్లుగా లెక్కించబడును.  మత్తయి 1:18, ''యేసు క్రీస్తు జననవిధ మెట్లనగా, ఆయన తల్లియైన మరియ యోసేపునకు ప్రధానము చేయబడిన తరువాత వారేకము కాకమునుపు ఆమె పరిశుద్ధాత్మవలన గర్భవతిగా ఉండెను.''  కన్య మరియమ్మకు యోసేపుకు మధ్య ఈ నిశ్చితార్థము జరిగింది.  యోసేపు నిశ్చితార్థము ద్వారా మరియమ్మను తన భార్యగా ఒడంబడిక చేసికొనినను వివాహము జరగక ముందే ఆమె పరిశుద్ధాత్మ ద్వారా యేసుక్రీస్తు ప్రభువును తన గర్భమునందు ధరించెనని గ్రహించి ఆమెతో వివాహ ధర్మము తప్ప ఆమెను తన దేవుని తల్లిగా గౌరవిస్తూ వారిని పోషించుచూ వచ్చాడు.  ఎన్ని కష్టములు జరిగినను వారిని విడనాడలేదు.  ఇక్కడ జరిగింది వివాహము కాదు.  కాని వివాహము జరిగినవారు ఏ విధముగా భార్యాపిల్లలను పోషించుట కొరకు తాము కష్టపడుదురో, అలాగే యోసేపుకు మరియమ్మతో వివాహము జరగక పోయినను అంత విలువ నిశ్చితార్థమునకు ఇచ్చి దానిని పాటించుట జరిగింది.  వీరి మధ్య శారీరక ధర్మము తప్ప యోసేపు తన జీవితమును వారి కొరకు ధారపోసి ధన్యుడైనట్లుగా గ్రహించాలి.  ప్రభువు తల్లి యోసేపు వలన ఏ శరీరేచ్ఛలకు గురి కాకుండ ప్రభువు సన్నిధిలో తన పరిశుద్ధతను ఎట్లు నిలుపుకొన్నదో నాచే విరచితమైన ''నా ప్రభువు తల్లి'' అను గ్రంథమును చదివి ఆ తల్లి యొక్క ఆదర్శవంతమైన జీవితమును అనుసరింపగలరు.  అలాగే ఈనాడు నిశ్చితార్థము చేసుకున్న జంట ఆ బాధ్యతను నెరవేర్చాలి.  ఒక్క శారీరక ధర్మము తప్ప సమస్త విషయములో ఏక నిర్ణయముగా జీవించవలసియున్నది.  ఈ నిశ్చితార్థము ఎంత ఆర్భాటముగా చేసినను లేక సాధారణ స్థితిలో చేసినను బాధ్యతను మర్చిపోకూడదు.  నిశ్చితార్థము జరిగిన తరువాత వధువుగా మారిన స్త్రీ యొక్క సమస్త అవసరతలలో నిత్యము వరుడు బాధ్యత వహించి సంపూర్ణ సహకారము చేయాలి.

28.  తల్లిని విడనాడు తనయుడు

        ప్రియపాఠకులారా!  ఈ సంఘటన గొప్ప అనుభూతితో కూడిన బాధాకరమైన సంఘటన.  మన కుటుంబములో కొడుకు పుట్టాడని ఆనందించు తల్లిదండ్రులకు ఆ కొడుకు ఒకానొక దినమున తల్లిని తండ్రిని విడనాడునని గుర్తుకు రాదు.  కాని విడనాడునని బైబిలు గ్రంథములో చెప్పబడియున్నది.  ఆ సందర్భమే వివాహము.  మనము వివాహములో స్త్రీని పురుషుని జతపరచుట జరుగును.  ఇరుప్రక్కలవారు గొప్ప ఆర్భాటముతో ఈ తంతును జరిగిస్తారు.  ఆ రోజు నుండి వారిద్దరు ఏక శరీరులుగా జీవించాలని దీవిస్తారు.  అదే సమయము నుండి తమ తనయుడు లేక తమ కూతురు వారిని విడిచిపోవుటకు మార్గము సిద్ధమైందని గ్రహించాలి.  ఈనాడు మన సభ్య సమాజములో ఎన్నో కుటుంబాలు ఉన్నాయి.  తమ తల్లిదండ్రులతో కలిసి జీవించు కుటుంబాలు ఎన్ని?  ఏ సమస్య లేక కలిసి జీవించువారు ఉన్నారా?  అంటే అరుదు అని చెప్పవచ్చును.  ఆ దినము నుండి భార్యను భర్త, భర్తను భార్య సంతోష పెట్టుట కొరకు అన్ని విధాలుగా ప్రయత్నించుదురుగాని తమ తల్లిదండ్రుల విషయములో సాధ్యమైనంత వరకు దూరముగా జీవిస్తారు.  ఒకే ఇంటిలోనే ఉంటారుగాని మనసుల మధ్య దూరము ఉంటుంది.  ఇక్కడ నుండి వారి జీవితము బైబిలు గ్రంథములో చెప్పిన విధముగా ఉంటుంది.  ఆదికాండము 2:24, ''కాబట్టి పురుషుడు తన తండ్రిని తన తల్లిని విడిచి తన భార్యను హత్తుకొనును; వారు ఏక శరీరమై యుందురు.''  దీనికి కారణము హవ్వను ఆదాము శరీరము నుండి తీయుటయే.  కనుక తల్లిని తండ్రిని విడనాడు సమయమే వివాహ సందర్భము.  దీనికి ముందువరకు తమ తల్లిదండ్రులతో ప్రతి విషయము చర్చించువారు వివాహానంతరము తమ రహస్య జీవితము మొదలై ఏ విషయమైనను భార్యాభర్తలు ఇరువురు చర్చించుకొందురేగాని అన్ని విషయాలు తల్లిదండ్రులకు తెలియజేయరు.  ఇది చదువుతున్న మీరు మీ ఒక్కసారి మీ హృదయముపై చేయి వేసుకొని ఆలోచించండి.  మీ వివాహమునకు ముందు మీరు ప్రతి సంఘటన ఎవరికి తెలిపేవారు?  వివాహము తరువాత ఎవరికి చెప్పుచున్నారు?  ఎన్ని సంగతులు తల్లిదండ్రులకు చెప్పుచున్నారు?  ఎన్ని సంగతులు మీరు మీ తల్లిదండ్రులకు చెప్పుట లేదు?  ఇదే దేవుడు ఏర్పరచిన బంధము.  ఈ బంధమును అనుసరించినవారు ఆనందకరమైన జీవితమును జీవిస్తారని గుర్తించాలి.  అలాగే తల్లిగాని తండ్రిగాని తన తనయునకు వివాహము చేయదలచిన రోజే ఒక నిర్ణయమునకు వచ్చి తమ కుమారునికి మరో రహస్య జీవితమునకు పునాది వేయుచున్నారని ఆ జీవితములో మనలను మానసికముగా దూరముగా ఉంచి జీవించునని గ్రహించి వారికి సాధ్యమైనంతవరకు సమస్యగా జీవించకూడదు.  వారి విషయములను పట్టి పట్టనట్లుగా జీవించాలి.  ఒకప్పుడు వారు కూడ అదే స్థితి పొందిరని గ్రహించాలి, ఎందుకంటే దేవుని వాక్యమును పాటించుట మనకు శ్రేయస్కరము కాదా!  మరి విడనాడవలెనని దేవుని వాక్యము చెప్పుచుండగా విడనాడకూడదని తల్లి తండ్రి భావించుట దైవవాక్యమునకు విరుద్ధముగా జీవించుట కాదా!  అయితే ఈ విడనాడుట అనునది ఎంతవరకో తెలుసుకోవాలి.  ఎందుకంటే ఒకే ఇంటిలో జీవించుచున్నను వారిని ప్రత్యేక కుటుంబముగా చూచునంతగా విడనాడుట చూపాలి.  అలాగే వారు చేయు ఏ కార్యమునకు ఏది అడిగినను సాధ్యమైనంత సహాయపడాలిగాని అడ్డు చెప్పరాదు.  నీతి వచనముగా ఏది చేసినను జాగ్రత్తగా చేయండి అని మాత్రమే చెప్పాలి.  అంతేగాని ప్రతీది పట్టించుకొంటే సమస్యలు మిమ్ములను చుట్టుకొంటాయి.  ఈ విధముగా నరుడు తల్లిదండ్రులను విడనాడునని గ్రహించి వారి స్వతంత్ర మనస్సునకు వారిని వదిలివేసిన వారు వారి తల్లిదండ్రులవలె ప్రతి విషయములో అభివృద్ధిలో పయనించగలరని గ్రహించాలి.  లేని పక్షములో బావిలో కప్పలవలె ప్రతి విషయములో బాధను అనుభవించవలసి యుంటుంది, ఎందుకంటే దేవుని వాక్యము అనుసరించుట సకల అనర్థాలకు పరిహారము.  కనుక నీ భార్య ఇలా అని కుమారునికి తల్లి, నీ తల్లి ఇలా అని భార్య చెప్పకూడదు, ఎందుకంటే వీరు ఇరువురు రెండు కుటుంబములవారు.  ఇరువురికి రహస్య జీవితములు ఉన్నాయి.  1.  కుమారుడు, ఆయన భార్య  2.  మామ మరియు అత్త (ఇరుప్రక్కల).  ఈ రెండు కుటుంబాలు ఒకే ఇంటిలో ఉంటారు కాని రెండు రహస్య జీవితములను ఒకే ఇంటిలో నడుపుదురు.  ఇలా వారి జీవితము ఉంటుందిగాని అలాగే ఉంటూనే విడనాడి ఉండాలి అని చెప్పాలి.  అంటే దాంపత్య రహస్య జీవితములో వారిని పట్టించుకోని స్థితిలో విడనాడి ఉండాలి.  ఈ విధముగా వివాహ దినము మొదలు తనయుడు తన తల్లిని తండ్రిని విడనాడి తన రహస్య జీవితమును జీవించునని గ్రహించాలి.  అంటే వివాహానంతరము తమ తనయునికి సాటి సహాయి వచ్చినది కనుక తమ అవసరత ఇక లేదని గ్రహించాలి.

        హెబ్రీ 12:8-10 వివాహము వరకు స్త్రీ పురుషులు తమ తల్లిదండ్రుల శిక్షణలో పెరిగియున్నారు.  వివాహానంతరము భార్యాభర్తలు తమ తల్లిదండ్రులను వదలుట చేత ఆత్మలకు తండ్రియైన పరమాత్మకు మరెక్కువగా లోబడి బ్రతుకవలెను.  తన పరిశుద్ధతలో పాలు పొందాలని మన మేలు కొరకే ప్రభువు శిక్షించుచున్నాడు.  కనుక భార్యాభర్తలు వాక్యానుసారముగా నడుచుకొంటూ మంచి విశ్వాసము ప్రార్థనా జీవితము కలిగియుండాలి.  అంటే వివాహము వరకు తల్లిదండ్రుల క్రమశిక్షణలో పెరిగినారు.  అయితే వివాహ అనంతరము ఆత్మలకు తండ్రియైన ప్రభువు క్రమశిక్షణలో పెరగవలసి ఉన్నది.

29.  వివాహము

        ప్రియపాఠకులారా!  వివాహము వధూవరులు కలిసి జీవించుటకు ఏకశరీరముగా జీవించుటకు ఏర్పరచబడిన సాంగ్యము.  ఇది చాలా పవిత్రమైనదని పాన్పు నిష్కల్మషముగా ఉంచాలని చెప్పబడింది.  హెెబ్రీ 13:4, ''వివాహమ అన్ని విషయములలో ఘనమైనదిగాను, పానుపు నిష్కల్మషమైనదిగాను ఉండవలెను; వేశ్యాసంగులకును వ్యభిచారులకును దేవుడు తీర్పు తీర్చును.''  నీతితో ఉన్న వధూవరులు ఇకపై ఏక శరీరముగా జీవించు అవకాశము ఇక్కడ నుండి ఈయబడును.  ఇదే నూతన జీవికి మార్గము ఏర్పడి వీరి ద్వారా జన్మించుట జరుగును.  ఈ స్థితిలో అనేకులు అనేక విధాలుగా తమ తమ బాధ్యతలను నెరవేర్చుకోవాలి.  వరుని తల్లిదండ్రులు కుమారునికి సమస్తమును అనగా న్యాయముగా ఇయ్యవలసిన వారసత్వమును ఇచ్చుదురు.  ఆదికాండము 24:36, ''నా యజమానుని భార్యయైన శారా వృద్ధాప్యములో నా యజమానునికి కుమారుని కనెను;  నా యజమానుడు తనకు కలిగినది యావత్తును అతనికిచ్చి యున్నాడు;''  ఈ విధముగా అబ్రాహాము తనకు ఉన్నదంతయు ధారాళముగా తన కుమారునికి ఇచ్చి అటుతరువాత ఇస్సాకుకు వివాహము చేయాలని సిద్ధపడ్డాడు.  ఇలా వివాహమునకు ముందు బాధ్యతలు ఇచ్చుట ద్వారా కుమారునియొక్క చాకచక్యము తెలుసుకొన వీలగును.  ఎవరైతే యోగ్యతగా బాధ్యతగా జీవిస్తారో వారికి వివాహము చేయాలన్నది ఇందులోని రహస్యము.  అలాగే వధువు తల్లిదండ్రులు కూడ తమ కూతురుకి వివాహము నిశ్చయమైన తరువాత ఆమెకు ఇయ్యవలసిన వారసత్వ సంపదను వివాహమునకు ముందు ఇవ్వాలి.  సంఖ్యాకాండము 36:8, ''మరియు ఇశ్రాయేలీయులకు వారి వారి పితరుల స్వాస్థ్యము కలుగునట్లు, ఇశ్రాయేలీయుల గోత్రములలో స్వాస్థ్యముగల ప్రతి కుమార్తెయు తన తండ్రి గోత్రవంశములోనే పెండ్లిచేసికొనవలెను.''  ఈ విధముగా వారికి చెందిన వారసత్వపు  హక్కును వీరు పొంది నూతనముగా వైవాహిక జీవితమును వీరు కొనసాగిస్తారు.  వీరు ఇరువురు ఒక్కరే.  వీరు ఆ కుటుంబము నుండి వేరై వేరొక కుటుంబముగా అభివృద్ధిని పొందుదురు.  ఈ విధముగా వీరు ఈ లోకములో మానవజాతి మనుగడకు తోడ్పడుదురు.  కనుక వివాహము అన్ని విషయములలో ఘనమైనదని చెప్పబడింది.  వివాహానంతరము వరుని తల్లిదండ్రులు వారు యధావిధిగ సంపాదించుచూనే ఉంటారు.  ఈ సంపాదనను కూడ వారసత్వముగా తమ కుమారునికి ఇయ్యాలి.  ఆదికాండము 25:5, ''అబ్రాహాము తనకు కలిగినది యావత్తు ఇస్సాకు కిచ్చెను.''  మొదట వివాహమునకు ముందు ఇచ్చాడు.  అటుతరువాత తాను చనిపోవు సమయము వచ్చినప్పుడు మరల ఇచ్చుట జరిగింది.  ఇదే బిడ్డలపై తల్లిదండ్రుల బాధ్యత.  పిల్లలకు ఇవ్వాలి.  వీరు తీసుకోవాలి.

30.  జాతి గోత్రములు మార్చి వివాహమాడువారు

        ప్రియపాఠకులారా!  అన్ని సందర్భాలలో అన్ని కుదరవు.  ఒక్కొక్కసారి వరునికి వారి జాతిలో కులములో విశ్వాసములో ఉన్న వధువు దొరకక పోవచ్చును.  ఇలాంటి స్థితిలో ఏమి చేయాలి అన్న సందేహము మనకు లుగవచ్చును.  ఈ స్థితి కలిగినవారు  వారి జాతిలో గాని కులములో గాని ఏ స్త్రీ విశ్వాసములో ఉండి అతనికి సాటి సహాయిగా దొరకక పోయిన అతను వారి జాతులలో వేరే గోత్రాలలో తనవలె అలాంటి స్థితిలో ఉన్న స్త్రీని వివాహమాడవచ్చును.  ఇందుకు అభ్యంతరము లేదు.  అయితే మొదట సంపూర్తిగా అన్వేషించిన తరువాతే ఈ వివాహము చేసుకోవాలిగాని అన్వేషణ చేయక ప్రేమించానన్న నెపముతో చేయకూడదు.  విశ్వాసి / విశ్వాసురాలు వరుడు / వధువుగా తమ జాతిలో / తమ గోత్రములో లేనప్పుడు మాత్రమే ఈ నియమము వర్తిస్తుంది.  లేవీయకాండము 22:12, ''యాజకుని కుమార్తె అన్యుని కియ్యబడినయెడల ఆమె ప్రతిష్ఠతమైనవాటిలో ప్రతిష్ఠార్పణమును తినకూడదు.''  ఇందులో యాజకుని కూతురికి మరో యాజకుని వరుడు దొరకలేదు.  ఈమె సాధారణ స్థితిలో జీవించు వరుని వివాహము చేసుకొనుట జరిగింది.  కనుక ఈమె ఇక పై యాజకుని స్థితి వారికి సంబంధించిన వాటిలో పాలు లేదు.  యాజకుడు / ఫాదరు / పాస్టరు తాను దేవునికి వారసత్వములో చర్చీ నుండి తెచ్చుకొన్న తన ఆహారములో వానికి / ఆమెకు పాలు లేదు.  కనుక ఆ ఉన్నత స్థితిని ఆమె కోల్పోవునని గ్రహించాలి.  ఈనాడు మన మధ్య ఇదే స్థితిలో గోత్రాలు లేక జాతిని మార్చి వివాహమాడినవారు ఈ విధముగా వారి నియమములు  మారిపోవును కనుక పవిత్రమైనవాటిపై అధికారమును కోల్పోవును.  అప్పుడు తాను వివాహమాడిన వరుని / వధువు వారిలోని తక్కువ స్థాయిని వారు పొందాలి.  దేవుని ఎక్కువ స్థాయి దేవుడు ఇచ్చింది.  ఇది పుట్టుకతో మనము పొందినది.  కాని మన నిర్ణయం ప్రకారము ఆ స్థాయి కన్నా తక్కువ స్థితిలో ఉన్నవారిని వివాహమాడినప్పుడు ఆ తక్కువ స్థితే తన స్థితి అగును కనుక వారు ఇక పై ఆ స్థాయిలోనే వారి నియమములనుబట్టి ఆచరించాలి.  సంఘములో అందరు బోధకులు కాలేరు.  అందరు ప్రవచనవరము గలవారు కాలేరు.  సంఘములో ఎన్నో విధాలైన ఉన్నత స్థాయి గలవారు ఉన్నారు.  ప్రభువు బల్ల ఆరాధన జరిగించు యాజకుని మొదలు సాధారణ స్థితిలో ఏమి తెలియక అయోమయముగా చూచువారు కలరు.  కనుక వివాహము జరిగించునప్పుడు వారి స్థితిని బట్టి జరిగించుట మంచిది.  దొరకనప్పుడు మార్చి చేసిన వివాహ స్థాయిలో తక్కువ స్థాయిలో ఉన్నవారికి అనుగుణముగా జీవించాలి.

        ఇందునుగూర్చి హోషేయ 1:2 చదివినట్లయితే వ్యభిచారమందు పుట్టిన బిడ్డను చేసికోమంటున్నాడు.  ఎందుకని పురుషుడే వ్యభిచారములో సులభముగా పాల్గొంటాడు.  కాని స్త్రీ వ్యభిచారమునకు ఇష్టపడదు, ఆమెను ఉద్యోగమిప్పిస్తాననియో ఏదైన ఆశ చూపియో బలాత్కరించియో వ్యభిచార కూపములో నెట్టుతారు.  కనుక ఇట్టివారి పిల్లలను  పెళ్లి చేసుకొని తమ గోత్రములో తమ మతములో వారికి ఇష్టమైతే చేర్చుకోవచ్చు అంటున్నాడు.  ఇందునుగూర్చి యేసు ప్రభువు లూకా 15:23 తప్పిపోయిన కుమారుని యొక్క మారుమనస్సును బట్టి చేర్చుకొని తండ్రి ఆనందించాడు.  లూకా 19:9  సుంకరి మరియు పాపియైన జక్కయ్యకు ప్రభువు రక్షణ ఇచ్చుటయేగాక ఇతడును అబ్రాహాము  వంశపువాడేయని తీర్పుదీర్చినాడు.  కనుక ఈ నూతన నిబంధన కాలములో ఏ జాతి ఏ దేశము ఏ భాష మాట్లాడేవాడైనను స్త్రీయైనను ప్రభువు మార్గములో నడిచేవారిని నిషేధింపకూడదు.

31.  వ్యభిచారిణితో వివాహము

        ప్రియపాఠకులారా!  వ్యభిచార స్త్రీ వివాహమునకు పనికిరాదు.  ఈ స్త్రీని విడిచిపెట్టమని క్రీస్తు ప్రభువే స్వయముగా తెలియజేసి యున్నారు.  మత్తయి 5:32, ''నేను మీతో చెప్పున దేమనగా-వ్యభిచారకారణమునుబట్టి గాక, తన భార్యను విడనాడు ప్రతివాడును ఆమెను వ్యభిచారిణిగా చేయుచున్నాడు; విడనాడబడినదానిని పెండ్లాడువాడు వ్యభిచరించుచున్నాడు.''  వ్యభిచార కారణము వలన వివాహము రద్దు అగుచున్నది.  ఇలాంటి స్థితిలో వ్యభిచారిణిని వివాహము చేసుకొనుట తగునా?  అన్న ప్రశ్న మనకు కలుగును.  ఏ కోణములో ఆలోచించినను వ్యభిచారిణిగా ఉన్న స్త్రీ వివాహమునకు పనికిరాదనే నా మనస్సునకు తోచుచున్నది.  ఇందులో రెండు సంగతులు మన ముందుకు వచ్చును.  1.  హోషేయ అన్న ప్రవక్తను దేవుడే వ్యభిచారిణిగా ఉన్న స్త్రీని వివాహము చేసుకొనమని చెప్పుట  2.  నూతన నిబంధనలో వ్యభిచారమున పట్టుపడిన స్త్రీని సైతము క్రీస్తు ప్రభువు క్షమించుట.

        హోషేయ 1:1-9, ''ఉజ్జియా యోతాము ఆహాజు హిజ్కియా అను యూదారాజుల దినములలోను, యెహోయాషు కుమారుడైన యరొబోము అను ఇశ్రాయేలురాజు దినములలోను బెయేరి కుమారుడైన హోషేయకు ప్రత్యక్షమైన యెహోవా వాక్కు.  మొదట యెహోవా హోషేయద్వారా ఈ మాట సెలవిచ్చెను-జనులు యెహోవాను విసర్జించి బహుగా వ్యభిచరించియున్నారు గనుక నీవు పోయి, వ్యభిచారము చేయు స్త్రీని పెండ్లాడి, వ్యభిచారమువల్ల పుట్టిన పిల్లలను తీసికొనుము అని ఆయన హోషేయకు ఆజ్ఞ ఇచ్చెను.  కాబట్టి అతడుపోయి దిబ్లయీము కుమార్తెయైన గోమెరును పెండ్లిచేసికొనెను.  ఆమె గర్భవతియై అతనికొక కుమారుని కనగా యెహోవా అతనితో ఈలాగు సెల విచ్చెను-ఇతనికి యెజ్రెయేలని పేరు పెట్టుము.  యెజ్రెయేలులో యెహూ యింటివారు కలుగజేసికొనిన రక్తదోషమును బట్టి ఇక కొంతకాలమునకు నేను వారిని శిక్షింతును, ఇశ్రాయేలువారికి రాజ్యముండకుండ తీసివేతును.  ఆ దినమున నేను యెజ్రెయేలు లోయలో ఇశ్రాయేలు వారి విల్లును విరుతును.  పిమ్మట ఆమె మరల గర్భవతియై కుమార్తెను కనగా యెహోవా అతనికి సెలవిచ్చిన దేమనగా-దీనికి లోరూహామా అనగా జాలినొందనిది అని పేరు పెట్టుము; ఇకమీదట నేను ఇశ్రాయేలువారిని క్షమించను, వారియెడల జాలిపడను.  అయితే యూదావారియెడల జాలిపడి, విల్లు ఖడ్గము యుద్ధము గుఱ్ఱములు రౌతులు అను వాటిచేత కాక తమ దేవుడైన యెహోవాచేతనే వారిని రక్షింతును.  లోరూహామా (జాలినొందనిది) పాలువిడిచిన తరువాత తల్లి గర్భవతియై కుమారుని కనినప్పుడు యెహోవా ప్రవక్తకు సెలవిచ్చినదేమనగా-మీరు నా జనులు కారు, నేను మీకు దేవుడనై యుండను గనుక లోఅమ్మీ (నాజనము కాదని) యితనికి పేరు పెట్టుము.''  ఇందులో ప్రవక్తయైన హోషేను దేవుడే చెప్పి వ్యభిచారిణియైన యువతిని వివాహమాడమని చెప్పుట జరిగింది.  ఆ విధముగా హోషేయ వివాహము వ్యభిచారములో ఉన్న స్త్రీని చేసుకొంటాడు.  ఆమె వలన బిడ్డలను కూడ కన్నట్లుగా వ్రాయబడింది.  కాని దేవుడు వారిని గూర్చి గొప్పగా చెప్పుట లేదుగాని ఆ బిడ్డలు కూడ ఆమె వంటి వారే అగుదురని ఇశ్రాయేలీయులు కూడ తనను విడనాడి అన్యదేవత విగ్రహాలను పూజిస్తూ వ్యభిచారములో ఉన్నారని చెప్పుచున్నాడు.  కనుక హోషేయ ప్రవక్తయైనను వ్యభిచారములో మ్రగ్గుచున్న స్త్రీని వివాహమాడి ఆమె వలన కనిన బిడ్డలు సైతము అదే స్థితిలో ఉందురని చెప్పుట జరిగింది.  

        పేతురు అపవిత్రమైనవి తినమన్నప్పుడు నేను అపవిత్రుని కాదలచుకోలేదని అడుగుట మనము బైబిలు గ్రంథములో చదువగలము.  అపొస్తలుల కార్యములు 10:14-15, ''అయితే పేతురు-వద్దు ప్రభువా, నిషిద్ధమైనది అపవిత్రమైనది ఏదైనను నేనెన్నడును తినలేదని చెప్పగా -దేవుడు పవిత్రము చేసినవాటిని నీవు నిషిద్ధమైనవాటినిగా ఎంచవద్దని మరల రెండవమారు ఆ శబ్దము అతనికి వినబడెను.  ఈలాగు ముమ్మారు జరిగెను.  వెంటనే ఆ పాత్ర ఆకాశమునకెత్తబడెను.''  ఇందులో అపవిత్రమైనవి చూపించినప్పుడు పేతురు దేవుని అడుగుచున్నాడు.  అందుకు దేవుడు నేను పవిత్రపరచితే అది పవిత్రమైనవని చెప్పుట జరిగింది.  దేవుడు పవిత్రపరచెను గనుక అది యోగ్యమైనవే కదా!  అయితే వ్యభిచారిణి విషయములో హోషేయను దేవుడు వివాహము చేసుకొనమన్నప్పుడు అపవిత్ర స్థితిలో ఉన్న స్త్రీని నేను వివాహమాడి అపవిత్రుని కానని అడగలేదు.  ప్రవక్తే కాని దేవునిని పేతురువలె అడిగి అపవిత్రమైనదానిని దేవునిచే పవిత్రపరచుకోవాలన్న తలంపు లేదు.  కనుకనే దేవుడు ఆ ప్రవక్త మూలమున జన్మించు సంతానము కూడ అపవిత్రత కలిగియుండురని గ్రహించాలి.  అలాగే హోషేయ గ్రంథము ప్రకారము వీరంతా బాబిలోనియా దేశములో శిక్షను పొందినట్లుగా చదువగలము.  వారు దేవునిలో ఉన్నత స్థానమును పొందలేక పోయారు.  అలాగే వ్యభిచారమున పట్టుబడిన స్త్రీని క్రీస్తు ప్రభువు క్షమించాడు.  ఒకసారి క్షమాపణ ఈ స్త్రీ పొందిన తరువాత ఆమె పరిశుద్ధురాలే.  ఈమెను దేవుడే క్షమించినప్పుడు మధ్యలో నీవు ఎవరు?  నేను ఎవరు?  కనుక దేవుడు క్షమించినవారు పవిత్రులే!  ఇకపై ఈ స్త్రీ వ్యభిచారిణి కాకుండ జీవించిన ఈ స్త్రీ నీతిమంతురాలుగానే లెక్కింపబడును.  ఈ విధముగా దేవునిచే పాపక్షమాపణ పొందక జీవించు వ్యభిచారపు స్త్రీని వివాహము చేసుకొనుట తప్పు.  నిజమైన పాపక్షమాపణ పొందిన తరువాత ఈ స్త్రీ ఆ పాపము నుండి విమోచింపబడి పరిశుద్ధురాలుగా మారెను గనుక ఇకపై ఈ స్త్రీని వ్యభిచారపు స్త్రీగా లెక్కింపకూడదు.  హోషేయ 3:1-3, ''మరియు యెహోవా నాకు సెలవిచ్చినదేమనగా-ఇశ్రాయేలీయులు ద్రాక్షపండ్ల అడలను కోరి యితర దేవతలను పూజించినను యెహోవా వారిని ప్రేమించినట్లు, దాని ప్రియునికి ఇష్టురాలై వ్యభిచారిణియగు దాని యొద్దకు నీవు పోయి దానిని ప్రేమించుము.  కాగా నేను పదునైదు తులముల వెండియు ఏదుము యవలును తీసికొని దానిని కొని ఆమెతో ఇట్లంటిని.  -చాల దినములు నా పక్షమున నిలిచియుండి యే పురుషుని కూడకయు వ్యభిచారము చేయకయు నీవుండవలెను; నీయెడల నేనును ఆలాగున నుందును.''  దేవుడు కరుణామయుడు గనుక మారుమనస్సును మొదట చెప్పుచున్నాడు.  మొదట మారుమనస్సు పొంది వేశ్యా వృత్తిని మానివేయాలి.  ఇలా చాల కాలము ఉండాలి.  ఆమె దేవుని ఎదుట నిజమైన మార్పు పొందెనని నిరూపించుకొన్న తరువాత ఆమె పరిశుద్ధురాలుగా మారును.  ఆపై ఆమె వివాహము చేసుకొని పరిశుద్ధ స్థితిలో తన పురుషునికి సాటి సహాయిగా ఉండవచ్చును.

32.  వివాహము - యుగాంతము

        ప్రియపాఠకులారా!  ఒకప్పుడు ఉన్న వివాహము జరుగుటలో ఉన్న శ్రద్ధ ఈనాడు లేదు.  ఈ వివాహ విలువలు కూడ చాలా తగ్గిపోయాయి.  ఈనాడు చీటికి మాటికి విడాకులు తీసుకొంటూ బైబిలుకు వ్యతిరేకముగా జీవించువారు అనేకులు కలరు.  విడాకులు తీసుకొని ఒంటరిగా జీవిస్తే తప్పు లేదుగాని వివాహము మరల చేసుకొనుటకు వీలులేదు.  ఇందునుగూర్చి లూకా 16:18, రోమా 7:3 వివరిస్తున్నది.  

        అయితే యుగాంతమునకు ముందు ఈ స్థితి అసలు కనబడదు.  అప్పుడు అబద్ధ బోధకులు వచ్చి వివాహము చేసుకొంటే విడిపోయి మరల చేసుకొను అవకాశము లేదు కనుక వివాహమును నిషేధించి ఎవరికి ఇష్టమొచ్చిన వారితో ఆనందించవచ్చునని ప్రచారము చేయుట జరుగును.  1 తిమోతి 4:3, ''ఆ అబద్ధికులు, వాత వేయబడిన మనస్సాక్షిగలవారై, వివాహమునిషేధించుచు, సత్యవిషయమై అనుభవజ్ఞానముగల విశ్వాసులు కృతజ్ఞతాస్తుతులు చెల్లించి పుచ్చుకొనునిమిత్తము దేవుడు సృజించిన ఆహార వస్తువులను కొన్నిటిని తినుట మానవలెనని చెప్పుచుందురు.''  ఈ విధముగా వివాహమును నిషేధించి వావివరుసలు మాని ప్రవర్తించు కాలము రాబోవుచున్నది.  కాబట్టి స్త్రీలు కూడ తీతు 2:4 మంచి ఉపదేశము చేయువారుగాను, అంతేగాక ఉపదేశముతో బాటు వారి దుర్‌నడతను దీర్ఘశాంతముతో ఖండించాలని 2 తిమోతి 4:2.  ఇందువలన స్త్రీల యొక్క యోగ్యమైన ప్రవర్తనను బట్టి పురుషులు మార్పు చెంది దైవిక మార్గమునకు ఆకర్షింపబడుదురని 1 పేతురు 3:1-6 వరకు వివరిస్తున్నది.  ప్రకటన 9:21, ''మరియు తాము చేయుచున్న నరహత్యలును మాయమంత్రములును జారచోరత్వములును చేయకుండునట్లు వారు మారుమనస్సు పొందిన వారు కారు.''  ఇందులో చెప్పబడిన జారత్వమును పౌలు తన లేఖలో ఈ విధముగా చెప్పుట జరిగింది.

33.  వివాహ మహోత్సవము - జరగవలసిన స్థలము

        ప్రియపాఠకులారా!  వివాహము అన్ని విషయములలో ఘనమైనదని బైబిలు గ్రంథము చెప్పుచున్నది.  ఈ వివాహ మహోత్సవములో జరుగు ఆర్భాటము ఇంక ఏ సందర్బములోను జరుగదు.  ఇంత ఆర్భాటముగా జరుగు వివాహము ఎక్కడ జరగాలి?  ఇది ప్రభువునందు మాత్రమే జరగాలి.  అంటే ఈ వివాహము ద్వారా జతపరచబడు వధువు వరుడు ఇద్దరు ప్రభువునందు మాత్రమే జతపడాలి.  ఇలా కాక మరే విషయములోను అవకాశము లేదు అంటే సంఘములో దైవసేవకుని చేతుల మీదుగా ఈ వివాహము జరగాలి.  అంటే క్రైస్తవ వివాహమై ఉండాలి.  ఇక మిగిలిన వివాహముల సంగతి ఏమిటి?  ఇవి క్రైస్తవ వివాహములు కావు.  ప్రభువునందు జరిగినవి కావు.  వీటికి వారు మారుమనస్సు పొంది కుటుంబసమేతముగా బాప్తిస్మము పొందినవారి వివాహమునకు మరల విలువ ఉన్నది.  అయితే ఒక క్రైస్తవుడు అన్యుల మాదిరిగా వివాహము చేసుకొనకూడదు.  ఎందుకంటే ప్రభువునందు మాత్రమే చేసుకోవాలి.  ఇలా వివాహము చేసుకోవాలి అంటే దానికి ఒక స్థలము కావాలి.  ఈనాడు చర్చీలు అనేకము ప్రత్యేకముగా నిర్మింపబడియున్నవి.  కనుక సాధారణముగా చర్చీలయందు వివాహము చేయుట ఉత్తమమైనది.  ఇలా దైవసేవకుల సమక్షములో జరుగు వివాహము దేవుని ప్రార్థనా స్థలములో జరుగు వివాహము కనుక ఇది పవిత్ర వివాహముగా లెక్కింపబడును.  అయితే కొన్ని చర్చీలు చిన్నవి అగుట వలన వివాహమునకు వచ్చువారికి సరిపోక పోవచ్చును.  ఇలాంటి సందర్భములో బహిరంగ ప్రదేశాలలోను వివాహము జరుగు హాల్స్‌ నందు కూడ జరిగించవచ్చును.  అక్కడ కూడ వివాహము జరుగు స్థలమును దేవునికి ప్రార్థనా స్థలమువలె పవిత్రముగా అలంకరించి అలా అది కనబడు విధముగా దానిని సిద్ధము చేయాలి.  బలపీఠములు ఎక్కడ కావాలంటే అక్కడ పాతనిబంధన కాలములో ఏర్పరచేవారు.  కాని దానిని ఏర్పరచు పద్ధతి ప్రకారము మాత్రమే వాటిని అప్పటికి నిర్మించుట జరిగించి అలాగున పవిత్ర వివాహమును జరిగించవచ్చును.  ఎక్కడ జరిగిన అది ప్రభువునందు మాత్రమే జరుగు వివాహమై ఉండాలి.

        ప్రకటన 19:7 గొర్రెపిల్ల వివాహ మహోత్సవము - గొర్రె అనగా ఆడది పొట్టేలు అనగా మగ జంతువు.  గొర్రెపిల్ల అనగా పొట్టేలు. ఈ పొట్టేలు క్రీస్తుకు సాదృశ్యము.  అందువల్లనే అబ్రాహామునకు ఆదికాండము 22:13 కుమారుని విడిపించుటకు ఈ పొట్టేలు సిద్ధపరచబడింది.  గొర్రెపిల్ల చర్మపు దుస్తులే ఆదాము హవ్వలకు రక్షణ వస్త్రాలయ్యాయి.  ఆత్మలకు స్త్రీ పురుష భేదము లేదు.  ఆదాములో ప్రవేసించిన ఆత్మ దేవునిదే - కనుక స్త్రీలోను పురుషునిలోను నివసించే ఆత్మ పురుష స్వరూపము గలది.  అయితే దేహము విడిచిన తరువాత శరీర రూపము ధరించుకొని ఆత్మ సంచరిస్తుంది.  ఆదాము స్త్రీకి లోబడి స్త్రీ ఇచ్చిన దైవనిషేధఫలములు తినినందున పురుషుడు స్త్రీకి దాసుడై ఎంతటి మగధీరుడైనను స్త్రీలతో బాటు వధువు సంఘములో చేరవలసిందే - వధువు సంఘములో చేర్చి స్త్రీ పురుషులను సిద్ధపరచేవాడు పరిశుద్ధాత్మ దేవుడు మాత్రమే.  మనము ప్రభువుతో ఏక పట్టణస్థులుగ ప్రభువు సన్నిధిలో పరిశుద్ధులతో బాటు సంచరిస్తాము.  ఇదియే గొర్రెపిల్ల వివాహ మహోత్సవము అనబడును.  వివాహమైన స్త్రీ భర్తతో సంచరిస్తుంది.  ఆ విధముగా ప్రభువుతో మనము మన కుటుంబము మన పిల్లలు బంధుమిత్రులు అందరు సంచరిస్తారు.

34.  క్రొత్తగా వివాహము చేసుకొన్న జంట విధి

        ప్రియపాఠకులారా!  క్రొత్త వధూవరులకు వివాహము చేసి వారిని వరుని ఇంటికి తీసుకొని వెళ్లుదురు.  వీరు అక్కడ ఉండుట భారతదేశ ఆచారము.  అయితే వీరికి ఎటువంటి కార్య భారములు చెప్పకూడదని బైబిలు గ్రంథము చెప్పుచున్నది.  కనీసము సంత కెళ్లి ఈ పని చేసుకొనిరా అని కూడ చెప్పకూడదు.  దేశము దుర్భర పరిస్థితులలో ఉండగా పరాయి దేశమువారు యుద్ధము చేయుటకు వచ్చియున్నప్పుడు కూడ ఈ నూతన వధూవరులకు ఏ కార్యము అప్పగింపరాదని చెప్పబడింది.  ఇలా ఒక సంవత్సరముపాటు ఈ నిబంధన వారికి వర్తించును.  ద్వితీయోపదేశకాండము 24:5, ''ఒడు క్రొత్తగా ఒకదానిని పెండ్లిచేసికొని సేనలో చేరి పోకూడదు.  అతనిపైన యే వ్యాపారభారమును మోపకూడదు.  ఏడాదివరకు తీరికగా అతడు తన యింట ఉండి తాను పరిగ్రహించిన భార్యను సంతోషపెట్టవలెను.''  ఈ విధముగా వధూవరులు ఒకరిని ఒకరు విడిచిపెట్టక సంతోషపెట్టుకొనుటయే వారి విధి.  ఆ విధముగానే వారి తల్లిదండ్రులు వారికి ఏ పనులు చెప్పకుండ కావలసినంత ఏకాంతమును వారికి కలిగించాలి.

35.  స్త్రీ పురుషుల కలయిక

        ప్రియపాఠకులారా!  భార్యాభర్తలుగ జతపరచబడిన వీరు దేవుని దీవెన వారి పైకి వచ్చుటకు వారు బిడ్డలతో సంతోషించుటకు స్త్రీ పురుషుల శారీర కలయిక ఎంతో ప్రాముఖ్యతను సంతరించుకొన్నది.  అందుకే వివాహము అన్ని విషయములలో శ్రేష్ఠమైనదని పాన్పు నిష్కల్మషముగా ఉండాలని బైబిలు గ్రంథము తెలియజేయుచున్నది.  హెబ్రీ 13:4.  అలా కాక అక్రమ సంబంధాలు వివాహమునకు ముందే కలిగి యున్నవారు వీరు అన్ని హంగులతో వివాహము చేసుకొన్నను వీరి పాన్పు కల్మషమైనదిగానే లెక్కింపబడును.  కనుక వివాహేతర సంబంధాలు తప్పని గుర్తించి దేవునికి సమాజమునకు యోగ్యమైన స్థితిని కలిగియుండాలని కోరుచున్నాను.

        కొందరు ముట్టుతో ఉన్న స్త్రీతో శారీరక కలయిక చేయుట.  ఇలాంటి కలయిక తప్పు అని దానికి కొద్దిపాటి శిక్షను ధర్మశాస్త్రములో చెప్పుట జరిగింది.  లేవీయకాండము 15:24, ''ఒకరు ఆమెతో శయనించుచుండగా ఆమె రజస్సు వానికి తగిలినయెడల, వాడు ఏడు దినములు అపవిత్రుడగును; వాడు పండుకొను ప్రతి మంచము అపవిత్రము.''  ఈ విధముగా శారీరక కోరికను తన ఆధీనములో ఉంచుకొనలేనివాడు చేయు పనికి వానికి మరో ఏడు దినములు స్త్రీకి వలె అశుద్ధునిగా ఎంచమని చెప్పుట జరిగింది.  కనుక ఆ దినములలో స్త్రీకి దూరముగా ఉండుట మంచిది.  లేవీయకాండము 18:19, ''అపవిత్రతవలన స్త్రీ కడగా ఉండునప్పుడు ఆమె మానాచ్చాదనమును తీయుటకు ఆమెను సమీపింపకూడదు.''

36.  స్త్రీ పురుషుల కలయిక అనంతరము కొన్ని నియమములు  . . .

        ప్రియపాఠకులారా!  పరిశుద్ధ వివాహములో జతపరచిన స్త్రీ పురుషులు కలసి జీవించాలి.  ఆ దినము నుండి ఆ స్త్రీ సాటి సహాయిగా ఆ పురుషునితో జీవించును.  వారికి కలిగిన శారీరక కోరికను బట్టి వారిరువురు శారీరక కలయికలో ఆనందించుట జరుగుచుండును.  ఈ శారీరక కలయిక తరువాత కొన్ని నియమములను బైబిలు గ్రంథము బోధించుచున్నది.  లేవీయకాండము 15:18, ''వీర్యస్థలనమగునట్లు స్త్రీ పురుషులు శయనించినయెడల వారిద్దరు నీళ్లతో స్నానము చేసి సాయంకాలమువరకు అపవిత్రులై యుందురు.''  ఇందులో స్నానము ఇద్దరు చేయవలెనని చెప్పబడింది.  ఈ విధముగా వారు శుద్ధిని పొందుట జరుగును.  ఒకవేళ స్త్రీ పురుషుల శారీరక కలయిక జరిగినప్పుడు పురుషుని నుండి విడుదలయిన వీర్యము ప్రక్కపై పడిన యెడల ఆ బట్టలను సైతము తీసి ఉతకవలసి ఉంటుంది.  లేవీయకాండము 15:17, ''ఏ బట్టమీదను ఏ తోలుమీదను వీర్యస్థలనమగునో ఆ బట్టయు ఆ తోలును నీళ్లతో ఉదుకబడి సాయంకాలము వరకు అపవిత్రమైయుండును.''  ఈ విధముగా భార్యాభర్తలు శారీరకముగా కలసినప్పుడు వారు స్నానము చేయుట, బట్టలపై పడిన వాటిని శుద్ధి చేసుకొనవలెను.  కనీసము వీర్యము తగిలిన చర్మ భాగములు శుద్ధి చేసుకొనవలసియున్నది.  ఈ విధముగా చేయుట వలన వారి శరీర భాగములు శుద్ధి కాబడి ఎటువంటి అనారోగ్యము పాలు కాకుండ ఉండును.  శరీరములో ఉన్నంతవరకు ఏదియైనను జీవము కలిగియుండును.  శరీరము నుండి వెలుపలికి వచ్చిన తరువాత అందులో జీవము కలిగిన కణములు ఉన్నను కొంత  కాలమునకు అవి చనిపోయి మృతముగా మారిపోవును.  కనుక శరీరము నుండి వెలువబడిన వీర్యము చివరకు చెడిపోవును.  ఈ స్థితి చూడకుండుట మేలు కనుక దానిని శుద్ధి చేయమని చెప్పబడింది.  అలాగే చెడు భాగములు క్రిములకు నిలయమై అనేక రోగములకు కారణమగును గనుక ఈ నియమములు పాటించుట మంచిది.  ఈ దినములలో బలులు నిషేధింపబడినవి కనుక మనము నియమమును పాటించుట బలులు అర్పించినదానితో సమానము.  హృదయములో పాటించాలి దానిని ఈ లోకములో అనుసరించాలి.  ఇలా జీవించుట పరిహారము చేసుకొన్నదానితో సమానము కనుక మైలపడి అశుద్ధులుగా ఉండరు.  స్నానము చేసి ఆ బట్టలను లేక వీర్యము తగిలిన భాగములను శుద్ధి చేసుకొనుటయే పరిహారము చేసుకొనుట దైవ ఆజ్ఞను ఆచరించుటగా భావించాలి.  లేవీయకాండము 15:16.

37.  ఇప్పటికే వివాహ స్థితిలో పై వలె కాక జీవించువారి ధర్మము

        ప్రియపాఠకులారా!  అన్యులలో పుట్టాము పెరిగాము మధ్యలో క్రైస్తవులుగా నిజదైవము క్రీస్తు ప్రభువునందు ఉన్నదని తెలుసుకొని దైవజనాంగముగా మారాము.  కాని కుటుంబములో అందరు మారితే ఇక్కడ ఏ లోపము ఉండదు.  భర్త, భార్య ఇద్దరిలో ఒక్కరు మాత్రమే మారితే ఇప్పుడు ఎలా?  ఒకరు దైవజనాంగముగా లెక్కించబడుదురు.  ఇంకొకరు అన్య జనాంగముగా లెక్కింపబడుదురు.  ఇది అక్రమమైనదేనా?  అన్న సంశయము మనకు కలుగును.  తెలియక చేసిన తప్పు పాపము అయినప్పటికి అది క్షమింపగల తప్పు క్రింద లెక్కింపబడును.  దీనిని గూర్చి చెప్పుచూ పౌలు కూడ వారి పట్ల కొంత కనికరమును చూపుట జరిగింది కాని అది దేవుడు చెప్పినది కాదని తానే స్వయముగా ఆలోచించి తెలియజేస్తున్నానని చెప్పుచున్నాడు.  1 కొరింథీ 7:12-13, ''ప్రభువు కాదు నేనే తక్కినవారితో చెప్పున దేమనగా-ఏ సహోదరునికైనను అవిశ్వాసురాలైన భార్యయుండి, ఆమె అతనితో కాపురము చేయ నిష్టపడినయెడల, అతడు ఆమెను పరిత్యజింపకూడదు.  మరియు ఏ స్త్రీకైనను అవిశ్వాసియైన భర్తయుండి, ఆమెతో కాపురముచేయ నిష్టపడినయెడల, ఆమె అతని పరిత్యజింపకూడదు.''  ఇక్కడ ఉన్నచో అనుటలో వారికి విషయం తెలుసుకొనునాటికే ఉన్నది అని అర్థమగుచున్నది, అంటే వీరు దేవుని ఆజ్ఞను మీరి ప్రవర్తించి యున్నారు.  కనుక వీరు అక్రమ స్ధితిలో ఉన్నట్లుగానే లెక్కింపబడునుగాని వీరు మారుమనస్సు భార్యాభర్తల ఇరువురిలో ఒక్కరిలో మాత్రమే కలిగినది కనుక వీరిలో ఒక దైవజనాంగము అనగా విశ్వాసిగాను ఇంకొకరు అన్య జనాంగముగా అనగా అవిశ్వాసిగాను జీవిస్తున్నారు.  కనుక ఇది అక్రమ స్థితిని కలిగియున్నారు.  అయితే విశ్వాసిగా మారినవానికి / ఆమెకు అటుతరువాత కూడ వారు పాత వివాహ స్థితిని కొనసాగించాలన్న కోరిక ఉంటే విడవరాదని చెప్పుచున్నాడు.  అంటే కలిసి జీవించుచు మన విశ్వాసమును వారికి చూపుచూ చివరకు వారిని క్రైస్తవునిగా నిజదైవజనునిగా మార్చవచ్చును.  ఇది జరిగితే మీరు తీసుకొన్న నిర్ణయము చాలా గొప్పది.  ఆ విధముగా అవిశ్వాసి విశ్వాసిగా మారి పరిశుద్ధునిగా మారుచున్నారు.  అలా కాక ఒకవేళ విశ్వాసియే అవిశ్వాసిగా మారితే వీరు అన్య మతస్థులుగా మారి శాశ్వతముగా నిజదైవము నుండి తొలగిపోవుట జరుగును కనుక ఇది ప్రభువు మాట కాదని దీనికి దేవుని ఆజ్ఞ లేదని పౌలు చెప్పుచున్నారు.  కనుక నిజ దైవప్రజలలోనే వివాహము చేసుకొనుట మంచిది.  అలాగే క్రీస్తు ప్రభువు కూడ నీవు విశ్వాసిగా మారినంత మాత్రాన అవిశ్వాసియైన భార్యనో / భర్తనో విడుచుట ధర్మము కాదని తెలియజేయుట జరిగింది.  మత్తయి 5:31, ''తన భార్యను విడనాడు వాడు ఆమెకు పరిత్యాగ పత్రిక యియ్యవలెనని చెప్పబడియున్నది గదా;''  ఈ వచనములో విశ్వాసి అవిశ్వాసి లేక ఏజాతివారని చెప్పుట లేదు.  వ్యభిచారము చేసినారా లేదా అన్నదే విడిపోవుట లేక కలిసియుండుటకు యోగ్యత.  అంతేగాని నేను విశ్వాసిగా మారాను విడిపోతానని చెప్పకూడదు.  కలిసియే ఉండాలి.  వివాహ ధర్మమును ఆమె / అతను పట్ల నెరవేర్చుచూ నీలో కలిగిన విశ్వాసమును ఓర్పు సహనముతో ప్రదర్శించి చివరకు వారిని కూడ విశ్వాసులుగా మార్చాలి.  కనుక ఇప్పటికే ఈ స్థితిలో జీవించువారు అనగా వేరే జాతులలో కులాలలో గోత్రాలలో వివాహము చేసుకొని జీవిస్తూ విశ్వాసిగా మారితే తమ భాగస్వామిని వదలక మీ విశ్వాసమును కొనసాగించి వారిని కూడ ఓర్పు సహనముతో యేసుక్రీస్తు ప్రభువులోని దివ్య ప్రేమను బయల్పరచి ఋజువుపరుస్తూ నిజ క్రైస్తవులుగా మార్చుకోవాలి.  ఇదే మీకు దేవుడు ఇచ్చిన పరీక్షగా భావించి ఈ స్థితిలో సాతాను కలిగించు శోధనలన్నింటిని ఓర్పుతో సహించుచు ప్రార్థనతో పోరాడి చివరకు విజయము సాధించినవారు కూడ జయించినవారి క్రిందకే లెక్కింపబడుదురు.

        ఒకవేళ అవిశ్వాసియైన భర్త / భార్య విశ్వాసియైన భార్య / భర్తను విడిచిపెట్టి ఉండాలని అనుకుంటే మాత్రము మీరు అడ్డు చెప్పక వారిని వారి ఇష్టమునకు వదిలి వేయమని చెప్పుచున్నారు.  ఎందుకంటే మనము దేవునిలో ప్రశాంతముగా జీవించాలని చెప్పుట జరిగింది.  1 కొరింథీ 7:15, ''అయితే అవిశ్వాసియైనవాడు ఎడబాసిన ఎడబాయవచ్చును; అట్టి సందర్భములలో సహోదరునికైనను సహోదరికైనను నిర్బంధము లేదు.  సమాధానముగా ఉండుటకుదేవుడు మనలను పిలిచియున్నాడు.''  ఇందులో ఒక నిబంధన ఉన్నది.  వదిలిపెట్టవలసినది అవిశ్వాసియైనవారేగాని విశ్వాసి కాదు.  కనుక అవిశ్వాసి కోరుకుంటే విశ్వాసి ఒప్పుకోవాలిగాని విశ్వాసి వదిలిపెట్టుటకు కోరుకొనకూడదు.  అలాగని అవిశ్వాసి విడిచి జీవించాలని కోరుకొంటే బలవంతముగా ఉండవలసిన అవసరత లేదని గ్రహించాలి.  అవిశ్వాసితోనే కలిసి జీవించమని చెప్పుట జరిగిందంటే విశ్వాసికి అసలు తన కుటుంబములోని భర్త / భార్య విశ్వాసములో ఉంటే వేరుపడు అవకాశమే లేదని గ్రహించాలి.

38.  భార్యాభర్తలు ఉండవలసిన తీరు

        ప్రియపాఠకులారా!  భార్యాభర్తలు ఏకశరీరముగా ఉంటారని దైవవాక్యము బోధించుచున్నది.  వీరు ఒకరి పట్ల ఒకరు ఏ విధముగా ఉండాలి?  ఎఫెసీ 5:25, ''పురుషులారా, మీరును మీ భార్యలను ప్రేమించుడి.''  ఆదికాండము 24:67, ''అతడు ఆమెను ప్రేమించెను,'' అని చెప్పబడియున్నది.  ఇంగ్లీషులోని కొన్ని తర్జుమాలలో ''అతడు ఆమెను కాలు క్రింద పెట్టనీయకుండ చూచుకొనెను,'' అని కూడ వ్రాయబడి యున్నది.  అంటే మంచము మీదనే ఉంచి అటు ఇటు కదలనీయకుండ చేసి చివరకు రోగిష్టిదానిని చేసెనని కాదుగాని అంతగా ప్రేమించి ఆమెకు సకల సదుపాయాలతో బాటుగా తన ప్రేమను పంచెనని గ్రహించాలి.  అలాగే భార్య కూడ తన భర్తకు విధేయులుగా ఉండాలి.  ఎఫెసీ 5:22-24, ''స్త్రీలారా, ప్రభువునకువలె మీ సొంతపురుషులకు లోబడియుండుడి.  క్రీస్తు సంఘమునకు శిరస్సై యున్నలాగున పురుషుడు భార్యకు శిరస్సై యున్నాడు.  క్రీస్తే శరీరమునకు రక్షకుడైయున్నాడు.  సంఘము క్రీస్తునకు లోబడినట్టుగా భార్యలుకూడ ప్రతి విషయములోను తమ పురుషులకు లోబడవలెను.''  ఈ విధముగా జీవించు భార్య దైవాజ్ఞను పాటించినట్లే లెక్క.  కనుక భార్య భర్త పట్ల విధేయత కలిగి యుండగా భర్త భార్య పట్ల ప్రేమను కలిగి జీవించాలి.  ఇది దేవుడు భార్యాభర్తల నుండి కోరుకొనేది.  ఎఫెసీ 5:21, ''క్రీస్తునందలి భయముతో ఒకనికొకడు లోబడియుండుడి,'' వలె మీరు ఇరువురు ఒకే స్వభావము కలిగి గౌరవముగా జీవించవలెనని కోరుచున్నాను.  ఈ విధముగా జీవించు భార్యాభర్తలు ఆదర్శమైన కుటుంబముగా అగుపిస్తారని గ్రహించాలి.

39.  వైవాహిక జీవితములో ఏకశరీరముగా జీవించువారికి కలుగు లైంగిక శోధన

        ప్రియపాఠకులారా!                భార్యభర్తల బంధము దేవుడు జతపరచిన బంధము.  ఇలాంటివారిని నరమాత్రులు విడదీయరాదని చెప్పబడింది.  ఎఫెసీ 5:31, ''ఈ హేతువు చేత పురుషుడు తన తండ్రిని తల్లిని విడిచి తన భార్యను హత్తుకొనును; వారిద్దరును ఏకశరీరమగుదురు.''  వారిద్దరు ఏకశరీరముగా ఉండాలి.  ఇదే వివాహ చట్టము.  భార్య శరీరములో లోపము ఏర్పడితే భర్త తన శరీరములో లోపము సంభవించినట్లుగా బాధపడాలి.  అలాగే భార్య కూడ భర్త విషయములో బాధను కలిగియుండాలి.  వీరు ఇరువురు వారి వారి ధర్మము అనగా సంసార బంధమును కొనసాగించాలి.  1 కొరింథీ 7:3, ''భర్త భార్యకును ఆలాగుననే భార్య భర్తకును వారి వారి ధర్మములు నడుపవలెను.''  ఇలా వారి వారి ధర్మమును కొనసాగించువారు - 1 కొరింథీ 7:4, ''భర్తకేగాని భార్యకు తన దేహముపైని అధికారము లేదు; ఆలాగున భార్యకేగాని భర్తకు తన దేహముపైని అధికారము లేదు.''  ఈ విధముగా ఒకరి శరీరముపై మరొకరికి అధికారమేగాని వారికి వారి శరీరము స్వంతము కాదు.  ఇలాంటి స్థితిలో ఏక మనస్సుతో ఐక్యముగా భార్యను భర్తను జీవించమని చెప్పుచున్నాడు.  1 కొరింథీ 7:1, ''మీరు వ్రాసినవాటివిషయము :- స్త్రీని ముట్టకుండుట పురుషునికి మేలు.''  ఇలా ఉండలేక జారత్వము కలిగియుండుట కంటే స్వంత భార్యను కలిగి ప్రతి ఒక్కరు ఉండుట మేలని గుర్తించాలి.  1 కొరింథీ 7:2, ''అయినను జారత్వములు జరుగుచున్నందున ప్రతివానికి సొంతభార్య యుండవలెను, ప్రతి స్త్రీకి సొంతభర్త యుండవలెను.''  ఇలా జీవించువారు ఖచ్చితముగా వారి వారి ధర్మము ప్రకారము జీవించాలి.  అలా వారి వారి లైంగిక ధర్మమును పాటించకపోతే వారి మధ్య సాతానుకు అవకాశము ఇచ్చినవారు అగుదురు.  ముట్టుతను కూడవద్దని స్త్రీ కడగా ఉన్నప్పుడు ఆజ్ఞగా చెప్పబడింది.  లేవీయకాండము 15:9.  ఈ దినములలో తప్ప మిగిలిన దినములలో లైంగిక ధర్మము స్త్రీ పురుషులిద్దరు ఉభయుల ఆసక్తిని బట్టి పాటించాలి.  అలా పాటించక ఏదో ఒక కుంటిసాకుతో భర్త నుండి భార్య లేక భార్య నుండి భర్త తప్పిపోయినట్లయితే, వారిని సాతాను శోధించు అవకాశము ఉన్నది.  అందుకే - 1 కొరింథీ 7:5, ''ప్రార్థనచేయుటకు మీకు సావకాశము కలుగునట్లు కొంతకాలమువరకు ఉభయులసమ్మతి చొప్పుననే తప్ప, ఒకరినొకరు ఎడబాయకుడి; మీరు మనస్సు నిలుపలేక పోయినప్పుడు సాతాను మిమ్మును శోధింపకుండునట్లు తిరిగి కలిసికొనుడి.''  వారు ఈ లైంగిక ధర్మమును విడనాడి దూరముగా ఉండు సమయము కేవలము ప్రార్థన చేయుటకు మాత్రమే అని గుర్తించాలి.  మిగిలిన సమయములో ఒకరి విషయము మరొకరు ఆలోచిస్తూ భర్తను భార్య, భార్యను భర్త ఏలాగు సంతోషపెట్టగలమో ఆలోచించుచు వారికి మనోతృప్తి కలుగునట్లుగా వారి ధర్మమును కలిగియుండాలి.  అలాకాక భర్త నుండి భార్య, భార్య నుండి భర్త కొన్ని దినములు దూరముగా ఉన్నట్లయితే, వారిలోని శారీరక కోరికలు విజృంభించినప్పుడు, సాతాను వారికి చెడు తలంపులను శోధన కలిగించును.  ఇలా జరిగినప్పుడు వారిలో జారత్వము లేక వ్యభిచారము చోటు చేసుకొనునని గ్రహించాలి.  అందుకే పౌలు మీరు మనస్సు నిలుపలేకపోయినప్పుడు అని చెప్పుచున్నాడు.  ఈ స్థితి కలిగినప్పుడు భార్యాభర్తలు శారీరక కలయిక ద్వారా శరీరమునకు తృప్తి కలిగించి జారత్వము లేక వ్యభిచారము నుండి దూరముగా జీవించుమని చెప్పుచున్నాడు.  

        మన సమాజములో చాలామంది జీవితమంటే ఒక్క లైంగిక ధర్మమేనా అనేకములు లేవా అని అడుగుచుంటారు.  నిజమే, జీవితమంటే ఒక్క లైంగిక ధర్మమే కాదు!  ఇది ఒక పౌలులాంటి బ్రహ్మచారులకు ఇలా ఉంటే మంచిదే; ఎందుకంటే 1 కొరింథీ 7:32, ''మీరు చింతలేనివారై యుండవలెనని కోరుచున్నాను.  పెండ్లికానివాడు ప్రభువును ఏలాగు సంతోషపెట్టగలనని ప్రభువు విషయమైన కార్యములను గూర్చి చింతించు చున్నాడు.''  అదే పెండ్లి చేసుకొనినవారు - 1 కొరింథీ 7:33-34, ''పెండ్లియైనవాడు భార్యను ఏలాగు సంతోషపెట్టగలనని లోకవిషయమైనవాటిని గూర్చి చింతించుచున్నాడు.  అటువలెనే పెండ్లికాని స్త్రీయు కన్యకయు తాము శరీరమందును ఆత్మయందును పవిత్రు రాండ్రయియుండుటకు ప్రభువు విషయమైన కార్యములనుగూర్చి చింతించుచుందురు గాని పెండ్లియైనది భర్తనుఏలాగు సంతోషపెట్టగలనని లోకవిషయమైనవాటిని గూర్చి చింతించుచున్నది.''  కనుక వీరు దేవుని గూర్చిన చింతన తగ్గి జీవిస్తారు కనుక పెండ్లి లేక బ్రహ్మచారులవలె ఉండుట మంచిదని చెప్పబడింది.  అలా అని పెండ్లి చేసుకొనుట తప్పు అని బైబిలు గ్రంథము చెప్పుట లేదు.  పెండ్లి చేసుకొని ఒక స్త్రీతో / ఒక పురుషునితో జారత్వము లేకుండ జీవించమని అలా జీవించుట పవిత్రమైనదేనని చెప్పబడింది.  అంటే భార్యాభర్తలు లైంగిక కలయికలో తప్పు లేదు.  అది పవిత్రమైనదే.  కాని పెండ్లి చేసుకొని వ్యభిచరించువారు పాపాత్ములు.  అలా చెప్పానని పెండ్లి కాకుండానే వ్యభిచరించువారు కూడ పాపులే అని గ్రహించాలి.  ఇలాంటి స్థితిలోనివారు వారి వారి ధర్మమును పాటించక అనగా ఒక పెండ్లి అయిన స్త్రీ తన భర్తను లైంగిక ధర్మము చొప్పున దగ్గరకు రానీయక రోజుల తరబడి దూరపరచినప్పుడు, అతడు తన మనస్సును నిలుపుకొనలేనప్పుడు, సాతాను అతనిని దిగజార్చుటకు శోధనగా మరో స్త్రీచే ప్రేరేపించి వానిని వ్యభిచారుడుగా చేయుటకు అవకాశము ఉన్నది.  అలాగే స్త్రీ విషయములో జరగవచ్చును.  

        కాని పెండ్లి చేసుకొనక ముందు లైంగిక ధర్మము ఎరుగని స్థితిలో ఉంటారు.  వీరు కొంత మనస్సు కంట్రోలు చేసుకొని వేరే విషయములపై శ్రద్ధ వహించుటకు అవకాశము ఉంటుంది.  కాని పెండ్లి చేసుకొన్నవారు వారు లైంగిక ధర్మమును అనుభవించుట చేత వారి శరీరములు పదేపదే ఆ అనుభవమును కోరుకొనును కనుక సులభముగా వ్యభిచారులుగా మారు అవకాశము కలదు.  ఇది గమనించుకొని భార్యాభర్తలు ఇరువురు వారి వారి లైంగిక ధర్మమును విడనాడక ఒకరి యెడల ఒకరు ప్రేమ కలిగి జీవించాలి.  

        ఉదా :-  పెండ్లి కాని స్త్రీ తాను పురుషునితో కలసినప్పుడు గర్భము వచ్చు అవకాశము ఉన్నదని తెలియును.  అలాగే పెండ్లి కాకనే పురుషునితో కలయుట పాపమని కూడ ప్రతి స్త్రీకి తెలుసు.  అందువల్ల తన ప్రియునితో తిరుగునప్పుడు ఆ పాపము చేయకూడదనే అనుకొనును కాని వారి వారి లైంగిక ప్రేరణలు అదుపు తప్పి కలిగినప్పుడు పౌలు చెప్పిన విధముగా వారు మనస్సును నిలుపలేక తప్పు ఒక్కసారే కదా ఇక చేయమని అనుకొనుచూ తప్పు చేయు అవకాశము కలుగును.  ఒకసారి తప్పు చేసిన తరువాత వారికి బాధ కలుగును.  అటుతరువాత కొద్దికాలములోనే మరల అదే తప్పు చేయుచూ ఒకరిని విడిచి ఇంకొకరు ఉండలేని స్థితి కలిగించుకొందురు.  ఇట్టి పరిస్థితులలో పెండ్లి కానివారు కావచ్చును అయినవారు కావచ్చును.  చివరకు ఈ స్త్రీ గర్భవతి కూడ అవుటకు అవకాశము ఉన్నది.  ఏమి వీరు మనస్సును ఎందుచేత కంట్రోలు చేయలేకపోయారు.  దీనికి కారణము సాతాను వారిని శోధనకు గురిచేసి వారిచే తప్పు చేయించి దేవుని ఆజ్ఞకు వారిని దూరస్థులను చేసి వారిని సమూలముగా దేవుని నుండి దూరపరచాలని వాని తలంపు.  కనుక ఈ పతనము చెందిన దేవుని దూత ఆలోచనను గ్రహించి భార్య తన భర్తను శోధనకు గురి కానీయకుండ చేయు బాధ్యత ఆమెకు ఉంది.  ఆమె తన భర్తను తృప్తి పొందునట్లుగా తాను లైంగిక ధర్మమును జరిపించాలి.  అలాగే భర్త కూడ తన భార్యను సాతాను శోధనకు గురి కాకుండునట్లుగా లైంగిక ధర్మమును జరపాలి.  ఇలా ఒకరి యెడల ఒకరు జీవిస్తున్నట్లయితే సాతాను శోధనకు వీరు గురి అవవలసిన అవసరత ఏర్పడదు.  ఈ విధముగా సాతాను నుండి వచ్చు లైంగికపరమైన శోధనను ఒకరికి ఒకరు తోడై జయించవచ్చునని మనము గ్రహించాలి.  లేని యెడల సాతాను శోధనకు గురై ఇద్దరిలో ఒకరు పతనమైన వారి కుటుంబము పవిత్ర కుటుంబముగా ఇక ఎప్పటికి ఉండజాలదు.  నుక భర్త కోరికను భార్య / భార్య కోరికను భర్త ఎంత విధి లేని స్థితిలో కూడ మన్నించి వారివారి ధర్మమును కొనసాగించి ఒకరిని ఒకరు సాతాను శోధన నుండి రక్షించుకోవాలని గ్రహించాలి.

40.  స్త్రీ - తన భర్తపై వాంఛ

        ప్రియపాఠకులారా!  స్త్రీకి పురుషునిపై కామవాంఛ ఎందుకు కలుగుచున్నది?  ఒక స్త్రీ పురుషుని కలయికతో మరో శిశువుకు జన్మ నిచ్చుచున్నది.  ఈ సందర్భములో ఆమె అనుభవించు బాధ వర్ణనాతీతము.  దీనినే ప్రసవవేదన అని చెప్పబడింది.  కన్యగా ఉన్న స్త్రీ తన వివాహానంతరము తన భర్తతో కలసి ఒక శిశువుకు జన్మనిస్తుంది.  అప్పుడు అనుభవించు బాధకు ఎవరికైన ఇక ఈ బాధ నేను పడలేనని అనిపిస్తుంది.  కాని మరి కొద్ది రోజులలో మరల పురుషుని కలయిక ద్వారా మరల మరో శిశువుకు జన్మకు సిద్ధమగుట మన దైనందిత జీవితములో చూస్తున్నాము.  ఇదే వాంఛ అని ఇది దేవుని శాపము మూలముగా కలిగినదని చెప్పబడింది.  ఆదికాండము 3:16, ''ఆయన స్త్రీతో నీ ప్రయాసమును నీ గర్భవేదనను నేను మిక్కిలి హెచ్చించెదను; వేదనతో పిల్లలను కందువు; నీ భర్తయెడల నీకు వాంఛ కలుగును; అతడు నిన్ను ఏలునని చెప్పెను.''  అంటే శిశువు పుట్టుట శాపము కాదు.  మొదటి శిశువు పుట్టుట వలన కలిగిన బాధను స్త్రీ తనలోని పురుషునిపై కలిగిన వాంఛ వలన మరల గర్భము ధరించుట జరుగును.  లేని పక్షమున స్త్రీ తన పురుషునితో కలయక పోయిన మరో శిశువు ఎలాగున జన్మించును?  కనుక దేవుడు ప్రసవవేదన ఎక్కువ చేసినను స్త్రీలో పురుషునిపై వాంఛ అను కోరికను పెంచి శిశువు జన్మకు మార్గము సరాళము చేయుట జరిగింది.  కనుక పురుషులు తమ భార్యలను అశ్రద్ధ చేసి వారికి దూరముగా జీవించుట చేయకూడదు.  ఎందుకంటే స్త్రీకి కూడ పురుషునిపై వాంఛ ఉంటుంది.  దీనివలన ఆమె కోరికను తన పురుషుని వలన తీర్చుకొనవలెనని కోరుకొంటుంది.  ఇది లభించనప్పుడు లేక భర్త ఆమెను అశ్రద్ధ చేసినప్పుడు (ఏ కారణము చేతనైనను) ఆమె తన వాంఛ వలన సాతాను ప్రేరణతో తప్పు చేయు అవకాశమును మనము ఇచ్చినవారము అగుదుమని గ్రహించాలి.  ఇక్కడ మనము ఒక విషయము గుర్తించాలి మన వాక్యములో స్త్రీకి కలుగు వాంఛ లేక కోరిక కేవలము తన భర్త పైనేగాని వేరే వారిపై కాదు.  భర్తపై కలుగు వాంఛ లేక కోరిక న్యాయ సమ్మతమైనదేగాని పాపము కాదు.  అదే వాంఛ పరపురుషునిపై కలిగిన అది వ్యభిచారమనబడును అది పాపము.  కనుక ఈ వాంఛ దేవుడు ఇచ్చిన శాపముగా కలిగినను పాపము లేని శాపమును దేవుడు ఇచ్చినట్లుగా గ్రహించాలి.

41.  స్త్రీ - జన్మనిచ్చుట

        ప్రియపాఠకులారా!  ఈ సృష్టిలో స్త్రీ మరో శిశువుకు జన్మనిచ్చుట మనకు తెలిసిన నిజము.  అయితే ఈ జన్మ నిచ్చుటకు గల కారణము ఇప్పుడు తెలుసుకొందము.  ఆదికాండము 1:27-28, ''దేవుడు తన స్వరూపమందు నరుని సృజించెను; దేవుని స్వరూపమందు వాని సృజించెను; స్త్రీనిగాను పురుషునిగాను వారిని సృజించెను.  దేవుడు వారిని ఆశీర్వదించెను; ఎట్లనగా-మీరు ఫలించి అభివృద్ధిపొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోపరచుకొనుడి; సముద్రపు చేపలను ఆకాశ పక్షులను భూమిమీద ప్రాకు ప్రతి జీవిని ఏలుడని దేవుడు వారితో చెప్పెను.''  ఈ విధముగా ఈ లోకములో రూపొందించిన ఆదాము హవ్వలను దేవుడు దీవించాడు.  ఈ దీవెన వలన స్త్రీ పురుషులు ఇరువురు మరో శిశువు జన్మకు కారణమగుచున్నారు.  పురుషుని మూలముగా మరో శిశువుకు జన్మనిచ్చు యోగ్యత స్త్రీ పొందియున్నది.  ఈ యోగ్యత తన పుట్టుకతోనే దానిని పొందినను, తాను చేసిన పాపము మూలముగా ప్రసవవేదన వంటి బాధను అనుభవించు శిక్షను పొందినది.  ఆదికాండము 3:13, 16, ''అప్పుడు దేవుడైన యెహోవా స్త్రీతో-నీవు చేసినది యేమిటని అడుగగా స్త్రీ-సర్పము నన్ను మోసపుచ్చినందున తింటిననెను.  . . .  ఆయన స్త్రీతో నీ ప్రయాసమును నీ గర్భవేదనను నేను మిక్కిలి హెచ్చించెదను; వేదనతో పిల్లలను కందువు; నీ భర్తయెడల నీకు వాంఛ కలుగును; అతడు నిన్ను ఏలునని చెప్పెను.''  ప్రసవవేదనను ఎక్కువ చేయుదును.'' దేవుడు తినవద్దన్న పండును తిని హవ్వ పాపము చేసిన కారణము చేత నొప్పులు లేని ప్రసవము పొందవలసిన తను ప్రసవవేదన అధికముగా పొందుటకు కారణమైంది.  ఎంత బాధ ఉన్నను స్త్రీ మరో శిశువుకు జన్మ నిచ్చుట, తొమ్మిది నెలలు ఆ శిశువును తన గర్భమునందు మోస్తూ జీవించుట స్త్రీ పొందిన గొప్ప అదృష్టముగా గుర్తించాలి.  యోహాను 16:21  ఒకవేళ పాపము హవ్వ చేయకుంటే ఈనాడు ప్రసవవేదనతో కూడిన శిశు జన్మము ఉండేది కాదేమో!  ఓ స్త్రీ!  ఒకసారి ఆలోచించు.

42.  ప్రసిద్ధులైన పురాతన వీరులకు జన్మనిచ్చిన నరుల కుమార్తెలు

        ప్రియపాఠకులారా!  ఇందులో స్త్రీని గూర్చి చెప్పుచూ నరుల కుమార్తెలుగా వర్ణించుట జరిగింది.  ఆదికాండము 6:4, ''ఆ దినములలో నెఫీలులను వారు భూమి మీదనుండిరి; తరువాతను ఉండిరి.  దేవుని కుమారులు నరుల కుమార్తెలతో పోయినప్పుడు వారికి పిల్లలను కనిరి.  పూర్వకాలమందు పేరు పొందిన శూరులు వీరే.''  ఇందునుబట్టి దేవుని జనాంగముగా ఉన్న స్త్రీలు వేరు.  అయనకు దూరముగా జీవిస్తూ జీవిస్తున్న స్త్రీలు వేరు.  ఆదికాండములో ఆదాము సంతతిని దైవజనాంగముగాను కయీను సంతతి లేక నిజదైవమును విడనాడిన సంతతిని నరుల జనాంగముగాను లెక్కకు తీసుకొనబడినవి.  కనుక ఈ జనాంగము దేవునిలో ఉన్న ప్రతి ఒక్కరిని వారు పురుషులైనను స్త్రీలయినను వారు దేవుని కుమారులుగా పిలువబడినారు.  పాపపు స్థితిలో నిజదైవమునకు దూరముగా జీవించువారిని నరుల కుమార్తెలుగా పిలువబడుట మనము గమనించాలి.  ఒకవైపు సరియైన మార్గము మరో వైపు పాపపు మార్గము.  ఈ రెండు దారులు వేరు వేరు.  ఒకటి పరలోక మార్గమైతే, రెండవది పాతాళ లోకమునకు మార్గము.  రెండు దారులు వేరైనను వారి మధ్య ఒక మార్గము ఏర్పడింది.  అదే వివాహమన్న కార్యముతో దేవుని పుత్రులుగా ఉన్న స్త్రీ పురుషులలో వారికి నచ్చినవారిని దారి తప్పినవారిలో అనగా దేవుని మరచిన కయీను సంతతిలోని స్త్రీలను చేసుకొనుట జరిగింది.  ఈ విధముగా జరుగుట వలన మహాకాయులు పురాతన కాలములోని ప్రసిద్ధులు వీరులుగా జన్మించారు అని తెలియజేయబడింది.  ఇలా పుట్టిన వీరు కూడ ప్రసిద్ధులైనారని బైబిలు గ్రంథము పక్షపాతము లేకుండ వ్రాయుట జరిగింది.  దీనికి కారణము నిజదైవములో ఉన్నవారిని మూడు తరముల వరకు దీవిస్తానని దైవవాక్యము తెలియజేస్తుంది.  నిర్గమకాండము 20:5-6, ద్వితీయోపదేశకాండము 8:9-10  ఈ దీవెన వారికి ఫలింపుగా మారి వారు పాపపు స్థితిలో జీవించువారితో సంబంధము ఏర్పరచుకొన్నను దేవుని మాట జరిగి తీరును గనుక వారి సంతానమును కూడ దేవుడు మూడు తరముల వరకు శిక్షించకుండ వారి స్థితిని కాపాడుచూ వస్తున్నారు.  అలాగే ఈనాడు క్రైస్తవులు అన్యులలోని వారితో వివాహము ద్వారా సంబంధము ఏర్పరచుకొని తిరిగి సంతానమును పొందినను వారిని విడనాడనని వారిని కూడ ఆశీర్వదించునని చెప్పబడింది.  1 కొరింథీ 7:14  కాని ఎంత కాలము మూడు తరముల వరకు.  ఈ లోగా నిజదైవమును తెలుసుకొని దేవునిలోని దేవునిలోకి మారినా వారు రక్షణ పొందుట జరుగును.  లేని యెడల దేవుని వరం వారి నుండి తొలగిపోవును గనుక ఇక వారు నరుల కుమార్తెలుగా పిలువబడుచు విడవబడినవారుగా ఉందురు.  ఆత్మ పురుష స్వరూపి.  అది తండ్రియైన దేవుని నుండి వచ్చింది కనుక ఎవరైతే పాపము చేయక జీవిస్తారో వారందరు దేవుని కుమారులుగా పిలువబడుచున్నారు.  పాపములో తగులుకొని సాతాను చెరను అనుభవించువారు నిజదైవమునకు దూరముగా ఉన్నవారు కనుక వీరు నరుల కుమార్తెలే.  వీరి సంతానము దైవకృప దేవుని కుమారుల వలన వచ్చినను మూడు తరముల వరకు వీరిని విడనాడక ఆ తదుపరి వారి స్థితిని బట్టి వారు నిజదైవమును విడనాడి జీవించినవారిని విడచునని గ్రహించాలి.

43.  ప్రసవ వేదన - శుద్ధీకరణ ఆచారము

        ప్రియపాఠకులారా!  ఆదిలో ఆదాము హవ్వలు పాపము చేయగా దేవుడు శపించివారిలో ఆదాము యొక్క సాటి సహాయియైన హవ్వ ఒకటి.  ఈ హవ్వ నరజాతి కంతటికి తల్లి లేక మొదటి స్త్రీ.  ఈ స్త్రీ ద్వారా పాపము జరుగగా ప్రసవవేదన అను శాపమును పొందినట్లుగా చదువగలము.  ఆదికాండము 3:16, ''ఆయన స్త్రీతో నీ ప్రయాసమును నీ గర్భవేదనను నేను మిక్కిలి హెచ్చించెదను; వేదనతో పిల్లలను కందువు; నీ భర్తయెడల నీకు వాంఛ కలుగును; అతడు నిన్ను ఏలునని చెప్పెను.''  ఈ విధముగా ఈనాడు ప్రసవవేదనతో బిడ్డను కంటున్న సంగతి మనకు తెలిసిన విషయమే.  ఇది దైవశాపము.  ఈనాటి స్త్రీలు సైతము దానిని నెరవేర్చుచున్నట్లుగా మనము గ్రహించాలి.  భార్యభర్తలుగా జతపరచబడిన తరువాత వారు ఇరువురు ఏకమై ఇంకొక బిడ్డకు జన్మనిచ్చుట జరుగును.  ఇలా జన్మనిచ్చుట దేవుని ఆశీర్వాదము.  ఇదే పాత నిబంధన నాటి స్త్రీల నమ్మకము కూడ.  ఆదికాండము 1:27-28, ''దేవుడు తన స్వరూపమందు నరుని సృజించెను; దేవుని స్వరూపమందు వాని సృజించెను; స్త్రీనిగాను పురుషునిగాను వారిని సృజించెను.  దేవుడు వారిని ఆశీర్వదించెను; ఎట్లనగా-మీరు ఫలించి అభివృద్ధిపొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోపరచుకొనుడి; సముద్రపు చేపలను ఆకాశ పక్షులను భూమిమీద ప్రాకు ప్రతి జీవిని ఏలుడని దేవుడు వారితో చెప్పెను.''  ఇందులో బిడ్డలను కనుట దేవుని దీవెన అని వ్రాయబడి యున్నది.  దేవుని దీవెన ద్వారా ప్రతి స్త్రీ బిడ్డలను కంటున్నది.  అందుకే ఆదికాండము 4:1, ''ఆదాము తన భార్యయైన హవ్వను కూడినప్పుడు ఆమె గర్బవతియై కయీనును కని-యెహోవా దయవలన నేనొక మనుష్యుని సంపాదించుకొన్నాననెను.''  ఆదికాండము 25:33, ''యాకోబు-నేడు నాతో ప్రమాణము చేయుమనెను.  అతడు యాకోబుతో ప్రమాణము చేసి అతనికి జ్యేష్ఠత్వమును అమ్మివేయగా''  ఇలా అనేక సందర్భాలను మనము గమనింపవచ్చును.  ఇంత దీవెనకరమైన స్థితి బిడ్డ రూపములో స్త్రీ తన గర్భమునందు మోయుట ఎంత ఉన్నతమైన స్థితి.  ఈ స్థితిని ఒక్క స్త్రీకి మాత్రమే దేవుడు ఇచ్చాడు.  అందుకే పాత రోజులలో మా తాతలు ఎంతమందిని కంటే అంత గొప్పగా దేవుడు ఆశీర్వదించెనని చెప్పుకొనేవారు.  ఇలా శిశువు జన్మించుట దేవుని దీవెన అయితే శిశువు పుట్టినప్పుడు స్త్రీకి ప్రసవవేదన కలుగును.  ఇది దైవశాపము వలన వచ్చింది.  కనుక భార్యాభర్తలుగా జతపరచుట ఘనమైనది.  వారిద్దరి పాన్పు నిష్కల్మషమైతే గర్భములో ఏర్పడిన శిశువు దేవుని దీవెనే.  ఇంతవరకు బాగానే ఉన్నది.  అంతా పవిత్రమే కాని హవ్వ చేసిన పాపము వలన వచ్చిన శాపము శిశువు జన్మించు దినమున శిశువుకు జన్మనిచ్చు స్త్రీని బహుగా బాధించి దేవుని శాపమును నెరవేర్చినవారిగా మారుస్తుంది.  ఈ విధముగా దైవశాపమును తాము తమ శరీరములో శిశువు జన్మించు సందర్భములో అనుభవించుట వలన ఆ శరీరము ఆ శాప ప్రభావమునకు లోనై అశుద్ధిగా మారుచున్నది కనుక మోషే శుద్ధీకరణ ఆచారమును ఏర్పరచుట జరిగింది.  లేవీయకాండము 12:1-8, ''మరియు యెహోవా మోషేకు ఈలాగు సెలవిచ్చెను.  -నీవు ఇశ్రాయేలీయులతో ఇట్లనుము-ఒక స్త్రీ గర్భవతియై మగపిల్లను కనినయెడల ఆమెయేడు దినములు పురిటాలై యుండవలెను.  ఆమె తాను ముట్టుదై కడగానుండు దినముల లెక్కనుబట్టి పురిటాలై యుండవలెను.  ఎనిమిదవ దినమున బిడ్డకు సున్నతి చేయింపవలెను.  ఆమె తన రక్తశుద్ధికొరకు ముప్పదిమూడు దినములుండి తన రక్తశుద్ధి దినములు సంపూర్ణమగువరకు ఆమె పరిశుద్ధమైన దేనినైనను ముట్టకూడదు, పరిశుద్ధ స్థలములో ప్రవేశింపకూడదు.  ఆమె ఆడుపిల్లను కనిన యెడల ఆమె తాను కడగా ఉండునప్పటివలె రెండు వారములు పురిటాలై ఉండవలెను.  ఆమె తన రక్తశుద్ధి కొరకు అరువదియారు దినములు కడగా ఉండవలెను.  కుమారునికొరకేగాని కుమార్తెకొరకేగాని ఆమె శుద్ధిదినములు సంపూర్తియైన తరువాత ఆమె దహనబలిగా ఒకయేడాది గొఱ్ఱెపిల్లను, పాపపరిహారార్థబలిగా ఒక పావురపు పిల్లనైనను తెల్లగువ్వనైనను ప్రత్యక్షపు గుడారము యొక్క ద్వారమునకు యాజకునియొద్దకు తీసికొనిరావలెను.  అతడు యెహోవా సన్నిధిని దాని నర్పించి ఆమె నిమిత్తము ప్రాయశ్చిత్తముచేయగా ఆమె రక్తస్రావ విషయమై ఆమె పవిత్రపరచబడును.  ఇది మగపిల్లనుగాని ఆడు పిల్లనుగాని కనిన స్త్రీనిగూర్చిన విధి.  ఆమె గొఱ్ఱెపిల్లను తేజాలని యెడల ఆమె రెండు తెల్ల గువ్వలనైనను రెండు పావురపు పిల్లలనైనను దహనబలిగా ఒకదానిని, పాపపరిహారార్థబలిగా ఒకదానిని తీసికొని రావలెను.  యాజకుడు ఆమె నిమిత్తము ప్రాయశ్చిత్తముచేయగా ఆమెకు పవిత్రత కలుగును.''  మగ బిడ్డకైతే ఏడు దినములు పిరుటాలై యుండవలెను.  ఆడ బిడ్డకైతే ఏడు + ఏడు = 14 దినములు, మగ బిడ్డకైతే రక్త శుద్ధి దినములు 33.  అదే ఆడ బిడ్డకైతే 33 + 33 = 66 దినములు.  ఇదెక్కడి న్యాయము?  పురుషుని నుండి తీయబడిన స్త్రీ - ఆ పురుషునికి దైవనిషేధఫలములు తినిపించి పాప ప్రవేశానికి మూలకారకురాలు స్త్రీయైనందున ఆమె ఆడబిడ్డ విషయములో రెట్టింపు దినములు వరకు పరిశుద్ధ స్థలములోకి ప్రవేశాన్ని నిషేధించడం జరిగింది.  ఇందులో శుద్ధిని కోల్పోయినదని ఆ విధముగా పవిత్రత పొందవచ్చునని చెప్పబడింది.  అట్లే క్రీస్తు ప్రభువు విషయములోను జరిగింది.  లూకా 2:21-24, ''ఆ శిశువునకు సున్నతి చేయవలసిన యెనిమిదవ దినము వచ్చినప్పుడు, గర్భమందాయన పడకమునుపు దేవదూతచేత పెట్టబడిన యేసు అను పేరు వారు ఆయనకు పెట్టిరి.  మోషే ధర్మశాస్త్రముచొప్పున వారు తమ్మును శుద్ధి చేసికొను దినములు గడచినప్పుడు -ప్రతి తొలిచూలు మగపిల్ల ప్రభువుకు ప్రతిష్ఠ చేయబడవలెను.''  కనుక 40 రోజుల తరువాత వీరు శుద్ధీకరణ ఆచారము ప్రకారము నెరవేర్చారు.  ఇది దేవునికి ప్రతిష్టింపబడదు.  కనుక ఈనాడు కూడ శిశుజననము తరువాత మగ సంతానమైతే 7, 40 ఆడ సంతానమైతే 14, 70వ రోజు చర్చీకి తీసుకొని వెళ్లి కానుకలను సమర్పించి శుద్ధీకరణ చేసుకొనుట మంచిది.  7వ / 14వ రోజు మగ / ఆడ సంతానము పొందిన స్త్రీ ఇంటిలో అందరివలె తిరుగును.  అంతవరకు విశ్రాంతిని పొందును.  అటుతరువాత 40 / 70 రోజలు తన మగ / ఆడ శిశువును దేవాలయములో సమర్పించి కానుకలను ఇచ్చి ప్రతిష్ఠ కార్యము జరిగించుట మంచిది.

44.  తల్లి పాలు

        ప్రియపాఠకులారా!  తల్లి శరీరము ద్వారా వచ్చు ఈ పాలు బిడ్డకు ఎంతో శ్రేష్ఠమైనదని మనందరికి తెలిసిన విషయమే.  పుట్టిన బిడ్డకు సుమారు నాలుగు నుండి ఐదు నెలల వరకు ఈ పాలే ఆహారము.  ఈ పాలను సంవత్సరము పాటు త్రాగు పిల్లలు ఉన్నారు.  నాలుగు నుండి ఐదు సంవత్సరాల వరకు త్రాగువారిని నా జీవితములో చూచాను.  ఏది ఏమైనప్పటికి తల్లి పాలు బిడ్డకు ఆహారము.  ఆ బిడ్డ ఆ పాలు త్రాగి జీవించును కనుక దేవుడు బిడ్డ పుట్టు దినము మొదలు ఈ పాలు ఉత్పత్తి అగునట్లుగా ఈ స్త్రీ శరీరమును సిద్ధపరచినట్లుగా గ్రహించాలి.  ఒక్కసారి మనము ఆలోచిస్తే-ప్రసవ దినము వరకు స్త్రీ రొమ్ములయందు పాలు రావు.  కాని ప్రసవించిన కొన్ని నిమిషములలోనే పాలు ఆ రొమ్ములలో ఏర్పడును.  ఈ పాలు త్రాగిన శిశువు ఈ లోకములో మనుగడ సాగించును.  అయితే మంచివారిని గూర్చి వారికి పాలిచ్చి పెంచిన స్త్రీని పొగుడుదురని గ్రహించాలి.  లూకా 11:27 తన పొరుగువారు తన బిడ్డ మంచితనమును గూర్చియు జ్ఞానమును గూర్చియు పొగడునప్పుడు తల్లి సంతోషమునకు మితి యుండదు.   అట్లుగాక ఆ స్త్రీ కన్న బిడ్డ లూకా 23:29లో చెప్పబడినట్లు దుష్టుడు దుర్మార్గుడు లోకకంటకుడైనప్పుడు లేదా త్రాగుబోతై దుర్దశలో ఉన్నప్పుడు ఇటువంటి బిడ్డను కనకుండ గొడ్రాలిగా ఉంటే నాకెంతో సంతోషమని భావించును.  అనేకమంది పిల్లలను కనిన తల్లి అష్టకష్టాలతో జరుగుబాటు లేక దరిద్ర స్థితిలో వేదనపడునప్పుడు పిల్లలు లేని గొడ్రాలు పిల్లలు కనిన స్త్రీ పడే కష్టాలు నాకు లేకుండ గొడ్రాలిగా చేయడం నాకెంతో ఆనందముగా భావించును.  యెషయా 54:1.  ఈ విధముగా క్రీస్తు ప్రభువు విషయములో ఆయనకు పాలిచ్చి పెంచిన మరియమ్మ చాలా ధన్యమైన స్త్రీగా చెప్పబడింది.  ఆ మాట అనువారే నీచునిగా ఉన్నవారి విషయములో ఈ నీచునికి పాలిచ్చి పెంచిన స్త్రీని దుర్మార్గురాలిగా వర్ణించుట జరుగును.  కనుక నిన్ను నవమాసములు మోసి కని తన పాలతో పెంచిన స్త్రీని ఏ స్థితిలో ఈ లోకములో ఉంచుట నీ చేతిలో ఉన్నది కనుక దేవునికి ప్రీతికరముగా జీవించుచు పెద్దల మన్నన పొందవలెనని కోరుచున్నాను.  అయితే అబ్రాహాముకు వారసుడుగా ఇస్సాకు శారా నుండి జన్మించుట జరిగింది.  శారా తన ముసలి వయస్సు నందు కూడ సిగ్గుపడక ఇస్సాకును తన పాలతో పోషించినట్లుగా వ్రాయబడియున్నది.  ఆదికాండము 21:8, ''ఆ పిల్లవాడు పెరిగి పాలు విడిచెను.  ఇస్సాకు పాలు విడిచిన దినమందు అబ్రాహాము గొప్ప విందు చేసెను.''  అయితే ఇస్సాకు తల్లి పాలు ఎప్పుడైతే వదిలి ఈ లోక ఆహారముతో జీవితమును కొనసాగించాడో ఆ రోజు అబ్రాహాము గొప్ప విందును చేసి ఆనందించెనని వ్రాయబడింది.  మన జీవితములో తల్లిదండ్రులుగా ఇందుకు ఆనందించదగిన దినము.  ఇంతటితో తల్లి పాలు రొమ్ములలో ఇంకి ఇకపై రావు.

45.  పసిపిల్లలు

        ప్రియపాఠకులారా!  పసిపిల్లలు అంటే పాలు త్రాగువారు.  వీరికి సరియైన జ్ఞానము ఉండదని చెప్పబడింది.  హెబ్రీ 5:13, ''మరియు పాలు త్రాగు ప్రతివాడును శిశువేగనుక నీతి వాక్యవిషయములో అనుభవములేనివాడైయున్నాడు.''  కనుక ఇలాంటి వీరు వయస్సు పెరిగిన కొలది అభ్యసించుచు జ్ఞానమునందు మంచి చెడును వివేచించు జ్ఞానమును పొందుదురు.  హెబ్రీ 5:14, ''వయస్సు వచ్చిన వారు అభ్యాసముచేత మేలు కీడులను వివేచించుటకు సాధకముచేయబడిన జ్ఞానేంద్రియములు కలిగియున్నారు గనుక బలమైన ఆహారము వారికే తగును.''  ఇందునుబట్టి పసిపిల్లలు చేయుదానికి శిక్ష ఉండదు.  అనుభవరాహిత్యము వలన వీరు మంచి చెడు అను వివేచింపగల జ్ఞానమును అభ్యసించవలసియున్నది.  వారికి ఏమి ఎరుగని స్థితిలో వీరు ఉంటారు.  పసిపిల్లలు మంచి చెడు జ్ఞానము పొందువరకు బహు జాగ్రత్తగా పెంచవలసిన బాధ్యత తల్లిదండ్రులది.  ఈ స్థితిలో పసిపిల్లలను గూర్చి సామెతలలో సొలొమోను కూడ బాలుడుగ ఉన్నప్పుడు బహు జాగ్రత్తగా పెంచాలని చెప్పుట జరిగింది.  సామెతలు 6:23.

        తల్లిదండ్రులు చేయు దోషములను బట్టి వారిపై దేవుని కోపాగ్ని రగుల్కొన్నప్పుడు  వారి పాపమును బట్టి పిల్లలు నిర్దోషులైనను దిక్కులేనివారగుటయే - పెద్దలు చేసిన పాపములకు వారి పిల్లలు కూడ మొత్తబడుదురు.  నిర్గమకాండము 22:24, 2 దినవృత్తాంతములు 21:14 ఇందునుగూర్చి వివరిస్తున్నది.  పరలోక రాజ్యములో నరుడు ప్రవేశించాలంటే కల్లాకపటము కుత్సితము వగైరాలు లేనట్టి చిన్నపిల్లల వలె తమను తాము తగ్గించుకోవాలని, దిక్కులేని పిల్లలను చేరదీయాలని అట్టివారు ప్రభువును చేర్చుకొన్నవాడగును.  చిన్న పిల్లలను పాడు చేయువాడు మెడకు తిరుగటి రాయి కట్టుకొని లోతైన సముద్రములో దూకినవానితో సమానమని ప్రభువు మత్తయి 18:1-6లో హెచ్చరిస్తున్నాడు.  ప్రభువు తన శిష్యులను కొన్ని సందర్బాలలో పిల్లలారా!  అని సంబోధిస్తున్నాడు.  యోహాను 13:33-34 పిల్లలారా!  నేనెక్కడికి వెళ్లుచున్నానో మీరు రాలేరని, మీరు ఒకరినొకరు ప్రేమించి సహోదర ప్రేమ నిలువరముగ ఉంచినప్పుడు నిజముగా ప్రభువు శిష్యులై తండ్రి సన్నిధికి రాగలరని ఆయన మరియొక సందర్భములో మార్కు 10:24 పిల్లలారా!  ఆస్తిపరులు పరలోక రాజ్యములో ప్రవేశింపజాలరని ప్రభువు పునరుత్థానమైనప్పుడు యోహాను 21:5 తన శిష్యులను చూచి పిల్లలారా!  భోజనమునకు ఏమైన ఉన్నదా!  అని శిష్యులను ప్రశ్నిస్తున్నాడు.  అయితే యేసుక్రీస్తు దివ్యనామమున విశ్వాసముంచిన ప్రతి యొక్కడు దేవుని పిల్లలని యోహాను 1:12 వివరిస్తున్నది.  నమ్మి బాప్తిస్మము పొంది ప్రభువు యొక్క జ్ఞానములో ఎదుగనివారు కూడ పిల్లలే యనియు 1 కొరింథీ 3:1-3 వివరిస్తున్నది.

46.  తల్లిదండ్రులు - పిల్లలు

        ప్రియపాఠకులారా!  ప్రతి కుటుంబము పిల్లలు ఉన్నప్పుడే పరిపూర్ణత కలిగి యుండును.  అయితే తల్లిదండ్రులు పిల్లలు కలసి ఒకే కుటుంబముగా జీవించాలి అంటే వారు కొన్ని నియమములకు లోబడి యుండాలి.  లూకా 2:51, ''అంతట ఆయన వారితో కూడ బయలుదేరి నజరేతునకు వచ్చి వారికి లోబడి యుండెను.  ఆయన తల్లి ఈ సంగతులన్నిటిని తన హృదయములో భద్రము చేసికొనెను.''  ఈ విధముగా మనము ఆరాధించు క్రీస్తు ప్రభువు కూడ తన తల్లియైన మరియమ్మకు తనను సాకుచున్న యోసేపుకు విధేయుడుగా జీవిస్తున్నాడు.  అలాగే కుటుంబములోని ప్రతి పిల్ల లేక పిల్లవాడు ఖచ్చితముగా విధేయతను వారి తల్లిదండ్రుల పట్ల కలిగియుండాలి.  ఎఫెసీ 6:1-3, ''పిల్లలారా, ప్రభువునందు మీ తల్లిదండ్రులకు విధేయులైయుండుడి; ఇది ధర్మమే.  నీకు మేలు కలుగునట్లు నీ తండ్రిని తల్లిని సన్మానింపుము, అప్పుడు నీవు భూమిమీద దీర్ఘాయుష్మంతుడవగుదువు.  ఇది వాగ్దానముతో కూడిన ఆజ్ఞలలో మొదటిది.''  ఇలా తల్లిదండ్రులకు విధేయులుగా ఉంటూ వారిని గౌరవముతో చూడాలి.  ఇది పిల్లలుగా వారి బాధ్యత.

        ఇక తల్లిదండ్రులు చీటికి మాటికి పిల్లలను విసిగించకూడదు.  అలా అని వారిని వారి ఇష్టానికి వదిలివేయకూడదు.  వారిని క్రమశిక్షణతోనే పెంచాలి.  అలాగే వారికి క్రీస్తు ప్రభువుని గూర్చి బోధించుచు ఆ బోధకు అనుగుణముగా వారిని పెంచవలసి యున్నది.  ఎఫెసీ 6:4, ''తండ్రులారా, మీ పిల్లలకు కోపము రేపక ప్రభువుయొక్క శిక్షలోను బోధలోను వారిని పెంచుడి.''  ఈ విధముగా తల్లిదండ్రులు పిల్లలు మెలగాలని గుర్తించాలి.

        రోమా 9:8 శరీర సంబంధమైన పిల్లలు దేవుని పిల్లలు కారు.  దేవుని వాగ్దాన సంబంధమైన అనగా దేవుని వాక్కులను పాటించే పిల్లలే దేవుని సంతానమనబడును.  కనుక చిన్నతనము నుండి దేవుని వాక్కులను ఉపదేశిస్తూ చిన్న పిల్లలను తీర్చిదిద్దవలసిన బాధ్యత తల్లిదండ్రుల మీద నున్నది.  తల్లిదండ్రుల హితోపదేశాల వలన రోమా 8:20 సృష్టి నాశనమునకు కారణమైన దాస్యము నుండి విడిపింపబడి దేవుని పిల్లలు మహిమగల స్వాతంత్య్రమును పొందుదురు.

47.  పిల్లలు - ఒలీవ పిలకలు

        ప్రియపాఠకులారా!  కీర్తన 128:3, '' నీ భోజనపు బల్లచుట్టు నీ పిల్లలు  ఒలీవ మొక్కలవలె నుందురు.''  పిల్లలు ఎలా ఉంటారు అన్నది ఒకే ఒక పోలికతో కీర్తనాకారుడు బహు సుందరముగా వర్ణించుట జరిగింది.  ఒలీవ పిలకకు ఆధారము ఒలీవ చెట్టు కదా!  ఒలీవ చెట్టు వేరుల నుండి ఫలింపుగా పిలకలు చుట్టూ ఉంటాయి.  కనుక కుటుంబ జీవితములో తల్లిదండ్రుల చుట్టూ పిల్లలు ఉంటేనే దానికి అందము.  మామూలుగా మనము ఎక్కడికి వెళ్లిన పిల్లలు మనలను అంటుకొని ఉన్నట్లు ఉంటూనే మరుక్షణములో కొంత దూరముగా వెళ్లుచు ఆడుచున్నట్లుగా కనబడుచూనే తిరిగి తల్లిదండ్రులను హత్తుకొని జీవించు జీవితము వీరిది.  ఈ జీవితము పిలక జీవితము కనుక వారికి సంపాదన ఉండదు.  కనుక వీరు స్వతంత్రులు కారు.  వీరిపై ఇంటిలోని పనివారు సైతము వీరిపై అధికారమును సలుపుదురు.  ఇలాంటి స్థితిలోని ఈ పిల్లలు భోజనపు బల్ల చుట్టూ ఉంటారని చెప్పబడినది.  మనము భోజనమునకు కూర్చునప్పుడు వీరు కూడ మనతో బాటుగా కూర్చుంటారు.  మనకన్నా ముందుగా వీరు ఇందులోని పదార్థములను తీసుకొని భుజిస్తారు.  వీరికి ఎలాంటి నియంత్రణ ఉండదు.  వీరు తినుటకు ఏమి కావాలంటే అది వారికి ఇయ్యాలి.  మనము తినుటకు తీసుకొన్న పదార్థమును నాన్న / అమ్మతో నాకివ్వు అన్నప్పుడు వెంటనే ఎవరైన వారికి ఇచ్చేస్తారు.  వీరికి ఇందులో ఎలాంటి నియంత్రణ ఉండదు, ఉండకూడదు కూడ.

48.  దేవుని పిల్లలు

        ప్రియపాఠకులారా!  యోహాను 1:12-13, ''తన్ను ఎందరంగీకరించిరో వారికందరికి, అనగా తన నామమునందు విశ్వాసముంచినవారికి, దేవుని పిల్లలగుటకు ఆయన అధికారము అనుగ్రహించెను.  వారు దేవునివలన పుట్టినవారే గాని, రక్తమువలననైనను శరీరేచ్ఛవలననైనను మానుషేచ్ఛవలననైనను పుట్టినవారు కారు.''  ఇందులో చెప్పబడిన విధముగా ఎవరైతే క్రీస్తు ప్రభువునందు విశ్వాసముంచి ఆయనను తమ రక్షకునిగా అంగీకరిస్తారో వారు దేవునికి పిల్లలుగా ఉంటారు.  ఇది చాలా గొప్ప విషయము.  ఈ బంధము శరీరేచ్ఛలవలన ఏర్పడినది కాదు.  కేవలము మనము క్రీస్తు ప్రభువును విశ్వసించి అన్యదేవతల విగ్రహారాధనను విడనాడుట వలన వచ్చింది.  కనుక మనము విశ్వాసము కోల్పోక మరణము వరకు కలిగియుండిన మనము దేవునికి పిల్లలుగా ఉందుము.  ప్రకటన 2:25.